గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఆంధ్ర భాషాపోషణం
ఆంధ్రభాషాపోషణం
(11 - 1 - 1934)
కొన్ని రోజులక్రిందట మన ప్రభుత్వమునందు ఆర్థికశాఖలో మంత్రివర్యులగు సర్. అక్బర్ హైదర్‌నవాజ్ జంగ్ బహదర్‌గారు హనుమకొండ ఇంటర్మీడియేట్ కళాశాలకు ఆహ్వానింపబడి అచట కళాశాల సభలో ఉపన్యసింపుచు ఆ కళాశాలలో సంస్కృతాంధ్రపోషణకై ప్రత్యేకముగ ఉపన్యాసకుల నేర్పరుచుట చాలా ముఖ్యమైన అవసరమని కలాశాలాధ్యక్షులవారు గావించిన సూచనతో ఏకీభవించి యుండిరి. సర్ అక్బర్ హైదరిగారి యొక్కయు, కలాశాలాధ్యక్షులగు అజీజుఖానుగారి యొక్కయు ఈ గొప్పబుద్ధి మతభేదములను దాటియున్నది. కళాశాలాధ్యక్షులవారు మొదట పారసీక అరబ్బీ భాషలనుకూడ చేర్చిరి. కాని తర్వాత "ఆ భాషలకన్నిటికి ఏర్పాట్లు చేయుట సాధ్యము కాకున్నను అధమపక్షము తెలుగు సంస్కృతములకైనను అట్టి ఏర్పాటు అవసరము." అని చెప్పియుండిరి. వరంగల్లు ప్రాచీనమునుండి సంస్కృతాంధ్ర విజ్ఞానములకు పోషణస్థానముగా గణనకెక్కి యుండినది కాబట్టి ఆ ప్రాచీన విజ్ఞాన సంరక్షణార్థమీవిధమగు ఏర్పాటు అవసరసుని ఇరువురు మహాశయుల యొక్కయు అభిప్రాయము కాబట్టి త్వరతో వరంగల్లు కేంద్రమున సంస్కృతాంధ్రోపన్యాసకుల ఏర్పాటు జరుగగలదని నమ్మవచ్చును
ఈ సందర్భమున సర్ అక్బర్‌గారి మరియొక మాటకూడ ముఖ్యముగా మనసున నుంచుకొనదగియున్నది. వారు ఇంటర్మీడియెటు కళాశాల స్థానిక భాషలను వృద్ధి చేయవలయుననిరి ఈ అభిప్రాయముతో కళాశాలాధ్యక్షులగు ఆజీజుఖానుగారి మాటను చేర్చుదము. అజీజుఖానుగారు వరంగల్లు తెలంగానా ప్రాంతపు విజ్ఞాన చక్రమునకు కేంద్రమనిరి కాబట్టి వరంగల్లు ప్రాంతములో ఇంటర్మీడియేటు కళాశాల ముఖ్యముగా తెలుగు భాషను వృద్ధిచేయదగియున్నది. అనుమాటను కలాశాలాధ్యక్షులవారును ఆర్థికమంత్రి వర్యుడును ఒప్పుకొనక తప్పదు. తెలుగుభాష వృద్ధిజెందుటకు బాల్యమునుండి అన్ని విషయములను తెలుగుద్వారా బోధించుటకంటె శ్రేష్ఠతరమార్గము వేరొకటిగలదా? కాబట్టి సర్ అక్బరుగారు నిజముగా ఇంటర్మీడియేటు కళాశాలలు స్థానికభాషల నభివృద్ధి చేయవలయునని హృదయపూర్వకముగా నమ్మెడు. పక్షమున తెలంగానా ప్రాంతపు సర్కారి పాఠశాలలలో తెలుగుద్వారా విద్యనేర్పుటకు ఏర్పాటు చేయవలసి యున్నది ఇదియే ఆంధ్రులు కోరునది. ఈ కోరిక ఎప్పటికి తీరగలదో ?