గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఆంధ్రుల ఆయుర్వేద విద్య
ఆంధ్రుల ఆయుర్వేద విద్య
1 - 10 - 1934
మన రాష్ట్రమందలి 14436148 మంది జనులలో ఆంధ్రులు 6972534 మంది అనగా దాదాపు సగము మంది ఆంధ్రులున్నారు. ఈ సంఖ్యకు తగిన పలుకుబడి మాత్రము లేకున్నది నిజాం రాష్ట్రమందు ఆంధ్రులను వారు గలరు అనిపించవలయుననిన, ఆంధ్రులు అనేక విషయములయందు ముందుకు రావలసి యున్నది నిజాం రాష్ట్రాంధ్ర జన కేంద్ర సంఘము యొక్క కృషి వలన రాష్ట్రీయులగు ఆంధ్రులు నిద్రావస్థ నుండి మేల్కొనగల్గిరి కాని తమ యభివృద్ధికై వారు పట్టుదలతో ఉద్యమించవలసిన సమయము వచ్చినది - ఇతరులకు ఆంధ్రుల యభివృద్ధి పట్టనపుడు వారికి స్వయంకృషి తప్ప వేఱుగతిలేదు. సర్వవిధముల యభివృద్ధికిని విద్య పునాది గదా! అట్టి విద్య ఆంధ్రులకు అధమపక్షము మాధ్యమిక ఘట్టము వరకైనను, ఆంధ్ర భాషలో ఒసగబడుటలేదు ఆదిలోనే ఆంధ్ర వ్యక్తిత్వమునకు గొప్ప కొరత ఇక తక్కిన విషయములను గూర్చి చింతపడిన లాభములేదు గాని సమయము వచ్చుటచే మన రాష్ట్రమందు ఆంధ్రులకు ఎక్కువ అనుకూలములగు వైద్య సౌకర్యముల విషయమై ఒకటి రెండు మాటలు చెప్పవలసి యున్నది
రానున్న డిసంబరు నెలలో మన రాష్ట్రమందలి మహారాష్ట్ర ప్రాంతముల ఆయుర్వేద మహాసభ పైరానులో జరుపదలచబడినదని యొక వార్త తెలుపుచున్నది మహారాష్ట్రులు ఆయుర్వేద విధానము యొక్క అభివృద్ధికై చేయు కృషి జూచి మన ఆంధ్రులును ఆ విషయమున కృషి చేయవలసిన అవసరము గలదు
ఆయుర్వేదమునకై మన ప్రభుత్వము వారేమి చేసినదియు స్పష్టముగా తెలియుటలేదు. 1341 వ ఫసలీ పరిపాలనా నివేదికలో లెక్కలను పరిశీలించి చూడగా ఆయుర్వేద నిమిత్తమై మన ప్రభుత్వము వారు ఏమి ఖర్చు పెట్టినట్లును కానరాదు. ఆరోగ్య రక్షణ, చికిత్సా శాఖలకు కలిపి మొత్తము రూ 2137747 లు ఖర్చు అయి యుండెను. అందులో అందులో ఆరోగ్య రక్షణ శాఖకు మాత్రము రూ 262111 లు ఖర్చు అయ్యెను మిగిలిన రూ.1875636 లలో రూ. 1721410 లు ఇంగ్లీషు వైద్య భాగమునకును (మెడికల్ అనుదానికి అంతే అర్ధమని తలచెదము) రూ. 154226 లు యునాని భాగమునకును ఖర్చు అయినట్టు చెప్పబడియున్నది. ఇంగ్లీషు వైద్య శాఖకును యునాని వైద్య శాఖకును మాత్రమే కలిపి రూ. 1875636 లు కాగా, యిక ఆయుర్వేదమునకు ఏమి ఖర్చయినదని చెప్పవలెను. ప్రధాన నగరములో ఈ నివేదిక వత్సరములో యునాని, ఆయుర్వేద ఆసుపత్రులు కలిసి మొత్తము 29 యుండెనని ఆయుర్వేదము యొక్క పేరును వ్రాయుట మాత్రమేగాని, సర్కారువారిది ఒకటైనను ఆయుర్వేద వైద్యాలయము ఉన్నట్లు ఊహించ వీలులేకున్నది ఇక జిల్లాలలో యునాని ఆసుపత్రులున్నట్లు చెప్పబడినదే కాని ఆయుర్వేదము పేరైనను చెప్పబడలేదు. జిల్లాలలో ఆయుర్వేద మందు, చౌకదనముచే నైననేమి, సుళువుగా అందుబాటులో నుండుటచే నేమి, సంప్రదాయమందు నెలకొన్న దగుటచే నేమి, విశ్వాసము గల వారగుటచే, అనేకులు బీదలు సహితము ఖర్చుకైనను ఓర్చి ఆయుర్వేద వైద్యము నాశ్రయించుచున్నట్లు వినుచున్నాము. అయినను ఆ దేశీయ విధానమును వృద్ధికి దెచ్చు విషయము మన సర్కారు వారికి పట్టినట్లులేదు.
కాబట్టి మేము చెప్పబోవునదే మనగా యిపుడు మన ఆంధ్ర జిల్లాలయందు ఆయుర్వేద వైద్యులు ముందుకు రావలసి యున్నది బ్రిటిషిండియాలో పండిత డి గోపాలాచార్యులు మొదలగు వారి కృషి వలననెకదా అక్కడ ప్రభుత్వము వారుగూడ ఆయుర్వేదమును ఒప్పుకొనినది అంతకు పూర్వము ఆయుర్వేద మనిన అచటి ప్రభుత్వముచే వెలివేయబడినట్లుండ లేదా? ఆయుర్వేద పండితులును వైద్యులును ఐకమత్యముతో ఆయుర్వేదమును వృద్ధి దశకు దెచ్చి దానికి మన ప్రభుత్వమువారి నుండి తగిన గౌరవమును సంపాదించునంతవరకు కృషి చేయవలసి యున్నది ఆంధ్ర ఆయుర్వేద వైద్య మహాసభ యొకటి అఖిల నిజాం రాష్ట్రాయుర్వేద వైద్య మహాసభకొక దానిని అనుబంధముగా నుండి కర్తవ్యమును విశదముగా నిర్ణయించుకొని తదనుసారముగ ప్రవర్తించిన లాభముండును.