Jump to content

క్రీడాభిరామము (ఎమెస్కో)/క్రీడాభిరామము

వికీసోర్స్ నుండి

క్రీడాభిరామము

[ప్రస్తావన: రూపకభేద మగు వీథీప్రశస్తి - కృతికర్త వంశప్రశంస (ప్రరోచనము) - వల్లభామాత్యుని పాండితీవైభవాదికము - మూలగ్రంథ మగు ప్రేమాభిరామప్రశంస - దేశభాషలందుఁ దెనుఁగు లెస్స - పాత్రప్రవేశసూచనము - సూత్రధారోక్తి.]

ప్రస్తావన

రూపకభేదమగు వీథీప్రశస్తి

తే.

గణన కెక్కిన దశరూపకములయందు
[1]వీథి, రసభావభావనావీథి లెస్స,
యే కవీంద్రుఁడు రచియించె నీ ప్రబంధ
మనుచు మీ రాన తిచ్చెద రైన వినుడు:

1

కృతికర్త వంశప్రశంస (ప్రరోచనము)

సీ.

అఖిలప్రపంచంబు నన్యథా కల్పించెఁ
                        బటురోషరేఖ సాఫల్య మొందఁ,
ద్రైశంకవం బైన తారకామండలం
                        బాకాశమార్గంబునందు నిలిపె,
మాలినీతీరనిర్మలసైకతములలో
                        మేనలకాప్సరసతో మేల మాడె,

నామ్నాయమాత గాయత్రీమహాదేవిఁ
                        బ్రణుతించి బ్రహ్మర్షిపదము గాంచె


తే.

నెవ్వఁ డాతండు సామాన్యఋషియె తలఁపఁ?
దాటకా కాళరాత్రికి, దాశరథికిఁ,
గాలకంధరకోదండఖండనునకుఁ
గార్ముకాచార్యవర్యుండు గాధిసుతుఁడు.

2


స్ర.

ఆ విశ్వామిత్రుగోత్రం బను జలనిధి యాహ్లాదముం బొందుచుండన్‌,
భూవిఖ్యాతప్రభావాభ్యుదయుఁ డుదయముం బొందె [2]మంచన్నకీర్తుల్‌,
ద్యావాపృథ్వ్యంతరాళాంతరముల నతినిస్తంద్రచంద్రాతపశ్రీ
ధావళ్యస్ఫూర్తి లక్ష్మీతరళతరకళాధాళధళ్యంబు సూపన్‌.

3


శా.

ఆ మంత్రీశ్వరు కూర్మినందనుఁడు చంద్రామాత్యుఁ డంభోజభూ
భామారత్నపయోధరద్వయతటప్రాలంబనైపథ్యము
క్తామాణిక్యనిభాభిరూప్యపదవాక్యప్రౌఢసాహిత్యవి
ద్యామాహాత్మ్యవిలాససమ్ముదితవిద్వన్మానసుం డిద్ధరన్‌.

4


శా.

కర్ణాటక్షితినాథుఁడైన పెదబుక్కక్ష్మాప దేవేంద్రు న
భ్యర్ణామాత్యుని, దానఖేచరునిఁ, జంద్రాధీశు, బంధుప్రియున్‌
వర్ణించున్‌ గవికోటి, శంకరజటావాటీతటాంతర్నటత్‌
స్వర్ణద్యంబుతరంగరింఖణలసత్సాహిత్యసౌహిత్య యై.

5


క.

ఆ చంద్రమంత్రిమణికిని
పోచాంబారత్నమునకుఁ బుట్టెను, బుధర

క్షాచణుఁడు, మంచనార్యుఁడు,
వాచస్పతిసదృశబుద్ధివైభవుఁ డగుచున్‌.

6


ఆ.

మంచనార్యు తిప్పమకును సుపుత్రులు
నలువు, రందు సింగనయును, తిప్ప
నయును, మల్లనయును, నయనీతిసత్కళా
న్వితుఁడు [3]చంద్రమంత్రివిభుఁడు ననఁగ.

7


గీ.

సింగనామాత్యసుతుఁడు, సుస్థిరగుణుండు,
మానినీమన్మథుఁడు, చంద్ర మంత్రివరుఁడు
వెలసె వైభవముల దేవవిభునిఁ బోలి
సకలబుధతతి యెల్లను సంస్తుతింప.

8


క.

మిరుతూరి [4]విట్ఠమంత్రీ
శ్వరుతనయ వరించె మల్లసచివాగ్రణి శం
కఁరు డద్రిరాజనందనఁ
బరిణయ మగుభంగి నధికభాగ్యోన్నతుఁ డై.

9


ఉ.

మల్లన మంత్రికిం ద్రిపురమా తరళాక్షికిఁ, గాంతి రోహిణీ
వల్లభు లాత్మసంభవులు, వల్లభ లింగన తిప్పన క్షమా
వల్లభ మంత్రిశేఖరులు, వారవధూజనపుష్పభల్లు, లు
త్ఫుల్లయశోవిభాసితులు, పుణ్యులు, సింగన భైరవేంద్రులున్‌.

10


వ.

అందు.

11


సీ.

తారకామందారతారాచలంబుల
                        తో రాయు నెవ్వాని చారుకీర్తి
భావసంభవభద్రదేవేంద్రసూనుల
                        మఱపించు నెవ్వాని మహితమూర్తి

జీమూతవాహనశిబిసూర్యతనయుల
                        ధట్టించు నెవ్వాని దానశక్తి
భార్గవగార్య్గగీష్పతిమతిప్రౌఢిమ
                        నిరసించు నెవ్వాని నిశితబుద్ధి


తే.

యతఁడు రిపురాజరాజ్యసప్తాంగహరణ
కరణపరిణతయుక్తిప్రకాశమానుఁ,
డతులితాచారవిజితగంగాత్మజుండు,
మర్య్తమాత్రుండె వల్లభామాత్యవరుఁడు?

12


సీ.

వాచాలసురధునీవీచికాగంభీర
                        వాచావిలాసుండు బైచమంత్రి,
పల్లవోష్ఠీమానసోల్లాసకృతిపుష్ప
                        భల్లావతారుండు మల్లవిభుఁడు,
పన్నగాలంకారపన్నీరజధ్యాన
                        సన్నుతాత్ముండు పోచన్నశౌరి,
ప్రత్యగ్రసహజసాహిత్యవిద్యాకళౌ
                        న్నత్యుండు తిప్పనామాత్యఘనుఁడు


తే.

నందనులు చంద్రమందారకుందకుముద
గంధకీగంధసారసౌగంధ్యబంధు
బంధురోదారకీర్తిసౌభాగ్యనిధికి
మల్లికార్జును[5]పుత్రుఁడు వల్లభునకు.

13


మ.

కనకాద్రిప్రతిమానధైర్యనిధి, లింగక్ష్మాసమంత్రీంద్రుతో
ననతారాతినృపాలమంత్రి జనతాహంకారతారాహిమా
ర్కునితో, రూపరతీంద్రుతో, హరిహరక్షోణీంద్రసామాజ్యవ
ర్ధనుతో సాటి, సమాన, మీడు గలరా రాజన్య సైన్యాధిపుల్‌?

14


ఆ.

తిప్పమంత్రి జగదుదీర్ణవితీర్ణుఁ డు
ద్వాహ మయ్యె నధికవైభవమున

హరితగోత్రజలధిహరిణాంకుఁ డగుతిప్ప
నార్యతనయఁ బెద్దమాంబ నెలమి.

15


స్ర.

ఆ మల్లామాత్య[6]పుత్త్రుం, డయుగనయనపూజానుసంధానసంధా
సామగ్రీపుండరీకేక్షణుఁడు, వెలసె నైశ్వర్యసంపత్సమృద్ధిన్‌,
సీమాదంతావళాభ్యు చ్ఛ్రితకరతటక్షేత్రనిర్యన్మదాంభస్
స్తోమవ్యాలోలభృంగస్తుతవిమలతరస్ఫూర్తి మత్కీర్తిలక్ష్మిన్‌.

16


సీ.

[7]సత్యవ్రతాచార సత్కీర్తిగరిమల
                        చంద్రుతోడను హరిశ్చంద్రుతోడ,
నభిమానవిస్ఫూర్తి నైశ్వర్యమహిమల
                        రారాజుతోడ రైరాజుతోడ,
సౌభాగ్యవైభవ జ్ఞానసంపన్నత
                        మారుతోడ సనత్కుమారుతోడ,
లాలిత్యనిరుపమశ్లాఘావిభూతుల
                        భద్రుతోడను రామభద్రుతోడఁ,


తే.

బాటి యనఁదగు ధారుణీపాలసభల
వీరహరిహరరాయపృథ్వీకళత్ర
రత్నభండారసాధికారప్రగల్భు,
మల్లికార్జున త్రిపురారి మంత్రివరుని.

17


మ.

కపటాచారవిరోధిరాజసచివగ్రావోగ్రదంభోళికిన్‌,
నృపనీతివ్యవహారకార్యఘటనానిర్ధారణాశాలికిన్‌,
దపనీయాచలరాజధైర్యనిధికిన్, ధర్మైకపాథోధికిన్,
ద్రిపురారాతిమహాప్రధానునకు, నేరీ యుద్దు లిద్ధారుణిన్‌.

18

మ.

అటవీసూకర మేల? యేల ఫణి? యేలా కొండ? లేలా దిశా
తటవేదండము? లేల కూటకమఠాధ్యక్షుండు? సప్తాబ్ధిసం
ఘటనాలంకృతమధ్య మైననిఖిలక్ష్మాచక్రవాళంబు నె
క్కటి దాల్పం ద్రిపురారివల్లభుభుజాకాండద్వయం బుండఁగన్‌.

19


ఉ.

గంధవతీప్రతీరపురఘస్మరపాదబిసప్రసూనపు
ష్పంధయచక్రవర్తి, శ్రుతపర్వతదుర్గమహాప్రధానరా
డ్గంధగజంబు తిప్పన, యఖండితధీనిధి, కాంచెఁ బుత్రులన్‌
బాంధవకల్పవృక్షముల, బైచన మల్లన తిప్ప మంత్రులన్‌.

20


వ.

అందు.

21

వల్లభామాత్యుని పాండితీవైభవాదికము

సీ.

మూఁడుగ్రామగ్రాసములతోడఁ గూడంగ
                        మోపూరు పాలించె ముల్కినాట,
నాశ్వలాయనశాఖయందు ఋగ్వేదంబు
                        కరతలామలకంబుగాఁ బఠించెఁ,
బ్రత్యక్ష మొనరించి భైరవస్వామిచే
                        సిద్ధసారస్వతశ్రీ వరించెఁ,
గామకాయనస విశ్వామిత్రగోత్రంబు
                        వంశగోత్రంబుగా వార్త కెక్కె,


తే.

నెవ్వఁ, డా త్రిపురాంతకాధీశ్వరునకు,
రాయనవరత్నభండారరక్షకునకుఁ
బ్రియతనూజుండు, చందమాంబిక సుతుండు,
మనుజమాత్రుండె వల్లభామాత్యవరుఁడు?

22


క.

అహరవధిసమయనృత్య
త్తుహినాంశుధరప్రచారధూతాభ్రధునీ

లహరీభ్రమఘుమఘుమములు
వహిఁ దిప్పయ వల్లభన్న వాగ్వైభవముల్‌.

23


క.

హాటకగర్భవధూటీ
వీటీకర్పూరశకలవిసృమరసౌర
భ్యాటోపచాటుకవితా
పాటవ మరు [8]దవని వల్లభన్నకు నమరున్‌.

24


క.

హల్లీసక నట[9]నోద్భట
పల్లవ హరికృష్ణ కంఠ వనమాల్య మిళ
ద్గల్లత్సురభులు, తిప్పయ
వల్లభ రాజప్రధాన వాగ్వైభవముల్‌.

25


క.

అమృతరసమథనసంభవ
ఘుమఘుమితపయఃపయోధికోలాహలమున్‌
భ్రమియించుఁ, దిప్ప సచివో
త్తము వల్లభవిభుని చాటుధారాఫణితుల్‌.

26


క.

భిల్లావతార మధుభి
ద్భల్ల భుజాస్ఫాల్యమాన పటుచాపజ్యా
వల్లీమతల్లి చెల్లెలు,
వల్లభరాయప్రధాని వాగ్వైభవముల్‌.

27


క.

నెల్లూరి తూముకాలువ
హల్లకముల కమ్మఁ దావి నపలాపించున్‌
సల్లలితలీలఁ, దిప్పయ
వల్లభరాయ ప్రధాన వాగ్డంబరముల్‌.

28


క.

ఉపమించెద ధారాధర
తపనజ రేరాజ రాజ ధారానగరా

ధిప ధారాధరవాహులఁ,
ద్రిపురాంతక వల్లభుని వితీర్ణప్రౌఢిన్‌.

29


క.

సరివత్తు రీవి, నిర్జర
పరివృఢమణి ధనద జలజ బలి ఖచర నిశా
కర సురతరు సురధేనువు,
లరుదే త్రిపురారి వల్లభామాత్యునకున్‌.

30


శా.

సారాచారమునన్‌, వివేకసరణిన్‌, సౌభాగ్యభాగ్యంబులన్‌,
ధౌరంధర్యమునన్, బ్రతాపగరిమన్‌, దానంబునన్‌, సజ్జనా
ధారున్, దిప్పనమంత్రి వల్లభు, నమాత్యగ్రామణిన్, బోల్పఁగా
వేరీ మంత్రులు సింధువేష్టితమహోర్వీచక్రవాళంబునన్‌.

31


సీ.

మందారవారుణీమదఘూర్ణితాత్ముచే,
                        వెడదకన్నులచిన్నివడువుచేత,
డమరుఖట్వాంగదండకపాలపాణిచే,
                        ధూర్తబాలకచక్రవర్తిచేతఁ,
గుర్కురపరివారకోటిసేవితునిచే,
                        వెలఁదికోరలమోమువేల్పుచేత,
[10].....................
            ......................


తే.

విశ్వవిశ్వంబు పాలించువిభునిచేతఁ,
బార్వతీదేవి గారాపుఁబట్టిచేత
నీప్సితము గాంచుఁ దిప్పమంత్రీంద్రతనయుఁ
[11]డార్యమణి వల్లభామాత్యుఁ డహరహంబు.

32

మూలగ్రంథమగు ప్రేమాభిరామప్రశంస

వ.

ఆ మంత్రిశేఖరుండు, రావిపాటి త్రిపురాంతకదేవుం డనుకవీశ్వరుం
డొనరించిన ప్రేమాభిరామనాటకంబు ననుసరించి, క్రీడాభిరామం
బనురూపకంబు తెనుంగుబాస రచియించినవాఁడు,

33

తే.

ఆతఁ డెంతటివాఁడు? ప్రేమాభిరామ
మనఁగ నెంతటియది? దాని ననుసరించి
వీథి యనురూపకము మది వెఱపు లేక
తిప్పవిభు వల్లభుం డెట్లు తెనుఁగుఁ జేసె?

34


వ.

అని యాన తిచ్చెదరేని,

35


ఉ.

నన్నయభట్టతిక్కకవినాయకు లన్న, హుళిక్కిభాస్కరుం
డన్నను, జిమ్మపూఁడి యమరాధిపుఁ డన్నను, సత్కవీశ్వరుల్‌
నెన్నుదుటం గరాంజలులు నింతురు జే యని, రావిపాటి తి
ప్పన్నయు నంతవాఁడ, తగునా యిటు దోసపుమాట లాడఁగన్‌?

36

దేశభాషలందుఁ దెనుఁగు లెస్స

ఆ.

జనని సంస్కృతంబు సకలభాషలకును
దేశభాషలందుఁ దెనుఁగు లెస్స
జగతిఁ దల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాఁడుబిడ్డ మేలుగాదె?

37


వ.

నేపథ్యమునందు,

38

పాత్రప్రవేశసూచనము

చ.

“గతిరసికుండ! షట్చరణ! గానకళాకమనీయ! యో మధు
వ్రత! వికచారవింద వనవాటిక నేమిటికిం బరిత్యజిం
చితి? వటవీప్రదేశమునఁ [12]జెట్టులఁ జేమలఁ నేమి గల్గు నన్‌
రతి నిటు సంచరించెదవు? ప్రాఁబడిపోయెనె నీవివేకమున్‌?

39


ఆ.

చేర వచ్చి వచ్చి దూరంబుగాఁ బోదు,
డాయవత్తు దవ్వు పోయి పోయి,
మాట లింక నేల? మా పాలిటికి నీవు
మాయలేడి వైతి మంచిరాజ.”

40

సూత్రధారోక్తి

వ.

ఆకర్ణించి సూత్రధారుఁడు “హా! యే నెఱింగితి, నేకశిలానగరంబునం
దార్యవాటంబునం గామమంజరి యను పునర్భువునందు బద్ధాను
రాగుం డై, కార్యాంతరవ్యాసంగంబునం దేశాంతరగతుం డైన,
కాసల్నాటి గోవింద మంచనశర్మ నుద్దేశించి, యమ్ముద్దియ
పుత్తెంచిన యసంబంధీభూతప్రేమసంధుక్షణాగర్భం బైన
మదనలేఖ సందేశపద్ధతి యది; పఠియించుచున్నవాఁ డతని
కట్టనుంగుఁ జెలికాడు టిట్టిభసెట్టి గావలయు, నయ్యిరువురు
నాబాల్యమిత్రంబులు. వీరి యోగక్షేమంబు లనుసంధించెదం
గాక” యని నిష్క్రాంతుం డయ్యె.

41


ఇది ప్రస్తావన

క్రీడాభిరామము

కథాప్రారంభము

[కథాప్రారంభము : గోవింద మంచనశర్మ, టిట్టిభశెట్టి ప్రవేశము - శీతోపద్రవము - ప్రస్థానకాలోచితశుభ శకునములు - కోడి కూఁత - శీతకాలమునఁ బల్లెటూరిభోజనసౌష్ఠవము - కామమంజరి యలుక - ప్రావృట్కాల ప్రవాసఖేదము - తొలి సంజకెంజాయ - ప్రత్యూష సుషమ - శుభశకునములు - మేదర కరణ వేశ్యావిలాసములు - చెఱకువిలుకాని ములికి చండాలభామ - కర్ణాటి కలికితనము - సుసరభే త్తను వేడుక మందు నమ్ము జోటి - కాపుటిల్లాలి మౌగ్ధ్యము - కర్ణాటభామతో మంచనశర్మ ప్రౌఢసంవాదము - పాపద్యూతపర్యాలోకనము - సంపంగినూనె నమ్ము కరణకాంత - ములికినాటి తెలికి జోటి - కుట్టుపనివాని కొంటెచూపులు - ఈ రీర్చు చకోరనేత్ర - మగపోఁడిమి వైఖరితో బసపు నూరు పడఁతి సొబఁగు - ఓరుఁగల్లు మహానగరవైభవము - పలనాటి వీరగాథాగానాభినయము - పలనాటి వీరుల చరిత్ర - ఏకవీరాదేవి స్తుతి - మాహురమ్మ మహిమ - ఏకవీర యెదుటఁ బరశురామగాథాగీతిక - మాలెత ఏకవీరాకీర్తనము - కాపు పూవుఁబోఁడి కైసేఁత - జక్కులపురంధ్రి కామవల్లీస్తోత్రము - అక్కల యారాధనము మైలార వీరభటుల పటుసాహసకృత్యములు - గొరగపడుచు గొండ్లి యాట - మైలారదేవస్తుతి - నగర మందలి నానావిధదేవాలయములు - మంచన గావించిన భైరవస్తోత్రము - నిప్పులు చెఱఁగెడి బీరెండ - గడియారమ్మున ఘంటానాదము - పూటకూటింటఁ బుష్పశరుని దౌత్యము - ఆహారవిహారముల యభిరుచులు - పుష్పలావిక గేదఁగి పూవు కానుక - మాచల్దేవి చిత్రశాలాప్రవేశము - మంచన మాచల్దేవుల సరససంభాషణము - చిత్తజుని శౌర్య మెఁఱిగించు చిత్రశాల - మదనరేఖకు ముకురవీక్షామహోత్సవము - శ్రీకాకుళపుఁ దిరునాళ్ళలో నసమబాణుని స్వైరవిహారము - స్వచ్ఛందచారిణులకు మంచన దీవెన - మంచన కామమంజరి ననునయించుట - నాగరికుని నాగస్వరము - పాములాట - పాముల వెంగని నాగస్వరనైపుణి - తూర్పునాటి గడిఁడు - పొట్టేళ్ళపోరు, పందెములు - కోడి పందెముల వర్ణనము - మహి నుదయించిన గాంధర్వి మధుమావతి - మధుమావతి తొలి మలి జన్మరహస్యము - మదాలసవృత్తాంతము - మంచనశర్మ బోధించిన విటధర్మసూక్ష్మము - సాయంకాలవర్ణనము - బాలల బంగరుబంతుల యాట - నట్టువుని కోడలితో మంచన చతురోక్తి - చలిని సరకుగొనని సైరికుండు - అక్కలవాడలోని టక్కులాడులు - జారధర్మాసనమున విషయచర్చ - మంచనశర్మ న్యాయనిర్ణయము - సంధ్యాకాలమున ఆర్యవాటీప్రవేశము - మంచనశర్మ కామమంజరిని తలంచి వలవంతల పా లగుట - కామమంజరీసమాగమము - టిట్టిభసెట్టికిఁ దమ్మడిసానితోడి సాంగత్యము - చంద్రునకు జారదంపతుల సమర్చ- ఉపసంహారోక్తి (భరతవాక్యము) - ఆశ్వాసాంతగద్యము.]

గోవింద మంచన శర్మ, టిట్టిభసెట్టి ప్రవేశము

సీ.

గన్నేరుఁ బూఁజాయ కర మొప్పు నీర్కావి
                        మడుఁగు దోవతి పింజె విడిచి కట్టి,
గొజ్జంగిపూనీరు గులికి మేదించిన
                        గంగమట్టి లలాటకమునఁ దీర్చి,
వలచేత బంగారు జలపోసనముతోడఁ
                        బ్రన్నని పట్టుతోరము ధరించి,

42

జరిగొన్న [13]వెలిపట్టు జన్నిదంబుల లుంగ
                        యంటులు వాయంగ నఱుత వైచి,


తే.

తళుకు చెంగావి[14]కోకయు, వలుఁదశిఖయుఁ,
జిగురుబొమ్మంచు పెదవులు, చిన్నినగవు,
నంద మొందంగ వచ్చె గోవిందశర్మ,
మాధవునిపట్టి యొసపరి మన్మథుండు.

42


క.

కాసల్నాటి శ్రేష్ఠుఁడు,
మీసాలప్పయ్యగారి మేనల్లుఁడు, ధా
త్రీసురతిలకుఁడు, కుసుమశ
రాసనసముఁ, డంధ్రనగరయాత్రోన్ముఖుఁడై,

43


వ.

తూర్పుఁ గనుంగొని, టిట్టిభునిం జూచి, వయస్య! సుప్రభాతంబు!
సుఖనిద్ర యయ్యెనే? శీతం బుపద్రవంబు సేయదు గదా యీ
పుష్యమాఘంబులందు?

44

శీతోపద్రవము

ఉ.

ప్రక్కలు [15]వంచి వంచి, మునిపండ్లును బండ్లును [16]రాచి రాచి, ఱొ
మ్మక్కిలఁ [17]జేసి చేసి, తల యల్లనఁ గాళుల [18]నంది నంది, లో
చక్కికి [19]నొక్కి నొక్కి యిరుచంబడ, గుమ్మడి మూటగట్టి, వీ
పెక్కి దువాళి చేసి, చలి యిక్కడ నక్కడఁ బెట్టు వేఁకువన్‌.

45


ఉ.

కుమ్ములు హవ్యవాహములు, గుత్తపు సుగ్గడితంపు దోఁపు రెం
టమ్ములు, దట్టు పున్గు మృగనాభియుఁ జాఁదును నోడె నద్దిరా!
యమ్మకచెల్ల యింక నవయౌవనదర్పనఖంపచంబు లౌ
కొమ్మలచన్నులన్‌ సరకు గో నటులున్నవి వో తుషారముల్‌.

46


శా.

స్థూలద్విత్రిపటావకుంఠనముఁ, గస్తూరీరజఃపాళికా
కాలాగు ర్వనులేపనంబులను నుద్ఘాటించి, ధాటీగతిన్‌

బ్రాలేయంబు దువాళి సేసిన, భయభ్రాంతంబులై యూష్మముల్‌
వాలాయంబుగఁ బ్రాఁకె నంధ్రవనితావక్షోజశైలాగ్రముల్‌.

47


శా.

స్థూలద్విత్రిపటావకుంఠనములున్‌, ధూపోపచారంబులున్,
గాలాగుర్వనులేపనంబులు, వధూగాఢోపగూహంబులున్,
గేళీగర్భనికేతనంబులును గల్గెంగాక, లేకున్న నీ
ప్రాలేయాగమ మెవ్విధంబున భరింపన్‌ వచ్చురా టిట్టిభా?

48


వ.

శీతోపద్రవంబు లేక సుఖనిద్ర యయ్యెనే? యని యడిగి,
వేఁకువ యగుచున్నయది, కావున నిదియ మనకుఁ బ్రస్థానకాలం
బని, నిమిత్తం బనుసంధించి,

49

ప్రస్థానకాలోచితశుభశకునములు

ఉ.

చుక్క యొకింత నిక్కి, బలసూదను దిక్కున రాయుచుండుటన్‌
జక్కఁగ వేగ దిప్పుడు, నిశాసమయం బిది ప్రస్ఫుటంబుగా,
ఘుక్కని మాటిమాటికిని గోటఁడు వల్కెడు వామదిక్కునన్,
జొక్కటమై ఫలించు మన శోభనకార్యము లెల్లఁ టిట్టిభా!

50


క.

మాఁగిలి మాఁగిలి, వృక్షము
పూఁగొమ్మున నుండి షడ్జము ప్రకాశింపన్‌
లేఁగొదమ నెమలి పల్కెడుఁ
గేఁగో యని వైశ్య! మనకు గెలు పగుఁ జుమ్మీ!

51


తే.

గొనకొనం గోడి, యేట్రింత, కొంకనక్క,
నమిలి; యీ నాలుగిటి దర్శనంబు లెస్స,
వీని వల తీరుఁ బలుకు నుర్వీజనులకుఁ
‘గొంగు బంగార’ మండ్రు శాకునికవరులు.

52

కోడికూఁత

వ.

అనిన నాకర్ణించి టిట్టిభుఁడు,

53

ఉ.

మంచన! వింటివో వినవొ, మన్మథుఁ డేకశిలాపురంబులోఁ
జంచలనేత్రలం బతుల శయ్యలపై రతికేళి రాత్రి పో
రించి, ప్రభాతకాలము పరిస్ఫుట మైనను, ధర్మదార వ
ట్టించుచునున్నవాఁ డదె! కుటీగతకుక్కుటకంఠకాహళిన్.

54


వ.

అని యట వోయి ముందట,

55

శీతకాలమునఁ బల్లెటూరి భోజనసౌష్ఠవము

తే.

శీతకాలంబు కడి మాడ సేయఁ గుడుచు
భాగ్యవంతుండు ఱేపాడి పల్లెపట్లఁ,
[20]గ్రొత్తయోరెంబు నిగు రావకూరతోడఁ,
బిఛ్ఛిలంబైన నేతితోఁ, బెరుఁగుతోడ.

56

కామమంజరి యలుక

వ.

టిట్టిభ! తలంపునం బాఱె, నొక్కనాఁ డేనునుం గామమంజరియును
బ్రేమం బెలర్పఁ గలసి మెలసి, కూడి మాడి, పొంది పొసఁగి,
యనఁగి పెనఁగి, చొక్కి తక్కి యుండ, దైవవశంబున
గోత్రస్ఖలనంబు కారణంబుగా, నక్కాంతారత్నం బలిగిన,

57


గీ.

ఎట్టకేలకు నలుక రే యెల్లఁ దీర్చి,
యువిద యధరామృతము గ్రోలుచున్న నాకుఁ
బానవిఘ్నంబుగా మ్రోసెఁ, బాపజాతి,
జాతిచండాలమైన వేసడపుఁ గోడి.

58

ప్రావృట్కాలప్రవాసఖేదము

వ.

టిట్టిభ! యమ్మదనపట్టాభిషేకమత్తేభరాజగమన నట్టనడుమ
సురతకాలంబున వసంతసమయంబునం బాసి, మల్లికాధవ
ళాట్టహాసమహాకాళమూర్తి యగు తపర్తుసమయంబు లంఘిం
చితి, లాంగలీకుసుమకేసరపరాగరేణువిసరపిశంగితదశదిశా

హట్టం బగు వర్షాసమయం బెట్టకేలకుం గడిపితిఁ, బ్రావృట్కాల
ప్రవాసంబును మరణంబును రమణీరమణులకు నొక్కసమంబ,
యది యెట్టిదనిన:

59


మ.

పటుఝంఝాపవనోత్తృణాలయములో, భద్రంబునం బట్టె కం
కటిపై ముచ్చముడింగి, నిర్భరవియోగగ్లాని శోషించి, యె
క్కటి నిద్రించుచు నున్న పాంథవనితన్‌, గర్జావచఃప్రౌఢిమన్‌
దటిదుద్య్దోతము చూపు నట్టనడు రే ధారాధరశ్రేణికిన్‌.

60


వ.

అని మంచన మఱియును ప్రాగ్దిశాంచలము వీక్షించి,

61

తొలిసంజ కెంజాయ

తే.

దాసనపుఁబువ్వు చాయతోఁ ద్రస్తరించు
చుదయ మయ్యెడు నదె చూడు మొదలిసంజ,
సొబగు వీడినఁ గట్టెఱ్ఱ సోఁకినట్టి
కామమంజరి నెమ్మోము కాంతి వోలె.

62

ప్రత్యూషసుషమ

మ.

అదె మాణిక్యపుఁ బూర్ణకుంభము వయస్యా! కార్యసంసిద్ధికై
మొదలం దోఁచిన యట్టి మంచి శకునంబుంగా విచారింపరా!
యుదయం బయ్యెడు భానుబింబము దిశావ్యోమావకాశంబులన్
బదియార్వన్నెపసిండితీఁగలగతిన్‌ బ్రాఁకెన్ బ్రభాజాలముల్‌.

63


శా.

ఓరుంగంటిపురంబు సౌధములపై నొప్పారెడిన్‌ జూచితే
యీరెండల్‌? మణిహేమకుంభములతో నేకాంతముల్‌ సేయుచున్‌,
స్వారాజప్రమదాఘనస్తనభరస్థానంబులం బాసి, కా
శ్మీరక్షోదము, ప్రాణవల్లభదృఢాశ్లేషంబులన్‌ రాలె నాన్‌.

64


వ.

అనుదితనియమవ్రతంబు గావున నిట క్రితంబ సం
ధ్యాగ్నిహోత్రక్రియాకలాపంబులు నిర్వర్తింపంబడియె. నీవు
ముఖమజ్జనంబు సేసి, యిష్టదేవతాభివందనంబు గావించితివి

గదా? గోధూళి లగ్నంబునం బురంబు ప్రవేశింపవలయు,
విశేషించి యుషఃకాలంబు సర్వప్రయోజనారంభంబులకుఁ
బ్రశస్తంబు.

65

శుభశకునములు

తే.

గార్గ్యసిద్ధాంతమత ముషఃకాలకలన,
శకున మూనుట యది బృహస్పతిమతంబు,
వ్యాసమతము మనఃప్రసాదాతిశయము,
విప్రజనవాక్య మరయంగ విష్ణుమతము.

66


వ.

అని పరిక్రమించి, వెలిపాళెంబు కట్టకడపటఁ గటకారకుటీర
వాటికఁ బ్రవేశించి,

67

మేదర కరణ వేశ్యావిలాసములు

సీ.

ఎకసెక్కెముగ నాడు నేదైన నొకమాట,
                        పాడు నొయ్యన పాట పాట పాట,
యలఁతి యద్దపుబిళ్ళ యలవోక వీక్షించుఁ,
                        గొనగోరఁ బదనిచ్చి కురులు దీర్చుఁ,
బయ్యెద దిగజార్చి పాలిండ్లు పచరించు,
                        దిస్సువారగ నవ్వుఁ దీఁగ నవ్వు,
ధవళతాళపలాశతాటకంబులు త్రిప్పుఁ,
                        గలికిచూపులఁ జూపు గర్వరేఖ,


తే.

కటకుటీద్వార[21]వైణవకాష్ఠపీఠ
మధ్యభాగనిషణ్ణయై మదము మిగిలి,
వీటి పామరవిటుల ‘తంగేటి జున్ను’
కాము బరిగోల, మేదర కరణ వేశ్య.

68


క.

పుటభేదనబహిరంగణ
కటకశ్రీకారకూటకటకం బగు నీ

కటగారకులవధూటీ
కుటికాగారంబు, గరడి కుసుమాస్త్రునకున్‌.

69


క.

[22]గీసిన వెదురుసలాకల
నేసిన యిరుఁదల శిఖండి నిడు మంచమునం
దోసరిలి, కటకుటీరవి
లాసిని రమియించు మిండలసహస్రములన్‌.

70


ఉ.

పల్లవతస్కరుం డొకఁడు, ప్రాక్సముపార్జితతారపంక్తితో
వల్లువ మెత్తికొంచుఁ బెడవాకిట వెళ్ళిననాఁటనుండి, పా
టిల్లిన శంక, నీ కటకుటీరవిలాసిని యహ్హహా! పటీ
పల్లవకోణముల్‌ బిగియఁబట్టి, రమించును మిండగీలతోన్‌.

71


వ.

ఆ చేడియం జూచి, యట పోవం బోవ ముందట,

72

చెఱకువిలుకానిములికి చండాలభామ

శా.

గం డాభోగము పజ్జ లేనగవు శృంగారింపఁ గ్రేఁ గన్నులన్‌
మెండై మించు మెఱుంగుఁ జూపు గమి క్రొమ్మించుల్‌ పిసాళింపఁగాఁ,
జండాలాంగన వచ్చె నొక్కతె ఋతుస్నానార్థమై, యిక్షుకో
దండుం డేర్చినబాణమో యనఁగ సౌందర్యంబు నిండారఁగన్‌.

73


వ.

అట్లు పోవం బోవ ముందట,

74

కర్ణాటి కలికితనము

మ.

కటిభారంబును, జన్నుదోయి భరమున్‌ గల్పించె నా బ్రహ్మ పి
న్నటి కౌఁదీగకు మున్న, యిప్డు విమలార్ణఃపూర్ణమై యున్న యీ
ఘటిభారం బొకఁ డెక్కు డయ్యె ననినన్‌, గర్ణాటి క్రా ల్గన్నులన్‌
బటి తాళింపుచు నవ్వె, నీలకబరీభారంబు కంపింపఁగాన్‌.

75

వ.

అనుచు గోవింద మంచన శర్మ, నర్మసఖుండగు టిట్టిభుండును
దానును హట్టమార్గంబునం జనునప్పుడు,

76

సుసరభే త్తను వేడుకమందు నమ్ము బోటి

తే.

జిగురుటుండలు నించి, డా చేతియందుఁ
బెద్ద యేనుఁగు దంతంబు పెట్టెఁ బెట్టి,
యింతులకుఁ బ్రీతిగా మైల సంతలోన
‘సుసరభే’త్తని ఘోషించె జోటి యోర్తు.

77


వ.

ఇది యేమి ఘోషించుచున్నయది? కిరాటకులరత్నంబ! నీవు
తేటపడ నెఱింగి, మాకు నెఱింగింపు మనుచు మంచనశర్మ
యడిగిన,

78


చ.

ముసిముసినవ్వుతో నతని మోము గనుంగొని వైశ్యుఁ డి ట్లనున్‌;
రసికకులావతంసుఁడవు బ్రాహ్మణ! యింతకు మున్నెరుంగవే?
యసమశరాలయంబునను హత్తిన వెండ్రుక కప్పు వోవఁగా,
విసరు సమీరణం బయిన వేడుక మం దిది, కొందు రంగనల్‌.

79


సీ.

కమఠావతారంబుఁ గైకొన్న దైత్యారి
                        కమనీయచరమభాగంబు వోలె,
నాదియుగంబునం దావిర్భవించిన
                        జిననాథదేవుని శిరసు వోలెఁ,
గసటు వోవఁగఁ దోమి కడిగి బోరగిలంగఁ
                        బెట్టిన తామ్రంపుబిందె వోలెఁ,
గంగమట్టియతోడ సాంగత్య మెడలిన
                        నునుపారు మునిమిట్టనుదురు వోలెఁ,


తే.

జిఱుత ప్రాయంపునాఁటి సజ్జికపుఁ జాయ
తొలు సమర్తయకాలంపు విలసనమునఁ

దరుణులకుఁ బంచబాణమందిరము లమరు
సుసరభేత్తను నీ మందు సోఁకినపుడు.

80


వ.

ఇది నిర్యాసమయంబును, సరభేదనసమర్థంబును నగుటం
జేసి, సుసరభే త్తను నామంబు దీనికిం గలిగెఁ, గామనిల
యాఘాటరోమాటవీసముత్పాటనపరిపాటికై పాటల
గంధులు దీనిం బాటింతు రనుచు నెఱింగించి, యట పోవం
బోవ, ముందంట వెలిపాళెంబు మధ్యప్రదేశంబున, హాలికవాటి
యందు నొక్కచక్కని జవరాలు, కట్టెఱ్ఱ తొగరుం గఱ్ఱల యెఱ్ఱ
యొల్లియ నితంబభారంబున నమర్చి, బాలార్కకిరణసంప
ర్కంబునఁ, జాంపేయకుసుమచ్ఛదచ్ఛాయాదాయాదంబు
లైన యవయవంబులు మిసమిస మెఱవం, గుక్కుటాసనంబునం
గూర్చుండి,

81

కాఁపుటిల్లాలి మౌగ్ఢ్యము

ఉ.

[23]కందుకకేళి సల్పెడు ప్రకారమునం, బురుషాయితక్రియా
తాండవరేఖ చూపెడు విధంబునఁ బామరభామ, లేఁత యీ
రెండ ప్రభాతవేళ రచియించె, నితంబభరంబుఁ, జన్నులున్‌,
గుండలముల్‌, గురుల్‌, కదల గోమయపిండము లింటి ముంగిటన్‌.

82


వ.

అప్పామరభామారత్నంబు నుద్దేశించి,

83


తే.

పొలపములు లేవు కఱివంక బొమలయందుఁ,
జిన్ని నగవులు లేవు లేఁ జెక్కులందుఁ,
గలికితనములు లేవు క్రా ల్గన్నులందుఁ,
గాఁపుటిల్లాండ్ర కిట్టి మౌగ్ధ్యముల యొప్పు.

84


వ.

అట చని, వీథీవిటంకంబునఁ డిట్టిభుండు విటపేటికాప్రకాఘటిత

కృకాటికానికటచేటికానుయాత యగు కర్ణాటాంగనం
గనుంగొని,

85


మ.

[24]కుసుమం బెట్టిన చీరకొంగు వొలయన్, గ్రొవ్వారుపాలిండ్లపైఁ
ద్రిసరంబుల్‌ పొలుపార, వేణి యవటూదేశంబుతో రాయ, న
ప్పస మెవ్వాఁడొ యొకండు రాత్రి సురతప్రౌఢిం దనుం దేల్చినన్‌,
వసివా ళ్వాడుచు వచ్చుచున్నయది కర్ణాటాంగనం జూచితే?

86


తే.

వాహకుం డెక్కి విడిచిన వారువంపుఁ
గొదమయును బోలి, రతికేళి మదము డిగ్గి,
యలసభావంబుతోడఁ గర్ణాటవేశ్య
వచ్చుచున్నది యదె విప్రవర్య! కంటె?

87


ఉ.

ఈమరి, యింక నొక్కమరి, యింకొకమా, ఱిఁకనొక్కమాఱు, ‘నా
నోములపంటగా!’ యనుచు [25]నోవులఁ బెట్టుచు, రే యొకండు నా
ల్జాములు దీనితోఁ గుసుమసాయకతంత్రము సల్పఁబోలు, లే
దా మృగశాబనేత్ర యఖిలాంగకముల్‌ వసివాళ్ళు వాడునే?

88

కర్ణాటభామతో మంచనశర్మ సంవాదము

వ.

అనిన, మందస్మితంబుతో గోవింద మంచనశర్మ నర్మగర్భంబుగా
దర్భాంకురాలంకృతంబు లగు తన కరపంకజంబులం గర్ణ
పుటంబులు ముట్టుకొని, పూతిమాషగోత్రంబును మంచన
నామధేయంబునుం జెప్పి, నమస్కరించి యి ట్లనియె:

89


శా.

పంచారించిన నీ పయోధరము లాస్ఫాలింతునో? లేఁతబొ
మ్మంచుం గెంజిగురాకుమోవి ణిసిధాత్వర్థం బనుష్టింతునో?
పంచాస్త్రోపనిషద్రహస్యపరమబ్రహ్మస్వరూపంబు నీ
కాంచీదామపదంబు ముట్టుదునొ? యో కర్ణాటతాటంకిణీ!

90

క.

వ్రాలని నీ చన్నులతో,
వ్రాలెడు జక్కవలు సరియె? వలలం బెట్టం
జాలెడు నీ కన్నులతో
బాలకి! సదృశములె వలలఁ బడు మత్స్యంబుల్‌?

91


శా.

చాటుప్రౌఢిఁ బిసాళ మాడెదవు కాసల్నాటి బాఁపండవో?
శాటీహాటకనిష్కముల్‌ వెలిగ జంఝాటంబు చాలించు, క
ర్ణాటస్త్రీలు కటారికత్తియలటే రాపాడఁగాఁ బట్టఁగా?
డా టా లీడ గుణింపరాదు పెఱ చోటం బోలెఁ బైపాటునన్‌.

92


తే.

దిట్ట బాఁపండు నడువీథిఁ దెగడి పలికెఁ,
గూట మీక్షింపఁ దెమ్ము కిరాట! నేఁడు
పన్నిదము వీని మెడ నున్న జన్నిదములు,
సవరగా గ్రుత్తుఁ గ్రొత్త పుంజాలదండ.

93


వ.

అనుటయు విప్రుం డి ట్లనియె:

94

.

సీ.

ముసుఁగు పెట్టిన నేమి! ముత్యాల కమ్మల
                        క్రొమ్మించు లీలలు కులుకరించె,
మోము వంచిన నేమి! మొలకనవ్వుల కాంతి
                        చెక్కుటద్దములపై జీరువాఱెఁ,
జూడకుండిన నేమి! సొబఁగు ఱెప్పల మించి
                        తేట వాల్మెఱుఁగులు దిచ్చరించెఁ,
జాటు చేసిన నేమి! చక్రవాకులఁ బోలు
                        పాలిండ్ల మెఱుఁగులు బయలుపడియె,


తే.

సిగ్గు నటియించి, మావేడ్క చిన్నపుచ్చి,
యేల యిటు [26]పిసాళించె? దిం దేమి సిద్ధి?
కాముసామ్రాజ్యపట్టంబు గట్టి, నన్నుఁ
గౌఁగిలింపంగఁ గదవె! యో కరణకాంత!

95

వ.

అని చిఱునవ్వు నవ్వుచు గోవింద మంచనశర్మ, నర్మసఖుండును
దానును నట పోవఁ బోవ ముందట,

96

పాపద్యూతపర్యాలోకనము

మ.

పరివేష్టించి ప్రజాకదంబకము పై పై వ్రాలి వీక్షింపఁగాఁ,
బరహస్తంబున నొత్తుకాండ్రు నపలాపప్రౌఢి బోధింపఁ, బా
మరులై పన్నిదమాడి యోడి, మఱి దుర్మానంబుతో నాట గొ
ల్పిరి, వేశ్యావలయాభిసంవళిత మువ్విళ్ళూర్చె గోవిందునిన్‌.

97


శా.

సంగాసంగజయాజయంబు, పరిహాసప్రస్ఫుటాశ్లీలభా
షాంగం, బాకలితాంతరావలయకక్ష్యాభాగముద్రాలస
ద్భంగీనిష్టితకాష్ఠశంకుకము, పాపద్యూత, మీ పన్నిదం
బంగీకారము సేయువారి మొలలం బ్రాపించుఁ గౌపీనముల్‌.

98


తే.

నీకు నౌ నీకు నౌ నంచు నెమకి నెమకి,
ముగుద లగువారి భ్రమియించు, మోసపుచ్చుఁ
బశ్యతోహరుఁ, డత్యంతపాపబుద్ధి
పట్టణములోఁ దగుల్పరి పందెగాఁడు.

99

సంపంగినూనె నమ్ము కరణకాంత

వ.

అనుచు నట ముందట శతానందగేహినీకరరుహప్రరోహశిఖర
ముఖరవీణాక్వాణపాణింధమం బైన మధురస్వరంబున,

100


సీ.

విజ్జోడు పడ విడ్డ వెండ్రుక జందెంబు
                        వలి గుబ్బపాలిండ్ల కెలఁకు లొరయఁ,
గరమూలమున వెండి మొరవంకకడియంబు
                        మూఁడుమూలల లింగముద్ర లొత్త,
జంగాళముగఁ బింజె సవరించి కట్టిన
                        మడుఁ గొంటిపొరను లోఁదొడలు మెఱయ

బలితంపు విచ్చుటాకుల దుద్దుఁగమ్మలు
                        నిద్దంపుఁజెక్కుల నీడఁ జూడ,


తే.

నోరుఁగంటిపురములో, నోరఁ గ్రంతఁ,
పెద్దయెలుఁగున నమ్మె సంపెంగనూనె,
కోకిలము పంచమశ్రుతిఁ గొసరినట్లు
కనుమ యవ్వలిదేశంబు కరణకాంత.

101

ములికినాటి తెలికిబోటి

తే.

పలికినప్పుడు తేనియ లొలికి పడెడు,
జళుకుఁ జూపులఁ గ్రొమ్మించు లులికి పడెడు,
ములికినాటిది కాఁబోలుఁ జెలి! కిరాట!
కలికి, చిలుకలకొలికి, యీ తెలికిజోటి.

102


ఉ.

ఈ నళినాక్షి, తాఁ దిరుపుటెద్దు ప్రతోదము మోసి రొప్పుచున్‌,
గానుగపట్టెపైఁ దిరుగఁ గట్టిడిఁ, డిట్టిభ! మంథరాద్రిమం
థానకమథ్యమానతిమిధామజలభ్రమిమండలం బధి
ష్టానముగా భ్రమించు నల సంపదచేడియఁ బోలకుండునే?

103


ఉ.

[27]మీనవిలోచనంబులును, మీఁటిన ఖం గనుగుబ్బచన్ను, లిం
పైన వచో౽మృతంబు, సొగసైన మదాలస మందయానముం
గా నొనరించి, దీని గణికామణిఁ జేయక నిర్దయాత్ముఁడై
గానులదానిఁ జేసిన వికారవిధిం దల మొత్తఁగాఁ దగున్‌.

104


వ.

అట యుత్తరంబునం గత్తెర నొత్తి, పెక్కువన్నెలపొత్తుల
బహువిధనర్తనల హత్తించి, యెత్తి కట్టిన పూగుత్తులు, మత్త
కోకిలకలహంసదాత్యూహవ్యూహంబులుం గలిగిన [28]మోహరి
వాడయందు,

105

కుట్టుపనివాని కొంటెచూపులు

చ.

కొలుచును, జేన వెట్టుఁ, గుచకుంభయుగం బెగడిగ్గఁ గన్ను గ్రే
వలఁ బరికించు, గక్షముల వైచును దృష్టులు మాటిమాటికిన్,
గలికితనంబునం దఱచుగా నగు సౌచిక పల్లవుండు, గం
చెల [29]వెసఁ గుట్టి యీఁడు వెల చేడియకున్‌, విషయాభిలాషియై.

106


వ.

అనుచు నవ్వాడ గడచి, యట యుత్తరంబు సనునప్పుడు
ముందట నొకయింటిమఱుంగున మచ్చెకంటిం బొడగని,

107

ఈ రీర్చు చకోరనేత్ర

ఉ.

సారెకు సారె కేమిటికిఁ జంపెదు గోరఁట యెఱ్ఱలైన వా
లారు నఖాంకురంబుల వయస్య కచంబునఁ, బాట పాడి, యీ
రీరిచి, సీత్కృతుల్‌ చెవుల కిం పొనరింపఁ జకోరనేత్ర! నీ
చారుకుచద్వయంబు మముఁ జంపెడు దోసము నీకుఁ జాలదే?

108


వ.

అనుచు నయ్యింటిముందట,

109

.

మగపోఁడిమి వైఖరితోఁ బసపు నూరు పడఁతి సొబగు

మహాస్రగ్ధర.

పరిపాటీఖర్వఖర్జూపరతిసమయసంభ్రాంతసంభోగభంగిన్‌,
దరుణీరత్నంబు హేలాతరళగతి హరిద్రారజఃకర్దమంబుం,
గురు లల్లాడంగ, వీఁగుం గుచములు కదలం గొంతు కూర్చుండి నూఱెన్‌
గరవల్లీకాచభూషాకలమధురఝణాత్కారముల్‌ తోరముల్‌ గాన్‌.

110

వ.

అని యచ్చోటు వాసి, బాహ్యకటకవీథీవిటంకంబు నతిక్రమించి,

111

ఓరుఁగల్లు మహానగరవైభవము

సీ.

 సప్తపాతాళవిష్టపమహాప్రస్తాన
                        ఘంటాపథం బైన గనపపరిఖ,
తారకామండలస్తబకావతంసమై
                        కనుచూపు గొనని ప్రాకారరేఖ,
పుంజీభవించిన భువనగోళము భంగి
                        సంకులాంగణమైన వంకదార,
మెఱుఁగుఱెక్కలతోడి మేరుశైలముఁ బోలు
                        పెనుబైఁడితలుపుల పెద్దగవని,


తే.

చూచెఁ, జేరెఁ, బ్రవేశించెఁ, జొచ్చెఁ, బ్రీతి,
సఖుఁడు, దానును రథఘోటశకటకరటి
యూథసంబాధముల కొయ్య నోసరిలుచు,
మందగతి నోరుఁగల్లు గోవిందశర్మ.

112


వ.

ప్రవేశించి, టిట్టిభనామధేయుండైన కోమటిసెట్టిగారితో నాతఁ
డి ట్లనియె:

113


సీ.

రాజమార్గంబు వారణఘటాఘోటక
                        శకటికాభటకోటిసంకులంబు,
ధరణీస్థలీరజస్త్రసరేణుబహుళంబు
                        కావున మనమందుఁ బోవవలదు,
క్రంతత్రోవల నొండు కలకలంబులు లేవు,
                        తఱచుగా సుఖవినోదములు గలవు,
మఱియు విశేషించి మన్మథకూటమౌ
                        వేశ్యవాటిక మధ్యవీథి దఱిసి,


తే.

చిత్తనమున కెక్కినట్టి లంజియలతోడ
సరససల్లాపసౌఖ్యంబు సలుపవచ్చు

నంత, మధ్యాహ్నసమయమౌ, నపుడు గాని
వేడుకై యుండ దక్కలవాడ సొరఁగ.

114


తే.

అనినఁ, డిట్టిభుఁ డౌ నంచు ననుసరింప,
నాలువరి క్రింది త్రోవగా నరిగి యరిగి,
విప్రుఁ డీక్షించెఁ బలినాఁటి వీరపురుష
పరమదైవత శివలింగ భవనవాటి.

115

పలనాటి వీరగాథాగానాభినయము

మ.

ద్రుతతాళంబున, వీరగుంఫితక ధుం ధుం ధుం కిటాత్కారసం
గతి వాయింపుచు, నాంతరాళికయతిగ్రామాభిరామంబుగా
యతి గూడన్, ద్విపదప్రబంధమున వీరానీకముం బాడె నొ
క్కతె, ప్రత్యక్షరముం గుమారకులు ఫీట్కారంబునం దూలఁగన్‌.

116


సీ.

గర్జించి, యరసి, జంఘాకాండయుగళంబు
                        వీరసంబెటకోల వ్రేయు నొకఁడు,
ఆలీఢపాదవిన్యాస మొప్పఁగ వ్రాలి
                        కుంతాభినయముఁ గైకొను నొకండు
బిగువుఁగన్నుల నుబ్బు బెదరుఁజూపులతోడ
                        ఫీట్కార మొనరించుఁ బెలుచ నొకఁడు,
పటుభుజావష్టంభపరిపాటి ఘటియిల్ల
                        ధరణి యాస్ఫోటించి దాఁటు నొకఁడు,


తే.

 ఉద్ది ప్రకటింప నొక్కరుం డోల వాఁడు,
బయలు గుఱ్ఱంబు భంజళ్ళఁ బఱపు నొకఁడు,
కొడుము దాటింపుచును బెద్దగొలువులోనఁ
బడఁతి పల్నాటివీరులఁ బాడునపుడు.

117

పలనాటి వీరుల చరిత్ర

ఆ.

కులము దైవతంబు గురిజాల గంగాంబ,
కలని పోతులయ్య చెలిమికాఁడు,
పిరికికండ లేని యఱువది యేగురు
పల్లెనాటి వీరబాంధవులకు.

118


గీ.

ఆరువల్లి [30]నాయురాలి దుర్మంత్రంబు,
కోడిపోరు, చాపకూటికుడుపు,
ప్రథమకారణములు పల్నాటి యేకాంగ
వీరపురుషసంప్రహారమునకు.

119


ఉ.

పచ్చని పిండిగందమును, బాలము సేసయు, నెఱ్ఱపూవులన్‌
గ్రుచ్చిన కంఠమాల్యములు, [31]గొప్పఁగ నల్లిన వేణిబంధముల్‌,
కుచ్చుల వీరసంబెటయుఁ, గ్రొత్తమణుంగఁగు కాసెపుట్టము
న్రచ్చల కెక్కినట్టి రవణంబులు, వీరకుమారకోటికిన్‌.

120


క.

నల్లంగొండయు, నాగరి
కల్లును ధరణీస్థలిం బ్రగల్భస్థలముల్‌;
పల్లేఱు, నాగులేఱును
బల్లె క్ష్మాకాంత యెల్ల ప్రారంభమ్ముల్‌.

121


సీ.

“ఇచ్చోట భుజియించి రేకకార్యస్థులై
                        సామంతనృపతులు చాపకూడు,
ఇచ్చోటఁ జింతించె నిచ్చ నుపాయంబు
                        నళినాక్షి యార్వెల్లి నాయురాలు,
నిజ మను శుద్ధికై నిప్పులయేటిలో
                        నోలాడె నిచ్చోటఁ బీలసాని,
యిచ్చోటఁ బోరిరి యిల పణంబుగ గొల్ల
                        సవతితల్లులబిడ్డ లవనిపతులు,

తే.

ధీరు లగువార లేవురు వీరపురుషు
లై, మదోద్ధతి నిచ్చోట నాజిఁ బడిరి”
యనుచుఁ జెప్పుదు రైతిహ్య మచట నచట,
జనపపెద్దలు పల్లెదేశములయందు.

122


ఉ.

చిత్తము గూర్చి మాచెరల చెన్నుఁడు, శ్రీగిరిలింగముం గృపా
యత్తతఁ జూడఁ [32]బల్లెవిషయంబున కా మహిమంబు చెల్లెఁగా,
కుత్తరలోన మింట జల ముట్టిన మాత్రన, నాపఱాలలో
విత్తిన యావనాళ మభివృద్ధి ఫలించుట యెట్లు చెప్పుమా?

123


మ.

“మగసింగంబులు సంగరాంగణములన్‌ మత్తిల్లి రున్మత్తులై
జగదేకస్తుతు” లంచు నేమిటికి సంశ్లాఘింప? నా భూమిలోఁ
జిగురుంబోఁడులఁ, గాఁపుగుబ్బెతల నక్షీణప్రభావంబునన్‌
మగసింగంబులఁగా నెఱుంగుదురు పుంభావప్రసంగంబులన్‌.

124


తే.

కోలదాపునఁ ద్రిక్కటిఁ గూడియున్న,
గచ్చు చేసిన చిత్రంపుగద్దెపలక
వ్రాసినా రదె చూడరా వైశ్యరాజ!
శీలబ్రహ్మాదివీరనాసీరచరిత.

125


వ.

ఈ వీరపురుషులు మనకుం గార్యసిద్ధి సేయుదురు గాక! పద
పద మనుచుం గతిపయపదంబు లరిగి, నింబపల్లవనికురంబ
సందానితవందనమాలికాలంకృతద్వారం బగు నేకవీరాగార
గోష్ఠంబు గనుంగొని,

126

ఏకవీరాదేవి స్తుతి

సీ.

వందనం బిందిరావరు కన్నతల్లికి,
                        దండంబు ఫణిరాజమండనకును,

నంజలి సోమసూర్యానలనేత్రకు,
                        నభివందనము జగదంబికకును,
మొగుపుఁజేతులు దేవమునిసిద్ధసేవ్యకు,
                        జమదగ్నిగారాపుసతికి శరణు,
జోహారు రమణీయశోభనాకారకు,
                        నమితంబు గిరిరాజనందనకును,


తే.

నిత్యకల్యాణి, కలికులనీలవేణి,
కాదిశక్తికి, వేదవేదాంతసార,
కేకవీరకుఁ, బూర్ణరాకేందుముఖికి,
నఖిలజననికి సాష్టాంగ మనుదినమ్ము.

127


సీ.

పద్మలోచన, భృగుబ్రహ్మసంయమివంశ
                        పరిపాటి కభినవాభరణ మయ్యె,
రమణి, త్రేతాద్వాపరముల సంధ్యావేళ
                        మగనితోఁ బెక్కేండ్లు మనుపుమనియె,
నెలఁత, కానక కన్ననెయ్యంపుఁగొడుకుచేఁ
                        జంపించె ముయ్యేడుసారె [33]నృపుల
తరుణి, హైహయరాజదంతాస్థిపటలంబు
                        గవడపేరుగఁ జేసి కట్టె నఱుత,


తే.

మండపాకను, బెనుఁబాక, మాహురమున,
నాగవరమునఁ, బోలాస ననిచె నింతి,
యోరుఁగంట వసించె నీలోత్పలాక్షి,
కాకతమ్మకు సైదోడ యేకవీర.

128

మాహురమ్మ మహిమ

సీ.

అలగి యెంతటిరాజు నాండ్రనైనను బట్టి
                        పుట్టుఁబాపలఁ జేయు రట్టుకత్తె,

ఘనుఁడైన జమదగ్ని మునినాథు కూరిమి
                        వెలయించు పెనుఁబాక వేడ్కకత్తె,
సుక్షత్రియకులంబు నిక్షత్రముగఁ జేయు
                        కొడుకుఁ గాంచినయట్టి కోపకత్తె,
బవనీల జవనిక పాటల నిల్లాండ్ర
                        రమణఁ ద్రుళ్ళాడించు రంతుకత్తె,


తే.

యోలిమిఁ గదుళ్ళవాఁగులో నోలలాడు
కలికి పల్లిక దేబెలఁ గన్నతల్లి,
వాసి కెక్కినయట్టి పోలాస యిల్లు
చక్కమెప్పుల మాహురమ్మక్కనాచి.

129

ఏకవీరయెదుటఁ బరశురామగాథాగీతిక

సీ.

కక్షనిక్షిప్తవికస్వరస్వరవిలా
                        సశ్రీనివాసంబు జవని కందుఁ
గట్టిన తంత్రికిఁ గంఠశ్రుతికిఁ గూడఁ,
                        జొక్కంబుగా నారి సొబగు మీఱ,
నాలాపముల శుద్ధసాళగసంకీర్ణ
                        వివిధరాగంబుల చవులు చూపి,
డమడమధ్వనులఁ బొటారించి, యెడనెడఁ
                        గత్తెరమార్గంబు బిత్తిరిల్ల,


తే.

వాద్యవైఖరిఁ గడు నెఱవాది యనఁగ,
నేకవీరామహాదేవియెదుట నిల్చి,
పరశురాముని కథలెల్లఁ బ్రౌఢిఁ బాడెఁ
జారుతరకీర్తి, బవనీలచక్రవర్తి.

130

మాలెత – ఏకవీరాకీర్తనము

మ.

అలరుంబోఁడి జనంగమప్రమద మ డ్వానద్ధఘంటాధ్వనుల్‌
చెలఁగం బాడె సమస్తలోకజననిన్‌, శ్రీయేకవీరాంబికన్‌;

వలరా జొక్కొక మూర్ఛనాస్వరమునన్‌ బ్రాణంబు గల్పింపఁగాఁ,
గలకంఠీకలకంఠకోమలకుహూకారంబు తోరంబుగన్‌.

131


మ.

అకలంకస్థితిఁ గోరి కొల్చెదరు బ్రహ్మానందభావంబునన్‌
సకలానందమయైకమాత యగుచున్‌ సంతోషచిత్తంబునన్‌
[34]తక దుం దుమ్ములు, తాళముల్‌, జవనికల్‌, తందాన, లమ్మయ్యకు
న్నెకవీరమ్మకు, మాహురమ్మకు, నథోహ్రీంకారమధ్యాత్మకున్‌.

132


శా.

ఆలోకింపక మ్రొక్కరాదు నిజభక్య్తావేశసంపత్తిమై,
నాలోకించినఁ జిత్త మెట్లగునొ కామావేశసంయుక్తిమై?
నేలాగోయి కిరాట? మానుదమొ? సంవీక్షింతమో? చెప్పుమా!
వ్రీళాశూన్య కటీరమండలము దేవీశంభళీవ్రాతమున్‌.

133

కాఁపు పూవుఁబోఁడి కైసేఁత

సీ.

[35]జఱివోని గడితంపుఁ జిఱుతచౌకంబుల
                        తొగరుఁబుట్టము కచ్చఁ దొడివి కట్టి,
యోలగందపుబొట్టు నుపరిభాగంబుపై
                        సిందూరతిలకంబుఁ బొందుపరచి,
పసరు దారెడు నింబపల్లవంబులదండ
                        గుబ్బచన్నులమీఁదఁ గుదురుగొల్పి,
క్రొత్త తోమిన దంతకోరకంబులయందుఁ
                        తాంబూలరాగంబు తళుకు గూర్చి,


తే.

సకలసంధ్యంగములకుఁ దేజంబు గలుగ,
మధుమదారంభ మణఁకువ మరలఁ ద్రోవఁ
దేఁకువయు నారజంబునుఁ దేటపడఁగఁ
బురమునకు వచ్చె నొకకాఁపుఁ బూవుఁబోఁడి.

134

వ.

అయ్యవసరంబున నేకవీరాంబకుం బ్రణమిల్లి, యట చను
నప్పుడు,

135

జక్కులపురంధ్రి – కామవల్లీస్తుతి

సీ.

కోణాగ్రసంఘర్షఘుమఘుమధ్వని తార
                        కంఠస్వరంబుతో గారవింప,
మసిబొట్టు బోనాన నసలు కొల్పిన కన్ను
                        కొడుపుచేఁ దాటించు నెడప దడప
శ్రుతికి నుత్కర్షంబుఁ జూపంగ వలయుచోఁ
                        జెవిత్రాడు బిగియించు జీవగఱ్ఱ,
గిల్కుగిల్కున మ్రోయు కింకిణీగుచ్ఛంబు
                        తాళమానంబుతో మేళవింప,


తే.

రాగముననుండి లంఘించు రాగమునకు,
నురుమ యూరుద్వయంబుపై నొత్తిగిల్లఁ
గామవల్లీ మహాలక్ష్మి కైటభారి,
వలపు వాడుచు వచ్చె జక్కులపురంధ్రి.

136

అక్కల యారాధనము

సీ.

ముద్రికామాణిక్యములదీప్తి కెంగేలి
                        పించెంబు గుంచెతో బిత్తరింప,
నుపవాసమునఁ దద్దయును సన్ననగు కౌను
                        చనుదోయి భరమున జలదరింపఁ
దోఁకచుక్కలఁ బోలు తోరంపుఁ దెలికన్ను
                        [36]లావైళమున సిగ్గు నతకరింప,
నిద్దంపువెలిపట్టు నెఱిక దూలిన యప్డు
                        తొడలమించులు వెలిఁ దొంగలింప,


తే.

నురుమచప్పుళ్ళకును బిల్లబురులమ్రోఁత
కంతకంతకు బేరుబ్బు నావహింప

నాడెఁ బీటలపై నోలిఁ గూడియున్న
యక్క లేడ్వురలో నొక్కయలరుఁబోఁడి.

137


చ.

హర! హర! యింత యొప్పునె మహారభటిన్‌ జగఝంకృతస్వన
న్మురళిని మిశ్రితాంకరవమూర్ఛలఁ [37]జిత్తము లుబ్బి, యక్క లే
డ్వురు నదె యాడఁజొచ్చిరి కడుంగడు వేడ్క, సమున్నమత్పయో
ధరయుగభారభీరుతమతన్వవలగ్నము లైననృత్యముల్‌.

138


వ.

ఇదె మాయింటియజమానుండు సంతానకాంక్షియై, ప్రతిబంధనోద
నార్థంబు యక్షకన్యలం బరీక్షారాధనంబు సేయుచున్నవాఁడు
గావలయు. మాణిభద్రకులోద్వహు లైనదేవతలు కామవల్లి శ్రీమహా
లక్ష్మితోఁ గూడి యపేక్షితకార్యంబు మనకు నవ్యాక్షేపంబునం
జేయుదురుగాక! యనుచు విశ్వాసంబుతో నమస్కారంబు సేసి,
కాసల్నాటి గోవిందమంచనశర్మ, నర్మసఖుండు దాను నట చని
ముందట,

139


ఆ.

మంద్రమధ్యతారమానత్రయాభిన్న
మహిషశృంగనాదలహరిఁ గూడి,
డమరు డిండిమంబు డమడమ ధ్వని మ్రోసె,
నద్భుతం, బ దేమి యార్భటంబు?

140


వ.

అని టిట్టిభుం డడిగిన,

141

మైలారవీరభటుల పటుసాహసకృత్యములు

సీ.

ఱవఱవ మండు నెఱ్ఱనిచండ్రమల్లెల
                        చోద్యంపుగుండాలు చొచ్చువారు,
కరవాఁడియలుఁగుల గనపపాఁతర్లలో
                        నుట్టిచేరులు గోసి యుఱుకువారు,

గాలంపుఁగొంకిఁ గంకాళచర్మము గ్రుచ్చి
                        యుడువీథి నుయ్యెల లూఁగువారు,
కటికిహొన్నాళంబు గండకత్తెర పట్టి
                        మిసిమింతులును గాక మ్రింగువారు,


తే.

సందులను నారసంబులు సలుపువారు,
యెడమ కుడిచేత నారతు లిచ్చువారు,
సాహసము మూర్తి గైకొన్న సరణివారు,
ధీరహృదయులు, మైలారవీరభటులు.

142

గొరగపడుచు గొండ్లియాట

తే.

వీరు మైలారదేవర వీరభటులు,
గొండ్లి యాడించుచున్నారు, గొరగపడుచు
నాడుచున్నది చూడు [38]మర్ధాభినయము,
తాను [39]నెట్టికసీలంత గాని లేదు.

143


చ.

వెనుకకు మొగ్గవ్రాలి, కడువిన్నను వొప్పఁగఁ దొట్టెనీళ్ళలో
మునిఁగి, తదంతరస్థమగు ముంగర ముక్కున గ్రుచ్చుకొంచు లే
చెను, రసనాప్రవాళమున శీఘ్రము గ్రుచ్చెను నల్లపూసపే
రనుపమలీల, నిప్పుడు నుపాయము లిట్టివి యెట్టు నేర్చెనో?

144

మైలారదేవస్తుతి

సీ.

శనివారసిద్ధి, సజ్జనపారిజాతంబు,
                        వరదాత, యాదిత్యవారభోగి,
మాడచీ[40]రమణుంగు మాయావినోదుండు,
                        మాళవీప్రియభర్త, మహితయశుఁడు
పల్లెమ్మనాయకుం, డెల్లవేల్పులరాజు,
                        గనపవేఁటల వేడ్కకాండ్ర భర్త,

కత్రశాలస్వామి, కరుణాపయోరాశి,
                        పుణ్యకీర్తనుఁడైన ప్రోలియయ్య,


తే.

మంచు కుంచాలఁ గొలువంగ, మాయలేళ్ళఁ
బట్టి కట్టంగ నేర్చిన బాసవెల్లి,
భైరవుని తోడిజోడు, మైలారదేవుఁ,
డోరుఁగంటినివాసి మే లొసఁగుఁ గాక!

145


మ.

అదిగో యెత్తినవారు పట్టణముమధ్య క్షోణిసింహధ్వజం!
బదిగో కట్టినవారు నింబదళమాల్యాతోరణవ్రాతముల్‌!
విదితం బయ్యె మహోత్సవంబు, నెఱయన్‌ వీథీవిటంకంబులం
దదిగో! నిల్పినవారు పూర్ణకలశం బాబాలవృద్ధాంగనల్‌.

146


మ.

అకలంకస్థితి శీధుపానరుచులై యాసాదు లుప్పొంగి “యో
యకరో! యమ్మకరో! యమక్కరొ! యదీ! యట్టట్టకో!” యంచుఁ బా
యక తప్పెట్లును, దళ్ళెతాళములు నింపై సొంపు రంపిల్లఁగా
జకజుంజుం జకజుంజు జుమ్ము మనుచున్‌ సాగుం గడున్‌ వాద్యముల్‌.

147


వ.

అట చని ముందట,

148

నగరమందలి నానావిధదేవాలయములు

సీ.

అదె భైరవస్థాన! మటమీఁద నల్లదె
                        చమడేశ్వరీ మహాశక్తి నగరు!
వీరభద్రేశ్వరాగారమంటప మదె!
                        యదె బౌద్ధదేవువిహారభూమి!
అదె ముద్దరా ల్ముసానమ్మనివాసంబు!
                        నల్లదె కొమరుసామయ్యనగరు!
అదె పాండవులగుడి! యట దక్షిణంబునఁ
                        గర్తారుఁ డుండు తుర్కలమసీదు,

తే.

కొంతదవ్వుల నదె మహాగోపురముల
పైఁడికుండలు రవిదీప్తిఁ బ్రజ్వలించి,
కాననయ్యెను మేరుశృంగములఁ బోలెఁ
గేశవశ్రీ స్వయంభూనికేతనములు.

149


వ.

అనుచు నట జని, ముందట నొక్కభైరవాలయంబుఁ బొడగని,
నమస్కరించి, కాసల్నాటి మంచనశర్మ యి ట్లనియె:

150

మంచన గావించిన భైరవస్తుతి

మ.

అమితోత్సాహముతోడ నీవు పటుబాహాఢక్క నొక్కొక్కమా
టు మనాక్కంపము నొందఁ జేయఁ, దొలఁకాడున్‌ వార్ధి వేలాలుఠ
త్కమఠం బై, వలమానమీన మయి, యుద్యన్నక్ర మై, యుత్తర
త్తిమి యై, యుల్లలదంబుమగ్నఢులి యై ధీరా! మహాభైరవా!

151


వ.

అని యూర్థ్వం బవలోకించి యిప్పుడు మధ్యాహ్నకాలం బగుచున్నయది.

152

నిప్పులు చెఱఁగెడి బీరెండ

శా.

వ్రాలెన్‌ దిక్కులు, భానుభావ్యతికరప్రక్రీడదర్కోపల
జ్వాలాజాలజటాలజాంగలతటీవాచాలకోయష్టు లై,
రోలంబంబులు మూతి ముట్ట వెఱచెన్‌ గ్రొవ్వేడి బీరెండలన్‌
జాలం గ్రాఁగి కరంబు వేడి యగు కాసారాబ్జమైరేయముల్‌.

153


వ.

అని, యనంతరం బాకాశంబునం జెవి వెట్టి, శ్రుతి నభినయించి
గోవిందుండు.

154

గడియారమ్మున ఘంటానాదము

మ.

ఉడువీథిన్‌ శిఖరావలంబి యగు నంధ్రోర్వీశుమోసాలపై
గడియారంబున మ్రోసె రెండెనిమిదుల్‌ ఘంటాఘణాత్కారముల్‌,

సడలెన్‌ భానుఁడు పశ్చిమంబునకు, వైశ్యా! పూఁటకూటింటికిన్‌
గుడువం బోదమె లెక్క యిచ్చి? కడు నాఁకొన్నార [41]మిప్పట్టునన్‌.

155


వ.

విచారించిన నదియును మనకు విశ్రామస్థానంబు,

156

పూఁటకూటింటఁ బుష్పశరునిదౌత్యము

గీ.

సంధివిగ్రహయానాదిసంఘటనల
బంధకీజారులకు రాయబారి యగుచు,
బట్టణంబున నిత్యంబు పగలు రేయి
పూఁటకూటింట వర్తించుఁ బుష్పశరుడు.

157


వ.

అనుచుఁ గొంతద వ్వరిగినం దమకు నెదురుగా నేఁతెంచు నొక్క
బ్రాహ్మణుం గనుంగొని,

158


ఉ.

వీఁ డిదె తెల్లనాకులను వీడెము సేయుచు వీథి వచ్చుచు
న్నాఁడు, మదించి తిండి తినినాఁడు చుమీ! యిటమీఁద నేడకో
తేఁడఁగఁ బోయెడిం, గరణదేశపుజాణఁడు గాఁగఁ బోలు నీ
బాఁడు, పణోపహారపరిపాటి యెఱుంగఁగవచ్చు వీనిచేన్‌.

159


వ.

ఇతఁడు వెడలివచ్చు నవ్వాడయె పూఁటవంటకంబు వెట్టు
బాడబులవాడ గావలయు, నది యె ట్లంటేని,

160


ఉ.

ఘ్రాణపుటీకుటీరములఁ గాపుర ముండఁ దొడంగె నిప్డు పా
షాణఘరట్టఘట్టనవశంబునఁ బుట్టిన సత్తుగంధ, మ
క్షీణకఠోరసౌరభవిజృంభణ దిక్కులఁ జల్లఁజొచ్చె సా
మ్రాణిపదార్థజాలములు, బ్రాహ్మణకాంతలు తాలఁ బోయగన్‌.

161

గీ.

మందవేగంబుతోఁ గ్రొత్తమలఁకవాళ్ళ
కిఱ్ఱుచెప్పులు మొరయ, నుంకించి నడుచు
కరణబ్రాహ్మణవిటముఖ్యుఁ గదియవచ్చి,
పూతిమాషాన్వయుం డగుభూసురుండు.

162


వ.

పూఁటవంటకంబులవృత్తాంతం బడిగిన నతండు,

163

ఆహారవిహారముల యభిరుచులు

క.

ఆహారవిహారములకొ?
యాహారంబునకునో, విహారంబునకో
బేహారము? మీ కీసం
దేహారంభంబు మాకు దెలియఁగ వలయున్‌.

164


వ.

ఆహారంబున కంటేని;

165


ఉ.

కప్పురభోగివంటకము, కమ్మనిగోధుమపిండివంటయున్‌,
గుప్పెఁడు పంచదారయును, గ్రొత్తగఁ గాఁచిన యాలనే, పెస
ర్పప్పును, గొమ్ము నల్లనఁటిపండ్లును, నాలుగు నైదు నంజులున్‌,
లప్పలతోడఁ గ్రొంబెరుగు లక్ష్మణ[42]వజ్ఝలయింట రూకకున్‌.

166


వ.

విహారంబున కంటేని?

167


క.

అఱుగౌను, గుబ్బచన్నులు
మెఱుఁగుంగన్నులును గలుగు మెచ్చులనవలా
కుఱుబోడముండరత్నము
[43]బఱివోవఁగ విడిచినట్టి బ్రహ్మకు జే జే.

168


శా.

పూవుంబోఁడులు లేరె విప్రవిధవల్‌ భూమండలిన్‌? దాని రే
ఖావైదగ్ధ్యవిలాసవిభ్రమకళాగర్వంబు ల ట్లుండనీ,

యా విశ్వస్థయుపస్థచాయ నవలక్షాధీశఫాలస్థలీ
సౌవర్ణస్థిరపట్టబంధసుషమాసౌభాగ్యలక్ష్మిన్‌ గనున్‌.

169


ఉ.

కోయిల పంచమస్వరము క్రోల్చినభంగిని [44]గంఠ మెత్తి, రా
మాయణ మాఱుకాండములు నచ్యుతజాగరవేళఁ బాడె నా
రాయవితంతురత్న మనురాగముతోడ, “నమశ్శివాయ శాం
తాయ సమస్తదోషహరణాయ” సమానమె దాని కెవ్వరున్‌?

170


ఉ.

సంకృతపూతిమాషకులసాగరశారదపూర్ణిమాకురం
గాంకుఁడు మంచి, లక్ష్మణుగృహంబున నెచ్చెలికాఁడుఁ దానునుం
జంకలబంటిగా మెసవి, చక్కనివేడుకకత్తెఁ జూచి, తా
రింకొకమారు వత్తమని యేఁగిరి కార్యభరంబుపెంపునన్‌.

171


వ.

అటం బోవం బోవ ముందట,

172

పుష్పలావిక – గేఁదగిపూవు కానుక

సీ.

పాంథసీమంతినీప్రాణమత్స్యములకు
                        గాలాము లగుకంటకములతోడ,
గరుడపచ్చలచాయఁ బరిహసింపఁగ జాలు
                        దళమైన బాహ్యపత్రములతోడ,
జీర్ణకీకసకణశ్రేణిఁ జిడ్డలు చేసి
                        యవియఁ దోమినయట్టి యన్నుతోడఁ,
బదియాఱువన్నియ బంగారు సరివచ్చు
                        సంవర్తికాపలాశములతోడ,


తే.

శివుని చిచ్చఱకంట వెచ్చిన యనంగు
బూది కెన యైన కమ్మఁబుప్పొళ్ళతోడఁ

దాని ఘనమైన కమ్మఁగేదంగిపూవు,
భూసురున కిచ్చెఁ దగ నొక్కపుష్పలావి.

173


వ.

ఇచ్చినం జూచి,

174

.

ఉ.

క్రొన్నెలరేఖతోడఁ గెడఁగూడి సుఖింపఁగ భాగ్య మబ్బమిన్‌
ఖిన్నత నొందుఁ గాని నవకేతకి, శూలి వివేకహీనుఁడై
తన్నుఁ దిరస్కరించుటకు దైన్యము నొంద, దదే వివేకసం
పన్నిధి దానిపాలి పెరుమా ళ్ళొకఁ డెక్కడనైన లేఁ డొకో?

175


గీ.

అందుకొని, పుష్పలావికిఁ ద్యాగ మిచ్చి,
బ్రాహ్మణుల కందు నొక్కొక్క[45]పత్ర మొసఁగి,
జాణవిప్రుండు సిగఁ దాల్చెఁ, జందమామ
కొండనాలిక యగు నొక్కగొమలిఱేకు.

176


వ.

అదె విద్వేషిభువనజిగీషాసంరంభవిజృంభమాణఝషధ్వజ
భుజపరాక్రమసముత్సాహనాటకప్రస్తావనాప్రథమనాందీ
శ్లోకం బగు వేశ్యవాటికానికటంబు:

177

మాచల్దేవి చిత్రశాలాప్రవేశము

గీ.

చందనంబునఁ గలయంపి చల్లినారు
[46]మ్రుగ్గు లిడినారు కాశ్మీరమున ముదమున
వ్రాసినా రిందురజమున రంగవల్లి,
కంజములఁ దోరణంబులు గట్టినారు.

178


వ.

ఇది యెవ్వరి యిల్లొకో, శోభనంబు ముడిపడుచున్నయది! యనుచు
నాకాశంబు వీక్షించి, యచ్చటివారల నేమి యని యడిగిన,

179

శా.

ద్వీపాంతంబుననుండి వచ్చితివె? భూదేవా! “ప్రశాంతం మహా
పాపం” సర్వజగత్ప్రసిద్ధసుమనో[47]బాణాసనామ్నాయవి
ద్యోపాధ్యాయి, ప్రతాపరుద్రధరణీశోపాత్తగోష్ఠీప్రతి
ష్టాపారీణ, నెఱుంగవయ్యెదవె మాచల్దేవి వారాంగనన్‌?

180


వ.

చిత్రశాలాప్రవేశంబు చేయుచున్నయది, పుణ్యాహవాచనకాలంబు,
మీరునుఁ బచ్చని [48]పెండ్లికూటంబుఁ జూడవచ్చునది యనిన,

181


తే.

లెస్స గాక కిరాట! యీ లేమచరిత
మాడుదురు నాటకంబుగ నవనిలోన,
దీనిఁ జూడంగ బోదమా! యీ నెపమున
నరసి చూతము మన కేమి యచట? ననుచు.

182


వ.

ప్రవేశనాటితకంబునఁ జిత్రశాలఁ జొచ్చి పూతిమాష
గోత్రుం డచ్చోటం [49]బెండ్లికూటంబున నిలువునం గైసేసి, హంస
తూలికాతల్పంబుమీదం గూర్చున్న, హావభావవిభ్రమ
విలాసనిధి మాచల్దేవిని గనుంగొని,

183


తే.

అంకుశాఘాతరేఖల నంద మొందు,
గంధగజకుంభములతోడఁ గలహమాడు
క్రొత్తనఖములతోడి నీ కుచభరమున
కతివ! యభ్యుదయపరంపరాభివృద్ధి.

184


తే.

కల్లఁ జెప్పము విను నీకుఁ గల ప్రసిద్ధి
డిల్లి సురతాణికిని లేదు పల్లవోష్టి!
యాదిలక్ష్మికి నీకును భేద మేమి?
యుదధి జనియింపకుండుట యొకటి దక్క.

185


తే.

ఓరుఁగంటి మాచాంబ పయోరుహాక్షి,
పంచబాణావతారుని, మంచిఁ జూచి,

కంకణాలంక్రియాఝణత్కార మెసఁగ,
“నయ్యగారికి జోహారు” లనుచు మ్రొక్కె.

186


తే.

అగురుధూపాధివాసితాభ్యంతరంబు,
మగువ! నీ మన్మథచ్ఛత్రమంటపంబు
సర్వయోషిదసామాన్యసౌష్టవంబు
కాచుఁ గావుత మోర్గంటికటకవిటుల!

187


వ.

అనుటయు,

188

మంచన మాచల్దేవుల సరససంభాషణము

సీ.

[50]ఎందుండి వచ్చితి రీరు? కాసల్నాట
                        నుండి వచ్చితిమి మే ముత్పలాక్షి!
యెవ్వరివారు మీ? రేము సంకృతిపూతి
                        మాషమాధవుని కుమారవరుఁడ,
మీ దివ్యనామకం బేదియో? గోవింద
                        మంచనశర్మ సమాహ్వయులము,
మీర లిచ్చటికి రాఁ గారణం బెయ్యది?
                        చేరి మీబోంట్ల నాశీర్వదింప,


తే.

నైన విచ్చేసి కూర్చుండ నవధరింపు,
వార్చి వచ్చెద మటు వోయి వనరుహాక్షి!
యెచ్చటికి వార్వఁ బోయెద రెఱుఁగఁ జెప్పుఁ?
డక్కవాడకు, మేము బ్రాహ్మణుల మగుట.

189


వ.

చిత్రావలోనంబు చేసి, టిట్టుభునకు గోవింద మంచనశర్మ
యి ట్లనియె:

190

చిత్తజుని శౌర్య మెఱిఁగించు చిత్రశాల

సీ.

అదె దారువనభూమి! యసమనేత్రుఁడు వాఁడె!
                        సంయమీంద్రుల పుణ్యసతులు వారె!

యదె కన్యకారత్న! మబ్జాసనుఁడు వాఁడె!
                        యదె రతిక్రీడావిహారశయ్య!
వాఁడె వైకుంఠుండు! వారె గోపస్త్రీలు!
                        యమునానదీసైకతాంత మదియె!
యదె యహల్యాదేవి! యమరాధిపుఁడు వాఁడె!
                        యదె పర్ణశాలికాభ్యంతరంబు!


తే.

చందురుఁడు వాఁడె! యదె బృహస్పతిపురంధ్రి!
జాలరియు నదె! శ్రీపరాశరుఁడు వాఁడె!
కుశికజుఁడు వాఁడె! యదె యింద్రుకొలువులేమ!
చిత్తజునిశౌర్య మెఱిఁగించెఁ జిత్రశాల.

191


ఉ.

తియ్యనివింటిజోదు, రతిదేవిచనుంగవ నొత్తిగిల్లి, యొ
య్యొయ్యన వంక చక్కఁబడ నొత్తెడుఁ జూచితె పుష్పబాణముల్‌?
మయ్యెర వ్రాసెఁ జిత్తరువు [51]మాఁగిలి మాఁగిలి చిత్రకారుఁడా!
దయ్యము గాక! [52]నీవిపసదానము టిట్టిభ వీని కీఁదగున్‌.

192


వ.

అనుచు దద్గృహంబు నిర్గమించి, పూర్వానుభూత యగు
గాంధర్విగృహంబు రోయువాఁడు, కతిపయమందిరంబులకు
నవల సిందువారలతికాకుండుగం బడియాలంబున నెఱింగి,
యనుంగు మొగసాలం జొచ్చిన, దాసదాసీజనంబు
ససంభ్రమంబుగా నెదురేఁగి తోడ్కొనిపోవం బోయి,
యభ్యంతరమందిరంబున మహోత్సవవ్యాపారపారీణ యై
యున్న యవ్వారముఖ్యం జేరి, యాసనార్ఘ్యపాద్యాది
సముచితసత్కారంబులం బొంది సుఖాసీనుం డై,

193

మదనరేఖకు ముకురవీక్షామహోత్సవము

ఉ.

గోత్రమువార లెల్లఁ గెడఁ గూడినవారు, వ్రతంబొ, దేవతా
యాత్రయొ, పండువో, మనగృహంబున శోభన మేమి, శోభనం

బత్రిసమాన! నేటి యపరాహ్ణసమాగమవేళఁ, బుష్యన
క్షత్రమునందు, నీ యనుఁగు గాదిలికూఁతురు, చూచు నద్దమున్‌.

194


క.

ఆవేళ నీవు బిడ్డకు,
దీవనమంత్రంబు చెప్ప దీర్ఘాయు వగున్‌,
లావణ్యంబు వివేకము
ప్రావీణ్యము వైభవంబు భాగ్యము గలుగున్‌.

195


తే.

ముకురవీక్షావిధానంబు మొదల లేక,
వెలపడంతికిఁ గారాదు విటునిఁ గవయ,
యాయజూకున కెట్లు చేయంగవచ్చు
నరణిసంగ్రహ మొనరింప కధ్వరంబు?

196


తే.

లంజెవారికి శ్రీమహాలక్ష్మి గాదె
దర్పణము విప్రముఖ్య! గంధర్వగణము
పుణ్యచారిత్ర! దృష్టాంతభూమి గాదె
దర్పణమ్ము వివర్తవాదముల కెల్ల?

197


ఉ.

ఉన్మదమత్తకోకిల కుహూకలపంచమరాగరాగసం
పన్మహనీయమైన మధుమాసపుఁ బున్నమనాఁడు, బిడ్డకున్‌
మన్మథవేధదీక్ష పదినాళ్ళగు మాత్రము, నేతదర్థమై
సన్మతి నుండఁగావలయుఁ జక్కనివాఁడవ యక్కవాడలోన్‌.

198


సీ.

[53]అదె నీ కుమారిత మదనరేఖాకన్య
                        వదనరేఖావైభవమునఁ జంద్రు
[54]దొరఁ గూర్చికొన్నది ధూర్తదేవత, నిన్నుఁ
                        దండ్రిఁ బోలినయట్టి తరళనయన,
సాముద్రికాగమజ్ఞానపారీణులు
                        కడుభాగ్యసంపద గలది యండ్రు,

భాగ్యసంపదకల్మి ప్రస్ఫుటం బయ్యెఁగా
                        [55]మీర లిందుల వచ్చి మీఱియుంట,


తే.

జనకుఁడవు, కర్త వొజ్జవు, సజ్జనుఁడవు,
క్రొత్తలంజెలకాముండ, వుత్తముఁడవు,
తొడల నిడుకొని, ముద్దుకూతునకు నీవు
మించుటద్దంబు చూపరా! మంచిరాజ!

199


గీ.

కేలఁ గ్రొమ్మించుటద్దంబు గీలుకొల్పి
మంచితొడమీఁద నొప్పారె మదనరేఖ,
ముద్దునెమ్మోము లావణ్యమున జయించి
కువలయాప్తునిఁ జెఱవెట్టుకొన్నకరణి.

200


క.

దీవించి మంచి కూఁతురు,
“శ్రీ వర్ధస్వంబు” చెప్పి, చెవి [56]టిట్టిభసె
ట్టీ! వెస నిప్పింపుము సం
భావన నొకవెండి, బిడ్డపసుపున కనియెన్‌.

201


వ.

అనంతరంబ గాంధర్వి పూర్వసంబంధంబున నైన ప్రేమాను
బంధంబునఁ గేలు గేలం గీలించి యి ట్లనియె:

202


తే.

ఎందు పోయితి గోవింద? ముందరట్ల
యెంద ఱతివల వలపించి తెచట నెచట?
తలఁపు పుట్టించెనే నీకు దైవ మిట్లు
పాయసం బారగించిన ప్రాఁతపట్టు!

203

శ్రీకాకుళపుఁ దిరునాళ్ళలో నసమబాణుని స్వైరవిహారము

తే.

దవనపున్నమఁ గాకుళాధ్యక్షుఁ డైన
తెలుఁగురాయఁడు దేవతాధీశ్వరుండు,

భువనహితముగ నుత్సవం బవధరింప
నందుఁ బోయితి మీ పోయినట్టి యేఁడు.

204


తే.

[57]కారవేల్లమతల్లికాకల్పవల్లి
కడుపు నిండారఁ గాంచిన కొడుకుఁగుఱ్ఱ
జారచోరమహాధూర్తచక్రవర్తి,
దేవవేశ్యాభుజంగుండు, తెలుఁగుభర్త.

205


ఆ.

పసిఁడికోర వేఁడిపా లారగించినఁ
బుల్లసిలిన యధరపల్లవమున,
విప్రకన్య చనువు వెలయించుచున్నాఁడు
విశ్వమునకుఁ గాకుళేశ్వరుండు.

206


ఉ.

ఈరస మెత్తు వేదములు, హ్రీ వహియించుఁ బురాణసంహితల్‌,
సౌరభహీన మౌ నుపనిషత్తులు, [58]లేఁబడు నాగమావళుల్‌,
గారవ ముల్లసిల్ల సిరికాకుళనాథుఁడు నాగదేవభ
ట్టారకునింటఁ బుట్టి ప్రకటంబుగ వేడుక నాదరింపఁగన్‌.

207


మ.

గరుడస్తంభప్రతిష్ఠాకలన మొదలుగాఁ గల్పమంత్రోక్తపుష్పా
ధ్వరపర్యంతంబు కృష్ణాతటిని తటమునన్‌ ద్వాదశక్రోశధాత్రీ
పరివేషాభ్యంతరశ్రీ పరమపదమునం బర్వకాలంబునందున్‌
బరనారీసంగమాదుల్‌ భగవదనుమతిం బాపముల్ గాక యుండున్‌.

208


శా.

వ్యామగ్రాహ్యనితంబబింబకుచభారాభీలభద్రాకృతుల్‌,
కామాంధల్‌, వెలనాటి కోడెవిధవల్‌, కాకొల్లి తిర్నాళ్ళలో

నా[59]మాంధాళల, భీమసేనుఁడు హిడింబాధీశ్వరుం, డోపునో
యేమో కాని, [60]తెమల్పనేర రితరుల్‌ హేలారతిక్రీడలన్‌.

209


ఉ.

పేర్చిన సందడిం బెదవి పీల్చి, యురంబునఁ జన్ను లొత్తి, చే
దూర్చి యనంగమందిరము దూకొని, కూరిమినీరు జఱ్ఱనన్‌
గార్చుకొనంగఁ జేసి, యిఱుఁ గౌఁగిట నుప్పర మెత్తి, యేటికిం
దార్చి, రమింతు రూళుల వితంతువులం దిరునాళ్ళఁ బల్లవుల్‌.

210


క.

ముంజె పదనైన శంబర
భంజనుగేహములు గలుగు బ్రాహ్మణవిధవా
పుంజము [61]లుండఁగ, నూరక
లంజియ లేమిటికిఁ కాకుళపుఁ దిరునాళ్ళన్‌?

211


సీ.

జవరాలిఁ బొడగన్న సన్న్యాసిపై నేయుఁ
                        దులసి లేఁజికురాకుఁదూపు మరుఁడు,
వేదవిప్రునిఁ గన్న విధవపై ఝళిపించు
                        దర్భపల్లవహేతి దర్పకుండు,
కటకారకులకన్యఁ గనిన హాళికుమీఁదఁ
                        బొడుచుఁ బూమునికోలఁ బుష్పశరుఁడు,
నాడింధమునిఁ గన్న నాతిపై నేయును
                        నలరుఁ జిచ్చఱకోల నంగభవుఁడు,


తే.

బెరసి వెన్నెల కాయంగఁ, బేరకమ్మ
పులినతలముల నాయాయి కొలము లెఱిఁగి,
తాల్చు శస్త్రాస్త్రములు జారదంపతులకు
నసమబాణుండు, తిరునాళ్ళ నన్నినాళ్ళ.

212


వ.

అని యనంతరంబ యా ముందటం జనుదెంచు వితంతు
సమూహముం గని, యాశీర్వదింపవలయు నని,

213

స్వచ్ఛందచారిణులకు మంచెన దీవెన

సీ.

చెలఁగి చెలఁగి పొత్తి[62]చీరలు గట్టెడు
                        మాసకమ్మకు దీర్ఘమాయు రస్తు!
సారె సారెకు దేవసదనంబులకు నేఁగు
                        చెడిపెకు సంకల్పసిద్ధి రస్తు!
నిత్యంబు వ్యభిచారనిష్ఠతో నుండెడు
                        విధవకుఁ బుత్రాభివృద్ధి రస్తు!
దళముగాఁ దులసిపేరులు ధరించినయట్టి
                        విశ్వస్త కారోగ్యవిభవ మస్తు!


తే.

మిండముండకు సంపత్సమృద్ధి రస్తు!
పఱచుతెంపికి నిత్యసౌభాగ్య మస్తు!
వదరుఁగల్కికి నీప్సితావాప్తి రస్తు!
బలువితంతుకు మైథునప్రాప్తి రస్తు!

214


వ.

అని యట చనునప్పుడు,

215

మంచన కామమంజరి ననునయించుట

వ.

అనిన, [63]గాంధర్వి పరదేశపట్టణంబుల వితంతువుల చేత వక్షః
కుట్టనంబు సేయించుకొన మరిగి, నీ వెట్టు మమ్ముం దలంతువు?
పదపద, విచ్చేయు, మనుచు నీర్ష్యాకుటిలం బగుకటాక్షంబునం
జూచిన,

216


చ.

లవ లవఁ జన్నుదోయి గదలన్‌, దొలుకారుమెఱుంగుఁదీఁగలం
గవ కవ నవ్వుడాలు వలికన్నుల మించులు చౌకళింపఁగా,
నవ నవ యౌవనంబు గల నాఁటి భవత్పురుషాయితోద్ధతుల్‌,
శివ శివ! యెన్నిభంగులను జిత్తములో మఱవంగ వచ్చునే?

217

వ.

కార్యాంతరవ్యాసంగంబున నార్యవాటికిం బోవుచున్నవాఁడ, మన
మదనరేఖాకన్య దర్పణావలోకముహూర్తంబు సుము
హూర్తం బయ్యెడుఁ బోయివచ్చెద నని.

218

నాగరికుని నాగస్వరము

తే.

వెడలి, పశ్చిమదిశ నాల్గుగడియ లంత
ప్రొద్దు గలుగంగ నడువీథిఁ బోయి పోయి,
కేళిసఖుఁడును దా నాలకించి చనియె
నాగసొరముల మ్రోఁత, యన్నాగరికుడు.

219

పాములాట

క.

నాగస్వరసుషిరసర
న్నాగవరాళ్యాదివివిధనానారాగ
ప్రాగల్భ్యప్రకటఫణా
భోగములై యాడఁజొచ్చె భోగీంద్రంబుల్‌.

220


సీ.

కద్రూమహాదేవి గారాపుసంతతి,
                        మధుకైటభారాతి మడుఁగుఁబాన్పు
కాలకంఠునియంఘ్రి గండపెండారంబు,
                        భానుమంతుని తేరి ప్రగ్రహంబు,
నక్షత్రవీథి నెన్నడిమి పెద్దగ్రహంబు,
                        మూలాలవాలంబు మొదటిదుంప
యాదిభైరవదేవు యజ్ఞోపవీతంబు,
                        క్రీడావరాహంబు తోడిజోడు,


తే.

యర్కనందనుసెలకట్టె యంపకోల,
పులుఁగురాయని తాత్కాలపుణ్యభిక్ష,
కేతకీపుష్పవాసనాకృత్రిమాసి,
పర్వతేంద్రంబు తరిత్రాడు, పాపఱేఁడు.

221

వ.

ఇమ్మహానాగంబులు మనకుం గార్యసిద్ధి యొసఁగుం గాక!
యని చని, ముందట,

222


సీ.

కడగోరఁ దీర్చిన కస్తూరిగీర్బొట్టు
                        నెక్కసక్కెంబుగాఁ జుక్క మెఱయ,
నడ్డంబు ద్రికటంబు నై యురస్స్థలమున
                        గంధసార[64]స్థాసకములు మెఱయఁ,
జాలనిగ్గులు గుల్కు పాలఱెక్కలకుచ్చు
                        వామకర్ణంబుతో వక్కళింపఁ,
బెనచి వెండ్రుకలతోఁ బిరివెట్టి చుట్టిన
                        ప్రాఁతచెంద్రిక వన్నెపాగ యమర,


తే.

జన్నిదంబుగఁ బెనుబాము సవదరించి,
యంఘ్రికటకంబు ఘల్లు ఘల్లనుచు మొరయ
నాహితుం డిక గరళవిద్యాధిరాజు,
వచ్చెఁ బాములమెంగఁడు, వదరులాఁడు.

223


సీ.

ఫూత్కారపవనంబు పూరించుపుక్కిళ్ళు
                        ముసిఁడిపండులతోడ ముద్దుఁగురియ,
సందిటిసంకు పూసలసద్దు కటు తుంబి
                        నాదస్వరోజ్జృంభణముల నడఁప,
నేడు రంధ్రమ్ములు నిరుఁగేల వ్రేళ్ళను
                        వివృతి సంవృతి లీల విస్తరింప,
నాలాపతాళాంతరాంతరంబులయందుఁ
                        గిక్కను శబ్దముల్‌ చొక్కటముగ,


తే.

నాగసింధుప్రభేదనానావరాట
రాగగంధర్వలహరికారంభణముల

మిహిపదంబుగఁ బాములమెంగఁ డూదె
భోగిరాజులు నర్తింప నాగసొరము.

224


వ.

అట చని, ముందట నొక్కమంటపంబున విటభటపట
లంబు నెదురుకట్ల నార్భటింప టిట్టిభుండు విని, గోవిందశర్మ
నడిగిన,

225

తూర్పునాటి గడిఁడు

సీ.

నున్నవై నలుపెక్కి నొసలఁ జేరువ కంటి
                        కెకువ వైచిన శిఖ పెకలుచుండఁ
గరసానఁ దిగిచిన కలివె గందపుబొట్టు
                        తిరికట్టుకొని మోము తిరిగియుండఁ,
దటపెట దిమికిట ధ్వను లోలిఁ బుట్టింపఁ
                        జాలు గుమ్మెట చంక వ్రేలుచుండ,
నలుకనై మీఁజేత నంటిన యా క్రొత్త
                        మువ్వలత్తెము [65]సారె ములుగుచుండ,


తే.

నొసలు స్రుక్కించు నావుర్న నోరు దెఱచు,
గ్రుడ్లు మిడికించు, రాగంబు [66]గుమ్మడించు,
పాడుగతులకుఁ దను దానె పరగి యాఁడు;
నల్ల యాతండువో తూర్పునాటి గడిఁడు!

226

పొట్టేళ్ళపోరు - పందెములు

వ.

అనుచు నట పోవఁ, గంటె కిరాట! రెండు మేషకంఠీరవంబు లా
నీరాటరేవున నీరను ముంచి సంచితంబున నస్యంబు సేయుచుఁ
బెంచుటం జేసి, ధేనువుల ననుధావనంబు సేయు వత్సంబులుం
బోలె, వాత్సల్యంబునం దమయేలికలవెంటఁ గంఠగ్రైవేయ
ఘంటికాటంకారంబులును, విషమవిషాణకోటిఘటితకలా

పాయసాశ్వత్థపల్లవగుళుచ్ఛరింఛోళికాఘణఘణత్కారం
బులు చెలంగ, యుద్ధక్రీడాసన్నద్ధంబులై వచ్చుచున్నయవి.
ఈ సజీవద్యూతంబు చూతము కాక! యనుచుఁ గౌతూహ
లంబున నిలిచియున్న యవసరంబున వాహ్యాళిప్రదేశంబునం
బందెగాండ్రు పందెంబు నొడివి తలపెట్టిన,

227


చ.

ఉభయము భావవీథి జయమొందిన భంగి, భయం బొకింత లే
కభిముఖ మయ్యె, వె న్వెనుకకై యట కొన్నిపదంబు లేఁగుచున్‌,
రభసముతో దువాళి గొని భ్రగ్గునఁ దాఁకెడుఁ జూడు సెట్టి టి
ట్టిభ! థిథిథీ యనంగను గడింది నదభ్రము లీ యురభ్రముల్‌.

228


క.

నిటలమ్ము లవిసి, నెత్తురు
సొట సొట వడియంగ, సమరశూరోత్తములై,
కటుకునను మెండు తగరులు
చటులాటోపమున రెండు సరిఁబఁడఁ బోరెన్‌.

229


ఆ.

వట్టివైదురుమోపు వైచినచందాన,
గుండు గుండుమీఁదఁ గూలినట్లు,
కడిఁదిమ్రోఁత మేషకంఠీరవంబులు,
తాఁకి తాఁకి డస్సి తట్టువాఱె.

230


వ.

ఇట్లు తట్టువాఱి, పొట్టేళ్ళు నాస్కందం బుడిగి, మంద నిశ్వాసో
చ్ఛ్వాసంబులై డిల్లపడి మూర్ఛిల్లిన,

231


సీ.

హా! హా! నృపాలసింహాసనాధిష్ఠాన
                        రత్నకంబళకాభిరామరోమ!
మజ్ఝా! కృపీటసంభవమహాదిక్పాల
                        హేలావిహారవాహ్యాళివాహ!
మాయురే! ప్రవిలంబమా[67]నాండసంపాత
                        కుతుకానుధావితక్రోష్టురాజ!

యహహ! శ్రీవీరభద్రావతార మహేశ
                        నిహతదక్షకబంధవిహితవదన!


తే.

భళిరె! మేంఠరాజ! బాపు! రురభ్రేశ!
ఔర! యేడకేంద్ర! యరరె! తగర!
మమ్మ! హం క్రియాభిమాన దరిద్రాణ!
మేలు మేలు! గొఱ్ఱె మిండగీఁడ!

232


వ.

మీకు నీ గండంబులు దొలంగుం గాక! యనుచు నట చని,
ముందటఁ గక్షవిలంబితతామ్రచూడు లగు కోడిపందెగాండ్రఁ
గనుగొని, యిదియును నొక్కసజీవద్యూతంబ, యీ దురోదర
క్రీడావిహారంబు నాదరింపవలయుఁ, బానుగంటి కలుకోడి తోడఁ
బుట్టువులు వోని యీ జగజెట్టి కోడిపుంజులయందుఁ
బ్రత్యేకంబు,

233

కోడిపందెముల వర్ణనము

తే.

[68]పారిజాతపుఁ బూవు నా బరగుఁ జూడు
తామ్రచూడంబు చూడాపథంబు జొత్తు,
దర్పభరమున బ్రహ్మరంధ్రంబునడుమఁ
జించి వెడలిన క్రోధాగ్నిశిఖయుఁ బోలె.

234


వ.

టిట్టిభ! యవలోకింపు నారికేళబకజాతీయంబులై యీ జగజెట్టి
కోడిపుంజులు మెడలు నిక్కించుచు, ఱెక్క లల్లార్చుచుఁ,
“గొక్కొక్కొ” యని కాల్ద్రవ్వి, క్రొవ్వు మిగిలి, తరళతార
కోద్వృత్తరక్తాంతలోచనమండలంబులై, యొండొంటిం
గదిసి చుఱచుఱఁ జూచి, యేచిన కోపాటోపంబునఁ గుప్పించి,
యుప్పరం బెగసి, చరణాంగుళీకుటిలనఖశిఖాకోటికుట్టనం
బులం జిరుదొగడు లెగయన్ వక్షస్స్థలంబులు వ్రచ్చి
వందరలాడియుం, ద్రోసియు లాసియు, నాసాపుటంబులం బుట
బుటన నడునెత్తిం జొత్తిలు నెత్తురు [69]విఱ్ఱగాఁ గఱచియుఁ, గొఱ

కొఱం గొఱుకుముఖంబున గురుకు గురుకు మనుచు, సవ్యాప
సవ్యంబుల నోహరిం బక్షవిక్షేపంబులం బడలువడ నడిచియు,
నొడిచియు, నడికి నడికిఁ దప్పించుకొని, సడిచప్పుడు గాక
యుండం గాళ్ళక్రిందికిఁ దూరియుఁ జీరియు, మాటిమాటికి
“ఘాటఘాటఘాట” యని కృకాటం బుక్కుఁ దండసంబులు
వోని ముక్కులం జెక్కులం జిక్కగా నొక్కి, యిట్ట ట్టనక
బిట్టూని పట్టి, గాలంపుఁగొంకులభంగి వంక లగు కొంకి
కత్తులం గడుపు లొడిచికొని, చించి చెండాడి, కొండొకసేపు
వాలిసుగ్రీవులవిధంబున, విందానువిందులచందంబున,
మురారిచాణూరులప్రకారంబున, నేకాంగయుద్ధంబు చేసి,
చారణగంధర్వగరుడవిద్యాధరశ్లాఘనీయంబుగా నమోఘ
పరాక్రమంబు సలిపి, వీరవ్రతం బేపార, వాహ్యాళీమండలం
బునం దమకుఁ దార పాయగిలఁబడి, పోటుగండ్ల రొప్పు
రుధిరంబులం దొప్పఁదోఁగి, మూర్ఛాంధకారంబున మునుంగు
చున్నయవి;

235


సీ.

హా! కుమారస్వామి యౌపవాహ్యములార!
                        హా! మంత్రదేవతాస్వాములార!
హా! కాలవిజ్ఞానపాకకోవిదులార!
                        హా! భూతభుక్తికుంభార్హులార!
హా! యహల్యాజారయభనహేతువులార!
                        హా! బలాత్కారకామాంధులార!
హా! నిరంకుశమహాహంకారనిధులార!
                        హా! కామవిజయకాహళములార!


తే.

హా! ఖగేంద్రంబులార! కయ్యమున నీల్గి
పోవుచున్నారె దేవతాభువనమునకు?

మీరు రంభాతిలోత్తమామేనకాది
భోగకార్యార్థమై కోడిపుంజులార!

236


వ.

అని యట పోవుచు, నా దక్షిణంబున పైఁడికుండల మొగసాల
తోడిది, మాధవశర్మ కూఁతురు మధుమావతీదేవి మందిరంబు.

237

మహి నుదయించిన గాంధర్వి మధుమావతి

తే.

సింహళద్వీపమునఁ గాని, సృష్టిలోనఁ
బద్మినీజాతి లేదను పలుకు కల్ల,
తెఱవ మధుమావతీదేవి దేవకన్య,
పద్మినీజాతి దోర్గంటిపట్టణమున.

238


చ.

మలయజగంధియైన మధుమావతి యూర్పుల కమ్మఁదావి చెం
గలువల సౌరభంబునకు గాదిలిచుట్టము, చక్రవాకులం
గలకల నవ్వు దాని చనుకట్టు, తదీయ విశాలనేత్రముల్‌
తొలకరి క్రొమ్మెఱుంగు సయిదోడులు మిండలు గండుమీలకున్‌.

239

మధుమావతి తొలి మలి జన్మరహస్యము

ఉ.

టిట్టిభసెట్టిగారు! వినుఁడీ! యొకచొక్కపుజోగి రేయి రో
వట్టిడి దీనితోఁ గలసి, భైరవతంత్రము దీర్చి, మెచ్చి, సౌ
ధాట్టమునన్‌ లిఖించె నఖరాక్షరభంగిఁ దెనుంగుఁబద్యమున్‌,
బుట్టువు పే రనాగతము భోగము భాగ్యముఁ బ్రస్ఫుటంబుగన్‌.

240


క.

ఈ తలిరుంబోఁడికిఁ గల
భూతభవద్భావికాలములజన్మములున్‌,
జాతులు ప్రస్ఫుటములుగా
నాతఁడు లిఖియించెఁ బద్య మల్లదె కంటే!

241


సీ.

అలకాపురంబున [70]నంగారవర్ముఁ డన్‌
                        గంధర్వపతి కన్య కమలపాణి,

యా దివ్యగంధర్వి కపరావతారంబు
                        మధుమావ తోర్గంటిమండలమున,
[71]నా సుందరాంగి దక్షారామమునఁ బుట్టు
                        భువనమోహిని చిన్నిపోతి యనఁగ,
నప్సరస్ స్త్రీజాతి యగు యా సానికూఁతురు
                        చిరకాలమున సదాశివునిఁ గూడి


తే.

పావనంబైన తమిలేటి పరిసరమున,
వేఁగి కురువాటికాదేశవిపినభూమిఁ
[72]గోవులను పేరి చెంచులకులమునందుఁ
గడిమి కత్తులయమ్మి నాఁ గలుగఁగలదు.

242


ఆ.

కడిమి కత్తులమ్మి నిడువాలుఁగన్నులు
గండుమీల [73]నడచు మిండగీడ!
దాని చన్నుదోయి ధారాసురత్రాణ
కటకకుంభికుంభకలహకారి.

243

మదాలసవృత్తాంతము

వ.

ఈ మధుమావతీదేవి చెలియలు మదాలస, మా మామ మీసాలప్ప
య్య ద్వివేదుల కొడుకు శ్రీధరునకు ననుపు లంజెయై యుండు;
నా కంజాక్షిం దగిలి యా రంజకుం డచ్చోటనే యున్నవాఁ డని
విన్నార మరయుదము గాక! యనుచు మోసాలం జొచ్చి కక్ష్యాంత
రమ్ములు గడచి, గాజుటోపరిముందటఁ గటకంబళంబులమీఁదఁ
దమలో జిటపొట వోవుచుం గూడియుం గూడక యున్న యప్ప
చెలియండ్రను మామయాత్మజునిం జూచి, గోవిందుండు మంద
స్మితంబునఁ బటు ............... (గ్రంథపాతము)

244


తే.

అహి వెట్టితి జొన్నగడ్డాగ్రహార
వృత్తి యేనూఱురూకలవృత్తమునకు,

ననుభవింపుఁడు నీవు మదాలసయును,
సరససంసార మింతయు నధ్రువంబు.

245


తే.

మిన్నకున్నార లిది యేమి మీరు ముగురు?
నీఁగకును బోక వెట్టిన యిట్టిభంగి,
హెచ్చు కుం దింతమాత్ర మేదేని గలదె?
మిగులఁ గోపంబు మీకు లేమియును దోఁచె.

246


వ.

అనిన మధుమావతి గోవిందమంచనశర్మతో నిట్లనియె:

247


సీ.

ఏమి చెప్పుదుము! మా కీవు తోఁబుట్టుగ
                        వైననుం జెప్పక యణఁపరాదు,
నీదు వియ్యంకుండు నిర్భాగ్యుఁ డీతండ
                        యీ పోయినట్టి రే యేకతమున
మా మదాలస కేళిమందిరాంతరమున
                        హంసతూలికపాన్పు నందు నొంటి
నిద్రించి యుండంగ, నీవిబంధం బూడ్చి
                        యటు చేయవలసిన యట్టు చేసె,


తే.

మధుమదారంభమున మేను మఱచి యపుడు
మోసపోయితి [74]మీనాఁడు ముట్టఁ దెలియఁ
జెలియలికి నాకు గొడ్డేఱు కలఁక పుట్టె
బ్రాహ్మణుఁడె వీఁడు? విశ్వాసపాతకుండు.

248


క.

నడురేయి మధుమదంబున
నొడ లెఱుఁగక యున్న నన్ను నోవరిలోనన్‌
దడవెను, గుడిలో నుండియు
[75]గుడిఱాళ్ళను దీసె వీడు గోళకుఁ డరయన్‌.

249

వ.

పాడిపంతంబు లెఱిఁగిన పెద్దవు నీవు. మాభాగ్యకృతంబున
విచ్చేసితివి. అజ్ఞానకృతంబునకుం బ్రాయశ్చిత్తంబు విధింపు
మని మఱియును,

250


శా.

హాలాపానమదాతిరేకమునఁ బర్యంకంబుపై నొంటి ని
ద్రాలస్యంబున నుంట దక్క, మరి యేయన్యాయమున్‌ జేయ నే
నేలా పాపము గల్గె? నీ భయము వో నే ముట్టెదన్‌ శుద్ధికై
వాలాయంబును మీనకేతనుని దివ్యశ్రీపదాంభోజముల్.

251

మంచనశర్మ బోధించిన విటధర్మసూక్ష్మము

వ.

అనిన, గోవిందుండు మీరు విటజనధర్మసూక్ష్మం బెఱుంగరు.
ఇది యన్యాయంబు గాదు. వేశ్యాజనంబునకు వావివరుస యెక్క
డిది? తొల్లి నముచిసూదనునకు ననుపులంజెయై యూర్వశి
యతని కొడుకుఁ గవ్వడిం గామింపదే? రావణుండు నలకూబరుని
రంభోరు నంభోరుహాక్షి రంభం గోడలిని సంభోగింపక సాగ
నిచ్చెనే? వారకాంతను దల్లి, దాసి, యప్ప, చెలియలు, కూఁతురు,
దాది యని [76]కేళికాగేహంబునం బరిహరించుట విటధర్మంబు
గాదు.

252


ఆ.

జాణతనము గల్గి, [77]సవరతనము గల్గి,
తెలివి గల్గి, మోరతీరు గల్గి,
చే యలంతి తనకుఁ జే కూడినప్పుడు,
వావి వలదు లంజెవారియింట.

253


వ.

అని పలికి సౌముఖ్యంబు సంపాదించి,

254


చ.

వదినెయు, లంజెయున్‌, విటుడు, వైరము లాత్మల నుజ్జగింపుఁ డ
భ్యుదయపరంపరా[78]వివిధభోగము లందుఁడు, మేము వోయివ

255

చ్చెద మని, వారి సత్కృతులు చేకొని, మంచనశర్మ వెళ్ళెఁ, ద
త్సదన మపారభాగ్యధనసంపద కెంతయుఁ జోద్య మందుచున్‌.

255


చ.

కొడుకులు కూఁతులుం గలిగి, కూడును బాడియుఁ ద్రవ్వి తండమై,
విడిముడి లాఁతుగా గలిగి వెండియుఁ బైఁడియు నిండ్లలోపలన్‌
దడఁబడఁ, దారు బంధువులుఁ దామరతంపరలై సుఖించు వా
రుడిపతిమౌళిమౌళి నొకయుమ్మెతపూ [79]విడువారు వేడుకన్‌.

256

సాయంకాలవర్ణనము

వ.

అనుచు మధుమావతిదేవి భవనంబు వెలువడి, కట్టాయితంబైన
ఘటశాసిపుంగవుండు, నింగి చెఱంగుమొన వ్రాలిన పతంగ
బింబంబుం గనుగొని టిట్టిభ! యదె చూడు. వరుణరాజవారాంగనా
విలాసదర్పణానుకారియై యహర్పతి గ్రుంకం బోయె, నింక
మనకు నేవంకం దడయఁ బనిలేదు. కుహళీచషకంబుల నారి
కేళంపుమధువుం గ్రోలి మత్తిల్లి వీ రిదె మందిరోద్యానవీథులం
బల్లవాధరలు పుష్పగంధికానృత్యంబులు పరిఢవించెదరు. వారు
కొందఱు మందిరప్రాంగణంబున వారాంగనాజనంబులు
విచిత్రశ్లోకంబు లనేకరాగంబులం గూర్చి, లాస్యాగం బుత్తమం
బుగాఁ జూపెదరు. మఱియు నంతరాంతరంబులం బ్రచ్ఛేదన
సైంధవద్విమూఢకస్థితపార్యాభిమార్గాభినయభేదంబులు రస
భావభావనామోదమధురంబుగా శాతోదరు లభినయించెదరు ఇ
వ్విధంబున వినోదంబు లిన్నియుం జూడం దలంచితిమేని, కామ
మంజరీగృహప్రవేశంబునకుం గార్తాంతికుండు పెట్టిన ముహూ
ర్తంబు సరిగడచు. ఇపుడు పుష్యనక్షత్రంబున నాల్గవపాదంబు
నడచుచున్నయది. కాలావర్తవిషనాడికాస్పర్శనంబు లేక
యమృతద్వంద్వంబు గూడి, యిందుబింబాననాధరోష్ఠపల్లవా

మృతపారణలాభంబునకుం గారణంబుగాఁ గలిగియున్నయది.
ఇవ్వేశవాటంబు వీథీవిటంకం బతిక్రమించి వేవేగం జన
వలయు. ఇదె యాఁటది యొకసురపొన్నక్రీనీడ క్రీడాభరం
బునఁ గన్నియలం గూడి, కందుకక్రీడ యొనర్చుచున్నయది, దీని
నలవోక వోలె నైనం జూడవలయునని చూడం జని,

257

బాలల బంగరుబంతుల యాట

శా.

పంచారించిన లేఁతచన్నులపయిం బ్రాలంబముల్‌ గ్రాలఁగాఁ,
గాంచీనూపురకంకణక్వణములన్‌ [80]గర్జింప, బాలాజనుల్‌
కించిన్న్యంచ[81]దుదంచితక్షమముగాఁ గ్రీడించెద ర్చూడుమా
చంచత్కాంచనకందుకత్రయములన్‌ సవ్యాపసవ్యంబులన్‌.

258

నట్టువుని కోడలితో మంచన చతురోక్తులు

వ.

అనుచుం గతిపయపదంబు లరుగఁ, గట్టెదుర నొక నట్టువుని
కోడలు, గోడలు నిక్కి చూడఁ బొడగని, యమ్మచ్చెకంటి
మున్ను త న్నెఱింగినది యగుట టిట్టిభున కెఱింగించి, గోవింద
మంచనశర్మ యి ట్లనియె:

259


క.

వ్రాలె నరవిందలోచన
పాలిండులు చూడఁ జూడఁ బ్రసవాంత్యమున,
న్నేలా యీ మాటల పని?
వ్రాలుట చోద్యంబె చక్రవాకులకొదమల్‌?

260


వ.

అనుచుం జనునప్పుడు ముందట నొకసైరికునిం గని, టిట్టి
భునకుం జూపి యి ట్లనియె:

261

చలిని సరకుగొనని సైరికుఁడు

తే.

మాఘమాసంబు పులివలె మలయుచుండఁ
బచ్చడం బమ్ముకొన్నాఁడు [82]పసరమునకు
ముదితచన్నులు పొగలేని ముర్మురములు
చలికి నొఱగొయ కే లుండు సైరికుండు?

262

అక్కలవాడలోని టక్కులాడులు

ఉ.

దిక్కరికుంభకూటముల దీకొను చన్నులు, కాముతేరిపై
టక్కెపుగండుమీల నును[83]డాల్కొను కన్నులు, క్రొమ్మెఱుంగుతో
[84]నుక్కివమాడు మేనిపస, యొడ్లకుఁ గల్గునె? యోరుఁగంటియం
దక్కలవాడలోని వెలయాండ్రకుఁ దక్కఁ, గిరాట టిట్టిభా!

263


వ.

అనుచు నట చని, వేశవాటంబు వెడలి, భైరవాలయద్వారంబున
బాడిపంతంబునం గూడిన వారవిటలోకంబుం గనుంగొని,
యేమి ధర్మాసనంబు దీర్చెదరొకో? యని యడిగిన,

264

జారధర్మాసనమున విషయచర్చ

సీ.

మును తనకూఁతు దీముగఁ జూపి రోపట్టు
                        పరదేశివిటునిచేఁ బణము గొనియు,
ననుపు పల్లవుని సన్నకుసన్న రప్పించి,
                        యతని శయ్యకుఁ దార్చి యనిపి పుచ్చి,
కైసేసి, తనయింటిదాసి నా విప్రున
                        కాతిథ్య మొనరింప ననుమతించె,
[85]దాని నా ద్విజుఁడు ప్రాతఃకాలమునఁ జూచి
                        బెడదవెట్టిన యప్డు బెదరదయ్యె,

తే.

పిళ్ళకోపంబుతో నిల్లు వెళ్ళివచ్చి,
తలవరుల కీ ప్రసంగ మంతయును జెప్ప,
వారు రప్పింప వచ్చె నీ వదరు జఱభి
లంజెతల్లియె యిదియు గుల్లాము గాక!

265


వ.

అనిన నజ్జఱభి భయంబు నొంది, సభాసదులకు దండప్రణా
మంబు సేసి, యా ద్రవిళు నుద్దేశించి.

266


శా.

నీకుం జేసిన బాస యెట్టిదియొ తుండీరద్విజశ్రేష్ఠ! మా
రాకాచంద్రనిభాస్య, కాకతిమహారాజేనిఁ బుత్తెంచినం
గైకో దెట్టులు, నేమి సేయుదును? శృంగారంపు లేఁదోఁటలోఁ
బైకొం గెత్తి, కుచంబు లొత్తి, పరిరంభం బీదు లేఁ గ్రోవికిన్‌.

267


వ.

మమ్ము నూరక రట్టుసేయుట ధర్మంబు గా దనుచున్న యా
ధూర్తజఱభిం జూచి, యవ్విటలోకంబు “ప్రోడ నొక్క
నిమిత్తంబున భంగపెట్టుట యుక్తం”బని “నీవు విటధర్మం
బెరిగినవాఁడ వానతీయవలయు” ననిన గోవిందుండు,

268

మంచనశర్మ న్యాయనిర్ణయము

క.

కందర్పశాస్త్రవేదులు
నిందుకు షాణ్మాసచింత యేలా నెఱపన్‌
సందేహింపక గొఱిగిం
పం దగు నీ జఱభిజుట్టు పట్టి రయమునన్‌.

269


తే.

ముక్కు సోణంబు దాఁకను జెక్కు టొకటి,
బోసినోరుగఁ బం డ్లూడబొడుచు టొకటి,
గూబ లంటంగఁ జెవిదోయి గోయు టొకటి,
లంజెతల్లి యొనర్చు కల్లలకు శిక్ష.

270


వ.

మాకుం దోఁచిన ధర్మంబు జెప్పితిమి. యథాపరాధంబుగా నీ
యధమజాతిని దండింపుఁడు. మఱియు నొక్కవిన్నపంబు.

271

మ.

స్మరదివ్యాగమకోవిదుల్‌, మదనశిక్షాతంత్రవిద్యావిదుల్‌,
సురతారంభమహాధ్వరప్రవణు, లిచ్చో నుండు వేశ్యావరుల్‌,
తిరమై నాకు ననుజ్ఞ యిండిపుడు ([86]తార్తీయీకమై యొప్పు న)
ప్పురుషార్థంబు నెఱుంగఁబోయెదఁ బునర్భూభామినీవాటికిన్‌.

272

సంధ్యాకాలమున ఆర్యవాటిప్రవేశము

వ.

అనంతరంబ భాస్వంతుండు వరుణరాజశుద్ధాంతకాంతానివాస
మాణిక్యదర్పణంబై, చరమగిరికటకకాననంబుమాటునం
జాటువడియెఁ, గాశ్మీరపరాగచ్ఛటాభాసురంబైన సంధ్యా
రాగంబు నింగి యింగిలీకంబునం బెట్టె. క్రీడోద్ధూతధూర్జటిజటా
జూటవల్లీమతల్లికామల్లికాకోరకాకారంబులై తారకంబులు
వియత్తలంబునఁ దళతళ వెలింగె. విభావరీపురంధ్రీకర్ణపూర
చాంపేయకుసుమసాదృశ్యసౌభాగ్యసంపత్సంసాదన
లంపటంబులై భువనప్రదేశంబులు ప్రకాశించె. నెఱసంజయు
మసమసకని చీకట్లునుం గలసి దిక్సౌధకూటవాటీనికురుంబం
బుల వ్రేలవిడిచిన కురువిందపూసలపేరునుం బోలె పొలుపు
మిగిలె. అప్పుడు గోవిందశర్మ గోధూళిలగ్నంబున నార్యవాటికఁ
బ్రవేశించి, కామమంజరీచౌర్యరతివిహారసంకేతస్థలంబులైన
రథ్యాముఖశివచత్వరప్రపామండపంబులు విలోకించుచుఁ,
గులటాఫాలతిలకంబులకుం గుంటెనకత్తియలగు కొత్తెమ
జంగమబోడితలకుం గ్రేగంటిచూపుసన్నఁ దనరాక యెఱిం
గింపుచు, నవ్వేళకుం జూడ గూఢవివిక్తంబునుం, బూర్వ
పరిచితంబునుం, బురుషశూన్యంబును, వివాహకాలోచితవృత్త
స్తనభారవివిధవిలాసవిప్రవాసకన్యాసనాథంబును, విశ్రామ
స్థలంబును, నైన యొక్కతమ్మడిసాని మందిరంబున విడిసి,
తనరాక దేవయాత్రావ్యాజంబున నప్పూజరివిధవచేత నెఱిం

గింపం బంచి, వీరభద్రేశ్వరస్థానంబువెనుక బొడ్డసబావి
యందుఁ గృతసంధ్యావందనుండై నిజాంతర్గతంబున,

273


ఉ.

కంగటికాలు పుచ్చుకొని ఖంగనఁ గాలు కిరీటకూటమున్‌
లొంగఁ గొనంగ లేరు, రవి నోరుఁ దటాలున దన్నలేరు, క
న్నింగల మూని దర్పకుని నేర్చఁగ లేరు, లలాటపట్టకో
త్సంగము చేరునే యహహ! తక్కటివేల్పులకై మదంజలుల్‌.

274


వ.

అనుచు శివార్చనంబు దీర్చి, సుఖాసీనుండై టిట్టిభునితో
యి ట్లనియె:

275


మ.

వదనాంభోరుహఫూత్క్రియాపవననిర్వాణప్రదీపంబు
...................................................................
...................................................................
......................................................................

276

మంచనశర్మ కామమంజరిని తలంచి వలవంతల పాలగుట

చ.

పొదలిన చీకువాల నడుప్రొద్దున, యౌవనగర్వవిక్రియా
మదమున, వింజ మా కిడినమాడ్కిఁ బురంబు జనంబు నిద్దురం
గదిరినవేళ, నాయెడకుఁ గామిని రా నలవాటు సేఁతకై
…………....................................... నిమీలితాక్షియై.

277


ఉ.

దట్టపునీలిచేల గడితంబుగఁ గచ్చ బిగించి, ద్రిండుగాఁ
గట్టి, కటారికోల కరకంజమునం ధరియించి, గుబ్బచ
న్కట్టునఁ దోపుటంగి తొడి, గ్రక్కున న న్నడురేయి వచ్చి, నా
కట్టెదురం జొహారు లనుఁ, గాంత భటుండయి నవ్వులాటకున్‌.

278


వ.

అనుచుం బెక్కుప్రకారంబుల నా కాముకుండు పూర్వవృత్తాం
తంబు కట్టనుంగుఁజెలికాడైన కిరాట టిట్టిభసెట్టితో నుబ్బున
నుగ్గడింపుచుఁ, గామమంజరీసందర్శనోత్కంఠాతిసంకులం

బైన చిత్తంబు మన్మథాయత్తంబై యుండఁ, గొండంత
యాశతో ధార్మికధర్మపతి యెప్పుడు వచ్చునో యని యువ్విళ్ళూ
రుచుం దృణంబు చలించినం, జీమ చిటు కన్ననుం, జెవి వ్రాలం
బెట్టి యాలించుచు, భామినీవిలోకనోత్సవం బాసన్నం బగుటం
జేసి ……….. ...................... దీపంబునుం బోలెఁ బరితాపంబు వహిం
చుచుండ, నంతఁ జంద్రుండు పురందరహరిద్దరీకుహరగర్భాంత
రాళంబున నుండి కంఠీరవంబునుం బోలె మింటికి లంఘించి,
మయూఖనఖరంబులం దిమిరకుంభికుంభంబులు వ్రచ్చి వందఱ
లాడి, నభఃక్రోడంబున నుడుగణంబులను ముత్తియంబుల
వెదజల్లె, నావేళ నిండువెన్నెల కాయఁ, బ్రాణనాయకుండు
వచ్చుటఁ గని, విని, పరమహర్షోత్కర్షంబున.

279


తే.

వీరభద్రేశ్వరార్చనావిధినెపమున
…...........…….. ......................
…............…….. ......................
…….............….. ......................

280

కామమంజరీసమాగమము

మ.

కరపద్మంబునఁ బైఁడిపళ్ళెరమునం గంధాక్షతల్‌ పచ్చక
ప్పురమున్‌ వీడెము గొంచుఁ, గ్రొత్తమడుఁగుం బొన్పట్టు నీరంగితో,
మురిపెం బొప్పఁగ వచ్చెఁ, జౌర్యరతసంభోగార్థమై కామమం
జరి గోవిందునియొద్దకున్‌, శివనమస్కారచ్ఛలం బొప్పఁగన్‌.

281


క.

మోదంబున రాకాచం
ద్రోదయదేవతయుఁ బోలె నొయ్యనఁ జని, శా
తోదరి గోవిందుని శ్రీ
పాదంబుల కెఱఁగె భక్తిభయలజ్జలతోన్‌.

282

ఉ.

మచ్చికయున్, బ్రమోదమును మన్ననయున్‌, నయమున్‌, విలాసమున్‌,
మెచ్చును, నేర్పడం దనకు మేయిడి మ్రొక్కిన కామమంజరిన్‌
గ్రుచ్చియుఁ గౌఁగిలించె, సరిగుబ్బచనుంగవ రెండుక్రేవలన్‌
బచ్చనివింటిజోదు పయిపైఁ బులకంబులు నారు వోయఁగన్‌.

283


వ.

అనంతరం బాసనాసీనులైన, నగ్గోవిందుండు కామమంజరిం
జూచి,

284


మ.

అరవిందాస్య! తలంచి చూడ నిది యత్యాశ్చర్యమో కాని, నీ
సరసాలాపము లాదరించి వినఁగా సంభావనం జూడఁగన్‌,
ఖరపాకం బయి కర్ణరంధ్రముల కంగారంబుగా, బిట్టు ని
ష్ఠురముల్‌ పల్కెడు రాజకీరములు గండుంగోయిల ల్వీణియల్‌.

285

టిట్టిభసెట్టికి తమ్మడిసానితోడి సాంగత్యము

వ.

అని జారదంపతులు పూజరివారి యింటిముంగిట, వెన్నెల బైట
నుండి, టిట్టుభునకుం గట్టాణిముత్తియంబునుం బోని తమ్మడి
[87]సానిం గూర్పు నేర్పు విచారించి, సన్నపుటెలుంగునం బూజరి
సానిం బిలిచి, కనకనిష్కంబుతోడఁ గూడఁ గర్పూరంబు
వీడియం బచ్చేడియచేతిలోనం బెట్టి, యాపాదమస్తకంబు
వీక్షించి శిరఃకంపంబు సేసి,

286


సీ.

బంగారుతలుపులు పాయంగ ధట్టించి
                        లావణ్యవిత్త మేలా వ్రయించె?
లావణ్యవిత్త మేలా వ్రయించున గాక!
                        యతిమాత్ర మేలా ప్రయాసపడియె?

నతిమాత్ర మాయాస మనుభవించును గాక
                        విటజనంబుల నేల వెడ్డుకొలిపె,
విటజనంబుల కారవేరంబు సేయగా
                        నేల నిర్మింపఁడో యెనయు మగని?


తే.

సొమ్ము పోక, మహాప్రయాసమ్ము రాక,
ప్రజలబాధ, నిరర్థకారంభణంబు
లెలమి సిద్ధింప నేమిగాఁ దలచె నొక్కొ
సరసిజాసనుఁ డీ తలోదరి సృజించి?

287


చ.

దొరసెమునందుఁ జుట్టుకొని తోరణకట్టె నురోవిభాగమున్‌,
నిరుడు పయోజకోశరమణీయతఁ దాల్చెను, వర్తమానవ
త్సరమున నొప్పె హేమకలశంబులబాగున, ముందటేటికిం
గరినిభయానచన్నుఁగవ కౌఁగిలిపట్టులు గాక యుండునే?

288


గీ.

సన్నచూపులఁ బూజరిసానిఁ బిలిచి,
పసిడిటంకంబు పరిరంభపణము సేసి,
టిట్టిభునితోడ నేఁడు కూడింపు కూఁతు
నేకశయ్య సహాయశ్రీకై రమింప.

289


క.

కన్నెఱిక [88]ముడుప వేఱే
సొన్నాటంకములు రెండు, చుట్టంబులలోఁ
గన్ను మొఱంగెడు నేర్పును
విన్నాణము మాకుఁ గలదు వెఱ పేమిటికిన్‌?

290


వ.

అని యనుమతింపం జెప్పి, బొమలమీఁద వెండ్రుకలు వ్రాలు
పూజరిసానిబిడ్డను వెడ్డుపెట్టి, టిట్టిభునిచేతి కిచ్చి, యచ్చవెన్నెలలం

బొరపొచ్చెంబు లేని మచ్చికల ...................... చంద్రమండలంబుమీఁద
దృష్టి నిలిపి, టిట్టిభుండు విన నిట్లనియె:

291

చంద్రునకు జారదంపతుల సమర్చ

సీ.

కలశపాథోరాశి గారాపునందన!
                        కల్యాణములు మాకుఁ గలుగఁజేయు,
కుసుమకోదండుని కూరిమిమామ! సౌ
                        ఖ్యాభ్యుదయంబు మా కాచరింపు,
రాకావిభావరీరమణీమనోహర!
                        సంతోషములు మాకు సవదరింపు,
శౌరిపట్టపుదేవి కూరిమిసయిదోడ!
                        యైశ్వర్యములు మాకు నాచరింపు,


తే.

మనుచు గొజ్జంగినీరను నర్ఘ్య మిచ్చి,
పచ్చకప్పుర మందంద బడసివైచి,
మ్రొక్కి రనురాగసంపద మూరిఁబోవ
జార జాయాపతులు నిండుచందురునకు.

292

ఉపసంహారోక్తి (భరతవాక్యము)

క.

నటులది దోరసముద్రము,
విటులది యోర్గల్లు, కవిది వినుకొండ, మహా
పుటభేదన మీ త్రితయము,
నిటఁ గూర్చెను బ్రహ్మ రసికు లెల్లను మెచ్చన్‌.

293


చ.

ముదమున ముల్కినాటిపురమోహనశైలసువర్ణకందరా
సదనుఁడు, కాలభైరవుఁడు, శంభునిపట్టి సమగ్రవైభవా

భ్యుదయపరంపరావిభవముల్‌ గృపసేయుఁ, గవీంద్రకాంక్షిత
త్రిదశ మహీరుహంబునకుఁ దిప్పయవల్లభరాయమంత్రికిన్‌.

294


వ.

అని యందరును యథాసుఖంబుగ నిజస్థానంబుల కరిగి, సుఖి
యించుచుండిరి.

295

ఆశ్వాసాంతగద్యము
ఇది శ్రీమన్మహామంత్రిశేఖర వినుకొండ తిప్పయామాత్యనందన
చందమాంబాగర్భపుణ్యోదయ సుకవిజనవిధేయ
వల్లభరాయప్రణీతంబైన క్రీడాభిరామంబను
వీథి నాటకంబున సర్వంబు
నేకాశ్వాసము

సంపూర్ణము

  1. వివిధరసభావనవీథి (మా)
  2. నాచంద్ర (మూ.ప్ర.)
  3. చెన్న
  4. ...న్నమంత్రీ (మూ.ప్ర.)
  5. నమంత్రికి (వ్రా.ప్ర.)
  6. వర్యుం (మా)
  7. ఈపాదమునందు అర్థక్రమము తప్పినది.
  8. ధవణి (మూ.ప్ర.); ఢవణి (మా)
  9. నోద్భవ వల్లభ (మూ.ప్ర.)
  10. గ్రంథపాతము
  11. డర్మవణి (మా.వే.), డర్య (మూ.ప్ర.)
  12. జెట్టులు చేమలు నేమి గల్గినన్‌ బతిచెడి (మూ.ప్ర.)
  13. సమకట్టు (మూ.ప్ర.)
  14. కోరలు (మూ.ప్ర.)
  15. వంచు
  16. రాయు
  17. జేయు
  18. నందు
  19. నొక్కు (మూ.ప్ర.)
  20. గొత్త (మూ.ప్ర.)
  21. వేణుకా కష్ట (మూ.ప్ర.)
  22. కీసిన (మూ.ప్ర.)
  23. చూ. శ్రీనాథుని వీథి. ప. 4)
  24. చూ. శ్రీనాథుని వీథి. ప. 13)
  25. నోడల (మూ.ప్ర.)
  26. వలెఁ జరియించె దేమి బుద్ధి? (మూ.ప్ర.)
  27. ఈపద్యము శ్రీనాథుని వీథిలోను గలదు. (చూ.ప. 107)
  28. దోహరివాడ (వే)
  29. తెగఁ గుట్టి (మూ.ప్ర.)
  30. నాయినారి (మూ.ప్ర.)
  31. కొప్పుగ
  32. ముల్కి (మూ.ప్ర.)
  33. నరుల (మూ.ప్ర.)
  34. తకదుమ్ముల్‌ యొకతాళముల్‌
  35. చరివోని (మూ.ప్ర.)
  36. లావేశమున (మూ.ప్ర.)
  37. బెత్తము (మూ.ప్ర.)
  38. మూర్ధాభినయము (వే)
  39. నట్టికసీలంత (మూ.ప్ర.)
  40. రమణుండు (వే)
  41. మిప్పూటకున్ (మూ.ప్ర.)
  42. యొజ్జల (మూ.ప్ర.)
  43. బఱిపోతుగఁ జేసినట్టి (మూ.ప్ర.)
  44. విద్ది చూచి (మూ.ప్ర.)
  45. రత్న (మూ.ప్ర.)
  46. మ్రోక లిడినారు కాశ్మీరమృగమదమున (మూ.ప్ర.)
  47. వాణీ (మూ.ప్ర.)
  48. పిలికూటంబు (మూ.ప్ర.)
  49. పిలి (మూ.ప్ర.)
  50. ఆపద్యము ప్రశ్నోత్తరరూపమునఁ గలదు.
  51. మాంగిలి మాంగిలి (మూ.ప్ర.)
  52. నీవి (వే), వీని (మూ.ప్ర.)
  53. ఈపద్యమున ప్రశ్నోత్తరములు గలవు.
  54. ధృతి (మూ.ప్ర.)
  55. …..వత్సరం బుడుగకుండ (మూ.ప్ర.)
  56. టిట్టిభసెట్టివిగ నిప్పించెను (మూ.ప్ర.)
  57. కారవల్లి (మూ.ప్ర.)
  58. వెంబడు (మూ.ప్ర.)
  59. మాంధాత్రుఁడు (మూ.ప్ర.)
  60. తెరల్పఁజార రితరుల్ యెన్నార లత్యుద్ధతిన్ (మూ.ప్ర.)
  61. లూరక కలుగఁగ (మూ.ప్ర.)
  62. చీర గట్టెడు మాసకమ్మకుఁ జాల దీర్ఘాయు రస్తు (మూ.ప్ర.)
  63. గాంధారి (మూ.ప్ర.)
  64. స్థానకములు (మూ.ప్ర.)
  65. సాలె (మూ.ప్ర.)
  66. గ్రుమ్మరించు (మూ.ప్ర.)
  67. నంద (మూ.ప్ర.)
  68. పారిజము పువ్వుచాయ నొప్పారెఁ జూడు (మూ.ప్ర.)
  69. వఱ్ఱంగా (మూ.ప్ర.)
  70. నంగారపర్ణుఁ డన్‌ (మూ.ప్ర.)
  71. మధుమావతి దాక్షారామమునఁ బుట్టు (?) (మూ.ప్ర.)
  72. గోవిలనుపేరి (మూ.ప్ర.)
  73. ననుపు మిండఁగీల (మూ.ప్ర.)
  74. మీ వాఁడు (మూ.ప్ర.)
  75. గుడిత్రాళ్ళను గోసె (మూ.ప్ర.)
  76. గణికా (మూ.ప్ర.)
  77. సరసతయును (మూ.ప్ర.)
  78. విభవ (మా)
  79. విడినారు టిట్టిభా (మూ.ప్ర.)
  80. గ్రాలంగ
  81. దుదంచితంబునను సంక్రీడించె దర్పుండు (మూ.ప్ర.)
  82. పణములకును (మూ.ప్ర.)
  83. డాల్నగు కన్నులు (మూ.ప్ర.)
  84. నుక్కిన యూరుకాంతియును నొండ్లకు (మూ.ప్ర.)
  85. తద్ద్విజుం డా తొత్తుఁ బ్రాతఃకాలమునఁ జూచి (?) (మూ.ప్ర.)
  86. ఈకుండలితభాగము మూ.ప్ర.లోఁ గానరాదు.
  87. సానికూతుం
  88. ముడుపు