Jump to content

గోపీనాథ రామాయణము - రెండవసంపుటము/సుందరకాండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీరామచంద్రపరబ్రహ్మణేనమః

గోపీనాథరామాయణము

సుందరకాండము



వాణీశ్వరశంకర
దేవేంద్రప్రముఖనిఖిలదేవోత్తమసం
సేవితపాదాంబుజ లీ
లావిర్భూతావతార హరి శ్రీకృష్ణా.

1


వ.

శ్రీ దేవా విన్నవించెద నవధరింపుము కుశీలవు లగుకుశలవు లవ్వలికథ యి ట్లని
చదువం దొడంగి రిత్తెఱంగున శత్రుకర్శనుం డగుహనుమంతుండు రావణనీత
యైనసీత యున్నపదం బన్వేషించుటకు గగనమార్గంబునం బోవ సమకట్టి.

2


తే.

నిష్ప్రతిద్వంద్వమును గడుదుష్ప్రధర్ష, మైనకార్యంబు సాధింప నాత్మఁ దలఁచి
పావని యుదగ్రమస్తకగ్రీవుఁ డగుచు, సుందరవృషంబుచందానఁ జూడనొప్పె.

3

హనుమంతుఁడు మహేంద్రపర్వతంబున విహరించుట

వ.

తదనంతరంబ.

4


క.

విలసితజలకల్పము లగు, సలలితవైడూర్యవర్ణశాద్వలములయం
దల మారుతి ధైర్యం బ,గ్గల మంద యథాసుఖంబుగా విహరించెన్.

5


మృగపతికైవడి మృగముల, బెగడం దోలుచు మహీజబృందంబులపై
ఖగముల నెగయం జోపుచు, నగచరవీరుండు ప్రియవిహారము సలిపెన్.

6


మ.

ఘనమాంజిష్ఠపలాశవర్ణసితరక్తశ్యామపీతాభిరం
జననానావిధధాతుయుక్తసముదంచత్సానుసంచారయ

క్తనిశాటామరభోగిరాడ్గరుడగంధర్వాంగనాగానని
స్వనవిభ్రాజిత మైనశైలమునఁ జంచత్ప్రీతిఁ గ్రీడించుచున్.

7


క.

వినుతజలాశయమధ్యం, బున నొప్పెడుమత్తదంతిపోలికి నప్పా
వని నాగవరాయుత మగు, ఘనగిరితలమందు నిలిచి కడుభక్తిమెయిన్.

8


క.

మునుకొని తూర్పుమొగం బై, యనువుగ నిజజన్మహేతు నగుపవనునకు
న్వనజాసనునకు శక్రున, కినునకు భూతముల కెఱఁగి యింపు దలిర్పన్.

9


ఉ.

నీరధి నుత్తరింపఁ గృతనిశ్చయుఁ డై పవమాననందనుం
డారయ నిండుపర్వముల నంబుధి పొంగినభంగిఁ బొంగి సొం
పారఁగ నిష్ప్రమాణతనుఁ డై చరణంబుల బాహుశాఖలం
దోరపుబల్మిచే నడఁగఁ ద్రొక్కె నగేంద్రము నమ్మహేంద్రమున్.

10


చ.

సలలితపుష్పితాగ్రతరుశాఖలనుండి ప్రసూనమంజరు
ల్జలజల రాల దారుణశిలాప్రచయంబులు వ్రస్సి గూల ని
స్తులఘనవప్రసంఘము వసుంధర వ్రాల ఖగంబు లార్వ న
క్కులగిరి సంచలించెఁ గపికుంజరపాదవిఘట్టితాగ్ర మై.

11


క.

ఆతరుముక్తసుగంధిస, మాతతపుష్పములచేత నభిసంవృత మై
ఖ్యాతిగ నగ్గిరి యతులవి, భూతం బుష్పమయ మైనపోలికి నలరెన్.

12


క.

ఉత్తమవర్యుం డగుకపి
సత్తముచేఁ బీడ్యమానసానుకమై శై
లోత్తమము జలము గురిసెను
మత్తేభము జలము గురియుమాడ్కిన్ బెలుచన్.

13


వ.

మఱియు నమ్మహేంద్రపర్వతంబు బలవంతుం డగుమరున్నందనునిపదాఘాతంబున
నిపీడ్యమానం బై కాంచనాంజనరాజతరేఖలం జూపుచుఁ గాళీకరాళీవిష్ఫు
లింగినీధూమ్రవర్ణావిశ్వరుచిరోహితామనోజవాభిధానంబులు గల సప్తార్చుల
లోన నుధ్యమార్చిర్విశిష్టుం డైనవైశ్వానరుండు ధూమనిచయంబులం బోలె
మనశ్శిలాయుక్తంబు లగుశిలాచయంబులం దొరఁగించె నప్పుడు.

14


క.

బహుపీడ్యమాన మగు న, మ్మహేంద్రగిరిచే నిపీడ్యమానము లై త
ద్గుహల వసించినభూతని, వహములు వికృతగతి మొఱసె వారనిభీతిన్.

15


తే.

శైలపీడానిమిత్తజసత్వనాద, మపుడు విలయాబ్ధినిర్ఘోష మనుకరించి
యఖిలభూతభయంకర మై ధరిత్రి, నాకసంబును దిక్కులు నాక్రమించె.

16


క.

వ్యక్తస్వస్తికలక్షణ, యుక్తము లగుపృథుశిరంబు లొప్పారుమరు
ద్భుక్తతులు విషముఁ గ్రక్కుచు, రక్తాస్యము లలర శిలలు గ్రక్కునఁ గఱిచెన్.

17


క.

ఇటు కుపితక్రూరవిషో, త్కటకాకోదరనికాయదష్టము లై స
మ్మెటవాటులఁ బగిలినక్రియఁ, బటపట ఱా లెల్ల వేయిభంగులఁ బగిలెన్.

18

తే.

ఆనగంబున నెయ్యవి యహివిషంబు, నణఁప జన్మించె నట్టిదివ్యౌషధములు
సర్పసందష్టదలితవిశాలగండ, శైలవిషమును వారింపఁజాల వయ్యె.

19


తే.

ఘోరకాయంబు లగుమఱికొన్నిఫణులు, ప్లవగపదపీడితంబు లై పట్టు చాల
కపుడు నిజతేజమున భీషణాగ్నిశిఖలఁ, గ్రక్కుచు గుహాముఖంబులు కలఁక వెడలె.

20


తే.

మర్కటేంద్రపదాక్రమ్యమాణ మైన, గిరివరమునందు నూతనాంకురము లైన
తరులు వికసితకైరవోత్పలసుగంధి, కుసుమవర్షంబు లెల్లెడఁ గురిసె నపుడు.

21


క.

హరితాళసంవృతంబులు, సురుచిరగైరికవినీలజుష్టము లగుప్ర
స్తరములు మనశ్శిలాసం, భరితము లై యపుడు పుడమిఁ బడఁదొడఁగె రహిన్.

22


వ.

మఱియుఁ జిత్రకాననసానుసంశోభితంబును హరిచందనవనవిభ్రాజితంబును దీప్త
గైరికధాతుపరిక్షిప్తంబు నగుమహేంద్రపర్వతంబు పావనిపదాఘాతంబున విఱిగి
కూలునో యనుభయంబున నం దున్నసిద్ధవిద్యాధరకిన్నరకింపురుషాదులు పాన
భూమిగతం బైనహైమాసవభాజనంబులును మహార్హంబు లగుపాత్రంబులును
హిరణ్మయంబు లగుకరకంబులును నుచ్చావచంబు లగులేహ్యభక్ష్యంబులును
వివిధంబు లగుమాంసంబులును నార్షభంబు లగుచర్మంబులును గనకత్సరుయు
క్తంబు లగుఖడ్గంబులునుం బరిత్యజించి విచిత్రదివ్యాంబరమాల్యానులేపన
హారాలంకృతశరీరు లై రక్తపుష్కరపత్రంబులభంగి మదఘూర్ణమాననేత్రం
బులు గ్రాల హారనూపురకేయూరపారిహార్యధర లగునిజసుందరులం గూడి
శీఘ్రంబున నగ్గిరికందరంబులు నిర్గమించి సుమేరుసమానశరీరుం డగుహనుమం
తుండు నరవానరనాయకార్థంబుగా మహావేగంబున మకరాలయం బగుసము
ద్రంబు లంఘించి దుష్ప్రాపం బైనతదీయదక్షిణతీరంబు సేర నిశ్చయించినవాఁ
డిట్టి దుష్కరకర్మంబు సేయ నెవ్వరికైన శక్యం బగునే యని యగ్గించుచు నణి
మాదిసిద్ధులం జూపుచు విస్మితులై సస్మితంబు లగుముఖారవిందంబు లందంబు
లై యలర నంతరిక్షంబున నిలిచి యప్రమేయుం డగుహనుమంతు నవలోకించు
చుండఁ దదీయస్తోత్రనాదంబు లాకాశంబు నిండి చెలంగె నప్పుడు.

23


క.

రోమముల గగు ర్పొడవఁగ, భూమిధరోపముఁడు పవనపుత్రుఁడు మే ను
ద్దామగతిఁ బెంచి ఘోరము, గా మేఘముభంగి నార్చి గమనోన్ముఖుఁ డై.

24


క.

రోమచితం బగువాలము, భీమంబుగ మిన్నుదాఁకఁ బెంచి పతత్రి
స్వామి ఫణినాథునిన్ బలె, నామారుతసుతుఁడు విప్పి యల్లార్చి వడిన్.

25

హనుమంతుఁడు వానరులముందఱఁ బ్రతిజ్ఞ సేయుట

సీ.

పరిఘసన్నిభదీర్ఘబాహుదండంబుల సంస్తంభ మొనరించి సముచితముగఁ
బదములు జోడించి పదిలంబుగాఁ గటితటి మెయి నడఁగించి తగువిధమున
భుజములు శిరమును బొందుగాఁ గురియించి తలఁగకుండంగఁ బాదంబు లూఁది
కర్ణము ల్నిక్కించి కడువేడ్కతో హృదయంబునఁ బ్రాణంబు నాఁగి పట్టి

తే.

ధైర్యము బలంబు తేజంబు శౌర్య మూని, సొం పెసఁగ దూరపథమునఁ జూపు నిలిపి
పొంచి తమకించి పులకించి పొలుపు గాంచి, మించి తాటించి చివ్వున మిన్ను దాఁకి.

26


వ.

ఇత్తెఱంగునం గ్రీడాగతి గగనంబునకుఁ దాఁటువాఁడై యవ్వానరపుంగవుఁ
డంగదాదుల నిరీక్షించి ప్రావృట్కాలవలాహకగర్జాసముజ్జృంభణగంభీరభాష
ణంబుల ని ట్లనియె.

27


చ.

తడయక యింక మీకుఁ బ్రమదం బిగురింపంగ నబ్ధి దాఁటి పెం
పడరఁగ లంక సొచ్చి రిపు లడ్డము వచ్చిన సాహసంబునం
గడిచి మహీసుత న్వెదకి కాంచి రఘూత్తమువార్తఁ జెప్పి మీ
కడ కరుదెంచెద ముదము గ్రాలఁ గృతార్థుఁడ నై రయంబునన్.

28


ఉ.

చప్పున లంకలో వెదకి క్ష్మాసుత గాంచెదఁ గానకున్న నా
చొప్పున నాకము న్వెదకి చూచెద నందురు గానకున్న నే
ర్పొప్ప దశాస్యుఁ బట్టుకొని యుద్ధతిఁ ద్రచ్చెద నొండెఁ గానిచోఁ
దప్పక లంక వేఁ బెఱికి దక్షతఁ దెచ్చెద రామునొద్దకున్.

29


వ.

ఏను సర్వప్రకారంబులఁ గృతకార్యుండ నై సీతం జూచి వచ్చెద నని పలికి
మహోత్సాహంబున నాహరిశ్రేష్ఠుండు విక్రమోదీర్ణుం డగుసుపర్ణునితెఱంగున
నద్భుతజవంబున నంబరంబున కెగసె నప్పుడు.

30


క.

దాఁటెడురయమునఁ బదముల, వ్రేటునకుం గాక పాదు విఱిగి మహీభృ
త్కూటములు భూరిభూరుహ, కోటియుతంబుగఁ బయోధిఁ గూలెం బెలుచన్.

31

హనుమంతుఁ డాకాశమున కెగయుట

క.

సమదమనోహరకోయ, ష్టిమకము
లగుపుష్పశాలిశీతలతరులన్
రమణీయోరుభుజావే, గమున న్వెంటఁ గొని మింటఁ గడువడిఁ జనియెన్.

32


శా.

ఓజన్ దూరపథంబు పోవుటకు నుద్యోగించుసద్బంధు న
వ్యాజప్రీతి దలిర్ప నంపఁ జనుహృద్యద్బంధువర్గంబనాఁ
దేజశ్శాలిమరుత్తనూజవిలసద్దీర్ఘోరువాతోత్థిత
క్ష్మాజవ్రాతము కొంతద వ్వతనివెన్కన్ బోయె నత్యుద్ధతిన్.

33


ఆ.

మఱియు నూరువేగమథితంబు లగుసాల
తగులు కొన్ని పవనతనయు వెంట
నరిగె దండయాత్ర కరుగు భూపతివెంటఁ
జనెడుసైన్యములకు సాటి యగుచు.

34


తే.

పుష్పితాగ్రమహోన్నతభూరిభూజ, షండమండితుఁ డై వృక్షచరవరుండు
వాయుపథమున మేరుపర్వతముకరణి, నప్పు డద్భుతదర్శనం వెలింగె.

35


తే.

సారవంతంబు లగుమహీజములు కొన్ని, పరఁగ లవణాంబునిధియందుఁ బడి మునింగె
ననిమిషాధిపుభయమున నబ్ధియందుఁ, బడిమునింగెడుకొండలపగిది దోఁప.

36

క.

వికచసుమావృతుఁ డై వా, యుకుమారుఁడు చూడ నొప్పె నొగి సాంకురకో
రకములచే ఘనఖద్యో, తకములచే నొప్పు భూమిధరమో యనఁగన్.

37


వ.

మఱియుఁ గొన్నిమహామహీరుహంబులు పావనిభుజావేగోత్థితంబు లై యొక్కింత
దూరం బమ్మహావీరునివెంటం జని తద్వేగవిముక్తంబు లై పుష్పంబులు విడిచి
బంధుప్రస్థాపనార్థంబు సమాగతు లైనచుట్టంబులు బంధులం బనిచి మగిడిన
తెఱంగున మగిడి సలిలంబునం బడియె మఱియు.

38


క.

వానరవాయుప్రేరిత, మై నానావిధవిచిత్ర మగుమృదుసుమసం
తానము తరునికరంబుల, పైనుండి పయోధియందు బడియె లఘుగతిన్.

39


క.

ఆసూనసమూహంబుల, చే సాగర మప్పు డొప్పెఁ జెలువుగ ఘనతా
రాసముదయములచేఁ గడు, భాసురముగ నొప్పు గగనభాగముమాడ్కిన్.

40


క.

నానావర్ణవినూతన, సూనసమూహములచేతఁ జూడఁగ నొప్పె
న్వానరుఁ డచిరద్యుతిసం, తానంబుల నొప్పు వారిధరమువిధమునన్.

41


వ.

అప్పుడు.

42


తే.

సుప్రసారితములును భాసురము లగ్ర, భాగగతములు నైనతద్బాహు లొప్పె
శైలశిఖరంబువలన నిష్క్రాంతము లగు, పంచముఖశోభితము లైనఫణులకరణి.

43


క.

ఆకసము మ్రింగఁ జనుగతిఁ, బ్రాకటముగ నబ్ధిజలముఁ ద్రావుటకొఱకుం
దేఁకువ నేగెడుకైవడి, నాకపివీరుండు పొల్చె నంబరవీథిన్.

44


తే.

చటులగతి వాయుమార్గానుసారి యైన
కపివరుని చంచలాప్రభాకారము లగు
చక్షువులు పొల్చెఁ బర్వతస్థంబు లైన
సమధికానలదీప్తకుండములకరణి.

45


తే.

మఱియు నుద్దీప్తము లుపరిమండలములు
పింగములు విశ్రుతము లగుపింగనేత్ర
కులవిభూషణుదివ్యచక్షువులు దనరె
నుదితు లగుసోమసూర్యులయొప్పు గలిగి.

46


క.

భాసురతామ్రద్యుతి గల, నాసికచేతఁ దరుణాననము శోభిలె సం
ధ్యాసమభిస్పృష్టం బగు, నాసూర్యునిబింబ మట్టు లద్భుతభంగిన్.

47


క.

ప్లవమానుం డగుపవమా, నవరాత్మజువాల మపుడు నభమున నొప్పెన్
దివిపై నుచ్ఛ్రిత మగువా, సవునిమణిధ్వజముక్రియ విశాలస్ఫూర్తిన్.

48


వ.

మఱియును.

49


క.

అతివేగుం డగుమారుత, సుతులాంగూలంబు వెనుకఁ జూడఁగ నొప్పెన్
ధృతి మీఱ సుపర్ణునిచే, నతులితముగ కృష్యమాణ మగుఫణిమాడ్కిన్.

50


క.

అరుణాస్యుఁడు సితదంష్ట్రుఁడు, సరసుఁడు నగునతఁడు వాలచక్రవృతుం డై

పరివేషపరివృతుం డగు, ఖరకిరణునిచందమునఁ బ్రకాశించె దివిన్.

51


క.

అరుణస్ఫిగ్దేశముచేఁ, గర మరుదుగ నప్పు డొప్పెఁ గపివీరుఁడు భా
స్వరగైరికాదిధాతూ, త్కరమున శోభిల్లుపర్వతముచందమునన్.

52


క.

శరనిధి దాఁటెడు తఱి న, త్తరుచరసింహుఁ డగుపవనతనయుని కక్షాం
తరగతుఁ డై యనిలుఁడు భీ, కరముగ గర్జింపఁదొడఁగెఁ గాండదముక్రియన్.

53


క.

అతులితగతిఁ గపిపతి య, ద్భుతవైఖరి నుత్తరాంతమున నుండి పరి
చ్యుత యగుమహోల్క పడియెడు, గతి నంబరవీథి నపుడు గానఁగ నయ్యెన్.

54


వ.

మఱియుఁ బతత్పతంగసంకాశుండును దీర్ఘాకారుండు నగుమరున్నందనుండు
మధ్యబంధనరజ్జుబంధసమయంబున దీర్ఘీభూతం బైనమాతంగంబుచందంబున
నందం బగుచు సాగరోపరిగతం బైనశరీరంబుచేత సాగరాంతప్రవిష్ట యైన
తనుచ్ఛాయచేత నేకాకారుం డై యంబుధినడుమ వాయుప్రేరిత యైననావ
పగిదిఁ జూపట్టె మఱియును.

55


క.

ఏయేదేశమునకుఁ జనె, నాయాదేశంబు చూడ నంబుధినడుమ
న్వాయుసుతాంగరయంబునఁ బాయకసోన్మాద మైనపగిదిం దోఁచెన్.

56


క.

 శరనిధికల్లోలంబుల, వరిగిరివర్షముల గఠినవక్షోనిలుచే
బఱియలు వాయఁగఁ దట్టుచు, నురువడి నభ్రమున వానరోత్తముఁ డరిగెన్.

57


క.

దారుణబలవత్‌ప్లవగస, మీరము దుర్భారఘనసమీర మొకటి యై
ఘోరతరనిస్వనంబునఁ, బారావారమును దొట్రువడ సుడి వెట్టెన్.

58


వ.

మఱియు నురోవేగజనితవాయువేగంబున మహోన్నతంబు లగులవణోదధిసం
జాతకల్లోలమాలికాజాలంబులు రోదసీకుహరంబు నిండ నెగయం జిమ్ముచు.

59


తే.

ఉబ్బి గగనంబు ముట్టి పయోధియందు, మేరుమందరసంకాశభూరిభంగ
సంఘముల లెక్కపెట్టంగఁ జనువిధమున, ఘనశరీరుఁడు పవమానతనయుఁ డరిగె.

60


వ.

అప్పుడు సముద్రజలంబు తదీయభుజావేగోత్కీర్ణం బై గగనంబున కెగసి యం
దున్నజలధరంబుతోడ సహచరత్వంబు పాటించి తానును జలదవిశేషంబువిధం
బున నొప్పె నాసమయంబున.

61


క.

తిమినక్రమీనకర్కట, కము లవి వివృతంబు లగుచుఁ గానఁగ నయ్యె
న్విమలపటాకర్షణమునఁ, గ్రమమునఁ జూపట్టు దేహిగాత్రములక్రియన్.

62


క.

అనిలజవంబున మింటం, జనుకపివరుఁ గాంచి యబ్ధిచరనాగంబు
ల్వినుతబలాఢ్యుం డగున, వ్వినతాసుతుఁ డనుచుఁ జాల వెఱఁ గందె మదిన్.

63


వ.

అప్పు డప్పవమాననందనుం డగువానరసింహునిశరీరచ్ఛాయ పదియోజనంబుల
వెడల్పును ముప్పదియోజనంబుల నిడుపునుం గలిగి నిర్మలాభ్రసాంద్రపంక్తి
చందంబున జలంబునందుఁ జారుతరంబుగాఁ బ్రకాశించె మఱియును.

64


తే.

దీర్ఘదేహుండు సంపూర్ణతేజుఁ డైన, ప్లవగకులశేఖరుఁడు నిరాలంబ మైన

వాయుమార్గంబునఁ బతత్రవంతమైన, సురుచిరనగంబుచందానఁ జూడ నొప్పె.

65


క.

ప్రాకటముగ నేతెరువున, నాకపికులవర్యుఁ డరిగె నా తెరువున ద్రో
ణీకృత మైనవిధంబున, నాకంధియుఁ జూడ నొప్పె నద్భుతభంగిన్.

66


క.

గగనమున ఖగకులములకు, ఖగపతిచందమునఁ దనరి కపిశేఖరుఁ డా
శుగముక్రియ నభ్రపంక్తులఁ, దగువిధమున లాగికొనుచుఁ దడయక యరిగెన్.

67


క.

వడి నభ్రంబులఁ దూఱుచు, వెడలుచు నొక్కొక్కచోట వెలుఁగుచు నొకచోఁ
గడుఁబ్రచ్ఛన్నుఁ డగుచు న, ప్పుడు వాయుకుమారుఁ డొప్పెఁ బూర్ణశశిక్రియన్.

68


తే.

అమితబలుఁ డైనప్లవగనాయకునిచేత, నప్పు డాకృష్యమాణంబు లై వినీల
పాండురారుణకాంతులఁ బరిఢవిల్లు, మేఘములు చిత్రవైఖరి మింట నలరె.

69

సముద్రుఁడు మైనాకపర్వతముతో హనుమంతునకు సాహాయ్యంబు సేయుమని చెప్పుట

వ.

ఇట్లు రామునిబాణంబుచందంబున నమోఘరయంబున నంబరంబునం జను
సమీరకుమారునిం గని దేవతలు కుసుమవర్షంబు గురియించిరి దేవర్షులు కృతకార్య
సిద్ధి వగుమని యాశీర్వదించిరి యప్సరస లాడిరి గంధర్వులు పాడిరి సూర్యుండు
చంద్రుండుం బోలె సుఖశీతలస్పర్శుం డయ్యె సమీరుండు దేవతాతరుపుష్ప
సుగంధియై విసరె నాగయక్షరక్షస్సిద్ధవిద్యాధరులు పరమానందంబున నంబరం
బునంబన్ని తదీయవిక్రమవిశేషంబు గనుంగొనుచు బహుభంగులం బ్రశంసించి
రాసమయంబున నిక్ష్వాకుకులపూజార్థి యగునాగరుండు తనమనంబుననే నిక్ష్వా
కునాథుం డగుసగరునిచేత వివర్ధితుండ నైనవాఁడ నీహనుమంతుం డాయిక్ష్వా
కుసచివుం డితండు ఖేదంబు నొండ నర్హుండు గాఁ డిమ్మహాత్మునకు సాహాయ్యంబు
గావింపనేని వాగింద్రియవంతులకు సర్వనిందావాగ్విషయీభూతుండ నగుదు
నవ్వీరోత్తముండు మత్సాహాయ్యంబున నొక్కింతసేద దీర్చికొని యవ్వల
సముద్రశేషంబు యథాసుఖంబుగా సంతరించెడుఁ గాక యని తలంచి తనచేత సుర
క్షితం బైనహిరణ్యప్రధానం బగుమైనాకం బనుపర్వతశ్రేష్ఠంబు నవలోకించి
నగేంద్రా నీవు నిలింపపతిభయంబున నాలోన డాఁగి పదంపడి యతనిపంపునఁ
బాతాళతలవాసు లగురాక్షసులు వెడలి రాకుండ నప్రమేయం బైనపాతాళ
ద్వారంబు నాక్రమించి పరిఘప్రాయుండ వై చిరకాలంబుననుండి నాచేత రక్షి
తుండ వై యున్నవాఁడవు నీవు సర్వతోముఖుండవు గావున నీకుఁ గ్రిందికి మీఁ
దికి నడ్డంబుగాఁ బెరుఁగ శక్తి గల దిప్పుడు రామకార్యార్థంబుగాఁ గపిశార్దూలుం
డగుహనుమంతుండు గగనమార్గంబుఁ బట్టి భవదుపరిభాగంబునం జనుచున్నవాఁ
డితనికి సాహాయ్యంబు నాచేత నవశ్యకర్తవ్యం బై యుండు నితం డిక్ష్వాకుసచి
వుం డిక్ష్వాకులు నాకుఁ బూజ్యు లగుటం జేసి నీకునుం బరమపూజ్యు లిమ్మహాత్మునకు
సాచివ్యంబు గావింపు మీసాచివ్యకరణంబువలన నస్త్మత్ప్రయోజనంబు లోపింప
కుండుఁ గర్తవ్యకార్యంబు గావింపకుండు టది సత్పురుషులకుఁ గోపంబు పుట్టిం

చుఁ గావున నీవు శీఘ్రంబున జలంబులనుండి పయికి నిర్గమించి చనుదెమ్ము రమ
ణీయం బైనభవదీయశిఖరంబుమీఁద నొక్కింతసేపు విశ్రమించి యవ్వల సము
ద్రమార్గశేషంబు లంఘింపఁగలండు రామునివివాసనంబును సీతాహరణంబును
హనుమంతుని పరిశ్రమంబును విలోకించి శీఘ్రంబున నిర్గమింపు మని పలికిన.

70

మైనాకపర్వతము సముద్రమునుండి పైకెగసి వచ్చుట

ఉ.

అంబుధిమాటఁ గైకొని మహాద్రుమశోభిత మై నగంబు వై
ళంబసుసాంద్రనీరదముల న్విరియించుచు వ్రచ్చు హేళిచం
దంబున సాగరాంబువు లుదగ్రత వాయపడంగఁ ద్రోచికొం
చంబుధిలోన నుండి ముదమారఁగఁ బై కెగసెన్ జవోద్ధతిన్.

71


వ.

ఇత్తెఱంగున నిర్గమించి యొక్కముహూర్తంబునకు శాతకుంభమయంబులు
గిన్నరోరగసేవితంబులును సూర్యోదయసన్నిభంబులును గగనోల్లిఖితంబులును
స్వయంప్రభంబులు నగుమహోన్నతశిఖరంబులచేత నుపలక్షితుం డై యాత్మీయ
శృంగంబులు దర్శింపంజేయుచుఁ దదీయకాంతివిశేషంబుచేత శస్త్రసంకాశం
బైనయాకాశంబును గాంచనప్రభంబు గావించుచు నాదిత్యశతసంకాశుం డై
వాయునందనుమ్రోలం జూపట్టిన.

72


మ.

కని వీఁ డొక్కనిశాచరుం డగుట నిక్కం బిక్కడన్ నాకుఁ జ
య్యన విఘ్నం బొనరింప వచ్చె నిటు లాహా వీని భంజింతుఁ గా
కని యమ్మారుతి క్రోధరక్తనయనుం డై మారుతం బల్కతో
ఘనముం దాఁకినభంగి వక్షమున వీఁకన్ దాఁకె మైనాకమున్.

73


క.

తాఁకిన నగ్గిరి వజ్రము, సోఁకిన యట్లైనఁ జాల సుడివడి మరలన్
బ్రాకటముగ ధృతిఁ గైకొని, యాకపివరువేగమునకు హర్షించి తగన్.

74

మైనాకపర్వతము హనుమంతునిఁ దనశిఖరములపై విశ్రమించి పొమ్మని ప్రార్థించుట

క.

మానుషరూపధరుం డై, పూనిక నాత్మీయశిఖరమున నుడువీథి
గానం బడి గగనగతుం, డైనమరుత్సుతునితోడ నర్మిలిఁ బలికెన్.

75


క.

తరుచరవర నీ వీదు, ష్కరకర్మ మొనర్చి తింపుగా మచ్చిఖరో
త్కరములపై వ్రాలి సుఖం, బిరవందఁగ విశ్రమించి యేగుము ప్రీతిన్.

76


వ.

మహాత్మా యీసముద్రుం డిక్ష్వాకువంశసంభవు లగుసగరపుత్రులచేఁ బరివర్ధి
తుం డగుటవలన రామహితయుక్తుండ వైననీకుఁ బ్రతిపూజనంబు గావింపం
దలంచినవాఁ డుపకారంబునకుఁ బ్రత్యుపకారంబు గావించు టది సనాతనం బైన
ధర్మంబు గావునఁ బ్రతీకారార్థి యైనయీసముద్రునిప్రార్థనంబు నీవు సమ్మానింప
వలయు నీకపిశ్రేష్ఠుండు యోజనశతదూరంబు లంఘించుటకు నుపక్రమించి వచ్చు
చున్నవాఁడు భవదీయశిఖరంబులమీఁద నొక్కింత విశ్రమించి యవ్వల మార్గ

శేషంబు సంతరింపం గలవాఁడని భవన్నిమిత్తంబు సాగరుండు బహుమానపురస్స
రంబుగా నన్నుఁ బుత్తెంచినం జనుదెంచితి నీవు మదీయశిఖరంబులమీఁద నించు
కసేపు విశ్రమించి గంధవంతంబును స్వాదువు నగుకందమూలఫలాదికం బుప
యోగించి సముద్రశేషంబు తరింపుము మాకు నీతోడఁ ద్రిలోకవిఖ్యాతంబును
మహాగుణపరిగ్రహంబు లగుసంబంధంబు గలదు నీవు వేగవంతు లగువానరు
లలో నతిశ్రేష్ఠుండవు ధర్మవిచక్షణుం డగువాని కతిథి యగువాఁడు ప్రాకృతుం
డైనను బూజార్హుం డగుచుండ నీయట్టిమహాత్ముండు పూజార్హుం డగుట కేమి
సందియంబు నీవు దేవశ్రేష్ఠుం డగువాయువునకుఁ బుత్రుండవు బలపరాక్రమ
వేగంబుల నతనికి సమానుండవు పూజితుండ వైననమ్మహాత్ముండును బూజనొం
దినవాఁ డగు గావున నీవు నాకు మిక్కిలి పూజనీయుండ విందుకు నొక్కకార
ణంబు గలదు దాని నెఱింగించెద వినుము.

77


ఉ.

మోదము వీడి దేవమునిముఖ్యు లహర్నిశము ల్ప్రపాతశం
కాదృతచిత్తు లై బహుముఖంబులఁ బాఱుచుఁ దల్లడిల్లఁగా
నాదియుగంబునందు గిరులన్నియు ఱెక్కలు గల్గి మర్త్యలో
కాదిసమస్తలోకము లుదంచితవేగమునం జరింపఁగన్.

78


చ.

అలిగి సుపర్వనాథుఁడు శతారముచేఁ గులశైలపక్షముల్
చలమునఁ ద్రుంచుచు న్నను వెసం గని డాసిన నేను భీతిమైఁ
గళవళ మందుచుండ ననుకంప ననుం గొనిపోయి కంధిలో
పలఁ బడవైచె గా డ్పచలభంజనహేతికిఁ జిక్కకుండఁగన్.

79


క.

నను రక్షించిన కతమున, సనిలుఁడు పూజార్హుఁ డయ్యె నతనికి జన్మిం
చినకతమున నీవును మా, కనఘా మాన్యుండ వైతి వతిశయభంగిన్.

80


క.

నావిన్నపంబుఁ గైకొని, యీవనధికి నాకు హర్ష మింపారంగా
నీ వస్మచ్ఛిఖరముపై, భూవరసఖ విశ్రమించి సొమ్ము యథేచ్ఛన్.

81


క.

నే నిచ్చుపూజనంబులు, మానుగ నందికొని నన్ను మన్నింపు కపీం
ద్రా నీసందర్శనమున, నేను గృతార్థుండ నైతి నెంతయుఁ బ్రీతిన్.

82


వ.

అనిన నాశైలగ్రామణి యి ట్లనియె.

83

హనుమంతుఁడు మైనాకపర్వతమును వీడ్కొనుట

చ.

అగకులవర్య నీ వొసఁగు నట్టి సపర్యలు వచ్చె నుండఁగాఁ
దగ దిట మాకు భాస్కరుఁ డుదగ్రతఁ గ్రుంకక మున్నె సంద్ర మిరి
పుగఁ దరియిందువాఁడ నని పూని ప్రతిజ్ఞ యొనర్చి వచ్చితిన్
మగటిమి పోదె యేను గుణమండన నేఁ డటు చేరకుండినన్.

84


తే.

చటులజనమున నంబుధి సంతరించి, మించి సీతను లంకలోఁ గాంచి మరల
సంచితంబుగ నిట కరుదెంచి నపుడు, కూర్మి నెఱపెద నీతోడ గోత్రతిలక.

85

వ.

అని పలికి మహాబలనందనుం డాశైలంబుపైఁ గేలూది ప్రసన్నవదనుం డై
యచటు వాసి సముద్రపర్వతంబులు జాతకౌతూహలంబు లై తన్ను విలోకించి
యనేకవిధంబుల నాశీర్వదింప నిరాలంబం బగుగగనంబున కెగసి యమ్మహాగిరి
నవలోకించుచు వాయుమార్గంబున నమోఘరయంబునం జనియె నప్పుడు
రెండవదియైన తదీయదుష్కరకర్మంబుఁ జూచి దేవర్షిగంధర్వసిద్ధవిద్యాధరులు
పరమానందభరితాంతఃకరణు లై సాధువాక్యంబులం బ్రశంసించి రంత సహ
స్రాక్షుండు హిరణ్యనాభం బగుమైనాకంబుకడకుం జనుదెంచి మైత్రి నెఱపు
చుఁ బ్రమోదవిశేషంబున ని ట్లనియె.

86

ఇంద్రుఁడు మైనాకపర్వతమునకు వర మొసంగుట

చ.

ధరణిధరేంద్ర నిర్జరహితంబుగఁ బుట్టిన రామభర్త కి
ట్లిరవుగ దౌత్యము న్నెఱప నేగెడు నీవిపినాట మౌళికిం
గరము సఖుండ వైతి వటుగావున బంధుఁడ వీవు నాకు న
త్యురుతరపక్షయుగ్మమున నుర్విఁ జరించుచు నుండు మెప్పుడున్.

87


క.

నా కులిశము వలని భయము, నీ కెన్నఁడుఁ గలుగ దింక నీవు ముదముతో
లోకములకు ముద మొసఁగుచుఁ, జేకొని చరియింపుమయ్య శీతాద్రిసుతా.

88


క.

అని పలికి పాకశాసనుఁ డనిమిషపురి కరుగ నమ్మహాశైలము చ
య్యన నింద్రువరముఁ గైకొని, తనమనమున భయము విడిచెఁ దద్దయుఁ బ్రీతిన్.

89


వ.

ఆసమయంబున.

90


క.

సురమును లాహనుమంతుని, గురువీర్యము బలము నెఱుఁగఁగోరి రయమునన్
సురస యనునాగమాతను, బరికించి యుదంచితోక్తిఁ బలికిరి నెమ్మిన్.

91


ఉ.

ఇక్కపివీరుఁ డొక్కరుఁడె యేగెడు లంకకు నం దసంఖ్యు లై
రక్కసు లున్నవా రితనిరంగును వారిబలంబు లెట్లొకో
యెక్కువ తక్కువల్ దెలియు టెంతయు లెస్సయి యుండుఁ గాన నీ
వొక్కముహూర్తమాత్రము సముద్ధతి విఘ్న మొనర్పు త్రోవకున్.

92


వ.

మఱియుఁ బర్వతోపమం బైనఘోరరాక్షసశరీరంబు గైకొని గగనసమంబును
దంష్ట్రాకరాళపింగాక్షంబు నగువదనంబుతో నడ్డంబు చను మతండు ని న్నుపా
యంబున నిర్జించి చనునో విషాదంబు నొందునో యెఱుంగవలయు నని పలికిన
నాసురస యౌఁగా కని రయంబున.

93


ఉ.

లోకభయావహంబు నతిలోకము నైననిశాటిరూపముం
గైకొని యంజనాచలముకైవడి మే నమరంగఁ గిన్కతో
నాకసమందు మారుతరయంబున మబ్బులఁ దూలఁ దోలుచున్
వీఁక దలిర్ప నేగు కపివీరున కడ్డము నిల్చి యి ట్లనున్.

94

దేవతల వచనంబున సురస హనుమంతున కడ్డము వచ్చుట

క.

ఓరివనాటుఁడ నీ విపు, డారయఁగా నాకు భక్ష్య మైతివి నిన్ను
న్వారక పడి మ్రింగెద మ, ద్ఘోరాననగహ్వరంబు గొబ్బునఁ జొరుమా.

95


క.

నా విని శ్రీమంతుం డగు, పావని చేదోయి ఫాలఫలకంబున సొం
పావహిలఁ జేర్చి సురసా, దేవిం గని యిట్టు లనియె ధీరత్వమునన్.

96


చ.

ఇనకులభర్త రామవిభుఁ డింతియుఁ దమ్ముఁడు గొల్వ దండకా
వనమున సంచరించునెడ వంచన నవ్విభుదేవి జానకిం
గొని చనె పంక్తికంధరుఁడు గొబ్బున నయ్యమఁ జూడ లంక కొ
య్యనఁ జనుచున్నవాఁడ విమలాత్ముఁడు రాముఁడు పంప దూతనై.

97


ఉ.

కావున నీకు నోగిరము గా దగ దిప్పుడు లంకలోన న
ద్దేవిని జూచి రాఘవునిఁ దేర్చి త్వదాస్యము వచ్చి చొచ్చెద
న్బోవఁగ నిమ్ము నన్ను రఘుపుంగవుకార్యము భక్తియుక్తితో
నీవును జేయఁగా వలయు నెమ్మిగ రాఘవరాజ్యవాసినీ.

98


వ.

అని పలికిన.

99


ఉ.

అక్కపిఁ జూచి పల్కె నురగాంబ మహాక్రుధ నాకు నిచ్చటం
జిక్కితి వెందుఁ బోఁగలవు చెల్లదు నాకడ నీబలంబు నే
నిక్కము నిన్నుఁ బట్టుకొని నేర్పున మ్రింగక పోవనిత్తునే
తక్కక నాకు నిట్లు మును ధాతవరంబు కరంబు గల్గఁగన్.

100


ఉ.

నా విని క్రుద్ధుఁడై పవననందనుఁ డిట్లను నెల్లభంగులం
బోవలె నన్న నడ్డమయి పోవఁగ నీక మహాత్ముఁ డైనయా
భూవరుకార్యమున్ జెఱుపఁ బూనితి వీ వెటు నన్ను మ్రింగెదో
నీవిధ మంతఁ జూతు నిఁక నీవదనం బటు విచ్చి చూపుమా.

101

హనుమంతుఁడు సురసను జయించుట

ఉ.

అన విని నాగమాత జగమంతయు నద్భుత మంది చూడఁ జ
క్కన దశయోజనాయతము గాఁ దనవక్త్రబిలంబుఁ బెంచినం
గనుఁగొని వాయుపుత్రుఁ డలుక న్దశయోజనవిశ్రుతంబుగా
ఘనముగ మేనుఁ బెంప నది గన్గొని వెండియుఁ బన్నగాంబయున్.

102


సీ.

ఉరవడి నిరువదియోజనంబులు నోరు పెంచినఁ జూచి విపినచరుండు
ముప్పదియోజనంబులు మేను బెంచిన నురగాంబ నలువదియోజనములు
యాననం బెత్తిన నాతఁ డేఁబదియోజనములంతవాఁడైన నాగమాత
వెస షష్టియోజనవికృతాస్య గాఁగ వానరుఁడు డెబ్బదియోజనములయంత


తే.

యొప్పుటయుఁ జూచి యెనుబదియోజనములు
నోరు పెంచిన సురకాంత మారుతియును

బూని నవతియోజనములు మేను పెంప
నాతి శతయోజనంబు లాననముఁ బెంచె.

103


తే.

అంత శతయోజనాయతం బైనసురస
వదన మీక్షించి పవమానవరసుతుండు
కరము మతిమంతుఁ డౌటఁ దత్కాల మెఱిఁగి
పెరుఁగు టుడిగి శరీరంబు కుఱుచ పఱిచె.

104


తే.

చిత్రతరభంగి నంగుష్ఠమాత్రుఁ డగుచు, సురసదారుణవక్త్రంబుఁ జొచ్చి వేగ
వదనమార్గంబు వెలువడివచ్చి నగుచు, నంబరంబున నుండి యి ట్లనుచుఁ బలికె.

105


క.

నీకడుపుఁ జొచ్చి వచ్చితి, నాఁకలి దీఱెఁ గద యింక నవనీతనయం
దేఁకువ వెదకఁగ నేగెద, నీకు న్మ్రొక్కెదను గరుణ నెఱపుము తల్లీ.

106


తే.

అనిన సురకాంత నిజరూప మాశ్రయించి, వదననిర్గతుఁ డగుకపివరుని రాహు
వదననిర్గతుఁ డగుపద్మవైరివట్టు, లింపు సొంపార వీక్షించి యిట్టు లనియె.

107


ఆ.

కార్యసిద్ధి పొంటెఁ గడురయంబున నేగు, మనఘచరిత లంక కరిగి యందు
రాజపుత్రిఁ గాంచి రామునకు హితంబు, గూర్పు మదియె నీకు గుణము వత్స.

108


తే.

అని హితము దెల్పి దీవించి యరిగె సురస, యపుడు వేల్పులు హనుమంతుఁ డాచరించి
నట్టిమూఁడవ దగుకర్మ మరసి చూచి, హర్ష మిగురొత్తఁ గొనియాడి రాకసమున.

109


వ.

అంత హనుమంతుండు గరుత్మంతుండుం బోలె జవాతిరేకంబున నంబరంబున
కెగసి వారిధారాసేవితంబును బతంగనిషేవితంబును దుంబురుప్రముఖనిఖిలకైశి
కాచార్యచరితంబును నైరావతపరిష్కృతంబును సింహవ్యాఘ్రకుంజరపతగోరగ
వాహనసముహ్యమానసంపతద్విమలవిమానాలంకృతంబును వజ్రాశనిసమా
ఘాతపావకోపశోభితంబును గృతపుణ్యమహాభాగస్వర్గజిద్విరాజితంబును జిత్రభా
సునిషేవితంబును గ్రహచంద్రార్కనక్షత్రతారాగణవిభూషితంబును మహర్షి
గంధర్వనాగయక్షసమాకులంబును వివిక్తంబును విమలంబును విశ్వంబును విశ్వా
వసునిషేవితంబును దేవరాజగజాక్రాంతంబును జంద్రసూర్యపథంబును జీవ
లోకవితానంబును శివంబును వితతంబును బ్రహ్మనిర్మితంబు నగువాయుమార్గం
బున లంబపక్షం బగుపర్వతంబు కరణి నొప్పుచుఁ గాలాగరుసవర్ణంబు లగు
మేఘంబులఁ బవనునిభంగి విరియం దోలుచు సారెసారెకు మేఘంబుల
దూఱుచుఁ గ్రమ్మఱ వెడలుచుఁ బ్రావృట్కాలచంద్రుండుంబోలె శోభిల్లుచు
రక్తపీతసితాసితవర్ణంబు లగుమహాభ్రంబుల నూరువేగంబున నాకర్షించుకొని
యమోఘరయంబునం బోవు నప్పుడు.

110

సింహిక హనుమంతున కడ్డపడుట

చ.

ప్రకటజవంబునం జనెడు పావనిఁ గగ్గొని నీటిలోన సిం
హిక యన నొక్కరక్కసి యహీనకృపం దిను మంచు నాకుఁ బా

యక విధి పెద్దకాలమున కాఁకలి దీఱఁగఁ దెచ్చి పెట్టె ని
మ్మెకమును దీనిఁ బట్టుకొని మ్రింగెదఁ గా కని నిశ్చితాత్మయై.

111


శా.

ఛాయాగ్రాహిణి యౌటచే నది మహాసంరంభ మేపారఁగా
నాయంభోనిధినుండి మీఁదికి రయం బారంగ లంఘించి త
త్తోయాగ్రంబున దీర్ఘమై భయదమై దుర్వారమై పొల్చు త
త్కాయచ్ఛాయను బట్టి వేగ దిగిచెం గట్టల్క దీపింపఁగన్.

112


క.

సింహిక ఛాయం దిగిచిన, రంహ ముడిగి సాహసము పరాక్రమ మెడల
న్సింహపరాక్రముఁ డగుకపి, సింహుఁడు వెఱఁ గంది చాలఁ జింతించె మదిన్.

113


క.

ప్రతిలోమమారుతముచేఁ, బ్రతిహత మగునోడభంగిఁ బ్రక్షిప్తుఁడ నై
గతవేగుఁడ నై పంగూ, కృతవీర్యుఁడ నైతి నేల యెద్ది తెఱఁ గిఁకన్.

114


తే.

అనుచుఁ జింతించి నలుదెస లరసి చూచి
దివి పరీక్షించి క్రిందుగా దృష్టిఁ జొనిపి
తోయమున నున్నఘోరజంతువును గాంచి
మది వివేకించి యాహనుమంతుఁ డపుడు.

115


క.

ఉగ్రప్రేక్షణుఁ డై యా, సుగ్రీవుఁడు చెప్పినట్లు చూడఁగ నిది ఛా
యాగ్రాహిణి యౌ నిజముగ, నాగ్రహమున దీనిఁ జంప నగు నా కిచటన్.

116


ఉ.

అంచుఁ దలంచి వృష్టి సమయంబున మేఘముఁ బోలెఁ దా విజృం
భించి లయోగ్రమూర్తి గతిమించి సమంచితరౌద్రభంగిఁ గా
న్పించినఁ గాంచి రాక్షసియుఁ బెద్దబిలంబుక్రియ న్నిజాస్యముం
బెంచి ఘనంబుమాడ్కి నతిభీషణవైఖరి నార్చి పేర్చినన్.

117

హనుమంతుఁడు సింహికం జంపుట

చ.

అనుపమఘోరనారకగుహాసదృశం బగుదానివక్త్రము
న్గనుఁగొని వజ్రతుల్యఘనకాయుఁడు పావని బుద్ధిశాలి గా
వునఁ బరికించి చూచి తనువుం దగఁ గొంచెముఁ జేసి దారుణా
శనిగతి మింటనుండి పెలుచ న్దుమికె న్వెసఁ దన్ముఖంబునన్.

118


వ.

అప్పుడు.

119


క.

దానవవనితావక్త్రగు, వానరపరివృఢుని రాహువదనగతుం డౌ
భానునిఁ బోలెఁ గనుంగొని, దీనత్వముఁ బొంది రపుడు దేవతలు మునుల్.

120


ఆ.

అంతఁ గొంతవడికి నాహనూమంతుండు, కఱకుగ్రోళ్ల దానికడుపు సించి
రక్తసిక్తుఁ డగుచు రవిచందమున నొప్పి, వేగ తన్ముఖంబు వెడలి వచ్చె.

121


వ.

ఇట్లు నిర్గమించి దానిం గొండొక పొడువు గొని చని సముద్రోదకంబునం బడ
వైచె నంత నాలవది యైనతన్మహాద్భుతకర్మంబుఁ జూచి యాకాశచరంబు లగు
భూతంబు లప్పవననందనుకడకుం జనుదెంచి మహాత్మా ఘోరం బైనయీసత్వం

బు నీచేత నిహతం బయ్యె నీకు శుభం బగు నింక నెయ్యదియు నసాధ్యంబు
దెట్టికర్మంబులయందైన నీకు ధృతియు దృష్టియు మరియు దాక్ష్యంబును నశి
యింపకుండు నింక యథాసుఖంబుగాఁ జని రామునికార్యంబు సాధించి కీర్తి
వడయు మని పలికి యంతర్ధానంబు నొందె నంత హనుమంతుండు ప్రతిపన్న
ప్రయోజనుం డై శీఘ్రంబున గరుడునిభంగి నాకాశంబున కెగసి శతయోజనా
యతం బగుసముద్రంబు నవలీల దాఁటి వేలాతటంబుఁ జేరి నానావిధవనరాజి
విరాజితంబును వివిధద్రుమభూషితంబును మలయోపవనమండితంబును సాగ
రానూపసంభూతవివిధగుల్మలతావృతంబును సాగరపత్నీముఖోపలక్షితంబు నగు
లంకాద్వీపంబు గనుంగొని.

122


ఉ.

ప్రాకటభూరివారిదమువైఖరి నభ్రము నిండి యున్నయా
త్మాకృతిఁ జూచి యీఘనరయంబును దేజముఁ గాయవృద్ధి న
న్నాకరిపు ల్గనుంగొనిన నా కవరోధము గల్గుఁ గావునం
జేకొని గాత్రముం గుఱుచసేయుదుఁ గా కని నిశ్చితాత్ముఁ డై.

123


చ.

అనిలజుఁ డద్రితుల్య మగునంగము కొంచెము చేసి వెండి చ
య్యనఁ బ్రకృతిస్థుఁ డయ్యె బలి నాఁగి జగంబులు గొన్నవెన్క వా
నునుఁడు త్రివిక్రమాకృతిని మాటి యథాస్థితి నొంది నట్లు మం
తనమున యోగి మోహము నణంచి నిజస్థితి గొన్నకైవడిన్.

124

హనుమంతుఁడు లంబపర్వతముపై వ్రాలుట

వ.

ఇట్లు నానావిధరూపధారి యగుహనుమంతుండు నిజశరీరబాహుళ్యంబు కుఱుచ
పఱచి ప్రకృతిమాత్రుం డై సకేతకోద్దాలకనారికేళంబును నానావర్ణవిచిత్ర
ధాతుమండితంబును గగనచుంబిమహోన్నతశిఖరవిరాజితంబును బహువిధవిచి
త్రవనరాజివిభ్రాజితసానుతలంబు నగులంబాఖ్యపర్వతశిఖరాగ్రంబున వ్రాలె
నప్పుడు.

125


క.

తరుచరవీరునిపదహతి, నురవడి గిరి దరలఁ దరువు లూఁగఁగఁ బుష్పో
త్కరములు రాలెన్ ఖచరులు, వరమతిఁ గురియించుపుష్పవర్షము పోలెన్.

126


క.

సురసకుఁ జిక్కక సింహిక, కఱవక మైనాకమునకు నబ్బక యూర్పు
ల్నెఱపక శతయోజనములు, చిరగతి దాఁటియును గ్లానిఁ జెందండయ్యెన్.

127


క.

నడుమ నడు గిడక వ్రేల్మిడి, నుడుగక బహుశతసహస్రయోజనములు దాఁ
టెడుకపివరునకు నూఱా, మడ దాఁటుట యనఁగ నెంత మదిఁ బరికింపన్.

128


వ.

అంత నక్కొండమీఁదఁ గొండొకదడవు విశ్రమించి సమీరకుమారుండు
కట్టెదుట.

129


క.

రంగచ్చంపకకురవక, లుంగవకుళకుందమాతులుంగపనసనా
రంగకరవీరతిలకల, వంగక్రముకతరురమ్యవనవాటికలన్.

130

క.

జంబీరతాలవికసిత, జంబూహింతాలబిల్వసరళతమాలో
దుంబరనింబకపిత్థక, దంబవిరాజితవిశాలతరువిపినములన్.

131


క.

లలితసకలర్తుపల్లవ, ఫలకుసుమోల్లసితవృక్షపటలరణత్కో
కిలకీరశారికారవ, కలితమహోద్యానవాటికలఁ గనుఁగొనియెన్.

132


వ.

మఱియుఁ బవనసంచలితశాఖాశిఖాగ్రంబులును బుష్పభారనిబద్ధంబులును విహ
గాకీర్ణంబులు నగుసరళకర్ణికారఖర్జూరప్రియాళుముచిళుందకుటజకేతకీప్రియం
గుగంధపూర్ణనీపసప్తచ్ఛదాసనకోవిదారప్రముఖనిఖలతరువ్రాతంబుల నవ
లోకించుచు.

133


క.

వికసితపుష్కరకైరవ, మకరందరసోపభోగమత్తమధుపసం
ఘకలరవనినాదితహ, ల్లకరమ్యసరోవరంబులం గనుఁగొనుచున్.

134

హనుమంతుఁడు లంకాపురమును జూచుట

సీ.

పుండరీకోత్పలకాండాభిరంజితాయతపరిఖావృతం బైనదాని
శారదాంబుదతుల్యజాతరూపమహోన్నతాకారమండితం బైనదాని
గాంచనధ్వజపతాకామహాట్టాలకప్రాకారశోభితం బైనదానిఁ
గైలాసశిఖరసంకాశపాండురరత్నహర్మ్యవినిర్మితం బైనదాని


తే.

ఘనలతాపంక్తిచిత్రితకనకరత్న, తోరణకవాటచిత్రప్రతోళికాగ్ర్య
చత్వరవిశాలగోపురసౌధవిపణి, మానితస్తంభసంవృతం బైనదాని.

135


తే.

సంతతాట్టాలకావతంసకయు వప్ర, జఘనయు నవాంబుధౌతవస్త్రయు శతఘ్ని
కాత్రిశూలకేశాంతయుఁ జిత్రరత్న, నయన యై కాంతకైవడి ననుచుదాని.

136


వ.

మఱియు శూలముసలముద్గరభిండివాలకరవాజపటిసహస్తులును దంష్ట్రాకరాళ
ముఖులును భయంకరాకారులు నగురక్షోవీరులచేత సంరక్షిత క్ష్యాంతరం బగు
దాని నతిరమణీయగగనోల్లిఖితశిఖరిశిఖరసంకాశం బగుదాని ననంతబలసమేత
క్రూరమృగోరగసంకీర్ణం బగుదాని నాశీవిషసేవితం బైనమహాబిలంబుం బోలె
భయంకరరాక్షసకింకరసంకులం బైనదాని నతివిచిత్రశిల్పకౌశలవిశ్వకర్మనిర్మితం
బైనదాని ననంతబలసంపన్నరాక్షసరాజపాలితం బగుదాని మఱియును.

137


సీ.

రమణీయకాంచనప్రాకారవిజితాలకాపురం బైనలంకాపురంబుఁ
దపనీయమణిగణస్థగితపుష్కరచుంబిగోపురం బైనలంకాపురంబు
సంతానతరులతాజాలనిర్ణీతదేవతాపురం బైనలంకాపురంబు
జీవరత్నప్రభాజితరమ్యభోగవతీపురం బైనలంకాపురంబు


తే.

భీమనిర్ఘోషరాక్షసస్తోమములకుఁ, గాఁపురం బైనఘోరలంకాపురంబు
సమరనిర్జితత్రైలోక్యసంపదలకు, దాఁపురం బైనయట్టిలంకాపురంబు.

138


చ.

కని యరుదందుచున్ మిగులఁ గమ్రసుగంధిలతాశతంబులం
బెనఁగొని మింటితో నొరయు పేరగు మ్రాకుల నొప్పు గట్లసం

దున మృదుశాద్వలంబులఁ గనుంగొనుచుం దనరూప మేరికిం
గనుపడకుండ సత్వరముగం జనియె న్వడి లంక డాయఁగన్.

139

హనుమంతుఁడు లంకాసన్నివేశమును జూచి వితర్కించుట

వ.

ఇత్తెఱంగునం జని లంకయుత్తరద్వారంబునం జేరి దానిగుప్తికర్మంబును సాగ
రంబును ఘోరశత్రుం డైనరావణుని మనంబునం దలపోసి హనుమంతుం డిట్లని
వితర్కించె.

140


తే.

అరసి చూచిన నీలంక సురవరులకు, నైన రణమున సాధింప నలవిగాక
చెలఁగుచున్నది కపు లెట్టు చేరఁగలరు, చేరి రాక్షసవిభు నేమి చేయఁగలరు.

141


క.

రావణపరిపాలిత మగు, నీవిషమమహాపురమున కెటురాఁ గలఁడా
భూవిభుఁడు వచ్చియును ర, క్షోవిభు నెటు చంపఁగలఁడు ఘోరరణమునన్.

142


ఆ.

సామయుక్తి దీని సాధింపఁగా రాదు, దానయుక్తి దీనిఁ దలఁపరాదు
భేదమునకు నిది యభేద్యంబు నాలవ, సాధనమున కిది యసాధ్య మరయ.

143


ఆ.

వాలినందనునకు వనచరవిభునకు, నాకు నీలునకును నయ మెలర్ప
సత్వరముగ గతియు సంభావితం బగు, నలఘుభంగి నధికబలుల మగుట.

144


ఆ.

ఇప్పు డేటి చింత యిది నాకుఁ దగుభంగిఁ, బురముఁ జొచ్చి మనుజవరునిపత్నిఁ
గాంచి యవల రిపునికడిమి మాయింపంగ, హేతు వరసి నిశ్చయింతుఁగాక.

145


క.

అని పవమానతనూజుఁడు, తనమనమున నిశ్చయించి దశరథభూభృ
త్తనయాభ్యుదయరతుం డై, యనుపమమతి మరల నిట్టు లని చింతించెన్.

146


ఉ.

పాయక క్రూరకర్ము లతిబంధురసత్త్వులు తిగ్మతేజు ల
త్యాయతవిక్రము ల్రణవిహారులు దైత్యులు గాచి యున్నవా
రీయురుమూర్తితోడ నిపు డీపురమున్ జొరరాదు భూమిభృ
త్కాయులు రాక్షసాధములు గానక యుండ మొఱంగి చొచ్చెదన్.

147


వ.

మఱియు రాత్రిసమయంబున నిప్పురంబు సొచ్చి లక్ష్యాలక్ష్యం బగురూపంబున
జానకిం బరిశోధించెదఁ గాక యని నిశ్చయించి వెండియు దుస్సాధ్యయైనలంక
నవలోకించి తనమనంబున.

148


క.

క్రూరవిచారుఁడు ఘోరా, కారుఁడు రావణుఁడు వాఁడు గనకుండఁగ నే
నేరీతి లంక సొత్తునొ, యేరీతి మహీకుమారి నీక్షించెదనో.

149


క.

జనకజచందం బెట్లొకొ, జననాథునికార్య మెట్లు సాధింతునొ య
వ్వనితామణి నేకాంతం, బునఁ జూచెద సందియంబు పొందఁగ నేలా.

150


క.

వనరుహమిత్రోదయమునఁ, బనిపడి చీఁకటులుఁ బోలె బాలిశుఁ డగుదూ
తను గొని భూతార్థము ల, ట్లనిశంబు వినష్టఫలము లై చెడు ధాత్రిన్.

151


క.

దురహంకృతు లగుచారకు, లరయఁగఁ గార్యములఁ జెఱుతు రర్థానర్థాం

తరమున నిశ్చిత యయ్యును, సురుచిరముగ మంత్రబుద్ధి శోభింప దిలన్.

152


ఉ.

ఏగతి నబ్ధిసంతరణ మిప్పుడు వ్యర్థము గాక చెల్లు నిం
కేగతిఁ బుణ్యుఁ డైనమనుజేంద్రునికార్యము పాటి కెక్కు నే
నేగతి లంక సొత్తు దనుజేంద్రుఁడు గానక యుండునట్టు లం
దేగతి సంచరింపుదు మహీసుత నేగతిఁ గాంతు నిత్తఱిన్.

153


క.

లెక్కకు వెక్కస మై నలు, దిక్కుల రక్కసులు గ్రమ్మి ద్రిమ్మరుచున్నా
రిక్కడ ననుఁ జూచినఁ బని, చిక్కును దడ వుండ నిచటఁ జెల్లదు నాకున్.

154


క.

దానవు లెఱుంగ కుండఁగ, జానుగ నా కిచట మెలఁగఁ జన దిఁక నెవ్వా
రైన నిచటఁ జరియింపం, గా నేర్తురె రాక్షసులకుఁ గన రాకుండన్.

155


క.

దనుజాకృతిఁ గైకొని బో, రనఁ జొచ్చెద నంటినేని రాక్షసవీరుల్
గనుఁగొనుచుండఁగ నిప్పురి, ననిలుం డైనను జొరంగ నలుకు నురవడిన్.

156

హనుమంతుఁడు వానరరూపంబుతో రాత్రియందు లంకఁ జొచ్చెదనని నిశ్చయించుట

క.

దానవు లెఱుఁగని యర్థము, మానుగ నించుకయు లేదు మఱి యేరూపం
బే నిపుడు దాల్చి భూపతి, మానినిఁ గనుఁగొందు విభుని మన్ననఁ గందున్.

157


ఉ.

ఇంత విచార మేల నను నెవ్వరుఁ గన్గొనకుండఁ బద్మినీ
కాంతుఁడు గ్రుంకు నంత కిటఁ గౌతుక మొప్పఁగ నుండి రాత్రియం
దెంతయుఁ గీశరూపమున నీనగరం బటు సొచ్చి రామభూ
కాంతునిభామిని న్వెదకి కాంచెదఁ గా కని నిశ్చితాత్ముఁ డై.

158


వ.

సూర్యాస్తమయంబుఁ గోరుచు వైదేహీదర్శనోత్సుకుం డై యుండఁ గొండొక
దడవునకు సూర్యుం డస్తశిఖరిశిఖరాంతర్గతుం డయ్యె నంత హనుమంతుండు
మహోన్నతం బైనతనశరీరంబు కుఱుచపఱచి పృషదంశకమాత్రగాత్రుం డై
ప్రదోషకాలంబునఁ దత్పురగోపురప్రాకారాధిరోహణంబుఁ జేసి రమ్యంబును
సువిభక్తమహాపథంబును బ్రాసాదమాలావితతంబును గంధర్వనగరాకారం
బును శాతకుంభస్తంభవిరాజితంబును జారుచామీకరగవాక్షశోభితంబును
స్ఫటికోపలసంకీర్ణకార్తస్వరవిభూషితసప్తభౌమాష్టభౌమప్రాసాదోపలక్షితం
బును వైడూర్యమణివిచిత్రముక్తాజాలవిభూషితకాంచనతోరణరాక్షసాలయ
శోభితంబును హర్యక్షవిక్రమరణదక్షరక్షోభటవనసంకులంబును బాండురోద్విద్ద
విమానమాలాసమాకులంబును మహార్హజాంబూనదజాలతోరణంబును భీమరా
క్షసబలోపేతంబును నచింత్యంబును నద్భుతాకారంబును రావణబాహుపాలి
తంబు నైనలంకాపురంబు గలయంగనుంగొని విషాదహర్షంబులు మనంబునం
బెనంగొన వైదేహీదర్శనోత్సుకుం డై వెండియు నిరీక్షింప నప్పుడు.

159

హనుమంతుఁడు లంకాపురం బంతయుఁ గలయం జూచుట

ఉ.

హారపటీరహీరరుచి యై యుడుపంక్తులు చుట్టుఁ బర్వఁగా
ధారుణి నెల్లఁ గౌముదివితానముచే వెలుగంగఁ జేయుచు

న్మారుతితోడ సఖ్యము నొనర్పఁగ వచ్చినవాఁడు పోలె నా
సారసశాత్రవుం డపుడు చల్లనయై కనుపట్టెఁ దూర్పునన్.

160


శా.

శంఖక్షీరమృణాళవర్ణుఁ డగుచు న్సంభూతచంచన్మరు
త్కంఖాణద్యుతిమండలాంతరమునన్ గన్పట్టఁ జీఁకట్లనె
ల్లన్ ఖండించుచు నభ్రమధ్యగతుఁ డై రాణించుచంద్రు న్సరః
ప్రేంఖద్రాజమరాళమున్ బలెఁ గపిశ్రేష్ఠుండు గాంచె న్రహిన్.

161


వ.

ఇట్లు చంద్రోదయంబు నీక్షించి తన్మయూఖప్రకాశితసమస్తవిస్తార యగు
దాని రమ్యకాననతోయాఢ్య యగుదాని శారదాంబుధరసంకాశదివ్యభవనోప
శోభిత యగుదాని సాగరోపమనిర్ఘోష యగుదాని సాగరానిలసేవిత యగుదాని
సుపోషితబలసంగుప్త యై విటపావతిచందంబున నందం బగుదానిఁ జారుతోరణ
నిర్యూహ యై బాండురద్వారతోరణ యై శుభం బగుభోగవతీపురంబుకైవడిఁ గరం
బలరుదాని శాతకుంభమయమహోన్నతప్రాకారాభిసంవృత యగుదాని మంద
మారుతసంచార యగుదాని జ్యోతిర్మార్గనిషేవిత యగుదాని గింకిణీజాలనిర్ఘోష
పతాకాలంకృత యగుదాని లలితవైడూర్యవజ్రతలంబులఁ జారుచామీకరనూత
నకేతనంబులఁ బురందరచాపానుకూపవివిధవిచిత్రతోరణంబుల నగణితమణిప్రభా
పటలజటిలజాతరూపవితర్దికలఁదప్తహాటకనిర్యూహంబుల మణిస్ఫటికముక్తాఫల
విరచితకుట్టిమంబుల స్ఫాటికాంతరపాంసురూషితరాజతామలపాండురవైడూ
ర్యతలసోపానంబులఁ జారుసంజవనంబున రుచిరవితానంబులఁ గ్రౌంచబర్హిణరాజ
హంససంఘంబుల నలరు మహనీయద్వారంబులు గలుగుదాని ననల్పశిల్పికల్పిత
మణిమందిర యగుదానిఁ దూర్యాభరణనిర్ఘోషప్రతినాదిత యగుదాని దిగంత
శ్రాంత యగుదాని స్వర్గలోకంబుభంగి నింగి వెలుంగుదాని ననుత్తమ యగుదాని
రత్నవసనోపేతయుఁ గోష్ఠిగారావతంసకయు యంత్రాగారస్తనియు నై విలాస
వతిపోలికి మెప్పుదాని నచింత్య యై యప్రమేయ యై యసాధ్య యై యద్భుత
దర్శన యై యున్నదాని లంకాపురిఁ గలయ నవలోకించి విస్మయావిష్టహృద
యుండును సీతాదర్శనలాలసుండు నై తనమనంబున.

162


ఉ.

ఈనగరంబు బల్మిమెయి నెవ్వరికిం జొరఁ గూడ దైన నా
భానుతనూజుఁ డంగదుఁడు పావకపుత్రుఁడు కేతుమాలకుం
డేనును మైందుఁడున్ ద్వివిదుఁ డెంతయు సాహస మొప్పవచ్చి యీ
దానవువీఁడు సొచ్చి యలధాత్రిసుతన్ గొనిపోవఁ జాలమే.

163


ఉ.

రాముఁ డమోఘసాయకుఁడు లక్ష్మణుఁ డంతకు భంగిఁ బొల్చునీ
భూమికి వచ్చు టెంత నరభోజనులం బొలివుచ్చు టెంత యా
భూమిసుతం గడంగి గొనిపోవుట యెంత విచార మేల నా
కీమెయి శంక లేక పుర మిప్పుడు సొచ్చెద సీతఁ గాంచెదన్.

164

హనుమంతునకు లంక రాక్షసీరూపముతో నడ్డపడుట

చ.

అని తలపోసి రాత్రిసమయంబున నప్పురిఁ జొచ్చి ప్రీతితో
జనునెడ నిమ్మహాపురి నిశాచరిరూపముతోడ వాయుపు
త్రునిఁ గని భీకరాస్య యయి త్రోవకు నడ్డము వచ్చి నిల్చి క
న్గొనల మిణుంగుఱుల్ సెదర ఘోరఘనధ్వని మీఱ నిట్లనున్.

165


ఉ.

ఎచ్చటనుండి యెచ్చటికి నేగుచు నిచ్చటి కద్భుతంబుగా
వచ్చితి మర్కటాధము యవార్యభుజాబలశాలి రావణుం
డచ్చుపడంగ నేలెడు మహానగరం బిది నీతెఱంగు నా
కొచ్చెము లేక దెల్పుము సముద్ధతిఁ బ్రాణము గల్గి యుండఁగన్.

166


ఉ.

నావిని లంకతోఁ బవననందనుఁ డీనగరంబువాకిటం
గావలి యుండి క్రూరవచనంబుల న న్వెఱపించె దేల నా
త్రోవకు నడ్డమై యడుగు ద్రొక్కెద వెవ్వతె వీవు మున్నుగా
నీవిధ మంత దెల్పు మట నిక్కము నావిధ మంతఁ దెల్పెదన్.

167


చ.

అన విని యానిశాటి పవనాత్మజుఁ గన్గొని యేను లంక నీ
యనిమిషకంటకుం డగుదశాస్యునిపంపున నీపురంబు నే
ననిశముఁ గాచి యుండుదు దురాసదనై ననుఁ గానకుండ నె
వ్వరికిఁ జొరంగ రాదు నిను వారక యిప్పుడె దీర్చి పుచ్చెదన్.

168


వ.

అనిన నప్పవమావనందనుండు లంకావచనంబులు విని వృష్టిమేఘంబుభంగి
విజృంభమాణశరీరుం డై రెండవశైలంబుకరణి సుస్థిరత్వంబు వహించి స్త్రీ
రూపవికృత యగుదాని నవలోకించి యి ట్లనియె.

169


ఉ.

ఈపురిఁ గల్గు వప్రము లహీనవనోపవనప్రకాండముల్
గోపురము ల్విశాలగృహకూటములు న్మణిహర్మ్యసౌధము
ల్వాపులు కూపముల్ దరులు భ్రాజితమందిరచత్వరంబులుం
జూపుల విందుగా నిపుడు చూడఁగ వచ్చినవాఁడ రాక్షసీ.

170


క.

అన విని రాక్షసి మారుత, తనయునితో నిట్టు లనియెఁ దప్పక యనిలో
నను గెల్వక యీనగరము, సునిశితగతి నిపుడు నీకుఁ జొరరా దిచటన్.

171


క.

నా విని యారాక్షసితోఁ, బావని యి ట్లనియె నడిచిపడనేటికి నే
నీవీడుఁ జూచి వెస నీ, త్రోవ న్జనుదెంతు మరల దుర్దమలీలన్.

172

హనుమంతుఁడు లంకను జయించుట

క.

అని పవనసుతుఁడు పలికిన, విని రాక్షసవనిత క్రోధవికృతానన యై
ఘననాదంబున నార్చుచు, మునుకొని వెస నతనిఱొమ్ము ముష్టిం బొడిచెన్.

173


క.

పొడిచిన లావు చెడక య, ప్పుడు వాయుసుతుండు గ్రోధమూర్ఛితుఁ డై వే
పడఁతి యని చంప నొల్లక, పిడు గడచినభంగి దానిఁ బిడికిటఁ బొడిచెన్.

వ.

ఇట్లు హనుమంతునిచేత వ్రేటుపడి వజ్రప్రహారంబున ఱెక్కలు దెగి కూలుపర్వ
తంబుకరణి గాఢమూర్ఛాపారవశ్యంబునఁ బుడమిం ద్రెళ్లి కొండొకసేపునకు
లబ్ధసంజ్ఞ యై వికలంబు లైనయంగంబులు సవరించుకొని యన్నిశాచరి గద్గద
కంఠ యై సమీరకుమారు నవలోకించి యి ట్లనియె.

175


సీ.

కపివర్య కృప నన్నుఁ గావుము చంపకు మిలలోన నిది వధ్య మిది యవధ్య
మని యెఱింగి చరింతు రార్యులు నీచేత నేను నిర్జిత నైతి నిక్కువముగ
నెప్పుడు నినుఁ గీశుఁ డేతెంచి నిర్జించు నప్పు డిప్పురికిఁ జే టగు నటంచు
మును నాకు వర మిచ్చె వనజాసనుం డమ్మహాత్మునిపలు కసత్యంబు గాదు


తే.

తత్సమయ మిదె నీదు సందర్శనమునఁ, గదిసి వచ్చె మహీసుతాకారణమునఁ
గ్రూరరాక్షసు లందఱుఁ గూలఁగలరు, సమరమునఁ బంక్తికంఠుఁడు చావఁగలఁడు.

176


క.

అనిలజ నీ విపు డీపురిఁ, గని చొచ్చి యథాసుఖంబు గా నెల్లెడలన్
జనకజను వెదకి వచ్చిన, పను లన్నియుఁ దీర్చికొనుము భద్రాత్ముఁడ వై.

177


వ.

అని పలికిన.

178


క.

సముదితతేజుం డగునా, సమీరతనయుండు కామచారిణి లంక
న్సముదంచితవిక్రమమున, నిమేషమాత్రంబులోన నిర్జించి వడిన్.

179


క.

ఆవాకిటఁ బోవక లం, కావరణము కదులఘుత్వగతి దాఁటి రహి
న్బావని పురి సొచ్చి రఘు, క్షా్మావల్లభుసతిని వెదకఁ గౌతూహలి యై.

180

హనుమంతుఁడు లంకాపురముఁ బ్రవేశించుట

క.

పడఁతుక నెపమునఁ బతిచేఁ, జెడఁ గల దీలంక యింక సిద్ధం బనుచున్
ఎడమయడుగు మును పెట్టుచుఁ, గడురయమున రాజమార్గగతుఁ డై యరిగెన్.

181


వ.

ఇట్లు లంకాపురంబు ప్రవేశించి ముక్తాపుష్పవిరాజితం బైనరాజమార్గంబు దఱి
సి చిత్రమాల్యాభరణంబులును వివిధాకృతిరూపంబులును దూర్యఘోషపురస్స
రహసితోత్కృష్టనినదనినాదితంబులును వజ్రాంకుశనీకాశంబులును వజ్రజాల
విభూషితంబులును దీప్తకాంచనస్తంభనిర్మితంబులును శాతకుంభశిఖరంబులు
నగురాక్షసగృహంబులచేత నంబుదంబులచే నాకాశంబుభంగి వెలుంగుచునికి
నచ్చెరువందుచుఁ గైలాసశిఖరాకారంబు లగుసర్వతోభద్రపద్మస్వస్తికవర్ధమా
నాఖ్యప్రభుగృహభేదంబుల నెడనెడ గనుంగొనుచు నానందించుచు నురఃకంఠ
శిరస్స్థానోత్పన్నమంద్రమధ్యమతారకస్వరభూషితం బైనమదనముత్థరాక్షసాం
గనామధురగీతంబు నంబరంబున నప్సరఃకాంతలగీతంబుంబోలె మనోజ్ఞంబుగా
నాలకించుచు సోపానచరత్కాంతాజనమంజుమంజీరకాంచీనూపురనినదంబును
హేమదండతాడితభేరీమృదంగపటహాదిదివ్యవాద్యనిర్ధోషంబును హర్షోత్పన్న
క్రియావిశేషజనితశబ్దంబులును రాక్షసులసింహనాదంబులు నాకర్ణించుచు జపత
త్పరు లగుయాతుధానులమంత్రనాదంబులును స్వాధ్యాయనిరతు లగువారివేద

వేదఘోషంబులును రావణస్తవసంయుక్తు లగురాక్షసులగర్జారవంబులును
వినుచు రాజమార్గగతు లై విహరించురక్షోభటుల నిరీక్షించుచుం జనిచని మధ్య
మగుల్మంబున నగరవృత్తాంతవేదకు లగుగూఢచారులు దీక్షితుల జటిలుల ముండి
తశిరస్కుల వృషభచర్మధారుల స్వాధ్యాయనిరతుల దర్భలు కరంబులం గొని
యనిష్టనివారకానుష్ఠానంబు సేయుదర్భముష్టిప్రహరణులఁ గృత్యాదులం బుట్టిం
చి వానిచేత శత్రుమారణంబు సేయుటకు నాభిచారికహోమంబు గావించునట్టి
వహ్నికుండాయుధుల నేకాక్షుల నేకకర్ణుల లంబోదరపయోధరులఁ గరాళభుగ్న
వక్త్రుల విషమాచారుల వామనాకృతులఁ బుష్పమాలికాధరుల గంధానులిప్త
గాత్రుల విచిత్రకవచోజ్జ్వలుల నాతిస్థూలుల నాతికృశుల నాతికుబ్జుల నాతివామ
నుల విరూపుల బహురూపుల సురూపుల సువర్చుల వరాభరణభూషితుల నానా
వేషసమాయుక్తుల స్వేచ్ఛావిహారకుశలులఁ గూటముద్గరదండాయుధఖడ్గచాప
శతఘ్నీముసలపరిఘశూలవజ్రశక్తివృక్షపట్టిసాశనిక్షేపణిపాశధరుల మహాబలుల
శతసహస్రసంఖ్యాతుల రక్షోధిపతినిర్దిష్టు లై పురంబు సర్వంబు రక్షించు
చున్నరాక్షసవీరుల నవలోకించుచు గిరిమూర్ధప్రతిష్ఠితంబును మహహాటకతో
రణంబును బుండరీకావతంసపరిఘాభిసంవృతంబును హేమప్రాకారమండితం
బును ద్రివిష్టపసన్నిభంబును దివ్యంబును దివ్యనాదనినాదితంబును వామహేషిత
సంఘుష్టంబును భూషణస్వనసంకులంబును శ్వేతాభ్రనిచయోపరచతుర్దంత
దంతావళదానధారాపంకిలగృహాంగణంబును రథయానవిమానవిరాజితంబును
ననల్పశిల్పికల్పితరత్నపారావతప్రముఖపతత్రివిచిత్రితద్వారంబును ననేకసహస్ర
వీరరాక్షససురక్షితంబును స్వర్ణప్రాకారమండలయుక్తంబును మహార్హముక్తా
మణివిభూషితాంతరంబును బరార్థ్యకాలాగరుచందనాక్తంబు నగు రావణుని
యంతఃపురద్వారంబు సేరం జని యప్పుడు.

182


చ.

గురుతరపూర్ణచంద్రికలఁ గుంభిని నెల్ల వెలుంగఁ జేయుచు
న్సురవరు లెత్తుబల్‌దివియసొంపున గోష్ఠమున న్భ్రమించుసుం
దరవృషభంబు లీల వితతద్యుతి నంబరమధ్యవర్తియై
కర మలరారు చందురునిఁ గాంచె సమీరకుమారుఁ డయ్యెడన్.

183


వ.

మఱియును.

184


క.

జలధి కడ లెత్తి మ్రోయఁగఁ, గలువలు వికసింప లోకగతదుఃఖంబుల్
దొలఁగఁగ భూతవ్రాతము, లలరఁగఁ జంద్రుండు పొల్చె నంబరవీథిన్.

185


తే.

అవనిలో మందరాద్రిస్థ యైనలక్ష్మి
యంబువులయందుఁ గమలస్థ యైనశోభ
లలిఁ బ్రదోషములం దబ్బిఁ జెలఁగుకాంతి
శీతకరునందుఁ దగఁ బ్రకాశించె నపుడు.

186

చ.

సురుచిరపుష్కరస్థరుచిసొంపుగ నప్పులయందుఁ బోలె భా
సురతరసాగరస్థ యగుశోభ ప్రదోషములందుమాడ్కి మం
దరకుధరస్థలక్ష్మి వితతంబుగ ధారుణియందునున్ బలెం
గరము నిశాకరస్థ యగుకాంతి నభంబున నొప్పె నయ్యెడన్.

187


ఉ.

మందరకందరస్థ మగుమత్తగజేంద్రవిరోధిభంగి సొం
పొందఁగ పంజరస్థ మగునున్నతరాజమరాళము న్బలెం
బొందుగఁ గుంజరస్థుఁ డగుభూరిపరాక్రమశాలికైవడిం
జందురుఁ డొప్పె నప్పుడు విశాలతరద్యుతి నంబరస్థుఁ డై.

188


ఉ.

మానుగఁ దిగ్మశృంగ మగుమానితమత్తమహావృషంబుచం
దాన మహోచ్చశృంగ మగునవ్యతుషారనగంబుభంగి జాం
బూనదబద్ధశృంగ మగుభూరిమదేభములీలఁ బాండుర
శ్రీనిధి యైనచందురుఁడు చెన్నలరె న్బరిపూర్ణశృంగుఁ డై.

189


ఉ.

మోహనమూర్తియున్ జలధిమోహననందనుఁడు న్మహాగ్రహ
గ్రాహవినష్టపంకుఁడు ప్రకాశరమాశ్రయనిర్మలాంకుఁ డ
వ్యాహతరోచి నష్టశిశిరామృతపూరతుషారపంకుఁ డు
త్సాహము మీఱఁగా నలరెఁ జారుశశాంకుఁడు పుష్కరంబునన్.

190


క.

సమరస్థం బగుకరిచం, దమున శిలాతలము నొందినమృగేంద్రముమా
డ్కి మనోజ్ఞపూజ్యసామ్రా, జ్యము నొందిననృపతిభంగిఁ జంద్రుం డలరెన్.

191


మ.

ధవళాంశూదయనష్టదోషము ప్రవృత్తక్రూరరాత్రించర
ప్రవరోద్యత్పిశితాశదోషము లసద్రామాభిరామేరితా
ప్రవిషహ్యాత్మగతైకదోషము ఘనస్వర్గప్రకాశంబు నై
స్తవనీయంబుగ నేగె నప్పుడు ప్రదోషం బుర్వి రాగిల్లఁగన్.

192


వ.

ఇట్లు వెలుంగుచంద్రుం గనుంగొని యలరుచు నాహనుమంతుండు వెండియు.

193


చ.

సురుచిరతంత్రినిస్వనము శ్రోత్రసుఖంబుగ నాలకించుచుం
బురుషులుఁ గూడి తల్పములఁ బొంది సుఖంబుగ నిద్ర వోవుసుం
దరుల లసద్విహారము నుదంచితభంగి నొనర్పఁ బూనుని
ర్భరతరరౌద్రవృత్తు లగురాక్షసవీరులఁ గాంచె నయ్యెడన్.

194

హనుమంతుఁడు లంకాపురం బంతయుఁ గలయం దిరుగుట

తే.

స్యందనాశ్వభద్రాసనసంకులంబు, లనవరతవీరలక్ష్మీసమాశ్రయంబు
లుత్తమంబులు మత్తప్రమత్తతరము, లగుకులంబులఁ జూచె నయ్యనిలసుతుఁడు.

195


చ.

బిఱబిఱ డాసి యొండొరులఁ బిల్చుచు బాహువుల న్విదుర్చుచున్
ఉరములు దట్టుచు న్దనువు లొయ్యనఁ గాంతలమీఁద వైచుచు
న్బరుషమదప్రలాపములు పల్కుచు మేనులు పానమత్తు లై
మఱచుచుఁ జిత్రచాపములు మాటికి సూటిగ నెక్కుపెట్టుచున్.

196

వ.

మఱియు ననేకప్రకారంబుల దేహవికారంబులు నెఱపురాక్షసులఁ గలయ నవ
లోకించుచు వెండియు.

197


చ.

పురుషులఁ గౌఁగిలించుకొని పొందుగ నిద్దురవోవువారి భా
స్వరతరగంధలేపనము సల్ఫెడువారి సురూపవక్త్ర లై
సరసత నవ్వువారి నెకసక్కెము లాడెడువారిఁ శ్రద్ధ లే
పరుసము లాడువారిని క్షపాచరకాంతలఁ జూచె నయ్యెడన్.

198


క.

పరఁగ బుసకొట్టుకాకో, దరములచే మడువుఁ బోలె దంతావళభీ
కరవీరదానవులచేఁ, గర మొప్పెడునప్పురంబు గనుఁగొనియె రహిన్.

199


చ.

వితతజగత్ప్రధానులు వివేకధురీణులు శ్రద్ధధాను లం
చితరుచిరాభిధానులు విశేషబలు ల్వివిధాభిధాను లా
తతధిషణాప్రధానులు సదాసురభీతికరాభిధాను లు
న్నతపురి యాతుధానులు మనం బలర న్గనుపట్టి రయ్యెడన్.

200


చ.

వివిధగుణాభిరాములఁ బ్రవృద్ధుల నాత్మగుణానురూపులం
బ్రవిమలతేజుల న్వితతబంధురవిక్రమదుర్నివారుల
న్సువిహితబాహుసత్త్వుల మనోజ్ఞసురూపవిరూపధారులన్
దివిజవిరోధులం గనియె ధీరుఁడు వాయుకుమారుఁ డయ్యెడన్.

201


చ.

అరయ విశుద్ధభావల వరార్హల వల్లభసక్తభావల
న్మఱియు మహానుభావల సమంచితరూపల రమ్యరూపసుం
దరరమణోపగూఢల నదభ్రసదృక్షగుణప్రభావలం
దరుణులఁ గాంచె గంధవహనందనుఁ డంచితసౌధవీథులన్.

202


చ.

నిరుపమజాతరూపమణినిర్మితహర్మ్యతలంబులందుఁ బు
ష్కరశరదైవతోత్సవము సల్పి ప్రియాంకసుఖోపవిష్ట లై
సురుచిరరత్నహారపరిశోభితఘర్మజలార్ద్రగాత్ర లై
వరతనుకాంతి నొప్పు సురవైరినివిష్టలఁ గాంచెఁ గొందఱన్.

203


చ.

అనుపమరత్నహారరుచు లంగముల న్వెలుగంగఁ జేయ సి
గ్గునఁ దల వాంచి కాంతుల నకుంఠితలీలఁ గవుంగిలించుచున్
ఘనకుసుమోపగూఢవిహగంబులభంగి ముదం బెలర్ప మె
ల్లన సురతంబు సల్పెడు నెలంతులఁ గొందఱఁ గాంచె నచ్చటన్.

204


చ.

అరుదుగ నుత్తరీయరహితాంగులఁ గాంచినరాజవర్ణల
న్సురుచిరహేమవర్ణల మనోజ్ఞశశాంకకళంకవర్ణల
న్వరరుచిరాంగవర్ణల ధనంజయవర్ణలఁ జంద్రవర్ణలం
దరుణులఁ గొందఱం గనియె నాథవియుక్తల నప్పురంబునన్.

205


క.

అతులితమనోభిరాములఁ, బతులం గని ప్రీతియుక్తభావంబులతో

రతికి న్మెయికొనుదానవ, సతులం గలయంగఁ జూచె సామీరి యటన్.

206


తే.

జలజసంకాశనేత్రపంక్తులను జంద్ర, తుల్యముఖపంక్తులను దటిత్తులితరత్న
హారపంక్తుల దీప్తహేమాభవస్త్ర, పంక్తులను జూచె నచ్చటఁ బ్లవగవరుఁడు.

207


వ.

ఇత్తెఱంగున నచ్చటివారి నెల్లఁ గలయ నవలోకించి యప్పవమాననందనుండు
పరమాభిజాత యగుదాని రాజకులప్రజాత యగుదాని నయోనిజాత యగు
దాని సాధుజాత యగుప్రఫుల్లపల్లికైవడి నొప్పుదాని సంతతావిచ్చేదపాతివ్రత్య
రూపధర్మమార్గసన్నివిష్ట యగుదాని భర్తృచిత్తానుసారిణి యగుదాని రామునిం
బేర్కొని విలపించుదాని రామాలోకసనిశ్చయ యగుదానిఁ ద్రిజగన్నుతపతివ్ర
తాశిరోమణి యగుదాని విరహతాపపీడిత యగుదాని సానువృతాస్త్రకంఠి యగు
దాని వరార్హోత్తమనిష్కకంఠి యగుదాని స్నిగ్ధకంఠి యగుదాని వనపవృత్త యగు
నీలకంఠిపగిది నలరుదాని నస్ఫుటప్రకాశ యగుచంద్రరేఖలాగునఁ బాంసు
రూషిత యైనహేమరేఖకైవడి క్షతప్రరూఢ యగుబాణరేఖకరణి వాయు
ప్రభిన్న యగుమేఘరేఖచొప్పునఁ గృశాంగి యై యనావిష్కృతతేజోవిశేష యై
యంతర్వేదనాసహిత యై సమాధేయశైథిల్య యై యుండుదాని ననంతకల్యాణ
గుణసమేత యైనసీతం గానక దుఃఖాభిహతచిత్తుం డై కొండొకసేవు విచారించి
వెండియు లంకాపురంబు గలయ వెదకి.

208


సీ.

వరవజ్రగర్భితవైడూర్యతలములు భాసురస్ఫటికసోపానములును
మణిహారచారుహేమస్తంభపంక్తులు చిత్రకాంచనరత్నశిఖరములును
విలసితనవరత్నవేదికాతలములు ద్వారచిత్రితరత్నతోరణములు
మహితముక్తాజాలమయవితానంబులు బహుచిత్రశోభితభద్రవలభి


తే.

దనరి వీరరాక్షసరక్షితంబు వార
యువతిసేవితమును మంత్రియుతము వివిధ
చిత్రమృగచర్మవర్మరాజితము నగుచు
నలరునాస్థానసదనంబు గలయ వెదకి.

209

హనుమంతుఁడు ప్రహస్తాదులగృహములయందు సీతను వెదకుట

వ.

మఱియు రూప్యకోపహితహేమభూషితవిచిత్రతోరణంబును విశాలరుచిరకక్ష్యా
ద్వారసంవృతంబును గజహయస్యందనస్థవిగతశ్రమాసంహార్యమహామాత్ర
శూరసంసేవితంబును సింహవ్యాఘ్రచర్మనిర్మితతనుత్రాణోపేతంబును దాంతకాం
చనరాజితఘోషవద్విచిత్రరథచరితంబును బహురత్నసమాకీర్ణంబును బరార్థ్యాస
నభాజనంబును మహారథసమావాసంబును మహారథదర్శనీయపరమోదారవివిధ
బహుసాహస్రమృగపక్షిపరిపూర్ణంబును వినీతాంతపాలరక్షోగణసురక్షితంబు
ను ముఖ్యనరనారీపరిపూర్ణంబును ముదితప్రమదారత్నంబును వరాభరణనిర్హ్రాద
సముద్రస్వననిస్వనంబును వరార్హచందనలిప్తంబును రాజగుణసంపన్నంబును

మహాజనసమాకీర్ణంబును సింహాభిగుప్తవనప్రతీకాశంబును భేరీమృదంగశంఖపట
హపణవాదివాద్యస్వనసంకులంబును జందనాదినిత్యార్చితంబును దర్శపౌర్ణమా
సపర్వహుతంబును రాక్షసపూజితంబును సముద్రసమగంభీరంబును మహారత్న
పరిచ్ఛదంబును జందనాగరుధూపవాసితంబును మహాజనసమాకీర్ణంబును గజా
శ్వరథసంకులంబును మహనీయవపుర్విరాజమానంబును సింహాభిగుప్తగుహాస
దృశంబును నగురావణునిదివ్యమందిరంబుఁ గనుంగొని.

210


క.

అది లంకాభరణం బై, సదమలబహురత్నకాంతిసంభరితం బై
మదరాక్షససంకుల మై, త్రిదశపతిగృహంబుభంగిఁ దేజిలు చునికిన్.

211


వ.

మనంబున నచ్చెరు వందుచు.

212


క.

వనములఁ జూచుచు మేడలు, ఘనముగ నెక్కుచును గేళికాగృహముల నె
వ్వనికిం గనరాకుండఁగ, మునుకొని ప్రచ్ఛన్నరూపమునఁ గనుఁగొనుచున్.

213


వ.

మఱియుఁ గ్రమంబునఁ బ్రహస్తునినివేశనంబును వెదకి మహాపార్శ్వునినివా
సంబు నెమకి మేఘప్రతీకాశం బగుకుంభకర్ణునినికేతనంబు శోధించి విభీషణుని
మందిరంబు విమర్శించి మహోదరవిరూపాక్షవిద్యుజ్జిహ్వవిద్యున్మాలివజ్రదంష్ట్రుల
సదనంబులు పరామర్శించి ధూమ్రాక్షునిసద్మంబు వీక్షించి ఘనవిఘనసంపాతి
విద్యుద్రూపశుకసారణులగృహంబులు గనుంగొని యింద్రజన్నిశాంతంబు
విలోకించి జంబుమాలిరశ్మికేతుసూర్యశత్రువజ్రకాయధూమ్రాక్షశుకనాసవ
కశఠవికటులనివాసంబు లాలోకించి హస్తికర్ణునినిలయంబు పరీక్షించి యుద్ధో
న్మత్తమత్తదంష్ట్రరోమశధ్వజగ్రీవహస్తిముఖేంద్రజిహ్వకరాళపిశాచశోణితాక్ష
యూపాక్షభీమకవిద్యుత్కర్ణాశ్వకర్ణనాగేంద్రజిహ్వకుంభనికుంభాగ్నికేతు
రశ్మికేతుదేవాంతకనరాంతకాతికాయమహాకాయత్రిశిరఃప్రముఖయాతుధా
నులభవనంబులు కలయం దిరుగుచు లీలోద్యానంబులు వెదకుచు నెందును జా
నకిం గానక యన్నియు నతిక్రమించి పురోభాగంబున.

214


క.

నిర్మలవినూత్నమణిగణ, నిర్మిత మై రత్నజాలనికరావృత మై
శర్మద మై యలరారెడు, భర్మప్రాసాద మొకటి పరికించి తగన్.

215


వ.

అందు.

216


క.

శూలములు ముద్గరంబులు, వాలంబులు శక్తిభిండివాలపరశువుల్
గేల ధరియించి శౌర్యము, గ్రాలఁగఁ గాపున్నదనుజకాంతలఁ గాంచెన్.

217


వ.

మఱియును.

218


క.

వివిధమహోద్యానంబులు, వివిధలతాగుల్మములను వివిధతరువుల
న్వివిధనికుంజంబుల న, ప్పవమానసుతుండు గలయఁ బరికించె రహిన్.

219


క.

నానాప్రహరణపాణుల, నానారూపులను భయదనానార్భటుల
న్నానావర్ణశరీరుల, నానాఖ్యులఁ గనియెఁ బవననందనుఁ డచటన్.

220

వ.

మఱియు మహాజవంబు లగురక్తశ్వేతపీతసితవర్ణంబులును జాంబూనదపరిష్కృ
తంబులు నగుహయసహస్రంబులను మహామేఘంబుకరణి భీమనిర్ఘోషంబులు
సలుపుచుఁ బర్వతంబులపగిది మదంబు గురియుచున్న రూపసంపన్నంబులును
బరగజారుజంబులును నైరావతసమానంబులును గులీనంబులును గజవిద్యా
భ్యాసంబునందు శిక్షితంబులును బరసైన్యవిదారణంబులు నగుగజంబులను
మేఘస్తనితనిర్ఘోషంబులును సురాసురదుర్ధర్షంబులును హేమజాలపరిచ్ఛన్నంబు
లును దరుణార్కప్రతీకాశంబులు నగురథంబులను జామీకరవిభూషితంబు లగు
వాహినీశతంబులను మణినిర్మితవివిధాకారంబు లగుశిబికాసందోహంబులను విచి
త్రంబు లగులతాగృహచిత్రశాలాయుక్తగృహక్రీడాగృహంబులను దారుకు
యక్రీడాపర్వతంబులను గామోద్దీపకగృహంబులను దివావిహారోచితగృహంబు
లను గలయ నవలోకించుచు నగ్రభాగంబున మందరాచలసంకాశంబును క్రీడా
మయూరస్థానసంకులంబును ధీరనిష్ఠితమహాతరఫలంబును గైలాసగిరిసన్నిభం
బును ననంతరత్ననిచయంబును ధ్వజయష్టిసమాకీర్ణంబును నిధిజాలసమన్వితం
బును జాంబూనదమయశయనాసనమణిభోజనసంకులంబును క్షౌద్రవికారమద్య
కృతద్రవంబును గుబేరభవనంబుపగిది మనోజ్ఞంబును నసంబాధంబును సాద
విశేషయుక్తకాంచీనూపురమృదంగతలనిర్ఘోషనినాదితంబును బ్రాసాదసంఘాత
యుతంబును బద్మస్వస్తీకరచనావిశేషప్రకోష్ఠంబు నగురావణునియంతఃపురంబు
గనుంగొని.

221

హనుమంతుఁడు రావణునియంతఃపురముఁ బ్రవేశించుట

క.

దనుజపతితేజమున నూ, తనరత్నవిశాలరుచులఁ దద్వేశ్మము సాం
ద్రనిశితసహస్రరశ్ముల, నినునిపగిది వెలుఁగు చునికి నిచ్చ నలరుచున్.

222


తే.

చారువైడూర్యమణిగణస్ధగితహేమ, జాలమై చంచలాశక్రచాపపత్రి
జాలయుత మైన మేఘంబుసరణి నీగృ, హం బలరుచున్న దేమందు ననుచుఁ బొగడి.

223


వ.

అద్దివ్యమందిరంబు ప్రవేశించి.

224


చ.

కరిరథవాజిశాలలు ప్రకాశశిలీముఖచాపశాలలు
న్గురుతరవాద్యశాలలు మనోహరనూతనచంద్రశాల లం
బరతలచుంబిదివ్యమణిమండితకాంచననాట్యశాలలు
న్సురుచిరచిత్రశాలలును జూచె సమీరకుమారుఁ డయ్యెడన్.

225


చ.

అనిమిషదైత్యపూజితము లంచితచిత్రపతత్రిసంలస
ద్వనములు సర్వదోషపరివర్జితము ల్మయనిర్మితంబులు
న్ఘననసురాజితంబులు ప్రకాశమనోజ్ఞగుణోత్తరంబులు
న్దనుజవరేణ్యుసద్మములు తప్పక చూచెఁ గపీంద్రుఁ డయ్యెడన్.

226


వ.

ఇత్తెఱంగున నవలోకించి తన్మధ్యభాగంబున.

227

సీ.

రుచిరకాంచనచారురూపంబు నుచితమేఘసన్నిభము సమిద్ధరత్న
సంకీర్ణ మసురవంశశ్రేష్ఠకబలానురూప మప్రతిరూపరూప మలర
లోకతుల్యము సర్వలోకసంపత్సమాకీర్ణంబు కైలాసగిరినిభంబు
రమణీయహేమవిరాజమానము హృద్యవసురాశిశోభాప్రవర్ధమాన


తే.

మఖిలకిన్నరయక్షవిద్యాధరేంద్ర, గరుడగంధర్వచారణ సురవరేణ్య
దివ్యసదనాగ్రగణ్యంబు దేవదైత్య, చారణవరాంగనాశతసంకులంబు.

228


వ.

మఱియు నానాతరుకుసుమరజోవకీర్ణపర్వతాగ్రసదృశంబును సంచలితచంచలా
సమంచిత మగుపయోదముం బోలె నారీప్రవేకదీప్యమానంబును హంసప్రవేక
నముహ్యమానగగనగామిసుకృతివిమానసంకాశంబును నభోమణినిభాగణిత
మణిగణప్రభాధగద్ధగాయమానంబును బహుధాతుచిత్రనగాగ్రప్రతీకాశంబును
గ్రహచంద్రచిత్రవిష్ణుపథనికాశంబును సమూహీకృతనానావర్ణమేఘవద్విచిత్రం
బును బహురత్నచిత్రంబు నగునొక్కవిమానంబు గాంచి యందు.

229


చ.

ధరణీధరాళిపూర్ణ యగుధాత్రిని వృక్షవితానపూర్ణభూ
ధరముల నాత్తపుష్పపరిధానము లైనమహాద్రుమంబుల
న్గురుతరపద్మకేసరమనోజ్ఞము లైనసుమవ్రజంబులం
దరుచరవీరుఁ డచ్చట ముదం బలర న్బరికించె నత్తఱిన్.

230


చ.

అతులితపాండుపద్మముల నంచితనవ్యసరోవరంబుల
న్వితతసకేసరప్రచురనీరజసంఘముల న్మనోజ్ఞపు
ష్పితఫలితప్రపల్లవితశీతలవృక్షలసద్వనంబులం
గృతకవిచిత్రశైలములఁ గీశచమూపతి గాంచె నయ్యెడన్.

231


చ.

కృతకవిచిత్రపత్రమణికేసరహేమపతత్రిజాలము
న్దతవసుచిత్రపన్నగవితానముల న్ఘనజాతిఘోటక
ప్రతిమమహాతురంగముల రాజతహైమమృగప్రకాండము
న్వితతసరోజహస్తకరిణీగణము న్బరికించె నెంతయున్.

232


తే.

భూరివిద్రుమకాంచనపుష్పపక్ష, చిత్రితంబు లాకుంచితజిహ్మపత్ర
లసితములును నన్యోన్యాభిలపనము లగు, కాంచనవిహంగమంబులఁ గాంచె నచట.

233


చ.

కమలపలాశహస్తములు కాంచనకేసరయుక్తము ల్సుహ
స్తములు నియుజ్యమానము లుదగ్రతరంబులు నైనచిత్రహే
మమయమహాగజంబుల సమంచితనూతనపద్మహస్త యై
ప్రమద మెలర్పఁ గ్రాలు నవలక్ష్మిని గాంచెఁ గపీంద్రుఁ డత్తఱిన్.

234

హనుమంతుఁడు పుష్పకవిమానమును జూచుట

వ.

ఇ ట్లభినవవిచిత్రచిత్రకల్పితంబును శోభనాకారరచనావిశేషంబును బరమసు
గంధబంధురంబును వసంతకాలచారుకందరమందరసంకాశంబు నగువిమానంబు

శోధించి శ్రీయరుదందుచు దశముఖబాహుపాలిత యగునప్పురిం జరించుచుఁ
బతిగుణోత్కర్షవశీకృత యగుదానిఁ బరమపతివ్రతాశిరోమణి యగుదాని సన
త్కులప్రసూత యగుసీతం గానక శోభననీతిమార్గవర్తియుఁ గృతప్రయత్నుం
డును దూరసాక్షాత్కారసమర్థుండు నగుపవననందనుండు సుదుఃఖితుండును
బహువిధచింతాన్వితచిత్తుండు నై కొండొకసేవు ఱిచ్చవడి యుండి వెండియు
నక్కాంచనమందిరమధ్యంబున మణివజ్రచిత్రితం బగుదానిఁ దప్తహేమగవాక్ష
నిర్మాణం బగుదాని నప్రమేయాప్రతికారకృత్రిమం బగుదాని నిర్మాణకాలంబున
విశ్వకర్మచేతఁ బ్రశంసాపూర్వకంబుగా విరచితం బైనదాని నాకాశగతం బగు
దాని వాయుపథప్రతిష్ఠితం బైనదాని మార్తాండమార్గచిహ్నంబుకరణి నలరు
దాని నతిప్రయత్ననిర్మితసర్వస్థలం బగుదాని మహార్హరత్ననిచితం బగుదాని
సుప్రతిష్ఠితరచనావిశేషతిరస్కృతసురవిమానం బగుదాని మహావిశేషయుక్తం
బగుదానిఁ దపోనుష్ఠానపరాక్రమార్జితం బగుదాని మనోభిలషితసర్వదేశ
గమనశీలం బగుదాని ననేకసంస్థానవిశేషనిర్మితం బగుదాని నితస్తతస్తుల్య
విశేషదర్శనం బగుదాని స్వామిచిత్తం బెఱింగి వలసినచోటికిం జనుదాని
మహాత్ములును బుణ్యవంతులును మహర్ధులును మహానందులు నగుశక్రాది
దిగీశులసదనంబులచందంబున నందం బగుదాని విశిష్టదివ్యరత్నాదివస్తుజాతంబు
నవలంబించి దివ్యసంస్థానవిశేషణావస్థితంబుగా నిర్మితం బైనదాని విచిత్ర
కూటం బగుదాని ననేకావాంతరకూటాలంకృతం బైనదాని మనోభిరామం
బగుదాని శరదిందునిర్మలం బగుదాని విచిత్రకూటం బగుమేరుశిఖరంబు
చందంబున నందం బగుదానిఁ గుండలశోభితవదనులును విఘూర్ణితవిపర్యస్త
విశాలవిలోచనులును మహాశనులు నగుసునిర్మితప్రతిమాకారనిశాకరులచేత
నుహ్యమానం బగుదాని వసంతకాలికపుష్పసమూహచారుదర్శనం బగుదానిఁ
బుష్పకనామదివ్యవిమానంబుఁ గనుంగొని తన్మధ్యదేశంబున బహుప్రాసాద
సంకులంబును విపులంబును వర్ధయోజనవిస్తీర్ణంబును సార్ధయోజనాయ
తంబును జతుర్విషాణత్రివిషాణద్విరదపరివేష్టితంబును నసంబాధంబును నుద్య
తాయుధరక్షోభటరక్ష్యమాణంబును రాక్షసపత్నీసేవితంబును బలాత్కారాక్ర
మ్యమాణరాజకన్యాసంకులంబును నక్రమకరతిమింగిలఝషపన్నగకమఠాకుల
వాయువేగసమాధూతసాగరోపమంబు నగునొక్కమహనీయహర్మ్యంబు విలో
కించి తన్మధ్యంబున.

235


చ.

ధనదుగృహంబుకంటె బలదాననభంజనువీటికంటె ధ
ర్మునిసదనంబుకంటె నలరుద్రునిగేహముకంటె గంధవా
హునిసదనంబుకంటెను బయోధిపుసద్మముకంటె హవ్యభు
గ్ధనుజులయిండ్లకంటె నధికద్యుతి నొప్పెడుదాని నెంతయున్.

236


క.

వారిజగర్భునకుం దప, మారయఁ గావించి ధనదుఁ డర్థిం గొన దు

ర్వారగతి నతని గెలిచి యు, దారత రావణుఁడు గొన్నదాని న్మిగులన్.

237


చ.

ఉరుతరభర్మనిర్మితము లుజ్జ్వలరత్నమయంబు ప్రస్ఫుర
ద్వరణసమావృతంబు సముదగ్రగృహప్రకరంబు లోకసుం
దరమును విశ్వకర్మరచితంబును బుష్పసుగంధదీపస
త్పరిమిళితంబు కామగమభద్రవితానవిరాజితాంగమున్.

238


వ.

మఱియు మత్తవారణసంకీర్ణంబును సర్వరత్నవిభూషితంబును గృత్రిమమృగ
సమాయుక్తకార్తస్వరహిరణ్మయసుకృతస్తంభసంవృతంబును గగనోల్లిఖతమేరు
మందరసంకాశశుభాకారకూటాగారాలంకృతంబును జ్వలనార్కప్రతీకాశహే
మసోపానసంయుక్తంబును బద్మరాగమణిస్థగితచారువితర్దికాశతవిరాజితంబును
గాంచనస్ఫాటికజాలవాతాయనయుక్తంబును నింద్రనీలమహానీలమణిప్రవరవే
దికంబును మహాధనవిద్రుమవిచిత్రనిస్తులముక్తామణిన్యూతకుట్టిమవిరాజితంబు
ను దపనీయనిభసుగంధిరక్తచందనానులిప్తంబును దరుణాదిత్యసంకాశంబును
నానావిధవరాకారకూటాగారపరిష్కృతంబు నగుదివ్యవిమానరత్నంబుఁ గాంచి
తన్మందిరమధ్యంబున శోభనస్వరూప యగుదాని రూపవతి యైనకాంతయుం
బోలె రావణునకు మనఃకాంత యగుదాని సువర్ణగవాక్షవిరాజిత యగుదాని
స్ఫాటికావృతకుట్టిమ యగుదాని మధ్యమధ్యదంతాంతరితనిర్మితరూపంబులు
గలదాని ముక్తాప్రవాళరూప్యచామీకరవిభూషితమణిస్తంభభూషిత యగుదా
నిఁ బక్షంబులచేతంబోలె మణిభూషితసమావక్రకాంచనస్తంభంబులచేత నాకా
శంబున కుద్గమింప గమకించుచున్నదానిచందంబునం జూపట్టుదాని సరిత్సముద్ర
గిరిరాష్ట్రాదిపృథివీలక్షణాంకితమహావిశాలచిత్రరత్నకంబళాస్తీర్ణ యై సరాష్ట్రగృ
హమాలిని యగుపృథివిభంగి నొప్పుదాని మత్తవిహంగసన్నాదిత యగుదాని
దివ్యగంధాధివాసిత యగుదానిఁ బరార్థ్యాస్తరణోపేత యగుదానిఁ జంద
నాగరుధూపవాసిత యగుదాని హంపచ్చదచ్చాయపగిది నతిపాండర యగు
దానిఁ బుష్పోపహారవిచిత్రసుప్రభాకలిత యై కల్మాషియుంబోలె సర్వానందదా
యిని యగుదాని మనస్సంహ్లాదజనని యగుదాని వర్ణప్రసాదిని యగుదాని శోక
నాశని యగుదాని సమస్తశోభాజన్మసీమ యగుదాని నొక్కవిశాలశాల నవలో
కించి తదీయసుషమావిశేషంబున కిచ్చ మెచ్చుచు గంధవాహుండు రూపవం
తుండై రావణుం డిచ్చోట వసియించి యున్నవాఁడని యెఱింగించుటకు బం
ధుం డుత్తమబంధునింబోలె మహాసత్త్వుం డగుహనుమంతు నెదుర్కొనియెనో
యన్నచందంబున గుబాళించుపానభక్ష్యాన్నసంభవం బైనసముచ్ఛ్రితదివ్య
గంధం బాఘ్రాణించి యరుదందుచుఁ దల్లి యుంబోలె నింద్రియపంచకంబు
నింద్రియార్థపంచకంబునఁ దృప్తినొందించుచునికి నానందించుచు.

239


క.

సురజగమొ బ్రహ్మలోకమొ, పురహరలోకంబొ స్వర్గపురమో దేవే
శ్వరులోకమొ యిది యని య, త్తరుచరవీరుండు మదిని దలఁచుచు మఱియున్.

240

క.

తలకొని జూదంబున ధూ, ర్తులచే నిర్జింపఁబడినధూర్తులక్రియ మి
క్కిలి ధ్యాన మలమి యున్న, ట్లలరు కనకదీపకళిక లటు గనుఁగొనియెన్.

241


క.

వరరూపరుచుల దశకం, ధరుతేజంబున విభూషణవ్రాతమనో
హరకాంతులఁ దన్మందిర, మరుదార వెలుంగు చునికి నతివిస్మితుఁ డై.

242


క.

వితతమణిమయకవాట, ప్రతతులచే రుచుల వెలికిఁ గ్రక్కుచు నున్న
ట్లతులితగతి నొప్పుతద, ప్రతిమానగృహంబు సొచ్చె బరమలఘుగతిన్.

243

హనుమంతుఁడు పుష్పకాంతర్గతంబుల సీతను వెదకుట

వ.

ఇ ట్లమ్మరున్నందనుండు దూరప్రణిహితేక్షణుండై పాదన్యాసంబునం జప్పుడు
కాకుండ మెల్లనఁ జొచ్చి యందు నానావర్ణాంబరపుష్పదామంబును నానావేష
విభూషితంబును బాననిద్రావశ౦గతంబును మదనక్రీడావ్యాయామపరిశ్రాంతం
బును నిశ్శబ్దాంతరభూషణంబు నై నిశ్శబ్దహంసభ్రమరం బైనపద్మవనంబుచూడ్కి
రత్నకంబళాస్తరంబుపై నిద్రించుచున్న వరనారీసహస్రంబు నవలోకించి.

244


క.

ముకుళితనయనంబులతోఁ బ్రకటితదంతములతోడ భాసురనీలా
లకములతో నొప్పెడుత, ద్వికచాక్షులయాననములు వీక్షించి రహిన్.

245


మ.

పవ లెల్ల న్వికసించి రాత్రులు తమఃప్రవ్యక్తిచే మోడ్చుచు
న్కి వధూవక్త్రము లంబుజంబు లని యెంతే ప్రీతిఁ దద్గంధముం
బవమానుం డొసఁగంగ మూర్కొని యళు ల్సంగీతసన్నాదవై
భవయుక్తిం గడు మ్రోయుచున్కి గుణసంపన్నుండు సానందుఁడై.

246


తే.

మఱియు మాధుర్యసౌరభ్యమాంద్యశైత్య
మార్దవాదికగుణముల మలయు చునికి
నీవెలందులముఖములు హృద్యపద్మ
సమములై యుండుటకు నేమి సందియంబు.

247


క.

దేవాంగనాసమావృత, మై నఱలెడు వైజయంతహర్మ్యముక్రియ నే
డీవరగృహము నిశాటీ, వ్యావృతమై యొప్పుచున్న దద్భుతభంగిన్.

248


తే.

మఱియు నీరత్నమయదివ్యమందిరంబు, దనుజకాంతాపరీతమై తారకాభి
రాజితం బైనశారదాభ్రంబుమాడ్కిఁ, గన్నులకు వింతయై యొప్పుచున్న దహహ.

249


ఆ.

మఱియుఁ బుణ్యశేషపరివృత లై యాక, సమున నుండి పుడమి జాఱిపడిన
తార లగుట నిక్క మీరాజముఖులు లే, కున్న వీరి కింత యొప్పు గలదె.

250


క.

ఈయెలనాగలదేహ, చ్ఛాయలచే నివ్విచిత్రసదన మలరెడిన్
బాయక వినూత్నతారా, చ్ఛాయలచే నలరు నాకసముచందమునన్.

251


వ.

అని బహుప్రకారంబులఁ దదీయప్రభావంబు వక్కాణించుచు నక్కాంతలలో
నఁ గొందఱు పానానంతరగీతనృత్యాదివ్యాపారకాలంబునందు నిద్రాపరవశలై
తిలకంబులు మాసియుఁ గొంద ఱందియ లూడ్చియుఁ గొందఱు వలువలు వీడి

యుఁ గొందఱు కుసుమమాలికలు కొప్పులం జాఱియుఁ గొందఱు కెలంకుల
ముక్తాహారంబులు రాల మేఖలలు వదలఁ బరస్పరాంగంబులఁ బతులంబలెఁ
గౌఁగిలించియు భూషణంబులు నెఱయ మెఱయుతమతమవదనంబులు కమలంబు
లని తావులకుఁ దేంట్లు ముసరి వివృతవదనలును వికీర్ణకేశపాశలు నై వాహిత
బాలాశ్వంబులపగిది నేలం బడి పొరలుచు ముఖపద్మంబులు వేణీభుజంగంబులు
నాభీసరోవరంబులు జఘనపులినంబులు బాహుబిసంబులు కూర్మపద్మంబులు
జంఘికామకరంబులు నేత్రమీనంబులు వక్షోజచక్రంబులు గలిగి సుప్తవాహి
చందంబున నందంబగువారి విలోకించుచు.

252


మ.

తతమాణిక్యవిభూషణంబులు లసద్వైడూర్యహారంబు లా
తతముక్తామణిదామముల్ మరకతోత్తంసంబులుం బొల్చె ని
ద్రితదైతేయకులాంగనాళికుచనీరేజాతమధ్యంబునం
దతులశ్రీకరచక్రవాకబకహంసాళిప్రతానోన్నతిన్.

253


క.

లలితాంగంబులయందును, విలసితకుచతటములందు విమలమణిగణో
జ్జ్వలభూషణరేఖలు చె, న్నలవడ భూషణము లట్టు లలరారె రహిన్.

254


క.

మాసితనవాంబరాంతము, లాననపవమానవిచలితాగ్రము లై య
య్యాననములపై మాటికి, మానుగ నొప్పారెఁ జిత్రమంజులకాంతిన్.

255


సీ.

కమనీయమరకతగైవేయకాంతులు రమణీయవక్త్రమూలముల వెలయఁ
దపనీయమణిజాలతాటంకరోచులు గండపాండిమపొత్తు గలసి మెఱయ
రుచిరవజ్రోపలవిచికలద్యుతులు నీలాలకంబులతోడ నౌఘళింపఁ
గనకకాంచీరణద్ఘంటికారుచులు మానితనితంబములపై నృత్య మాడ


తే.

భూరిమాణిక్యరుచిరకేయూరరుచులు
బాహుమూలజద్యుతులతో బలిసి కలయ
లీలమైఁ జాలు గొని పవ్వళించి యున్న
రాక్షసాధిపుప్రాణవల్లభలఁ గనియె.

256


క.

ఆసతులసురభిముఖని, శ్శ్వాసము మైరేయకుసుమశర్కరఫలమ
ధ్వాసవసుగంధభరితం, బై సుఖముగ సుడిసె నలదశాస్యునిమీఁదన్.

257


క.

కొందఱు రావణువనితలు, సందునఁ జాలు గొనియున్నసవతులముఖము
ల్పొందుగ సారెకు మూర్కొని, రందంబునఁ బంక్తికంధరాననశంకన్.

258


వ.

మఱియు నయ్యింతులు రాగాంధ లై రావణునియందు మిక్కిలి సంసక్తచిత్తు
లగుటం జేసి సపత్నులచేత నుపాఘ్రాతవదన లై తదాఘ్రాణనంబు పతికిం బ్రియం
బని తలంచి సపత్నులకుం బ్రియంబు గావించి రదియునుం గాక.

259


తే.

మఱియుఁ గొందఱు వనితలు మంతనమునఁ
బారిహార్యవిభూషితబాహువులను

దలగడలఁ జేసి లలితవస్త్రములమీఁదఁ
బవ్వళించి నిద్రించిరి భాసురముగ.

260


ఉ.

ఒక్కవెలంది వక్షమున నొక్కతె దానిభుజంబుమీఁద వే
ఱొక్కతె దానియంకమున నొక్కతె దానినితంబమందు నొం
డొక్కతె దానిపార్శ్వమున నొక్కతె దానివెడందవీపుపై
నొక్కతె గాఁగ ని ట్లసురయోష లొగి న్నిదురించి రయ్యెడన్.

261


వ.

మఱియుఁ గొందఱు యువతులు మదనస్నేహవశానుగలై యూరుపార్శ్వకటిపృ
ష్ఠంబు లితరేతరంబు గలయవైచుచుఁ బరస్పరనివిష్టాంగు లై యన్యోన్యగాత్ర
సంస్పర్శంబువలన నలగుచు నేకీకృతభుజ లై సుషుప్తి నొంది రి ట్లన్యోన్యసూ
త్రగ్రథిత యై యవ్వనితామాల సూత్రగ్రథిత యైనమత్తమధుకరకలితపుష్పమా
లచందంబున నందం బగుచుండె మఱియు నయ్యువతీవనంబు పరస్పరమాలాగ్ర
థితం బై సంసక్తకుసుమోచ్చయం బై వ్యతివేష్టితమస్కంధం బై యన్యోన్యభ్ర
మరాకులం బై మధుమాసంబునందు వాయుసేవనంబువలన వికసించినలతా
వనంబుభంగి నయ్యె నప్పు డుచితస్థానసంస్థితంబు లై నయతరుణులభూషణాం
గాంబరపుష్పదామంబుల వివేకంబు సువ్యక్తంబుగాఁ జేయుట కశక్యం బై
యుండె రావణుండు సుఖసంవిష్టుం డగుచుండఁ గాంచనస్తంభగతదీపంబులు వివిధ
ప్రభాభాసిత లగునయ్యువతుల స్వైరవిహారకర్మంబు ననిమిషత్వంబు నొందిన
వానితెఱంగున విలోకించుచుండె నయ్యవసరంబున నాహనుమంతుండు మెల్లన
నప్పల్లవాధరలమధ్యంబునం జొచ్చి యంతనంతఁ గలయ నవలోకించుచు.

262


మ.

ఒకవంకం దెలిచందురా జగతిపై నొప్పారుపూసెజ్జపై
నకలంకోజ్జ్వలహారపంక్తు లెద నవ్యక్తంబులై క్రాల ద
ర్పకకేళిం గడు డస్సి మైమఱచి సాంద్రప్రీతి నిద్రించుచు
న్నకృతామోదలఁ గామరూపిణుల మాన్యస్త్రీల వీక్షించుచున్.

263


సీ.

రాజర్షిభామల రాక్షసకాంతల దైత్యాబ్జముఖుల నాదిత్యసతుల
గంధర్వకిన్నరగరుడవిద్యాధరప్రమదల మఱి భోగిభామినులను
గొందఱు రణమునఁ గొన్నవారలును కొందఱు మదయుత లౌచుఁదారు కామ
వశగలై వచ్చినవారలు నందఱు రావణేశ్వరునందు భావబద్ధ


తే.

రాగలై భోగతృప్తలై రమణ మీఱి, యొప్పుచును మద్యకృతమోహ ముప్పతిల్ల
మూలమూలల వేర్వేఱ చాలు దీరి, కన్ను గూర్కెడువారలఁ గాంచె నపుడు.

264


వ.

మఱియు నిచ్చట నున్నవనితలలోన నొకతె యైన వీర్యబలంబున నిర్జించి బలా
త్కారంబునం గొని తెచ్చినయదిగా దన్యకామయు నన్యపూర్వయు నకులీనయు
హీనరూపయు నసమర్థయు ననుపచారయుక్తయు నకామనీయయు నొకతెయైన
లే ద ట్లందఱ విలోకించి హనుమంతుండు తనమనంబున.

265

హనుమంతుఁడు దేవనాగరాక్షసకాంతలం జూచి వితర్కించుట

ఉ.

అందఱు దైత్యసక్తమతు లందఱు చారుమనోహరాంగు ల
ట్లందఱు గంధలిప్తతను లంద ఱమానుషభోగయుక్త లిం
దందఱు దైత్యరాజహృదయార్పితచిత్తలు జాతకౌతుకల్
పొందుగ వీరిలోన నృపపుత్రిక యేల వసించు నారయన్.

266


మ.

తనభాగ్యంబు యశంబు పోవుటకు నీదైత్యేంద్రుఁ డాధారుణీ
తనయ మ్రుచ్చిలి తెచ్చెఁ గాక సుగుణుం ద్రైలోక్యనాథున్ జగ
ద్వినుతు న్రామునిఁ బాసి యవ్వనిత దుర్వృత్తున్ దురాధర్షు నీ
దనుజున్ గోరి భజించునే యిచట సంతాపంబు లేకుండునే.

267


ఉ.

ఎచ్చట డాఁచినాడొ దనుజేశ్వరుఁ డమ్మనుజేంద్రనందని
న్సచ్చరిత న్ద్రిలోకనుతచారుగుణ న్సుజనాభిజాత నే
నిచ్చటఁ జూచిన న్దొరకునే ఖలుఁ డాయమ కెగ్గు చేసి సం
పచ్చిరభోగభాగ్యమహిమంబులు గోల్పడె నాఁటినాఁటికిన్.

268

హనుమంతుండు రావణునిం జూచుట

వ.

మఱియు నీరాక్షసరాజభార్య లెట్లు స్వభర్తృవిశిష్ట లై రట్లు రాఘవధర్మపత్ని
రావణునిచేతఁ బ్రత్యర్పిత యై స్వభర్తృవిశిష్ట యయ్యెనేనియు నీరావణునిజన్మంబు
శోభనం బగుఁ గదా యనియు నీరాక్షసరాజభార్య లెట్టు రావణునిచేత హృత
లై రట్లు రాఘవధర్మపత్ని హృత యయ్యె నిక్కారణంబున రామునిచేత నిహ
తుం డై రావణుండు కృతార్థుం డగుఁ గదా యనియు నీరాఘవధర్మపత్ని
రావణునిచేత నెట్లు హృత యయ్యె నట్లే రాక్షసరాజభార్యలు హరీశ్వరుం డగు
సుగ్రీవునిచేత బలాత్కారంబున నపహృత లై రేని యాసుగ్రీవునిజన్మంబు సాఫ
ల్యంబు నొందుఁగదా యనియు నీరాక్షసరాజభార్య లెట్లు నాచేత సందృష్ట లై
గట్లు రాఘవధర్మపత్ని నాచేత సందృష్ట యయ్యెనేని మదీయసుకృతంబు పరిపా
కంబు నొందుఁ గదా యనియు నీరాక్షసరాజభార్య లెట్లు నాచేత సందృష్ట లై
రట్లు రాఘవధర్మపత్ని సందృష్ట యయ్యెనేని జానకీసందర్శనంబు గలుగమిరామ
సుగ్రీవులవలని భయంబునఁ బ్రాయోపవేశంబు గావింప నుద్యుక్తం బైనయంగ
దాదివానరసమూహంబునకు సుజాతం బగుఁ గదా యనియు నీరాక్షసరాజు
భార్య లెట్లు జీవించి యున్నవా రట్లు రాఘవధర్మపత్ని జీవించియుండెనేనియు
సీతాప్రాణసంశయవ్యదితాత్ముండై యున్న యారామునకు స్వజీవలాభసుజాతం
బు గలుగుఁ గదా యనియు రాక్షసేంద్రా యీయీవెలందులు నిన్నుంగూడి సుఖించి
నట్లు రాఘవధర్మపత్ని రామునిం గూడి సుఖించెనేని సర్వసంపత్సమృద్ధియుక్త
పుత్త్రపౌత్త్రమిత్రాదిసహితుండ వైననీకు సుజాతం బని రావణునకు హితం బుప
దేష్టవ్యం బనియు నీరాక్షసరాజభార్య లందఱు సామాన్యరూపలక్షణయుక్తలు
రాఘవధర్మపత్ని త్రిలోకసుందరి గావున వీరిలోన నద్దేవి లేదనియు నిట్లు

బహుప్రకారంబుల వితర్కించుచు నమ్మహీనందని పాతివ్రత్యాదిగుణంబులవలన
నిశ్చయంబుగా విశిష్టయై యుండునట్టి పతివ్రతాశిరోమణియందు రావణుం డప
హరణరూపదుష్కర్మం బాచరించె నెంత కష్టం బని రావణుని దౌర్జన్యంబునకు
గర్హించుచు సాధుబుద్ధి యగుహనుమంతుండు తత్పరిసరంబున మహేంద్రశయ
నోపమంబును ముఖ్యంబును స్ఫాటికాంతరకుట్టిమంబును రత్నభూషితంబును
దాంతకాంచనవిచిత్రాంగవైడూర్యవరాసనమహార్హాస్తరణమహాధనోపపన్నం
బు నగునొక్కపర్యకంబుఁ జూచి యం దొక్కదేశంబునఁ బుష్పమాల్యవిభూషితం
బును జాతరూపపరిక్షిప్తంబును దారాధిపన్నిభంబు నగుపాండరచ్ఛత్రంబు
విలోకించి తన్మధ్యభాగంబునఁ జిత్రభానుసమప్రభంబును నశోకమాలావితతం
బును వాలవ్యజనహస్తరాక్షసకన్యావీజ్యమానంబును వివిధగంధజుష్టంబును
వరధూపవాసితంబును బరమాస్తరణాస్తీర్ణంబును నావికాజినసంవృతంబును వర
మాల్యదామోపశోభితంబు నగుశయనాసనంబు గనుంగొని తన్మధ్యభాగంబున
నీలజీమూతసంకాశుండును బ్రదీప్తోత్తమకుండలుండును మదమూర్ణితరక్తాక్షుం
డును మహాబాహుండును మహారజతవాసుండును దివ్యాభరణభూషితుండును
రతిశ్రాంతుండును రాక్షసకన్యాప్రియుండును రాక్షససుభావహుండును మహా
వీరుండు నై తటిద్గణసంవృతం బైనసంధ్యారక్తతోయదంబుచందంబున
సుగంధిరక్తచందనానులిప్తశరీరంబు రత్నహారాలంకృతం బై గ్రాల సవృక్షవన
గుల్మాఢ్యం బైనమందరంబుకరణి శయనించి మహానాగంబుభంగి నూర్పులు
నిగిడించుచు నిద్రించుచున్నరావణు నవలోకించి పరమోద్విగ్నుం డై యప్ప
వననందనుండు భీతుండుంబోలె నొదిగి చప్పుడు గాకుండ మెల్లన నొక్కింత
వెనుకకుం జని సోపానమార్గంబున వేరొక్కవేదికామధ్యంబున నుండి దశ
గ్రీవుండు కామరూపి గావున నక్కాలంబున నేకముఖుండై ద్విబాహుండై
యుండుట కచ్చెరువు నొందుచు మరియు వానిచందంబంతయుఁ గలయ విలో
కించునప్పుడు.

269


క.

నిదురించి యున్నదైత్యుని, సదమలశయనోత్తమంబు చాలఁగ నొప్పె
న్మదహస్తి పవ్వళింపఁగ, విదితం బగుప్రస్రవణమువిధమున నచటన్.

270


వ.

మఱియు గాంచనాంగదనద్ధంబులును మహేంద్రధ్వజోపమంబులును నైరావత
విషాణాగ్రసంపీడితకృతవ్రణంబులును వజ్రోల్లిఖితపీనాంసంబులును విష్ణుచక్ర
పరిక్షతంబులును బీనంబులును సమసుజాతాంసంబులును సంహతంబులును
బలసంయుతంబులును సులక్షణనఖాంగుష్ఠంబులును స్వంగుళీతలలక్షితంబు
లును బరిఘాకారంబులును గరికరోపమవృత్తంబులును శశక్షతజపర్ణసుశీతలసు
గంధిపరార్థ్యచందనానులిప్తంబులును స్వలంకృతంబులును నుత్తమస్త్రీవిమృ
దితంబులును గంధోత్తమనిషేవితంబులును యక్షపన్నగగంధర్వదేవదానవ
దర్పదళనంబులును మందరాంతరసుప్తరుపితమహాహిసన్నిభంబులు నగురావ

ణునికరంబులు విక్షిప్తంబులై పంచశీర్షంబు లగుమహానాగంబులపగిది నొప్పు
చుండె మఱియును.

271


క.

గిరినిభుఁ డగుదశముఖుఁ డ, య్యురుభుజములచేతఁ జూడ నొప్పె నపుడు భా
సురతరశృంగంబులచే, నరుదార వెలుంగు మందరాద్రివిధమునన్.

272


తే.

చూతపున్నాగకురవకసురభియుతము
కలితమృష్టాన్నరసపానగంధసహిత
మగుచు రావణనిశ్శ్వాస మాననంబు
వలన వెలువడె గృహ మెల్లఁ గలయ బెరసి.

273


చ.

సలలితపద్మరాగమణి చారుకిరీటముచే విచిత్రకుం
డలములచే నిరంతరకనద్వరసౌరభపుష్పమాలచే
సొలయక చుట్టు రాఁ దిరుగఁ జుట్టినమౌక్తికదామపంక్తిచే
నలువయి యొప్పుఘోరవదనం బది గల్గినవాని ధీరునిన్.

274


వ.

మఱియును.

275


తే.

రక్తచందనదిగ్ధంబు రమ్యహార, తతియుతంబును భూషణీకృతసుపర్వ
హస్తిదంతాగ్రమును గవాటాయతంబు, నగువిశాలవక్షంబుచే నలరువాని.

276


క.

మదఘూర్ణితరక్తాక్షుని, సదమలపాండురమహార్హచారుమృదుగుణా
స్పదనూత్నచేలధారిని, ద్రిదశభయంకరునిఁ బూర్వదేవప్రవరున్.

277


తే.

భుజగపతిభంగి నూర్పులు పుచ్చువాని, గంగగట్టున నిదురించుగజముమాడ్కిఁ
జెలఁగువానిని మాషరాశియును బోలె, భూరిమేచకదీప్తి యొప్పారువాని.

278


క.

మించులచే మేఘముబలెఁ, గాంచనదీపములచేఁ బ్రకాశీకృతస
ర్వాంచితగాత్రుండై నిదు, రించెడురావణునిఁ గాంచి ప్రీతి దలిర్ఫన్.

279


వ.

తత్పాదమూలంబులును భుజోత్సంగంబులు నాశ్రయించి రతిశ్రాంతలై నిద్రిం
చుచున్ననృత్తవాదిత్రకుశల లగురాక్షసాంగనల నవలోకించి తదీయశ్రవణాం
తంబులం గ్రాలు వజ్రవైడూర్యగర్భంబు లగుకుండలంబులును భుజాగ్రంబులం
బొల్చుతాపనీయంబు లగుమణికేయూరంబులునుం గనుంగొనియె నప్పుడు శశి
ప్రకాశంబులును లలితకుండలమండితంబులు నగునయ్యంగనలశుభవక్త్రంబు
లచే నవ్విమానరత్నంబు తారాగణంబులచే నభంబుంబోలె నభిరామం బగు
చుండె వెండియు నక్కపిశ్రేష్ఠుండు ముదవ్యాయామఖిన్న లై తత్తదవకాశంబులం
బడి నిద్రించుచున్న రాక్షసాంగనలమధ్యంబుఁ జొచ్చి కలయ వెదకుచునందు.

280

హనుమంతుఁడు మదవివశలై నిదురించెడునంతఃపురస్త్రీలం జూచుట

తే.

నేర్పు మీఱంగ లఘుగతి నృత్య మాడి
యలకవిన్యస్తసర్వాంగి యగుచు నంగ

హార మొనరించుచు సుషుప్తి నలమి యున్న
నృత్తశాలిని యగునొక్కనెలఁతఁ గనియె.

281


ఆ.

వరుసఁ బెక్కుగతుల వాయించి వాయించి, కక్షకలితమడ్డుకంబుచేత
బాలపుత్ర యైనభామిని క్రయ నిద్ర, వోవుచున్న యొండుబోటిఁ గనియె.

282


తే.

అందముగ నిమ్నగామధ్యమందుఁ జను మృ
గాక్షి దగ నళినీపోత మాశ్రయించి
నట్లు కాంచనవల్లకి నాశ్రయించి
కన్ను గూర్కెడు వేఱొక్కగణితఁ గాంచె.

283


తే.

పెద్దకాలంబునకుఁ దనప్రియునిఁ జెంది
కౌఁగిలించి నిద్రించెడు గఱితనట్లు
పటహ మొక్కటి పీడించి పాన్పుమీఁద
సుప్తి నొందెడుమఱియొక్కసుదతిఁ గనియె.

284


క.

ముద మలరఁ బ్రియునిఁ గౌఁగిట, గదియించినభంగి దోఁప గనక విపంచిన్
వదలక యక్కున నిడికొని, నిదురించెడుదాని నొక్కనెలతం గనియెన్.

285


క.

వరునిన్ బలె మురళిం దగఁ, బరిరంభించుచు మనోజ్ఞ భర్మమయవరా
స్తరణముపై నిద్రించెడు, సరసీరుహనేత్ర నొక్కచానం గాంచెన్.

286


వ.

అప్పుడు.

287


చ.

మొనసి మృదంగము ఋణవము న్బహువైఖరు లొప్ప ధింధిమి
ధ్వనులు చెలంగ నాద మొదవ న్మొఱయించి సురారిచిత్తముం
దనియఁగఁ జేసి ప్రొద్దు సనినన్ మదవిస్మృతిఁ గాంత లిద్ద ఱొ
య్యన నవి యూఁతగాఁ గొని పదానతలై నిదురించి రెంతయున్.

288


తే.

బాలు నక్కునఁ గదియించి భర్తమీఁదఁ
బవ్వళించిన జవ్వనిపగిది నొక్క
డిండిమముఁ దాల్చి వేఱొక్కడిండిమంబు
మీఁద నొరగి సుషుప్తిచే మించె నొకతె.

289


క.

విపులంబుగ భుజసంయో, గపీడితాడంబరంబు గలదై రహిచేఁ
జపలాక్షి యొకతె ప్రణయము, నెపమున మదవివశ యగుచు నిద్రించెఁ దగన్.

290


వ.

మఱియు నొక్కయువతి విపర్యస్తస్వకీయకలశోదకార్ద్రీకృతశరీర యై వసంత
సమయంబున మ్లానిపరిహారంబుకొఱకు సలిలసిక్త యగుటంజేసి కబళపుష్ప యై
యొప్పుమాలపగిదిం జూపట్టె మఱియును.

290


క.

కనకకలశతుల్యము లగు, స్తనములు నిజకరతలములఁ దగువిధమున మ
ర్దన మొనరించుచు నొక్కతె, పనివడి పతిపదతలమునఁ బడి నిద్రించెన్.

291

క.

మదవిహ్వల యై యొక్కతె, ముదమున విభుఁ డనుచు నొక్కముదితను సతతం
బెదఁ గౌఁగిలించుకొని త, త్పదతలమున నిద్ర నొందెఁ బయ్యెద జాఱన్.

293


తే.

కాంత లొకకొంద ఱానక కాంస్యసుషిర
తతచతుర్విధహృద్యవాద్యముల నలమి
కామినులు కాముకులనట్లు కౌఁగిలించు
కొని సుఖంబుగ శయ్యపైఁ గూర్కి రపుడు.

294


వ.

ఇ ట్లనేకప్రకారంబుల నిద్రాబలపరాజిత లై శయనించి యున్నరావణునిపత్ను
లం గలయ నవలోకించి యొక్క యేకాంతవిన్యస్తశయనంబునందు.

295


చ.

సురుచిరరత్నహారపరిశోభిత యై ఘనహేమవర్ణ యై
వరతనుకాంతులన్ గృహము స్వర్ణమయంబుగఁ జేయుదాని భా
సురగతిఁ గూర్కుదాని నతిసుందరరూపముదాని రాక్షసే
శ్వరి యగుదాని రావణునిపత్నిని గౌరిని గాంచె నత్తఱిన్.

296


వ.

ఇట్లు మండోదరి నవలోకించి.

297


ఆ.

ఆవెలందిరూపయౌవనసంపద, లరసి చూచి సీత యని తలంచి
కపికులోత్తముండు కడువేడ్క సీతను, గంటి మంటి ననుచుఁ గడురయమున.

298


క.

మానుగ వాలముఁ ద్రిప్పుచు, గానము సేయుచును మిగుల గంతులిడుచు నా
స్థానస్తంభము లెక్కుచు, నానగచరవిభుఁడు ప్రియవిహారము సలిపెన్.

299


వ.

ఇట్లు కొండొకసేపు కాపేయాజాతిచేష్టావిశేషంబులు చూపి వెండియుఁ దనమ
నంబున వివేకించి.

300


చ.

చలువలు గట్టిహారములు చక్కగఁ దాల్చి సుగంధిచందనం
బలది ప్రసూనము ల్కబరియందు ఘటించి ముదంబుఁ గ్రోలి త
మ్మల మొనరించి కన్నుఁగవ మోడ్చి రతిశ్రమజాతఘర్మవా
ర్కలితశరీర యై యలసి క్రక్కున నీసతి నిద్రవోయెడిన్.

301


క.

కాన నది రాక్షసేంద్రుని, మానిని గా నోపు నకట మతిహీనుఁడనై
యే నొండుగాఁ దలంచితి, భూనాయకుపుణ్యసాధ్విఁ బూతచరిత్రన్.

302


చ.

ధరణిజ పుణ్యసాధ్వి వినుతవ్రత పావనశీల లోకసుం
దరి త్రిదశేంద్రవంద్య గుణధాముని రామునిఁ బాసి యన్యకా
పురుషులశయ్యపై నిదురబోవునె పుష్పసుగంధభూషణో
త్కరములు దాల్చునే మధువు ద్రావునె భోగము లిచ్చగించునే.

303


క.

నరపతి రామునిఁ బాసి య, మరలోకాధీశు నైన మదిఁ గోరునె యా
తరణికులవల్లభునితో, సరి సేయం దగినవాఁడు జగమునఁ గలఁడే.

304


తే.

అరయ నిది రామపత్నిగా దన్యకాంత, యనుచు మది నిశ్చయించిన నాటవర్యుఁ
డవ్విమానాధిరాజంబునందు నిద్ర, వోవువనితల నందఱఁ బోలఁ జూచి.

305


క.

ఎందును జానకిఁ గానక, డెందంబునఁ జింత నివ్వటిల్ల నభస్వ

న్నందనుఁడు మరల నచ్చటి, కందువ లన్నియును జూచి కడువేగమునన్.

306


చ.

అరుదు జనింపఁ గొంతవడి నాటలు పాటలు వాద్యఘోషముల్
సురతము లుద్ధతి న్సలిపి సొక్కుచు సోలుచుఁ బానమత్తలై
మురజమృదంగపీఠికల ముఖ్యవరాస్తరణమునందు వి
స్ఫురదురుశయ్యల న్నిదురవోయెడుకాంతల నెల్లఁ జూచుచున్.

307


వ.

మఱియుఁ జతుర్విధాలంకారాలంకృతలును స్వభర్తృసౌందర్యవర్ణనస్వభావ
లును భరతశాస్త్రార్థవ్యాఖ్యానచతురలును దేశకాలాభియుక్తలును సమయో
చితభాషిణులు నగువరాంగనలు పరివేష్టింపఁ దన్మధ్యంబున గోష్ఠస్థితధేను
మధ్యంబునం గ్రాలుమహోక్షంబుకైవడి మహారణ్యమధ్యస్థితకరేణుమధ్యంబున
నొప్పుదంతావళరాజుభంగి నలరువాని రతాభిరతసంసుప్తుఁ డైనరావణుని
విలోకించుచు నచ్చటు వాసి బహువిధసుగంధబంధురసమస్తవస్తువిస్తారపరి
పూర్ణ యైనపానశాలకుం జని యచ్చోట నిర్మలప్రదేశంబునం జందనమృగ
మదపంకంబున నలికి ఘనసారరేణువులు కలయం జల్లి నలుదెసల నూత్నముక్తా
ఫలంబుల రంగవల్లికలు దీర్చి తన్మధ్యదేశంబున రౌక్మవిశాలభోజనంబుల
నిడిన నర్ధభక్షితంబు లైనమృగమహిషవరాహమయూరకుక్కుటమాంసంబు
లును దధిసౌవర్చలాఖ్యలవణసంస్కృతంబు లైనవార్థ్రాణసాఖ్యచ్ఛాగవిశేష
పక్షివిశేషమృగవిశేషపిశితంబులును శల్యమృగమయూరంబులును గృతహింగు
మరీచ్యాదినిష్పన్నంబు లైనక్రకరాఖ్యపక్షివిశేషంబులును జకోరంబులును ము
ద్గాదిమిశ్రితోదనంబులును నేకశల్యాఖ్యమత్స్యవిశేషంబులును ఛాగంబులును
నుచ్చావచంబు లైనభక్ష్యభోజ్యలేహ్యపేయంబులును గనుంగొనుచు మణి
మయపానభాజనంబుల నిడినశర్కరాక్షోద్రద్రాక్షదాడిమమధురద్రవ్యవికార
విరళరసంబులఁ దత్సాంద్రరసంబుల నపవిద్ధమహాధనహరనూపురకేయూరం
బుల వివిధస్థలంబులఁ గృశపుష్పోపహార యై యచ్చటివసుంధరవిశేషకాంతియు
క్త యై యునికి నచ్చెరు వొందుచుఁ దత్తదంతికవిన్యస్తప్రదీప్తసంశ్లీష్టశయనాసనం
బుల సువర్ణకలశంబుల నిడి వేర్వేఱ విభజించి పెట్టిన పరసంస్కారసంస్కృతంబు
లైనవివిధమాంసంబుల నప్పానభూమి చిచ్చు లేక మండినట్లు చూపట్టుచునికి
నానందించుచు సముద్రమథనోత్సన్నసురాపూర్ణశాతకుంభకుంభంబులును గృ
త్రిమసురాపూరితఘటంబులును శర్కరాకృతమధుకృతద్రాక్షాఫలకృతపుష్పమ
కరందకృతసర్వఫలరసకృతసుగంధిచూర్ణసంయుక్తవాసితాసవకలశంబులు నిక్షు
రసమైరేయరసపూర్ణంబు లైనస్ఫటికపాత్రికలును గనుంగొని యలరుచుఁ జంద
నాగరుప్రముఖధూపపాత్రికలును సుగంధబంధురపుష్పమాలికాపరివేష్టితహిర
ణ్మయజాంబూనదమయకరకస్ఫటికభోజనంబులును మణిమయవిచిత్రపూర్ణభాజ
నంబులును రత్నఖచితశీధుకలశంబులును రాజతజాంబూనదమయకుంభంబుల
నిండారఁబోసిన పానశ్రేష్ఠంబులును విలోకించుచు నొక్కయెడ నర్ధావశేషపాన

కుంభంబుల నొక్కయెడ నల్పావశేషఘటంబుల నొక్కయెడ నంతయుం ద్రావి
నరిక్తఘటంబుల నొక్కయెడ సగంబు మెసవిననన్నరాసుల నొక్కయెడ నర్ధభక్షి
తంబు లైనభక్ష్యభోజ్యాదిపదార్థంబుల నొక్కయెడఁ బ్రభిన్నకరకంబుల నొక్క
యెడ నాలోళితఘటంబుల నొక్కయెడ సంపృక్తమాల్యంబుల నొక్కయెడ
సుశీతలస్వాదుజలంబుల నొక్కయెడ మధురసుగంధిఫలంబుల నొక్కయెడ
శూన్యంబు లైననారీశయనంబుల వీక్షించుచుఁ గస్తూరికాగంధసారఘనసారా
గరుచందనప్రముఖధూపకుసుమవిలసితాసవవాసనాపరిమిళితపవనాఘ్రాణంబుఁ
జేసి యరుదందుచు బహుప్రకారంబులఁ బానక్రీడ సలిపి మదావేశంబున
సొలసి నృత్యగీతవాద్యవిహారపరిశ్రాంత లై నానావిధమణిభూషణశోభావిశే
షంబు కార్శానవధామంబునీన నొండొరులం గౌఁగిలించుకొని యితరేతరవస్త్రం
బులు పైఁ దిగిచికొని నిద్రాపరవశత్వంబువలనను మదనహేతుకరతివలనను
గ్లాంతం బైనరూపంబు పద్మినీరూపంబుభంగి నతిరమణీయం బగుచుండ మేచక
లోహితపాండురసువర్ణవర్ణాంగంబులతో నిద్రించుచున్న నారీసహస్రంబుల నిరీ
క్షించుచు నిత్తెఱంగున రావణునియంతఃపురంబునుం బరిశోధించి యందును
జానకిం గానక ధర్మసాధ్వసశంకితుం డై యంతర్గతంబున.

308

హనుమంతుఁడు పరస్త్రీ గోప్యస్థానదర్శనమును గుఱించి చింతించుట

క.

వదలక నిదురించెడు పర, మదవతుల సమసగోప్యమర్మంబులు నే
విదితంబుగఁ జూచితి భయ, మొదవెడు నిది ధర్మలోప మొనరించుఁ గదా.

309


క.

పరకాంతలపై నెన్నఁడుఁ, దిరముగ నాదృష్టి సొరదు తెలియ కిచట నీ
పరదారపరిగ్రహ మి, త్తఱి నాచే దృష్ట మయ్యెఁ దప్పక యకటా.

310


తే.

అనుచు మనమునఁ జింతింప నంతలోన, నిశ్చితైకాంతమతి కావనేచరునకు
నర్థనిశ్చయదర్శిని యైనబుద్ధి, యటు జనించిన మరల ని ట్లని తలంచె.

311


తే.

మనము సర్వేంద్రియప్రవర్తనమునందుఁ, గారణం బగుదానిచేఁ గలుగుఁ బుణ్య
పాపములు నది పదిలమై పరఁగె నేని, జనుల కేటికి దోషంబు సంభవించు.

312


క.

ఏ నీయువతుల నందఱ, మానసమున వలచి చూడ మన్మథవశతం
బూనిక నా కిట ధర్మవి, హీనత్వం బేల కలుగు నిది దలఁ పగునే.

313


తే.

ఒనర నేసత్వమున కెద్ది యోని యచటఁ
బరఁగ నాసత్వ మరయంగఁ బడు నిజంబు
నష్ట యైన భామినిఁ గాననమున మృగము
లందు వెదకంగ మఱి శక్యమగునె యెందు.

314


వ.

ఏ నిక్కాంతల మదనవికృతమానసుండ నై చూడ నంతియె కాదు పుణ్యశ్లోకుం
డగు రామునిపనుపున వచ్చిననాకు నెల్లపనులు శుభంబు లగు నింత చింత
యేల యని నిశ్చయించి వెండియు రావణునియంతఃపురంబుం బరిశోధించి దేవ

గంధర్వనాగయక్షసిద్ధవిద్యాధరాంగనలఁ గలయ శోధించి యందును జానకిం
గానక వెండియు నమ్మందిరంబంతయుఁ గలయ వెదకి లతాగృహచిత్రగృహక్రీడా
గృహనిశానివాసయోగ్యగృహంబు లెల్లఁ బరిశోధించి సీతం గానక చింతాకుల
మానసుండై తనమనంబున.

315


క.

అలయక సొలయక యొకచో, నిలువక గనుఱెప్ప లిడక నేర్పున లంకం
గలపద్మము లన్నియు నిటు, గలయ న్వెదకితి మహీజఁ గానను నెచటన్.

316

హనుమంతుఁడు సీతం గానక దుఃఖించుట

క.

సురగరుడోరగరజనీ, చరశేఖరసిద్ధసాధ్యచారణవిద్యా
ధరకిన్నరవరయు, సురకాంతలఁ గంటిఁ గాని క్షోణిజఁ గానన్.

317


తే.

సతియు బాలయు సత్పథస్థితయు స్వకుల, శీలసంరక్షణాసక్తచిత్తయు నగు
సీత బలవంతుఁడును దుష్టచిత్తుఁ డైన, పంక్తిముఖునిచే వధియింపఁబడియెనేమొ.

318


చ.

అరయ విరూపరూపలు మహాస్యలు దీర్ఘవిరూపదర్శనల్
గురుతరమేఘనాదనిభఘోరనినాదలు రాక్షసాంగన
ల్పరుషమదప్రలాపములు పల్కుచు బల్విడిఁ జుట్టుముట్టఁగా
నరుదుగ వారిఁ జూచి భయమంది రయంబున మేనుఁ బాసెనో.

319


మ.

బలవంతుండును దీక్ష్ణదండుఁ డతిదర్పస్ఫూర్తిదోస్సారుఁ డు
జ్జ్వలతేజుం డనివార్యశౌర్యుఁడు వివస్వత్పుత్రుఁ డే జానకీ
లలనం గానక పౌరుషం బెడలి కాలం బేగ నచ్చోటి కె
ట్లెలమిం బోవుదు నేను బోయిన నతం డేలాగు మన్నించెడున్.

320


క.

అంతఃపురంబు సర్వముఁ, బంతంబున దైత్యసతులఁ బరికించితి భూ
కాంతునికాంతను గానమి, నింతకు నాయత్న మెల్ల వృథ యయ్యెఁ గదా.

321


చ.

జానకిఁ గాన కే నిపుడు సాగరము న్వడి దాఁటిపోయినం
గాననచారు లెల్ల ననుఁ గన్గొని సీతను జూచి వచ్చితే
వానర యంచు నన్నడుగ వారికి నేమని చెప్పుదున్ సతిం
గానక వచ్చినాఁడ ననఁ గన్నులు గానక చత్తురేకదా.

322


క.

తారుండు జాంబవంతుఁడు, తారేయుఁడు నలుఁడు సమ్మదము మీఱఁగ సీ
తారమణీవృత్తాంతముఁ జేరి యడుగ వారి కేమి చెప్పుదు నకటా.

323


సీ.

వికృతాసనంబులు వివిధరూపంబులు గలిగిన రాక్షసాంగనలఁ గంటి
ననుపమరూపయౌవనకళాకలితలై చెలఁగువిద్యాధరస్త్రీలఁ గంటిఁ
బూర్ణచంద్రునిమాడ్కిఁ బొలు పైనమోముల నలరారునాగకన్యకలఁ గంటి
మెఱుఁగుదీఁగెలభంగి మెఱయుమేనులు గల చారణగంధర్వసతులఁ గంటి


తే.

వన్నె మీఱిన వేల్పుజవ్వనులఁ గంటి, వినుతి కెక్కిన మర్త్యభామినులఁ గంటి
మఱియు నందంద పెక్కండ్ర మానవతులఁ, గంటిఁ గాని మహీసుతఁ గాననైతి.

324

వ.

అని యిట్లు క్షణమాత్రంబు చింతించి గ్రమ్మఱ నుత్సాహం బవలంబించి.

325

హనుమంతుఁ డుత్సాహం బవిలంబించి మరల సీతను వెదక నారంభించుట

క.

పరికింప ననిర్వేదము, పరమసుఖము సర్వకార్యఫలదము సంప
త్కర మటు గావున నేనును, గరము ననిర్వేద మింకఁ గాంచెద బుద్ధిన్.

326


ఉ.

ఇంతకు మున్ను చూడఁబడ కిక్కడఁ దప్పిన సందుగొందులం
గ్రంతల రచ్చచావిడుల రాజపథంబులఁ జిత్రమందిరా
భ్యంతరసీమలం గనకహర్మ్యతలంబుల రామమేదినీ
కాంతునిభామిని న్వెదకి కాంచెదఁ గా కిటు చింత యేటికిన్.

327


వ.

అని నిశ్చయించి యచ్చోటు వాసి వెండియు నాపానశాలలును బుష్పగృహం
బులును జిత్రశాలలును గ్రీడాగృహంబులును గృహారామమధ్యగతవీథులును
విమానంబులును భూబిలగృహంబులును జైత్యగృహంబులును గృహంబుల కనతి
దూరంబున విహారార్థంబు నిర్మితం బైనచతుష్పథగృహంబులును దేవతాయత
నంబులును బ్రాకారాంతరమధ్యవర్తిమంత్రికుమారాదిగృహవీథులును జతు
ష్పథవర్తివృక్షాధారభూతవితర్దికలును మొదలుగాఁ గలసర్వప్రదేశంబులు
వెదకి కవాటంబు లుత్పాటించి భూబిలగృహంబులలోనికి డిగ్గుచుఁ గ్రమ్మఱ
నిర్గమించుచు మేడలమీఁది కెక్కుచుఁ గ్రమ్మఱ డిగ్గుచు వనోపవనంబుల శోధిం
చుచు విమలసరోవరంబుల నెమకుచు నిత్తెఱంగునఁ జతురంగుళమాత్రం బైన
నవకాశంబు లేకుండ రావణాంతఃపురంబంతయు వెదకి జానకిం గానక వానరుల
యుద్యోగంబును సముద్రలంఘనంబును వ్యర్థం బని తలంచి యవ్విమానంబు
డిగ్గి ఘనమధ్యంబునందలి మెఱుంగుచందంబున వేగవంతుం డై తదీయప్రాకా
రాధిరోహణంబుఁ జేసి దీనవదనుండును శోకోపహతచిత్తుండు నై తనమనంబున.

328


సీ.

కంటి నూతనసౌధకాంచనప్రాకారహీరకృతద్వారతోరణములు
చూచితిఁ దపనీయశోభావిశేషాభిరామరామాలయస్తోమములును
బరికించితి విశాలభర్మమాణిక్యసంకలితవిచిత్రసంజవనములును
శోధించితిఁ దమాలసురభిచందననీపదాడిమతరుకృతోద్యానములును


తే.

గలయ వెదకితిఁ గేళికానిలయములును, నెమకితి సమస్తవీథికానికరములును
రమ్యగుణమండనుం డైనరామవిభుని, గఱిత నెందును పరికించి గాంచ నైతి.

329


తే.

అనఘచరితుండు సంపాతి యనెడుపక్షి, నాయకుఁడు మున్ను రావణునగరిచెంత
వనములో రాజసుత యున్నదనుచుఁ జెప్పె, నత్తెఱంగున లేదు నేఁ డరసిచూడ.

330


క.

జనకసుత యనఁగ మైథిలి, యని వైదేహి యనఁ దనరు నాసీత దురా
త్ముని దశకంఠునిఁ బొందునె, తనకులధర్మక్రమంబు తప్పి నడచునే.

331

హనుమంతుఁడు సీతం గానక వితర్కించుట

సీ.

రామాస్త్రభీతుఁడై రావణుం డుఱుకుచు వనమధ్యమునఁ బాఱవైచె నేమొ
ఆకాశపథమున నరిగెడుతఱి వార్దిఁ దగఁ జూచి హృదయంబు పగిలెనేమొ

విబుధకంటకబాహుపీడిత యై చాల బడలి ప్రాణంబులు విడిచెనేమొ
రయమునఁ జనువేళ రాక్షసాంకమున నూల్కొనలేక జలధిలోఁ గూలెనేమొ


తే.

తనకులోచితధర్మంబు దప్పకుండ, నరసి రక్షించుకొనుచున్నదగుటఁ జూచి
కెరలి పంక్తిముఖుండు భక్షించెనేమొ, పడఁతి యటు గాక యున్నఁ గన్పట్టకున్నె.

332


తే.

అకట దుష్టస్వభావ లైనట్టిదైత్య, నాథుపత్నులు మ్రింగిరో నలిననేత్ర
నిందుసన్నిభ మైననిజేశుముఖము, చాలఁ జింతించి దీన యై సమసెనొక్కొ.

333


మ.

అనిశం బాయమ దైత్యమధ్యగత యై 'హా రామ హా లక్ష్మణా'
యని వాపోవుచుఁ బ్రాణము ల్విడిచెనో యాదిత్యశత్రుండు నే
ర్పున దర్పం బుససంహరించి నిరనుక్రోశంబునం బట్టి బ
ద్ధను గావించెనొ పంజరస్థశుకిచందానన్ విలాపింపఁగన్.

334


క.

అనిశము సామంబున భే, దనమున దానమున మిగులఁ దచ్చిత్తము నే
ర్పున మెత్తఁ జేసి దైత్యుఁడు, తనవశముగఁ జేసికొనెనొ ధరణీపుత్త్రిన్.

335


క.

ఆపగిది నేల చొప్పడు, భూపుత్రిక పుణ్యసాధ్వి పూతచరిత ధా
త్రీపాలుఁ బాసి వేఱొక, కాపురుషునితోడిపొత్తు గావలె ననునే.

336


క.

దానవుఁడు మ్రింగు టొండెను, మానక భంజించు టొండె మఱి యొండొకచోఁ
బూనిక దాఁచుట యొండెను, జానకి తలపోయ నొండు జాడం గలదే.

337


తే.

అవనిపుత్రిక మృత యయ్యెననియుఁ గాని, యసురనాథుఁడు వడి దాఁచె ననియుఁగాని
గానననికాని ప్రియభార్యుఁ డైనరామ, విభునితో నెట్లు చెప్పుదు వెరవు మాలి.

338


వ.

సీత నెందునుం గాననైతి నని చెప్పితినేని రామప్రాణహానిరూపదోషంబు
గలుగుఁ జెప్పనైతినేని స్వామివంచనకరణరూపదోషంబు సంభవించు నిధి పర
స్పరవిరుద్ధంబుగాఁ దోఁచుచున్న దింక నెయ్యెది కర్తవ్యం బని కొండొకసేవు
విచారించి వెండియు నిజాంతర్గతంబున.

339


క.

జానకిని వెదకి యిచ్చటఁ, గానక కిష్కింధ కేను గ్రమ్మఱఁ జనినన్
మానిత మగుపురుషార్థము, క్ష్మానాథునికరుణ యెట్లు గలుగు న్నాకున్.

340


క.

హరివీరులయుద్యోగము, శరనిధిలంఘనము మఱియు సదమలలంకా
పురపరిశోధన మంతయుఁ, గర మిది వృథ గాదె సీతఁ గానక చనినన్.

341


ఉ.

సీతను గాన నే ననుచుఁ జెప్పినయంతనె దీనచిత్తుఁడై
యాతతదుఃఖశోకమున నప్పుడు రామవిభుండు చచ్చు నా
భూతలనాథుపాటు గని పొక్కుచుఁ బ్రాణసమానుఁ డాసుమి
త్రాతనయుండు తత్క్షణమ తప్పక జీవితముం ద్యజించెడిన్.

342


వ.

రామలక్ష్మణులచందం బెఱింగి భృశానురక్తుం డగుభరతుండు తక్షణంబ సంప్రా
ప్తమరణుం డగు నమ్మువ్వురతెఱం గెఱింగి మేధావి యగుశత్రుఘ్నుండు పంచ

త్వంబు నొందు నంతఁ బుత్రవ్యసనకర్శితలై ప్రియపుత్ర లగుకౌసల్యయుఁ గైకే
యియు సుమిత్రయు జీవితంబులు విడిచెదరు రామునివిధంబుఁ జూచి ధర్మజ్ఞుం
డును సత్యసంధుండును గృతజ్ఞుండు నగుసుగ్రీవుండు గడతేఱు నతనిపాటుఁ
జూచి రుమ భర్తృశోకంబున నిరానందయై మరణంబు నొందు వాలిదుఃఖంబు
ననె పీడితయై శోకకర్శిత యైనతార సుగ్రీవుండు పంచత్వము నొందినం దప్పక
నశించుఁ బితృమాతృవినాశవ్యసనంబునఁ గుమారుం డంగదుండు మృతుం డగు
నంత భర్తృవ్యసనకర్శితలై వానరకాంత లెల్లఁ గాష్ఠముష్టిప్రహారంబుల శిరం
బులు పగుల మోఁదుకొని మడిసెదరు తదనంతరంబ సుగ్రీవునిచేత సంరక్షితు
లగువానరు లందఱుఁ గెడసెదరు తద్వృత్తాంతంబు విని వనశైలనివాసు లగు
కపులెల్ల వనశైలగృహాదిసంవృతప్రదేశంబులయందు విహారంబు సల్పు టుడిగి
పుత్రదారమాతృసహితంబుగా శైలశృంగంబుల నుండి విఱుగంబడి యైన
విషంబుఁ గ్రోలియైనఁ బావకునం దుఱికియైన నురిగొనియైన నుపవాసంబు సల్పి
యైన శస్త్రపతనంబు గావించియైనఁ బ్రాణంబులు విడువంగల రేను గిష్కిం
ధకుం జనినయంతనె యింతయుం బాటిల్లు నిక్ష్వాకువంశంబును వానరవంశం
బును నాశంబు నొందించుట కేను బోవం జాల సీతం గానక సుగ్రీవునివదనంబు
విలోకింపం జాల.

343


క.

ఏ నిపుడు పోవకుండిన, జానకి వెదకి కని వచ్చు సామీరి యటం
చానరనాయకుఁ డాశను, బ్రాణము నిలిపికొని యుండుఁ బటుధైర్యమునన్.

344


క.

కావున నే నిపు డూరక, భూవిభుఁ డగురాముకడకుఁ బోవం దగ ది
చ్చో వానప్రస్థుఁడనై, కేవల మునివృత్తి నడవికిం జను టొప్పున్.

345


ఆ.

వదనపాణిపతితఫలపర్ణభోజినై, పరఁగ వృక్షమూలవాసి నగుచు
నియతిఁ గాననమున నివసించి యుండెదఁ, గాన పోదు సీత గాన కెట్లు.

346


తే.

వివిధబహుమూలఫలజలోపేత మైన, విమలతరసాగరానూపవిషయమందు
వితతశుష్కకాష్ఠంబులఁ జితి యొనర్చి, పరఁగ మండెడు చిచ్చులో నుఱుకువాఁడ.

347


తే.

మిగులఁ బ్రాయోపవిష్టుండ నగుచు నాత్మ, సంగమునకుఁ దొలగించునట్టి నన్ను
వాయసంబులు వ్యాఘ్రాదివన్యసత్వ, సంచయంబులు గడఁగి భక్షించుఁగాక.

348


క.

ధరలో మునిదృష్టం బగు, మరణం బిది రామవిభుని మానవతిని నే
నరయక గ్రమ్మఱఁ జనుదునె, పరువడి మున్నీటినీటఁ బడియెద నిచటన్.

349


వ.

మఱియు మొదల లంకాధిదేవతాజయంబుచేత శోభనప్రారంభయుఁ బదంపడి
సీతాన్వేషణసౌకర్యాపాదకచంద్రచంద్రికామనోహరయు సీతాన్వేషణసహకా
రికీర్తిమాలయు యశస్వినియు నగునీరాత్రి రామకార్యసహాయేచ్ఛచేత దీర్ఘభూత
యయ్యును సీతాసందర్శనరహితుండ నైననాకు నిష్ఫల యై తోఁచుచున్నది.

350

ఉ.

జానకిఁ గాన కే నిపుడు సమ్మతి నేగినఁ జూచి రాఘవు
ల్వానరు లార్తి మేను విడువం గల రిచ్చటఁ జత్తు నంటినా
మానినివార్తఁ గానక క్రమంబునఁ జత్తురు రెంట దోషము
న్మానక గల్గు నిచ్చటనె మౌనివిధంబున నుండు టొప్పగున్.

351


క.

కావున నే నటు పోవక, పానకశిఖలందు మేనుఁ బాయక యిచటన్
జీవంబు నిలిపికొని ముని, నై వనమున నియతి నుండ నర్హుఁడ నైతిన్.

352


వ.

మఱియు వినాశంబునందుఁ బూర్వోక్తబహువిధదోషంబులు సంభవించు బ్రతికి
యున్న శుభంబులు పడయవచ్చుఁ గావునఁ బ్రాణంబులు ధరించియుండెద జీవిత
సంగమంబున మంగళంబు ధ్రువంబు గదా యని యిట్లు బహుప్రకారంబులఁC
జింతించి సారెసారెకు దుఃఖంబు మనంబున ధరించుచు శోకంబునకుఁ దుదఁ గా
నక సీతాదర్శనాభావసంజాతశోకజనితదురంతక్రోధవివశాత్మకుం డై వెండియు
ని ట్లని వితర్కించు.

353


క.

మచ్చరమున వైదేహిని, మ్రుచ్చిలి కొని తెచ్చినట్టి మూఢు దశముఖున్
వ్రచ్చి వధియించి పుచ్చెద, నచ్చుపడ నది ప్రతికార మగు దాని కొగిన్.

354


క.

దశముఖదైత్యాధిపుఁ గొని, విసువక జలరాశి దాఁటి వెస రామునకు
న్బిశితోపహార మిచ్చెదఁ, బశుపతికిం బశువుఁ బట్టి బలి యిచ్చుక్రియన్.

355


వ.

ఏను సీతం జూడకయే సంపాతివచనంబు విశ్వసించి రాముని గొని తెచ్చితినేని న
మ్మహాత్ముం డద్దేవి నిచ్చటం గానక కోపవిశేషంబున వానరుల నెల్ల దహించుఁగదా
యని యి ట్లనేకప్రకారంబుల వితర్కించి నా కిప్పుడు వేగిరపడ నేల జనకనందనిఁ
గనుఁగొనునందాఁక నీలంక నిశ్శంకముగానుండి గ్రమ్మఱ వెదకెద మత్కృతంబున
సర్వవానరులు నశింపకుందురు గాక ముందట నొక్కమహోన్నతం బైనమహో
ద్యానంబు నయనాభిరామం బై వరసంస్కారసంస్కృతం బై యొప్పుచు నొప్పా
రెడు నింతకుము న్నావనంబు పరికింప వనపాలకు లగురాక్షను లచ్చటనుండి
పాదపంబుల రక్షించుచున్నవారు గంధవహుండు తత్పరిసరంబున నురవడి మెలం
గ వెఱచి మెల్లనం బొరయుచున్నవాఁ డందు జానకి యుండ నోపు వసురుద్రా
దిత్యమరుదశ్వులకు నమస్కరించి రాక్షసులకు శోకవర్ధనకరుండ నై యివ్వనంబుఁ
జొచ్చి యడ్డంబు వచ్చిన రాక్షసులు జయించి సీతం గాంచి తపస్వికిఁ దపఃఫలం
బుం బోలె రామచంద్రున కద్దేవి సమర్పించెదఁ గాక యని నిశ్చయించి పరిశుద్ధం
బగుతనమనంబున.

356


ఉ.

దండము రాఘవేంద్రులకు దండము మైథిలరాజపుత్రికిన్
దండము చంద్రసూర్యులకు దండము ధాతకు శేషశాయికిన్
దండము వాయుకాలురకు దండము వజ్రకి శూలపాణికిన్
దండ మటంచు భక్తిమెయి దక్షత వారికి మ్రొక్కి వెండియున్.

357

చ.

వరుణునకున్ ధనేశునకు వహ్నికి సర్వసుపర్వపాళికి
న్వరుస ధరాచరాభ్రచరవార్ధిచరాఖిలభూతకోటికిం
బరమమునీంద్రసంతతికి భాస్వరచారణసిద్ధసాధ్యకి
న్నరగరుడోరగాదులకు నర్మిలితోఁ బ్రణమిల్లి క్రమ్మఱన్.

358


క.

దినకరసుతునకుఁ జతురా, ననతనయాద్యఖిలవృద్ధనగచరితతికి
న్వినతి యొనరించి క్రమ్మఱ, వినయం బలరార రామవిభునకు నతుఁడై.

359


వ.

మీరందఱు మదీయాభిమతంబు సిద్ధింపఁజేయుం డని ప్రార్థించుచు.

360


ఉ.

పాండురదంత మవ్రణము భాసురకుండలగండభాగము
న్మండితపల్లవాధరము మంజులలాటము పూర్ణచంద్రికా
కాండశుచిస్మితంబు నవకంజపలాశవిలోచనంబు నై
యుండెడుజానకీవదన మొప్పుగ నెప్పుడు చూడఁ గల్గెడిన్.

361


ఉ.

క్రూరుఁడు పాపచింతనుఁడు క్షుద్రుఁడు రౌద్రుఁడు లోకకంటకుం
డారయ నీచకర్ముఁడు దురాత్మకుఁ దాదశకంఠుచే భుజో
దారబలాభిభూత యయి తక్కక దిక్కఱి కుందుచున్నయా
ధారుణిపుత్రి నా కెపుడు దైన్యము వాయఁగఁ గాన నయ్యెడిన్.

362


వ.

అని యొక్కముహూర్తంబు ధ్యానంబు చేసి యమ్మహోద్యానప్రాకారంబునకు
లంఘించి ముందట వసంతసమయసంపదంకురితపల్లవితకుసుమితఫలితలలితవిటపి
పటలవిభ్రాజితసాలరసాలతమాలతక్కోలచంపకాశోకనాగపున్నాగపూగకురవ
కోద్దాలకాదివివిధతరువ్రాతసంకులంబును మయూరశుకశారికామధుకరమధుర
శబ్దాయమానంబును జిత్రకాననశోభితంబును విచిత్రాంతంబును రజతకాంచన
పాదపాలంకృతంబును గాంచనలతాశతసమాకీర్ణంబును సువర్ణవర్ణమృగసంచా
రితంబు నగునశోకవనంబుఁ గనుంగొని మఱియు మహోత్తుంగప్రాకారమండలమం
డితంబును శారదనీరదావృతంబు నా ధవలసౌధవలయవలయితంబును నీలజలధర
మాలికాపరివేష్టితంబు నాఁ దమాలపరివృతంబు నై విలసిల్లునమ్మహావనంబు ద
ఱిసి గదాహస్తక్రూరరాక్షసరక్షితం బైనయయ్యుపవనద్వారంబు మౌర్వీము
క్తం బైననారాచంబుకరణి సొచ్చి యంత నంత జానకి నన్వేషించుచు నిద్రా
నిమీలితలోచనంబులగు విహంగమంబుల నెగయంజోపుచు నికుంజపుంజంబుల
నిదురించుచున్నమృగంబుల బెగడం దోలుచుఁ బక్షిపక్షవిక్షేపణజాతవాతస
మాఘాతశాఖావ్రాతవికీర్ణకుసుమవిసరపరికీర్ణుం డై పుష్పమయం బగుపర్వతంబు
చందంబునం దనరుచు వృక్షషండగతుం డైనతన్ను విలోకించి వనగోచరభూత
వ్రాతంబు వసంతుం డని తలంప నెల్లదిక్కులం జరించుచుఁ గంపితతరుపతితకుసు
మవిసరపరికీర్ణ యై విభూషిత యైనవిలాసినిపగిది నొప్పుచున్న వసుధ నవలోకిం
చుచు నిజపదాఘాతకంపితపతితలలితవిచిత్రనానావర్ణఫలకుసుమపత్రంబు లైన
వృక్షంబులు నిక్షిప్తవస్త్రాభరణు లైనద్యూతపరాజితపురుషులమాడ్కి నొప్పు

చుండం గనుంగొనుచుఁ బుష్పపత్రఫలరహితంబు లై విహంగమహీనంబు లై
స్కంధమాత్రాశ్రయంబు లై యగమ్యంబు లైనవృక్షంబుల నవలోకించుచు
విధూతకేశియు మృదితాంగరాగయు నిష్పీతశుభదంతోష్ఠయు నఖదంతవిక్ష
తయు నైనయువతిపోలికి వాలహస్తచరణవిమర్ధితప్రభగ్నవరపాదప యై
మ్రోఁటువడి యున్నయశోకవని నాలోకించుచుఁ బ్రావృట్కాలంబునఁ బవ
నుండు వింధ్యశైలోపాంతసముద్భూతమేఘజాలంబుం బోలె లతాదామం
బులం దట్టుచు మణిరజతకాంచనమయమనోహరభూముల నిరీక్షించుచు సుశీతల
స్వాదుజలంబుల మహార్హమణిసోపానంబుల ముక్తాప్రవాళసైకతంబుల స్ఫాటి
కాంతరకుట్టిమంబులఁ దీరసంభూతకాంచనవిచిత్రవృక్షంబులఁ బ్రబుద్ధపద్మోత్ప
లవనంబులఁ జక్రవాకదాత్యూహహంససారసనాదంబుల నమృతోపమానతో
యసంవర్ధితదీర్ఘద్రుమయుక్తరమ్యసరిత్సమూహంబుల సంతానకలతాశతం
బుల నానాగుల్మావృతఘనంబులఁ గరవీరకృతాంతరంబుల నలరు వివిధాకారవా
పీకూపంబుల విలోకించుచు విమలకలధౌతమణిమయస్తంభంబుల విచిత్రకూటం
బులఁ బ్రవృద్ధశిఖరంబుల రమ్యవనంబుల శిలాగృహంబుల నొప్పు నొక్కజగతీ
విహారపర్వతంబు పొడగని మగనియంకతలంబు విడిచి వచ్చినకాంతపగిది
నొక్క నది యన్నగంబుననుండి దిగం బాఱి ప్రియునిం బాసి యలిగి చనం
జుట్టంబు లడ్డంబు వచ్చి మరల్చినక్రియ జలనిపతితతరుశాఖాగ్రంబు లడ్డగించిన
మరలం దొంటికోపం బడంచుకొని ప్రసన్నయై ప్రియునియొద్దకుం జను
ప్రియురాలిచందంబునఁ గ్రమ్మఱ నెదురేగుదాని నవలోకించి యలరుచు
నయ్యచలంబు దాఁటి యవ్వల.

363


ఉ.

తీరజభర్మవృక్షముల దీవితమౌక్తికసైకతంబులం
బూరితశీతనీరములఁ బుష్పసుగంధిలతాశతంబుల
న్సారసకైరవంబులు విశాలమణీకటకాంతరంబులం
దీరగువిశ్వకర్మకృతదివ్యతరంగిణిఁ జేరఁ బోవుచున్.

364


చ.

వితతసువర్ణవేదికల విశ్రుతనవ్యలతాంతపల్లవ
ప్రతతులఁ జిత్రపత్రుల నభఃస్స్ఫురదుల్లిఖితాగ్రశాఖలన్
గృతనవమల్లికాతతుల నిర్మలవర్ణఫలోత్కరంబులం
జతురత నొప్పు కాంచనవిశాలమహీరుహపంక్తిఁ జూచుచున్.

365


వ.

మఱియు నచ్చటివృక్షంబు లన్నియుఁ బుష్పోపగఫలోపగంబు లై సవితానం
బు లై సశయనాసనంబు లై సవితర్దికంబు లై సువర్ణసోపానవేదికాయుక్తంబు లై
యలరు చునికి నచ్చెరు వొందుచు.

366


క.

అంచితముగఁ దత్తటమునఁ, గాంచనమయరమ్యవేదికల నావృత యై
మించుకరణి నొప్పారెడు, కాంచనశింశుపను వేడుకం గనుఁగొనియెన్.

367


క.

మఱియుం దత్పరిసరమున, మఱికొన్నిశిఖిప్రకాశమంజులచామీ

కరతరువులు గర్తంబులు, పరభూభాగములు ప్రస్రవణములు చూచెన్.

368


క.

అనుపమకాంతుల నీనెడు కనకమహీజములనడుమఁ గపివర్యుం డేఁ
గనకమ నైతి నటంచును, గనకనగంబుక్రియ నొప్పెఁ గడుఁ దేజమునన్.

369


క.

ఘనమారుతకంపితత, త్కనకమహీజవిటపాగ్రకలితోజ్జ్వలకాం
చనఘంటికాసహస్ర, ధ్వని విని మది విస్మయంబు దైవాఱంగన్.

370


క.

నిరుపమతరుణాంకురభా, సురపల్లవపుష్పితాగ్రసుందరశాఖా
భరిత మగుశింశుపాహ్వయ, తరుమహిమకు నాత్మ సమ్మదం బిగిరింపన్.

371


వ.

అమ్మహామహీరుహాధిరోహణంబుఁ జేసి నలుదెసలు కలయ నవలోకించి.

372


చ.

తలఁపఁగ రామభూరమణదర్శనలాలస యై కడిందినం
తలఁ బడి తాప మీఁగుటకు నవ్యసుగంధిలతాశతంబులం
గలయఁ జరించుసీతను జగన్నుత రాజకులాభిజాత న
త్యలఘుసమస్తసద్గుణగణాంచిత నిచ్చట నేఁడు చూచెదన్.

373


చ.

ఇది రమణీయకాంచనమహీరుహ మైనయశోకకాననం
బిది కమనీయకోకనదహేమమయాబ్జసుగంధికైరవా
స్పద మగుకేళికాసరసి చయ్యన నిచ్చటి కానరాధిదే
వదయిత నిచ్చ రాఁగలదు వచ్చినయంతనె చూడఁ గల్గెడిన్.

374


క.

తలఁపఁగ వనసంచారకు, శల గావున నిచటి కిపుడు జనకక్ష్మాధీ
శలలామతనయ వెస రాఁ, గలదు ముదం బలర నాకుఁ గనుఁగొనఁ గల్గున్.

375


చ.

నలువుగఁ దొల్లి కాననమునం జరియించెడువేళ నాశ్రమ
స్థలమునఁ దాను బ్రత్యహముఁ దాపసకన్యలఁ గూడి సంధ్యలం
దలయక తీర్థసేవకు రయంబున వేగెడి దౌట నేఁడు న
య్యలవున వచ్చు నిక్కముగ నయ్యమ తమ్మికొలంకుచెంతకున్.

376


క.

జీవించి యుండెనేనియు, క్ష్మావల్లభుదేవి నేఁ డసందేహముగా
నీవలనికి రాఁగల ద, ప్పాననగుణశీల నిచటఁ బరికింప నగున్.

377


వ.

అని యనేకప్రకారంబుల సీతాదర్శనోత్సుకుం డై విచారించుచు సుపుష్పితంబు
లైన సాంద్రవర్ణంబుల విలీనుండై యుండి దివ్యగంధరసోపేతసంతానకలతాపా
దపశోభితం బగుదానిఁ గాంచనోత్సలపద్మకైరవలక్ష్మీవిరాజమానసరోవరభాసితం
బగుదాని బహ్వాసనకుథోపేతనానామణిభవనయుతం బగుదానిఁ బ్రమదాకుల
కోకిలకీరశారికామధుకరమధురశబ్దాయమానం బగుదాని సర్వర్తుఫలకుసుమవిస
రవిభ్రాజితనానాపాదపసంకులం బగుదాని విచిత్రమృగపూగవిరాజితం బగుదాని
ననేకభూబిలగృహయుతం బగుదాని సుపుష్పితాశోకప్రభాతిరస్కృతసూర్యో
దయప్రభం బగుదాని యుగపద్వినిష్పతద్విచిత్రపుష్పావతంసకబహుపక్షిపక్ష
పిహితపర్ణత్వంబు గలుగుటవలనఁ బత్రరహితశాఖం బైనదానిపగిదిం దోఁచు
దానిఁ బుష్పభారాతిభారంబులు నవనీతలంబు స్పృశించుచున్నదానిపగిదిం జూ

పట్టుచు నామూలపుప్పోపచితశోకనాశనాశోకకర్ణికారకింశుకమహీరుహప్రభా
ప్రదీప్తప్రదేశం బైనదాని వివృద్ధమూలసువుష్పితపున్నాగసప్తపర్ణచంపకోద్దా
లకవిరాజితం బగుదానిఁ బ్రతప్తజాంబూనదశలాకలమాడ్కిఁ బ్రజ్వలితజ్వలన
జ్వాలికలభంగి నీలాంజనచయంబులకైవడి వెలుంగు పుష్పితాశోకసహస్రంబుల
సాంద్రం బగుదాని నానావిధావాంతరవనవిచిత్రంబు లైననందనచైత్రరథం
బులం దృణీకరించిన ట్లున్నదానిఁ బుష్పతారాగణయుక్తం బై రెండవగగనంబు
భంగి నొప్పుదానిఁ బుష్పరత్నశతచిత్రం బై పంచమసాగరంబుకరణి నలరుదాని
ననేకగంధప్రవాహం బై పుణ్యగంధమనోహరం బై ద్వితీయగంధాఢ్యం బై ద్వి
తీయగంధమాదనంబుకైవడిఁ దనరుదాని రమణీయశోభాభిరామం బగుదాని
నచింత్యాద్భుతదర్శనం బగుదాని నశోకవనంబు గలయ నవలోకించి తన్మధ్యదే
శంబున ననేకతప్తకాంచనవితర్దికాశోభితంబును బ్రవాళవిరచితసోపానంబును
గాంచనస్తంభసహస్రనిర్మితంబును వివిధప్రాకారసౌధావృతంబును గైలాసగిరి
పాండురంబు నగుచైత్యప్రాసాదంబు పొడగని యరుదందుచుఁ దన్మూలవిరచిత
మణిమయవేదికాతలంబున.

378

హనుమంతుఁడు సీతం జూచుట

తే.

శుక్లపక్షాదియం దొప్పు సోమరేఖ, భంగి ధూమజాలావృతపావకశిఖ
కైవడి విపద్మపద్మినిగతి సపంక, కాంచనశలాకచందానఁ గ్రాలుదాని

379


చ.

మలినముఁ గట్టి పాంసుపరిమార్జితసల్లలితాంగయష్టితోఁ
గళవళ మందుచు న్వదనకంజము నూర్పులు వాడఁ జేయఁ గే
వలపరితాప మెచ్చ నుపవాసములం గడు డస్సి చాల వం
తలఁ బడి దిక్కు మాలి నయనంబుల నశ్రులు గాఱ నేడ్చుచున్.

380


చ.

చెలు వఱి శ్వానమధ్యమునఁ జిక్కినలేడియుఁ బోలె దైత్యకాం
తలనడుమ గృశించుచు వితాకున నూటికి వెచ్చనూర్చుచు
న్సొలయుచు లజ్జయు న్భయము శోకము దైన్యము పారవశ్య మ
గ్గల మయి పర్వ మౌనమునఁ గన్నులు మూయుచు వెండి విప్పుచున్.

381


చ.

చతురత దక్కి భీషణకుజగ్రహపీడిత యైనరోహిణీ
సతిక్రియఁ బొల్పు దక్కి యనిశం బెదఁ గుందుచు నేకవస్త్ర యై
హితులను బంధువర్గముల నెప్పుడుఁ గానక ఘోరరాక్షసీ
ప్రతతులఁ జూచుచుం గలఁకఁబాఱుచుఁ జాల విచార మొందుచున్.

382


తే.

నీలనాగాభ మై యొప్పు నెఱయమెఱయు, జఘనగతదీర్ఘకోమలశ్యామలైక
వేణిచే నీరదాపాయవేళ విపిన, రాజిచే నొప్పుమహిభంగిఁ గ్రాలుదాని.

383


తే.

చిత్రమణిభూషణములు గై సేయు టుడిగి, యొడలఁ గలసినమలపంక మొప్పుచుండ
వాడు వాఱినమల్లికావల్లిపగిదిఁ, దీవ్రదుఃఖాభితప్త యై దిగులు గొనుచు.

384

క.

వ్యవసము లెఱుఁగనిదానిని, వ్యసనంబునఁ గుందుదాని వరవర్ణిని ను
ల్లసితాబ్దపత్రనేత్రను, నసితాలకకలితనిటల నంబుజపాణిన్.

385


మ.

ఘనవృత్తస్తనమండలి న్విమలరాకాచంద్రవక్త్ర న్రథాం
గనితంబన్ మృగరాజమధ్యను దలత్కంజాతపత్రేక్షణ
న్ఘనకేశి న్నవపల్లవోష్ఠిని జగన్మాత న్సువాస న్సతిం
దనుశోభాప్రకటీకృతాఖిలదిగంతం గంతుకాంతోపమన్.

386


తే.

పూర్ణచంద్రునిదీధితిపోలె జగతి, కమితసంతోషకారిణి యైనదాని
ననిలహతవల్లికైవడి నడలుదాని, భుజగపతిభంగి నూర్పులు పుచ్చుదాని.

387


వ.

మఱియు సందిగ్ధార్థం బైనమన్వాదిస్మృతివాక్యంబుకరణిఁ బరిక్షీణ యైనసమృద్ధి
చందంబున నవిశ్వాసబహుళ యైనశ్రద్ధమాడ్కి నలబ్ధకార్య యైనయాశపగిది
సాంతరాయ యైనసిద్ధికైవడి సకలుష యైనబుద్ధిమాడ్కి మిథ్యాపవాదంబున
నశించినకీర్తిరీతిఁ గాలమేఘపరివృత యైననక్షత్రరాజప్రభభంగి నభ్యాసాభావం
బునం బ్రశిథిల యైనవిద్యపోలికి సంస్కారాభావంబున విపరీతార్థంబు బోధించు
వాక్కుపగిది నస్ఫుటప్రకాశ యై రామప్రాప్తినిరోధనంబున దుఃఖించుచున్నదాని
మఱియును.

388


తే.

చంద్రవిరహిత యగురాత్రిచందమునను
జంటఁ బాసినజక్కువపెంటిరీతి
భాస్కరుఁడు లేనిదినలక్ష్మిభంగిఁ జాల
నొప్పు దూలి యొంటిఁ గృశించుచున్నదాని.

389


మ.

అనిశధ్యానపరీతచిత్త యగుచున్ హారామ హాలక్ష్మణా
యని వాపోవుచు వృక్షమూలమున నధ్యాసీన యై మౌనముం
దనరం దాపసిభంగి నొప్పెడు జగన్మాన్యన్ మహీనందని
న్వనజాతాయతనేత్ర సీతఁ గనియె న్వాతాత్మజుం డయ్యెడన్.

390

హనుమంతుఁడు రామోక్తసీతాలక్షణంబులఁ గని సంతసించుట

వ.

ఇత్తెఱంగున నప్పవననందనుం డనిందిత యగుసీతం గాంచి బహుప్రకారంబుల
విచారించి కొండొకసేపు కార్శ్యమాలిన్యతిరోహితరూపత్వంబువలన సీత గాదని
సందేహించి పదంపడి యువపాదనశీలకారణంబులచేత సీత యని నిశ్చయించి
పరమానందభరితాంతఃకరణుండై.

391


క.

జనవిభుఁ డేయేసొమ్ములు, జనకజ కున్న వని చెప్పె సమ్మతి న ట్లీ
వనితకు నాయాసొమ్ములు, గన నగుచున్నయవి విటపకలితము లగుచున్.

392


తే.

రాఘవుఁడు చెప్పినట్టు లీరాజముఖకిఁ, జారుమణినిర్మితశ్వదంష్ట్రప్రసూన
రూపరచనాభిశోభిత తాపనీయ, కర్ణవేష్టనయుగళంబు గాన నయ్యె.

393


తే.

చారుమణిచిత్రహస్తభూషణము లొప్పు, చున్నవి వియోగజనితతాపోష్ణతావి
శేషమున నసితంబు లై చిరనియుక్త, తావశమున సంస్థానవంతంబు లగుచు.

394

తే.

భూమిపైఁ బాఱవైచిన రామపత్ని, భూషణంబు లీకనకాంగిభూషణములు
పొలుపు మీఱంగ నొకమేనిభూషణంబు, లరయ రెంటికి భేద మింతైన లేదు.

395


తే.

భూమిపుత్రిక యేయేవిభూషణములు, పుడమిపై వైచె నాయావిభూషణములు
తత్తదుచితాంగములయందుఁ దక్కు వయ్యె, నరసిచూడంగ నిప్పు డీయజ్ఞముఖికి.

396


చ.

అరయఁగ నేను సూర్యతనయాదులు ము న్నలఋశ్యమూకమం
దిరవుగ నున్నవేళ మణిహేమమయోజ్జ్వలముండనంబు లం
బరమున మూటఁ గట్టి పడవైచినయాకనకోత్తరీయ మీ
హరివరమధ్యపై వలువ యౌట నిజం బొకవన్నె గావునన్.

397


మ.

అనిశధ్యాతరఘూత్తమావయవ యై హారామ హారామ హా
జననాథోత్తమ యొంటిఁ జిక్కితిని రక్షస్స్త్రీలమధ్యంబున
న్ననుఁ గావ న్వెస రాఁగదే దనుజునిన్ దండించి గొంపోఁ గదే
యని వాపోవుచు నున్న దీసతి నిజం బాసీత యౌ నారయన్.

398


తే.

కనకవర్ణాంగి యైనయీకాంత నిక్క, ముగను నారాముప్రియపత్ని యగును బ్రేమ
గరిమ నేసాధ్వి నష్టయై కానకున్న, నష్ట గాకుండు రాముమనంబునందు.

399


చ.

అతివ యటంచు భూరికృప నాలనిశోకముచే నజస్ర మా
శ్రిత యని యానృశంస్యమునఁ బ్రేయసి యౌట ననంగుచేత నే
యతివకృతంబునన్ రఘుకులాధిపుఁ డార్తిఁ దపించునట్టిభూ
సుత యగు నిక్క మీభువనసుందరి సుందరవేషసంపదన్.

400


క.

రంగుగ నారఘుపుంగవు, నంగప్రత్యంగసౌష్ఠవాతిశయం బీ
యంగనరూపవిశేషము, సంగతిగా నొక్కభంగి జతనం బయ్యెన్.

401


క.

ఈవనితచిత్త మెప్పుడు, నావిభుపై నుండు మిగుల నావిభుచిత్తం
బీవనితీఁద నుండును, గావున నిరువురును మనిరి క్షణ మైన నిలన్.

402

హనుమంతుఁడు సీతకు సంభవించినపాటు చూచి దుఃఖించుట

క.

ఈకాంతఁ బాసినప్పుడె, పోక విభుఁడు మేనఁ బ్రాణముల నింతకు న
స్తోకగతిఁ దాల్చి యున్నాఁ, డాకరణి న్మను టశక్యమై యుండుఁ గదా.

403


వ.

అని యిత్తెఱంగున నప్పవననందనుండు సీతం జూచి సంహృష్టచిత్తుండై మనంబున
రామునిం దలంచి ప్రశంసించుచు జానకిం గొనియాడుచు నొక్కముహూ
ర్తంబు చింతించి బాష్పపర్యాకులేక్షణుం డై యిట్లని విలపించె.

404


ఉ.

ఈసతిఁ బాసి రామవిభుఁ డించుకసేపు మనంగఁ జాలఁ డ
ట్లీసతి రాముఁ బాసి తను వించుక దాల్పఁగఁ జాలఁ దక్కటా
యీసతి రాముఁ డిర్వు రితరేతరవీక్షణ మాచరించు పే
రాస ధరిత్రి నిందనుకఁ బ్రాణయుతంబుగ నున్నవా రొగిన్.

405


తే.

లలితగుణమండనుం డైనలక్ష్మణునకు
మాన్యయును రామునకు బ్రియమహిషియు నగు

భూతనయ యిట్టిదుఃఖంబుఁ బొందవలసెఁ
గాలము దురత్యయం బెంతఘనున కైన.

406


ఆ.

రామువిక్రమంబు సౌమిత్రితేజంబు, నెఱిఁగి యున్న దగుట నీమృగాక్షి
జలదకాలగంగచాడ్పున క్షోభింప, కున్న దిపుడు ధైర్య మూఁతఁ జేసి.

407


క.

సమశీలవయోవృత్తయు, సమాభిజనలక్షణ యగుజానకికి రఘూ
త్తముఁడు దగు నవ్విభున కీ, యమ దగు దాంపత్య మింతయర్హం బగునే.

408


వ.

అని పెక్కుతెఱంగులం దలపోసి మలినసంవీతత్వోపవాసకృశత్వశోకధ్యాన
పరాయణత్వాదిపతివ్రతాదిధర్మయుక్త యై లోకకాంత యగురమాదేవియుం
బోలె నొప్పుచున్నసీత నవలోకించి శోకహర్షకలితుం డై యీత్రిలోకసుందరి
రామునిభాగ్యంబున జీవించి యున్నదని రామునిం బ్రశంసించి వెండియుఁ దన
మనంబున.

409


సీ.

ఈకాంతకై కాదె యినకులాధీశుండు ఘనరూపుఁ డగువిరాధుని వధించె
నీయింతికై కాదె యించె రాక్షసి కర్ణనాసికము లక్ష్మణునిచేత
నీకాంతకై కాదె వీఁకతో రావణప్రతిముఁ గబంధునిఁ బట్టి చంపె
నీలేమకై కాదె లీలతోఁ బదునాల్గువేలరక్కసుల వావిరి వధించె


తే.

నీజలజనేత్రకై కాదె యోజ మెఱసి, ఖరుని ద్రిశిరుని దూషణుఁ గలనఁ ద్రుంచె
మఱియు నీరామకై కాదె హరివరేణ్యు, ఘోరరూపుని వాలిని గూల వైచె.

410


తే.

భానుజుఁడు దుర్లభం బైనప్లవగరాజ్య, మొందుటయు నేను గడిమిమై నుదధి దాఁటి
వచ్చుటయు వేగ యీలంకఁ జొచ్చుటయును, బరఁగ నీపంకజేక్షణకొఱకుఁగాదె.

411


తే.

ఈచకోరాక్షికొఱకు నై యినకులుండు, జలధిపర్యంత మైనక్ష్మాతలమ గాదు
కెరలి ముల్లోకములు తలక్రిందు గాఁగఁ, జేసినను యుక్త మని యెంతుఁ జిత్తమందు.

412


తే.

అఖిలలోకైకసామ్రాజ్య మది యధికమొ
జనకనందని యధికమో యని తలంప
నఖిలవిష్టపసామ్రాజ్య మాధరిత్రి
పుత్రికకలాంశ మైనను బోల దరయ.

413


మ.

ధర భేదించి సరోజరేణునిభకేదారస్ఫురద్ధూళిచే
సిరి యొప్పారు హలాసనక్షతమఖక్షేత్రంబునం బుట్టి శ్రీ
కరసంస్తుత్యగుణాఢ్యుఁ డైనజనకక్ష్మాభర్తకుం బుత్రియై
స్థిరలో వన్నియఁ గన్న దీసుదతి పాతివ్రత్యధర్మంబునన్.

414


వ.

అదియునుం గాక.

415


చ.

అరిజయశీలుఁ డాదశరథావనిభర్తకు ముద్దుఁగోడలై
వరనృపమౌళిరత్నరుచిభాసితపాదకుఁ డైనరామభూ
వరునకుఁ బత్నియై జగతి వాసికి వన్నెకు నెక్కె నేఁటికి

ప్పరుసున దైత్యబాధలకుఁ బాల్పడి సొక్కుచు నున్న దక్కటా.

416


సీ.

వితతసుఖంబులు విడిచి భర్తృస్నేహబలమున నిడుమలు దలఁప కట్లు
జనశూన్య మగుఘోరవనమున కేతెంచి ఫలమూలముల క్షుత్తుఁ బాసికొనుచు
వేడ్కతో విభుని సేవించుచు నింటిలో నున్నకైవడిఁ బ్రీతి నొందియుండు
నట్టియీకనకాంగి యమ్మహాత్మునిఁ జాసి యొంటి దుఃఖించుచు నున్న దకట


తే.

పూని తష్ణాతురుం డైనమానవుండు, సంభ్రమంబున బానీయశాలనట్లుఁ
శీలసంపన్న యైనయీసీతఁ జూడఁ, గోరి యున్నవాఁ డానృపకుంజరుండు.

417


ఆ.

రాజ్యహీనుఁ డైన రాజు గ్రమ్మఱ ధాత్రి, నొంది సమ్మదంబు నొందినట్లు
రాముఁ డీమృగాక్షిఁ గ్రమ్మఱఁ జేకొని, యనుపమానసౌఖ్య మందఁగలఁడు.

418


తే.

బాంధవులఁ బాసి భోగసంపదలఁ బాసి
రాముఁ డరుదెంచి తన్ను దుర్వారశౌర్య
గరిమఁ గొనిపోవు ననువాస గలిగి మేనఁ
బ్రాణములు దాల్చి యున్న దీపద్మనేత్ర.

419


ఉ.

చూడదు పుష్పభూజములఁ జూడదు రమ్యవిచిత్రశాలలం
జూడదు నిష్కుటావలులఁ జూడదు రమ్యసరోవరంబులం
జూడదు రాక్షసాంగనలఁ జూపుల రామునిదివ్యరూపము
న్బోఁడిమితోడ నెప్పుడుఁ గనుంగొనుచుం దదధీనచిత్త యై.

420


తే.

రమణికి సమస్తమణిభూషణములకంటె
నెక్కు డగుభూషణము విభుఁ డీలతాంగి
ధవునిఁ బాసినకతన నిద్దంపుసొమ్ము
లెన్ని గలిగిన శోభింపకున్న దిపుడు.

421


క.

అనుపమసుఖభోగములకు, ననువుగఁ బాత్ర మగునీనృపాంగన దుఃఖం
బునఁ గుందుచుండఁ గని నా, మనమును గడుదుఃఖశోకమగ్నం బయ్యెన్.

422


ఆ.

రామలక్ష్మణాభిరక్షిత యై సుఖ, లీలఁ జెలఁగునట్టి యీలతాంగి
వికృతరూపదానవీజనాంతరమున, నొప్పు దూలి కుందుచున్న దకట.

423


తే.

హిమకణపరీతనళినిచందమున నష్ట, శోభ యై యప్రధృష్యదుఃఖాభిపీడ్య
మాన యై యొంటి సహచరహీనచక్ర, వాకిగతిఁ గుందుచున్నది వనజనేత్ర.

424


తే.

కాంతు నెడఁ బాసి యిట్లున్నకారణమున, నీసురభికాలహరిణాంకుఁ డీవిశాల
కుసుమితాశోకతరువు లీకువలయాక్షి, కొనర శోకంబుఁ బుట్టించుచున్న విపుడు.

425


వ.

అని పెక్కుతెఱంగుల విచారించుచు సీత యని నిశ్చయించి యల్పగాత్రుండై
యత్తరుశాఖాపర్ణంబులనడుమ నుండి సూచుచుండ నప్పుడు.

426

చంద్రాభివర్ణనము

చ.

కలువలపాలిమేలు శితికంఠునియౌదలపువ్వు మేలిత
మ్ములపగవాఁడు పాల్కడలిముద్దులపాపఁడు జింకదాల్పురి
క్కలదొర రేవెలుంగువిరికైదువుదాలుపుమేనమామ మ్రొ
క్కులదొర యుద్దిచీఁకటులగొంగవిధుం డలరెన్ నభంబునన్.

427


వ.

మఱియును.

428


క.

విమలప్రభచేఁ జంద్రుఁడు, ప్రమదంబున మైత్రి నెఱుపఁ బఱతెంచినచం
దమున సుశీతలకరములఁ, గొమ రొప్పఁగ వాయుపుత్త్రకుని సేవించెన్.

429


తే.

గగన మొప్పారె నీలోదకంబుకరణిఁ, దారకాప్రకరంబులు కైరవముల
పగిది విలసిల్లెఁ జంద్రుండు భాసమానుఁ, డగుచు హంసవిధంబున నలరె నపుడు.

430

హనుమంతుఁడు సీత యున్నవిధమంతయు విమర్శించుట

వ.

ఇట్లు గగనమధ్యభాగంబున వెలుంగుచందురుని చల్లనికరణంబులు తనశరీరంబు
నకు సుఖస్పర్శంబులై సోఁక నాహ్లాదించుచు నమ్మరున్నందనుండు వెండియు
వస్తుభారవిశేషంబున నుదకమధ్యంబున నాందోళించుచున్ననావచందంబున
శోకభారాక్రాంతయై తరుమూలంబున నాకంపించుచున్నజానకి నవలోకించుచుఁ
దత్పరిసరంబున నమ్మహావనస్పతిం జుట్టుకొని యున్నయేకాక్షుల నేకకర్ణలఁ గర్ణ
ప్రావరణల నకర్ణల శంకుకర్ణల మస్తకోచ్ఛ్వాసనాసికల నతిస్థూలోత్తమాంగుల
నస్థూలదీర్ఘశిరోధరల స్వల్పకేశుల ననుత్సన్నకేశులఁ గంబళరూపకేశధారిణుల
లంబకర్ణలలాటల లంబోదరపయోధరల లంబోష్ఠులఁ జుబుకోష్ఠుల లంబాస్యల
లంబజానుకల హ్రస్వదీర్ఘకుబ్జవికటవామనాంగులఁ గరాళభుగ్నవక్త్రల బింగా
క్షుల వికృతాసనల వికృతాకారలఁ బింగవర్ణల నతిక్రోధనలఁ గలహప్రియలఁ
గాలాయసమహాశూలకూటముద్గరధారిణుల సూకరహరిణవ్యాఘ్రలులాయమే
షజంబుకముఖుల మాతంగతురంగోష్ట్రపాదల గాత్రాంతర్వర్తిశీర్షల నేకహస్తల
నేకపాదల ఖరకర్ణల గోకర్ణల హయకర్ణల హస్తికర్ణల హరికర్ణల ననాసల
నతినాసలఁ దిర్యఙ్నాసల విగతనాసికల గజసన్నిభనాసికల లలాటోచ్ఛ్వాస
నాసికల హస్తిపాదల మహాపాదలఁ గోపాదలఁ బాదచూళికల నతిమాత్రశిరో
గ్రీవల నతిమాత్రకుచోదరుల నతిమాత్రముఖలోచనల దీర్ఘజిహ్వల దీర్ఘా
ననల ధూమ్రకేశల మదిరాపానపరవశల సదామాంససురాప్రియల మాంస
శోణితభోజనల రోమహర్షణదర్శనల రాక్షసాంగనల నవలోకించి యమ్మహా
వృక్షంబుక్రింద మలినవస్త్రంబునం గట్టినమానికంబుచందంబున నవిష్కృత
తేజోవిశేష యై పంకదిగ్ధ యైనమృణాళికతెఱంగున మాసి ప్రచండాతపపరి
మ్లాననూతనవల్లికైవడి వాడి వ్యాఘ్రీమధ్యంబునం జిక్కినలేడివైఖరి నా
కంపించుచు బుణ్యాంతంబునందు దివంబున నుండి పుడమిం బడినతారపగిదిఁ బరి

క్షీణకాంతి యై యోదంబునం జిక్కినగజాంగనభంగి దైన్యంబు నొంది పంజర
మధ్యగత యైనశారికవిధంబున రాక్షసీమధ్యంబునం జిక్కి ధూమజాలావృత
పావకశిఖలాగునఁ దనుచ్ఛాయ నడంగి పాంసుపరిచ్ఛన్న యైన హేమశలాకకైవడి
నొప్పుమాలి ప్రభంజనరయోద్ధూత యై మ్రోటువడి యున్నకదంబశాఖలాగున
మండనంబులు డుల్చి జంటఁ బాసినజక్కవపెంటిక్రియఁ బొలుపుదక్కి ప్రయో
దాంతంబునందు శారదాభ్రపరివృత యైనచంద్రరేఖగతి మలినాంగచ్ఛాయ
తోఁ దూలుచుఁ బాండురపరాగపటలపరిచ్ఛన్న యైనపుష్పమంజరిసొంపున ధూళి
బ్రుంగి పంకనిమగ్న మైనగోవుసొబగునఁ జేష్టలు మాని మంత్రౌషధరుద్ధవీర్య
యైనభుజంగికరణి నూర్పులు పుచ్చుచు ననారోపితతంత్రి యైనవల్లకియట్లు
రామణీయకంబు విడిచి యుద్వర్తనాదిసంస్కారాభావంబువలన నతిక్లిష్టరూప యై
భర్తృదర్శనహీన యై చారిత్రవ్యపదేశాఢ్య యై భర్తృవాత్సల్యభూషిత యై
భర్తృహితయుక్త యై తనదురవస్థకుం గుందుచుఁ గ్రూరరాక్షసులతర్దనోక్తులకు
దలంకుచు రావణుదౌరాత్మ్యంబునకు నిందించుచు రామునిం బేర్కొని కావ
రావే యని చీరుచు దైవంబును దూఱుచు ధరాసక్తవీక్ష యై కన్నీరు నించుచు
నిశ్శ్వాసమారుతంబులఁ బల్లవధారివృక్షంబుల దహించుచు స్వభావతనుచ్ఛాయ
నవ్వనంబు నెల్ల వెలింగించుచు నేకవేణియు మలినాంగియు మలసంకులశిరోజ
యునై శోకరసాధిదేవతయుంబోలెఁ జూపట్టుచు బహుప్రకారంబుల దుఃఖించు
చున్నసీత నవలోకించి తదీయదివ్యమహిమంబులు వక్కాణించుచు హర్షబాష్ప
పరిప్లుతుం డై మనంబున నద్దేవికి రామలక్ష్మణులకు నమస్కరించి యమ్మహీపుత్రి
తోడ రామునిసందేశంబుఁ జెప్పుటకు నవసరం బరయుచుండ రాత్రి యామ
త్రయం బయ్యె నప్పుడు షడంగసహితం బయినబ్రహ్మరాక్షసుల వేదఘో
షంబు మధురంబుగా వినవచ్చె నంత నక్కాలంబున శ్రోత్రమనోహరంబులగు
మంగళవాదిత్రగీతశబ్దంబుల మహాబలుం డగురావణుండు మేల్కని.

431

రావణుఁడు సీతయున్నస్థలమునకు వచ్చుట

చ.

అవనిసుతం దలంచుకొని యాత్మవివర్ధిత మైనకామము
న్దవిలి సహింప లేక మదనప్రహరాహతి కోహటించి త
త్ప్రవిమలమానసంబు బహుభంగుల మంజువచోనిరూఢి నా
త్మవశము చేసికొందు నని తద్దయు వేడుక దుర్విచారుఁడై.

432


చ.

 సదమలచంద్రికాధవళచారుదుకూలముఁ గట్టి మోదము
న్గదురఁగ రక్తచందనము కస్తురియుం గలపంబు మెత్తి సొం
పొదవఁ బ్రసూనదామచయ మొప్పుగఁ జుట్టి విచిత్రకాంచనాం
గదమకుటాదిభూషణనికాయములం గయిసేసి గ్రక్కునన్.

433

సీ.

విఱిగినచొక్కంపువేల్పుటేనుఁగుకొమ్ము వక్షస్స్థలమునకు వన్నెఁ బెట్టఁ
గమనీయకోటీరఘటితవజ్రోపలకాండదీధితులు నీరెండ గాయ
వాసితాసవపానవశమున నెఱ్ఱవాఱినవృత్తపింగలోచనము లలరఁ
గాలజీమూతసంకాశమేచకదీప్తి గిరితుల్య మగుమేన గిఱికొనంగ


తే.

సెలవిఁ బాఱంగ నవ్వినవెలికిఁ బర్వు, దీర్ఘదారుణదంతదీధితులు సిగుడ
రావణుఁడు సర్వలోకవిద్రావణుండు, రాజసము మీఱ నంతఃపురంబు వెడలెఁ.

434


వ.

ఇత్తెఱంగున వెలువడి చనునప్పుడు.

435


తే.

దేవగంధర్వయువతులు దివిజలోక, పాలు వెనుకొని చనుదెంచుపగిది దోఁప
నంగనాజనశతమాత్ర మానిశాట, నాథు వెనుకొని చనియె నందం బెలర్ప.

436


సీ.

తరుణులు కొందఱు తపనీయదండాగ్రసందీప్తదీపికాశతము గొనుచు
మగువలు కొందఱు మణిదండచామరోత్తమములు తాలవృంతములు గొనుచు
నిందీవరాక్షులు కొందఱు దుత్తూరసుమతుల్యసలిలపాత్రములు గొనుచు
గఱితలు కొందఱు కాలాహిసంకాశరమణీయమండలాగ్రములు గొనుచుఁ


తే.

బడఁతియొక్కతె మణిపానపాత్ర గొనుచుఁ, జానయొక్కతె రాజహంసప్రకాశ
ధవళరశ్మినిభాతపత్రంబు గొనుచు, రావణునివెంట నడిచి రారమణు లపుడు.

437


వ.

మఱియును.

438


సీ.

నిద్రానిమీలితనేత్రలై తూఁగుచు వెలఁదులు కొందఱు వెనుక నడువ
నరుదార మదపరీతాస్యలై కొందఱు గఱితలు పార్శ్వభాగమున నడువ
శ్రమజలాభివ్యక్తసాంకవామోదలై ముదితలు గొందఱు మ్రోల నడువ
సూనాస్త్రుకేళిచే సొటసొటవోవుచుఁ జెలులు కొందఱు చుట్టు బలసి నడువ


తే.

మరునిసేఁతలు మిక్కిలి మరులు కొల్పఁ
దనువు లొరయుచుఁ గొంద ఱంగనలు నడువ
దశముఖుఁడు వారినడుమన తనరె హస్తి
నీగణాంతరగతమత్తనాగమువలె.

439


వ.

మఱియుఁ గొందఱు మత్తకాశినులు తత్తరంబున.

440


ఉ.

చిక్కులు పడ్డహారములు చిందఱవందఱ లైనమాల్యము
ల్మొక్కలు పడ్డచన్నుమొనలు న్బలునొక్కులఁ గందువాతెఱ
ల్టక్కెరవింటిసామి నెఱిచందము దెల్పఁగ నీలమేఘమున్
మిక్కిలి వేడ్క వెన్కొనిన మించులకైవడి నేగుదేరఁగన్.

441


వ.

ఇట్లు కాంతాజనపరివృతుండును నచింత్యబలపౌరుషుండును ననేకగంధతైలావ
సిక్తకరదీపికావభాసితుండును వరమాల్యవిభూషితుండును మదఘూర్ణితరక్తాక్షుం
డును విరజోంబరధరుండును మథితామృతఫేనాభం బైనదాని విరజం బైనదాని
నంగదసక్తం బై విస్రస్తం బైనయుత్తమవస్త్రమును సలీలంబుగా సవరించుచున్న

వాఁడును నానావిచిత్రభూషణభూషితుండును గాలజీమూతసంకాశుండును
సింహవిశ్రాంతపరాక్రముండును గింకిణీఘోషసంఘుష్టుండును బరిత్యక్తేక్షు
చాపకందర్పసమానుండును శంకుకర్ణుండును గ్రామపరాధీనుండును సీతాసక్తమన
స్కుండు నై మదాంచితగమనంబున నశోకారామవాటికాద్వారంబు దఱిసి
యనుత్తమకాంతియుక్తంబును సర్వజుష్యఫలోపగనగజుష్టంబును నానాపుప్పోప
శోభితపుష్కరిణీవృతంబును దృష్టిమనోహరవిచిత్రవివిధవిహంగమయుక్తంబును
మణికాంచనతోరణంబును నానామృగగణాకీర్ణంబును బరిపతితఫలసమా
యుక్తంబును బహుపాదపశోభితంబు నగునమ్మహావనంబు సొచ్చి వచ్చుచున్న
రావణుని దవ్వులం జూచి పవననందనుండు తనమనంబున.

442

హనుమంతుఁ డశోకవనమునకు వచ్చురావణుని దవ్వులం జూచుట

ఉ.

కంకణకింకిణీధ్వనులు గ్రందుకొనన్ మదిరాయతేక్షణ
ల్జంకెలు సేయుచున్ గడువిలాసమునం దనవెంట రాఁగ ని
శ్శంకత నెవ్వఁడో కనకచారువిభూషణపంక్తి దాల్చి యీ
వంకకు దుర్విచార మొదవం జనుదెంచుచు నున్నవాఁ డొగిన్.

443


చ.

తలఁపఁగ వీఁడు రాక్షసవతంసకుఁ డౌ దశకంథరుండు గా
వలయు మనోజశాతకరవంచితుఁ డై యిటు వచ్చుచున్నవాఁ
డలయక యీదురాత్ముఁడు నృపాత్మజ నేమి దురుక్తులాడునో
సొలయక యిందె యుండి యటు చూచెద నీతనిచంద మంతయున్.

444


క.

అని నిశ్చయించి వేఱొక, ఘనశాఖకు దాఁటి యల్పగాత్రుం డగుచున్
దనుజునిచందము గనుఁగొను, మనమున వెసఁ బర్ణఘనము మాటున నుండెన్.

45


ఉ.

అంత మహీకుమారి రభసాతిరయంబున వచ్చుదైత్యు న
ల్లంతనె చూచి శోకము భయంబును గోపము దీనభావము
న్వంతయుఁ బెన్గొనన్ మొగము వాంచి ప్రవాతరయంబుచే వనా
భ్యంతరసీమయందు వడఁకాడెడుతీఁగెక్రియ న్వడంకుచున్.

446


క.

విడిచినకచముల వెన్నును, గడువడి జఘనంబు మాటు గావించి రయం
బడరఁగ నూరుల నుదరం, బడంచుకొని యశ్రుపూరితానన యగుచున్.

447


క.

కరములఁ బయోధరంబులఁ, బరువడిఁ గప్పుకొని రామభద్రునిపాదాం
బురుహంబులు మదిఁ దలఁచుచుఁ దరుణీరత్నంబు చాలఁ దలఁకుచునుండెన్.

448

రావణుఁడు సీతాదేవిచెంతకు వచ్చుట

వ.

అంత దురాత్ముం డగురావణుం డవ్వనవిలాసంబు లంత నంతఁ గనుంగొనుచు
నరనారీసహస్రపరివృతుండై మందగమనంబునఁ గల్యాణగుణసమేత యైనసీతం
జేర నరుగుదెంచి సముద్రమధ్యంబున విభిన్నయైననావపగిదిఁ బరశుచ్ఛిన్న యై
భూతలపతిత యైనవనస్పతిశాఖలాగున ధూమకేతుగ్రహంబుచేత ధూప్యమాన

యైనరోహిణికరణి మంత్రాద్యభిభూత యై చుట్టుఁ జుట్టుకొని పడియున్నపన్న
గాంగనకైవడి శీలవృత్తసంపన్నం బైనసత్కులంబునం బుట్టి విహితకర్మానుష్ఠా
నవతి యై దుష్కులంబునం బాణిగ్రహణలక్షణసంస్కారంబు నొందుటం జేసి
దుష్కులజాత యగుమానవతిపోలికిఁ బరిక్షీణ యైనమహాకీ ర్తిచాడ్పున విహత
శ్రద్ధమాడ్కిఁ బరిక్షీణ యైనపూజవిధంబునఁ బ్రతిహత యైనయాశతెఱంగున
విధ్వస్తం బైనయాగామిఫలంబు సొబగునఁ బ్రతిహత యైనయాజ్ఞచందంబున
నుత్పాతకాలంబున దహ్యమాన యైనదిక్కులాగున నపహృత యైనపూజరీతి
విధ్వస్త యైనపద్మనియట్లు హతశూర యైనసేనభంగిఁ దమోధ్వస్త యైనప్రభ
యనువున నింకిననదిమాడ్కి నపవిత్రాభిహత యైనవేదిపద్ధతి శాంతి నొందిన
పావకశిఖవడువున రాహుగ్రస్తేందుమండల యైనరాకానిశవైఖరి హస్తిహస్త
పరామృష్ట యై సముద్ధృతపత్రపద్మ యై విత్రాసితవిహంగమ యై కాలుష్యంబు
నొందినపద్మినిసరణి రోధోభంగాదులచే నిర్జీవీకృత యైననిమ్నగచొప్పునఁ
గృష్ణపక్షరాత్రిక్రియఁ గఠికరోద్ధృతయై సూర్యకిరణంబులం గమలినమృణాళిక
భాతి యూథపునిం బాసి స్తంభప్రతిబద్ధ యై యూర్పులు పుచ్చుగజాంగనం
బలెఁ జూపట్టుచు రామునిం బేర్కొని రోదనంబు సేయుచు మలమండనచిత్రాం
గి యై దుఃఖించుచు శోకంబునకుఁ దుదగానక నివ్వెఱపాటు నొందుచు ధ్యాన
శోకపరాయణ యై యొంటిఁ జిక్కి పరితపించుచుఁ బతిశోకాతుర యై శుష్కిం
చుచు నుద్వర్తనాదిసంస్కారహీన యై సౌకుమార్యంబు విడుచుచు నుపవాస
కృశాంగి యై తూలుచు శోకధ్యానభయంబుల నడలుచుఁ జింతావిశేషంబుల
నిట్టూర్పులు వుచ్చుచు నిరానంద యై చింతించుచు రామునియభ్యుదయార్థంబు
తపంబు సేయుచు మదీయేప్సితంబు ఫలింపఁజేయుండని దేవతలం బ్రార్థించుచు
స్వశీలవృత్తంబులు రక్షించుకొనుచు రామునిసమాగమంబు గోరుచు రావ
ణునిపరాభవంబు గాంక్షించుచు నేకవేణీధర యై యసంవృతమేదినిపయిం
గూర్చుండి సంకల్పహయయుక్తంబు లగుమనోరథంబులచేత రాజకంఠీరవుం
డగురామునియొద్దకుం జనుచున్నదానియట్లు గానంబడుచు రక్షకు నన్వేషించు
చున్నదాని సుపక్ష్మతామ్రాయతశుక్లలోచన యగుదాని రామున కనువ్రత
యగుదాని ననిందిత యగుదాని జానకి నవలోకించి దశకంఠుం డాత్మవధార్థం
బద్దేవియందుఁ జిత్తంబు సేర్చి సాభిప్రాయంబు లగుమధురవాక్యంబుల నిజాభి
ప్రాయంబు తేటపడ ని ట్లనియె.

449

రావణుఁడు సీతం జూచి దుర్వాక్యంబు లాడుట

చ.

వనరుహనేత్ర నన్నుఁ గని వారనిభీతిఁ గుచోదరంబు నీ
యనువున దాఁప నేల ప్రియ మారఁగ నానన మెత్తి నన్నుఁ గ
న్గొని వెలయింప వేటికి మనోహరరూపిణి వైననిన్ను నె
మ్మనమునఁ గోరినాఁడ బహుమానపురస్సరదృష్టిఁ జూడుమా.

450

ఉ.

మానవు లైనఁ గాని యసమానభుజాబలయుక్తు లైనయా
దానవు లైనఁ గాని మఱి తప్పక నిర్జరు లైనఁ గాని త
న్వీ నెఱి నీకు భీతి యొదవింపఁగ లేఁ డొకఁడైన నిచ్చటన్
జానుగ నీవు నావలనినాధ్వసముం దొలఁగింపు మిత్తఱిన్.

451


చ.

పనివడి బల్మిఁ బట్టి పరభామలఁ గూడి సుఖంచు టుర్విలో
దనుజులకు న్స్వధర్మ మది ద ప్పనరా దటు లైన నేమి నీ
యనుమతి లేక పొందనది యంతయుఁ గన్గొని నీదుకామము
న్బనివడి మచ్ఛరీరమున బాగుగఁ జేర్పుము చింత యేటికిన్.

452


తే.

ఈకరణి శోక మొందంగ నేల నీకు, మానినీమణి నీవు నామాట నమ్మి
భయము చింతయు మదిలోన బాయ బెట్టి, చెలగి నాతోడ నెయ్యంబు సేయు మిపుడు.

453


క.

హరిణాయతాక్షి మలినాం, బర ముపవాసంబు దీనభావము శోకం
బఱమఱయు నేకవేణియు, ధరణీతల్పంబు నీకుఁ దగదు మృగాక్షీ.

454


చ.

నళినదళాక్షి వేడ్కమెయి నన్ను వరించి విచిత్రభూషణం
బులును దుకూలచేలములు భూరిసుగంధిసుపుష్పచందనం
బులు శయనాసనంబు లతిభోగము లంచితనృత్యవాద్యము
ల్పొలుపుగ గానపానములు పొంది సుఖింపుము చింత యేటికిన్.

455


తే.

అతివ స్త్రీరత్న మైతి వీ వంచితముగ, నింపుసొమ్ములు మేన ధరింపు మింక
నన్నుఁ బొందియు దివ్యమండనసుగంధ, ధారణ మొనర్పకుండుట తగునె నీకు.

456


క.

వినుము సుఖాస్పదమగు యౌ, వన మది కడచనినవెనుక వలసిన మరలం
జనుదేర నేర దెంతయు, వనజేక్షణ నిమ్నగాప్రవాహముభంగిన్.

457


క.

మగువా నీసరి నెలఁతుక, జగములలో లేదు గాన స్రష్టయు నిన్నున్
జగతి సృజియించి పిమ్మటఁ, దగ నుపరతుఁ డయ్యెననుచుఁ దలఁచెద బుద్ధిన్.

458


క.

ఘనసౌందర్యవయశ్శా, లిని వగునినుఁ జూచి సంచలింపక యెవ్వాఁ
డను వందఁ గలఁడు సాక్ష్వా, ద్వనజాసనుఁ డౌన వంతఁ దగులక యున్నే.

459


చ.

లలనరొ నీతనూగతవిలాసములం దగ నాటియున్నచూ
పులు మరలింప లేక వెతఁ బొందుచుఁ జేడ్పడి యున్నవాఁడ నీ
చలము పరిత్యజించి నను సమ్మతి నేలుము మామకోగ్రదో
ర్భలవిజితాహృతత్రిదశభామలలోపల నగ్రభార్యవై·

460


తే.

ఏను దొల్లి భుజాబలం బెసఁగ నాజి, గెలిచి గైకొన్నముజ్జగంబులును మఱియు
నస్మదార్జితదివ్యరత్నాన్వితముగ, నీ కొసంగెదఁ జేకొమ్ము నీరజాక్షి.

461


క.

అతివా యుష్మజ్జనకునిఁ, జతురబ్ధిపరీతభూమిచక్రంబునకుం
బతిఁ జేసి లోకపాల, ప్రతిమునిఁ గావింతు నన్నుఁ బాలింపు మిఁకన్.

462


చ.

మగువరొ శౌర్యవీర్యమహిమంబుల నా కెన యైనవీరునిన్
జగముల నెందుఁ గాన నని సాహసవిక్రమరేఖ దోఁప నా

మొగమున నిల్వలేరు సురముఖ్యధనేశయమాదు లైన నా
యగణితదోర్విలాసవిధ మప్రతిమం బని చూడు మాత్మలోన్.

463


చ.

అలికులవేణి నీ వరసినట్లుగ నూతనదీప్తకాంచనో
జ్జ్వలమణిహారపంక్తులును బిరుదుకూలమున న్సుగంధిశీ
తలమృదుచందనంబు నెఱతావుల నీనెడుపుష్పమాలికల్
దొలఁగక దాల్చి నీవు కృపతో ననుఁ జేకొని ప్రోవు మంగనా.

464


చ.

నిరుపమశక్తి నాయొసఁగు నిత్యసుఖంబులు పొందు మింక నీ
గురుతరవాసితాసవముఁ గ్రోలి రమింపుము నన్ను గూర్చి భా
సురముగ గంధమాల్యములు సొమ్ములు దాల్పు మలంకృతాంగివై
వఱలెడునిన్నుఁ జూడఁ గడువాంఛ మనంబునఁ బుట్టె నంగనా.

465


తే.

పుడమి యైనను ధనమైనఁ బువ్వుఁబోణి, వలయువారల కొసగు మవ్వారిగాఁగఁ
బ్రీతి నాయందుఁ జేర్పుము విశ్వసించి, యడుగవలసినవస్తువు లానతిమ్ము.

466


చ.

ఘనతరమత్ప్రసాదమునఁ గ్రక్కున నీవు సుఖంచుచుండ నీ
జనకుఁడు నీదుబాంధవులు సమ్మతితోడ సుఖింతు రుర్వరన్
వనితరొ నన్ను నాకుఁ గలవైభవము న్సిరియు న్సమృద్ధియు
న్వినుతయశంబు బాహుబలవిక్రమ మంతయుఁ జూడు మెంతయున్.

467


చ.

అనుపమభోగభాగ్యమహిమాప్తిసమర్థుఁడ నైన నన్నుఁ గై
కొనక సమస్తసంపదలు గోల్పడి తాపసవేషధారి యై
వనమున నాకలమ్ము దిని వంతల నొందుచు నున్నవాని రా
ముని నతిదీనమానవుని భూతనయా మదిఁ గోర నేటికిన్.

468


చ.

జనకజ నీ హృదీశుఁ డనుజన్మయుతంబుగ నింత కెన్నడో
వనమునఁ జచ్చియుండుఁ బలువంత లిఁ కేటికిఁ గాక యుండిన
న్వననిధి దాఁటి రాఁగలఁడె వాఁ డిట వచ్చిన నన్ను నేగతిన్
జెనకి జయించు నాజి ననుఁ జేరఁగ నోపునె ముజ్జగంబులున్.

469


క.

అనువుగ నిచ్చట డాఁచిన, నిను నేర్పునఁ జూడలేఁడు నీవల్లభుఁ డో
వనిత సబలాకమేచక, ఘనపటలపరీత యైన కౌముదిని బలెన్.

470


క.

సురపతికరగతభార్యను, నెఱిఁ గాంచనకశిపుఁ డొందనేర్చినక్రియ మ
త్కరగత వగునిను రాఘవ, ధరణీవిభుఁ డొందలేఁడు తథ్యము తన్వీ.

471


తే.

చారునేత్రవిలాసిని చారువేణి, చారుజఘన చారుస్మిత చారుకేళి
పక్షినాథుఁడు సర్పంబుపగిది నాదు, చిత్తము హరించితివి వేయి చెప్ప నేల.

472


తే.

అతివ కృశవయ్యు ననలంకృతాంగి వయ్యు, మలినసంవీత వయ్యు నామదికి వేడ్క
గడలుకొనఁ జేసెదీవు ని న్గని స్వభార్య, లందు ననురక్తి విడిచితి నిందువదన.

473


క.

అంతఃపురగత లగుమ, త్కాంతల కందఱ కభీష్టదాయిని వై న

న్నెంతయు రతులం దేల్పుము, కంతునిచెయ్దముల నింకఁ గందక యుండన్.

474


క.

మనమున నొండు దలంపక, ననుఁ బ్రీతి భజించి తేని నాసుందరు లే
పున భక్తి నిను భజించెద, రవిశము నచ్చరలు లక్ష్మి నట్లు మృగాక్షీ.

475


క.

బాలామణి ననుఁ గైకొని, వాలాయము సకలసౌఖ్యవైభవయుతవై
యీలంకను నీసంపద, లీలోకము లీసమస్త మీ వేలు మికన్.

476


క.

ధనమున బలమున విక్రమ, మునఁ దపమున మఱియుఁ దేజమున భూరియశం
బున సౌభాగ్యంబున నా, కెనయే నీవిభుఁడు నొల్ల వేటికి నన్నున్.

477


క.

ధర నేలుము విహరింపుము, పొరిఁబొరి భోగముల నెల్ల భుజియింపుము భా
సురధనము లిచ్చగింపుము, సురఁ గ్రోలుము నన్నుఁ గూడి సుఖయింపు మిఁకన్.

478


వ.

మఱియుఁ గుసుమితతరుజాలసంతతంబులును భ్రమరగీతసన్నాదితంబులును రమ
ణీయలతాశతసంకులంబులు నగుసముద్రప్రాంతకాంతారంబుల నన్నుం గూడి
లీలావినోదంబుల విహరింపు మని యిట్లు కర్ణకఠోరంబుగాఁ బలికిన రౌద్రుం
డగురావణునివచనంబులు విని దీనవదనయు దుఃఖార్తయు వేపమానయు నార్త
స్వరయుఁ దపస్వినియు నగుజనకనందని పరిశుద్ధం బగు తనమనంబున రామునిం
దలంచుచు రావణునితోడ సాక్షాత్సంభాషణం బనర్హం బని యొక్కతృణ
ఖండంబు తన కడ్డంబుగాఁ బట్టుకొని మెల్లన రావణున కి ట్లనియె.

479

సీత రావణుని దూఱుట

తే.

దనుజపాంసన నామీఁదిమనసు విడువు
మెలమిఁ జిత్తంబు స్వజనమం దిడుము ఖలుఁడు
మోక్షసంసిద్ధినిం బలె మొనసి నన్నుఁ
గవియఁ గోర నర్హుండవు గావు నీవు.

480


తే.

పుడమిలో సత్కులంబునఁ బుట్టి సత్కు
లంబు సొచ్చి రామునకుఁ గరంబు ధర్మ
పత్నినై సాధ్వి యనఁ బెంపుఁ బడసి యిట్టి
నీచకార్యంబు గావింప నేర్తు నటర.

481


వ.

అని పలికి యద్దేవి పరాఙ్ముఖి యై వెండియు రావణున కి ట్లనియె.

482


క.

దురితాత్మక పరసతినై, వఱ లెడు నే నీకు యుక్తభార్యను గా నీ
దురితోక్తు లాడ వలవదు, చరియింపుము బుద్ధి గలిగి సాధువ్రతమున్.

483


సీ.

సాధువృత్త మెఱింగి చాపల్యమున నన్యరమణుల పొందుగోరకుము నీవు
నీసతి నీ కెట్లు నెఱి రక్ష్యయౌ నట్లు నన్యులకును రక్ష్యు లట్లు గాన
నిను నీవె యుపమగాఁ గొని స్వదారలయందుఁ బరితుష్టి నొందుము ప్రాభవమునఁ
దనగేహినులయందుఁ దనియనిచపలునిఁ జలితేంద్రియుని దుర్విచారపరుని

తే.

గాంచి సతులు వాని పంచతఁ గాంక్షింతు, రింత దుర్విచార మేల గలిగెఁ
గులము బంధుజనులు గూలు టింతియె కాక, చేకొనంగ నీకుఁ జెల్లు నటర.

484


ఉ.

ఓరి దురాత్మ యిందు బుధు లుండరొ యుండిన నీవు వారలం
జేరవొ సాధువాక్యములు చేకొన నొల్లవొ శిక్ష లేమి నా
చారవిహీన మై సకలసజ్జనగర్హిత మయ్యె నీమతం
బారయ నీకతంబున నిశాటకులంబు చెడు న్నిజంబుగన్.

485


మ.

అకృతాత్ముం డనయజ్ఞుఁ డైననృపుచే నర్థంబు లీరాష్ట్రముల్
సుకృతంబున్ హితబంధువర్గము నశించు న్గాన ని న్బొంది త
క్కక నీబుద్ధి కృతాపరాధమున లంకాపట్టణంబు న్సుహృ
న్నికరంబుం దనయు ల్నశింపుదురు పో నిక్కంబు శీఘ్రంబుగన్.

486


ఆ.

అవని స్వకృతదోషహన్యమానుఁడు నన్య, కాముకుండుఁ బాపకర్ముఁ డైన
నృపతిమరణమందు నేర్పుతో నిఖిలభూ, తోత్కరంబు మోద మొందుచుండు.

487


క.

విను మట్లుగాన దైవిక, మున రౌద్రుం డైనపంక్తిముఖుఁ డీవ్యసనం
బునఁ జిక్కె నటులె కావలె, నని విమతులు నిన్నుఁ గూర్చి హర్షింతు రొగిన్.

488


క.

సిరిఁ జూపి నన్ను లోఁబడఁ, బఱచెద నని చూచె దేమొ భానుకులునిపైఁ
దిరముగ నామది పాయదు, తరణిం బాయనితదంచితప్రభభంగిన్.

489


ఆ.

లోకనాథుఁ డైనకాకుత్‌స్థవిభునిస, త్కృతభుజంబు నాశ్రయించి బ్రతుకు
నట్టియేను నీచుఁ డైనయన్యునిభుజ, మసుర యెవ్విధమున నాశ్రయింతు.

490


తే.

సువ్రతస్నాతుఁ డతిపరిశుద్ధుఁ డైన
విప్రు నెడఁబాయఁ జాలనివిద్యకరణి
ననిశ మెడఁబాయ కే నామహామహునకు
నౌపయికభార్య నగుదు దుష్టాసురేంద్ర.

491


క.

వనబద్ధ యైనకరిణిని, గొనకొని యూథపునితోడఁ గూర్చినభంగి
న్దనుజాధమ దుఃఖిత నగు, ననుఁ గూర్పుము బుద్ధి గలిగి నాథునితోడన్.

492


క.

ఘోరవధ మిచ్చగింపక, వారక రాక్షసవిభుత్వవైభవ మాత్మన్
గోరిన మద్విభుతో నయ, మారఁగ మైత్రి యొనరించు టది యుక్త మగున్.

493


క.

శరణాగతరక్షకుఁడును, బరమదయాళుండు భక్తవత్సలుఁ డాభూ
వరుని శరణంబు నొందుము, ధరలోపల నీవు బ్రతుకఁదలఁచితి వేనిన్.

494


క.

మతి గల్గి వినమ్రుఁడవై, చతురుం డగుపతికి న న్నొసఁగి వెస శరణా
గతుఁడ వగు మార్తరక్షా, వ్రతుఁ డగునవ్విభుఁడు నిన్ను రక్షించుఁ దగన్.

495


చ.

బ్రతుకు దలంచితేని నను రామున కిచ్చి వినమ్రబుద్ధివై
బ్రతుకుము గాక దక్కినఁ దిరంబుగ నమ్మహనీయకార్ముక
చ్యుతయమరాట్కటాక్షతులితోగ్రనిశాతశిలీముఖంబు లు

ద్ధతి భవదుత్తమాంగములఁ దప్పక వే పడఁ గూల్చు నుర్వరన్.

496


క.

వర్జించు నింద్రవజ్రము, వర్జించు జముండుఁ జిరము వసుధాపతి యా
దుర్జయుఁడు రాఘవుం డని, వర్జింపఁడు నిన్నుబోఁటివాని నలిగినన్.

497


క.

బలవైరివిసృష్టం బగు, కులిశనినాదమునుబోలె గుండె లవియ ను
జ్జ్వలరామధనుశ్శబ్దము, పలలాశన వినియె దీవు పటుయుద్ధమునన్.

498


తే.

రామలక్ష్మణలక్షణభీమవేగ, కంకపత్రశరంబు లీలంకమీఁదఁ
గాలపన్నగములలీల వాలి రాత్రి, చరులఁ దునుమాడి నిరవకాశముగఁ జేయు.

499


తే.

ప్రబలుఁ డగురామగరుడుండు రాక్షసేంద్ర
దారుణాహుల నిర్జించి తడయక నను
వేగ గొనిపోవుఁ దార్క్ష్యుండు విషధరములఁ
బొసఁగ నిర్జించి సుధఁ గొనిపోయినట్లు.

500


క.

మును హరి త్రివిక్రమంబుల, దనుజుల నందఱ నధించి తప్పక లక్ష్మిం
గొనినక్రియ రాఘవుఁడు నిను, గొనకొని మర్దించి నన్నుఁ గొనిపోవు వడిన్.

501


తే.

దానవాధమ యలజనస్థానవాసు, లైనరాక్షసు లంద ఱ ట్లాజి మడియ
శక్తిఁ జాలక నీ విట్లు చౌర్యవృత్తిఁ, బట్టి ననుఁ దెచ్చి తిది నీకు బంటుఁదనమె.

502


సీ.

రామలక్ష్మణులు దూరమున కేగినవేళ మ్రుచ్చిలి నను నీవు దెచ్చి తిట్లు
శార్దూలములమ్రోల శ్వానంబు కడిమిమై నిలువనేరనిమాడ్కి నృపకులావ
తంసకు లైనయాదాశరథులమ్రోల నీవు ధైర్యంబున నిలువ లేవు
పొసఁగ వృత్రుని యేకభుజము దేవేంద్రుని భుజయుగళంబుతోఁ బోరి గెలువ


తే.

లేనిచందాన నీ వామహానుభావు, లైనరఘుకుంజరులతోడఁ బూని ఘోర
సంగర మొనర్చి గెలువంగఁజాల వరయఁ, గర్భురాధమ యీవృథాగర్వ మేల.

503


క.

దనుజాధమ మన్నాథుం,డనుజన్మసహాయుఁ డగుచు నంబకములచే
నినుఁ డల్పసలిలమున్బలె, ననిలో నీజీవితంబు హరియించు రహిన్.

504


క.

అనిమిషజగమున కేగిన, మునుకొని పాతాళలోకమునకుఁ జనిన రా
మనరేంద్రుఁడు నిను విడువఁడు, విను మశనియుఁ గాలనిహితవృక్షమునుబలెన్.

505


వ.

అని పలికినఁ బరుషంబు లగుసీతావచనంబులు విని రాక్షసాధిపుం డగురావణుం
డి ట్లనియె.

506


ఉ.

వారిజగంధు లెంత మగవారల దూఱిన ముఖ్యకామతం
గోరిక లొందువార లయి కోపముఁ బూనరు గాన నట్లు నీ
వీరస మెత్తి మ్రోల నను నెంత దురుక్తులఁ దూల నాడిన
న్సారసనేత్ర నే నలుగ సమ్మతితో నినుఁ గూడువాఁడ నై.

507

రావణుఁడు సీతాదేవిని బుజ్జగించుట

వ.

 అదియునుం గాక.

508

చ.

నరవరపుత్రి ఘోరమదనవ్యసనంబునఁ గుందుచుండియు
న్బురుషులు వేఁడ వచ్చిన సముద్ధతిఁ గా దనుమాట లాడుట
ల్తరుణులకు స్వభావ మది తప్పనఁగూడ దెఱింగి కాదె నీ
పరుసఁదనంపుమాటలకుఁ బల్కక యోర్చినవాఁడ జానకీ.

509


తే.

కాంత నీమీఁదఁ బొడమినకామ మిపుడు
తెగువమైఁ గ్రోధమును బట్టి తిగుచుచున్న
దరయ సూతుండు వెరువునఁ దెరువుఁబట్టి
తీవ్రగతి నేగుహయములఁ దిగిచినట్లు.

510


ఉ.

ఏ మని చెప్పవచ్చు నది నెంచక నీ విపు డన్నమాటకుం
గామిని జంతుసంతతికిఁ గామ మొగిం బ్రతిబంధకంబు త
త్కామముఁ జేరినట్టి ప్రియకాంతలపై ననుకంప మోహము
న్బ్రేమయు మార్దవంబును జనించు జనింపదు గిన్క గావునన్.

511

రావణుఁడు తన్ను రెండుమాసములలో వరింపవలయునని సీతకుఁ గట్టడ సేయుట

తే.

కపటమునివృత్తిఁ గైకొని కాననమున, కరుగుదెంచినమనుజుపై నాశ గలిగి
యున్ననిన్ను వధోచిత నొడిసి పట్టి, సాహసంబున వధియింపఁజాలనైతి.

512


క.

కావరమున నిట్లాడం, గావచ్చునె యెంత వాఁడి గలిగిన నీకు
న్నీ వన్నమాటలకు నిపు, డోవనితా ఘోరవధము యుక్త మగు నిటన్.

513


వ.

అని పలికి రాక్షసాధిపుం డగురావణుండు వెండియుఁ గ్రోధసంరంభసంయుక్తుం
డై సీత నవలోకించి యి ట్లనియె.

514


చ.

పడఁతిరొ యెంత న న్మిగిలిపల్కిన నిప్పుడు నిన్నుఁ జంప కేఁ
గడువడి రెండుమాసములు కట్టడ చేసితి నంతలోన నీ
వడుగక మున్నె నన్గలసి యర్థి సుఖించిన నుంచి దంత కీ
వొడఁబడ వేని ని న్జలిదియోగిర మయ్యెడున ట్లొనర్చెదన్.

515


వ.

అని తర్జించి పలికిన నతిభీత యగుసీతం జూచి చుట్ల నున్నదేవగంధర్వకన్యలు
విషాదించుచు రావణునిభయంబునఁ దత్ప్రకారంబు బయలుపడకుండ నోష్ఠ
ప్రకారంబుల ముఖనేత్రసంజ్ఞల నాశ్వాసింప నద్దేవి రావణుం గనుంగొని వృత్త
శౌండీర్యగర్వితం బగువాక్యంబున ని ట్లనియె.

516


క.

ఇం దెవ్వాఁడును ని న్నీ, నిందితకర్మంబువలన నెఱిఁ ద్రిప్పఁగ లే
నందున నీశ్రేయమును మ, దిం దలచెడువాఁడు లేఁడు దివిజవిరోధీ.

517

సీత రావణునిఁ దర్జించుట

క.

బలరిపుసన్నిభుఁ డుర్వీ, వలయాధిపుఁ డైనరామవల్లభ నగున
న్నిల నెవ్వఁ డైనఁ గోరునె, కలుషాత్ముఁడ వైననీ వొకండవు దక్కన్.

518

తే.

దానవాధమ యమితప్రతాపుఁ డైన, యలరఘూత్తముప్రియసతి నైననన్ను
బాపములు పల్కి తింక నాభానువంశ, తిలకుచేఁ జన కెందుఁ బోఁగలవు నీవు.

519


తే.

జనవిభుఁడు సామజము నీవు శశక మిరువు, రాజిఁ గావింపఁదలపడు టది దలంపఁ
దొడరి వనమున గంధసింధురము శశక, మని యొనర్పంగఁ దలకొనినట్లు గాదె.

520


ఉ.

అచ్చుగ నావిభుండు మృగయారతి దవ్వుల కేగఁ జూచి న
న్మ్రుచ్చిలి తెచ్చి నాయెదుటనోటికి వచ్చినయట్లు బంటవై
చెచ్చెర రాము నుగ్రరణసీమ రయంబునఁ ద్రుంతు నంచు నీ
విచ్చట సిగ్గుమాలి వచియించుట కెంతయుఁ జిత్ర మయ్యెడిన్.

521


తే.

దానవాధమ మద్విభుం డైనరామ, భద్రుచతుష్పథంబునఁ బడితివేని
యపుడె నీకుఁ దద్విక్రమమంత దెలియుఁ, దప్పి వచ్చితి విఁకనైనఁ దలఁగ లేవు.

522


క.

మానవపతిపై నిత్యము, జానుగ నత్యంతభక్తి సలిపెడున న్నో
దానవ పాపము లాడెను,నీనాలుక దునిసిపడ నిజముగ నింకన్.

523


తే.

ఉత్తమస్త్రీల వీక్షింపనోడ వీవు, భీకరాకారములు కృష్ణపింగళములు
నీచములు నైననీఘోరలోచనంబు, లోరి దుష్టాత్మ పుడమిపై నూడి పడవె.

524


తే.

ధవునియానతి లేకున్కి ధర్మమునకు, హాని వాటిల్లునో యని యాత్మ వెఱచి
నిన్ను శపియింపనైతిఁ గాకున్న భూరి, తేజమున నిటు సేయనే దివిజవైరి.

525


క.

నీవధముకొఱకు నీవిధి, దైవముచే విహిత మయ్యెఁ దగ నింతియె గా
కోవిమత నన్నుఁ గైకొన, నీవశమా తప్ప దింక నీవధ ముర్విన్.

526


క.

ధనదున కనుజుఁడ వై బల, మున నధికుఁడ వై ప్రవీరముఖ్యుఁడ వై రా
ముని డాఁగురించి మ్రుచ్చిలి, గొని తెచ్చితి వేల నన్నుఁ గ్రూరచరిత్రా.

527


సీ.

పంక్తికంధర రామబాణపాధోరాశి నిను దీవికైవడి నేఁడు ముంచు
దశకంఠ రామాభిధానపంచాస్యంబు నిను గజేంద్రముభంగిఁ దునిమివైచు
రాక్షసాధమ రఘురామసుత్రాముండు కొండవైఖరి నిన్నుఁ గూలవైచు
రావణ రామాఖ్య రాజీవబంధుండు మంచుకైవడి నిన్ను మాయఁజేయు


తే.

దైవతనిరోధి రాఘవతార్క్ష్యవిభుఁడు, సర్పమునుబోలె ని న్నాజిఁ జింపివైచు
నెదిరిఁ దన్ను నెఱుంగక యింతలోన, యడిచిపడ నేల నీకు దుష్టాసురేంద్ర.

528

రావణుఁడు సీతతోఁ బరుషంబు లాడుట

వ.

అని పలికినఁ గ్రూరంబు లగుసీతావాక్యంబులు విని రావణుండు వికటభ్రూకు
టిదుర్నిరీక్షుండును నీలజీమూతసంకాశుండును మహాభుజశిరోధరుండును సింహ
సత్త్వగమనుండును దీర్ఘజిహ్వోగ్రలోచనుండును జలాగ్రమకుటప్రాంశుండును
జిత్రమాల్యానులేపనుండును రక్తమాల్యాంబరధరుండును దప్తాంగదవిభూష
ణుండును గల్పవృక్షసంకాశుండును వసంతసమానుండును శ్మశానచైత్యప్రతి
ముండు నై యమృతోత్పాదనద్ధభుజంగం బైనమందరాచలంబుంబోలె నతిరమ

ణీయమేచకశ్రోణిసూత్రపరివృతుం డై యలరుచుఁ గాంచనకేయూరవిరాజితభుజ
యుక్తుం డై సువర్ణశృంగసంగతం బైననీలాచలంబుకరణిఁ జూపట్టుచు మణి
న్యూతతరుణాదిత్యవర్ణకుండలమండితుం డై సంఫుల్లరక్తపల్లవపుష్పవిరాజితాశో
కతరుషండమండితం బైనమహానగంబుపగిదిం బొల్చుచు మహాసర్పంబుపగిది
నూర్పులు పుచ్చుచుఁ గోపసంరక్తనయనంబుల వైదేహి నిరీక్షించి యపగతసా
మ్రాజ్యుం డై యన్యాయంబున వనంబునకుం జనుదెంచి దారిద్ర్యంబున నవి
యుచున్నహీనమానవునిం బెద్ద జేసికొని సర్వసంపత్సమృద్ధియుక్తుండ నైనన
న్నవమానించితివి సూర్యుండు నిజతేజంబున సంధ్యం బోలె నిన్ను నాశంబు
నొందించెదఁ జూడు మని తర్జించుచు సీతకుం గావలి యున్నరాక్షసస్త్రీల నవ
లోకించి.

529


ఆ.

భేద మాడి యైన బెదరించి యైనను, సామదానయుక్తి సలిపి యైన
బుజ్జగించి యైన బోధించి యైనను, మంచి నైనఁ గోపగించి యైన.

530


క.

మీరంద ఱేకమతులై, వారక యితరుణి నాకు వశగత యగు టె
ట్లారీతిఁ జేయుఁ డెంతయు, మాఱాడిన నత్తెఱంగు మాకుం జెపుఁడీ.

531

ధాన్యమాలిని రావణు ననునయించుట

వ.

అని పలికి వెండియు బ్రచండకోపంబున జిడిముడి వడుచుఁ గామమన్యుపరీతా
త్ముం డై రావణుం దాసీతఁ గదియునెడ ధాన్యమాలిని యడ్డంబు వచ్చి రావణుం
బరిష్వజించి యి ట్లనియె.

532


క.

మనుజాంగనయు వివర్ణయు, ననుకూలత లేక పెనఁగు నతిదీనయు నీ
వనితయెడ మోహ మేటికి, ననుఁ గూడి సుఖంపు మసురనాయక చెలిమిన్.

533


తే.

చిత్త మలరఁగ నినుఁ బొంది యుత్తమంబు
లైనధనదివ్యభోగంబు లనుభవించు
నంత భాగ్యంబు దయ సేయఁ డయ్యెఁ బద్మ
గర్భుఁ డీమర్త్యకాంతకుఁ గర్బురేంద్ర.

534


క.

ప్రతికూల మైనయువతిని, మతిఁ గోరినవాని కగు శ్రమం బనిశంబు
న్బ్రతికూల గానియువతిని, మతిఁ గోరినవాని కబ్బు మహితసుఖంబున్.

535


వ.

అని బోధించిన నద్ధానవివచనంబులఁ గోపం బడంచుకొని యల్లన నవ్వుచుఁ
బాదవిన్యాసంబున మహీతలంబు కంపింప రాక్షసస్త్రీపరివృతుం డై మరలి జ్వల
ద్భాస్కరవర్ణం బయిననిజగృహంబునకుం జనియె నతనిఁ బరివేష్టించి దేవగంధర్వ
నాగకన్యలు వానిదౌరాత్మ్యంబునకు మనంబునం గలుషించుచు నంతఃపురం
బునకుం జని రంత నద్దశకంఠనియుక్త లైననక్తంచరభామిను లందఱు జనక
నందనం జేర నేతెంచి సదనంబులం గోపంబు చెంగలింపఁ బరుషవాక్యంబు
బాడుచు ని ట్లనిరి.

536

రాక్షసస్త్రీలు సీతకు రావణు వరింపు మని బోధించుట

క.

తలలు పది గలుగువాఁ డల, పులస్త్యుమనుమండు దనుజముఖ్యుఁడు విభవో
జ్జ్వలుఁ డీరావణుఁ డితనికి, లలనామణి భార్యగాఁ దలంప వదేలా.

537


వ.

అని పలుక నం దేకజట యనురాక్షసి క్రోధతామ్రాక్షి యై కరతలోదరి యగు
సీత కి ట్లనియె.

538


చ.

తడయక సృష్టికర్త యగుధాతకు నాలవపుత్రుఁ డై పుల
స్త్యుఁడు జనియించె నాతనికి సొంపుగ విశ్రవుఁ డబ్జగర్భతు
ల్యుఁడు దగఁ బుట్టె నమ్మునికులోదధిచంద్రునకుం గుమారుఁడై
పొడమె సమస్తరాత్రిచరపూజ్యుఁడు పంక్తిముఖుం డుదగ్రుఁడై.

539


క.

నాలవబ్రహ్మ దలంపఁగఁ, బౌలస్త్యుఁడు గాన నీకుఁ బతిగాఁ దగఁడే
చాలఁగ నామాటలు విని, పౌలస్త్యు వరించి భోగభాగిని వగుమా.

540


వ.

అనినఁ గ్రోధంబు పెంపున మార్జాలనేత్రసదృశంబు లగుతననేత్రంబులు విచ్చి
హరిజట యనురాక్షసి యి ట్లనియె.

541


క.

ఎవ్వఁడు నిజభుజబలమునఁ, జివ్వకు రాఁ దిగిచి యముని జిష్ణుని సురలం
గ్రొ వ్వణఁచె నట్టిరావణు, జవ్వని వరియించి మేటిసౌఖ్యముఁ గనుమా.

542


వ.

అనిన రూక్షేక్షణంబుల నిరీక్షించి భీషణోక్తులఁ దర్జించుచుఁ బ్రఘన యను
రక్కసి యి ట్లనియె.

543


సీ.

జర లేనియౌవనసౌకర్యమున నొప్పు బృందారకస్త్రీల పొందు రోసి
తేటమాటల ముద్దుపాటలఁ గరఁగించు గంధర్వసతులసాంగత్య ముడిగి
సౌకుమార్యము బంధచాతుర్య మొప్పారు పన్నగాంగనలసంబంధ మెడలి
కఠినరతుల మది గరఁగించి మరిగించు దైత్యభామలపొందు దలఁగఁ బెట్టి


తే.

జనకసుత మర్త్యభామిని వనక నిన్ను, గణిత లందఱకన్నఁ జక్కనివెలంది
వనుచు దశకంధరుఁడు ప్రీతి నాశ్రయించె, నతని వెలయింప కి ట్లుండఁ దగునె నీకు.

544


వ.

అనిన వికటభ్రూకుటిదుర్నిరీక్ష యై వికట యనురాక్షసి యి ట్లనియె.

545


చ.

అనిమొన శ్రీదశక్రవరుణాదికు లెవ్వని కోడి భృత్యులై
యనవరతంబు నూడిగము లర్థి నొనర్చుచు నుందు రాసహ
స్రనయనవైరి రావణుఁడు సమ్మతి నంజలిఁ జేసి వేఁడఁ గై
కొని వెలయింప కిట్లు ప్రతికూలము లాఁడగ నీకుఁ జెల్లునే.

546


వ.

అనిన దుర్ముఖి యనురాక్షసి యి ట్లనియె.

547


సీ.

ఎవ్వానిభయమున నినుఁ డెండ గాయఁడు వేడ్కతోఁ బవనుండు వీవ నోడు
జలదంబు లెవ్వాని కులికి యింపారంగ సురుచిరతోయముల్ గురియుచుండుఁ
బటుగతి నెవ్వానిభయమునఁ జుక్కలరాయండు వెన్నెల కాయ వెఱచు
నెవ్వానిదెస భీతి నింపారఁ బావకుం డేపుతోఁ డనవేఁడిఁ జూపఁజాలఁ

తే.

డెవ్వనికి బెగ్గలం బంది యెల్లతరులు, సురభివుష్పవర్షంబులు గురియుచుండు
నిట్టిరావణు వరియింపనేల యొల్ల, వేము నీకుఁ జెప్పిన బుద్ధు లేల వినవు.

548


వ.

అనియె నంత రాక్షసభామ లందఱుఁ గోపాటోపంబున సీత నవలోకించి నీవు
సర్వభూతమనోహరంబును మహార్హశయనోత్తమంబు నగునంతఃపురంబున వసి
యింప నేల యొల్లవు బలహీనుం డైనమర్త్యునకుం బత్నివైన నేమి సుఖం బను
భవించెదవు రామునిమీఁదిచిత్తంబు విడువు మతనికి నీకును సమాగమం బెన్నటి
కిని గలుగదు త్రైలోక్యవసుభోక్త యైనరావణుం జేకొని యథాసుఖంబుగ విహ
రింపుము రాజ్యభ్రష్టుండును ధనహీనుండును నసిద్ధార్థుండును విక్లబుండు నగు
రామునిం గోరనేల నీయట్టిరూపవతికిం దగినపురుషుండు దొరకొనుట భాగ్య
వశంబునం గాదె యని పలికిన విని బాష్పాకులలోచన యగుచు వైదేహి వారల
కి ట్లనియె.

549

సీతాదేవి రాక్షసస్త్రీలవచనంబులఁ దిరస్కరించుట

క.

మీ రెంత వెరవుఁ గఱపిన, దారుణమును లోకనిందితం బగుకార్యం
బారయ నాచిత్తంబునఁ, దూఱునె పతి విడిచి పరునితోఁ గూడుదునే.

550


రసలో మనుజాంగన రా, క్షసునిం బతిగా వరింపఁగాఁ దగ దింక
న్వెస నన్నుఁ బట్టి మెసవిన, మెసవుఁడు నే వినఁగ నొల్ల మీవచనంబున్.

551


తే.

నానిజేశుఁడు రాజ్యవిహీనుఁ డైన, మానవుం డైన ముని యైన దీనుఁ డైన
నెట్టివాఁ డైనఁ గాని నా కేమి యెగ్గు, సతత మనురక్త నైతి నాసత్యధృతికి.

552


సీ.

ఇంద్రుఁ బులోమజ యినుని సువర్చల సగరుఁ గేశినియు నైషధుని భైమి
తగ వసిష్ఠుని నరుంధతి భార్గవుం డైనచ్యవను సుకన్యక సత్యవంతు
సావిత్రియును మఱి చంద్రుని రోహిణి సౌదాసు మదయంతి శంభు గౌరి
కపిలుని శ్రీమతి కలశసంభవుని లోపాముద్ర కంజాతభవుని వాణి


తే.

పగిది నేను నిరంతరభక్తితోడ, రఘుకులాబ్ధిరాకాచంద్రు రామచంద్రు
వేడ్క నెడఁబాయ కెపుడు సేవించుదాన, నరయ కిటు నన్నుఁ బాపంబు లాడనగునె.

553


వ.

అని పలుక నత్తలోచరిచిత్తంబు నిజమతాయత్తంబు గాకునికి నతిక్రోధరూక్షేక్ష
ణలై రాక్షసభామలు బొమలు ముడివడఁ గటము లదర సందష్టదశన లగుచు
సర్వలోకవిద్రావణుం డైనరావణు నేల యొల్ల వని పరుషోక్తుల భర్దించుచు ఖడ్గ
పరశుపట్టిసప్రాసాదు లంకించి శింశుపాతరుమూలంబున కరుగుదెంచి విటపీపర్ణం
బులనడుమ నొదిఁగియున్న హనుమంతుం డేమియుఁ బలుకక వినుచుండ నుగ్రాకా
రలై కదియ నమ్మహీనందన గడగడ వడంకుచుఁ గన్నుల బాష్పజలంబులు
గ్రమ్ముదేర నేడ్చుచు నాశింశుపాతరుమూలంబుఁ జేర నేతించి యుండె వెండి
యు రాక్షసాంగన లందఱుఁ దర్జనభర్జనోక్తుల గర్జించుచుండ నప్పుడు విషణ్ణ
వదనయై నివ్వెఱపడి యున్నసీతం జూచి భీమదర్శనయుఁ గరాళయు నున్నతో
దరియు నగువినత యనురాక్షసి యతికుపితయై యి ట్లనియె.

554

రాక్షసస్త్రీలు సీతను దర్జనోక్తుల బెదరించుట

తే.

అరయ నీచేఁ బతిస్నేహ మంత మాకుఁ
గాంత యిచట దర్శిత మయ్యె నింతె చాలుఁ
గడఁగి యతిమాత్రకృతము దుఃఖంబుకొఱకుఁ
గల్పితం బగు నింత నిక్కంబు జువ్వె.

555


క.

జనకజ నీమాటలు విని, మనమునఁ బరితుష్ట నైతి మనుజేశునిపై
మన సుడిగి పథ్య మగుమ, ద్ఘనతరవాక్యం బొనర్పఁ గడఁగుము ప్రీతిన్.

556


చ.

కృపణు నధీరు మర్త్యు ధనహీనుని రాముఁ బరిత్యజించి దే
వపతినిభు న్బలాఢ్యు ధనవంతు సమర్థునిఁ ద్యాగశీలునిం
దపనసమానతేజుఁ బ్రియదర్శను నుత్తమరూపవంతు దై
త్యపతిని బంక్తికంథరునిఁ దద్దయు వేడ్క భజింపు మిత్తఱిన్.

557


క.

లీలం బ్రసూనమాలా, చేలాభరణాంగరాగశృంగారిణి వై
బాలామణి యిది మొదలుగ, నీలోకంబులకు నెల్ల నీశ్వరి వగుమా.

558


క.

వనమున జీవము విడిచిన, మనుజునిపై మమత యేల మానిని దేవేం
ద్రునకు శచి హరికి రమ శం, భున కుమ యనిలునకు స్వాహపోలికి నీవున్.

559


క.

రాక్షసవంశాధిపునకు, దక్షత సతి వగుము గాక తక్కిన నిన్ను
న్రక్షోవనితలు వ్రేల్మిడి, భక్షించెద రీక్షణంబ పటురోషమునన్.

560


వ.

అనియె నంత లంబమానపయోధర యగువికట యనురక్కసి ముష్టిం బూన్చి
గర్జించుచుఁ గోపాటోపంబున ని ట్లనియె.

561


తే.

ఇందువదన దశాననుఁ డింతదనుక, సప్రియము లైననీమాట లాలకించి
కరుణపెంపున మార్దవగరిమఁ జేసి, మది సహించినవాఁ డింకఁ బదరవలదు.

562


క.

పరులకు దురాసదం బగు, శరనిధిమధ్యమునఁ బొల్చు చటులనిశాటా
కరఘోరరావణాంతః, పురమునఁ జిక్కితివి యెందుఁ బోయెద వింకన్.

563


క.

రావణమందిరమున నెం, తే వలనుగఁ జిక్కియున్నని న్నిఁక రాక్షా
ద్దేవాధీశ్వరుఁ డైనను, గానఁగ శక్తుండె మేము కావలి యుండన్.

564


ఉ.

గన్నుల శోకబాష్పములు కాల్వలు గట్టఁగ నేల యేడ్చెదో
సన్నుతగాత్రి శోకము విషాదము దైన్యము వీడి వేడ్కతోఁ
బన్నుగ నస్థిరం బయిన ప్రాయ మతీతము గాక మున్నె సం
పన్ను దశాస్యుఁ గూడి మగువా విహరింపు యథాసుఖంబుగన్.

565


క.

తరుణీసప్తసహస్రము, లొఱవుగ నినుఁ గొల్వ మంజులోద్యానమున
న్నిరుపమభోగము లందుము, స్థిరసత్త్వునిఁ బంక్తిముఖునిఁ జేకొని ప్రీతిన్.

566


క.

హిత ముపదేశించెడునా, మతము వినక నీవు మాఱుమాటఁ బలికిన
న్జతురత నీరాత్రించర, సతు లందఱు నిన్నుఁ బట్టి చంపెద రబలా.

567

వ.

అనియె నంతఁ జండోదరి యనురాక్షసి క్రోధమూర్ఛిత యై కాలాయసమయం
బగుశూలంబు కేల నంకించి లీలం ద్రిప్పుచుఁ ద్రాసోత్కంపికుచ యగునీసీ
తను రావణుండు గొని తెచ్చిననాఁటనుండి నామనంబున దీని భక్షింపఁగోరు
చుండుదు నిప్పుడు యకృత్సంజ్ఞకం బైనహృదయదక్షిణభాగస్థమాంసవిశేషం
బును బ్లీహసంజ్ఞకం బైనహృదయవామభాగస్థమాంసవిశేషంబును గ్రోడసం
జ్ఞకం బైనవక్షోగతగోముఖాకృతిమాంసయుక్తశల్యంబును హృదయోపరిస్థిత
మాంసంబును బంధనసహితముకుళాకారహృత్పద్మాఖ్యమాంసవిశేషంబును
నాంత్రంబులును శీర్షంబును భక్షించెద నని పలికె నంతఁ బ్రఘస యనురాక్షసి
యి ట్లనియె.

568


ఉ.

తెంపునఁ బట్టి దీని తలద్రెవ్వఁగ నేసి నిశాటభర్తతో
నింపుగ సీత చచ్చె నని యిందఱముం దగ విన్నవించి నె
య్యంపుఁదనంబుతో నతనియానతిఁ గైకొని వేగ వచ్చి భ
క్షింపుద మీవినీలఘనకేశితనూగతమాంసఖండముల్.

569


వ.

అనియె నంత నజాముఖి యనురాక్షసి యి ట్లనియె.

570


ఉ.

చండనిశాతఖడ్గమునఁ జారుతరంబుగ దీనిమేనిలోఁ
గండలు గోయుఁ నేను మన కందఱకు న్విభజించి పెట్టెదం
దెండు పరార్థ్యలేహ్యము వినిర్మలపేయము హృద్యఖాద్యమున్
మెండుగ ముద్ద చేసికొని మ్రింగెద మాఁకలి దీఱునట్లుగన్.

571


వ.

అనునెడ నయోముఖి యనురాక్షసి యి ట్లనియె.

572


ఉ.

చండతరంబుగా మనయజాముఖి చెప్పినయట్లు వేగ గో
యుం డసిధార దీనియొడ లుధ్ధతి నే విభజించి పెట్టెదం
దెండు పరార్థ్య లేహ్యము వినిర్మలపేయము హృద్యఖాద్యమున్
మెండుగ ముద్ద చేసికొని మ్రింగెద మల్లనికుంభిలాస్థలిన్.

573


వ.

అని యి ట్లనేకప్రకారంబుల భయంకరాకార లై రాక్షసాంగనలు పరుషవాక్యం
బులఁ దర్జించిన విని యమ్మహీపుత్రి, ధైర్యంబు విడిచి రోదనంబు సేయుచు
బాష్పగద్గదకంఠి యై యి ట్లనియె.

574


క.

రసలో మనుజాంగన రా, క్షసునిం బతిగా వరింపఁ గాఁ దగ దింక
న్వెస నన్ను బట్టి మెసవిన, మెసవుఁడు నే వినఁగ నొల్ల మీవచనంబుల్.

575

సీత యశోకవృక్షమును బట్టుకొని యేడ్చుట

వ.

అని పలికి యద్దేవి రాక్షసమధ్యగత యై రావణునివాక్యంబులును రాక్షసాంగ
నలవచనంబులునుం దలంచి యంత కంత కగ్గలం బైనశోకంబున నించుకయైన
సుఖంబు గానక శరీరంబు సంకోచింపంజేసి మిక్కిలి వడంకుచు వనమధ్యంబున
వృకంబులచేత వర్తిత యై యూథపరిభ్రష్ట యెనమృగాంగనచందంబున దిగులు

గొనుచు దిగ్గున లేచి హనుమదధిష్ఠితశింశుపాతరుసమీపగతం బైనపుష్పితా
శోకవిటపంబు నవలంబించి శోకబాష్పజలంబులచేతఁ బయోధరంబులఁ దడు
పుచు శోకంబునకుఁ దుది గానక చింతించుచు ఝంయూవాతసముద్ధూతకదళి
యుం బోలె నాకంపించుచు రాక్షసి భయవిత్రస్త యగుటం జేసి వివర్ణవదన యై
వినీలవేణి కృష్ణభుజగియుం బోలెఁ బృష్ఠభాగంబునం జలింప నిట్టూర్పులు
పుచ్చుచు శోకోపహతచేతన యై దుఃఖార్త యై యి ట్లని విలపించె.

576


తే.

హారఘూత్తమ హాకరుణాలవాల, హాసుమిత్రాత్మజ పుణ్యాత్మ హామ
హానుభావ హాకౌసల్య హాసుమిత్ర, పాసితిని మిమ్ము శోకాభిపన్న నైతి.

577


ఉ.

రామునిఁ బాసి యీనగరిరాక్షసు లిట్లు దురుక్తు లాడఁగా
వేమఱు నాలకించుచుఁ బ్రవేషిత నై మని యుంటిఁ గావున
న్భూమి నకాలమందు మృతిఁ బొందరు మర్త్యు లటంచు బ్రహ్మశో
భామహిమాఢ్యు లాడెడుప్రవాదము సత్య మటంచు నెంచెదన్.

578


తే.

విషధినడుమ మహావాతవేగనిహత, యైనయోడకైవడి నూతనాంబునిహత
మైన పెన్నేటిగట్టుచందాన శోక, వేగహత నై నశించెద వేయి యేల.

579


క.

కమలదళపత్రనేత్రుని, విమలేందుసమానముఖుని వీరోత్తముని
న్సముదితతేజుని మద్విభు, నమరం జూచెదరు ధన్యు లయ్యెడువారల్.

580


ఉ.

ఇచ్చట రాముని న్రఘుకులేంద్రునిఁ బాసి నిమేష మైన నే
నచ్చుగ నుండఁజాల గరళాదులవెంటను జత్తు నంటినా
దెచ్చెడువారు లేరు మఱి తెంపునఁ బావకుఁ జొత్తు నంటినా
పొచ్చెము లేక రాక్షసులు పోవఁగనీ రిఁక నేమి సేయుదున్.

581


తే.

ప్రాణవల్లభుఁ డైనశ్రీరాముఁ బాసి, యకట దుష్టరాక్షసులమధ్యమునఁ జిక్కి
యిట్టిదుఃఖంబు నొందుట కేమి కిల్పి, షంబుఁ జేసితినో పూర్వజన్మమందు.

582


తే.

రాక్షసస్త్రీలచేత సంరక్షితనగు, నేను రాముని వీక్షింపనేని యిచట
నొకనిమిష మైన జీవించి యుండఁజాల, వితతదుఃఖంబుచే మేను విడుతు నింక.

583


క.

ధరలోనఁ బ్రాణికోటికి, నరుదుగఁ దనయిచ్చ దలఁచినప్పుడె మృతియున్
దొరకొనమి మానుషత్వము, నెఱిఁ బరతంత్రత్వ మెంతనీచం బకటా.

584


వ.

అని బహుప్రకారంబుల దుఃఖించుచు భూతావిష్ట యెనదానితెఱంగున మద
కరద్రవ్యసేవనంబున మైమఱచి యున్నదానిపోలికి శ్రమాపనోదనార్థంబు వివే
ష్టిత యైనకిశోరిచందంబున వ్యామూఢచిత్తమాడ్కి, మహీతలంబునం బడి
యడలుచుఁ గన్నీరు నించుచు నధోముఖి యై వెండియు నిట్లని విలపించె.

585


ఉ.

ఎక్కడ దండకాగహన మెక్కడ పావనగౌతమీతటం
బెక్కడ లంక న న్నసురుఁ డేపున మ్రుచ్చిలి తెచ్చు టెక్క డే
నెక్కడ నాథుఁ బాసి దనుజాంగన లుద్ధతిఁ గాఱులాడఁగా

నిక్కడ దిక్కు మాలి మను టెక్కడ హా విధి నేమి సేయుదున్.

586


సీ.

అక్కడ మన్నాథుఁ డనవహితుం డగుచుండ నీచాత్ముఁ డీయుగ్రదైత్యుఁ
డీరసమున బలాత్కారంబుగా నన్ను మ్రుచ్చిలి చేకొని తెచ్చె నిటకు
దనుజకాంతామధ్యమునఁ జిక్కి తత్క్రూరవచనము ల్వినుచు నెవ్వగలఁ బొగిలి
బ్రతికి యుండఁగఁజాల రామునిఁ బాసి దైత్యాంగనావశగత నైననాకు


తే.

ధనము ప్రాణంబు భూషణోత్తమము లేల, పరఁగ నీదుఃఖమున వ్రయ్యవాఱకునికి
నశ్మసారం బగుట నిక్క మస్మదీయ, హృదయ మజరామరం బగు నింకమీఁద.

587


తే.

భర్త నెడఁబాసి యిట్లుండవలసె నాకుఁ, బాపజీవితనై యింక బ్రతుకఁజాల
నకట యసతి ననార్య నైనట్టియేను, బుడమిలో నింద కిటు పాత్రభూత నైతి.

588


క.

జలనిధిపరివేష్టితభూ, మలయాధీశ్వరుని మంజువాదిని బతి న
త్యలఘుగుణుఁ బాసి యేగతి, నిల బ్రతికెదఁ బ్రాణసుఖము లివి యేమిటికిన్.

589


ఉ.

కావలి యున్నరాత్రిచరకాంతలు మ్రింగిన మ్రింగని మ్మిటన్
రావణుఁ డల్గి దారుణమనంబునఁ జంపినఁ జంప నిమ్ము నా
జీవితనాథుఁ బాసి పలుచింతలఁ గుందుచు నుంటకంటె నా
కేవిధి నైనఁ జా వమరు టెప్పటికి న్సుఖ మంచుఁ దోఁచెడిన్.

590


మ.

ప్రియముల్ పల్కిన నిష్ణురోక్తు లనిన న్భీమాకృతిం దోఁచినన్
జయశీలుండ నటంచు నెంచుకొనినం బ్రాబల్య మూహించిన
న్నయదూరుం డగుపంక్తికంఠు నమరేంద్రద్వేషి వామాంఘ్రిచే
నయినం దాఁక స్వధర్మము న్విడిచి యత్యాసక్తిఁ గాంక్షింతునే.

591


వ.

మఱియు నీరావణుండు నాచేత బహుప్రకారంబులఁ దిరస్కరింపఁబడినవాఁ
డయ్యు నత్తెఱం గెఱుంగక నృశంసస్వభావంబునఁ దన్నుం దనకులంబునుం
బేర్కొనుచు సారెసారెకు నన్నుం బ్రార్థించుటకు నిశ్చయించుచున్నవాఁ డీరా
క్షసాంగన లెన్నిప్రలాపంబు లాడిన దీప్తాగ్నిలోనం బడవైచిన నవయవంబులు
ఖండించిన హృదయంబు విదారించిన నేమి గావించినం గావింపనిమ్ము రావ
ణునిచెంత నిల్చుట కైన నొల్ల పని పలికి వెండియు ని ట్లనియె.

592


తే.

ప్రాజ్ఞుఁడు కృతజ్ఞుఁడును దయాపరుఁడు సాధు
వృత్తుఁ డని ఖ్యాతిఁ గన్నరఘూత్తముండు
కడఁగి నేఁడు మద్భాగ్యసంక్షయమువలన
నిర్ధయుం డయ్యె నని మది నేఁ దలంతు.

593


క.

నయవిదుఁడు సదయుఁడు నిరా, మయఁ డగురఘువల్లభుండు మద్భాగ్యపరి
క్షయమువలన నేఁ డింతకు, దయ దప్పెనొ దైవ మేమి దలఁచెనొ యకటా.

595


సీ.

నాకొఱకై కాదె లోకకంటకుఁ డైన ఘనరూపుఁ డగువిరాథుని వధించె
నాకొఱకై కాదె భీకరైషికమునఁ గపటకాకాసురు గర్వ మడఁచె

నాకొఱకై కాదె యేకాస్త్రమునఁ జతుర్దశసహస్రనిశాటరాజిఁ ద్రుంచె
నాకొఱకై కాదె వీఁకతో ఖరదూషణాదిరాక్షసుల ఘోరాజిఁ దునిమె


తే.

నట్టిరఘుకులనేత దివ్యాస్త్రవిదుఁడు, రాముఁ డుగ్రాజి రావణునామ మణఁచి
సంతసంబున నన్నుఁ బ్రసన్నదృష్టి, నెలమిఁ గొనిపోక యేల యుపేక్ష సేయు.

595


మ.

గురుశౌర్యుండు కృపాలుఁ డస్త్రవిదుఁడున్ గోదండదీక్షాగురుం
డురుతేజుండు సురేంద్రకల్పుఁడు రణోద్యుక్తుండు మన్నాథుఁ డ
ప్పరమోదారకుఁ డల్పవీర్యుఁ డగునీపౌలస్త్యు ఘోరాజిలో
వరశౌర్యంబునఁ ద్రుంచి నన్నుఁ గొనిపోవం జాలఁడే దక్షతన్.

596


క.

శరనిధిమధ్యంబున నె, వ్వరికిఁ బ్రవేశింపరాక వఱలెడులంకా
పుర మిది యైనను రఘుశే, ఖరుశరగతి కడ్డ మిచటఁ గలదే తలఁపన్.

597


ఉ.

వేల్పులు దైత్యు లొక్కమొగి వీఁక నెదిర్చిన బాణవహ్నిచేఁ
గొల్పఁగఁ జాలునంతటి యఖండపరాక్రమశాలి మద్విభుం
డల్పపరాక్రముం డగుదశాస్యుని వ్రేల్మిడిఁ ద్రుంచి యేలకో
పొల్పుగ నన్నుఁ దోడుకొనిపోక యుపేక్ష యొనర్చె నక్కటా.

598


ఉ.

మ్రుచ్చిలి నీచదైత్యుఁడు సముద్ధతి న న్గొనితెచ్చి లంకలో
నిచ్చట డాఁచినట్టివిధ మింతయు రాముఁ డెఱుంగకున్నవాఁ
డచ్చుపడంగ దాని వినినప్పుడె తక్కక భ్రాతృయుక్తుఁడై
వచ్చి దశాస్యునిం దునిమి వారక న న్గొనిపోవకుండునే.

599


ఉ.

అక్కట రావణాపహృత యై పలవించుచు సీత లంకలో
దిక్కఱి కుందుచున్నయది తీవ్రతఁ గైకొని ప్రోవు మంచుఁ దా
మక్కువతోడ రామునకు మానుగఁ జెప్పెడునట్టియాప్తుఁ డిం
దొక్కఁడుఁ జిక్కఁ డెట్లు వినునో నను నేగతి నుద్ధరించునో.

600


చ.

వనమున మద్విధంబు దెలుపం దగునట్టిపతంగపుంగవుం
డనఘుఁడు నాఁడు నాకొఱకు నడ్డము వచ్చి దశాస్యుఁ దాఁకి నే
ర్పున వడిఁ బోరి తన్నిశితభూరితరాసివిలూనపక్షుఁడై
చనె నిఁకఁ దెల్పఁగాఁ దగిన సజ్జనుఁ డెవ్వఁడు లేఁడు చూడఁగన్.

601


క.

న న్నిచట నున్నదానిఁగఁ, బన్నుగ నేపగిది నైనఁ బతి వినె నేనిం
గ్రన్నన శరముల లోకము, గన్నార నరాక్షసంబు గావింపఁ డొకో.

602


ఉ.

తెంపునఁ గ్రుద్ధుఁడై విభుఁడు దివ్యశరంబుల నీపయోధి శో
షింపఁగఁ జేసి లంక నతిశీఘ్రతఁ జొచ్చి దశాస్యుఁ నాజిలోఁ
జంపి తదాప్తమంత్రిసుతసంతతిఁ ద్రుంచి తదీయకీర్తి మా
యింపఁగఁ జేసి దోర్బలసమృద్ధి ననుం గొనిపోవు నుద్ధతిన్.

603


తే.

పాపవర్తనుఁ డయిన యీపంక్తిముఖుఁడు
పార్థివులదృష్టిపథమునఁ బడియె నేని

పరఁగ నొక్కింతత్రుటి యైన బ్రతుకఁజాలఁ
డెన్నఁ డాగతి నాజి సంవృష్టుఁ డగునొ.

604


క.

గతి సెడి దుఃఖించెడునా, గతి నిఁకఁ బ్రతిమందిరముఁ గాకుత్‌స్థశరా
హతనాథ లై నిశారచర, సతు లందఱు నేడ్వఁగలరు సత్యం బరయన్.

605


వ.

మఱియు నీలంకాపురంబు శీఘ్రకాలంబునఁ జితాధూమాకులపథయు గృధ్రమం
డలసంకులయు నై శ్మశానంబుపగిదిఁ జూపట్టం గలయది రాక్షసులదురాచా
రంబే వారికి విపర్యయంబు ప్రకటింపం జేయుచున్నది గావున శీఘ్రంబున
నిక్కంబుగా నేను మనోరథంబు నధిగమింపం గలదాన మఱియు నశుభంబు
లనేకంబులు దోఁచుచున్నవి గావున దురాత్ముం డగునీరావణుండు నిహతుం
డగుచుండఁ బుణ్యోత్సవసమృద్ధం బైనయిప్పురంబు నిస్సంశయంబుగా విధవాం
గనపగిది హతప్రభ కాగలదు మఱియు నింటింట దుఃఖార్తలై విలపించు
రాక్షసకన్యల రోదనశబ్దంబు నాలకింతు మఱియు నీనగరంబు రామసాయక
నిర్దగ్ధంబై నిబిడాంధకారహతద్యుతియై పాడఱి యుండఁ గలదని యిట్లు ప్రమా
ణంబుగాఁ బలికి వెండియు దుష్టాత్ముం డగు రావణునిదురాలాపంబులు దలంచి
దుఃఖావేశంబున సమ్మహీనందని వెండియు ని ట్లని విలపించె.

606


ఉ.

చేరువ రావణుండు మితిఁ జేసినకాలము డాయ వచ్చె నా
కారులు ధర్మహీనులు దురాత్ములు కాపథవర్తు లద్భుతా
కారులు గాన నన్ను ననుకంపఁ దలంపక చంపఁ జూతు ర
ట్లీరస మెత్తి యేది గతి యేమి యొనర్చెద భర్తృహీననై.

607


ఆ.

తివిరి నాకు విషము దెచ్చి పెట్టెడుపుణ్యుఁ
డెవ్వఁడైన దొరకెనేని యిపుడె
తనువు విడిచి యమునిఁ గనఁ జనవచ్చును
ఘనుని విభునిఁ బాసి మనిన మేలె.

608


వ.

అని తెంపునం బలికి వెండియు నమ్మహీనందని మహావీరుండును మహానురక్తుండు
నగురాముండు తన్ను వెదకక యుపేక్షించి యున్నవాఁ డని శంకించి యిట్లుండు
టకు స్వజీవనాపరిజ్ఞానంబును దద్విపత్తియుఁ దాత్త్వికవైరాగ్యంబును బ్రవాస
దోషంబువలన నీప్రేమనాశంబును స్వగుణహీనత్వంబును స్వభాగ్యవిపర్యయం
బు నివి యాఱును గారణంబులుగా నుత్ప్రేక్షించుచు ని ట్లని వితర్కించె.

609


క.

మానవనాయకుఁ డించుక, యే నిట మని యున్నచంద మెఱుఁగఁ డెఱిఁగినన్
మానుగ ననుఁ దిలకింపక, తా నేటి కుపేక్ష సేయు ధార్మికుఁ డరయన్.

610


క.

ఘనతర మగుమద్దుఃఖం, బున నిక్కము మేను విడిచి భూపతి వగతో
ననుజయుతంబుగ నాకం, బున కాగతి నరిగి యుండఁబోలుఁ దలంపన్.

611


క.

ధవళాబ్జనయనుఁ డగురా, ఘవుని విలోకించి యక్షగరుడోరగదా
నవసిద్ధసాధ్యకిన్నరు, లవితధముగఁ జల ధన్యు లయ్యెద రచటన్.

612

మ.

జనకోర్వీపతిపుత్రి నై దశరథక్ష్మానాథవంశాబ్ధిచం
ద్రునకుం గోడలినై యమేయగుణయుక్తున్ రామునిం బ్రాణనా
థునిఁగాఁ జేకొని పుణ్యసాధ్వి యన నెంతో ఖ్యాతి వాటించి యా
ఘనుని న్రామునిఁ బాసి దిక్కఱి మనంగా నేర్తునే యిచ్చటన్.

613


ఉ.

శ్యామలకోమలాంగుని సుమాస్త్రసమానతనూవిలాసు సు
త్రామసమానవైభవు దరస్మితనిర్జితశీతధాముని
న్రామునిఁ బాసి యొంటిమెయి రాక్షసుచేఁ బడి చావు మంచు వా
క్కాముఁడు వ్రాసియుండ మదిఁ గందిన నేమిటఁ దీఱు నీనగన్.

614


ఉ.

నెట్టన రామభూపతికి నే సతినై జనియించినందు కి
ప్పట్టున నించుకైన ననపాయసుఖం బొనగూర్పలేక యో
పట్టుగ దుఃఖపుంజములపాలుగఁ జేసితి కానలోన నా
పుట్టుకయేల ధాత్రి ననుబోఁటి యభాగ్యులు గల్గ నేర్తురే.

615


క.

రాముఁడు ధీమంతుఁడు ని, ష్కాముఁడు రాజర్షి ధర్మకాముఁడు నాత్మా
రాముం డాసుజ్ఞానికి, నీమెయి నామీఁదఁ గాంక్ష యేల జనించున్.

616


చ.

చనువుగ నొద్ద నున్నయెడ సౌహృద ముంచుట యొద్ద లేనిచోఁ
దనహృదయంబులో నెనరుదప్పుల రాజులకు న్స్వధర్మమై
నను ధరలోఁ గృతఘ్నునిగుణం బది గాని కృతజ్ఞుఁ డైనరా
మునిగుణమే జగంబు లవి మూఁడు మునింగిన నన్ను వీడునే.

617


తే.

శత్రుసూదను నద్భుతచరితు నమిత, వీర్యు నక్లిష్టకర్ము మద్విభునిఁ బాసి
బ్రతికి యుండుటకంటె నెబ్బంగి నైన, మేనుఁ బాయుట నా కది మేలు గాదె.

618


తే.

ధరణి నెంత యభాగ్యనో మఱియుఁ బాప
మేమి చేసితినో తొల్లి యినకులేంద్రు
విమలగుణుఁ బాసి దైత్యమధ్యమునఁ జిక్కి
యనదమాడ్కిఁ గృశింపఁ బా లైతి నకట.

619


తే.

అకట నన్న్యస్తశస్త్రులై యడివిలోన, మూలఫలములు మెసవుచు మునులఁ గూడి
తవిలి పుణ్యాశ్రమంబులఁ దపము సల్పు, చున్నవారలొ యుపరతిఁ గన్నవారొ.

620


క.

అటు గాక యున్న వనమునఁ, గుటిలుం డగుపంక్తిముఖుఁడు గురుకపటమునం
దటుకున వంచించి విశం, కటముగ వధియించె నొక్కొ కలుషాత్మకుఁ డై.

621


ఆ.

అట్టియేను గాల మరుగుచు నుండ నే, కరణిఁ దాళుదాన గాఢశోక
మిట్లు పెక్కుగతుల నేర్చును నుండ నా, కలఘుభంగి మృతియుఁ గలుగ దేల.

622


శా.

రామక్ష్మావిభుఁ డబ్ధి దాఁటి రయ మారన్ వచ్చునొ రాఁడొ దో
స్సామర్థ్యంబున దైత్యు నాజి సుర లెంచం ద్రుంచునో ద్రుంపఁడో
వామాంకంబునఁ జేరి నన్నుఁ గొనిపోవం జూచునో చూడఁడో
నామీఁదం గృప గల్గునో గలుగదో సౌభాగ్య మెట్లున్నదో.

623

ఉ.

వారక దండకావననివాసి మునీశ్వరరక్షణార్ధమే
వీరవరేణ్యుఁ డుగ్రరణవీథి విరాధుని దూషణు న్భుజో
దారు ఖరు న్జతుర్దశసహస్రనిశాటసమన్వితంబుగా
ధారుణిఁ గూల్చె నమ్మునివితానశరణ్యున కేను మ్రొక్కెదన్.

624


క.

తలకొని ప్రియాప్రియంబులు, గలుగక జితకరణు లగుచు గతకల్మషు లై
యలరారునట్టితపనులు, తలపోయఁగఁ బుడమిలోన ధన్యులు గారే.

625


ఉ.

రాముఁడు ఘోరరాక్షసవిరాముఁడు రాక్షసనాథుని న్సమి
ద్భూమి వధించి నన్నుఁ గొనిపోయిన మే లటు గానిచోఁ దదీ
యామలవిగ్రహంబు హృదయంబున నెంచుచుఁ జత్తుఁ గాని దు
స్తామసుఁ డైనరాక్షసు వశంగతనై మనఁజాల నెంతయున్.

626


క.

ప్రియమువలన నగు సుఖ మ, ప్రియమువలనఁ గలుగు నధికభీతి విడిచి ని
ర్భయులై చరించుపుణ్యో, దయులకు వందన మొనర్చెద న్గడుభక్తిన్.

627


మ.

అని యి ట్లాయమ భాష్పపూర్ణముఖియై హా రామ హా లక్ష్మణా
యని దుఃఖంబునఁ జీరి యేడ్వ విని క్రోధారక్తనేత్రాంతలై
దనుజ్ఞస్త్రీలు రయంబునుం జని తమంతం దాము దేవారితో
వినయం బొప్పఁగ విన్నవించిరి సతీవృత్తాంత మాద్యంతమున్.

628


చ.

అటు దివిజారితోడ జనకాత్మజ యున్నవిధంబు దెల్పి సం
చటులకరాళవహ్నికణసంక్షయ మక్షుల నుప్పతిల్లఁగాఁ
గుటిలతరాస్యము ల్దెఱచికొంచు ఘనార్భటి మ్రోయుచున్ విశం
కటగతి నేగుదెంచి సతిఁ గ్రమ్మఱఁ గాంచి భయంకరాంగు లై.

629

రాక్షసస్త్రీలు సీతను బట్టి మ్రింగెద మని తర్జించుట

క.

సామమున నెంతఁ జెప్పిన, నోమగువా దానవేంద్రు నొల్లవు గద యిం
కేమనిన నేమి యగు నిను, మే మందఱ మిపుఁడు పట్టి మ్రింగెద మింకన్.

630


వ.

అని బహుప్రకారంబుల భయంకరాకారలై తర్జించుచున్నసమయంబున నచ్చే
రున నిద్రించుచున్నవిభీషణపుత్రి యగుత్రిజట యనురాక్షసి రయంబున.

631


క.

జనకునికూఁతును దశరథ, జనపతికోడలును రామచంద్రునిసతి నీ
వనజాక్షి మ్రింగ వలవదు, నను మ్రింగిన మ్రింగుఁ డింక నరభుగ్వనితల్.

632


క.

దశరథసుతునకు విజయము, దశముఖునకుఁ జేటు గలుగుఁ దప్పదు నే నీ
నిశ దీనితెఱఁగుఁ గాంచితి, విశదంబుగ స్వప్నమందు వింటిరె మీరల్.

633

త్రిజట తనకుఁ గలిగిన స్వప్నమును రాక్షసస్త్రీల కెఱింగించుట

క.

నా విని నివ్వెరపడి కడుఁ, దీవరమున దైత్యసతులు త్రిజటా యేలా
గీవిధము తేటపడఁ జెపు, మా వినియెద మనిన వారి కది యి ట్లనియెన్.

634


చ.

సలలితశుక్లమాల్యములు చారుదుకూలము మేనఁ దాల్చి సొం

పలరఁగ నంతరిక్షగతహంససహస్రసమేతదాంతని
ర్మలశిబికాధిరూఢుఁ డయి రాముఁడు లక్ష్మణుతోడఁ గూడి య
త్యలఘుజనంబుతో నిచటి కద్భుతవైఖరి రాఁగఁ జూచితిన్.

635


క.

హరిణాంబరధారిణి యై, ధరణిజ విమలప్రభాభ్యుదార యగుచు సా
గరపరివేష్టితపాండుర, గిరిపై నశియించి యున్నక్రియఁ గనుఁగొంటిన్.

636


సీ.

మఱియు రాముఁడు శుక్లమాల్యాంబరంబులు దాల్చి చతుర్దంతదంతి నెక్కి
తమ్మునితోఁ గూడి తనతేజమున దిశల్ వెలుఁగంగఁ జేయుచు జలజనేత్ర
వెదకుచుఁ జనుదెంచి వేడ్కతో సీతనుఁ గనుఁగొనె నంత నాజనకపుత్రి
యాశ్వేతశిఖరిపై నధిపుచేత గృహీత మైన గజస్కంధ మాశ్రయించి


తే.

విభునితొడమీఁద నుండి యావిధుతపనులఁ
గరముచే సంస్పృశింపంగఁ గంటి మఱియు
వారి మువ్వుర ధరియించి వరుస నాగ
జోత్తమం బీపురంబుపై నుండఁ గంటి.

637


తే.

మఱియు నారామభద్రుండు కరము వేడ్రఁ
దమ్ముని మహీజఁ గూడి యా దంతి డిగ్గి
పాండువృషభాష్టకోపేతభవ్యరథము
నెక్కి రయమున నీలంక కేగుదెంచి.

638


క.

దనుజుల వధించి పదపడి, యనుజుని జానకిని గూడి యనుపమహర్షం
బునఁ బుష్పక మెక్కి రయం, బున నుత్తరదిశకు నేగఁ బొడగంటి రహిన్.

639


వ.

ఇవ్విధంబున రాముండు సీతాలక్ష్మణసహితుం డై కలలోనం గనుపట్టెఁ గావున
నమ్మహాత్మునకు గెలు పవశ్యంబు సంభవించు మఱియు మహాతేజుం డగురాముండు
స్వర్గంబు పాపాత్ములకుం బోలె సురాసురాదుల కజయ్యుండై యుండు నది
యునుం గాక రావణుండు తైలసముక్షితుండును రక్తాంబరధరుండును బానమ
త్తుండు నై కరవీరకృతమాల్యోపశోభితం బై పుష్పకవిమానంబున నుండి నేలం
బడినయట్లు మఱియుఁ గృష్ణాంబరధరుండును రక్తమాల్యానులేపనుండును ముం
డితశిరస్కుండు నై యొక్కవనితచేత నాకర్షింపబడినయట్లు వెండియు ఖర
యుక్తం బైనరథం బారోహించి వికలంబుగా నవ్వుచు నృత్యంబు సేయుచుఁ
దైలపాలనంబు గావించుచు భ్రాంతచిత్తాకులేంద్రియుం డై పరిభ్రమించినట్లు
మఱియు రాసభంబు నెక్కి దక్షిణాభిముఖంబుగాఁ జనినయట్లు మఱియు నాగ
ర్దభంబుమీఁద నుండి తలక్రిందుగాఁ బుడమిం ద్రెళ్లి భయమోహితుం డై
శీఘ్రంబున లేచి సంభ్రాంతుండై భయార్తుండై మదవిహ్వలుండై యున్మ
త్తుండుం బోలె దిగంబరుండై దుర్వాక్యంబులు ప్రలపించుచు దుర్గంధదుస్సహ
ఘోరతిమిరసంవృతనరకోపమం బైన మలపంకంబునందుఁ బడి మునింగినట్లు
మఱియుఁ గాళియుఁ గర్దమలిప్తాంగియు రక్తాంబరధరయు నైన యొక్కవనిత

రావణునికంఠంబునఁ బాశంబు దగిలించి దక్షిణాభిముఖంబుగా నీడ్చుకొని
యరిగినట్లు మఱియుఁ గుంభకర్ణుండును రావణునట్లు ఖరారోహణమలపంకపత
నాదిక్రూరనిమిత్తయుక్తుండై దక్షిణాభిముఖంబుగాఁ జనినయట్లు మఱియు
రావణునందనులందఱుఁ దైలసముతాంగు లైనయట్లు మఱియు రావణకుంభ
కర్ణేంద్రజిత్తులు వరాహోష్ట్రశింశుమారంబు లెక్కి దక్షిణాభిముఖులై యరిగినట్లు
మఱియుఁ గుంభకర్ణాదిరాక్షసులు రక్తమాల్యాంబరధరులై తైలపానంబు
సేయుచు గోమయహ్రదంబునం గూలినట్లు సవాజిరథకుంజరము భగ్నగోపుర
తోరణయునై లంక సముద్రంబునం గూలి మునింగినట్లు మఱియు నీలంక రామ
కింకరుం డగునొక్కవానరునిచే భస్మీభూతయై కూలినట్లు లంకాపురంబు భస్మ
రూపం బగుచుండ రాక్షసాంగనలు విధవలై యింటింట గుంపులు గట్టి యుచ్చై
ర్నాదంబుల రోదనంబు సేయుచుఁ దైలపానంబు గావించుచు వికృతంబుగా
నవ్వుచు నృత్యంబు సేయుచున్నట్లు విభీషణుండొక్కరుండు శుక్లమాల్యాంబర
ధరుండును శుక్లగంధానులేపనుండును శ్వేతచ్ఛత్రుండును శంఖదుందుభినిర్ఘోష
నృత్తగీతాలంకృతుండు నై శైలసంకాశంబును మేఘ స్నితనిస్వనంబు నగు
చతుర్దంతదంతి నెక్కినట్లు మఱియు మంత్రిచతుష్టయసమన్వితంబుగా విమానం
బారోహించి నృత్తవాదిత్రనిస్వనభానురం బైనసభామధ్యంబునం బ్రకాశించి
నట్టు లి ట్లనేకప్రకారంబుల రామునకు విజయంబును రాక్షసులకు వినాశంబు
ను దెల్పు నొక్కకల గంటి నాకల నిక్కంబు గావున.

640

త్రిజట రాక్షసస్త్రీలకుఁ దనస్వప్నముయొక్క ప్రభావమును దెల్పుట

ఉ.

రాముఁడు వారిరాశిని గరం బవలీలగ దాటి వచ్చి సు
త్రామవిరోధి యైనయలరావణు దైత్యయుతంబు గాఁగ సం
గ్రామమున న్శితస్ఫుటశరంబులఁ ద్రుంచి ముదంబుతో జయ
శ్రీమహితాత్ముఁడై కడిమి సీతను గైకొని పోవు వ్రేల్మిడిన్.

641


చ.

అతిసుకుమార యయ్యు జనకాత్మజ మందిరసౌఖ్యమేమియున్
మతిఁ దలపోయ కెంతయు సమంచితవైఖరి భర్తృభక్తిచే
నతులితఘోరసత్త్వనికరావృత యై తగు కాననోర్వి కా
గతిఁ జనుదెంచె నట్టిప్రియకాంతను దా నెడాయ నేర్చునే.

642


క.

నానావిధదుఃఖంబుల, చే నీశశిముఖి విముక్తయై బాగుగఁ జే
తోనాథుఁ గూడి తగఁ బర, మానందముతోడఁ జాల నలరుచు నుండున్.

643


క.

దురితాత్ము లయిన రజనీ, చరులకు సురవినుతశౌర్యసాహసుఁ డగునీ
తరుణీమణీవల్లభుచే, నరుదారగఁ దీర్పరానియాపద గలుగున్.

644


వ.

కావున.

645


క.

మీరలు పరుషోక్తుల గడు, వేఱుగ నీచారునేత్ర వెఱపింపక సొం
పారఁగ వినయవచనములఁ, గోరి ప్రసాదంబు వేఁడుకొనుఁ డిఁకమీదన్.

646

క.

పడఁతికి దుఃఖము గలయ, ప్పుడు పరులకు నిట్టిస్వప్నముం దోఁచిన న
ప్పడఁతుక యాదుఃఖముచే, విడివడి సౌఖ్యంబు నొంది వెలయు ధరిత్రిన్.

647


క.

ఈవనితకు మ్రొక్కుఁడు కృప, యావహిలఁగ సుప్రసన్న యై మనలఁ దగన్
వావిరి భయంబువలనం, గావ సమర్థ యగుఁ దగవు గా దిటు లాడన్.

648

త్రిజట రాక్షసస్త్రీలకు సీతాశుభలక్షణంబులును శుభనిమిత్తంబులును దెల్పుట

వ.

అదియునుం గాక యీవిశాలాక్షియంగంబులయందు దుఃఖహేతు వైనవిరూప
లక్షణం బొక్కింత యైనఁ గానఁబడ దదుఃఖార్హయు దివ్యభోగార్హయు నగు నీ
దేవికిఁ గాంతివైకల్యమాత్రంబున నీదుఃఖం బుపస్థితం బయ్యెనని యూహించెద
నీసీతకు రాక్షసరాజనాశనరామవిజయరూపకార్యసిద్ధి యగుటకు సందియంబు
లేదు మఱియును.

649


ఉ.

దాఁచఁగ నేల స్వప్నమునఁ దప్పక నేఁ గనినంత కాదు దో
షాచరులార యీసుదతి సవ్యభుజోరుకుచేక్షణంబు లెం
తే చలియించుచున్ మనుజనేతృజయాసురనాథనాశసం
సూచనఁ జేయుచున్నయవి చూచితిరే యవి సారెసారెకున్.

650


వ.

మఱియుఁ బింగళకాఖ్యఖగంబు తరుశాఖాగ్రంబుమీఁద నుండి యుత్తమ
సాంత్వవాదియై శోభనబంధుసమాగమసూచకం బైనసర్వంబు నుచ్చరించుచు
సంతోషవిశేషంబున సారెసారెకు సమాగతశుభంబు నెదుర్కొను మని సీత
నుద్దేశించి ప్రేరేపించుచున్నదానియట్లు చూపట్టుచున్నది గావున నెల్లభంగుల
రామునకు విజయంబును రావణునకు వినాశంబును నిక్కంబుగా సంభవించుం
గావున మీ రిమ్మహీకుమారిఁ దర్జనభర్జనోక్తులం దూలనాడక మృదుమధుర
వాక్యంబుల ననూనయించుచు వినయభక్తిస్నేహంబులం గొలిచి బ్రతుకుం
డనిన నాత్రిజటపలుకులు విని వెఱఁగుపడి యద్ధానవాంగనలు తత్ప్రకారంబున
జానకి నాశ్వాసించుచుఁ బ్రియవాదినులై కొలిచియుండి రంత నద్దేవి దురాత్ముం
డగురావణుండు తన్ను మాసద్వయంబునకు హింసించెద నన్నపలుకులు తలపోసి
రాక్షసీమధ్యంబునం జిక్కి భయకంపితాంగియై వనాంతంబున సింహాభిపన్న
యైనగజరాజకన్యయుంబోలె నడలుచుఁ గాంతారమధ్యంబున విసృష్ట మైన
బాలికతెఱంగున ని ట్లని విలపించె.

651

సీత రావణునికట్టడం దలంచి దుఖించుట

ఉ.

అక్కట పాపజాతి చతురాస్యుఁడు గావలె నన్నయప్పుడే
చక్కగఁ బ్రాణికోటి కిలఁ జా వొనగూర్పనికారణంబునం
దక్కక నాథుఁ బాసియును దైత్యసతు ల్పరుషోక్తు లాడఁగా
నిక్కడ దైత్యబాధఁ బడి యే బ్రతుక న్వలసె న్విపన్న నై.

652


తే.

అకట వజ్రాహతం బైన యచలశిరము, కరణి నాహృదయంబు శోకంబుచేత

వేయివ్రయ్యలై పోవదు వితతవజ్ర, సారమయముగాఁ బోలు నిస్సంశయముగ.

653


మ.

కర ముద్వృత్తి దశాననుండు నను వీఁకం జంపిన న్మేలె గా
కరయం బాఱుఁడు వేద మంత్యజున కత్యాసక్తి నీ లేని వై
ఖరి నాచిత్తము పాపచిత్తుఁ డగురక్షఃపాలుపా ల్సేయ నే
ర రఘుశ్రేష్ఠుఁ దలంచుచుం దనువునం బ్రాణంబులం బాపెదన్.

654


ఆ.

ఆత్మహననకార్య మధికదోషం బని, వేదవిదులు చెప్ప వింటి మైన
వజ్రధరరిపునకు వధ్యనై యున్ననా, కాత్మహననదోష మరయ లేదు.

655


ఉ.

ఆడినయంతవట్టు చల మారఁగఁ జేసెడువాఁడు రావణుం
డోడక శల్యకృంతుఁడు సముద్ధతి గర్భగతార్భకాంగము
ల్వాఁడిమిఁ ద్రుంచినట్టు లిఁక బార్థివుఁ డీడకు రాకయున్ననా
జాడనె తీక్ష్ణశస్త్రములఁ జక్కలువాపఁడె మామకాంగముల్.

656


వ.

మఱియు రాజాపచారంబున బద్ధుండై ప్రాతఃకాలంబునందు వధ్యుం డగుతస్క
రునకుంబోలె రావణనిరుద్ధనై దుఃఖంచుచున్ననాకు మాసద్వయంబు రయం
బున నరుగుచుండ నత్యంతదుఃఖంబు వాటిల్లు నేమి సేయంగలదాన నని
యంతకంత కగ్గలం బగుశోకావేశంబున.

657


శా.

ఆకంజేక్షణ యశ్రుపూర్ణముఖియై హా రామ హా లక్ష్మణా
హా కౌసల్య సుమిత్ర హా జనకగోత్రాధీశ మి మ్మందఱ
న్వీఁకం బాసి దురాత్మకుం డగుమరుద్విద్వేషిచేఁ జిక్కి య
స్తోకార్తి న్బడరానిబాధఁ బడితిన్ దుఃఖాబ్ధినిర్మగ్న నై.

658


చ.

హరిణమువెంటఁ బైఁడిమెకమంచు రఘూత్తము నేల పంచితిం
బరుసము లాడి వెంటనె కృపాళుని లక్ష్మణు నేల పుచ్చితిన్
గురుతరదుఃఖవేగమున ఘోరవనంబున నన్నుఁ గాన కె
త్తెఱఁగునఁ గుందిరో యెటులు ద్రిమ్మరిలో యెటు లార్తిఁ దూలిరో.

659


తే.

అకట మత్కారణమున మహాత్ములైన, నృపజులు మృగరూపంబు ధరించినట్టి
చటులఘోరజంతువుచే విశస్తు లైరి, యశనిచే సింహవృషభంబు లణఁగినట్లు.

660


ఉ.

అక్కట పాపకాలుఁడు మృగాకృతితోఁ జనుదెంచి క్రూరత
న్దక్కక మందభాగ్య నగునన్నటు మోహితఁ జేసినందున
న్మిక్కిలి రామలక్ష్మణుల మిన్నక పాసితిఁ గానలోన నీ
దృక్కఠినాత్ముఁ డెందుఁ గలఁ డేమని దూఱినఁ దీఱు నీవగల్.

661


శా.

హా రాజోత్తమ హా కృపాజలనిధీ హా పూర్ణచంద్రాననా
హా రాజీవదళాక్ష హా గుణమణీ హా రామ హా సత్కృపో
దారా నన్ జెఱఁ దెచ్చి పాపరతుఁ డీదైత్యేంద్రుఁ డీలంకలో
ఘోరప్రక్రియ జంపఁ బూనె నను వే గొంపోఁగదే సత్కృపన్.

662

వ.

మఱియు మదీయధర్మనియమంబును క్షమయు ననన్యదేవత్వంబును శీలంబును
బాతివ్రత్యంబును గృతఘ్నునందుఁ బ్రయోగించినకృతంబుం బోలె నిరర్థకం
బయ్యె మఱియు నిన్నుం గానక దుఃఖించుచు దైన్యంబు నొంది సంగమంబు
నందు నిరాశనై యున్నకతంబున నాచే ననుష్ఠితం బైనధర్మంబు నేకపత్నీ
త్వంబును వితథంబై చనియె నని వగచి వెండియు.

663


ఉ.

తప్పక తండ్రి పంచినవిధంబున నీవు వివాస మింక నే
ర్పొప్పఁగఁ దీర్చి క్రమ్మఱ నయోధ్యకు నేగి సమగ్రవైభవం
బుప్పతిలంగ మేచకపయోధరవేణులఁ గూడి నిత్యమున్
మెప్పుగ సర్వభోగములు మీఁదట నొందెదు నిర్భయుండ వై.

664

సీత యురిగొని ప్రాణములు విడువ యత్నించుట

ఉ.

నే నిచ్చోట భవత్పదాంబుజము లెంతే భక్తిఁ జింతించుచు
న్నీనామంబు పఠించుచు న్నిను మది న్నిత్యంబు భావించుచున్
దానవ్యంతరమందుఁ ద్వద్విరహసంతాపాగ్నిసంతస్తనై
నానాభంగుల నల్పకాలమునఁ బ్రాణత్యాగము జేసెదన్.

665


చ.

గరళము గ్రోలి యైనఁ బటుఖడ్గమునం దల ద్రెంచి యైన స
త్వరముగఁ జత్తు నన్న విషదాతయు దారుణఖడ్గదాతయు
న్దొరకఁ డొకానొకం డయిన దుష్టనిశాచరు నాజ్ఞ వేణిచే
నురిగొని చత్తు నిప్పటికి నొండు సుయుక్తియు లేదు చూడఁగన్.

666


వ.

అని యనేకప్రకారంబుల విలపించుచు సమాహితం బగుచిత్తంబున రామునిం
దలంచుచు శోకంబున నడలుచు మొగంబున దైన్యంబు దోఁప దిగ్గున లేచి
వేణిం బ్రతిగ్రహించి పుష్పితాశోకశాఖావలంబనంబుఁ జేసి మరణవ్యవసా
యంబునందుఁ గృతనిశ్చయ యై తనకులంబును రామలక్ష్మణులం జింతించు
చుండ నప్పుడద్దేవికి శుభంబు దెలుపుచు ధైర్యసంపాదకంబులును బూర్వదృష్టం
బులును సుప్రసిద్ధంబులును శుభసూచకంబులు నగుకొన్నినిమిత్తంబులు
శ్రీమంతుం డైనమానవుని భృత్యులుంబోలె నమ్మహీనందని భజించెఁ బక్ష్మ
రాజినృతంబును గృష్ణవిశాలశుక్లంబును శుభదర్శనంబు నగువామనయనంబు
మీనాహతం బైనరక్తపద్మంబు భంగిఁ జలించెఁ బరార్ధ్యకాలాగరుచందనా
ర్హంబును జార్వంచితపీనవృత్తంబును నుత్తమప్రియాధ్యుషితంబు నగువామ
భుజంబు రయంబున నదరె గజేంద్రహస్తప్రతిమంబును బీనంబును సుందరంబు
నగుడాపలితొడ ప్రస్పందమానంబై రామునిం గట్టెదుట నున్నవానిఁ గా
నెఱింగించెఁ దోడనె యత్యంతరాగరూషితం బయ్యును హేమసమానవర్ణం
బగుట నీషధ్రజోధ్వస్తం బైనతెఱంగున నున్నతదీయచేలం బొక్కింత
జాఱె మఱియు ననేకశుభనిమిత్తంబులు దోఁచె వాతాతపపరిక్లాంతంబై
ప్రణష్టం బైనబీజంబు వర్షంబుచేతంబోలె నేతాదృశశుభనిమిత్తంబుల

చేత నమ్మహీనందని సంప్రబోధితయై యానందించె మఱియు బింబఫలారుణా
ధరోష్ఠంబును శోభననేత్రయుక్తంబును ధనుస్సంకాశభ్రూలతోపేతంబును నీల
చికురసంయుతంబును వక్రపక్ష్మంబును స్మితశుక్లదంశంబు నగుజానకివదనంబు
రాహుముఖప్రముక్తుం డైనచంద్రునికైవడిం దేజరిల్లెఁ బదంపడి యమ్మహీకు
మారి వీతశోకయై నిరస్తజాస్యయై హర్షవికసితచిత్తయై శాంతజ్వరయై సముది
తుం డగుచంద్రునిచేత శుక్లపక్షరాత్రియుంబోలె నిజవదనంబుచే నభిరామయై
ప్రకాశించె నాసమయంబున సీతావృత్తాంతంబును ద్రిజటావాక్యంబును రాక్ష
సాంగనలదుర్వాక్యంబులును విని వృక్షశాఖాంతరస్థితుం డగుహనుమంతుండు.

667


ఆ.

ఏమృగాక్షి వెదక నెల్లబలీముఖు, లఖిలదిశల కరిగి రామృగాక్షిఁ
బుణ్యసాధ్వి నాదుపుణ్యవశంబున, సురుచిరముగ నిచటఁ జూడఁ గంటి.

668


తే.

యుక్తచారుఁడ నై వైరిశక్తి దెలియఁ
గోరి పరు లెఱుంగక యుండ గూఢవృత్తిఁ
దిరుగు నాచేత నీలంక దితిజపతివి
శేష మసురులవిధము వీక్షింపఁబడియె.

669

హనుమంతుఁడు సీత నాశ్వాసింపఁ గోరి యుపాయము నాలోచించుట

క.

అరి త న్నెఱుఁగక మునుపే, వరమతిఁ జారుండు తాను వచ్చినకార్యం
బిరవందఁ దీర్చుకొను టి, ద్దర నుత్తముదౌత్య మగుఁ గదా తలపోయన్.

670


క.

అతులితమహనీయగుణా, ప్రతిముం డగురామవిభునిపత్నిని సీతం
బతిదర్శనకాంక్షిణి సు, వ్రత నాశ్వాసింపఁ బోలు వరమతితోడన్.

671


క.

పుట్టినమొదలుగ దుఃఖం, బెట్టిదొ దా నెఱుఁగ దీమహీసుత నేఁ డి
ప్పట్టున శోకమునకుఁ దుది, నెట్టును గనలేక యున్న దెంతయు భీతిన్.

672


మ.

పతిసందర్శన మాత్మఁ గోరుచు భయభ్రాంతాత్మయై తూలుచున్
గతమోదంబునఁ జాలు గాసిలెడు నీకళ్యాణి నీపుణ్య నీ
సతి నభ్యంచితసాంత్వవాక్యముల నాశ్వాసింప కే నేగినన్
హితముఁ దెల్పెడువాఁడు లేక వగఁ దా నెంతే వడిం జచ్చెడిన్.

673


ఉ.

కావున మిన్న కేఁ జనుట కార్యము గా దిపు డీమహీజతో
భూవిభువార్తఁ జెప్పి మదిఁబుట్టినశోకము కొంత పాపి యీ
దేవి తెఱుంగు రామునకుఁ దెల్లముగా వివరించి చెప్పి త
ద్భావమునందుఁ గల్గుపరితాప మొకించుక దీర్పఁగాఁ దగున్.

674


ఉ.

హేమసమానవర్ణ యగు నీసతితోఁ దగ మాట లాడ కే
రామునితోడఁ గంటి రఘురామ భవత్సతి నన్నయంతఁ దా
నేనని పల్కెఁ దెల్పు మన నేమని చెప్పుదుఁ జెప్పకున్న నా
భూమివిభుండు సూర్యజుఁడు భూరికృప న్నను విశ్వసింతురే.

675

ఉ.

జీవితనాథుకౌశలముఁ జెప్పెడుమిత్రునిఁ గాన కార్తయై
చావఁగ నున్న దీమగువ చయ్యన నీనిశ వేగునంతలో
క్ష్మావిభుసేమముం దెలుపఁగా నగు న ట్లెఱిఁగింతు నంటినా
కావలియున్నవా రసురకామిను లెద్ది యుపాయ మారయన్.

676


వ.

ఏ నిప్పు డిద్దేవి నాశ్వాసింపక రయంబున నేగి సీత యున్నచందం బెఱింగించి
యుద్ధంబుకొఱకు సైన్యసమేతంబుగా నతనిం దోడి తెచ్చెద నంటినేని మావ
చ్చు నందాఁక నిద్దేవి ప్రాణంబులు ధరించి యుండనోప దట్లగుటంజేసి సుగ్రీ
వునిప్రయత్నం బంతయు వ్యర్థంబై చను నదియునుంగాక.

677


ఉ.

దోస మటంచు నించుకయుఁ దోఁపక మ్రుచ్చిలి తెచ్చినట్టిదు
ష్టాసురుఁ జంపి యీసతి రయం బలరన్ గొనిపోదు నంటినా
వాసిగఁ గీశ సేనల నవార్యగతం దగఁ గూర్చి పోరు పే
రాస నొనర్పనున్నమనుజాధిపుయత్నము వ్యర్థమై చనున్.

678


వ.

ఏను వానరుండ నై యతిసూక్ష్మరూపంబున నీవృక్షంబుమీఁదనె యుండి
యోగసౌష్ఠవలక్షణసంసారయుక్తం బైనకోశలదేశస్థితమనుష్యసంబంధిభాష
చేత నిద్దేవి నాశ్వాసించెద నిది దక్క నొండువిధంబు యుక్తంబు గా దిట్లు
గావింపక బ్రాహ్మణునియట్లు సంస్కృతవాణి నుచ్చరించితి నేని వానరునకు సం
స్కృతభాషోచ్చారణశక్తి గలుగమి రావణుండని శంకించి యద్దేవి మిక్కిలి భ
యభ్రాంతయగుఁ గావున నవశ్యంబు మానుషభాషచేత నాశ్వాసింపందగినయ
ది వృక్షావతరణంబుఁ జేసి కట్టెదుట నిలిచి యాకస్మికంబుగా వానరమూర్తినై మా
నుషభాష నుచ్చరించితినేని తొల్లి రాక్షసులచేత విశ్రాసితయై యున్నదగుట నీదే
వి రావణుండనుశంకచేత విశేషత్రాసంబు నొంది యార్తధ్వనిఁ గావించు నంత.

679


క.

ఆనాదము విని దిగ్గున, దానవసతు లెల్ల లేచి తద్దయుఁ గినుక
న్నానాప్రహరణములు దగఁ, బూనిచి ననుఁ జుట్టుముట్టి భుజబలయుక్తిన్.

680


క.

దారుణరూపంబులఁ బొలు, పారఁగ ననుఁ జంప జూతు రటు గాకున్నన్
మీఱి యుపాయబలంబున, నారయఁబట్టుకొనఁ జూతు రద్భుతభంగిన్.

681


క.

ఏ నప్పు డీశరీరము, మాని దురాధర్షవైరిమర్దనయోగ్యం
బైనసమున్నతదేహము, జానుగఁ దాల్పంగ వలయుఁ జతురత మెఱయన్.

682


వ.

అ ట్లేను మహోన్నతంబై శరీరంబుఁ దాల్చి చూపట్టితినేని యద్భుతదర్శనం బైన
నారూపంబుఁ జూచి భయశంకిత యైనరాక్షసస్త్రీలు రయంబునం బరతెంచి రాక్ష
సేంద్రనియుక్తు లగురాక్షసులకుం జెప్పుదు రంత వారు శూలనిస్త్రింశాదినానా
విధసాధనంబులు గైకొని యొండొరులం బురికొల్పుకొని రయంబునం బఱతెంచి
చుట్టుముట్టి యట్టహాసంబుఁ జేసి రౌద్రంబునం గవియుదు రే నప్పు డూరకు
న్న నన్నుం బట్టుకొనియెదరు దానం జేసి యీజనకనందని యపరిజ్ఞాతరామ
సందేశప్రయోజన యగు నంతియెకాక రాక్షసులు హింసాభికాంక్షులు గావున

సీతంబట్టి వధింతురు దానం జేసి రామసుగ్రీవులకార్యం బంతయు విపన్నంబగు
నట్లు సీతను వధింపకున్నను రావణాభిగుప్తంబును సముద్రపరివేష్టితంబును బ్రణష్ట
మార్గంబును రాక్షసపరివారితంబు నైనయీదేశంబునం జిక్కి యుండు నేను
రణంబున రాక్షసులకుఁ బట్టువడినను వధింపంబడినను శతయోజనంబులు సము
ద్రంబు దాఁటి వచ్చి రామకార్యంబు సాధించునట్టి బలవంతుండు వానరులలో
నొక్కండైన లేఁ డేను సంగ్రామంబున రాక్షససహస్రంబులనైన నధింప సమ
ర్థుండ నైనను దదనంతరంబ యుద్ధపరిశ్రాంతుం డగుటవలన మరల సముద్రంబు
దాఁటుటకు సమర్థుండ నగుదునో కానో యెఱుంగరాదు యుద్ధంబు లనిశ్చితజ
యాపజయంబులు గావున సంశయితం బయినయుద్ధంబు నాకు యుక్తంబు గాదు
సంశయం బైనకార్యంబు ప్రాజ్ఞుండగువాఁ డెవ్వండు నిస్సంశయంబు గావించు
నే నిప్పు డింతయుం దలపోసి సీతతోడ సంభాషింపక యూరక యరిగితినేని
యీజనకపుత్త్రి నిస్సంశయంబుగాఁ బ్రాణత్యాగంబు సేయు సంభాషించితి
నేని పూర్వోక్తసీతాసంత్రాసనాదిదోషంబు సంభవించు భూతార్థంబు లవి
వేకి యైనదూతకతంబున దేశకాలవిరోధితంబు లై సూర్యోదయంబునందుఁ
దమంబు నశించునట్లు నశియించుఁ గార్యాకార్యవిషయంబునందు సునిశ్చిత
యయ్యును విక్లబుం డగుదూతకతంబున బుద్ధి శోభింపదు పండితమాను లగు
దూతలు కార్యంబులు చెఱుతు రెవ్వండు బహుప్రకారంబులఁ కార్యంబు
తెఱంగు విచారించు నతం డర్థసాధనంబునందు సమర్థుం డగుఁ గావున నిప్పుడు
కార్యంబు నశింపకుండ నాకు వైక్లబ్యంబు గలుగకుండ సముద్రలంఘనంబు
వ్యర్థంబు గాకుండ సీతారామలక్ష్మణులకు హాని గలుగకుండ నెవ్విధంబునఁ
గార్యంబు నడుపుదునో యని కొండొకసేపు విచారించి బుద్ధిమంతుం డగుహను
మంతుం డెట్టకేలకు రాక్షసస్త్రీలు వినకుండ మధురంబుగా నక్లిష్టకర్ముండగు
రాముని మెల్లనం బ్రశంసించి రామగతమానస యైనయీదేవిని నిరుద్వేగఁ
గావించి పదంపడి పొడసూపి ధర్మయుక్తంబు లగు రామునిశుభవచనంబులు
సమర్పించి యద్దేవిచిత్తంబునం గలశోకంబు నివారించి యనుజ్ఞఁ గొని
యవ్వలం దోఁచినకొలంది సూచికొనియెదంగాక యని నిశ్చయించి ద్రుమవిట
పాంతరస్థుండై మధురవాక్యంబున ని ట్లనియె.

683

హనుమంతుఁడు సీతకు మాత్రము వినునట్లు రామకథ నుపన్యసించుట

సీ.

దశరథుం డనునొక్కధరణీశతిలకుండు గలఁ డమ్మహాత్ముఁ డకల్మషుండు
వరరథకుంజరవాజిమంతుఁడు పుణ్యశీలుండు ఋజుఁడు విశాలయశుఁడు
తపముపెంపున మహాతాపసతుల్యుండు రాజర్షిముఖ్యుఁడు రాజనుతుఁడు
చక్రవర్త్యన్వయజాతుండు పార్థివవ్యంజనోపేతుఁ డవార్యశౌర్యుఁ


తే.

డలఘుఁ డక్షుద్రుఁ డిక్ష్వాకుకులవరుండు, లక్ష్మివర్ధనుఁ డాదిత్యరాజసముఁడు
భువనవిశ్రుతైశ్వర్యసంపూర్ణుఁ డఖిల, భూతహితకరుఁ డాశ్రితపోషణుండు.

684

ఉ.

ఆమనుజేంద్రచంద్రునకు నగ్రసుతుం డలరారు రాజసు
త్రాముఁడు రూపసంపదభిరాముఁడు సంగరనిర్జితాహిత
స్తోముఁడు పుణ్యనాముఁ డతిసువ్రతకాముఁడు నీలనీరద
శ్యాముఁడు రాముఁ డంచితవిశాలమహాసుగుణైకధాముఁడై.

685


ఆ.

సత్యసంధుఁ డయిన జనకునివాక్యంబు, వలన రాముఁ డఖలవైభవములు
మాని లక్ష్మణుండు జానకి తనవెంట, నేగుదేర నడవి కేగుదెంచె.

686


క.

ఆనృపసుతుచే దారుణ, కాననమున శైలతుల్యకాయు లనేకుల్
దానవులు మడిసిరి జన, స్థాననివాసులు ఖరాన్వితంబుగ నాజిన్.

687


క.

అంత జనస్థానవధం, బంతయు విని రాక్షసేంద్రుఁ డగుదశకంఠుం
డెంతయు రోషపరీత, స్వాతుండై యచటి కర్థిఁ జనుదెంచి వెసన్.

688


తే.

అధికమాయావిశారదుం డగుటవలనఁ
బంక్తిముఖుఁడు మృగస్వరూపంబుచేత
నరవరేణ్యుని వంచించి దురిత మనక
యమ్మహాత్మునిసతి సీత నపహరించె.

689


సీ.

అంత రఘూత్తముఁ డద్దేవి వెదకుచుఁ బఱతెంచి వనమున హరివరేణ్యుఁ
డైనసుగ్రీవునితో నెయ్య మొనరించి వాలిని జంపి తద్వైభవంబు
సుగ్రీవున కొసంగె సుగ్రీవసందిష్టు లై యనేకులు కపు లఖిలదిశల
కద్దేవి వెదకంగ నరిగి రేను గడంగి సంపాతి చెప్పినసరణి నూఱు


తే.

యోజనము లంబునిధి దాఁటి యోజతోడ, నీపురంబు ప్రవేశించి యెల్లకడలు
గలయ శోధించి దశకంఠునిలయ మరసి, కాంక్ష మీఱంగ నీయశోకంబుక్రింద.

690


తే.

భానుకులుఁ డగురామునివలన వినిన, వర్ణమును గాంతియును రూపవైభవంబు
గలిగినట్టి పతివ్రతాతిలక మైన, యమ్మహాదేవి గనుఁగొంటి యత్న మలర.

691


క.

అని పలికి యూరకుండిన, వనచరశేఖరుని మధురవాక్యంబులు దా
విని పతినామశ్రవణం, బున మనమున విస్మయంబు ముదము జనింపన్.

692


క.

ఏపుణ్యాత్ముఁడొ కనులకుఁ, జూపట్టక నేఁడు శ్రవణసుఖముగ నాహా
నాపతివృత్తాంతము కడుఁ, దీపుగ మృదుఫణితి వగపుదీఱఁ బలికెడిన్.

693


క.

అని కేశసంవృతం బగు, తనవదనసరోజ మెత్తి తప్పక దిక్కు
695
ల్గనుఁగొని మీఁద నశోకా, వనరుహవిటపాంతరమున వఱలెడువానిన్.

694


తే.

ఉదయగిరిమీఁద రవిభంగి నొప్పువాని, ఫుల్లకింశుక నుమకాంతిఁ బొలుచువాని
వేష్టితార్జుచేలుని నవిద్రుమాభ, వదనుఁ దీపచామీకరవర్ణనయను.

695


క.

సుగ్రీవసఖునిఁ గపివం, శాగ్రేసరు నలసమీరణాత్మజుఁ గుతుక
వ్యగ్రమనస్కుని రఘువం, శగ్రామణిదూత ననిలజవు హనుమంతున్.

696


క.

పరికించి ఘోర మగువా, నరరూప మీదేటి కిపుడు నాకుం దోఁచె
నర మద్భుత మకటా యని, ధరణీసుత వెండి భయము తనమది తలరన్.

697

క.

పాయనిదుఃఖభరంబున, నాయవనిజ హా రఘూత్తమా హా సౌమి
త్రీ యని పరిదేవన మొగిఁ, జేయుచు నేడ్చుచును జాలఁ జింతిలుచు వెసన్.

698


వ.

శోకమూర్ఛాపారవశ్యంబునఁ గొండొకసేపు విసంజ్ఞ యై యుండి వెండియుఁ
దెలివొంది.

699


తే.

అకట శాస్త్రనిషిద్ధమైనట్టిఘోర, వానరాకృతి కలలోనఁ గానఁబడియె
రమణలక్ష్మణాన్వితుఁడు శ్రీరామునకును, జనకునకు స్వస్తియగుఁ గాక సంతతంబు.

700


ఉ.

క్రూరనిశాచరుండు నను మ్రుచ్చిలి తెచ్చిననాఁటనుండియు
న్ధారుణినాథుఁ బాసినకతంబున శోకము నొంది కంటికి
న్గూరుకు గాన కిప్పగిదిఁ గుందెడునా కెటు స్వప్న మయ్యెఁ బో
వారిక నిద్ర లేనికల వచ్చునె యెవ్వరి కైన నుర్వరన్.

701


మ.

కలయో దైత్యునిమాయయో హృదయవైకల్యోత్థమో నిక్కమో
తెలియ న్నేరక యున్నదాననొ ధరిత్రీపుత్రినో కానొ కే
వలభక్తిన్ బ్లవగుండు నాదువిభుని న్వర్ణించుచు న్ధీసము
జ్జ్వలుఁ డై యుండుట కేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపఁగన్.

702


సీ.

డెందాన నెప్పుడు సౌందర్యనిధి యైన కువలయేశునిపొందు గోరుచుందుఁ
బలుకుల నెప్పుడు భానువంశాంభోధిచంద్రునినామంబు సంస్కరింతుఁ
గన్నుల నెప్పుడు కాకుత్‌స్థతిలకుని సుందరరూపంబుఁ జూడఁ దలఁతు
వీనుల నెప్పుడు వీరసమ్మతుఁ డైన విభునిమంగళకథ ల్వినఁ దలంతు


తే.

నన్య మేమి యెఱుంగక యనవరతము, తత్సమర్పితచిత్తనై తనరునాకుఁ
గాంతునిశుభస్వరూపంబు గానఁబడక, భయదకపిరూప మేల చూపట్టె నకట.

703


తే.

పవన పావక భాస్కర భారతీంద్ర, పాకహర మీకు మ్రొక్కెద నీకపీంద్రుఁ
డధిపతికిఁ బ్రాణమిత్రుఁడై యలరుఁగాక, యితనివాక్యంబు నిక్కమై యెసఁగుఁగాక.

704

హనుమంతుఁడు సీతకుఁ బొడసూపుట

వ.

అని బహుప్రకారంబుల వితర్కించు చున్నసమయంబున.

705


చ.

ఇది పొడసూపఁగా సమయ మీసతితో రఘునాథువార్త నిం
పొదవఁగఁ జెప్పి మంజుమధురోక్తుల నెవ్వగ మాన్చి భూరిస
మ్మద మొనగూర్తుఁగాక యని మారుతి గ్రక్కున మ్రాను డిగ్గి క
ట్టెదుట వినీతుఁ డై నిలిచి యింపుగ నంజలిఁ జేసి యి ట్లనున్.

706


ఉ.

నీరజనేత్ర యేసతివి నీ విటు మాసినచీర దాల్చి నేఁ
డూరక పద్మపత్రములనుండి దొరంగు జలంబులట్లు శో
కారుణితాక్షులం దొరఁగు నశ్రులు కాల్వలు గట్టి పాఱఁగా
ధీరత దక్కి దైన్యమున దిక్కఱి యేడ్చెద వేల చెప్పుమా.

707


ఉ.

పన్నుగ నాకుఁ జూడ హరిభామినికైవడి దోఁచె దెంతయు
న్బన్నగకాంతవో గరుడభామినివో సురసిద్ధకన్యవో

కిన్నర కామినీమణివొ ఖేచరతన్వివొ సాధ్యయోషవో
యెన్నఁగ యక్షబాలికవొ యేర్పడ నంతయుఁ దెల్పుమా దయన్.

708


తే.

చంద్రుఁ నెడఁబాసి దివినుండి సాహసమునఁ, బృథివి కరుదెంచినట్టిరోహిణివొ గాక
ప్రణయకోపంబున వసిష్ఠుభర్త విడిచి, తలఁగి వచ్చిన యలయరుంధతివొ చెపుమ.

709


శా.

లోలంబాలక పుణ్యశేషమున నేలోకంబునం దుండి నేఁ
డీలోకంబున కేగుదెంచితివి నీ వేలాగు నీలా గయో
బాలా నీతలిదండ్రు లెవ్వరు భవత్ప్రాణేశుఁ డేపుణ్యుఁ డి
ట్లేలా యశ్రులు గాఱ నేడ్చెదవు నీ వెంతేకృపం జెప్పుమా.

710


చ.

జనవిభునిం దలంచుటయు సారెకుఁ గన్నుల ఱెప్ప వేయుటల్
ఘనముగ నూర్పుపుచ్చుటయు ఘర్మజలంబులు మేనఁ బుట్టుట
ల్పనివడి భూమి నంటుటయుఁ బల్మఱు నశ్రులు గాఱ నేడ్చుట
ల్గనుఁగొన దేవతాసతివి గా దని నిన్ను మదిం దలంచెదన్.

711


ఉ.

మానిని నీదుచిహ్నముల మంగళరూపముఁ జూచి యాత్మలో
మానవనాథశేఖరునిమానిని వంచుఁ దలంచెద న్జన
స్థానమునందు రావణుఁడు తస్కరుఁడై గొనిపోయినట్టి యా
జానకి వేమొ నీవిధము సర్వము నా కెఱిగింపు మిత్తఱిన్.

712


క.

అతిమానుష మగురూపము, వితతఘనత పోను రూపవేషము కడు దీ
నతయున్ జూడఁగఁ గమలా, యతనేత్రా రామమహిషి వగుదు నిజముగాన్.

713

సీత హనుమంతునకుఁ దనవృత్తాంతమును జెప్పుట

క.

అన విని జానకి పతికీ, ర్తనహర్షిత యై తదంఘ్రి తామరసంబున్
మనమునఁ దలఁచుచు మారుత, తనయునితో నిట్టు లనియెఁ దద్దయు నెమ్మిన్.

714


చ.

అనుపమకీర్తి యౌ దశరథావనిభర్తకు ముద్దుకోడలన్
జనకునికూఁతుర న్విమలసర్వమహీశకిరీటబద్ధశో
భనమణిమాలికారుచివిభాసితపాదసరోజుఁ డైన రా
మనృపతి కేను భార్య నిల మైథిలి యందుకు నన్ను సద్ద్విజుల్.

715


క.

పదిరెండువత్సరంబులు, ముద మలరఁగ నత్తయింట మునుకొని భోగా
స్పదము లగుసకలసుఖములు, కొదవపడక యుండ నేను గుడిచితి నెమ్మిన్.

716


ఉ.

అంతఁ ద్రయోదశాబ్దమున నమ్మహికాంతుఁడు రాముని న్ధరా
కాంతునిఁ జేయఁ బూని కుతుకంబున మంత్రులఁ గూడి సమ్మద
స్వాంతముతోడఁ గార్యసువిచారముఁ జేసి సునిశ్చితార్థుఁ డై
చింత దొఱంగి యున్నయెడఁ జెచ్చెరఁ గైకయి దుష్టచిత్త యై.

717


సీ.

తనమనోహరునిచిత్తము కఠినోక్తుల నొప్పించి జనులకు నొప్పిదములు
గానివరంబులు గాంక్షించి సుతునకు భూపతిత్వంబు రామునకు నడవి

నునికియుఁ గోరి యి ట్లొనగూర్చునంత కాహారనిద్రావిహారాదు లొల్ల
నటు సేయ వేని రామాభిషేకముహూర్త మందె తప్పక మృతి నొందుదాన


తే.

ననిన విని సత్యవాది గావున నృపుండు, నాతివరదానసంస్మరణంబువలనఁ
జాల మోహితుఁడై ద్రిప్పఁజాల కపుడు, చింత నొందుచు రామునిఁ జేరఁ బిలిచి.

718


ఉ.

కన్నుల శోకబాష్పములు గాఱఁగ నేడ్చుచు రామరాజ్యము
న్బన్నుగఁ గైక కిమ్మనుచుఁ బల్కిన న ట్లగు నంచు బుద్ధిసం
పన్నుఁడు గాన వేఱొకటి పల్కక వేగ సమస్తసంపదల్
గ్రన్నన పాసి వల్కలముఖంబులఁ దాపసవేషధారి యై.

719


వ.

వనంబునకుం జనుదెంచె నమ్మహాత్ముం డొరుల కిచ్చువాఁడుం గాని యొరుల
చేతఁ గొనువాఁడు గాఁడు జీవితనిమిత్తంబువలన నైన నసత్యంబు పలుకఁడు సత్య
ప్రతిజ్ఞుండు గావున మృదువస్త్రంబులు విడిచి నారచీరలు ధరించి రాజ్యంబుఁ
బరిత్యజించి నిజజనని యగుకౌసల్యయొద్ద నన్ను వసింపు మని నియోగించిన నా
కమ్మహాత్ముని విడిచి యుండుచో టది స్వర్గం బైనను సమ్మతంబు గాదు గావున నే
నమ్మహాత్మునిం బాసి యుండ నొల్లక యనురూపం బగువ్రతం బంగీకరించి వన
గమనంబున కభిముఖి నైతి నంతకు మున్న భ్రాతృవత్సలుం డగుసుమిత్రాపు
త్రుండు ద్రుమచీరాజనాలంకృతుండై రామునితోడ నరుగుదెంచుట కుద్యుక్తుం
డయ్యె నిత్తెఱంగున మేము మువ్వురము భర్తృసమాదేశంబున దృఢవ్రతు
లమై పురంబు నిర్గమించి మునిశరణ్యం బైనదండకారణ్యంబుఁ బ్రవేశించి
యందు గౌతమీతీరంబునఁ బంచవటియందుఁ బర్ణశాల నిర్మించుకొని యందు
నివసించి యుండ దురాత్ముం డగురావణుండు కపటమృగస్వరూపంబున రామ
లక్ష్మణుల వంచించి బలాత్కారంబున నన్నుం కొని తెచ్చి యిచ్చోటం బెట్టి
తనదురాలాపంబుల కే నొడంబడకున్న మాసద్వయంబునకు హింసించెద నని
సమయంబుఁ జేసె సమయకాలం బతీతంబు గాక మున్నె రాముండు చనుదెంచి
రావణుం బరిమార్చి నన్నుం దోడ్కొని పోక యుపేక్షించె నేని మాసద్వయా
నంతరంబునఁ బ్రాణంబులు విడువంగలదాన నని దుఃఖపూర్వకంబుగాఁ దనవృ
త్తాంతం బెఱింగించిన నద్దేవివచనంబులు విని హనుమంతుండు దుఃఖితుండై
సాంత్వవచనంబుల ననూనయించుచు ని ట్లనియె.

720

హనుమంతుఁడు సీతకు రామలక్ష్మణుల కుశలము సెప్పుట

ఉ.

తల్లిరొ సాంగవేదసముదాయవిదుత్తముఁ డెవ్వఁ డట్టినీ
వల్లభుఁ డైనరాముఁడు ధ్రువంబుగ సేమము నొంది యున్నవాఁ
డల్లన నన్ను నీకుశల మారసి రమ్మని పంప దూతనై
తెల్లము గాఁగ నీకడకు ధీరత వారిధి దాఁటి వచ్చితిన్.

721


క.

అనఘుఁడు రాముఁడు నీతోఁ, దనకుశలముఁ జెప్పు మనియె దద్దయు భక్తిన్
ఘనుఁ డగులక్ష్మణుఁ డభినం, దన మొనరిచి చెప్పు మనియెఁ దనకుశలంబున్.

722

వ.

అని విన్నవించిన నద్దేవి పురుషసింహు లగురామలక్ష్మణులకుశలంబు విని ప్రీతి
సంహృష్టసర్వాంగి యై వెండియు హనుమంతు నవలోకించి.

723


తే.

పరగ నూఱేండ్లలోపల బ్రతికి యున్న
నరునకు నొకప్పు డైన నానంద మొదవు
ననుచు జను లాడుకొనువాక్య మవితథముగ
నహహ నా కిల నేఁడు సత్యార్థ మయ్యె.

724


తే.

అనుచుఁ గొనియాడె నప్పు డయ్యవనిసుతకు
హనుమదాగమనంబున నధికముదము
సంభవించె నొండొరులు విశ్వస్తు లగుచుఁ
గడు శుభాలాప మొనరింపఁ దొడఁగి రపుడు.

725


క.

హనుమంతుఁ డంత రాముని, వినుతించుచు సీతఁ జూచి వెఱఁగందుచు మె
ల్లన శోకదీన యగున, వ్వనజాక్షిసమీపమునకు వచ్చె న్బెలుచన్.

726

సీత తనసమీపమునకు వచ్చు హనుమంతుని రావణుఁగా శంకించి చింతించుట

క.

ఈరీతి నమ్రుఁడగుచు స, మీరకుమారుండు తనసమీపంబునకుం
జేర నరుదెంచునపు డా, ధారుణిసుత యతనిఁ గాంచి తద్దయు భీతిన్.

727


వ.

రామకుశలకథనంబున సంజాతవిశ్వాస యయ్యును రావణుమాయాబాహు
ల్యంబు దలంచి క్రమ్మఱ విశ్వాసంబు దొలంగఁ బెట్టి రావణుం డని శంకించి.

728


క.

తక్కక మ్రుచ్చిలి యెవ్వాఁ, డక్కట నన్నిటకుఁ దెచ్చినట్టిదశాస్యుం
డుక్కఱి రూపాంతరమున, గ్రక్కున వంచింప వచ్చెఁ గావలయు రహిన్.

729


ఆ.

అకట వీనిమ్రోల నరయక నాచేత, నయ్యె నెద్ది కథిత మది యనుచిత
మాత్మలోన నమ్మి యాడితి నిందాఁక, నెంత వెఱ్ఱి నైతి నే మొనర్తు.

730


క.

అని చింతించుచు శోకం, బున భూరుహశాఖ విడిచి భూపాలకనం
దని వెసఁ దరుమూలంబున, ననువుగ నాసీన యయ్యె నంగము వణఁకన్.

731


తే.

అప్పు డద్దేవి భయకంపితాంగి యగుట
కడలుచు సమీరసుతుఁడు డాయంగ నేగి
యభయదానంబు సేయుచు నధికభక్తిఁ
దత్పదాంభోజములకు వందన మొనర్చె.

732


క.

ఇత్తెఱఁగున వినయాన్విత, చిత్తంబునఁ దనకుఁ బ్రణతిఁ జేసినకపివం
శోత్తమునిఁ జూచి శంకా, యత్తం బగు మానసమున నయ్యమ పలికెన్.

733


తే.

అకట రావణ మాయావి యగుట మాయ
నాశ్రయించి తపింపఁజేయంగ నిటకు
వచ్చితివి నీవు గ్రమ్మఱఁ బంక్తిముఖుఁడ
వేని శుభకారి గాదు నీ కిది నిజంబు.

734

ఉ.

ఓజ దలిర్ప నెవ్వఁడు నిజోగ్రశరీరము మాని సత్పరి
వ్రాజకరూపధారి యయి వంచనఁ గాననమందు నాకతి
వ్యాజముతోడఁ గన్పడియె నట్టిదశాస్యుఁడ వీవు భూరిమా
యాజనితప్రభావమున నన్నియు దైత్యులు నేర్తురే కదా.

735


క.

అనిశ ముపవాసకృశనై, ఘనతరశోకాగ్నిచేతఁ గ్రాఁగెడు న న్నో
దనుజాధమ క్రమ్మఱ నీ, యనువున నేఁచెదవు దీన నశుభము గల్గున్.

736


వ.

అని పలికి యద్దేవి రావణదౌరాత్మ్యంబువలన హనుమంతుని రావణునిఁగా శం
కించి తద్దర్శనజనితమనఃప్రసాద మాలోచించి దాని నిరాకరించుచు హేత్వర్థ
సంహితం బగువాక్యంబున ని ట్లనియె.

737


ఉ.

అక్కట నిన్ను రాక్షసుఁడ వంచుఁ దలంచితి నిన్నుఁ జూచినన్
జక్కగ నాదుడెందమునఁ జాల ముదం బిగిరించుచున్న దీ
వెక్కడి క్రూరదైత్యుఁడవొ వృక్షచరుండవొ నాకుఁ దెల్పు పెం
పెక్కఁగ రామదూత వగు దేని శుభంబులు నీకుఁ గల్గెడిన్.

738


చ.

పనివడి నీవు రాఘవుఁడు పంపఁగ వచ్చినదూత వేని యో
వనచరవర్య యమ్మనుజవర్యుగుణాతిశయంబులు జగ
ద్వినుతకథావిధానములు వేగమె దెల్పుము నామనంబు బో
రన హరియించి తీవు జలరంహము నిమ్నగగట్టునుం బలెన్.

739


వ.

అని పలికి వెండియు రామదూతాగమనం బత్యంతాసంభావితం బని తలంచి
బహుప్రకారంబుల ని ట్లని వితర్కించె.

740


ఉ.

ఎక్కడ వానరుండు మనుజేశ్వరుఁ డెక్కడ వీని నేఁడు నా
చక్కటి కంపు టెక్కడ విశాలపయోనిధి నుత్తరించి యీ
రక్కసుచేతిలోఁ బడక ప్రాణముతోడుత వచ్చు టెక్క డే
నెక్కడ నిట్టివింత గలదే నిజ మింతయు స్వప్న మారయన్.

741


వ.

మఱియుఁ జిరకాలాపహృత నైనయేను స్వప్నంబునందు రామప్రేషితుం డైన
వానరుని వీక్షించితి నీ స్వప్నంబునం దైనను వీరాగ్రేసరుం డగు రామునిలక్ష్మణ
సహితంబుగా నవలోకించితినేని యొక్కింత దుఃఖోపశమనంబు గలుగు నీ స్వప్నం
బును మాత్సర్యంబు సేయుచున్న దని పలికి వెండియుఁ దనమనంబున.

742


తే.

స్వప్నమున వానరునిఁ గాంచి జనులు శుభము
పడయఁ జాలరు నిజము నా కుడుగ కిపుడు
కడఁగి శుభచిహ్నములు దోచుకారణమునఁ
బడఁగ నిది నిద్ర గాదు స్వప్నంబు గాదు.

743


వ.

అని యి ట్లయథార్థస్వప్నపక్షంబు నిరసించి క్రమ్మఱఁ జతుర్విధవిభ్రమపక్షం
బుల నుత్ప్రేక్షించుచు ని ట్లనియె.

744

తే.

వరుస నిది చిత్తమోహమో వాతగతియొ
దారుణోన్మాదజనితవికార మొక్కొ
బుఱియు మృగతృష్ణికయొ దీని తెఱఁ గెఱుంగ
రాదు కడు వింతయై దోఁచె నాదుమదికి.

745


క.

ఇది గా దున్మాదము గా, దిది యున్మాదపద మైన హృన్మోహంబున్
వదలక నన్నును వానరు, నుదంచితముగ మది నెఱిఁగి యున్నకతమునన్.

746


వ.

అని బహుప్రకారంబుల బలాబలంబులు వితర్కించి దనుజులకుఁ గామరూపంబు
గలుగుటఁ దలపోసి యవ్వానరపుంగవుని రావణుం డని నిశ్చయించి యేమియుం
బలుక కూర కున్న నాహనుమంతుం డద్దేవియభిప్రాయం బెఱింగి శ్రోత్రాను
కూలంబు లగుమధురవాక్యంబుల హర్షంబుఁ బుట్టించుచు సందియంబు పాయ
ని ట్లనియె.

747

హనుమంతుఁడు సీతకు విశ్వాసజననార్థము రామకథావృత్తాంతము సెప్పుట

సీ.

ఆదిత్యుఁడునుబోలె నధికతేజస్వియు రాకాబ్జుకై వడి లోకకాంతుఁ
డలకుబేరునిమాడ్కి నధికసంపన్నుండు సమవర్తిచందాన సత్యరతుఁడు
జలజనేత్రునిభంగి శౌర్యసంపన్నుండు కందర్పుఁడునుబోలె సుందరుండు
వాచస్పతియుఁబోలె వాగ్విలాసుఁడు దివస్పతిలీల నధికవైభవయుతుండు


తే.

అఖిలసుగుణోత్తరుండు మహారథుండు, శాస్త్రకోవిదుఁ డఖిలదివ్యాస్త్రవిదుఁడు
వేదవిదుఁడు మహాధనుర్వేదవిదుఁడు, రమణి నీవల్లభుం డగురాఘవుండు.

748


తే.

అనిమషేంద్రు బాహుచ్చాయ నాశ్రయించి
వీతఖేదు లై మోదించు వేల్పులక్రియ
నమ్మహాత్ముబాహుచ్ఛాయ నాశ్రయించి
జనులు హర్షించుచుందురు సంతతంబు.

749


క.

ఆకాకుత్స్థునిఁ గపటమృ, గాకృతి వంచించి నిర్జరారాతి నిను
న్వీఁకఁ గొనితెచ్చె నికఁ వాఁ, డాకర్మఫలంబు నొందు నతిశీఘ్రమునన్.

750


ఉ.

అచ్చుగ నేమహాత్ముఁడు మహాటవిలోఁ దను డాఁగురించి నిన్
మృచ్చిలి తెచ్చినట్టి కడుమూర్ఖుని బాణహతి న్వధింపఁగా
నిచ్చఁ దలంచె నట్టిమనుజేంద్రుఁడు రాముఁడు పంప దూతనై
వచ్చినవాఁడ నీకడకు వారక తత్కుశలంబు దెల్పఁగన్.

751


చ.

శశివదనా భవద్విరహసంభవదుఃఖముచే విభుండు దాఁ
గుశలముఁ జెప్పె లక్ష్మణుఁ డకుంఠితభక్తి నమస్కరించి తాఁ
గుశలముఁ జెప్పె రామునకుఁ గూర్మిసఖుండు దినేశజుండు దాఁ
గుశలముఁ జెప్పెఁ గీశకులకుంజరుఁ డెంతయు భక్తియుక్తుఁ డై.

752

శా.

తల్లీ రాముఁడు నిత్య మర్కజసుమిత్రాపుత్రులం గూడి తా
నుల్లంబందుఁ దలంచు చుండు నితరోద్యోగంబులున్ మాని నీ
సల్లాపంబులు నీవిలాసములు నీచారిత్రముల్ నీదుభా
స్వల్లావణ్యము నీమనోజ్ఞగుణము ల్వాక్రుచ్చి వర్ణించుచున్.

753


చ.

క్షితిసుత దైత్యమధ్యమునఁ జిక్కియుఁ జావక దైవికంబునన్
బ్రతికితి వింక నాపద దొఱంగెడుకాలము డాయవచ్చె సు
వ్రతుఁ డగునీదువల్లభుఁడు భానుజలక్ష్మణయుక్తుఁ డై కపి
ప్రతతులమధ్యదేశమున భాసిలుచుండఁగఁ గాంచె దెంతయున్.

754


ఉ.

భూవరపుత్రి యేను గపిముఖ్యుల కెల్ల నధీశుఁ డైనసు
గ్రీవసఖుండ వాయుజుఁడఁ గీశవరుండ హనూమదాఖ్యుఁడన్
ఈవనరాశి దాఁటిఁ దనుజేంద్రశిరంబులు దన్ని లోకసం
భావితవీర్యగర్వమున వచ్చితి రామునివార్త దెల్పఁగన్.

755


ఉ.

అంకిలిఁ జెప్పలేదు జనకాత్మజ నే నసురుండఁ గాను మీ
నాంకసమానసుందరున కంచితకీర్తికి రామమూర్తికిన్
గింకరుఁడం దదాజ్ఞ నిను నేర్పునఁ దేర్పఁగ వచ్చినాఁడ నీ
శంక పరిత్యజింపుము విచారము వల్వదు నమ్ము నెమ్మదిన్.

756

సీత హనుమంతుని రామలక్ష్మణులరూపగుణవిశేషప్రకారం బడుగుట

వ.

అని విన్నవించిన రామునికథావృత్తాంతంబు విని యద్దేవి హనుమంతు నవలో
కించి మృదుమధురవాక్యంబుల వెండియు ని ట్లనియె.

757


చ.

హరివర యెంత నీవు నిజమాడిన నే మది నమ్మఁ జాల నీ
వఱకు వనంబులోన నరవానరనాథులకు న్సఖిత్వ మె
త్తెఱఁగునఁ గల్గె రాఘవులు దివ్యకళామహిమంబు లెల్ల నే
కరణి నెఱింగి తీవు వినఁగావలతు న్వివరింపు మింపుగన్.

758


వ.

అదియునుం గాక.

759


చ.

అరయఁగ రామలక్ష్మణుల యందము చందము తత్ప్రభావమున్
గురుతరవిక్రమక్రమ మకుంఠితతేజము రూపసంపద
ల్పరఁగ శరీరవర్ణములు బాహుపదోరుగతిప్రమాణముల్
గుఱుతుగఁ జెప్పితేని కపికుంజర నామది నిన్ను నమ్మెదన్.

760


వ.

అనిన విని యమ్మరున్నందనుండు రామలక్ష్మణుల రూపలక్షణవిశేషంబు లెఱిం
గింపం దలంచి సీత నవలోకించి దేవి మత్కృతంబునందు మనంబునఁ బొడమిన
సందియంబు పాయుటకు మద్భాగ్యవిశేషంబున రామలక్ష్మణులసర్వావయవ
సన్నివేశప్రకారం బెఱింగింపు మని యడిగితివి దీనం గొఱంత యేమి యత్తెఱం
గు సవిస్తరంబుగా వినిపించెద దత్తావధానవై విను మని యి ట్లనియె.

761

హనుమంతుఁడు సీతకు రామలక్ష్మణుల రూపగుణవిశేషంబు లెఱింగించుట

శా.

తల్లీ రాముఁడు రూపవంతుఁడు సమస్తప్రాణసంరక్షణో
ద్యల్లీలాచతురుండు దానకరుణాదాక్షిణ్యసంపన్నుఁ డు
త్ఫుల్లాంభోరుహపత్రనేత్రుఁడు జగత్పూజ్యుండు త్రైలోక్యసం
పల్లాభానుభవైకదక్షుఁడు జగత్ప్రఖ్యాతశౌర్యుం డిలన్.

762


చ.

అతులితభూరితేజమున నర్కనిభుండు మనీషచే బృహ
స్పతిసముఁ డోర్పుచే నవనిసన్నిభుఁ డున్నతకీర్తిచే దివ
స్పతి కిల సాటి సేయఁ దగుశౌర్యముచే భుజగేంద్రశాయికిం
బ్రతి యగు భూసుఖత్వమునఁ బంకజవైరికి జోడు రాఁదగున్.

763


ఉ.

ఆశ్రితపోషణుండు సుగుణాభిరతుండు జితేంద్రియుండు వ
ర్ణాశ్రమధర్మరక్షణమహామహిముండు జగన్నుతుండు సాం
గశ్రుతిపారగుం డమరకల్పుఁడు దానరతుండు సర్వలో
కాశ్రయుఁ డుత్తమద్విజగణావనతత్పరుఁ డెన్ని చూడఁగన్.

764


తే.

రాజవిద్యావినీతుండు రాజధర్మ, సుస్థిరుఁడు బ్రహ్మచర్యవ్రతస్థితుండు
వితతగుణమండనుఁడు బహుశ్రుతుఁడు సత్య, శీలవంతుఁడు రఘువంశశేఖరుండు.

765


ఉ.

వేదచతుష్టయజ్ఞపృథివీసురపూజ్యుఁడు సర్వలోకమ
ర్యాద లెఱింగి తత్సరణి నందఱ నేలునియంతయున్ యజు
ర్వేదవినీతుఁడుం గడువివేకియుఁ గర్మవిధిజ్ఞుఁడు న్ధను
ర్వేదరహస్యకోవిదుఁడు వీరుఁడు సాధుజనోపకారియున్.

766


మ.

ఘనపద్మారుణలోచనుం డమలశంఖగ్రీవుఁడున్ దుందుభి
స్వననిర్ఘోషుఁడు సంభృతాంసుఁడు ఘనశ్యాముండు త్రైలోక్యమో
హనరూపుండు సునాసుఁడు న్సమవిభక్తాంగుండు స్నిగ్ధుండు వీ
రనయైకజ్ఞుఁడు గూఢజత్రుఁడు మహోరస్కుండు రాముం డిలన్.

767


తే.

పూర్ణచంద్రాననుండు సంపూర్ణతేజుఁ, డనఘుఁ డాజానులంబిబాహార్గళుండు
సూనశరకోటిసంకాశసుందరుండు, మత్తమాతంగగమనుండు మానధనుఁడు.

768


వ.

మఱియును.

769


క.

గురుమణిబంధము ముష్టియు, నురము స్థిరత్వంబు నొందియుండుటవలనన్
దరుణీమణి రఘువిభుఁ డు, ర్వరలోఁ ద్రిస్థిరుఁ డనంగ వర్ణితుఁ డయ్యెన్.

770


క.

క్రమమున ముష్కంబులు కను, బొమలును బాహుద్వయంబు పొసఁగ బ్రలంబ
త్వము నొంది యుంటచే న, క్లముండు నుతి కెక్కుఁ ద్రిప్రలంబుం డనఁగన్.

771


క.

సమకేశాగ్రుండును దగ, సమజానుతలుండు మఱియు సమవృషణుఁడునై
కొమరొందుఁ గాన నీపతి, క్షమలోఁ ద్రిసముం డనంగ సన్నుతి కెక్కున్.

772


క.

కుక్షియు నాభ్యంతరమును, వక్షం బున్నతము లగుచు వఱలెడుఁ గానన్
దక్షుం డగు నీపతి మీ, నాక్షి త్రిసమున్నతుండనా నుతి కెక్కున్.

773

తే.

పంకజేక్షణ నేత్రాంతపాణిపాద
తలనఖములందు రక్తిమ గలిగి యునికి
వాసవసమానుఁ డైననీవల్లభుండు
పొందుగఁ ద్రితామ్రుఁ డన ధాత్రిఁ బొగడు వడసె.

774


తే.

తుహినకరముఖి ఘనశిరోరుహవరాంగ
ములను మఱియును బాదరేఖలను దనరు
చారుసుస్నిగ్ధతావిశేషంబు గలిగి
యునికి ద్రిస్నిగ్ధుఁ డనఁ జాల వినుతి గాంచె.

775


క.

స్వరమును సత్త్వము నాభియు, నురుతరగాంభీర్య మొందియుండుటవలనన్
సరసిజముఖి నీవల్లభుఁ, డరయఁ ద్రిగంభీరుఁ డనఁగ నభినుతి కెక్కెన్.

776


క.

ధ్రువముగ నుదరతలంబున, యువతీ కంఠమునఁ ద్రివళు లుండుటవలనన్
దివిజేంద్రనిభుఁడు రాముఁడు, త్రివళీవంతుఁ డన నభినుతిం గాంచె నిలన్.

777


క.

వనజాక్షి పాదరేఖలు, ననువుగ స్తనచూచుకంబు లవనతములు నై
దనరారుఁ గాన నీవిభుఁ, డనఘుఁడు త్ర్యవనతుఁ డనంగ నభినుతి కెక్కెన్.

778


తే.

పద్మలోచనకంఠంబు ప్రజననంబు
జంఘికలు పృష్ఠ మరయు హ్రస్వంబు లగుట
వలన రఘువల్లభుఁడు చతుర్వ్యంగుఁ డనఁగ
జగతి లక్షణవిదులచేఁ బొగడు వడయు.

779


క.

అరయఁగ నావర్తత్రయ, పరివేష్టితశీర్షుఁ డగుటఁ బార్థివపుత్రీ
ధర లక్షలజ్ఞు లారఘు, వరుని నుతింతురు త్రిశీర్షవంతుం డనుచున్.

780


తే.

పుణ్యసాధ్వి తదంగుష్ఠమూలమందు
శ్రుతిచతుష్టయసంప్రాప్తి సూచకాభి
లలితరేఖాచతుష్టయం బలరు చున్కి
సన్నుతింతురు దగఁ జతుష్కలుఁ డటంచు.

781


తే.

తామరసనేత్ర తత్పాణితలములందుఁ
దగ లలాటంబునందుఁ బాదంబునందుఁ
బరఁగ రేఖలు నాలుగు వఱలు చునికి
క్షితిఁ జతుర్లేఖుఁ డనఁగ విశ్రుతి వహించు.

782


వ.

మఱియుఁ జతుర్వింశత్యంగుష్ఠాత్మకం బైనహస్తంబు కిష్కు వనం దగునట్టికిష్కు
చతుష్టయప్రమాణదేహంబు గలవాఁడు గావునఁ జతుష్కిష్కుం డతం డగు
నదియునుం గాక.

783


తే.

తొడలు మోఁకాళ్లు మఱియు జేతులును బిక్క
లరయ నీనాలుగు సమంబు లగుటవలనఁ

దల్లి నీవల్లభుం డైనదాశరథుఁడు
క్షితిఁ జతుస్సముఁ డనఁగఁ బ్రసిద్ధి గాంచె.

784


మ.

కరముల్ గన్బొమలుం గటోష్ఠపదదృక్కర్ణంబులుం జూచుకో
త్కరనాసాపుటముష్కపృష్ఠమణిబంధంబు ల్రహిన్ జానుకూ
ర్పరముల్ తుల్యములై మనోజ్ఞరుచిచే రాజిల్లుటం జేసి యు
ర్వర విఖ్యాతి గనెం జతుర్దశసమద్వంద్యుం డనా నెంతయున్.

785


తే.

అబ్జముఖి దంతపంక్తిద్వయంబునందుఁ
జాలు గొని పార్శ్వపదముల నాలుగేసి
లలితదంతవిశేషముల్ గలిగి యునికిఁ
దనరు నారఘుపతి చతుర్దంష్ట్రుఁ డనఁగ.

786


క.

హరివిధమున శార్దూలము, కరణి మహోక్షంబుపగిది గంధగజమువై
ఖరి నడుచువాఁడు గావున, వఱలుఁ జతుర్గతి యనంగ వనరుహనేత్రా.

787


వ.

మఱియు బంధుజీవకుసుమబింబఫలారుణమాంసలాధరంబును బరిపూర్ణమాంస
లోన్నతహనువును దీర్ఘోన్నతరుచిరపుటనాసికయుఁ గలవాఁడు గావున మహోష్ఠ
హనునాసుం డనం బొగడు వడసె నదియునుం గాక.

788


క.

అంచితతనూరుహాస్యన, ఖాంచలవాక్చర్మములు మహామృదులములై
మించుం గావున నీపతి, పంచస్నిగ్ధుం డనంగఁ బాటికి నెక్కెన్.

789


తే.

సరఁగ నూరులు జంఘికల్ బాహువులు వ
రాంగుళులు కడుదీర్ఘంబు లగుటఁ జేసి
యష్టవంశవంతుం డన నవనిలోన
నధికవిఖ్యాతి వడసె నీయధివిభుండు.

790


క.

స్తననఖకరపదజిహ్వా, ననతాలుముఖోష్ఠలోచనము లీపదియున్
వనజాకృతి నొప్పుటచేఁ, దనకు భవద్వల్లభుండు దశపద్ముఁ డనన్.

791


క.

శిరమును గంఠము కర్ణము, లురము హృదంఘ్రులును బృష్ఠ ముదరము ఫాలం
బురువులయి తోఁచుఁ గావున, సరసిజముఖ యలరు దశవిశాలుం డనఁగన్.

792


క.

అనుపమసంపద్వైభవ, మున యశమున భూరితేజమున సంతతముం
దనరారుచుండుఁ గావున, జననీ త్రివ్యాప్తుఁ డనఁగ సన్నుతి వడయున్.

793


క.

క్షితి మాతృపితృకులంబులు, నతిపరిశుద్ధంబు లగుట నార్యులచే స
న్నుతి వడయు విభుఁడు కమలా, యతనేత్ర ద్విశుక్లవంతుఁ డనఁగా నొప్పున్.

794


తే.

స్కంధమును ఫాలతలము వక్షస్థలంబు
కుక్షియును ఘ్రాణమును మఱి కక్షియుగ్మ
మున్నతము లై ప్రకాశించుచునికి జనక
సుతు షడున్నతుఁ డనఁగ విశ్రుతి వహించు.

795

తే.

మఱియు నంగుళీపర్వంబు లరయఁ గేశ
రోమనఖచర్మములును శ్మశ్రులును మతియు
దర్శనము శేఫమును జాలఁ దనువు లగుట
నవతనుం డన వఱలు నా నరవరుండు.

796


వ.

మఱియు నిత్యంబులు బూర్వాహ్ణమధ్యాహ్నపరాహ్ణకాలంబులచేఁ గ్రమంబున
ధర్మార్థకామంబుల నుపార్జించుఁ గావునఁ ద్రివ్యాప్తుం డన నొప్పు నిట్టిసకలశా
స్త్రోక్తమహాపురుషలక్షణంబులు సకలసుగుణాభిరాముం డగురామునకొక్కనికిఁ
దక్క నన్యుల కెవ్వరికి లే వదియునుంగాక.

797


తే.

సంగ్రహానుగ్రహరతుండు సత్యధర్మ, పరుఁడు సర్వలోకప్రియుఁ డురుగుణుండు
దేశకాలవిభాగవిధిజ్ఞుఁ డమర, భావితుఁడు పురుషాంతరకోవిదుండు.

798


క.

ఆమనుజేంద్రునితమ్ముఁడు, సౌమిత్రి కృపానురాగసౌహార్దగుణ
శ్రీమహితరూపయౌవన, కోమలశౌర్యమున నన్నకు న్సరి వచ్చున్.

799


క.

ఆనృపనందను లిరువురు, కాననమార్గమున నిన్నుఁ గనుఁగొనుకాంక్షన్
మానక వెదకుచు నెక్కడఁ, గానక సంతాప మాత్మఁ గడలుకొనంగన్.

800

హనుమంతుఁడు సీతకు రామసుగ్రీవసఖ్యసంఘటనప్రకారం బెఱింగించుట

క.

చనుదెంచి ఋశ్యమూకం, బనుశైలముచెంతఁ బంపయను సరసిని జ
య్యన దాఁటి నినుఁ దదంతిక, వనమున వెదకుచు విరాళి వచ్చుచు నుండన్.

801


వ.

అంతకు మున్ను సుగ్రీవుం డనువానరుండు భ్రాతృనిరస్తుండై మంత్రిచతుష్టయ
సమేతంబుగా బహుపాదసంకులం బయినయగ్గరికూటంబున నివసించియున్న
వాఁ డగుటం జేసి యాసమయంబున మహాధనుర్ధరు లై తనకడకు వచ్చుచున్న
వారి రామలక్ష్మణుల దవ్వులం జూచి వాలిపంపునఁ దన్ను హింసింపవచ్చుచున్న
వారిఁగా శంకించి భయమోహితుండై వేఱొక్కశిఖరంబుమీఁదికి రయంబున
దాఁటి వారివృత్తాంతం బెఱింగి రమ్మని నన్నుం బంచిన నే నమ్మహాత్ములకడ కతి
త్వరితగమనంబునం జని తదీయరూపలక్షణసుషమావిశేషంబులు వీక్షించి
మహాపురుషు లని నిశ్చయించి కృతాంజలిపుటుండ నై నారాక యెఱింగించి
తదాగమనప్రయోజనం బెఱింగినవాఁడ నై వారి నిద్దఱ వీఁపున నిడుకొని
సుగ్రీవునికడకుం దోడ్కొని యరిగితి నంత నానరేశ్వరహరీశ్వరు లన్యోన్య
మధురసల్లాపంబుల మైత్రిం బ్రకటించి ప్రీతిసంహృష్టసర్వాంగు లై యిరువు
రకుం బాటిల్లినయాపదలతెఱంగు దలపోసి యొండొరులకు సాహాయ్యం బాచ
రించువారై వాలిం జంపి వానరరాజ్యంబు నీ కొసంగెద నని రాముండు సుగ్రీ
వునితో శపథంబుఁ జేసి వానరుల నెల్లదిక్కులకుం బనిచి సీత యున్నచో
టెఱింగివచ్చి పదంపడి వైరివధార్థం బరుగునప్పుడు బలసమేతుండనై బాసటగాఁ