శివపురాణము/కుమార ఖండము/గణాధ్యక్ష పదవి

వికీసోర్స్ నుండి

ఆ ప్రకారం గజవదనుని జననవేళ. దేవతలంతా గొప్ప ఉత్సాహం నిర్వహించి సమస్త గణదేవతలకు అధ్యక్షుడిగా గజాననుని ఎన్నికచేశారు. దేవతలందరిలోనూ అగ్రపూజలందుకోమని పార్వతీదేవి వరం ప్రసాదించింది.

"నిన్ను ముందుగా పూజించినవారికి సమస్త విఘ్నాలూ తొలిగి సర్వసిద్ధులూ కలుగుగాక!" అని వరం ఇచ్చాడు ఈశ్వరుడు.

ఈ విధంగా శివుని తనయులైన ఈ గజముఖ, షణ్ముఖులిద్దరూ మహాశూరులై ఒకరు దేవసేనాధ్యక్షులుగా, మరొకరు మహా గణాధ్యక్షులుగా విరాజిల్లుతున్నారు.

విశ్వరూప ప్రజాపతి తన కూతుళ్ళయిన సిద్ధి బుద్ధిలను ఇచ్చి గణపతితో వివాహం జరిపించాడు. గణపతికి సిద్ధి యందు క్షేయుడు, బుద్ధియందు లాభుడు అనే పుత్రులు కూడా కలిగారు.

అయితే, విఘ్నరాజు వివాహవేళ, కుమారస్వామి లోకాంతర వాసంలో ఉన్నాడు. పుణ్యక్షేత్ర సందర్శనలో తాను ఉండగా సోదరుని వివాహం జరిపించేశారనే అలుకతో, కుమారస్వామి వారు కైలాసాన్ని విడిచి క్రౌంచపర్వతం చేరుకొని అక్కడే నివాసం ఉండసాగాడు.

శక్తిధరుడు లేనిలోటు కైలాసంలో బాగా కనిపించసాగింది. పార్వతీదేవికి కుమారుని వియోగమన్నది భరింపరానిదిగా మారింది.