Jump to content

గురుజాడలు/కవితలు/పూర్ణమ్మ

వికీసోర్స్ నుండి

ఆడపిల్లల పాటలు

పూర్ణమ్మ

మేలిమి బంగరు మెలతల్లారా !
కలువలకన్నుల కన్నెల్లారా !
తల్లులగన్నా పిల్లల్లారా !
విన్నారమ్మా యీకథను.


ఆటలపాటల పేటికలారా !
కమ్మని మాటల కొమ్మల్లారా !
అమ్మలగన్నా అమ్మల్లారా !
విన్నారమ్మా మీరీ కథను.


కొండలనడుమను కోనొకటున్నది;
కోనకి నడుమా కొలనొకటుంది;
కొలనిగట్టునా కోవెలలోపల
వెలసెను బంగరు దుర్గమ్మ.


పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడిబొమ్మా పూర్ణమ్మా;
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
పూజలు పువ్వులు కోసేది.


ఏయేవేళల పూసేపువ్వుల
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

ఏ యే ఋతువుల పండే పళ్ళను
ఆయా ఋతువుల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
            పుత్తడిబొమ్మా పూర్ణమ్మ.

పళ్ళను మీరిన తీపుల నడలను
పువ్వులు మీరిన పోడుములున్
అంగములందున అమరెను పూర్ణకు
             సౌరులుమించెను నానాటన్

కాసుకులోనై తల్లీదండ్రీ
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడిబొమ్మను పూర్ణమ్మను వొక
            ముదుసలి మొగడుకు ముడివేస్రీ.

ఆమనిరాగా దుర్గకొలనులో
కలకలనవ్వెను తామరలు;
ఆమని రాగా దుర్గవనములో
            కిల కిల పలికెను కీరములు.

ముద్దునగవులూ మురిపెంబు మరి
పెనిమిటిగాంచిన నిమిషమున
బాసెను కన్నియ ముఖకమలమ్మును
             కన్నులగ్రమ్మెను కన్నీరు -

ఆటల పాటల తోటి కన్నియలు
మొగుడు తాత యని కేలించ,
ఆటల పాటల కలియక పూర్ణమ
             దుర్గను చేరీ దుఃఖించె -

కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను
పుత్తడి బొమ్మను పూర్ణమను;
చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను
             పుత్తడి బొమ్మకు పూర్ణమకు -

పసుపు రాసిరి బంగరు మేనికి
జలకము లాడెను పూర్ణమ్మ;
వదినెలు పూర్ణకు పరి పరి విధముల
              నేర్పులు మెరసీ కై చేస్రీ.

పెద్దల కప్పుడు మొక్కెను పూర్ణమ
తల్లీ తండ్రీ దీవించ్రీ;
దీవన వింటూ పక్కున నవ్వెను
             పుత్తడి బొమ్మా పూర్ణమ్మా!

చిన్నల నందర కౌగిట చేర్చుకు
కంటను బెట్టెను కన్నీరూ;
అన్నల తమ్ముల నప్పుడు పలికెను
             పుత్తడి బొమ్మా పూర్ణమ్మా -

అన్నల్లారా తమ్ముల్లారా!
అమ్మను అయ్యను కానండీ!
బంగరు దుర్గను భక్తితో కొలవం
             డమ్మలకమ్మా దుర్గమ్మా.

ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ,
భక్తిని గోసి శక్తికి యివ్వం
             డమ్మల కమ్మా దుర్గమ్మా

నలుగురు కూచుని నవ్వే వేళల
నా పేరొకతరి తలవండి
మీమీ కన్నబిడ్డల నొకతెకు
             ప్రేమను నా పేరివ్వండి.

బలబల కన్నుల కన్నీరొలికెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు
కన్నులు తుడుచుకు కలకల నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా.

వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడిబెట్టన్
కాసుకు లోనై అల్లుని తలుచుకు
ఆనందించెను అయ్యొకడె.

యెప్పటి యట్టుల సాయంత్రమ్మున
యేరిన పువ్వులు సరిగూర్చి
సంతోషమ్మున దుర్గను కొలవను
వొంటిగ బోయెను పూర్ణమ్మ.

ఆవులు పెయ్యలు మందల జేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటను చుక్కలు మెరయుచు పొడమెను
               పూర్ణమ యింటికి రాదాయె.

చీకటి నిండెను కొండల కోనల
మేతకు మెకములు మెసల జనెన్
దుర్గకు మెడలో హారములమరెను
               పూర్ణమ యింటికి రాదాయె.

కన్నుల కాంతులు కలవల చేరెను
మేలిమి జేరెను మేని పసల్!
హంసల జేరెను నడకల బెడగులు
              దుర్గను జేరెను పూర్ణమ్మ.


(రచనాకాలం1912 అని విమర్శకులు ఊహిస్తున్నారు. గురజాడ వెంకట రామదాసు 1929లో ప్రచురించిన 'ముత్యాలసరములు, చిన్నకథలు' పుస్తకంలో ఆడపిల్లల పాటలు' అనే శీర్షికపెట్టి 'పూర్ణమ్మ' గేయాన్ని వేశారు - సం||)

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.