Jump to content

గణపతి/పదునెనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునెనిమిదవ ప్రకరణము

గణపతియొక్క బ్రతుకంతయు నల్లరి బ్రతు కగుటచేతను నతని తెలివితేటలు బాలకుల తలిదండ్రులకే గాక బాల కులకు గూడ విస్పష్టముగ దెలియుటచేతను బడి క్రమక్రమముగఁ క్షీణించెను. గణపతి చేష్టలు జూచి నవ్వఁ దలచినవారును, వినోదముగఁ గాలక్షేపము సేయఁ దలఁచిన వారు మాత్రమే యతని చుట్టుఁ జేరజొచ్చిరి. బాలకుల సంఖ్య క్షీణీంచినను బెద్దవా రనేకులు సయితము తమ కేదియు దోచనప్పుడు బడిలేనప్పుడు నతని బడికిఁబోయి కూర్చుండి యాతని మర్కటచేష్టలు నసందర్భప్రలాపములు విని యానందించుచు వచ్చిరి. బడి నిండుగా నున్నప్పుడు జీతములక్రింద బాలకుల దలిదండ్రులు ధాన్యము, కందులు, కూరలు మొదలగు వస్తువులు పంపుటచేత నతని యింట నిబ్బంది యంత విశేషముగ లేకపోయెను. అంతియెగాక దెబ్బలు తినలేక బాలకులు తెచ్చి యిచ్చు లంచములచేత గూడ కొంతకాల మతనికి దారిద్ర్యము లేకపోయెను. కాని ముగ్ధభావము దాచిపెట్టిన దాగునది గాదు. కనుక క్రమముగ బయలుపడి యాతనియందించు కేనియు గౌరవము లేకుండునట్లు చేసెను. గ్రామవాసులలోఁ గొందరు తమ బిడ్డలకు విద్యాభ్యాసము జేయించునట్టి మంచి యుపాధ్యాయుఁడు లేనందున విచారించి క్రొత్తపేట వెళ్ళి యచ్చటినుండి యొక యుపాధ్యాయునిఁ దీసికొనివచ్చి మఱి యొక యఱుగు మీఁద బడి పెట్టించి, తమ బిడ్డల నచ్చటికిఁ బంపదొడంగిరి. గణపతియం దే కారణముచేతనో యభిమానమున్న వారు కొందఱు మాత్రము తమ పిల్లల నితని బడికే యెప్పటియట్ల బంపుచుండిరి. క్రొత్తగా వచ్చిన పంతులు యుక్తాయుక్త వివేకజ్ఞానము గలవాఁ డగుట చేతను, వికృతచేష్టలు గాని విపరీత లక్షణములు గాని యతనికడ లేకపోవుట చేతను, మంచి బోధన శక్తి గలవాఁ డగుటచేతను, విశేషించి వినయాది సద్గుణములు గలవాఁ డగుటచేతను, గ్రామవాసుల కతని యెడఁ గ్రమక్రమముగ నభిమాన ముదయించెను. తమ బిడ్డల నతని పాఠశాలకంపి వారా యభిమానము స్థిరముజేసిరి. కాలక్రమమున గణపతి బడి వట్టిదయ్యెను. అందుచేత నతఁడు జీవనాధారము లేక మఱియొక వృత్తి నేదైన స్వీకరింపవలె నని యాలోచించుచుండగా శివరాత్రి కా యూరికి భాగవతులు వచ్చి భాగవత మాడిరి. పలివెల నుండి యెండమూరి గరుడాచల మను వేశ్యాంగన, యా భాగవతములో సత్యభామ వేషము గట్టెను. ఆ భాగవతము గణపతి చూచి మిక్కిలి సంతసించి మఱునాడు వేశ్య లున్న బసకుఁ బోయెను. అతఁ డచ్చటఁ గూర్చున్న సమయమున మేళనాయకురాలైన గరుడాచలము, దాని తల్లియగు పాపాచలము, మద్దెలవాఁడు సారంగు వాయించువాఁడు హాస్యగాడు మున్నగువాండ్రందఱు కృష్ణవేషగాఁడు తగినవాఁడు దొరకలేదనియు, స్థిరముగాఁ దమవద్ద నుండునట్టి కృష్ణవేషగాడు దొరకిన పక్షమునఁ దమ మేళము మిక్కిలి బాగుండు ననియు జెప్పుకొనిరి. అది విని గణపతి గరుడాచలమువంటి సరసురాలు సత్యభామ వేషము వేయుచున్నప్పుడు తనవంటివాఁడు కృష్ణవేషము వేసిన పక్షమునఁ దన జన్మము ధన్య మగు ననియు జన్మము ధన్యమగుటయే గాక తన పితృమాతృవంశములు గూడ జరితార్థము లగుననియుఁ దలంచి "కృష్ణవేషగాడు దొరికిన పక్షమున మీరేమి జీత మిత్తు" రని యడిగెను. "ఆటకు రెండు రూపాయలు చొప్పున నిత్తు" మని గరుడాచల ముత్తరము చెప్పెను. "నెల కెన్ని యాట లుండు" నని యతడు మరల నడిగెను. 'అది మన యదృష్టమును బట్టి యుండును. ఇన్నని వక్కాణించి చెప్పజాల ' నని యా వెలయాలు బదులు చెప్పెను. "నీకు శూద్రుడు కావలెనా? బ్రాహ్మణుడు కావలెనా? యని గణపతి వెండియుం బ్రశ్నింప "ఏమింత తరచి తరచి యడుగుచున్నారు. మీ కాపని గావలెనని యున్నదా!" యని వేశ్యమాతయైన వృద్ధాంగన యడిగెను. "ఔను, మీకంగీకార మైన పక్షమున నేనే కృష్ణవేషము వేయవలెనని యున్నది." యని యతఁడు త్తరము జెప్పెను. అతని వాలకము మాట తీరు చూచి యతఁ డాపని కక్కరకు రాడని పాపాచలము తలంచెను. గాని తమ మేళములో నతఁడుండుట వినోదకరముగా నుండి తమకుఁ బ్రొద్దుపుచ్చుననియు నవసరమై నప్పుడు నతనిచేఁ గృష్ణవేషముఁ గూడ వేయించవచ్చు ననియు గరుడాచల మాలోచించి "సరే ! మీరు మా మేళములో నుండవచ్చును. మీ బట్టలు మూఁటగట్టి తెచ్చి మాతో రండి" యని చెప్పెను. ఆ పలుకులు నిజముగా నతని మనస్సు మీఁద నమృతవర్షము గురిసినట్లయ్యెను. తాను కృష్ణవేషము ధరించుట గరుడాచలము సత్యభామవేషము ధరించుట దలంచుకొని గణపతి నిజముగాఁ దానా మేళనాయకురాలికిఁ బ్రాణనాయకుండె యనుకొని యపారమైన సంతోషము నొందెను. సత్యభామ తన్ను వరించునని తెలిసినప్పుడు శ్రీకృష్ణు డంత యానందము నొందెనో లేదో మనము జెప్పజాలము. ఆ దినమున నతని మనంబునం గలిగిన గర్వము వర్ణనాతీతమై యుండును. గరుడాచలము బసనుండి యింటికి వచ్చి ప్రాతశిష్యులను గొందరిని గ్రామవాసులలోఁ గొందరిని గలిసికొని మీసము మీఁదఁ జేయివైచి రెండు, మూడు సారులు సకిలించి కోరచూపు చూచుచు నిట్లనియె!" చూడుడి నా తమాషా! మీ యూరివారు నా తెలివి, నా తేట, నా మంచితనము, నా యోగ్యత విచారించకుండఁ దమ పిల్లలకు నేను విద్యాబుద్ధులు చెప్పి బాగుచేసినందకు విశ్వాసమైన లేకుండ నిష్కారణముగా మరియొక పంతులును బిలుచుకొనివచ్చి పోటీగా బడి పెట్టించినారు. వెధవబడి ! వెధవబడి! నా బడిపోతే యెంత, ఉంటే యెంత? ఇంతకంటె నెక్కువ పని సంపాదించినాను. గరుడాచలము తన భాగవతములో శ్రీకృష్ణవేషము వేయుమని నన్ను బ్రతిమాలినది. దాని మాట తీసివేయలేక నేను సరే యని వప్పుకొంటిని. చూడండి! యెటువంటి గౌరవమైన పని సంపాదించినానో, గరుడాచలమంటే యేమనుకొన్నారు? దేశదేశాల పేరు మ్రోగిన యాటకత్తె. అది భామవేషం కట్టితే చూచినవారు మూర్ఛపోవలెను. అది పాడితే ఆదిశేషు డాలకించవలెను. దాని భాగవతంలో కృష్ణవేషం కట్టడమంటే తహసిల్ దారీపని చేయడ మన్నమాట. ఈ బడిపోగానే మరేపని సంపాదించుకొనలేకుండుటకు నేనంత వెధవననుకొన్నారా? గణపతంటే సామాన్యుడు గాడు, వీఁడు మైరావణుఁడని మీకు యిప్పుడైనా తెలిసిందా? దాని భాగవతములో కృష్ణవేషము వేయఁగల యదృష్ట మెంతవానికిఁ బట్టును? వేదం జదువుకొన్న వెఱ్ఱినాగన్నలకు, శాస్త్రాలు నేర్చుకొన్న సన్యాసులకు, పెద్దవాళ్ళమని తెగనీల్గే పెద్దన్నయ్యలకు ఈ యోగము పట్టునా? నా యదృష్టముచేత నాకు పట్టినది. "అని త్రైలోక్య సామ్రాజ్య పదవి తనకుఁ జేకురినట్లు సంతసిల్లుచు నతఁడు పలికిన యా వెంగలి పలుకులు విని వారు ముసిముసినవ్వులు నవ్వుకొని "నిజముగా నీ యదృష్టము చేతనే దాని సేవ లభించినది. ఈ గ్రామములో నింతమందియున్నారు, వారి కెవరికైన లభించినదా? అందొక్కొక్కరి పూర్వజన్మ పుణ్యమువల్ల వచ్చుచుండును. 'ముఖేముఖే సరస్వతీ' అన్నారు. నీ ముఖము చూడఁగానే గరుడాచలము నీచేత శ్రీకృష్ణమూర్తి వేషము వేయించి, తాను భామవేషము కట్టి "రారా నందకుమారా రారా నవనీతచోర!" యని నీ బుగ్గమీఁద చేయివైచి ధన్యురాలు కాదలఁచుకొన్నది. ఇంతకు దాని యదృష్టము మంచిది. కానియెడల నీవంటి బ్రాహ్మణోత్తముఁడు దానికి వేయి జన్మములు తపస్సు చేసినను దొరకునా? మమ్మది చేర్చుకొన్న పక్షమున నాల్గు వరాల సొమ్ము దాని కిచ్చికొందుము. లంచ మిచ్చినను మమ్ములను జేరనియ్యదు. నీ ముఖారవిందము చూడఁగానే యది నీ వలలోఁ బడినది" యని వారెగతాళి చేయుచుఁ బలికిరి. వారు తన్ను బరిహాసముచేయుచున్న వారైనను నా బాలిశుఁడు గ్రహింపలేక దేశ మందరు తన్ను గౌరవించునట్టి మహాపదవిలోనికి వచ్చినట్లు సంతసించి యా వార్త తల్లికి జెప్పెను. అది విని యామె తన కొడు కేనుఁగు నెక్కినట్లు సంతసించి "నాయనా! మంచిపని సంపాదించినావు. నీ కింత గొప్పతనము పట్టినందుకు ఈ యూరివారందరు కన్నులలో నిప్పులు పోసికొంటారు. దిక్కుమాలిన బడి పోతేపోయిందిలే, దాని తాత వంటి పని వచ్చినది. నే నిక్కడనే సోలెడు బియ్యము కాచుకొని కాలక్షేపము చేయుచుండెదను, నీవు వెళ్ళిరా!" యని యన్నము పెట్టిపంపెను. గణపతి తన గుడ్డలు నాలుగు మూటగట్టుకొని తన స్నేహితులం బిలిచి "యీ చుట్టుప్రక్కల గరుడాచలం భాగవతం కట్టిందంటె నేను కృష్ణవేషము వేసినా నన్నమాటె. మీరందఱు నా కోసమైనా భాగవతం చూచుటకు రండి! నా వేషమెంత దర్జాగా యెంత ఠీవిగా నుంటుందో మీరు చూతురు గాని! అల్లరి చిల్లరి వెధవలు వేషము కట్టినట్లు కడతా ననుకున్నారా యేమిటి? ఎంత చమత్కారముగా నుండునో నా వేషము చూచిన తరువాత మీకే తెలియఁగలదు. తప్పక రండి." యని ప్రత్యేకముగ నొక్కరొక్కరితో జెప్పి గరుడాచలముతో బయలుదేరి పలివెల వెళ్ళెను.

ఆ యూరు వెళ్ళిన తరువాత గణపతి గర్వము మేఱమీఱెను. 'మీ రెవ్వరండీ!' యని యతని నెవ్వరైన క్రొత్తవా రడిగినప్పుడు 'గరుడాచలము మఁగడ ' నని యుత్తరము చెప్పు చుండును. ఆ పణ్యాంగన భామవేషము కట్టినప్పుడు తాను కృష్ణమూర్తి వేషము కట్టదలచుకొనుటచే నది యొక్కసారియైనను గట్టకమునుపే తా నామె మగఁడైనట్లు భావించుకొని యట్లే లోకమున జెప్పఁ దొడంగెను. వెలవెలఁదుల నిజముగ నుంచు కొన్నవారు సయిత మావిధముగ నెన్నఁడు జెప్పుకొన రని మన మందఱ మెఱుఁగుదుము. అయినను గణపతి సంబంధ మారోపించుకొని, యది తనకు గొప్పతనమే గలిగించునని, తానట్టి యుత్తరము చెప్పుట కవకాశము కలిగినందుకు మిక్కిలి సంతసించుచుండును. గణపతి బ్రాహ్మణయింట భోజనము జేసి, తక్కిన కాలమంతయు గరుడాచలముయొక్క గృహమందె గడుపుచుండును. అంత కొన్నాళ్ళకు కొత్తపేట డిప్యూటి తహసీలుదారు గారు గరుడాచలమును పిలిపించి భామ వేషము గట్టుమని యాజ్ఞాపించిరి. ఆ తహసీలుదారువారి యాజ్ఞ తిరస్కరించుట కొంచెము గొప్పస్థితిలో నున్నవారికే యపాయకరమై యుండ నాదినములలో వెలయాలునకు గొఱవితో దల గోకికొనుట యని వేర చెప్ప నక్కరలేదు. అందుచేత నామె యచ్చటకు వెళ్ళి భాగవతము గట్టెను. హాస్యగాడు మద్దూరి మహాదేవుఁ డను బ్రాహ్మణుఁడు. అతఁడు హాస్యమున మిక్కిలి గట్టివాఁడని పేరు వడసెను. అతని హాస్యప్రసంగమును విని సభాసదులు కడుపు చెక్క లగు నట్లు నవ్విరి. సత్యభామ తెరమీద జడవైచి దానిని మిక్కిలి సొగసుగా వర్ణించుచుండ, తహసీలుదారు జరుగుచున్న యాలస్య మోర్వక "యేమిటది, గేదెతోఁక లాగున జడ తెరమీఁదవైచి లోపల కూర్చుండి యేదో గింజుకొనుచున్న దేమిటి? ఎవరోయి బంట్రోతు! జడ బట్టుకొని లాగి యీవల కీడ్చుకొని రావోయి!" యని కేక వైచెను. గరుడాచలము సహజముగ గర్వోన్మత్తురాలు. ప్రశస్తమైన కంఠమును భామవేషధారణ ప్రవీణతయు గర్వమును హెచ్చించెను. తహసీలుదారుగా రాడిన పలుకుములుకు లామెకు దుస్సహములై ప్రత్యుత్తర మీదలచినను నటువంటి మహాధికారిని యెదిరించుట స్వనాశనముకు దారి జేసికొనుట యని గుర్తెఱిఁగి బంట్రోతీడ్చికొని రానక్కఱలేకయె జడవర్ణనము ముగించి తెఱవెడలి వచ్చెను. గరుడాచలము తన్నుంచుకొన్న రసికుల ప్రేరణముననో వారికి గుతూహలము గల్పింపవలె నను సంతసము చేతనో చిన్న నాఁడు తల్లి చేసిన యలవాటు చేతనో మనస్సున కుత్సాహము గలుగునను తలంపు చేతనో వేసవికాలమందు కల్లును, తక్కిన కాలములందు సారాయియుఁ ద్రాగుచుండును. భామవేషము కట్టినప్పుడు చాకచక్యము హెచ్చుటకై యామె తప్పక కొంచెము పుచ్చుకొని వచ్చును. ఆనాఁడు మోతాదు కొంచె మెక్కు వయ్యెను. సగము కలాపము వినిపించు నప్పటికి మత్తు సంపూర్ణముగ నెక్కుటచే నామె తప్ప తప్ప మాటలాడుచు నేలమీఁద బడెను. హాస్య గాడు, మద్దెలగాడు, శ్రుతిగాఁడు, గరుడాచలము నేలబడుటకుఁ గారణ మెఱుగుదురు. కాని గుట్టు బయటబెట్టుట వారి కిష్టము లేదు. కావున హాస్యగాఁడు ముందుకువచ్చి గుండె బాదుకుని "మహాప్రభూ! దుర్మార్గు లెంత పని జేసినారో, చిత్తగించండి ! గరుడాచలముయొక్క చక్కదనము, సంగీతము, భామవేషము లోని ప్రజ్ఞ చూచి యోర్వలేక యెవఁడో పాపాత్ముఁడు ప్రయోగము చేసినాఁడు. నేలబడిపోయినది. మేము దేశద్రిమ్మరులము గనుక మా దగ్గర వీనికి బ్రతిక్రియలున్నవి. ఇంత మాత్రముచేత భయము లేదు. కాని యిఁక నీ రాత్రికి భాగవతము సమాప్తము. పాప మది రేపు మధ్యాహ్నమువఱకు లేవలేదు. మహాప్రభూ, ఈ వేళకు సెలవిప్పించండి. రేపు రాత్రి యిటువంటి దొంగదెబ్బ తీయునట్టి దుర్మార్గులకు దొరకకుండ జాగ్రత్తపడి, తిరిగి భాగవతము గట్టెదము." అని వేడుకొని గరుడాచలమును తీసికొని పోయెను. వాని పలుకులు సత్యంబు గాదలచి యెవఁడో నిజముగఁ బ్రయోగము చేసినాడని నమ్మి ప్రేక్షకులు వానిని నోటికి వచ్చినట్లు తిట్టిపోయిరి. మరునాడు మరల భాగవతము జరిగెను. కొత్తపేటలో జరుగబోవు భాగవతమునకు రమ్మని యదివరకె గణపతి తన స్నేహితులకు వర్తమాన మంపెను. అందుచే హాయిగా భాగవతము జూచుటకు గణపతియొక్క కోర్కె నెఱవేర్చుటకును మందపల్లి వాసులలో బనిపాటులు లేని పడుచువాండ్రి పదిమంది వెళ్ళిరి. చదువురాని యాడు వాండ్రు పాటలు చెప్పుకొన్నట్లు గణపతి తన కలాపభాగము నొకరిచేత చెప్పించుకొని వల్లించెను. ఇప్పుడు కొన్ని రాగము లతఁడు నేర్చుకొనెను. కాని చిన్ననాఁడు తల్లి కొట్టినప్పుడు, పంతులు బాదినప్పుడు పెట్టు రాగాలకు, నీ రాగాలకు నంతగా భేదము కనబడలేదు. ఆ నాడు సత్యభామ నిర్విఘ్నముగా దన కలాపము వినిపించెను. హాస్యగాని వేషము కంటె కృష్ణవేషమే సభ్యుల కెక్కువ యానందము గలిగించెను. అనగా నతఁడు చక్కగా కథాకలాపము వినిపించుటవల్ల నని తలంపవలదు. వామనావతారమున దలపించు నతని మూర్తియే మొదట నానంద కారణ మయ్యెను. తరువాత నానందకారణ మిది. తాను జగద్రంజకముగఁ దన కథాభాగము వినిపింపగల నని గంపంతయాసతో నుండఁగా సభాసదులం జూడగానే యతనికి మేన ముచ్చెమటలు బోసెను. నోట మాట వెడలలేదు. తన స్నేహితుల యెదుర తన కవమానము గలుగు నని యాతఁ డెంతో వగచి జ్ఞాపకము జేసికోవలెనని కడు ప్రయత్నము చేసెను. కాని తాళము పోయిన పెట్టెలో నున్న వస్తువువలెనే కథా భాగము దుర్లభ మయ్యెను. సభాసదు లందఱు జప్పటలు గొట్టి నవ్విరి. అంతలో హాస్యగాడు కృష్ణవేషగానిని కొంచెము కదిపి మాటలాడించవలె నని 'మాధవా! మన దే యూర ' ని యడిగెను. కృష్ణవేషములో నుండుటచే ద్వారకకాపుర మని గణపతి యుత్తరము జెప్పుటకు మారుగా 'మనది మంద పల్లి గాదట్రా! ఎఱుగనివానివలె నడిగెదవే?' మని ప్రత్యుత్తరము చెప్పెను. అప్పుడు సభాసదుల యానంద మేమి చెప్పుదును? చప్పట్లతో దెసలు మారుమ్రోగెను. హాస్యగాఁడు కడచిన రాత్రి పన్నిన పన్నుగడయె మరల పన్నదలచి 'యెవరో మరల దెబ్బ గొట్టినారు. మహాప్రభో!' యని చెప్పెను. కాని యా పలుకులు ప్రేక్షకులకు నమ్మదగి యుండలేదు. నిష్కారణముగ భాగవతము చెడిపోయిన దని సభాసదులు విచారించిరి. గరుడాచలము సిగ్గుపడియెను. అందరు గృహముల కరిగిరి. గరుడాచలమునకు గణపతి యొక్క వేషభాషలు కొంతకాలమునుండి యేవ గలిగించుచు వచ్చినను గథాకలాపము వినిపించుటలో నతని కేమయిన ప్రజ్ఞయుండునేమో యని యామె యాసపడెను. కాన యదిగూడ వట్టిదైనతోడనే తన కొలువులోనుండి లేచిపొమ్మని గణపతితో జెప్పెను. ఇకమీద మిక్కిలి జాగ్రత్తతో బని చేయుదునని గణపతి యామెను బహువిధముల బ్రతిమాలెను. కాని వాని కోరిక నామె నిరాకరించెను. అటమీద నే వృత్తి యవలంబింపవలయు నని గణపతి తన మిత్రులతో నాలోచింప నెక్కడయినను వంటబ్రాహ్మణుఁడుగ గుదిరినపక్షమున చక్కగా జీవనము జరుగునని కొందరు మిత్రు లుపదేశించిరి. ఆ వృత్తి యతని కంతగా నిష్టము లేకపోయినను విధిలేక యతఁ డొడంబడ వలసి వచ్చెను. గరుడాచలము దగ్గర నున్నపుడు తల కగరు నూనె సంపెంగనూనె రాచికొనుచు నది తీసి పాఱవైచిన పూలదండలు చేతులకు మెడకు తగిలించుకొని యానందించుచు దాని మగడ నని చెప్పికొనుచు గడపిన దినములే తన జన్మమధ్యమున శ్రేష్టమైన దినములుగాఁ దలంచి పూర్వజన్మ దుష్క్రుత విశేషమున నట్టి యఖండయోగము తనకు దప్పిపోయిన దని విచారించుచు నొక లోకలఫండు యినస్పెక్టరు గారి యింట వంట బ్రాహ్మణుడుఁగ గుదిరెను. అన్నము పెట్టి నెలకు నాలుగు రూపాయలిచ్చుటకు వారొడంబడిరి. కాని పదునైదు దినములు ముందుగా దన యాడువాండ్రదగ్గఱ వంట నేర్చికొమ్మని యా యధికారి గణపతితో జెప్పెను. అట్లే యని గణపతి యాయన తల్లియు బార్యయు వంట చేయునపుడు దగ్గఱ కూర్చుండి వంట చేయువిధము కనిపెట్ట జొచ్చెను. ఇట్లొక మాసము గతించిన తరువాత యజమానుడు గణపతిని దీసికొని యొక గ్రామము వెళ్ళి యుద్యోగస్థుల నిమిత్త మేర్పడిన యొక బంగాళాలో దిగెను. వంట కుపయోగించు పాత్రములను దెచ్చుకొమ్మని యజమానుఁడు పలుమాఱు జెప్పెను. కాని మందమతులలో నగ్రగణ్యుఁడైన గణపతి గరిటెలు మఱిచిపోయెను. ఒక్కొక్క మనుష్యున కెన్ని బియ్యము పోయవలెనో యతఁ డెఱుఁగడు. ఏ గిన్నె యెంత యుడుకునో తెలియక మానెడు బియ్య ముడుకు గిన్నెలో, భోజనము చేయవలసినవారు తమ రిద్దఱైనప్పటికి వడ్డెడు బియ్యముబోసి పాక మారంభించెను. అన్నము గిన్నెలో నొక్కటే ముద్దయైపోయెను. కలియబెట్టుటకు గరిటె లేకపోవుటచే గణపతి చుట్టుప్రక్కల కరిగి యొక పుల్ల దెచ్చి దానితో గలియబెట్టెను. దైవవశమున నది వేపపుల్లయయ్యెను. పప్పులో నుప్పెక్కువ యయ్యెను. పైగా నది యెనుపక పోవుటచే బద్దలు బద్దలుగా నుండెను. చారు కాచెను. కాని యది కంసాలులు వెండి వస్తువులు మొదలగు వానికి వన్నెదెచ్చుటకై యుడుకబెట్టెడు చింతపండు పులుసు వలె రుచిలేక చూడ నసహ్యమై యుండెను. యజమానుఁడు స్నానముచేసి వడ్డించుమని కూర్చుండ, గణపతి గిన్నె దెచ్చి యా వేపపుల్లతోనే వడ్డించుటకు బ్రయత్నము చేసెను. కాని విస్తరిలో నన్న మూడిపడదయ్యెను. గిన్నె నేలబెట్టి కొట్టి వేపపుల్లతో బొడిచి పొడిచి నానా బాధలు పడునప్పటికి పారణపు ముద్దవలె రెండుండ లూడిపడెను. ఆ తరువాత గణపతి పప్పు వడ్డించెను. అన్నము చిదుపుటకు యజమానుని తరము గాకపోయెను. చేయి వై చునప్పటికి నిప్పుమీద చేయి వైచిన ట్లంటుకొనెను. విసనకఱ్ఱఁ దెచ్చి కొంతసేపు విసరిన తరువాత నన్నము చల్లబడెను. కాని యజమానుఁడు ప్రాణాహుతులు పుచ్చుకొను నప్పటికె యన్నము యొక్క రుచి తెలిసెను. వేపగింజలు వండిపెట్టి నట్లుండెను. కాని యన్నము వండిపెట్టినట్లు లేదు. తరువాత యజమానుఁడు పప్పు నోటబెట్టెను. ఉప్పులో నాలుగు పప్పుబద్ద లడ్డమువేసి యతఁడు వండెనో, పప్పులో చెరిసగ ముప్పువేసి వండెనో కనిపెట్టుట బ్రహ్మదేవుని తరముకాదు. అన్నము, సూపము రుచి చూచిన తరువాత యజమానునకు దుఃఖము కోపము నొక్కసారిగా రాఁగా నిట్లనియెను. 'హా! హా! హా! నీ వంట యమృతమువలె నున్నదిరా! నలపాక భీమపాకము లన యీ వఱకు లోకమున నున్నవి. కాని మా కర్మపాకము చేతనో దైవ దుర్విపాకముచేతనో గణపతిపాకమని మూడవ పాకము వచ్చినది. విరోధముచేత నెవఁడైన మరియొకని జంపఁ దలఁచు కొన్నపుడు నాభి పాషాణము మొదలయిన విషములు పెట్టనక్కఱలేదు. నీ చేత నొక్కసారి యన్నము వండి పెట్టించిన జాలు ఏబది సంవత్సరములు బ్రతుకదలంచిన వాఁడా పూట జచ్చును. ఉదయమున నే నేమియుఁ దినకుండ గుఱ్ఱమెక్కి యెంతో దూరము తిరిగి బడలి మిక్కిలి యాకఁలిగొని యింత మృష్టాన్నము నీవు వండి సిద్ధముగా నుంచుదు వని గంపంత యాసతో వచ్చినందుకు అన్నము పెట్టుటకు మారు నీవు సున్నము పెట్టితివి. నీ వంట మండిపోనూ. ఇఁక చాలు! నన్ను చంపక నీ దారిని నీవు వెళ్ళు, నాయనా ! మీ పెద్దలకు వేయి నమస్కారములు!' అనవుడు గణపతి చిన్నవోయి 'వంటెందుకు బాగులేదో నేనెరుగను. ఇది మీ వాళ్ళు నేర్పిన వంటే. నా వల్ల వచ్చిన లోప మొక్కటి. గరిటె మరచిపోయినాను అన్నమీ పుల్లతో గలియబెట్టినాను. ఇది వేపపుల్ల యేమో తెలియదు. అయితేమాత్రమేమి? వేపపుల్లతో మొగము కడిగికొనమా? వేపపువ్వు తినమా ? అన్నము చేదైన మాత్రమున నింత యల్లరి చేయవలెనా? మీ యాడవాళ్ళు చేసినప్పుడు మాత్రము వంట యెప్పుడైన చెడిపోదా ? మీకింత యోపిక లేదన్నమాట మొదటే తెలిసిన పక్షమున మీ దగ్గరకు నేను రాకపోదును. పోనియ్యండి. యేలుట కూళ్ళు లేవు గాని ముష్టి యెత్తుకొని తినుట కూళ్ళు లేవా? మీ వంటివారు నాకు వేయిమంది; నా వంటివాళ్ళు మీకు వేయిమంది. నీ మీ దగ్గర నెలదినములు పనిచేసినాను. నా జీతమీయండి. మీ దగ్గర పనిచేయడము నాకే యప్రతిష్ట' యని చివాలున లేచి తన గుడ్డలు నాలుగు మూట గట్టుకొని పయనమయ్యెను. ఆ యజమానుఁడు వాని మాటల కలుగక వాఁడొక యున్మత్తుఁ డనుకొని రెండు రూపాయాలు వాని చేతిలో బెట్టి " నీకు నెలకు నాలుగురూపాయ లియ్య దలఁచుకొన్నాను. కాని నీ తెలివికి రెండు రూపాయలు చాలును. పో!" యని చెప్పెను. "పోనీయండి. నా సొమ్మెంత మంది తినలేదు, అందులో మీరొకరు!' యని యా రెండురూపాయలు బుచ్చుకొని విసవిస నడచి పోయెను. ఆ యుద్యోగస్థుఁ డాపూట భోజనము లభింపమి యరటిపండ్లు తెప్పించుకొని తిని యొక విధముగా క్షుద్భాద తీర్చికొని సాయంకాల మాయూరు కరణముగారి యింటికిబోయి తన యవస్థ జెప్పుకొని యక్కడ భోజనము చేసెను.