Jump to content

కథాసరిత్సాగరము (వేదంవారి వచన రచన)/నాలుగవభాగము/శక్తియశోలంబకము: 4-వ తరంగము

వికీసోర్స్ నుండి

4-వ తరంగము.


ఇట్లు విద్యాధరీయుగళకథను వర్ణించి మంత్రిపుంగవుఁడు గోముఖుఁడు మరల నరవాహనదత్తునితో నిట్లనియె. దేవా! ఈ లోకములో సామాన్యజనులుకూడ కొందఱు వివేకవంతులు ఇహపరములు కోరినవారైన కామావేగమును సహింతురు. అందులకు ఒకకథ కలదు, వినుము.

కులధరుఁ డను రాజునకు శూరవర్మ యను సేవకుఁడు పౌరుషశాలి కులపుత్త్రుఁడు ఉండెను. అతఁడు ఒకప్పుడు గ్రామాంతరమునుండి వచ్చి నిశ్శంకముగా ఇల్లు సొచ్చినవాఁ డై అచట తనమిత్త్రునితోనే సంగత యైన తనభార్యను గాంచెను. కాంచి యతఁడు ధైర్యముచే క్రోధమును ఆఁపుకొని తనలో తాను 'పశుప్రాయుఁ డైన యీ మిత్త్రద్రోహిని చంపిన నేమి ప్రయోజనము? దుశ్చారిణిని ఈ పాపాత్మురాలిని దండించిన ఏమి ఫలము? పాపభాజనమ నైన నన్ను నే నేమి చేకొందును?' అని తలపోసి ఇరువురతోను 'మీరు మరల నాకంటి కగపడిన చంపివేసెదను, నాకంటికి అగపడక పొండి' అని పలికి తఱిమి వేసెను. వా రెచటికో పోయిరి. శూరవర్మ మఱి యొకతెను వివాహ మై సుఖ ముండెను. క్రోధమును జయించినవాఁడు దుఃఖభాజనము గాఁడు. తెలివి గలవానిని విపత్తు బాధింపదు. తిర్యగ్జంతువులకుఁ గూడ ప్రజ్ఞవలన సేమముగాని పరాక్రమము వలనఁ గాదు. అందులకు ఈసింహవృషభాదిక కథను వినుము.

సింహవృషభాదిక కథ.

పూర్వము ఒకానొకనగరమున ఒక వణిక్కుమారుఁడు ఉండెను. అతఁడు ఒకప్పుడు బేరమునకై మథురాపురమునకు పోవుచుండఁగా బండియెద్దు సంజీవక మనునది బండి లాగుచు దారిలో బరువుచే కాఁడి విఱిగిపోఁగా కొండయూటబురదలో కాలు జాఱి పడి దేహ మెల్ల చూర్ణప్రాయముగా నలుఁగుడు పొందెను. ఆదెబ్బకు ఒడ లెఱుఁగక పడి యున్న సంజీవకమును ఎంతప్రయాస పడియు లేప లేక వణిక్కుమారుఁడు నిరాశ చేసికొని దానిని వదలి తాను మాత్రము పోయెను. కొంతసేపటికి సంజీవకము దైవానుగ్రహమున సేదదేఱి లేచి మంచి గఱికమేయుచు మెల్లగా యమునాతీరము చేరి క్రమక్రమముగా మంచి మేఁతచే బలిసికోలుకొనెను. మూఁపురము పెరిగి శివునిగిత్తవోలె పుట్టలను కోరాడుచు మదించి ఱంకెలు వేయు చుండెను. ఆసవిూపమున ఒక సింహము పింగళక మనునది పరాక్రమముచే అడవినెల్ల ఆక్రమించి యేలుచు ఒక గుహలో నివసించి యుండెను. ఆ మృగరాజునకు ఇరువురు నక్కమంత్రు లుండిరి. ఒకనిపేరు కరటకుఁడు, రెండవవాఁడు దమనకుఁడు. ఆసింహమే ఒకప్పుడు జల పానార్థము యమునాతటమునకు వచ్చి చెంతనుండి పర్విన సంజీవకునిఱంకెను వినెను. అశ్రుత పూర్వమై దిక్కులు పిక్కటిల్ల వ్యాపించుచున్న యానాదమును విని సింహము 'ఆహాహా! నాదమే యీవిధముగా నున్నది? నిశ్చయముగా ఈచెంత నేదో గొప్పజంతువు ఉన్నది. అది నన్ను చూచిన, తత్క్షణము చంపును. లేదా, ఈయడవినుండి తఱుమును.' అని తలపోసి జలము త్రాగకయే మరలి అడవి చొచ్చి తనచింతను అనుచరులకు తెలుపక భయముచే దాఁగి యుండెను. అంత నతనిమంత్రిప్రాజ్ఞుఁడు దమనకుఁడు రెండవ మంత్రి యగు కరటకునితో 'భద్రా, మనదొర జలపానార్థము పోయి త్రాగకయే వడివడిగా వచ్చినాఁడు. ఇందుల కారణమును మనము అడిగి తెలిసికోవలయును.' అనెను. అంతట, కరటకుఁడు 'ఇ దేమి మనపనియా ? నీవు మేకు పెఱికిన కోఁతి కథను వినలేదా?' అని యాకథను చెప్పఁ దొడంగెను.

మేకుపెఱికినకోఁతి కథ.

ఒకానొకనగరములో వర్తకుఁ డొకఁడు విస్తారము కలప తెప్పించి దేవాలయము కట్టించుచుండెను. అచట పనివాండ్రు ఒకదూలమును ఱంపముతో సగము కోసి సందులో గూటము దిగఁగొట్టి యుంచి యింటికిఁ బోయిరి. అంతలో నచటికి ఒక కోఁతి వచ్చి గూటము దించి యుండిన యా సందులో చాపలముచే మృత్యుముఖంబునంబోలె కూర్చుండి కాలచోదిత మై రెండుచేతులతోను ఆ గూటమును పెఱికి వేసెను. గూటము లేచి పోఁగానే దూలముయొక్క చీలికలు రెండును కలిసికొనఁగా నడుమ నున్న యా కోఁతి చిదిగి చచ్చిపోయెను. ఈ రీతిని జోలిమాలినపనికిఁ బోవువాఁడు నశించును. కావున మృగరాజు స్థితి ఏ మయిన మన కేమి?

ఇట్లు కరటకునివలన విని దమనకుఁ డనియె: 'ప్రభు చిత్తములో చొరఁబడి తెలివి గలవాండ్రు సర్వదా విశేష భోగములు పొందుదురు. ఉదరపూరణమాత్రము చేసికొనని వాఁ డెవఁడు?' అంతట కరటకుఁడు 'సేవకునికి తనంతట తాను దొరయం దధికముగాప్రవేశించుట ధర్మము గాదు.' అనెను. దమనకుఁడు 'అట్లుగాదు. ఎల్లవారును తమసత్త్వమునకు తగిన ఫలము కోరుదురు. కుక్క ఎముకకు తృప్తిపొందును సింహము ఏనుఁగుమీఁది కెగురును.' అనెను. 'ఇట్లు చేయుదుమేని దొర సంతసించుటకు బదులు కోపగించినయెడల మన కేమి ఫలము ? 'దొరలు పర్వతములవలె మిక్కిలీ కర్కశులు, స్తబ్ధులు, ఘాతుక జం త్వావృతులు, దురాసదులు, విషములు.' అని కరటకుఁడు పలికెను. దమనకుఁడు 'అది సత్యమే, తెలివి గలవాఁడు ప్రభువును చిత్త మెఱిఁగి స్వాధీన పఱుచుకొనును.' అనెను.

అంతట కరటకుఁడు అట్లే చేయు మనఁగా దమనకుఁడు సింహమునొద్దకు పోయి నమస్కరించి కూర్చుండి యతనిచేత మన్నన వడసి యిట్లు విన్నవించుకొనెను. 'దేవా, నేను నీకు కులాగతుఁడను, భృత్యుఁడను, హితుఁడను. పరు నయినను హితుని చేర్పవలయును. తనవానినైనను అహితుని తొలఁగింప వలయును. హిత మయిన పిల్లిని వెల యిడి యయినను తెచ్చి పెంతురు. అహిత మయిన మూషకమును ఇంటఁబుట్టిన దాని నైనను శ్రమపడి యైనను చంపివేయుదురు. నేమము కోరిన యేలిక తన మేలు కోరు భృత్యుల మాటను విన వలయును. దొర యడుగ కున్నను వారు సమయమందు దొరకు హితము చెప్పవలయును. కనుక, దొరా! నాయందు నమ్మకము గలవేని కోపింపక దాఁపక చెప్పెదవేనియు ఒకవిషయ మడిగెదను.' ఇట్లు దమనకుఁడు పలుకఁగా, పింగళక మహారాజు చిత్తగించి 'ఓయి, నీవు నమ్మక మయినవాఁడవు. మాయందు భక్తి గలవాఁడవు. కాన నిశ్శంకముగా అడుగుము.' అనియె. దమనకుఁడు 'దేవా, నీవు దప్పిచే జలపానార్థము ఏటికి పోయి జలము త్రాగకయే మరలి చింతాక్రాంతుఁడ వై వచ్చినందులకు కారణ మేమి?' అని యడిగెను. ఆమాట విని మృగరాజు 'వీఁడు నన్ను కనిపట్టినాఁడు. వీఁడు నాయందు భక్తుఁడు. వీనియొద్ద దాఁప నేల?' అని తలంచి వానితో నిట్లనియె. 'వినుము నీకు చెప్పక నేను దాఁచునది యేమియు లేదు. నీటియొద్ద నుండఁగా నాకు ఒకగొప్పగర్జన యపూర్వ మైనది వినఁబడినది. ఆ యుగ్రనాదము నాకంటె గొప్ప దయిన యొకసత్త్వము దని తలంచుచున్నాను. ప్రాయికముగా జంతువు శబ్దానురూపముగా నుండును. బ్రహ్మ యొక్క జంతుసృష్టి అధికాధికముగా విచిత్రముగా నున్నది. ఆ జంతువు ఇచట ప్రవేశించినందున ఇఁక ఈ దేహము నాది గాదు, ఈవనమును నాది గాదు. కనుక నేను ఇచటినుండి మఱి యే యడవికేనియుఁ బోవలయును. ఇట్లు పలికిన దొరకు దమనకుఁ డిట్లనియె. శూరుఁడవు దేవా, ఈ మాత్రానకే యడవి వదలి బోయెద ననియెదవు. నీటిచేత అనకట్టును, కొండెముచే స్నేహమును, దాఁపమిచే రహస్యాలోచనయు, శబ్దమాత్రముచే పిఱికి వాఁడును భంగపడుట తెల్లము. యంత్రాది శబ్దములుకూడ భయంకరము లగును. ప్రభూ, తత్త్వ మెఱుఁగక భయపడఁ గూడదు. భేరీజంబుక కథను వినుము.

భేరీజంబుక కథ.

ఒక యడవిలో నొకనక్క ఆహారార్థము తిరుగుచు ఒకచోట యుద్ధము జరిగినక్షేత్రమును చూచి దఱిసి అచట నొక గంభీరధ్వనిని విని అదివచ్చినవైపు చూడ్కులు నిగిడించి అచట అదృష్టపూర్వ మయిన యొక భేరిని కని 'ఏమి యిది! ఇదే మయిన జంతువా, ఇట్లు పరున్నదా?' అని చింతించుచు, అది కదలక ఉండుట గని చెంత కేఁగి చూచి జంతువు కాదని తెలిసికొనెను. దానికి ఆడుచున్న ఱెల్లుకాఁడ తగులఁ దగుల భేరీముఖముతోలు శబ్దించుచుండెను. దాని నెఱిఁగి గోమాయువు, భయము తీఱి, ఇందులో తిండి కేమయిన దొరకునా, యని తోలును కొఱికి లోనఁ జొచ్చి చూడ కేవలము కొయ్యయు తోలును ఉండెను.

ఇట్లు, మీబోంట్లు శబ్దమాత్రమునకు వెఱతురా? సెలవిచ్చిన నేనుపోయి దానినెఱిఁగి వచ్చెదను.” సింహము 'శక్తుఁడ వేని పోయిరమ్ము.' అని సెల విచ్చెను. అంతట నక్క యమునా తటమునకు శబ్దానుసారము గా పోయి చూడఁగా అచట నొక యెద్దు మేయుచుండెను. దమనకుఁడు సమీపించి దానితో నొడంబడిక చేసికొని మరలి పోయి సింహములో ఉన్నది యున్నట్లే చెప్పెను.

అంతట పింగళకము సంతుష్టితో 'దమనకా, నీవు ఆ గొప్పయెద్దును పరిచయము చేసికొంటివేని దానిని యుక్తిగా ఇచటికి తోడ్కొని రమ్ము, ఎట్టిదో చూచెదను.' అని చెప్పి దమనకుని మరల సంజీవకమునొద్దకు పంపెను. దమనకుఁడు పోయి ఎద్దును 'రారమ్ము, మాదొర నీపై సంతోషించినాఁడు. నిన్ను పిలుచుచున్నాఁడు.' అని పిలువఁగా ఎద్దు భయముచే రాదాయెను. అంతట దమనకుఁడు మరల వనమునకుఁ బోయి తన దొరచే సంజీవకునికి అభయ మిప్పించి, మరల సంజీవకునొద్దకు వచ్చి అభయము తెలిపి ఓదార్చి సింగముకడకు కొనిపోయెను. ప్రణమిల్లిన సంజీవకమును సింహము 'రా, నాయొద్దనే ఇచ్చట నిర్భయముగా ఉండుము.' అని సత్కరించెను. అట్లే ఎద్దు అచటనే యుండెను; క్రమక్రమముగా ఆయిరువురమైత్త్రియు బలపడి, మృగరాజు ఇతరులయందు విముఖుఁ డయి సంజీవక తత్పరుఁ డై యుండెను.

ఆ స్థితిని గని ఖిన్నుఁ డై దమనకుఁడు కరటకునితో నిట్లనియె. “చూచితివా, మనదొర కేవలము సంజీవకుని వసమైనాఁడు, మనవైపు చూడను గూడ చూడఁడు. తాను ఒంటిగానే మాంసము భక్షించుచున్నాఁడు, మనకు పాలు ఇచ్చుట లేదు. ఈ ప్రభువు మూర్ఖుఁడు, వీనికి ఎద్దు నేర్పుచున్నది. ఈ యెద్దును తెచ్చుటయే నా తప్పు, కనుక ఈ యెద్దునకు ముప్పు కలుగునట్లు ప్రయోగము చేసెదను. మనప్రభువు ఈ యనర్హుని వదలునట్లు చేసెదను.” కరటకుఁడు 'చెలికాఁడా, ఇప్పుడు ఇట్లు చేయుటకు నీకుఁ గూడ శక్యము గాదు, ' అనెను. అందులకు దమనకుఁడు 'చేసెదను చూడు నాప్రజ్ఞ, ప్రజ్ఞగలవాఁడు ఏమిచేయ లేఁడు! ఇందుల నిదర్శనము, వినుము.' అని చెప్పఁదొడంగెను.

కొంగను చంపిన యెండ్రి కథ.

పూర్వము మత్స్యసమృద్ధ మయిన యొకసరసులో ఒక కొంగ యుండెను. దానికంట పడక భయముచే మత్స్యములు దాఁగుచుండినవి. వానిని పట్టుకొన లేక కొంగ వానితో నిట్లు బొంకెను — ఓ చేపలారా ఇచటికి జాలరి ఒకఁడు వచ్చి యున్నాఁడు. మిమ్ము క్షణములో వలలో పట్టి చంప నున్నాఁడు. నాయందు మీకు నమ్మక మున్న యెడల నా మాటప్రకారము రండు. ఒకానొక మాఱుమూల జాలరులు ఎఱుఁగనిది, స్వచ్ఛ జలసమృద్ధము ఒకసరస్సు, కలదు. మిమ్ము ఒక్కొక్కరినిగా కొనిపోయి అందు వేసెదను. అక్కడ నివసింపుదురు గాక.' ఆ మాట విని ఆ పిఱికి జంతువులు జడమతులు మత్స్యములు అయ్యా అయ్యా కొంగయ్యా, అట్లే చేయుము, 'మేము, నిన్ను నమ్ముకొని యున్నాము.' అని మొఱ పెట్టినవి. అంత నా కొంగ ఒకటొకటిగా చేపలను కొనిపోయి ఒకగుంటిమీఁదఁ బెట్టుకొని భక్షించుచుండెను. చేఁపలను అట్లు కొనిపోవుచున్న యాకొంగను ఆసరస్సులో నున్న యొకయెండ్రి కని, 'ఎక్కడికి చేఁపలను కొనిపోయెదవు?' అని యడిగెను. చేఁపలతోఁ జెప్పినట్లే కొంగ యెండ్రితోఁ గూడ చెప్పెను. ఎండ్రి భయపడి తన్నుఁగూడ కొనిపోయి కాపాడు మని కొంగను వేఁడెను. కొంగయు దానిమాంసమునకు నోరూర దానిని కఱచుకొని ఆతిండిగుంటికి కొని పోవుచుండఁగా, ఎండ్రి అచట భక్షితములైన మత్స్యములను అస్థిశేషములను కని 'ఆహా! ఈ కొంగ చేఁపలను నమ్మించి భక్షించుచున్నది గదా?' అని తెలిసికొని, తన్ను అది. రాతిపైఁ బెట్టఁగానే దానిమెడను తెగువతో తన రెండుగోళ్లతోను కత్తిరించి వేసినది. పిమ్మట నాయెండ్రి కడమ మత్స్యములకడకుఁ బోయి జరిగినవృత్తాంతమును వానికి చెప్పి వాని ప్రాణములను రక్షించెను. అవియును మిగుల సంతసిల్లినవి.

కావున ప్రజ్ఞయే బలము, ప్రజ్ఞ లేనివానికి బలమువలన ప్రయోజనము లేదు. సింహశశక కథను వినుము.

సింహశశక కథ.

పూర్వ మొక యడవిలో మహాపరాక్రమశాలి ఓటు లేనిది సింహ మొకటి అగపడిన జంతువు నెల్ల సంహరించుచు ఉండెను. అంత నడవిలో మృగము లెల్ల కలయఁ బలికికొని దానితో "ఓ మృగేంద్రా, నీకు దినమున కొక్కజంతువును ఆహారార్థము పంపెదము, ఒక్కమాఱే జంతువుల నెల్లఁ గూల్చి ఏల స్వార్థహాని చేసికొనియెదవు?" అని విన్నవించుకొన్నవి. అందులకు సింహము అంగీకరించెను. నాఁటనుండియు దినమున కొకజంతువును సింహము ఆరగించుచుండఁగా, ఒకనాఁడు ఒక చెవులపిల్లికి వంతు వచ్చినది. మృగము లెల్లను పంపఁగా తరలి వచ్చుచు బుద్ధిశాలి యా శశకము తనలో తా నిట్లాలోచించెను. 'ఆపత్కాలమందు తెలివి కోలుపోనివాఁడే గదా ధీరుఁడు. కావున మృత్యువు ఆసన్న మై యున్న నేను ఒక యుపాయము పన్నెదను.' ఇట్లాలోచించి శశకము సింగమునొద్దకు ఆలస్యముగా పోయి చేరెను. అట్లు తామసించి వచ్చిన శశకముతో సింహము 'ఓరీ శఠుఁడా, నా భోజన వేళను దాఁటి వచ్చితి వేమి! నీకు చావుకంటె ఎక్కువ బాధ కలిగించెదను. చూడుము.' అనెను. శశకము వినయముతో 'దేవా, అది నా తప్పు గాదు, ఏల యనఁగా ఇప్పుడు నేను నా వశములో లేను. నన్ను దారిలో మఱి యొక సింహము పట్టుకొని చాల సేపటికి విడిచి పెట్టినది.' అని విన్నవించెను. ఆ మాట విని సింహము తోఁకతో నేల తాటించుచు క్రోథారుణేక్షణ మై 'ఆ సింహము ఎక్కడ నున్నదో చూపుము.' అని శశకమున కాజ్ఞాపించెను. దేవా విజయంచేసి చూడుఁడు.' అని శశకము సింహమును ఒక నూతియొద్దకు కొనిపోయి 'ఇందులో నున్నది చూడు' మనెను. సింహము గర్జించుచు నూతిలోనికి చూచి అందు తేటనీటిలోని తన ప్రతిబింబమును కని, దానిని రెండవసింహముగాను, తనగర్జనకు ఆనూతిలోన కలిగిన ప్రతిధ్వనిని ఆ రెండవసింహముయొక్క ప్రతిగర్జనగాను, తలంచి, యా సింహమును సంహరించుటకై కోపముతో నూతిలోనికి దుమికి చచ్చెను. ఇట్లు శశకము ప్రజ్ఞచేత తాను బ్రదికి, ఎల్ల మృగములను ఆ వృత్తాంతము చెప్పి సంతోషపెట్టెను. ఇట్లు ప్రజ్ఞయే బలముగాని పరాక్రమము బలము గాదు. అట్లే నేనును ప్రజ్ఞచేత నా కోరికలను సాధించెదను: -

ఇట్లు దమనకుఁడు పలుకఁగా కరటకుఁడు ఊరక ఉండెను. అంతట దమనకుఁడు పోయి తనదొర పింగళకుని మ్రోల చింతాక్రాంతుఁడుగా నిలిచెను ప్రభువు కారణమును అడుగఁగా రహస్యముగా నతనితో “దేవా, ఎఱిఁగి యూర కుండ రాదు, గావున చెప్పెదను వినుము ; స్వామికి మేలు కోరువాఁడు అనాజ్ఞాతుఁ డయ్యును హితమును చెప్పవలయును. కాన, దేవా, వేఱుబుద్ధి మాని నావిజ్ఞాపనను సావధానముగా వినవలయును. ఈ సంజీవకము నిన్నుఁ గూల్చి నీరాజ్యమును అపహరింపఁ గోరియున్నది. ఇది నీ మంత్రి యై నీవు పిఱికి వని నిశ్చయించుకొని యున్నది. నిన్ను చంపఁ గోరి తన కొమ్ములను చిమ్ముచు ఉండును. 'గడ్డిమేఁపరిని నేను రాజనుగా మీరు సుఖముగా నుందురు గాక, రండు మాంసభోజనుని ఈతని యుక్తిగా చంపివేయుదము.' అని యడవిలోని జంతువుల నెల్ల పిలుచుచున్నది. కావున ఈయెద్దును నీవు నివారింపవలయును ; ఇది యున్నంతసేపు నీకు క్షేమము లేదు. " అని పలికెను. ఇట్లు దమనకుఁడు చెప్పఁగా విని పింగళకుఁడు. 'గడ్డి మేయునది యీ యెద్దు, తుచ్ఛజంతువు, న న్నేమి చేయఁగలదు? నన్ను శరణుఁజొచ్చి నాచేత నభయ ప్రతిజ్ఞపొందిన దీనిని నే నెట్లు చంపుదును!' అని మాఱు చెప్పెను.

దమనకుఁడు చెప్పుచున్నాఁడు - దేవా, అట్లనకు ; రాజు ఎవనిని తనకు సమానుని చేయునో వాఁడు రాచసిరి గలవాఁ డగును. ఆ సిరి ఉచ్ఛ్రితు లైన యా యిరువురయందును పాదమూని చాలసేపు అట్లు నిలువ లేక వారిలో ఒకని వదలును. దుష్టరోగిని వైద్యుఁడువోలె హితమును ఈసడించుచు సదా అహితమునే సేవించు ప్రభువును బుద్ధిమంతుఁడు వదలవలయు. తొలుత అప్రియ మయినను పిదప హితముగా పరిణమించు దానిని చెప్పువాఁడును వినువాఁడును ఎచట నుందురో అచట సిరి నెలకొనును. యోగ్యుల యాలోచనను వినక అయోగ్యుల బోధనలను వినువాఁడు త్వరలోనే ఆపద పొంది దుఃఖపడును. కావున, దేవా, ఈ యెద్దుమీఁద నీకు స్నేహ మనఁగా నేమి? నీకు ద్రోహము చేయ నున్న దీనికి అభయదాన మనఁగా నేమి? ఇది శరణుఁ జొచ్చుట యనఁగా నేమి ? మఱి నిత్యము నీచెంతనుండు నీయెద్దుయొక్క ఉచ్ఛయందును పేఁడయందును పుట్టుపురుగులు నీ దేహమందలి మత్తేభ దంతాఘాత వ్రణములలో ప్రవేశించినయెడల యుక్తిగా నీవధ జరుగదా. బుద్ధిమంతుఁడు దుర్మార్గుఁ డగునేని స్వయముగా కీడు చేయఁడు, వాని సంగము వలన కీడు గలుగును. ఇందులకు ఈ కథను వినుము -

నల్లియు చీర పేనును.

ఒకానొక రాజుసెజ్జలో మందవిసర్పిణి యను చీరపేను చిరకాలము నివసించియుండెను. ఆకస్మికముగా గాలికి కొట్టుకొని వచ్చి టీటిభ మను నల్లి యొకటి ఆసెజ్జలోనే చేరెను. దానిని చూచి మందవిసర్పిణి 'నల్లీ, నానివాసమునకు నీ వేల వచ్చితివి ? మఱి యెచటి కైనను పొమ్ము.' అనెను. నల్లియు ఇంతవఱకు నే నెన్నఁడును త్రాగి యెఱుఁగని రాజరక్తమును త్రాగెద, దయ చేసి నన్ను ఇచట నుండ నిమ్ము.' అని వేఁడెను. మందవిసర్పిణి కనికరించి దాని నుండ నిచ్చి 'అ టయిన నీవు అకాలమందు రాజును కఱవఁగూడదు, అతఁడు నిద్రలో నున్నపుడుగాని రతాసక్తుఁ డై యున్నప్పుడు గాని, మృదువుగా కఱవ వలయును.' అనెను. టీటిభము అందుల కంగీకరించి అచటనే యుండి రాత్రి శయ్యాగతుని ప్రభువును అవసరపడి కఱచెను. అతఁడు 'అబ్బా ! ఏదో కఱచినది!' అని అఱచుచు లేచెను. అంతట మత్కుణము శఠము పాఱి పోయినది; రాజభృత్యులు వెదకి మందవిసర్పిణి దొరకఁగా దానిని నలిపి వేసిరి. ఇట్లు టీటిభముతోడి సహవాసమువలన మందవిసర్పిణి మరణము నొందినది. అట్లే సంజీవకుని సహవాసముచేత నీకును ప్రాణ గొడ్డము కలుగును. నా మాటను సమ్మవేని ఆ సంజీవకము నీయొద్దకు వచ్చినప్పుడు అది శూలములవలె వాఁడు లయిన తనకొమ్ములను చిమ్ముటను నీవే ప్రత్యక్షముగా చూడఁగలవు.

ఇట్లు దమనకుఁడు బోధింపఁగా లోఁబడి పింగళకుఁడు సంజీవకమును చంప నిశ్చయించుకొనెను. పింగళకుని యభిప్రాయమును తెలిసికొని దమనకుఁడు క్షణములో సంజీవకుని యొద్దకు చింతాక్రాంతుఁడుంబోలె పోయెను. 'మిత్త్రమా, దమనకుఁడా, ఏమి యిట్లున్నావు ? నీకు ఆరోగ్యమా?' అని సంజీవకుఁ డడిగెను. 'మిత్త్రమా, ఏల యడిగెదవు. సేవకుఁడయిన వానికి కుశల మెం దయినం గలదా ? రాజుల కెవఁడు సదా ప్రియుఁ డగును? యాచకునికి లాఘవము తప్పునా? కాల గోచరము కానివాఁ డెవఁడు?' అని దమనకుఁడు పలికెను. 'వయస్యా, ఏమి యిట్లు దిగులు పడినట్టులు పలుకుచున్నావు? కారణము చెప్పుము.' అని సంజీవకుఁ డడుగఁగా దమనకుఁడు 'మిత్త్రుఁడా వినుము, నీయందలి ప్రీతిచేత నీకు చెప్పుచున్నాను. మృగరాజు పింగళకుఁడు ఇప్పుడు నీకు విరోధియై యున్నాఁడు. నిరపేక్షుఁడు అస్థిరస్నేహుఁడు నిన్ను వధించి భక్షింపఁ దలఁచి యున్నాఁడు. ఇతని పరివారమువారు ఘాతుకులు సదా ఇతనిని ప్రేరించుచున్నారు.' అనెను. మునుపటి నమ్మికచేత సంజీవకుఁడు దమనకుని యీమాటను విశ్వసించి చింతాకులుఁడై అతనితో నిట్లనియె:- ఇసీ ! ఎంత సేవచేసినను క్షుద్ర రివృతుఁ డైన క్షుద్రప్రభువు వైరమునే పొందును. నిదర్శనము విను.

మదోత్కటము కథ.

ఒకానొక యడవిలో మదోత్కటుఁడని యొక సింహము ఉండెను. దానికి పులి కాకి నక్కయు ముగ్గురు అనుచరులు ఉండిరి. సింహము ఆయడవిలో నొకప్పుడు ఒక లొట్టియ బిడారునుండి చీలి ఏకాకిగా హాస్యకర మైన యాకృతితో తిరుగుచుండఁగా చూచి 'ఇ దేమి జంతువు?' అని ఆశ్చర్యముతో తన యనుచరులను అడిగెను. నానాదేశములు తిరిగిన దైన కాకి 'అది లొట్టియ' అని తెలిపెను. అంతట సింగము కౌతుకముచేత లొట్టియకు అభయ మిచ్చి తన యనుచరులలో చేర్చుకొని తనయొద్ద నుంచుకొనెను. ఒకప్పుడు ఆసింగము గజ యుద్ధములో గొప్ప గాయములు పొంది అస్వస్థ మై అనేకోప వాసములు చేసెను. అనుచరులును అస్వస్థముగానే యుండిరి. అంతట సింహము ఆహారార్థము తిరిగితిరిగి ఎక్కడను దొరకక లొట్టిపిట్ట లేని సమయమున కడమ యనుచరులను రహస్యముగా ఉపాయ మడిగెను. వారు చెప్పిరి: - "ప్రభూ, ఆపత్సమయ మందు మేము ఉచిత కార్యమును చెప్ప వలసినది. ఏలినవారికి లొట్టియతో స్నేహ మనఁగా నెట్టిది? దానినే యేల భక్షింపఁ గూడదు? అది గడ్డి మేయునది న్యాయముగా మాంసభోజనులకు మనకు ఆహారము. అనేకులకు ఆశ్రితులకు మాంసము పెట్టుట కొఱకు ఒకదానిని చంపుటయందు ప్రభువునకు శంక యేల? 'దానికి అభయ మిచ్చితిని, ఎట్లు చంపుదుసు?' అని యేలినవారు చెప్పుదురేని, అదే తన్ను మీకు సమర్పించుకొనునట్లు మేము ఉపాయము పన్నెదము. ఇట్లు వారు పలుకఁగా సింహము అంగీకరించెను. అంతట సింహమునాజ్ఞ పొంది కాకి లొట్టియను చంపుటకు యుక్తిపన్ని దానితో నిట్లు చెప్పెను:- 'మనదొర క్షుత్పీడితుఁ డయ్యును మనతో ఏమియు చెప్పకున్నాఁడు, కనుక ఇతనికి మేము మమ్ము అర్పించుకొన్నట్లు పలికి మెప్పు వడసెదము. నీవు నట్లే చేయుము, నీయందును అతఁడు సంప్రీతుఁ డగును.' లొట్టియయు అట్లే చేయ నంగీకరించి కాకితోఁగూడ సింగము నొద్దకు వచ్చెను. అంతట కాకి సింహముతో 'దేవరా, నేను నీ స్వాధీనుఁడను, నన్ను భక్షింపుము.' అనెను. 'నీదేహము రవంత, నీవలన నేమి ప్రయోజనము?' అని సింగము నిరాకరించెను. అంతట నక్క 'ప్రభూ, నన్ను భక్షింపుము.' అనెను. సింగము దానిని కూడ అట్లే నిరాకరించెను. అంతట పులి తన్ను తినుమని సింగముతో విన్న వించుకొనెను. సింగము దానిని అట్లే నిరాకరించెను. అంతట లొట్టియ తన్ను తిను మని సింగముతో మనవి చేసికొనెను. ఆ మాటమిషచేత సింహము దానిమీఁద పడి దానిని చించి చీల్చి వాయసాదులతోఁ గూడి భక్షించెను.

ఈప్రకారమే కొండీఁ డెవఁడో నా మీఁద అబద్ధములు చెప్పి రాజునకు నాపై కోపము తెప్పించినాఁడు. హంసలచే పరివృత మయిన గద్ద నయినను రాజునుగాఁ గొలువ వచ్చును గాని గృధ్రపరివృత మయిన హంస నయినను గొలువఁగూడదు. ఇతరుల మాట చెప్ప వలయునా? -

ఇట్లు సంజీవకుఁడు పలుకఁగా కుత్సితుఁడు దనునకుఁడు ఇట్లు పలికెను:- సర్వము ధైర్యముచే సాధ్యపడును; అందులకు నిదర్శనము వినుము.

లకుముకి కథ.

కడలియోర లకుముకి భార్యతో నివసించు చుండెను. భార్య గర్భిణియై భర్తతో 'మఱి యెచటి కేని పోదము రమ్ము, ఇక్కడనే ప్రసవ మైన యెడల సముద్రుఁడు ఒకవేళ నాపిల్లలను కరడములతో అపహరించును.' అనెను. అందులకు టిట్టిభము 'ఏమి! నాతో విరోధించుటకు సముద్రునికి గుండెలా ? భయపడకు.' అనెను, టిట్టిభి యనెను:- ఇట్లు పలుకకు, నీ వెక్కడ సముద్రుఁ డెక్కడ? హితోపదేశమును గ్రహింప వలసినది. గ్రహింపని యెడల వినాశము కలుగును. నిదర్శనము వినుము:-

కంబుగ్రీవము కథ.

పూర్వము ఒకసరస్సులో కంబుగ్రీవ మని ఒకతాఁబేలుసుసంకట వికటము లని దాని మిత్త్రములు రెండు హంసములును ఉండినవి. ఒకప్పుడు వఱపుచేత సరస్సు ఎండిపోయినది. అంతట ఆ హంసలు మఱియొక సరస్సునకు పోవుటకు యత్నించుచు ఉండఁగా, కూర్మము తన్ను సైతము వారు పోవుచోటికి కొనిపొమ్మని వారిని వేఁడెను. వారు కూర్మముతో నిట్లనిరి- 'మేము పో నున్న చెఱువు బహుదూరము. అచటికి రాఁ గోరుదువేని నీవు మేము చెప్పునట్లు చేయవలసినది. మేము ఇద్దఱము నోట నొక కఱ్ఱును కఱచి పట్టుకొనియెదము. నీవు దానిని నడుమ కఱచి మాట లాడక యుండవలయును. నోరు తెఱతివేని క్రిందఁ బడి నశింతువు.' తాఁబేలు ఒప్పుకోఁగా హంసలు ఒక కఱ్ఱను తాము ఇరుగడను తాఁబేలు నడుమను కఱచుకొని ఆకాశమున ఎగిరిపోవుచుండినవి. అవి క్రమముగా తాఁబేటిని మోచికొని సరస్సమీపమునకు వచ్చుచుండఁగా అచట క్రింద నున్న నగరజనులు వీనిని చూచి 'ఏమి ఈ చిత్రము! రెండు హంసలు దేనినో మోచుకొని పోవుచున్నవి!' అని కలకలము చేసిరి. విని చపలమతి ఆ తాఁబేలు ' క్రింద ఏమి యీగొల్లు?' అని యడుగుచు, నోరు తెఱవఁగానే, కఱ్ఱనుండి జాఱి నేలఁబడి జనులచేత మోఁదులు వడి మడిసెను. ఈరీతిగా హితము విననివాఁడు కఱ్ఱను విడిచిన కూర్మమువలె చేటొందును.

మూఁడుచేఁపలకథ.

ఇట్లు భార్య పలుకగా టిట్టిభము బదులు చెప్పెను:- “ప్రేయసీ, నీవు చెప్పినమాట సత్యమే. అయినను నీవును ఈకథ వినుము. ఒకనదిలో ఒకచోట మడుఁగులో మూఁడు చేఁపలు ఉండినవి; అనాగతవిథాత, యద్భవిష్యకము, ప్రత్యుత్పన్నమతి అని వానిపేరులు ; మూఁడును సహవాసగాండ్రు. ఒకనాఁడు జాలరులు ఆదారిని పోవుచు 'ఆహా! ఈ మడుఁగులో చేఁపలు విశేషముగా నున్నవి !' అని ఒకరితో నొకరు చెప్పుకోఁగా, ఈ మూఁడు చేఁపలు విన్నవి. అంతట బుద్ధిమంతుఁ డనాగతవిధాత జాలరులవలన తనకు చావు అగు నని వెఱచి ప్రవాహములోఁ బడి మఱి యొక చోటికిపోయెను. ప్రత్యుత్పన్నమతి 'అపాయము కలిగిన యెడల, నేను ఉపాయముచే తప్పించుకొనియెదను.' అని అచటనే యుండెను. 'నా కేమి కలుగును ?' అని యద్భవిష్యుఁడు అచటనే యుండెను. ఇట్లుండఁగా జాలరులు వచ్చి వలలు వేసిరి. వారు వలలోఁబట్టి యెత్తఁగా ప్రత్యుత్పన్నమతి కదలక మెదలక చచ్చినట్లు పడి యుండెను. అది స్వయముగానే చచ్చిన దనుకొని జాలరులు దానిని కొట్టక విడిచి పెట్టిరి. అంతట నాచేఁప నదీప్రవాహములో తప్పించుకొని పోయినది. యద్భవిష్యము వలలోనేఎగురుచు దొరలుచు ఉండెను. దానిని జాలరులు పట్టుకొని చంపివేసిరి. కావున నేనును నాప్రజ్ఞ చేత సముద్రమువలని యాపదను తప్పించెదను గాని భయపడి ఆవలికి పోఁజాలను.” అని వచించి టిట్టిభము ఆ గూఁటనే యుండెను.

సముద్రుఁడు ఆ లకుముకి యహంకార వచనములను వినెను. టిట్టిభియు కొన్నాళ్లకు పిమ్మట గ్రుడ్లు పెట్టెను. అంతట సముద్రుఁడు 'చూతము. ఈ టిట్టిభము ఏమి చేయఁగలదో!' అని కుతూహలముచేత ఆ గ్రుడ్లను అపహరించెను. అంతట టిట్టిభి ఏడ్చుచు, 'నేను ముందే చెప్పిన యపాయము కలుగనే కలిగినది, చూచితివా?' అని పతితో మొఱ పెట్టెను. ధీర మయిన యా టిట్టిభము భార్యతో "పాపాత్ముని ఈసముద్రుని ఏమి చేసెదనో, చూడు.' అని, పక్షుల నన్నిటిని సభ కూర్చి తనకుఁ గలిగిన పరాభవమును తెలిపెను. అంతట పక్షు లన్నియు గుంపుగాఁ బోయి గరుడునితో 'దేవా, నీవు మాయేలిక వై యుండ, సముద్రుఁడు మాగ్రుడ్లను హరించి మమ్ము అవమానపఱిచినాఁడు.' అని మొఱ పెట్టినవి. గరుడుఁడు కోపగించి విష్ణుదేవునితో చెప్పుకొనెను. దేవుఁడు ఆగ్నేయాస్త్రప్రయోగముచే సముద్రమును ఇగురఁగొట్టి సముద్రునిచే టిట్టిభికి అండములను ఇప్పించెను.

కావున ఆపత్కాలమందు బుద్ధిమంతుఁడు ధైర్యమును వదలఁగూడదు. ఇప్పుడు నీకు పింగళకునితో పోరు పొసఁగినది. పింగళకుఁడు ఎప్పుడు తోక నిక్కఁబెట్టుకొని నాలుగుపాదములతోను సమముగా లేచునో అప్పుడే అతఁడు నిన్నుఁ గొట్టు నని యెఱుంగుము. నీవు సిద్ధముగా తల వంచుకొని యుండి వానిని కడుపులో కొమ్ములతో పొడిచి ప్రేగులు చల్లివేయుము.

ఇట్లు దమనకుఁడు సంజీవకమునకు బోధించి, కరటకుని కడకుఁబోయి, ఆయిరువురకును భేదము సిద్ధించిన దని పలికెను.

సంజీవకుఁడు ఇంగితాకారములచే పింగళకుని చిత్తమును తెలిసికొనఁ గోరి మెల్లగా నతని కడ కేఁగెను. అచట తోఁక

నిక్కఁబెట్టికొని నాల్గు పాదములమీఁదను సమముగా లేచుచు యుద్ధమునకు సిద్ధముగా నున్న పింగళకుని చూచి శంకచేత తలను పైకి ఎత్తి ఊఁచు చుండెను. పింగళకుఁడు దానిని గని ఎగిరి దుమికి గోళ్లతో ఎద్దును కొట్టెను. ఎద్దు సింహమును కొమ్ములతో పొడిచెను. ఇట్లు ఆయిరువురకును ఘోరయుద్ధము ప్రారంభ మాయెను. దానిని గని కరటకుఁడు దమనకునితో నిట్లనియె:-- "ఏమి యిట్లు నీవు స్వార్థసిద్ధికై ప్రభువునకు మహాపాయమును తెచ్చి పెట్టితివి, పారుష్యముతో తెచ్చిన కామినియుఁ బ్రజానుతాపముచే సంపాదించిన సంపదయు, శాఠ్యముగా చేసిన మైత్త్రియు, చిరకాలము ఉండవు. చాలుఁ జాలును. హితవాక్యమును తిరస్కరించు వానికి ఎవఁడు విశేషించి యుపదేశించునో వాఁడు వానివలన సూచీముఖపక్షిక్రోఁతివలనం బోలె కీడు వొందును.

సూచీముఖకథ.

పూర్వము ఒకయడవిలో కోఁతులు గుంపుగా చరించు చుండినవి. అవి చలిలో మిడుఁగుఱుంబురువులం గని నిప్పని బ్రమసినవి. ఒకకోఁతి ఆ పురుగులమీఁద ఆకలములు వేసి ఊఁద సాగినది. దానిం గని ఒక పక్షి సూచీముఖ మను పేరిది దానితో 'ఇది నిప్పు గాదు, మిడుఁగుఱుఁబురువులు, ఏల వృథా క్లేశపడెదవు?' అని బోధించెను. ఆమాట పాటింపక ఆ క్రోఁతి ఊఁదుచునే యుండుటం గని ఆపక్షి చెట్టు దిగి వచ్చి నివారించెను. ఆ నిర్భంధమునకు కోపగించి క్రోఁతి రాతితో సూచీముఖమును చూర్ణము చేసెను. కాఁబట్టి వినని వానికి హితము చెప్పఁగూడదు. మఱియు ఏమి చెప్పుదును! నీవు చేసిన భేదము వలన కీడే గలుగును. దుర్బుద్ధిచే చేసినపనివలన మేలు కాదు.

ధర్మబుద్ధి దుష్టబుద్ధుల కథ.

పూర్వము ఒకపట్టణములో ఇద్దఱు అన్న దమ్ములు వర్తకకుమారులు ధర్మబుద్ధి దుష్టబుద్ధియు ననువారు ఉండిరి. వారు ధనముకొఱకు కలసి దేశాంతరము పోయి ఎట్లో రెండువేల బంగారుదీనారములు సంపాదించిరి. దానిం గైకొని తమ పురమునకు మరలి వచ్చి ఒకచోట చెట్టుక్రింద ఆధనమును పాఁతిపెట్టిరి. అందునుండి నూఱుదీనారములు మాత్రము తీసి, ఇద్దఱు సమముగా పంచుకొని, సుఖముగా తండ్రియింట నుండిరి. ఒకనాఁడు దుష్టబుద్ధి దుర్వ్యయములు గలవాఁడు ఒంటిగా పోయి చెట్టుక్రిందినుండి ఆ దీనారముల నెల్ల త్రవ్వి పుచ్చుకొనెను. పిమ్మట ఒకనెల గడపి ధర్మబుద్ధిని 'అన్నా, రమ్ము, దీనారములను తెచ్చికొందము, నాకు వ్యయ మున్నది.' అని పిలిచెను. ధర్మబుద్ధి వానితోఁ బోయి పాఁతినచోట వానితోఁగూడ త్రవ్వెను. దీనారములు లేవు. అంతట శఠుఁడు దుష్టబుద్ధి ధర్మబుద్ధితో 'నీవే ఆదీనారముల నెల్ల ఎప్పుడో నాకు తెలియకుండ త్రవ్వుకొని పోయితివి. కావున నాకు వానిలో సగ మిమ్ము.' అనెను. 'నేను కొనిపో లేదు, నీవే కొనిపోయినాఁడవు.' అని ధర్మబుద్ధి పలికెను. ఇట్లు కలహము కలుగఁగా దుష్టబుద్ధి రాతితో తలఁ గొట్టుకొని ధర్మబుద్ధిని రాజకులమునకుఁ గొనిపోయెను. అచట నిరువురును తమవాదములను తెలుపుకొనిరి. రాజాధికారులు నిర్ణయము గానక నిరువురును సాయంకాలమువఱకు అచటనే యుంచిరి. 'ఏచెట్టుక్రింద దీనారమును పాఁతితిమో ఆ చెట్టే, ఈ ధర్మబుద్ధి వాని నపహరించె నని, సాక్ష్యము చెప్పును.' అని దుష్టబుద్ధి రాజాధికారులతోఁ దెలుపుకొనెను. వా రత్యంత మాశ్చర్యపడి 'ఱేపు ప్రాతఃకాలమందు, పోయి ఆ సాక్ష్యము వినియెదము.' అని పలికి వారి నిరువురను జామీనుమీఁద విడిచిపెట్టిరి. ఇరువురును వేఱువేఱుగా ఇంటికి పోయిరి. దుష్టబుద్ధి తండ్రికి రహస్యముగా వృత్తాంతము చెప్పి ధన మిచ్చి 'నీవు చెట్టుతొఱటలో చేరి నా పక్షముగా సాక్ష్యము చెప్పవలసినది.' అని యడిగెను. వాఁడు అంగీకరించెను. వెంటనే దుష్టబుద్ధి వానిని కొనిపోయి ఆ రాత్రియందే ఆ చెట్టులో పెద్దతొఱ్ఱలో ఉంచి యింటికి వచ్చెను. తెల్లవాఱఁగానే అధికృతులతో ఈయన్నదమ్ములు పోయి అచెట్టును 'ఓవృక్షరాజా, ఎవఁడు మా దీనారములను కొనిపోయెనో చెప్పుము' అని యడిగిరి. 'ధర్మబుద్ధి దీనారములను కొనిపోయెను.' అని స్ఫుటముగా చెట్టు తొఱ్ఱనుండి తండ్రి పలికెను. అసంభావ్య మైన యామాటను విని అధికృతులు 'నిశ్చయముగా ఇచట తొఱ్ఱలో ఎవనినో దుష్టబుద్ధి పెట్టినాఁడు.' అని తలఁచి ఆతొఱ్ఱలో గడ్డిపెట్టి నిప్పంటించిరి. ఆపొగ చుట్టుకొని ఒడలు కాలఁగా దుష్టబుద్ధి తండ్రి తలక్రిందుగా నేలఁ బడి కాలధర్మము నొందెను. దానింగని యధికృతులు నిజ మెఱిఁగి, దుష్టబుద్ధిచేత ఆదీనారములు ధర్మబుద్ధి కిప్పించి, దుష్టబుద్ధిని చేతులు నాలుకయు కోయించి, దేశము వెడలఁ గొట్టి, యథార్థము చెప్పిన ధర్మబుద్ధిని సమ్మానించిరి. ఈప్రకారము అన్యాయ్యబుద్ధిచేత చేసిన పని శుభావహము కానేరదు. కావున పామునకు కొంగ చేసినట్లు న్యాయ్యబుద్ధితోఁ జేయవలయును.

కొంగయు పామును.

పూర్వము ఒకానొక కొంగయొక్క పిల్లలను పుట్టినప్పుడెల్ల ఒకపాము తినుచుండెను. అందులకు దుఃఖించి కొంగ యొక ఝషముతో చెప్పుకొని దాని యుపదేశము ప్రకారము మత్స్యమాంసఖండములను ముంగిస నివాసముండి పాము బొక్కవఱకు చల్లెను. ముంగిస లేచి ఆ మాంసఖండములను తినుచు క్రమముగా పాము బొక్క కడకు వచ్చి అందుఁ దూఱి పామును పాముపిల్లలతోఁగూడ చంపి వేసెను. ఈప్రకారము మంచియుపాయముచేత పనిని నెఱవేర్చుకొనవలయును. మఱియొక కథ వినుము.

ఇనుప కాటా.

పూర్వము ఒక వణిక్కుమారుఁడు పైతృకధన మెల్ల కోలుపోయి దరిద్రుఁ డాయెను. ఒక యినుపకాటామాత్రము మిగిలి యుండెను. ఆ కాటా వేయి పలముల యినుముతో చేసినది. దానిని అతఁడు మఱియొక వర్తకునియొద్ద దాఁచుకొని దేశాంతరము పోయెను. మరల వచ్చి అడుగఁగా, దానిని ఎలుకలు భక్షించిన వని ఆ వర్తకుఁడు చెప్పెను. 'సత్యము ఆ లోహము మిగుల తీపు, కనుకనే దానిని ఎలుకలు భక్షించినవి.' అని మనస్సులో నవ్వుకొనుచు చెప్పి, వణిక్కుమారుఁడు ఆ దినము ఆ వర్తకుని యింటనే భోజన మడిగెను. వర్తకుఁడు సంతోషించి యతనిని భోజనమునకు నిలువు మనెను. పిమ్మట వణిక్కుమారుఁడు వర్తకుని కొమరునిచేతిలో అటకలిపాత్రము నుంచి, వానిని వెంటఁ గొని స్నానమునకు పోయెను. స్నానము చేసి పిల్లవానిని రహస్యముగా తన స్నేహితునియింట దాఁచి తాను ఒంటిగా వర్తకునియింటికి భోజనమునకుఁ బోయెను. పిల్లవాఁ డెక్కడ నని వర్తకుఁ డడుగఁగా, 'పిల్ల వానిని గ్రద్ద తన్నుకొని పోయె నని యుత్తరము చెప్పెను. 'నా పిల్ల వానిని ఎక్కడనో దాఁచినాఁడవు.' అని కోపగించి వర్తకుఁడు అతనిని ఈడ్చుకొని రాజకులమునకు పోఁగా అక్కడఁ గూడ అతఁడు వర్తకునితో మునుపు చెప్పిన యుత్తరమునే చెప్పెను. 'అది యసంభావ్యము. గ్రద్ద యేమి ! పిల్లవానిని తన్నుకొని పోవుట యేమి!' అని అచట సభ్యులు పలుకఁగా, వణిక్కుమారుఁడు 'ఏ దేశములో ఎలుకలు గొప్ప యినుపతులను భక్షించునో, ఆ దేశములో గ్రద్ద ఏనుఁగును కూడ తన్నుకొని పోవును, పిల్లవానిని తన్నుకొని పోవుట ఆశ్చర్యమా!' అనెను. దానిని విని కౌతుకపడి సభ్యులు వృత్తాంత మడిగి తెలిసికొని వర్తకుని చేత తులను తెప్పించి వణిక్కుమారునికి ఇప్పించిరి. అతఁడును పిల్లవానిని తెచ్చి యిచ్చెను. ఇట్లు ఉపాయముచే బుద్ధిమంతులు కార్యమును సాధింతురు. నీవు సాహసము చేసి ప్రభువును ప్రాణసందేహములో వైచితివి.

కరటకుఁ డిట్లు చెప్పఁగా దమనకుఁడు. నవ్వుచు ననెను:- 'మిత్త్రమా, అట్లు చెప్పకుము, ఎద్దుతోడి యుద్ధమునందు సింహమునకు అపజయము కలుగునా ! మదపుటేనుఁగుల దంతకోటి ఘాతముల దట్టపు గాయములే ఆభరణము లయిన సింహ మెక్కడ! కొరడా దెబ్బలతో నలిగిన యెదెక్కడ!' ఈ ప్రకారము జంబుకములు రెండును పరస్పరము సంభాషించు చున్నంతలో పింగళకుఁడు సంజీవకమును సంహరించెను. ఇట్లు సంజీవకుఁడు హతుఁడు కాఁగా, దమనకుఁడు చిరకాలమునకు తుష్టుఁ డై కరటకునితోఁ గూడ మృగాధిపునిపార్శ్వము చేరి అప్రతిహతముగా మంత్రిపదవిని అనుభవించుచుండెను.

ఇట్లు నరవాహనదత్తుఁడు నీతిమంతుఁ డైన గోముఖమంత్రి వరునివలన బుద్ధివిభవ సంపన్న మగు నీ చిత్రకథను విని మిగుల సంతసించెను.