శివపురాణము/యుద్ధ ఖండము/గజాసుర వృత్తాంతం

వికీసోర్స్ నుండి

అంధకాసురుని గాథానంతరం సూతపౌరాణికుడు గజాసుర వృత్తాంతం వినిపించసాగాడు.

శ్రీకృష్ణుని చేత నిర్జ్జింపబడిన మహిషాసురుని కొడుకు గజాసురుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి దేవతల సమస్త వైభవాలూ తాను పొందేలాగ, కామమోహితులైన స్త్రీ పురుషులచేగాని - దేవతలచేగాని తనకు మరణం సంభవించకుండేలాగ వరం పొందాడు.

ఆ వరగర్వితుడై, త్రిలోకాలనూ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాక - కాశీలోని (వారణాసీపురి) శివభక్తులను సైతం విడిచిపెట్టక అందర్నీ హింసలకు గురిచేయడంతో, ఆగ్రహించిన శివుడు త్రిశూలధారియై గజాసురుని పైకి యుద్ధానికి వెళ్లాడు.

కామమోహితుడు కాని వారిచేత నిర్జింపబడాలని కోరుకున్నందున, మహావిరాగి అయిన మహేశ్వరుడి చేత మరణించబోతూ గజాసురుడు ఓ వరం కోరుకున్నాడు.."దేవా! కాముడినే జయించిన జగన్మంగళ మూర్తివి నువ్వు! నీచేత నేను సంహరించ బడడమే నాకు సంతోషంగా ఉన్నది" అంటూ పరిపరి విధాల స్తుతించాడు.

శివుడు సంప్రీతుడై ఏదైనా వరం కోరుకోమన్నాడు. "నాకు ఇంక కోరికేముంటుంది మహేశా! పునీతుడినైన నేను మళ్లీ జన్మ కోసమో - భోగోపసౌఖ్యాల కోసమో, నిన్ను వరం కోరుకోలేను. నీ దిగంబర దేహం చూడలేకున్నాను. కనుక - నా తోలు వలచి దానిని నీవు వలువగా ధరిస్తే నాకు అంతేచాలు!" అని కోరుకున్నాడు గజాసురుడు.

భక్తుని కోరిక తీర్చాడు శివుడు. నాటినుంచే శివునికి కృత్తివాసుడు, కరి చర్మాంబరధారి అనే విశేషణాత్మక నామధేయాలు చేరాయి.

తన భక్తుని పేరిట, గజాసుర శరీరం శివలింగమై భూలోకాన వెలుస్తుందని అనుగ్రహించాడు సాంబశివుడు"...అని వచించాడు సూతమహర్షి.

తదనంతరం..

శౌనకాది మహామునుల కోరిక మేరకు యుద్ధఖండము నందలి కిరాతార్జునీయఘట్టం వినిపించ ప్రారంభించాడు.