Jump to content

కృష్ణరాయ విజయము/కృష్ణరాయవిజయము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

కృష్ణరాయ విజయము

పీఠిక


శా.

శ్రీసీతాసతితోడఁగూడి భువన క్షేమంకర ప్రక్రియో
ల్లాసం బొప్పఁగ లోకకంటకుల నెల్లం ద్రుంచి సత్కీర్తులన్
భాసిల్లున్ రఘువీరుఁ డెంతయును సంపత్ప్రౌడిరక్షించువీ
క్షాసద్వైఖరి నారివీటి చినరాజశ్రీమహారాయనిన్.

1


సీ.

జగదధిష్ఠానభాస్వజ్యోతి యగువాఁడు
         బ్రహ్మాదు లదరుదురాయివాఁడు
చలిగట్టుపట్టినిఁ దళుకుమేనఁ గలాఁడు
         చిఱునవ్వువెన్నెలల్ జిలుకువాఁడు
వాఁడు వీఁడనక యెవ్వనినైనఁ బ్రోచువాఁ
         డఖిలదై వతగురుం డైనవాఁడు
లీలమై శూలంబుఁ గేలఁ బూనినవాఁడు
         నలమేనిదొరతూఁపు గలుగువాఁడు


తే.

కలితపంపాతటంబున నిలుచువాఁడు
శ్రీవిరూపాక్షశివుఁడు రక్షించు నెపుడు
నఖిలసద్గుణమణి పేటి నారివీటి
చిన్న వేంకటరాయనిఁ జెలువుమీఱ.

2


క.

అంబానందనుఁడు మహా
లంబోదరుఁ డఖిలదివిజలక్షితనిజపా
దాంబుజుఁడు విఘ్నహారి ద
యాంబుధి మత్కృతిసహాయుఁడై ననుఁ బ్రోచున్.

3

క.

వీణాధర బింబోపమ
శోణాధర మధుపనికర సురుచిరవిలస
ద్వేణీభర పద్మోద్భవు
రాణి లసద్వాణి నన్ను రక్షించు దయన్.

4


క.

మద్వంశ్యుల కెల్లప్పుడు
సద్విద్యామహిమ యొసఁగి సత్కృపతోడన్
హృద్వనజములం దగుసం
పద్వైభవుఁ గాళహస్తిపతి నుతియింతున్.

5


తే.

అమ్మ జ్ఞానమ్మ శ్రీకాళహస్తివిభుని
కొమ్మ వేలుపురారాలకులుకుబొమ్మ
సమ్మదమ్మున నిపుడు నానెమ్మనమున
నెలకొని నితాంతసాహిత్యనియతి యొసఁగు.

6


సీ.

ఏస్వామి కారుణ్య మెరసినంతనె పటా
          పంచలై మాయాప్రపంచ మణఁగు
నేస్వామి యుపదేశమిచ్చినంతనె జీవ
          పరమాత్మలకు నైక్యభావ మందు
నేస్వామి శ్రుతివాక్య మెదిరినంతనె భేద
          వాదిమతంబులు వట్టి వౌను
ఏస్వామిసామ్రాజ్య మిచ్చినంతనె పున
          ర్జన్మంబు లేక మోక్షంబుగల్గు


తే.

మోదవిస్ఫూర్తి దక్షిణామూర్తి శివుఁడు
తానె యై యవతరించి నన్ ధన్యుఁ జేసె
నట్టివేదాంతమహితవిద్యాధురంధ
రుండు కాశీపతిస్వామి బ్రోచు నన్ను.

7


తే.

మూఁడుమాటల ధర్మంబు మొదలఁ దెలిపి
వెలుఁగునవ్వల వెలిఁగెడువెలుగుఁ జేర్చి

యద్భుతానంద మొనరించునట్టిబ్రహ్మ
కాచి మన్నన ననుఁ బ్రోచుఁ గరుణతోడ.

8


తే.

పుట్టఁ బుట్టినవాఁ డౌటఁ బుట్టతేనె
లుట్టిపడునట్టి జిగిమాట లొఱపుమీఱ
రాముచరితంబు వర్ణించి రహిఁ జెలంగు
మొదటికవిరాజు నెంతు సమ్మోద మలర.

9


ఆ.

ధరణి వ్యాసుఁ గాళిదాసు మయూరుని
మాఘు బిల్హణుని సమంచితగతి
నుతులు సేతు నెపుడు నతులితసంస్కృత
పటుకవిత్వ గరిమ పట్టువడఁగ.

10


సీ.

వాక్శాసనుం డనువాని నిక్కంబుగా
          నలబ్రహ్మదేవుఁడే యని నుతింతుఁ
గుండలీంద్ర సమాఖ్యఁ గొమకొందుకవిచంద్రు
          ననువొంద శేషాహి యని తలంతు
శ్రీనాథవిఖ్యాతిఁ జెన్నొందుబుధవర్యుఁ
          బురుషో త్తముఁ డటంచు బుజ్జగింతు
ధూర్జటిప్రౌఢిచే నూర్జితుం డగువాని
          సాక్షా చ్చివుం డని సంస్మరింతు


తే.

నవని మఱియును వెలసినయాంధ్రకవుల
నాధునికకావ్యకవుల యశోధనికుల
సారసాహిత్య సౌహిత్యసరణి వెలయ
వర్ణన లొనర్తు రమణీయ వాక్యములను

11


చ.

అపరిమిత ప్రభావుఁ డగునట్టిమహాకవిరాజు నెంచకే
నృపసభ యస్సరోవరము నెంచి యొకానొకచో వసింపుచుం
గృపణతతో బకాధముఁ డొగిన్ ద్విజరాజు హసించురీతి నే
రపువగఁబల్కు దుష్కవులఁ బ్రస్తుతి జేతురె సత్కవీశ్వరుల్.

12

క.

అని గురుదేవస్తోత్రం
బును కవినుతి కుకవినింద పొలు పమరంగా
నొనరిచి ప్రబంధ మొక్కటి
యనువందఁగ రచనఁ జేతు నని తలఁచునెడన్.

13


సీ.

నీలంపునికరంపునెఱినింపు గలవాఁడు
          డంబైనమణికిరీటంబువాఁడు
తోర మౌ కస్తూరిగీఱునామమువాఁడు
          మకరకుండలకాంతి మలయువాఁడు
కఱిమబ్బుజిగి నొప్పు మెఱుఁగు మేన్జిగివాఁడు
          మొలకనవ్వులఁ గుల్కు మోమువాఁడు
జంటైదుతలలరాక్షసునిఁ గూల్చినవాఁడు
          వానితమ్మునిఁ బ్రోచువలను వాఁడు


తే.

తళుకుబంగారుసరిగంచువలువవాఁడు
తరళపంకేజరుచిరనేత్రములవాఁడు
రామచంద్రుండు కారుణ్యరసము వెలయ
నపుడు నాకలలోనఁ బ్రత్యక్ష మగుచు.

14


క.

వత్సా! నిను రక్షింపఁగ
వాత్సల్యం బొదవె నౌ భవన్మధురిమరం
గత్సారవచనకృతినం
దత్సరణిన్ మాకు నంకితము సేయఁదగున్.

15


తే.

నేను శ్రీరామచంద్రుండ నిఖిలలోక
కర్తనగువాఁడ నీదుభాగ్యంబుకతన
నిపుడు ప్రత్యక్ష మైతి సందియమువలదు
వేగఁ గృతిసేయు మొకకథ వింత దనర.

16


తే.

అనుచు నంతర్హితుం డయ్యె నమ్మహాత్ముఁ
డపుడు నే మేలుకొని మది హర్ష మలర

నెంత ధన్యుండ నని యెంచి యెద్దియేని
తగుప్రబంధము సేయంగఁ దలఁచి యుంటి.

17


తే.

అంత నొకనాఁడు పొడగంటి నలరువిలుతు
వంటిచక్కఁదనంబున వలను మీఱి
సకలకవిరాజరక్షణోత్సుకత వెలయు
నట్టియార్వీటిచినవేంకటావనీంద్రు.

18


తే.

అమ్మహారాజుదర్శనం బైనయంత
భోజుసముఖంబు గలిగినతేజ మలర
మఱియు మఱియును నుప్పొంగుమధురరచన
బొడమి సంస్తుతిఁ జేసితి భూరిమహిమ.

19


వ.

వెండియు నఖండ ఖండపరశు కుండలిపరిబృఢాఖండల మహోద్దండ
వేదండ డిండీరపుండరీకపటీర హీర హారతార తారకాచల నార
దాపార పారద శారదా శారదశరదశర రాజహంస విరాజమానకీర్తి
చంద్రికా ధవళిత బ్రహ్మాండభాండుండును, భాండాగార భరిత
నిబిడ ద్రవిణ మణిగణ గణనీయ వైభ వాధరీకృత వైశ్రవణుండును,
శ్రవణభూషాయ మాణ సుధా ముధాకరణ నిపుణ నిఖిల పురాణేతిహాస
కథా ప్రసంగుండును, సంగరాంగణజయరమాంగనాసమాలింగిత
నిజభుజాగ్ర జాగ్రత్ఖడ్గధారా విఖండిత విమతమండలీ గళగళద్రక్త
ధారాప్రవాహాభినవ శోణభద్రా ప్రహర్షిత రత్నాకరుండును, కరార
వింద బంథురాంబురుహ రేఖాద్యనేకశుభలక్షణ భ్రాజమానుండును,
మానవతీమనోహరాకార రేఖాకార రేఖావధీరితనవనలకూబర జయంత
వసంత యామినీకాంతుండును, కాంతస్వకీయ బాహాప్రతాప ప్రభా
విపాలిత రసాలసాల కిసలయ కింశుక ప్రసవ కాంచన కల్హార కురు
వింద కందళ దళ త్కనకకేతకీ ప్రసూనుండును, సూనృత వచోవిని
ర్జితహరిశ్చంద్రుండును, చంద్రనగధీరుండును, ధీరజనహృదయరం

జక విహారుండును, హారకేయూరమకుటహస్త కటక ప్రముఖ
నిఖిల భూషణాలంకారుండును, కారుణ్యరస పూరితాంతరంగుండును,
తరంగవత్యభీకగంభీరుండును, భీరుజన సంరక్షణాంచత్కటాక్ష వీక్ష
ణుండును, క్షణక్షణ విచక్షణ క్షణతాభిరక్షితక్షితిసురవారాశీర్వాద
వర్ధిత సప్తార్ణవమధ్య సామ్రాజ్యసంపన్నుండును, పన్నగాధీశ మే
థాధురంధరుండును, ధరాధినాథ సభాంతర నిరంతరస్తవనీయ సరస
సంగీత సాహితీభోజుండును, భోజోద్భవారమణ సన్నిభధరాపాలన
ప్రవీణుండును, వీణాధరార్హ మాధుర్య ధుర్యవాగ్ధారణీ సమన్విత
కవితాలతా పునస్సముత్పాదనా మోదవన్మ హాకవీంద్రజాలాలవాల
సంపూరితకనకవర్షండును, వర్షాశనప్రభృతి వివిధజీవనోపాయ ప్రదాన
సమాహూయమాన శ్రీరంగ కాంచికా శేషాదలాదిపుణ్యస్థలస్థితాశేష
విప్ర జనకృతస్తోత్రుండును, సదాత్రేయగోత్ర పవిత్రుండును,
విచిత్ర శుభచరిత్రుండును, విరోధివరూధినీ హృదయపుటభేదనకర
పరమశివకరసంసిరుహ ముహుర్ముహుస్తాడిత డమరుఢమఢ మారవ
చమత్కారధిక్కారి భేరీవిరావ నిర్దళిత దశదిశాంతరుండును, శాంత
రంజిత గుణగణోత్తరుండును, కర్ణాట కాశ్మీర కాంభోజ గాంధార
సింధు సౌవీర మగధ ద్రవిడ కేరళ కళింగ వం గాంగ బంగాళ
పాంచాలాది దేశాధినాథదత్తబహువిధోపదాసమారబ్ధగంధసింధురసైంధ
వబంధురతదీ యసౌవర్ణమణిమయకోటీరకోటీరమాసాతత్యసమలంకృత
నిజగృహాంగణాభిరాముండును, సోమార్జవశచీంద్రబలిదధీచిమరున్నై
చికీవిరోచన కుమార మందార తిరస్కరణ నిపుణవితరణ గుణా
భరణుండును, షడ్రసోపేతనిరతాన్నదాన ధురీణుండును, వివిధ
కళారసాభిజ్ఞుండును, మూరురాయర గండప్రచండబిరుదాంకుండును,
ధరణీ వరాహాంకుండును, చాళుక్యనారాయణుండును, ఖడ్గనారాయ
ణుండును, లోభి వేశ్యాభుజంగండును, చంద్రవంశ పయః పారావార

సంపూర్ణ చంద్రుండును, రామపృధ్వీరమణ సాధ్వీమణి నాంచారమాంబా
గర్భ శుక్తిముక్తాఫలంబును, నగుచిన్న వేంకటరాయ రాజదేవేంద్రుండు
నిండువేడుకలు మెండుకొనఁ బండువెన్నెలలవన్నెల చిన్నెలఁజెన్న
లరుక్రొన్నెల రాలతిన్నెల నిగనిగల వగలుమీఱు మగరాలగోడల
నీడలం దురంగలించు క్రీడాపులినంపుఁగొణింగెల జెలంగురంగుల
మెలంగువెలుంగులు గలదట్టంపుచుట్టుబవంతి వింతజిగిదంతపు రేకు
సంతనలచే నలరు వంతుమీఱు గుజరాతి కెంపుసొంపు రాణించుబారి
దూలంపుకంబంపుగుంపుల నింపలరుతళుకుటద్దంపుచెక్కడపు మిక్కు.
టపు దారబందపు చందపు కుందనపుతలుపుమెలపులం బొలుపు లగు
వాకిళులఁ గట్టిన కట్టాణిమెట్టికలతొట్టికట్టుల ముంగిళ్ల నెసంగు మెచ్చు
గలబంగాళి విచ్చలపు హెచ్చువిలువ పచ్చలపసడాలు సొగసుల నెసంగు
కపురంపుటనంటికంబములడంబములవెలయుతోరణంబుల నలరుఘుమ
ఘుమలం జెందు చందుర కావిజిలుఁగు చందువాలపొందు వాటిల్లు
సాంబ్రాణి ధూపవాసనలు గుబురుకొను చిత్తర్వుహర్వుపదాఱ్వన్నె
జాళువామిన్నల నన్నుకొను నును కప్పురాలయొప్పున నొప్పుగొప్ప
యుప్పరిగలోన నిందిరారమణచరణారవిందధ్యాన నిష్ఠాగరిష్ఠ
శుభచర్యా ధుర్యు లగునాచార్యవర్యులును, నవార్యధైర్యవాదాను
మోద కర్కశ తర్కవ్యాకరణవేదాంతాది శాస్త్రార్థపరిజ్ఞానఘనులగు
విద్వజ్జనులను, కావ్యనాట కాలంకార సారజ్ఞ రచనాగరిష్ఠులగు సత్కవి
శ్రేష్ఠులును, సరసమృదులసంగీత విశారదపరాజిత నారదముని
నాయకులగుగాయకులును, సర్వసర్వంసహాధీశ్వర ప్రధానవర్గభృత్య
ప్రముఖులును, సుముఖులై పరమానందకందళిత హృదయారవిందులై
కొలువఁ జెలువలరుచలువపైఠాణిపావడలు వడఁక నౌక పడతుక
వింజామర వీవ, వేఱొక్కబోఁటి కాశాంజికా ఘనసారవీటికా కరండ
ముకురాది రాజ ద్రాజలాంఛనంబులు కరంబుల వహింప, మఱొక్కకల

కంఠీరత్నంబురత్నకంకణ ఝణఝణత్కారంబు తోరంబుగాఁగపురం
పుబాగా లొసంగ, శృంగారవైభవంబు లెసంగ బంగారుహొరంగు
సింగంపు రతనంపుగద్దియపైఁ బేరోలగంబుండియొక్క నాఁడు.

20


తే.

వితతకవితాప్రసంగసంగతుల నతుల
మతులఁ గృతు లయి కృతులు సంస్కృతపదాను
బంధబంధురరుచిరాంధ్రపదము లెసఁగ
రచనఘటియించుసత్కవుల్ ప్రణుతిసేయ

21


క.

కరుణాకటాక్షవీక్షణ
తరుణాంబుజముఖవిలాసదరహాసరుచుల్
మెఱయం గురువిద్ద్వజ్జన
సరసానుమతి న్నితాంత చతురత వెలయన్.

22


సీ.

నను భరద్వాజగోత్రుని సదాపస్తంబ
          సూత్రుని బాంధవస్తోత్రపాత్రు
పాకనాటార్వేలవంశ ప్రసిద్ధుని
          ధూర్జటిపౌత్రు బంధురచరిత్రు
సద్గురుకారుణ్య సంప్రాప్తవిద్యావి
          హారుని శ్రీకాళహస్తినిలయ
చిత్ప్రసూనాంబికాశ్రీకరానుగ్రహా
          సాదితకవితారసజ్ఞహృదయు


తే.

సారరచనాధురీణుఁ గుమారధూర్జ
టీప్రధానాగ్రగణ్యుఁ బటీరహీర
మహితసత్కీర్తి కాళియామాత్యపుత్త్రు
వేంకటార్యునిఁ బిలిపించి వేడ్క ననియె.

23


క.

బాలుఁడ వయ్యును విద్యా
శీలుఁడవు గభీరమధురశృంగారకళా

లాలితచాతుర్యకవి
త్వాలోచననిపుణ వేంకటామాత్యమణీ.

24


ఉ.

చిత్రము గాఁగఁ, జిన్నపుడె చేసితి వౌ రసముల్ చెలంగి సా
విత్రిచరిత్రమున్ మిగుల వేడుక నిందుమతీవివాహమున్
స్తోత్ర మొనర్ప నర్హమగు సూక్తిగతిన్ రచియించి తౌఁగదా
ధాత్రిఁబ్రసిద్ధిఁగాంచితివి ధన్యుఁడ వౌర కుమారధూర్జటీ.

25

పంచచామరము.

కుమారుఁ గన్నతండ్రిభక్తికూర్మిఁ గన్ననీ కహో
కుమారమణ్యధీశశంఖఘుంఘుమారవత్సన
త్కుమారతుల్యచిత్కళాభిగుప్తసూక్తి వింతయే
కుమారధూర్జటీ రసార్థగూఢరూఢవాగ్జటీ.

26


చ.

తెలుఁగునఁ జెప్ప నేర్చితి సుధీజను లెల్ల సెబాసు ధూర్జటీ
భళియనఁదళ్కుగుల్కువగబాటిలుతేటతెనుంగుమాటలన్
మెలకువఁగాంచుబెళ్కు జిగిమించఁ బ్రబంధములన్ ఘనంబుగా
బలుకులముద్దరాలిజిగిబంగరుటందెరవల్ చెలంగఁగన్.

27


ఉ.

ఒక్కొక్కవింతహోర నిజయుక్తుల సూరిజనుల్ నుతించఁగాఁ
జక్కనిమాట లెంతయు రసస్థితి ముందర బాఱుదీఱఁగాఁ
జక్కెరలొల్కఁదేనియలు సారెకుఁజిల్కగభవ్యకావ్యముల్
గ్రక్కునఁ జెప్ప నేర్తువనఁగా వినఁగా గడు వేడుకయ్యెడిన్.

28


చ.

స్తుతమతి యైనయాంధ్రకవిధూర్జటిపల్కుల కెట్లు గల్గెనో
యతులితమాధురీమహిమ నామును మీ పెదతాత చాలస
న్నుతిఁ గనెఁ గృష్ణరాయలమనోజ్ఞసభన్‌వినుమీవునట్లుమ
త్కృతబహుమానవైఖరులఁగీర్తివహింపుముధాత్రిలోపలన్

29


క.

మాకరుణకుఁ బాత్రుండవు
ప్రాకటగతిఁ బద్యకావ్యఫణితిం జెపుమా

శ్రీకృష్ణరాయచరితము
నీకవితాప్రౌఢి సుకవినికరము మెచ్చన్.

30


తే.

అనుచు బంగారుకడియముల్ హారములును
తాళి చౌకట్లు జాళువాతగటిపాగ
రంగలరుపట్టుపచ్చడా లుంగరములు
తళుకుజిగిమేల్మిసరిపెణుల్ దయ నొసంగి

31


క.

ఉరుధాటీఘనఘోటీ
వరశాటీస్వగ్రహారవాటీచిత్ర
స్ఫురితమణిపేటు లాదిగ
స్మరకోటిసమానుఁ డతఁడు సమకొల్పి కృపన్.

32


తే.

సారఖర్జూర కదళికా నారికేళ
ఫలసముత్కర చందనకలిత కుంకు
మములు గస్తూరియును సంకుమదము మొదలు
గాఁగఁ గర్పూరవీటికఁ గరుణ నొసఁగె.

33


ఉ.

అందుల కెంతయుం బ్రమదమందుచు రాయలవారలౌరనా
డెందమునందుఁ గల్గినటు ఠీవి నొసంగె ధరిత్రిలోన నీ
యందమునన్ రసజ్జు లయినట్టిదొరల్ గలరే యటంచు నే
బొందుగఁగృష్ణరాయకథఁబొల్పగుకావ్యముఁజేయఁబూనుచున్.

34


తే.

అమ్మహారాజుతోడ నిట్లంటి మఱియు
జనవరేణ్య భవద్వాక్యసరణి నిపుడె
కృతి యొనర్చెద నిదియు నంకితము జేయు
టెవ్వరి కటన్న నవ్విభుఁ డిట్టు లనియె.

35


క.

శ్రీరామున కంకితముగ
గారవమునఁ జేయు మనఘ కడు శీఘ్రముగా

శ్రీరంజిలు నీ కనవుడు
నౌర మహిన్ భాగ్య మబ్బె నని కడువేడ్కన్.

36

షష్ఠ్యంతములు

క.

శ్రీజనకనందనాస్తన
రాజత్కుంకుమకళాభిరాజితవక్షో
భ్రాజితభూషణఘృణికి మ
హాజినటద్దితిజసామజావళిసృణికిన్.

37


క.

చండతరదివ్యసునిశిత
కాండునకు నజాండభాండఘటనాఘటనో
ద్దండునకు నండజాధిప
కాండునకున్ సుగుణరత్నఘనకాండునకున్.

38


క.

శారదనీరదనారద
పారదహిమతారహీర బంధురకీర్తి
శ్రీరమ్యునకున్ సద్వి
ద్యారహితజనాళిమానసాగమ్యునకున్.

39


క.

రామునకు సర్వజగదభి
రామునకున్ విజితపరశురామునకు ముని
స్తోమస్తుతబహువైభవ
ధామునకు సురారివరసుధాధామునకున్.

40


క.

ఆర్వీటివంశ చినరా
జోర్వీరమణాభిరక్షణోత్సుకునకు గం
ధర్వాదిదివిజనుతునకు
సర్వజ్ఞునకున్ సమస్తజగదీశునకున్.

41


వ.

నావిన్నవింపం బూనిన కృష్ణరాయవిజయం బనుమహాప్రబంధం
బునకుం గథాప్రారంభం బెట్టి దనిన.

42

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము

సీ.

శ్రీరమారమణవిహారహారిగృహంబు
          బహుశోభనాన్వితప్రత్యహంబు
సతతపౌరజనాచరితవిస్తృతమహంబు
          దుర్వారచతురంగధూర్వహంబు
శ్రీమహరత్సుమగంధసహితగంధవహంబు
          దీపితారాతిగర్వాపహంబు
నాయికానాయకోన్నతరహఃకలహంబు
          సర్వవస్తువ్రాతసంగ్రహంబు


తే.

మహిని రహి మీఱునౌర పంపానదీత
రంగసంఘఘుమంఘుమారవవిధూత
జాహ్నవీనిమ్నగాసుధాసాగరంబు
విజయనగరంబు సుజనసంవిత్కరంబు.

43


ఉ.

శ్రీ దళుకొత్తుఁ దత్పురినిఁ జెన్నగుమేడ లనంతరత్న సం
ఛాదనలీలఁ జెంది వరుసన్ బహురాజమరాళసంతతా
హ్లాద మొనర్చుచున్ ఘనసుధాంశుపరిస్ఫురణావృతిస్థితిన్
మేదినిఁ జూడఁ జూడ నెలమి న్శరదంబుదరేఖలో యనన్

44


మ.

తనసాలస్థితిఁ జూచువారికి యథార్ధంబైతగం గోట యొ
ప్పు నవీనద్యుతిఁ గొమ్మ లంబరమునన్ బొల్పార సంబద్ధర
త్ననికాయంబులు కాయలున్ ఫలము లాదారిం బ్రకాశింపఁగా.
ఘనతన్ జాలకజాలముల్ దళములుం గన్పింప నాప్రోలునన్.

45

సీ

పార్శ్వస్థగిరిదరీపద్మరాగప్రభల్
          పొలు పైనకుంకుమపూఁత లనఁగఁ
దుంగభద్రానదీతోయబిండువ్రాత
          ములు సుపాణిమెఱుంగుమ్రుగ్గు లనఁగ
నికటాద్రి జపటీరనికషణజ్వలనధూ
          మములు సాంబ్రాణిధూమము లనంగ
మందానీలోద్ధూతమాకందఫలపరం
          పరలు నైవేద్యసంపద లనంగ


తే.

నౌర యకృతప్రయత్నోపచారగరిమ
లమరె నని దివ్యమునులెల్ల నభినుతింప
సకలనిత్యోత్సవంబున సంతతమును
హరిహరగృహంబు లలరుఁ దత్పురమునందు

46


సీ.

తతరజోగుణవృద్ధిఁ దాల్చుచు సతతంబు
          రాజహంసాధఃకరణ మొనర్చె
దానభోగాసక్తిఁ దప్పక నిరతంబు
          సురపానహితయుక్తిఁ జూడనేర్చె
భూకాంతహితసూక్తిఁ బొరయనియొకపద్య
          ఫణితిని దుర్దైత్యగణము నెంచెఁ
దనశక్తిఁ దలఁచి యుండకయె మున్ బోరి వి
          శ్వామిత్త్రు మంచివాఁ డనుచుఁ బల్కె


తే.

నరయఁ జదు వెంత యాచారపరత యెంత
కవి యనుట యెంత సామర్థ్యగరిమ యెంత
యనుచు నవ్వుదు రచటిధరామరోత్త
ములు విధి గురు భృగుజ వసిష్ఠుల నయారె.

47

సీ.

గురుకర్ణహరణదుష్కరమహాధర్ముఁడై
          మును పేడి యనిపించుకొనక యున్న
నొకశిఖండికి చాల నొద్దిక యై బ్రహ్మ
          చర్యవ్రతునిఁ జంపఁ జనక యున్న
నాయుధంబులు మాని ప్రాయోపవిష్టుఁడౌ
          పుణ్యాత్ముకర మేయఁ బూన కున్న
దురములో నొకగొల్లదొర సహాయుఁడు గాక
          కలకాలము స్వశక్తి గలిగి యున్న


తే.

మెచ్చవచ్చును వివ్వచ్చు హెచ్చు గాఁగ
ననుచు బ్రహసింతు రధికబలైకరణజి
తారివీరులు నసహాయశూరు లైన
రాట్కుమారులు తత్పురీరత్నమునను.

48


ఉ.

ఎప్పుడుఁ గోటికిం బడగ లెత్తినవారు మనీషశేషునిం
దప్పులువట్టువారు వరదానవిభూతినిఁ గర్ణముఖ్యులం
దెప్పెడివారు ధర్మములు దిక్తటులన్ వెలయించువారునై
యప్పురిలోనివైశ్యులుసుఖాన్వితులై వసియింతు రెంతయున్.

49


ఉ.

హృద్రమణీయవారిజదరీభ్రమరీభవధీశు లప్పురీ
శూద్రులు విప్రభక్తిజయశోభలభద్రులు జన్యరంగసౌ
భద్రులు ధైర్యనిర్జితసుపర్వమహాద్రులు దాతృతానిలిం
పద్రులు సర్వసస్యబలభద్రులు బొల్తురు సద్గుణోన్నతిన్.

50


చ.

రతిపతిమోహనాస్త్రములు రత్నశలాకలు కాంచనోజ్జ్వల
ప్రతిమలు మల్లికాలతలు పద్మజునంచలు నాట్యశాస్త్రదే
వతలు సుధాంశురేఖలు ప్రవాళపురెమ్మలు ముద్దుగుమ్మల
ద్భుతనవయౌవనాకృతులఁ బొల్చినతత్పురివారకామినుల్

51

మ.

వరుసన్ బృంహితహేషగర్జ లెసగన్ వర్షాంబుధారాగతిన్
వరగండద్వితయీగళత్పృథుఝరీవారంబు లుప్పొంగ న
ప్పురమందున్ గజబృందముల్ దనరునంభోధిస్థలోత్క్రాంతసం
చరదద్రీంద్రములో యనంగ నవరాజన్నీలమేఘోన్నతిన్.

52


సీ.

ఒక్కనిబ్బరముగా హురుమత్తుపరువెత్తు
          సళ్శించుకళెముల్ ఘల్లనంగ
మళ్ళించుచీ రైనమలఁచినవలయాద్రి
          దాఁటి క్రమ్మఱ వచ్చుదాఁటు వెలయ
గడువడిఁ జేసన్న కంఠ మాస్ఫాలింప
          చౌకముల్ రవ లెచ్చ సంచరించు
చండవేగంబు లై రెండువీథుల జుట్టు
          వేడెముల్ వచ్చు ప్రవీణగతుల


తే.

నౌర సాదుల నెమ్మేను లలయ నీక
వన్ని యకడానిరెండంకె వన్నె లలరఁ
దత్పురీరత్ననూత్న గాంధారసింధు
బాహ్లికారట్టకాంభోజపటుహయములు.

53


సీ.

మధురసాధికసుధామధుర సారోల్లస
           స్మధురసావల్లరీమహిమతోడ
సురసాలతుల్యభాసురసాల వనమధ్య
           సురసాలజంబీరతరులతోడఁ
బున్నాగహితసూనపున్నాగసంచర
          త్పున్నాగకైతకస్పురణతోడ
బాలికారమణీయ పాళికాసవమధు
          పాళికాసారసంపదలతోడ

తే.

మల్లికావల్లికాగిరిమల్లికామ
తల్లికలతోడఁ దాళహింతాళకదళి
కావకుళసంఘములతోడ ఘనత మీఱు
నౌర విద్యానగరమహోద్యానతతులు.

54


సీ.

చిగురాకుపైఁ గెంపుసొగసయ్యె బింబోష్ఠ
          యది ప్రవాళప్రౌఢి నలరుఁ గాదె
ఆలులు నీచూపుల కలరునే చపలాక్షి
          పైఁడి నల్గినవానిపస య దెంత
గోరంటవిరిగుత్తిసౌ రంటునె లతాంగి
          చెల్లఁబో నీ కేల గిల్ల నగునె
ఆననపరిమళం బమరునే చంద్రాస్య
          వలచువారికి లేవె వలపువిరు ల


తే.

టంచు భావార్థగూఢవాక్యములు మెఱయ
సరససాంబ్రాణిధూపవాసనలవిరులు
విటుల కందిత్తు రప్పురివీథులందుఁ
బూలసరు లమ్ముప్రాయంపుఁబూవుబోండ్లు

55


వ.

మఱియు నప్పురవరంబు కరంబు తిరం బైన శృంగారంబు నం
దనరుచుఁ దనరుచులం బ్రచురంబు లై యంబరమణీ వితానంబుల
నవలఁ ద్రోయం గలమెఱుంగుల రంగలరు బంగరుహొరంగుల నెసంగి
చెంగలువరారాలడాలు గీలుకొను ప్రరులహరువులమురువుల మురుపు
మీఱిధరాపురంధ్రీ చరణనూపురం బనందగి ధర్మపుంగవమహోన్నతం
బగు మూఁపురం బనం గల పురద్వార పృథుగోపురంబు సవిధ వివిధ
హేమకూటమతంగప్రముఖనిఖిలధరాధరంబులమించి గోపురోపరిలో
కంబులఁ గ్రమక్రమంబుల నధిగమించిన యౌన్నత్యంబున సత్యలోక

పర్యంతంబు సాంతత్యంబు గనుటఁ దదీయవైచిత్ర్యంబుం గనుంగొని
తనకన్న మిన్న యగు సృష్టిచాతుర్యంబు గన్న పురుషవర్యుం డెవఁ
డిది నిర్మించెనో యని యద్భుతంబున దద్వైదగ్ధ్యసాకల్యసమ్యగ్వీక్షా
మతిం జనుదెంచి యంతరిక్షంబున నిల్చినవిరించి వెంట నంటివచ్చిన
నిలింపశంపాలతాంగు లని యప్రతిమానఖచిత ప్రతిమానికరంబుల
నంతఃపురసౌధవీథికాజాలమార్గంబుల నిరీక్షించుఁ జంచలాక్షులనిద్దంపు
ముద్దుమోములఁ దద్దయుం బ్రొద్దు సుద్దదిద్దడపు పచ్చరాగచ్చుమేల్మ
చ్చుల నిచ్చలపు సోరణగండ్లదారిఁ గనుంగొను పురాంగనల ముచ్చట
లెచ్చు జిలిబిలిపలుకులకులుకులకు మెలఁకువ లెసంగ ననంగ సంగర
సమయ గళరవంబులం దలంపించు కలరవంబుల కలరవంబు విని
ముఖారవిందంబుల నెలనవ్వు లొలయ సొలయునిజాననంబులం దప్పక
చూచు ప్రియునిచెయువులకుఁ గలకల నగుచు సరసంబులు మెఱయ
వినయంబులు నెఱయు వారలతోడ మందిరాళిందబహిర్ద్వారవజ్రనిర్మిత
వితర్ధికలం గూర్చుండి చతురలై చతురంగద్యూతలీలాలాలసలగువార
బాలామణుల కటాక్ష వీక్షణంబులను క్రొవ్వాడితూఁపులు గాడిన డింది
వలరేనివేఁడిమింబొంది పోఁడిమి దక్కిచిక్కుఁబడి యొక్కొక్క నెప
మ్మున నవలఁజను విటులచటులవాక్పటిమలం బిలుచుపడుచువగపూ
విలువచెలువల చెలువలరు పలుకుజలువల కలకల నలరులు గొనం
దొరసి బోటుల యటమట లాకర్ణింప నింపొనరు సొంపు పెంపులం
జాణతనంబున నుత్తరంబు లొసంగుచమత్కారంబులు విను పరాకున
బేరంబు లాడందడబడు వైశ్యకుమారుల యంగళ్ళ చెంగటిముంగిళ్ల
నిండియుండు కుంకుమసంకుమదకర్పూరచందనాగరు కస్తూరికాది
పరిమళవిచిత్రవర్ణి కావివిధపట్టాంబరంబుల నలంకృతంబు లగువిపణి
కలతోరంబు లగు పచ్చతోరణంబుల తోరణంబు లొనర్చు ప్రతిభవ
నాంగణప్రవర్ధితంబు లగుపాళికా నారికేళ పాళికలనీడల జాడల నాడా

డాడం జూడజూడ వేడుక నాడుచుండు బాలురయాటపాటలకు
మోదంబు గదుర గ్రక్కున నక్కునం జేర్చుకొనుతల్లు లగువనితా
మతల్లులతనూవల్లుల నల్లువితంబు లగుభూషణద్యుతుల హల్లీసకంబుల
గుసువర్ణాంశుకంబులం గదలించుకమ్మదెమ్మెరల చలాచలంబులగు
గగనభాగధగద్ధగాయ మాన సౌధయూథ నవీనకేతనప్రభావిభాసితం
బులగు రాజమార్గంబులం గట్టిన నవరత్ననూతనకిరణంబులు ధరా
రమణీఘనాభ రణంబుల రత్నంబులనంగనుపట్ట నమరావతిరీతి సుధ
ర్మాభిరామ విబుధ నికరరంభాచిత్ర రేఖావిచిత్రంబై హస్తిపురంబుభాతి
శాంత నవరాజరాజగురుకృపాలంకృతంబై యింద్రప్రస్థంబుచందంబున
యుధిష్ఠిర భీమార్జునకీర్తిధుర్యంబై ద్వారకానగర ప్రకారంబున
నచ్యుత ప్రద్యుమ్న బలభద్రభాసితంబై భోగవతియందంబున ననంత
కుండలీంద్ర ప్రముఖ పున్నాగవిరాజితంబై సరోవరంబువిధంబునం
గువలయద్విజాశ్రయంబునుం గమలాభిరామంబు నగుచు నాలస్యంబు
నితంబినీగమనంబులయంద, చాంచల్యంబు చంద్రాననాలోచనంబుల
యంద, వక్రత్వంబు చక్రస్తనీనీలాలకంబులయంద, కాఠిన్యంబు
బాలామణీకుచద్వయంబులయంద, చోరత్వంబు మానినీమాన ధనంబు
లయందునుం గాని మఱెందును లేక సర్వశుభలక్షణుంబులఁ జెన్నొందు
నప్పురంబున కధీశ్వరుండు.

56


ఉ.

శ్రీరమణీమనోరమణసేవనతత్పరుఁ డబ్జసంభవ
శ్రీరమణీయకీర్తినిధి చిత్తజసన్నిభమూర్తి విద్విష
ద్వీరభయంకర ప్రకటవిశ్రుతశౌర్యధురంధరుండు నౌ
వీరనృసింహరాయపృథివీపతి పొల్చు నఖండసంపదన్.

57


సీ.

తనకీర్తిచంద్రికల్ దశదిశాభామినీ
          కమనీయకౌ శేయకములు గాఁగఁ

దనప్రతాపద్యుతుల్ ఘనవైరిరాడ్గర్వ
          తిమిరౌఘబాలాతపములు గాఁగఁ
దనసద్గుతావళుల్ వనధివేష్టితధరా
          వితతార్థికల్పకలతలు గాఁగ
దనవచోనిచయముల్ వినుతవిద్వత్కవీం
          ద్రమణికర్ణావతంసములు గాఁగఁ


తే.

ధరణిఁ జెలువొందు నిజఖడ్గదళితవిమత
మండలోద్దండవేదండమండలుండు
మండలీకృతచండకోదండగళిత
కాండదుస్సహుఁ డాధరాఖండలుండు

58


ఉ.

అంచితకీర్తి యన్నరవరాగ్రణి ప్రొద్దున నొక్కనాఁడు మే
ల్కాంచి ధరామరద్వయినిఁ గన్గొని శ్రీహరినామకీర్తనల్
మంచిపురాణముల్ బుధసమాజము దెల్పఁగ నాలకించి మో
దించి ప్రభాతకృత్యములు దీఱిచి సత్కృతిఁబంచివారలన్.

59


తే.

కళుకుబంగరువన్నె బంగరుమెఱుంగు
రహి జెలంగుజగాహజారంబులోని
చికిలితుమ్మెదవగ లానుచిత్రమణుల
డంబు మీఱిన సింహాసనంబుమీఁద.

60


సీ.

మొగి సలాము లొనర్చి ముదముతో దవ్వుగ
          భయముతోడ వజీర్లు బాఱు దీఱ
సాష్టాంగముగ మ్రొక్కిసామంతనృపకోటి
          కోటీరమణిఘృణి గ్రుమ్మరింప
మన్నీలు బాంధవుల్ మన్నన ల్గలవార
          లొకదండ సంతోషయుక్తి నుండఁ
గానుక ల్గొని వచ్చి గౌరవం బలరంగ
          బాళెంపు దొరగుంపు ప్రస్తుతింప

తే.

దండిభవభూతినిభు లైన దండికవులు
సరసవిద్వత్కవుల్ దనసరస వెలయ
వనిత లిరుగడఁ బైఁడిపావడలు వీవఁ
బ్రమద మలరంగఁ బేరోలగమున నుండె.

61


వ.

తదనంతరకథావృత్తాంతం బెట్టిదనిన.

62


చ.

అనుపమితప్రభావయుతహారిచరిత్రధరాసుతామనో
వనరుహమిత్ర మిత్రకులవారిధినాథనిశాకళత్ర స
జ్జనవనచైత్ర వైద్యుతనిజద్యుతిమద్ఘననేత్ర లోకపా
వననిజనామకీర్తననివారితభక్తవరాఘ రాఘవా.

63


క.

శరదిందువదనకుంద
స్ఫురదంచితరదన దివిజమునిహృత్సదనా
యరవిందదృశాళిమనో
హరనిజకేలనజితాఖిలాసురకదనా.

64


మాలిని.

హారిదృగ్బంధురా హారయుక్కంధరా
నీరజాతేక్షణా నిత్యసత్యక్షణా
ధీరసన్నాధితా దివ్యరాడ్వందితా
భూరివిద్యానిధి భూమిజా సేవధీ.


గద్యము.

ఇది శ్రీమదోరుగంటి కాశీపతిసద్గురురాజయోగీంద్ర చరణారవింద
మనోవిహార నిరంతరానందకర రాజయోగ సామ్రాజ్య లక్ష్మీధురంధర
స్వస్వరూపానుభవసంపన్నజ్ఞాన ప్రసూనాంబికా కాళహస్తీశ్వరకరుణా
కటాక్షవీక్షణప్రసాదిత కవితాచమత్కార కాళయామాత్య లక్ష్మాంబికా
దత్తపోలమంత్రిగురువమాంబికాకుమార ధూర్జటి ప్రణీతంబైన శ్రీకృష్ణ
రాయవిజయం బనుమహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.

శ్రీరస్తు

కృష్ణరాయ విజయము

ద్వితీయాశ్వాసము

శ్రీవిలసదారువీటికు
లావిర్భావచినవేంకటాధిపరక్షా
ప్రావీణ్యభక్తిగణ్యద
యావృత కోదండరామ యతులితధామా.

1


సీ.

అందంబుగ నలికమం దొప్పుతిరుమణి
          తిరుచూర్ణమును వింతమెఱుఁగు లీన
నిద్దంపుఁజెక్కుల ముద్దుగుల్కుకడాని
          కుండలంబులకాంతి మెండుకొనఁగ
శంఖచక్రాకీర్ణసౌవర్ణమకుటముల్
          ధళధళద్యుతులు దిక్తటుల నించఁ
బదియాఱుమూరడంబపుటంచుకమ్మిడాల్
          కంబిదోవతిచెల్వు మించు లెసఁగ


తే.

కంఠవలమాననవమాలికల్ రహింపఁ
గేలఁ బద్మాక్షమాలికల్ గీలుకొల్పి
వియ్య మందంగ ధారాళశయ్య సత్ప్ర
బంధరావంబు నెఱయంగఁ బ్రౌడి వెలయ.

2


క.

కడువేడుక నడుగడుగునఁ
బుడమిన్ సాష్టాంగముగను భుజముద్రలతో

నడుగులకు మ్రొక్క జనముల
నడియందాసోహమనెడియార్భటు లెసఁగన్.

3


సీ.

ఆచార్యకరుణ చక్రాంకనమ్ములు మీకు
          నింతవఱకును లే దేమి రోరి
మీతండ్రి తాత మాచేత శిక్షితు లైరి
          మీ రెఱుంగరె చిన్నవారు గాన
తిరుమాళిగెకును రా దీఱదో యిన్నాళ్ళ
          వలెఁ గాదు మించె నైశ్వర్య మౌర
మంచిది యైన నే మాయెలే దయచేసి
          నారము లేదు లే నేర మిదిగొ


తే.

దీర్థమును ప్రసాదము మీకుఁ దెచ్చినార
మనుచుఁగొంద ఱొసంగుచు నద్భుతముగ
వెంట నిజశిష్యగణములు వేలు గొలువ
వైష్ణవులు వచ్చి రపుడు భూవరుని సభకు.

4


ఉ.

పొంకపుపట్టెనామములు పొల్పగుమేల్తిరుచూర్ణరేఖలున్
చంకల తాళికాదళ విసారిత పేటికలున్ భుజంబులన్
సంకును చక్రము ల్గలుగుసాత్తనివా రరుదెంచి రప్పు డా
పంకజనాభపాదయుగభక్తులవెంబడి సందడించుచున్.

5


సీ.

చిత్రవస్త్రములతో సిగలపైఁ గట్టిన
          శివలింగము ల్చాలఁ జిందులాడ
కర్ణాంతవిశ్రాంతఘనఫాలభసితత్రి
          పుండ్రగంధాక్షతస్ఫూర్తులమర
స్ఫటికప్రవాళవిస్ఫుటభుజాంతరనట
          ద్భద్రరుద్రాక్షనైపథ్య మలర

గటినిఁ గట్టిననీరుకావిదోవతిచాయ
           లెఱ్ఱగన్నెరుపూల నీసడింప


తే.

హర మహాదేవ పార్వతీశ్వర యటంచు
వెంట శైవద్విజుల్ గొంద ఱంటి రాగ
నధ్యయనధుర్యు లైనయారాధ్యవరులు
సరగ నరుదెంచిరి నృపాలుసముఖమునకు.

6


ఉ.

వచ్చినయమ్మహాత్ములకు వందనము ల్ఘటియించుచు న్విభుం
డచ్చెరు వొప్పఁగా మణిమయాంచితకాంచనపీఠసీమలం
దచ్చినభక్తి నుంచి వినయంబు జనింప శుభో క్తిమించ వా
రిచ్చుప్రసాదతీర్థముల నెంతయుఁ గైకొని వేడ్కనిట్లనెన్.

7


శా.

శ్రీరంగస్థల శేషశైలముఖ లక్ష్మీనాథదివ్యస్థలిన్
శ్రీ రంజిల్లఁగ వైభవోన్నతులచే జెన్నొప్పునే నావు డా
ధీరశ్రేష్ఠులు తావకాంచితయశస్తేజోవిరాజన్మహా
జ్ఞారూఢి న్సకలోత్సవంబులును బొల్పౌనన్న హృష్టాత్ముఁడై .

8


తే.

పాంచభౌతికలింగ ప్రభావలీల
నలరునేకామ్రజంబ కేశులకు ధారు
ణీశ్వరునకును గాళహస్తీశ్వరునకు
నలచిదంబరునకు వేడ్క లలరు ననుచు.

9


శా.

గారా మొప్ప గభీరసూక్తితమయోగక్షేమముల్ ప్రౌఢులౌ
నారాధ్యు ల్దెలుప న్బళీ యనుచు నత్యంతప్రమోదాప్తినెం
దే రాజన్మణిభూషణాంబరతతుల్ తేజిల్లుగ్రామాళి వే
ర్వేఱన్ వారికి నిచ్చి పంపె హృదయావిర్భూతకారుణ్యుఁడై.

10


శా.

ఆక్షోణీరమణాగ్రగణ్యుఁడు విరూపాక్షేశ్వరస్వామికిన్
రక్షాశిక్షకుఁ డైనవిట్ఠలునకున్ రంజిల్లునిత్యోత్సవం

బక్షయ్యబుగ మించునంచు నిజభృత్యశ్రేణి దెల్పన్నితాం
తక్షేమంకరుఁ డై పురీజనులు నానందంబునం జెందఁగన్.

11


పంచచామరము.

దణాయలున్ దలారులున్ ముదంబునం గ్రమంబుగా
క్షణక్షణంబునం బరాకు సారెసారె దెల్పఁగా
రణాంగణావధీరితారిరాజరాజి యైశుభే
క్షణక్షణాభివీక్ష్యరక్ష్యసత్కవీంద్రపాళి యై

12


వ.

తత్సభాసదులం గనుంగొని.

13


క.

వెలయఁగ విద్యారణ్యులు
చెలువల[1]రం గని పురంబు సేయక మునుపే
కొలఁది దనరారు నీస్థల
మిలలో నిచ్చటి మహత్త్వ మెందునుగలదే.

14


శా.

విద్యారణ్యు లనంగ నెవ్వరతఁ డేవిద్యం బ్రకాశించె నీ
హృద్యంబైనపురం బొనర్చువిభవం బేలాగునం గాంచెనో
చోద్యం బయ్యెడి మీరు విన్నకథ యిచ్చో లెస్సగాఁ దెల్పుఁడీ
యాద్యంతంబునటన్నఁ దత్సభికు లాహ్లాదంబుతో నుండఁగన్.

15


మ.

రమణీయాభ్రతరంగిణీముమఘుమారావార్థగంభీరవా
క్క్రమజంఝూనిలధూతదుష్కవిమహాగర్వాభ్రస౦ఘు౦డు ది
గ్రమణీమౌక్తికహారబంధురయశోరాజద్గుణాఢ్యుండు డిం
డిమపుంభావసరస్వతీంద్రుఁ డనియెన్‌ ఠీవిం బ్రకాశించుచున్.

16


క.

స్వామీ విద్యారణ్య
స్వాములచరితంబుఁ దెలుపవలె నంటిరిగా
యీమానవులకు నమ్ముని
సామర్ధ్యం బెఱుఁగ వశమె జగతీరమణా.

17

మ.

నరు లజ్ఞానవిమోహితాత్ము లగుటన్ రక్షించఁగా నెంచి శం
కరుఁడే శంకరుఁడై విభేదమతముల్ ఖండించి వేదాంతశా
స్త్రరహస్యస్థితిఁ దెల్పఁగా నతడె విద్యారణ్యమూర్తిన్ జగ
ద్గురుఁడై తోచేఁ దదీయవైభవము లెందున్మెచ్చఁగా శక్యమే.

18


తే.

సకలవిద్యాప్రవీణుఁడై జనవరేణ్య
యమ్మహామౌని శ్రీలక్ష్మి ననుసరించ
మహితచింతామణీమంత్రమర్మ మెఱిఁగి
సాత్త్వికోన్నతిఁ బెక్కేండ్లు జపముఁ జేసె.

19


వ.

అమ్మునీంద్రచంద్రుడు వెండియు నఖండవిద్యాసుధాసాగరంబునఁ
బొడమిన రత్నంబుకైవడిం దనరుతనకు నమ్మహా దేవితోడుగావలయు
ననితదీయసాక్షాత్కారంబపేక్షించు తీవ్రతకుం గరుణించి యొక్క
నాఁడు.

20


సీ.

కలువలు వెదజల్లుకలికిచూపులతోడ
          ముద్ధుగుల్కు మెఱుంగుమోముతోడఁ
గుందంబు నణఁగించుమందహాసముతోడ
          విలసిల్లువాలారువేణితోడ
మించుల నలరించు మేల్మిసొమ్ములతోడఁ
          దమ్మిపూ లమరుహస్తములతోడ
శ్రీహరికొనగోటిచెక్కునొక్కులతోడ
          దళుకుమించుకడానివలువతోడఁ


తే.

గాముఁ గన్నమ్మ నలమేనిసామికొమ్మ
కమ్మపూరెమ్మ యపరంజికళుకుబొమ్మ
కలిమిముద్దులగుమ్మ సత్కరుణ గ్రమ్మ
నమ్మునీంద్రునిమ్రోలఁ బ్రత్యక్ష మగుచు.

21


తే.

వరమునీశ్వర వేఁడుము వర మటన్న
కరము మోడ్చుచు సంతోషకరము గాఁగఁ

బరమసద్భక్తి వెలయఁ దత్పరమతీవ్ర
భాసమానస్థితుల్ మించఁ బ్రస్తుతించి.

22


తే.

అమ్మహాదేవితోడ నిట్లనియె నతఁడు
వేడ్క మీఱఁగ నాపేర వెలయునట్టి
పురము గావింపవలయుఁ దత్పురమునందుఁ
జెలఁగి సంతతమును నీవు నిలువఁదగును.

23


చ.

అన విని యిందిరారమణి యమ్మునిచంద్రునితోడఁ బల్కె నో
వినుతగుణాఢ్య నీదువెనువెంటనె వచ్చెదఁ బొమ్ము ముంగలన్
ఘనతరలీలలం బురము గట్టుటకుం దగుచోటుగాక నన్
గనుఁగొనఁబోకు మియ్యెడనె క్రమ్మఱి సన్మునిరాజశేఖరా.

24


వ.

అనిన నమ్మహానుభావుం డట్లనె తనయున్న చక్కటికిం జక్కనిదక్షి
ణంబుగాఁ గతిపయప్రయాణంబులు చనిచని ముందట.

25


శా.

రంగత్తుంగతరంగఘుంఘుమరవద్రాఘిష్ఠశైలాంతరా
భంగగ్రావపరస్పరోత్కషణబిధ్యద్గ్రాహపాఠీనసా
రంగానీకకుళీరహంసబకచక్ర క్రౌంచవన్యోత్థమా
తంగధ్వన్యధరీకృతాఖిలసముద్రం దుంగభద్రానదిన్ .

26


క.

కనుఁగొని యమ్మునిచంద్రుం
డనువొందఁ గృతావగాహుఁడై తత్తటినీ
ఘనతరతటస్థితుం డై
తనరువిరూపాక్షశివుని దర్శించె వెసన్.

27


వ.

తదీయస్థలప్రభావంబుఁ దెలియం గోరినం బురాణజ్ఞు లగుపారు లిట్లనిరి.

28


తే.

మునుపు సుగ్రీవుఁడును వాలియును గడంగి
భండనముఁ జేసి రిచ్చట ప్రబలుఁడైన
వాలి కలికి మతంగపర్వతము నెక్కె
నల్లరవిసూనుఁడట వాలి కరుగ రామి.

29

తే.

అమ్మతంగమునీంద్రునియాజ్ఞవలన
శాపయుక్తుండు గాన నాశైలమునకు
జనఁగ భయ మంది సుగ్రీవుజాడఁబోక
క్రమ్మఱును వాలి యిది పూర్వకథ మహాత్మ.

30


సీ.

ఇది నిజోన్నతశృంగహేవాకజితమేరు
          కుధర మై తగు హేమకూటశైల
మది పతంగతురంగహరిత ప్రభాసంగి
          మరకతశిఖర మౌ మాల్యవంత
మిది వశ్యమునిదృశ్యహితలతాంచితమహా
          భూమీజయుతఋశ్యమూకశిఖరి
యది మతంగజబృంహితారవప్రతిరవ
          ప్రదకంధరమతంగపర్వతంబు


తే.

మునిజనోత్తమ కిష్కింధ యనఁగఁ దనరు
నమ్మహాపుణ్యభూమి నీ విందు నిల్వ
నర్హ మనుటయు విని యమ్మహానుభావుఁ
డాత్మ నద్భుత మొంద నయ్యవసరమున.

31


తే.

తత్ప్రదేశంబునందు నెంతయును వింత
మీఱఁగా నొకకుందేలు సారమేయ
మును మహోద్ధతిఁ దఱుమునబ్బురముఁ జూచి
యౌర యిది యద్భుతం బని యాత్మ నెఱిఁగి.

32


క.

వీరక్షేత్రం బగు నిది
గారవమున నగర మిచటఁ గావింప శుభ
శ్రీ రంజిల్లు నటంచున్.
సారమతి న్సన్ముహూర్తచతురత వెలయన్.

33

సీ.

కోట లాతెఱగంటిపాటలాధర లెల్ల
          నాటలాడఁ దలంచ హౌసు మించ
మేడ లామిన్నేటిజాడ లానినయంచ
          జోడు లాదటఁ గాంచుసొబ గెసంగ
శాల లానవరత్నజాలలాలితకాంతి
          లీల రాగినవింత మేలు జూప
బాల లామరునిబాబాలలాగునఁ బల్కు
          హేల లోఁగొనఁ జాలునితవు మీఱ


తే.

నవుర నిర్మించెఁ దనపేర నఖిలలోక
పాలకపురాధికప్రభాబంధురముగ
గరిమ దనరంగ విద్యానగర మనంగ
మెఱయుపురరత్న మాధరామరవరుండు.

34


క.

అదిమొద లిర్వదిపట్టము
లిదివఱకు నృపాలతిలక యిది మీదట న
ర్వదియేండ్లు వెలయునట్లుగ
మొదటన్ నిర్ణయ మొనర్చె మునివరుఁ డెలమిన్.

35


మ.

అని యాడిండిమసార్వభౌమకవి ప్రఖ్యాతంబుగాఁ దత్పురా
ఘనవృత్తాంతము నెల్లఁ దెల్పిన చమత్కారంబు వీక్షించి యా
జననాథాగ్రణియున్ సభాసదులు నుత్సాహంబున న్మెచ్చి కాం
చనభూషాదు లొసంగి రెంతయు దయాసంరంభధౌరేయులై

36


వ.

ఇవ్విధంబున నవ్వసుంధరారమణచంద్రుండు మహేంద్రవైభవం
బునం బ్రత్యహంబునుం బూర్వసర్వసర్వంసహాధీశ్వర పుణ్యకథా
సుధాస్వాదనంబునం దృప్తి నందుచు సామ్రాజ్యసంపన్నుఁడై యుండి
యొక్కనాఁడు.

37

తే.

తమరు పెద్దల రైతి రిత్తఱినిఁ గృష్ట
రాయ లనుపేరిమత్పుత్త్రరత్నమునకుఁ
దనరఁ బట్టంబు గట్టెద ఘనత మీఱ
ననుచు నప్పాజితోన మంతనముఁ జేసి.

38


మ.

సరసీజాక్షునిసత్కృపాగరిమచే సత్కీర్తి రాణించగా
ధరణిరక్షణదక్షతన్ వెలయుపుత్త్రా రమ్ము రమ్మంచు బం
గరుడాల్ముద్ధమెఱుంగుటుంగరము వేడ్కన్ గృష్ణరాయక్షితీ
శ్వరుహస్తంబున నుంచె భూవరుఁడు రాజద్రాజధర్మస్థితిన్.

39


క.

సత్త్రాజిద్ధరణీపతి
మిత్రుఁడు రత్నం బొసంగ మెఱసినరీతిన్
జిత్రముగఁ గృష్ణరాయధ
రిత్రీపతియుంగరంబు శ్రీ నొప్పారెన్.

40


సీ.

ప్రణుతింప నతఁడు తోరణగట్టు పరసీమ
          లనురీతి నూత్నతోరణము లెసఁగ
రిపుల ఖండించి సత్కృపఁ దత్సుతుల నిల్పు
          నట్ల ద్వారములందు ననఁటు లమర
విలిఖించు నతఁడు దిక్కుల జయస్తంభాళి
          ననుమాడ్కిఁ జిత్తర్వుహర్వు లలర
వెలయు నిట్లితనికీర్తులు దిక్తటుల నన్న
          సరణి ముత్తెఁపుమ్రుగ్గుజగ్గు లమర


తే.

నభినవాలంకృతిస్ఫూర్తి నతిశయించె
నప్పురీరత్న మపుడు మహాద్భుతముగఁ
బ్రకటమహిమల శ్రీకృష్ణరాయనృపతి
శ్రీకరం బైనపట్టాభిషేకవేళ.

41

మ.

సరగం దెచ్చిరి భూసురోత్తములు కృష్ణాగౌతమీజాహ్నవీ
వరణాసూర్యసుతాకవీరతనయావారాశిముఖ్యాంబువుల్
గరిమం గాంచనరత్నకుంభతతులం గారుణ్యవిశ్వాసత
త్పరులై యెంతయుఁగృష్ణరాయవిలసద్రాజ్యాభిషేకార్థమై.

42


తే.

శంఖకాహళభేరీప్రచండవాద్య
తతరవంబులు భూనభోంతరము నిండ
బ్రాహ్మణుల్ కృష్ణరాయధరావరునకుఁ
జెలఁగి పట్టాభిషేకంబు జేసి రెలిమి.

43


సీ.

చక్కెరవిలుకానిచక్కందనము గల్గి
          చొక్క మౌనార్వీటిబుక్కరాజు
సాకల్యముగఁ గీర్తిసర్వదిక్తటులందుఁ
          బ్రాకటస్థితి నిల్చునౌకువారు
కంటకరాజన్యగర్వంబు లణఁగించి
          లీలచే మించునందేలవారు
ధాటీనిరాఘాటఘోటీహతవిరోధి
          కోటులై వెల్గువెల్గోటివారు


తే.

చండతరశౌర్యు లగుకురాసానివారు
బూదహలివారు మొదలైన భూమిపతులు
కొలువఁ బట్టాభిషిక్తుఁడై చెలువుమీఱె
రమ్యగుణపాళి శ్రీకృష్ణరాయమౌళి.

44


సీ.

అన్నన్న యతఁడు సింహాసనం బెక్కిన
          నిభరాజు తా కొండ లెక్కఁదొడఁగె
నయ్యారె యతఁడు పట్టాభిషిక్తుఁడైన
          సింధురాణ్ణేత్రముల్ చెమ్మగిల్లె

హైసరే యతనిపే రనినమాత్రముననే
          కురుదేశ మేల్రాజుగుండె లదరె
నోహో యతఁడు ఖడ్గ మొక్కింత ముట్టిన
          సకలారిసంఘము ల్సంచలించె


తే.

మాయురే నరసింహకుమారరామ
చంద్రశౌర్యనితాంతరాజత్సమాఖ్య
కృష్ణరాయాభిధానవర్ధిష్ణుఁ డేలు
ధర్మముల్ ధాత్రిలో యధార్థంబు గాఁగ .

45


శా.

ఈరీతిం జతురబ్ధివేష్టితధరిత్రీశు ల్భజింపన్ మహా
ధీరుం డానరనాథచంద్రుఁడు యశస్తేజోవిలాసంబు లెం
తే రాణించ యుధిష్ఠిరుండు దగురీతిన్ ధన్యుఁడై యొక్కనాఁ
డారూఢి న్సభవార లెల్ల వినఁగా నప్పాజితో నిట్లనెన్.

46


తే.

అప్ప యీవఱదనుక సింహాసనంబు
భారము నృసింహరాయలవారు బూన
నిర్భరత మంటి నాయందు నిల్పెఁగాన
నఖిలకార్యస్థితుల్ దెల్పుమయ్య యిపుడు.

47


సీ.

సింహాసనప్రభుశీల మేక్రియ నుండు
          పాలించు టేరీతి ప్రజల నెల్ల
బాంధవపరిజనప్రతతిఁ బ్రోచుట యెట్లు
          ధనము లార్జించుసాధనము లేవి
యెటువలె వ్యయ మొనర్చుటకును మర్యాద
          యేదారి శత్రుల నేపణంప
నాత్మరక్షణ కర్హు లగుదు రెవ్వార లా
          ప్తుల ననాప్తుల లెస్సఁ దెలియు టెటుల

తే.

రాజలక్షణ మెయ్యది రాజ్యలక్ష్మి
శాశ్వతంబుగ నుండు టేసరణి రాజ
నీతు లెన్నివిధంబులు నిఖిల మెలమిఁ
దెలుపు మెంతయు నామది తేటపడఁగ.

48


మ.

అను డామంత్రివరేణ్యు డిట్లనియె నయ్యా వింతగా మీ ఱెఱుఁ
గనినీతిస్థితిధర్మరీతి గలదే కానిమ్ము నే విన్నయం
త నృపాలోత్తమ విన్నవింతు వినుమా దత్తావధానుండవై
ఘనసామ్రాజ్యసమాగమప్రకటసౌకర్యస్థితుల్ మించగన్

49


తే.

ప్రభుసమర్ధత సకల కార్యములకెపుడు
బలిమి నది వృద్ధిఁ బొందు నాప్తజనమంత్రి
వర్గబాంధవనిఖిలవిద్వత్కవీంద్ర
కృతసదాలోచనంబునఁ గృష్ణరాయ.

50


తే.

స్వామ్యమాత్యసుహృత్కోశశసకలరాష్ట్ర
దుర్గబలము లనంగ నెందును నృపాలు
నకును సప్తాంగబలములు నరవరేణ్య
వీనిఁ దెలియంగవలయును వేఱువేఱ.

51


తే.

అధిప విను మయ్య మఱియు సప్తాంగము లగు
రాజ్యవాహనవస్త్రాభరణములు ఘన
సారతాంబూలములు మొదల్ జనపతులకుఁ
దెలియవలె ననియును మదిఁ దేటపడఁగ.

52


ఆ.

ధరణి సామభేదదానదండంబులు
మాయయును నుపేక్ష మఱి మహేంద్ర
జాలమును ననంగ సప్తమహోపాయ
ములను దెలియఁ దగును ముద మెలర్ప.

53

తే.

బోఁటి జూదంబు పానంబు వేఁట జనుట
తిట్టుటయ హేతువుగను దండించఁ దలచు
టౌచితి దొఱంగి యనుచితం బైనవ్యయము
సేయుటయు నివి వ్యసనము ల్పాయవలయు.

54


ఆ.

ధనముఁ బాఁతిపెట్టి దైవాలయము గట్టి
వనము వేసి పెండ్లి వడుగుఁ జేసి
ధరఁ దటాకతతులు ద్రవ్వించి పుత్త్రులఁ
గాంచవలయు ధరణికాంతుఁ డధిప.

55


క.

సకలకవిరాజవిద్వ
త్ప్రకరము నితిహాసపరులు పౌరాణికులుం
బ్రకటపరిహాసకావళి
సుకరస్థితిఁ గొల్పి నృపతి సొం పొందవలెన్.

56


తే.

సప్తసాగరపరివృతసకలధరణి
విలసితాష్టాదశద్వీపములను తనదు
ఘనతరయశంబును బ్రతాపగరిమ మెఱయ
నృపతి చెలువొందవలయు మనీషివినుత.

57


తే.

సప్తకులపర్వతంబుల సప్తఋషుల
మహిమ లన్నియు వినుచు సంపదలు మీఱఁ
జక్రవర్తులచరితంబు సకలరాజ
పుణ్యకథలను వినఁదగు భూవిభుండు.

58


వ.

మఱియు నాస్తిక్యంబు నప్రసాదంబు నాలస్యంబు మొదలయినగుణం
బుల నుపేక్షించుచు మంత్రంబుల రక్షించుచు శుభకార్యంబు లొనరించుచు
దుష్టనిగ్రహశిష్టపరిపాలనంబుఁ జేయుచు సత్యంబు దప్పక యున్న
మహీవరులకు రాజ్యంబు సమృద్ధం బగు సమయోచితవర్షంబులు గురియు

సర్వసస్యంబులు మెఱయు భాండాగారంబుల ధనంబు నెరయుఁ గావున
నీవు ధర్మస్థితిం బ్రజాపాలనంబు సేయు మనిన విని యమ్మహీరమ
ణుం డమ్మంత్రిపుంగవున కిట్లనియె.

59


క.

గురుఁ డింద్రునకుం దెచ్చిన
సరణిన్ బహునీతిధర్మశాస్త్రస్ఫురణం
బెఱిఁగించితి వెంతయు సు
స్థిరమతి నింతయు గ్రహించితిన్ మంత్రిమణీ!

60


తే.

వీరనరసింహరాయలవారు మున్ను
పాలన మొనర్చు దేశముల్ ప్రబలదుర్గ
ములును సత్పుణ్యజనపదంబులును మేము
చూడవలయును మిక్కిలి వేడు కలర.

61


మ.

అనుఁ డమ్మంత్రివరేణ్యుఁ డిట్టు లనె నయ్యామంచికార్యంబ యే
లినవా రియ్యెడ నానతిచ్చినది మేలే మున్ను మీ పెద్ద లే
లినరాజ్యావని వింత లెల్లఁ గనుట న్నే విన్నవించం దలం
చినకార్యంబు తనంతనే పొడమె మీచిత్తంబున న్భూవరా.

62


ఉ.

నావుడుఁ గృష్ణరాయలు మనంబు ఘనం బగువేడ్కఁ జెంద నా
నావిధకార్యనిర్వహణనైపుణి గల్గినధీరులం బుర
శ్రీ వెలయంగ దిట్ట మొనరించి రయం బెసఁగన్ దిగంతర
క్ష్మావరవర్తనం బెఱుఁగఁ జారుల బంచె సమంచితోన్నతిన్.

63


ఉ.

ధీరత నర్ధరాత్రమునఁ ద్రిమ్మరు నప్పురవీథులందు నె
వ్వారలు వింతరీతి గలవాక్కులు, బల్కుదురో యటంచు వి
స్తారతమోదళద్రుచిసుజాగ్రదుదగ్రభుజాగ్రఖడ్గుఁ డై
తోరపువేడ్కతో నతనితో సరి రాఁ గలరే ధరాధిపుల్.

64


వ.

వెండియు నమ్మహీరమణవర్యుం డొక్కనాఁడు

65

క.

కొలిచినవారలకుం గల
కొలఁదికి నెక్కువగ బలము గూర్చిన సేనా
బల మధికం బగు ననుచుం
గొలువునకు న్వచ్చి మిగులఁ గుతుకం బలరన్.

66


తే.

సంప్రతులఁ బిల్చి యెన్ని లక్షలకుఁ గలదు
రాజ్య మెన్నెన్ని గలవు దుర్గస్థలములు
బొక్కసంబునఁ గలధనభూషణాది
వస్తువులు నశ్వవేదండవర్గ మెంత.

67


క.

నవముగ లెక్కలు దెం డని
వివిధగతుల నొరసి యొరసి విద్యారణ్యా
దివిభుత్వార్జితరీతులు
వివరంబుగ వేఱువేఱ వివరింపు డనన్.

68


తే.

పురము గావించునప్పు డమ్మునివరుండు
గూఱిచినరూక తొంబదియాఱుకోట్లు
గురుమణివిభూష లొకనాల్గుకోట్లు గలవు
రాజదేవేంద్ర శ్రీకృష్ణరాయచంద్ర.

69


క.

వినుఁ డీవరకున్ సింహా
సన మేలిననృపులు బొక్కసము గూర్చినసొ
మ్మెనయఁగ దొమ్మిదికోట్లకు
నను వై యున్నది ధరాతలాధిపతిలకా.

70


చ.

ఎనుబదినాల్గులక్షలకు నెన్నగఁ గన్నడరాజ్య మందులో
ననువుగ దేవదాయవసుధామరదాయము లెన్న నేల ని
ల్చినవరహాలకున్ గణన జెప్పెద వెయ్యిజిరాగురాల కిం
పొనరఁగ లక్షవంతున మహోన్నతి నిర్వదినాల్గువేలకున్.

71

క.

ఇరువదినాలుగులక్షలు
కరికి న్వెయ్యింటిలెక్క గలనూఱుఘటల్
మెఱయఁగ ద్వాదశలక్షలు
వరహాల్ నిర్ణయముసుమ్ము వసుధాధీశా.

72


తే.

భటులు వెయ్యింటి కెన్న నిర్వదియు నాల్గు
వేలుగా లక్షయర్వదివేల ప్రజకుఁ
జెల్లు నల్బదిలక్షలు జీతమనఘ
యమర నేలెడిదొరల కీక్రమమె సుమ్మి.

73


వ.

ఇవ్విధంబునకుం దగినచందంబున భవదీయభుజాపరిపాలితం బైన
కృష్ణాకావేరీమధ్యస్థిత దేశంబునం గల నిఖిలశైల స్థలదుర్గంబుల కధి
పతు లై తత్తద్దేశంబు లనుభవించుచుం గొందఱునృపాలవరులు
సింహాసనంబునం గొలిచియున్నవా రని సంప్రతిజనంబులు విన్న
వించి మఱియు నిట్లనిరి.

74


క.

ఈలేఖప్రకారమునకుఁ
జాలఁగఁ జతురంగబలము సరిచూడఁ దగున్
వాలాయము కొలిచినభూ
పాలురదుర్గములఁ గాంచి పాలింప దగున్.

75


తే.

అనుచుఁ బలుకంగ విని తనయాత్మలోన
నగరికై జీతముగను లేఖ గణుతింప
నేమియును దెల్పఁగా లే దిదేమి యనుచు
నప్పు డప్పాజితోడ నిట్లనుచుఁ బలికె.

76


తే.

అరయ నిటమీఁదఁ దగినకార్యముల కెల్ల
నడవవలసినయాలోచనక్రమంబుఁ
జేయు టెట్లన్న నతఁడు మీచిత్తమునకు
వచ్చినట్లనె నడచు సర్వంబు ననియె.

77

మ.

అను డాకన్నడరాయశేఖరుఁడు రాయల్ నన్నుసింహాసనం
బునకుం గర్తను జేసెఁ గాపరిజనంబుల్ చాలస్వాతంత్ర్యవృ
త్తిన బ్రాబల్యముగాఁ జెలంగఁ గలరింతే యిప్పుడేనేమనం
గొనసాగంగలదేయటంచుమదిలో గూఢాశయంబొప్పఁగన్.

78


వ.

అన్నగరశోధనార్థంబుగాఁ జనిన ట్లంతఃపురంబు వెడలి తత్పురంబున
కనతిదూరంబున నొక్కదేవస్థలంబుఁ గని యందొక్కరుండునుం
బ్రవేశించి స్థానికు లొసంగు పరిమళజలంబుల నాని తీర్థం బొనరించి
తద్దేవతార్థంబు లగుప్రసాదంబు లుపయోగించి కృతాచమనుం డై
పట్టణంబు చాయం గనుంగొనుచు సుఖాసీనుం డై యుండు నంత.

79


మ.

దొర యెచ్చో వసియించినాఁడొ యని యెంతోవేగ నల్దిక్కులం
దరయ న్వేగులవారిఁ బంపుచు రహస్యప్రౌఢి నొక్కండు ద
త్సరణిం దెల్ప నెఱింగి వచ్చునతనిం దా దవ్వులం గాంచి య
ద్ధరణీనాయకుఁ డల్కఁ జెన్నొలయ నిద్రారీతితో నుండఁగన్.

80


ఆ.

సన్నిధానమునకుఁ జని కృతాంజలి యైన
మంత్రివరుని జూచి మనుజనాథుఁ
డిటకు మీరు లిప్పు డేమి వచ్చితి రన
భయము వినయ మెనయఁ బల్కె నతడుఁ.

81


శా.

స్వామీ వీరనృసింహభూవరసుధావారాశిచంద్రోదయా
శ్రీమత్కీర్తివిశుద్ధ కాంతిజయసాంద్రీభూతచంద్రోదయా
భామామన్మథమన్మధారినిభసంపచ్ఛౌర్యభాస్వద్దయా
ప్రేమల్ మీఱఁగ నన్ను గన్గొనుము పేర్మిం గృష్ణరాయాధిపా.

82


క.

మీ రిట వచ్చు టెఱుంగక
నారయుచు న్నగరిలో రహస్యం బెసఁగం

జారుఁ డొకఁడు మీవచ్చిన
దారిం దెలుపంగ విని ముదం బలరారన్.

83


తే.

పౌరు లగుజను లెవ్వరి వార్త వినక
యుండునట్లుగ మృగయార్థ ముర్విరమణుఁ
డరుగుచున్నాఁడు మీరలు నరుగుదెం డ
టంచు దొరలకుఁ బత్త్రిక లంపి యిటకు.

84


క.

వచ్చితి మీచిత్తమునకు
వచ్చినగతి నడచు సకలవైభవములచే
హెచ్చుగఁ బురిలోనుం డిట
విచ్చలవిడి వత్తురే వివేకనిధానా.

85


తే.

అధిప యివ్వార్త పరు లెవ్వరైన వినిన
వైపరీత్యంబు గాదె సర్వంబు నెఱుఁగు
నట్టిధన్యులు మీర లి ట్లన్యజనుల
సరణి రాఁ జెల్లునే సాధుజనశరణ్య.

86


వ.

అనిన నమ్మహీశ్వరుం డతనిం గనుంగొని.

87


క.

క్షితి నఘటనఘటనసమ
ర్థత గలమీవంటిసత్ప్రధానులు గలుగన్
మతి మా కేమి విచారము
సతత మొనర్తుము యథేష్టసంచారంబున్

88


తే.

తృణము మేరు వొనర్తుర క్షణములోన
మేరు వైనను దృణ మౌను మీర గాద
టన్న సామాజికులకు సామర్థ్య మధిక
మగుట వసుధాప్రభువులభాగ్యంబుసుమ్ము

89

మ.

అను డారాయలవారితోఁ బలికె నయ్యప్పాజి యోస్వామి యే
మనఁగా నెంతటివారమయ్య భవదీయాజ్ఞావిలాసంబులో
ననువొంద న్భయభక్తుల న్మెలఁగినట్లైనం గృపం జూడు కొ
ల్చినవా రెచ్చటనైన భూపతులకు న్శిక్షార్హు లెంచన్ ధరన్.

90


తే.

లలిఁ దృణగ్రాహి యైననీలమున కరయ
విలువ యధికంబు తృణ మని విడిచినంత
జాతినీలంబు గా దన్నసరణి ధరణి
ప్రభువులు పరిగ్రహించిన ప్రజలు ఘనులు.

91


ఉ.

కావున మీ ప్రతాపమునఁగాక సమర్థత వేఱె కల్గునా
దేవరవార లి ట్లనినఁ దెల్పుకొనంగ సమర్థు లెవ్వరో
భూవర మీర లేక్రియను బుద్ధిగఁ జెప్పిన నాక్రమంబునన్
దేవ సమస్తకార్యములు దీర్చెద రమ్ము పురమ్ము జేరఁగన్.

92


క.

అని భయము నయము వినయం
బెనయం దెల్పుకొనునతనిహితవాక్యంబుల్
విని కృష్ణరాయఁ డిట్లనె
ఘనతరకారుణ్యగరిమ కడలుకొనంగన్.

93


ఆ.

దుష్టనిగ్రహంబు శిష్టపాలనమును
జేయు మనుచు మీరు జెప్పినట్టి
నీతిరీతి నడుచు నియతికిఁ దగినమా
ర్గంబు గన్న వత్తు ఘనత నిపుడు

94


చ.

అన విని సాళ్వతిమ్మసచివాగ్రణి రాయలవారితోడ ని
ట్లనియెఁ బరాకు మీర లిపు డానతి యిచ్చినదెంతయు న్నిజం
బెనయఁగఁ గార్యరీతి యిదమిత్థ మటన్న ఘటించెద న్భవ
ద్ఘనతరదృష్టికి న్నిలుచుకార్యము లెయ్యవి రాజశేఖరా.

95

తే.

అనిన రాయలు పల్కె నయ్యనఘుతోడ
గట్టికై జీత మిప్పుడు గట్టి చుట్టు
ముట్టి బెట్టుగఁ దురకలపట్టణములు
గొట్టి సాధించవలయు గగ్గోలుపడఁగ.

96


క.

ధీమంతు లయినప్రభువులు
సామంతులబలముకన్న స్వంతము బలముల్
తా మెంతయుఁ గూర్చినచో
శ్రీమంతు లటన్ననీతిఁ జెప్పఁగ వినవే.

97


క.

నా విని యామంత్రీశ్వరుఁ
డీవింత యి దెంతకార్య మిందుకుఁగా మీ
రీవిధమున రావలెనా
కావించెద మీరు దలఁచుకార్యము లెల్లన్.

98


వ.

అని యాక్షణంబ యాక్షితినాథుండు వీక్షించుచు నుండ నయ్యుద్దండ
దండనాథుండు నిండుచాతుర్యంబు మెఱయ సుధీచమత్కారంబు
నెరయ సకలజనంబులకు భయంబు నెఱయ రయంబున నయం బెన
యుచందంబున ధర్మంబు దనరునందంబున డెందంబున నమందా
నందంబు క్రందుకొన నెందెందుఁ గలధరాపురందరులం బిలువం
బంపి చతురంగబలంబుల నెన్నిక జూపించి లెక్కకున్ మిక్కిలి
యెక్కువ యగునక్కొలందికిం దగినరొక్కంబులు గ్రక్కునం గొని
బొక్కసంబుల గ్రిక్కిఱియ నుంచి మించి బహుదినములనుంచి
యనుభవించిన దేశంబు లెంచి మంచి దొరల మంచిదొరలు పెక్కాచా
రంబుగ సారంబుగల నేరంబు పరిహరించిన ధనంబులు తిరుగఁ
దెమ్మనిన నమ్మనుజపతులు సొమ్మును రిమ్మగా ఘనమ్ముగ గంధ
సింధుర సైంధవ సముద్భట భటవ్రాతంబునడుకట్టునం గట్టికొని దట్టం

బులయిన వేదండంబు లేనూఱును, పది రెండువేలు కాండ ప్రకాండం
బులు, ప్రచండశౌర్యదోర్దండు లగునఱువదివేల భటుల, చటులగతి
నేలుమేలుగలనృపాలుర నగరివశంబు జేసినం జూచి మెచ్చ విచ్చల
విడి బహుమానంబుగ మెచ్చు గలపచ్చరామెచ్చు రాణించు హెచ్చు
విలువకడెంబులు కపురంపు విడెంబులు జాంబూనదాంబరంబు లొసంగి
చతురంగబలంబులు గొలువ నైరావణోపమానం బయిన దంతావ
ళంబు సమారోహణంబు గావించి యమ్మంత్రిమాణిక్యంబుతోడం
గూడి నిజరాజధానిం బ్రవేశించి యందఱ నిజనివాసంబులకుం బంచి
యప్పంచశరరూపరేఖావిరాజ మానుం డగు వీరనృసింహరాయకు
మార కుమారవిక్రమాభిరామ కృష్ణరాయమహీమహేంద్రుండు కొలు
వుండి వెండియు నొక్కనాఁడు.

99


తే.

తలఁచినట్లనె చతురంగబలముఁ గూర్చి
ధరణి నఘటనఘటనచాతురి చెలంగె
సాళ్వతిమ్మరుసయ్యకు సాటి యైన
మంత్రివర్యుండు గలఁడె యిమ్మహిని రహిని

100


క.

ఘనుఁ డీయన సవరణ చే
సినగజహయములక్రయంబు చింతింపంగా
వినుఁడీ నలుబదిలక్షల
ధన మౌరా యింతమహిమ ధరణిం గలదే

101


క.

అమరేంద్రునకు బృహస్పతి
యమరిచినటులం బ్రభుత్వ మమరెఁగదా నేఁ
డమరపుప్రభువులు గొలువఁగ
నమరుదరికృపానిరూఢి నలరఁగఁ గలిగెన్.

102


మ.

అన నప్పల్కులకు న్సభాసదులు మేలాహా సెబాసయ్యభూ
జనరక్షాపరుఁ డౌనరేంద్రునకు రాజత్ప్రౌఢిమన్ మీరుమం

త్రనిగూఢాశయమంత్రిరత్నము కరస్థం బైనవక్రార్థతా
రినృపాలాహిభయం బొనర్చు టరుదే శ్రీకృష్ణ రాయాధిపా.

103


చ.

కరచరణాదు లందఱికిఁ గల్గినయంతటనే సమర్థతన్
మెఱవడిఁ గాంచ నేర్తురె మనీషివరుల్ ధరలోన నెవ్వ రి
క్కరణి ఘటించుచుం గృతయుగంబునఁ ద్రేతను ద్వాపరంబునం
దరయఁగ సాళ్వతిమ్మసచివాగ్రణికి న్సమమంత్రి కల్గునే.

104


క.

ధరలోన మంత్రిరత్నము
నరనాథుఁడు సంతరించినన్ మణితురగ
ద్విరదవధూజనముల వి
స్ఫురితగతిన్ గలుగఁ జేయు బుద్ధిప్రౌఢిన్.

105


క.

విను పంచలోహములలో
నను బంగారంబు హె చ్చనందగునటులన్
మనుజులలో సామర్థ్యం
బెనసినసద్బుద్ధిమంతు నెన్నఁగ వలయున్.

106


ఆ.

శతసహస్రసంఖ్యజనులలో నొక్కశూ
రుండుఁ బండితేంద్రుఁ డుండు టరిది
వక్తయైనవాఁడు వర్ణింప వేవేలఁ
గలుగు టరిది దాత గలఁడొ లేఁడొ.

107


క.

అనునట్టిరీతినీతిన్
ఘనవాగ్జాలతయు సకలకార్యధురీణ
త్వనిరూఢియుఁ గలమంత్రులు
జననాథునికరుణ గలుగ జగతిం గలరౌ.

108


క.

అని యయ్యమరుసు మొదలుగ
జననాథునితోడ నాప్తసరసోక్తితతుల్

దనరఁగ బలుకుచు నుండఁగ
ననుపమగతి గూఢచారుఁ డాసమయమునన్.

109


ఉ.

వచ్చి విజాపురిం గలుగువార్తలు దెల్పఁ దొణంగె భూవిభుం
డచ్చటిమందియున్ మిగుల నద్భుత మంది వినంగ నెంతయున్
హెచ్చరి కయ్య స్వామి ధరణీశ పరాకు పరా కటంచు భా
స్వచ్చతురోక్తివైభవవిశాలసుధీయుతుఁ డై చెలంగుచున్.

110


పంచచామరము.

నిజాముశాహువారలున్ మనీషశేషతుల్యు లౌ
వజీర్లు గల్గుగోలకొండ వారిభూరిమంత్రులున్
గజాధినాథుపేర చాలఁ గాగిదమ్ము లంపుచున్
విజాపురమ్ములోనఁ గూడి వేడుకల్ దలిర్పఁగన్.

111


క.

ఒద్ద న్వెంకోజి యనాఁ
దద్దయుఁ బెద్ద యనఁ దగినదాదోజి యనా
నిద్దఱుమంత్రులు నొండొరు
లొద్దికమై రాత్రి పగలు నూహల్ మిగులన్.

112


ఉ.

వీరనృసింహరాయమణి వేడుకతోడుతఁ గృష్ణరాయలం
గోరికమీఱ రాజ్యమునకుం దొరఁ జేసిననాఁటనుండియున్
వీరుఁ డతండు శాత్రవుల వెంటఁబడంగఁ దలంచు టెంతయున్
గౌరవ మొప్ప నచ్చటిముఖాములు వ్రాయదొణంగి రెంతయున్

113


క.

సింహాసనముల నరపతి
సింహావళి కధికమహిమఁ జెన్నొందె సుమీ
సంహృతదుశ్శీలుం డగు
సంహోహరుఁడైన వేంకటాద్రీశుకృపన్.

114

తే.

అనుచు నొకకొంద ఱెక్కువ యనఁగ నేమి
యనియును సమంబె యనుచు నన్యోన్యకలహ
మంది క్రమ్మఱఁ దెలివంది యధికుఁ డెందు
నరపతి యటంచుఁ బలికిన నయ మెసంగ.

115


ఉ.

ఎక్కడ జూచిన న్సురమునీశ్వరమందిరశైలపంక్తు లే
దిక్కునఁ గన్గొనన్ ధరణిదేవనివాసమహాగ్రహారముల్
మిక్కుట మౌనదు ల్గలుగుమేదినిఁ బ్రోచు నరాధినాయకుం
డెక్కడ యీతురుష్కవిభు లెక్కడ రాయలతోడ సాటియే.

116


తే.

నరులలోన నరాధిపస్ఫురణ మెనయు
నతఁడు నే నని భగవంతుఁ డనినవాక్య
మెఱుఁగరె తదంశజుండు శ్రీకృష్ణరాయ
లెంచి చూచిన సామాన్యనృపుఁడె మహిని.

117


ఉ.

కాదన నేల గాఁగలుగుకార్యము లౌనె గదా యి దెంతయున్
మోద మెలర్పఁగా నిపుడు మందుగఁ దెల్పుట మే లటంచు న
య్యేదులశాహుతో దెలుప నెంతయు నద్భుతమంది వారితో
వాదము లాడుచుం గినిసి వా డనియెన్ దురహంక్రియార్భటిన్

118


శా.

ఆసింహాసన మేలునట్టినృపు లాహా తొల్లి శౌర్యంబుతో
నీసీమ ల్దిలకింప నేర్చిరె మఱేమీ కృష్ణరాయండు నేఁ
డాసన్‌ వచ్చినవచ్చుగాని భయమే యస్మన్నిరాఘాటఘో
టీసంఘంబులముంగల న్నిలువఁగా ఢిల్లీశుఁడున్ శక్తుఁడే.

119


తే.

అనుచుఁ బ్రజ మెచ్చుఁకోఁగ బాహ్యమునఁ బలికి
యంతరంగంబులోఁ జాల నళుకుఁ జెంది
బెగ్గడిల్లుచు జాబు లంపించె గోల
కొండకు నిజాముశాహునకు న్మహీశ.

120

శా.

ఆమూఁడిండ్లదునీలు నేక మగుసౌహార్ధంబుతోఁ దావకీ
నామేయస్థిరకార్యనిర్వహణశౌర్యారూఢి విన్నంత నే
సీమన్ దుర్గములందుఁ గోటలను విస్తీర్ణస్థితిన్ ధాన్యపున్
సామగ్రు ల్సమకూర్ప నెంచిరి నితాంతస్వాంతచాంచల్యులై.

121


ఉ.

సాలవిశాలసాలఘనజాలములం దగు కొత్తళంబులం
జాలగఁ జాలుగా జబురుజంగి పిరంగులు నాదిగా దిగా
భీలగతి న్ఘటింపుచును భీకరు లైనవజీర్ల నిల్పుచున్
హాళిమెయిం జరించెద రయారె భవజ్జయధాటి కళ్కుచున్.

122


తే.

ఎఱుక గలవారితరబడి నేఁగునపుడు
కరముల సిఖాలు జేసి ముష్కరతురుష్కు
లవలఁ బొ మ్మని కొత్వాల కప్పగింతు
రచ్చటికిఁ జేరఁ బరులకు నలవి గాదు.

123


తే.

మద్యపానులు నున్మత్తమానసులును
విప్రజనదేవతాస్థలవిముఖు లగుటఁ
దావకీననితాంతయుద్ధమున కెదిరి
పోరఁగా లేరు తురకలు భూవరేణ్య

124


క.

అని విన్నవించుసమయం
బున గజపతిసీమఁ జూడఁ బోయినచారుల్
జనుదెంచి ప్రణతు లై యి
ట్లని తెల్పం దొడఁగి రచటివృత్తాంతంబున్.

125


చ.

జయజయ కృష్ణరాయనృపచంద్ర పురందరభోగసాంద్ర మీ
దయను గళింగదేశవసుధాపతివర్తన మెంతయున్ మహా
రయమునఁ గాంచి వచ్చితిమి రాజవరేణ్యుఁ డతండు సంతత
ప్రియకరుఁ డాశ్రితావనగరిష్ఠగుణాభరణుండు చూడఁగన్.

126

సీ.

కుందబృందనవారవిందముల్ జెన్నొంది
          యంద మౌపొందళ్కుచందువాలు
పచ్చడాల్ హెచ్చు రాగచ్చు రాణించుడాల్
          ముచ్చట ల్మించ మేల్మచ్చగములు
కల్వరా చెల్వు రా విల్వ రాణించుక్రొం
          జల్వ రాజిలుగొప్పచప్పరములు
నిందిరామందిరానందరాజన్మహా
          మందిరాదికగృహాళిందములును


తే.

నెందుఁ గనుఁగొన్న కన్నులవిం దొనర్చు
నౌర గోదావరీవారిపూరవర్ధి
తామితారామసర్వసస్యాభిరామ
నవ్యగుణధామ యాజగన్నాథసీమ

127


తే.

అలజగన్నాథునిప్రసాద మఖిలజనులు
సృష్టిదోషంబు లేక భుజింపవలయు
నమ్మహావైభవంబు బ్రహ్మాదులకును
సన్నుతింపఁగ శక్యమే జనవరేణ్య

128


ఉ.

ధీయుతుఁ డాముకుందగజదేవు నిరంతర మెంతయున్ జగ
న్నాయకుల న్బజింపుచు జనంబులఁ బ్రోచుచు నుండి యొక్కనాఁ
డాయతసౌధమంటపమునందు నిజాశ్రితు లెల్లఁ గొల్వఁగా
శ్రీ యలరంగ సింహమణిచిహ్నితపీఠమున న్వసింపఁగన్.

129


ఉ.

అల్లనిజాముశాహుసచివాగ్రణి యిట్లనె నానృపాలుతోఁ
జెల్లుగఁ గృష్ణరాయనృపశేఖరుఁ డన్యనృపాలచిత్తముల్
ఝల్లన గోలకొండయు విజాపురమున్ బెదరన్ జనావళుల్
ఘొల్లన దాడివచ్చుపలుకుల్ బలుకంగ దొణంగి రయ్యెడన్.

130

క.

అలవిజయనగరిలోనం
గలవీరులమంత్రివరులు కాగిదములలో
పల వ్రాసి యంప దొణఁగిరి
తిలకింపఁగ నబ్రమౌగతిం బ్రభుచంద్రా

131


క.

ఆకర్ణాటకభూవరుఁ
డాకృష్ణకు నవల వచ్చినంతనె తురకల్
ప్రాకటహయధాటీగతి
భీకరముగ నెదిరెదరు గభీరస్పురణన్.

132


తే.

ఆముదాపురపర్యంత మైన నిపుడు
మించి రాఁగల్గునతఁడు సమంచితగతి
మీరు మీదుర్గసీమల మేర మీఱ
వస్తుసామగ్రు లుంచిన శిస్తుగాదె.

133


తే.

అనిన గజపతి యొక్కింత నాత్మ నెంచి
యలజగన్నాయకులె మాకుఁ గలఁ డటంచు
శత్రుభీకరమూర్తు లౌక్షత్రపాత్ర
వరులతో మంతన మొనర్చి వరుసతోడ.

134


క.

సరగునఁ దమదుర్గస్థల
వరభూములయందు సకలవస్తుప్రతతుల్
పరిపూర్ణస్థితి దనరం
గరితురగభటాళు లుంచె గాఢస్ఫురణన్.

135


శా.

భూనాథోత్తమ యొక్కవింత గల దాభూభర్త గోదావరీ
స్నానార్థం బరుదెంచు వేగుఁ గని కొండం గల్గుపాశ్చాత్యవీ
రానీకంబులు జుట్టుముట్టుటయు శౌర్యస్ఫూర్తి శోభిల్ల వే
గానన్ నల్గురుక్షత్రియుల్ గణగిఁ వీకం గూల్చి రమ్మూఁకలన్.

136


మ.

అదియుంగాక మహావిచిత్రములు దేవా యొక్కపాత్రుండు బు
ట్టిరమౌ ఖడ్గహతిన్‌ మహీరుహము ఖండించెన్‌ మహౌద్దత్యసం

పదఘోటిం దుమికించె నొక్కడు ఘనాంభస్సేతుమధ్యోర్వియా
సదయుం డెంతయు మెచ్చి వారి కొసగె న్సద్భూషణవ్రాతముల్.

137


తే.

అలపదార్గురురాజులే యిలను వేడ్క
నిట్టిక్షత్త్రియపాత్రులై పుట్టిరొక్కొ
కా దనిన నింతదోస్సారగరిమ గలదె
కృష్ణరాయక్షితీంద్ర సత్కీర్తిసాంద్ర.

138


ఆ.

విన్న కన్న కొన్ని వింత లెంతయు మీకుఁ
దెలుప వలయుఁ గానఁ దేటపడఁగ
విన్నవించినార మిన్ని యాకర్ణించి
కొంచె మనక చిత్తగించవలయు.

139


వ.

అని యివ్విధంబునఁ దెలుపుచారుల వాక్యంబు విని యద్భుతంబున
నమ్మహీరమణుండు బహుమానం బొనరించి వారలం బంచి యప్పాజి
మొదలగు మంత్రులఁ గాంచి సమంచితప్రకారంబున నిట్లనియె.

140


ఉ.

దిక్కులఁ గల్గువార్త లట తేటపడ న్వినినట్ల యయ్యెఁగా
నిక్కడ సేయఁగల్గుపను లెయ్యవి తెల్పుఁడటన్న నెంతయున్
మక్కువతోడ నిట్లనిరి మంత్రి శిఖామణు లానృపాలుతో
వాక్కలకంఠకంఠికరవల్లకిసల్లలితోక్తివైఖరిన్.

141


తే.

వీరనరసింహరాయకుమార నీదు
పేరు విన్నంత గజరాజు బెగ్గడిలఁడె
యిల జగన్నాథభక్తుఁ డై వెలయు నతని
నెలమి దయసేయఁ దగు నీకుఁ గృష్ణరాయ.

142


క.

దేవబ్రాహ్మణభక్తి
ప్రావీణ్యము గనినయతనిబంధుత్వమునన్
ఖావింపుము సత్కీర్తుల
ఠీవిగ నెదిరింపుమయ్య ఢిల్లీశ్వరుతోన్.

143

ఉ.

నావుఁడు గృష్ణరాయనరనాథుఁడు మంత్రులమాట కెంతయున్
భావమునం జెలంగి నిజబంధుతతిం బిలిపించి మేటిసం
భావనఁ జేయుచున్ ఘనతఁ బంతిని విందొనరించి సర్వసే
నావళితోడఁ గొల్చినధరాధిపవర్యుల గౌరవింపుచున్.

144


చ.

మెఱుగుకడెంబులుం దళుకుమించినకంఠసరుల్ దురాయులున్
సరిపెణ లుంగరంబులును నాల్గునగల్ చరణాంగదంబులుం
దురగము లాదిగాఁగ దయతో బిరుదుల్ వెలయంగ నిచ్చె నం
దఱికి నృపాలశేఖరుఁ డుదారముదారచితోక్తివైఖరిన్.

145


మ.

పురసంరక్షణదక్షు లౌజనులకున్ బుద్ధిస్థితుల్ దెల్పి భూ
సురసందర్శితదివ్యలగ్నమహిమల్ బొల్పొంద నందంబుతో
స్థిరశౌర్యోన్నతి జృంభమాణగరిమన్‌ దిగ్జైత్రయాత్రామతిన్
వెరవొప్పం బురిచెంతల న్వెలిగుడా ర్వేయంగఁ బంచె న్వెసన్.

146


ఉ.

పంచి సమంచితస్థితిసభాసదులు న్విలసత్కృప న్విలో
కించి ధరామరేంద్రులకుఁ గీర్తి చెలంగ సమస్తవస్తువుల్
మించినవేడ్క దానము లమేయగతిన్ ఘటియించి విస్ఫుర
త్కాంచనభూషణావళితతద్యుతిరంజితదివ్యమూర్తియై.

147


చ.

వరమతి సద్గుణప్రకటవైభవనిర్జితశారదాంబ యౌ
తిరుమలదేవి కప్పురపుదీవెనవీడె మొసంగి పంపఁగా
నర వరమౌళి దివ్యశకునమ్ములు గన్నడ భద్రదంతిపై
సరగుననెక్కి ఛత్రమును చామరము ల్మెఱయంగనెంతయున్

148


సీ.

అనవద్యచిత్రవాద్యస్వనంబులతోడ
          భేరీవిరావము ల్భోరుకలఁగ
గంధేభఘీంకారఘనతరధ్వనితోడఁ
          ధురగ హేషారవస్ఫురణ మెనయ

వరభూసురాశీరవప్రభావముతోడ
          వందిమాగధశబ్దబృంద మొనర
సకలాభరణపంక్తి చకచకద్యుతితోఁడ
          సురుచిరాయుధదీప్తి సొబగు మీఱ

148


తే.

సరసమన్నీలు దుముదార్లు చతురవితత
సకలసేనాసమేతు లై సందడింవ
రమణఁ జెలువొందు రాజమార్గమున వచ్చె
రమ్యగుణపాళి శ్రీకృష్ణరాయమౌళి

149


తే.

అతనిమహిమకుఁ జాల నద్భుతము నొంది
విరులవానను గురియించువేల్పు లనఁగ
విమలసౌధాగ్రములనుండి వేడు కలర
సేస జల్లిరి పురిలోనిచెలువ లపుడు.

150


వ.

తదనంతరకథావృత్తాంతం బెట్టిదనిన.

151


క.

దివిజేంద్రతనయహారణా
రవిసుతసంరక్షణాతిరాజత్కరుణా
ప్రవిమలవాల్మీకివచః
కవనస్తుతిభరణ కీర్తికలితస్ఫురణా.

152


ఉ.

రావణకుంభకర్ణరణరంగమహాంగణలీఢగాఢబా
ణావళిదీప్తిరాజితదిశాంతరశాంతిరసైకవిస్ఫుర
ద్భావసమాధిగమ్య నిజభావనిరంతరసంశ్రితావళి
శ్రీవిభవప్రదానచణసిద్ధభుజోత్థ మహీధురంధరా.

153


భుజంగప్రయాతము.

విరాజత్సదార్వీటివేంగక్షమాధీ
శ్వరస్తుత్య సన్నీతవైరిప్రభావా

ఖరారీ కుభృత్కన్యకావర్ణ్యనామా
శరశ్చంద్రికావాససన్మందహాసా.

154


గద్యము.

ఇది శ్రీమదోరుగంటి కాశీపతిసద్గురు రాజయోగీంద్ర చరణారవింద
మనోవిహార నిరంతరానందకర రాజయోగ సామ్రాజ్యలక్ష్మీధురంధర
స్వస్వరూపానుభవసంపన్నజ్ఞానప్రసూనాంబికా కాళహస్తీశ్వరకరుణా
కటాక్షవీక్షణప్రసాదా సాదితకవితాచమత్కార ధూర్జటిపౌత్ర కాళయా
మాత్య లక్ష్మ్యంబికాదత్త పోలనమంత్రిగుర్వమాంబికా కుమార ధూర్జటి
ప్రణీతం బైన శ్రీకృష్ణరాయవిజయం బనుమహాప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము.



శ్రీరస్తు

కృష్ణరాయ విజయము

తృతీయాశ్వాసము

శ్రీ చినవేంకటరాయ ధ
రాచక్రేశ్వరి మనోబ్జరాజద్భృంగా
యాచతురాననవినుత
ప్రాచుర్యగుణాలవాల రామ కృపాణ్యా.

1


వ.

అవధరింపుము.

2


క.

ఇటువలెఁ బురంబు వెలువడి
పటగృహమున నిలిచి ఘనశుభప్రదవేళం
జటులచతురంగసేనా
ర్భటు లెసఁగ న్నడిచె దిశలఁ బ్రతిరవ మడరన్.

3


మ.

చని ప్రాగ్దక్షిణపశ్చిమోత్తరవిదిగ్జాలంబునన్ వైరివీ
రనృపాలావనిఁ జుట్టుముట్టుకొని యా రాజ్యంబునం గల్గుగో
ధనము ల్ముందఱిమూఁక లాఁగినను మాద్యల్లీలతో సర్వసై
న్యనిరూఢిం దదధీశు లెంతయును జన్యప్రౌఢిమం గ్రమ్మినన్.

4


సీ.

రటితదిక్తటనటత్పెటపెటార్భటులతో
          ఘోరమైనతుపాకిగుండ్లచేత
దవ్వుదువ్వున హెచ్చి రివ్వురివ్వున వచ్చి
          ప్రసరించురాచూరిబాణములను

పెల్లుగా వెసజిత్తజల్లుగా వెదజల్లు
          పెంపరుల్ బెంపారునంపగముల
ధాటీగతి నటింప మాటికి సూటిగా
          నాటుకొన్ బల్లెంపుటీటిగముల

4


తే.

నఱిమి తఱిమిన భయమున విఱిగి జరిగి
నిజబలంబులఢాకకు నిల్వలేక
శరణు జొచ్చినవారలఁ గరుణఁ జూచి
యచటిదుర్గస్థలంబుల నాక్రమించి.

5


వ.

అనంతరం బొక్కహురుమత్తున నుమ్మత్తూరు శివసముద్రస్థలంబుల
నెసంగు గంగరాజు నొడయల నోడించి తదీయస్థలంబున నాణెంబులు,
బలియించి శ్రీరంగపట్టణంబు నిరీక్షించి యక్కడినుండి గ్రక్కున
నెక్కటిమూఁకల వెక్కసపు బరాక్రమక్రీడల దిక్కులు గ్రక్కదల
సంకులసంరంభసైన్యనాయకుం డగు సంకులనాయకునిం గటాక్షించి
చంచత్ప్రతాపంబు మెఱయ రయంబున విజాపురంబు గడిదుర్గంబుల
చాయం జనుదెంచుసమయంబున.

6


ఉ.

శ్రీల వెలుంగునానృపతిశేఖరుదాడికి నిల్వ కెంతయున్
జాలినిఁ బొంది యచ్చటిరసాతలకాయకు లాత్మలన్ మహాం
దోళనమంది కోటలును దుర్గములుం గయికొమ్మటంచు ను
ద్వేలభయంబున న్శరణు వేడుచు కానుక లిచ్చి మ్రొక్కినన్.

7


క.

శరణాగతరక్షణఘన
బిరుదాంకుఁ డతండు వారిఁ బ్రేమం గనుచుం
గరుణించి తత్పురంబుల
నెఱయం దనబలము లుంచి నిండినవేడ్కన్.

8


వ.

ఇవ్విధంబునఁ బ్రతిదినప్రవర్ధమానశౌర్యధైర్యధురీణుండగు నమ్మహీ
మండలాఖండలుండు తొంటి రఘుమహారాజుచందంబున నిఖిలరాజులు

తనకు హస్తగతంబులు సేయు నాదవని ముదుగల్లు రాచూరు మొద
లైన మహాస్థలంబుల నిజబలంబు లుంచి గోలకొండపురంబుపై నుద్దండ
వేదండకాండభటప్రకాండంబులతో నురువడించు నవసరంబున.

9


ఉ.

ఆగజవాజిబృందముల కాభటకోటుల కానృపాలుబా
హాగురుశౌర్యధైర్యముల కాత్మ గలంగుచు విన్నమాత్ర నా
హా గణుతింప శక్యమె యహర్నిశమున్ భయమందియుండిర
య్యాగరనాముదానగరియందు విజాపురి గోలకొండలోన్.

10


తే.

లక్షగుఱ్ఱంబుతోడను లక్షణంబు
మెఱయ బీరాన మూఁడిండ్లతురకదొరలు
కృష్ణవేణికి నీవలఁ గృష్ణరాయ
నృపున కెదురుగ జనుదెంచి నిలిచి రపుడు.

11


చ.

నిలిచినవార్త వేగరులు నిక్కముగాఁ దనమ్రోలఁ దెల్పినన్
జెలఁగి భళీ తురుష్కతతిచెంతకుఁ జేరిన యంత వచ్చెనే
కలఁగి తొలంగిపోయెదరుగాక మదీయబలంబు ముంగలన్
నిలువఁగ నేర్తురే యనుచు నిశ్చలధైర్యమునన్ వెలుంగుచున్.

12


తే.

అపుడు కొలువయి కొలిచినయమరనాయ
కులను మన్నీల నందఱఁ బిలువ నంపి
సకలబహుమానము లొనర్చి జనవరేణ్యుఁ
డల్లఁ తురకలవృత్తాంత మెల్ల దెలుప.

13


మ.

విని యాభూవరకోటిలోన ఘనదోర్వీర్యప్రభావుండు బం
ధునృపాలప్రబలుండు యుద్ధములయందున్ స్వామికార్యంబునం
దు నయజ్ఞుండగు పెమ్మసానికులచంద్రుండైన యారాయలిం
గనృపాలాగ్రణి బల్కె సంగరకలాకౌతుహలాయత్తుఁడై.

14

చ.

తురక లనంగ నెంత పటుదోర్బలలీల వధింతు వారలన్
గుఱుతుపడం గుడార్లు దెగఁగోసెద బౌఁజులలో మెలంగెదన్
నరపతిచంద్ర యెంతయు ఘనంబుగ దేవరవారిసొమ్ము ది
న్నఋణము దీర్చుకోఁగలిగెనన్ గృపఁ జూడు మటంచుఁ బల్కినన్.

15


తే.

అపుడు సభలోనఁ గలిగిన యఖిలరాజ
సుతులు మన్నీలు మిగుల నద్భుతము గాఁగ
ఘనతరస్థైర్యశౌర్యము ల్గనపడంగఁ
బల్కి రెంతయు సంతోషభరితు లగుచు.

16


క.

ఆనృపమణిపర్యంతము
రానిత్తుమె శౌర్యమహిమ రంజిల నిదిగో
పూని విరోధుల గెల్తు మ
నూనపరాక్రమధురీణ యుర్వీరమణా.

17


సీ.

గుదులుగుదుల్ గాఁగ గ్రుచ్చి యెత్తుదుముగా
          పెల్లుగా వాలారుబల్లెములను
చేబల్మిచేఁ గ్రమ్మి చిమ్మివైతుము గదా
          నోట దంటుకొనంగ నీటిమొనల
తెంపుతో గుంపులై తెగ నేయుదుము గదా
          తఱుచైన శరపరంపరలచేత
జముదాడి యని తోచ జముదాడి పోటులం
          గూలఁద్రోతుము గదా ఘోరలీల


వే.

కరుల హరుల ధరాస్థలి దొరల దొరల
ముష్కరతురుష్కహరుల ధానుష్కవరుల
చెఱకుతుంటలరీతిని నఱకఁ గల్గె
కరముల కరమ్ము గల్గుఖడ్గముల గముల

18

క.

అని కొలిచిన వారందఱు
ననుపమశౌర్యములు మెఱయ నాడినమాటల్
విని యాభూమీరమణుఁడు
ఘనతరకౌతుహలంబు గడలుకొనంగన్.

19


తే.

మీరలందఱు నటువంటిశూరవర్యు
లౌర కావున మాకు విచార మేమి
కార్య మొనరించి జయలక్ష్మిఁ గాంచుఁ డనుచు
వీడెము లొసంగె వేఱ్వేఱ వేడ్కమీఱ

20


తే.

అటుల సమ్మానములు గాంచి యఖిలనృపులు
రణసముత్సాహములు మది రంజిలంగ
విభవ మలరంగ నవ్వేళ విశదలీల
శిబిరములు జేరి సుఖనిద్రఁ జెంది రంత.

21


క.

ఆవృత్తాంతము చారుల
చే విశదముగాఁగ విని వజీరులు ముగురున్
భావంబుల నాలోచన
గావింపుచు భయము జెంది కళవళపడుచున్.

22


చ.

కొలఁది యెఱుంగ కిట్లు మనగుఱ్ఱపుఁ బౌఁజులతోన కృష్ణ కీ
వల నిటఁ జొచ్చి రాఁదగదు వచ్చితి మెక్కడ బోవవచ్చు కే
వలనృపమాత్రుఁడే తలఁప వారిజనాభునియంశజుం డతం
డలిగిన నెంతవారలకునైన రణం బొనరింప శక్యమే.

23


తే.

లక్షలకొలంది భటజను లక్షయప్ర
తాపధౌరేయు లానృపోత్తమునిఁ గొల్చి
యేకమనమున నున్నవా రెంచి చూడ
లక్షగుఱ్ఱంబు గాదె బలంబు మనకు.

24

తే.

ఏనుఁగులు వేయి బొందిలీ లెంచి చూడ
లక్షపెండారు లొకలక్షలక్షతురక
లిచటిబల మానృపాలున కెంచ భటులు
నాఱులక్షలు హరు లర్వదాఱువేలు.

25


తే.

వఱలుకరు లొకరెండువే లరసి చూడ
రాజులును వెలమలుం గమ్మప్రజలు ఘనులు
గలుగురాయలతోఁ బోరి గెలువ మనకు
వశమె యైన ఖుదా యున్నవాఁ డటంచు.

26


క.

తమతమహెచ్చరికలతోఁ
గమకంబున నుండి రంత ఘనతరశౌర్య
క్రమమున నుభయబలమ్ములు
సమరమునకు మొనసె నపుడు జనములు బొగడన్

27


సీ.

నడయాడుకొండలవడువున లేదండ
          తండంబు లొండొండ మెండుకొనఁగఁ
గడలితరంగల బెడగారుచందానఁ
          గాండప్రకాండముల్ కడు నటించ
వెదురుగుంపులె వెల్లివిరిసిన ట్లేతెంచె
          ననఁగ బల్లెము లీఁటె లతిశయించ
నంచ లంబరమున మించిన ట్లంచిత
          చ్ఛత్రచామర సితచ్ఛాయ లలర


తే.

ఘంటికాకింకిణీఘణంఘణవిరావ
భూరిభేరీరవంబులు బోరుకలగ
రాయబలములు నడిచె గుఱ్ఱంపుదొరల
పౌజుపై దేవగణములు ప్రస్తుతింప.

28

వ.

ఇట్లు దార్కొని యొండొరుల మార్కొని తమతమ దొరల నామాంక
నంబు లగుబిరుదులు బేర్కొని తొలుదొల్తయలబలంబు లెసంగయల
గోలుబలంబులు తుపాకులపెళపెళలు పెట్లుగ్రోవుల పెటపెటలు జబురు
జంగుల ఫిరంగుల ఢిమఢిమలు ఢమాఢమీల ఢమఢమలు బాణాపుఁజి
వ్వల జిఱజిఱలు బాణంబుల బిఱబిఱలు మనంబులం బుట్టు చిఱచిఱలు
శింజినీటంకారంబులు పరస్పరహుంకారంబులు నన్యోన్యపురస్కరణం
బులు నితరేతరతిరస్కరణంబులు వివిధరోషణంబులు నెఱయ ఖడ్గా
ఖడ్గి దండాదండి బాహాబాహిం దాఁకుచుం బెనంగుచుం బాయుచుఁ
గ్రమ్ముచు డాయుచు నడచుచుం గ్రుమ్ముచుఁ జిమ్ముచు నెట్టుచుం
దచ్చనల మెచ్చుచు హెచ్చుచుం జొచ్చుచు నీఁటెలం గ్రుచ్చుచు బల్లెంబు
లఁ గ్రుమ్ముచు కేడంబులం బమ్ముచు శిలల ఱువ్వుచు గెరలి నవ్వుచు
తేజీల నడపుచు నేజాలం గెడపుచు లకోరీలం దునుముచుఁ గొండొకసేపు
రెండుబలంబులుం గన్నులపండువుగ చండశౌర్యంబులు వెలయ
భండనం బొనర్చు నెడందడబడక కడువడిం గినుక వొడమి యొక్క
మొగి రక్కసు లనందగిన వెక్కసపుమొక్కలపుతురుష్కులు ధాను
ష్కకౌశలం బడగం జనుదెంచురయంబు గన్గొని సంరంభంబునం బెమ్మ
సానిరామలింగనృపాలుండు కృష్ణరాయక్షమాకాంతున కిట్లనియె.

29


పంచచామరము.

పరాకు రాకు రాకు మంచుఁ బారసీకభూపతుల్
చిరాకు మీఱ దట్ట మైనసింగిణీలకోరులన్
జిరాగుఱాల వేసి డాసి చిల్లుపొల్లు జేయుచున్
నిరాకరించి మించి వచ్చు నేర్పుఁ జూచితే నృపా.

30


ఉ.

పంతముతో హుటాహుటినిఁ బౌఁజులలోపలఁ జొచ్చి సైన్య మిం
తింతలు గాఁగ ఖడ్గహతిఁ దెంచెద దేరిజత్రాళ్ళు మీర లీ

చెంతనె యుండి కన్గొనుఁడు శీఘ్రముగాఁ బరవీరరాజులన్
దుంతవయాళికానిపురిఁ ద్రోచెదఁ జండపరాక్రమోన్నతిన్.

31


క.

మీ రాసమయంబున జయ
భేరీరావములు చెలఁగఁ బృథుతరసైన్య
శ్రీ రాజిల దఱిమినచోఁ
జేరరె తమసీమలకును జెల్లాచెదరై.

32


మ.

అనుచుం బల్లెము కేలఁ బూనుకొని శౌర్యారూఢులౌ కమ్మవా
ర్వెనువెంటం బదివేలు బల్లెములతో విఖ్యాతశౌర్యోన్నతిం
జనుదేరన్ ఘనసింహరావ మలరన్‌ దత్సైన్యముం జొచ్చి హె
చ్చినధైర్యంబునఁ బారసీకతతులం జెండాడె నుద్దండుఁ డై.

33


మ.

మొనకు న్వచ్చినవిచ్చుకత్తు లసివేముస్తీదుమేల్ రౌతులన్
దునుమాడంగను గల్గి పార్శ్వములయందుం గ్రమ్మునశ్వమ్ములన్.
దనబల్లెమ్మున గ్రుమ్ముకమ్మఱుచు వెన్కన్‌దారసిల్ జోదులన్
గని దూరంబు దొలంగఁజేయుఁ బటుదోర్గర్వం బఖర్వంబుగన్.

34


క.

ఆదండధరుఁ డటంచున్
గోదండధరు ల్గలంగఁ గుటిలారిమహా
వేదండతతులఁ గూల్చెన్
వేదండనిజాప్తనృపులు వేడుకఁ జెందన్.

35


క.

ఘనశరతతులం దనసా
ధనగతుల న్విసరి రిపులు తల్లడిలఁగ హ
త్తినరయమునఁ దఱుముచుఁ గ
త్తినతఁడు దేరిజపుత్రాళ్ళు దెగఁగోసి వెసన్.

36


వ.

అట్టహాసంబు జేయునతని బెట్టిదంపుదిట్టతనంబు నడుజిట్టాడుచు గుట్టు
చెడి యట్టట్టు మెదలం గూడకతట్టింబడినపులుఁగులగతి గొట్టుమిట్టాడి

పట్టపుదొరలు దెరలం జూచుసమయంబున రయంబున నవ్విధంబు
గనుంగొని కృష్ణరాయ ధరానాయక హరిసాయకుండు చండశౌర్యం
బున నుద్దండవేదండసమారూఢుం డగుచు నుభయచామరచ్ఛత్ర
మరకతకేతనప్రభలు వెలయ నఱువదేనువేలగుఱ్ఱంబులు నాఱులక్ష
లపదాతివర్గంబు నిన్నూఱుఘటంబు నేనుంగులుం గొలువ నొక్క
నిబ్బరంబున సింహనాదంబులు రోదోంతరంబులు నిండం దఱుముచు
జయభేరికాతాడనంబు గావించ నియోగించిన.

37


మ.

జలధు ల్ఘూర్ణిలె దిక్కరు ల్జెదరెఁ జాంచల్యంబు నొందెన్ ధరా
స్థలి ధాత్రీధరసంఘము ల్గదలె పాతాళంబు స్వర్లోకమున్
గలఁగెన్ శత్రుభయంకరప్రకటదోర్గర్వస్ఫురత్కృష్ణరా
యలనద్భేరిధణంధణస్వనము లాశాంతంబులం బర్వఁగన్.

38


తే.

అటల జయభేరికారవం బతిశయించఁ
జెలఁగి చనుదెంచునతనికోల్తలకుఁ గాఁగఁ
జెదరి బెదరి కలంగి కన్ జెదరి తొలఁగి
గచ్చువిచ్చయ్యెఁ బారశీకవ్రజంబు.

39


వ.

అయ్యవసరంబున

40


ఉ.

వాహినిఁ గూర్చి నీవు శరపాళి విరోధుల ముంచితౌ నృపా
వాహినులందు నెన్నఁదగువాహినిగానె భవత్సహాయ నై
యీహరులన్ శరార్తి నలయించెదఁ జూడుమటంచు నెంచెనో
నాహరినీలనీలసలిలావృతిఁ గృష్ణయు నిండె నెంతయున్.

41


క.

కొందలము మిగుల మదిలో
నాందోళన మంది తురక లకట ఖుదా నే
మందము సీమలకుం జను
టందము గా కిచట నిల్వనగునే మనకున్.

42

ఆ.

ఎందుఁ జనఁగ రానియిక్కట్టు ప్రాపించెఁ
గృష్ణ రాఁ దొడంగెఁ గృష్ణరాయ
లివలఁ దఱుమఁ జొచ్చె నెంతయు వెఱపించఁ
బోయి వెఱచుకొన్నచాయ యయ్యె.

43


ఆ.

పదరి కృష్ణ దాఁటి పదపద మని వచ్చి
యొక్కమన్నెవాని కోర్వలేక
తిరిగినట్టు లయ్యెఁ దెలియంగ రాయల
యెదుటఁ బడినరిపులు బ్రదుకుఁ గలరె.

44


తే.

వెనుక ముందైనయంతనే వెనుకముందు
దోఁచకున్నది నది దాఁటి తొలఁగు టరిది
యనుచు మంత్రులు దాము నన్యోన్యచింత
నాత్మలోఁ గుంది కడ లేనియార్తిఁ జెంది.

45


సీ.

తురకవేషము మాని తోర మౌ కర్ణాట
          కపు వేషములు వేసి కదలువారు
దండిదరికి వచ్చెఁ జెండె నీతఁడు మించి
          పొండి యనుచుఁ బాఱిపోవువారు
వేగు జూచెద మంచు వెగవెగఁ జనుదెంచి
          దూర మేఁగుచు బొదల్ దూఱువారు
వెనువెంటఁ దగిలెను వీఁడె వీఁడె యటంచు
          గొబ్బునఁ బఱచుచుఁ గూలువారు


తే.

సారెసారెకుఁ గర్తాలు దూఱువారు
నె కలంగి యథాయథ లగుచుఁ జనిరి
మదహయగజంబు లటుబెట్టి మొదటిదొరలు
ఒక్కవిధమున నది దాఁటి యుఱికి రపుడు.

46

తే.

అటుల జయలక్ష్మిఁ గైకొని హరులకరులఁ
బరులధనపంక్తులను దనవశము జేసి
వెలయు శ్రీకృష్ణరాయల విభవగరిమఁ
గాంచి కన్నుల పండువు గాఁగ నపుడు

47


తే.

సరససాహిత్యరచనవిస్ఫురణ మెనయ
సారమధురోక్తి మాదయగారిమల్ల
నార్యుఁ డలయల్లసానిపెద్దార్యవరుఁడు
ముక్కుతిమ్మన మొదలైనముఖ్యకవులు.

48


క.

వినుతించి రపుడు వారికిఁ
గనకాంబరభూషణములు ఘనత నొసఁగి యా
జనవరుఁ డప్పాజిఁ గనుం
గొని యిట్లని పలికె నపుడు కుతుకం బలరన్.

49


చ.

విరిగినవైరులం దఱిమి వేగమె వారలసీమ లెల్ల సు
స్థిరమతి నాక్రమింపవలదే యను డానెఱమంత్రి బల్కెభూ
వర యిది వేళగాదు పొరవం జననిచ్చి కెలంకులందు స
త్వరు లగుశాత్రవుల్‌ గదియవైపు దొరంగదె యెంతవారికిన్.

50


తే.

భూమిపాలక గజపతిసీమలోన
గలుగువారల మించి మార్గములయందు
నెందు ముట్టడి గావించ నెంచ మనకు
రస్తుసామగ్రి జేరుట దుస్తరంబు

51


క.

తూరుపునం గలగజపతి
వారిదళమునెల్లఁ దెచ్చి వరుసన్ జయల
క్ష్మీరమణిఁ జెందు మనవుడు
భేరీభాంకార మడరఁ బృతనాయుతుఁ డై.

52

తే.

తనప్రతాపప్రకాశంబు దనర బంధు
జనమనఃపద్మనికరరంజన మెలర్ప
నహితకువలయవరగర్వ మణఁగ నుదయ
గిరికి వేవేగ నయ్యినుం డరుగుదెంచె.

53


క.

వచ్చి చతురంగబలములు
విచ్చలవిడి నాల్గుదిశల వెలయఁగ నిలిచెన్
మె చ్చలరఁగ దనమహిమ వి
యచ్చరు లచ్చెరువుతోడ నభినుతిసేయన్.

54


సీ.

ఏచాయఁ గనుఁగొన్న హేరాళ మై తోఁచు
          గంధాంధసింహళగజచయంబు
నేవంక నీక్షించ హేషారవోదీర్ణ
          గాంధారకాంభోజకాండవితతి
యేదారిఁ జూచిన నాదారిన తుపాకి
          బలువైన జబురుజంగులు ఫిరంగు
లేదండ గణుతించ వేదండకరచండ
          కోదండధరభటకోటి పటలి


తే.

యెచటఁ జూచిన బల్లెంబు లీఁటెగములు
గలుగు రాయలదళ మెల్లఁ గలయ నెంచి
యుదయగిరిచెంత నుదయించె నొక్కవింత
యనుచు దుర్గములో మంది యళుకుఁ జెంది.

55


క.

అభిమానమునకుఁ గా న
య్యిభరాజుజనంబు బోరె నెంతయు బాహా
విభవం బెలర్ప సేనా
రభసమ్మున కెదిరి కృష్ణరాయలతోడన్.

56

క.

దుర్గమ మగునాదుర్గ మ
నర్గళగతి దీయుటకు నహర్నిశము మహా
దోర్గర్వమునన్ నానా
మార్గములం బోరి రపుడు మాద్యద్గతులన్.

57


సీ.

కోటలు దుర్గమున్ గొనుచు దోఃపటుబల
          ధాటిచే మించునార్వీటివారు
కంటకాహితకంఠలుంఠనోద్ధతలీల
          దంట లై తగుతొరగంటివారు
నిబ్బరంబుగ శత్రునికరంబు నణఁగించి
          ధీరు లై మించుగొబ్బూరివారు
చాల దోర్బలలీల సమదారిసంఘంబుఁ
          దూలించి వెలయునందేలవారు


తే.

నాదిగాఁ గల్గురాజులు మేదురగతి
తుళువదొరలును బోయలు దురుసు గాఁగఁ
బ్రతిదినంబును ఘోర మౌరణ మొనర్ప
నిలిచి పోరాడె గజపతిబలము లపుడు

58


ఉ.

ఠీవిగ నౌకువారును కడింది రహిన్ వెలుగోటివార లా
రావెలవారు గూడుకొని రాత్రి బగల్ చతురంగసేనతో
నేవగఁ జూచినన్ దెలియ నెంతయుశక్యము గానిదుర్గమా
భూవరమౌళి గాంచి యొకపూఁటనెదీసెద నంచు నుగ్రుఁడై.

59


ఉ.

దిగ్గున లేచి సాహసము తేటపడన్ మునుమున్ను గాఁగఁదా
నగ్గలికన్ జెలంగువిధ మంతయుఁ గన్గొని రోషచిత్తుఁ డై
లగ్గల కెక్కి రందఱు బలంబు చలం బలరన్ రవంబులన్
దిగ్గజముల్ వడంక బలుతెంపున గుంపులుగూడి యుద్ధతిన్.

60

క.

తనధాటి కళుకుచున్ గ్ర
క్కున దుర్గము డిగ్గి కావుకా వనువారిన్
గనుఁగొని యాభూరమణుఁడు
ఘనతరకారుణ్యరసము గడలుకొనంగన్.

61


తే.

జడియకుఁ డటంచు నభయహస్తం బొసంగి
యమ్మహాదుర్గమహిమకు నద్భుతంబు
నొంది యచ్చట నాప్తుల నుంచి యవల
జనియె నుద్దండశౌర్యప్రచండుఁ డగుచు

62


సీ.

అట కందుకూరు బెట్టదిరె కాహళశంఖ
          భేరీవిరావముల్ భోరుకలగ
ఆవల కొండవీ డలరె దిక్తటనట
          త్సేనారజోవ్రజశ్రీలు వెలయ
మఱికొండపలిఁ గలంగె రటన్మదేభేంద్రు
          ఘంటికాఘణఘణంఘణలు జెలఁగ
ఆమీఁద వినుకొండ యల్లాడె భటసము
          ద్భటసింహరవమహార్భటులు దనర


తే.

వెండియును గల్గుకోటలు వివిధదుర్గ
తతులు తముఁ దామె విడిచి కొండలకుఁ జేరి
రచటిగజపతివారిసైన్యాధినాథు
లలనృపాలునిదాడికి నిలువలేక.

63


తే.

ఎదురు గాంచనముద్రలు ముద మెలర్ప
దెచ్చి వేవేగఁ జేతి కందిచ్చువారు
శరణు వేఁడుచు సాష్టాంగ మెఱఁగువారు
నైరి యుత్తరమునఁ గల్గునట్టిదొరలు.

64

వ.

ఇవ్విధంబున నిఖిలస్థలదుర్గశైలదుర్గంబులు హస్తగతంబు లగుటయు
నందందుఁ గ్రందుగ నిజసైన్యంబు లుండ నియమించిన దర్పంబున
నముదానగరంబుపయి గరంబు దురంబు సేయందలంచి యప్పురం
బునలుదెసలుం జుట్టుముట్టినం బెట్టదరియు బెదరియుఁ దజ్జానపద
వర్గంబు పలుదెసలం బాఱ మీఱినరాగంబున నచ్చటియవనబలంబు
లెసంగ చలంబునన్ గోట వెడలి వడిం బోరు ఘోరం బై కౌరవపాండ
వరణంబునుం బోలి గాంగేయకుంభజాతదుశ్శాసనవీరలక్ష్మణకర్ణ
శల్యహరణకారణం బై రామరాక్షసయుద్ధంబునుం బోలి ఖరదూషణ
బలకబంధసంబంధహరివరప్రహరణధురీణం బై కృష్ణదానవసంగ్రా
మంబునుం బోలి మాగధబలిదంతవక్త్రకేశిశిరఃఖండనప్రచండం
బై భంగంబు లగుమతంగజంబులు పాటితంబు లగుఖేటకంబులు పాత
నంబు లగుకేతనంబులు తొఱఁగుగాత్రంబులు విఱుగుఛత్రంబు
లుస్రస్తంబు లగుచామరంబులు నస్తంబు లగుతోమరంబులు
పాటితంబు లగుకపాలంబులు నిరంతరంబుగ మెఱయు నయ్యుద్ధ
విడికి నోహటించి చలించి పలాయమాను లగుపారసీకుల ననేకులం
గాందిశీకులని యెంచి బ్రతుకుదురు గాక యని యుపేక్షించి తదీయస్థలం
బున జయధ్వజం బెత్తించి పదిలంబుగ దశంబు హత్తించి జయో
త్సాహంబున మించి గజపతి యున్నదేశంబుకుం గమకంబునం దమ
కంబు మీఱంజననెంచు నమ్మూరురాయరగండప్రచండబిరుదాంకుం
గనుంగొని యనంగునిమామగురునిం గ్రేణిసేయం గల సుధీచమత్కా
రంబున వెలయు సాళ్వతిమ్మరుసు మంత్రిపుంగవుం డిట్లనియె.

65


చ.

ఇతరులు శక్తులే తలఁప నేదులశాహునిజాముశాహులన్
గుతపనిమల్కునున్ గెలిచి గొబ్బున సర్వగిరీంద్రదుర్గముల్
జతురతఁ గైకొనన్ ధర నసాధ్యము నీ కిఁక గల్గ దైన నం
చితయశ యొక్కవిన్నపముఁ జేసెద వేదురఁ జిత్తగింపుమా.

66

ఉ.

తిన్నఁదనంబునన్ గజపతిం గెలువం జను టొప్పు గాక యా
పన్న శరణ్యశైలవనపంక్తులు దాఁటి తదీయసీమలో
న న్నిలఁ జూచి వారలు ఘనంబుగ మార్గము లడ్డగించినన్
సన్నుతశౌర్యరస్తు మనసైన్యము జేరుట దుస్తరంబగున్.

67


చ.

అనుటయుఁ బిన్ననవ్వు నగి యప్ప యిదెంతటికార్యమయ్య యా
వనగిరు లెంత వస్తుతతి వచ్చుట యెంత సమస్తదేశముల్
మనకు వశంబు లయ్యెఁ బదమాముద మానుచు సంశయంబు నె
మ్మనమున మానుచు న్దివిజమంత్రిసమాన యటంచుఁ బల్కుచున్.

68


క.

ఆవీరనృసింహధరి
త్రీవరనందనుఁడు రణదతిస్ఫుటభేరీ
రావములు చెలఁగ నడచెన్
దేవతలు నుతింప గజపతిన్ గెలుచుటకై.

69


క.

చనుచోఁ జితాపుఖానుం
డనువాఁడు ధరాధరాంతరాంతరసీమన్
గనుమలలో నఱువదివేల్
ఘనశార్జ్గధరుల్ చెలంగఁ గలహ మొనర్పన్

70


ఉ.

నాలుగుదిక్కులం గవిసి నట్టడవిం జరియించు నచ్చమూ
పాళి గలంగ బల్లెముల బాణములన్ మెఱుగీఁటెగుంపులన్
రాలఁ దుపాకులం బలుఫిరంగుల భంగము నొందఁజేసి గ
గ్గోలుపడం గడంగి యెలగోలుబలంబు చలం బెలర్పఁగన్.

71


క.

ముంగల నెసంగ రంగ
త్తుంగతురంగేంద్రఖురవిధూతరజంబుల్
నింగిఁ జెలంగఁ గళింగధ
రాంగణమున నిల్చె రాయ లద్భుతమతి యై.

72

పంచచామరము.

చితాపుఖానుఁ డంగడిందిచిచ్చు నార నేర్చి వ
చ్చితింగదా ముదంబు మీఱ శీఘ్ర మీగజాధిపున్
నితాంతకీర్తి ధాత్రిలోన నిండ గెల్చెదన్ ఘన
ప్రతాపదీధితిం దిగంతభాగము ల్విరాజిలన్.

73


తే

అనుచు పొట్నూరిసింహాద్రి కరుగుదెంచి
సకలచతురంగబలములు సరగ నపుడు
పరభయంకరవైభవప్రకటలీల
పాళె మిడియించె వేడ్క నప్పార్థివుండు

74


సీ.

కెందమ్మిచెంగల్వచందమ్ములం గెల్వఁ
          జె ల్వైనకెంబట్టుజిగి గుడార్లు
రంగారుబంగారుసింగారము లెసంగు
          మే లైనవెలిపట్టుమిహిగుడార్లు
చిగురాకుతెగసౌరు నగ రాజిలు హుశారు
          వగ మీఱు రత్నాలవహిగుడార్లు
హెచ్చైనవిలువ మేల్పచ్చడాల్‌పచ్చడాల్
          పచ్చడాల్ గలజీనిపనిగుడార్లు


తే.

గొప్పహురుమంజిసుప్పాణికూర్పడంపు
డంబు పగడంబు జగడంబు సంబరంబు
లెసఁగినగుడార్లు గలుగునవ్వసుమతీశు
పాళె మీక్షించి గజరాజు భయము మించి.

75


శా.

ఔరా చూచితెగాని రాయలబలం బౌరౌర యేనుంగు ల
య్యారే చారుతురంగసంఘములహాహా మన్నెవారల్ భళీ

ధీరుల్ రాజకుమారు లంచు మది నెంతేయద్భుతం బొందుచున్
బోరన్ శక్యమె యీనృపాలమణితో భూరిస్థిరప్రౌఢిమన్.

76


తే.

అనుచు నాప్తులతోన మంతన మొనర్ప
వార లిట్లని పలికిరి వసుమతీశ
యలపదార్గురుపాత్రులు నద్భుతప్ర
తాపశాలులు గలుగంగఁ దలఁక నేల.

77


క.

అనుటయుఁ దెలివిం జెందుచు
జననాథుఁడు వారివారిసదనంబులకున్
ఘను లయినమంత్రిపుంగవు
లను బంపెన్ వారువారలం బిలుచుటయున్.

78


క.

చనుదెంచువార లవ్విభుఁ
గనుఁగొనఁ గూర్చుండుఁ డనుచు గౌరవ మెసఁగన్
ఘనతరముగ బహుమానము
లొనరింపుచుఁ బల్కె నప్పు డుచితప్రౌఢిన్.

79


ఉ.

వింటిరె కృష్ణరాయపృథివీపతి యచ్చట శౌర్యలీలచేఁ
గంటకు లౌ తురుష్కులఁ గకాపిక లై చనఁజేసె నెంతయున్
దంటతనంబు మీఱ భుజదర్పమునన్ మనసీమఁ జొచ్చెగా
కంటికినింక సేయఁదగుకార్యము లెయ్యవి తెల్పుఁడియ్యెడన్.

80


క.

మును పెదగజపతిభూవరుఁ
డనువందన్ సేతుదర్శనార్థం బరుగన్
వెనువెంటఁ జనినతురకలు
వినుఁ డాదేశమునఁ గొన్నివింత లొనర్పన్.

81


క.

అది చాల న్మనసునఁ గల
దదియును గా కచటిసీమ లస్మత్సీమల్

గలిసినమాట ల్వినుఁ డ
క్కులరత్నము సూడుద్రిప్పుకొన వచ్చె సుమీ.

82


ఆ.

కృష్ణరాయఁ డనఁగ గేవలమనుజుఁడే
విష్ణుమూర్తి గాన విజయశీలుఁ
డతని గెల్వఁ దగినయతులితోపాయంబుఁ
జింత సేయుఁ డయ్య శీఘ్రముగను.

83


క.

అనిన విని కృష్ణరాయం
డననేమి సురాధినాథుఁ డైనన్ భయమే
యనియెన్ బలభద్రనిభుం
డనఁదగుబలభద్రపాత్రుఁ డతిమోదమునన్

84


శా.

భర్గుం డి ట్లరుదెంచెనో యని రిఫుల్ బాఱంగ జన్యస్థలిన్
దుర్గాంబాకరుణాకటాక్షవిలసద్దుర్వారఖడ్గాహతిన్
దోర్గర్వం బలరంగ నీక్షణమె గెల్తుం జూడు మంచు న్వెసన్
దుర్గాపాత్రుఁడు బల్కె భూవరుఁడు సంతోషంబునన్ దేలఁగన్.

85


క.

భీముఁ డని రిపులు దలఁపఁగ
భీమాహవకేళి సల్పి పేర్చెద వినుమీ
భీమకటాక్షముచేతఁ గృ
పామహిమభీనటంచు భీమపాత్రుం డనియెన్.

86


పంచచామరము.

ముకుందసత్కృపాకటాక్షము న్విరాజిలన్ నృపా
ముకుందబల్లెముం గరంబు బూని శత్రుసైన్యమున్
చెకుందముం జెలంగ జొచ్చి చింతు వింతగా ననెన్
ముకుందపాత్రుఁ డెంతయుం బ్రమోదయుక్తచిత్తుఁడై.

87

క.

ఏకరణిం జననీయక
వే కరఖడ్గమున శత్రువీరులనెల్లన్
శ్రీకరముగ గెలిచెద నని
భీకరపాత్రుండు బల్కె భీకరలీలన్

88


తే.

శూరవరు లన్న యారాయబారు జొచ్చి
ధీరుఁ డని మెచ్చ ఖడ్గసందీప్తు లెసఁగ
నాహవ మొనర్తు నని పల్కె నద్భుతముగఁ
జేరుపాత్రుండు సారగంభీరఫణితి.

89


క.

క్షణమున జయించి వచ్చెదఁ
బ్రణుతింపఁగ శత్రువరుల బలిమి నటంచున్
రణరంగపాత్రుఁ డనియెన్
రణరంగోత్సాహవిభవరంజితమతి యై

90


క.

సుత్రామాదులు మెచ్చన్
శాత్రవులన్ గెలిచి వత్తు సరగున ననుచున్
జీత్రముగఁ బలికె ఖడ్గా
పాత్రుఁడు సభవార లెల్లఁ బ్రణుతి యొనర్పన్

91


క.

తుండములతోడ మదవే
దండములం గాండతతుల ధరణిం బడగా
ఖండాజెండెద నని యా
ఖండలపాత్రుండు బలికెఁ గడువేడుకతోన్.

92


చ.

బలముచలంబు నేర్పడ శబా సని దేవరవారు మెచ్చఁగా
విలసితబాణపాతముల వేగమె శత్రునృపాలసంఘముల్
కలఁగి తొలంగ నేతు నని గౌరవరీతి దగన్ మురారిపా
త్రులు బలికెన్ గజాధిపతితోఁ దనశౌర్యవిలాస మేర్పడన్

93

వ.

వెండియుఁ బ్రచండశౌర్యుం డగువజ్రముష్టిపాత్రుండును తురగ
రేవంతపాత్రుండును గజాంకుశపాత్రుండును అసహాయపాత్రుండును
మృగేంద్రపాత్రుఁడును దక్కినవీరలోకంబు నట్లనె పలికినం గనుం
గొని వారలతో నిట్లనియె.

94


ఆ.

ఇట్టిపట్ల మీర లెవ్విధంబున నైన
నిర్వహింప వలయు నిఖిలరాజ్య
వైభవం బటంచు వక్కలాకులతోడ
వస్త్రభూషణములు వరుస నొసఁగ.

95


అ.

అన్నిటికి జగన్నాయకు
లున్నా రని పలికి రణసముత్సాహమనో
త్యున్నతిఁ జని రని వారల
సన్నాహము కృష్ణరాయజనపతి వినుచున్

96


తే.

ఇలఁ బదార్గురు రాజుల చెలువు గలిగి
యలచతుర్దశభువనముల్ గెలువఁ బూను
నట్టిఘను లౌనెకా వారి నణఁచి వశమె
పదరి వచ్చితి మప్పాజిపలుకు వినక.

97


క.

అని యాలోచనఁ జేయుచు
మనమున నారాత్రి యుబ్బుమఱుగునఁ బాళెం
బునఁ గలజను లవ్వార్తలు
విని యుత్సాహంబు లేనివిధ మెఱిఁగి వెసన్.

98


ఆ.

అయ్యుదంత మప్పు డప్పాజితోఁ దెల్ప
నాదుపల్కు వినక నరవరేణ్య
వచ్చినంత యింత వచ్చెఁగదా యిందు
కేమి సేయువార మిచటఁ జెపుమ.

99

తే.

అనుడు రాయలు బల్కె నీ వనినమాట
లెక్క సేయమి నిచ్చోటఁ జిక్కవలసెఁ
దలఁప నినువంటిమంత్రి యిద్ధాత్రిఁ గలఁడె
చూడు మిందుల కొకయుక్తి సూక్ష్మమతిని.

100


మ.

అను డమ్మంత్రిరేణ్యుఁ డిట్లనియె నయ్యా భేదమార్గంబునన్
విను మప్పాత్రులఁ గెల్వగావలయు నుర్విన్‌ శౌర్యధైర్యంబులం
జెనయన్ శక్యముగాదు గా ధనమణిశ్రేణీదుకూలాదివ
స్తునికాయంబు లొసంగ నెవ్వరు నసాధ్యుల్ లేరు చింతింపఁగన్.

101


క.

నావుఁడు బొక్కసమంతయు
నీవశ మగు నీకుఁ దోచునియతిం గార్యం
బేవగను నిర్వహించెదొ
ధీవర్య యటంచు నరిగె తేజం బెసఁగన్.

102


వ.

ఇట్లరిగి యభ్యంతరమందిరంబున సుఖంబున వసించె నంత నమ్మంత్రి
పుంగవుండు.

103


క.

ఘనతరభేదోపాయం
బునకుం దగినట్టియుక్తిఁ బుట్టించి రయం
బొనరఁగ రాయల పేరిటి
దినసరు లాక్షత్త్రియులకుఁ దేటపడంగన్.

104


క.

వ్రాయించి మందసమ్ముల
రాయల్ ధరియించునాభరణవస్త్రతతుల్
ధీయుక్తి నుంచి పంపె శు
భాయత్తత భటులఁ గూర్చి యప్పాత్రులకున్.

105


క.

పంచిన దుర్గములోపలి
వంచనఁ గని సామజేంద్ర వారలు వారిన్

బొంచి దొరమ్రోల నిల్చిన
సంచలితస్వాంతుఁ డగుచు సరగున నతఁడున్.

106


తే.

దట్టముగఁ బెట్టియలలోనఁ బెట్టి యున్న
తళుకుబంగారుజిగికాగిదములలోని
సారముగ వ్రాసి యున్నదస్తూరిఁ జూచి
చదువుకొనె నాత్మలోన విస్మయము గదుర.

107


సీ.

శ్రీమతు కర్ణాటసింహాసనాధ్యక్షుఁ
          డగుకృష్ణరాయధరాధినాథుఁ
డల పదారుగురుపాత్రులకు సంప్రీతిఁ బం
          పినసులేఖంబులు మిమ్ము మునుపు
గజపతిరాష్ట్రదుర్గవిశేషములనుండి
          మెలఁపుగాఁ బలికినపలుకుబడుల
తీరు వ్రాసితిరి మీకోరినట్లనె ఘనా
          భరణదుకూలముల్ బంపినార


తే.

మట్లనే రేపు జగడాని కరుగుదెంచి
నట్లు జనుదెంచి మాచేతి కతని మీరు
పట్టియిచ్చిన యపుడె మీపట్ల మేము
కొదువ పడకుండ నడపించుకొనెద మెపుడు.

108


ఆ.

అనుచు తేటపడినయావ్రాఁతఁ గనుఁగొని
వ్రాఁత యిట్టులయ్యె వసుధలోన
నమ్మఁ గూడ దెంతనమ్మినవారల
మోస మయ్యె ననుచు వేసరిలుచు.

109


క.

నరసేంద్రుకృష్ణరాయల
వరధాటికి నిల్వలేక వారణపతి స

త్వరగతి తత్పరమతి న
ప్పుర మతిదూరముగ వెడలి పోయెన్ బెలుచన్.

110


క.

మరునాఁ డాకథ విని తా
మరిగిరి సంతోషరహితు లై యెందైనన్
దొర లేనిపోటు గలదే
దురమున నని తలఁచి యచటఁ దొలఁగుచుఁబాత్రుల్.

111


తే.

అపుడు త్రైలోక్యసామ్రాజ్య మబ్బినట్లు
సకలచతురంగసేనతో సంతసిలుచు
గృష్ణరాయక్షితీంద్రుండు కీర్తి వెలయ
సరగ నచ్చట నొకజయస్తంభ మునిచె.

112


తే.

తత్పురంబుఁ బ్రవేశించి తగినరీతి
నల్లగజరాజనగరిచాయలకుఁ దనదు
సేన జనకుండ దిట్టంబు జేసి తాను
నొక్కచోట వసించెను యుక్తలీల.

113


వ.

తదనంతరవృత్తాంతం బెట్టిదనినఁ

114


చ.

మునిసవనావనా భువనమోహనదానకళాజితాబ్ధిరా
డనిమిషధేనురత్నతరుహాటకశైలఘనాఘనాపురా
తనబహువాక్యవర్ణితపదద్వయసద్వయదుఃఖభంజనా
యనుపమభక్తివైభవపదాంబుజసేవకచిత్తరంజనా.

115


క.

వనసంచారిగణప్రభు
ఘనతరసామ్రాజ్యవిభవకారణకరుణా
వనరాశిగర్వహరణా
కనకాచలధైర్యజనకకన్యారమణా.

116

వనమయూరము.

సూనృతవచోవిభవ సూరకులచంద్రా
దీనజనరక్షక సుధీజితఫణీంద్రా
భూనుతవిలాస ఘనపుణ్యగుణవాసా
హీనజనదూర విబుధేంద్రజనిరాసా.

117


గద్యము.

ఇది శ్రీమదోరుగంటి కాశీపతీసద్గురురాజయోగీంద్ర చరణారవింద
మనోవిహార నిరంతరానందకర రాజయోగ సామ్రాజ్యలక్ష్మీధురంధర
స్వస్వరూపానుభవసంపన్నజ్ఞానప్ర సూనాంబికా కాళహస్తీశ్వరకరుణా
కటాక్షవీక్షణ ప్రసాదా సాదితకవితాచమత్కార ధూర్జటిపౌత్ర కాళయా
మాత్య లక్ష్మ్యంబికాదత్త పోలనమంత్రిగుర్వమాంబికా కుమార
ధూర్జటిప్రణీతం బైన శ్రీకృష్ణరాయవిజయం బనుమహా ప్రబంధంబు
నందుఁ దృతీయాశ్వాసము.



శ్రీరస్తు

కృష్ణరాయ విజయము

చతుర్థాశ్వాసము

శ్రీ మదనంతపరాక్రమ
ధామా యార్వీటిరామ ధరణీశసుత
శ్రీమద్వేంకటరాయ
ప్రేమాస్పద రామచంద్ర పృథుగుణసాంద్రా.

1


వ.

అవధరింపుము.

2


శా.

ఆరీతిన్ జయలక్ష్మి గైకొని మహాహ్లాదంబుతో నవ్విభుం
డారూఢిన్ దనపద్దు చెల్లె నిట రాజ్యం బాగజాధీశ్వరుం
డే రంజిల్లుచు నేలుఁగాక యనియెంతే వేడ్కఁ దన్మంత్రివే
నారాజుం బిలిపించె నంచితకృపావ్యాపారపారీణుఁ డై

3


తే.

అందులకుఁ గొంత సంశయ మంది యతఁడు
రాయ లెంతయు బాంధవప్రౌడి వెలయఁ
దలఁచి యుండుట లెస్సగాఁ దెలిసి యపుడు
కానుకలు గొంచుఁ జనుదెంచె ఘనత దనర.

4


సీ.

భువి రోహణాచలంబునకు రత్నావళు
          లంచితంబుగ సమర్పించినట్లు
రహిని మేరుధరాధరంబున కెంతయు
          రంగారుబంగా రొసంగినట్లు

తగ సుధాసాగరోత్తమున కెవ్వారైన
          మెచ్చునాక్షీరము ల్దెచ్చినట్లు
సరగ మందారభూజమునకు వింతగా
          హెచ్చైన యొకఫలం బిచ్చినట్లు


తే.

నమ్మహాగుణమణికి నయ్యతులధైర్య
హారికాకరుణానిధి కావితీర్ణ
ఖనికి మణిధనధేనువుల్ ఘనపటములు
వసుతతియు మ్రోల నిడె గజవల్లభుండు.

5


తే.

కరము గనుఁగొని మిగుల శ్రీకరము గాఁగ
కరము వేడుక నెదు రేఁగి గౌరవముగఁ
గౌఁగలింపుచు నెనరున గారవించి
రాయ లెంతయు నాగజరాజు నపుడు.

6


క.

కూర్చుండుఁ డనుచుఁ దానుం
గూర్చుండినయపుడె నెనరుగూర్చినమదితో
నేర్చిననవరత్నంబులు
జేర్చినసింహాసనమున సింధురపతియున్.

7


క.

వసియించి కృష్ణరాయల
రసికతకు న్మనసులోన రంజిలి విలస
ద్బిసరుహమరందధారా
విసృమరమధురోక్తిగరిమ వెలయఁగ ననియెన్.

8


క.

నిరసించిన నిరసించన్
శర ణన రక్షించ నీకె చను నృపతులతోఁ
గరుణించితి వీపట్లన్
దిరముగ సింహాసనంబు నిల్పితివిగదా.

9

క.

లోకంబు లెల్ల మెచ్చఁగ
మాకుం బ్రా పగుచు నిట్లు మన్నించితి వౌ
శ్రీకృష్ణుఁడు ధర్మసుతుం
జేకొని రక్షించినట్లు సిద్ధము గాఁగన్.

10


క.

గోవిప్రుల రక్షింపుచు
దేవగృహతటాకములఁ బ్రతిష్ఠించి ధరన్
భూవర యపహృతరాజ్య
శ్రీ వెలయించినయతండె శ్రీవిభుఁ డెందున్.

11


ఉ.

నీరుణ మెందుఁ దీర్చుకొన నేర మదీయకుమారిఁ జారుశృం
గారమణిన్ గుణోన్మణిని గై కొను మిచ్చితి నీకుఁ గీరతు
ఖ్కారసమానరూప హిమకైరవబంధుయశఃకలాప ల
క్ష్మీరమణాప్రతాపనరసింహకుమార కుమారవిక్రమా.

12


తే.

నావు డప్పాజి యాగజనాథుతోడ
ననియె నీతోడ బాంధవం బరయఁ గృష్ణ
రాయశౌరికి క్షీరనీరధి మురారి
కబ్జగేహిని నొసఁగిన యట్లసుమ్మి

13


చ.

అనవుడుఁ గృష్ణరాయనృపుఁ డాగజనాథునితోడ నిట్లనెన్
వినుము నరేంద్ర నీ వనఁగ నే నన భేదము లేదు నీమనం
బున నొకవింతగాఁ దలఁపఁబోకుము శీఘ్రము గాఁగ నెంతయున్
ఘనతరవైభవం బలరఁగా నొనరింపు వివాహయత్నమున్.

14


క.

అనుటయుఁ బరమానందం
బున గజపతి కృష్ణరాయభూపాలునితో
జననాథ మత్కుమారిం
గనుఁగొన నప్పాజిఁ బంపఁ గాఁదగు వేడ్కన్.

15

తే.

మత్కుమారివివేకసంపద తదీయ
రూపరేఖావిలాసనిరూఢి జూచి
వేగ నిటు వచ్చు పంపు నావెంట నిపుడు
నవ్యగుణసంగ శుభలక్షణం బెసంగ.

16


తే.

నావుఁడును గృష్ణరాయధరావిభుండు
తనదునెమ్మోము గనుఁగొన్నమన నెఱింగి
యమ్మహామంత్రి స్వామి భాగ్యంబుఁ జేసి
నాడ చూచెద ననుచు సంతస మెలర్ప.

17


తే.

అపుడు బహుమాన మొనరించి యధిపుఁ డంప
విభవ మలరంగ నగ్గజవిభునివెంట
నరిగి యమ్మంత్రిమౌళి తదాదరంబు
దనరఁ గక్ష్యాంతరంబులు దాఁటి యెలమి.

18


క.

నవరత్ననిర్మితోన్నత
భవనంబున రత్నపీఠిపై వసియింపన్
సవినయముగ నజ్జనపతి
వివిధాంబరభూషణములు వేడుక నొసఁగెన్.

19


క.

నీయంతమంత్రిమణి సుర
నాయకునకు నైనఁ గలఁడె నరనుత మాకున్.
రాయలబంధుత్వంబును
నీయుక్తిం గలిగెఁ గాదె నీతివిచారా.

20


క.

అని సరసగోష్ఠిఁ బెంపొం
దినవేడ్కఁ గుమారిఁ దోడి తేఁ దగువారిన్
బనిచిన ఘనశృంగారం
బొనరం దొడితెచ్చి రప్పు డుచితప్రౌఢిన్.

21

సీ.

తళుకుకన్గవ జిల్కుతళ్కుఁజూపులసౌరు
          తమ్మిరేకులతీరుఁ గ్రమ్మరింప
మెఱుఁగుటద్దపుముద్దు మెఱయునిద్దపుమోము
          మొలకనవ్వులతేట గులకరింపఁ
గప్పురాజిగి నొప్పుకఱకుపెన్నెరిగొప్పు
          తేఁటిదాఁటులనీటు దీ టెసంగఁ
గమ్మపూనెరిమేనియెమ్మెమేలికడాని
          గ్రొమ్మెఱుంగుహొరంగుఁ గ్రుమ్మరింపఁ


తే.

గులుకువగగుబ్బచనుదోయి గునిసి గునిసి
సరిగెచెంగావిపైఁటతో సరసమాడ
చరణమంజీరరావము ల్సందడింప
వచ్చెఁ జెలువంబు మీఱి భూవరకుమారి.

22


తే.

వచ్చి గౌరవ మలర భూవరునియాజ్ఞ
దనర నప్పాజి కపుడు వందన మొనర్ప
నతఁడు దీవించి తగును రాయలకు నిమ్మ
హాత్మురా లని మదిలోన హర్ష మలర

23


తే.

అమ్మ కర్ణాటసింహాసనాఢ్యుఁ డగుచుఁ
జెలఁగుశ్రీకృష్ణరాయలఁ జెట్టవట్టి
మాదృశాశ్రితజనులు నీమహిమ నుతులు
సేయ వర్ధిల్లు మని వల్కెఁ జెలువు మిగుల

24


క.

అలతుఖ్కారమణీమణి
జలజాస్యలు వెంటఁ గొల్వ జనకునియాజ్ఞన్
వెలయుచు నంతఃపురికిన్
విలసితగతి నరిగె నపుడు వేడుక మీఱన్.

25

మ.

అలభూపాలకమౌళి తిమ్మరుసుతో నయ్యా మదీయాత్మజా
విలసత్ప్రౌఢిమఁ గాంచితే తెలుపుమీ వేవేగ శ్రీకృష్ణరా
యలతో నంచు వచించునట్టియెడ నత్యాశ్చర్య మొప్పారఁ ద
ల్లలనారత్నము వింత మీఱ నొకచిల్కం బంపె నచ్చోటికిన్.

26


క.

పంచిన విరించి యువతి వి
పంచిరవోదీర్ణవాక్యబంధురఫణితిన్
మించి నిజపాణిసరసీ
జాంచలమున వేడ్క మీఱ నది వ్రాలుటయున్.

27


తే.

కాంచి యమ్మంత్రి యెచ్చోటనుంచి వచ్చె
పంచదారలతీపు మేల్పచ్చవన్నె
మించుపంచాస్త్రువారువ మంచునాత్మ
నెంచ గజపతి కన్గొని యిట్టు లనియె.

28


క.

ఇది మత్కుమారి బెంచిన
చదివినకీరంబు తనదుసౌందర్యగుణా
భ్యుదయము రాయలు వినుటకు
ముదమున దెల్పు మని పంచె ముచ్చట గాఁగన్.

29


క.

బంగారమునకుఁ బరిమళ
ముం గలిగినయట్లు నృపతిముంగల మీ రీ
యంగనగుణంబు లెన్నఁగ
సంగతి దగ నిదియు మఱియు సన్నుతి సేయున్.

30


శా.

దీనిం గైకొని పొం డటంచు నతఁ డెంతేఁబ్రేమ మీఱంగ భూ
షానూత్నాంబరవాహనాదికము లిచ్చ న్మెచ్చుగా నిచ్చి స
న్మానశ్రీరహి మించఁ బంచుటయు నమ్మంత్రీంద్రుఁ డాకార్యసం
ధానాత్యుద్ధతి నేఁగుదెంచెఁ బురకాంత ల్మేడలం జూడఁగన్.

31

ఉ.

ఎప్పుడు వచ్చు మంత్రిమణి యెప్పుడు వీనులవిందు గాఁగ నా
యొప్పులకుప్ప సద్గుణసమున్నతి చక్కఁదనంబు విందు నే
నెప్పుడు గాంతుఁ బెండ్లిహొయ లెప్పుడు పొం దొనరింతు నంచు మే
ల్జొప్పడ భూవరుం డెదురుచూచుచు నుండఁగ సత్వరంబుగన్

32


తే.

వచ్చి యప్పాజి యాధరావల్లభునకు
వేడ్క మీఱంగఁ దనచేత వెలయుచిలుక
ముంగల నిడంగఁ గనుఁగొని ముద మెసంగ
వింత యిది యేమి యనుచు నవ్విభుఁ డనంగ.

33


తే.

స్వామియానతిఁ జని గజస్వామితనయఁ
జూచి వచ్చితి నెంతయుఁ జోద్య మయ్యె
నమ్మగువచక్కఁదనము బ్రహ్మాదులకును
వర్ణనలు సేయ శక్యమే వసుమతీశ.

34


ఆ.

ఆకంజాక్షివిలాసం
బీకీరం బెఱుఁగుఁగాని యితరు లెఱుఁగ రా
రాకేందువదన దీని గు
ణాకర యిట రాయబార మంపె న్వేగన్.

35


చ.

అనుడు పరాకు సామి కరుణాకర రాయలదేవ మీకు వం
దన మొనరించెద న్వినుఁడు నామనవెంతయుఁ జిత్తగింపుఁడీ
జనవర నాదుపేరు సహజంబుగ మోహనవాణి యండ్రు నిన్
గనుఁగొనఁగల్గె నెంతయును కన్నులపండువు గాఁగ నియ్యెడన్.

36


ఉ.

క్షీరసముద్రమధ్యమున శేషశయానునిపువ్వుదోఁటలో
గారవ మొప్పఁగాఁ బ్రబలి కల్మిలతాంగికిఁ బ్రొద్దు బుచ్చుచున్
సారవచోవిలాసముల సన్నుతిఁ గాంచిరి సర్వలోకసం
చారులు దొల్లి మాకొలముసాములు బూమెలు గాదు భూవరా.

37

తే.

అలజగన్నాయకస్వామి యవతరించి
యిలు వసించుట మజ్జనయిత్రి మఱియు
జనకుఁడును దర్శనార్థమై సరగ వచ్చి
యిచట శాశ్వతముగ నిల్చి రెలమితోడ.

38


తే.

స్వామిసన్నిధి రత్నపంజరమునందుఁ
బ్రబలుచును బిన్ననాఁడె భూప్రజలవలన
వింటి గజపతిసుత సద్వివేకగరిమ
లెనయఁ జిలుకల బోషించు నెప్పు డనుచు.

39


చ.

విని యొకనాఁడు వేడ్కఁ బృథివీవరనందన గారవించఁగాఁ
దనరెద నంచు నెంచి వనితామణి తానె ప్రియంబు మీఱఁ గాం
చనకలశాంబుపూరములు జల్లుచు బ్రోచిన తియ్యమామిడుల్
గొనబగుకేళికావనులకుం జని క్రుమ్మరుచుంటి నెంతయున్.

40


ఉ.

అంత వసంత మెంతయుఁ దనంత ననంతఘనాంతకాంతవ
న్యాంతికదంతురీభవదనంతలతాంతనితాంతకాంతితో
నంతశకుంతసంతతిహృదంతరసంతతచింతితార్థభా
స్వంతము పొల్చెనౌ విరహవంతుల కెంతయు వింతవింతగన్.

41


సీ.

తొలుదొల్తఁ బండుటాకులు రాలె మహిమీఁద
          విలసిల్లె మలయాద్రి మలయునీఁడ
యొక్కొక్క కెందలి రుదయించెఁ దరురాజిఁ
          దోర మై తనరెఁ గంతునివరాజి
చెలఁగె దిక్తటులఁ గోయిలరావములసౌరు
          మెదలాడె గండుతుమ్మెదలబాఱు
రహి మీఱె నపుడు మరందధారల చెన్ను
          పొలుపొందె మెఱుఁగుఁబుప్పొడులవన్నె

తే.

పొన్నగున్నలు సురపొన్న లన్నువ లగు
క్రొన్ననలచెన్ను లలరినవిన్న నెసఁగె
నెన్న నన్నన్న యాచైత్ర మెంతవింత
సంతస మొనర్చె రమ్య మై జనులకెల్ల.

42


ఉ.

సారెకు సారెకుం గుసుమసాయకుఁ డధ్వగరాజిగుండియల్
దూఱఁగ వేగఁ జేవెడలి దూసి వెసన్ జళిపించురక్తసి
క్తారుణనూతనాయుధము లై మలయానిలమందమందసం
చారచలచ్చలామ్రతరుజాలముల న్మెఱసెం గిసాలముల్.

43


ఉ.

మత్తిలి వీర లియ్యెడల మమ్ము గణింపక మానినీమనో
విత్తముల న్హరించెదరు వేగమె పాంథులు శిక్షసేతు మౌ
నిత్తఱినంచుఁ జిత్తజునిభృత్యులు తత్తఱపాటు మీఱఁగా
నెత్తినబెత్తులట్ల తగె నెంతయుఁ జక్కనిపూవుఁదీవియల్.

44


సీ.

వేళాసతీపదాన్వితలాక్షగగనల
          క్ష్మీకుచద్వయకుంకుమాకలన ము
ధరకదంబకసముత్కరసూనరాజి ది
          శాంగనాశోణపట్టాంబరాళి
మోహభిల్లీగళస్ఫురితగుంజాఫల
          ప్రతతి యధ్వగమధువ్రతవినూత్న
చాంపేయతతి సుమాస్త్రస్యందనారుణ
          దీప్తిమద్వైజయంతీవితాన


తే.

మమితతరుమౌనిబృందజటాంశుపటలి
మాధవార్పితవల్లికామానినీవ
తంసమణిఘృణి తలిరాకు దనరె నప్పు
డంగజుప్రతాపవిస్ఫూర్తి నతిశయించి.

45

క.

ఆమధుమాసదినంబున
నామధురవచోవిలాస మలరినవగ నా
రామ ముదం బొనరఁగ నా
రామమునకు రాఁ దలంచి రమణీయముగన్.

46


సీ.

సరిగంచుజిలుఁగుచందురుకావికుచ్చెల
          యడుగుఁదమ్ములయెమ్మె ననుసరింపఁ
దళుకులేముద్దుఁజెక్కులబెళ్కుజిగితోడ
          రతనాలకమ్మడాల్ బ్రతిఘటింప
గుత్తంపుకులుకుచన్‌గుబ్బకొండలతోడ
          ముత్తెంపుపేరులు ముద్దుగురియ
కళ లీనుకలువనెచ్చెలివంటిమోముపైఁ
          గమ్మకస్తురిబొట్టు గమ్మనంగ


తే.

మేల్మిసొమ్ములు క్రొమ్మించుమించు నణఁచ
వెంట రాయంచబోదల జంట లంట
మగువ లిరుగడఁ గొల్వంగ మందగతుల
వచ్చె గజరాజపుత్త్రి యవ్వనమునకును.

47


క.

వచ్చి మణినూపురధ్వని
హెచ్ఛ న్నెచ్చెలులతోడ హేలాగతులన్
మెచ్చలర నవ్వనంబున
విచ్చలవిడి తరులనీడ విహరించె రహిన్‌.

48


సీ.

ఒకదారి బకదారి చికిలిపారువముల
          జిలిబిలిపలుకుల చెలువు వినుచు
నొకదండ శుకకాండ సుకుమారసారవా
          గ్రమణీయకలకలారవము వినుచు

నొకమూల మజరాలయకనత్సరోవర
          వికచారవిందము ల్వేడ్కఁ గొనుచు
నొకవంక నకలంకమకరందరసబిందు
          ధారాఝరీతటుల్ దాఁటి చనుచు


తే.

నలరునలరులు తలిరులు ఫలము లెలమి
చెలిమిచెలువలతోఁగూడఁ జిదిమికొనుచు
నగుచు మెల్లన నే నుండునవ్యఫలస
మన్వితం బైనయెలమావి కపుడు జేరె

49


తే.

చేరి యపు డేను రాల్చినచిన్నిఫలము
లన్ని గైకొని ననుఁ జూచి యద్భుతమున
వెలఁది కనుఁగొంటె యిది యొక్కవింతచిలుక
యెచట నుండియొ చనుదెంచె నిచటి కిపుడు.

50


క.

అని నెచ్చెలులుం దానును
ననుఁ బట్టుకొనం దలంచి నవ్వుచు రా న
వ్వనజాక్షితోడఁ బల్కితి
ఘనతరవాక్ప్రౌఢిమంబు గడలుకొనంగన్

51


తే.

తరుణి సామాన్యముగ నన్ను దలఁచ వలదు
ధరణిజనులకు ననుఁ బట్టఁ దరముగాదు
నీగుణాతిశయప్రౌఢి నేను మున్నె
చాల విని యుందు నెందెందు జగతియందు.

52


ఉ.

కన్నులపండు వై తనరఁ గన్గొనఁ గల్గెఁ గదా లతాంగి న
న్మన్నన సేయ నీదుచరణంబులప్రాపుల నుండ నెంచితిం
గన్నియ నే నెఱుంగుదును కాఁగలకార్యము గృష్ణరాయఁ డన్
గన్నడరాజమౌళి నిను గౌరవలీలను బెండ్లి యాడెడిన్.

53

తే.

అనిన సిగ్గునఁ దలవంచి యలరుబోఁడి
యనుఁగు జెలువలు మెచ్చ సౌహార్ద మెనయ
నన్నుఁ జేకొని పంజరాంతరమునందు
గరిమతో నుంచి మిక్కిలి గారవించె.

54


శా.

ఆగాంభీర్య మవార్య మాచెలిమి నిత్యానందసంధాయకం
బాగానాన్వితసాహితీరమ యనన్యస్త్రైణసామాన్య యౌ
రా గంధర్వవధూవతంసములయం దావింత నే, జూడ లే
దౌ గాంధర్వవరాధిరోహణధురీణా కృష్ణరాయాగ్రణీ.

55


సీ.

అచటితుమ్మెదబాఱు లబ్జాస్యనెరులతో
          సరిరాక నో బెట్టు మొఱయదొణఁగె
నచటిపల్లవపంక్తి యబలపాదములతో
          సమతఁ గాంచకనొ చంచలతఁ జెందె
నచటికోయిలగుంపు హరిణాక్షిపలుకుల
          కుదురంద నేరకో కూఁత లిడియె
అచటిపెందీవియ లలివేణిమేనిడా
          లొనరకో యుఱ్ఱూఁత లూఁగఁదొణఁగె


తే.

నచటివిరిగుత్తు లాచెలికుచయుగంబు
రహి వహింపఁగ లేకనో రాలఁ గణఁగె
నచటిపూఁదేనె కనకాంగి యధరమధురి
మకు సమానంబుగాక నో మహినిఁ జెందె.

56


క.

ఘను లానెరికురు లనుచున్
ఘను లాడం గడఁగి రౌర కాంతామణికిన్
దొన లాజంఘిక లౌ నని
జను లాదట మెత్తు రౌర చంద్రాననకున్.

57

తే.

నెమ్మిదోదుమ్మిబంగారునీటుకమ్మి
చమరవాలమ్ము వాలమ్ముసాటి యౌను
గతియు నూఁగారు నెమ్మేను కళుకుఁజూపు
బాలికామణి కెపుడు భూపాలతిలక.

58


తే.

మీలు తామరపూలు క్రొమ్మెఱుఁగుచాలు
తరుణమృగి నేలు తరుణినేత్రములడాలు
తొమ్మిదవలెక్క వ్రాలు వీన్‌దోయిమేలు
పలుకులహొరంగు కపురంపుఁబలు కెసంగు.

59


తే.

శంఖశంఖంబు లైనను సరసిజాక్షి
గళముతో సాటి గా వనర్గళజయాంక
తరుణినునుఁగౌనుతో ననంతమ్ము లగు వ
సంతములు నైన సరిగా వహార్యధైర్య.

60


క.

బొమలా కమలాసుతువిలు
రమలా రమణీయనిటలరాజత్వములా
కమలారిద్వికళాభా
గములా విమలాంగి నెన్నఁగా వశమగునే.

61


క.

పరిణతతాంబూలలతా
సరసదళావళుల గిల్లి సరగునఁ బెల్చన్
ధరణి రహి మీఱు నెంతయుఁ
దరుణీమణిముద్దుగుల్కు తళుకు ల్బెళుకుల్.

62


క.

కురువిందమ్ముల తమ్ముల
సరవింద మ్మేలు మనఁగ సౌ రౌనవలా
గరగర నౌపల్వరుసల్
గరగర దానింబవిత్తుగమి నదలించున్.

63

సీ.

ఔరౌర శరదుజ్జ్వలాబ్జమో దూరీకృ
          తాబ్జమో తరలాయతాక్షిమోము
హైసరే హృదయాపహారమో మౌ క్తిక
          హారమో యెలనాగయలఁతినవ్వు
చాఁగురే శృంగారసారమో నిమ్నకా
          సారమో తన్వంగిసరసనాభి
చాబాసు మేదినీచక్రమో మరుతేరి
          చక్రమో పూబోణిజఘనసీమ


తే.

రంభలో హస్తికరజయారంభ లేమొ
యురుతరస్తనిపలుచనియూరు లౌర
రాజదేవేంద్ర యటువంటిరాజముఖినిఁ
గంటిమే వింటిమే తొంటికతలనైన.

64


తే.

నాస హేమంబు గావున నాసఁజేసి
యనుసరించెనా నువ్వుఁబువ్వనఁ జెలంగు
రాచజవరాలిమోమున రహిఁ జెలంగు
ముద్దుబంగారుముంగఱముత్తియంబు.

65


ఉ.

ఆరమణీలలామ మలయానిలచంచలదూర్మికానట
త్పారసరాజహంసఘనసారసపాళిమదాళిజాలసం
చారసమంచితారవవిశాలగభీరజలాశయంబునన్
దోరపువేడ్క నెచ్చెలులతో జలకేళి యొనర్చె వేడుకన్.

66


సీ.

బంగారుపావడల్ చెంగావిపుప్పొడుల్
          సింగారము లెసంగుజిగి మెలంగ
ఘనవళీకాండముల్ కల్లోలతండముల్
          మెండుగా నొండొండఁ దాండవింప

విమలదృగ్బృందముల్ వికచారవిందముల్
          క్రందుగానందంద పొందు సల్ప
కచభృంగజాలముల్ కలితశైవాలముల్
          మాలిమి నన్యోన్యకేళిఁ దేల


తే.

నతులితోత్సాహ మంతంత నతిశయించ
సరసి విహరించునప్పు డబ్జాతముఖులు
పాలసంద్రంబులోపల నోలలాడు
వేలుపువెలందులో యన వెలసి రపుడు.

67


తే.

గంధమాల్యాభరణవస్త్రకలిత లగుచు
శాస్త్రపద్ధతి సకలోపచారములను
తెలివిఁ జెలువొందుకపురంపుఁదిన్నెలందుఁ
బువ్వుబోఁడులు వలరేనిపూజ జేసి.

68


క.

కన్నడసేయకు మదనా
కన్నడరాయఁ డగుసరసఘనుఁ గృష్టేంద్రుం
జెన్నలరఁగ గజనాథుని
కన్నెకుఁ బతిసేయు మనుచుఁ గలకల నగుచున్ .

69


మ.

తనవెంటం గొలువంగఁ బ్రాణసఖులం దాత్పర్య ముప్పొంగఁగాఁ
గనుచున్‌ వేడుక లుల్లసిల్లగను సౌఖ్యస్ఫూర్తి నంతఃపురం
బునకుం జేరి లతాంగి సత్కరుణ నన్ బోషింపుచు న్సత్కథల్
వినుచు న్విద్యలఁ బ్రొద్దుబుచ్చు నెపుడున్‌ లీలావతీమన్మథా.

70


సీ.

ఏవేళ భవదీయలీలావిశేషముల్
          వేవేలవిధముల వినుచునుండు
నేవేళ యుష్మత్ప్రభావసంతోషముల్
          వేడుక ల్వెలయంగ వినుచునుండు

నేవేళ తావకీనావిష్కృతయశఃప్ర
          వీణతేజస్థితు ల్వినుచునుండు
నేవేళ మీజయశ్రీవితీర్ణకళావి
          వేకవైభవములు వినుచునుండు


తే.

కృష్ణమూర్తివె నీవు శ్రీకృష్ణరాయ
సత్యముగ నవ్వధూటియే సత్యసుమ్మి
కలుగుఁ గళ్యాణ మిదిగొ శీఘ్రముగ మీకు
నతులితసుఖైకవార్ధి నోలాడు మధిప.

71


వ.

త్వదీయహితార్థంబుగా తదీయరూపరేఖావిలాసగుణంబులు ప్రకటింపం
జనుదెంచితిఁ దొల్లి దమయంతీనలదూత్యం బొనరించినరాజహంసంబు
చందంబున భవత్కారుణ్యంబు గాంచితిం బోయివచ్చెద నీకు నమ
స్కృతి యొనర్చితి ననుచుం గలకలధ్వను లెసంగ నయ్యనంగతు
ఖ్కారంబు తుఖ్కారమణీ మణిగృహాంగణంబునకుం జని తన్మనః
ప్రియం బొనర్చె నంత నయ్యనంతాధీశ్వరుండును సభాసదులు నద్భు
తానందంబులం జెందుచు సుఖం బుండి రయ్యవసరమున.

72


సీ.

కట్టిరి నవరత్నఘనతోరణంబులు
          కడువేగ రాజమార్గములయందుఁ
బట్టిరి శోభనప్రకటితద్రవ్యముల్
          రంజిల్ల మిగులహేరాళముగను
జుట్టిరి రంభాదిసురుచిరస్తంభాళి
          రహి మీఱ చిత్రవస్త్రములసమితి
పెట్టిరి దట్ట మౌకట్టాణిముత్తెంపు
          మ్రుగ్గులు ద్వారభూములఁ జెలంగ


తే.

సరగ నెందెందు గజపతిపురమునందు
నభినవాలంకరణలీల హర్ష మలర

సంతతోత్సాహచిత్తులై సకలజనులు
నంత వైవాహికోత్సవం బతిశయించ.

73


ఉ.

అంతట సామజేంద్రుడు దిగంతసమాగతబాంధవావళుల్
సంతసమందఁ గీర్తిజితచంద్రుఁ డనందగుకృష్ణరాయభూ
కాంతునకుం గొమార్తె నొసఁగన్ సుముహూర్తము నెంచి వేడ్కతో
నంతిపురం బలంక్రియల నంద మొనర్చె విచిత్రవైఖరిన్.

74


ఉ.

పెండ్లికొమార్తెఁ జేయుఁడని పెద్దలు బల్క మిటారితళ్కుపూ
బోండ్లు నృపాలపుత్త్రికను పుత్తళిమేల్‌జిగిపీఁట నుంచి హొం
గిండ్లను తావినూనె తగు గిన్నెల బంగరుపళ్లెరంబులన్
బండ్లును కుంకుమం బెసఁగఁ బాటలు పాడుచుఁ దెచ్చి రయ్యెడన్.

75


క.

వనితామణి తలయంటెన్
జనితామోదమునఁ బటుకుచద్వయి గులుకన్
నునుగౌ నళుకుం దాటం
కనటత్కంకణసువేణికలును జెలంగన్.

76


తే.

జలకమాడి మెఱుంగుదువ్వలువ దాల్చి
గంధమాల్యాభరణవస్త్రకలిత యగుచు
మించుటద్దంబు వీక్షించి మెఱుఁగుఁబోడి
యంగజునిరాజ్యరమవోలె నలరె నపుడు.

77


తే.

తనకు జోడగు నొకరాజు ఘనతరాన్వ
యమునఁ గలిగెమ కృష్ణరాయ లయి సత్య
మరిభయంకరతేజోవిహారి యనుచు
వెఱచి వేవేగ సిగ్గున జరగె ననఁగ

78


తే.

సమయనరు డబ్ధిరణసీమఁ జక్రసింధు
ధవువియోగాగ్ని పాశుపతమున నేయ

మించి రయమున దాఁకఁగ మిట్టిపడిన
తత్కిరీటంబురీతిని దళు కెసంగి.

79


చ.

ఇనుఁ డపరాబ్ధిఁ గ్రుంకె గగనేందిర దాల్చినకుంకుమంబనాఁ
దనరెను సాంధ్యరాగరుచిదట్టము లై కనుపట్టెఁ దార ల
య్యనిమిషభూషణోజ్జ్వలములౌమగరాలమెఱుంగుగుంపులో
యనగ మనోజుఁ డొక్కమొగి నంతట జల్లినతూపులో యనన్.

80


మ.

తనబాహ్యస్థిరకార్యసంగగరిమన్‌ దా నిల్చునజ్ఞానమో
యనఁగాఁ జీఁకటి మించె వెన్కఁ గని నౌనచ్ఛత్వమోనాగఁ బ్రా
గ్ఘనపాండుప్రభ దోచె సత్త్వగతలింగంబో యనం జంద్రుఁ డొ
ప్పె నిజానందకళల్ జెలంగెననఁ గల్పించెన్‌ కనచ్చంద్రికల్.

81


మ.

కృప యొక్కింతయు లేక చిత్తజుఁడు సారెన్‌ వాఁడిక్రొందళ్కుతో
రపుచెంగల్వమెఱుంగుతూపు లెదఁ దూఱం బెట్టుగా నేయఁగా
విపరీతస్థితిఁ గోయిల ల్మొరయఁగా విభ్రాంతితో మించఁగా
నపు డావెన్నెలకుం గలంగె నలకన్యారత్న మత్యంతమున్.

82


ఆ.

కలిఁగి కలువఱేనిఁ గనుఁగొని కటకటా
తగునె చంద్ర నీకుఁ దలిరుబోండ్ల
నలఁచుదుర్గుణంబు కలకాల మీగతిఁ
బాప మెనయ నేమి ఫలము దీన.

83


సీ.

ఇనునితో జోడుగాఁ దనరెద ననుచునో
          యధ్వగావళి నిట్టు లలచు టెల్ల
సోమనామము దాల్చి సొలసెద ననుచునో
          యుగ్రరూపస్ఫూర్తి నొనరుటెల్ల
బడబాగ్నితోఁగూడ బొడమితి ననుచునో
          వేఁడివెన్నెలలచే వేచుటెల్ల

హరిసమాఖ్య వహించి యలరితి ననుచునో
          పటుభయంకరవృత్తిఁ బరఁగుటెల్ల


తే.

పద్మినులఁ బ్రోచి చెలువుచేఁ బ్రణుతిఁ గాంచి
చల్ల నగుచోటనే నిల్చి జనులు మెచ్చ
జగతి కాదరు వైనదత్సద్గుణంబు
లెంచ వారలసమత నీ కేల కలుగు.

84


మ.

అరయంగాఁ దనతల్లియింటి కహితవ్యాపారముం జేసి యి
ద్ధర నాత్మీయవిరోధియౌ శివునకుం దా భూషణం బయ్యెనే
తఱి నమ్మం దగఁడంచు నెంచక నినున్‌ దా మామగా నెంచుతా
మెరతూపుందొర యింతమాత్రమునకై మిన్నందెదే చంద్రమా.

85


తే.

అరయఁ బాశ్చాత్యమహిభృత్పదాంతరమునఁ
దింగి సురపానహితరీతి సొబ గెసంగి
సరగ గురుభక్తి దొరగి గోసంగి వైతె
నీకుఁ జెల్లునె ద్విజరాజనియతి చంద్ర

86


క.

నక్షత్రేశత గలని
న్నీక్షితి రా జనఁగఁ దగునె యెప్పుడు నమరుల్
ప్రక్షీణునిఁ జేసిన నీ
వక్షయగతి బ్రతికె దౌర యాశ్చర్యముగన్.

87


వ.

అని యివ్విధంబున.
{{Telugu poem|type=తే.|lines=<poem>చందమామను దూరి నీచందమాన
చంద మామందమారుత స్యందమాన
బిందుమాధుర్యధరశరబృంద యనుచు
నందమానందనునిఁ బల్కె నలరుఁబోఁడి.

88

తే.

మార నిను శంకరుఁడు పలుమారు మార
వలయుఁ గ్రమ్మఱ బ్రతికించఁ దలఁచె నకట
యట్టి యవివేకమునసుమీ గట్టుఁబట్టి
బెట్టుజటగట్టి భైక్షంబు బట్టఁ గడఁగె.

90


పంచచామరము.

రమాకుమార సారె పాంథరాజి నెంచ నిట్లు బీ
రమా యుమాధినాథుతోడ రాయడించి మించి నే
ర మాని తౌర నీకునుం దురంగ మొక్కకీరమా
రమారమి న్మెలంగ కౌర రవ్వ సేయ సారమా.

91


సీ.

మెత్తందనము గల్గు నెత్తమ్మిరేకుల
          కేలాగు గలిగెనో యిట్టివేఁడి
కోమలత్వముఁ జెంది కొమరొందుకలువల
          కేరీతిఁ గలిగెనో యిట్టివాఁడి
చల్ల నై వలపుచే నుల్లసిల్‌మొల్లల
          కేలాగు గలిగెనో యిట్టియుడుకు
మంచిమాటలచేత నంచితం బగుచిల్క
          కేవగఁ గలిగెనో యిట్టిదుడుకు


తే.

కటకటా నీవు చేపట్టఁ గాని కాదె
ఇప్పు డిన్నియు న న్నిట్టు లేఁచఁ దొడఁగె
జగతి నెటువంటివస్తువు ల్సద్గుణంబు
విడువకుండునె దుర్గుణాన్వితునిఁ గూడి.

92


క.

పలుభూజములం దిరుగుచు
బలుభూతం బైననిన్ను బాములఁ బెట్టన్
వలయును సుడిఁబడఁ గా ని
మ్మలయుటఁ జాలించి నిలుమ మలయానిలమా .

93

వ.

అని మఱియును.

94


క.

చిలుకా నాపాలికి మరు
చిలుకా నీ విపుడు చెలిమిఁ జేసితె మున్నే
పలుకాదర మెనయవుగా
పలుకాఁకలపాలు సేయఁ బాడియె నీకున్.

95


తే.

ఔర నీయైకకంఠ్య మేమనఁగ వచ్చుఁ
బల్లవాసక్తిఁ బ్రబలి తౌ ప్రజలు నవ్వ
నల్లపలుగాకులనుగూడి తనుచుఁ గాదె
కోకిలా నిన్ను రాముఁడు కోపగించె

96


తే.

తుమ్మెద నటంచు వత్తు వెందును జెలంగి
నీదుమధుపానవృత్తి గణించ నేల
చుఱుకుముట్టంగ మొరయుచు సోఁకునట్టి
యలిశిలీముఖ మంచు ని న్ననఁగ వినవె.

97


క.

అని విధుమదనులను సమీ
రణశుకకోకిలల మధుకరంబును నిందిం
చును వనితామణి ఘనతర
కనదనుపమవిరహతాపగతిఁ గలిగించన్.

98


క.

అచ్చెరువుఁ జెంది నెచ్చెలు
లచ్చానకు శైత్యకృత్య మలరించి మఱిన్
మెచ్చలరంగ వచించిరి
విచ్చలవిడి గారవంబు వెలయఁగఁ గరుణన్.

99


ఆ.

ఇంత కలఁగ నేల యెలనాగ రేపు మా
పటికిఁ బెండ్లి యౌను ప్రౌఢివెలయ

నీకుఁ గృష్ణరాయభూకాంతునకును నీ
చింతితార్థఫలము సిద్ధి యగును.

100


తే.

అని యనేకవిధంబుల ననునయించి
గారవింపుచు మిక్కిలి యూఱడించి
తెలివితో నుండె నెంతయుఁ దీవెబోణి
యప్పు డంతంత వేగుజా మయ్యె నచట.

101


క.

మిన్నక కుక్కుటములు తమ
చెన్నగుకాలజ్ఞరీతి శివు బాహ్యముగా
నెన్నెఁద రదేమి మీయం
దున్నాఁడో యనుచుఁ దెలుపునోజ న్మొరసెన్.

102


చ.

అలగురుఁ డట్టివేకువ సురాపగఁ గ్రుంకి తదీయతీరమం
దలరిచినట్టిసైకతమయంబగులింగము పూజసేయఁగా
దలఁచి తదేకనిష్ఠ నవతామరసం బపు డెత్తె భక్తి రం
జిల నన వేగుజుక్క వెలసెన్ తళుకుంజిగితోడఁ బ్రాగ్దిశన్.

103


తే.

అపుడు ప్రాగ్భామ స్నానార్థ మర్జవంబు
దరిని నుదయాచలాంతికస్థలమునందు
నారవైచినచెంగావిచీర యనఁగ
నరుణదీధితి గన నయ్యె నంచితముగ.

104


సీ.

ఇంద్రుఁడు కొలువుకు నేతెంచి పఱుపున
          గీలించుమహితాళికెం పనంగ
నమరుల సభఁ జూడ నరుదెంచునొకభక్తి
          పరుఁడు దెచ్చిననిమ్మపం డనంగ
నందనవనమందుఁ గ్రందన నెరజాజు
          పొలుపొందుదానిమ్మపూ వనంగ

వినయంబుతోడ నింద్రునిభృత్యుఁడు ధరించు
          కెంగేలిబంగారుగిం డనంగ


తే.

నప్పు డుదయించి వచ్చె నీహారతిమిర
కువలయచకోరవిస్ఫూర్తి గుందుపడఁగ
విశ్వజనచక్షురంభోజవితతితోన
బద్మతతు లెల్ల వికసించఁ బద్మహితుఁడు.

105


తే.

అప్పు డప్పాజి కృష్ణరాయలను బెండ్లి
కొడుకుఁ జేయంగ నెంచ పుత్తడిమెఱుంగు
డంబుల నెసంగుబలుదివాణంబులోన
భద్రపీఠంబుపై నుంచెఁ బ్రౌఢి మించ.

106


వ.

తదనంతరంబ.

107


చ.

కులుకుచు నిబ్బరంపుబిగిగుబ్బలు పయ్యెటలోన మించఁగా
నళుకుచుఁ గౌనుఁదీఁగె శ్రవణాభరణంబులు హారవల్లరుల్
బెళుకుచు నిగ్గు లీన వలభిన్మణివేణి నటించ తావినూ
నెల సిరసంటె నొక్కతరుణీమణి కన్నడరాయమౌళికిన్.

108


క.

హృద్యానవద్యవాద్యర
వాద్యసుగీతస్వనంబు లతివలపాటల్
చోద్యం బొసంగె నెంతయు
సద్యోవైవాహికప్రసన్నతఁ దెల్పెన్.

109


ఆ.

ఒకలతాంగి తావి యొనరినయటకలి
యొసఁగ వేగ నొక్క బిసరుహాక్షి
నెరులు బ్రామ నొక్కనెలఁత కొప్పెరనీట
జలకమార్చి క్రొత్తవలువ లొసఁగ.

110

క.

తడి యొత్తె నప్పు డొకపు
త్తడిబొమ్మ నృపాలమణికిఁ దాత్పర్యమునన్
వడి సాంబ్రాణిని ధూపం
బడరించె లతాంగి యొకతె యవనీపతికిన్.

111


సీ.

సరిగంచువలిపమేల్ జంటిరుమాలుడాల్
          నెరులపూసరులపై నీటుజూప
వేలలేనిముత్యాలతళుకుచౌకట్లతో
          మగరాలబావిలీ ల్సొగసుఁజూప
మెఱుఁగారుజాతికస్తురిగీఱుబొట్టుతో
          ముంగురు ల్పలుమాఱు ముచ్చటాడ
తలుకుగందంపునిద్దపునిండుపూఁతతోఁ
          జలువదుప్పటినిగ్గు సరస మలర


తే.

మూరురాయరగండ పెండేరముఖ్య
లలితభూషణకలితుఁడై యలరె నప్పు
డలరువిలుకానిచెలువంబు నతిశయించి
వీరనరసింహరాయకుమారశౌరి.

112


క.

వైవాహికార్హవస్తు
శ్రీ వెలయఁగఁ దత్తదుచితశృంగారవిధుల్
వేవేగ నొనర్పుచు గజ
భూవిభుఁ డలరె న్నితాంతమోదం బెసఁగన్.

113


క.

కులదేవతార్చనాదిక
విలసితకళ్యాణలీల వెలయఁగ నెంతేఁ
జెలఁగిరి యంతఃపురిలో
సులలితవిప్రాంగనాదిసుదతులు వేడ్కన్.

114

మ.

ఇనుఁ డస్తాద్రికిఁ జేరెఁ జక్రములకుం దేపారె నాకాశమ
ధ్యనిరూఢద్యుతితారకాప్రతతు లంత న్వింతలై సారెసా
రెనిరీక్షించఁగ వేడ్కలూరె శశి మీఱెం బ్రాగ్దిశాఖామినీ
ఘనవక్షోరుహహారమౌక్తిక మనంగా వారి యుప్పొంగఁగన్.

115


సీ.

హాటకోన్నతకాంపాటలద్యుతి మించు
          దివ్వటీ ల్వేనవేల్ తేజరిలఁగ
వజ్రమౌక్తికముఖ్యవరరత్ననిర్మిత
          చ్ఛత్రచామరకాంతి చౌకళింప
బిరుదాంకకేతనస్ఫురదంబరచ్ఛటల్
          మించి యంబరమున సంచరింప
మౌళిమండనరత్నపాళీలసద్ద్యుతుల్
          దీపాంకురంబులఁ దెగడి మెఱయఁ


తే.

బగలువత్తులు దినకరప్రభల వెలుఁగ
నపుడు గజపతి దోడ్తేర హవుసుమీఱ
వచ్చెఁ బెండ్లికుమారుండు వాద్యరవము
లెసఁగఁ బెండ్లింటికడకు భద్రేభ మెక్కి.

116


ఉ.

వచ్చి మదేభముం డిగి సువాసిను లిచ్చుమెఱుంగుటారతుల్
మచ్చిక మీఱఁ గన్గొని చెలంగుచు ద్వారము లెల్లఁ దాఁటి భా
స్వచ్చటులేందుకాంతమణి నంఘటితం బగు పెండ్లితిన్నెపై
హెచ్చినహేమపీఠముపయిన్‌ వసియించె నృపాలుఁ డయ్యెడన్.

117


మ.

ఘనవిప్రుల్ నృపమౌళిచే నపుడు సంకల్పంబు సేయించి భూ
జనరక్షాంచిత మైనహస్తమున భాస్వత్కంకణం బుంచి చెం
దినవేడ్కన్ గజరాజనందనను దోడ్తెమ్మన్న బాలామణుల్
మనసుల్ రంజిలఁ బాట లుల్లసిల శుంభల్లీలఁ దోడ్తెచ్చినన్

118

తే.

మదనుఁ డనుబొమ్మలాటగాఁ డద నెఱింగి
రాజునెదుటికిఁ దెరలోన రహిఁ జెలంగు
మెచ్చుబంగారుప్రతిమను దెచ్చె ననఁగ
వచ్చెఁ బెండ్లికుమారి చెల్వంబు మీఱి.

119


తే.

సరగ దెరబట్టి మంగళాష్టకము జదువఁ
బట్టిఁ దనయొద్దఁ గూర్చుండఁ బెట్టుకొనుచు
నపుడు గజపతి సంకల్ప మాచరించెఁ
దెలివిగను గోత్రనామముల్ కలయ నుడివి.

120


తే.

సరగపట్టపుదేవియంజలి నొసంగు
కలశజలములచేత రాయలపదాబ్జ
ములకు నర్ఘ్య మొసంగి యాభూవరుండు
గంధమాల్యాభరణవస్త్రకలితుఁ జేసి

121


క.

మధుపర్క మొసఁగి కలశాం
బుధి హరికిన్ లక్ష్మీ నొసఁగుపోలికె గజరా
డ్విధుఁడు సుత దారవోసెం
బ్రథితోన్నతి మీఱఁ గృష్ణరాయల కెలమిన్.

122


ఆ.

అట మిటార్లు గొంద రపరంజిజిగిమెట్టుఁ
బ్రాలపుటికె లిడిరి ప్రౌఢి మిగుల
శంఖకాహళాదిసద్రావములు మ్రోయఁ
బాటలాధరాళిపాట లెసఁగ.

123


క.

శృంగారవతిగళంబున
మంగళసూత్రంబు గట్టె మహనీయకళల్
రంగలరఁ గృష్ణరాయలు
సంగతి దనర న్నితాంతసంతోషమునన్.

124

తే.

అపుడు తలఁభ్రాలు వోసి యన్యోన్యమస్త
కముల నెలమి వధూవరుల్ కమలశరుఁడు
రతియుఁ దమకీర్తితతులు ధరాతలమునఁ
దేటపడఁ జేసి రనఁగ ముత్తెములగముల.

125


తే.

అలయరుంధతిదర్శన మాచరించి
యెలమిమీఱ వధూవరు లిచ్చి రఖిల
జనుల కెంతయుఁ దాంబూలచయము జాల
వల్లికలకాంతు లంతట నుల్లసిలఁగ.

126


క.

విలసితబహువైభవముల
నలరుచు నాగవలిఁ జేసి యఖిలార్థిజనం
బులకు వరహాలుమాళ్వి
చ్చలవిడి పచ్చడము లిచ్చె జనవరుఁ డంతన్.

127


తే.

ఘనతరాపూపసూపాజ్యకలితభోజ
నముల సంతృప్తిఁ జెందె బాంధవజనంబు
లభినుతింపంగ వశమె బ్రహ్మాదులకును
వలను మీఱంగ నప్పె౦డ్లివైభవంబు.

128


క.

అంత నవరత్నకాంచన
కాంతం బై వెలయుకేళికాగృహమున న
భ్యంతరశయ్యాతలమున
నెంతయు రాయలు వసింప నెలమి దలిర్పన్.

129


మ.

చెలువ ల్దోడ్కొనిరా మణీఖచితమంజీరధ్వనుల్ మించఁగాఁ
దళుకుంజెక్కుమెఱుంగుటద్దములపై తాటంకరత్నద్యుతుల్
వెలయం దా గజరాజపుత్త్రి యగుఠీవిం దెల్పుచందాన వ
చ్చె లతాంగీమణి మందమందగతులన్ శృంగార ముప్పొంగఁగన్.

130

తే.

వచ్చి పడుకింటిగడప కివ్వలనె నిలిచి
సిగ్గున శిరంబు వంచునచ్చిగురుబోఁడి
తచ్చనల్ మెచ్చ పదమంచుఁ దలిరుబోండ్లు
నృపతిముంగల నిల్పిరి నేర్పు వెలయ.

131


తే.

రాయబారంబు బంపె నీరమణి కృష్ణ
రాయ భారంబు మీదె యీరాజవదన
చాల దయచేయుటకు ముద్దరాలుసుమ్మి
యే మెఱుంగదు గోల భూమీశతిలక.

132


క.

అని యొకనెపంబుఁ బెట్టుక
యనుఁగుంజెలువలు జనంగ నవనతముఖియై
కనకమణిస్తంభము మఱుఁ
గున నిల్చినతరుణిఁ జూచి కుతుకం బలరన్.

133


తే.

అపుడు నరనాథుఁ డింతి కిట్లనియెఁ దరుణి
యింత సిగ్గేల నీకు నిన్నెప్పు డెప్పు
డెనయుదు నటంచు మదిలోన నెంచియున్న
నన్ను దయసేయఁ గదవె పొందళుకుబొమ్మ.

134


క.

స్థిర మగుదుర్గవ్రజమున్
స్థిరరణమున నాక్రమించితిన్ శీఘ్రముగా
మరురణమున నీకుచయుగ
వరదుర్గము లాక్రమింపవలయుం జుమ్మీ.

135


క.

అని సరసోక్తులు మెరయన్
వినతాంగిం జేర దీసి విరిపానుపునన్
మనసారఁ గౌఁగిలింపుచు
జనితామోదం బెలర్ప జనవరుఁ డంతన్.

136

సీ.

వాలారుకొనగోట బాలపెన్నెరిగొప్పు
          నీటుగా పలుమాఱు నిమిరి నిమిరి
మొలక లౌతరుణిచన్నులమీఁద నెంతయు
          నొరపుగా నెలవంక లుంచి యుంచి
తళుకులౌచును ముద్దుగులుకుచెక్కిళ్ళను
          ననువు మీఱఁగ ముద్దు లాడి యాడి
తేనియల్ జిప్పిల్లు తెరవనిద్దపుమోవి
          చాలంగఁ దనివారఁ గ్రోలి క్రోలి


తే.

యలరుపై వ్రాలునెలదేఁటిచెలువు మించి
పంచశరశాస్త్రసరసప్రపంచసరణి
నమితరతిసుఖవార్ధి నోలాడి మిగులఁ
దనిసి తనియించె లలితాంగి ధరణివిభుఁడు.

137


మ.

అలవేదండనృపాలుఁ డశ్వగజభూషానేకసద్వస్తువుల్
కొలఁదుల్ మీఱఁగ నిచ్చి పంపఁగ దిశల్ ఘూర్ణిల్లుభేరీరవం
బులతో సేనలు గొల్వఁ దేజ మడరన్ భూమీజను ల్మెచ్చఁగా
జలజాతాక్షుఁ డనంగ రాయ లపు డుత్సాహంబునం గ్రమ్మఱెన్.

138


క.

అరణముగా గజపతివా
రరుదారం గృష్ట కవలియఖిలస్థలముల్
సరసత నొసంగఁ గైకొని
వరజయకీర్తిప్రతాపవైభవ మలరన్.

139


తే.

కల్బరగికోటమీఁద లగ్గలకు నెక్కి
కార్య మొనరించి జయలక్ష్మిఁ గాంచి యచట
నుండి తనరాజ్యమునఁ గల్గునొరపుమీఱు
మంచిదేవస్థలంబు లీక్షించ నెంచి

140

సీ.

శ్రీశైలకాళహస్తిచిదంబరాదిక
          రమణీయశైవస్థలములు జూచి
శ్రీరంగకాంచికాశేషాచలప్రము
          ఖములైనవిష్ణుస్థలములఁ జూచి
అర్ణవఘనతామ్రపర్ణీకవేరసు
          తాముఖ్యపుణ్యతీర్థములు జూచి
చోళకేరళపాండ్యసురుచిరనిజభుజా
          శ్రయదేశజాగ్రహారములు జూచి


తే.

విలసితోత్సవములు చాలవెలయఁ జేసి
విజయపురి గోలకొండవా ర్వెఱగుపడఁగ
విజయనగరంబుఁ జేరె దిగ్విజయలీలఁ
బ్రజలు వర్ణింప శ్రీకృష్ణరాయనృపతి.

141


తే.

బందురకవీంద్రకృతులలోఁ బ్రౌఢిఁ గన్న
మనుచరిత్రాదికృతు లంది మహిమ చెలఁగి
సకలసామ్రాజ్యవైభవసరణి వెలయ
ధరణి యేలుచు నుండె నద్ధరణివిభుఁడు.

142


శా.

నిర్వాణప్రదదివ్యనామబలభిన్నీలోపలశ్యామగం
ధర్వస్తుత్యయశోవిహారజనహృత్తాపార్తిసంహారవాక్
ఛర్వాణీరమణాద్భుతప్రదమహాశౌర్యప్రభావోదయా
యార్వీట్యన్వయచిన్నవేంకటధరాధ్యక్షార్చితాంఘ్రిద్వయా.

143


క.

శరణాగతరక్షణఘన, బిరుదాంకాభక్తిమద్విభీషణకరుణా
భరణాంతఃకరణాతి, స్పురణాసకలదివిజప్రపూజితచరణా.

144


ఉత్సాహము.

తాటకాహరా ప్రసిద్ధతారకాక్షరప్రదా
హాటకాంగదావతంస హారభూషణోజ్జ్వలా

పాటితారివీర నిత్యపావనాకృతీ జగ
న్నాటకక్రియాధురీణ నవ్యసద్గుణోన్నతీ.

145


గద్యము.

ఇది శ్రీమదోరుగంటి కాశీపతి సద్గురురాజయోగీంద్రచరణార
విందసంధానితమనోవిహార నిరంతరానందకరరాజయోగసామ్రాజ్య
లక్ష్మీధురంధర స్వస్వరూపానుభవసంపన్న జ్ఞానప్రసూనాంబికాకాళ
హస్తీశ్వరకటాక్షవీక్షణప్రసాదాసాదితకవితాచమత్కార ధూర్జటి
పౌత్ర కాళయామాత్య లక్ష్మ్యంబికాదత్త పోలనమంత్రి గుర్వ
మాంబికా కుమారధూర్జటి ప్రణీతం బైన కృష్ణరాయవిజయంబునందు
సర్వంబును జతుర్థాశ్వాసము.



కృష్ణరాయవిజయము సంపూర్ణము


  1. రఁగ నీపు