శివపురాణము/యుద్ధ ఖండము/గణపతి పూజ

వికీసోర్స్ నుండి
(గణపతి పూజ నుండి మళ్ళించబడింది)

"సురాసుర ప్రముఖులరా! సాగర తరణం అనే మహత్కార్యాన్ని తలపెట్టారు. కనీసం, ఇంత గొప్ప పనిచేస్తూ కూడా, అతిచిన్న కార్యక్రమం పట్ల అశ్రద్ధ కనపరిచారు. అదే విఘ్నాలకు మూలం! సకల విఘ్న కర్తయైన శ్రీ మహాగణాధిపతిని పూజించక ఈ పని మొదలెట్టారు కనుకనే ఇలా జరుగుతున్నది" అనేసరికి, వెంటనే దేవదానవులు అప్పటికప్పుడే సర్వ విఘ్నోపశాంతి కోసం సమాయత్తమయ్యారు.

ఆ సముద్ర తీరమునందే, ఒక ఇసుక తిన్నెమీద హేరంబుని విగ్రహం ప్రతిష్ఠించి, హరనందనుడైన ఆ గజవక్త్రుని - శూర్పకర్ణుని - విఘ్నాధిపతిని షోడశోపచార సహితంగా పూజించారు దైత్యాదితేయులు.

ఆ ఘట్టము నిజంగా చూచి తీరవలసినదే గాని చెప్పనలవిగానిది!

ఈవిధంగా చిలుకగా - చిలుకగా కొంతసేపటికి,సముద్ర మధ్యమునుండి భుగ భుగలు మిన్నంటేలా హాలాహలం అనే మహా విషం బయలుదేరి లోకాలను చుట్టేయసాగింది.

వాసుకి కక్కుతున్న విషపునురగలకు తోడు, ఈ మహావిషం కూడా అందరినీ హాహాకారాలకు గురిచేసింది.

అంతవరకు - ఈ మథన విషయమై తటస్థుడిగానే వున్న మహాదేవుడు, ఈ హాలాహలం లోకకంటకం కావడం గమనించాడు.

తక్షణమే రుద్రుడు, ఒక గొప్ప హూంకార ద్వనితో, ఆ హాలాహలం మొత్తాన్ని ఒక మేఘరూపంగా మార్చాడు. అదంతా ఒక నేరేడుపండు ప్రమాణానికి కుదించి, దాన్ని గటుక్కున మ్రింగేశా డాదిదేవుడు.

అంతా విస్తుబోయి చూస్తున్నారా లీల! అనితర సాధ్యమైన ఆ లీలావినోది కిదొక దివ్యమణిలా, కంఠాంతర్గతమై అమరిపోయింది.

ఆ విధంగా పరమశివుడు హాలాహల భక్షణము చేసి, లోకాలను ఆదుకున్న పిమ్మట,సాగర మథనం తిరిగి ప్రారంభమైంది.

ఆ తదుపరి, కొంత సేపటికి లక్ష్మీదేవి,చంద్రుడు, మందారం, హరిచందనం, పారిజాతం, కల్పవృక్షం, కామధేనువు...ఇట్లు స్వర్గంలో నుండి ఏవేవి సముద్రం పాలయ్యాయో అవన్నీ పైకి తేలాయి.

ఆ పిదప, రంభాది అప్సరసలు, తార, ఉచ్చైశ్రవం అనే గుర్రం, ఐరావతం అనే ఏనుగు, కాంతివంతమైన చింతామణి,ఓషధులు, లతలు...వంటి విలువైన వస్తుచయమంతా పైకొచ్చింది.

అవన్నీ ఎవరెవరికి చెంది వున్నాయో, వాటిని వారు తీసుకున్నారు.

ఇంతకాలం దేవతల దగ్గర ఆయా వస్తువులు ఉండేవని చెప్పుకోవడమే తప్ప, వాటిని ప్రత్యక్షంగా చూసినవారు బహు కొద్దిమంది దానవ ప్రముఖులు మాత్రమే!

ఇప్పుడీ సాగరమధనం పుణ్యమా అని అంతా, వాటిని చూసేసారు. దాంతో అధిక భాగం దైతేయులకు కన్ను కుట్టింది.

"ఔరా! ఈ దేవతలెంత స్వార్ధపరులు? ఇన్ని ఉత్తమ వస్తువులు తమ దగ్గర ఉంచుకున్నారు. ఇంకా ఆశపడుతూ వున్నారు. ఈ అమృతం కోసం ఎలా చిలుకుతున్నారో చూడు!" అని అనుకోసాగారు వాళ్ళు.

ధన్వంతరి అనే మహావైద్య శ్రేష్ఠుని కరకమలాలను అలంకరించిన అమృత భాండం - ఆయనతో సహా బైటికొచ్చింది.

అంతే! అంతవరకూ తమ ప్రభువు బలిచక్రవర్తి ఆజ్ఞకు కట్టుబడి, దేవతల వస్తువుల పైన దేనిమీదా ఆశపడని కాలకేయాది అసురగణం, ఒక్కుమ్ముడిగా ధన్వంతరిపై దాడిచేసి - ఆ కోమల దేహిని ఒక్క త్రోపుతోసి అమృతభాండం చేజిక్కించుకున్నారు.

"ఇది దేవతలకు దక్కరాదు. ఈ రోజువున్న స్నేహం, రేపటికి నిలుచునన్ను హామీలేదు. ఈసారి కయ్యం సంభవిస్తే, మనమే మిగలాలి! దేవతలే మరణించాలి" అనే స్వార్ధబుద్ధి వాళ్లనందర్నీ ఒక్కుమ్మడిగా కమ్మేసింది.

అసురులు అమర్త్యులైతే, జరిగే పరిణామాలను సూక్ష్మ బుద్ధిగల దేవతలు చటుక్కున గుర్తించేసి శ్రీహరిని శరణువేడారు.

ఇంతలో - వారి అదృష్టమా అన్నట్లు, దానవుల చేజిక్కిన అమృతాన్ని ఎవరికి వారే జుర్రుకోవడానికి ఆత్రపడసాగారు. అది చేతులు మారసాగింది తప్ప ఎవ్వరి నోట్లోనూ ఒక్కచుక్క అయినా పడలేదు.