కథాసరిత్సాగరము (వేదంవారి వచన రచన)/నాలుగవభాగము/శక్తియశోలంబకము: 1-వ తరంగము
శక్తియశోలంబకము
1 - వ తరంగము.
క. శ్రీరుచిరము సిందూర వి
నీరంధ్ర మరాత్యవారణీయమహిమ మా
హైరంబవారణీయము
దూరముగా విసరుఁ గరము దురితౌఘములన్.
క. పురములపై హరునక్షులు
శరసంథానమున రెండుసక్తము లగుడున్
ఖరవిస్ఫురణోల్బణ సం
భర మగు నిటలాక్షి దురితపాళిం గాల్చున్.
క. అరిపధమున రక్తారుణ
ఖర కుటిల నృసింహుదృష్టి కరరుహతతియున్
హరియించును గావుత మీ
దురితవ్రాతంబు పుణ్యదోహన మగుచున్.
భారికరత్నదత్తుల కథ.
ఈ రీతిని నరవాహనదత్తుఁడు సభార్యుఁడై కౌశాంబియందు సుఖముండెను. ఒకనాఁడు అతఁడు తండ్రితోఁగూడ ఆస్థానమం దుండఁగా ఒక వర్తకుఁడు రత్నదత్తుఁ డనువాఁడు ప్రతిహార నివేదితుఁ డై రాజానుఙ్ఞాతుఁ డై వచ్చి రాజునకు ప్రణమిల్లి ఇట్లు విన్నపము చేసికొనెను. "దేవా, వసుధరుఁ డని ఈనగరములో దరిద్రుఁడు బరువులు మోచువాఁడు ఒకఁడు కలఁడు. వాఁడు ఇప్పుడు ఆకస్మికముగా త్రాగుచు భుజించుచు సుఖముగా నున్నాడు. దానిని చూడఁగా కౌతుకమై వానిని మాయింటికిఁ గొనిపోయి మత్తెక్కఁ ద్రాగించి యడుగఁగా వాఁడు చెప్పిన దే మనఁగా 'రాచనగరిద్వారమున రత్నఖచితమైన కడియము నాకు దొరకినది. అందునుండి ఒక రత్నము పెకలించి విక్రయించితిని. లక్ష దీనారములు వెల యొసఁగి దానిని హిరణ్యగుప్తుఁ డను వణిజుఁడు కొన్నాఁడు. అందువలన నేను సుఖముగా జీవించుచున్నాను.' ఇట్లు పలికి వాఁడు ఏలినవారిపేరు చెక్కిన యాకడియమును చూపినాఁడు. "నేను ఏలినవారికి విన్నవించితిని.” వత్సరాజు విని కడియము తోఁగూడ భారికుని, రత్నముతోఁ గూడ వణిజుని రప్పించెను.
'ఆహా ! జ్ఞప్తికలిగినది ! ఇది నాచేతినుండి ఊరేగింపులో జాఱిపడిపోయినది!' అని ఆకటకమును రాజు జ్ఞప్తిచేసికొని పలికెను. రాజునెదుట సభ్యులు 'ఓరీ, రాజుపేరుచెక్కిన యీ కడియము నీకు దొరకిన నీవు దానిని ఎట్లు ఉంచుకొన్నావు?' అని యడుగఁగా, 'బాబూ, బరువులుమోచు కూలివాఁడను, నాకు రాజనామాక్షరములు ఎట్లు తెలియును, దారిద్ర్యదుఃఖ దగ్ధుఁడను నేను ఇది దొరకఁగానే పుచ్చుకొంటిని.' అని భారికుఁడు పలికెను. అంత సభ్యులు రత్నమును గుఱించి వణిజుని ఆక్షేపించిరి. 'నేను వెల యిచ్చి బజాఱులో కొంటిని, దానిపై రాజుగారి గుఱుతు లేదు. దానివెలలో వీఁడు అయిదువేలు కొనిపోయినాఁడు, మిగత నాయొద్దనే ఉన్నది.' అని హిరణ్యగుప్తుఁడు చెప్పెను. ఈ మాటవిని యౌగంధరాయణుఁడు 'ఈ విషయములో, ఎవరిదియు దోషము గాదు. పేదవాఁడు అక్షర మెఱుఁగనివాఁడు ఈకూలివాఁడు. దారిద్ర్యముచే దొంగతనము కూడ చేయుదురు. దొరకినదానిని ఎవరు వదలుదురు ! ఈ వణిజుఁడు వెల యిచ్చి రత్నమును గ్రహించినాఁడు. కనుక ఇతని యందును తప్పు లేదు. ' అని చెప్పెను. ఆ మహామంత్రి వచనమును నత్సరాజు అంగీకరించెను. భారికుఁడు వ్యయము చేసికొన్న యైదువేలను ఇచ్చి రాజు హిరణ్యగుప్తునివలన ఆరత్నమును పుచ్చుకొని భారికునివలన కడియమును పుచ్చుకొని వారిని పంపెను. అయిదువేలు వ్యయము చేసికొన్న వాఁ డై భయము తీఱి భారికుఁడు పోయెను. 'నమ్మినవానిని ద్రోహముచేసినవాడు వీఁడు పాపాత్ముఁడు.' అని రాజు మనస్సులో రత్నదత్తుని ద్వేషించుచునే కార్యగౌరవముచే ఆదరించెను.
భద్రఘటము క థ.
వారు పోయినపిమ్మట రాజుమ్రోల వసంతకుఁడు ఇట్లనియె: ఆహా! దైవనిహతులకు అర్థము దొరకినను నిలువదు. ఈ కూలివాని గతి భద్రఘట వృత్తాంత మయినది. వినుఁడు.- పూర్వము పాటలిపుత్త్రకంబున శుభదత్తుఁ డని యొక కట్టెల మోపువాఁడు ఉండెను. వాఁడు దినదినము ఒక మోపు కట్టెలు అడవినుండి తెచ్చి అమ్ముకొని జీవించుచుండెను. ఒకనాఁడు వాఁడు చాలదూరము వనములో పోయి అచట నలువురు యక్షులను దివ్యాభరణాంబరులను చూచి బెదరి పోయెను. వారు వీనిబెదరును చూచి ప్రీతు లై, అందఱును అడిగి, పేదవాఁ డని ఎఱిఁగి, కృప గలిగి, 'ఓయి నీవు ఇచ్చటనే మా యొద్ద పనులు చేయుచుండుము. నీకుటుంబమును మేము ఆశ్రమము గా భరించెదము.' అని పలికిరి. వల్లె యని శుభదత్తుఁడు వారికి స్నానాది పరిచర్యలు చేయుచు వారికడనే యుండెను. భోజనవేళ కాఁగా యక్షులు వానితో 'ఓయి ఈభద్రఘటము నుండి మాకు ఆహారములు ఎత్తిపెట్టుము.' అని ఘటము చూపిరి. వాఁడు ఆవట్టికుండను చూచి సందేహించుచుండఁగా గుహ్యకులు నవ్వుచు, "శుభదత్త, నీకు తెలియదు, కుండలోపల చేయి పెట్టుము. కోరిన దెల్ల దొరకును. ఈఘటము కామప్రదము సుమా.' అని బోధించిరి. అట్లే అతఁడు చేయిపెట్టఁగా కోరిన యాహారపానాదిక మెల్ల అందు సిద్ధముగా నుండెను. శుభదత్తుఁడు వారికి పెట్టి పిమ్మట తాను భుజించెను. ఈరీతిని యక్షులను భయక్తులతో కొలుచుచు వారికడనే కుటుంబ చింతార్తుఁ డై యుండెను. దుఃఖార్త మయినయతని కుటుంబమును గుహ్యకులు కలలో ఓదార్చిరి.
నెలకాఁగానే యక్షులు శుభదత్తునితో 'నీ భక్తికి మెచ్చితిమి. ఇచ్చెదము అడుగుము ఏ మయిన.' అని పలికిరి. 'నిజముగా నాపై తుష్టియేని ఈ భద్రఘటమును నాకు దయసేయుఁడు.' అని శుభదత్తుఁడు వేఁడెను. 'దీనిని నీవు కాపాడుకొన లేవు; ఇది పగిలిపోయిన మఱి నిలువదు. కనుక వేఱు వరము వేడుము' అని యక్షులు చెప్పిరి. శుభదత్తుఁడు మఱి యొండువరము నొల్లనందున యక్షులు దానినే వాని కిచ్చిరి. అంతట శుభదత్తుఁడు వారికి ప్రణమిల్లి ఆఘటమును పుచ్చుకొని యింటికిఁ బోయెను. అతనిం గని బంధువులు సంతసించిరి. ఇంట ఆఘటమునుండి భోజనాదికమును గ్రహించి, దానిని పదిలముగా ఇతరభాండములనడుమ దాఁచిపెట్టి, బంధుసమేతుఁడై శుభదత్తుఁడు భోజనము చేసెను. ఇట్లు అతఁడు భారముక్తుఁడై భోగము లనుభవించుచు ఒకనాఁడు పానమత్తుఁడై యుండఁగా బంధువులు వానిని, 'నీకు ఈభోగశ్రీ ఎట్లు గలిగినది?' అని యడిగిరి. మూడుఁడు గర్వముచే మాటగా చెప్పక, ఘటమును బుజమునఁ బెట్టుకొని నర్తనము చేయనారంభించెను. కైపుచే కాళ్లు తడఁబడుచు నృత్యము చేయుచుండఁగా బుజమునుండి ఘటము నేలఁ బడి ముక్క లయి పోయెను. వెంటనే ముక్కలన్నియుచేరి అక్షతఘటమై యక్షులయొద్దకుఁ బోయి చేరెను. శుభదత్తుఁడు మరల యథాప్రకారము విషాదాక్రాంతుఁ డై దరిద్రుఁ డాయెను. ఈరీతిగా అదృష్టహీనులు చేతికి అబ్బినసిరిని గూడ పానాదిదోషములచే పోఁగొట్టుకొందురే గాని కాపాడుకోఁ జాలరు.
ఇట్లు వసంతకునివలన భద్రఘటాఖ్యానమును విని వత్సేశ్వరుఁడు గోష్ఠిచాలించి స్నానాహారాది కృత్యములకు లేచెను. నరవాహనదత్తుఁడును తండ్రితోఁగూడనే స్నానమాడి భుజించి సాయంకాలమున చెలికాండ్రతోఁగూడ తన మందిరమునకుఁ బోయెను. ఆరాత్రి అతఁడు నిద్ర పట్టక మేలుకొని యుండఁగా మరుభూతి ఇతర సచివులు గూడ విన నిట్లనియె. - 'దేవా, నీవు దాసీసంగేచ్ఛచే అంతఃపురమును పిలువ వైతివి, దాసిని కూడ పిలువ కుంటివి, అందుచేత నీకు ఇప్పుడు నిద్రపట్టకున్నది. ఇప్పటికిని ఎఱిఁగియు వేశ్యలను కామించెదవు! వీరికి సద్భావము లేదు. అందులకు ఈకథను వినుము.
ఆలజాల కథ.
చిత్రకూట మని లక్ష్మీసమృద్ధ మయిన మహానగరము కలదు. అందు రత్న వర్మ యని మహాధనుఁడు ఒక వర్తకుఁడు ఉండెను. అతనికి ఈశ్వరారాధనచేత కొమారుఁడు కలిగెను. వానికి ఆ కారణమున ఈశ్వరవర్మ యని యాతఁడు పేరు పెట్టెను. ఆచిన్న వానికి విద్యాభ్యాసము ముగిసి యౌవనము ప్రవేశింపఁగా ఏకపుత్త్రుఁడైన రత్నవర్మ యిట్లు తలపోసెను. 'వేశ్య యనఁగా లోకములో యౌవనాంధుల ధనప్రాణములను హరింపు మని బ్రహ్మదేవుఁడు మూర్తిమతిగా చేసిన నికృతి కనుక ఈ కుమారుని ఒకకుట్టనికి అప్పగించి, వేశ్యలకు వీఁడు లోఁబడ కుండునట్లు వారిమాయలను నేర్పించెదను.' ఇట్లాలోచించి రత్నవర్మ కుమారునిఁ దోడ్కొని యమజిహ్వ యను పేరి కుట్టని యింటికి పోయెను. అచట కొమారితకు ఆటనేర్పుచున్న యా కుట్టనిని, లావు లైన చెక్కిళ్లు పెద్ద దంతములు చప్పిముక్కు గలదానిని, కనెను. ఆ ముసలిది కొమారితకు 'పుత్త్రీ, వేశ్యాజన మెల్ల ధనముచే గౌరవము పొందును. ఆనురాగము గలదానికి ధనము దొరకదు. కనుక వేశ్య రాగము మానవలయు, రాగము వేశ్యకును పశ్చిమసంధ్యకును దోషాగ్రదూతగా నున్నది. సుశిక్షిత యైన నటివలె వేశ్య మిథ్యారాగమునే చూపును. ఆ మిథ్యారాగముచే అది ముందుగా కాముకుని రంజించి, పిమ్మట రంజితుని ధనము నెల్లను పిదికి వేయును. రిక్తుఁ డైన వెంటనే వానిని త్యజించును. మరల పూర్ణుఁ డాయెనా మరల వానిని గ్రహించును. యువ శిశు విరూప వృద్ధ రూపవంతులయందు వేశ్యాజనము మునివలె సమముగానుండి అర్థమునే పరముగా గ్రహించుచుండును.” అని నేర్పు చుండెను. అట్లున్నట్టి యాకుట్టనియొద్దకుఁ బోయి రత్నవర్మ సత్కృతుఁడై కూర్చుండి 'ఆర్యా, ఈ నాపుత్త్రునికి వేశ్యాకళలను నేర్పుము, అందువలన వీనికి తెలివి గలుగును. గాక. ఇందులకు నీకు వేయి దీనారము లిచ్చెదను.' అనెను. కుట్టనియు అంగీకరించెను. అంతట రత్నవర్మ కుట్టనికి వేయి దీనారములు ఇచ్చి పుత్త్రుని అప్పగించి ఇంటికి పోయెను. పిమ్మట ఈశ్వరవర్మ ఒక సంవత్సరములో వేశ్యాకళలను నేర్చి తండ్రియింటికిఁ బోయెను.
తనకు పది యాఱేండ్లు రాగా ఈశ్వరవర్మ తండ్రితో 'మనకు ధర్మకామములు అర్థమువలన కలుగును. అర్థమువలన గౌరవము, అర్థమువలన కీర్తి.' అనెను. ఆవచనము నంగీకరించి కుమారునికి వ్యాపారార్థము మూలధనముగా అయిదు కోటు లిచ్చెను. దానిని గైకొని ఈశ్వరవర్మ మంచిదినమున బిడారుతో స్వర్ణద్వీపమునకు పయన మాయెను. దారిలో అతఁడు కాంచనపుర మను నగరమునొద్ద బాహ్యోద్యానములో బసచేసి స్నాన మై భుజించి ఆ నగరము సొచ్చి వింతలు చూచుటకై ఒక దేవళమునకు పోయెను. అచట యౌవనసమీరణముచే లేచిన రూపాబ్ధిలహరింబోని దానిని సుందరి యనుపేరి యాటకత్తెను ఆడుచుండఁగా చూచి, చూచియుఁ జూడక ముందే తదేకగతమానసుఁ డాయెను. కుట్టనీశిక్ష కోపగించినదియుంబోలె దూరముగా పోయెను. అంత నతఁడు వయస్య ముఖమున ఆ లాసికకు తన కోరికం దెలిపెను. లాసికయు ధన్య నయితి నని అంగీకరించెను. అంతట ఈశ్వరవర్మ తనయింట మూలధనమును రక్షించుటకు తగినవారిని నియమించి, తాను సుందరియింటికిఁ బోయెను. అచట ఆలాసికతల్లి మకరకటి యనునది వానిని సమయోచితము లయిన గృహాచారములచే సమ్మానించి, రాత్రి పడఁగానే, కెంపులమేలుకట్టు గలదియు సరత్న పర్యంక శయనమును అయిన పడుకటింట సుందరితోఁ గూడ ప్రవేశపెట్టెను. నృత్యకరణములలోను సురతకరణములలోను విదగ్ధ యైన యాసుందరితో నతఁడు క్రీడించుచుండెను. తెల్లవాఱఁగానే గాఢరాగమును చూపి తనప్రక్కనుండి ఎడఁబాయఁజాల కున్న యాసుందరిని ఈశ్వరవర్మ విడిచి పో నేరకుండెను. దానికి ఇరువదియైదు లక్షల హేమరత్నాదికమును ఆ వణిక్కుమారుఁడు ఆ దిన మిచ్చెను. సుందరి 'నాకు ధనము విస్తారము దొరకియే యున్నది, నీబోటి సరసుఁడు ఇంతవఱకు దొరక లేదు. నీవే దొరకినపిమ్మట నాకు ధన మేల?' అని యసత్యములు పలుకుచు గ్రహింపక యుండఁగా, తదేశపుత్త్రి మకరకటి వచ్చి దానిని ఇట్లు మందలించెను: - ' ఇప్పుడు మనదిగా నున్న ధనమెల్ల ఇతనిదే. దానినడుమ ఈధనమును కూడ ఉంచి పుచ్చుకో నిమ్ము, పిల్లా, దోష మేమి ?' ఇట్లు తల్లి పలుకఁగా సుందరి చేయునది లేక ఎట్టకేలకు దానిని గ్రహించెను. మూఢుఁ డయిన యీశ్వరవర్మ దాని ప్రేమ సత్య మనియే తలంచెను. దాని రూప నృత్య గీతములచేత హృతమానసుఁ డై ఆ వణిక్కుమారుఁడు దానియింట రెండు మాసము లుండెను, అప్పటికి అతఁడు సుందరికి రెండుకోట్ల ధన మిచ్చెను.
ఇంతలో అర్థదత్తుఁ డని ఇతని చెలికాఁడు ఒకఁడు వచ్చి యితనితో నిట్లనియె: 'మిత్త్రమా, ఏమి, కుట్టని నేర్పిన విద్య భీతుని యస్త్రవిద్యవలె సమయమున నిష్ప్రయోజనమై పోయినది? వేశ్యప్రేమ వాస్తవ మని నీవు తలంచితివి గదా, ఎండమావులలోని నీళ్లను నమ్మితివి; కావున నీ ధన మెల్ల ఇక్కడనే క్షయింపకముందే పోదము రమ్ము. ఈ వృత్తాంత మెఱిఁగిన నీ తండ్రి క్షమింపఁడు.' ఇట్లు మిత్త్రుఁడు పలుకఁగా, ఈశ్వరవర్మ 'సత్యము, వేశ్యలకు అనురాగ ముండదు. సుందరి మాత్రము అట్టిది గాదు; క్షణము నన్నుఁజూడకున్న ప్రాణములు వదలును. మనము వెడలక తప్పదని నీవే పోయి దానిని బోధింపుము.' అని యుత్తర మిచ్చెను. అంత నర్థదత్తుఁడు అతనియెదుట మకరకటి యెదుట సుందరితో నిట్లనియె: - 'సుందరీ, నీకు ఈశ్వరవర్మ మీఁద అసాధారణప్రీతి; ఇతఁ డిపుడు అవశ్యముగా స్వర్ణద్వీపమునకు వాణిజ్యముకై పోవలసి యున్నది. అచట లక్ష్మిని సంపాదించుకొని వచ్చి దానితో నీయొద్ద యావత్కాలము ఉండును. ఇప్పుడు సెల విమ్ము.' అంతట సుందరి కన్నుల నీళ్లు నించుకొని విషాదముతో ఈశ్వరవర్మ మొగము చూచి 'మీకే తెలియును, నే నేమి చెప్పుదును? అంతము చూడక ఎవరిని నమ్మ వచ్చును ? చాలు ! మీ యిచ్చ వచ్చి నట్లు చేయుఁడు. నాకు కాఁగలది అగును.' అని పలికెను. 'పిల్లా, ఏడువకు; ధైర్య మవలంబింపుము. నీ ప్రియుఁడు కార్యము తీర్చుకొని మరల నీయొద్దకు వచ్చును. పిమ్మట నిన్ను వదలఁడు.' అని తల్లి ఓదార్చెను. సుందరి పిమ్మట తల్లితో కలియఁబలికికొన్న దై ఈశ్వరవర్మ పోవుదారిలో ఒక నూతిలో వల పన్నించెను. ఈశ్వరవర్మ దుఃఖముచే ఏమియు తోఁపక యుండెను. సుందరియు దుఃఖముచేతనుంబోలె ఆహార పానములను కొంచెకొంచెముగా గ్రహించెను, గీతవాద్యనృత్యములను మానెను. ఈశ్వరవర్మ దానిని నానాప్రణయములచే ఓదార్చెను.
పిమ్మట మిత్త్రుఁ డేర్పఱిచిన దినమున ఈశ్వరవర్మ కుట్టని చేసిన మంగళముతో సుందరీ గృహమునుండి తరలెను. తల్లిని దోడ్కొని సుందరియు కన్నీళ్లువిడుచుచు ఊరి వెలుపల వల పన్నిన నూతివఱకు సాగ నంపి, అచట తాను ఆ బావిలో దుమికెను. 'అయ్యో ! సుందరీ, అయ్యో ! పుత్త్రీ' అని భృత్యవర్గమును తల్లియు మొఱ పెట్ట సాగిరి. ఆ కోలాహలమునకు ఈశ్వరవర్మ మిత్త్రులతోఁగూడ మరలి వచ్చి నూతిలోఁ బడియున్న సుందరిని చూచి మూర్ఛితుఁ డాయెను. తెలివి రాఁగానే మకరకటి పలవించుచు తన నౌకరులను తన రహస్య మెఱిఁగినవారిని ఆప్తులను నూతిలో దింపి సుందరిని వెలికి తీయించెను. వారును త్రాళ్లతో దానిని 'ఆహా బ్రదికియున్నది! బ్రదికియున్నది!' అని పలుకుచు బయటికి ఎత్తిరి. అదియు చచ్చినదానివలె కొంచెముసేపు ఉండి పిమ్మట ఎట్టకేలకు వణిక్పుత్త్రుని ప్రశ్నలకు ఉత్తర మిచ్చెను. దానిని ఓదార్చి ఈశ్వరవర్మ పయనము మాని దానియింటికే పోయెను. సుందరీప్రేమ నిజ మని నిశ్చయించుకొని, అది మరల తనకు దక్కుటయే జన్మఫల మని తలఁచి, అతఁడు ప్రయాణమును మరల తలంపఁ డాయెను. అట్లు అచటనే అతఁడు నిలువఁగా చెలికాఁడు అర్థదత్తుఁడు 'మిత్త్రమా, అజ్ఞానముచే ఏల యిట్లు చెడిపోయెదవు? నూతిలో పడినమాత్రాన సుందరీస్నేహమును నీవు నమ్మకుము. కుట్టనీకూటరచనలు బ్రహ్మకుఁ గూడ దురూహములు. ధనమెల్ల నాశము చేసి తండ్రి కేమి సమాధానము చెప్పుదువు ? ఎచటికిఁ బోఁగలవు? కనుక ఇప్పటికైన వివేకము తెచ్చుకొని ఇచటినుండి వెడలుము.’ అని బోధించెను. ఈ వచనమును లక్ష్యపెట్టక వణిక్పుత్త్రుఁడు ఆ నెలలో ఆ మూఁడు కోటుల ధనమును వ్యయము చేసెను. అంతట ఆ ధన మెల్ల హరించి మకరకటి అతనిని సుందరీగృహమునుండి అర్ధచంద్ర మిచ్చి తఱిమి వైచినది.
అర్థదత్తాదులు త్వరగా నిజనగరమునకుఁ బోయి ఆ వృత్తాంత మెల్ల రత్నవర్మకు నివేదించిరి. రత్నవర్మయు విని దుఃఖించి యమజిహ్వకడకుఁ బోయి యిట్లనియె. 'జీతము పుచ్చుకొని నీవు నాసుతునికి నేర్పిన విద్యకు ఫల మిది. వాని ధనమెల్ల మకరకటి సులువుగా హరించినది!' ఇట్లని ఆతఁడు తన కుమారుని వృత్తాంత మంతయు వివరించెను. అంత నా వృద్ధకుట్టని యిట్లనియె: 'పుత్త్రు నిచటికి పిలిపింపుము. మకరకటియొక్క సర్వధనమును అతఁడు హరించునట్లు చేసెదను' అంత రత్నవర్మ కుమారుని తోడ్కొని రమ్మని మరల మంచి మాటలతో ధనముతో హితైషిని అర్థదత్తునిఁ బంపెను. అర్థదత్తుఁడు కాంచనపురమునకుఁ బోయి సర్వ వృత్తాంతమును ఈశ్వరవర్మతో చెప్పి ఇట్లనియె: — 'మిత్త్రా, నా మాట విన వయితివి. వేశ్యాసద్భావమును ఇప్పటికి ప్రత్యక్షముగా కంటివి గదా. అయిదుకోట్ల ధనమునకు ఒక యర్ధచంద్రమును పొందినాఁడవు. వేశ్యలయందును ఇసుకయందును ప్రాజ్ఞుఁడు విశ్వాస ముంచునా? నిన్నననేల, వస్తుధర్మ మిట్టిదే. రామావిభ్రమ భూములయందు పడకున్నంత సేపే పురుషుఁడు విదగ్ధుఁడు, వీరుఁడు, భాగ్యవంతుఁడును. తండ్రియొద్దకు వచ్చి కోపశాంతి చేయుము' ఇట్లు బోధించి అర్థదత్తుఁడు వానిని త్వరగా తండ్రియొద్దకు కొని వచ్చెను. ఈశ్వరవర్మ దుఃఖాక్రాంతుఁడై తన యపరాధమును క్షమింపు మని తండ్రిపాదములలో వ్రాలెను. తండ్రియు ఏకపుత్త్ర, స్నేహముచేత వానిని ఓదార్చి యమజిహ్వకడకు తోడ్కొని పోయెను
అది యడుగఁగా ఈశ్వరవర్మ అర్థదత్తముఖమున తన ధననాశవృత్తాంతమును సుందరి కూపములో పడుట తుదిగా చెప్పెను. 'నాదే తప్పు, ఈమాయను నేను నేర్ప మఱచితిని. మకరకటి కూపములో వల కట్టినది. దానిమీఁద సుందరి పడి చావక హాయిగా నుండినది. దీనికి ప్రతీకారము కలదు.' అని పలికి యమజిహ్వ తన కోఁతిని ఆల మనుపేరి దానిని అచటికి తెప్పించి దానియెదుట రెండువేల దీనారములను పెట్టి మ్రింగుమనెను. కోఁతి మ్రింగెను. ఓరీ, అబ్బాయీ, వీనికి ఇరువది ఇమ్ము, వీనికి ఇరువదియై దిమ్ము. వీనికి అఱువది, వీనికి నూఱు,' అని నానావ్యయములకు ఆజ్ఞాపింపఁగా ఆకోఁతి ఆప్రకారమే లెక్క తప్పక క్రక్కి యిచ్చెను. ఆలముయొక్క యీ శక్తిని చూపి యమజిహ్వ వణిక్పుత్త్రునితో 'ఈ కోఁతిపిల్లను తోడుకొని మరల సుందరియింటికిఁ బొమ్ము. ముందుగా ఇది మ్రింగిన దీనారములను వ్యయార్థము దానియెదుట ఇప్పించుచుండుము. సుందరి తన సర్వస్వమును నీ కిచ్చి చింతామణీ సదృశమును ఈకపిని నిర్బంధప్రార్థన చేసి గ్రహించును. దీనిని ముందుగా రెండుదినముల వ్యయమునకు ధనము మ్రింగించి ఇచ్చి, దాని ధన మెల్లఁ గొని తత్క్షణమే ఆ నగరము వదలి దూరముగా పొమ్ము,' అని చెప్పి, అతనికి ఆ కోఁతిని ఇచ్చెను. తండ్రియు వానికి రెండుకోట్ల ధన మిచ్చెను.
అది యెల్లఁ గొని అతఁడు మరల కాంచన నగరమునకుఁ పోయి, ముందుగా దూతముఖముగా తనరాకను తెలిపి, సుందరీ గృహము ప్రవేశించెను. అదియు సర్వసాధనములతో వచ్చిన యతనిని సమిత్త్రుని కంఠాశ్లేషాది సంభ్రమ విభ్రమములతో సంతోష పెట్టెను. దానికి స్నేహము చూపి యీశ్వరవర్మ అప్పుడే అర్థదత్తుని పంపి ఆలమును తెప్పించి 'ఓరి ఆలపుత్త్రా, ఇప్పుడు, మున్నూఱు దీనారములు భోజనపానములకు ఇమ్ము, తాంబూలాదికమునకై నూఱు దీనారములు ఇమ్ము, అమ్మకు మకరకటికి నూఱు దీనారములు ఇమ్ము, బ్రాహ్మణులకు నూఱు ఇమ్ము, సహస్రములో మిగిలి యుండుదానిని సుందరికి ఇమ్ము.' అని యాజ్ఞాపించెను. ముందుగ వేయి దీనారములు మ్రింగి యున్న యా మర్కటము ఆప్రకారమే దీనారములను క్రక్కి క్రక్కి వ్యయసమయములయం దిచ్చుచుండెను. ఈప్రకారము ఒకపక్ష కాలము ప్రతిదినము ఈశ్వరవర్మ వ్యయమునకై జోఁతిచే దీనారములు ఇప్పించెను. ఇంతలో మకరకటియు సుందరియు ఆలోచించిరి. 'అహొ ! చింతామణి కోఁతిరూపమున సిద్ధించి యున్నది. దినమునకు ఇది సహస్రదీనారములు ఇచ్చును. దీనిని ఇతఁడు మన కిచ్చిన ఇఁక కోరవలసిన దేమియు సుండదు.' ఇట్లు ఏకాంతమున తల్లితోఁగూడి ఆలోచించుకొని సుందరి ఈశ్వరవర్త్మను భోజనానంతరము సుఖముగా నున్నప్పుడు 'నాయందు నీకు స్నేహము నిజమేని, ఈ యాలమును నాకిమ్ము.' అని యడిగెను. ఈశ్వరవర్మ యనియె: 'ఇది మా తండ్రియొక్క సర్వధనము, దీనిని ఇయ్య వలనుపడదు.' 'మీ యైదు కోట్లను ఇచ్చెదను, దీనిని ఇమ్ము.' అని సుందరి పలికెను. ఈశ్వరవర్మ నీ సర్వస్వము ఇత్తువేని, ఈ నగర మెల్ల నిత్తువేనియు, దీని నీయ సాధ్యపడదు, కోట్లసంగతి తలఁప నేల?' అని దృఢముగ పలికెను. సుందరియు 'నా సర్వధనమును ఇచ్చెదను. కోఁతిని" నా కిమ్ము. అమ్మకు నాపై కోపము వచ్చిన రానిమ్ము.' అని ఈశ్వరవర్మపాదములు పట్టుకొనెను. అర్థదత్తాది మిత్త్రులు 'ఇమ్ము, ఏ మయిన నగును గాక' అనిరి.
అంత నీశ్వరవర్మ కోఁతిని ఇయ్య నంగీకరించినవాఁడై, హృష్టురా లయిన సుందరితో ఆదినమును గడపి, తెల్లవాఱఁ గానే మరల సుందరి నిర్బంధింపఁగా ఆమర్కటముచే ముందుగా రెండువేల దీనారములను మ్రింగించి, దానిని సుందరికి ఇచ్చి, దానివెలగా సుందరియొక్క సర్వస్వమును కైకొని తత్క్షణమే వాణిజ్యముకై స్వర్ణద్వీపమునకు పోయెను. సుందరి సంతుష్ట యై యాచింపఁగా ఆలము రెండుదినములు వేయేసి దీనారములు ఇచ్చెను. మూఁడవనాఁడు ఎన్నిమాఱులు అడిగినను ఆలము ఏమియు ఇయ్య కుండుడు, సుందరి దానిని పిడికిట గ్రుద్దెను. కోఁతి తన్నుకొట్టుచున్న సుందరీ మకరకటుల ముఖములను కోపమున ఎగిరి దంతములతోను గోళ్లతోను గీఱి గాయములు చేసెను. అంత ముసలిది మోమున రక్తధార లొలుకుచుండ దుడ్డుఁగఱ్ఱలతో ఆలమును కొట్టెను. ఆ దెబ్బలకు ఆలము చచ్చెను. అది చచ్చుటయు సర్వధనము పోవుటయు తలఁచి దుఃఖిత యై సుందరియు తల్లితోఁగూడ ప్రాణత్యాగమునకు నిశ్చయించుకొనిరి. ఈ వృత్తాంతమును విన్నజనులు 'మకరకటి జాలముచే ఎవని ధనము నెల్ల హరించినదో, వాఁడు బుద్ధిమంతుఁ డై ఆలముచే దాని సర్వస్వమును హరించినాఁడు. అది ఇతరులమీఁద జాలము చేయ నేర్చినదిగాని తనమీఁద ఇతరుఁడు చేసినయాలమును తెలిసికో నేరక పోయినది.' అని పలుకుచు నవ్వుచుండిరి. నష్టార్థయు పాటితాననయు నైన సుందరిని దాని జననిని ప్రాణత్యాగమునుండి స్వజనులు ఎట్టకేలకు నివారించిరి. ఈశ్వరవర్మ మహాధనమును ఆర్జించి స్వర్ణ ద్వీపమునుండి మరలి చిత్రకూటమున తండ్రియింటికిఁ బోయెను. కుమారుఁడు ఇట్లు అమితధనము నార్జించి రాఁగా రత్నవర్మ సంతోషించి ఆతని నభినందించి యమజిహ్వకు ధనము లిచ్చి మహోత్సవము చేసెను. ఈశ్వరవర్మయు సకలమాయ లెఱిఁగి, వారవిలాసినీ సంగమందు విరక్తుఁ డై, వివాహము చేసికొని ఇంట సుఖముగా నుండెను.
రాజేంద్రా, ఈరీతిని వార వనితా హృదయమందు కపటమే గాని సత్యము లేశ మయినను ఉండదు. కనుక సార్థ సాధ్యగమన లైన వారస్త్రీలయందు శూన్యాటవులయందుం బోలె భూతికాముఁడు గమింపఁ గూడదు.
ఇట్లని మరుభూతివలన ఈ యాలజాలకథను విని నరవాహనదత్తుఁడును గోముఖాదులును అంగీకరించి సంతసించిరి.