Jump to content

కథాసరిత్సాగరము (వేదంవారి వచన రచన)/నాలుగవభాగము/శక్తియశోలంబకము: 2-వ తరంగము

వికీసోర్స్ నుండి

2 - వ తరంగము.

కుముదిక యను వేశ్య కథ.

ఇట్లు మరుభూతి వేశ్యల యసద్భావమును గుఱించి చెప్పఁగా బుద్ధిమంతుఁడు గోముఖుఁడు అట్లే కుముదికకథను చెప్పెను. ప్రతిష్ఠాననగరములో విక్రమసింహుఁ డని సింహతుల్యవిక్రముఁడు అన్వర్థనాముఁడు రాజుండెను. ఆప్రభువునకు శశిలేఖ యని సుందరి ఆలంకారతనువు నదీన ప్రభవ దేవేరి యుండెను. అతని నొకప్పుడు తననగరమం దుండఁగానే ఏవురు దాయాదులు, మహాభటుఁడు వీరబాహువు సుబాహువు సుభటుఁడు ప్రతాపాదిత్యుఁడు అనువారు, అందఱును మహా బలులు దండెత్తివచ్చి ముట్టడించిరి. వారితో సామాదికమును ప్రయోగించుచున్న మంత్రిని నిరాకరించి విక్రమసింహఁడు యుద్ధమునకు వెలువడెను. రెండుసేనలకు శస్త్రాస్త్ర సంపాత ఘోరముగా యుద్ధము జరుగు చుండఁగా, విక్రమసింహుఁడు శౌర్యదర్పముచేత తాను ఏనుఁగు నెక్కి స్వయముగా యుద్ధము చేయ నారంభించెను. ఆతఁడు ధనుర్ద్వితీయుఁ డై బలములను చీల్చివేయుచుండఁగా చూచి, మహాభటాది రాజులు అయిదుగురును కలసి, అతనిని ఒక్క మొగి నెదుర్కొ నిరి. వారి బలమెల్ల కలసి మీఁదికి రాఁగా విక్రమతుంగునిదండు తక్కువ యగుటచే విఱిగి పోయెను. ఆసమయమందు అనంతగుణుఁ డను నామంత్రి విక్రమసింహుని చెంతకు వచ్చి 'మనబల మెల్ల పగిలి పోయినది, మనకు జయము లేదు. నామాట వినక బలవంతులతో పోరు పెట్టుకొంటివి. ఇప్పటి కైన నామాట విని మేలు పొందుము. ఏనుఁగును దిగి గుఱ్ఱ మెక్కి పరదేశమునకు పోదము రమ్ము. బ్రదికియుండిన వీరిని మరల జయింప వచ్చును.' అని పలికెను. ఆతని మాట విని రాజు ఏనుఁగును దిగి గుఱ్ఱమెక్కి అతనితోఁ గూడ తన బలమునుండి బయలు వెడలెను. మాఱువేషము వేసికొని ఆమంత్రితోఁ గూడ విక్రమసింహుఁడు క్రమముగా ఉజ్జయినికిఁ బోయి అచట మహాధనసమృద్ధ మయిన కుముదిక యను వేశ్యాంగన యింటికి మంత్రిద్వితీయుఁ డై చనియెను.

ఆకస్మికముగా వచ్చిన యతనిని చూచి ఆవేశ్య యిట్లు చింతించెను. - 'ఇతఁ డెవఁడో మహాపురుషుఁడు; తేజముచేతను ఇతఁడు రా జని తెలియుచున్నది. ఇతనిని స్వీకరింతునేని నా యభీష్టము సిద్ధించును!' ఇట్లాలోచించి కుముదిక సమంత్రిని రాజును కుశల మడిగి గొప్పగా ఆతిథ్యము చేసి, విశ్రాంతుఁడైన పిమ్మట రాజుతో నిట్లనియె. - 'నేను ఇప్పుడు ధన్యురాల నయితిని. నా పూర్వ సుకృతము ఇప్పటికి ఫలించినది. ఏలినవారు వచ్చి మా యింటిని పవిత్రము చేసినారు ; కావున ఈ ప్రసాదముచే కొనఁబడిన దాసిని నేను. నా దయిన యీ హస్తిశతము ఇరువదివేల గుఱ్ఱములు పూర్ణరత్న మయిన యీ మందిరమును సర్వమును తమదే.' ఇట్లు పలికి కుముదిక మహార్హము లయిన స్నానాద్యుపచారములతో సమంత్రిని రాజును ఉపచరించెను. విక్రమసింహరాజు ఖిన్నుఁ డయ్యును కుముదిక చేయుచున్న యుపచారములు గ్రహించుచు సామాత్యుఁ డై అట నుండెను. దాని ధనమును రాజు స్వేచ్ఛగా వ్యయముచేసెను; యాచకుల కిచ్చెను. కుముదిక అందులకు వికృతి పొందక సంతసించుచునే యుండెను. 'అహో! దీనికి నా యందు ఎంత ప్రేమ!' అని సంతోషించుచున్న రాజును చెంత నున్న మంత్రి ఏకాంతమున నిట్లనియె.

'దేవా, వేశ్యలకు సద్భావము లేదు. ఈ కుముదిక నీయందు చూపెడు భక్తికి కారణము తెలియకున్నాను!' 'ఇట్లు కాదు, కుముదిక నాకై ప్రాణములను కూడ ఇచ్చును, నీకు నమ్మకము లేదేని నిదర్శనము చూపెదను.' అని పలికి రాజు ఈకపటమును పన్నెను. ఆహారపానాదికములు తగ్గించి తనదేహమును క్రమక్రమముగా కృశము చేసి అవయవములు శిథిలము లగునట్లును చేసికొని, చచ్చినట్లును పడి యుండెను. పరిజనులు అతనిని శిబికలో పెట్టి శ్మశానమునకుఁ గొనిపోయిరి. అనంతగుణుఁడు శోకమును అభినయించుచు కూడఁ బోయెను. కుముదికయు శోకాకుల యై బంధువులు ఎంత వారించినను నిలువక తానును వచ్చి ఱేనిచిత యెక్కెను. నిప్పు పెట్టఁ బోవు నవసరమున కుముదిక వచ్చియున్న దని తెలిసికొని రాజు ఆవులించి లేచెను. 'ఆహా! మహారాజు బ్రదికినాఁడు! ' అని పలుకుచు పరిజనులు అతనిని మరల ఇంటికిఁ గొనిపోయిరి. ఆసంతసమునకు కుముదిక ఉత్సవము చేయఁగా, రాజు మంత్రిని ఏకాంతమున 'ఏమి కుముదికయొక్క స్నేహమును చూచితివా?' అని యడిగెను. 'ఇప్పటికిని ఈప్రేమను నేను నమ్మను. దీని కారణమును కనిపట్ట లే కున్నాను. మనలను దీనికి తెలియఁబఱుచుకొని దీని బలమును తోడ్కొని పోయి శత్రువులను క్షణములో ఓడింతము,' అని మంత్రి పలికెను.

ఆ సమయములో చారుఁడు వచ్చి ఇట్లు చెప్పెను. 'శత్రువులు దేశము నాక్రమించినారు. లోకులవలన రాజు మృతిఁ బొందె నని విని శశిలేఖాదేవి అగ్నిప్రవేశము చేసినది' చారునివలన ఈమాట విని రాజు శోకాశని హతుఁ డై 'హా దేవీ! హా పతివ్రతా!' అని ఏడువఁ దొడంగెను. క్రమముగా వృత్తాంత మెఱిఁగి కుముదిక వచ్చి విక్రమసింహుని ఓదార్చెను. 'ముందే నేను చెప్పలేదా ? ఏల తామసించెదవు ! నా దండుతోఁ బోయి శత్రువులను ఉన్మూలింపుము.' అని అది పలుకఁగా రాజు దాని ధనములతో మఱియు ఎక్కువదండు సంపాదించి, ఆ దండుతో తనమిత్త్రుఁడును బలవంతుఁడు నయిన యొక రాజుకడకు పోయి, అతని బలములను తనబలమును చేర్చి తోడ్కొని, యా యైదుగురు శత్రువులమీఁదికి నడచి, వారిని యుద్ధములో ఓడించి, తన రాజ్యముతో వారి రాజ్యములను సయితము గ్రహించెను. పిమ్మట కుముదికను 'నీ యెడల నేను పీతుఁడను. నీ కోరిక యేమి ? చెప్పుము, తీర్చెదను.' అని యడిగెను 'ప్రభూ, నీవు నిజముగా తుష్టుఁడవేని నా హృదయమందు చిరకాలమునుండి యున్న యీ శల్యమును తీసివేయుము, ఉజ్జయినిలో నా ప్రియుని శ్రీధరుఁ డను ద్విజకుమారుని స్వల్పాపరాధమునకు రాజు చెఱలో వేసినాఁడు. నిన్ను ఉత్తమరాజలక్షణములచే కల్యాణము పొందువానినిగా నెఱిఁగి ఈకోరిక తీర్పఁగలవాఁడ వని, భక్తితో సేవించితిని. నీవు మృతిఁ బొందితి వని, నాకోరిక తీఱదనెడి దుఃఖముచే, ఆవిప్రకుమారుఁడు లేని నాజీవిత మేల యని వైరాగ్యముచే, ప్రాణత్యాగార్థము నీచితను కూడ ఎక్కితిని.' అని కుముదిక చెప్పెను. విక్రమసింహుఁడు ' నీకోరిక తీర్చెద ; ధైర్య మవలంబించియుండుము.' అని పలికి, మంత్రి వచనమును స్మరించి,. 'వేశ్యలకు సద్భావము లే దని అనంతగుణుఁడు చెప్పినమాట తప్ప లేదు. అయినను ఈ వరాకియొక్క కోరికను నేను తీర్పవలసినది.' అని నిశ్చయించుకొని ఉజ్జయినికి తరలి శ్రీధరుని విడిపించి, కుముదికను బహుధనము లిచ్చి ప్రియసంగమ సుస్థితను గావించెను. విక్రమసింహుడు మరల తన నగరమునకు వచ్చి మంత్రివచనమును దాఁటక రాజ్య మేలుచు సుఖముగా నుండెను. ఈ ప్రకారము వేశ్యాంగనల హృదయము అగాధము, తెలియ రానిది.

చంద్రశ్రీ కథ.

ఇట్లు కథ చెప్పి గోముఖుఁడు విరమింపఁగా, నరవాహనదత్తునిమ్రోల తపంతకుఁడు పలికెను. - దేవా, చపలమతులయిన స్త్రీలకు విశ్వాస ముండదు. వేశ్యలకుంబోలె కులస్త్రీలకుఁ గూడ కొందఱకు విశ్వాస ముండదు. ఇచటనే నే నెఱిఁగిన యాశ్చర్యమును చెప్పెదను వినుము. ఈనగరమందే బలవర్మ యని యొక వణిజుఁ డుండెను. చంద్రశ్రీ యని యతని భార్య ఒకనాఁడు మేడకిటికీనుండి అందగానిని శీలహరుఁ డను వణిక్కుమారుని కని, కామించి, తత్క్షణమే తనచెలి యింటికి రప్పించుకొని ప్రచ్ఛన్నముగా వానితో క్రీడించెను. ప్రతిదినము అట్లే చేయుచుండెను. ఈవృత్తాంతము భృత్యులకు బంధులకు ఎల్లవారలకును తెలిసినది. బలవర్మ యొక్కఁడు మాత్రము ఎఱుఁగఁడు, సాధారణముగా స్నేహాంధులగు పురుషులు భార్యల దురాచారమును కనిపట్టరు. ఇట్లుండఁగా బలవర్మకు దాహజ్వరము వచ్చి క్రమముగా ముమూర్షావస్థ సంభవించెను. అతఁడిట్టి యవస్థలో నున్నను అతనిభార్య ప్రతిదినము తనచెలికత్తె యింట ఉపపతిని గూడుచుండెను. మఱునాఁడు జారునితో ఆమె యుండఁగా బలవర్మ మృతిఁ బొందెను. అంత నామె ఆ కాముకుని వీడ్కొని యింటికి పోయి దుఃఖార్త యై దీని శీలము నెఱిఁగిన బంధువులు వారించుచున్నను వినక పతితోఁ గూడ చిత యెక్కి, సహగమనము చేసెను. ఇట్లు స్త్రీల చిత్తగతి దురవధార్యము. ఇతరునితో సంగమింతురు. పతితో సహగమనము చేయుదురు.

దేవదాసుని కథ.

ఇట్లు తపంతకుఁడు పలుక హరిశిఖుఁ డనియె: - దేవా, దేవదాసుని వృత్తాంతమును విన లేదా. దేవదాసుఁ డని యొక కుటుంబి యీగ్రామములో నుండెను. వానికి దుశ్శీల యని యన్వర్థనామధేయ భార్య యుండెను. అది పరపురుషాసక్త యని ఇరుగుపొరుగువారు ఎఱిఁగిరి. ఒకనాఁడు దేవదాసుఁడు కార్యవశమున రాచనగరికిఁ బోయెను. ఆసమయమందు వాని భార్య వానిని చంపింపఁ గోరి పరపురుషుని తోడ్కొని వచ్చి యింటిమీఁద కూర్చుండఁ బెట్టెను. పతి ఇంటికి వచ్చి భుజించి నిద్రించుచుండఁగా రాత్రి వానిని పరపురుషునిచేత చంపించి, వెలువడి 'నాభర్తను తస్కరులు చంపినారు.' అని విలపింపఁ దొడంగెను. అంత నచటికి బంధువులు వచ్చి చూచి ఇతనిని దొంగలు చంపిరేని ధన మేమియు హరింప లే దేమి?' అని పలికి, దాని కుమారుని బాలుని 'మీ నాయన నెవరు చంపినారు? ' అని యడిగిరి. 'ఇంటిమీఁద ఎక్కి ఎవఁడో పడుచువాఁడు పగలు కూర్చుండి యుండెను. వాఁడే రాత్రి నేను చూచుచుండఁగానే నాయనను చంపినాఁడు, నన్ను ముందుగా అమ్మ నాయనయొద్దనుండి అవతలికి తీసికొని పోయినది ' అని శిశువు పలికెను. అంత భార్యాజూరునిచే దేవదాసుఁడు మడిసె నని తెలిసికొని ఆబంధువులు అప్పుడే ఆజారుని వెదకి పట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా అన్యరక్త యయిన స్త్రీ భుజంగివోలె నిశ్చయముగా చంపివేయును.

వజ్రసారుని కథ.

ఇట్లు హరిశిఖుఁడు పలుకఁగా గోముఖుఁడు మరల చెప్పసాగెను. ఇతరుల కథ లేల ? వత్సేశ్వరసేవకునికి వజ్రసారునికి కలిగిన దానిని హాస్యకరమైనగతిని వినుము. వాఁడు శూరుఁడు కాంతుఁడు. వానికి భార్య మాలవదేశముది సురూప యను నది స్వశరీరాధికప్రియగా నుండెను, ఒకనాఁడు దాని తండ్రి పుత్త్రసమేతుఁ డై దానిని పిలుచుకొనిపోవుటకు వచ్చెను. వజ్రసారుఁడు అతనిని సత్కరించెను. మామ పిలువఁగా రాజునొద్ద సెలవు పుచ్చుకొని భార్యతోఁగూడ తానును మాలవమునకుఁ బోయి మామగారియింట నెలదినము లుండి మరల ఇచటికి వచ్చి తనకొలువులో చేరెను. భార్యమాత్రము అటనే ఉండెను. కొన్నిదినములు గడచినపిమ్మట ఆకస్మికముగా క్రోధనుఁ డను చెలికాఁడు వజ్రసారునితో నిట్లనియె: 'ఓరీ, భార్యను తండ్రి యింట నుంచి కొంప చెఱిపితివి. అచ్చట ఆముండ పరపురుషాసక్త యై యున్నది. నా యాప్తమిత్రుఁ డొకఁడు వచ్చి నాకు చెప్పినాఁడు. ఇది అబద్ధము కానేరదు. కనుక దీనిని దండించి మఱి యొకతెను పెండ్లి చేసికొనుము.' ఇట్లు పలికి క్రోధనుఁడు పోఁగా, వజ్రసారుఁడు ఏమియుఁ దోఁపక కొంత సే పుండి 'ఇది సత్యమే అని తోఁచుచున్నది. కాదేని మానిసిని పంపినను అది రా దేమి? కనుక నేనే పోయి తోడ్కొని వచ్చెదను, ఏమి జరుగుచున్నదో కనిపట్టెదను.' అని సంకల్పించి మాళవమునకుఁ బోయి అత్తమామలయనుమతిని భార్యను వెంటఁ బెట్టుకొని బయలువెడలెను.

చాల దూరము నడచి అతఁడు అనుచరులను యుక్తిగా వంచించి తప్పుదారిని బడి భార్యతోఁ గూడ మహారణ్యము చొచ్చి, అచట విజనమందు దానిని కూర్చుండఁబెట్టి దానితో నిట్లనియె. 'నీవు అన్యపురుషాసక్త వని నాకు ఆప్తమిత్రుఁ డొకఁడు చెప్పినాఁడు. నేను అక్కడనే యుండి పిలిపింపఁగా రావయితివి. సత్యముచెప్పుము. చెప్పవేని నిన్ను దండించెదను.' ఆమాటకు అది 'నీ కిదే నిశ్చయమేని, న న్నేల యడిగెదవు? నీకు తోఁచినట్లు చేయుము.' అని తిరస్కారముగా పలికెను. అంత వజ్రసారుఁడు కోపముతో దానిని చెట్టునకు కట్టి తీఁగలతో కొట్టి వస్త్రమును ఊడ్చి వేసెను. నగ్నను చూడఁగా రిరంస గలిగి దానితో కట్టువిప్పకయే క్రీడింపఁగోరి వాఁడు వేఁడుకొనఁగా అది ఒప్పక 'న న్నెట్లు నీవు కట్టి తీఁగలతో కొట్టితివో ఆప్రకారము నిన్ను నేను కట్టి తీఁగలతో కొట్టితినేని అప్పుడు నిన్ను క్రీడింప నిత్తును; మఱి యెట్లును సమ్మతింపను.' అనెను. ఆ మూడుఁడు వజ్రసారుఁడు మనోభవుని ప్రభావముచేత తృణసారుఁ డై అందుల కంగీకరించెను. అంత నా చెడిప వానిని కాలుసేతులు గట్టిగా చెట్టునకు కట్టి కొట్టి, వానికత్తితోనే వాని ముక్కు చెవులను చెక్కి వేసి, కత్తిని కైకొని, వాని వస్త్రములతో తాను పురుష వేషము వేసికొని, పాపాత్మురాలు తన యిచ్చ చొప్పున పోయెను. వజ్రసారుఁడు శ్రవణ నాసికలు కోలు పోయి, రక్తము కాఱుచుండ, మానము పోఁగా, అచటనే ఉండెను.

ఇట్లుండఁగా అచటకి ఒకవైద్యుఁడు ఏదో యోషధికొఱకు వచ్చి, అతనిని కనికరించి విడిపించి తన యింటికి కొనిపోయెను. అచట కొంతయుపచారములు వడసి కొంతబాధ తీఱి వజ్రసారుఁడు ఆపాడుపెండ్లమును అక్కడక్కడ వెదకియు కనిపట్టఁ జాలక వృత్తాంతమును క్రోధనునికి చెప్పెను. వాఁడు వత్సరాజు మ్రోల సవిస్తరముగా వర్ణించెను. వీఁడు పౌరుషహీనుఁడు స్త్రీ భూతుఁ డని వీనిభార్య వీని పురుషవేషమును హరించి, వీనికి తగిన దండన చేసినది.' అని రాజకులములో అందఱును పరిహసించినను వజ్రసారుఁడు వజ్రసార మగు మనస్సుతో ఇచటనే ఉన్నాఁడు, దేవా, ఇట్లుండఁగా స్త్రీలను ఎవఁడు నమ్మవచ్చును !

కల్యాణవతి కథ.

ఇట్లు గోముఖుఁడు పలుకఁగా మరుభూతి యిట్లనియె. స్త్రీల మనస్సునకు నిలుకడ లేదు. అయినను ఈకథను వినుఁడు. పూర్వము దక్షిణాపథమున సింహబలుఁ డని రాజుండెను. అతనికి సకలాంతఃపుర స్త్రీలలోను అధికప్రియ మాలవరాజు కూఁతురు కల్యాణవతి యని యొక భార్య యుండెను. రాజు ఆమెతోఁ గూడ రాజ్యము ఏలుచుండి ఒకప్పుడు తనమీఁదికి కలసి దండెత్తి వచ్చిన బలవంతు లైన దాయాదులచే దేశమునుండి నిష్కాసితుఁ డై, ఆ ప్రియతమను తోడ్కొని ప్రచ్ఛన్నముగా ఆయుధ మాత్ర సహాయుఁ డై అల్ప పరిచ్ఛదముతో మాలవమునకు మామగారియింటికి పోయెను. దారిలో అడవిలో సింహము మీఁద 'దుముకఁగా ఆ శూరుఁడు అవలీలగా కత్తితోఁ గొట్టి రెండు తుండెములు చేసెను. అడవియేనుఁగు గిఱగిఱ తిరుగుచు విూఁదికి రాఁగా కత్తితో దాని పాదములు తెగనఱికి నేలఁగూల్చెను. దొంగలదండులను అడవియేనుఁగు కమలములను బోలె నాశము కావించెను. ఇట్లు దారిని అద్భుత విక్రమములను చూపుచుఁ గడచి మహాసత్త్వుఁడు మాళవము చేరి దేవితో ఇట్లనియె. - 'నా మార్గ. విక్రమమును నీవు నీతండ్రియింట ప్రశంసింపకుము. అట్లు చేయుట లజ్జాకరము, క్షత్రియుని పరాక్రమమునకు శ్లాఘ యేమి!' ఇట్లు బోధించి ఆమెతోఁ గూఢ మామగారి యింటికిఁ బోయి, ఆయన దిగులుపడి యడుగఁగా, జరిగినవృత్తాంతము చెప్పెను. ఆయన అల్లుని సమ్మానించి గుఱ్ఱములను ఏనుఁగును ఇచ్చి పంపెను.

అంతట సింహబలుఁడు శత్రు విజ యోద్యతుఁ డై, కల్యాణవతిని అచటనే ఆమె తండ్రియింట ఉంచి, ప్రబలుఁ డయిన గజానీకరాజునొద్దకుఁ బోయెను. అతఁడు పోయిన కొంతకాలమునకు ఒకనాఁడు దేవి కల్యాణవతి కిటికీలోనుండి ఒక పురుషుని చూచి, చూచినమాత్రమున వానిచే హృతచిత్తయై మదనాకృష్ట యై యిట్లు తలఁచెను:- 'ఆర్యపుత్త్రుని కంటె అందగానిని శూరుని ఎఱుఁగను, అయినను ఈపురుషుని యందు నామనస్సు ఆసక్త మై యున్నది. కనుక ఏ మయినఁ గా నిమ్ము. వీనిని సేవించెదను.' ఇట్లు నిశ్చయించుకొని ఆమె తన యభిప్రాయమును రహస్యధారిణి యయిన చెలికి చెప్పెను. అదియే వానిని రాత్రి కొని వచ్చి కిటికీగుండ త్రాటిమీఁదుగా ఎక్కించి అంతిపురిలో ప్రవేశపెట్టెను. వాఁడు ఆమెయొక్క తేజమునకు భయపడి ఆమెమంచము నెక్క ధైర్యము లేక ప్రక్కను మఱియొక యాసనమున కూర్చుండెను. దానిం గని రాణి 'అయ్యో! వీఁడు నీచుఁడు!' అని చింతించుచుండఁగా, పైనుండి పా మొకటి వచ్చెను. దానిం గని ఆపురుషుఁడు భయపడి లేచి ధనుస్సు కొని కోలం గూల్చి చచ్చినదానిని కిటికీ గుండ వెలికి పాఱ వేసి భయము తీఱి హర్షముతో నర్తనము చేయసాగెను. ఆడుచున్న వానిని చూచి కల్యాణవతి చింతాక్రాంతురా లై 'చీ! చీ! నిస్సత్త్వుఁడు ఈ యధముఁడు నా కేల?' అని విరక్తి చెందెను. ఆభావము ముఖవికారమువలన నెఱిఁగి సఖి వెలువడి మరల తొట్రుపాటుతో వచ్చి 'దేవీ, మీ నాయనగారు వచ్చుచున్నారు, ఇతఁడు ఇప్పటికి వచ్చినదారినే తన యింటికి పోవును గాక.' అనెను. అంత వాఁడు భయాకులుఁడై ఆ వాతాయనమార్గమున త్రాటిమీఁదుగా దిగి దుబ్బున పడెను గాని చావ లేదు.

వాఁడు పోఁగానే కల్యాణవతి సఖితో 'సఖీ, నీవు ఈ నీచుని తఱిమి మంచి పని చేసితివి. నీవు నా హృదయమును తెలిసికొంటివి. నా చిత్తము దుఃఖపడుచున్నది. నా భర్త వ్యాఘ్రసింహాదులను కూల్చి లజ్జచే బైట చెప్పఁడు. ఈ సత్త్వ హీనుఁడు పామును కొట్టి నర్తనము చేసినాఁడు. అట్టి మహా సత్త్వుని వదలి ఈ ప్రాకృతునితో నా కేమి రతి ? చపలమతి నైన నా బ్రదు కేల! శుచి యైనకర్పూరమును ఈఁగలు వోలె పతిని వదలిపోవునట్టి స్త్రీల బ్రదు కేల?' అని యిట్లు పశ్చాతప్తురాలై ఆ రాణి ఆరాత్రి గడపి భర్తను ఎదురు సూచుచు, తండ్రియింట నుండెను.

ఇంతలో, సింహబలుఁడు గజానీకుని తోడ్పాటుతోఁ బోయి, ఆ పాపాత్ములను దాయాదులను ఏవురను కూల్చి, తన రాజ్యమును మరల వశపఱుచుకొని, కల్యాణవతిని మామగారి యింటనుండి రప్పించుకొని, ఆతనిని ధనరాసులతో నిండించి, నిష్కంటకముగా చిరకాలము రాజ్య మేలేను.

ఇట్లు, దేవా, వివేకవతులకుఁ గూడ పతి వీరుఁడును అందగాఁడును అయినను, మతి చలించును. విశుద్ధ సత్త్వలు లోకములో అరుదు. ఇట్లు మరుభూతి చెప్పనకథను విని నరవాహనదత్తుఁడు సుఖనిద్రం బొంది రాత్రి గడపెను.