కురాన్ భావామృతం/అష్-షుఅరా

వికీసోర్స్ నుండి
(కవులు (అష్-షుఅరా ) నుండి మళ్ళించబడింది)
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

26. షుఅరా (కవులు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 227)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
తా-సీన్‌-మీమ్‌. ఇవి విషయస్పష్టత గల గ్రంథానికి చెందిన సూక్తులు. (1-2)
ముహమ్మద్‌ (స)! (నీ పరిస్థితి చూస్తుంటే) వారు (సత్యాన్ని) విశ్వసించడం లేదన్న దిగులుతో నీవు కృశించి ప్రాణాలు పోగొట్టుకునేలా ఉన్నావు. మేము తలచుకుంటే ఆకాశం నుండి అద్భుతమైన నిదర్శనం పంపి దాని ముందు వారి మెడలు వంచ గలము. వారు తమ దగ్గరికి కరుణామయుని నుండి కొత్తగా ఎలాంటి ఉపదేశం వచ్చినా దానికి విముఖులవుతారు. వారు సత్యాన్ని నిరాకరించారు. (ఇక దారికి రారు.) వారీనాడు ఏ విషయాన్ని గురించి హేళనచేస్తున్నారో దాని వాస్తవికత ఏమిటో త్వరలోనే వారికి తెలిసిపోతుంది. (3-6)
వారెప్పుడూ భూమిని పరికించి చూడలేదా? మేమందులో రకరకాలతో కూడిన ఎంతో మంచి వృక్షజాతులు పుట్టించాం. నిస్సందేహంగా ఇందులో గొప్ప సూచన ఉంది. కాని వారిలో అనేకమంది సత్యాన్ని విశ్వసించనివారే ఉన్నారు. నీ ప్రభువు సర్వశక్తి మంతుడు, అపార దయామయుడు. (7-9)
నీ ప్రభువు మూసాను పిలిచినప్పటి గాధ విన్పించు. అప్పుడు మూసాతో నీప్రభువు “దుర్మార్గులైన ఫిరౌన్‌జాతి ప్రజల దగ్గరకు వెళ్ళు. వారు భయపడరా?” అన్నాడు. (10-11)
దానికి మూసా “ప్రభూ! వారు నన్ను తిరస్కరిస్తారేమోనని భయంగా ఉంది. నా గుండె అదిరిపోతున్నది. నాకు సరిగ్గా మాట్లాడటం రాదు. నీవు హారూన్‌ని ప్రవక్తగా నియమించు. అదీగాక వారి దగ్గర నామీద ఒక నేరారోపణ కూడా ఉంది. అందువల్ల వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను” అని అన్నాడు. (12-14)
“ఏమీకాదు. మీరిద్దరు మా సూచనలు తీసుకొని వెళ్ళండి. మేము మీతోపాటే ఉండి విషయాలన్నీ వింటాం. మీరు ఫిరౌన్‌ దగ్గరకెళ్ళి ‘మమ్మల్ని సర్వలోక ప్రభువు పంపాడు; కనుక నీవు ఇస్రాయీల్‌ సంతతిని మావెంట పంపించు’ అని చెప్పండతనికి.”
(మూసా, హారూన్‌ ప్రవక్తలు ఫిరౌన్‌ చక్రవర్తి దగ్గరికెళ్ళి ఈమాట అన్నప్పుడు)...
ఫిరౌన్‌ (ఎత్తిపొడుస్తూ) “మేము నిన్ను పసితనంలో పెంచలేదా? నీవు నీ జీవితాన్ని అనేక సంవత్సరాలు మా దగ్గర గడిపావు. తర్వాత ఏదో చేసి వెళ్ళిపోయావు. (మేము చేసిన మేళ్ళన్నీ మరచి చివరికి మాకే ఎసరు పెట్టడానికి వచ్చావన్నమాట!) నిజంగా నీవు చాలా కృతఘ్నుడివి” అని అన్నాడు. (15-19)
“ఆనాడు నేనా పని అజ్ఞానాంధకారంలో ఉండి తెలియక చేశాను. తరువాత మీకు భయపడి పారిపోయాను. ఆ తరువాత నా ప్రభువు నాకు జ్ఞానకాంతి ప్రసాదించి నన్ను ప్రవక్తల జాబితాలో చేర్చాడు. ఇక నీవు నన్ను ఎత్తిపొడుస్తున్న మేలు సంగతికొస్తే, (అందులో విశేషం ఏమీ లేదు.) నీవు (నా జాతికి చెందిన) ఇస్రాయీల్‌ సంతతిని కట్టు బానిసలుగా చేసుకున్నావు” అని సమాధానమిచ్చాడు మూసా. (20-22)
“సరే, నువ్వేదో సర్వలోక ప్రభువంటున్నావు, ఎవరా సర్వలోక ప్రభువు? ఏమిటా కథ?” అడిగాడు ఫిరౌన్‌. (23)
“నీవు విశ్వసించే వాడివయితే విను. ఆయన భూమ్యాకాశాలకు, వాటిమధ్య ఉన్న సమస్త సృష్టిరాసులకు ప్రభువు” అన్నాడు మూసా. (24)
“వింటున్నారా (ఈయనగారి వింతమాటలు)?” అన్నాడు ఫిరౌన్‌ తన చుట్టూ ఉన్న మందీ మార్బలంతో. (25)
“ఆయన మీకూ ప్రభువే, మీకు పూర్వం గతించిన మీ తాతముత్తాతలకూ ప్రభువే” అన్నాడు మూసా (26)
“(చూశారా!) మీ వద్దకు పంపబడిన ఈ ప్రవక్తమహాశయులు గారిని, చూస్తే మహా తలతిక్క మనిషిలా కన్పిస్తున్నాడు” అన్నాడు ఫిరౌన్‌ (సభాసదుల్ని ఉద్దేశించి). (27)
“మీరు విజ్ఞతా వివేచనలు కలవారయితే (వినండి), ఆయన ప్రాక్పశ్చిమాలకు, వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువే” అన్నాడు మూసా. (28)
“(మూసా! ఇక చాలించు.) నీవు నన్ను తప్ప మరొకడ్ని దైవంగా అంగీకరించా వంటే (జాగ్రత్త!) నిన్నుకూడా జైళ్ళలో పడి మగ్గుతున్నవారి దగ్గరకు చేరుస్తా (తెలుసా?)” అన్నాడు ఫిరౌన్‌ (ఆగ్రహంతో బెదిరిస్తూ). (29)
“ఒకవేళ నేను నీముందు (నా దౌత్యానికి నిదర్శనంగా) ఒక స్పష్టమైన వస్తువుని ప్రదర్శిస్తే (నమ్ముతావా)?” అడిగాడు మూసా. (30)
“(ముందు) అదేమిటో చూపు నీవు సత్యవంతుడవైతే” అన్నాడు ఫిరౌన్‌. (31)
(అప్పుడు)మూసా తన చేతికర్ర క్రింద పడవేశాడు. అది ఒక్కసారిగా నిజమైన సర్పంగా మారిపోయింది. ఆ తర్వాత అతను తన చేతిని చంకలోపెట్టి అదిమి బయటికి తీశాడు. అది ప్రేక్షకుల ముందు దేదీప్యమానంగా వెలిగిపోసాగింది. (32-33)
ఫిరౌన్‌ తన చుట్టూ ఉన్న ఉన్నతాధికారుల్ని ఉద్దేశించి “ఇతను నిజంగా ఆరితేరిన గొప్ప మాంత్రికుడు. తన మంత్రబలంతో మిమ్మల్ని మీరాజ్యం నుండి వెళ్ళగొట్టాలని భావిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో మీరే చెప్పండి” అన్నాడు. (34-35)
“అతడ్ని, అతని సోదరుడ్ని ఆపి, వివిధ పట్టణాలకు రాజభటుల్ని పంపండి. వారు కాకలుతీరిన మాంత్రికుల్ని మీదగ్గరకు పిలుచుకొస్తారు” అన్నారు వారు. (36-37)
దాని ప్రకారం ఒక రోజు నిర్ణీత సమయాన ప్రముఖ మాంత్రికుల్ని పిలిపించడం జరిగింది. ఆ సందర్భంగా “మీరు సభాస్థలికి వస్తున్నారా? అయితే మాంత్రికులు గెలిస్తే మనం (మన) మాంత్రికుల మతంలోనే ఉండిపోవచ్చు. (లేకుంటే మనకిక్కడ పుట్టగతు లుండవు)” అని జనంలో విస్తృతప్రచారం జరిగింది. (38-40)
మాంత్రికులు రంగంలోకి దిగి, “మేము గెలిస్తే మాకేమైనా బహుమానం దొరుకు తుందా?” అని అడిగారు ఫిరౌన్‌ని. (41)
“తప్పకుండా, అప్పుడు మీరు మా సన్నిహితుల్లో చేరిపోతారు” అన్నాడు ఫిరౌన్‌#
“మీరు పడవేయ దలచుకున్నదేమిటో పడవేయండి” అన్నాడు మూసా. (42-43)
వెంటనే వారు తమ దగ్గరున్న త్రాళ్ళను, కర్రలను నేలమీద పడవేస్తూ “ఫిరౌన్‌ (దివ్య) శక్తితో మేమే విజయం సాధిస్తాం” అన్నారు. (44)
(వారి త్రాళ్ళు, కర్రలు పాములుగా మారి భీతావహం సృష్టించాయి. అప్పుడు) మూసా తన చేతికర్ర క్రింద పడవేశాడు. అది ఒక్కసారిగా (భయంకర సర్పంగా మారి) వారి అభూతకల్పనలను చకచకా మింగివేస్తూపోయింది. ఈ అసాధారణ మహిమ చూసి మాంత్రికులంతా అప్రయత్నంగా సాష్టాంగపడ్డారు. తర్వాత “మేము సర్వలోక ప్రభువుని విశ్వసించాం...మూసా, హారూన్‌ల ప్రభువుని విశ్వసించాం” అన్నారు. (45-48)
ఫిరౌన్‌ (ఆగ్రహోదగ్రుడయి) “ఏమిటి, నేను అనుమతించక ముందే మీరు మూసా మాట ఒప్పుకున్నారా? అయితే ఇతను తప్పకుండా మీకు మంత్రవిద్య నేర్పిన గురువై ఉంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. సరే కానివ్వండి, (నా తడాఖా ఏమిటో) ఇప్పుడే మీకు తెలిసిపోతుంది. నేను పరస్పర వ్యతిరేక దిశల్లో ఉన్న మీ కాళ్ళు చేతుల్ని నరికించి మిమ్మల్నందర్నీ ఉరికంబం ఎక్కిస్తాను” అని అన్నాడు. (49)
“పరవాలేదు. మేము ఎటూ మాప్రభువు దగ్గరికి పోవాల్సినవాళ్ళమే. మేము అందరి కంటే ముందు విశ్వసించాం. అంచేత మాప్రభువు మా పాపాలు క్షమిస్తాడని మాకు నమ్మకముంది” అన్నారు మాంత్రికులు (ఫిరౌన్‌ బెదిరింపుకు భయపడకుండా). (50-51)
మేము మూసాకు దివ్యావిష్కృతి ద్వారా “(ఒకరోజు) రాత్రికి రాత్రే నా దాసుల్ని తీసుకొని బయలుదేరు, మిమ్మల్ని (ఫిరౌనీయులు) వెంబడిస్తారు” అని చెప్పాము. (52)
(ఈసంగతి తెలిసి) ఫిరౌన్‌ (సైనిక సమీకరణ కోసం) రాజభటుల్ని పిలిచి “వీరు కొద్దిమంది మాకు ఆగ్రహం తెప్పించారు. మనం అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్న సాయుధ బలగం” అని చెప్పి పంపించాడు. (53-56)
ఈవిధంగా మేము వారిని తోటలు, సెలయేరులు, నిక్షేపాలు, అందమైన గృహాల నుండి బయటికి తీశాం. ఇదీ వారిపట్ల మాప్రవర్తన. ఇక ఇస్రాయీలీల విషయానికి వస్తే వారిని మేము (అలాంటి విలువైన) వస్తువులన్నిటికీ వారసులుగా చేశాం. (57-59)
(ఓరోజు) ఉదయాన్నే ఫిరౌనీయులు వారిని వెంబడించడానికి బయలుదేరారు. (ఒకచోట) రెండుపక్షాలు ఒకదానికొకటి తారసపడగానే మూసా అనుచరులు (భయపడి పోతూ) “మేమిక పట్టుబడి పోయాం” అని కేకలు పెట్టారు. (60-61)
“కాదు (అలా జరగదు). నాతోపాటు నా ప్రభువున్నాడు. ఆయన తప్పకుండా నాకు దారి చూపుతాడు” అన్నాడు మూసా.
మేమప్పుడు మూసాకు దివ్యావిష్కృతి ద్వారా “నీ చేతి కర్రతో సముద్రం మీద ఓ దెబ్బ వెయ్యి” అని ఆదేశించాము.
(మూసా అలా చేయగానే) సముద్రం ఒక్కసారిగా చీలిపోయింది. చీలిన ప్రతి భాగం ఎత్తయిన కొండలా తయారైంది. ఆ (చీలికల మధ్య) ఏర్పడిన ఖాళీ స్థలంలోనే మేము రెండోపక్షాన్ని కూడా దగ్గరగా తీసుకువచ్చాం. తర్వాత మేము మూసాను, అతని వెంటనున్న వారందర్నీ రక్షించాం. మిగతావారిని (నీటిలో) ముంచివేశాం. (62-66)
ఈ సంఘటనలో గొప్పసూచన ఉంది. కాని వారిలో చాలామంది విశ్వసించేవారు కాదు. నీ ప్రభువు ఎంతో శక్తిమంతుడు; అమిత దయామయుడు. (67-68)
వారికి ఇబ్రాహీం గాధ విన్పించు. అతను తనతండ్రిని, తనజాతిని “మీరు దేన్ని పూజిస్తున్నారు?” అనడిగాడు. దానికి వారు “మేము విగ్రహాల్ని పూజిస్తున్నాం. ఎల్లప్పుడూ వీటి ఆరాధనలోనే ఉంటాం” అన్నారు. (69-71)
“అయితే మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఇవి మీప్రార్థనల్ని ఏమైనా ఆలకిస్తాయా? లేక ఇవి మీకేమైనా లాభంగాని, నష్టంగాని కలిగిస్తాయా?” అడిగాడు ఇబ్రాహీం. అందుకు వారు “లేదు, మా తాతముత్తాతలు ఇలా చేస్తుంటే చూశాం” అన్నారు. (72-74)
“మీరు, పూర్వం మీ తాతముత్తాతలు పూజించే ఈ వస్తువులేమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్క విశ్వప్రభువు తప్ప ఇవన్నీ నాకు శత్రువులు. నన్ను విశ్వప్రభువు సృష్టించాడు. ఆయనే నాకు (రుజు)మార్గం చూపించాడు. నాకు ఆహారపానీయాలు ఆయనే ప్రసాదిస్తున్నాడు. నేను జబ్బుపడితే స్వస్థత చేకూర్చేవాడు, నాకు మరణం కలిగించేవాడు, (పరలోకంలో) నన్ను పునర్జీవింపజేసేవాడు కూడా ఆ ప్రభువే. ఆయన తీర్పుదినాన నా పాపాలు క్షమిస్తాడని ఆశిస్తున్నాను” అన్నాడు ఇబ్రాహీం. (75-82)
(ఆ తర్వాత అతనిలా ప్రార్థించాడు:) “ప్రభూ! నాకు విద్యా వివేకాలు ప్రసాదించు. నన్ను సజ్జనులలో చేర్చు. భావితరాలలో నాకు సత్కీర్తి ప్రసాదించు. మహాభాగ్యాలతో నిండిన స్వర్గానికి వారసులయ్యేవారి జాబితాలో నన్ను చేర్చు. నాతండ్రిని క్షమించు. ఆయన దారితప్పాడు. మానవులు మళ్లీ బ్రతికించి లేపబడే రోజున నన్ను నవ్వులపాలు చేయకు. ఆరోజు సంతానం, సిరిసంపదలు ఏమాత్రం ఉపయోగపడవు. నిష్కల్మషమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చినవారికే ఆరోజు ప్రయోజనం ఉంటుంది.” దైవభీతి పరులకు స్వర్గం అతిచేరువగా తీసుకురాబడుతుంది. (83-90)
(ఆరోజు) దారితప్పినవారి ముందు నరకం ఉంచబడుతుంది. అప్పుడా మార్గ భ్రష్టుల్ని (దైవదూతలు) ఇలా అడుగుతారు: “మీరు నిజదేవుడ్ని వదలి ఆరాధించిన ఆ మిధ్యాదైవాలు ఇప్పుడు ఏమైపోయాయి? అవి మీకేమైనా సహాయం చేస్తున్నాయా? పోని, తమనుతామైనా కాపాడుకో గలుగుతున్నాయా?” ఆ తరువాత (దైవదూతలు) ఆ మిధ్యాదైవాలను, ఈ భ్రష్టుల్ని, షైతాన్‌ అనుచర మూకను అందర్నీ ఒకరిమీద ఒకర్ని పడవేసి నరకంలోకి త్రోసివేస్తారు. (91-95)
అక్కడ వారంతా పరస్పరం పోట్లాడుకుంటారు. వారు (మిధ్యాదైవాలతో) “దేవుని సాక్షి! మేము మీకు సర్వలోక ప్రభువంతటి స్థానమిచ్చి మార్గభ్రష్టులై పోయాం. అసలు మమ్మల్నీ పాపాత్ములే పెడదారి పట్టించారు. ఇక (మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు?) మాకెవరూ సిఫారసుచేసేవారు లేరే! ఏ ప్రాణస్నేహితుడు కూడా అడ్డు పడలేడే!! అయ్యయ్యో! (మేమెంత దౌర్భాగ్యులం!!) మాకోసారి ప్రపంచానికి తిరిగివెళ్ళే అవకాశం లభిస్తే మేము (తప్పకుండా) విశ్వాసులైపోతాం” అని అంటారు. (96-102)
ఇందులో గొప్పసూచన ఉంది. కాని వారిలో చాలామంది విశ్వసించే రకం కాదు. నీ ప్రభువు ఎంతో శక్తిమంతుడు, పరమ దయామయుడు. (103-104)
నూహ్‌జాతి ప్రజలు దైవప్రవక్తలను తిరస్కరించారు. వారికి వారిసోదరుడు నూహ్‌ చేసిన హితబోధ జ్ఞప్తికి తెచ్చుకో. అతను వారితో ఇలా అన్నాడు: “మీరు (దేవునికి) భయ పడరా? నేను మీకోసం వచ్చిన నమ్మకస్తుడైన దైవప్రవక్తను. కనుక మీరు దేవునికి భయ పడండి. నాకు విధేయులై ఉండండి. నేనీ పనికోసం మీ నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించడం లేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత సర్వలోక ప్రభువుపై ఉంది. అందువల్ల మీరు ఇకనైనా దేవునికి భయపడి, నాకు విధేయులైపోండి.” (105-110)
దానికి వారు “అధములు, అత్యంతనీచులే (నీ చుట్టుచేరి) నిన్ను అనుసరిస్తు న్నారు. అలాంటి నీకు మేము విధేయులమై పోవాల్నా?” అన్నారు. (111)
“వారు చేస్తున్న పనులేమిటో నాకేం తెలుసు! (ఆ సంగతి నాకవసరం లేదు) వారి లెక్కాపత్రం చూడటం నా ప్రభువు బాధ్యత. మీరు విషయం అర్థం చేసుకుంటే బాగుం టుంది. నేను విశ్వసించినవారిని నా దగ్గర్నుంచి వెళ్ళగొట్టలేను. నేను (పరలోక పరిణా మాల్ని గురించి) స్పష్టంగా హెచ్చరించేవాడ్ని మాత్రమే” అన్నాడు నూహ్‌. (112-115)
“నూహ్‌! (గుర్తుంచుకో.) నువ్వీ వైఖరి మానుకోకపోతే మాత్రం మేము నిన్ను రాళ్ళతో కొట్టి చంపుతాం” అన్నారు వారు (బెదిరిస్తూ). (116)
అప్పుడు నూహ్‌ “ప్రభూ! నా జాతి నన్ను తిరస్కరించింది. కనుక నాకూ, వారికీ మధ్య తిరుగులేని తీర్పుచెయ్యి. నన్ను, నాతోపాటున్న విశ్వాసుల్ని రక్షించు” అని ప్రార్థించాడు. చివరికి మేము నూహ్‌ని, నిండునావలో కూర్చున్న అతని అనుచరుల్ని రక్షించాం. తరువాత మిగిలిన వారందర్నీ (నీటిలో) ముంచివేశాం. (117-120)
ఇందులోనూ గొప్పసూచన ఉంది. కాని వారిలో చాలామంది సత్యాన్ని విశ్వసించే రకమే కాదు. నీ ప్రభువు నిజంగా ఎంతో శక్తిమంతుడు. దాంతోపాటు ఆయన అమిత దయామయుడు కూడా. (121-122)
ఆద్‌జాతి ప్రజలు కూడా దైవప్రవక్తలను తిరస్కరించారు. వారికి వారిసోదరుడు హూద్‌ చేసిన హితబోధ జ్ఞాపకం తెచ్చుకో. వారితో అతనిలా అన్నాడు: “మీరు (దేవునికి) భయపడరా? నేను మీకోసం వచ్చిన నమ్మకస్తుడయిన దైవప్రవక్తను. కనుక మీరు దేవునికి భయపడండి. నాకు విధేయులైపోండి. నేనీ పనికోసం మీనుండి ఎలాంటి ప్రతి ఫలం ఆశించడం లేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత సర్వలోక ప్రభువుపై ఉంది.
మీరు ఎత్తయిన ప్రతి చోటా పనికిమాలిన స్మారక భవనం నిర్మిస్తున్నారేమిటీ? ఇక్కడే శాశ్వతంగా ఉండాలన్నట్లు పెద్దపెద్ద మేడలు కడ్తున్నారు. మీరు ఎవరినైనా పట్టు కుంటే వారి పట్ల చాలా క్రూరంగా వ్యవహరిస్తారు. (ఇప్పటికైనా) దేవునికి భయపడండి. నాకు విధేయులైపోండి. మీరెరిగినవన్నీ మీకు ప్రసాదించిన దేవునికి భయపడండి. ఆయన మీకు పశుసంపద, సంతానం, సెలయేరులు, తోటలు (వగైరా ఎన్నో సంపదలు) ప్రసాదించాడు. మీ విషయంలో నేను ఒక ఘోరమైన దినాన ఎదురయ్యే (నరక)యాతన గురించి భయపడుతున్నాను.” (123-135)
దానికి వారు (పెడసరిగా సమాధానమిస్తూ) “నీవు మాకు హితోపదేశం చేసినా చేయకపోయినా ఒకటే. (మేము నీమాటలు నమ్మం.) ఇవన్నీ పూర్వం నుంచి వస్తున్న సంగతులే. మాపై ఎలాంటి శిక్షా వచ్చి పడదు” అని అన్నారు. (136-138)
చివరికి వారు అతడ్ని తిరస్కరించారు. కనుక మేము వారిని సర్వనాశనం చేశాం. ఇందులో గొప్ప సూచన ఉంది. కాని వారిలో చాలామంది విశ్వసించే రకం కాదు. నీ ప్రభువు ఎంతో శక్తిమంతుడు, అమిత దయామయుడు. (139-140)
సమూద్‌జాతి ప్రజలు కూడా దైవప్రవక్తలను తిరస్కరించారు. వారి సోదరుడు సాలిహ్‌ వారికి హితబోధచేస్తూ ఇలా అన్నాడు: “మీరు (దేవునికి) భయపడరా? నేను మీకోసం వచ్చిన నమ్మకస్తుడైన దైవప్రవక్తను. కనుక మీరు దేవునికి భయపడండి. నాకు విధేయులైపోండి. నేనీ పనికోసం మీనుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించడం లేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత సర్వలోకప్రభువుపై ఉంది. ఈ తోటలు, కాలువలు, పచ్చటి పొలాలు, పండ్లతో నిండిన ఈ ఎడారివనాల మధ్య మిమ్మల్ని హాయిగా ఎల్లకాలం ఉండనివ్వడం జరుగుతుందని భావిస్తున్నారా? పైగా మీరు కొండల్ని తొలచి బడాయి కోసం పెద్దపెద్ద కట్టడాలు నిర్మిస్తున్నారే! కాస్త దేవునికి భయపడండి. నాకు విధేయత చూపండి. దేశంలో ఎలాంటి సంస్కరణ (సంక్షేమ) కార్యాలు చేపట్టకుండా హద్దులు మీరి, అలజడులు రేకెత్తిస్తూ తిరిగేవారికి విధేయత చూపకండి.” (141-152)
దానికి వారు “నీకెవరో చేతబడి చేశారు. నువ్వు మాలాంటి మానవమాత్రుడవే కాని, మరేమీకాదు. నీవు సత్యవంతుడవైతే దానికి నిదర్శనం ఏదైనా చూపు” అన్నారు#
“అయితే ఇదిగో ఈ ఒంటె ఉంది చూడండి, (వంతులవారిగా) ఒకరోజు ఇదొక్కటే నీరు త్రాగాలి. మరొక రోజు మీరంతా నీరు వాడుకోవచ్చు. ఎట్టి పరిస్థితిలోనూ మీరు దీని జోలికి పోకూడదు. దీని జోలికి పోతే మాత్రం మీమీద ఒక దుర్దినాన భయంకర మైన ఉపద్రవం విరుచుకు పడుతుంది” అన్నాడు సాలిహ్‌. (153-156)
కాని (కొన్నాళ్ళతర్వాత) వారా ఒంటెపొదుగు కోసివేశారు. చివరికి వారు (దైవాగ్రహ సూచన చూసి) పశ్చాత్తాపం చెందసాగారు. (దైవ)శిక్ష వారిని చుట్టుముట్టి మట్టు పెట్టింది. ఇందులోనూ గొప్ప సూచన ఉంది. కాని వారిలో చాలామంది విశ్వసించని వారే ఉన్నారు. నీప్రభువు మహాశక్తిమంతుడు, అమిత దయామయుడు. (157-159)
లూత్‌జాతి ప్రజలు కూడా దైవప్రవక్తలను తిరస్కరించారు. వారికి వారి సోదరుడు లూత్‌ చేసిన హితబోధ జ్ఞప్తికి తెచ్చుకో. అతనిలా అన్నాడు: “మీరు (దేవునికి) భయ పడరా? నేను మీకోసం వచ్చిన నమ్మకస్తుడైన దైవప్రవక్తను. అందువల్ల మీరు దేవునికి భయపడండి; నాకు విధేయులయిపోండి. నేనీ పనికోసం మీ నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించడం లేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత సర్వలోక ప్రభువుపై ఉంది. మీ ప్రభువు మీకోసం మీ భార్యలలో సృష్టించినదాన్ని వదలి, మీరు యావత్తు సృష్టితాలలో పురుషుల దగ్గరికి వెళ్తున్నారా? (ఎంతటి సిగ్గుచేటు!) మీరసలు హద్దుమీరి పోయారు.” (160-166)
“లూత్‌! నువ్వీ మాటలు మానుకోకపోతే నిన్ను మాపట్నం నుంచి వెళ్ళగొడ్తాం” అంటూ వారు బెదిరించారు. “మీచేష్టలు నాకు రోత పుట్టిస్తున్నాయి...ప్రభూ! నన్ను, నా కుటుంబసభ్యుల్ని వీరి దుర్నడత, దుర్గుణాల బారినుండి కాపాడు” అన్నాడు లూత్‌#
చివరికి మేము లూత్‌ని, అతని కుటుంబసభ్యుల్ని కాపాడాం. అయితే వెనకుండి పోయినవారిలో చేరిన ఒక వృద్ధురాలిని మాత్రం వదిలేశాం. ఆ తర్వాత మేము మిగిలిన వారందర్నీ సర్వనాశనం చేశాం. వారి మీద (భయంకరమైన రాళ్ళ) వర్షం కురిపించాం. అది భయపెట్టబడిన వారిపై విరుచుకుపడిన మహాదారుణ (శిలా)వృష్టి. (167-173)
ఈ ఉదంతంలో గొప్పసూచన ఉంది. కాని వారిలో చాలామంది విశ్వసించే రకం కాదు. ఏమైనా నీప్రభువు గొప్ప శక్తిసంపన్నుడు, అపార దయామయుడు. (174-175)
‘అయికా’ ప్రజలు కూడా దైవప్రవక్తలను తిరస్కరించారు. వారికి షుఐబ్‌ చేసిన హితబోధ గుర్తుకుతెచ్చుకో. అతను వారితో ఇలా అన్నాడు: “మీరు (దేవునికి) భయ పడరా? నేను మీకోసం వచ్చిన నమ్మకస్తుడయిన దైవప్రవక్తను. కాబట్టి మీరు దేవునికి భయపడండి; నాకు విధేయులైపోండి. నేనీ పనికోసం మీ నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించడం లేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత సర్వలోకప్రభువుపై ఉంది. (176-180)
తూనికల్లో, కొలతల్లో న్యాయం పాటించండి. ఎవరికీ నష్టం కలిగించకండి. సరైన త్రాసుతో తూచివ్వండి. ప్రజలకు న్యాయంగా రావలసిన వస్తువులు తగ్గించి ఇవ్వకండి. ప్రపంచంలో అల్లర్లు, అలజడులు రేపుతూ తిరగకండి. మిమ్మల్ని, మీకు పూర్వం ఉండిన తరాలవారిని సృష్టించిన దేవునికి కాస్త భయపడండి.” (181-184)
దానికి వారు “నీకెవరో చేతబడి చేశారు. నీవుకూడా మాలాంటి మానవమాత్రుడవే గాని మరేమీకాదు. పైగా నువ్వొట్టి అబద్ధాలకోరువని మేము భావిస్తున్నాం నీవు సత్య వంతుడవైతే ఆకాశపుతునక ఒకదాన్ని మామీద పడవేయించు” అన్నారు. (185-187)
“మీరు చేస్తున్న పనులేమిటో నాప్రభువుకు బాగా తెలుసు” అన్నాడు షుఐబ్‌.#
(షుఐబ్‌ బోధ వారికి ఏమాత్రం తలకెక్కలేదు.) వారతడ్ని తిరస్కరించారు. చివరికి వారిపై ఛాయాకృత ఉపద్రవం వచ్చిపడింది. అదొక భీకరదినాన (వచ్చిపడిన) శిక్ష. ఈ ఉదంతంలో కూడా గొప్పసూచన ఉంది. కాని వారిలో చాలామంది విశ్వసించే జనం కాదు. ఏమైనా నీప్రభువు గొప్ప శక్తిసంపన్నుడు, అమిత దయామయుడు. (188-191)
ఇది సర్వలోక ప్రభువు అవతరింపజేసిన (అద్భుత) వాణి. దీన్ని తీసుకొని నమ్మ కస్తుడయిన దైవదూత స్పష్టమయిన అరబీభాషలో నీ హృదయఫలకంపై అవతరింప జేశాడు, నీవు (దైవదాసుల్ని) హెచ్చరించేవారిలో చేరాలన్న ఉద్దేశ్యంతో. (ఏకదైవారాధన, ప్రవక్త పట్ల విధేయత, పరలోకభావన వంటి) ఈ విషయాలు పూర్వీకుల (మత) గ్రంథా లలో కూడా ఉన్నాయి. (192-196)
దీన్ని గురించి ఇస్రాయీల్‌ సంతతి ధర్మవేత్తలకు తెలుసన్న విషయంలో వీరికి (మక్కాపౌరులకు) ఎలాంటి సూచన కానరావడం లేదా? మేము దీన్ని అరబ్బేతరునిపై అవతరింపజేసి, అతను దీన్ని చదివి విన్పించినా వీరు విశ్వసించరు. (197-199)
ఈవిధంగా మేము దీన్ని నేరస్థుల గుండెల్లోకి గునపంలా దించుతాం. (దాంతో) వారు (రెచ్చిపోయి) వ్యధాభరితమైన శిక్ష కళ్ళారా చూసుకునేదాకా దీన్ని విశ్వసించరు. వారు ఏమరుపాటులో పడి ఉన్నప్పుడు ఆ శిక్ష విరుచుకుపడితే (దాని సూచనలు చూసి భయంతో) “ఇప్పుడు మాకేమైనా అవకాశం లభిస్తుందా?” అంటారు. (200-203)
మరి వీరు మాశిక్ష కోసం ఎందుకు తొందరపడ్తున్నారు? ఏమైనప్పటికీ మేము వారికి ఏండ్లతరబడి అవకాశమిచ్చినా, హెచ్చరించబడుతున్న ఆపద మాత్రం వారిమీద తప్పక వచ్చిపడుతుంది. అప్పుడీ ప్రాపంచికసంపద వారికి ఎలా ఉపయోగపడుతుంది?#
ప్రజల దగ్గరకు బోధకులను పంపకుండా, వారుండే ఏపట్టణాన్నీ మేము ఎన్నడూ నాశనం చేయలేదు. (బోధకుల్ని పంపకుండానే అన్యాయంగా ప్రజలను శిక్షించడానికి) మేము దౌర్జన్యపరులం కాము. (204-209)
దీన్ని పిశాచ శక్తులు (షైతానులు) తీసుకొని అవతరించలేదు. ఈపని వాటికి తగినది కాదు. ఈవిధంగా అవి చేయలేవు కూడా. కనీసం దీన్ని వినడానికి కూడా అవకాశం లేకుండా వాటిని దూరంగా ఉంచడం జరిగింది. (210-212)
కనుక ముహమ్మద్‌ (సల్లం)! నీవు మాత్రం (ఏకేశ్వరుడైన) అల్లాహ్‌ను తప్ప మరే దైవాన్నీ ప్రార్థించకు. అలా చేశావంటే నీవు కూడా శిక్షించబడతావు. (213)
నీ దగ్గరి బంధువులను (దైవశిక్షను గురించి) భయపెట్టు. నిన్ను అనుసరిస్తున్న విశ్వాసుల పట్ల దయార్ద్రహృదయంతో మసలుకో. అయితే వారు గనక నీకు అవిధేయు లైపోతే “మీరు చేసే పనులకు నేను బాధ్యుడ్ని కాన”ని చెప్పు. మహా శక్తిమంతుడు, అపార దయాళువు అయిన దేవుడ్ని మాత్రమే నమ్ముకో. నీవు (తహజ్జుద్‌ నమాజ్‌ కోసం) లేచి సిద్ధమవుతున్నప్పుడు, నమాజు చేసేవారి మధ్య తిరుగుతున్నప్పుడు ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఆయన సమస్తం వినేవాడు, ఎరిగినవాడు. (214-220)
మానవులారా! పిశాచ శక్తులు ఎవరిని ఆవహిస్తాయో నేను మీకు తెలుపనా? వంచకుడు, అబద్ధాలకోరు అయిన ప్రతి పాపాత్ముడ్ని అవి ఆవహిస్తాయి. వినీ వినని కొన్ని మాటలు మోసుకెళ్ళి వారి చెవులలో ఊదేయడం జరుగుతుంది. వాటిలో అనేక విషయాలు అసత్యాలే అయివుంటాయి. (221-223)
ఇక కవుల విషయానికి వస్తే, వారి వెనుక మార్గభ్రష్టులు, (మతి భ్రమించినవారు) మాత్రమే నడుస్తారు. వారు తాము చేయని వాటిని గురించి మాట్లాడుతూ (దారీతెన్నూ లేకుండా) ఊహాలోకంలో తిరగడాన్ని నీవు చూడటం లేదా? అయితే సత్యాన్ని విశ్వ సించి సదాచారులైన కవులు మాత్రం అలాంటివారు కాదు. వారు దేవుడ్ని అత్యధికంగా స్మరిస్తారు. తమపై దౌర్జన్యం జరిగితే వారు ఆ మేరకు మాత్రమే బదులు తీర్చు కుంటారు.....దౌర్జన్యపరులు తాము ఎలాంటి పర్యవసానం చవిచూడవలసి ఉంటుందో త్వరలోనే తెలుసుకుంటారు. (224-227)