కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/పాడినపాటే
పాడినపాటే
శ్లో. ఉచిత మనుచితం వా కుర్వతా కార్యజాలం
పరిణతిల రవధార్యా యత్నతః పండితేన
అతి రభసకృతానాం కర్మణా మావిపత్తే
ర్భవతి హృదయదాహీ శల్యతుల్యో విపాకః.
శాస్త్రులవారిని నే నడిగిన యంశమేమని? ఏదో యొక దానిని గూర్చి అనఁగా? మీరెక్కుడు నమ్మికతో మరల నెత్తికొని వ్రాసిన శ్రీకారమును గూర్చియా? అందు ఒందుగా మార్చుటను గూర్చియా? ప్రప్రథమమును గూర్చియా? “ఇట్లనే, అట్లన" అనువానిం గూర్చియా? "కొంపతీఁతను” గూర్చియా? ఈ చూపినవానిలో దేనిం గూర్చియో? వ్రాయవలసినదని నిరూపింపుఁడు. దానింగూర్చి చేత నైనంతలో విస్తరించి వ్రాయుదు ననియేకదా? అట్లేదో యొకటి నిర్దేశింపఁబడవలసి యుండఁగా మరల సూత్రప్రాయముగా మున్ను దత్తోత్తరములగు శ్రీకారములోనగు పెక్కింటి నుదాహరించి వాదము పెంచుటేలొకో? వారి తాత్పర్య మెట్టిదియైనను నేను "పరప్రతారణమాత్ర ప్రయోజనముగా" భావించుచున్నాఁడను. ఈపరప్రతారణ ప్రధాన ప్రయోజనపు వ్రాఁతలో "చండాలోస్తు" “జ్ఞానహీనో గురుస్త్యాజ్యః" ఇత్యాదికము వ్యక్తిదూషణాశయమును ధ్వనింపఁజేయుచున్నవి. ధ్వన్యర్థ మిటులుండఁగా వాచ్యార్థము మిక్కిలిగాఁ దమకు మాయెడల గౌరవమున్నట్లు చాటుచున్నవి; పెక్కు వాక్యములు గలవు. వానిం గూర్చి యడిగి గ్రంథము పెంచుటకు నే నిష్టపడను. నేను వారి వ్రాఁతయొక్క సారాంశమును నిరూపించుచుఁ దత్సందర్భమున వ్రాయక తప్పని విధిచే “గురు శుశ్రూషణయా" అని యుదాహరించినదానికి మరల శాస్త్రులవారు కుపితులై తాము శిష్యత్వము నంగీకరించినను “నేను గురుత్వమునకుఁ దగను" అను నంశమును వాచ్య వృత్తిచేఁ బ్రకటించినారు. ఆ యక్షరము లియ్యవియే, తిలకింపుఁడు.
“కాని. వేంకటశాస్త్రులవారు గురువులగుటకుఁ దగుదురా?" లోనగునవి. వారు “తగ”రని వ్రాయుచుండఁగా నేను "తగుదు"నని వ్రాయుట యపహాస్యాస్పదముగా నుండునని యెఱిఁగియుఁ దప్పని విధియగుటచే నిట్లు వ్రాయుచున్నాఁడను. అయ్యా! శాస్త్రులవారూ? మీ విమర్శనపుcబద్ధతిని బరికించినను మీ రచ్చటచ్చటఁ గుండలీకరణపు గుర్తులతో లిఖించెడి యాంగ్లభాషా వర్ణములనుబట్టి చూచినను మీకా భాషలో గూడఁ బాండితి యున్నట్లు తోcచెడిని. దానిలో మీకు గురుత్వము జేయుటకు నాకు లేశమును బ్రవేశములేదు గాని మనకుఁ బ్రస్తుతము నడచుచున్న "వాదోపవాదములు" దానికి సంబంధించినవికావు గనుక, దీనికి సంబంధించిన సంస్కృతాంధ్ర భాషలలో గురుత్వము చేయఁగలనని నొక్కి వక్కాణించుచున్నాఁడను. ఇట్లు నా వ్రాసినవ్రాఁత లోకులకు సర్వదా "భోజనమునకు రావలదనిన, పట్టుచీర గట్టుకొనివత్తును అను సామెతను స్ఫురింపఁ జేసెడినని యెఱిఁగియు వ్రాయ సాహసించిన నన్ను గౌరవించి యొకపరి సెలవుదినములలో దర్శన మిప్పింపఁగోరెదను. “అధవా విద్యయా విద్యా" కనుక నాకు మీ రాంగ్లభాషలో గురుత్వము చేసి నాఋణమును దీర్చికోవచ్చును. లాక్షణికులు "కావ్యజ్ఞశిక్షయాభ్యాసః" అని వ్రాసిన వ్రాఁతకుఁ బైరీతినిన మీరు సార్థక్యము గలిగించుట సర్వథాయుక్తము. నేను "కావ్యజ్ఞుఁడను" అని మీ రిందును వెనుకటి పత్రికలయందును వ్రాసిన వాక్యములలో ననేకములు తోడ్పడుచున్నవి. కావున వాని నందందు మీరే చూచికోఁగలరని యిందెత్తలేదు. "అన్యోన్యం గురవో విప్రాః" కనుక నిట్లొనర్చుటలో మీకుఁగాని, నాకుఁగాని యవమానము కూడ నుండఁగూడదు. మీకు నేను "చండాలుఁడనుగా" దోఁచినను నా బుద్ధికి మీరుత్తమ బ్రాహ్మణ వంశజులుగనే ముమ్మాటికిని దోఁచుచున్నారు. కావుననే యిట్లు వ్రాయఁగలిగితిని. "నీచాదపి మహావిద్యా"యను దానిని స్మరింపుఁడు. ఇంతవఱకు మీరు వ్యక్తికిఁదగుల వలయునను నాశయముతో వ్రాసిన యక్షరములను బురస్కరించుకొని వ్రాసినవ్రాఁత. ఇఁకఁ బ్రస్తుతాంశము నుపక్రమింతము. ఏదో యొకదానినిగూర్చి నిర్దేశింపుఁడని కోరితిని. అట్లేమీరు నిర్దేశింపక మరలఁ బెక్కువిషయములనెత్తికొనిరి; పోనిండు. ఈయెత్తికొన్న వానిలోనేని యొకదాని నీసారి నిరూపింపుఁడు. అనారోగ్య ప్రయుక్తమగు నసమర్థతచే మిమ్మిట్లభ్యర్థించుచున్నాఁడను, సత్యమును గ్రహించి యట్టు లనుగ్రహింపుఁడు. ఇఁక నా కోరికమీంద మీరు నాకుc బరీక్షార్థమై యొసఁగిన “తత్ర శ్లోక చతుష్టయమ్" అను నభియుక్తోక్తి కుదాహరణ మనఁదగు చతుష్టయములోని "అస్మాన్ సాధువిచింత్య" అనుదానిని నే నెట్లు పాడుచేయుదునో కొంతమాత్రమే యిపుడు తిలకించి దానిని మీశక్తికొలఁదిని సమర్ధింపుఁడు. ఈ నా యవ్యక్తపు వ్రాఁత స్వయంకృతాపరాధ ప్రయుక్తము కాకవేవల పరేచ్ఛా ప్రారబ్ద ప్రయుక్తమని పత్రికా పాఠకులెల్ల నెఱిఁగియే యుందురు. కావున వారు నన్ను రోయకుందురని తలఁచి యిందుల కుపక్రమించుచున్నాఁడను.
"అస్మాన్, సాధు, విచింత్య, సంయమధనాన్" ఇచట, అస్మాన్ అనుపదమునకుఁ గణ్వమహాముని యర్థము, బహువచనము. “అస్మదోద్వయోశ్చ" అను సూత్రముచే సమర్థనీయము, కాని “సవిశేషణస్య ప్రతిషేధః" అని యుండుటచేతను, ఇచట “సంయమధనాన్" అని విశేషణ ముండుటచేతను, చింత్యమనక తప్పదు. ఇఁక దీని సమర్ధనమునకై కొన్ని త్రోవలు కలవు, వానిని శాస్త్రులవారే తొక్కుదురు కాన నేనందులకుఁ బూనక “ఏకవచనముగా నుండునట్లు దిద్దుకొమ్మని కాళిదాసును శిక్షించుచున్నాఁడను. ఇది మీ విమర్శనము ననుకరించు తెగలోనిది కాదు. ఇచటఁ గొంత “ప్రష్టవ్యత్వమున్నది" యని మీ వంటి ప్రాజ్ఞులెల్ల నంగీకరింతురు. ఇఁక "ఉచ్చైః కులం" ఇయ్యెడ దంత్య తాలవ్యభేదము కొంత ప్రతిబంధించెడిదియే యైనను, సంస్కృతభాషలో “దంత్య చకారము లేకున్నను " ఈపదమునం గల తాలవ్యచకారము దంత్య చకారఘటిత మగు “ఉచ్చ” అనుపదమును స్ఫురింపఁజేయు నను కువాదమును మీరెట్లు ఖండింతురు? ‘చకాశే పనసప్రాయైః పురీషండ" అను లాక్షణికోదాహరణము మీరు తిలకించియే యుందురు. అట యథాకథంచిత్తుగా ముడివెట్టుటచే నిష్పన్నమైన “శేప, పురీష" శబ్దములలో శేప శబ్దము శేఫ శబ్దమునకు స్మారకమెట్లగునో ఇదియునట్లేయని యెఱుఁగుఁడు. ఆస్మారకత్వము కేవలము సంస్కృతభాషకు మాత్రమే సంబంధించినది. ఇది యట్లుకాక, తెలుఁగు భాషను బురస్కరించిన దొసఁగు కావున వైషమ్య ముండునని వారింపకుఁడు. అట్లే యగుచో సంస్కృత గ్రంథస్థములగు, “శష్పశ్యామాన్" లోనగు నిర్దుష్ట ప్రయోగములను మన యాంధ్రదేశపుఁ బుస్తకములలో, "ఘాస శ్యామాన్" అని దిద్దుటకుం గతమేమో విచారింపుఁడు. లాక్షణి కాశయ మేవిధముగాఁ గూడ నశ్లీలము స్ఫురింపఁగూడ దనియే సుఁడీ? అట్లగుటచేతనే సర్వదేశ సామాన్యభాష యగు గీర్వాణ భాషకుఁగూడ నాయాయీ దేశపు వ్యవహారమునకు లోఁగ వలసియుండుటకు లాక్షణికులు సమ్మతించియున్నారు. దానింబట్టి యీశ్లోకమునందలి, “స్నేహ ప్రవృత్తిమ్” అను పదముకూడ నశ్లీలార్థ స్ఫోరకమగుచున్నది. మాదేశమునందీ “ప్రవృత్తి" పదమున కంత ప్రాచుర్యముగా "విరేచనార్థకత్వము" లేదుగాని గద్వాలప్రాంతమున దీనికట్టియర్థము పండిత పామర సాధారణ్యముగాఁ గలదు. బహుశః మీదేశమునఁగూడఁ గల దనుకొనియెదను. దీని నిశ్చయము దీనిపై మీరు వ్రాయుదానివలనఁగాని తేలదు. ఇప్పటికి గద్వాలప్రాంత దేశవాసుల మతమున నియ్యది యశ్లీలముకాక తీరదుగదా? ఇక్కడి కిది వెట్టిత్రోవను ద్రోక్కి దిఙ్మాత్రముగా విమర్శింపఁబూనిన నాలఘు విమర్శనము. ఈ “ప్రవృత్తి"కిని సమర్థనముకలదు. గాని శాస్త్రులవారే చూపుదురు. అదినాపనిగాదు. శ్లోకములోనింకను సగముకన్న నధికము కాలేదు. శ్లోకమో? కాళిదాస కృతము, తత్రాపి, “పేరువడిన చతుష్టయములో నొకటి" శాంతం పాపం, ఇది నాబుద్ధిదోషమో? కవిదోషమో? తిలకింపుఁడు. ప్రకృత మనుసరామః. మఱియును "అబాంధవ కృతామ్" అనుచోట? “అబాంధవ" అని ఛేదించి దానిని "హే అబాంధవ!” అని సంబోధించునట్లు సమన్వయించి కొనినయెడలఁ గాళిదాసున కనభిప్రేతమగు రాజదూషణము సంఘటించును. అపుడు తక్కిన పదములకు సమన్వయమెట్లందురా? హేఅబాంధవ, త్వయి, కృతాం, అస్యాః స్నేహ ప్రవృత్తిం, అని సమన్వయము. అర్ధత స్స్యయ మేవేతి సంబంధ్యతే. మఱచితిని, "స్నేహప్రవృత్తిమ్" అనుచో నశ్లీలము వారించుటకై కాళిదాసునకు శిక్ష నుపపాదింపవలసి యున్నది. కనుక నతఁడిట, “స్నేహప్రసక్తిమ్ లేక ప్రసత్తిమ్” అని దిద్దికొననగు. ఇక్కడికి శ్లోకములోని సగము శాస్త్రులవారి ధోరణినిబట్టి విమర్శింపవలసి యున్నది. పిమ్మటఁ జూతముగాక. మొత్తముమీఁద గొన్ని యిట్టిదోషములున్నను నీశ్లోకము, చాల రసవత్తరమై వ్యాసవాల్మీకాదులకన్న నిక్కవి నగ్రస్థానమున నుంచుచున్నది. వారిప్పట్టున ననఁగా వ్యాసులవారిప్పట్టున నితనియొద్దసరస కవితావిధానమును నేర్చికోవలసియున్నది. ఇత్యాదులు కృష్ణరాయ శాస్త్రులవారి ననుసరించి నా వ్రాయు నక్కరములుగాని బుద్ధిపూర్వకముగా నేవ్రాయునవికావు. కావున నాపై నాగ్రహింపవలదని చదువరులను మరలఁబ్రార్థించుచున్నాఁడను. నే నిదివరలో "బాగుగనున్నదని మెల్లఁగా నొకమాట వ్రాసి జాఱవిడిచిన శాస్త్రులవారి “యార్థిక విమర్శనమెల్ల" పైదాని సజాతీయమే యనియు దానినెల్లఁ బ్రత్యక్షరమును విడఁదీసి విమర్శింప వలసివచ్చుచో నేను మరల జన్మించి వయస్సునుబొంది రావలసినదేకాని, యిపుడున్న శరీరబలము చాలదనియు నెంచి యట్లు జాఱవిడిచి శబ్దవిషయమునుమాత్రము చర్చింపఁబూనితినని పాఠకు లరయుదురుగాక. వీరి విమర్శనమున "అతి సర్వత్ర వర్జయేత్" అను నభియుక్తోక్తిని బొత్తిగా మన్నించుట వలనమును గన్పట్టదు. ఏ వెఱ్ఱిమొఱ్ఱిమాటలనో వ్రాయు మాకు భవభూతికన్ననుత్తమస్థాన మొసఁగిననెవరు సమ్మతింతురు? ఇక్కాలమునందలి యే కొందఱకన్ననో కొండొక మిన్నలుగా నేకొందఱో భావించుచున్న మమ్మును వ్యవహారభాషయగు తెలుఁగున “అందు ఒందుగా మార్చికొమ్మని" యన్న నెవరు సంతసింతురు? ఈ రెండును సంఘటింపనివియే, “కవయః కాళిదాసాద్యాః కవయోవయ మప్యమీ! పర్వతే పరమాణౌచ పదార్థత్వం వ్యవస్థితమ్." కావున శాస్త్రులవారి మెచ్చున కుబ్బి తబ్బిబ్బగుటగాని, నిరసనకుఁ చింతించుటగాని యొనర్చువారు, “పరమామాయికులని’ మాతాత్పర్యము. విస్తంచ మెందులకు? వారిడిన ప్రశ్నమున కుత్తరముగా “నాపాడుచేయు విధమును" జూపితిని. దీని నింక వారు బాగుచేయవలయును, చేయనే లేరనుకొందము. కాదు న్యాయముగనే సమర్థింతురనుకొందము. నేను వారి వ్రాఁతయందలి సారమునుగ్రహించి మిన్నకుండెదనా? ఏదో బదులని పేరుపెట్టి గిల్కుచునే యుందును. దీనికి నిర్ణేతలెవరు? ఈ యథాత్తువాదము నాఁగువారెవ్వరు?
శ్లో. స్వాధీనో రసనాంచలః పరిచితాశ్శబ్దాః కియం తఃక్వచి
త్క్షోణీంద్రోననియామకః పరిషద శ్శాంతా స్స్వతంత్రం జగత్.
ఇఁక నిప్పటికి విరమించుచున్నాఁడను. ఎంత యొప్పైనదానినేని తప్పుచేసెదనని నాయంతట నేనై కాకున్నను శ్రీశాస్త్రులవారి నిర్బంధము వలన ననఁగా వారి విమర్శనవిధాన మిట్టిదియని చదువరులకుఁ దెల్పుటకైనను బ్రతిజ్ఞపట్టుట కొంత దొసఁగు కాకపోదు. ఇందులకు నేనెంత చదువరులను "మన్నింపుఁడని” ప్రార్ధించినను నాపై వారు కొండొక కనులెఱ్ఱఁజేయక మానరని కొంకుచున్నాఁడను. ఈ ప్రతిజ్ఞ
శ్లో. విదుషాం నివహై రిహైకమత్సా ! ద్యదదుష్టం నిరటం కియచ్చ దుష్టం
మయి జల్పతి కల్పనాధి నాథే ! రఘునాథే మనుతాం తదన్యదైవ.
అనినుడివిన రఘనాథభట్టాచార్యునికిఁ గాని “శ్లో ఆమూలాగ్రతస్నానోః ... ... వాచా మాచార్యతాయాః పదమనుభవితుంకో౽స్తి ధన్యోమదన్యః." అని నుడివిన జగన్నాథ పండితరాయలకుఁగాని నావంటి సామాన్యునకుఁదగదు. పైనుదహరించిన శ్లోకద్వయము వలన శాస్త్రులవారి వ్రాఁతలోని "వేంకటశాస్త్రిగారు ప్రకటించిరి. నందిని పందినిచేసేది. పందిని నందినిచేసేది యిదేకాఁబోలును... ..ఏవిమర్శకుఁడును చారిత్రాత్మకముగ (పుక్కిటికథలుగాక) నిట్లు ప్రతిజ్ఞపట్టినట్లెఱుఁగను.” అను నక్షరములు పరాస్తములు. ఇపుడేని యెఱుఁగఁదగు. ఇది యిటులుండ, తగకున్నను, నియ్యది యనుకృతికై కైకొన్న భూమికనుగా భావించి పాఠకలోకము నన్ను క్షమించుఁగాక యని వేఁడుకొనుచున్నాఁడను.
★ ★ ★