Jump to content

కూసుమంచి గణపేశ్వరాలయం/కూసుమంచి ఆలయ శిల్పాలూ, శిల్పరీతి

వికీసోర్స్ నుండి

కూసుమంచి ఆలయ శిల్పాలూ, శిల్పరీతి

శిల్పకళను ఆంగ్లంలో స్కల్ప్చర్ అంటారు. లాటిన్ పదం స్కల్పెరీ అంటే కోయు అనే అర్ధం. ప్రకృతిలో కనిపించే విషయాలనే కాదు, మానవుని హృదయంలో పుట్టే భావాలకూ రూపకల్పనం చేయటం ఈ కళలోని ప్రత్యేకత. ఒక జాతి సంస్కృతి, నాగరికత, కళా వైభవాలను వెల్లడి చేసే శక్తిదీనికుంది. అందుకే తరాల వెనకటి వారి ఆలోచనలకు ప్రత్యక్షసాక్షాలుగా నిలచిన ఈ స్వల్పఆధారాలను అమూల్యమైనవిగా భావించాలి. వీటిద్వారా వాళ్ళని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయకపోతే కోసప్రాణాలతో మిగిలిన అవకాశాన్ని పూర్గిగా పోగొట్టుకున్నట్లే అవుతుంది.

కాకతీయులు వాస్తుపద్దతులను సాంప్రదాయక పద్ధతులను అనుసరిస్తూనే స్థానిక సాంప్రదాయ శైలిని తమ అభిరుచులను జోడించారు. అలంకరణలలో కాకతీయ సంస్కృతినీ, పద్ధతులను తెలిపే శిల్పాలను చేర్చటంలో ప్రత్యేకత చూపారు.

దేవాలయం కాకతీయుల కాలానిదే అని నిర్ధారించుకునేందుకు మనకి పటిష్టంగా కనిపించే ఆధారం దేవాలయ నిర్మాణ రీతి. దీనిని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఈ విషయాన్ని అర్ధంచేసుకోవచ్చు. ఈ ఆలయం రామప్పఆలయ నిర్మాణాన్ని చాలా వరకూ పోలి వున్నప్పటికీ ఆలయంలో రాళ్ళను అమర్చిన విధానం రామప్పకంటే భిన్నంగా వుంటుంది. పాలంపేటలో ఆలయంకోసం శిల్పులను ఎంచుకునేందుకు గణపతిదేవుని గురుతుల్యుడు విశ్వేశ్వరశర్మ ఒక పరీక్ష పెట్టారట. ఆ పరీక్షలో కూసపు కొలత, రంధ్రపు కొలతలను ముందుగా తీసుకుని. వాటిని వేర్వేరుగా తయారుచేయాలి. తొలిప్రయత్నంలోనే అవి కొంచెం వదులు కానీ, బిగుతుగానీ కాకుండా ఖచ్చితంగా బిగించగలగాలి. దీనిలో

దీనిలో బాగా సరిపోయేలా తయారుచేసిన యువకుడైన రామప్ప ఎంపికయ్యాడనేది ఒక కథనం. దీనిఆధారంగా గమనిస్తే గణపేశ్వరాలయ ప్రౌఢనిర్మాణ శైలికి విశ్వేశ్వరశర్మవంటి వారే కారణమయివుండొచ్చు అనిపిస్తుంది. రామప్పలోని సుందరమైన శిల్పాల నిర్మాణంలోనూ, నందివిగ్రహాన్నిజీవకళ ఉట్టిపడేలా మలచడంలోనూ రామప్ప ప్రజ్ఞాపాటవాలు, నైపుణ్యచతురత కన్పిస్తాయి. సాలభంజికల సౌందర్యారాధనలో అతని యవ్వన ప్రభావం కనిపిస్తుంది. కానీ కూసుమంచి గణపేశ్వరాలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే రాతిపై రాతిని ఖచ్చితంగా పేర్చుకుంటూ రావడంలో అత్యంత నిరాడంబరమైన గాంభీర్యత కన్పిస్తుంది. ఒక ప్రౌఢత్వం ప్రస్పుటమవుతుంటుంది. అందుకే ఈ ఆలయం గణపతిదేవుని కాలంలో శిల్పి రామప్పకంటే పెద్దవాడయిన విశ్వేశ్వరాచార్యుని పర్యవేక్షణలో నిర్మించబడింది అంటే నిజమేనేమో అనిపిస్తుంది. సాలభంజికలు, మదనికలు వంటి అలంకారశిల్పాలు మాత్రం ఈ ఆలయంలో లేవు. మూలవిరాట్టుగా ప్రతిష్టించిన శివలింగం మాత్రం చాలా ప్రత్యేకమైనది, బృహత్తరమైనది. ఓరుగల్లు,రామప్పలలోని మూలవిరాట్టుగా వున్న శివలింగాల పరిమాణాలకంటే ఇది మరింత పెద్దదిగా వుంది. లోపటి శివలింగము, దానికంటే ఇక్కడే స్థూలంగా కనిపించే మరో మహాలింగం గురించి తర్వాతి వివరణల్లో తెలియజేసాను.

స్థూలంగా ఆలయనిర్మాణాన్ని గమనిస్తే కాకతీయులు భారతీయ శిల్పసంప్రదాయంలో విశిష్టమైన ‘వేసర శిల్పరీతి’ ని అనుసరించారు. ధక్షిణ భారతదేశంలో ద్రవిడ సంప్రదాయం, తూర్పు ఉత్తర భారతదేశాలలో నాగర సంప్రదాయం ప్రచారంలో వున్నప్పటికీ కాకతీయులు తమదైన ప్రత్యేకతను నిలుపుకునేందుకు వారి శిల్పరీతిలో విశిష్టతను ప్రదర్శించుకునేందుకు ఈ సంప్రదాయాన్ని అనుసరించి వుంటారు. దేవాలయం పునాదుల నిర్మాణం నుంచి శిఖరం వరకూ గల కొలతలు, గర్భాలయపు రూపురేఖల నుండి స్తంభాల విన్యాసం, రంగమండపము, ఉపరంగమండపము నిర్మాణము అన్నీ ఒకే పద్దతిలో కనిపిస్తాయి. ఇలా ఒకే పద్దతిని వారి పరిపాలనాకాలంలో నిర్మింపబడిన ఏ ఆలయానికైనా వర్తింపజేయటంతో అది కాకతీయ శిల్పమే అని కనుగొనేందుకు వీలుగావుంది. అలాగే కాకతీయ శిల్పులు ఆలయాల అంతర్భాగంలో చూపిన సున్నితమైన పనితనం బయటి భాగంలో చాలా చోట్ల చూపలేదు. అదే హోయసలులు ఆలయాల బయటివైపున పాదపీఠికనుంచి శిఖరం వరకూ ఏమాత్రం విరామం లేకుండా వారి ప్రతిభనూ, నైపుణ్యాలనూ శిల్పాలలో చూపారు. కూసుమంచి గణపేశ్వరాలయంలో లోపటి విగ్రహంలో కానీ అంతరాలయ శిల్పాలలో కానీ అత్యద్బుతమైన పనితనం కనిపిస్తుంది. కానీ బయట పెద్దగా అలంకరణలు లేవు.