కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/సమస్యలూ, తప్పించుకొనే మార్గాలు

వికీసోర్స్ నుండి

సమస్యలూ, తప్పించుకొనే మార్గాలూ

'నాకు ఎన్నో ముఖ్యమైన సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించాలని నేను ప్రయత్నించినకొద్దీ యింకా క్లిష్టంగా, బాధాకరంగా తయారవుతున్నాయి. ఏం చేయాలో పాలుపోవడంలేదు, ఎటూ తోచకుండా వుంది. వీటికి తోడు నాకు చెవుడు కూడా వుంది. అందుకోసం పరమ వికారమైన యీ యంత్ర మొకటి పెట్టుకుంటున్నాను. నాకు చాలామంది పిల్లలున్నారు. నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. పిల్లల్ని గురించే చాలా దిగులుగా వుంది. నేను పడ్డ బాధలు, కష్టాలు మాత్రం వాళ్ళకి రాకూడదని కోరుకుంటున్నాను'.

మన సమస్యలకి ఒక పరిష్కారం వెతికి పట్టుకోపోలని ఎంత ఆత్రపడుతుంటాం! పరిష్కారం వెతికే ఆ తొందరలో అసలు సమస్యని గురించి సరిగ్గా విచారించలేము. సమస్యని మౌనంగా పరిశీలించడానికి అది అడ్డు తగులుతుంది. అసలు ప్రధానమైన విషయం సమస్య తప్ప పరిష్కారం కాదు. గట్టిగా చూస్తే పరిష్కారాన్ని కని పెట్టవచ్చు. అయితే సమస్య మాత్రం అట్లాగే కొనసాగుతుంది. ఎందుకంటే సమస్యకి పరిష్కారానికి ఏ సంబంధమూ లేదు. మనం వెతుకుతున్నది సమస్యనుంచి పారిపోయే మార్గం కోసం, పరిష్కారం అనేది వట్టి పైపై చికిత్స. దీనివల్ల సమస్యను అవగాహన చేసుకోవడం జరగదు. అన్ని సమస్యలకు మూలస్థానం ఒక్కటే. ఆ మూలస్థానాన్నీ అర్థంచేసుకోకుండా సమస్యల్ని పరిష్కరిద్దామని చూడటం వల్ల గందరగోళమూ, బాధా ఎక్కువవుతాయి. అసలు మొదట సమస్యని అవగాహన చేసుకోవాలనే వుద్దేశ్యం మనకి నిజంగా వుందా లేదా, అసలు యీ సమస్యలేవీ లేకుండా వుండాలనే ఆవశ్యకతను గ్రహించామా అనే సంగతి స్పష్టంచేసుకోవాలి. అప్పుడే సమస్యలను తయారు చేస్తున్న కర్తని సమీపించగలుగుతాము. సమస్యల నుంచి విముక్తి లేకుండా ప్రశాంతి లేదు. సంతోషంగా వుండాలంటే ప్రశాంతి అవసరం. అయితే అదే గమ్యం అని కాదు. పిల్లగాలులు వీచడం ఆగిపోయినప్పుడు నీటిమడుగు నిశ్చలంగా వున్నట్లు, సమస్యలు సమాప్తం అయినప్పుడు మనసు కూడా నిశ్చలమవుతుంది. అయితే మనసుని నిశ్చలంగా చేసివేయడం సాధ్యంకాదు. అట్లా చేస్తే అది మృతప్రాయమే, మురిగిపోయిన నీటిగుంట అవుతుంది. ఇది కనుక స్పష్టమవుతే, సమస్యలని తయారుచేసే కర్తని పరిశీలించవచ్చు. ఈ పరిశీలన మౌనంగా జరగాలి. బాధా సౌఖ్యాలని దృష్టిలో పెట్టుకొని ముందుగానే నిర్ణయించుకున్న ఒక పధకం ప్రకారంగా జరగకూడదు. 'అసాధ్యమైన విషయాలను గురించి మీరు చెప్తున్నారు! మన చదువులే మన మనసులకి విచక్షణ చేయడం, పోల్చిచూడటం, తప్పొప్పులు నిర్ణయించడం, ఎంచుకోవడం నేర్పి అందులో శిక్షణ యిస్తాయి. పరిశీలించినదానిని ఖండించకుండానో, సమర్థించకుండానో ఉండటం చాలా కష్టం. ఇటువంటి నిబద్దీకరణం నుంచి విముక్తి చెంది, మౌనంగా పరిశీలన చేయడం ఎట్లా?'

మౌనంగా పరిశీలించడం, నిర్లిప్తమైన ఎరుక వుండటం అవగాహనకు చాలా ఆవశ్యకం అని మీరు గ్రహించినప్పుడు, మీ గ్రహింపు అనే సత్యమే వెనకాలవున్న నేపధ్యమంతటి నుండి మిమ్మల్ని విడుదల చేస్తుంది. నిర్లిప్తంగా వుంటూనే, అప్రమత్తమైన ఎరుకను కూడా కలిగి వుండాలనే తక్షణావశ్యకతను మీరు గ్రహించనప్పుడు మాత్రమే 'ఎట్లా' అనే ప్రశ్నా, మన పూర్వ నేపధ్యాన్ని అంతరింపచేసుకొనే సాధనం కోసం అన్వేషణా బయల్దేరుతాయి. విడుదల కలిగించేది సత్యమే తప్ప సాధనం కానీ, పద్ధతి కానీ కాదు. మౌనపరిశీలన వల్ల మాత్రమే అవగాహన కలుగుతుందనే సత్యాన్ని మనం గ్రహించాలి. అప్పుడే యీ ఖండించడాలు, సమర్థించడాలు తొలగిపోతాయి. ఒక అపొయాన్ని చూసినప్పుడు దానినుంచి దూరంగా ఎట్లా పోవాలి అని ప్రశ్నిస్తూ మీరు కూర్చోరు. నిర్లిప్తమైన ఎరుకతో వుండవలసిన అవసరాన్ని మీరు చూడటంలేదు కాబట్టే 'ఎట్లా' అని అడుగుతున్నారు. అది చాలా అవసరం అనేది మీరు ఎందుకు గ్రహించడం లేదు?

'గ్రహించాలనే వుంది కాని యింతకు ముందు నేను యీ రకంగా ఆలోచించ లేదు. సమస్యలు నన్ను చిత్రవధ చేస్తున్నాయి కాబట్టి వాటిని వదుల్చుకోవాలని అనుకుంటున్నాను; అది మాత్రమే నేను గట్టిగా చెప్పగలను. అందరిలాగే నేను సంతోషంగా వుండాలని అనుకుంటున్నాను'.

నిర్దిష్టమైన ఎరుక అత్యావశ్యకం అన్న సంగతి గ్రహించడం మనకి యిష్టం వుండదు. ఇది మనకు తెలిసి జరగవచ్చు, తెలియకుండానూ జరగచ్చు. ఎందుకంటే సమస్యలను నిజంగా వదుల్చు కోవాలని మనకి వుండదు. సమస్యలు లేకపోతే మనం ఏమైపోతాం? అది ఎంత బాధాకరమైనదైనా సరే, మనకి తెలిసినదానిని పట్టుకొని వేలాడటమే నయం అనుకుంటాం. ఎందుకంటే ఎక్కడికి చేరవేస్తుందో తెలియని దానీ వెంటపడి అన్వేషించడంలో యింతకన్నా ప్రమాదం వున్నదని అనుకుంటాం. కాబట్టి సమస్యలు కనీసం మనకి బాగా అలవాటయిపోయాయి. అయితే, ఆ సమస్యలని సృష్టించిన కర్తని వెతికి పట్టుకోవాలనే ఆలోచన, చివరకు మనల్ని ఎక్కడకు చేరుస్తుందో తెలియక పోవడం వల్ల మనలో భయాన్ని, స్తబ్ధతనూ కలిగిస్తుంది. సమస్యలని గురించిన చింత లేకపోతే మనసు అయోమయంలో పడుతుంది. సమస్యలే మనసుకి ఆహారం, అవి ప్రపంచ సమస్యలవచ్చు, వంటింటివీ అవచ్చు; రాజకీయపువి, వ్యక్తిగతమైనవి, మత పరమైనవి, సైద్ధాంతిక సంబంధమైనవి ఏవయినా అవచ్చు. కాబట్టి సమస్యలు మనల్ని అల్పంగా, సంకుచితంగా తయారు చేస్తాయి. ప్రపంచ సమస్యలతో సతమతమవుతున్న మనసు ఎంత అల్పమైనదో ఆధ్యాత్మిక వున్నతి కోసం పాటుపడుతున్న మనసు కూడా అంతే అల్పమైనది. సమస్యలు మనసుని భయం అనే భారంతో నింపుతాయి. ఎందుకంటే సమస్యలు స్వీయాన్ని, 'నా'ని, 'నాది'ని యింకా బలంగా తయారవడానికి సహాయం చేస్తాయి. సమస్యలు లేనప్పుడు, విజయసాధనలూ, ఓటములూ లేనప్పుడు స్వీయం అంటే 'నేను' వుండదు.

'కానీ, స్వీయం అనేది లేకుండా ఎవరయినా జీవించగలరా? అన్ని చర్యలకూ అదే కదా మూలస్థానం?'

కోరికకు పర్యవసానంగా గానీ, స్మృతికి, భయానికి, సుఖానికి, బాధకి పర్యవసానంగా గాని చర్యలు జరుగుతున్నప్పుడు, ఆ చర్యలు తప్పకుండా సంఘర్షణను, గందరగోళాన్నీ, విరోధాన్ని పెంచి పోషిస్తాయి. అవి ఏ స్థాయిలో జరిగిన సరే, మన చర్యలన్నీ మన నిబద్దీకరణం ఫలితంగానే జరుగుతుంటాయి. ఒక స్పందన మన ప్రతిస్పందన అసంపూర్ణంగా వుండి, తగినంతగా లేకపోవడం సంఘర్షణను తప్పక కలిగించి తీరుతుంది. సమస్య అంటే అదే. అసలు సంఘర్షణే 'నేను' కు ఆకార స్వరూపాలనిస్తుంది. సంఘర్షణ అనేదే లేకుండా, అత్యాశ అనే సంఘర్షణో, భయం అనే సంఘర్షణో, గెలుపు కోసం సంఘర్షణో, అవి ఏవీ లేకుండా జీవించడం అసంభవమేమీ కాదు. అయితే యీ సంభావనీయతను ప్రత్యక్ష అనుభవం ద్వారా కనిపెట్టనంత వరకు అది అసలైన యదార్థం అవదు. కేవలం సైద్ధాంతిక రూపంలోనే వుంటుంది. 'నేను' యొక్క తీరుతెన్నులన్నీ అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే అత్యాశ అనేదే లేకుండా జీవించడం సాధ్యమవుతుంది.

'నాలోపల భయాలు వుండి, పోటీనీ అణచుకోవడం వలన నాకు చెవుడు వచ్చిందంటారా? చెవి భౌతిక స్వరూపంలో ఏ లోపమూ లేదని వైద్యులు గట్టిగా చెప్పారు. నా చెవులకు మళ్ళీ వినబడే శక్తి రావడానికి అవకాశం వున్నదా? నా జీవితకాలమంతా ఏదో ఒక రకంగా నేను అణచి తొక్కివేయబడుతూనే వున్నాను. నేను నిజంగా చేయాలని యిష్టపడినవి ఎన్నడూ చేయలేక పోయాను'.

అంతర్గతంగాను, బాహ్యంగాను కూడా అవగాహన చేసుకోవడం కంటే అణచివేయడమే సులభం, అవగాహన చేసుకోవడం చాలా కఠినమైన పని, ముఖ్యంగా చిన్నప్పటి నుండీ బాగా బలంగా నిబద్దీకరణం చెందినవారికి. చాలా శ్రమతో కూడుకున్నదయినా అణచివేసుకోవడం ఒక అలవాటుగా తయారవుతుంది. అవగాహన చేసుకోవడం ఒక అలవాటుగా, ఒక నిత్యకృత్యంగా ఎన్నటికీ అవలేదు. దానికి నిరంతరమైన జాగరూకత, అప్రమత్తత వుండితీరాలి. అవగాహన చేసుకోవడానికి మెత్తని గుణమూ, సున్నితత్వమూ, భావోద్రేక పూరితం కానటువంటి ఆర్ధ్రతా కావాలి. అణచివేత ఏ రకంగా చేసుకున్నా దానికి ఎరుకను పదును పెట్టవలసిన పని వుండదు. ప్రేరణలకు యీ విధంగా ప్రతిస్పందించడం అతి సులువైన, అతి బుద్ధిహీనమైన పద్ధతి. అణచివేసుకోవడం అంటే ఏదో ఒక భావనకో, ఒక పద్ధతికో లొంగిపోయి వుండటం. దీనివల్ల ఒక కృత్రిమమైన భద్రత, మర్యాద లభిస్తాయి. అవగాహన వల్ల విడుదల కలుగుతుంది. అణచుకోవడం సంకుచితంగాను, స్వార్థపూరితంగాను తయారుచేస్తుంది. ఆధిపత్యం అన్నా, భద్రతా లేమి అన్నా, యితరుల అభిప్రాయం అన్నా వుండే భయం సైద్ధాంతిక రూపంలో ఒక ఆశ్రయాన్నీ, భౌతికరూపంలో దాని జంటతో పాటుగా నిర్మిస్తుంది. మనసు అందులో పడిపోతుంది. ఈ ఆశ్రయం ఏ స్థాయిలో నిర్మించుకున్నా సరే, భయాన్ని ఎప్పటికీ వుండేలా పోషిస్తూ వుంటుంది. ఈ భయంవల్ల, ఏదో ఒకదానితో భర్తీ చేసుకోవడం, పవిత్రతను ఆపాదించుకోవడం, క్రమ శిక్షణా బయలుదేరుతాయి. ఇవన్నీ అణచివేతకు రకరకాల మారురూపాలు. ఆణచుకున్నది బయట పడటానికి ఏదో ఒక మార్గం కావాలి. అది శరీర సంబంధమైన రుగ్మత కావచ్చు, సైద్ధాంతిక పరమైన భ్రాంతి కావచ్చు, ఒక్కొక్కరి స్వభావగుణాన్ని బట్టి, వారి వారి వింత విచిత్ర ప్రకృతులను అనుసరించి మూల్యం చెల్లించవలసి వస్తుంది.

'నాకు రుచించనివి వినవలసివచ్చినప్పుడల్లా యీ శ్రవణ యంత్రాన్ని ఆశ్రయిస్తున్నానని నేనే గమనించాను. ఆ విధంగా నా స్వంతదైన మరో లోకంలోకి నేను పారిపోవడానికి అది సహాయపడుతున్నది. అయితే ఏళ్ళ తరబడి జరిగిన అణచివేత నుంచి విముక్తిచెందడం ఎట్లా? దానికి చాలా సమయం పట్టదూ?'

ఆది సమయానికి సంబంధించిన సమస్య కాదు; గతాన్ని తవ్వితోడటమూ కాదు, జాగ్రత్తగా విశ్లేషించడమూ కాదు. అణచుకోవడం అనే సత్యాన్ని గ్రహించడానికి సంబంధించిన సంగతి. అణచుకోవడం అనే ప్రక్రియ ఎడల ఏ విధమైన ఎన్నిక చేసుకోవడమూ లేని నిర్లిప్తమైన ఎరుక కలిగివుంటే, అందులోని సత్యాన్ని వెంటనే గ్రహిస్తాము. నిన్న, రేపు అనే దృష్టితో ఆలోచించడం ద్వారా అణచివేయడం అనే సత్యాన్ని కనిపెట్టలేము. సత్యం కాలగమనంలో ఆకళింపు చేసుకునేది కాదు. సత్యం సాధించి అందుకునేది కాదు. దానిని చూస్తారు లేదా చూడరు. అంతే తప్ప క్రమ క్రమేణా దానిని చూసి గ్రహించడం అనేది లేదు. అణచి వేసుకోవడం నుండి విముక్తి పొందాలనే సంకల్పం అందులోని సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఆటంకమవు తుంది. ఎందుకంటే సంకల్పం అంటే కోరిక; అది అనుకూల సంకల్పమైనా సరే, ప్రతికూలమైనదైనా సరే. కోరిక వున్నప్పుడు నిర్లిప్తమైన ఎరుక వుండటం కుదరదు. అసలు యీ అణచుకోవడాన్ని తయారుచేసినదే కోరిక లేక కాంక్ష. ఈ కోరిక, దీనినే యిక్కడ సంకల్పం అని అంటున్నా కూడా, తానే సృష్టించినదాని నుంచి మళ్ళీ తనని ఏనాటికీ విముక్తం చేసుకోలేదు. అందుకే నిర్లిప్తమైన, అప్రమత్తమైన ఎరుక ద్వారా సంకల్పంలోని సత్యాన్ని పరికించి చూడాలి. విశ్లేషకుడు తనని తాను దీనినుంచి వేరుగా వుంచుకున్నప్పటికీ, అతడు ఆ విశ్లేషించుతున్న విషయంలోని ఒక భాగమే. అతడు విశ్లేషిస్తున్న విషయమే అతడిని నిబద్ధీకరించింది కాబట్టి, దానినుండి తనని తానే విముక్తం చేసుకోలేడు. అందుకే, యిందులోని సత్యాన్ని కూడా గ్రహించుకోవాలి. సత్యం వల్లనే విడుదల కలుగుతుంది తప్ప సంకల్పం వల్ల, ప్రయత్నం వల్ల కాదు.

(కమెంటరీస్ ఆన్ లివింగ్)