కాశీమజిలీకథలు/పదవ భాగము/348-349 పుటలు
వ్యాఘ్ర - ఛీ! రండా! నోరుమూయి. ఇంతయాస్తి న్యాయవర్తనమున సంపాదింపఁగలమా. ఇప్పుడు వచ్చినపురుషునిమేనఁ గోటివెలగల రవ్వలవస్తువు లున్నవి. వాఁడు దీనితోఁ గలిసినఁ బదులిచ్చును. వెలిచ్చును. ఇప్పుడో అంతయాస్తియు సులభముగా దక్కినది. దేహము చెడలేదు.
దాది - అమ్మా! ఎంతకాల మిట్లు విటపురుషులం జంపుదువు? ఇక నిట్టిపని జేసినఁ దానెం దేవిఁ బోయెదనని అమ్మాయిగారు మీతో జెప్పుచున్నది తెలిసినదియా!
వ్యాఘ్ర - నీవు నదియుంగూడఁ బొండు. మఱియొకకన్యం దెచ్చి పెంచెద. నీబోధయంతయు నీవే చేయుచున్నావు. అ దేమియు నెఱుంగదు. సరేకాని రేపు పెందలకడ రమ్ము. నూతిలో విటశరీరముపైఁగల వస్తువులు తీయవలసియున్నది. రహస్యముగా శవవాహకులతోఁ గూడఁ జెప్పుము.
అని పలుకునప్పటికి నాకుఁ గోప మాగినదికాదు. హిరణ్యకశిపునిపై నుఱుక నరసింహమూర్తియుంబోలె నాభీలరౌద్రావేశముతోఁ బోయిఁ దానిపయింబడి యెడమచేతితోఁ గొప్పు పట్టుకొని లాగుచు --
శా. రండా! నీతనువెల్ల ముక్కలుగ ఘోరప్రక్రియం గోసి యా
కండల్ గుక్కలు గాకగృధ్రములు మెక్కంజేయుదున్ జంకులే
కుండం జంపితి వెందఱెందఱినొ మాయోపాయపాండిత్య ము
ద్దండంబై తగనిండె నీదు దురతౌద్దత్యం బహా నేఁటికిన్.
అని పలుకుచు నొఱనుండి కటారిం బెఱికి శిరంబు నఱకనుంకించుటయు నది మొఱ్ఱోయని యరచుచు నిట్టట్టు కొట్టుకొనుచుండ సందిటంబట్టి యెత్తి గుభాలున నాపాడునూతిలోఁ బారవైచితిని. అందున్నపురుషులు గొంద రడ్డము వచ్చినవారినెల్ల గత్తితోఁ నఱకి యాకూపంబుననే పడవిడిచితిని.
అందున్న దాదులు వెఱచి నలుమూలలకుం బరువులిడుచు కుందమాలం గౌఁగిలించుకొని యాక్రందనము సేయఁ దొడంగిరి. అప్పు డావేశ్యకన్య యాయుపద్రవము విని యడలుచు మేడ దిగి నాకడకు వచ్చి నమస్కరించి నాకత్తికి మెడ యొగ్గి యిట్లనియె.
మహాత్మా! నిరపరాధులగు నీపరిజనుల నేమిటికిఁ బరిమార్చెదరు?నాశిరంబు నఱకుఁడు. నాకతంబుననే యాఘోరకృత్యము జరుగుచున్నది. నన్నుఁ జంపిన మీ కేదోసము రాదు. చంపుఁడని పలికిన విని నేను గటారి నేలం బారవైచి కుందమాలా! నీడెందము చందము నే వినియుంటి. నీవు ఉత్తమురాలవు. నీతల్లి మహాపాపాత్మురాలు. అనేకహత్యలు గావించినది. నీ వట్టిపాపకృత్యము లెఱింగియు నుపేక్షించితి వది కొంతతప్పే. కాని నీమందలింపులు విననిచో నీ వేమి చేసెదవు? తల్లికై నీవు విచారింపవలసినపని లేదు. నిన్ను రక్షించితి వెఱవకుమని యభయహస్త మిచ్చితిని.
ఆలలనారత్నము మదీయలాలములవలనఁ దేరి నాయడుగులం బడి మహాపురుషా! మీ రెవ్వరో నే నెఱుంగ. మిమ్ముఁ జూచినతోడనే నాడెందము మీయందుఁ దగులుకొన్నది. ఆమాట నాదాదితోఁ జెప్పితిని. అడిగిచూడుఁడు నాజీవితముతో ధనకనకవస్తువాహనాదులతో మీయాధీన నైతిని. న న్నేలికొనుఁ డింతకుము న్నెవ్వరిం గన్నెత్తిచూచియుండలేదు. మీరే నాభర్తలు అని పలుకుచు వేఁడికొన్నది. నాకు దానిమాటలచే జాలి వొడమినది. తత్సౌందర్యాతిశయము హృదయమును లాగినది. అంగీకరించి యందే వసించి మరునాఁడుదయంబున నూఁతినుండి దానితల్లిని మఱికొందరిని దీయించి దహింపఁజేసితిని.
దానియన్న నాచేత దెబ్బలు తిని పాఱిపోయి మీయొద్ద నభియోగము దెచ్చెను. తరువాయికథ మీరు వినినదియేకదా. తత్క్రీ