Jump to content

గోగీతము

వికీసోర్స్ నుండి

​



గోగీతము



'భోజరాజీయము' లోని

గోవ్యాఘ్రసంవాదమునుండి

యనువదింపఁబడినది



నాళము కృష్ణరావు



1927

0-2-0

​

గోగీతము

అనఁగనఁగ నొక్క చక్కని యావు కలదు,
కుఱుచకొమ్ములు బదువైన గుల్ల పొదుఁగు
మెత్తనై కుఱుమట్టంపు మేను కలిగి
కనులపండువు సేయు నాగంగిగోవు.

పొడువ దెవ్వరి, కయ్యంబుపొంతఁ బోదు,
చెనఁటియావులతో చెల్మి చేయ దెపుడు
బుడుతఁ డైనను పిదుకుచో పొదుఁగు చేపి
కుంభ ధారగ క్షీరముల్ కురియఁజేయు.

మిసమిసని దానినిద్దంపుమేను జూచి
మవ్వ మగు దాని గికండకొవ్వు జూచి
పోతరించిన దానిమూపురము జూచి
గండుపులి యొండు దానిపై కన్నువైచె

​

ఒక్క దినమున నా ధేను వూరిబయట
కానలో మేయుచుఁడంగ, కాంచి పొంచి
చెంగు మని యొక్క గంతున చెంగలించి
గోవుపై ఁ బడె నాపులి గోండ్రు మంచు.

గుప్పు మని యిట్లు తనపైకి కొప్పరించి
బొబ్బరింతలు పెట్టు బెబ్బులిని జూచి
కొంచెమేనియు నయ్యావు కుదిలగొనక
ఇట్టు లనియెను ధీరత యుట్టిపడఁగ.

ఆగు మాగుము ఫులిఱేఁడ! యాత్ర మేల?
చిడుముడి యొకింత మాని నేఁ జెప్పఁబోవు
చిన్న విన్నప మొకసారి చిత్తగించి
ఆరగింపుము కడుపార నవల నన్ను.

అనుడు నామాట బెబ్బులి యాలకించి
వెఱగుపాటును నివ్వెఱ పెనఁగొనంగ
మీఁది కెత్తిన కే లట్టె మీఁద నిలిపె
చిత్తరువులోని బొమ్మ నా చేష్ట లుడిగి.

కోలుపులి యంట, ఆకలి సోలె నంట,
చియ్యబట్టినయావు చేఁజిక్కి నంట,
నిలువు మన నావు, పులి యట్టె నిలిచె నంట,
ఎన్న డేనియు వింటిమే యిట్టివింత?

​

మరణ మన ధేను వించుక వెఱుపుగొనక
సాహసంబునఁ జూపిన శాంతమునకు
పులియె యద్దిర! పిల్లియైపోయె ననఁగ,
శాంతమున గెల్వరానిది జగతిఁ గలదె?

అంత పులితోడ నీరీతి సనియె మొదవు
'ఓయిపులి రాజ! ఈ పొంతయూరఁ గలఁడు
పాఱుఁ డొక్కడు సన్ను తాచార పరుఁడు
మురిపమున వాడు పెనుపంగ పెరుగుచుంటి.

నిరత మాతఁడు నులివెచ్చనీటఁ గడిగి
కసవుపోచల నా మేనికపటు వోవ
సవరగాఁ దోమి, గంగడోల్ నివిరి దువ్వి
అంటుసంటుల కొనగోట నంటి తివియు.

ఏమి చెప్పుదు నాతని ప్రేమగరిమ?
ఎట్టిరుచిర పదార్థము నేనిఁ దాను
మున్నుగా నాకు పెట్టక ముట్టఁ డెపుడు,
తడవ నేటికి యిప్పు డాగొడవ యెల్ల?

పుట్టె నా కొకతోలిచూలిముద్దు పట్టి
మూడునా ళ్లయిన చనలేదు వాఁడు పుట్టి
బొడ్డుమావియు నూడనిపురిటిపాప
పూరి ముట్టఁడు, త్రావఁడు నీరువట్టు.

​

తువ్వ కాదది తేనియగవ్వ గాని
గవ్వ కా దది నును వెండిమువ్వ గాని
మువ్వ కా దది తెలిమల్లెపువ్వు గాని
పువ్వు కాదది జిగి వెన్న ముద్ద గాని,

పాలు గుడిపితి తెల తెల్లవాఱు వేళ
ఇంతలో నందునిందుకు గంతులిడఁగ
అకట! ఆపాలు పుడిసెడు సఱిగిపోవ
తూలుచున్నాఁవొఁ యాకట సొలి కొడుకు:

వీఁకమై నేను తకమేను నాఁకుచుండ
తోఁక పై కెత్తి వీనుల దోరవైచి
కన్ను లఱమోడ్చి సొక్కు, నాచిన్ని కూన
కెవరు ది క్కొకొ యెక్కటా! యింకమీఁద?

నన్ను గానక నెమరి కాకన్న కొడుకు
దారి నేగొడ్డుటా వైనఁ దారసిలిన
పొదుఁగు తొనకంగ, సయ్యది యువరిపడుచు.
కొమ్ముచేఁ గ్రుమ్మి చిమ్మునో కుదికిలఁబడ?

కుక్షి నిండును గుక్కె డుగుమ్మపాల
నాదుసుతునకు, నా మేనిసంజు డెల్ల
తనివి దీఱఁగ నారగించినను గాని
ఉడుగ దించుకయేని నీకడుపుచిచ్చు.

​

చిన్ని పాపకు మున్నుగా చన్ను గుడిపి
అవల నియాకలిని దీర్తు వ్యాఘ్ర రాజ!
ఇంతమాత్రము చనవు నా కియ్య నయ్య
పుట్టకుండునే డయ నీకు పులిన యైన?

పుడమి గోవులమై మేము పుట్టినపుడే
వ్యాఘ్రముల కామిషంబుగ నజుఁడు మమ్ము
చేసెఁ గావున దీనికై చింత యేల?
భోజ్యమను నేను వ్యాఘ్రమా! భోక్త వీవు."

అనుచు నీరీతి వచియియించు నావుఁ జూచి
వికటముగ నవ్వి మువ్వన్నె మెకము పలికె
ఏటి కీమాట లాడెద? విట్టిపలుకు
లెవ్వ రైనను విన్నచో నవ్వ రొక్కొ?

ఒరులచేఁ జిక్కి, మడియంగ నున్న వేళ
ఏయుపాయంబు పన్నియో యెట్టు లైన
తనదుప్రాణంబు గాపాడఁ బెసఁగుఁ గాని
సమ్మతించునే చావ సేజంతు వైన?

నోటఁ జిక్కినజంతు వేనాఁట నైన?
విడిచె పులి యంచు వింటివే వెఱిగోవ?
కోరి తనుదాన బెబ్బులినోరఁ గవియు
జంతు వెందైన నుండునే జగతియందు?

​

విడిచినంతన బ్రతుకు జీవుఁడయటంచు
సరగ తనయునికడ కేగి చన్ను గుడిపి
కాంక్ష మీఱఁగ నుందువు గాక, యకట!
తిరిగి వత్తువె యిచ్చటి కెఱిఁగి యెఱిఁగి?

బ్రదికియుండిన శుభములు బడయవచ్చు
తఱకలును చొప్ప చాలును, మఱచి యైన
తలపొలము వీడి యడు గైన దాట' నంచు
తలఁచెదవు కాని నామాట తలఁతు వొక్కొ?

మహితవిజ్ఞానయుతు లైన మనుజులం దె
మాట తప్పంగ నేరని మానధనులు
కానరా రన్న, మాటికి గడ్డి కఱచు
పసరములమాట వేఱ చెప్పంగ నేల?

ఆఁకటను ప్రేగు నకనకలాడుచుండె
ఇట్టు న న్నింక నఱ్ఱాఁక వెట్టఁ దగునె?
తడవు సేయంగ నేటికి? తనివి దీఱ
నంజుకొనియెద నీ మేనినంజు డెల్ల.

ఇట్టు లేమిటి కింకను నెట్టుకొనెదు?
నీదుకఱుదుల నాకుక్షి నిండుకొనునె?
బిడ్డపై జడ్డు విడలేక పెనంగె దౌర!
ప్రిదులవచ్చునె నాముందు వెఱ్ఱిగొవ?

​

నావు డామాట లాలించి యావు పలికె
అలుకమై తన్ను గద్దించు పులిని జూచి
పులుకుపులుకున కన్నీరు తొలకరింప,
పలుకుపలుకున దైన్యంబు గులకరింప.

అగునె నీ విట్టు లాడంగ వ్యాఘ్రరాజ?
పశుగణంబుల యందును పక్షులందు
పలుకు తిరుగక చరియించువారు లేరె?
బోయ కీయదె తన మేను మును కపోతి?

ఆడి తిరిగిన చండాలుఁ డండ్రు గాని
కులము చండాలుఁ డైనను కొఱఁత లేదు
ఆడి తిరుగక యుండెనా వాఁడె పుడమి
పూజ్యుఁ డరుమాట విన లేదె పులుల ఱేడ!

కడుపుతీపుకొలందిని నుడివియుంటి
నీ నెఱుంగనిధర్మంబు లెందుఁ గలవు
పోయి రమ్మని యందువా పోయివత్తు
అట్లు గాకున్న నీ కొక్క యడ్డు గలదె?

అతిధి సత్కారమునకంటె సధికఫలము
కలుగ దంచు వచింతురు గాదె బుధులు:
కాన నీ కిదె నా మేను కాన్క యిత్తు
కాంక్ష దీఱ భుజింపుము కడుపునిండ.'

​

కఱకుఱా లైన జాలిచే కఱఁగఁ జాలు
ఆవు పలికినపలుకుల నాలకించి
ఇట్లు వచియించె బెబ్బులి యెట్ట కేని
హృదయమున ప్రేమలతికలు ఱేకులెత్త.

"ఏను నిను వీడ చయ్యన నింటి కేగి
పుత్ర మోహంబు కడుపార పొంగిపొరల
మగుడ వత్తువో రావో నమ్మంగఁ జాల
శపథ మేమి యొనర్తువో చెప్పుమ గోవ!'

అనుడు మోమున దరహాస మంకురింప
పులికి వందన మొనరించి పలికె నావు
బళిర! నీ మేలు మఱపంగఁ గలనె యెపుడు?
వినుము నే నిచే బాస గావించు చుంటి.

గోవులను పస్తువెట్టెడి కూళగతికి
గొడ్ల ముకుత్రాళ్ళ బంధించు కుజనుగతికి
చూడ లేనావు పితికిన దుష్టుగతికి
పోవుదానను నే రాకపోతి నేని.

దేవదూషణ సేయు నాస్తి కునిగతికి
గురుల ధిక్కార మొనరించు కుమతిగతికి
సాధువుల బాధపెట్టు నృశంసుగతికి
పోవుదానను నే రాకపోతి నేని.

​

తల్లిదండ్రులు నిందించు ప్రల్లదుండు
బంధువులఁ బ్రొవ నేరని బ్రహ్మబంధు
వర్ధిజనములు మనుపని వ్యర్థ జీవి
అల్పజంతువులకు హింస సల్పు ములుచ.

పరసతులఁ బట్ట మంకించు పరమపాపి
అన్యధనములఁ గాంక్షించు నట్టి చెనటి
చెలుల నమ్మించి ద్రోహంబు చేయు పలున
అరులు కాటిని వెన్నిచ్చు పిఱికి పంద,

తిన్నయింటికి వాసాల నెన్ను తులువ
అప్పు లొనరించి యెగఁ బెట్టు నాక తాయి
కూటసాక్ష్యము లిచ్చెడు కుటిలబుద్ధి
కొండియంబుల నాడెడు కుత్సితుండు,

అతిథు లింటికి నే తేర నన్న మిడక
కుక్షి నిండంగఁ గుడుచు కక్కూర్తి కాండు
తాను గుడువక యొరులకు దాన మీక
పసిఁడి కుప్పలుగాఁ గూర్చు పిసినిగొట్టు,

అగ్ని సాక్షిగ పరిణయమాడినట్టి
కులసతిని వీడి వెలయాలిఁ గూడు కూళ
కడుపుకూటికై కాటికి కాళ్లు సాఁచు
ముదుసలికి కూఁతు తెగనమ్ము ముష్కరుండు

​

పరులకృతిలోని యెంగిలి భావములను
దొంగిలించెడు వెంగలిదుష్టకవులు,
కవులకై తంపుహక్కులు క్రయముదీసి
గ్రంధవిక్రయ మొకరించు కష్టమతులు,

సుతులు మృతి నొంద వారలస్మృతుల పేర
కృతుల రచియించి యమ్ము నికృష్ట జీవి
పోవువారలగతులకు పోవుదాన
నింటికడ కేగి మగుడ రాకుంటినేని.'

సత్యదేవత యెదుట సాక్షాత్కరించె
ననఁగ వెలుఁగొందుచున్న యయ్యావు జూచి
అచ్చెరువు ఱిచ్చపాటును పిచ్చలింప
పలికె నీరీతి శార్దూలనల్లభుండు.

చాలు చాలును గోవ! నీసత్యనిష్ఠ
కిచ్చ మెచ్చితి, నీయింటి కేగి, వేడ్క
కన్న బిడ్డకు కడుపార చన్ను గుడిపి
తిరుగ రావమ్మ నాకోర్కి దీర్ప వేగ.

కడుపుతీపిని నీ విట్లు పడెడు బాధ
కడుపుమంటను నే నిప్డు పడెడు బాధ
కంటె నధికఁబు కావున, నింటికడకు
పోయి రావమ్మ వేగ నోపుణ్యురాల!

​

వనధిలో తెంతో యెన్నంగ వచ్చుఁ గాని
తల్లిదయలోతు నెన్నంగఁ దరము కాదు.
మాతృప్రేమకు సాటి యీధాత్రిఁ గలదె?
పోయి రావమ్మ వేగ నోపూజ్యురాల!'

అనుడు పులికి ప్రదక్షిణ మాచరించి
కనుల నానంద బాష్పముల్ క్రమ్ముకొనఁగ
అరిగె పరుగున ధేను 'నంబా' యటంచు
పొదుఁగువ్రేగున తడఁబడ పదచయంబు.

ఆసుధామధురథ్వని యాలకించి
వత్స ' మంబే' యటంచును పఱుగు వాఱి
మాతకడ కేగి పొదిక్రింద మూతి దూర్చి
గుప్పుగుప్పున దుగ్గముల్ గుడిచికొనియె.

ముట్టెతోఁ గుమ్మి పొదుగుపై పొడిచి పొడిచి
కొడుకు పాల్ ద్రావుచున్నంతతడవు తల్లి
అట్టు,నిట్లును మెదలక యట్టె నిలిచె
తెల్ల రాతిని మలచిన ధేను వనఁగ.

అంత నాయింటియిల్లాలు చెంత కరిగి
బిందె చేకొని పొందిక్రిందఁ బెట్టి నిలువ
ఉఱు దాయియు లేకయె ముఱు బాలు
కురిసె సంతతధారగా పొరలిపాఱ.

​

పొట్టపొంగున తనతల్లిపొదుఁగు వాసి
గురువువాఱుచు నటునిటు పఱువులేత్తు,
తల్లి యెలుఁగెత్తి పలుమఱు దన్ను బిలువ
నిలిచి తల యెత్తి చూచుచు పొలసియాడు.

సుడిసి యెవరైన తను బట్టఁ గడఁగి రేని
వీక చేయీక కుప్పించి చౌకళించు,
బిడ్డ లెవరైస దారిలో నడ్డమైన
మిట్టిమీనయి జంకించి మింటి కెగయు.

పుడమిపై ముట్టె నానించి మూరుకొనుచు
చెండు మీటినగతి పైకి చెంగలించు,
గఱికిపఱకల నెడ నెడ కోఱుకఁ దివురు,
నేలఁ బొరలాడు, క్రమ్మఱ నిలిచి పాఱు.

ఇట్లు శైశవక్రీడల నెసఁగుచున్న
పుత్రుఁ బొడఁగని కన్నీరు పొంగిపొరల
ఇట్టినెత్తురుకందు నే నిచట డించి
పోవవలసెనే కటకటా! దైవగతికి?

ఈడుదూడలు తమతల్లు లేగు దేఱ
ఎదురుగా నేగ, తానును ముదము మీఱ
నేగి, తనమాతృహీనత యెఱుకపడఁగ
చిత్తమున నెంత కుందునో చిన్ని కూన?

​

ఏను తను జాసిపోవుట యెఱుఁగ కకట!
ఆడుచున్నాఁడు బిడ్డడు వేడు కలర;
అచట బెబ్బులి యాఁకట కాగలేక
స్రుక్కి సోలుచు నను దూఱి సురిగె నేమొ.

గడియయేనియు నే నిట తడయ నగునె?
అనుచు ధేనువు తలపోసి, మనమునఁదు
నెట్టికొనివచ్చు శొకంబు మట్టువఱచి
తనయునిఁ జేరి వానితో ననియె నిట్లు,

'అన్న! నవమాసములు మోసి నిన్ను గాంచి
చనవుమై పెంచుచుంటిని చన్ను గుడిపి
నీవు జనియించి మూన్నాళ్లు నిండ లేదు,
నీకు నాకును చెల్లెనే నేఁడు ఋణము?

తండ్రి! యిఁకమీద నామాట తలఁపఁ బోకు
మమ్ము మఱువుము, సత్య మేమఱకు మయ్య
మనల నిన్నాళ్ళు ప్రేమతొ' మనిచినట్టి
విప్రునానకు మాఱు గావిఁపఁ బోక .

ఒంటి నేగకు పొలముల, కింటికడకు
పొద్దు వాలకమున్ను గాఁ బోవు మయ్య
కరులు ఖరములు తురగముల్ తిరుగుచొట
దారి కడ్డంబుగా నిల్చి తారఁ బోకు.

​

నూతిదరులందు లోతైన గోతులదరి
నెట్టి పచ్చిక మొలచిన మెట్టఁ జనకు,
గుమురుగా నున్న కసవుజొంపముల నేని
మూరుకొనకుండ నెన్నడు ముట్టఁ బోకు.

పోటుపస రాలజోలికిఁ బోకు మెపుడు
దుడుకుతోడు కులపొదుఁగుల దూటఁ బోకు
తెవులుగొం టులతోఁ గూడి తిరుగవలదు
మొసలి మసలెడు మడువుల మూతి నిడకు.'

నిన్ను బోయక చెంత నే నున యపుడె
ఒద్దికను నిన్ను ముద్దు సేయుదురు కాని,
అక్కటా! నేను నిను బాసి యరిగిసంత
లెక్కగొందురె ని న్నొక్క వక్క కైన?

తూడుకంటెను, పుప్పొడిధూళికంటె,
తృణకణముకంటె, పులుఁగులయీఁకకంటె
బెండు కంటెను, మఱి దూదిపింజకంటె
చల్క నగుఁ గాదె తల్లి లేనిసుతుఁడు జగతి.

స్వామి యెపు డైస కినుకచే నేమి యన్న
అల్క జెందక తలలోని నాల్క వగుచు
ఏను లేనట్టికొద గాననీక మెలఁగి
వెయ్యియేఁడులు నర్ధిల్లు మయ్యకొడుక!'

​

తల్లి యీరీతి బోధింప తల్లడిల్లి
దూడ యిట్లనె, అమ్మ! యిట్లాడె దేమె?
దాన మొసఁగెనో, అమ్మెనో, తన తనూజ
కరణ మిచ్చెనో చెప్తును భూసురుఁడు నిన్ను?

ఎటకుఁ బోయెదు? నీవెంట నేను వత్తు
గోవుదూడల నెడ సేయు కుమతి గలఁడె?
నీవు లేకున్న నిముసంబు నిలువఁ జాల
తల్లితోడిద లోకంబు పిల్లలకును.

పేర్మి నన్నింక నెవ్వరు పెంచువారు?
వీక న న్నింక నెవ్వరు నాకు వారు.
కూర్మి న న్నింక నెవరు చన్గుడుపు వారు?
ఎందు బోయెదు న న్నొంటి నింట డించి?'

కనుల జలజల బాష్పముల్ కాల్వ గట్ట
వత్స మీరీతి తనచోడఁ బలుకుచుండ,
జల్లుజల్లని హృదయంబు జలదరింప
సూనుఁ గౌఁగిట గదియించి సురభి యనియె.

జాలి నీలీల వాపోవ 'నేల వత్స?
పాఱుఁ డెవరికి న న్నీయ పాలువడఁడు,
విధినియోగంబుచే నేన వెడలుచుంటి'
అంచు జరిగిన దెల్ల విన్పించె, నంత.

​

కొఱవిచేఁ గాల్చినట్టులు, సురియ బెట్టి
వ్రచ్చినట్టులు, కొఱ్ఱున గుచ్చినట్లు
ములుకులను బోలు తనతల్లిపలుకులు విని
గుండె లవియంగ నేలపైఁ గూలె దూడ.

అంబ యను, నన్ను వీడ నాయంబ యనును,
వనట ముంచితె చెనంటిదైవంబ! యనును,
ధరణి నాజీవ మింక వ్యర్ధంబ యనును,
అకట! పులి యేల దాపురం బయ్యె ననును-

అనుచు పలవించుతనయుని కనియె గోవు
జీవియై పుట్టుపిమ్మట చావు నిజము
ఉఱక చచ్చుటకంటెను పరులకొఱకు.
మరణ మొందుట పరమధర్మంబు గాదె?

అమలసత్యంబె యూఁతగా, వ్యాఘ్రవక్ర,
గహ్వరం బది మోక్షమార్గంబు గాఁగ
స్వర్గసుఖముల చూఱాడఁ జనుచునుంటి
అహహ! యింతటికంటె భాగ్యంబు కలదె?'

అనుచు నాత్మజశోకద వాగ్ని కీల
లాత్మవచనాంబువృష్టిచే నాఱఁజేసి
సత్వరంబున పులి యున్న చక్కి జేర
నరిగె గోరత్న, మంత నవ్వ్యాఘ్ర మచట.

​

పాటి యున్నదె యెందైన పసరమునకు?
బేలనై దానిమాటల బెలువడితి
కేలఁ జిక్కి నయావులు గోలుపోతి
అకట! నావంటియంబేద యవనిఁ గలడె?

బళిర! తా నొక్క నిజమరిబలె నటించి
పెక్కు బాసలు చేసి తప్పించుకొనియె,
అయినఁ గానిమ్ము, ఇంతలో నైన దేమి?
ఎదురువడకున్నె యది యింక నెన్న డేని?

ఇంక నీ సారి అయ్యది యెదురుపడిన
ఒక్క పెట్టుక దాని పై నుఱికి, మేను
వ్రచ్చినందఱచేసి యావెచ్చనెత్రు
గ్రోలకుండిన నింక నే క్రొలుపులినె?

అంచు పెటపెట పండ్లు దీటించుకొంచు
కడిఁదియాఁకట కటకటబడుచునున్న
పులికుఱంగట నొయ్యన నిలిచె గోవు
చుక్క తెగి రాలిపడినట్లు చక్కవచ్చి.

ఇట్టు లరుదెంచి పులి చెంత నిట్టనిలిచి
ధేను విట్లనె (పులిఱేఁడ! నేను పోయి
ఎంతో తడ వయ్యె, అక్కటా! యింత సేపు
ఎటు లుంటివో యాఁకట బిట్టు దూలి?

​

వ్యాఘ్రరాజమ! నీచేసినట్టి మేలు
మఱన శక్యమె యెన్ని జన్మముల కైన?
నీదయారసకలనచేఁ గాదె యేరు
బుజ్జగించితి సుతునకు బుద్ధి సెప్పి.

నాదుకోరిక దీఱెను, నీదుకోర్కి
యింక దీఱఁగ నా దేహ మిదిగొ నీకు
ధారవోయుచునుంటిని, తనివిదీఱ
నారగింపుము తడవు సేయంగ నేల?'

అనుచు నీరీతి తనతోడ నావు పలుక,
చిత్ర మది యేమొ! పులి యంత చేష్ట లుడిగి
తేకువను గోలుపోవు, వితాకు జెందు,
కనుల నటె విచ్చి వెడవెడ గాంచు బయలు.

ఎదుట నిలిచిన యాపుఁ గన్నెత్తి కనఁడు,
గడగడ వడంకు, బాష్పముల్ కనుల నించు,
గొణుగుఁ డనలోన, వేదురు గోన్న భంగి
నుండు, తల యూచు, వెచ్చనియూర్పు పుచ్చు.

కరుణ యెట్టిదొ కల నైన నెఱుఁగనట్టి
వ్యాఘ్ర మీరీతి శౌర్యంబు పరిహరించి
దీనవృత్తిని వహియించి మౌనముద్ర
నుంట గనుఁగొని యక్కజ మొంది యావు.

​

అఱ్ఱు పై కెత్తి గంగకోల్ బిఱ్ఱబిగియ
పుండరీకముపొంతకుఁ బోవ, వ్యాఘ్ర
ముస్సురను రని పెద్దనిట్టూర్పు పుచ్చి
మార్మొగము వెట్టి వెనకకు మరలిపోవు.

అంత నీరీతి పులితోడ ననియె సురభి
కాదో యాకలి? నామీఁద కాంక్ష లేదొ?
నాదుమాంసము వాచవి గాదొ? యిట్లు
దెసలు జూచెద వేటికి తెల్లబోయి?

ఆకటకు స్రుక్కి వాడివ త్తయ్యే నొడలు,
కడుపు వీపున నంటె నప్పడము వోలె,
జాల మేటికి? నాదుమాంసమ్ము మెసవి,
పుణ్యలోకంబులకు సన్న బుచ్చ నయ్య.

ఆవు గావించు తెగునకు నదరిపడుచు
ఎట్టకేలకు శార్దూలమిట్టు లనియె,
పుడమి పై నేను పులి నయి పుట్టి పెరిగి
యిట్టిధీకత గంటినే యెన్న డైన?

అకట! నీయట్టి మహితాత్ము లైనవారి
బట్టి వధియించి దురితంబు గట్టికొనుట
కంటె, లొడితెడు పొట్టకై కాయగసరు
మెసవి మునివృత్తి మసలుట మేలు కాదె!

​

కన్ను గానక కూళనై యిన్ని నాళ్ళు
కూల్చితిని జీవరాసుల కోట్లకొలఁది,
కట్ట! నిను గూడ నా పొట్టఁ బెట్టికొనుచు
ఘోరనరకానలంబునఁ గూలఁ జాల.

నీదు ధర్మమె నినుగాచె, నేను నిన్ను
గాచిపుచ్చితి ననుమాట కల్ల, నేను
నిన్ను గెలుచుట యటు లుండె, నీవె నన్ను
గెలిచికొంటివి సత్య వాగ్విభవకలన.'

అనుడు ధేనువు వచియించె వ్యాఘ్రరాజు!
ఏల యీరీతి పలికెద? వేను మున్ను
ధారవోసితిఁ గాదె యీ తనువు నీకు
చింత యేమిటి కింక భక్షింపు మయ్య.

ఈవు నను గాచి విడువ, నే నింటి కేగఁ
గాంచి, ఈయావు పులి గికురించి వచ్చె
మాయురే! ఎంతమాయలమారి!' యంచు
నెల్లిదంబులు సేయరే యెల్లవారు?

అకట! సడికంటె చావు మే లగును గాని
చారుతరలీల నీకు నాహార మగుచు
కాయ మర్పించుటో, అట్లు గాక యున్న
జీవముల బల్మిఁ దొరఁగుటో చేయుదాన.'

​

అనుచు పులిఁ జేరి 'తిను' మంచు నావు పెనఁగ
నీకు మ్రొక్కెద నాజోలి రాకు మమ్మ
తినను తిన' నంచు బెబ్బులి పెనఁగ నిట్లు
జరగె వాదము వారికి చాలసేపు.

అంత ఖేచరు లద్భుత మంది, గోవు
సత్యవాకుృద్ధి, పులికృపాసక్త బుద్ధి
చాల మెచ్చుచు నంతరిక్షమున నుండి
కుసుమవర్తంబు వారిపై కురిసి రోగిని.

మొలను పులితోలు పచ్చడంబును ధరించి
నృషభ రాజంబుపై నెక్కి వేడు కలర
అంత నీశ్వరుఁ డచట ప్రత్యక్షమయ్యే
వ్యాఘ్ర ధేనూ త్తమంబుల వాద ముడుప.

ఇట్టు లవతరించిన యీశు నెదుటఁ గాంచి
వ్యాఘ్రమును గోవు భక్తి సంభ్రమము లెసఁగ
స్తుతు లొనర్చిరి, దాని కీశుండు మెచ్చి
కరుణతో నిచ్చెవారికి పరమపదము.

బుద్ధిచాలని మూర్ఖుని పుడమియందు
పశు వటంచును పిలుతు, రాపశువ కాదె
నిత్యసత్యవ్రతంబును నిర్వహించి
ప్రవిమలానందపదవిని బడయఁగలిగె.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse

"https://te.wikisource.org/w/index.php?title=గోగీతము&oldid=501891" నుండి వెలికితీశారు