శివపురాణము/కుమార ఖండము/గణపతి ఆవిర్భావం

వికీసోర్స్ నుండి

పార్వతీదేవి స్నానం చేస్తూండగా, ఒకటి రెండుసార్లు శివుడు హఠాత్తుగా ప్రవేశించడం అందువల్ల పార్వతి సిగ్గిల్లడం జరగడంతో, ఒక ఉపాయ మాలోచించిన పార్వతి, తాను పెట్టుకున్న నలుగునంతటినీ నలిచి, ఆ పిండితో ఒక పురుషాకృతి నిర్మించి ప్రాణం పోసి, ఆ బాలకుడిని ద్వారం దగ్గర కూర్చోబెట్టి, కాపలా ఉండమనీ - ఎంతటి వారనైనా లోపలకు రానివ్వద్దనీ హెచ్చరించి స్నానానికి వెళ్లింది.

బాలకుడు భక్తిగాను - వినయ విధేయతలతోనూ ద్వార రక్షణ చేస్తూండగా, శూలం తిప్పుకుంటూ లోనికి ప్రవేశించబోయాడు శూలి.

బాలుడు నిలిపేశాడు అయ్యవార్ని " అమ్మ ఆజ్ఞలేదు గనుక, గాలిని కూడా లోపలకు పంపేది లేదు" అని అడ్డుకున్నాడు. బాలుడు ముద్దుల మూట గడుతూన్నట్లున్నా, తననే ధిక్కరించేంత స్థాయికెదిగాడా? అని కోపం వచ్చింది స్థాణుడికి. కోపం తమాయించుకొని, బాలుడి మీద బ్రహ్మాస్త్రం దేనికని యోచించి ఎగాదిగా చూసి "నువ్వెవరో కొత్తవాడిలాఉన్నావే! సరే! నీకు తెలిదు కనుక చెప్తున్నాను. నేను మీ అమ్మగారి పతిదేవుడ్ని" అన్నాడు మందహాసం చేసి.

"ఇది బాగుందయ్యా! ఆవిడ భర్తనని చెప్పేస్తే చాలు! సరిపోతుంది - అనుమతిస్తాననుకున్నావా? అదేంకుదరదు. అయినా నాకు యజమానురాలి గురించే తెల్సు తప్ప యజమాని గురించి తెలీదు" అన్నాడు మొండిగా.

'వేలెడంత లేడు! విరూపాక్షుడినే ఎదిరిస్తున్నాడే ' అని శివానుచర గణాలకు మహాకోపం వచ్చింది.

ఈలోగానే శివుని శూలం ఆ బాలుని శిరస్సును ఎగురమీటింది. కనుచూపుమేరలో మాత్రమేకాదు! కానరాని చోట ఎక్కడో పడిపోయింది. కొడుకు వంటి ఆ బాలుడి విగత జీవదేహం చూచి, కొండరాచూలికి కోపావేశ దుఃఖాదులు ఒక్కుమ్మడిగా కలిగాయి. ఆమె అలిగి కోపగృహం చేరింది.

పరిపరి విధాల వేడుకొని శాంతింపజేసిన మీదట, పార్వతమ్మ కిచ్చిన మాట ప్రకారం, ఫాలాక్షుడు ఆ బాలుని పునర్జీవితుడ్ని చెయ్యడానికి నిర్ణయించుకొని ప్రమథాది గణాలను పురమాయించి తాను ఎగుర మీటిన శిరస్సు ఎక్కడ పడిందో వెతికి తెమ్మన్నాడు. ఎవరెంత వెతికినా శిరస్సు లభ్యం కాలేదు.

ఉపాయాంతరం అన్వేషించి, ఉత్తరదిశా ముఖం పెట్టి ఏ జీవి నిద్రిస్తున్నా, ఆ జీవితలను తీసుకురమ్మమ్మాడు.

మళ్లీ వెళ్లిన గణాలు బాగా శోధించాక, ఒకే ఒక్క ఏనుగు పిల్ల ఆరీతిన నిద్రిస్తున్న వైనం కనుగొన్నారు. తీరాచూస్తే అది శ్రీ కృష్ణాంకిత మైన మాలాధారణ వల్ల జన్మించిన వరప్రభావిత గజకిశోరం. కనుకనే దానికి సాక్షాత్తు శివునిచేత పట్టాభిషిక్తమయ్యే యోగం పట్టింది.

శివాజ్ఞ ప్రకరం, ఆ ఏనుగు పిల్ల తలనే తెచ్చేశారు ప్రమథులు. దానిని అ బాలకుని మొండేనికి దగ్గరగా చేర్చగా శివుడు ప్రాణప్రతిష్ఠ చేయడంతో నిద్రనుండి మేల్కాంచినట్లుగా లేచి ఆ బాలకుడు గజముఖుడై ముందుగా జననీ జనకులకు నమస్కరించాడు. ఆ వెనుక అక్కడకు చేరిన - దేవతలకు తలవంటి వాడైన బ్రహ్మకు నమస్కరించాడు. చిరాయురస్తు అని దీవెనలంది పార్వతీమాత సంతసానికి కారకుడయ్యాడు.