| |
వివిధప్రకారంబుల విన్నాణంబుగాఁ బోరుచుండ నయ్యాయోధనంబు మహా
భీమం బై తుములం బై సురాసురసంభ్రమప్రదంబై త్రిలోకభయానకం బై
చెల్లె నప్పుడు.
| 1964
|
| ఆ. |
శత్రుకర్శనుండు సౌమిత్రి కోపించి, కనుల దారుణాగ్నికణము లలరఁ
దొడరి దనుజుమీఁద దొడ్డనారసము మే, నుచ్చి పోవ నేయ నొచ్చి యతఁడు.
| 1965
|
| క. |
చండతర మైనతత్కో, దండస్వన మాలకించి తద్దయుఁ గినుకం
బెండు సెడి దీనముఖుఁ డై, యుండె న్లక్ష్మణునివదన మొగిఁ గనుఁగొనుచున్.
| 1966
|
| తే. |
ఈకరణి దీనవదనుఁ డై తేఁకువ సెడి
ఱిచ్చవడి యున్నవాసవరిపుని జూచి
శత్రుభీషణుఁ డగువిభీషణుఁడు వినయ
మింపు సొంపార సౌమిత్రి కిట్టు లనియె.
| 1967
|
| క. |
మనకు శుభనిమిత్తంబులు, గన నగుచున్నయవి రాజకంఠీరవ యీ
దనుజుఁ డవశ్యము మృతుఁడగు, మునుకొని పటుశరము లేయుము రయం బడరన్.
| 1968
|
| ఉ. |
నా విని లక్ష్మణుండు ఫణినాథనిభాగ్నిశిఖోపమాననా
నావిధవజ్రతుల్యదిననాథమయూఖసమానకాండము
ల్దేవవిరోధిమీఁద దొరలించిన సంక్షుభితాఖిలాంగుఁ డై
వావిరి వాఁడు మై మఱచి వ్రాలె శతాంగముమీఁద రోజుచున్.
| 1969
|
| తే. |
ఇట్లు మూర్ఛితుఁ డై రాక్షసేంద్రతనయుఁ
డొకముహూ_ర్తమునకుఁ దెలివొంది నొచ్చి
యున్న నిఖిలావయవముల నుదుటుకొల్పి
కార్ముకం బందుకొని రోషకలితుఁ డగుచు.
| 1970
|
| క. |
కన్నుల రక్తిమ నిగుడగఁ, బన్నుగ వీరాగ్రగణ్యుఁ బార్థివతనయుం
గన్నారఁ జూచి పరుషం, బెన్నిక కెక్కంగ మరల నిట్లని పలికెన్.
| 1971
|
| సీ. |
మనుజేంద్రనందన మఱచితే తోలినాఁటిరాత్రియుద్ధంబున లావు మెఱసి
నిన్ను నీయన్నను నిరుపమనగాస్త్రపాశబద్ధులఁ జేసి భండనమునఁ
బడవైచినవిధంబు పదపడి మొన్నటిమాపు మి మ్మందఱ నేపు మీఱి
చలమునఁ గఱకుటమ్ముల విసంజ్ఞులఁ జేసి యనిలోనఁ గూలవైచినతెఱంగు
|
|
| తే. |
నిద్రవోయెడు కేసరి నెమకి లేపి, సటలు వెఱికినమాడ్కి వేసరక నన్నుఁ
జెనక వచ్చితి విబ్బంగి సిగ్గుమాలి, వాఁడితూపుల నినుఁ ద్రుంతుఁ జూడు మిపుడు.
| 1972
|
| వ. |
అని పలికి రోషపరవశుం డై యద్దనుజరాజనందనుండు వహ్నిశిఖలం బోలిన
సప్తనారాచంబులు లక్ష్మణునిమీఁదఁ బరఁగించి నొప్పించి పదంపడి పదిబాణం
బులు పవననందనునిపై నడరించి వెంటనే వజ్రకల్పంబు లగునూఱువిశిఖం
బులు విభీషణుని నెఱకలు గాఁడ నేసి విజృంభించిన నద్దశరథరాజనందనుండు
వానికడిమి గైకొనక సూర్యమరీచికల్పంబు లైనకాండసహస్రంబులు పరఁ
|
|
| |
గించి యుబ్బడంచి ముఖారవిందంబునకు మందహాసంబు చెలువొసంగ వాని
కి ట్లనియె.
| 1973
|
| ఉ. |
ఓరి దురాత్మ యిందనుక నూరక ప్రేలితి వేమి యయ్యె నీ
పౌరుష ముర్వి నుత్తముఁడు పంతము లాడక శత్రువర్గము
న్బారము నొందఁజేయు నటు పంతము లాడియు నల్పుఁ డెంతయు
న్వైరుల గెల్వ లేఁడు పటువాగ్బల మాజి జయం బొసంగునే.
| 1974
|
| క. |
బల్లిదుఁడ నంచుఁ బలుమఱుఁ, బ్రల్లదములు పలికి పిదపఁ బగతుఁడు డాయన్
వెల్లదనంబున నుండం, జెల్లునె చెల్లింపు మీవు చెప్పినయంతన్.
| 1975
|
| క. |
అని పలికి కోపమున డా, సినఁ గవచము దెంచి మేను చిల్లులు వాఱ
న్సునిశితసాయకవర్షము, దనుజేంద్రకుమారుమీఁద దళముగఁ గురిసెన్.
| 1976
|
| తే. |
రాజపుత్త్రుసాయకముల రాక్షసేంద్రు
హేమవర్మంబు చూర్ణ మై వ్యోమవీథి
నుండి పడెడుతారాజాలమో యనంగ
సడలి వనచరు ల్చూడంగఁ బుడమిఁ బడియె.
| 1977
|
| చ. |
శరపరిధూతవర్ముఁడయి సాంద్రకృతవ్రణుఁ డై విభావరీ
చరుఁడు మహామహీధరముచాడ్పునఁ గంపము నొంద కక్షుల
న్వరుస మిడుంగుఱు ల్సెదర వారక రాజకుమారుమీఁద భీ
కరతరవజ్రతుల్యపటుకాండసహస్రము లేసె నుద్ధతిన్.
| 1978
|
| క. |
ఆమహనీయప్రదర, స్తోమము సీతాధిపానుజుని దాఁకి వెసన్
మైమఱువు సించి గాత్రము, భీమోద్ధతిఁ దూంట్లు గట్ట భేదించె వడిన్.
| 1979
|
| వ. |
ఇ ట్లన్యోన్యకృతప్రతికారు లై యద్దాశరథిదాశకంఠు లుత్కంఠ దీపింప
నకుంఠితలీల మత్తకంఠీరవంబులచాడ్పునం దలపడి సవ్యాపసవ్యమండల
ప్రకారంబులం దిరుగుచు మండలీకృతకోదండు లై పరివేషపరివృతసూర్య
మండలంబులయొప్పుఁ జూపుచు సాసారంబు లగుప్రళయకాలవలాహకంబుల
కరణి గర్జించుచు నొండొరులమీఁద నీరంధ్రంబుగా నంపవాన గురియుచుఁ
బరస్పరప్రహారభిన్నవక్షు లై ప్రస్రవణంబులు జలంబులు దొరఁగుచం
దంబున రుధిరంబు గ్రక్కుచు రక్తధారోక్షితశరీరు లై ధాతుశోభితంబు
లగుకులాచలంబులమాడ్కిఁ జూడ్కులకు వ్రేఁ గగుచు రుధిరావసిక్తశరస్యూత
సర్వాంగులై హేతిమంతు లైనవైశ్వానరులభంగి వెలుంగుచు బాణక్షతవే
దన సహింపంజాలక సారెసారెకు నిట్టూర్పులు వుచ్చుచు మత్తమాతంగంబుల
మాడ్కి మాఱుమసలుచు నొండొరులశరప్రహారంబులు వారింప నలవి గాక
నౌడు గఱచుచు సాయకవిదారితసర్వాభరణులై మ్రోటువడియున్న కదంబవృక్షం
బులలాగునం జూపట్టుచు యుద్ధోన్మత్తు లగుటం జేసి పరిశ్రమం బెఱుంగక
|
|
| |
రౌద్రరసోల్లాసభాసురవదను లై లయకాలరుద్రులకైవడిఁ దేజరిల్లుచు మఱి
యు రక్తధారాసారసంసిక్తసర్వాంగులై యఖండసంధ్యారాగమండలాంతర్గత
మార్తాండునిం గ్రేడి సేయుచు నుచ్చావచాకారంబు లగునారాచంబుల నంతరి
క్షంబు బంధించుచు సర్వాస్త్రకోవిదులలోన నగ్రగణ్యులు గావున సారెసారెకు
వస్త్రకౌశలంబులు చూపుచు విచిత్రప్రకారంబునఁ గరలాఘవశరలాఘవంబు
లు దీపింప నన్యోన్యజయకాంక్షల౦ గులాచలంబులు కంపింప సముద్రంబులు
పొంగి పొరల గగనంబు ఘూర్ణిల్ల దిక్కులు వడంక సర్వభూతంబులు భయం
బునం బర్వ దివారాత్రంబు లేర్పడకుండ దీర్ఘకాలంబు రణంబు గావించి రప్పుడు.
| 1980
|
| క. |
నరరాక్షససాయకకర, పరిముక్తసువర్ణపుంఖబాణములు తదం
గరుధిరపరిషిక్తములై, హరిపదమున నొప్పెఁ బావకార్చులమాడ్కిన్.
| 1981
|
| క. |
మఱికొన్నిమార్గణము లం, బరపథమున నుండి పుడమిపైఁ బడఁ దొడఁగెం
బెరసి విలయసమయంబున, నురుగతి మహి వ్రాలుదారుణోల్కలమాడ్కిన్.
| 1982
|
| క. |
దారుణలయఘననిర్ఘా, తారవములభంగి మ్రోసె నతిసాంద్రముగా
వారిధనుర్గుణరవములు, ఘోరము లై విన్నవారిగుండెలు పగులన్.
| 1983
|
| ఉ. |
ఒండొరుమీఁద నుగ్రగతి నొక్కట నేయులసచ్ఛరంబు లొం
డొండ నభంబునం దొరసి యుక్కునఁ బుట్టిన ఘోరవహ్నిచే
మండుచుఁ దద్రణక్రమము మాపులు సర్వము గానిపించున
ట్లుండగఁ గ్రాలుబల్దినియలో యనఁ జూడఁగ నయ్యె నయ్యెడన్.
| 1984
|
| తే. |
అంబకాసారసుకృతవ్రణంబు లైన, దాశరథిదాశకంఠులతనువు లపుడు
చూడ నయ్యె నిష్పత్రకుసుమితభూరి, శాల్మలీకింశుకంబుల చంద మొంది.
| 1985
|
| చ. |
నలువుగ వారిగాత్రములు నాటినసాయకము ల్నగంబుపైఁ
బొలిచినభూరిభూజములపొల్పునఁ జూడఁగ నయ్యె నప్పు డ
య్యలవు బలంబు శౌర్యము వరాస్త్రసమృద్ధియుఁ బోలఁ జూచి వీ
రు లనఁగ వీరె యంచు నమరు ల్దనుజు ల్గొనియాడి రెంతయున్.
| 1986
|
| క. |
ఆలోకనభీకర మై, వేలుపులకుఁ దాపసులకు విస్మయకరమై
కీలాభీలం బై యపు, డాలోకింపంగ నయ్యె నయ్యుద్ధ మొగిన్.
| 1987
|
| క. |
వేసరక చలము డింపక, గాసిల్లక రాక్షసుండు కాకుత్స్థవరుం
డీసున రోసంబుల ను, ల్లాసంబునఁ బోరి రిట్లు లా వినుమడి గాన్.
| 1988
|
| వ. |
ఇత్తెఱంగున మహావీరులును గీర్తిమంతులును జయశీలురును సర్వాస్త్రకోవిదులు
నగుమానవదానవనాథనందనులు రౌద్రతం బెనంగునెడ సమరపరిశ్రాంతుం
డై నరావణిం బ్రవర్ధమానతేజుం డై లక్ష్మణునిం జూచి యమ్మహారాజనందను
నకుఁ బ్రియహితంబులు సంపాదించుతలంపున మహాతేజుం డగువిభీషణుండు
సంగ్రామంబు గావింప సమకట్టి సచివసమన్వితుండై కలభపరివేష్టితం బైనమత్త
|
|
| |
శుండాలంబులీల ననుకరించుచు రోదసీకుహరంబు నిండ గుణధ్వనిఁ జేసి విపుల
రోషంబునఁ జిచ్చఱపిడుగులం బోనినిశితవిశిఖంబులు సాంద్రంబుగాఁ బరఁ
గించిన నవి వైశ్వానరజ్వాలలు కాఱడవి దహించుచందంబున రాక్షససైన్యం
బుల దహింపం దొడంగె నప్పు డతనిప్రాపునం బన్ని తదనుచరులు శూలాసి
పట్టిసకూటముద్గరగదాపరిఘంబులు ప్రయోగించి దనుజబలంబుల నేలకుం
గోలకుం దెచ్చి రిట్లు విభీషణుండు మంత్రులుం దానును నలిరేఁగి యాతుధా
నుల నుగ్గునూచంబు చేసి వానరుల నవలోకించి యి ట్లనియె.
| 1989
|
| చ. |
వనచరులార రాత్రిచరవర్యునిజీవిత మన్న దోర్బలం
బనిన నితండె యీఖలనిశాటుఁడు చచ్చినఁ బంక్తికంథరుం
డనిమొన రామబాణనిచయంబులఁ జచ్చినవాఁడు గావునన్
ఘనభుజు లంద ఱొక్కమొగిఁ గ్రమ్మి వధింపుఁడు వీని నుద్ధతిన్.
| 1990
|
| సీ. |
కుంభనికుంభులు కుంభకర్ణుఁడు ప్రహస్తుఁడు వజ్రదంష్ట్రుఁడు ధూమ్రనయనుఁ
డలజంబుమాలి మహామాలియును నిఘ్నుఁ డశనిప్రభుండు సంహ్రాది వికటుఁ
డగ్నికేతుండును యజ్ఞకోపుండు సుప్తఘ్నుం డకంపనప్రఘసతపన
తరణిశత్రులు మహోదరమహాపార్శ్వప్రఘసకప్రజంఘాతికాయభాస
|
|
| తే. |
కర్ణదేవాంతకనరాంతకద్విజిహ్వు, లావిరూపాక్షయూపాక్షయజ్ఞశత్రు
లాదిగాఁ గలదైత్యబలాధినాథు, లందఱును ఘోరగతిఁ గూలి రాలమందు.
| 1991
|
| క. |
పంతము మీఱ రణార్ణవ, మంతయు దాఁటితిరి మీర లటు గోష్పదకం
బంతకడఁ జిక్కె నీతని, నంతము నొందించి దాఁటుఁ డాశేషంబున్.
| 1992
|
| క. |
మగఁటిమి మీఱఁగ మనతో, జగడమునకు వచ్చినట్టి సాహసు లెల్లం
దెగటారి రితఁడు మడిసిన, నగచరవరులార మనమనఃపీడ దెగున్.
| 1993
|
| క. |
పినతండ్రి నైననా కిటు, తనయునిఁ జంపంగఁ దగదు దాఁ జంపిన నొ
క్కనిచే రణమునఁ జంపిం, చిన భువి నీరెండు సరియై చింతింపంగన్.
| 1994
|
| తే. |
దురిత మైనను గానిమ్ము పరమహితము, రామకార్యార్థ మిది గాన భీమవర్యుఁ
డైనసౌమిత్రిచే వీని నద్భుతముగఁ, గలనఁ జంపింతు మాయలు గెలువ నింక.
| 1995
|
| క. |
వానరు లందఱుఁ దలపడి, నానావిధతరుల శిలల నఖదంతములన్
వీనిసహచరుల నందఱఁ, బూని వధింపుఁడు సమగ్రభుజబల మలరన్.
| 1996
|
| వ. |
అని పలికిన విభీషణప్రేరితు లై వానరు లందఱు విలయపవనప్రేరితమేఘంబుల
పగిది విజృంభించి మేఘంబులం జూచిన మయూరంబులభంగి భూనభోంతరంబు
నిండ సింహనాదంబులు చేయుచు లాంగూలంబులు ద్రిప్పుచు మదగజేంద్రం
బులపై కుఱుకుకొదమసింగంబులమాడ్కి రాక్షసులమీఁది కురవణించి సాం
ద్రంబుగా శిలాపాదపవర్షంబులు గురియుచు విక్రమించిన నయ్యాతుధానులు
కోపించి భయంబు విడిచి గదాపరిఘపట్టిసప్రాసకరవాలభిండివాలశక్తితోమర
|
|
| |
పాణు లై వారలం దలపడిన నయ్యిరుగెడలవారికి దేవాసురులకుం బోలె
ఘోరం బగుసంగ్రామం బయ్యె నప్పుడు భల్లూకనాథుం డగుజాంబవంతుండు
నిజబలంబులఁ బురికొల్పి తానును రాక్షసబలంబు సొచ్చి కాలమేఘంబు కర
కాశనివర్షంబు గురియుచందంబున నీరంధ్రంబుగా శిలావర్షంబు గురియుచు
నఖదంతంబుల వచ్చుచు బహుప్రకారంబుల రూపుమాపం దొడంగిన నద్దా
నవు లాపరాక్రమధుర్యుం బొదివి నీలజీమూతంబు మహాచలంబుమీఁద జడి
వాన గురియుపోల్కి నానాస్త్రశస్త్రవర్షంబుఁ బరఁగించి వెనుదీయక యేపునం
బెనంగుచుండి రిత్తెఱం గాలోకించి మరున్నందనుండు లక్ష్మణుని డించి యొక
విశాలసాలం బుత్పాటించి తెచ్చి యొక్కొక్కవేటున ననేకరాక్షసుల నేలం
గూల్చుచు విక్రమవిహారంబు సలిపె విభీషణుండును మంత్రులుం దానును నలి
రేఁగి వివిధాస్త్రశస్త్రంబుల దనుజులఁ బెక్కండ్రఁ బాఱి సమరుచుండె నక్కల
కలం బాలకించి యింద్రజిత్తు కోపించి బ్రహ్మాండభాండంబు పగుల ధనుష్టం
కారంబు గావించి వజ్రాశనిసమప్రభంబు లైననారాచంబులు విభీషణుని
మీఁదం బ్రయోగించిన నవి యతనిశరీరంబు భేదించి ధరణి గాఁడిన నది దండ
తాడితం బైనకుంభంబుపగిది పగిలి వ్రయ్య లయ్యె నప్పు డతనియాటోపంబుఁ
జూచి సహింపక లక్ష్మణుం డెప్పటియట్ల హనుమంతు నెక్కి యింద్రజిత్తుం దల
పడిన నవ్వీరశిఖామణుల కనన్యసాధారణం బైనరణం బయ్యె నంత.
| 1997
|
| ఉ. |
చండభుజావలేపమున సాంద్రగుణధ్వని మింటఁ బర్వఁగా
నొండొరుమీఁద నొక్కమొగి నుగ్రశరప్రకరంబు లేయుచున్
గాండతిరోహితాంగు లయి కాలఘనాంతరితౌషధీశమా
ర్తాండులభంగిఁ గన్పడక దారుణభంగిఁ బెనంగి రిద్దఱున్.
| 1998
|
| మ. |
శరసంధానమునుం బ్రమోక్షము ధనుస్సవ్యాపసవ్యక్రమం
బురుముష్టిప్రతిబంధనంబు గుణసంయోగంబు లక్ష్యాప్తియుం
గర మాదానము విగ్రహంబును సమాకర్షంబుఁ గన్పట్టకుం
డ రహిం బోరిరి పాణిలాఘవమునన్ మాఱొడ్డి చిత్రంబుగన్.
| 1999
|
| తే. |
చాపవేగప్రముక్తవిశాలబాణ, జాలములచే నభంబు సంఛన్న మగుచు
నుండఁ దద్గతవిమలగ్రహోడువితతు, లెవ్వియును జూడఁబడవయ్యె నెట్టిరణమొ.
| 2000
|
| తే. |
రాజసుతుతోడ మార్కొన రావణికిని, రావణి నెదిరి పోరాడ రాజసుతున
కగునుగా కమ్మహాత్ముల నలమ నొరుల, కలవియే యని కొనియాడి రమరు లపుడు.
| 2001
|
| క. |
అతులితశరబాహాహం, కృతిఁ బోరెడువారిఁ జూచి యితఁడు గెలుచు నేఁ
డితఁ డోడు నని యథార్థ, స్థితి నూహింపంగ లేక చిక్కిరి వేల్పుల్.
| 2002
|
| చ. |
సమకొని వార లిర్వురు ప్రచండగతిం బరఁగించుశాతకాం
డము లతిసాంద్రభంగి గగనంబును దిక్కులు నిండఁ బర్వ న
|
|
| |
య్యమవసనాఁటిరాత్రి యసితాభ్రము గ్రమ్మినవేళఁ బుట్టుసం
తమసమువోలె ఘోరముగఁ దత్సమయంబునఁ గ్రమ్మెఁ జీఁకటుల్.
| 2003
|
| ఆ. |
అంతలోనె సూర్యుఁ డస్తమించె రణాంగ, ణమునఁ బాఱురక్తనదులకాంతి
మింటఁ బర్వి కెంపుమించెనో యనుమాడ్కిఁ, బరమదారుణముగఁ బరఁగె సంధ్య.
| 2004
|
| సీ. |
కాంక్ష దీరఁగ మాంసఖండజాలము మెక్కి లీలమై నాడు బేతాళురవము
పునుకలో మెదడు గైకొని తిని సొక్కెడు కూశ్మాండగణములఘోషణంబు
కడుపులు నిండ రక్తము ద్రావి దిరుగు భీకరజంబుకంబుల కలకలంబు
మస్తిష్కము భుజించి మలయుకంకోలూకకాకగృధ్రములభీకరనినాద
|
|
| తే. |
మొక్కటై భీమగతి మ్రోసె నుర్వి నిండ
వాయువులు వీవ నోడె వైశ్వానరుండు
వెలుఁగఁ డయ్యె నక్షత్రము ల్వెలుఁగుఁ జూప
వెఱచె విలయకాలమునాఁటివిధము దోఁచె.
| 2005
|
| క. |
ఆయుత్పాతము గని నిర, పాయులు పరమర్షు లెల్ల భ్రాంతహృదయు లై
పాయక గోబ్రాహ్మణులకు, శ్రేయం బగుఁగాక యని వచించిరి వరుసన్.
| 2006
|
| ఉ. |
ఆరభసంబుఁ జూచి గరుడామరకిన్నరసిద్ధసాధ్యయ
క్షోరగగుహ్యకాదులు భయోద్ధతి నచ్చటి కేగుదెంచి యా
వీరవరేణ్యు లక్ష్మణుని వేయువిధంబుల సన్నుతించి యీ
ఘోరనిశాటుఁ ద్రుంపు మని గొబ్బున దీవన లిచ్చి రయ్యెడన్.
| 2007
|
| ఉ. |
అంత రఘుప్రవీరుఁడు మహాభుజవీర్యుఁడు లక్ష్మణుండు కా
లాంతకుమాడ్కి బిట్టలిగి యద్భుతఘోరగుణస్వనంబు రో
దోంతర మెల్ల నిండ నిశితాయుధము ల్పరఁగించి వానరు
ల్సంతస మందఁ దత్తనువు జల్లెడకంతలు చేసి వెండియున్.
| 2008
|
| క. |
దక్షతఁ బదిబాణంబుల, వక్షము పగులంగ నేసె వదలక విలస
త్పక్షార్ధచంద్రశరమున, రక్షపతిసుతునివిల్లు గ్రక్కునఁ దునిమెన్.
| 2009
|
| ఆ. |
మఱియు నొక్కఘోరమార్గణంబున వాని, పడగ నేలఁ గూల్చి పటునిజాత
శరచతుష్టయమున హరిచతుష్టయమును, వికల మొందఁ జేసి వేగ మడర.
| 2010
|
| ఉ. |
పాయక యొక్కదారుణసుపర్వసుపత్రసుపుంఖశాతపూ
ర్ణాయతముక్తనిర్జరవరాయుధసన్నిభకాలదండక
ల్పాయతభానుభానుతులితాగ్నిశిఖోపమకాంచనోల్లస
త్సాయక మేసి వాని రథసారథిశీర్షము ద్రుంచె నుద్ధతిన్.
| 2011
|
| వ. |
ఇట్లు వినిహతసారథియు విశకలితకేతనుండును వికలసాధనుండు నై యయ్యాఖండ
లరిపుండు తానె సారథ్యంబు సేయుచు వేఱొక్కమహోద్దండకోదండంబు గొని
గుణధ్వనిఁ జేసి నిరంతరంబుగా శరంబులు గురియుచుఁ జూపఱ కద్భుతసామ
|
|
| |
ర్థ్యంబుఁ జూపుచుం గవిసిన నాలక్ష్మణుండు వానియాటోపంబుఁ జూచి సహిం
పక కోపించి వాఁడినారసంబు లడరంట నేసిన నద్దనుజశేఖరుం డయ్యమోఘశ
రంబుల నొచ్చి యంతలోన లబ్ధసంజ్ఞుం డైనసారథిం దలంచుకొని చింతించి వేఁ
డినిట్టూర్పులు వుచ్చుచుఁ జాపంబు సారింప శరంబు సంధింప శక్తుండు గాక
లక్ష్మణుం దేఱిచూడం జాలక విషణ్ణవదనుం డై యూరకున్న నతనిముఖలక్షణం
బుపలక్షించి వానరు లందఱు పరమసంహృష్టు లై లక్ష్మణుం బ్రశంసించి రంత
బ్రమాథియు రభసుండును శరభుండును గంధమాదనుండును వీరావేశంబునం గవిసి
శైలశృంగంబులు రావణిరథంబుపై వైచిన నది మథితాష్టతురంగమం బై భగ్నా
క్షకూబరం బై విశకలితకేతనాతపత్రచక్రం బై ధరణిం గూలె నిట్లు రథంబు నుగ్గు
నూచంబుఁ జేసి యవ్వానరోత్తములు నల్వురు గ్రమ్మఱ లక్ష్మణునిపాలికిం జనుదెం
చి తత్పార్శ్వంబునం గొలిచి యుండిరి యిట్లు తనరథంబు భగ్నంబై కూలిన విర
థుండై లాఘవంబునఁ బుడమికిం దాఁటి పదాతియై కోపంబు రెట్టింపఁ బొలివోని
బంటుతనంబునఁ బుంఖానుపుంఖంబులుగా శరంబులు పరఁగించుచు మార్కొ
నిన నద్దశరథరాజనందనుండు సంక్రుద్ధుం డై శరాసారఘోరంబుగాఁ గవిసిన
నమ్మహావీరులు పరస్పరజయకాంక్ష లినుమడింప మత్తగజంబులచాడ్పునం దల
పడి ఛిద్రంబు లన్వేషించుచు రౌద్రంబునం బెనంగునెడఁ దత్పార్శ్వంబుల
నలి రేఁగి రాక్షసులు వానరులు భీమప్రకారంబున మార్కొని మహారభసంబున
ఘోరప్రకారంబునఁ బెసఁకువకుం జొచ్చిన సందడికయ్యం బయ్యె నప్పు డాసం
దున నెడగని రావణనందనుండు రాక్షసుల కి ట్లనియె.
| 2012
|
| సీ. |
కలయంగ బెరసిన కటికిచీఁకటులచే దిక్కు లన్నియుఁ జాలఁ దెల్వి దప్పెఁ
దనవారు నెదిరివా రని తెలియఁగ లేక భ్రమగొని యున్నారు ప్లవగవరులు
వీరల వంచించి వెస నేను బురి కేగి రథ మెక్కి వచ్చెద రణ మొనర్ప
నావచ్చునందాఁక నావార్త వానరు లెఱుఁగకుండఁగఁ బోరుఁ డేపు మెఱసి
|
|
| తే. |
యేను బురి కేగుటయు మది నెఱిఁగిరేని, దురాత్ములు వానరు లెట్టులైన
నఱిమి పోనీక పెనఁగుదు రట్లు గాన, స్వస్థచిత్తు లై కయ్యంబు సలుపవలయు.
| 2013
|
| క. |
అని పలికి రాక్షసేశ్వర, తనయుఁడు తనపనికి యాతుధానుల నిడి కా
ననచరవీరుల నందఱ, గనుమఱపి నిశాటపురికి గ్రక్కున నరిగెన్.
| 2014
|
| చ. |
అరిగి సువర్ణకేతనసమంచితనూత్నయుగాక్షచక్రకూ
బరపరిశీలితంబు ప్రతిబద్ధజవాశ్వము సర్వశస్త్రసం
భరితము కాంచనాభరణభాసిత మశ్వగతిజ్ఞసూత
ఖరసహితంబు నైనగిరికల్పశతాంగము నెక్కి చెచ్చెరన్.
| 2015
|
| ఉ. |
దానవయోధముఖ్యులు ప్రతాప మెలర్పఁగఁ దన్నుఁ గొల్వ న
ద్దానవనాథనందనుఁడు తప్పక గ్రమ్మఱ యుద్ధభూమికిన్
|
|
| |
మానుగ వచ్చె వాని లఘిమ న్గని వానరు లావిభీషణుం
డాకృపనందనుండు హృదయంబున విస్మయ మంది రయ్యెడన్.
| 2016
|
| ఉ. |
అంత దశాస్యపుత్రుఁడు దురంతకృతాంతబలాభిభూతుఁ డై
పంత మెలర్పఁ గార్ముకము బాగుగ సజ్యముఁ జేసి శౌర్య మం
తంతకు మీఱ సాయకసహస్రము లేసి వనాటసైన్య మిం
తింతలు తున్కలై వెస మహీస్థలిఁ గూలఁగఁ జేసి బల్విడిన్.
| 2017
|
| ఉ. |
వెండియు మండలీకృతనవీనశరాసనుఁ డై మహోద్దతిం
జండశిలీముఖంబు లతిసాంద్రముగాఁ బరఁగించి వేసవి
న్జండకరుండు తీవ్రకిరణంబులు నల్పజలాశయంబు ను
ద్దండత నింకఁ జేసినవిధంబునఁ గీశతతిం గలంచినన్.
| 2018
|
| తే. |
వికటమారారిమార్తి యై విక్రమించు, వానికోలల కోర్వక వానరాళి
నొచ్చి సౌమిత్రిశరణంబుఁ జొచ్చె నపుడు, భయము దీపింపఁ బ్రజ ప్రజాపతిని బోలె.
| 2019
|
| క. |
ఆరఘువర్యుఁడు వానర, వీరుల కభయంబుఁ దెల్పి వేగం బడరన్
భూరికరలాఘవంబున, సారాంబక మేసి వానిచాపము ద్రుంచెన్.
| 2020
|
| క. |
అతఁ డొండొకకోదండము, చతురతఁ గైకొనిన దానిఁ జయ్యన బాణ
త్రితయమునఁ దునిమె మఱియొక, వితతధనువు గొనిన దాని విసువక దునిమెన్.
| 2021
|
| తే. |
తునిమి తోడ్తోడఁ గ్రొవ్వాఁడితూపు లేసి, కత్తళము సించి పదపడి కాలఫణిస
మానశరపంచకంబున వానిగాత్ర, ముచ్చిపో నేసె వేల్పులు మెచ్చి పొగడ.
| 2022
|
| క. |
సౌమిత్రి కార్ముకస్రుత, భీమశరము లతనిమేను భేదించి వడిన్
వ్యోమమున కెగసి వెంటనె, భూమిం బడె రక్తగాత్రభోగులమాడ్కిన్.
| 2023
|
| చ. |
విడువక యింద్రజిత్తు రఘువీరవరాంబకభిన్నవర్ముఁ డై
కడువడి నోట శోణితము గ్రక్కుచు వేఱొకవిల్లు దాల్చి బి
ట్టడరి కులాద్రిమీఁద విలయాభ్రము వర్షము గుమ్మరించుకై
వడి రఘువర్యుమీఁద శరవర్ష మొగిం గురియించె నుద్ధతిన్.
| 2024
|
| తే. |
అర్కుఁ డాత్మీయకరముల నవిరళముగ, నెఱసికొని యున్నచీఁకటి విరియఁజేసి
నట్లు దశరథసుతుఁడు నిజాంబకముల, రాక్షసోత్సృష్టబాణవర్షంబు మాన్చె.
| 2025
|
| ఆ. |
మంచు విరియఁజేసి మహితతేజంబునఁ, గ్రాలుభానుగతి విరాజమానుఁ
డగుచు వైరిమీఁద నవిరళశరవృష్టి, గురిసి విస్మయంబు వఱలఁ జేసె.
| 2026
|
| క. |
సురవైరి మేన నాఁటిన, శరములు రఘువీరువింటిశరము లొకటి యై
పరికింపఁ ద్రాళ్ళు వెనఁచిన, కరణిం జూపట్టె నడిమి కాండము లెల్లన్.
| 2027
|
| క. |
ఒక్కొకని మూఁడుశరములఁ, దక్కినరక్కసులనెల్లఁ దద్దయుఁ గినుకన్
స్రుక్కించి మరల రావణి, నక్కజముగఁ బెక్కుఁగఱకుటమ్ముల నొంచెన్.
| 2028
|
| ఆ. |
శత్రుతాపి యైనసౌమిత్రిచే నిట్లు, హన్యమానుఁ డగుచు నసురవరుఁడు
కనుల నిప్పు లురలఁ గాకుత్స్థవంశాగ్ర, గణ్యు ఘోరసాయకములఁ గప్పె.
| 2029
|
| ఉ. |
దానికి నల్గి రాఘవుఁడు దారుణశాతశిలీముఖంబులం
దానవముక్తకాండములఁ దట్టి వడిం గరలాఘవంబున
న్మానక సూతుఁ జంపినఁ గ్రమంబున వాజు లవిక్లబంబు లై
పూని రథంబు మోచికొని పూర్వగతి న్విహరించె నేర్పునన్.
| 2030
|
| ఆ. |
ఆవిధంబుఁ జూడ నద్భుతం బయ్యె సౌ, మిత్రి యంతఁ గనలి మిహిరకిరణ
తులితసాయకములఁ దోడ్తోడ వేగంబు, నివ్వటిల్ల హరుల నొవ్వఁ జేసె.
| 2031
|
| క. |
రాఘవునిభూరికరశర, లాఘవ మది చూచి కనలి రాక్షసవర్యుం
ఢాఘోషం బడర దళా, మోఘశరము లేసె వక్షముం దాఁకంగన్.
| 2032
|
| ఆ. |
వానివజ్రతుల్యవాసుకిసన్నిభ, సాయకములు పవనసమరయమున
నేగి రఘువరేణ్యు హేమవర్మము దాఁకి, మిడుఁగుఱులు సెలంగ మిట్టిపడియె.
| 2033
|
| ఉ. |
అంతటఁ బోక వాఁడు విలయాగ్నివిధంబునఁ బేర్చి యార్చి కా
లాంతకదండకల్పనిశితాంబకము ల్వెస మూఁడు గూర్చి య
త్యంతరయంబునం గుణరవార్భటి వింటఁ జెలంగ నమ్మహీ
కాంతకుమారుఫాలఫలకం బొగి నాటఁగ నేసె నుద్ధతిన్.
| 2034
|
| తే. |
ఘనలలాటస్థపటుసాయకత్రయమున, నమ్మహారాజసుతుఁడు రణాగ్రమందుఁ
శోభిల్లె నపుడు లసత్త్రిశృంగ, కలిత మైనసుమేరునగంబుకరణి.
| 2035
|
| తే. |
రాజసుతుఁ డిట్లు రాక్షసరాజతనయ, బాణవిద్ధుఁడై కోపంబు ప్రజ్వరిల్ల
ధనువు సారించి వానివక్త్రంబుమీఁద, విశిఖపంచక మడరించి వెగడుపఱచె.
| 2036
|
| వ. |
ఇట్లు మహాబలశరాసనులును సముద్యతాయుధులును మహావీరులును భీమవరా
క్రములును బ్రచండవేగులును నగురాజనందనరావణనందనులు పరస్పరజయా
భిలాషలం గవిసి నిశితాగ్రంబు లగుఘోరనారాచంబు లొండొరులమీఁదం
బరగించుచు శోణితదిగ్ధాంగులై పుష్పితాశోకకింశుకంబులచందంబునం దేజరిల్లు
చుండి రప్పుడు సమరకోపసంయుక్తుండై రావణాత్మజుండు సౌమిత్రితోడం బో
రుచు నేడగని మూఁడువాఁడితూపులు విభీషణువదనంబు గాఁడ నేసి వెండియు
లాఘవంబున నయోముఖంబు లైనభల్లంబులు పరఁగించి యొక్కొక్కశరంబున
నొక్కొక్కవానరుం దూలనేసి వానరుల నందఱ బడలుపడంజేయుచు విజృం
భించిన నతనిభుజాటోపంబున కలిగి విభీషణుండు గద గొని సాహసంబున వాని
రథంబు పైకి లంఘించి హయంబులం జదియ మోఁదిన నతండు హతాశ్వసూ
తుండై పుడమికి దాఁటి కోపాటోపంబున.
| 2037
|
| క. |
మదమున రథశక్తిం గొని, వదలక పినతండ్రిమీఁద వైచిన దానిం
జదలఁ గని రాముతమ్ముఁడు, పదితునుకలు సేసె నడుమఁ బటుభల్లములన్.
| 2038
|
| చ. |
అలిగి విభీషణుండు చలమారఁగ నైదు శితాంబకంబు లా
బలభిదరాతినాథసుతుపై నిగిడించినఁ దచ్ఛరంబు లా
ఖలునియురంబు దూఱి చులుక న్వెస వీఁపున నిర్గమించి శో
భిలె నతిలోహితావయవభీషణభోగులమాడ్కి నెంతయున్.
| 2039
|
| క. |
రావణి యప్పుడు కన్నులఁ, బావకశిఖ లుప్పతిల్లఁ బటుగుణరవము
న్గావించి పితృవ్యునిపై, జీవము గొనునట్టిఘోరశితశర మేసెన్.
| 2040
|
| క. |
తడయక దశరథతనయుఁడు, కడువడిఁ బఱతెంచుదానిఁ గాంచి రయమునం
బిడుగుల కెన యగుతూపుల, నడుమనె ఖండించి వైచె నాకులు మెచ్చన్.
| 2041
|
| ఉ. |
రావణనందనుం డలిగి రాక్షసు లందఱు మెచ్చి చూడ నెం
తే వడి శింజినీస్వనము దిక్కులు నిండఁగఁ జేసి వీఁకతో
వావిరిఁ గాలుఁ డిచ్చినయవార్యశరం బరిఁబోసి వీరసం
భావితుఁ డైనలక్ష్మణునిపై నిగిడించెఁ బ్రచండవైఖరిన్.
| 2043
|
| ఉ. |
దానితెఱంగుఁ జూచి వసుధావరపుత్రుఁడు మున్ను స్వప్నమం
దానరవాహనుం డొసఁగినట్టిసురాసురలోకదుస్సహం
బైనయమోఘబాణము రయంబున వింట ఘటించి శింజినీ
ధ్వానము మీఱ దేవపతివైరిపయిం బరఁగించె నుద్ధతిన్.
| 2044
|
| వ. |
ఇ ట్లమ్మహనీయాస్త్రంబులు రెండును పరిఘోపమబాహుపూర్ణాకృష్టవిసృష్టం
బులై ప్రచండతేజంబున వెలుంగుచుఁ గ్రౌంచంబులపగిది విరావంబులు సేయుచు
వైశ్వానరజ్వాలలభంగి నింగి వెలుంగం జేయుచు భయంకరప్రకారంబున
గగనంబున ముఖాముఖి నొండొంటిం దాఁకి పరస్పరసంఘట్టనంబునం బుట్టిన
సధూమవిస్ఫులింగపావకజ్వాలలు భూనభోంతరంబు నిండ మహాగ్రహంబులపో
ల్కి దారుణంబుగాఁ బోరిపోరి యన్యోన్యతేజఃప్రదహ్యమానంబులై పుడమిం
బడియె నిట్లు ప్రతిహతంబు లైనశరంబుల విలోకించి దశరథనందనులు వ్రీళితులై
యొక్కింతసే పూరకుండి వెండియుఁ జాతరోషులై రౌద్రప్రకారంబు నరణంబు
గావించుచు.
| 2045
|
| శా. |
వీరగ్రామణి లక్ష్మణుండు పటుదోర్వీర్యంబు దీపింప నే
పార శ్రావణిమీఁద వారుణశరం బత్యుగ్రుఁ డై యేసినం
గ్రూరాత్ముం డగురాక్షసుండు మదిలోఁ గోపించి రౌద్రాస్త్రము
న్ఘోరప్రక్రియ నేసి దాని నడుమన్ దున్మాడె నత్యుద్ధతిన్.
| 2046
|
| ఉ. |
రావణి యల్గి తీవ్రతరరావము లేర్పడ సర్వలోకము
ల్దేవత లార్తి నొందఁ బటుదీప్తహుతాశనబాణ మేసిన
న్భూవరనందనుం డపుడు భూరిభుజవిభవాభిరంజితుం
డై వడి సౌరబాణమున నయ్యనలాస్త్రముఁ ద్రుంచె వ్రేల్మిడిన్.
| 2047
|
| శా. |
ఆరక్షఃపతినందనుం డపుడు ఘోరాకారుఁ డై పేర్చి మౌ
ర్వీరావంబు చెలంగ సర్వజగము ల్భీతిల్లి కంపింప దే
వారాతు ల్వినుతింప వాయుశర మేయం దాని ఖండించె నే
పార న్లక్ష్మణుఁ డాకపు ల్వొగడ నైంద్రాస్త్రప్రయోగంబునన్.
| 2048
|
| మ. |
దనుజాధీశకుమారుఁ డప్పు డురగాస్త్రం బేసినం జూచి రా
మనరేంద్రావరజుండు వేల్పులు నుతింపం గారుడాస్త్రంబు నే
సిన నారెండును మింటఁ దార్కొని బలశ్రీ మీఱఁగాఁ బోరి గ్ర
ద్దన నన్యోన్యహతంబు లై ధరణిమీఁదం గూలె నత్యుద్ధతిన్.
| 2049
|
| తే. |
ఇటుల నవ్వీరశేఖరు లిరువు రుగ్ర, మూర్తులై వాహనంబున మొనసి యస్త్ర
సమర మొనరించునప్పు డేచాయఁ గన్నఁ, బ్రళయకాలంబునాఁటి తెఱంగు దోఁచె.
| 2050
|
| క. |
ద్యోవీథి నున్నమౌనులు, దేవత లారఘుకులప్రదీపకు నొగి సం
భావించుచు దీవించుచు, సేవించిరి సమరవిజయసిద్ధి దలఁచుచున్.
| 2051
|
| ఉ. |
అప్పుడు దైత్యవర్యుఁడు నృపాస్త్రనివారిత మైనబాణము
న్దప్పక చూచి యల్గి భుజదర్ప మిఁ కెన్నటి కంచుఁ గన్నులన్
నిప్పులు రాలఁ దీవ్రగతి నేర్పున వింట మహాసురాస్త్రముం
దప్పక కూర్చి యేసె వితతంబుగ మంటలు మింటఁ బర్వఁగన్.
| 2052
|
| మ. |
దనుజుం డిట్లు సమగ్రశక్తి నసురాస్త్రంబు న్బ్రయోగింపఁ జ
య్యన నయ్యస్త్రమహత్త్వ మెట్టిదొ యసంఖ్యాతంబు లై శూలముల్
ఘనచక్రాసిపరశ్వథంబులు గదల్ ప్రానంబులున్ శక్తికుం
తనికాయంబులు పుట్టి యాకసము నిండం బర్వె ఘోరంబుగన్.
| 2053
|
| క. |
ఆయుత్పాతము గనుఁగొని, పాయక దేవతలు మునులు భయమున నధిక
శ్రీయుతుఁ డగు సౌమిత్రి క, పాయము రాకుండఁ దోడుపడి ప్రోచి రనిన్.
| 2054
|
| మ. |
అసురాధీశకుమారబాహుగళితం బై ఘోర మై తీక్ష్ణ మై
యసిచక్రాదికగర్భ మై సకలభూతావార్య మై
బస మీఱ న్శ్వసనాతివేగమున శుంభల్లీల నేతెంచున
య్యసురాస్త్రంబును జూచి లక్ష్మణుఁడు తీవ్రాటోపసంరంభి యై.
| 2055
|
| చ. |
అలిగి మహేశ్వరాస్త్రము రయంబున నేసిన నమ్మహాస్త్ర ము
జ్జ్వలదినుఁ డాత్మతేజమున సాంద్రతమంబు నడంచుకైవడిం
దలకొని దానవాస్త్రమును దప్పక దగ్ధముఁ జేసి సత్రము
న్గలయ దహించినట్టిశిఖికైవడి శాంతి వహించె నంతయున్.
| 2056
|
ఇంద్రజిత్తు లక్ష్మణునిచేఁ జచ్చుట
| వ. |
ఇ ట్లమిత్రబలమర్దనుం డగులక్ష్మణుండు మాహేశ్వరాస్త్రంబున నసురాస్త్రంబు
నవలీల రూపుమాపి యంత నిలువక యంతకుభంగి నంతంత కధికరౌద్రుండై
|
|
| |
యింద్రజిత్తుం జూచి ప్రచండకోదండగుణప్రణాదంబు రోదసీభాగంబు నిండం
బూరించి కోపంబుఁ బెంచి సింహనాదంబు గావించి తొల్లి దేవాసురయుద్ధంబు
నందు మహాతేజుం డగుపురందరుం డెద్దానివలన దానవులు జయించె నట్టిహు
తాశనసమస్పర్శంబును రాక్షసవినాశనోచితంబును బతత్రశోభితంబును సుసంస్థి
తాంగంబును సుపర్వంబును సువర్ణాలంకృతంబును వీరశరీరాంతకరంబును దురా
వారంబును దుర్విషహంబును సర్వలోకభయావహంబును నాశీవిషప్రఖ్యంబును
సర్వదేవనమస్కృతంబును నమిత్రమథనక్షమంబును నజిహ్మగంబును నప్రతిహ
తంబును ననంతబలంబు నగునైంద్రాస్త్రంబు గొని సచరాచరంబు లగులోకం
బులు భయంబున నాకంపింప మహీచక్రంబు చలింప దిక్కులుఁ బీఁటలు వాఱ
దివాకరుండు మందరశ్మి గాఁగ సురగరుడోరగగంధర్వపరమర్షిసిద్ధవిద్యాధరా
దులు గగనంబునం బన్ని సంభ్రాంతహృదయు లై రావణి న్జయింపు మని పలుక
సమంత్రకంబుగా శరాసనంబునందు సంధించి యాకర్ణపూర్ణంబుగా నాకర్షించి
లక్ష్మీవంతుం డగులక్ష్మణుండు కార్యసాధనం బగువాక్యంబున ని ట్లనియె.
| 2057
|
| చ. |
అతులితభంగి రాఘవనృపాగ్రణి ధార్మికుఁ డేని సత్యసు
వ్రతుఁ డగునేని లోకగణరంజనుఁ డేని సుపర్వకోటికిన్
హితుఁ డగునేని నిక్కముగ నీశరరాజము నేఁడు రావణిం
జతురతఁ జంపుఁ గాక సురసాధ్యమహామునిసాక్షికంబుగన్.
| 2058
|
| క. |
అని పలికి లక్ష్మణుఁడు చయ్యన నాకర్షించి యమ్మహాస్త్రము నసురేం
ద్రునిమీఁద విడిచె శత్రుఁడు, మును జంభునిమీఁద వజ్రమును బోలె రహిన్.
| 2059
|
| సీ. |
కల్పాంతకాలసంకర్షణానలశిఖామాలికాజాజ్వల్యమాన మగుచుఁ
బ్రళయకాలోదగ్రభాస్కరతిగ్మమరీచికాగణదుర్నిరీక్ష మగుచుఁ
గాలజీమూతసంఘాతనిర్గతమహానిర్ఘాతత్వలితోగ్రనినద మగుచుఁ
బ్రబలమహీధరోత్పాటనక్షమమహావిలయఝంఝావాతవేగ మగుచు
|
|
| తే. |
నంబరమ్మున న ట్లేగి యమ్మహాస్త్ర, మెల్లవారలు చూడ నహీనరత్న
ఖచితకుండలకోటీరకలిత మైన, జంభసూదనరిపునిమస్తకము ద్రుంచె.
| 2060
|
| క. |
అపు డారాత్రించరసై, న్యపతివిపులశిరము శోణితౌఘోక్షిత మై
తపనీయకందుకముక్రియ, క్షపాచరులు చూచి యేడ్వఁ గహ్వరి డొల్లెన్.
| 2061
|
| క. |
సతనుత్రాణము నారో, పితచాపము రత్నఖచితపృథులాభరణ
ద్యుతియుత మగుతత్కాయము, క్షితిజముచందాన నపుడు క్షితిపైఁ గూలెన్.
| 2062
|
| ఆ. |
వానిపాటుఁ జూచి వనచరు లందఱు, హర్షకలితు లగుచు నలబలుండు
పుడమిఁ బడినఁ జూచి పొంగువేల్పులభంగి, సింహనిస్వనములు సేసి రపుడు.
| 2063
|
| ఆ. |
అంత నంతరిక్షమందు గంధర్వదే, వర్షిసిద్ధసాధ్యవసుభుజంగ
యక్షగరుడచారణాప్సరోజనహర్ష, నిస్వనంబు దిశలు నిండి చెలఁగె.
| 2064
|
| క. |
ప్రముదితమానసు లై యపు, డమరులు గగనమున నుండి యారఘుకులస
|
|
| |
త్తము వేనోళ్ల నుతించుచుఁ, గొమరారఁగఁ బుష్పవృష్టి గురిసిరి వేడ్కన్.
| 2065
|
| క. |
సురతటినీజలశీకర, పరిషిక్తతదీయకమలపరిమళలహరీ
పరికలితుఁడై రఘూత్తము, పరిశ్రమము వాయ నపుడు పవనుఁడు విసరెన్.
| 2066
|
| క. |
పాడిరి గంధర్వులు గొని, యాడిరి పరమర్షిచారణాదులు దివిపై
నాడిరి దివ్యాప్సరసలు, తోడనె మ్రోయించి రమరదుందుభులు రహిన్.
| 2067
|
| క. |
విగతవ్యథంబు లై స, మ్యగలంకృతమందిరంబు లై భవ్యము లై
నిగదితశుభకథనము లై, జగములు శోభిల్లె నపుడు సమ్మోదమునన్.
| 2068
|
| మ. |
దురితాత్ముం డగురావణాత్మజునిచే దూరీకృతస్వార్జితా
ధ్వరు లై గొందుల డాఁగి దిక్కఱి మహాదైన్యంబుతో నున్నయా
పరమర్షిప్రభు లింక నాత్మతపము ల్పాలించుచున్ హృష్టు లై
చరియింపం గల రంచుఁ బల్కిరి దివి న్సాధ్యోరగు ల్దేవతల్.
| 2069
|
| మ. |
తను మున్నాజి జయించినట్టిఖలుఁ డుద్యద్భాహువీర్యుండు దు
ష్టనిశాటుండు దశాస్యపుత్రుఁ డనిలో క్ష్మానాథపుత్రప్రయు
క్తనిశాతాస్త్రవిలూనకంఠుఁ డగుచుం ధాత్రీస్థలిం గూలినం
గని యానందము నొందె శక్రుఁడు మరుద్గంధర్వయుక్తంబుగన్.
| 2070
|
| ఉ. |
మించినవేడ్కతో సురలు మింటను దుందుభు లొక్కరీతి వా
యించిరి పుష్పవృష్టి గురియించిరి పెక్కుతెఱంగుల న్వినో
దించిరి రాజపుత్రు వినుతించిరి నిర్జరవారకాంత ల
భ్యంచితభంగి నాడిరి జయాంకముఁ బాడిరి వీడి రాపదల్.
| 2071
|
| సీ. |
నీరధు లన్నియు నిర్మలాంబువు లయ్యె దిక్కు లన్నియుఁ జాలఁ దెల్వి నొందె
గగనంబు గ్రహతారకాయుక్త మై యొప్పె సుస్థిర యై ధాత్రిఁ జూడ నయ్యె
మేదురస్వనము లై మేఘంబు లొప్పారె విగతార్తి బహుళ మై జగము దనరెఁ
బుష్పవంతంబులై బుణ్యాశ్రమము లొప్పె ఘనతరంగిణులు ప్రకాశ మొందె
|
|
| తే. |
సురభిశీతలపవనుండు సుడిసెఁ జంద్ర, సూర్యు లెప్పటివలె భూరిశోభఁ దాల్చి
రఖిలలోకభయావహుం డగుదశాస్యు, కొడుకు సౌమిత్రిచే నాజిఁ గూలుచుండ.
| 2072
|
| క. |
అమరరిపుఁ డీల్గె నిఁక భూ, మ్యమరు లిఁకఁ బ్రశాంతకలితు లై విజ్వరు లై
యమరఁ జరింతురు గాకని, యమరగరుడసిద్ధసాధ్యు లాడిరి వరుసన్.
| 2073
|
| వ. |
ఇట్లు దేవగణంబులు పరమోత్సవంబు సలిపి ప్రియదర్శనుం డైనసౌమిత్రి నభి
నందించి పరమానందభరితాంతఃకరణు లై దివంబునకుం జని రంత రాక్షసులు
లక్షణబాధపీడితుం డైనరావణి నవలోకించి జితకాశు లగువానరులచేత వధ్య
మానులై యాయుధంబులు పరిత్యజించి భయంబునం బఱచి కొందఱు లంకా
పురంబు ప్రవేశించిరి కొందఱు సముద్రంబునం బడిరి కొందఱు పర్వతగుహ
లాశ్రయించి రిత్తెఱంగున సూర్యుం డస్తగతుం డైన నతనికిరణంబు లతనితోఁ
గూడ నరిగినచందంబున నింద్రజిత్తుండు హతుం డగుచుండ రాక్షసు లందఱు
|
|
| |
దశదిశలకుం బాఱి రప్పుడు శాంతరశ్మి యైనసూర్యునికరణి నిర్వాణపావకుని
కైవడి గతజీవితుండై నిక్షిప్తసర్వాంగుండై మహాశైలంబుపగిది నేలం గూలి
యున్నశక్రజిత్తు నవలోకించి లక్ష్మణుండు గతశ్రముం డై విజయలక్ష్మితోడం
గూడి నిజవిజయం బెల్ల వారికిఁ దెల్లం బగునట్లు శంఖంబు పూరించి కార్ముకజ్యా
నినాదంబు గావించి సింహనాదంబుఁ జేసిన నవ్విపులనాదంబు విని వానరు
లందఱు సంప్రహృష్టచిత్తులై రయంబునం గూడుకొని విజయలక్ష్మీవిరాజమా
నుండై యున్నసౌమిత్రి నవలోకించి నమస్కరించి సాధువాక్యంబులఁ బ్రస్తు
తించిరి విభీషణుండును సంతుష్టాంతరంగుండై యమ్మహాత్ము నాలోకించి యాలింగ
నంబుఁ జేసి వినుతించె హనుమదంగదనలనీలసుషేణపనసర్షభగజగవాక్షగవయ
గంధమాదనమైందద్వివిదజాంబవత్ప్రముఖనిఖిలయూథాధిపతులందఱు గ్రమం
బునం బొడసూపి శుభలక్షణసమన్వితుం డైనలక్ష్మణునకుం బ్రణమిల్లి సాదరం
బుగా నాలింగనంబుఁ జేసి బహుప్రకారంబులం గొనియాడి హర్షోత్కర్షంబునం
గొందఱు గానంబు సేసిరి కొందఱు నృత్యంబు గావించిరి కొందఱు సింహ
నాదంబు చేసిరి కొంద ఱుచ్చైర్నాదంబుల లక్ష్మణువిజయంబు సాటించిరి కొం
ద ఱొండొరులం గౌఁగిలించుకొని ప్రీతిసంహృష్టసర్వాంగులై లక్ష్మణవిజయసం
శ్రితకథాప్రసంగంబు సలిపిరి యిత్తెఱంగున లక్ష్మణుండు పండ్రెండవనాఁటిరాత్రి
యుద్ధంబున శక్రజేత నాహవంబునఁ దునిమి సంతోషవిశేషంబునం బొదలుచు
రుధిరక్లిన్నగాత్రుండును శరసంవృతసర్వాంగుండు నై ధాతుశోభితంబును దరు
పరివేష్టితంబు నైనహిమవత్పర్వతంబుకరణి శోభిల్లుచు నచ్చట జయస్తంభంబు
పాదుకొలిపి హనుమత్ప్రముఖవానరపరివేష్టితుం డై విభీషణుం దోడ్కొని
సర్వశోభాసమన్వితుం డై శీఘ్రంబున రామసుగ్రీవులపాలికిం జనుదెంచి సమర
పారవశ్యంబున విభీషణాంజనేయుల నవష్టంభించి వినయవినమితశరీరుం డై రా
మునిచరణంబుల కభివందనంబు గావించి యంజలి గీలించి యిట్లనియె.
| 2074
|
| మ. |
నరశార్దూల భవత్ప్రసాదమున విన్నాణంబుగా రావణి
న్వరబాణంబులఁ ద్రుంచి వచ్చితి నిఁకన్ స్వస్థుండ వై యామినీ
చరనాథుం డగుపంక్తికంఠుని ఖలు న్సంగ్రామరంగంబులో
నురుబాణంబులఁ జంపునట్టివిధమున్ యోజింపు ముద్యన్మతిన్.
| 2075
|
| క. |
అని విన్నవింప నప్పుడు, ప్రణతుఁ డయి విభీషణుండు పరమోత్సాహం
బున ఘటితాంజలిపుటుఁ డై, యినకులవర్ధనునితోడ నిట్లని పలికెన్.
| 2076
|
| తే. |
అధిప మీ రానతిచ్చినయట్ల భవ్య, లక్షణవిరాజితుం డగులక్ష్మణుండు
ఘోరశరముల రావణిఁ గూలవైచి, వచ్చెఁ గృతకృత్యుఁడై శౌర్య మచ్చుపడఁగ.
| 2077
|
| క. |
నా విని హనుమత్ప్రముఖులు, భావంబునఁ బొంగి రామభద్రుని గని యో
దేవా లక్ష్మణుఁ డనిలో, దేవారి వధించి వచ్చెఁ దేజం బెసఁగన్.
| 2078
|
| సీ. |
అని పల్కి రిబ్బంగి నందఱు రావణివధ మెఱింగించిన వసుమతీశుఁ
|
|
| |
డధికహర్షంబున నవ్విభీషణుఁ గొనియాడి శుభోక్తుల నద్రిచరుల
నందఱ వీక్షించి యర్హవిధంబుల మన్నించి తనమ్రోల నున్నధీరు
లక్ష్మణు నాదరోల్లాసంబునం గని యుగసన్నికాశబాహువులు సాఁచి
|
|
| తే. |
బిగిచి తొడమీఁద నిడుకొని మిగుల విశ్వ
సించి హర్షబాష్పంబుల శిరముఁ దడిపి
యతిమధురభాషణంబుల నాదరించి
శిరము మూర్కొని మోదంబు కరము నించి.
| 2079
|
ఇంద్రజిత్తును వధించి వచ్చిన లక్ష్మణుని శ్రీరాములు గారవించుట
| క. |
మిక్కిలి యనురాగంబునఁ, జెక్కిలి ముద్దుగొని ప్రియము చేసి చుబుకమున్
జక్కగఁ బుణికి కృపారస, మక్కజముగఁ గనులఁ గురియ నంగము దడివెన్.
| 2080
|
| క. |
జననాయకుఁ డివ్విధమున, ననుజన్ముని గారవించి యతనిశరీరం
బున నాఁటియున్నదారుణ, సునిశితపటుసాయకములఁ జూచి మనమునన్.
| 2081
|
| చ. |
దనుజవరేణ్యనందనవధశ్రవణప్రభవాతిమోద మ
య్యనుజశరీరలగ్ననిశితాంబకదర్శనజాతఖేదమున్
బెనఁగొనఁ గొంత మైమఱిచి నేర్పున గ్రమ్మఱఁ దెల్వినొంది త
మ్మునిఁ దగ గారవించి రఘుముఖ్యుఁడు సంతస మంది యిట్లనున్.
| 2082
|
| ఉ. |
రావణనందనుం డనఁగ రాక్షసకోటికి నెల్ల మేటి బా
హావిభవాధికుండు సకలాస్త్రవిదుండు రణానివర్తి యా
దేవపతిన్ జయించి కొని తెచ్చిన సాహసి యెట్టిదుర్జయు
న్నీ వనిలో వధించితివి నేఁడు మహాద్భుత మయ్యె లక్ష్మణా.
| 2083
|
| ఆ. |
దేవతలకు దిగులు దీఱె నా కెంతయు, సమ్మదంబు గలిగె సకలలోక
ములకు సేమ మయ్యె మునుల యాపద మానె, నేఁడు నీకతమున నృపకుమార.
| 2084
|
| క. |
యే నిఁక రావణు ననిలో, మానక వధియింతు వానిమహిమయు బలమున్
మానితతేజముఁ దనయుని, తో నటు నేఁ డాజిఁ బొలిసె దుర్జనదూరా.
| 2085
|
| సీ. |
సమరధీరుఁడు సర్వశస్త్రాస్త్రకుశలుండు దనుజుల కెల్ల నాధారభూతుఁ
డగుప్రియనందనుం డాజిలోఁ గూలుట విని సర్వకామము ల్విడిచి పంక్తి
ముఖుఁడు రోషరసోగ్రమూర్తియై రయమునఁ దోడ్తోడ నెల్ల కైదువులు దాల్చి
సమరంబు గావింపఁ జనుదెంచె నేనియు సముదగ్రవజ్రోగ్రసాయకముల
|
|
| తే. |
మహితచతురంగసేనాసమన్వితముగ
వాని ననిలోనఁ దునిమి దేవతలు మెచ్చి
చూడఁ దత్తనుత్వఙ్మాంసశోణితంబు
పూని యుపహార మిచ్చెద భూతములకు.
| 2086
|
| చ. |
దనుజకులాధినాథునకు దర్పము వైభవము న్బ్రచండశా
|
|
| |
సనమును సత్త్వసంపదయు సర్వ మతండె యతండు నేఁడు నీ
ఘనతరఘోరవజ్రనిభకాండముల న్దెగి కూలెఁ బాపవ
ర్తనుఁ డగుపంక్తికంథరుని దక్షిణబాహు వడంగ నెంతయున్.
| 2087
|
| శా. |
ఈవాతాత్మజుఁ డివ్విభీషణుఁడు నీ కెంతేని సాహాయ్యము
న్గావింపం గడుమేటి వై రిపుని వీఁక న్మూఁ డహోరాత్రముల్
ప్రావీణ్యంబునఁ బోరి చంపితివి నీబాహాబలం బల్పమే
నీవీర్యంబున జానకిం బడసితి న్నిర్వైరినై మించితిన్.
| 2088
|
| క. |
అని యూఱడించి రాముఁడు, తనకరములు సాచి ప్రీతిఁ దమ్ముని నాలిం
గన మొనరించిన నపు డా, ఘనభుజుఁ డానంద మొందె గతవేదనుఁ డై.
| 2089
|
| వ. |
అంత నారఘుపుంగవుండు ముదితుం డై సభామధ్యంబున నున్నసుషేణునిం
బిలిచి మిత్రవత్సలుం డగునీసౌమిత్రియు మహాప్రాజ్ఞుం డగువిభీషణుండును
ద్రుమశైలయోధు లగుభల్లూకవానరగోలాంగూలవీరులును దక్కినసమస్త
సైనికులును రాక్షసప్రయుక్తశస్త్రాస్త్రపరంపరల నొచ్చి యున్నవారు వీరి నం
దఱ నధికప్రయత్నంబున విశల్యులం జేసి సుఖాత్ములం గావింపు మని పలికిన
మహాత్ముం డగునవ్వానరశ్రేష్ఠుండు రయంబునం జని విశల్యకరణిం గొని తెచ్చి
లక్ష్మణునకు విభీషణున కాంజనేయునకుఁ దక్కినయూథపులకు సమస్తసైన్యం
బులకుం జూపిన నాదివ్యౌషధిగంధం బాఘ్రాణించి లక్ష్మణుండు విగతవేదనుం
డును లలితశరీరుండు నై శోభిల్లెఁ దక్కినవా రందఱును వీతశరప్రవ్రణవేద
ను లై సుగ్రీవునిపనుపున సర్వాభరణభూషితు లై సర్వశోభాసమన్వితు లై
చారువిగ్రహులై మహనీయతేజోవిశేషంబునఁ జంద్రసూర్యులచందంబున బ్రకా
శించుచు సింహనాదంబులు సేయుచు నృత్తావాదిత్రగీతంబులు నెఱపుచు
గోలాంగూలంబులు ద్రిప్పుచు బహుప్రకారంబుల విహరించుచుండిరి విభీష
ణుండును సుగ్రీవుండును నంగదుండును హనుమంతుండును జాంబవంతుండును
నీలుండును నలుండును సుషేణుండును దక్కినయూథపులును విగతశ్రములై
సంతుష్టాంతరంగులై శుభలక్షణుం డగులక్ష్మణుం బురస్కరించుకొని యమృ
తంబు ప్రాపించినదేవతలకరణి రామునిం బ్రాపించి రావణున కవలంబనభూతుం
డైనశక్రజేతమరణంబునకు సమ్మోదంబు గాంచి విజయలక్ష్మీవిరాజమానుం
డైనలక్ష్మణుని విలోకించి హర్షవిశేషంబున సారెసారెకుం బూజించుచు సంపూ
ర్ణకాములై యథాసుఖంబుగా విహరించుచుండిరంత హతశేషు లైనరాక్షసులు
లంకకుం జని సముచితంబుగా రావణు సందర్శించి కేలు మొగిచి శోకభయ
గాద్గద్యంబున నిట్లనిరి.
| 2090
|
| సీ. |
దనుజేంద్ర నీప్రియతనయుండు శక్రారి కార్చిచ్చు వనవాటి నేర్చుకరణి
బాహాబలము మీఱఁ బటువిశిఖాగ్నులఁ దరుచరసేన నంతయు దహించి
మఖభుక్కు లరుదంద మహనీయదివ్యాస్త్రమహిమ దీపింప లక్ష్మణునితోడ
|
|
| |
దెప్పర మయ్యెడుతెఱఁగునఁ బోరాడి పటుశక్తిఁ జీకాకు వడఁగఁ జేసి
|
|
| తే. |
ప్రౌఢి దీపించి తుది నానృపాలతనయ, దివ్యసాయకనిహతుఁడై దివసనాథుఁ
డస్తమించినగతి శిఖి యాఱినట్లు, సమరధరమీఁదఁ బడి జీవితములు విడిచె.
| 2091
|
| క. |
అని యింద్రజిత్తు మరణము, వినిపించిన నతఁడు శోకవిహ్వలమతి యై
తనయవధశోకదహనుఁడు, తను వేర్చగ నోర్వ లేక ధరణిం ద్రెళ్లెన్.
| 2092
|
రావణుఁ డింద్రజిత్తుపరాక్రమముఁ దలంచి దుఃఖించుట
| తే. |
ఇట్లు పెద్దయుఁ బ్రొద్దు దైత్యేశ్వరుండు
తను వెఱుంగక పెనుమూర్ఛ మునిఁగియుండి
నేర్పుమైఁ దేఱి వేఁడి నిట్టూర్పు వుచ్చి
కంపితశరీరుఁ డై విలపింపఁ దొడంగె.
| 2093
|
| శా. |
హా లంకాపురపాలకార్ముకధరా హా వీరచూడామణీ
హా లేఖాంతక హా మహారథవరా హా వీరదర్పఘ్న లో
కాలోకాంతగతప్రకాశితయశా హా పుత్ర ము న్నాశచీ
పాలుం దోలిన నీవు లక్ష్మణునిచేఁ బంచత్వముం బొందితే.
| 2094
|
| ఉ. |
నీవు ధనుర్ధరుండ వయి నిక్కువ మల్గి ప్రచండభంగి జ
న్యావనిముంగల న్నిలిచినప్పుడు నీకడఁ దేఱిచూడఁగా
దైవతసిద్ధసాధ్యఫణిదానవు లైనను జాల రట్టిబా
హావిభవాధికు న్నిను రణాగ్రమునం దొకమర్త్యుఁ డోర్చెనే.
| 2095
|
| సీ. |
దండికొండల నెల్లఁ బిండి చేసినశక్రు గెలిచినని న్నెట్లు గెడపె నరుఁడు
జగము లన్నియు మ్రింగఁజాలుకాలున కార్తి నిచ్చిననీశౌర్య మెందుఁ బోయెఁ
బూని మందరగిరి నైన ప్రక్కలు సేయు నీమార్గణావరు లేమి యయ్యెఁ
దోయధు లన్నియు ధూళి గావించు నీవిక్రమస్ఫురణ మేవీరుఁ డణఁచె
|
|
| తే. |
బవరమున మున్ను పలుమాఱు పార్థివేంద్ర
సుతుల నవలీల గెలిచి వచ్చితివి బలస
మృద్ధి నేఁ డాపరాక్రమ మెట్లు సమసె
నిచట న న్నొంటి విడిచిపోయితె కుమార.
| 2096
|
| ఉ. |
యోధవరేణ్య నీవు ప్రతియోధునితో వడిఁ బోరి పోరి యా
యోధనమందుఁ గాలగతి నొందితి వీతెఱఁ గుర్విలో మహా
యోధుల కొప్ప నిట్లు సమరోర్వి రహి న్దెగి వచ్చినట్టియా
యోధవరు న్సమస్తసురయోధులు మెచ్చి నుతింతురేకదా.
| 2097
|
| క. |
సురరాజవిమత యెవ్వఁడు, పరువడిఁ బితృకృతమునందు భండనభూమి
న్మరణంబు నొందు నతనికిఁ, జిరవీరస్వర్గసుఖము సిద్ధించుఁ గదా.
| 2098
|
| ఉ. |
మేరునగంబుభంగి రణమేదినిఁ గూలిననిన్నుఁ గాంచి బృం
దారకసిద్ధసాధ్యవసునాగనభశ్చరయక్షకిన్నరు
|
|
| |
ల్పాఱులు తాపసు ల్బువనపాలురు భీతి దొఱంగి హృష్టు లై
స్వైరవిహారధీరు లయి చాల సుఖింతురు నేఁడు పుత్రకా.
| 2099
|
| క. |
నీ వొకఁడవు లేనందున, స్థావరజంగమసమన్వితము లగుజగము
ల్భావింప ధరణి యంతయు, దేవారీ శూన్య మైనతెఱఁగునఁ దోఁచెన్.
| 2100
|
| క. |
కాంతారయుతాద్రిగుహా, భ్యంతరమునఁ గరిణిరవమునట్లుగ నేఁ డీ
యంతఃపురమున రాక్షస, కాంతలరోదనరవంబు కడు వినవలసెన్.
| 2101
|
| క. |
వాలాయము దైవబలము, చాలమి నిను నరుఁడు నేఁడు చంపఁగఁ జాలె
న్గాలవిపర్యాసంబునఁ, గాలుఁడు నీకన్నఁ జాల ఘనుఁ డయ్యెఁ గదా.
| 2102
|
| క. |
నీయిష్టసఖుల లంకను, నీయువరాజత్వబుద్ధి నీతల్లిని నీ
దాయాదులఁ బుత్రుల నీ, జాయల విడనాడి పోవఁ జాలితె తండ్రీ.
| 2103
|
| తే. |
అన్యలోకంబునకుఁ జనినట్టితండ్రి, కాత్మజుఁడు ప్రేతకృత్యంబు లన్ని దీర్చు
టెన్న ధర్మంబు నేఁ డది యెట్లు వోయె, శక్రవిద్వేషి యే నీకు సలుపవలసె.
| 2104
|
| చ. |
ఇనసుతుఁ డావిభీషణనరేంద్రకుమారకు లాసమీరనం
దనుఁడును నాదుమర్మములు నాఁటి గలంచుచు నున్నవారు పె
ల్చన నటువంటి నాహృదయశల్యములం బెకలించి వైవ కి
ట్లనిమిషలోకనాథవిమతా యెటు వోయితి వేమి సేయుదున్.
| 2105
|
| క. |
అని యీగతి విలపించెడు, దనుజాన్వయనాథుఁ డైనదశకంఠునకుం
దనయవధశోకజం బగు, ఘనకోసము వొడమె వహ్నికల్పం బగుచున్.
| 2106
|
| వ. |
ఇట్లు వొడమినపుత్రమరణజనితమనఃకాలుష్యంబులు స్వభావకోపనుం డైన
యద్ధశగ్రీవుని నిదాఘసమయంబునఁ దిగ్మమరీచులు స్వభావదీప్తుఁ డైనసూర్యు
నింబోలె మిక్కిలి వెలుంగం జేసిన నద్దానవేశ్వరుండు యుగాంతకాలవాతప్రే
రితమహాగ్రాహసహితతరంగంబులచేత సుదీర్ణం బైనమహార్ణవంబుకరణి లలాట
ఘటితవికటభ్రుకుటీబంధంబులచేత నతిదుర్నిరీక్షుండై విజృంభించిన నప్పుడు
బడబాముఖంబువలన నిర్గమించు సధూమవైశ్వానరజ్వాలలభంగి నతనిదశవద
నంబులనుండి రోషాగ్నిజ్వాలలు నిర్గమించె స్వభావరక్తంబు లైనయతనినేత్రం
బులు క్రోధానిలజ్వాలాభీలంబులై ప్రదీప్తవహ్నికుండంబులపగిది దారుణప్రకా
రంబునం గనుపట్టె మఱియు స్వభావఘోరం బైనవానిరూపంబు క్రోధాగ్ని
మూర్ఛితంబై దురాసదం బైనవిలయకాలరుద్రునిరూపంబుపగిది నలరె దీపంబు
లగుదీపంబులనుండి యర్చిష్మంతంబు లైనతైలబిందువులు దొరఁగుచందం
బునఁ దదీయనేత్రములనుండి యశ్రుబిందువులు నిరంతరంబుగాఁ గురిసెఁ దదీయ
దంతసంఘటనసంజాతనిస్వనంబు దానవులచేత భ్రామ్యమాణం బైనమహా
యంత్రఘటితనినదంబుభంగి దిఙ్ముఖంబులం బ్రతిధ్వనులు సెలంగ నతిభయంక
రంబుగా మ్రోసె నిట్లు సమస్తచరాచరజంతుసంహారసమయసంక్రుద్ధుం డైన
|
|
| |
కాలాంతకునిచందంబున నతిఘోరదర్శనుం డై యద్ధశగ్రీవుండు విలయసమయ
మహావాతప్రేరితవైశ్వానరునిభంగి మండుచుఁ దనమ్రోల నిలువనోపక రాక్షసు
లెల్ల భయభ్రాంతు లై పఱవ నెల్లదిక్కులు విలోకించి యుద్ధభీతు లగురాక్షసుల
నెల్ల వెఱపు దీఱునట్లుగాఁ బ్రావృట్కాలజీమూతధీరనాదంబున ని ట్లనియె.
| 2107
|
| ఉ. |
నీరజగర్భుఁ గూర్చి పటునిష్ఠ ననేకసహస్రవర్షముల్
దారుణభంగి నేను మును తత్పరతం దప మాచరించి సొం
పారఁ దపస్సమాప్తిసమయంబున నమ్మహనీయసత్కృపా
ధారుఁ బ్రసన్నుఁ జేసికొని తప్పక పెక్కువరంబు లొందితిన్.
| 2108
|
| శా. |
వాణీనాథకటాక్షలబ్ధవిలసద్వజ్రప్రభోద్యత్తను
త్రాణం బొక్కటి యున్న దాకవచ మారక్షోమరాయోధన
క్షోణిం దత్పవిశక్తి గైకొనక మించున్ దాని గైకొన్న గీ
ర్వాణుల్ దానవు లైన న న్నెదిరి పోరం జాల రాలంబునన్.
| 2109
|
| తే. |
మఱియు నద్దేవదేవుండు మత్తపంబుఁ
జూచి మెచ్చి కృపాళుఁ డై సురదనుజుల
వలన నవ్వి జావు లేకుండ వర మొసంగెఁ
గాన నా కెందును భయంబు గలుగ దింక.
| 2110
|
| చ. |
జలజభవుండు నాకు మును సత్కృప నిచ్చిన విల్లు నమ్ములున్
దలముగ దివ్యవాద్యనినదంబులతోఁ గొని తెండు వాని సొం
పలరఁగఁ దాల్చి ఘోరచతురంగబలంబులఁ గూడి యేగి దో
ర్బలమున నాజిలోన నరరాజుల వానరుల న్వధించెదన్.
| 2111
|
| మ. |
అని యి ట్లాగ్రహ మొప్పఁ బల్కి క్షణదాటాధీశ్వరుం డంతలో
దనయశ్రేష్ఠవధప్రభూతపృథుసంతాపంబు కోపంబు పై
కొనినం జానకిఁ జంపి కాని వెస నీక్షోభంబుఁ బాపంగ లే
నని చిత్తంబునఁ దోఁచిన న్మరల దైత్యశ్రేణితో ని ట్లనున్.
| 2112
|
| మ. |
అనిలో వానరవంచనార్థముగ మాయాజానకిం జంపె మ
త్తనయుం డత్తఱి నాయుపాయ మది వ్యర్థం బయ్యె నే నిప్పు డా
వనజాతాక్షి నిజంబుగాఁ దునిమి దుర్వారోద్ధతి న్రాము నా
తనితమ్ము న్రవిపుత్రు శోకభవసంతాపాబ్ధిలో ముంచెదన్.
| 2113
|
| వ. |
అని పలికి పుత్రశోకాకులచేతనుండై రోషావేశంబున నిర్మలాకాశసదృశం బైన
చంద్రహాసంబు కలయం గొని జళిపించుచు భార్యాసచివసమన్వితుండై చరణా
హతి మహీతలంబు కంపింప నతిరభసంబున సీత యున్నయశోకవనంబునకుం
జనుచుండి నప్పు డతనికోపాటోపంబుఁ జూచి రాక్షసు లందఱు సింహనాదంబు
సేయుచు నొండొరులం గౌఁగిలించుకొని తమలో ని ట్లనిరి.
| 2114
|
| సీ. |
ఈరాక్షసేశ్వరుం డేపార నృపతుల నిశితశరంబులు నేఁడు ద్రుంచు
బాహాబలంబునఁ బాకశాసనయమాద్యఖిలదిక్పాలుర నాజి నోర్చె
నాదిత్యవసురుద్రయక్షమరుత్సిద్ధగరుడగంధర్వకిన్నరపిశాచ
సాధ్యవిద్యాధరచారణగుహ్యకతుషితులఁ బెక్కండ్రఁ దూలఁ దోలె
|
|
| తే. |
ముజ్జగము లాక్రమించె సంపూర్ణశక్తి, విష్టపంబుల నసమానవీరుఁ డయ్యె
నీజితారికి నరు లన నెంతవారు, తరుణి వధియించు టొక్కటె తగదు గాక.
| 2115
|
రావణుఁడు సీతాదేవిం జంపఁబోవుట
| క. |
అని పలుకుచు దనుజేశ్వర, వనితను వధియింపఁ బోవ వల దని వారిం
చినఁ జలము డింప కాతఁడు, కనులం బటుకోపవహ్నికణములు రాలన్.
| 2116
|
| క. |
ఘోరాకృతి నేగి యశో, కారామము సొచ్చి మింట నతిభీమముగాఁ
గ్రూరగ్రహంబు రోహిణిఁ, జేరినక్రియ సాధ్వి యైనసీతం జేరెన్.
| 2117
|
| ఉ. |
తెంపున ఖడ్గధార గొని దేవ నెలంతలఁ జంపరాదు రో
షింపకు మంచు బాంధవులు సెప్పిన మానక తన్నుఁ గిన్కమైఁ
జంపఁగ నిట్లు వచ్చుఖరజాతి దశాస్యునిఁ జూచి భీతిచేఁ
గంపము నొంది భూమినుత గద్గదికం దలవాంచి యిట్లనున్.
| 2118
|
సీతాదేవి దుఃఖించుట
| శా. |
క్రూరాత్మం డగురావణుం డిపు డతిక్రోధంబున న్రాక్షసుల్
వారింపం దమకంబు మాన కతిరౌద్రం బొప్ప నామీఁది కే
పార న్వచ్చుచు నున్నవాఁడు నను శాతాసి న్వడిం జంపు ని
ష్కారుణ్యంబున నేఁడు దానవునిచేఁ జంపించితే దైవమా.
| 2119
|
| చ. |
పలుమఱు డాసి వీఁడు రఘుభర్త కనువ్రత నైన నన్ను నే
ర్పలరఁగ నాకు భార్య వగు మంచు దురుక్తులు వేయుఁ బల్కి నా
పలుకుల నిగ్రహింపఁబడి భావమునందు దురాశ మాని బి
ట్టలుక శితాసిధారఁ దునుమాడఁగ వచ్చినవాఁడొ చూడఁగన్.
| 2120
|
| చ. |
అనుపమలీల నీపురమునందు మదాగణితప్రహృష్టదై
త్యనికరధీరదారుణసమగ్రముదీరితభీమసింహని
స్వనము చెలంగుచున్నది నిశాచరుచే నని రామలక్ష్మణుల్
పనివడి మన్నిమిత్తముగఁ బంచత నొందిరొ నేఁడు దైవమా.
| 2121
|
| తే. |
అకట నామీఁదఁ బగచేఁ గృతాంతకుండు
మాన్యచరితుల రామలక్ష్మణులఁ దెచ్చి
పెక్కుసంకటముల బెట్టెఁ బేరు వాడి
యేమి సేయుదు నింక నా కేది దిక్కు.
| 2122
|
| క. |
అటుగాక వీఁడు తనసుతుఁ, డటు రణమున నీల్గు టెఱిఁగి యాజిసుతులతో
|
|
| |
బటుశక్తిఁ బెనఁగ జాలక, యిటు నను వధియింపఁ బూని యేతెంచెనొకో.
| 2123
|
| చ. |
అనిలసుతుండు మున్ను వినయంబున రామునిపాలి కేను జ
య్యనఁ గొని పోదు రమ్మనిన నాగతి రాఁ దగ దంటి నప్పు డే
చనిన దశాస్యుచే నిచటఁ జావక పుణ్యచరిత్రుఁ డైన రా
మునియెదపై వసించి కడుమోద మెలర్ప సుఖంతునేకదా.
| 2124
|
| సీ. |
అక్కడ మన్నాథుఁ డసురునిచే నేఁడు హతుఁ డయ్యె నేని తత్సుతునివార్త
విని వీట నేకనందన యగుకౌసల్య యమ్మహామహునిజన్మాతిశయము
బాల్యంబు యౌవనప్రాప్తియు రూపంబు ధర్మగుణంబులు తలఁచి తలఁచి
యధికదుఃఖమున నిరాశయై విఫలితహృదయమై యౌర్ధ్వదైహికము సలిపి
|
|
| ఆ. |
చేఁదు మ్రింగి యైనఁ జిచ్చులోఁ బడియైన, జీవితము పరిత్యజించుఁ బాప
చిత్త యైనకుజ్జసేఁతల నద్దేవి, కిట్టికష్ట మొదవె నే మొనర్తు.
| 2125
|
| క. |
అని యీగతి విలపించుచు, వనితామణి కనుల నీరు వఱదలు గట్టం
బెనువగలఁ గుందుచుండఁగ, దనుజుం డాసీత గదిసెఁ దద్దయుఁ గినుకన్.
| 2126
|
| ఆ. |
అతనితెగువఁ జూచి యాహానినాదంబు, లెసఁగఁ దల్లడిల్లి రసురు లెల్ల
దీనవదను లగుచు దివిజులు శోకించి, రఖిలభూతములకు నడలు గలిగె.
| 2127
|
| వ. |
అప్పుడు రావణుసచివుండు సుపార్శ్వుం డనువాఁడు నీతివిద్యావిదుండు బుద్ధి
మంతుండు రయంబున నతని కడ్డంబు వచ్చి సాహసంబున నతనిం బట్టుకొని
సాంత్వవాక్యంబుల బోధించుచు ని ట్లనియె.
| 2128
|
రావణుని కడ్డంబు వచ్చి సుపార్శ్వుండు నీతి బోధించుట
| సీ. |
దానవేశ్వర పులస్త్యబ్రహ్మమనుమఁడ వలవిశ్రవునకు నీ వాత్మజుఁడవు
శ్రీదానుజుండవు వేదవిద్యావ్రతస్నాతుండవు స్వకర్మనీతివిదుఁడ
వధికకోపంబున ననుపమధర్మంబు విడనాడి పెద్దలు విన్నఁ దెగడు
నట్టిదుర్మార్గంబు వట్టితి విట్లేల తగ దాఁడువారలఁ దవిలి చంప
|
|
| తే. |
నదియుఁ గాక సరోజాక్షి యనుపమాన
కోమలాగణ్యలావణ్యసీమ యగుటఁ
జేసి కాలాంతరంబునఁ జిక్కు నేమొ
యడిచిపడి వధియింపరా దుడుగు మిపుడు.
| 2129
|
| క. |
నీపాటివిభుల కింతికిఁ, గోపింపఁగఁ దగదు దనుజకుంజర ఱేపీ
కోపం బంతయు ననిలో, భూపాలునిమీఁదఁ జూపుము ససైన్యుఁడ వై.
| 2130
|
| చ. |
ప్రమద మెలర్ప నేఁ డసితపక్షచతుర్దశి గాన మంచిల
గ్నమునఁ బురోపకంఠవిపినంబుల నేఁడు వసించి యుండి ఱే
పమవసనాఁటిప్రొద్దున జయార్థము వెల్వడి యాజిలో నృపో
త్తముల వధించి సీతను ముదంబునఁ జేకొను మీ వధీశ్వరా.
| 2131
|
| వ. |
అని పలికి చంద్రహాసంబు పుచ్చుకొని సుపార్శ్వుండు గ్రమ్మఱఁ దోడ్కొనివచ్చిన
నద్దశగ్రీవుండు సుహృన్నివారితకోపుం డై మరలి గృహంబునకుం జని మఱవ
రానిపుత్రమరణాతురత్వంబున మిక్కిలి మఱుఁగుచు నెప్పటియట్ల కొలువుకూ
టంబునకుం జనుదెంచి యాసనముఖ్యంబునం గూర్చుండి పరమదుఃఖితుం డై
సంక్రుద్ధం బైనసింహంబుపగిది నూర్పులు వుచ్చి వదనంబున వైవర్ణ్యంబు
దోఁప బలముఖ్యుల నందఱఁ గలయ నవలోకించి బహూకరించి యంజలి
గీలించి దీనస్వరంబున నిట్లనియె.
| 2132
|
| చ. |
బలపతులార మీరు కడు భక్తులు శక్తులు యుక్తు లాజికిం
గలనికి నాదుశాసనము గైకొని గ్రక్కున మీర లందఱుం
జలమున వాజిసంఘములు సామజయూథములు న్రథవ్రజం
బులు భటవర్గముం గొని ప్రభుత్వము మీఱఁగ నేగుఁ డుద్దతిన్.
| 2133
|
| చ. |
మదమున డాసి యానృపకుమారుల నిద్దఱ సాహసంబునన్
బొదివి ప్రతాప మేర్పఁడగఁ బ్రోష్ఠపదంబున మింటఁ బన్ని వా
రిదములు ఘోరవర్ష మడరించినచాడ్పున శాతదారుణా
యుధశరవృష్టి పైఁ బఱపి యుక్కున గీటడఁగించి రం డొగిన్.
| 2134
|
| తే. |
సంగరంబున మీచేతఁ జావఁడేనిఁ
బలుదెఱంగుల మే నెల్ల నలియఁ బొడిచి
రండు నే నెల్ల చని ఘోరరణములోనఁ
దునిమి వచ్చెద శరవృష్టి మునుఁగఁ జేసి.
| 2135
|
రావణమూలబలంబు యుద్ధమునకు వచ్చుట
| వ. |
అని పలికి సాదరంబుగా వీడుకొలిపిన నద్ధశగ్రీవునిశాసనంబున లంకలోఁ గలమేటి
గమికాం డ్లంద ఱొక్కమొత్తం బై వజ్రాంగులు దొడిగి నానావిధభూషణ
వ్రాతశోభితశరీరులై తమతమవాహనంబు లెక్కి పూర్వపరిచితనానావిధసాధనం
బులు గైకొని తొల్లి దిక్పాలాదులతోడం బోరునప్పుడైనను నిర్గమింపనట్టిచిర
కాలసంరక్షితం బైనమూలబలంబును దోడ్కొని యుద్ధసన్నద్ధు లై సువర్ణఘం
టికాకలితకరటిఘటాఘీంకారంబులును గాంచనాపీడతురంగహేషారవంబు
లును గమనీయశతాంగనేమినిర్ఘోషంబులును వీరభటహుంకారంబులును శింజినీ
టంకారంబులును గంకణఝణంఝణశబ్దంబులును ఘంటాఘణంఘణనినాదం
బులును నిస్సాణధణంధణనినదంబులును బరస్పరబహూకారధిక్కారరవంబులును
గేతనాగ్రఘటితనూతనపటపటాత్కారంబులును నొక్కటియై మంథానశైలమ
థితమహార్ణవధ్వనిభంగి దిక్కులన్ ఘూర్ణిల్ల మహీతలంబు కంపింప సింహనాదం
బులు నింగి ముట్ట శంఖంబు లొత్తుచు నొండొరులం దలకడచి భీషణప్రకారం
బునఁ జతుర్దశినాఁటిరాత్రి సూర్యోదయసమయంబున లంకాపురంబు వెడలి సా
గరంబు నిర్ణమించుబడబాగ్నిజ్వాలాసహస్రంబులభంగి నతిరభసంబుగాఁ జను
|
|
| |
దెంచి వానరబలంబు దాఁకిన నక్కపివీరులు రణోత్సాహంబున నుప్పొంగి సిం
హనాదంబులు సేయుచుఁ గూర్మవరాహశేషదిశాగజకులకుధరంబులు కుదికిలం
బడ గగనంబున కెగిరి జగతికి దాఁటుచు బ్రహ్మాండభాండంబు వగుల భుజాస్ఫా
లనంబు సేయుచు మహీధరమహీరుహగండశిలాజాలంబు లుత్పాటించికొని తె
చ్చి ప్రచండవేగంబున దానవులం దలపడి రిట్లు నిశాచరసైన్యంబులు దక్షిణో
త్తరసముద్రంబులమాడ్కి వివిధాయుధతరంగమాలాభీలంబుగాఁ దార్కొని
యార్చి పేర్చి యొండొరులమీఁద గదాఖడ్గపరిఘపట్టినప్రాసపరశ్వథభిండివాల
తోమరముసలముద్గరముసుంఠిచక్రశూలశక్తికుంతజీవితాంతకసాయకగిరితరు
శిలాచయంబులు నీరంధ్రంబుగాఁ బరఁగించుచు గిట్టి యట్టహాసంబునం బెనంగు
నెడ నుభయసేనాపదాఘాతసముద్ధూతమహీపరాగంబు పెల్లెగసెఁ బదంపడి
రక్తధారాసారంబున నది యడంగిన నప్పుడు రణాంగణంబున మాతంగరథకూ
లంబు లై వాజిమత్స్యంబు లై ధ్వజద్రుమంబులై శరీరసంఘాటవహంబులై కంఠ
దఘ్నంబు లై యనేకశోణితప్రవాహంబులు ప్రవహించె నంత.
| 2136
|
| క. |
తరుచరు లడరించుమహా, తరులు గిరులు దైత్యు లేయు దారుణశస్త్రో
త్కరములు గగనపథంబున, గిఱికొని గాఢప్రతమము గిఱికొనఁ జేసెన్.
| 2137
|
| క. |
ఎవ్వానిఁ గన్న గమికాఁ, డెవ్వానిం గన్న శూరుఁ డెవ్వనిఁ గన్నం
జివ్వకుఁ గాల్ద్రవ్వెడువాఁ, డెవ్వానిం గన్నమేటి యిరుదెసలందున్.
| 2138
|
| క. |
హరి హరిఁ దాఁకినకైవడి, గిరి గిరిఁ దార్కొన్నకరణిఁ గేవలశక్తిం
గరి కరిఁ బెనంగుచాడ్పునఁ, దరుచరరాత్రిచరు లపుడు దాఁకిరి వరుసన్.
| 2139
|
| సీ. |
అరదము ల్వఱపించి సురుచిరపటుసాయకము లేసి వీరాంగకములు దునిమి
కరుల డీకొల్పి భీకరతోమరము లేసి సకలావయవములు చక్కు చేసి
హయముల దుమికించి యభిముఖవృత్తంబు లగునట్లు కత్తుల నెగిచి నఱికి
మదమత్తు లై మాఱుమసలుచు వడిఁ దాఁకి దారుణనానాయుధములఁ గ్రుమ్మి
|
|
| తే. |
యామినీచరరథికులు సామజాధి, రోహకులు నాశ్వికులు ఘోరరూపు లైన
భటులు వీరాతివీరు లై బలముఁ జలము, మెఱయ వానరవీరులఁ దఱిమి రపుడు.
| 2140
|
| సీ. |
రమణఁ దోఁకలఁ జుట్టి రథికసారథిసమన్వితముగాఁ దేరులు విసరివైచి
గురుబాహుబలమున గొప్పకొండలు వైచి సమదవారణముల సమయఁ జేసి
సస్కంధవిటపవృక్షము లేసి హయముల సాదులతోఁ గూడఁ జదియ మోఁది
ఘనశక్తిఁ బిడుగుల కెన యగుపిడికిళ్ల భటులవక్షంబులు పగులఁ బొడిచి
|
|
| తే. |
కఱకుఁగోళ్ల ఘ్రాణంబులుఁ గనులుఁ జెవులు
బెఱికి శితదంష్ట్రలను మెడ ల్గొఱికి జాను
కూర్పరతలాభినిహతుల గుదియఁ జదిపి
యసురబలముల వధియించి రద్రిచరులు.
| 2141
|
| సీ. |
దవ్వుగా మింటి కుద్ధతిఁ దన్నుకొని పోయి కడువడిఁ బుడమిపైఁ బడఁగ విడిచి
|
|
| |
కడకాళ్ళు పట్టి భీకరలీలఁ బలుమాఱు వడిఁ ద్రిప్పి త్రిప్పి నల్గడల వైచి
విసువక దోర్బలవేగంబు దీపింప నురుతరాశ్మములపై నుదికి యుదికి
గగనంబుపై నుండి కఠినాశనులమాడ్కిఁ బఱతెంచి తలలపై వరుస దుమికి
|
|
| తే. |
కడిమిఁ దలవెండ్రుకలు వట్టి పడఁగ నీడ్చి
కాళ్లఁ జేతుల మర్దించి ఱాళ్లఁ బొడిచి
పృథివిలో నంటఁ ద్రొక్కి యావృక్షచరులు
దితిజుల వధించి రప్పు డద్భుతము గాఁగ.
| 2142
|
| సీ. |
నవరుక్మకేతుదండమును గైకొని సూతరధికరథ్యములఁ జూర్ణంబు సేసి
కరిదంతములు గొని కడువడి మత్తేభభద్రకుంభంబులఁ బగుల మోఁది
చలము దీపింప నశ్వకళేబరంబులు గొని హయంబుల నేలఁ గూలవైచి
తక్కక యొకనితో నొక్కని వ్రేయుచు భటకదంబము నెల్ల బడలుపఱచి
|
|
| తే. |
ఘోరదుర్వారపటుభుజాసార మెసఁగ, వీరవానరసైనికు ల్వేల్పు లలరఁ
బ్రబలదానవచతురంగబలము నెల్లఁ, జించి చెండాడఁ దొడఁగి రచ్చెరువు గాఁగ.
| 2144
|
| క. |
ఒక్కొకదనుజునిఁ గీశులు, మొక్కలముగ నూర్వు రొక్కమొగి నుద్ధతిమై
నెక్కిరి మిక్కిలి శకునము, లెక్కుడుతమి ఫలితతరువు నెక్కినమాడ్కిన్.
| 2145
|
| వ. |
ఇట్లు నానాప్రకారంబులఁ గనుపుగొట్టినం గోపించి యాతుధానయోధులు
గొఱంతవడనిబీరంబునం బెచ్చు పెరిఁగి విచ్చలవిడి వానరబలంబు సొచ్చి మచ్చ
రంబున భూనభోంతరంబు నిండ సింహనాదంబులు సేయుచుఁ జిందంబులు
పూరించుచు రుధిరప్రవాహంబులు దాఁటి గజాశ్వరథాదికంబులు పఱపించి నిరం
తరంబుగా ఘోరనారాచంబులఁ బ్రయోగించియుఁ గరవాలంబుల నఱికియు
గదల వ్రేసియు శూలంబులం బొడిచియు ముసలంబులు విసరివైచియు ముద్గ
రంబుల మోఁదియుఁ బరతువులం దెగవ్రేసియు నీటెలం గ్రుమ్మియు భిండివాలం
బులం జదియనడిచియు మఱియు బహువిధాయుధంబులం బ్రహరించియు విజృం
భించి విక్రమక్రీడ సలిపిన విలూనకంఠచరణజానుజంఘోరుమధ్యబాహులై
విభిన్నవక్షు లై రుధిరోక్షితసర్వాంగు లై చూర్ణితాస్థిసందోహు లై కొందఱు
పుడమిం ద్రెళ్లిరి కొందఱు తమచేతియాయుధంబులు పాఱవైచి భయంబున
సేతుమార్గంబు వట్టి పఱవందొడంగి రప్పు డంగదహనుమంతు లడ్డంబు చని
ధైర్యంబు దెలిపి గ్రమ్మఱించిన వారలు చనుదెంచి రామునిమఱువు సొచ్చిన
నవ్వీరశిఖామణి వారల కభయంబు దెలిపి చాపం బందుకొని గుణధ్వనిఁ జేసి
మేఘమండలంబువలన నిర్గమించి సూర్యుఁడు నిర్మలగగనంబుఁ బ్రవేశించి తిగ్మ
కరంబులు సహస్రప్రకారంబుల వెదచల్లుకైవడి రాక్షసబలంబు ప్రవేశించి నీరం
ధ్రంబుగాఁ జతురంగసైన్యంబులమీఁద నిశాతశిలీముఖంబులు పరఁగించి రశని
సంఘట్టనసంజాతవహ్నిశిఖాపరంపరల నరివాహిని దహింపందొడంగిన నప్పుడు.
| 2146
|
| సీ. |
రథికసారథికేతురథ్యయుతంబుగా మందరాచలనిభస్యందనములు
నాధోరణారోహకాభియుక్తంబుగాఁ బక్షవద్గిరితుల్యభద్రకరులు
సాదులతోఁ గూడ జవవినిర్జితమనోగంధవాహము లైనసైంధవములు
కాలమేఘనికాశకఠినాంగసౌష్ఠవవిజితపర్వతు లైనవీరభటులు
|
|
| తే. |
నక్కజంబుగఁ గూలిరే దిక్కు గన్నఁ, బెక్కుదిట్ట లై లెక్కకు వెక్కసముగ
నద్భుతాటోపరఘువీరహస్తముక్త, దివ్యమార్గణవితతులఁ దెగి రణమున.
| 2147
|
| సీ. |
కడువడి బవనుండు గహనమధ్యము సొచ్చి వృక్షషండంబులు విఱుగఁ ద్రోయు
తఱి నెల్లవారికిఁ దాఁ గానరాకుండ లలిఁ గార్యభూతఫలంబుచేత
ననుమితుఁ డై నట్టు లారఘుసత్తముఁ డమరారిసైన్యమధ్యంబు సొచ్చి
కరుల రథంబుల హరులఁ బదాతుల సాయకంబులఁ గూలఁద్రోయునపుడు
|
|
| తే. |
దానవుల కెందుఁ గన్నఁ దాఁ గానరాక, మఱిఁగి యసుకర మైనకర్మంబుచేత
ననుమితుం డయి వేగ వీర్యములు పూని, రణవినోదంబు సలిపె నిర్జరులు వొగడ.
| 2148
|
| ఉ. |
భండనభూమి రామనరపాలశరాసనవిచ్యుతోల్లస
చ్చండపృషత్కకోటిఁ దిలశశ్శతశశ్శకలంబు లై రహిన్
మెండుగఁ గూలురాక్షసులమేనులు గన్పడుఁగాని వేగవం
తుం డగురాముఁ డెచ్చటఁ గనుంగొనఁ గన్పడఁ డయ్యె నయ్యెడన్.
| 2149
|
| మ. |
ఘనవేగాతిశయంబున న్శరములన్ గాత్రంబులన్ ఘోరవీ
ర్యనిరూఢిం బ్రహరించురామవిభుని న్రక్షోవరు ల్పోరిలోఁ
గనలే రై రొగి నింద్రియాదివిషయౌఘప్రేరకత్వంబునం
దనుమధ్యంబునఁ దేజరిల్లు పరమాత్మం జూడ లేనట్లుగన్.
| 2150
|
మూలబలంబుపై శ్రీరాములు సమ్మోహనాస్త్రంబు ప్రయోగించుట
| సీ. |
అప్పుడు రఘురాముఁ డధికసంక్రుద్ధుఁ డై తనుఁ జుట్టుముట్టి రౌద్రగతిఁ బోరు
వీరరాక్షసులను వీక్షించి రయమున నరుదార సమ్మోహనాస్త్ర మేయఁ
దత్ప్రభావంబున దనుజుల కాజిలో నంతట రామసహస్రకములు
దోఁచినఁ గుపితులై తొడరి యాతఁడు గుఱ్ఱములఁ జంపె నితఁ డేనుఁగుల వధించె
|
|
| తే. |
నితఁడు రథికులఁ జక్కాడె నితఁడు భటుల
గలఁచె నని రామసామ్యంబువలన బ్రమసి
యొండొరుల బెట్టువ్రేయుచుఁ జండభంగిఁ
బెనఁగి తమలోన హతు లైరి దనుజవరులు.
| 2151
|
| వ. |
ఇట్లు మహనీయం బైనగాంధర్వాస్త్రంబున మోహితులై యాతుధాను లొక్క
తఱిఁ బెక్కండ్ర రాములం జూచుచు నొక్కతఱి నొక్కరామునిం జూచుచు
నొక్కతఱి మండలాకారగతివిశేషంబున భ్రమించుటం జేసి యలాతచక్రప్రతి
మ యై యొప్పునప్పురాక్రమధుర్యునికాంచనకార్ముకకోటి నవలోకించుచు
|
|
| |
నొక్కతఱి రామధనుశ్చ్యుతం బైనశరజాలంబును సూర్యమండలసంభూతంబైన
రళ్మిజాలంబున ట్లవలోకించుచు నొక్కతఱి శరరశ్మిసహస్రాఢ్యుండును మధ్యా
హ్నాదిత్యవర్చసుండు నై దిగంతంబులు వెలుంగంజేయుచునికి నిరీక్షింపంజాలక
కన్నులు మూయుచు నొక్కతఱి ధనుశ్శిక్షాకృతలాఘవాతిశయంబున మండలీ
కృతకార్ముకుండై శరపరంపరల నరివాహిని దహించుచు శరీరనాభిమధ్యప్ర
శంబును సత్త్వార్చియు శరారంబును నేమికార్ముకంబును జ్యాఘోషతలనిర్ధోషం
బును దేజోబుద్ధిగుణప్రభంబును దివ్యాస్త్రగుణపర్యంతంబు నైనరామచక్రం
బును గాలచక్రంబునం బోలె నిరీక్షించుచు నొకపదాతి యైనరామునిచేత
దినాష్టమభాగంబునకు నూటడెబ్బదియాఱుకోట్ల నలువదియొక్కలక్ష యేఁబది
యాఱువేలచతురంగబలంబు హతం బయ్యె నమ్మహాయుద్ధంబున రాక్షసకళే
బరంబు లనేకంబులు గగనంబున నాడుచుండెఁ దద్రణభూమి హతగజహయ
రథపదాతిగణసంకులయై క్రుద్ధుండైనరుద్రుని యా క్రీడభూమిచందంబునం జూ
పట్టె నిట్లు పదుమూఁడవదివసంబున మహాత్ముం డగురాముండు రణంబున నశ్ర
మంబున మూలబలంబులు నిశ్శేషంబుగా రూపిమాపిన రాము నవలోకించి
దేవర్షిగంధర్వాదు లచ్చెరువంది హర్షవిశేషంబునం బ్రశంసించి రప్పుడు
రాముండు సుగ్రీవవిభీషణమైందద్వివిదహనుమజ్జంబవదాదుల నవలోకించి పర
మానందంబున నిట్లనియె.
| 2152
|
| ఆ. |
ఏను శివుఁడు దక్క నిమ్మహనీయాస్త్ర, మెఱుఁగఁ డన్యుఁ డొక్కఁ డిజ్జగముల
దీనిమహిమ లెఱుఁగఁగా నేర రింద్రాదు, లెంత చేసెఁ జూడుఁ డీక్షణమున.
| 2153
|
| క. |
అని పలికి శక్రసముఁ డగు, మనుజవిభుం డస్త్రశస్త్రమహిమంబున దై
త్యనికరములఁ దునిమి మనం, బున నానందించుచుండె మునులు నుతింపన్.
| 2154
|
| సీ. |
ఈరీతి రాఘవుఁ డేపారుశరములఁ బెక్కుగజంబులఁ బెక్కుహరులఁ
బెక్కురథంబులఁ బెక్కండ్రదనుజుల నక్కజంబుగఁ దునుమాడి సురల
కద్భుతం బొనరింప నవ్విధ మంతయుఁ గనుఁగొని హతశేషదనుజు లతిభ
యంబున లంకకు నతిరయంబునఁ బాఱి యెఱిఁగింప విని దైత్యతరుణు లెల్ల
|
|
| తే. |
భండనంబున హతు లైనపతుల సుతుల
హితులఁ జుట్టలఁ దలపోసి వితతదుఃఖ
భరమున శరీరములు వ్రాల బాష్పపూర్ణ
వచన లై గూడుకొని యిట్లు వగచి రపుడు.
| 2155
|
| మ. |
సుకుమారుండు మహారథుండు సుజనస్తుత్యుండు సర్వాస్త్రశ
స్త్రకళావేది సరోజనేత్రుఁడు తనూసౌందర్యగాంభీర్యధై
ర్యకళానిర్జితమారవారిధిసువర్ణాద్రిప్రజానాథుఁ డ
త్యకలంకాత్ముఁడు రాఘవుండు ముని యై యక్కానలో నుండఁగన్.
| 2156
|
| ఉ. |
కావరమెత్తి యంతరము గానక దుర్ముఖియుం గరాళదు
|
|
| |
ర్భావయు నిర్ణతోదరి యభాగ్యయు వృద్ధయు శ్వేతకేశి ఘో
రావయవాంగి క్రూరయు దురాత్మకయు న్గుణహీన భీరుదం
ష్ట్రావళి యైనశూర్పణఖ యాదటఁ గ్రామపరీతచిత్త యై.
| 2157
|
| సీ. |
అసమానబలుఁ డైనయారఘుస్వామిని జేరి గట్టల్క ధర్షింప నేల
దానికి నల్గి భూజాని ఖడ్గము కేలఁ గొని కర్ణనాసము న్గోయ నేల
యంతటఁ బోక యయ్యతివ ఖరాదుల ననికిఁ బంపఁగ నేల యవ్విభుండు
వారిఁ జంపఁగ నేల వరుసతో రావణుం డడవిని వంచించి యతనిదేవి
|
|
| తే. |
నపహరింపంగ నేల యయ్యవనివిభుఁడు, వచ్చి మనవారి నందఱ మచ్చరమున
బవరమునఁ జంప నేల శూర్పణఖవలన, నింత యాపద జనియించె నేమి గలదు.
| 2158
|
| ఉ. |
ఈరజనీచరేంద్రుఁడు మహీసుత నాత్మవినాశనార్థ మై
వారక దోడి తెచ్చె బలవంతునితోఁ బగ మేలె యమ్మహా
వీరునిపత్ని చేకొనఁగ వీనికిఁ జెల్లునె తా నొకండె దు
ర్వారతఁ జావ కిట్లు మనవారల నందఱఁ జంపె నక్కటా.
| 2159
|
| చ. |
విసువక దండకాగహనవీథి నెదిర్చి మహీకుమారిక
న్వెసఁ గొనఁ బూనినట్టిపటువిశ్రుతవీర్యు విరాధు నాజిలో
మసలక యుగ్రభంగి నొకమాత్ర వధించె రఘుప్రవీరుఁ డ
య్యసదృశవిక్రముం దొడరి యాల మొనర్ప నితండు శక్తుఁడే.
| 2160
|
| సీ. |
ఖలజనస్థానవాసులఁ జతుర్దశసహస్రనిశాచరుల నాజిఁ జంపుటయుమ
ఖరుని దూషణునిఁ ద్రిశిరునిఁ గల్పానలకీలాభశరముల గెడపుటయును
యోజనాయతబాహు నుగ్రకబంధుని దొడరి ఖడ్గంబునఁ ద్రుంచుటయును
నమరేంద్రనందను నమితవిక్రమశాలి వాలి నమ్మునఁ గూల వైచుటయును
|
|
| తే. |
వనధి నరికట్టి వెస దాఁటివచ్చుటయును, గుంభకర్ణేంద్రజిత్తులఁ గూల్చుటయును
బార్థివునివీర్యమున కివి ప్రత్యయంబు, లతని నిర్జింప వీనికి నలవి యగునె.
| 2161
|
| శా. |
ఆలిం గోల్పడి ఋశ్యమూకగిరిపై నత్యంతదుఃఖంబున
న్వాలాయంబు కృశించు దీనముఖు భాస్వత్పుత్రుఁ జేపట్టి యి
ల్లాలి న్వానరరాజ్య మిచ్చె రఘువంశాగ్రేసరుం డత్తెఱం
గాలోకింపఁ దదీయవిక్రమవిధం బవ్యాహతంబే కదా.
| 2162
|
| చ. |
అనిలతనూజుఁ డొక్కఁడు మహార్ణవ మొక్కట దాఁటి వచ్చి వా
లనిహితవహ్నిచేఁ దొడరి లంక దహించి బలాఢ్యుఁ డైనయ
క్షుని వధియించి భూతనయఁ జూచి వెసం జనె నవ్విధంబు గ
న్గొనియు గణింప కీదనుజకుంజరుఁ డింతకుఁ దెచ్చె నందఱిన్.
| 2163
|
| క. |
హితవాది యగువిభీషణుఁ డతులితమతి నన్నవాక్య మది వినఁ డితఁ డా
గతి నాఁడు వినిన నేఁ డీ, గతి లంక శ్మశానభూత గాకుండుఁ గదా.
| 2164
|
| మ. |
ఘనకాయుం డగుకుంభకర్ణుఁడు మహాకాయాతికాయోగ్రకుం
భనికుంభు ల్హరిజిన్మహోదరమహాపార్శ్వుల్ప్రహస్తుం డకం
పనదేవాంతకు లాదిగాఁ గలబలప్రౌఢు ల్నిశాటు ల్రణా
వనిలో నీల్గిరి వీరిదుర్ణయమున న్వాపోవఁ జేసెం బురిన్.
| 2165
|
| మ. |
పతులుం బుత్రులు బాంధవు ల్సచివులు న్భ్రాత ల్కపిశ్రేణిచే
హతు లై రాజి ననేకవాజులు శతాంగానీకముల్ వారణ
ప్రతతుల్ ఘోరపదాతివర్గములు సంగ్రామంబులోఁ జచ్చె న
ద్భుతభంగి న్రఘునాథముక్తవిశిఖస్తోమంబుల న్వ్రేల్మిడిన్.
| 2166
|
| శా. |
రక్షోరాజి వధింపఁ బూని తగ మర్త్యత్వంబు గైకొన్నప
ద్మాక్షుండో హరుఁడో పితామహుఁడొ దేవాధీశుఁడో పాశియో
సాక్షాదంతకుఁడో రఘుప్రవరుఁ డాచందంబు గాకున్న న
ప్రక్షీణద్యుతి నిట్లు రాక్షసులవర్గం బెల్లఁ జక్కాడునే.
| 2167
|
| మ. |
మనవా రందఱు రామబాణములచే మంత్రించిన ట్లాజి మే
దినిలోఁ గూలిరి వీట నింక మనకున్ దిక్కేరు చర్చింప నీ
ఘనదుఃఖాబ్ధికిఁ బార మెద్ది తనువు ల్గంపింపఁగాఁ జొచ్చె నే
మనినం దీఱు దశాస్యుచెయ్దములు వంశాంతంబుఁ జేసెం దుదిన్.
| 2168
|
| ఉ. |
కాంచనగర్భదత్తవరగర్వమున న్దశకంథరుండు తా
నించు కెఱుంగఁ డీరఘుకులేంద్రునిచేఁ దన కైనమోస మ
భ్యంచితవర్యుఁ డైనమనుజాధిపుబారికి నగ్గ మైనచోఁ
బంచత నొందకుండఁ బరిపాటిగఁ బోవఁగఁ జాల రెవ్వరున్.
| 2169
|
| క. |
అనికి వెడలు నపుడెల్లను, మునుకొని కడు దుర్నిమిత్తములు దోఁచుచు రా
మునిచే నితనికి రణమే, దినిఁ జేటగునట్టివిధము దెలిపెడి వరుసన్.
| 2170
|
| ఉ. |
ఈదనుజుండు తొల్లి భువనేశుగురించి తపం బొనర్చి స
మ్మోద మెలర్ప నద్దివిజముఖ్యునిచే వర మందునాఁడు దే
వాదిసమస్తభూతనివహంబులచే నభయంబు వేఁడె న
ట్లాదర మొప్ప వేడఁ డభయం బటు మర్త్యునిచే జడాత్ముఁ డై.
| 2171
|
| ఆ. |
దానఁ జేసి నేఁడు తప్పక మనుజుని, వలన సకలరాక్షసులకు దైత్య
వరుని కిటు వినాశకర మైనఘోరభ, యంబు వొడమె సందియంబు లేదు.
| 2172
|
| వ. |
మఱియుఁ దొల్లి యాదశగ్రీవునిచేత బాధితులై వేల్పులును గంధర్వవిద్యాధ
రాదులును విధాత నుద్దేశించి ఘోరతపంబు గావించి యద్దేవుని బ్రసన్నుం
జేసికొని వివిధప్రకారంబుల నారాధించిన నమ్మహాత్ముండు సంతుష్టుండై దేవత
ల నందఱఁ గలయ నవలోకించి నేఁడు మొదలు మీరు భయంబు దక్కి ముల్లో
కంబులయందు వలసినచోట్ల నెల్ల యథేచ్ఛం జరియింపుఁడని పలికి వారికి హితం
బాపాదించె నయ్యాదిత్యప్రముఖులు పదంపడి భగవంతుం డైనపురాంతకునిం
|
|
| |
జేరి నానాప్రకారంబుల నభినుతించి తత్ప్రసాదంబు వడసి తమనొప్పి యెఱింగిం
చిన నమ్మహాదేవుండు కృపాళుం డై మీకు హితంబు రాక్షసులకు వినాశంబు
సేయుట కొక్కయువతి జనియించు నెమ్మదిగ నుండుండని యానతిచ్చెఁ గావున.
| 2173
|
| సీ. |
ఆచంద్రశేఖరుఁ డానతిచ్చినమాడ్కి నీసీత దేవతాహితముకొఱకుఁ
బ్రభవించె మృత్యువు ప్రళయకాలమునందు మిన్నక ప్రాణుల మ్రింగునట్లు
దనుజేంద్రయుతముగా మనల నందఱు మ్రింగు నీరావణుఁడు దుర్విచారపరత
నిట్టియాపద దెచ్చె నిఁక మన కెవ్వరు శరణంబు కల్పావసానమందు
|
|
| తే. |
భానుసుతుమ్రోలఁ జిక్కిన ప్రజలభంగి
దవముచే వేష్టితము లైనదంతులక్రియఁ
బార్థివునిచేతఁ బొదువంగఁ బడితి మకట
యేమి సేయుద మసురేంద్రుఁ డెంత చేసె.
| 2174
|
| క. |
అని పెక్కుగతుల దనుజాం, గనలు భయము చిత్తమందు గడలుకొనఁగఁ జ
య్యన నొండొరుఁ బట్టుకొనుచుఁ, బెనువగలం బొగిలి రపుడు భీషణభంగిన్.
| 2175
|
| క. |
వారలదుఃఖసమీరిత, భూరినినాదములు బెరసి పురి నింటింటం
దారుణగతి నెగసిన సుర, వైరి విని మొగంబున న్వివర్ణత గదురన్.
| 2176
|
| తే. |
మనమున ముహూర్తమాత్రంబు మౌన మూఁది
యొక్కనిట్టూర్పు నిగిడించి మిక్కుటముగఁ
గినుకఁ బొడమిన నిప్పులు కనులఁ దొరఁగె
నాస్యములు ఘోరదర్శన మై వెలింగె.
| 2177
|
| తే. |
అధరము చలించెఁ గటము లంతంత నదరె
నీడలు కంపించెఁ జెమ్మట లూరె బొమలు
ముడివడియె దంతఘట్టనోద్భూతఘోర
నాద మశనిస్వనంబుచందాన మ్రోసి.
| 2178
|
| వ. |
ఇట్లు యుగాంతాగ్నిచందంబునఁ గ్రోధానలప్రజ్వలితశరీరుం డై యెల్లవారికిం
దేఱిచూడ రాక సమీపస్థు లగురాక్షసుల వేఁడిచూపుల నిరీక్షించి క్రోధావ్య
క్తకంఠుం డై మీరు రయంబున మచ్ఛాసనంబు దెల్పి చతురంగసైన్యంబు
నాయోధనంబునకుఁ గట్టాయితంబు గావింపుఁడు మున్ను రణంబున మద్భ్రాత
లగుమహోదరమహాపార్శ్వులు హతులై రిప్పుడు మత్సచివులై బలముఖ్యులైన
మహోదరమహాపార్శ్వవిరూపాక్షులు సంగ్రామంబునకుం జనువారలుగా నియో
గింపుఁ డని పలికిన నయ్యాతుధానులు తద్వచనప్రకారంబున నందఱకు బవరం
బునకుఁ బైనంబుఁ జెప్పిన నక్తంచరు లందఱు రాజుశాసనంబు నియ్యకొని
భయంకరాకారు లై ధీరు లై వీరాంకవీరు లై నానావిధసాధనంబులు ధరించి
రావణునకుం బొడసూపి యతనిసముచితప్రకారంబునం బూజించి యనుజ్ఞ
గొని కృతస్వస్త్యయను లై తద్విజయంబు గోరుచు సంగ్రామరంగంబునకుం
|
|
| |
బోయి రప్పు డద్దశగ్రీవుండు క్రోధపరవశుం డై విరూపాక్షమహోదరమహాపా
ర్శ్వుల కి ట్లనియె.
| 2179
|
| మ. |
అనిమేషేంద్రకరీంద్రహస్తనిభదీర్ఘస్మత్కరాగ్రస్ఫుర
త్కనకాద్రీంద్రసమానసారపటుకోదండప్రముక్తోగ్రనూ
తనకల్పాంతదినేశసన్నిభపృషత్కశ్రేణిచే రాజనం
చనులం గీటడఁగించి నేఁడు జము చెంతం జేరఁగాఁ బుచ్చెదన్.
| 2180
|
| క. |
విపులశరంబుల నృపులం, గపులఁ దునిమి నేఁడు కుంభకర్ణాచలభీ
ద్రిపుకుంభనికుంభకరా, దిపూర్వదివిజులఋణంబు దీర్చికొనియెదన్.
| 2181
|
| క. |
గగనము ధాత్రియు దిశ లా, పగలు సముద్రములు నాదుపటుతీవ్రశితా
శుగజలదవృతము లై నేఁ, డొగిఁ బ్రద్యోతంబు నొందకుండెడు మిగులన్.
| 2182
|
| తే. |
వీఁకఁ బర్జన్యుఁ డొగి శిలావృష్టి గురిసి, సస్యసంతతి గూల్చినసరణి నాదు
సాంద్రశరవృష్టిఁ గపిసైన్యసమితి నేల, పాలు సేసెద నిందఱుఁ బ్రస్తుతింప.
| 2183
|
| తే. |
మారుతజవంబున రథంబు మందరంబు, కరణిఁ జరియింప మచ్చాపశరనిధిప్ర
భూతబాణోర్మువితతుల భూజచరబ, లాలియనుదీవి ముంచి జయంబు గొందు.
| 2184
|
| తే. |
నలినకింజల్కవర్ణవానరచమూవి, శాలసలిలాశయంబుల సమదసామ
జంబుభంగిఁ గలంచి రాక్షసుల కెల్ల, వేడుక జనింపఁ జేసెదఁ జూడుఁ డిపుడు.
| 2185
|
| క. |
హరియూథపు లందఱు నేఁ, డరయఁగ మద్విశిఖపూరితాననములచే
వరుస ధరఁ గప్పెదరు సురు, చిరసమృణాళాంబుజములచేతం బోలెన్.
| 2186
|
| క. |
ఒక్కొక్కఘోరశరమునఁ, దక్కక యుద్ధప్రచండతరుచరవరులం
బెక్కండ్ర శైలయోధుల, నక్కజముగ నేఁడు ద్రుంతు నమరులు వొగడన్.
| 2187
|
| క. |
అనిలోఁ జచ్చిన భర్తలఁ, దనయుల సోదరులఁ దలఁచి తద్దయు దుఃఖం
బునఁ బొగులుదనుజవనితా, ననగళదశ్రుప్రమార్జనం బొనరింతున్.
| 2188
|
| తే. |
వినుఁడు మద్బాణనిర్భిన్నవిప్రకీర్ణ
విగతచేతనఘనరూపు లగువనాట
వరులచే నేఁడు సంగ్రామవసుధ యధిక
యత్నసంప్రేక్ష్యతల యగు టరుదె తలఁప.
| 2189
|
| క. |
కాలవ్యాళనిభాంబక, జాలార్ధితశత్రుమాంసశకలంబులచేఁ
జాలఁ బరితృప్తిఁ జేసెద, నాలంబున గృధ్రజంబుకాదులకు వడిన్.
| 2190
|
| చ. |
మసలక మచ్చతాంగమును మానుగ నాయితపెట్టుఁ డింద్రచా
పసదృశఘోరకార్ముకము బాణములం గొని తెండు సర్వరా
క్షసులును నాదువెంట వరుస న్రణభూమికి వచ్చువారుగా
వెస నియమింపుఁ డిప్పు డరివీరమృగంబుల వేఁటలాడెదన్.
| 2191
|
| వ. |
అని పలికిన నద్దశగ్రీవునివచనంబులు విని రాక్షసోత్తముం డగుప్రమత్తుండు సమీ
పస్థు లగుబలాధ్యక్షుల నవలోకించి మీరు రయంబున హతశేషు లగురాక్షసుల
|
|
| |
నందఱి రాజశాసనంబున రణంబునకుఁ బైనంబు సేయింపుం డనిన వా రతిత్వరి
తగమనంబునం బ్రతిగృహంబునకుం జని లంకలోఁ గలయాతుధానుల నందఱ
యుద్ధసన్నద్ధులం జేసి తోడి తెచ్చిన నొక్కముహూర్తంబులోనఁ బరాక్రమధుర్యు
లగురాక్షసవర్యు లనేకులు భయంకరాకారు లై కాలమేఘంబులకరణి గర్జిం
చుచుఁ బట్టసాసిశూలగదాముసలముద్గరశక్తికుంతచక్రప్రాసపరశ్వథభిండివాల
శతఘ్నీప్రముఖనిఖిలాయుధంబులు భుజంబుల నిడికొని భీమప్రకారంబున
రావణసమీపంబునం గూడుకొని రంతలోన సూతుండు మహోన్నతకేతనం
బెత్తి యెనిమిదిజవాశ్వంబులం బూన్చి ధనురాదిసాధనంబుల నలంకరించి రథం
బాయితంబు చేసి తెచ్చిన నమ్మహనీయకాంచనమణిగణప్రభాభాసమానరథం
బెక్కి రావణుండు సత్వగాంభీర్యతేజోధైర్యంబులు వెలుంగ రాక్షసబలోపేతుం
డై నిజతేజంబున దశదిశలు వెలుంగంజేయుచు ధరణీతలంబు గ్రక్కదల రణం
బునకుం జనియె నతనిపిఱుందదెస రథారూఢులై యుద్ధోన్మత్తమత్తవిరూపా
క్షులు ఘోరనాదంబులు సేయుచు రభసాతిశయంబున మహీచక్రంబు బ్రద్దలు
వాఱ భీషణప్రకారంబునం జని రిట్లు సర్వసంరంభసన్నాహవిజృంభితుం డై
కాలాంతకయమోపముం డగురావణుండు కరంబునఁ జాపంబు గ్రాల సూతసా
రథ్యనైపుణవిశేషంబున నతిదుర్నిరీక్షం బై రథంబు పఱవఁ గోలాహలబలం
బుగా నుత్తరద్వారంబున వెడలి చనుసమయంబున.
| 2192
|
రావణుఁడు యుద్ధంబునకు వచ్చుట
| సీ. |
నలినబాంధవుఁడు వినష్టప్రభుం డయ్యె దిక్కులఁ దిమిరంబు పిక్కటిల్లెఁ
గ్రవ్యాదములు భయంకరగతి వాపోయె గహ్వరీచక్రంబు కంప మొందె
నిర్ఘాతసన్నిభనినదంబు లై మహోల్కలు రాలె రక్తవర్షంబు గురిసె
కాకఘూకసృగాలకంకగృధ్రంబులు ధ్వనులు సేసె శివారవంబు లెసఁగె
|
|
| తే. |
రథ్యములు మ్రొగ్గె రావణురథముమీఁద
గద్ద వాలెఁ దదంగము ల్కంప మొందె
మోమున వివర్ణతయుఁ దోఁచె వామలోచ
నము చలించె స్వరంబు హీనత వహించి.
| 2193
|
| క. |
మఱియుఁ బథంబున దనుజే, శ్వరుఁ డగుదశకంథరునకు సంగ్రామమునన్
మరణము దెలుపుచుఁ దఱుచుగఁ, బొరిఁబొరి బహుదుర్నిమిత్తములు దోఁచె రహిన్.
| 2194
|
| తే. |
దానవేశ్వరుఁ డామహోత్పాతములను
గాంచి చింతింపక తృణీకరించి మించి
కాలచోదితుఁ డై వేగ కయ్యమునకుఁ
జనియె భయదాట్టహాసనిస్వనము లెసఁగ.
| 2195
|
| ఉ. |
వారిశతాంగఘోషమున వానరసత్తము లుత్సహించి సొం
పారఁగఁ దాఁకి రుగ్రగతి నద్దనుజు ల్వెస వారిఁ దాఁకి రే
|
|
| |
పారఁగ దక్షిణోత్తరమహార్ణవము ల్వడిఁ బోరుకైవడి
న్వారక పోరె నయ్యుభయవాహిను లార్పులు నింగి ముట్టఁగన్.
| 2196
|
| క. |
జయకాంక్ష లినుమడింపఁగ, రయమునఁ గపిరాక్షసులు కరముచలమున నెం
తయు నొండొరులం బిలుచుచు, భయదగతిం బెనఁగి రపుడు పటుకార్యమునన్.
| 2197
|
| క. |
ఆదారుణసమరంబున నాదంబులకంటె మున్ను నగచరరక్షః
పాదహతభూపరాగము, మేదురముగ నెగసి దెసల మింటం బర్వెన్.
| 2198
|
| ఉ. |
అంత వనాటవీరులు భయంకరవిక్రమదుర్నివారు లై
పంత మెలర్ప శైలములఁ బాదపసంఘములు న్నఖంబులన్
దంతములం గరంబులఁ బదంబుల దైత్యుల నుగ్గు సేసి రో
దోంతరమెల్ల నిండ వడి నార్చిరి వేల్పులు మెచ్చి చూడఁగన్.
| 2199
|
| క. |
ఆవిధ మంతయుఁ గనుఁగొని, రావణుఁ డతిరుష్టుఁ డగును రాక్షసభటులం
దా వీక్షించి వనాటబ, లావలిపైఁ గవిసి పొడువుఁ డవిశంకితులై.
| 2200
|
| చ. |
అని పురికొల్పినం దనుజు లార్చి జయస్పృహులై భుజాబలం
బినుమడి గాఁగ సాంద్రశరవృష్టి గదాపరిఘాసిశూలపా
శనిశితశక్తితోమరగదాముసలాంకుశముద్గరంబుల
న్వనచరనాథసైన్యముల వ్రచ్చి వధించి రనేకభంగులన్.
| 2201
|
| చ. |
దశముఖుఁ డల్గి చాపగుణదారుణనిస్వన మత్యుదాత్తమై
దశదిశలం జెలంగ వితతస్ఫుటరాజదయోముఖాగ్రక
ర్కశసితవత్సదంతపవికల్పవికర్ణిసుపుంఖపత్రవ
ద్విశిఖము లేసి వానరుల వేగ మడంచి వధించె వ్రేల్మిడిన్.
| 2202
|
| క. |
ఆరక్షఃపతిముంగల, బీరము దీపింప నిలిచి పెనఁగెడువీరుం
డేఱిన నొక్కఁడు లేఁ డా, భూరుహచరవాహినీసమూహములోనన్.
| 2203
|
| వ. |
అంత నొక్కింతధైర్యంబున వానరబలంబులోనఁ జేయం గలమేటిమగ లెల్ల
నొక్కమొత్తం బై పర్వతాగ్రంబులుఁ బాదపంబులు హస్తిమాత్రపాషాణం
బులుం గైకొని రావణుఁ జుట్టుముట్టి యట్టహాసంబుఁ జేసి ప్రాణహరం బైనశి
లాద్రుమవర్షంబు నీరంధ్రంబుగాఁ గురిసిన.
| 2204
|
| ఉ. |
దానికి నల్గి కల్గొనల దారుణవహ్నకణంబు లొల్క న
ద్దానవలోకనాయకుఁడు దండధరాకృతి ఘోరదర్శనుం
డై నిశితాగ్నిసన్నిభమహాహిసమానశరప్రవృష్టిచే
వానరవీరసేనల నవార్యగతిం దునుమాడె నుద్ధతిన్.
| 2205
|
| క. |
మఱియు దశాస్యుఁడు కల్పాం, తరవిక్రియఘోరశరకదంబకరములం
దరుచరసేనాహ్రదమును, దురమున శోషింపఁజేసె దుస్సహశక్తిన్.
| 2206
|
| తే. |
రావణుం డనుకల్పాంతపావకుండు, క్రోధవాతప్రయుక్తుఁ డై ఘోరబాణ
సాంద్రశిఖలచే వానరసైన్యశుష్క, విపినమును జుట్టి నీఱు గావించె నపుడు.
| 2207
|
| క. |
దితిజకులేశ్వరకాండా, ర్దితులై భిన్నాంగు లై రుధిరపూరపరి
ఫ్లుతు లై గతజీవితు లై, క్షితిఁ గూలిరి వానరులు విచేతను లగుచున్.
| 2208
|
| వ. |
ఇట్లు వానరబలంబుల నెల్ల నేలకుం గోలకుం దెచ్చి గంధమాదనుం డడరినఁ
బదునెనిమిదిశరంబుల దూల నేసి నలుండు దూరంబునం బొడసూపిన దశవిశి
ఖంబులు మేనం గ్రుచ్చి మైందుండు వచ్చిన సప్తసాయకంబుల వేగం బడంచి
గజుం డెదిరించిన నైదుతూపుల విముఖునిం జేసి హనుమంతుండు మార్కొ
నిన ముప్పదిబాణంబుల నివారించి నీలుండు దోఁచినఁ బదికాండంబుల వెగడు
పఱచి గవాక్షుండు గవిసిన నిరువదేనువెడందవాతియమ్ములం గ్రమ్మఱించి ద్వివి
దుండు మొనసూపిన నాఱుకుప్పెకోలల నొప్పించి పనసుం డదల్చినఁ బదిగన్నే
రాకుఁగోలల వాడిమిఁ జెఱచి కుముదుండు మీఁది కుఱికినఁ బంచదశశిలీము
ఖంబుల నిశ్చేష్టితుం జేసి జాంబవంతుం డాహ్వానంబుఁ జేసిన సప్తనారాచంబుల
వికలాంగునిం జేసి తారుండు గదియవచ్చిన నైదుకాండంబుల సొగియనేసి
వినతుండు తలమిగిలిన నెనిమిదిమార్గణంబులఁ గాందిశీకునిం జేసి యంగదుం
డడ్డంబై యొడ్డారించినఁ బండ్రెండుతీవ్రాశుగంబుల వికలసాధనుం జేసి శర
భుండు దలపడిన నొక్కయర్ధచంద్రాంబకం బురంబు గాఁడనేసి యుబ్బడంచి
క్రధనుండు ప్రథనంబున కుత్సహించిన మూఁడువాఁడితూపులు లలాటంబున
నాఁటించి మూర్ఛితుం జేసి వెండియు సూర్యమరీచికల్పంబు లగుకాండసహ
స్త్రంబులు సేనమీఁదం బరఁగించి మర్మంబులు సించిన నందుఁ గొందఱు భిన్న
మస్తకు లై కొందఱు విఖండితబాహు లై కొందఱు విశకలితచరణజానుజం
ఘోరుమధ్యులై కొందఱు చక్షుర్వివర్జితు లై కొందఱు భిన్నగాత్రు లై
కొందఱు రుధిరోక్షితశరీరు లై పుడమిం గూలి రప్పుడు.
| 2209
|
| క. |
అవిరళగతిఁ దెగి గూలిన, ప్లవగులచేఁ దఱుచుగాఁగ రాలినతరుశ
స్త్రవరాస్త్రఖండములచే, బవరపుమేదిని ముసుంగువడి యుండె రహిన్.
| 2210
|
| ఆ. |
అప్పు డప్రధృష్య మైనదశాస్యుఘో, రేషుసంప్రపాత మించుకైన
వైరు లొగి సహింప లేరైరి మారుత, మిత్రు నోర్వ లేని మిడుతలట్లు.
| 2211
|
| క. |
రావణతీవ్రశరార్దితు, లై వానరు లార్తినొంది యాక్రందితము
ల్గావించుచు వెసఁ బఱచిరి, దావానలదహ్యమానదంతులభంగిన్.
| 2212
|
| క. |
ఇనతేజంబునఁ దమ మొ, య్యన విరిసినక్రియ దశాస్యుఁ డని నేవంకం
గనుఁగొనె నావంకం గల, వనచరసైన్యంబు విచ్చె వననిధిదాకన్.
| 2213
|
| క. |
ఆయసురేంద్రుఁడు వెనుకొని, పాయకు సాయకము లేసి ప్లవగులఁ దోలె
న్వాయువు నిజవేగంబునఁ, దోయదముల నభ్రవీథిఁ దోలినమాడ్కిన్.
| 2214
|
| మ. |
దనుజాధీశ్వరుఁ డిట్లు కొంతవడి యుద్ధక్రీడ గావించి చ
య్యన నాత్మీయపృషత్కమోహితము లై యంభోజపత్రస్థజీ
|
|
| |
వనమున్బోలెఁ దలంకుకీశపృతనావర్గంబులం జూచుచు
న్జనియె న్రాఘవుఁ డున్నచోటికి రణేచ్ఛ న్గ్రోధసంరంభి యై.
| 2215
|
| వ. |
ఇ ట్లనివార్యగమనంబునం జనుదశగ్రీవుని దవ్వులం జూచి సుగ్రీవుండు విపుల
గ్రీవుం డై యతనికోల్తల కోర్వక భయభ్రాంతు లై దీనదశకు వచ్చి తొలంగి
పాఱువానరుల కభయంబు దెల్పి మధ్యమగుల్మసంరక్షణంబునం దాత్మసమా
నబలుని సుషేణుని నియోగించి యొక్కవిశాలసాలం బుత్పాటించి తెచ్చి యం
సభాగంబున నిడికొని మత్తశుండాలంబులీల మాఱు మసలుచుఁ బాదవిన్యాసం
బునఁ బుడమి వడంక సంగ్రామార్థి యై రావణున కభిముఖంబుగా నరిగె నతని
వెనుక నుభయపార్శ్వంబుల ననేకయూథాధిపతులు వివిధద్రుమంబులు శైలం
బులు కరంబుల నీడికొని పరుసంపుమాటల నొండొరులం బురికొల్పుకొనుచు
సహాయార్థం బరిగి రి ట్లడరి సూర్యనందనుండు తనయన్నపగిది భయంకరాకా
రుండై బ్రహ్మాండభాండంబు పగుల నుచ్చైర్నాదంబు సేయుచుఁ గ్రోధసంరక్త
నయనుం డై యుగాంతసమయంబునందుఁ బ్రభంజనుండు ప్రవృద్ధవృక్షంబునుం
బోలె నెడనెడ నడ్డంబు వచ్చినమహాకాయు లగురాక్షనులు బడలువడం
జేయుచుఁ గాననాభ్యంతరంబున మేఘంబు పక్షిసంఘంబుమీఁద శిలావర్షంబు
గురిసినభంగి రాక్షససైన్యంబులమీఁద నీరంధ్రముగాఁ బాదపవర్షంబులు గురి
యుచు సురేంద్రుండు వజ్రప్రహారంబున ఱెక్కలు దెగవ్రేసినఁ బుడమిం
గూలు పర్వతంబులమాడ్కిఁ దనచేతివృక్షప్రహారంబున శిరంబులు పగిలి
దానవు లవనిం ద్రెళ్ల ననేకప్రకారంబుల భుజావిక్రమంబు ప్రకటించుచుం
జని రావణుం గదియునెడ రథికుం డగువిరూపాక్షుం డడ్డంబు వచ్చి నిలువరించి
యేను విరూపాక్షుండ రణంబునకుం జనుదెంచినాఁడ నన్ను మీఱి పోవరాదు
బంటవై తేని నాతో రణంబు సేయు మని పలికి పొగ లేనిమంట లుమియు నారసం
బులు దట్టంబుగాఁ బరఁగించిన నతనిప్రఖ్యంబు లగుతత్సాయకంబులు నెక్కిం
పక సుగ్రీవుండు గర్జించుచు శరాభిముఖుం డై వానిం గదియ నుఱికి.
| 2216
|
| చ. |
హరిహయవిక్రముండు ప్లవగాధిపుఁ డుద్ధతి వానితేరు స
త్వరముగ నాక్రమించి వడిఁ దద్రథకీలితవాజిశీర్షము
ల్హరిశతకోటిసన్నిభపదాహతి ప్రక్కలువాఱఁ దన్నిన
న్నెఱిసెడి కన్ను లూడిపడ నెత్తురు గ్రక్కుచు వ్రాలె నేలకున్.
| 2217
|
| క. |
ఇనతనయుఁ డివ్విధంబున, దనుజునిహయములు వధించి తరుచరసేనల్
తను వినుతింపఁగఁ దత్స్యం, దనచోదకుఁ దునిమె ఘోరతరవృక్షహతిన్.
| 2218
|
| తే. |
అంతలో విరూపాక్షుఁ డతిజవమున
ధరకు లంఘించె నంతలోఁ దరుచరేంద్ర
సచివు లందఱు గ్రమ్మి తత్స్యందనమును
జూర్ణ మొనరించి రింద్రాదిసురులు వొగడ.
| 2219
|
| సీ. |
దానవుఁ డిబ్బంగి ధరణికి లంఘించి కవచియు బాణియుఁ గార్ముకియును
దూణియు నై పటుబాణజాలంబులు కపివల్లభునిమేను గాఁడ నేసి
నంతలో రావణుం డధికరోషమున వానరభర్తపైఁ బెక్కునారసములు
పరఁగించి వెంటనె బహువిధాంబకములు సేనపై నిగుడించి చిక్కుపఱచె
|
|
| తే. |
నతనికోలల కోర్వక యద్రిచరులు, కాండపీడితు లై భీతి గడలుకొనఁగఁ
బఱచి రఘుకులవర్యునిమఱుగు సొచ్చి, రపుడు సుర లజుమఱుఁగున కరిగినట్లు.
| 2220
|
| ఆ. |
రావణప్రయుక్తుఁ డై విరూపాక్షుండు, చలము బలము గినుక జవము మెఱయ
సంభ్రమమున నఖిలశస్త్రోపకల్పితం, బైననగసమానహస్తి నెక్కి.
| 2221
|
| క. |
నింగి పగులంగ నార్చుచుఁ, బొంగి నిశాటులకుఁ బ్రీతి పుట్టించుచు మా
తంగశ్రేష్ఠమును వెసఁ బ్ల, వంగబలము నడుమ నిలిపి వారనియలుకన్.
| 2222
|
| క. |
కరలాఘవ మొప్పఁగ వన, చరపతి సర్వాంగమర్మసంధులు నాటం
గుఱి సేసి భుజగసన్నిభ, శరములు నిగుడించెఁ బెక్కుచందములవడిన్.
| 2223
|
| చ. |
కపివిభుఁ డిట్లు రాత్రిచరకార్ముకముక్తశరాతివిద్ధుఁ డై
యపు డతికోపవేగమున నక్షుల వహ్నికణంబు లొల్కఁగా
విపులమహీరుహంబు గొని వేగమె వాని వధించు కోరికన్
జపలగతి న్మృగాధిపునిచాడ్పున నేగె గజంబుమీఁదికిన్.
| 2224
|
| క. |
హరివిభునిరయము గనుఁగొని, విరూపనేత్రుఁ డతిభీతి వేగం బడరం
గరిమీఁద నుండి తడయక, ధరణికి లంఘించెఁ గపివితానము నవ్వన్.
| 2225
|
| ఆ. |
అంత వానరేంద్రుఁ డాకుజంబున సామ, జంబు నేయ నది శిరంబు పగిలి
వింటిపెట్టుదవ్వు వెనుకకు ఘీంకార, మడరఁ బఱచి చచ్చి యచటఁ బడియె.
| 2226
|
| క. |
వానరనాథునిచేఁ దన, యేనుఁగు రణభూమిఁ బడుట వీక్షించి వెసన్
దానవుఁడు చిత్తమున నభి, మానము రోసముఁ జలంబు మల్లడిగొనఁగన్.
| 2227
|
| క. |
వాలును బలుకయుఁ గైకొని, కాలానలులీలఁ జాలఁ గనలుచు రక్షః
పాలుఁడు శమనునికైవడిఁ, గ్రాలుచు గపివిభుని కెదురుగాఁ జనుదెంచెన్.
| 2228
|
| క. |
ఆలో దినేశతనయుఁడు, శైలాగ్రం బొకటి తెచ్చి సాహస మడర
న్వాలమునఁ జుట్టి విసరి వి, శాలబలం బలర రాత్రిచరుపై వైచెన్.
| 2229
|
| క. |
వైచిన దానిం గని రజ, నీచరవీరుండు నిశితనిస్త్రింశమున
న్ఫ్రాచుర్య మెసఁగ నచలుం, డై చూర్ణము చేసె నడుమ నయ్యచలంబున్.
| 2230
|
| ఆ. |
దనుజుఁ డిట్టు వ్రేటు దప్పించుకొని డాసి, వేగ యినజు ఖడ్గవిద్దుఁ జేయ
నొచ్చి యతఁడు మూర్ఛ వచ్చిన నొక్కింత, సొలసి యంతలోనఁ దెలివి నొంది.
| 2231
|
| క. |
అక్షుల నిప్పులు రాలఁగ, వీక్షించి సురేంద్రహేతి కెనయగుముష్టిన్
లక్షించి రాక్షసుని పెను, వక్షంబునఁ బొడిచె దైత్యవర్గము బెదరన్.
| 2232
|
| క. |
దానికి నించుక స్రుక్కక, దానవుఁడు నిశాతఖడ్గధారాభిహతి
న్వానరవల్లభు సొగియం, గా నేసిన నతఁడు నొచ్చి కడువేగమునన్.
| 2233
|
| ఉ. |
క్రమ్మఱఁ దెల్వినొంది బలగర్వ మెలర్పఁగ వానిఱొమ్ము వే
ళమ్ముగ వజ్రసన్నిభతలంబున వ్రేసిన దాని కాత్మలో
నుమ్మలికంబు నొందక సముద్ధతి వాఁడు వనాటరాజువ
క్ష మ్మొగి ముష్టిచేఁ బొడిచె సాంద్రకృశానుశిఖ ల్జనింపఁగన్.
| 2234
|
| క. |
దనుజునివ్రేటు కపీంద్రుఁడు, వనచరపతివ్రేటు దానవశ్రేష్ఠుం డొ
య్యనఁ దప్పించుకొనుచు నే, ర్పున నఱిముఱిఁ బోరి రిరువురు ప్రచండగతిన్.
| 2235
|
| శా. |
అన్యోన్యభ్రమణంబు సేయుచు జిగీషాయత్తు లై మీఁది క
న్యోన్యం బుద్ధతిఁ బట్టి యెత్తి ధరపై నత్యుగ్రు లై వైచుచున్
సైన్యంబు ల్వెఱఁగంది చూడఁగ మహాసత్త్వాఢ్యు లై పెంపునన్
జన్యక్రీడ యొనర్చి రిద్దఱును ముష్టాముష్టి ఘోరంబుగన్.
| 2236
|
| వ. |
ఇట్లు మహాద్భుతప్రకారంబునం బోరునెడ నెడ గని సుగ్రీవుండు మహేంద్రాశని
కల్పం బైనపాణితలంబున విరూపాక్షునిఁ బెడతల వేసిన నయ్యాతుధానుండు
శిరంబు పగిలి రుధిరక్లిన్నశరీరుం డై సఫేనం బగుశోణితంబు గ్రక్కుచు వికృత
వదనుం డై వివృత్తనేత్రుం డై వికృతనాదంబు సేయుచుఁ బుడమిం బడి పొర
లుచుఁ బ్రాణంబులు విడిచె నిట్లు విరూపాక్షతరుం డై ధరణిం గూలిన విరూ
పాక్షు నీక్షించి వానరులు పరమానందభరితాంతఃకరణులై సుగ్రీవునిఁ బ్రశంసిం
చిరి వానరబలంబు మహోద్వేలగంగాప్రతిమంబై తన్నియోగంబునం జెలరేఁగి
నానాప్రకారంబుల రాక్షసుల నుగ్గునూచంబు గావింపం దొడంగినఁ దదా
టోపంబున కోర్వక రాక్షసబలంబు భయభ్రాంతం బై నిదాఘసంతప్తజలా
శయంబుకరణిఁ బరిక్షోభంబు నొంది పద్మపత్రగతజలంబులమాడ్కి దల్లడిల్లుచు
దశదిశలకుం బాఱె నప్పుడు రావణుండు స్వబలవిఘాతంబును విరూపాక్ష
వధంబును విలోకించి దైవవిపర్యయంబు చింతించి గాఢవ్యధాక్రాంతుం డై
కోపంబు రెట్టింప సమీపస్థుం డైనయుద్ధోన్మత్తుం డగుమహోదరు నవలోకించి
యిట్లనియె.
| 2237
|
| సీ. |
అమరారివర్య యీసమయంబునం దీవు దక్క వేఱొకఁడు యుద్ధంబుఁ జేసి
విజయ మొసంగెడు వీరుండు లేఁ డిది పార్థివునిఋణంబుఁ బాపుకొనుట
కవసరం బిపుడు శౌర్యం బంతయును జూపి పగఱ నిర్జింపుము భండనమున
ననిన నద్దానవుఁ డట్ల గావించెద నని రణోత్సాహ మాస్యమునఁ జెలఁగ
|
|
| తే. |
నద్భుతాటోపయుతుఁ డై మహామకరము, వారినిధిఁ జొచ్చినట్లు దుర్వారభంగి
రథముఁ బఱపించి శత్రువర్గంబు సొచ్చి, వృక్షచరులను సాయకవృష్టి ముంచె.
| 2238
|
| చ. |
అమితబలాఢ్యు లైనవిపినాటులు పాణిధృతాశ్మవృక్షు లై
సమదగతి న్సముద్ధత నిశాచరసైన్యముఁ జొచ్చి దైత్యులన్
గ్రమమున వేసి యార్చి రది గన్గొని వాఁ డలుక న్ప్రచండకాం
డము లడరించి కీశచరణంబులుఁ జేతులుఁ ద్రుంచె బల్విడిన్.
| 2239
|
| ఉ. |
దానవచాపముక్తశితధారశరార్థితు లై వలీముఖు
ల్ప్రాణభయంబునం బెదరి పాఱి మహీధరకందరంబులం
గాననసీమల న్నదులఁ గంధితటంబులఁ బల్వలంబులన్
మానక వృక్షషండములమాఁటున డాఁగిరి వీతగర్వు లై.
| 2240
|
| క. |
మొన విఱిగి పఱచుసేనల, వెనుకొని పడిఁ దఱుముదైత్యవీరునిమ్రోలం
గనుఁగొని పంకజబాంధవ, తనయుఁడు కోపించి దష్టదశనచ్చదుఁ డై.
| 2241
|
| క. |
కులగిరినిభఘోరాతత, శిల నొక్కటి గొని గడంగి చిడిముడి గదుర
న్బలియుఁ డగురాక్షసునిపై, బలముకొలఁది విసరివైచె బటురోషమునన్.
| 2242
|
| క. |
ఈచందంబునఁ బెనుశిల, వైచిన దానిఁ గని వేగవంతుం డై దో
షాచరుఁ డుడుగక పటునా, రాచంబుల నడుమ నూఱువ్రయ్యలు సేసెన్.
| 2243
|
| క. |
సమరోన్మత్తవిశాలశ, యముక్తసాయకనికృత్తమై యాఘోరా
శ్మము మింటనుండి వెస గృ, ధ్రమండలముమాడ్కి నపుడు ధరణిం గూలెన్.
| 2244
|
| క. |
శిల నుగ్గై కూలుట గని, జలజాతసఖాత్మజుండు సక్రోధుం డై
యలఘుబలంబున సాలము, పలలాశనుమీఁద వైచె బటురవ మెసఁగన్.
| 2245
|
| క. |
దానికి నించుక దలఁకక, దానవుఁడు శరత్రయమునఁ దద్వృక్షంబున్
మానక ఖండించి తపన, సూనునిమర్మములు నాఁటఁ జొనిపెం దూపుల్.
| 2246
|
| మ. |
తనవృక్షం బటుభగ్న మై పడుటకుం ద న్నాసురారాతి చ
య్యన నానాంబకవిద్దుఁ జేయుటకుఁ గీశాధీశ్వరుం డల్గి యా
దనుజశ్రేష్ఠునితేరిపై కుఱికి కోదండంబు ఖండించి సూ
తుని మర్దించి పతాక గూల్చి హరులం దున్మాడి యత్యుద్ధతిన్.
| 2247
|
| చ. |
అరదముమీఁద నున్నపరిఘాయుధము న్గొని డాసి క్రవ్యభు
గ్వరుని వధింపఁ జూచిన జవంబున వాఁడు రథంబు డిగ్గి భీ
కరగతి నార్చి వేగ గద గైకొని మచ్చర మొప్పఁ దాఁకె వా
నరపతి తేరు డిగ్గి జతనంబున నాతనిఁ దాఁకె నుద్ధతిన్.
| 2248
|
| వ. |
ఇవ్విధంబున నన్నగనిశాచరవరులు గదాపరిఘహస్తు లై విద్యుత్సమన్వితంబు
లైనఘనంబులమాడ్కిఁ దలపడి గోవృషంబులచందంబున ఱంకెలు వైచుచుఁ
బ్రచండభంగిం బోరునెడ సంక్రుద్ధుండై తాపవంతుండును యుద్ధోన్మత్తుండు నగు
మహోదరుండు గదాదండంబు జిఱజిఱం ద్రిప్పి వైచిన దాని నవలోకించి సుగ్రీ
వుండు రోషతామ్రాక్షుం డై తనచేతిపరిఘంబు విసరివైచిన నయ్యాయు
ధంబులు రెండు నొండొంటిం దాఁకి పరస్పరహితంబులై పుడమిం గూలె నంత
సుగ్రీవుండు రథంబుపై నిడినకాలాయనమయం బైనముసలంబు గొని విసరి
వైచిన నద్దనుజపుంగవుండు వేఱొక్కగద గొని వైచిన నవి రెండును బరస్పర
సంఘర్షణంబున భిన్నంబు లై ధరణిం బడియె ని ట్లాయుధంబులు నుగ్గై రా
|
|
| |
లిన నయ్యిరువురు ముష్టియుద్ధంబునకుం దలపడి తేజోబలసమన్వితు లై దీప్త
హుతాశనులచందంబున వెలుంగుచు ఘనాఘనంబులకరణి సారెసారెకు గర్జిం
చుచు మత్తకంఠీరవంబులమాడ్కి విక్రమించుచు మర్మంబు లెఱింగి యొండొ
రులం బ్రహరించుచుఁ బరస్పరప్రహారపీడితులై సొలసి ధరణితలంబునం బడి
యంతలోనఁ దెలిసి యొండొరులం బొడుచుచుఁ బరువు లెత్తుచుం బఱతెంచి
యురవడిం దాఁకుచు బాహుయుద్ధంబు నశ్రమంబు నొంది తత్సమీపంబున
నున్ననిశితఖడ్గంబులు గొని రోషపరీతస్వాంతు లై సాహసధైర్యశౌర్యలాఘ
వంబు లేర్పడఁ దమశస్త్రవైశారద్యంబునకు మెచ్చుచు నుభయసైన్యంబులు
వెఱఁగుపడి సూచుచుండ సవ్యాపసవ్యమండలప్రచారంబులం దిరుగుచు నన్యో
న్యజయకాంక్షులై ఛిద్రాన్వేషణంబు సేయుచు ననేకమార్గంబులం బోరునప్పు
డు మహోదరుండు ఖడ్గంబున సుగ్రీవుని వ్రేసిన నవ్వనచరనాథుండు నేర్పున
వ్రేటు దప్పించుకొని తనచేతిఖడ్గంబునఁ గిరీటకుండలోపహితం బయినరాక్షసు
నిశిరంబు ధరణీతలంబున డొల్ల నేసిన నత్తెఱంగు విలోకించి.
| 2249
|
మహోదరుఁడు సుగ్రీవునిచేఁ జచ్చుట
| క. |
భగ్నం బై కమలదళవి, లగ్నజలముకైవడిం దలంకుచుఁ బరమో
ద్విగ్నం బై దుఃఖార్ణవ, మగ్నం బై రాత్రిచరసమాజము పాఱెన్.
| 2250
|
| క. |
హృష్టుం డై శూరజనవ, రిష్ఠుం డై భూరుహచర ఋక్షస్తుతి సం
తుష్టుం డై విజయరమా, జుష్టుం డై యలరె సూర్యసుతుఁ డవ్వేళన్.
| 2251
|
| క. |
గుము లై జయనాదజితా, భ్రము లై పాణిధృతపాదపము లై సంతు
ష్టము లై గగనోద్యతవా, లము లై యపు డద్రిచరబలంబులు చెలఁగెన్.
| 2252
|
| క. |
ఘను లై కృతజయజయని, స్వను లై దైత్యవధజనితసంభ్రమలసితా
నను లై పరివేష్టితముని, జను లై విలసిల్లి రాకసమున సుపర్వుల్.
| 2253
|
| క. |
ధీరుం డై ప్రకటితదో, స్సారుం డై విజయలబ్ధసాంద్రానందో
దారుం డై చిత్తహరా, కారుం డై రాముఁ డలరెఁ గదనక్షోణిన్.
| 2254
|
| క. |
ఖిన్నుం డై బంధువధవి, పన్నుండై శోకజనితబాష్పజలపరి
క్లిన్నుం డై రోషపట, చ్ఛన్నుం డై యుండెఁ బుణ్యజనవిభుఁ డచటన్.
| 2255
|
| ఉ. |
దేవసమప్రభావుఁ డతిధీరుఁడు వానరవల్లభుండు సు
గ్రీవుఁడు యాతుధాను నిటు గీ టణఁగించి కృతార్థుఁ డై ప్లవం
గావృతుఁ డై నవీనరుధిరాప్లుతుఁ డై విజయాభిరాముఁ డై
యావసుధీశుఁ డున్నవిషయంబునకు న్జనియె న్ముదంబునన్.
| 2256
|
| సీ. |
అంత మహోదరుఁ డాదిత్యసుతునిచే హతుఁ డౌట గని మత్తుఁ డధికరోష
రక్తాక్షుఁ డై తేరు రయమునఁ బఱపించి వెదకి వానరలోకవిభునిఁ గాన
కౌడు గఱచి మ్రోల నత్యుగ్రుఁ డై నిండికొని యున్నవాసవితనయుసైన్య
గహనంబు సొచ్చి భీకరశరానలహేతివితతులఁ గాల్చుచు విక్రమించి
|
|
| తే. |
యమితవాతంబు తాలఫలములఁబోలె, మహితవానరవీరుల మస్తకములు
భల్లముల డొల్లనేయుచుఁ బాదపాణి, జానుజంఘోరుమధ్యము ల్జక్కు సేసె.
| 2257
|
| క. |
అసురకరముక్తసాయక, విసరవిభిన్నాంగు లగుచు వృక్షచరవరు
ల్దెస చెడి సమరవిముఖు లై, వసమఱి యుండిరి విషణ్ణవదనంబులతోన్.
| 2258
|
| క. |
తనసైన్యం బట్లగుటకు, మనమునఁ గనలూది శక్రమనుమఁడు పర్వం
బునఁ బొంగుసముద్రముక్రియ, ఘనరయ మంగీకరించి కడురభసమునన్.
| 2259
|
| క. |
హేళిమరీచిసమప్రభ, కాలాయసమయవిశాలకఠినపరిఘము
న్లీలఁ గొని విసరి రక్షః, పాలునివక్షమున వైచెఁ బటురోషమునన్.
| 2260
|
| వ. |
మత్తుండు తత్ప్రహారపీడితుం డై మైమఱచి నెత్తుటం జొత్తిల్లినశరీరంబుతో రథం
బుమీఁదనుండి పుడమిం బడియె నంతలోన నీలాంజనచయోపముండును మహా
వేగుండును దేజస్వియు సవిద్యున్మేఘసన్నిభుం డగుజాంబవంతుండు క్రుద్ధుండై
గిరిశృంగసన్నిభం బైనవిపులగ్రావం బొక్కటి యెత్తి బలంబుకొలంది తద్రథం
బుపై వైచి సూతాశ్వసహితంబుగా నుగ్గు గావించె నంత నొక్కముహూర్త
మాత్రంబునకు గ్రమ్మఱ లబ్ధసంజ్ఞుండై మత్తుండు తనమ్రోల నున్నవాసవపౌత్రు
నవలోకించి తదీయస్తనాంతరంబున దశవిశిఖంబులు నాటించి పదంపడి మూఁడు
వాఁడితూపులు జాంబవంతుని మనం గీలుకొల్పి పదిసాయకంబుల నీలునిమర్మం
బులు నొప్పించి పంచశిలీముఖంబుల గవయుం దూలనేసి సింహనాదంబు గా
వించిన నప్పు డంగదుండు శరనిపీడితు లైనవానరుల నవలోకించి క్రోధమూ
ర్ఛితుం డై రయంబున.
| 2261
|
| మ. |
ఇనరశ్మిప్రతిమానదీప్తపరిఘం బేపారఁగాఁ జేతులం
గొని పల్మాఱు మిడుంగుఱు ల్సెదర నుగ్రుండై వడిం ద్రిప్పి గ్ర
ద్దన నద్దైత్యుని ఱొమ్మునం బడ వధార్థం బుద్ధతి న్వైవ వే
చని యాశస్త్రము వానిచాపము శిరస్త్రాణంబు ద్రుంచె న్రహిన్.
| 2262
|
| తే. |
వాలిసుతుఁ డిట్లు దైత్యుని వరకిరీట, కార్ముకంబులు ధరఁ గూల్చి కడిమి మెఱసి
మకరకుండలయుక్త మై మలయువాని, కర్ణమూలం బదర నేసెఁ గరతలమున.
| 2263
|
| ఉ. |
దానికి నించు కైన మదిఁ దల్లడ మందక ధైర్య మూఁది యా
దానవుఁ డల్గి ఘోరసముదగ్రనిశాతమహాహిసన్నిభా
నూనపరశ్వథం బరిజను ల్బెగడొందఁగఁ గేలఁ బూని యా
వానరనాథనందనుని వామభుజం బదరంట నేసినన్.
| 2264
|
అంగదునిచే మత్తుఁడు చచ్చుట
| సీ. |
వనచరోత్తముఁడు నేర్పున దానిఁ దప్పించుకొని కృతాంతునిమాడ్కిఁ గనలి వేగ
మంగీకరించి దురంతసత్త్వముఁ బెంచి చతురత మర్మదేశం బెఱింగి
పిడుగున కెనయైనఁ బిడికిట మత్తుని వక్షంబుఁ బొడిచిన వాఁడు ఱొమ్ము
పగిలి రోఁజుచు నేలఁ బడి శోణితము నోట వెడలఁ బ్రాణంబులు విడిచె నతని
|
|
| తే. |
పాటు గనుఁగొని రాక్షసబలము పఱచె
వనచరబలంబు సంతోషమునఁ జెలంగె
దైత్యవల్లభుఁ డైనయాదశముఖునకు
వెఱఁగుపాటును శోక మావిర్భవించె.
| 2265
|
| ఉ. |
అప్పుడు సంప్రహృష్టవిపినాటులపుష్కలసింహనిస్వనం
బుప్పరవీథి నున్న పురుహూతముఖామరహర్షనిస్వనం
బొప్పఁగ నొక్క టై గిరివనోపవనాలయసంయుతంబుగా
నప్పులదిండిఱేనిపురి నెంతయు బ్రద్దలువాపె నెంతయున్.
| 2266
|
| వ. |
అంత నద్ధశగ్రీవుండు దేవవానరులమహాప్రణాదం బాలకించి సహింపక రోషవి
వశుం డై వెండియు భండనంబున కాభిముఖ్యంబు వహించి మృతు లైనమహో
దరవిరూపాక్షులను గాందిశీకు లైనతక్కినబలవంతు లైనరాక్షసులం దలంచు
కొని కన్నీరు నించి యొక్కింతసేపు కార్యశేషంబు చింతించి సైన్యంబుల రణం
బునకు మరలించి రథంబు దోలు మని సూతున కాజ్ఞాపించి యెల్లవారలు విన
వాని కిట్లనియె.
| 2267
|
| సీ. |
రణరంగమున నేఁడు రాజపుత్రులఁ ద్రుంచి హతు లైనమంత్రుల వితతదుఃఖ
మగచరబలరుద్ధ యైనమత్పురిదుఃఖ మపనయించెదఁ దోలు మరద మిపుడు
రాఘవుఁ డన నొక్కరమణీయవృక్షంబు భూపుత్రి దానికిఁ బుష్పఫలము
హనుమదంగదనీలపనససుషేణజాంబవదాదియూథాధిపతులు కొమ్మ
|
|
| తే. |
లరయ మూలంబు హత మైన నన్నియును హ
తంబు లైను సంగ్రామధరణి నతఁడు
నిహతుఁ డైన దక్కినవారు నిహతు లగుదు
రతఁడ కాఁడె భుజవిక్రమాధికుండు.
| 2268
|
| క. |
అని పలికి పటుశతాంగ, ధ్వని రోదసి నిండఁ జెలఁగఁ దద్దయు రభసం
బున రాముఁ డున్నచోటికిఁ, జనియె దశముఖుఁడు దశదిశలు కంపింపన్.
| 2269
|
| తే. |
మును హరిత్రివిక్రమమునందు దనుజవరులు
వెఱచి పఱచినక్రియ దైత్యవిభునిఁ జూచి
వృక్షచరులు రణంబున వెఱచిపఱచి
వచ్చి రఘుపతి శరణంబుఁ జొచ్చి రపుడు.
| 2270
|
రావణుండు మరల యుద్ధమునకు వెడలుట
| ఉ. |
వారలఁ జూచి రాజకులవల్లభుఁ డోడకుఁ డంచుఁ బల్కి సొం
పారఁగఁ గాలమేఘముక్రియ న్వడి మ్రోయుచు విల్లు దాల్చి దు
ర్వారపటుప్రతాప మడరం జనుదెంచునిశాచరేంద్రుని
న్వారక మ్రోలఁ జూచి హితవాది విభీషణుఁ గాంచి యిట్లనున్.
| 2271
|
| ఉ. |
దవ్వుల నీలశైలమువిధంబునఁ గ్రాలుచుఁ జాపటంకృతు
ల్నివ్వటిలంగ వర్మరుచి నింగిఁ జెలంగఁగ బాణపాణి యై
క్రొవ్వునఁ గీశులం గనుపుగొట్టుచు బల్విడి వచ్చుచున్నవాఁ
డెవ్వఁడు దైత్యసత్తమ తదీయవిశేషము మాకుఁ జెప్పుమా.
| 2272
|
| వ. |
అనిన విని యవ్విభీషణుం డవ్వసుమతీవల్లభున కిట్లనియె.
| 2273
|
| ఉ. |
రాజకులప్రదీప యలబ్రహ్మకు మన్మఁడు విశ్రవస్సుతుం
డాజి నజయ్యుఁ డస్త్రవిదుఁ డద్భుతవీర్యుఁడు దైత్యకోటికి
న్రా జగు రావణుం డితఁ డరాతి భయంకరమూర్తి క్రూరుఁ డం
భోజభవప్రసాదమున ముజ్జగము ల్గయికొన్నవాఁ డొగిన్.
| 2274
|
| తే. |
పాపకర్ముండు క్షుద్రుండు పండితుండు
క్రూరచిత్తుండు దారుణాచారుఁ డాజి
నమరవీరుల దోర్దర్ప మడఁచి జయము
గొన్నవాఁ డతివిఖ్యాతి గన్నవాఁడు.
| 2275
|
| తే. |
తపము పెంపున మును దేవదానవులను
సంగరంబున గెలిచిన చతురుఁ డితఁడు
వానరుల బల్మిఁ దోలుచు వచ్చుచున్న
వాఁడు వీని వధింపుము వసుమతీశ.
| 2276
|
| క. |
అన విని రాముఁడు విలు గయి, కొని సజ్జ్యముఁ జేసి సాంద్రగుణనిర్ఘోషం
బొనరించి యలవిభీషణుఁ, గనుఁగొని గాంభీర్య మెసఁగఁ గ్రమ్మఱఁ బలికెన్.
| 2277
|
| క. |
నీచాత్ముఁ డైనయీరజ, నీచరపతి దైవికమున నేఁటికి నాకున్
గోచరుఁ డయ్యె నితని దెగఁ, జూచి కృతార్థత వహింతుఁ జూడుము మిత్రా.
| 2278
|
| క. |
అని పలికి బాణ మొక్కటి, ధనువున సంధించి తిగిచి దశముఖుపై నే
సినఁ దలఁక కతఁడు దానిం, గనుఁగొని భల్లత్రయమున ఖండించె వెసన్.
| 2279
|
| చ. |
దనుజనికృత్తసాయకము తప్పక గన్గొని చాపభృద్వరుం
డనుపమబాహువీర్యుఁడు బలాఢ్యుఁడు లక్ష్మణుఁ డల్క బూని లో
చనములఁ గెంపుసొం పెసఁగఁ జండతరస్ఫుటచాపశింజినీ
స్వనమునఁ బెక్కురక్కసులఁ జావగఁ జేసి మహాద్భుతంబుగన్.
| 2280
|
| చ. |
జలధులు తల్లడిల్లఁ గులశైలము లట్టిటు కంప మొంద ది
క్కులు గలఁగంగ నాకసము కుంభిని బ్రద్దలు వాఱ సాంద్ర మై
కదియఁగ మ్రోయులక్ష్మణునికార్ముకనిస్వన మాలకించి వే
ల్పులు వెఱఁగంది రాదనుజపుంగవుఁ డెంతయు విస్మితాత్ముఁ డై.
| 2281
|
| క. |
కర మల్గి నిశితసాయక, మురవడిఁ గొని తనదుమ్రోల నున్నసుమిత్రా
వరపుత్రుఁ జూచి పవినిభ, పరుషోక్తుల నిట్టు లనియెఁ బటుగర్వమునన్.
| 2282
|
| చ. |
నరవరపుత్త్ర చూడు మిదె నాదుశిరంబులు వజ్రభూషణ
స్ఫురితము లై మహారజతపుంఖము లై నిశితంబు లై హరి
ద్ధరణిముఖంబు లై విమతదర్పనిషూదనదక్షిణంబు లై
పరువడిఁ గాలసర్పములభంగిఁ జెలంగుచునున్న వెంతయున్.
| 2283
|
| చ. |
అరుదుగ నన్ను గన్గొని భయంపడి పాఱక నిల్వు మీశరో
త్కర మిటు నీదుశోణితము తప్పక పానము సేయు నంతటం
బరువడి నీవు ప్రాణములఁ బాసి కృతాంతునిరాజధాని కి
ప్పరుసున నేగె దస్త్రములు బాణము లన్నియు నేయు మిత్తఱిన్.
| 2284
|
| చ. |
అన విని లక్ష్మణుండు హృదయంబునఁ గోపము చెంగలింప న
య్యనిమిషవైరిఁ జూచి యసురాధమ కార్ముకబాణపాణి వై
ఘనరథ మెక్కి కైదువులు గైకొని వచ్చితి వాజిలోన నీ
సునిశితశౌర్య మంతయును జూపుము వ్యర్థదురుక్తు లేటికిన్.
| 2285
|
| ఉ. |
నీదుపరాక్రమక్రమము నీశరనైపుణ మంత చూచి యా
మీఁద సమీరణుండు పడిమీఱఁగఁ బక్వఫలంబులం బలెన్
మేదురశాతకాండముల నీశిరము ల్పడఁగూల్తు వట్టివా
గ్వాద మొనర్చినం జయము గల్గునే నీ కిటు చావు దప్పునే.
| 2286
|
| తే. |
తప్తకాంచనభూషణోద్ధతమదీయ, మేదురశిలీముఖములు నీమేన వ్రాలి
వితతముగ నేఁడు నీదుశోణితము గ్రోలు, దానవారాతు లమృతంబుఁ ద్రావినట్లు.
| 2287
|
| క. |
అనిన విని రాక్షసేంద్రుఁడు, మనమునఁ గోపించి యొక్కమార్గణము రయం
బున లక్ష్మణుపై నేసినఁ, గని యవ్వీరోత్తముండు కడురోషమునన్.
| 2288
|
| క. |
చండాశీవిషసన్నిభ, కాండం బడరించి దాని ఖండించినఁ ద
త్కాండము శతఖండంబై, మండుచు మహి వ్రాలె మును లమరులు నుతింపన్.
| 2289
|
| ఉ. |
దానికి నల్గి రావణుఁడు దాశరథిం బ్రదరాలిఁ గప్పి య
వ్వానరసేనమీఁద శరవర్ష మొగిం బరఁగించి యంగదు
న్భానుసుతం న్విభీషణుని బాణపరంపర ముంచి ఘోరవై
శ్వానరహేతికల్పశరజాలము లేయుచుఁ జేరె రామునిన్.
| 2290
|
| క. |
చేరిన రావణు గన్గొని, ధీరుఁడు రఘువల్లభుండు తీవ్రాంబకముల్
దారుణగతి నేయుచుఁ గరిఁ, జేరుమృగేంద్రంబులీలఁ జేరె న్వానిన్.
| 2291
|
| వ. |
ఇట్లు క్రోధావేశవివశు లై పరస్పరజయకాంక్షలం దలపడిన యారామరావ
ణులకు ఘోరంబును జీవితాంతకరంబును రోమహర్షణంబు నగుమహాయుద్ధం
బయ్యె నప్పుడు.
| 2292
|
రామరావణుల యుద్ధము
| ఉ. |
రాక్షసలోకవల్లభుఁడు రామునిదివ్యశరప్రవేగమున్
దక్షతయు న్బలంబును బ్రతాపము లాఘవ మంత చూచి వాఁ
|
|
| |
డక్షముఁడై శితాగ్రవిశిఖావలి నమ్మహనీయుఁ గప్పి హ
ర్యక్షసమాను లక్ష్మణుని నస్త్రగణంబుల ముంచి వెండియున్.
| 2293
|
| శా. |
శైలాంభోధివనావృతాఖిలమహీచక్రంబు గంపింప నా
భీలాస్త్రంబులు శక్తు లుగ్రశరము ల్భీమాయుధశ్రేణి వా
క్పాలుం డిచ్చినదివ్యసాధనము లాకాశంబు నిండ న్శిఖి
జ్వాలాభీలముగా మహీరుహచరవ్రాతంబుపై నేసినన్.
| 2294
|
| క. |
యూథాధిపతులు పాఱిరి, భూధరచరబలము తత్సుపుంఖవిశిఖసం
బాధిత మై ధరణిం బడె, బాధాకుల మయ్యె దిగ్విభాగము లెల్లన్.
| 2295
|
| క. |
ధరణీపరాగ మెగసెను, హరిదంతము లతిభయంకరాకృతు లయ్యెన్
హరిసైన్యము ఝంఝానిల, పరిధూతం బైనజలధిభంగిఁ దలంకెన్.
| 2296
|
| క. |
ఈకరణి రాక్షసేంద్రుఁడు, వీఁక నమోఘాస్త్రశస్త్రవిసరంబుల న
స్తోకగతి వానరావలిఁ, జీకాకుపడంగఁ జేసి చిడిముడిఁబడుచున్.
| 2297
|
| సీ. |
వనజాతనేత్రుఁ గూడినమహేంద్రునిభంగి ననుజన్మసహితుఁ డై యలరువాని
శంపాలతాయుక్తసజలాంబుదముమాడ్కి నురుకార్ముకము దాల్చియున్నవాని
గంధవాహప్రయుక్తహుతాశనునిలీలఁ బృథులకోపమున దీపించువాని
నలువైనకెందామరలఁ బోలురోషారుణీతలోచనంబుల నెగడువాని
|
|
| తే. |
దీర్ఘబాహు నరిందము దీప్తతేజుఁ, బీనవక్షు బరాక్రమస్థానభూతు
నజితు నపరాజితు నదీను విజయశీలు, రాజలక్షణలక్షితు రాముఁ గాంచి.
| 2298
|
| క. |
కోపంబుఁ బెంచి దారుణ, రూపం బంగీకరించి క్రూరాత్ముం డై
జాపంబు వంచి దిక్కులు, వాపోవఁగ శింజినీరవం బొనరించెన్.
| 2299
|
| వ. |
అంత మహాతేజుం డగురాముండు భగ్నం బై పఱచునిజానీకం బాలోకించి
రక్తాంతవీక్షణుండై సౌమిత్రిసహితంబుగా మహాప్రమాణవిపులం బైనకోదం
డంబు సారించి భూనభోంతరాళంబు నిండ గుణప్రణాదంబుఁ జేసిన.
| 2300
|
| క. |
సురవైరిచాపరవమున, నరనాథధనుర్గుణప్రణాదంబున ను
ర్వర వణఁకె నభము పగిలె న, సురసైన్యము మూర్ఛ మునిఁగి క్షోణిం ద్రెళ్లెన్.
| 2301
|
| తే. |
రాక్షసేశ్వరుఁ డప్పు డారాజసుతుల
కాండపథముఁ బ్రాపించి నక్షత్రనాథ
భాస్కరులమ్రోల నున్నస్వర్భానుపగిది
సొంపుచెడి వెల్లనై ప్రకాశింపకుండె.
| 2302
|
| వ. |
ఆసమయంబున శుభలక్షణుం డగులక్ష్మణుం డఖండకోదండపాండిత్యంబు నెఱ
య మెఱసి ప్రచండమార్తాండునిభంగి నతిదుర్నిరీక్షుం డై యద్ధనుజమండలా
ఖండలుతోఁ బ్రథమభండనంబు తా నొనరింప సమకట్టి.
| 2303
|
| క. |
దిశ లద్రువ శిఖిశిఖోపమ, విశిఖంబులు పెక్కు పఱప విసువక వెస న
ద్దశముఖుఁడు వాని నన్నిటి, నిశితశరము లేసి నడుమ నేర్పునఁ దునిమెన్.
| 2304
|
| క. |
ఒకటి కొకటి రోసము డింపక మూఁటికి మూఁడు మఱియుఁ బదిటికిఁ బది నూఁ
టికి నూఱమ్ములు పఱపి నృ, పకుమారునిసాయకములు పాయక దునిమెన్.
| 2305
|
| క. |
తక్కక పటుకోపంబున, నక్కజముగఁ బెక్కుదారుణాశుగములు పే
రుక్కున నేయుచు లక్ష్మణుఁ, జిక్కువడంజేసి కడువిశృంఖలవృత్తిన్.
| 2306
|
| ఉ. |
సొంపుగఁ బాణిలాఘవముఁ జూపుచుఁ గార్ముకకౌశలంబు దీ
పింపఁ బృషత్కవృష్టి పరపించుచు వింశతిలోచనంబులం
గెంపు సెలంగ లక్ష్మణుని గేవలశక్తి నతిక్రమించి సై
రింపఁగ రానిరోస మిగురింపఁగ రామునిఁ జేరి ధీరతన్.
| 2307
|
| క. |
కాలాంబుదంబు కాంచన, శైలముపై వృష్టి గురియుచందమున మహీ
పాలకులశేఖరునిపై, వాలాయము సాంద్రబాణవర్షము గురిసెన్.
| 2308
|
| ఉ. |
రావణకార్ముకచ్యుతశరంబులు గన్గొని రాముఁ డస్త్రవి
ద్యావిదుఁ డుగ్రుఁ డై నిజశరాసన మెక్కిడి ముక్తకంచుకా
శీవిషతుల్యభల్లములు చెచ్చెర వేయుచు వాని నన్నిటిం
జేవ దలిర్ప దుత్తుమురు సేసె సుర ల్వెఱఁగంది చూఁడగన్.
| 2309
|
| క. |
రాఘవుని రావణుం డా, రాఘవుఁ డారావణునిఁ బరస్పరమును దో
ర్లాఘవ మొప్పఁగ వివిధశ, రాఘంబులఁ గప్పి రప్పు డతిసాంద్రముగన్.
| 2310
|
| క. |
ఒండొరులమీఁద నురవడిఁ, జండగతి న్బఱచు వివిధశరతతి యనిలో
నొండొంటిఁ దాఁకి మిక్కిలి, మండుచు సాంద్రముగ గగనమండలి నిండెన్.
| 2311
|
| వ. |
ఇట్లు మహాద్భుతప్రకారంబునం దలపడి సకలాస్త్రశస్త్రవిశారదులును బరాక్ర
మధుర్యులును మహేష్వాసులును రణకర్మనిపుణులు నగురామరావణులు సవ్యా
పసవ్యమండలప్రచారంబులం దిరుగుచుఁ బరస్పరచ్ఛిద్రాన్వేషంబు సేయుచు
విచిత్రక్రమంబులం జూపుచు యమాంతకసన్నికాశు లై చూపఱకు భయంబు
పుట్టించుచు రౌద్రరసోల్లాసభాసురవదను లై కదనవైశారద్యంబుఁ జూపుచుఁ
గాలమేఘంబులు వృష్టిధారలు గురియుచందంబున నిరంతరంబుగా నొండొరుల
మీఁద బాణవర్షంబులు గురియుచు నన్యోన్యజయకాంక్ష లినుమడింప దారు
ణంబుగాఁ బోరుచుండ నప్పుడు తదీయబాణవేగంబుఁ జూచి సర్వభూతంబులు
భయంబునం బఱచె నానావిధసాయకపరిచ్ఛన్నంబై గగనంబు విద్యున్మాలికా
సమాకులం బైనప్రావృణ్మేఘంబులచేతఁ బరిచ్ఛన్నం బైనపగిదిఁ జూపట్టె మఱియు
నయ్యంబరంబు శరవర్షంబున గవాక్షితం బైనచందంబునం దనరె నొక్కొ
క్కతఱి వజ్రాగ్నిస్ఫురితాననంబు లగుతీక్ష్ణాగ్రసాయకంబుల నభివృతంబై యాక
సంబు గాఢాంధకారపరివృతం బయ్యె నిట్లు సంధ్యాసమయసమావర్జితబలు లై
|
|
| |
కాలాగ్నికిం గల వేఁడిమియు యుగాంతాదిత్యునకుం గల తేజంబును గల్పాంత
వాయువునకుం గల వేగంబును బ్రళయకాలాంతకునకుం గల కోపంబును దమ
యందు నెఱసి మెఱయ వాసవవృత్రులకరణి గరుడపన్నగంబులమాడ్కి
సింహగజంబులపోల్కి విన్నాణంబుగాఁ జిరకాలంబు సంగ్రామంబు సలిపి
రాసమయంబున నమ్మహావీరులశరోర్ములు వాయుప్రసిద్ధంబు లైనమహోదధుల
మహోర్ములుంబోలెఁ దండోపతండంబు లై నభోమండలంబు నిండె నంత.
| 2312
|
| సీ. |
శక్రారి కోపించి సంసక్తహస్తుఁ డై లక్ష్మణాగ్రజునిలలాటమందు
గార్మకచ్యుతఘోరనిర్ముక్తసంకాశరమణీయనిశితనారాచమాల
నాటింప నమ్మహీనాథోత్తముఁడు దాని మహితనీలోత్పలమాలనట్ల
శిరమునఁ దాల్చి తత్తఱపాటు నొందక సంక్రుద్ధుఁ డై మంత్రజప మొనర్చి
|
|
| తే. |
కనుఁగొనలఁ దామ్రదీధితుల్ గ్రమ్ముదేర
నతధనుర్జ్యాసమాకర్షణం బొనర్చి
యుగ్రరౌద్రాస్త్రమంత్రప్రయుక్తఘోర
మార్గణము లేసెఁ బొగ లేనిమంట లెసఁగ.
| 2313
|
| క. |
శ్రేణీకృతంబు లై త, ద్భాణంబులు వేగ పఱచి దైత్యపతితను
త్రాణంబు దాఁకి వమ్మై, క్షోణిం బడెఁ గాని మేను సొర లేవయ్యెన్.
| 2314
|
| ఆ. |
దివిజరిపుఁ ఢభేద్యకవచుఁ డౌ టెఱిఁగి స, ర్వాస్త్రకుశలుఁ డానృపాత్మజుండు
వ్రేలు గఱచి మరల వేఱోక్కపరమాస్త్ర, మేసె బాహువీర్య మినుమడింప.
| 2315
|
| క. |
ఆయస్త్రమువలన వివిధ, సాయకజాలములు వొడమి సత్వరముగ దై
తేయపతిఁ దాఁకి బోరన, మ్రోయుచు ధరఁ బడియెఁ బంచముఖఫణులక్రియన్.
| 2316
|
| మ. |
అసురాధీశ్వరుఁ డిట్లు రాఘవునిదివ్యాస్త్రంబుఁ బో నేసి కో
పసముద్దీపితనేత్రుఁ డై కుపితసర్వప్రక్రియన్ రోఁజుచు
న్బస మీఱఁ శ్వసనాతివేగమున శుంభద్విక్రమాటోపుఁ డై
యసురాస్త్రం బడరించె సంతమస మాశాంతంబులం గ్రమ్మఁగన్.
| 2317
|
| వ. |
ఇట్లు సమంత్రకంబుగాఁ బ్రయోగించినఁ దన్మహనీయాస్త్రప్రభావంబున సింహ
శార్దూలకాకకంకసృగాలగృధ్రశ్యేనఖరకోకగజోష్ణవరాహశ్వానకుక్కుట
మకరాశీవిషేహామృగభల్లూకబలాకాచకోరవదనంబులును భయానకంబులును
నేకానేకముఖంబులు నగునిశితసాయకంబు లనేకంబులు జనించి గగనంబు
నిండినం గనుంగొని.
| 2318
|
| క. |
పావకనిభుఁ డగురాముఁడు, భావంబునఁ గోప మూఁది పరమోత్సాహ
శ్రీ విలసిల్లఁగ గ్రక్కునఁ, బావకశర మేసె దైత్యపాలునిమీఁదన్.
| 2319
|
| వ. |
ఇట్లు నిష్టాగరిష్టుం డై నిగిడించిన నాదివ్యాస్త్రంబువలన నగ్నిదీప్తముఖంబులును
వజ్రసూర్యసంకాశంబులును జంద్రార్ధచంద్రవక్త్రంబులును ధూమకేతుదనంసం
|
|
| |
బులును ధూమకేతువదనంబులును గ్రహనక్షత్రలపనంబులును మహోల్కా
ముఖసన్నిభంబులును విద్యుజ్జిహ్వోపమంబులు నగునానావిధనిశాతబాణంబు
లనేకంబులు వొడమి తండోపతండంబులై మెండుగా నభోమండలంబు నిండి
కొని దశాననప్రయుక్తకాండప్రకాండంబుల నెల్ల నిశ్శేషంబుగా విలయంబు
నొందించిన.
| 2320
|
| ఉ. |
ఆవిధ మంతఁ జూచి విపినాటబలంబులు వాయుపుత్రసు
గ్రీవనలాదియూథపులు ప్రీతియుఁ గౌతుక మొప్ప రాము బా
హావిభవాభిరాముఁ గొనియాడుచు దిక్కులు పిక్కటిల్ల ని
చ్ఛావిధి సింహనాదములు సల్పిరి వాలము లెత్తి యార్చుచున్.
| 2321
|
| ఉ. |
ఆరఘువంశవర్యుఁడు దశాననకార్ముకనిస్సృతాస్త్రమున్
దారుణభంగిఁ ద్రుంచి ప్రమదంబునఁ గ్రాలుచు నుండె నంత నా
ధీరుఁడు రావణుం కలిగి తేఁకువ మీఱ మయుండు మున్ను సొం
పార సృజించి యిచ్చినవరాస్త్రము నేయ నుపక్రమించినన్.
| 2322
|
| చ. |
ముసలగదాసిచక్రములు ముద్గరతోమరకూటపాశప
ట్టసపరిఘంబులుం బటుకుఠారనిశాతముసుంఠిశూలకుం
తసముదయంబు లొక్కమొగిఁ దత్సృథుచాపభవంబు లైయుగాం
తసమయమారుతంబులవిధంబున రోదసి నిండఁ బర్వినన్.
| 2323
|
| క. |
శూరనుతుఁ డుత్తమాస్త్రవి, శారదుఁ డగురాఘవుండు చయ్యన దానిన్
దారుణగాంధర్వాస్త్రము, వారక నిగిడించి త్రుండె వనచరు లలరన్.
| 2324
|
| క. |
దానవనాథుఁడు నిహతం, బైననిజాస్త్రమును జూచి యతికుపితుం డై
మానక సౌరాస్త్రంబును, బూని ప్రయోగించె రాజపుంగవుమీఁదన్.
| 2325
|
| ఉ. |
కలయ న్దాన జనించెఁ జక్రము లనేకంబు ల్విధూమాగ్నికాం
తులు పెల్లూరఁగ వానిచే గగన మెంతో దీప్తచంద్రగ్రహం
బులచే పోలెఁ బ్రదీప్తమై తనరె రాముం డుగ్రుఁడై మేటితూ
పుల నొక్కుమ్మడి వాని నన్నిటి వడిం బో నేసెఁ జిత్రంబుగన్.
| 2326
|
| క. |
హత మైననిజాస్త్రము గని, దితిజకులేశ్వరుఁడు క్రోధదీపనయనుఁ డై
శితశరము లేసె రఘువం, శతిలకు సర్వాంగమర్మసంధులు నాటన్.
| 2327
|
| క. |
ఆనరనాథకులేంద్రుఁడు, దానవకరనిస్సృతప్రదరవిద్ధుండై
మేను రుధిరంబు గ్రమ్మఁగ, మానుగ ధాతుయుతనగముపూడ్కి నచలుఁడై.
| 2328
|
| క. |
లోచనయుగమున శోణమ, రీచులు నిగుడంగఁ బేర్చి పృథులనిశితనా
రాచములు వఱపె నట దో, షాచరపతిసర్వగాత్రసంధులు నాటన్.
| 2329
|
విభీషణుఁడు రావణుని రథాశ్వంబులం జంపుట
| వ. |
ఆసమయంబున బలవంతుం డైనలక్ష్మణుండు సంక్రుద్ధుండై గిరికందరంబు నిర్గ
మించి వచ్చుదృప్తకంఠీరవంబుచాడ్పున నతిలాఘవంబునం జనుదెంచి రావణున
|
|
| |
కభిముఖుండై పావకునిసప్తార్చులం బోలినసప్తసాయకంబులు నిగుడించి తదీయ
కేతుదండంబు సప్తఖండంబులు చేసి యొక్కవెడందవాతియమ్మున సముజ్వలిత
కుండలం బైన సారథిశిరంబు డొల్లంజేసి పంచవిశిఖంబులఁ గరికరోపమం బైన
చాపంబు ముష్టికిం దెగవ్రేసె నంతలోన వైరిభీషణుం డగువిభీషణుండు కాల
దండసదృశం బైనగదాదండంబు బాహుదండంబులం బట్టి మిడుంగుఱులు
చదలంజెదర జిఱజిఱంద్రిప్పుచు మహావేగంబున రావణురథంబుపై కుఱికి కాల
మేఘసంకాశంబులును మహాపర్వతసన్నిభంబులు నగురథాశ్వంబులం బిలుకు
మార్చె నిట్లు దశముఖుండు హతాశ్వుండును హతసూతుండు నై రథంబుమీఁద
నుండి రయంబునఁ బుడమికి దాఁటి దశముఖంబులం జిడిముడిపాటు గదురఁ దీవ్రం
బగుక్రోధం బంగీకరించి దీప్తాశనివిధంబున వెలుంగునొక్కశక్తిం గొని విభీషణు
మీఁదం బ్రయోగించిన దాని నవలోకించి లక్ష్మణుండు శీఘ్రంబున మూఁడు
వాడిశరంబుల ముత్తునియలుగా ఖండించిన నది భిన్నయై కాంచనభూషణరోచు
లు వెలుంగ విస్ఫులింగపటలంబులు రాల నంతరిక్షంబున నుండి దెగి పడు
మహోల్కపగిదిఁ బుడమిం బడియె నత్తెఱంగున విలోకించి వానరులందఱుఁ బర
మానందభరితాంతఃకరణులై భూనభోంతరాళంబు నిండ సింహనాదంబుఁ జేసి
రంత.
| 2330
|
| సీ. |
యమవాయువరుణేంద్రయక్షేశ్వరాదుల కైన దురాసద యైనదాని
గమనీయవిపులాష్టఘంటారవాస్ఫోటితాజాండకర్పర యైనదాని
దృగ్భీకరాత్మీయతేజోధగద్ధగితాఖిలహరిదంత యైనదానిఁ
ననిశంబు గంధపుష్పాక్షతంబు లొసంగి యురుభక్తిఁ బూజించుచున్నదాని
|
|
| తే. |
నసురమాయావినిర్మిత యైనదాని, నఖిలపరిపంథిఘాతిని యైనదాని
దీప్తపావకశిఖ లుప్పతిల్లుదాని, నమితవజ్రాశనిప్రభ యైనదాని.
| 2331
|
| తే. |
అహికులేంద్రజిహ్వోపమ యైనదానిఁ, గనకభూషణకలితయై గ్రాలుదాని
శక్తి గొని రావణుఁడు విభీషణునిమీఁదఁ దీవ్రభుజశక్తి నిగిడింపఁ దివురునపుడు.
| 2332
|
| క. |
తనమది జీవితసంశయ, మున మిక్కిలి భయము నొంది మునుకొని దిక్కుల్
గనుఁగొనుచున్న విభీషణు, గనుఁగొని లక్ష్మణుఁడు కడఁగి కడువేగమునన్.
| 2333
|
| చ. |
అతనిఁ బిఱిందికిం దిగిచి యడ్డము నిల్చి మహోగ్రచాప ము
ద్ధతి సవరించి మార్వి నినదం బొనరించి నిరంతరంబుగా
నతులితశక్తిహస్తుఁ డగునద్ధశకంఠునిమీఁద బల్విడిన్
శితవిశిఖప్రవృష్టి గురిసెన్ మొరసెం బటునాద మయ్యెడన్.
| 2334
|
| ఉ. |
ఆశరవృష్టికిం దలఁక కవ్విభు లక్ష్యము సేయ కాజిలోఁ
గీశులవంకఁ బోక విముఖీకృతవిక్రముఁ డై గడంగి దై
త్యేశుఁడు తమ్మునిం దునుమ నెంతయుఁ బోరి తరంబు గాక వా
రాశిగభీరు లక్ష్మణుఁ గరం బలుకం బరికించి యిట్లనున్.
| 2335
|
| చ. |
జడత వహించి రాజసుత చావఁగఁ జూడకు మావిభీషణున్
విడువుము వీడ కిప్పగిది వీర్యముఁ జూపితివేని మండుచుం
గడువడి మత్కరాగ్రమునఁ గ్రాలెడు నిమ్మహనీయశక్తి బ
ల్వడి భవదీయవక్షము గలంచి వధించి చనున్ నిజంబుగన్.
| 2336
|
రావణుశక్తిచే లక్ష్మణస్వామి మూర్ఛిల్లుట
| వ. |
అని పలికి యద్దశగ్రీవుం డమ్మహనీయశక్తి లక్ష్మణుమీఁద వైచిన నది రావణ
బాహుపరిఘోత్సృష్ట యై దంష్ట్రాకరాళవదన యై జ్వలనజ్వాలాభీలయై శక్రా
శనిసమస్వనయై భీమవేగంబునం బఱతెంచుచున్నదాని నవలోకించి మహాత్ముం
డగురాముండు నిర్మలాంతఃకరణుం డై యీమహనీయశక్తివలన లక్ష్మణునకుఁ
బ్రాణభయంబు గలుగకుండెడు మని పలుకుచుండ నప్పు డమ్మహాశక్తి రయం
బునం జనుదెంచి లక్ష్మణుని వక్షంబు గాఁడిన నమ్మహావీరుండు శక్తినిర్భిన్నహృద
యుం డై దూలి రణమేదినిం బడియె నప్పు డవ్వీరో త్తమునియవస్థ విలోకించి
మహాతేజుం డగురాముండు భ్రాతృస్నేహంబున విషణ్ణహృదయుం డై దుఃఖ
బాష్పజలంబులు కన్నులం గ్రమ్ముదేర నొక్కముహూర్తంబు మౌనంబుఁ బూని
విషాదకాలంబు గాదని చింతించి సునిశితంబు లగుకాండసహస్రంబులు రావ
ణునిమీఁదం బరఁగించి బహుప్రయత్నంబున నతని నివారించి వెండియు రుధి
రావసిక్తసర్వాంగుం డై సపన్నగం బైనపర్వతంబుకరణి నేలం బడి యున్న
లక్ష్మణు నవలోకించి యతనిసమీపంబునకుం జనియె నప్పుడు బలవంతు లైన
హరిశ్రేష్ఠు లందఱు లక్ష్మణునికడకుం జని యతనిహృదయంబు భేదించి ధరణిం
గాఁడి యున్నశక్తిం బెఱుక సమర్థులు గాక రావణప్రయుక్తబాణపరంపరార్ధి
తు లై యూరకున్న నప్పు డారాముండు లక్ష్మణు డాసి కరికరోపమంబు లగుకరం
బుల నమ్మహాశక్తిం బెఱికి విఱిచివైచి దూరంబున నుండి రావణుండు సర్వాంగం
బులు నాట నురవడిం బ్రయోగించునారాచపరంపరలు గణింపక తృణీకరించి
లక్ష్మణుం గౌఁగిలించికొని సమీపస్థులైనహనుమదంగదసుగ్రీవజాంబవత్ప్రముఖ
వానరుల నిరీక్షించి యుగాంతాగ్నిచందంబున వెలుంగుచు వారల కిట్లనియె.
| 2337
|
| సీ. |
కపివర్యులార లక్ష్మణుఁ గాచికొనుఁ డిది లక్షింప శోకకాలంబు గాదు
ఘర్మాంతమునఁ జాతకంబున కొయ్యన నంబుదదర్శన మబ్బినట్లు
చిరకాక్షితం బైనగురుపరాక్రమకాల మిప్పుడు నా కబ్బె నీదురాత్ము
ననిలోనఁ దునిమి కృతార్థుండ నయ్యెద వినుఁడు నాదుప్రతిజ్ఞ విశ్రుతముగ
|
|
| తే. |
రావణుం డొండె నటు కాక రాముఁ డొండె, రామరావణు లిరువురు భూమి నునికి
గలుగనేరదు సత్యసంకల్ప మిదియ, పగఱ నణఁపక తక్కిన బ్రతుకు మేలె.
| 2338
|
| చ. |
అనుపమరాజ్యనాశము మహాగహనప్లవనంబు దండకా
వనపరిధావనంబు సురవైరిసమాగమనంబు జానకిన్
|
|
| |
దనుజుఁడు మ్రుచ్చిలించుటయు దైత్యులతోడ రణంబు గల్గు టీ
ఘనతరదుఃఖ మంతయును గ్రక్కున రావణుఁ జంపి పాసెదన్.
| 2339
|
| సీ. |
ఎవ్వానిఁ జంపుట కీమహీధరచరానీక మంతయు సమానీత మయ్యె
వాలి నెవ్వానికై వధియించి సుగ్రీవు రాజుఁ జేసితిఁ గపిరాజ్యమునకు
వనచరవీరు లెవ్వని వధింపఁగఁ బూని కడలిపై సేతువు గట్టి రెలమి
వరుస మీ ఱంద ఱెవ్వానివధార్థమై యనిఁ జేసితి రతిప్రయాస మలర
|
|
| తే. |
నట్టిపాపాత్ముఁ డైనదేవారి నాదు, దృష్టిమార్గంబునకు వచ్చి దివిరి నేఁడు
దృష్టివిష మైనకాలాహి దృష్టిఁ బడిన, జడునిచందాన బ్రదికిపోఁజాలఁ డింక.
| 2340
|
| క. |
హరిపుంగవు లందఱు భూ, ధరశిఖరాగ్రంబు లెక్కి తద్దయు వేడ్క
న్సురవైరికి నా కయ్యెఁడు, సురుచిరజన్యక్రమంబుఁ జూడుఁడు కడిమిన్.
| 2341
|
| క. |
సురసాధ్యయక్షకిన్నర, గరుడోరగసిద్ధు లెల్లఁ గడువడి మద్భీ
కరరణముఁ జూచి నేఁ డిటు, పరికింతురు నన్ను రామభద్రునిఁ గాఁగన్.
| 2342
|
| తే. |
ధారుణీచక్ర మెందాఁకఁ దలఁక కుండు
వరుస నెందాఁక సప్తార్ణవంబు లింక
కుండు నందాఁక మత్కృతయుద్ధకర్మ
మఖిలవిష్టపములు గొనియాడుఁగాక.
| 2343
|
| క. |
కపివీరులార యిఁక వి, ష్టపత్రయమునందుఁ గల్గు సంగరముల క
ట్లుపమానపాత్రమై మ, ద్విపులరణము చెల్లుఁ గాక విశ్రుతఫణితిన్.
| 2344
|
| క. |
అని పలికి రాఘవుఁడు కాం, చనభూషణభూషితోగ్రశరములు దనుజేం
ద్రునిమీఁదఁ బఱపెఁ గార్ముక, నినదంబులు గగనవీథి నిండి సెలంగన్.
| 2345
|
| క. |
సురవైరియుఁ గోపంబున, సురుచిరనారాచవృష్టి క్షోణీంద్రునిపైఁ
గురియించెఁ గాలజలదము, గురుశైలముమీఁద వృష్టి గురిసినమాడ్కిన్.
| 2346
|
రామరావణుల యుద్ధము
| వ. |
ఇట్లు మహాద్భుతప్రకారంబునం దలపడి రణంబు గావించునప్పు డారామరావణ
కార్ముకవినిస్సృతనిశాతశిలీముఖంబు లొండొంటిం దాఁకుచు నుగ్రనిర్ఘోషంబు
లును బరస్పరసంఘర్షణంబునం బుట్టిన మంటలును గోదండచండగుణటంకా
రంబులును భువనభయంకరంబు లై నభోమండలంబు నిండె నంతఁ గొంతవడికిఁ
దత్సాయకంబులు విశీర్ణంబు లై యంతరిక్షంబున నుండి మహోల్కల
భంగిఁ బుడమిం బడియెఁ దదీయజ్యాతలనిర్ఘోషంబు విని సర్వభూతంబులు
విభిన్నహృదయంబు లై భయంబునం బఱచి రయ్యాయోధనం బద్భుతోపమం
బయ్యె నంత నమ్మహీకాంతుని బాణంబు లనంతంబు లై దిగంతంబులు నిండి
గాఢసంతమసంబు గావించిన నయ్యంపవాన వారింప నలవి గాక దశగ్రీవుండు
వెగడువడి సింహంబుముంగలి మదవారణంబుమాడ్కి దీనవదనుం డై నిలువ
|
|
| |
నోపక భయవిహ్వలితగాత్రుం డై రణభూమి విడిచి కచభారంబులు వీడఁ గమ
నీయరత్నఖచితభూషణవ్రాతంబు కనుకనిం జెదరం జరణాభిహతి మహీచక్రంబు
కంపిల్లఁ దొలంగి లంకకుం బాఱి యంతఃపురంబు సొచ్చి నొచ్చినయంగంబులు
సవరించుకొని కొండొకసేపు సేద దీర్చికొని లజ్జాభయవిషాదంబులు మొగం
బునం దోఁప నేమియుం దోఁపక నిజపత్ని యగుమందోదరి రావించి యద్దేవి
తోడఁ బెద్దయుం బ్రొద్దు చింతించి యి ట్లనియె.
| 2347
|
శ్రీరాములచే దెబ్బలు దిని రావణుండు మందోదరితో విలపించుట
| సీ. |
ఏమని చెప్పుదు నింతిరో నేఁ డుగ్రరణమునఁ గల్గుపరాభవంబు
రాముండు లయకాలభీమునికైవడి నత్యుగ్రమూర్తియై యచలసార
మగువింట ఘంటారవార్భటుల్ సెలఁగంగ జ్యావల్లి సవరించి సాంద్రభంగి
విలయకాలాభ్రంబు వృష్టిని గురియించు కరణి సాయకవృష్టి గురియఁ జేసె
|
|
| తే. |
నమ్మహాసాయకనికాయ మబ్ధివేగ
మనుకరించి యవార్య మై యరుగుదెంచి
దీవిచందాన నను ముంచె జీవితంబు
దక్కఁ గొని వచ్చినాఁడ యత్నంబుతోడ.
| 2348
|
| చ. |
అనలునికన్న వేఁడిమి బలాంతకవజ్రముకన్న వాఁడిమిన్
ఘనతరకాలదండమునకన్న నమోఘత మారుతంబుక
న్నను గడువేగమున్ గలిగి దాశరథిప్రవిముక్తఘోరమా
ర్గణములు కాలసర్పములకైవడిఁ దాఁకి కలంచె మర్మముల్.
| 2349
|
| చ. |
హరిహయుతోడఁ బోరితి ధనాధిపుతో సమరం బొనర్చితిన్
వరుణయమాగ్నికోణపతి వాయుదినేశులతోడ ఘోరసం
గర మొనరించితి ఫణిజగత్పతితోడ రణంబు సల్పితిన్
సరసిజనేత్ర తద్విశిఖసంతతి కింతరయంబు లే దొగిన్.
| 2350
|
| ఆ. |
హరుని కంటిమంట లవి సహింపఁగ వచ్చుఁ, గాని రామశరనికాయ మించు
కయు సహింపరాదు కంటివె జల్లెడ, కంత లయ్యె నాదుగాత్ర మెల్ల.
| 2351
|
| సీ. |
జగము లన్నియు మ్రింగఁజాలుపరాక్రమోదీర్ణుండు మనకుంభకర్ణుఁ డీల్గె
నింద్రాదిదిక్పాలహృచ్ఛూల మైనవీరోత్తముం డలశక్రజిత్తు మడిసె
నీతిసారజ్ఞవిఖ్యాతి వాటించిన ఘనతేజుఁ డయ్యతికాయుఁ డడఁగె
ననిలోన మాణిభద్రాదులఁ దోలిన చండవీర్యుఁడు ప్రహస్తుండు గెడసె
|
|
| తే. |
నఖిలరణములయందు మున్నారితీరి, నట్టిజెట్టిజోదులు మకరాక్షవజ్ర
దంష్ట్రదేవాంతకాదిప్రధానదైత్య, వరులు గూలిరి రణమందు హరులచేత.
| 2352
|
| ఆ. |
అఖిలభువనవిజయ మర్మిలిఁ గావించి, యసురవిభుఁ డనంగ ఖ్యాతి వడసి
యమరవర్యు లూడిగములు సేయఁగ ధాత్రి, వన్నె గన్నయేను భంగపడితి.
| 2353
|
| క. |
దాశరథిబాణములు ఘో, రాశీవిషనిభము లగుచు నద్భుతభంగిన్
రాశీభూతము లై రా, నోసరక సహింప నెవ్వఁ డోపు మృగాక్షీ.
| 2354
|
| చ. |
సురపతివజ్రము హరునిశూలము కాలునిదండమున్ ధనే
శ్వరుగదయుం బయోధిపతిపాశము నైరృతరాజఖడ్గము
న్దురమునఁ జీరికిం గొనక దోర్బలశక్తి వెలుంగునేను సం
గరమున నొక్కమర్త్యువిశిఖంబులఁ జిక్కితి నేమి చెప్పుదున్.
| 2355
|
| క. |
ఏలాగు రాఘవుని నే, నాలంబునఁ గడచువాఁడ నాతనిరూపం
బాలోకించినయంతనె, కాలుం డనుసంశయంబు గలిగెడుఁ దన్వీ.
| 2356
|
| చ. |
నయవిదుఁ డావిభీషణుఁడు నాఁ డటు నీతి యెఱుంగఁ బల్క దు
ర్నయమున నేను గైకొనక గ్రక్కునఁ బ్రో ల్వెడలంగఁ బుచ్చితిన్
నియతమనస్కుఁ డాతఁ డొగి నేర్పునఁ జెప్పినమాట లన్ని త
ద్దయు నిజ మయ్యె నేఁడు వనితా యిపు డేమన నేమి కాఁదగున్.
| 2357
|
| క. |
దివియందు జలధులందును, భువియందును దిక్కులందు బూర్ణము లై రా
ఘవునిపటుదివ్యబాణము, లవిరళగతి నిండియున్నయట్లుగఁ దోఁచెన్.
| 2358
|
| క. |
కను మూసినఁ గను విచ్చిన, ఘనుఁ డారాఘవుఁడు మ్రోలఁ గన నయ్యెడు వే
యన నేల భువన మంతయు, వనితా రామమయ మగుచు వారక తోఁచెన్.
| 2359
|
| వ. |
దేవీ నా కిప్పు డొండుశరణంబు లేదు దర్పకదర్పహరణుండును జంద్రకిరీటాలం
కృతమస్తకుండును మందాకినీసరిత్సలిలపూరితజటాజూటుండును వ్యాఘ్ర
చర్మాంబరధరుండును విభూత్యనులిప్తసర్వావయవుండును నాగయజ్ఞోపవీతధరుం
డును గజచర్మోత్తరీయుండును ద్రిశూలాలంకృతకరుండును భక్తానుగ్రహవిగ్ర
హుండును శైలజావిభూషితవామభాగుండును సకలలోకశంకరుండు నగుశంక
రుని శరణంబు నొందెద నప్పరమేశ్వరుండు తొల్లి మదీయసంగీతంబునకు మెచ్చి
పరమదయాళుండై యెప్పు డేనియు నీకరులవలన సంగ్రామంబునఁ బరాజయంబు
గలుగునప్పుడు నన్ను నుద్దేశించి హోమంబు గావింపు మవ్వేలిమి విఘ్నంబు
లేకుండఁ భారంబు నొందెనేని వహ్నికుండంబున నుండి దివ్యాశ్వసమన్వితం
బైనదివ్యరథంబును దివ్యాస్త్రంబులును దివ్యకవచశరాసనతూణీరంబులునుం
బొడము నమ్మహనీయసాధనంబులు గైకొని రణంబున కరిగితి వేని గెలు పవశ్యంబు
గలుగు నని యాదేశించెం గావున నే నిప్పు డమ్మహానుభావు నుద్దేశించి హో
మంబు గావించెద నని పలికి శీఘ్రంబున సుస్నాతుండై ధౌతాంబరంబులు
ధరించి యొక్కశివాలయంబునకుం జని యం దొక్కవేదిక నిర్మించి మంత్ర
విదు లగుబ్రహ్మరాక్షసుల యాజకులుగా నియమించి సమిత్కుశలాజపుష్పాక్ష
తాదికంబులు సంగ్రహించి బలవంతు లగురాక్షసులఁ జుట్టునుం గాపువెట్టి
హోమంబు గావింప సమకట్టిన నప్పు డచ్చటికిఁ దలోదరి యగుమందోదరి చను
దెంచి నిజభర్త నవలోకించి యి ట్లనియె.
| 2360
|
శివునిఁ గూర్చి హోమము సేయ సమకట్టినరావణునకు మందోదరి నీతి గఱపుట
| సీ. |
దనుజేంద్ర యిట్లేల మునివృత్తి దాల్చెదు ధరణి వీరున కిది ధర్మ మగునె
మున్ను నీచే రణంబున నోడి పాఱినవేల్పు లీచందంబు విన్న నగరె
దంతిరథాశ్వపదాతిసంకుల మైనబలము నీ కది చాలఁ గలిగి యున్న
దది గాక మును రజతాచలం బెత్తిన కరము లిర్వది నీకుఁ గలిగి యుండఁ
|
|
| తే. |
గొఱఁత యేమి బలంబులఁ గూర్చి హోమ
కృత్య మది మాని విక్రమౌద్ధత్య మడరఁ
గలని కిపు డేగి పగతుల గెలువు మలఁతి
సేఁతఁ బౌరుషభంగంబు సేయ నగునె.
| 2361
|
| ఉ. |
ఇంత భయంబు గల్గిన మహీసుత నప్పుడు దెచ్చి తత్సతీ
కాంతునితో నకారణముగా నిటు వైరము గొంటి వేల నేఁ
డింతకు వచ్చినం దలఁకి యిట్లు తపించినఁ బోనె యేటి
చింత దొలంగఁ బెట్టి యని సేయఁగ నేగుము ధైర్యశాలివై.
| 2362
|
| చ. |
మనుకులవర్యు రాఘవుని మానవమాత్రునిఁగాఁ దలంచితో
యనిమొన దేవదానవులకైన నసాధ్యుఁ డతండు విల్లు గై
కొనిన జగత్రయంబు నొకకోలనె భస్మము సేయఁ జాలు న
య్యనఘునిబాహుశ క్తికి ఖరాదులచా వది సాక్షి గా దొకో.
| 2363
|
| క. |
నీపేరు విన్నయంత ది, శాపాలురు సోమరవులు శైలగుహలలో
నేపఱి తనువులు వడఁకఁ బ్ర, తాప ముడిగి యడఁగి యుండ్రు తద్దయు భీతిన్.
| 2364
|
| తే. |
అధిప నీ కేమి కొదవ మాయాజలంబు, శస్త్రబలము దోర్బలమును సైన్యవితతి
గలిగి యున్నది చాల సంగరమునందు, మనుజపతి గెల్వు మిఁక వేఱుమాట లేల.
| 2365
|
| వ. |
అని పలికిన నద్ధశముఖుండు ప్రియురాలివచనంబులకు లబ్దించి హోమకృత్యంబు
చాలించి తత్సమేతంబుగా నభ్యంతరమందిరంబునకుం జనియె నంతరాముండు
పదునాలవనాఁటిరాత్రి యుద్ధంబున నడురేయి రావణశక్తినిహతుం డై రుధి
రోక్షితసర్వాంగుం డై గాఢమూర్ఛాపారవశ్యంబునం బడి యున్నసౌమిత్రి
నవలోకించి శోకపరీతచిత్తుం డై సుషేణున కిట్లనియె.
| 2366
|
మూర్ఛితుం డగులక్ష్మణునిం జూచి రాముఁడు విలపించుట
| సీ. |
అనఘాత్మ రణధీరుఁ డైనయీసౌమిత్రి రహి దశాననశక్తినిహతుఁ డగుచుఁ
బన్నగేంద్రునిమాడ్కిఁ బరివేష్టితాంగుఁ డై యుద్ధమేదినిఁ బడియున్నవాఁడు
కడఁగి ప్రాణంబులకంటెఁ బ్రియుం డితఁ డరుదార రుధిరసిక్తాంగుఁ డగుచు
నిబ్బంగిఁ బడియుండ నెట్లు చూడఁగ నోర్తు నురుశోకము జనించుచున్న దకట
|
|
| తే. |
భవ్యలక్షణయుక్తుండు పరమభక్తుఁ డితఁడు పంచత్వ మొందిన నింక నాకు
జీవితం బేల సుఖ మేల సిగ్గు వొడము, చున్న దెంతయు నాశౌర్య మెన్నికొనిన.
| 2367
|
| చ. |
కరమున నుండి కార్ముకము గ్రక్కున జాఱఁదొణంగె నేత్రముల్
పొరిఁబొరి శోకబాష్పపరిపూర్ణము లయ్యె శిలీముఖౌఘముల్
కరము నశించె గాత్రములు కంపము నొందెడు శౌర్య మింకె న
బ్బురముగఁ దీవ్రచింత మదిఁ బుట్టె నహా యిఁక నేమి సేయుదున్.
| 2368
|
| తే. |
అని పలికి నష్టచేష్టుఁ డై యవని వ్రాలి, యున్నతమ్ముని దుఃఖార్తి నుగ్రశక్తి
హతు బహిశ్చరప్రాణంబు నట్ల చూచి, తీవ్రశోకాభితప్తుఁ డై దిగులు గొనుచు.
| 2369
|
| తే. |
అంగములు నొచ్చి యున్నవి యనుజుఁ డెట్లు
బ్రతుకువాఁ డని తలపోసి భయము నొంది
గాత్రములు కంప మొందఁగ గాఢశోక
వివశుఁ డై విలపించి నవ్వీరవరుఁడు.
| 2370
|
| చ. |
తక్కక ప్రాణతుల్యుఁ డగుతమ్ముఁడు దానవశక్తివిద్ధుఁ డై
మిక్కిలి ధూళి బ్రుంగి రణమేదినిపైఁ దగ వ్రాలె నింక నా
కెక్కడిసీత యేటిబ్రతు కెక్కడిరాజ్య మిఁ కేటిసంగరం
బక్కట వీనియట్ల చను టంతియె కార్యము వేఱె యున్నదే.
| 2371
|
| వ. |
అని యిత్తెఱంగున విలపించుచు శోకవిజ్వలితేంద్రియుండును వివేష్టమానశరీ
రుండు నై దైన్యంబున దుఃఖించుచు సారెసారెకు నిట్టూర్పు నిగిడించుచున్న
రాము నవలోకించి మందమధురాలాపంబుల నాశ్వాసించుచు సుషేణుం డిట్ల
నియె.
| 2372
|
| సీ. |
లోకేశ నీ కింత శోకింప నేటికి లక్ష్మివర్ధనుఁ డైనలక్ష్మణుండు
మృతుఁడు గాఁ డిదె చూడు మితనివక్త్రమున వైవర్ణ్యంబు నిష్ప్రభత్వంబు లేదు
కడు సుప్రసన్న మై కాంత మై సుప్రభాకలిత మై యున్నది కరతలంబు
పద్మపత్త్రంబులపగిదిఁ జూపట్టెడు నయనంబు లివె ప్రసన్నత వహించి
|
|
| తే. |
ప్రాణయుక్తు లై యున్నవారలకె గాక, యిట్టిరూప మప్రాణుల కేల గల్గు
నితఁడు జీవించియున్నవాఁ డిది నిజంబు, మది విషాదంబు నొందకు ముదితతేజ.
| 2373
|
| తే. |
నాసికారంధ్రనిర్గతోచ్ఛ్వాసమాన్య
కలితకాంతి ముహుర్ముహుఃకంపమాన
హృదయ మిత్యడు సప్రాణుఁ డై యెసఁగుచున్న
చంద మెఱిఁగించుచున్నవి జనవరేణ్య.
| 2374
|
| క. |
అని పలికి రాఘవేంద్రుని, మనమునఁ గలసందియంబు మాన్చి సుషేణుం
డనఘాత్ముఁ డైనమారుత, తనయునిఁ దనమ్రోలఁ జూచి తడయక పలికెన్.
| 2375
|
హనుమంతుండు సంజీవనీపర్వతమును దేఁబోవుట
| సీ. |
అనిలకుమార నీవజనందనుఁడు మున్ను చెప్పిన యోషధిశిఖరికడకుఁ
దడయక చని దానిదక్షిణశిఖరంబు నందుఁ బ్రసిద్ధంబులై విశల్య
|
|
| |
కరణియు సంధానకరణియు సౌవర్ణకరణియు సంజీవకరణి యనఁగ
దివ్యౌషధులు నాల్గు తేజరిల్లుచు నుండు వానిఁ గైకొని తెచ్చి మానికముగ.
|
|
| తే. |
నింపుతో లక్ష్మణుని బ్రతికింపు మనిన, నట్ల సేయుదు ననుచు నయ్యతిబలుండు
వేగ శైలంబుకడ కేగి వెదకిమందు, లన్నియును గొని తెత్తుఁ గా కనుచుఁ బూని.
| 2376
|
| వ. |
రాఘవేంద్రస్తుతివచనాకర్ణనజనితమహోత్సాహప్రవర్ధమానశరీరుం డై విక్ర
మోదీర్ణుం డైనత్రివిక్రమదేవునిభంగిం జూపట్టుచు భూచరఖేచరపయోధిచరభూ
తవ్రాతంబులగుండె లవియ నొక్కమహానాదంబుఁ జేసి సముద్రప్రాంతకాంతా
రమండితం బైనయొక్కకొండ యెక్కి యమ్మహామహీధరంబు మహీతలంబు
నం గ్రుంగఁ బాదంబు లూఁది గగనంబున కెగసి విష్ణుకరపరిముక్తంబైనసుద
ర్శనచక్రంబుకైవడి నతిదుర్నిరీక్షుం డై మహావేగంబున నుత్తరాభిముఖుం డై
పోవుచుండె నప్పు డావృత్తాంతంబు చారులవలన విని దశగ్రీవుం డొక్కింత
సేపు విచారించి యర్ధరాత్రసమయంబున నెవ్వరికిం గానరాకుండఁ దాటకేయుం
డగుమారీచుపుత్త్రుమందిరంబునకుం జని యెడ నెడ నెదు రైనయాతుధాను
లందఱుఁ గాలుం డని శంకించి భయంబునఁ దొలంగిపాఱ నొక్కవెరవున
వాని డాయం జనియె నప్పుడు రావణునిరాక యెఱింగి శీఘ్రంబున నెదు
ర్కొని వినయంబునం దోడి తెచ్చి యొక్కయుచితాసనంబున నాసీనుం జేసి
యర్ఘ్యపాద్యాదినానావిధోపచారంబులు గావించి యంజలి గీలించి మెల్లన
నిట్లనియె.
| 2377
|
| చ. |
ఉడుగక యేను జేయుపని యున్న ననుం బిలిపింప కక్కటా
నడునిశ మీకు రాఁ దగునె నాథుఁడ వీ వఖిలాసురాళి కి
వ్వడువున నొంటి నిచ్చటికి వచ్చినకార్యము నానతిమ్ము నేఁ
గడువడి దానిఁ దీర్చెదను గట్టిగ నోపిన నోపకుండినన్.
| 2378
|
రావణుఁడు కాలనేమిని హనుమంతునకు విఘ్నము సేయ నియోగించుట
| ఉ. |
నా విని రావణుండు కదనంబున మద్ఘనశక్తి లక్ష్మణుం
డావిధి మూర్ఛితుం డయిన నాతని వే బ్రతికింపఁ బూని యు
ర్వీవరుపంపునం బ్లవగవీరుఁడు మారుతనందనుండు సం
జీవని దేర ద్రోణగిరిఁ జేరఁగఁ బోవుచు నున్నవాఁ డొగిన్.
| 2379
|
| శా. |
మారీచాత్మజ నీవు తండ్రిపగిదిన్ మాయ ల్తగ న్నేర్తు వే
పారం ద్రోవకు నడ్డ మేగి కదనం బత్యుద్ధతిన్ సల్పి య
వ్వీరుం జంపుము గానిచోఁ దెరువునన్ విఘ్నంబు గావింపు మా
నీరేజాప్తుఁడు వచ్చునందనుక నీనేర్పుల్ రిపుల్ మెచ్చఁగన్.
| 2380
|
| క. |
ఇనుఁ డుదయించినపిమ్మట, మనుజవిభునితమ్ముఁ డుర్వి మనఁజాలఁడు గా
వున నంతదనుక నీనే, ర్పున విఘ్నము సేయు మసురభూషణ నెమ్మిన్.
| 2381
|
| వ. |
ఇందు కొక్కయుపాయంబు గలదు దాని నీ కెఱింగించెద ద్రోణగిరిసమీపం
బున నొక్కయగాధం బైనసరోవరంబు గల దది దేవనిర్మితం బందు ఘోరం
బైనయొక్కమహాగ్రాహి నివసించి యుండు నది యింద్రాదిదేవతల నైన
మ్రింగంజాలు దానినోరం బడి గ్రమ్మఱ బ్రతికివచ్చుట కెవ్వండును సమర్థుండు
గాఁడు నీ వచ్చట మాయామయం బైనయొక్కమహనీయతాపసాశ్రమంబు
నిర్మించి యం దొక్కమునివై యుండి యుపాయబలంబున హనుమంతు సక్కొ
లనికడకుం బుచ్చు మతం డమ్మకరిచేత మ్రింగంబడినవాఁ డై మృతుం డగు
దానం జేసి మనయుద్యోగం బంతయు సఫలం బగు నీ విక్కార్యంబు గావించి
కీర్తి పడయు మని పలికిన నమ్మారీచనందనుం డతని కి ట్లనియె.
| 2382
|
కాలనేమి రావణునకు బుద్ధులు గఱపుట
| సీ. |
దనుజవల్లభ నీవు దలఁచినకార్యంబు వల దని పలుక నెవ్వారివశము
నీవు పంచినయట్ల నేర్చినవిధమునఁ జేసెద వంచనఁ జేయ కిపుడు
ప్రాణుల కెపు డైనఁ బంచత గలుగుట సిద్ధంబు ప్రాణేచ్ఛచేతఁ గాదు
నాకుఁ దోఁచినభంగి నయవాక్య మొక్కటి చెప్పెదఁ గృపఁ జేసి చిత్తగింపు
|
|
| తే. |
మధిప మాయయ్య మును మీభయంబువలన
నరిగి రామునిఘోరశరార్తి గెడసె
నమ్మహాత్మునిపేరు విన్నంత గుండె
లవియుచున్నవి యింక నేమని వచింతు.
| 2383
|
| చ. |
ఖరుఁ డనిఁ గూలె దూషణుఁ డకంపనుఁడుం ద్రిశిరుండుఁ జచ్చి రా
గురుభుజు లౌప్రహస్తుఁడును గుంభనికుంభులుఁ గుంభకర్ణుఁడున్
హరిహయతుల్యవీర్యుఁ డగునయ్యతికాయుఁడు మేఘునాథుఁడున్
మఱియు ననేకరాక్షసులు మానక కూలిరి శైలసన్నిభుల్.
| 2384
|
| ఉ. |
తెంపున నేగి జన్యమున ధీరుని రాముని సాయకంబులం
జంపుట యొండెఁ గానియెడ జానకి నిచ్చి చలంబు మాని ర
క్షింపు మటంచు భక్తి నతిసేయుట యొండె నిశాటనాథ ద
ర్చింపఁగ నొం డుపాయ మిఁకఁ జెల్లదు మాటలు వేయు నేటికిన్.
| 2385
|
| క. |
అనుజుని రావించి ముదం, బున లంకారాజ్య మిచ్చి భూపుత్రిని రా
మున కొసఁగి తాపసుఁడ వై, వనమున కేగు మిట నుండ వల దిఁకమీఁదన్.
| 2386
|
| వ. |
అని పలికిన విని యాగ్రహోదగ్రవ్యగ్రమానసుం డై దశగ్రీవుం డుగ్రప్రేక్ష
ణంబుల నిరీక్షించి చంద్రహాసంబు గొని వానిం దెగవ్రేయుట కడరిన వాఁడు
భయంబు గొని నీ కింతకోపం బేల నీ పంచినయట్ల గావించెద నని పలికి వలగొని
నమస్కరించి యనుజ్ఞ వడసి మనోజవంబునం బఱచి దశగ్రీవోపదిష్టప్రదేశంబునఁ
దనమాయచేత నతిరమణీయంబుగా నొక్కయాశ్రమంబు నిర్మించి కపటముని
వేషంబు దాల్చి మిథ్యాజపంబు సేయుచు హనుమదాగమనంబు ప్రతీక్షించు
|
|
| |
చుండె రావణుం డంతఃపురంబునకుం జని చింతాకులమానసుండై నిద్ర వేగిం
చుచుండె నట హనుమంతుండు జాంబవత్సుషేణోపదిష్టమార్గంబున ద్రోణా
ద్రికిం బోవుచుండ నప్పుడు మార్గంబునందు.
| 2387
|
| మ. |
వృజినాత్ముం డగుకాలనేమి యిచటన్ నిమ్నంబు గావించఁగా
ద్విజరూపంబున నున్నవాఁ డితని దోర్వీర్యంబునం జంపి సం
ఖ్యజయంబుం గొన రమ్మటంచు సుతు వేడ్కం బిల్వ నేతెంచె నాఁ
గ జగత్ప్రాణుఁడు వీచె సర్వసుమనోగంధాఢ్యుఁ డై పైపయిన్.
| 2388
|
| శా. |
నానాచిత్రమనోజ్ఞకాంతివిలసన్నక్షత్రమాలాంచితా
నూనానంతపథంబుచందమున నన్యూనప్రభావిస్ఫుర
త్సూనాచ్చాదితవృక్షషండ మగుచున్ శోభిల్లుదీవ్యన్మహో
ద్యానం బొక్కటి గాననయ్యె ధనదోద్యానంబు గ్రేడించుచున్.
| 2389
|
| సీ. |
మందారకుందమాకందపుష్పమరందబిందుపానావశేందిందిరంబు
పరిపక్వదాడిమీఫలబీజఖాదనోన్మదకీరమృదునాదనాదితంబు
లలితరసాలపల్లవఖాదనోన్మాదకలకంఠకులకంఠకలనినాద
మభ్రంకషానోకహాగ్రనిషణ్ణమయూరసంఘాతకేకారవంబు
|
|
| తే. |
నగుచు నభినవమణిగణస్థగితకనక, పట్టభూషితమేదినీపద్మగంధి
నీలవేణిచందంబునఁ గ్రాలు చునికి, నద్భుతానందములు మది నావహిల్ల.
| 2390
|
| మ. |
గరిమన్ ము న్నలజాంబవంతుఁ డనుపంగా నేను సంజీవనీ
కరణిం దేఁ జనునప్పు డిట్టివనమున్ గన్నట్ట దిచ్చోట నేఁ
డరుదారం గనుపట్టుచున్నయది భ్రాంతాత్ముండ నై ద్రోణభూ
ధరముం జేరెడుత్రోవ దప్పితినొ హృత్సందేహమున్ గల్గెడిన్.
| 2391
|
హనుమంతుఁడు మునివేషధరుం డగుకాలనేమియాశ్రమమునకుఁ బోవుట
| చ. |
ఇది యొకతాపసేంద్రవన మిచ్చట నొక్కవిరించినన్నిభుం
డుదితయశుండు మౌనివరుఁ డుండఁగఁబోలు సమగ్రభక్తిఁ ద
త్పదముల కేను మ్రొక్కి, వితతంబుగ నమ్మహనీయమూర్తిచే
ముదమొనఁ ద్రోవచొ ప్పెఱిఁగి పోయెదఁ గా కని నిశ్చితాత్ముఁ డై.
| 2392
|
| సీ. |
మాకందఖర్జూరమాలూరమందారకింశుకశింశుపావంశతిలక
జంబీరజంబూకదంబనింబకదంబవటకపిద్ధాశ్వత్థకుటజనీప
మాతులుంగలసంగ మాధవీధవలుంగ నారంగపున్నాగనాగపూగ
తాలతక్కోలతమాలహింతాలరసాలసాలాంకోలకోలతూల
|
|
| తే. |
శేలుకృతమాలకుద్దాలపీలునీల, భూర్జకస్ఫూర్జకార్జనసర్జకాది
వివిధతరుశోభితం బయి వెలయునమ్మ, హావనంబు ప్రవేశించి యవలఁ జనుచు.
| 2393
|
| సీ. |
వరకుసుమౌఘసంపదకు నివాసమై బలవైరియుద్యానవనముపగిది
ననిశంబు పుణ్యజనానందకారియై రహి మించునలచైత్రరథముభంగి
|
|
| |
నలశుకాదివనప్రియద్విజోపేత మై నైమిశాఖ్యమహావనంబుమాడ్కి
నిరుపమశైలభూనీలకంఠవిలాసవైభవం బై కామ్యవనమురీతి
|
|
| తే. |
నలరుచు నదృష్టపూర్వమై యక్షిహృదయ
హారి యై యద్భుతానందకారి యై ని
తాంతరుచి నొప్పుచున్నది తపసివిపిన
మహహ యేమందు దీనిశోభాతిశయము.
| 2394
|
| మ. |
ప్రసవోత్క్షిప్తరజోవిభూతియు మరుద్వ్యాధూతశాఖాశిఖా
విసరోత్పింగజటాచయంబు కుసుమోత్పీడాళిరుద్రాక్షలున్
బసమీఱ న్ధరియించి నిశ్చయతపఃప్రారూఢిమైఁ బొల్చుతా
పసులున్బోలెఁ జెలంగుపాదపములం బార్శ్వంబులం జూచుచున్.
| 2395
|
| చ. |
పురుషులతోఁ బెనంగొనిన భూరిపయోధరభారనమ్రసుం
దరతరగాత్ర లైనయెలనాగలనట్ల తదాశ్రమంబునం
దరువులతోఁ బెనంగొనిన నవ్యఘనస్తబకాభిరామబం
ధురరుచిరోలపంబుల మనోజ్ఞగతిం బరికించె నత్తఱిన్.
| 2396
|
| సీ. |
పొదరిండ్లలోనఁ గ్రోల్పులులు శంబరములమూఁపులు నాకుచు ముచ్చటాడఁ
దుండముల్ సాఁచి వేదండచయంబులు కంఠీరవంబులఁ గదియ దిగువఁ
గాకోదరంబులు కడువేడ్క ముంగుల మూతులు నాకుచు ముద్దులాడ
నెలుకలుఁ బిల్లులు నేకమై యొకచోట నవిశంకబుద్ధిఁ జెల్లాటమాడఁ
|
|
| తే. |
దక్కినమృగవ్రజంబు లండజము లొకట
విగతజాతివైరంబు లై వెలయుచుండఁ
జూచి మునిశేఖరునితపస్స్ఫూర్తిమహిమ
కాత్మ నలరుచు నడుదారి నరిగియరిగి.
| 2397
|
| సీ. |
సమ్యక్ఫలితచూతజంబూఫలస్రవద్రసధార లేఱు లై వసుధఁ బాఱఁ
దరువిటపాగ్రపతత్సూనరాసులు రురుదంపతులకుఁ బఱువులు గాఁగ
గుంజావినిర్మితకుంజపుంజంబులఁ గస్తూరిమృగము లుత్కలికఁ జూప
వైడూర్యవర్ణశాడ్వలతలంబుల రణత్కేకీగణంబు సంక్రీడ సల్ప
|
|
| తే. |
లలితకిసలయకుసుమపల్లవమరంద
గంధము గ్రహించి శీతలగంధవహుఁడు
పుప్పొడిదుమార మంతటఁ బొలియ ఘ్రాణ
హారి యై వీవ నవ్విపినాంతరమున.
| 2398
|
| వ. |
ఇట్లు బహువిధగుణోపేతంబై నేత్రమనఃకాంతంబై యదృష్టపూర్వశోభారమ
ణీయంబై నానాతరులతావితానకలితం బై మధువాపీశతశోభితం బై శుద్ధ
స్ఫటికసవర్ణసుధోపమాననిర్మలసలిలపూరితదీర్ఘకాశాసంకులంబై యొప్పు నవ్వన
మువిలాసంబు నంతనంతఁ గనుంగొనుచుఁ జని చని తన్మధ్యదేశంబున.
| 2399
|
| చ. |
విపులగతిన్ శుకంబు లటువేదములం జదువం బికంబు ల
య్యుపనిషదర్థజాతము సుయుక్తిఁ బ్రసంగము సేయ శారికల్
చపలత శాస్త్రవాదములు సల్పఁగఁ దేంట్లు సుతానగీతముల్
నిపుణతఁ బాడ నొప్పు నొకనిర్మలపర్ణకుటిప్రదేశమున్.
| 2400
|
| ఆ. |
కాంచి మానసమునఁ గౌతుకంబు ముదంబు, సంభ్రమంబు చాల సందడింప
భయము భక్తి మెఱయఁ బరశాలాంతర, సీమ నంచితముగఁ జేరి యందు.
| 2401
|
| సీ. |
పొలుపొంద నెమ్మేన భూతిరుద్రాక్షలు దాల్చి కాషాయవస్త్రము ధరించి
కపిలవర్ణసవర్ణ విపులజటాజాలబంధంబు శిరమునఁ బాదుకొలిపి
దండంబు సలిలకమండలు లిరువంక నలవరించి స్వనాసికాగ్రమందుఁ
జూడ్కులు నాటించి సురుచిరయోగాసనంబునఁ గూర్చుండి నయనయుగళ
|
|
| తే. |
మరయ నర్ధనిమీలితం బై తనర్పఁ
దివిరి జపమాలపూసలు ద్రిప్పికొనుచుఁ
గపటమునివేషధారి యై కపటజపము
సలుపు కాలనేమిని గాంచి సంభ్రమమున.
| 2402
|
| తే. |
అతని నిక్కము మునియ కా మతి దలంచి, వినయవినమితగాత్రుఁడై విమలభక్తి
వందన మొనర్చి పేశలవాగ్విశేష, మెసఁగ నమ్మాయతపసితో నిట్టు లనియె.
| 2403
|
| ఉ. |
మౌనివరేణ్య యేను హనుమంతుఁడ మారుతపుత్రుఁడన్ గుణ
శ్రీనిధి రాఘవుం డనుప జీవదదివ్యమహౌషధీలతన్
జానుగఁ దేర ద్రోణగిరి చక్కటి కేగుచుఁ ద్రోవ దప్పితిన్
దానితెఱంగుఁ జెప్పి కరుణ న్ననుఁ బ్రోవుము సత్వరంబుగన్.
| 2404
|
| వ. |
మునీంద్రా డప్పి న్బడలియున్నవాఁడ నివ్వనంబున నిర్మలతోయం బైనజలా
శయం బొక్కటి గలదేని యానతిమ్మని యడిగిన నమ్మాయతపసి హనుమంతున
కిట్లనియె.
| 2405
|
కాలనేమి హనుమంతునితో వంచనోక్తులు పలుకుట
| సీ. |
వాయునందన రఘువర్యుండు లక్ష్మణజానకీసహితుఁ డై కాననమున
నుండ రాక్షసవల్లభుండు జానకి నెత్తుకొని పోవుటయు రాజకుంజరుండు
వనచరోపేతుఁ డై వారాశి బంధించి లంకకుఁ జనుటయు లక్ష్మణుండు
రావణశక్తిచే రణరంగమున మూర్ఛ నొందుటయును నీవు పొందుపడఁగ
|
|
| తే. |
నవనినాయకుఁ డంపఁ ద్రోణాద్రి కేగి, కడిమి మెఱయ సంజీవనీకరణినామ
కౌషధంబు తేఁ బోవుట యంత యేను, యోగదృష్టిచేఁ గనుఁగొనియున్నవాఁడ.
| 2406
|
| వ. |
కపీంద్రా నీవు సర్వలోకహితకరుం డైనరామునకు భృత్యుండ వగుటం జేసి
నాకు మిక్కిలి పూజనీయుండ వైతి వమ్మహాత్మునికార్యంబు నీకుంబోలె నాకు
నవశ్యకర్తవ్యంబై యుండు నే నిప్పు డొక్కమంత్రంబు నీ కుపదేశించెద దా
నిం బ్రతిగ్రహించితి వేని నీ కభీష్టలాభసిద్ధి యగు ధృతియు మరియు దృష్టి
|
|
| |
యు దాక్ష్యంబు నెప్పుడు నశింపకుండు సంగ్రామంబున శత్రుజయంబు గలుగు
మఱియు నమ్మంత్రప్రభావంబున దివ్యౌషధులు తమయంతం దాము పొడ
సూపు నదియునుం గాక మదీయాశ్రమంబున నమృతకల్పంబు లైనపక్వఫలం
బులు సమృద్ధంబులై యున్నవి వీని నుపయోగించి సుధోపమం బైనమదీయక
మండలుజలంబు ద్రావి యీరాత్రి యిచ్చట వసియించి సంజీవన్యాదిదివ్యౌ
షధు లిచ్చటనే యున్నవి గావున వానిం గొని ప్రభాతకాలంబున యథేచ్ఛం
జనుము మత్ప్రసాదంబున క్షణమాత్రంబులోన లంకాపురంబు ప్రవేశించెద
పని పలికిన విషమిశ్రమధూపమం బైనవానివచనంబు విని యవ్వాయునందనుం
డమ్మాయాముని కిట్లనియె.
| 2407
|
| సీ. |
మౌనిశేఖర నీకమండలుజలమున దప్పి దీఱదు నాకుఁ దడయ కిప్పు
డివ్వనంబున హ్రద మెచ్చోటఁ గలిగిన నచ్చటి కరిగెద నానతిమ్ము
లంకాపురంబులో లక్ష్మణుం డటు మూర్ఛ నొందియుండఁగ నారఘూత్తముండు
వ్యసనియై యుండ నేఫలములు గొని యెట్లు భుజియింతు నిట నిద్ర వోదు నెట్లు
|
|
| తే. |
ప్రొద్దు పొడిచిన నారాజపుత్రకుండు, మనఁడు గావున నిచ్చోట మసలఁదగదు
మాన కీరాత్రి యెటులైన మందులు గొని, శీఘ్రజవమున లంకకుఁ జేరవలయు.
| 2408
|
| క. |
అని పలికినఁ గృత్రిమముని, విని యప్పుడు మందహాసవికసితముఖుఁ డై
యనిలతనూజునిఁ గనుఁగొని, ఘనతరగౌరవము మెఱయఁగా నిట్లనియెన్.
| 2409
|
కాలనేమి హనుమంతునకు నొకసరస్సును జూపించుట
| ఉ. |
ధీరవరేణ్య తూర్పుదెస దివ్యసరోవర మొప్పుచున్న దిం
పారఁగ శీఘ్రగామి వయి యచ్చటి కేగి సుధోపమానత
న్నీరము దప్పి దీఱఁ గొని నేర్పున మాకడ కీవు గ్రమ్మఱం
జేరఁగ రమ్ము సత్కరుణఁ జెప్పెద నీ కొకమంత్రరాజమున్.
| 2410
|
| క. |
మారుతసుత నీ వచ్చటఁ, గోరికఁ గడుపార నీరు గ్రోలు నపుడు సొం
పారఁగ నయనద్వంద్వము, వారక మూసికొని ద్రావవలయుం జుమ్మీ.
| 2411
|
| క. |
అని పలికి యొక్కశిష్యుని, మునుకొని తో డిచ్చి పనుప మోదంబున న
వ్వనచరవీరుఁ డతఁడు చూ, పినతెరువున నరిగి యొకవివిక్తతలమునన్.
| 2412
|
| శా. |
కాంచెం బావని నిర్మలస్ఫటికసంకాశామృతోదారముం
బ్రాంచద్భంగచలన్మయూరబకచక్రక్రౌంచసంచారముం
బంచాస్త్రప్రదరీకృతస్ఫుటితపద్మశ్రేణికాధారముం
జంచత్కోమలచంచరీకపరిషజ్ఝంకారకాసారమున్.
| 2413
|
| వ. |
మఱియుఁ గుసుమితాభినవసుగంధబంధురమాధవీమాలతీమల్లికైలాలతాశతా
కీర్ణకుంజకుటీరరంజితతీరప్రదేశం బగుదానిఁ దటరుహవిటపివిటపపటలభూషాయ
మానపరిపక్వమాకందజంబుజంబీరఫలరంధ్రగళన్మధురసప్రవాహప్రసరణం
బగుదానిఁ గన్నెమావికొమ్మలజిబురుగొన్న కెందలిరుజొంపంబులు మెక్కి నిక్కి
|
|
| |
యున్మదావస్థ నెక్కొనఁ గుహూకారంబులు సేయుకలకంఠంబులకంఠకలకలం
బులు మదనాస్త్రమంత్రంబు లై యలర సురభికుసుమమకరందరసాస్వాదనపరవ
శేందిందిరఝంకారంబులు మౌర్వీటంకారంబులయందంబు పొందుపఱపఁ బరి
పక్వదాడిమీఫలబీజగ్రసనసముత్థసముత్సాహకీరగీరమావిలాసంబు రమాకు
మారునియుదారకీర్తికథాగానసంపదసొంపు సంపాదింప విరహిణీజనమృగం
బుల వేఁటాడుటకుం జనుదెంచిన పుష్పబాణునిమృగయాస్థానంబుభంగిఁ జెలంగు
దాని మఱియును.
| 2414
|
| సీ. |
మలయమరుత్పోతచలితపుష్పలతాప్రసూనసౌరభసాంద్ర మైనదానిఁ
బద్మకుట్మలమిళద్బంభరస్వనముల వలరాజుకీర్తనల్ పాడుదాని
నుడివోక పొలయుపుప్పొడిగందవడి వనసారసపాణిపైఁ జల్లుదానిఁ
బృథులోర్మిడోలికాప్రేంఖన్మరాళికాకలనాదములఁ దన్నుఁ బిలుచుదానిఁ
|
|
| తే. |
గలితవుష్కరశోషరేఖావికీర్ణ, లలితశీతలవాలుకాతలనిషేవి
తాంచితరథాంగసారసక్రౌంచమిథున, చారురవముల మిగుల నొప్పారుదాని.
| 2415
|
| సీ. |
అనిశంబు నాశ్రయించిన హంసతతులకు విడక తామరతూండ్లు గుడువ నిచ్చి
వదలక గీపెట్టు కొదమతుమ్మెదలకు విరులతేనియ లిచ్చి విందు చేసి
యభ్యాగతుం డైనయలసవాయువునకుఁ గుసుమసౌరభ మిచ్చి కూర్మి నెఱపి
తనచుట్ల నున్నయున్నతతరులతలను బుష్కరకణములు పోసి పెంచి
|
|
| తే. |
మత్స్యకచ్ఛపనక్రకూర్మద్విరసన, ముఖనిఖిలజంతుసంతానములకు నియత
మైనయాహార మిడి తనయఖిలభువన, జీవనత్వంబు తెల్లంబు సేయుదాని.
| 2416
|
| సీ. |
వికచపద్మోత్పలవీక్షణంబులు గల్గి రమణీయచక్రస్తనములు గల్గి
రుచిరశైవాలశిరోరుహంబులు గల్గి నవ్యమరాళయానంబు గల్గి
పృథుతరావర్తగంభీరనాభియుఁ గల్గి విలసితకల్లోలవళులు గల్గి
వితతసైకతతలోన్నతనితంబము గల్లి లలితమృణాళదోర్లతలు గల్గి
|
|
| తే. |
సుందరాకృతిఁ గైకొన్నసుదతివోలెఁ, గన్నులకు వేడ్క సేయుచు నున్నదాని
మానససరోవరంబుచందాన మదికి, నరుదు పుట్టించునమ్మహాసరసిఁ గాంచె.
| 2417
|
| ఉ. |
ఈగతిఁ గాంచి వాయుసుతుఁ డింపు దలిర్పఁగ దాని డాయగా
నేగి తదీయశైవలము నీవల నావలఁ బాయఁదట్టి లీ
లాగతి గంధసింధురములాగున భూరిఘనంబువైఖరిన్
బాగుగఁ దజ్జలం బతిపిపాసితుఁ డై వడిఁ ద్రాగుచుండఁగన్.
| 2418
|
ముసలి హనుమంతుని బట్టి మ్రింగుట
| క. |
చింతింపక మును మకరము, పంతంబున దంతిరాజుఁ బట్టినమాడ్కిన్
వింతగ నొకమకరి హనూ, మంతునిపాదములు పట్టె మచ్చర మొప్పన్.
| 2419
|
| వ. |
ఇ ట్లతిఘోరరూపిణి యైనమహాగ్రాహి మునిదత్తశాపవిమోచనంబు గావించి
రక్షింపవే యని ప్రార్థించుకైవడి నమ్మహావీరునిచరణంబులు పట్టిన దాని విలో
|
|
| |
కించి బలవంతుం డగుహనుమంతుండు వజ్రాశనిసమస్పర్శం బైనవాలంబున
దానిదంతంబులు విఱుగం బ్రహరించి వైనతేయుండు మహాసర్పంబుం బోలెఁ
దీక్ష్ణనఖంబులఁ గఠోరకంటకభరితం బైనదానినాలుక వెలికిం బెఱికి వైచిన
నది యంతటం బోక రయంబున.
| 2420
|
| ఉ. |
అంబుచరంబుబల్మి మెఱయం బటుదారుణతప్తలోహపిం
డంబును లోలెఁ బావని ననంతపరాక్రమదుర్నివారు శీ
ఘ్రంబునఁ బట్టి మ్రింగె యలుకన్ మునివల్లభదత్తశాపరో
గంబు హరింప భేషజముఁ గాంక్షమెయిం దగ మ్రింగుకైవడిన్.
| 2421
|
| సీ. |
ఆసమయంబున ననిలతనూభవుం డిఁక నేమి సేయుదు నెద్ది తెఱుఁగు
దారుణగ్రాహిణి తప్పక ననుఁ బట్టి దిగిచి మ్రింగఁ దొణంగె దీనిచేతఁ
జావంగ వలసెనో జనవల్లభునికార్య మెట్లగునో తమ్ముఁ డింపు మెఱయ
జీవింపకున్న సుగ్రీవవానరచమూసహితుఁ డై పొలియునో జనకపుత్రి
|
|
| తే. |
విభునిపా టంతయును విని విమతి నొంది, చచ్చునో సూర్యవంశయశంబు కీశ
వంశకీర్తి నశించునో పరఁగ దైవ, మేమి గావింప నున్నదో యింకమీఁద.
| 2422
|
హనుమంతుండు మొసలిగర్భంబు చించి దానిం జంపుట
| వ. |
అని యించుక విచారించి కలవళింప నేల యిప్పు డల్పగాత్రుండనై దీనియుదరం
బు ప్రవేశించి వధింతుఁ గాక యని నిశ్చయించి యంగుష్ఠమాత్రుం డై గరళపు
ముద్దయుంబోలె మండుచు గాఢాంధకారభరితగుహాసదృశం బైనదానికుక్షి
లోనం బ్రవేశించి మహార్ణవమధ్యంబునం బరిభ్రమించుబడబానలంబుచందం
బున నేర్చుచు శరీరంబుఁ బెంచి వజ్రాయుధసంకాశంబు లైనకరరుహంబుల
దానియుదరగతంబు లైననరములు ద్రెంచి నెమ్ములు చూర్ణంబులు చేసి మాం
సంబుఁ జెక్కి సంధులు నుఱుము గావించి ప్రేవులు ముద్ద చేసి యూపిరి వెడలి
రాకుండఁ గంఠబిలంబున కడ్డంబుగాఁ ద్రోచిన నమ్మకరి తదీయవేదన సహింపం
జాలక యిది నాకు నఱుగునాహారంబు గాదు దీన నిక్కంబుగా మరణంబు
సిద్ధించు నని తలంచి యుల్లోలకల్లోలంబులు కడలకుం బఱవ నమ్మహాసరోవర
మధ్యంబునఁ బరిభ్రమించుచు నూపిరి వెడలక కొండొకసేవునకుఁ బంచ
త్వంబు నొందె నప్పుడు తదీయవదనకర్ణనాసారంధ్రవినిస్స్రుతశోణితధారాప్రవా
హంబున నమ్మహాసరోవరసలిలంబు సిందూరితం బయ్యె నంత నమ్మరున్నంద
నుండు దానియుదరంబు భేదించి వెలుపలికి నిర్గమించి ఘోరం బైనమకరి
కళేబరం బీడ్చికొని శీఘ్రంబునఁ దత్సరోవరతీరంబుఁ జేరి రక్తసిక్తాంగుండై ఘనీ
భూతం బైననీహారంబు విరియఁ దట్టి ప్రకాశించుచున్న బాలదివాకరునిపొలు
పునం దేజరిల్లుచు విధుంతుదవదనవినిర్గతుం డైనశశాంకునిపొంకంబున నతి
ప్రియదర్శనుం డై యొప్పె నంత.
| 2423
|
ధాన్యమాలినికి మకరరూపంబు వదలి యప్సరోరూపంబు వచ్చుట
| సీ. |
తనయచిరత్వంబు దలఁగఁబెట్టి తనుత్వ మరుదారఁ గైకొన్నమెఱుఁగుభంగి
సతతంబు గగనసంచారంబుపై రోసి ధరణికి వచ్చినతారపగిది
నందనోద్యానంబునం దున్కి మాని యుర్వర జనించెడుకల్పవల్లి మాడ్కి
ముజ్జగంబుల నెల్ల మోహింపఁ జేయంగ స్మరుఁడు పంపినపుష్పశరముకరణిఁ
|
|
| తే. |
దనువు గైకొని వెలికి వచ్చినసరోంబు
బింబితమనోజ్ఞశశికరణంబురీతి
మాకరాంగంబు విడిచి యమ్మకరి యపుడు
సుందరాకారయువతి యై చూడ నొప్పె.
| 2424
|
| సీ. |
బంభరీభూషితపంకేరుహంబులు నలువొప్ప నయనాననములు సేసి
జలభంగసంచలచ్చారుచక్రంబులు రమణీయకుచనితంబములు సేసి
భూరిసౌరభలుబ్ధపుష్పంధయశ్రేణి తీ రైనజడయు నూఁగారు సేసి
పొందుగా విరిసిన కెందమ్మిఱేకులు చరణయుగ్మాధరోష్ఠములు సేసి
|
|
| తే. |
మొలకనవ్వులు నునుదొడ ల్వలుఁదచెక్కు
లలరునాభియుఁ గలదు లే దనెడుకౌను
వఱల సాక్షాత్కరించిన సరసిలక్ష్మి
వైఖరిఁ జెలంగుచున్నయవ్వనితఁ జూచి.
| 2425
|
| ఉ. |
మారుతి యేమిచిత్ర మిది మాకరరూపము మాని భూరితే
జోరమణీయమూర్తి యగుసుందరి యై కన నయ్యెడి స్మరు
త్సారసనేత్రయో భుజగచంపకగంధియొ యక్షకాంతయో
చారుజలాధిదేవతయొ జవ్వని యంచుఁ దలంచుచుండఁగన్.
| 2426
|
| చ. |
అతులసువర్ణరత్నరచితార్కసమానవిమానరాజ మ
ద్భుతగతి నెక్కి కార్మెఱుఁగుపోలిక నింగి వెలుంగఁజేయుచున్
స్మితరుచిజాల మవ్విపినసీమకు వెన్నెలతేటఁ జూపఁగాఁ
జతురతఁ బల్కెఁ బావనికి సాంద్రసుధారసధార లొల్కఁగన్.
| 2427
|
| ఉ. |
మారుతి నీప్రసాదమున మాకరరూపము వీడి నేఁటి కి
చ్చో రమణీయభంగిఁ గడుసొంపుగఁ దాల్చితి దివ్యదేహ మిం
పారఁగఁ బూర్వజన్మసుకృతాతిశయంబు ఫలించి దుఃఖముల్
దీఱెఁ గృతార్థ నైతి నిఁక దేవజగంబున కర్థి నేగెదన్.
| 2428
|
| సీ. |
అనిలనందన యిది మునితపోవని గాడు దితిజమాయావినిర్మితవనంబు
దశకంఠుపనువునఁ దాటకేయసుతుండు తనమాయచే దీనిఁ దగ సృజించి
తాపసవేషంబుఁ దాల్చి నీ కంతరాయము సేయ నిచ్చటి కనిపె నిన్ను
వీనిమాటలు నీవు విశ్వసింపఁగ రాదు తెగువగా వీని వధించి పుచ్చి
|
|
| తే. |
ద్రోణధాత్రీధరమున కీత్రోవ నేగి, కోర్కి దివ్యౌషధంబులు గొని రయమున
లంకకుం జని సంప్రీతి లక్ష్మణునకు, నిడి బ్రతుకఁ జేసి సత్కీర్తి వడయు మయ్య.
| 2429
|
| వ. |
కపీంద్రా యేను ధాన్యమాలిని యనుపేరం బరఁగునప్సరఃకాంతను మహాత్ముం
డైనశాండిల్యమునిశాపంబున నీసరోవరంబునందు మకరినై యుండు టెఱింగి
యున్నవాఁ డగుటం జేసి రావణుండు నాచేత నిన్నుఁ జంపించువాఁడై మారీచ
నందనుం డైనకాలనేమి యనువాని మహామాయు నొక్కరాక్షసుం బనిచిన
వాఁ డిమ్మాయావనంబు నిర్మించి కపటమునివేషంబుఁ దాల్చి యుపాయబలం
బున ని న్నిచటికిం బనిచె నేను శాపవశంబున నజ్ఞాతభవత్ప్రభావనై నిన్నుంబట్టి
మ్రింగితి నీవు మహాబలవంతుం డగుటం జేసి నన్ను వధించి కుశలి వై తీరంబు
నకుం జనుదెంచితి నేను భవత్ప్రపాదంబున మునిదత్తశాపవిముక్త నై ఘోర
గ్రాహీరూపంబుఁ బరిత్యజించి యెప్పటియట్ల దివ్యరూపంబు ధరించి కృతార్థ
నైతి నింకఁ బురందరునికొలువునకుం జనియెద ననుజ్ఞ యొసంగు మని పలికిన
విని యమ్మరున్నందనుం డాశ్చర్యరసావిష్టచిత్తుం డై యవ్వరారోహ కి ట్లనియె.
| 2430
|
| క. |
శమభూషణులు జితేంద్రియు, లమలాత్ములు పుణ్యు లతిదయాళురు మౌనుల్
కమలేక్షణ శాండిల్యుఁడు, శమము విడిచి నీకు నేల శాపం బిచ్చెన్.
| 2431
|
| క. |
అని యడిగిన నద్దివిష, ద్వనితామణి ముద్దుగుల్కుఁబల్కులఁ దేనెల్
చినుకఁగ మెల్లన నిట్లని, వినిపించెను దనదుపూర్వవృత్తాంతంబున్.
| 2432
|
ధాన్యమాలిని తనపూర్వవృత్తాంతంబు హనుమంతునకుఁ జెప్పుట
| శా. |
లోకస్తుత్యచరిత్ర శంభుసభ నాలోకింప నే నొక్కనాఁ
డాకైలాసనగాధిరాజమున కుద్యత్ప్రీతితో నేగి య
స్తోకప్రౌఢిమ లాస్యము ల్సలుప సంతోసిల్లి మన్నించి నా
కీకళ్యాణవిమానరాజ మొసఁగెన్ హేమాద్రిధన్వుం డొగిన్.
| 2433
|
| చ. |
అది మొద లేను శంకరునియానతి గైకొని దీని నెక్కి స
మ్మదమున సర్వలోకములు మానుగ నిచ్చలు సంచరించుచు
న్వదలక యొక్కనాఁడు కపివర్య మనోహరపద్మసౌరభా
స్పద మగునిమ్మహాసరసివారివిహారము సల్పుచుండఁగన్.
| 2434
|
| చ. |
అపరిమితప్రభావుఁడు మహామహుఁడు న్మృగచర్మధారియు
న్గపిలజటాచ్ఛటాధరుఁ డకల్మషభూతివిలిప్తగాత్రుఁ డై
తపనునికైవడిన్ దెస లుదగ్రరుచి న్వెలుఁగంగఁ జేయుచున్
దపసి యొకండు నాకడకుఁ దప్పకఁ జేరఁగ వచ్చి యిట్లనున్.
| 2435
|
| తే. |
ఏను శాండిల్యనామమునీశ్వరుండ, దూరమున నీతనుద్యుతిఁ బాఱఁ జూచి
చక్కనిమెఱుంగుఁదీఁగెయో చంద్రకళయొ, యని పరీక్షింప వచ్చితి నబ్జవదన.
| 2436
|
| సీ. |
మోహనగాత్రి నీమోమున కెన యైనజలజాతచయ మిందుఁ గలిగి యునికిఁ
గువలయగంధి నీకుచములతో సాటి యగుచక్రవాకంబు లలరు చునికి
|
|
| |
నెలఁత నీనిడుదపెన్నెఱులకుఁ దుల యైనమృదులశైవలలతల్ వొదలుచునికి
గజరాజగమన నీకనులకు జో డైననీలోత్పలము లిందు నెగడు చునికి
|
|
| తే. |
నీసరోవరలక్ష్మితో నీసు పూని
తమ్ములు మునుంగఁ జక్రముల్ తలఁగి పాఱ
శైవలము దూలఁ దొవలు సంచలత నొందఁ
గలఁచెదవ యేమి చెప్పుమా కాంత యిపుడు.
| 2437
|
| చ. |
సుదతిరొ దాఁచ నేల నినుఁ జూచినయప్పటినుండి మన్మథుం
డదయతఁ దిగ్మబాణముల నారట పెట్టఁగ సాగె ధైర్యము
న్వదలితి నింక నే నొకక్షణం బయిన న్నిలుపోపఁ జాల నీ
యధరసుధారసం బొసఁగి యంగజతాపము దీర్పవే దయన్.
| 2438
|
| సీ. |
మానినీమణి నీదుమధురాధరము గన్నయంతనే యనురాగ మావహిల్లె
శుకవాణి నీకురుల్ చూచినయంతనే ఘనతరమోహాంధకార మొదవెఁ
గలకంఠకంఠి నీకనులయందముఁ జూచినంతనే చపలత్వ మంకురించె
నలినాయతాక్షి నీనడుముఁ జూచినయంతఁ బలుమఱు నొడలఁ గంపము జనించె
|
|
| తే. |
రమణి నీపీనవక్షోరుహములఁ జూచి
డెందమునఁ గొంతధైర్యంబు నొంది యున్న
వాఁడఁ గౌఁగిట గదియించి వలపు మించి
యింపు సొంపార రతులఁ దేలింపు మబల.
| 2439
|
| వ. |
అని పలికిన నేను భయకంపితాంగి నై వినయంబున నమ్మునివరున కిట్లంటి.
| 2440
|
| చ. |
అనఘచరిత్ర పాపనిలయంబు తపఃఫలహానిహేతుకం
బనవరతంబు ఘోరనరకాస్పదము న్బుధలోకనిందితం
బును గులధర్మనాశకరము న్బరలోకపథావరోధకం
బును వెలయాలిపొందు మిముబోఁటి మహాత్ములు గోరఁ బాడియే.
| 2441
|
| క. |
నా విని యమ్మునినాథుఁడు, భావజపరిముక్తబాణబాధితుఁ డగుచున్
గేవలపరితాపంబున, నావదనముఁ జూచి పలికె నమ్రుం డగుచున్.
| 2442
|
| చ. |
పడఁతిరొ నీకటాక్షశరపాతవిభిన్నహృదంబుజుండ నై
బడలితి నోర్వఁజాల నిఁక బంధకి వౌ నినుఁ బొంది ప్రాణము
ల్విడువక నేఁడు గాచికొని వెండియు భూరితపంబుపెంపునం
బడయఁగ రాదె పుణ్యము దివంబును బావనధర్మసంపదన్.
| 2443
|
| ఉ. |
కోమలి నేఁడు నీవు నను గూడక కాదని త్రోచి పుచ్చినం
గామశితాస్త్రపాతమున గాసిలి ప్రాణము నిల్వ దెంతయున్
బ్రేమ సుధార్ద్రదృష్టిఁ గని వేడుక మీఱఁ బరిష్వజించి భా
షామధురత్వ మేర్పడఁగ సంగమసౌఖ్య మొసంగి ప్రోవవే.
| 2444
|
| వ. |
అని పెక్కుతెఱంగులం బ్రార్థించిన మాఱువలుకంజాలక యియ్యకొని మునీం
ద్రా యే నిప్పుడు రజస్వల నై యున్నదాన నేఁడు ప్రథమదివసంబు దినత్రయం బతీ
తంబైనపిమ్మటఁ బరిశుద్ధ నై నాలవనాఁడు మీయొద్దకుం బఱతెంచెద నందాఁకఁ
దాల్మి వహించియుండవలయు నని పలికిన నత్తాపసేంద్రుండు సమ్మతించి
యథేచ్ఛం జనియె నంత నేను గంధమాదనపర్వతంబునకుం జని యం దొక్క
పుష్పోద్యానంబునందుఁ జంద్రకాంతశిలాఫలకంబుమీఁద సుఖాసీన నై వీణా
దండం బంకించి పాణిపంకజరత్నకంకణఝణఝణత్కారంబు తాళమానం
బులు దెలుపఁ దరుణపల్లవసుకుమారాంగుళులచేతఁ దంత్రులు మీటుచు రాగ
సంపద లేర్పడ శ్రుతిమనోహరంబుగా గీతప్రబంధంబులు పాడుచుంటి నంతకు
మున్న రావణుండు దిగ్విజయార్థం బరిగి దైవయోగంబున నాఁటిరేయి సేనా
సమేతంబుగా నమ్మహామహీధరంబుమీఁద విడిసి యంత నంత నప్పర్వతవిలా
సంబులు గనుంగొనుచు నేకాంతంబుగాఁ జనుదెంచి నాయున్న పుష్పోద్యానంబు
ప్రవేశించి మధురం బైనమదీయగానస్వనం బాలకించి శీఘ్రంబున నాకడకుం
జనుదెంచి తదీయభయంకరరూపసందర్శనసంజాతభయభ్రాంత నై వాతాందో
ళితనూతనవల్లియుం బోలె వడంకుచున్న నన్ను విలోకించి యంగజరాగమత్తుం
డై యిట్లనియె.
| 2445
|
| మ. |
కమలాక్షీ విను మేను రావణుఁడ లంకానాథుఁడన్ దోఃప్రతా
పమహోదగ్రుఁడ సర్వదైత్యవిభుఁడన్ భాషేశవిశ్రాణితో
త్తమనానావరుఁడన్ ద్రిలోకజయ ముద్యచ్ఛక్తిఁ గావించి దు
ర్దమలీలం జరియించువాఁడను మహాధన్యుండ నే నన్నిటన్.
| 2446
|
| ఉ. |
కాంతరొ యేమి చెప్ప నినుఁ గాంచినయప్పటినుండి బల్విడిన్
గంతులతాంతశాతశరకంపితగాత్రుఁడ నైతి నింక నా
కెంతయు నీదుమోవిమధు విచ్చి కవుంగిట గారవించి గి
ల్గింతలు సల్పి వేడ్క రతికేళి నను న్వలయింపు మిత్తఱిన్.
| 2447
|
| సీ. |
హరిచక్ర మఱచేత నవలఁ దట్టిననన్నుఁ జెలి నీదుజఘనంబు చిక్కువఱచె
గోత్రారివజ్రంబు గోట మీటిన నన్నుఁ గలికి నీచూడ్కులు గాసిపఱచె
శయములఁ గైలాసశైల మెత్తిననాకు గఱిత నీపాలిండ్లు ఘనతఁ జూపె
భుజగలోకాధీశుఁ బొడిచి గెల్చిననన్ను వెలఁది నీవేనలి వెతలఁ బెట్టె
|
|
| తే. |
వనిత నాపౌరుషంబు సర్వము నడంచెఁ, జారుభవదీయసుందరాకారలీల
నీకు దాసుఁడ నైతిని నెనరు గల్గి, సురతసుఖ మిచ్చి ప్రోవుము సురభిలాంగి.
| 2448
|
| తే. |
అంబురుహపత్రనేత్ర నాయంతవాఁడు, బంటుగతి వేఁడుకొనినఁ గాదంటి వేని
యవనిలో రతిసారజ్ఞ లైనసతులు, నిన్ను నిందింపరే యవినీత వనుచు.
| 2449
|
| చ. |
అని యిటు వల్క నేను నయమార దశానన యే రజస్వల
న్ననుఁ గదియంగ రా దనిన నవ్వుచు వాఁడు రజస్వల ల్పరాం
|
|
| |
గనలును మద్యసేవినులు గల్గినచోఁ గడు లెస్స మాకుఁ గ్ర
మ్మినతమి నంటి కాంతల రమించుట ధర్మము దైత్యపాళికిన్.
| 2450
|
| చ. |
అని తమకంబుపెంపున దశాస్యుఁడు న న్బలిమిన్ గ్రహించి గ్ర
క్కున మధురాధరామృతము గ్రోలుచు మర్మములం గలంచుచున్
దనియక పెక్కుగాఢసురతక్రియల న్నను గాసిపెట్టెఁ బె
ల్చన సలిలాశయం బటు లులాయము సొచ్చి కలంచుకైవడిన్.
| 2451
|
| వ. |
ఇట్లు శిలోచ్చయకఠినవిగ్రహుం డైనరావణుండు భోగించివిడిచిన నేను మహా
వాతలోలితపుష్పలతయుంబోలె నాకంపితాంగి నై బడలి యుంటి నప్పుడు
నాకు సద్యోగర్భంబున శైలసంకాశదేహుండును ఘనారావసమనిస్వనుండును
భోగీంద్రభోగకల్పదీర్ఘబాహుండును విశాలశిలాఫలకసమానవక్షుండు నగు
నొక్కపుత్రుం డుద్భవించిన నక్కుమారున కతికాయుం డనునామం బిడి
వానిం దోడ్కొని రావణుండు యథేచ్ఛం జనియె నంత నేను దివసత్రయం
బతిక్రమించిన నాలవనాఁడు కృతాభిషేక నై ధౌతపరిధానంబు ధరియించి
మణిమండనపుష్పదామచందనద్రవంబులచేత నలంకృతాంగి నై మనోహరా
కారంబుతో శాండిల్యునికడకుం జని మహాత్మా పరిశుద్ధ నై చనుదెంచితి
నింక నావలన నిష్టోపభోగంబు లనుభవింపు మని పలికిన నమ్మహాత్మం డతీతా
నాగతవృత్తాంతాభిజ్ఞుండు గావున మనంబున రావణకృత్యం బంతయు నెఱింగి
కోపారుణితలోచనుం డై నా కిట్లనియె.
| 2452
|
| సీ. |
వనజాక్షి నాయొద్ద వర్తించుచుండి నీ వన్యునిఁ బొందుట యర్హ మగునె
చలితమానసుఁడ నై కులట వౌనీమీఁద వేడ్కఁ జేసితి నెంత వెఱ్ఱి నైతి
జలధరచ్ఛాయలు చంచలాదీప్తులు జలరేఖ లతివలసంగమములు
తేజంబునకు గాఢతిమిరంబునకుఁ బోలెఁ గులటలకును దాపసులకుఁ బొందు
|
|
| తే. |
గలుగ దెప్పటికైనను గఱిత నీదు, వదన మీక్షింప దోసంబు వచ్చు మాకు
రూపగర్వంబు నీ కింత యేపు దెచ్చె, మకరి వై యుండు మింక నిమ్మడువులోన.
| 2453
|
| క. |
కను గానక ని న్నిటు చే, సినదుష్టుఁడు బంధుసుతసచివసహితముగా
ఘనసంగ్రామంబున రిపు, జనములచేఁ గూలు నింత సత్యం బబలా.
| 2454
|
| చ. |
అని యిటు శాప మిచ్చిన భయాకులితాత్మక నై వడంకుచు
న్బ్రణతజనప్రసన్న యపరాధ మొకించుక లేదు నాయెడన్
దనుజుఁడు మూర్ఖుఁడై బలిమి దర్పకకేళి యొనర్చి యేగె స
జ్జనులు ప్రశాంతచిత్తు లిఁక శాపవిముక్తి యనుగ్రహించవే.
| 2455
|
| ఉ. |
నా విని మౌనిభర్త కరుణ న్ననుఁ జూచి మదేభయాన నీ
కీవిధి వేయివత్సరము లేగినపిమ్మట రామదూత యౌ
పావని వచ్చు నిచ్చటికి భవ్యగతి న్బనిఁ బూని యమ్మహా
పావనమూర్తిచేఁ గలుగుఁ బట్టుగ శాపవిమోచనం బొగిన్.
| 2456
|
| వ. |
అని పలికి యమ్మహాముని యథేచ్ఛం జనియె.
| 2457
|
| క. |
మునినాథుఁ డన్నచందం, బున నీచే నాకు శాపమోక్షము గలిగె
న్విను మతికృతార్థ నైతిని, జనియెద నే నింక శక్రసదనంబునకున్.
| 2458
|
| క. |
అని పల్కి ధాన్యమాలిని, దినకరకులుభృత్యవరుని దీవించి వెసన్
జనియె నటు మెఱుఁగు మెఱసిన, యనువున నెమ్మేనికాంతి యాశలఁ బఱవన్.
| 2459
|
| తే. |
అంతఁ బవమాననందనుం డతిరయమునఁ
గపటమునివేషధరుఁ డైనకాలనేమి
కడకుఁ బోయిన నవ్వీరుఁ గాంచి యతఁడు
పలికెఁ గపటమాధుర్యంబు బయలుపడఁగ.
| 2460
|
| చ. |
అనిలతనూజ యెంత దడవాయె జలంబులు గ్రోలి వచ్చితే
గొను మిఁక మంత్రరాజమును గూర్మి నొసంగెద దీన మందు లొ
య్యనఁ గన వచ్చు దీని కెనయౌ గురుదక్షిణ యెద్ది యన్న న
వ్వనచరవంశవర్యుఁ డనివార్యపరాక్రమదుర్నివారుఁ డై.
| 2461
|
| క. |
గురుమంత్రంబున కెన యగు, గురుదక్షిణ యొసఁగఁ బోలుఁ గొను మిదె నీకున్
గురుదక్షిణ యిచ్చెద నని, గురుముష్టిం బొడిచె వానిగుండియ లవియన్.
| 2462
|
హనుమంతుండు కాలనేమిం జంపుట
| వ. |
ఇట్లు కఠోరదంభోళిధారాసంకాశమరున్నందనముష్టిప్రహారభిన్నవక్షుం డై
యామారీచనందనుండు క్రోధావిష్టచిత్తుండై తత్క్షణంబ కృత్రిమమునివేషంబుఁ
బరిత్యజించి నిజరూపంబ దాల్చి ప్రత్యగ్రనిశితాగ్రం బైనమండలాగ్రంబున
నాసుగ్రీవసఖునివక్షంబు వ్రేసిన నతండు బెండు సెడక గండు మిగిలి యాగ్ర
హోదగ్రుం డై యుగ్రత్రిశూలకల్పం బైనకరతలం బెత్తి దురాత్మా నీమాయ
లింకఁ బనిగొన విదె మదీయపాణిప్రహారంబు గొనుము దీన నీకుం జావు
సిద్ధించు నింక నెక్కడి కేగ వచ్చు నని తర్జించుచుఁ బెడతల వేసిన వాఁ డొల్లం
బోయి మెల్లనఁ దెలిసి యొక్కపక్షిరూపంబు దాల్చి పక్షసంజాతవాతంబులఁ
దూలం దోలుచు నిశాతనఖంబుల వ్రచ్చుచుఁ బ్రచండతుండంబునం గఱచుచు
విజృంభించిన వానియాటోపంబుఁ జూచి సహింపక యమ్మహాబలనందనుండు
తండ్రియనువున బలవేగంబు లంగీకరించి మహోద్దండకాలదండసదృశంబులైన
నిశాతనఖంబులం జీఱుచు నశనిపాతకల్పం బైనకఠోరముష్టిం బొడుచుచు
మహేంద్రధ్వజసన్నిభం బైనదీర్ఘవాలంబునం దట్టుచుఁ జరణనఖతుండపత
త్రంబులు విఱిచి నుగ్గునూచంబు చేసిన వాఁ డాపతత్రిరూపంబు మాని దంష్ట్రా
కరాళ భీషణం బైనసింహాకారంబు దాల్చి నటాసంచలనసంజాతవాతూలసము
ద్ధూతజీమూతవ్రాతుం డై వనద్విపంబులు భయంబునం బఱవఁ గఠోరకంఠ
హుంకారంబుఁ జేయుచు రభసాతిరేకంబునం గవిసిన నప్పవననందనుండు శర
|
|
| |
భంబులీల నవలీల వానిమీఁది కుఱికి ముష్టిపాతంబునఁ దదీయదంష్ట్రలు విఱు
గం బొడిచి సటాజాలంబుఁ బెఱికివైచి నెమ్ములు విఱుగఁ బాదంబులం దన్ని
కరతలంబున శిరంబు పగులవ్రేసిన నద్దానవుం డారూపంబు చాలించి స్వకీయ
మాయాబాహుళ్యంబున సుగ్రీవుండై చనుదెంచి లక్ష్మణుండు మూర్ఛ దేఱి దశ
గ్రీవునితో నుగ్రసమరంబు గావించుచున్నవాఁ డింక సంజీవనీకరణి దేవల
దిచ్చటనుండి గ్రమ్మఱ లంకకుం జనుదెమ్మని పలికిన విని హనుమంతుం డిది రాక్ష
సమాయ గాని నిక్కంబుగా సుగ్రీవుండు గాఁడు వీనిమాటలు విశ్వసింపఁ దగ
దని నిశ్చయించి గంధసింధురంబుపైకి లంఘించు సింగంపుఁగొదమభంగి వాని
మీఁది కుఱికి తదీయదంతంబులు రాల నెమ్ములు విఱుగ శిరంబు పగులఁ జరణ
జానులాంగూలముష్టిఘాతంబుల బడలుపడంజేసిన వాఁ డమ్మాయాసుగ్రీవ
రూపంబు విడిచి నిజరూపంబు దాల్చి కోదండంబు గొని కాండప్రకాండంబు
పరఁగించుచుఁ గొండొకసేపు నానాప్రకారంబుల భండనంబు గావించె నప్పు
డవ్వనచరశ్రేష్ఠుండు కాలాత్యయం బైనం గార్యంబు చెడుఁ దడవు గాకుండ
వీని వధింపవలయు నని తలంచి లయకాలరుద్రమూర్తితెఱంగున రౌద్రరసో
ల్లాసభాసురుం డై వాలచలనంబునఁ దదీయశరపరంపరలు విరియందట్టుచు నద్ద
నుజాధముని గ్రిందం బడఁద్రోచి దాను మీఁదై జానుకూర్పరముష్టిఘాతంబుల
సర్వాంగసంధులు నొప్పించి హీనసత్వుం జేసి మదసింధురంబు కమలనాళం
బుం బోలె వానికంఠనాళంబు ద్రెంచి వధించి కాలుప్రోలికిం బుచ్చి విజయ
లక్ష్మీవిరాజమానుం డై ద్రోణశిఖరిమార్గంబుం బట్టి యతిత్వరితగమనంబునం
బోవుచుండ నప్పుడు.
| 2463
|
| సీ. |
కిన్నరపరివృఢక్రీడాసరోవరస్తిమితసౌగంధ్యగంధము గ్రహించి
నిర్మలమందాకినీసరిత్కల్లోలధృతవారిశీకరార్ద్రత వహించి
రమణీయతరచైత్రరథవనంబునఁ గల పువుటీరములచెంతఁ బొంచి పొంచి
మానసకాసారమహితపద్మోత్పలకుసుమపరాగంబు కొల్ల లాడి
|
|
| తే. |
నిధువనశ్రాంతకిన్నరమిథుననిటల, కలితనూతనఘర్మాంబుకణము లార్చి
సమరసంజాతబంధురశ్రమము వాయఁ, దనకుమారునిపై వీచె ననిలుఁ డపుడు.
| 2464
|
| చ. |
అటఁ జని కాంచె వానరకులాగ్రణి దుగ్ధపయోధివీచికా
పటలబృహత్పయఃకణవివర్థితసాంద్రవిశాలసాలమున్
గటకచరత్తరక్షుగజగండకభల్లమృగేంద్రకోలమున్
దటరుహజీవనౌషధిలతారుచిజాలము ద్రోణశైలమున్.
| 2465
|
హనుమంతుండు ద్రోణాద్రిం గనుంగొనుట
| వ. |
ఇట్లు విలోకించి యమ్మహామహీధరం బెక్కి.
| 2466
|
| సీ. |
హరినఖదళితసింధురకుంభవిగళితమౌక్తికాలంకృతమార్గములును
గిన్నరదంపతీక్రీడావినోదాభిరామనిర్జరవనస్తోమములును
|
|
| |
సౌదామనీలతాసంకాశదీప్తకాంచనలతాభూషితసానువులును
వృక్షశాఖాగళద్వృక్షసన్నిభసుమాస్తీర్ణమనోహరాధిత్యకలును
|
|
| తే. |
రమ్యమణిమయధాతుపరాగపటల, పాటలీకృతవివిధభూభాగములును
ధరసరిద్భంగచటులమృదంగనిస్వ, నానురూపనటన్మయూరాళిఁ గనియె.
| 2467
|
| తే. |
ఇట్టు లచ్చటికందువ లెల్లఁ జూచి, యలసుషేణుండు చెప్పినయట్టిమందు
లరసి కనుఁగొన వేగ డాయంగఁబోవు, నంతలోపల నవి యదృశ్యంబు లయ్యె.
| 2468
|
| వ. |
అప్పు డప్పవననందనుండు చింతాకులితమానసుండై యప్పర్వతంబున కిట్లనియె.
| 2469
|
| చ. |
నగవర యేను రామునకు నమ్మినబంటఁ దదాజ్ఞఁ బూని సొం
పుగ భవదీయశృంగమునఁ బొల్చు మహౌషధము ల్గొన న్వడి
మగఁటిమి మీఱ వచ్చితిని మందులు ప్రీతి నొసంగు మింక నీ
కగణితకీర్తిలాభ మగు నవ్విభుకార్యము దీర్చినందునన్.
| 2470
|
| చ. |
అని నయ మారఁ బల్కిన నగాగ్రణి మిక్కిలి గర్వితాత్ముఁ డై
మనమున శంకఁ బో విడిచి మందులు వేగ మొసంగకున్న న
వ్వనచరవంశవర్యుఁ డనివార్యమహాగ్రహదుర్నిరీక్ష్యుఁ డై
కనుల మిడుంగుఱు ల్సెదరఁ గ్రమ్మఱ నిట్లని పల్కె దానికిన్.
| 2471
|
| చ. |
పలుమఱు మందు లిమ్మనుచుఁ బ్రార్థనఁ జేసిన నీ వొసంగుదే
కులిశముచేత వేయఁ దగు కొండలు మెత్తనిమేలిమాటలన్
దలఁకునె కర్కశత్వ మది దప్పునె ని న్బెకలించి దోర్బలం
బలరఁగ లంకకుం గొని రయంబున నేగద నేఁడు చూడుమా.
| 2472
|
హనుమంతుండు ద్రోణశైలంబు గొని లంకకు వచ్చుట
| వ. |
అని పలికి యా ప్రభంజననందనుండు ప్రావృట్కాలజీమూతంబుకరణి విజృంభ
మాణశరీరుం డై యవక్రపరాక్రమంబున జగత్త్రయంబు నాక్రమింప నుపక్ర
మించిన త్రివిక్రమదేవునిమాడ్కి నద్భుతదర్శనుండై చతుర్దశభువనభారధౌరే
యకాద్రవేయసమానసారం బైనవాలంబు దిరుగం జుట్టి యట్టహాసంబుఁ జేసి
తొల్లి నారాయణుండు మందరాచలంబు నుత్పాటించినతెఱంగున నమ్మహామహీ
ధరంబుఁ బెఱికి ప్రళయకాలధారాధరంబుభంగి నొక్కమహాధ్వని గావించిన.
| 2473
|
| సీ. |
అవనిమండలము చక్రాకృతిఁ జలియించె దిగ్గజంబులు భీతి దిమ్మదిరిగెఁ
గిటికచ్ఛపాహు లుత్టకభయంబున మ్రొగ్గెఁ గులశైలవరములు కలఁగఁబడియె
నింగియు దిక్కులు నిబిడంబుగా మ్రోసెఁ బొంగి పయోనిధుల్ పొరలఁబడియెఁ
దఱుచుగా దివినుండి తారకంబులు వ్రాలె గ్రహగణంబులు మింట గతులు దప్పెఁ
|
|
| తే. |
బంచభూతంబు లధికవిభ్రాంతి నొందె
ఖచరభూతంబు లన్నియు గాసివడియె
|
|
| |
భీకరాకారుఁ డై మరుత్ప్రియసుతుండు
గిరివరము వాలమునఁ జుట్టి పెఱుకునపుడు.
| 2474
|
| వ. |
ఇ ట్లఖిలభువనభయకరంబుగా నిరువదియోజనంబులతనర్పును నూఱుయోజ
నంబులపొడువునుం గలయప్పర్వతం బుత్పాటించి కరంబుల నెత్తి శిరంబున
నిడికొని నిరంకుశప్రతాపంబునం దేజరిల్లుచు గమనోన్ముఖుం డయ్యె నప్పు డద్ది
వ్యౌషధులకుం గావలి యున్నచిత్రసేనాదిత్రయోదశకోటిగంధర్వపతులు
సంరంభవిజృంభితులై భీషణరోషాతిరేకంబునం జనుదెంచి రభసంబునం బోనీక
పొదివి నిలునిలు మని యదల్చుచుఁ జుట్టుముట్టి యట్టహాసంబుఁ జేసి యతిభయం
కరాకారులై గదాముసలముద్గరభిండివాలకరవాలశూలప్రాసకుంతచక్రశక్తితో
మరపరశ్వథాదినానావిధసాధనంబులు సాంద్రంబుగాఁ బరఁగించిన నవ్వీరశిఖా
మణి సరకుగొనక విజృంభించి వాని నన్నిటిని దూరంబుగా వాలంబున విరియం
దట్టి పాదంబులం దన్నుచు మోకాళ్లఁ గ్రుమ్ముచు నఖంబులఁ జీఱుచు నఱచేతు
లం బ్రహరించుచు మోఁచేతులఁ దాటించుచుఁ బిటికిటం బొడుచుచు వక్షంబు
నం దట్టుచు లాంగూలచలనంబునఁ దూలందోలుచు ఘోరనాదంబున గుండె
లవియించుచు ని ట్లనేకప్రకారంబులు విజృంభించిన నాగంధర్వులు సచ్చియు
నొచ్చియు విచ్చియు సుడివడియుఁ జీకాకువడియు మహావాతోద్ధూతజీమూత
వ్రాతంబురీతిఁ జెల్లాచెదరై నలుదెసలకుం బఱచి రందుఁ గొందఱు మహాత్మా మహా
బలుండ వైననీతోడ రణంబు గావింప మే మెంతవారము మాయపరాధంబు
సహించి శైలంబు గొని శీఘ్రంబునం జను మని పలికి రిట్లు గంధర్వపతుల నంద
ఱ నశ్రమంబున నిరించి దుర్జయుండై యమ్మహాశైలంబు గొని గ్రీష్మాదిత్యుని
భంగి నింగి వెలుంగుచు వాయువేగంబునం బోవుచుండె నప్పుడు.
| 2475
|
భరతుండు నందిగ్రామంబునందు దుస్స్వప్నంబు గని వ్యాకులచిత్తుం డగుట
| సీ. |
పొసఁగ నందిగ్రామమున నాఁటిరాతిరి భరతుండు నిద్రించి పరమధార్మి
కుం డైనరాముండు దండకావనములో జూనకీలక్ష్మణసహితుఁ డగుచుఁ
దైలసిక్తాంగుఁ డై తలవెండ్రుకలు జాఱఁ బంకంబులోఁ జిక్కుపడినయట్లు
కల గని మేల్కాంచి కళవళ మందుచు రామలక్ష్మణులకు నేమి కీడు
|
|
| తే. |
గలిగెనో రాక్షసులచేత గాసివడిరొ
యెన్ని యిడుములఁ బడిరొ యెందున్నవారొ
వీనులకు నేమి దుర్వార్త వినఁగ నగునొ
యేమి సేయుదు నింక నా కెద్ది తెఱుఁగు.
| 2476
|
| క. |
దిక్కుల ధూమము గవిసెను, నక్కలు గూయంగ సాగె నల్గడలందున్
జుక్కలు రాజఁ దొడంగెను, గ్రక్కున దివినుండి వేడిగాడ్పులు విసరెన్.
| 2477
|
| మ. |
అని చింతించుచు ధైర్యము న్వదలి మే నాకంపముం బొందఁ గ్ర
న్నన నావేళనె భూసురప్రవరుల న్రావించి దానాదికం
|
|
| |
బును వేదాధ్యయనంబు మంత్రపఠనంబు న్శాంతిహోమాదికం
బును గావింపఁగఁ బంచి దానును మహాపూతాత్ముఁ డై గ్రక్కునన్.
| 2478
|
| ఉ. |
ఏను రఘుప్రదీపకున కెంతయు భక్తుఁడ నేని నిత్యము
న్మానుగ సత్యధర్మనయమార్గమునం జరియింతునేనియున్
మానుగ రామలక్ష్మణు లమానుషచర్యులు సీతఁ గూడి య
క్కానఁ జరించి సేమమునఁ గ్రమ్మఱ వత్తురు గాక వీటికిన్.
| 2479
|
| క. |
తామరసప్రియుకైవడి, వేమఱు గగనంబు దిశలు వెలిఁగించుచు నా
సామీరి వేగ నంది, గ్రామము సేరంగ వచ్చి ఘనసౌధమునన్.
| 2481
|
హనుమంతుఁడు భరతునిం గాంచి శ్రీరాములని వ్యాకులచిత్తుం డగుట
| సీ. |
సజలనీలాంబుదశ్యామలాంగమువానిఁ గమలపలాశనేత్రములవాని
నాజానులంబిబాహార్గళుం డగువానిఁ గంబుసన్నిభ మైనగళమువాని
విపులాంసములవాని వెడఁదవక్షమువానిఁ గమనీయదివ్యవిగ్రహమువాని
రాకేందుసంకాశరమ్యవక్త్రమువాని సమదేభతుల్యయానములవాని
|
|
| తే. |
వరజటాజాలభూషితశిరమువాని
నగ్నివల్కానృతావలగ్నంబువానిఁ
బరమమునివేషమున నున్నభరతుఁ గాంచి
వనచరకులోత్తముఁడు రాముఁ డని భ్రమించి.
| 2482
|
| ఉ. |
అక్కడ లక్ష్మణుండు సమరావని రావణశక్తివిద్దుఁ డై
తక్కక మూర్ఛ వోవఁ గని తద్వ్యసనంబున నిల్వ లేక
నుక్కును బౌరుషం బెడలి యుష్ణకరాత్మజుఁ బోవఁ బంచి యా
చక్కటి జానకి న్విడిచి చయ్యన రాఘవుఁ డేగుదెంచెనో.
| 2483
|
| మ. |
అని చింతించి తదస్త్రసంపద తదీయానూనదోశ్శక్తి త
ద్వినుతప్రజ్ఞయుఁ బౌరుషంబు మదిలో వీక్షించి రాముండు నీ
చనిశాటుం బరిమార లేక నిజవంశఖ్యాతిఁ బోఁ బెట్టి యి
ట్లనుమానింపక వచ్చునే గతరణవ్యాపారుఁ డై వీటికిన్.
| 2484
|
భరతుండు హనుమంతునిం జూచి పెనుభూతం బని బాణంబు వేయుతఱి నాకాశవాణి వలదనుట
| క. |
మదిలోఁ దప్పఁ దలంచితి, నిది యేటివిచార మొదవె నీతఁడు సుగుణా
స్పదుఁ డగురామునిఁ బోలిన, సదమలమౌనివరుఁ డింత సత్యం బరయన్.
| 2485
|
| క. |
అని నిశ్చయించి నభమునఁ, జనుచుండఁగ నవ్వనాటసత్తముఁ గని యా
ఘనభుజుఁడు భరతుఁ డిది యొక, పెనుభూతం బనుచు మదిని విస్మయ మొదవన్.
| 2486
|
| క. |
దీనిఁ బడవైతుఁ గాకని, మానుగఁ జాపంబు గొని సమగ్రవిశిఖ సం
ధానంబుఁ జేసి మౌర్వీ, స్వానము గావించె దశదిశలు కంపింపన్.
| 2487
|
| తే. |
అప్పు డశరీరవాణి యిట్లనుచుఁ బలికెఁ
గైకయీపుత్ర యీతఁడు మీకుఁ జాల
హితుఁడు పరమాస్త్ర మితనిపై నేయ వలవ
దుడుగు మన విని యవ్వీరుఁ డూరకుండె.
| 2488
|
| శా. |
వీరాగ్రేసరుఁ డైనపావని మరుద్వేగంబునం బోయి సొం
పార న్ముంగలఁ గాంచె నంబరపథవ్యాప్తోర్మిసంచారమున్
ఘోరగ్రాహకుళీరనక్రకమఠక్రూరోరగోదారమున్
బారావారము శంఖశుక్తిసికతాభాస్వన్మహాతీరమున్.
| 2490
|
మాల్యవంతుండు దశకోటిరాక్షసులం గూడి హనుమంతున కడ్డంబు వచ్చుట
| వ. |
ఇత్తెఱంగున నాకపిసత్తముండు సముద్రంబు విలోకించి తదుపరిమార్గంబునం
బోవుచుండ నప్పుడు రావణప్రేరితుండై ధైర్యనిర్జితమాల్యవంతుం డగుమాల్య
వంతుండు శమనకింకరభయంకరు లగుదశకోటిరాక్షసులం గూడి భీషణరభసాతి
రేకంబుగా హనుమంతున కడ్డంబు వచ్చి చుట్టుముట్టి యట్టహాసంబుఁ జేసి యం
బరంబున జీమూతంబులకరణిం బన్ని యూర్జితగర్జానిస్వనంబులు ఘనస్తనితం
బులై యలర సర్వాభరణరోచు లచిరరోచులసొంపు సంపాదింపఁ గనత్కనక
వలయమండితకార్ముకదండంబు లాఖండలచాపంబులయందంబు పొందుపఱుప
గదాముసలముద్గరభిండివాలకరవాలశక్తితోమరపాశపరశ్వథచక్రకుంతక్షురి
కాశిలీముఖాదినానాసాధనవర్షంబు నీరంధ్రంబుగాఁ గురియించిన నప్పవమాన
సూనుండు చలింపక చిక్కుపడక యాజ్యాహుతిప్రవర్ధమానపవమానసఖుండుం
బోలె నక్కజం బగుతేజంబు దిక్కులం బిక్కటిల్ల నుక్కు మిగిలి రక్కసు లెక్క
డెక్కడం బడ రాక్షసులపాలి ధూమకేతువుంబోలె విస్ఫులింగజ్వలాభీలం బైన
వాలంబున విసరుచుఁ బిడుగుల కెనయైనపిడికిటిపోట్లం బొడుచుచు వజ్రాయుధ
సఖంబు లైననఖంబుల శిరంబులఁ జిదిమివైచుచుఁ గరచరణజానుజంఘోరు
మధ్యవక్షశ్శీర్షంబులు శకలంబు లగునట్లుగాఁ బదతలంబులం దన్నుచు జానుకూ
ర్పరఘాతంబుల సర్వాంగసంధులు విదళించుచుఁ బదుగుర నూర్వుర నిన్నూ
ర్వురం బట్టి పాణితలంబుల మెదిచి చూర్ణంబు సేయుచుఁ బ్రళయకాలధారా
ధరగర్జాభీషణం బైనఘోషణంబున గుండె లవియం జేయుచు ని ట్లనేకప్రకా
రంబుల విజృంభించి శుష్కకాంతారంబు నేర్చుకార్చిచ్చుచాడ్పున మడువులో
నం జొచ్చి కలంచుమాతంగంబుకరణిఁ గురంగశాబకంబుల భంజించుసింగంపుఁ
గొదమభంగి మహోత్తాలతాలవనమధ్యంబున విహరించుమహావాతంబురీతి దా
రుణరణక్రీడ గావించిన నద్దానవులు తద్దయు భీతిల్లి హనుమంతునిముంగల నిలు
వంజాలక కాఱాకులగతి సుడివడి దశదిశలకుం బఱచి రయ్యాయోధనంబు
|
|
| |
నిరాలంబం బగువాయుమార్గంబునం బ్రవర్తిల్లుటంజేసి పదనిక్షేపణశబ్దరహి
తం బై చెల్లె నప్పుడు.
| 2491
|
| శా. |
ఘోరాకారుఁడు మాల్యవంతుఁడు చలత్కోదండటంకార మే
పార న్మేచకవృష్టి మేఘము ఘనంబై గాఢవర్షం బొగి
న్నీరంధ్రంబుగఁ గాంచనాచలముపై నిండార వర్షించిన
ట్లారూఢిం గపివీరుపైఁ గురిసె నుద్యత్సాయకాసారమున్.
| 2492
|
| ఉ. |
దానికి నించుకైన మదిఁ దత్తఱ మందక ధీరుఁ డామరు
త్పూనుఁడు వాలఘాతమున సూరెల నన్నిటిఁ దూలఁ దోలుచున్
మానితతిగ్మతేజమున మంచును మాయఁగఁ జేసి నింగిపై
మానుగ నొప్పుభాస్కరునిమాడ్కి వెలింగె నుదీర్ణతేజుఁ డై.
| 2493
|
| ఆ. |
అంత మాల్యవంతుఁ డతిరుష్టుఁడై గద, ద్రిప్ని వహ్నికణము లుప్పతిల్ల
వాయుసుతునిమీఁద వైచి పెల్లార్చి తా, దిట్టతనము మెఱయ నిట్టు లనియె.
| 2494
|
హనుమంతుండు మాల్యవంతునిం జంపుట
| మ. |
అవురా వానర తొల్లి విష్ణుఁడు ఖగేంద్రారూఢుఁ డై వచ్చి న
న్ను వడిం దాఁకి రణం బొనర్చి తదిఁ దానుం బోరఁగా లేక శ
క్తివిహీనుం డయి పాఱె నాజి సలుపం గీశుండ వీ వెంతవాఁ
డవు సప్రాణుఁడ వై వెస న్జలధిఁ గొండ న్వైచి పొ మ్మవ్వలన్.
| 2495
|
| చ. |
అన విని వాయుపుత్రుఁడు మహాగ్రహుఁ డై వెసఁ దత్ప్రయుక్తకాం
చనగద నుద్ధతిం జదిపి చయ్యనఁ జూర్ణము చేసి బల్విడిన్
ఘననఖరంబులం జిదిమి కండలు చెక్కలువాపి యల్కతోఁ
బనివడి వానిగుండియలు బ్రద్దలు వాఱఁగఁ దన్నె నంఘ్రులన్.
| 2496
|
| వ. |
అంత నద్దానవుండు కాలవ్యాళకరాళం బైనకరవాలంబున వేసిన నదివజ్రసమ
స్పర్శం బైనతదీయక్షంబు దాఁకి సహస్రఖండంబులై పుడమిం బడియెఁ బదం
పడి కాలాయసమయం బైనముసలంబు విసరివైచిన దానిఁ గరంబుల నొడిసి
పట్టి మదోద్దండవేదండం బిక్షుదండంబుంబోలె విఱిచి వైచె వెండియు దంష్ట్రా
కరాళభీషణం బైనశక్తి నిగిడించిన దాని సముద్రజలంబులం బడునట్టుగాఁ
బాదంబులం దన్నె నంత నద్దానవుండు వికలసాధనుండై సేయునదిలేక వెల్లనై
సూచుచుండ నప్పుడు బాహువుల వాని నాకర్షించి పాణినిష్పేషణంబున హీన
సత్త్వుం గావించి వాలపాశంబు గళంబునం జుట్టి మీఁది కెత్తి ఖగేంద్రుండు
కాకోదరంబుం బోలె వేయిమాఱు లంబరంబునం ద్రిప్పి సముద్రంబులఁ బడ
వైచిన నన్నిశాచరుండు పతనవేగంబున రసాతలం బంటి మరల వచ్చుటకు సామ
ర్థ్యంబు లేమిం జేసి మృతుండై యమసదనంబునకుం జనియె హతశేషు లగు
రక్కసు లుక్కు సెడి భయభ్రాంతులై లంకకుం బఱచి రిట్లు వాతూలనందనుండు
|
|
| |
మాల్యవంతుని సేనాసమేతంబుగా నంతకగోచరుం జేసి జయంబు గొని కర..
తమహౌషధీపర్వతుం డై సింహనాదంబు చేసి గ్రాష్మాదిత్యునిభంగి నింగి వెలుం
గుచు మనో వేగంబున లంకాద్వీపంబు డాయం జనియె నప్పు డమ్మహనీయమూ
ర్తితేజోవిశేషంబును ద్రోణమహీధరమణిదీప్తులు దూరంబు నవలోకించి
రాముండు సూర్యుం డుదయించి వచ్చుచున్నవాఁ డని తలంచి లక్ష్మణప్రాణశంకి
తుం డై.
| 2497
|
రాముండు దూరంబున హనుమంతునిం జూచి సూర్యుం డని యెంచి కోపించుట
| సీ. |
అక్కట లక్ష్మణుం డమరారిశక్తిచే మేదినిఁ బడియె సమీరసుతుఁడు
దివ్యౌషధీలతల్ దెచ్చెద ననిపోయి తడవాయె భానుఁ డుదగ్రభంగి
నుదయించుచున్నవాఁ డదయుఁడై యింక నే నేమి సేయుదుఁ దమ్ముఁ డెట్లు బ్రతుకు
నెలమి సుమిత్రతో నేమని భాషింతు భరతునిదుఃఖ మేపగిది నణఁతు
|
|
| తే. |
ఘనుఁడు శత్రుఘ్నుఁ డడుగ నేమని వచింతు
నల విభీషణుతోడ నే నన్నమాట
యనృత మయ్యె మదన్వయయశము వోయె
వనచరులకష్టమంతయు వ్యర్థ మయ్యె.
| 2498
|
| మ. |
అని యిబ్బంగిఁ దలంకుచుండఁ గపివంశాధీశుఁ డేతెంచి రా
మనరేంద్రుం గని పల్కె నోయనఘ ధీమంతుండ వీ వివ్విధం
బున దుఃఖింపఁగఁ జెల్లునయ్య జగముల్ పుట్టి౦ప రక్షింప గ్ర
ద్దన నాశం బొనరింప దక్షుఁడ వెద ధైర్యంబు గీల్కొల్పుమా.
| 2499
|
| తే. |
దేవ నాలవజాము వర్తించుచున్న, దెలమి నిఁక నొక్కయామంబు గలదు రాత్రి
లక్ష్మణున కేమిహాని గల్గదు దురంత, దుఃఖ మది వీడి స్వస్థచిత్తుండ వగుమ.
| 2500
|
| తే. |
అనుచు నిబ్బంగి సూర్యనందనుఁడు ధైర్య
మెంత చెప్పిన నుడుగ కయ్యినకులుండు
పెక్కువిధముల దుఃఖించి పిదపఁ గోప
రసము నిగుడంగ నత్యంతరౌద్రుఁ డగుచు.
| 2501
|
| సీ. |
వనజమిత్రుండు మద్వంశంబునకుఁ గర్త యయ్యును గృపమాలి యనుజుఁ డిచట
మూర్ఛదేఱక మున్నె మునుకొని పగతురపాలివాఁ డై నన్ను పరిభవించి
యుదయించి చనుదెంచుచున్నవాఁ డితనిదౌ దుర్ణయ మేమని దూఱవచ్చుఁ
గడు వేగమున వీనిఁ బుడమిపైఁ బడఁ గూల్చి జగమంతయు నరాక్షసం బొనర్తుఁ
|
|
| తే. |
జూడుఁ డని రక్తకాంతులు చూడ్కిగములఁ
గ్రమ్ముకొన విల్లు గొని జగత్త్రయము బెగడ
ఘోరరౌద్రాస్త్ర మరిఁ బోసి దారుణముగ
గుణరవముఁ జేసె దైత్యులగుండె లవియ.
| 2502
|
| మ. |
శరధిక్షీరము లింకె బల్విడి ధరాచక్రంబు కంపించె భూ
ధరము ల్మ్రొగ్గె నభంబు బిట్టవిసె దిగ్దంతావళీశ్రేణి యా
తురతం బొందె నిరంతరంబుగ నుడుస్తోమంబు రాలె న్నిశా
చరభూతాలి గలంగె రాఘవధనుష్టంకారమాత్రంబునన్.
| 2503
|
| వ. |
అట్టిమహోత్పాతంబులు చూచి సుగ్రీవుం డతిభీతుం డై దేవా యొక్కనికై
పెక్కండ్ర నొక్కపెట్ట వధింపంబూనుట ధర్మంబు గాదు మీ రెఱుంగనిధర్మం
బు గలదే యని పలుకుచుండ నప్పుడు సుషేణుండు చనుదెంచి మహాత్మా బల
వంతుం డగుహనుమంతుండు దివ్యౌషధీశైలంబు గొనివచ్చుచున్నవాఁ డిది
తదీయదివ్యతేజఃపుంజంబు గాని సూర్యుండు గాఁడు శీఘ్రంబున నవ్వీరోత్త
మున కెదురుగాఁ దగువానరులం బంపు మని పల్కిన నతనిపల్కులం గలంక
దేఱి కోదండం బెక్కుడించి రాముండు సౌమ్యదర్శనుం డై యతిరయంబున
వానరుల నప్పావని నెదుర్కొనం బంచె నంతలోన నయ్యంజనానందనుండు
శైలంబు గొని తెచ్చి వానరసేనామధ్యంబున డించి కౌసల్యానందనునిచరణార
విందంబుల కభివందనంబు గావించి పదంపడి సుగ్రీవజాంబవదాదులకు నమస్క
రించి తక్కినయూథపోత్తముల నయ్యైతెఱంగుల సంభావించి నిటలతటన్యస్త
హస్తపుటుం డై వినయంబున రామభద్రున కిట్లనియె.
| 2504
|
హనుమంతుండు ద్రోణపర్వతమును రామునకు సమర్పించుట
| సీ. |
అనఘచరిత్ర మీయానతి మందులు గొనితేరఁ బనిఁ బూని ఘనరయమునఁ
బోవుచు నుండంగఁ ద్రోవ ననేక విఘ్నంబులు గల్గె మీకరుణవలనఁ
దలఁకక యని యెల్లఁ దప్పించుకొని ద్రోణగిరిఁ జేరి యోషధు లరసి కాంచి
తేఁ బూని కాల మతీత మౌ నని యెంచి శైల ముత్పాటించి జవము మెఱయ
|
|
| తే. |
నిటకుఁ దెచ్చితి నింతసే పేల తడవు, చేసితి వటంచుఁ గోపంబు సేయవలదు
డెందమున నాదుతప్పులు క్రిందుపఱచి,ఘనకృపాదృష్టిఁ జూడుము మనుకులేంద్ర.
| 2505
|
| ఉ. |
నా విని రామభద్రుఁడు మనంబున సంతసమంది పల్కు నో
ధీవర నీకుఁ దప్పు గలదే కృప లక్ష్మణుప్రాణ మిచ్చి నా
జీవము మత్కులంబుఁ గపిశేఖరువంశము నిల్పి తీవు నే
నేవిధిఁ దీర్చికొందుఁ బ్లవగేశ్వర నీఋణ మెంచి చూడఁగన్.
| 2506
|
| ఉ. |
ఎక్కడ లంక ద్రోణనగ మెక్కడ నొంటిగ వైరికోటికిం
జిక్కక శైలముం బెఱికి శీఘ్రమునం గొని తెచ్చి తీవు నీ
కెక్కడ నెవ్వ రీడు గల రేమనవచ్చు భవత్ప్రభావమున్
దక్కక తార్క్ష్యుఁ డైనను సదాగతి యైనను సాటి వత్తురే.
| 2507
|
| చ. |
అనుచు బహూకరించె విభుఁ డంత సుషేణుఁడు కీశయుక్తుఁ డై
ఘనగతి శైల మెక్కి మణిగైరికధాతువిచిత్రసానువు
|
|
| |
ల్వనరుహషండమండలవిభాసితరమ్యసరోవరంబులు
న్వినుతఫలప్రసూనయుతవృక్షవనంబులు గాంచి యిట్లనున్.
| 2508
|
| సీ. |
ఇచట విష్ణుఁడు సుధ నింపార దనుజుల వంచించి సురలకుఁ బంచిపెట్టె
నిచటఁ గృత్రిమసురాకృతి నమృతము ద్రావు టెఱిఁగి శ్రీపతి రాహుశిరము ద్రుంచె
జెలఁగి యిచ్చోట సంజీవనీప్రముఖదివ్యౌషధంబులు దాఁచి రమరవర్యు
లీచ్చోట శక్రాదు లేపార దానవరాజితో దారుణరణ మొనర్చి
|
|
| తే. |
రనుచుఁ దనతోడికపులతో నచటఁ గలుగు, కందువలఁ జూపి చెప్పుచు ఘనవిశల్య
కరణి గనుఁగొని దానిఁ గైకొని నితాంత, సమ్మదము మీఱ నప్పర్వతంబు డిగ్గి.
| 2509
|
లక్ష్మణుండు మూర్ఛ దేఱుట
| తే. |
ఒకశిలాఫలకంబుపై నుత్సుకమున
దాని నిష్పేషణము చేసి తడయ కపుడు
ప్రీతి సౌమిత్రి కొసఁగ నాపృథుబలుండు
క్షణములో మూర్ఛ దేఱి విశల్యుఁ డయ్యె.
| 2510
|
| వ. |
ఇట్లు లక్ష్మణుం డాదివ్యౌషధిగంధం బాఘ్రాణించి మూర్ఛ దేఱి విశల్యుం డై
నిద్రితుం డగుపురుషుండు మేల్కాంచినతెఱంగున లేచి సుఖాసీనుండై తొల్లిం
టికంటె నధికం బైనబలవీర్యతేజంబులు గలిగి ప్రకాశించుచుండె నప్పు డారా
మభద్రుండు సౌమిత్రిం గౌఁగిలించికొని పరమానందబాష్పధారాపూరంబులఁ
దదీయశరీరంబు దడుపుచుఁ బులకాంకితవిగ్రహుం డై శిరంబు మూర్కొని
చెక్కిలి ముద్దుగొని సుధామధురసల్లాపంబుల గారవించి సుషేణుం జూచి కపీం
ద్రా భవదనుగ్రహంబున సహోదరుం బడసి ధన్యుండ నైతి నీవు గావించిన
యీదుష్కరోపకారంబునకు నధికం బగుప్రత్యుపకారం బేమియుఁ గావించు
టకు సమర్థుండఁ గా నని బహూకరించె నంత వానరు లందఱు నమందానంద
రసపోషితవిగ్రహులై కులశైలగుహాముఖంబులఁ బ్రతిధ్వనులు సెలంగ సింహ
నాదంబులు చేసి భుజాస్ఫాలనంబులు గావించి వాలసంచలనాదికాపేయజాతి
చేష్టావిశేషంబులు నెఱపి పరమోత్సవంబు గావించి సుషేణునియనుమతంబున
నమ్మహామహీధరారోహణంబుఁ జేసి యచ్చటం గలచిత్రవస్తుజాతం బంతయుఁ
గలయ నవలోకించి యరుదందుచు నమృతకల్పంబు లగుఫలంబులు మెసవి
సుధారసోపమానంబు లగుతత్రత్యదివ్యసరోవరసలిలంబులు ద్రావి దివ్యౌషధీ
లతాసమీరస్పర్శంబున విగతజన్యశ్రము లై శీఘ్రంబున నప్పర్వతంబు డిగ్గి తేజ
సత్త్వజవాధికు లై కయ్యంబునకుఁ గాలు ద్రవ్వుచుండి రంత నమ్మహీకాంతుండు
హనుమంతు నవలోకించి బహుమానపురస్సరంబుగా నిట్లనియె.
| 2511
|
| చ. |
తరుచరవర్య నీకరుణఁ దమ్ముఁడు గ్రమ్మఱఁ బ్రాణయుక్తుఁ డై
సురుచిరసత్త్వతేజముల శోభిలె నేఁ గృతకార్యసిద్ధి నై
|
|
| |
వఱలితి నింక నిన్నగము వారక యెప్పటిచోట నుంచి భా
సురగతి రమ్ము కష్ట మని చూడక చెచ్చెరఁ బొమ్ము నావుడున్.
| 2512
|
| ఉ. |
దేవరవారికార్య మది దీర్చుట కష్టమె నీకటాక్షమే
కావలెఁ గాక యీనగము గ్రమ్మఱఁ గైకొని యేగి తొంటిచో
వావిరి డించి మీకడకు వచ్చెద భూరిసమీరవేగి నై
దేవవిరోధు లెంద ఱరుదెంచినఁ బీఁచ మణంచి యుద్ధతిన్.
| 2513
|
హనుమంతుఁడు ద్రోణపర్వతము నెప్పటిచోట మనుచుట
| క. |
అని పలికి వాయునందనుఁ డనుపమభుజసత్త్వ మలర నగ్గిరి గేలం
గొని జలదముగతి నార్చుచు, ననిలునిచందమున వేగ యరుగుచు నుండన్.
| 2514
|
| సీ. |
అప్పుడు దశకంఠుఁ డాంజనేయుఁడు కొండ గొని వెండి పోవుట విని రయమున
స్థూలజంఘికుని జతుర్వక్త్రు గజకర్ణు నుల్కాస్యు ఘనవర్ణు నుగ్రరూపు
నలమహాదంష్ట్రమహానాదు లనుమహోదరమహావీర్యుల దైత్యవరుల
రావించి మీరు శీఘ్రంబునఁ బావని కడ్డంబు చని వాని నతిబలమునఁ
బట్టి తెం డటు గాక దిట్ట యై పోరిన శైలంబు వారిధి జలములోన
|
|
| తే. |
వైచి రం డట్లు గా దేని వానిఁ జంపి, రెండు మీలోన నెవ్వఁడు గండు మిగిలి
యిప్పని యొనర్చు వాని కిం పెసఁగ నర్ధ, రాజ్య మిత్తు నిమ్మాట తిరంబు సుండి.
| 2515
|
| చ. |
అని నియమించి పంచిన మహాబలు లారజనీచరోత్తము
ల్ఘనములమాడ్కి గర్జిలుచుఁ గాటుకకొండలభంగిఁ గాయము
ర్దనరఁగ భీమరాక్షసకదంబములం గొని సాస్త్రు లై రయం
బునఁ జని మారుతాత్మజుఁడు పోవుపథం బరికట్టి యుద్ధతిన్.
| 2516
|
| ఉ. |
ఓరి వనాట కొండ గొని యుద్ధతి నెక్కడి కేగె దబ్ధిలోఁ
బాఱఁగవైచి శీఘ్రమునఁ బ్రాణయుతంబుగ నేగు మట్లు గా
కీరస మెత్తి మార్కొనిన నిప్పుడె మాకరదండవిస్ఫుర
ద్ఘోరవరాస్త్రశస్త్రములఁ గూలఁగ వైచెద మొక్కవ్రేల్మిడిన్.
| 2517
|
| చ. |
మసలక శైలముం బొదివి మబ్బులు దారుణవృష్టి ముంచి న
ట్లసమున ఘోరబాణపరిఘాశనితోమరశూలపాశప
ట్టసకరవాలచక్రశితటంకగదాప్రముఖాస్త్రశస్త్రముల్
విసువక వేసి యార్చి రలవిష్ణుపదంబు దిశల్ చలింపఁగన్.
| 2519
|
| శా. |
ఆలోకించె సమీరనందనుఁడు క్రోధారక్తనేత్రాంతుఁ డై
కీలాభీలవరాస్త్రశస్త్రచయసంకీర్ణప్రభౌద్ధత్యులం
ద్రైలోక్యస్థితవీరసన్నుతసముద్యద్దోర్భలౌన్నత్యులన్
|
|
| |
వ్యాలోలద్భుజవీర్యనిర్జిత సమస్తాదిత్యుల న్దైత్యులన్.
| 2521
|
| ఉ. |
దానవులార మీరు కడు దర్పము గల్గినవారుపోలె నా
తో నని సేయ వచ్చితిరి తొల్లిటివారలచే టెఱుంగరే
ప్రాణములం దపేక్ష గలదన్నఁ గడంగి తొలంగి పొండు గా
దేని భుజాబలం బెసఁగ నిందఱ నిప్పుడె తీర్చి పుచ్చెదన్.
| 2523
|
| శా. |
కాలవ్యాళకరాళము న్హుతవహోగ్రజ్వాలికాభీలము
న్హేలానిర్జితచక్రవాళము సుపర్వేంద్రధ్వజోత్తాలమున్
శైలారాతిధనుర్విశాలము మదోన్మత్తాహితోన్మూలమున్
వాలంబు న్వడిఁ బెంచి సంచలనవిష్వగ్జాతవాతూలమున్.
| 2525
|
| చ. |
సరసిజలోచనుండు నిజచక్రమునుం బలె వేయిమాఱు లం
బరమునఁ ద్రిప్పి వేయుటయుఁ బర్వతసన్నిభయాతుధాను లం
దఱు వెస దానిక్రిందఁ బడి తప్పక చూర్ణితదేహు లై సరి
త్పరివృఢమధ్యసీమఁ బడి పంచత నొందిరి తత్క్షణంబునన్.
| 2527
|
| వ. |
ఇ ట్లనేకరాక్షసుల వాలప్రహారంబునం బిలుకు మార్చి గెలుపుగొని సింహనాదం
బుఁ జేసి మనోవేగంబునం బఱచి ద్రోణశైలం బెప్పటిచోట నునిచి గ్రమ్మఱం
జనుదెంచి కౌసల్యానందనునిచరణంబులకు నమస్కరించి యమ్మహాత్మునిచేత
మన్నన వడసి తత్పార్శ్వమున గొలిచి యుండె సుగ్రీవజాంబవదంగదనలనీల
సుషేణాదు లాహనుమంతునితేజస్సత్త్వవీర్యసాహసోత్సాహప్రభావంబులు
బహుప్రకారంబులం గొనియాడి రంత.
| 2528
|
| సీ. |
విబుధారిమోములు వెలవెలఁ బాఱంగ దివిఁ దారకలగుంపు తెలివి మాసె
సౌమిత్రిగాఢమూర్ఛాతమం బడఁగంగఁ గడలఁ గార్కొన్నచీఁకట్లు విరిసె
వనచరాననముల ననురక్తి మీఱంగఁ దొలిసంజకెంజాయదళము గొనియె
శక్రాదిసురులయాస్యంబులు వికసింపఁ గమలషండములు వికాస మొందె
|
|
| తే. |
నిఖలలోకైకరక్షణనిరతుఁ డైన, కౌసలేయునిదుర్నిరీక్షస్ఫుటప్ర
తాప మావిర్భవింపంగఁ దపనుఁ డపుడు, వేడ్కఁ బూర్వాద్రిమీఁద నావిర్భవించి.
| 2529
|
| వ. |
అప్పు డారఘువల్లభుండు లక్ష్మణుం జూచి భ్రాతృస్నేహంబునఁ దమ్ముఁడ రమ్మని
కరంబులం దిగిచికొని గాఢంబుగా నాలింగనంబుఁ జేసి యానందబాష్పధారా
పూరితలోచనుండును ప్రతిసంహృష్టసర్వాంగుండు నగుచు నిట్లనియె.
| 2530
|
| చ. |
అతులితశక్తిచే హతుఁడ వై ధరఁ గూలియు నేఁడు మత్పురా
కృతసుకృతంబు పెంపున నరిందమ చావక నీవు గ్రమ్మఱన్
|
|
| |
బ్రతికితి విట్లు నీకు సమరంబున వేఱొకభంగి యైన నే
గతిఁ జనువాఁడ జీవితము గల్గిన నేమి ప్రయోజనం బగున్.
| 2531
|
| తే. |
అనిన విని లక్ష్మణుండు దయాళుఁడైన, రాము వీక్షించి ఖన్నుఁడై మోము వాంచి
కేలుదోయి ఫాలంబునఁ గీలుకొలిపి, యింపు దళుకొత్త మెల్లన నిట్టు లనియె.
| 2532
|
| సీ. |
దేవ ప్రాకృతుఁడవే నీవు మహానుభావుండవు మహానీయపండితుఁడవు
సత్యప్రతిజ్ఞుండ వత్యంతశూరుఁడ వలఘువీర్యుఁడ విట్లు పలుక నేల
మును దండకాటవి మునిసమక్షంబునఁ జేసినసమయంబు శిష్టుఁ డైన
మనవిభీషణున కిచ్చిన బాస చెల్లించి చరితార్థుఁడవు గమ్ము సాధుపురుషు
|
|
| తే. |
లాడి తప్పరు నృపజాతి కవనిలోనఁ, బ్రతిన నెఱపుటకంటె ధర్మంబు గలదె
ఘోరశరముల దశకంఠుఁ గూలవైచి, సొంపుమీఱఁ బ్రతిజ్ఞ పాలింపు మధిప.
| 2533
|
| క. |
హరినాథుబారిఁ జిక్కిన, కరినాథునిభంగి రాజకంఠీరవ నీ
శరపథమునఁ బడిననిశా, చరనాథుఁడు బ్రతికి పోవఁజాలఁడు తలఁపన్.
| 2534
|
| క. |
తడ వేటి కింక దిననా, థుఁడు గ్రుంకకమున్నె మెఱుఁగుతూపులఁ బుడమి
న్బడఁగూల్పుము దశకంఠుని, విడువక దేవతలు మింట వినుతింపంగన్.
| 2535
|
| చ. |
పరువడి నీప్రతిజ్ఞ నెఱవంగఁ దలంచితి వేని జానకిెం
గర మనురక్తిఁ గైకొనఁగఁ గాంక్ష మనంబునఁ గల్గె నేని యో
నరవర పథ్యవాది నగునావచనంబుఁ బరిగ్రహించి దు
ర్భరవరశాతబాణముల రాక్షసనాథునిఁ ద్రుంపు మిత్తఱిన్.
| 2536
|
| క. |
అని యిట్లు విన్నవించిన, ననుజన్మునిమాట కలరి యనఘచరితుఁ డా
జననాథుఁడు సంగ్రామం, బున కభిముఖుఁ డయ్యె శౌర్యభూషితుఁ డగుచున్.
| 2537
|
| వ. |
అంత నద్దశముఖుండు హనుమంతునిపరాక్రమంబును లక్ష్మణుండు మూర్ఛ దేఱు
టయు రామునిసమరోత్సాహంబును వానరులవ్యవసాయంబును సర్వంబును విని
చింతాకులితమానసుండై తప్తపాత్రాంతరాళస్థతైలంబుభంగిఁ దొట్రుపాటు
వహించి యేమియుం దోఁపక నమ్రవదనుం డై కొండొకసే పూరకుండి యంత
నొక్కింత జయోపాయం బాలోచించి శీఘ్రంబున నిజగురుం డైనశుక్రుని
యొద్దకుం జని యమ్మహాత్మునిచరణంబులు నిజకిరీటంబులు సోఁకం బ్రణమిల్లి
నిటలతటఘటితకరపుటుండై మొగంబున దైన్యంబు దోఁప వినయంబున నిట్ల
నియె.
| 2538
|
రావణుండు శుక్రాచార్యులయొద్ద కరిగి తన్ను రక్షింపు మని చెప్పుకొనుట
| సీ. |
భార్గవకులవర్య భానువంశజుఁ డైనరాముండు వానరరాజిచేత
సేతువు గట్టించి చెలువొప్ప జలరాశి లంఘించి కడువడి లంకఁ జేరి
ద్వారంబు లరికట్టి ఘోరసంగరమునఁ బెక్కండ్రదైత్యులపీఁచ మడఁచి
తనయుల భ్రాతల దండనాథుల మంత్రివరులను సఖుల నందఱ వధించె
|
|
| తే. |
నాజి కేగినవారిలో నసురుఁ డొక్కఁ
డైనఁ గ్రమ్మఱ బ్రతికి రాఁడయ్యె నకట
భయము జనియించె దైన్యంబు పాదుకొనియె
నేమి సేయుదు నింక నా కెద్ది తెఱఁగు.
| 2539
|
| తే. |
అనఘ నీయంతగురుఁ డుండ నాజిలోన
నరులచేఁ బడి చావఁ బాలైతి నింక
నైన సదుపాయ మెఱిఁగించి యధికకరుణ
గెలు పొసఁగి శిష్యవరుని రక్షింపరాదె.
| 2540
|
| ఉ. |
మాయలు సర్వతంత్రములు మంత్రములు న్సమరక్రియాజయో
పాయము లీ వెఱుంగుదు తపంబున నత్యధికుండ వన్నిట
న్నాయెడ నీవు పూర్ణకరుణారసపూరితదృష్టిఁ జూచిన
న్వే యన నేల శాత్రవుల వ్రేల్మిడిలోన వధించి పుచ్చనే.
| 2541
|
| క. |
వాలాయము మీ రిచ్చిన, దీలంకయు నీబలంబు నీయైశ్వర్యం
బీలక్ష్ములు నీసర్వము, పాలింపుము శత్రువరులపా ల్గాకుండన్.
| 2542
|
| సీ. |
అని యిట్లు ప్రార్థింప నక్కావ్యుఁడు ప్రసన్నుఁడై వానిఁ జూచి యిట్లునుచుఁబలికె
మంత్రము ల్తంత్రము ల్మందులు మాయలు మఱి పెక్కుపాయము ల్మనకుఁ జాలఁ
గలిగియున్నవి యింత కలవళింపఁగ నేల యే నుండ నింక నీ కేమి కొదవ
పాతాళహోమంబు పటునిష్ఠ నాచెప్పినట్ల సేయుము వహ్నియం దమోఘ
|
|
| తే. |
ఘనరథధనుశ్శిలీముఖకవచకుండ, లాదికంబులు వొడము నీ వంచితముగ
వాని నన్నిటిఁ గైకొని పూని యనికిఁ, జనితి వేనియు జయ మవశ్యంబు గలదు.
| 2543
|
శుక్రాచార్యులపంపున రావణుండు పాతాళహోమంబు సేయుట
| వ. |
హోమంబున కంతరాయంబు గలిగెనేని చేటు వాటిల్లు నట్లు గాకుండ వేలిమి
పరిసమాప్తి నొందింపు మని పలికి తన్మంత్రతంత్రక్రియాకలాపంబులు సమగ్రం
బుగా నెఱింగించి యనిచిన నద్దశముఖుండు నిజగృహంబునకుఁ జనుదెంచి బల
వంతు లగురాక్షసుల వలయునెడలఁ గాపు వెట్టి కవాటంబులు బంధించి పాతాళ
సన్నికాశం బైనయొక్కగుహ ప్రవేశించి విద్యుజ్జిహ్వుం డనువాని నొక్క
రాక్షసుని జతురంగబలసమేతంబుగా గుహాముఖంబున నుండ నియోగించి కృత
స్నానుం డై రక్తాంబరమాల్యానులేపనంబులు ధరియించి గంధాక్షతపుష్పా
లంకృతం బైనవేదికయందు విధ్యుక్తప్రకారంబున నగ్నిప్రతిష్ఠాపనంబుఁ
జేయించి లోహపాత్రలు నస్త్రసమిధలు వేదిసమీపంబునం బెట్టి భల్లాతకదాడి
మసమిధలును దత్ఫలంబులును దూర్వాగరుసర్షపగుగ్గులు మధుఘృతరక్తప్రవాళ
పాయసదర్భలును ఛాగకాకమీననక్రకూర్మమేషంబులును గాకకంకశ్యేనగృధ్ర
సర్పభల్లకురరంబులును జందనకుంకుమకర్పూరరక్తపుష్పంబులును ధాతురసం
|
|
| |
బులును గేశంబులును గల్పోక్తప్రకారంబున హోమంబు సేయుచుండె నప్పుడు
తదీయహోమధూమంబు విలయకాలసంకర్షణముఖవినిర్గతనిశ్శ్వాసధూమంబు
పగిది నతిభయంకరం బై వెలుపలికి నిర్గమించి ప్రళయకాలజీమూతంబుకరణి
గగనంబును దిక్కులును నీరంధ్రంబుగా నావరించి గాఢసంతమసంబుఁ బుట్టించె
నప్పుడు సిద్ధచారణమరుద్గంధర్వయక్షకిన్నరోరగాదు లత్యంత సధ్వసంబున సంధీ
భూతులై సుడివడిరి వాతంబులు కలుషంబు లై సుడిసె దిక్పాలకు లేమియుం
దోఁపక ఱిచ్చవడియుండిరి వానరులు భయకంపితాంగు లై తూలగతిం దూలిరి
జగంబంతయు నతిభయంకరం బై తోఁచె నమ్మహోత్పాతంబులన్నియు విలో
కించి రావణకృత్యం బంతయు నెఱింగి నీతివిద్యావిభూషణుం డగువిభీషణుండు
రయంబున రామునియొద్దకుం జనుదెంచి యి ట్లనియె.
| 2544
|
రావణుండు పాతాళహోమంబు చేయుచున్నాఁ డని విభీషణుండు శ్రీరామున కెఱింగించుట
| చ. |
నరవర మిము మార్కొని రణం బొనరింపఁగ లేక భీతుఁ డై
కర మరుదార రావణుఁడు కావ్యునిపంపున భూబిలంబులో
నురవడి నాభిచారికపుహోమముఁ జేయుచు నున్నవాఁడు స
త్వరముగ వేలిమిం జెఱుప వానరవీరులఁ బంపు మిత్తఱిన్.
| 2545
|
| చ. |
పరువడి హోమకృత్య మది పారము ముట్టిన వహ్నియందు ది
వ్యరథకృపాణబాణకవచాదికము ల్వెస నుద్భవించు భీ
కరగతి వాని నన్నిటిని గైకొని పోరికి నేగుదెంచినన్
హరిపరమేష్ఠిశంకరులకైన నసాధ్యుఁడు వాఁ డధీశ్వరా.
| 2546
|
| ఉ. |
నా విని రాఘవుండు కపినాథున కిట్లను బాహువిక్రమ
శ్రీవిభవాభిరాములను వృక్షచరాగ్ర్యుల నంగదాదుల
న్వావిరి వేలిమిం జెఱుపఁ బంపుము జా గోొరింప వల్వ దా
రావణు నాజిలో గెలువ రా దటు హోమము పార మొందినన్.
| 2547
|
| సీ. |
అని యానతిచ్చిన నవ్వానరాధీశుఁ డంగదజాంబవదాంజనేయ
నలనీలకుముదపనసవలీముఖధూమ్రగంధమాదనగజగవయవృషభ
శరభగోముఖరంభశతవలిమైందద్వివిదగవాక్షసుషేణవినతతార
ముఖ్యవానరయూథపులఁ బదికోటుల నియమించి పంచిన రయము మెఱయ
|
|
| తే. |
వారు బ్రహ్మాండభాండంబు పగుల నార్చి, వృష్టిఘనములగతి వినువీథి నిండి
పక్షవత్పర్వతంబులపగిది నేగి, లావు దీపింప నురవడి లంకఁ జేరి.
| 2548
|
అంగదాదులు రావణునిపాతాళహోమంబునకు భంగము సేయ నరుగుట
| శా. |
ప్రాకారంబులు గూల్చి ఖేయములు విధ్వంసంబు నొందించి య
స్తోకప్రౌఢిమ ద్వారరక్షకుల రక్షోవీరులం జంపి నా
|
|
| |
కౌకు ల్మెచ్చఁ గవాటము ల్విఱుగ నొయ్యం దన్ని బాహాబలో
ద్రేకం బొప్పఁగ లంక సొచ్చి విజయశ్రీ మీఱఁగా నేగుచున్.
| 2549
|
| సీ. |
వాజిశాలలు చొచ్చి వాయువేగము గలఘోటకంబుల ధాత్రిఁ గూలఁ దన్ని
కరిమందిరంబుల కుఱికి బల్పిడికిళ్ల భద్రేభకుంభము ల్వగుల మోఁది
రథగృహంబుల కేగి రభసంబుతో శతాంగంబుల నుగ్గునూచంబు సేసి
యాయుధశాలల కరిగి మహాధనుర్విశిఖాదికంబులు విఱిచివైచి
|
|
| తే. |
సౌధములు నేలఁబడఁ దన్ని సాహసమున
వరనిశాచరగృహములు పాడు చేసి
మదగజేంద్రంబు లొక్కట మడువు సొచ్చి
గలఁచినట్లు లంకాపురిఁ గలఁచి రపుడు.
| 2550
|
| చ. |
తమ కెదురైనదైత్యుల నుదగ్రబలంబునఁ బట్టి నేల దు
ర్దమగతి వ్రేయుచున్ ఖరకరంబులఁ దట్టుచుఁ గాళ్ల మెట్టుచు
న్విమతునిఁ బంక్తికంథరుని వేగమె చూపుఁడు మాకు నంచు సం
భ్రమమున యామినీచరుల బాధలు పెట్టి రనేకభంగులన్.
| 2551
|
| చ. |
అసమున యాతుధానులగృహంబులు దూఱి చలం బెలర్ప రా
క్షసులను బట్టి యీడ్చికొని గ్రక్కున వచ్చి శిలాతలంబుల
న్విసువక వైచి చంపుచుఁ బ్రవృద్ధుల బాలురఁ బట్టి బల్మిమైఁ
గసిమసిచేసి చంపిరి యఖండపరాక్రమదుర్నివారు లై.
| 2553
|
సరమవలనఁ బాతాళహోమగుహ నెఱింగి యంగదుండు గుహలోనికిఁ జొచ్చుట
| వ. |
ఇట్లు లంకాపురంబంతయు నాకులంబు గావించిన నన్నిశాచరులు తదీయప్రహార
పీడితులై పద్మదళవిలగ్నజలకణంబులమాడ్కిఁ దల్లడం బొందుచుఁ బ్రాణభ
యంబునఁ గొందఱు దశదిశలకుం బాఱిరి కొంద ఱుచ్చైర్నాదంబున రోదనం
బు గావించిరి గొందఱు పాపాత్ముం డగురావణుని దుర్నయంబున నింత పుట్టె నిట్టి
మహోపద్రవం బెన్నఁ డెఱుంగమని కటకటంబడుచుండి రాసమయంబున విభీ
షణునిభార్య సరమ యనునది రావణుండు హోమంబు చేయుచున్న గుహాస్థలంబు
హస్తసంజ్ఞచేత నంగదునకుం జూపిన నవ్వీరో త్తముండు దాని నెఱింగి రయం
బున గుహకడకుం జని గుహవాత వైచియున్నపాషాణంబు పాదప్రహారంబున
నుగ్గునూచంబు చేసి యచ్చటం గావలియున్న రాక్షసుల నిశ్శేషంబుగా వధించి
పుచ్చి గుహలోనికి డిగ్గి యందు.
| 2554
|
| శా. |
అక్షీణద్యుతి యైనవాలితనయుం డచ్చోట వీక్షించె జ
న్యక్షోణీతలనిర్జితాగ్నియమరాడ్యక్షేశరక్షస్సహ
స్రాక్షు న్భూరిపరాక్రమాక్రమితహర్యక్షున్ నిశాటాన్వయా
|
|
| |
ధ్యక్షున్ దారుణహోమకృత్యకలనాదము న్సముద్రాక్షకునిన్.
| 2555
|
| చ. |
కని పట్టుకోపవేగమునఁ గన్నుల నిప్పులు రాల డాయఁగాఁ
జని కుసుమాక్షతాదిబలిసంతతియున్ ఘనహోమవస్తువు
ల్పనిపడి పంక్తికంథరుని పాణులు నొప్పెడు స్రుక్స్రువంబుల
న్మునుకొని హోమపాత్రలు సముద్ధతితోఁ బడవైచె వహ్నిలోన్.
| 2556
|
| వ. |
ఇట్లు హోమార్థంబు సమానీతంబు లైనపదార్థంబు లన్నియు నిశ్శేషంబుగా
వహ్నికుండంబునం బడవైచి రావణుం గదిసి.
| 2557
|
| సీ. |
పిడుగుల కెనయైనపిడికిటిపోటుల గుండియ ల్వగులంగఁ గ్రుమ్మి క్రుమ్మి
పవిసన్నిభస్పర్శపటునఖంబుల మేను చిల్లులు వాఱంగ జీల్చి చీల్చి
కరములఁ బట్టి చిక్కనితలవెండ్రుక ల్బిఱుసైనమీసాలు వెఱికి వెఱికి
వీరుండ వైతేని వెడలిర మ్మాజి సేయఁగ నంచు రోషోక్తు లాడి యాడి
|
|
| తే. |
పెక్కువిధముల బాధించె నుక్కు మిగిలి
యెంత చేసిన దశకంఠుఁ డించుకైన
నేత్రములు విచ్చి చూడక నిష్ఠ వదల
కచలమును బోలె సుస్థిరుం డగుచు నుండె.
| 2558
|
| తే. |
అత్తెఱం గంతయును జూచి యమరనాథ
పౌత్త్రుఁ డొక్కింత యోచించి పటురయమున
నచట నుండక సురవైరియంతిపురికి
నుక్కు మెఱయంగ నరిగి యందొక్కచోట.
| 2559
|
అంగదుండు దుగఖించుచున్న మండోదరి నీడ్చుకొని రావణునికడకు వచ్చుట
| సీ. |
రాకాబ్జనిర్గళత్ప్రాలేయకణములకరణిఁ గన్నుల నశ్రుకణము లొలుక
విడువక వెడలు బల్వేఁడినిట్టూర్పుల లలితాధరోష్ణపల్లవము గంద
స్వర్భానుకబళితశశిమండలమువోలె వదనంబు మిగుల వైవర్ణ్య మొందఁ
గరపల్లవోష్ణతఁ గమలి చారుకపోలముకురంబు మలినతాస్ఫూర్తి నొప్ప
|
|
| తే. |
వాలుఁగొ ప్పంసతలమునఁ దూలియాడ, వాతవేగసముద్ధూతవల్లిభంగి
గాఢశోకంబుచే మేను కంప మొంద, విన్నమోమునఁ గూర్చుండి యున్నదాని.
| 2560
|
| చ. |
అలఘుచరిత్ర నంచితగుణాఢ్యను సాధ్విని రాజపుత్రి దే
వల దని చెప్పిన న్విన కవార్యగతిం జని కానలోన మ్రు
చ్చిలి కొని తెచ్చె రావణుఁడు చేసినదోసము రిత్తవోవునే
కలన వధంబు గల్గు నని కాంతలతో ననుదాని వెండియున్.
| 2561
|
| చ. |
గురుబలుఁ డామహోదరుఁడు కుంభనికుంభులు కుంభకర్ణుఁడు
న్మఱియుఁ బ్రహస్తుఁ డాదియగుమంత్రులు శక్రజిదాదిపుత్త్రులు
న్నరహరివీరదోర్బలమున న్నశియించిరి పోర నింక నె
|
|
| |
వ్వరి గొని యాజి గెల్పు గొనువాఁడు నిశాచరనాథుఁ డారయన్.
| 2562
|
| ఆ. |
ఏమి సెప్పుదాన నింతకాలమున కి, ట్లనుభవింపవలసె నమితదుఃఖ
మకట దైవకృత్య మలవియె తప్పింప, ననుచు సఖులతోడ నాడుదాని.
| 2563
|
| సీ. |
ఖరదూషణాదుల మరణంబు మారీచమథనంబును గబంధవధము శక్ర
తనయునినిధనంబు తపనపుత్త్రునిసఖ్య ముదధిబంధనము రణోర్వియందుఁ
గుంభకర్ణా॰దికఘోరదైత్యులచావు రామలక్ష్మణులమార్గణసమృద్ధి
వానరవరులదుర్వారబలోద్ధతిఁ బేర్కొని మదిలోన భీతిఁ జెంది
|
|
| తే. |
రామభద్రుని నెదిరించి రణములోన
జయము చేకొని రాక్షససత్తమునకు
వశమె యడియాస లింవకేల వదలఁ డనుచు
యొడలు కంపింప నుడుకుచు నున్నదాని.
| 2564
|
| వ. |
మందోదరిం గాంచి యవ్వాలినందనుండు రయంబునఁ దారం జేరుమహాగ్ర
హంబుకైవడి నూతనలత డాయుమహావాతంబుపోల్కి గజాంగనం బొదువుసిం
హకిశోరంబుచాడ్పున మృగాంగనం గవియుశార్దూలపోతంబుమాడ్కి నద్దేవిం
గదిసి మత్తశుండాలంబు తుండంబున శైవాలపుంజంబుం బరిగ్రహించినభంగి
కచంబులం బట్టుకొని దశకంఠునియశఃకుసుమంబులపోల్కి ననర్ఘరుచిరావతంస
స్థగితస్థూలముక్తాఫలంబులు జల్లనఁ బుడమిం బడ రాక్షసవల్లభునిప్రతాపం
బనేకశకలంబు లై పుడమి రాలినతెఱంగున వక్షోనిక్షిప్తమహార్హమణిభూషణ
వ్రాతంబులు చిందఱవందఱ లై రాల భర్తృకరవిమర్దనం బింకఁ గలుగమికి
దుఃఖించుచున్నకరణిఁ గుచమండలంబు నిరంతరగళదశ్రుధారల నొప్ప దదీయరమ
ణీయగాత్రవల్లికాగ్రప్రసూనంబులసొబగున గొప్పకప్పుఁగొప్పునం జుట్టినవిరులు
విరిసిపడ వధనసరోరుహపరిభ్రమన్మత్తబంభరడింభంబులపొలుపున రంగైనముం
గురులు నిటలతటంబునం జలింప నిశాటపతికిం జేటు గల్గు నని మొఱపెట్టు
చందంబున మణిరంజితమంజీరంబులు మొఱయ దివినుండి దేవతాంగనలు
హర్షనాదంబులఁ గావింపఁ జుట్ల నున్న రాక్షసవనిత లుచ్చైన్నాదంబున రోద
నంబు గావింప రాక్షసరాజ్యలక్ష్మింబోలె నమ్మందోదరి నీడ్చికొని యతిసాహ
సంబున రావణునొద్దకుం జని వానితో నిట్లనియె.
| 2565
|
| ఉ. |
రావణ నీవు ము న్నలయరణ్యమునం బతి యొద్ద లేనిచో
వావిరిఁ దస్కరుండ వయి వంచనఁ దెచ్చితి వామహీసుత
న్నీవును నీదుబాంధవులు నేఁడు గనుంగొనుచుండ బల్మి నీ
దేవిని బట్టి యీడ్చికొని తెచ్చితి చూడుము దీని ముంగలన్.
| 2566
|
| క. |
అని పలుక నపుడు శోకము, మనమున నంతంత కెదుగ మందోదరి రో
దన మొనరించుచు భర్తను, గనుఁగొని యి ట్లనియె నడలు గడలుకొనంగన్.
| 2567
|
మండోదరి రావణునకు రోషంబు పెరుఁగ నాడుట
| చ. |
జనపతి యొద్ద లేనియెడ జానకి ముచ్చిలి తెచ్చి తీవు నీ
దనుజులు నీవుఁ జూడ నిటు దప్పక దెచ్చితి నీదుగేహినిం
గనుఁగొను మంచు గర్వ మది గన్పడ నీకపి యన్నవాక్యము
న్వినియును నీకు లజ్జయు వివేకముఁ గోపముఁ బుట్ట దేలకో.
| 2568
|
| చ. |
హరిహయవైరి సర్వపరమాస్త్రవిదుండు నుదగ్రనందనుం
డురుభుజవిక్రముండు మని యుండిన నీవిపినాటుఁ డీక్రియం
దిరముగ నన్నుఁ బట్టికొని తెచ్చునె పాశియమేంద్రకిన్నరే
శ్వరులకు నైనఁ జూడఁగ వశంబె నిశాచరనాథ నాదెసన్.
| 2569
|
| ఉ. |
వాసవతుల్యుఁ డైనరఘువర్యుని దేవిని మ్రుచ్చిలించి యు
ల్లాసము మీఱ దెచ్చితివి లంకకు శంక యొకింత లేక నీ
దోసము రిత్తవోవునె యధోగతికి న్నినుఁ బుచ్చుఁగా కిల
న్వీసరవోవునే యనుభవించినఁ గాక నిజాపరాధముల్.
| 2570
|
| ఉ. |
కాలము డాయవచ్చిన నకార్యము కార్యము బుద్ధిలోఁ గనం
జాలరు దోచినంతపని సల్పుదు రార్యహితోపదేశము
ల్మేలని చూడ రంతమున మిక్కిలి హాని యొనర్చుసీత నీ
పాలిటికాళరాత్రి యని భావమునం దలపోయఁజాలితే.
| 2571
|
| ఉ. |
రామునిదివ్యసాయకపరంపరల న్సమరంబులోన ను
ద్దామపరాక్రమాధికులు దానవవీరు లనేకు లీల్గి రిం
కేమని చెప్పుదాన నసురేంద్ర యొకండవు చిక్కి తీవు సం
గ్రామజయంబు గల్గు నని రాక్షసనాథ తలంప నేటికిన్.
| 2572
|
| చ. |
కడువడిఁ గాలపాశ మురిగాఁగ మెడం దగిలించుకొంటి వె
క్కడఁ జనవచ్చు నింక బలఘస్మరుఁ డైనను గావ శక్తుఁడే
విడువక యాజి కేగి రఘువీరుని దాఁకి వధింపు గానిచోఁ
దడయక చావు మవ్విభుని దారుణదివ్యశరాభిసంహతిన్.
| 2573
|
| క. |
చి చ్చొడిఁ గట్టినవానికి, వచ్చునె మే లకట రాజవర్యునిదేవిం
దెచ్చినయప్పుడె నీపనిఁ, జచ్చితి వని దలఁచితిని నిశాచరనాథా.
| 2574
|
| చ. |
తలఁగక జన్యరంగమున దాశరథిన్ వధియించు టొండె న
య్యలఘుచరిత్రుదివ్యవిశిఖాహతిఁ జచ్చుట యొండె మాయలున్
బలుమఱు మంత్రతంత్రము లుపాయములు బని సేయ వింక నీ
వలవనియాశ మాని సురవైరికులోత్తమ లెమ్మ చెచ్చెరన్.
| 2575
|
| మ. |
హరిదంతద్విపదంతముల్ పెఱికి దుర్గాధీశుకైలాస మె
త్తి రహిన్ దివ్యధనుర్గుణవ్రణకిణోద్దీప్తంబు లై నిర్జరే
|
|
| |
శ్వరయక్షేశయమాదిదిక్పతులదోఃప్రాబల్యమున్ మాన్చి బం
ధురలీలం జెలువారె నీదుభుజముల్ దుర్వారశౌర్యోద్ధతిన్.
| 2576
|
| మ. |
అసమానోరుభవత్కరార్పితసముద్యద్దేవతానోకహ
ప్రసవాలంకృత మైననాదుకబరీభారంబు నివ్వానరుం
డసురుల్ చూడఁగఁ బట్టి యీడ్చె దనుజేంద్రా భూరిబాహాబలం
బెసఁగన్ వీనిమదంబు వో నిడక నీ కిట్లుండఁగాఁ జెల్లునే.
| 2577
|
| చ. |
అజునిఁ దపంబునం దనిపి యవ్విభుచేత వరంబు లంది దో
ర్విజితజగత్త్రయుండ వయి వీరుఁ డనంగఁ బ్రసిద్ధి గన్ననీ
నిజసతికేశపాశ మొకనీచవనాటుఁడు పట్టి యీడ్చె నో
రజనిచరేంద్ర మానముఁ దిరం బగుకీర్తియు నింక నిల్చునే.
| 2578
|
| క. |
మునివృత్తి హోమకృత్యం, బొనరించి నృపాలమౌళి నుద్ధతి ననిలో
మునుకొని జయింపఁ జూచితొ, పనిగొన వింకఁ గొఱగానిపనులు సురారీ.
| 2579
|
| తే. |
మంత్రములు తంత్రములు దైత్యమాయ లన్ని
శక్రజితునితోడనె వెంటఁ జనియె నింక
నేమి చేసిన నే మగు నృపవరేణ్యు
శరనిహతిఁ గూలు టంతియె గొఱఁత నీకు.
| 2580
|
| చ. |
రణమున కీవు పోయి రఘురామునిముంగలఁ గొంతసేపు మా
ర్గణములకల్మిఁ జూపి తుది రాజలలామునివిస్ఫురద్ధను
ర్గుణపరిముక్తకాండములఁ గూలుము భూస్థలి నట్లు గానిచో
గుణ మది గల్గి రామునకు గొబ్బున జానకి ని మ్మధీశ్వరా.
| 2581
|
| వ. |
అని యిట్లు మందోదరి శోకరోషభయలజ్జాపరాభవకలిత యై పలికిన విని రాక్షస
వల్లభుం డగురావణుండు హోమంబు చాలించి మౌనంబు విడిచి డిగ్గన లేచి రోషా
నలజ్వాలాభీలలోచనుండై కాలవ్యాళంబుం బోనికరవాలం బంకించి వాలినంద
నునిభుజాంతరంబు వ్రేసి మూర్ఛితుం జేసి తనప్రాణేశ్వరిని విడిపించిన నది వాతాం
దోళితవనలతకైవడి నడలుచుఁ గేశబంధంబు వీడి వెన్నున జీరియాడఁ బాదం
బులు తొట్రువడ రోదనంబు సేయుచు నంతఃపురంబునకుం జనియె నప్పుడు విసం
జ్ఞుం డైనయంగదుం జూచి బలవంతుం డగుహనుమంతుండు మహాశనిసంకాశం
బైనముష్టి నలవరించి దశగ్రీవునిమస్తకంబుఁ బొడిచె నంతలోనం దెలివొంది
పురందరపౌత్త్రుండు రక్తధారాస్నపితదేహుం డై ధాతుభూషితం బైనశైలంబు
చాడ్పునం జూపట్టుచు నతికోపంబున దైత్యేంద్రునిబలంబు దూలివోవఁ గరతలం
బున వ్రేసె ని ట్లయ్యిరువురచేత వ్రేటుపడియు సరకుగొనక బలం బెడలక చలంబు
డింపక రావణుండు వహ్నికుండంబులవలన నిర్గమించువిస్ఫులింగంబులుంబోలె
భీషణరోషకషాయితలోచనంబుల నగ్నికణంబు లుప్పతిల్ల గదాదండంబున నాఖం
|
|
| |
డలపౌత్త్రుని దూల నేసి పదంపడి హుతాశనజ్వాలాభీలం బైనకరవాలంబున
హనుమంతునిం బ్రహరించి దోడనె నలనీలగజగవయగవాక్షగంధమాదనశరభ
శతవలిమైందద్వివిదులఁ గ్రమంబున ముసలముద్గరపరిఘపట్టసప్రాసకుంతతోమ
రాంకుశశూలచక్రంబులు ప్రయోగించి జర్జరితాంగులం జేసిన వారు బెండు
సెడక గండు మిగిలి కరచరణనఖదంతముష్టిజానుకూర్పరవాలతలపార్ష్ణిఘాతంబుల
నొప్పించి వెగడుపఱచి నిజసైన్యంబులం గూడి రామునియొద్దకుం జనుదెంచి
హోమంబుఁ జెఱిచి వచ్చితి మని వినయంబున విన్నవించి పరమానందంబు
నొందించి రంత రావణుండు హోమం బంతరాయంబు నొందిన నతిభీతుండై
సేయునది లేక యేమియుం దోఁపక యభ్యంతరమందిరంబునకుం జని యం
దేకాంతంబున శోకరసాధిదేవతయుం బోలెఁ జూపట్టుచు రోదనంబు సేయుచున్న
మందోదరిం గాంచి యిట్లనియె.
| 2582
|
| చ. |
పడఁతిరొ యింత నీకు వగవం బని లే దిలఁ బ్రాణికోటికిం
గుడువక తీర దెన్నటికిఁ గోరి యొనర్చిన కర్మసంచయం
బెడపక నేను జన్యమున కేగి మహోగ్రశిలీముఖావళుల్
వడిఁ గురియించి రాఘవుల వానరులన్ వధియించి వచ్చెదన్.
| 2583
|
| చ. |
నళినదళాయతాక్షి కదనంబున రామునిఁ జంపు టొండె న
య్యలఘుచరిత్రదివ్యవిశిఖాహతిఁ జచ్చుట యొండె నంతె పో
పలుకు లిఁ కేల యే నచటఁ బంచత నొందిన నీవు దుఃఖ మ
వ్వల నిడి జానకిం దునిమి వహ్నిముఖంబునఁ జావు మొక్కటన్.
| 2584
|
శ్రీరాములప్రతాపమును మండోదరి రావణున కెఱింగించుట
| క. |
అన విని మండోదరి తన, మనమునఁ గడు నుమ్మలించి మానక విభునిం
గనుఁగొని బాష్పకణంబులు, చనుమిట్టలఁ జిందుచుండఁ జయ్యనఁ బలికెన్.
| 2585
|
| మ. |
విబుధేంద్రస్తుతశౌర్యు రాముని రణోర్విం జంపఁగాఁ జాల వెం
తబలౌద్ధత్యము నీకుఁ గల్గిన దిగంతవ్యాప్తతేజుండు బా
డబకీలోపమదివ్యబాణుఁడు ప్రచండస్ఫారవీర్యోన్నతిం
గబళింపంగ సమర్థుఁ డీజగములం గాకుత్స్థుఁ డూహింపఁగన్.
| 2586
|
| మత్తకోకిల. |
శక్రతుల్యపరాక్రముండు విశాలకీర్తిఘనుండు దో
ర్విక్రమార్జితవీరశబ్దుఁ డరిందముం డనఘుండు ని
ర్విక్రసాధుచరిత్రుఁ డాశ్రితపారిజాతమహీజ మో
క్రశిష్యవరేణ్య రాముఁడు సుప్రశస్తబలుం డిలన్.
| 2587
|
| ఉ. |
మానవనాథు రాఘవుని మానవమాత్రునిఁగాఁ దలంచితో
మానితతావకీయశరమర్దితు లై సుర లెల్ల వేఁడఁగా
మానవరూపధారి యయి మర్త్యజగంబున దుష్టదైత్యులం
|
|
| |
బూని వధింప నాజి కిటు పుట్టినమాధవుఁగా నెఱుంగుమా.
| 2588
|
| చ. |
నిను మును దోఁకఁ జుట్టుకొని నీరధు లన్నియు ముంచినట్టియా
ఘనబలశాలి వాలి నొకకాండమునన్ వధియించె వారిపై
వనచరకోటిచేత సులభంబుగ సేతువు గట్టఁ జేసె నొ
య్యన నివి మర్త్యమాత్రునకు నయ్యెడుకార్యములే హృదీశ్వరా.
| 2589
|
| సీ. |
పిన్ననాఁడె త్రిలోకభీకరాకృతి యైనతాటకఁ జంపె నుద్దండవృత్తిఁ
దాటకేయాదిదుర్దమరాక్షసులఁ దోలి కౌశికయాగరక్షణ మొనర్చె
భుజశక్తి సురలైన మోపెట్టఁజాలని శూలికార్ముక మవలీల విఱిచె
గార్తవీర్యునిబాహుకాండంబు ద్రుంచిన భార్గవరాముని భంగపఱిచె
|
|
| తే. |
దానవేశ్వర యివి యన్ని దలఁచి చూడఁ
గర మమానుషచర్యలు గావె యధిప
యిట్టిజగదేకవీరు నహీనసత్త్వు
నమితశౌర్యు జయింప నీ కలవి యగునె.
| 2590
|
| సీ. |
మత్స్యరూపమున సోమకుఁ జంపి ధాతకు శ్రుతుల నొసంగిన దితఁడు గాఁడె
కమఠమై మందరాగము నెత్తి వేల్పుల కింపుతో సుధ నిచ్చె నితఁడు గాఁడె
కిటియై హిరణ్యాక్షుఁ గెడపి బల్గొమ్మునఁ బృథివీతలం బెత్తె నితఁడు గాఁడె
కరరుహంబులఁ జీఱి సురలెల్లఁ గొనియాడ హేమకశిపుఁ జంపె నితఁడు గాఁడె
|
|
| తే. |
వామనాకృతి బలి గిట్టి వైచి జగము
లేపుతో నాక్రమించిన దితఁడు గాఁడె
భృగుకులంబునఁ బుట్టి ముయ్యేడుమాఱు
వెతకి రాజుల వధియించె నితఁడు గాఁడె.
| 2591
|
| క. |
దురమున నినుఁ బొరిగొని ని, ర్జరులకు హిత మాచరించి సంయమివరులం
గరుణం గానఁగ నందక, ధరుఁ డిప్పుడు రామరూపధరుఁ డై పుట్టెన్.
| 2592
|
| తే. |
సంగరంబున నీ కింకఁ జావు నిజము
నాకు నీతోడ ననుగమనంబు సేయ
రాదు ముదిమియు మరణంబు లే దటంచు
మున్ను వర మిచ్చె మాతండ్రి మునివిరోధి.
| 2593
|
| ఆ. |
ఏమి సేయుదాన నిఁక నెద్ది దిక్కు నా, కొంటి నిన్ను విడిచి యుండవలసె
వరుసఁ బూర్వకర్మఫలము భుజింపక, తీఱ దుర్వి నెంతవారి కైన.
| 2594
|
| తే. |
సంభ్రమమున నలవిభీషణునిభార్య
సరమ పంచినపను లన్ని సంతతంబు
దాసిచందానఁ జేయుచు దోసి లొగ్గి
బ్రతుకవలసె నా కింక సుపర్వవైరి.
| 2595
|
| వ. |
అని పలికి రావణుం గౌఁగిలించుకొని దీనముఖ యై లోచనగళదశ్రుధారాసా
రంబునఁ బతిశరీరంబు దడుపుచు నుచ్చైర్నాదంబున రోదనంబు గావించె నప్పు
డద్దశగ్రీవుం డుచితసల్లాపంబులం బ్రియురాలి నూరార్చి తత్కాలసదృశం బగు
వాక్యంబున ని ట్లనియె.
| 2596
|
రావణుండు మండోదరితోఁ దనదీనస్థితిని చెప్పుకొనుట
| చ. |
తనయుల మంత్రులన్ సఖులఁ దమ్ముల భృత్యుల సర్వబంధులన్
ఘనచతురంగసైన్యములఁ గయ్యమునన్ మును గోలుపోయితిన్
వనజదళాక్షి యే నొకఁడఁ బట్టుగ నేమి సుఖంబు నొందఁగా
మనియెద వారు పోయినక్రమంబున నాకును బోవు టొప్పగున్.
| 2597
|
| మ. |
అనిమేషేంద్రభుజావలేపహననవ్యక్తప్రతాపోదయున్
ఘనమాయున్ నిఖిలాస్త్రశస్త్రవిదు జన్యప్రేము నయ్యింద్రజి
త్తును గోల్పోయితి నింక నేల బ్రతుకన్ దోశ్శక్తి నమ్మానవేం
ద్రునిఁ బోరన్ వధియింతుఁ గానియెడఁ జత్తుం గాక వే ఱున్నదే.
| 2598
|
| చ. |
చెఱిచితి యజ్ఞకర్మములు శిష్టుల మౌనులు బాధ పెట్టితిన్
బరసతులం దగఁ జెఱలువట్టితి వేల్పుల హింస చేసితిన్
గరివరయాన యేను గనుగానక చేసితిఁ బెక్కుపాపముల్
గఱకఱి నన్నిటిం గుడుచుకాలము డాయఁగ వచ్చె నేఁటికిన్.
| 2599
|
| చ. |
నరసురయక్షకింపురుషనాగనభశ్చరసిద్ధసాధ్యకి
న్నరగరుడోరగాదుల రణంబునఁ దోలి యశంబు గన్న నే
నరుదుగ నేఁడు మర్త్యు శరణాగతి నొందుట యెట్లు పౌరుషం
బఱుగదె యింతకంటె సమరావనిఁ జచ్చుట మేలుగాదొకో.
| 2600
|
| క. |
బాలా పౌరుష మణఁగిన, నేలా రాజ్యంబు భోగ మేలా సైన్యం
బేలా నశ్వరజీవిత, మేలా నీ వేల భాగ్య మేటికిఁ జెపుమా.
| 2601
|
| చ. |
హరిహయుచేతివజ్రము కృతాంతునిదండము పాశిపాశమున్
గరువలికేతనం బసురఖడ్గముఁ బావకుశక్తిఁ గిన్నరే
శ్వరుగదఁ జీరికిం గొననివాఁడ మహేశ్వరదత్తభూరిభీ
కరతరచంద్రహాస మది గల్గఁగ నింత విచార మేటికిన్.
| 2602
|
శ్రీరాములచేఁ జచ్చుటయే నాపరమార్థం బని రావణుండు భార్యకుఁ దెల్పుట
| చ. |
అళికులవేణి యొక్కపరమార్థముఁ జెప్పెద దేవతల్ మునీం
ద్రులు దను వేఁడుకొంటకుఁ జతుర్భుజుఁ డాజి ననుం బరాక్రమం
బలర వధింపఁగా దశరథావనిభర్తకుఁ బుత్త్రుఁ డై ముదం
బలవడ రామరూపమున నర్థి జనించుట నే నెఱుంగుదున్.
| 2603
|
| ఉ. |
రాగ మెలర్ప ఘోరసమరంబున రామశరంబులం దను
త్యాగముఁ జేరి దుర్లభసుఖావహశాశ్వతముక్తికామినీ
భోగము నొందఁ గోరి నృపపుత్రిని మ్రుచ్చిలి తెచ్చితి న్సము
ద్యోగ మెలర్ప నవ్విభున కుద్థతి నాపయిఁ గిన్క పుట్టఁగన్.
| 2604
|
| తే. |
నేఁటితో సరి వనితరో నీదుపొందు
భూపతిశరంబులం దెగి ముక్తికాంతఁ
బొంద రణమున కిప్పుడె పోవువాఁడ
నిదియె సుముహూర్త మెడసేయ నేటి కిచట.
| 2605
|
రావణుండు కడపటియుద్ధంబునకు వెడలుట
| వ. |
అని పలికి యద్దేవికిం జెప్పి దనుజకుంజరుండు దిగ్గున లేచి రణోత్సాహసాహస
బాహాటోపకోపంబు లభివృద్ధి నొంద శీఘ్రంబున నంతఃపురంబు వెలువడి పాద
విన్యాసంబున మహీతలంబు గ్రక్కదల సముదగ్రవినూతనమహాగ్రహంబున నతి
దుర్నిరీక్షుం డై యాస్థానసదనంబునకుం జనుదెంచి మణిఖచితహేమసింహాస
నంబున నాసీనుం డై యుదయమహీధరోపరిగతనీలజీమూతంబుకరణిం జూప
ట్టుచుఁ గులమహీధరగుహాముఖంబులం బ్రతిధ్వనులు సెలంగ సప్తసముద్రం
బులు పొంగి పొరల ధరాచక్రంబు తల్లడపడ దిశాముఖంబులు బ్రద్దలు వాఱ
గగనంబు ఘూర్ణిల్ల భూచరఖేచరభూతవ్రాతంబులగుండె లవియ గ్రహంబులు
గతులు దప్పఁ గోటిపిడుగులమ్రోఁతకు న్దీటగునట్లుగాఁ బ్రస్థానభేరి వేయించి
యనర్ఘమణిమయరత్నకిరీటంబులు దశశిరంబుల నలంకరించి మణికేయూరంబు
లిరువదిభుజంబుల బాదుకొల్ప మాణిక్యమయకుండలచ్ఛాయాసంక్రాంతవింశ
తిగండమండలుం డై నానావిధకమనీయతరళతారహారంబు లురంబున సవరించి
శశక్షతజకల్పసుశీతలచందనపంకలిప్తగాత్రుం డై సంధ్యారాగపరీతజీమూ
తంబు ననుకరించుచు మణిమండనమండితసర్వాంగుం డై ధాతుశోభితాంజనాచ
లంబుపోల్కిం దేజరిల్లుచు శరశరాసనగదాముసలముద్గరభిండివాలకరవాల
శక్తితోమరపాశపరిఘాంకుశచక్రకుంతశూలప్రాసపరశ్వథక్షేపణీప్రముఖబహు
విధాయుధాలంకృతవింశతిబాహుం డై తీవ్రమయూఖమండితుం డై నపుండరీక
బంధుండుంబోలె వెలుంగుచుఁ గాలకేతునామకసూతుండు సహస్రజవాశ్వం
బులం బూన్చి మణిమయపతాకాకేతనంబు లెత్తి కార్ముకబాణతూణీరాది
బహువిధాస్త్రశస్త్రపరిపూర్ణంబు గావించి షోడశచక్రపరిక్షిప్తం బైనసాంగ్రా
మికకాంచనరథం బాయత్తంబు చేసి సహస్రఘంటానిర్దోషభీషణంబుగాఁ
దెచ్చిన దాని నారోహించి శంఖదుందుభికాహళభేరీభాంకరణపురస్సరంబుగా
దివ్యవిమానాధిరూఢుండై పరమపదంబునకుం బోవుచందంబున నాజిరంగంబు
నకుం జనియె నతనిరథంబు వెనుకొని సర్పరోముండును ఖడ్గరోముండును వృశ్చి
కరోముండు నగ్నివర్ణుండు ననునామంబు గలయాతుధానయోధులు నలువురు
|
|
| |
సర్వాయుధపరిష్కృతు లై ముక్తపురుషుని వైకుంఠంబునకుం గొని చను పార్ష
దులభంగి వెలుంగుచుం జనిరి వారల వెనుకొని చక్రపయోధరయుఁ దూణీరజం
ఘికయు శతఘ్నీశూలకేశాంతయు శంఖగళయు ధనుర్భ్రూలతోపోతయు శితసా
యకకటాక్షవీక్షణయు మత్తదంతావళయానయు శతాంశరథాంగనితంబయు
సముచితధ్వజపతాకాహస్తయు నానావిధహేతివ్రాతమణిభూషణాలంకృత
యు నై రాక్షససేనాలక్ష్మి బహువిధవాద్యంబులతో రామభద్రుని వరియింపం
జనుచందంబుగా నరిగె నిట్లు రావణుండు సకలసాంగ్రామికపరికరసమేతుం డై
రథభారంబు మోవంజాలకు శేషుండు శిరంబులు వంప రథచక్రసముద్భూతధరణి
పరాగపటలంబు గగనంబున కెగయఁ గోలాహలబహులంబుగా నుత్తరద్వా
రంబున వెడలి వానరబిలంబు సొచ్చి మహావాతంబు జీమూతంబులందోలుకై
వడి నిజాభీలశరజాలంబుల వానరులం దూలం దోలుచు నతిరభసంబున రామ
భద్రునియొద్దకుం జనుదెంచుచుండె నప్పుడు.
| 2606
|
| క. |
దనుజానీకము రావణు, పనుపున నవిశంకవృత్తిఁ బ్రబలస్వనముల్
వినువీథి ముట్ట నురవడి, వనచరబలవితతిఁ దాఁకి పటురోషమునన్.
| 2607
|
| చ. |
గదలును శక్తు లుగ్రపరిఘంబులు తోమరకుంతము ల్పటు
ప్రదరములు న్గుఠారములుఁ బ్రాసపరశ్వథముద్గరంబులు
న్వదలక చక్రశూలములు పట్టసము ల్శితమండలాగ్రము
ల్మదమున వైచి వానరసమాజము నుబ్బడఁగించి రేవునన్.
| 2608
|
| చ. |
కవులును బీఱువోవక యఖండభుజబలదుర్నివారు లై
విపులశిలాచయంబులును వృక్షగణంబులు వీచి వైచుచున్
గుపితమనస్కు లై గఱకుగోళ్ల వధించుచు నుగ్రభంగిఁ గో
ణపులమదం బడంచి గగనం బగల న్వడి నార్చి రుద్ధతిన్.
| 2609
|
| ఉ. |
వానరదానవప్రవరషాదతలాభిహతప్రభూత మై
తోన మహీరజం బెగసి దొంతర లై గన నయ్యె మిన్నున
న్మానక యొక్కరీతిఁ గదనంబునఁ జచ్చినవీరు లయ్యెడం
బూని మరుజ్జగంబునకుఁ బోవ నమర్చినమెట్టులో యనన్.
| 2610
|
| మ. |
ఇరువాఁగు ల్వడి నిట్లు దార్కొని చలం బేపార నొండొంటిపైఁ
గర ముద్వృత్తి నిగుడ్చువిస్ఫురదమోఘక్రూరశస్త్రాస్త్రముల్
వరుస న్దత్పృథుకంఠనాళములపై వ్రాలె న్మరుత్కామినీ
గురుహస్తప్రవిముక్తదామములతోఁ గూడ న్విచిత్రంబుగన్.
| 2011
|
| చ. |
మృతభటదంతిఘోటకశరీరగణంబులు శాతఖడ్గని
ర్దితకరపాదశీర్షముల తెట్టెలు గల్గి నితాంతరక్తపూ
రితసమరాంగణంబు విపరీతగతిం గన నయ్యె నప్పు డ
ద్భుతముగ ద్వీపపర్వతవిభూషితభూరిపయోధిచాడ్పునన్.
| 2612
|
| ఆ. |
అందు యానపాత్రలై యరదము లొప్పె, సకలభూతములు పిశాచములును
మకరకచ్ఛపములమాడ్కిఁ జరించె భూ, షణరజంబు లిసుకచంద మొందె.
| 2613
|
ఖడ్గరోమ సర్ఫరోమ వృశ్చికరోములు హనుమదంగదనీలులచేఁ జచ్చుట
| క. |
వనధు లిల నభము ఘూర్ణిల, దనుజుల కగచరుల కిట్లు దారుణరణమున్
జనలోచనభీకర మై, యనుపమ మై యద్భుతావహం బై చెల్లెన్.
| 2614
|
| క. |
తల మిగిలి ఖడ్గరోముఁడు, చలమున నాత్మీయరోమశాతాసులచే
బలువడిఁ గీశులగాత్రం, బులు చెక్కులు వాపు చిట్లు పో రొనరించెన్.
| 2616
|
| ఉ. |
అప్పుడు వానిమీఁదఁ బవనాత్మజుఁ డొక్కవిశాలసాలమున్
దప్పక పెళ్లగించి నిజదర్ప మెలర్పఁగ వేయిమాఱులుం
ద్రిప్పి రయంబున న్విసరి తెంపున వైవ నతండు దానిచే
గొప్పమహీధరంబుక్రియఁ గూలె విభిన్నశిరస్కుఁ డై భువిన్.
| 2617
|
| ఉ. |
ఆతనిపాటుఁ జూచి మది నాగ్రహ మొప్పఁగ సర్ఫరోముఁడున్
జేతులతీట వోవ నని సేయుచుఁ దోడినిశాటు లెల్ల సం
ప్రీతి వహింపఁగా నిజశరీరజరోమవిషాహిదష్టు లై
యాతతతేజు లైనవిపినాటులు చావఁగఁ జేసె బల్విడిన్.
| 2618
|
| ఉ. |
వానితెఱంగుఁ జూచి కపివర్యుఁడు వాలితనూజుఁ డుగ్రుఁ డై
మానక గండశైల మసమానభుజాబల మొప్పఁ దెచ్చి య
ద్దానవుమీఁద వైచిన నతం డొకవ్రేటున భిన్నవక్షుఁ డై
ప్రాణము లంగము న్విడిచి పాఱఁగఁ గూలె నగంబుచాడ్పునన్.
| 2619
|
| చ. |
అనిమిషనాథపౌత్త్రపటుహస్తవిసృష్టశిలాహతి న్రయం
బున సమరావనిం బడినభూరిపరాక్రము సర్పరోమునిం
గనుఁగొని భూరికోప మెసఁగ న్వడి వృశ్చికరోముఁ డుగ్రుఁ డై
వనచరసేనఁ జొచ్చి యనివార్యగతి న్విదళించె నందఱన్.
| 2620
|
| తే. |
అతనికోల్తల కోర్వక యద్రిచరులు, చదలఁ బఱచినవారల జడుపు దీర్చి
వహ్నితనయుండు నీలుం డవార్యశౌర్య, మొప్ప రయమున వానిపై కురవణించి.
| 2621
|
| చ. |
హరిహయవజ్రతుల్య మగుహస్తతలంబునఁ దత్కపోలము
న్జఱచిన దీర్ఘదంతములు జల్లన రాలఁగ నక్షి తారక
ల్పరువడి నిష్క్రమింపఁగ క్షపాచరు లందఱుఁ జూచి యేడ్వఁగా
గురుకులిశాహతి న్దెగినకొండవిధంబునఁ గూలె నుర్వరన్.
| 2622
|
రాముం డగ్నివర్ణునిం జంపుట
| వ. |
వానిపతనంబు విలోకించి యగ్నివర్ణుండు కోపించి కాలాగ్నియుంబోలె మం
డుచు నిజతేజోజాలంబుల వళీముఖుల నెల్ల శలభంబులంబోలె దహించుచు
|
|
| |
నిరంకుశప్రతాపదీపితుం డై రణక్రీడ సల్పి నతనియాటోపంబుఁ జూచి రా
ముండు విభీషణునివలన నతనివృత్తాంతం బంతయు నాకర్ణించి శీఘ్రంబున వాయ
వ్యాస్త్రంబు శరాసనంబునం గూర్చి తిగిచి విడిచిన నయ్యమోఘాస్త్రపాతం
బున నద్దానవుండు గతప్రాణుం డై పుడమిం బడియె నిట్లు తనచక్రరక్షకు లగు
ఖడ్గరోమవృశ్చికరోమసర్ఫరోమాగ్నివర్ణులు నలువురుఁ బంచత్వంబు నొందిన
విలోకించి రావణుండు దశవదనంబులం జిడిముడిపాటు గదుర నుదీర్ణవిక్రముండై
రథంబు దోలించి మార్తాండుండుంబోలె వెలుంగుచు నిజశరమయూఖంబుల
వానరబలజలాశయంబును శోషింపఁజేయుచు రభసోద్రేకంబున రణవిహారంబు
గావించుచుండె నప్పుడు.
| 2623
|
| చ. |
అనుపమతేజుఁ డారఘుకులాగ్రణి గన్నులఁ గెంపు మీఱ గ్ర
క్కున దివిజేంద్రచాపనిభఘోరశరాసన మెక్కు వెట్టి కాం
చనవలయాభిశోభితనిశాతశిలీముఖము ల్నిశాటనా
థునిపయి నేసె నంగములు దూల గుణధ్వని నింగి ముట్టఁగన్.
| 2624
|
| ఉ. |
ఆరజనీచరాధివిభుఁ డగ్రశతాంగగతుండు భాస్కరుం
జేరినరాహుభంగి నృపుఁ జేరి ఘనంబు మహాగిరిం బయో
ధారలఁ గప్పినట్లు వితతంబుగఁ గాంచనపుంఖవహ్నికీ
లారుచివజ్రసన్నిభకలంబము లేసె మహాద్భుతంబుగన్.
| 2625
|
| క. |
దానికి నించుక దలఁకక, మానవనాయకుఁడు ఘోరమార్గణవితతుల్
పూని శతాంగగతుం డగు, దానవనాయకునిమీఁద దళముగఁ గురిసెన్.
| 2626
|
ఇంద్రుఁడు దనరథంబు గొని రామునకు సారథ్యము సేయ మాతలి నియోగించుట
| వ. |
ఇట్లు పదియేనవనాఁటిప్రాతఃకాలంబునం దలకొని సమానవిక్రమంబునం బోరు
నెడ నంబరమధ్యగతు లైనవేల్పులు రథి యైనరావణునిఁ బదాతి యైనరాముని
విలోకించి వీరిరువురకు రణంబు సమంబు గా దని పలికిన వారలవచనంబు విని
పరమార్థ విదుం డగుపాకశాసనుండు నిజసారథి యగుమాతలి రావించి నీవు
శీఘ్రంబున మద్రథంబు దోలుకొని రఘూత్తమునికడకుం జని యమ్మహాత్మునకు
సారథ్యంబుఁ జేసి దేవతలకు హితంబు సంపాదించి పెంపు వడయు మని పలికిన
నతం డట్ల కావించెద నని యీయకొని శక్రునకు బ్రణామంబుఁ జేసి యనుజ్ఞా
తుం డై కాంచనచిత్రాంగంబును వైడూర్యకృతకూబరంబును దరుణాదిత్యసం
కాశంబును గింకిణీశతవిభూషితంబు నగురథంబు సన్నద్ధంబుఁ జేసి రుక్మవేణు
ధ్వజం బెత్తి కాంచనాపీడంబులును సూర్యసంకాశంబులును శ్వేతప్రకీర్ణయు
క్తంబులును హరిద్వర్ణంబులు నగుతురంగంబులం బూన్చి యమ్మహారథంబు గొని
దివంబున నుండి పుడమికి దిగి వచ్చి సముచితప్రకారంబున రామునకుం బొడ
సూపి నిటలతటఘటితాంజలిపుటుం డై వినయంబున నిట్లనియె.
| 2627
|
| మ. |
అనఘా యేను సురేంద్రసూతుఁడఁ దదీయం బైనతే రుద్ధతిం
గొని శీఘ్రంబునఁ దత్ప్రచోదితుఁడ నై ఘోరాజిలో నీవు దై
త్యుని దున్మాడి జయంబు చేకొనుట కెంతో ప్రీతి నేతెంచితి
న్నను మన్నించి శతాంగ మెక్కి రణము న్గావింపు ముద్యన్మతిన్.
| 2628
|
| శా. |
ఐంద్రం బొక్కమహాశరాసనము దివ్యం బైనవర్మంబు భో
గీంద్రప్రఖ్యపృషత్కము న్శితమహాహీనోగ్రశక్తు ల్సుప
ర్వేంద్రుం డంపెఁ బరిగ్రహించి కుతుకం బేపార నీనీచదై
త్యేంద్రుం జంపుము సంగరంబున ధరిత్రీంద్రాసురు ల్మెచ్చఁగన్.
| 2629
|
| తే. |
ఏను సారథ్య మొనరింప నింపు మెఱయఁ, దొల్లి జంభారి దనుజుల ద్రుంచినట్టు
లేను సారథ్య మొనరింప నింపు మెఱయ, నిపుడు దశకంఠు వధియింపు మినకులేంద్ర.
| 2630
|
రాముం డింద్రరథారూఢుండై రావణునితో యుద్ధము సేయుట
| క. |
అని విన్నవింప రాముఁడు, మనమున హర్షించి వాని మన్నించి రథం
బునకుఁ బ్రణమిల్లి శీఘ్రం, బున నెక్కె స్వదీప్తి లోకముల వెలిఁగింపన్.
| 2631
|
| ఆ. |
అంత ముజ్జగంబు లాకులపడఁగ భూ, తములు కడుభయమునఁ దత్తఱింప
రథికు లైనరామరావణులకు ఘోర, సంగరంబు చెల్లె సంకులముగ.
| 2632
|
| మ. |
దశకంఠుండు కడంగి ఘోరతరగాంధర్వాస్త్ర మేయ న్సమ
స్తశరజ్ఞుండు రఘుప్రవీరుఁ డటు గాంధర్వాంబకం బేసి దై
త్యశరంబు న్వడిఁ ద్రుంచె వాఁ డలుక దైవాస్త్రంబు బిట్టేయ స
ద్యశుఁ డాయోధవధుర్యుఁ డానృపతి దైవాస్త్రంబునం ద్రుంపఁగన్.
| 2633
|
| చ. |
అలిగి దశాసనుండు చలమారఁగ దారుణరాక్షసాస్త్ర మ
త్యలఘుగతి న్నిగుడ్ప వెస నప్పరమాస్త్రమునందుఁ గాంచనో
జ్వలమహనీయదుష్ప్రసహసాయకకోటులు పుట్టి బల్వడిన్
దళముగ సర్పరూపములు దాల్చి మహాద్భుతభంగి దోఁపఁగన్.
| 2634
|
| చ. |
కడువడి దీప్తపావకశిఖాతతిఁ గ్రక్కుచు వాతదుర్విషం
బడర భయానకంబు లయి వ్యాదితవక్త్రము లై యహీంద్రుకై
వడి వడిఁ బూని దిక్కులు దివంబును ధాత్రియు నిండి విక్రమం
బడరఁగ రామభద్రుదెస క ట్లడరెం గడురౌద్రవైఖరిన్.
| 2635
|
| చ. |
కనుఁగొని రాజనందనుఁ డకంపితుఁడై వడి గారుడాస్త్ర మే
సిన వెస దానియం దతివిచిత్రతరంబుగ ఘోరపక్షముల్
సునిశితతుండము ల్గలిగి శోభిలునట్టి సువర్ణకోటి చ
య్యన జనియించి వహ్నిశిఖలట్ల వెలుంగుచు ఘోరవైఖరిన్.
| 2636
|
| మ. |
క్షమయు న్దిక్కులుఁ బుష్కరస్థలము నాచ్ఛాదించి తీక్ష్ణాగ్రతుం
డముల న్వ్రచ్చియు వజ్రసన్నిభనఖాంతవ్యాహతిం జించి పా
|
|
| |
దములం దన్ని పత్రత్రజాతపటువాతప్రోద్దతిం దూలఁ దో
లి మహారాక్షసముక్తసర్పశరముల్ లీల న్విచారించినన్.
| 2637
|
| మ. |
తనయస్త్రం బిటు నిష్ఫలం బయిన దైత్యస్వామి కోపించి బో
రనఁ గాలాంబుద మద్రిమీఁద ఘనవర్షంబు న్ప్రవర్షించుచా
డ్పున నారామునిమీఁద నొక్కమొగి నాప్తుల్ చూచి హర్షింప గ్ర
క్కున నీరంధ్రపృషత్కవృష్టిఁ గురిసె న్ఘోరప్రకారంబునన్.
| 2638
|
| ఉ. |
వాసవవైరి యిట్లు రఘువర్యుని నమ్ముల ముంచి వెంటనే
వాసవసూతు మాతలి నవార్యపృషత్కసహస్రవిద్దునిం
జేసి సుపర్ణకేతనముఁ జెచ్చెరఁ దూపుల నుర్విఁ గూలఁగా
నేసి సురేంద్రవాజుల ననేకశరంబులఁ గప్పె నుద్ధతిన్.
| 2639
|
| వ. |
ఇట్లు దశగ్రీవుండు దశవదనంబులం జిడిముడిపాటు గదురఁ దనయిరువదిచేతుల
బరువుఁ జూపిన.
| 2640
|
| ఆ. |
ఆర్తుఁ డైనరాము నప్పుడు వీక్షించి, సురలు కిన్నరులును బరమమునులు
గరుడయక్షసిద్ధగంధర్వకిన్నర, సాధ్యముఖులు కడువిషణ్ణు లైరి.
| 2641
|
| తే. |
అసురవరరాహుసంగ్రస్తుఁ డైనరామ, చంద్రు నీక్షించి వానరసహితుఁ డైన
సవితృనందనుఁడును విభీషణుఁడు జాల, దీను లైరి మొగంబులఁ దెలివి దక్కి.
| 2642
|
| క. |
ప్రజల కశుభావహుం డై, ద్విజరాజసుతుండు మిగుల విధువల్లభయౌ
యజదేవతాకతారమ, ఋజుగతిఁ జననీక యావరించెం గడిమిన్.
| 2643
|
| తే. |
శరనిధి సధూమపరివృత్తసాంద్రవీచి, యగుచు మంటలు పర్వ నత్యంతకోపుఁ
డై రవిని సంస్పృశింపంగ నరుగుమాడ్కి, నిబిడనిర్ఘోష మడరంగ నింగి ముట్టె.
| 2644
|
| తే. |
మందరశ్మి యై శస్త్రసమానవర్ణుఁ
డై పరుషుఁ డై కబంధాంకుఁ డై వినీల
పరిధి యై భాస్కరుండు నిష్ప్రభత నొంది
ధూమకేతువుతోఁ గూడి దోఁచె మింట.
| 2645
|
| తే. |
తెఱఁగునకుఁ దప్పి యింద్రాగ్నిదేవతాక, మైనకోసలనక్షత్ర మగువిశాఖ
నాక్రమించి యంగారకుఁ డంబరమునఁ, గింశుకచ్ఛవి నటు విలోకింప నయ్యె.
| 2646
|
| క. |
పదితల లిరువది భుజములు, పదికార్ముకములును గలిగి భండనభూమిం
ద్రిదళారికులవరేణ్యుఁడు, కదలనిమైనాకశిఖరికైవడి నొప్పెన్.
| 2647
|
| వ. |
ఇట్లు రావణునిచేత నిరస్యమానుం డై రాముండు కొండొకసేవు శరసంధా
నంబు సేయుటకుం దోఁపక వెగడుపడి యుండి వెండియు ధైర్యాతిశయంబునం
బరమసంక్రుద్ధుండై విలయకాలవైశ్వానరునిభంగి వెలుంగుచు బొమలు ముడి
వడ రోషారుణితలోచనంబున దహించుచున్నవాఁడుపోలెఁ జూపట్టిన నప్పు డార
ఘువల్లభునివదనం బుపలక్షించి సర్వభూతంబులు భయంబు నొందెఁ బుడమి
|
|
| |
వడంకె నచలంబులు చలించె ద్రుమంబులు చాఁపకట్టువడియె సముద్రంబులు
సంక్షోభించె మేఘంబులు భయంకరంబు లై యుత్సాతకాలంబునందుంబోలె
భీమనిర్ఘోషంబులు సేయుచు మండలంబు సేయుచుండె నట్టిదారుణంబు లైన
యౌత్పాతికంబులు విలోకించి రావణుండును బరమోద్విగ్నుం డయ్యె దేవ
గంధర్వకిన్నరగరుడోరగసిద్ధచారణరక్షోయక్షాదులు విమానస్థు లై నానావిధ
భీమప్రహారంబులచేత రభసంబుగా రణంబు సేయువారి మహాశూరు లగురామ
రావణులను లోకసంవర్తసంస్థితం బైనతదీయయుద్ధంబును విలోకించి మహాద్భు
తంబు నొందుచుండి రప్పుడు.
| 2648
|
| క. |
రిపుని వధింపుము దైత్యా, ధిప యని రాక్షసులు రిపు వధింపుము రామా
ధిప యని వేల్పులు సారెకు, విపులంబుగఁ బల్కి రభ్రవీథి నురవడిన్.
| 2649
|
| తే. |
అంత దుష్టాత్ముఁ డైనదశాననుండు
కోవసంరక్తనేత్రుఁ డై ఘోరభంగిఁ
బదిమొగంబులఁ జిడిముడిపాటు గదుర
నృవలలామునిఁ బ్రహరింప నిశ్చయించి.
| 2650
|
| సీ. |
వజ్రసారము సర్వవైరినిబర్హణ మసమాన మఖిలభయావహంబు
గిరిశృంగనిభకూటకీలిత మతిరవచలితకాలాగ్నినిభప్రభంబు
చటులాగ్నికణధూమసంచారఘోర మనాసాధ్య మతిరౌద్ర మద్భుతంబు
తతసర్వభూతసంత్రాసనంబు దురాసదంబు భేదన మతిదారుణంబు
|
|
| తే. |
నైనకాలాయసమయోగ్రమాననీయ
శూల మొక్కటి గైకొని కాలవహ్ని
గతి వెలుంగుచు నిజసైన్యతతికిఁ గడు ము
దం బొసంగుచు ఘోరనాదం బొనర్చె.
| 2651
|
| మ. |
అతికాయుం డతిదారుణుం డతిభుజాహంకారుఁ డైనట్టియా
దితిజాధీశుఁడు భూరిరోషము మది న్దీపింపఁ బెల్లుబ్బి యీ
గతి నాదం బొనరింపఁ దద్రవముచేఁ గంధు ల్దిశ ల్వ్యోమము
న్గుతలంబు న్మఱి సర్వభూతములు సంక్షోభించె నొక్కుమ్మడిన్.
| 2652
|
| తే. |
దశముఖుం డిట్లు శూలాయుధమును గేలఁ
బూని జళిపించుచు నితాంతభూరిరవము
చేత సర్వంబు శోషింపఁజేసి గర్వ
మెసఁగ నారఘువరునితో నిట్టులనియె.
| 2653
|
| చ. |
సురుచిరవజ్రసార మగుశూలముఁ జూచితె రామ నీకుఁ గా
నురవడి మత్కరంబున సముద్యత మయ్యె రణాంగణంబున
న్గర మిది నీద జీవితము గైకొని లక్ష్మణు గీటణంచి గ్ర
మ్మఱఁ జనుదెంచు నిప్పుడె సమర్థుఁడ వేని దలంకకుండుమీ.
| 2654
|
| క. |
ఘనశూలంబున ని న్నని, మొన నిప్పుడు గీటణంచి మును నీచేఁ జ
చ్చినరాక్షసవీరుల యా, ననగళదశ్రుప్రమార్జనం బొనరింతున్.
| 2655
|
| క. |
అని పలికి రాక్షసేంద్రుఁడు, కనుఁగొనలఁ బ్రదీప్తవహ్నికణములు రాలం
దనబలముకొలఁది శూలము, మనుజేంద్రునిమీఁద వైచె మంటలు దొరుఁగన్.
| 2656
|
| వ. |
ఇట్లు మహాశూలంబు రావణకరోన్ముక్తం బై విద్యున్మాలాసమాకులం బై యష్ట
ఘంటామహానాదం బై ఘోరదర్శనం బై మంటలు గ్రక్కుచు భీషణరభసాతి
రేకంబునం దన కభిముఖంబుగా నడరిన నారఘుపుంగవుం డనేకవిశిఖంబులం
బరఁగించి పురందరుండు జలౌఘంబుచేత యుగాంతవహ్నిం బోలెఁ దచ్ఛరా
సారంబున దాని వారించిన నది సరకుగొనక పావకుండు పతంగంబులంబోలె
రామకార్ముకవినిస్సృతసాయకంబుల నన్నింటిని నిజతేజంబున దహించిన శూల
సంస్పర్శచూర్ణితంబు లై భస్మసాద్భూతంబు లైననిజశరంబుల నవలోకించి
రాముండు రయంబున.
| 2657
|
| ఉ. |
ఆతతకోప మేర్పడ బలారివినిర్మిత యైనదాని న
మ్మాతలిచేతఁ దేఁబడినమానితశక్తిఁ బరిగ్రహించి వి
ఖ్యాతబలుండు గానఁ జులుకం బలుమా ఱటు వీచి వైచె ఘం
టాతతినిస్వనంబులు కడానిమెఱుంగులు మింటఁ బర్వఁగన్.
| 2658
|
| క. |
ఈలీల రాఘవునిచేఁ, దోలిత యై యింద్రశక్తి దోడ్తోడ మహో
ల్కాలీల వెలుంగుచుఁ జని, శూలముపైఁ బడియె మింటఁ జుక్కలు రాలన్.
| 2659
|
| తే. |
దారుణోదగ్రశక్తిచే దానవేంద్ర, శూల మది భిన్నమై రణక్షోణిఁ గూలె
నవ్విధంబు గనుంగొని యమరవరులు, నగచరులు మెచ్చి రామునిఁ బొగడి రపుడు.
| 2660
|
| ఉ. |
అంత రఘూత్తముండు విలయాగ్నిశిఖోపమవజ్రకల్పకా
లాంతకదండతుల్యనిశితాంబకకోటుల రథ్యము ల్పరి
క్లాంతము లై కరంబు వికలత్వము నొందఁగఁ జేసి సూతునిం
బంత మెలర్ప శాతశతబాణముల న్వడి నొంచి వెండియున్.
| 2661
|
| క. |
మంట లుమియు బాణము లై, దింట నురము మూఁట శిరము దెస యేడింటన్
రెంట నొసలు భుజములు నా, ఱింటం బార్శ్వములు నేసి రేఁగం గడిమిన్.
| 2662
|
| ఉ. |
రావణుఁ డిట్లు జన్యమున రాఘవబాణవిభిన్నగాత్రుఁ డై
కావర మేది దట్టముగఁ గాఱెడునెత్తుటఁ దోఁగి ధాతుజా
లావృతశైలరాజముక్రియం గనుపట్టుచుఁ గోపతాపము
ల్భావమున న్బెనంగొన విపన్నత నొంది చలించి వెండియున్.
| 2663
|
| ఉ. |
రోషముపెంపునం గనుల రోహితరోచులు నివ్వటిల్లఁగా
భీషణభంగి నేర్పు గనిపింప గుణస్వన మాచరించి ఘో
రేషుపరంపర ల్రఘుకులేంద్రునిపైఁ బరఁగించి ముంచె ని
ర్ఘోషము సేయుచు న్ఘన మకుంఠితవృష్టిఁ దటాకము న్బలెన్.
| 2664
|
| ఉ. |
ఆరజనీచరప్రవరుఁ డద్భుతభంగి నిగుడ్చుతూపులం
బూరితగాత్రుఁ డై గిరియుఁ బోలె నకంప్యుఁడు రామభద్రుఁ డే
పారఁ జలింప కర్కుఁడు నిజాంశువులం బెనుజీఁకటింబలెన్
సారశరంబుల న్రిపునిసాయకము ల్విరియించె వ్రేల్మిడిన్.
| 2665
|
| ఉ. |
వెండియు రావణుం డలిగి వేయిశరంబులు వింటఁ గూర్చి కో
దండగుణార్భటు ల్సెలఁగఁ దప్పక రామనరేంద్రుమీఁద ను
ద్దండత నేయఁ దద్విశిఖతాడితుఁ డై రవివంశవార్ధిసో
ముం డొగి నెత్తుటం దడిసి పూచినమోదుగుభంగిఁ దోఁచుచున్.
| 2666
|
| ఉ. |
వ్రేటునఁ బుట్టుకోపమున వీరవరేణ్యుఁడు లక్ష్మణాగ్రజుం
డేటిప్రతాప మీతని జయింపక యుండిన నంచుఁ గ్రుద్ధుఁ డై
మాటికి వేయు వేయు పటుమార్గణము ల్నిగిడించి గాత్రము
ల్బీఁటలు వాఱఁ జేయు చిటు భీషణభంగిఁ బరాక్రమించినన్.
| 2667
|
| చ. |
దనుజవరేణ్యుఁ డవ్విధముఁ దప్పక గన్గొని దుర్మదాంధుఁ డై
ఘనతరసాయకావళులఁ గప్పుచు డాసిన నమ్మహారథు
ల్ఘనభుజవీర్యు లవ్విశిఖగాఢతమంబున నెల్లవారికిం
గనఁబడకుండి రప్పు డలుక న్రఘువీరుఁ డొకింతలోపలన్.
| 2668
|
| చ. |
గురుతరహేమపుంఖశరకోటులఁ దత్ప్రదరాంధకారము
న్విరియఁగఁ జేసి జన్యమున వీరరసోజ్జ్వలఘోరరూపుఁ డై
యురుతరభంగిఁ గట్టెదుట నున్నదశాస్యుని వేఁడిచూపులం
జుఱచుఱఁ జూచి పల్కెఁ దనశూరత గన్పడ దారుణోక్తులన్.
| 2669
|
శ్రీరాములు రావణుతో వీరాలాపంబు లాడుట
| ఉ. |
ఏమిర రాక్షసాధమ మహీసుత యొంటి వసించి యుండ నీ
వామదిరాక్షిఁ దస్కరుఁడ వై కొని తెచ్చితి వప్డు దాన నీ
కేమియశంబు వచ్చెఁ దుది నిట్టియకార్య మొనర్చి యేను దే
జోమహిమాధికుండ నని శూరులమ్రోల వచించె దెంతయున్.
| 2670
|
| ఉ. |
ఓరివివేకహీన పరయోషల బల్మి గ్రహించువానికి
న్దారుణపాతకంబు కులనాశము గర్హణ మార్తియు న్సదా
చారవిరోధము న్గలుగు సత్యము నీ వది గాన లేక నే
శూరుఁడ నంచుఁ బల్కె దిది శూరునికృత్యమె యెంచి చూడఁగన్.
| 2671
|
| క. |
నీపాలిమిత్తి యగుధా, త్రీపాలకపుత్రి నిట్లు దెచ్చి దెలియ కో
పాపాత్మక శూరుఁడ నని, మాపాల వచించె దెంతమతిహీనుఁడవో.
| 2672
|
| క. |
ఘనశూరుం డగుధనదుని, యనుజుఁడవు బలాధికుండ వయినందుకు గ్ర
|
|
| |
ద్దనఁ బెద్దలు కొనియాడెడు, పనియే గావించి తీవు ప్రాజ్ఞుఁడ వరయన్.
| 2673
|
| వ. |
మఱియు నుత్సేకంబున ననుష్ఠింపంబడిన యీనిందితకర్మంబునకుం దగినఫలం
బిప్పుడె యనుభవించెద వదియునుం గాక.
| 2674
|
| తే. |
ఘోరకృత్యంబు గావించి శూరవరుఁడ
ననుచు నిను నీవె నుతియించుకొనెద వేల
సిగ్గు లే దించు కైన నీచెయ్దు లన్ని
విన్నవారలు గర్హించుచున్నవారు.
| 2675
|
| తే. |
అరయ మత్సన్నిధానంబునందు సీత
బలిమి నీచేత ధర్షింపఁ బడియె నేని
యపుడె మత్సాయకంబుల హతుఁడ వగుచు
గొబ్బున ఖరాదిదనుజులఁ గూడఁ జనవె.
| 2676
|
| చ. |
ఉడుగక దైవయోగమున నుద్ధతి నాదగుదృక్పథంబునం
బడితివి నేఁడు ని న్నిపుడె బాణముల న్రణభూమిఁ ద్రుంచి యే
పడరఁగ ధర్మరాజపురి కంపెద ఎక్కువ మింతలోన నీ
వడిచిపడంగ నేల దనుజాధమ తొల్లిటిపాటు చెల్లునే.
| 2677
|
| తే. |
ఆజి మద్బాణనిర్భిన్న మైననీదు
వెడఁదఱొమ్మున నుడుగక వెడలుసాంద్ర
శోణితము గ్రోలి విహగముల్ చొక్కి మింట
కలకలంబులు గావింపఁగలవు నేఁడు.
| 2678
|
| తే. |
లలితకోటీరకుండలోజ్జ్వలిత మైన
నీదుమస్తకనికరంబు నేఁడు నాదు
పటుశరంబుల దెగి ధాత్రిఁ బడుచు నుండఁ
గాకఘూకాదికము లీడ్వఁ గలవు నీచ.
| 2679
|
| తే. |
ఘోరసంగ్రామతలమునఁ గూలియున్న, నీవిశాలవక్షమున నేఁడు వ్రాలి
బాణశల్యాంతరోత్థితశోణితంబు, తనివి దీరంగ ఖగములు ద్రావఁగలవు.
| 2680
|
| క. |
శరభగ్నాంగుఁడ వై సం, గరమునఁ బడియున్న నీదుగాత్రంబులు చె
చ్చెర నీడ్వఁగలవు ఖగములు, గరుడులు సర్పముల నీడ్చుకరణి దురాత్మా.
| 2681
|
| క. |
అని పలికి రాఘవేంద్రుఁడు, దనుజుని వధియింపఁ బూని తద్దయుఁ గినుక
న్ఘనశరములు వెదచల్లుచు, ననిమిషకంటకునిఁ గదిసె నాటోపమునన్.
| 2682
|
| ఉ. |
సాహసము న్బరాక్రమము శౌర్యముఁ దేజము భూరిసంగరో
త్సాహము సత్త్వసంపదయు సర్వవరాస్త్రవిశేషకౌశలం
బాహవనైపుణంబు విజయస్పృహ ధైర్యము పాణిలాఘవం
బూహయు వృద్ధిఁ బొందె రయ మొప్పఁగ రామున కంతకంతకున్.
| 2684
|
| తే. |
అంత నారఘుపుంగవుఁ డాత్మగతము
లైన శుభచిహ్నములు చూచి మానసమునఁ
బొంగి వింట ఘంటాధ్వనుల్ నింగి ముట్ట
రావణునిమీఁద శరసహస్రంబు నేసె.
| 2685
|
| క. |
ఆహరివీరులు వెంటనె, సాహసమున దనుజుమీఁద సాంద్రశిలాసం
దోహముఁ బరఁగించిరి పటు, బాహుబలము విక్రమంబు వాటికి నెక్కన్.
| 2686
|
| వ. |
ఇట్లు దశగ్రీవుండు రామప్రయుక్తశరౌఘంబులచేత వానరప్రయుక్తశిలానికరం
బులచేత నేకకాలంబున హవ్యమానుం డై విహ్వలహృదయుండై శరాసనం
బెక్కుపెట్టుటకును సాయకప్రయోగంబు సేయుటకును సమర్థుండు గాక మూర్ఛా
పారవశ్యంబున రథంబుపైఁ ద్రెళ్లె నప్పుడు రామునివీర్యం బప్రతిహతం బయ్యె
నప్పు డారావణప్రయుక్తదివ్యాస్త్రంబులు పరిపంథిపరాజయంబునకుంగాక మో
ఘరయంబులై పఱవం దొడంగెనది యాతనికి మృత్యుకాలంబు సన్నిహితం బగు
టను సూచించె నాసమయంబున రావణుని రథచోదకుండు వానిదురవస్థ విలో
కించి యచ్చట నుండనీక రయంబున రథంబు దొలంగం దోలుకొనిపోయె నంతఁ
గొంతసేపునకు మూర్ఛ దేఱికృతాంతబలచోదితుండై యవివేకంబున సంక్రుద్ధుం
డై కన్నులం గెంజాయ రంజిల్ల సూతు నవలోకించి యి ట్లనియె.
| 2687
|
రథంబు తొలఁగం దోలిన సారథిని రావణుండు దూఱ నాడుట
| ఉ. |
ఓరి దురాత్మ యస్త్రబల మున్నతవీర్యము బాహుసత్త్వము
స్ధిరతయు న్బరాక్రమము తేజము శౌర్యము భూరిమాయయు
న్బౌరుషము న్యశంబు పరభావగతిజ్ఞత నాదుసొమ్ము నీ
వారయ లేక యన్నిటికి హాని యొనర్చితి వేల చెప్పుమా.
| 2688
|
| సీ. |
అతిమాని నైననాయాశయం బెఱుఁగక భండనంబున వైరి పరిహసింపఁ
దలకొని రథ మేల తొలఁగఁ దోలితి విట్లు నిర్మలం బైనమన్నిబిడకీర్తి
దుగ్ధవారాశికిఁ దోడ్తోడ నీచేత హాలాహలముచేతఁ బోలె మిగుల
నురవడి మాలిన్య ముపపాదితం బయ్యె బహుకాలతపమునఁ బడసినట్టి
|
|
| తే. |
బలము వీర్యంబు దేజంబు ప్రత్యయంబు
యశము కోల్పుచ్చితివి విక్రమాఢ్యుఁ డైన
రివునిముంగల ననుఁ జాల రిత్తవాని
జేసితివి దుర్యశం బెంత చెందె నేఁడు.
| 2689
|
| ఉ. |
విక్రమరంజనీయుఁ డగు వీరుఁడు రాముఁడు చూచుచుండ ని
ర్వక్రగతిం బ్రచండసమరం బొనరింపఁగఁ బూని యున్ననా
విక్రమ మంత నేఁ డడవివెన్నెలచందము నొంది డింద ని
ట్లక్రమ మాచరించి పురుషాధముఁ జేసితి విప్డు దుర్మతీ.
| 2690
|
| చ. |
దివిజవిరోధి నీతెఱఁగు తెల్లముఁ జేసితి శత్రుపక్షపా
తివి నినుఁ దేరుఁ దోలుటకుఁ దేఁకువఁ దోడ్కొని వచ్చినందుకై
బవరమునందు మాకుఁ దలవంపులు చేసితి వౌర యింతవాఁ
డ వని యెఱింగియున్న జగడంబునకుం గొని తేక యుండనే.
| 2691
|
| క. |
నీ వొనరించినకృత్యము, భావింపఁగ నాకు మేలొ పరిపంథికి మే
లో వివరింపు మిది హితము, గావింపఁ దలంచువానికార్యమె తలఁపన్.
| 2692
|
సూతుండు రావణుకోపం బుపశమిల్ల నాడుట
| క. |
అరి రాక మున్నె గ్రక్కున, మరలింపుము సమరమునకు మామకరథమున్
జిరకాలంబున నుండియు, నెఱుఁగవె మన్నిష్ఠగుణము లెల్లను సూతా.
| 2693
|
| క. |
అని యిటు మతిహీనుండై, దనుజకులవిభుండు కోపతాపంబునఁ బ
ల్కిన మతిమంతుం డగువాఁ, డనియె మరల నతనితోడ సానునయోక్తిన్.
| 2694
|
| ఉ. |
భీతుఁడఁ గాను శత్రుకృతభేదము నొందినవాఁడఁ గా నవి
ఖ్యాతుఁడఁ గాను బాలిశుఁడఁ గాను బ్రమత్తుఁడఁ గాను దేవదు
ర్జాతుఁడఁ గాను విప్రియము సల్పినవాఁడను గాను దుర్గుణ
వ్రాతుఁడఁ గాను నన్నుఁ గడవానిఁగ మీ రిటు దూఱ నేటికిన్.
| 2695
|
| వ. |
రాక్షసేంద్రా హితకాముఁడ నైనయేను యశంబు రక్షించుకొఱకు స్నేహప్రస
న్నచిత్తంబునఁ బ్రియంబె కావించితి నది నీ కప్రియం బై తోఁచె నీయర్థంబు
నందుఁ బ్రియహితుండ నైననాయందు లఘుచిత్తుం డైనయనార్యునియందు
నుంబోలె దోషారోపణంబు గావింపం దగదు సంగ్రామంబున నిమ్మహారథంబు
చంద్రోదయప్రవర్ధమానసముదోదకంబుచేత నదీవేగంబుకరణి నాచేత విని
వర్తితం బైననిమిత్తం బెఱింగించెదఁ గోపం బుజ్జగించి విను మేను ఘోరం
బైనమహాయుద్ధకర్మంబున బడలితి నీవును వీర్యసుముఖత్వంబును రణోత్సాహం
బును విడిచి శత్రుప్రహారపీడితుండ వై యలసి రథంబుమీఁదం బడితివి రథ్యం
బులు రథోద్వహనఖిన్నంబు లై స్రుక్కి ఘర్మజలంబులం దోఁగి వృష్టిహతంబు
లైనగోవులపగిది దీనదశకు వచ్చె మఱియు నెయ్యెడం జూచిన మనకుఁ బ్రతి
కూలనిమిత్తంబులు వొడమె రథంబు గడపు సారథియగువాఁడు దేశకాలంబులు
నస్త్రశస్త్రప్రయోగశైఘ్ర్యమాంద్యాదికంబులును శుభాశుభనిమిత్తంబులును
ముఖప్రసాదవైవర్ణ్యాదికంబులును ధైర్యంబును దైన్యంబును ఖేదంబును
హర్షంబును బలాబలంబులును భూమియందు స్థలనిమ్నంబులును సమవిషమం
బులును యుద్ధకాలంబును బరచ్ఛిద్రదర్శనంబును సమీపగమనపశ్చాద్గమనంబు
లును స్థానంబును నపసర్పణంబును గ్రమంబున నెఱింగి రథంబు గడపవలయు
నీకును రథాశ్వంబులకు విశ్రాంతి సంపాదించుతలంపున దుస్సహం బైనఖేదం
బుఁ బాపుటకు రథంబుఁ దొలంగం దోలితి నిది యుక్తంబె గాక యయుక్తంబు
|
|
| |
గా దకారణంబుగా నిప్పని యొనరించినవాఁడఁ గాను భర్తృస్నేహపరుండ
గావించితి నింక నీ చెప్పినట్ల సూతకృత్యంబు గావించి ఋణంబుఁ బాపికొనియెద
నానతిమ్మనిన నద్దశగ్రీవుం డతనివాక్యంబున సంతుష్టుండై రణలుబ్ధుండు గావున
బహుప్రకారంబుల వానిం బ్రశంసించి రావణుండు నేఁడు రణంబున శత్రుని
వధింపక గాని మరలండు రయంబున రథంబు రామునిసమ్ముఖంబునకుం దోలు
మని పంచి యనర్హం బైనయొక్కహస్తాభరణం బొసంగిన నతండు పరమప్రీ
తుండై యుగ్యంబులపగ్గంబులు వదలి యమోఘరయంబున రథంబు రాముని
సమ్ముఖంబునకుం దోలుకొని వచ్చె నంతకు మున్ను వేల్పులతోఁ గూడ రణం
బు విలోకించుటకుం జనుదెంచి గగనమార్గంబున నున్న యగస్త్యుం డప్పుడు యుద్ధ
పరిశ్రాంతుం డై రావణవధోపాయంబు చింతించుచున్నరామునిం జూచి పదం
పడి రణార్థంబు సముపస్థితుం డైనరావణుని విలోకించి రయంబున రామునికడ
కుం జనుదెంచి స్వవీర్యోపబృంహణంబుకొఱకు నాదిత్యహృదయనామకంబైన
స్తోత్రం బుపదేశించుతలంపున నిట్లనియె.
| 2696
|
శ్రీరాములకు నగస్త్యుం డాదిత్యహృదయం బుపదేశించుట
| సీ. |
దశరథతనయ యెద్దాని జపించినఁ గలన శత్రుజయంబు గలుగు నట్టి
యాదిత్యహృదయాఖ్య మగుస్తోత్ర మిపు డుపదేశింతు దానిఁ బ్రతిగ్రహింపు
మది గుహ్య మది పుణ్య మది విజయావహం బది శత్రునాశన మదియు జప్య
మది శివ మక్షయ్య మది సర్వమంగళమాంగళ్యమును బరమంబు సర్వ
|
|
| తే. |
తాపనాశంబు శోకచింతాప్రశమన, ముత్తమం బప్రతర్క్య మాయుష్కరంబు
వీర్యవర్ధన మంచితైశ్వర్యకరము, నిఖిలపాపప్రణాశంబు నిర్మలాత్మ.
| 2697
|
| వ. |
మఱియు నాదిత్యమండలమధ్యవర్తిపరమపురుషప్రతిపాదకం బగుటవలన నమ్మహా
స్తోత్రం బాదిత్యహృదయసంజ్ఞకం బయ్యెఁ గావున.
| 2698
|
| క. |
పరమాంతరంగభక్తాం, తరమున భాసిల్లువానిఁ దప్పక దేవా
సురనరగరుడోరగముని, వరుల కుపాసింపఁదగినవాని న్మఱియున్.
| 2699
|
| క. |
ధర్మము సంస్థాపించుట, కర్మిలి యుగయుగమునందు నభినవఫణితి
న్నిర్మలమతిఁ బుట్టి విహిత, కర్మము నడిపించునట్టి కారుణ్యనిధిన్.
| 2700
|
| క. |
నిరతిశయదీప్తిమంతుని, సురుచిరముగఁ జంద్రవహ్నిసూర్యాదులకున్
వరదీప్తి యొసఁగువానిని, బురుషోత్తము భువనపతిని బూజింపు మొగిన్.
| 2701
|
| తే. |
ఇతఁడు సర్వదేవాత్మకుం డితఁడు రశ్మి, భావనుఁ డితండు తేజస్వి పరమపురుషుఁ
డమరులను విష్టపంబుల ననవరతముఁ, దనగభస్తులఁ బాలించుదాత యితఁడు.
| 2702
|
| తే. |
విష్టపంబుల సృజియించువిధి యితండు
పరఁగ నన్నిటిఁ బాలించుహరి యితండు
వరుస నన్నిటి గ్రసియించుహరుఁ డితండు
మూఁడుమూర్తుల కిరవైనమూల మితఁడు.
| 2703
|
| తే. |
శత్రుశోషణ మొనరించుచతురుఁ డితఁడు, షణ్ముఖాకృతి గైకొన్నజాణ యితఁడు
వసుధలోఁ బ్రజాపతిశబ్దవాచ్యుఁ డితఁడు, వర్ణితైశ్వర్యమున నిరవధికుఁ డితఁడు.
| 2704
|
| తే. |
ఇతఁడు లోకసంహారకుం డితఁడు వేద, సిద్ధసర్వఫలప్రదుఁ డిద్ధయశుఁడు
సర్వకారణమయసోమశబ్దవాచ్యుఁ, డితఁడు సమవర్తి యితఁ డపాంపతి యితండు.
| 2705
|
| క. |
ఋతు వితఁడు కర్త యీతం, డితఁడు వసువు లితఁడు సాధ్యు లితఁడు మరుత్తుల్
పితరులు వాయువు వహ్నియు, నితఁ డాశ్విను లితఁడు ప్రాణ మితఁడు మనువగున్.
| 2706
|
| వ. |
వత్సా స్తోత్రప్రకారం బెఱింగించెద నీవు సమాహితుండ వై సూర్యమండల
మధ్యవర్తి యైనపరమపురుషు నుద్దేశించి దేవా నీ వశేషవిషయభోక్త వగుటం
జేసి యాదిత్యుండవు సమస్తజగంబునకుఁ బ్రేరకుండ నగుటం జేసి సవితవు కర్మ
ప్రేరకుండ వగుటంజేసి సూర్యుండవు పరమాకాశగతుండ వగుటం జేసి ఖగుం
డవు స్థితికర్త వగుటం జేసి పూషుండవు సర్వవ్యాపిని యగులక్ష్మి గలవాఁడ వగు
టం జేసి గభస్తిమంతుండవు పక్షవంతుండ వగుటం జేసి సుపర్ణుండవు సర్వతప
నుండ వగుటం జేసి తపనుండవు సర్వంబును వెలుంగంజేయువాఁడ వగుటం జేసి
భానుండవు హిరణ్మయం బైనయండోత్పాదకద్రవ్యంబు గలవాఁడ వగుటం జేసి
హిరణ్యరేతసుండ వజ్ఞాననివర్తనపూర్వకంబుగా జ్ఞానం బుత్పాదించువాఁడ వగు
టం జేసి దివాకరుండవు మనోహరగరుడవాహనంబు గలవాఁడ వగుటం జేసి హరి
దశ్వుండ వనంతకళ్యాణగుణవంతుండ వగుటం జేసి సహస్రార్చివిసప్తాఖ్యసప్తి గల
వాఁడ వగుటం జేసి సప్తసప్తివి శంఖచక్రగదాధరుండ వగుటం జేసి మరీచిమం
తుండవు జ్ఞానోత్పత్తిప్రతిబంధకదోషనివర్తకుండ వగుటం జేసి తిమిరోన్మథనుం
డవు నీవలన సుఖంబు గలుగుటవలన శంభుండ విరువదియొక్కమాటు వెదకి
ధరణీచక్రం బక్షత్రంబు గావించినవాఁడ వగుటం జేసి త్వష్ట వచేతనం బైన
బ్రహ్మాండంబు జీవింపఁజేయుటం జేసి మార్తాండుండ వంతర్బహిర్వాప్తిమం
తుండ వగుటం జేసి యంశుమంతుండవు సకలజగదుత్పాదకసమష్టిజీవజాతంబు
గర్భంబునందుఁ గలవాఁడ వగుటం జేసి హిరణ్యగర్భుండవు తాపత్రయసంతపు
లగువారికి విశ్రమస్థానంబ వగుటం జేసి శిశిరుండవు విరోధిసంతాపకరుండ వగు
టం జేసి తపనుండవు సర్వవస్తుసాక్షాత్కారహేతుభూతుండ వైనలోకకర్త వగు
టం జేసి భాస్కరుండవు సర్వప్రాణులచేత స్తూయమానుండ వగుటవలనను దేవ
తల కుపదేశించువాఁడ వగుటవలనను రవివి కాలాగ్నిరుద్రుండు గర్భంబునందుఁ
గలవాఁడ వగుటం జేసి యగ్నిగర్భుండవు పురందరుని రక్షించువాఁడ వగుటం జేసి
యదితిపుత్రుండవు నిరవధికానందవంతుండ వగుటం జేసి శంఖుండవు సూర్యరూ
పంబున హిమంబు నాశంబు నొందించువాఁడవు గావున శిశిరనాశనుండవు కా
మసాహంకారరూపంబున నాకాశస్రష్ట వగుటం జేసి వ్యోమనాథుండవు భక్తుల
తమోగుణంబు భేదించువాఁడ వగుటం జేసి తమోభేదివి సకలవేదపర్యవసాన
|
|
| |
భూమి వగుటం జేసి ఋగ్యజుస్సామపారగుండవు నీవలన సకలకర్మఫలంబు లధి
కంబులై నెగడుఁ గావున ఘనవృష్టిని మహార్ణవశాయి వగుటం జేసి యుపామ్మి
త్రుండవు ముక్తప్రాపకుండు వగుటం జేసి వింధ్యవీథీప్లవంగముఁడవు జగన్నిర్మాణ
సంకల్పంబు గలుగుటం జేసి యాతపివికౌస్తుభాదికంబు గలుగుటం జేసి మండలివి
మృత్యుశరీరకుండ వగుటం జేసి మృత్యువవు సుశీలుండ వగుటం జేసి పింగళుండ
వేకకాలంబున సకలాండసంహారకుండవు గావున సర్వతాపసుండవు విదితాఖిల
వేద్యుండవు గావునఁ గవివి విశ్వశరీరకుండవు గావున విశ్వుండవు నిరవధికపరాభి
భవసామర్థ్యంబు గలవాఁడవు గావున మహాతేజుండవు సర్వరంజకుండవు గావున
రక్తుండవు సర్వజగదుత్పత్తిహేతుభూతుండవు సర్వభవోద్భవుండవు నక్షత్రగ్ర
హతారకాంతర్యామివి గావున నక్షత్రగ్రహతారకాధిపుండవు విశ్వస్థితికారణం
బవు గావున విశ్వభావనుండవు ప్రశస్తతేజస్వివి గావునఁ దేజోవంతులకుఁ దేజం
బొసంగువాఁడవు ద్వాదశమండలాంతర్వర్తివి గావున ద్వాదశాత్మకుండ వట్టినీకు
నమస్కారంబు గావించెద.
| 2707
|
| సీ. |
పూర్వపశ్చిమమహాభూధరాంతర్యామి కత్యంతముక్తజనాధివిభున
కప్రతిహతవిక్రమాధికునకు నుపాసకుల నానాకిల్బిషంబు లడఁచి
కళ్యాణ మొసఁగెడుఘనున కవ్యయునకు హరివాహనునకు దినాధిపతికి
నాదిత్యునకును సహస్రజీవున కనుపాపకోగ్రునకు శుభప్రదునకు
|
|
| తే. |
వీరవరునకు హంసావతారునకును, బ్రణవమునఁ బ్రతిపాదింపఁబడెడువాని
కనవరతము సారగ్రాహి యైనవాని, కందముగ నేను గావింతు వందనములు.
| 2708
|
| తే. |
తగ నచేతన మైనయీజగమునెల్లఁ, జేతనత్వం బొసంగి రక్షించువాని
కర్థిఁ బద్మప్రబోధకుం డైనవాని, కంచితంబుగ వినతి గావించువాఁడ.
| 2709
|
| తే. |
సృష్టిసంహారసంస్థితు ల్సేయునట్టి, యజహరాచ్యుతులకు విభుం డైనవాని
కఖిలయజ్ఞస్వరూపకుం డైనవాని, కంజలి ఘటింతు నతిభక్తి ననవరతము.
| 2710
|
| తే. |
అఖిలకర్మసంప్రేరకుం డైనవాని, నగణితదినేశతేజుఁ డై నట్టివాని
నమితసౌందర్యవిగ్రహుండైనవాని, నఖలమఖభోక్త యగువాని నాశ్రయింతు.
| 2711
|
| క. |
అరిసంహారార్థము నర, హరిరూపము దాల్చినట్టియధిపునకుఁ దమో
హరునకు రవిరూపంబున, నురుహిమము నడంచువాని కొనరింతు నతుల్.
| 2712
|
| క. |
తనయంతఁ దానె వెలిఁగెడు, ఘనునకు విజితేంద్రియునకుఁ గలికల్మషనా
శనున కఖిలసురరూపున, కనంతమహీమాధికునకు నభివందనముల్.
| 2713
|
| తే. |
కల్పితాజ్ఞానతిమిరవిఖండనునకు, విశ్వకర్మకు వేదాంతవేద్యునకును
బరమగతికి హిరణ్మయపురుషునకును, సర్వసాక్షికి మ్రొక్కెద సంతతంబు.
| 2714
|
| వ. |
అని యిట్లు స్తోత్రంబు గావింపుము మఱియు నితండు మహాప్రళయంబున సర్వ
భూతంబుల నాశంబు నొందించి పదంపడి కర్మసహాయంబుగా సృజించి సూర్య
|
|
| |
రూపంబు దాల్చి గభస్తులచేత సర్వరసంబుల నాకర్షించి క్రమ్మఱ వర్షించుచుఁ
బ్రవర్ధమాననానావిధౌషధులచేత రక్షించుచుండు నదియునుంగాక యితడు
భూతంబులయం దంతర్యామిత్వంబున నుండి సుషుప్తిసమయంబునఁ దనయం
తం దాను బ్రకాశించుచుండు.
| 2715
|
| తే. |
అగ్నిహోత్రఫలంబు నయ్యగ్నిహోత్ర
మధ్వరంబులు వేదంబు లధ్వరఫల
మితఁడు సర్వకార్యములకుఁ బతి యితండు
సకలభువనంబులకుఁ బ్రవర్తకుఁ డితండు.
| 2716
|
| తే. |
కాననములందు ఘోరసంకటములందు
భయమునం దాపదలయందు భక్తితోడ
నితని భజియించుపురుషుఁ డొకించుకైన
వంత నొందక కుశలి యై వఱలు నధిప.
| 2717
|
| మ. |
అనుమానింపక నీవు భక్తి నిపు డేకాగ్రుండ వై విశ్వరూ
పుని విశ్వాత్ముని దేవదేవు నితనిం బూజించి ముమ్మాఱు లీ
వినుతస్తోత్ర మొగిం జపింపు మటు గావింప న్రణోర్విం దశా
ననుఁ డీల్గు న్విజయంబు నీకుఁ గలుగుం దథ్యంబు రాజోత్తమా.
| 2718
|
ఆదిత్యుండు రామునకుఁ బ్రసన్నుం డగుట
| మ. |
అని యి ట్లామునిరాజు పల్కి రయ మొప్పార న్నభోవీథికిం
జనియెం బిమ్మట రాఘవుండు ఘననిష్ఠాయుక్తుఁ డై సమ్మదం
బున నీరంబుల వార్చి కుంభభవుఁ డామోదంబు మీఱ న్వచిం
చినభంగి న్రవిఁ జూచి స్తోత్రము పఠించె న్భక్తి ముమ్మా ఱొగిన్.
| 2719
|
| వ. |
ఇవ్విధంబున నారఘుపుంగవుం డాదిత్యహృదయంబు పఠించిన నయ్యాదిత్యుం
డు పరమానందపులకితగాత్రుండై రావణనాశంబు నిశ్చయించి నిజమండలంబు
వలన నిర్గమించి సమీపంబునకు వచ్చి గగనంబునందుండి రామభద్రు నవలో
కించి వత్సా శీఘ్రంబున దశగ్రీవుని వధియింపు మని వేగిరపడి పలికిన నక్కౌస
లేయుండు నష్టశోకుం డై రయంబున మహనీయకోదండం బందుకొని సర్వ
యత్నంబున రావణునివధంబునందు దృఢనిశ్చయంబుఁ జేసి యుద్ధాభిముఖుండై
తనకట్టెదుటఁ బరసైన్యప్రధర్షణంబై గంధర్వనగరాకారం బై సముచ్ఛ్రితపతా
కాలంకృతంబై హేమాభరణభూషితపరమసంపన్నకృష్ణాయుక్తంబై ధనుఃకవ
చాదియుద్ధోపకరణసంపూర్ణం బై రాక్షససైన్యహర్షణంబై మహాధ్వజో తం
బై మహానాదం బై యనంతకాంతిబహుళంబై తటిత్తుల్యపతాకాసంకీర్ణం బై
యింద్రాయుధసదృశసర్వాయుధపరిష్కృతం బై మేఘసంకాశంబై వర్షాంబు
దంబు ధారాసారంబుంబోలె శరధారాసారంబు గురియుచు గగనంబున నుహ్య
|
|
| |
మానం బైనమహావిమానంబుపోలికిఁ జూపట్టుచు మహీతలంబు బ్రద్దలు వాఱ
గగనంబు మ్రింగం జనుదెంచుచున్నదానిపోలికిఁ గింకిణీజాలనిర్ఘోషభీషణంబుగా
మహావేగంబున వజ్రాభిహతగిరిస్వనసదృశస్వనం బై యవసవ్యంబుగాఁ జను
దెంచుచున్న రావణునిరథంబుఁ జూచి రాముండు బాలచంద్రనతం బైనధనువు
సారించి భీషణప్రకారంబున గుణప్రణాదంబు సేయుచు సహస్రాక్షసారథి యైన
మాతలి నవలోకించి యిట్లనియె.
| 2720
|
| చ. |
ఖలుఁ డగురాక్షసాధముని కాంచనచిత్రరథంబు గ్రమ్మఱ
న్వలగొని భూరివేగమున వచ్చుచు నున్నది ఘోరభంగి మా
తలి గనుఁగొంటె నేఁ డని నితం డిపు డాత్మవధార్థ మీగతిం
దలకొని యున్నతెంపు బెడిపంబును గన్పడుచున్న దెంతయున్.
| 2721
|
| ఉ. |
మానద యేను జన్యమున మారుత మభ్రసముత్థితాభ్రము
న్మానక పాఱఁదోలినక్రమంబున వీని వధింపఁబూనితి
న్మానుగ నీవు నేఁ డిటఁ బ్రమాదము మాని రథంబు వీనితే
రానఁగఁ దోలు మాశుగ రయంబున నీచతురత్వ మేర్పడన్.
| 2722
|
| తే. |
సంభ్రమము మాని రశ్మిసంచారనియతి
గలిగి వైక్లబ్య ముడిగి వ్యగ్రతయు వీడి
హృదయమును వీక్షణంబులు చెదరనీక
రథము దోలుము సవ్యమార్గమున నిపుడు.
| 2723
|
| చ. |
హరిహయునంతవానికి సురాసురయుద్ధములందు శంక లే
కరుదుగఁ దేరు దోలినమహాచతురుండవు నీకు నేరుపు
ల్వరుస గణింపఁగా వలెనె వైరివధం బొనరింపఁ గోరి నేఁ
గఱపితి జ్ఞాపకార్థ మిటు గ్రమ్మఱ శిక్షకుఁ గారు మాతలీ.
| 2724
|
| చ. |
అని యిటు రాఘవుండు వినయంబునఁ బల్కిన హృష్టచిత్తుఁ డై
సనయుఁడు శక్రసూతుఁ డలచక్రసముత్థితధూళిఁ గప్పుచుం
దనుజకులప్రదీపుని రథం బపసవ్యముఁ జేసి ఘంటికా
ధ్వనులు చెలంగ మారుతజవంబునఁ దే రటు దోలె నుద్ధతిన్.
| 2725
|
| ఉ. |
ఆరజనీచరప్రవరుఁ డావిధ మంతయుఁ జూచి తామ్రవి
స్ఫారితనేత్రుఁ డై పటునిశాతమహోగ్రశిలీముఖావళుల్
ఘోరముగా రథప్రతిముఖుం డగురామునిమీఁద నేయ నా
భూరమణుండు కోపరసపోషితదుస్సహభూరితేజుఁ డై.
| 2726
|
| చ. |
రయమున నైంద్రచాపము తిరంబుగ సజ్య మొనర్చి కాండము
ల్నియతి దలిర్ప నాశనము నిండ ననేకము లేయుచు న్వడి
న్భయదగతి న్జెలంగె నిటు పట్టుగఁ దార్కొని యమ్మహారథు
ల్జయము దలంచుచు న్హరులచందమున న్వడిఁ బోరి రుద్ధతిన్.
| 2727
|
రావణునకు దుర్నిమిత్తంబులు రామునకు శుభనిమిత్తంబులుం దోచుట
| తే. |
అప్డు రావణవధకాంక్షు లైన దేవ, గరుడగంధర్వసిద్ధులు పరమమునులు
రామరావణసంగరక్రమముఁ జూడ, వచ్చి వినువీథి నుండిరి వరుసతోడ.
| 2728
|
| వ. |
ఆసమయంబున దశగ్రీవునినాశంబు తెలియంజేయుచుఁ గొన్ని దారుణోత్పా
తంబులు దోఁచెఁ బర్జన్యుండు రావణునిరథోపరిభాగంబున సాంద్రంబుగా రుధిర
వర్షంబు గురిసె రావణునిదృష్టి లోపింపఁజేయుచు నపసవ్యంబుగా రజోవా
తంబులు సుడిసె గృధ్రంబులు గుంపులుగట్టి రాక్షసేంద్రునిశీర్షోపరిభాగం
బునం బరిభ్రమించుచు నతనిరథంబు చనినచోటి కెల్లం జనుచుండె జపాపుష్ప
సన్నికాశయైససంధ్యచేత లంకాపురంబు సమావృతంబగుటం జేసి పర్వతభూమి
యంతయు రాత్రియం దగ్నిచేత సంప్రదీప్త యైనకైవడిఁ బవటియందునుం
బ్రదీప్తయై చూపట్టె మహోల్కాసమన్వితంబులై నిర్ఘాతంబులు వడియె రావ
ణునిహితు లగురాక్షసులకెల్ల విషాదంబు వొడమె లంకాసహితంబుగా మహీ
చక్రంబు చలించె రణంబు గావించు రాక్షసులబాహువులు ప్రగృహీతంబు
లైనమాడ్కి స్తబ్ధంబు లయ్యె శిలోచ్చయధాతువులభంగి దామ్రపీతాసితశ్వేత
రూపంబు లగుచు రవికిరణంబులు రావణునియంగంబునం బడియె శివాగణం
బులు గృధ్రంబులతోఁ గూడి వదనంబులం బావకజ్వాలలు గ్రక్కుచు రావ
ణుని విలోకించి ఘోరంబుగా రోదనంబు సేయుచుండె రాక్షససైన్యంబుమీఁద
శక్రాశనులు సాంద్రంబుగాఁ బడియె రక్తమేఘంబులు దారుణంబుగా గర్జించు
చుండె దిక్కులఁ దిమిరంబు నెఱసె సాంద్రరజోవర్షంబుచేత గగనంబు దుర్దర్శం
బయ్యె శారికలు పరస్పరంబు కలహించి భయంకరారావంబు సేయుచు శత
సంఖ్యాతంబు లై దశగ్రీవునికిరీటంబులమీఁద వ్రాలె రావణునిరథతురగం
బులు జఘనంబులవలన వహ్నికణంబులును నేత్రంబులవలన బాష్పకణంబు
లును నించె నిట్లు బహుప్రకారంబులు భయావహంబు లైనమహోత్పాతంబు
లనేకంబులు దోఁచెఁ బదంపడి రామునకు విజయంబు సూచించుచు దక్షిణ
నయనోరుబాహుస్ఫురణాదిశుభనిమిత్తంబు లనేకంబులు దోఁచె నంత నారఘు
పుంగవుండు నిమిత్తకోవిదుండు గావున నాత్మగతంబు లైనశుభనిమిత్తంబు
లన్నియు విలోకించి నిక్కంబుగాఁ దనకు విజయంబు గలుగు నని నిశ్చయించి
దశగ్రీవు నిహతుం డైనవానిఁగాఁ దలంచి పరమసంహృష్టుండై తొల్లింటికంటె
ద్విగుణీకృతం బైనవిక్రమం బంగీకరించి హర్షవికసితవదనుండై శరాసారఘో
రంబుగా రావణుం గదిసి విజృంభించిన నారామరావణులకు సర్వలోకభయా
వహం బైనద్వంద్వయుద్ధంబు ప్రవర్తిల్లె నప్పు డమ్మహాద్భుతసంగ్రామంబుఁ
జూచి రాక్షససైన్యంబును వానరసైన్యంబును నానాప్రహరణాలంకృతభుజం
బయ్యు నమ్మహారథులద్వరద్వంణంబు విలోకించుతలంపున నొండొరులతోడం
బోరక రణంబు సాలించి ఱెప్ప వ్రేయక తప్పక దశగ్రీవదాశరథుల విలోకించుచు
|
|
| |
విస్మితబుద్ధియై చిత్రప్రకారంబున నిశ్చేష్టంబై యూరక సూచుచుండె నివ్విధం
బునం దలపడి రామరావణులమహావేగం బంగీకరించి నిర్బయు లై తమతమ
వీర్యం బంతయు నానాప్రకారంబుల నొండొరులకుం జూపుచుఁ బరస్పరజయ
కాంక్షలం బోరుచుండి రప్పుడు.
| 2729
|
రామరావణులద్వంద్వయుద్ధము
| మ. |
దనుజాధీశ్వరుఁ డల్గి దారుణభుజాదర్పం బెలర్పం బ్రచం
డనిశాతాశుగము ల్సురేంద్రుధ్వజదండం బుద్ధతిం దాఁక నే
సిన నయ్యంబకము ల్మరుద్రయముతో శీఘ్రంబునం బోయి కే
తనశక్తి ప్రథశక్తిఁ గాంచి ధరమీఁద న్వ్రాలె మోఘంబు లై.
| 2730
|
| మ. |
క్షితినాథుం డది చూచి లోచనములం గెంజాయ రంజిల్లఁగాఁ
బ్రతికారం బొనరింపఁ బూని పటుచాపం బట్టె సారించి య
ప్రతిమానోగ్రశిలీముఖం బొకటి రౌద్రస్ఫూర్తి మీఱ న్నభో
గతదైత్యేంద్రశతాంగకేతనము దాఁక న్వేగ యేసె న్వడిన్.
| 2731
|
| ఉ. |
రామకరప్రయుక్తశరరాజము మంటలు గ్రక్కుచు న్ఫణి
స్వామితెఱంగునం బటుజవం బడరం జని యామినీచర
స్వామిరథోపరిస్థితవిశాలమణిధ్వజ ముర్విఁ గూల్చి యు
ద్దామగతి న్రసాతలము దాఁకఁగ బ్రద్దలువాపె మేదినిన్.
| 2732
|
| మ. |
రథకేతూన్మథనంబుఁ జూచి ఘనుఁ డారక్షోవిభుం డక్షులం
బ్రథితక్రోధజవిస్ఫులింగములు రాల న్బ్రజ్వలన్మూర్తియై
ప్రథనోర్విం గరలాఘవంబున లసద్బాణంబు లాశైలభి
ద్రథరథ్యంబులు దాఁక నేసెఁ బటు దోర్గర్వం బఖర్వంబుగన్.
| 2733
|
| ఉ. |
రాక్షసరాజసాయకపరంపరలం బరివిద్ధ మై సహ
స్రాక్షశతాంగవాజినివహం బపు డించుక యైనఁ దత్పృష
త్కక్షతజాతఖేద మది గానక స్రుక్కక స్థైర్యయుక్తమై
దక్షతఁ జూడ నొప్పె సుమదామహతేభగణంబుచాడ్పునన్.
| 2734
|
| సీ. |
అసురేశుఁ డవ్విధ మంతయు వీక్షించి క్రుద్ధుఁడై వెండియు ఘోరభంగి
శరవృష్టి గురియించి చలమునఁ దోడ్తోడఁ బరిఘగదాచక్రపరశుకుంత
ముద్గరతోమరముసలపట్టసశూలభిండివాలప్రాసగండశైల
పాదపాసారంబుఁ బరువడి నిగిడించి మఱియు వెంటనె దైత్యమాయఁ బన్ని
|
|
| తే. |
నిఖిలశస్త్రాస్త్రవర్షంబు నిగుడఁజేయ
నది తుముల మై భయంకర మై మహోగ్ర
నినద మై దిక్కులు నభంబు నిండి శస్త్ర
మయము గావించి భూనభోమధ్య మెల్ల.
| 2735
|
| చ. |
దివిజవిరోధి వెండియును దెంపును బెంపును రోస మీసు లా
ఘవము పరాక్రమం బెసఁగఁ గాండసహస్రము లానరేంద్రుపై
నవిరళభంగి నేసిన రయాతిశయంబున నాపృషత్కము
ల్రవికులుతేరు దాఁటి యవలం గపిసైన్యము ముంచె నుద్ధతిన్.
| 2736
|
| క. |
నరవిభుఁ డరిశరలాఘవ, కరలాఘవములను జూచి గ్రక్కునఁ దాను
న్సరిలేనివీర్యమున భా, సురగతిఁ దనచేతిబలుపుఁ జూపినయంతన్.
| 2737
|
| ఉ. |
ఆరఘువంశశేఖరుని హస్తమహత్త్వమొ మంత్రశక్తియో
యారయ భూరికార్ముకమహత్త్వమొ దాని నెఱుంగరాదు సొం
పార నమోఘసాయకసహస్రపరంపర లుప్పతిల్లి దు
ర్వారగతి న్దిశల్ నభము వారక నిండె నొకింతలోపలన్.
| 2738
|
| క. |
వసుదేశశరార్ధితులై, పస చెడి రాక్షసులు మ్రోడుపడి యుండిరి సొం
వు సెడంగ జంగపురువులు, ముసరిననేరండవృక్షములచందమునన్.
| 2739
|
| క. |
జనపతిబాహాటోపము, గనుఁగొని దైత్యేశ్వరుండు కలుషించి రయం
బున సాంద్రశరాసారం, బినవంశజుమీఁదఁ గురిసె నినుమడిగాఁగన్.
| 2740
|
| తే. |
నరవిభునిసాయకములు దానవునికరము, లాకసము నిండి తన్మహాహవవిధంబుఁ
జూడవచ్చినవేల్పులచూడ్కు లుర్వి, నాట నీ కడ్డగించె నీపాటిరణమొ.
| 2741
|
| క. |
మనుజపతిశరము సోఁకని, దనుజుం డొక్కరుఁడు లేఁడు దనుజుశరము సోఁ
కనికపి యొక్కఁడు లేఁ డే, మని సెప్పుదు వారివిక్రమాధిక్యంబున్.
| 2742
|
| క. |
వలపట దాపటఁ దిరుగుచుఁ, జలమున జడివాన గురియుచందంబున ని
ట్టలముగ శరములు గురియుచుఁ, బలుతెఱఁగుల నాకసంబు బంధించి రొగిన్.
| 2743
|
| తే. |
రామరావణముక్తమార్గణములందు, నిష్ఫలము భేద్య మవిభేత్తనిర్నిమిత్త
మైనశర మొక్క టైన లే దరసిచూడఁ, బరఁగ నన్యోన్యహతము లై ధరణిఁ బడియె.
| 2744
|
| క. |
వాదస్వనములు ఘంటా, నాదంబులు భూరిసింహనాదంబులు జ్యా
నాదము లపు డేకం బై, భేదించె నభంబు దిశలుఁ బృథివీతలమున్.
| 2745
|
| క. |
ఒండొరులమీఁద నడరుచు, నొండొరులహయాలిమీఁద నుగ్రాంబకము
ల్మెండుగఁ గురియుచు సూతుల, గం డడచుచు నిరువు రుగ్రగతిఁ బోరి రొగిన్.
| 2746
|
| క. |
ఆయుద్ద మేమి సెప్పుదుఁ, బాయక వీక్షించునట్టి పరులకు భయసం
ధాయక మై శూరజన, ధ్యేయం బై ముజ్జగంబు లిట్టటు చేసెన్.
| 2747
|
| క. |
ఒండొరులఁ జంపఁ దివురుచు, గండు మిగిలి యొండొరులను గదియుచు మిగులన్
గుండె లవియ గర్జించుచు, భండన మొనరించి రపుడు పటుశౌర్యమునన్.
| 2748
|
| క. |
హుంకారంబులు బాహా, హంకారంబులు పరస్పరాకృష్ణధను
ష్టంకారంబులు మీఱ భ, యంకరగతి రణ మొనర్చి రపు డారథికుల్.
| 2749
|
| క. |
నొగ నొగయ హయము హయమును, దగురీతి సిడంబు సిడముదాఁక రథంబు
|
|
| |
ల్నిగిడించి సాహసంబున, జగడం బొనరించి రపుడు జగములు మెచ్చన్.
| 2750
|
| క. |
శరవర్షము గురియించుచు, సరభసగతి నడుపువారిస్యందనములు సం
గరముఖమునఁ గన నయ్యెను, దఱుచుగ సాసారవారిధరములమాడ్కిన్.
| 2751
|
| తే. |
రోషవీర్యప్రవృద్ధస్వరూపు లగుచు, దారుణంబుగ నని సేయువారిఘోర
రూపములు లయకాలాగ్నిరుద్రరూప, ములతెఱంగునఁ గనుపట్టె .......
| 2752
|
| క. |
మున్నెన్నఁ డిట్టికయ్యము, గన్నది విన్నదియు లేదు కడుఘోరం బై
యున్న దని సురలు మును ల, భ్యున్నతగతి సన్నుతించు చుండిరి మింటన్.
| 2753
|
| వ. |
ఇట్లు మహాద్భుతప్రకారంబునం దలపడి రామరావణులు సూతసారథ్యనైపుణ్యం
బున రథంబు లప్రతిహతగమనంబు లై సంచరింప మండలీకృతకోదండం బై తం
డోపతండంబులుగాఁ గాండంబులు నిగిడించుచుఁ బ్రచండభంగి మండలంబు
లును వీథులును గతప్రత్యాగతంబులును బ్రవర్తననివర్తనంబులందు బహువిధ
గతివేగవిశేషంబులునుం జూపుచుఁ బాయుచుఁ డాయుచుఁ బెక్కు విన్నాణం
బుల రణక్రీడ సల్పి రాసమయంబున.
| 2754
|
| ఉ. |
రాముఁడు క్రుద్ధుఁ డై పటుశరంబులు నా ల్గడరించి రాక్షస
గ్రామణితేరిగుఱ్ఱములగర్వ మడంచి తొలంగఁ దోలినం
దామసుఁ డానిశాచరుఁడు దానికి నల్గి హయోత్తమంబులన్
దీమస మొప్పఁ ద్రిప్పికొని పెంపున రాముని డాసి గ్రమ్మఱన్.
| 2755
|
| క. |
భీమతరంబుగ విశిఖ, స్తోమంబులు రాముమేనఁ జొనిపిన మదిలో
నేమియు స్రుక్కక నృపతి, గ్రామణియుఁ జలింపకుండెఁ గనకాద్రిక్రియన్.
| 2756
|
| ఉ. |
వెండియు రావణుం డలిగి వేయినిశాతశిలీముఖంబు లా
ఖండలసూతుగాత్రములు గాఁడఁగనేసిన నించు కైన నా
తం డని మోహ మందక వ్యథాపరిణద్ధుఁడు కాక నిశ్చలా
త్ముం డయి సూతకృత్యము సముద్ధతి సల్పుచు నుండె ధీరతన్.
| 2757
|
| ఉ. |
మాతలి నిట్లు రావణుఁడు మార్గణవిద్ధునిఁ జేయు టంతయు
న్భూతలనేత చూచి మదిఁ బుట్టినకోపము తాల్మి మ్రింగఁగా
శాతశిలీముఖాయుతము చయ్యన నొక్కొకసారి నించుచున్
ఖ్యాతిగఁ దద్రథంబు విముఖత్వము నొందఁగఁ జేసె వ్రేల్మిడిన్.
| 2758
|
| క. |
అసురవిభుండును గోపం, బెసఁగ నృపకుమారుమీఁదఁ బృథుపరశుగదా
ముసలాంకుశశరవర్షం, బసదృశముగఁ గురిసి యార్చె నంబర మదరన్.
| 2759
|
| క. |
రిపుఁ డేయ నృపుఁడు ద్రుంచును, నృపుఁ డేయఁగ రిపుఁడు ద్రుంచు రిపుఁడు న్నృపుఁడు
న్విపులగతిఁ బోరి రెంతయు, నపురూపం బై తనర్చె నయ్యుద్ధ మొగిన్.
| 2760
|
| సీ. |
సప్తసాగరములు సంక్షుభితము లయ్యె దిక్కుడ్యములు వేయివ్రక్క లయ్యె
గ్రహతారకలు మింట గతులు దప్పి చరించె జగతి కుమ్మరసారెపగిది దిరిగెఁ
|
|
| |
గులమహీధరములు కుదురు దప్పి చలించెఁ బద్మమిత్రుఁడు మందభానుఁ డయ్యెఁ
బాతాళతలవాసి పన్నగంబులు దూలె జడత సమీరుండు సుడియ కుండె
|
|
| తే. |
ఘోరరాక్షసకరముక్తభూరిశస్త్ర, జనితనాదంబుతోఁ గూడ జనవరేణ్య
ఘనధనుర్ముక్తసాయకౌఘప్రభూత, చండపవనంబు జగములు నిండుకొనిన.
| 2761
|
| వ. |
అట్టిమహోత్పాతంబులు విలోకించి దేవగంధర్వమహోరగకిన్నరసిద్ధసాధ్యులు
చింతాకులమానసు లై గోబ్రాహ్మణులకు స్వస్తియగుఁ గాక లోకంబులు శాశ్వ
తంబు లై యుండుఁగాక రాఘవుండు రణంబున రాక్షసేశ్వరుం డగురావణుని
జయించుంగాక యని జపించుచు వెండియు నసదృశం బై రోమహర్షణం బై
ఘోరం బై ప్రవర్తిల్లుచున్నరామరావణులయుద్ధంబుఁ జూచి గగనసాగరంబు
లకు సదృశవస్త్వంతరాభాసంబువలన గగనంబు గగనంబుతోడ సాగరంబు
సాగరంబుతోడ నె ట్లుపమింపంబడియె నట్లు రామరావణులయుద్ధంబు రామ
రావణులయుద్ధంబున పోలి యసమానం బై ప్రవర్తిల్లుచున్నది కంటిరే యని
యొండొరులకుం జెప్పుచుఁ బరమాశ్చర్యరసావిష్టచిత్తు లై యుద్ధప్రకారంబు
విలోకించుచుండి రంత.
| 2762
|
రావణునితలలు రామునిచే ఖండించఁబడినవై మాటిమాటికిని మొలువ సాగుట
| ఉ. |
వీరవరేణ్యుఁ డైనరఘువీరుఁడు రాముఁడు జాతరోషుఁ డై
దారుణభోగితుల్యనిశితక్షుర మొక్కటి గూర్చి దానిచే
ఘోరగతి న్సముజ్జ్వలితకుండల మైనదశాస్యుశీర్షము
న్వారక ద్రుంచె వేల్పులు మనంబునఁ బొంగి చెలంగి చూడఁగన్.
| 2763
|
| క. |
దానవపతిశిర మీగతి, క్ష్మానాథకుమారబాణసంఛిన్నం బై
మానక వజ్రాభిహతం, బైనగిరిశిరంబుమాడ్కి నవనిం ద్రెళ్లెన్.
| 2764
|
| క. |
దనుజపతిమస్తకం బిటు, దినకరకులుసాయకమునఁ దెగి కూలినవెం
టనె వేఱొకశిరము వొడమి, మునుపటివలెఁ జూడనొప్పె భూరిద్యుతితోన్.
| 2765
|
| ఉ. |
వెండియుఁ జండవిక్రముఁడు వీరవరేణ్యుఁడు రామభద్రుఁ డా
ఖండలశస్త్రతుల్య మగుకాండము వింట ఘటించి ప్రోల్లస
త్కుండలదీప్త మై కలితకుంతల మై తనరారుదాని నా
రెండవశీర్షముం దునిమె రేసి సుర ల్వెఱఁగంది చూడఁగన్.
| 2766
|
| క. |
తునిమినఁ దోడనె వేఱొక, ఘనతరశీర్షంబు వొడమఁ గనుఁగొని దాని
న్మనుకులుఁడు రాఘవేంద్రుఁడు, కనత్కనకసాయకమున ఖండించె రహిన్.
| 2767
|
| క. |
తల లెన్ని యంకురించినఁ, జలమున రాముందు ఘోరసాయకములచే
నలఘుగతి హస్తలాఘవ, మలరారఁగఁ దునిమి వైచె నన్నిటి వరుసన్.
| 2768
|
| క. |
ఉడుగక యిలఁబడుశిరములు, నెడతెగక నభంబుమీఁది కెగయుశిరంబు
ల్గడువడిఁ దెగియెడుశిరములు, కడుఁజిత్ర మొనర్చె నపుడు గనువారి కొగిన్.
| 2769
|
| క. |
బెడిదపుఁజప్పుడుతో నిలఁ, బడుదైత్యునితలలు చూడఁబడియె నపుడు గా
డ్పడరిన నుడుగక పుడమిం, బడియెడుపరిపక్వతాలఫలములమాడ్కిన్.
| 2770
|
| వ. |
ఇత్తెఱంగున నారఘుసత్తముం డుత్తమవీర్యంబున నేకోత్తరశతవారం బేకో
త్తరశతశిరంబులు ఖండించిన నవి యెప్పటియట్ల చూపట్టుటయుఁ దత్ప్రకారం
బు విలోకించి రావణునిజీవితక్షయవిషయంబునందు నిశ్చయంబు నిరూపింపం
జాలక తనమనంబున.
| 2771
|
| సీ. |
మున్ను క్రౌంచారణ్యమున విరాధుం డనుదైత్యుఁ దేశరముల దళితుఁడయ్యె
నలజనస్థానవాసులు ఖరదూషణత్రిశిరు లేశరములఁ దీఱి చనిరి
దండకావనమునఁ దాట కేయకబంధు లేశరంబుల నీల్గి రేపు మాని
వాలి యేతూపుల నాలంబులోఁ గూలె నేసాయకముల నదీశుఁ డింకె
|
|
| తే. |
నట్టిబాణంబు లన్నియు నసురవిభుని, యం దిపుడు మందతేజంబు లయ్యె నేమి
కారణం బని చింతించి వైరియురము, మీఁద శరవృష్టిఁ బరఁగించె మేదురముగ.
| 2772
|
| చ. |
అసురవరేణ్యుఁడు న్గినిసి యద్భుతవైఖరి డాసి యీసున
న్ముసలగదాసిచక్రపటుముద్గరతోమరకుంతవర్షము
న్వెస నిగిడించె ని ట్లడరి వేయితెఱంగులఁ బోరఁ దద్రణం
బసదృశ మై జగద్భయద మై ఘన మై గన నయ్యె నయ్యెడన్.
| 2773
|
| వ. |
మఱియు నారథికశ్రేష్ఠులు త్రికూటశిఖరిశిఖరంబున ఘోరంబుగా రణంబు
సేయుచు నాగ్రహకృతగతివశంబున నంతరిక్షంబున కెగయుచుఁ బర్వతసమీప
భూమికి డిగ్గుచుఁ గ్రమ్మఱ గిరిశిఖరంబుమీఁదికి దాఁటుచు రాత్రి యైన దివం
బైన నొక్కముహూర్తంబైన నొక్కక్షణంబైన విరామంబు నొందక వీరాద్భుత
భయానకబీభత్సరౌద్రరసంబుల కాస్పదంబుగా నహోరాత్రంబు మహాయుద్ధం
బు గావించి రప్పుడు సురవరరథసారథి యగుమాతలి రామరావణులకు జయ
పరాజయంబులఁ జింతించి రామునకు విజయంబు సంపాదించుతలంపున నమ్మ
హాత్మున కి ట్లనియె.
| 2774
|
రాముఁడు మాతలిప్రేరితుఁడై రావణునిమీఁద బ్రహ్మాస్త్రముఁ బ్రయోగించుట
| చ. |
ఎఱుఁగనివానిచందమున నీవు చరించెద వేల వీఁడు భీ
కరకమలాసనాస్త్రమునఁ గాని రణంబునఁ జావఁ డీనిశా
చరుపయిఁ గాలయాపనము సల్పక యమ్మహనీయసాధనో
త్కర మడరింపు మీతనికిఁ గాలము డగ్గఱి వచ్చె భూవరా.
| 2775
|
| క. |
అనిమిషపతిసారథిచే, జననాథుకుమారుఁ డిట్లు సంస్మారితుఁ డై
తనమనమున నుత్సాహము, ఘనమోదముఁ గౌతుకంబుఁ గడలు కొనంగన్.
| 2776
|
| తే. |
అఖిలభువనంబులు సృజించునంతకంటె, నధికయత్నంబున సరోరుహాసనుండు
వేడ్క నిర్మించి త్రైలోక్యవిజయకాంక్షి, యైనదేవేంద్రున కొసంగినట్టిదాని.
| 2777
|
| ఆ. |
కుంభసంభవుండు కూర్మితో మున్నర్థిఁ, దన కొసంగినట్టిదాని మించు
కరణి మెఱయుదాని నిరుపమం బగుదాని, నఖిలలోకపూజ్య మైనదాని.
| 2778
|
| తే. |
అఖిలదివ్యాస్త్రసారాంశ మైనదాని, విలయకాలాగ్నిశిఖభంగి వెలుఁగుదానిఁ
గ్రూరసర్పంబుగతి బుసకొట్టుదాని, నఖలలోకసంత్రాసనం బైనదాని.
| 2779
|
| తే. |
పక్షములయందుఁ బవనుండు ఫాలమందుఁ
దపనవహ్నులు తనునందు విపులనభము
గౌరవమునందు మందరమేరుగిమలు
గలుగుదాని వాసుకిభంగి నలరుదాని.
| 2780
|
| తే. |
భూరితేజంబుచే సర్వభూతములకు, దపనదీప్తి యొసంగుచుఁ దనరుదాని
భువననుత మైనదాని సుపుంఖ మైన, దానిఁ గాంచనభూషితం బైనదాని.
| 2781
|
| తే. |
మహితకాలాగ్నిచందాన మండుదాని, వివిధరుధిరమేదోక్త మై వెలయుదాని
వీర్యమునఁ గ్రాలుదాని నవార్యమైన, దాని భీషణనిస్వనం బైనదాని.
| 2782
|
| తే. |
అఖిలవానరనందనం బైనదాని, నసురవంశనిషూదనం బైనదాని
శత్రుకోటికి శోకం బొసంగుదాని, నింపుగాఁ దన కానంద మిచ్చుదాని.
| 2783
|
| తే. |
సమితిదారుణ మై వజ్రసార మై ప్ర, చండనిస్వన మై మహోద్దండ మై య
మోఘ మై సర్వలోకసమ్మోహసంప్ర, దాయకం బయి పొగడొంది దనరుదాని.
| 2784
|
| తే. |
ఆలమున సర్వభూతబేతాళములకుఁ
గాకఘూకోగ్రజంబుకకంకగృధ్ర
ములకుఁ దక్కినమాంసాదములకు భక్ష్య
మొసఁగుదానిఁ గాలాభమై యొప్పుదాని.
| 2785
|
| తే. |
పృథుమదావళఘోటకబృందములకు, భేదనం బైనదాని నభేద్య మైన
దానిఁ గులమహీధరముల నైన డాసి, వేయివిధముల వ్రక్కలు సేయుదాని.
| 2786
|
| మ. |
అభివృద్ధిం గనుదాని నొక్కమహనీయామోఘకాండంబు వే
రభసం బొప్పఁగఁ దీసి దాని నియతి న్బ్రహ్మాస్త్రమంత్రంబుచే
నభిమంత్రించి శ్రుతిప్రయుక్తవిధిచే నాపద్మమిత్రాన్వయ
ప్రభుఁ డౌరాముఁడు భూరినిష్ఠ మెయిఁ జాపంబందు సంధించినన్.
| 2787
|
| క. |
ధర వడఁకె నభము ఘూర్ణిలె, శరధులు క్షుభితంబు లయ్యె జగములు బెదరె
న్గిరు లొడ్డగిల్లె భూతము, లరుదార భయాన్వితంబు లై సుడివడియెన్.
| 2788
|
రావణుండు నిహతుం డగుట
| వ. |
ఇట్లు రాముండు బ్రహ్మాస్త్రంబు సంధించి పరమాయత్తుం డై యాకర్ణపూర్ణం
బుగాఁ దిగిచి విడిచిన నమ్మహనీయాస్త్రంబు రామకార్ముకప్రముక్తం బై వజ్ర
బాహువిసర్జితం బైనవజ్రాయుధంబుపగిది నవార్యుం డైనకృతాంతునికరణి నతి
|
|
| |
వేగంబునం బఱచి దురాత్ముం డగురావణునియురంబు భేదించి వానిప్రాణంబులు
హరించి రుధిరావసిక్తంబై వేగాతిశయంబున ధరణీతలంబు ప్రవేశించి కృతకృ
త్యంబై వినీతం బైనదానిపోలికిఁ గ్రమ్మఱఁ దూణీరంబు సొచ్చె హతుం డైన
రావణునికరంబున నుండి ససాయకం బైనకార్ముకంబు పుడమిం బడియె నిట్లు
రామబాణాభిహతుం డై మహాద్యుతి యగుదశగ్రీవుండు గతాసుం డై వజ్రివ
జ్రాభిహతుం డైనవృత్రునిపగిది రథంబుపైనుండి పుడమిం గూలె నప్పుడు రణమే
దినిం బడినరావణునిం జూచి హతశేషు లైననిశాచరులు హతనాథు లై గతా
శ్రయత్వంబువలన బాష్పప్రస్రవణముఖు లై శోకంబునం బఱచిరి రాక్షసేం
ద్రునినిధనంబు విలోకించి జితకాశు లగువానరులు పరమానందభరితాంతఃకర
ణులై సింహనాదంబులు సేయుచు రామునివిజయంబు గొనియాడిరి గగనంబు
న దేవదుందుభులు మ్రోసె దివ్యగంధవహుం డై సమీరుండు సుఖంబుగా
వీచె నంతరిక్షంబుననుండి సాంద్రంబుగా రామునిరథంబుమీఁదఁ బుష్పవర్షంబు
గురిసె గగనంబుననుండి దేవతలు సాధువాక్యంబుల రామునిం బ్రశంసించిరి
సర్వలోకకంటకుం డగు రావణుండు నిహతుం డగుచుండ దేవగంధర్వసిద్ధచార
ణాదుల కనంతసమ్మోదం బావిర్భవించె రాక్షసపుంగవుం డగురావణుని వధి
యించి రాముండు ప్రీతిసంహృష్టసర్వాంగుండై సుగ్రీవాంగదహనునుదాదుల
తోడ సరసాలాపంబు లాడుచుఁ గృతప్రతిజ్ఞుండై నిహతరిపుం డై స్వజనబలా
భివృతుండై త్రిదశగణాభివృతుఁ డైనదేవేంద్రునిచందంబునం దేజరిల్లుచుండె
మరుద్గణంబులు ప్రసాదంబు నొందిరి దిక్కులు తేజంబు నొందె నభంబు విమ
లం బయ్యె ధరాచక్రంబు చలింపకుండె సమీరణుండు సుఖస్పర్శుండై విసరె
సూర్యుండు స్థిరప్రభుం డయ్యె నంత సుగ్రీవవిభీషణాదు లగుసుహృదులు
లక్ష్మణసహితంబుగా రామునియొద్దకుం జనుదెంచి రావణవధతోషితు లై య
మ్మహాత్మునిం బూజించి రంత.
| 2789
|
విభీషణుండు హతుం డైనరావణు వీక్షించి దుఃఖించుట
| క. |
దక్షుఁ డగురామభద్రుని, యక్షయబాణమున నిహతుఁ డై ఘనసంగ్రా
మక్షితిఁ గూలినయన్నను, వీక్షించి విభీషణుండు విలపించె రహిన్.
| 2790
|
| శా. |
హా వీరోత్తమ హా త్రిలోకవిజయవ్యాపారధౌరేయకా
హా విఖ్యాతపరాక్రమా దనుజవంశాగ్రేసరా జన్యవి
ద్యావైదుష్యము మాని మంజుశయనస్థానంబు వర్జించి నేఁ
డీ విబ్బంగి నరేంద్రుచే హతుఁడ వై పృథ్వీస్థలిం గూలితే.
| 2791
|
| తే. |
సిద్ధవిద్యాధరామరస్త్రీల నెపుడు, విడువ కాలింగనంబు గావించునట్టి
దీర్ఘకరములు సాఁచి యధీశ నీవు, పృథివిఁ గౌఁగిటఁ జేర్చి గూర్కితివె నేఁడు.
| 2792
|
| తే. |
అర్కమండలములభంగి ననుపమాన, దివ్యరత్నప్రభలచేత దిశలు వెలుఁగఁ
|
|
| |
జేయునీదుసువర్ణవిచిత్రవరకి, రీటములు నేలఁ బడియెనే నేఁటి కధిప.
| 2793
|
| చ. |
వలవదు రాక్షసేంద్ర బలవంతునితోడివిరోధ మీవు మై
థిలిని నొసంగు మింక నరదేవున క ట్లొనరింపవేని నీ
తలలు రణంబులోఁ దునుము దాశరథుం డని యేను బల్క నా
పలుకులు నిగ్రహించితివి వల్కినయంతయు నిక్క మాయెఁగా.
| 2794
|
| చ. |
హరిహయజిన్మహోదరనరాంతకకుంభనికుంభకుంభక
ర్ణరుధిరభోజనాదు లయినం దగ దంచు వచింప రైరి యీ
నెఱి చనఁ గీడు వచ్చు నని నీకును దోఁపక పోయె నాఁడు న
న్బరుసము లాడి ప్రో ల్వెడలఁ బంచితి వీగతి యయ్యెఁ గా తుదిన్.
| 2795
|
| తే. |
నీవు దీఱినకతమున నేఁడు ధర్మ
విగ్రహము నీతిమర్యాద వితతసత్త్వ
సంగ్రహంబును గుఱియుఁ బ్రస్తవములగతి
సర్వమును దీఱివోయె నిశాచరేంద్ర.
| 2796
|
| తే. |
అస్త్రవిదులలో నధికుండ వైననీవు, పడుట జలనిధు లింకినభంగి మఱియు
మిహిరతుహినకిరణు లస్తమించినక్రియ, పావకుండు చల్లాఱినపగిది గాదె.
| 2797
|
| చ. |
కడిమి దలిర్పఁ దొల్లి త్రిజగంబుల నొక్కట గెల్చి యేకవీ
రుఁడ వన శూరమధ్యమున రూఢికి నెక్కిన నీవు నేఁడు సొం
పెడలి రజంబులో మునిఁగి యీగతిఁ గూర్కెడువానిభంగిఁ జే
డ్పడి రణభూమిఁ గూలఁ గని పౌరుషము న్వృధ యంచుఁ జూచెదన్.
| 2798
|
| క. |
భీకరతేజుఁడ వగునీ, వీకరణి హతుండ వగుచు నిలఁ గూలిన నీ
లోకం బంతయు నిపు డా, లోకిత మయ్యె హతశూరలోకం బగుచున్.
| 2799
|
| చ. |
కలితధృతిప్రవాళ మవికంపితము న్బ్రసవాగ్రపుష్ప ము
జ్జ్వలితతపోబలం బసదృశంబును శౌర్యనిబద్ధమూల మౌ
విలసితరాక్షసప్రవరవృక్షము రాఘవమారుతంబుచే
నలఘుతరంబుగా నిహత మై రణమేదినిఁ గూలె నక్కటా.
| 2800
|
| చ. |
అతులతరప్రసాదశయ మంచితకోపరసాపరాంగ మ
ద్భుతబలవీర్యదంతము సమున్నతసత్కులవంశవంశ మ
ప్రతిమపరాక్రమంబు నగుబంధురరావణగంధహస్తి నేఁ
డతులితభంగి రాఘవమృగాధిపుచే హత మయ్యె నాజిలోన్.
| 2801
|
| తే. |
స్వబలతేజోయుతంబు నిశ్శ్వాసధూమ
హితము విక్రమోత్సాహవిజృంభితార్చి
యైనరావణవహ్ని నేఁ డాజి రాఘ
వాశుగాభ్రంబుచేతఁ జల్లాఱె నకట.
| 2802
|
| తే. |
ఘోరరాక్షసవాలకకుద్విషాణ, మరిజయోత్సాహగంధసింధురము చాప
లేక్షణశ్రుతి యైనదైత్యేంద్రవృషము, పార్థివవ్యాఘ్రనిహత మై పడియె నేఁడు.
| 2803
|
రాముఁడు విభీషణు నూఱడించుట
| వ. |
అని యిట్లు బహుప్రకారంబుల శోకసమావిష్టుండై విలపించుచున్న నప్పుడు
పరిదృష్టార్థనిశ్చయంబును హేతుమంతంబు నైనయవ్విభీషణుని వాక్యం బాక
ర్ణించి రామభద్రుం డతని కి ట్లనియె.
| 2804
|
| చ. |
వినుతపరాక్రముండు భుజవీర్యఘనుండు రణానివర్తి గం
ధనపరుఁ డుగ్రతేజుఁ డతిదర్పుఁడు శూరజనాగ్రగణ్యుఁ డీ
దనుజవరేణ్యుఁ డీతఁ డనిఁ దప్పక పంచత నొందియు న్జగం
బున మని యున్నవాఁ డితనిపోకకు శోకము నొంద నేటికిన్.
| 2805
|
| చ. |
వదలక వృద్ధికాము లగువారు ప్రతాపముఁ జూపి వైరిచేఁ
గదనమునందుఁ గూలుదురు కయ్యములోపలఁ జన్నవారికిం
ద్రిదశపదంబు గల్గు నటు దీఱినవారలఁ గూర్చి ధర్మకో
విదు లగువారు చిత్తముల వేమఱు శోకము గూర్ప రుర్వరన్.
| 2806
|
| ఉ. |
ఈదనుజాన్వయప్రవరుఁ డెల్లజగంబులు గెల్చి శక్రకా
లాదిసమస్తదిక్పతుల నాజితలంబునఁ బాఱఁ దోలి క్ర
వ్యాదకులాంబురాశిశశి యై స్వజయార్జితవీరశబ్దుఁ డై
యాదటఁ గాలధర్మగతుఁ డయ్యె మహాత్ముఁ డితండు శోచ్యుఁడే.
| 2807
|
| తే. |
పుడమి నేకాంతవిజయ మభూతపూర్వ
మాహవతలంబున నొకానొకప్పుడైనఁ
బరులచేఁ జచ్చు మఱియుఁ దాఁ బరులనైనఁ
జంపువీరుండు జయ మది చంచలంబు.
| 2808
|
| తే. |
సమరమరణంబు క్షత్రియసమ్మతంబు, త్రిదశవర్యులచేత సందృష్ట మైన
చంద మిదియె రణంబునఁ జచ్చినట్టి, నృపతి శోచ్యుఁడు గాఁ డిది నిశ్చయంబు.
| 2809
|
| వ. |
విభీషణా నీ వీనిశ్చయం బెఱింగి విజ్వరుండ వై యనంతరకార్యం బెయ్యది
కర్తవ్యంబు దాని విచారింపు మనిన నతండు రామభద్రు నవలోకించి శోకగద్గ
దకంఠుం డై యిట్లనియె.
| 2810
|
| ఉ. |
రాజవరేణ్య యీతఁడు పరాజయ మెన్నఁ డెఱుంగ కట్లు ము
న్నాజితలంబున న్సురవరాదులఁ దోలి జయంబు గొన్నవాఁ
డోజ దలిర్ప నేఁడు సమరోన్మదుఁ డై వెస నిన్నుఁ దాఁకి వే
లాజితసాగరంబుక్రియ లావఱి గూలెఁ బ్రభగ్నదర్పుఁ డై.
| 2811
|
| చ. |
ధనము లొసంగె మిత్రులకు దైవముల న్భజియించె భోగముం
దనివి సన న్భుజించె భుజదర్పము వైరులయందు నించె భృ
|
|
| |
త్యనికరము న్భరించె వివిధాధ్వరకర్మము లాచరించె లో
కనుతతపం బొనర్చెం ద్రిజగంబుల విశ్రుతి గాంచె నన్నిటన్.
| 2812
|
| వ. |
కావునఁ బ్రేతత్వగతుం డైనయీరాక్షసేంద్రునకు భవత్ప్రసాదంబున సంస్కా
రంబు గావింపం గోరెద నని పలికిన నారఘువల్లభుండు విభీషణునిపలుకులు విని
మిత్రా వైరంబులు మరణాంతంబులు మత్సంకల్పితప్రయోజనం బంతయుఁ
దీఱె నింక నీరావణుండు స్నేహవిషయంబునందు నీ కెట్టివాఁడు నాకు నట్టి
వాఁ డయ్యె నితనికి స్వర్గారోహణసాధనం బైనసంస్కారంబు గావింపు మని
పలికె నంత రామునిచేత రావణుండు రణంబున నిహతుం డగుట విని రాక్షస
కాంత లెల్ల శోకకర్శిత లై యంతఃపురంబు నిర్గమించి యెవ్వ రెంత నివారించిన
నిలువక మహీరేణువులం బడి పొరలుచు ముక్తకేశకలాపలై హతవత్స లైన
గోవులభంగి దుఃఖపీడిత లై యనేకరాక్షసులతోడ నుత్తరద్వారంబు వెడలి
మాంసశోణితకర్దమంబై కబంధాకం బై ఘోరదర్శనం బై యున్నసంగ్రామ
రంగంబు సొచ్చి రావణుఁడు పడియున్నచోటు వెదకుచు హానాథా యని
యాక్రందనంబు సేయుచుఁ గన్నీరు నించుచు శోకపరాజిత లై దూలుచు
హతయూథప లైనగజాంగనలపగిది నారావంబు సేయుచుం జనుదెంచి
యొక్కచోట.
| 2813
|
రావణునిభార్యలెల్ల యుద్ధభూమికి వచ్చి యాక్రందించుట
| చ. |
హతకరుఁ డైన హేళిక్రియ నప్పుల నాఱినవహ్నికైవడి
న్శతమఖవజ్రఖండితవిశాలవినీలనగంబుమాడ్కి భూ
పతిశరభిన్నగాత్రుఁ డయి బంధురశోణితసిక్తుఁ డై రణ
క్షితిఁ బడియున్నదైత్యకులశేఖరు రావణుఁ గాంచి చెచ్చెరన్.
| 2814
|
| క. |
భూరికుఠారపరిచ్చి, న్నారణ్యకలతలభంగి నడలుచు దివిష
ద్వైరిపతియొడలిపైఁ బడి, ఘోరంబుగ నేడ్చి రప్డు గురుశోకమునన్.
| 2815
|
| సీ. |
విభునిఁ గౌఁగిటఁ జేర్చి విలపించె నొక్కతె భుజములు పైకెత్తి పొక్కె నొక తే.
గళ మవలంబించి విలపించె నొక్కతె మగనియంఘ్రులు వట్టి వగచె నొకతె
తొడమీఁద శిర ముంచి దుఃఖించె నొక్కతె యురముపై వ్రాలి బిట్టఱచె నొకతె
తను వంటి రోదన మొనరించె నొక్కతె కేశము ల్వీడ శోకించె నొకతె
|
|
| తే. |
చిందు కన్నీటిచినుకులచేత జీవి, తేశువదనంబు దడుపుచు నేడ్చె నొకతె
దైత్యసతు లిట్లు పెక్కుచందముల విభునిఁ, బట్టుకొని విలపించిరి బంధురముగ.
| 2816
|
| వ. |
వెండియు నంద ఱేకవాక్యంబున.
| 2817
|
| సీ. |
ఇంద్రాదిదిక్పతు లెవ్వానిభయమున శూరుల మని తలఁ జూప వెఱతు
రాలంబున ధనేశుఁ దోలి పుష్పకనామ ఘనదేవయాన మేఘనుఁడు దెచ్చె
సురదైత్యముఖులచే మరణంబు లేకుండ వరము లెవ్వఁడు ధాతవలనఁ బడసెఁ
దన కడ్డ మైనశంభునివెండికొండను బెకలించె నెవ్వాఁడు పృథుబలమున
|
|
| తే. |
గరుడగంధర్వయక్షకిన్నరులు చాల వెఱతు రెవ్వానినామంబు విన్నయంత
నట్టిరాక్షసలోకేంద్రుఁ డాజి నొక్క, నరునిచే హతుఁడై గూలినాఁడు నేఁడు.
| 2818
|
| క. |
పరులవలన భయ మెన్నఁడు, నెఱుఁగనిశూరోత్తమునకు నెక్కడ నేఁ డి
ప్పరుసునఁ బదాతి యగునొక, నరునివలన భయము గలిగె నాయము దప్పెన్.
| 2819
|
| చ. |
హితమతు లైనపెద్దలు సుహృత్తులుఁ జెప్పిననీతివాక్యముల్
శ్రుతిపుట మంట నీక నృపసుందరి నాత్మవధార్థ మీవు దు
ర్మతిఁ గొని తెచ్చి రాక్షసుల మమ్మును నిన్నును జంపుకొంటి వ
ప్రతిమపరాక్రమాఢ్యుఁ డగుభానుకులేంద్రునిసాయకంబులన్.
| 2820
|
| చ. |
అరసి విభీషణుండు మనకందఱ కీగతి వచ్చు టాత్మలో
నెఱిఁగి మహీజ నానృపతి కిమ్మని నేర్సున నెంత చెప్పిన
న్బరుసఁదనంబున న్వినక పట్టణము న్వెడలంగఁ బంచి తా
పరమవివేకశాలి మును వల్కినయంతయుఁ దథ్య మాయెఁగా.
| 2821
|
| చ. |
అసురవరేణ్య రాఘవున కప్పుడె జానకి నిచ్చి పుచ్చినం
బస చెడి సర్వరాక్షసులు బంధులు మిత్రులు ద్రుంగి పోక యీ
వ్యసనము మాకు లేక సుతులందఱుఁ బంచత నొంద కీవు ఘో
రసమరమందుఁ జావక తిరంబుగ నందఱ ముందుమే కదా.
| 2822
|
| సీ. |
మాననీయుం డైనమనవిభీషణుమాట పాటించి వినిన నిష్పన్నకాముఁ
డగునాతఁ డందున నాప్తపక్షుం డైన జనపతి నిన్నాజిఁ జంపకుండు
నీవు చావక యున్న నేఁడు మాకెల్ల నీకరణి వైధవ్యంబు గలుగకుండుఁ
బగవార లైనదికృతులకు సురలకుఁ గోర్కు లెల్లను సమకూరకుండు
|
|
| తే. |
నవనిపుత్రిని మరల నీనందువలన, నేకకాలంబున సమస్తహితులు సుతులు
వాహినీంద్రులు నేము భవత్సమన్వి, తంబుగ వధింపఁబడితిమి దానవేంద్ర.
| 2623
|
| క. |
మానుగ దైవాధీనం, బీనిఖిలము దైవనిహత మెయ్యది దాని
న్మానవుఁడు ద్రుంచు స్వేచ్ఛా, ధీనోద్యోగంబు లేదు తెలియఁగ నీకున్.
| 2824
|
| క. |
వానరులకు నీకు నఖిల, దానవులకు నాశనంబు దైవమువలన
న్మానక ప్రాప్తం బయ్యెను, మానవపతికతన నేఁ డమర్త్యవిరోధీ.
| 2825
|
| క. |
బలశౌర్యాజ్ఞావిక్రమ, ముల మఱి యర్థమునఁ గామమున దైవగతిం
దలకొని మరల్పఁగా లే, రిలలో నెవ్వార లైన హృదయాధీశా.
| 2826
|
మందోదరి రావణుం జూచి విలపించుట
| వ. |
అని యిట్లు బహుప్రకారంబుల దుఃఖార్త లై దీనస్వర లై రావణపత్ను
లందఱుఁ గన్నీరు మున్నీరుగా రోదనంబు సేయుచుండి రప్పు డగ్రపత్ని మండో
దరి యచింత్యకర్ముం డగురామునిచేత నిహతుం డై రణమేదినిం బడియున్న
రావణు నవలోకించి దీనస్వరంబున ని ట్లని విలపించె.
| 2827
|
| సీ. |
ప్రాణేశ ఘోరసంగ్రామతలంబునఁ గ్రుద్ధుండవైన నీమ్రోల నిలువ
విబుధనాయకుఁ డైన వెఱచు నీనామంబు చెవులు సోఁకినయంత సిద్ధసాధ్య
గరుడగంధర్వులు గడగడ వడఁకుచుఁ బఱతురు దిశలకు భయముతోడ
విష్టపత్రయమున వీరశిఖామణి యనఁగ విశ్రుతి గన్న ఘనభుజుండ
|
|
| తే. |
వట్టి నీవు మానుషమాత్రుఁ డైనరామ, నృపతిచే సంగరంబున నిర్జితుండ
వైతి వేమందు దైవయోగాతిరేక, మిట్లు నటకు నీకు సిగ్గేల లేదు.
| 2828
|
| తే. |
అసురనాయక త్రైలోక్య మాక్రమించి, విక్రమశ్రీయుతుండ వై వితతతేజ
మున వెలింగెడునిన్ను నేఁ డని నరణ్య, గోచరుం డగునరుఁ డెట్లు గూలవైచె.
| 2829
|
| తే. |
కర్బురోత్తమ నరుల కగమ్య మైన, దేశమునఁ గామరూపి వై ధీరవృత్తిఁ
బరఁగ వర్తించుని న్నెట్లు నరుఁడు చంపె, నిట్టివింతలు పుట్టె నేఁ డిచట నీకు.
| 2830
|
| క. |
అనిమిషులు జయించిన నిను, మనుజుఁడు సంగ్రామమందు మర్దించె నన
న్విన విన విం తగుచున్నది, మనమున నమ్మంగఁజాల మానసనాథా.
| 2831
|
| తే. |
శమనుఁ డిబ్బంగి నీవినాశంబుకొఱకు
మించి దుర్వారమాయ నిర్మించి రామ
రూపమున వచ్చెఁ గాఁబోలు రూఢి మెఱయ
నట్లు గాకున్న నరుఁ డింత కర్హుఁ డగునె.
| 2832
|
| సీ. |
చెలు వొప్పఁ గపులచే సేతువు కట్టించి వారాశి లంఘించి వచ్చుటయును
బహుదైత్యయుతముగా భండనంబున ఖరదనుజుని వ్రేల్మిడిఁ దునుముటయును
జలమున నిను నాల్గుసంద్రము లుంచిన వాలిని వెసఁ గూలవైచుటయును
దరుచరుఁ డొక్కఁడు వెఱవక చనుదెంచి పుర మంతయు దహించిపోవుటయును
|
|
| తే. |
మఱియు రామునియద్భుతమహిమ లరసి
యతఁడు మర్త్యమాత్రుండు గాఁ డంచుఁ జాలఁ
జిత్తమున నెంచి యతనిచేఁ జేటు నీకుఁ
గలుగు నని యుమ్మలింపుదుఁ గర్బురేంద్ర.
| 2833
|
| తే. |
వాసవుఁడు రామరూపుఁ డై వచ్చి నిన్ను, గొంటుతనమున నిటు చేసె నంటినేని
వైరులకు దుస్సహుండ వై వఱలునిన్నుఁ, జంపుటకు వాసవున కంతశక్తి గలదె.
| 2834
|
| సీ. |
స్వాభావికజ్ఞానశక్తియుక్తుఁడు సనాతనుఁ డఖిలాంతరాత్మకుఁ డజుండు
ప్రకృతికంటెఁ బరుండు పరిణామవిరహితుఁ డాదిమధ్యాంతశూన్యాద్వయుండు
క్షయశూన్యుఁడు మహత్తుకంటె మహత్తును సర్వలోకేశుండు స్రష్ట యచలుఁ
డరిసుదర్శనగదాధరుఁ డజయ్యుఁడు రమావరుఁ డచ్యుతుఁడు శ్రీవత్సవక్షుఁ
|
|
| తే. |
డైనవిష్ణుండు లోకహితార్థ మిట్లు, మానుషాకృతి ధరియించి మర్కటత్వ
మొందినసుపర్వులను గూడి యుద్ధమందు, నిన్ను వధియించె నేఁ డిది నిక్కువంబు.
| 2835
|
| తే. |
అసురనాయక మున్నింద్రియముల గెలిచి
గెలిచితివి ముజ్జగంబుల నలఘుభంగి
|
|
| |
వరుస నయ్యింద్రియంబులే మరల నిన్ను
గెలిచె వైరయు క్తము లౌటవలన నేఁడు.
| 2836
|
| క. |
మానవపతితో వైరము, మానుము వైదేహి నిమ్ము మరల ననుచు ము
న్నే నెంత బుద్ధి చెప్పిన, మానుగ విన వైతి విది సమాగత మయ్యెన్.
| 2837
|
| తే. |
పుణ్యపతి యైనసీతపైఁ బుట్టినట్టి, కామ మది వహ్నిరూపమై కర్బురేంద్ర
నిన్ను నన్నును గులమును నిఖిలసుతులు, హితుల మంత్రుల నెల్ల దహించె నేఁడు.
| 2838
|
| సీ. |
దనుజనాయక యరుంధతికంటె రోహిణికంటె విశిష్ట యై గ్రాలుదాని
వసుధలో క్షమ గలవారి కెల్లను నిదర్శనభూత యైనట్టిరసకు సర్వ
సౌభాగ్యయుతు లైనజనుల కెల్లను నిదర్శనభూత యైన వారాశిసుతకు
దృష్టాంతభూమి యై తేజరిల్లెడుదానిఁ బతిభక్తి గలదానిఁ బరమసాధ్వి
|
|
| తే. |
నబల సర్వానవద్యాంగి యైనదాని, మహితశీలంబు గలదాని మాన్య యైన
దాని సీతను బతియొద్ద లేనివేళ, ముచ్చలి యరణ్యమున నుండి దెచ్చి తీవు.
| 2839
|
| తే. |
తెచ్చినందున ఫలమేమి దీర్పరాని
కలుషము ఘటిల్లుటయుఁ జేటు గల్గుటయును
గులకు చెడుటయు నింతియే గలిగెఁ గాని
భోగ మేమైనఁ గలిగెనే పొసఁగ నీకు.
| 2840
|
| సీ. |
రాక్షసేశ్వర పతివ్రత యైనసీత తపోగ్నిచే దగ్ధుండ వైతి మున్నె
తనుమధ్య నుద్ధతి ధర్షించునప్పుడే దగ్ధుండవై పోక తక్కి తదియు
నురుతపోమహిమను బురుహూతముఖసురు లురుభయంబునఁ గుందుచుండ్రి దేనఁ
బరిపక్వకాలంబు పర్యాగతం బైనఁ గలుషకర్మఫలంబు కర్త కొదవు
|
|
| తే. |
శుభము గావించుపురుషుఁడు సుఖము నొందు
దురిత మొనరించుపురుషుఁడు దుఃఖ మొందు
సుకృతి యగువిభీషణునకు సుఖము గలిగె
దోషకారికి నీ కిట్టిదుఃఖ మొదవె.
| 2841
|
| క. |
దివిజారి రూపవతు లగు, యువతులు పెక్కండ్రు కలిగియున్నా రిట నీ
కవివేకతఁ గన వైతివి, యవనీసుతకంటె వారి నధికలఁ గాఁగన్.
| 2842
|
| క. |
ఉరుమోహంబున మదిలో, నెఱుఁగఁగలే వైతి వామహీసుత కులరూ
పరమాగుణముల నాతో, సరివచ్చునె యెక్కు డగునె చర్చింపంగన్.
| 2843
|
| క. |
తనవిభునిఁ గూడి జానకి, యనుపమహర్షాబ్ధి నోలలాడుచు నుండు
న్నినుఁ బాసి యేను సతతం, బును శోకపయోధియందు మునిఁగి యడలెదన్.
| 2844
|
| సీ. |
ప్రాణేశ దివ్యచిత్రస్రగంబరములఁ గైసేసి యసమానకాంతితోడ
నినుఁ గూడి సంతత మనురూప మగువిమానం బెక్కి నిస్తులానంద మలర
వివిధ దేశంబులు వీక్షించుచును మేరునగమందు మందరనగమునందుఁ
గైలాసనగమందు ఘనచైత్రరథమందుఁ దక్కినదేవతోద్యానవీథు
|
|
| తే. |
లందు విహరించుచుండుదు నట్టియేను
గామభోగసంత్యక్త నై కళలు దొఱఁగి
విధవనై యుండవలసె భూవిభులభోగ
భాగ్యములు నమ్మఁదగవు చపలము లరయ.
| 2845
|
| తే. |
దానవోత్తమ సర్వభూతముల కిల న, కారణం బగుమృత్యువు గలుగ దట్లు
గాన మైథిలీహేతుకం బైనమృత్యు, విట్లు నీకును గలిగె నిం కేమి గలదు.
| 2846
|
| సీ. |
దనుజేంద్ర సుప్రసాదంబుచే శోభచే దీప్తిచే శశిపద్మదినకరులకు
సాటి యై సుభ్రూవిశాల మై సుకుమార మై సమున్నస మై విలాసినేత్ర
కలిత మై దీప్తకుండల మై మనోజ్ఞ మై మకుటాభిరామ మై మహితమద్య
పానభూములయందుఁ బటుమదవ్యాకులదీప్రాక్ష మై యొప్పు నీప్రధాన
|
|
| తే. |
వదన మిప్పుడు రాఘవప్రదరభిన్న, మై రుధిరసిక్త మై దీన మై వికీర్ణ
మాంసమస్తిష్క మై పరిమ్లాన మగుచుఁ, గన్నులకు వేడ్క గావింపకున్న దకట.
| 2847
|
| వ. |
దేవా మందభాగ్య నైననాచేత నొకానొకప్పుడైన నెయ్యది యవిచారితం
బయ్యె నట్టిమద్వైధవ్యకారిణి యైనపశ్చిమావస్థ నీకు సంప్రాప్త యయ్యె నని
వగచి వెండియు.
| 2848
|
| తే. |
అఖిలరాక్షసవరుఁడు మాయయ్య యనియు
దానవకులేశ్వరుండు మద్భర్త యనియు
దండితపురందరుండు నాతనయుఁ డనియు
విఱ్ఱవీఁగుచు నెపుడు గర్వించి యుందు.
| 2849
|
| ఉ. |
పట్టుగ మీరు ఖ్యాతబలపౌరుషు లాహవశూరు లెంతయున్
దిట్టలు విక్రమాధికులు ధీరులు నించుక యైన మీకు నే
పట్టున హాని గల్గ దని భావమునం దగ నమ్మియుంటి నేఁ
డిట్టులు మర్త్యుచేత భయ మింత పొసంగు టెఱుంగ నక్కటా.
| 2850
|
| సీ. |
లలితేంద్రనీలనీలము ప్రాంశుశైలేంద్రసదృశంబు మణిమయచారుమకుట
కమనీయకంకణాంగదహారకేయూరసురుచిరసుమదామశోభితంబు
ఘనవిహారములందుఁ గాంతంబు సమరంబులందు దీప్తంబు భార్యాంగరాగ
దీప్తిచే శంపాప్రదీప్తమేఘనిభంబు రమణీయచేలాభిరంజితంబు
|
|
| తే. |
నైననీదుశరీర మత్యలఘుశల్య
శలలములచేతఁబోలె నసంఖ్యనిశిత
కాండసంవ్యాప్త మై నేఁడు కౌఁగిలించు
కొనుటకు నశక్య మై యున్న దనిమిషారి.
| 2851
|
| చ. |
నిరుపమరామకార్ముకవినిస్సృతదారుణచండకాండముల్
గఱిగఱి ..............ఁడిన నెత్తుటఁ దోఁగి నెమ్ములు
|
|
| |
న్విఱిగి భవచ్ఛరీరము పవిత్రవిఖండిత మైనకొండవై
ఖరి నిలఁ గూలి యుండ నీటు గన్గొనఁ బాలయితిన్ హృదీశ్వరా.
| 2852
|
| తే. |
అధిప యిది స్వప్నము యథార్థ మయ్యె నేని, రాముఁ డెబ్భంగి నిను సమరమునఁ జంపె
మృత్యువున కైన మృత్యువ వెట్లు మృత్యు, వశగతుఁడ వైతి వీవు దుర్వారతేజ.
| 2853
|
| ఉ. |
జేతవు లోకపాలురకుఁ జెల్వుగ సర్వనిశాటకోటికి
న్నేతవు సార్వకాలికము నిన్ను భజించెడుభృత్యకోటికిన్
దాతవు భీతు లై మఱుఁగు తప్పక సొచ్చినవైరపాళికిం
దాతవు సర్వశాస్త్రపరిరక్షిత వీవు విధాత వెన్నఁగన్.
| 2854
|
| క. |
భర్తవు ముజ్జగములకుఁ బ్ర, హర్తవు వైరులకు రాక్షసాన్వయమునకుం
గర్తవు సురనరపతులకు, హర్తవు వీర్యాధికుండ వసురవరేణ్యా.
| 2855
|
| క. |
లోప్త వనేకమఖములకు, గోప్తవు హితమంత్రబంధుకోటికి నెల్లన్
క్షేప్తవు కైలాసాద్రికి, నప్తవు కమలాసనునకు నయగుణశాలీ.
| 2856
|
| క. |
వ్యక్తపరాక్రమపరుఁడవు, వక్తవు శత్రువులమ్రోల వరదర్పమున
న్యుక్తిసహితవాక్యములకు, భోక్తవు త్రైలోక్యరత్నభోగంబులకున్.
| 2857
|
| తే. |
వీరవర్య యావిష్కృతవిక్రముండ, వఖిలవిష్టపములకు భయప్రదుఁడవు
వ్రేలఁ జూపినవారలఁ గాలఁ జూపి, నట్టిఘనుఁడవు బాహుసత్వాధికుఁడవు.
| 2858
|
| క. |
నీకంఠస్వనము వినిన, లోకస్థసమస్తభూతలోకం బెల్లం
జీకాకుపగిది సుడిపడు, భీకరమూర్తివి ప్రతాపపేటివి తలఁపన్.
| 2859
|
| తే. |
పాయక నివాతకవచులఁ బాఱఁదోలి, నట్టిశూరుండ వఖిలమాయామహత్త్వ
కోవిదుండవు సకలవిద్యావిదుండ, వఖిలధర్మవ్యవస్థాభిహంత వీవు.
| 2860
|
| తే. |
అసురపుంగవ మాకెల్ల ననుదినంబుఁ, గామభోగంబుల నొసంగి గారవించు
నట్టికృప గలవాఁడ వీ వతిరథుండ, వలఘుచారిత్రుఁడవు త్రిలోకాధికుఁడవు.
| 2861
|
| వ. |
ఇట్టి ప్రభావసంపన్నుండ వైననీవు రామబాణాభిహతుండ వై పుడమిం బడి
యుండ నిన్ను విలోకించి హతప్రియ నై యీదేహంబు ధరించి యున్నకార
ణంబున నే సత్యంతకఠినహృదయ నైతి నని దుఃఖించి వెండియు నిట్లనియె.
| 2862
|
| క. |
విలసితమహార్హతల్పం, బులపై నిదురించునట్టిభోగివి నీ వె
ట్లలపాంసుపాటలుఁడ వై, యిలపై వసియించినాఁడ వేమందు విధిన్.
| 2863
|
| క. |
సుతుఁ డింద్రజిత్తు సమర, క్షితిలో లక్ష్మణునిచేతఁ గెడసినయపుడే
హత నైతి నిపుడు వెసఁ బా, తిత నైతి మహాత్మ నీవు దెగినకతమునన్.
| 2864
|
| క. |
పతిసుతహితబాంధవవిర, హిత నై మఱి కామభోగహీన నయి మహి
న్మతి లేనిదుఃఖభరమున, గతిసెడి మనియుండవలసెఁ గలకాలంబున్.
| 2865
|
| క. |
నినుఁ బాసి నిమిషమైనను, మనియుండఁగఁజాల నన్ను మక్కువతోడం
గొని పొ మ్మిచ్చట నొంటిగ, నను విడిచి యొకండ వరుగ న్యాయమె యధిపా.
| 2866
|
| క. |
విలపించెడుననుఁ గనుఁగొని, పలుకవు నగరంబు విడిచి పాదగతి న్వి
చ్చలవిడి వచ్చిననాపై, నలుగవు చూడవు మృదూక్తు లాడ వదేలా.
| 2867
|
| తే. |
విగతలజ్జావగుణ్ఠిత లగుచుఁ బురము, విడిచి వెలికి విశృంఖలవృత్తి నేగు
దెంచిననిజాంగనల విలోకించి నీవు, కోపగింప వదేల రక్షోవరేణ్య.
| 2868
|
| తే. |
అధిప క్రీడాసహాయమైనట్టియీజ, నంబు దిక్కఱి కడు వ్యసనమునఁ జిక్కి
చాల విలపించుచున్న దీవేల దీని, నాదరింపవు మన్నింప వసురనాథ.
| 2569
|
| సీ. |
దనుజేంద్ర మును నీవు ధర్మమార్గము దప్పి భర్తృశుశ్రూషణపరత ధర్మ
నిరతల సాధ్వులఁ బరమపుణ్యలఁ గులస్త్రీల సువ్రతలను జెఱలుపట్టి
వారిభర్తల నెల్ల వధియించితివి బల్మి నయ్యుత్తమాంగన లపుడు గినిసి
నీవంశమంతయు నిర్మూల మగుఁ గాక నీశిరంబులు దెగి నేలఁ గూలుఁ
|
|
| తే. |
గాక నీపత్ను లింక మాకరణి విగత, కాంత లై యేడ్చుచుందురుగాక యనుచు
ఘోరభంగి శపించి రాగోడు నీకు, దైవకృతమునఁ దప్పక తగిలె నేఁడు.
| 2870
|
| వ. |
దేవా యెవ్వనికృతంబునఁ బతివ్రత లగుయువతులకన్నీరు మహీతలంబునం
బడు నట్టివానికి నాశంబు గలుగు ననియెడుప్రవాదంబు నేఁడు సత్యం
బయ్యె బాహువీర్యంబున లోకత్రయంబు నాక్రమించి ప్రతాపవంతుం
డవై తేజరిల్లెడునీకుఁ బరాంగనాభిమర్శనంబు క్షుద్రం బని తోఁప
కేల చనియెఁ గపటమృగవ్యాజంబున రాముని దూరగతుం చేసి యా
శ్రమంబున నొంటిఁ జిక్కియున్నవేళఁ గపటపరివ్రాజకరూపంబున జానకిం
గొని తెచ్చితి వది నీకుఁ గాతర్యలక్షణంబు రణంబులయం దింతకుమున్ను
నీ కొకానొకప్పు డైనఁ గాతర్యంబు గలిగె ననుమాట యెన్నఁడు విని యెఱుంగ
నిట్టియ కాతరప్రకృతి నైననీకు భాగ్యవిపర్యాసంబువలనఁ జౌర్యరూపం
బైనయేకాతర్యంబు పుట్టె నది వినాశజ్ఞాపకం బయ్యె నతీతానాగతవర్త
మానార్థవిచక్షణుండును మహాభాగుండు నగుమద్దేవరుండు నీచేత వంచించి
తేఁబడినసీతం జూచి నిట్టూర్పులు వుచ్చి కొండొకసేపు విన్ననై ధ్యానంబు
పూని యుండి దీన రాక్షసులకు వినాశంబు గలుగు నని పలికె నతండు సత్య
వాది గావునఁ దద్వచనప్రకారంబున రాక్షసముఖ్యుల కెల్ల వినాశంబు సంప్రాప్తం
బయ్యెఁ గామక్రోధసముత్థవ్యసనప్రసంగి వైననీచేత మూలహరం బైనయిట్టియన
ర్థంబు సమానీతం బయ్యె మౌర్ఖ్యంబువలన నీరాక్షసకులం బంతయు ననాయ
కంబు గావించితివి ప్రఖ్యాతబలపౌరుషుండ వైననీవు నాకు శోచితవ్యుండవు
|
|
| |
గావు స్త్రీస్వభావంబున నాబుద్ధి కారుణ్యంబునందు బ్రవర్తించుచున్నది నీచే
సినసుకృతదుష్కృతంబులు చేకొని నీవు స్వగతికిం జనితి వేను భవద్వియోగం
బున దుఃఖార్తనై గతిగానక దుఃఖించుచుండవలసెఁగదా యేను నన్నే
యుద్దేశించి దుఃఖించెద హితకాము లగుసుహృత్తులును మారీచుడును గుంభ
కర్ణుండును మాల్యవంతుండును విభీషణుండును బహుప్రకారంబుల హేత్వర్థయు
క్తంబును శ్రేయస్కరంబును దారుణేతరంబు నగుహితం బుపదేశించిరి నీవు
వీర్యవంతుండవై వారలహితోక్తులు వినక యీదృశం బగుఫలం బనుభవించితి
విఁక నేమి వగచిన నేమిఫలం బని పలికి యంతకంత కగ్గలం బైనశోకంబున
వెండియు నిట్లని విలపించె.
| 2871
|
| శా. |
హా పీతాంబర హా శుభాంగదధరా హా పూర్ణతేజోనిధీ
హా పంచాననతుల్యవిక్రమ వినీలాంభోధరాభద్యుతీ
భూపాలాస్త్రహతుండవై గళదసృక్పూరాప్లుతాంగుండ వై
యేపుం జేవయు వీడి నీ విటులు జన్యేలా స్థలిం గూలితే.
| 2872
|
| తే. |
అనుపమానదుఃఖాక్రాంత నైననన్నుఁ, గరుణ వీక్షించి మంజువాగ్వైభవమున
నాదరింప వదేల నాయందు నేర, మించు కైనను లేదు రాత్రించరేంద్ర.
| 2873
|
| తే. |
అమితవిక్రమశాలి రణానివర్తి, యైనమాల్యవంతునకు నీ వసురలోక
పాల దౌహిత్రుఁడవు పరిభవము నొంది, నేలపైఁ బడియుండె దీవేళ లెమ్ము.
| 2874
|
| సీ. |
రాక్షసాధీశ్వర రవికరంబులు నిరాతంకంబు లై నేఁడు లంక సొచ్చె
నుద్యానవనములు నుపవనంబులు డాసి విచ్చలవిడి గాడ్పు విసరసాగెఁ
దనమానసమునఁ గూరినభీతిఁ దలఁగించి పావకుఁ డుజ్జ్వలుం డై వెలింగెఁ
దలఁజూప వెఱచి గొందుల డాఁగియున్న నిర్జరపంక్తి చెలరేఁగి దిరుగఁదొడఁగెఁ
|
|
| తే. |
దోయధులు పొంగి మిన్నంది మ్రోయ సాగె
గ్రహగణంబులు వినువీథి గండుమీఱె
సకలలోకప్రశస్తకంటకుఁడ వైన
నీవు గూలినకతమున నిర్జరారి.
| 2875
|
| మ. |
ఇనరశ్మిప్రతిమాన మెద్ది యనిలో నెద్ధానిచే వైరిపం
క్తినిరాసం బొనరింతు వింద్రపవిమాడ్కిం బూజితం బెద్ది కాం
చనభూషాన్విత మెద్ది యట్టిభవదంచచ్చంద్రహాసంబు
ఖనికాయం బటు చూడ నేఁడు తిలశఃఖండంబు లై గూలెనే.
| 2876
|
| తే. |
అసురపుంగవ ప్రియురాలినట్ల నేఁడు
కదనమేదినిఁ గౌఁగిటఁ గదియఁ బట్టి
నాదువదనంబుఁ జూడవు మోద మిడవు
నన్నుఁ గడదానిఁగాఁ జూడ న్యాయమగునె.
| 2877
|
| తే. |
అఖిలకామభోగము లిచ్చునట్టినీవు
యుద్ధమేదినిఁ బంచత్వ మొందుచుండఁ
బోలఁ గని వేయివ్రయ్య లై పోవ దేల
భిదురమయము గాఁబోలు నాహృదయ మకట.
| 2878
|
| మ. |
అని యి ట్లామయపుత్రి శోకజనితవ్యాలోలబాష్పాంబులో
చన యై మోహము పైకొనం దనువు ఝంఝామారుతోద్ధూతనూ
తనచంచల్లతకైవడి న్వడఁక సంధ్యారక్తనీలాభ్రయు
క్తనవైరావతిభంగి భర్తయెదమీఁదన్ వ్రాలి దుఃఖించినన్.
| 2879
|
| వ. |
అప్పు డామండోదరివిలాపంబుఁ జూచి సపత్ను లందఱు భృశాతురలై యద్దేవిం
గ్రుచ్చియెత్తి యాసీనం జేసి బాల్యకౌమారయౌవనవార్థకాద్యవస్థాభేదపర్యా
యంబు సంప్రాప్తం బగుచుండ లోకస్థితి రాజసంపత్సహితంబుగా నస్థిర యని
యెఱుంగవే నీ కింత యజ్ఞానం బేల యని యాశ్వాసించిన నారావణపత్నిశోకంబు
డింపక బాష్పధారాసారంబునఁ గుచంబులు నడుపుచు సశబ్దంబుగా రోదనంబు
సేయుచుండె నంత నారఘుపుంగవుండు విభీషణుం జూచి యాలస్యం బేల
యీయవరోధజనంబుల నెల్ల నూరార్చి పురంబులోనికిం బంచి యితనికి సంస్కా
రంబు గావింపు మని పలికిన నవ్విభీషణుండు వినయాన్వితుం డై ధర్మజ్ఞుండు
గావున మనంబున విమర్శించి రామానువృత్తికొఱకు ధర్మార్థసహితం బగువా
క్యంబున రామభద్రున కిట్లనియె.
| 2880
|
| సీ. |
అవనీశ యితఁడు సంత్యక్తధర్మవ్రతుం డున్నతుండు సాధుహింసాభిరతుఁడు
క్రూరుండు క్షుద్రుండు ఘోరకర్ముండు దుర్మదుఁ డన్వదారాభిమర్శనుండు
భ్రాతృరూపుం డైనపరిపంథి నా కితఁ డఖలలోకాహితుఁ డట్లు గాన
నితనికి సంస్కార మే నొనర్పఁగ నొల్ల గౌరవపూజ్యుండు గాఁడు నాకు
|
|
| తే. |
భ్రాత కపరకర్మం బొనర్పనికతమున
మొదలు నిందింపుదురు నన్ను మూర్ఖుఁ డనుచు
నవల నితనిదుర్గుణజాత మంతయు విని
సుకృతి యని యెన్నుదురు నన్ను సూరిజనులు.
| 2881
|
రావణశవదహనము
| వ. |
అని పలికిన విని ధర్మాత్ముం డగురాముండు వెండియు విభీషణు నవలోకించి నీచేత
మత్త్రియంబె కర్తవ్యంబై యుండు నాచేత భవద్ధితంబె యుపదేశింపం దగి
యుండుఁ గావున నారావణసంస్కారంబు నాకుఁ బ్రియంబును నీకు హితం
బునుం జేయు నితండు మిక్కిలి యధర్మానృతసంయుక్తుండైనను దేజస్వియు బల
వంతుండును రణములయందు శూరుండును మహాత్ముండును శతక్రతుప్రముఖ
దిక్పాలురతోడం బోరి పరాజయం బెఱుంగనివాడునుం గావున గుణబాహు
|
|
| |
ళ్యంబువలన సంస్కరించుటకుం దగియున్నవాఁడు వైరంబు మరణాంతంబులు
మత్సంకల్పితప్రయోజనం బంతయు నిర్వృత్తం బయ్యె నీరావణుండు ప్రీతివిష
యంబునందు నీ కెట్టివాఁడు నాకు నట్టివాఁ డయ్యె నితనికి విధిపూర్వకంబుగా
సంస్కారంబు గావించి నీవు యశోలాభంబు వడయు మని పలికిన నారాఘవుని
వచనంబు విని యవ్విభీషణుండు రావణునకు యాయజూకానురూపసంస్కారంబు
గావింప సమకట్టి సుగంధిద్రవ్యవిశేషయుక్తంబుగాఁ జందనకాష్ఠంబులచేతఁ
బద్మకోశీరంబులచేఁ జితి గావించి వేదోక్తక్రియావిశేషంబు నరాంకవాస్తరణో
పేతం బైనయచ్ఛితామధ్యంబున రావణునికళేబరం బిడియె నప్పుడు ఋత్విజులు
వేదవిహితక్రమంబున నంత్యేష్టి గావించి పితృమేధంబుఁ జేసి యాగ్నేయభా
గంబున వేదియందు యథాస్థానంబునఁ బావకుం బ్రతిష్ఠించి శాస్త్రదృష్టవిధి
చేతఁ దన్మధ్యంబునఁ బశువిశసనంబు గావించి తదంగంబులు ఘృతంబునం దడి
పి హోమంబు గావించి దధిసహితఘృతపూర్ణం బైనస్రువం బగ్నిలోనం బడవై
చి శకటంబును ముసలంబు నులూఖలంబును దారుపాత్రంబులు నరణియు నుత్త
రారణియు శ్రుతిస్మృతిప్రోక్తవిధానంబున సర్వంబును యథాస్థానంబున నునిచి
రాజగవి నాలంభించి తచ్చర్మంబుచేత నాచ్చాదించి రావణునికళేబరంబు గంధ
మాల్యవస్త్రంబులచేత నలంకరించి లాజలు చల్లి రంత విభీషణుండు విధియు
క్తంబుగా రావణున కగ్నిసంస్కారంబు గావించి స్నానంబుఁ జేసి యార్ద్రవస్త్ర
ధరుండై విధిపూర్వకంబుగా నతనికిఁ దిలోదకంబు లొసంగి నమస్కరించి మండో
దరీప్రముఖనిఖిలాంతఃపురకాంతల సాధువాక్యంబుల ననూనయించి లంకకుం
బనిచి కృతకృత్యుం డై గ్రమ్మఱ రామునొద్దకుం జనుదెంచి వినీతుండై గొలిచి
యుండె రాముండును రిపువధజనితహర్షవదనుం డై సుగ్రీవవిభీషణహనుమదాది
సుహృత్సమేతుం డై వృత్తాంతకుఁ డైనపురందరునికరణిఁ దేజరిల్లుచుండె నంత
రావణవధంబు విలోకించి దేవగంధర్వదానవులు రావణునివధంబును రాముని
పరాక్రమంబును వానరులయుద్ధంబును సుగ్రీవునిమంత్రిత్వంబును లక్ష్మణుని
యనురాగంబును వీర్యంబును నానాప్రకారంబులు వక్కాణించుచు మఱియు
శుభకథాప్రసంగంబులు సేయుచుఁ బరమానందభరితాంతఃకరణులై తమతమ
విమానంబులతోఁ గూడ నిజనివాసంబులకుం జని రప్పుడు రాముండు మాతలిం
బూజించి యీదివ్యరథంబు గొని నీవు దివంబునకుం జను మని పలికిన నతండు
రామునిచేత ననుజ్ఞ వడసి శిఖిప్రభం బైనయమ్మహనీయస్యందనంబుతోఁగూడ
నింద్రుపాలికిం జనియె నంత రాముండు పరమప్రీతుం డై సుగ్రీవుం గౌఁగిలిం
చుకొని హరిశ్రేష్ఠులచేతఁ బూజ్యమానుం డై లక్ష్మణసహితంబుగా నిజబలంబు
లోనికిం జనుదెంచి తనపార్శ్వంబునఁ బరమానందప్రవర్ధమానతేజుండై యలరు
చున్నలక్ష్మణు నవలోకించి యి ట్లనియె.
| 2882
|
రాముఁడు విభీషణుని లంకారాజ్యపట్టాభిషిక్తునిం జేయ లక్ష్మణుని నియోగించుట
| మ. |
అనఘాత్ముండు మహోపకారి మన కత్యానందసంధాయకుం
డనురకతుండును భక్తుఁడు న్వినయవిద్యాదానసంపన్నుఁడున్
ఘనబాహుండు విభీషణుం డితని లంకారాజ్యపట్టాభిషి
క్తునిఁ గావింపుము నాదువాక్య మఖిలస్తోత్రార్హమై చెల్లఁగన్.
| 2883
|
| ఆ. |
దేవసమ్మతుండు దితిజాన్వయవరుండు, దోషరహితుఁ డీవిభీషణుండు
సదభిషేకసలిలసంక్లిన్నమస్తకుం, డగుచు నుండఁ జూడ హర్ష మొదవు.
| 2884
|
| చ. |
అని విని లక్ష్మణుండు హృదయంబున హర్షము నివ్వటిల్లఁగాఁ
గనకఘటంబుల న్నిఖిలకంధిజలంబుల బట్టి తెండు మీ
రని విపినాటులం బనుప నాదట వారలు లక్ష్మణుండు చె
ప్పినపగిదిం బయోనిధికృపీటములం గొని వేగ వచ్చినన్.
| 2885
|
| తే. |
లక్ష్మణుం డంత రయమున లంకలోని
కరిగి సుముహూర్తమునఁ బరమాప్తు నలవి
భీషణుని హేమమయభద్రపీఠిమీఁద
నునిచి మంగళవాద్యనిస్వనము లెసఁగ.
| 2886
|
| ఉ. |
తా నొకహేమకుంభము ముదంబునఁ జేకొని రాఘవాజ్ఞచే
వానరసంవృతుం డగుచు వారక రాక్షసమధ్యమందు ను
శ్రీనిధిమంత్రదృష్టవిధిచే నభిషిక్తునిఁ జేసె వేడ్కతో
దానవరాజ్యమం దఖిలదైత్యవిభూషణు నవ్విభీషణున్.
| 2887
|
| క. |
ఈకరణి లక్ష్మణుం డభి, షేకము గావించి ప్రీతచిత్తుం డగుచున్
చేకొని చిరకాలం బ, వ్యాకులమతి లంక నేలుమని దీవించెన్.
| 2888
|
| తే. |
అప్పు డభిషిక్తుఁ డైనమహాత్ము నలవి
భీషణునిఁ జూచి భూరిసంతోష మడర
హితులు మంత్రులు సేనాధిపతులు భక్తి
మెఱయఁ బూజించి మ్రొక్కిరి వరుసతోడ.
| 2889
|
| ఆ. |
రామదత్త మైనరాజ్యంబు ప్రాపించి, యలవిభీషణుండు హర్షవికసి
తాస్యుఁ డగుచు రాఘవానుజయుక్తుఁ డై, పరమసఖులు వెంట నరుగుదేర.
| 2890
|
| చ. |
మునుకొని లాజ లక్షతలు మోదుకము ల్సురపుష్పదామముల్
గొని రఘువర్యుపాలికి నకుంఠితవైఖరి నేగుదెంచి స
ద్వినయ మెలర్బఁ దాను గొని తెచ్చినమంగళవస్తువు ల్దగన్
జనవరమౌళికిం దదనుజన్మున కర్పణ చేసె నెంతయున్.
| 2891
|
| తే. |
దోషవర్జితుఁ డైనవిభీషణుండు
తగ నొసంగినమంగళద్రవ్యములను
|
|
| |
రామభద్రుండు తత్ప్రియార్థము గ్రహించి
యతని మన్నించి సమ్మోద మతిశయిల్ల.
| 2892
|
రాముఁడు హనుమంతుని సీతకు నిజజయంబుఁ జెప్పఁ బంచుట
| ఉ. |
బంగరుగట్టుభంగిఁ దనపార్శ్వమునం గమనీయగాత్రుఁ డై
పొంగుచు భక్తిహస్తములు మోడ్చి వినమ్రత నొంది యున్నవా
నిం గపివంశశేఖరు ననింద్యచరిత్రుని వాయుపుత్రుని
న్సంగతి మీఱఁ గాంచి నృపసత్తముఁ డంచితసూక్తి నిట్లనున్.
| 2893
|
| సీ. |
అనఘాత్మ నీవు దైత్యాధీశుఁ డగువిభీషణునకుఁ జెప్పి తచ్ఛాసనమున
లంకలోనికిఁ బోయి లలి రావణునిగృహం బటు ప్రవేశించి సమంచితముగ
వైదేహితోడ రావణుఁడు సంగ్రామరంగమునఁ జచ్చుటయును గడిమి మెఱయ
నేను లక్ష్మణవానరేంద్రవిభీషణయుతముగాఁ గుశలి నై యుండుటయును
|
|
| తే. |
సర్వము నెఱుంగఁ జెప్పి యాచంద్రవదన
కుశల మరసి సందేశంబు గొని రయమున
ర మ్మనుచుఁ బల్క నవ్వానరప్రవరుఁడు
రామునకు మ్రొక్కి వీడ్కొని రయమునఁ జని.
| 2894
|
| తే. |
దానవులచేత సంపూజ్యమానుఁ డగుచు
రావణునిమందిరము సొచ్చి రమ్యకాంతిఁ
దనరునంతఃపురోచితవనము చేరి
కనకమయశింశుపాఖ్యవృక్షంబుక్రింద.
| 2895
|
| సీ. |
అబ్జవైరివిహీన యైనరోహిణిభంగి విన్ననై కనుపట్టుచున్నదాని
శార్దూలమధ్యదేశమునఁ జిక్కినలేడిగున్నమాడ్కి వడంకుచున్నదానిఁ
జెక్కిటఁ జెయిఁ జేర్చి చింతాభరంబున నూరక ధ్యానించుచున్నదాని
రామునివిజయంబు రావణుపంచత్వ మొయ్యన వినఁగోరుచున్నదాని
|
|
| తే. |
గాంతు నెప్పుడు వీక్షింపఁ గల్గునో య
టంచుఁ డెందమునఁ దమకించుదాని
జనకజను జూచి నమ్రుఁడై సంభ్రమంబు
వినయగౌరవ మెసఁగ వందన మొనర్చె.
| 2896
|
| తే. |
ఇటులు సాష్టాంగ మొనరించి నిటలదేశ
కలితకరపుటుఁ డై మ్రోలఁ గొలిచి యున్న
శ్వసనసుతుఁ జూచి జానకి సాంద్రమోద
కలిత యయ్యును దా నేమి పలుకకుండె.
| 2897
|
హనుమంతుఁడు రామవిజయరావణవధంబులను సీతాదేవి కెఱింగించుట
| వ. |
అప్పుడు హనుమంతుం డమ్మహాదేవిముఖప్రసాదాదికం బుపలక్షించి వినయ
వాక్యంబున నిట్లనియె.
| 2898
|
| చ. |
జనకజ రామభద్రుఁ డనుజన్మవిభీషణపద్మమిత్రనం
దనులకు గూడి వానరయుతంబుగ సేమము నొంది యున్నవాఁ
డనిమిషలోకకంటకు దశాస్యునిఁ జంపి జయాభిరాముఁ డై
తనకుశలంబు దెల్పుటకుఁ దద్దయు వేడుకఁ బంప వచ్చితిన్.
| 2899
|
| క. |
జననీ లక్ష్మణునయమున, ననిశంబు విభీషణునిసహాయత రఘురా
మునిదివ్యసాయకంబుల, దనుజవరుం డీల్గె బలయుతంబుగ నాజిన్.
| 2900
|
| క. |
భండనమున రాముఁడు శిత, కాండంబుల రిపునితలలు ఖండించి కృతా
ర్థుం డయి పరమానందా, త్ముం డయి కుశలంబుఁ జెప్పఁ బుత్తెంచె రహిన్.
| 2901
|
| ఉ. |
వీఁక రఘూద్వహుం డసురవీరునిఁ బంక్తిముఖు న్వధించు నం
దాఁక శుభాంగి నీ విచట దైవవశంబున మేనఁ బ్రాణముల్
దేఁకువఁ దాల్చి యుంటి విఁక ధీరవరేణ్యుని రాముఁ గూడి య
స్తోకసుఖంబు లొందెదవు శోకము సర్వము దీఱె నేఁటికిన్.
| 2902
|
| క. |
పగతుఁడు రావణుఁ డీల్గెను, దగ విజయము మాకుఁ గలిగెఁ దప్పక నేఁ డీ
నగరము వశగత మయ్యెను, మగువా వగ లుడిగి స్వస్థమానస వగుమా.
| 2903
|
| తే. |
జలధి బంధించి రాముని బలయుతముగఁ
దోడుకొని వచ్చి పగతుని ద్రుంచి ప్రతిన
నెఱపునందాఁకఁ గంటికి నిద్ర యెఱుఁగ
జనని నేఁటికి నామాట సత్య మయ్యె.
| 2904
|
| ఉ. |
ఇందునిభాస్య యొంటిమెయి నీపురిలోఁ జెఱ నుంటి విన్నినా
ళ్లందుకు నాత్మలో వగచినందునఁ గార్యము లేదు వేడ్క లిం
పొంద నిజేశుఁ గూడి విభవోన్నతి నింక నయోధ్యలో భవ
న్మందిరసీమయందు గరిమ న్విహరించెద వీవు జానకీ.
| 2905
|
| మ. |
అని యిటు గంధవాహసుతుఁ డాడిన నామిథిలాధినాథనం
దన దశకంఠరాక్షసవధశ్రవణప్రభవప్రమోదనం
జనితనితాంతబాష్పజలసంభృతలోచన యై మనంబులో
నెనసిన పారవశ్యమున నేమియుఁ బల్కక యూరకుండినన్.
| 2906
|
| క. |
అనిలకుమారుఁడు వెండియు, జనకకుమారికను జూచి జననీ చిత్తం
బునఁ జింతఁ బూని నాతో, మునుకొని భాషింప వేల ముదితవు గమ్మా.
| 2907
|
| తే. |
అనుచుఁ బావని పల్కిన నమ్మహీజ, విపులసమ్మోదవికసితలపన యగుచుఁ
బవనతనయుని వీక్షించి పలికెఁ బరమ, హర్షగద్గదస్వరమున నతనితోడ.
| 2908
|
| తే. |
వీరశేఖర మత్ప్రాణవిభునివిజయ, కలికశుభవార్త యాలించి గాఢమోద
కంధివీచిపరంపర ల్గప్పికొన క్ష, ణాంతరం బేను నిర్వాక్య నైతి నిట్లు.
| 2909
|
| సీ. |
వానరవర్య సర్వప్రియంబులలోన నత్యుత్తమప్రియమైనరామ
భద్రునివిజయంబు పాపాత్ముఁ డగుపంక్తివదనునినిధనంబు వరుసఁ జెప్పి
యసమానసంతోష మొసఁగితి నీయట్టి యుపకారి వేఱొక్కఁ డుర్విఁ గలఁడె
గణుతింప నీప్రియాఖ్యానంబునకుఁ దుల్య మగువస్తు వొసఁగ నెయ్యదియు లేదు
|
|
| తే. |
పరగఁ ద్రైలోక్యసామ్రాజ్యపద మొసఁగిన, నాకపర్వతమంతధనం బొసఁగిన
వివిధరత్నంబు లిచ్చినఁ బ్రియవచనము, లెన్ని చెప్పిన దీనికి నీడు గాదు.
| 2910
|
| క. |
నా విని సంతోషము మది, నావిర్భవ మందఁ బ్రకటితాంజలి యగుచు
న్బావని గ్రమ్మఱ వినయ, ప్రావీణ్య మెలర్ప నద్ధరాసుత కనియెన్.
| 2911
|
| తే. |
సౌమ్య మై సారవంతమై శ్లాఘ్యమై మ, హార్థమై మంజుమధురమై యమృతసార
మై మనోజ్ఞ మై నీపలు కలరుచున్న, దిట్లు భాషింపఁగా నర్హ వీవె తల్లి.
| 2912
|
| తే. |
అమితరత్నౌఘ మిచ్చినయంతకంటె, నమరరాజ్యం బొసంగినయంతకంటె
దేవి నీవచనంబు నాభావమున క, నంతసమ్మోదసంపాది యయ్యె నేఁడు.
| 2913
|
| తే. |
విమతుఁ బరిమార్చి రాముండు విజయలక్ష్మి, నధిగమించినకతన ననర్హు దేవ
రాజ్యరత్నాదిగుణము లర్ధంబువలనఁ, బరఁగ నాచే నధిష్ఠింపఁ బడియె నేఁడు.
| 2914
|
| తే. |
అనిన విని సీత మరల నిట్లనియె యుక్తి, యుక్త మష్టాంగబుద్ధిసంయుక్త మమృత
సిక్తమాధుర్యగుణవిభూషితము నైన, యుక్తిని వచింప నీవె యర్హుండ వనఘ.
| 2915
|
| వ. |
మఱియు భవదీయవాక్యం బత్యంతలక్షణసంపన్నంబై యున్నది.
| 2916
|
| చ. |
అనఘచరిత్ర, నీవు వృషదశ్వసుతుండవు ధార్మికుండవు
న్ఘనుఁడవు శ్లాఘనీయుఁడవు కాంతియుఁ దేజము శౌర్యసత్త్వము
ల్వినయము సుస్థిరత్వము వివేకము దాక్ష్యము విక్రమంబు నో
ర్పును మఱి సర్వసద్గుణసమూహము నీయెడ నుండు నిత్యమున్.
| 2917
|
| క. |
అన విని హర్షవిశేషం, బున నుబ్బి సమీరసుతుఁడు మోడ్పుఁగరములన్
వినయవిధేయుం డై య, య్యినవంశజుపత్నితోడ ని ట్లని పలికెన్.
| 2918
|
సీతాదేవి తనకుఁ గావలియున్న రాక్షసస్త్రీలఁ జంపంజూచిన హనుమంతుని వారించుట
| వ. |
దేవి పతిదర్శనకాంక్షివై దిక్కఱి యశోకవనిమధ్యంబున దుఃఖించుచున్నని
న్నాశ్వాసింపక భయంకరాకారలై క్రౌర్యంబున దారుణవాక్యంబులఁ దర్జిం
చినయీరాక్షసస్త్రీల వధియింప నిశ్చయించితి ననుజ్ఞ యొసంగితివేని యిప్పుడ
చరణజానుజంఘోరుపాణిముష్టిదంతనఖప్రహారంబుల నిందఱ నిశ్శేషంబుగా
వధించెదఁ జిత్తంబుకొలంది యానతి మ్మనిన నమ్మహాదేవి యమ్మరున్నందనున
కి ట్లనియె.
| 2919
|
| సీ. |
శ్వసననందన రాజసంశ్రయవశ్య లై పరులశాసనమునఁ బనులు సేయు
నట్టిదాసులమీఁద నలుగఁ జెల్లదు భాగ్యవైషమ్యయోగంబువలనఁ బూర్వ
|
|
| |
దుష్కృతంబున నింత దురవస్థ దొరకొనె స్వకృతకర్మఫలంబు వ్యర్థమగునె
తనపూర్వకర్మంబు దక్క సుఖంబు దుఃఖము సేయ వేఱొక్కకర్త గలఁడె
|
|
| తే. |
రావణునియాజ్ఞ నీదైత్యరమణు లెల్ల, నన్నుఁ దర్జించి రిందాఁక నయము విడిచి
యతఁడు దెగియె నింకేమి సేయంగఁ గలరు, వీరిఁ జంపిన మన కేమి పేరు గలదు.
| 2920
|
| వ. |
వానరోత్తమా ము న్నొక్కమహారణ్యంబులోన నొక్కవ్యాధుం డొక్కశా
ర్దూలంబుచేత ధర్షింపంబడి సాధ్వసంబున నొక్కవృక్షం బెక్కిన నావృక్షంబు
మీఁద నంతకుము న్నొక్కభల్లూకం బెక్కి యుండి తన్ను విలోకించి మిక్కిలి
భయంబున వడంకుచున్నవ్యాధున కభయంబు దెల్పి తనయొద్దకుం దిగిచికొని
నీవు నిర్భయంబున నిద్రింపు మేను మేల్కొని యుండెద నని పలికినఁ దద్వచన
ప్రకారంబున వ్యాధుండు నిద్రించుచుండ నప్పు డావృక్షంబుక్రిందనే యుండి
వ్యాఘ్రంబు భల్లూకంబుతో నీవ్యాధుండు మన కంతకుండు దైవయోగంబున
నిప్పుడు చిక్కె వీనితోడి దేమి పని వీని దిగం ద్రోయు మేను వీని భక్షించి యథే
చ్ఛం జనియెద దీనం జేసి నీకును నాకును సఖ్యంబు గలుగు నని పలికిన నాభల్లూ
కంబు శరణాగతుం డైనవీనిం బరిత్యజించిన ధర్మహాని యగు నీచెప్పినట్లు సేయ
నోప నని పలికి వ్యాధుం బ్రబోధితుం జేసి యే నింక నొక్కింతసేపు
నిద్రించెద నీవు మేల్కని యుండు మని పలికి భల్లూకంబు నిద్రించిన
నావ్యాఘ్రంబు వ్యాధునితో నీభల్లూకంబు భక్ష్యలుబ్ధం బై నీతోడ మాయావా
దంబుఁ జేసె దీనిం బడఁద్రోచితివేని యేను భక్షించి చనియెద నంత నీవు నిర్భ
యంబున వృక్షంబు డిగ్గి యథేచ్చం జనియెద వట్లు గావింపుమని పలికిన వ్యాఘ్ర
చోదితుండై వృక్షంబుమీఁదనుండి ఋక్షంబు క్రిందం బడఁద్రోచిన నది యభ్యా
సబలంబున శాఖాంతరం బవలంబించి దిగువం బడక కృతాపరాధుం డైనవీనిం
బడఁద్రోయు మని వెండియు వ్యాఘ్రంబుచేత నుచ్యమానంబయ్యును భల్లూ
కంబు కృతాపరాధుం డైనను వీని నీ కొసంగ నని పలికి వ్యాధుని రక్షించె నని
పురాణకథ గలదు పరుల నుద్దేశించి పాపం బాచరించువారికిఁ బ్రాజ్ఞులగువారు
ప్రత్యుపకారరూపం బైనపాపం బంగీకరింప రపకారులయందైనఁ బ్రత్యప
కారవర్ణనరూపం బైనయాచారంబు రక్షితవ్యంబై యుండుఁ బెద్ద లగువారు
చారిత్రభూషణులై యుందురు వధార్హు లగునట్టివారియందును సజ్జనునిచేతఁ
గారుణ్యంబు కర్తవ్యంబై యుండు లోకంబునం దపరాధంబు గావింపనివాఁ
డొకఁడైన లేఁడు దయాశాలి యగు వానికి సర్వజనరక్షణంబు యోగ్యంబు
లోకంబునందుఁ బరహింసనంబును గామసంచారంబును బాపాచరణంబును
రాక్షసులకు స్వాభావికం బైనధర్మం బట్టివారియందు దండనంబు సముచి
తంబు గా దని పలికిన నవ్వాయునందనుం డవ్వైదేహి కిట్లనియె.
| 2921
|
| తే. |
పరమకళ్యాణి నీవు భూపాలమణికిఁ, బతికి రామున కనురూపపత్ని వైతి
వేమనఁగ వచ్చు నీగుణం బేను విభుని, కడకుఁ జనెద సందేశంబు నొడువు మింక.
| 2922
|
| చ. |
అన విని భూమిపుత్రి ముదముంది సమీరకుమారుమోముఁ గాం
చి నెనరు దోఁప నిట్లనియెఁ జెప్పెడిదే మిఁక ముజ్జగంబులు
న్వినుతికి నెక్కి నట్టిఘనవిక్రమశాలిఁ గకుత్‌స్థవంశవ
ర్ధనుని మనోజ్ఞవేషు గుణధాముని రామునిఁ జూడఁగోరెదన్.
| 2923
|
| ఉ. |
నా విని వాయుపుత్రుఁడు మనంబున సంతస మంది యమ్మహా
దేవిని జూచి పల్కె నతిధీరునిఁ బూర్ణశశాంకవక్త్రుని
న్భావజసన్నిభు న్విమతభంజను మిత్రసమేతు భ్రాతృసం
సేవితు రాముఁ జూచెదు శచీపతి శక్తునిఁ జూచినట్లుగన్.
| 2924
|
| క. |
అని పలికి యతఁడు సాక్షా, ద్వనజాలయభంగి నలరు వసుధాసుతకు
న్వినతి యొనరించి వీడ్కొని, చనియె రఘూత్తమునికడకు సమ్మద మెసఁగన్.
| 2925
|
| వ. |
ఇవ్విధంబునం జనుదెంచి సముచితంబుగా రాముని సందర్శించి బుద్ధిమంతుం
డగుహనుమంతుం డంజలి గీలించి యమ్మహాత్మున కిట్లనియె.
| 2926
|
హనుమంతునివలన సీతావాంఛితమును విని రాముఁడు చింతించుట
| సీ. |
అవనీశ కీశసైన్యములఁ గూర్చుటయును గడలిపై సేతువు గట్టుటయును
పరిపంథి ననిలోనఁ బొరిగొనుటయు మొదలైన యీయారంభ మేనిమిత్త
మామహీసుతను శోకాభిపీడిత నింక వీక్షింపవలయు నావిమలహృదయ
నీవిజయము విని నిర్గతశోకయై పరమసమ్మోదంబు పాదుకొల్పెఁ
|
|
| తే. |
బూర్వకప్రత్యయమున నాపుణ్యసాధ్వి
చాల మది నమ్మి లక్ష్మణసహితుఁ డైన
వానిఁ గృతకృత్యుఁడై యున్నవాని జీవి
తాధిపుని జూడఁగోరెద ననుచుఁ బలికె.
| 2927
|
| వ. |
అని విన్నవించిన ధర్మభృద్వరిష్ఠుం డగురాముండు హనుమద్వచనంబు విని
రావణభవనోషితసీతాపరిగ్రహంబునందు మహాలోకాపవాదం బగుననియును
నిర్దోష యైనయద్దేవిపరిత్యాగంబునందు మహాదోషం బగు ననియుం దలంచి
యేమి సేయువాఁడ నని కించిద్బాష్పపరిఫ్లుతలోచనుండై దీర్ఘంబుగా వేఁడి
నిట్టూర్పు వుచ్చి పరిశోధన సేయకయె జానకిం బ్రతిగ్రహించితినేని యేతా
దృశదివ్యసుందరి యగుసీత నవలోకించి రావణుం డేల యూరకుండు రాఘవుం
డెంతచపలాత్ముం డని జను లందఱు బహువిధదురితపంకకళంకితచిత్తులై నిష్క
ళంక యగుదేవియందు దోషంబును నాయందు గర్హణంబు నారోపింతు రని
తలంచి జగన్మర్యాదాపాలనార్థం బవతీర్ణుం డైనవైకుంఠుండు గావున శ్రేష్ఠుం
డగువాఁ డెద్దాని నాచరించు నదియె యితరజను లాచరింతు రనున్యాయం బను
సరించి నిష్కల్మషగా జానకి నెఱింగియు లోకాపవాదనివృత్తికొఱకు నద్దేవి
యందుఁ బరుషితుం డైనవాఁడుపోలెఁ బరుషోక్తు లాడుచు నద్దేవి నగ్నిప్రవే
|
|
| |
శంబు సేయించి పద్మభవమహేంద్రప్రముఖసురశ్రేష్ణులచేతఁ బ్రార్థితుండై య
వ్వల నిత్యశుద్ధ యైనదేవి నంగీకరించుతలంపున భూమి నవలోకించుచు మేఘ
సంకాశుం డైనవిభీషణున కి ట్లనియె.
| 2928
|
రాముఁడు సీతం దనయొద్దకుఁ బిలుచుకొని వచ్చుటకు విభీషణుని నియోగించుట
| క. |
జనకజను శిరస్స్నాతను, ఘనతరదివ్యాంగరాగకలితను నవకాం
చనదివ్యాభరణోపే, తను గావించికొని రమ్ము తడయ కిచటికిన్.
| 2929
|
| క. |
అన విని విభీషణుఁడు చ, య్యన నంతఃపురము సొచ్చి యాత్మీయస్త్రీ
జనములచే మున్నుగ నా, థునివచనము చెప్పి పంపి తోడన్ తానున్.
| 2930
|
| ఉ. |
మానుగ నయ్యశోకవనమధ్యమునం దొకవృక్షమూలమం
దానరనాథపత్నిఁ గని యంజలిఁ జేసి వినీతగాత్రుఁ డై
జానకి నీవిభుండు నిను సమ్మతిఁ జూడఁగఁ గోరె దివ్యభూ
షానవచేలపుష్పచయచందనభూషిత వై రయంబునన్.
| 2931
|
| చ. |
అనుపమయాన మెక్కు మన నాసతి యాతనిఁ జూచి యేను మె
ల్లనఁ బతిపాలి కిప్పు డనలంకృతనై చనుదెంతు నన్న నా
యనఘుఁడు భర్త చెప్పినక్రియ న్జనుదెంచుట లెస్స యన్న నా
ఘనకచ భర్తృదేవతయ గావున దానికి సమ్మతించినన్.
| 2932
|
| సీ. |
అపుడు విభీషణు ననుమతి రాక్షససతులు మైథిలికి మజ్జన మొనర్చి
దివ్యాంబరంబులు దివ్యభూషణములు దివ్యమాల్యంబులు దివ్యగంధ
మర్పించి గైసేసి రంత నాదనుజేంద్రుఁ డద్దేవి ననదృశానర్ఘరత్న
ఖచితదివ్యాంబరకలితరక్షోగణరక్షిత మగుదివ్యరత్నయాన
|
|
| తే. |
మర్థి నెక్కించుకొని రయ మాన రాము
పాలి కేతెంచి ప్రణతుఁ డై పరమహర్ష
ముప్పతిల్ల మహాసాధ్వి సుర్విపుత్రి
సీత నర్పించె నవ్వీరశేఖరునకు.
| 2933
|
| క. |
దనుజగృహచిరోషిత యగు, జనకసుతను గాంచినంత జననాథకుమా
మనకుఁ బ్రమోదము దైన్యము, ఘనతరరోషంబు మూఁడు గ్రక్కునఁ బొడమెన్.
| 2934
|
| వ. |
అప్పు డారఘువల్లభుండు తనపార్శ్వగతుం డైనవిభీషణు నవలోకించి నీవు శీఘ్రం
బున వైదేహిని మత్సన్నిధానంబునకుం దోడ్కొని రమ్మని యాజ్ఞాపించిన
నతండు కంచుకోష్ణీషు లగువేత్రపాణులం జూచి మీరు సర్వజనోత్సార
ణంబు సేయుం డనిన వారలు ఋక్షరాక్షసవృక్షచరుల నందఱ గుంపులు చేసి
దూరంబునకుం దోలిన నుత్సార్యమాణు లగువారలమహాస్వనంబు వాయువు
చేత నుజ్జృంభమాణం బైనసముద్రునినిస్వనంబుభంగి నింగిఁ జెలంగె నప్పుడు
జాతసంభ్రములైనవారి నందఱ నిరీక్షించి దాక్షిణ్యంబువలనను దద్ధర్షణాసహ
|
|
| |
నంబువలనను నివారించి సంరబ్ధుండై రోషకషాయితాక్షుండై చుఱుకుఁజూ
పుల విభీషణునిం జూచి సోపాలంభంబుగా నిట్లనియె.
| 2935
|
| క. |
న న్నాదరింప కేటికి, బన్నుగ వానరుల గాసిపడఁ జేసెదు వీ
రెన్నఁగ స్వజనము మా కిటఁ, గ్రన్నన మరలింపు మత్సకాశంబునకున్.
| 2936
|
విభీషణుఁడు సీతాదేవిని రామునకు సమర్పించుట
| తే. |
దనుజవర సాలములును వస్త్రములు మఱియు
గేహములు ధాత్రిలోఁ దిరస్క్రియలు గావు
తివిరి యిట్టివి రాజసత్కృతులు గావు
వారిజాక్షికి వృత్తంబె నరణ మరియ.
| 2937
|
| తే. |
పరిణయమునందు విభునియభ్యాశమందు
వ్యసనములయందుఁ గృచ్ఛ్రములందు మఱియు
యాగమందు స్వయంవరమందు సమర
మందు సతిదర్శనంబు దూష్యంబు గాదు.
| 2938
|
| తే. |
ఈయువతి యుద్ధగతయును గృచ్ఛ్రగతయు
వ్యసనసంగతయును మదభ్యాశగతయుఁ
గాన రాక్షసనాథ యీకమలనేత్ర
దర్శనమునందు దోష మింతయును లేదు.
| 2939
|
| క. |
కావున నీసీతను ర, క్షోవర నాకడకు వేగ గొనితె మ్మిపు డీ
దేవి సుహృద్గణసహితుఁడ, నై వెలిఁగెడునన్నుఁ బ్రీతి నవలోకించున్.
| 2940
|
| క. |
అని యాజ్ఞాపించిన న, ద్దనుజేంద్రుఁడు పుణ్యసాధ్వి ధరణీపుత్రిన్
గొని తెచ్చి పుణ్యరతుఁ డగు, జనపతిపార్శ్వమున నునిచె సమ్మద మలరన్.
| 2941
|
| వ. |
అప్పుడు లక్ష్మణసుగ్రీవులును హనుమంతుండును రామునివాక్యంబు విని మిక్కిలి
వ్యధితమనస్కులై కళత్రనిరపేక్షంబు లైనయింగీతంబులచేత రాముని సీతయం
దప్రియుం డైనవానిగా విత్కరించుచుండి రిట్లు వైదేహి విభీషణానుగతయై
రామునిపార్శ్వంబునకుం జనుదెంచి క్రీడాసంకుచితసర్వాంగి యై వానరసభా
మధ్యంబున నార్యపుత్రా యని మధురంబుగా నుచ్చరించి వదనంబునఁ బటం
బొత్తి రోదనంబు గావించి పదంపడి పతి దేవతగావున నచింతితరామపునస్సం
దర్శనంబున విస్మయంబును బ్రియదర్శనంబున హర్షంబును స్వాభావికం బైన
స్నేహంబును మనంబున ముప్పిరిగొన రాకాశశాంకవదన యగుజానికి సౌమ్య
తరపదనయై యుదితపూర్ణ చంద్ర కాంతంబగుటవలన నతిసౌమ్యం బెనరాముని
వదనంబు విలోకించి మనోగతం బైనదుఃఖంబు నపనయించె నప్పుడు తన
పార్శ్వంబున వినమ్రశరీరిణియై యున్న సీత నవలోకించి రాముండు హృద
యాంతర్గతక్రోధుం డై యిట్లనియె.
| 2942
|
| చ. |
సరసిజనేత్ర యాలమున శాత్రవునిం బరిమార్చి నిన్ను నే
చెఱ విడిపించి పౌరుషముఁ జెల్లఁగఁ జేసి యమర్షలాభము
న్బరువడిఁ గాంచి చిత్తమున నాటిన వైరికృతావమానము
న్వరుస విషాదము న్బెఱికివైచి కృతార్థుఁడ నైతి నెంతయున్.
| 2943
|
| క. |
పౌరుషము దృష్ట మయ్యెను, జారుముఖీ శ్రమము నేఁడు సఫలం బయ్యె
న్వారక ప్రతిజ్ఞ దీరెను, ధారుణిలో నేను జాల ధన్యుఁడ నైతిన్.
| 2944
|
రాముఁడు సీతాదేవితోఁ బరుషోక్తులు పలుకుట
| ఉ. |
ఏ నెడఁబాసియున్నయెడ నీచలచిత్తుఁడు రావణుండు నిన్
గాననసీమనుండి చులుక న్వెస మ్రుచ్చిలి దెచ్చె నింతయు
న్మానిని దైవకృత్య మది మామకపౌరుషశక్తిచే రహి
న్వాని జయించితి న్ద్రిభువనంబున భూరియశంబు గాంచితిన్.
| 2945
|
| క. |
తన కొదవిన యవమానము, ననుపమతేజమున నవల నటు ద్రోయఁగఁ జూ
లనియల్పతేజుఁ డగుపురు, షునకుం బురుషార్థ మరసి చూచినఁ గలదే.
| 2946
|
| సీ. |
అబ్ధిలంఘన మాదియగుమరుత్సుతుపరిశ్రమ మంతయును నేఁడు సఫల మయ్యె
దరుచరసైన్యప్రదానాదిసుగ్రీవయత్న మంతయు నేఁడు సార్థ మయ్యె
సామ్రాజ్యకాంక్షియై శరణుఁ జొచ్చినవిభీషణుని కామము ఫలసహిత మయ్యెఁ
బ్రాణము ల్దాఁపక రణముఁ జేసిన కపిశ్రేష్ఠులు కృతకార్యసిద్ధు లైరి
|
|
| తే. |
లక్ష్మణునివిక్రమము సఫలత వహించెఁ
బరఁగ మత్పౌరుషంబు సాఫల్య మొందె
భువనకంటకుఁ డైనయీదివిజవైరి
ఘనరణంబున హతుఁ డైనకారణమున.
| 2947
|
| క. |
చకితమృగేక్షణ యగుజా, నకి నిజవల్లభునిమాట నైరాశ్యద్యో
తకమై యుండుట కడలుచు, నకటా యని లోచనముల నశ్రులు నించెన్.
| 2949
|
| క. |
ఇట్లు శోకించుచున్నమహీజఁ గాంచి, భూవిభుండు ప్రభూతఘృతావసిక్తుఁ
డైనదీప్తపావకునిచందానఁ గనలి, యంత కంతకు మదిఁ గ్రోధ మగ్గలింప.
| 2950
|
| క. |
రయమునఁ దిర్యక్ప్రేక్షిత, నయనుం డై బొమలు మోమున ముడివడ వెం
డియు నెల్లవారు విన ని, ర్దయుఁడై పరుషోక్తి నద్ధరాసుత కనియెన్.
| 2951
|
| క. |
మానము గలనృపుచే నవ, మానముఁ బాపుటకు సదభిమానంబున నె
ద్దాని నొనరింపఁగాఁ దగు, దానిం గావించి యేను ధన్యుఁడ నైతిన్.
| 2952
|
| శా. |
ప్రాచుర్యంబుగఁ గుంభసంభవమునీంద్రశ్రేష్ఠుచే దక్షిణా
శాచక్రంబు జయింపఁబడ్డగతి దోశ్శక్తి న్రహి న్నేఁడు నీ
|
|
| |
వో చంద్రానన శత్రుహస్తగతవయ్యు న్బల్మిడిం గ్రమ్మఱ
న్నాచే నిర్ణీత వైతి వీక్రియ ననూనప్రౌఢి దీపింపఁగన్.
| 2953
|
| చ. |
వనచరసేనఁ గూర్చుటయు వారినిధి న్వడి దాఁటి వచ్చుటల్
ఘనసమరంబులోన దశకంఠునిఁ బుత్త్రసుహృద్యుతంబుగా
ననుపమశక్తిఁ ద్రుంచుటయు నాదిగ నీశ్రమ మంతయున్ ఘనా
ఘననిభవేణి నీకొఱకుఁ గా దని యుల్లమునం దెఱుంగుమా.
| 2954
|
| క. |
పౌరుషమును జారిత్రము, భూరికులాచారధర్మము న్బ్రోచుటకున్
మీఱి యపవాద ముడుగుట, కీరీతి నొనర్చినాఁడ నిది నిజ మబలా.
| 2955
|
| తే. |
ప్రాప్తచారిత్రసందేహ వై మదగ్ర, భాగమున నున్ననీ వక్షిరోగి మ్రోల
నున్నదీపంబుచందాన నువిద నాకు, మిగులఁ బ్రతికూల వైతివి వగపు లేల.
| 2956
|
| సీ. |
పరగృహోషిత యైనపత్నిని గ్రమ్మఱఁ గులమును దేజంబు గలపురుషుఁడు
మిగుల సుహృల్లేఖ్య మగు మానసంబునఁ గైకొనఁ దలఁచునె వీఁక రావ
ణాంకపరిభ్రష్ట వై దుష్టదృష్టిచేఁ బరిదృష్ట వైనని స్మరల నెట్లు
గైందు రిపుహస్తగత మైనయశమును గ్రమ్మఱఁ గొంటి దోర్బలముపేర్మి
|
|
| తే. |
నబల మాకు నీతోడికార్యంబు లేదు, రక్తి లేదు నీమీఁదియాసక్తి లేదు
ప్రజ్ఞ లేటికి మాచే ననుజ్ఞ వడసి, యెచటి కేనియు నరుగు మిం కేమి గలదు.
| 2957
|
| క. |
తనమందిరమునఁ జిక్కిన, ఘనవేణిని దివ్యరూపఁగాంతను నిన్నున్
గనుఁగొని యిన్నాళ్లేటికి, దనుజాధముఁ డూరకుండుఁ దద్దయుఁ దాల్మిన్.
| 2958
|
| వ. |
పుత్రసదృశు లైసలక్ష్మణభరతసుగ్రీవవిభీషణులలో నెవ్వని నైననొక్కని నాత్మ
భరణార్థం బనుసరింపు మని పలికినఁ బ్రియశ్రవణార్హ యైనయవ్వైదేహి సరో
షుం డైనప్రియునివలనఁ బరుషంబును రోమహర్షణంబు నశ్రుతపూర్వంబును
రూక్షంబు నైననయ్యప్రియవచనంబు విని గడగడ వణంకుచు గజేంద్రహస్తా
భీహత యైనసల్లకి క్షీరంబు నించినచందంబున బాష్పంబు నించి ప్రవ్యథి
తాంతరంగ యై లజ్జాభరంబున మొగంబు వాంచి నిట్టూర్పు సెలఁగ వదనార
విందంబు గంద సమందశోకతాపంబు పైకొన దుఃఖరసాధిదేవతయుం బోలెఁ
జూపట్టుచు బాష్పగద్గదకంఠియై మెల్లన నిజభర్త కిట్లనియె.
| 2959
|
సీతాదేవి రామునిమాటలు విని పరితపించుట
| సీ. |
హృదయాదినాథ ప్రాకృతుఁడు ప్రాకృతనట్ల కర్ణదారణ మైనకఠినవాక్య
మి ట్లేల పలికితి విటువంటిమాట నీ వనుట కే వినుట కనర్హరూప
మై యున్న దిపుడు మహాత్మ నీవు దలంచినట్టిదుర్జాతి గా నర్కచంద్ర
పావకు ల్సాక్షిగాఁ బలికితి నిమ్మాట ధరలోన దుష్టకాంతలప్రచార
|
|
| తే. |
మరసి స్త్రీజాతి యంతయు నట్లె యంచుఁ
జిత్తమున నెంచితివి నాదుచిత్తవృత్తి
|
|
| |
యాదినుండి పరీక్షిత మయ్యె నేని
వంచన యి దేల విడువుము వట్టిశంక.
| 2950
|
| తే. |
దుఃఖభరమున నవశనై దుష్టదైత్య, గాత్రసంస్పర్శ మొందితిఁ గాని నాకుఁ
గామకారంబు లేదు నిక్కముగ నందు, దైవ మటు చేసె మదపరాధంబు లేదు.
| 2951
|
| తే. |
దనుజుఁ డప్పుడు ననుఁ గేల దాకినందు, కధిప జీవితత్యాగంబునం దొకింత
శక్తి గలదేని యప్పుడే చత్తు నవశ, నగుటఁ జేసి చావంగరాదయ్యె నాకు.
| 2952
|
| ఆ. |
పరులచే గ్రహింపఁబడుటకు శక్యంబు, గాని దగుట నాదుమానసంబు
నృపవరేణ్య యపుడు నీమీఁద వర్తించెఁ, జిక్కె గాత్ర మేమి సేయుదాన.
| 2953
|
| వ. |
దేవా చిరకాలంబున నుండి నొక్కచోట సహసంవాసంబును సహసల్లాపం
బును సహసంచారంబును సహక్రీడయు సహసంసర్గంబునుం గావించినవాఁడ
వయ్యు మత్స్వభావం బెఱుంగనికారణంబున నేను మిక్కిలి హతనైతి నింత
యనుమానంబు మనంబున నిడికొని యుండి నాఁటికి నాఁడే విసర్జింపక మత్కు
శలం బరసి రమ్మని హనుమంతు నేల పంచితి నవ్వీరోత్తముండు ప్రత్యక్షంబుగా
నప్పటిమద్వృత్తాంతంబంతయు నెఱింగియున్నవాఁడు నీవలన నైరాశ్యం
బెఱింగిన నే నప్పుడే ప్రాణత్యాగంబు సేయుదు దానంచేసి నా కింతకాలంబు
భవద్వియోగజనితవ్యథ లేకయుండు నీకును బ్రాణసందేహకరం బైన యీవృ
థాపరిశ్రమంబు లేకుండు భవత్సఖు లైనసుగ్రీవాదులకును నిష్ఫలం బైనయీప
రిక్లేశంబు గలుగకుండు లఘుచిత్తునిచేతంబోలె నీచేత స్త్రీత్వంబు పురస్కరించు
కొని క్రోధంబు ప్రకటింపంబడియెఁ గాని మచ్ఛీలంబు విదితంబు గాదయ్యె జనక
వ్యాజంబున వసుధాతలంబున నుండి యేను బొడముటయును బాల్యంబున
నుండి మత్సుచరిత్రంబును సదాచారంబును విచారింపవైతివి బాల్యంబునందు
నీచేత నాచరింపంబడిన పాణిగ్రహణం బప్రమాణీకృతం బయ్యె మదీయశీలం
బును నీయందుం గలభక్తియు సర్వంబును వెనుకకుం ద్రోచితి వని పలికి రోద
నంబు సేయుచుఁ దత్ఫరిసరంబున దీనవదనుండై చింతించుచున్నలక్ష్మణు నవలో
కించి యిట్లనియె.
| 2964
|
సీతావియోగంబున లక్ష్మణుండు చితి యొనర్చుట
| సీ. |
అనఘాత్మ యేను మిథ్యాపవాదము నొంది జీవింప నేర్తునే చింత యేల
యీవ్యసనంబున కెలమి భేషజ మైనచితిఁ జేర్పు మిపుడెల్ల హితులమ్రోల
సద్గుణంబులచేత సంప్రీతి నొందనిభర్తచే విడువంగఁ బడిననాకుఁ
గరము ప్రమాణంబు గావించుటకు నర్హ మైనప్రదీప్తాగ్నియందుఁ జొత్తు
|
|
| తే. |
ననిన నాలించి లక్ష్మణుఁ డన్నమోము
గని తదాకారసూచితకార్యభావ
మెఱిఁగి తదనుమతంబున హరులు వెఱఁగుఁ
జెంద దృఢకాష్ఠములచేతఁ జితి యొనర్చె.
| 2965
|
| చ. |
వెఱవక నిష్ఠచే నపుడు వీరపతివ్రత యైనసీత చె
చ్చెరఁ బతికిం బ్రదక్షిణముఁ జేసి సురాలికి భూసురాలికి
న్వరుస సమస్కరించి యలవహ్నిసమీపముఁ జేరి హస్తముల్
స్థిరమతి ఫాలభాగమునఁ జేర్చి జనంబు వినంగ నిట్లనున్.
| 2966
|
సీతాదేవి యగ్నిప్రవేశము సేయుట
| సీ. |
అనిశంబు మచ్చిత్త మాత్మనాథునియందుఁ దవిలి వర్తించుట తథ్య మేని
వితతదుష్టత్వశంకిత నైనయే నుర్వి నతిశుద్ధచారిత్ర నైతి నేని
కరము వాఙ్మానసకర్మంబుచే మనోధిపుమాట మీఱి వర్తింపనేని
రవిచంద్రదిగ్వాయురాత్రిసంధ్యాదినభూనభంబులు సర్వభూతములును
|
|
| తే. |
సకలదిక్పాలకులు నాదుసచ్చరితము, సర్వము నెఱింగి యుండుట సత్యమేని
సవనహేతువు లోకైకసాక్షి యైన, చిత్రభానుండు నన్ను రక్షించుఁగాక.
| 2967
|
| చ. |
అని యిటు పల్కి తప్తకనకాభశరీరిణి తప్తహేమమం
డన యగుసీత వహ్నికిఁ బ్రదక్షిణము న్దగ నాచరించి చ
య్యన గగనంబు ముట్టి భయదాకృతి మండెడుచిచ్చులోఁ బ్రవే
శన మొనరించి సర్వజనసన్నిధియం దవిశంకితాత్మ యై.
| 2968
|
| క. |
రయమున నీగతి శిఖిలో, నియతి న్వడిఁ జొచ్చినట్టినృపపుత్రిని ద
ద్దయు శోకంబునఁ గనుఁగొని, భయ మందిరి సర్వజనులు బాలురు వృద్ధుల్.
| 2969
|
| క. |
ఘనపుణ్యఘృతాహుతిక్రియ, ననలుఁ బ్రవేశించినట్టియవనీతనయ
న్గనుఁగొని ముల్లోకంబులు, ఘనవాతహతాంబునిధులకరణిఁ జలించెన్.
| 2970
|
| క. |
ఊహ గలంగక యీగతి, సాహసమున నగ్నిఁబడినజనకజను జగ
న్మోహనవిగ్రహఁ గనుఁగొని, హాహాకారములు చేసి రసురులు ప్లవగుల్.
| 2971
|
| ఆ. |
సవనమందు మంత్రసంస్కృత యగువసు, ధార వడినభంగి దహనమధ్య
మందుఁ బడినసీత నఖలజగన్మాతఁ, జూచి వగచి రచటిసుదతు లెల్ల.
| 2972
|
| తే. |
కరము శప్త యై నాకలోకమున నుండి
నిరయమునఁ బడ్డదేవతాతరుణిమాడ్కి
బావకునియందుఁ బడినయాపరమసాధ్విఁ
జూచి శోకించి రప్పుడు సురలు మునులు.
| 2973
|
| క. |
వారలదీనధ్వని విని, కారుణికుఁడు విభుఁడు ఘోరకర్మము నాచేఁ
గారిత మయ్యె ననుచుఁ గ, న్నీ రొలుకఁగ ధ్యాన మూని దీనుం డయ్యెన్.
| 2974
|
బ్రహ్మరుద్రేంద్రాదులు రామునిం జూడ వచ్చుట
| సీ. |
రాజరా జగుయక్షరాజు రిపుధ్వంసి యైనకాలుఁడు సహస్రాక్షుఁ డైన
పురుహూతుఁడు పరంతపుం డైనవరుణుండు మూఁడుకన్నులు గలభూతనాథుఁ
డఖిలలోకవిధాత యైనవిరించనుఁ డాదిగాఁ గలనిఖిలాదితేయ
|
|
| |
వరు లర్కసన్నిభవరవిమానములతో నచ్చోట నవ్వేళ నరుగుదెంచి
|
|
| తే. |
సముచితంబుగ నంజలిసహితుఁ డైన
రాఘవునిఁ జూచి కేయూరరత్నవలయ
ముద్రికాలంకృతము లైనభుజము లెత్తి
యి ట్లనుచుఁ బల్కి రాజగద్ధితునితోడ.
| 2975
|
| ఆ. |
రామభద్ర నీవు త్రైలోక్యకర్తవు, జ్ఞానవిదులలోన ఘనుఁడ వీవు
నిన్ను నీవు దెలియ నేరక వహ్నిలోఁ, బడెడుసీత నేల యుడుప వకట.
| 2976
|
| సీ. |
అఖిలలోకంబుల కాదికర్తవు నీవు పరుఁడవు పూర్వకల్పంబునందు
సాధ్యులయందుఁ బంచమసాధ్యుఁడవు రుద్రులం దష్టముఁడవు స్వయంప్రభుఁడవు
వాసుదేవుండవు వసువులలో ఋతధామాఖ్యవసుఁడవు తలఁప నీకుఁ
గర్ణంబు లాశ్వినుల్ గన్ను లినేందులు వసుధ పాదములు దివంబు శిరము
|
|
| తే. |
సృష్టి కాద్యంతములయందు దృశ్యమాన
మైనవస్తువు నీవు మహానుభావ
ప్రాకృతం బైనపురుషునిభంగిఁ బుణ్య
శీల యగుజానకి నుపేక్ష చేసె దేల.
| 2977
|
| వ. |
అని పలికిన సర్వలోకవిభుం డైనరాముండు లోకపాలురచేత సంస్తూయమానుం
డయ్యును బ్రహ్మవలన నాత్మస్వరూపగుణవిభూతిని సర్వజనులయందుఁ బ్రక
టింపం జేయుట కుద్యుక్తుండై స్వసౌశీల్యంబు దర్శింపం జేయుచు నయ్యమర
శ్రేష్ఠుల కిట్లనియె.
| 2978
|
| ఉ. |
అవ్వసుధేశశేఖరున కాజికిఁ బుత్రుఁడ రామనాముఁడ
న్మువ్వురకంటెఁ బెద్దను మనుష్యుఁడ నంచుఁ దలంచుచుందు నే
నెవ్వఁడ నాకుఁ బూర్వతను వెయ్యది విష్ణుఁడ నంటి రిప్పుడే
నివ్వసుధ న్జనించుటకు నెయ్యది కార్యము దెల్పుఁ డింతయున్.
| 2979
|
| క. |
అని పలికిన విని మెల్లన, వనజభవుఁడు రాముఁ జూచి వాగ్వైచిత్రి
న్వినిపించెద నీచందము, విను మని యిట్లనుచుఁ బల్కె వినయం బెసఁగన్.
| 2980
|
బ్రహ్మదేవుండు నీవు నారాయణుఁడ వని రామునకుఁ దెల్పుట
| సీ. |
అనఘాత్మ నీవు నారాయణుండవు చక్రధరుఁడవు విభుఁడవు దైత్యహంత
వప్రమేయుండవు స్వప్రకాశుండవు పురుషోత్తముండవు భూతభవ్య
కాలాత్మకుండ వక్షరుఁడవు నిత్యుండ వాదిమధ్యాంతశూన్యాద్వయుఁడవు
పరమాత్ముఁడవు పరబ్రహ్మవు పరుఁడవు సత్త్వభూతుండవు తత్త్వనిధివి
|
|
| తే. |
పురుషుఁడవు శార్ఙ్గకోదండధరుఁడ వజుఁడ
వఖిలవిషయేంద్రియవిభుండ వచ్యుతుండ
|
|
| |
వనుపమచతుర్భుజుండ వనంతనామ
రూపుఁడవు సర్వలోకైకదీపకుఁడవు.
| 2981
|
| తే. |
ఏకశృంగవరాహుండ వీవ కావె, భావనాతీతమూర్తివి నీవ కావె
నిఖిలలోకైకకర్తవు నీవె కావె, నిరుపమానందఘనుఁడవు నీవె కావె.
| 2982
|
| తే. |
అజితుఁడవు వ్యాపకుఁడవు సర్వాదితేయ
వందితుఁడవు, విద్యామయనందకాఖ్య
ఖడ్గధరుఁడవు నిరుపమకాంతియుతుఁడ
వాద్యుఁడవు శాశ్వతుఁడవు బృహద్బలుఁడవు.
| 2983
|
| సీ. |
శ్రమమును దమమును క్షమయును బుద్ధియు నిత్యచిద్వస్తువు నీవె కావె
సత్యంబు మఖము వషట్కార మోంకార మావిర్భవస్థాన మీవ కావె
మధుసూదనుఁడవు వామనుఁడవు ప్రభవుండ వీశ్వరరూపుండ వీవ కావె
యింద్రకర్ముఁడవు మహేంద్రుండ వఖిలలోకేశుండ వజరుండ వీవ కావె
|
|
| తే. |
కమలనాభుండవు రణాంతకారి వఖిల, నేతవు నియామకుండవు నీవ కావె
ప్రాణులకు నిత్యము స్వకర్మఫల మొసంగ, నేర్పరివి విశ్వమయుఁడవు నీవ కావె.
| 2984
|
| వ. |
మహాత్మా దివ్యు లగుమహర్షులు నిన్ను విష్వక్సేనుండ వనియును సేనాని వని
యును సర్వలోకంబుల కాశ్రయణీయుండ వనియు నుపాయభూతుండ వని
యును సహస్రశాఖసామవేదస్వరూపుండ వనియును నిత్యనైమిత్తికకామ్య
రూపసామాన్యవిశేషచోదనారూపశతజిహ్వుండ వనియును శ్రేష్ఠతముండ వని
యు నస్మదాదుల కెల్లఁ గర్త వనియును స్వయంప్రభుండ వనియు ననవరతం
బారాధించునట్టిముక్తులకుఁ బ్రాప్యస్థానం బనియును సృష్టికంటెఁ బూర్వం
బును బరంబును స్వాంతర్గుప్తానంతకోటిజీవసంఘాతుండ వై యుండుమేటి వని
యును సత్యంబ మనియుఁ బరంబ వనియును బ్రభవనిధనంబులు లేనివాఁడ వని
యు నపరిచ్ఛేద్యుండ వనియును బ్రహ్మాదులు నీనిజరూపం బెఱుంగ రనియు సర్వ
భూతంబులయందును గోబ్రాహ్మణులయందును దిక్కులయందును గగనంబునం
దును బర్వతంబులందును వనంబులందును నిత్యం బంతర్యామిత్వంబున గోచ
రించువాఁడ వనియును సహస్రశీర్హుండ వనియును సహస్రనేత్రుండ వనియునుం
గొనియాడుదురు మఱియును.
| 2985
|
| తే. |
ఆదికూర్మస్వరూపుండ వై సమస్త, భూమిభారంబుఁ దాల్చినప్రోడ వీవు
అంతమందును సంకర్షణాత్మకుండ, వై జలంబులఁ దోఁచుమహాహి వీవు.
| 2986
|
| సీ. |
లోకనాయక విను లోకంబు లన్నియు నరయ నీకుక్షిలో నణఁగి యుండు
నీకోప మగ్నియు నీజిహ్వ భారతి నీహృదయం బేను నీప్రసాద
మిందుండు నీస్థైర్య మిల నీశరీరంబు నిఖిలజగంబులు నీదుఱెప్ప
లహము రాత్రియుఁ దనూరుహములు వేల్పులు పరఁగ నీప్రాణము ల్పవనములును
|
|
| తే. |
నీదుసంస్కారములు సర్వవేదములును, నీదుకర్ణము ల్దిక్కులు నీదుదృక్కు
లర్కచంద్రులు నీకంటె నన్యమైన, వస్తు వెద్దియు లే దార్తవరద రామ.
| 2987
|
| తే. |
విశ్వనాయక మున్ను త్రివిక్రమములు
విక్రమించి త్రిలోకంబు లాక్రమించి
బలిని బంధించి యనుకంప సెలఁగ రాజ్య
మింద్రున కొసంగినఘనుండ వీవ కావె.
| 2988
|
| తే. |
అనఘచారిత్ర నీవు నారాయణుఁడవు, వసుమతీపుత్రి లక్ష్మి రావణవధార్థ
మర్థి మానుషరూప మింపలరఁ దాల్చి, యవని నవతార మొందితి వయ్య నీవు.
| 2989
|
| తే. |
రావణుఁడు నేఁడు హతుఁ డయ్యె రణములోన
నవతరించినపని దీరె హర్ష మొదవె
రాజనుత యింక శేషకార్యములు దీర్చి
చెలఁగి స్వస్థానమునకు వేంచేసె దీవు.
| 2990
|
| క. |
నీవిక్రమంబు తేజము, నీవీర్యము నీయశంబు నీదర్శనమున్
దేవ నినుఁ గూర్చి యే నిటు, గావించినస్తవ మమోఘకరమై యుండున్.
| 2991
|
| క. |
సూరిజనస్తుత ధర్మవి, శారద నీయందు భక్తి సలిపెడువా రె
వ్వారు గల రట్టిసజ్జను, లారయ ధరలో నమోఘు లై యుందు రొగిన్.
| 2992
|
| క. |
అజుని ఖగధ్వజునిఁ జతుర్భుజుని భృతద్విజుఁ బురాణపురుషోత్తముని
సృజియించునట్టి జను లుభ, యజగంబులఁ గోర్కు లొంది యరుగుదు రభవా.
| 2993
|
| క. |
శ్రుతిసిద్ధము దివ్యం బ, ప్రతిమం బతిగుహ్యమును బురాతన మగునీ
యితిహాసము గొనియాడిన, చతురుల కశుభంబు లేదు సత్య మధీశా.
| 2994
|
అగ్నిదేవుండు సీతాదేవిని రామునకు సమర్పించుట
| వ. |
అని యిట్లు పద్మగర్భుండు గొనియాడిన నమ్మహాత్మునివచనంబు విని యవ్విభావ
సుండు శీఘ్రంబున వహ్నిప్రవేశకాలంబునందు యాదృగ్వస్త్రాంగరాగస్రగాభ
రణయుక్తయై యుండెఁ దాదృశసౌభాగ్యయుక్త యైనసీత ననంతగుణసమేత
నతిసత్కులజాత నభినవాదిత్యసమద్యోత నానీలకుంచితచికురవ్రాత ననర్ఘతప్త
కాంచనభూషణస్ఫీత నంచితపాతివ్రత్యధర్మాభీత నక్లిష్టమాల్యాభరణోపేత
నఖలలోకైకమాత నంకంబున నిడికొని చితామధ్యంబున వెల్వడి రాముని
కడకుం జనుదెంచి యద్దేవి నమ్మహాత్మున కొసంగి వినయంబున నిట్లనియె.
| 2995
|
| ఉ. |
రామనరేంద్ర యీజనకరాజకుమారికయందుఁ గల్మషం
బేమియు లేదు నీవచన మించుక యైన నతిక్రమింప దీ
శ్యామ సువృత్త సాధ్వియు ననన్యశరణ్య మనంబు ధ్యానము
న్నీమముతో ననారతము నీపయిఁ జేర్చి భజించు నిత్యమున్.
| 2996
|
| మ. |
అగజేశస్తుతవీర్య కృత్రిమమృగవ్యాజంబున న్నిన్ను దూ
రగతుం జేసి దురాత్ముఁ డాదనుజుఁ డీరామ న్సతీరత్న యో
|
|
| |
గ్యగుణాఢ్య న్మిథిలేంద్రపుత్రిని బలాత్కారంబునం దెచ్చి చౌ
ర్యగతి న్దాఁచె నిజాలయోల్లసదశోకారామమధ్యంబునన్.
| 2997
|
| ఉ. |
మాయలు పన్ని రావణుఁడు మాటికి నెన్నిదురుక్తు లాడినం
బాయక రాక్షసాంగనలు పట్టుగఁ దర్జనభర్జనోక్తుల
న్రాయిడి పెట్టిన న్వినక రాజవరా త్వదధీనచిత్త యై
యీయవనీతనూజ మది నెప్పుడు నిన్నె దలంచుఁ గావునన్.
| 2998
|
| క. |
రవికులవర నావచనము, జవదాఁటక పుణ్యసాధ్వి జనకతనూజ
న్బ్రవిమలచిత్తను జేకొని, యవిరళమోదమున నేలుమయ్య మహాత్మా.
| 2999
|
| వ. |
అని అగ్నిదేవుండు పలికిన విని ద్యుతిమంతుఁడును మహాతేజుండును దృఢవిక్ర
ముండును ధర్మభృద్వరిష్ఠుండును వక్తలలోన శ్రేష్ఠుండు నగురాముండు ప్రీత
చేతస్కుండై యానందబాష్పవ్యాకులలోచనుం డై యొక్కింతసేపు విచారించి
యవ్వైశ్వానరున కిట్లనియె.
| 3000
|
రాముం డగ్నిదేవునివచనంబున సీతాదేవిం బరిగ్రహించుట
| చ. |
సురవర యీమహీజ పరిశుద్ధచరిత్రను గా నెఱింగియు
న్పరసదనస్థ యైనతనపత్నిని శోధన సేయ కర్థిఁ గ్ర
మ్మఱఁ గొనియె న్రఘూత్తముఁడు బాలిశుఁ డంగజమత్తుఁ డంచు స
త్పురుషులు ధిక్కరింతు రని దోషము వాయఁగ నింత చేసితిన్.
| 3001
|
| క. |
ముల్లోకంబులఁ గలవా, రెల్ల విలోకించుచుండ నీసతి శిఖిలో
మెల్లనఁ జొచ్చి శుచిత్వము, తెల్లము గావించె నేఁడు దేవత లలరన్.
| 3002
|
| క. |
మిగుల స్వతేజోరక్షిత, యగునీసతి గడవఁ జాలఁ డాదశకంఠుం
డొగి సాగరంబు వేగ మె, సఁగ వేల నతిక్రమింపఁజాలనిమాడ్కిన్.
| 3003
|
| తే. |
దినకరునిఁ బాసి యుండనిదీప్తిభంగిఁ, బరఁగ నీసాధ్వి న న్నెడఁబాసియుండ
దాత్మవంతుఁడు కీర్తిన ట్లనిశ మేను, విమలచారిత్ర నీసతి విడువఁజాల.
| 3004
|
| క. |
దురితాత్ముఁ డైనరావణుఁ, డరయఁగ సందీప్త యైనయనలశిఖిక్రియ
న్నిరుపమగతి వెలిఁగెడునీ, కరటిగమన సంస్పృశింపఁ గాఁ జాలఁ డొగిన్.
| 3005
|
| వ. |
మహాత్మా త్రిలోకంబులయం దతివిశుద్ధయు ననన్యహృదయయు మచ్చిత్తపరిర
క్షిణియు నైనయీసీత నవశ్యంబు భవద్వచనంబునం బ్రతిగ్రహించెద నని పలికి
యారఘువంశవల్లభుం డమ్మహీపుత్రిని సాదరంబుగాఁ గైకొని ప్రియవచనంబుల
గారవించి తత్సమేతుం డై రోహిణీసహితుం డైనపూర్వశశాంకునిపొంకంబున
నలరె సీతాపరిగ్రహణంబు విలోకించి యెల్లవారును బరమానందభరితాంతః
కరణు లై రంత సర్వలోకమహేశ్వరుండు రఘుపుంగవు నవలోకించి యిట్లనియె.
| 3006
|
ఈశ్వరుం డచ్చటికి వచ్చియున్న దశరథుని రామునకుం జూపుట
| సీ. |
కమలాక్ష దైవయోగమున నీయద్భుతకర్మంబుఁ జేసితి కడిమి మెఱసి
ఖలుఁ డైనదశకంఠువలనఁ బుట్టినభయ మణఁగించి జగముల కమితహర్ష
|
|
| |
మొసఁగితి వింక నయోధ్య కేగి మహాత్ము భరతుని శత్రుఘ్నుఁ గరముఁ బ్రీతి
మన్నించి తల్లుల మక్కువ సేవించి రాజ్యంబు గైకొని ప్రజలఁ బ్రోచి
|
|
| తే. |
వంశకరు లగుపుత్రులఁ బడసి యశ్వ, మేధసవనంబుఁ జేసి యమేయకీర్తి
తగ నుపార్జించి ద్విజులకు ధన మొసంగి, చెలఁగి స్వస్థానమునకు వేంచేయుమయ్య.
| 3007
|
| శా. |
దేవా యీమహనీయుఁ డాదశరథాధీశుండు మీతండ్రి సం
సేవార్హుండు మహాయశుం డితఁడు న చేఁ దారితుం డై సురేం
ద్రావాసంబు లభించి భాస్వరవిమానారూఢుఁ డై నిన్ను సం
భావింపం జనుదెంచినాఁ డితనికి న్భక్తి న్నతిం జేయుమా.
| 3008
|
| వ. |
అని నియోగించి దేవదేహగ్రహణంబున నపరిజ్ఞాతుఁ డై యున్నదశరథుని
నంగుళినిర్దేశంబుఁ జేసి చూపిన.
| 3009
|
| ఉ. |
ఆరఘువంశశేఖరుఁ డుమాధిపువాక్యము లాలకించి సొం
పార విమానరాజమున నద్భుతకాంతి వెలుంగువాని సు
శ్రీరమణీయచేలము ధరించినవాని గురు న్మహాగుణో
దారునిఁ గాంచి లక్షణయుతంబుగ నంజలిఁ జేసె భక్తితోన్.
| 3010
|
దశరథుఁడు రామలక్ష్మణులఁ గవుంగిలించుకొనుట
| చ. |
తన కిటు మ్రొక్కినట్టిసుతు ధన్యునిఁ బ్రాణసమాను రామునిం
గనుఁగొని దేవయానమునఁ గమ్రతరద్యుతి నొప్పుచున్నయ
జ్జనపతి హర్షయుక్తుఁ డయి సయ్యన నంకముఁ జేర్చి బాహులన్
మునుకొని గ్రుచ్చి తచ్ఛిరము మూర్కొని వేడ్క దలిర్ప నిట్లనున్.
| 3011
|
| చ. |
ధనపర యైనకైక మును తప్పక పల్కినక్రూరవాక్యము
ల్మనమున నాటియున్నయవి మానుగఁ ద్వద్రహితుండ నైననా
కనిమిషలోకవాసము సురాధిపసఖ్యము దేవమౌనిపూ
జనము రుచింపకున్నయది సత్యముఁ బల్కితి నందనోత్తమా.
| 3012
|
| ఆ. |
కుశలి వైననిన్ను గుణి యైనలక్ష్మణుఁ, గాంచి నేఁడు మిమ్ముఁ గౌఁగిలించి
హిమవిముక్తుఁ డైనయినుమాడ్కి దుఃఖంబు, వలన విడువఁబడినవాఁడ నైతి.
| 3013
|
| తే. |
ఖ్యాతిఁ గన్నయష్టావక్రిచేతఁ దొల్లి, యలకహోళుఁడు తారితుండైనమాడ్కి
శీలవంతుండ వైననీచేత నేను, దారితుఁడ నై చెలంగితిఁ దనయవర్య.
| 3014
|
| తే. |
అమరకంటకుఁ డైనదశాస్యు నాజిఁ, బొరిగొనుట కట్లు నాఁడు నిర్జరులచేత
రమణ నభిషేకవిఘ్నకార్యము ఘటింపఁ, బడియెనని యిప్పు డెఱిఁగితిఁ బరమపురుష.
| 3015
|
| క. |
గహనమున నుండి గ్రమ్మఱ, గృహమున కరుదెంచినట్టికృతకృత్యుని ని
న్రహి మీఱఁ జూచి మీయమ, యహిమాంశుకులేంద్ర ధన్య యగు నిక్కముగన్.
| 3016
|
| క. |
విలసదభిషేకపుష్కర, కలితాంగుఁడ వైననిన్నుఁ గనుఁగొని పురిలోఁ
గలవా రందఱు హర్షో, జ్జ్వలు లై విహరింపఁగలరు ..........
| 3017
|
| క. |
యుక్తుం డనురక్తుఁడు కడు, భక్తుఁడు నృపధర్మవిదుఁడు భరతుఁ డతనితో
యుక్తుఁడవై యుండఁగ నా, సక్తి నినుఁ జూచుకాంక్ష చాలఁ బొడమెడిన్.
| 3018
|
రాముఁడు కైకేయీభరతుల ననుగ్రహింపుమని దశరథునిం బ్రార్థించుట
| వ. |
వత్సా సీతాలక్ష్మణసహితుండ వైననీచేత నరణ్యంబునఁ బదునాల్గువత్సరం
బులు నిర్యాతితంబు లయ్యె నివృత్తవనవాసుండ వైతివి నీప్రతిజ్ఞ సాఫల్యంబు
నొందె రావణవధం బాపాదించి దేవతలకు సమ్మోదం బొసంగి కృతకృత్యుండ
వై శాశ్వతం బైనయశం బుపార్జించితి వింక భ్రాతృసహితంబుగా సామ్రాజ్యంబు
గైకొని దీర్ఘాయుష్మంతుండవై సుఖింపుమని పలికిన నారాముం డమ్మహీపతివచ
నంబు విని యంజలి గీలించి మహాత్మా నాయందుం గలవాత్సల్యంబు భరతుని
యందును బ్రకటింపం జేయుము మున్ను సపుత్ర వైననిన్నుఁ బరిత్యజించెద
నని కైకేయితో నాడితి విప్పు డాఘోరశాపం బమ్మహాదేవిని స్పృశింపకుండ
ననుగ్రహింపు మని ప్రార్థించిన నమ్మహారాజు శేఖరుఁ డగుంగాక యని పలికి
పదంపడి సౌమిత్రిఁ గౌఁగిలించికొని యిట్లనియె.
| 3019
|
| సీ. |
జానకీయుతుఁడవై సతతంబు రాముని నతిభక్తి సేవించినందువలన
నాకు సమ్మోదంబు నీకు ధర్మఫలంబు పరమయశంబు సంప్రాప్త మయ్యె
రామభద్రుఁడు జగత్త్రయమంగళప్రదుం డింద్రాదిదిక్పతు లితరసురులు
పరమర్షు లిచటికిఁ బఱతెంచి యమ్మహాపురుషునిఁ బూజించి పొగడి రిపుడు
|
|
| తే. |
రాముఁడు ప్రసన్నుఁ డగుచుండ రమణ నీకు
స్వర్గము యశంబు మహిమయుఁ జాలఁ గలుగుఁ
గావున ననారతంబు రాఘవున కర్ణి
నుచితభంగి శుశ్రూష సేయుము కుమార.
| 3020
|
| తే. |
విను మఖిలవేదతాత్పర్యవిషయభూత, మక్షరంబు రహస్య మవ్యక్త మజము
నిర్మలం బవ్యయము బ్రహ్మనిర్మితంబు, నైనపరతత్త్వ మితఁడె సు మ్మనఘచరిత.
| 3021
|
| క. |
రాముని మహానుభావునిఁ, గా మది నెఱిఁగికొని నీవు ఘనతరభక్తి
న్నేమంబున సేవింపుము, సౌమిత్రీ దీన యశము జగముల నిండున్.
| 3022
|
| వ. |
అని లక్ష్మణుం బ్రబోధించి యమ్మహీపతి సీత నవలోకించి యిట్లనియె.
| 3023
|
| చ. |
ఘనభుజుఁ డైనరాఘవుఁడు గ్రద్దన ని న్నిపు డన్నమాటకు
న్మనమునఁ జింత సేయకుము మానవతీ పరిశుద్ధఁ జేయుమం
తనమున ని ట్లొనర్చెఁ బరదైవము నీకు విభుండె గావున
న్మునుకొని యిమ్మహాత్ముని సమున్నతభక్తి భజింపు మెప్పుడున్.
| 3024
|
| క. |
అని యిటు రాముని లక్ష్మణు, జనకసుతను గారవించి జననాథుఁడు చ
య్యన దివ్యవిమానముతోఁ, జనియె న్సురపురి కనంతసమ్మోదమునన్.
| 3025
|
ఇంద్రుఁడు రామునకు వరంబు లొసంగుట
| తే. |
అంత జంభాంతకుఁడు ముదితాత్ముఁ డగుచు
రామభద్రునిఁ గాంచి హర్షమునఁ బలికెఁ
బొసఁగ నీదర్శనము మా కమోఘ మయ్యె
హర్షయుక్తుండ నైతి మహాత్మ నేఁడు.
| 3026
|
| క. |
నీకోరినవర మొసఁగెదఁ, బ్రాకటముగ వేఁడు మననఁ బ్రాంజలి యై సీ
తాకాంతుఁడు హర్షం బునఁ, బాకారిం జూచి మధురఫణితిం బలికెన్.
| 3027
|
| సీ. |
అమరేంద్ర నామీఁద ననుకంప గలదేని యడిగెద దాని సత్యముగఁ జేయు
మస్మదర్థంబుగా నాండ్రడ్డబిలఁ బాసి యరుదెంచి నాకుఁ బ్రియం బొనర్పఁ
దెగువమై రణములోఁ బగతుల మార్కొని వారిచే హతు లైనవార లెవ్వ
రట్టిగోలాంగూలహర్యక్షవీరు లెందఱు గల రందఱు మరల బ్రతికి
|
|
| తే. |
తగ విశల్యు లై తొల్లిటి పగిది నలఘు
మతియుఁ దేజమ్ము భుజవిక్రమంబు బలము
ధృతియు దాక్ష్యంబు గలిగి వర్తించువారు
గాఁ బ్రసాదింపు మిడియె మత్కాంక్షితంబు.
| 3028
|
| ఆ. |
మఱియు ననిమిషేంద్ర మర్కటోత్తములు వ, సించి యున్నవిపిన మంచితముగ
సంతతంబు మూలజలఫలయుక్త మై, యుండునట్టివరము లొసఁగ వలయు.
| 3029
|
| వ. |
అని యడిగిన నప్పాకశాసనుండు రఘుపుంగవునితో మహాత్మా నీ విప్పు డడిగిన
వరంబు రణంబున రాక్షసప్రయుక్తసాయకవిలూనంబులై యీవలావలం బడిన
కరచరణకర్ణనాసాకంఠపుచ్ఛాదిసర్వావయవస్వస్థానసంధానపరలోకగతజీవిత
సమానయసరూపాఘటితార్థఘటకత్వంబువలన మహత్త్వంబు ప్రాపించి యు
న్నది నావచనం బనృతంబు గాదు నీవు కోరినయట్ల సంగ్రామంబున దానవుల
చేత నికృత్తాననబాహు లై కూలిన వానరభల్లూకగోలాంగూలవీరు లెందఱు
గల రందఱు మత్ప్రసాదంబున నీక్షణంబున సప్రాణులై సుప్తులైనవారు ప్రబుద్ధు
లైనమాడ్కి లేచి నీరుజులును నిర్వ్రణులును సంపన్నబలపౌరుషులును నై
తమతమసుహృద్బాంధవజ్ఞాతిపుత్త్రకళత్రాదులం గూడుకొని పరమానందంబున
సుఖింతురు గాక యకాలంబునందునుం బాదపంబులు ఫలవంతంబు లై పుష్ప
శబళంబులై యుండుఁగాక నదీసంఘంబులు విమలసలిలోపేతంబులై యొప్పుఁ
గాక యని పలికిన నప్పుడు పురందరునివరప్రభావంబున రణంబున హతు లైన
వానరు లందఱు సజీవితు లై నిద్ర మేల్కొనినతెఱంగున లేచి నిర్వ్రణులై యిది
యేమి యాశ్చర్యం బని తలంచుచుఁ బరమానందంబునం బొదలుచుండి రంత
దేవత లందఱు స్తవార్హుం డైనరాముని సౌమిత్రిని యథార్హపూజనంబులం
బరితుష్టులం జేసి సాధువాక్యంబులం బ్రస్తుతించి సంప్రీతచేతస్కు లై రామ
భద్రున కిట్లనిరి.
| 3030
|
| చ. |
అనఘచరిత్ర నీవు రయమార నయోధ్యకు నేగి కైకయీ
తనయుని లక్ష్మణానుజునిఁ దల్లుల జానకి నూఱడించి మిం
చినయనురాగ మొప్ప నభిషిక్తుఁడ వై విపినాటకోటుల
న్సనయము గాఁగ వీడుకొని సమ్మతి నేలుము సర్వరాష్ట్రముల్.
| 3031
|
| క. |
అని పలికి ప్రీతుఁ డగురా, మునిచేత ననుజ్ఞ వడసి మునుకొని సుర ల
ర్కనిభవిమానంబులతోఁ, జనిరి యథాస్థానమునకు సమ్మోదమునన్.
| 3032
|
| క. |
అనిమిషులు చనినపిమ్మట, ఘనుఁ ఢారాఘవుఁడు ముదము గదుర సుమిత్రా
తనయావనిజాయుతుఁ డై, మునుకొని యొకచోట వాసము న్జేసె రహిన్.
| 3033
|
| చ. |
సమధికరామలక్ష్మణభుజాపరిరక్షిత మైనకీశసై
న్యము సముదగ్రకాంతియుత మై సముదంచితహర్షయుక్త మై
సముదితతేజ మై విజితశాత్రవసైన్యకదంబ మై రహి
న్విమలశశిప్రణీతరజనీక్రియ నొప్పె జయాభిరామ మై.
| 3034
|
| తే. |
రామభద్రుఁ డీరీతి నారాత్రి యచట
నిరుపమప్రీతితో సుఖనిద్రఁ జేసి
మేల్కొనినయప్పు డాజగన్మిత్రుతోడ
నంజలి ఘటించి పలికె నయ్యసురవిభుఁడు.
| 3035
|
| ఉ. |
భానుకులప్రదీప నవపద్మనిభేక్షణ లైనకాంతలు
న్మానుగ మజ్జనోపకరణంబులు చేకొని వచ్చినారు సు
స్నాన మొనర్చి దివ్యహరిచందనమాల్యదుకూలవస్త్రనా
నానవరత్నభూషణగణంబులచేఁ గయిసేయు మిత్తఱిన్.
| 3036
|
| తే. |
అనిన విని లక్ష్మణాగ్రజుఁ డవ్విభీష
ణోక్తుల కనంతహర్షసంయుక్తుఁ డగుచు
మరల ని ట్లని పలికె నప్పరమసఖునిఁ
గాంచి యనురక్తి మనమునఁ గడలుకొనఁగ.
| 3037
|
| ఉ. |
ఈకపిలోకవల్లభుఁ డహీనసుఖోచితుఁ డార్తబంధుఁడు
న్నాకు హితం బొనర్పఁ బ్రధనంబున వైరుల నోర్చి డస్సినాఁ
డీకపివీరు లంద ఱరిహేతుల గాసిలి యున్నవార ల
స్తోకమతి న్మదర్థముగ శూరుల వీరి బహూకరింపుమా.
| 3038
|
| సీ. |
గురుభక్తియుక్తుండు పరమధర్మజ్ఞుండు సత్యసంధుఁడు సాధుసమ్మతుండు
లలితుండు భ్రాతృవత్సలుఁడు కుమారుండు ప్రాణతుల్యుం డైనభరతుఁ డట్లు
మద్వియోగజశోకమగ్నుఁ డై యుండ నా కభిమత మగునె మాల్యాంబరాది
ధారణ మమ్మహాధార్మికు వీక్షింప కున్న నామనమున కురుముదంబు
|
|
| తే. |
గలుగ దిప్పుడె పురికిఁ బోవలయు మాకు
దూరపథ మెవ్విధంబునఁ జేరఁ గలనొ
|
|
| |
యనిన విని యంజలి ఘటించి యాస రేంద్ర
చంద్రుతో వెండి యలవిభీషణుఁడు పలికె.
| 3039
|
| చ. |
పురుషవరేణ్య చూడు మదె పుష్పకనామవిమానరాజ మం
బరమణిసన్నికాశము సమంచితరత్నవినిర్మితంబు వి
స్ఫురితశిరస్సహస్రము సముజ్వలభద్రవితానయుక్త మం
బరచరము న్మనోజవము భవ్యము కామగ మెన్ని చూడఁగన్.
| 3040
|
| ఆ. |
దీనిమీఁద నెక్కి తేని రఘూత్తమ, యొక్కపవటిలో నయోధ్య కెలమిఁ
గోర్కి మీఱ నిన్నుఁ గొనిపోవు దుర్గమ, పథ మనుచు విచారపడఁగ వలదు.
| 3041
|
| క. |
ఈదివ్యవిమానము మును, శ్రీదుఁడు మాయన్న తపముఁ జేసి నలువ చే
మోదమునఁ బడసె రావణుఁ, డాధనపతి నాజిఁ దోలి యటు కొని తెచ్చెన్.
| 3042
|
| క. |
అనఘా భవదర్థం బది, మునుకొని పాలింపఁబడియె ముదము దలిర్పం
గొని తెప్పించెద మీ రిపు, డనుపమగతి దాని నెక్కి యరుగుఁడు ప్రీతిన్.
| 3043
|
| వ. |
దేవా యేను నీ కంతరంగభక్తుండ నేని నాయందుఁ గృప గల దేని మత్ప్రాణ
ధనంబులు భవదధీనంబులు చేసి యుండుట సత్యం బేని సీతాలక్ష్మణసహితం
బుగా నొక్కింతకాలం బిచ్చట వసించి నాచేత సర్వకామంబుల నర్చితుండవై
సైన్యసుహృజ్జనసహితంబుగా శాస్త్రవిహితం బైనమత్పూజనంబు మత్సకాశం
బున నుండి ప్రతిగ్రహించి ప్రీతియుక్తుండ వై యరుగవలయు నేను నీకు
భృత్యుండ నగుటవలన నీమాట ప్రణయబహుమానసౌహృదంబులవలన
నాడితిఁ గాని యాజ్ఞాపించినవాఁడఁ గా నని ప్రార్థించిన నారఘువల్లభుం డలరి
సర్వజనంబులు వినుచుండ వెండియు నవ్విభీషణున కి ట్లనియె.
| 3044
|
| చ. |
దనుజవరేణ్య నీ విపుడు తద్దయుఁ బల్కినమాటకంటెఁ బూ
జన మధికంబె సఖ్యమున సర్వవిధోత్తమబాంధవంబున
న్ఘనతరసౌహృదంబున నకల్మషభక్తి ననారతంబు నే
ననుపమభంగిఁ బూజితుఁడ నైతిని నా కొకభేద మున్నదే.
| 3045
|
| చ. |
గురుతరచిత్రకూటగిరికూటముపై వసియించి యున్నన
న్నరుదుగఁ గ్రమ్మఱించుటకు నచ్చటి కెవ్వఁడు వచ్చె సారెకు
న్శిరమున యాచితుండ నయి చేకొని యెవ్వనికోర్కి దీర్ప కేఁ
బఱపితి వీటి కాభరతు భక్తిరతు న్వెసఁ జూడఁ గోరెదన్.
| 3046
|
| క. |
గురువుల వృద్ధులఁ బౌరుల, నరుదారఁగ జానపదుల నఖిలసచివులం
బరమాప్తుల జనయిత్రుల, గర మనురాగమునఁ జూడఁ గాంక్ష వొడమెడిన్.
| 3047
|
| చ. |
దనుజవరేణ్య మా కిచటఁ దాలిమితో నిలువంగ రాదు వ
చ్చినపని చక్కనయ్యె నిఁక శీఘ్రమునం బురికిం జన న్వలె
న్ఘనముగ నేను నేఁ డఖిలకామములం బ్రతిబూజితుండ నై
తిని దడ వేల నీ వనుమతించి విమానము దేరఁ బంపుమా.
| 3048
|
విభీషణుఁడు రామునకుఁ బుష్పకవిమానము నొసంగుట
| వ. |
అని పలికిన నవ్విభీషణుండు రయంబునం దగువారిఁ బురంబులోనికిం బనిచి
కాంచనచిత్రాంగంబును వైడూర్యకృతవేదికంబును వరాకారకూటాగారపరిక్షి
ప్తంబును సమంతతోరాజితప్రభంబును బాండురధ్వజపతాకాలంకృతంబును
గాంచనహర్మ్యశోభితంబును హేమపద్మవిభూషితంబును గింకిణీజాలప్రకీర్ణం
బును ముక్తామణిగవాక్షితంబును ఘంటాజాలఘణంఘణితంబును మధురస్వన
వంతంబును మేరుశిఖరాకారంబును విశ్వకర్మనిర్మితంబును ముక్తారజతసన్నిభ
బహుహర్మ్యసమన్వితంబును స్ఫాటికచిత్రాంగవైడూర్యవరాసనంబును మహా
ర్హాస్తరణోపేతంబును మహాధనోపపన్నంబు ననాధృష్యంబును మనోజవంబును
బుష్పభూషితంబు నగుపుష్పకవిమానంబు దెప్పించి రామునకు సమర్పించి
కృతాంజలిపుటుండును వినయవినమితోత్తమాంగుండును హర్షపులకితగాత్రుం
డును నై దేవా నీకింకరుండ నేమి సేయం గలవాఁడ నానతి మ్మనిన నారఘు
పుంగవుండు స్నేహపురస్కృతం బగు వాక్యంబున ని ట్లనియె.
| 3049
|
| సీ. |
దానవనాథ యీతరుచరవీరు లాహవమునఁ బ్రాణభయంబు విడిచి
యనివర్తు లై పోరి యరుల నిర్జించిరి వీరివిక్రమమున భూరిదైత్య
రాజ్యంబు నీకు సంప్రాప్తించెఁ గృతకృత్యు లగువీరి నందఱ నర్హభంగి
ధనరత్నభూషణదానంబులఁ గరంబు సత్కరింపుము నీవు సంభ్రమమున
|
|
| తే. |
సర్వకపులు నీచే నట్టు సత్కరింపఁ, బడి నిరంతరసమ్మోదపరు లగుదురు
దీన నీకు యశంబును మానితముగ, సంతతంబును నాకు హర్షంబు గలుగు.
| 3050
|
రామునిపనుపున విభీషణుఁడు వానరుల నందఱ సత్కరించుట
| చ. |
సదయుని సంగ్రహీతను యశస్విని ద్యాగిని మానవాధిపు
న్వదలక సైన్య ముర్విఁ దఱి వచ్చినయప్పుడు ప్రోచుఁ బ్రీతితో
సదయుని ద్యాగశూన్యు నభిహంతను రాజగుణప్రహీను దు
ర్మదుని బరిత్యజించి సమరంబు ఘటిల్లినవేళ బల్విడిన్.
| 3051
|
| చ. |
అనిన విభీషణుండు ముదమంది యనర్ఘమణీసువర్ణనూ
తనపటకాంచనాభరణదానములం దగ నర్హభంగిఁ గా
ననచరుల న్ఘనంబుగ మనం బలర న్వెస సత్కరించినం
గనుఁగొని రాఘవుండు మదిఁ గౌతుకము న్మద ముల్లసిల్లఁగన్.
| 3052
|
| క. |
జగతీతనయానుజయుత, ముగఁ బుష్పక మెక్కి యంకమున జనకసుతం
దగ నిడికొని దైత్యేంద్రుని, నగచరవీరులను జూచి నయముగఁ బలికెన్.
| 3053
|
| క. |
వృక్షచరులార మీచే, నక్షయముగ మిత్రకార్య మది దీర్పఁబడె
న్దక్షత మీమీయిరవుల, కక్షీణజవంబుతోడ నరుగుఁడు ప్రీతిన్.
| 3054
|
| ఉ. |
మిత్రుఁడ వైననీ వతిసమృద్ధభుజాబలశక్తి నిర్జరా
|
|
| |
మిత్రుల నాజి గీటడఁచి మిత్రునికార్యముఁ దీర్చి బల్విడి
న్ధాత్రిఁ గృతప్రతిజ్ఞుఁ డనఁ దద్దయు సన్నుతి కెక్కి తింక నో
మిత్రకుమార నీపురికి మేటిగఁ బొమ్మ చమూయుతుండ వై.
| 3055
|
| చ. |
గురుకృప నాయొసంగినయకుంఠితదానవరాజ్య మేలుచుం
దిరముగ లంక నుండు మలదేవత లైనను దేఱి చూడఁ జా
లరు నిను సంప్రమోదము సెలంగ నయోధ్యకుఁ బోయెదన్ లస
న్నిరుపమభక్తితో ననుమతింపుము రాక్షసలోకవల్లభా.
| 3056
|
సుగ్రీవవిభీషణాదు లయోధ్యవఱకుఁ గూడ వచ్చెద మని రామునితోఁ జెప్పుట
| క. |
అని విని వా రందఱుఁ గర, మనురాగము మీఱ రాఘవాన్వయపతితో
వినయ మిగురొత్తఁ బలికిరి, ఘనతరముగ ఫాలభాగఘటితాంజలు లై.
| 3057
|
| ఉ. |
వేడ్కఁ దలిర్ప నేము రఘువీర యయోధ్యకు వత్తు మిందఱం
దోడ్కొని పొమ్ము భ్రాతృసహితం న్నినుఁ బుణ్యుఁ గృతాభిషేకునిం
జూడ్కుల విందుగా నచటఁ జూచి పురంబును గాంచి యవ్వల
న్వీడ్కొని మాగృహంబులకు వేగమె వచ్చెద మట్లు సేయవే.
| 3058
|
| క. |
మీతల్లుల మీగృహముల, మీతమ్ముల మీసమస్తమిత్రులఁ జూడం
జేతోమోదము గదిరెడు, సీతాధిప యిష్టసిద్ధి సేయుము ప్రీతిన్.
| 3059
|
| క. |
అన విని రఘునాథుఁడు తన, మనమున ముద మావహిల్ల మర్కటవిభునిన్
దనుజకులేంద్రునిఁ దక్కిన, వనచరులం జూచి కరుణ వఱలఁగఁ బలికెన్.
| 3060
|
| చ. |
ఘనమతులార మీ రిపుడు కౌతుక మొప్పఁగ మాయయోధ్యకు
న్మునుకొని వచ్చు టెంతయుఁ బ్రమోదము గాదె సుహృద్యుతంబుగాఁ
జనియెద మత్పురంబు గని చయ్యన వత్తురు గాని రండు మీ
రనుపమలీల నందఱు రయంబునఁ బుష్పక మెక్కుఁ డిత్తఱిన్.
| 3061
|
| వ. |
అని పలికినఁ దదనుమతంబున సుగ్రీవుండు హనుమదంగదసమేతుం డై చమూ
యుతంబుగాఁ బుష్పకవిమానం బారోహించె విభీషణుం డమాత్యసహితం
బుగా విమానారోహణంబుఁ జేసె నిట్లంద ఱప్పరమాసనం బెక్కి యసంబా
ధంబుగా నాసీను లైరి రాముండు సీతాలక్ష్మణసహితంబుగా సాక్షాత్కుబే
రుండుం బోలెఁ దదీయాగ్రభాగంబున నధివసించె నిట్లందఱు యథాసుఖంబు
గా నాసీను లైనయనంతరంబ కౌబేరం బైనయద్దివ్యవిమానంబు రామునిచేత
ననుజ్ఞ వడసి వాహనాకారనిర్మితమరాళంబులతోఁగూడ గగనంబున కుద్గమించి
మారుతోద్ధూతం బైనమహామేఘంబుకరణి నతిత్వరితగమనంబునం జను
చుండె నప్పుడు రఘుపుంగవుండు పూర్ణచంద్రనిభానన యగుజానకి నవలోకించి
యి ట్లనియె.
| 3062
|
సీతారామలక్ష్మణులు వానరరాక్షససహితంబుగాఁ బుష్పకారూఢులై యయోధ్యకుఁ బయనంబగుట
| క. |
కైలాసశిఖరనిభసు, శ్రీలక్షిత మగుత్రికూటశిఖరాగ్రముపైఁ
గ్రాలెడులంకను జూడుము, నీలాలక విశ్వకర్మనిర్మితపురమున్.
| 3063
|
| క. |
హరిరాక్షసవీరులసం, గర మిదె పృథురక్తమాంసకర్దమమై భీ
కరమై చతురంగకళే, బరయుతమై చూడ నొప్పె భామిని కంటే.
| 3064
|
| మ. |
పటునిష్ఠం దప మాచరించి నలువం బల్మాఱు మెప్పించి యు
త్కటభంగి న్నిఖిలార్థము ల్వడసి దోర్గర్వాతిరేకంబునం
గుటిలుండై చరియించురావణుఁడు సంక్షోభీకృతాదిత్యుఁ డి
చ్చట నాచే హతుఁ డయ్యెఁ జూచితివె చంచచ్చారుపద్మేక్షణా.
| 3065
|
రాముఁడు సీతాదేవికి దారిలో నాయావిశేషములం జెప్పుట
| సీ. |
ఇందీవరేక్షణ యిచ్చట నాచేత హతుఁ డయ్యె ఘటకర్ణుఁ డత్యుదీర్ణుఁ
డేణాంకముఖి చూడు మిచట నీలునిచేత సుప్రశస్తుఁడు ప్రహస్తుండు మడిసెఁ
గనకాంగి యిచట లక్ష్మణునిచే హతుఁ డయ్యెఁ జలితమహీభృత్తు శక్రజిత్తు
సామజయాన యిచ్చట వాయుసుతునిచే హతుఁ డయ్యె ధూమ్రాక్షుఁ డాజిదక్షుఁ
|
|
| ఆ. |
డలరుఁబోడి యిచట హతుఁ డయ్యె వికటుండు, శూరుఁ డైనవాలిసుతునిచేత
నలసుషేణుచేత నాజి విద్యున్మాలి, నిహతుఁ డయ్యె నిచట నీలవేణి.
| 3066
|
| వ. |
మఱియుఁ గుంభకర్ణనందను లైనకుంభనికుంభులు రావణునితనయు లైన
యతికాయమహాకాయులును దేవాంతకనరాంతకత్రిమస్తకులును మహోదర
మహాపార్శ్వవజ్రదంష్ట్రమకరాక్షవిరూపాక్షమత్తప్రమత్తాకంపనాదిరాక్షస
యోధులును నిహతు లైనప్రదేశంబులు వేర్వేఱ విలోకింపుము.
| 3067
|
| క. |
ఆదశకంఠునిసతి మం, డోదరి పతిఁ గూర్చి యశ్రు లొలుకఁగఁ దగ ని
ర్వేదించెఁ జిత్తమున నడ, లూఁది సపత్నీసహస్రయుత యై యిచటన్.
| 3068
|
| క. |
వారాశి దాఁటి యిచ్చట, నారాత్రి వసించినార మబ్జానన సొం
పారఁగఁ గల్లోలాకుల, పారావారానిలములు పై వీవంగన్.
| 3069
|
| క. |
అగణితబలుఁ డగునలుచే, మిగుల న్సలిలార్ణవంబుమీఁదఁ జతురత
న్దగ సేతువు గట్టించితి, సొగసుగ నీకొఱకు దానిఁ జూడుము తరుణీ.
| 3070
|
| ఉ. |
రంగదభంగసంతతతరంగకరంబులు సాఁచి యావియ
ద్గంగను గౌఁగిలింపఁ జనుకైవడి మ్రోయుచు మిన్ను దాఁక ను
ప్పొంగెడుదాని శుక్తిదరపుంజనిషేవిత మైనదాని మా
తంగఝషాకులం బయినదాని నపారపయోధిఁ గంటివే.
| 3071
|
| ఉ. |
తోయజనేత్ర నీకడకుఁ దోరపువేడ్క మహాజవంబుతో
వాయుసుతుండు వచ్చుతఱి వానికి నించుక విశ్రమార్థ మీ
|
|
| |
తోయధిచేతఁ బంపఁబడి తోయము వెల్వడి వచ్చెఁ గాంచన
చ్ఛాయల నొప్పునీశిఖరికాంచననాభము దీనిఁ జూచితే.
| 3072
|
| వ. |
దేవీ యిది సముద్రతీరపుణ్యక్షేత్రంబు మహాపాతకనాశనంబును బవిత్రంబును
విమలంబును త్రైలోక్యపూజితంబు నై యుండు నీసముద్రోత్తరతీరదేశంబున
స్కంధావారనివేశనంబు గావించితి నిది సేతునిర్మాణమూలప్రదేశం బగుటం
జేసి సేతుబంధం బనఁ బ్రాశస్త్యంబు వహించు మఱియు నిచ్చట సేతుబం
ధంబుకంటె మున్ను మహాదేవుండు సన్నిధానంబుఁ జేసి జలోపరిభాగంబున
సేతుకరణరూపప్రసాదం బొసంగె నిచ్చట రాక్షసవల్లభుం డగువిభీషణుండు
శరణాగతుం డయ్యె నని పలికి వెండియు ని ట్లనియె.
| 3073
|
| తే. |
ఏను వర్షరాత్రము వసియించినట్టి
శైల మిదె మచ్ఛరంబున వాలి యిచట
నిహతుఁ డై గూలెఁ గపిపతి మిహిరతనయుఁ
డేలుకిష్కింధ యిదె చూడు మిందువదన.
| 3074
|
రామనియోగంబున సీతాహితార్థంబు వానరు లందఱుఁ దమతమపత్నులనుం దోడ్కొనివచ్చుట
| క. |
అన విని కిష్కింధాపురిఁ, గనుఁగొని సమ్మోద మాత్మఁ గడలుకొనంగాఁ
దనవిభునిఁ జూచి యిట్లనె, జనకజ మృదుఫణితిఁ బ్రణయసాధ్వసయుత యై.
|
|
| ఉ. |
ఆదర మొప్ప భాస్కరసుతాదికవానరపత్ను లైనతా
రాదిసమస్తవానరమృగాక్షులు గొల్వ భవత్సమేత నై
మోదముతో నయోధ్యకు సమున్నతభంగిఁ జనం దలంచితిం
గా దన కర్థి నాత్మ ననుకంప దలిర్పఁగ న ట్లొనర్పుఁడీ.
| 3076
|
| క. |
నా విని రఘుపుంగవుఁ డటు, గావించెద ననుచుఁ బలికి ఘనపుష్పకమున్
ద్రోవ నటు నిల్పి యలసు, గ్రీవుని వీక్షించి పలికె బ్రీతి దలిర్ఫన్.
| 3077
|
| చ. |
దినకరపుత్ర కీశయువతీసహితంబుగ మాయయోధ్యకుం
జనఁగఁ దలంచె జానకి ప్రసన్నమతి న్వెసఁ దత్ప్రియార్ధ మ
ల్లనఁ గపు లంద ఱాత్మసతులం దగఁ దోడ్కొని వచ్చువారుగా
ననుమతి సేయు మీవును రయంబున రమ్ము సతీయుతంబుగన్.
| 3078
|
| చ. |
అనిన మహాప్రసాద మని యాతఁడు సర్వవనాటయుక్తుఁ డై
యనుపమరత్నకాంతిఁ జెలువారు నిజాగ్ర్యగృహంబులోనికి
న్నెనరు దలిర్ప నేగి రుచినిర్జితతారను దారఁ గాంచి యి
ట్లనియె మృదూక్తి రామవిభుఁ డానతి యిచ్చినచంద మేర్పడన్.
| 3079
|
| చ. |
సరసిజనేత్ర సర్వకపిసత్తము లాత్మకళత్రయుక్తు లై
ధరణిసుతా ప్రియార్థ మిటు దప్ప కయోధ్యకు నేఁడు రావలె
|
|
| |
న్బరువడి నట్లు సేయు మని భానుకులేంద్రుఁడు పల్కెఁ గావునం
దిరముగ నీవు వానరసతీసహితంబుగ రమ్ము చెచ్చెరన్.
| 3080
|
| క. |
పరఁగ నయోధ్యకు నేగిన, భరతాదులఁ బంక్తిరథునిపత్నుల నచటం
బరికింప వచ్చు నప్పని, పరమహితము గాదె మనకుఁ బంకజనేత్రా.
| 3081
|
| వ. |
అని పలికినఁ దత్క్షణంబ శోభనాకార యగుతార వానరపత్నుల నందఱ రావించి
వైదేహికిఁ బ్రియంబుగా మన మందఱము భర్తృసహితలమై యయోధ్యా
పురంబున కరుగవలయు రామవచనప్రకారంబున సుగ్రీవుం డి ట్లాన తిచ్చె నిది
నాకును బరమప్రియం బైనయది సాకేతపురప్రకారంబును బౌరజానపదసహి
తంబుగా రామప్రవేశంబును బట్టాభిషేకంబును దశరథస్త్రీవిభూతియు విలో
కింపం గలుగు నని పలికిన వానరస్త్రీ లందఱుఁ దారచేత ననుజ్ఞాత లై చతుర్వి
ధాలంకారంబులం గైసేసి తారాసహితంబుగాఁ జనుదెంచి ప్రదక్షిణంబుఁ జేసి
పుష్పకవిమానం బారోహించిరి సుగ్రీవుండు సర్వవానరసహితంబుగా నారో
హించె నంత నద్దివ్యవిమానంబు గగనంబున కెగసి రామునియభిమతప్రకారం
బునం జనుచుండె నప్పు డారఘుపుంగవుండు జానకి నవలోకించి వెండియు
ని ట్లనియె.
| 3082
|
| చ. |
చకితమృగాక్షి మ్రోల నొకశైలము గంటివె ఋశ్యమూకనా
మక మది సర్వధాతుగణమండితమై చపలాయుతాంబుదం
బుకరణి నొప్పుచున్నది నభోమణిపుత్రునితోడ వహ్నిసా
క్షికముగ నిచ్చటం జెలిమిఁ జేసి తదగ్రజుఁ జంపఁ బూనితిన్.
| 3083
|
| మ. |
పరికింపం దగుఁ జిత్రకాననము పంపానానదీవ్యత్సరో
వర మిచ్చోట నినుం దలంచుకొని దుర్వారోగ్రకామవ్యధా
తురత న్మిక్కిలి గాసిఁ జెందితి రహిన్ దోడ్తోడ నీపద్మినీ
వరతీరాశ్రమభూమియందు శబరి న్వామాక్షి వీక్షించితిన్.
| 3084
|
| ఆ. |
రాజవదన యిచట యోజనాయత బాహుఁ, డధికఘోరరూపుఁ డగుకబంధుఁ
డస్మదీయకరగతాసిచే ఖండిత, హస్తపాదుఁ డగుచు నవనిఁ బడియె.
| 3085
|
| తే. |
వనజనేత్ర జటాయునివాసభూత, మైనన్యగ్రోధపాదప మదియె చూడు
మిచట నీకొఱ కాపతగేశ్వరునకు, రావణునకును ఘోరసంగ్రామ మయ్యె.
| 3086
|
| క. |
జానకి చూడు మిది జన, స్థానం బిచ్చటనే గాదె తప్పక యనిలో
దానవవరులు ఖరాదులు, మానక మత్సాయకముల మడిసిరి వరుసన్.
| 3087
|
| సీ. |
ఇది మనయాశ్రమం బిందీవరేక్షణ యిది గౌతమీనది యేణనయన
యిదిపర్ణశాల రాకేందునిభానన యసురుఁ డిచ్చోట నీ న్నపహరించె
నిది యగస్త్యాశ్రమ మిభరాజనిభయాన యిదియె మందాకిని హేమగాత్రి
యిది సుతీక్ష్ణాశ్రమ మిది శరభంగునియాశ్రమపదము పద్మాయతాక్షి
|
|
| తే. |
యిచటఁ జూపట్టె మనకు సురేశ్వరుండు
దండిమైఁ దాపసాశ్రమమండల మిదె
పరఁగఁ గులపతి మనకుఁ జూపట్టె నిచట
నెలఁత యిచట విరాధుండు నిహతుఁ డయ్యె.
| 3088
|
| తే. |
ఇచట ననసూయ నీకు సందృష్ట యయ్యె
నిదియె చిత్రకూటాఖ్యమహీధరంబు
ప్రీతి నిచటికి నన్నుఁ బ్రార్థించుకొఱకు
భరతుఁడు చమూసమేతుఁ డై యరుగుదెంచె.
| 3089
|
| సీ. |
అలివేణి కంటె దవ్వులఁ జిత్రకాననశోభితతట యైనసూర్యసుతను
బద్మాక్షి గనుఁగొంటె బ్రహ్మలోకసమాన మగుభరద్వాజునియాశ్రమంబు
భామిని చూచితె పావనజీవనవిలసిత యగుజాహ్నవీస్రవంతి
కళ్యాణి యవ్వలఁ గనుఁగొంటివె నిషాదవిభుఁ డున్నయలశృంగిబేరపురము
|
|
| తే. |
సంప్రపుష్పితతరుసహస్రప్రకీర్ణ
యూపమాలిని యగుసరయూస్రవంతి
వరుస వీక్షింపు మదియె యిక్ష్వాకురాజ
ధాని యై యొప్పు మనయయోధ్యాపురంబు.
| 3090
|
| క. |
సేమమున మరల నిచటికి, గోమలి వచ్చితి వయోధ్యకుఁ బ్రణామంబు
న్బ్రేమ నొనరింపు నీ వన, భూమితనయ భక్తి మెఱయ మ్రొక్కె న్బురికిన్.
| 3091
|
| చ. |
అపుడు సమస్తకీశులు నిశాటవిభుండు విభీషణుండు నా
కపివిభుఁ డఱ్ఱు లెత్తి కుతుకంబున హేమవిశాలకక్ష్యల
న్విపులగజాశ్వపంక్తుల వినిర్మలపాండురహర్మ్యపాళి నిం
ద్రపురివిధంబునం దనరుదాని నయోధ్యను జూచి రింపుగన్.
| 3092
|
| తే. |
అంతలోన భరద్వాజునాశ్రమాంతి, కమున కద్దివ్యయానంబు కడురయమున
నరుగుటయు రాముఁ డల్లన నచట డిగ్గి, గాఢభక్తి నమ్మునినాథుపాలి కరిగి.
| 3093
|
రాముఁడు భరద్వాజమహర్షి సందర్శించుట
| వ. |
ఇవ్విధంబున నారఘుసత్తముండు పదునాలవవత్సరంబు సంపూర్ణం బగుచుండఁ
జైత్రశుక్లపక్షపంచమీదివసంబున భరద్వాజాశ్రమంబుఁ జేరి నియతుం డై
సముచితంబుగా నమ్మహామునిని సందర్శించి యభివందనంబు గావించి వినయం
బున నీ ట్లనియె.
| 3094
|
| క. |
మునివర సాకేతపురం, బనామయం బై సుభిక్ష మై యున్నదె మా
యనుజుఁడు ప్రజలం బ్రోచునె, జనములకు సుఖంబు గలదె సర్వము శుభమే.
| 3095
|
| క. |
అన విని దరహాసము మో, మున కెంతయుఁ జెలువొసంగ మునినాథుం డా
జనకతనయామనోహరుఁ, గనుఁగొని యిట్లనియె ముదము గడలుకొనంగన్.
| 3096
|
| తే. |
పాదుకాన్యస్తరాజ్యుఁడై పంకదిగ్ధ
వృషముచందానఁ దాపసవేషుఁ డగుచు
యుష్మదాగమనము గోరుచున్నవాఁడు
భరతుఁ డఖిలంబు శుభము మందిరమునందు.
| 3097
|
| సీ. |
వదలక కైకయీవాక్యచోదితుఁడ వై కరమర్థిఁ బితృవాక్యకరణరూప
ధర్మం బనుష్ఠింపఁ దలకొని రాజ్యంబు సర్వభోగంబులు సకలసుఖము
సకలజనానురంజన మైననగరంబు విడిచి వల్కలములు జడలుఁ దాల్చి
పరఁగఁ బదాతి వై ఫలమూలభోక్త వై విపినంబునకుఁ జనువేళ నిన్నుఁ
|
|
| ఆ. |
జూచి యేను జాల శోకించితి మహాత్మ, యిపుడు బంధుగణసహితుని విజిత
వైరి నాత్తమిత్రవర్లు సమృద్ధార్థుఁ, గాంచినంత ముదము గలిగె నాకు.
| 3098
|
| వ. |
వత్సా నీదుసుఖదుఃఖంబు సర్వంబు నాకు విదితం బయ్యె నీవు విరాధునిం జంపు
టయు జనస్థాననివాసు లై రాక్షసుల నందఱ వధించుటయు బ్రాహ్మణార్థంబునందు
నియుక్తుండ వై తాపసరక్షాదీక్ష వహించి పంచవటియందు నివసించియుండు
నప్పుడు భవనోన్మనోహారిణి యైనయీసీతను రావణుండు ముచ్చిలించి గొని
పోవుటయు మారీచదర్శనంబును గబంధదర్శనంబును బంపాభిగమనంబును సుగ్రీ
వసఖ్యంబును వాలివధంబును వైదేహీపరిమార్గణంబును హనుమంతునిసముద్ర
లంఘనాదికార్యంబును నలసేతుబంధంబును లంకావరోధంబును బుత్రమిత్ర
బాంధవామాత్యబలవాహనసహితంబుగా రావణుండు రణంబున నీచేత నిహ
తుం డగుటయు సర్వదేవతాసమాగమంబును దేవతావరప్రదానంబును మొద
లుగాఁ గలకార్యంబు లన్నియుఁ దపోలబ్ధవిజ్ఞానంబున నెఱింగి యున్నవాఁడ
నీ కభీష్టం బైనవరం బొసంగెద వేఁడుము మద్దత్తం బైనయతిథిసత్కారంబుఁ
బ్రతిగ్రహించి రేపకడ సాకేతపురంబునకుఁ జను మని పలికిన నారఘుసత్త
ముండు భరద్వాజునివాక్యంబు శిరంబునం బ్రతిగ్రహించి సంహృష్టుం డై
యమ్మహాత్మున కిట్లనియె.
| 3099
|
భరద్వాజుండు రామునకు వరం బొసంగుట
| సీ. |
మునినాథ సాకేతపురమార్గమున సర్వపాదపంబు లకాలఫలము లగుచు
మధువులు గురియుచు మహితసుధాకల్పవివిధఫలంబులు విస్తరిల్లి
వఱలునట్లుగ మీరు కరుణింపుఁడనిన నయ్యనఘుఁ డట్లగుఁ గాక యనుచుఁ బలుక
పాదపంబులు స్వర్గపాదపనిభము లై ఘనమధుస్రవము లై కరము శుష్క
|
|
| తే. |
వృక్షములు పత్రయుతము లై విఫలనగము
లమృతకల్పఫలాఢ్యంబు లై విపుష్ప
తరువులు సుమాన్వితంబు లై వరుస నపుడు
మూఁడుయోజనముల నేలఁ జూడ నయ్యె.
| 3100
|
| చ. |
ముదము దలిర్ప నాప్లవగముఖ్యులు మౌనితపఃప్రభావము
|
|
| |
ల్వదలక పెక్కుచందములఁ బ్రస్తుతి సేయుచుఁ గాంక్ష, దీరఁ ద
న్మృదుఫలము ల్భుజించి యెలమి న్విరితేనెలు ద్రావి బల్విడిం
ద్రిదశవిభుత్వ మబ్బినగతిం గడువేడ్కఁ జెలంగి రత్తఱిన్.
| 3101
|
| వ. |
అంత నారామచంద్రుండు దూరంబున నయోధ్యాపురంబు విలోకించి ప్రియ
కాముం డై ప్రియం బైనకర్తవ్యకార్యంబు విచారించి నిశ్చయించి హను
మంతు రావించి యిట్లనియె.
| 3102
|
రాముండు తనరాక భరతునకుం దెల్ప హనుమంతునిం బంపుట
| ఉ. |
మత్సందేశముఁ బ్రీతితోఁ దెలిపి భామారత్నము న్జానకిం
దత్సందేశముఁ జెప్పి న న్నలభిషగ్దానంబుచే లక్ష్మణు
న్వాత్సల్యంబునఁ బ్రోచినట్టిధిషణావంతుండ వీ వన్నిట
న్వత్సా నీసముఁ డైనదాత గలఁడే వర్ణింప మా కెందునన్.
| 3103
|
| చ. |
భరతుఁడు భ్రాతృవత్సలుఁడు పాయక నే నిట వచ్చునప్డు మ
త్పురమున కర్థి న న్మరలఁ దోడ్కొని పోవఁగఁ జిత్రకూటభూ
ధరమున కేగుదెంచి వితతంబుగ వేఁడి మదీయచిత్తము
న్గరఁగక యున్నఁ బాదుకలు గైకొని గ్రమ్మఱ వీటి కేగుచున్.
| 3104
|
| చ. |
అఱమఱ లేక చెప్పెద మహాత్మ చతుర్దశవత్సరాంతవా
సరమున నీముఖాంబుజము సమ్మతి మీఱఁగ జూడ నేని ని
ష్ఠురగతి వహ్నిమధ్యమునఁ జొచ్చెద నంచుఁ బ్రతిజ్ఞఁ జేసి నాఁ
డరిగె మహానుభావుఁ డతఁ డంతయుఁ జేసెడువాఁడు గావునన్.
| 3105
|
| ఉ. |
ప్రాకటశక్తి నబ్భరతుపాలికి నీ విపు డేగి వేడ్క మా
రాక యెఱుంగఁ జెప్పి సుకరంబుగ నాతనిఁ బ్రోచి పిమ్మటన్
మాకుశలప్రదానమున మాతలఁ దక్కినవారి నెల్ల న
స్తోకముదబ్ధిఁ దేల్చి పరితుష్టుఁడ వై చనుదెమ్ము చెచ్చెరన్.
| 3106
|
| చ. |
నలువుగ శృంగిబేరపురనాథు నిషాదపతి న్గుహు న్గుణో
జ్జ్వలుఁ గని నాదుకౌశలము సమ్మతి నేర్పడఁ దెల్పి యవ్వలం
దలఁగ కయోధ్యకుం జని ధృతవ్రతుని న్భరతుం గుమారు న
త్యలఘుచరిత్రుఁ గాంచి వినయంబున మత్కుశలంబుఁ దెల్పుమా.
| 3107
|
| సీ. |
బలవంతుఁ డైనయాఖలుఁడు దశాస్యుండు దండకారణ్యమధ్యమున నుండి
జనకజ మ్రుచ్చిలి గొనిపోవుటయుఁ గపివిభునితో మైత్రిఁ గావించుటయును
వాలి నొక్కమ్మునఁ గూల నేయుటయును వెలఁదుక వెదుకంగ విపినచరులఁ
బంపుటయును గీశబలసహితంబుగా వారిధితీరంబుఁ జేరుటయును
|
|
| తే. |
జలధి ప్రార్థించుటయు నతం డలరి దివ్య
రూపధారి యై వెసఁ బొడసూపి కాన
|
|
| |
లిచ్చి సదుపాయ మెఱిఁగించి యేగుటయును
గడలిపై సేతువు నలుండు గట్టుటయును.
| 3109
|
| చ. |
తొలఁగక సేతుమార్గమునఁ దోయధి వ్రేల్మిడి దాఁటి రావణుం
గలన వధించి జానకిని గ్రమ్మఱఁ గైకొని యక్షశూలభృ
జ్జ్వలరుహగర్భపాశధరశక్తులచేత వరంబు నొందుట
ల్కలుషవిదూరు మజ్జనకుఁ గాంచుటయు న్గృతకార్యసిద్ధియున్.
| 3110
|
| మ. |
ధరణీపుత్రియు లక్ష్మణుం డనుజుఁడున్ దైత్యాన్వయశ్రేష్ఠుఁడు
న్వరుసం గొల్వ ననంతవానరచమూవారాభియుక్తుండ నై
యరు దౌపుష్పక మెక్కి బల్విడి సమృద్ధార్థుండ నై వచ్చుట
ల్గర మర్థి న్వినిపింపు సర్వమును నీకన్నంత విన్నంతయున్.
| 3111
|
| సీ. |
మారుతసుత నీవు మారాక ప్రీతితో నెఱిఁగింప విని కైకయీసుతుండు
ఖేదంబు నొందునో మోదంబు నొందునో యతినియాకారంబు నతనిభావ
మతనివృత్తాంతంబు నతనియింగితములు నతనిసంభాషణం బతనిబుద్ధి
యతనియాననవర్ణ మాతనివ్యవసాయ మతిసూక్ష్మబుద్ధిచే నంత యెఱిఁగి
|
|
| తే. |
సత్వరంబుగఁ జనుదెమ్ము సర్వకామ, ఫలదము రథాశ్వహస్తిసంకులము పితృపి
తామహసమాగతం బైనధరణిరాజ్య, మెవ్వనిమనంబు దగ హరియింపకుండు.
| 3112
|
| క. |
చిరకాలపరిచయంబున, నిరవుగ రాజ్యార్థి యయ్యెనేనియు వినుమా
భరతున కొసఁగెద రాజ్యము, కర మరుదుగ నతఁ యేలుఁగాక ధరిత్రిన్.
| 3113
|
| ఉ. |
నా విని ధీరుఁ డాపవననందనుఁ డెంతయుఁ బొంగి చారునా
నావిధరూపధారణమున న్గడు దక్షుఁడు గాన నేర్పున
న్వావిరి సంశయార్హ మగువానరరూపము మాని యింపుసొం
పావహిల న్మనోజ్ఞమనుజాకృతిఁ గైకొని సమ్మదంబునన్.
| 3114
|
| చ. |
గరిమ నయోధ్య కేగ సమకట్టి భుజంగమభక్ష్యులుబ్ధుఁ డౌ
గరుడునికైవడి న్జవము గైగొని గ్రక్కున దాఁటె దేవకి
న్నరమునియక్షసిద్ధవసునాగనభోగపతత్రిసాధ్యకిం
పురుషవిహారదేశ మగుభూరిఘునాభివృతాభ్రవీథికిన్.
| 3115
|
| వ. |
ఇట్లు గగనంబున కుద్గమించె.
| 3116
|
| చ. |
రయమున నేగుచుం గనియె రమ్యఫలాశఫలప్రసూనసం
చయభరితాంబరోల్లిఖితచారువిశాలరసాలవృక్షసం
ఘయుతవనంబులుం ద్రిపథగాయమునానదిమధ్యసంస్థితా
క్షయమునిమందిరంబులును గైరికధాతువిచిత్రితాద్రులన్.
| 3117
|
హనుమంతుండు శృంగిబేరపురమందు గుహునకు రామాగమనం బెఱింగించుట
| క. |
అంగజహరుఁ డల శైలసు, తుం గూడిననాఁటిసొంపు దాల్చి యలరునా
గంగాయమునాతటినీ, సంగమవిషయంబు గనుచుఁ జని చని యవలన్.
| 3118
|
| ఉ. |
రంగదభంగమంగళతరంగపరంపరల న్నభశ్చర
ద్గంగను సంస్పృశించెడువిధంబున నొప్పెడులోకపావని
న్గంగను సాంద్రహర్ష మెసఁగం గని యానది నుత్తరించి యా
ముంగలిశృంగిబేరపురము న్గని సంగతి మీఱ నచ్చటన్.
| 3119
|
| ఉ. |
ఆజగదేకవీరుఁడు మహాత్ముఁడు వాయుకుమారుఁ డాగుహు
న్రాజితసత్వశాలిఁ గని రామకథాకథనప్రభూతము
ద్రాజితవక్త్రుఁ డై ఘనుఁడు రాముఁడు నీప్రియమిత్రుఁ డాభర
ద్వాజునియాశ్రమంబునకు వచ్చెఁ బ్రియానుజసంయుతంబుగన్.
| 3120
|
| ఉ. |
పంచమినాఁటిరాత్రి నరపాలశిఖామణి రాముఁ డచ్చటం
గొంచక నిద్రఁ జేసి మునికుంజరుచేత ననుజ్ఞ గాంచి య
భ్యంచితరీతి రేపకడ నంపక మై వెస రాఁ గలండు నీ
వించుకసేపులోనఁ దగ నిచ్చటఁ జూచెద వాదయానిధిన్.
| 3121
|
| వ. |
అని పలికి సకలజగదానందకారి యగురామభద్రుని ప్రత్యాగమనంబు నాచేతఁ
గథితం బయ్యె నని సంప్రహృష్టతనూరుహుం డై మహాతేజుం డగువాయునం
దనుండు వేగవంతుం డై మార్గశ్రమంబు విచారింపక మహావేగంబున నాకా
శంబున కెగసి వాయుమార్గంబునం బోవుచు.
| 3122
|
| మ. |
కనియె న్ముందట రామతీర్థము నపంకన్ స్యాందికాఖ్యాపగ
న్గనదంభోరుహషండమండలయుతాఖండద్యుతి న్గోమతి
న్వినుతస్వచ్ఛసుశీతలోదకయుత న్వేదశ్రుతి న్నిమ్నగ
న్ఘనవేదండనిపీతతోయతమసాకల్లోలినీరత్నమున్.
| 3123
|
| క. |
ధనధాన్యోపేతంబులు, జనయుతములు సకలసస్యసంపన్నంబు
ల్వనరాజిరంజితంబులు, జనపదములు చూచికొనుచుఁ జనియె లఘుగతిన్.
| 3124
|
| చ. |
నిరుపమభర్మనిర్మితవినిర్మలశర్మదరమ్యహర్మ్యము
ల్వరశుకశారికాపికరవస్ఫురితోరుమహావనంబులు
న్సురుచిరహేమరత్నరుచిశోభితసాలములు న్గభీరసా
గరనిభఖేయము ల్గలిగి కాలునయోధ్యను గాంచె దవ్వులన్.
| 3125
|
| వ. |
ఇట్లు విలోకించి యమ్మహారాజధానికిఁ గ్రోశమాత్రదూరంబున.
| 3126
|
| క. |
ఆమారుతపుత్రుఁడు మణి, ధామరుచివితానరంజితస్ఫుటవీథీ
స్తోమ మగుదాని నంది, గ్రామంబును గని తదంతికంబున నొకచోన్.
| 3127
|
| సీ. |
సమదకోకిలకీరశారికామధుకరబర్హిణనిస్వనబంధురంబు
రుచిరపల్లవఫలప్రచయసూనగుళుచ్ఛకళికాభిరామశాఖాచయంబు
శీతలానిలసమానీతనానావిధవ్యాకీర్ణవాసనావాసితంబు
స్ఫుటితపద్మోత్పలభూషితామృతతుల్యజీవనోపేతసరోవరంబు
|
|
| తే. |
పోషితవిచిత్రమృగరాజభూషితంబు, చమరికస్తూరికామృగసంకులంబు
|
|
| |
చైత్రరథనందనోద్యానసన్నికాశ, మగుమహోద్యాన మొకటి సొం పలరఁ గనియె.
| 3128
|
హనుమంతుఁడు భరతునిం జూచుట
| వ. |
ఇట్లు మహోద్యానంబు సొచ్చి తన్మధ్యదేశంబున.
| 3129
|
| సీ. |
జడలగుంపు ధరించి శైవాలయుతసూర్యతనయాలహరిభంగిఁ దనరువాని
నెఱిమించి పసిఁడిజన్నిదము దాల్చి తటిత్సమేతమేఘముమాడ్కి మెఱయువాని
వల్కలంబులు గట్టి వనరాజిరంజిత నీలాచలమురీతి నెగడువాని
నలు నొప్పఁ గృష్ణాజినము దాల్చి నీలాభకలితాంబరములీలఁ గ్రోలువాని
|
|
| తే. |
మౌనివేషంబు గైకొని మహితధర్మ, యుక్తి నాశ్రమవాసి యై యున్నవానిఁ
గార్శ్యమాలిన్యలక్షితకాయుఁ డైన, వాని బ్రహ్మర్షిసమతేజుఁ డైనవాని.
| 3130
|
| క. |
నిర్మలచిత్తుని నియతుని, ధర్మవిశారదునిఁ దనువుఁ దాల్చినసాక్షా
ద్ధర్మము క్రియఁ జూపట్టెడు, ధర్మాత్ముని వశిని ఋజుని దాంతుని వాగ్మిన్.
| 3131
|
| క. |
దీనుని ఫలమూలాశను, మానధనుని రామనామమంత్రజపపరు
న్ధ్యానాసక్తమనస్కుని, దీనావనచణగుణాఢ్యు ధీగుణయుక్తున్.
| 3132
|
| చ. |
అకలుషచిత్తరామచరణాంకితపావనదివ్యహేమపా
దుకలు పురస్కరించుకొని తోయధిమేఖల నేలువాని సే
వకులను నాల్గువర్ణములవారి స్వధర్మములందు నిల్పి నే
ర్పుకలిమి సంతతం బరసి ప్రోచెడువాని మహానుభావునిన్.
| 3133
|
| శా. |
కాషాయాంబరధారు లై విమలు లై కౌతూహలం బొప్ప ని
ర్దోషు ల్పౌరపురోహితు ల్సుగుణసంస్తుత్యు ల్సుమంత్రాదికా
శేషామాత్యులు చుట్ల నుండి మిగుల న్సీతేశవృత్తాంతము
న్భాషింపం దగుభంగి వారినడుమ న్బాగొప్ప నాసీనుఁ డై.
| 3134
|
| చ. |
కడిమిమెయి న్రఘూత్తముఁడు కానకుఁ బోయి చతుర్దశాబ్దము
ల్కడచనె నమ్మహాయశుఁడు గ్రమ్మఱ వచ్చెడుజాడ లేదు నే
నుడుగక యన్నమాట మది నుంచెనొ లేదొ యటంచు దీనుఁ డై
యడలుచు నున్నవాని సుగుణాభిరతు న్భరతు న్గనె న్రహిన్.
| 3135
|
| వ. |
ఇట్లు సముచితంబుగా సందర్శించి.
| 3136
|
| క. |
తక్కక రామునిరూపం, బక్కజముగ నతనిరూప మచ్చొత్తినయ
ట్లొక్కటి యై యుండుట గని, గ్రక్కున నద్భుతము ముదముఁ గడలు కొనంగన్.
| 3137
|
హనుమంతుఁడు భరతునకు రామాగమనంబు దెల్పుట
| వ. |
ప్రియవచనశీలుం డగునమ్మారుతనందనుండు నిటలతటవిన్యస్తపుటుం డై పర
మానందనంపాదకం బైనమధురవాక్యంబున ని ట్లనియె.
| 3138
|
| చ. |
అనఘచరిత్ర యెవ్వఁడు జటాజినము ల్ధరియించి దండకా
వనమున కేగె నెవ్వనివివాసనము న్దలపోసి యాత్మలోఁ
బెనువగఁ బూచి నీ విటు తపించెద వారఘురాముఁ డెంతయు
|
|
| |
న్దనకుశలంబు దెల్పు మని తప్పక నన్నిటఁ బంప వచ్చితిన్.
| 3139
|
| ఉ. |
రాముఁడు జన్యరంగమున రావణుఁ జంపి కృతార్థుఁ డై రహి
న్భూమితనూజఁ జేకొని సమున్నతవానరసైన్యయుక్తుఁ డై
కోమలమూర్తి లక్ష్మణుఁడు గొల్వ సుఖస్థితి నేగుదెంచె నా
హైమవతీకుమారయుతుఁ డైనపురారిక్రియం జెలంగుచున్.
| 3140
|
| తే. |
జంభశాసనుఁ గూడినశచివిధమునఁ
జంద్రుఁ గూడినరోహిణిచందమునను
రామచంద్రునిఁ గూడి యాభూమిపుత్రి
ముదము దీపింప వచ్చుచున్నది మహాత్మ.
| 3141
|
| క. |
ధీరోత్తమ నీ విప్పుడె, శ్రీరామునిఁ గలసి మెలసి శీఘ్రంబున నీ
దారుణశోకము విడిచెదు, వారక శుక్లాన్య మైనవస్త్రముఁ బోలెన్.
| 3142
|
| చ. |
అన విని కైకయీతనయుఁ డప్రతిమప్రమదాబ్ధివీచిక
ల్మునుకొని తన్నుఁ గప్పికొన మోహవశంబున నూరకుండి యం
త నొకముహూర్తవేళ కటుతప్పక కన్నులు విచ్చి మ్రోలఁ గ
ల్పనగముభంగి నున్నప్రియవాదిని ధీరుని వాయుపుత్రునిన్.
| 3143
|
| ఉ. |
చూచి ముదంబు నొంది పరిశుద్ధకుశాజినపీఠి నుండి వే
లేచి సుధామయోక్తుల వళీముఖవర్యు బహూకరించి హే
మాచలధీరుఁ డామనుకులాగ్రణి హస్తికరాభహస్తము
ల్సాఁచి ప్రియత్వ మేర్పడఁగఁ జయ్యనఁ గౌఁగిటఁ జేర్చి వేడుకన్.
| 3144
|
భరతుండు హనుమంతునకు బహుమతు లొసంగుట
| క. |
ఆనందబాష్పధారలఁ, దా నెంతయుఁ దడిసి పిదపఁ దరుచరవరునె
మ్మే నంతయుఁ దడుపుచు నృప, సూనుఁ డిట్లనె శిరీషసుమమృదులోక్తిన్.
| 3145
|
| క. |
జీవజగంబుననుండి మహావాత్సల్యంబు మెఱయ నరుదెంచినయా
దేవతవో మనుజుఁడవో, ధీవర నీవిధము నాకుఁ దెలియం జెపుమా.
| 3146
|
| చ. |
ప్రియమున నిట్టిసత్ప్రియము ప్రీతి దలిర్పఁగఁ జెప్పినట్టినీ
కయుతగజంబులు న్శతసహస్రహయంబులు లక్షగోవులు
న్బ్రయుతమణు ల్వరాభరణభాసితలం గులశీలసౌకుమా
ర్యయుతలఁ జంద్రవక్త్రలఁ బదార్వురఁ గన్యల హేమవర్ణలన్.
| 3147
|
| క. |
ఇచ్చెదఁ గైకొను మీ వని, యచ్చుపడం బలికి భరతుఁ డతఁడును దానుం
జెచ్చెర నాసనములపై, మచ్చికఁ గూర్చుండి ఱపు డమానుషలీలన్.
| 3148
|
| వ. |
ఇవ్విధంబున వరాసనంబులయందు సుఖాసీనులైనయనంతరంబ భ్రాతృవత్సలుం
డగుభరతుండు రామసమాగమనశ్రవణసంజాతసాంద్రానందరసపోషితసర్వాం
గుం డై వెండియు హనుమంతు నవలోకించి యిట్లనియె.
| 3149
|
| సీ. |
అనఘాత్మ మన్నాథుఁడైన రాముఁడు వనంబున కేగి పెక్కుహాయనము లయ్యె
|
|
| |
నానందకర మైనయమ్మహాత్మునిశుభవార్త నేఁ డిట్లు నీవలన వింటి
మని యున్ననరునకు మహి శతాబ్దములలో ఘనతరానందంబు గలుగు ననెడు
జనవార్త నేఁటికి సత్యార్థ మై తోఁచె విపులసమ్మోద మావిర్భవించె
|
|
| తే. |
నృపులకు వనాటులకు సఖ్య మెట్లు గలిగె
నేమి కారణమునఁ గల్గె నెందుఁ గల్గె
నంతయును బ్రీతి నెఱిఁగింపు మనినఁ బవన
తనయుఁ డవ్విభుతోడ నిట్లనుచుఁ బలికె.
| 3150
|
హనుమంతుఁడు భరతునకు రామునివృత్తాంతమంతయుం దెల్పుట
| సీ. |
నృపతి కైకకు వర మిచ్చుటయును రాముఁ డెలమిఁ గాననమున కేగుటయును
దనయశోకమున మీతండ్రి చచ్చుటయును దూతచోదితుఁడ వై తొడరి నీవు
చనుదెంచుటయును రాజ్యము గైకొనక చిత్రకూటాచలమున కేగుటయు రామ
భద్రునిఁ గడుభక్తిఁ బ్రార్థించుటయు నమ్మహాత్ముఁడు ధర్మాత్ముఁ డగుటవలన
|
|
| తే. |
రాజ్య మంగీకరింపక రా ననుటయు, వరుసఁ దత్పాదుకలు గొనివచ్చుటయును
నృపకులోత్తమ యింతయు నీకుఁ దెలిసి, యున్నదేకద యవ్వలియునికి వినుము.
| 3151
|
| చ. |
నృపకులశేఖరా పురికి నీ విటు వచ్చినపిమ్మట న్మద
ద్విపతురగోష్ట్రగోవృషభవీరవిమర్దితవృక్షషండ మై
విపులభయప్రవేగహతవిష్కిరవన్యమృగప్రకాండ మై
యపు డలచిత్రకూటవన మంతయుఁ బాడఱి యుండె నెంతయున్.
| 3152
|
| మ. |
అకలంకేందుసమానవక్త్రుఁ డగురామాధీశుఁ డచ్చోట ని
ల్వక భార్యానుజయుక్తుఁ డై భయదకోలవ్యాఘ్రవేదండశ
ల్యకభల్లూకమృగేంద్రభీషణము నుద్యత్ప్రాంశుశాఖావిసా
రికుజాతం బగుదండకావనముఁ జేరె న్బూరితేజంబునన్.
| 3153
|
| ఉ. |
ఆయడవి న్విరాధుఁడు నగాభశరీరుఁడు రాక్షసుండు నా
గాయతసత్త్వుఁ డంబుదనిభార్భటితో భయదాట్టహాసుఁ డై
డాయఁగ నేగుదెంచినఁ గడంగి నదత్కరినట్ల యమ్మహా
కాయునిఁ ద్రుంచి రాముఁడు నిఖాతమునం బడవైచె నుద్దతిన్.
| 3154
|
| క. |
ఈవిధి నద్భుతకర్మము, గావించి మహాత్ము లైనకాకుత్స్థవరు
ల్వావిరి శరభంగమునిత, పోవనమండలము సేరఁబోయిరి పెలుచన్.
| 3155
|
| వ. |
ఇట్లు సాయాహ్నసమయంబునకు శరభంగునిరమ్యాశ్రమంబు నేరం జని.
| 3156
|
| క. |
ఆమునిచేఁ బూజితులై, భూమద్యుతు లతఁడు దివికిఁ బోయినపిదప
న్భూమీశసుత సుతీక్ష్ణమ, హామునిరమ్యాశ్రమమున కరిగిరి వరుసన్.
| 3157
|
| ఉ. |
ఆజటివర్యుఁ డిచ్చినమహాపచితిం గొని యవ్వనంబులో
రాజిలుచున్న సర్వమునిరాజులఁ గాంచి నమస్కరించుచు
న్దేజ మెలర్పఁ గుంభభవదివ్యమునీంద్రునిపాలి కేగి త
|
|
| |
త్పూజనము ల్గ్రహించి నరపుంగవు లెంతయు హృష్టచిత్తులై.
| 3158
|
| తే. |
ఆయగస్త్యునివలన దివ్యాయుధములు, వడసి గౌతమీనదిచెంత వఱలుపంచ
వటి ప్రవేశించి మువ్వు రచ్చట వసించి, యుండిరి పలాశశాలలో నుత్సుకముగ.
| 3159
|
| ఉ. |
అంతట నొక్కనాఁ డొకమహాసురి శూర్పణఖాఖ్య వచ్చి తా
నెంతయుఁ గ్రుద్ధ యై వెస మహీతనయం గబళింపఁ బోయినం
బంత మెలర్ప లక్ష్మణుఁడు భ్రాతృనియోగమున న్శితాసిచే
వింతగ దానినాసికయు వీనులు గోలి విరూపఁ జేసినన్.
| 3160
|
| మ. |
అలుక న్దానవి ఘోరనాదమున నాహాకారముం జేయుచు
న్జల మొప్ప న్వడిఁ బాఱి యచ్చట జనస్థానంబునం దున్నదో
ర్బలశాలి న్ఖరనామరాక్షమని శుంభద్విక్రమాటోపుని
న్బలనంయుక్తునిఁ జేసి దారుణగతిం బంపె రణార్థం బొగిన్.
| 3161
|
| చ. |
అసమున రాముఁ డొక్కఁడు మహాశనితుల్యశిలీముఖంబుల
న్వెస నిగిడించి యాభువనవిశ్రుతులం బదునాల్గువేలర
క్కసుల భుజబలాధికులఁ గల్మషుల న్మఖవిఘ్నకారులం
గసిమసి చేసె నొక్కత్రుటికాలములోన మహాద్భుతంబుగన్.
| 3162
|
| ఉ. |
దానవవంశవర్యు నతిదర్పితు దూషణు వైరిదూషణు
న్దోన నమోఘవీర్యు నరిదుర్దము రాక్షసశేఖరు న్ఖరున్
జ్యానినదప్రకంపితమహాద్రిశిరుం ద్రిశిరుం దగం జన
స్థాననివాసులం దునిమె దారుణభంగి ఘనాంబకంబులన్.
| 3163
|
| వ. |
ఇవ్విధంబున నర్ధాధికముహూర్తమాత్రంబున కద్దోషాచరుల నందఱ నిశ్శేషం
బుగా రూపుమాపిన.
| 3164
|
| ఉ. |
ఆవిధ మంత గన్గొని రయంబున రాక్షసి లంక కేగి ర
క్షోవిభుఁ డైనరావణునకుం దగఁ జెప్పిన వాఁ డమర్షి యై
పావకుకైవడిం గనలి పాపమనస్కునిఁ దాటకేయుని
న్దేవవిరోధినిం బనిచెఁ దెంపు మెయి న్వెస వారియొద్దకున్.
| 3165
|
| ఉ. |
వాఁ డటు రత్నచిత్రితసువర్ణమృగాకృతి నొంది బల్విడి
న్వేడుకతోడ నవ్విపినవీథిఁ జరించుచు దేవిచిత్తము
న్దోడ హరించిన న్బ్రమసి తొయ్యలి రామునిఁ జూచి యీమెకం
బేడది నామనంబు హరియించెడుఁ గంటివె నీవు ముంగలన్.
| 3166
|
| శా. |
ఆహా యెంతవిచిత్ర మీమృగము నుద్యత్ప్రీతితోఁ బట్టి తె
మ్మూహింప న్మనయాశ్రమాభరణమై యొప్పారు నంచు న్సము
త్సాహం బేర్పడఁ బల్కిన న్విభుఁడు కాంతాప్రేరితుం డై సుస
న్నాహం బొప్పఁగ నేగె నమ్మెకమువెంట న్సద్దనుష్పాణి యై.
| 3167
|
| శా. |
ఈచందంబునఁ బోయి రాముఁడు రయం బేపార దాని న్బల
ప్రాచుర్యంబునఁ బట్టలేక కడుదూరం బేగ దోషాటమా
యాచాతుర్య మటంచు నెంచి పటుశౌర్యస్ఫూర్తి శోభిల్ల మా
రీచు న్నీచుని ఘోరకాండమున ధాత్రిం గూల్చె నత్యుద్ధతిన్.
| 3168
|
| క. |
ఆతాటకాసుతుం డీ, రీతి శరాలీఢుఁ డై ధరిత్రిం బడి హా
సీతా హా లక్ష్మణ యని, యాతతముగఁ బేరుకొనుచు ననువులు విడిచెన్.
| 3169
|
| క. |
ఆనినదము విని యప్పుడె, జానకిపనుపునఁ బ్రతాపసాంద్రుండు సుమి
త్రానందనుండు కౌసల్యానందనుసేమ మరయ నరిగెం బెలుచన్.
| 3170
|
| శా. |
ఆలో రావణుఁ డేగుదెంచి కుటిలుం డై భౌముఁ డారోహిణిం
బోలెన్ జానకి బల్మిఁ గైకొని జగంబు ల్మ్రోయఁ దద్రక్షణా
లోలు న్వృద్ధు జటాయువు న్విహగపాలుం ద్రుంచి మింటం జనెన్
శైలాగ్రంబున నుండి యేవురు కపుల్ సంభ్రాంతు లై చూడఁగన్.
| 3171
|
| శా. |
ఈరీతిం జని లంక సొచ్చి దనుజాధీశుండు హేమాచలా
కారాగారమునందు డించి మృదువాక్యప్రాణిఁ బ్రార్థించి దు
ర్వారప్రోద్ధతిఁ ద న్గణింపక తృణప్రాయంబుగా నెంచి న
న్నైరాశ్యంబున దాఁచె నిష్కుటమున న్నారీశిరోరత్నమున్.
| 3172
|
| ఉ. |
రామనరేంద్రుఁ డీగతి నరణ్యమునం బటురౌద్రభంగి మా
యామృగరూపధారిని నిశాటుని గీ టణఁగించి వచ్చి సు
త్రామసమానుఁ డాశ్రమపదంబున జానకిఁ గాన కెంతయు
న్భీమతరప్రశోకపరిపీడితుఁ డై యనుజాన్వితంబుగన్.
| 3173
|
| ఉ. |
ఆవిపినంబునం గలమహాద్రుమము ల్నగము ల్నికుంజము
ల్పావనగౌతమీనదియుఁ బద్మనిబద్ధజలాశయంబులు
న్భూవరుఁ డన్నియు న్వెదకి భూమిజఁ గానక శోకదీనుఁ డై
వావిరి మేదినిం బడినవాని జటాయువుఁ గాంచె నొక్కచోన్.
| 3174
|
| క. |
అతఁడు పితృసఖుఁడు గావునఁ జతురత సంస్కారవిధులు సలిపి మిగుల శా
శ్వతసౌఖ్య మొసఁగి యనుజా, న్వితుఁ డై యద్దేవి నడవి వెదకుచుఁ గడఁకన్.
| 3175
|
| చ. |
చనిచని యొక్కచో నమితసత్త్వు మహావికృతాంగునిం గబం
ధునిఁ గని వానిఁ జంపుటయుఁ దోడనె దివ్యశరీర మప్డు గై
కొని యతఁ డింద్రలోకమునకు న్జనుచు న్దగ ఋశ్యమూకమం
దనువుగ నున్నభానుసుతు నర్థిఁ గనం జను మంచుఁ బల్కినన్.
| 3176
|
| వ. |
మహాత్మా రామభద్రుండు కబంధోపదిష్టమార్గంబునఁ బంపాపుష్కరిణి నధిగ
మించి యందున్నశబరిచేత నర్చితుం డై విశాలసాలజాలం బైనఋశ్యమూక
శైలంబునకుం జని వానరాధిపుం డైనసుగ్రీవునితో సఖ్యంబు గాంచె నంతకు
మున్నె బలవంతుం డైనవాలిచేత నిరస్తుం డైనసుగ్రీవుండును సీతావియోగ
|
|
| |
దుఃఖితుం డగురాముండును సమానావస్థలు గలవా రగుటం జేసి మనంబునఁ
బరస్పరసంబంధంబు గాంక్షించుచున్నవారు కావున నయ్యిరువుర కితరేతర
సంవాదంబున గాఢం బైనప్రణయంబు గలిగె నంత.
| 3177
|
| క. |
బలవంతుఁ డైనవాలిని, బలసూదనసుతుని నొక్కపటుబాణముచే
నిలఁ గూల నేసి రవిజున, కెలమిం గపిరాజ్య మిచ్చెఁ గృప దళుకొత్తన్.
| 3178
|
| ఉ. |
రామునిసత్కృపం బ్లవగరాజ్యము నొంది కృతార్థుఁ డై రహి
న్ధామనిధిప్రియాత్మజుఁడు దాశరథిప్రియపత్ని యైనయా
భూమికుమారిక న్వెదకఁబుచ్చె ననేకసహస్రకీశులం
గామశరీరుల న్గిరినికాశుల మారుతతుల్యవేగులన్.
| 3179
|
| వ. |
ఇట్లు సుగ్రీవప్రేరితు లై దశకోటివానరులు సీతామార్గణవ్యగ్రు లై నలుదెస
లకుం జని రేను వారిలోఁ గొందఱ వానరులం గూడి దక్షిణదిక్కునకుం జని
వింధ్యమహీధరప్రాంతకాంతారసుందరకందరసానుకటకాధిత్యకలయందు వైదే
హిన న్వేషించి యెందునుం గానక ముత్పిపాసాపరవశుల మై యొక్కబిలంబులో
నికి డిగ్గి మరలి వెడలుతెఱం గెఱుంగక పరిభ్రమించుచుండ మాకుఁ గొండొక
కాలం బతిక్రమించె నంత నొక్కయోగినిమహిమంబున నమ్మహాబిలంబు వెడలి
వచ్చి సుగ్రీవభయభ్రాంతుల మై యొక్కచోటఁ బ్రాయోపవేశనంబుఁ జేసి
యుండ నప్పుడు జటాయువు నన్న యగుసంపాతి యనువాఁడు మాకడకుం జను
దెంచి లంకాపురంబునం గల రావణునియశోకవనంబులో జానకి యున్నదని చెప్పి
యరిగిన యనంతరంబ ప్రాయోపవేశనంబు చాలించి.
| 3180
|
| ఉ. |
ఏ నొకరుండ వానరులకెల్లఁ బ్రియంబుగ నాత్మవీర్యము
న్మానుగఁ దాల్చి మారుతసమానజవంబునఁ బన్నగారిచం
దాన విహాయసంబునకు దాఁటి వెన న్శతయోజనంబు లం
భోనిధి నుత్తరించి యటు వోయి త్రికూటనగాగ్రమండలిన్.
| 3181
|
| చ. |
అతులితహేమసౌధముల నంచితరత్నవిశాలశాలల
న్వితతవిమానరాజముల విశ్రుతకాంచనవప్రగోపుర
ప్రతతుల రమ్యచత్వరవరంబుల నొప్పుచు విశ్వకర్మని
ర్మిత మయి నాగపట్టణమురీతి వెలింగెడు లంకలోపలన్.
| 3182
|
| చ. |
అరుదుగ నయ్యశోకవనికాంతరమందు దురంతచింతచే
మురువు దొఱంగి యశ్రుకణపూరితలోచన యై కృశాంగి యై
నిరుపమశోకవేగమున నీరధిలోనఁ జలించుభారభృ
త్తరిపగిదిం జలించుచు వితాకున మాటికి వెచ్చ నూర్చుచున్.
| 3183
|
| ఆ. |
మలినపటముతోడ మాసినజడతోడ, నొప్పు దూలి గుందుచున్నదాని
రేణుజాలయుతశరీరంబు గలదానిఁ, బుణ్యసాధ్వి జనకపుత్రిఁ గాంచి.
| 3184
|
| క. |
జననాయకుఁ డిచ్చినకాం, చనముద్రిక గుఱు తొసంగి సదమలమతి మె
|
|
| |
ల్లనఁ బతిసేమం బంతయు, వినిపించితి వీను లలర వినయం బెసఁగన్.
| 3185
|
| శా. |
ఆరామామణి విశ్వసించి పతివార్తాకర్ణనోద్భూతవి
స్తారానందరసప్రబుద్ధవిలసత్సర్వాంగి యై మోము రా
కారాజచ్ఛశిభంగి సొంపలర వేడ్క న్నన్ను మన్నించి శం
కారాహిత్యముతో శిరోమణి యభిజ్ఞానార్థ మర్పించినన్.
| 3186
|
| శా. |
దానిం జేకొని యేను వేల్పు లరుదంద న్దైత్యరాడ్జీవిత
స్థానం బైనయశోకకాననము విధ్వంసంబు గావించి దై
త్యానీకంబుల నాజిరంగమున బాహాశక్తి మర్దించి ర
క్షోనాథాత్మజు నక్షునిం దునిమి సక్రోధుండ నై పిమ్మటన్.
| 3187
|
| మ. |
గరిమ న్వాలగతాగ్నిచే మిగుల లంకాపట్టణం బంతయు
న్వరుస న్భస్మము చేసి రాముమహిమ ల్వర్ణించి పేర్వాడి గ్ర
మ్మఱఁ బాథోనిధి దాఁటి రాముకడకు న్మానొప్ప నేతెంచి యా
దర మారం దగ మానికం బొసఁగి సీతాక్షేమముం దెల్పితిన్.
| 3188
|
| ఉ. |
ఆనృపవంశవర్యుఁడు ప్రియాకుశలశ్రవణాభిజాతసాం
ద్రానుసమానహర్షపులకాంచితవిగ్రహుఁ డై సుధారసం
బానినవేల్పుమాడ్కి విగతాసుభయుం డయి వీతశోకుఁ డై
మానుగ నా కొసంగె నసమానభుజాపరిరంభణం బొగిన్.
| 3189
|
| వ. |
ఇవ్విధంబున నాలింగనంబు గావించి యుద్యోగంబు సమకట్టి.
| 3190
|
| చ. |
అలిగి యుగాంతకాలమున నద్భుతభంగి జగంబు లేర్చఁగాఁ
దలకొనినట్టిపావకువిధంబున రాక్షసనాశమందు ని
శ్చలముగఁ జిత్తము న్నిలిపి సర్వవనాటచమూసమేతుఁ డై
నలకృతసేతుమార్గమున నల్వుగ నీరధి దాఁటి బల్విడిన్.
| 3191
|
| సీ. |
అనిలోన నేను ధూమ్రాక్షుఁ డాదిగ దైత్యవీరులఁ దునిమితి విక్రమమున
బలశాలి యగునీలుఁ డల ప్రహస్తునిఁ జంపె వనచరవిభుఁడు కుంభుని వధించె
వాలితనూజుండు వజ్రదంష్ట్రాదులఁ బరిమార్చె సౌమిత్రి ప్రధనమందు
నతికాయశక్రజిదాఖ్యులఁ దెగటార్చె రామభద్రుండు దుర్వారభంగిఁ
|
|
| తే. |
గలన రావణకుంభకర్ణుల వధించె, నిట్లు విజయంబు గైకొని యింపు మీఱ
నగ్నిముఖమునఁ బరిశుద్ధ యైనయవని, సుతను జేకొని రఘుపతి యతిముదమున.
| 3192
|
| చ. |
అనిమిషవల్లభుండు యముఁ డర్ణవనాథుఁడు శూలపాణియున్
వనజభవుండు దేవమునివర్గయుతంబుగ నేగుదెంచి చ
య్యన బహుభంగుల న్వినుతు లర్థి నొనర్చిన నంతవారిచే
ననుపమలీల దుర్లభము లైనవరంబులు గాంచి పిమ్మటన్.
| 3193
|
| తే. |
దేవవిష్టపమున నుండి దివ్యరూప, ధారి యై చనుదెంచినతండ్రిఁ గాంచి
ప్రస్తుతించి రణంబునఁ బడినకపుల, నెల్లఁ గ్రమ్మఱ బ్రతికించి యింపు మీఱ.
| 3194
|
| వ. |
రావణానుజుం డైనవిభీషణుని లంకారాజ్యంబున కభిషిక్తునిం జేసి సుగ్రీవవిభీ
షణజాంబవదంగదాదిసుహృత్సమేతుం డై సీతాలక్ష్మణసహితంబుగాఁ బుష్పక
నామవిమానం బారోహించి కిష్కింధాపురమార్గంబునఁ గ్రమ్మఱ భరద్వాజా
శ్రమంబునకుం జనుదెంచి మునిసన్నిధియందు వసించియున్నవాఁ డమ్మహాత్ము
నెల్లి పుష్యయోగంబున నవిఘ్నంబుగా సందర్శింపంగల వని సర్వంబును సవిస్త
రంబుగా విన్నవించిన సత్యం బైనమారుతివచనంబు విని భరతుండు పరమానం
దరసప్రబుద్ధసత్త్వుం డై యంజలి గీలించి హనుమంతు నవలోకించి యిట్లనియె.
| 3195
|
| సీ. |
పూర్వాచరితపుణ్యపుంజంబు లన్నియు ఫలియించెఁ గా నేఁడు పవనతనయ
నాకోర్కు లన్నియు నయముతో నేఁటికిఁ బూర్ణంబు లయ్యె నోపుణ్యచరిత
నేఁడు గా నా కనిందితసర్వశుభములు సమకూడె నిచ్చట సాధువినుత
నిరుపమం బైనమానితసౌమనస్యంబు నేఁడు గా సమకొనె నిర్మలాత్మ
|
|
| తే. |
రఘుకులం బంతయును నేఁడు రమణ కెక్కె
ఘనత సౌభాగ్యకీర్తులు గలిగె నేఁడు
రాజకోటికి మిక్కిలి తేజ మెసఁగెఁ
గౌసలేయుండు వచ్చినకారణమున.
| 3196
|
| వ. |
అని పలికి సత్యవిక్రముం డగుభరతుండు ప్రీతిమంతుం డై శత్రుఘ్ను నవలో
శించి పరమానందకరం బగువాక్యంబున నిట్లనియె.
| 3197
|
| మ. |
మననాథుం డగురాముఁ డిచ్చటికిఁ బ్రేమ న్వచ్చుచున్నాఁడు చ
య్యన నానాపురదేవతాయతనచైత్యాగారము ల్వీథులు
న్ఘనవాదిత్రసుగంధమాల్యముల శృంగారంబు గావింప వే
డ్క నియోగింపుము యోగ్యు లైననరులం గౌతూహలం బొప్పఁగన్.
| 3198
|
భరతునినియోగంబున రాజపురుషు లయోధ్యారాజమార్గంబుల నలంకరించుట
| వ. |
మఱియు మహానుభావుం డగురామచంద్రు నెదుర్కొనం జన వలయు స్తుతి
పురాణజ్ఞు లైససూతులును సర్వవైతాళికులును సర్వవాదిత్రకుశలులును గణిక
లును రాజపత్నులు నమాత్యులును సైన్యంబులును సేనాగణాంగనలును రాజు
న్యులును బ్రాహ్మణులును శ్రేణీముఖ్యులును దక్కినజనంబులును శశిసన్నిభం
బైనరామునివదనంబు విలోకించుటకు శీఘ్రంబునం జనుదెంచువారుగా
నియోగింపు మని పలికిన నతండు తద్వచనప్రకారంబున నయ్యైపనులకుఁ దగు
వారల నియమించి రామాగమనం బెఱింగించి ప్రయాణంబు చాటింపం బం
చిన నందుఁ గొందఱు విషమస్థలంబులు సమతలంబులు గావించిరి కొందఱు
పరిమళోపేతం బైనశీతోదకంబులు చిల్కరించిరి కొందఱు లాజపుష్పంబులు
నల్లిరి పురవరంబున రాజవీథులందుఁ బతాకాధ్వజంబులు నిలిపిరి గృహాంగణం
బులందు రంగవల్లికలు దీర్చిరి యసంబాధం బైనరాజమార్గంబు సుగంధమాల్య
|
|
| |
పుష్పపంచవర్ణరంగవల్లికల నలంకరించిరి బహిర్ద్వారంబులందు రంభాస్తంభం
బులు నాటి రంత.
| 3199
|
| తే. |
అర్థసాధకాశోకసిద్ధార్థవిజయ
మంత్రపాలకదృష్టిసుమంత్రవరజ
యంతులు యథార్హయానంబు లర్థి నొక్కి
యింపు సొంపారఁ బతిఁ జూడ నేగి రపుడు.
| 3200
|
| ఉ. |
పొందుగ మత్తనాగములు భూరికరేణువులుం దురంగము
ల్స్యందనము ల్మహోక్షములు సచ్ఛిబిక ల్శకటాదికంబు లిం
పొందఁగ నెక్కి సంతసము లొప్పెసఁగం బురిలోనఁ గల్గువా
రందఱు రామచంద్రు నపు డర్థి నెదుర్కొన నేగి రెంతయున్.
| 3201
|
| క. |
నరవిభునిపత్ను లందఱుఁ, దఱుచుగ యానంబు లెక్కి తగఁ గౌసల్యం
బరఁగ సుమిత్రాదేవిని, బురస్కరించుకొని చనిరి పుత్రులఁ జూడన్.
| 3202
|
| క. |
హరిఖురశబ్దము రథనే, మిరవము గజబృంహితంబు మేదురభేరీ
వరపటహకాహళాదిక, వరవాద్యధ్వనులు మ్రోసె వసుధ చలింపన్.
| 3203
|
భరతుఁడు సపరివారుండై రాము నెదుర్కొనం బోవుట
| వ. |
ఇత్తెఱంగున నయోధ్యానగరంబునం గలవా రందఱు రామదర్శనలాలసు లై
పరమోత్సాహంబున నంది గ్రామంబునకుం జనుదెంచి రప్పుడు భరతుండు వార
లం గలసికొని ధర్మకోవిదుండు గావున రామపాదుకలు శిరంబున నిడికొని శుక్ల
మాల్యోపశోభితం బైనపాండురచ్ఛత్రంబును హేమవిభూషితంబు లైనరాజార్హ
వాలవ్యజనంబులును బరిగ్రహించి యుపవాసకృశాంగుం డయ్యును రామాగ
మనసంజాతసాంద్రానందరసపోషితసర్వాంగుం డై చీరకృష్ణాజినాంబరధరుండై
సాక్షాద్రాజర్షియుం బోలె వెలుంగుచు బ్రాహ్మణోత్తములును శ్రేణీముఖ్యు
లును వణిజులును మాల్యమోదకహస్తు లైనమంత్రులును బ్రాసశక్తిఖడ్గహ
స్తంబు లైనవీరభటసహస్రంబులును గాంచనాపీడంబు లైనహయంబులును
శాతకుంభవిభూషితంబు లైనమదవారణంబులును బతాకావంతంబు లైనరథం
బులును సాంద్రప్రకారంబునం దనవెంట నరుగుదేర సచివసమన్వితుం డై శత్రు
ఘ్నసహితంబుగా రాము నెదుర్కొనం బోవుచుఁ బవననందనుఁ గనుంగొని
యిట్లనియె.
| 3204
|
హనుమంతుఁడు భరతునకు రాముఁడు సమీపించెనని చెప్పుట
| చ. |
వనచరవంశవర్య రఘువర్యుఁడు వచ్చెడుజాడ గాన మా
వనచరవీరు లిచ్చటికి వచ్చెడుచందము దోఁప దేమియుం
గొనకొని ధాత్రిలోఁ గపులకుం జలచిత్తము గల్గు నండ్రు నీ
వనుపమలీల జాతిగుణ మర్మిలిఁ గైకొని పల్కవే కదా.
| 3205
|
| ఉ. |
నా విని ప్రీతితోఁ బవననందనుఁ డంజలిఁ జేసి యిట్లనున్
|
|
| |
దేవ కపిత్వ మూని యిటు దెల్పినవాఁడను గాను జూడుఁ డీ
త్రోవ మహీరుహావళి మధుస్రవ మై ఫలపంక్తి గల్గి నా
నావిధనూనలీనఖగనాదిత మై యటు చూడ నయ్యెడిన్.
| 3206
|
| ఉ. |
రాజకుమార మున్ను సురరాజు వళీముఖు లున్నచోట ధా
త్రీజవితాన మాత్తమధుదివ్యఫలప్రసవప్రకాండ మై
రాజిలుచుండుఁ గా కని వరం బొసఁగె న్మఱి వెంటనే భర
ద్వాజమునీంద్రుఁ డట్టులె ముదం బలరం గృపఁ జేసె నెంతయున్.
| 3207
|
| క. |
మున్ను సబలుండ వగునీ కున్నతగతి నమ్మునీంద్రుఁ డొనరించినసం
పన్నతరాతిథ్యము విని, యున్నారము మౌనిశిష్యు లొగి నెఱిఁగింపన్.
| 3208
|
| క. |
హరిబల మప్పుడు గోమతి, తరించుచున్న దని బుద్ధి దలఁచెద విను మం
బరవీథి నిండి చెలఁగెడు, గుఱుతుగఁ బరహృష్టకీశకోలాహలమున్.
| 3209
|
| క. |
మానుగ వాలుకినీనది, వానరు లటు దాఁటి యిప్పుడు వచ్చుచు నున్నా
రోనృపసుత యతిసాంద్రం, బై నెఱసిన పాంసుజాల మదె గనుఁగొనుమా.
| 3210
|
| క. |
ఆలోకింపుము దవ్వులఁ, గాలాంబుద మాకసమునఁ గదలినమాడ్కిం
జాలఁ జలించుచు నున్నది, పాలవనము ప్లవగవాలశయచలితం బై.
| 3211
|
| సీ. |
పటుతపంబున మున్ను పరమేష్ఠి మెప్పించి ధనదుఁడు ప్రీతి నెద్దానిఁ బడసె
దారుణరణమున ధననాథుని జయించి దశకంఠదైత్యుఁ డెద్దానిఁ గొనియె
రమణీయతరదివ్యరత్నదీధితులచే నతిచిత్రమై యెద్ది యలరుచుండు
మనసునకంటె గాడ్పునకంటె ముంగల సత్వరంబుగ నెద్ది చనఁగ నొప్పుఁ
|
|
| తే. |
గామదం బెద్ది చిత్తానుగమన మెద్ది
యట్టిపుష్పక మనుదేవయాన మెక్కి
రాముఁ డరుదెంచుచున్నాఁడు రమణితోడఁ
జూడు మదె మింట శశిభంగిఁ జూడ నయ్యె.
| 3212
|
| తే. |
అని సమీరాత్మజుఁడు పల్కునంతలోన
మణిసువర్ణరోచుల నభోమండలమును
వెలుఁగఁ జేయుచు భానుమండలముకరణి
నవ్విమానోత్తమంబు డాయంగ వచ్చె.
| 3213
|
భరతుఁడు పుష్పకారూఢు లైనసీతారామలక్ష్మణులం జూచుట
| ఉ. |
రాముని లక్ష్మణు న్జనకరాజకుమారిక నవ్విభీషణు
న్ధామనిధిప్రియాత్మజునిఁ దక్కినకీశులఁ గీశపత్నులం
బ్రేమ దలిర్పఁ గన్గొని పురిం గలస్త్రీయువవృద్ధబాలకు
ల్సామజవాజియానరథజాలము డిగ్గిరి సంభ్రమంబునన్.
| 3214
|
| క. |
వారలహర్షసమీరిత, భూరినినాదంబు తూర్యములఘోషణ మ
బ్జారివిలోకనవర్ధిత, నీరధినిస్వనముభంగి నింగిఁ జెలంగెన్.
| 3215
|
| తే. |
మంత్రపాలసుమంత్రాది మంత్రివరులు
పూర్ణజైవాతృకునిఁ బోలెఁ బుణ్యచరితు
రామభద్రుని వీక్షించి ప్రమద మెసఁగ
వాహనంబులు డిగ్గిరి వరుసతోడ.
| 3216
|
| చ. |
భరతుఁడు భ్రాతృవత్సలుఁడు పాయక లక్ష్మణజానకీయుతుం
బరమపవిత్రమూర్తి నరిభంజను భానుకులాబ్ధిసోము ధ
ర్మరతుని సత్యసంధుని విమానగతు న్రఘువర్యుఁ గాంచి బం
ధురవినయంబు హర్షము కుతూహలము న్మది నుప్పతిల్లఁగన్.
| 3217
|
| చ. |
ఎదురుగ నిల్చి ఫాలమున నింపుగ నంజలిఁ జేసి నమ్రుఁ డై
త్రిదశనగాగ్రభాగమునఁ దేజము మీఱుఘనంబుమాడ్కి సొం
పొదవ విమానరాజమున నుజ్జ్వలభంగిఁ జెలంగురాముని
న్వదలనిప్రేమఁ జూచె రఘువర్యుఁడు కన్నులగర్వు దీఱఁగన్.
| 3218
|
| తే. |
వైజయంతాగ్రగతుఁ డైనవజ్రపాణి
యనువునఁ జెలంగురామభద్రునకు నుదయ
పర్వతాగ్రంబుపైఁ దోఁచుభాస్కరునకుఁ
బోలెఁ జాఁగిలి మ్రొక్కె నప్పురుషవరుఁడు.
| 3219
|
| తే. |
అంతలోఁ బుష్పకవిమాన మబ్ధినడుమ, నుండి తీర్థదేశంబున కున్నతగతి
నరుగుదెంచినపోతంబుకరణి గగన, దేశముననుండి చేర నేతెంచె నపుడు.
| 3220
|
భరతుఁడు రామునకు నమస్కరించుట
| వ. |
అంత నారామచంద్రుండు సమీపగతు లైనభరతాదులం జూచి రయంబున
మహీతలంబునకు డిగ్గు మని విమానంబున కాజ్ఞాపించిన హంసయుక్తం బైన
యమ్మహనీయవిమానంబు గగనంబున నుండి పుడమి కవతరించిన నప్పుడు సత్య
విక్రముం డగుభరతుండు సంభ్రమంబున విమానం బెక్కి రామునిసమీపంబు
నకుం జని యమ్మహాత్మునిచరణంబులు శిరంబు సోఁకం బ్రణమిల్లిన నద్దయా
ళుండు ముదితుండై చిరకాలంబునకు సంలబ్ధుం డైనభరతునిఁ గ్రుచ్చి యెత్తి
నిజోత్సంగంబున నిడికొని గాఢంబుగా నాలింగనంబుఁ జేసి యానందజనకంబు
లైనప్రియవచనంబులు గారవించె నంత భరతుండు వైదేహి కభివాదనంబు
గావించి కృతప్రణాముం డైనలక్ష్మణునిఁ బరిష్వజించి సంభావించి పదంపడి
సుగ్రీవజాంబవదంగదమైందద్వివిదనలనీలఋషభసుషేణగజగవయగవాక్షగం
ధమాదనశరభపనసవిభీషణాదుల నందఱ వేర్వేఱఁ గవుంగిలించి యాదరించిన
నవ్వానరశ్రేష్ఠు లందఱుఁ గామరూపులు గావున మానుషరూపధరు లై యా
నందవిశేషంబున భరతు నభినందించి కుశలం బడిగి రంతఁ గైకేయీసుతుండు
సుగ్రీవు నవలోకించి యిట్లనియె.
| 3221
|
| క. |
మీవంటిమిత్రు లెందును, మావారికి దొరకు టరిది మానల్వురిలో
|
|
| |
నీ వైదవవాఁడవు సు, గ్రీవా సౌహృదముచే సఖిత్వము గలుగున్.
| 3222
|
| వ. |
అని పలికి విభీషణు నవలోకించి.
| 3223
|
| క. |
రాక్షసవర రఘువర్యుఁడు, రాక్షసుల వధించి జనకరాజకుమారిన్
దక్షతఁ గైకొను టెంతయు, నక్షయభుజశక్తి నీసహాయతఁ గాదే.
| 3224
|
| వ. |
అని సాదరంబుగా నభినందించి నంత శత్రుఘ్నుండు చనుదెంచి రామలక్ష్మణు
లకు నమస్కరించి పదంపడి వైదేహికిం బ్రణమిల్లిన నక్కుమారుని గారవించిరి
తదనంతరంబ రాముండు తల్లికడకుం జని శోకకర్శిత యై యున్నయద్దేవికి
హర్షంబుఁ బుట్టించుచు వినయంబున నమస్కారంబు గావించి పదంపడి సుమి
త్రకుఁ గైకేయికిఁ దక్కినజనయిత్రుల కందఱకు వేర్వేఱ ప్రణామంబుఁ జేసి
పురోహితునిచరణంబుల కభివందనంబు గావించె నంత.
| 3225
|
| చ. |
పురజనము ల్నిటాలమునఁ బొల్పుగ నంజలిఁ జేర్చి రాఘవే
శ్వర కరుణాసముద్ర నృపచంద్ర మహాత్మ కృతవ్రతుండ వై
వరయశ మొంది సేమమున వచ్చితివే యన వారియంజలు
ల్సరసమతిం బ్రఫుల్లకమలంబులఁ బోలెఁ బరిగ్రహించుచున్.
|
|
భరతుఁడు రామపాదుకలను రామునిచరణంబులకుఁ దొడుగుట
| వ. |
వారి నందఱ నయ్యైతెఱంగుల సంభావించె నప్పుడు.
| 3226
|
| చ. |
భరతుఁడు హేమరత్నమయపాదుక లెంతయు జానకీమనో
హరుచరణంబులం దొడిగి యంజలిఁ జేసి మహానుభావ గ్ర
మ్మఱఁ బురి కేగుదెంచిననృపాలుని ని న్నిటు గాంచినందునం
బరువడి నామనోరథము పండెఁ గృతార్థుఁడ నైతి నిత్తఱిన్.
| 3227
|
| ఉ. |
నీ దగురాజ్య మిందనుక నీపృథుతేజము నాశ్రయించి మ
ర్యాదలు దప్పకుండ నయమారఁగఁ బ్రోచితి నింక దీని న
త్యాదరవృత్తిఁ జేకొను మహాత్మ పురంబు బలంబు గోష్ఠకో
శాదిక మంతయు న్దశగుణాధిక మై యలరారెఁ జూడుమా.
| 3228
|
| క. |
అని పలుక నపుడు భరతుని, వినయోక్తుల కలరి దైత్యవిభుఁడును భాస్వ
త్తనయాదికపులు కన్నుల, ననువుగ బాష్పములు నించి రతిమోదమునన్.
| 3229
|
| వ. |
అంత నారఘువర్యుండు భరతునివినయవాక్యంబుల కలరి యతనిఁ గరంబులం
దిగిచికొని యంకతలంబున నిడికొని సైన్యసమేతంబుగాఁ బుష్పకంబుతో గూడ
భరతాశ్రమంబు ప్రవేశించి యందు విమానంబు డిగ్గి దాని నవలోకించి నీవు
కుబేరునిపాలికిం జని తద్వశవర్తి వై యుండు మని యాజ్ఞాపించిన ననుత్తమం
బైనయద్దివ్యయానంబు మనోజనంబున నుత్తరాభిముఖంబుగాఁ జని ధనదాల
యంబు ప్రవేశించె విమానంబు చనినయనంతరంబ రామభద్రుండు శక్రుండు
బృహస్పతికింబో
లె స్వానురూపుం డైనవసిష్ఠున కభివందనంబు గావించి యమ్ముని
పుంగవునితోఁ గూడఁ బృథగాసనంబున నాసీనుం డయ్యె నంతఁ గైకేయ్యా
|
|
| |
నందవర్ధనుం డగుభరతుండు శిరంబున నంజలి గిలించి సత్యపరాక్రముండును
జ్యేష్ఠుండు నగురామచంద్రున కి ట్లనియె.
| 3281
|
భరతుఁడు రాజ్యంబు గైకొమ్మని రామునిం బ్రార్థించుట
| సీ. |
రఘుకులోత్తమ నీవు రాజ్యంబు విడనాడి కానకుఁ బోయినకతన నస్మ
దంబ నీచేఁ జాల నర్చిత యయ్యె ము న్నలచిత్రకూటాద్రియందు మీకుఁ
బ్రీతి నర్పించిన పృథురాజ్య మెబ్బంగి న్యాసరూపంబున నాకు దత్త
నుయ్యె నవ్విధమున నర్థిఁ గ్రమ్మఱ నీకు నిచ్చెదఁ గైకొని యేలు మిపుడు
|
|
| తే. |
జగతి నసహాయబలవదుక్షంబుచేత, విడువఁబడిన భారంబు బల్విడిఁ గిశోరి
మోవఁజాలనిచందాన నీవు దాల్పఁ, దగినమేదినీభర మేను దాల్పఁజాల.
| 3282
|
| చ. |
ఉదకరయప్రపీడితమహోన్నతసేతువుఁబోలె భిన్న మై
సిదిలము నొంది హీనదశఁ జెందిన యీమహనీయరాజ్యమున్
సదమలబుద్ధి నీ కిపు డొసంగితిఁ జేకొని ధర్మపద్ధతి
న్వదలక పౌరజానపదవర్గము సంతసమంద నేలుమీ.
| 3233
|
| ఆ. |
అశ్వగతి ఖరంబు హంసగతిని గాక, మనుసరింప లేనియట్లు నిఖిల
భువనకర్త నగుచుఁ బొగడొందు నీమార్గ, మనుసరింపఁ జాల నధిప! యేను.
| 3234
|
| సీ. |
అనఘాత్మ యంతర్గృహంబున నాటినవృక్ష మంతంతకు వృద్ధిఁ బొంది
కడుదురారోహప్రకాండ మై పుష్పించి ఫలనిచయంబుఁ జూపక విశీర్ణ
మైన ఫలాకాంక్షి యై నాటినట్టివాఁ డాతరుఫలము నె ట్లనుభవింపఁ
డయ్యె న ట్లీవు లోకానందకారి వై భక్తుల భృత్యులఁ బరమహితుల
|
|
| తే. |
మమ్ముఁ బాలింపవేని యోమాననీయ
చరిత యీయుపమానార్థ మెఱిఁగికొనఁగ
నర్హుఁడవు తండ్రిచే వినుతాతిసుగుణ
పాళియుతుఁడ వై సృజియింపఁబడుటవలన.
| 3235
|
| మ. |
పరమప్రీతి నమాత్యరాజి వొగడం బట్టాభిషిక్తుండ వై
కర మర్థి న్పృథుకాంతి లోకము వెలుంగ న్జేయుమధ్యందినో
ష్ణరుచిప్రక్రియ భూరితేజమున భాస్వల్లీల శోభిల్లుని
న్నరుదార న్జను లెల్లఁ జూచెదరు గా కత్యంతహర్షంబునన్.
| 3236
|
| చ. |
అలయక కానలో ఖగమృగారవము ల్దగ నాలకించుచున్
మెలపునఁ గూర్కుచు న్మరల మేల్కొనునట్టిశ్రమంబు వాయఁగా
విలసితతూర్యఘోషముల వేణురవంబుల భూషణస్వనం
బుల మఱి మాగధస్తుతులఁ బొల్పుగ మేల్కొను మింక రాఘవా.
| 3237
|
రాముఁడు భరతప్రార్థన నంగీకరించుట
| మ. |
స్థిర యెందాఁకఁ జలింపకుండు నల జ్యోతిశ్చక్ర మెందాఁక నం
బరవీథిం జరియించునందనుక భాస్వత్క్షీరవారాశిశం
|
|
| |
కరజైవాతృకశారదాభ్రతటినీకాండోల్లసత్కీర్తి వై
సరసాగ్రేసర సర్వరాజ్యమునకున్ స్వామిత్వముం బొందుమా.
| 3238
|
| చ. |
అని యిటు విన్నవింప విభుఁ డాభరతోక్తుల కిచ్చ మెచ్చి యా
తనిఁ గని నీవు పల్కినవిధంబున నీఘనరాజ్య మర్థిఁ గై
కొనియెద నంచుఁ బళ్కె నయకోవిదుఁ డాభరతుండు రామునిన్
ఘనమతి ని ట్లొడంబఱిచి గ్రక్కున నాసితుఁ డయ్యెఁ బీఠికన్.
| 3239
|
| వ. |
అంత శత్రుఘ్నునిపనుపున సుహస్తు లగుశ్మశ్రువర్ధకు లతినిపుణులు రామునిం బరి
వేష్టించిరి భరతుండును మహాబలుం డగులక్ష్మణుండును వానరేంద్రుం డైన
సుగ్రీవుండును రాక్షసేంద్రుం డగువిభీషణుండును సుస్నాతు లై చతుర్విధాలం
కారంబుల నలంకృతు లైరి తదనంతరంబ రాముండు విశోధితజటామండలుం
డై పరిమళసలిలంబున మజ్జనంబు గావించినప్పుడు కొందఱు నేర్పరు లగువారు
రామభద్రు నలంకరించిన.
| 3240
|
రాజపురుషులు రాము నలంకరించుట
| చ. |
హృదయగతోడురాడ్రుచు లహీనగతి న్వెలి కుబ్బెనో యన
న్సదమలచారుమౌక్తికవిశాలసరం బలరె న్లసద్వియ
న్నదిసలిలప్రవాహము ద్విధాకృత మై పడుచుండ మధ్యవ
ర్త్యుదితనభంబుమాడ్కి నపు డొప్పె నురంబు తదంతరంబునన్.
| 3241
|
| చ. |
విలసితతేజుఁ డైనరఘువీరుఁడు మేన ధరించునప్పు డు
జ్జ్వలదురుచారుమౌక్తికవిశాలమణీమయహారధారలో
పలఁ బ్రతిబింబితం బయిన భాసురలోకము కుక్షిసంగతా
ఖిలభువనాభిశంక గలిగించెఁ గనుంగొనువారి కెంతయున్.
| 3242
|
| చ. |
అరుదుగ రాఘవోల్లసదురోంబరమందు విచిత్రభూషణాం
తరగతవిస్ఫురద్బహువిధస్ఫుటరత్నము లొప్పె నత్తఱిం
దిరముగ ఋక్షపంక్తులగతిం బతకంబునఁ దాపినట్టిసుం
దరతరవజ్ర మొప్పె వితతద్యుతి నవ్విధుమండలాకృతిన్.
| 3243
|
| మ. |
పస మీఱం బరికింప నయ్యె నపు డాభాస్వత్కులాంభోధిరా
జస ముత్తుంగకటీరదేశమున రజ్యత్కంజకింజల్కవ
ర్ణసవర్ణోరుసువర్ణచేల మలవర్షాకాలమేఘంబుపై
నసమానద్యుతి నొప్పుగార్మెఱుఁగుచాయం జూడ్కి కింపారఁగన్.
| 3244
|
| తే. |
కాంచనవిచిత్రకటిసూత్రకలితుఁ డగుచు, సుందరాకారుఁ డారాజనందనుండు
చాల శోభిల్లె నప్పుడు జంభవైరి, కార్ముకపరీతనీలమేఘంబుకరణి.
| 3245
|
| ఉ. |
చారువిచిత్రదివ్యమణిజాలవినిర్మితసత్కిరీటకే
యూరవిభూషితుం డగుచు నుష్ణకరాన్వయుఁ డొప్పె నప్పు డిం
|
|
| |
పారఁగ ధాతుచిత్రితమహార్హసువర్ణమయత్రిశృంగరే
భారమణీయ మైనబలఘస్మరనీలనగంబుచాడ్పునన్.
| 3246
|
| మ. |
కమనీయోజ్జ్వలరత్నకుండలయుగాగ్రప్రోల్లసత్పద్మరా
గమణిచ్ఛాయలు గండభాగములఁ దద్గండస్థలచ్ఛాయలు
న్సమతం దన్మణులందుఁ గూడుకొని భాస్వల్లీల నారెండునుం
శ్రమ మొప్పం బరికింప నయ్యె నొకవర్ణం బైనచందంబునన్.
| 3247
|
| శా. |
సాద్విష్ణువు తాను గావున మహీజానేత సత్పుండరీ
కాక్షత్వంబును శ్రీమనోహరతయున్ హైరణ్యచేలత్వము
న్దక్షత్వంబు పితామహాతనుగురుత్వం బాత్తపద్మోల్లస
ద్వక్షంబు న్బురుషోత్తమత్వమును మోదం బొప్పఁ దాల్చె న్రహిన్.
| 3248
|
| క. |
చందనలిప్తాంగుం డై యందముగా మాల్యధారి యై కౌసల్యా
నందనుఁడు మెఱసె శారద, కందోడుపరీతనీలగగనముమాడ్కిన్.
| 3249
|
| చ. |
శిరము దివంబు నాభిగతసీమ నభంబు పదంబు లుర్వి యై
పరఁగెడునవ్విరాట్పురుషవర్యుఁడు రామవిభుండు గానఁ బ్ర
స్ఫురితకిరీటహారవరభూషణబింబితలోక మత్తఱి
న్వఱలె దివంబుచాడ్పున నభంబుతెఱంగున ధాత్రికైవడిన్.
| 3250
|
| వ. |
మఱియు నేకావళీమాణవకగుచ్ఛగుచ్ఛార్ధగోస్తనార్ధహారదేవచ్ఛందతరళకలిత
నక్షత్రమాలాపారిహార్యకటకోర్మికాముద్రికాసారసనతులాకోటిప్రముఖనిఖిల
పరిష్కారపరిష్కృతుం డై కామితఫలప్రదాయకుం డై పుష్పఫలభరితం
బైనకల్పవృక్షంబుచందంబున నందంబుగాఁ బ్రకాశించె నంత.
| 3251
|
| క. |
ఆరాజపత్ను లందఱు, గారవమున హారపటసుగంధసుమములం
జేరి మహీపుత్రి కలం, కారము గావించి రపుడు కడుహృద్యముగాన్.
| 3252
|
| తే. |
సాధుగుణశీల యైనకౌసల్య యపుడు, పుత్రలాలస గావునఁ బొలుపు మీఱఁ
జారుభూషణపటము లొసంగి కీశ, సతుల నెల్ల నలంకారయుతలఁ జేసె.
| 3253
|
| తే. |
అంత శత్రుఘ్నుపనుపున నలసుమంత్రుఁ డర్కమండలసంకాశ మైనదివ్య
కాంచనరథంబు కరిశిశుకల్పహరులఁ బూన్చి గొని తెచ్చి రామునిముందట నిడె.
| 3254
|
| వ. |
కళ్యాణగుణసాంద్రుం డైన రామచంద్రుండు సర్వాంగశోభనం బైనయమ్మహ
నీయరథంబు సముచితంబుగా నారోహించి యుదయమహీధరశిఖరాగ్రగతసహ
స్రకరునిసొంపున దివ్యవిమానాధిరూఢుం డైనసహస్రాక్షునిపోలికిఁ బుష్పక
విమానాధిగతుం డైనరాజరాజుసొబగున నభిరామదర్శనుం డై తేజరిల్లుచు
నయోధ్యాభిముఖుండై చనియె దివ్యాంబరాభరణమాల్యానులేపనాలంకృతు
లై శుభకుండలభూషితులై సుగ్రీవవిభీషణు లరిగిరి వరాభరణసంపన్నలై వానర
కాంతలు సీతాసహితంబుగా నగరసమాలోకనౌత్సుక్యంబునం జని రటము
|
|
| |
న్నయోధ్యాపురంబున రాజసచివులు పురోహితుం బురస్కరించుకొని యభిషేకో
పయోగిమంగళద్రవ్యసంపాదనార్థం బెద్ది కర్జం బని యాలోచించిరి యశోక
విజయసుమంత్రాదులు రామవృద్ధికొఱకు నగరవృద్ధికొఱకుఁ గూడుకొని యా
లోచనంబు గావించి జయార్హుం డైనరామునియభిషేకార్థం బెయ్యది కర్తవ్యంబు
దాని నంతయు మంగళపూర్వకంబుగాఁ గావింప నర్హు లని పురోహితునకుం
జెప్పి రామదర్శనలాలసులై పురంబు నిర్గమించి రామునికడకుం జనుదెంచి రిట్లు
గూడుకొనిన యశోకాదిమంత్రులం గూడి రామచంద్రుండు నక్షత్రసహితుం
డైనచంద్రుండుఁబోలె వెలుంగుచు ననంతవైభవాభిరంజితుం డై దివ్యరథం
బారోహించి సాకేతపురంబునకుం జనుసమయంబున.
| 3255
|
రాముఁడు సపరివారుఁడై యయోధ్యానగరంబు ప్రవేశించుట
| సీ. |
కమనీయగుణగణాకరుఁ డైనభరతుండు గడువేడ్క హరులపగ్గములు పట్టె
శత్రుఘ్నుఁ డప్పుడు శతశలాకం బైన తతపాండురాతపత్రము ధరించె
లక్ష్మివర్ధనుఁ డైనలక్ష్మణుం డభినవవ్యజనంబుఁ దాల్చి సొంపలర విసరె
విధునిభం బగునొండువింజామరము గొని యలవిభీషణుఁడు చెన్నార వీచె
|
|
| తే. |
నంజనాచలతుల్యశత్రుంజయాఖ్య, దంతి నెక్కి సుగ్రీవుఁ డాచెంత నరిగె
నవసహస్రనాగము లెక్కి నయ మెలర్ప, మనుజరూపంబు గైకొని చనిరి కపులు.
| 3256
|
| చ. |
ఘనతర శంఖనాదములు కాహళవేణుమృదంగవల్లకీ
స్వనములు డిండిమధ్వనులు చారుతరాంక్యవిశాలభేరికా
నినదములు న్మహాపటహనిస్వనము ల్కరతాళశబ్దముల్
మునుకొని గాఢభంగి మినుముట్టి సమున్నతి మ్రోసె నత్తఱిన్.
| 3257
|
| మ. |
అనుమానింపక యీరఘూత్తముఁడు దేవారి న్దశాస్యు న్రణం
బున మర్దించి జగత్త్రయంబునకు సమ్మోదంబు గావించె నీ
యనఘుం డెంతమహాత్ముఁ డెంతఘనుఁ డాహా యంచుఁ గీర్తించుదే
వనికాయంబులస్తోత్రము ల్మధురవాగ్వైచిత్రి మ్రోసె న్టివిన్.
| 3258
|
| ఉ. |
కాదన కీరఘూత్తముఁడు కానకుఁ బోయిననాఁటిఖేదమే
ఖేద మితండు వెండి పురికిం జనుదెంచెడు నేఁటి మోదమే
మోద మటంచు జానపదముఖ్యులు పౌరులు గూడి గాఢస
మ్మోదరసాబ్ధిఁ దేలుచు సమున్నతి రామునిఁ జూచి రయ్యెడన్.
| 3259
|
| మ. |
మఱియు న్మంత్రిపురోహితుల్ హితులు సామంతుల్ బుధుల్ సేవకుల్
గరిమ న్దివ్యరథస్తుఁ డై పురికి వేడ్క న్వచ్చురామాధిపుం
గరుణోదారునిఁ బూర్వశైలశిఖరాగ్రస్థోడురాజుంబలెన్
దెఱఁగొప్పం గనుఱెప్ప వేయక దమి న్వీక్షించి ర ట్లందఱున్.
| 3260
|
| వ. |
మఱియు సర్వాలంకారభూషిత లగుకన్యలును ధేనువులును జాతరూపాక్షత
|
|
| |
హోదకహస్తు లగుపురుషులును బ్రత్యుద్గతులై పురోభాగంబునం బోవుచుండిరి
వేదవేదాంగవిశారదు లైనవిప్రోత్తములు మంగళాశీర్వాదంబులు సేయుచు రాము
నిం బరివేష్టించి చనుచుండిరి రూపలావణ్యవతు లగువారయువతులును దాళ
స్వస్తికపాణు లగువైతాళికులును మృదంగప్రముఖనిఖిలవాదిత్రధరులును దమ
తమవిద్యావైశారద్యంబుఁ జూపుచుఁ బ్రమోదంబుతో నగ్రభాగంబునం
జనిరి చతురంగబలసమేతు లై సేనానాథులు వెనుక ముందఱ నుభయపార్శ్వం
బులం జాలుగొని పరమానందంబున నరిగిరి వందిమాగధసూతగాయకు లం
దంద స్తుతివచనంబుల నభినందించుచుఁ జనుచుండిరి కంచుకోష్ణీషధరు లగు
సౌవిదల్లులు సువర్ణవేత్రపాణు లై మ్రోల నడుచుచుండిరి యిత్తెఱంగున
రాముండు నయనాభిరాముం డై మంత్రిపురోహితసామంతసేనానాథప్రముఖ
నిఖిలజనపరివేష్టితుం డై నక్షత్రసహితుం డైనచంద్రునిభంగి వెలుంగుచు సుగ్రీ
పునిసఖ్యంబును హనుమంతునిప్రభావంబును రాక్షసులబలంబును సేతుబంధన
సముద్రలంఘనలంకాదహనరావణవధాదికార్యంబును మంత్రులకుం జెప్పి వారి
నందఱఁ బ్రమోదాశ్చర్యరసావిష్టచిత్తులం జేయుచు వానరుల మన్నించుచు
భ్రాతృసహితంబుగా సుందరమందగమనంబునం జని సముచితధ్వజపతాకం
బును సిక్తసమ్మార్జితపథంబును గ్రముకరంభాస్తంభరంగవల్యాద్యలంకృతప్రతి
గృహాంగణంబును బ్రాసాదమాలావితతంబును నాపణప్రసారితనానావిధవస్తు
సంపూర్ణవిపణిమార్గంబును హృష్టపుష్టజనాకీర్ణంబును మంగళవాద్యఘోష
సన్నాదితంబును సర్వమంగళశోభితంబును నై చంద్రోదయసమయసంవర్ధిత
మహార్ణవంబుపగిది నుప్పొంగుచున్నయయోధ్యాపురంబు ప్రవేశించి రాజమా
ర్గంబునం జనుసమయంబున.
| 3261
|
పౌరస్త్రీలు మేడలెక్కి రామునిం జూచి సంతసించుట
| చ. |
చలువలు గట్టి సంకుమదసౌరభగంధ మలంది మాల్యము
ల్చెలువుగఁ దాల్చి భూషణవిశేషములం గయిసేసి కౌతుకం
బలరఁ బురాంగన న్విలసదంఘ్రివిభూషణఘంటికాధ్వను
ల్సెలఁగఁగ మేడ లెక్కి రఘుశేఖరుఁ గన్గొని సంభ్రమంబునన్.
| 3262
|
| సీ. |
ఇతఁడె పో కాంతారగతు లైనఖరదూషణాదుల ద్రుంచిన యలఘుభుజుఁడు
ఇతఁడె పో వాలిని హింసించి కపిరాజ్య మినతనూభవున కిచ్చినఘనుండు
ఇతఁడె పో కపులచే నింపార సేతువు నబ్ధిపైఁ గట్టించినట్టిచతురుఁ
డితఁడె పో సంగరక్షితి రావణాది దుష్టాసురుల వధించినట్టిశూరుఁ
|
|
| తే. |
డితఁడె సుమ్మి లంకారాజ్య మింపుతోడ, నలవిభీషణునకు నిచ్చినట్టిమహితుఁ
డీజగన్మోహనునిరూప మింపుతోడఁ, గాంచుఁ డిప్పుడు కన్నులకర్వు దీఱ.
| 3263
|
| చ. |
తపములు పండెఁ గోరిక లుదంచితభంగిఁ జెలంగె జన్మము
ల్సఫలత నొందె భద్రములు చాలఁ జిగిర్చె సమస్తసంపద
|
|
| |
ల్విపులము లయ్యె నేఁడు రఘువీరుని రామునిఁ జూచినందునం
జపలమృగాక్షులార మనసమ్మద మెవ్వరి కైనఁ గల్గునే.
| 3264
|
| ఉ. |
భానుకులోత్తముండు మనపాలిటిభాగ్యము జానకీప్రియుం
డానలినారిభంగిఁ బ్రియమార వెలుంగుచు వచ్చుచుండ ని
మానితరాజధాని యసమానశరత్సమయప్రదీప్తరా
కానిశమాడ్కి నున్నయది కంటిరె కంటికి నింపొనర్చుచున్.
| 3265
|
| తే. |
రమణ నీలోకమిత్రునిరాకవలనఁ, బౌరజనచిత్తశోకాంధకార మణఁగె
మోముఁదమ్ముాల కొకవింతమురువు గలిగె, సాధుజనలోకతతి కబ్బె సమ్మదంబు.
| 3266
|
| ఉ. |
ఆఁకలి గొన్నవేళఁ దగ నంగిలి యెండినవేళ నెండపై
సోఁకినవేళ రోగములు సోఁకినవేళ సుధాప్రవాహము
న్వీఁక జలాశయంబు ఘననిష్కుటము న్గలితౌషధం బొగిన్
జేకుఱినట్ల యయ్యెఁ బురసీమకు నవ్విభురాక యిత్తఱిన్.
| 3267
|
| వ. |
అని పెక్కుతెఱంగులు వక్కాణించుచు నానందనముద్రలహరిం దేలియాడు
చుండి రప్పుడు.
| 3268
|
| చ. |
నిరుపమచంద్రకాంతమణినిర్మితనిర్మలహర్మ్యదర్పణాం
తరగతరామరూపములు తప్పక గన్గొని మున్ను లంకలో
దురమున యామినీచరులఁ ద్రుంచెడునప్పు డనేకరూపముల్
సరగునఁ దాల్చె నన్నది నిజం బని పల్కిరి కొంద ఱంగనల్.
| 3269
|
| ఉ. |
అతతకేతనానిలరయప్రవికంపితనూతనోల్లస
చ్చూతపలాశతోరణముఁ జూచి సమున్నతసౌధసంచర
ద్భీతమృగాక్షు లయ్యధరబింబఫలగ్రసనస్పృహాభరా
యాతశుకాలి యంచు భ్రమ మంది మొగంబులు ద్రిప్పి రెంతయున్.
| 3270
|
| శా. |
రాజత్సౌరభచంద్రదీపకళికారాజి న్నివాళించి రా
రాజాస్య ల్పురిఁ దీఁగఁబోండ్లు క్షితిభృద్రాజు న్రఘుశ్రేష్ఠుని
న్రాజత్కోమలకాంతిసంభరితతారారాజిచే నెంతయు
న్రాజాస్య ల్నిశ లింపుతోడ క్షితిభృద్రాజు న్సుమేరుం బలెన్.
| 3271
|
| ఉ. |
జాజులు మల్లెపువ్వులును సంపెఁగలు న్నవమౌక్తికంబులు
న్లాజలు పైఁడిపళ్లెరములం దగ నుంచి పురీకులాంగన
ల్రాజకులావతంస మగురామునిపైఁ గడువేడ్కఁ జల్లి రా
రాజితకల్పవల్లికలు రమ్యసుమంబులు చల్లుకైవడిన్.
| 3272
|
| చ. |
అనుపమవాద్యఘోషము మహావిభవం బలర న్రథస్థుఁ డై
మునుకొని పౌరజానపదముఖ్యులు గొల్వఁగ నిట్లు రాజవీ
థిని శశిభంగి రాఁ దగినధీరుఁడు రాముడు తాపసాకృతి
|
|
| |
వ్వనమున కేగునాఁడు గనువారలచూడ్కికి నిం పొనర్చునే.
| 3273
|
| శా. |
ప్రాసాదంబులమీఁదనుండి కనుఱెప్ప ల్వ్రేయ కారాముని
న్వాసిం దప్పక చూచునట్టిపురకాంతామధ్యగామర్త్యభా
మాసందోహము నేర్పరించుటకు సామర్థ్యంబు లే దెంతప్రే
క్షాసంపన్నున కైన వీటఁ గల లోకశ్రేణిలో నత్తఱిన్.
| 3274
|
| చ. |
వలనుగ రాజవీథి నిరువంకలఁ బాఁతినపూగపాదపం
బుల కదళీమహీజములముంగలఁ జాల్గొని నిల్చి యున్న యం
జలిగతదీపపాత్ర లగుచంచలనేత్రలు స్తంభనిర్మితో
జ్వలదురుహేమపుత్రికలచందమునం గనుపట్టి రయ్యెడన్.
| 3275
|
| మ. |
అతులప్రీతి నాగేంద్రనందనికరం బాత్మీయమంత్రాధిదే
వత యౌరామునిఁ జూడఁగోరి బహురూపంబు ల్రహిం దాల్చి స
త్కృతి సేయం జనుదెంచునో యనఁగ నుత్ప్రేక్షింపఁగా నయ్యె నా
తతరామాంగరుచిచ్ఛటాచ్చురితతత్పౌరాంగనారూపముల్.
| 3276
|
| ఉ. |
వారక రామభద్రుపయి వ్రాలునెలంతలదృక్సమాజ మొ
ప్పారె నభంబుపైఁ గలసియాడుచకోరగణంబుభంగి సొం
పారఁ దమాలశాఖపయి హత్తినఖంజనపంక్తిరీతి శృం
గారరసాబ్ధిలోనఁ దిరుగంబడుమీనగణంబుకైవడిన్.
| 3277
|
| ఉ. |
కమ్మనిపుష్పసౌరభము కస్తురితావి పునుంగువాసన
ల్ఘుమ్మని రాజవీథుల బుగుల్కొనుచందనధూపగంధము
ల్గ్రమ్ముసతీతనూపరిమళంబును గైకొని ఘ్రాణహారి యై
తెమ్మెర వీచె వారయువతీనిటలాలకము ల్చలింపఁగన్.
| 3278
|
| చ. |
అమరినవేడ్క నాడువెలయాండ్రు నయాభినయంబు దెల్పుచం
దము గన నయ్యె నీరఘువతంసునిఁ బోలినసుందరుండు మీ
యమరులయందు లేఁ డని మహాక్షణదర్శనకౌతుకాగతో
త్తమసురలోకవారవనితాతతి కవ్విభుఁ జూపుకైవడిన్.
| 3279
|
| చ. |
అతులితతప్తహేమరచితాంచితనిర్మలకుడ్యమధ్యని
ర్మితమణిజాలమధ్యమునఁ బ్రేమ వసించి రఘూత్తము న్సమా
తతగతిఁ జూచునట్టిమృదు ధౌతపటావృత యైన లేము యొ
క్కతె గన నయ్యెఁ బంకరుహగర్భముఖస్థితవాణికైవడిన్.
| 3280
|
| ఉ. |
వాసననీలనిర్మితకవాటముమాటున నర్ధగాత్ర ము
ల్లాసము మీఱఁ గన్పడ విలాసముతోఁ దగ నిల్చి రాముని
న్వాసవతుల్యుఁ గన్గొనెడుభామిని యొక్కతె పొల్చె నత్తఱి
న్భాసునురలీల నీలఘనపార్శ్వలసత్పృథుచంచలాకృతిన్.
| 3281
|
| శా. |
సాక్ష్మాన్మాధవుఁ డౌట రాముఁడు రహి న్స్థానీయముం బాసి స
త్రక్షోణిం జరియింప నేగుతఱి ఘర్మవ్యాప్తి నేవృక్షముల్
ప్రక్షీణద్యుతి శుష్కపత్రకలన న్లక్షింప రాకుండెఁ ద
ద్వృక్షంబు ల్దనరె న్బలాశకుసుమోపేతంబు లై యత్తఱిన్.
| 3282
|
రాముఁడు రాజమందిరంబు ప్రవేశించుట
| ఉ. |
ఆరఘువర్యుఁ డీగతి మహావిభవంబున రాజవీథి నిం
పార నితాంతశీతలకటాక్షములం బురివారి నందఱన్
వారక చూచుచుం జని ప్రభాప్రవిభాసితరాజమందిర
ద్వారముఁ జేరెఁ బంచవిధవాద్యరవంబులు మిన్ను ముట్టఁగన్.
| 3283
|
| ఉ. |
అచ్చటఁ దేరు డిగ్గి హరిణాంకుఁడు శారదమేఘపంక్తిలోఁ
జొచ్చినరీతి వజ్రరుచిశోభితరాజగృహంబుఁ జేరి తా
నచ్చుపడంగఁ దల్లులకు సందఱకుం బ్రణమిల్లి వేడ్క వా
రిచ్చినదీనన ల్గొని రహిం బితృసద్మముఁ జేరఁ బ్రీతితోన్.
| 3284
|
| వ. |
ఇట్లు సముచితంబుగాఁ బితృగృహంబు ప్రవేశించి భరతు నవలోకించి మధురం
బుగా నిట్లనియె.
| 3285
|
| చ. |
సురుచిరరత్నకాంతుల నశోకవనంబులఁ బద్మకైరవ
స్ఫురితసరోవరంబులను శోభిలుమామకమందిరంబునం
దరణిజు నుంపుమన్నఁ బ్రమదంబున నాతఁడు చేయిఁ బట్టి గ్ర
చ్చఱఁ గొని పోయి తద్విపులసద్మమున న్విడియించె నాతనిన్.
| 3286
|
| తే. |
అంత శత్రుఘ్నచోదితు లై సమస్త, పరిజనంబులు తైలదీపములు కనక
చారుపర్యంకములు వరాసనములు గొని, వెసఁ బ్రవేశించి రారామవేశ్మమందు.
| 3287
|
| వ. |
అప్పు డాభరతుండు తక్కినవానరుల నందఱ యథార్హస్థానంబుల విడియనియ
మించి సుగ్రీవు నవలోకించి యిట్లనియె.
| 3288
|
సుగ్రీవుఁడు వానరులకుఁ జతుస్సముద్రంబుల నుండి యుదకము దేర నియోగించుట
| మ. |
వనికిం జైత్రసమాగమం బవనికిన్ వర్షాగమంబుం బయో
జినికిం దీవ్రకరోదయంబు నిశికి న్శీతాంశుసలబ్ధి య
బ్బినయ ట్లయ్యె మహానుభావుఁడు రణాభీరుండు కళ్యాణభా
జన మౌరామునిరాక యీనగరికి న్శాఖామృగాధీశ్వరా.
| 3289
|
| ఉ. |
మిత్రసుతుండ వీవు మఱి మిత్రకులోత్థుల మేము గావున
న్మైత్రి ఘటిల్లె నీపగిది మాకును మీకును దైవతంత్ర మీ
చిత్రము ధీవరా తడవు సేయఁగ రా దిఁక నెల్లి భవ్యన
క్షత్రమునందు రామునకు గ్రక్కునఁ బట్టము గట్టు మున్నతిన్.
| 3290
|
| చ. |
అన విని భానుజుండు హృదయంబున వేడుక పల్లవింపఁగా
వనచరవీరులం బిలిచి వారక నాల్గుసువర్ణకుంభము
ల్గొని చని నాల్గువారిధులలోనిజలంబులు సంగ్రహించి మీ
రినుఁ డుదయించునంతకు నహీనజవంబున రండు వీటికిన్.
| 3291
|
| వ. |
అని యాజ్ఞాపించిన సుగ్రీవునిశాసనంబున సర్వరత్నవిభూషితంబు లైనశాత
కుంభకుంభంబులు గొని జాంబవంతుండును హనుమంతుండును వేగదర్శియు
ఋషభుండును జతుస్సముద్రజలహరణార్థంబు గరుడానిలతుల్యవేగంబునం జనిరి
మఱియుఁ గొందఱు వానరులు నదీజలంబులు దెల్చుటకు మణికలశంబులు గొని
యరిగి రనంతరంబ.
| 3292
|
| మ. |
అమరారాతివిరోధి యైనరఘువంశాధీశుపట్టాభిషే
కముఁ జూడం బురలక్ష్మి పంప సురలోకగ్రామణిం బిల్వ నె
య్యమునం బోయెడుదూతలో యనఁ గరం బంతంత కత్యంతదీ
ర్ఘము లై తూర్పున కేగె గోపురపతాకాచ్ఛాయ లింపారఁగన్.
| 3293
|
సంధ్యాసమయవర్ణనము
| తే. |
రాముఁడు పలాశపల్లవస్తోమవిమతుఁ
డగు టెఱిఁగి నామసమత భయంబు గాంచి
తనమురు వడంచుకొనియెనో యనఁగ మొగిచె
సురుచిరపలాశపల్లవస్తోమ మపుడు.
| 3294
|
| చ. |
చెలువుగ నాజిసూతియభిషేకనిమిత్తము పశ్చిమాశ క
ప్పులు గొనితేర నభ్రమునఁ బోయిన వానరుఁ డాత్మహస్తమం
చలరుసువర్ణరత్నఘట మబ్ధిజలంబుల ముంచెనో యనం
జలరుహమిత్రబింబము వెసం జరమాంబుధిఁ గ్రుంకె నత్తఱిన్.
| 3295
|
| క. |
హరిదిక్సతి క్రీడార్థము, వరుణహరిత్కాంతమీఁదవైచిన కెందా
మరబంతివోలె రవి యం, బరమున పడి నేగి చరమవారిధిఁ గ్రుంకెన్.
| 3296
|
| ఆ. |
వృద్ధి నొంది రాజు వెనుకొని చనుదేర, నులికి గ్లానిఁ జెంది యున్నయినుఁడు
ఆత్మతేజ మెడలి యపరభూభృన్మణి, మఱుఁగుఁ జొచ్చి నది క్రమంబు గాదె.
| 3297
|
| ఆ. |
ఇనసమాగమమున కెంతయు రాగిల్లి, వరుణదిగ్వధూటి వన్నె మీఱఁ
గటితటంబునందుఁ గట్టినకౌసుంభ, వస్త్రమో యనంగ వఱలె సంధ్య.
| 3298
|
| తే. |
పూర్వదిక్సతి మొగమునఁ బొడమెఁ గప్పు
వరుణదిక్కాంత మొగమున వఱలె రక్తి
యినునిఁ బాసినదానికి హీనతయును
గలసిన నెలంత కనురక్తి గలుగు టరుదె.
| 3299
|
| సీ. |
భువనబాంధవుఁ డస్తమున కేగె నంతలో దోషాకరుఁడు కాంతితో వెలింగెఁ
జక్రవాకంబులు జతఁబాసె నంతలో సొరిదిఁ జకోరము ల్జోడుగూడెఁ
|
|
| |
గమలవనంబులు కడుమోడ్చె నంతలో నుత్పలవిపినంబు లుల్లసిల్లెఁ
జిలుకలగుమి నీడములు చేరె నంతలోఁ కాళికాదికము లొక్కటఁ జలించె
|
|
| తే. |
నట్టిదే కద లోకమర్యాద చూడఁ
గాలపరిపాకమునఁ జేసి ఘనుఁ డొకండు
గ్లానిఁ జెందుచు నుండ జఘన్యుఁ డొక్కఁ
డుపచయము నొంది వెలయు నీయుర్వియందు.
| 3300
|
| తే. |
భ్రమరసందోహములు వివర్ణంబు లైన
నలినములఁ బాసి తగ సవర్ణంబు లైన
కలువలను జేరెఁ దమజాతి గలయు టుడిగి
యెలమిఁ బరజాతి గలయుదు రెవరు ధరణి.
| 3301
|
| తే. |
పగలు మీఱి ప్రదోషాప్తి బడలి యున్న
జలజములఁ బాసి క్షణదోపచయము గన్న
కలువలను జేరెఁ జంచరీకములు కలిమి
గలజనుల నాశ్రయింపరె గానపరులు.
| 3302
|
| మ. |
ప్రమదం బొప్పఁగ రామచంద్రునిమహాపట్టాభిషేకోత్సవా
ర్థ మిలాభాగ మలంకరించుటకు దిగ్రామాలి కర్పూరచూ
ర్ణము కస్తూరియుఁ జల్లెనో యనఁగ విన్నాణంబుగాఁ జంద్రిక
ల్తిమిరంబు ల్తిలతండులద్యుతి ధరిత్రిం గప్పె సొంపారఁగన్.
| 3303
|
| తే. |
గగననీలోదకంబుపైఁ గ్రాలుపద్మ, కైరవంబులచందానఁ గాన నయ్యె
గండుచుక్కలు తన్మధ్యగతమనోజ్ఞ, హంసవిధమున హరిణాంకుఁ డలరె నపుడు.
| 3304
|
| తే. |
వసుధ గప్పినఘనశరావంబుభంగి
నింగిఁ జూపట్టెఁ దన్మధ్యనిహితదీప
కళికవిధమునఁ జంద్రుండు గాన నయ్యె
నుడులు తద్రంధ్రములమాడ్కి నొప్పె నపుడు.
| 3305
|
| సీ. |
చెలువొప్ప గగనలక్ష్మీవక్షమున వ్రేలుప్రతి లేనిమగతాలపతక మనఁగ
నాకాశకల్పవృక్షోగ్రభాగంబునఁ గొమరారునవపుష్పగుచ్ఛ మనఁగ
సరి లేనియభ్రకాసారమధ్యంబున నలరారుకొదమరాయంచ యనఁగఁ
గడువేడ్క రేచాన కబరీభరంబునఁ దాల్చినకేతకీదళ మనంగ
|
|
| తే. |
సమయహలికుండు గాఢసంతమసగహవ
పదము నఱకంగఁ గైకొన్నపరశు వనఁగ
నపుడు సాకేతపురగోపురాగ్రమునకుఁ
జారుమౌక్తికకలశ మై చంద్రుఁ డలరె.
| 3306
|
| సీ. |
ద్విజరాజనామ ముర్విఁ జెలంగె నితనికి నధిగతహరిపదుం డగుటవలన
రాజాభిధానంబు రంజిల్లె నితనికిఁ గువలయానందంబు గూర్చుకతన
|
|
| |
విధుఁ డనువిఖ్యాతి విలసిల్లె నితనికి శ్యామాభిరాముఁ డై యలరుకతన
సోమాభిధానంబు శోభిల్లె నితనికి దాక్షాయణీప్రాణదయితుఁ డగుట
|
|
| తే. |
నన్నిటను జూడ దొడ్డవాఁడయ్యు నితఁడె, యేవగింపక విరహుల నేఁచుకతన
నవని దోషాకరుం డనునాఖ్య వడసె, ననుచు లోకంబు వర్ణింప నబ్జుఁ డలరె.
| 3307
|
| మ. |
నవసంధ్యారుణకుంకుమం బలఁది నూత్నధ్వాంత మన్గొ ప్పమ
ర్చి విధూదంచితకేతకీదళము వాసిం గూర్చి జ్యోత్స్నాంబరం
బు వెసం గట్టి సదృక్షసంతతిమణీభూషావళు ల్మేన నిం
చి వియత్కాంత యలంకరించెఁ బురలక్ష్మి న్వేడ్క సైరంధ్రియై.
| 3309
|
| వ. |
మఱియు నిజభుజప్రతాపపాటలీకృతదిశాననదశాననవరశిరఃకాంతారకఠోరకు
ఠారధారాయితనిశితసాయకరఘునాయకనితాంతానంతకీర్తి మూర్తీభవించి
మిన్నుముట్టి దట్టంబుగా దశదిశలు వెలుంగుం జేయుచున్నదో యని యుత్ప్రే
క్షింపఁదగి యొప్పుశిశిరకరునికరనికరంబులు సాకేతపురంబు గలయంబర్వి తరుల
తాభిరామగృహారామవాటికామధ్యసంస్థాపితవిశాలరసాలసాలమూలవిరచితన
వేందుకాంతవితర్దికమీఁద నిదురించి యున్నపంచశరుండు మేల్కాంచి యుదం
చితవివిధవర్ణతరుపర్ణాంతరసమాగతవిశదరశ్మినిచయంబులం బట్టి లేచి యామినిం
జూచి తలయూచి కరంబులు సాఁచి తుంటవింట జంటగా సంఫుల్లనవమల్లి
కాభల్లంబులు గూర్చి పేర్చి యార్చి కర్ణోపాంతంబు సోఁకఁ దీసి యేసినఁ
దదమోఘప్రదరవిదళితహృదయ లై యదయ లై పతులతోఁ బొలయల్కలు
వూని యున్నయన్నులు సుప్రసన్న లై మక్కువలు చెక్కులొత్తఁ జక్కెర
వింటివాని దర్పంబునేర్పున నపనయించుటకుఁ బ్రియులయొద్దకుం జను
నెడ వారలయడుగులకుఁ బఱచినచలువమడుపులై తదీయశయనప్రాసాదకుడ్యం
బులకు వజ్రోపలంబులై తన్మహనీయపర్యంకంబులకు హంసతూలికాతల్పంబు లై
వారలు తమ్ములమ్ములు సేయుటకుం జేకొనిన సువర్ణవర్ణనాగవల్లీపర్ణంబులకు సుధా
చూర్ణంబు లై విస్రస్తవసన లై విలాసపురుషులం గలసి క్రీడించువారలకటి
తటంబులకు దుకూలచేలంబులై మదనకదనక్రీడాయాససంజనితఘర్మసలిలక్షాళి
తకాశ్మీరకర్దమంబు లైనవారలయురస్స్థలంబునకుఁ జందనపంకంబులై పరస్పర
పరిరంభసంభావనాసంభ్రమంబు సలుపుటకు దుర్లభం బని మణిభూషణంబులు
దొలంగ నిడుటవలన భూషణవిరహితంబు లైనవారలకంఠోపకంఠంబులకు మౌ
క్తికహారంబులై మృదుమధురాధరపల్లవదంతక్షతవ్రణంబులకు బద్ధపటోచ్ఛేదం
బులై వికీర్ణకుసుమదామంబు లైనవారలచికురబంధంబులకు మందారకుందార
విందప్రసూనదామంబు లై పరిశ్రమపరిహారార్థంబు ముంగిళ్లకుఁ జనుదెంచు
నప్పుడు సుశీతలసుధాప్రవాహంబులై హర్మ్యగవాక్షమార్గంబులు సుందరంబు
లైనయంతర్మందిరంబులు ప్రవేశించి వైడూర్యమణిస్యూతభిత్తికలయందు
|
|
| |
నత్తమిల్లి ముగ్ధాంగనలకు మార్జాలనేత్రశంక నంకురింపంజేయుచుఁ గ్రూరుం
డగుమారుండు కుసుమధన్వుండు గావునఁ బురారాతిశిరఃకుసుమం బైనశశాం
కునిఁ గోడండంబుగాఁ గొని తండోపతండంబులుగా భూమండలంబుమీఁద
నిండార నిగిడించిన నవమల్లికాకాండప్రకారంబులపగిది మెండుకొని గండుమీఱి
విరహిణీమృగకదంబంబులమేనఁ జుఱుకుచుఱుక్కునం గాఁడి మూర్ఛాపార
వశ్యంబు సంపాదించుచు విగతపుష్పంబు లైనవిటపిపటలంబులకు స్ఫుటితప్రసూ
నవితానసంపదసొంపు సంపాదించుచు దూతికాసమాహూయమానులై వేడు
కకాండ్రు వెలయాండ్రగృహంబులకుం జని యంగజసంగరక్రీడాజనితపరిశ్రాంతి
నపనయించుటకు మరలి నిజమందిరంబులకుం జనుదెంచుచుండఁ జారుచామీ
కరప్రణాళీముఖంబుల గగనచుంబిసౌధవిమానాగ్రనిబద్ధతుహినకరకాంతమణి
సంజాతవారిధారాసారంబు సంపాదించుచు వసంతసమయసంపాదితనితాంత
లతాంతఫలకుసుమరమణీయశోభాధరీకృతపురందరనందనోద్యానవనప్రమదా
వనాంతరసంఫుల్లహల్లకసుగంధబంధురసరోవరతీరసంభూతకర్పూరకదళికాషం
డమండలాంతర్గతైలాలతాదికుంజపుంజమధ్యంబున నల్లిబిల్లిగా నల్లుకొనిన ద్రాక్ష
పందిళ్లనడుమఁ బ్రన్ననిపటికంపుఁదిన్నెలమీఁద విరులపాన్పునం బవ్వళించి
యమందకందర్పక్రీడానందరసం బనుభవించి యలసిసొలసి నిదురించుచున్నపౌర
దంపతులకుఁ బరిశ్రమాపనోదనార్థం బొడలం జిందిన పన్నీటితుంపురులయం
దంబు పొందుపఱచుచు లోకాలోకశిలోచ్చయసముత్సేధసువర్ణప్రాకారోపరిసం
స్థాపితమహోపలదారుయంత్రంబులు నిశాకాలసమాగతయక్షరాక్షసత్రాసజన
నంబుకొఱకుఁ గరంబులం దాల్చిననిశాతకృపాణధాళధళ్యంబులయనువుఁ జూ
పుచు గోత్రాభిరంజనరఘునాథభుజాపరిపాలితం బైనసాకేతపురంబు గోత్రభంజ
నసురనాథభుజాపరిపాలితం బైనయమరావతీపురంబు నసహసించుచు నవ్వినచిఱు
నవ్వుసొంపు వహించుచు మనోహరంబు లై సుస్నిగ్ధంబు లై సుఖస్పర్శంబు
లై కామవర్ధనంబు లై ప్రకాశించుచుండె సాక్షాన్నారాయణుం డైన రామ
భద్రుండు నివసించి యుండుటవలనఁ జంద్రికాధాళధళ్యంబులఁ బరిఖ పయః
పారావారం బై సాలంబు వజ్రసాలం బై తరువులు కల్పవృక్షంబు లై యలరు
చుండ సాకేతపురంబు తెలిదీవిచందంబున నందం బగుచుండె నప్పుడు.
| 3310
|
| ఉ. |
ఆతతసౌధభాగముల నన్నిశఁ బౌరులు నృత్తవాద్యసం
గీతకళావినోదము లొగిం బచరించుచు బ్రొద్దు వోయినం
బ్రీతిగఁ గంతుకేళి యొనరించి వసంతసమీరపోతము
ల్చాతురిఁ దద్రతిశ్రమజలం బడఁప న్నిదురించి రయ్యెడన్.
| 3311
|
| ఆ. |
నాకపథమునందు వీఁక ననేకస, హస్రయోజనంబు లరిగి యలసి
చరమశిఖరిశిఖరశయ్యపై రోహిణీ, భామఁ గూడి విధుఁడు పవ్వళించి.
| 3812
|
| ఆ. |
పాండురుచిచయంబు పిండారఁ బోసిన, పగిది నలరునిలకుఁ బట్టపగలు
|
|
| |
చేసి యపరదిగ్విలాసినీకబరికి, నజ్జబింబ మభినవాబ్జ మయ్యె.
| 3313
|
| తే. |
శ్రీరఘుస్వామి పట్టాభిషేకవార్త
నెలమిఁ బాతాళవాసుల కింపు మీఱి
నెఱుఁగఁ జెప్పంగఁ గడువడి నేగె ననఁగఁ`
గుముదబాంధవుఁ డపరాబ్ధిఁ గ్రుంకె నపుడు.
| 3314
|
| క. |
జలజారి యస్తమించిన, దళముగఁ జీఁకటులు పర్వె ధారుణియందుం
బెలుఁచ నరాజక మగుచోఁ, జెలరేఁగరె మలిను లది ప్రసిద్ధము గాదే.
| 2315
|
| చ. |
దినకరుఁ డెప్పుడుం దమకు దేవత గావున నాతఁ డస్తమిం
చునపుడు ముచ్చటం గొనిన శోభను దాము ప్రతిగ్రహించెనో
యన రతితాంతకాంతలదృగంతము లెంతయు రక్తిఁ దాల్చె నొ
య్యనఁ గపురంపుఁదమ్ములమునందు రుచు ల్జనియించె స్త్రీలకున్.
| 3316
|
| ఆ. |
జన్యజనకభావసంబంధమున నిజ, ద్యుతులు సురతతాంతసతులకనుల
కొసఁగి వానికాంతు లొగిఁ గొన్నచందాన, దీపకళిక లపుడు తెల్లనయ్యె.
| 3317
|
| చ. |
వదలినకేశపాశములు వాడినదండలు గోటినొక్కులం
గదుములు వడ్డచన్నులును గందినమోవులు నిద్రమబ్బునం
జెదరినచూపులుం జెమటచిత్తడిఁ దోఁగిన మేను లొప్ప స
మ్మద మలరం బునారతులమైఁ బ్రియులం గరఁగించి రంగనల్.
| 3318
|
సూర్యోదయసమయవర్ణనము
| సీ. |
ప్రాచీముఖంబున వఱలుముత్యాలచేర్చుక్కకైవడి వేగుఁజుక్క వొడిచె
నరుణోదయస్నాత లగువిప్రులను మేలుకొలుపుచుఁ గలకలఁ బలికెఁ గవులు
రతిపరిశ్రాంతనిద్రితదంపతులమేనిచెమట లార్పుచు సమీరములు విసరె
భూసురోత్తమగృహంబులఁ జెవి కింపుగాఁ దతసామగానశబ్దములు మీఱె
|
|
| తే. |
హిమకరుం డైనకువలయాధీశ్వరుండు
చనుట కలయుగ్రకరుఁ డైనచక్రవిభుఁడు
వచ్చుటకుఁ జాలఁ జింతించి వన్నెఁ బాసె
ననఁగఁ దారలు గతకాంతు లయ్యె నపుడు.
| 3319
|
| సీ. |
గగనకాసారోడుకైరవంబులు గోయఁ బ్రాచి సాఁచినహస్తపల్లవంబు
నెఱసిన బలితంపునిబిడాంధకారకాంతారసీమకు బృహద్భానుహేతి
ప్రబలవిభావరీప్రతతి ద్రుంపఁగ సానఁ బట్టించి యెత్తినపరశుధార
జలజాతవనవాటికలఁ గల్గుజాడ్యంబు పరిహసింపంగఁ బాల్పడ్డమందు
|
|
| తే. |
పయనములు వేకువం బోవుపథికతతికి
దారిఁ జూపెడు తెరువరిదంపతులకుఁ
బంచశరజన్యవిరతిఁ బుట్టించుచతురుఁ
డరుణుఁ డుదయించెఁ బ్రాక్పర్వతాగ్రమందు.
| 3320
|
| సీ. |
గ్రహరాజతురగరింఖాఘట్టనోత్థితప్రాక్శైలధాతుపరాగ మనఁగ
ధరణీసురార్ఘ్యాంబుశరలూనమందేహదేహోత్థితాసృక్ప్రవాహ మనఁగ
హరిసమాగతహృష్ట యై ప్రాచియురమునఁ బ్రామినకాశ్మీరపంక మనఁగఁ
బూర్వాచలంబుపైఁ బొడమినచూతవృక్షముమీఁది చిగురాకుగమి యనంగ
|
|
| తే. |
సమయరజకుండు పూర్వదిక్సతి కొసంగ, నాఱఁబఱచినచెంగావిచీర యనఁగ
శక్రపురికోట కలఁదినజా జనంగ, నలరెఁ దూర్పున నూనూఁగుమొలకయెండ.
| 3821
|
| సీ. |
ప్రాక్పయోరాశిలోపల నుండి పయికిఁ బ్రాఁకినబడబానలకీల లొక్కొ
తోయజాప్తునితేరు దోలుపిచ్చుకకుంటు పాఱఁ దీసినరశ్మిపటల మొక్కొ
ప్రాగాశ భేదించి పయి కుద్గమించిన ఫణిఫణామణిఘృణిగణము లొక్కొ
తగ నుదయాద్రి నెత్తముమీఁదిపాదిలో మొలకలెత్తిన కందమోను లొక్కొ
|
|
| తే. |
ప్రాఙ్మహీధరపక్షతిప్రచ్ఛిదాక్ష
తోత్థశోణితధారాసమూహ మొక్కొ
యనుచుఁ గొనియాడ రవికిరణాంకురములు
పాటలద్యుతి నొకకొన్ని ప్రాఁకె నభము.
| 3322
|
| సీ. |
ఉస్రంబు లొకకొన్ని యువతులకొప్పుపైఁ జెంగల్వఱేకులరంగు దెలుప
నంశువు లొకకొన్ని యంభోజవనులందుఁ గార్కొన్ననిద్రాంధకార మడఁప
గిరణంబు లొకకొన్ని తరుషండములయందుఁ గెందలిరులవిచికిత్స నొసఁగ
భానువు లొకకొన్ని పరమానురక్తిచే గగనలక్ష్మిని బ్రీతిఁ గౌఁగిలింప
|
|
| తే. |
వైరిమదసంతమసహేళి వాలి నాజిఁ
దునిమినరఘుప్రవీరునిదోఃప్రతాప
మంచితంబుగ మూర్తీభవించినట్లు
మిహిరమండల ముదయాద్రిమీఁదఁ దోఁచె.
| 3323
|
| సీ. |
పసఁగునిగ్గులు దేఱఁ బ్రాచినెన్నొసలుపై దిద్దినసిందూరతిలక మనఁగఁ
దులకించుతొలిసంజ నెలఁతపేరురముపై భాసిల్లుమాణిక్యపతక మనఁగఁ
బాకశాసనువీటిపడమటిగోపురాగ్రమునఁ గ్రాలుసువర్ణకలశ మనఁగఁ
బూర్వాబ్ధిజలముఁ దేఁబోయినహరిమస్తకముమీఁదితపనీయఘట మనంగ
|
|
| తే. |
బంధురార్జితచక్రతపఃఫలంబు
భూసురకృతనమస్కారములకుఁ బాత్ర
మజహరిపినాకిమూర్తిత్రయాభిరాముఁ
డర్కుఁ డలరారెఁ బ్రాగ్దిశాభ్యంతరమున.
| 3324
|
| చ. |
కనదలివేణి కోకకుచ కంబుశిరోధర హంసయాన ప
ద్మనయన చారుసైకతనితంబ మృణాళభుజాడ్య సారస
స్వనమృదునాద సన్మకరజంఘిక యై కడురక్తిఁ దాల్చె న
య్యినకరసంగతిం గనుల కింపుగఁ బద్మిని కాననంబునన్.
| 3325
|
| సీ. |
మకరందరసపానమత్తరోలంబకదంబంబు మధురగీతములు వాడఁ
గారండవక్రౌంచసారసాధిపతత్రిరాజికూజితవాద్యరవము లెసఁగ
శరదిందుచంద్రికాస్వచ్ఛపాండుచ్ఛచ్ఛదదచామరములు పార్శ్వములఁ జెలఁగ
సూర్యభానుచ్ఛటాస్ఫురితోరుపుండరీకమహార్హపుండరీకములు వెలయ
|
|
| తే. |
నేర్పు మెఱయ సారంగముల్ నృత్య మాడఁ
బ్రమదమునఁ గోకములు బరాబరులు సేయ
నభినవవిచిత్రసరసీసభాంతరమునఁ
గమల గొలువుండెఁ గెందమ్మిగద్దెమీఁద.
| 3326
|
| వ. |
అంతకు మున్నె జాంబవత్సుషేణులు పూర్వసముద్రతోయంబును సమీరనందన
ఋషభులు దక్షిణార్ణవజలంబును వేగదర్శిగవయులు పశ్చిమోదధిసలిలంబును
ఋషభనలు లుత్తరసాగరపుష్కరంబులను మఱియుఁగొందఱు వానరశ్రేష్ఠులు
నద్యంబువులు గొని సువర్ణఘటంబులం బట్టికొని తెచ్చి శత్రుఘ్నునకు సమ
ర్పించి రాశత్రుఘ్నుండు కపివరసమానీతసరిత్సరిత్పతిపుణ్యతీర్థంబులు మునిశ్రేష్ఠుం
డైనవసిష్ఠునకు సమర్పించె నంత ననంతనితాంతానర్ఘనిర్మలశశికాంతభిత్తికాం
తరసంక్రాంతనరనారీరూపంబులు సభాసదనాంతరస్థితజనంబులకు విచేతను లైన
వానరుల నెల్ల సచేతనులం జేసినమహానుభావుం డగురామభద్రునిమహామహి
మంబునఁ గుడ్యోపరిపరిలిఖితవిచిత్రచిత్రంబులు సప్రాణంబు లయ్యెనోకో యని
యును దదీయచరణకంజాతరజఃపుంజంబు సోఁకి పాషాణంబు లెల్ల యోషా
మణు లయ్యెనొకో యనియు శంక నంకురింపంజేయ ననన్యసామాన్యగుణసాం
ద్ర రామచంద్రపట్టాభిషేకమహోత్సవాలోకనకౌతూహలాతిరేకంబున దివంబు
ననుండి చనుదెంచిన బృందారకసుందరీబృందంబులయందంబు పొందుపఱచుమ
హోన్నతమహేంద్రనీలస్తంభాగ్రవిరచితమణిమయసాలభంజికాపుంజంబులు ని
జకరతలకలితచారుచామీకరప్రాంతాంతరాళస్థగితమాణిక్యదీపంబుల నివాళింప
రమణీయవిశాలప్రవాళకవాటంబులయందు వాటంబుగా సంఘటించిననీటైన
మగఱాలగందపట్టెలమీఁద రంజిల్లునపరంజిగుబ్బలు రంజన్మంజుకంజపుంజంబు
లని తుండంబులతండంబులు సాఁచి యంతలోన నుభయపార్శ్వచిత్రితసాంద్ర
మృగేంద్రరూపంబులు సూచి భయంబు గొని రయంబున వెనుకకుం బఱచు
మహోత్తుంగమత్తమాతంగంబుల దానధారాసారంబునం బంకిలంబు లగుప్రాం
గణపర్యంతగేహళీప్రదేశంబులఁ బరినిబద్ధనిర్మలగారుత్మతరత్నంబులయందుఁ బ్ర
తిఫలించినకోరకితపూగవృక్షంబులు గోమయగోముఖంబులు గావించి నించినరం
గవల్లులభంగి నెఱింగింప స్ఫటికోపలనిర్మితజాలవాతాయనరంధ్రసమాగతమంద
మరుచ్చలితవిశాలవితానంబునందు లిఖించిన బహువిధదేవతావిగ్రహంబులు
విలోకించి జనంబులు నిక్కంబుగా దేవతలు గగనంబుననుండి లాస్యంబులు
సేయుచున్నవార లని డెందంబులఁ గీలుకొలుప నూతనచూతపత్రఘటితచారు
|
|
| |
తోరణంబులు ద్వారోపరిభాగలంబమానపద్మరాగమణిదామంబు గాంచి బింబ
ఫలంబు లని భ్రమించి గ్రసనాభిలాష నరుగుదెంచి ముక్కులం గఱచి వ్రేలు
రాచిల్కలచాలుచెలువున నలర భిత్తికామధ్యంబున నూర్ధ్వముఖంబుగా వ్రాసి
నబిడాలంబులు తదుపరిభాగవిటంకంబుల నుంచినకృత్రిమకీరంబులం బట్టుటకుం
బొంచియున్నవానితెఱం గెఱింగింప మహోన్నతశాతకుంభస్తంభపక్షంబులచే
త దివంబున కుద్గమించునో యని తలంచి య ట్లెగురకుండ నడ్డపెట్టినమాడ్కిఁ జూ
డ్కికి వేడ్క సేయుచున్న యతిస్థూలంబు లైనమగఱాలదూలంబుల వ్రేలుపచ్చ
ఱాలకొణిగలకుం దగిలించిన నిగనిగనితొగరువన్నెకుందనంపుగొలుసులతుద
నలరుమహనీయధూపపాత్రలవలన నిర్గమించుచందనాగరుప్రముఖధూపవాసన
లుపరిగ్రహించి తిన్నతెమ్మర లెమ్మెగా గుబాళింపఁ గ్రిందం బఱచినపృథివీలక్షణాం
కం బైనకుథాస్తరణంబును మీఁదం గట్టిన స్వర్గలక్షణాంకం బైనవితానంబును
రంజిల్లుచుండఁ దన్మధ్యభాగంబు పృథివీలోకస్వర్గలోకమధ్యగతనానావిధనక్షత్ర
శోభితం బైనయంతరిక్షంబు ననుకరింప నగణితమణిగణప్రభాచాకచక్యంబుల
వైజయంతంబుఁబోలె శోభిల్లుచున్నయాస్థానమండపమధ్యంబున విలసిల్లురత్న
మయభద్రపీఠంబున సీతాసహితంబుగా రామభద్రునిం గూర్చుండ నియో
గించి పురోహితశ్రేష్ఠుం డైనవసిష్ఠుండు ఋత్విగుపాధ్యాయసమేతుండై మంగ
ళాచారంబులు నిర్వర్తించె నంత.
| 3327
|
శ్రీరామచంద్రపట్టాభిషేకఘట్టము
| సీ. |
వరుస వసిష్ఠుండు వామదేవుఁడు మునివరులు సుయజ్ఞజాబాలివిజయ
కాశ్యపు ల్గౌతమకాత్యాయనులు నరశార్దూలుఁ డగురామచంద్రు నెలమి
వసువులు దగ దివస్పతినిబోలె సుగంధి విమలప్రసన్నతోయములచేత
నభిషేక మొనరించి రవుడు ఋత్విగ్ధరామరులు కన్యకలును మంత్రివరులు
|
|
| తే. |
యోధు లభిషేక మొనరించి రుత్సుకతను, సర్వదిక్పాలకులు దేవసమితిఁ గూడి
వ్యోమముననుండి సకలదివ్యౌషధీర, సముల నభిషేక మొనరించి రమలబుద్ధి.
| 3328
|
| చ. |
పొలు పలరార మున్ను మనుముఖ్యతదన్వయజాతరాజవ
ర్యులు రహి నెద్ది దాల్చి ముద మొప్పఁగఁ దా మభిషిక్తు లైరి సొం
పలరఁగ నెద్ది తొల్లి కమలాసననిర్మిత మయ్యె నాసము
జ్జ్వలమణిరత్నశోభితవిశాలకిరీటము దెచ్చి చెచ్చెరన్.
| 3329
|
| క. |
మునివర్యుఁడు ఘనుఁడు తపో, ధనుఁడు వసిష్ఠుండు రామధరణీశున కిం
పెనయఁగఁ బెట్టె విలోకన, జనముల కత్యంతసంతసం బుదయింపన్.
| 3330
|
| క. |
అతులితనానామణిచి, త్రిత మయి ధనయుక్త మయి యుదీర్ణం బై సం
భృతసజ్జనకమై యవు డ, ప్రతిగతిఁ జూపట్టె నాసభాస్థలము రహిన్.
| 3331
|
| తే. |
సంతసంబున శ్రీరామచంద్రుఁ డిట్లు, సర్వఋత్విక్పురోహితసమితిచేత
ననుపమంబుగ నభిషిక్తుఁడయ్యె నఖిల, జనము లరుదంది యానందజలదిఁ దేల.
| 3332
|
| సి. |
భూరిమోదమునఁ దాంబూలకరండము వహియించి సేవించె భరతుఁ డపుడు
లక్ష్మణుండును భర్మలక్షణవ్యజనంబు భక్తితోఁ గరములఁ బట్టి విసరె
శత్రుఘ్నుఁ డానందసహితుఁ డై పాండరచ్ఛత్రంబుఁ బట్టెఁ బ్రసన్నబుద్ధి
నిరువంక శశినిభపరచామరంబులు వీచిరి కపిదైత్యవిభులు వేడ్క
|
|
| తే. |
వాయుపుత్రుండు సవినయావనతుఁ డగుచు
ముదితుఁ డై రత్నపాదుకల్ మోచి కొలిచె
నింద్రనందనుఁ డైన నుండి యెలమి మిగులఁ
జెలఁగు ప్రజకు బరాబరుల్ సేయుచుండె.
| 3333
|
| సీ. |
శతదళసంయుక్తచారుచామీకరమయసరోరుహవరమాలికయును
దతరత్నకలితముక్తాహారము నొసంగె శస్త్రచోదితుఁ డయి స్పర్శనుండు
దివి దేవగంధర్వదివ్యగానంబులు చెలఁగె నప్సరసలు నెలమి నాడి
రతిసంభ్రమంబున నమరదుందుభులును దోరంబుగా నప్డు బోరుకొనియె
|
|
| తే. |
నఖిలసస్యసమృద్ధ యై యలరె ధాత్రి, ఫలసమృద్ధియుఁ గ, నెఁ బాదపంబు లెల్లఁ
దవిలి సుమములు గంధవంతంబు లయ్యె, శ్రీరఘూద్వహుపట్టాభిషేకవేళ.
| 3334
|
| వ. |
ఇట్లు రామభద్రుండు పట్టాభిషిక్తుం డై బ్రాహ్మణులకు లక్షధేనువులును శతసహ
స్రతురంగంబులును శతవృషభంబులు నొసంగి వెండియుఁ ద్రింశత్కోటిని
ష్కంబులును నవరత్నఖచితనానాభరణంబులును మహార్షంబు లగుసువర్ణ
చేలంబులును ద్విజశ్రేష్ఠుల కొసంగె ననంతరంబ.
| 3335
|
| ఉ. |
భానుమరీచితుల్యము సువర్ణమయంబును రత్నభాస్వరం
బైనమనోజ్ఞమాలిక దివాకరపుత్రున కిచ్చి వజ్రభృ
త్సూనుకుమారుఁ గాంచి మణిశోభితవజ్రమయాంగదంబు లెం
తే నయ మొప్పఁగా నొసఁగెఁ దేఁకువ నుల్లము పల్లవింపఁగన్.
| 3336
|
| క. |
వరమణిజుష్టంబును హిమ, కరసదృశము నైనమౌక్తికప్రకరమనో
హరహారము శ్రీసీతా, సరసిజనేత్రకు నొసంగె సంతస మలరన్.
| 3337
|
| క. |
నిరుపమదివ్యాంబరయుగ, మురుతరమణిరత్శోభితోత్తమకనకా
భరణంబులు సీతాముఖ, మరుదుగఁ గనుఁగొనుచు మారుతాత్మజున కిడెన్.
| 3338
|
| చ. |
పరమదయాళుఁ డై తనకు భర్త యొసంగినరత్నహారము
న్గరమునఁ బట్టి వానరులఁ గాంతునిమోమును సారెకు న్మనో
హరగతిఁ జూచుచున్న జనకాత్మజభావ మెఱింగి మోమునం
జిఱునగ వంకురింప సరసీరుహనేత్రుఁడు రాముఁ డిట్లనున్.
| 3339
|
| చ. |
వనరుహనేత్ర యెవ్వనిప్రభావమునం బరితుష్ట వైతి వె
వ్వనియెడ విక్రమంబు ఘనపౌరుషము న్మతియు న్స్థిరంబు లై
దనరుచు నుండు నట్టిగుణధామున కిమ్మహనీయహార మి
మ్మనిన ధరాకుమారిక రయంబున మారుతి కిచ్చె హారమున్.
| 3340
|
| క. |
చెలువుగ ముక్తాహారము, గళమున ధరియించి యలజగత్ప్రాణసుతుం
డలరె సుధాకరకరనిభ, సలలితశుభ్రాభ్రకలితశైలముభంగిన్.
| 3341
|
| వ. |
అంత దిగంతవిశ్రాంతయశోవిరాజితుం డగురామచంద్రుండు మైందద్వివిదనీలుల
వారియభిప్రాయం బెఱింగి యుచితప్రకారంబులఁ బరితుష్టులం జేసి తక్కిన
సమస్తవృద్ధవానరుల నయ్యైతెఱంగుల నభీష్టవస్తుప్రదానంబులం దృప్తులం
జేసె నిట్లు విభీషణుండును సుగ్రీవహనుమజ్జాంబవత్ప్రముఖనిఖిలవానరులును
వస్త్రాభరణమణిరత్నాదిసత్కారంబుల యథార్హంబుగాఁ బ్రతిపూజితు లై
రంత సుగ్రీవుండును సమస్తవానరులును రామాభిషేకమహోత్సవంబు సంద
ర్శించి తదనుజ్ఞ వడసి కిష్కింధకుం జనిరి విభీషణుండు సర్వకామప్రతిపూజి
తుండై కులధనంబును బ్రాపించి సంతోషవిశేషంబున ననుజ్ఞ వడసి లంకకుం
జనియె నిట్లు సర్వకపిరాక్షసవరులు తమతమనివాసంబులకుం జనినయనంతరం
బ యాజానకీరమణుండు వినిహతశత్రుం డై మహాయశుం డై రాజ్యంబు పరి
పాలించుచు లక్ష్మణుం జూచి యిట్లనియె.
| 3342
|
రాముఁడు భరతుని యువరాజుగాఁ జేయుట
| తే. |
అనఘ మత్తుల్యతేజుఁడ వరయ నీవు, లీల మద్వంశనృపులు పాలించినట్టి
యవని నేలుము నాతోడ యౌవరాజ్య, పట్టభద్రుఁడ వై భుజాజలము మెఱయ.
| 3343
|
| ఉ. |
నా విని లక్ష్మణుండు నరనాథునిఁ గన్గొని భక్తి నిట్లను
న్దేవ యనారతంబు భవదీయపదాంబుజ సేవ సేయుచు
న్జేవ దలిర్ప సన్నిధి వసించి మనంగలవాఁడ నాత్మలో
వావిరిఁ గోర నెద్దియు భవత్పరిచర్యయుఁ దక్క నెంతయున్.
| 3344
|
| క, |
మునుకొని రాఘవుఁ డంతట, ననుపమగతి యౌవరాజ్యమందు భరతునిన్
ఘనశౌర్యకలితు ననఘునిఁ, బనివడి యభిషిక్తుఁ జేసెఁ బౌరులు మెచ్చన్.
| 3345
|
| తే. |
వాజవేయశతంబులు పౌండరీక, తురగమేధశతంబులు దోడుతోడ
నర్థి నొనరించి దశసహస్రాబ్దకములు, రాజ్యపాలన మొనరించె రాఘవుండు.
| 3346
|
| చ. |
జనకసుతామనోహరుఁడు సత్యరతుం డయి రాజ్య మేలఁగా
జనములు జారచోరవిషసర్పమహాజ్వరబాధ లెవ్వియు
న్మునుకొని చెందకుండఁ గడుమోదముతో సుఖియించి రంగన
ల్పనివడి వేడ్కతోడ విధవాత్వ మెఱుంగకయుండి రెంతయున్.
| 3347
|
| క. |
బాలమరణం బెఱుంగక, వాలాయము వృద్ధజనులు పరమముదమున
న్గ్రాలుచు నుండిరి రాముఁడు, హేలాగతిఁ బూజ్యరాజ్య మేలుచు నుండన్.
| 3348
|
| సీ. |
సర్వజనంబులు సత్యధర్మిష్ఠులై ఘనతరసంతోషకలితు లైరి
రామునిఁ గాంచి పరస్పరంబును హింసఁ జేయక కడు మైతిఁ జెంది విగత
రోగు లై దుఃఖ మెఱుంగక పుత్రపౌత్రాభివృద్ధియుఁ గల్గి యనవరతము
శీలంబు దప్పక చెలఁగి వర్షసహస్రజీవు లై కడు వృద్ధిఁ జెంది రెలమి
|
|
| తే. |
క్ష్మాజములు నిత్యఫలపుష్పశాలు లయ్యె
బరఁగఁ బర్జన్యుఁడును గాలవర్షి యయ్యెఁ
బవనుఁడు మనోజ్ఞముగ సుఖస్పర్శుఁ డయ్యె
మించి రఘురాముఁ డవనిఁ బాలించునపుడు.
| 3349
|
| చ. |
పనివడి నాల్గువర్ణములవారు నిజోచితకర్మయుక్తు లై
యనవరతంబు ధర్మరతు లై శుచు లై కడు సత్యవాదు లై
యనుపమలక్షణాభియుతు లై సుగుణాన్వితు లై చెలంగి రా
ఘనమతి రాఘవుండు కుతుకంబున రాజ్యము నేలుచుండఁగన్.
| 3350
|
| తే. |
భూరిగుణయుక్తు లైనతమ్ములను గూడి
యఖిలజనములు తనుఁ గొనియాడుచుండ
నుదితతేజుండు రాముండు పదునొకండు
వేలవర్షంబు లిల యేలె వేడ్కతోడ.
| 3351
|
శ్రీమద్రామాయణపఠనశ్రవణపూజనాదిఫలశ్రుతి
| శా. |
ఆయుష్యం బతిధన్యము న్ఘనయశస్యంబు న్నృపశ్రేణికి
న్శ్రేయఃప్రాప్తినిమిత్త మార్షము సభాసేవ్యాదికావ్యం బుపా
దేయంబు న్మునిరాట్కృతంబు సుజనధ్యేయంబు భద్రప్రదం
బీయాఖ్యానము దీని విన్నమనుజుం డింపొందు వీతాఘుఁ డై.
| 3352
|
| తే. |
చెలువు మీఱంగ రామాభిషేచనంబు
విన్న విత్తకామునకును విత్త మొదవుఁ
బుత్రకామున కొదవు సుపుత్రుఁ డరుల
గెలిచి రాజ్యంబుఁ బ్రాపించు క్షితివిభుండు.
| 3353
|
| వ. |
మఱియు నీరామచరిత్రంబు విన్న యువతులు రామలక్ష్మణభరతశత్రుఘ్నులచేతఁ
గౌసల్యయు సుమిత్రయుఁ గైకయు నెట్లు జీవత్పుత్తులై రట్లు నిజపుత్రులచేత జీవ
త్పుత్త్ర లై ప్రకాశింతు రదియునుంగాక.
| 3354
|
| తే. |
జగతి నీరామవిజయంబు శ్రద్ధధానుఁ, డై జితక్రోధుఁ డై విన్నయమలచరితుఁ
డఖలదుర్గంబులఁ దరించి యంచితముగఁ, బెద్దకాలంబు జీవించి పెంపు వడయు.
| 3355
|
| తే. |
మఱియు రామాయణము విన్నమానవుండు
కాంక్షితవరంబు లొందు రాఘవునివలనఁ
బరఁగఁ బరదేశమున నున్న బంధుజనులు
సేమమున వత్తు రాత్మీయధామములకు,
| 3356
|
| వ. |
మఱియు నీరామాయణశ్రవణమాత్రంబున దేవతలును బితృదేవతలును సంతు
ష్టు లగుదు రెవ్వనిగృహంబున నిమ్మహాకావ్యం బుండు నట్టిగృహంబున విఘ్నం
బు లన్నియు శమించు రజస్వలాంగనలు విన్న గుణవంతు లైనపుత్రులం బడ
|
|
| |
యుదురు పురాతనం బైనయీయితిహాసంబు నిజమందిరంబున నునిచికొని
యెవ్వాఁడు నిత్యంబుఁ బూజించుచుఁ బఠించు నతండు సర్వపాపవిముక్తుం డై
దీర్ఘాయుష్మంతుండై విలసిల్లు మఱియు మహీవరుండు నమస్కరించుచు నిమ్మహా
కావ్యంబు విప్రునివలన నాకర్ణించిన నతండు నిస్సంశయంబుగా నఖండైశ్వర్యం
బును బుత్రలాభంబు నధిగమించు నీరామాయణశ్రవణపఠనంబున నారాయ
ణుండును దేవాదిదేవుండును హరియు నవ్యయుండు నగురాముండు సంతుష్టి
నొంది కుటుంబధనధాన్యకీర్తిసుఖంబు లొసంగు మఱియు నాయుష్యంబు
నారోగ్యకరంబును సౌభ్రాత్రకరంబును యశస్యంబును శుభంబును దేజోబల
కరంబు నగునీయాఖ్యానంబు నియమంబున వృద్ధికాము లగువారిచేత వినం
దగి యుండు మునికృతం బైనయిమ్మహాకావ్యంబు భక్తిచేత లిఖించినమహా
త్ములు త్రివిష్టపంబుఁ బ్రాపింతు రిమ్మహాకథ మాచేత నాఖ్యాతం బయ్యె హరి
కరుణవలన మీకు భద్రంబును బలంబును వృద్ధి నొందుఁ గాక యని యిట్లు
కుశలవులు యుద్ధకాండకథావృత్తాంతంబు సవిస్తరంబుగా వినిపించిన విని రామ
భద్రుండును లక్ష్మణభరతశత్రుఘ్నులునుం దక్కినసభాసదులును బరమానంద
భరితాంతఃకరణు లై సాధువాక్యంబుల నక్కుమారులం బ్రశంసించిరి.
| 3857
|
| ఉ. |
శంబరభృత్కులప్రవర శంబరముఙ్నిభదేహ రుక్మిణీ
శంబరదృఙ్మనోనిలయ శంబరభిచ్ఛతతుల్యమందరా
శంబరవైరివైరినుత శంబరజాతదళాయతేక్షణా
శంబరరాశిరాట్ఛయన శంబరవాజ్యశనేంద్రవందితా.
| 3858
|
| క. |
వనమాలాశోభిత పా, వనమాలాకారరక్ష భాసురబృందా
వనకేళిలోల యమునా, వనకేళీచతుర గోపవనితాధీశా.
| 3359
|
| మాలిని. |
శమితసకలదోషా బాలగోపాలవేషా
విమలసుగుణహృద్యా వేదవేదాంతవేద్యా
సుమహితగుణజాలా సూరిసంస్తుత్యశీలా
సముదితరవితేజా చంద్రవంశాధిరాజా.
| 3360
|
| గద్యము. |
ఇది శ్రీరామచంద్రచరణారవిందరసాస్వాదనతుందిలేందిందిరాయమాణ
మానస కులపవిత్రకౌండిన్యగోత్ర పద్మనాభసూరిపుత్ర విద్యాసాంద్ర వేంకట
కవీంద్రప్రణీతం బైనశ్రీమద్రామాయణం బనుమహాకావ్యంబునందు రాముని
దండయాత్రయు సముద్రసంగమంబును రావణమంత్రంబును విభీషణనీతిప్రబో
ధంబును రావణకోపంబును విభీషణుండు రామునిశరణంబు వేడుటయు రావణ
వధోపాయనివేదనంబును సముద్రప్రార్థనయు రామకోపంబును సముద్రసమాగ
మంబును సేతుబంధంబును సముద్రప్రతారణంబును శుకవిమోచనంబును వానర
బలసంఖ్యానంబును సువేలారోహణంబును రావణసుగ్రీవుల యుద్ధంబును రావణ
మకుటభంగంబును లంకానిరోధంబును స్కంధావారనివేశనంబును నంగదుని
|
|
| |
రాయబారంబును యుద్ధప్రారంభంబును ద్వంద్వయుద్ధంబును నాగాస్త్రబంధ
మోక్షణంబును ధూమ్రాక్షవధంబును వజ్రదంష్ట్రవధంబును నకంపనవధంబును
బ్రహస్తవధంబును రావణునిపరాజయంబును గుంభకర్ణవధంబును మహోదర
మహాపార్శ్వదేవాంతకనరాంతకాతికాయత్రిశిరులవధంబును నింద్రజిత్తు
యుద్ధంబును బ్రహ్మాస్త్రప్రయోగంబున వానరు లందఱు మూర్ఛితు లగుట
యు హనుమంతుండు మహౌషధిశైలంబు దెచ్చి వానరుల బ్రతికించుటయుఁ
బునర్లంకాదహనంబును గుంభనికుంభయూపాక్షశోణితాక్షప్రజంఘాకంపను
లవధంబును మకరాక్షవధంబు నింద్రజిత్తు వానరమోహనార్థంబు మాయాసీతం
జంపుటయును రామశోకంబును నింద్రజిత్తునికుంభిలాహోమారంభంబును విభీ
షణోక్తప్రకారంబును లక్ష్మణుం డింద్రజిత్తుపయికిం జనుటయు హోమభంగం
బును నింద్రజిల్లక్ష్మణులయుద్ధంబును నింద్రజిద్వధంబును రావణునివిలాపంబును
రావణుండు కోపించి సీతం జంప గమకించుటయు సుపార్శ్వుండు నివారించు
యటు మూలబలయుద్ధంబును రాక్షసపరిదేవనంబును రావణయుద్ధంబును లక్ష్మణ
మూర్ఛయు హనుమంతుండు ద్రోణగిరికిఁ బోయి మార్గంబునఁ గాలనేమిం జంపి
దివ్యౌషధీప్రదానంబున లక్ష్మణునిమూర్ఛ దేర్చుటయు రావణుండు పాతాళ
హోమంబుఁ జేయుటయు రామరావణులయుద్ధంబును శక్రునిపంపున మాతలి
రథంబు గొనితెచ్చుటయు నగస్త్యుండు రామున కాదిత్యహృదయం బుపదేశిం
చుటయు రావణవధంబును సీతావహ్నిప్రవేశంబును సర్వదేవతాసమాగమం
బును వహ్నివచనంబున రాముండు సీతం బరిగ్రహించుటయు నింద్రవరంబున
మృతు లైనవానరుల నందఱఁ బునస్సంజీవితులం జేయుటయు విభీషణాభిషే
కంబును బుష్పకారోహణంబును నయోధ్యాగమనంబును భరతసమాగమం
బును రామాభిషేకమహోత్సవంబును సర్వసైన్యవిసర్జనంబును రామరాజ్య
వర్ణనంబు ననుకథలం గలయుద్ధకాండము సమాప్తము.
|
|
| శా. |
ఈకావ్యప్రతిపాదితుం డయినసీతేశుండు రామప్రభుం
డీకళ్యాణకృతీశ్వరుం డయినశ్రీకృష్ముండు సంప్రీతితో
సాకల్యంబుగ నిష్టసిద్ధికరులై చంచత్కృపాపూర్ణతన్
లోకస్తుత్యకుమారయాచధరణీంద్రుం బ్రోతు రెల్లప్పుడున్.
|
|
శ్రీరాధాకృష్ణార్పణ మస్తు
శ్రీసీతాలక్ష్మణభరతశత్రుఘ్నహనుమత్సమేత శ్రీరామచంద్రార్పణ మస్తు