కవికోకిల గ్రంథావళి-3: నాటకములు/కాంగ్రెస్‌వాలా

వికీసోర్స్ నుండి






కాంగ్రెస్‌వాలా.

ఏకాంక రూపకము

1935. ఏప్రెల్

పాత్రలు

________

వెంకటరెడ్డి కాంగ్రెసువాలా
నరసింహం కాంగ్రెసు వాలంటీరు
రంగారావు రవీంద్రుని శాంతినికేతన విద్యార్థి
కళ్యాణరెడ్డి పుదుచ్చేరి అరవిందు ఆశ్రమవాసి
లాల్‌గుడి వెంకటేశయ్యరు హోటల్ సొంతదారు
జంగ్లి ఎంగిలిప్లేట్లు తీయు ఏనాది
గమళ్ళ వెంకటేసు ఆతనిభార్య - బిడ్డ; రోగి - ఆమెబిడ్డ రంగనాయకుల తిరునాళ్ళ చూచుటకు వచ్చిన యాత్రికులు
ఇద్దఱు విద్యార్థులు
ప్లీడరు - ఆయనభార్య


కాంగ్రెస్‌వాలా

[ఏకాంకరూపకము]

స్థలము 1. నెల్లూరు.

[లాల్‌గుడి వెంకటేశయ్యరు కాఫీహోటలు. కాఫీ హోటలులో నాలుగు అంకణముల గది. గోడలకు కాంగ్రెస్ నాయకుల పటములు, రవివర్మా పటములు తగిలించఁబడియున్నవి. వాకిలికి ఎదురుగా నున్న గోడపై గడియారపు స్టాండు అమర్చఁబడి దానిపై వెంకటేశ్వరుల పటము పెట్టఁబడియున్నది. చిన్న యిత్తడి శెమ్మె, సాంబ్రాణి వత్తుల స్టాండు, పటము ప్రక్కన నున్నవి. ఒకమూల చిన్న టేబిలుపై గ్రామో ఫోను, ప్లేట్లు, ఎలక్‌ట్రిక్ ఫ్యాన్ (fan) పెట్టబడియుండును. తెరయెత్తునప్పటికి ఎంగిలి ప్లేట్లు - తామరాకులతో నిండిన టేబిలు కనబడును.

రంగారావు ప్రవేశించును. ఈయన వయస్సు షుమారు ఇరువదిరెండు సంవత్సరములుగ నుండును. చెవులమీదికి వ్రేలాడు పొడుగాటి క్రాపు వెండ్రుకలు, కంటికి 'ప్రిన్సునెజ్‌' సులోచనములు, వేస్టుసిల్కు పక్కజోభీ కుడితిని, సిల్కుకద్దర్ బెంగాలీకప్ప, చేతి గడియారము, కుడిచేత జపానుదేశపు ఎదురుకఱ్ఱ, ఎడమచేత (hand camera) చేతిక్యామర ఇవి రంగారావు అనివార్య బాహ్యలక్షణములు; అలంకారములు.]

రంగారావు : అయ్యర్. [ఎవరు పలుకరు.] [సులోచనములు సర్దుకొనుచు నలువైపులచూచి] ఈహోటళ్ళుకూడా మన భాగ్యవంతుల బంగళాలాగే పటాలంగళ్ళుగా తయారయ్యాయి. డెకరేషన్(decoration) కూడా వొక ఆర్టని, ఆర్డరు - అరేంజిమెంటు - టేస్టు - అనేవి ఈప్రపంచములో వున్నాయని వీళ్ళకు తెలియకపోవడం ఘోరం. [ఈగలు మూగుచున్న ఎంగిలి ప్లేట్లను తామరాకులనుచూచి] పూర్వకాలంలో తామర పూవులపైకి తుమ్మెదలు మూగి ఝుంకారం చేస్తూవుండేవని కవులు వర్ణించేవారు. ఇప్పటి కవులు, ఈలాంటి హోటళ్ళలో ఎంగిలి తామరాకులపైకి మూగే ఈగల అవ్యక్తమధుర గానాన్ని అభివర్ణించవలసి వుంటుంది. - అయ్యర్ - [కఱ్ఱతో టేబిలు తట్టును.]

అయ్యర్ : [ప్రవేశించి] కూసుకోండిమి. ఏం తెచ్చేదండి.

రంగా : ఆ సంగతి తర్వాత, ముందు ఈకవితా సామగ్రిని తీసి వెయ్యించండి. అయ్య : ఆ జంగ్లీగాడ్దెకు ఎన్నిమాట్లు చెప్పినా దినం కొత్తేనండి ఏమిరా జంగ్లీ - ఏమి చేస్తున్నావురా? = ఈప్లేట్లు తీసివేయ్.

[ఇంతలో ఏనాదివాడు బక్కెటు పట్టుకొని వచ్చి ప్లేట్లను ఆకులను దానిలో వేసికొని ఒక మురికిగుడ్డతో టేబిలును తుడిచిపోవును.]

అయ్య : స్వీటు కావలిస్తే - బాదంహల్వా, రవాకేసరి, మైసూర్‌ పాక్, లడ్డూ, జాంగ్రీ, పాల్‌కోవా, గులాబ్‌జాన్, గౌరీజాన్, ఎట్‌సెట్రా. కారం కావలిస్తె - కారాబూంది, పగోడి...

[కళ్యాణరెడ్డి ప్రవేశించును. ఈయన మల్లు చొక్కాతొడిగికొని గోరంచు ఉత్తరీయము వేసికొనియుండును. వయస్సు షుమారు ముప్పది సంవత్సరము లుండును.]

కళ్యాణరెడ్డి : ఓహో! ఎప్పుడొచ్చారండీ, రంగారావుగారూ?

రంగా : వారంరోజులైంది.

కళ్యాణ : చాలరోజులకు దర్శనం.

రంగా : మీరు గ్రామంలోనే వున్నారా?

కళ్యాణ : లేదండి. నేను పుదుచ్చేరి ఆశ్రమంలో వున్నాను.

రంగా : ఓహో!

కళ్యాణ : [అయ్యరు తట్టు తిరిగి] ఏమున్నాయండి.

అయ్య : రవాకేసరీ, బాదంహల్వా, మైసూర్పాక్, జాంగ్రీ, గులాబ్‌జాన్...

[వెంకటరెడ్డి ప్రవేశించును. కుడితిని, పంచె, ఉత్తరీయము, టోపీ ఖద్దరువి. చేతికి తగిలించుకొన్న ఖద్దరుసంచిలో ఒక పుస్తకము, ఒక వార్తాపత్రిక, కరపత్రము లుండును.]

అయ్య : [వెంకటరెడ్డితట్టు తిరిగి] కారాబూంది, అటుకులు. మైసూరుబోండా...

వెంకట : [విసుగుతో] ఇంక చదువుచాలిస్తూ. [సీరియస్ గా] సరోజనీ హల్వా, బజాజ్ వుప్పుమా, నెహ్రూ చట్నీ, గాంధీ అటుకులు తెచ్చిపెట్టు.

[రంగారావు కళ్యాణరెడ్డి ఒకరి మొకము నొకరుచూచి నవ్వుకొందురు.]

అయ్య : ఆగోడ తట్టుచూడండి. ఇంకా తిలక్, పటేలు, ఆండ్రూస్, దాస్ - పటాలపేర్లు రాలేదు - తిలక్ పగోడి, పటేలు బజ్జి, అండ్రూస్ సేమియాపాయసం తెమ్మంటారా?

వెంకట : అయ్యర్, నీఅధికప్రసంగంతోనే మాకు కడుపు నిండింది. తక్కినవాటికి చోటేది?

అయ్య : మీరేం తెమ్మన్నారండీ?

రంగా : బాదంహల్వా.

కళ్యాణ : అటుకులు.

అయ్య : [లోనికిపోవును]

రంగా : [లేచి] ఈగదిలోనకి గాలే దూరదు. పైగా పొగ ఒక విశేషం. [ (fan switch) - ఫ్యాన్‌ స్విచ్ వేయును - అది తిరుగదు] ఇది కూడా ఒక అలంకారంలాగె వుంది. [కూర్చుండును.]

[అయ్యరు రంగారావుకు కళ్యాణరెడ్డికి చెరియొక ప్లేటు పెట్టి వెంకటరెడ్డికి మూడు ప్లేటులు పెట్టును. వెంకటరెడ్డి ఆతురతతో తినుచుండును. కళ్యాణరెడ్డి మెల్లగా చిటికెడు అటుకులు తీసుకొని నోట వేసికొనును. రంగారావు స్పూను

కొనతో సెనగగింజంత హల్వా తీసికొని నోరు మెదల్పక చప్పరించుచుండును.]

రంగా : వెంకటరెడ్డి తలయెత్తక నమలుచుండుట చూచి] మన వాళ్ళకు తినడంకూడా ఒక ఆర్టని ఇంతవఱకు తెలియదు. వాళ్ళు తినడం చూస్తే చాలా బార్బరస్ గా (barbarous)వుంటుంది.

కళ్యాణ : [ఈ రిమార్కు తనకుకూడా అన్వయించునను అనుమానముతో అటుకులు మెల్లగ నములుచుండును.]

వెంకట : దినానికి ఒక్క పూటకూడా కడుపునిండా అన్నము దొరకనివాళ్ళు లక్షలకొలది మన దేశంలో వున్నారు. అటువంటివాళ్ళకు తినడం ఆవశ్యకంగా యేర్పడుతుందిగాని శిల్పంగా వుండదండి.

రంగా : [స్పూను క్రిందపెట్టి చేతి రుమాలుతో మూతి తుడుచుకొని] మీరేమైనా అనండి, ఎక్స్‌క్యూస్‌మి (excuse me) మీ పేరేమండి?

వెంకట : వెంకటరెడ్డి.

రంగా : మిస్టర్ వెంకటరెడ్డి, గాంధీ ఉద్యమం ప్రబలమైనప్పటి నుండి మన దేశంలో చాలా హల్లకల్లోలం బయలుదేరింది. కవిత్వంపైన ఆర్టుపైన ఉత్సాహం తగ్గింది. మొరటుతనం హెచ్చింది.

కళ్యాణ : శాంతిలోవుండే సౌందర్యం పోయింది.

రంగా : ఇదంతా గాంధీకి (aesthetics) ఈస్తటిక్సు, ఆర్టు, తెలియని లోపం. A thing of besuty is a joy for ever అని అన్నాడు కీట్సు. అసలు స్త్రీ ప్రకృతి చాలా సున్నితమైనది; ఆలాంటి మల్లెపూలవంటి స్త్రీలకు మొరటుఖద్దరు కట్ట బెట్టి, వారిచేతికి జెండాలిచ్చి ఎఱ్ఱ టెండలో వీథులు తిప్పించి, లాఠీచార్జీలకు గుఱిచేయించిన దానికంటే ఘోరం, పాపం, అక్రమం, అన్యాయం ఫిక్ షన్ (fiction) లో కూడా వుండదండి. గాంధి ఆర్టును మర్డరు (murder)చేశాడు.

కళ్యాణ : కొంపదీసి పాఅలిటిక్‌స్‌లో యాక్‌షన్ (action) తెచ్చి పెట్టాడు.

వెంకట : [నములుచున్న పదార్థం మ్రింగి]మీ పొరపాటు చాలా శోచనీయంగావుందండి. మీరు తెలుసుకోగలిగిన దానికంటే గాంధీ చాలా గొప్ప ఆర్టిస్టు. ఆయన ఆర్టును తెలుసుకోవలెనంటే మీకు ఇంకా కొంత యథార్థమైన (culture) కల్‌చర్ కావాలె. ఆయన క్యాన్ వాస్ (canvas) అయిదారడుగుల చుట్టుకొలత కలదిగాదు; హిందూదేశమంత విశాలమైనది. ఆయన న్యూటన్ కంపెనీ రంగులతో చిత్రింపడు. లోక కళ్యాణానికి ఆత్మార్పణం గావించిన తన నిరాడంబర జీవితం నుండి అపూర్వమైన త్యాగసౌరభం ఈ అనంతభారతీయాకాశాన్నంటి ఇంద్ర ధనుర్వర్ణములతో ప్రభాతరాగ జ్వాలలను చిత్రిస్తున్నది. ఆ మనోహర దృశ్యం ప్రపంచమంతట అన్ని జాతులవారిని ఆశ్చర్యముగ్ధులను గావిస్తున్నది.

రంగా : కాంగ్రెసు వాళ్ళల్ణోకూడా కొంత పోయిటిక్ టచ్ (poetic touch) ఉందన్నమాట! ఎ రెవెలేషన్! (a revelation!)

వెంకట : నామాటల్లో కవిత్వం గాదు ప్రధానం, విషయం.

కళ్యాణ : మా మహర్షి విషయగర్భితంగా కవిత్వము వ్రాస్తారు. చిత్తరంజనుని సాగరసంగీతం ఇంగ్లీషు కవిత్వంలోకి తర్జుమాచేశారు. మీరు చూశారా? అందులో సముద్రఘోష ప్రతిధ్వనిస్తుంటుంది.

వెంకట : ప్రజాఘోష ప్రతిధ్వనిస్తే బాగుండేదేమో. - ఇప్పుడు మీబోటివారంతా A thing of besuty is a joy for ever అని పాఠం వొప్పజెప్పి సంతృప్తిపడుతుంటే, గాంధీ ఆ thing of beauty ని తన దైనందిన జీవితంలో సమ్మేళనంచేసి ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. మీస్థూలదృష్టికి ఏది వికారంగా కనబడుతుందో, ఆయన అంతశ్చక్షువుకు అది రమణీయంగా కనబడుతుంది. మీ కేది త్యాజ్యమో ఆయన కది పూజ్యము.

కళ్యాణ : [రెండు చిటికెలు అటుకులు నోట్లో వేసుకొని నమలుచు] గాంధీ ఆర్టిస్టు కాకపోవడంవల్ల మనకేం బాధలేదు. అయితే పవిత్రమైన ఆధ్యాత్మిక తత్త్వాన్ని పాలిటిక్‌స్‌తో సాంకర్యం చేసి రచ్చకీడ్చి నానా గోలపెట్టాడు. హిందూదేశం పూర్వం పరమఋషులున్న తపోభూమి. ఇప్పటికికూడా మా మహర్షివంటి మహనీయులు అక్కడక్కడ లేకపోలేదు. ఇటువంటి పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణంలో రాక్షసమైన (politics) పాలటిక్సును తెచ్చి పెట్టి దేశశాంతికి భంగం కలిగించాడు గాంధి. అందువల్లనే మా మహర్షి పుదుచ్చేరి వదలి రావడం లేదన్నాడు. ప్రపంచాన్నంతా ఆధ్యాత్మికంగా ఒక్క సారి వుద్ధరించడానికి మాగురుదేవుడు ఆ దివ్యశక్తిని పాపభూయిష్ఠమైన యీ ప్రపంచంలోకి అవతరింప జేస్తున్నాడు. అది సూర్యమండలం దాటింది; చంద్రమండలంలోకి ప్రవేశించింది; ఇక కొన్నిదినాలకు మేఘమండలంగూడా వ్యాప్తిస్తుంది. అప్పటికి మన హృదయాలన్నీ చాలా (receptive state) రిసెప్‌టివ్ స్టేట్ లో వుంచుకో వాలె. పాలిటిక్‌స్ దానికి ప్రతిబంధకం.

వెంకట : అయ్యర్ - కాఫీ.

రంగా : ఎందుకండీ.

వెంకట : తాగడానికి.

రంగా : మిమ్ములను గాదండి.

కళ్యాణ : పాలిటిక్సు (politics) యీ లోకానికి సంబంధించిన గోల; మానవశరీరం క్షణికం; ఇక దానికి సంబంధించిన ప్రతిదీ క్షణికమె. ఆ దివ్యశక్తి క్రిందకు అవతరిస్తే ఒక్క హిందూదేశమే గాదు; ప్రపంచానికంతా ముక్తి గలుగుతుంది. వెంకట : ఆ దివ్యశక్తి బీహారు భూకంపం లాగా నాలుగుచోట్ల వస్తేనేగాని అందరికి ఒక్కసారిగా ముక్తిగలుగదు. ఉట్టికెక్కలేనివాళ్ళు స్వర్గానికెక్కుతారట!

రంగా : ఈకాంగ్రెస్ క్రీడులోనే వుంది యీ తలబిరుసుతనం నాజూకుగా మాట్లాడేది వీళ్ళకు తెలియనే తెలియదు.

అయ్య : [వెంకటరెడ్డికి కాఫీతెచ్చి యిచ్చును.]

వెంకట : [రెండుగుక్కలు త్రాగును.]

కళ్యాణ : గాంధీ లోకాన్ని పట్టుకొని యింకా వూగులాడుతున్నాడు. ఆయన్ను సెయింట్ (saint) అనడం అక్రమం. అందరి కళ్ళకు కనబడుతూ అందరితో మాట్లాడేవాడు సెయింట్ కానేకాడు. సెయింట్ అంటే మా మహర్షికి ఒక్కడికే చెల్లుతుంది. ఒక్క మదర్ (mother) కు తప్ప ఆయన ఇంకొక మానవుడి కంటికి కనబడడు. ఆయన స్పెన్సరు కంపెనీ చుట్టలు తప్ప మరేవి తాగడని అందరూ అనుకొంటారుగాని ఆయన వుద్దేశం వీళ్ళెవరికి తెలియదు.

వెంకట : మీకు తెలిస్తే చెప్పండి

కళ్యాణ : గాంధి ద్వేషంతో పరదేశి గుడ్డలను తగులబెట్టించాడు. మా మహర్షి ఏమాత్రం ద్వేషబుద్ధి లేకుండా పరదేశీ వస్తువును ప్రయోజనకరంగా తగులబెడుతున్నాడు. ప్రేమలో వైరాగ్యం సాధిస్తున్నాడు. ప్రకృతి పురుషుల సంయోగమె సృష్టికి మూలమని ఋజువుచేశాడు. -

అయ్య : [టీ తెచ్చి పెట్టును.]

రంగా : మా గురుదేవుడికి మోస్తరే మహర్షికికూడా ఇన్‌టర్ నేషనల్ ఔట్ లుక్ (international out-look) వుంది. మహర్షి చాలా గ్రేట్ జీనియస్! (great genius) అందుకు ఏమాత్రం సందేహం రంగా : కూర్చోండి. ఆ అటుకులు తీరా తీసుకోండి. - మీరు సాధనాలేమైన ఉన్నాయా?

కళ్యాణ : ఆ విషయం రహస్యం. మదర్ (mother) ఆజ్ఞ.

రంగా : ఇంత రహస్యం రామకృష్ణ పరమహంసకు కూడా లేదనుకొంటాను. - అయ్యర్, one cup tea.

వెంకట : పాపం! పరమహంసకు ఆ రహస్యంలోనే వుంది చితంబర రహస్యమంతాను. నన్ను విప్పి చెప్పమంటారా?

కళ్యాణ : నిన్నుంచి కాదుగదా మీగురువునుంచీ కాదు.

వెంకట : మహర్షి కాకపూర్వం ఆయన రాజకీయంగా చాలా ప్రబోధం కలిగించాడు దేశంలో; ఒప్పుకొంటారా?

అయ్య : [టీ తెచ్చి పెట్టును.]

రంగా : నిజమె! [ఒక గుటికెడు టీ త్రాగును]

వెంకట : తర్వాత కేసులో తప్పించుకొని తన్ను నమ్మివుండిన స్నేహితులని నట్టేటిలో పుట్టెముంచి పుదుచ్చేరిలో మకాం వేశాడు. ప్రజలంతాకూడా ఈమహానుభావుడు మళ్ళి వస్తాడు, రాజకీయచక్రం తిప్పుతాడు అని ఎదురుచూస్తుండినారు. ప్రజల నిరీక్షణం ఆయనకు గడబద్ధకమైంది. రాజకీయంగా ఏమీ చేయలేమని అనుకొన్నాడు. ఆ ఉద్దేశానికి ముసుగువేశాడు; ఆధ్యాత్మికంగా ముసుగులో తానూ కూర్చున్నాడు. ముసుగు అక్కడక్కడా చినిగిపోతున్నది. కొంతకాలానికి యథార్థం బటా బయలౌతుంది. తుదకు మహర్షే బయట బడతాడో, లేకపోతే కపటవేషమేబయట పడుతుందో దేవుడికే యెఱుక!

కళ్యాణ : [కోపముతో] నాయెదురుగా మా మహర్షిని యిట్లు నిందించడం, లేని కాపట్యం ఆరోపించడం నీచం, అసహ్యం, ఇంపెర్టినెంసు, రూడ్ నెస్ (impertinance, rudeness)

[అని లేచిపోవును.]

అయ్య : [వాకిలిదగ్గఱకు పోయి] ఏమండో, డబ్బు ఎగనూకి పోతున్నారే!

కళ్యాణ : [తిరిగివచ్చి డబ్బు ఇచ్చును]

రంగా : కాంగ్రెసువాళ్ళ మాటలకు తలా తోకవుండదు లేండి. ఇన్‌ష్యూరెంసు ఏజెంట్లులాగ ఎక్కడచూచినా యీకాంగ్రెసుగూడెము వారె హాజరౌతారు. వీళ్ళమాటలకు కోపపడితే మనషి బ్రతకడం దుర్ఘటం. కూర్చోండి.

కళ్యాణ : [కూర్చుండును]

రంగా : వీళ్ళకు గాంధీతప్ప మరెవ్వరు పనికిరారు. ఆ గాంధీ వల్లనే స్వరాజ్యం రాకుండాపోయినసంగతి కూడా వీళ్ళకు తెలియదు. మా టాగూరు ఇంగ్లాండుకు పోయినప్పుడు ఆయన్ని చూచి అందరు ఓరియన్‌టల్ క్రైస్ట్ (Oriental Christ) అని ఆరాధించారు. ఆయన flowing silver beard, పట్టు అంగీ సర్వజన వశీకరణం చేశాయి. చాలమంది ఇంగ్లీషుకన్యలు ఈయన ముసలివాడు కాకుండావుంటే పెండ్లిచేసుకొని వుందుము గదా అని చింతించినారట! ఈలాంటి మహానుభావులు పుట్టిన దేశానికి స్వరాజ్యం యివ్వవలసిందని లేబరువాంళ్లు పట్టుబట్టితే అప్పుడు మ్యాగొనాల్డుకు మెజారిటీలేక ఆ తీర్మానం ఓడిపోయిందట. గాంధీ రౌండ్టేబిల్ కాన్ఫరెన్‌సుకు పోవడమువల్ల మనదేశానికి పరమ అన్యాయం జరిగింది. మోకాళ్ళకుపైగా ఖద్దరుగుడ్డ యెగదీసి కట్టి ఒక పెద్ద మోటు దుప్పటి పైన కప్పుకొని పెద్ద 'బూర్‌' (boor) లాగా తయారై అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన్ను చూచినవాళ్ళందరు India is uncivilised; India is unfit for Dominion Status అని అరిచారు. ఇంగ్లీషు కన్యలందరు ఒక కమిటీ గట్టి గాంధీ ఇంతకంటె futher ఫర్‌దరుగా డ్రెస్ రిఫారం (dress-reform) చేయగూడదని హోరుదగ్గరికి డెప్యుటేషన్ వెళ్లినారట. కన్‌సర్‌వెటివ్ పక్షంవాళ్లు ఈ సమయం అనుకూలంగా వుందని గాంధీ ఫోటోను లేదు. Art, poetry భావంలో విశేషంగా వున్నవి. ఇంగ్లీషు వాళ్ళుకూడా ఆయనతోపాటు ఇంగ్లీషు వ్రాయలేరు. ఇంగ్లీషులో కవిత్వం అద్భుతంగా వ్రాస్తాడు, అంతా బాగానే వుంది. అయితే ఆయన రహస్య ప్రవర్తనం నాకు బోధపడటం లేదు.

వెంకట : మీకేగాదండి, ప్రపంచాని కంతటికి గూడా బోధపడడం లేదు.

కళ్యాణ : ప్రాకృతులకు బోధపడదు. పూర్వం మహర్షులుకొండ గుహలలో తపస్సుచేసి భావతరంగాలతో ప్రపంచం నింపేశేవారు. అలాగే మాగురుదేవుడు కూడా చేస్తున్నాడు. తపస్సు పరిపక్వం కావడంతోటె బుద్ధుడు మోస్తరె ఆయన బయలువెడల్తాడు. ఇప్పుడాయన్ను హేళనచేసేవాళ్ళందరు పటాపంచలైపోతారు.

[వెంకటరెడ్డి మొకముచూచుచు టేబిలు పైగా చేయివిసరును. టీ కప్పు దొరలును.]

కళ్యాణ : [టీ గుడ్డలపైకి కాఱకుండా కుర్చీకొంచెము వెనుకకు జరుపుకొనును.]

రంగా : Many a slip between the cup and the lipǃ

వెంకట : అప్పుడు జరగబోయే ఉత్పాతం యెట్లుంటుందోగాని, ఇప్పుడుమాత్ర అయ్యర్ కాఫీబొచ్చెకు తలనొప్పి వచ్చింది. - ఏజంగ్లీ, వచ్చి యీ టేబిల్ తుడువు.

ఏనాది : [టేబిలు తుడుచును.]

కళ్యాణ : అయ్యర్, ఇంకోకప్పు టీ.

రంగా. మీరు ఆశ్రమంలో ఎన్ని సంవత్సరాలుగా వున్నారండీ?

కళ్యాణ : అయిదారు సంవత్సరాలుగా వున్నాను. అయ్య : [టీ తెచ్చి పెట్టును.]

రంగా : మీ కోర్సు (course) పూర్తయిందా?

కళ్యాణ : [టీ గ్రుక్కెడు త్రాగి] మాకు వేఱే కోర్సేమి లేదండి; డెయిలీకోర్సు (daily course) మాత్రం వుంది.

వెంకట : మగవాళ్ళు కాబట్టి -

కళ్యాణ : ప్రొద్దున్నే లోటాడు ఆవుపాలిస్తారు. మధ్యాహ్నం రాత్రి, సాత్వికాహారం. వాళ్ళిచ్చే మామూలు చాలనివాళ్ళు సొంతంగా వంట చేయించుకొని ఎక్‌స్ట్రా (extra) గా తినవచ్చును. ఒకరికొకరికి ప్రత్యేకంగా గదు లుంటవి, భార్యాభర్తలు ఒకటిగా వుండవచ్చు. ఇష్టముంటే చదువుకోవచ్చు, బీచికి షికారు వెళ్ళవచ్చు.

రంగా : అయిదే మీకు ప్రొద్దెట్లా జరుగుతుందండి?

కళ్యాణ : భోంచేసిన తర్వాత పరుపుమీద వెల్లకిల పండుకొంటాము; ఆ దివ్యశక్తిని ఆకర్షించడానికి మనస్సును రిసెప్టివ్ స్టేట్ (receptive state) లో వుంచుకోవడం అభ్యసిస్తాం. ఇది మనిషికి చాలా న్యాచురల్ పొజిషన్. (natural position)

వెంకట : నిష్కర్మయోగు లన్నమాట!

రంగా : మహర్షి యేం చేస్తుంటాడండి? పుస్తకాలు వ్రాస్తుంటాడేమొ!

వెంకట : ఆశ్రమ కులాయంలో సూపర్ మ్యాన్ (super-man) గుడ్లు తయారౌతున్నాయి వాటిని పిల్లలు చేయించ డానికి పొదుగుతున్నాడు మహర్షి.

రంగా : O congress, thy name is impertinanceǃ

వెంకట : with apologies to Shakespereǃ

కళ్యాణ : నే వెళ్ళతానండి. న్యూస్ పేపర్లలో గుప్పించి "ఇటువంటి అనాగరకులున్న దేశాన్ని రక్షించి ఉద్ధరించడానికి దేవుడు మనలను ధర్మకర్తలనుగా నియమించాడ"ని క్రిశ్చియన్ ఫిలాసఫి (christian philosphy) బోధించారట. గాంధీవల్ల మన మాతృభూమికి యింత అన్యాయం జరిగితే దాన్నంతా మరుగు పెట్టి, నోరూ వాయీ లేని అమాయికులను మోసం చస్తున్నారు ఈ నాయకులంతాను. గ్రామస్థుల్లో మొట్టమొదట మానవసేవ ప్రారంభించాల. ఆర్టు, పొయిట్రీ నేర్పించాల. వాళ్ళకు మందూమాకు యిచ్చి కాపాడాల.

అయ్య : టీ చల్లగాపోతున్నదండి.

రంగా : థ్యాంక్‌యు (thank you) [టీత్రాగబోయి టేబిలు పైబెట్టి] ఆహా! ఏమి యీ చిత్రం! [లేచును]

కళ్యాణ : ఏమిటండీ?

రంగా : ఈగ కప్పులో పడ్డది. తన్నుకొంటున్నది స్ట్రగుల్ ఫార్ ఎగ్ జిస్ స్టెన్స్ (struggle for existence) ప్రాణికోటికంతా ఎంత సహజంగావుంది! దీంట్లో ట్య్రాజిక్ బ్యూటీ (tragic beauty) కనిపిస్తుంది. ఇంతచిన్న యీగ ఇన్ని టీ నీళ్ళలో ఈదుటకు ప్రయత్నించడం సబ్లైం! సబ్లైం! (sublimeǃ sublimeǃǃ)

వెంకట : [ముసిముసి నవ్వు నవ్వును]

కళ్యాణ : [ఈగను చూచుటకు లేచును]

అయ్య : స్పూనుతో తీసిపారవెయ్యండి.

రంగా : ఆ ట్య్రాజిక్‌స్ట్రగుల్ (tragic struggle) లో వుండే స్పిరిచ్యుఅల్ (spritual) భావాన్ని చూడు! ఇటువంటి ప్రకృతి ప్రేరణలు లేకపోతే కవిత్వం రాదు.

కళ్యాణ : [కూర్చుండి] అవును! కవిత్వానికి -

రంగా : ఉండండి. నాకు కవిత్వము దొర్లుతున్నది. "కాఫీ కప్పున నీగ తన్నుకొనుచున్ కాన్పించు సంసారమందాఫెన్ టైమ్సు...

[తర్వాత సాగదు; మరల ఆపాదమును ఉచ్చరించును.]

కళ్యాణ : చాలా (natural) గా వుందండి. ఎట్లా వున్నదో అట్లా చెప్పడంలోనే నేచర్ స్టడీ (nature study) వుండేది.

రంగా :

కాఫీ కప్పున నీగ తన్నుకొనుచున్ కాన్పించు సంసారమం దాఫన్‌టైమ్సు-

[తర్వాత సాగదు]

వెంకట : తర్వాత బండిసాగలేదన్నమాట!

"నిరుపహతిస్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పుర విడెము"

కావలసి వుంటుందేమో!

రంగా : తొందరలో ఫకార ప్రాస వేశాను. దాన్ని పూర్తిచేయడం కొంచము కష్టమె.

వెంకట : అందుకనా ఆఫైన్‌టైమ్సు అని అన్నారు.

రంగా : రాజభాష ఉపయోగించ వచ్చు. పూర్వకవి ప్రయోగాలున్నాయి. మీకు కవిత్వంగూడా తెలుసునా యేంటి?

వెంకట : ఏదో కొద్దిగ.

రంగా : అట్లయితే నాన్‌కోఆపరేటర్లయ్యా రేం?

వెంకట : ప్రస్తుతావస్థలో కవిత్వం, ఆర్టు, డ్రామా, సర్వం దాస్య విమోచనం కొఱకే వుపుయోగ పడవలెనని నా అభిప్రాయమండి.

రంగా : అయితే మీరు Art for art's sake వాదులు కారన్న మాట. You are prostituting Art. కోకిల యేమి ప్రయోజనం ఆశించి గానం చేస్తున్నదంటారు?

వెంకట : కోకిలకు ప్రయోజనం ఆశించే జ్ఞానములేదు. మనిషి కున్నది.

రంగా : We are poles as under.

"కాఫీ కప్పున నీగ....

[తర్వాత పద్యము సాగదు]

ప్రపంచమంతా (freedom freedom) ఫ్రీడం ఫ్రీడం అని ఘోషిస్తుంటే తెలుగు కవిత్వం మాత్రం సనాతనంగ మడికట్టుకోవడం, అందు వల్ల "కవిశయ: పార్థి" అన్న కాళిదాసులు మనదేశంలో పుట్టడానికి అవకాశం లేకుండాపోవడం చాలా అన్యాయం.

వెంకట : మీరు పొరబడుతున్నారు. తెలుగువారు ఎందులోనూ తీసిపోరు. డెమొక్రసీ అని పేరుపెట్టి పద్యానికి గద్యానికి వుండే భేదం లేకుండా చేశారు. కట్టుదిట్టాలేమి అవసరంలేదు. పాడిందల్లా పాటే, ఆడిందల్లా ఆటే! ఆర్టులో రిస్ట్రెయింట్ (restraint) అక్కర లేదట!

రంగా : మైగాడ్ (my God) నాలుగు సంవత్సరాలుగా కలకత్తాలో వుండడంవల్ల మన వాఙ్మయంలో కలుగుతున్న మార్పులతో నాకు టచ్ (touch) లేదు - అట్లయితే యీపద్యం యిప్పుడే పూర్తి చేస్తాను. {{center

కాఫీ కప్పున నీగ తన్నుకొనుచున్ గాన్పించు సంసారమం దాఫెన్ టైమ్సు సమస్త బాధలకు లోనై గట్టుగాన్పించకే - }} [తర్వాత పద్యం సాగదు.] ఏమండీ, గణాల్లో గూడ (freedom) వచ్చిందా? వెంకట : ఓ! సర్వదుంబాళంగా వచ్చింది. రంగా : హుర్రా! (hurrahǃ) అట్లయితే కవిత్వం యింకా సుళువె.

                      కాఫీ కప్పున నీగ తన్నుకొనుచున్ గాన్పించు సంసారమం
                      దాఫెన్ టైమ్సు సమస్త బాధలకులోనై గట్టుగాన్పించకే
                      కుయ్యోమొఱ్ఱయటంచు డిప్రెషను కష్టాల్ పొందు గృహసు చం
                      దానన్, ట్రాజెడి యన్న నిట్టిదెకదా సబ్లైము బావంబులన్!

వెంకట : కవిత్వం చాలా ట్య్రాజిక్ గా వుందండి.

[ఇంతలో ఒకకాంగ్రెసు వాలెంటీరు ఆతురతతో పరుగెత్తుకొనివచ్చి "వెంకటరెడ్డి వున్నారాండీ?" అని అటు నిటు చూచును.]

వెంకట : ఏమి నరసింహం?

నరసింహం: రంగనాయకుల తిరుణాళ్ళకు గ్రామాంతరాన్నుంచి యెవరో ఒక అమ్మాన్ను చంటిబిడ్డ వచ్చినారు. ఆమెకు కలరా తగిలి పాత చత్రంలో పడిపోయింది. ఆమెను వదలిపెట్టి చత్రంలో వుండిన వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. బిడ్డ పాలకేడుస్తుంది. తల్లి కష్టావస్థలో వుంది.

వెంకట : అట్లనా! అయ్యర్. [డబ్బిచ్చి] ఒక కప్పులో పాలు పోసివ్వండి. నరసింహం, నీవు డాక్టరు దగ్గిరికి వెళ్ళి కలరా మిక్స్చరు కలిపించుకొని చత్రందగ్గిరికి వాయువేగంతో రావాల. సైకిల్ వుందా?

నర : ఉందండి.

వెంకట : అయితే వెళ్లు.

నర : [నిష్క్రమించును] అయ్య : [కప్పులో పాలు తెచ్చియిచ్చి] కలరా వచ్చిందీ మళ్ళా! ఇక ఈ స్యానిటరీ యిన్‌స్పెక్టర్లతో వేగేది కష్టం. ఇప్పుడు వొక్కపూటే తిరిపెపు కాఫీకి వస్తున్నారు. రేపటినుంచీ రెండుపూటలూ తగులుకొంటారన్నమాట!

వెంకట : [నిష్క్రమించును.]

రంగా : ఈ కాంగ్రెసు వాలంటీర్లు కొఱవిదయ్యాలండి. కలరా అంటురోగమని అది ప్రజలలో వ్యాపిస్తుందని వీళ్ళకు కొంచెంకూడా జంకులేదు. [సిగిరెట్టు ముట్టించి] అయ్యర్, మీవద్ద కర్పూరపు బిళ్ళ లుంటే ఒక పైసా కివ్వండి.

అయ్య : లేవండి. ఎందుకు?

రంగా : కర్‌చీఫ్‌లో వేసుకొని మూచ్చూస్తుంటే కలరా రాదండి. - రెడ్డిగారు, మీరుగూడ సిగరెట్ ముట్టించండి. కలరా పురుగులు ఆ పొగలో మాడిపోతవి.

కళ్యాణ : నాకు అభ్యాసం లేదు - మనంగూడా అ చత్రంతట్టు వెళ్ళుదామా?

రంగా : ఎందుకు?

కళ్యాణ : ఇది అడ్వర్ టైజ్ మెంటు ఎత్తో లేకుంటే యథార్థమో కనుక్కొందాం.

రంగా : ఆఁ! గ్రేట్ హిట్! (great hit) అవును. మనము ఈ కాంగ్రెసువాళ్ళను మెర్‌సిలెస్ (merciless) గా ఎక్స్‌పోజ్ (expose) చెయ్యాల. నేను కర్పూరం బిళ్ళలు కొనుక్కొని మీతో గూడా వస్తాను.

[అయ్యరుకు డబ్బిచ్చి వెడలిపోవును.]

కళ్యాణ : మా మహర్షిని అపనింద లాడిన వీళ్ళకు ......... ఆల్ రైట్ (allright) [వెడలిపోవును.]

________

స్థలం : 2 పాత చత్రం వరండా.

_______

[కలరా తగిలిన స్త్రీ గుడ్డ పఱసుకొని చిన్నమూట తలక్రింద పెట్టుకొని పండుకొని బాధపడుచుండును. వెంకట రెడ్డి ఒక సంవత్సరం వయస్సుగల చంటిబిడ్డను చేతులతో పెట్టుకొని అటునిటు త్రిప్పుచు లాలించుచుండగా తెరయెత్త బడును.]

రోగి : [అటునిటు పొరలుచు, వోక్కిరమనుచు బాధపడుచు, ఈలగొంతుతో) అయ్యా, యీబాదెట్లయ్యా! నేనెందు కీ పాడు తిరనాళ్ళ కొస్తినయ్య [వోక్కిరమనుచు] రామా - దేవుడా - యెక్క డుండావురా నాయనా - అబ్బా - తండ్రీ -

[ఇంతలో బిడ్డయేడ్చును.]

వెంకటరెడ్డి : నాయన - నాయన - ఏడవబోకు తండ్రీ. పాలుతాగించేదా?

[పాల లోటాను మూతిదగ్గర పెట్టును. బిడ్డ త్రాగడు. లోటా క్రిందపెట్టి జోబీలోనుండి తాళపు గుత్తి తీసుకొని కదలించుచు బిడ్డను లాలించుచుండును.] }} రోగి : నాబిడ్డగ్గూడా కల్లర తగిలిందయ్యా?

వెంకట : లేదమ్మా, బిడ్డ బాగున్నాడు. పాలు నోటిదగ్గర బెడితే తాగలేదు.

రోగి : అట్ల తాగడు నాయనా, కాళ్ళమీద వేసుకొని ఉగ్గుపాలతో పోస్తేనేగాని తాగడు. - అబ్బా! మావాళ్ళ కెట్లా తెలుస్తుందయ్యా? వెంకట : మీ దేవూరు?

రోగి : ఇక్కడ్నే, ఏటవతల.

వెంకట : ముందు నీకు మందిచ్చి. తర్వాత ఆసుపత్రికి తీసుకొని పోతాను. నీకేమీ భయంలేదు.

రోగి : నేను బతకతానయ్యా?

వెంకట : నీకేమాత్రం ప్రాణభయములేదు. నీవు ధైర్యంగాఉండు. దేవుడున్నాడు రక్షించడానికి.

రోగి : ఆ దేవుణ్ణి చూడడానికి వస్తేనే యిట్లయిందయ్యా, [బాధతో] ఆ - - ఎట్లయ్యా.

[ఇంతలో నరసింహం మందు తీసికొనివచ్చి సైకిల్‌ను గోడకు ఆనించును.]

వెంకట : ఈ బిడ్డను పట్టుకో; మందిస్తాను.

[అందించునపుడు బిడ్డ యేడ్చును.]

రోగి : అయ్యో, నాబిడ్డ ఆకటికి అల్లాడుతుందయ్యా, నేనైనా గుక్కెడు పాలిస్తాను.

వెంకట : [బ్రతిమాలినట్లు] నీవీయగూడదమ్మా, [నరసింహం తట్టు తిరిగి] నరసింహం, చేతిగుడ్డ పాలల్లోముంచి ఒక్కొక బొట్టుగా బిడ్డ నోట్లో పిండు; చూస్తాం. [రోగి ప్రక్కకువచ్చి] అమ్మా, నోరు తెరువు ఈమందు కొంచెంతాగు. నీకు తప్పకుండా బాగౌతుంది.

[మిక్స్చరు నోటిలో పోయును. ఆమె గుటక వేయును.]

[ఇంతలో రంగారావు, కళ్యాణరెడ్డి వచ్చి కొంచెము దూరముగా నిలబడి రోగిని చూచుచుందురు.]

రోగి : నీకు చెయ్యెత్తి దణ్ణం పెడ్తానయ్యా. దేవుడు మిమ్మల్ని సూపించకపోతే నాగతి నాబిడ్డగతి యేమైయుండేదో!

వెంకట : నీవూరుకో అమ్మా, ఊరికే మాట్లాడితే అలిశిపోతావు. నరసింహం. ఏమైనా పాలు తాగిందా బిడ్డ?

నర : కొద్దిగా తాగిందండి.

రోగి : దాహమెత్తుందయ్యా, పుల్లగెంజిలో వూరగాయవూట కలిపిస్తే ముంతెడైనా తాగుతాను.

వెంకట : ఇక్కడ యీసమయంలో పుల్లగంజి దొరకవు. నరసింహం, ఆబిడ్డను నాచేతికిచ్చి సోడాబాటిల్ కొట్టించుకొని తీసుకరా. పరుగెత్తు.

నర : [బిడ్డను వెంకటరెడ్డిచేతికిచ్చి సైకిల్ తీసుకొని వెళ్ళును.]

రంగారావు : మిస్టర్ వెంకటరెడ్డి.

వెంకట : [రెండడుగులు ముందుకు పెట్టి] ఏమండి?

రంగా : [ఒక అడుగు వెనుకకు పెట్టి] మీరక్కడనే వుండండి. పరవాలేదు. [కర్పూరం బిళ్ళ ఒకటి విసరివేసి] దీన్ని కర్‌చీఫ్‌లో పెట్టి మూచ్చూస్తుండండి. Rpevention is better than cure అని అరిస్టాటల్ చెప్పాడు.

వెంకట : [కర్పూరపు బిళ్ళ తీసుకొని నలిపి రోగిపక్క దగ్గిర చల్లును.

రంగా : ఏమిటి యీ తనకుమాలిన ధర్మం? [సిగిరెట్టు ముట్టించును]

కళ్యాంఅ : వీళ్ళు లో కాన్ని - [హఠాత్తుగా జ్ఞప్తికి వచ్చి మొలత్రాడు తడువుకొనును.]

రంగా : ఏమిటండీ?

కళ్యాణ : తాయెత్తులేండి. రంగా : [చిఱునవ్వుతో] తలిస్‌మాన్ తాయెత్తా?

కళ్యాణ : కాదండి. [రహస్యముగా చెప్పువానివలె] అదృష్టవశాత్తుగా ఆశ్రమంలో అమ్మగారి వెంట్రుక ఒకటి దొరకింది. దాన్ని బంగారు తాయెత్తులోవేసి మొలకు కట్టుకొన్నాను. ఏ చీడాపీడా ఆశించదు.

వెంకట : ఓ! [నవ్వుచు] అందువల్లనే ధైర్యంచేసి వచ్చారు.

రంగా : Yesǃ It is faith cure.

కళ్యాణ : వీళ్ళు లోకాన్ని తాము వుద్ధరిస్తూన్నామని అనుకొంటారు. ఆ దివ్యశక్తి ప్రపంచ చక్రం నడపుతున్నది. పుట్టించేదెవరు? చంపేదెవరు? రోగాలు భూకంపాలు, విప్లవాలు, యుద్ధాలు నేచరుస్కీమ్ (nature Scheme)లో వుండేవే. ఇవిలేకపోతే నేచరులో ఈక్విలిబ్రియం (equilibrium) వుండదు. ఆత్మకు ఎప్పటికి నాశనం లేదు.


                   నైనం ఛిందంతి శస్త్రాణి, నైనం దహతిపావక:,
                                    అనిన్నీ -
                   వాసాంసి జీర్ణాని యథావిహాయఁ నదాని
                   గృహ్ణాతినరో౽అపరాణి -

అనిన్నీ గీతాశాస్త్రమే చెబుతున్నది. మామహర్షి అందువల్లనే (social service) వుత్తమిధ్య - బూటకమని దాన్ని బహిష్కరించాడు.

రంగా : [సిగరెట్టుముక్క క్రిందపడవేయును.]

కళ్యాణ : [అటుపోయి సిగిరెట్టుముక్కను త్రొక్కి యెగిరిపడి] అబ్బా! తేలుకుట్టింది. [సిగరెట్టుముక్కను చూచి కోపముతో] ఏమండి, మనుష్యులు తిరిగేచోట ఆర్పకుండా సిగిరెట్టుముక్కలు పడవేస్తే కాళ్ళు మండుకపోతవని తెలియదూ? రంగా : Sorry, excuse me. పరధ్యాన్నంలో క్రింద వేశాను, [తన బూడ్సుకాలుతో దానిని రాచివేయును.]

కళ్యాణ : [కాలు చూచుకొని] బొబ్బపోయిందండి.

వెంకట : నైన చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక:!

కళ్యాణ : చురుక్కుమని చస్తుంటె యిప్పుడుకూడా వేళా కోళమేనా?

వెంకట : తమరు సెలవిచ్చిందే కదండి?

[ఇంతలో నరసింహం వచ్చి సైకిల్ అచ్చటపెట్టి సోడా ఆమె నోటిలో పోయును.]

రోగి : [సోడా త్రాగి] అబ్బా! తండ్రీ, నాబాధ యెవరు తీరుస్తారయ్యా?

రంగా : ఈ పోజ్ (pose) చాలా అద్భుతంగా వుంది. మొగంలో ట్య్రాజిక్ బ్యూటి (tragic beauty) తాండవిస్తూ వుంది. ఇప్పుడు గాన నందలాల్ బోసు వుండి ఈ మాడల్ (model) ప్రకారం ఒక చిత్రం వ్రాస్తే డయింగ్‌ప్రిన్సు (dying prince) అనే మొగల్ చిత్రానికంటే బాగుంటుంది.

[హాండ్ క్యామిరా తెరచి ఫోకస్‌చేసి ఫోటోయెత్తును.]

మీకుగూడా ఒకకాపీ యిస్తానులెండి.

కళ్యాణ : ఈతూరి సిగరెట్టుముక్క జాగ్రత్తగా పాఱవేయండి.

రంగా : థాంక్స్ (thanks)

వెంకట : నరసింహం, ఇక మనము ఆలస్యం చేయడం బాగులేదు. ఈమెను సెగ్రిగేషన్ హౌసుకు తీసుకొనివెళ్ళాల. మన గ్రహచారం మనవూళ్ళో అంబులెన్సుకూడా లేదు. మఱి జట్కావాళ్ళను పిలిచాను. కలరా పేషంటంటే ఒక్కడూ రాలేదు.

రంగా : At least they are reasonable.

వెంకట : ఇప్పు డెట్లా మఱి?

నర : మనమే తీసుకొని వెళ్ళదాం. ఆమె దుప్పటితో వుయ్యాల కట్టి మధ్యవొక కఱ్ఱదోపి మోసుకొని పోవచ్చు.

వెంకట : బిడ్డ?

నర : ఇంకొక్కరు కావాలనే మఱి. [రంగారావు తట్టుచూచును]

రంగా : [గమనించనట్టు ఒకతట్టుకు మరలును]

వెంకట : రంగారావుగారు. ఈబిడ్డని కొంచెం అక్కడిదాకా యెత్తుకొని వస్తారా?

రంగా : మా గురువుగారు పసిబిడ్డలను గుఱించి అద్భుతంగా కవిత్వం వ్రాశారు. ఆ పద్యాలు ఒరిజినల్ (original) లో చదివితే బిడ్డల్ని ముద్దాడవలెననే కోరిక పుడుతుంది.

                      పూచిన తమ్మివంటి పసిబిడ్డల మోమున నవ్వు దొంతరల్
                      కేసర గుచ్ఛమట్లు కను వొందొనరింపఁగ చేరదీసి, నా
                      నాయన, రార యంచు చిరుబుగ్గల ముద్దిడువాని భాగ్యమే
                      భాగ్యము; కోటలున్న పెఱభాగ్యము భాగ్యమె? రెడ్డిమిత్రమా!

అనే మోస్తరుగా కవిత్వంలో పసిపాపలు చాలా అందంగా వుంటారు. అయితే ప్రాక్టికల్ ప్రాబ్లం సాల్వ్ (practical problem solve) చేయడంలోనే వుండే చిక్కంతా.

(ఇంతలో మూడోఫారం విద్యార్థు లిద్దరు పుస్తకములు చంక బెట్టుకొని ఆదారిన పోవుచుందురు)

ప్రథమ విద్యార్థి : ఒరే, మనమేష్టరు Student's social league start చేశాడు. మొన్నటి ఆదివారం మేము ఆసుపత్రులన్నీ తిరిగి వచ్చాం; చాలా గమ్మత్తుగా వుణ్ణింది. పేషంటొకడు నిద్రపోతుంటే పక్కన బెంచిమీద రొట్టెముక్కలు పెట్టివుండినాయి నేను మెల్లగా రెండు ముక్కలు జోబీలో వేసుకొన్నాను. ఇంటివద్ద తింటే యెంత టేస్టుపుల్‌గా (tasteful) గా వుండిందనుకొన్నావు? నీవుకాడా ఒక వాలంటరీగా చేఱాదు?

ద్వితీయ విద్యార్థి : అది సరేకాని, మనపాఠం రాకపోతే యీవేళ బుగ్గలు నులుమేస్తాడు. అందులో యీవేళ మంగళవారం. తలగొరిగించుకొని వస్తాడు. నీకు జామెట్రీపాఠం వొప్పజెప్పను వచ్చిందీ?

ప్ర. వి : ఓ, వచ్చు; Three angles of a rightangle is equal to two right angles.

ద్వి. వి : నాన్ సెన్సు (nonsense) నీకు జామెట్రీరాదు. వ్యాకరణం రాదు. [వత్తిచెప్పుచు] Three angles of a triangle are equal to two right angles

ప్ర. వి. ఓహో! ట్రయాన్‌గిల్ (triangle)లో వచ్చిందీ గల్భాఅంత! ఇప్పుడు విని. [ప్రతిపదము ఒత్తి చెప్పుచు] Three angles of a triangle is equal to two right angles

ద్వి. వి. : రైట్ (right). నేను వ్యాకరణ సూత్రాలు వొప్ప చెబుతాను. అత్తకు ఇత్తు పరంబగు నపుడు -

ప్ర. వి. రాంగ్ (wrong) అత్తునకు ద్వి. వి. అత్త గ్రాంధికం - అత్తు గ్రామ్యం. మీ అత్తను అత్తు అంటావా యేం?

ప్ర. వి. మేనత్తలో అత్తకాదోయ్ ఇది.

ద్వి. వి. కాకపోతే పిల్లనిచ్చిన అత్త. అత్త అత్తుకాదు; ఏం పందెం? - ఇంకొక సూత్రం వొప్ప జెప్పుకో -

కొన్నియెడల మశూచికార్థంబుఁగా భావిలో భూతంబు చూపట్టెడి.

ప్ర. వి. మశూచికార్థం కాదురా. తద్ధర్మార్థం.

ద్వి.. వి : నా నోట్సులో నేను చెప్పినట్లే వుంది.

రంగా : అబ్బాయీ, భావిలో భూతం కనబడితే భయంపుట్టదూ?

ద్వి. వి : ఒరే! యీయన యెవర్రో పిల్ల టాగూర్రో!

ప్ర. వి. ఒరే సర్దారు ఇక్కణ్ణే వున్నాడ్రో.

[వెంకటరెడ్డి దగ్గరకు పోయి] ఈవేళ యెంతమంది జైల్లోపడ్డారండి? గాంధీ బైటున్నాడా? జైల్లో వేశారా?

వెంకట : బైటే వున్నాడు గాని, ఈమెకు కలరా తగిలింది.

ప్ర. వి, ద్వి. వి : [అదురుకొని ఒక్కటిగా] ఏంటి, కల్రానా!

రంగా : ఒన్-టు-త్రి. (one-two-three.)

[త్రీ చెప్పగానే విద్యార్థులు. "ఓరి బాబో" అంటూ పరుగెత్తుదురు. ఒకని చంకలోని పుస్తకములు క్రిందపడును. జవురుకొని పరుగెత్తును.]

రంగా : Goodǃ they can as well represent India in the olymphic running race. [సిగరెట్టు కేసు తెరచి సిగరెట్లు లేకయుండుటను చూచి] సిగరెట్ ప్యాకెట్టు పట్టుకొస్తాను.

కళ్యాణ : నాకుకూడా వొక కిళ్లీ పట్టుకరండి.

రంగా : మీరింకా సెల్ఫ్ హెల్ప్, డిగ్‌నిటీ ఆఫ్ లేబర్ (self help-dignity of labour) నేర్చుకోవాల. ఫోర్డు వంటి కోటీశ్వరుడు తన బ్యాగ్ తానే తీసుకొని వెళ్ళతాడు. కిల్లీ కొనుక్కోడానికి ఒక మీడియేటర్ (mediator) ఎందుకు? [అని కళ్యాణిరెడ్డి చేయిపట్టుకొని లాగుకొనిపోవును.]

[మోటారు హారన్ వినబడును; ఒక ప్లీడరు ఆయన భార్య ఆ దారిని వత్తురు. ఆయన ఖద్దరు పంట్లాము కోటు వేసుకొని యుండును. ఆమె సిల్కుచీర కట్టుకొనియుండును.]

భార్య : టై మైందండి. ఇంకకొంచెం ముందుగా కోర్టునుంచి రమ్మంటే వచ్చారుగారు. నేనిప్పు డొక మీటింగులో ప్రెసిడెంటుగా వొప్పుకొన్నాను.

ప్లీడ : ఏమ్మీటిం గేంటి?

భార్య : స్త్రీజనోద్ధరణం మీటింగండి. నేనొక వుపన్యాసం వ్రాసుకొచ్చాను.

ప్లీడ : ఏం వ్రాశావు?

భార్య : ఆంధ్రపత్రికలో వస్తే చూస్తురుగాని లెండి. ఇప్పుడు చెబితే స్వారస్యం పోతుంది.

[బిడ్డ యేడ్చును. వెంకటరెడ్డి లాలించును.]

ప్లీడ : ఎవ్వరది? [తిరిగిచూచి] Hallo ǃ good-evening Mr. Reddy. భార్య : [కొంచెం ముందుకు వచ్చి] ఆ బిడ్డెవరండి?

వెంకట : [రోగితట్టు చూపించి] పాపం! ఆమెకు కలారా తగిలింది

ప్లీడ , భార్య : [ఒకటిగా] కల్రా!

భార్య : ఇక రాండి. మన మీదార్నే వెళ్ళవద్దు. కార్ తిప్పమనండి. - కాసిం, [అంటూ వెళ్లును.]

వెంకట : మీ కారు కొంచెమివ్వండి. ఈ పేషెంటును (patient) సెగ్రిగేషను హౌసుకు (segregation house) తీసుకొని వెళ్ళాలె.

ప్లీడ : [ఆశ్చర్యముతో] What? Oǃ No. cholera patientǃ new model Buick Sedon - immpossible [వెళ్ళును.]

ఇంతలో గమళ్ళవెంకటేసు, ఆతనిభార్య, రెండుసంవత్సరములబిడ్డ ప్రవేశింతురు. వెంకటేసు దిట్టమైన యెదురు కఱ్ఱకు ఒక కొనన అన్నముమూట, చెంబు, సీసా, ఇంకొక కొనన అరటి పండ్ల చీపు కట్టి భుజముపై పెట్టుకొనియుండును. భార్య చంకబిడ్డను క్రింద దించును.]

వెంకటేసు : ఈ సత్రంలో కూసోని రెండు మెతుకు లేసుకొంటామే. అబ్బబ్బా! ఏంపెజ, ఏంపెజ! ఇశికేస్తే రాలటం లేదు. [కఱ్ఱ దించిపెట్టి క్రిందకూర్చుండును.]

[రోగి బాధపడును. భార్యా భర్తలు ఆమెతట్టు చూతురు. వెంకటరెడ్డి చేతిలోని బిడ్డ యేడ్చును. ఆయన లాలించును.]

భార్య : ఆమెకు ఏంజబ్బు పాపం! అట్లా బాధపడుతుండది.

[రంగారావు సిగరెట్టు త్రాగుచు, కళ్యాణరెడ్డి కిళ్ళి నములుచు ప్రవేశింతురు.]

వెంకట : ఈమెకు కల్రా తగిలింది?

వెంకటే : [చివుక్కున అదరిపడి లేచి] ముందుగా చెప్పగూడదంటయ్యా, మాకాపరం ముంచడానికి చేశావా యీపని? [కఱ్ఱ భుజాన పెట్టుకొనును]

భార్య : ఈ బిడ్డకూడా ఆమెదేనా?

వెంకట : అవునమ్మ.

వెంకటే : ఇంక సాలుగాని రావే పెసంగం.

రంగా : అనదర్ రేస్ (Another race)

భార్య : పాలగ్గామాల యేడుస్తుంది.

వెంకట : మేము లోటాతో తాగిస్తే తాగలేదు.

భార్య : పాపం! నాచేతికియ్యండి, గుక్కెడు పాలిస్తాను.

రంగా : Ahǃ Devine Motherhoodǃ

కళ్యాణ : మొరటుతనం.

వెంకటే : నీకేం పిచ్చిపట్టిందా? దెయ్యం పట్టిందా? కుడిచి కూసోని కల్లరతగిలిన మనిషి బిడ్డకు పాలిస్తానంటావేమే? నీకేం చేటుకాలం?

భార్య : వుండవయ్యా, పాపం! పశిబిడ్డ ఏడుస్తుంటేను.

వెంకట : [బిడ్డను అందిచ్చును.]

భార్య : [ఒకతట్టు కూర్చుండి బిడ్డకు పాలిచ్చును]

రంగా : గ్ర్యాండ్, గ్ర్యాండ్, (grandǃ grandǃ)

వెంకటే : ఎంత గుండెలు తీసిన ఆడదానివె! మళ్ళీ మనవల్మి వూళ్లోకి రానిస్తారంటె? నువ్వేమి చావాల్నని వుండావంటె?

కళ్యాణ : ఏమంటారు? Instinct of self-preservationǃ

రంగా : విత్ వెంజన్సు (with vengeance) వెంకటే! : ఏం? బెల్లంకొట్టిన ఱాయాల ఊరికే కూసోనుండావు పలక్కుండా? అట్లయితే నువ్వే చావు. నేపోతాను. [తన బిడ్డను చంక పెట్టుకొనును]

రంగా : ఒన్-టు-త్రీ-(one-two-three)

భార్య : నా ఊపిరిగూడా పోసుకొని నువ్వే నూరేళ్ళు బతుకు

వెంకటే : నేనేం అంత పనికిమాలినవాణ్ణనుకొన్నావా యేం నీమతిలో? నీ తస్సాదియ్యా, అట్నే కూసో. నేనూ కూసొంటాను. [బిడ్డను దించి తాను కొంచెము దూరముగా కూర్చుండును.]

కళ్యాణ : ఈ మొరటు ముండాకొడుకు మీకు డిసపాయింట్‌మెంట్ (disappointment) కలిగించేలాగుంది.

రంగా : wait and see

వెంకట : ఆమెను ఆసుపత్రికి తీసుకొని పోవాలంటే జట్కా వాళ్ళు రాలేదు. మేమిద్దర మున్నాము. బిడ్డ నెత్తుకొని రావడానికి యింకొక్కమనిషి కావాల.

వెంకటే : [వెంకటరెడ్డితట్టు ఉరిమి చూచును]

భార్య : కల్లర తగిల్నోళ్ళకు ఆసుపత్తిరిలో మందిస్తారా? ఇస్తే నయమవుతుందయ్యా?

వెంకట : మందిస్తారు. ఇంజక్షన్ చేస్తారు. తప్పకుండా నయమవుతుంది.

భార్య : అట్లయితే ఆసుపత్తిరికి తీసుకొని పొండయ్యాపాపం!

వెంకటే : ఈ పట్న వాసాల్లో వాళ్ళ మాటలుగాని, అంకమ్మ తగిలితే ఆసుపత్తిరిలో బాగవుతుందా? మేకపోతుని మొక్కోండయ్యా. - నీకేం ముశించిందేమె ఆపాట్నే కూసోనున్నావు? ఇంతా వచ్చిందానికి ఆతీర్తం దొరక్కపోయెను. పెసాదంకూడా దొరకనేలేదు. కాశ ముందుగా పొయ్యి దేవళంలో కూర్చుంటాము రావె. [లేచును] భార్య : [కోపంతో] పశిబిడ్డకు పాలియ్యవద్దంటావాయేంటి?

వెంకటే : పెసాదమె.

భార్య : [కోపముతో] నీ పెసాదం పెన్నలో గలిసింది. తీర్తం దిగబడ్డది. పాపం! ఆ అమ్మ యెవరో దిక్కులేకుండా పడిపొయ్యుంటే కాశ ఆసుపత్తిరికి తీసుకపోకుండాను. మనమేమన్నా రాయికట్టుకోని శిలా శాశిపితంగా వుంటామా? [వెంకటరెడ్డితట్టు తిరిగి] మీరొకతట్టు ఎత్తుకోండి. మా యింటాయన యింకొకతట్టు ఎత్తుకుంటాడు. బిడ్డను నేను ఎత్తుకోని వస్తాను.

రంగా : That is real worshipǃ Grandǃ

వెంకట : [ఆనంద పులకితుడై] తల్లీ, దండం పెడ్తున్నాను.

భార్య : మీబోటి గొప్పవాళ్ళు అట్లనవద్దండి. ఇదెంతబాగ్గెం లేండి.

వెంకటే : బయటికొచ్చినప్పుడుగూడా నామీద పెత్తనమేనా? ఈ ఆడోటితో యేగేది కనాకష్టం. అయితే కానియ్యండయ్యా.

[వెంకటరెడ్డి వెంకటేసు దుప్పటి ఉయ్యెలగా కట్టి రోగిని దానిలో కూర్చుండబెట్టుదురు.]

రంగా : [కళ్యాణ రెడ్డితో] ఈ విలేజర్సు (villagers) కు చదువులేదు. ఆర్టు, పొయిట్రి తెలియదు. అయినప్పటికి హృదయంలో మాత్రము సింపతి (sympathy) విశేషంగావుంది. గాంధీ టోపిల వాళ్ళుకూడా - Grandǃ I feel [మనస్సులో భావ సంఘర్షణము కలిగిన వానివలె అటునిటు తిరుగును.]

[ఉయ్యాలలో మధ్య కఱ్ఱదూర్చి ఒకతట్టు వెంకటరెడ్డి యింకొకతట్టు వెంకటేసు ఎత్తుకొందురు. వెంకటేసుభార్య

రోగి బిడ్డనెత్తుకొనును. నరసింహం వెంకటేసు సామానులను తీసుకొని సైకొలుసీటు వెనుకనున్న స్ట్యాండ్ (stand) పై పెట్టి కట్టును. వాళ్ళ బిడ్డను సైకిలుసీటుపై నెక్కించుకొని తాను పట్టుకొని సైకిలు నడిపించును.]

రోగి : [ఉయ్యెల యెత్తుకొన్న వెంటనే] నాయన్లకందరికి దంణ్ణమయ్య మీచాత మోయించుకుంటున్నాను. పాపిష్టురాల్ని. మీయింట్లో కుక్కగానైనా పుట్టి మీరుణం తీర్చుకొంటాను తండ్రీ.

రంగా : [గద్గద స్వరముతో, కన్నులనిండ నీళ్ళు క్రమ్ముచుండ] Reddy - I feel - నీ మానవసేవాపరాయణ్వం, ఆ పల్లెటూరి యిల్లాలి అవ్యాజ కారుణ్యం - నన్ను ముగ్ధుణ్ణి కావించింది. సిగ్గుపఱిచింది [రోగిని నిర్దేశించి] ఈమె కృతజ్ఞతలో వుండే అవ్యక్తమాధుర్యం నాహృదయాన్ని కరిగించింది. Oh, it is grand. - grander - grandest Damn my poetry - damn my art. [వెంకటరెడ్డి వెనుకకువచ్చి భుజము కఱ్ఱకు ఆనించి] ఇప్పుడు నేను కృతార్ధుణ్ణి. I feel happy. Hail Congressǃ Hail [కదలుదురు]

కళ్యాణ : మా మహర్షి యీదృశ్యం చూస్తే!

[తెరపడును.]

సంపూర్ణము

________