కవికోకిల గ్రంథావళి-3: నాటకములు/కుంభరాణా

వికీసోర్స్ నుండి






కుంభ రాణా.

[మీరాబాయి]

అర్చకుఁడు : పూజల పనేగాని ఒక్కరూక కూడ పడడములేదు తీర్థపాత్రలో.

[వెంకయ్య సుబ్బయ్య అను ఇద్దఱు యాత్రికులు ప్రవేశింతురు.]

సుబ్బయ్య : [దేవాలయ స్తంభములు తక్కిన విశేషములు చూచుచుండును.]

వెంకయ్య : ఓయ్, శనిపిశాశమా, యిట్టసూడు దేవుణ్ణి. బుద్ది, బుద్ది. [చెంపలు వేసికొని] మనకా యింటికాడి కూఁతలే వస్తాయి దేవళాల్లో కూడాను. దేవుణ్ణి శేవించు.

సుబ్బ : ఆ - శేవించాంగా మఱి. దూరాపుకొండలు నునుపన్నారు పెద్దోళ్ళు. ఈసంబరానికా మఱి నన్ను గోదారినుండి ఏంటేంటో శెప్పి యింతదూరం లాక్కొనొచ్చావు ? ఇంతదూరం వచ్చాంగా యెంత పెద్ద గాలిగోప్పరం వుంటుందో అని ఆశపడ్డాను. శ్రీరంగ దేవళంలో నూరోవంతుకూడాలేదు. దాని తస్సాదీయ ఆస్తంబాలకేశి చూస్తే తలగుడ్డ కింద పడ్డాది. యెంకయ్యా, యీశిత్తరం చూశావా ? ఇంత జగప్పెళయంగా తిరునాళ్ళ జరుగుతుంటె ఒక్క జంతరిజంతరిపెట్టె కూడాలేదు. ఒక్క రంకలరాటమైనాలేదు. అదేంసూశావు, ఒక్క సుట్టపొవ్వాకు అంగడికూడా లేదు.

వెంక : ఆ, బేష్, మాబాగాశెప్పావురా సుబ్బన్నా ! ఎంత పెద్దగాలిగోపురం వుంటే అంత పెద్ద మహత్తెం గల్ల దేవుడుంటాడాయేం? ఇక్కడ మహత్తెమంతా ఆమీరాబాయమ్మగారిదే. అందుకోసమే దేశ దేశాలనుంచి జనం తేరుమోకు తీశినమల్లె వస్తుంటారు. ఒక్కసారి ఆతల్లి పాటవింటే మనజన్మం తరిస్తుందంట. ఆమె యీ పట్న మేలే రాణాగారి పట్టపుదేవంటారు. సుబ్బ : ఆలాగా ? పట్టపుదేవిని మనము సూస్తే యింకా బతకడం గూడానా ?

వెంక : ఆ బక్తురాలికి రాణి వాసంలేదు.

సుబ్బ : అందరూ సూశేటట్లు పెళ్ళాన్ని యీదులు తిప్పేరాజు యేంరాజోసి తోసిరాజు !

అర్చకుఁడు : [చేతులుతట్టి] ఓయ్, పండ్లూ ఫలాలు బేడా పాతిక యేదైనా తెస్తే సన్నిధిలో సమర్పించండి. తీర్థం శటకోపం తీసుకోండి.

సుబ్బ : ఒకమూల కడుపు కాలు తుంటే శిత్తం శివుడిమీద నిలుస్తుందా యేవిటి ?

వెంక : మీరాబాయమ్మ యెప్పుడు ఇక్కడికి వస్తాదండి ?

అర్చ : ఆమె యిప్పుడు రాదు. మీరు తెచ్చిన నైవేద్యం తృణం ఫణం యీతట్టలో పడవేయండి.

[హారతిపళ్ళెము చూపించును.]

సుబ్బ : [వెంకయ్యతో రహస్యముగ] ఇక్కడిది ఇక్కణ్ణే రంగరిస్తాం. [ప్రకాశముగ] అంతా దేవుడి సొత్తేగదండి. పళ్ళు ఫలాలు ఇక్కడివే పెట్టండి.

వెంక : ఒక అణారూక పెట్టు.

సుబ్బయ్య : కాటికాపైనా తప్పినా తప్పుతుందిగాని, అర్చకుడి కట్నంమాత్రం తప్పేది కనాకష్టం. [కుచ్చె కొంగుముడివిప్పుచు] ఇంట్లో డబ్బు స్మరణా, ఈదులో డబ్బుస్మరణా, దేవళంలోకూడా డబ్బు స్మరణేనా సోమీ ?

అర్చ : [కర్పూరము వెలిగించి హారతి త్రిప్పుచు] ఏడ్చినట్లే వుంది మీ స్మరణా, మీభక్తి ! యాత్రవచ్చినప్పుడైనా పదిపాతికలు ఖర్చు చేయరాదూ ? [ఈలాటి మంత్రములతో హారతియిచ్చి, ఒక తులసిదళం ప్రసాదముగా యిచ్చును.] సుబ్బ : కాశంత ఆ పళ్ళుఫలాలు పెసాదం పెట్టండి సోమీ.

అర్చ : కొనుక్కోని తినండి వెళ్ళండి. వచ్చేవాళ్ళకుకూడ అడ్డము. [అని అదిలించును.]

సుబ్బ : అణారూక శేతులోపడేదాక కాస్త అట్టా యిట్టావుండి అది శేతులో పడ్డపాట తన్నబోతాడ ! ఈడి తస్సాదియ మావూళ్ళోకాక పోయెనే.

వెంక : నోరుమూసుకో. అపచారం. [సుబ్బయ్యను లాగుకొని పోవును.]

[పూర్వసువాసినియగు వైష్ణవియు నొకబాలుఁడును పూజాద్రవ్యములతోఁ బ్రవేశింతురు]

వైష్ణవి : [అర్చకుని చేతి తబుకులో పూజాద్రవ్యములు పెట్టును.]

అర్చ : అష్టోత్తరమా, సహస్రనామమా ?

వైష్ణ : సహస్రనామమె చెయ్యండి.

అర్చ : అష్టోత్తరానికి అర్ధరూపాయి, సహస్రనామానికి ఒక రూపాయి.

వైష్ణ : అట్లయితే అష్టోత్తరమే జరిపించండి.

అర్చ : అర్ధరూపాయ యిట్లా పడవేయండి.

వైష్ణ : [గుడ్డకొంగు విప్పుచు] జపించండి. ఇస్తున్నాను.

అర్చ : మీయజమానుడి పేరేమి?

వైష్ణ : ఒరే, బాబు.

బాలు : ఏమవ్వా ?

వైష్ణ : మీతాత పేరటచెప్పరా.

బాలు : వరదాచార్లు.

వైష్ణ : కాదురా. బాలు : రంగాచార్లు.

వైష్ణ : కాదురా, నీకు తెలియదూ ?

బాలు : [కోపముతో] కుంకాచార్లు, వెంకాచార్లు.

వైష్ణ : ఛీ! వెధివి. [అర్చకుడితట్టు తిరిగి] అది గాదండీ. సీతా అమ్మవారి మరిదిపేరు ఏమిటండి ?

అర్చ : భరతుఁడు.

వైష్ణ : ఇంకొకాయనండి.

అర్చ : శత్రుఘ్నుఁడు, లక్ష్మణుఁడు.

వైష్ణ : ఆ, నిలపండి ఆరెండో ఆయనండి.

అర్చ : లక్ష్మణాచార్యులా ! అబ్బా ? చంపినావుగదమ్మా [అర్చన మొదలు పెట్టి పదినామములు చదివి అర్ధరూపాయ కొఱకు చూచుచు] ఈ యుగములో విచ్చేటట్టుగా వుండలేదే ఆకొంగుమూట !

వైష్ణ : ఇదుగోనండి [బేడరూక తబుకులో వేయును. బేడను చూచి అసంతృపుఁడయి అర్చనచేయుట ముగించి కర్పూర హారతి యిచ్చి, తీర్థమిచ్చును.]

బిచ్చగాడు : అయ్యా రెండుకళ్ళూ లేనివాణ్ణి, ఒక్కకాణీ దై చెయ్యండి తండ్రులారా.

బాలు : [రహస్యముగ] అవ్వా, నీదగ్గరవుండిన చెల్లని బేడబిళ్ళ ఏమిచేశావు ?

వైష్ణ : ఎందుకురా ?

బాలు : అదుగో ! ఆ గుడ్డివాడికి వేశి చిల్లరతీసుకొంటాము.

వైష్ణ : అయ్యో, నేను అర్చకుడి తబుకులో వేసి తీర్థం తీసుకొన్నా గదరా.

బాలు : అయితే పోనీలే అవ్వా, మంచిపనే చేశావు.

[ఇద్దఱు నిష్క్రమింతురు.]

[హిందూ యాత్రికుల వేషముధరించిన తాన్‌సేను ఇస్మాయిల్ ప్రవేశితురు.]

తాన్‌సేన్ : ఆహా, యేమి యీచిత్రము ! గర్భగుడి చీఁకటిలో మినుకుమినుకు మని నక్షత్రములవలె వెలుఁగుచున్న ఈ దీపములు మూల ప్రకృతిలో మెఱయుచున్న జీవాత్మలో యనునట్లున్నవి ! ఈ యగరు దూపము, ఈ కర్పూర సౌరభ్యము, ఇవి యన్నియుంజూడ మన మెదో యొక దివ్యప్రపంచమున సంచరించుచున్న ట్లున్నది. మన శ్రమకు మించిన ప్రతిఫల మబ్బినది.

ఇస్మాయిల్ : తాన్ సేన్ జీ -

తాన్ : జాగ్రత -

యిస్మా : మఱచితిని. గురూజీ, ఇచ్చట ప్రాణరహితములగు శిలలు కూడ పవిత్రము లైనవో యనునట్లు భయ భక్తులను పురి కొల్పు చున్నవి. మీరాబాయి గాన మాధుర్యముచే మెత్తవడి, భక్తుల యడుగు రాపిళ్ళకు అఱుగు వాఱిన ఈ శిలా ఫలకములు గూడ మానవ కారుణ్యమునకు పాత్రములగు చున్నవి.

తాన్ : నేను హిందూ దేవాలయము లోనికి ప్రవేశించుట కిదియే మొదటితూరి. ఇట్టి యానందము నే నెప్పుడును అనుభవించియుండలేదు. మనము పునీతులమైతిమి. మనజన్మము సార్థకమైనది.

అర్చ : [తీర్థపు గిన్నెలోని రూకలను ఎంచుకొనుచు] దమ్మిడి యాగాణి, అణా, ...ఒక వెండిరూకైన వేసిన పాపాత్ముడులేడు. లేకలేక ఒక బేడరూక పడితే అదికూడా చెల్లనిదే ! వీళ్ళభక్తి యిట్లా బద్దలవుతుంది.

[డబ్బులు తీసి రొండిన దోఁపుకొనును.]

[కొందఱు యాత్రికులు ప్రవేశింతురు. దూరమున మీరాబాయి గానము వినఁబడును. కలకలముమాని యాత్రికు లందఱు వినుచుందురు.]

తాన్ : ఆ యవ్యక్త మధురగాన ప్రవాహమెక్కడనుండి?

యాత్రికులు : అదిగో ! మీరాబాయి, మీరాబాయి.

[యాత్రికులలో కలకలము]

[మీరాబాయి పాడుచు ప్రవేశించును. సుశీల, వాసంతికి ఇంకకొందఱు స్త్రీపురుషులు పూజాద్రవ్యములతో ప్రవేశింతురు. దేవాలయములోనుండిన యాత్రికులు మీరాబాయికి సాష్టాంగ నమస్కారములొనరింతురు.]

అర్చ : [స్వగతము] ఈయమ్మవల్ల మాబ్రతుకుఁదెరువు పాడయిపోతున్నది.

మీరా : అన్న లారా, లెండు, లెండు. నాకు మీరేల మ్రొక్కెదరు ? ఈతుచ్ఛురాలి నేల ప్రశంశించెదరు ? నేనుదాసురాలను, ఈకృష్ణ మందిరమున నూడీగము చేయుదానను. బిచ్చకత్తెను. యాచించు బిచ్చగాండ్రకు ఏమిప్రయోజనముకలదు ? మనల నందఱను రక్షించుటకు కంకణము గట్టుకొన్న ఈ శ్రీకృష్ణపరమాత్మను - ఈరాధావల్లభుని - ఈభక్తవత్సలుని _ ఈయనంత కళ్యాణగుణ పరిపూర్ణుని _ ఈసౌందర్యరాశిని మనమందఱమును చేరి ప్రార్థించెదము.

[కొందఱు యాత్రికులు అర్చకుని చేతికి పూజాద్రవ్యముల నియ్యఁబోవుదురు.]

మీరా : వలదు, వలదు. మీరుతెచ్చిన పూజాద్రవ్యములను ఈలీలావిగ్రహుని పాదముల కడనుంచుఁడు. జన్మమెత్తిన ప్రతిమానవుఁడును దేవుని పూజించుట కర్హుఁడు. అందఱము సృష్టికర్తయెదుట సమానులము మధ్యవర్తితో నవసరములేదు.

[అందఱును అట్లేచేయుదురు.]

అర్చ : [కోపము దిగమ్రింగుచు] మీరు సొంతగా పూజించుకొంటే పూజించుకొన్నారుగాని, మాభాగం కొబ్బరిచిప్పలు పండ్లు ఫలాలు తృణం ఫణం ఈబుట్టలో పడవేయండి. [బుట్టచూపును.]

[కొందఱు అట్లుచేయుదురు.]

మీరా : [భక్తిపారవశ్యమున పాడును.]

[అందఱును ఆనందపరవశు లగుదురు. అర్చకునకుగూడ భక్తి గలిగి మీరాబాయికి నమస్కరించును.]

మీరా : హే కృష్ణా, భక్తజనహృత్పద్మాసనాసీనా.

[ధ్యాన నిర్మగ్నయగును; సుశీల ఆమెను పడనీయక పట్టుకొనియుండును.]

తాన్ : మిత్రమా, నేనిఁక గాయక సార్వభౌముఁడనుగాను. నాగర్వము నేలగఱచినది. నాగాన నైపుణ్యము తృణప్రాయమైనది. మీరాబాయి బ్రతికియున్నంతవఱకు లోకమున మఱియెవ్వరును గాయకసార్వభౌములు లేరు. ఆహా ! అగ్బరు చక్రవర్తియే ఈభక్తురాలి గానము విన్న -

ఇస్మా : చక్రవర్తి బిచ్చగాఁడగును. కృష్ణమందిరమె వాసగృహమగును.

[మీరాబాయి మెల్లగా కన్ను లెత్తిపాడుచు కదలును; అర్చకుఁడు తప్ప అందఱును ఆమెననుసరింతురు.]

[తెఱజాఱును.]

_______

స్థలము : 2 :డిల్లి

_________

[అగ్బరుపాదుషా విశ్రాంతి మందిరము; చిన్న మేజాపై హుక్కా పెట్టబడియుండును. తెఱయెత్తు నప్పటికి అగ్బరు తాన్‌సేనులు సంభాషించు వైఖరిలో నుందురు.]

తాన్ : ప్రభూ, మీకోరిక అపాయకరము. మఱలనాలోచింపుడు.

అగ్బరు : అపాయము మొగలాయిచక్రవర్తులకు క్రొత్తది కాదు; అనుక్షణ పరిచితము.

తాన్ : అయినను ఇది సాహసకార్యముగాదా ?

అగ్బ : నే నెఱుంగుదును. కుంభరాణా మనకు ప్రబల విరోధి. రహస్యముగ ఆతని రాజ్యమున ప్రవేశించుట సాహసకార్యమె. అయినను, ఆభక్తురాలి దర్శనము అవశ్య కర్తవ్యము. తాన్‌సేన్, ఆమెపాట నిన్ను కూడ ఆనంద పులకితుని గావించినదా?

తాన్ : నన్నేకాదు. ఆ దావీదు నేఁడు జీవించియుండి ఆభక్తురాలి గానమువిన్న ఆనంద పరవశుఁడై యొడలు మఱచును. స్వర్గములోని కౌసరు నిర్ఝరము ఆమె కంఠమునుండి ప్రవహించును. ఆదివ్యగాన ప్రవాహమున నేనును నాచిన్న పానపాత్రిక నింపుకొంటిని.

అగ్బ : ఏమి ?

తాన్ : నేను ఆమెపాటలు కొన్ని నేర్చుకొంటిని.

అగ్బ : [సంతోషముతో] అటులనా, ఏదీ ఒక్కపాట పాడుము. నాహృదయమును ఆనంద వీచికల నుయ్యాల లూఁపుము.

తాన్ : ఆ సుధా ప్రవాహమెక్కడ ? ఈ యుప్పునీటి కాలువ యెక్కడ ? అగ్బ : ఆ పాటలు విన కుతూహలము వొడముచున్నది.

తాన్ : [పాడును]

అగ్బ : ఆహా, ఏమి యీ పాటసొంపు ! ఈగీతము ఆమె సౌందర్యముకడ మాధుర్యము నెరవు తీసికొనెనా యేమి ?

తాన్ : ప్రభూ, వ్రతోపవాస కృశాంగి యగుటచే ఆమె సౌందర్యము పూజ్యము; దివ్యము. శ్రీకృష్ణ ధ్యానపరాయణయై తన్మయత్వమున ఒడలు మఱచి వ్రాలినది. మజ్నూనుకూడ లైలా కొఱకు అంతటి వేదన అనుభవించియుండఁడు. షీరీనుకొఱకు భృగుపాతమొనరించిన ఫర్హాదు సైత మట్టి నిర్మల ప్రేమ నెఱిఁగియుండఁడు 'అనల్‌హక్‌' అని చాటించిన మాన్సూరుకూడ అంతటి ఆత్మ పరమాత్మల యైక్యము రుచుచూచి యుండఁడు. ఆ సతీతిలకము హిందూనూఫీ-

                     హర్షపులకిత దేహయై హా! ముకుంద,
                     కృష్ణ, కృష్ణా యటంచు సంకీర్తనంబు
                     సలుపుచునె ధ్యానమగ్నయై సన్నుతాంగి
                     దివ్య శోభా పరిధియందుఁ దేజరిల్లె !

అగ్బ : తాన్‌సేన్, నా వాంఛా ప్రదీపమును వెలిగించితివి; ఉత్కంఠ ప్రేరించితివి. నిర్దయుఁడవై మఱల నార్పఁబోకుము. నాజీవిత మంతయు రాజ్యసంపాదనమునందె వ్యయమగుచున్నది. ఒక్కనిమిషమైన శాంతిలేదు. ఈ తృష్ణకు దరిదాపుగలదా ?

                     ఒకరాష్ట్రము గైకొన వే
                     ఱొక రాజ్యము నాచి కొనఁగ నుల్లముగోరున్;
                     సకలైశ్వర్యము లొనరియు
                     నిఁకఁ జాలునటన్న తృప్తి యిల లేదుగదా !

తాన్ : మా బోఁటి దరిబేసులకు తృప్తి యుచితము గాని, తమవంటి చక్రవర్తులకు పరాక్రమమే యశస్కరము.

అగ్బ : తాన్‌సేన్, చక్రవర్తులు గూడ మర్త్యులే సుమా.

                    ఏరీ యా బహరాముగోరి, ఖుసురూ ? లెందేఁగె సౌషీరవాన్ ?
                    ఏరీ రుస్తుముజాలు, తాయి ? యెపుడో యెచ్చోటనో ధూళియై
                    పోరే, వారి సమాధులైనఁ గలవే ? భోగాను భోగత్వమే
                    సారంబో, పరతత్త్వమొండు గలదో సత్యంబుగా సృష్టిలోన్?

మే నెవ్వఁడను ? ఏలజన్మించితిని ? ఏల మరణించుచున్నాను ? ఈ జనన మరణముల రహస్యమేమి ? ఈ ప్రశ్నలు చిరంతనములయ్యును నిరంతరములుగ నగపడుచున్నవి. దైవదృష్టియందు అందఱును సమానులమేకదా ? అట్లయిన లోకములోని ఈ విపర్యాసమునకు కారణమేమి? కొందఱు రాజులు, కొందఱు రైతులు, కొందఱు సంపన్నులు, కొందఱు దరిద్రులు. కొందఱు సుఖితులు, కొందఱు దు:ఖితులు ! ఈరహస్యమును ఆ భక్తురాలు భేదింపఁగలదు. ఆమె ఐంద్రజాలిక స్పర్శచే ఈ రహస్యము దాఁచిన మం జూషపు మూఁత విడిపోవును. మనము రేపే తరలవలయును.

తాన్ : నావలనఁ గదా మీ కీ తలంపు గలిగినది ! ఇప్పటికే మౌలానాలు, షేకులు మిమ్ము ద్వేషించుచున్నారు. మీ హైందవ పక్షపాతమును నిందించుచున్నారు. ఇంతకును నేను కారకుఁడనని నామరణమున కెదురుచూచు చున్నారు.

అగ్బ : తాన్‌సేన్, వారు జగదేకసత్యము నెఱుంగరు. జ్ఞానమున కన్న వారికి స్వపక్షాభిమానము మిక్కుటము. జ్ఞానమునకు జాతిమతభేదములులేవు. గులాబిపూవు ఎవరిచేతనుండినను అదేవాసన గొట్టుచుండును.

తాన్ : నిజము చెప్పితిరి.

                      హైందవ తురుష్క పారసీ హౌణులకును
                      వీరువారననేల ?. యీ విశ్వమునకు
                      దేవుఁ డొకఁడను సత్యంబుఁ దెలియలేక
                      మతము పేరటఁ బోరాట మ్రందు జనము.

అగ్బ : మీరాబాయి జ్ఞానప్రదీప మీ మాయాంథకారమును దొలఁగింపఁగలదు.

తాన్ : మహమ్మదీయుల కంటఁ బడిన కులకాంతలు రాణివాసమునకు తగరని రాజపుత్రుల మతము. అందులో కుంభరాణా మిక్కిలి యభిమానవంతుఁడు.

అగ్బ : మనయుద్దేశము దుష్టముగాదు. ఆమె హృదయ హోమకుండమునుండి జ్ఞానవిస్ఫులింగ మొక్కటియైన వెలికుఱికి మన మన:పథముల జ్యోతిర్మయము చేయవచ్చును.

తాన్ : మీచిత్తము. వజీరు లీయుద్యమమున కియ్యకొందురా ?

అగ్బ : ఇది మన యిరువురిని దాఁటి పోని రహస్యము.

తాన్ : మీ ప్రయాణమునకు కారణము ?

అగ్బ : ఆ సంగతి నాకు వదలుము. మనము హిందూ యాత్రికులమయ్యెదము. వలసిన యేర్పాటులు గూఢముగ కావింపుము.

తాన్ : మాఱాడఁ జాలను.

అగ్బ : సంశయింపకుము. దైవము మనకు తోడ్పడును.

తాన్ : అట్లె యగుఁగాక ! సెలవు. [నిష్క్రమించును.]

అగ్బ : నా జీవిత కావ్యమునందు క్రొత్త అధ్యాయము ప్రారంభమైనది. [హుక్కాత్రాగుచు ఆలోచించుచుండును.]

[తెఱజాఱును]

__________

స్థలము 3 ఉదయపురము.

_________

[ఉద్యానవనము. ఒక సరోవరము, అందు చేపలుతినుచున్న కొంగయు అగపడును. కుంభరాణా పరాయత్తచిత్తుఁడై ఒకపూవును వాసన చూచుచు చలువఱాతిబండపయి కూర్చుండియుండును.]

రాణా : నానాఁటికి మాయంత:పురము నే నడుగిడుటకు యోగ్యముగాని సన్న్యాసిని మఠమగుచున్నది. అచ్చట పూర్వమునవలె హృదయరంజన మొనరించుట కొక్క చిఱునవ్వుగాని, ఒక్క ప్రేమావలోకనముగాని, తుదకొక్క తియ్యని మాటగాని కఱవయ్యెను. నా ప్రాణేశ్వరి క్రమక్రమముగ నాచేతినుండి జాఱిపోవుచున్నది. ఆపాడు మత మేనాఁడు మా యింట నడుగు వెట్టినదో ఆనాఁటినుండియు మా యిరువురి యనురాగ బంధములు సడలి పోయినవి. ఆ విరాగిణి హృదయమున నాకిప్పు డించుకయైన చోటులేదు. [నిట్టూర్చి] నేఁడు నేను కేవలము భర్తను, ప్రాణవల్లభుఁడను. పుప్పొడి రస్తావలె కనుపడుచుండిన మా జీవిత మార్గము నేఁడు కంటకశిలా భూయిష్టమయి అసహ్యమయి ఘోరమయి పొడకట్టుచున్నది - నాసంసార మసారమయి నరకప్రాయమైనది.

[మీరాబాయి, సుశీల పువ్వుల బుట్టతో ప్రవేశింతురు.]

మీరా : నాథుఁడిచ్చటనే యున్నాఁడు. సుశీలా, మనమా వంకకు పోయి పూవులు కోసికొందము. పూజా సమయము కావచ్చినది.

[ఇరువుఱును రాణాకు కొంచెము దూరమునఁ బోవుచుందురు.]

రాణా : నన్నుచూచి యేల మరలుచున్నారు ? ఈ ప్రాకృతుని గాలిసోఁకిన పంచమహాపాతకములు మిమ్మంటుకొను ననియా ?

మీరా : అయ్యో! నాయపరాధమును మన్నింపుఁడు. మీరేదో యాలోచనలో మునిఁగియున్నటుల తోఁచినది. మాసందడి మీ యవధానమునకు అంతరాయము కావచ్చునను తలంపుతో తొలఁగిపోయితిమి.

రాణా : [విషపు చిఱునవ్వుతో] అనుకూలవతివి !

మీరా : నా సదుద్దేశము నేల యనుమానించుచున్నారు ? ఎపుడైన మీకనిష్ట మాచరించితినా ? నాసతీత్వమున కేమైన లోపమువాటిల్లెనా?

రాణా : మీరా, ఆయుపచారవాక్యముల నటుండనిమ్ము. సతులు నిరంతర వ్రతోపవాస కృశాంగులేకారు, కేవలము విధినియమబద్ధ సంబంధ లేకారు; పతుల హృదయము లాకర్షించు సమ్మోహన మంత్రాధి దేవతలు గను. మృదుమధుర స్వభావలుగ నుండవలయును. పరస్పర హృదయైక్యములేని వైవాహిక బంధము నీరసము - సంతాపకరము - హత్యాకరము. కృశాంగీ, కడచిన యేడెనిమిది సంవత్సరములు వేఱు. మున్నటి లావణ్యవతి వేనా నీవు ?

                     కాటుక జిగి పూఁత కాఱుచీఁకటి గ్రమ్ము
                              నీ కన్నుఁదమ్ముల నీటుదొలఁగె;
                     హృదయభేదక చింత లేనియు నడఁగించు
                              చిఱునవ్వు విడిమోము చిన్నవోయె;
                     కనుల కానందంబు గలిగించు నీరూప
                              సౌందర్య మేడకో జాఱిపోయె;
                     ఎపుడైన విశ్లేష మెఱుఁగని చిత్తంబు
                              ప్రణయ శ్మశానమై రాజఁదొడఁగె;

                       నవ్వులాటలు సరసాలు నాఁడె ముగిసె;
                       నీ సమేలమేనియు స్మరయణీమయ్యె;
                       అనుదినంబును నెడఁబాటె యధికమయ్యె,
                       నిఁక సతీపతి సంబంధమేమి యౌనొ!

మీరా : సుశీలా, చూచితివా నాధుఁడెంత తప్పదలఁచుచున్నాఁడొ? వేషముపైని యభిమానమును నాపైని ప్రేమయని పొరపడినాఁడు.

సుశీల : [మీరాతట్టు తిరిగి] అంతేగదమ్మా మఱి. [రాజుతట్టుతిరిగి] అట్లుగాదు లేవమ్మా [స్వగతము] ఎటుచెప్పినా చావె.

రాణా : మీరా, నీకిపు డటులనే తోఁచును లెమ్ము. హృదయముతోడ నంతయు మాఱును. - చేటికా, నీవిఁక వెడలిపొమ్ము.

సుశీల : [వారికి కనఁబడకుండ మూతి త్రిప్పుకొనుచు నిష్క్రమించును.]

రాణా : [మీరాబాయి భుజముపట్టుకొని] నీవేల యీ పిచ్చి వేషము వేసికొని నా కన్నులను దూషించుచున్నావు ? నా సంతోషము భగ్నము చేయుటకు నీవు కంకణము కట్టుకొంటివా ?

మీరా : నాథా, యెవరెవరి వేషములు వారివారి చిత్తసంస్కార స్వభావాదుల కనురూపముగ నుండును. నాకీ వేసముపై ప్రీతిగలదు.

రాణా : నాప్రీతియు తలఁపవలదా ?

మీరా : నాస్వభావమునకు విరుద్ధముగ నేనెట్లు నడచుకొనఁ గలను ? ఆ కపటనాటకుమువలన మీకెట్టి ప్రీతిగలుగును ?

రాణా : అన్యోన్య భావానుసరణము కపటనాటకముగాదు. అదియె గార్హస్థ్య జీవితమునకు పునాది.

మీరా : నేను ధర్మబాహ్యనని మీ యుద్దేశమా ?

రాణా : నీమతావేశము, అలౌకిక విషయచింతనము, నిరభిమానము, శుష్క వైరాగ్యము సామాన్య గృహస్థ ధర్మములకు భంగము గలిగించుచున్నది.

మీరా : [దీనముగ] అయ్యో! అందుకు నేనేమిసేయుదును ? నా మనస్సు నాస్వాధీనము కాకయున్నది. కన్నులు మూసినను దెఱచినను శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహము నాయెదుట నిలిచినట్లు పొడకట్టును. ఒక్కనిమిషమా రాధావల్లభుఁడు నాకన్నులకుఁ గట్టకున్న లోకమే మునిఁగిపోయినట్లు అంతయు శూన్యముగ నగపట్టును. నిమిషమొక్క యుగముగ విశ్లేషదు:ఖ మనుభవింతును. ఇట్టి జీవితము నాకు స్వభావికమైనది. ఇందు మీకేమి విపరీతము తోఁచుచున్నది ?

రాణా : అందు విపరీతము కానిదేమున్నది ? [స్వగతము] ఇంతదనుక యీ కాంతను తనదారిని తన్నేఁగనిచ్చినందులకు నేనే నింద్యుఁడను. అయినను పూర్వస్మృతిని కొంత కలిగించి చాచెదను. [ప్రకాశము] ప్రేయసీ, యటుచూడుము. ఆసుందర సరోవర ప్రాంతమును మఱచితివా ?

మీరా : లేదు.

రాణా : తామరపాకువెంబడి నిలుచుండి యాకొంగ చేయుచుండిన యుదర పూరణ తపస్సును చూడుము:

                      ధ్యాన నిర్మగ్నమైనిల్చి యా బకంబు
                      కాలు దవిలిన చేపలఁ గఱచితినును,
                      కపట వైరాగ్యనటనల ఘనతచూపి
                      గ్రుడ్డిలోకుల వంచించు గురుని పగిది.

మీరా : నాథా, నిశ్చింతముగ జీవితమును వ్యర్థముసేయుచున్న యాబేడిస త్రుళ్ళిపాటును దిలకింపుఁడు.

                     కాయ మనపాయ మని యెంచి కాలమెల్ల
                     మిట్టిపాటులఁ బుచ్చెదు మీనరాజ,
                     విధి యదృశ్యహస్తము వెనువెంట నంటి
                     కడకు నిను మృత్యుపదముల కడకు గెంటు.

రాణా : [స్వగతము] ఇంతవఱకు నాయుద్దేశము తనయుద్దేశముగ నుండినది. ఇప్పుడు భిన్నము. ఇదియంతయు దుర్మతముయొక్క వైపరీత్యము [ప్రకాశముగ] అవునుగాని, మీరా, యీపాలఱాతిబండ జ్ఞప్తియున్నదా ?

మీరా : పూర్వము మనకు విశ్రాంతిపీఠము.

రాణా : పూర్వము ! - అవునవును పూర్వము ! మఱియొకమాఱిచ్చట కూర్చుండి మున్నటి వినోదములను ఆప్రణయ సఖ్యమును కొంచెము సేపు కల గనియెదము వచ్చెదవా ? ఆస్మృతి మందపవనుని సుఖోచ్ఛ్వాసమువలె, నాయొడలు పులకరింపఁజేయుచున్నది.

మీరా : కలయని తెలిసియు దానిపై నింతమక్కువ యేల ?

రాణా : [విసుగుతో] నీయీపిచ్చి ప్రశ్నలే నన్ను మాటిమాటికి హతాశుని చేయుచున్నవి. నీకేదో చిత్తచాంచల్యము కలిగియుండవలయు. రమణీయస్వప్నము ఆనందదాయకము కాదా ?

మీరా : ఆ యానంద మెంతకాలము ? కలగనినంతకాలమె. మనమేల నిరంతర దివ్యానంద మనుభవించుటకు యత్నింపఁగూడదు ?

రాణా : [ఆసతో] ఆ యానంద మెట్టిది ?

మీరా : అమృతానందము; శ్రీకృష్ణలీలాధ్యాన పారవశ్యము.

రాణా : [లాఘవముగ నవ్వి] ఓసీ పిచ్చిదాన, నీమాటలు నాదు:ఖమునందు కూడ నవ్వుపుట్టించుచున్నవి. నామనస్సు తేలికయైన యగరు ధూపమనుకొంటివా గాలిలో నెగిరిపోవుటకు ? ఊహమాత్రమైన పాల సము ద్రమును నమ్మి చేతిలోని పాయసపు పాత్రను జాఱవిడుచు మూఢుడుండునా ? దారిద్ర్యచింతా పీడితుల నూరడించుటకొఱకు, పరలోకముమీఁది యాసతో నిహలోక దు:ఖము సహించుటకొఱకు, అవివేకులను భయపెట్టి ధర్మబద్ధులను జేయుటకొఱకు పౌరాణికులు స్వర్గనరకములను కల్పించిరి. పరలోకమునకు ద్వారపాలకులు గురువులఁట! వారికి లంచమిచ్చినవారికి పరమపదము ! నిరసించినవారికి నరకము కాఁబోలు ! ఎంత యవివేకము ?

మీరా : [దీనముగ] అయ్యో! యేల యీ పరలోకదూషణము, గురునిరసనము ? అహంకారచిత్తు లెఱుఁగఁజాలని తత్త్వరహస్యము లెన్ని లేవు ?

                      కండ నెత్తురు ప్రాయంపుఁ గారవంబు
                      కనుల కెగఁదట్టఁ దత్త్వంబు గానఁబడదు;
                      పాలనా దండశక్తి నశ్వరమటన్న
                      పిడుగువంటి సత్యంబును వినెద వెపుడొ.

రాణా : మీరా, నీ నిరసన స్వభావము నాకు కోపము గొల్పినను నీయజ్ఞానమునకు మాత్రము నాకు జాలికలుగుచున్నది. ఆఁడువా రబలలు దుర్బలచిత్తలు. వివేకమునకన్న భావోద్రేకము మిక్కుటము. కావుననే మత విక్రేతలగు కపటగురువులు మిమ్ములను దేలికగ లోపఱచుకొని వంచింతురు. పాక్షికమతావలంబకులే లోకమునకు ఉపద్రవకారులు, స్వయమారోపితమైనవారి పవిత్రత ఏవము పుట్టించును; వారి దుర్ణయములు దురాచారములు మతాచ్ఛాదసముతో లోకుల మోసగించు చున్నవి. మీరా, నీమతోన్మాదము నీకు పరలోకము నిచ్చునో లేదో తెలియదు గాని, సంతోషముగను నిశ్చింతముగను గడచిపోవుచుండిన మన గార్హస్థ్య జీవితమును మాత్రము భగ్నముచేసినది.

                       తెమ్మెర వీవఁ గఁపిలెడి దీపము మానవ జీవితంబు; సౌ
                       ఖ్యమ్ములు భోగముల్ గుడువనౌను దదంతరమందుఁ; జావు స
                       త్య; మ్మని రూప్యసంశయపదంబు పరంబును నమ్మియేల భో
                       గ్యమ్మగు యౌవనాసవము నానక చిందెదవో విరక్తవై.

మీరా : [స్వగతము] ఓవిశ్వనాటక ప్రణేతా, నీవురచించిన యీ సంసార విషాదాంత నాటకమును అభినయింపించుటకు మమ్మునిరువుర నొక్కమాత్రమున బంధించితివా ? ఏమి నీమాయావిలాసము !

రాణా : [స్వగతము] సుందరుఁడయి సర్వభోగ సమో పేతుఁడయి తన్ను ప్రాణప్రదముగ కామించుప్రియుని అలక్ష్యముచేసి అప్రత్యక్షమైన యూహవిగ్రహమును మనోవైకల్యములేని యేయువతియైన ప్రేమించునా ? - ఇది యసహజము. - ఇదియొక మానసిక వ్యాధి. ఔషధసేవనము మేలుచేయవచ్చును.

[నేపథ్యమున శంఖధ్వని]

మీరా : నాథా, నేనిఁక పోవచ్చునా ? శ్రీ కృష్ణ మందిరమున శంఖమును పూరించుచున్నారు. ఇది పూజాసమయము.

రాణా : నాయొద్దిక నీకంత వెగటు పుట్టించుచున్నది కాఁబోలు. మీరా, మనజీవితమునందెంత మార్పుకలిగినదో నీవే యూహింపుమా. ఈ పరిసరములే అప్పటి మనవినోదమునకు సాక్షులు.

                      ఇచటి సంధ్యావిహారంబు, లిచటి చేఁత,
                      లిచటి యాటలుపాటలు హేళనములు,
                      నిచటి విడరాని కౌఁగిళ్ళు, నిచటి సుఖము
                      కనుల కాలేఖ్యమట్టులఁ గానవచ్చు.

సుఖమయముగా కడచిపోయిన ఆనాఁటి జీవితమునకును నీరసమై నిరయప్రాయమైన యీనాఁటి జీవితాభాసమున కెంతటి తారతమ్యము కలదో నీవెఱుంగకపోవు.

మీరా : సకల వస్తువులకును మార్పు అనివార్యము. భోగములు శాశ్వతములని తలంచితిరి కాఁబోలు ! మీరు నారూపసౌందర్యమునే వలచియుందురేని నేనెప్పటికైన పరిత్యజింపఁబడవలసిన దాననే. నాసౌందర్యము నిరంతము కాదు. రోగపీడితను జరాభారకృశాంగిని కావచ్చును.

రాణా : నీవు నిజముగ లోకజ్ఞాన శూన్యవు. యౌవన సౌందర్యములెట్లు కాలబద్ధములో మానవును భోగాభిలాషకూడ అట్లె. ఆకామ్యానురాగమె అనుభుక్తమయి వార్థక్యమునందు తప్తకాంచనమువలె నిష్కల్మష మయి బహుకాల సహవాసజనిత బాంధవ్యముగ మాఱును. వసంతమున పూచిన పువ్వు శరత్తున ఫలవంతమగును. సామాన్యమైన యీ ప్రకృతి ధర్మమును గుర్తెఱుఁగని నీమనస్తత్త్వము నాకు దురూహ్యముగనున్నది.

మీరా : అసామాన్య ధర్మములుకూడ. కొన్నికలవని మీరును గుర్తింపవలయును.

రాణా : [విసుగు కోపములతో] అవి కుక్కమూతి పిందియలు. చెడుకాలమునకు పుట్టు విపరీతములు.

మీరా : మీకట్లు తోఁపవచ్చును.

రాణా : [స్వగతము] మతితప్పినవారింత యుక్తియుక్తముగ మాటలాడుదురా ? నాబుద్ధిసంశయగ్రస్త మగుచున్నది. [ప్రకాశముగ] విరాగవతీ, రసహీనమైన తర్కము నేనెఱుంగను. హృదయముల భాష వేఱు. ఆ భాషయె నాకు తెలియును. నీవనావశ్యకముగ భావిచింతనము సేయు చున్నావు.

                      కడచినది కడచిపోయె దు:ఖమ్మొ సుఖమొ,
                      కడచు చున్నదె పెదవుల నిడినపాత్ర;
                      దానికన్న ననిశ్చితార్థంబు మేలె?
                      రేపు రేపను మాటకు రూపులేదు

[బ్రతిమాలుకొనునట్లు] నీవీ సన్న్యాసిని వేషమును తగులవెట్టి మున్నటి మీరావు కమ్ము.

మీరా : ఆమీరా నిఁక చూడలేరు; పునర్జన్మము వచ్చినది. నాథా, వేషములో నేమున్నది ?

రాణా : [కోపముతో] నీహృదయములో నేమున్నదో ఆవల్లకాడే వేసమునందు ప్రతిఫలించుచున్నది. ఎంతయోర్చుకొనఁ బోయినను నీయీతత్త్వోన్మాదము నాకు విసుఁగుపుట్టించి కోపము రేఁపుచున్నది. నీవు నీమతమునైనను లేదా నేను నిన్నైనను వదలుకొనవలయును. అందు నీ కేది సమ్మతము ?

మీరా : నాకు రెండును సమ్మతములుకావు. నేను మిమ్ములను ద్వేషించుట లేదు.

రాణా : ప్రేమించుటయునులేదు. అటులైన భావసామరస్యము లేని మనకు సంసారమెట్లు నిరంతరాయముగ కొనసాగును ?

మీరా : ఆసామరస్యము, ఆసంధిస్థానము మీయందును నాయందును అందఱియందును కలదు. మనమందఱము నొక్క మాత్రమున గ్రుచ్చఁబడిన ముత్యములము; ఒక్క భిత్తిపై చిత్రింపఁబడిన బొమ్మలము; ఒక్క సముద్రమున రేఁగు తరంగములము. ఈబాహ్యవివిధత్వమునందు అంతర్భూతమైన ఏకత్వము కలదు.

రాణా : ఓసి వెఱ్ఱిదానా, నీరోగమునకు మందులేదా ? మీరా : ఆమందుకొఱకె నిరంతర మన్వేషించుచున్నాను. చేతికి చిక్కీ చిక్కక మాయగారడివలె మఱిఁగిపోవుచున్నది. ఆమందు దొఱకిన నా పిచ్చియే కాదు, లోకము పిచ్చిగూడ కుదురును.

రాణా : [కోపముతో] మీరా, నీవిఁక పిచ్చిదానివికమ్ము, బిచ్చకత్తెవు కమ్ము, ఇంక నేదియైన కమ్ము, నీవుమాత్ర మిఁక నంత:పుర మర్యాదను దాఁటవలదు. సామాన్యస్త్రీలవలె అందఱికంటపడుచు నీవు కృష్ణమందిరమునకు పోవలదు. నీప్రవర్తనము నీయొక్కతెకే సంబంధించినదికాదు; మాపైకూడ ప్రతిఫలించును. ఉదయపూరు రాజ్యాధీశ్వరుని పట్టమహిషి పిచ్చిపట్టి వీథులవెంబడి తిరుగుచున్నదను అపవాదమునుండి కాచికొనుము.

మీరా : నాపై ఆస వదలితి నంటిరి. బిచ్చకత్తె నగుటకు సమ్మతించితిరి. దారిప్రక్కల దుమ్ముతోకూడ సరిపోలని నాకు అభిమానమేల ? ఆదురభిమానము పూర్వజన్మముతోడ నశించినది. దిక్కులేనివారికి దేవుఁడే తోడునీడ. బిచ్చమెత్తుటకు నాకు అనుజ్ఞయిండు; ఆలోకేశ్వరుని ముంగిట భిక్షాందేహియని నిలచెదను.

రాణా : నీపిచ్చికి నిన్ను వదలినను త్రాడుతెగినగాలిపటమువలె నిన్ను తిరుగనిచ్చుట నాకిష్టములేదు. ఇంకను నేను నీకు పతిని.

మీరా : అ కృష్ణుఁడొక్కఁడే ప్రాణేశ్వరుఁడు. లోకములోని జీవిలందఱును విరహిణులు.

రాణా : [కోపముతో] ఈపిచ్చి మఱింత ముదురుచున్నది. మీరా, నీవన్నమాట నీకుతెలిసివచ్చినదా ? - వినుము, ఇంకను నేనునీకు ప-తి-ని.

మీరా : నన్ను సేవకురాలిగ పనిగొండు. నామతమునకు నన్ను వదలుఁడు. అన్యమతస్థులే పూజ్యమైన హిందూమతమును స్వీకరించి సంసారమును తరించుచుండ మీరేల నాస్తికులగుట ?

రాణా : అన్యమతస్థులెవరు ? మీరా : అగ్బరు పాదుషావంటివాఁడే గోపిచందనము ధరించి భక్తిమార్గము నవలంబించి హిందూ మతమును ఆదరించుచున్నాఁడని వినికిడి.

రాణా : [కోపముతో] అగ్బర్ ? మరల ఆతని ప్రశంస. ఇదివఱకే పలుమాఱులు హెచ్చరించితిని. ఆతని ప్రశంస నారాజ్యమునందు అపరాధము. ఆతఁడు మేకవన్నెపులి. తేనేపూసిన కత్తి. చిరకాలమునాఁటి రసపుత్రరాజ్యములను మెలమెల్లగ కబళించుచున్నాఁడు. ఆతని రాజకీయ నీతి అతలస్పర్శి. - ఆ! - సరి, సరి. నీయభిమానమునకు కారణముకలదు. అగ్బరు నిన్ను వివాహమాడ తలఁచి యుండెనుగదా. మీతండ్రికి మానము ఆభిజాత్యము లేకుండిన నీవు సార్వభౌముని శుద్ధాంత కాంతవై యుందువు. పాపము, నీదురదృష్టవశమున నాబోఁటి యల్పమండలేశ్వరునకు భార్యవైతివి.

మీరా : కడచిన గాధలేల త్రవ్వెదరు ? మీమనస్సులోని వేరు పుర్వు ఇంకను నశింపలేదు. మీయనుమానమె మీకు తెవులులేని వేదనయగుచున్నది. అగ్బరు పాదుషా మనకు విరోధియైనంత మాత్రమున ఆయన పేరుకూడ ఉచ్చరింపకూడదా ? విరోధి లొనున్నంతమాత్రమున సద్గుణములు గౌరవింపఁబడకూడదా ? పాదుషాహి జనకునివంటి కర్మయోగియని వింటిని.

రాణా : [పిడుగడచినట్లు నిర్విణ్ణుఁడయి, కోపఘూర్ణిత నేత్రుడయి] ఏమీ ? - నాసతి - నాయెదుట - ఆరసపుత్రకుల మానాపహారిని ఆమ్లేచ్ఛుని ప్రశంసించుట ? వాని దుర్ణయములను సమర్థించుట ! - సహింపరాని పతితిరస్కృతి. ఓసి మాన రహితా, నీవెంత సాహసమున కొడిగట్టితివి ? ఆ మాయవేషగాఁడా నీకు పూజ్యుఁడు ? ఆ కపటనాటకము హిందువుల నాకర్షించి మోసగించుటకై పన్నిన పన్నాగమని నీవెఱుఁగవా ? గౌరవమైన రసపుత్రకులము చెడపుట్టిన బీహారిమల్లునివంటి వంశపాంససులు వానిపాదములు నాశ్రయించి తమకూఁతుండ్లను వాని యంత:పురకాంతలు గావించి వాని గులాములకు గులాములై తిరుగుచుండ నేనొక్కఁడనే వానిని ధిక్కరించి స్వతంత్రుఁడనై యుండుట నీవెఱుంగవా ? ఆదురా త్మునిపై ఏల నీకు గౌరవము ? నా నెత్తురు తుకతుక యుడికిపోవుచున్నది.

మీరా : [దీనముగ] అయ్యో! నేనేమిసేయుదును ? నాదురదృష్టమువలన నామాటలలో మీకు విపరీతార్థములు తోఁచుచుండును. నేను విన్నసంగతి యంటిని ?

రాణా : అవునవును! విన్నసంగతి యంటివి. అంత:పురమున నీకు వాని ప్రసంగములతో ప్రొద్దుపోవుచుండెనా ? వెడలిపొమ్ము, నామనము సంక్షుబ్ధమైనది.

మీరా : [కన్నీరు నించుచు] మీకింత మనోవేదన కలిగించు నేనుండియేమి ఉండకయేమి ? శ్రీకృష్ణా, ఆపద్బాంధవా, నన్ను నీకడకు చేర్చికొమ్ము.

[నిష్క్రమించును.]

రాణా : ఎంతకాల మీయింటిలోనిపోరు ? - హృదయములోని కొలిమి ? - నాసతి నావిరోధికి వత్తాసివచ్చుట ? - రవంతయైన యళుకు లేక ఆతుచ్ఛుని జనక మహర్షితో సరిపోల్చుట, ఆ కాంత ధిక్కారము హృదయ శల్యమువలె పీడించుచున్నది. మన కింక శాంతిలేదు. మీరా, మన యిద్దరిలో నెవ్వరైన నొకరు చావవలయును.

[నేపథ్యమున] చేటిక : ఇద్దరున్నూ.

రాణా : ఏమి యీయుపశ్రుత ? ఎవరక్కడ ?

చేటిక : [ప్రవేశించి] దాసురాలిని వాసంతికను. రాణిగారూ సుశీలా యెక్కడికి పోయారని గోస్వాములవారడిగారు. ఇద్దరున్నా యిప్పుడే దేవాలయం తట్టుకు పోయారని చెప్పేసరికి దేవరవారు హెచ్చరించుకొన్నారు.

రాణా : మరల ఆయున్మాదిని దేవాలయమునకు పోయెనా ? ఈ గోస్వాములు మహిషస్వాములు మాసంసారమిట్లు వల్లకాడుచేసిరి. ఏడి యాసన్యాసి ?

[తొందరగ నిష్క్రమించును.]

చేటిక : ఓయమ్మో. ఇంకేముంది - [అంటూ నిష్క్రముంచును.]

[తెఱజాఱును.]

________

స్థలము 4 : ఉదయపురము.

________

[పాంథశాల. కొందఱు యాత్రికులు కునికిపాట్లు పడుచుందురు, కొందఱు నిద్రించుచుందురు. ఒక ముసలియవ్వ కాళ్ళుచాపుకొని కూర్చుండి మేలుకొలుపులు పాడుచుండును. ఈసందడికి వెంకటదాసు ముందుగాలేచును.]

వెంకటదాసు : ఏమండోయ్, గోకులదాసూ, లెగండి, లెగండి, ఎంత మొద్దునిద్రయ్యా మీకు ! పొద్దున్నే ప్రయాణమంటే నాకు రాత్రంతా నిద్రపట్టదు. ఏమండోయ్, బృందావనానికి పొయ్యేబండ్లు కదిలిపోతున్నాయి; ఈసమయం తప్పితే మనకింక మంచి దారితోడుదొరకదు. లెగండయ్యా లెగండి.

[ఒక ఫకీరు ఈకేకలకు నిద్రమేల్కొనును.]

ఫకీరు : అయ్! ఏకోన్ రే తెలంగిముసాఫిర్, రాత్రిహంతా దివానా మాద్రి పుకార్ శేస్తాడ్ ? ఈ హడావుడీమే మాకి హొక్క ఛనంకూడా నీంద్‌వుందిలేదు. హొక్డుముసాఫిర్ వస్తాడ్ హరిబోలో హరిబోలో శెప్తాడ్, ఇంకాహొక్డు బైరాగివస్తాడ్ జయ్‌సీతారాంబోల్తాడ్. తుత్తెరీ గడ్బడా హింద్వాలోగ్. [కోపముతో జోలె గొంగడి జవురుకొని పోవును.]

వెంకటదాసు : నీదేంటోయ్ ? పక్కీరి, కీసరపాసర మంటావు, కట్టెపుచ్చుకోని నీబుఱ్ఱ బద్దలు చెయ్యనా యేంటి.

[ఇంతలో యిద్దరు యాత్రికులు తూఁగుకన్నులతో లేచి కూర్చుండి "పట్టుకో పోనియ్యవద్దు, దొంగలు, దొంగలు" అని అరతురు.]

వెంకట : ఏఁటీ ఆవెఱ్ఱి కలవరింపు ? పట్టుకోవడమేంటి !

యాత్రికుడు : నీవు మఱి బుఱ్ఱ బద్దలుకొట్టమన్నది దొంగల్ని కాదూ ?

వెంకట : (పకాయించి నవ్వును.)

[ఈసందడికి యాత్రికులందఱు లేచి మూటా ముల్లె సవరించుకొందురు. ఇంతలో అగ్బరు తాన్‌సేనులు హిందూ యాత్రికుల వేషములతో ప్రవేశింతురు.]

అగ్బరు : వారుచెప్పిన పాంథశాల యిదియేకాఁబోలు.

తాన్‌సేన్ : ఈరాత్రి మనమిచ్చటనే నిదురించి వేఁగుజామున లేచి కృష్ణమందిరమునకు పోవచ్చును. అగ్బ : అట్లేకానిమ్ము.

తాన్ : అయ్యో! మీరీ వట్టినేల యెట్లు నిద్రింతురు ?

[మూటలోని గుడ్డనుతీసి పడక వేయును.]

అగ్బ : [పడకపై కూర్చుండి] ఆహా ! యీపాంథశాల యెంత గభీర సత్యమును బోధించుచున్నది. ఉమ్రఖయ్యాము రుబాయిని తలంపునకు తెచ్చు చున్నది.

                    అంతములేని యీభువనమంత పురాతన పాంథశాల, వి
                    శ్రాంతి గృహంబు; నందు నిరుసంజలు రంగులవాకిళుల్; ధరా
                    క్రాంతులు పాదుషాలు, బహరాం జమిషీదులు వేనవేలుగాఁ
                    గొంత సుఖించి పోయిరెటకో పెఱవారికిఁ జోటొసంగుచున్.

ఇచట; నున్నంతవఱకె మనదనియెడి భ్రాంతి. తరువాత సుకృత దుష్కృతములు తప్ప వేఱొండు మనల నంటిరాదు. ఇట్లయ్యును జీవితాశ సహజముగ నుండుట వింతగదా ?

తాన్ : భగవంతుఁడు బ్రాంతియనెడు పుష్పహారముచే విశ్వసంసారమును బంధించి యున్నాఁడు.

అగ్బ : కావుననే బంధము గూడ ప్రియమైనది.

[పాంథాశాలలోని యాత్రికులు వెడలుచుందురు]

వెంకట : [తాన్‌సేన్ తట్టుతిరిగి] ఏమండోయ్, మీరింక సుఖంగా పండుకోవచ్చును. మేము వెళ్ళుతున్నాం.

తాన్ : అయ్యా. మీరేదేశస్థులు ?

వెంక : [స్వగతము] తస్సాదియ్యా, బాగా డాబుసరిగా చెబుతాను. [ప్రకాశముగ] నేనా ? ఆంధ్రుణ్ణి. తాన్ : చాలాదూరము యాత్రచేసినారు.

వెంక : అయ్యో! మాదురదృష్టం యిక్కడికి గూడా తరుముకొచ్చిందండి. ఆపరమభక్తురాలిని మీరాబాయమ్మగారిని దర్శనంచేసుకోని ఆమె కృష్ణమందిరంలో పాడుతుంటె విని మా పాపిష్టి జన్మాలు కృతార్థం చేసుకోడానికి యింతదూరం ఎండనక వాననక కొండంత ఆశతో యీ పట్నంచేరినాము.

అగ్బ : [ఆతురతతో] ఏమీ ? ఆమెదర్శనము మీకు లభింపలేదా ?

వెంక : మీ ఆత్రం చూస్తే మీరుకూడా ఆభక్తురాలి దర్శనానికి వచ్చినట్లుంది.

అగ్బ : అవును.

వెంక : ఆతల్లి దర్శనమైతే యింత మనస్తాప మెందుకు ? ఆమెకు పిచ్చిపట్టిందట ! రాణాగారు ఆమెను అంత:పురములోవుంచి చికిత్స చేయిస్తున్నాడట.

తాన్ : తన యవివేకమునకు చికిత్సచేయించుకొనిన బాగుగ నుండెడిది.

వెంక : పిచ్చికుదిరి కృష్ణమందిరానికి వస్తుందని పది దినాలు కనిపెట్టుకొని వుండినాము. ఆమెకు దినదినం పిచ్చి హెచ్చుతున్నదని విని ఇక యింతదూరము వచ్చినవాళ్ళము బృందావనమైనా సేవించుకొని పోదామని బయలుదేర్నాము. మీరేమైనా వస్తారా ?

అగ్బ : [ఆలోచనా నిమగ్నుఁడై యుండును.]

తాన్ : మేమిప్పుడే యిచ్చటకు వచ్చితిమి. పట్టణముచూడ వలయును.

గోకు : అబ్బబ్బా, యీ వెంకటదాసుతో వేగేది కష్టంగావుంది. ఎవరడిగినా ఆంధ్రుణ్ణి ఆంధ్రుణ్ణి అని బలే డాబుసరిగా మాట చెబుతాడు. కార్యంమాత్రం బండిసున్న. దారిలోమనిషి కనపడ్డ పాపానికి తలవిసిగి బట్ట కట్టేవరకు వుపన్యాసంచేస్తాడు - ఏమోయ్ వెంకటదాసూ, బండ్లుకదిలి పోతున్నాయి రావయ్యా, మాటలెట్టుకోని పెద్దదొర కొడుకులాగా నిలుచున్నావు ?

వెంక : ఏమోయి, మనం దొరకొడుకులంగాక, రామరాజు ప్రభువు రాజ్యంచేసేవఱకు ఆంధ్రుడికుండే జబర్దస్తి పాచ్చావుకు కూడాలేదు, మన దెబ్బంటే గోల్కొండ అబ్బా అంటుంది!

గోకు : ఆఁ! యిట్లా యెగనిక్కినవాళ్ళే కిందపడేది. ఆఁ - ఇక చాలురావయ్యా ప్రసంగం.

వెంక : [కోపముతో] ఏమంత పుట్టుమునిగిపోయిందా యేంటి ? మనిషి కనబడితే మాట్లాడనియ్యవు, నీబోటి శకునాలపక్షితో కూడా వస్తే యింతేకదూ మఱి.

యాత్రికులు : హా ద్వారకీవాసా, శ్రీకృష్ణా, జయరమారమణ గోవిందోహరి. [మూటముల్లె లెత్తుకొని కదలుదురు.]

అగ్బ : మనము దైవముచే వచింపఁబడితిమి; మందభాగ్యులము. ఆ పరమ భక్తురాలి వైరాగ్యమును ధ్యానపారవశ్యమును ఉన్మాదముగా శంకించి విషయలోలుఁడైన రాణా ఆమెను అంత:పురమున బంధించి యుండవచ్చును. ఇఁక మనమెట్లు దర్శింపఁగలము?

తాన్ : మనలను ప్రేరించి యింతదూరము ఈడ్చుకొనివచ్చిన యాభగవంతుఁడు మన కేదైన సదుపాయము చూపింపకపోవునా ?

అగ్బరు : మిత్రమా, కోకిల పంజరమున బంధింపఁబడియు గానము మానదుగదా ?

తాన్ : గానమున కప్పుడే యెక్కుడావశ్యకత. వేదనా మృదులమైన గానము మఱింత మధురమై భువనేశ్వరుని హృదయ ద్వారముకడ అతిథియై నిల్చి తలుపుఁదట్టగలదు. - ఇఁక విశ్రమించెదము.

అగ్బ : మీరాబాయిని దర్శించువఱకు నాకెక్కడి విశ్రాంతి ?

[తాన్‌సేను మూటవిప్పి అగ్బరునకు పడకపఱచును. ఇరువురును గుడ్డలు కప్పుకొని పండుకొందురు. తాలారి మురళీదాసు కట్లకఱ్ఱతోను చేతిలాందరుతోను ప్రవేశించును.]

మురళీదాసు : ఎవరు ముసాఫిర్‌ఖానాలో బాటసార్లు ? మూటా ముల్లెజాగర్తగా తలకిందపెట్టుకోండి. దొంగలు దోచుకుంటె మా జబాబుదారీలేదు. హుషార్. హుషార్,

[అగ్బరు తాన్‌సేనులు గుడ్డకప్పుకొని లేచికూర్చుండుదురు.]

తాన్ : అయ్యా, నీవెవ్వఁడవు ?

మురళి : నేను గస్తితిరిగే తలారివాణ్ణండి.

అగ్బ : బాటసారులను నిదురలేపుటతోడనే జవాబుదారితనము తీఱినట్లున్నది !

మురళి : ఏమి చెయ్యమంటా రండి బాబు ? ఎవరుబాటాసార్లో యెవరు వేషధార్లో కనుక్కొనేది కనాకష్టం.

[అగ్బరు తాన్‌సేనులు చిఱునవ్వుతో అర్థగర్భితముగ పరస్పరము చూచు కొందరు.]

మురళి : దొంగలుకూడా యాత్రికుల్లాగా వచ్చి నెమ్మదిగా పండుకొంటారు. అందరిని నిద్రపోనిచ్చి దొరికినవరకు చంకలోపెట్టుకొని పెద్దమనుష్యుల్లాగా వెళ్ళిపోతారు.

అగ్బ : అవును ! లోకము బహువిధము.

తాన్ : నీపేరేమి ?

మురళి : మురళీదాసండి. అగ్బ : పేరు వినుటకు సొంపుగనేయున్నది.

మురళి : నవుకరిమాత్రం బలే గడుసుగా వుందండి కడుపునిండా కూడులేదు. కంటినిండా నిద్రలేదు. కట్టుగుడ్డకు గూడా కరువు. ఇట్లాంటి కక్కురితి నవుకరి చేసేదానికంటె మీమాదిరి బైరాగులై "జై సీతారాం" మంటూ నాలుగిళ్ళకుపోయి నాలుగు పిడికెళ్ళు బియ్యంతెచ్చుకొని సుఖంగా పొట్టగడుపుకొంటూ కాలుమీద కాలువేసికొని ఏసత్రపుగోడకో ఆనుకొని దొరకొడుకు ఎట్టాండి వాడ్రా అనుకొంటూ కాలచ్చేపం చెయ్యడమే మేలుగా తోస్తుంది నాబుద్ధికి. మారాజులుకూడా సోమారిపోతుల్నే ఆదరిస్తారు. మాబోటి కష్టపడే వాళ్ళకు కూడులేదు యీకాలంలో. మావూళ్ళోవుండే రామాంజయ్యగోరు పొద్దున్నే మొగాన యెంటికపోసంత సందూ కూడాలేకుండా నామాలుపెట్టుకోని గుమ్మడికాయతపిలె నెత్తిన పెట్టుకోని అచ్చాపాత్రకొస్తాడు. సాయంత్రం పూలదండలమ్ముతాడు. నెలకి రెండు మోరీల అచ్చాపాత్రబియ్యం అమ్ముతాడు. సారాయంగడికి దినమ్మూ తప్పడు. మల్లీ పెళ్ళానికి బంగారు మురుగులు రాళ్ళకమ్మలు చెయ్యించాడు. ఇదంతా అచ్చాపాత్రడబ్బె ! ఇంక నేను నెలపొడుగుతూ నవకరిచేస్తే కల్లు తాక్కుండా బిగబట్టుకొని వుంటేగింటే పెళ్ళాం బిడ్దలకు దినానికి రెండు పూటలు కూడుదొరికేది కనాకష్టం. నాపెళ్ళాంగూడా బిచ్చమెత్తి మురుగులు చేయించిపెట్టమని దినమ్మూ తగువు. నాకు అదేతేలిగ్గా వుందిబాబు.

అగ్భ : దానము దుర్వినియోగమగుటయేతప్ప, బిచ్చ మెత్తుటవలన బీదతనము పోదు, ఎంతటివానికైనను కాలుసేతులు చక్కగానుండు నంతవఱకు యాచించుట నీచము.

మురళి : కడుపునకు చాలీచాలని నవుకరి అంతకంటె నీచంగా తోస్తుందండి. యాత్రకువచ్చిన పల్లెటూరివాండ్లను అదిలించి బెదిలించి, కొంచెము డాబుసరి మణుసులను యాచించి బేడా పాతికా సంపాయించుకొని కాలం గడుపుతూ వుండినాను. ఇప్పుడు మాకూట్లో రాయిపడిందండిబాబు. అగ్బ : ఏమీ ?

మురళి : రాణిగోరి వల్లనే యీపట్నం యాత్రాస్తళమైంది. ఆ తల్లికి పిచ్చిపట్టి అంతప్పురములోనే చెరపెట్టినప్పటినుంచి యాత్రికులందరు మెల్లింగా సళ్ళుకొంటున్నారు. మాకొక్క దమ్మిడీ యిచ్చేవాళ్లు కూడా కనబడరు.

తాన్ : ఈ పిచ్చికథను సామాన్య జనులందరు నమ్ముచున్నట్లే యున్నది - ఈయూరిలో విశేషము లేవియైనఁ గలవా?

ముర : రాణిగోరికి పిచ్చిపట్టిందొక పెద్ద విసేసం. ఆలుబిడ్డల్ని పెట్టుకొని గుట్టుగా కాపరంచేస్తుండే సంసార్లకు మతాలు వైరాగ్యాలు నేర్పించి కుటుంబాల్లో కలహాలుపెట్టే గురువుల్ని సన్నాసుల్ని రాజ్యంలోనుండి యెళ్ళగొడ్తారని మొన్నదొరగారు పట్నమంతా తుడుమెయ్యించారు. ఈది బళ్ళల్లో యేమితెలియని పిల్లకాయలికి యేలాంటి మతాలు మాయమాటలు చెప్పకూడదనీ యిందుకు తప్పినట్లయితే వురిసిచ్చని చాటించారు. వూరంతా కూడుడికినట్లు వుడికిపోతుంది. గురువులంతా వొక కట్టుగట్టి సీసువుల్ని పిసువురాండ్లని యెగదోల్తున్నారు.

తాన్ : అయితే మీయూరిలో చాలావిశేషములు గలవు.

ముర : ఇంకా వకటండి - ఆ - మరేంగలిస్తే - మీకేమైనా పిచ్చికి వైయిద్దం తెలుసునాండి? అట్లయితే దివాణంలో కొంచెం సంభావన ముట్తుంది. గోసాయిచిట్కాలంటే అందరు నమ్ముతారు.

అగ్బ : రాణిగారి పిచ్చి కుదుర్చుటకా ?

ముర : అవునండి.

తాన్ : సంస్థానపు వైద్యులులేరా ?

ముర : ఎందుకులేరు ! వుండాడు కండోజీరావు. ఆయన రాణీగోరిని సూశి దణ్ణంపెట్టి ఈరోగానికి నాకు మందు తెలియదని వెళ్ళిపోయాడంట !

అగ్బ : ఆతఁడు వివేకి తాన్ : అంత:పురములోనికి ఇతరులను రానిచ్చెదరా ?

ముర : ఆ - వైద్దుగులైతే రావచ్చును. అంతప్పురాధికారి బలవంతరావుగోరి వుత్తరువు తీసుకొని రాణమ్మగారికి వైద్దెం చేయవచ్చును. కుదిరితే మీకు బలే పేరుంటుంది. వూళ్ళోవాళ్ళందరు మిమ్మల్నే పిలస్తారు.

అగ్బ : [చిఱునవ్వుతో] మీయూరి వారికందఱకు ఇట్టి పిచ్చియే పట్టి యున్నదాయేమి ?

ముర : కాదండి. ముందుగా రాజోరి నగళ్ళల్లోపేరుతెచ్చుకుంటే ఆయెనక యాడబట్టినా చెల్లాకె.

తాన్ : మేము రాణిగారియొద్దకు పోవలసియున్న రాణాగారివద్దకు పోవలసిన యవసరములేదా ?

ముర : ఇదంతా బలవంతరావుగారిమీదనే వదలి పెట్టేశిన లాగుంది. ప్రెబువుగా రిప్పుడు కొలువుకచ్చేరిలోకి రావటంలేదు. దొరగారు ముందటిమాదిరి కాదు. [నలుప్రక్కలుచూచి రహస్యము చెప్పువానివలె నటించి] ఎవ్వురు ఏమీ అనుకోడానికి కూడా జంకుతారు. బంగారమంటి దొర యీలాగై పొయ్యాడని పెద్దచిన్నా అందరు అనుకొంటున్నారు [దుప్పటిమడచి క్రిందవేసికొని కూర్చుండి] అయ్యా చలిపుడ్తూవుంది. మీదగ్గిర చిలిమివుంటే వొక్క దమ్మిస్తారా ?

అగ్బ : మేము బైరాగులముకాము. బంగి త్రాగము. ఇదిగో! యిటురమ్మ, నీవు చాలామంచి వాఁడవుగా నున్నావు. ఈరూక తీసికొనుము.

ముర : [లేచి సంతోషముతో చేయిచాపి] దైశెయ్యండి బాబు, మీపేరు చెప్పుకోని పిల్లాపిసుగు రెండుదినాలు కమ్మంగా కారంగా కడుపు నిండా గెంజితాగుతాము. నేను కల్లంగడికి పోనేపోనండి. [రూకతీసికొనును.]

తాన్ : [మెల్లఁగా] రేపటి మన యెత్తుగడకు అవలంబము దొఱకినది.

అగ్బ : అంతయు దైవేచ్ఛ. [గుడ్డకప్పుకొని పరుండును] ముర : [రూకను చేతిలాందరు వెలుఁగున చూచుకొని] అబ్బో! ఇదిరూకగాదురో! మోరియ్య! - ఇట్టాధర్మంచేసే బైరాగుల్ని నేను పుట్టిబుద్దెరిగినాక ఎప్పుడూ చూళ్ళేదు. [మరల లాందరు వెలుఁగున చూచుకొని] అబ్బో! యీమోరియ్య గిన్నెలో సారాయిలాగ చకచక మెరుస్తుంది.

[అటునిటు పరిక్రమించుచు]

              గేయము - బంగారు మోరియ్య బయమేసుతుంది
                            శేతులో మెరుపట్ల శెదిరీపోతుంది.
                            కనబడని దేవుండు గరడావాహనుడు
                            పెత్తేక్షదైవంబు బంగారుమోరి;
                            పిశినారివాడింట పెరిగే నంటుంది
                            మాబోటివారిండ్ల మారిపోతుంది;
                            పెళ్ళాన్కి సూపిస్తె ప్రియమాడుతుంది
                            పిలిశి ముద్దెట్టి నన్ వలపించుతుంది.

               దాని తస్సాదియ్యా, దానికి సూపించను సూపించను.

                            సారాయమ్మేబాబు సల్లంగావుంటె
                            నవుకర్కి శెలవిచ్చి నవ్వుకొంటాను;
                            బంగారు మోరియ్య బయమేసుతుంది
                            శేతులో మెరుపట్లు శెదరీపోతుంది.

                                                      [నిష్క్రమించును]

[తెరజాఱును.]

________

స్థలము - 5 : అంత:పురము

________

[మీరాబాయి ధ్యాననిమగ్నయై యుండును. తెరయెత్తఁబడును. సుశీల మందుగిన్నెతో ప్రవేశించును.]

సుశీల : రాణిగారూ, ఈమందు కొంచెం పుచ్చుకోండి. ఈసారం కడుపులోకి పొయ్యేసరికే పిచ్చి కుదురుతుందట.

మీరా : [పలుకదు]

సుశీ : ఈమెపిచ్చి మందూమాకులతో కుదిరేలాగులేదు. మూడు దినాలు నుంచీ అన్నం నీళ్లు అంటకుండా ద్యాన్నించుకొంటూ, పాడుకొంటూ, నవ్వుకొంటూ మనలోకంలోనే లేదు. మా లలితకు జన్నిగుణం తగిలినప్పుడు ఈలాగే వుణ్ణింది. ఇట్టాంటి రోగాలు కట్టెతోగూడా పోవాల్సిందే - అమ్మ గారూ, కొంచెమయినా యీమందు తాగండి.

మీరా : [ధ్యాన నిమగ్నయై పలుకదు.]

సుశీ : మందంతా తాగేశిందని బలవంతరావుగారితో చెబుతాను. [ఒకప్రక్కకువచ్చి మందు క్రింద పాఱఁబోసి మెల్లఁగా స్తంభమున కానుకొని తూఁగుచుండును.]

మీర : [మెలమెల్లఁగఁ గనులెత్తి] శ్రీకృష్ణా, రాధామనోవల్లభా, దీనావనదీక్షా పరతంత్రా, నన్నేల యీనిర్బంధమున నుంచితివి ? నేనేమి యపరాధ మొనరించితిని ? నీమందిరమునకు వచ్చి నీదివ్యసుందరమూర్తిని సేవింప నీయక నాభర్త నన్నీ యంత:పురమున బంధించియుండుట నీకు సమ్మతమేనా ? - తమ సర్వస్వమును నీపాదములకు నర్పించిన పల్లెటూరి గొల్ల పడుచుల సైతము నల్లాటవెట్టుట కలవాటుపడిన నీకు న న్ను పేక్షసేయుట యొకవింతయా ! - ఓభక్తవత్సలా, యజ్ఞానముచే నీసదుద్దేశమును తెలిసికొన లేక నిందించితిని. సందేహించితిని. విషయవాంఛా మలీమసములై గోపికల హృదయములను విరహాగ్ని జ్వాలలందు పరిశుద్ధము గావించి, వారికి నిర్వాణసామ్రాజ్యము నొసంగితివి. నీదాసురాలను నన్నుఁగూడ నట్లే పరిశుద్ధము చేయుటకు ఈ యుపాయము పన్నితివి కాఁబోలు! "సకలాంతర్యామినైన నన్ను ఈ యజ్ఞానవతి యెఱుంగలేక మందిరము మందిరమని భ్రమపడుచున్నది. దీనికి చక్కని గుణపాఠము నేర్పించెద"నని యెంచి, నాకీ బంధనము విధించియుందువు. ఆపత్పరంపరలు మహోపకార గర్భితము లను గభీర సత్యమును నేఁడు గ్రహించితిని. కృష్ణా, నీకరుణ అనంతము ! అనంతము !

[ధ్యాననిర్మగ్న యగును.]

[వాసంతిక ప్రవేశించును.]

వాసంతిక : సుశీలా, యెక్కడ?

సుశీ : [తూఁగుచుండి యుల్కిపడిలేచును] మల్లీ మందుతెచ్చావా ? అమ్మగారు వొక్కచుక్క పోకుండా మందంతా తాగేశినారు.

వాసం : దొరసానమ్మగారు అ అవస్తలో వుంటే నీవు నిమ్మళంగా నిద్రపోతున్నావా ?

సుశీ : నీవొక్కదానివే బయబక్తులతో నవకరి చేసేదానివిన్నీ తక్కిన వాళ్ళందరూ కూలికి పనిచేసేవాళ్ళు. ఎందుకీ పనికిమాలిన బడాయి ? వచ్చినపని చూచుకోని పోరాదూ.

వాసం : సుశీలమ్మగారూ, బుద్ది, బుద్ది. [చెంపలువేసుకొనును] రాణిగారికెట్లావుందో కనుక్కోని రమ్మన్నారు బలవంతరావుగారు. మందు తాగిన వెనుక నెమ్మదిగా పడుకుందోలేదో కూడా అడిగి రమ్మన్నారు.

సుశీ : బుద్దితో అట్లా అడుగు చెబుతాను. - మునుపటికంటె పైదుర్గుణాలేమి కనిపించలేదు. ఇంకా కాళ్ళుముక్కు పీక్కునే సితికిరాలేదు. తనలో తానే మాట్లాడుకొంటుంది. ఇప్పుడే కన్ను మాల్చింది. ఇంతవఱకు నేను విసురుతునే వుణ్యాను - కానీ, యీసంగతంతా నేనుపోయి బలవంతరావుగారితో విన్నవిస్తాను. అంతదాకా రాణిగారి దగ్గర వుంటావుగదూ ?

వాసం : ఆమాటలు చెప్పడానికి యెవరితెలివైనా యెరవుతెచ్చుకోవాల్నా యేంటి ? [నిష్క్రమించును.]

సుశీ : ఇది బహుచమత్కారి తొత్తుకూతురు. మఱచిపోయైనా మోసపోతుందంటె మోసపోదు. రేయింబవుళ్ళు నన్నే పడిచావమంటుంది.

మీర : [ఉల్కిపడిలేచి బయలుచూచు] హృదయేశ్వరా, యింతలో నా కౌఁగిలి విడిపించుకొని యెట్లుపోయితివి ? ఎచ్చటికేగితివి ? ఈదీనురాలిని వంచించుటకు నీకు మనసెట్లు పుట్టెను ? ఒక్కస్థలమున నుందువని నిర్ణయములేని నిన్ను నే నెక్కడయని వెదకుదును ?

                     ఉందువో మౌనిజనోత్ఫుల్ల హృదయాబ్జ
                               కర్ణికా నాట్య రంగములయందు?
                     ఉందువో శాంత రసోజ్జ్వల మూర్తివై
                               క్షీరాబ్ధిలో మృదుశేషశయ్య?
                     ఉందువో దీనావనోద్యోగ రతుఁడవై
                               తలపోఁత కందెడు దవ్వునందు ?
                     ఉందువో నిర్వాణయోగ సంధాయివై
                               రాస లీలా భోగరాజ్యమందు?

                     ఇంక నెచ్చోట నుందువో యెవరికెఱుక?
                     సృష్టినాటక సూత్రధారివి ! నిరంత
                     ప్రకృతి కేళీ వినోద హర్షంబు కొఱకు
                     బొమ్మరిలు గట్టి తుడిపెదు మొదలుసెడక.

లోకేశ్వరా, ఎందుకీ లీలావిలాసము ? నీదివ్యమంగళ సౌందర్యము నీ యనంత ప్రకృతి దర్పణమునఁ ప్రతిఫలింపఁజేసి నిన్నునీవు చూచుకొనుటకా ? [బయలుచూచి క్రమక్రమముగ ధ్యాననిమగ్న యగును.]

సుశీ : ఈయమ్మగారి మాటలూ మందలింపులూ నాకు సంస్కుతంగావుంది - నిన్నటిరాత్రంతా కునికిపాటైనాలేక యీమెతోటి మేల్కొని అవస్తపడ్డాను. కొంచమట్ట కన్ను మాలస్తాను. ఆముదనష్టపు వాసంతికతో నాకు అత్తపోరయింది. [పైటచెంగు పఱచుకొనియొక మూలగ పరుండును]

మీర : నన్నేల యింకను నీయొద్దికి చేర్చుకొనవు ? దవాగ్ని మధ్యమున పరితపించుచున్న యీ కురంగిని కాపాడుటకు నీకింకను దయ గలుగులేదా ? నీకంఠమున వేయుటకై కట్టిన పొగడదండ నాయంజలిపుటమున కమలి పోయినది. ఇంకను నీవురావేమి ? నేను పంపుచుండిన బాష్పదూతికలు నిన్నింకను చేరలేదా? నా విన్నపమును గొనిపోయిన బలాకలు దారిలో నేమైన నాలసించినవా ? లేక నీవే యుపేక్షించితివా ?

                     ధూళి గప్పిన యీజీర్ణ చేలఁదాల్చి
                     గఱిక పువ్వులు కొప్పులోఁ దుఱిమి, ముసుఁగు
                     టంబరంబును రాణివాసంబు వీడి
                     దుమ్ము గద్దియ నెక్కితిఁ దుదకు నాథ !

ఇంకనైనను నీచరణదాసినగుటకు తగనా ? పూర్వ మా రుక్మిణిని గొనిపోయినట్లు నన్నేల గొనిపోవు? రాధామనోవల్లభా, నీవు రాధాకౌఁగిటిలో చిక్కియున్నావు. లేకయున్న నీవేల మఱతువు, రాధా ? నీవు ధన్యవు - ధన్యవు - [ధ్యాన నిమగ్నయగును.]

సుశీ : [మేల్కొని కూర్చుండి పైటచెంగుతో విసురుకొనుచు] అబ్బా ! యీ హడావుడిలో నిద్రపట్టడంగూడానా. [ఆవులించి, తూగి, కొంచెము జరిగి పండుకొనును.]

మీరా : [ఉల్కిపడిలేచి అటునిటుచూచుచు] ఇంతలో నెక్కడ మాయమైతివి ? - నాయొద్దనే కూర్చుండి నన్ను ముద్దిడుచుంటివే. నీ త్రిజగన్మోహన స్వరూపము నొక్కక్షణమాత్రము నాకన్నులకు కనిపించి యానందపారవశ్యమున నే నొడలు మఱచియుండ మోసముచేసి పారిపోయితివా ? నీ కెందఱో ప్రాణవల్లభులు గలరు. వారిని వదలి నీవొక్క క్షణమైన సహింపనోపవు. ఈరాధతో నీకేమిపని? - నేను సౌందర్యవతిని గాను. భాగ్యవతిని గాను - కులీననూ గాను - కృష్ణా, నీకిట్టి భేదబుద్ధియుం గలదా? ఆకుబ్జ యెట్టి యందకత్తె? ఆ విదురుఁడెంతటి బాగ్యవంతుఁడు? ఎట్టికులీనుఁడు? అట్టి యవ్యాజ కృపాకటాక్షము నాయెడల యేల యుజ్జగించితివి? - మోసగాఁడా, పొమ్ము, పొమ్ము. నీవు మరల అర్ధరాత్రమున వచ్చి నాతలుపుతట్టి నన్ను బ్రతిమాలుకొన్నను నేను లోఁబడును. అలుకపూని నిన్ను వెనుకకు మరలించెదను. చెలులారా, ఒకవేళ నేను మెత్తందన మూనినను మీరు గట్టితనముబూని నాకు సహాయపడవలయును. - ఇసీ ! నేనెంత ముద్దరాలను? పదియారువేల గోపికలకు జీవితేశ్వరుఁడైన మన్మధజనకుని ఈదీను రాలి అలుకయేమిసేయును ? పేదవారలకోపము పెదవులుదాఁటదు. దాఁటినను నవ్వులచేటు. - హృదయేశ్వరా, నా కా యభిమానము దుమ్ముదుమారమైనది. నేను నీసొత్తును. అస్వతంత్రను. తలపై పెట్టుకొన్నను కాలిక్రింద వైచికొనున్నను నాకిష్టమె. - నాకిష్టమనునది యెక్కడిది? అంతయు నీయిష్టమె. నన్నేల ప్రొద్దుపొడుపుననే నీతోడ యమునా తీరమునకు కొనిపోవు? గొల్ల పడుచునకు రాణివాసమెక్కడిది ? ఇరువురముఁ దోడుతోడుగఁ బసుల మేపు కొనుచుందముగదా!

                      నీ వెండలోఁ జెట్లనీడలఁ బన్నుండి
                                 పసుల మేపఁగ నన్నుఁబంపరాదొ;

                      చలిది చిక్కంబుల సడలించి యన్నంబుఁ
                             బెట్టవేయని పేర్మిఁ బిలువరాదొ;
                      అలసితి నొక్కింత తలిరువీవన వీవు
                             ప్రేయసీ, యని యాజ్ఞవెట్టరాదొ;
                      మనసయ్యె భువన మోహనగాన మొనరింప
                             మురళి యిమ్మని చూడ్కి నెఱపరాదొ;

                      తలిరుటాకులు పూవులు దండగట్టి
                      మెడను గీలింపుమా యని నుడువరాదొ;
                      అట్టి యుపచారముల కే ననర్హ నైన
                      నిష్టముండిన రీతి నన్నేలరాదొ!
                                                [ధ్యాననిమగ్నయగును]

[అగ్బరు తాన్‌సేనులు వైద్యుల వేషముతో ప్రవేశింతురు]

అగ్బరు, తాన్‌సేనులు : తల్లీ, చరణదాసులము. [దండము పెట్టుదురు.]

మీరా : [ఆనంద పారవశ్యమున నుండును]

తాన్ : దర్శనమాత్రముననే ధన్యులము.

అగ్బ : గానమువిన్న నేమి యగుదుమో!

మీరా : నందనందనా, దివ్యసుందరశరీరా, నీవంటి సుకుమార కుమారుని ఆకొండ తిప్పలలో ఆ యరణ్యములలో పసుల గాచుటకు ఆ యశోదాదేవి యెట్లుపంపెను? ఆనందుఁ డెట్లియ్యకొనెను ? తలిదండ్రుల హృదయము లింత కఠినముగ నుండునా ?

                      పగలెల్ల సూర్యాతపంబునఁ దిరుగంగ
                               ముదుక వాఱిన నీదు మోముఁగాంచి;
                      సజలమేఘశ్యామ సంకాశదేహంబు
                               గోరజ చ్ఛన్నమౌ తీరుగాంచి;
                      లలిత పల్లవ కోమలములైన వ్రేళులు
                               కఱ్ఱ రాపిడి కాయ గాయఁగాంచి;
                      వజ్రభామినీ మన: పథముల విహరించు
                               పదములు ముండ్ల పాల్వడుటఁగాంచి;
                      వేడినిట్టూర్పు విడతు; నావిధిని దూరు
                      కొందు; హృదయంబు వ్రీలిపోఁ గుందుచుందు;
                      నీచరణదాసిని రాధను నేనులేనె,
                      యంతకష్టంబు నీకేల యాత్మపాల?

అగ్బ : ఈ పరమభక్తురాలికి రాధాత్వము సిద్ధించినది.

మీరా : కృష్ణా, రేపటినుండియు నేనే యాల మేపఁబోయెదను. నీవా యరణ్యమునకు రావలదు. నాకు వాదోడుగా నుండుటకు నీపిల్లనగ్రోవినిమ్ము. నీ పెదవి కెంజిగురులంటిన వివరమునందె నా వాతెఱనాన్చి నీమధురాధర రసస్పర్శ ననుభవించెదను.

తాన్ : [మెల్లగా కనుఱెప్పలువాల్చుచు] గానపారవశ్యముచేత కన్నులు మూఁతవడుచున్నవి.

అగ్బ : కన్నులు మూఁతవడుచుండఁగనె ఇంతకు ముం దెన్నడును ఎఱిఁగియుండని హృదయద్వార మొకటి తెఱవఁబడినది.

తాన్ : దాని తాళపుచెవికొఱకె మనమింత దూరము వచ్చితిమి. ఏమి యీగాన విశేషము !

అగ్బ : కావుననే లోకప్రసిద్ధమైనది.

తాన్ : తల్లీ, మమ్మొక్కమాఱు కరుణింపుము. మేము కృతార్థులమయ్యెదము.

సుశీ : [కన్నులుపులుముకొనుచు లేచి కూర్చుండి] మల్లీ వైద్దుగు లొచ్చినారె ! రోగమొక దోవ మందొకదోవ.

మీరా : [ఉల్కిపడిలేచును]

[అగ్బరు తాన్‌సేనులు లేతురు]

మీరా : ఆ! - మనోమోహనా, వచ్చితివా ? నన్నుఁగొనిపొమ్ము. ఎంతకాలము నీకయి వేచియుంటిని ?

సుశీల : ఇక్కణ్ణుంచి కొనిపొమ్మని వేడుకొంటుంది దొరసానమ్మ. [కూర్చుండి తూగును.]

మీరా : [అగ్బరు తాన్ సేనులు తట్టుతిరిగి] ఇద్దరు శ్రీకృష్ణులు ! [సుశీలవంకచూచి] ఇంకొక శ్రీకృష్ణుఁడు. [నలువంకలుచూచి] కోటానుకోట్ల శ్రీకృష్ణులు ! ఇందులో నాప్రాణేశ్వరుఁడైన యశోదానందనుఁడేడి?

అగ్బ : ఈ భక్తురాలికి లోకమంతయు శ్రీకృష్ణమయముగ నున్నది. అమ్మా, ఆకృష్ణుని మాకు చూపించి మమ్ములను భవ విముక్తులను గావింపుము.

మీరా : జగన్మోహనా, నీవు నాతో చెరలాట మాడుచున్నావా? నీవు నిన్నెఱుఁగవా? నీవు శ్రీకృష్ణుఁడవుగావా?

అగ్బ : ఈమె కీసమయమున నిహలోకజ్ఞాన మంతరించినది. రాధయే తానను విశ్వాసమున శ్రీకృష్ణ విశ్లేషము సహింపనోపక యార్తిఁజెందు చున్నది. మనమిప్పు డీమెతో సంభాషింపలేము. దర్శనముచే పవిత్రుల మైతీమి. గానముచే హృదయము నిర్మలమయ్యెను. ఇఁక మరలుదము. తాన్ : 'నీవు నిన్నెఱుఁగవా? నీవు శ్రీకృష్ణుఁడవు గావా ?' యను వాక్యముతో మనకు చిరంతన సత్యమును బోధించినది.

సుశీ : [కనులెత్తి] అబ్బో! మరల దోమరాటుకూడా యెక్కువైంది. [పైటతో విసరుకొనుచు] కన్నట్టైమూయనీయ వీ పాపిష్టిదోమలు - అయ్యా, యేమైనా మందిచ్చిపోతున్నారా ? కుప్పెకట్టయితే మఱొక్క సుట్టు యెక్కువగా సాదియ్యండి. కాస్త యిచ్చాపత్తెం పెట్టండి. పాపం మారాణిగారు ఇప్పటికే సన్నగిల్లి పోయారు.

అగ్బ : ఆమెపిచ్చికి ఆమెయొద్దనే మందుగలదు. దానిని మేము గూడ కొంచెము గ్రహించితిమి.

సుశీ : [స్వగతము] వీళ్ళకుగూడా పిచ్చిపట్టిందాయేంటి ! ఈపిచ్చి అంటురోగమాల అందరికీ తగులుకొనేటట్టుంది. ఈ గాలితగిలి నాకుగూడ పిచ్చిపట్టిందోయేమొ అద్దముచూచుకొనివస్తాను. [నిష్క్రమించును.]

అగ్బ : ఈదాసి మనల ననుమానించి యుండదుకదా.

తాన్ : అది తూగుబోతు.

అగ్బ : తల్లీ, ఈగురుకట్నమును గ్రహింపుము. ఈ హారమును శ్రీ కృష్ణునకు స్వయంవర హారముగ సమర్పింపుము.

[మీరాబాయి అంజలిలో హారమును విడచును.]

తాన్ : ఈబీదకట్నమునుగూడ సంగ్రహింపుము. [పూవులదండను దోసిట విడచును.]

[దండముపెట్టి యిరువురు నిష్క్రమింతురు. ధ్యాన నిమగ్నయైయున్న మీరాబాయి చేతిలోనుండి హారము క్రిందికి జాఱిపడును.]

సుశీ : [ప్రవేశించి] అద్దములో చూచుకొంటె ముందరి మొఖం లాగేవుంది. నాకేం పిచ్చిపట్టలేదు. - వైద్దుగులు మందైనా యియ్యకుండా వెళ్ళిపొయ్యారె. - [హారమును చూచి ఆశ్చర్యముతో] ఆ! యిదేంటి చుక్కల దండలాగా మెరుస్తుంది. [నలుప్రక్కలు పరికించి] ఇక్కడ యెవ్వరూలేరు. రాణిగారు కన్నుమాల్చివున్నారు. [హారముతీసికొని] వైద్దుగులు చూచివుంటె తట్టేసివుండేవాళ్ళే. దీన్ని దొంగిలిస్తే దేవుడుకూడా కనుక్కోలేడు. [అటునిటుచూచి ఱవికెలో దోపుకొనును]

మీరా : [మెల్లగా కనులెత్తి] ప్రాణవల్లభా, యీవిరహణిని నీవు పరిత్యజించితివి. ఇఁక నే జీవించియుండలేను. ప్రాణపరిత్యాగము చేసికొందును. ఈ హత్యాపాతకము నిన్నుఁదప్పక చుట్టుకొనును. [తన్నుఁజూచుకొని యుల్కిపడిలేచి] హా! ఇదియేమివింత ! నేనే కృష్ణుఁడను ! - మా కిరువురకు నభేధ ప్రతిపత్తి గలిగినది ! - ఈ చరాచర భూతసృష్టియంతయు నేనే ! - నేను లేనిదియు నేను కానిదియు నొక్కటియైన కనఁబడదు ! అంతయు నేనే - నేనే - నేనే - నే - నే...

[మూర్చిల్లును; సుశీల ఆనుకొని పట్టుకొనును]

[తెరజాఱును.]


స్థలము 6 : రాణిగారి అలంకార మందిరము.

_________

[తెర యెత్తఁబడునప్పటికి సుశీల అచ్చట సామానులు సరదుచుండును]

సుశీల : అదుష్టం గోడమీది పిల్లి దూకినట్లు దూకుతుంది. కలలో నైనా యిట్టాంటి హారం వేసుకొనే దినం వస్తుందని నే ననుకోలేదు.

[రవికెలో దాచియున్న హారమునుతీసి కన్నులద్దుకొని, మెడలో వేసికొని అద్దముచూచుకొనుచు పాపట దిద్దుకొనుచు]

దాసీయని పేరేగాని నాకుమాత్రం అంద చందాలు లేవా యేంటి? రాణివాసంలో పుట్టేవుంటే నేనూ రాణినై యుండేదాన్నే.

[ఇంతలో వాసంతిక ప్రవేశించి, సుశీల మాటలువిని యొకప్రక్క నక్కియుండును.]

వాసంతి : ఈగదిలో యేంచేస్తుంది సుశీల? రాణిగారిని వదలిపెట్టి యిక్కడ తారాడుతుంది. [కొంచెము వంగిచూచి] ఓహో! అందం చూచుకొని మార్ఛపోతుంది. ఆమొఖం యింకా కాస్తబాగుంటే అద్దం రవికెలోనె వుండాల్సి వుంటుందేమొ.

సుశీ : అందంలో రాణిగారికి చవితినిగా వున్నాను. మఱి యీ హారంవల్ల నాఅందం యిమ్మడించింది.

వాసం : [ఆశ్చర్యముతో] ఇదేంటి యీవిచిత్రం! ఈబుగ్గలబూచి ! కడుపులో యెన్ని ఆలోచనలున్నాయి ! వొక్కదెబ్బలో రాణిగారికి చవితై పోయింది ! ఇంక రాణాగారివంటి మొగుడొక్కడే తక్కువ ! సుశీ : నేనింక అధికారంచేస్తే వొక్కదాసీతొత్తు కూతురుకూడా పల్లెత్తు మాటనలేదు. నా హారంచూచి గపుచిపుమని నోరుమూసుకోని పోతారు.

వాసం : ఈ దయ్యాల మంగిని చీపురుకట్టతో శివాళించ బుద్దేస్తుంది. దీని కెక్కడి దీ హారము? ఏ మిండమగడైనా యిచ్చిపోయినాడా యేం?

సుశీ : నాకు మంచికాలం వచ్చేసరికి ఆ వైద్దుగులు దొరసానమ్మకు హారం నజరిచ్చి పోయినారనుకుంటాను. లేకపోతే వుట్టవుడియంగా హారాలు ఆకాశం బిందచేసుకొని కిందపడతవా ?

వాసం : ఆ ! తెలిసింది. ఎవరో నజరిచ్చి పోయిన హారాన్ని రాణిగారు మాంద్యంలో వుండేటప్పుడు ఈ మాయలాడి తట్టేసివుంటుంది.

సుశీ : ఆవాసంతిక నా అందాన్ని చూచి చూపోపలేక గొంతుకు వురివేసుకోని చస్తుంది.

వాసం : [మెటికలు విఱచుచు] ఓసి లంబాడి, నీబుగ్గలుకోసి వండివేస్తే పదిమంది సిపాయిల కడుపులు నిండుతాయి. నీయందాన్నిచూచి నేను వురివేసుకోని చావాల్నా ?

సుశీ : సరిసమానుల్లో వొకరికి కొత్తగా భాగ్యంవస్తే తక్కినవాళ్ళ కళ్ళల్లో కారం చల్లినట్లుంటుంది. వాళ్ళయీసు నన్నేమి చేస్తుంది ? కొంచెం వోరపైటవేసుకొని మద్యరంగంలో పనివున్నట్లు తిరుగుతుంటాను, ఎవరైనా యెక్కడి దీహారమంటే రాజాగారిచ్చినారని రహస్యంగా చెబుతాను.

వాసం : [ఈమాటలు విని నవ్వునిలుపుకొనలేక పక్కున నవ్వును.]

సుశీ : [ఉల్కిపడి] ఎవరక్కడ? - వాసంతికా?

వాసం : అమ్మా, దొరసానమ్మా, అట్టాంటిరాజు నాకూ మొగుడైతే నేను రాణిగారికి చవితినై వుందునుగదా!

సుశీ : [ప్రాణములు పోయినట్లు దిగాలువడును] ఈలంజె కూతురు అంతా విన్నది [తెప్పరిల్లి] వాసంతికా, యెంతసేపైంది నీవు వచ్చి ? వాసం ; తమరు రాణిగారికి చవితి అయ్యింది మొదలు తమరి అందచందాన్నిచూచి వాసంతిక వురివేసుకొని చచ్చేవఱకు, రాణాగారు నిన్ను మోహించి ఆ హారం బహుమానం చేసేవఱకు.

సుశీ : నే ననుకొన్నట్లే మోసపోయావు.

వాసం : అదేంటి?

సుశీ : నీవు వచ్చి వాకిటివద్ద దాంకొన్నది అప్పుడే చూచాను. నీ వేమనుకొంటావో చూస్తామని అట్లా మాట్లాడినాను.

వాసం : [నవ్వుచు] నేనుమాత్రం నిజమనుకొన్నానా? నీవు తమాషా పట్టిస్తున్నావని నేనుకూడా నవ్వుతుణ్ణాను.

సుశీ : నేను ఎగతాళికి అన్నమాటలు నీవు దాసీలదగ్గర అనవద్దు. వొట్టు, వాళ్ళు ఎకసక్కెంమాటలుకూడా నిజమని యెత్తి పొడుస్తుంటారు.

వాసం :అంతేగా భాగ్యం. అట్లాగే, నాకు పనివుంది, మల్లీవస్తాను. [స్వగతము] ఇది నన్ను మోసంచేసినానని అనుకొంటుంది. దీన్ని మోసంచేసి కొరడా వేట్లతో నలుగు పెట్టిస్తాను. [నిష్క్రమించును.]

సుశీ : పాపము, వాసంతిక నన్నొకకంట కని పెట్టేవుంటుంది. ఎట్లయినా దానికి నన్నుచూస్తే కొంచెం భయమె. [హారముతీసి ఱవికెలో దోపు కొనును] శుక్రవారమునాడు తలకుపోసుకొని రాణి గారిచ్చిన బనారసుచీర కట్టుకొని మల్లీ యీ హారం వేసుకొంటాను.

[తెరలో 'సుశీలా, ఇంకా యేం చేస్తున్నావు?' అని కేక వినఁ బడును]

సుశీ : ఇదిగో! వస్తున్నాను. రాణిగారి మందు సంగతే మరచి పొయ్యాను. [నిష్క్రమించును]

చెప్పుము ! సంవత్సరముక్రిందట అగ్బరు ఈహారమును కొనియుండెనా?

దునీ " ఇటువంటిదానివలె వుండినదేగాని, అయితే యిదౌనోకాదో నేను నిర్ణయించి చెప్పడానికి జ్ఞప్తిచాలదండి మహప్రభో.

మాధ : నిజముచెప్పుము; అందువలన నీకేమి యపాయములేదు.

దునీ : [అనుమానించుచు] ముప్పాతికా మూడువీసాలా మూడు పిరలు ఆ హారంమాదిరిగానే - వుండినట్లు - తోస్తుందండి ప్రభో.

రాణా : [శేటుభుజము వదలి] సత్యము బయటబడినది. అమాత్యులారా, యింకను మీకు ఘనిష్టములైన యాధారములు కావలయునా ? ఆ దుర్మార్గుఁడైన అగ్బరే మాఱువేసమున మాయంత:పురముఁ జొచ్చెననుట కింకను సందియము గలదా ? కుంభరాణా బ్రతికి యుండగనే తనయంత:పురమున నింతటి యన్యాయము జరుగునా ? [నలుప్రక్కల చూచి] ఆదాసి యెచ్చటకు తారిపోయినది? - అంత:పురములో నొళవు లేనిదే యితరు డింతటి సాహస కార్యమున కియ్యకొనునా ? పూజ కను నెపమున కోరినప్పుడెల్ల మీరా కృష్ణమందిరమునకు పోవుచుండెను. యాత్రికుల వేషము ధరించి అగ్బరు అప్పుడప్పుడు ఆ మందిరమునకు వచ్చుచుండెఁ గాఁబోలు ! ఆ కపట వతి యంత:పురమున బంధింపఁ బడుట యెఱింగి వైద్యవేషధారులయి వారు వచ్చి యుందురు.

శ్యామ : నాబుద్ధి సంశయాందోళితమైనది. ఎట్లు నిర్ణయించుటకును వీలు కాకున్నది.

మాధ : రాణిగా రిట్టి నింద కతీతులు.

రాణా : [రేగుచున్న కోపము బిగబట్టుకొనుచు] ఏమీ? రాణిగారు ఆకసము బొంద చేసికొని క్రిందికినూడి పడిరా ? ఏల మీకింకను సందేహము ? అది యేమిబుద్ధి ? మీ ముందు మట్టిబొమ్మనజేసి పెట్టినఁగాని యధార్థము నూహింపలేరా ? - ఆ దాసి యెక్కడ ?

[భయముతో సుశీల ప్రవేశించును.]

రాణా : ఓసీ, ఆవైద్యులు వచ్చినప్పుడు నీ వంత:పురమున నుంటివా ?

సుశీ : [గొణుగుచు] వుణ్యానండి

రాణా : మీరా అ వైద్యులతో నేమైన మాటలాడినదా?

సుశీ : అమ్మగారు ముందటి మాదిరిగానే మాట్లాడుకుంటూ వుణ్యారు. వైద్దుగులను చూచి అమ్మగారు "వచ్చితివా, నన్ను తీసుకొని పొమ్ము, ఎంతకాలము వేచివుందును" అని వేడుకొంటూ వుణ్ణింది.

రాణా : ఆఁ ? [క్రోధమూర్తి యగును]

సుశీ : అమ్మగారితో గూడా రాత్రంతా మేల్కొనుండి అప్పుడే తెలియకుండా కన్నుమాల్చినాను.

రాణా : [కోపముతో] అమ్మగారు - అమ్మగారు - ఆ అమ్మగారిని నిన్ను ఒక్క త్రాటనే యురివేయించెదను. నీకంతలోనే నొడలు తెలియని నిద్రవచ్చెనా ? దీని నిద్రమత్తు వదలునట్లు గుఱ్ఱపు కమిచీతో మేలుకొల్పుడు.

సుశీ : [దు:ఖముతో] ఈతప్పు మన్నించండి దొరగారు. బుద్ది గెడ్డిదిని నిద్రబొయ్యాను.

[బంట్రోతు నెట్టుకొనిపోవును.]

శ్యామ : మహప్రభూ, యిట్టి సందర్భముల తొందరపాటు తగదు. ఆ తెలివితక్కువదాసి, చెప్పిన తబ్బిబ్బు మాటల నాధారము చేసికొని మీ సందేహమును బలపఱచుకొనఁ బోకుఁడు. అది నిద్రమత్తున నుండి పూర్వాపరముల నెఱుంగక అసంగతముగ కొన్నిమాటలు చెప్పెను.

రాణా : శ్యామలరావ్, మీ సదుద్దేశము ప్రశంసనీయము. కాని, తక్కువ వ్యాఖ్యానము ?

బల : [అణఁగిపోయి] ప్రభువులవారు మత విషయములలో ఇంత కఠినముగా మాట్లాడడము కొంచెము - [నీళ్ళు నమలును]

రాణా : మూఢ భక్తులకు మతము కానిదేది ?

బల : పాఠశాలలో మతప్రచారము చేయకూడదని దేవరవారు కావించిన శాసనము ప్రజలలో కల్లోలము పుట్టించుచున్నది. పీఠాథిపతులు, కులగురువులు, రాజద్రోహము బోధించుచున్నట్లు వినికిడి. మొగలాయి వాళ్ళు మనమీఁద కత్తిగట్టియున్న యీసమయమున మన ప్రజలలో రాజ్యద్వేషం కలగడము మంచిపనిగాదు. ఏదో వృద్ధుఁడను. సంస్థాన శ్రేయోభిలాషిని, అనుభవశాలిని విన్నవించుకొన్నాను. తర్వాత ప్రభువుల చిత్తము.

రాణా : నిజమే! దానిని నేను గమనింపకపోలేదు. విశ్వసనీయుఁడైన సేనాధిపతికి ఖచ్చితమైన ఉత్తరువు పంపియున్నాను. ఈమతాధికారము ప్రతిపదమునందును నాయాజ్ఞ నెదుర్కొనుచున్నది. నారాజ్యమునందు నా శాసనమే శిరసావహింపఁబడవలయును. అరాజకము, బహురాజకము రెండును అపాయకములే ! మతాచార్యుల పలుకుబడి సన్నగిల్లిననే ప్రజలలో మూఢభక్తి నశింపఁగలదు. లౌకిక జ్ఞానమును, జీవితమును ద్వేషించు ప్రతి మతమును మానవుని మనోవికాసమునకు అభ్యంతరమగును. ఈ సంకుచిత మతములను నారాజ్యమునుండి సమ్మార్జింపవలయును.

బల : మతాధికారము చాలా శతాబ్దములనుండి వేళ్ళు పారియున్నది.

రాణా : నేను ప్రవేశపెట్టిన విద్యాపద్ధతికి కఱకైన వాదరగలదు.

బల : దేవరవారికి తెలియనిదేమున్నది ? సర్వజ్ఞులు - అయినా అనుభవశాలిని. శలవు పుచ్చుకొంటాను. [లేచి కొంతనడచి] మనవి చేసుకొన వలయునని మఱచిపోతిని - ఒక చిన్నసంగతి, ప్రభువులవారికి తెలియవలసిన ముఖ్యమైన విషయము గాదు. రాణా : ఏమది?

బల : రాణిగారికి చికిత్సచేయుటకు నిన్నటిదినమున ఎవరో యిద్దరు వైదేశిక వైద్యులు వచ్చియుండిరి. వారును వచ్చినట్లే పోయిరి. అప్పుడు రాణిగారివద్ద సుశీలయనుదాసి యుండినది. ఈనాఁడు అదిఏదోయొకహారము వేసికొని తిరుగుచున్నదని ఇంకొక దాసి వాసంతిక చెప్పెను. దానిని పిలిపించితిని; అది ధరించుకొన్న హారము అమూల్య వజ్రహారముగా కనుపట్టినది.

రాణా : ఈవిషయము చిత్రముగనున్నది. దాసి ఏమి? వజ్రహారమును ధరించు టేమి ? దాని నిటకు పిలిపింపుఁడు.

బల : ఎవడురా అక్కడ ?

ద్వారపాలకుఁడు : స్వామి.

బల : రాణిగారి పెద్దదాసిని సుశీలను ఇచ్చటకుఁ దోడ్కొనిరమ్ము.

ద్వార : చిత్తం. [నిష్క్రమించును.]

రాణా : ఆదాసి యెచ్చటనైన దొంగిలించి యుండునా ?

బల : అది సామాన్యభాగ్యవంతులు వేసికొను హారముగాదు. దొంగిలించియుండిన అంత:పురముననే దొంగిలించి యుండవలయును.

[సుశీల మెడలో హారమువేసికొన్ యోరపైటతో కల్కునడకతో ప్రవేశించును]

సుశీల : [స్వగతము] రాజుగారు నన్నెప్పుడు పిలిపించేవారుగారు. ఈదండ మహత్తెంవల్ల నాకేదో యదృష్టం పట్టేలాగుంది. [సిగ్గు నభినయించుచు] నీళ్ళల్లో లోతు, మనుసులో మర్మం యెవరికి తెలుస్తుంది ! [పైటసవరించుకొని హారము దిద్దుకొని] దాసురాలిని [దండముపెట్టును.]

రాణా : [సుశీల మెడలోని హారమును పరికించును.]

సుశీ : [స్వగతము] రాజుగారు నా వోరపైటమీదనే కన్ను వేశారు రాణా : ఆ హారమును దీసికొండు.

సుశీల : [సిగ్గుపడుచు హారముదీసి వినయ మభినయించుచు దూరము నుండి బలవంతరావుచేతి కందియిచ్చును]

బల : [రాణాచేఁత బెట్టును]

రాణా : [పరీక్షించుచుండును.]

సుశీ : [స్వగతము] ఎవరైనా నన్ను మోసంచేసి వుండరుగదా ?

రాణా : దాసీ, నీ కీహార మెక్కడిది ? మాబొక్కసములోని ధనమంతయు వెచ్చించినను దీని మూల్యమునకు సరిపోదు.

సుశీ : [స్వగతము] అబ్బో! అట్టాంటి హారమా యిది ? యెంత వెఱ్ఱి ముండను. దాచైనా పెట్టుకోక పోతిని.

రాణా : ఏమి యాలోచించుచున్నావు ? కట్టుకథ లల్లకుము. యధార్థము చెప్పుము.

సుశీ : నిన్నటిదినం రాణిగారికి మందియ్యడానికి వచ్చిన వైద్దుగులు ఈహారము ఇచ్చిపోయినట్లుంది.

రాణా : ఊహించుటయేమి ? నీవు చూడలేదా ?

సుశీ : [భయముతో] రాత్రంతా అమ్మగారికి విసుర్తూనే వుండి నిద్రలేక అప్పుడే కన్నట్ట మాల్చాను.

రాణా : ఓహో ! కన్నుమాల్చితివా ?

సుశీ : తర్వాత రాణిగారు నన్ను దగ్గరికి పిలిచి "ఒసె సుశీలా, ఇక్కడ వుండే దాసీల్లోకెల్లా నీవుకొంచెం ముక్కూ మొగం అందంగా వుండేదానివి, ఈహారం నీకైతే తగివుంటుంది" అని నేను వద్దనేకొంది నా మెళ్ళోవేశారు.

రాణా : [కోపముతో] ఓసీ, బుద్ధిలేనిదానా, నీసౌందర్యవర్ణనముతో మాకిప్పుడు పనియేమి ? మీరాకు ఆవైద్యులు ఈవజ్రహారము నిచ్చిరా? లేక అంతకుముందే ధరించియుండినదా ? సుశీ : అంతకుముందు లేదండి దొరగారు, వాళ్ళు రాణిగారికి నజరు తెచ్చినారేమొ.

రాణా : వైద్యులేమి అంత:పురమున కిట్టి నజరులు తెచ్చుటయేమి? ఇదియొక క్రొత్తచికిత్స కాఁబోలు !

బల : [స్వగతము] ఇది అటుతిరిగి యిటుతిరిగి కడపటికి నాప్రాణముల మీదికే వచ్చునట్లున్నదే.

రాణా : పాతర త్రవ్వఁబోవఁగా భూతము బయట పడినట్లు ఇదేదియోయొక క్రొత్తవిషయము బొగడపొడిచెను. దీనినంతయు మా యమాత్యులుకూడ విచారించి పరిశీలించిన బాగుగనుండును - ఓరీ

ద్వారపాలకుఁడు : దాసుణ్ణి.

రాణా : మా మంత్రులను నిచ్చటకు రమ్మని చెప్పుము; శీఘ్రముగ'

ద్వార : చిత్తం [నిష్క్రమించును.]

రాణా : బలవంతరావ్, ఆవైద్యులు మీయుత్తరువు తీసికొని యంత:పురములోనికి ప్రవేశించిరా?

బల : [సగర్వముగ] నా యనుమతి లేనిదే పోతుటీఁగ కూడ అంత:పురములోనికి ప్రవేశింపదు.

రాణా : వారి వేషభాష లెట్లుండినవి ? అసాధారణ విశేషము లేవియు మీకు తోఁపలేదా ?

బల : వారివేషములు వారికి తగినవిగనే యుండినవి. వారి సంభాషణ యోగ్యతను పట్టిచూడగా రాజసంస్థానములలో మెలఁగిన వైద్యులవలెనే యగపడిరి. ద్రవ్యార్జనముకంటె వ్యాధి కుదిర్చిన కీర్తియే వారికి ముఖ్యమైనట్లు తోఁచినది. తిరిగి పోవునప్పుడు సంభావన మాటయే యెత్తలేదు.

రాణా : [కోపము బిగపట్టుకొని] అప్పుడు నీబుద్ధి స్వాధీనమున నుండినదా లేక అభిని మత్తున తూఁగుచుంటివా ?

బల : [తత్తరముతో చేతులు పిసుగుకొనుచు, స్వగతము] రాజు గారికిగూడా తెలిసినట్లే యున్నది.

రాణా : [కోపముతో] ఓయీ, పిచ్చిబ్రాహ్మణుఁడా, నీవు కన్ను లుండియు చూడలేవు; వీనులుండియు వినలేవు; తలయుండియు నాలోచింపలేవు. ఇట్టి యమూల్య హారములను నిశ్చింతముగ కానుక యియ్యఁగల వైద్య వేషధారులకు నీవిచ్చు బీదసంభావన లెందుకు?

బల : [ఆశ్చర్యముతో] వేషధారులా వారు!

రాణా : కాక, మఱియెవ్వరు ?

సుశీ : [స్వగతము] ఈ ముసలాయనకు మూడుచిట్ల ముక్క జొన్నలు బత్తెం పడేలాగుంది.

[మంత్రు లిరువురు ప్రవేశింతురు]

మంత్రులు : జయము, జయము !

రాణా : విచ్చేయుఁడు.

[మంత్రులు కూర్చుండుదురు]

రాణా : శ్యామలరావుగారూ, మన యంత:పురమున వింతలు పుట్టుచున్నవి. ఈ హారమును చూచితిరా ? [శ్యామలరావు చేతికిచ్చును.] దీని ఆదాసివేసికొని తిరుగుచుండఁగా మఱియొకదాసి చూచి బలవంతరావుగారి కెఱిఁగించెను.

సుశీ : [స్వగతము] చూపోపలేక ఆ మాయలాడి తొత్తుకూతురు వాసంతిక మోసంచేసి వుంటుంది. ఈ ముసలిబాపడికి నేనంటె కళ్ళల్లో కారం చల్లినట్లుంటుంది.

రాణా : నిన్నటిదినమున ఎవరో యిద్దఱు వైద్యులు మన యంత:పురమునకు వచ్చి మీరాకు ఈహారములను నజరిచ్చి పోయిరఁట !

శ్యామ : వైద్యులా యిట్టిహారములను బహుమతిచేయుట ! మాధ : [హారమును తాను తీసికొని] ఇది నమ్మతగినది కాదు.

సుశీ : నిజమేనండి ధొరగారు.

మాధ : నీవు చూచితివా?

సుశీ : నా చేరడేసి కళ్ళనిండా చూచానండి.

రాణా : రావుజీ, వైద్యులు మనయంత:పురమునకు వచ్చినమాట యధార్థము. ఆసంగతి బలవంతరావుగారె చెప్పిరి.

బల : వచ్చినమాట వాస్తవమె.

రాణా : ఆవైద్యులే యీ హారమును దెచ్చియుండక పోయిన, అంతరాళము నుండి యూడిపడి యుండునా !

శ్యామ : వారు నిక్కువమైన వైద్యులైనట్లు తోఁపదు.

రాణా : నేనును అట్లెతలంచితిని. ఎవరో దురాత్ములైన సంస్థానాధిపతులు మాయంత:పురము నపవాద కళంకితము కావించుటకొఱకు వైద్యవేషధారులై వచ్చిరి, - నీకు వారి యుచ్చారణలో భేదమేమైన గోచరింప లేదా ?

బల : [తత్తరముతో] ఏదో కొంచెముండి నట్లుగనే తోఁచుచున్నది. నాకప్పు డనుమానము తట్టనందువలన అంతగా పరిశీలింపలేదు. కొంత మొగలాయిదేశ స్పర్శ ఉండినట్లుగా భ్రమ.

రాణా : ఆ1 - తెలిసినది. ఇది యంతయు ఆ కపటాత్ముఁడు అగ్బరు పన్నిన కుట్రవలె నగపడుచున్నది. నన్ను శౌర్యముతో లోఁబఱచుకొనలేక యిట్టి యధమకృత్యమున కొడిగట్టి యుండును - మీరేమి తలంచెదరు?

శ్యామ : మన యూహావలంబనమునకు ఇంకను కొన్ని, ఘనిష్టములైన యాధారములు దొఱకవలయును.

మాధ : ఒకవేళ ప్రభువుగారి యూహ సత్యముగనే యుండవచ్చును. మొగలాయివారు ఎట్టి నీచకార్యములకైన సాహసింపఁ గలరు.

రాణా : ఆ దుర్వివేకుఁడు ఇట్టి కుతంత్రములవలన నన్ను లోఁబఱచు కొనఁగలఁడా? అక్క సెలియండ్రను ఆలుబిడ్డలను మొగలాయి పాదుషాల కర్పించి యా యపకీర్తి మూల్యముచే నున్నతోద్యోగముల విలిచి నీచ జీవనము సేయుచు చిరంతన యశో విరాజితమైన రాజపుత్ర కులమునకు కళంకము దెచ్చిన మానసింహాదులవంటి పతితుఁడ ననుకొనెనా నన్ను ? ఎన్ని యుపాయములైన పన్ను గాక, కుంభరాణా అగ్బరునకు ప్రాణముతో లోఁబడడు. [బలవంతరావు తట్టు తిరిగి] ఓయీ నిద్దురపోతా, నీ యజాగ్రత్తవలన గదా మాయంత:పురమున కింత యపనింద కలిగినది ?

బల : [లేచి. గద్గద స్వరముతో] మహాప్రభూ, అంత: పురాధికారి నౌట నేనే యపరాదిని. వృద్ధుడనౌట బుద్ధిపాటవముకూడ తగ్గిపోవుచున్నది. కన్నులును చక్కగ గనబడవు. నన్నిక నుద్యోగ విముక్తుని గావింపవలయునని ప్రార్థించుచున్నాను.

రాణా : ప్రార్థన మవసరములేకయే నిన్ను పదబ్రష్ఠుని గావించు చున్నాను; నీవయస్సు, నీస్వామిభక్తియు, నీప్రాణములను దక్కించినవి. వెడలిపొమ్ము.

బల : మన్నింపబడితిని. ధన్యుడను. [తాళములు రాజుముందర పెట్టును]

రాజసేవ కత్తిపైని సాము ! [నిష్క్రమించును]

సుశీ : [స్వగతము] ఈ ముసలిబాపడు మేయబోయి మెడకు దగిలించుకొన్నాడు. ఆ వాసంతిక మాటవిని నామీద చాడీలు చెప్పినందుకు ఆ వుద్యోగం కాస్తా వూడిపోయింది.

రాణా : మాకు విశ్వాసపాత్రుఁడైన కుమార సింహుని అంత:పురాధికారినిగా నియమించితిమి. ఉత్తరువు సాదరు చేయించుఁడు.

శ్యామ : చిత్తము. దేవరవారు చాలా న్యాయముగఁ దీర్మానించితిరి. కుమారసింహుడు పసిప్రాయము వాఁడగుటవలన అతని తండ్రి యుద్యోగమును బలవంతరావుగారి కొసఁగఁబడియుండెను. ఇప్పుడు కుమార సింహుడు యుక్తవయస్కుడు.

సుశీ : రాణిగా రొంటరిగ వుంటారు. మల్లీవస్తాను. [నిష్క్రమించును.]

ద్వార : తలారివాడొకడు ప్రభువులవారి దర్శనానికి కనిపెట్టుకోని వున్నాడు.

శ్యామ : ప్రభువుగా రిప్పుడు కార్యాంతర నిమగ్నులు. రేపువచ్చి మనవి చేసికొమ్మనుము.

ద్వార : [నిష్క్రమించి, మరలవచ్చి] వాడిది అగత్తెమయిన మని వంట. పెళ్ళాం బిడ్డల నోటికాడ కూడంట.

రాణా : ఏమది? వానిని రమ్మనుము. - నాదర్శనమును గోరువారి నెవ్వరిని ఆటంక పెట్టకుఁడు. అంతకన్న నాకు ఉత్తమ మయిన కార్య మేమున్నది?

శ్యామ : చిత్తము.

[తలారి మురళీదాసు ప్రవేశించును.]

మురళిదాసు : మహాప్రెభో, నాది అగిత్తెమయిన మనివండి. పెళ్ళాం బిడ్డల నోటికాడ కూడండి. [వంగి దణ్ణము పెట్టును.]

శ్యామ : ఏమిరా నీమనవి ! ఒకటి రెండు మాటలతో విన్నవించుము.

మురళి : చిత్తం మహాప్రెభో, యీయాళపొద్దున, అంటె పొద్దు అల్లాడి కెక్కినాక, [నిర్దేశించును] నేనొక బంగారు మోరీ యెత్తుకోని మార్చుకొందామని దునీచంద్ సేట్ దగ్గిరికి వెళ్ళినాను. ఆమోరీ తీసుకొని దాని కరీదు పది రూపాయలని అయిదు రూపాయలిచ్చి మిగత పైకానికి పదిరోజులు తాళి రమ్మన్నాడండి.

రాణా : కానిమ్ము. మురళి : ఆపక్కంగటి సేటు ఆయన కడుపు సల్లంగుంటె - దాని కరీదు యిరవయి రూపాయలని చెప్పినాడు. ఆపాట మల్లీ దునీచందుసేటు దగ్గిరికి పోయి నీపయికంతీసుకోని నా మోరీఅన్నా యియ్యీ, లేకుంటె యిరవయి రూపాయలన్నా యియ్యీ అని బతిమాలినాను. మోడేసుకొన్నాను. ఏమీచేసినా నాకోడికి మూడే కాళ్ళంటాడు. ససేమంటే ససేమంటాడు. మోరీయెత్తి తిత్తిలో యేసుకొని పెట్లోపెట్టి బీగంయేసి, మొల్లో యేసుకొన్నాడు. నేను మల్లీ గట్టిగా అడిగితే నీవిక్కడ అల్లరిచేస్తే దొంగసొత్తని చెప్పి దండాధికారికి పట్టిస్తాను కబరారని గుడ్లు మిటకరించాడు. ఆపాట నేను యిదంతా యిన్నపం చేసుకోడానికి దండాదికారిదగ్గిరికి పోయినాను. పోయినపాటనే అక్కడవుండిన నౌకరి నాచేతికి యిసనకఱ్ఱ పట్టిచ్చి ఆయన యాడకో జారుకొన్నాడు. నేను విసుర్తూ మనవి చేసుకొంటూ వుణ్యాను. అయ్యగారు మెల్లంగా కన్నుమాల్చినారు. రెండు గెడియలకి మేల్కొని సరే అంతా విన్నానుగాని, దునీచందు నీమీద ఫిర్యాదుచేస్తే అప్పుడు విచారిస్తాము పో అని పంపేశాడు. నామోరీ యిప్పించేమాట మరిశేపొయ్యాడు.

శ్యామ : నీమనివి యా మోరీని తిరుగ యిప్పించమనియే కదా.

మురళి : అదేనండి మహప్రేభో.

రాణా : శ్యామలరావుగారూ, చూచితిరా మన పరిపాలనా సౌష్ఠవము, దండనీతి విధానము ? ప్రజల మనస్సులేకాదు పాలనా యంత్రము కూడా సంస్కరింపఁ బడవలయును.

శ్యామ : చిత్తము.

రాణా : నీకు మొహరీ యెక్కడిదిరా ?

మురళి : నిన్నటిరాత్రి ముసాపురిఖానా వద్ద గుస్తు తిరుగుతుణ్యాను. నేను అందరి తలారివాళ్ళలాగ రాత్రంతా నిద్రపోయి పొద్దున్నేలేచి కాగడా పట్టుకోని వచ్చేవాణ్ణి కాదండి. గుట్టుగా నవుకరి చేసుకోని బతికేవాణ్ణి. రాణా : కానిమ్ము.

మురళి : చిత్తం మహప్రెభో - ఆ సాలలో యిద్దరు ముసాఫర్లు పండుకోని నిద్రపోతుండినారు. వాళ్ళను లేవగొట్టి మూటాముల్లె భద్రమని యెచ్చరించాను. నేనెప్పటికి ప్రతి బాటసారిని కఱ్ఱతో తట్టి లేపి కాగడా బట్టి చూస్తుంటాను. అందువల్లనే నా ఫారాలో వొక్క దొంగతనమైనా పోలేదండి ధొరగారూ. అదంతా ప్రెభువుల కెరికె.

రాణా : అధిక ప్రసంగము చేయకుము. శీఘ్రముగ ముగించుము.

మురళి : [భయముతో] చిత్తం మహప్రెభో - మాటామాటలో మా యింటి మంచీ శెబ్బరా చెప్పుకొన్నాను. వాళ్ళల్లో నొకాయన నామీద కనికరంపుట్టి వొక మోరియ్య యినామిచ్చినాడు. ఇంతకంటె చిల్ల పెంకెత్తుగూడా యెత్యాషం జరగలేదండి ధొరగారు. [దండము పెట్టును.]

రాణా : వారు వైదేశిక యాత్రికులా, బైరాగులా ? వారిపై నీ కేమైనా అనుమానము తట్టలేదా?

మురళి : వాళ్ళు దొంగల్లాగా లేరండి మహప్రెభూ, పెద్ద పెద్ద నామాలు, తొళిసిపూసల దండలూ చూస్తే భక్తుల్లాగా కనబడ్డారు. నా యంటివాణ్ణీ గూడా 'అయ్యా' అని పెద్దమణిశినిలాగా పలకరించారు.

రాణా : అందుకే యుబ్బి తబ్బిబ్బులయి నీయుద్యోగ విధులను మఱచితివా ? అడిగినంతనే బంగారు మొహిరీల విసరి పాఱవేయఁగల సంపన్న యాత్రికులు బిచ్చ గాండ్రకయి కట్టింపఁ బడియున్న పాంథశాలలలో నివసింతురా ? ఓరీ, మూర్ఖుడా, నీగాడిద బుద్ధిచే మానవాకృతి దూషింపఁబడినది. [మంత్రులతట్టు తిరిగి] రావుజీ, యీబాటసారులే యావేషధారి వైద్యులు.

శ్యామ : అట్లే తోచుచున్నది. ఆ దునీచందుశేటును పిలిపించెదము. ఆతఁడు రత్న వ్యాపారముచేయు గొప్ప షాహుకారు. అతనిచేత ఈ హారమునకుగూడా మదింపు వేయింపవచ్చును. రాణా : పిలిపింపుడు.

శ్యామ : ఓరీ.

ద్వారపాలకుఁడు : స్వామి.

శ్యామ : నీవు శీఘ్రముగాపోయి దునీచంద్‌ శేటును రాజాజ్ఞగా పిలిచికొనిరమ్ము. తలారియొద్ద తీసికొనిన మొహరీనిగూడ తీసికొనిరమ్మనుము.

ద్వార : చిత్తం. [నిష్క్రమించును.]

రాణా : మనవేగువారు చాలాప్రమత్తులయినటుల కనఁబడుచున్నారు. లేకయున్న పరదేశీయులు మాఱువేసములతో సంచరించియు, అంత:పురమున దూరియు తప్పించుకొని పోగలుగుదురా ?

శ్యామ : ఈతూరి ప్రమాదమే జరిగినది.

రాణా : తీవ్రముగ మందలింపుడు.

శ్యామ : చిత్తము.

[దునీచంద్ శేటు ప్రవేశించును.]

దునీచంద్ శేటు : [తలారి మురళీదాసును చూచి రహస్యముగ] ఏమిరా యీసంగతి రాజుగారిదాకా తెచ్చావా? ఉండు ! భడవా, నీసంగతి చెప్పిస్తాను.

మురళి : చూడండి ధొరగారూ, యీ శేటుగా రేమంటున్నారో.

దునీ : జయము, జయము ఏలినవారికి ! ధొరగారి వుత్తరువైతే యీ మొహరీ వాడికిస్తానని చెప్తున్నానండి.

మురళి : [స్వగతము] ఆ - వూరికే యిస్తావా, వుంగరాల చేతి ముట్టు దగిలితే పెద్దమణిశి లాగా యిస్తావు.

శ్యామ : నీవుపోయి, నీ నవుకరి చూచుకొమ్ము. మేము విచారించి నీసొత్తును నీకిప్పించెదము.

మురళి : దయిసేయించండి సోమి, పిల్లా జల్లా గల్లవాణ్ణి. [దండము పెట్టి, నిష్క్రమించును.]

దునీ : [తిత్తికుచ్చె విప్పుచు] తమరు బంట్రోతును పంపేటప్పటికే నేను దండాధికారి దర్శనం చెయ్యడానికి సగందూరం వచ్చానండి. నే నబద్ధమాడితే ఆ జవ్వాన్నడగండి. [మొహరి శ్యామలరావు చేతికిచ్చి] ఇది దొంగ సొత్తేనని నాకు చాలా అనుమానం తట్టింది. అట్టాంటి సొత్తులను కొనవలెనంటె నాకు మహా చెడ్డ భయమండి.

శ్యామ : [పరిశీలించి] ప్రభువుగారు దీనిని చిత్తగింపుడు: ఇది మొగలాయి నాణెము.

రాణా : [పరికించి] అవును ! ఆవేషధారులు కూడ మొగలాయి రాజ్యమునకు సంబంధించినవారె.

దునీ : [భయముతో] ఇంకే వేషధారులు మా దుకాణానికి దొంగ సొత్తులు తేలేదండి. కర్పూరం వెలిగించి ఆర్పమన్నా ఆర్పుతాను.

శ్యామ : శేటుగారూ, దొరగారు మీ పెద్దమనిషితనమును అనుమానింపలేదు. ఈ వజ్రహారమునకు మదింపు వేయుడు.

దునీ : [హారమును తీసికొని ఉత్తరీయపు చెఱఁగుతో దానిరుద్దుచు] నేను ధరవేస్తే త్రాసులోపెట్టి తూచినట్లు సరీపోతుంది. [పరికించి ఆశ్చర్యముతో] ఈహారము నే నిదివఱకు చూచినదేనండి. కాశ్మీరదేశవర్తకుడు సంవత్సరము క్రిందట పదిలక్షల రూపాయలకు అగ్బరు చక్రవర్తి గారికి అమ్మినాడు.

రాణా : [చివుక్కనలేచి] ఏమంటివి ? అగ్బరుకా?

దునీ : [తత్తరముతో స్వగతము] కొంపమునిగినట్టుంది [ప్రకాశముగ] పరధ్యాన్నంమీద యేమొ అన్నాను.

రాణా : [ఉద్రేకముతో శేటు భుజముపట్టుకొని] యధార్థము

స్థలము 7 : రాణాగారి విశ్రాంతిమందిరము.

_________

[పట్టు మెత్తలుకుట్టిన సోఫాయుండును. దానికి కుడి ప్రక్కన రెండుకుర్చీలు వేయఁబడియుండును. ఎడమ ప్రక్కన ఒక చిన్న టేబిలుపై హుక్కాయుండును. రెండు మూడు పుస్తకములు పెట్టఁబడియుండును. రాణా ఆలోచనా నిమగ్నుఁడయి అటునిటు పచారుచేయుచుండఁగా తెరయెత్తఁబడును. రాణా కుదుటపడని మనస్సుతో ఒకతూరి పుస్తకము తీసికొని పుటలుత్రిప్పి మరల బల్లపై పెట్టును. అటునిటు తిరుగును. ఒక్క గ్రుక్కెడు హుక్కాపీల్చి గొట్టమును బల్లపై పెట్టును. రాణా యిట్లు మనస్సంక్షోభము కనఁబఱచు చేష్టలు ఒకటి రెండు నిమిషములు చేయును.]

రాణా : మీరాయొక్క నడవడి విడదీయరాని చిక్కుగ నేర్పడినది. ఇది యది యని నిర్ణయించుటకు వీలు కాకున్నది. కొందఱు దీనిని మతావేశమని చెప్పుచున్నారు. మతావేశముకూడ యొక మానసిక వ్యాధియనియే నాయుద్దేశము. [సోఫాపై కూర్చుండును] ఔరా ! నాకన్నుల యెదుటనే నా జీవిత మెట్లు మాఱిపోయినది ! ప్రేమకు విషయీభూతమగు వస్తువే ద్వేష ప్రేరకమైనయెడల - ఈరాజ్యమేకాదు, ప్రపంచమునంతయు నేలు వానికైన శాంతిలేదు, ఆనందములేదు. - హృదయము శ్మశానము. జీవితము మరుప్రదేశము. ఇంతకన్న దు:ఖకరమైన ఆంతరిక సంక్షోభము వేఱొండు లేదు. [లేచి అటునిటు తిరిగి] తనకు తెలిసి మీరా నన్ను తిరస్కరించుట లేదు, ద్వేషించుటయులేదు. ఒకప్పుడు తాను వంచించు మాటల ఫలితమును యోచింపలేనంత అమాయికగ నగపడును. ఆకాంత యొనరించు ప్రతికార్యమును తనకు నైసర్గికమైనట్లె తోఁచుచుండును. ఏదియో యొక బలాత్కార శక్తి తన్ను నన్నుండి యాకర్షించుకొన్నట్లు నిస్సహాయమై వర్ణించుచుండును. [మఱల సోఫాలో కూర్చుండును.]

మీరాను పరిత్యజింపఁజాలను. ప్రణయమంజులమైన గతజీవితస్మృతి నాసంకల్పమున కడ్డుపడుచున్నది. ఎప్పటికైనను మీరాను నావంకకు త్రిప్పుకొనగలనను నమ్మకము గలదు.

[బలవంతరావు ప్రవేశించును]

బలవంతరావు : జయము, జయము ధర్మప్రభువులకు!

రాణా : కూర్చుండుము - మీరా ఇపు డెట్లున్నది?

బల : [కూర్చుండి] నిన్నటివలెనే యున్నది. ఔషధ సేవనము వలన ప్రయోజనమేమియు నగపడుటలేదు. దైవానుకూలముగ నా కొక విషయము జ్ఞప్తికి వచ్చినది. భూతచికిత్స చేయించి వేయిమంది సద్భ్రాహ్మణులకు షడ్రసోపేతముగ సంతర్పణ చేయించి, శాంతిచేసిన యడల రాణిగారికి తప్పక జాడ్యము కుదురును !

రాణా : [విసుగుచూపుచు, స్వగతము] ఇతఁడు పురాణ పురుషుఁడు. ఇతని ఇప్పటి యోగ్యత వార్థక్యమే !

బల : భేతాళుని ఆజ్ఞలోనుండి అప్పుడప్పుడు కొన్నిపిశాచములు తప్పించుకొని, భూలోకమునకువచ్చి ప్రజలను బాధపెట్టుచుండునని మంత్రశాస్త్రవేత్తలు చెప్పుదురు. అవి పట్టినప్పుడు ఆవేశమునచ్చినట్లూ, పిచ్చిపట్టినట్లూ ఉండేదికలదు. భల్లూకశాస్త్రులవారు శాతపొడి మంత్రములలో -

రాణా : [విసుగుతో] ఇస్ - ఇఁక చాలింపుము ! ఎంతతెలివి సదుద్దేశములు అపరాధ కళంకమును తుడిచి వేయఁజాలవు. ఇఁక నేను బూటకపు సమాధానముల నమ్మను. ఇదివఱకు నా యనుమానము నిర్హేతుకమని తలఁచి యుంటిని. సందేహ వశంవదుఁడనైన నా యభిప్రాయము నణఁగ ద్రొక్కి నిష్పక్షపాత బుద్ధితో అన్యునివలె విషయ పరిశీలనము గావించితిని ఇప్పుడంతయు స్పష్టమైనది.

శ్యామ : ప్రథమ విచారణయందు దోషములని తేలినవి. కొన్ని పునర్విచారణయందు నిర్దోషములని నిరూపింపఁ బడవచ్చును. మేఘాచ్ఛన్నమైన యాకాశము ఒక్కపెట్టున మేఘ నిర్ముక్త మగుటలేదా?

రాణా : మీ కవితా ప్రియత్వము మన్నింపఁ దగినది.

శ్యామ : దేవరవారు నామనవిని తుదివఱకు చిత్తగింపుఁడు : - అగ్బరు చక్రవర్తి మాఱు వేసమున మన యంత:పురము జొచ్చినది నిశ్చయము. అది అంత:పురధర్మమునకు కేవలము విరుద్ధము.

మాధ : నింద్యమును.

శ్యామ : నింద్యమె, కాని! -

రాణా : [విసుగుతో] కాని యేమి?

శ్యామ : కొంచెము ఓర్పు వహింపుఁడు.

రాణా : నిరర్థక కాలయాపనము !

శ్యామ : అయినను ఇచ్చట కార్యోద్దేశము ముఖ్యముగ గమనింపఁదగిన విషయము. రాణిగారు సర్వభోగములఁ బరిత్యజించి, వైరాగ్యమూని నిరంతరము శ్రీకృష్ణపదధ్యాన పరాయణయై కాలము గడపుచున్నది. ఆమె భక్తురాలను కీర్తి దేశమంతట వ్యాపించియున్నది. ఆమెను దర్శించుటకు వేనవేలుగ భక్తులు వచ్చుచుందురు.

రాణా : ఇంతకు మీమాటలలో స్ఫురించున దేమనఁగా, మీరా యొక లోకాతీతయైన భక్తురాలు, అగ్బరు లోకాతీతుఁడైన పరమభాగవ తోత్తముఁడు, మోక్షార్థియై భక్తిభావనతో అతఁడు మీరాను సేవింప వచ్చెను. ఇంతియేనా ?

శ్యామ : చిత్తము.

రాణా : చక్కగానున్నది విషయకల్పనము! విపరీత వ్యాఖ్యానమునకు కూడ నొక హద్దుండవలయును. ఆత్మవంచనమునకు పరస్పర ప్రతారణమున కిచ్చట నవకాశములేదు. నా వివేకమును మీ రనుమానించు చున్నట్లున్నది. నేను పసిపాపనుగాను [ఉద్రేకముతో] నేను తిరస్కరింపఁబడితిని. వంచింపఁబడితిని. నాబలము, నాశౌర్యము, నాయభిమానము, నాగౌరవము - తుదకు నాస్థితియె ధిక్కరింపఁబడినది, తృణీకరింపఁబడినది. పట్టపగలే నా యంత:పురము గణికా మందిర మైనది. ఇఁక నేమి కావలయును ?

మంత్రులు : రామ! రామ! పాపము శాంతిల్లుఁగాక !

రాణా : [దు:ఖగద్గద స్వరముతో] నా యాశాలేశముకూడ భగ్నమై పోయినది. [మీరాబాయి నుద్దేశించి] మీరా, ఇఁక నీవు నాప్రేమకుఁ బాత్రమవు కావు. నా సంసార మసారమైనది. సుఖస్వప్నము ఆతర్కితముగ భిన్నమైనది. మీరా, నీవు చావ వలయును ! చావ వలయును !

శ్యామ : [తత్తరముతో] మహప్రభూ, - ఏమి నిర్ణయించితిరి. ఘోరము! ఘోరము! ఈ తొందర పాటునకుఁ బశ్చాత్తప్తులు కాఁగలరు. వెనుక చింతించుటకంటె ముందుజాగ్రత మేలు. కోపోద్రిక్త మానసులయి సత్యము నెఱుంగఁ జాలకున్నారు.

రాణా : దుర్బల హృదయులై మీరు సత్యము నెదుర్కొనభయపడుచున్నారు. మీరా భక్తురాలను మీ దురభిప్రాయము సత్య సందర్శనమున కడ్డువడుచున్నది. ఆమాయలాడి రక్తపాతమునఁగాక యీ యపయశో మాలిన్యము సమ్మార్జితముకాదు.

మాధ : హరి! హరి! కొంచెము తడవిండు. నిజము నిలుకడమీఁద తేలఁగలదు. రాణా : కాలము జరుగుకొలఁది దాంపత్యప్రేమ విడంబించి విధినిర్వర్తనమునందు అసమర్థుఁడను గావచ్చును.

శ్యామ : నాచిన్న మనవి యాలకింపుఁడు. ఈ విషయమును గుఱించి రాణిగారేమి సమాధానము చెప్పికొందురో తెలిసి కొనవలయును.

మాధ : అవును. అపరాధిని విచారింపక యెంత యల్పదండనము విధించినను అది న్యాయ్యముగాదు.

రాణా : నాకుఁదెలిసి నేనెవ్వరికి నన్యాయమొనరింపను. ఇంతకుఁ దెగించిన సాహసవతి తనతప్పుల నొప్పుకొనక పోవునా ? అయినను కనుగొందము. పిలిపింపుఁడు.

శ్యామ : రాణిగారు పట్టమహిషి !

రాణా : [కోపముతో] ఇంకను పట్ట మహిషియా ?

శ్యామ : దేవరవారు పట్టభద్రులై యున్నంతవఱకును.

రాణా : [విసుగుతో] నా సంకల్పము నాటంక పెట్టుటకు మీరు పండితులు. నే నిప్పు డేమి చేయవలయు?

శ్యామ : అంత:పురమునకుపోయి రాణిగారిని విచారింపవలయును.

రాణా : [లేచి కొంతదూరము పోయి, వెనుకకు మరలి కోపముతో] ఆపాపిష్టురాలి మొగము నే నింకఁ జూడనొల్లను. [కూర్చుండును]

శ్యామ : అట్లయిన నెవరినైన నియోగింపుఁడు.

రాణా : నే నెవ్వరిని విశ్వసింపఁ జాలను. నేనే పోయి విచారించెదను. ఇప్పుడు నేను భర్తనుగాను. న్యాయాధిపతిని. [లేచును.]

శ్యామ : మాకు సెలవిండు. మరల మాపై మీకు నమ్మకము గలిగినప్పుడు పిలిపింపుఁడు.

రాణా : [వినిపించుకొనక నిష్క్రమించును.]

మాధ : రాజు తననే తాను నమ్మలేఁడు. ఇఁక నితరులను నమ్ముటెట్లు ? శ్యామ : అయినను ఈ సమిష్టి నింద యసహ్యము. మన జీవిత మంతయు ప్రభువు శ్రేయోభి వృద్ధులకు ధారవోసితిమి ! అందుకు ప్రతిబహుమానమేమి?

మాధ : అవిశ్వసనీయుల మగుట!

శ్యామ : మరల రాజమందిరమునకు వచ్చుటకుఁ బూర్వము మనకర్తవ్యమును నిశ్చయించుకొనవలయును. మొదటినుండియు రాజు స్వభావము మన మెఱుంగుదుము. అనురాగము గాని విరాగముగాని అతిగాఢము; భావోద్రేకము కలవాఁడు. వదలక పట్టువట్టి తన యభిమతము నెగ్గించుకొనును.

మాధ : చాలవఱకు న్యాయబుద్ధియుఁ గలదు.

శ్యామ : కలదు; కాని, న్యాయబుద్ధియె తప్పుదారిపట్టి అందుకు ధృడ సంకల్పము తోడ్పడునెడల గుణము విషమించి యవగుణ మగును. ఒకవేళ ఆశ్రయనాశకమును గావచ్చును.

మాధ : మనచేత నైనంతవఱకు విప్పి చెప్పితిమి. మన విధి మన:పూర్వకముగ నిర్వర్తించితిమి. రాజుగారి యకార్యమునందు మనము భాగస్వాములము కాము. ఇఁకమీఁది కర్తవ్యము మీరే నిశ్చయింపవలయును.

శ్యామ : భాగస్వాములము కాము గదాయని తృప్తిపడి యుండకూడదు. పవిత్రశీలయగు రాణిగారు రక్షింపఁ బడవలయును.

మాధ : అవును. మా మంత్ర ప్రయోగమునకు అవకాశ మేర్పడినది.

శ్యామ : సైన్యాధిపతి మన యభిప్రాయమునకు విరుద్ధుఁ డయ్యె నేని అతని నెట్లయిన మనప్రక్కకుఁ ద్రిప్పుకొనవలయును.

మాధ : అదిచాల ముఖ్యము.

శ్యామ : రాణిగారిని సంరంక్షిచుటకొఱకు రాణాగారిని తిరస్క రింపవలసి వచ్చినను అందుకు మనము సంసిద్ధులమై యుండవలయును.

మాధ : నేను మిమ్ము ననుసరించెదను. - కాని, కుమారసింహుఁడు ?

శ్యామ : ఆతఁడు రాజభక్తి యంత్రము. ధర్మమైనను అధర్మ మైనను రాజాజ్ఞ నెరవేర్చును. మన నిర్ణయ మతనికి తెలియకూడదు.

మాధ : అట్లె.

[ఇరువురు నిష్క్రమింతురు.]

స్థలము 8 : రాజమందిరము.

_________

[రాజు ఖిన్నమానసుఁడై, సోఫాపై కూర్చుండి యుండును]

రాణా : ఇంతవఱకె యీ యపవాదము నగర మెల్లెడల మాఱు మ్రోగుచుండును. పనిపాటులేని సోమరిపోతులు రచ్చకొట్టములలోఁ గూర్చుండి గోరంత కింవదంతిని కొండంత సత్యముగ పెంచి వితర్కించుచు, ఆనందించుచు ప్రొద్దు ప్రుచ్చుకొనుచుందురు కాఁబోలు ! ఇంకను ఆ కళంక వతిని బ్రతుకనిచ్చి నందులకు రాజపుత్ర యువకులు నన్ను దూషించుచుందురు. నా బ్రతుకు నగుఁబాట్ల పాలైనది. - ఎంత సాహసవతి ! తన దుష్కార్యమును గప్పిపుచ్చుటకు అసత్య మాడుచున్నది!

[మంత్రులు ప్రవేశింతురు.]

రాణా : [చిత్తోద్వేగము నడచుకొని] అమాత్యులారా, మీరా ఒక దేవత యనియు, సత్యవ్రత యనియు, మీరు విశ్వసించి యుంటిరి. మీ విశ్వాసము మూఢభక్తియనియు అస్థానికమనియు ఆ దుశ్చరితయొక్క యసత్య వాదనమె నిరూపించుచున్నది - వేయినోళ్ళ ఘోషించుచున్నది.

శ్యామ : రాణిగా రేమిచెప్పిరి?

రాణా : పూజ్యురాలైన మీరాణిగారు అంత:పురమునకు నిన్న వైద్యులెవ్వరును వచ్చియుండలేదని సెలవిచ్చిరి.

మాధ : అది యెట్లు ?

రాణా : ఎట్లో బుద్ధిమంతులు మీరే యోచింపుఁడు.

మాధ : [సంశయముగ] రాణిగా రేల యబద్ధ మాడవలయును ? రాణా : ఏలనో కనుగొండు. ఇప్పటికైనఁ దెలియవచ్చినదా మీ రాణిగారి పూజ్య ప్రవర్తనము ?

శ్యామ : [ఆలోచించి] మహాప్రభూ, రాణిగా రేమియు నసత్యమాడలేదు. వైద్యులు వచ్చిన సంగతియే యామె యెఱిగియుండదు.

రాణా : శ్యామలరావ్, మంచి వూఁతమాటలు ! మీరా ప్రాణరక్షణోద్యమము ప్రశంసనీయ మైనను మాకుగల గౌరవమును బలి యీయ నెంచుట నింద్యము.

శ్యామ : పరాభిప్రాయమునించుక సహించుఁడు. నిజము తేలఁగలదు. భక్రిపరవశురాలైన రాణిగారికి వైద్యులు వచ్చునప్పటికి నిహలోక జ్ఞానమంతరించి యుండినది.

మాధ : ఉండవచ్చును.

రాణా : [గంభీరముగ] నా యదికారము నెల్లిదము సేయుటకు మీరు కృతనిశ్చయులైనట్లున్నది. - కానిండు.

శ్యామ : తప్పదలఁచితిరి. మేము న్యాయైక పక్షపాతులము. నిరంతరమును దేవరవారి మేలుగోరు మంత్రులము. మా విధిని నిర్వర్తించుచున్నాము.

రాణా : ఏల యీ వ్యర్థప్రసంగము? నానమ్మకము అవిచార మూలకముగాదు. సత్యము నూహించితిని. నిజ మెఱిఁగిన వెనుక నాకర్తవ్యమును అనుకూలముగ మఱచునంతటి భీరువునుగాను - స్వార్థపరుఁడనూ గాను. నా సంకల్పము న్యాయ్యము. నా న్యాయ్యసంకల్పము శాసనము. నా శాసనము పొల్లుపోవక కొనసాఁగి తీఱవలయును.

శ్యామ : మీ యాజ్ఞ కేలము ధర్మబాహ్యము. మా యంతరాత్మకు విరుద్ధమైన కార్యము మేము చేయఁజాలము. మమ్ము నుద్యోగ విముక్తులను గావింపుఁడు.

రాణా : [ఆశ్చర్య కోపములతో స్తంభితుఁడై చూచి] ఏమీ ? నాయాజ్ఞకు మాఱు పల్కుటయా ? - మీకు మతిభ్రమణము కలిగినదా ? లేక నేను కుంభ రాణా యను సంగతి మఱచితిరా ? మమ్ము పదభ్రష్టుల గావించుటయేగాదు వధ్యశిలయొద్దకు మరణదండనము మీవెనువెంట నంటివచ్చును పొండు. మీ సర్వస్వము మా సైన్యాధిపతి జప్తిచేసి కోశాగారమున కర్పించును.

శ్యామ : సత్యమేవ జయతి. [నిష్క్రమించును]

మాధ : [అనుసరించును]

రాణా : [క్రోధముతో] పాదాన్వితములైన రాజద్రోహ పిండములు నడచిపోవుచున్నవి - ద్రోహులు - తేనెపూసిన కత్తులు - నట్టనడియేట పుట్టిముంచు పాతకులు - వారికి చెడుకాలమునకు బుద్ధి పెడదారి పట్టినది కాఁబోలు ! ఏమివారి అపూర్వప్రవర్తనము ! - ఓరీ.

భటు : స్వామి -

రాణా : పరుగెత్తుము. పొమ్ము. మాసేనాధిపతిని పిలుచుకొనిరమ్ము.

భటు : ఆజ్ఞ. [నిష్క్రమించును.]

రాణా : [ఉద్రిక్త చిత్తుఁడై అటునిటు తిరుగుచు] ఈ యమాత్యుల విపరీత ప్రవర్తనము నాకు బోధపడకున్నది. నన్ను ప్రతిఘటించుటకుఁ దగిన ధైర్యము వారి కెట్లువచ్చెను? ఆ ! యీ ధిక్కారము నేను సహింపఁజాలను.

[సేనాధిపతి ప్రవేశించును.]

సేనాధిపతి : జయము, జయము !

రాణా : ధర్మసింహా, నీవు గుఱ్ఱపు రౌతుల వెంటఁబెట్టుకొనిపోయి అమాత్యుల భవనములను ముట్టడించి, వారి స్థిర చరాస్తులను జప్తిచేసి కోశాధిపతి యాధీనము చేయుము. వారిరువురకు మరణదండనము విధించితిని. ఆజ్ఞా పత్రముగొని దానిని నిర్వహింపుము. సేనా : [ఆశ్చర్యముతో] మరణ దండనమా ! ఎందులకు ?

రాణా : [కోపముతో] ఏమీ? యీ యాజ్ఞా విమర్శన మహామారి యందఱకు వ్యాపించి నట్లున్నది ! - అది నాయుత్తరువు.

సేనా : అమాత్యు లంతటి యపరాధ మేమిచేసిరి?

రాణా : [కోపము నడచుకొనుచు] ఆ విచారము నీ కనవసరము నా పనుపు సేయుము, పొమ్ము.

సేనా : నిరపరాధులను నేను హత్య చేయఁజాలను.

రాణా : ఇది హత్యకాదు. దండనము.

సేనా : నిర్హేతుకమైన దండనము బలాత్కార హత్య.

రాణా : [విసుగుతో] ఇంక వేఱేమి హేతువు కావలయును? సతీత్వమర్యాదను అతిక్రమించిన మీరాకు మరణశిక్ష విధించితిని. అమాత్యులు నాయాజ్ఞను తిరస్కరించిరి.

సేనా : అపరాధ మొనరించినది అగ్బరు, అతఁడు దండ్యుఁడు.

రాణా : [కోపముతో] నీవు నాకు ధర్మోపదేశము చేయునంతటి పండితుఁడవైతివా? అమాత్యులయొద్ద శిక్షపొందితివా ?

సేనా : అపరాధులే దండ్యులగుట న్యాయమని మనవి చేసితిని.

రాణా : ఇరువురును దండ్యులె. ఆ అగ్బరును మాత్రము వదలిత నను కొంటివా ? ఆ దురాత్ముని రక్తపూరము మాయంత:పురమునఁ జల్లించి అంటు వాపెదను. మీరాను శిక్షింపనిదే లోకము సంతృప్తిపడదు - ఈ యనవసర కాలయాపన మెందుకు ? - నాయాజ్ఞను నిర్వహించెదవా? లేదా? - ఒక్కమాట.

సేనా : సంగ్రామభూముల విరోధికంఠ నాళముల నిష్కరుణముగ చెండాడితిఁగాని, ఎన్నడును నిరపరాధులను హత్యగావించి యెఱుఁగను. మీరు నన్ను నిర్భందించుదురేని ఇదిగో! నాయధికార చిహ్నమునకు మీకు సమర్పించుచున్నాను [కత్తిని రాజుపాదములకడ వైచి నిష్క్రమించును.] రాణా : [కోపస్తంభితుఁడై అట్టె కొంతవఱకుచూచి] ఆ! - వీరందఱకు సంఘాతమరణము విధింపవలయును. - అందఱు స్వామిద్రోహులు - ఈవిప్లవకారులు నా నీడయందె పన్నాగించుచున్న యీకుట్రను నేనుశంకింప లేకపోయితిని. అందఱు లంచగొండెలు. అగ్బరుచే లంచములను దీసికొని నా యుప్పుపులుసునకు ద్రోహముచేసిరి ! - వీరిని ముక్కలుముక్కలుగ తఱిగించి గ్రద్దలకు వెదచల్లించినను నాకసి దీఱదు. - ఎవఁడురా అక్కడ? [పలుకరు]

[అటునిటు నాలుగుతట్టుల తిరుగుచు] ఓరీ - [పలుకరు] - ఏమీ? ద్వారపాలకుఁడును లేఁడా? నా జీవితమునం దెప్పుడును ఇటువంటి యాజ్ఞా తృణీకరణము ననుభవించి యుండలేదు. - నా కన్నులయెదుటనే నా పాలనాదండము భగ్నమై పోయినదా ? ఈధిక్కార మసహ్యము ! ఉదయపూర్ రాజ్యాధిపతి ఒక్కక్షణములో నిస్సహాయుఁడయ్యెనా ? - ఇది స్వప్నము కాదుకదా ! [కలయంజూచి] అహో! యిది నగ్న సత్యము ! - కుమార సింహా, నీవును విశ్వాసఘాతుకుఁడవైతివా ?

[కుమారసింహుఁడు ప్రవేశించును]

కుమారసింహుఁడు : మహాప్రభూ, నేను విశ్వాస ఘాతుకుఁడను గాను. స్వామి యాజ్ఞకై వేచియున్నాను.

రాణా : [అతురతతో కౌఁగిలించికొని] కుమారా, నీవొక్కఁడవే నాకు స్నేహస్పదుఁడవు. తక్కినవార లందఱు విప్లవకారులు. స్వామిద్రోహులు. అమాత్యులతోడ నందఱును వెడలిపోయిరా ? ఇది దీర్ఘాలోచితమైన కుట్రగానున్నది. వారి కంత పలుకుబడియుండుట యెప్పటికైన నపాయకరమె.

కుమా : రాణిగారిపై ఆబాల వృద్ధముగ నందఱికిని భక్తి విశ్వాసములు కలవు. ప్రజలును అట్టివారె. దివాణమున నుండిన ఎవ్వరైన మీ యాజ్ఞను నిర్వర్తింపవలసి వచ్చు నేమో యని యందఱు వెడలిపోయిరి. రాణా : నాప్రజలు నన్ను త్యజించిరా ?

కుమా : రాణిగారిని విశ్వసించుచున్నారు.

రాణా : నా సైన్యములు?

కుమా : రాణిగారి సతీత్వము ననుమానింపవు.

రాణా : [యోచనా మగ్నముగ] అమాత్యులు, ప్రజలు, సైన్యములు మీరా సతీత్వము సంశయింపరు ! - నే నేమైన పొరపడితినా ?

కుమా : ఎట్టి వివేకవంతులైనను పొరపడుట కలదు.

రాణా : [యోచించుచు హఠాత్తుగ తలయెత్తిచూచి] కుమారా, నేను పొరపడలేదు. న్యాయమని నాకు తోఁచినయెడల ప్రపంచమునకు ప్రతి స్పర్ధిగ నైన నిలువఁగలను - లోకులు మూఢభక్తులు, గతాను గతికులు; అమాత్యులు దుర్బల హృదయులు, సైనికులు వివేక శూన్యులు. ప్రత్యక్ష సాక్ష్యము మీరా యపరాధమును నిరూపించుచున్నది. - ఇపుడేమి కర్తవ్యము ? - ఎవ్వరును లేరా ?

కుమా : రాజప్రసాద మంతయు నంధకార కులాయముగా నున్నది.

రాణా : [కోపముతో] మీరా రక్తజ్వాలలతో మన ప్రాసాదము మరల నుద్దీప్తము కాఁగలదు. కుమారా, నీవు విశ్వాసపాత్రుఁడవని నే నెఱుంగుదును. నాయాజ్ఞను నిర్వహింపుము. నీవె నాకుఁ గడపటి పట్టుగొమ్మవు. మీరాకు మరణదండన పత్రమును వ్రాసితెమ్ము.

కుమా : రాణిగారిని శిరచ్ఛేదన మొనరించుట కొక్క కటికవాఁడైన నొప్పుకొనఁడు.

రాణా : నీవో -

కుమా : [వెఱగుపడి ఒకయడుగు వెనుకకు పెట్టుచు] నేనా? -

రాణా : అట్లయిన మీరాయె స్వప్రాణ హంతకి కావలయును. అటులనే వ్రాసితెమ్ము. కుమా : [స్వగతము] రాజాజ్ఞ అనుల్లంఘనీయము. [నిష్క్రమించును.]

రాణా : [సంక్షుబ్ధ చిత్తుఁడై గద్గదస్వరముతో] మీరా, నీవు చావవలయునా ? నీ కీ దుర్బుద్ధి పుట్టకయున్న నీ విట్టి చావు చావవుగదా ! భర్తయే భార్యకు మరణదండనము విధించుట ! హా ! ప్రళయం కరోద్యోగము. అసహ్యమైన మానసిక సంఘర్షణము! - నేను రాక్షసుఁడను. - [దు:ఖించును.]

[ఇంతలో కుమారసింహుఁడు ఆజ్ఞాపత్రము వ్రాసికొని తెచ్చి, నిలుచుండి వేచియుండును.]

రాణా : [కొంతసేపటికి తలయెత్తి స్వప్నములోవలె] తెచ్చితివా?

కుమా : [ఆజ్ఞాపత్రమును చేతికిచ్చును.]

రాణా : [చేవ్రాలు చేయఁబోవునప్పుడు, చేయి వడకును, కొన్ని యక్షరములు వ్రాసి నిలుపును. ఎట్లో చేవ్రాలు పూర్తిచేయును.] ఈ పత్రికను మీరాహస్తమునఁ బెట్టుము. ఎంత వేడికొన్నను నాదర్శన మిప్పింపకుము. ఆ కాంత ప్రాణపరిత్యాగము గావించుకొనువఱకు నీ వంగరక్షకుఁడవుగ నుండుము. పొమ్ము.

కుమా : [స్వగతము] అకటా ! నే నీ సతీతిలకముయొక్క యాత్మహత్యకు సాక్షిగ నుండవలయునా ? ఘోరము ! ఘోరము! [నిష్క్రమింపఁబోవును]

రాణా : ఏదీ, పత్రిక నిటుదెమ్ము. చక్కగ చేవ్రాలు చేసితినో లేదో చూతము.

కుమా : [ఇచ్చును.] రాణా : [పత్రికను చూచిచూచి యొక్క బాష్పకణము కార్చిరి. కుమారసింహుని చేతికిచ్చును]

కుమా : [నిష్క్రమించును]

రాణా : [దు:ఖ గద్గదస్వరముతో] మీరా. నీ యపరాధమునకు మరణముకన్న నల్పదండనము వేఱొండులేదు. ఇంకొక్క నిమిషములో చిరపరిచితమైన నీ మోహనస్వరూపము, ఏడెనిమిది సంవత్సరములు నా జీవితమున కమృతంపువర్తియైన నీ ముఖేందుబింబము, మర్త్యలోకమునుండి సమ్మార్జితము కాఁగలదు. నా యాశలు నిరాశలైనవి. నా సంసారము నిస్సారమరు ప్రదేశమైనది. - మీరా,...చచ్చితివి....చచ్చితివి...

[సోఫాలో నొరగఁబడును]

[తెరజాఱును]

స్థలము 9 : యమునానదికిఁ బోవుమార్గము.

_________

[చీఁకటి. అప్పుడప్పుఁడు మెఱయుచుండును. అగ్బరు తాన్‌సేనులు యాత్రికులవేషములతో ప్రవేశింతురు.]

తాన్‌సేను : నేనెంత బ్రతిమాలుకొన్నను వినకున్నారు. మూడు దినములనుండియు మనము మాఱువేసములతో ఉదయపురమున నున్నాము. ఇచ్చట మనము నిస్సహాయులము. మన యునికి రాణా యెఱింగిన ప్రాణములతో మన శరీరములు ఢిల్లీకి పోవు. భారతసామ్రాజ్యము మీ పరిపాలనమున సుఖించుచున్నది. అట్టి మీ యమూల్య జీవితమును బ్రతి నిమిషమునందును అపాయమున కగ్గముసేయుట భావ్యముకాదు. ఇప్పుడే కదలుదము రండు.

అగ్బరు : తాన్‌సేన్, నే నధ:పతితుఁడను. ఉత్సహముచే దీర్ఘాలోచనము సేయ నేరక మీరాబాయిని అంత:పురమున దర్శించితిమి. అంతఁ బోక యానంద జడచిత్తుఁడనై వివేక శూన్యుఁడనై, ఆమెకు వజ్రహారమును సమర్పించితిని. అదియె యా పరమ పావన చరిత్ర మరణదండనమునకు హేతువయ్యెను. ఈ ఘోరపాతకమునుండి నే నెట్లు విముక్తుఁడను కాఁగలను. ఇందుకేమైన ప్రాయశ్చిత్తము కలదా? నా సింహాసనమైనను లేక నా ప్రాణమైనను సమర్పించి యీ పాపమును బాపుకొనఁ గలిగినయెడల నే నందుకు సంసిద్ధుఁడను.

తాన్ : అంతయు దైవికముగ జరిగినది. దైవేచ్ఛకు మానవుఁడు ప్రతికూల కల్పనము చేయఁజాలఁడు.

అగ్బ : అది దైవేచ్ఛయే యగునుగాక ! ఆదైవము మనయెడలఁ బ్రతికూలము. మాఱు వేసములతోఁ బరుల యంత:పురముఁ జొచ్చితినన్న యపవాదము నా జీవితమునకు కళంక మాపాదించుచున్నది.

తాన్ : మీరాబాయి పావన చరిత్రము లోకు లెల్లఱకు విదితము సామాన్యములైన యంత:పుర ధర్మములు మానా వమానముల కతీతయైన యా పరమ భక్తురాలియెడఁ జెల్లవు, మీ సదుద్దేశమును బ్రజలు శంకింపరు.

అగ్బ : ఎట్టులో సమాధానపఱచుకొనుటకు మార్గములు కలవు - కాని, మన తొందరపాటునకుఁ బర్యవసాన మేమి? మీరాబాయి హత్య! - ఇది మరణాంతమువఱకు పీడించు హృదయ శల్యము. ఈ రాత్రియె యామె మరణింపవలయునని వింటిమిగదా!

తాన్ : [ఆలకించి] దారిలో పదశబ్దములు వినవచ్చు చున్నవి.

అగ్బ : [ఆలకించును]

[మీరాబాయియు కొంతదూరమున కుమారసింహుఁడును బ్రవేశింతురు.]

తాన్ : ఏదోయొక స్త్రీవ్యక్తి.

అగ్బ : అమ్మా, మీ రెవ్వరు?

మీరా : పథికురాలను.

అగ్బ : ఎచ్చటి కేఁగుచున్నారు?

మీరా : బృందావనమునకు.

అగ్బ : ఆదారి తప్పివచ్చితిరి. ఈ త్రోవ యమునానది యొద్దకు పోవును.

మీరా : ఇదియే దగ్గరి మార్గము.

అగ్బ : అడవిదారి ఒంటరిగా పోవుచున్నారు.

మీరా : తోడు లేనివారికిఁ దోడ్పడు బంటు ముందు నడచు చున్నాఁడు. అగ్బ : చిమ్మచీఁకటి.

మీరా : ఇదియె యభిసరించుటకు దగిన సమయము.

అగ్బ : నిన్నంత శ్రమ పాలుచేసిన యాకఠిన హృదయుఁ డెవఁడు?

మీరా : నా ప్రాణేశ్వరుఁడు.

                     అఖిల భూభువన పట్టాభిషిక్తుండయ్యుఁ
                             బసుల మేపుట కిష్టపడియె నెవఁడు?
                     బ్రహ్మాండ సంసార బంధముక్తుండయ్యుఁ
                             దల్లి బంధములలోఁ దవిలె నెవఁడు?
                     గోపాంగనా ప్రేమ గోష్ఠీ రతుండయ్యు
                            నిర్మల జ్యోతియై నెగడె నెవఁడు?
                     నిర్జీవ వేణు ప్రణీత గీతుండయ్యు
                            ఱాల నాత్మల రేపఁజాలె నెవఁడు?

                     బర్హిపింఛంబు హొంబట్టు వలువతోడ
                     విశ్వమోహన మూర్తియై వెలిఁగె నెవఁడు?
                     అట్టి శ్రీకృష్ణుఁడే నాకు నాత్మవిభుఁడు;
                     అతని యన్వేషణమె జీవితాంత్య ఫలము!

అగ్బ : ఆ! తల్లీ, ఈపాతకులను మన్నింపుము. [ఇరువురు పాదముపై వ్రాలుదురు]

మీరా : అయ్యలారా, లెండు! మీ రెవ్వరు?

అగ్బ : మీ నిర్హేతుక మరణదండనమునకుఁ గారకులమైన రాక్షసులము. కుమారసింహుఁడు : [స్వగతము] హా! అగ్బరు పాదుషా! రాణా కెఱింగించెదను. [పోఁబోయి] అయ్యో! ఆజ్ఞ లేదే ! అయినను ఈ వార్త రాణాకు ప్రియముగ నుండవచ్చును. తడయజనదు. [నిష్క్రమించును]

తాన్ : ఎవరో పరుగెత్తుచున్నటుల కాలిచప్పు డగుచున్నది!

మీరా : పాదుషా, నీవు నాకుఁ బరమ బంధుఁడవు. నీమూలమున నాకు బంధవిముక్తి కలిగినది. నీవు నిమిత్త మాత్రమైన కీలుబొమ్మవు, సూత్రధారుఁడు సర్వేశ్వరుఁడు.

అగ్బ : తల్లీ, యీ మరణోద్యోగము నుండి విరమింపుము. నా వలన నీవు మరణింప వలసివచ్చె నన్న దు:ఖము సహింపఁజాలను.

మీరా : పాదుషా. అజ్ఞానలేశము నిన్నింకను ఆవరించియున్నది. పరలోకము భయంకరమను అపోహయు, ఇహలోకముపైఁ గల అత్యంత మమతయు మరణమాధుర్యమును విషవంతము చేయుచున్నది. జీవితము నిరంతర ప్రవాహము - ఆద్యంతములు లేనిది. ఒకచోటి చావు మఱియొక చోటి పుట్టుక.మరణము భౌతికపరిణామము. అనివార్యము. అందుకు చింతయేల?

అగ్బ : అమ్మా, మరణ మనివార్యమైన యెడల దానిని జయించుటకు మార్గము లేదా?

మీరా : కలదు. మరణమును చిఱునవ్వుతో నెదుర్కొనుటయె విజయోపాయము.....హృదయేశ్వరా,...యిదిగో! వచ్చుచున్నాను. వాఁడు గో! నా మనోవల్లభుఁడు, నన్ను పిలుచుచున్నాఁడు. [కదలును]

అగ్బ : [పాదములపైఁ బడి] తల్లీ, మన్నింపుము. నిలువుము. నిలువుము!

మీరా : [తొలఁగి] పాదుషా, నన్నంటకుము. [నిష్క్రమించును.]

[నేపథ్యమున మీరాబాయి గీతము పాడుచు పోవుచుండును. ఆగీతము క్రమక్రమముగ సన్న గిల్లును.]

తాన్ : మనహృదయము లింకను పరిశుద్ధము కావలయును?

అగ్బ : ఇదియె కడసారి పాట!

తాన్ : అశరీర గానము ఆకసమునఁ దేలిపోవు చున్నట్లున్నది.

అగ్బ : ఆ గాన మస్ఫుటమై లయించినది. అకటా ! మీరాబాయి నిఁక మర్త్యలోకమునఁ జూడలేము.

                      చిర విరహతాప సంశీర్ణ చిత్త, మీర
                      యభిసరించుచు నున్నది యాత్మనాథు -
              తాన్ : నెన్నడో దివ్యపాదోధి నెడసినట్టు
                      జలకణంబు సంగమ తృష్ణఁ జనెడురీతి.
                                                                    [తెరజాఱును.]

_______

స్థలము 10 : రాజమందిరము.

_______

[రాణా చెదరినవెంట్రుకలతో ఉద్రిక్తచిత్తుఁడై అటునిటు తిరుగుచుండును]

రాణా : మీరా యింతలోన విషముత్రావి యైనను ఉరివేసుకొని యైనను లేక యమునలో దూకియైనను ప్రాణపరిత్యాగము గావించుకొని యుండును. ఓసీ, కాంతాపాత్రనిర్వహణముతో నన్ను మోసగించిన పిశాచీ! నీవు యమునలోనే దూకి చావుము. నీ యపయశో మాలిన్యము గుర్తింపరాక ఆ యమునా జలనీలిమములో మిళితమై పోఁగలదు. నీ చిఱునవ్వు మఱుగున గలయంజూచి] అమావాస్యరాత్రి, కాఱుమబ్బులు నలుదెసలు నావరించి యున్నవి. ఈ వృక్షశ్రేణులక్రింద నాకు నేనే యగపడుటలేదు! చినుకులు గూడ పుటపుట రాలుచున్నవి. అంతయు నాహృదయమువలె గాఢాంధకార మలీమసమైనిశ్శబ్ద సమాధిగ నగపడుచున్నది. [ఆలకించి] ఎవరిదా కాలిచప్పుడు? [మరల నాలకించి] కాదు, కాదు. చెట్లయాకులు కదలుచున్నవి. [పరికించి] ఇచ్చట ఎవ్వరును లేరు. వా రింతవఱకే వెడలిపోయి యుందురా? [కొంత పరిక్రమించి] అచ్చట నేదియో యొక యాకృతి కనఁబడుచున్నది. [కాలిచప్పుడు కాకుండ దగ్గఱకుపోయి కత్తితో పొడుచుట నభినయించి] ఓ! తరుకాండము! అగ్బ రని భ్రమించితిని!

[వెదకుచుండును.]

[కుమారసింహుఁడు ఖడ్గహస్తుఁడై ప్రవేశించును.]

కుమారసింహుఁడు : [స్వగతము] నే నెచ్చట వెదకినను వారిరువురు నగపడలేదు. ఈ చెట్ల నీడలో దాగుకొని యుందురు. [అటునిటు పరికించి] అదిగో! చీకటిలో నస్పష్టముగ నటునిటు తిరుగుచున్న వ్యక్తియె అగ్బరు పాదుషా. ఆతని యీకత్తిచే నొక్క పోటు పొడిచి నా స్వామి ఋణమును దీర్చుకొందును. [మెల్లగాపోయి పొడిచి] అగ్బర్ పాదుషా, యిది యుదయపూర్ రాజ్యాధిపతి యాజ్ఞ. నీ దుండగమునకు దగిన మరణదండనము - నా స్వామి ఋణము దీర్చుకొంటిని.

రాణా : [తరుకాండమున కానుకొని బాధ నభినయించుచు] అయ్యో! ప్రమాదము! కుమారా, చచ్చితిని, చచ్చితిని.

కుమా : [దు:ఖోద్వేగముతో] హా! స్వామి ఘాతుకుడను. అయ్యో, తండ్రీ, నీవేల యింతలో నిచ్చటకు వచ్చితివి? హతవిధీ, తలపట్టి యీడ్చుకొని వచ్చితివా? ఈదు:ఖము దుర్భరము. మీ సేవకుడు మిమ్ము ననుసరించుచున్నాడు. [నడుము కట్టులోనున్న ఖడ్గముదూసి పొడుచుకొని] తండ్రీ, మన్నింపుము. మన్నింపుము. - విధి - చేష్ట - వి - ధి - చే - ష్ట - [మరణించును.]

రాణా : [తరుకాండము క్రిందికిజాఱి] కుమారా, స్వామిభక్తున కనురూపమె నీప్రాణ పరిత్యాగము, ప్రయోజనమేమి? నావైన ఏల బ్రతుకవు? తలంపని చోటనుండి కులిశాఘాతము! ఎంత ఘటనా వైపరీత్యము.

ఓరీ, అగ్బర్, నీకింకను మంచి దినములుగలవు; నీవు బ్రతికితివి. నే నిప్పు డశక్తిమంతుఁడను. ఒక్క నిమిషములో మరణింపనున్నాను. కాని, నీకుమాత్రము దండనము తప్పదు. నా యవమానమును కులావమానముగఁ దలంచిన యే రసపుత్ర వీరుఁడైనను నా మనో నిశ్చయమును నెరవేర్పఁగలఁడు. రక్తజ్వాలా భయంకరమైన నా యభిశాపము పిడుగువలె నీ తలపై ప్రేలఁ గలదు.

[అగ్బరు తాన్ సేనులు ప్రవేశింతురు.]

అగ్బరు : ఎవఁడో వేదనా భరితుఁడు నన్ను నిందించుచున్నాఁడు. [దగ్గఱి] అయ్యా. మీ రెవ్వరు? అగ్బరు నేల శపించుచున్నారు?

రాణా : [వేదనా గద్గదస్వరముతో] ఆ పరమపాతకుని నామమును మీ రేల యుచ్చరించెదరు? ఆమొగలాయి కులకలంకుఁడు నన్నారడిపుచ్చి నా యిల్లాలిని దొంగిలించుకొని ఢిల్లీకి పాఱిపోవుచున్నాఁడు.

తాన్‌సేన్ : ఇదియేమి భ్రాంతి ?

అగ్బ : మీకేల యింత దురవస్థ కలిగినది?

రాణా : విపరీత సంఘటనము.

అగ్బ : అగ్బరును చంపింప నెంచి మీరే చంపఁబడితిరా?

తాన్ : పాదుషాకు ప్రాణాంతకమైన గండము తప్పినది.

అగ్బ : కుంభరాణా.

రాణా : నారాజ్యమున నన్ను బేరుపెట్టిపిలచు మానవుఁ డెవ్వడు? విషదిగ్ధమగు కోఱల నెట్లు దాఁచుకొని యుంటివి? - నే నెంతబుద్ధిహీనుఁడను! ఇంకను ఆ కులభ్రష్టవిషయమై చింతించు చున్నాను; దాని మనోహర ప్రతిమను నాహృదయమునుండి బలాత్కారముగఁ బెఱికివైచితిని. కాని, మచ్చ మాత్రము మాసిపోదు.

ఒక్క దినములో వార్థక్యము వచ్చినట్లు తోఁచుచున్నది! నా జీవితపు పునాదియే సడలినట్లు కదలుచున్నది. నేను కుంభరాణాకన్న నన్యుఁడను భ్రమపుట్టుచున్నది - నాస్మృతి పథమున జీవించియున్న కుంభరాణా, ఇప్పటి నన్ను నీ వెక్కిరింపకుము! - ఆ! గతస్మృతి! ఇది మరణదండనమున కన్న హింసాకరము! ఘోరము!

[కుమారసింహుఁడు ఎగుఊపిరితో పరుగెత్తుకొనివచ్చును]

కుమారసింహుఁడు : అగ్బ రిచ్చటనే యున్నాడు.

రాణా : ఎక్కడ? అంత:పురములోనా?

కుమా : కాదు. యమునామార్గమున రాణిగారిని నే ననుసరించు చుంటిని.

రాణా : కానిమ్ము, ఒక్కమాటలో చెప్పుము! ఎక్కడ?

కుమా : అచ్చట నొకచోట నిద్దఱు మనుష్యులు ఆమెతో మాటలాడుచుండిరి. వారిలో నొకడు "మీమరణ దండనమునకు కారణమైన రాక్షసులమని చెప్పుచుండెను. నేను పరుగెత్తుకొని వచ్చితిని. అతడే అగ్బరు కావలయు.

రాణా : [కోపముతో] ఆ దుశ్చరితుఁడే అగ్బరు కుమారసింహా, నీ వేల యింత మందబుద్ధివైతివి? ఆ యంత:పుర ద్రోహి ప్రక్కలో నొక్క కత్తిపోటు పొడిచి యా సంతోషవార్తను దెచ్చుటకుమాఱు ఊరకయేల బేలవై పరుగెత్తుకొని వచ్చితివి?

కుమా : [చేతులు పిసుగుకొనుచు] ఆజ్ఞకొఱకు. రాణా : ఓరి, దుర్బలహృదయుఁడా. కాలు దవిలిన విష సర్పమును చావమొత్తుట కెవరియాజ్ఞ కావలయును? పొమ్ము! ఱెప్పపాటులో ఆస్థలము చేరుము. నీ పిడిబాకుతో వాని హృదయమును జీలిచి ఆరక్తపూరములో నీ రుమాలు గుడ్డను తడిపి కొనిరమ్ము. [చేతిగుడ్డను విసరి కుమారసింహునితట్టు పాఱవేయును; కుమారసింహుఁడు వంగి అందుకొనును]

ఆ దురాత్ముఁడు మీరాను ఢిల్లీకిఁ దీసికొనిపోవుటకు వేచియున్నాఁడు. అదియె వారు నిర్ణయించుకొన్న సంకేతస్థలము. - ఇంకను నీ విచ్చటనే యున్నావా? పరుగెత్తుము. ఎగిరిపొమ్ము. [కుమ్మరసింహుఁడు నిష్క్రమించును] వంటయిలుసొచ్చిన కుందేటిని వదలివచ్చితివి.

ఓరీ! పాదుషా, నీకు దగిన శిక్షను నీవు పొందనున్నావు. ప్రాణములతోడ నీవు మరల ఢిల్లీకిఁబోవు. ఓ మృత్యుదేవతా, ఈనాఁటిరాత్రి నీకుఁ జేతినిండ పనిదొరికినది. ప్రళయంక రోన్మత్త నృత్యము గావింపుము.

ఆఁ! యిసీ! నేనెంత మందమతిని? ఎంతపొరపడితిని? నాయంత:పురము నారడి వుచ్చి, నా యానంద భాండమును బగులఁ దన్ని, మా పవిత్ర వంశ యశమును అపవాద దూషితము గావించి, నన్నిట్లు పిచ్చిబికారిని జేసిన యా నరాధముని ఈ కరవాలమునఁ గ్రుమ్మి యాతని మరణవేదన నా కను లారఁ జూడకున్న నా హృదయ సంతాప మెట్లు తీఱును? అగ్బర్, నీకు మృత్యు వాసన్నము. [ఖడ్గహస్తుఁడై వేగముగ నిష్క్రమించును.]

[యవనిక జాఱును.]

స్థలము 11 : యమునానదీ మార్గము.

________

[గాఢాంధకారము. రాణా ఖడ్గ హస్తుఁడై ప్రవేశించును.]

రాణా : ఇదియేనా యమునకుఁ బోవుమార్గము ? [నలుప్రక్కలఁ అగ్బ : అగ్బరు మీ యంత:పురముఁ జొచ్చినది నిజము. తన జీవితమును పునీతముచేసి కొనుటకై పరమ భక్తురాలైన మీరాబాయిని సందర్శించెను. ఆమె పాదరజ: ప్రసాదము యాచించుట కొఱకు సాధారణ ధర్మములు లెక్క సేయక పాదుషా సాహసించెను.

రాణా : [భూమిపైనుండి సగము నిక్కి] ఏమీ? అగ్బరు మీరాను మోహింపలేదా?

అగ్బ : తల్లి స్తన్యపానము చేయుచున్న పసిబిడ్డకు మోహ మంట గట్టు నీచు డెవ్వఁడుండును?

రాణా : నీవెవ్వడఁవు? అగ్బరు సహాయులలో నొక్కఁడవా?

అగ్బ : నేనే అగ్బరును.

రాణా : [క్రోధముతో] అగ్బర్! [దూరముగ పడియుండిన కత్తి కయి చేయి తడవును]

అగ్బ : [కత్తితీసికొనివచ్చి కుంభరాణా కందించుచు] నా మరణమువలన నీ హృదయము నీ మరణకాలమున క్రోధరహితమయి, సుఖవంతమగు నేని నన్ను వధింపుము. ఇదిగో! అనాచ్ఛాదితమైన నా వక్షస్థలము. [మోకాలుపైన వంగును]

తాన్ : ఏమి యీ సాహసము? [చేయిపట్టుకొని పైకి లాగును]

రాణా : [ఇతి కర్తవ్యతా మూఢుఁడయి, ఆశ్చర్య స్తంభితుఁడయి] పాదుషా, నీవు సత్యము పలుకుచున్నావా? ఇంతదనుక నన్ను బాథించుచున్న సంశయము కేవలము స్వప్నమా? మీ రిరువురును నిరపరాథులా?

అగ్బ : రాణా, నీ యెడల నాకు జాలి కలుగుచున్నది. మీరాబాయి మాతల్లి. నే నామె పుత్రుఁడను. ఇంతకన్న నెక్కుడుగ నేనేమి చెప్పఁగలను? నీకేల యింత భ్రాంతి కల్గెను?

రాణా : పాదుషా, నా హృదయమున మెరముచుండిన శల్యమును పెరికి వైచితివి. నాకు నీవు ప్రబలద్వేషి వయ్యును ఇప్పుడు పరమాప్తుఁడ వైతివి. సంశయ గ్రస్త చిత్తుఁడనై బ్రతికియుండుటకన్న సత్యమెఱుంగుట కాస్పదమైన యీ మరణమె సుఖవంతము. అగ్బర్, నా మీరా యేమైనది?

అగ్బ : ఆ పతివ్రతా శిరోమణి యమునాగర్భము నాశ్రయించినది.

రాణా : [గద్గదస్వరముతో] హా! పరమ పాతకుఁడను. ఆ అమాయికను నిష్కారణముగ హింసించినందులకు దు:ఖించెదను. మందమతినై తప్పుజాడపట్టితిని. స్వయంకృతాపరాధమునకు తగిన చరమశిక్ష ననుభవించు చున్నాను. - అబ్బా, భ్రమ కప్పుచున్నది. - మీరా - మీరా - క్షమాపణము వేడికొనుటకై నీయొద్దకే వచ్చుచున్నాను. - పాపాత్ముఁడనని పెడ మోము పెట్టకుము. నీ యెదుట నంజలి బద్ధుఁడనై నా యపరాధము నొప్పుకొందును. మీరా - మీరా - మన్నింపుము - కనికరింపుము - మీ - రా - మీ - రా - రా - రా - [మరణించును.]

అగ్బ : రాణా మరణమునకన్న నా బ్రతుకే శోచనీయము. ఆతఁడొక్కసారియే మరణించెను. నేను ప్రతిక్షణము మరణవేదన ననుభవించు చున్నాను.

తాన్ : మృత్యువు దైవముయొక్క అమోఘాస్త్రము.

అగ్బ : అజ్ఞాతముగ మన మీ ఘటనావర్తములోని కీడ్వఁబడితిమి.

                      పరమభక్తురాలి పదములు సేవింప
                      భక్తితోడ నిటకు వచ్చినాఁడ,
                      దైవఘటన మెట్లు తలపోతు? మరలెద
                      రక్తసిక్తమౌ కరంబుతోడ.

                                                                             [తెరజాఱును.]

సంపూర్ణము.

29-10-1924

______:(0):_______

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.