Jump to content

గరిమెళ్ళ వ్యాసాలు/ఆంధ్ర రాష్ట్రమునకు ఆలస్యమేల?

వికీసోర్స్ నుండి

​

ఆంధ్రరాష్ట్రమునకు ఆలస్యమేల?

(ఆలస్యమువలన కలుగు మహానర్థములు సత్వర కార్యనిర్వాహణావశ్యకత)

ఆంధ్రు లారంభశూరులన్నమాట ఆధునిక కాలములో అనుశ్రుతమై పోయినది. దేశోద్ధారకుని పత్రికా సంస్థలు, పట్టాభిగారి బందరుసంస్థలు, ఉన్నవ వారి శారదానికేతనము మొదలగు కొన్ని మాత్రము ఈ సూత్రమునకు కాస్త వ్యతిరేకములై నేటివరకును నిలిచి యున్నవి. తగిన కట్టుదిట్టములు చెస్తే చిరస్థాయులే కాగలవు ఇంక రాజమహేంద్రవరం పేపరుమిల్లుకు పాపరు చీటీ వచ్చినది. చెన్నపురి స్వరాజ్య పత్రికకు కన్నం పడిపోయినది. ఎన్నెన్నో పారిశ్రామిక సంస్థలను యెన్నెమ్మ కొట్టి వేసినది. క్రొత్త క్తొత్తగా ఊహింపబడుచున్న సినీమాకంపెనీలు రిత్త ప్రకటనలగుచున్నవి. దేశీయ విద్యాప్రయత్నములు తేజోహీనము లగుచున్నవి. కొన్ని కొన్ని ఖధ్దరుసంస్థలు కూడ కల్తీలపాలగుచున్నవి.

ఇందుకు కారణము లేకపోలేదు. ఏ సంకల్పము నైనను ప్రారంభించే నాడుండే విజృంభణము ఆ మర్నాడు ఆంధ్రుల కుండదు. ఆరంభములు అత్యంతమగు అట్టహాసముతో జరుగును. ఆ సంస్థలకు ఆరంభకులుగా, ఉపన్యాసకులుగా, అధ్యక్షులుగా, కార్యదర్శులుగా, కోశాధ్యక్షులుగా, భాగస్వాములుగా చేరేవారి సంఖ్యకు మితియుండదు. ఎవరిని చేర్చుకొనకున్న యేమి ముప్పువచ్చునో అన్నంత ఉప్పనగా ప్రతీదీ మొట్టమొదట ఉండను. ఇట్టి శుభోదయముతో ప్రారంభమైన సంస్థకు అడ్దు యేదైనను రాగలదా అన్నంత ఉత్సాహము మొదటి కొన్నాళ్ళదాకా ఆంధ్రుల నందరినీ ఉఱ్ఱూత లూగించుచుండును. ప్రోస్పెక్టసు అచ్చుపడగానేనో, పేరులు ప్రకటింపబడగానేనో ఆ ఉద్రేకము కొంచెము తగ్గును. కార్యోపక్రమణ మనేటప్పటికి కలతలు ప్రవేశించును. అక్కడనుంచి కార్యదర్శుల పాట్లు చెప్పనక్కరలేదు. సభ అనేనాటికి కోరముకూడుటయే కష్టము. కూడితే ఒక నిర్ణయమునకు రావడము కష్టము. దీనితో ఒకరిద్దరు వెనుకతగ్గి బిగి తగ్గించివేతురు. ఇతరులు వీరి ననుసరించి విరమింప బ్రయత్నము చేయుచుందురు. అటు తరువాత ​వైండింగుఅప్పు కడు సులభముగ నెరవేరిపోవును. కొందరికి కొంత నష్టముతో వివేక ముదయించి, వచ్చే ప్రయత్నాలలో అడుగుపెట్టుట మానుకొందురు.

ఇతర రాష్ట్రములు, అనగా బెంగాల్, గుజరాతు, పంజాబు, బొంబాయిలలో అనేక జాయింటు స్టాకు కంపనీలు, మిల్లులు, భీమా కంపెనీలు, ఫిల్ము చిత్రములు, బ్యాంకులు మొదలయినవి లేచి దీనదిన ప్రవర్ధమానము లగుచుండగా మన ఆంధ్ర రాష్ట్రములో అవి చాలా అరుదుగా ఉన్నవి. ప్రతీరాష్ట్రపు విదేశపు కంపెనీవారున్నూ మన ఆంధ్ర రాష్ట్రమును పలు విధముల దోచుకొనుచుండగా, మన శ్రమను ద్రవ్యమును మనము వారికి ధారపోయుచున్నాము. ఇతర రాష్ట్రములలోని యెట్టి డిగ్రీలును లేని యువకులు నెలకు వందలు వేలు జీతములు లాగుచుండగా మనము పెద్ద చదువులకై ఆస్తులు తగులబెట్టుకొని నిరుద్యోగులమై మలమల మాడిపోవుచున్నాము. మనకు మూలధనమునకు కొదవా, ధీచాతుర్యమునకు కొరతా, కార్యనిర్వహణశక్తి తక్కువా, యోగ్య వర్తనకు లోపమా? కార్యంపట్ల ఐకమత్యము శూన్యముగ ఉండుటొక్కటే దీనికి కారణమనవలెను. ఈ కారణము వల్లనే ఏకైక వ్యక్తి మాత్రస్థాపితములగు సంస్థ లేవియో కాస్త బాగున్నవి. తక్కినవి కృశించినవి.

సంఘీభావము అవశ్యకము

ఇది కలియుగము, ధనయుగము, వాణిజ్య యుగము. పదిమంది కలిస్తేనే కాని ప్రసిద్ధమైన ప్రయత్నము లేమీ కొనసాగవు. పదిమంది మాట ఒక్కటైతేనే యే సంస్థ అయినా బాగా వర్ధిల్లుతుంది కాని, లేకుంటే అత్యంతోన్నత స్థానమునకు రాజాలదు. ఈ యుగములో అత్యంతోన్నతమైన సంస్థలు మాత్రమే ఢకామక్కీలకు ఆగి కొంత కాలమువరకు నిలుచును కాని, సాధారణ సంస్థలు చితికిపోకతప్పదు. పదిమందితో కలిసి పనిచేసే శక్తి ఆంధ్రులకు తక్కువనుకోవాలి. ఎవరి క్రిందనో చాకిరీయైనా చేస్తారు కాని తమ సంఘముతో సమరసంగా వర్తింపలేరు. ఎవరి పట్టు నెగ్గాలని వారికే ఉబలాటం. పదిమంది పదితోవల లాగుతే అసలు పనే చెడిపోతుందనేనా వారికి దృష్టి వుండదు. ఎవరికీ ముఠీత్రోపు యెక్కువగా ఉంటే వారు కొంతవరకే పై చెయ్యి కలిగి ఉండగలరు గాని, కలకాలం ఆ స్థితిలో వారు ​ఉండలేరు. అటువంటి నిర్వక్రస్థితికి అతనొక పార్టీ బయలుదేరతీస్తే వెంటనే మరోపార్టీ బయలుదేరుతుంది. ఎవరి పార్టీ బలం కోసం వారు యెటువంటి పనులనైనా చేయుటకు సంకోచించరు. మన గ్రామ పంచాయతీ సంస్థలు, నగర పరిపాలన సంస్థలు, కాంగ్రెసు సంస్థలు, శాసన సభా సంస్థలు, ఇదీ అదీ అనడమెందుకూ - అన్ని సంస్థలలోనూ నేడు ఇటువంటి పార్టీలే ఉంటున్నవి. అవన్నీ పైనున్న కొన్ని ఉత్తరోత్తరాధికార సంస్థల క్రింది ఉంటున్నవి కనుక యేలాగో ఒకలాగ యీడ్చుకొని వస్తున్నవి., తక్కినవి వేగం వేగం తెగిపోతున్నవి.

ఈలాగైతే యేజాతియైనా యెప్పటికి అభివృద్ధికి రాగలదు? ఆంధ్రులు వెనుకబడుతున్నారు. ఆంధ్ర భాష పేలవమగుచున్నది. ఆంధ్ర సంపద హరించుచున్నది. ఆంధ్ర విజ్ఞానము కళలు ఆరిపోవుచున్నవి. ఆంధ్రులు నిరుద్యోగులగుచున్నారు. ఆంధ్ర రాష్త్ర సమస్య ఆలస్యమగుచున్నది అని వట్టి వట్తి ఆందోళనలు చేస్తే యేమి లాభము? ఆంధ్రులు మొట్టమొదట తమలో ఐకమత్యమును సాధించుకోవాలి. అప్పుడే క్రిందనున్న పల్లెటూరు బడి మొదలు పై నున్న ఆంధ్ర రాష్ట్రముదాకా అన్ని సమస్యలు ఏకముహుర్తమున సులభముగా పరిష్కారము కాగలవు. అట్లుకాక ఈ అనేకత్వం ఉన్నన్నాళ్లు మనము ఈ యీడు పొతలన్నీ పడవలసినదే. ఆంధ్రులకు మొట్టమొదట కలుగవలసినది ఈ ఆంధ్ర చైతన్యం. ఈ చైతన్యం లెకుండా వారికి వర్గ చైతన్యం, కులచైతన్యం, మతచైతన్యం, జిల్లా చైతన్యం, గ్రామ చైతన్యం, వ్యక్తి చైతన్యం కలుగుట వలన వారు మరింత పరస్పర కలహములకే పాత్రులై అసలు చైతన్యమునే కోలుపోవుదురు కాని నిజమైన జాతీయాభివృద్ధిని పొందజాలరు.

మనకు కావలసినది జాతీయచైతన్యము కాని, ఈ ఆంధ్ర రాష్ట్రీయ చైతన్య మెందుకని ఆక్షేపించేవారు కొందరు లేకపోలేదు. ఈమాట నిజమే కావచ్చును కాని ప్రతి రాష్ట్రమువారును తమ తమ చైతన్యములను ఆ రీతి నుద్దీపింపజేసుకొని సత్వరాభివృద్దికి వచ్చి భారతజాతీయ చైతన్యమునకు తగిన రీతిని దోహదము చేయుచుండగా ఆంధ్రులదెసమాత్రం వ్రేలుపెట్టి దీని నొక నేరముగా చూపుట పాడికాదు. ఇట్టి చైతన్య ముదయించినంత మాత్రమున ఇతరులపై అసూయ కలుగునని మన మనుకొనరాదు. వారి ​ప్రతిభను ప్రశంసించు ద్వారానే మనకిట్టి చైతన్యజ్ఞానము కలుగవలెను. మన రాష్ట్ర విషయముల యందు మన కెట్టి గౌరవాభిమానము లుండునో, అట్టివే ఇతర రాష్ట్ర విషయములందును . అఖిల భారత విషయములందును, ఉండుటకు వీలులేదా? భాషా ప్రయుక్త రాష్ట్ర సమస్య కిట్టి వ్యాఖ్యానము నెవరును ఎన్నడును చేయలేదే. తిలకు మహాశయుడే దీని నంగీకరించెను. జవహరులాలే ఆమోదించుచున్నాడు. ప్రతినాయకుడును దీనిని ప్రశంసించుచునే యున్నాడు. నిజముగా రాష్ట్రము లుండవలసిన పద్ధతియే అది. అంతేకాని బ్రిటిషు ప్రభుత్వ రాష్ట్ర విభజన పద్ధతి ఒక పద్ధతియే కాదు. వీలయినంతవరకు దానిని సవరించవలసినదే! దీని కాటంకము చెప్పుటలో వివేకము లేదు.

రాష్ట్ర సమస్య

ఇట్టి రాష్ట్రమే మనకు తొలి నుండియు ప్రత్యేకముగ ఉండిన యెడల మన సమస్యలును సంస్థలును స్థితిగతులును నేడింత వెనుకబడి యుండవు. మన సమస్యను దేనిని పరిష్కరించుటకును నేడు మనము కర్తలము కాకున్నాము. విద్యాసమస్య, పరిశ్రమల సమస్య, ఆర్థిక సమస్య, వ్యవసాయ సమస్య, నీటి పారుదల సమస్య, వాణిజ్య సమస్య యే సమస్య పరిష్కారము కావలెనన్నను మనకు పై అనుమతి ఒకటి కావలసియున్నది. ఆ పై అనుమతినిచ్చునది ఒక కలగాపులగం సంస్థయై యున్నది. అదియే మద్రాసు ప్రభుత్వము. ఆ ప్రభుత్వమునకు అందరితో వలె మనమును కప్పములు కట్టుచున్నాము, విధేయతలు సలుపుచున్నము; అభివృద్ధిని కల్పించుచున్నాము, కాని మన విషయమైన ప్రశ్న యేదైనా వచ్చినప్పుడు మన అందరి మాటా చెల్లుటకు వీలుకాకున్నది. ఆ ప్రభుత్వము తన అనుకూలము ప్రకారము ఈ ప్రశ్నకు సమాధానము చెప్పును కాని, మన అనుకూలము ప్రకారము మనకును, ఇతరుల అనుకూలము ప్రకారము వారికిని పరిష్కారమిచ్చే ఔదార్యము గలది కాకున్నది. కనుకనే భాషాప్రయుక్త రీతిని మనము నలుగురమును వేరువేరుగ నున్నచో అందరి సమస్యలును యథానుకూలముగా పరిష్కరించుకొనవచ్చుననియే మన సంకల్పము. ఎవరు కాని దీనికి ఎందుకు అడ్డము చెప్పవలెనో అర్థం కాకున్నది. ఇతరులను ​మించి కూడా మనలో మనమే స్పర్ధలు పడి దీనికెందుకు ప్రాతికూల్యమును ప్రకటించవలెనో మరీ అర్థం కాకున్నది.

అర్థములేని ఆక్షేపణలు

ఆంధ్ర రాష్ట్ర సమస్య కంటె మద్రాసు ప్రభుత్వ సమస్య చాలా ప్రధానమైనదియు, ఈ నూతన ప్రభుత్వ ప్రారంభావస్థలో దీనిని పైకి యెత్తితే ఆ ప్రధాన సమస్యకు ఆటంకము వచ్చుననియు మనకు కొన్ని హితబోధలు కూడా వినబడుచున్నవి. ఈ రాష్ట్రీయ, రాజధానీయ, అఖిలభారత జాతీయ సమస్యలలో ఒక దానికి ప్రాధాన్యమును, ఇంకొక దానికి ప్రాధాన్యమును కాని, ఒక దానికి ప్రథమ ప్రాధాన్యమును, ఇంకొక దానికి ద్వితీయ లేక తృతీయ ప్రాధాన్యమును కాని యిచ్చుటకు వీలులేదు. అన్నిటికిని సమాన ప్రాధాన్యము నిచ్చినపుడీ సవ్యమగు పరిష్కారము చిక్కగలదు కాని, ఇటువంటి భేద దృష్టి వలన లాభము చిక్కబోదు. ఈ భేదదృష్టి కేవలము కాలయాపనకు నెపమును, వేరు భావములకు ఆకరమును అగుచున్నదనుటకు సందేహం లేదు. ఇట్టి దృష్టి వల్లనే జస్టీసు, ఇండిపెండెంటు మంత్రివర్గములు ఈ సమస్యను దిగద్రొక్కి యథారీతిని కాలక్షేపము చేసుకొనగలిగినవి. కాంగ్రెసు మంత్రివర్గమునకు, అందులో ముఖ్యముగ మన ఆంధ్ర శాఖకు కూడా ఇటువంటి దృష్టి లేదని మనము అనుకోవలెను. కాలయాపనమున కగు నెపములను విడచి కార్యకరణమునకు దిగునప్పుడే యే మంత్రివర్గమైనను రాణించగలదు. క్రొత్త పంథాలకు దిగుటకై సంకోచించుచు తమకు చేజిక్కిన పదవుల నేవో యొకరీతిని నిలబెట్టుకొనుటకై తంటాలు పడుచుండుటవలనే గదా జస్టీసు ప్రభుత్వము నిర్వీర్యమై అఖాతములో మునిగిపోయినది! అట్టి రాజనీతిని తిరస్కరించియే కదా కాంగ్రెసు మంత్రివర్గము ఎన్నియో నూతన సంస్కరణములకు గడంగుచున్నది! వీనిలో యే సంస్కరణముకన్న ఈ సంస్కరణము తక్కువ ప్రధానమైనది? దీనికి కలిగే ఆటంకము లేమి?

ప్రారంభించిన నూతన సంస్కరణములకే చాలా సొమ్ము వ్యయమగుచుండగా, వానికి ఈ సంస్కరణమును కూడా చేర్చి ఆ వ్యయ భారమును మరింత యెక్కువ చేయవలె నెందుకని కొందరు మహాశయులు ప్రశ్నించి ​మన ఆశయమును త్రోసిరాజు చేయుచున్నారు. రాష్ట్రములన్నీ కలసి వుంటేనే దక్షిణ ఇండియా, లేక మదరాసు రాజధానీ ప్రభుత్వ మంతయు స్వయం సమర్థకముగా ఉండును కాని వానిని వేరుపరచుచో ప్రత్రిరాష్ట్రమును స్వయం సమర్థము కాక చేతిసొమ్ము తగులుకొనునని కొందరు వాదించుచున్నారు. ఇది కొన్ని భాగముల పట్ల నిజమగునేమో కాని ఆంధ్ర రాష్ట్ర సమస్య నాలోచించి నంతమేరకు సత్యము కాదని రూఢిగా చెప్పవచ్చును. సింధు, ఒరిస్సా, సరిహద్దు రాష్ట్రముల వలె గాక స్వయం సమర్థక మైనదని లెక్కలు స్పష్టపరచుచునే యున్నవిగదా? ఏ చిన్న భూభాగమో, ఏ అల్పసంఖ్యాకజనులో, వీరికొరకై ప్రత్యేకత యెందుకనువాదమిక్కడ పొసగదు గదా! మూడు కోట్లను మించిన జన సంఖ్యయు 18 మండలములును గల ఆంధ్రావనిపైని ఈ నేరమును మోపతగదు గదా ఇట్లు వేరు చేయుటవలన ఇతర భాగములకైనను విశేషనష్టము కలుగదు సరేగదా న్యాయమైన లాభములేవియో జరుగుచునే ఉండును. ఏది యెట్లున్నను నాలుగు భాషలును బ్రిటిషు ఇండియాలో సగము భూభాగమును గల దక్షిణ ఇండియా నంతటిని ఒకే రాష్ట్ర ప్రభుత్వములో కుక్కి ఈ విధానము నిప్పటివలెనే కొనసాగించవలెనని సలహా యిచ్చుటలో అర్థము లేదు. ఈ నాలుగింటిలోను అధికతర జనసంఖ్యయు, జిల్లాలును గల ఆంధ్ర భాగమునైనను ముందుగా విడదీసి వారి పరిపాలనమును వారికొప్పగించుట ప్రప్రథమ కర్తవ్యము.

ఈ పని యింతకుముందెన్నో సంవత్సరముల క్రిందటనే జరుగవలసి యుండెను. ఈ ఆందోళన ప్రారంభమై ఇరవై సంవత్సరములు దాటినది. దీనికి యేడు వెనకల ప్రారంభమైన ఆందోళనలెన్నో కార్యరూపమును దాల్చినవి. జస్టీసు పార్టీవారి అసడ్డయు, కాంగ్రెసు పార్టీవారి అన్యకార్య నిమగ్నతయే దీని నిన్నేళ్లు ఆలస్యము చేసినవి. ఈ కాలములోనే మన భేదములను విస్తరింపజేయుటకును, పరస్పర స్పర్ధలు పుట్టించుటకును అనేక ప్రయత్నములు జరిగినవి. అయినను ఆంధ్ర రాష్ట్ర నిర్మాణము దైవ నిర్ణయము. ఇట్టి పరస్పర స్పర్ధలు చిరకాలము నిలువజాలవు. నవ్యతరమగు ఆందోళన సకల భాగములయందును ఏక ముహూర్తమున ప్రారంభమైనది. ఈ బీజమును మొట్టమొదట నాటిన శ్రీ పట్టాభి సీతారామయ్యగారు తిరిగి అనుపమానమైన ఆందోళనమును లేవనెత్తి దీనిని సాధించుటకై కంకణము ​కట్టుకొనియున్నారు. సందేహములు స్పర్థలు పటాపంచలగుచున్నవి. ఇది కేవలము ప్రాంతీయ సమస్యగా కాక అఖిల భారతసమస్యగా కూడ పరిణమించినది. అఖిల భారత కాంగ్రెసు కమిటీ నుండియే మద్రాసు ప్రభుత్వమునకు హుకుము రానున్నది. విజయము చేరువగుదున్నది. కనుక నాయకులును ప్రచారకులును కూడ చిలిపి సందేహములను మాని కార్యక్రమమునకై గడంగుట శ్రేయము.

"ఆంధ్రులలో ఐకమత్యము లేదు. ఒక ప్రాంతము వారు రాష్ట్రము కావాలంటే ఇంకొక ప్రాంతమువారు వద్దంటున్నారు. ఒక పార్టీకి ఇంకొక పార్టీకి పొసగకుండా ఉన్నది. ఇవన్నీ సర్దుకుంటే కాని ఆంధ్ర రాష్ట్ర సమస్య నాలోచించుటకు వీలులే"దని కొందరాంధ్రేతరులు ఇప్పుడిప్పుడుకూడ వాక్రుచ్చుచున్నారు. ప్రత్యేక రాష్ట్రమేర్పడేవరకును ఇట్టి భేదములను రేపుటకును వర్ధిల్లుటకును అవకాశము లుంటునే ఉండును. వీనికన్నిటికిని స్వస్తి చెప్పవలెనను సంకల్పముంటే ఆంధ్ర రాష్ట్రమును వెంటనే విభజింపక తప్పదు. ఆ మరునాటి నుండియు ఇట్టికాల్పనిక భేదములన్నియు నశించి ఐకమత్య ధర్మము తనంతట తానే వర్ధిల్లగలదు.

ప్రత్యేక రాష్ట్రమైతే రాయలసీమ వారికో, ఉత్తరసీమలవారికో కొన్ని ఇబ్బందులుండునని కొందరు వాదింతురు. విశాలదృష్టితో చూచినయెడల నవి యెవ్వియును ఇబ్బందులుకావు. ఒక వేళ అయినను , ఈ జిల్లాలనన్నిటిని ఒక కాంపోజిట్టు రాష్ట్రములో కుక్కుటవలన కలిగే ఇబ్బందుల కంటె యెక్కువ కావు. ప్రస్తుతము అవి యిబ్బందులవలె కొందర కగపడినను ప్రత్యేక రాష్ట్ర మేర్పడగానే వానినన్నిటిని సవరించుకొని సమ్యగ్భావముతో వర్తించగలనేర్పు సిద్ధించక మానదు. ఒక కాంపోజిటు రాష్ట్రములోనే ఎన్నో యిబ్బందులు పొందుచు కాలక్షేపము చేయువారు ప్రత్యేక రాష్ట్రములో కలతలుపడుతారన్నది వ్యర్థమగుమాట.

భేదములు నిజమైనవి కావు

ఇంతకును ఆంధ్రులేయే ప్రాంతముల నెట్టియెట్టి ఆచార వ్యవహరాదులతో నున్నను ఆంధ్రులే. వారిది యేకభాష, యేకభావములు వారి ​లాభములును నష్టములు సర్వసమానములు. ఒకరి నష్టము నొకరి లాభముగాను, ఒకరి లాభమును తమ నష్టముగాను భావించు కొందురని అనుకొనుటకు వీలులేదు. కొన్ని కొన్ని మండల సమస్యలు ప్రత్యేకములగునుగాక, ఇప్పుడు మాత్రము కాకున్నదా? సమిష్టి ఆంధ్ర సమస్యలు వేనవేలున్నవే? వాని పోషణమునకై సంకుచితలాభ భావములకు వారు త్యాగము చేసుకొనలేరా? గాంధీ మహాత్ముని అసహాయ యోగమునందు వారు ప్రదర్శించిన మహాత్యాగములలో ఇది యెన్నవవంతు? ఇంతకును, ఒక అవయవము కొరకై శరీరమునందలి ఇంకొక యవయవము పడే శ్రమ త్యాగ మనిపించుకొనదు. ప్రధాన కర్తవ్యమే, అట్లే "రాయలసీమ" కొరకు సర్కారులో, "సర్కారుల" కొరకు రాయలసీమయో యేదేనా శ్రమపడవలసి వస్తే అది త్యాగమనిపించుకొనదు. సకలాంధ్రుల శ్రేయస్సే ప్రతి ఆంధ్రుని శ్రేయస్సున్ను. ఏ యొక్క వ్యక్తి ఆశ్రేయస్సును కూడ ఆంధ్ర రాష్ట్రము తనదంతటిదిగానే భావించి దానిని మాయము చేయుటకై ప్రయత్నించును. అందుకనే గదా మనము ప్రత్యేకాంధ్ర రాష్ట్రమునకై ఆందోళన ప్రారంభించినాము! ఈ ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఆందోళనను వ్యతిరేకించి సమిష్టి రాష్ట్ర సంతృప్తితో కాలక్షేపము చేయుచున్నయెడల, ప్రత్యేక భాగములకు కలిగే విశేషపుష్టి యేమియును లేకుండను సరేకదా, సమాన నష్టములు కూడ అపరిమితముగ నున్నవి. కనుక వ్యతిరేక భావముల కింతతో స్వస్తి చెప్పవలెను.

ఇంతకును ఆంధ్ర మండలములను, రెండు ఖండములుగా విభజించుట యెట్లు? దత్తమండలము లొక ఖండమును, సర్కారు లొక ఖండమును, తక్కిన భాగములొక ఖండమునా? వీనిలో గల ప్రబల భేదము లేవి? వీరందరిదీ ఒక భాష కాదా, కులములు నాడులు మొదలగువానిలో భేదములు కలవా? ఆచార వ్యవహారములలో భేదములు కలవా? వీనిమధ్య కొండలు సముద్రములు నిలచి అంతరాయములు కలిగించుచున్నవా, రాకపోకలకు సులభోపాయములు తక్కువా? దేనిని బట్టి ఖండ ప్రభేధము? చారిత్రకముగా నైనను ఇవి వేరువేరు భాగములా? ఎన్ని ఆంధ్ర ఆంధ్రేతర సామ్రాజ్యముల క్రింద ఇవన్నియు కలసి యుండలేదు. ఎంతమంది ఆంధ్ర కవి, పండిత సచివోత్తములు వీనితో సమాన గౌరవముతో సంచరించుచు ఆంధ్ర విజ్ఞానమును, కళలను పోషించుచుండలేదు? ఎన్ని సందర్భములలో వీరందును ​కత్తికట్టి సమాన శత్రువులతో పోరాడి విజయద్వజములను ప్రతిష్ఠించ లేదు? ప్రతాపరుద్రునికన్న గౌరవ మొక్క ఓరుగల్లు ప్రాంతమువారిదేనా? శ్రీనాథుని పెంచిన కీర్తి ఒక్క నెల్లూరు మండలముదేనా? పెద్దనాదులను, శ్రీకృష్ణదేవరాయలను వర్ధిల్లజేసిన తేజము ఒక్క రాయలసీమవారి దేనా? పంచమవేదమగు ఆంధ్ర మహాభారతకృతిని ప్రారంభించిన యశశ్చంద్రిక నొక్క రాజమహేంద్రవరమే గుత్తకొన్నదా? వీరిలో నెవ్వరి పేరు దలచుకొన్నను ఆంధ్రులకందరకును పులకాంకురములు పొడమకుండునా? రాయల పరిపాలనము కేవల దత్తమండలములతో ముగిసినదా? దక్షిణ దేశమునందంటను అతని ధాటి వెలయలేదా, కటకమువరకును అతని పరాక్రమము ప్రసరించలేదా? ఇంటింటను ప్రతీ కవీశ్వరుని గ్రంథములును పఠించబడుచున్నవే. గోడగోడయందును ప్రతివీరుని చిత్రపటమును తగిలించబడుచున్నదే. జిహ్వ జిహ్వయందును వారిపద్యములు చిత్రములు సంచరించుచున్నవే? వీనిలో దేనిని ఏ యాంధ్రుడు నాదికాదనగలడు. లేక నాదిమాత్రమే అనగలడు? ఈ భేదములీనాటికైనను పటాపంచలు కావలదా?

ఆంధ్రులందరును ఇట్టి స్వల్ప భేదములను మాని యేక చైతన్యముతో విజృంభించగలిగిననాడే వారి ప్రజ్ఞ దేదీప్యమానము కాగలదు. ఆనాడే ప్రారంభ వయోజన విద్యలు సత్వరముగా వ్యాపించగలవు. మండల రాష్ట్రీయ పరిపాలనములు చక్కగా వర్ధిల్లగలవు. వ్యవసాయ వాణిజ్య పరిశ్రమలు సవ్యముగా విజృంభించగలవు. శ్రీ సౌభాగ్యములు చెలరేగగలవు: భాషాయోషామణి "శిరీషకుసుమ పేశల సుదామయోక్తుల" చిందగలదు; కావ్య నాటకాలంకారములు కమనీయములు కాగలవు; స్వల్ప భేదములెల్లయు తొలగి సౌమనస్యము చెలగగలదు: అఖిల భారత జాతీయాభివృద్ధికి కూడ మన మిప్పటి కంటె చక్కని దోహదమొసంగగల్గుదుము. ఈ లోపల మన లోపముల నెన్నిసార్లు మనము లెక్కపెట్టుకున్నను లాభము లేదు. అవి యెల్లయు తొలంగగల తరుణౌషధ మొక్కటియే. అదియే స్వరాష్ట్ర సంసిద్ధి. అందుకే మన పయత్నముల నేకముఖము చేయవలసిన ఆవశ్యకత.

ఫెడరేషనుకు ఈ సమస్యకు సంబంధము లేదు

మరియు నొక్కమాట. ఫెడరేషను వస్తే కాని ఇది సిద్ధంచనేరదనుమాట ​మనము అనుకోకూడదు. ఫెడరేషను రాకపోయినను ఇది సిద్ధింపగలదని ధ్రువమైనది. ఆ విషయమంతయు ఇక్కడ తలపెట్టుట చర్వితచర్వణము. మనమనుకొనేరీతి ఫెడరేషను వచ్చుటకు చాలా కాలము పట్టవచ్చును. బ్రిటిషువారు ఇస్తామంటున్న మోస్తరు ఫెడరేషను మాకు వద్దని కాంగ్రెస్సే ఆటంకములు చెప్పుచున్నది. యుక్తమైన ఫెడరేషను వచ్చుటకు ఆంధ్రరాష్ట్ర నిర్మాణము అడ్డు కానేరదు. మనమనుకొనె రీతి ఫెడరేషను వచ్చునుగాక, రాకుండును గాక, మన రాష్ట్ర నిర్మాణ ప్రయత్నమునుండి మనము విరమించుటకు వీలులేదు. అంధ్రదేశ మంతయు ఏకకంఠముతో ఇందుకై మాఱుమ్రోగవలెను. మద్రాసు శాసన సభలలో ఈ తీర్మానము సత్వరముగా ప్యాసు కావలెను. సెంట్రలు సభలలో ఇది ఆమోదింపబడవలెను. బ్రిటిషు పార్లమెంటు ఇట్టి కోర్కెకు అడ్డు చెప్పజాలదు. అడ్దుచెప్పితే అప్పుడే ఆక్షేపించి పోరాడవచ్చును. కొందరూహించుచున్న ఆటంకములు ఊహలు మాత్రమే కాని సత్యము కావు. తీవ్రప్రయత్న మాత్రమున ఇది సులభసాధ్యము. ఇటువంటి తరుణముల నిదివరలో నెన్నింటినో కోలుపోతిమి. ఇదియే ఆఖరు ప్రయత్నముగా నమ్మి మనము పట్టువిడవకుండా పోరాడవలెను. ఈ సమయమును కూడ వృథా పుచ్చితిమేని ఫెడరేషను వచ్చిన తరువాతనైనను ఇది సిద్ధించుననుట కేమి నిశ్చయము? మన వ్యతిరేకపక్షము వారు ఇప్పటికంటె వేఱు వ్యతిరేక కారణములను అధికముగా అక్కాలమున గుత్తళముగా గ్రుచ్చి యేకరువు పెట్టుదురు. కాలము తిరిగిన కొద్దీ జాలము తప్ప మరే క్రొత్త విశేషమును రాబోదు. మన దృష్టిని ఈ సమస్యనుండి తప్పించి, మన ఆశయమును వీటి బుచ్చుటకై అనేక ప్రయత్నములు జరుగుచున్నవి. వీనిని మొదటిలోనే త్రుంచివేయకున్న ఎడల రానురాను ఇవి మరింత ప్రబలమగును.


- భారతి, డిసెంబర్, 1937