కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/నన్నయ్యభట్టు
నన్నయ్యభట్టు
ఈయన్ని గూర్చి యెప్పుడో సుమారు యిప్పటికి 45 ఏళ్లనాఁడు దేవీభాగవతప్పీఠికలో యేవో కొన్ని మాటలు వ్రాయవలసి వ్రాయడం తటస్థించింది. దాన్ని గుఱించి నేఁటివఱకున్నూ యెవరున్నూ యేమీ వ్యతిరేకంగా వ్రాసినట్టులేదు. అందులో నేను వ్రాసిందేనా మఱేమీలేదు-
“నన్నయసమున్నతుఁడై కడు లక్షణంపుఁ బ్రోవైగుది గూర్చు నేర్పుగలఁడై తగు" అని మాత్రమే. ఆయన్ని ప్రయోగవిషయంలో కవిత్రయంలో యెక్కువ నియమనిష్ఠలు కలవాఁడని కవులందఱూ అనాదిగా పొగుడుతూనే వున్నారు. అహోబల పండితుఁడు కవిత్రయంవారిలో నన్నయ్య ప్రయోగాన్ని శిరసావహిస్తాఁడు కాని తక్కిన యిద్దఱివీ తఱుచు, తోసేస్తూనే వుంటాఁడని విజ్ఞులందఱూ యెఱిఁగిన విషయమే. ఆంధ్రశబ్దచింతామణి నన్నయ్య రచించనట్టే పలువు రభిప్రాయపడతారు. నేనుకూడా యీ తెగలో వాఁడనే. నన్నయ్యప్రయోగాలు కొన్ని చింతామణి సూత్రాలకు వ్యతిరేకించినవి కనపడతాయి. దాన్నిఁబట్టి-
“తానొక కట్టుచేసి యది తప్పెను నన్నయ కొన్నిచోట్ల" అని వ్రాశాను. యిది స్థూలదృష్టినిచూస్తే నన్నయ్యకు న్యూనతాపాదకమే గాని గౌరవాపాదకం గాదుగదా? అయితే సామాన్యులదృష్టిలో తప్ప విజ్ఞుల దృష్టిలో యీలాటి సందర్భాలు న్యూనతాపాదకాలు కావు. యెందుచేతనంటే పాణిన్యాచార్యులంతమహానుభావుఁడుకూడా తనశాసనానికి భిన్నంగా సూత్రాలలో ప్రయోగిస్తూ వస్తే ఆప్రయోగాలుకూడా సూత్రప్రాయంగా పండిత లోకానికి ప్రవృత్తినివృత్తులను శాసించడం అందఱూ యెఱిఁగిందే. యీమర్యాదను అహోబలుఁడు వొక్కనన్నయ్యగారికే యిచ్చాఁడు. యితరలాక్షణికులో కవిత్రయంవారి ప్రయోగాలు యావత్తుకూ యిస్తూ వచ్చారు. ఆత్మకూరుపండితులతో మాకుకల్గిన విద్యావిషయికవాదంలో నన్నయ్యప్రయోగాలిస్తేనే తప్ప వారు వొప్పుకొనేవారు కారు. “దేవతలు ధర్మవర్తులు" అనేది నన్నయ్యగారిది కావడంచేతనే వారు తోసేయడానికి వల్లకాక “ధర్మ వృత్తులు" అని దిద్దడానికి వుపక్రమించారు. భవతు. మేము నన్నయ్యను గూర్చి వ్రాసినది బహుకవిసమ్మతమైనమాటగాని మాస్వంతాభిప్రాయము లేశమున్నూ కాదు. నన్నయ్య వైదికశాఖకనక తి. వెం. కవులు వైదికశాఖకు చెందినవారు కావడంచేత అతణ్ణి గొప్పచేశా రనేవారున్నూ వున్నారు. వారికి వొక నమస్కారం. యెవరికీ నచ్చనిమాట మేము వ్రాస్తేమాత్రం పనిచేస్తుందా? చేయదు.
“ఇంచుకకేమి యజ్వయున్ లోఁగక యాతనిన్ జెనయు” అని ఆపద్యంలోనే వ్రాశాము. దీన్నిబట్టి నియమాలలో సోమయాజులుగారు నన్నయ్యకన్న నలుసంత లొక్కుతారని వ్రాసినట్లు స్పష్టపడుతుంది. యిదిన్నీ మాస్వంతకల్పన కాదు. నన్నయ్యగారి సీసాలు యతితోప్రారంభిస్తేయతితోటే, ప్రాసతోటి ప్రారంభిస్తే ప్రాసతోటే, ఒకదళంలో దానితోటిన్నీ వేఱొకదళంలో దీనితోటిన్నీ ప్రారంభిస్తే ఆప్రకారమే ముగింపఁబడతాయనిన్నీ తక్కిన భారతకవిద్వయంవారి సీసాలు యీ నియమాన్ని అంతగా పాటించినట్లు లేదనిన్నీ విమర్శకులు యిదివఱకే వ్రాసివున్నారు. అయితే నన్నయ్యగారు కూడా యెక్కడో స్వల్పంగా యీనియమాన్నిపాటించక అభ్యనుజ్ఞ యిచ్చివున్నారనికూడా వారేవ్రాశారు. అర్థానుస్వారం గల హ్రస్వ పూర్వక ప్రాసకు అది లేనివర్ణాన్ని నన్నయ్యగా రెక్కడా ప్రాసపెట్టలేదు. తిక్కన్నగారున్నూ పెట్టలేదుగాని-
“క. నగములు. యె! సఁగుపూర్వస్థితిన" అని శాంతిపర్వంలో కాcబోలును వొకచోట సార్థబిందు, నిరర్థబిందువులకు ప్రాస పెట్టినట్లు కనపడుతుంది. యింకా యీలాటివే నీహారలేశాలు కొన్ని శ్రీగిడుగుపంతుల వారు చూపివున్నారు. (జ్ఞకార కకారాలకు యతి పెట్టడం వగయిరాలు కూడా కొందఱు చూపుతారు) “వ్యయము" అనుటకు బదులు "వ్రయము" అని సోమయాజులుగారు దిద్దరానిచోట వాడినారు. అది వ్యావహారికంగాని గ్రాంథికంగాదు. యేవో యిట్టులేతమమయము వగయిరాలు చూపుతారు కొందఱు తిక్కనగారికి. యీమాటలు మనస్సులో పెట్టుకొనియ్యేవే “ఎన్నియో దోసముల్ పొసఁగున్ నన్నయకన్నఁ దిక్కనకు నల్పుండౌనె? తన్మాత్రలోన్" అని వారివారి వాదమును ఖండించు తాత్పర్యంతో వక వాక్యం “అభ్యుపగమ్యవాద" పురస్కారంగా వ్రాసి వున్నాము. దానిని శాఖా ద్వేషంగా అపవదించేవారికి మేము చెప్పఁదగ్గ జవాబు లేశమున్నూలేదు. “సహృదయాః ప్రమాణమ్” అని మాత్రమే మనవి చేయుదుము. నన్నయ్యగారు ప్రయోగించినదే అయితే అది వకవేళ శాస్త్ర విరుద్ధమే అయినా దాన్ని అనుకరించిన తిక్కనాదులను యెవరూ యేమీ అనడానికి అవకాశం లేనట్టు కవిరాక్షసుఁడు సిద్ధాంతీకరించి వున్నాఁడు.
"ఉ. ఆదిని శబ్దశాసనమహాకవి చెప్పిన భారతంబులో" అనే పద్యార్థం యెఱిఁగినవా రందఱూ పైసందర్భాన్ని అంగీకరిస్తారు. దుర్ణయ శబ్దగతణత్వం నన్నయగారి నాటికి నిర్దుష్టమే అయినా తిక్కనగారి నాటికి దుష్టమనేవాదం బయలుదేరివున్నట్టయితే తిక్కన్నగారు వదులుకోవలసివుండేది. కాని ఆలా వదులుకొన్నట్టులేదు. యీసిద్ధాంతము శేఖరకారకునిదవడం చేత తిక్కన్నగారు శేఖరకారకునికంటె (యీ పూర్వాపరవిచారం బొత్తిగా తెలియక ఒకరు కాశికావృత్తికంటె కౌముదే పూర్వమెందుకు కాకూడదంటూ వ్రాశారు) పూర్వులు కావడంచేత ఆయనికి గోచరించవలసిన ఆవశ్యకత లేదనుకున్నా అనుకోవచ్చును. కాని తిక్కన్నగారు వొకచోట అక్షోహిణీశబ్దాన్ని యతిస్థానంలో ప్రయోగించి వున్నారు. “అక్షాదూహిన్యాం" అనే వార్తికంవల్ల అక్షౌహిణీశబ్దం ఔకార ఘటితమే కాని ఓకారఘటితంగా కూడా వుండడానికి అవకాశంలేదు. కాని ఓకారఘటితంకూడా వుండవచ్చునని తత్త్వబోధినిలో సమర్ధనం కనపడుతుంది. తత్త్వబోధినిగాని, కౌముదిగాని తిక్కన్నగారి నాఁటికి పుట్టినగ్రంథాలుకావు. అయితే ఆయన కీవిషయం యెట్లు గోచరించిందంటే వారుచదివిన యితర గ్రంథంలో యెక్కడో వుందని సమర్ధనం చెప్పుకోవలసి వుంటుంది. విషయం విషయాంతరంలోకి డేఁకుతూ వుంది. మనకు ప్రధానం నన్నయ్యభట్టు ఆంధ్రానికి ప్రప్రథమలాక్షణిక కవి అవడంచేత అతనిప్రయోగ మెట్టిదైనా అది తిక్కనాదిమహాకవులకు ఆదరణీయం కావలసివచ్చిందన్నదే. యేకొందఱు చేదస్తులో తప్ప తక్కినమహా కవులందఱూ వక్కనన్నయ్యనేకాక కవిత్రయాన్ని ప్రథమాచార్యులుగా సమ్మానించి వున్నట్టు లక్షణగ్రంథాల వల్ల స్పష్టపడుతుంది. మేము యీతుదిమతాన్ని అవలంబించడమే కాకుండా యింకా ప్రసిద్దులైన పోతనాది మహాకవులనుకూడా ప్రయోగాలవిషయంలో ఆదర్శప్రాయులుగా పెట్టుకొని కవిత్వాన్ని సాగిస్తూవచ్చాము. యీ అంశాన్ని"సీ. నన్నయకవి పెట్టినాఁడుకదా? తిక్కనాది కవీంద్రుల కాదిభిక్ష.. ...వీరలును వీరిమార్గమ్ము గోరి యాంధ్ర కృతుల నొనరించి బహుబహూకృతుల నలరు వారలును మాకుఁ బూజ్యులు"- అనే మాశ్రవణానందపద్యం వ్యాఖ్యానిస్తూనే వుంది. తిక్కన్నగారు, అర్థబిందు రహితమైన నగము అనేదానికి సార్థబిందుకమైన ఎసఁగు అనేదాన్నిప్రాసలో నిల్పడాన్ని బట్టియ్యేవే మేము అట్టిప్రాసమును వాడియుంటిమి. యిది యేమో మేము స్వతంత్రించి చేసినసాహసమని వొకానొకరు యీ మధ్య గుంటూరుడిస్ట్రిక్టులోని శాస్త్రజ్ఞులుకాని విమర్శకులు వ్రాసి వున్నారు. బహుశః వారు తిక్కన్నగారి ప్రయోగాన్నేనా చూచివుండ రనుకుంటాను. భారతంలోవున్న విశేషాలు యెందఱెంత శోధించినా యింకా మిగులుతూనే వుంటాయి. ఆ కారణంచేతనే-
"సముద్రమున కెవ్వఁడు పారము నిర్ణయించెడిన్" అని దేవీభాగవతంలో వ్రాయవలసి వచ్చింది. దీన్ని గుఱించి గుంటూరు డి|| విమర్శకులు పూర్వులు భారతమహా సముద్రాన్నుంచి ముత్యాలూ, రత్నాలూతీస్తే వీరునత్తగుల్లలు కాఁబోలు తీశారంటూవ్రాశారు. వెనుకటి వారికి అవి దొరికితే మాకివి దొరికాయని ఆయనకు తోఁచడాని కేదోకారణం వుంటుంది. ఆకారణం క్రమంగా ముందుముందుగోచరిస్తుంది. కనకవిస్తరించేదిలేదు. రచనావిషయాన్ని అనుకరించడంలో మాకునన్నయగారికంటె తిక్కన్నగారి యందే యెక్కువ గౌరవ మనేసంగతి మాభారతనాటకాదులు చదివినవారికి గోచరమే కనక విస్తరించేదిలేదు. దేవీభాగవతరచనలో కూడా మేము తిక్కన్నగారిశైలినే వరవడిగాఁ బెట్టుకున్నాము. యెంతవఱకు కృతార్థులమైనామో అది లోకం తేల్చవలసినవిషయం గాని మావిషయం గాదు. శ్రీనివాసవిలాసపీఠికలో-
“విరచించినారు దేవీభాగవతమును దిక్కన్నశైలిగాఁ దెల్గుబాస”
అనియ్యేవే వ్రాసియున్నాము. తి. వెం. కవులెక్కడ తిక్కన్నగా రెక్కడ? నక్కెక్కడ? దేవలోకమెక్కడ? అనేవారికి మేము జవాబు చెప్పవలసివుండదు. యెవరినో వరవడిగా పెట్టుకోక యేలాగా తప్పదుకదా? అప్పుడుమాత్రం యీ ఆక్షేపణకు గుఱికాక తప్పుతుందా? అందుచేత కవిబ్రహ్మగారినే వరవడిగా పెట్టుకున్నామని మా మనవి. పోనీ ఆదికవిగదా? నన్నయ్యభట్టునే వరవడిగా పెట్టుకోరాదా? ఆలా పెట్టుకుంటే కొంత శాఖని గౌరవించినట్టుకూడా అవుతుందని యెవరేనా శంకిస్తారేమో? వినండి యథార్థాన్ని ఆంధ్రకవులలో యింతవఱకు నన్నయ్యధారాశుద్ధిని అనుసరించి కృతార్థులైనవా రెవరున్నూ నా బుద్ధికి కనుపించడంలేదు. ఆయనకవిత్వంలో తక్కినగుణగణాలాలావుండఁగా సమాసశైలి బహు అసాధ్యస్థితిలో వుంటుంది. దాన్ని అనుసరిద్దామంటే బొత్తిగా కొఱకఁబడదు. కొన్ని పద్యాలు వుదాహరించి చూపితేనేబాగుంటుందిగాని గ్రంథవిస్తరభయం బాధిస్తూవుంది. (1) కురువృద్దుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ (2) మదమాతంగతురంగ కాంచనలసన్మాణిక్యగాణిక్య- లోనైన పద్యాలు యెన్నో వున్నాయి. చదువరులే పరిశీలించుకోవాలి. కొద్ది గొప్ప యీ సమాసధోరణి పెద్దన్నగారికవిత్వంలో కనపడుతుందని అన్యత్ర వ్రాసి వున్నాను. కాఁబట్టి యిక్కడ స్పృశించివిడుస్తూన్నాను. నా అభిప్రాయాన్ని బట్టి ధారాశుద్ధికి నన్నయ్యకు నన్నయ్యేకాని యితరులు దీటుకారనియ్యేవే. యితర గుణాలలో, యితరుల కవిత్వం నన్నయ్యగారిని మించుతుందంటే అది యథార్థమైనా, కాకపోయినా నేను వివధించేవాణ్ణికాను. నా యీ అభిప్రాయం లోకానికి యెంతవఱకు నచ్చుతుందో నాకు తెలియదు. యీ అభిప్రాయం నిన్న నేఁడు పుట్టిందికాదు. చాలా బాల్యంలోనే పుట్టింది. డెబ్బయో పడిపూర్తికావచ్చినా యిది మాఱినట్టులేదు. యిఁక ముందున్నూ మాఱుతుందని తోఁచదు. కొన్ని అభిప్రాయాలు వెనుక వకలాగువుండేవి. యిటీవల మఱివకలాగు మాఱిపోయాయి. అందులో మచ్చుకు వకటి వుదాహరిస్తాను. మను, వసుచరిత్రలలో వసుచరిత్రే అగ్రస్థానానికి వస్తుందని కొంతకాలం అనుకొనేవాణ్ణి. యిటీవల ఆ అభిప్రాయం మాఱింది. యేలా మాఱిందో వ్రాయవలసివస్తే చాలా వ్రాయాలి. కనక ప్రధానాంశాన్ని వుపక్రమిస్తాను. శాఖాభిమానాలనేవి నిన్న నేఁడు పుట్టినట్టుతోఁచదు. అనాదిగా వున్నట్టే తేలుతుంది. కాని వైద్యవిషయంలోనున్నూ కోర్టువిషయంలోనున్నూ దీన్ని పాటిస్తూన్నట్లు కనపడదు. చూడండీ; యెవరివైద్యం బాగానచ్చుతుందో, యెవరిహస్త అమృతహస్తమని పేరుపడుతుందో, వారు తమశాఖవారు కాకపోయినా వారిదగ్గిఱికే రోగులు వెడతారు. ఆలాగేకోర్టువిషయంలో ప్లీడర్ల దగ్గిఱికిన్నీ కవిత్వం కూడా శాఖాభిమానాన్నిపట్టి మెచ్చుకొనేవారు ప్రాజ్ఞులలో వుండరనే నాతలంపు. ఆలా యెవరేనా వున్నా వారి యభిప్రాయాన్ని లోకం బొత్తిగా ఆదరించదు. లోకం ఆదరించనప్పుడు మనలో మనం యేమనుకుంటే యేం లాభం? యింతవఱకు వ్రాసిన వ్రాఁతవల్ల మాకు భారతకవులలో యెవరియెడల యే యేవిషయంలోవున్న అభిప్రాయం యేలాటిదో గోచరిస్తుంది. కనక యిఁక విస్తరించేది లేదు. దేవీభాగవతపీఠికలో-
క. ఎన్ని పురాణమ్ములు తా|మన్నిటి నాంద్రీకరించి యనుకంపన్‌గా
కున్నన్ దీనిన్ విడుతురె; నన్నయభట్టాది కవిజనంబులు మాకున్.
అని వకపద్యం వ్రాసివున్నాము. యీపద్యమే యీవ్యాసం వ్రాయడానికి తగ్గప్రసక్తి కల్పించింది. కనక దీన్ని బాగా గమనించవలెనని హెచ్చరిక. మేమాంద్రీకరించడానికి ఆరంభించేటప్పటికి యీపురాణం ఆంధ్రంలోకి యెవరూ అనువదించలేదనే తాత్పర్యంతోటే మేము ఆరంభించాం గాని, లేకపోతే ఆరంభించేవాళ్లంకాము. గ్రంథరచన పూర్తిఅయి సాపువ్రాస్తూ వుండఁగా తూర్పున త్రిపురాన తమ్మన్న దొరగారున్నూ, పడమట ములుగు పాపయారాధ్యులవారున్నూ, పూర్వమే తెలిఁగించినట్టు ఆప్తులు చెప్పఁగావిన్నాము. శ్రీదాసు శ్రీరామకవిగారు కూడా తాము ఆంద్రీకరిస్తున్నామని స్వయంగానే చెప్పినారు. ఆ చెప్పేటప్పుడు మీరాంద్రీకరిస్తున్నారని విన్నాననికూడా వారే సెలవిచ్చారు. ఆయీవిషయం ద్వితీయ ముద్రణపీఠికలో శ్రీ దాసువారి భాగవతపీఠికలో సుమారు యిప్పటికి పదహారేళ్లనాఁడు నేను వ్రాసేవున్నట్లు జ్ఞాపకం. సంగతి సందర్భాలు యీలా వుండఁగా గుంటూరు డి|| విమర్శకుఁడుగారు మా మీఁద యేలాటి అపవాదవేస్తున్నారో! చూడండి-
తే.గీ. దేవీభాగవతంబు నాంద్రీకరణము
నందుఁ బ్రప్రథములుగఁ బేరందఁగోరి
వ్రాసితిరె? యిట్లు దాసు శ్రీరామకవి తె
నుంగు చేసినయది మున్నెఱింగి యుండి.
చ. క్రమమది లేని యీనుడుల గౌరవమందెదవయ్య?... నీవచించువా
క్యములవియెల్ల వేదములుగా గ్రహియింతురె! పండితోత్తముల్,
మాయం దీమహనీయుఁడి కింతకోపం యెందుకో? యెవరుముందు తెలిఁగిస్తే వచ్చే ఆధిక్యం యేమిటో వొకరిది వొకరుచూచి తెలిఁగించారని ఋజువుచేసి నిందిస్తే యింకా కొంత బాగుండేదేమో? మాలోమాకేమేనా వైషమ్యాలున్నాయా? వుంటే శ్రీరామకవిగా రీక్రిందివిధంగా యెందుకురాస్తారో ఆలోచించండి ప్రాజ్ఞులారా?
చ. తిరుపతివేంకటేశ్వరసుధీమణులన్ గొనియాడి మొక్కెదన్
సరసులు నాకు మిత్రులును సర్వజనస్తవనీయ పాండితీ
భరితయశుల్, తెనుంగునను భాగవతంబురచింపఁబూని రం
చెఱిఁగితి వారివల్న, గణియింపరు నాయపరాధపుంజమున్.
ఆయీ పద్యతాత్పర్యాన్ని విమర్శకుఁడుగా రేలాచేసుకొని మమ్మల్ని అపవదింప మొదలుపెట్టారో నాకు లేశమున్నూ బోధ కావడంలేదు. "అన్యబుద్ధి అప్రత్యక్ష" మంటారు యిదే కాఁబోలు. దిక్కుమాలినప్రప్రథమత్వం, దీనికోసం యింత తగవెందుకు? ఉత్తరరామాయణాన్ని సోమయాజిగారు ఆంద్రీకరించారు. తరవాత చాలాకాలానికి దాన్నే పాపరాజుగా రాంద్రీకరించారు. ప్రప్రథములు తిక్కన్నగా రవడంచేత పాపరాజుగారి కవిత్వానికేమేనా గౌరవం తగ్గిందా? అందుచేత విమర్శకుఁడు గారేదో కోపం మనస్సులో పెట్టుకొని యేవిధమైనవైషమ్యాలున్నూ యెన్నఁడున్నూ లేని మామామధ్య పొరపొచ్చెములు కల్పించి మమ్మ దూషిస్తున్నారేకాని అన్యంకాదని మనుష్యమాత్రులకు గోచరించే విషయమే కనక విస్తరించేదిలేదు--
బ్రతికివున్న నామీఁదేకాదు యెన్నడో చచ్చి స్వర్గమలంకరించిన నన్నయ్యమీఁద కూడా విమర్శకుఁడు గారికి విపరీతమైన కోపమే వుంది. యీపద్యాలు చూడండి
“చ. మొదలిడి భారతంబు తుద ముట్టకముందె యరణ్యమందుఁ గ్రుం
కి దివియలంకరించుపనికిం జనునన్నయ మీకుఁ దా దయ
న్వదలిన దెట్టులయ్యెనది వాకొనె దాతనిపేరు గ్రుచ్చి, నీ
మది కిది తోఁచె నౌ దురభిమానికి యుక్తము లెట్లుదోఁచెడిన్"
చూచారా? మేము నన్నయాది మహాకవులు మాకు తెలిఁగించుకొనడానికి యీదేవీభాగవతాన్ని దయచేత వదలిపెట్టారనడం విమర్శకుఁడుగారికి యెంత అపరాధంగా తోఁచిందోఁ యీ కారణంచేత నేను “దురభిమానిని"గా వారికి తోఁచి చీవాట్లు పెడుతూ వున్నారు. ఇక్కడ నాకు కర్తవ్యమేమిటి? యేమీలేదు. శిరసావహించి వూరుకోవడమే. ఆ పద్యం తరవాయి పద్యంకూడా చూడండి! ప్రాజ్ఞులారా!
క. దయచేఁ దెనిఁగింపక న
న్నయభట్టిది మాకు నిచ్చినాఁడనుకన్నన్
బ్రియమెక్కువ గనఁబడు ని
శ్చయమగు మామీఁదికరుణఁ జచ్చెనటన్నన్.
అబ్బా! విమర్శకుఁడుగారి ఆగ్రహానికి పట్టపగ్గాలే కన్పడడంలేదు. యెందుకో! నన్నయ్యగారిమీఁద యీ అకారణకోపం. మమ్మల్ని విమర్శకుఁడుగారు దిద్దుకొమ్మన్నట్టు దిద్దుకోవలసివస్తే నన్నయ్యభట్టును మాత్రమే "దయచేత చచ్చినట్టు" వుటంకిస్తే యేలా సమన్వయిస్తుంది. తిక్కన్న, యెఱ్ఱన్న, పోతన్న, సోమన్న, ఇంకా యెందఱో ప్రాచీన కవులు మాయందు దయచేత చచ్చివున్నారని వ్రాయవలసివస్తుందిగదా? అప్పుడు ఆ విషయం వైదికశాఖవాడైన నన్నయ్యకే ఘటింపక విమర్శకుఁడుగారు ప్రేమించే వారికికూడా తగిలితే అది వారి ఉపదేశానుసారం మేము చేసిన అపరాధమైనా మా మీఁద మఱింత కోపం హెచ్చి మమ్మల్ని యింకా నిందిస్తారేమో అసలు పద్యంలోవున్న- “నన్నయభట్టాది కవిజనంబులు" అనే పదంలో యెంత పరిశీలించినా యేవిధమైన దుర్ధ్వనిన్నీ లేకపోయినా విమర్శకుఁడుగారు నన్నయభట్టుకు ఆంధ్రకవీశ్వరులలో ప్రప్రథమత్వం యెందుకురావాలి అనేవుక్కురోషంతో యీ మందలింపు వుపక్రమించినట్టు పసులకాపరులకుకూడా గోచరించే విషయంలో యింతకన్న పెంచి వ్రాయడం అనవసరమని విరమిస్తూన్నాను. యిది వొకచిత్రమైనకాలం. యీ కాలంలో విమర్శనాలుమాత్రమే కాదు. యింకా యెన్నో సందర్భాలు యీలాటివే కనపడతాయి. "కాలాయనమః కలవికరణాయనమః" నన్నయ్యభట్టుకంటె పూర్వం తెలుఁగుకవిత్వం చెప్పేవారు లేకపోరుగాని యీలాటి సలక్షణకవిత్వం చెప్పేవారు లేకపోవడంచేత యితనికి ప్రప్రథమత్వభాగ్యం తటస్థించిందని చెప్పవలసి వస్తుంది. పైఁగా విమర్శకుఁడుగారు నన్నయ్యకు యింకోదోషాన్ని ఆపాదించివున్నారు
తే.గీ. పరుఁడు తోడయి నిర్వహింపంగ భార
తము తెనింగింపఁ గలుగుట తానె చెప్పె
నట్టినన్నయ్యభ ట్టెట్టు లర్హుఁడయ్యె
హెచ్చు గలిగించి నీయిచ్చు మెచ్చు గొనఁగ.
నారాయణభట్టు సహాయమంటూ లేకపోతే నన్నయ్యభట్టు భారతాన్ని ఆంద్రీకరించనేలేఁడని వీరి తాత్పర్యమనుకోవాలి. భారతం నన్నయ్యగారి కన్వయించదని కూడా యీయన వ్రాయ సాహసింతురు. యీసాహసానికేంగాని పయిపద్యధోరణిచూడండి, నన్నయ్యపేరు వినఁబడేటప్పటికి విమర్శకుఁడుగారి కెంతఅగ్రహమోఁ యేమి కాలకర్మ దోషమో? యీమధ్య కొన్నివ్రాఁత లీలాటివే చదవటం తటస్థిస్తూవుంది. కొందఱు-
“నన్నయ్యగారి ద్రౌపది” అనిన్నీ “తిక్కన్నగారి ద్రౌపది” అనిన్నీ విడఁదీసి వారివారి వాగ్వైశద్యాలు చూపడం మొదలుపెట్టడం చూచి వెగటుగాఁదోఁచి కాఁబోలు మా సతీర్థులు శ్రీకాశీభొట్ల సుబ్బయ్య శాస్త్రులుగారు గాఢంగా మందలించి వున్నారు. అది కొంతవఱకు అభినందనీయంగానే వుంది గాని ఆ సందర్భంలో తిక్కన్నగారిరచనకు ప్రత్యక్షరానికిన్నీ బొత్తిగా అనౌచిత్యాన్ని ఆపాదించడమనేది కొంతశోచ్యంగా నాకు తోఁచింది. అట్టిసందర్భంలో నీవెందుకు సుబ్బయ్యశాస్త్రుల్లుగారి పూర్వపక్షాలను ఖండించకూరుకున్నావని యెవరేనా నన్ను ప్రశ్నిస్తారనుకుంటాను. సుబ్బయ్యశాస్త్రులవారు మంచి శాస్త్రజన్యజ్ఞానంతో మిళితమైన యుక్తినైపుణ్యం కలవారుగా వుండడంచేత ఆయన ఆక్షేపణలు ఖండించడానికి పూనుకుంటే సుఖసుఖాల తేలేటట్టు కనపడక అనారోగ్యంచేత బొత్తిగా అసమర్థతా స్థితిలో వున్న నేను దానిజోలికి పోలేదు. నిజానికి సుబ్బయ్యశాస్త్రుల్లుగారు యెవరో నన్నయ్యనుగూర్చి అనుచితపువ్రాఁత వ్రాయడంచేత వారికి వాగ్బంధం కలిగించడానికే అట్టిపూనిక పూనివున్నారుగాని, తిక్కన్నగారియందు శాఖాద్వేషం వుండికాదని నేననుకున్నాను. అదేమాదిరిగా విమర్శించవలసివస్తే నన్నయ్యతిక్కన్నగార్ల లెక్కయేమి? వ్యాసవాల్మీకు లాగుతారా? కాళిదాస భవభూతు లాగుతారా? కాcబట్టి అది విమర్శనమే కాదు. అందుచేత సుబ్బయ్యశాస్త్రుల్లుగారు ఆపనికి పూనుకోవడం యింకా విచారణీయమేను
“మయి జల్పతి కల్పనాధినాథే రఘునాథే మనుతాం తదన్యదైవ"
అన్నట్టు సమర్ధులైనవారు పూనితే మంచి చెడ్డగానూ, చెడ్డ మంచిగానూ కావడానికి యేమాత్రమూ అభ్యంతరం వుండదు. "జ్ఞానలవదుర్విదగ్ధుల" వ్రాఁతలు తాటాకుదళ్లవలె క్షణంలో యెగిరిపోతాయి. కాళిదాసుగారు-
“అధరస్య మధురిమాణం కుచకాఠిన్యం దృశోశ్చ తైక్ష్ణ్యంచ"
అంటూ వకశ్లోకం లోకోత్తరమయినది చెప్పివున్నారు. సహృదయత్వం వదలి దీన్ని నేను బగ్గంపాడుగా విమర్శించి పాడు చేయడం మొదలుపెడితే యెవరుగాని సమర్ధించనే లేరని సప్రతిజ్ఞంగా చెప్పవలసివచ్చి చెపుతూవున్నందుకు లజ్జిస్తూవున్నాను. వూరికే మచ్చుకు వకశ్లోకంయొత్తిచూపివున్నాను గాని యేకవిదేనా సరే, యేశ్లోకమేనా సరే సహృదయత్వాన్ని వదులుకొని విమర్శించడానికి దిగితే సమర్ధించడం కష్టసాధ్యమే అవుతుంది. యీశ్లోకం పేరెందు కెత్తవలసి వచ్చిందంటే గుంటూరు డి|| విమర్శకులు దీని సజాతీయమయిందే మాపద్యం వకటి లక్షణాపరిణయంలోది యెత్తి యేమేమో వ్రాసివున్నారు. ఆయనకు దీనిద్వారా తెల్పడానికే. చాలా ఉదాహరణలు చూపవలసి వున్ననూ, అందుకోసం యీవ్యాసం వ్రాయడంలేదు గనక ఆ విధానం యిక్కడ కొంత ప్రస్తుతమైనప్పటికీ వుదాహరించి చూపలేదు. "శ్లో అస్మాన్ సాధు విచింత్య" అన్నశ్లోకంమీఁద సుమారు 16 యేండ్లనాఁడు నా వికటవిమర్శన చాకచక్యాన్ని ఒకరికి చూపి ఉన్నాను. కావలసినవారు దాన్ని చూడండి. పూర్వకాలంలో కూడా యీశాఖాభిమాన ప్రయుక్త పక్షపాతాలున్నూ ద్వేషాలున్నూ వున్నట్టు అడిదం సూరకవిగారికిన్నీ సోమకవిగారికిన్నీ జరిగిన యుక్తిప్రయుక్తి ప్రసంగంలో సోమకవిగారుచెప్పిన- క. పలుకుల చిలుకల కొలికీ- అనేపద్యం సాక్ష్యమిస్తుంది. కాని అంతకుమించినసాక్ష్యం మఱేది కనcబడకపోవడంచేత యీ శతాబ్దంలో వున్నంత శాఖాభిమానాలు, లేక, ద్వేషాలు అప్పుడు లేవనియ్యేవే మనం అనుకోవచ్చును. నన్నయ్యయందు తిక్కన్నగారికి యెంత గౌరవమో వుండడానికి ఆయన తెనిఁగించినంత మట్టుకు భారతం అలాగే వుంచి తరువాయి అందుకొని ఆంద్రీకరించడమే సహస్రముఖాల వ్యక్తం చేస్తుంది. పదిహేను పర్వాలు అవలీలగా తెలిఁగించిన తిక్కన్నగారికి ఆమూఁడుపర్వాలున్నూ మూcడునెలలలో తెనిఁగించడానికి చేతకాకపోతుందా? అంతేకాదు, ఆపర్వత్రయమున్నూ తిక్కన్నగారు మళ్లాతెలిఁగించేయెడల రసవంతంగా వుండడానికి అభ్యంతరం వుండకపోవచ్చునుగాని నన్నయగారిశైలి అనితరసాధ్యమవడంచేత ఆ విషయంలో ఇటీవలి కవులు యెక్కువగా వాదోపవాదాలకు దిగవలసివచ్చేదనుటకు సందేహంలేదు. వొకరు ముందుగాచేసిన పనినే వేఱొకరు చేసేయెడల యేవో కొన్ని భాగాలు ముందువారివి అదివఱకే శ్లాఘ్యతరంగా వుండే పక్షంలో యిటీవలి వారి రచన అక్కడ తీసిపోక తప్పదు. సోమయాజులుగారు యీమాట మనస్సులో పెట్టుకొని ఆపర్వత్రితయంజోలికి పోలేదని యింతవఱకెవ్వరున్నూ వ్రాసినట్లు లేదు. నేనున్నూవ్రాయను. తిక్కన్నగారికి నన్నయ్యగారియెడల అపారమైన గౌరవమేగాని శాఖాద్వేషాదులేవిన్నీలేవు. అనియ్యేవే వ్రాస్తాను. ఆగౌరవం- “అందాది దొడంగి మూఁడుకృతులాంధ్రకవిత్వ విశారదుండు విద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్",
అనే వాక్యంవల్లనే గోచరిస్తుంది. అరణ్యపర్యశేషం జోలికి పోకపోవడానికి లోకంలో వున్నప్రవాదమే కారణమనుకుంటాను. నన్నయ్యగారి కవిత్వం సంస్కృత పదభూయిష్ఠంగా వుండడానికిన్నీతిక్కన్నగారిది ఆంధ్రపదభూయిష్ఠంగా ఉండడానికిన్నీ పలువురు పలువిధాల అభిప్రాయపడుతూన్నారు. నేను తెలుగు కనక “టీకా౽పి సంస్కృతమేవ" అన్నట్లు కాక తెలుఁగుపదాలతో రచించడమే యుక్తమని తిక్కన్నగా రభిప్రాయపడివుందురనిన్నీ నన్నయ్య గారిక్కూడా ఆంద్రీకరణ విషయములో పైసందర్భం గోచరించవలసే వున్నను అప్పటిపండిత మండలి యీసడిస్తారేమోనని తత్సమపదభూయిష్ఠంగా రచించి వుందురనిన్నీ అభిప్రాయపడతాను. దీన్ని గురించి యింతమాత్రమే వ్రాస్తేచాలదు. యింకా వ్రాయాలి. వీరి కవిత్వాలలో నాకు గోచరించిన దింకొక విశేషము. యెంత సంస్కృత పద జటిలంగా నన్నయ్యగారి ధారనడిచినా ముఖ్య తాత్పర్యం మాత్రం తిక్కన్నగారి రచనకన్న సుళువుగానే కలిగిస్తుందనిన్నీ అభిప్రాయపడతాను. ఈసందర్భం విరాటోద్యోగాల వఱకే. యుద్ధపంచకంలో యీ చిక్కులేదు. తరువాత పర్వాలు శాంతివగయిరాలు ధర్మశాస్త్రం వంటివి. వాట్లలో అసలు సంస్కృతంలోనే అంతగా కవిత్వనైపుణికి అవకాశం లేనప్పుడు అనువాదకులకుమాత్రం యెక్కడనుంచి వస్తుంది? ధర్మశాస్త్రంగాని, వైద్యజ్యౌతిషములుగాని ఛందోబద్ధాలుగా రచించినా అవి కవిత్వాలనిపించుకోవని చాలాచోట్ల వ్రాసివున్నాను. కనుక యిక్కడ స్పృశించి విడిచాను. యితర విషయాలు చాలాచాలా నడిచినా ప్రధానంగా తెలుసుకోతగ్గది నన్నయ్యగారిశైలి సంస్కృతపదభూయిష్ఠమే అయినా అది సామాన్యులకు ప్రతి పదార్థం చెప్పవలసివస్తే కొంత అడ్డుతగులుతుందేమోకాని, తాత్పర్యార్ధాన్ని చేసుకోవడానికి అంతగా బాధించదనేదే. నాకుతోఁచిన విషయం యిది. దీన్నిబట్టి యేమి, వ్యాకరణాది సంబంధమైన మఱికొన్ని సందర్భాలనుబట్టి యేమి, ఆయన్నిగుఱించి, కొంత వ్రాస్తూ ప్రసక్తానుప్రసక్తంగా తిక్కన్నయెఱ్ఱన్నగార్లనుకూడా “మంగళాదేవి” అన్నభాష్యకారోక్తి ననుసరించి కొంచెం యెత్తుకున్నాను దేవీభాగవతప్పీఠికలో- గుం|| డి|| విమర్శకుఁడుగారు యీలా యెత్తుకోవడానిక్కూడా వొప్పుకున్నట్లు లేదు. చూడండి.
తే. గీ. కవుల చారిత్రములు వ్రాయఁగడఁగినావె?
దేవిభాగవతమున నీ తెలివిఁ జూపి
దురభిమానంబు నీలోన దొరలి కాక
యాదికవిభేద మిం దేమియవసరంబు.
దేవీభాగవతములో ఆదికవుల రచనాభేదాన్ని గూర్చి నేను వ్రాయడంకూడా దురభిమానప్రయుక్తమేనఁట! అసలు నేను యీ ఆంధ్రదేశంలో పుట్టడానిక్కూడా విమర్శకుఁడుగారు సమ్మతించరనుకుంటాను.
(1) “ఉ. తిక్కనకున్న పేరు తెగఁద్రెంచియు నన్నయ కీయఁజాలితీ,
వక్కట! యెంతకైనఁ దగుదైనను దిక్కనయేమి చేసె? నీ
కెక్కువ యేమిత్రవ్వి తలకెత్తెను నన్నయ?”
(2) “తే. గీ. ...బ్రాహ్మణుండవ యింత దుర్మార్గమగునె"
(3) “క. ...కవితాలలనమొగంబు బూడిదం బులిమెదవే?"
(4) “మ. ...ఎటోచాకుండఁ బోకుండఁగా అవధానంబని నెత్తినెత్తికొని"
(5) "తే.గీ. ...నీవె కవివె? సింగికూడఁ గవిత్వంబు చెప్పలేదె?"
(6) ‘శా. .బుద్ధిలేదె? యిది సత్యంబౌనె?"
(7) “క. ...మీ కా కాకోపమానమే సార్థకమౌ!"
(8) “చ. తెఱవలుగా గణించితివె? ధీరహితా
(బుద్ధిహీనుఁడా) వృథగా నియోగులన్"
(9) "ఆ. వె. ...వెఱ్ఱివెంకటాయ..."
(10) “ఉ. ఎక్కడనో విధాతలిఖియించిన యట్టి యదృష్టరేఖచే
దక్కెను నీకుఁ బేరు కవితావిషయంబున నంతెకాని"
(11) “క. లాభం బబ్బినదానికి నీ భంగిన్ జచ్చి చెడఁగ--"
(12) "క మీరాశుకవిత చెప్పఁగ నీరక --"
(13) “క. మన వేంకటశాస్త్రి నీతిమాలిన వ్రాతన్."
(14) “తే. గీ. అయనమున కొక్కపద్యంబు నల్లనేర్చు
వాఁడు మీకంటె ఘనుఁడు--"
(15) "శా. కైపుంజెందినవేళ వ్రాసితిరె? మీకావ్యంబులన్”
(16) “తే, గీ. . . . ..నిన్నేమనందు? నిట్టి
రోఁతలకు మెచ్చునట్టి సూరులను నిన్ను
ననియతాత్ముఁ జేసిన విధినందుఁగాక."
(17) “తే. గీ. ఆశుకవితావధానంబులందు మీకు
శక్తిచాలమిఁ బన్నినసాకుఁగాదె?"
(18) “క. పతి నీవో? లే కా తిరు
పతిశాస్త్రియొ? యెఱుఁగ మీవి హమ్మున దం
పతు లూరేఁగెడు నపు డుప
పతీయే? అగ్రాసనాధిపతి పల్లకిలోన్."
(అగ్రాసనాధిపతి, కా. కృ ఆచార్యలు ఱంకుమగడా)
(19) “క. ఇద్దఱు భోక్తల కెక్కువె?
తద్దినమని యిదియె మీకుఁ దగునుపమ..."
(20) "తే, గీ. గంటకేఁ బది (10) పద్దెముల్ గెంటలేని - నీకొలఁదికి...”
(21) “ఉ. ...చచ్చి చెడంగలార లొక జామల తిర్పతి వేంకటేశ్వరుల్,"
(22) “తే. గీ. కొత్త విశ్వస్తలన మూలఁ గూరుచుండి...”
(23) “తే. గీ. అరయఁ బదియవనాcటి ముత్తైదువలన--
(24) “ఆ. వె. సభకుcబోయి చూడఁజాలనిమీరు--
(25) “తే, గీ. బుఱ్ఱగొఱిగించి సున్నపుబొట్లవెట్టి
తిరుపతిని వెంకటన్నను ద్రిప్పినాము"
(ఇది సొంతతిట్టుకాదు, ఇతరానుకరణము)
(26) “చ. -పదియవనాఁటి యైదువలభంగి నడంగరె?"
(27) “చ. ...నక్కపోతు నే-నని యుపమించుకొ
మ్మదియె యన్ని విధంబుల సార్థకంబగున్."
(28) “క. .వెంగలితన మింకఁ గలదే! వేంకటశాస్త్రీ."
(29) "తే, గీ. ...పందవై పాఱుటది యొకబంటుతనమె?"
(30) "క ...నీ వీ వెడపోకలఁ బోయితె? ద్రావిడ యుక్తులన..."
(31) “చ. పయోధరములు చిమ్ముకొంచరుగు ద్రావిడభామలచందము,”
(విమర్శనములో ద్రావిడస్త్రీల పయోధరాల జోలి యేటికో)
యెన్నని చూపుదును? యిదేరీతిని నూటపదహారు డెమ్మీసైజు పుటలు తి. వెం. కవుల గ్రంథవిమర్శన మనే పేరుతో నొకరు పద్యాలతో పూరించినారు. వారు మమ్మిట్లు తిట్టుటకు ప్రధానహేతువు నన్నయ్య భట్టును మేము మా దేవీభాగవత పీఠికలో -"లక్షణంపుఁబ్రోవై" అని సంభావించినందుకున్నూ, ప్రప్రథమకవిగా అతణ్ణి సమ్మానించి నందుకున్నూ అనుకోవడానికి పయినచూపిన వాక్యాలలో యెన్నో ఆధారాలున్నాయి కదా? కాని మొట్టమొదటనే ఆ విషయం యెత్తుకొని కొన్ని తిట్లుతిట్టడంచేత స్థూలదృష్టికి అందుకోసమేమో అని మాత్రం తోస్తుంది. అయితే యింకావున్న తిట్లకు ఫలితాన్ని విచారించవద్దూ, వినండి, అసలు మా గ్రంథాలు విమర్శించడానికిన్నీ పూనుకున్నట్లులేదు. విమర్శకుఁడు గారికి మా మీఁద వచ్చిన కోపమంతా "గుంటూరు సీమ"కు సంబంధించినదే. అందులో సప్రమాణంగా మేము వ్రాసిన విషయమంతా కాకపోయినా యే కొంచెమో యెత్తుకొని ఖండిస్తూ వచ్చారు. ఆ ఖండన యేలా వుంటుందంటే “నన్నయ భట్టాది కవిజనంబులుమాకున్” అనే వాక్యంలో మేము వ్రాసిన నన్నయభట్టాది. అనే అక్షరాలకు చేసిన ఖండన మేలా వుంటుందో అచ్చంగా మూఁడుమూర్తులా ఆలాగే ఉంటుందని వేఱేచెప్పనక్కఱలే దనుకుంటాను. విమర్శకుఁడుగారి పరిశ్రమకు ముఖ్య ఫలితం యేమిటంటే, మేము కొప్పరపు కవుల కవిత్వ పాండిత్యాలకు జంకి పాఱిపోయి ఆపరాభవాన్ని కప్పిపుచ్చడానికి యేమీ వుపాయంతోcచక గుంటూరుసీమ అనే అబద్ధపుతడకను అల్లి లేని జయాన్ని ప్రకటించుకొని సంతుష్టిపడ్డట్టు తేల్చడమే. యీలా తేల్చడంలో కొన్నిచోట్ల జడ్డిగానున్నూ కొన్ని చోట్ల లాయరుగానున్నూ కొన్ని చోట్ల సాక్షిగానున్నూ విమర్శకుఁడు గారు పనిచేసివున్నారు. యిలా మమ్మల్ని సమర్థించవలసిందని వీరిని కొప్రపువారుగాని, తత్పక్షీయులుగాని, కోరివున్నట్లు నామనస్సాక్షికి తోఁచుటలేదు, "ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః" గీరతవిషయాన్ని కూడా కొంత అందుకొని వీరు సమర్థనానికి పనిచేసివున్నారు. అదికూడా స్వయంగా చేసిందే కాని దానికి సంబంధించినవారి ప్రేరణవల్ల జరిగినట్టుతోఁచదు. దానికిఁగాని, దీనికిఁగాని, వారివారి ప్రేరణ యేమాత్రం వున్నా గ్రంథం అంత అనుచితధోరణిలో నడిచివుండదని నా నమ్మకం. గుంటూరి సీమపుట్టి యిప్పటికి మూఁడుదశాబ్దులు కావచ్చింది. అందులో అసత్యాలే వుంటే యిన్నాళ్లవఱకున్నూ మాకొప్పరపుసోదరులు వుపేక్షించేవారుకారు, “జల్లిసీమ" అనే పేరుతో గ్రంథం వ్రాస్తున్నామనో, వ్రాశామనో వారు ఆరోజులలో దేనిలోనో వ్రాసినట్లు జ్ఞాపకం. కాని ఆపుస్తకం బయటికి వచ్చినట్టు మాత్రంలేదు. యీవిమర్శన పుస్తకాన్ని చూచి సోదరులు లోలోపల చాలా లజ్జిస్తారనికూడా నా అంతరాత్మకు తోస్తుంది.
ఈ విమర్శకుఁడు గారికి మాయందు అందులో విశేషించి నాయందు వండే ఆగ్రహమే యీ వ్రాఁతకు కారణం. ఆగ్రహానికి కారణం నేను వైదికశాఖవాణ్ణిగా వుండడమే. మరొక కారణం నన్నయ్యభట్టు ప్రప్రథమ కవిగా వుండడమున్నూ అతణ్ణి నేను-
సీ. "నన్నయకవి పెట్టినాఁడుకదా తిక్కనాది కవీంద్రుల కాదిభిక్ష"
అని శ్రవణానందంలో కవిత్వభిక్షాప్రదాతనుగా పేర్కోవడం అనుకోవాలి. అయితే వచ్చినకోపమంతా వినియోగించారో లేదో యేలా తెలుస్తుంది? ఆలా వినియోగిస్తే యింకా ముదురుపాకంలో తిట్టేవారేమో! అందుచేత కొంత దిగమింగి వ్రాసినట్లే భావించాలి. దూషించకుండా వ్రాయరాదా అంటే దూషించకుండానే వ్రాసివున్నట్టే ఆయన అనుకొని వుందురు. అందుచేత ఆప్రశ్న మన మడగడం అనవసరం. విమర్శకుఁడుగారు నాతోపాటుగా వయోవృద్దులే అని వారిపీఠికలో వకవాక్యం చెపుతూవుంది. నన్నువారు పద్యాలలోనేకాక వచనంలోకూడా, "వేంకటశాస్త్రి" అనియేకవచనంగానే వాడుతూ వుంటారు. అది వారికి నాయందు వుండే నిరసనభావానికి స్ఫోరకమే అయినా దానివల్ల వారి విమర్శనగ్రంథతత్త్వం పూర్తిగా వెల్లడి కావడం సంభవించడంచేత నాయందలి ప్రేమగానే భావిస్తాను. లేకపోతే ఆయా విషయాలు అన్నీ కాకపోయినా కొన్నైనా నేను ఖండించి మచ్చు చూపవలసివచ్చేది. యిప్పడు ఆ పరిశ్రమ లేకుండా పోయిందని వేఱే వ్రాయవలసి వుండదు.
శా. కోపంబుల్ పనిసేయునే? ఒరుల కెగ్గుల్ చూపుచో-
ఒకటి మాత్రం నామీఁద పెద్దభారం దానంతట అదే వచ్చిపడింది. దూషించనివ్వండి. భూషించనివ్వండి. సుమారు నాల్గువందల పద్యాలకు యే మాత్రమో తక్కువగా తఱుచుచున్నను (నికృష్టంగానే కానివ్వండి) సంబోధిస్తూ గ్రంథకర్త విమర్శనవ్యాజంతో రచించినప్పుడు యీమూలంగా కృతి పతిత్వం అబ్బిన నేను ఆయన్ని సమ్మానించ వలసివుంటుందని వేఱే చెప్పనక్కఱలేదు. తిట్లకుకూడా సమ్మానమా? అని శంకిస్తారేమో? మాప్రాంతాన్నే నాబాల్యంలో జరిగిన యీ యితిహాసాన్ని వినండి. తహస్సీల్దారీ వుద్యోగాన్నో డిప్యూటీకలెక్టరీ వుద్యోగాన్నో చేస్తూవున్న వొక బ్రాహ్మణ గృహస్థు తనకూతురివివాహంలో సంతర్పణసమయంలో నేతిజారీ పుచ్చుకొని నేయి వడ్డిస్తూ వుండఁగా వొకానొక బలశాలి బ్రాహ్మఁడు- "నీ అబ్బ సొమ్మేమేనా ఖర్చుపెడుతున్నావా? బాగా సమృద్ధిగా వడ్డించవేమి" అని యేమేమో అంటూ వొకచెంపకాయ కొట్టినట్టున్నూ, దానితో దిమ్మతిరిగి ఆయన కొంత సొమ్మసిల్లి ఆజారీ అక్కడ వదిలిపెట్టి యింట్లోకి వెళ్లి - ఆ బ్రాహ్మణ్ణి భోజనమైన తరువాత నావద్దకి తీసుకురావలసిందని ఆర్డరిచ్చాడనిన్నీఆలా ఆర్డరివ్వడంతోటట్టే అందఱున్నూ యేదో శిక్ష విధిస్తారని అనుకుంటూ వుండఁగా, యేచేతితో ఆయన తన చెంపఁమీద కొట్టివున్నాఁడో ఆచేతికి వక మంచిబంగారు మురుగు బహుమతీ యిచ్చి ఆదరించి పంపేటప్పటికి అందఱూ ఆశ్చర్యపడ్డారనిన్నీ చెప్పకోఁగా విన్నాను. ఆబ్రాహ్మఁడు ఆయన యెవరో లేశమూ యెఱఁగఁడు పాపం. భవతు. ఆకాలపు వాళ్ల ఉదారతలు అలావుండేవి. రాయన భాస్కరుఁడు మొదలైనవారు ఆలాటివుదారులే. యిపుడు నాకు ఆలాటి అవకాశమే తటస్థించింది. నేను సామాన్యగృహస్టుడు గాని జమీందారుణ్ణికాను. దానంతట తటస్థించిన అవకాశాన్ని దాఁటఁబెట్టకూడదు. గ్రంథకర్తకు నన్ను తిట్టడమే వుద్దేశమైనా గ్రంథాన్ని కృతియిచ్చి కృతిపతిని చేసినట్లు తుదకు పరిణమించింది. కవిత్వం బాగా సాఫుగా వుంది. అందుచేత నాశక్తికొలఁదిగా- "చంద్రుఁడికొక నూలుపోగు" అన్నట్టు యేదో మా గ్రామంలో చిన్న సభచేసి యేవో అభినందనపద్యాలుకొన్ని చెప్పి యిప్పటికి నావద్ద నిల్వవున్న సేలుజోళ్లలో వత్తమతరగతి సేలుజోడును బహుమతిగా యిచ్చి నోటితో లేదనడం కంటే చేతితో లేదన్నాఁడన్న లోకోక్తికి లక్ష్యంగా వుందామని తోఁచిందని త్రికరణశుద్ధిగా యిందుమూలంగా వారికి నేను ఆహ్వానం పంపుతున్నాను. నాప్రార్థనను అచిరకాలంలోనే దయచేసి వారు సఫలీకరిస్తారని నమ్ముచున్నాను. వారు లేశమున్నూ సందేహించవలసిన విషయం యిందులో లేదు-
"కబ్బమిచ్చినవానిఁ గన్నె నిచ్చినవాని" అనే వేణుగోపాలశతకచరణాన్ని వినేవుంటారాయన. అంతేనేకాని ఆయన నాశంకలకు తగిన జవాబు వ్రాయవలసిందని సవాలుచేసివున్నప్పటికీ ఆపనికి పూనుకొనేది లేదు. పూనుకుంటే మళ్లా తిట్టవలసి వస్తుందాయె. తిట్లకు తిట్లేజవాబు. విషస్య విషమౌషధం. ఆ పని నాకేకాదు యెవరికీ యిష్టంవుండదుకదా. ఆయన యేవో తిట్లు వ్రాసివ్రాసి తుట్టతుదకు నాకు వుపదేశంగా వకపద్యాన్ని వ్రాసివున్నారు. దాన్ని వుదాహరించి యీ అవాంతర విషయాన్ని వదలి ప్రధానాంశంయెత్తుకొని నాల్గు మాటలు వ్రాసి వ్యాసాన్ని ముగిస్తాను.
తే.గీ. పరువ మనియెడు చండభాస్కరుఁడు మింటఁ
నేగి తుది నపరాంబుధి నీడఁబడియె
జరయనెడి కాఱుచీఁకటి పొరసె నింక
జ్ఞానదీపికఁగొని యాత్మఁ గాంచుమయ్య
యీ పద్యంకూడా సదుద్దేశంతో వ్రాసిందికాదు గాని మనం సదుద్దేశంకిందే భావిధ్ధాం.
"కొట్టితే కొట్టాఁడు కొత్తకోకెట్టాఁడు” అన్న మాదిరిగావున్న యీ పద్యం వ్రాసిన కవిని నేను అంతో యింతో కవినైవుండి తన్మూలాన్ని యెన్నో సమ్మానాలు పొంది వుండిన్ని శక్తివున్నంతలో సమ్మానించకుండా యేలా వుండఁగలనో చదువరులే చెప్పవలసివుంటుంది. యిందులో యేదో కపటం వుందని ఆయన ఆలోచించి రాకపోతే అదినాదురదృష్టమని విచారించడం కంటె నాకు కర్తవ్యం కనపడదు. యిది నిష్కపటమైన ఆహ్వానమని యే ప్రమాణం కోరితే ఆ ప్రమాణాన్ని చేస్తాను. ఈయన రెండేళ్ల నుంచి అనారోగ్యస్థితిలో వున్నట్టు మిత్రుని ద్వారా వ్రాయించి వున్నారు. యీ పుస్తకంలో కాక యేదో భారతసంశయ విచ్ఛేదమనే వీరితాలూకుపుస్తకంలో కొన్ని అపప్రయోగాలు కనపడి నేను వాట్లకు సమాధానంయీయవలసిందని వీరి మిత్రుఁడు గారి ద్వారా కబురంపితే వారితో పైసంగతినిచెప్పి మతికూడా స్థిరంగా వుండడం లేదని చెప్పినట్లునాకు వ్రాశారు. యిందుకు నేను మిక్కిలిగా విచారిస్తూ ఉపాస్యదేవతను వీరికి త్వరలో నాతోపాటు ఆరోగ్యాన్ని కలిగించి చిరకాలమునుంచి తుల్యావస్థలోనే వున్న నాకు కృతి ప్రదాతను సమ్మానించినాఁడన్న యశస్సును సంపాదించి పెట్టవలసిందని ప్రార్థిస్తూన్నాను. ఆ సమ్మానసభలోనే వారికి అంగీకారమైతే వారిశంకలకు కూడా సరళంగా తోcచిన సమాధానాలుకూడా చెప్తాను. నన్నయ్యను గూర్చిన శంకలవంటివే అయితే చెప్పనే అక్కఱలేదుకదా? ఆయీ సందర్భం వారి అంగీకారానంగీకారాలను బట్టి వుంటుంది. బలవంతంలేదు. యీయన కవితాధారనేకాక శాఖాభిమానాన్ని కూడా చదువరులు ప్రశంసింపవలసి వుంటుందని నాతలఁపు. తిట్లకేమి అవి యీయనవి కావు కోపానివి. యిఁక యీలాటి సందర్భం వకటి నిమిత్తంగా పెట్టి యీ విమర్శకుఁడు గారిచేత నన్ను కృతినాయకుణ్ణిగా చేసిన నన్నయ్యభట్టారకుని అనితరసాధ్యరచనకై కొన్ని పద్యాలు చవిచూపుతూ తోcచినమాటలు కొన్నివ్రాసి ఈ వ్యాసం ఆఁపుతాను.
చ. బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణసరస్సరస్వతీ
సహితమహామహీభరమజస్రసహస్రఫణాళిఁదాల్చి దు
స్పహతరమూర్తికిన్ జలధిశాయికిఁ బాయక శయ్యయైన య
య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁడయ్యెడున్.
చ. అరిదితపోవిభూతి నమరారుల బాధలు వొందకుండcగా
నురగులనెల్లఁ గాచిన మహోరగనాయకుఁ డానమత్సురా
సురమకుటాగ్రరత్నరుచి శోభితపాదున కద్రినందనే
శ్వరునకు భూషణంబయిన వాసుకి మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.
ఉ. గోత్రమహామహీధరనికుంజములన్ విపినంబులన్ గురు
క్షేత్రమునన్ బ్రకామగతి ఖేలన నొప్పి సహాశ్వసేనుఁడై
ధాత్రిఁ బరిభ్రమించు బలదక్షపరాక్రమదక్షుఁ డీక్షణ
శ్రోత్రవిభుండు తక్షకుఁడు శూరుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.
యిట్టి ధారాశుద్ధికై నేను బాల్యమాదిగా ప్రయత్నించి చూచాను. అలవడింది కాదు. యీభట్టారకుఁడు స్వల్పంలో తేలేదాన్ని పెద్దచేసిన్నీ చెప్పఁగలఁడు. పెద్దలో చెప్పేవిషయాన్ని క్రోడీకరించిన్నీ చెప్పఁగలఁడు. కర్తు మకర్తు మన్యథాకర్తుం సమర్థుఁడు. దీనికి వుదాహరణాలుగా కొన్ని పద్యాలు భారత విశేషాలలో యెప్పుడో చాలానాళ్లక్రితమే చూపివున్నాను. "జలధివిలోలవీచివిలసత్కలకాంచి" లోనైనపద్యాలు చూచుకోవాలి. ఆయీశక్తులన్నిటిలోనున్నూ నాకు అనితరసాధ్యంగా తోఁచింది యీతని సమాసగ్రధన నైపుణ్యమే! అప్రయత్నంగా భట్టారకుని కవిత్వంలో శబ్దాలంకారాలు కుప్పతెప్పలుగా వచ్చిపడతాయి. అందు కిదివఱలో చూపిన పద్యాలే చాలును. మఱివకటికూడా యిస్తాను.
"ఉ. భారతభారతీశుభగభస్లిచయంబులఁజేసి."
యమకకవిత్వం రసాన్ని చెడఁగొట్టుతుందని లాక్షణికులందఱున్నూ వొప్పుకొన్న విషయమే. భట్టారకుని కవిత్వంలో వున్నయమకం రసాన్ని లేశమున్నూ భంగించదు. కారణ మేమంటే నిఘంటులసహాయంతో ప్రయత్నించి సమకూర్చిన యమకమయితే కాదూ ఆదోషానికి గుఱి కావడం. అసలు అతనిధారలోనే యిమిడి వుంటుందాయె శబ్దాలంకారం. యింకొకటి తత్సమపదాలు విడివిడివి కూర్చడంలోకూడా భట్టారకుని నైపుణి అనితరసాధ్యంగా వుంటుంది.
క. దేవసములైన యనుజుల
తో విప్రులతో రథాళితో వచ్చి యర
ణ్యావాసము చేసెదు ధర
ణీవల్లభ నీవు ధర్మనిష్ఠితబుద్ధిన్
పైపద్యంలో వున్న కూర్పుసాగసు అలా వుంచుదాం. వచ్చి, చేసెదు, నీవు అనేమూఁడు మాటలుతప్ప అచ్చ తెలుఁగుమాటలు లేని యీపద్యం యెంతసుళువుగా కుఱ్ఱలకుకూడా అన్వయమవుతుందో పరిశీలించండి. భక్తి అనేది సంస్కృతం, బత్తి అనేది తెలుఁగు, ఆశ్చర్యము సంస్కృతం, అచ్చెరువు తెలుఁగు, ఆయీ పదాలలో యేపదాలు సుళువుగా అర్థమవుతాయో ఆలోచించండి. ఆయీ రహస్యం భట్టారకునికి తెలిసినట్టితరులకు తెలియదేమో అనుకుంటాను. యెక్కువగా యిమిడ్చి చెప్పడం సూత్రగ్రంథాలకు అవసరం గాని పురాణాదులకు అవసరం కాదు. శ్రీ|| కం|| వీ|| పంతులుగారు భట్టారకుని కవిత్వంకంటెను, సోమయాజి కవిత్వంకంటెను కూడా నాచనసోముని కవిత్వం రసబంధురమని అభిప్రాయ మిచ్చివున్నారు. కొన్ని పద్యాలు అతఁడు కేవల కావ్యపాకంలో నడిపించివున్నాఁడు. ఆపద్యములు రసవత్తరములనుటకు సందేహంలేదు. దరహంమీఁద చూస్తే భారతకవులను మించుననడానికి నాకు వొప్పుదల లేదు. ఆరీతినే పరిశీలించి చూచేయెడల తిక్కన్నగారి శైలిని కంకంటివారిశైలి అతిక్రమించిందని చెప్పవలసి వస్తుంది. పురాణశైలితో తిక్కన్నగారు ఉత్తరరామాయణాన్ని నడిపించారు. పూర్తిగా కావ్యశైలిలో పాపరాజుగారు నడిపించారు. వారి వారి వుద్దేశాన్నిబట్టి విమర్శకులు విచారించ వలసివుంటుంది. కవిబ్రహ్మంతటివాఁడు వ్రాసినదాన్నే పుచ్చుకొని ఆంద్రీకరించడం మహాసాహసంకదా? అట్టి సాహసానికి దిగినపాపరాజుగారు యెన్ని వన్నెచిన్నెలున్నూ పెట్టకపోతే యేలా తుదనెగ్గుతుంది? పయిగా పాపరాజుగారి వాణికూడా రసవంతమైనది కాని అల్లాటప్పా తరగతిలోనిదికాదు. కనుకనే అపహాస్యాస్పదుఁడు కాలేదు. యమకాలు వగైరా అలావుంచండి-
సీ. తిలకంబు దిద్ది "దిద్దితిఁ జూడు" మను రమా
సుదతి చెక్కుల నీడఁ జూచువాని"
యీపద్యం శ్రీమహావిష్ణువును వర్ణించినది. చరణాలన్నీ యీలాగే వుంటాయి. అందులోనున్నూ యీ మొదటిచరణం అత్యద్భుతమైన రసికత్వాన్ని వెల్లడిస్తూ వుంది. యెందుచేతంటారా? మీరేచూచుకోండి. నన్నెందుకు చెప్పమంటారు? ప్రసక్తానుప్రసక్తంగా పాపరాజుగారు వచ్చారు. ప్రస్తుతం నన్నయ్యగారు ఆయీ కవులను గూర్చి వ్రాయవలసివస్తే వొక్కొక్కరికి వొక్కొక్కవ్యాసం పెట్టుకోవలసిందే గాని వొకరిని గూర్చి వ్రాస్తూ వేఱొకరినిగూర్చి యెత్తుకోవడం మహాపరాధంగా పరిణమిస్తుందని నేను భయపడుతూవుంటాను. ఆలా యెత్తుకోవడం పేరే. - సీ. ఒకరి పెండిలిలో మఱొక్కఁడాపల్లకీ నిరుక నుంకించుటవంటిది. వారు కోరకపోయినా మనం వారిని యిఱికించినట్లవుతుంది. దీన్ని యెఱుఁగుదును. అయినా సంబంధం వుండడంచేత స్పృశించడం తప్పింది కాదు. భారతకవులను గూర్చి యెత్తుకుంటే యిటీవలవారిని యెత్తుకోవడం మానినా అసలు ముగ్గురినేనా యెత్తుకోక వొక్కరి నెత్తుకొని విరమించడానికి బుద్ధిపుట్టదు. యెఱ్ఱన్నగారు “నాపెసరపప్పు కలసినదంతా నాదే" అన్నమాదిరిని భారతకవులైనారు. నన్నయ్యగారు అసలు ఆమహాకార్యాన్ని ప్రారంభించినవారవడంచేత భారతకవి అనేపేరు వహించారుకాని చాలా రచించికాదు. నిజంగా భారతకవి పట్టభద్రత్వం తిక్కన్నగారికే కట్టవలసి వస్తుంది.
చ. ...దుర్గమార్ధజలగౌరవ భారతభారతీసము
ద్రముదరియంగ నీఁదను విధాతృనకైనను నేర్వఁబోలునే
అని నన్నయ్యగారి దివ్యవాణి భావికాలమందలి యనర్థాన్ని సూచించింది. సంశయాత్మా వినశ్యతి అన్నట్లు తుదకు ఆలాగే జరిగింది. సత్కవివాక్యము రిత్తవోవునే. యెన్నటికి రిత్తవోవదు. భవతు. ఆలా జరిగికొన్నాళ్లు అసంపూర్ణ స్థితిలోనే వున్న ఆ భారతాన్ని ఆంద్రీకరించడానికి సాహసించినతిక్కనగారు “యశోవా మృత్యుర్వా" అనే అభియుక్తోక్తిని మనస్సు యందుంచికొనియ్యేవే కర్తవ్యాంశమందు ప్రవర్తించినారని తోస్తుంది. ఆయన నన్నయవలె కవిమాత్రుఁడుకాక దండనాథుఁడుకూడా కదా! దండనాథునకు ప్రాణభీతి వుండదని వేఱే చెప్పనక్కరలేదు. అదిగాక– “న సాహస మనారుహ్య నరో భద్రాణిపశ్యతి" అనే న్యాయాన్ని పాటించిన తిక్కన్నగారు భారత మనాయాసంగా రసవత్తరంగా పూరించి తద్ద్వారాగా తాను తరించడమేకాకుండా నన్నయ్యగారిని కూడా తరింపచేశారనుటకు సందేహంలేదు. తిక్కన్నగారి విజ్ఞానం నన్నయ్య గారినికూడా కూడతీసుకురావడం లోనేవుంది. దీన్నిగుఱించి లోగడ వ్రాసేవున్నాను. అందఱు యెఱిఁగిందే అయినా తిక్కన్నగారిశైలికూడా కొంతమచ్చుచూపి యీ వ్యాసాన్ని ముగిస్తాను-
ఉ. చిచ్చఱకన్ను మూసికొని చేతిత్రిశూలము డాఁచి లీనమై
వచ్చిన రుద్రుచందమున వ్రాలుదు వీవనిలోన నోర్వఁగా
వచ్చునె నిన్ను నెట్టిమగవానికి నీకృప నాశ్రయింపఁగా
వచ్చితి మెవ్విధిం గెలువవచ్చు మహాత్మ యెఱుంగఁ జెప్పవే,
క. సంజయ మురభంజనుని ధ
నంజయునిం జీరికిం గొనఁడు కర్ణుం డిం
ద్రుంజెనఁకియైన గెల్లున
నుం జచ్చెనె అట్టివాఁడునుం గయ్యమునన్.
క. పలపలనిమూఁకలోఁ గా
ల్నిలువక గుఱ్ఱమ్ముడిగ్గి నీకొడుకు గదా
కలితభుజుఁడగుచు నొక్కఁడు
తొలఁగి చనియె నేమిచెప్పుదున్ గురునాథా,
యిట్టివి విడివిడి పదాలకూర్పుతో ముద్దులు మూటగట్టేశైలిలో వున్న పద్యాలెన్నో వుదాహరించవలసి వుంటుంది. యీశైలికి కూడా మార్గదర్శి నన్నయ్యగారే యేమో అని నే ననుమానిస్తాను.
తిక్కన్నగారి పద్యాలలో తెలుఁగెక్కువ సంస్కృతం తక్కువ. నన్నయ్యగారి పద్యాలలో సంస్కృత మెక్కువ తెలుఁగు తక్కువ, అని వ్రాయనక్కఱలేదు. కాని శైలి వుభయులదిన్నీ ప్రసాద గుణభూయిష్టమే. నెల్లూరు, గుంటూరు, బందరు ప్రాంతాలలో వున్నంత అచ్చతెలుఁగు గోదావరీ మండలంలో వాడకంలో లేదనే నాకు తోస్తుంది. కాని నన్నయ్యకెక్కడి నుండి వచ్చాయో మాఱుమూల తెలుఁగుపదాలుకూడా కవిత్వంలో దొర్లుతాయి. ఏడైఱ, ఒగి, వెస, మొదలైనమూటలు వ్యావహారికంలో నేనెక్కడా మా ప్రాంతాలలోcగాని యితర ప్రాంతాలలోఁగాని వినలేదు. భారతకవుల కెక్కడినుండి వచ్చాయి? గ్రాంథికంగా వున్నాయంటే నన్నయ్యగారి నాఁటికి వున్న గ్రంథాలపేళ్లు చెప్పఁగలమా? యీశంకలకు సరియైన సమాధానాలు కనపడవు. మొత్తం నన్నయ్యగారిక్కూడా యేదో ఆధారం వుండితీరాలన్నది సిద్ధాంతం. శాసనాలకవిత్వం మాత్రమే నన్నయ్యగారికి పూర్వం వుండేదంటూ కొందఱువ్రాస్తారు. ఆశాసనాల్లోకూడా యీ మాటలు వున్నట్టులేదు. నిఘంటులన్నీ నన్నయ్యగారి కీవలివేను. నన్నయ్యగారు వాడని పదాలు కొన్ని- ఉపతాయి మొదలైనవి స్వల్పంగా తిక్కన్నగారు వాడివున్నారు. అవి వ్యావహారికాలో, గ్రాంథికాలో తెలియదు. భాష ప్రపంచ సృష్టితోపాటు అనాదిగా వుండితీరుతుందన్నదే తుదకు సర్వసమ్మతమైన మాట. భవతు. దీన్ని యీలావుంచి ప్రసక్తి కలిగింది కనక యెఱ్ఱన్న గారిని గూర్చి కూడా కొన్ని మాటలు వ్రాస్తాను. ఈయన వ్రాసిన భారతారణ్యపర్వశేషంకూడా ముద్దులుమూట కడుతూ జనరంజకంగానే వుంది. కనకనే మళ్లా యెవరున్నూ కలిగించుకొని పునఃపాకాని కుపక్రమించలేదు. యావత్తుకూ వుపక్రమించినవారు పలువురున్నూ ఆ పాకాన్ని అతిక్రమించినట్టున్నూ లేదు.
చ. ధనములు చాల గల్గి సతతంబును నింద్రియవాంఛ సల్పుచున్
మనమున నెన్నఁడున్ సుకృతమార్గము పొంతనుబోక లోభమో
హనిరతబద్దులై తిరుగునట్టి జనుల్ పరలోక సౌఖ్యమున్
గనుటకు నేర రిప్పటి సుఖంబులు మేలయి తోcచు వారికిన్.
క. ఈలోకమ యగుఁగొందఱ
కాలోకమ కొందఱకు నిహంబును బరమున్
మేలగుఁ గొందఱ కధిపా!
యే లోకము లేదు సూవె యిలఁ గొందఱకున్.
యీలాటి వింకా యెన్నో పద్యాలు వుదాహరించతగ్గవి వున్నాయి. సమాసగ్రథన విషయంలో మొట్టమొదటనే నన్నయగారి "శారద రాత్రుల” పద్యాన్ని యీయన అనుకరించవలసిన ఆవశ్యకత కలిగింది. అనుకరించి “స్ఫురదరుణాంశురాగరుచి" మొదలైన పద్యాలను ఇంచుమించు అదేశైలితో ముగించి చాలవఱకు కృతార్థుఁడుకూడ కాఁగలిగాఁడు. వొక్కొక్కరి కవిత్వమందున్నూ వొక్కొక్కరి గానమందున్నూ ఒక్కొక్క విశిష్ట గుణం సహజంగా వుంటూవుంటుంది. ఆగుణం అనుకర్తలకు యే కొంత భాగమో స్వాధీన మవుతుంది గాని, పూర్తిగా స్వాధీనం కాదన్నది సర్వానుభవసిద్ధం. శ్రీనారాయణ దాసుగారిని హరికథకు లెందఱు అనుకరించడంలేదు? కోడి రామమూర్తిగారిని మల్లవిద్యాప్రవిష్ఠు లెందఱు అనుకరించడం లేదు? వొకరైనా వారి వారి పూర్తి విశేషాలు ప్రకటింపఁ గలుగుతున్నారా? పై విషయమున్నూ అలాటిదే. నిజంగా అనుకర్తలు కృతార్థులు కాఁగలిగినా ప్రప్రథములయం దుండే గౌరవాతిశయంచేత అనుకర్తలను లోకం యేకొంచెమోతగ్గించడమే కనఁబడుతుంది. ఉపమానస్థానంకన్న ఉపమేయ స్థానాన్ని మనం యెంత వుత్కృష్టంగా వర్ణించినా తత్తుల్యంగా ఉంది అని చెప్పినట్టే అవుతుంది. ఆ యీభావాన్ని మనస్సులో పెట్టుకొనియ్యేవే దేవీభాగవతంలో మేమీ క్రింది పద్యం వ్రాశాము.
ఉ. మూగురయందు నన్నయ సమున్నతుఁడై కడులక్షణఁపుఁ బ్రో
వై గుది గూర్చు నేర్పు గలఁడై తగు నించుక కేమి? యజ్వయున్
లోఁగక ఆతనిన్ జెనయు, న్యూనుఁడనందగఁ డెఱ్ఱనార్యుఁ డెం
తే గడుసుందనమ్ము గలఁ డిర్వురకున్ సరివచ్చు నన్నిటన్.
యెవరికో కోపం వచ్చిందని యిప్పుడు నేను నన్నయ్య స్థానాన్ని తిక్కన్నగారికి మార్పుచేసినా దాన్ని లోకం విశ్వసిస్తుందా? కొందఱు విశ్వసించినా మఱికొందఱు తిరగఁబడతారు.
“... ... ... ... ... ... అందఱినిం దనియింప ಮಿಮ್ಮಿ ని
ర్మించిన బ్రహ్మకైన దరమే! యిది పెద్ద లెఱుంగకుందురే!”
వాల్మీకి కన్నా కూడా మిన్నగా కవిత్వం చెప్పినట్టు కాళిదాసును సమర్ధించవచ్చును. కాని కాళిదాసుకు సమకాలికుఁడైన భోజరాజు -- - -
"మధుమయఫణితీనాం మార్గదర్శీ మహర్షి"
అని ఆ గౌరవాన్ని వాల్మీకి యందే ఆపాదించాఁడు. సంస్కృత కవిత్వం వాల్మీకులతోనే ఆరంభంకాలేదు. వేదంలోకూడా కవిత్వపదార్థం గలవి కొన్ని భాగాలు కనపడతాయి. అయినా కావ్యరూపందాల్చింది వాల్మీకుల వాక్ప్రవాహమే. అందుచేత- “భువిఁ గవితాకన్యఁ బుట్టించె నెవ్వాఁడు” అన్న యశస్సు ఆయనకు దక్కింది. అదే విధంగానే యేదో తెలుఁగు కవిత్వం నన్నయ్యనాఁటికి కొంత వున్నప్పఁటికి
“మ. మహి మున్ వాగనుశాసనుండు సృజియింపన్"
చ. ఒకరొక రుండ్రు దీరవరు లొక్కరికొక్కరు తీసిపోరు భూ
మికి యశ మబ్బె రావణుని మెచ్చున నంచనుకొందుమేని వా
లికి నతడింత జంకె లవలేశము లొక్కట డించి వీనులుం
టకు విని కన్నులుంటకుఁ గనందగు నల్పుల మేమి చెప్పఁగన్.
స్వస్తి.
అనుబంధము
(షరా) ఈ వ్యాసంరాయడానికి ప్రసక్తి కల్పించిన విమర్శకుఁడు గారు రమారమి నావలెనే డెబ్ఫైయేళ్ల వృద్ధ వయస్సులోనే వున్నట్టు వారు పీఠికలో వ్రాసిన-- "వెంకశాస్త్రియు నీవును వృద్దులైరి." అనే వాక్యంవల్ల స్పష్టపడుతుంది. అయితే మేము గుంటూరు సీమలో విద్యావిషయికంగా సుమారు మూడుమాసాలకాలం వున్నరోజుల్లో యేప్రసక్తిలో గాని యీయన పేరెన్నడును వినబడ్డట్టులేదు. పలువురు శాఖాభిమానులు పద్యాలతో మమ్మల్ని గాఢంగా తిట్టి ప్రచురించేవారు. వారు వారు వారివారి పేళ్లను కూడా ప్రచురించడమే వుండేది. ఆపేళ్ల జాబితా అక్కడక్కడ గుంటూరు సీమలో ప్రచురించే వున్నాము. వీరిపేరు ఆపేళ్లలో యెక్కినట్టు లేదు. మేము పొరఁబడి వున్నామా? లేక యీయన అప్పుడీ విషయంలో జోక్యం కలిగించుకోనే లేదా అని సందేహం కలుగుతూ వుంది. యే కొందఱో "యథార్థవాది" “సత్యవాది" అనే మారుపేళ్లతో మమ్ముదూషించి ప్రచురించే మహానుభావులును వుండేవారు. ఆపేళ్లలో వీరు వొకరైవుందురా? ఇంత ఆవేశం కలవీరు వార్ధక్యం వచ్చే దాకా ఆయీ దూషణోక్తులను కడుపులో నెట్లు దాచుకోగలిగిరో? అని కూడా సందేహం కలుగుతూ వుంది. అయితే వీరు వ్రాసిన- -
“బహుకాలమునకు మరలి యీగోల యేలయని తలంతురేని...” “యిది బహుకాలము క్రిందటనే వ్రాయబడినను..."
అనే వాక్యద్వయమువలన విమర్శకుఁడుగారు చాలాకాలం క్రితమే దీన్నివ్రాసి లోకులకు జంకియో లేక మఱేకారణం వల్లనో దీన్ని దాఁచితుదకు వార్ణక్యం వచ్చాక వ్రాసిన గ్రంథం వృథా పోనేల? అని ప్రతిష్ఠార్థం దీన్ని ప్రకటించినట్లు తోస్తుంది. పూర్వ వయస్సుకన్న వృద్ధవయస్సు కొంత యుక్తాయుక్త విచక్షణత్వానికి తోడ్పడవలసి వుంటుంది. ఆపద్ధతిని తిట్లు తగ్గించుకొని శంకలుమాత్రం ప్రచురించుకుంటే అవి నిలచినా, నిలువకపోయినా యుక్తంగా వుండేది. ద్రావిడ స్త్రీల కచకుచాల దగ్గరనుంచి ప్రసక్తిగాని ప్రసక్తిగా యెత్తికొని వ్రాస్తే విమర్శనం యెక్కువ శృంగారంగా వుంటుందని ఆయనకు తోచడం ఆశ్చర్యంగా కనబడుతుంది. “రోళ్లా రోకళ్లా పాడిన" గుంటూరు సీమలోవున్న విషయాలు ఈసీమవారైన వీరికి యేకొంచెమున్నూ అవగతం కాలేదనుకోవడానికి వీరిశంకలు కొన్ని సాక్షమిస్తాయి. సోదర కవులు కాకినాడనుంచి యెవరో వారి ఆప్తులకు వ్రాసిన వత్తరం అసత్యవాక్య పూరితం అని అసలు వారే వొప్పుకున్నట్లు నాఁటివారి తూష్ణీంభావమే వేనోళ్ల సాక్ష్యమిస్తూ వుండగా ముప్బై యేండ్లకు వీరు ఆవుత్తరమంతా సమర్థించడానికి పూనుకోవడంకన్న ఆశ్చర్య మేముంటుంది? వీరి విమర్శనమంతా యిదే విధంగా ప్రవర్తించింది. దానికి నేను సమాధానం చెప్పడముకంటె ఆ సీమలో ఆ కాలంలో వుండేవారిలో యిప్పటికి స్వర్గతులుకాగా మిగిలిన గ్రంథకర్తగారి బందుగులే చెప్పఁగలరని వారికి బరాతం చెప్పడం యుక్తమని తోఁచింది. ఆ గ్రంథాన్ని మెచ్చినవారిని వీరు“స్తోత్రపాఠకులు కొందఱు ఒళ్లెఱుంగని సివమన్నయట్లు గుడ్డలూడ్చి గంతులు వైచిరి... వీరేమి విశేషములు గాంచి యట్లయిరి. తి. వేం. కవులయందలి దురభిమానమువారి నట్లాడించినది...” అనినీచంగా దూషించి యున్నారు. కాబట్టి అట్టివారు వీరి కేమి బోధించినను అది దురభిమాన ప్రయుక్తమే కాబట్టి ఆ వుత్తరపుతత్త్వం వగయిరాలకు మాకునాఁడు ప్రతిపక్షులైనను ఇటీవల మిత్రులే అయిన సోదర కవులనే సాక్షులుగా చూపుచున్నాను. 116 పుటలలో బోలెడు శంకలుండునుగదా? అన్నిటికి యిదివఱలో నన్నయ్యను ఆదికవిగా పేర్కొన్నందుకు శంకించిన శంకకు వ్రాసినట్లే వ్రాస్తే చాలా పెరుగుతుంది. నిస్సారమైన ఆ యీశంకా సమాధానాలకు లోకం యేకొంచెమున్నూ సుముఖంగా వుండదు. అందుచేత యేపత్రికగాని పరిగ్రహించదు. యీకారణం చేతేగదా? విమర్శకుఁడుగారు తమశంకలను పృథక్కుగా ద్రవ్యము వ్యయించి అచ్చొత్తించుకోవలసి వచ్చింది. నేను కనక సరిపోయిందిగాని వీరుచేసిన అనుచిత ప్రసంగమునకు యితరులైతే యింతతో సరిపోదు. కాని యెన్ని అనుచితపు తిట్లు తిట్టినా విమర్శకుఁడు గారి వుద్దేశము తిట్టవలెననేదికాదనే నా అంతరాత్మకు తోస్తూవుంది. యేలాగో దేశానికి వచ్చిన కళంకాన్ని తొలగిద్దామనేదియ్యేవే. అందుచేత దీన్ని ప్రస్తుతం జర్మనీ లోనైన దేశాల్లోనేకాక మనదేశంలో కూడా సర్వత్రావ్యాప్తిలోవున్న దేశాభిమానం క్రింద జమ కట్టవలసి వుంటుంది. అన్నిటికి మూలం కవిత్వం వకటి సాఫుగా వుంది. యీగుణం నన్ను బాగా ఆకర్షించడం చేతనేనే యీయన్ని నేను సేల్జోడు సమర్పించి బహూకరింపఁదలఁచినాను. యితర - విషయంలో పద్యం సాపుగావ్రాయడమే శ్లాఘ్యం. అందులో పూర్వోత్తరపక్షాలు పద్యంలో సాఫుగా వ్రాయడం మఱీ శాఘ్యం. అందుచే వీరు నాకు అభినందనీయులు. పయిగా కృతిప్రదాతలు. నాసమ్మానము ననాదరింపక దయచేసి త్వరలో సభాముఖమున స్వీకరింతురని విశ్వసించుచున్నాను.
★ ★ ★