Jump to content

గబ్బిలము/కవిత

వికీసోర్స్ నుండి
పుస్తక స్కాన్ ఆధారిత పాఠ్యం గా  చేయబడటానికి సూచిక:గబ్బిలము.pdf లో సహకరించండి.

చిక్కినకాసుచే తనివి చెందు నమాయకు డెల్ల కష్టముల్‌
బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి న
ల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న యరుంధతీ సుతుం
డొక్కడు జన్మమెత్తె భరతోర్వరకుం గడగొట్టు బిడ్డడై

పూపవయస్సులో వలసపోయిన చక్కని తెల్గు కైతకున్‌
ప్రాపకమిచ్చినట్టి రఘునాథనృపాలకు డేలియున్న తం
జాపురి మండలంబునకు చక్కగ దక్షిణభాగ భూములన్‌
కాపురముండె నప్పరమ గర్భదరిద్రుడు నీతిమంతుడై

ముప్పు ఘటించి వీని కులమున్‌ కబళించి (తదీయ) దేహమున్‌
పిప్పియొనర్చు నీ భరతవీరుని పాదము కందకుండగా
చెప్పులు కుట్టి జీవనము సేయును గాని నిరాకరింప లే
దెప్పుడు; నప్పువడ్డది సుమీ భరతావని వీని సేవకున్‌

వాని ఱెక్కల కష్టంబు లేనినాడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనము బెట్టు వానికి భుక్తిలేదు

వాని తలమీద పులిమిన పంకిలమును
కడిగి కరుణింప లేదయ్యె గగనగంగ
వాని నైవేద్యమున నంటువడిన నాడు
మూడుమూర్తులకు కూడ కూడులేదు

పామునకు పాలు చీమకు పంచదార
మేపుకొనుచున్న కర్మభూమిం జనించు
ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడ
నులికిపడు జబ్బు కలదు వీడున్న చోట

వాని నుద్ధరించు భగవంతుడే లేడు
మనుజుడెట్లు వాని కనికరించు
వాడు చేసికొన్న పాపకారణమేమొ
యింతవరకు వాని కెరుక లేదు

ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి
యినుపగజ్జెల తల్లి జీవనము సేయు
కసరి బుసకొట్టు నాతని గాలిసోక
నాల్గుపడగల హైందవ నాగరాజు

కులములేని నేను కొడుకుల పుట్టించి
యీ యఘాతమందె త్రోయవలెనె
భార్య యేల పుట్టుబానిసకని వాడు
జరుపసాగె బ్రహ్మచర్య దీక్ష

ఉదయమాది రక్తమోడ్చి కష్టము జేసి
యినుని సాగనంపి యిల్లు సేరి
ఉన్న గంజి త్రావి యొక్కనాడా పేద
ప్రక్కమీద మేను వాల్చియుండె

భూ నభముల క్రొంజీకటు
లేనుగునకు మదమువోలె యెసక మెసగె సం
ధ్యా నాట్యకేళి మాని మ
హానటుడు శివారవముల నారంభించెన్‌

ముక్కు మొగమున్న చీకటి ముద్ద వోలె
విహరణము సేయసాగె గబ్బిల మొకండు
దాని పక్షానిలంబున వాని చిన్ని
యాముదపు దీప మల్లన నారిపోయె

తిల్లిక నారిపి దయ్యపు
పిల్ల వలెం తిరుగు తబిసిపిట్ట నరయగా
పల్లవితమయ్యె నాతని
యుల్లంబున క్రొత్త క్రొత్త యూహాంకురముల్‌

చెలిమిన్‌ పక్షికి విన్నవించుకొన జొచ్చెన్‌ స్వీయవృత్తాంత ము
మ్మలికన్‌ కందిన నెమ్మనంబున మదోన్మత్త ప్రపంచంబులో
పులుగుం బుట్రలు కాక పేదలకు నాప్తుల్‌ చుట్టపక్కంబులున్‌
కలరే వాని కవోష్ణ బాష్పములు వ్యాఖ్యానించె చక్రాంగనల్‌

ప్రవిముల దేవతాభవన వాసము చేయుచు మమ్మువంటి మా
నవులకు లేని గౌరవమునం దులదూగెడు గబ్బిలాల రా
ణివి గద నీవు స్వాగతము నీకు శుభంబ కదమ్మ నీ తనూ
భవులకు తల్లక్రిందుల తపంబులకున్‌ గుడిగోపురాలకున్‌

గాఢనిద్రావలంబియై కన్ను మూసి
క్ష్మా తలము మేను మరచిన కాళరాత్రి
నా గృహంబున వెదకుచున్నావదేమి
దొరక దిచ్చట నానందకిరణ లవము

నిన్ను బహిష్కరించు నవనీవలయంబిది యంటరానివా
డున్న నిషిద్ధగేహము సహోదరి నీవు సమస్తదేవతా
సన్నిధి నారగింతువు ప్రసాదము లంతటి పుణ్యురాలివై
అన్నములేని పేదల గృహంబులు సొచ్చితివేల బేలవై

హృదయము లేని లోకము సుమీ యిది మాపుల పశ్చిమంబుగా
ఉదయము తూర్పుగా నడచుచుండు సనాతన ధర్మ ధేనువుల్‌
పిదికిన పాలు పేదకు లభింపవు శ్రీగలవాని యాజ్ఞలో
పెదవి మెదల్ప జాల రరవిందభవ ప్రముఖామృతాంధసుల్‌

ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని దుః
ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్‌
మెతుకు విదల్ప దీ భరతమేదిని ముప్పదిమూడు కోట్ల దే
వత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తు లారునే

పరమార్ధంబులు బోధసేయుదురు లోభస్వాంతులై నిత్యమున్‌
గురువుల్‌ ముక్కుకు సూటిగా తగులు యుక్తుల్‌ పన్ని కైవల్యపుం
దెరువుల్సూపి మహాపరాధివనుచున్‌ తీర్మానముల్‌ సేయుచుం
దురు వేదాంతరథంబు సాగదనుకొందున్‌ నేను లేకుండినన్‌

ఒగి సంసారము దిద్దుకొంచు కర మత్యుచ్ఛస్థితిం దూగుచుం
పగలెల్లన్‌ మునివృత్తి నుండి యనుకంపన్‌ శర్వరీవేళలన్‌
వగలం దూలు దరిద్రమూర్తుల సమాశ్వాసింప నేతించితే
ఖగసన్యాసిని! యర్హురాల వకలంబైన మర్యాదకున్‌

గిరుల గుండెలు కరిగి నిర్ఝరములట్టు
లుబుకుచున్నవి దిశల నన్నూరడింప
పక్షికళ్యాణి సోదరప్రజల కండ్ల
నిర్గమించెనె యొక్క కన్నీటిచుక్క

చుట్టాలే కద వాలఖిల్యు లినతేజుల్‌ యోగవిద్యానిధుల్‌
పుట్టుందాపసు లార్ద్రచిత్తులు మహాత్ముల్‌ వైనతేయస్తుతిన్‌
చెట్టుంగొమ్మ పరిత్యజించిన పరశ్రేయశ్శుభాకాంక్షు లో
పిట్టా నీకు నమస్కరించెదను నా విజ్ఞప్తి నాలింపవే

ఈ ప్రశాంతరాత్రి యెల్ల లోకంబును
బుజ్జగించి నిద్ర బుచ్చుకొనియె
నౌషధంబు లేని యస్పృశ్యతా జాడ్యు
మందభాగ్యు నన్ను మరచిపోయె

కర్మసిద్ధాంతమున నోరు కట్టివేసి
స్వార్థలోలురు నా భుక్తి ననుభవింత్రు
కర్మమననేమొ దానికీ కక్ష యేమొ
యీశ్వరుని చేత ఋజువు చేయింపవమ్మ

ఆలయంబున నీవు వ్రేలాడువేళ
శివుని చెవి నీకు కొంత చేరువుగ నుండు
మౌని ఖగరాజ్ఞి పూజారి లేనివేళ
విన్నపింపుము నాదు జీవితచరిత్ర

ఆ పూజారులు విన్న నీకగును ప్రాయశ్చిత్త మీశానుడున్‌
కోపించున్‌ వివరింప నేమిటికి నీకుం బొమ్ము వార్ధక్యమున్‌
దాపై పెంజెడ తెల్లనైనది నిశీధస్త్రీకి నాఖేటక
వ్యాపారంబు ముగించి నీ పొరుగుగూబల్‌ గూండ్లకున్‌ బోయెడిన్‌

పసమించు నీ గరుత్తుల
విసరి శ్రమం బడపి నన్ను ప్రేమించిన నీ
అసమోపకారమునకుం
పసదన మిడలేక నే ఋణస్థుడ నైతిన్‌

నీ నమస్కారముల నిక్కినిక్కి నడవ
పక్షిణీ నాకు నుద్యోగబలము లేదు
మెచ్చదగు నీ కళాశక్తి మచ్చరింప
ఖగసతీ నాకు కులము యోగ్యతలు లేవు

స్వార్థమున నిన్ను కొరముట్టు వలె గణింప
కడుపునిండిన భాగ్యవంతుడను కాను
దోషములు సూపి నీకు నీతులు వచించి
దొరతనము సేయగా మతస్థుడను కాను



మృగపక్షిత్వ విచిత్రధర్మములు మూర్తిన్‌ దాల్చి యున్నట్టి నీ
మొగముం జూడదు లోక మట్టి శకునంబుల్‌ ప్రాతపట్టింపులున్‌
దగవీ పేదకు రమ్ము గబ్బిలపు చానా నాదు స్వాంతంబులో
దిగులుం బాపి పినాకపాణి కొక సందేశంబు నందింతువా

ధర్మమునకు పిరికితన మెన్నడును లేదు
సత్యవాక్యమునకు చావులేదు
వెరవనేల నీకు విశ్వనాథుని మ్రోల
సృష్టికర్త తాను సృష్టి వీవు

నరునకు చేరరాని సదనంబున వాసము సేయు నీశ్వరే
శ్వరునకు నా నమస్కృతు లుపాయనమి మ్మొకవేళ కారణాం
తరముల వెండిపర్వతమునన్‌ నివసించుచునున్న పక్షి సుం
దరి యొకపూట యానమ కదా యిది నీకు పరోపకారిణీ

గౌరీనాథుడు కాశికిం జనెడు మార్గంబందు రామేఘపుం
జారన్‌ చుక్కలతోట నాటుకొని మింటన్నీకు కన్పట్టు నా
దారింబొ మ్మొకవేళ చూచెదవు భూతస్వామినిన్‌ నీకు చ
త్వారం బేర్పడి దారి తప్పెదవు కాదా భానుడేతెంచినన్‌

ఛత్రముల వంటి నీలిపక్షములు విచ్చి
నీవు బ్రహ్మాండమున పయనించు వేళ
చిత్తజల్లుల ముమ్మాయి ముత్తియములు
జలధరస్వామి నీమీద చల్లగలడు

మొలక సంధ్యారాగమున కెంపులెగజిమ్ము
        చరమాచలంబున చరణమూది
సెలయేటి నీట నీతలు కొట్టి విహరించు
        మరుదంకురముల సన్మానమంది
కొండకొమ్ముల నెదుర్కొని తుత్తునియలైన
        తోయదమ్ముల మీద తుంగలించి
కలహంస పొదిగి పిల్లలుసేయు మిన్నేటి
        జాంగలంబుల మీద సంచరించి

చిలుక లెంగిలింప చిటిలి తేనియలూరు
స్వాదుఫలము లెలమి నారగించి
కొన్నినాళ్ళపాటు కుటిలసంసారంబు
దిగులు మరచి రమ్ము ఖగవధూటి

స్వాతికాహారిణీ తపశ్చర్య కతన
నీ మనంబున జాలివెన్నెల రహించు
నాదు కన్నీటి కథ సమన్వయము సేయ
నార్ద్రహృదయంబు కూడ కొంతవసరంబు

బిడ్డల గని పాలిచ్చెడు
దొడ్డతనంబున్న పుల్గు దొరసానివి నా
కడ్డపడ దిగిన వేలుపు
గిడ్డివి నా మనవి నాలకించెదవు కదా

నీ యౌదార్యగుణంబు మెచ్చెదరు సందేహంబు లేకుండగా
నాయుష్మంతులు నీ కుమారులు మగం డంగీకృతిం జూపి నీ
వా య్తైతెన నగంబు కొమ్మల విహాయస్కేశు నావాసమం
దూయేలూగి కృతార్ధురాలవయి రమ్మో పుల్గు పుణ్యాంగనా

పక్షిసుందరి నీ చిన్ని కుక్షినిండ
ఇన్ని నీరంబు పలహార మున్న చాలు
ఎన్ని దేశాలు తిరిగిన నేమి నీకు
నీవు నావలె పుట్టుబానిసవు కావు

తడవైనన్‌ గుడిగోపురంబులను సందర్శించుచుం బొమ్ము నీ
కడవుల్‌ కొండలు నడ్డుసేయవు కదమ్మా వ్యోమయానంబునన్‌
సుడిగాల్పు ల్సెలరేగినన్‌ నిలువవచ్చుం ధర్మసత్రాలలో
పిడుగుల్‌ వడ్డ ప్రవేశయోగ్యతలు పాపిన్నాకు లేవచ్చటన్‌

అందందు ఫలవనంబుల
విందుగుడుచు చల్లనల్ల విశ్రామ మణీ
మందిరముల నిద్రించుచు
ముందుకుచన తోచునెన్నొ పుణ్యస్థలముల్‌

కొమరారు తంజనగరము
సమీపమున కలదు తెలుగు సౌరభ్యంబుల్‌
గమగమ వలచిన చోటది
యమరున్‌ రఘునాథరాజు నాస్థానమునన్‌

కృష్ణరాయలవారి యెడబాట్ల చీకట్లు
        ముసరి దిక్కులలోన మసలువేళ
భూరి వాఙ్మయలక్ష్మి దారిబత్తెము తోడ
        తంజాపురమువంక తరలు వేళ
వేంకటకవి తెల్గు పంకేరుహాక్షికి
        శ్లేషోక్తు లలవాటు సేయువేళ
పచ్చపచ్చని ముద్దుపళని ముద్దులకైత
        శృంగారరసము వర్షించువేళ

మువ్వగోపాలదేవుని పూజసేయ
ఘనుడు క్షేత్రయ కల మందుకొనిన వేళ
నపరరాయలు రఘునాథ నృపతి విభుడు
కట్టుకొన్నాడు సత్కీర్తి కుట్టిమంబు


తనువుప్పొంగ సరస్వతీమహలు సందర్శించి తంజాపురీ
మనుజాధీశుల యోలగంబును పరామర్శించి పొమ్ముత్తరం
బునకున్‌ ద్రావిడభూములం గడచి పోబో దోచెడిన్‌ వాడువా
రని శౌర్యంబును మించు తెల్గు పొలిమేరల్‌ నేత్రపర్వంబుగన్‌

యతియుం బ్రాసయు లేని సంస్కృత కవిత్వారణ్యమందున్న భా
రత వేదాన పదేనుపర్వముల కాంధ్రత్వంబు నేర్పించి శా
శ్వతుడై పోయిన తిక్కయజ్వకు నివాసంబైన నెల్లూరికిన్‌
నతులర్పింపుము స్నానమాడు మతిగణ్యంబైన పెన్నానదిన్‌

ఒకపల్కు జాణతనమున
సకియలు నెల్లూరుసీమ సత్కవివరులం
దికమకలు పెట్టగలరని
పుకారు కల దది యబద్ధమో నిక్కువమో

హంపీక్షేత్రము జూచి పోవలయు నమ్మా తెల్గురాజ్యంపు నై
లింపశ్రీల కొకానొకప్పుడది కేళీరంగ మేత ద్రమా
శంపావల్లరు లారిపోయిన ప్రదేశంబందు నీ బందుగుల్‌
కొంపల్గట్టి నివాస ముండెదరు నీకుం గూర్తు రానందమున్‌

పరదాపద్ధతి మాన్పిరో సిరికి కుప్పల్‌ వోసి యంగళ్ళ యం
దురుమాణిక్యము లమ్మినారచట మున్నో పక్షిణీ మూరురా
యరగండండు మహేంద్రవైభవముతో నాంధ్రక్షమామండలిన్‌
పరిపాలించిన నాటి పెంపును తలంపన్‌ మేను కంపించెడిన్‌

పగతు రసూయ చేత కరవాలమునన్‌ తనువెల్ల చెండినన్‌
జిగిరిచియున్న యుగ్రనరసింహుని భీమదృగంచలంబులన్‌
పొగలుడివోవ లేదతని మ్రోల నిమేషము నిల్వజాలనిన్‌
ఖగసతి నిన్ను ధైర్యవతిగా గణియింతురు వీరయోధులున్‌

ఏనికవంటి సానువు గణేశుని నున్నని బొజ్జ మీద కా
లూనగలేదు తుమ్మెద తదుజ్వ్జల శిల్ప మఖండ తుంగభ
ద్రానది కప్పగించుకొని దద్దమలైన తెలుంగువారి వి
ద్యానగరాన చిందుమొక యశ్రుకణంబు నుపాయనంబుగన్‌

సరసుడు కృష్ణభూవిభుడు స్వారి యొనర్చిన పారసీహుమా
దొరల ఖురాగ్రహల్యలను దున్నిన భూములలోన నాంధ్ర సుం
దరు లొకనాడు నాటుకొనినారు దిగంత జయప్రరోహముల్‌
గరిసెల నించినా రురువుగా ఫలియించిన సుప్రతిష్ఠలన్‌

మూరురాయరగండ డూరేగడీనాడు
        విద్యానగర రాజవీధులందు
మేలైన పట్టుడేరా లెత్తరీనాడు
        పారసీకగురాల బేరగాండ్రు
ఇనుపరోకళ్ళ సాధన సేయవీనాడు
        కొమ్మునిక్కిన భద్రకుంజరములు
తెలుగు స్కంధావారముల నిండదీనాడు
        మరఫిరంగుల తెల్లదొరల దండు

మణిమయంబైన యాంధ్రసామ్రాజ్యరథము
భువికి గ్రుంగిన పదియునారవ శతాబ్ది
కృష్ణవిభు వీట ప్రొద్దు క్రుంకినది మొదలు
ఋషిఖగాంగన తెల్లవారినది లేదు

కంచర్ల శ్రీకృష్ణ గంధర్వు డేలిన
        నగరంబు దున్నించి నారువోసి
వినుకొండ విభుని రాయని భాస్కరుని కోట
        బురుజు లూపున నేలకొరగ దన్ని
పల్నాటిదొరల శుంభత్ప్రతాపజ్వాల
        సాటికెక్కని నాగులేట కలిపి
వినుతి గాంచిన కొండవీటి సామ్రాజ్యంబు
        నుక్కుకత్తుల బావి కొప్పగించి

యుడుకునెత్తుట చేతులు కడిగికొన్న
కాలపురుషుని పెనుదుండగములు తలచి
మనసు నలిగిన గుంటూరు మండలంబు
నరసి పోవమ్మ జన్మ ధన్యత వహింప

ప్రొద్దునకు వన్నె బెట్టిన
యిద్దరు భాస్కరులు పుడమి నేలగ సొగసుల్‌
దిద్దినది మేన వయసున
పెద్దది గుంటూరు సీమ పెరసీమలలో

ఖరుచైపోయె తెలుంగు రక్త మతిలోక స్వచ్ఛశౌర్యంబు సో
దరి! వ్యర్థంబగు కోడిపందెపు తగాదా లందు పల్నాటిలో
నరుదారన్‌ మివిలెన్‌ వినోదముగ కార్యంపూడి తిర్నాళ్ళ త
త్కరవాలంబులు త్రుప్పుపట్టి యిపుడున్‌ కల్పించు నారాటమున్‌

కృతులంది కృతులొసంగిన
వితరణరతులైన కొండవీటి నృపుల యు
న్నతియుం బతనం బిప్పుడు
కృతులై కొండల నలంకరించి జితించెన్‌

విసిగి విరక్తిచే తెలుగు వీధులలో నొక పిచ్చివానిగా
మసలిన రెడ్డిరాజు మునిమాన్యుడు వేమన యాశుధారగా
విసరిన కావ్యముల్‌ శ్రవణపేయముగా ప్రతిశబ్ద మీనెడిన్‌
దెసల నలంతి పోలికల తీయదనంబున భావసంపదన్‌



జలదవ్రాతము తోడుగా నవల కృష్ణాతీర దివ్యస్థలుల్‌
కలయంగ్రుమ్మగ సాగిపొమ్ము కవిలోకబ్రహ్మ నన్నయ్యకున్‌
నిలయంబై తగు రాణ్మహేంద్రపురికిన్‌ విద్వత్సభారంజిత
స్థలికిన్‌ పూర్వచళుక్యభూపతుల రత్నస్థాపితాస్థానికిన్‌

ఎచ్చట జూచినన్‌ ప్రతిపదించు కళం బలె పచ్చపచ్చగా
రచ్చలకెక్కు కన్నడసరస్వతి నారసి మానసంబులో
మచ్చరికించి నన్నకవి మాన్యుడు రాజమహేంద్రు నాన తా
నిచ్చట చేయిచేసికొనియెన్‌ ప్రథమాంధ్ర కవిత్వసృష్టికిన్‌

రెండున్నర పర్వంబులు
పిండిన రసమొలుకునట్టి పెను చెరకుగడన్‌
పాండవుల చరిత నన్నయ
పండించెన్‌ తెలుగులోన ప్రజ్ఞాన్వితుడై

జనవిభుండైన విష్ణువర్ధనుని నాటి
గౌతమీగంగ నీకు స్వాగతమొసంగు
వీరమాగాణముల నుద్భవిల్లునట్టి
గణికపోచయు నాకర్షకము కదమ్మ

తొలి సారంగధరుండు వట్టి యపవాదు న్నెత్తిపై దాల్చి క
త్తుల పాలైన విషాదగాథ వినలేదో నీవు చిత్రాంగి మే
డలలో మూలుగుచున్న విప్పటికి కూడన్‌ పావురాల్‌ నీతికిన్‌
బలియై పోయిన రాజనందనుని దౌర్భాగ్యంబు నూహింపుచున్‌

అజ్జాయింతువొ చుట్టుమార్గమని ద్రాక్షారామ భీమేశ్వరుం
డుజ్జీలేని దయాస్వభావుడు ప్రభావోల్లాసి ముప్ప్రొద్దులున్‌
గజ్జెంగట్టెడి నాట్యగాడతడు సాక్షాత్కారమున్‌ జెందినన్‌
మజ్జాత్యుద్ధరణంబు కల్గు కలదమ్మా పొమ్ము సేవింపగన్‌

నిద్దంపు లేత కస్తురి
ముద్దవనుచు నిన్నుజూచి ముచ్చటపడి రా
ముద్దియలు ముచ్చటించెద
రొద్దిక శ్రీనాథకవి బహూకరణముగన్‌

అరవింద రత్న మండిత
తరంగరథమెక్కి విభుని దర్శనమునకై
పరువెత్తుచున్న గోదా
వరి తోడుగ బొమ్ము దక్షవాటి నగరికిన్‌

అమృతమ్ము విషము వాక్కున
నమరిన కవిరాక్షసునకు నావాసంబై
కొమరారు నపరకాశిక
సుమి కడు మహిమాఢ్యమైన చోటది పతగీ

అల బుస్సీదొర కొల్లగొట్టిన యనన్యంబైన మా వెల్మ వీ
రుల విఖ్యాత పరాక్రమజ్వలన మూర్పుల్‌ జిమ్ముచున్నట్టి బొ
బ్బిలి కోటం గని దాటిపొమ్ము చటులావేశంబు దేహంబునన్‌
మొలుచున్‌ బొల్చు కవోష్ణ వీర రుధిరంబున్‌ జీవనాళంబులన్‌

నాయెడ జాలిలేక చరణంబున కత్తులుగట్టి ప్రాణముల్‌
తీయదొడంగు రాజవితతిం దెలవార్చితి తెల్లవారునే
నా యులి వాలకింపని యనంత విభావరులంచు కొక్కురో
కో యని కూయుచున్న దదిగో తొలికోడి బడాయి కొట్టుచున్‌

పూసపాటివారి ముఖ్యపట్టణమైన
విజయనగరమందు విశ్రమించి
జగము దద్దరిల్ల సకిలించినది తొల్లి
రాయరావుతుల గుఱాలదండు

కరవాలంబున గొల్చి రాయలు పరిష్కారంబు గావించుచున్‌
సరిహద్దుల్‌ సవరించినాడటు లొరిస్సా దాక నా రాజభా
స్కరు డెత్తించిన బొట్టునూరి విజయస్థంభంబుపై వేలుపుం
దెరవల్‌ నిల్చి పఠింతు రాంధ్రుల విభూతిన్‌ ముక్తకంఠంబులన్‌

నీవు బొబ్బిలి మీదుగా నిర్గమించి
మన్యము తరించి కొన్ని యామడలు నడువ
పలుచబడిపోవు మన జిల్గు తెల్గు శోభ
తావు లెగజిమ్ము నోఢ్ర వాతావరణము

తేటయైన తీపినీట దిక్కులదాక
విస్తరించి రుచులు గుస్తరించి
చిల్కసంద్ర మింపుసేయుచు కన్పట్టు
స్వచ్ఛమైన తెల్గుభాష వోలె

చిట్టి మరుదంకురంబుల
బుట్టిన కెరటాల మొత్తములు తీరములన్‌
కొట్టుకొని మరలిపోవును
గట్టులెగయ జూచు చిలిపి కవనముల వలెన్‌

తగులున్నీకట మార్గమధ్యమున బౌద్ధస్థూప శైథిల్యముల్‌
మగధోర్వీశుల రాణివాసములు లీలాభర్మ హర్మ్యావళుల్‌
జగముల్‌ మెచ్చిన శాక్యసింహుని యహింసాసూక్తి మాధ్వీక ని
మ్నగలం దేలిన పుణ్యభూములు నలందా పాటలీపుత్రముల్‌

ముక్తిదంబులైన పుణ్యస్థలములందు
ప్రథమగణ్యమమ్మ వారణాసి
అన్నపూర్ణ సేయు నాహారభిక్షతో
ముక్తిభిక్ష నీకు ముట్టగలదు

నదుల తోడికోడలు దధీశు పెదభార్య
జాహ్నవీ స్రవంతి జలము దేర
అతిథి పూజ సేయు నన్నపూర్ణాదేవి
వారణారి గూడి వారణాసి

కలరు కళాసముద్రములు గట్టులు రాయగ నీదినట్టి ధీ
విలసితులైన పండితులు పెక్కురు వేదపురాణ శాస్త్రముల్‌
పలికిన సత్కవీశ్వరుడు వ్యాసమునీంద్రుడు శిష్యకోటితో
మెలగె నొకప్పు డుండు నట మేచకకంఠుడు విశ్వనాథుడై

మొగలాయి చక్రవర్తుల
మృగాంకకేతనము నింగి మెరసిన ఢిల్లీ
నగరంబు దృష్టిగోచర
మగు ప్రోన్నత సౌధ చుంబితాంభోధరమై

ఆ ఢిల్లీపురి హస్తినాపురి సమాఖ్యన్‌ ద్వాపరంబందు కొం
డాడం బడ్డది ధర్మజుండచట రాజ్యంబేలి చేయించినా
డీడుం జోడును లేని జన్నముల నెన్నే గన్నులున్నందుకున్‌
చూడందగ్గ పురంబు సుమ్మచట వీచున్‌ భోగసౌరభ్యముల్‌

ముడిచె నిచ్చట కుంతికొడుకు ద్రౌపదికొప్పు
        పగవాని రుధిరంబు పరిమళింప
మెరసె నిచ్చోట నాదరుషా కుఠారంబు
        నిఖిలభారతము కన్నీరునింప
వెలసె నిచ్చోట పచ్చల బర్హిపీఠంబు
        షాజానురాజు నాస్థానవాటి
పెండ్లాడె నిచ్చోట పృధ్విరాజొకరోజు
        జయచంద్రు సుతను దోస్సార గరిమ

యుగయుగాల కథల నుదరాన జీర్ణించి
రాజరక్త నిర్ఝరముల దేలి
నవ్వుచున్న ఢిల్లి నగరంబు నందంబు
తరుగలేదు శిరము నెరియలేదు

సులతానీ సులతానులున్‌ మణిగణాంశుల్‌ చుట్టుమిట్టాడు మే
డలలో వాసము జేసినారు నిజరాష్ట్రం బాకటం దూల పే
దల నోరూర భుజించినారిచట ముక్తారత్న పాత్రంబులన్‌
కలమాన్నంబు; సుఖించినా రఖిల భోగశ్రీ మహాడోలలన్‌

కుతుబుద్దీనుడు నిల్పిన
కుతుబుమినా రనెడు గొప్ప గోపురము సము
న్నత మయ్యు చెక్కుచెదరదు
శతాబ్దముల నాటి శిల్ప చకచకితంబై

చామనచాయ కలట్టిది
కామజనకు ననుగుభార్య కాళింది వినీ
లామల కోమల వీచీ
చామరములు వీచి నీకు స్వాగతమిచ్చున్‌

సూనుని ఖాయిలా తనకు చొప్పడు లాగు నమాజు చేసి య
ల్లా నలరించి ఆది మొగలాయి నరేంద్రుడు బేబరుం డుమా
యూనున కాయురున్నతులు సృష్టి యొనర్చిన చిత్రగాథ ఆ
గ్రానగరంబు కర్ణశుభగంబుగ నీకు నుపన్యసించెడిన్‌

షాజాను నశ్రుజలకణ
మీ జగముపురంధ్రి దాల్చు నేడవ నగ ముం
టాజమహలు నిద్రించెడు
తాజమహలు దృశ్య మద్భుతంబు పతంగీ

కుహనా గోపుం డాగమ
రహస్యమగు గీత బాహిరము చేసిన శ్రీ
మహిత కురుక్షేత్రంబున
విహారమొనరించి పొమ్ము విహగవధూటీ

సుజనస్తుత్యుడు బోధిసత్వ ధరణీశుం డర్థరాత్రంబునన్‌
నిజవాసంబు పరిత్యజించి యతిశాంతి స్థాపనేచ్ఛా మనోం
బుజుడై బిచ్చపుగిన్నె దాల్చిన మహాపుణ్యప్రదేశంబులన్‌
మజిలీ సేయుము రెండునాళ్ళు ఖగభామా జన్మసిద్ధించెడిన్‌

లుంబినీవన పరిమళోల్లసిత మగుచు
నేగుదెంచెడు నీ కర్య్ఘమీయగలదు
గౌతముం డాదరించిన కనకహంస
నీరు కలియని మధుర గోక్షీరధార

దర్శింపగలవు గౌతమబుద్ధ దేవుని
        ప్రాచీన భరత శిల్పంబునందు
సాధింపగల వహింసా మంత్రరాజంబు
        శాక్యసింహుని కాలిజాడలందు
తెలిసికోగలవు బౌద్ధుల సాహితీసేవ
        అమరసింహుని కవిత్వమున యందు
వీక్షింపగలవు కపిలవస్తు నగరంబు
        నాశనదే వ్యధీనంబు నందు

రెండువేలేండ్ల క్రింద నిద్రించుచున్న
మౌర్యరాజుల విపుల సామ్రాజ్యచరిత
యేకరువు పెట్టు ప్రకృతియం దాకళించి
వెచ్చవెచ్చని కన్నీరు విడువగలవు

అక్కడనుండి యుత్తర దిశాభిముఖంబుగ నిర్గమించు నీ
దృక్కుల నడ్డుచున్‌ హిమగిరీంద్రము దర్శనమిచ్చు దానిపై
నెక్కగనెంచి తెల్లదొర లీలిగిరెందరొ వారి దేహముల్‌
స్రుక్కవు నేటికిం బులుగుసుందరి మంచు మహత్వ్త మెట్టిదో

కరగిన మంచుబండలు ప్రగాఢభరంబున పట్టుదప్పి త
ద్గిరి శిఖరాల నుండి తలక్రిందులుగా దిగజారి లోయలన్‌
దిరిగెడు జీవరాసుల వధించుచు నుండును పేదవారికిన్‌
చెరపె కదా బలాధికుల నేయము సంయమిపక్షి భామినీ

అందు నెవరెష్టు శిఖరాన నధివసించి
వ్రాసికొనవచ్చు భరతవర్షంబు పటము
దాని యున్నతి తారకాధ్వజము మిగులు
సులలితములైన కవుల యూహలకు తరుగు

కలహంసల్‌ సను వాయుమార్గముల రేఖల్‌ పర్వతాగ్రంబునన్‌
కల వాత్రోవల దక్షిణోత్తర దిశాగ్రవ్యాప్తముల్‌ ప్రోన్నతం
బులు నీకున్‌ చనకాదు నిచ్చలు నిలింపుల్‌ గుంపులై రాకపో
కలు గావించెడు వెండికొండ వెరవుల్‌ కన్పట్టు నైమూలగన్‌

విహిత కైలాసయాత్ర గావించు నిన్ను
మంచుకొండలవిభు డాదరించగలడు
అల్లునకు కూతునకు వార్త లంపునేమొ
సమ్మతింపుము నుడులు భారమ్ము కావు

అస్త్రవిద్యాభ్యసన వేళ నద్భుతముగ
కొంచకొండకు రంధ్రంబు కొట్టినాడు
చినతనంబున పార్వతి చిన్నకొడుకు
తారకాగిరి కదియ యుత్తరపు గవిని

గిరుల మగవాని చెలిమి వ్యక్తీకరింప
మస్తమున దాల్పు మొక చిన్ని మంచుతునక
విసపుమేతరి కది సిఫారసుగ నుండు
వ్యర్థములు కావు పెద్దల పరిచయములు

మంచుఫలించు నగ్గిరుల మూడుల కారుమొయిళ్లపై నుడా
యించు గమింపు మవ్వల మహేంద్రునివీడు త్రివిష్టపంబు క
న్పించు డలాయిలామలను వింతనృపుల్‌ పరిపాలనంబు సా
గించెద రిప్పు డచ్చరలు క్రీడ యొనర్పరు నందనంబునన్‌

ఆ లామాలకు పెండ్లిపేరటము లే దాజన్మ సన్యాస దీ
క్షా లగ్నాశయులై ధరింతు రతిదీర్ఘంబైన కుళ్ళాయముల్‌
మౌళిన్‌ వారి యనుజ్ఞ లేక విహరింపం బోల దెవ్వారి కా
నేలన్‌ పక్షివి నీకు పోదగని క్షోణీమండలం బుండునే

ఆ రాజ్యంబును గూబపట్టుకొని బిట్టాడించుచుండున్‌ దురా
చారంబుల్‌ వెడనమ్మకాల కది వాసస్థాన మస్పృశ్యతా
క్రూరవ్యాఘ్రము సంచరించుటకు సంకోచంబు లే దైన బౌ
ద్ధారామంబులు సాగనీయవు కదమ్మా దాని యౌద్ధత్యమున్‌

అసమ రుచిరాంబువైన మానస సరస్సు
కన్న కూతురు బుడుత గంగాభవాని
యెక్కి దిగుచుండు కొండల చక్కదనము
ప్రేక్షణీయంబు సుమ్ము గబ్బిలపుదేవి

బలిసిన మేనులన్‌ జడలబర్రెలు కొమ్ముల వింత సింహముల్‌
బలె విహరించు కొండల యుపత్యకలన్‌ సెలయేటి నీళ్ళ క్రో
ల్పులుల కళేబరా లచటి లోయలలో పొరలాడు వాని య
మ్ముల కెనయైన శృంగముల పోటుల తూటులుబడ్డ పొట్టలన్‌

జడనిధి వంటి మానసము సాటికి రావు సరస్సులెల్ల నం
దుడుగక రేగు పేరలల యూపున గట్టులదాకి ప్రాణముల్‌
విడిచిన గండుచేపలు కుళీరము లెల్లెడ తీరభూములం
దడుగిడరాక చీకి వికలాంగములై పడియుండు గుట్టలై

దమయంతీ నలులకు దౌ
త్యము చేసిన తొంటి పసిడి హంస విభుని చు
ట్టములందు పంకజోద్యా
నములందున నాలపింత్రు నైషధకథలన్‌

నిండిన దోరవెన్నెలల నిక్కిన పచ్చిక మేసి చాందినీ
కొండబయళ్ళలో తిరుగు గోపతి నీ కగుపించు నందు వే
దండవిరోధి దాల్చిన జటాటవి పూచిన పూవు చంద్రమః
ఖండము గోచరించు నెరుకల్గల నీ కెరిగింప నేటికిన్‌

విలు నమ్ముల్‌ ధరియించి చెంచులు తదాభీలాటవీ మధ్య భూ
ముల కన్పట్టిన నంజలింపుము మహాత్ముండైన భర్గుండు భ
క్తుల కిష్టార్థము లీయగోరిన గణస్తోమంబుతో మాయ పం
దుల వేటాడుచు భిల్లుడై నరుల కన్నుల్‌ గప్పి క్రీడించెడిన్‌

అచ్చోట తబిసి రాజులు
నిచ్చలు తపమాచరించు నీ కాతిథ్యం
బిచ్చెదరు పరుల విద్యలు
మెచ్చెద రీ గుణము నేడు మృగ్యంబ కదా

ఇప్పటికి కూడ క్రొంబొగ లెగయుచున్న
త్రిపురముల ప్రాత బూడిద దిబ్బ లచటి
కనతి దూరాన నీకు ప్రత్యక్షమగును
చిత్రముగ పాపమున కెంత చేవ గలదొ

వలరాజు పగవాని కొలిచి ముందుకు సాగు
        తొలకరించిన నీలి జలధరంబు
మహిషుని వనిత లుమ్మలికింప గర్జించు
        సితికంఠు నిల్లాలి సింహరమణి
కొసరి దిక్కులు మేలుకొలిపి గానము సేయు
        కొమరుసాముల వారి కోడిపుంజు
తల మీద రతనాలు మొలిచి ముద్దులు గార
        నటియించు సర్పంబు నటకురాలు

కనుల జూచి రమ్ము కైలాసభూముల
వింతలెల్ల తెలుప వేళకాదు
నీకు శుభము కల్గు నిఖిలామరశ్రేణి
సరసుడమ్మ బాలచంద్రధరుడు

రేగిన గందపుం దరు పరీమళముం గని మోసపోయి యం
దాగి పదంబు మోవ వల దచ్చట కొమ్మల నాశ్రయించి మి
న్నాగులు తాండవించు మరణంబును పుక్కిటబట్టి యాపదల్‌
డాగిన తావులే వలపులం దొణికించి మనస్సు నీడ్చెడిన్‌

పుడమి ననంతకాల రథమున్‌ కదలించి మనుష్యకోటిపై
నడిపి నశింపజేయు యతనంబులు నీ బెదరింపు లిచ్చటన్‌
పడవని రుండమాలికలు పండ్లిగిలించి వెడంద నోళ్ళతో
మృడుని గళంబునన్‌ చెనటి మృత్యువుతో వెకసక్కెమాడెడిన్‌

ఒలికిపోయిన పండువెన్నెలల పాలు
క్రోలుచున్నది తపిత చకోరకంబు
ప్రొద్దువోయెను నీ చిన్న భోజనమును
వెదికికొన బొమ్ము తబిసి గబ్బెతల రాణి

వీనులు చిన్నవోవ వినిపించు నదే డబుడుక్కు వాని డ
క్కా నినదంబు తూరుపు ముఖంబుగ హైందవవీధి సభ్యతా
స్థానము గల్గు తాను మన సఖ్య మెరింగిన కంటగించు నో
మౌనిశకుంతమా చను ముమాపతి మేడకు కోడి కూసెడిన్‌

నన్నొకమారు నీ దరిసెనంబున ధన్యుని జేసి భర్గుడే
మన్నది చెప్పిపొమ్ము విబుధాలయవాసిని నాకు లేరు నీ
కన్న శరణ్యు లాప్తులు వికాసితమైనవి తూర్పురేఖలున్‌
కన్నపుదొంగ తోడ సదనంబునకుం జనుమమ్మ పక్షిణీ

ద్వారములు లేని నాదు కుటీరలక్ష్మి
స్వాగతం బిచ్చి నీకు మర్యాదచేయు
నా యనుజ్ఞకు వేచియుండంగ నీకు
వలదు వలదమ్మ రాత్రిం దివమ్ములందు

నిద్దుర మేల్కొని యల్లన
ఖద్దరు రాట్నంబు పౌరకాంత వహించెన్‌
ప్రొద్దు పసివాడు తూరుపు
ముద్దియ పొత్తిళ్ళలోన ముద్దులు గురిసెన్‌

వాని యిష్టార్థములు కూర్చు దానివోలె
విశ్వనాథుని గుడికి గబ్బిలము సనియె
వేయిచేతుల పెనుకాపు వేగిరింప
గచ్చ బిగియించె నప్పేద కార్మికుండు

బహుదేశ మత మహాపరిషత్తు తలయూచ
        పలికి వచ్చినది మా భరతసుతుడు
కండెబొట్టున నైదు ఖండాల నోడించి
        కొలువు లందినది మా కోమటన్న
సీమలో నాచార్య సింహపీఠిక మీద
        నిలిచివచ్చినది మా తెలుగువాడు
విశ్వసన్మానంబు వెలయ నోబెలు కీర్తి
        రంగమెక్కినది మా వంగ సుకవి

చెట్టుచేమల సుఖదుఃఖ జీవితములు
నిజము దేల్చినవాడు మా నేలవాడు
నన్ను దొలగించి లెక్కించినారు గాని
మొదట నెల్లర మన్న దమ్ములము మేము

గబ్బిల మేమని చెప్పెనొ
గుబ్బలి యల్లుండు కన్నుగోనల నశ్రుల్‌
గుబ్బటిల లేచి నల్లని
మబ్బులలో తక్షణంబ మాయం బయ్యెన్‌

తిరువానుకూరు దేవుడు
తెరచెం గుడి తలుపు లితర దేవుండ్లును బి
త్తరవోయి నిమ్నజాతుల
దరిసెనమున దరిసి రాత్మదౌర్భాగ్య దశల్‌

అంటరాని తనంబు నంటి భారతజాతి
        భువనసభ్యత గోలుపోయె ననుచు
క్షమకు మించిన కత్తి జర్మనీ యుద్ధాన
        గనుగొన్న మొనగాడు గలుగడనుచు
కదురు రాట్నము చేత గాక స్వేచ్ఛాస్వర్గ
        ముదము జిక్కుట నభఃపుష్ప మనుచు
నూరేండ్లు గాదు మున్నూరేండ్లు మనవచ్చు
        న్యాయమార్గంబున నడువు డనుచు

నిమ్నజాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమును గాల్చివేయు ననుచు
రాట్నమును దుడ్డుకర్ర కరాన బూని
దెసల దోతెంచె గుజరాతు ముసలిసెట్టి

సీమగుడ్డకు కన్నులు చెమ్మగిల్లె
ముతకబట్టకు మర్యాద పొటమరించె
నగరి వెలుపలి మాలమాదిగలు కూడ
నరులుసుమ్మని దేశంబు గురుతుబట్టె

వెరపు వలదు నీకు హరిజన సోదరా
స్వీయరాజ్యరధము వెడలివచ్చె
లాగిపొమ్ము నీకు భాగంబు గలదంచు
పాడుచుండె రత్న భరతమాత

ఒకనాడా మునిపక్షి తొంటి చెలికాడున్నట్టి గేహంబు లో
నికి నేతెంచి యధావిధిం దిరుగుచుండెన్‌ మిత్రు డీక్షించి యు
త్సుకతం బొంగి దరస్మితంబున నిదే జోహారహో పక్షిణీ
యకలంకంబగు నీ సహాయమున నా యర్థంబు పండాయెనే

నా వర్ణించిన పుణ్యభూములను సందర్శించినావే మహా
దేవుం డాయన దేవియుం దగిన యాతిథ్యంబు నీకిచ్చిరే
నా వాక్కుల్‌ జెవి నాటితే మహిత రత్న స్వర్ణకాంతి చ్ఛటా
ద్వావ ద్దివ్య హిమాద్రికందర పవిత్ర క్షేత్రముల్‌ సూచితే?

పుడమి కలుషరాశి మ్రుగ్గిపోవుచు నుండ
నాట్యమాడుకొనుట న్యాయమగునె
భర్గదేవ! సృష్టి పరికించి పొమ్మంచు
పిలిచివచ్చినావె పులుగుచెలియ

కాళిదాసుని మేఘంబు గౌరవంబు
తెచ్చుకొన్నదె నీదు సందేశగాధ
ఘనులు చేకొను భూభృదగ్రముల పూజ
అసమ చతురత్వమున్న బానిసకు రాదు

వ్యాస వాల్మీకి ముని మదేభములు రెండు
తిరుగుచుండెనె కైలాస గిరుల మీద
వారి వార్ధక్యమున నీకు స్పష్టమగును
భరత రామాయణంబుల పడుచుదనము

ఆ వాల్మీకి నిసర్గ జంతుకరుణా వ్యాసక్తియే సత్కవిన్‌
కావించెన్‌ వెడలించె రామునికథా గాంగేయమున్‌ కానిచో
త్రోవల్‌ కొట్టెడు బోయ కేగురువు నేర్పున్‌ దివ్యగీర్వాణమున్‌
ఆవేశించి కళాధిదేవి వరమీయన్‌ విద్య లేమాత్రముల్‌

ఎదురై వచ్చెనె కాళిదాసుని లసచ్ఛృంగార సందేశ మం
బుద మార్గంబున తద్రసంబులు ధ్వనుల్‌ ముత్యాలు వర్షించెడిన్‌
పదినూరేండ్ల పురాణమేఘమనుచున్‌ భావింతువో నిత్యముం
పదియారేండ్ల వయస్సు కూర్పదె సుకావ్యస్పర్శ జేజెమ్మకున్‌

జనముల్‌ మెచ్చు రసప్రసిద్ధమగు నా సందేశభారంబుతో
జనముల్‌ వచ్చు విమానమాలికల గర్జాభీషణంబౌ ప్రభం
జన మార్గంబున నీ ప్రయాణమెటులన్‌ సాగించి నెగ్గించితో
చెనుకన్నేరవు గండముల్‌ తబిసిపక్షీ జన్మసన్మార్గులన్‌

కన్నులు ధన్యంబులుగా
కన్నావే మంచుకొండ గగనము శిరముం
తన్నెడు దాని నమరగవి
వెన్న వలెం ధవళరుచులు పిండెడు దానిన్‌

ఆ కొండయే యిండియా విరోధుల దండు
        గుండె గాలంబైన వెండికోట
ఆ కొండయే ముత్తియపుదండ భారతో
        ర్వీమాతృమణికి కిరీటభూష
ఆ కొండయే పర్వతాగ్రగణ్యములైన
        కులపర్వతముల నిక్కులకు నిక్కు
ఆ కొండయే రజతాచలస్వామికి
        మణిమయ కళ్యాణ మంటపంబు

సింధు గంగా మహానదుల్‌ చిన్ననాడు
ప్రాకనేర్చిన అపరంజి ప్రస్తరములు
పాదచిహ్నాలు పరికించి వచ్చినావె
కలుషములు వాయ కన్నుల కరువు తీర

ఇంద్రధనువు బట్టి సాంద్రాబ్దవనవాటి
మెలగుచున్నవాడు మృగయుడొకడు
వాడు గొంతుబిసిగి వసుధపై విసరిన
జంతుతతులు నిమ్నజాతి జనులు



ఆగర్భప్రతిభా సముద్రులగు శిల్పాచార్యు లూహింపగా
మూగంబడ్డ శకుంతముల్‌ పలికి గుంపుల్‌ కట్టి కీర్తింపగా
వేగుంజామున రంగులద్దు నల శిల్పబ్రహ్మ దే గ్రామమో
భోగట్టా కనివచ్చితే రసమయంబుల్‌ తత్కళా పద్ధతుల్‌

బెళుకుంజూపులు గుల్క పోకడలు చూపీ చూప కూరించుచున్‌
జలదాగారము లందు తోచెదరు కన్యల్‌ కొంద రీక్షించితే
పులుగుంజేడియ! అబ్ధిగర్భములలో ముత్యాలు పండించి భూ
ముల కర్పించెదరంట మేటి గహనంబుల్‌ సృష్టివైచిత్రముల్‌

ఎంత కోయిలపాట వృధ యయ్యెనో కదా
        చిక్కు చీకటి వనసీమలందు
ఎన్ని వెన్నెలవాగు లింకిపోయెనొ కదా
        కటికికొండల మీద మిటకరించి
ఎన్ని కస్తురిజింక లీడేరెనో కదా
        మురికితిన్నెల మీద పరిమళించి
ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనొ కదా
        పండిన వెదురు జొంపముల లోన

ఎంత గంధవహన మెంత తంగెటిజున్ను
యెంత రత్నకాంతి యెంత శాంతి
ప్రకృతిగర్భమందు భగ్నమై పోయెనో
పుట్టరాని చోట పుట్టు కతన

నెలలో నున్నది వృద్ధురాలొకతె గాంధీశిష్యురా ల్నిచ్చలున్‌
జిలుగున్నూలు తయారుచేసుకొనుచున్‌ జీవించు జేజెమ్మ కొం
డల యల్లుండు శిరాననుంచుకొని సన్మానించెడిం బండువె
న్నెల పూదోటల విశ్రమించి మన సందేశంబు నాలించెనే

నాచిత్తంబున దక్క తోచదెచట న్నాతల్లి రూపంబు ధా
త్రీచక్రంబున దేహమూడ్చి నరు లుర్వింబాసి వైకుంఠ మం
దో చండీశ్వరుడుండు మండలమునందో యుందురండ్రెల్ల రా
యాచోటం గనివచ్చితే మృతి భవిష్యన్ముగ్ధముల్‌ విశ్వముల్‌

చంద్ర చండకరులు సన్మార్గగతులయ్యు
నొకని జూచి యొక్క డోర్వజాల
రెందు కింత వైర మిరువురిలో ద్రావి
డీ డెవండు తెల్గువా డెవండు

పవ లింపారెడు సృష్టి చీకటి శిలాపంకంబునం బుంపి యి
ట్లవమానించెడు కొంటెవాడెవడు ప్రొద్దల్లంత కన్పట్ట వే
కువ నేమోల నణంగియుండు తమ సిగ్గుంజేటు యోజింప రీ
యవివేకుల్‌ విరమింపరీ దినదిన వ్యర్థ ప్రయత్నంబులన్‌

శివుడు తాండవించి చేకొన్న సత్కీర్తి
తన ప్రయోజకత్వ మని తలంచి
విఱ్ఱవీగడండ్రు పెక్కురు నటకులు
విఱ్ఱవీగి కవుల విస్మరింత్రు

వెలవాక్రుచ్చగ రాని భావముల నన్వేషించుచున్‌ సత్కవీం
ద్రుల యూహల్‌ విహగంబులై తిరుగుచుండున్‌ ప్రోన్నతాకాశమం
డలమస్తంబున నాకళించితె ప్రయాణశ్రాంతి నమ్మంచు కొం
డలకున్‌ డిగ్గెడి నీవిశేషము రసజ్ఞజ్ఞేయ మూహింపగన్‌

వడుకునూలు చేత పగ్గాలు పేనించి
దొడ్డమృగయు డుచ్చు లొడ్డినాడు
తగులుకొనునొ కాక తప్పించుకొను నొక్కొ
స్వీయరాజ్య మనెడు సింహరాజు

నరులన్‌ ముట్టక నందులం గొలిచి పుణ్యంబెల్ల సాధించు న
ప్పరమంబైన రహస్యమున్‌ శివునితో ప్రస్తావముం జేసితే
పరమేశుం డివి నిమ్నజాతులకు సంప్రశ్నింపగా రాని వే
ద రహస్యాలని కోపగించుకొని స్వార్థంబుం బ్రదర్శించెనే

బసుమంబు బూసికొని యే
రసికత లేకుండ బ్రతుకు ప్రమదుల నడుమన్‌
రసికుడగు సుకవి జీవిత
మసిధారావ్రతము వలవ దది శత్రులకున్‌

ఎవరికి వారై బ్రతుకుచు
నవీనధర్మముల పిచ్చినమ్మకములతో
సవరించి ప్రజల తలలో
ప్రవేశ మొనరించు స్వార్థపరులం గంటే

దిరుసుల్‌ మార్తురు కొంద రాంధ్రులవురా దేశాంతరంబేగి వ
త్సరముల్‌ పుచ్చి త్రివిష్టపప్రజలలో సఖ్యంబు గావించి యె
బ్బెరికంబైన విదేశనాగరికతన్‌ విచ్చేయ కచ్ఛాంధ్ర మం
దర వేసంబు ప్రతిష్ఠ నిల్పితివి సన్మానార్హ వెంతేనియున్‌

చెప్పక చెప్పుచున్నది విశేషము లేదని నీమొగంబు నే
తప్పొనరించి యింతటి వృధాశ్రమ యిచ్చితి మా యదృష్టముల్‌
దప్పిన దప్పని మ్మనుగు తమ్ముల శ్రేయము గోరి భర్గునిన్‌
గుప్పెడు గుండెతో యెదురుకొంటివిదే పదివేలు పక్షిణీ



అపజయంబులు విజయగేహంబు నిలుచు
స్తంభములు సుమ్ము నీకు విచారమేల
కొద్ది కొద్దిగ నిక్కిన గోడ వోలె
సగము సగములుగా పనుల్‌ ముగిసిపోవు

ఓటమిలేదు నా యతన మూరకపోదు తుఫానువోలె నా
మాట లుమామహేశ్వరుల మానసముం గదిలించితీరు క
న్నీట మునింగి పైకుబుకు నిర్మలసూక్తి ఫలింపకున్న పో
రాటముతో స్వరాజ్యము విరాజిలుటల్‌ కృతకప్రచారముల్‌

పలనాటన్‌ మును బ్రహ్మనాయని కృపాబాహుళ్యనేత్రంబులో
పల నాటంబడి నాయురాలి కృతక వ్యాపార దానంబు లో
పల భస్మంబయి సంఘసంస్కరణ దివ్యద్బీజ మీనాటికిం
ఫలియించెంగద గాంధిచే యతనముల్‌ వ్యర్థంబు గా వెన్నడున్‌

నీకావించిన రాయబారమునకు న్నిత్యాభిషేకంబుగా
నాకన్నీటిని కాన్కగా యొసగుచున్నానో దయాశాలినీ
చేకొమ్మింతకుమించి నావలన నాశింపంగ లేదిట్టి నీ
బాకీ దీర్తు స్వరాజ్య సౌధమున నావాసంబు సిద్ధించినన్‌

ఏజాతి కెంతవచ్చునొ
రాజత్వం బంత నాకు రావచ్చు గదా
నాజాతి యెత్తు కేతన
రాజంబున నీదుమూర్తి వ్రాయింతు చెలీ

పెల్లు తమస్సులోన దురపిల్లెడు మా బ్రతుకుం దమస్వినుల్‌
భల్లున తెల్లవార్చగల బాబులు పెద్ద లనేకులుండగా
తెల్లనివేల్పు భిక్షకుని దిండికి బట్టకులేని కొండరా
యల్లుని నాశ్రయించి యకృతార్థుడనైతిని పిచ్చివాడనై

మరచితి నాదిదేవుని సమానుడు బుద్ధుని యంతవాడు భా
సుర దరహాస చంద్రికల శుభ్రత లోన గలట్టి వాడు య
ద్దొరలకు గాదు వారి చెవిదూరినవారిని లక్ష్యపెట్ట డ
ప్పరమమునిన్‌ సబర్మతి నివాసిని జూచితివే తపస్వినీ

ముల్లొక్కించుక వాలిపోయినను బాపూజీకి దీటైన శ్రీ
వల్లాభాయి పటేలు దర్శనము సంప్రాప్తించెనే నీకు నే
డల్లంతన్‌ గనుపట్టుచుండెడు స్వరాజ్యార్థంబు సర్వస్వమున్‌
గొల్లంబెట్టిన త్యాగి తా నతడెఱుంగున్‌ నా మనఃక్లేశమున్‌

ధిక్కారించెడు రాచగుఱ్ఱముల స్వాధీనంబు గావింపగా
యుక్కుంగళ్ళెము జహ్వరుం డతని విద్యుచ్ఛారదామూర్తి న
ల్దిక్కుల్‌ నిండి నటించుచున్న దనుచున్‌ దేశంబు లగ్గించు మా
చిక్కుల్‌దీర్చుట విస్మరింపడుగదా స్వేచ్ఛాజయాంతంబునన్‌

పసుపుం బచ్చని పూతపూచినది మువ్వన్నెల్‌ పిసాళింప గాం
గ్రెసు మందార మనంత శాఖికలు నిక్కెన్‌ దిగ్దిగంతంబులన్‌
పసలేర్పడ్డవి సర్వవర్ణములకున్‌ తచ్ఛాఖిశాఖాతతిన్‌
వసియింపన్‌ మనకుండదే స్థలము దివ్యన్మౌని పక్షీశ్వరీ!

కల డంబేద్కరు నా సహోదరుడు మాకై యష్టకష్టాలకుం
బలియై సీమకువోయి క్రమ్మరిన విద్వాంసుండు వైస్రాయి మే
ల్కొలువందంగల దొడ్డవాడతడు నీకున్‌ స్వాగతం బిచ్చి పూ
వుల పూజల్‌ వొనరించెనే యతనిమెప్పుల్‌ నీ జయారంభముల్‌

నేను నాకను నహము ఖండింపలేక
పదియు నెనిమిది శాస్త్రాలు పదును లుడిగె
నీవు నేనను సమత సంధింప గలిగె
తీవ్రతరమైన చిన్న మౌనవ్రతంబు

వచ్చినవారు సీమనరపాలుర మంత్రు లభీప్సితార్థముల్‌
దెచ్చిరి ప్రేమతో భరత దేశజులం దనియింపవచ్చి పో
వచ్చు స్వతంత్రభారత సువర్ణకిరీటము నేడుగాక రా
వచ్చు మరొక్కనాడు నెలవాసిన తొయ్యలి తీర్థమాడదే?

గుడిలో దేవుడు చూచిపొమ్మనుచు నాకున్‌ వార్తలంపింపగా
దొడగెన్‌ నల్వురచేత నీవెనుకవత్తున్‌ నన్ను రమ్మందువా
తడవైనన్‌ మరణింతురెందరొ విముక్తాహార దీక్షాపరుల్‌
నడుమన్‌ నేను సహింపజాల నొక యాంధ్రప్రాణి శుష్కించినన్‌

గబ్బిలమవయ్యు శివుని లోకంబునందు
వలయు కదలిక గలిగించి వచ్చినావు
నిశ్చలంబైన కాసారనీరమునను
నలతి శిల చాలదే వలయముల దీర్ప

అర్థించి చనుదెంతు నగ్రహారముకన్న
        సర్వేశ్వరుని యింటి చౌకదనము
అడిగివచ్చెద వీటి నడిబజారునకన్న
        గుడిగోపురముల తక్కువతనంబు
పలికించుకొనివత్తు బంతి బువ్వలకన్న
        తీర్థప్రసాదాల దేబెతనము
ప్రశ్నించివత్తును రాచబావులకన్న
        పాతాళగంగమ్మ పలుచదనము

నిజము దేలిచికొని వత్తు నిన్న నేడు
నన్ను జూచిన నల్లంత నడుచుతనము
గుడికి రమ్మనినంతనే యొడలుమఱచి
పరువులెత్తుట నాకంత పరువుగాదు



ఎంతో దూరము పోవనేమిటికి నే డింటింటికిం బ్రాకి యా
శాంతవ్యాప్తముగా రహించెడు స్వరాజ్యస్వర్ణసూత్రంబు చౌ
దంతి స్తంభన మాచరించెగద యేతద్దివ్యసూత్రంబు మో
కంతై నిక్కిన కట్టివేయగలదా యస్పృశ్యతా వ్యాఘ్రమున్‌

చాటింపించి మదీయజాతికి నభీష్టంబుల్‌ ప్రసాదింపగా
పూటా పడ్డది కొంతభారమది రేపో మాపొ రావచ్చు నీ
నాటంగాదని కొంతభారతము పంతంబొప్ప వాదించు నీ
వోటెవ్వారికొసంగితో తెలిపి నన్నోదార్చవే నెచ్చెలీ

ప్రియములు గాని సత్యములు పెక్కులు నేను వచించుచుంటి నీ
దయకెడవై తపింతునొ యదార్థపిపాసువులైన వారి య
వ్యయ కరుణావిశేష రుచిరాత్త మనస్కుడనై సుఖింతునో
భయపడనేల నా పలుకు పల్కులు బాష్పకణాభిరామముల్‌

ఏకవి పిచ్చిగా నడుచు పృధ్వికి లోబడి కీర్తి కోసము
ద్రేకము సంహరించుకొని దేశము వోయిన త్రోవబోవునో
ఆకవి పేడుమూతి మగ డంబుజగర్భుని రాణిగారికిన్‌
సాకుడు బిడ్డ డాస్తిగల సామికి బేరసిక ప్రదాతకున్‌

పుట్టంగావలె సత్కవీశ్వరుడు నీ పుణ్యాన మావంశపుం
బుట్టం జీలిచికొంచు సంచితకళాపూర్ణ ప్రభారాశియై
పుట్టంగూడదు పుట్టినం గలుగ వెప్డున్‌ నిండుసన్మానముల్‌
కట్టా యుచ్చత నీచతాయుత వితర్కభ్రష్ట దేశంబునన్‌

పిడికెండన్నము బెట్టలేదెపుడు మా వేమన్న జీవించి న
ప్పుడు ముద్దుల్‌ గురిపించు మేలికవనంపుం బుగ్గలుప్పొంగి కా
ఱడవుల్‌ మొద్దులు మోసులెత్తినపు డౌరా నేడు గోరీపయిన్‌
నడచుం బూజలు పుణ్యకార్యములు వింతల్‌ మా దయాధర్మముల్‌

బ్రతికియున్న సాయిబాబెన్నడును గాడు
చావకున్న వట్టి సాయిబయ్య
తిరుమలేశుడైన తెలియడీ యర్థంబు
చావు బ్రతుకులోన సారమిదియ

సమతలు సఖ్యముల్‌ పెదవిజారినమాటలు కట్టుబాట్లు చ
ట్టములు బటుత్వమూడిన గుటారపుదూముడి బందనాలు ధ
ర్మములు దయారసాల్‌ మొసలిరాలుచు నశ్రుకణాలు చిత్రచి
త్రములు మతస్వభావములురామరగా వివరింప గల్గితిన్‌

ఇప్పుడు గుండురాతి వలె నీశ్వరుడై ముడుపుల్‌ గ్రహించు కో
టప్ప యొకానొకప్పుడు గృహస్థుడు మానవమాత్రులైన రాల్‌
రప్పలు వేల్పులై సకలరాసులు మ్రింగక మిన్నకుండునే
యప్ప పులుంగురాణి యిక నాసలులేవు క్షుధార్తజాతికిన్‌

మరణము వార్ధకంబను ప్రమాద మెరుంగని కైతలల్లు న
బ్బురపు కవీంద్రు రెడ్డికులముఖ్యుని వేమన చాకచక్యమున్‌
మరచి పురాణకావ్యరస మత్తుడు వీరుడు సంఘసంస్కృతి
స్థిరుడు రచించె నాంధ్ర కవిజీవితముల్‌ బొరబాటు చేయుచున్‌

దొడ్డరాళ్ళగుండ్లు దొరలించి పఠితల
బెదురుబెట్టు కవిత విస్తరించి
పండితులకు దక్క పరుల కందకపోయె
దేవతలకు కామధేనువట్లు

కవిత చచ్చుదయ్యు కథ పేరుగలదైన
కవికి కొంత కీర్తి కలుగవచ్చు
నెలలు తక్కువైన బలమైన తిండిచే
నుసురునిల్పుకొన్న నిసుగువోలె

వ్యాకరణ శాస్త్రకారులు
క్షాకు గకారంబు వింతి కన్పడదని చీ
కాకు పరతు రంతెకానీ
పాకము రసమింపు సొంపు పరికించెదరే

వ్యవహారంబున భ్రష్టమయ్యు రసభావస్ఫూర్తి గల్పించి మా
ర్దవముల్‌ శబ్దములెన్నియో కలుగు శాస్త్రజ్ఞానమాత్రుల్‌ పురా
కవితోన్మత్తు లెరుంగజాలుదురె కుగ్రామీణ భాషాబ్ధిలో
చవులూరించు తెలుంగుపల్కుల జగాస్వారస్య రాహస్యమున్‌

కనుగొన్నావుగదమ్మ కృష్ణవిభుడక్కాలాన భాషావనం
బున సాగించిన యష్టదిగ్గజరథంబున్‌ శారదావాహమున్‌
తెనుగుందేశము విస్మరించినది తద్దిగ్దంతి దంతావళ
ధ్వని యధ్వాన్నపు టద్రిగర్భముల నిద్రంబోవు నాంధ్రత్వమున్‌

తెల్గుతేజం బెల్లదిక్కుల కెగబ్రాకి
        పగవాని బెదరించి వచ్చునపుడు
తెలుగుశిల్పుల సుత్తెదెబ్బ ఖంగునమ్రోసి
        చీనాకు పయనంబు సేయునపుడు
తెలుగుకవిత్వంబు దిగ్దంతుల ముఖాన
        బృంహితధ్వనులు గావించునపుడు
తెలుగుజెండా శక్తి నలుదెసల్‌ ప్రసరించి
        విద్యానగరవీధి వెలుగునపుడు

రామలింగని హాస్యకార్యములు దలచి
నాల్గుదిక్కులు కడుపుబ్బ నవ్వునపుడు
నాట్యమాడిన యానందనవ్యలక్ష్మి
కానుపించెనె శిధిలదుర్గముల యందు



అక్కట తల్లికోట సమరాంగన యాఖరు తెల్గుపోటుచే
యుక్కిరిబిక్కిరై తురకయోధుల వంకకు వాలునాడు భూ
భుక్కులగండడౌ తెలుగుభోజుని పూజలు చూరగొన్న యా
టక్కరిదేవతల్‌ తనువుదాచుట నాకు నసహ్యమయ్యెడిన్‌

తొంబదియెండ్ల వృద్ధు డతిదోర్బల భీముడు రామరాజు డెం
తెం పరగండడౌ నృపమణీ సుతభర్త మహమ్మదీయ ఖ
డ్గంబులకున్‌ శిరంబొసగి కష్టముదెచ్చిన మాట ఆంధ్ర వ
ర్గంబు సహింపనేరని పరాభవమై భరమై దహించెడిన్‌

తెలుగు లండను నగరంబు తెలుగుకోట
తెలుగుకవి దిగ్గజంబులు తెలుగుదనము
పొట్టిగుఱ్ఱమునెక్కిన పొగరుబోరు
టళియరాముని కతన ముక్కలయిపోయె

విహరింపనే భీతివిడచి మస్తమునెత్తి
        సకల సామ్రాణ్మహా సభలలోన
వాక్రుచ్చనే రాలువగిలి బుగ్గలుజిమ్మ
        నతి నిశాత ప్రబంధాదికములు
కల్పింపనే తెల్గు కల్యాణి కొప్పున
        సొగసైన కీరితి పొగడదండ
ఎత్తింపనే మేటి హిమవద్గిరుల మీద
        శాశ్వత విజయ రాష్ట్ర ధ్వజంబు

సగరగర్భకుహరి స్వారిగావింపనే
యింటిగుట్టు బయటికెక్కకున్న
సమ్మతించి జాతి కుమ్మక్కుకాకున్న
కొండలన్ని పిండికొట్ట నొక్కొ

అది మా రత్నము లారబోసుకొను విద్యాశారదాపీఠ మ
ల్లది మా కత్తుల ఖారుఖాన మది యాంధ్రాదిత్యబింబంబు సం
పద సొంపారిన మాల్యవంతమని డంబం బొప్ప చాటించు స
మ్మద సౌఖ్యం బొక తెల్గువీరునకె సంప్రాప్తించె ముమ్మాటికిన్‌

కలవెన్నో విషయంబు లాంధ్రుల కళాకౌశల్యముల్‌ సాటు తా
వులు ప్రత్యర్థుల గుండెలో వెరపునిప్పుల్‌ సల్లు గాథావళుల్‌
కల విప్డున్‌ పలనాటి పౌరుషపు రేఖల్‌ మా శరీరంబులన్‌
కలుపుంగోలుతనంబు లేదది కళంకం బండ్రు మా జాతికిన్‌

ముసలుమానులలోని యసమ సమత్వంబు
        లంగోటిగట్టి చెలంగుచుండ
ఘూర్ఖా సిపాయీల కుటిలశౌర్యజ్వాల
        నట్టింటి కాపలా నడుపుచుండ
ద్రవిడుల కార్యసాధన ధనార్జన దీక్ష
        సాంబారు నోరెత్తి చాటుచుండ
రాష్ట్రాంతరములకు బ్రాకి హిందీభాష
        పదుగురి నోళ్ళలో నెదుగుచుండ

అఖిలదేశములకు నవతంసకుసుమంబు
రాజితోగ్ర కదన రక్తతిలక
మానధనికురాలు మా తెల్గుటిల్లాలు
కలత జెందదౌర కాలమహిమ

గౌతమి గంగలోన మృతకాంతులతో నుదయంబుగన్న వి
ఖ్యాత మణీవితానము మహమ్మదురాజుల దండు దెబ్బతో
తాతలనాడ పోయె నిక తాతలుబుట్టిన రావు రత్న దీ
పాతత కాంతులీను గృహమక్కట నూనెకు దేబిరించెనే

రతనాల్దొంగలు దోచుకున్నపుడు, శౌర్యశ్రీలు విద్రోహి భూ
పతు లేవే మృదుకీర్తి చాతురులచే బంధించునాడేని, భా
రత చండీశ్వరి కోటిమస్తముల దర్పంబుం ప్రదర్శింపదో
ధృతిహీనంబగు భిన్న భిన్న మత విద్వేషంబు పాటించెనో

గప్పాల్‌ గొట్టిన నేమి లాభము ధరా గర్భాన నిద్రించు కృ
ష్ణప్పల్‌ దాతలు లేచివచ్చెదరె వీరావేశ విభ్రాజితుల్‌
నిప్పుంబోలు తెలుంగువీరు లిపుడున్‌ జీవించియున్నార లీ
చప్పంబడ్డ యనుంగుసోదరుల కుత్సాహంబు సంధింపగన్‌

ఏనాడు మాకావ్య సృష్టికర్తల జిహ్వ
        విశ్వసత్యము నాలపింపగలదొ
ఏనాడు మాజాతి దృష్టిమాంద్యము వాసి
        చుట్టుప్రక్కల దేరి చూడగలదొ
ఏనాడు మాబుఱ్ఱలీ జుట్టు తలలేని
        పుక్కిటి కథలలో జిక్కువడవొ
ఏనాడు మావిద్య లినుపసంఘమునందు
        చిలుము పట్టక ప్రకాశింపగలవొ

తనువు దాచక సోమరితనము మాని
యెన్నడీ మఠంబులు బిచ్చమెత్తుకొనవొ
అట్టి శుభవేళకై కొంగుబట్టి నిలచి
నలిగి వాపోవుచున్నది నా మనస్సు



ప్రభువుల పెండ్లిపేరంటాలు వర్ణించి
        కాలంబు పెక్కేండ్లు ఖర్చుపెట్టి
విరహవేదన మేనుమఱచి మూర్ఛలువోవు
        రాణివాసంబును రచ్చకీడ్చి
అంగాంగవర్ణనా వ్యసనంబు రెట్టింప
        యువక జీవిత కోటి కుచ్చులొడ్డి
పదియునెన్మిది మార్లు బాడిన శ్రీరాము
        చరితంబు వగరెక్క తిరుగబాడి

శరణు శరణటంచు బరుగులెత్తుచు వచ్చు
నార్తలోక రుత మనాదరించి
భువనహితము గోరు కవితాకళను నేడు
స్వార్థజడధి నూరవైచినారు

పెద్దల శల్యముల్‌ బలె వివేకమొసంగని గ్రంథరాసులే
విద్దియలైన నింక పదివేలయుగాలల్‌ తలకాయలేని గం
గెద్దులు బుట్టి స్వార్థపరులెత్తిన గంతలు మోసి తీరెడిన్‌
బుద్ధి చిగుర్చునే యరుచి బుట్టు కథల్‌ తలమీదరుద్దినన్‌

ఆడుది లేక యున్న కృతి కందము లేదని నమ్మి యెన్నడో
పాడి రనుత్తమ ప్రణయ బంధుర గీతము లర్థతృష్ణ వె
న్నాడ కవుల్‌ మహీపతి బృహన్నల వర్గము సంతసింప నీ
నాడు రచింతు రిద్ధ కరుణా పరిణద్ధ రసప్రబంధముల్‌

మొన్నటి యుద్ధదేవతకు బుట్టిన కూతురు క్షామదేవి మృ
ష్టాన్నముగా భుజించిన క్షుథార్తుల డొక్కలు శల్యరాశి సం
పన్నుల వీధులందు కనుపట్టెనె? వంగకవీంద్రకోటి చే
కొన్న కలా లెరుంగవనుకొందు దయారస నవ్యకావ్యముల్‌

చలిచీమం బొలియింప నేరని యహింసామానసుల్‌ ఱాలలో
మొలిపించెం బహు బుద్ధవిగ్రహచయంబుం భారతంబంతటన్‌
కలయైపోయెనొ తత్కృపాగుణము బంగాళంబులో ప్రేమ మూ
ర్తులు లేరో భుజియింపరో ద్రవిణవంతుల్‌ మేలి మృష్టాన్నమున్‌

ఎట్టు నశించిపోయె నితరేతర విశ్వసనంబు లెందు కీ
చట్టములం ప్రమాణముల సారమషీరస పత్రలేశముల్‌
కొట్టిన గొట్టుమం చెదరి గుండియలం గరగించు ధర్మముల్‌
బుట్టినగడ్డలో నకట ఫూత్కృతి సల్పు నశాంతి సర్పముల్‌

అనఘుం డశ్రు మషీజలంబున వివేకానంద సన్యాసి వ్రా
సిన వ్రాతల్‌ దడియారలే దిపుడు ప్రాచీనంపు టజ్ఞాన బం
ధన విచ్ఛేదమొనర్చి యే ఘనుడు విద్యాభిక్ష గావించి ప
చ్చని బంగారము వంటి మా భరత సంసారంబు నెగ్గించునో

గాలిందూలెడు శుష్క దేహములతో కాషాయవస్త్రాలతో
శూలంబుల్‌ సొరకాయబుర్రలు జటాజూటంబులుం దాల్చి యా
మూలాగ్రంబుగ భ్రష్టులై తిరుగు బాబుల్‌ దొడ్డగంజాయి భా
యీ లున్నా రెదురైన వారె మునిపక్షీ కుక్షిరక్షాపరుల్‌

జపమో ధ్యానమొ యభ్యసించి యతివేషంబూని క్రీడించు మో
సపు పార్థుల్‌ ప్రతి పల్లెటూర గలరీ సన్యాసవర్గంబు నీ
కుపదేశింపదొ యిష్టసిద్ధికని మాయోపాయ మంత్రంబు భ
క్తి పరత్వం బొక సాధనం బిహ పర స్త్రీ వంచకశ్రేణికిన్‌

పాలుంబండులు కందమూలములు మాభక్ష్యాన్నముల్‌; గోర మే
కాలం బన్యపదార్థముల్‌ రజితమో బంగారమో కొద్దిగా
జాలున్‌ మాకని సేకరించెదరు గోసాయీ లుపాయాలు మో
సాలెన్నేని నిరంతరాయముగ రాజ్యంబేలు నేడెల్లెడన్‌

వృత్తుల్‌ సర్వము త్రుప్పువట్టి చనగా భిక్షాటనంబున్‌ జగా
వృత్తుల్‌ కా పలుజాతులై నిలువ దుర్భిక్షంబు రాకుండునే
యుత్తుంగాశయు లెందరో కలరు దేశోద్ధారకుల్‌ పూనరీ
చిత్తంబేర్చు కళంకమున్‌ దుడిచి సుశ్రీ నేలకుం గూర్పగన్‌

ఎన్ని సుక్షేత్రములు సారమిగిరి పోయి
ముండ్లతుప్పర బంజరభూములయ్యె
దృఢతరంబైన యెంతెంత దేహశక్తి
భిక్షకుల పోషణమ్ములో పృధివి గలిసె

పదవుల పీటలెక్కి యనువారము లంచపు బాడిబర్రెలం
బిదికి గడించి కార్మికుల పేదల చెమ్మట దెచ్చి కాన్కలి
చ్చెదరు పరోపజీవులు విచిత్రపు భక్తులు వేషధార్లు నీ
కెదురయి వచ్చిరే వలదిసీ చెయిచాచకుమమ్మ పక్షిణీ

నరుని కష్టపెట్టి నారాయణుని గొల్చు
ధర్మశీలురున్న ధరణి మీద
కాలుమోపలేక గబ్బిలమొక్కటే
చరణయుగళి దివికి సాచి నడచు

పూజారి భోషాణమును కాపలాకాయు
        చిల్లరవేల్పుల సేవజేసి
గొర్రెపోతుల నల్ల జుర్రి గర్రున ద్రేచు
        కరకు సత్తులకు జాతరలు సల్పి
ఏటేట పెండ్లి జేయించుకొం చుదయించు
        కృతకరాముల పల్లకీలు మోసి
నిలువుదోపిడి చేసి తలకాయ గొరిగించు
        ఏడుకొండలవాని మేడలెక్కి

అంబుధీశుని కళ్యాణులని తలంచి
ముంచు గంగమ్మలకు డబ్బు పోసి పోసి
పాతకము వోలె నా వెన్ను వాయకున్న
గోచితో నిల్చియున్నాడ పేచకంబ



గుఱ్ఱాలకు ఱెక్కలు గల
వెఱ్ఱియుగాల్‌ దాటిపోయె విజ్ఞానంబున్‌
బుఱ్ఱ గల గాంధి యుగమిది
కఱ్ఱలు ఖడ్గంబు లేలగా లేవు ప్రజన్‌

రాజుగారి గుఱాల రధచక్రముల క్రింద
        మరణించు రైతుకు శరణమిచ్చి
నరజాతిలోన నంతరము లుండుట కన్న
        నఘము లేదను ధర్మ మాకళించి
బహుమతాచార దుర్భర పదాహతి చేసి
        అసురుసురగు వారి కభయమిచ్చి
రాజభాషల కన్న రాష్ట్రభాషలలోన
        రసమున్నదను యదార్థత నెఱింగి

యుగయుగాల నాడ యూబిలో దిగబడ్డ
మహితమైన జాతి మత్తగజము
ప్రబల దాస్య నిగళ బంధంబు లగలించి
దెసల మసలుచున్న దినము లివ్వి

కలరే మోసపు దేశభక్తి పరు లక్కైలాస దేశంబునన్‌
చలికిం ఖద్దరుధారులై యవల స్వేచ్ఛారాజ్యభాగంబు రా
గల దంచున్‌ విహరించు పెద్దలు పతంగస్వామినీ నిమ్న జా
తులపై వీరు వెలార్చు బాష్పములు చిందున్‌ తియ్యగా పుల్లగా

మా దౌర్భాగ్యపు జాతిలోన నొకనిం బాధింపకున్నట్టి యీ
యాదివ్యాధికి నగ్గమై కుములు టేలా నాకు పోనిమ్ము నా
చేదస్తం బిది కష్టపెట్టితిని పక్షీ రోషగాడెన్నడున్‌
ప్రాదుర్భావము నందరాదు పరసేవాభ్రష్ట వంశంబునన్‌

కలదమ్మా వ్రణ మంటరానితన మాకర్ణింపుమీ యిండియా
పొలమందుం గల మాలమాదిగలకున్‌ భూతేశుడే కాదు కృ
ష్ణులు కృష్ణున్నిరసించు దైవములు క్రీస్తుల్‌ మస్తుగా బుట్టినన్‌
కలుపన్నేరరు రెండుజాతులను వక్కాణింప సిగ్గయ్యెడిన్‌

చాకిరిజేసితిం దెలుగుజాతికి నేబదివత్సరాలు నా
వాకిలి ద్రొక్కిచూడవు శుభంబులు సౌఖ్యము లెంతకాల మీ
పాకి వయస్సుతో నడుగుబట్టిన యాసలు తెప్పరిల్లునో
లేక నశించునో తెలుపలేడు గదా మదనాగ వైరియున్‌

శుభశిశువో యదిగాక య
శుభశిశువో తెలియరాదు క్షోణీసతికిన్‌
ప్రభవించు బిడ్డ యకటా
యభంగుర ప్రసవబాల కగ్గంబయ్యెన్‌

అరవం గుత్తుకగోసి జంతువుల గర్భాగారముల్‌ జీల్చి నె
త్తురుటేళ్ళ న్నటియించు మూఢతమ జాతుల్‌ జాతరల్‌ సేయ జూ
తురు చూపింతురు ప్రోత్సహింతు రతివాదుల్‌ శాస్త్రపారంగతుల్‌
కరుణల్‌ కమ్మని బోధ లో పులుగుటక్కా ఛీ హుళక్కుల్‌ గదా

కని గంగార్పణమంచు త్రోసి చనియెం కర్ణున్‌ పృథాదేవి యా
తని విద్యా కుల రూప సంపదలు వ్యర్థంబై ప్రలాపింపవో
కనియెన్‌ భారతకుంతి మమ్ముల నసంఖ్యాకంబుగా కర్ణులన్‌
మునిపక్షీ యమనందనుల్‌ తెలియరిప్డున్‌ మాదు భ్రాతృత్వమున్‌

ఒకడు రుద్రాక్షమాలికలు నెత్తికి జుట్టి
        శివుమూర్తియై భూమి కవతరించు
ఒక డూర్య్ధపుండ్రంబు లురువుగా దగిలించి
        శివలింగమును జూచి చీదరించు
ఒకడు రెండును గాని వికటవేషము దాల్చి
        పైవారి మీద సవాలు సేయు
ఒకడు గంజాయి దమ్ముకు దాసుడై పోయి
        బూడిదగురవడై పుట్టివచ్చు

మనుజులార మాది ఘనమైన మతమని
ఒకడు తరిమి తరిమి యుగ్గడించు
పెక్కుమతము లిట్లు పేచీలు సాగింప
మార్గమేది యైకమత్యమునకు

మొక్కుబళ్ళ నెపాన చక్కని పసిపాప
        లెందరు గంగలో నిమిడిరొక్కొ
సహగమనాచార దహనదేవత లెన్ని
        చిగురుగొమ్మల బూది చేసెనొక్కొ
చదువుదాచెడు దురాచారణ మెందరి కళా
        భ్యసన చాతురి గొంతు బిసికెనొక్కొ
పొందెరుంగని వేరుబందాలచే బాహు
        బలమెంతగా చచ్చువడియెనొక్కొ

చిలిపిరాలకు నగిషీలు చెక్కిచెక్కి
కాలమెంత యగంతాన కలిపిరొక్కొ
చదువ నేర్చిన వెర్రిని జంపగలరె
ఒక్క బుద్ధుడు నొక క్రీస్తు నొక్క గాంధి



శిలవంటి యూరిసత్తులకు నెత్తుటికూడు
        రేపులు మాపులు మేపలేక
ఆచారమని తప్పదని వెంటబడివచ్చు
        గురుల దక్షిణ లిచ్చుకొనగలేక
మంత్రతంత్రముల సోమరిమాంత్రికుల బారి
        బడి ధైర్యమును చిక్కబట్టలేక
శతసహస్ర క్రూర మతసింహములు సేయు
        కుటిలగర్జన తట్టుకొనగలేక

అనుగు తమ్ముల సిరు లోర్చుకొనగ లేక
పిచ్చిపూజల మమతలు విడువలేక
అమరనుతమైన మాదు దేశాభ్యుదయము
యుట్టికిని స్వర్గమున కెక్క కూగులాడు

విందుభుజించి పొమ్మనుచు పిల్చుట కర్హతలేదు నాకు క
ర్మంది పతంగినీ పనికిమాలిన సంఘము సమ్మతించునే
పొందులు పొత్తులు న్మనకు ముప్పదినూర్ల కులాలవారికిన్‌
నందుల నాగులం గొలిచి నవ్వులపా లగుచున్న జాతికిన్‌

స్వయముగ నన్నపూర్ణ తన భర్తకు సిద్ధము జేసియున్న య
వ్యయ రుచిరాన్నమున్‌ శివుని పంక్తి భుజించిన పూజ్యురాల వ
న్వయము తరించె నిట్టి మునిపక్షిణివై కులభేద బుద్ధిచే
కయికొనకుందువే సఖుల గర్భదరిద్రుల యాతిథవ్యముల్‌

తుల వాక్రుచ్చగ రాని నెత్తుటిసిరాతో వ్రాయుచున్నారు మ
త్కులజుల్‌ దుఃఖరసోత్కటంబులగు పెక్కుల్‌ కావ్యముల్‌ జాతి లు
బ్ధుల వజ్రస్థిరచిత్తులన్‌ కరగి సంతోషించునో యీప్సితం
బులు పండింపక సుంకునో సమసి మామూల్‌ త్రోవలం ద్రొక్కునో

కవిగారికిదె నమస్కారం బనెడు వాడు
        కళకులెమ్మని పరోక్షమున బలుకు
కవనంబునకు మేను కరగి మెచ్చినవాడు
        కవిచెంత వెరబెరికముగ మసలు
విద్యాకళంకంబు వెదకజాలనివాడు
        జాతిలేదని నోరు చప్పరించు
శాఖీయులకు సహస్రములు బోసిన దాత
        అన్యుల మధురవాక్యముల దనుపు

జీవకళలు చెక్కు శిల్పిని నిరసించి
శిల్పమునకు పూజ సేయునట్టి
వక్రచరితులైన వ్యక్తులు గలచోట
కళల కకట ప్రేతకళల గతులు

పోటీసేయ సమర్ధులయ్యెదరె మా ముక్కన్న తిక్కన్నతో
మేటుల్‌ షేకుసుపీయరుల్‌ బయిరనల్‌ మిల్టన్లు గోల్డుస్మితుల్‌
నాటైనారు స్వకీయులైన కవులీనా డన్యభాషాకవుల్‌
నీటైరక్కట కాలమాంత్రికుని పాండిత్యప్రభావంబునన్‌

జాతీయోద్యమ యుద్ధరంగ మహితోత్సాహ ప్రతిధ్వానముల్‌
కూతల్‌ బెట్టుచు నాల్గుజాతులకు గగ్గుర్పాటు కల్పించెడిన్‌
స్వాతంత్య్రంబను స్వర్గసౌఖ్యమున మా భాగంబు మాకిత్తురో
ఖాతాలేదని త్రోసిపుచ్చెదరొ వక్కాణింపవే చెల్లెలా

కలధౌతాద్రిగుహల్‌ ప్రతిధ్వను లెసంగన్‌ తెల్గు రాష్ట్రార్థమై
గలభా రేచిరి సోదరాంధ్ర జను లాకర్ణింపవో నీవు చె
ల్లెల రాష్ట్రంబు గడించినారనుచు హాళిం దేలితో తెల్గు బి
డ్డల యత్నా లనరాదు గాని యవి సోడాబుడ్డి యుద్రేకముల్‌

బలియైనాడు ధరాహితార్థము మహాభాగుండు యేసుండు త
త్ఫలితంబై కనుపట్టు భిన్నమత సిద్ధాంతంబులుం జీలికల్‌
కులముల్‌ కుట్ర లనైకమత్యములు చిక్కుల్‌ చీదరల్‌ రిత్త బో
ధలు వేదాలు పదాలు రాల్ప వరచేతన్‌ ముక్తిముక్తామణిన్‌

భోగులాహారించు భుక్తి కన్నుల జూచి
        పరమపేదలు దుఃఖపడని చోటు
సాంఘికాచార పంచాస్యగర్జనమున
        బెదరక జ్ఞానంబు పెరుగుచోటు
జాతివైషమ్య రాక్షస పదాహతి చేసి
        కందక కళలు పెంపొందుచోటు
పరిపాలక క్రూరతర కరాసికి లొంగి
        పోక స్వేచ్ఛాలక్ష్మి పొదలుచోటు

అనదబిడ్డలు చూడ నెయ్యంపుసుతుల
ముద్దులాడని గుణనిధుల్‌ పుట్టుచోటు
చెప్పగదవమ్మ చూచివచ్చితివె నీవు
నిశ్చయంబుగ వాసముండెదను నేను

పయిపై నవ్వులు పల్కరింపులు మృషాబాంధవ్యముల్‌ సూపి యా
పయి శత్రుత్వము సేయు నాగరికతా భ్రష్ట స్వభావాధముల్‌
సయితానుల్‌ చరియింపనట్టి ధర గోష్పాదంబు గన్పట్టినన్‌
దయతో నాకెరిగింపుమమ్మ యచటన్‌ నాయిల్లు గట్టించెదన్‌

కళలం దాచెడు చుప్పనాతితన మింకం దేశమందున్నచో
కలదే ముక్తి ప్రపంచసభ్యతకు మార్గం బుండునే జాతికిన్‌
తలయుం దోకయు లేని తొంబది సమాధానంబులం జెప్పి పే
దల వంచించు కళానిహంతలె యనర్థం బీ శుభక్షోణికిన్‌



అసుశక్తిం బనిసేయుచున్‌ మసలు దేహాపూర్వయంత్రంబులో
బిసలెన్నో కల వేనెరుంగనివి నా విజ్‌ నాన భాండారపుం
బిసలెల్లం బనిసేయ విందలి మరల్‌ పాడైనచో యెవ్వడీ
బిసగా డెందుల కీ రహస్యములకున్‌ బీగంబు బంధించెనో

అచ్చెరువున్‌ ఘటింపగల యంత్రములం గనుగొన్న జ్ఞానులుం
జచ్చిరి చావుపుట్టువుల జాడ లెరుంగ కెరింగి దేవతల్‌
జచ్చిరి మృత్యువుం గెలుచు శక్తు లొసంగని చుప్పనాతి వే
ల్పెచ్చట డాగినా డతని కెందుల కీ తెరచాటు మోసముల్‌

మును మేనూడ్చిన వారి యెమ్ము లెరువై భూదేవి పండించి నిం
చిన నానా ఫలవృక్షరాజముల కిచ్చెన్‌ దివ్యమాధుర్యమున్‌
తనురక్తంబును మేఘమై కురిసి యానందంబు గల్పించు చ
చ్చునదేదీ ప్రతిజీవియుం దిరిగివచ్చుం భిన్నరూపంబులన్‌

మరణితులైన వారి తనుమాంసము కొన్నియుగాలు భూమిపై
మురిగి రసాయన ప్లుతుల పూర్ణపరీక్షల నిగ్గుదేలి యా
ఖరుకు శిశూత్కరాదులకు కాయముగా విలసిల్లకున్న నీ
సురుచిర దివ్యకాంతులు నిసుంగుల మేన రహింపనేటికిన్‌

ఆజన్మంబు తపంబులం బెరిగి దేవావాస వాస్తవ్యవై
పూజాపద్ధతులెల్ల నేర్చితివి నీ ముత్తాతలుం దాతలున్‌
జేజెమ్మల్‌ కులసంఘ బాహ్యులయి కస్తిం గుందుచో దేవతల్‌
రాజీ పెట్టిరె పేదవారి మొర కర్ణక్లేశ మెవ్వారికిన్‌

మాతృభాషల కర్హ మర్యాద లొనరించు
        సర్వకళాశాల సాగుచోటు
ప్రజల నాహారించు బహుమత దేవతా
        దైనందిన గ్లాని లేనిచోటు
నవనీతనిభమైన కవుల కమ్మనివాక్కు
        వెఱవు లే కావిర్భవించుచోటు
సంతానమునకు వైషమ్యంబు నేర్పని
        తల్లిదండ్రులు విరాజిల్లుచోటు

విసపునవ్వుల లాహిరీవేషగాండ్ర
పాదచిహ్నల మరక లేర్పడనిచోటు
తోడునీడయు లేనట్టి దుర్బలులకు
గబ్బిలపుచాన వానయోగ్యంబు గాదె

జాతీయ పౌరుష జ్వలన మాబాల్యంబు
        సవరించు కావ్యరాజ్యములు లేక
విక్రమక్రమ శిక్ష వెన్నతోనిడు జిజా
        సతి వంటి మాతృదేవతలు లేక
నొకజుట్టు నొకబొట్టు నొకకట్టుబడి నేర్పి
        పాలింపజాలు దేవతలు లేక
కులమెల్ల చెదరి తెంపులు తెంపులగుచుండ
        వారించి కాపాడు ప్రభువు లేక

బుద్బుదంబుల కెనయైన మూడునాళ్ళ
పదవులకు ప్రతిష్టలకునై ప్రాకులాడి
నరుల నమ్మించుకొనలేక నమ్మలేక
చిదికియున్నవి మాజాతి జీవితములు

ఆసల్‌ చెప్పుదు రిప్పుడీ గురులు ముం దాకాశ సింహాసనా
ధ్యాసీనత్వము సంఘటించు నిది సత్యంబంచు రూపింతు రీ
బీసీనాటి పురాణగాధలు రుషావేషంబు తగ్గించి నా
దాసత్వంబు స్థిరీకరించెడు పరంధామంబు నాకేటికిన్‌

పుట్టుకపూర్వమే తలను బుంపిన జాతి మతప్రచండ సం
ఘట్టన చేసి నా సహజకౌశలముల్‌ నశియించిపోయె నీ
కట్టినకట్లు విప్పు నధికారము లేని గురుండెవండొ యీ
యుట్టికి నెక్కలేని నను నూచెడునంట వికుంఠడోలికన్‌

నను సృష్టించిన వాడె నావెనుక జన్మం బెత్తునే నోరెఱుం
గని నన్నీ పదివేల రూపములతో కంగారుగావించునే
కనకంపుం గుడిగోపురాల్తనకు నాకాంక్షించునే కానుకల్‌
గొనునే యిట్టివి మోసగాండ్రయిన భక్తుల్‌ పన్ను పన్నాగముల్‌

అనినమాటను మార్చుకొనలేని శాస్త్రముల్‌
        స్వాభిమానము దక్కి పలుకగలవె
కులముంచుకొని నన్ను కొలుచుకొం డను వేల్పు
        కడగి నా కన్నీరు తుడువగలడె
మానవదాస్యంబు మరగిన లోకంబు
        నెనరూని నాచెల్మి నెరపగలదె
అస్వభావిక కథావ్యాసంగ హతమైన
        పృథివి సత్యంబు నూహింపగలదె

యుడుకురక్త మెన్నడో చచ్చుబడిపోయి
చేతులెత్తి మ్రొక్కు స్వీయజాతి
కరకు వీరసూక్తు లరిగించుకొని వేచి
యెదుట నిలచి పగర నదమగలదె

ధర్మసంస్థాప నార్థంబు ధరణి మీద
నవతరించెద ననె నబ్జభవుని తండ్రి
మునుపు జన్మించి నెత్తికెత్తినది లేదు
నేడు జన్మింపకున్న మున్గినది లేదు

కనుబడలేదు దైవతము కాని పదార్థము భారతంబునన్‌
కనుబడలేదు వర్ణనము కన్న పిశాచము భారతంబునన్‌
కనుబడలేదు సత్కులము కన్న మహాకళ భారతంబునన్‌
కనుబడలేదు పంచముని కన్నను నీచపు జంతు వేదియున్‌

హక్కుల్‌ దొంగలు దోచుకొన్నను మనుష్యత్వంబు జంతుత్వమై
చిక్కుల్‌ వెట్టెడు కాలమందును క్షమాసిద్ధాంతముల్‌ నేర్వ నా
పక్కా పౌరుషవవహ్ని నార్పు మతరూప క్రూరసింహంబు నా
ప్రక్కం పండులునూరుచున్నది తలంపన్‌ శల్యసారథ్యమై

జగముల్‌ మెచ్చు బియే లెమేలు బిరుదుల్‌ సాధించినామంచు నీ
లుగు మా మాలలు మాదిగల్‌ కులమహాలోభంబు రెట్టింపగన్‌
తెగలంగట్టి తగాద లెంచెదరు గానీ సంధి గావింపరో
ఖగభామా మతబోధలేల కులకక్ష్యా భ్రష్ట దుర్జాతికిన్‌

అసలే ముక్కిడి దానిమీద పడిసెం బన్నట్లు మాజాతి బా
నిసలౌరా కలహించుచుందు రుభయుల్‌ నీచోచ్చతా నిర్దయ
వ్యసన వ్యగ్రత సిగ్గుచేటగు నయో యస్పృశ్యతాత్రాస మం
త్ర సమేతుండగు గాంధి నేర డివి యంతర్నాటకారాటముల్‌

భీతింగొల్పెడు నస్వభావిక కథావేదాంత శాస్త్రాలకుం
జేతుల్‌ మోడ్చు నమాయక ప్రజలు సంసేవింప భోగాబ్ధిలో
నీతల్‌ గొట్టు కవిప్రకాండముల సాహిత్యప్రపంచంబులో
ప్రాతఃకాంతుల జిమ్మునట్టి కవితాభానుండు జన్మించునే

నటకునివోలి కాలపరిణామ విధేయములై రహించు ను
త్కట మత ధర్మ శాసననికాయము తీరుపు చేసి సంఘ సం
కటముల పాలొనర్చి యధికారముసేయు దరిద్రజాతిపై
కటకట నల్వురాడు నెడ కల్ల యథార్ధము కాకపోవునే

రచ్చలకెక్కనీక సమరంబున బూడ్చిన కర్ణుశక్తి నే
డెచ్చట జూచినం ప్రభవహించి సముజ్వ్జలమై వెలుంగదే
కచ్చ లసూయలుం కళ నొకానొక కాలము డాచియుంచినన్‌
హెచ్చి తురంగలించి ధ్వజ మెత్తకపోదు యుగాంతరంబునన్‌

కవ్వడి పరువున్నిల్పగ
న వ్వసుదేవాత్మజాతు డట్లనె గానీ
కవ్వడి కర్ణుని గెల్చుట
నవ్వులపా టనెడు మాట నల్వు రెరుగరే

వలదన్నన్‌ వెనువెంట నంటి నను నిర్బంధించుచున్నట్టి వే
ల్పుల సిద్ధాంతములెల్ల నా సహజ సంపూర్ణ ప్రతాపంబులో
జిలికెం జిక్కని మచ్చుమందు మునిపక్షీ యింక నీవంటి గ
బ్బిలముల్‌ సేయు హితోపదేశములు వేవే ల్కాలి కాహారముల్‌

అగుపించెనే యసూయా దుర్గుణజ్వాల
        సంహరించెడు శాస్త్రసముదయంబు
పరికించివచ్చితే పరమతసహనంబు
        భాషించు వేదాంతపాఠశాల
వీక్షించితే వర్ణభేదాల వ్యాధిచే
        శాంతిగా రాజ్యంబు సలుపు నెలవు
కనుగొంటివే మనుష్యుని జూచి మనుజుండు
        మిట్టమీనై దాటునట్టి సీమ

నేను చిందులాడి నేను డప్పులుగొట్టి
యలసి సొలసి సత్తికొలువు గొలువ
ఫలితమెల్ల నొరులు భాగించుకొనిపోవు
నీచమైన భూమి జూచినావె

క్రూరుల్‌ కుత్సితు లస్మదీయములు హక్కుల్‌ దోచుకున్నారు న
న్నూరింబయటకు నెట్టినా రిపుడు నన్నోదార్చుచున్నారు గాం
ధారేయుల్‌ నెలకొల్పినారు మతసంస్థల్‌ లక్కయిండ్లక్కటా
మారుందమ్ములు నమ్మజాలనివి స్వాత్మశ్రీ సమారంభముల్‌

తనురక్తంబు వ్యయించి సత్కవికళా ద్రవ్యంబు వెచ్చించి మ
ల్చిన శిల్పాలు విమర్శకబ్రువుల కల్తీవ్రాతలం ఖ్యాతికె
క్కనివైపోయె నసూయచే బలుకు నాల్కల్‌ సత్యమున్‌ చాటునే
అనుమానింతురు కొంద రీశ్వరుని ధర్మాధర్మ నిర్ణేతృతన్‌

జనులం బీలిచి పిప్పి జేసెడు దురాచారంబులన్‌ కాలమ
ట్టని విద్యాబలమేల విద్యయన మౌఢ్యవ్యాఘ్రి కింపైన భో
జనమా మోసపువ్రాతకోతలకు రక్షాబంధమా యెందుకీ
మనుజత్వంబు నొసంగలేని చదువుల్‌ మైరేయపున్‌ మైకముల్‌

చిరకాలంబును భిన్న జాతిమతముల్‌ జీవించు రాజ్యాన సు
స్థిరమై శాంతి రహించునన్న నుడి సందేహించెదం బక్షిణీ
తురకల్‌ హైందవు లీ స్వరాజ్యరథమున్‌ దొర్లింతురే దక్షిణో
త్తరదిగ్దంతులు రెండునుం గలిసి మేతల్‌ మేయు తావున్నదే

వీరవసంతరాయడను వేల్పొక డుద్భవమంది దుష్ట సం
హారమొనర్చి ధర్మము సహస్రముఖంబులు నాటునంచు నా
జారిన గుండెలో వెఱపు సల్లుదు రీ యనృతప్రచారకుల్‌
కారణమమ్మ పిచ్చితలకాయలకున్‌ వెడ నమ్మకాలకున్‌

పుట్టించెం దయలేనిలోకమున నే పుణ్యాత్ముడో కుక్షిలో
ముట్టించెం బొగలేని యాకటిసొదన్‌ ముప్పూట లీచిక్కులో
నట్టిట్టై తపియించు నా కొదవు నాహారంబు భక్షింపగా
పుట్టంజొచ్చిరి దేవతల్‌ బహుళరూపుల్‌ పుట్టలై చెట్టులై

అట్టు లెడంద నేర్చెడు మహావ్యధ నాతడు వెళ్ళగ్రక్కినన్‌
బిట్టు కదుష్ణబాష్పములు నిండిన కన్నుల సానుభూతి చూ
పెట్టి ప్రదక్షిణించి సురభిక్షకు నింటికి లేచిపోయె క
న్పట్టె స్వతంత్రభారత విభాకర బాలుడు తూర్పుడోలికన్‌

మునిపక్షి రాకపోకల
ఘనసందేశముల కలన ఖర్చయిపోయెన్‌
తనురక్త మా దరిద్రుడు
చనిపోవునొ తత్ఫలంబు చవిజూచెడినో