Jump to content

కథాసరిత్సాగరము (వేదంవారి వచన రచన)/నాలుగవభాగము/శక్తియశోలంబకము: 5-వ తరంగము

వికీసోర్స్ నుండి

5-వ తరంగము.


శక్తియశకై ఉవ్విళులూరుచున్న నరవాహనదత్తునికి వినోదార్థము గోముఖుఁడు మరల కథలు చెప్ప సాగెను:--- దేవా, ప్రాజ్ఞులకథను వింటివి, మూఢులకథలను వినుము.

మూఢుల కథలు.

అగరు దాహి.

పూర్వము ధనికుఁడయిన యొక వణిజునికి ఒక కుమారుఁడుండెను. ఆ కుమారుఁడు ఒకప్పుడు వర్తకముకొఱకు కటాహ ద్వీపమునకుఁ బోయెను. అతనిసరకులో గొప్ప భాగము అగరు చందనము. తక్కిన సర కంతయు అమ్ముడు పోయెను, అగరువును మాత్రము ఎవరును కొన రైరి. ఆ దీవిలోనివారు దాని యుపయోగము నెఱుఁగరు. అంతట వణిక్కుమారుఁడు వంట చెఱకమ్మువారివలన జనులు బొగ్గులు కొనుటం జూచి, తన యగరు చందనము నంతయు కాల్చి బొగ్గు చేసి బొగ్గువెలకు విక్రయించి, స్వదేశమునకు వచ్చి, అట్లు విక్రయించిన తనప్రజ్ఞను ఇతరులతో చెప్పుకొని పరిహాసము పొందెను.

తిలకార్షికుఁడు.

అగరుదాహికథను వింటిని, తిలకార్షికుని కథను వినుము. గ్రామ్యుఁ డొకఁడు జడుఁడు పంటకాఁ పుండెను. వాఁడు ఒకనాఁడు వేఁచిన నువ్వులు తిని, అవి మిగుల రుచిగా నుండుటం గని, ఆట్టి రుచి గలవిగానే నువ్వులు పండుటకై వేఁచిననువ్వులనే చల్లెను. అవి మొలవక పోఁగా, నష్టి పొందిన యా కాఁపును చూచి లోకులు పరిహసించిరి.

అగ్నికుంభుఁడు.

తిలకార్షికుని వింటిని, నీళ్లలో నిప్పు దాఁచిన వానిని వినుము. ఒక మూడుఁడు ఱేపు తెల్లవాఱఁగానే దేవతాపూజ

చేయుదును గాక యని కోరి, ఆ ముందు రాత్రి మఱునాఁటికి స్నాన పానాదికములకు వలసిన జలానలములను ఒకచోటనే సులువుగా దొరకునట్లుగా ఉంచుకొనఁ దలఁచి, నీళ్లకుండలో నిప్పు ఉంచి నిద్రించెను. తెల్లవాఱఁగానే పోయి చూచుకొనునప్పటికి నిప్పు ఆఱి బొగ్గయి యుండెను, నీళ్లు చెడి పోయినవి. బొగ్గులచే నల్లఁబడిన జలమును చూడఁగానే వానిముఖము కూడ అట్టిదే ఆయెను. ఆవృత్తాంతము నెఱింగిన లోకుల ముఖములు మాత్రము తెల్ల నాయెను.

నాసికారోపణుఁడు.

అగ్నికుంభునికథ వింటివి, నాసికారోపణునికథ వినుము. మూఢమతి యొకపురుషుఁ డుండెను. వాఁడు తనభార్య చప్పి ముక్కుది అగుటయు తండ్రి పొడుగు ముక్కు వాఁ డగుటయుం గని, తండ్రి నిద్రించు చుండఁగా అతని ముక్కు కోసి కైకొని పోయి, అట్లే భార్యముక్కును కోసి దానిముఖమున తండ్రి ముక్కును అంటించెను. ఆముక్కు అచట నిలువదాయెను. ఈరీతిగా వాఁడు భార్యను తండ్రిని ఇద్దఱను ముక్కిఁడులను చేసెను.

పశుపాలుఁడు.

పశుపాలునికథను విను. మహామూఢుఁడు ధనవంతుఁడు పశుపాలుఁడు ఒకవనములో నుండెను. వానిని ధూర్తు లనేకులు త్త్రవ్యాజమున ఆమిశ్రయించిరి. 'నీకు పిల్ల నిమ్మని నగరవాసిని ఒకధనికుని అడిగినారము, అతఁడును ఇచ్చెద నని వాగ్దానము చేసినాఁడు.' అని వానితో చెప్పిరి. అందులకు సంతోషించి వాఁడు వారికి ధన మిచ్చెను. కొన్నాళ్లు పోనిచ్చి వారు మరల వానితో 'నీకు వివాహముకూడ అయినది.' అనిరి. అందులకు అతఁడు మఱియు సంతోషించి వారికి విశేషధన మిచ్చెను. మరల కొన్నాళ్లకు 'నీకు కుమారుఁడు గలిగినాఁడు.’ అని చెప్పిరి. ఆమూడుఁడు అందులకు మఱియు సంతోషించి తన సర్వధనమును వారి కిచ్చి వేసి 'కుమారునికోసము బెంగపెట్టు కొన్నాఁడను.' అని ఆమఱునాఁడు ఏడువఁ దొడంగెను. ఈ ప్రకారము ధూర్తులచే వంచితుఁడై పశువులనుండి జడత్వమును స్వీకరించినవాఁడుం బోలె మూర్ఖుఁ డయిన యాపశుపాలుఁడు ఏడ్చుచు, లోకులకు హాసము పుట్టించెను.

అలంకారలంబకుఁడు.

దేవా, పశుపాలుని వింటివి, అలంకారలంబకుని వినుము. పల్లెటూరివాఁ డొకఁడు భూమిని త్రవ్వుచుండఁగా గొప్ప యలంకారముల మూఁటదొరకెను. దానిని ముందురాత్రి దొంగలు రాచనగరినుండి దొంగలించి అచట పాఁతిపెట్టి కొనిరి. దానిం గొని వాఁడు ఇంటికి పోయి ఆనగలతో భార్య నలంకరించెను. తలకు మొలనూలు చుట్టి జఘనస్థలమునకు హారము కట్టెను. చేతులకు అందెలు తొడిగి చెవులకు కంకణములు పెట్టెను. దానిం గని లోకులు పరిహాసములతో ప్రకటింపఁగా రాజు తెలిసికొని ఆయాభరణములను పుచ్చుకొని ఆమూర్ఖుని విడిచిపెట్టెను.

తూలికుఁడు.

అలంకారిని వచించితిని, ఇఁక తూలికుని వినుము. ఒక మూర్ఖుఁడు దూది అమ్ముకొనుటకు బజాఱునకుఁ బోయెను. దానిని శుద్ధము చేయనిదని ఎవ్వరు కొనరైరి. ఇట్లుండఁగా అచట కంసాలి యొకఁడు నిప్పులో బంగారమును కాల్చి శుద్ధిచేసి అమ్ముటయు ఎవరో పుచ్చుకొనుటయు మూర్ఖుఁడు చూచి తన దూదిని గూడ ఆప్రకారమే శుద్ధిచేయఁ గోరి దానిని అగ్నిలో వేసెను. అది దగ్ధ మాయెను. లోకులు వాని తెలివికి నవ్విరి.

ఖర్జూరీచ్ఛేదకులు.

తూలికుని వింటివి. దేవా, ఖర్జూరీచ్ఛేదకులను వినుము. దివాణమువారి యాజ్ఞప్రకారము గ్రామ్యులను కొందఱను ఆ రామాధికారులు ఖర్జూరపు మొలకలు తెమ్మని యాజ్ఞాపించిరి. వారు సులువుగా పండ్లు కోసికొనుటకు అనుకూలముగా పండ్లతోఁ విఱిగిపడి యున్న యొక ఖర్జూరవృక్షమును చూచి తమ గ్రామములోని ఖర్జూరవృక్షముల నన్నిటిని కొట్టి వేసి పండ్లతోను కాయలతోను ఉన్నట్టి యా వృక్షముల నన్నిటిని తెచ్చి నగరి తోఁటలో నాటిరి. అవి సిద్ధింప లేదు. రాజు ఆ వృత్తాంత మెఱిఁగి ఖర్జూరముల నన్నిటిని నాశము చేసినందులకు వారిని దండించెను.

నిధ్యాలోకనుఁడు.

ఖర్జూరహాసు లయినారు, నిధ్యాలోకనుని వినుము. ఒకానొకరాజు నిధానములు కనఁగలవాని నొకని తెప్పించెను. వీఁడు మఱి యెచటికిని పాఱిపో కుండును గాక యని మంత్రి కన్నులు పెఱికి వేయించెను. భూమియొక్క లక్షణములను కనలేక రాకకు పోకకు భేదము కనలేక యున్న యా నిధాన దర్శిని చూచి లోకులు మంత్రి తెలివికి మిక్కిలి నవ్విరి.

లవణాశనుఁడు.

లవణాశనుని వినుము. పూర్వము గ్రామవాసి యైన గహ్వరు నొకని నగరవాసి యయిన మిత్త్రుఁడు ఒకప్పుడు తన యింటికిఁ గొనిపోయి ఉప్పుచేత రుచ్యము లయిన వ్యంజనములతోను ఇంక నితరభోజ్యములతోను భోజనము పెట్టించెను. ఈ భోజ్యవ్యంజనాదులకు ఇంతరుచి దేనివలనఁ గలిగిన దని గహ్వరుఁడు మిత్త్రుని అడిగెను. ఉప్పుచేత కలిగిన దని మిత్త్రుఁడు చెప్పెను. 'అట్లయిన దానినే భక్షింపవలసినది' అని నూఱిన యుప్పు పిడికెఁడు ఎత్తి వాఁడు నోటఁ బోసికొనెను. ఆ పొడి ఆ మూఢుని పెదవులకు మీసాలకును అంటుకొని ధవళిమం గలిగించెను; దానిం గని పరిహసించిన జనుల మొగములును ధవళము లాయెను.

గోదోహకుఁడు.

గోదోహకుని వినుము. మూడుఁ డైన యొకగ్రామ్యునికి ఒక గో వుండెను. అది వానికి దినమునకు నూఱు పలముల పాలు ఇచ్చుచుండెను. ఇట్లుండఁగా వానికి ఒకప్పుడు పండు గొకటి సంప్రాప్తమైనది. అంతట పండుగునాఁడు పా లన్నియు ఒక మాఱుగానే గ్రహింతునుగాక యని ఆలోచించుకొని ఆ మూర్ఖుఁడు నెలదినములు ఆవును పిదుకక యుండి పండుగునాఁడు పిదుకఁగా ఒక బొట్టయినను పాలు రావు. లోకులు అమితముగా పరిహసించిరి.

పథికఖల్వాటులు.

ఖలతి కథను వినుము. రాగిచెంబును బోలిన బట్టతలవాఁడు ఒక మూర్ఖుఁడు ఉండెను. వాఁడు వెలఁగచెట్టు క్రింద కూర్చుండఁగా, ఒకబాటసారి వయసువాఁడు మార్గాయాసముచే ఆఁకలిగొని అచటికి వచ్చి వెలఁగపం డొకటి కోసి క్రీడఁగా వాని నెత్తిమీఁద వేసెను. ఖలతి దానిని సహించెను గాని తరుణుని ఏమియు అన లేదు. క్రమముగా వాఁడు చెట్టులోని పండ్ల నన్నిటిని కోసి ఒక టొకటిగా ఖల్వాటుని తలమీఁదనే వేయు చుండెను. ఖల్వాటుఁడు తల పగిలి రక్తము ధారలు ధారలుగా కాఱుచు ఉన్నను ఊరక యుండెను. మూర్ఖతరుఁడు బాటసారి పండ్లన్నియు ఈప్రకారము చిద్రుపలై పోఁగా తినుట కేమియు లేక ఆఁకటితోనే వచ్చినట్లే పోయెను. ఖల్వాటుఁడు 'తియ్యని వెలగపండ్లతో బెబ్బలు ఎన్నియేనియు తిందును.' అని యనుకొనుచు నెత్తినుండి కాఱుచున్న రక్త ధారలతో ఇంటికిఁ బోయెను. మూర్ఖ సామ్రాజ్య పట్టము చేతనుంబోలె నెత్తుటి పట్టముతో వేష్టిత మైన వాని శిరమును గని లోకులు మిగుల పరిహసించిరి.

దేవా, ఈరీతిని లోకములో బుద్ధిహీనులు అపహాస్యు లగుదురు, కార్యమును చెఱుచుకొందురు; బుద్ధిమంతులు గౌరవము పొందుదురు. ఇట్లు గోముఖుఁడు చెప్పిన మూర్ఖుల తెలివి తక్కువ కథలను విని నరవాహనదత్తుఁడు ఆహ్నిక కృత్యములకై లేచెను. మరల సముత్సుకుఁ డై నరవాహనదత్తుఁడు ఆజ్ఞాపింపఁగా, గోముఖుఁడు ప్రజ్ఞావంతులకథలను ఈరీతిగా చెప్పసాగెను.

కాక మూషక కూర్మ మృగముల కథ.

ఒకానొక యరణ్యములో గొప్పబూరుగు చెట్టుండెను. దానిమీఁద లఘుపాతి యను కాకి గూఁడు కట్టుకొని నివసించి యుండెను. ఒకనాఁడు ఆ కాకి చూచుచుండఁగా నచటికి క్రూరాకారుఁ డైన పురుషుఁ డొకఁడు చేత వల పట్టుకొని వచ్చి ఆ చెట్టు క్రింద నేలపై వలను పఱిచి ఎరగా వడ్లుచల్లి కనుపెట్టుకొని యుండెను. అంతలో పావురములరాజు చిత్రగ్రీవు డనువాఁడు నూర్లకొలఁది పావురముల పరివారముతో ఆకాశమార్గమున వచ్చి ఆవడ్లను చూచి ఆహారార్థము వ్రాలి సపరివారముగా వలలో పట్టుపడెను. అంతట చిత్రగ్రీవుఁడు ఆయాపదను కని పరివారమునకు 'ఓరోరీ, వలను ముక్కులతో కఱుచుకొని ఒక్కమాఱుగా అందఱును పైకి ఎగురుఁడు.' అని ఉపాయము బోధించెను. పావురము లన్నియు అట్లే ఎగిరి భీతిచే ఆకాశమున మఱియు వేగముగా పోవుచుండినవి. వ్యాధుఁడును పైని చూచి విషణ్ణుఁ డై మరలి పోయెను. అంతట చిత్రగ్రీవుఁడు భయము తీఱి తనపరివారముతో 'నామిత్త్రుఁడు హిరణ్యుఁడు మూషక రాజు ఈసమీపమున నున్నాఁడు గదా, అతఁడు పాశములను తెగఁగొఱికి మనలను రక్షించును, ఆటకు పోదము రండు,' అనెను. అంతట ఆవలతోనే సపరివారుఁడుగా చిత్రగ్రీవుఁడు ఆ యెలుక కలుగునొద్దకు పోయి నేలను వ్రాలి 'మిత్త్రుఁడా హిరణ్యా, బయటికిరా, చిత్రగ్రీవుఁడను వచ్చి యున్నాఁడను.' అని పిలిచెను. ఎలుక విని ద్వారముగుండ చూచి మిత్త్రునిఁ గని తన శతముఖబిలమునుండి వెలువడి చెంత చేరి వృత్తాంత మడిగి తెలిసికొని త్వరగా చిత్రగ్రీవునికిని పరివారమునకును పాశములను తెగఁగొఱికెను. పాశములు తొలఁగఁగా చిత్రగ్రీవుఁడు మూషకరాజును ప్రియవచనములచే నలరించి సపరివారముగా సెలవు పుచ్చుకొని వెడలి పోయెను.

ఆకాకి వెంబడిగానే వచ్చి ఇది యెల్లఁ గని ఆశ్చర్యపడి, బిలప్రవిష్టుని హిరణ్యుని పిలిచి 'అయ్యా, నేను కాకిని, నాపేరు లఘుపాతి ; మిత్త్రవత్సలుని నిన్ను ఇట్టి విపత్తులో మిత్త్రులను రక్షించువానిని మిత్త్రునిఁగా వరింప వచ్చినాఁడను.' అనెను. ఆమాట విని బిలమునుండియే కాకిని చూచి యెలుక 'పోపో, భక్ష్యభక్షకములకు 'మైత్త్రి' యనఁగా నేటిది?' అనెను. వాయసము చెప్పెను:- 'అట్లు చెప్పకు, నిన్ను భక్షించిన, క్షణకాలము ఆఁకలి తీఱును. నీవు మిత్త్రుఁడవుగా

నుండిన మాటిమాటికి ప్రాణమును కాపాడుదువు.' కాకి ఇట్టి మంచిమాటలు చెప్పి ప్రమాణము చేసి నమ్మికపుట్టించి బిలమునుండి వెలుపలికి ఎలుకను రప్పించి దానితో సఖ్యము చేసెను. అది మొదలు కాకి మాంసపేశములను తెచ్చుచును, ఎలుక వడ్లు తెచ్చుచును, రెండును కలసి భుజించుచు, సుఖముగానుండినవి. ఒకనాఁడు కాకి హిరణ్యునితో 'మిత్త్రా, ఇచట అడవిలో దూరమున నది యొకటికలదు, అందు మంధరకుఁ డని నా స్నేహితుఁడు కూర్మము కలఁడు, వానికై అచటికి పోయెదను, అచట మాంసభోజనము సులభముగా దొరకును, ఇచట ఆహారము సులువుగా దొరకుట లేదు; నిత్యము నిచట వ్యాధ భయము కూడ కలదు.' అనెను. అంతట మూషకము 'మిత్త్రా, నన్నుఁగూడ అక్కడికే కొని పొమ్ము, అందఱము అచటనే కలసి నివసింతము, ఈచోటి మీఁద నాకును విరక్తి గలిగి యున్నది, అందులకారణము అచట నీకు చెప్పెదను. అనెను. అంతట కాకి ఎలుకను నోటఁ గఱచుకొని ఆకాశమార్గమున త్వరగా ఆ వననదీతటమునకు పోయి, అచట మంథరకుని కని, సమూషకునికి తనకు అతఁడు విందు చేయఁగా, భుజించి సుఖముగా నుండెను. ప్రసంగవశమున కూర్మమునకు తాను వచ్చిన కారణమును, ఎలుకతోడి స్నేహ మయిన వృత్తాంతమును చెప్పెను. మంథరకుఁడు వాయసముచే ఇట్లు తెలుపఁబడిన హిరణ్యుని మిత్త్రుని చేసికొని అతఁడు స్వదేశముమీఁద విరక్తి గొన్న కారణము నడిగెను. హిరణ్యుఁడు కాకకూర్మములకు తనవృత్తాంతము నిట్లు వర్ణింపఁ దొడంగెను,

హిరణ్యుని పూర్వవృత్తాంతము.

నేను ఒక నగరిసమీపమున బిలములో నివసించుచుండి ఒకనాఁడు రాచనగరినుండి ఒకహారమును తెచ్చి బిలములో దాఁచికొంటిని. మాటిమాటికి ఆహారమును చూచుకొంటచే నాకు బలము హెచ్చఁగా ఆహారము తెచ్చుటయందు సమర్థుఁడనయిన నన్ను ఎలుకలు ఆశ్రయించినవి. అంతలో నాబిలము సమీపమున ఒకసన్న్యాసి మఠము కట్టుకొని భిక్షాటన వృత్తిచే జీవించుచుండెను. అతఁడు తినఁగా మిగిలిన భిక్షాన్నమును భిక్షాపాత్రలో ఉంచి మఱునాఁటి యుదయమున భుజించుటకొఱకు చిలుకకొయ్యకు తగిలించి యుంచుకొనును. వానిని నిద్ర పో నిచ్చి నేను ప్రతిరాత్రియు బిలముగుండ మఠములోనికి పోయి ఎగిరి దుమికి ఆహారమును తెచ్చు చుంటిని. ఇట్లుండఁగా, వాని మిత్త్రుఁడు మఱియొక సన్న్యాసి వచ్చి రాత్రి భోజన మయిన తర్వాత వానితో సంభాషించు చుండెను. ఇంతలో నేనును ఆ యాహారమును దొంగిలింప నారంభింపఁగా నతఁడు మాటిమాటికి చెవి యొగ్గి విని భిక్షా భాండమును పగిలిన వెదురుఁ గఱ్ఱతోఁ గొట్టు చుండెను. 'ఏమి, సంభాషణ మాని మధ్యమధ్య ఏమో చేయుచున్నావు?' అని ఆగంతుకుఁ డడుగఁగా, ఇచట నాకు ఎలుక యొకటి శత్రువు సంభవించి యున్నది, అది ఎంత యెత్తయినను దుమికి నా యన్నమును సదా దొంగిలించును. ఈజర్జర వేణుదండముతో అన్న భాజనమును కొట్టికొట్టి ఆయెలుకను బెదరించి తఱుముచున్నాను.' అని మఠసన్న్యాసి యుత్తరము చెప్పెను. ఆగంతుకుఁడు చెప్పసాగెను:--

అతిసంచయేచ్ఛాదోషము.

లోభము ప్రాణులకు దోషము కలిగించును. అందులకు కథ వినుము. నేను తీర్థములు తిరుగుచు ఒకనగరములో ఒక బ్రాహ్మణునియింటికి బసకై పోయితిని. నే నుండ, బ్రాహ్మణుఁడు భార్యతో 'నేఁడు పర్వదినము, బ్రాహ్మణునికొఱకు పులగము చేయుము.' అనెను. 'పేదవానికి నీకు పులగ మెట్లు వచ్చును?' అని యామె యాక్షేపించెను. అంతట బ్రాహ్మణుఁడుచెప్పెను:- ప్రేయసీ, ధనమును కూడఁ బెట్టుట న్యాయమే, ఐనను అతిసంచయేచ్ఛ కూడదు. అందులకు కథను వినుము.

లోభి నక్క.

ఒకవనములో బోయ వేఁట యాడి, విల్లెక్కుపెట్టి, బాణమును తొడిగి, వింట మాంసము కట్టి పెట్టి, పందిని తఱుముకొని పోయి, పందిపై బాణ మేసెను. తాను మడియు నంతలో అది ముట్టెతో వానిని పొడిచి చంపి పేసెను. ఆ వృత్తాంత మెల్ల దూరమునుండి యొక నక్క చూచి వచ్చి ఆఁకలికొని యుండియు, దాఁచుకొన నిచ్చ గొని, విస్తారముగా నున్న యా మానిసిమాంసమును గాని పంది మాంసమును గాని కొంచె మయినను తినక ధనుస్సులో నున్న మాంసమును తినఁ బోయి యంత్రపుబిస వదలఁగా బాణము తగిలి చచ్చెను. కావున అతిసంచయము కూడదు.

ఇట్లు బ్రాహ్మణుఁడు చెప్పఁగా భార్య ఒప్పుకొన్నదై పులగము చేయుటకై నువ్వులు ఎండ బోసెను. ఆమె యింటిలోనికి పోఁగా వానిని కుక్క తిని మైల చేసెను. వానిని వెలఁబెట్టి ఎవ్వరును కొనరైరి. ఈరీతిగా లోభమువలన భోగము కలుగదు, కేవలము క్లేశమే కలుగును.

ఇట్లు పలికి ఆగంతుక సన్న్యాసి స్థానిసన్న్యాసితో 'గుద్దలి తెమ్ము, ఈ మూషకోపద్రవమును నివారించెద.' అనెను. స్థాని గుద్దలి తెచ్చెను. నేను చాటున దాగియుండి దానిం గని బిలములోఁ దూఱితిని. అంత నాగంతుకుఁడు నేను తిఱుగు చుండిన కలుగును చూచి గుద్దలితో త్రవ్వ సాగెను. చాలదూరము త్రవ్వఁగా అతనికి నా హారము దొరకినది. నేను పాఱిపోయితిని. అంత నాగంతుకసన్న్యాసి స్థానిసన్న్యాసితో 'ఈ హారంపుఁ దేజస్సుచేత ఆ యెలుకకు అట్టిబలము కలిగినది.' అని పలికి నా సర్వస్వ మయిన యాహారమును హరించి నెత్తిని పెట్టుకొని ఇరువురు సన్న్యాసులును సుఖముగా నిద్రపోయిరి; వారు నిద్రించుచుండఁగా నేను నాహారమును హరించి తెచ్చుకొనుటకు మరల పోఁగా స్థాయిసన్న్యాసి మేలుకొని నన్ను నెత్తిమీఁద కఱ్ఱతోఁ గొట్టెను. అంత నాకు గాయ మై దైవవశమున చావక బిలము చొచ్చితిని. మరల మునుపట్టివలె అన్నార్థ మై దుముకుటకు శక్తి కలుగ లేదు. పురుషులకు ధనమే యౌవనము, ధనాభావమే ముసలితనము. ధననాశముచే పురుషునికి తేజస్సు, బలము, ఉత్సాహమును నశించిపోవును. అది మొదలు నా పొట్టమాత్రము నిండించు కొనుటకు యత్నించుచున్న నన్నుఁ గని నా పరివారపుటెలుక లెల్ల నన్ను వదలి వెడలి పోయినవి. అన్నము పెట్టని ప్రభువును భృత్యులును, పువ్వులు లేని చెట్టును తుమ్మెదలును, నీరు లేని సరస్సును హంసలును, చిరకాలసేవితము నయినను వదలుట నిక్కము. ఈప్రకార మచట చిరకాలము దుఃఖితుండ నై ఈ లఘుపాతిని మిత్త్రునిగాఁ పొంది చివరకు, ఓ కూర్మరాజా, నీసన్నిధికి వచ్చితిని.

హిరణ్యకుఁడు ఇట్లు చెప్పఁగా మంథరకుఁ డనియె:- మిత్త్రమా, ఈచోటు నీదే, అసంతుష్టిగా నుండకు., గుణవంతునికి విదేశము లేదు, సంతుష్టునికి అసుఖము లేదు, ధీరునికి విపత్తు లేదు, సప్రయత్నునికి అసాధ్యము లేదు.

చిత్రాంగాగమనము.

ఇట్లు కూర్మము పలుకు చుండఁగా, చిత్రాంగ మను లేడి దూరమునుండి వ్యాధుఁడు వెంటఁ దఱుమఁగా ఆ యడవికి వచ్చెను. దాని రాకను, దాని వెంట రాక వ్యాధుఁడు నిలిచి పోవుటను, గని కూర్మాదులు దాని నోదార్చి దానితో సఖ్యము చేసినవి. కాక కూర్మ మృగాఖువులు అన్నియు అచటనే పరస్పరోపచారములు చేసికొనుచు మిత్త్రములుగా నివసించి యుండినవి.

ఒకనాఁడు చిత్రాంగుఁడు ఎంతసేపటికిని రాకుండఁగా వెదకుటకై లఘుపాతి చెట్టెక్కి చూచెను. చిత్రాంగుఁడు నదీతీరమందు యంత్రపువలలో తగులుకొని పడియుండెను. వానిం గని వాయసము కూర్మాఖువులకు తెలిపెను. అంతట కలయఁబలికికొని కాకి ఎలుకను నోటఁ గఱచుకొని చిత్రాంగుని యొద్దకు కొనిపోయెను. హిరణ్యకుఁడు బంధనములో నున్న చిత్రాంగుని ఓదార్చి వలను తనదంతములతో క్షణములో తెగఁగొఱికి విడిపించెను. ఇంతలో మంథరుఁడును మిత్త్రవాత్సల్యముచేత నదీప్రవాహముగుండ వచ్చి తానును గట్టెక్కి వారిం గలసెను. ఆక్షణమందే వల పన్నిన వ్యాధుఁడు వచ్చి, మృగాదులు పలాయితములుగా కాఁగా మంథరకమును పట్టుకొని ఆవలలోనే చుట్టిపెట్టుకొని, మృగము పాఱిపోయినందులకు ఆకులుఁ డై పోవుచుండఁగా, దీర్ఘదర్శి యైన యెలుక బోధించినప్రకారము లేడి వానిదారిలో ముందు పోయి చచ్చినట్లు పడి యుండెను. కాకి దానినెత్తిమీఁద వ్రాలి కన్నులు పొడుచుచున్నట్టు అభినయించు చుండెను. దానిం గని వ్యాధుఁడు మృత మైన యా మృగమును కైకొనుటకై నదిగట్టున తాఁబేటిని ఉంచి పోయెను. వాఁ డవలికి పోఁ జూచి ఎలుక వలను కొఱికి కూర్మమును విడిపించెను. కూర్మము మెల్లఁగా నడచి నదిలో పడెను. లేడియు కచ్ఛపము లేకుండ వ్యాధుఁడు సమీపింపఁగానే లేచి పారిపోయెను, కాకి చెట్టెక్కెను. వ్యాధుఁడు మరలి వచ్చి, కూర్మము పాశములు తెగి పలాయిత మయి పోయినందున, ఉభయభ్రష్టుఁ డై విధిని దూరుచు ఇంటికి పోయెను. పిమ్మట అన్నియు ఒకచోట చేరి సంతోషించినవి. లేడి ప్రీతిచే ఇతరులను 'మీ ప్రాణాపాయములను లక్ష్యపెట్టక నాప్రాణమును రక్షించినట్టి మీరు నాకు మిత్త్రము లయితిరి, నాకన్న ధన్యు లెవ్వరు?' అని ప్రశంసించెను. ఇట్లు అవి అన్యోన్యప్రీతిసుఖితము లై వసించి యుండినవి.

ఈప్రకారము తిర్యగ్జంతువులు కూడ ఇష్టమును నెఱవేర్చుకొనును, ఆపత్కాలమందు తమ ప్రాణమైనను ఇచ్చి మిత్త్రమును రక్షించును. ఈరీతిగా, 'మిత్త్రులయం దాసక్తి శ్రేయము; ఈర్ష్య కలిగించును గాన స్త్రీలయం దాసక్తి మేలు గాదు' అని పెద్దలు చెప్పుదురు. ఈకథను వినుము.

ఈర్ష్యాళుపతి.

పూర్వము ఒకనగరములో ఈర్ష్యాళువు ఒక పురుషుఁడుండెను. వానికి రూపవంతురాలు ప్రియభార్య యుండెను. అతఁడు ఆమెయందు నమ్మకము లేక ఎప్పుడును ఆమెను ఒంటరిగ వదలఁ డాయెను; చిత్తరువుల యందలి పురుషప్రతిమలవలనఁ గూడ ఆమెకు శీలభంగము కలుగు నని శంకించుచుండెను. ఒకానొకప్పుడు అతఁడు తప్పని పని కలిగి భార్యను వెంటఁబెట్టు కొని దేశాంతరము బయలు దేఱెను. దారిలో భిల్ల భూయిష్ఠమైన యడవిని కని భయముచేత భార్యను ఒకగ్రామములో ఒక ముసలి బ్రాహ్మణునియింటఁ బెట్టి పోయెను. ఆమె అచ్చటనే యుండి ఆదారిని వచ్చిన యొక బిల్లుని తగులుకొని పోయెను. వానితోఁగూడ వానిపల్లెకుఁ బోయి ఈర్ష్యాళుపతి యను పీడ వదలి, ఆనకట్టుతెగిన నదివోలె యథేచ్ఛముగా విహరించుచుండెను. ఇంతలో పతి పని ముగించుకొని మరల ఆదారిని వచ్చి బ్రాహ్మణునియింటికిఁ బోయి 'నాభార్య యెక్కడ? ' అని అడిగెను. బ్రాహ్మణుఁడు 'అది ఎక్కడికి పోయెనో ఎఱుఁగను, ఇక్కడికి భిల్లులు వచ్చిరి, వారు దానిం గొనిపోయి యుందురు, వారిపల్లెయు దగ్గఱనే యున్నది. అచటికి త్వరగా పొమ్ము, అక్కడ అది దొరకును, వేఱాలోచన చేయకుము.' అనెను.

వెంటనే అతఁడు ఏడ్చుచు తెలివి లోపమునకు తన్ను తిట్టుకొనుచు ఆ భిల్లపల్లికి పోయి భార్యను గనియెను. ఆ పాపాత్మురాలు వానిం గని దగ్గఱకు వచ్చి 'నావలన దోషము లేదు, నన్ను భిల్లుఁడు బలాత్కారము చేసి తెచ్చినాఁడు.' అని పలికెను. 'అ టయిన రారమ్ము. ఎవఁడును చూడక ముందే పోదము.' అని రాగాంధుఁడు ఈర్ష్యాళువు పిలిచెను. 'నన్ను తెచ్చినభిల్లుఁడు వేఁటనుండి వచ్చెడువేళ యిది, రాఁగానే మన పోక యెఱిఁగి వాఁడు తఱుముకొని వచ్చి మనలను పట్టుకొని చంపి వేయును; కనుక ఇచట ఈగుహలో దాఁగి యుండుము. రాత్రి వాఁడు నిద్రింపఁగానే వానిని చంపి వేసి నిర్భయముగా పోదము.' అని యాశఠ చెప్పెను. వాఁడును గుహలో దాఁగి యుండెను. కామాంధులహృదయములో వివేకమునకు అవకాశ మెక్కడిది? ఆ దుశ్శీల వ్యసనముచేత అచటికి వచ్చిన యాపతిని గుహాంతః స్థితుని సాయంకాలమున ఇంటికి వచ్చిన భిల్లునికి చూపెను. క్రూరుఁడు పరాక్రమవంతుఁ డా భిల్లుఁడు ఈర్ష్యాళువును గుహనుండి వెలికి ఈడ్చి మఱునాఁడు ప్రాతఃకాలమున దేవికి బలివేయుటకై దృఢముగా నొకచెట్టునఁ గట్టి పెట్టెను. రాత్రి భోజనము చేసి ఈర్ష్యాళునికన్నులయెదుటనే వానిభార్యతో క్రీడలం దేలి దానితోఁగూడ నిద్ర చెందెను.

వాఁడు నిద్రించిన పిమ్మట చెట్టునకు కట్టఁబడి యున్నట్టి యీర్ష్యాళువు చండికాదేవిని స్తుతించి శరణుఁ జొచ్చెను. దేవి ప్రత్యక్ష మై వానికి వర మిచ్చెను. వర ప్రభావముచేత నతఁడు బంధము లూడి భిల్లునితలను వాని కత్తితోనే నఱికి వేసెను. 'ఇఁక రా పోదము, పాపి చచ్చినాఁడు. ' అని భార్యను పిలువఁగా ఆదుశ్శీల అత్యంతదుఃఖముతో లేచి, బిల్లునిశిరమును భర్తకు తెలియ నీయక కైకొని పతితోఁగూ డిపయన మై పోయెను. తెల్లవాఱఁగా ఒకనగరము చేరి అచట ఆ శిరమును జనులకు చూపి 'ఇతఁడు నాభర్తను చంపివేసినాఁడు.' అని భర్తను చూపుచు విలపించెను. అంతట నగరరక్షకులు వారి నిరువురను గొనిపోయి రాజునెదుట నిలిసి వారి వృత్తాంతమును తెలిపిరి. రా జడుగఁగా ఈర్ష్యాళువు యధార్థమును తెలుపుకొనెను. రాజు తత్త్వ మెఱిఁగి ఆ పాపాత్మురాలిని ముక్కు సెవులు కోయించి వెడలఁగొట్టెను, దానిపతిని విడిచి పెట్టెను, వాఁడును కుస్త్రీస్నే హాగ్రహము తొలఁగి తనయింటికిఁ బోయెను. దేవా, ఈర్ష్య యే స్త్రీలకు అన్యపురుషాసంగమును నేర్పును. కావున బుద్ధిమంతుఁడు ఈర్ష్యను చూపకయే స్త్రీని కాపాడుకో వలసినది.

స్త్రీలకు రహస్యము చెప్పఁగూడదు.

మఱియు మేలు గోరిన వాఁడు స్త్రీలకు రహస్యమును చెప్పఁ గూడదు, వినుము. నాగుఁ డొకఁడు గరుడభయమున పలాయితుఁ డై వచ్చి భూలోకములో మనుష్య రూపమును ధరించి ఒకానొక వారయువతి యింట దాఁగియుండెను. ఆగణిక రాత్రికి ఏనూఱు ఏనుఁగులను బాడిగ పుచ్చుకొనునది, నాగుఁడు దినదినము తనప్రభావముచే అంతబాడిగను ఇచ్చుచుండెను. 'నీకు ప్రతిదినము ఇన్ని ఏనుఁగులు ఎట్లు కలుగును ? నీ వెవరవు చెప్పుము.' అని యావిలాసిని నిర్బంధింపఁగా మదనమోహితుఁడై నాగుఁడు 'ప్రేయసీ, ఎవరితోను చెప్పకుము, నేను గరుడ భయమున వచ్చి ఇచట దాఁగి యున్నాఁడను, నాగుఁడను.' అని చెప్పెను. గణిక యీ రహస్యమును, కుట్టినికి చెప్పెను. ఇంతలో గరుడుఁడు లోక మంతయు వెదకుచు పురుషాకృతితో వచ్చి కుట్టినిని 'ఈ దినము నేను నీకూఁతుతో నుండెదను, బాడిగ కై కొమ్ము' అనెను. 'ఇచట నాగుఁడు ఉన్నాఁడు, దిన మునకు ఏనూ ఱేనుఁగుల నిచ్చుచున్నాఁడు. ఒకనాఁటి బాడిగ నా కేల?' అని కుట్టిని పలికెను. అచట నాగుఁ డున్నాఁ డని గరుడుఁడు తెలిసి ఆయింట అతిథిగా ప్రవేశించి మేడడాబా మీఁద నున్న నాగునిఁ గని దఱిసి నిజరూపమును ప్రకటించి దుమికి భక్షించెను. కావున ప్రాజ్ఞుఁడు స్త్రీలతో అనర్గళముగా రహస్యము చెప్పఁగూడదు.

ఖల్వాటుని కథ.

ఇట్లు పలికి గోముఖుఁడు మరల ముగ్ధుల కథను చెప్పఁదొడంగెను. ఒక మూర్ఖుడు ధనవంతుఁడు రాగిచెంబువంటి బట్టతల గలాఁడు, తనకు జుట్టు లేనందులకు మిగుల అవమానము వహించు చుండెను. ఒక ధూర్తుఁడు వాని యాశ్రితుఁడు వచ్చి 'అయ్యా, తలవెండ్రుకలు మొలపించు నౌషధమెఱిఁగినవాఁడు వైద్యుఁడొకఁడున్నాడు.' అని చెప్పెను. 'అతనిని నాయొద్దకు తెత్తువేని నీకును వానికిని ధన మిచ్చెదను.' అని ఖల్వాటుఁడు అడిగెను. చిరకాలము వాని ధనమును అనుభవించి ఆ

కేశముగ్ధుఁడు.

ధూర్తుఁడు ఆమూర్ఖునియొద్దకు ఒకధూర్తవైద్యుని తోడ్కొని వచ్చెను. వైద్యుఁడును చిరకాలము మూర్ఖునిధనము అనుభవించుచు తనతలపాగ తీసివేసి ఆమూర్ఖునికి చూపుచుండెను. దానిం గనియు విమర్శించుకో లేక, ఆ జడుఁడు వైద్యుని కేశౌథషము అడుగుచునే యుండెను. వైద్యుఁడు వానితో 'ఓయి మూర్ఖా, బట్టతలవాఁడను నేను బట్టతలవానికి నీకు జుట్టు ఎట్లు మొలపింప నేర్తును? అని నీకు స్వయముగా నా బట్టతలను చూపితిని. అప్పటికిని నీవు కనుంగొననేరవు! ఇసీ!' అని వెడలి పోయెను. ఈ రీతిగా, దేవరా, ధూర్తులు జడమతులతోడ క్రీడించుచుందురు.

తైలముగ్ధుఁడు.

కేశముగ్ధుని వింటివి, తైలముగ్ధుని వినుము. ఒకశిష్టునికి సేవకుఁడు ముగ్ధుఁ డొకఁ డుండెను. ఒకనాఁడు స్వామి నూనె తెమ్మని దుకాణమునకు పంపఁగా సేవకుఁడు నూనెను గిన్నెలో తెచ్చు చుండెను. దారిలో మిత్త్రుఁ డొకఁడు 'నూనె గిన్నె క్రింద కాఱుచున్నది, పదిలపఱుచుకో.' అని బోధించెను. అంత, గిన్నెయడుగును పరీక్షించుటకై వాఁడు తల క్రిందు చేసెను' నూనె యంతయు నేలపా లాయెను. సేవకుఁడు లోకహాస్యు డాయెను. ఆవృత్తాంతము నెఱిఁగి స్వామి వానిని ఇల్లు వెడలఁగొట్టెను. కావున మూఢునికి స్వబుద్ధి వలయుఁ గాని బోధన పనికి రాదు.

అస్థిముగ్ధుఁడు.

అస్థిముగ్ధునికథను వినుము. పూర్వము మూఢుఁ డొకడుండెను. వానిభార్య అసతి. అతఁడు పనిమీఁద దేశాంతరము పోఁగా, ఆ యసతి చేయవలసిన దెల్ల నేర్పి తన యాప్తురాలిని పనికత్తెను ఇంట నుంచి ఏకాంతముగా ఉపపతియింటికి నిరర్గళ సుఖార్థ మై పోయెను. ఇట్లుండఁగా పతి దేశాంతరమునుండి వచ్చెను. వానితో పూర్వశిక్షితురా లయిన యా దాసి బాష్ప గద్గద స్వరముతో 'అయ్యా, నీభార్య కాలధర్మము నొందినది, దహనము కూడ అయి పోయినది.' అని, వానిని శ్మశానమునకు కొనిపోయి ఒకపొదలోని యెముకలు, చూపించెను. వాఁడు వెంటనే భార్యకు ఉదకక్రియలు చేసి, అస్థులను తీర్థములో వేసి వచ్చి, భార్యకు శ్రాద్ధము చేయ నారంభించెను. ఆ దాసియే సద్బ్రాహ్మణుఁ డని భార్యోపపతినే తేఁగా, వానినే మూడుఁడు శ్రాద్ధ బ్రాహ్మణునిఁగా నియంత్రించెను. ఆ యుపపతితోడ ప్రతిమాసికమునందును భార్యకూడ ఉదారవేషాభరణ యై వచ్చి భోజనము చేసి పోవుచుండినది. 'ఓప్రభూ, చూడు నీభార్య పాతివ్రత్యప్రభావముచే పరలోకమునుండి ప్రత్యక్షముగా వచ్చి బ్రాహ్మణునితో కూడ భోజనము చేయుచున్నది!' అని దాసి చెప్పెను. ఆ మూర్ఖశిరోమణి ఆ మాటను యథార్థముగా నమ్మి ఆనందించెను. ఈ ప్రకారము కుస్త్రీలచే ఋజుబుద్ధులు వంచితు లగుదురు

చండాలకన్య.

చండాలకన్య కథను వినుము. రూపవంతురాలు ముగ్ధచండాలకన్యక యొకతె సార్వభౌముని వరునిఁగాఁ బడయ సంకల్పించుకొని యుండెను. ఒకనాఁడు రాజు ఊరేఁగుచుండఁగా కని సర్వోత్తము నతని భర్తృబుద్ధిచే వెంబడించెను. ఇంతలో ఆదారిని ముని ఒకఁడు రాఁగా, రాజు అతనిపాదములకు ప్రణమిల్లి మరల నేనుఁగు నెక్కి తన యింటికి పోయెను. దానిం గని రాజుకంటె మునియే ఉత్కృష్టుఁడని తలఁచి చండాలకన్య మునివెంటఁ బడెను. మునియు పోవుచు దారిలో శూన్యశివాలయమును గని నేల మోఁకా ళ్లూఁది శివవందనము చేసి నడచెను. దానం గన్నియ మునికంటె శివుఁడే అధికుఁ డని తలఁచి మునిని మాని భర్తృబుద్ధితో శివునే ఆశ్రయించి అచటనే యుండెను. క్షణములో అచటికి కుక్క యొకటి వచ్చి దేవునిపీఠము నెక్కి శివలింగముమీఁద కాలెత్తి తన జాత్యుచితము చేసి పోయెను. అంతట చండాలకన్యక దేవునికంటె కుక్కయే యుత్తమ మని పతిబుద్ధిచే ఆ కుక్కవెంటఁ బోయెను. కుక్కయు ఒక చండాల గృహమునకుఁ బోయి అచట పరిచితుఁడయిన చండాలతరుణుని పాదములలోఁ బడి ప్రేమచే దొరల సాగెను. అంతట చండాలకన్య కుక్కకంటె చండాలకుమారుఁడే ఉత్తముఁ డని స్వజాతి తుష్టయై వానిని పతిగా వరించెను. ఈ ప్రకారము దూరమున అడుగు పెట్టు మూర్ఖులు తమచోటనే పడుదురు.

మూర్ఖరాజు.

మూర్ఖరాజుకథ వినుము. మూర్ఖుఁడు రా జొకఁడు ధనవంతుఁ డైనను లోభి యై యుండెను. మంత్రులు ఒకనాఁడు హితార్థము అతనిని 'దేవా, దానము పరలోకదుర్గతిని పోఁగొట్టు నని పెద్దలు చెప్పుదురు. కావున దానములు చేయుము. అయుస్సు ధనములును శాశ్వతములు గావు.' అని బోధించిరి. 'మంచిది, నేను చచ్చి పరలోకమందు దుర్గతిని పొందినయెడల అటుతర్వాత దానము చేసెదను.' అని యాతఁడు చెప్పెను. మంత్రులు తమలో తాము నవ్వుకొని ఊర కుండిరి. మూర్ఖుఁడు తన్ను ధనము వదలువఱకు తాను ధనమును వదలఁడు.

మిత్త్ర ద్వయము.

మిత్త్రద్వయమును వినుము. చంద్రాపీడుఁ డని కన్యాకుబ్జమున ప్రభు వుండెను. ఆయనయొద్ద ధవళముఖుఁ డని సేవకుఁడుండెను. వాఁడు నిత్యము బయటనే భుజించి త్రాగి యిల్లు చేరు చుండెను. 'నిత్యము భోజనము చేసి త్రాగి వచ్చెదవు, ఎక్కడనుండి?' అని భార్య యడుఁగగా 'సుందరీ, నేను నిత్యము మిత్త్రులయొద్ద భోజనము చేసి త్రాగి వచ్చుచున్నాను. నాకు ఈలోకములో ఇద్దఱు మిత్త్రు లున్నారు ఒకఁడు కల్యాణవర్మ, నాకు భోజనాదికముచే ఉపకరించువాఁడు, రెండవవాఁడు వీరబాహువు ప్రాణము లయిన నిచ్చి యుపకరించువాఁడు.' అని చెప్పెను. ఆమాట వినిన యంతట భార్య కుతూహలముచే ఆ మిత్త్రుల నిరువురను తనకు చూపు మని వేఁడెను, అంత ధవళముఖుఁడు భార్యతోఁగూడ కల్యాణవర్మ యింటికి పోయెను. అతఁడును వారిని మహార్హోపచారములతోడ సత్కరించెను. మఱునాఁడు వారిరువురును వీరబాహువు నింటికి పోయిరి. అతఁడు జూద మాడుచుండి వారికి స్వాగతము పలికి వదలెను. అంతట భార్య కౌతుకముచేత ధవళముఖుని 'ఆర్యపుత్త్రా, కల్యాణవర్మ నీకు గొప్పసత్కారము చేసినాఁడు, వీరబాహువు నీకు స్వాగతముమాత్రము పలికినాఁడు, అతనికంటె ఇతఁడెక్కువమిత్రుఁ డని తలంతు వెట్లు?' అని అడిగెను. 'ప్రేయసీ, అట్లయిన, నీవు పోయి అబద్ధమే వా రిరువురతోను రాజు మా మీఁద కోపగించినాఁడని చెప్పుము. అంతట నీవు స్వయముగా ఇరువుర తారతమ్యమును ఎఱుఁగుదువు.' అని ధవళముఖుఁడు చెప్పెను. భార్యయు పోయి కల్యాణవర్మతో అట్లు చెప్పఁగా, 'అమ్మా, నేను వణిక్కుమారుఁడను, రాజున కేమి చేయఁగలను చెప్పుము.' అని కల్యాణవర్మ పలికెను. పిమ్మట ఆసుందరి వీరబాహువునొద్దకు పోయి అట్లే చెప్పెను. అతఁడు విన్న వెంటనే డాలు కత్తియు చేతఁగొని వీరియింటికి వచ్చెను. అంతట ధవళముఖుఁడు వానిని 'మిత్త్రమా, రాజు మంత్రులమాటవలన

అలుక మానినాఁడు, కనుక మఱి యేమియు విశేషము లేదు. ఇంటికి పొమ్ము.' అని ఇంటికి పంపి వేసి, 'చూచితివా? ఇది ఆయిరువురలోను భేదము.' అని భార్యను హెచ్చరించెను. ఆమెయు సంతోషించెను. ఇట్లు ఉపచారమిత్త్రము వేఱు, సత్యమిత్త్రము వేఱు, జిడ్డు సమానమే అయినను, నూనె నూనె, నేయి నేయి, మరల గోముఖమంత్రి నరవాహన దత్తునికి మూర్ఖులకథలను చెప్పసాగెను.

జలభీతుఁడు.

ఒకమూర్ఖుఁడు బాటసారి దప్పిగొని మహాప్రయాసతో అడవిని దాఁటి నదిని చేరియు జలమును త్రాగక చూచుచు ఉండెను. 'దప్పి గొనియు త్రాగ వేమి?' అని అచట నెవఁడో అడుగఁగా, 'ఇంత నీ రెట్లు త్రాగుదు?' నని జడమతి ఉత్తరము చెప్పెను. 'ఈ నీ రంతయు త్రాగినయెడల రా జేమి నిన్ను దండించునా?' అని అతఁడు పరిహాసము చేసెను. ఐనను ఆ మూర్ఖుఁడు జలము త్రాగనే లేదు. ఇట్లు మూడులు ఏపనిని గాని పూర్తిగా చేయ లేరో దానిలో యథాశక్తిగా ఒక భాగము నైనను చేయరు.

పుత్త్రఘాతి.

జలభీతునికథ యయినది. పుత్త్రఘాతి కథను వినుము. మూర్ఖుఁ డొకఁడు బహుపుత్త్రుఁడు దరిద్రుఁ డుండెను. వాఁడు తనకొడు కొకఁడు చచ్చి పోఁగా, రెండవకొడుకును అన్న లేక ఒంటిగా దూరప్రయాణము నడవ లేఁ డని తాను చంపివేసెను. అందులకు జనులు వానిని పరిహసించి దేశము వెడలఁ గొట్టిరి. ఈరీతిగా నిర్వివేకమతులు పశుతుల్యులుగా నుందురు.

భ్రాతృమూఢుఁడు.

భ్రాతృమూఢుని వినుము. మూఢుఁ డొకఁడు జనుల నడుమ మాటలాడుచు ఉండెను. వాఁడు భవ్యాకారుని ఒక పురుషుని కని 'వీఁడు నాయన్న, వీనిసొత్తును హరించెదను, నేను వీనికి ఏమియుఁ గాను, కావున నాకు ఇది ఋణము గాదు' అని పలికి, అచట రాలను గూడ నవ్వించెను. ఇట్లు స్వార్థాంధుఁడైన మూఢుని మూఢత్వము అతిచిత్రముగా నున్నది.

బ్రహ్మచారి సుతుఁడు.

బ్రహ్మచారిసుతుని వినుము. ఒకమూడుఁడు తమతమ తండ్రుల గుణవిశేషములను చెప్పుకొనుచున్న జనుల గోష్ఠిలో ఉండి తన తండ్రి మహిమను 'మానాయన బాల్యమునుండి బ్రహ్మచారి, ఆయనకు తుల్యుఁడు లేఁడు' అని వర్ణించెను. 'అట్లయిన నీ వెట్లు పుట్టితివి?' అని మిత్త్రులు వాని నడిగిరి. నేను ఆయనకు మానసపుత్త్రుఁడను' అని పలికి జడశిరోమణివారిని మఱియు నవ్వించెను. జడమతులు ఎట్టియత్యంతాసంబద్ధము లైనను చెప్పుదురు.

గణకుఁడు.

గణకుఁ డొకఁడు విజ్ఞానహీనుఁడు ఉండెను. వాఁడు జీవనము లేక భార్యాపుత్త్రులతో స్వదేశమునుండి పరదేశము పోయి, లేని విజ్ఞానము ప్రకటించుకొని జనుల నమ్మకముచేత ధనసత్కారము పొందుటకు యత్నించెను. సకలజనుల యెదుట తనపిల్లవాని నొకనిం గౌఁగలించికొని యేడవసాగెను. జనులు కారణ మడుగఁగా, 'అయ్యా, నేను భూత భవ్య భవిష్యత్తు లెఱుఁగుదును; ఈశిశువు నేఁటికి ఏడవనాఁడు చచ్చి పోవును.' అని జనుల నందఱను ఆశ్చర్యపెట్టి, ఏడవనాఁడు తెల్లవాఱు జామున నిద్రించుచున్న యా శిశువును చంపెను. చచ్చిన శిశువుం గని జనులు నమ్మకము కలిగి గణకుని ధన మిచ్చి సత్కరించిరి. ఆ ధనము కైకొని వాఁడు స్వదేశమునకుఁ బోయెను. ఇట్లు ధనలోపముచే విజ్ఞానముప్రకటింపఁ గోరు మూర్ఖులు పుత్త్రు నయినను చంపుకొందురు.

కోపి.

కోపధారి మూర్ఖుని కథ. - వెలుపల నున్న పురుషుఁడొకఁడు వినుచుండఁగా, ఇంట నొకఁడు తనబంధువులతో అతని గుణములను చెప్పు చుండెను. శ్రోతలలో నొకఁడు 'మిత్త్రా, అతఁడు గుణవంతుఁడే ; అయినను వానియందు రెండు దోషము లున్నవి, సాహసమును క్రోధమును.' అనెను. వెలుపల నున్నవాఁడు విని తటాలున ఇల్లు సొచ్చి ఆపలికినవానిని మెడకు గుడ్డచుట్టి పట్టుకొని 'ఓరి మూర్ఖా, చెప్పు, నా సాహస మేమో, నాకు కోప మెక్కడిదో.' అనిక్రోథాగ్నిచే జ్వలించుచు అడిగెను. అంతట ఇతరులు నవ్వుచు ' నీ సాహసక్రోధములు ప్రత్యక్షముగానే అగపడుచున్నవి, వేఱె చెప్పవలయునా ?' అనిరి. ఇట్లు స్వదోషము ఎంతప్రకట మయినను అజ్ఞులకు తెలియదు.

కన్యావర్ధ యిత.

కన్యావర్ధయితకథను వినుము. - ఒక రాజునకు సురూప కన్య పుట్టెను. ఆపిల్లను అతిప్రేమచేత ఆరాజు ఒక్కమాఱు గానే పెద్దదానిని చేయుటకై వైద్యులను రప్పించి ప్రీతితో వారిని 'మంచివరుని పెండ్లి యాడుటకు తగినట్లుగా నా కొమారిత ఇప్పుడే పెద్దది యగునట్లుగా మంచి యౌషధము చేయుఁడు.' అని ఆజ్ఞాపించెను. ఆజడుని ధనమును స్వీకరింప వైద్యులు 'ప్రభూ, ఇందులకు ఓషధి బహు దూరదేశమున నున్నది. దానిని మేము తెప్పించెదము. అది వచ్చువఱకు నీ కొమారితను అదృశ్యురాలినిగా నుంపవలసినది. ఇది ఆ వైద్యమునకు విధానము.' అని తెలిపిరి. రాజు అందులకు అంగీకరించెను. వారు పిల్లను కొనిపోయి పెక్కు వత్సరములు, 'ఇంక ఔషధము రా లేదు' అని చెప్పుచు తమయొద్దనే ఉంచుకొనిరి. ఆమెకు యౌవనము రాఁగానే ఔషధము వచ్చినదనియు దానిమహిమచే పెద్ద దయిన దనియు చెప్పి ఆమెను కొనిపోయి రాజున కొప్పగించిరి. రాజు వారిని ధనములలో ముంచెను. ఇట్లు ధూర్తులు మూర్ఖు లయిన యీశ్వరులను వ్యాజమున భుజింతురు.

అర్ధపణుఁడు.

అర్ధపణునికథ వినుము: - నగరవాసి యొకఁడు ప్రజ్ఞాగర్వము కలవాఁడుండెను. వానియొద్ద పల్లెటూరివాఁ డొకఁడు ఒకవత్సరకాలము కొలువుచేసి జీతము చాలక సెలవు పుచ్చుకొని స్వగ్రామమునకుఁ బోయెను. వాఁడు పోఁగానే అతఁడు భార్యను 'నీయొద్ద నేమియు వాఁడు పుచ్చుకొనలేదు గదా,' యని యడిగెను. అరపణము పుచ్చుకొని పోయె నని ఆమె చెప్పెను. అంత నతఁడు పదిపణములబత్తెము వ్యయపఱుచుకొని నదీతటమార్గముగా పోయి యాభృత్యునివలన ఆ యరపణమును పుచ్చుకొని మరలి వచ్చి, ఆప్రజ్ఞను లోకులతో చెప్పుకొని పరిహాసాస్పద మాయెను. ఈరీతిగా ధనాంధబుద్ధి స్వల్పముకొఱకు విస్తారము వ్యయము చేసికొనును.

అభిజ్ఞానకర్త.

అభిజ్ఞానకర్త కథను వినుము: - ఒకమూర్ఖుఁడు ఓడలో సముద్రమార్గమున పోవు చుండఁగా వానిచేతినుండి వెండిగిన్నె సముద్రములో పడిపోయెను. అంత నా మూర్ఖుఁడు మరల ఆ దారిని వచ్చునప్పుడు మునిఁగి తీసికొందునుగాక యని గిన్నె పడినచోటికి సుడులు బుడగలు లో నగువానిని గుర్తు పెట్టుకొనెను. సముద్రము దాఁటి దిగునప్పుడు నీళ్లలో సుడులు మొద లగువానిని కని ఆగుర్తును బట్టి వెండిగిన్నెను ఎత్తుకొనుటకు పలుమాఱు నీళ్లలో మునుఁగు చుండెను. లోకులు అడుగఁగా జరిగిన వృత్తాంతమును చెప్పి మిగుల పరిహాస్యుఁడాయెను.

ప్రతీమాంసప్రదుఁడు.

ప్రతిమాంసప్రదుఁ డయిన రాజుకథ వినుము. మూడుఁడొకరాజు మేడనుండి క్రింద ఇరువురు పురుషులను, వారిలో నొకఁడు మహానసమునుండి ఆయిదుపలముల మాంసమును హరించి చేతఁబెట్టుకొని యుండుటనుం, గని, వానిదేహమునుండి అయిదుపలముల మాంసమును కోయించివేసెను. మాంసము దేహమునుండి కోయఁగానే వాఁడు నొప్పికి ఏడ్చుచు నేలఁగూలెను. రాజు కనికరించి ప్రతీహారునితో 'అయిదుపలముల మాంసము వీనిదేహమునుండి కోసినందులకు వీనికి ఇట్టినొప్పి కలిగినది; కనుక వీనికి అంతకంటె ఎక్కువమాంసమును ఇమ్ము.' అనెను. 'తల తెగఁగొట్టినవాఁడు నూఱు తలలను ఇచ్చిన మాత్రమున బ్రదుకునా ? అయినను ఇచ్చెదను.' అని చెప్పి ప్రతిహారుఁడు నవ్వుకొనుచు వెలుపలికిం బోయి ఆపురుషుని ఓ దార్చి వైద్యుల కొప్పగించెను. ఈరీతిగా, నిగ్రహమును గాని అనుగ్రహమును గాని ఎట్లు చేయ వలయునో మూఢప్రభువు ఎఱుంగఁడు.

పుత్త్రాంతరకాంక్షిణి.

పుత్త్రాంతరకాంక్షిణికథ వినుము. ఒకానొకతెకు ఒకఁడే కొడుకు. అది ఇంక నొక కొడుకును కోరి యుపాయ మడుగఁగా పాషండురాలు క్షుద్రతాపసి యొకతె 'అమ్మా, నీ కుమారుని చంపి దేవతకు బలివేయుదువేని, నిశ్చయముగా నీకు మఱియొక కుమారుఁడు కలుగును.' అని బోధించెను. ఆ మూఢురాలు అట్లే చేయ నుద్యోగించు చుండఁగా ఒక వృద్ధ ఎఱిఁగి రహస్యముగా దానితో 'ఓసి, పాపాత్మురాలా, లేని కుమారుని కోరి ఉన్న కుమారుని చంపెదవు ! వాఁడును పుట్టనియెడల అప్పు డేమి చేయుదువు!' అని బెదరించి వారించెను. ఈరీతిగా స్త్రీలు శాకినీసంగత లై ఆకార్యములం జొత్తురు; వృద్ధోపదేశముచేత నివారిత లై బాగుపడుదురు.

ఆమలకానేత.

ఆమలకానేతకథనువినుము: - ఒకానొక గృహస్థునికి భృత్యుఁడు మూఢుఁ డొకఁ డుండెను. గృహస్థుఁడు భృత్యుని 'ఓరీ, తోఁటకు పోయి మంచి తీయని యుసిరికపండ్లు నాకు కోసికొని రమ్ము.' అని యాజ్ఞాపించెను. ఆమూడుఁడు ఒక్కొక ఫలమును పండ్లతో కొఱికి రుచి చూచి తీయగా నున్న దని నిశ్చయించుకొని తెచ్చి 'ప్రభూ, ఈ పండ్లు, మధురములు, నేను రుచి చూచి తెచ్చినాఁడను.' అని యెదుట నుంచెను. గృహపతియు సగముగొఱికిన యాపండ్లను గని రోసి వానిని ఆభృత్యునితోఁ గూడ సమముగా వదలివేసెను. ఇట్లు ప్రజ్ఞాహీనుఁడు ప్రభుకార్యమును తన కార్యమును రెంటిని నాశముచేయును.

భ్రాతృద్వయము.

భ్రాతృద్వయకథను వినుము. పాటలీపుత్త్రనగరమందు ఇరువురు బ్రాహ్మణులు యజ్ఞసోముఁడు కీర్తిసోముఁడు అని అన్నదమ్ములు ఉండిరి. వారి పిత్రార్జితధనము విస్తారము ఉండెను. కీర్తిసోముఁడు తనభాగమును వర్తకముచే వృద్ధిచేసెను. యజ్ఞసోముఁడు తనధనము నెల్ల అనుభవించి ఇచ్చి వ్యయపఱిచెను. 'అతఁడు నిర్ధనుఁ డై తనభార్యతో: - 'ఓసీ, 'ప్రేయసీ, నేను ఇంతవఱకు ధనాఢ్యుఁడ నై యుండి ఇప్పుడు బంధువుల నడుమ నిర్ధనుఁడనుగా నెట్లు బ్రదుకుదును? రమ్ము దేశాంతరము పోవుదము. ' అనియె. 'బత్తెము లేక యెక్కడికి పోగలము?' అని భార్య పలికెను. అతఁడు నిర్బంధింప భార్య అవశ్యముగా పోవలయు నేని, మీ తమ్ముడు కీర్తిసోమునియొద్దనుండి బత్తెముకొఱకు కొంచెము ద్రవ్యము తెచ్చుకొమ్ము.' అని చెప్పెను. అతఁడును పోయి తమ్ముని పాథేయ మడుగునంతలో తద్భార్య యిట్లనియె: 'ఇతఁడు స్వధనమును పోఁగొట్టుకొన్నాఁడు, ఇతనికి ధనము మన మేల ఈవలయును? దరిద్రుఁ డయినవాఁ డెల్ల మన కడకే వచ్చును.' కీర్తిసోముఁడు విని అన్నయందు స్నేహము కలవాఁ డయ్యును అతనికి ఏమియు ఈఁజాలఁడాయెను. దుష్టస్త్రీల వశములో నుండు పురుషులకష్ట మిది. అంత యజ్ఞసోముఁడు ఊరకయే ఇంటికిఁ బోయి ఆ వృత్తాంతమును భార్యతో చెప్పి దైవైకశరణముగా బయలు వెడలి పోవుచుండఁగా అడవిలో ఆ బ్రాహ్మణుని అజగరము మ్రింగెను. అతనిభార్య దానిం గని నేలఁ బడి యేడువ సాగెను. 'అమ్మా. ఏల ఏడ్చెదవు?' అని మనుష్యభాషలో అజగర మడుగఁగా బ్రాహ్మణి యిట్లనియె. 'మహానుభావా, విదేశములో నా భిక్షాభాజనమును నీవు హరించితివి, నే నెట్లు ఏడువకుందును?' ఆమాట విని అజగరము తననోటినుండి క్రక్కి. ఒక గొప్పబంగారు పాత్రమును 'ఇదిగో, నీభిక్షాపాత్రముకొమ్ము.' అని ఆమె కిచ్చెను. 'మహానుభావా, స్త్రీకి నాకు ఇందులో భిక్ష ఎవరు పెట్టుదురు?' అని యామె యడుగఁగా, అజగరము 'నీ వడుగఁగా ఈపాత్రములో ఎవఁడు భిక్ష పెట్టఁడో వానితల నూఱు వ్రక్క లగును. నా మాట యిది నిక్కము.' అని చెప్పెను. అంత నా బ్రాహ్మణి పతివ్రత అజగరమును 'అయ్యా, అట్లయినయెడల నీవు ఇందు నా కిప్పుడు పతిభిక్ష పెట్టుము.' అని యడిగెను. ఆమెనోట ఈమాట రాఁగానే అజగరము తననోటినుండి ఆబ్రాహ్మణుని సజీవుని వెడలఁ గ్రక్కి ఆమెకు ఇచ్చి, దివ్యపురుషుఁ డై తుష్టు లయిన యాదంపతులతో 'నేను విద్యాధరరాజును, నాపేరు కాంచనవేగుఁడు, గౌతమశాపముచేత నజగరమ నైతిని. పతివ్రతతో సంవాదము కలుగువఱకు నాకు శాపము.' అని పలికి ఆపైఁడి పాత్రమును రత్నములతో నిండించి యిచ్చి తత్క్షణమే హర్షముతో ఆకాశ మార్గమునఁ బోయెను. ఆదంపతులు ఆరత్న రాశినికైకొని యింటికిఁ బోయిరి. ఇట్లు యజ్ఞసోముఁడు అక్షయ ధనుఁడై సుఖముండెను. బ్రహ్మ ఎల్లవారికిని సత్త్వానురూపముగా సర్వమును ఇచ్చును.

నాపితార్థి.

నాపితార్థి కథను వినుము. - కర్ణాటదేశీయుఁడు ఒక భటుఁడు రాజునొద్ధ కొలువుండి యుద్ధములో ఆతని మెప్పించెను. ప్రభువు వానిని ఇష్ట మయిన కోరిక కోరుకొమ్మనెను. అంతట నపుంసకప్రాయుఁ డాభటుఁడు 'ప్రభూ, నీ మంగలవానిని నాకిచ్చి వేయుము' అని యడిగెను. ఎల్లవారును వారి సత్త్వమునకు తగినట్లు ఫలము వేఁడుదురు.

నకించిన్మార్గణుఁడు.

నకించిన్మార్గణుని వినుము. ఒక మూర్ఖుఁడు దారిని పోవుచుండఁగా బండివాఁ డొకఁడు వానిని తనబండి కొంచెము సరిగా పెట్టి పొమ్మని యడిగెను. అందులకు నాకేమి యిచ్చెద వని మూర్ఖుఁ డడిగెను. '(నకించిత్ దదామి) ఏమియు ఇయ్యను (నకించిత్ ఇచ్చెదను)' అని బండియాసామి చెప్పెను. అంత మూర్ఖుఁడు బండిని చక్కఁగా నిలిపి బండివానిని 'ఇయ్యవోయి నాకు నకించిత్ ' అని యడిగెను. అతఁడు పరిహసింపసాగెను. దేవా, ఈరీతిగా మూర్ఖులు జనులచే పరిహాసమును పొంది నింద్యు లయి ఆపదల పా లగుదురు. యోగ్యు లెప్పుడును పూజనీయులుగా నుందురు.

ఇట్లు నరవాహనదత్తుఁడు రాత్రి గోముఖునివలన ఇట్టి వినోదకథలను విని జగత్త్రయ విశ్రాంతి హేతు వైన నిద్రా సుఖమును భజించెను.