గణపతి/పదిహేడవ ప్రకరణము
పదిహేడవ ప్రకరణము
నిద్ర పరమసుఖప్రద మనియు నా రోగ్య ప్రదాయిని యనియు సర్వావస్థలయందు నపేక్షనీయ మనియు మన మందర మెరుగుదుము. మరియు నిద్రవచ్చినప్పు డీ స్థల మా స్థల మనక మెట్టయనక పల్లమనక పాను పనక వట్టినేల యనక తలగడలు మొదలగున వున్నవనక లేవనక మనుష్యుఁడు మైమఱచి గాఢ సుషుప్తి నొందుననియు మన మెరుగుదుము. కాని, వ్యాధియు మనోవ్యాధియు భయము మున్నగునవి పీడించు నప్పుడు మనుష్యునకు సాధారణముగా నిదురరాదు. మానవుఁ డట్టివానికి లోనగునప్పుడు నిశాసమయ మతిదీర్ఘమై చట్రాతివలెఁ గదల నట్టులుండి, నిద్రను మనుజుని సన్నిధికిని రానీయ త్రోసి వేయును. ప్రకృతిధర్మ మిట్లుండగా బడిలోని పిల్లవానిని జావఁ గొట్టినందుకుఁ దన్నా బాలుని తండ్రి చంపివేయు నని యతిభయ భ్రాంతుడై విహ్వలచిత్తుడై యటకమీఁద కెక్కిన గణపతికి నావకాయగూనకు జేరఁబడి కూరుచున్న యవస్థలోనే తన్ను గూర్చి జరుగుచున్న గొడవ వినఁబడకుండ నంత గాఢనిద్ర యెట్లు వచ్చెనని మీకుఁ దోచవచ్చును. గణపతియొక్క నిద్రాసుఖముఁ గూర్చి మీరు సంపూర్ణముగ నెఱుగరు. కాన మీ కట్టి శంకలు పొడముచుండును. నిద్రావిషయమున గణపతికి గల యసాధారణ శక్తి వర్ణనాతీతమై యుండును. అతఁడు నడచుచు నిద్రపోగలఁడనుట యతిశయోక్తి కాదు. కూరుచుండి నిద్రింపఁ గలడనుట కవి చాతుర్యము గాదు. భోజనము సేయుచు సుషుప్త్యవస్థయం దుండఁగల డనుట వర్ణనా చమత్కృతి గాదు. లక్షలు, కోట్లు నల్లులు గల మంచము మీఁద నే విధమయిన పరుపు గానిఁ దుప్పటి గాని లేకుండ నతనిం బండుకొన బెట్టుడు. ఆ నల్లు లన్నియు నతని శరీరమందంతట సముద్రముమీఁద దెప్పునఁనదేలి చెరలాడు చేపలవలె నిట్టటు బరుగులెత్తుచు నతనిం గరచుచు, నెత్తురు పీల్చుచున్నను నతఁడు కదలఁడు మెదలఁ డొత్తిగిల్లఁడు. ఇట్టి నిద్రాసుఖము ప్రపంచమునం దెవరికిఁ గలదు? ఒక నల్లి మంచముమీఁద నున్నంత మాత్రమున నిద్రపట్టదని దీపము చేతపుచ్చుకొని యానల్లిం బొడిచి కడతేర్చినదాక మంచముపై మఱల బండుకొనని మహాత్ము లనేకులు గలరు. నల్లులే కాదు. జుమ్మని దోమలు ముసరి, తమ విపరీత గానముచేత నిద్రా దేవతకు భయము గల్పించి యా గదిలోని కామెను రాకుండఁ జేసినప్పుడు సయితము గణపతికి నిద్రాదేవికి నెట్టి మైత్రి కలదో గాని యతనికిఁ మాత్ర మామె ప్రసన్నురాలగును. దోమల సేనయు నల్లుల సేనయుఁ గలసి యాతని శరీరముపై పడినను మూసిన కన్ను దెఱువకుండ నతఁడు నిద్రింపఁ గలడు. మహాకవియైన వాల్మీకి, రామాయణ మహాకావ్యము నందు రావణానుజు డయిన కుంభకర్ణుడు నిరంతరము నిద్రాసక్తుడై యుండి యాఱునెలలు కొక్కసారి లేచు ననియు, లేచినప్పుడు వానిని వేల్పు లయిన గెలువలే రనియు, మాసషట్కము లోపల నతనిని మేల్కొలుపవలసివచ్చెనేని మసలఁగ్రాగిన చమురు మీఁద బోయుట, ధాన్యము తనువుపైఁ బోయించి యేనుగులచేత ద్రొక్కించుట మొదలగు భయంకర సాధనములు ప్రయొగింప వలె ననియు వ్రాసియున్నాడు. ఈ కలియుగంలోనే గణపతి వంటి దుర్వార నిద్రాపరాయణుడు జనించినప్పుడు మహాద్భుతముల కెల్ల నిలయమైన త్రేతాయుగమున కుంభకర్ణునివంటి నిరంతర నిద్రాప్రియుఁడు పుట్టియుండుట యాశ్చర్యము కాదని హేతువాదము సలుపునట్టి యీనాటి నవనాగరికులు నమ్ముట కవకాశము యున్నది. కాని కుంభకర్ణునకు మన గణపతికి నొక్క భేదము కలదు. కుంభకర్ణుడు బ్రహ్మదత్త వరప్రసాదమున షణ్మాస పరిమిత మయిన నిద్రం జెంద గలిగె. గణపతి యే దేవతాప్రసాదము లేకయె నిద్రావిషయమున నింత ప్రజ్ఞానవంతుఁడయ్యె. కావున నిరువురలో గణపతియె యొకవాసి గొప్పవాఁడని మనము నిశ్చయింప వచ్చును. నిద్రానుభవమున గణపతి కెంత నిరుపమాన ప్రజ్ఞ కలదో లోకమునకుఁ దెలియుటకు స్థాళీపులాక న్యాయముగా రెం డుదాహరణము లిచ్చుట మంచిది. ఆ యుదాహరణం బట్టి యతని నిద్రానైపుణ్యమును మీరు కొంతవఱకు గ్రహింపవచ్చును. గణపతి వేసవికాలములో రాత్రులు విశేషమైన యుక్క యుండుటచే నింటిలోఁ బండుకొనక మహాదేవశాస్త్రిగారి వీథి యఱుగులమీఁద బండుకొను చుండును. దీపములు పెట్టిన తరువాత నతఁ డొంటిగాఁ బండుకొనలేడు. కదలలేడన్న మాట చదువరుల కీవఱకే విశదము. అందుచేతఁ దనకు విధేయులయి వివిధోపపచారములం జేయునట్టి పెద్దశిష్యులను నలుగు రైదుగురను బ్రతిదినము రావించి యిరుపుర నీప్రక్కను నిరువుర నాప్రక్కను బండుకొనఁబెట్టి నడుమ దాఁ బండుకొనుచుండును. అట్లు పండుకొనుచుండ నొకనాఁడు గణపతి నిద్రించిన పిదప నలువురు శిష్యులు రెండవ యఱుగుమీఁద కరిగి యా రాత్రి యేదయిన చమత్కారము చేయవలె నని సంకల్పించిరి. ఆ చమత్కృతికిఁ దమ పంతులుగారినే విషయముగాఁ జేయఁదలచు కొనిరి. ఆ చమత్కృతి యే రూపముగ నుండవలయునని ప్రశ్న రాగాఁ గడుసుదనంబునకు దావకం బైన యొక శిష్యుడు తక్కినవారి కిట్లనియె. "ఓరీ! అన్నిటి కన్న మిక్కిలి యందమైన విధము నేను చెప్పెద వినండి. ఏడుకట్ల సవారి కట్టి పంతులవారిని దానిమీద పండుకొన బెట్టి వల్ల కాళ్ల దగ్గరకుఁ దీసికొనిపోయి పెట్టెదము. పంతులవారి నిద్రసంగతి మీకు దెలియునుదగదా! ఆయనకు మెలకువరాదు, ఉదయమున దారింబోవు వారందఱుఁ మహానందభరితు లగుదురు. ఈ వృత్తాంతము విన్న వారందఱు గడుపు చెక్కలగు నట్లు నవ్వి వహవ్వా! యీ పని నెవరు చేసినారో గాని మిక్కిలి చమత్కారముగా జేసినారురా యని మెచ్చుకొందురు. మేమే యీపని చేసినా మని మన మెప్పుకొని యామెప్పును బొందుటకు వీలులేక పోయినను గ్రామవాసుల కింతటి యానందము గల్పించితిమి గదా యని మన మనంబులలో మనమే గర్వించవచ్చును. ఇది రహస్యముగ గట్టవలయునుగదా! ఎక్కడ గట్టుద మని మీరడుగుదురేమో, ఆ విషయమై విచారింప నక్కఱలేదు. మా దొడ్డిలో వెదుళ్ళున్నవి. వెదురు బద్దలున్నవి. మాదొడ్డిలో గోడ యొకమూల పడిపోయినది. ఆ దారిని వెళ్ళి మనము రెండు వెదుళ్ళు, రెండు బద్దలు తెచ్చి యీప్రక్క నున్న బోడిగోడల దొడ్డిలో కటుకు కట్టవచ్చును. తాటినార కూడ మా దొడ్డిలోనే యున్నది. తీసుకు వచ్చెదను. ఆయనకు మన మేమియు హాని చెయ్యవద్దు. ఇది మీకు సమ్మతముగా నున్నదా! లేని పక్షమున మీకు దోచిన విధము లెఱిగింపుడు." అతని పలుకులు తక్కిన మువ్వురకు శ్రవణానందకరములై మనఃప్రమోదావహములై యుండినందున వారు భళీ యని యాతని యుపాయమునకు మెచ్చి తక్షణమే ప్రయత్నము జేయుమనిరి. వెంటనే యతఁడు తన దొడ్డిలో నుండి వెదుళ్ళు, నార మొదలైనవి దెచ్చెను. నలుగురు గలిసి కష్టపడి పొట్టి కటుకు నొకదానిం గట్టిరి. అనంతర మా శిష్య చతుష్టయము గురువు పండు కొన్న చోటికి వచ్చి కాళ్ళిద్దరు చేతు లిద్దరు పట్టుకొని యాదొడ్డిలోనికిఁ దీసికొనిపోయి యక్కటుకు మీఁద బండుకొనబెట్టి యతని యుత్తరీయమె మేనిమీఁద గప్పి జాఱిపోకుండ నారతోఁ గట్టి యా దారుణకర్మమున కపరిచితులయ్యు నలుగురు నాల్గు కొమ్ము లెత్తి భుజములపైఁ బెట్టికొని మోసికొని స్మశానభూమి కరిగిరి. అరిగిన తరువాత నేమి చేయవలెనో వారికిఁ దోచలేదు. నిద్ర మేల్కొలుపుద మని యొకడు, కాదు కాదు మరల నీ విధముగానే గృహమునకు తీసుకొనిపోవుదమని యొకడు చెప్పిరి. వారి యాలోచనలు ద్రోసిపుచ్చి మొట్టమొదట నీ చమత్కృతి సలుపు మని యుపదేశించిన యత డిట్లనియె "ఓరీ! మనము మొట్టమొద టేమనుకొన్నాము? తెల్లవారినదాక నిచట నునిచి, యీదారిన బోవు జనులకు వేడుక గలిగింపవలయు ననిగదా మన సంకల్పము! దానికి భిన్నముగా మన మిప్పు డేల యాచరింప వలయు? గావున నిది యీవిధముగానే యిక్కడనుంచి మన మిండ్లకు వెళ్లుదము. కాని పంతులుగారికి మిక్కిలి భయము గదా! మెలకువ వచ్చినప్పుడు వల్లకాడు చూచి భయపడి చచ్చిపోవు నేమో? యని మీకు సందేహము కలుగవచ్చును. కాని యట్టిసందేహమున కవకాశము లేదు. ఏలయన మనపంతుల వారికి సూర్యోదయ మగువఱకు మెలకువరాదు. ప్రతిదినము చూచుట లేదా? ఇంటిలోఁ బండుకొన్నపుడు తల్లియు, మహాదేవశాస్త్రి గారు ప్రొద్దెక్కినది లే లెమ్మని పెద్ద పెట్టున నఱచి, చేతులతో జఱచి లేపిన గాని లేచెడి వాడు కాడు. వీథిలో బండు కొన్నపుడు సూర్యకిరణములు మొగము మీద బడి కన్నులలో దూరి తాళముచేతులు తలుపులను దెఱచినట్లు ఱెప్పలు విప్పిన గాని లేచుటలేదు. మనమిక్కడ గొంతసేపుండి తెల్లవారుజామున నింటికి వెళ్ళుదము." అనవుడు నతని మాటలు తమ ప్రారంభమున కనుకూలముగా నున్న వని వారందఱు నిశ్చయించి, పంతులవారి యాకారము చక్కదనము నాకారమునకుఁ దగిన ప్రజ్ఞలు గుణగణములు చెప్పుకొని కడుపులు పగులునట్లు నవ్వి కాలక్షేపముజేసిరి. అటకమీద గూనకు జేరబడి పండుకొన్నప్పుడు గణపతి కెంత సుఖముగా నిద్రపట్టెనో కటుకుమీద బండుకొన్నప్పుడు నంత సుఖముగానే నిద్రపట్టెను. నిద్రపోయినవారును జచ్చినవారును సమాన మన్న సామెత యొకటి యున్నదిగదా! ఆ సామెత గణపతికడ నిజమయ్యెను. ఎన్నడో చచ్చిన యట్లతఁడు మైమఱచియుండెను. కడపటిజాము కోడి కూయు వఱకు శిష్యులు గురువుం గనిపెట్టుకొనియుండి, కాపులు మొదలగువారు పొలముల కా దారినే దెల్లవారుజామున బోవుదుదు గనుక దా మచ్చట నిక యుండగూడ దని లేచి గ్రామమునకుం బోయి యెవరి యింటికి వారరిగిరి. కాకులు గూసెను. తూర్పుదెస తెల్లవాఱెను. ఆడవాండ్రు ముందుగ లేచి ముంగలివాకిళ్లు వీథియరుగులు గుమ్మములు తుడుచుకొనఁ జొచ్చిరి. కనుచీకటి యుండగానే యొక కాపువాడు వల్లకాటి మీదుగా దన పొలమునకు కరుగుచు నచ్చట కటుకుపై నున్న శవముం జూచి "హా ! యేమిది చిత్రముగ నున్నది. శవము కనఁబడుచున్నది. చుట్టుప్రక్కల జుట్టములు పక్కములు లేరు. నరసంచారమే లేదు. నిప్పు లేదు. కుండలు లేవు. మోసినవారు లేరు. కాడు పేర్చలేదు. పుల్లలు లేవు. పిడకలు లేవు. కూనీ యైన శవమేమో యనుకొందమన్న నట్టి శవమును నే తుంగలోనో త్రొక్కి పారవేయుదురు. గాని యింత జాగ్రత్తగా నొక కటుకుఁ గట్టి మోసికొని తీసికొనివత్తురా! ఇది యేమో మాయగా నున్నది. ఈ విషయమై నేను పోయి మునసబు, కరణాలతోఁ జెప్పి దీసికొనివచ్చెదను." అని పరుగునఁ బోయి మునసబు కరణాలని లేపెను. ఈ లోపున మరికొంద ఱా మార్గమునం బోవుచు, నప్పటికి మొగ మానవాలు పట్టుటకు దగినంత వెలుతురు వచ్చినందున దగ్గఱకుఁ బోయి కటుక మీఁదనున్న విగ్రహముం జూచి పంతులుగారి నెవరో చంపి పడవైచి రని కలఁతజెందిన మనస్సులతో వెనుకకుఁ బోయి గ్రామవాసులతోఁ చెప్పిరి. ఆ వార్త గ్రామమంతయు గుప్పుమనెను. స్త్రీలు మిక్కిలి యక్కజముతో జాలి పెంపున గన్నీరు విడుచుచు "అయ్యో! తల్లి కొక్క బిడ్డమ్మ, ఆ ముసలిముండ ముప్పు గడపకుండ బోయినా డమ్మ! ఇంత పని చేయుటకు వాళ్ళకు చేతు లేలా గొచ్చెనో యమ్మా! అయ్యో ! బెత్తము పుచ్చుకొని పిల్లలను కొట్టుచున్నట్లే నా కన్నుల ముందర మెలఁగుచున్నాడే అమ్మా!" యని చెప్పుకొనజొచ్చిరి. పురుషుఁ లందరు నీ వార్త చెవినిఁ బడగానే యితరకృత్యములు విడచి స్మశానభూమికే పరుగిడిరి. ఎవరో మహాదేవశాస్త్రిగారి గుమ్మము ముందరకుబోయి "శాస్త్రులు గారు! పంతులుగారి నెవరో చంపి వల్లకాటిలో వైచిపోయినారయ్యా!" యని కేకవేసి పోయిరి.
ఆమాట సింగమ్మ చెవిని బడగానే చేతిలో నున్న పనిని విడిచిపెట్టి "అయ్యో ! కొడుకా! అయ్యో కొడుకా, నీ వుసురెవరు పోసుకున్నారురా, కొడుకా! అయ్యో! అయ్యో శాస్త్రులుగారు! నా వరహాలచెట్టు నెవరో పడగొట్టినారట రండి నాయనా! రండి నాయనా, రండి" అని గుండె బాదుకొనుచు మొత్తుకొనుచు వీధిలోఁ బడెను. "అయ్యయ్యో! ఎంత పని, ఎంతపని! యింత పాపమున కెవడు వడిగట్టినారయా!" యని మహాదేవశాస్త్రిగారు, స్త్రీలు జాలిపడిరి. శాస్త్రి యామెం దోడ్కొని రుద్రభూమికరిగెను. సింగమ్మ త్రోవలో దుఃఖావేశము చేతఁ దన కుమారుని గుణగణములు మెచ్చుచు గ్రామవాసులం దిట్టుచు శపించుచు నరిగెను. వా రిరువురు వెళ్ళకముందే గ్రామవాసు లనేకు లచ్చట జేరి గణపతి చచ్చిపోయినాఁడని యొకరు, చావలేదు ప్రాణము గుడుగుడు లాడుచున్నదని యొకరు, ముక్కుదగ్గర వ్రేలుపెట్టి శ్వాస యాడుచున్నదో లేదో యని చూచువా రొకరు. శ్వాస యున్నది కాని యది కొనయూపిరి యని యొకరు, చచ్చిపోలేదు నిద్రపోవుచున్నాడు, అదిగో గుఱ్ఱని యొకరు, గుఱ్ఱు కాదయా గురక, గొంతు పిసికి చంపినారు అని యొకరు, గొంతు పిసికితే కంఠము వాచి యుండదా? గొంతు పిసకలేదు, కత్తితోఁ బొడిచి చంపినారేమో యని యొకరు, పొడిచిన పక్షమున నెత్తురు, గాయములు కనఁబడవా? యని యొకరు, పలు తెరంగుల నెవరికి దోచినట్లు వారు పలనించిరి. మొత్తముమీద గణపతి సంపూర్ణముగఁ జావలేదనియు, నవసానలక్షణమయిన గురక బైలుదేరిన దనియు క్షణములోనో నరక్షణములోనో కడతేరు ననియు నచటివారు నిశ్చయించిరి. అంతలో మహాదేవశాస్త్రితో సింగమ్మ వచ్చెను. వచ్చి కొడుకు పైఁబడి "నా తండ్రీ! నా కొడుకా! నన్నొంటి దాన్ని జేసి లేచిపోయినావురా! నాకింక దిక్కెవరురా, నాయనా! నన్నుఁ గూడ నీతోఁ దీసికొనిపోరా! తండ్రీ! నా వరహాలచెట్టూ ! నా కాసులపేరూ! నిన్న రాత్రి కడసారి నీకుఁ గడుపునిండా అన్నము పెట్టినానురా, నాయనా! తెల్లవా రే పాడుమొగం చూచినానో గాని యింత దుర్వార్త వినవలసి వచ్చిందిరా, నాయనా! నాముప్పు కడతేర్చి నన్నింత మట్టిచేసి పోదువని అనుకున్నాను గాని యింత పని జరుగునని కలలోనూ నే ననుకో లేదుర నాయనా! నిన్నింత పని చేయుటకు యెవరికి చేతులు వచ్చినవిరా, నాయనా! వాళ్ళ చేతులు పడిపోనూ, వాళ్ళ వంశము నాశనంగానూ! నాలాగే వాళ్ళ తల్లులుగూడ కొడుకా! కొడుకా! అని యెప్పు డేడ్చి మొత్తుకొందురో, నాయనా! నానోట్లో మట్టిపోసి పోయినావురా నాయనా! నా కడుపులో చిచ్చుపెట్టి పోయినావురా, నాయనా! నా కొంప తీసినావురా, నాయనా! ఈ చావు దేవుఁడు నా కెందుకు పెట్టినాడు కాదురా, నాయనా! నీకు పెండ్లిచేసి నీ వొక యింటివాఁడవై యుండగా నా కన్నులు చల్లగా చూడవలె ననుకొన్నానురా, నాయనా! బ్రహ్మచారివై చచ్చిపోవలసి వచ్చినదిరా, తండ్రీ! నీ పేరుగా చూచుకొనేందుకు నీ కడుపున నొక పిల్లవాఁడైన లేకపోయెరా, నాయనా! నీ వెవరిజోలికి వెళ్ళనివాడవురా, నాయనా! నీ మీఁదింత కోపము మెవరికి వచ్చిందిరా, నాయనా! ప్రాణము పొయ్యేటప్పుడు నన్ను దలఁచుకొని యెంత దుఃఖపడ్డావో, తండ్రీ! నీ ప్రాణమెంత కొట్టుకున్నదో, నాయనా! దిక్కిమాలినముండను నేను లోపల పడుకొన్నాను గాని వీథిలో పడుకున్నానుకానురా, నాయనా! నీ కిన్ని పాట్లుండబట్టే భగవంతుఁడు నాకటువంటి పాడుబుద్ధులు తోపించాడురా, నాయనా! ఆ నాగన్న వెధవ, ఆ గంగమ్మ ముండ యీ వార్త విని సంతోషముతో పరమాన్నము వండుకొని తింటారురా, నాయనా! నేనేలాగున బ్రతకనురా, బాబూ! నిన్ను రాజులాగు పెంచుకొన్నానురా, బాబు! అవతారమూర్తి అనుకున్నానురా, నాయనా! ఎవరు దగ్గరవుంటే నీ దగ్గరున్న ట్లుంటుందిరా, నాయనా! దాహం తాగితే మానెడు తరవాణి త్రాగేవాడవురా, నాయనా! నీవు చద్ది అన్నము తినేవేళైనది లేరా, నాయనా!" అని పరి పరి విధముల దుఃఖించెను. తల్లి పెద్ద గొంతుకతో నెల్లవారి గుండెలు నీరగున టేడ్చుచున్నను, గ్రామవాసులు చేరి కంఠము లెత్తి మాటలాడుచున్నను గణపతికి మెలకువ రాలేదు. అంతలో సూర్యోదయ మయ్యెను. గణపతి మొగముమీద సూర్యకిరణముల వెలుగు పడెను. అప్పుడు గణపతికి నించుక మెలకువరాఁగా నతఁడు "ఉండవే లేస్తాను. ఏమి తొందర వచ్చినది?" అని కన్నులు తెరవకయే చేతితోఁ దల్లిని గెంటెను. అప్పుడందరు 'పంతులుగారు బ్రతికి యున్నారు, బ్రతికి యున్నారు, చావలే' దని కేకలువేసి చప్పటలు కొట్టిరి. సింగమ్మ "నా తండ్రీ! బ్రతికున్నావురా, నాయనా ! ఈ గండము గడిచినది గనుక నిన్ను దీసికొని తిరుపతి వెళ్ళెదనురా, నాయనా ! వెంకటేశ్వర్లువారికి కుంచె డావునేతితో దీపారాధన చేసెదనురా, నాయనా ! యని మనస్సులో వెంకటేశ్వర్లు వారిని దలచుకొని చేతులు జోడించి నమస్కరించి 'నాయనా ! దెబ్బలెక్కడ తగిలినవి? నిన్నెవరు చంపవచ్చిరో యెరుగుదువా?' యని గట్టిగా నడిగెను. అంతలో మొగము మీదకిఁ నెండ బాగుగా వచ్చుటచేతను గ్రామవాసులు చప్పటుల చేతను మొగము, చేతులు, తల్లి మాటి మాటికి పట్టుకొని కదుపుట చేతను గణపతికి మెలఁకువ సంపూర్తిగ వచ్చెను. అంతలో గ్రామవాసులలో నొకడు వచ్చి కట్లు విప్పెను. అంత గణపతి కన్నులు దెరచి చీకు చాపలు, కుండపెంకులు, కచ్చికలు, పంచయనము చేసిన చోటులు, వెదురుముక్కలు మొదలగు వానింజూచి, గుంపులు గుంపులుగా నుండు జనముం జూచి, గుభాలున కటుకుమీఁదనుండి లేచి భయమునకు నాశ్చర్యమునకు లోనై "ఇదేమిటి! మహాదేవశాస్త్రిగారి యరుగుమీఁద పడుకున్న వాఁడను నేనిక్కడ కేల వచ్చితిని. నారాయణ! నారాయణ! నన్నీ కటుకుమీఁద పండుకోబెట్టినవాఁరెవరు! ఇదేమిటి నన్ను వల్లకాటికి దీసికొని వచ్చినారు. ఏరీ ! రాత్రి నా ప్రక్కను బండుకొన్న పిల్లవెధవలు! నన్నెవరో యీలాగున తీసుకువచ్చుచుండఁగా నా ప్రక్కను పండుకున్న కుఱ్ఱవెధవలు భయపడి పారిపోయినారు గాఁబోలు?" అని లేచి నిలిచెను. పంతులుగారి నెవ్వరు చంపఁ దలంచుకో లేదనియు నెవరో కోపముచేతనో, కొంటెతనముచేతనో నీ విధముగా జేసినారని నచ్చటఁ జేరిన గ్రామవాసు లందరు నిశ్చయించిరి. పదిమంది పెద్దమనుష్యులను బ్రోగుచేసి పోలీసువారికి వర్తమాన మంపించి, భోజనములు లేకుండ మూడు జాములదాక గూర్చుండి పంచాయితీ చేయనక్కరలేకుండ వ్యవహారము చులకనగా తేలినదని మునసబు కరణములు సంతోషించుచు నింటికిఁ బోయిరి. "తమ మరణాంతరము బంధువులు తమ నిమిత్త మెట్లు విలపింతురో చెవులార వినియెడిభాగ్య మెవ్వరి కబ్బదు! గణపతి కట్టి మహోత్సవము తీరిన" దని నవ్వుకొనుచు, గ్రామవాసుల నందర నచ్చటికిఁ జేర్పఁ గలిగిన యీ పన్నాగము పన్నినవారి బుద్ధికుశలత మెచ్చుకొనుచు, గ్రామీణులు "వహవ్వా ! యేమి పంతులయ్యా ! ఎందరనో పంతుళ్ళను చూచినాము గాని యింత విపరీతపు పంతులును చూచినాము కాము. మన యదృష్టము కొద్ది దొరికినాఁడుగాని" యని పరిహాసాస్పదమగు పలుకులు పలుకు కొనుచుఁ బోయిరి. అప్పుడు సింగమ్మ కొందరు పెద్దమనుష్యులం గనుంగొని "చూచినారా, నాయనా! కిట్టకపోతే కిట్టనట్లుండవలెను గాని యింత దుర్మార్గపుపని చేయవచ్చునా ? పోనీ కొంటెతనము కోసము చేసినారంటారా, వేళాకోళపు మాటలాడుకోవచ్చును, హాస్యములు చేసికోవచ్చును. సరసాలాడుకొనవచ్చును. గాని యింత కొంటెతనమున్నదా? ఒక్క బిడ్డ, నాకు. నా కెంతో వోగాయిత్యముగా నున్నది. ఈలాటి మోటసరసాలా. ఈ పని జేసిన దెవరో తెలిసినపక్షమున దుమ్మెత్తిపోసెదను. మునసబు గారితోఁ జెప్పి బొండ వేయించెదను. వాళమ్మ కడుపు గాలా, యీలాటి పనిచేసినవాళ్ళ వంశాలుండవురా, నాయనా! మీకు తెలిసెనా వాళ్ళ ముఖాలు చీకి తాటాకులతో తగులబెట్టి, నోట్లో గడ్డి పెట్టండి! అర్ధాయుస్సు ముండాకొడుకులకుఁ గాని యిట్టి బుద్ధులు పుట్టవు. నా మనస్సెంత క్షోభపడిందో వాళ్ళ తల్లులు గూడ యంత క్షోభపడవలెను. చూడు, నేనన్నాను. ఉత్తమ యిల్లాలను!" అని తా జెప్పవలసిన దంతయుఁ జెప్పి "రా నాయనా! యింటికి ! యీ కటుకుమీఁద నిన్ను మోసికొని వచ్చినవాళ్ళనే మోసికొని పోవుదురులే. నీవు చిరంజీవివై నూరేళ్ళు బ్రతుకఁ గలవు. ఆ దుర్మార్గపు ముండకొడుకులే రాళ్లు పగిలిపోయినట్లు తలలు పగిలి చచ్చిపోఁగలరు!" అని కుమారుని చేయి బట్టుకొని యింటికిఁ దీసికొనిపోయొ, దృష్టిఁ దీసి, వేడి నీళ్ళతో స్నానము చేయించెను. స్మశానవాసదోషము దొలఁగి పోవునట్లు, పిశాచాది పీడాపరిహార మగునట్లు మహాదేవశాస్త్రి విభూతి మంత్రించి గణపతి మొగమునిండ బొజ్జనిండ భుజముల నిండఁ బెట్టి శతగాయత్రీజపము జేసికొమ్మనెను. గణపతికి గాయత్రీ మంత్రము రాదన్న మాట మహాదేవశాస్త్రి యెరుఁగడు. అయినను గణపతి యా జపము చేసినట్లే యభినయించెను. ఆనాఁడు మహాదేవశాస్త్రిగారి యిల్లు కోటిపల్లె తీర్థమువలె నుండెను. స్మశానభూమికి గ్రామమునం గల మగవారే వెళ్ళిరి గాని స్త్రీలు శిశువులు మొదలగువారు వెళ్ళకపోవుటంజేసి వారందరు గణపతిం జూడవచ్చిరి. విభూతి పెండెకట్లు పెట్టుకొని జంగముదేవరవలె గూర్చున్న గణపతిం జూచి వారందరు నవ్వి "అదృష్టవంతురాలవమ్మా" యని యతని తల్లిని బరామర్శచేసి వెళ్ళిరి. నాఁటిరేయి మొదలు గణపతికి స్వప్నములలో స్మశానము కాష్టములు కటుకులు కుండపెంకులు గుడ్డపేలికలు చాపలు మొదలైనవి కనఁబడ జొచ్చెను. స్వప్నదృష్టములైన యా వస్తువులం జూచి యతఁడు పెద్దపెట్టున నేడ్చుచుండును. 'నే చావలేదు! నన్ను దహనము చేయకండోయి! యని కేకలు వేయుచుండును. తల్లి యతనిం గట్టిగఁ గౌగిలించుకొని పండుకొనవలసి వచ్చెను. ఆ పని యెవరు చేసిరని గణపతి తన ప్రక్కను రాత్రి పండుకొన్న బడిపిల్లలనుబిలిచి యడిగెను. ఆ శిష్యు లిట్లనిరి - "పంతులుగారు, రెండు జాముల రాత్రివేళ కాగడాలతో నెవరో కొందరు వచ్చిరి. ఎవరో మనుష్యులనుకొని మేము లేచి యెవరువా రని యడిగితిమి. వారు మా కుత్తరము చెప్పలేదు. వాళ్ళ నోళ్ళు చిన్నవి. కడుపులు బానకడుపులు. మడమలు ముందరికి పాదములు వెనుకకు నున్నవి. చిన్నప్పుడు మా తాత మా నాయనమ్మ దయ్యము లాలాగుండునని చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చెను. అవి కొరవిదయ్యము లని మే మప్పుడనుకొంటిమి. కేకలు వేసిన పక్షమున నోళ్లు నొక్కునని మేము కిక్కురు మనకుండ మా ప్రాణము లరచేతిలోఁ బెట్టుకుని పారిపోయితిమి. మిమ్ము లేపుటకయిన వ్యవధానము లేకపోయినది. ఆ కొరవి దయ్యములే యింతపని చేసినవి!" గణపతి కా మాటలు సత్యములని తోచెను. ఎవరో కొంటెపిల్లవాండ్రాపని చేసి యుందురని చూడవచ్చిన గ్రామవాసు లందరు నేకగ్రీవముగాఁ జెప్పినను గణపతి వారి మాటయందు లేశమైన విశ్వాసముంచక తన విద్యార్థుల మాట యందె నిండు నమ్మిక యుంచి పిశాచ మాంత్రికుని కడకు బోయి వానికి గొంత ద్రవ్య మిచ్చి మంత్రించిన విభూతి పుచ్చుకొని మేనఁ బాముకొని రెండు రక్షరేకులు పుచ్చుకొని రెండు భుజములకుఁ గట్టికొని వీథులలో నెన్నఁడు బండుకొనఁ గూడ దని లోపలనె బండుకొనుచుండెను. శిష్యుల కొంటెతన మెరుఁగడూ గనుక వారినే నమ్మి తన ప్రక్కను వారిని బండుకోబెట్టుకొను చుండెను. ఒకనాఁ డొకఁ శిష్యుఁడు చేదత్రాడు దెచ్చి వాని జుట్టుకు ముడివైచి యాత్రాడు దూలమునకుఁ గట్టెను. ఆ నాఁడు గణపతికి నిద్రలో దాహము విశేషముగ నైనందున రెండు జాముల రాత్రివేళ నతనికి మెలఁకువ వచ్చి దాహము త్రాగుటకయి లేవబోఁగా, దన జుట్టు పట్టుకొని యెవరో లాగినట్లయ్యెను. అప్పు డతఁడు మహాభయభ్రాంతుఁడై "చచ్చిపోయినానోయి, నాయనా ! దయ్యములు నా జుట్టు పట్టుకొని లాగుచున్నవిరోయి ! ఓ అమ్మా ? ఓ శాస్త్రిగారు ! చచ్చిపోయినాను, చచ్చిపోయినాను! రండోయి, రండోయి! రండోయి!" యని యుచ్చైస్వరముతో నరచెను. కొంటెతనము చేసిన విద్యార్థియు వానితోఁబాటు 'దయ్యాలు బాబో! దయ్యాలు ' అని యేడువఁజొచ్చెను. తక్కిన విద్యార్థులుగూడ నాఁటి కుట్రలోఁ జేరినవారె యుగుటంచేసి చకితస్వాంతులైన ట్లభినయించి గోల పెట్టె యేడ్చిరి. 'అయ్య కొడుకో! కొడుకో!' యని సింగమ్మ లోపలనుండి వచ్చెను. ఇంటిలో దీపము లారిపోయినందున సింగమ్మ నిద్రలోనుంచి యకస్మాత్తుగ లేచి గుమ్మ మెక్కడున్నదో యెరుఁగక గోడమీఁద బడి మొగమునకు దెబ్బ తగిలించుకొని దయ్యములే పడవేయుచున్న వని కొడుకు గతి యేమైనదో యని యేడ్వఁజొచ్చెను. ఇంతలో మహాదేవశాస్త్రి తన యడప సంచిదీసి చెకుముకిరాతితో నిప్పుచేసి దీపము వెలిగించి చూచునప్పటికి గణపతి జుట్టుకు ద్రాడుపోసి దూలమునకుఁ గట్టి యుండుట కనఁబడెను. అపు డాయన నిజస్థితి చెప్పి గణపతి భయ మడిసి యది యా శిష్యులలో నెవ్వరో చేసిన కొంటెతనమని గట్టిగాఁ జెప్పెను. అది దయ్యములు చేసిన పని గాని మేము చేసిన పని గాదని విద్యార్థులు గురువుగారిమీద నొట్టు పెట్టుకొని చెప్పిరి. గణపతి కా మాటలే విశ్వాసపాత్రములైనను మహాదేవశాస్త్రి నాఁటంగోలె విద్యార్థులను లోపలికి రానియ్యగూడ దని నొక్కి వక్కాణించెను. మఱి యొకనాడు మహాదేవశాస్త్రి సకుటుంబముగా బంధుగృహమున జరుగు వివాహము నిమిత్తము పలివెల వెళ్ళెను. ఇంటిలో గణపతియుం దల్లియు మాత్రముండిరి. దల్పులన్నియు వైచుకొని రాత్రి తల్లికొడుకులు నిద్రపోవుచుండగా దొడ్డిలో నున్న తాటియాకుల పాక యంటుకొనెను. చుట్టుప్రక్కల నున్న జను లందరు లేచి కుండలతోను; బిందెలతోను నీళ్ళు తెచ్చి యది యార్పఁ బ్రయత్నించిరి. పెద్ద గోల యయ్యెను. తలుపులు తీయుమని సింహద్వారము వొద్ద దొడ్డిగుమ్మమువొద్ద నాకసము మాఱుమ్రోగునట్లు గ్రామవాసులు పెద్దపెట్టున నఱచిరి. కాని గణపతికి గాని తల్లికిఁగాని మెలఁకువ రాలేదు. గ్రామీణులలోఁ గొందఱు గోడ దూకియు దొడ్డిగోడ దూకియు గొందఱు నిచ్చెనలు వైచుకొని లోనికి దిగియు దొడ్డి తలుపులు దీసికొని యంటుకొన్న పాక చల్లార్చిరి. కాని గణపతికి మెలకువ రానందున సాహసులు కొంద ఱుతకలెత్తి తలుపులు తీసి గణపతిని లేపబూనిరి. గాని యంతకు నతనికి మెలకువ రానందున నతని చెవిలోఁ జల్లని నీరు పోసిరి. అప్పు డతడు మేల్కొనియెను. మఱియొకసారి గణపతి మహాదేవశాస్త్రిగారితోఁ గలిసి రాత్రి బండిమీఁద బయనమై వెళ్ళు చుండెను. అది చీకటిరాత్రి. బండి పొలములోనుండి వెళ్లుచు నొకచో బోల్తపడెను. అదివరకు బండిలో బండుకొని నిద్రపోవుచున్న గణపతి బండి బోల్తపడినప్పు డెగిరి దూరముగాఁ బడెను. కునికిపాట్లు పడుచున్న మహాదేవశాస్త్రి మఱియొక వైపున గూలఁబడియెను. శాస్త్రిగారికి జేయి మడతబడి నొప్పిపట్టెను. బండివాఁడు గుమ్మడికాయవలె నేలఁబడ వాని చట్ట విఱిగెను. 'చట్టవిఱిగినది, బాబోయి!' యని వాడేడ్వజొచ్చెను. 'నాచేయి విఱిగినదిరా!' యని శాస్త్రి బెంగగొని గణపతీ ! గణపతీ! యని పదిసారులు పిలిచెను. అతఁడు పలుకలేదు. ఎద్దులు త్రొక్కిచంపినవో, బండి చక్రముక్రిందఁ బడి చచ్చెనో యని శాస్త్రి "భగవంతుడా ! యీ ప్రయాణ మెందుకు దెచ్చిపెట్టితివి ! పాప మీ కుఱ్ఱవాని జంపుటకా" యని ఖేదపడుచుండ నంతలో నెవరో మార్గస్తులు చిన్నలాంతరు పుచ్చుకొని యాదారినె వెళ్ళుచుండిరి. మహాదేవశాస్త్రి దూరమునం బోవుచున్న యా బాటసారులను గేకవైచి పిలిచెను. వారా కేక విని రాగా శాస్త్రి వారితో "మా బండి బోల్తా పడినది. నిద్రించుచున్న పిల్లవాఁ డెక్కడనో బడిపోయిఁనాడు. చచ్చిపోయినాడేమో యని భయపడుచున్నాము. కొంచెము వెదకండి, నాయనా!" యని చెప్పెను. వారు నలు దెసలు కలయం గనుంగొనఁగా గణపతి యొకచోఁ బడియుండెను. 'ఆ పిల్లవాఁడు స్మారకము లేక పడియున్నాడండి' యని శాస్త్రితోఁ జెప్పిరి. బ్రతికి యున్నాడో లేదో నాడి చూచి, ముక్కదగ్గర వ్రేళ్లుపెట్టి చూడండి యని ప్రత్యుత్తర మిచ్చి చేతినొప్పితో మెల్లగా నచ్చటి కరిగెను. వారట్లు చూచి "బ్రతికి యున్నాఁడు. తలకు మోపైనదెబ్బ తగిలియుండఁబట్టి తల దిమ్మెత్తి పడియుండఁబోలు" నని చెప్పి చేతితో నిట్టటు గదలించి చెవిదగ్గఱ గణపతీ! గణపతీ ! యని గట్టిగా నఱచిరి. అప్పు డతఁడు ఆ! యని పలికెను. మరియు నట్టివిధముగానె నిద్దఱు రెండుచెవులదగ్గర జేరి కంఠము లెత్తి పిలువ నతడు మేల్కొని 'బండి యాపినారేమి? యని యడిగెను. అపుడు జరిగిన వృత్తాంత మంతయు శాస్త్రి వానితోఁ జెప్పెను. క్రొత్త బాటసారులు గణపతి యొక్క యఖండనిద్రను దెలిసికొని 'కలియుగ కుంభకర్ణుడురా, యీ గణపతి!' యని మహాశ్చర్యమనస్కులై తమ దారిం జనిరి. మన కథానాయకుని నిద్రాతిశయమును గూర్చి వ్రాయఁదలచుకొన్న పక్షమున నింకను ననేకోదాహరణము లున్నవి. గాని గ్రంథ విస్తరభీతిచేత నింతటితో విరమింపవలసి వచ్చెను.