కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/కవులు భిక్షాటకులేనా?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to searchకవులు భిక్షాటకులేనా?

కవులు భిక్షాటకులేనా? అని ప్రశ్నిస్తే జవాబు చెప్పడం కష్టం.

“భిక్షాటకులే” అందామా? అప్పుడు కొంత చిక్కు వుంది. కాదు అంటే కొంత చిక్కుంది. కొంతసేపు “భిక్షాటకులే” అని జవాబిచ్చి చూద్దాం. దీనికి కొన్ని ఆధారాలు కనపడుతూ వున్నాయి. “మాంతు భిక్షాటనమ్” అన్నాఁడు కాళిదాసు. భోజరాజును స్తుతిస్తూ చెప్పిన శ్లోకంలో చిట్టచివరది పైవాక్యం. శివుణ్ణి ఆశ్రయించిన గంగ, చంద్రుఁడు, వాసుకి, సర్వజ్ఞత్వం, అధీశ్వరత్వం, భిక్షాటనం వగైరాలలో నిన్ను అధీశ్వరత్వ, సర్వజ్ఞత్వాలు పొందినవనిన్నీ తుట్టతుదనున్న “భిక్షాటనం" నన్ను (కాళిదాసుని) ఆశ్రయించిందనిన్నీ కాళిదాసు స్వయంగా వొప్పుకుంటూ వున్నాఁడు. శ్లోకంలో వున్న తక్కిన అంశాలు మనకు ప్రస్తుతాలు కావు కనక వ్యాఖ్యానంతో పనిలేదు. యెవరేనా ఆశ్రయించి జీవించేవాళ్లు ఆశ్రయపదార్థం అంతరిస్తే నఖముఖాలా చెదిరిపోయి మఱొక ఆశ్రయాన్ని చూచుకోవడం లోకంలో వుంది. కనక ప్రస్తుతం కాళిదాసు ఆ రీతిని చమత్కరించాఁడు. శ్రీనాథుఁడు

“కస్తూరికా భిక్షాదానము సేయరా” అని తెలుంగురాయలను

“సాంపరాయని తెలుంగాధీశ!" అని సంబోధిస్తూ యాచించాఁడు. ఆ కస్తూరి తన భార్యగాని, కోడలుగాని, కూఁతురుగాని ప్రసవిస్తేవుపయోగపఱచడాని కేమో? అంటే అందుకుగాదు యిందుకే అని ఆ పద్యంలోనే వ్యాఖ్యానించాఁడు.

"ద్రాక్షారామపురీవిహారవరగంధర్వాప్సరోభామినీ
 వక్షోజద్వయ కుంభికుంభములపై వాసించు నవ్వాసనల్

యిక్కడ యీ ప్రభువెవ్వరో కొంత విచారిస్తే బాగుంటుంది.

“రంభ గూడెఁ దెలుంగురాయ రాహుత్తుండు
 కస్తూరికేరాజుఁ బ్రస్తుతింతు”

అనే సీసచరణంలో తుట్టతుది సమయములో స్మరింపఁబడ్డవాఁడీ మహారాజే. యితని తండ్రిపేరుతో వున్న గ్రామం వొకటి, గోదావరిజిల్లా రామచంద్రపురం సమీపంలో వుంది. కొమరగిరి, రాజోలు, వేమవరం, పోలవరం యిత్యాదులన్నీ పూర్వం రాజ్యమేలిన రాజులపేర్లతో పుట్టిన వూళ్లే యిందులో కొన్ని వూళ్లు అసకృదావృత్తిగా కూడా (పోలవరాదులు) వున్నాయి.

“పోలయవేమా!” అంటూ పద్యాలు కొన్ని శ్రుతమవుతూ వున్నాయి. వేమభూపాలుని తండ్రిపేరు పోలయ్య ఆయన పేర పుట్టిన గ్రామం "పోలవరం" ప్రస్తుతం శ్రీనాథునికి కస్తూరికా భిక్షాదానంచేసి తదనుగుణమైన రంభా సంభోగాన్ని చూరగొన్న శృంగార రసారాధకుఁడు పాలించిన భూభాగానికి రాజధానిగా వుండేపట్నం పేరేదో చారిత్ర విజ్ఞాతల ద్వారా తెలుసుకోవాలి. సంస్కృత కవులలో “కాళిదాసు" భిక్షాటకుఁడుగా రుజువైనట్లే తెలుఁగు కవులలో శ్రీనాథుఁడు కూడా భిక్షాటకుఁడుగా రుజువైనది. అయితే కాళిదాసు భిక్షాటకత్వానికీ, శ్రీనాథుని భిక్షాటకత్వానికీ చాలా వార కనఁబడుతూవుంది. బాగా పరిశీలిస్తే శ్రీనాథుణ్ణి భిక్షాటకుఁడుగా సమర్ధించడానికి పైని చూపిన పద్యపాదాలు పనిచేయవు. ఆయీ పద్యపాదాలు శ్రీనాథుని నిరాఘాటప్రవర్తనాన్ని సమర్థించడానికి మాత్రమే వుపకరిస్తాయి. అంతకంటే "కైలాసగిరి పండె మైలారువిభుడేగి దినవెచ్చ మేరాజు తీర్చఁగలఁడు" ఆయీ చరణం భిక్షాటకత్వాన్ని సమర్థించడానికి కొంచెం తోడ్పడుతుంది.

“చిన్న ముష్టీ, పెద్ద ముష్టీ" అనే భేదం తప్ప యేదేనా చేయి చాఁచడం భిక్షాటనం కిందకే వస్తుందికదా! నిరాఘాటత్వానికి “తురగా రామకవి" ముందర యే శ్రీనాథుఁడూ చాలఁడు. పెద్దాపురం సంస్థానం అంతరించడాన్ని గూర్చి పరంపరగా వినేయితిహాసం (పెద్దాపురపుఁగోట పెద్దమ్మకిల్లౌట కవివరేణ్యుల కోపకలనఁగాదె, శ్రవణా, చూ.) విశ్వాస్యమే అయితే, తురగా రామకవిగారి ప్రభుత్వం ముందు శ్రీనాథుఁడి ప్రభుత్వం శతాంశమూ కాదు. రామకవిగారు తఱచు దేశాటకులైనా అసలు నివాసం తునిగాని ఆ ప్రాంతంలో వుండే యేదో పల్లెటూరుగాని కావాలి. అప్పటి సంస్థానాలలో రామకవిగారికి "వర్షాశనాలు" వున్నాయి. వర్షానికి ఒక్కసారి వచ్చే ఏర్పాటుతోవుంటాయి కనక ఆపేరు ఆమామూళ్లకు సార్థకం. రామకవిగారు వార్షికానికి వచ్చి పదో అయిదో రోజులు రాజుగారి కోరికమీఁద వుండి వర్షాశనం. పుచ్చుకొని వెళ్లి మళ్లా స్వల్పకాలంలోనే వచ్చి దివాణంలోకి కబురుచేసి నట్టున్నూ రాజుగారు దర్శనమివ్వక అనాదరించినట్టున్నూ దానిమీఁద వెంటనే మసిబొగ్గుతో కోటద్వారం గోడమీఁదో తల్పుమీఁదో (పద్యమంతా పిమ్మట వ్రాస్తాను. వుత్తరార్ధం మాత్రం యిక్కడ వుటంకిస్తాను) పెద్దమ్మ నాట్యమాడెను, దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్.

అని వ్రాస్తూవుండఁగా రాజుగారికి తెలిసి సగంసగం స్నానంచేస్తూ వున్న తడిబట్టతోనే వచ్చి శాంతింపఁజేసి, "మహాత్మా! తాము మొన్ననేకదా దయచేసి వార్షికం పుచ్చుకొని వెళ్లి వున్నారు, మళ్లా సంవత్సరానికిఁ గాని దయచేసే ఆచారంలేదని నేను తమ రాకను నమ్మకపోవడంవల్ల తమకాగ్రహం కల్గించినందుకు క్షమించి శాపాన్ని మళ్లించవలసింది."

అని బతిమాలి వారు వచ్చిన పని అంతగాని, కొంతగాని సమంజసమైనది కాకపోయినప్పటికీ నెరవేర్చేటప్పటికి రామకవిగారికి మోమోటం కలిగి - అద్దిర! శ్రీ భూనీళలు ముద్దియలా హరికిఁ గలరు ముగురమ్మలలోఁ "బెద్దమ్మ నాట్యమాడెను.”

అని సవరించి అంతతో వూరుకోక తన మొదటి శాపం ఫోర్సు పూర్తిగా యింత మాత్రంతో శాంతించదనీ యెఱుఁగును కనక అది, “నీ నాఁడు గాదు నీ మనుమని నాఁడు అమలు జరుగు" నని చెప్పినట్టున్నూ చెప్పుకుంటారు. యీ మనుమని నాఁడు, అని వున్న పద్యం కూడా నేనుయెప్పుడో వినే వున్నాను కాని అది యిపుడు సరిగా నోటికి వచ్చిందికాదు. ఆయన వాక్శుద్ధి యెట్టిదో కాని అదేప్రకారం ఆ రాజుగారి మనుమనిరోజులు కొంతవరకు బాగా జరిగి తుట్టతుది రోజుల్లో వొక్కొక్క ముఠా చొప్పున అమ్మకానికి ఆరంభమైనట్టున్నూ ఆయన స్వర్గతి పిమ్మట భార్యలు ముగ్గురూ చాలవఱకు అనప్పిండి విస్సన్నగారి దివాన్‌గిరీ రోజులలో భర్తగారు ప్రారంభించిన విక్రయ వ్యాపారాన్ని పూర్తిచేశారనిన్నీ చెప్పకోవడం.

అనప్పిండివారు ద్రావిడ బ్రాహ్మణులు. కోనసీమ నివాసులు. ఆ యీ యింటివారిపేరు కోనసీమలో అనాతవరంలో కాఁబోలును యిప్పటికీ వున్నారని వినడం. యెవరో వొక గేస్తురాలు

“అనప్పిండి విస్సన్నగారిదీ బట్టతలే, మా వారిదీ బట్టతలే”

అందనిన్నీ లోకోక్తులలో చెప్పుకుంటారు. అదృష్టవంతులలో యీయన్ని పేర్కొనడం ఆ రోజుల్లో విశేషించి వుండేదని పైలోకోక్తివల్ల అవగతమవుతుంది.

“అనప్పిండివిస్సా ... ... తుస్సా" అంటూ వొక పెద్దదండకం భట్రా జెవరో చెప్పినట్లు వినికిడి. క్రియలో మాట రామకవిగారి వాక్కు రెండో భీమకవిగారి వాక్కే "నానృషిః కురుతేకావ్యం" అనే అభియుక్తోక్తి రామకవిగారిపట్ల సమన్వయించినట్లు యేనన్నయ తిక్కనాదులకుగాని సమన్వయించదు.

"ఉంగుటూరిళ్ల రాకాసు లుండవచ్చు"

అనే పద్యపాదానికి సంబంధించిన యితిహాసంకూడా రామకవి మహర్షులలో పరిగణింపతగ్గవాఁడు గాని కవిమాత్రుఁడుకాఁడని చెపుతుంది. ఆయీ రాకాసుల పద్యంలోవున్న శాపానికి యేకొంచెమో అపరాధం ఆవలి వారి (తల్లాప్రగడవారు) వల్ల కనcబడుతుంది. పెద్దాపురం విషయంలో అట్టి అపరాధం లేశమూ వున్నట్టు లేదు. రామకవిగారు వార్షికం పుచ్చుకువెళ్లి మళ్లా వెంటనే (నెలకో రెండు నెలలకో అన్నమాట) రావడానికి చెప్పుకొనే మాటలు విమర్శించడానికి అర్హంగా వుండవు. ఉదార హృదయులకు బొత్తిగా రుచించవు కూడాను. అయినా ప్రధానాంశమైనశాపానికీ వాట్లకూ లంకెగా వుండడంవల్ల వుదాహరిస్తాను. రామకవిగారికి వేశ్యాసంపర్కం వున్నట్లు

(1) భూతలమందు ధాతకు నపూజ్యత గల్లెను.

(2) చూడఁగ నల్పుగాని పరిశోభిత దివ్యకురంగనాభి.

(3) పెండెలనాగి చెక్కులను పెద్దికటిస్థలి గంగిగుబ్బ చన్గొండల

అనే పద్యాలు ధ్రువపరుస్తాయి. యీ మూగురు సానులలో నొకదాని నివాసం తుని. ఆపెనేమో బంధువులు "నీవేమో నేనమ్మాతురగారామ కవిగారి సానినని విఱ్ఱవీఁగుతావు! నీకేమేనా పాయకరావుపేఁట సేలువులు కప్పివున్నారా? (పాయకరావుపేట తునికి మైలులో వుంటుంది. ఆకాలంలో సేలువులకు ప్రసిద్ధి) లేకపోతే పెద్దాపురం మహారాజావారి కైజారుపిడిమీఁద వుండే రత్నాలు తెచ్చి నీ సవరపు కొప్పెమీఁద తాపడం చేయించారా?" అని యెత్తిపొడిచే టప్పటికి ఆ అనాత్మజ్ఞురాలు ప్రియుణ్ణి, ఆ రత్నాలు తెస్తావా? చస్తావా? అని పట్టుపట్టి కూర్చుండేటప్పటికీ రామకవిగారు తప్పని విధిచేత వార్షికం తెచ్చుకున్న అచిరకాలంలోనే, పెద్దాపురం వెళ్లవలసి వచ్చిందని చెప్పుకుంటారు. కైజారులో వుండే మాణిక్యాలు వూడదీయించి కవిగారికి సమర్పించడంచేతనే మనమడి తరందాఁకా రాజ్యం ఆగినట్టున్నూ చెప్పుకుంటారు. ఆ యీ శాపప్రదానానికి హేతువు అంతగాని కొంతగాని సరిగా కనపడదు. దీనికే కాదు, పౌరాణిక శాపాలలో కూడా నూటికి తొంభైవంతులు యీలాగే వుంటాయి. యీమాదిరి యాచకులను మనం, భిక్షాటకులుగా విశ్వసించడం యేలాగ? యిస్తే పుచ్చుకోవడమూ, యివ్వకపోతే చక్కాపోవడమూ 'భిక్షకుల' లక్షణం. (అవమానం పురస్కృత్యమానం కృత్వాతు పృష్ఠతః చూ.)

అదిన్నీ కాక యేదో “నిజదార సుతోదర పోషణార్థం" బియ్యమో, వడ్లో, జొన్నలో? అథవా రొక్కమో? అయితే భిక్షాటనంగా భావించడానికి అవకాశం వుంటుంది, గాని నా సానికి పూయడానికి కస్తూరి కావాలి, నాసాని సవరపు కొప్పెలో చెక్కించడానికి రత్నాలు (ఆ రత్నాలుకూడా అలాయిదాగా యిస్తే వల్లకాదు) మీ కైజారుపిడిలో వున్నవి కావాలి, అనే భిక్షాటనం భిక్షాటన మవుతుందా? “నమ్మిన నమ్మకున్న నది నా వశమా?" అన్నారు దాసువారు. నే విన్నమాటలు వ్రాశాను, కథలకు కాళ్లూ ముంతలకు చేతులూవుండవు. క్రియలోమాట తురగా రామకవి పద్యాలు చూస్తే తెలుఁగు కవులలోనే కాదు, సంస్కృతకవులలో కూడా అంతటి తృణీకృత బ్రహ్మ పురందరుఁడు లేడనే తోస్తుంది. అతని ధారలోనే వొక విధమైన "వైశిష్ట్యం” కనపడుతుంది. చూడండి.

ఉII రాతిరి మేము పస్తు, హయరత్నము పస్తు, కవీంద్ర యాచక వ్రాతము పస్తు, నర్మసచివాగ్రణి పస్తు (పైభాగం కొంత జ్ఞాపకం లేదు. ఉన్నదానిలో కొంత అసభ్యమగుటచే వుటంకించలేదు) ... ... పస్తికనేమి చెప్పుదున్

ఇది రామకవిగారి పద్యమే. దీనిలోవున్న సిబ్బందీ చూస్తే పూర్వం కవులు (అందఱూ కాదు కొందఱే) మతగురువులలాగు దేశం తిరిగి వసూలు చేసేవారేమో? అనిపిస్తుంది. నిగ్రహానుగ్రహదక్షులుగా వుండడంచేత వారికి ఆవిధంగా సాఁగిందనుకోవాలి. తురగా రామకవి ఆ యీ దక్షులలో నెంబర్‌వన్. ఇతనివి లోకంలో లెక్కకి చాటువులు పదికంటే ఎక్కువ చిక్కవు. కాని మహాగ్రంథాలు రచించిన నన్నయాదులతోపాటు భాషా ప్రపంచంలో యితనికి పేరు వుంది. ఇత డెంతవాఁడో చెప్పడానికి వశంకాదు. ఇంతవఱకు వ్రాసిన చర్చవల్ల కవులు, “భిక్షాటకులు" కారనే తేలుతుంది. వూరకే వినయార్థం కాళిదాసు - “మాంతు భిక్షాటనమ్” అని అనివుంటాఁడు. కవులుభిక్షాటక తరగతికి చెందినవారే అయితే

“ఎదురైనచోఁ దన మద కరీంద్రము డిగ్గి
 కేలూఁత యొసగి యెక్కించి కొనియె"

ఇట్టి గౌరవం జరగడం అసంభవం కదా! మంత్రిత్వంలో లోపాయికారీగా అనుభవించే ఐశ్వర్యం యెక్కువగా వుంటే వుంటుంది. పైకి కవికున్న గౌరవం, మంత్రులకు వుండదు. మంత్రి నవుకర్ల తరగతివాఁడు. కవి యే తరగతివాఁడూ కాఁడు. యెంత ఐశ్వర్యం అనుభవించినా మంత్రికి జగ్గప్పా అనే సంబోధన. కవిని అలా యేకవచనంతో యే మహారాజు పిలుస్తాఁడు, పైఁగా -

1. ఎదురైనచోఁ దన మదకరీంద్రము డిగ్గి కేలూఁత యొసఁగి యెక్కించుకుంటాడు.

2. పురమేగఁ బల్లకి తనకేలఁబట్టి యెత్తుతాడు.

యింకోటి. మంత్రి రాజుకు నమస్కరించాలి. కవికో రాజే నమస్కరించాలి. కవులలో రెండు తరగతు లుండడం యెఱుఁగుదురు గదా!

1) కేవల కవులూ; 2) విద్వత్కవులు అనే యీ రెండు తెగలలో సంస్కృతకవులు సర్వులూ విద్వత్కవులే. శాస్త్ర జ్ఞానంతో మిళితమైన సాహిత్యం వుంటేనే తప్ప సంస్కృతంలో వొక్క అనుష్టుప్పు సైతం నడవదు. తెలుఁగో ఆలాటిది కాదు. మాతృభాష వుగ్గుబాలతో ప్రతీవాఁడికీ వచ్చివుంటుంది. దానితో-శుద్ధ సురన్నది రుద్రరూపమై అని ప్రారంభిస్తాఁడు. తేలిన సారాంశం, తెలుఁగులోనే కాని- కేవల కవీ - విద్వత్కవీ అనే భేదం సంస్కృతంలో పాటింపవలసి వుండదు. వెలివేసినట్టు పూర్వులు కేవల కవులను కేటాయించి- “కేవల కవయస్తు కేవలం కపయః" అన్నారు. అంటే అన్నారు గాక యీ కాలంలో - సంఫేుశక్తిః

ఇది విషయాంతరం. కవులు భిక్షాటకులుగా స్థూలదృష్టికి గోచరించినా, భిక్షాటకులు కారనే మనం తెలుసుకోవాలి. పైఁగా రాజులను (రాజ్య మదమత్తులను) భిక్షాటకులుగా చేసినట్టు - వేములవాడ భీమకవిగారి చరిత్ర ఘాషిస్తూవుంది.

సీ. “రాజకళింగగంగ్రాజు భిక్షకుఁడౌట కవివరేణ్యుల కోప కలనఁగాదె?... కరుణగల్గిన యిల్లు బంగారమౌను కరుణ దప్పిన నడవియౌగడియలోన బ్రహ్మకొడుకైన గవులకు భయముఁజెందు" (శ్రవణా) ఆ యీ సందర్భాన్ని ఋజువు చేసిన కవులు పూర్వులలో చాలామంది వున్నారు.

కాని యిటీవలివారిలో పిండిప్రోలికవిని చెప్పవలసి వుంటుంది. ఈయన పెద్ద విద్వత్కవి కాకపోయినా నిగ్రహానుగ్రహసమర్థుఁడు. విద్వత్కవులు గల సభలో నిర్భయంగా తన కవిత్వాన్ని వినిపించగలవాఁడు. యీయనకున్నూ, శిష్టు కృష్ణమూర్తి విద్వత్కవిగారికిన్నీ తఱచుగా యుక్తి ప్రయుక్తులూవాదోపవాదాలూ జరుగుతూవుండేవి. వాట్లలోయీపిండి ప్రోలికవియెప్పుడూ తీసిపోయినట్టు లేదు. దీన్ని బట్టి ఈయన నేఁటి కేవల కవుల వంటి వాఁడు కాడఁని స్పష్టం. దావు దమ్మన్నగారు యీయన లంకభూమిని యేడు పందుములు (24 యకరాలన్నమాట) పశుబలంచేత అపహరించేటప్పటికి లంకావిజయం అనేపేరుతో వొక ద్వ్యర్థి కావ్యం రచించి తనభూమిని (కోర్టుకువెళ్లకుండానే) తిరిగీ సంపాదించుకున్న అభిమానశాలి. ఆద్వ్యర్థి కావ్యానికి రావణదమ్మీయం అనినామాతరం వుంది. లంకావిజయం అనే పేరుకన్న రెండో పేరేలోకంలో మిక్కిలిగా వ్యాప్తిలోవుంది. రాములవారి భార్యను అపహరించిన రావణాసురుఁడికి పట్టిన దుర్గతే దమ్మన్నగారికి పట్టిందని చెప్పఁగా విన్నాను. నాచిన్నతనం నాఁటికి యీ లక్ష్మణకవిగారిని ప్రత్యక్షంగా యెఱిఁగిన వృద్దులు కొంతమంది వున్నారు

(1) మర్ల పేరు సౌమయాజులుగారు (యానాం ఫ్రెంచిటవును)

(2) ఉప్పులూరి రామజోగన్న సిద్ధాంతిగారు (కొత్తపల్లి ఐలండు)

వీరిద్దరివల్లనూ నాకు లక్ష్మణకవిగారినీ శిష్టుకృష్ణమూర్తిగారినీ బాగా తెలుసుకొనే భాగ్యం కలిగింది - యిందులో 1) కృష్ణమూర్తిగారు. వేదం, శాస్త్రం, సంగీతం యింకా చాలా విద్యలలో ప్రవేశంకల మహావిద్వాంసులు, మంచి కవులూను, గొప్ప రాజాస్థానాలలో పేరు ప్రతిష్ఠలు పొందిన వారున్నూ, సంస్కృతంలోనూ తెలుఁగులోనూ కొన్ని గ్రంథాలు రచించారు. చిరకాలం జీవించారు. చిన్నయసూరి, కోరాడ రామచంద్రశాస్త్రుల్లు గారు (బందరు) మొదలైనవారు వీరి శిష్యులు. దివ్యమైన అత్యాశువులో ఆకాశపురాణం (సంస్కృతంలో) చెప్పే అసదృశ ప్రజ్ఞకలవారు. కాని లక్ష్మణకవి గారి పేరు భాషా ప్రపంచంలో శాశ్వతంగా నిల్చినట్లు - (అంతఘాటుగా నన్నమాట) కృష్ణమూర్తిగారిపేరు నిలవడానికి ఆస్కారం లేకపోయింది.

1. యక్షోల్లాసం, 2. సర్వకామదా పరిణయం వగయిరాలు ఉభయ భాషలలోను ప్రబంధాలున్నాయి వీరివి. మంచిచాటువులున్నూ వున్నాయి. వున్నప్పటికీ లక్ష్మణకవిగారివి యిందులో యెన్నోవంతూ లేకపోయినా భాషా ప్రపంచంలో లక్ష్మణకవిగారు నేcటి తారలలో వొకరుగా నిల్వఁగల్గినారు. కృష్ణమూర్తిగారు వారి జీవిత కాలంలో యెంతగా ప్రకాశించినా ఒక్కపద్యం కూడా (చాటువులు తప్ప) గ్రంథాల తాలూకు కృష్ణమూర్తిగారివి నోటికి వచ్చినవారుకనుపడరు. లక్ష్మణకవిగారి రావణదమ్మీయం (చాలాచిన్న పుస్తకంలో) పద్యాలు చాలామందికి కంతోపాఠంగావచ్చును. దీనికి లంకభూమిని, అపహరించిన దమ్మన్న (ధర్మారావు) గారేకారణం. ఈపుస్తకం తప్ప లక్ష్మణకవిగారు మరియేదిన్నీ రచించినట్టులేదు. ఇదికొందరు తిట్టు కవిత్వంగా యీసడించినా మృదుమధుర పాకంలో వుంది. పేరు నిల్పింది. దీని రచనకు యీయనకు-

చ. “హయ మది సీత, పోతవసుధాధిపుఁ డారయ రావణుండు ని
     శ్చయముగ నేను రాఘవుఁడ సహ్యజ వారిధి మారుఁ డంజనా
     ప్రియ తనయుండు సింగన విభీషణుఁ డా గుడిమెట్ట లంక నా
     జయమును బోతరక్కసునిచావును నేడవనాఁడు చూడఁడీ"

అనే పద్యం (యెవరిదో జ్ఞాపకం లేదు) మార్గదర్శకం, లక్ష్మణ కవికి ఆ యీ పద్యంలో వున్న - సింగన్న పేరు కూడా తోడ్పడింది. యింతకూ చెప్పేదేమిటంటే? తగిన 'మేటరు' దొరకడంచేత లక్ష్మణ కవిగారి పేరు నిల్చేకవిత్వం వుదయించింది. కృష్ణమూర్తిగారికో అట్టి భాగ్యం పుట్టిందికాదు.

“తద్వచసైవ సార్థం విచ్ఛేదమాప భువి యస్తు కథా ప్రబంధః" అన్నాఁడు బాణమహాకవి కొడుకు.

యింతకూ లక్ష్మణకవిగారు పని పడితే ఆయుధం చూపి కార్యాన్ని సాధించేఁకవేగాని - భిక్షాటకుఁడు కాఁడని ఫలితార్థం. అయితే నాకబలి పళ్యాలకు లక్ష్మణకవిగారు వెళ్లడం వొకటి వుంది. యీ పళ్యాలంటే యేమిటో యిప్పటివారికి తెలియనే తెలియదు. నాకు యిరవై యేళ్లు వచ్చే వఱకున్నూ కవులకు, తోలుబొమ్మలకు, హాస్యగాళ్లకు, యింకా యెక్‌సెట్రాలకు కోమట్ల యిండ్లల్లో జరిగే వివాహాలలో పళ్యాలు (సన్మానాలన్నమాట) కంపల్‌సరీగా యిచ్చే ఆచారం వకటి వుండేది. ఆ యేర్పాటు మన పూర్వ జమీందార్లు యేర్పఱచి ఆయా విద్యలకు పట్టాలిచ్చివున్నారు. అందుచేత యిచ్చితీరవలసిందే కాని యెగ్గొట్టడానికి వీల్లేదు. నేను కూడా వొకటి రెండు పళ్యాలు యెత్తినవాణ్ణే మా వంశం కవితావంశం కావడంచేత ఆ గౌరవం మా ప్రాంతంలో మా వంశస్టులకు (కవిత్వం చేతకాని వాళ్లకు కూడా) వుండేది. యిటీవల కోమట్లు తెలుఁగుమీరి యివ్వడం మానేశారు. పిఠాపుర ప్రాంతం గొల్లప్రోలుగ్రామంలో కోర్డుదాఁకా వెళ్లింది యీ విషయం. దానిలో కోమట్లే గెల్చివుంటారు. పిండిప్రోలు కవిగారు పెళ్లిఅయిన సంవత్సరంలోగా యెప్పుడేనా వెళ్లి వసూలుచేసే వారఁట! సకాలంలో మీరు రాలేదు గనక యిచ్చేదిలేదని వొక కోమటి నిర్భయంగా శతాయించి కూర్చునేటప్పటికి మన కవిగారు - పిండీ ప్రోలూ లేకుండా నీయింట్లో పెండ్లేలా జరిగింది? బాగా ఆలోచించుకో జాగ్రత్త - అని కల్లెఱ్ఱఁజేసేటప్పటికి ఆ వర్తకుఁడు భయపడి కాలదోషశంక వదలుకొని పెండ్లిమామూలు యిచ్చి పంపించినట్టు చెప్పఁగా విన్నాను.

యీయన మాటలు అన్నీ యీలాగే వుంటాయి. యీయనపుట్టుకతోనే ద్యర్థికవి.

(1) కుళ్లుముండా గుడ్డుతుక్కుంటాను, బండముండా రాయియ్యవే.

(2) కమ్మకుమ్మొచ్చి పట్టుకుంది.

(3) మాదిగవల్లి శివరావెక్క డున్నాఁడు నాయనా!

యీవాక్యాలన్నీ యీయనవే. సమస్య-

'ఈశునకము కృష్ణమూర్తియే యెన్నంగన్.'

అని శిష్టు కృష్ణమూర్తిగారికి తగిలివచ్చేటట్టు వొకసమస్య యిచ్చేటప్పటికి కృష్ణమూర్తిగారికి కోపంవచ్చి -

క. “దాశరథీశబ్దమ్మును
    దాశరథిపరమ్ముఁ జేయుద్వైయర్థికిదు
    ర్ధీశక్తి బిడాలమునకు
    నీశునకము కృష్ణమూర్తియే యెన్నంగన్"

అని పూర్తిచేశారఁట! అసలు నల్లటికుక్కనుజూచి యీసమస్యను యిచ్చాఁడఁట! తరువాత ఈశునకము (బాణము) కృష్ణమూర్తి శ్రీ మహా విష్ణువు (త్రిపుర విజయంలో నన్నమాట.) ఆయన జీవితమంతా యీలాటి ప్రసంగాలతోటే వుంటుంది. రామలింగం తరువాత యీయన రెండో రామలింగమని యీ చరిత్రను బట్టి చెప్పకుంటారు.

విస్సన్నచెప్పింది వేదం అనే లోకోక్తి యేమహావిద్వాంసుణ్ణి పురస్కరించుకొని పుట్టిందో అట్టి యింద్రగంటి విశ్వపతి శాస్త్రుల్లుగారిని కూడా లక్ష్యపెట్టని యుక్తిశాలి యీ లక్ష్మణకవి.

మామా! వీదీస్తే శ్వపతివి (కుక్కవు) శ్వాదీస్తే విపతివి (వీనాం పక్షిణాం పతిః) అన్నాడట యేదో సందర్భంలో;

యీలా వ్రాస్తూవుంటే పెరుఁగుతూనే వుంటుంది. ప్రధానాంశం లక్షణకవిగారు నాగవల్లి పళ్యాలకు వెళ్లేవాఁడవడంచేత భిక్షాటకులలోకి వస్తాఁడనే వారిమాట పాటించతగ్గది కాదనియ్యేవే. ఆ పళ్యాలు కూడా క్విటురెంటు భూములవంటివిగాని యాయవారంబాపతు కావు. కాని అవి పోనుపోను నీచస్థితిలోకి వచ్చాయి.

క. "నాఁకబలి పళ్లేరమ్ముల
     నాఁకట జీవించు కుకవు లరుగుదురె"

అని మే మనడానికి క్కారణం మా రోజులనాఁటికి వాట్ల గౌరవం తగ్గిపోవడమే. కృష్ణమూర్తిగారి జీవిత కాలంలో ఆయనకున్నంత గౌరవం యేకవికీ లేకపోవడంచేత ఆయన పెద్దగా భూవసతి సంపాదించి పిల్ల జమీందారుగా ప్రకాశించారు. జీవిత కాలంలో ఆయన గొప్పవాఁడు. జీవితాంతం ఈయన (లక్ష్మణ కవి) గొప్పవారు. క్రియలో మాట - యీ వుభయులలోనూ యెవరిప్రసక్తి వచ్చినా రెండోవారి ప్రసక్తిరావడం తప్పదు. ఆయన మహా విద్వత్కవి అయినా ఆమాటను నిల్పేకవిత్వం యేదీ కనపడకపోవడంచేత “పిళ్లఃకవిరహం విద్వాన్" అన్నట్టు వ్యవహరించవలసి వుంటుంది. లక్ష్మణకవి విద్వత్కవి కాకపోయినా రచన విద్వత్కవి సమ్మతమే. కనక నేఁటి కేవల కవుల పంక్తిలో చేర్చకూడదు. యితని భిక్షాటనం “పట్టుకోకెట్టమని పెళ్లికూతురివారంటారు, పట్టుకో కెట్టమని మే మంటాం, యీ తగాయిదా తీరితేగాని పెళ్లి స్థిరపడేటట్టు లేదు." అనే వైఖరిలో వుంటుంది. యీ మాట వినీ వినడంతోడనే పట్టుచీర కూడా తెప్పించి యిచ్చి పెండ్లికి పంపించారఁట. అప్పటి పిఠాపురం జమీందారు నీలాద్రి రాయణింగారు మా ముత్తాత “రావు వేంకట నీలాద్రి రాయనృపతి, చేత సత్కృతి చెందు విఖ్యాతయశుఁడ" అని, వ్రాశాఁడు. మా ముత్తాతగారికన్న కొంచెం లక్ష్మణకవిగారు చిన్నలయితే కావచ్చును. వీరిద్దరూ కలుసు కొన్నట్లు కొందరు చెప్పగా విన్నాను. అంతేకాదు.

శ్లో. “కచభారాత్కుచ భారః కుచభారాద్భీతిమేతి కచభారః
     కచకుచభారాజ్జఘనం కో౽యంచంద్రాననే; చమత్కారః"

అనే శ్లోకంలో కొంతవివాద పడ్డట్టున్నూ విన్నాను. లక్ష్మణకవిగారు గౌరవభంగం లేకుండా రాజులవల్లనూ సంపన్నగృహస్థుల వల్లనూ జీవితయాత్ర గడుపుకొన్న మనస్వి మాముత్తాత జమీందారు స్వయంగా తన దగ్గిఱకువచ్చి కోరుకోవలసినది అని ప్రార్థించినా కోరుకోని యశస్వి. వీరిపదవులన్ని మంత్రిపదవికి చాలా పైమెట్టులోనే వుంటాయి. భీష్ముండేమన్నాడు?

"అర్థస్య పురుషోదాసః" అనలేదా? మనువేమన్నాడు; “నశ్య వృత్త్యాకదాచన"

యెంతపెద్ద ఐశ్వర్యాన్ని అనుభవించే వారైనా, “శాకం పచతి స్వేగృహే" తెగలోవుండే నిస్పృహులకు (నిస్పృహస్య తృణంజగత్) దాసోహం అనడానిక్కారణం అందరికీ గోచరమే.

మాగాపు శరభకవిగారిపేరు వినడమేకాని పెద్దాపురపు రాజుగారు సదరు కవిగారిని యెప్పుడూ సందర్శింపని కారణంచేత రాజుగారు స్వయంగా ముమ్మిడివరం దాపునవున్న మాగాంగ్రామానికి వెళ్లేటప్పటికి పుట్టగోచీ పెట్టుకొనిదొడ్లో అరఁటితోఁటలో యేవోపాదులకు గొప్పుతవ్వుతూ (రాజరు దెంచునప్పటి కరంటులతోఁటకు గొప్పు) శరభకవిగారు కనపడేటప్పటికి రాజాగారు కవి వినేటట్టు “ఇతఁడేనా శరభకవి" అనేటప్పటికి కవికి మనసునొచ్చి అరవైపద్యాలు యీ క్రింది శైలితో ఆశువులోచెప్పి రాజుగారిని నిర్ఘాంతపోయేటట్టుచేసేట్ట. అందులో వొకపద్యం మాత్రం నాకిప్పుడు కొంచెం తరువాయిగా జ్ఞాపకంవుంది. శైలికి వుదాహరిస్తాను.

మ. “ఇతఁడా రంగదభంగసంగరచమూ హేతిచ్చటాపావకో
      ద్యత కీలాశలభాయమానరిపురాడ్ధారా శ్రుధారా నవీ
      నతరంగిణ్య బలాసమా (కొంతమఱిచాను) ... ... ...
      ... ... ... వత్సవయి తిమ్మక్ష్మావిభుండీతఁడా?"

యెందు కీలా చెప్పవలసి వచ్చిందో స్పష్టంగా తెలుస్తూనే వుంది. అయినా కొంచెం వివరిస్తాను. తనకు నేను నౌకరునుగాను. ఇండిపెండెంటు తరగతిలో వాణ్ణి. యెప్పుడూతన దర్శనానికి వెళ్లలేదు. కనక నన్ను చూడడానికి రావడం బాగానేవుంది. కాని, ఈయనా? అని అనక, నిస్సాకారంగా నన్ను ఇతఁడా? అని అంటాఁడా? సరే! ఆయన నన్ను వొక్క సారి - ఇతఁడా అన్నాఁడు కనక ఆయన్ని నేను 60 సార్లు “యితఁడా?" అంటే సరిపోతుంది అని శరభకవిగారు. ఆ విధంగా తన సామార్థ్యాన్ని ప్రకటించారని చెప్పుకుంటారు. ఆ యీ ధార చూస్తే శంకరకవిగారి హరిశ్చంద్రోపాఖ్యానంలో వున్న

మ. “అకటా! చేరెఁడునేలకున్ దగఁడె? సప్తాంభోధివేష్టీభవ,
      త్సకలద్వీపకలాప భూపమకుటాయ త్పద్మరాగోజ్వల
      త్ర్పకటానర్గళ నిర్గళత్సుభగ శుంభత్పాదుఁడై నట్టి రా
      జకుమారుండని యేడ్చెఁ గన్నుఁగవనశ్రుల్ కాల్వలై పాఱఁగన్."

అనే పద్యానికికూడా మించినశైలితో వొకటిగాదు రెండుగాదు 60 పద్యాలు నిల్చున్న పాళాన్ని నిల్చున్నట్లుగానే ఆశువులో రచించిన శరభకవికి యెంతటి విద్వత్తువుందో యెవరునిర్ణయిస్తారు? అట్టిశరభ కవికి తగినప్రసక్తి యేదీ తటస్థంకాక యేదీ రచించినట్లు కనపడదు. లేదా, రచించినప్పటికీ, ఆ రచన కాలగర్భంలో లీనమైపోయిందో! మనకు కావలసింది ఆ యీ మాదిరి కవులు రాజులను అవసరాన్నిబట్టి యాచించినప్పటికీ భిక్షాటకులుగా పరిగణింపఁ బడరనియ్యేవే. తగిన పాత్రం దొరకని రాజులు తరించడానికి వీరే ఆధారభూతులుగా వున్నట్టు కనపడుతుంది. ధర్మాత్ములుగా వుండే మహారాజులు అయిపుట్టినవాళ్ల కాళ్లు గడగడానికి సమ్మతింపక వేదాధ్యయనపరులకూ, శాస్త్రజ్ఞులకూ, మహాకవులకూ అగ్రహారాదులు సమర్పించినట్లు కనపడుతుంది. కొన్నితరాలనుండి ప్రతిగ్రహ దోషం యెఱుఁగనివారిని - అప్రతిగ్రహీతలుగా వాడతారు. ఆలాటివారిని జమీందారులు కొందఱు మోమాటపెట్టి భూమివగైరాలు స్వీకరింపచేసిన యితిహాసా లెన్నో ఉన్నాయి. పెద్దాపురపు రాజుగారు చాలాభూములు ఆవిధంగా యిచ్చినవే. అయితే ఆరోజులలో పదిరూపాయలు యివ్వడం కంటె పదికుంచాలో, పదియెకరాలో యివ్వడమే తేలికగా వుండేదని చెప్పేమాట కూడా కొట్టేయ తగ్గదికాదు. సామాన్యులకందఱికీ అన్వయించే మాట కాదు గాని కాస్త నామరూపాలుగల కవులెవ్వరుగాని - భిక్షాటకులు కారనే చెప్పవలసివుంటుంది. అగ్రహారాలు వుండిన్నీ అవితిన్నగా ఫలించకపోవడంచేత యాచనకు గురికావలసివచ్చిన కవులు కొందఱు వున్నట్టు కనపడుతుంది.

చ. “గరిసెలవ్రాఁతె కాని యొకగంటెఁడెఱుంగను మన్నెదేశముల్
     దిరిగి సమస్త వస్తువులు దెచ్చిభుజింతును సార్వకాలమున్
     సురుచిర సత్కవిత్వనిధి సూరకవీంద్రుని కేలగల్గెఁగం
     చరయును, రేగ మేకమెడచన్నుల పోలిక రెండు గ్రామముల్"

ఆయీపద్యం తురగా రామకవిగారికి సమకాలీనుఁడు అడిదం సూరకవిగారిది. దీనిలోవున్న - కంచర – రేగ ఈరెండుపల్లెలున్నూ సూరకవి గారి సర్వదుంబాల అగ్రహారాలు. వీట్లపంటకు సంబంధించిన చెరువుకు చుట్టరికంగలవే “కదులుమిట మాని దివ్యగంగాభవాని" అనేమకుటంగల సీసాలు. ఆచెరువు నీటిముంపువల్ల తన అగ్రహారానికి చిక్కువచ్చి చెరువు నీరు కొంత తగ్గించే వుపాయం చేయవలసిందని సూరకవిగారు కోరితే జమీందారులు తమ రయితులకు దానివల్ల నష్టం తగులుతుందని అంగీకరించారు కారనిన్నీ ఆపిమ్మట పైని వుదహరించిన మకుటంతో కొన్ని పద్యాలు చెప్పి ఆ వుపద్రవాన్ని తొలగించు కున్నారనిన్నీ చెప్పుకోవడం పలువురు యెఱిఁగినదే. ఆ పద్యాలు జ్ఞాపకంలేక వుదహరించ లేదు. గతమైన కవుల వృత్తాంతాలు పరిశీలిస్తే కవులు భిక్షాటకులుగానూ కనపడతారు, భాగ్యవంతులుగానూ కనపడతారు.

“సుకవితా యద్యస్తి రాజ్యేనకిమ్" అనివుండడంచేత ధనద్రవ్యాదుల మూలకంగా కాకున్నా కవిత్వంచేతనే కవులు భాగ్యవంతులు అనిసరిపెట్టుకుంటే సరిపోతుంది. లోకంలో ధనార్జనకు యేర్పడ్డవృత్తులు నాల్గేకనపడుతాయి

శ్లో. "వాణిజ్యే వర్తతేలక్ష్మీ స్తదర్థం కృషికర్మణి,
      తదర్థం రాజసేవాయాం భిక్షాయాం నైవనైవహి."

లోకంలోవున్న వృత్తులలో కవులుచేసేవృత్తి నాలుగోదిగానే కనపడుతుంది. కొందఱు కవులు రెండోవృత్తిని అవలంబించిన వారున్నారు. కాని వారు దానిలో ధనవంతులు కాలేదు.

1) “తదఖిలం త్యక్తాశ్రితస్త్వామహం” అన్నాఁడు వ్యావసాయకుఁడుగా మాఱిన కుట్టికవి దున్నపోతు ప్రభువునుగూర్చి అతఁడే-

‘శిష్టం మే త్వలమల్లకం" అనిన్నీ అన్నాఁడు తుట్టతుదకు. అలమల్లకంఅంటే, కౌపీనం, శ్రీనాథుఁడేమో:- .

"బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి, నెట్లుచెల్లింతుడంకములేడునూర్లు"

అంటూ విచారించాండు, పోతరాజుగారేదో విధంగా

“పంచమే౽హని షఫ్టేవా శాకం పచతి స్వేగృహే"

అనేశ్లోకార్ధానికి లక్ష్యభూతులై కాలక్షేపం చేశారు. బాగా పరిశీలిస్తే కవులవృత్తి కాళిదాసుగారు నిర్ణయించిన భిక్షాటనంగానే తేలుతుంది. యేకొందఱు కవులకో రాజులు అగ్రహారాలుయిచ్చి సన్మానిస్తూ వుండటంకలదు గాని అది క్వాచిత్కం. యెవరోపెద్దన్న గారివంటివారు "కోకట గ్రామాద్య నేకాగ్రహారాలను" సంపాదించినవారున్నా అందఱూ (నఖలు సర్వో౽పివత్సరాజః) తాదృశులు కారు. యీవిషయంలో కవులకూ, గాయకులకూ యెంతోతేడా వుండదు. కవులకంటె గాయకులే అదృష్టవంతులని ఎవరో కవి చెప్పిన శ్లోకంవల్ల గోచరిస్తుంది. దాన్ని కొంచెం వుదాహరిస్తాను.

శ్లో. “నవటా నవిటా నగాయకా
     నచ సభ్యేతర వాదచుంచవః
     నృప మీక్షితు మత్ర కేవయం
     స్తన భారానమితా నయోషితః’

యీ అర్థాన్నే బోధిస్తుంది వొక పద్యం.

మ. "కవితల్ నేర్చినఁ బాటపాడిన వృథా కష్టంబు లోకమ్ములోఁ
       బువుఁబోడుల్ కడుభాగ్యశాలినులహో! పుంస్త్వంబు . .
       చవివుట్టన్ సొగ సిచ్చి యించుక ... ... బెట్టి పుట్టింప నీ
       యవనీశాళి సమస్త మిచ్చును గదా; హా! పాపపున్ దైవమా!

కుట్టికవి మహిషశతకాన్నిబట్టి చూచినా మహాకవులలో నూటికి 19 మంది దారిద్ర్య దోషానికి గుఱి కావలసి వచ్చినట్టే కనపడుతుంది.

1) శ్లో. "ఆర్య శ్రీధర మంబుదీక్షిత మిమౌ దృష్ట్యా మహాపండితౌ,
         ............................ సకలం త్వం మే లులాయప్రభో"

2) శ్లో. “ఖ్యాతః కుట్టికవిస్తు దుర్ధనిగృహ ద్వారేషు నిద్రాయతే"

3) శ్లో. "తేషాం వక్రవిలోక నాత్తవవరం ... కోశేక్షణమ్”

ఇత్యాది శ్లోకాలు పరిశీలిస్తే లోకోత్తరులైన కవులందఱూ ధనికుల నాశ్రయింప వలసినట్లే కనపడుతుంది. కవులకన్న గాయకులకు యింకో చిక్కు కవియెక్కడికో కట్టుగుడ్డలతో - లేడికి లేచిందే ప్రయాణం' అన్న విధంగా వెళ్లి యే దాతనో

సీ. “బళిబళీ! మీతాత బళ్లెమ్ము చేఁబూని పుల్లాకు తూటుగా బొడిచినాఁడు"

అంటూ స్తోత్రం చేసి దుడ్డో దుగ్గాణో తెచ్చుకుంటాఁడు. పాపం గాయకునికి అట్టి వీలులేదు.

1) “అగస్త్యుఁ డొకయెత్తూ, కమండలం వొకయెత్తూ, 2) సెట్టి సేరూ లింగం సవాసేరూ” అన్నమాదిరి, తంబూరాగాని, వీణగాని, ఫిడేలుగాని మోసుకుపోవాలి. యెక్కడి క్కడ మద్దెగాఁడు కుదరాలి. కుదిరితే మాత్రం, వాఁడికీవీఁడికీ జత కుదరాలి. యిదంతా కుదిరి పాటకచేరీ జరిగితే-

“ఈ సభలో నింతకు లాభ మేమొ యనుచున్ సందేహం”. అందు చేతనే అనుకుంటాను గాయకులు వారివారి సంతతికి యే యింగ్లీషు ముక్కలో చెప్పిస్తారుగాని గానంలో ప్రవేశపెట్టడం సకృత్తుగాకనపడుతుంది. యే హరి నాగభూషణం వంటిఛాందస గాయకులో తప్ప తమ తమ సంతానాన్ని గానంలో ప్రవేశపెట్టడమే లేదు - నాగభూషణంగారేనా నామాదిరిని కొడుకులకు - ఏ.బీ.సీ.డీ.లు కూడా రాకుండే పద్ధతిలో వుంచలేదు. కొంచెం రాజకీయ విద్యలోనూ పరిచితి వుందనిపించినట్లే. నాగభూషణంవంటి గాయకులు యీ కాలంలో అరుదనే చెప్పాలి. ఏమంటే ఇంగ్లీషులో బీ.యే. ఫస్టుగ్రేడు ప్లీడరూ, అసలు బి.యల్. ప్యాసయి అడ్వొకేటు అనిపించుకో తగ్గవాఁడే, కాని దానికి అంతకుముందు గర్భంలో పడ్డ రోజుల్లోనే అవలంబించిన సంగీతం బాధించి, అంటే (అంతాయింతా కాదు. సంగీతముచేత బేరసారము లుడిగెన్" అన్నమాదిరి నన్నమాట.) ఫస్టుగ్రేడు ప్లీడరు కావలసి వచ్చింది. అంతవరకూ సంగీతానికీ యింగ్లీషుకీ సమంగానే తన కాలాన్ని వినియోగపఱచేవాఁడు. కాని ఆ చెన్నపట్నంలో యెవరో - అయ్యరుగారి ఫిడేలుబాణీ విని ఆమాదిరిని వాయించాలని దీక్ష కలిగి యింగ్లీషు చెట్టెక్కించడంచేత - రాజకీయ విద్యలో మార్కులు లోపించాయి. బీ.యల్. కాలేకపోయి పిదప ఫస్టుగ్రేడుగా మాఱేఁడు. యీలాటివారు నామిత్రవర్గంలో యింకొకరున్నారు. వారు పూర్వాశ్రమంలో కే. టీ. రామారావుగారు - వీరు యమ్.యే. డిగ్రీపొంది కాలేజీలో లెక్చరరుగా రు. 100-0-0ల జీతంలో వుండిన్నీ బి.యల్. పరీక్షకు చదివేనిమిత్తం చెన్నపురి వెళ్లి అక్కడ ప్రస్థానత్రయం చదవడాని కారంభించి తుదకు తత్ఫలితం అనుకూలించి “పరమహంసలు'గా పరిణమించి ధన్యులైనారు. నాగభూషణంగారు యిటీవల - ప్రస్థానత్రయ శాంతిచేశారు. చాలా నిష్ఠాగరిష్ఠులు, సంస్కృతంలో మంచి పాండిత్యం, ఉభయ భాషలలో కవిత్వం వొకటేమిటి? మన ప్రాంతంలో యిన్ని విద్యలు వచ్చి యింత సదాచార సంపత్తి కలిగిన శిష్టులింకొకరు లేరేమో (ఛాందసత్వం సరేసరి) అనిపిస్తుంది. గానంలో చెన్నపట్నం వెళ్లకముందే నా ముందర తుంబురు నారదులు పనికిరారనే అభినివేశం వుండేది. (ఆయీ విషయం యితరత్రభంగ్యంతరంగా వ్రాసినట్టే జ్ఞాపకం) గాని నేనూ, కే.టీ. రామా రావుగారూ, యింకా కొందఱూ యీతనికి ప్రతిపక్ష గాయకులను అభిమానించే తెగ. యెడ్డెమంటే? తెడ్డెం'గా వాదిస్తూ వుండేవాళ్లం. ధనకోటి, నాగరత్నం, భవాని మొదలైన సుప్రసిద్ధ గాయనీమణుల సంగీత సభలు జరిగినప్పుడు శ్రీయుతులు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రులవారికీ గఱకపర్తి కోటయ్య దేవరగారికీ ఫ్రీ టిక్కెట్లు పంపించడం సరేసరి కాని, వారితోపాటు నాకూ, శ్రీ కే.టీ. రామారావుగారికీ కూడా వచ్చేవని జ్ఞాపకం.

నాగభూషణంగారు అప్పటికీ సుమారు యిరవైయేళ్ల వయస్సులో వుండేవారు. బహుశః, బి. యే. క్లాసు విద్యార్థిదశలో వుంటారని తోస్తుంది. యీయనకు - ఫ్రీ టిక్కెట్టు పంపేవారు కారు. పోనీ అని గుట్టుగా వూరుకోవచ్చునా? అలా వూరుకోక అస్మదాదులతో కొంత సంఘర్షించడం వుండేది. దాన్ని గురించి వ్రాయవలసివస్తే చాలా పెరుగుతుంది. నేనూ, రామారావుగారూ యీ నాగభూషణంగారిని చాలా తేలికగా చూచేవాళ్లం అనేది భూతార్థం. యిటీవల నాగభూషణంగారు విశిష్టత్వాన్ని గానంలో సంపాదించాక కూడా దానిలో రహస్యాలు మాకేం తెలుస్తాయి

ఉ. "చేరువవాడపల్లి నరసిమ్ముఁడితీరత మోయి బోగమ
     మ్మోరులయాట సుస్తివరిముంగల దేముఁడదెంత యిద్దెలో
     తీరుపయాసగంటి నొకతిత్తిని గుక్కిడఁకూఁదువాని కా
     లూరక మొక్క బుద్దగు నహో! యను మూర్ఖుఁడు చంద్రశేఖరా!"

అన్నట్టుంటుంది మాబోట్ల రసజ్ఞత్వం. ఆయన కొంతసేపు గానకచేరీ చేసి నాదబ్రహ్మముగా మారిపోయి పీఁటదగ్గిఱమాత్రం కమాను ఏకొంచెమో నడిపీ నడపనట్లు నడుపుతూ వుండే వైఖరి నూత్నదంపతులు క్రీడాగృహంలో సల్లాపిస్తూన్నట్లు - అనఁగా?

శ్లో. "కిమపి కిమపి మందంమంద మాసత్తియోగా
     దవిరళిత కపోలం జల్పతోః" (భవభూతి)

అన్నట్టుగా వుండిన్నీ యావత్తు సభకూ వినపడుతుంది. ఆ వినికికి కారణం సభవారు నిస్తరంగసముద్రులుగా మాఱడమైనా కావచ్చును. ఆలా మాఱడాని క్కారణం యేమిటంటే, వేఱే చెప్పనక్కఱలేదు. ఆ సమయంలో యేమాత్రం యెడమచేతి వ్రేలు ప్రమాదానికి గుఱి అయినా - గోవిందా! అని గాయకుఁడు పాతాళ గర్తంలో కూలవలసిందే. ఆ జ్ఞానమంతా యెడమ చేతిదే, పాపం! భగవంతుఁడు ఆ చేతియందే తన తేజాన్ని లోపింపఁ జేశాఁడు. ఆ యీ తన పోకడ కొడుకుల కలవాటు పడక పూర్వమే యీ అపకారం జరిగింది. ఆ అపురూపపు పోకడ (దక్షిణ దేశంలో కాదు) మన తెలుఁగుదేశంలో పోయేవారున్నారో లేదో? ఉంటారే అనుకుందాం, యిది గానంగాని కవిత్వం కాదు. మర్మం విడిచి కొడుక్కు కూడా గాయకులు చెప్పరని కింవదంతి. అట్టి స్థితిలో యెవరు చెపుతారు

శ్లో. “యాతే దివం పితరి తద్వచనైవ సార్థం
     విచ్ఛేదమాప భువి యస్తుకథా ప్రబంధః"

అన్నాఁడు బాణమహాకవికొడుకు ఉత్తరకాదంబరిలో - అక్కడ బాణుఁడు స్వర్గానికి వెళ్లడంచేత ఆ దుర్యోగం పట్టింది. ప్రస్తుతం, నాగభూషణంగారు సజీవులై దీర్ఘాయుష్మంతులై కొంత ఆరోగ్యంలో (ఫిడేలుకు మాత్రం పనికిరానిస్థితి) వుండఁగానే దుర్యోగం పట్టింది. యిప్పడెవరేనా నాగభూషణంగారిని నీకు సంగీతంలో యేమీ రాదని అన్నా వూరుకోవలసిందే. శ్రీరాముఁడేమన్నాఁడు పరశురాముణ్ణి -

“పటచ్చరీభూతా ఖల్వియం కీర్తిపతాకా, నన్విదానీమేవ ద్రష్టవ్యమ్"

రామునివంటి నిషధయోగ్యుఁడే ఆవిధంగా ప్రశ్నించినపుడు యితరులు ప్రశ్నించరను కోవడానికి వీలుంటుందా? మనదేశానికి పేరుతెచ్చిన శ్రీనారాయణదాసుగారు, నాయుఁడుగారు లోనైనవారిలో - నాగభూషణంగారొకరు. సంగీతానికి వుపయోగించక పోయినా యితర గాయకులలో (నారాయణదాసుగారికి వినా) పలువురికిలేని ప్రజ్ఞలు నాగభూషణంగారికి వున్నాయి-

'ఇదం బ్రాహ్మ్య మిదం క్షాత్రం' అనే శ్లోకానికి నాగభూషణం గారు ప్రథమోదాహరణం కావడంలో అత్యుక్తి వుండదు కాని ఆ యితర విద్యలే యీయన్ని అస్మదాదుల తరగతిలోకి ఆకర్షించి - భిక్షాటకులా? అనే శీర్షిక కింద వుదాహరించి కొంత వర్ణించడానికి అవకాశం కలిగించినది. యీయన కవి, ప్లీడరు, సాహితీవేత్త, వేదాంతి, ఛాందసుఁడు. ఆ యీ లక్షణాలలో ప్లీడరీ తప్ప తక్కిన చిహ్నాలు అస్మదాదుల తరగతిలోకే ఆకర్షిస్తాయి. ఆకర్షిస్తే ఆకర్షించనివ్వండి, నాకు ఆ యీ తరగతియందే యెక్కువ ప్రేమ. అందుకే

మ. "పరమాదృష్టము పెట్టి పుట్టినటులేభావించి గర్వింతు, దు
       స్తరమీ హూణశకమ్మునం దితరభాషన్ బొట్టకై నేర్వకే
       సురభాషన్ బఠియించి యక్కతన సంస్తుత్యుండనై మించితిన్
       సిరియున్ సంపద కూడ నీ కరుణచేఁ జేకొంటిఁ గామేశ్వరీ.”

యేదో యీ విధంగా వున్నదానితో సంతృప్తి పడాలిగాని గొంతెమ్మ కోరికలు కోరడం మొదలిడితే “మనోరథానా మతటాః ప్రవాహాః".

భర్తృహరి యేమన్నాఁడు? “మనసిచ పరితృప్తే కో౽ర్థవాన్ కోదరిద్రః" అనలేదా? యీ మనస్సుకు తృప్తంటూ వుందా? తృష్ణకు అంతమంటూ వున్నట్టు తోఁచదు. “తృష్ణా నజీర్ణా, వయమేవ జీర్ణాః"

కవులూ, గాయకులూ ఐశ్వర్యానికి వొక విధమైన నోమే నోఁచినా చిల్లరదుకాణం పెట్టడానికి సంశయించకపోతే గాయకులకు పట్నవాసాలు కొంచెం జీవనాన్ని (శిక్షల ద్వారా) కలిగిస్తాయి. యిప్పుడు పెండ్లికూఁతురుకు కావలసిన క్వాలిఫికేషనులో సంగీతం వొకటి. నిన్నమొన్నటిదాఁకా సంగీతం వుంటే సరిపోయేది. ఇటీవల మఱొకటి చేర్చారు. యింగ్లీషు స్కూలు ఫైనలు దాఁకానేనా వుండాలి. పూర్వం యెవరో కవి “కన్యా పితృత్వం ఖలు నామ కష్టం" అని తన మనోదుఃఖాన్ని వెలువరించాఁడు. అప్పటికింకా యీ చిక్కులు గోచరించనేలేదు. అయితే కొంచెం దూరాలోచన చేసి చూస్తే ఆయీ క్వాలిఫికేషన్సు కల కన్యలకు వివాహంచేసేభారం తల్లిదండ్రుల మీఁద వుందనుకోవచ్చును. “అజ్భిన్నం పరేణ సంయోజ్యం" అన్నట్టు స్కూలులో వుండఁగానే యెవరో స్వయంవరంగా పరిగ్రహించడం తటస్థించే యెడల తండ్రి వరాన్వేషణానికని, హైస్కూళ్లూ కాలేజీలూ పరిశీలించడానికి ఆయా తరగతుల టీచర్లనీ, లెక్చెరర్లనీ ఆశ్రయించడం బాధ నూటికి 99 పాళ్లు తప్పిపోతుందని సంతోషించవచ్చు ననుకుంటాను. అప్పడల్లా వివాహంచేస్తే సరిపోతుంది. కుల గోత్రాదులు పెట్టుకోనక్కఱలేదు. ఆ యీ పద్ధతి అమల్లోకే వస్తే గేస్తులు కణ్వమహర్షులుగా పరిణమిస్తారు. యిది మన భారతదేశాచారమేకాని ఖండాంతరాచారం కాదనడానికి శకుంతలాసతియే చాలును. శారదాబిల్లు వచ్చి అయిదురోజుల పెళ్లిని వొకరోజులోకి తెచ్చింది గాని ఆవొకరోజేనా యేవో మంత్రాలు తంత్రాలూ మంగళ వాద్యాలూ చుట్టాలూ పక్కాలూ భోజనాలూ పిండివంటలూ యింకా తప్పడంలేదు, యీ పిమ్మట లోcగడ వుదాహరించిన క్వాలిఫికేషన్సు పద్ధతి అమల్లోకి వస్తే "కరగ్రహః ప్రథమమభియోగః" అన్న గోవర్ధనాచార్యుల సప్తశతిశ్లోకమే పురోహిత స్థానాన్ని అలంకరిస్తుంది.

మన నాగరికత "ప్రతిక్షణ విజృంభణాదుభయ బాహుకూలం కషస్తనత్రుటిత కంచుకం నమత యావనం యోషితామ్” అన్నరీతిని విజృంభించడం చాలా అభినందనీయం. యీ సందర్భమేనా నిర్బంధ కట్నాలను వారిస్తే బాగుండును. కొన్ని శాఖలలో విద్యనిబట్టి, ధనాన్ని బట్టి, భూమినిబట్టి గౌరవాన్నిబట్టి కట్నాల తారతమ్యం వుంటుంది. కొన్ని శాఖలలో విద్యాదులేమీ ఆవశ్యకంలేదు. పెండ్లి కొమారుఁడు, అనేడు ప్రత్యయానికే అట్లీస్టు నాలుగువేలు పయిగా చెల్లించాలి. ఆయీ మహాఘోరం యిరవయ్యో శతాబ్దారంభాన్నుంచి మొలకెత్తింది. యిప్పుడు బాగా పెరిఁగిపోయింది. యీ కట్నం అడగడంలో అడగనట్లు అభినయించే వారు కొందఱు. మచ్చు చూపుతాను, ఒక వియ్యాలవారంటారు కదా? “అయ్యా! మాకు యేమీ కట్నంతో అవసరంలేదు. ఉభయఖఱ్చులు పెట్టి పెండ్లి సలక్షణంగా చేసి పంపండి. అల్లుఁడు కట్నం కోరలేదు గనుక పెండ్లికూఁతురుకు నగలు పెట్టండి. మీరే మీ పిల్లకు నగలు పెట్టుకోండి." యిది కవుల భిక్షాటనానికంటే కూడా పైతరగతిలోకి దేఁకుతుంది. యేదో వ్రాస్తూ దేనిలోకో వచ్చాం. అసలేమో వ్యాసం కవుల భిక్షాటనాన్ని గుఱించి ఆరంభం. ముగించే సమయానికి గాయకులు వచ్చి కలిశారు. అంతలో నేcటి పెండ్లి కట్నాలు వచ్చి కలిశాయి. మంగళాంతంగా వ్యాసం ముగించడం శ్రేయః ప్రదమే కదా! కవులు భిక్షాటకులు కారని సమర్ధించడానికి కలం చేతఁబట్టినా తుదకు అభీష్టార్థసిద్ధి కాలేదనుకుంటాను. భిక్షాటకులు కాకపోతే రసజ్ఞ లోకానికి మంచి కవిత్వం వుదయించదు, యేమంటారా? ఆపక్షంలో కవి యిల్లు కదలనే కదలఁడు. అప్పుడు

1) శ్లో. “మద్గేహే మశకీవ మూషికవధూర్మూషీవ మార్జాలికా,
         మార్జాలీవ శునీ శునీవ గృహిణీ వాచ్చాః కిమన్యే జనాః."

2) శ్లో. “క్షుత్తృ డాశాః కుటుంబిన్యో, మయి జీవతి నా౽న్యగాః;
         తా సా మంత్యా ప్రియతమా, తస్యాశ్శృంగార చేష్టితమ్”

3) శ్లో. “ఆరనాళగళ దాహశంకయా మన్ముఖాదపగతా సరస్వతీ”

4) క. “శీతల సలిలస్నానము
         భూతలమున శయ్యయొంటిపూట మెతుకులు
         న్నాతిగల బ్రహ్మచర్యము
         నాతరమా? రోజు గడపనారయభూపా!"

5) శా. "వేధన్ దిట్టఁగరాదుగాని భువిలో విద్వాంసులన్ జేయనే
          లాధీచాతురిఁ జేసెఁ జేసిన గులా మాపాటుతోఁబోకక్షు
          ద్బాధాదుల్ రచియింపనేల? అది కృత్యంబైన మూఢాత్ములన్,
          ఛీ! ధాత్రీశులఁ జేయనేమిటికయా! శ్రీకాళహస్తీశ్వరా!"

6) “శా. సంతోషించితిఁ జాలుఁజాలు బహురాజ ద్వారపౌఖ్యములన్
          శ్రాంతిన్ జెందితిఁ జాలుఁజాలు రతిరాజ ద్వారపౌఖ్యమ్ములన్
          శాంతిన్ జెందెదఁ జూపు బ్రహ్మపదరాజ ద్వారపౌఖ్యంబు ని
          శ్చింతస్వాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వరా!"

7) “తిండికైతె పదిమంది వసంతి, తండులాలు గృహమందునసంతి
         రండనా కొడుకు లెల్ల హసంతి కొండగోగులు గృహేవిలుఠంతి"

కవులు ఆగర్భశ్రీమంతులుగా వుండే పక్షంలో ఆ యీపూర్వోక్త రీతిని చక్కని కవిత్వం వెలువడ దని ఆలోచించే అనుకుంటాను బ్రహ్మదేవుఁడు కవులను నొకవిధమైన భిక్షాటన తరగతిలో సృజిస్తాఁడు. బ్రహ్మ దేవుఁడు ఆలోచించి, ఆలోచించి కవులనూ, గాయకులనూ పూర్వోక్త విధంగా సృష్టించినా ఆ యీ రెండు తెగలలోనూ కొందఱు తమ స్వాతంత్ర్యాన్ని నిల్పుకుంటూనే జీవయాత్ర సాగించినట్లు కనపడుతుంది-

చ. "నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక దెచ్చి యిచ్చుక
      ప్పురవిడె మాత్మకింపయిన భోజనముయ్యెల మంచ మొప్పుఁద
      ప్పరయురసజ్ఞు లూహదెలియంగల లేఖకపాఠకోత్తముల్
      దొరికినగాక యూరకకృతుల్ రచియింపు మటన్న శక్యమే”

ఆ యీ పద్యం రాయలకు యేదో సందర్భంలో పెద్దన్నగారు యిచ్చిన జవాబు. దీనిలో కవి తనకుఁగల స్వేచ్ఛను వెలువరించాఁడు. శ్రీ విజయనగర సంస్థాన గాయక శిరోమణులలో వొకరైన, కీ.శే. శ్రీ కలిగొట్ల కామరాజుగారిని గూర్చి చిత్రంగా చెప్పుకుంటారు. పల్లవిలో ఈ మహనీయుఁడు అద్వితీయుఁడని చెప్పఁగా వినడం. ఆ యీ గాయక శిరోమణి తనకు తోఁచినప్పుడేగాని ప్రభువు కోరినా పాడే ఆచారం లేదని వినికిడి. శ్రీ పరవస్తు రంగాచార్లయ్యవార్లంగారు, తమ యేర్పాటు ప్రకారమైతేనేగాని విజయనగర సంస్థానంవారి ఆస్థానానికి వెళ్లడానికి వొప్పుకొనేలేదు - ఆ యేర్పాట్లు. 1) సవారీతో కోటద్వారం వఱకూ వెళ్లడం, 2) అక్కడ సవారీ దిగి పాదుకలతో సభవఱకూ వెళ్లడం. 3) అక్కడ పాదుకలు వదలి సభకు వెళ్లి సభలో చిత్రాసనంమీఁద కూర్చోవడం.

ఆ యీ మూఁడింటలోనూ మూఁడవదానికి శ్రీ మహారాజావారు చెప్పిన అడ్డంకి యేమిటంటే? స్వామీ! సభలో మీరు చిత్రాసనం మీఁద కూర్చుండడానికి మాకేమీ అభ్యంతరం లేదుకాని ఆ సందర్భం మా పండితుల కవమానకరంగా వుంటుంది గనుక అంగీకారం కాదన్నారనిన్నీ ఆ పద్ధతిని - మేము రానే రాము అని ఆచార్యులవారు నిరాకరించా రనిన్నీ మాపరమ గురువులు చెప్పఁగా విన్నాను - యెవరోతప్ప మహావిద్వాంసులు గాని మహాకవులుగాని మిథ్యాస్తవాలు చేయరు, ఒక షట్ఛాస్త్రవేత్త మహాపండితునకు, ఒక మహాసంపన్నుఁడు నూటపదహాఱు పెద్దకాసులూ సేలువులూ యిచ్చి సన్మానించాఁడు. ఆ యీ సన్మానం వేఱొక పండితుని ప్రయత్నంమీఁద జరిగింది. ఆ ప్రయత్నించిన పండితుఁడు ఆ గృహని గూర్చి కొంచెం శాఘించవలసిందని హెచ్చరించే టప్పటికి ఆ మహావిద్వాంసుఁడు శ్లాఘించిన వాక్యం యిక్కడ వుదాహరించేది లేదు - తాత్పర్యం వ్రాస్తాను.

మీ యిల్లు యిల్లులాగ లేదు. అనఁగా, యేదో మహారాజు గృహం లాగవుందని శ్లాఘించినట్లయింది. కాని దానిలో నుంచి వ్యంగ్యం తీస్తే ఆగృహస్థు యేకులంవాఁడో ఆ కులాన్ని యీసడించి నట్లయింది. అష్టకష్టాలు లోకంలో ప్రసిద్ధం. అందులో మిథ్యాస్తవం చేరలేదు, కాని చేరతగ్గదే. దానిలో యేకొంచెమో గుణంవుంటే “పరగుణపరమాణూన్ పర్వతీకృత్య" అనేది పెంపుచేసి ప్రసంగించవచ్చును గాన కేవలం నిర్గంధ కుసుమాలని గూర్చి ప్రశంసించడం చాలా కష్టం. ఆ యీ బాధ కవుల కప్పడప్పుడు కలుగుతూ వుంటుంది. 1) "మాతర్నాతః పరమనుచితంయత్ఖలానాంపురస్తా దాస్తాశంకం జఠరపిఠరీ పూర్తయే నర్తితాని” (లీలాశుకుఁడు)

2) “అరసికాయ కవిత్వనివేదనం శిరసి మాలిఖ మాలిఖ" చూ

యీవిధంగా పలువురు కవులు తమ పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చి వున్నారు, యేమైనా సరే అంతో యింతో కవి భిక్షాటకుఁడుగా వున్నప్పుడే కొంత అందం వుంటుంది. ఆగర్భ శ్రీమత్త కవిత్వానికి సహాయపడదు.

“తిరుగంగవలె దేశదేశాల వెంబడి
 పడవలెఁ బడరాని పాటులెల్ల... ... ... ...
 కవులు కవులన్న మాత్రాన కవులుగారు
 విజయనగర మహారాజ విపులతేజ!"

★ ★ ★