Jump to content

కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/"శుభస్యశీఘ్రమ్"

వికీసోర్స్ నుండి



“శుభస్యశీఘ్రమ్”

అయ్యా! "సంధిమిచ్చంతి సాధవః" అనే లోకోక్తి ననుసరించి మీరునన్నెం తతూలనాడి, దూషించి, చెడతిట్టి వెగటుగాప్రవర్తించినప్పటికీ నాకది అపకారకం గాదనిన్నీ మీకే అది యెంతసవరించుకోవాలని ప్రయత్నించినా (భవతిహృదయదాహీ శల్యతుల్యో విపాకః) సవరణకాక బాధిస్తుందనిన్నీ ఆతొందర పాటును నేను లెక్కింపక మీతో సంధికిగా మనస్సా ప్రయత్నించి మీకు కవితా సామగ్రి సరియైనది లేశమున్నూ లేదని యెఱిగిన్నీ గణయతి ప్రాసలకూర్పు కొంతసాఫుగా వుండుటచే (బహుమానించడానికి యేదో మిష వుండాలికదా) నేను సంతోషించి మిమ్మల్ని సమ్మానించాలని త్రికరణశుద్ధిగా యేర్పరచుకొని యెంతో గౌరవంగా నిష్కపటంగా ఆహ్వానిస్తే మీరుదాన్ని అవమానకరంగా భావించి కావలిస్తే నేనే మీకు సమ్మానం చేయడానికి సిద్ధంగా వున్నాను. మావూరే రావలసిందంటూ వ్రాస్తారే? మీ వ్రాత యుక్తిసహంగా వుందా? లేకపోయినా మీ కోరిక ప్రకారం రావడానికైతే సిద్ధపడతానుగాని మీరేమనుకొన్నారో? నేను బొత్తిగా దుర్బల స్థితిలోవున్నాను. సుమారు యేడెనిమిదియేళ్లనుండి నేను అతిమూత్ర వ్యాధితో అతిమాత్రంగా నలుగుతూన్నాను. అందులో వకసంవత్సరాన్నుంచి మఱిన్నీ అందులో గతించిన వేసవి మొదలుకొని మఱీమఱీనిన్నీ నేను వస్త్రధారణం కూడా బరువయి చేసికొనే శక్తి తగ్గి "కౌపీనవంతః ఖలుభాగ్యవంతః." అనేకృపణస్థితికి వచ్చి సంవత్సరన్నఱకన్న యెక్కువ కాలమే అయినది. ఇట్టి నన్ను ఆహ్వానించడానికి మాయింటికివచ్చి కొందఱు మాటదక్కదేమో? అని భయపడి మోమోటపెట్టక తిరిగి వెళ్లుచున్నారు. ఈ స్థితిలోనే చెన్నపట్టణంవఱకున్ను నన్ను బలవంతపెట్టి శ్రీతిరుమల శ్రీనివాసత్రిలింగపీఠంవారు నిరు డీరోజుల్లో తీసుకువెళ్లారు. భగవదనుగ్రహం తిన్నగావుండడంచేత వారికి అప్రతిష్ఠ లేకుండా మళ్లా యిల్లు చేరఁగలిగానుగాని చాలావ్యయం రాకపోకలకు వారికి తగిలింది. నిరిటి కన్ననూ మిక్కిలి తక్కువస్థితిలోవున్ననన్ను యీ మధ్య తెనాలివైశ్యులు ఆహ్వానించారు. బలవంతంమీద వెళ్లడమూ రావడమూ జరిగింది. అంతే కాని సభలో నాలుగుమాటలు మాటాడేనో? లేదో? నాకు బాగా తెలియదు. యిప్పటి నాతూకం యేబైపౌనులకన్న కొంచెం తక్కువలోనేవుంటుంది. యిట్టినన్ను కృతిప్రదాతృత్వద్వారా మామగారున్నూ, తద్ద్వారా గురుపంచకంలోవారవడంచేత పరమపూజ్యులున్ను అయినమీరు మనుగుడుపునకో అన్నట్లున్నూ“వీరభద్రపళ్లెమునకు హనుమత్పళ్లె" మన్నట్టున్నూ బలవంతంగా కాకపోయినా యేదో విధంగా వీడువాడు గదా? అనే పూర్ణ విశ్వాసంతో ఆహ్వానిస్తున్నారు. నాకు (కృతికన్యాభర్తృత్వద్వారా) అల్లునకు ప్రస్తుతస్థితినిబట్టి యిచ్చేబహుమానం “చంద్రుడికి నూలుపోగు" సామెత వుండనేవుంది కనుక (తావన్మాత్రమే) కౌపీనం యిచ్చినా నేనుసంతోషిస్తాను. సందేహపడనక్కఱలేదు. “శ్వశురాగారసమ్మానంసద్యోగృహ్ణాతి పండితః" కనక మీసత్కారాన్ని పొందడానికి నేను ఉవ్విళ్లూరుతున్నాను. నన్ను సత్కరించడానికి మీకు యెక్కువ వ్యయప్రయాసలు తగలవు గానిరాకపోకలకు అధమం నలభైయాభై రూపాయిలదాకా తగులుతాయనిన్నీ ఆహేతువుచేత అది సాధుబాధగా పరిణమిస్తుందేమో? అనిన్నీ సంశయిస్తూన్నాను. తమకు అంగీకారమయితే యేలాగో బయలుదేఱి తమ సమ్మానాన్ని పొంది మీ గ్రామస్థులసందర్శనం చేదామని కుతూహలం యింతా అంతా కాదుసుమండీ! బోలెఁడువుంది. నా ప్రస్తుతస్థితినిబట్టి నాకు చేయవలసిన సదుపాయం అంతగా వ్యయప్రయాసలకు గుఱిఅయి వుండదు. ఉదయం 8 గంటలకులోగా వేడినీళ్ల స్నానం. అఱగిద్దెడు బియ్యపుసన్ననూకల పలచటి జావ. అఱసోలెడు మజ్జిగ (ఆవుదేనా సరే? గేదెదేనా సరే)- ఇంతే, మధ్యాహ్నం యేదో మీతోపాటు భోజనం, 3 1/2 గంటలకు సుమారున బార్లీగింజలజావ, రాత్రి మీతోపాటుగా కొంత ఆలస్యంగాకాక నల్లమందుకనక 7 గంటలకు భోజనం (ఇది ప్రధానం కాదు) నిమ్మకాయంత గోధుమపిండితో చేసిన చపాతీ, అఱసోలెడు ఆవుపాలు : బస్ ఇంతే. యీసదుపాయం యెవరికిగాని అంతగా భారంకాదనే నేను అనుకుంటాను. కాని యింతకంటె అధికమైన సదుపాయం కొన్నిచోట్ల మిక్కిలి చిక్కుగా వుండేది వకటివుంది. అది ఆవలీవలికివెళ్లే సదుపాయం. నాపడకగదికి పదిగజాలలో ఆ సదుపాయం కుదరాలి. (అవసర మవుతుందేమో అని యిట్లు కోరడంగాని యిది యెల్లప్పుడూ అవసరంకాదు. కాని మనిషికివున్నది పుష్టికదా) నాకువున్నవ్యాధి మూత్రవ్యాధి అని లోగడనే వ్రాశానుగదా. అది అప్పడప్పుడు ప్రకోపిస్తూ వుంటుంది. ఇది వార్ధక్యాతిశయంచేత యిప్పుడు మఱింత లోకువచేసి తఱుచు ప్రకోపాన్ని చూపిస్తూవుందిగాని అసలు నన్ను యిది ఆశ్రయించేమో నలభై అయిదేళ్లు దాటవచ్చింది. యిది కల్పితమని తమరభిప్రాయపడి విమర్శనకు వుపక్రమిస్తారేమో? గ్రంథస్థంగావున్న యీకింది పధ్యాలు చిత్తగించండని ప్రార్ధిస్తాను.

“మ. పదిగా దిర్వది గాద యీరుజ ననున్ బాధింపఁగాఁ జొచ్చి న
      ల్వదిపై నాలుగుదాఁటె వత్సరము; లీపాపిష్టరోగాన కే
      నెద నొక్కించుక చోటొసంగియసుమా? యెట్లెట్లొ వర్తింతు నేఁ
      డిది నాకున్ భరియింప రాద యిఁక నీవే దిక్కు కామేశ్వరీ”

యిక్కడ విమర్శించే వారికి కొంత అవకాశం వుంది. అదేమిటంటే? మొదట నల్వదియైదేళ్లంటూ వ్రాశావేమి? పద్యంలో “నల్వది పైనాలుగు అనిమాత్రమే వుందికదా? పరస్పరవిభేదంగాలేదా! అని శంకించేవారికి సమాధానం వినండి. యిప్పటికి సుమారు సంవత్సరం తొమ్మిదిమాసాల క్రితం యీవ్యాధినితట్టుకొనేశక్తి బొత్తిగాలేని దౌర్బల్యం యేర్పడింది. అప్పుడు చెప్పినది యీపద్యం. అందుచేత యిప్పటికీ, అప్పటికీ మధ్యవున్నకాలం కొంత అందులో చేరవలసిరాక ఆ వ్యత్యాసం కలిగిందని మనవిచేస్తాను. అయితే యిదిన్నీ వకశంకేనా? దీనికి సమాధానం యెందుకని తాము కాకపోయినా మఱెవరేనా శంకిస్తారేమో, యెవరో అక్కఱలేదు. దేవరవారే యిట్టిశంకలు చేసేవారిలో అగ్రగణ్యులనే సంగతి యీవ్యాసంలోనే అవకాశంవుంటే కొంత లోకానికి ఋజువుచేస్తాను. అందుకే అనుకుంటాను నేను గతంలో కొన్నాళ్లక్రితమే గతించవలసివుండిన్నీ ఆగవలసి వచ్చిందని తోస్తూవుంది. తక్కినశంక లేలావున్నా “దాఁటెను” అన్నచోట మీశంక తప్పదుగదా? "దాఁటెను నన్నయ" అన్నది, "తప్పెను నన్నయ" అని దిద్దుకున్నట్లు వ్రాసివున్నారు. అది పుస్తకంచూడకుండా వ్రాయడంచేత కలిగిన మార్పుగాని నాదిద్దుబాటుకాదని విజ్ఞప్తి మీరు భ్రమపడినారు. మీరనుకొన్నదోషం దాఁటులోలేదు. ప్రసక్తికలిగింది కనక యింకొక పద్యంకూడా ఆఘట్టంలోదే వుదాహరించి మఱీ ప్రస్తుతం అందుకుంటాను. -

"మ. ఇదియే బందరునందు నిల్పె నను నెన్నేనేళ్లు సంపన్నుఁగా
       నిదియే సల్పె ననేకశిష్యులకుఁ దా నీరోగమే యొజ్జగాఁ
       బొదలించెన్ ధ్రువ మేను దీనిభయముం బోనెట్టఁగానెంచి నె
       మ్మదిగా నొక్కట నిల్చితిన్ నిజము సుమ్మా! తల్లి! కామేశ్వరీ.”

సరే! ప్రసక్తివచ్చి మఱోపద్యం చదువర్లవినోదార్థం వుదాహరిస్తే యిది విమర్శకాగ్రేసరులైన తమవంటివారికి పెక్కుశంకలు కలిగించేదిగా పరిణమించిందే. కాగతిః అవును తప్పేమీ? రోగమేమిటి? అన్ని వుపకారాలు చేయడమేమిటి? యిది ప్రష్టవ్యాంశం కాకపోతుందా? అయ్యా తెలియక అడుగుతాను. యివిన్నీ శంకలేనా అని మిమ్మెవ్వరూ మందలించనే లేదేమండి - ఆశ్చర్యం. అందుచేత యేదోజవాబుచెప్పే తీరవలసిందేనా? అంతే వినండి. అడిగేవాడికట! చెప్పేవాడట! లోకువట! అంతేనేకాని యివన్నీ పూర్వపక్షాలే అవుతాయా? శాంతం పాపం. యీపద్యచరిత్ర చెప్పవలసివస్తే అధమం రెండువందల ఫారాలేనా గ్రంథం పెరుగుతుంది. పత్రికాప్రవర్తకులు శ్రీయుతులు వెంకటేశ్వరశాస్త్రుల్లుగారు విసుక్కోకుండా ప్రకటిస్తారా? అని కూడా సందేహం. వారు నాకు యెన్నో వత్సరాలనుంచి పత్రిక గౌరవార్థం పంపిస్తూన్నారుగాని, యెప్పుడు గాని వొకమంచివ్యాసం విపులమయినది వారిపత్రికకు నేను పంపించిన పాపాన్ని పోలేదని లజ్జిస్తూ వుంటాను. అయితే సుమారు సంవత్సరానికి పూర్వం కొన్నివేలకాలాలుదాకా వ్యాసాలు వ్రాసివున్నాను. అప్పుడేనో కొన్ని వ్యాసాలు వారిపత్రికకి పంపిస్తే యీలజ్జించడానికి అవకాశమే లేకపోయేది కాని ఆ పత్రికలకున్నంత వ్యాప్తి దీనికి లేదనుకొని నే నాకాస్త పనీ చేయలేకపోయాను, ప్రస్తుతం గుం|| డి|| విమర్శకుఁడుగారు నా “నన్నయ్యభట్టు" వ్యాసానికి జవాబుగా యిచ్చే “సంశయవిచ్ఛేదావచ్ఛేద ప్రచ్ఛేదోపచ్చూద" వ్యాసం నా “నన్నయ్యభట్టు" వ్యాసంలో వీరివిమర్శక గ్రంథాన్నుంచి యెత్తిచూపిన ముప్పయివక్క దూషణవాక్యాలన్నీ బాగా చూచివుండడంచేతకాఁబోలు వీరివ్యాసాన్ని “తోసిరా" జన్నారు. దానిచేత ఆసందర్భం యేమీ యెఱగని త్రిలింగకదివచ్చింది. వస్తేమాత్రం ప్రాజ్ఞులు వేంకటేశ్వరశాస్త్రుల్లుగారు వ్యాసకర్తగారి తిట్లు “పదియవనాఁటిముతైదువు" లోనైనవిన్నీ హాస్తోక్తులు ద్రావిడ స్త్రీలకుచాలు లోనైనవిన్నీ (నేనుయెత్తిచూపినవి) చూచేవంటే కృష్ణవారుచేసినట్టే చేశేవారుకాని అవి వారెఱుగనేయెఱుగరని పూర్తిగా విశ్వసిస్తూ వారికి నేనొక చిన్నవిజ్ఞప్తికూడా పనిలోపనిగా అందించుకుంటూవున్నాను. అయ్యా! నన్ను సంవత్సరంనాడు త్రిలింగపీఠంవారి సమ్మానసభలో మీరు చూచివున్నారు. నాకోరికమీద– “చరకసంహితను" కూడా నాకు మీరు యిచ్చివున్నారు. జ్ఞాపకం వుందా? అప్పటి నాశరీరస్థితి యెంత శోచ్యస్థితిలోవుందో మీకు నేను వ్యాఖ్యానం చేయనక్కఱలేదు. యిది నానాటికి పోయేకాలంగాని, వచ్చేకాలం గాదుకదా? అందుచేత అప్పటికంటే యిప్పుడు యెంత కృశించివుంటానో వేఱే వ్రాయనక్కఱవుంటుందా? వుండదు. ఇట్టిస్థితిలో- “తిరుపతి వేంకటకవుల గ్రంథవిమర్శనం" అనే పేరుతో యెన్నో బండబూతులు (మనుష్యులలో యెవరో తప్ప నోట వచింపరానివిన్నీ వినరానివిన్నీ) తిట్టిన యీ గుం|| డి|| విమర్శకుఁడుగారు యింకా యేమో తారతమ్యశూన్యంగా వ్రాసే చేతగానివ్రాతకు అవకాశం యిచ్చి నాకుపనికల్పించడంలో (ఆయీతత్త్వం యెరక్కే అనుకుందాం) మీరు భాగస్వాములయినందుకు నేను మిక్కిలీ విచారిస్తూన్నాను. యీయన తిట్టినతిట్లు మళ్లా యిక్కడ నేను అనువదిస్తే గ్రంథం చాలా పెరుగుతుంది. ఆతిట్లను చూచేవుంటే యీమధ్య వీరిసన్మానానికి ప్రసిడెంటుగా వీరివూళ్లోనే జరిగినసభకు వచ్చిన పండితులు మెల్లగా తప్పుకునేవారే అని ఖండితంగా నొక్కిచెపుతున్నాను. శ్రీశిష్ట్లావారు (పేరు జ్ఞాపకంలేదు) ఈయన మాగ్రంథాలమీద చేసినవిమర్శనకు నేను మెచ్చుకున్నానంటూకూడా వుటంకించి యీయన్ని ప్రశంసించారు. యుక్తంగావుంటే నేను ప్రశంసించేస్వభావం కలవాణ్ణో కానో? "గిడుగా? పిడుగా" వగయిరా నావ్యాసాలెఱిగివున్న మీబోట్లకు వేఱేవ్రాయనక్కఱవుండదు. రామ! రామ! ఈయన వ్రాసిన డెమ్మీ సైజు 116 పుటలలోనూ మచ్చుకేనా వకటిన్నీ యుక్తమయింది లేనేలేదు. చూడండీ మచ్చుకు వకటి చూపుతాను.

“నీవు మీసం పెంచావుగదా కవిత్వానికంటూ? మీ తిరుపతి శాస్త్రి యెందుకు పెంచాఁడు కాఁడూ?”

అనేది అందులో ఒక పూర్వపక్షం చూడండీ, దీన్ని గుఱించి యెంత వ్రాయాలోను. అసలు యీమీసం పెంచడం గొడవ యెందుకు వచ్చిందో చెప్పాలా? ఆత్మకూరు సంస్థానంలో మా దేవీభాగవతం వినిపిస్తూవుండఁగా ఆ సంస్థాన విద్వాంసులు, మహాపండితులు శ్రీనివాసాచార్లుగారు- “నాపలుకాలకింపుమ అనంత! గుణాలయనైన యట్టి" అనే పద్యంలో - గుణాలయ లక్ష్మి అనే ప్రయోగము యెట్లాసాధువు అని ప్రశ్నించారు. యేదో సమాధానం చెప్పాము. తృప్తిపడ్డారు కారు. దానిమీఁద క్రమంగా ఘర్షణ పెరిగింది. భారతం వుదాహరణంగా చూపుతామన్నాం. చూపండిగాని భారతం అంతా మేమంగీకరించే వాళ్లంకాం. నన్నయ్యభట్టుగారి కవిత్వంలోనే చూపాలన్నారు వారు; అందుకైతే మేం అంగీకరించలేదుగాని (ఓహో గ్రంథం పెరిగిపోతూవుందే! యేంచేసేది? తీఁగతీస్తే డొంక కదులుతూ వుంది కాఁబోలు) సాధ్యమైనంతవఱకు నన్నయ్యగారి ప్రయోగాన్నే చూపలేకపోతామా? (యెప్పుడూ అభ్యుపగమ్యవాదం జిగీషువులకు వుపకరిస్తుందని నా మతం.) అనే ధీమాకుతో వున్నాం. మర్నాడు నన్నయ్య గారిదే “దేవతలు ధర్మవర్తులు" అనేది యిచ్చాం. కొంపమీఁదికి వచ్చింది వారికి. దానితో మెసలడానికి వీలులేక "ధర్మవృత్తులు" అని దిద్దుతామంటూ పిడివాదం పుంతలోకి దిగారు వారు. (ఎందుచేత ప్రతివాదులకు మెసలడానికి వీలిచ్చిందికాదో? వ్రాయవలసివస్తే మఱీ గ్రంథం పెరుగుతుంది. పైగా సామాన్యులకు బోధించదుకూడాను.) దానిమీఁద జరుగుతూవున్న ఘర్షణలో వారు మా యుక్తిమీఁద పైయుక్తి తోఁచక రాజుగారితోటి ‘మహాప్రభూ! వీరు లౌక్యులు. బాగా మాట్లాడతారు. లౌక్యులైనందుకు ఆ బాఱమీసాలే గుఱుతు చిత్తగించండి" అన్నారు. మీసాలు ఆకాలంలో వైదికానికి చాలా ఆక్షేపణీయాలని వ్రాయాలా? అక్కఱలేదు. దానిమీఁద నేనన్నానుగదా? యీ మీసాలు లౌకికరీత్యా పెట్టుకున్నవికావండి. మేమూ వైదికులమే. అతఁడు వెల్నాఁటి. నేను ఆరామద్రావిణ్ణి. అయితే మీసాలెందుకు పెట్టుకున్నామంటే? యిందుకు అని అంతా సుప్రసిద్ధంగా చదువుకుంటూ వుండే మాత్రాలూకు “దోసమటం చెఱింగియును" అనే పద్యాన్ని ఆవేశంతో చదివేను. ఆపద్యరచన నాఁటికి మా వయస్సు 28 యేండ్లు దాదాపు ఆయీవయోనిర్ణయం నానారాజసందర్శనంలో వున్న “తే, కుజుఁడు భూకారకుండఁట?” అనే పద్యం (ఆసంస్థానంలో చెప్పిందే) చదువుకొని పిమ్మట జాతకచర్యలో ఉండే జననకాలదశాశేషం పరిగ్రహించి జననం మొదలుకొని లెక్కపెట్టుకుంటే లెక్కలలో చాలా ప్రజ్ఞవున్న గుం|| డి|| విమర్శకుఁడుగారికి క్షణంలో తెలుస్తుంది. నాకన్న తిరుపతిశాస్త్రి సంవత్సరం యేడు మాసాలు కాఁబోలును చిన్న యెందుకీసోదె? యెవరుసంతోషించింది? చెప్పండి? అయితే యేంచేతును. ఈ పనికిమాలినపని ఆయన కల్పనచేశారు, వృథాగా పత్రిక నిండుతూంది. "కాకస్య కతివా దంతా" చెప్పొచ్చేదేమిటంటే! యిది జరిగి యిప్పటికి 42 యేండ్లు దాటవచ్చింది. అప్పుడు నాకుమాత్రమే మీసంవున్నట్టున్నూ, తిరపతయ్యకి లేనట్టున్నూ విమర్శకుఁడుగారు అభిప్రాయపడి ప్రశ్నిస్తారే? ఆసందర్భం వీరికేలా తెలిసింది? మాయిద్దఱికీ కూడా వుండcబట్టే మీసం "పెంచినార మీమీసము” అనడం తటస్థించింది. భవతు. విమర్శకుఁడుగారివూహే సమంజసం అనుకుందాం. యిన్నాళ్లదాఁకా యీ శంకకు అవకాశం లేకపోతుందా? పాండిత్యంలో మన విమర్శకుఁడుగారివంటి పరిజ్ఞానం లేకపోవచ్చుఁగాని ఆ రాజుగారికి వొక్కరికే మీసం వుందనిన్నీ రెండోవారికి లేదనిన్నీ అట్టి సందర్భంలో "పెంచినారము" అని చెప్పడం పొసఁగదు కనక పృచ్చచేదామనేనా? అనుకోరా? వారల్లా వుండఁగా "మాట్లాడితే మారామేకు"లన్నట్లు గొంతుకపట్టి నొక్కి యేలాగేనా సంస్థానాన్నుంచి పాఱదోలుదామనే దురుద్దేశంతో వున్న ఆ పండితులు వూరుకుంటారా? వారెందుకూరుకున్నారంటే? అసలు శంకకవకాశమే లేదుకనకనే యింకేముంది?- “గజం మిథ్య పలాయనం మిథ్య" వినండి భూతార్థాన్ని అప్పుడేకాదు మఱికొంతకాలందాకా యిద్దఱికీ కూడా పూర్తిగానే (కత్తిరిమీసాలు కావు) మీసాలు వుండేవి. (మెలిఁబెట్టివిడిచిన మీసాలపై గొప్ప నిమ్మకాయలు రెండు నిలుపవచ్చు) అయితే అతనివి అంతగఱిబోజా మీసాలుకావు. వకమాదిరివి. నావో? బాగా శివాజీ మీసాలలాగు వుండేవి. ఆ మీసంతో వున్న నా ఫోటో బందరులో ప్రైవేటు డాక్టరు శేషగిరిరావువద్ద వకటి వుంటే వుండవచ్చు ననుకుంటాను. (ఎందుకీసోదె యిదేం ప్రశ్న? యేం జవాబు. యీలాటి చొప్పదంటు శంకలుచేసి పైఁగా అమంగళాశ్లీలపు బండబూతులు తిట్టి అందుకు నేను యేమీ అనక కాస్త్రయతిప్రాసల కూర్పున్నూ ధారాబాగుందని సేల్జోడుబహుమతీ చేయదలచుకుంటె దాన్ని పరిగ్రహించడం అవమానంగా భావించి యేదో చెత్తయిలాటిదే వ్రాసి కయ్యం పెంచేవారికి తమ పత్రిక తోడ్పడిందని వ్రాయబోతే గ్రంథం పెరుగుతూవుంది కదా? పెరిగితే చింతలేదు. యీ వ్రాతకూడా చెత్త వ్రాతే అవుతూ వుందికదా? చెత్తకి చెత్తేకాక మఱివకటి వస్తుందా? రాదుకదా? అవుతే మంచిదే. యేంచేసేది) విమర్శకుఁడిగారికి అవసరమైతే ఆతనిపేర వ్రాసి తెలుసుకోవచ్చును. ఈయన తిట్టినతిట్లు యెంత గర్షణీయాలో తమకే తెలుస్తుంది. ఆపత్రిక తాము చిత్తగించలేదనే నావిశ్వాసం. యిప్పుడు అది తాము చూచామని నాకు ప్రత్యుత్తరం వ్రాసేదాకా పూర్తినిద్దురేపట్టదు. ఆపత్రికల తేదీలు ప్రకృతం విమర్శకుఁడుగారు మీ పత్రికలో వ్రాస్తూవున్న “సంశయావచ్ఛేదకావచ్ఛిన్నం"లో వుదాహరించే వున్నారు (నాకు కలిగిన సంశయ మేమిటో? విమర్శకుఁడుగారు ఛేదించేదేమిటో? నాకు బోధపడడంలేదు. అంత ప్రజ్ఞాశాలులేమి, కావచ్చు). ఆ తేదీలుగల పత్రికలు పంపవలసిందంటే కృష్ణాపత్రికవారు తమకు పంపకపోరు. లేదా? నావద్ద వకటే ప్రతివుంది. దాన్నే పంపవలసిందంటే పంపుతాను. లేదా విమర్శకుఁడుగారు అలాటితిట్లను వుపయోగించిన "తిరుపతివేంకట కవుల గ్రంథవిమర్శనం" అనే (రు 1-0–0 వెలగల) గ్రంథాన్ని తమకు పంపవలసిందంటే పంపకపోరని తలుస్తాను. ఇందులో యేదో వక పనిచేసి తాము ఆతిట్లు చూడాలి. అయితే ఆయన్ని మీరెప్పుడేనా యేపల్లెత్తు మాటేనా అన్నారేమో? అందుచేత ఆయనికి మిమ్మల్ని అలా (కృతేతు ప్రతి కర్తవ్యం) గాఢంగా తిట్టి బుద్ధి చెప్పవలసివచ్చిందంటారేమో? రామ రామా! ఆయనకీ మాకూ యెన్నడూ యేవిధమైన సంబంధమూలేదు. వొకరిమొగం వకరం చూచి యెఱుగం. (అయమయమితి ప్రత్యభిజ్ఞగా) యెఱుగనే యెఱుగం. రెండేళ్లనాడు కాcబోలు “గ్రామం గచ్ఛన్ తృణం స్పృశతి"గా మావూరు వచ్చి నన్ను చూచినట్లు వీరిస్నేహితులు నాపేర యిటీవల వ్రాశారు. యీ తిట్లు చాలాకాలంనాఁటివి. కాఁబట్టి యిది నిష్కారణవైరం. “పండితా పండితానాం” అంటూయేకరువు పెట్టివున్నారు అభియుక్తులు. ఆయనమహాపండితులు. ఆకారణంచేత తరపేక్షయా శుంఠతావచ్ఛుదక కోటిలో పరిగణింపవలసిన మేము ద్వేష్యులం కావలసి వచ్చిందేమో? ఆ తిట్లు చూచి తాము వారిని ప్రశ్నిస్తే వారే తమకు తోcచిన సమాధానం సెలవిస్తారు. మిమ్మల్ని యెందుకు యింత నిర్బంధిస్తానంటే? పత్రికా సంపాదకులకు వ్యాసకర్తల తత్త్వం తెలియడంకూడా అవసరమనియేను. చిరకాలాన్నుంచి నాకున్నూ మీకున్నూపరిచయంవుందికాని- “ఎన్నఁడు నినుఁ బెట్టుమనుచు నీండ్రము సేయన్” అన్నాడు భాగవతంలో, యెప్పుడూ మిమ్మల్ని యేమీ నేను స్వార్థంకోరలేదు. యిప్పుడు కోరుతూ వున్నాను. తీరిస్తే యీకోరిక తీఱ్చండి. లేదా? చింతలేదు. యాచ్న గదా!

“అవమానం పురస్కృత్య మానం కృత్వాతు పృష్ఠతః" అన్నారు అభియుక్తులు (మీరూ, మీరూ యేవో కలహాలు పెట్టుకుంటూ వుంటే మేమూ మేమూ కలిగించుకుంటూ వుంటామా? అంటారనిన్నీ యెఱుగుదును. యీ కలహం నిష్కారణంగా తిట్టడంగదా). నాకు తమసహాయమల్లా వ్రాయక వ్రాయక “జన్మానికల్లా శివరాత్రి"గా మీ పత్రికకు వ్రాస్తూ వున్న నా దీర్ఘ వ్యాసాలు (ప్రస్తుతానికి సంబంధించినవి మాత్రమే) మీ పత్రికలో జాగ్రత్తగా ప్రచురించడమే కావలసింది. వుండడం ప్రాయోపవేశావస్థలోవున్నా బుద్ధి యింకా అంతో యింతో ప్రసరింపచేస్తూనే వుంది భగవతి. బహుశః విస్తారంగా మీ పత్రికకు పని కల్పనకాదే అనుకుంటాను. ఆ బ్రాహ్మడు తిట్టినతిట్లకు తగినంత సమర్ధనం ఆయన చూపడమంటూ వుండదు. అలా చూపడమే తటస్థిస్తే “వింధ్యః ప్లవే త్సాగరే". ఆపద్ధతిని అంతతో "భాషామంజరీ సమాప్తా" కావలసే వస్తుందిగదా? ఆయనికి నామీద వున్న కోపానికి పరిమితే కనపడదు. నామీద కోపం అంతతో ఆగక నన్నయ్యమీదికికూడా ప్రసరించింది. నాకేమో? నన్నయ్య సమాస గ్రథనఫక్కి భారతకవులు తక్కిన యిద్దఱిలోనే కాదు యిటీవలకవులలో గూడా మృగ్యమని వక అభిప్రాయంవుంది. యిది తప్పుటభిప్రాయమైనా కావచ్చును. దీనికోసమే అయితే అన్నితిట్లు “దశాహం (దిక్కుమాలిన దశాహం) నాఁడు గొఱిగించుకొన్న ముత్తైదువు"నఁట నేను. యేమి కర్మం. పాపం ఆబ్రాహ్మడికి యీలాటి సదూహ కలిగింది? వకవేళ మేము యెప్పడేనా ఆయన్ని యేమేనా అనేవున్నామేమో? మఱచినామేమో? అంటే పాపం, ఆగ్రంథంలో ఆలాటి అభూతంగా వుండేకల్పన యేమీ చేసినట్టులేదు. దీనికి ఆయన్ని అభినందించవలసివుంది. మా మొదటి తప్పల్లా ఆయన పట్టుకున్నతప్పు

“క. ఎన్ని పురాణమ్ములఁ దా
     మన్నిటి నాంద్రీకరించి అనుకంపన్ గా
     కున్నన్ దీనిన్ విడుతురె?
     నన్నయభట్టాది కవిజనంబులు మాకున్.”

అనే పద్యంలో "నన్నయభట్టాది" అనేపదం దగ్గిఱే వుంది. నన్నయభట్టు భారతం వ్రాస్తూ వ్రాస్తూ అరణ్యపర్వం ముగియకుండానే చచ్చుకున్నాడు గదా? అట్టిస్థితిలో అతణ్ణి అంత గొప్పచేసి యెత్తుకోవడం యెందుకు? ఇదంతా వెంకటశాస్త్రి దురభిమాన ప్రయుక్తంగాని వేఱుకాదు. (యింతతో సరిపెడితే చింతలేదు. దశాహంనాటి ముత్తైదువులెందుకో? మీబోట్లు కనుక్కోవాలి) అంటూ తిట్లకు వుపక్రమించడంచూస్తే శోచ్యావస్థలోవున్న ఆ వ్రాతకు ఆశ్చర్యమేకాదు. విచారంకూడా కలుగుతుంది. యెందుకు విచారం నన్నుతిట్టినందుకనుకుంటూ వున్నారా? అలా మీరు అనుకోనూ అనుకోరు. అందుకు నేను అలా వ్రాయనూలేదు. నాకు 70 వత్సరాల వయస్సుగాని ఆయనకు 76 వత్సరాల వయస్సని వారివూరి బ్రాహ్మడే వకాయన యీ మధ్య తెనాలి రైలులో నాకు కనపడి చెప్పివున్నాడు. ఆయీ విమర్శన గ్రంథం (బూతులబుంగ) అచ్చై వకసంవత్సరం లోపు కనక దీని ప్రచురణం 75 వత్సరాల ప్రాయంలో జరిగివుండాలి. యేమీ చదువుకోని వాళ్లక్కూడా వృద్ధత్వం కొంత వివేకాన్ని కలిగిస్తూందంటారు. యీయన సాక్షులు గదా? పైగా భగవదనుగ్రహం బాగావుంటే కొలదివత్సరాలలో విమర్శకుడుగారు సహస్రమాసజీవులు పొందదగ్గ బిరుదం, భగవత్స్వరూపులు అనేది నిన్ననేడు వారివారి సభ్యులు మమ్ము కసిదీర తిట్టి ప్రచురించిన గ్రంథరచనాన్ని కూడా యితర సంశయవిచ్ఛేదాలతో సంపుటీకరించి యిచ్చిన “1. కవిశేఖర, 2. అభినవతిక్కయజ్వ" లోనైన బిరుదావళితోసహాధరించే మంచిసమయం రాబోతుంది అట్టి భవిష్యద్భగవదవతార మూర్తుల చేతితోనేనా "దశాహంనాఁడు గొఱిగించుకొన్న ముత్తైదువు"లు అసకృదావృత్తిగా చిత్రించఁ బడవలసిందంటాను? యింతకు వెంకటశాస్త్రిగాఁడు ఆ అవతారమూర్తులపట్ల చేసిన అపచారం యేమిటో? నన్నయ్యను పురాణాలు తెలిగించినవారిలో చేర్చి గౌరవించడంకన్న అపచారం యేమి కావాలి? ఆయీ తిట్లేకాదు. శంకలుకూడా తిట్లలాగే వుంటాయి. వుంటాయేమిటి వున్నాయి. శంకలేతిట్లు, తిట్టులే శంకలు. శ్లో "త్వమేవాహం త్వమేవాహం” “ముత్తెదు" వల్లా వుండఁగా, పంద, వెంగలి, ఎట్సెట్రాలు, చూపేదేమిటి? "ఇట్టి రోఁతలకు మెచ్చు సూరులను నిన్ను ననియతాత్ము జేసినవిధి నందుఁగాక,” అని విమర్శకులు వ్రాసిన పరితాపవాక్యాన్ని చూచికూడా శ్రీశిష్ట్లాశాస్త్రులవారు నాకుప్రష్టవ్యులైనారు. తి. వెం. కవులు తమమీఁద వీరు వ్రాసిన విమర్శనాన్ని మెచ్చుకొన్నట్లు వుటంకించి వీరిని ప్రశంస చేశారు. వీరు యిలా అనడానికి వారికి ఆధారం ఏమిటోకదా! నేను నన్నయ్య వ్యాసంలో వీరి కవితాధారను అభినందనీయమని అన్నాను. దానికే సేల్జోడు బహుమతి అన్నాను. విమర్శనం అద్దాన్నమే అని వ్యంగ్యంగా కాదు వాచ్యంగానే అన్నాను. అంతకు మున్ను వీరి స్నేహితులకు వ్రాసిన కార్డులో వీరిభారత సంశయ విచ్ఛేదాన్ని అర్ధజరతీన్యాయంగా, అభివంతనీయమన్నట్టు కొంత తేలుతుంది అంతే. విమర్శన గ్రంథాన్ని అభినంద్యంగా వ్రాయలేదే? అట్టిస్థితిలో శ్రీ శిష్ట్లాశాస్త్రులు వారు నేనభినందించినట్టివారి (విమర్శకుడుగారికి సంబంధించిన) పొగడ్తలో ఆమాట యేలా వుటంకించి వున్నారు? అని నాకు సందేహం. యీ సందేహము తీర్చతగ్గదే అయి వారిని అడగడానికి తగ్గంత అర్హత నాకువున్నట్టు వారి చిత్తానికితోస్తే వారు నాకేదో ప్రత్యుత్తరాన్ని అనుగ్రహించనే అనుగ్రహిస్తారు. లేదా? అప్పుడు అంతపాటి అర్హత నాకులేదు కాఁబోలును అని నాలో నేనే లజ్జించి తలవంచుకుంటాను (వారు యేదేనా వ్రాయదలంచుకుంటే పత్రికలో వ్రాయాలిగాని నాకు వుత్తరం వ్రాయరాదు). యిది బొత్తిగా అసంబద్ధంగా వుందిగాని మావిమర్శకుఁడుగారికి వారివూరి (ధూళిపూడి) వారు సమర్పించిన స్వాగతంలో వుటంకించిన అక్కరముల ధోరణి కడుంగడుc జక్కఁగా నున్నది. వుదాహరించి చూపుదునా, “విమర్శకాగ్రణీ! విమర్శచేయుపట్ల మీకలము ఖడ్గమునకే యుద్ది దానిని ఝళిపించి కవిసింహములగు తిరుపతి కవులనే తాఁకితిరి" ఈ వాక్యమెంతో సమంజసముగా నున్నది. మేము వారి విమర్శనము నభినందించినట్లిందు లేశమును లేదు. ఇది చరిత్రకుపకరించు ధోరణి, యీ వ్రాతనేగాక వ్రాసిన వారింగూడ నే నభినందించుచున్నాను. శిష్ట్లా వారివాక్యమునకే నాకు సమన్వయము కుదురకున్నది. వారి వాక్యము కూడా వుదాహరిస్తే బాగుండునుగాని ఆ పత్రిక యిప్పడెక్కడుందో వెతకాలి. నేను దాన్ని బెజవాడలో కాఁబోలును చదివినాను. అయితే శిష్ట్లావారి ఉద్దేశమందేమేనా దోషముండి అట్లనియుందురా! శివ! శివా! అదికేవల మసోహ. విమర్శకుఁడుగారి గౌరవార్ధము వారట్లుటంకించి యుందురు. అంతేకాని విమర్శకుఁడుగారు ఆసమయంలోనేమి? లోఁగడ వుదాహరించిన స్వాగతము నందలి వాక్యశ్రవణ సమయంలో నేమి? కొంత కలగఁజేసికొని తి. వెం. కవులద్వారా నాకు గౌరవం రావడమేమిటి? “యిది నాకు బొత్తిగా అవమానంగా వుండే పద్ధతి" వారు శుద్ధతెల్వితక్కువవారు. పనికిమాలిన వ్రాఁతలు వ్రాయువారు, అందుచేత తద్వారా నా గౌరవాన్ని ప్రకటించడం నాకు బొత్తిగా యిష్టంలేదని చెప్పవలసింది. ప్రస్తుతం ప్రాస్తూవున్న"సంశయవిచ్ఛేద" వ్యాసం చాలాభాగం జాగ్రత్తగానే విమర్శకుఁడుగారు వ్రాస్తూన్నారు కాని కొద్దిగా తొందరపాటు మాటలు యిందులోనూ లేకపోలేదు. చూడండి యీవాక్యాన్ని

"అట్లు కాదేని శాస్త్రి (వెం. శా.) గారి తెల్వితక్కువ యనవలసివచ్చును."

యిప్పటి వ్యాసంలో యింతకు మించిన తుందుడుకు మాటలున్నట్టులేదు. యిది స్థూలదృష్టిని వ్రాసినమాట. యీ వ్యాసంలో పూర్వం నాకెప్పుడు పెట్టని “గార్లూ, బూర్లూ" కూడ పెట్టడమేకాక, నాపేరుకు మొదట శ్రీకూడా తగల్చడాన్ని గూర్చి నేను వాటి సమన్వయాన్ని యీ విధంగా చేసుకుంటూవున్నాను. యేలాగంటే తిట్లుతిట్టి వ్రాసేగ్రంథరచన నాఁటికి విమర్శకుఁడుగారికిన్నీ, నాకున్నూ యేవిధమైన సంబంధ బాంధవ్యాలున్నూ యేర్పాటు కాలేదుకనక ఆలా నిరాఘాటంగా చేతికి వచ్చినట్లల్లా యేకవచనపు వషట్కారాలతో తిట్టఁగలిగారనిన్నీ యిటీవల కృతియివ్వడం ద్వారా నేను శ్రీ తిక్కన సోమయాజిగారి “క. నే నిన్ను మామయనియెద దానికిఁ గాఁ గావ్యకన్య" అనే పద్యం చొప్పున అల్లుణ్ణి అవడం తటస్థించడంచేత 70యేళ్ల బాలప్రాయంలోవున్న అల్లుణ్ణి మన్నిస్తేగాని బాగుండదని “గార్లు" పెట్టి విందుచేశారని సమన్వయించుకున్నాను. అయితే ఆబ్దికంలో భోక్తలికిపెట్టే పిండివంట గార్లేమిటి? మంగళప్రదమైనపిండివంటలు యేబొబ్బట్లో పెడితే యుక్తంగా యుండేవి, అని కొందఱనుకోవచ్చుగాని "దశాహం ముతైదువుగా" నన్ను పేర్కొనడమే కాకుండా యింకోపద్యంలో “క్ర, ఇద్దఱు భోక్తల కెక్కువె? తద్దినము" అంటూ మా సీమ గ్రంథంలోవున్న - "ఒకరి పెండిలిలో అనే పద్యంలో వున్న శుభప్రదమైన వాక్యాన్ని - "ముద్దు గుడవరా ముది పెండ్లికొడకా" అన్న సామెతగా ప్రాసకుదిరింది కదా? అని తద్దినంగా అపవదించి అమంగళాశ్లీలాలు వెలార్చిన మాకృతి కన్యాప్రదాతలుం గారు యింకా ఆ వాసనసోకే అనుకుంటాను యీ ఆబ్దికపు పిండివంట (గార్లు) నాకు అనుగ్రహించి వుంటారని వూహిస్తాను. నాకు యిప్పటి పెండ్లి (కృతికన్యాపరిణయం) మూఁడోదో? నాలుగోదో? అవుతుంది. తక్కిన భార్యలు తిట్టుమోతులుగారుగాని, యీనాల్గో భార్య బాగా గయ్యాళిన్నీ తిట్టుమోతున్నూ దొరికింది. వార్ధక్యం దీనితో గడపాలి. శాంతం పాపం! మొట్టమొదటి పెళ్లికి పిల్లనిచ్చిన అత్తవారింట కూడా అదేంకర్మమో? నాకు మా అత్తగారు (మీరు నమ్ముతారో, నమ్మరో?) గార్ల పిండివంటతోనే విందు చేసేవారు. అది మీకు ఇప్పటికి యేలాజ్ఞాపకం వుందంటారేమో? నాధారణయెఱింగినవారున్నూ ఆ మధ్య నేను వ్రాసిన దీర్ఘవ్యాసాలు చదివినవారున్నూ యీప్రశ్న వేయరు. నాకు మూఁడో సంవత్సరములో నా తరువాత పుట్టి - మొన్న పురుట్లో వోయిన “ప్రబుద్దుడు" అనే పద్యార్థానికి లక్ష్యమైన మాతమ్ముడు పురుడు సహా యిప్పటికింకా తూ.చా.తప్పకుండా జ్ఞాపకం. అతిశయోక్తిగా జమకట్టుకుంటే ఆలాగే జమకట్టుకోండి. నమ్మితే నమ్మండి - “నమ్మిన నమ్మకున్న నది నావశమా" అన్నారు. మా పరమమిత్రులు శ్రీదాసు శ్రీరామ మహాకవిగారు యేదో విషయం వ్రాస్తూ తెలుఁగు నాఁడు అనే చిన్నపుస్తకంలో, యిది విషయాంతరం, ప్రస్తుత విషయం జ్ఞాపకం వుందనడానికి బీజమేమిటంటే? అప్పటికి ఏడెనిమిదేళ్లవాఁడు నాకొకస్యాలకుడుండేవాడు. ఆకుఱ్ఱవాడు ఆ గార్ల పిండివంట సందర్భములో అన్నాడుకదా? మా అత్తగారితో- "అమ్మా! యీవాళ మనింట్లో గార్లు వండుతున్నావు తద్దినమా?" అన్నాఁడు. అది మా మామగారువిని వాణ్ణితిట్టి అయ్యో అమంగళంగా అన్నాఁడే అని నొచ్చుకున్నారు. ఆయన కుఱ్ఱవాణ్ణి తిట్టిన తిట్లు కూడా జ్ఞాపకం వున్నాయికాని, యెలక మీఁదా, పిల్లిమీఁదా పెట్టి నేను విమర్శకుడు గారిని తిట్టినట్టువారు భావించుకుంటారని వుటంకించలేదు. క్రియమాట యీవృద్ధదశలో తటస్థించిన అత్తవారివిందులోనే కాక బాల్యదశలోకూడా నాకు అత్తవారివిందు "గార్ల" తోనే జరిగేదన్నది యిక్కడ వక్తవ్యాంశం. మా అత్తమామలు నన్నుయెప్పుడూ గారు పదంతోటే పిల్చేవారన్నది ధ్వన్యర్థం. యీ మామగారు యేకవచనంతోటే గౌరవించారు పూర్వం. యింతకూ చెప్పేదేమిటంటే? యిప్పుడు వ్రాసూవున్న వ్యాసంలో మాత్రం దుందుడుకు మాటలు కొంత మృగ్యం అనియ్యేవే, సాహసోక్తులు, తలకు తగని ప్రసంగాలు చాలా వున్నాయి అవి పూర్వపక్ష సిద్ధాంతాలు చేసుకొనేటప్పుడు ప్రతివారి వ్రాఁతలలోనున్నూ అంతో యింతో వుంటూనే వుంటాయి కనక వాట్లని గూర్చి వ్రాయవలసిందిలేదు. గార్లపురాణం అంతవసరం లేకపోయినా నాజ్ఞాపకశక్తిని తెల్పడానికి వుటంకించాను. శిష్ట్లావారి అభినందన సందర్భములో స్వాగతంలో వున్న విమర్శకుడుగారి "కత్తిఝళిపించు"ను గూర్చిన ప్రసంగములోన్నుంచి యిలా ఎక్కడికో పోతూవున్నాము "కత్తిఝళిపించు" వ్రాఁత చాలా సరసంగావుంది. యేమంటారా? వ్రాసినవారు యిట్టే తప్పుకోవచ్చు, హిట్లరు మహాశూరుఁడు కదా? అతఁడిమీద మాయింట్లో నేను కూర్చుండి బ్రిటిషు తరఫున నావద్దవున్న (బండాడిముక్కుకూడా తెగని) మొద్దుచాకు నూరి ఝళిపించవచ్చునుగదా? అది పనిచేసిందా? లేదా? అన్నది విచారణాంతరం. శ్రీకృష్ణభగవానుడేమన్నాడు--

"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన"

అనలేదా? ఫలం దైవాయత్తం. మనం చేయవలసింది పనిమాత్రమే. అట్టిపనిని విమర్శకుఁడుగారు చేసినారు కనుక వారు మహాసాహసులని మాత్రమే ఆవాక్యం చెపుతుంది. ధ్వనినికూడా తీస్తే విమర్శకుని శక్తి తి. వెం. కవులముందు అంతగాని, కొంతగాని పసకట్టేది కాదుగాని కాకపోయినా సాహసించి అందుకు పూనుకోవడం అభినందనీయమని కూడా తేలుతుంది. ధ్వనిగదా? “అస్తమేతి గభస్తిమాన్” అనేవాక్యం యెందఱికెన్ని విధాల ధ్వనించింది. కాని ఆధ్వనికికూడా కొంచెం సంబంధం మాత్రం వుండాలి. యీమాట విమర్శకుఁడుగారు బాగా గమనించాలి. ఇది విషయాంతరం. శిష్ట్లావారు స్థూలదృష్టిని అభినందించడంలో ఆమాట దొర్లినట్టు అనుకోవడమే. యిప్పటికి నాకు కర్తవ్యం యేదేనా యింతకంటె అధికం వారు తెల్పితే తెలుసుకోవడమున్నూ - పెళ్లి పీఁటలమీఁద వున్న పెండ్లికొడుకును వారివారికి తోఁచినట్టు అందఱూ ఆశీర్వదిస్తారు. వాటికి అవయవార్థాలలో అవసరం వుండదు. ప్రస్తుతం సందర్భం ఆలాంటిదైనా ప్రసక్తి కలిగి కొంతవ్రాయవలసి వచ్చింది. యెందులోన్నుంచి యెందులోకో పోవడంవల్ల ప్రధానాంశం మఱుగుపడుతుంది, మామీసాల ప్రసక్తిలో విమర్శకులు వేసిన ప్రశ్న ఆయనకు బొత్తిగా దానిపూర్వోత్తర సందర్భాలు తెలియకవేసిన ప్రశ్నగా ఋజువు చేయబడిందికదా? యీలాటిప్రశ్నలే గుంటూరుసీమలోని (ఆప్రాంతంవారు ఆబాలగోపాలమూ యెఱిఁగిన) సందర్భాలను గూర్చి కొన్ని వేసివున్నారు. స్వర్గతులుకాగా మిగిలిన విమర్శకుఁడుగారి బంధువులకే వాట్లవిషయం బరాతంపెట్టి వున్నాను.

వారు యీపాటికి విమర్శకుఁడుగారికి వాటిసందర్భాలు చెప్పేవుంటారనుకొంటాను. కాని యీవిషయంలో యింకోటి ప్రస్తుతం ఆలోచించాలి. సుమారు ముప్పదియేళ్లనాఁటి గుంటూరు సీమచరిత్ర యిప్పుడు 76 వత్సరాల ప్రాయంలో వుండడం నిజమే. అయితే అప్పటికి 46 వత్సరాల ప్రాయంలో వుండే వీరికి యితరులు బోధించడంతో పనేముంటుంది. అందుచేత యితరులకు బరాతం పెట్టడం కూడా అనవసరమే అనిన్నీ అసలు విమర్శకుఁడు గారికే బరాతం పెట్టడం యుక్తమనిన్నీ యిప్పటికి తేలింది. అయితే ఆయన యెఱిఁగేవంటే? వాట్లనుగూర్చి మళ్లాయెందుకు ప్రశ్నిస్తారు? అంటే వున్నదంతా దానిలోనే వుంది కుల్లస్సు. ఆప్రశ్నించడమే అత్యాశ్చర్యం. ఆశ్చర్యంలోనున్నూ ఆశ్చర్యం. ఆరోజుల్లో యీవిజృంభించడం బొత్తిగా కనపడక యిన్నాళ్లకి విజృంభించడాని కారంభించడం యింకోటి. కాశికావృత్తికంటె కౌముదే యెందుకు పూర్వం కాకూడదని మొదట ప్రశ్నించి, తరువాత ఆప్రశ్నించడం బొత్తిగా అనభిజ్ఞత్వప్రయుక్తమని నేను సూచించినతర్వాత యిప్పటివ్యాసంలో అపూర్వత్వం గుంటూరిసీమ గ్రంథంలో వున్న నావాక్యాధారం మీఁదే సమర్ధించఁబడుతుందని వుబలాటపడటం యింకోటి. శాంతం పాపం! దీన్ని గుఱించి కొంచెం వ్రాస్తాను. వీరేవాక్యం భ్రమపడి దానికి ఆధారమవుతుందను కొన్నారో! ఆవాక్యం వీరు వుదాహరించినప్పుడు దానితత్త్వాన్ని బోధపఱుస్తాను. యిప్పటికి వారిసంతోషాన్ని అలాగే వుండనిస్తాను. బొత్తిగా శాస్త్ర సంస్కారం లేనివారు యేవో ప్రశ్నలు కూరగాయప్రశ్నలువేసి చాలించక యీబాధకూడా యెందుకో, "బుద్ధిః కర్మానుసారిణీ" మీసపు శంక వదిల్చినట్లయింది. యద్వా మీసం నేను మాత్రమే పెంచి తిరుపతిశాస్త్రి పెంచనేలేదని వాదసౌకర్యార్థం క్షణకాలం వప్పుకుని మాట్లాడుకుందాం. అప్పుడు మాత్రం “పెంచినారము" అని చెప్పఁగూడదా?“అస్మదోద్వయోశ్చ" అనేది యేమవుతుంది? యింకా వాదం సాఁగితే వీరు యింకో ప్రశ్నవేస్తారని తోస్తూవుంది. అది యిది.

“మీరిద్దఱూ జంటకవులు గదా? తిరుపతిశాస్త్రి యిప్పటికి సుమారు 20 యేళ్లనాఁడే దేహం చాలించాఁడు కదా? నీవింకా దిక్కుమాలిన వ్యాసాలు వ్రాస్తూ వొక్కినరంలాగ జీవించి వున్నావేమీ, మాయిష్టం వచ్చినట్లల్లా మమ్మల్ని వ్రాసుకోవడానికి అభ్యంతరం కల్పిస్తూ" అనేది కూడా వొకప్రశ్నలోకే చేరుతుందనుకోవడాని కభ్యంతరం వుంటుందా? యీవిమర్శకుఁడుగారి ప్రశ్నలధోరణి చూస్తే, ఆలాటిప్రశ్న వేస్తారా? విమర్శకాగ్రణిగారు. యిదివఱలో వేసినప్పటికీ యిప్పుడు కొన్ని బిరుదులు పొందివుండికూడా వేస్తారా? అలాటి ప్రశ్న అంటే? యిప్పుడు వేయరేమో కాని మునుపు వేయడాని కభ్యంతరం లేశమున్నూ లేదని మనవిచేస్తూ అలాటిప్రశ్నలే వీరు వేసినట్లు యిక్కడ మఱివకటిచూపి ఋజువు చేస్తూన్నాను. దేవీభాగవతపద్యం వీరివిమర్శన కంతకూ ఆయువుపట్టు పద్యం- “క. ఎన్ని పురాణమ్ములు" అన్నది లోcగడ వుదాహరించే వున్నానుగదా! అందులో యీయన చేసినశంక యేలాటిదో? గమనించండి. అరణ్యపర్వం తెలిగిస్తూ చచ్చిన నన్నయ్య "యేలా నీవిచ్చేమెచ్చు పరిగ్రహించడానికి అర్హుఁడైనాఁ"డనికదా? ప్రశ్నించారు విమర్శకాగ్రణిగారు. ఈయన భాగవతం యెప్పుడేనా ఆఖరికి కృత్యాదిపద్యాలేనా చదివి వుంటారో? లేక లోకోపకారార్ధం సంశయవిచ్ఛేదం చేయడానికి భారతం (అదేనా తెలుఁగే సుమండీ) మాత్రమే చదివివుంటా రనుకోవాలో? తెలియదు. యేమంటారా? “మ. ఒనరన్ నన్నయ తిక్కనాదికవులీయుర్విం బురాణావళుల్ దెనుఁగుం జేసియు” అన్న పద్యంలో పోతన్న గారుచేసిన అపరాధాన్నేనా తి. వెం. కవులు. “క. ఎన్ని పురాణమ్ములు" అనేపద్యంలో చేసింది. అంతకన్న అధికమైనదా? అట్టిస్థితిలో దీన్ని వీరే (తి. వెం.) చేసిన అపరాధంగా అపవదిస్తూ-

1. కవితాలలనమొగంబు బూడిదం బులిమెదవే

2. బ్రాహ్మణుండవ యింత దుర్మార్గమగునె?

3. మామీఁదికరుణ (నన్నయ్య) చచ్చెనటన్నన్

4. దురభిమానంబు నీలోన దొరలికాక.

యిన్ని అసంగతోక్తులున్నూ, సాహసోక్తులున్నూ వ్రాయవలసి వుంటుందా?

పోతన్నగారు నన్నయ్యను పురాణముమాత్రమే తెలిఁగించిన కవులలో మాత్రమే కాదు, పురాణావళుల్ తెలిఁగించిన కవులలో కూడా చేర్చి గౌరవించి వుండఁగా మేము గౌరవించఁ గూడదా? దానికి యీవిమర్శకుఁడు గారి అభ్యంతరమా? మాకు యిక్కడికి విమర్శకుఁడుగారి ప్రశ్న సౌడభ్యం వెల్లడిగా తెలుస్తూవుందా? సౌడభ్యం (లడయో రభేదః) యీలావున్నా తిట్లేమో-1. క్రొత్తవిశ్వస్తలన మూలఁగూరుచుండి, 2. అరయఁ బదియవనాఁటి ముత్తైదువలన, 3. యిద్దఱుభోక్తల కెక్కడెతద్దినము, 4. చచ్చిచెడంగలారు, 5. పదయవనాటియైదువలభంగి నడంగరే?

యీలాటి అమంగళాలతో వున్నా నిరసనోక్తులేమొ? 1. వెఱ్ఱివెంకటాయ, 2. మన వెంకటశాస్త్రి నీతిమాలిన వ్రాతల్, 3. ధీరహితా (బుద్ధిహీనుఁడా), 4. నీవె కవివె?, సింగిగూడఁ గవిత్వంబు చెప్పలేదె? 5. బుద్ధిలేదె? 6. నక్కపోతునని యుపమించుకొమ్ము.

యింతటి అనాత్మజ్ఞత్వంలో వున్నా, యివిలేశమున్నూ నేను గణించనే లేదని ఈయన్ని త్రికరణశుద్ధిగా నేను సేల్జోడు (రమారమి 70 రూపాయిలది) సమ్మానించడానికి ఆహ్వానించినదానివల్లనే లోకం గుఱితిస్తుంది కదా? నేను ఈతిట్లవల్ల అమాత్య సార్వభౌమ వంశోద్భవులే అయినా బొత్తిగా బొందcబడుతూ వున్నారుగదా? అని మనస్సారా గుఱితించి “బుద్ధిః కర్మానుసారిణీ" అని సమాధానం చెప్పికొని యిట్టి అనాత్మజ్ఞులతో ఆసన్న మరణదశాంతర్దశలలో వున్నమనం వాదోపవాదాలకి దిగడానికి ప్రాజ్ఞలోకం బొత్తిగా అంగీకరించదని యింట్లోవున్న పదార్థంగాని మనం కొని చేసేది కాదుగదా? అని,

“క. అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ.”

అనే పద్యాన్ని స్మరించి ఆరీతిగా యీయన అనుగ్రహాన్ని సంపాదించుకొందామని ప్రయత్నించాను. ఈనాప్రయత్నం కూడా విఫలమే అయింది. విమర్శకుఁడుగారు దీన్ని అవమానంగా భావించారు. లోక మేలా భావించిందో? చూడండీ, చాలా వుత్తరాలున్నా వక్కపిల్లకవి వత్తరంలో నుంచి కొన్ని మాటలు మాత్రమే వుదాహరిస్తాను.

గునపఱ్ఱు, తాడేపల్లిగూడెం పోష్టు,

24–05–1939.

మానాప్రగ్గడ శ్రీరామసుబ్బరాయశర్మ నమస్కరించి వ్రాసికొనెడి

విజపి :

"కృష్ణాపత్రికలో ప్రకటింపఁబడినవ్యాసము (నన్నయ్యనుగూర్చినది) చూచితిని. దేవీభాగవతపు విమర్శకుఁడుగారికి మీరిచ్చిన సమాధానము చదివితిని. వారు పశ్చాత్తప్తులు కాకపోరని నానమ్మకము. ఏమందురా?

“క. తిట్టినవారల మరలం
     గట్టలుకం దిట్టఁబోక కానుక లఱుతం
     జట్టఁగఁ జూతురు శాంతముఁ
     బెట్టెనె? మీ యమ్మ ఉగ్గుఁ బెట్టెడివేళన్."

నాకాశ్చర్యమైనది. ఇట్టి శాంతయుతుని ప్రేరేపణ లేకయే మీకృతి కర్తగారికి (మానియోగితల్లజునకు) కవిలోకమే సమాధానమీయఁగలదు.

చేవ్రాలు.

అనేకులు కవులు, అడ్వకేట్లు (ఇందుఁ గొందఱు వాచా అభినందించినవా రున్నారు.) ఉద్యోగులు (వీరందఱు నియోగులే) నాపూనికను అభినందించిన వారుగలరు. అసలు . వారూ వీరూ యెందుకు బోధించాలి. విమర్శకుఁడుగారి వార్ధక్యం బాగానే వుండి నలుగురి నోళ్లల్లో పడవలసిన ప్రాప్తి లేకపోతే వారివృద్ధత్వమే వారిని బోధించేది. “అవశ్య మనుభోక్తవ్యం కృతంకర్మ" నిరసించినవారల్లా నేనెవరిని ఆతిథ్యమునకై ఆహ్వానించితినో వారు మాత్రమే అయితే, వారికి మనస్సులో అన్ని అనుచితమైనతిట్లు తిట్టి యేలావెళ్లి వానిసత్కారాన్ని స్వీకరించేది అనే సంశయం కలగడంలో ఆశ్చర్యం వుండకూడదు. అది మానవసహజమైనధర్మం. ఎంతకోపం లోపల వున్నా శారీరక ధర్మాలుగాని, మానసిక ధర్మాలుగాని మార్పుచెందవన్నది సర్వానుభవసిద్ధం. అకారణంచేత మొగం చెల్లక వారు నిరసించారు గాని మఱోటికాదు కనక మళ్లా వారిని ప్రార్ధిస్తాను. అయితే - “రానివారలన్ రమ్మని పిల్వ వేడుకనరా" అని నన్ను లోకం పరిహసిస్తుందేమో? వినండి ఆయన నన్ను తిట్టినా ఆదూషణాలు నాకు భూషణాలుగానే పరిణమించాయి. యీలాటి తిట్లకు వప్పుకోలేదుగాని కీ|| శే|| సోమంచి భీమశంకరంగారు (ప్లీడరు) అమ్మాఆలీ బూతులయితే ఆశీర్వచనాలే అని వొకప్పుడు చమత్కరించారు. యీతిట్లు లోకంలో యీలాటివా రుంటారని తెలుసుకోవడానికి అవకాశం గలిగి గురుత్వాన్ని కూడా చేసినట్లయింది. అందుచేత మొదట కొంచెం భారంగా కనపడ్డా, క్రమంగా అది చెడ్డపని అయినప్పటికీ, ముమ్మాటికికూడా చెడ్డపనేఅయినప్పటికీ దానివల్ల నాకుఁగాని, నాయశస్సుకుఁగాని, యిప్పుడు గాని, భవిష్యత్కాలంలోఁగాని జరిగే అపకారం యత్మించిత్తూ కూడా లేదని నాకు తోcచింది. దీన్ని లోకం యెంతవఱకు విశ్వసిస్తుందో నాకు తెలియదు.

“ఉత్పత్స్యతే మమ తు కో౽పి సమానధర్మా"

అన్నాఁడు భవభూతి. అలమతి విస్తరేణ. అందుచేత వారిని నేను కవితాధార సాఫుగా వున్నదనే గుణలేశాన్ని పురస్కరించుకొని తక్కిన దాన్ని సర్వమున్ను పొల్లుగా భావించి జల్లించి “తోసిరా” జని సమ్మానింప దలఁచినాను. యిప్పటికీ యింకా నాప్రయత్నం అమల్లోనే వుందిగాని “నిరాశాః పితరో గతాః" కాలేదు. వారితిట్లు సమర్థనీయాలు కావన్న సంగతి వారికి బాగా గోచరించినట్లు వారి యిటీవలి సశేష వ్యాసంలో వుండే అక్షరాలవల్ల వ్యక్తం అవుతూ వుంది. ఆ అక్షరాలు చూచాకే నేనీ వ్యాసాన్ని వ్రాయడానికి ఆరంభించాను. ఇంకా వారి వ్యాసం “సశేష" స్థితిలో వున్నా యొప్పటికప్పుడే జీవితసంశయంలోవున్న నేను రాఁబోయేవారివ్యాసశేషం చూడకుండానే, “మీగాళ్ల" సామెతగా భవిష్యత్తులో రాఁబోయేవారి మాటలను భావనాశక్తిచేత (కవులకు భావనాశక్తి చాలా సంగతులను గోచరింపఁ జేస్తుంది). వూహించి మళ్లా యీ ఆహ్వానాన్ని పంపుతూన్నాను. ఇది విషయాంతరం. వారి వ్యాసంలో వున్న యీమాటలు వారికి వారితిట్లను సమర్థించుకునే వుపాయం లేక నీళ్లు నమలవలసి వచ్చిందన్నసంగతిని తెలుపుతాయో! లేదో! చదువరులకు తెలియడానికి వుదాహరిస్తూవున్నాను.

“31 సంఖ్యగాఁ గొన్ని పద్యములు వెగటుగాఁ గనపడునట్లుటంకించి కొంత విపరీతార్ధము చేసి వ్రాసియున్నారు. శాస్త్రిగారి యుద్దేశమేమియో? నేనట్లు తమ్ము నిందించినట్లు లోకమునకుఁ దోఁచవలయుననికదా? కానిండు నా గ్రంథమామూలాగ్రము చదివినవారికైన సత్యము తెలియఁబడదా?” అని వ్రాయ మొదలిడినారు. నేను చేసిన విపరీతార్థమేమో? అసలు వారి సుపరీతార్థమేమో శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులు గారు గాని, లేదా వీరిని ధూళిపూడి సభలో అభినందించి నాపేరు లేక మాయిద్దఱి (తి. వెం. కవుల) పేరులు యెత్తికొన్న శ్రీ శిష్ట్లాశాస్త్రులుగారు గాని లేదా ఆ సభకు ప్రసిడెంటుగా శ్రీ పిఠాపురం మహారాజావారి కాలేజీ నుండి దయచేసిన పండితమండనులు గాని నాకు తెల్పి మందలింతురని కోరుచున్నాను. నేనొకవేళ అందులో సుపరీతార్ధమే వుందని ఆబ్రాహ్మడికి యీలోకంలోనే కాదు పరత్రకూడా అపకారం యెందుకు కలగాలనిఅన్నా వెగటుగాలేదు సొగసుగానేవుంది. స్వర్గానికి మెట్లు కడుతూవుందని అబద్ధానికి సిద్ధపడి వాదించడానికి దిగినా; ఆయీ ముద్దుమాటలను సీ! యని రోయని పుణ్యాత్ము లెక్కడేనా పుట్టి వున్నారా? అనేదే నాశంక. వీరే అక్కఱలేదు విమర్శకుడుగారు తమకుఁదోఁచిన యేవిజ్ఞుల పేరులుదాహరించినాసరే, వారేశాఖ వారేనా సరే, యేకులంవారైనా (18 జాతులలో) సరే, ఆడవాళ్లేనాసరే, మగవాళ్లేనాసరే, ఆ తిట్లు తిట్లుకావనియు, అందులో అంతరార్థం సుపరీతార్థ మున్నదనియు "పదియవనాటి ముతైదువు" పుణ్యస్త్రీయే అనియు అర్థము చెప్పి విమర్శకుఁడు గారిని వొడ్డెక్కిస్తే నేను సంతోషిస్తాను. (యేదో? కాలకర్మ దోషంచేత కర్మం చాలక అలా నోరుకాదు చేయి జాఱింది అని క్షమాపణ (నాకుకాదు) లోకానికి చెప్పి నిర్దోషత్వాన్ని సంపాదించుకోక యింకా తగుదునంటూ యీ పిడివాదం యెందుకంటాను?) తగుదునని యింకా వ్యాసాన్ని వ్రాసి పత్రిక నిండిస్తూ తమ అనుచిత ప్రసంగాన్ని సమర్థించుకోవడానికి ఉపాయం కనపడక యితరులు విపరీతార్థం చేశారనిన్నీ"వెగటుగా వుండేటట్టు ప్రకటించా"రనిన్నీ అపవదించడం శోచనీయం కాదా? పైఁగా

శాస్త్రిగారి యుద్దేశమేమియో? నేనట్లు తమ్ము నిందించినట్లు లోకమునకుఁ దోఁపవలయునని కదా? (లోకానికి నిందించినట్లు తోఁచదు స్తుతించినట్టుగానే తోస్తుందేమి?)

ఈ వాక్యసౌడభ్యం చదువరులు గమనించాలి. శాస్త్రిగారియుద్దేశం శాల్జోడు సమర్పించుకోవడమే ముమ్మాటికిన్నీ అంతే. తిట్టనట్లుమాత్రం లోకానికి తోఁచకుండా శాస్త్రిగారు చేయాలి. చేయగలరా? తిడితేమాత్రం 76 సంవత్సరాల బ్రాహ్మఁడుగదా! యెందుకు పడఁగూడదూ? అంటాను పైఁగా అంతకంటె అనఁగా తిట్లకంటె అధిక పాండిత్యం పూర్ణానుస్వారంగా వుండి విమర్శనకు పూనుకొన్నవృద్దులు తిడితే మాత్రం నోరుమూసుకూరుకోవాలిగాని అయ్యా! చూడండని వారితోను వీరితోను చెప్పకోవడం కూడానా? యెంత ఘాతచేశాఁడూ. వెం. శా, (ముదిమి రెండవ బాల్యంబు కదా) అవును తప్పే. దాన్ని వారించుకోవడానికేకదా? శ్రీవారిని శాల్జోడుతో అభినందన పద్యాలతో సహాగా సత్కరించడానికి సంకల్పించుకున్నాఁడు. కాబట్టి వారు వాఁడికోరిక తీర్చడంకన్న కర్తవ్యం లేదు. పైఁగా “నేను విమర్శన గ్రంథమున వ్రాసిన విషయములకు సరియైన సమాధానము వ్రాసిరేమో చూడఁడు.” (యెంతముద్దుగా వుందో? యీ వాక్యం పరిశీలించాలి) అని కూడా వ్రాస్తారే? నన్నయ్యను గుఱించిన ఆక్షేపణ దానిలో వున్నదేనా? మీసప్రస్తావన దానిలోదేనా? వాట్లను గూర్చి నన్నయ్య భట్టు వ్యాసంలో మొదటి దానికిన్నీ దీనిలో మీసప్రసక్తికిన్నీ సమాధానం వ్రాశానా? తక్కినదానికి బంధుసముద్రులకి బరాతం పెట్టివున్నానా?

యిఁకనల్లా “పదియవనాటి ముత్తైదువు వగయిరా తిట్లకు నేను జవాబు చెప్పవలసి వుంటుంది. యేమని చెప్పాలో తోఁచకే సేల్జోడు బహుమానంగా యివ్వదలచుకున్నాను. (వెనక అధాత్తువాదం చేసి నీయమ్మజిజ్ఞాసా అంటూ వాదించినపండితుడి కేశాలు శిరస్సున ధరించి తనకు రాజుగారిచ్చిన బహుమానం ఆయనకిచ్చిన సంగతి లోకానికి తెలియదా? వెం. శా. ఆయనకి తీసిపోతాఁడా) ద్రావిడ స్త్రీల కుచాలుకూడా తడివినందుకు వొక్కనాకేకాక పత్రికాధిపతులకుకూడా సంబంధం వుండడంచేత మేము ఉభయులమున్నూ చెఱివక సేల్జోడున్నూ బహుమతీచేస్తేనేగాని మా పాపాలు పటాపంచలైపోవు. వెల్నాటికనక తి. శా. కి యీ ప్రాయశ్చిత్తం చేసుకోవలసివుండదు. ధన్యుడు! కనక వేంకటేశ్వర శాస్త్రులవారిని హెచ్చరిస్తూన్నాను. సేల్జోడు సిద్ధంచేయమని. యిఁకమీఁదటనేనా యీలాటివారి వ్యాసాలు అనాలోచితంగా ప్రకటించి నాబోటి సర్వసంసిద్దులకి అమాంగళ్యపు వ్రాఁతలు (మఱివకప్పపుడేనా సరే) వ్రాసే యీలాటి ప్రబుద్దులద్వారా పనికల్పించి బాధించడం యుక్తంకాదని పత్రికాప్రవర్తకులకు తోఁచేయెడల క్రియారూపంగానో, వాగ్రూపంగానో వారిఅనుతాపాన్ని ప్రకటించ గోరుచున్నాను. లేదా? పరుండియే నే నింకా బళ్లని తోలగలను వ్యాసాలు. వాట్లని జాగ్రత్తగా ముద్రించి ప్రకటించి ఆయీలోపాన్ని సవరించుకోవలసిందని ప్రార్థిస్తాను. విమర్శనగ్రంథం చూచినట్లయితే మీరు యెంత యేవగించుకుంటారో అనుకుంటాను. అయినా నాకోసంచూచి అందేదేనా ఉత్తరం యియ్యతగ్గది వుందేమో? పత్రికాధిపతులు చూపితే దానికి తోఁచినసమాధానాన్ని యిస్తాను. అధిపతులే అక్కఱలేదు. నన్ను ద్వేషించేవారు సుప్రసిద్దులు కొందఱున్నారుగదా? పేళ్లెందుకు తీరికూర్చుని ఆ ద్వేషించేవారిని ఆశ్రయించేనా సరే తిట్లుకావని వారిచేత అనిపిస్తే యింకో సేల్జోడుకూడాను. సరేనా అసలు విమర్శకులకు నన్నుప్రశ్నించడానికి అర్హత యెంత వఱకు వున్నట్లు గోచరిస్తుందో? ఆయనచేసిన “పదియవనాఁటి" వగైరా 31 ఆశీర్వాదాల వల్లనే కాక యింకా గ్రంథంలోవున్న ఆశీర్వాదాలవల్ల కూడా నిర్ణయించి పత్రికలో పత్రికాధిపతుల ఆచార ప్రకారం ప్రకటించి లోకాన్ని సంతోషపెట్టఁగోరతాను. పత్రికలలో పలుసంగతులు పడుతూ వుంటాయి. వాట్లన్నిటికీ మేము బాధ్యులమా? మీలో మీరు వాదోపవాదాలద్వారా తీర్చుకోవలసిందే అనిగాని, లీగల్‌గా అనిగాని జవాబు చెపుతారా. యిది స్పెషల్ విషయంగా మీరు పరిగణిస్తారనియ్యేవే యింతగా వ్రాశాను గాని లేకపోతే యీమాత్రానికైతే వ్రాయను. ఈయనకు జవాబు చెప్పలేకపోను? (అనcగా యిప్పుడేకాదు జీవితానంతరం అధమం ఒక సంవత్సరందాకా కూడా చేతిలో లేఖిని పనిచేస్తూనే వుంటుందని నా పిచ్చి నమ్మిక) గాని యీ వయస్సులో యీలాటి అనుచిత ప్రసంగానికి (అనగా కోర్డువారు తీర్చవలసిన దానికన్నమాట) నేను జవాబులు వ్రాస్తూ కూర్చుండడానికి లోకోపకారకార్యాలలో తఱుచుగా ప్రవర్తించే మీబోట్లు ఆమోదిస్తారా? మీ పత్రికపుట్టి సుమారు యిరవైయేళ్లేనా కాకపోదుగదా? యేవిమర్శకులేనా యే గ్రంథకర్తనేనా “పదియవనాఁటి ముత్తైదువు" లోనైన అపృచ్ఛ్యపు మాటలతో బహూకరించి నట్లెఱుఁగుదురా! అట్టిమాట లెన్నఁడేcనా మీరు (ఇప్పుడూ ఆమాటలు మీరు ప్రకటించ లేదుసుడీ పాపం! ఆయనే ప్రతిష్ఠకోసం చిరకాలం దాఁచిదాఁచి యిప్పటికి అదృష్టంపండి స్వద్రవ్యంతో బయటికిఁ బెట్టివున్నారు.) మీ పత్రికలో ప్రకటించి వున్నారా? అని నా ప్రశ్న తాము జూడలేదు యీయన తిట్లని యీసంగతి నేనెఱుఁగుదును. యీయన విమర్శకులు కారు. వట్టి అనాత్మజ్ఞులు అని నేను తెలిసికొన్నాను. మొట్టమొదటనే పంపిన భారతసంశయవిచ్ఛేదం మీఁద అభిప్రాయం అసలు వారు కోరకుండానే నాఅంతట నేనే వొకమాదిరిగా యిచ్చి మెల్లిగా రంగంలోకి అవతరింపచేశాను. అప్పుడీపుస్తకం విమర్శనం పంపించారు. చూచాను. సమ్మానించ తలచాను. దానికి ఆయన నాకు అనుగ్రహించిన ప్రత్యుత్తరం ఇది. -

“తామే మాగ్రామము వచ్చి సభచేసి చేయవలసి యుండునుగాని నేను తమగ్రామము వచ్చుట తగియుండదు.”

“యెందుచేత తగియుండదోకదా? కృతిప్రదాత కృతి నాయకుని కడ కేగి సమ్మానింపఁబడుట ఆచారమా? కృతినాయకుఁడు కృతియిచ్చిన గ్రంథకర్తయింటికేగి సమ్మానాన్ని పొందుట ఆచారమా? తిక్కన్నసోమయాజులుగారికి కేతనమహాకవి దశకుమారచరిత్రను కృతినిచ్చెను గదా? దానిని తిక్కన్నగారి గృహమునకు వచ్చి వినిచి సమ్మానమును తిక్కన్నగారి గ్రామములో పొంది వుండునా? లేక తిక్కన్నగారే కేతన్నగారి వూరు వెళ్లి అక్కడనే కేతన్నగారి కవిత్వాన్ని విని వారింటే భోంచేసిసమ్మానించి వచ్చివుంటారా? మనుమసిద్ధి తిక్కన్నగారింటికి వచ్చి ఉత్తర రామాయణాన్ని విని సత్కరించి తన రాజధానికి లేదా కోటకు వెళ్లియుండునా? యింతటి పరిజ్ఞానంకూడా గుం. డి. విమర్శకుఁడు గారికి లేదని లోకం అభిప్రాయపడరాదు. నేను అంతకంటే పడేదిలేదు. కాని యేంచేస్తారు పాపం! వురిలో చిక్కారు. "అప్రతిపత్తిమూఢమనసా ద్విత్రాస్థితా నాడికాః" అన్న యెత్తు నేనెత్తడంచేత యేమీ వ్రాయడానికి కలమాడక యీలా అపహాస్యపు టక్కరాలు వెళ్లఁగ్రక్కారే! కాని అసలు శక్తి యీలాటిది కాదు. లౌకికాగ్రేసరులు అంకెలలో మంచి పాండిత్యముంది. దాన్నిబట్టి సంఖ్యావంతులు కూడా (అసలు సంఖ్యావచ్ఛబ్దవ్యుత్పత్తి వేఱుకదా) అనఁబడతారు. యీమధ్యనే అభినవ తిక్కయజ్వలు కూడా వారి గ్రామంలోనే (యింట గెల్చిరచ్చ గెలువు మన్నారుకదా) అయి వున్నారు. యీ పైని త్రిలోక విజయంకూడా చేస్తే చేస్తారేమో; “పదియవనాcటి ముతైదువునూ, దశాహంనాcటి ముతైదువునూ" బంగారు పట్టుతల్లిగా సమర్ధిస్తారు. (ఇంకా యీలాటి అపృచ్ఛ్యప్రసంగం చాలావుంది.) దానితో ఆ బిరుదేకాదు సర్వమూ సమర్ధితం అవుతుంది చూస్తాము. కానీ ధూళిపూడి గ్రామస్థులకు మహాకవి తిక్కన్నగారియెడల గౌరవం లవలేశమున్నూ లేదేమోనని వివేకులు అనుమానించవలసి వస్తుందేమో అని నాచింత. యేమంటే? యీయనజ్ఞానం మిక్కిలి సామాన్యంగా కనపడుతూ వుంది. వీరికిచ్చినస్థానమేమో పెద్దది యిప్పుడు తిక్కన్నగారి యశఃకాయమే వుందిగాని అసలు కాయంలేదు. పరిశీలించేవారు అనుకోరుగాని, స్థూలదృష్టులు వారి బండారంకూడా యింతపాటిదే అనుకుంటే? అయ్యో కర్మమా! తిక్కన్నగారి ప్రజ్ఞావిశేషపరిజ్ఞానానికి యీలాటి వుపమేయ స్థానాలేనాగతి? అలా యెవరంటారు, గాని లోకంలో ప్రాజ్ఞుల సంఖ్య చాలా తక్కువ, ప్రాజ్ఞేతరులే అనఁగా? జ్ఞానలవదుర్విదగ్ధులే యెక్కువ. అందుచేత కొంత వారికికూడా మనం భయంపడవలసి వుంటుందని నామనవి. సరిగ్గా నాలుగు పంక్తులు వ్రాయడానికి సామర్థ్యం పూర్ణానుస్వారంగా వుండే వీరు పెద్దపెద్దమాటలు ప్రకటిస్తారే! యీసాహసం వీరికి యొక్కడనుండి వచ్చిందోగదా! ఆ యీ సందర్భం యిఁక లోకమే తేలుస్తుంది. అందుకే నాశాంతి మంత్రాలు వీరికి నచ్చాయి కావు. నాసంధి అంతకంటే నచ్చింది కాదు. నాసమ్మానాన్ని నిరాకరించారు సరే, అంతటితోనేనా వూరుకున్నారా! ఊహూ! ఊరుకోలేదు. యీ క్రింది వాక్యాన్ని చిత్తగించండి.

“అట్లుకాదేని వారు వచ్చినశత్రుణ్ణి నన్ను జామాతగా విమర్శకుడు గారు బుద్ధిపూర్వకంగా అంగీకరిస్తారని యెవరనుకుంటారు? భవతు. యేలాగయితేనేమి? యిప్పటికి మనుగుడుపు ఆహ్వానందాఁకా వచ్చింది కదా? యీ వివాహం సర్వథా రాణిసంయుక్తకున్నూ, పృథ్వీరాజుకున్నూ జరిగినమాదిరిగా ఆచరిత్ర యెఱిఁగినవారు భావిస్తారు. సంయుక్తతండ్రికి యేకోశమందున్నూ పృథ్వీరాజుయందు యిష్టంలేదు, లేకపోతే మాత్రం దైవలిఖితం తప్పుతుందా?

"ఎన్నఁగ రాదుగా? మఱియు నేఱికి నేఱికి ధాత వ్రాయునో కృతి యిచ్చి వుండిన్నీ బహుమతి పుచ్చుకోవడానికి దయచేయవలసిందని నేను సగౌరవంగా కోరితే గతంలో తామొనర్చిన అపచారాలవల్ల రావడానికి మొగం చెల్లక ఆ బహుమానం అక్కడకే మూటగట్టి తెచ్చి చేయవలసిందంటారే! యిది యెక్కడి లోకజ్ఞానం బాబూ? ఏమో? అలాఅనడానికిన్నీ వల్లకాదు; “కవితాలలన మొగంబు బూడిదం బులిమే" వాళ్లకు దానిలోవున్న సారస్యం బోధపడుతుందా! ఏదో మాదిరి "ముతైదువు" కదా! వాఁడు కృతిభర్త సేల్జోడు పట్టుకొని అత్తవారింటికే (స్వంత ఖర్చులతో కూడా కాబోలును) వెళ్లి కృతికన్యాప్రదాతను సమ్మానించడం యెట్టిదో? ధూళిపూడి గ్రామమే తెలుసుకొనుcగాక. ఆ భారం దానిదే నాకెందుకు - యిఁక. “ఏ భూపాలుc డీవచ్చినన్” అన్నసాఁకును గూర్చి విచారిద్దాం. తృతీయ చరణంలో వున్న- “సాలగ్రామము మున్నుఁగా గొనఁడు” అన్నది బాధిస్తుంది కాఁబోలు స్పృశించనే లేదు. ఆసాలగ్రామ పదంవల్ల కాళ్లుకడిగి మంత్రపూర్వం యిచ్చే షోడశమహాదానాలు గాని, దశదానాలుగాని (అనఁగా పురోహితవృత్తిలో వుండేవారు పరిగ్రహించే వన్నమాట) ప్రవరాఖ్యుఁడు న ప్రతిగ్రహీత కనక పరిగ్రహించడనే స్వారస్యమే వస్తుందిగాని, పాండిత్యప్రయుక్తమైన సన్మానాలుకూడా అతఁడు పరిగ్రహించక నిరాకరిస్తాఁడని స్ఫురించదు. స్పృశించక వదిలినా ఆసాలగ్రామం "ఎట్‌సెట్రా" న్యాయంచేత వచ్చితీరుతుంది. పెద్దనామాత్య ప్రభృతి మహాకవులు అగ్రహారాదులు రాజులవల్ల సగౌరవముగా స్వీకరించేవున్నారుగాని నిరాకరించలేదు (కోకటగ్రామాద్యనే కాగ్రహారంబు లడిగిన సీమల యందునిచ్చె). కాఁబట్టి మన అభినవతిక్కయజ్వగారు నాయిచ్చుసేల్జోడు బహుమానాన్ని నిరాకరించడానికి ఆసాఁకు బొత్తిగా యేమీ ఉపకరింపనందున- మొగం చెల్లకపోవడమే యిందుక్కారణమని తప్పక యొప్పికోవలసి వస్తూవుంది. యీవూహ నిక్కమే అయితే యిప్పటికేనా "పశ్చాత్తాపానికి" వచ్చినట్టు ప్రాజ్ఞలోకం భావించడమే కాకుండా పశ్చాత్తాపం పాపనివారకంకాఁబట్టి పారలౌకికపు చిక్కు కూడా వారికి లేదని తోస్తుంది. నాకు వయస్సు ఉత్తరవయస్సు కనక ఐహికభయం కంటె పారమార్థిక భయమే యెక్కువగా చూచుకోవలసి వుంటుందని వేఱుగా చెప్పనక్కఱలేదు. “శా. నాకుం దోఁచినమాట యైహికమటన్నన్ దీర్ఘ యాత్రాపరుల్, వీఁకంజేయు మకాము లందొకటియౌ వేయేళ్లు జీవించినన్." మఱేమీ ఆశ్చర్యంగా కనపడదుగానీ, యే పైలాపచ్చీసు వయస్సులో నేనావున్నవారైతే యీలాటి తిట్లుతిట్టి ప్రచురించారన్నా కొంత అంగీకరించడానికి మనస్సు వొప్పుకుంటుందిగాని యీలాటి పెద్దలు, భారతాది గ్రంథపరిశీలకులు, విమర్శకులు, లౌకికసార్వభౌములు పైఁగా అంతో యింతో కవులున్నూ గదా? వీరు! వీరు“పదియవనాఁటి" మొదలైన తిట్లు మమ్మల్ని కాదే అనుకుందాం వేఱొకరినేనా యెంత నికృష్టుణ్ణేనాతిట్టి ప్రచురించి (వారు కోర్టుకు మాలాగే వెళ్లరే అనుకోండి) మళ్లా లోకంలో యెలా తలెత్తుకు తిరగడానికి వల్లపడుతుంద దనుకున్నారో అనేదే పెద్ద సందేహం. మాశిష్యకోటిలో వ్యక్తులిద్దరు యీమధ్య నేను బెజవాడ వెళ్లినప్పుడు “యీలాటివారి కందఱికీ మీరుజవాబు చెపుతూ వుండడం మీది పెద్దలోపం" అంటూ నన్నుమందలించడానికి మొదలుపెట్టారు. దానిమీద-

"నాయనా! ఆయనమీకు దగ్గఱ బంధువులు కాకపోయినా శాఖా మాత్రబంధువులు కాకపోరుగదా? నాకుపనిలేకుండా పోతుంది. కాస్త కలిగించుకొని మంచి మార్గానికి తిప్పండి అని ఆ యిద్దఱిలో వకరితో మాత్రము అని చూచాను. కానీ అతనికి యెల్లప్పుడూ ఆ కాంగ్రెస్సు వర్కుతోటే సరిపోవడం చేతనో యేమో? మళ్లా యీప్రసక్తి యెత్తుకోనేలేదు. లేకపోతే వుపేక్షించేవాఁడు కాఁడు. గుంటూరుసీమ వివాదల పుట్టుపూర్వోత్తరం పూర్తిగా యెఱిఁగి అయ్యో! అని నొచ్చికొనే వాళ్లల్లో మొట్టమొదటివాఁడే, "ఉ. శాఖకు నప్రతిష్ఠ" యీలాటి వృథా అభిమానం అని చింతించేవాఁడే. అయినా -

"నమాజు చేయఁబోతే మసీదు మెడ బడ్డది" అన్నట్టున్న యీవ్యర్థ వ్యాపారంలోకి యెవఁడో నావంటి చేదస్తుడుతప్ప యెవఁడు కలిగించుకుంటాడు? ఆలాకలిగించుకుంటే విమర్శకుఁడుగారు ఆవ్యక్తులనుకూడా విభీషణాయిగాళ్లని నిందించడం వుంది. అది వారివిమమర్శన గ్రంథంలో వక విశేషాంశమే. కీ|| శే|| వడ్లమన్నాఁటి నరసింహశర్శనున్నూ ప్రస్తుతం విశాఖపట్నంలో ఉద్యోగిగానున్న పింగళి లక్ష్మీకాంతాన్నిన్నీ నాఁడేమో అనఁగా గుంటూరుసీమవివాదములలో ఆవలిపక్షానికి వ్యతిరేకంగా న్యాయపక్షాన్ని వర్తించారని వీరు దూషించివున్నారు. భవతు. యిప్పుడు వీరి వుద్యమాన్ని యేబంధుసముద్రులు సమర్థిస్తారో? చూడవలసివుంది. యేదో ఆకాలంలో ఆసీమలో వివాదం జరిగిందన్నమాటే కాని అప్పుడు పరమశత్రువులుగా వున్న వారందఱున్నూ యిటీవల పరమబంధువులుగా మారినట్టు నాకు బాగా అనుభూతం అయింది. అది బ్రాహ్మణలక్షణం. యెందుకు అలాగ మాఱ రంటాను. నన్నయ్యభట్టు- "విప్రులయలుకయు తృణహుతాశనమ్ము దీర్ఘమగునె?" అని వూరికేనే అన్నాఁడా? అతఁడు లోకజ్ఞుఁడు "లోకజ్ఞునుభయభాషా" అని వూరికేనే వ్రాసుకున్నాఁడా? లేదు. యిప్పటికి సుమారు 16 యేళ్లక్రితం నేను హఠాత్తుగా గుంటూరు వెళ్లడం తటస్థించింది. అప్పుడు శ్రీయుతులు పాటిబండ సూర్యనారాయణరావుగారు (ప్లీడరు) అరండల్ పేటలోనే అనుకుంటాను వారు కట్టించిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం చూడాలని బలవంతంగా తీస్కువెళ్లి యెంతో ఆదరించారు. అప్పటిమాట యెందుకు? సంవత్సరానికి పూర్వం బెజవాడలో శ్రీపాటిబండ సుందర్రావుగారు (అడ్వొకేటు) యెంతో ప్రయత్నపూర్వకంగా సపుత్రకంగా, సచ్ఛాత్రంగా, నన్ను వారింటికి పిల్చుకొని వెళ్లి సేలువలువగైరాలతో సమ్మానించి విందుకూడా చేశారు. పాటిబండవారినే ప్రత్యేకించి యెందుకు యెత్తుకున్నానంటే ఆరోజుల్లో “పండితబ్రువ లక్షణం" అనేపేరుతో మామీఁద కొన్ని దూషణోక్తులు వ్రాసినవారు పైవారిలో మొదటివారు. రెండవవారు బహుశః అప్పటికి పుట్టివుంటారేమోకాని (కౌపీనవంతః ఖలు భాగ్యవంతః") కనక ఆ యుద్ధంలో పాత్రత్వం వున్నవారు కాకపోయినా వారితండ్రిగారు శ్రీవేంకటరమణయ్య పంతులవారికి ద్వేషుఁడంటూ వుండవలసివస్తే చెళ్లపిళ్లమాత్రమే. కార్డులోకూడా (లౌకికాగ్రేసరులై వుండికూడా) వాఁడు మహా దుర్మార్గుఁడు అని నిరాఘాటంగా వ్రాసేవారు. శ్రీయుతులు కృత్తివెంటి గంగరాజుగారు ఆవ్రాయడాన్ని చూచి చాల మెచ్చుకొనేవారు. నేను వారి (వెం. ర. య్యగారి) వ్రాఁతనే సమర్థించేవాణ్ణి. దానిమీద గంగరాజుగారికి పంతులుగారి మీద మఱింత కోపంవచ్చేది. యింతే వ్రాయవలసింది. యిఁక వ్రాస్తే సారస్యం చెడుతుంది. శేషం ఊహించుకోండి- లేదా? గంగరాజుగారికి బందరు వ్రాసి తెలుసుకోండి. చాలును యీసందర్భంలో నన్ను కార్డులో కూడా వాఁడు దుర్మార్గుఁడు అని వ్రాసేవారి వ్రాఁతను ఆమోదించి నేను సమర్ధించడపు లౌక్యంయేమిటి? అని అడుగుతారేమో? అందులోనేవుంది. వెం. శా. ప్రజ్ఞావిశేషం యావత్తూ; ఈ బ్రాహ్మణుడువంటి యేకొలఁది మంది హృదయం లోనోతప్ప ఆనాఁటివిషయం లేశంకూడా యిప్పుడు వున్నట్లేలేదు. వారూవీరూ క్షీరనీరన్యాయంగా వుంటూవున్నరోజుల్లో యీయన మళ్లాదీన్ని లేవదీశారు. అయితే దీనిమూలాన్ని యీయనకేమాత్రమో లభించడం జరిగిందని వింటాను. అందుచేత కొంత అవసరమే అని తోస్తుంది. “సర్వ స్వార్ధం సమీహతే" కదా! యీయన ప్రశ్నలు చూస్తే ఆశ్చర్యంగా వుంటుంది. అత్యాశ్చర్యంగా కూడాను. దేవీభాగవతంలో నష? నా తెలివిని చూపించానుష?. (దేవీభాగవతమున నీతెలివి చూపి చూ.) దేవీభాగవతాన్ని ఆంద్రీకరిస్తూ వున్న నేను నా తెలివిని చూపక యితరుల తెల్వి నేలా చేసేదీ? యెరువు తెచ్చుకొనేదా? “ఆదికవిభేద మిందేమి యవసరంబు" అంటూ వకప్రశ్న యీప్రశ్నకు కొంచెం వ్రాసి యిఁక వ్యాసం విరమిస్తాను. ఆత్మకూరి విద్యావివాదం దేవీభాగవతం రచించడానికి మొదలిడిన కొద్దికాలంలో ప్రారంభ మయింది. ఆపండితులు లక్ష్యవిషయంలో భారతాన్నేకాని వొప్పేవారు కారు సరిగదా? అందులో నన్నయ్యనిమాత్రమే. యీచేదస్తం వారికి తెచ్చిపెట్టింది అహోబలుఁడున్నూ కవిరాక్షసుఁడున్నూ ఆసందర్భం యీకారణంచేత ఆకాలంలో ప్రస్తుతం అవడంచేత, ఆగ్రంథపీఠికలో భారతప్రామాణ్యాన్ని గూర్చి చర్చించడం అవసరం అయింది. యెత్తుకున్నాను. చర్చించాను. చర్చించాను. తుట్టతుదకి “ఏమైనను భారతమ్మునకు నంజలి సేయక తీరదేరికిన్." అని ముగ్గురు కవులూ ప్రామాణ్యకోటిప్రవిష్టులే అనితేల్చాను. యీయనకేం తెలిసి ప్రశ్నించారో! పాపం! “ఆదికవిభేద మిందేమి యవసరంబు" అంటూ ప్రశ్నిస్తూ, పైఁగా అంతటితో సరిపెట్టక, "దురభిమానంబు నీలోన దొరలికాక" అనికూడా పైని కొసరువేస్తారు. ఆయీసందర్భాలు యెన్నని యెత్తిచూపేది? చూపడమే వస్తే వొక్క త్రిలింగ చాలుతుందా? నేఁటి తెలుఁగు పత్రికలన్నీ కలిస్తే కూడా చాలుతాయా? యింతటి అమాయికసార్వభౌములెక్కడేనా వుంటారా? యేప్రసక్తిన్నీ లేకుండానే భారతాన్ని గుఱించి అన్నిపద్యాలు పిచ్చిగానీ యెత్తి దానిపీఠికలో వ్రాస్తామా? పైఁగా నన్ను నేను, "నక్కపోతని" ఉపమించు (పోల్చు) కోవాలష! సరి! యెవఁడేనా తన్ను తాను "నక్కపోతునని, కుక్కపోతుననీ" ఉపమించుకుంటాcడా? విమర్శఁకుడుగారు యెన్నెన్నో బూతుఁగూఁతలు కావుకావు అమాంగళ్యపుకూఁత లుపయోగించినప్పుడు యీ "నక్కపోతు" కూఁత మాత్రం అంతకు తీసిపోయిందని కాఁబోలు నాకు వదలిపెట్టారు. వారే వుపయోగించవచ్చునే? యిది. “పదియవనాఁటి" వగైరా మృదు ప్రసంగముకంటె చెడిపోయిందా? లేదా? “దున్నపోతు" అని కూడా ఉపమించి కసితీర్చుకోవచ్చునే? యేమంటారా! దున్నపోతు పోలికలో ప్రస్తుతం చాలా బలహీనస్థితిలో వున్ననాకు అది పంచగురువులలో వొక గురువు మామగారు వాడేదికనక ఆశీర్వచనంగా పరిణమించి దున్నపోతుకు వుండే బలపరాక్రమాల్లో యేశతాంశమేనా నాకు అంటుకొని ఆయనగారి చొప్పదంటుశంకలన్నిటికీ యీలాగే సమాధానాలు వ్రాస్తూ ప్రజ్ఞలోకంచేత “యీయనకేం మతిపోయిందా?” అని పరిహసింపఁ బడడానికి కొంత వుపకరిస్తుంది కదా? ఆదున్నపోతుపమానం! అంతేకాక ముసలికి, రోగికి కృతికన్యాదానం చేసిన పూజ్యులు వానిక్షేమం కోసం పడరానిపాట్లు పడాలి. నేను శ్రీజయంతి పంతులుగారికిన్నీ శ్రీజయపురం మహారాజావారికిన్నీ మిక్కిలి వృద్దులకు పిల్ల (కృతి) నిచ్చిచూడండి? యేలావ్రాశానో? శ్లో భార్యాగతాది వమథాపి మమోద్భభూవ కన్యాద్వయం జగదతీత కలావిలాసం జామాతరావతి తరాం జరఠౌ చలబ్ధౌ సర్వాత్మనాయుషి భత్కరుణా శరణ్యా" ఆశ్చర్యం. ఆశ్చర్యం. పైఁగా నాకు-

ఎక్కడో బ్రహ్మదేవుఁడు వ్రాశాఁడఁట? అందుచేత కవితావిషయంలో నాకు పేరు దక్కిందష? ఏమిటా దక్కుతా? యీలాటివారిచేత బండబూతులు తినడమేనా? యెదురు తిరిగి నేను-

"అయ్యా! యెక్కడనో? అన్నారుగదా? అదియెక్కడ? యెవరు కనిపెట్టినారు? లేక." ...అంటూ ప్రశ్నిస్తూ గేలిచేస్తేగతేమిషో! అయొచ్చేదీ, పయొచ్చేదీ తెలుసుకోవద్దా? నాలాగ “కవితాలలనమొగంబు బూడిదంబులిమెడి" వారిలో చేరేవారు కారుకదా? వీరు కుంకుమతో పులిమేవారు. వేదజ్ఞానంలేని వైదీకం యెంతశోభిస్తుందో? లోకజ్ఞానంలేని లౌకికమూ అంతేశోభిస్తుందనుకుంటాను. రెండిటికీ మారెండు వ్యక్తులున్నూ లక్ష్యంగా నేఁటికాలానికి భగవంతునిచే సృష్టింపబడ్డాయి కాఁబోలును. ప్రశ్నల వైఖరేమో? అలావుంది. ఆప్రశ్నలకు సమాధానం రాలేదంటూ నెపం వకటా? చూడండీ యింకోప్రశ్న. “ఉపపతియా? (ఱంకుమగఁడా) అగ్రాసనాధిపతి?” అని కాశీ కృష్ణమాచార్లగారిని గుఱించి ప్రశ్నించారు. దీనిముద్దు లోకంగమనించి మెచ్చి మేఁకతోలు గప్పుతుందని మామామగారితాత్పర్యంగదా! దీన్ని విమర్శించవలసివస్తేనో, మొుగుఁడుగాని, ఱంకుమొగుఁడుగాని వుండవలసివస్తే ఆడాళ్లకేగాని మొగాళ్లకుఁ గాదుగదా? తి. వెం. కవులు మొగాళ్లా? ఆడాళ్లా? వొకవేళ విమర్శకులు "ఱంకుమొగుణ్ణి కట్టిపెట్టడానికి ఆఁడాళ్లే అంటారేమో? అనరు. కృతికన్యకను దయచేశారుగదా? అందుచేత సమన్వయించదు. లక్షణ చెప్పవలసివస్తుంది. ఆలక్షణ వాళ్లపెళ్లాలకో? తల్లులకో? నాయనమ్మలకో? అమ్మమ్మలకో? అనే అర్ధాన్ని తీసుకువస్తుంది. వాళ్లుదుష్ప్రవర్తనగలవాళ్లే అయితే యేమోగాని, సత్ర్పవర్తనగలవాళ్లే అయితే అలా అపవదించినవ్యక్తి యిహపరాలకు రెంటికీ దూరం అవడంలో సందేహ ముంటుందా? పద్యం సాపుగానే వుందని నేనూ వొప్పుకుంటాను. దానికి సేల్జోడుబహుమానం మినహాయించండి. తుట్టతుదకు యీలాక్షణికార్థంవచ్చి తీరుతుందనిన్నీ కంఠంపట్టుకుంటుందనిన్నీ లోకం యేవగించుకుంటుందనిన్నీ తెలిసేవంటే విమర్శకుఁడు గారు పాపం ఆలా చిత్రించి వుండరు. తెలియకపోవడానికి కారణం వొక్క లోకజ్ఞానవైధుర్యంమాత్రమే కాదు. శాస్త్రజ్ఞాన వైధుర్యంకూడా దానిలో చేర్చుకోవాలి. దీన్నిబట్టే నేను "శాస్త్రజ్ఞులుగాని" అని వీరిని గూర్చి నన్నయ్యవ్యాసంలో వ్రాస్తిని. దానికి నామీఁద వీరికి కోపంవచ్చింది. నన్నయ్యధారతో (తత్సమధారతో) నేను యేయితరకవుల ధారలు (ఆవిషయంలోనే) తులఁదూఁగవని వ్రాశాను. తూఁగేవి వున్నట్లు వీరు కొన్ని పద్యాలమొదళ్లు సూచించారు; అయ్యో! దేవుఁడా ఆపద్యాలు ఆమడదూరంలో కూడా నిలబడలేవు. పనిపడితే ఆయీవిషయం కవులలోకూడా యెవరికోగాని అవగతమయ్యేది కాదు. వీరు చూపినపద్యాలన్నీ వాడివడపోసి వ్రాసినమాటే అది. అందుచే యేమాత్రమో కూర్పునేర్పు మాత్రంతో సర్వజ్ఞత్వానికి దిగి "మనవెంకటశాస్త్రి నీతిమాలిన, తెల్విమాలిన, పనికిమాలిన, వ్రాఁతల్" అని వ్రాయడానికి సాహసించిన విమర్శకుఁడుగారికి ప్రస్తుత విషయం బొత్తిగా బోధించదు. నేను బోధించడానికి ప్రయత్నించినా లాభంలేదు. అని ప్రమాణంచేసి (చెప్పవలసిన విషయం కనక) చెప్పక తప్పిందికాదు. గర్వోక్తిగా భావించవొద్దని అభ్యర్థన. (వచ్చునె? . . యేమిచ్చినఁగాని, కానలకు నేగినఁగాని హరిప్రబోధముల్) అన్నాఁడు ప్రహ్లాదుఁడు. ఆయీ విషయము యీమధ్య యీవిమర్శకుఁడుగారి సన్మానసభకు అధ్యక్షులుగా వుండిన పిఠాపురపు కాలేజీపండితులు నిర్ణయింప వలంతులవుతారని వారి ముఖపరిచయం నాకులేకపోయినా వినికినిబట్టి విశ్వసిస్తూ బరాతం పెడుతూన్నాను. “కోవెత్తికవితాతత్త్వ మీశ్వరో వేత్తివా నవా? నేనల్లా విమర్శకుఁడుగారు నన్ను యెన్నితిట్టినా ధారసాఫుగా వుందనేదానికే సంతోషించాను. తిట్లకేమి? వాటిశిఖా కోసినతిట్లు అవి గాలికిపోతాయి! అని నన్నయ్య వ్యాసంలో దులపరించి బహుమానానికి ఆహ్వానించానుగదా.

“ఉపపతియా? అగ్రాసనాధిపతి పల్లకిలో" అన్న కూర్పు యెంతో చక్కఁగా వుంది. యతికిఁగాని, ప్రాసకుఁగాని తడుముకొన్నట్లులేదు. అయితే కవిత్వమంటే? “యతియుం బ్రాసయుఁగూర్పు మాత్రమే" అగునా కాదుగదా? అయినా నేను రసపిపాసకుణ్ణి. ఆధారకే సంతసించి మా అమ్మమ్మల్ని నాయనమ్మల్ని కూడా అన్వేషించే తిట్లను గణించనేలేదు.

సేల్జోడు బహుమతీ యిద్దామనుకున్నాను. నామనోరథాన్ని విమర్శకుఁడుగారు అధఃకరించారు. వారివూరువెళ్లి అక్కడ దాన్ని సమర్పించుకోవలసిందిగా ఆజ్ఞాపించారు. కాని అట్లాంటి ఆచారం లేకపోవడంచేత వుపరమించుకోవలసి వచ్చింది. యీ బహుమతీ జరిగేవుంటే విమర్శకుఁడు గారు నన్నువుద్దేశించి వాడిన "వెఱ్ఱివెంకటాయ" పదం సార్ధకమే అయిందని కొంద రనుకొనేవారు. ప్రాజ్ఞులు సంతసించేవారు. యీమాత్రం ధారతో యతిప్రాసలు కూర్చువారు ఆసీమలో అనాదిగా పలువురు వుంటూవున్నారు. శాస్త్రజ్ఞత్వం మాత్రం యొక్కడోగాని వున్నట్టు యీకాలంలో కనపడదు. పూర్వకాలములో యింత శూన్యం కాదు. యిది విషయాంతరం. తిట్లు బాగా తిట్టితిమిగదా? కసిదీరా అనిమాత్రమే యీవిమర్శకులు సంతోషించుకున్నారుగాని వాట్లవల్ల తేలేతత్త్వాన్ని పాపం? ఆయన గమనించుకోలేదు. అవి ఆత్మాపకారకా లవుతా యనుకొన్నారా? లేదు.

“బాబుకుఁ బెండ్లియౌ ననుచు బాలుఁడు సంతసమందె" అంతే, పాపం! వీట్లనుగూర్చి నాకువున్న అభిప్రాయాన్ని తెల్పేపద్యాలున్న పుస్తకాన్ని వీరు సపుత్రకంగా కొంత గూఢంగా మావూల్లో మాయింటి పడమటివసారాలో గుడ్డకుర్చీమీఁద అనారోగ్యంగా కూర్చుని వున్ననాకు యిప్పటికి రెండేళ్ల ఆఱుమాసాలనాఁడు దర్శనం యిచ్చినప్పుడు (జయంతిని) సమర్పించి వున్నాను. అప్పటికి వీరితిట్లపుస్తకం రచింపcబడి వున్నప్పటికీ ముద్రితం కాలేదని శ్రీయుతులు పోవూరి వేంకటేశ్వర్లుగారిచే వీరు వ్రాయించిన వుత్తరంవల్ల తేలుతుంది. నేను వీరికి సమర్పించిన జయంతిలోవున్న

శా. నన్నున్‌దిట్టి జయింపలేరెవరు విన్నాణమ్ములేనట్టివా
     రి న్నీచంపువిధానకగ్గమయి రా యీ తిబ్లెనాకిచ్చు సం
     పన్నత్వమ్ముఁ గవిత్వ మెవ్వరు ననుం బ్రాజ్ఞత్వపర్యాప్తిమై
     దున్నంగా లిఖియింతురో? పరమబంధుల్ వారు నాకెల్లరున్.

అనే పద్యమున్నూ-

శా. ఈమంత్రార్థము నే నెఱింగినటు లింకేయార్యులు న్నేర రే
     నీ మంత్రమ్ము జపించియే జయముమై నేపారితిన్‌దిట్లు నా
     కేమిన్ రావనుకోకుఁ డందుననునింకే యొజ్జలుం బోల రే
     నేమో? తిట్టెడివారిఁ దిట్టకయె హాయి న్విందు నాతిట్టులన్.

అనేపద్యమున్నూ వీరు చదవకుండానే వుంటారా? చదివివుండిన్నీ తమపుస్తకంలో వున్న తిట్లను సవరించుకోక పోవడంవల్ల వీరియెడల దైవాని కప్పటికప్పుడే చేసిన అనుచితప్పనివల్ల ఆగ్రహం కలిగిందనిన్నీ ఆకారణంచేత సవరణ చేసుకోకుండానే ముద్రణం చేసుకొమ్మన్నాఁడు కాబోలుననిన్నీ అనుమానించవలసి వచ్చింది. యిక్కడనొక అవాంతర విషయం పైపద్యంలో అతిఝడితిగా స్ఫురించింది. యీలాటి వెన్నో నాకవిత్వంలో నాకు అప్పుడప్పుడు గోచరిస్తూ వుంటాయి. కాని అవి యితరులకు గోచరించి వ్రాయవలసిన రహస్యాలుగాని గ్రంథకర్తకు గోచరించినా వ్రాయఁదగ్గవి కావు. వ్రాసుకుంటేనో? యెవరోతప్ప తక్కినవారు గేలి చేస్తారు. యెక్కడోగాని సహృదయులుండరు. అందుచే వ్రాయకూడదు. అయినా యిక్కడ వ్రాస్తున్నాను. నేను యేపుస్తకాన్ని అచ్చుపడ్డదాన్ని వీరికి యిచ్చి వున్నానో? ఆయిచ్చేసమయానికి వీరెవరో నాకు సుతరామున్నూ తెలియదుగదా? అంతకు పూర్వమో అంతకంటే తెలియదు. తి. వెం. కవుల గ్రంథ విమర్శనం అన్నపుస్తకమంటూ యెవరేనా వ్రాసేరన్నసంగతేనా అప్పటికి నాకు తెలుసునా? తెలియదు. అదిన్నీకాక అప్పటికే అచ్చుపడి ఆఱుమాసాలకు సుమారుకాలం అతిక్రమించిందికదా? జయంతికి; అట్టిజయంతిపుస్తకంలో విమర్శకుఁడుగారి యింటిపేరికి వికృతి అయిన "ఒజ్జ" పదం వుండడానికి నాలో నాకే ఆశ్చర్యంగా కనపడి అది దాఁచుకోలేక పత్రికక్షులు గేలిచేస్తారని యెఱిఁగికూడా యిక్కడ వుటంకించాను. అంతమాత్రమే కాదు. యీయన శుద్ధ తిట్టుమోతు అనికూడా ప్రకరణవశంచేత ఆపద్యార్థంవల్ల తేలుతుంది. ఇంతేకాదు. “ఒజ్జ" పదానికి ప్రకృతిగావుండే పదం యింటిపేరుగాగలవారైతే తిట్లల్లో ప్రజ్ఞకలవారే గాని పనిపడితే ఆ తిట్లల్లో నాకు వారు తీసిపోయేవారేగాని, హెచ్చేవారుకారనిన్నీ నాకు వచ్చినతిట్లు నేనెన్నఁడూ వుపయోగించననిన్నీ వుపయోగించినా అందులోకూడా కవిత్వపదార్ధంవుండి “క. వీcడా? నాకొకకొడుకని గాడిద యేడిచెగదన్న ఘనసంపన్నా?” అన్నట్లుంటాయిగాని, యింత అయుక్తంగా వుండవనిన్నీ, అందులోనున్నూ నన్ను తిట్టేవారిపట్ల వాట్లని బొత్తిగా వుపయోగించే వుద్దేశం నాకు అసలే కలుగదనిన్నీ నేనల్లా వారు నన్నుతిట్టేతిట్లు హాయిగా వినడమే చేసి ప్రచురించి వూరుకుంటాననిన్నీ ఆపద్యార్థం వ్యాఖ్యానిస్తుంది. ఆయీ సందర్భం ప్రస్తుతానికి యెంత అనుగుణంగా వుందో? విజ్ఞులు విచారింతురుగాక. ఆయీవిశేషం నాకిప్పుడే స్ఫురించిందని మొదటనే వ్రాసి వున్నాను. యింకోమాట యిక్కడ వ్రాయవలసింది మఱిచాను. నేను విమర్శకుఁడుగారి యింటిపేరుగాని పేరుగాని యింతవఱకెక్కడా వుదాహరించనే లేదు. దానికి నేను చెప్పఁదలచిన కారణం.

“శ్లో ఆత్మనామ గురోర్నామ... న గృహ్ణీయాత్"

అన్న అభియుక్తోక్తియే! వీరు నాకు పంచగురువులలో వకగురు స్థానం అని మొదటనే సూచించి వున్నాను. జయంతిలో ప్రకృతివికృతిభావ ప్రకారంగా వున్న యింటిపేరు బుద్ధిపూర్వకంగా వ్రాసింది కాదుకనుక ఆ నిషేధానికి నేను గుఱిగానని ఆయాశాస్త్రజ్ఞులకు మనవి చేసికొని ప్రస్తుత మందుకుంటూ వున్నాను. వీరు నన్ను యెంత పచ్చిగా తిట్టినా నాకు వీరి కవిత్వంలోవుండే సాఫుదనమే ముఖ్యంగా కావలసింది. అందుకే నేను వీరిని సమ్మానింపఁదలంచిందని నన్నయ్యవ్యాసంలోనే నొక్కినొక్కి వ్రాసి వున్నాను. దాన్ని స్వాగతంలో- "కత్తిఝళిపించడాన్ని వుటంకించినవారు చదివి గ్రహించే వున్నారు. శిష్ట్లావారు అంతశ్రద్ధగా దాన్ని చదవేలేదో? లేక అసలే చదవే లేదో? వీరివిమర్శనాన్ని నేను అభినందించినట్లే అభిప్రాయపడి ఆ విధంగా వీరిని మెచ్చడం జరిగింది. మెచ్చదగినశంకలు వున్నప్పటికీ నేను మెచ్చలేదంటే అదినాకుకళంకు. విమర్శకుఁడుగారు మాత్రమేకాదు. యెవరేనా ఆ ప్రశ్నలలో సారవంతమైనది వుందంటే నేనున్నూ వప్పుకుంటాను. వొప్పక తప్పుతుందా? వాది ప్రతివాదులు వొకరివాదాన్ని వేఱొకరు మెచ్చడమంటూ వుండనేవుండదన్నది సామాన్యపుమాట గాని విశేషపుమాటకాదు. ఆ పక్షంలో నేను వీరికవిత్వం సాఫుగా వుందని, త్రికరణశుద్ధిగా వొప్పుకోవడమే కాకుండా దానికోసం వీరిని సమ్మానించడానికి ఆహ్వానించడం యేలా సంభవిస్తుంది? దీనిచేతనే ఆ సామాన్యపుమాట వెం. శా. గారికి ప్రతిబంధించేదికాదని ప్రాజ్ఞలోకం విశ్వసిస్తుంది. వున్నంతలో గుణాన్ని అంగీకరించడమే నామతం. ప్రతి వాఁడికవిత్వమూ బాగానేవుందంటూ సర్టిఫికేట్లిస్తూవుంటావు, నీకేమేనా మతి వుందా లేదా అంటూ మాతిరపతిశాస్త్రి నన్ను గేలిచేస్తూవుండేవాఁడు. ప్రతివాణ్ణి విద్యార్థిగా చేర్చుకొని యేదో చెప్పడమే నాపని. ప్రాయోపవేశావస్థలో వున్నయిప్పుడుకూడా "బ్రామి" న్సైతేనేమి, “నాన్ బ్రామి" న్సైతేనేమి, సుమారు పదిమందికి తక్కువగాలేరు. యిక్కడ వీళ్లని గుఱించి యెందుకు వ్రాస్తానంటే? ప్రస్తుత మవడంచేతనే, అప్రస్తుతపు వ్రాఁత వ్రాయడం నాలేఖినికి బొత్తిగా చేతకాదు. మావిమర్శకుఁడుగారు వారి (ధూళిపూడి) గ్రామానికి సన్మానించే సదూహతో నన్ను రావలసిందని ఆహ్వానించారు గదా? నాకుకావలసిన సదుపాయాలు లోఁగడ వుటంకించి ఖర్చులు సుమారు నలభై యాభై రూపాయిలదాఁకా తగులుతాయేమో? అని వుజ్జాయింపుగా సూచించి వున్నాను. దాన్ని యిక్కడ తపిసీలుగా గుఱికి బారెఁడు హెచ్చుతగ్గులో వివరించడం ఆవశ్యకం కాకపోదు. యూ విద్యార్థి మూఁకంతా నాతో యెప్పుడూ రాదు. వృథాగా ఖర్చులు తగిల్చే దురుద్దేశంతో యీమూకని యిప్పుడున్నూ తీసుకు వచ్చేదిలేదు. నాభార్య సర్గస్థురాలయే సమయానికి సుమారు యేడేళ్ల శైశవావస్థలోవున్న కడసారికుఱ్ఱవాఁడు ప్రస్తుతం పదేళ్లవాఁడైనప్పటికి నేనెక్కడికివెడితే అక్కడికి– “తాడుతో దబ్బనం"గా తప్పఁడు. వాఁడికి సంరక్షణార్థమైతేయేమి, సహాధ్యాయిగా చదువకైతే ఏమి యింకో విద్యార్థి పెద్దటిక్కెట్టు వయస్సు వాఁడే వస్తాఁడు. యిక్కడికి టిక్కెట్టున్నఱగదా? నాసంరక్షణకంటూ వక పెద్దవిద్యార్థి కౌముది చదివేవాఁడు వుండాలి. కానీ బెజవాడలో వంతెన దిగడం యెక్కడం యీలాటి చిక్కువుండడంచేత యిప్పుడు కౌముది చదివే విద్యార్థి వయస్సు చేత పెద్దవాఁడేగాని నన్ను యెత్తుకొని "దండాడించడానికి" (దండాడించడం పెళ్లిలో నాగవల్లినాఁడు మావైపున జరుగుతుంది. పెళ్లికొడుకునీ, పెళ్లికూఁతుర్నీ చెఱివకరున్నూ యెత్తుకొని బుక్కాతో తెయితక్కలాడతారు. ఆవంతెనమెట్లల్లో యెత్తుకు నడిచేటప్పుడు ఆలాగే వుంటుందన్నమాట) తగ్గంత శక్తికలవాఁడు కాఁడు. అందుచేత అసలు ధూళిపూడినుండి పనిపడితే నన్నుయెత్తుకొని బెజవాడ బ్రిడ్జిమీఁద “దండాడింపు" చేయడానికి యెవరేనా రావలసి వుంటుంది సమర్థులు. యీవచ్చేవారు తిరిగి మాగ్రామం వచ్చేటప్పుడు ఆవంతెన గండం దాఁటేవఱకే కాని మాగ్రామం చేర్చేవఱకూ వుండ నక్కఱలేదు. అయితే అసలు బెజవాడలో దిగడంతో అవసర మేముంటుంది? ధూళిపూడికి (తణుకోయిమాచారంగా) తెనాలి దాఁకా యెకాయెకీనే ప్రయాణం చేయరాదా? అని ప్రశ్నిస్తారేమో? ఆయనే వుంటే మంగలాణ్ణి పిల్చి పెట్టునన్నట్టు ఆశక్తి లోపించిన అవస్థలోకి వచ్చి యిప్పటికి కప్పుడే పదేళ్లు దాఁటింది. యిప్పటిస్థితి చెప్పవలసివుండదు కదా? యిది ప్రాయోపవేశావస్థ, మదరాసు ప్రయాణం, పొన్నూరుప్రయాణం, నిన్నమొన్న నవరాత్రాలలో చేసిన తెనాలి ప్రయాణం, యివన్నీ బెజవాడలో మొదట మకాంచేసి తరవాత మళ్లా మఱునాఁడో? మూఁడోనాడో? రైలెక్కినవే మళ్లా తిరిగీ వచ్చేటప్పుడు బెజవాడలో దిగినవే. వారివారిని కనుక్కుంటే దీనియథార్థం తెలుస్తుంది. బ్రిడ్జిమీఁద "దండాడింపు" యిప్పటి కెప్పుడూ జరగలేదు. ఆసమయానికి భగవంతుఁడు యేలాగో కఱ్ఱసహాయంతో ("వృద్ధోయాతిగృత్వా దండం") ఆ గండందాటే శక్తిని యిస్తూవున్నాఁడు. ఆపక్షంలో యింకో టిక్కెట్టు వృథాగా యెందుకు తగల్చవలసి వుంటుందంటే? తీరా అవసరమైతే అప్పుడు మనకు అక్కడ మోసే మనిషి యెక్కడనుంచి సప్లయి అవుతాఁడో? ఆలోచించండి. పెట్టెలూ, బేడలూ మోసే రైలులైసెన్సు కూలీలు పనిపడితే మనిషిని సజీవుణ్ణి కూడా మోస్తారా? స్పెషలుగా ఆమోఁతక్కూడా వాళ్లు అంగీకరించి సిద్ధపడినా? యీటిక్కెట్టు చార్టీకంటె యెక్కువే అడుగుతారో? యింకా అంతకంటేనూకూడా సమయాన్నిపట్టి మఱిన్నీ యెక్కువబిల్లు చేస్తారో? అందుచేత మనం ముందే జాగ్రత్తపడడం మంచిదికదా? (“జాగ్రత్తా తోభయం నాస్తి") యిక్కడికి మూడు టిక్కెట్లన్నఱతేలింది. నాకు దూరప్రయాణానికయితే సెకండు క్లాసుగాని దగ్గిఱప్రయాణమే కనక యింటరు చాలును. నావ్యాధి ఆవలీవలికి తఱచుగా వెళ్లేపద్ధతిలోది కావడంచేతగాని ఆచిక్కేలేకుంటే? యింటరులోకాకపోతే గౌరవానికి లోపం వస్తుందని నేనెన్నఁడు అనుకోను. యేంచేసేది. “అవస్థాపూజ్యతే రామ" అని యెవరెఱుఁగరు? యిక్కడికి రమారమీ అయిదు "థర్డుక్లాసు" టికెట్లదాఁకా డేఁకినట్లయింది. యింకా కొన్ని సాదరఖర్చులు గుఱ్ఱపు జట్కాలు వగైరాల బాపతు వుంటాయికదా? నేను రోజువారీగా పుచ్చుకొనే మందులు నేనే తెచ్చుకుంటాను. నల్లమందుసహితంగా, వకప్పుడు అవసరం పడితే ఆమందులు సమీపంలో వుండేపట్నానికి యెవరేనా వెళ్లి తీసుకురావలసి వస్తుంది. (దీనికి నేనే సొమ్ముయిస్తాను.) చాలా రోజులు వుండవలసివస్తే తప్ప మూడునాల్గురోజులయితే యిూ మందుల సప్లయిచిక్కువుండదు. యేమో? వెళ్లేది పొరుగూరుగదా? యెన్నఁడూ వెళ్లలేదు కూడాను. యెన్నాళ్లు పడుతుందో? యిప్పుడు ఆగ్రహంగావున్న విమర్శకుడిగారికే నామీఁద అనుగ్రహం కలగగూడదా? లేదా ఆవూళ్లో చాలామంది సంపన్న గృహస్థులున్నారని వినికి వారికి నామీఁద అభిమానం కలిగి మఱి కొన్నాళ్లుండవలసివస్తే వస్తుందేమో? అభిమానానికి కారణం లేకపోలేదు. వారివూరి విమర్శకులు నన్ను యెన్ని తిట్టినా, వాట్లను నేను సహనంతో వెఱ్ఱివెంకటాయ మాదిరిగా దులపరించుకొని శిరసావహించి వారియందుండే యేదోగుణాన్ని పురస్కరించుకొని-

“పరగుణపరమాణూన్ పర్వతీకృత్య"

అనే భర్తృహరి వాక్యానుసారం గౌరవించడానికి ఆహ్వానించడం కంటె వేఱొకకారణం యేంకావాలి. రెండోది వారివూరి విమర్శకులు నన్ను సమ్మానించడానికి ఆహ్వానించినప్పుడు వారు సామాన్యగృహస్థులవడంచేత వారికి మనంకూడా తోడ్పడదామనే వుద్దేశం వారికి కలిగినా కలగవచ్చు. దీన్ని యిప్పుడు నిర్ణయించలేము. నాకు నాజీవితకాలంలో జరిగినవన్నీ యీలాటి సందర్భంలో జరిగిన సమ్మానాలే. వాట్లని వివరించవలసివస్తే చాలా పెరుగుతుంది. కనక వుపేక్షిస్తాను. అందుచేత యీధూళిపూడి ప్రయాణంకూడా తుదకు అలాగే పరిణమిస్తుందేమో అని అనుమానించవలసి వచ్చింది. యిది పుత్రేక్ష కాదు. ఆమధ్య శ్రీరావుగంగాధరరామారావుబహద్దరుగారి షష్టిపూర్తికి మద్రాసు వెళ్లి యెవరికీ తెలియకుండానే వద్దామని సంకల్పించుకుంటే తుదకు అది ఆలా కాలేదు. శ్రీరాజావారి పెద్దసమ్మానమేకాక గౌరవనీయులైన గవర్నరుగారు లోనగువారు వేయిన్నూటపదార్లు తలవనితలంపుగా సమ్మానించి వున్నారన్నది లోకప్రసిద్ధం కనక విస్తరించేది లేదు. నేనిప్పుడల్లా విమర్శకుఁడుగారివల్ల పొందదలఁచిన సమ్మానం. "కౌపీన సంరక్షణార్థ మయం పటాటోపః" గాని నాప్రస్తుతావస్థనుబట్టి అంతతోటే సంతృప్తి పడతానని వారికి మనవిచేసుకుంటూ వున్నాను. యిదివరలోకూడా మనవి చేసుకున్నాను. “మూఁడడుగుల్ మేరయ ద్రోయకిచ్చుటయె బ్రహ్మాండమ్ము నాపాలికిన్" అన్నమాదిరి ధోరణిలోకి దిగే కపటమేమేనా నామాటలలో వుందేమోనని విమర్శకుఁడుగారుగాని, వేఱొకరుగాని అనుమానపడనక్కఱలేదు. అట్టిబేరాలు నేనెక్కడా చేసివుండలేదు. యేమిస్తే అదే పుచ్చుకొని సంతోషించడమే నాప్రధాన ప్రకృతి. పోతరాజుగారి “క. వ్యాప్తింజెందక వగవక, ప్రాప్తంబగు లేశమేని పదివేలు" అనేపద్యం నాకు కంఠోపాఠం. నాకు (పొరబాటుచేతో యేమో? రూపాయనుకొనే అవుతుంది.) అర్ధణాకాసు (ఇప్పుడివి అమల్లోలేవు) యిచ్చి సమ్మానించినవారు కూడావున్నారు. అయితే శంకాసమాధానాలతో చేరిన వ్యాసంగనక దీనిమీcద వచ్చే పూర్వపక్షానికి జవాబు యిప్పుడే చెపుతున్నాను. నైజాం యిలాకా వనపర్తి సంస్థానంలో పదిరూపాయలు యిస్తే, “పదిరూపికలిచ్చినావుగా” అంటూ యెందుకు తగువులాడవలసివచ్చిందీ? అని శంకిస్తారేమో? బహుశః యీశంక యిదివఱలో విమర్శకుఁడుగారు వారి గ్రంథంలో యెక్కించే వుంటారేమో? అందులోవున్న శంకలన్నీ యీమాదిరివేకదా? ఆపుస్తకం ప్రస్తుతం నావద్ద లేకపోవటంచేత నిశ్చయించి వ్రాయలేకపోయాను. పనిలోపని యింకొకటి వ్రాస్తాను. విమర్శనపుస్తకాలు వందో? యేభైయో? నావద్దకు వారు పంపితే యెవరేనా ఉచితంగా కోరితే ఉచితంగా యిచ్చిన్నీ రు. 1–0–0 యిన్నీ ఇచ్చి పుచ్చుకుంటే ఆప్రకారంగా యిచ్చిన్నీ వసూలైన ఆసొమ్ము పువ్వులలోపెట్టి వారికి (మనియార్డరు ఖర్చుపోను) పంపించుకుంటాను. నాకు పుస్తకాలవర్తకం వుండడంచేత యిది వారికి అంగీకారమైతే యీసహాయంచేస్తాను. దానివ్యాప్తివల్ల నాయశస్సు అభివృద్ధి చెందుతుందనే పూర్ణవిశ్వాసంతోనే వారిని నేను యూవిధంగా అభ్యర్థించడం (క. నేరక కృతిచెప్పుట తననేరమి నపకీర్తి జగతినిల్పుట కాదే?) తరవాతమాట యేలాగవున్నప్పటికి ప్రస్తుతం వకపుస్తకం పంపవలసిందని ప్రార్థిస్తాను. యీవాదం యింతతో ముగిస్తే అక్కఱలేదుగాని యింకా యూరపుఖండ యుద్ధంలాగు సాఁగేయెడల అవసరమవుతుందేమో అని యీలా అభ్యర్థించడం. తొందరగా పోస్టుద్వారా పంపనక్కఱలేదు.

కొలఁది రోజుల్లో వారి గ్రామానికి నన్ను వెంటఁబెట్టుకొని వెళ్లనే వెడతారు కనుక అప్పుడు అడిగి తీసుకుంటేసరిపోతుందికదా! విమర్శకుఁడుగారు "హనుమత్పళ్లెం" మాదిరిని నన్ను రమ్మని కోరడం ఆలా వుండఁగా ఆగ్రామంలో వుండే సంపన్నగృహస్థులు నన్ను ఆహ్వానించాలని అనుకొంటూ వున్నట్టు తెనాలిరైలులో వకరు ఆవూరివారే బ్రాహ్మణులు జానపాటివారు చెప్పివున్నారు. అందుచేతనైతేనేమి? యిందుచేతనైతేనేమి? ఆవూరి ప్రయాణం నాకు యేలాగా బ్రాహ్మ వ్రాసి పెట్టినట్లే వూహకు వస్తుంది.

శా. “ఏవేళ న్మఱి యేస్థలమ్మునను నేయేరీతిగా నున్నదో
     ఆవేళన్ మఱియాస్థలమ్మునను ఆయారీతియైతీరు సూ
     ర్యావిర్భావముఁ బ్రొద్దు గ్రుంకుటయు దృష్టాంతమ్ము లిప్పట్ల నీ
     భావమ్మింత యెఱుంగదైర్యము మదిన్ బాటిల్లుఁ గామేశ్వరీ”

కాఁబట్టి వారికి లోగడ సంగ్రహంగా మనవిచేసుకున్నవికాక, చేదస్తంగా వున్నాయే అని విమర్శకులు పరిహసించేవైనా మరికొన్ని కూడా మనవి చేసుకొందునా? అయ్యా! నాకు వుండే వ్యాధిప్రకోపావస్థలో వున్నప్పుడు నేను పొరుగూళ్లోనే కాదు. స్వగ్రామంలో స్వగృహంలో కూడా స్తిమితంగా వుండేస్థితి చాలా దుర్ఘటంగానే వుంటుంది. దానికి కొన్ని వుపాయాలు “సవాకోటిదరిద్రాలకు అనంతకోటి వుపాయాలు” అన్నట్టు నేను యేర్పఱచుకొని గాజుకాయమాదిరిగా ఆయుశ్శేషాన్ని గడుపుతూవున్నాను.

మ. “ఎపుడున్ వ్యాధికి నర్ఘ్యపాద్యములుగా నెన్నెన్నొమందుల్ సమీ
     పపుగూటన్ బదిలమ్ముచేసికొని నిన్ బ్రార్థించుచున్ వీలువ
     డ్డపుడెల్లన్ భగవచ్చరిత్రములు వ్యాహారించుచున్ నేనిటుల్
     కృపణత్వ మ్మెడగాఁగ నుంటి నిది నీదేచల్వ కామేశ్వరీ” 682

అంకెనుబట్టి యీసౌభాగ్యకామేశ్వరిపద్యాలెన్ని వందలున్నాయో చదువర్లు గుణితిస్తారు. పద్యంలోవున్న అంశంవల్ల ప్రస్తుత జీవితవైఖరికూడా గ్రహిస్తారు. ఈ కారణంచేతనే నేనువాదానికి భయపడి శ్రీపోవూరి వేంకటేశ్వర్లుగారు నాకు మునియేడు వ్రాసిన (విమర్శకుఁడుగారి అనుమతిమీదనే అనుకుంటాను) వుత్తరాలకు అనగా విమర్శనగ్రంథం అచ్చుకాకపూర్వం అందులోకొన్ని మచ్చుకు శంకలు వుటంకిస్తూ వ్రాసినవుత్తరాలకుచాలా శాంతంగా, నిస్పృహగా మనవి వ్రాసుకున్నాను, వారావిషయం తెల్పకపోరనుకుంటాను. అదిఆలా వుంచి-అందులోదే (సౌభాగ్యకామేశ్వరిలోదే) యింకోటి వుదాహరిస్తే యింకా కొన్ని విశేషాలు బోధపడతాయి.

మ. "ఒక పన్నున్నది నాకు విఘ్నపతినో? ఒక్కండె కన్నుండె నా
     కకవీంద్రుండనొ? తెల్పు మంబరొ? భవత్కారుణ్య మీనాకుఁద

క్కక దేవత్వము నిప్పుడే యిడినటుల్ గాఁదోఁచుఁజిత్రంబు వా
ర్ధకదోషాలకుఁగూడ నబ్బెనిటు సార్థక్యంబు కామేశ్వరీ."

చాలును. పెరిగిపోతూవుంది వ్యాసం. వక్తవ్యాంశం యింకా మిగిలేవుంది. యీస్థితిలో వున్న నన్ను రప్పించదలఁచుకొన్న విమర్శకుఁడుగారు గాని (నేనువిన్నది నిజమే అయితే) ఆధూళిపూడిలో వుండే సంపన్న గృహస్థులుగాని యెంతత్వరలో కార్యధూర్వహులయితే అంతమాట దక్కుతుంది. జనవరినెలలోఁగాతప్ప నేను యిప్పటికంటె మంచిస్థితిలో వున్న పూర్వమప్పుడేనా ప్రయాణం చేయలేను. కారణం ఫిబ్రవరి మొదలుకొని మళ్లా అధమం జూనునెలాఖరులోగా నావ్యాధి నన్ను మఱీ బెదరిస్తూ వుండడమే. (యిప్పటిరీతి అన్నిటికీ బెదరఁదగ్గదే కదా!) యిల్లుకదలకుండా "కడుపులో చల్ల కదలకుండా" కాలక్షేపం చేస్తే చిక్కులేదు. అందుచేత జనవరి దాఁటకుండానే ఆ యీప్రయత్నం చేయాలిగాని తరువాత చేసి యేదో రావడానికి భయపడ్డాఁడనీ, యేమోఅనీ, యేమో అనిన్నీ నెపపెడతారేమో? అని యీలా వ్యవధివుండగాఁ మనవి చేసుకోవడం. భయపడడం యెందుకు? చప్పట్లపర్వం జరుగుతుందనేనా? అయితే అది గ్రామంకాదా? వొకవేళ అదిన్నీ జరుగుతుందే అనండీ! అందులో కల్గే విష్ణుచక్రంకంటె యిదివఱలో విమర్శకుఁడుగారు అనుగ్రహించిన తిట్లల్లో తక్కువ అవమానం వుందా? దాన్ని నేను గణించేవాణ్ణి యెప్పటికీ కాను. యీలాటి విష్ణుచక్రాలవల్లనే నాపేరు (అసలేమేనా వుండడమే నిజమైతే) బయటికి వచ్చిందని “పుణ్యైర్యశోలభ్యతే" అనేవ్యాసంలో వ్రాసి వున్నాను. అట్టివారు నాకు అభినందించ వలసినవారు “ఏమహాత్ములు గల్గ భూమీశ సభలలోఁ గవులకు బహుళవిఖ్యాతి గల్గె" గతంలో జరిగిన చప్పట్లపర్వాల వల్ల నాకెంత నష్టం కలిగిందిన్నీ ప్రాజ్ఞలోకం యెఱగనే యెఱుఁగును. అందుచేత

శ్లో "అవమానం పరస్కృత మానం కృత్వాతు పృష్ఠతః"

అని అనుకుంటూ రానక్కఱలేదు విధిగా సమ్మానమే జరుగుతుందని నమ్మియ్యేవే రానిశ్చయించుకొన్నాను. వస్తాను. నాకున్నదల్లా వొక్క అనారోగ్యప్రతిబంధకమే. నేను పెట్టిన గడువుమాత్రం మించనీయకండి. వారంరోజులు వ్యవధి వుంచి నాకు తెలపండి. యెందుకంటే? ఆ వ్యవధి దినములలో ఆహారాదులలో మఱీ జాగ్రత్తగావుండి మఱికొంత ఆరోగ్యాన్ని అభివృద్ధి పఱచుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతే కాకుండా ప్రయాణానికి అనుకూలించే సుముహూర్తంకూడా వున్నంతలో వీలైనది చూచుకోవడం కూడా అవసరమేకదా! (యిది సున్నపుపిడత ప్రయాణం) తీసుకువెళ్లినందుకు మీకు మాటదక్కాలి. వచ్చినందుకు నాకున్నూ మాటదక్కాలి, యితరవిధయా రసాభాసైనా, అనారోగ్య విధయా రసాభాసకాకూడదుకదా? భగవదనుగ్రహం యెట్టిదో కాని యింట్లో వున్నప్పుడున్నంత అనారోగ్యం అశక్తత యిల్లువదలిన ఉత్తర క్షణానన్నుంచే నన్ను వదలి పెట్టడం వుంది. దీన్ని గుఱించి చిరకాలంక్రితమే ఆలోచించి తేల్చుకున్నాను. సుమారు యిరవై రెండేళ్ల వయస్సులో వున్నప్పుడు శ్రీవేంకటగిరిసంస్థానానికి వెళ్లడం తటస్థించింది. అప్పుడు సంస్థానం వారిమీఁద చెప్పిన పద్యాలలో వకపద్యంలో యీశాపం తగిలిందని నాఅనుమానం. యేలాగా "వెఱ్ఱివెంకటాయ" బిరుదం రానేవచ్చింది, కనక ఆ బిరుదాన్ని పోషించే పిచ్చినమ్మకాలు కూడా యిందులో వ్రాస్తాను.

"చెడ్డకాపరానికి ముప్పేమిటి? మొండికాలికి చెప్పేమిటి?"

సీ. “పరసజ్జనావళుల్ పరమబంధులు గాఁగఁ
               బరులయన్నము పుష్టికరముగాఁగ."

తక్కినది సందర్శనంలో చూచుకోండి కావలిస్తే, అందుచేత యిల్లు బయలుదేరడానికే బ్రహ్మష్టో బ్రహ్మం గాని బయలుదేరి యింకా పరాన్నం తినకుండానే ఆరోగ్యమే కాదు, శరీరబలమేకాదు, కొంతఅభివృద్ధిలో వుంటుంది. ఆబరవసాన్ని పురస్కరించుకొనియ్యేవే. “కూర్చుండి కూడొండలేను వంగుండి తీర్థం" అన్నస్థితిలో వుండికూడా బలవదాహ్వానాలకు సిద్ధపడుతూ వుంటాను. అందులో యీ ఆహ్వానం సామాన్యాహ్వానమా? "కత్తేస్తావా? బద్దేస్తావా?" అన్నతరగతిలోదికదా? అయితే యిదేమిట్రాబాబూ? "నమాజు చేయబోతే మసీదు మెడబడ్డ"దని మెల్లగా యేదో మఱో సాఁకు చూచుకొని యీ వుద్యమం విరమిస్తే చెప్పఁజాలనుగాని, నా అంతట నేనుమాత్రం వెనకంజ వేసేదిలేదు. అప్పుడే “ప్రభువిచ్చె వేనూటపదియాఱులనునట్టి స్వప్నములే ధనార్జనములాయె" యింకాకొన్నిహిరణ్యాక్షవరాలు భోజనానికి సంబంధించినవైతే వున్నాయికాని, అవి సమకూర్చడానికి యెవరు గాని చేసే ప్రయత్నం లవలేశమున్నూ వుండ నక్కఱలేదు. కనక యిందులో వుటంకించి గ్రంథం పెంచలేదు. "శ్లో. ప్రక్షాళనాధ్ధి పంకస్య దూరా దస్పర్శనం వరమ్” అనే న్యాయంచేత అసలే, యీప్రయాణం మానుకోరాదా? అని కొందఱు విజ్ఞులనవచ్చును. కాని వారిమాటలు యీగంగిరెద్దుకు రుచించవు. “మ. అఱకం గట్టిన గంగిరెద్దురుకదే! ఆత్మీయ వాద్యధ్వని స్ఫురణం బించుక విన్నన్,” అన్న గీరతపద్యం యెఱిఁగినవారునన్ను వారించరు. వారించలేరూనున్నూ కనక- “నందో రాజా భవిష్యతి" వెళ్లే తీరతాను. విమర్శకుడిగారి సమ్మానాన్ని పొందే తీరతాను. వారివూరు నేను వెళ్లిన తరవాత నాకు అంతాజయమే కాదే అనుకుందాం. యేభయమూ లేదాయె. ప్రాణభయం కూడా లేని వార్ధక్యవయస్సాయె. యెందుకు జంకాలీ అంఛాను, నాసౌహార్దం వారికి వచ్చినట్లే అయితే లోఁగడ నేనాహ్వానించిన ఆహ్వానమేకాక మళ్లా వారిని ముఖాముఖీనికూడా వారి గ్రామం వెళ్లినప్పుడు ఆహ్వానిస్తాను. గనక వారుకూడా మాగ్రామం వచ్చి, మాగృహం పావనం చేసి, నా అభినందన పద్యాలున్నూ సేలుజోడున్నూ దయతో స్వీకరించేటట్టున్నూ, నన్ను ఆశీర్వదించేటట్టున్ను అమాంగళ్యపువాక్యాలు మఱిచి పోయేటట్టున్నూవారి వూరి వారిచేతనే గట్టిగా నచ్చఁజెప్పించి తిట్టినప్పటికీ ఆ తిట్లు గణింపక కృతి ప్రదాతను సమ్మానించాడు చెళ్లపిళ్ల అనే యశస్సును పొందే తీరతాను అనే దృఢవిశ్వాసంతో యీవ్యాసాన్ని వ్రాశాను. బొబ్బిలి సంస్థానంవారికిన్నీ , విజయనగరసంస్థానంవారికిన్నీ వున్న వివాదంకంటె మావిమర్శకుఁడుగారికిన్నీ మాకు (తి. వెం.) న్నూ యెక్కువ వివాదం వుందా? యిప్పటి బొబ్బిలి మహారాజావారి తాతగారున్నూ, శ్రీమదానందగజపతి మహారాజులుంగారున్నూ చాలా మైత్రిగా వుండేవారు. ఆలాగే లోఁగడ విమర్శకుఁడుగారు నన్ను తిట్టిపోసినప్పటికీ “కొట్టితే కొట్టాఁడు కొత్త కోకెట్టాఁడు” అన్నమాదిరిగా నేను సంతృప్తిపడి వారిస్నేహాన్నే అభ్యర్థిస్తూ వుంటే దీన్ని యేలా తోసివేస్తారో చూస్తాను.”

“బాజాలసందట్లో మంగళసూత్రాన్ని మఱచివున్నాను"

లోఁగడ వొకదాన్ని యెత్తుకొని దాన్ని సమాప్తి పొందించకుండానే యేదో ధోరణిలో పడి యేమేమో వ్రాశాను. అదేమిటంటే? "యేమిచ్చినా సంతోషించడమేకాని పేచీపెట్టడం నాస్వభావం కా"దన్నది. వనపర్తిసంస్థానం వగయిరాలు పరీక్షించి సమ్మానించే వవడంచేత ఆలా పేచీపెట్టవలసి వచ్చిందనేమాట లోఁగడనే వ్రాయవలసింది. మఱిచాను యిక్కడ వ్రాశాను. ఆఘట్టంలోకి జమకట్టుకోండి. ఆయీపద్యంవల్ల ఆపేచీ తాలూకు పూర్వోత్తర సందర్భం తేలుతుంది. వుదాహరిస్తాను

“క్ర, గానమ్ముకన్నఁ గవనం
    బేనాఁడేనియును దక్కువే? నరవర; నీ
    వీ నియతి విడిచి యిచ్చిన
    నే నేమని సమ్మతింతు నెఱిఁగి యెఱిఁగియున్."

యెత్తుకొని యీలా మడిచిన వింకా వుంటే వుంటాయేమో? వయోదోషంవల్లనూ, అనారోగ్యంవల్లనూ వచ్చే యీహంసపాదులకు చదువరులు నన్ను క్షమించాలి. నావంటివాఁడే వొకcడు. గోచీ మఱిచి పోయితలపాగా మాత్రం పెట్టుకొని యెవరో ప్రశ్నించేటప్పటికి తొడమీద హంసపాదు వ్రాశాడcట!

యిప్పటి నాస్థితి అట్టిదే! విమర్శకుఁడుగారి శంక లెట్టివో? వాట్లవాలకాన్ని చాలావఱకు బయటికితీసి చూపడమున్నూ జరిగింది. యీ చూపడం కొంత వాచ్యంగానున్ను కొంత వ్యంగ్యంగానున్నూ వుంటుంది. గనక చదువరులు బాగా గమనించాలి. వారుసమాధానపడక పోవచ్చును. గాని నేను వారికొఱకు మాత్రమే వ్రాయలేదుకదా? నన్నయ్యను పురాణాలు తెలిగించిన కవులలో చేర్చినదికదా? నాప్రధానాపరాధం; పోతన్నగారి ప్రవృత్తివల్ల విమర్శకుఁడుగారికి యథార్థం బోధపడి వుంటుందా? యింకా బోధపడదా? యిందుకేనా వారు సంతుష్టిపడితే వారికి వచ్చిన ఆగ్రహంలో నూఱువంతుల్లో 99 వంతులు సవరణ అవుతుంది. మా పెద్దలు కృతార్థులవుతారు. గుంటూరుసీమ అంతా తప్పులతడకే అయినా ముప్పై సంవత్సరాలు నిరాఘాటంగా ప్రచారం చేసి రెండు ముద్రణాలు పొంది సుమారు నాల్గువేల రూపాయలు సంపాదించుకుంది. యీ పైనిదాని ప్రచారం ఆగిపోయినా చిక్కులేదు. యెంతోకష్టించి వ్రాసిన విమర్శకుడుగారి ప్రయాసకు ఆమాత్రమేనా చారితార్థ్యం కలిగించడానికి నాఅభ్యంతరం లేశంకూడా లేదుగాని ఆచరిత్రను ఆమూలాగ్రంగా యెఱిగిన విమర్శకుఁడుగారి బంధువులే యెదురుకుంటారేమో కదా? ఆలా యెదురుకోవద్దనిన్నీ వారు చాలా పరిశ్రమ చేసి వ్రాసివున్నారనిన్నీ యీతుట్టతుది వయస్సులో నేను యెవరినీ జయించే కోరికతో లేననిన్నీ వొకవేళ "పుఱ్ఱెను పుట్టిన గుణం" సామెతగా అట్టికోరిక నాకింకా పోకపోయినా “పిచ్చుక మీద బ్రహ్మాస్త్ర ప్రయోగానికి" సిద్ధపడేది లేదనిన్నీ కాబట్టి నాకోరిక చెల్లించవలసిందనిన్నీ వారిని ప్రార్థిస్తాను. ఆపద్ధతిని నీవీమాత్రం వ్రాయడం కూడా అవసరమే అని శంకిస్తారేమో? వినండి నేను విరమించుకొనే తలపుతో సమ్మానానికి అంతఃకరణశుద్ధిగా ఆహ్వానిస్తే దాన్ని వారు అన్యథాకరించి,

“మ. గతమేమో? గతియించెఁ గొంతఅదియున్ గయ్యాలతో గొంత శాం
      తతతోఁ గొంత వృథాగఁ గొంత కవితానందమ్ముతోఁ గొంత యే
      యితి కర్తవ్యము లేక కొంత యెటులో యీపై భవచ్చింతనా
      మృతరక్తిం గలిగించి ప్రోవుమని కే లే మోడ్తుఁ గామేశ్వరీ”

అని యిలువేల్పు కామేశ్వరిని ప్రార్థించుకుంటూ సర్వసంగపరిత్యాగినిగా వున్ననన్ను-

“తే, కొట్టవచ్చిన వారిని గొట్టఁ బోక
     తిట్టవచ్చినవారిని దిట్టఁబోక
     చతురుపాయమ్ములను శాంతి సతతమార్జి
     తమ్ముగావలెనంచుc జిత్తమునఁ దలఁతు."

అని జీవితచరిత్రలో వ్రాసికొని తదర్థమై అవసరంలేని సందర్భంలో కూడా క్షమాపణయిచ్చి లోకానికి దాన్ని వెల్లడించి వున్ననన్నుయీ విమర్శకుఁడుగారు సంశయ విచ్ఛేదము అనే శీర్షికతో యింకా యేవేవో ప్రగల్భాలు వ్రాసి యీనాలుగు మాటలున్నూ బలవంతంగా వ్రాయించుకున్నారు. గాని యిది బుద్ధిపూర్వకపు వ్రాఁతకాదు. ఆలాటి వ్రాఁతే అయితే యింతఘాటు తగ్గివుండదని లోకమెఱింగినదే? (వెం. శా. కి కలిగిన సంశయ మేమిటో వీరు తీర్చేదేమిటో? ఆవ్యాసానికీ శీర్షికకూ వుండుకున్న “బదరీబాదరాయణ" సంబంధం తప్ప యితర సంబంధం యెట్టిదోతేల్చాలి) యిందుకు కారణం యింకోటి కూడావుంది. మొదట యీ గుంటూరు కలహం తెచ్చిపెట్టింది రాహుమహాదశలో శుక్రుఁడు యిప్పటికి మళ్లా శత్రుస్థానంలోవున్న శనిలో శుక్రుని అంతర్దశ వచ్చింది. వచ్చి యిప్పటికి ఆఱు మాసాలు కాబోలును అయింది ఆకారణంచేతే, “ఆలర్కం విషమివ" అని భవభూతి చెప్పినప్రకారం చిరకాలానికి యిది మళ్లా రేగింది. యీలాటి తార్మాణంవల్లనే నేను జాతకాన్ని నమ్మేపిచ్చి వాళ్లల్లో వొకణ్ణిగా లోకంచేత పరిగణింపఁ బడతాను. ఆలర్కం, వెఱ్ఱికుక్క సంబంధమైన విషమని వ్యాఖ్యాత వ్రాసినట్లు జ్ఞాపకం. అది సకాలంలో నివర్తించక యేమాత్రం శేషించినా యెప్పుడో వకప్పుడు మళ్లా పొడచూపి బాధిస్తుందని సంప్రదాయజ్ఞులు అంటారు. ఆలాగే యిదిన్నీ అప్పుడు వీరు 46 యేండ్లవయస్సులో వున్న ప్రాజ్ఞులైవుండికూడా “నలుగురితోపాటు నారాయణా, కులం తోటిపాటు గోవిందా"గా నాఁడు మమ్మల్ని ప్రత్యేకించి దర్బారు అనే పేరుతో వక పత్రిక పెట్టి దూషించే మహానుభావులతో నేకీభవించి యేవోనాలుగురాళ్లు రువ్వితే, మళ్లాయిప్పుడు నాకు యీ పరిశ్రమ కలిగించ వలసి వచ్చేదే కాదు.

“సఱ్ఱాజు పెళ్లిలో గుఱ్ఱాజు కొకపోఁచ"గా అప్పుడే యేదో అయేది “గోళ్లని తీరేపనికి గొడ్డళ్లన్నట్లు మళ్లా యీపరిశ్రమ తగిలేదేకాదు. కాని యీశనిలో వచ్చే శుక్రాంతర్దశకు దీన్ని వీరు మిగల్చడం అంటే? “న దుఃఖం పంచభి స్సహ" అన్నట్లు వారితో చేరక మీకు తిట్టడం బాగా చేతగాదు. అందుచేత నేను మీతో కలవను అని మాని స్వయంపాకస్థుల మాదిరిని శుద్ధశ్రోత్రియంగా పృథక్కుగాతిట్టడం అనేది దైవచోదితంగాని, యెన్నివిధాల ఆలోచించినా బాహ్యకారణంగాని, అంతఃకారణంగాని కనుపించడంలేదు. అందుచేత యీదోషాన్ని సర్వమున్నూ నాజాతక గ్రహాలమీద "పాపాయపరపీడనం"గా ఆరోపిస్తూ విమర్శకుఁడుగారి స్నేహాన్ని లోగడ మాటిమాటికి అభ్యర్థించడం జరగనే జరిగింది. కనకదాన్నే జ్ఞాపకంచేస్తూ, నన్ను రప్పించ దలచినది త్రికరణశుద్ధిగానే జరిగినట్టిదే అయితే నా యిప్పటిస్థితి ఆలసింప తగ్గది కాదు కనుక- “శుభస్య శీఘ్రమ్” అనే లోకోక్తికి ఉదాహరణంగా వుండేట్టు చేయవలసిందని ప్రార్థిస్తూ స్వస్తి చెపుతూన్నాను. వెం. శా. శతావధాని.

సింహావలోకనం

ప్రసక్తాను ప్రసక్తంగా పైవ్యాసంలో చాలా విషయం నడిచింది. అందుచేత ముఖ్యాంశాలు యిక్కడ వుటంకించడం మంచిదనుకుంటాను.

(1)విమర్శకులకు నేను వారి విమర్శన అద్దాన్నంగావున్నా అనుచితంగా వున్నా అపృచ్ఛ్యసంభాషణతో, వృథాసాహసోక్తులతో, అమంగళాశ్లీలాలతో, అప్రగల్భోక్తులతో నిండివున్నా అందులోవున్న కవితాధార చాలాధారాళంగా వుండడంచేత చేయఁదలఁచుకొన్న సేలుజోడుసత్కారం విమర్శకుఁడుగారు మావూరు రావడానికి మొగం చెల్లక వారివూరే పట్టుకువచ్చి చేయవలసిందని నాకు విధించడం ఆచార విరుద్ధ మవడంచేత నేను వొకవేళ గత్వాగత్వావారి ఆహ్వానం తుదకు ఫేలయినా, దేవుఁడు చాలా మేలుచేస్తే వారివూరుసంపన్న గృహస్థుల ఆహ్వానంమీఁద వెళ్లవలసివచ్చినా అప్పుడు మళ్లా వారిని యధాపూర్వంగా ఆహ్వానించడమే జరుగుతుందిగాని అక్కడనే సమ్మానించడం జరగదు అని ధ్రువంగా నమ్మవలసి వుంటుంది.

(2) వారి ఆహ్వానం (నన్నుద్దేశించింది) యుక్తియుక్తమే. కృతి కన్యాపరిణయం జరిగి కొలఁది కాలమే అయివుండడంచేత, సదరుఆహ్వానం మనుగుడుపు ఆహ్వానంవంటి దవడంచేత, నాకు అనారోగ్యప్రతిబంధకం తప్ప యితర ప్రతిబంధకాలు లేవు కనుక, నేను శిరసావహించి జనవరి నెలలోగా యెప్పుడేనా సరే వారంరోజులు నాకు గడువుయిచ్చి వెంటఁ బెట్టుకొని వెళ్లేయెడల నానల్లమందువేళ వగయిరా యేర్పాట్లకు భంగంకలగనిపద్ధతిని మధ్య మధ్య మకాములతో తప్పక రావడానికి సిద్ధంగానేవున్నాననిన్నీ మామూలుగా నాతో మాచిన్నచిరంజీవితోసహా ముగ్గురువిద్యార్థులు మాత్రమే వుంటారుగాని యితరవిద్యార్థులు వుండరనిన్నీ లోఁగడ మనవిచేసినా మళ్లాకూడా మనవిచేస్తాను. యీప్రయాణమునకు వారితరువాయేగాని నా తరువాయి లేశమున్నూ యిప్పటికిలేదు. ముందుమాట చెప్పలేను.

(3) 116 పేజీల విమర్శన గ్రంథంలో వున్నవన్నీ చొప్పదంటుశంకలేకాని వొకటీకూడా సజావుగావున్నది కాకపోవడంచేత జవాబివ్వడమంటూ మొదలుపెట్టి గ్రంథం పెంచి పత్రిక నించడానికి వొప్పక,

“ప్రధానమల్ల నిబర్హణ" న్యాయానుసారంగా నన్నయ్యను పురాణాంద్రీకర్తలలో చేర్చడం పూర్తిగా సమర్ధించి చూపడం జరిగింది కనుక చూపినంతమట్టుకేనా వొప్పుకోవలసివుందో! లేదో! లేకపోతే యెందుకు లేదో? లోకానికి తెల్పినపిమ్మటఁగాని వృథాగా యిఁక వివాదం పెంచవద్దని విమర్శకుఁడుగారిని కోరుతున్నాను. యెందుచేతనంటే యీమూలకంగా పేరుసంపాదించుకోవాలని ప్రయత్నించేమీకు యిది ఆవశ్యకంగా తోఁచినా “యెక్కడనో ధాత లిఖించినకారణంచేత” రాఁదగ్గపేరు రానే వచ్చింది కనుక నాకిది “యూసులేసుగా" కనపడిందనివిజ్ఞప్తి.

(4) మీతాలూకుతిట్లుతిట్లేకాని మఱివకటికావు. ఆతిట్లు తక్కినవిమర్శగ్రంథంవల్ల సవరణకావు, యెన్నటికీకావు అందులోవున్న వెగటు సర్వమూ మీఁదేగాని నేను తెచ్చిపెట్టిందికాదు. మీబుద్ధిపూర్వకమేగాని ప్రమాద ప్రయుక్తమున్నూ కాదు. అందుకు వేఱేసాక్షులక్కఱలేదు. మీహృదయమే సాక్షి! జవాబుదారీ దానిదే అందులో శ్లేషగాని, అన్యాపదేశంగాని, యితర ధ్వనిగాని, యేవిధమైన కమ్మీగాని లేశమున్నూలేదు. శుద్ధబట్టబయలు కనక ఆలాటి వృథాఆరోపణలు చేయవద్దని 76 వత్సరముల ప్రాయములో వున్న మిమ్మునేను కడచిన ప్రమాదమే చాలు యింకా ప్రమాదపు వ్రాతలు వ్రాసి పరాక్రమించవద్దని మీ శ్రేయస్సుకోసం సాంజలిబంధంగా ప్రార్థిస్తాను. కోపం ఆఁపుకోలేక పోయారు యిప్పుడే మనుకుంటే కలిసి వస్తుంది. యెవరో యెందుకు తుదకి మీ చిరంజీవులు, మునిమనుమలు, పసిపాపలు యెదురుకున్నా మీకు జవాబు సున్న

(5) నేను పెద్దవాణ్ణి, మీరూ పెద్దలే (నాకన్న కూడాను) కనక యీ తుదివయస్సులో అనవసరపు వివాద మెందుకు? కనక అన్యోన్యమున్ను అన్యోన్యసత్కారాలు అన్యోన్యగ్రామాల్లో యథాన్యాయంగా స్వీకరించి లోకం యొక్క ఆమోదాన్ని పొందడం మంచిదని విన్నవిస్తాను. తరువాత తమచిత్తం- యీతుది వయస్సులో మీకు భగవంతుఁడీతీరని శల్యాన్ని తెచ్చిపెట్టినాఁడు. జయేచ్ఛ మీకు యీచిక్కు తెచ్చిపెట్టింది. యింకాపరాక్రమిస్తే మఱీబాగుండదు కనక సమ్మానాన్ని స్వీకరించి జయగుర్తుగా మిమ్మల్ని ప్రేమించే అమాయికులవద్ద డచ్చీలు ప్రచురించుకోండి.

(6) మీకు ప్రధానంగా మనస్సులో వున్నకోపమల్లా నేను నాఁడు యెప్పుడో మాంధాతలనాఁడు (ముఫ్ఫైయేండ్లప్రాంతంలో) యెవరికో మీ శాఖవారికి సహాసనాన్ని కవితావిషయంలో నిషేధించడంకదా? అది చాలా యుక్తమే అనిన్నీ అంతేకాని శాఖాద్వేషప్రయుక్తం కాదనిన్నీ రేపు నాకంటే చాలా పెద్దలైన మీవిషయంలో కూడా అట్టిపట్టుపటాంగంవస్తే అది కవితా విషయంలోనే (లెక్కలవిషయంలో కాదు) అయితే అంతే జరుగుతుందనిన్నీ దానికి మీరు నాహృదయాన్ని బాగా పరిశీలించాలంటే? మారెండో చిరంజీవి శతావధాన్ని నాతోసమానుఁడనే వుద్దేశంతో యెవరేనా నాపంక్తిని కూర్చోపెట్టేయెడల వాణ్ణికూడా నేను నిషేధించే వాణ్ణి అనిన్నీ స్పష్టంగా మనవి చేస్తున్నాను. కనుక ఆవిషయమైన ద్వేషం నాయందు మీరు వుంచుకోవడం కేవలం అన్యాయమనిన్నీ నొక్కి వక్కాణిస్తూన్నానని మనవి.

(7) నాకు ధారాశుద్ధివిషయంలో అనఁగా సంస్కృత సమాసగ్రథన విషయంలో నన్నయ్యకు నన్నయ్యే కాని తక్కిన యిరువురున్నూ అతనికి దీటుకారన్న అభిప్రాయం శాఖాభిమానప్రయుక్తం కాదనిన్నీ విద్యాభిమాన ప్రయుక్తమేననిన్నీ ప్రమాణంచేసిచెపుతూ దాన్ని గూర్చి మాట్లాడడానికి మీకువుండుకున్న చదువుగాని, అనుభవంగాని, బొత్తిగా చాలవు కనక ఆ విషయమై యిఁకవాదం పెంచవద్దనిన్నీ కూడా ప్రార్థిస్తాను. తగ్గంత పిండి వుంటేకాని ఆయీ విషయం గోచరించేదికాదు. నాఅభిప్రాయం తప్పయితే దాన్ని నిరూపించతగ్గవారెవరేనా నిరూపిస్తారు. తిట్లవల్ల దాన్ని నిరూపించడం అసంభవమని యెన్నిసార్లు వ్రాసేది. శాంతం పాపం.

(8) నియ్యోగులునూ, వైదికులున్నూ కలిసి సంబంధ బాంధవ్యాలు చేసుకోవడం దగ్గిఱనుంచిన్నీ నాకు అభినందనీయాలనిన్నీ మా ప్రభాకర శాస్త్రి కొమార్తను శ్రీయుతులు విస్సా అప్పారావుగారి కుమారున కిచ్చిచేసిన పెండ్లిని నేను మనఃపూర్వకంగా అభినందించి వున్నాననిన్నీ కవితా విషయంలో పిండిప్రోలివారిని గూర్చిన వ్యాసంవల్ల గుణమే ప్రధానంగాని నాకు శాఖప్రధానం కాదనిన్నీ మీకు కారణాంతరంచేత గోచరించక పోయినా యితరుల కందఱకి పూర్తిగ గోచరిస్తుంది. కనక ఆదోషాన్ని నామీఁద ఆపాదించవద్దనిన్నీ తామే భరించవలసి వుంటుందనిన్నీ మనవి చేసుకుంటాను. తరువాత తమచిత్తం.

(9) మీరు మావూరు నేను చేయఁదలఁచుకొన్న సన్మానానికి రావడానికి లేశమున్నూ భయపడనక్కఱలేదనిన్నీ రౌండుటేబిలు సభకువెళ్లిన గాంధీగారిని ఆహ్వానించినవారెంత భద్రంగా కాపాడి మనదేశానికి సమర్పించారో? మిమ్మల్ని కూడా అంత భద్రంగానే మీ గ్రామం పంపించడానికి పూచీపడుచున్నాననిన్నీ మళ్లామళ్లా పునరుక్తి ప్రాయంగా మనవి చేసుకుంటూ వున్నాను. -

(10) షరా:- యింతదాకా యీవ్యాసం వ్రాసిన తరవాత విమర్శకుఁడుగారి వ్యాసం తరవాయి కూడా వున్న పత్రిక వచ్చింది. దానిలోసారమల్లా వెం. శా. విమర్శకుఁడుగారికి వోడిపోయినట్టున్నూ అంతేకాక నన్నయ్యభట్టుకు గౌరవం కలిగించాలనే వుద్దేశంతో వెం. శా. వ్రాసిన వ్యాసం వాఁడివుద్దేశాన్ని నెఱవేర్చక నన్నయ్య భట్టుకు న్యూనత్వాన్ని కలిగిస్తూ వుందనిన్నీ పనిపడితే పండితసమక్షంలో వీట్లనేకాక యింకా వారు (విమర్శకులు) విమర్శన గ్రంథంలో వ్రాసిన విషయాలన్నిన్నీ సమర్ధించడానికి సిద్ధంగావున్నామనిన్నీ యేమేమో కొన్ని సాహసోక్తులు వ్రాసి వ్యాసాన్ని ముగించారు. నాకు పట్టరాని నవ్వు వచ్చింది. చెప్పొద్దూ కవితాధార అభినందనీయమని వొప్పుకున్నదే కదా? లోఁగడ సాహసమున్నూ అనాత్మజ్ఞత్వమున్నూ కూడా అభినందనీయులే అని వ్రాయకపోవడం తప్పుగదా? అనుకున్నాను.

(11)వాట్లకన్నిటికీ సరిపడేమాట యిదివఱలో నా యీవ్యాసంలో అసకృదావృత్తిగా దొరలేవున్నా మళ్లాయిక్కడ వుదాహరిస్తాను. అయ్యా! పండితసమక్షంలో మీతో వాదించడానికి నన్ను సమర్ధుణ్ణిగా లోకం వొప్పుకుంటుందని నేను అనుకోను. అందుచేత మీవిమర్శనగ్రంథంలో వున్న యితర విషయాలన్నీ వదిలిపెట్టి మీరు నన్ను తిట్లుకావనుకొని తిట్టినతిట్లను సమర్ధించడానికి మీకు యేపండితుఁడి పేరు నచ్చుతుందో? ఆ పేరుమాత్రం వుదాహరిస్తే అంతటితో మీమీఁదవున్నభారం వదలిపోతుందని మనవి చేసుకుంటాను. యేమేనా వాదోపవాదాలు చేసుకోవలసివస్తే ఆయనా, నేనూ చేసుకుంటాము, విశేషించి గ్రంథం పెంచక ఆపండితుల నామధేయాన్ని మాత్రం ప్రచురించ వలసిందని ప్రార్థిస్తాను. బాగుందా? యీలా అనుగ్రహించండి లేదా? వొకజయపత్రం వ్రాయించి తెచ్చుకోండి నేను కూడా వ్రాలుచేస్తాను. సంతోషించండి.

(12) ఇది విమర్శనగ్రంథానికి సంబంధించిన వాదవిషయం. మీరు నన్ను సమ్మానించడానికి రప్పించేవిషయం ఆలాగే నిల్చివుందని జ్ఞాపకం చేస్తున్నాను. నేను మిమ్మలిని సగౌరవంగా ఆహ్వానించిన ఆహ్వానాన్ని తాము నిరాకరించారు. అయినప్పటికీ మీగ్రామం వచ్చినప్పుడు మళ్లా ప్రయత్నించి చూస్తానని పలుసార్లు వ్రాసేవుండడంచేత అది అమల్లోనే వుంది గాని అధఃకరింపఁబడలేదు. వృథాగా జయేచ్ఛతో పరాక్రమిస్తూ వున్న మీరు శ్రీపోతన్నగారి-

“మ. ఒనరన్ నన్నయ తిక్కనాది కవులీయుర్విం బురాణావళుల్ తెనుఁగున్ జేసియు” అన్న వాక్యానికేనా వెం. శా. సరియైన అర్ధాన్ని గ్రహించాఁడో? లేదో? కాస్త పత్రికాముఖాన్ని ప్రకటించండి. శ్రీమానాప్రగ్గడవారి అబ్బాయి వ్రాసిన వుత్తరం (నేను ప్రకటించింది) తమకేమేనా రుచిస్తే రుచించినట్లున్నూ, లేకపోతే లేనట్లున్నూ కొంచెం ప్రకటించండి. “శ్లో. యుక్తియుక్తం వచోగ్రాహ్యం బాలాదపి సుభాషితమ్, వచనం తత్తునగ్రాహ్య మయుక్తంతు బృహస్పతేః" యీశ్లోకార్థం తమరు అంగీకరించేదే కదా? అయితే ఆబాలకవి నేమంటారు.

(13) నవ్వొచ్చేది యింకొక మాట వ్రాస్తూ వుంటారు. మీరు ధైర్యంతో వ్రాసేదేనా? ఆమాట "మీవిమర్శనగ్రంథ మంతా పాఱఁజదివితే యేదో విజ్ఞులకు బోధిస్తుందంటూ వ్రాస్తారుగదా? మీరు ఆలాపాఱఁజదివితే అప్పుడు అందులోవున్న “పదియవ నాఁటి” వగయిరాలు వెగటుగా వుండక మధురంగా వుండడం తటస్థిస్తుందనేనా? మీ అభిప్రాయం. కానివ్వండి మీకుతూహలాన్ని తోసి రాజనడం యెందుకు? ఆలాగే ప్రత్యక్షరశోధగా యేపండితుఁడి చేతనో చదివించి ఆవ్రాత వెగటుగా లేదని ఆయన చేవ్రాలుతో నాలుగు అక్షరాలు పత్రికలో ప్రకటింపఁజేయండి. సరేనా? యిక్కడకి సర్వమూ మీ అభిప్రాయానుసారంగానే నేను వొప్పుకొన్నట్టయింది గదా! అయితే యిదంతా కొంత గంపచిక్కుగా కనపడుతుంది. తుదకి పసకట్టేది కాదంటారా? ఆపక్షంలో మిమ్మల్ని నేను బాధించేవాణ్ణి కాను. చక్కఁగా నాసగౌరవాహ్వానాన్ని ఆమోదించి నాసేల్జోడుసత్కారాన్ని స్వీకరించండి యింతే నావిజ్ఞప్తి. మీగ్రామంలో వుండే సంపన్న గృహస్థులకేనా తృప్తికరంగా వుండేటట్టు మీతిట్లను సమర్థించుకోవడం వకటిన్నీ రెండోది యెవరేనా మీ బంధుసముద్రులు సేల్జోడు బహుమానాని కెందుకు దయచేశారు కారని అడిగితే తృప్తికరమైన జవాబు యివ్వడం వకటిన్నీ జరిగినట్టు విని సంతోషిద్దామని కోరిక వుందనికూడా మఱోవిజ్ఞప్తి. ఆర్థికశంకలే మీరు మీ గ్రంథంనిండా చేసివున్నారని నాకు జ్ఞాపకం. ఆ పుస్తకం నావద్ద లేదని లోగడ మనవి చేసేవున్నాను. యిప్పుడు వ్రాసిన “సంశయ విచ్ఛేదా వచ్చేదం"లో శాబ్దిక శంకలు కొద్దిగా సూచించారు. వాట్లకి జవాబు యివ్వలేదని కూడా తేల్చారు. ఆగ్రహించారు. మీవాక్య ముదాహరిస్తునా? “మాదుమీదులు” మఱికొన్ని దుష్ప్రాసములు మొదలగుదోషముల కేమియు సమాధానములు చెప్పక యొక్క హ్రస్వముమీఁది బిందు నిర్బిందుప్రాసమునకు మాత్రమే యెక్కడనో యొకానొకచోట (శాంతి పర్వములోనోయేమో) ఉన్నట్లు స్థాననిర్ణయములేక తమకసి యంతయు వెళ్లఁగ్రక్కుచు 'శాస్త్రజ్ఞులు కాని విమర్శకు' లనియు బహుశః వారు తిక్కనగారి ప్రయోగమునైనఁ జూచియుండరనుకొందు ననియు వ్రాసిన వ్రాఁతయే సాక్ష్యమిచ్చుచున్నది." అంటూ వ్రాస్తారుకదా? సార్థబిందు నిరర్థబిందు ప్రాసవున్నపద్యంలో ప్రధానస్థలాన్ని (నగము ఎసఁగు) అనే పదాలతో చూపితినిగదా? పైఁగా శాంతిపర్వం అంటినికదా? కంద పద్యమని తెలిసికోవడానికి కూడా కొంత ఆధారం వుంది. ఏచరణానికి ఆచరణంగా, ఏపద్యానికి ఆపద్యంగా అచ్చువేసిన భారతాలు వున్నయీ రోజుల్లో ఆపద్యాన్ని వెతుక్కోవడంకూడ మీకు కష్టమే అయిందా? అదిన్నీకాక ఆవ్యాసంలో “నగములు. ఎసఁగు పూర్వస్థితిన" అన్నంతవఱకు కూడా మొట్టమొదట వుదాహరించి వుంటిని కదా? యింకా “ముంజేతికంకణాని కద్దం చూపించమంటారే" యిది మీకు యుక్తంగా తోఁచిందా? లక్షణగ్రంథాలలో ప్రయోగం యిచ్చి వూరుకుంటారుగాని యింత మాత్రమున్నూ స్థలం వగైరాలు సూచించరే? అయితే వకతప్పు నాది వుంది. శాస్త్రగ్రంథ సంప్రదాయం తెలియని మీకొఱకు వ్రాసే వ్యాసంలో శాస్త్రజ్ఞమర్యాదగా కలం నడపడం తప్పుకాకపోదు. కర్మం కాలి నాకు ఆలాటి మీతో వాదం వస్తే వచ్చిందికాక నేను-

చ. "గురుకులవాసమున్ జరిపి కూరిమి మాధుకరంబు వారముల్
     జరుపుచు, నమ్మగాని యొకసాధ్విని నమ్మ! యటంచు బాబటం
     చొరులను గొల్చి నేర్చితిమి యొండొకశాస్త్రము పండితుల్ సెబా
     సుర! యని మెచ్చఁ బద్యములు శ్లోకములున్ రచియింతు మొప్పుగన్"
                                                               (గుంటూరుసీమ - పూర్వరంగము)

ఆయీ పద్యంలో చెప్పినప్రకారం గురుశుశ్రూషచేసి నేర్చుకొన్న శాస్త్రమర్యాదను విడిచి యెలా వ్రాయడం తటస్థిస్తుంది.

(1) “కథంతర్హి హాపితః క్యాపి హేసుభ్రు” ఇతిభట్టిః

(2) "మణీవోష్ట్ర స్యేతితు ఇవార్థే వశబ్దో వాశబ్దోవా బోధ్య"

యీ మాదిరిగాఁ గదా? శాస్త్రగ్రంథాల్లో వుంటుంది. యిందులో వక ప్రయోగ విషయంలో "భట్టి" అనేనా అన్నాఁడు గాని రెండోదానిలో ఆమాత్రమున్నూ అనలేదుగదా! యీలాటి శాస్త్రమర్యాదలు మీకు చూపడం నాది మఱీతప్పిదంగా విజ్ఞలోకం భావిస్తుంది. యేమంటే? "శాస్త్రజ్ఞులు కాని విమర్శకులు" అని వ్రాస్తినిగదా? మిమ్మల్ని గూర్చి; ఆలావ్రాసి మళ్లామీకు శాస్త్రకర్తలమర్యాదలను వుదాహరించడం తప్పా, మఱీ తప్పా? అయితే యీ విధంగా ఆలోచించినట్టయితే మీకు సమాధానం వ్రాయడానికి మొదలెట్టడానికే ప్రాజ్ఞలోకం అంగీకరించదుగదా? అపద్ధతిని “మూలచ్ఛేదీ తవ పాండిత్యప్రకర్షః" లోకి దిగవలసి వస్తుంది. కనక "కంబళీలో భుజిస్తూ వెండ్రుకలు వెదకడానికి" మొదలుపెట్టక ఛందాను రోధంగా ఆపద్యాన్ని యావత్తూ వుదాహరించవలసిందే. నేను అట్లు చేసి వుండలేదు. యెప్పుడో యిప్పటికి సుమారు యాభైయేళ్లనాఁడు చూచినదవడంచేత నయితేయేమి యీప్రాసవిషయం తప్ప దానిలో జ్ఞాపకం వుంచుకోతగ్గ అర్థసారస్యం వగయిరా లేకపోవడంచేతనైతేయేమి, పద్యం యవతూ వుదాహరించవలసిందే. నేను అట్లు చేసి వుండలేదు. యెప్పడో యిప్పటికి సుమారు యాభైయేళ్లనాండు చూచిన దవడంచేత నయితేయేమి యీప్రాసవిషయం తప్ప దానిలో జ్ఞాపకం వుంచుకోతగ్గ అర్థసారస్యం వగయిరా లేకపోవడంచేతనైతేయేమి, పద్యం యావత్తున్నూ జ్ఞప్తిలోలేదు. యిప్పుడు మళ్లా వెదుకుదామంటే? తగినంత వోపిక కనపడడంలేదు. అదిగాక నేను చూచిన భారతం చాలా ప్రాచీనం. అది మా మామగారిది. దాన్ని ఆయన జీవితకాలంలోనే మేనగోడలి కుమారుఁడికి ఆయన యిచ్చివున్నారు. దాన్నిప్పుడు బళ్లారినుండి తెప్పించాలి. యెందుకీశ్రమ. "నమ్మీనమ్మక ప్రయోగాలు జ్ఞానప్రకాశము వగైరాలు". యిటీవల సంస్కర్తలు మార్చేశారు కూడాను. దీన్ని మార్చవలసి వుండదుగాని యేమో ఆలాగనిన్నీ నిశ్చయించడానికి వీలుకాదు బాగా పరిశీలిస్తేనేకాని? యింతకూ ఆప్రాస దుష్టమా? అయితే అప్పకవి “పాఁడి ద్రచ్చఁగనిమ్ము నాతండ్రి కృష్ణ" అంటూ కూడా వుదాహరించి సార్థబిందుకానికిన్నీ సంపూర్ణబిందుకానికిన్నీ (రేఫశ్లిష్టత్వవిషయం వుపేక్షిద్దాం.) వుచ్చారణలో యెంతో భేదం కనబడుతూ వున్నా ప్రాసను అంగీకరించాఁడుకదా? శ్రవణంలో లేశమున్నూ (పూర్వకాలంలో సంగతి మనకు తెలియదు.) ఇటీవల భేదమేలేదని - నగము - ఎసఁగులకు ప్రాసపెట్టనే లేదనుకుందాం.

సోమయాజిగారు పెట్టకపోతే మాత్రం మనం పెట్టుకోకూడదా? యిప్పుడదంతా వెదకడ మెందుకంటాను. సర్వతంత్రస్వతంత్రులున్నూ, నిరంకుశచర్యులున్నూ, అభినవపండితరాయలున్నూ అయిన శ్రీమాడభూషి వెంకటాచార్యులవారికిన్నీ శ్రీ అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిగారికిన్నీ “ఇఁక” అనేపదం ప్రాసలో పెట్టి పద్యం చెప్పవలసిందని కోరినప్పుడు నడచిన వాదంలో ఆ ఆచార్లగారు తక్కినవి నిరర్థబిందుకాలు పెట్టి చెప్పితే ఆయన ఆక్షేపిస్తే చెప్పినసమాధానం సుప్రసిద్ధం కనక తిక్కన్నగారు ఆ లాపెట్టని పద్ధతిని కూడా యితర మహాకవులరచనలలో కుప్పతెప్పలుగా వున్న యీ విషయమై చర్చించడం అనవసరం. ఆ భారతం విమర్శకుఁడే చూచి లేదంటే తప్ప యీలోఁగా నేను దాన్ని వెతకడానికి ప్రయత్నించేదిలేదు. పోవూరి వేంకటేశ్వర్లుగారిచేత విమర్శకుఁడుగారు వ్రాయించిన వుత్తరాలకు నేను "లోకమో? పాడో" అనుకొని యథాలాభంగా, అశ్రద్ధగా యిచ్చిన మొట్టమొదటి జవాబువల్ల విమర్శకుఁడుగారికి బాగాలోఁకువ చిక్కి-వీఁడు తామనుకొన్న అసకృదావృత్తిగా విమర్శన గ్రంథంలో వాడుకున్న “ముత్తైదువు" లాగ వూరుకునే వాఁడేఅని ధీమాకు చిక్కి లోఁకువకట్టి ఆపుస్తకం పాఁతరలోనుంచి బైటికితీసి తిట్లూ, ద్రావిడస్త్రీల కుచాలు వగైరాదుష్ప్రసంగంతోటే “ఐసరుబొజ్జా" అని ధైర్యంగా, నిర్లక్ష్యంగా భవిష్యదాలోచన లేక విమర్శన గ్రంథం (స్వంతద్రవ్యంతోనే పాపం?) అచ్చొత్తించుకొన్నారు. దానికీకూడా నేను అజ్ఞాన ప్రయుక్తమైన వనిగదా? అనివోపికలేని రోజుల్లో యెందుకీయనతో వాదం పెట్టుకోవడమని యేదో ప్రసక్తిలేని ప్రసక్తిగా “నన్నయ్యభట్టును" గూర్చి వ్రాయడం పెట్టుకుని విమర్శకుఁడిగారి శంకలలో వున్న అసారస్యాన్ని దిజ్మాత్రం చూపి, తిట్లనుచూపి అవి కూడా గణింపక సేల్జోడు బహుమానంద్వారా గౌరవిద్దా మనుకుంటే అది అంగీకరించలే. ఉహూ పైఁగా నాకే సమ్మానం. అంతతోటీ వుపరమించలే. నాశంకల కన్నిటికి జవాబివ్వలే దంటూ వొకనెపం. ప్రతీశంకా యేదో కొంత చరిత్రను పురస్కరించుకొన్నదే. యిప్పటికి ముఫ్పై యేళ్లనాఁటి చరిత్ర కొన్నిటికి వ్రాయాలి. యాభైయేళ్లనాఁటి చరిత్ర కొన్నిటికి వ్రాయాలి. యెంత కుంచించి వ్రాసినా తీఁగదీస్తే దొంక కదలినట్లవుతుందాయె. అక్కడికీ మచ్చుకు మీసాన్నిగూర్చి వ్రాసి చూపిస్తినాయె. ఆయువుపట్టుశంక నన్నయ్యభట్టును గూర్చి లోఁగడ వ్యాసంలోనేకాక మళ్లా యీవ్యాసములో పోతరాజుగారి-

“మ. ఒనర న్నన్నయ తిక్కనాదికవు లీయుర్విం బురాణావళుల్ తెనుఁగుంజేసియు”

అన్నపద్యం కూడా వుదాహరించి చూపడం అవుతూవుందా? యీవ్యాసంలో యింతతోటేనా కిక్కురుమన కుండా స్వయంకృతాపరాధానికి (అంటే యీలాటిశంకలకు కాదు. పదియవ నాఁటివగైరాతిట్లకే లజ్జిస్తూ యిట్టి అపమార్గంలోకి దింపిన విపరీత దైవానికి చింతిస్తూ నాసేల్జోడు బహుమానాన్ని స్వీకరించి (వయస్సుచే) పెద్దలు కనుక నన్ను యీలాగే యెవరేనా తలతిక్క ప్రశ్నలు వేస్తూవుంటే జవాబు యిస్తూ శేష జీవితాన్ని గడుపుకోవలసిందని ఆశీర్వదించి తలదాఁచుకోవడమేయుక్తమో? “నాశంకల కింకా సమాధానం రానేలేదు" అంటూ "కిందఁబడ్డా మీఁదివాణ్ణే" అంటూ పరాక్రమించడానికి తలెత్తబోవడమే యుక్తమో? లోకంమాటకేంగాని ఆధూళిపూడిలో చాలామంది ఆంగ్లభాషా విశారదులున్నట్లు నే విన్నమాట నిజమే. అయితే వారే మందలిస్తారని నా ఆశ. యిందులో నాదేమేనా తప్పున్నట్టు వారికి తోస్తే నన్నుకూడా ఆధూళిపూడి ధూళిరేఁగేటట్టు మందలించడానికి పూర్ణమైన అధికారం కలిగి వుందని వేఱే వ్రాయనక్కఱలేదు. యీయన మా “పాణిగృహీత" గ్రంథం కృతి యివ్వడాన్ని గూర్చి కొన్నిశంకలు చేసి వున్నారు. వాట్లను గూర్చి వ్రాయవలసివస్తే బోలెఁడు చరిత్ర వుంది. అది సుమారు 35 సంవత్సరాలఁనాటి చరిత్ర. ప్రస్తుతం యెంతో ప్రయత్నిస్తేనేగాని మొట్టమొదట ఆవుత్తరాలు వగైరా ప్రచురించిన ఆపుస్తకం కూడా చిక్కదు. సరే? యేలాగో సంపాదిస్తానే అనుకోండి. ప్రచురిస్తానే అనుకోండి. దానివల్ల యేప్రయోజనాన్ని సాధించినట్టయింది. విమర్శకుఁడుగారిని సమాధాన పఱచడంకంటే యింకేం ప్రయోజన మంటారా? ఆయన తలలో సత్యం వప్పుకొనే రేణువులంటూ వుంటేనా? ఆబాపతురేణువులు యేవొకటి రెండు వున్నప్పటికీ గుంటూరిసీమలోవున్న ఆయా వుత్తరాలనుగూర్చియేమి యితర విషయాలనుగూర్చి యేమి శంకించవలసి వుండదు. లేదా శ్రీకొప్పరపు సోదరుల స్వహస్తలిఖితానికి మక్కికి మక్కి నకలును మేము ప్రచురించడం; వారుమాకు డాబుదర్పంగా రిజిస్టరు నోటీసు యివ్వడం; మళ్లామేము జబాబు యివ్వడం; దానితో - "నిమ్మకునీరెత్తినట్లు" వారు కిక్కురుమనకుండా తూష్ణీంభావం వహించి గత్యంతరం లేక వూరుకుండడం; అంతా గుంటూరుసీమ ఉత్తరరంగంలో ప్రచురింపఁబడి వుండఁగా దాన్ని గూర్చి అసలు వారు యెన్నఁటికీ మాట్లాడడానికి అవకాశంలేక వారి ప్రమాదాన్ని వారు న్యాయంగా వప్పుకోవడంచేత లోకుల గౌరవానికి భాజనులుకాఁగా యిప్పడీవిమర్శకుడుగారు దానికోసం పెనుగులాడడమనేది - "గుంజ లార్చాయి" అనే సామెతను జ్ఞప్తికి తెస్తూ వుందో? లేదో? పరిశీలించండి నాయనలారా! అప్పుడు - "పచ్చగడ్డి వేస్తే భగ్గునమండుతూ" వుండే రోజులు గదా? వారికీ మాకూ? యేమాత్రం అవకాశం వున్నా సోదరులుగాని వారిపార్టీ వారుగాని ఆకాలంలో వుండేశాఖాభిమానంగాని వూరుకోనిచ్చేదేనా? అసలువుత్తరమే వొకవైదిక స్కూలు మాస్టరుకి చేజిక్కింది. అసలు అతనివద్దవుంచుకొన్నాడు. నకలు వ్రాసియిచ్చాఁడు, పని పడితే అసలుతో హాజరు గావడానికి సిద్ధంగా వున్నానని అసలు దాన్ని చూపించాఁడు, దాని మీఁద దాన్ని మేము ప్రచురించఁగలిగాము. ఆరికార్దంతా యిప్పటికింకా జాగ్రత్త పెట్టే వుంచాను. యేమో? యెప్పటి కేం పని పడుతుందో? అని“కోకాలః (కః కాలః అనరు) కోధర్మః" అంటారు కదా? అభియుక్తులు. చెప్పొచ్చే దేమంటే? విమర్శకుఁడుగారు ముప్పైయేళ్లకి మళ్లా అదంతా ప్రచురింపచేసే పనికికదా? అంకురార్పణచేశారు. (ఈశంకా సమాధానాలకూ పాండిత్యానికీ సంబంధబాంధవ్యాలేమేనా వున్నాయా? లేవు. అయితే దీనివల్ల జరిగే లోకోపకారం యేమి? అంటే, సమాధానం సున్నకదా?) అది నాకు ఆశ్చర్యంగా కనపడి ఆసీమవారికి బరాతం చెప్పివున్నాను. సోదరులు కూడా వీరివ్రాఁతలకు మనస్సా సమ్మతించరు. సంతోషించరు. ఆమోదించరు. ఈమాట నేను “నన్నయ్యభట్టు" వ్యాసంలో వ్రాసే వున్నాను. దాన్ని వీరు బోలెఁడు అప్రస్తుతాలు వ్రాసి పెంచి యీమధ్య వ్రాసిన “సంశయచ్ఛేదం" లోస్పృశించినట్టుగాని ఖండించేటట్టు లేదనియ్యేవే నానమ్మకం. మాతిరుపతిశాస్త్రికిన్ని వారికిన్నీ యెప్పుడున్నూ చుక్కెదురే గాని నాకూ వారికీ కొంత సంభాషణవగైరాలు కలవు. శ్రీరాజా భుజంగ రావుగారికొమార్తలలో వొకకొమార్త వివాహంలో కాదు యిద్దఱు కొమార్తల వివాహాలలో మేమూ మేమూ కలుసుకున్నాము. బ్రహ్మశ్రీ వేమూరి శ్రీరామశాస్త్రి శతావధానిగారు శ్రీవడ్డాది సుబ్బారాయకవిగారిని మమ్మల్నీ యింకా కొంత మందినిన్నీ పిల్చి విందు చేశారు. ఆవిందులో మా తి. శా. గారు శివరామ శాస్త్రిని ఆపంక్తికి తనతోపాటు రాకుండా చేశాఁడు. నేను యెంత చెప్పినా వినలేదుకూడానున్నూ నేను సోదరుల పంక్తిని భోంచేసిన వాణ్ణే. ఆయీమాభోజనం ఆయీ అవడంలోనే శివరామశాస్త్రి సహితంగా వచ్చి భోజనానికి ఆఁకలేస్తూందని విస్తళ్లు తీయకుండానే తొందర పెట్టినాఁడు. అంతకుపూర్వం ఆఁకలే లేదు. యీవేళ తినేదేలేదని శ్రీరామశాస్త్రి గారితో చెప్పి తక్కినవారిని భోంచేయవచ్చు నన్నాడు. ఆయీవిషయం సోదరుల జ్ఞప్తిలో వుందో? లేదో? చెప్పొచ్చేదేమిటంటే? నాకూ సోదరులకూ ప్రధానవిషయంలో తప్ప యిటీవల వ్యక్తిగతంగా లేశమూకూడా ద్వేషాలు లేవు. వారిలో పెద్ద సుబ్బారాయకవిగారు స్వర్గతులైనపుడు వారిసోదరులలో యెన్నో వారో వొకరు (ఉత్తరం తీసి చూస్తేనేకాని సరిగా చెప్పలేను.) ఆవిచారకరమైన దారుణవార్తను నాకు తెల్పినారు. నేను నా విచారాన్ని లేఖద్వారాగానే వారికి సాశ్రుతర్పణ పూర్వకంగా తెలిపి వున్నాను. -

“ముఖం వుంది. అద్దం వుంది.” యీసందర్భం సోదరకవులను పృచ్ఛ చేస్తే జ్ఞాపకం వుంటే వారు చెప్పకపోరు. యిట్టి సందర్భంలో "రోళ్లా రోకళ్లా పాడిన" గుంటూరిసీమలో వున్న చారిత్రక విషయాలు "గజం మిథ్య పలాయనం మిథ్య"గా మావిమర్శకుఁడుగారు అపవదించి యేదో పుస్తకమంటూ వ్రాసి రు.1-0–0 వెలకూడా పెడతారే? పోనీ యేదో మన పేరుమీఁదుగా ఆబ్రాహ్మడికి కొంచెం లాభం కలిగితే కలుగుతుంది పేరున్నూ కలుగుతుంది. దానికి సేల్జోడు బహుమానంతోడవుతుందనుకుంటే వొప్పుకోలేదు చూడండి. ఆశ్చర్యమాశ్చర్యం. భవతు. యేదో “ఘటం భింద్యాత్" అన్నారుకదా? పెద్దలు; దానికే సంతోషించింది కదా? స్వగ్రామం. వచ్చే బిరుదులేవో వచ్చాయికదా? యింకా ప్రయత్నం యెందుకంటాను? యింకా వ్యాసా లెందుకంటాను? యింకా వెం. శా. తెల్వితక్కువవాఁడు నేను తెలివైనవాణ్ణి అని వ్రాసి సంపాదించతగ్గదేమేనా వుందా? వెం. శా. కూడా సేల్జోడుపట్టుకొని సమ్మానించడానికి సిద్ధంగానే వున్నాఁడు కదా? దయచేసి స్వీకరించి “ఇదుగో? నావిమర్శనకి జవాబు చెప్పలేక భయపడి యెవరో జమీనుదారులు బహుమతీగా యిచ్చిన జరీసేలుజోడు (గడి విప్పనిది) నాకిచ్చి క్షమాపణచెప్పాఁడు." అని యిప్పుడు సమ్మానించే బంధుసముద్రులతో ప్రసంగించుకోవచ్చును గదా? యింకా వ్యాసాలెందుకు? సంశయచ్చేదా లెందుకూ అంటాను. సరే? సార్థబిందు నిరర్థబిందు ప్రాసప్రసక్తిలోన్నుంచి చాలా దూరంపోయింది వుపన్యాసం. యీలాగే పెరుఁగుతుంది వ్రాత వ్రాసినకొద్దీ అని లోకానికి తెల్పడానికేనా యిది పనికి వస్తుంది కదా! యింక విమర్శకుఁడు గారు శృంగిగ్రాహికయా వుదాహరించిన “మీదుమాదులు" అనేచోట వున్నదుగాగమప్రసక్తితప్పా? వొప్పా? అన్నదాన్ని గూర్చి కొంచెం వ్రాసి విరమిస్తాను. యిది వీరినేకాదు చాలామందిని పొరపెడుతూ వుంది. దీన్ని గుఱించి మాజయంతిలో చూడండీ యేమని వ్రాయఁబడి వుందోను.

" 'నీదు' అనుచోటంబలె 'మీదు' అనుచోట దుగాగమము రాదని గురువులవాదము. దీనింగూర్చి 'గుప్తార్థ ప్రకాశిక' చక్కఁగా మందలించినది. కనుక నిపుడేని వారు దానిం జూడందగు.”

ఆయీ జయంతిని విమర్శకుఁడుగారికి దాఖలు చేసే వున్నాను. శ్రీవారు దాన్ని చూడలేదనుకోనా? (లోకంలో మాపుస్తకాలు ప్రత్యక్షర శోధగా చదివినవారంటూ కొందఱు వుండేయెడల వారి కెవరేనా “ప్రైజు” యిచ్చేయెడల అది వీరికి యిచ్చాకగాని మఱివొకరివ్వకూడదని నాసలహా) గుప్తార్థ ప్రకాశిక చూడలేదనుకోనా? చూచినా కనబడలేదేమో? అనుకోనా? యిదేమీ కాదు. చూడడం జరిగింది. కనపడా కనపడింది గాని ఆగ్రంథం వ్రాసిన బ్రహ్మశ్రీ కల్లూరివారి పాండిత్యం నచ్చలేదనుకోనా? భవిష్యత్తులో యింకా కలమాడిస్తే అప్పుడుగాని యీవిమర్శకుఁడుగారు దీన్ని గూర్చి యేతోవ తొక్కుతారో? బోధపడదు. పడడానికేముంది? "నేను మాత్రం వూరుకున్నానా?" అన్నట్టు శాంతిపర్వములో ప్రయోగం వుందని చూపిస్తే మళ్లా ప్రశ్నించనట్టే ప్రశ్నించారనుకోవాలి. యీసారి ఆ “మీదుమాదు"లను గూర్చి యేపుటలో యెన్నో పంక్తి దగ్గఱనుంచి యెన్నోపంక్తిదాఁకా వ్రాయఁబడివుందో కూడా వ్రాయవలసివుంటుందేమో? అవసరమైతే ఆపనికూడా చేస్తాను. పడరాని షాట్లన్నీ పడాలిగదా? నేను యిందుకే పుట్టినట్లున్నూ, ఆయన అందుకే పుట్టినట్టున్నూ అప్పుడు లోకం గుర్తించుఁగాక! అప్పటిదాఁకా అక్కఱే లేదు. ఈ పాటికే గుర్తించి వుంటుంది. (“భజగోవిందం" రోజులుకదా? యివి యెందు కొచ్చిన పిచ్చి లేక వెఱ్ఱిశంక లివి యెవరిదగ్గఱకేనా వెళ్లి చదువుకోరాదా?) “మీదుమాదు" ప్రయోగాల సమర్ధనమే కాదు. “మీదుమాదు" పాండిత్యాదులు సమస్తమూ తేలిపోతాయి. దీనితో గుప్తార్ధప్రకాశిక 266, 267, 268 పేజీలు చూడండి. 268లో సుమారు 12 పంక్తులు దాఁటిన (ఓహో! దాఁటి ప్రయోగంపడిందే మళ్లా తప్పు పడతారనుకుంటాను.) తరవాత శ్రద్ధగా చదివితిరా మీదుమాదు ప్రయోగాలలో వుండే సాధుత్వం తెలుస్తుంది. యెవరో లాకలూకాయలు ప్రయోగించిన ప్రయోగాలుగావు. కానేకావు. గ్రంథకర్త చూపిస్తా: అప్పకవీయంలోవి. తెలిసిందా? జాగ్రత్త సూత్రార్థం కూడా యేకవచనానికే దుగాగమం వస్తుందనిన్నీ బహువచనానికి రాదనిన్నీ చేసుకోరాదని చేసుకోవడానికీ అవకాశం లేదనికూడా సహేతుకంగా ఆయన గట్టిగా మందలించారు. మీకు సూత్రార్థాలూ గీత్రార్థాలు (తెలియవు కనుక) వుపయోగించవు కదా? ప్రయోగాలు చూచుకోండి. సంతుష్టిపడండి. మెసలడానికి అవకాశం వుంటేమీరు వూరుకొనే వారుకారు కనక మెసలనే మెసులుతారు గదా? లేనిపద్ధతినో? యేమీలేదు. మళ్లా తిట్లకేరేఁగండి. యీలా అభ్యనుజ్ఞ యిచ్చినప్పటికి యిటుపైనిమీరు రేఁగుతారని తోఁచదు తిట్లకు. యేమంటారా? యింక ఆబాపతు సరుకు ఈవద్దస్టాకులో లేనట్టు పూర్తిగా ఘాటుచచ్చినమాదిరిగా లంఖణాలబోటు వాలకంగా నడచిన యిప్పటిమీ - "సంశయవిచ్చేద" వ్యాసంవల్ల గోచరిస్తూవుంది. యీ వివేకం మొదటేకల్గితే మీవయో వృద్ధత్వానికి యింత హానికలిగేదికాదు. అయితే యెవడిశక్యం. దైవం అనుల్లంఘనీయంకదా? సరే యీవ్యాసంలో మీరు జవాబురాలేదనుకొన్న-నగ - ఎసఁగు, ప్రాసల శంకకున్నూ “మీదుమాదు" దుగాగమ శంకకున్నూ జవాబు వచ్చినట్లేనా? యిఁక “దుప్ప్రాసాలు" అన్నదానికి బాకీవుంది. "నీళ్లల్లో గేదె (బఱ్ఱె)ను బెట్టి బేరంబెడితే యేలాగ?" ఆదుష్ప్రాసాలు వున్నచోట్లేవో ? చూపి ప్రశ్నించండి, సమాధానం చెప్పఁగలిగితే చెపుతాను. లేదా? తప్పే అని వొప్పుకుంటాను. లేదా? ప్రమాదం అంటాను. అయితే విమర్శన గ్రంథంలో చూపేవున్నాను. చూచుకో అంటారేమో? ఆపుస్తకం ప్రస్తుతం నావద్దలేదు, మా తిరుపతిశాస్త్రి కొడుకు వద్ద విశాఖ పట్టణంలో వుంది. వాఁడి అడ్రెసు నాకు బాగా తెలియదు. అందుచేత ఆపుస్తకాన్ని వకటి పంపండని మిమ్ములనే ప్రార్ధించవలసి వచ్చింది. అనుగ్రహించండి. నన్నయ్య వ్యాసంతో తమరు విరమిస్తారనుకొని వాఁడు చూస్తానంటే వాఁడికి యిచ్చివున్నాను తెలిసిందా? అయితే- “తానొకటి తలిస్తే దైవము వొకటి తల్చాఁడు" ఆవ్యాసమూ మిమ్మల్ని మందలించలేకపోయింది. సేల్జోడుబహుమానమూ మీవిజృంభణాన్ని మందలించలేకపోయింది. కొంచెంగా ఘాటుమాత్రం తగ్గించాయి అవి. యెందుచేత? నేను కవితాధార సాఫుగావుందని సేల్జోడు బహుమానం యివ్వదలఁచినా మీరు అందు కనుకోలేదు. తిట్ల పాండిత్యానికిరా? బాబూ! యీ సేల్జోడు అనుకొని వుంటారు. సామాన్యులా? ఆవలిస్తే పేగులు లెక్కెడతారుగా? అదిన్నీకాక దానికి వుపమానంగా చూపినకథవల్ల అసారస్యం యేలాటి పసిపిల్లాఁడికేనా గోచరిస్తుందాయె బాగా గ్రహించారు. సంతోషమే సరే? యీలాటి ప్రశ్నలువేయండి తప్పేమి. తోఁచినంతలో జవాబు వ్రాస్తాను. శిష్ట్లావారి అభినందనంవల్ల మీరు మళ్లా వ్రాఁతకి దిగారుగాని లేకపోతే దిగేవారుకారు. వారు పూర్తిగ పొరఁబడ్డారు. మీతిట్లువగైరాలకు మీ కెంత జవాబు కాధారం వుందో? వారి అభినందనానికి అంతే. యీ సంగతి మీకుత్వరలోనే గోచరిస్తుంది. నేఁడో రేపో శిష్ట్లావారు నా “నన్నయభట్టు" వ్యాసాన్ని చదివితీరతారు. ఆధారం దొరికితే నన్ను మందలిస్తూ జవాబు యిస్తారు. దొరక్కపోతే ప్రమాదపడ్డట్టేనా జవాబు యిస్తారు. (“ప్రమాదోధీమతామపి” అపి రేవ కారార్ధకః అంత అసిధారావ్రతంగా నడిచే జీవితం యెక్కడో కాని వుండదు.) నిమ్మకు నీరెత్తినట్లు గంభీరంగా వూరుకోనేనా వూరుకుంటారు. "అప్రతిషిద్ధ మనుమతం భవతి." కనుక అట్టి తూష్ణీంభావం కూడా వుపయోగమే అవుతుంది. నేను వికటవిమర్శనంచేస్తాను. చూస్తారా? అంటూ వకవాక్యం నన్నయ్య వ్యాసంలో వ్రాస్తేదాన్ని ఆక్షేపించడం మొదలెట్టి వున్నారు విమర్శకులు. కర్ణుడు పలికిన పల్కులు వున్నపద్యం చూపి వున్నారు. నన్నయ్యభట్టు భావివిషయం సూచితమైన“భారతభారతీసముద్రము” అన్నదాన్నిగూర్చిన నావివరణం బాగులేదంటూ వ్రాఁతకు దిగారు. యెందుకు తండ్రి? యీ అప్రస్తుతాలు. ప్రస్తుతం మీతిట్లను సమర్ధించుకొని బయటఁబడే ప్రయత్నం చేయండి. తరువాత నన్నయ్యభట్టునీ, తిక్కన్న సోమయాజినీ యెఱ్ఱాప్రగడనీ వుద్ధరిస్తురుగాని- "స్వయం తరితు మక్షమః కథ మసౌ పరాం స్తారయేత్" భారతానిది యేవూరు; మీదేవూరు? భాగవత పీఠికలోవున్న- “ఒనర న్నన్నయ తిక్కనాదికవులు” అన్నపద్యార్థం అవగతం కాకో లేదా? చూడకో? యెంతోగతంలో వ్రాయడమేకాక మళ్లా యీవ్యాసములోకూడా బోలెఁడువ్రాఁత వ్రాసినమీరు భారతంలో వుండే సంశయాలు తీరుస్తారేమి? పైఁగా అందులో వుండే పద్యార్థాలు నేను అన్యథా చెప్పినట్లు మీకు యెవరో చెప్పినట్లుగా అభూతకల్పన వొకటా? కాదు నిజమే అనుకుందాం. “నహిసర్వ స్సర్వం విజానాతి" కదా? యేదోపద్యం నాకంటె మీరే బాగా అన్వయిస్తారనుకోండి. తగినవయస్సుకాక పోఁబట్టిగాని యుక్తమైన వయస్సే అయితే నావద్ద తమరు యెంతకాలం శుశ్రూష చేయఁదగ్గ పాటి సాహితి కల్గి వుంటారో? (యితరులను వద్దు) మీ అంతరాత్మను ప్రశ్నించి చూడండి. అది యేదో యంత్రం వుత్తర దిక్కునే సూచించినట్టు యథార్థాన్నే బోధిస్తూ వుంటుందని యింతగా మనవి చేయడం. స్థూల దృష్టిని 76 యేండ్ల వయస్సుగదా? వొకరివద్ద శుశ్రూష చేయడానికి తగినది కాదని వ్రాశాను గాని బాగా ఆలోచిస్తే 'ముదిమి రెండవ బాల్యంబు' అన్నారు కనుక తగినదే అవుతుందేమో? శాంతం పాపం? యెంతో గర్వరహితంగానే వ్యాసాన్ని నడిపిద్దామని సంకల్పించానుగాని, బూతు కూఁతలు పడలేదుగాని గర్వోక్తులు (యథార్థాలే అనుకోండి) పడకుండా వుండాలంటే మీవ్యాస ధోరణి అంగీకరించిందికాదు. దీనికి మాముత్తాతగారు చెప్పిన సమాధానమే గతి. అది జయంతిలో-

మ. గరువంపున్నుడు లిందు నచ్చటచటం గన్పట్టు నప్పట్టునం
     బరిహార మ్మొకకొంత గన్పఱచెడిన్ మాపిన్న ముత్తాత యి
     దురితమ్మున్ గుఱితించి చింతిలుచు నుందున్ ముప్పదిన్ రెండుదు
     ర్దురితమ్ముల్ గురుఁడాడ సైఁచి కవితన్ దూఱంగ నోరెత్తితిన్.

అన్నపద్యంకింద టిప్పణిలో వుంది చిత్తగించండి. ప్రస్తుతం 32-31గా మార్చుకోండి. యెవరో "పండితాయతే"లు యేవో తొందర మాటలు వ్రాసినంతలో వాట్లకు జవాబు వ్రాయడానికి సిద్ధపడడం వుదారత్వానికి లక్షణం కాదనిన్నీ యెఱుఁగుదును, యేం లాభం. యీపిచ్చి సోమయాజులకి అట్టి వుదారత్వం యీవార్ధక్యంలో సర్వసంసిద్ధమైన స్థితిలోకూడా అమల్లోపెట్టడానికి భగవదాజ్ఞ లేకపోయింది. పిచ్చిసోమయాజులను గూర్చి లోఁగడయేదో వ్యాసంలో విస్తరించివ్రాసే వున్నాను. అక్కడ చూచుకోండి. వాఁడికి తన్నుయెవరేనా స్పృశిస్తే సరి వెంబడించి వారిని యెంత దూరమేనా తరుముకువెళ్లి స్పృశించడమే వ్రతం, నాగతి కూడా ఆలాగే వచ్చిందని చింతిస్తాను. సరే? యెంత వ్రాసినా మీ తొందరపాటు మాటలు వత్తరించతగ్గవి మిగిలినట్లే కనపడతాయి. "యెలుఁగుబంటి తంటస" మన్నట్టు యిది యెప్పటికి తేలేటట్టు లేదు, అత్యవసరాలు వుత్తరింపఁ బడ్డాయికదా? తృప్తిపడండి. ముఖ్యాంశాలు వ్రాసి విరమించడానికి సంకల్పించుకొని మళ్లా లేఖినిచేతఁబట్టేటప్పటికి అంతలో మీవ్యాస శేషం వచ్చింది. దానితో యిదికూడా అంటే సింహావలోకనంకూడా పెరిఁగింది. పెరిఁగినానాకు సంతుష్టి యింకాకలగలేదు. అయినప్పటికి పత్రికవారికి భయపడి ముగిస్తూన్నాను. యీ వ్రాత మళ్లా యెక్కడికక్కడే దోపుళ్లతో నిండి నడవడంచేత చాలా హంసపాదులతో నిండి వుంది. జాగ్రత్తగా ముద్రించి మళ్లా మీశంకలు రాకుండా చేస్తే సంతోషిస్తానని పత్రిక వారికి విజ్ఞప్తి. ఆయీవార్ధక్యంలో-

మ. శివనామమ్ముఁ దలంచి కొంచు నెటులో జీవన్ గృతార్డుం బొన
     ర్చువిధిన్ బద్దెము లల్లికొం చుపనిష చ్చుద్దా స్తకాన్తామణీ
     భవనప్రాంగణసీమ దాస్య మొనరింపం బోవు నన్నెందుకో?
     కవనమ్మున్ దెగ వెక్కిరించి గురుఁ డీగర్వోక్తు లాడించుటల్.

అన్న పద్యార్ధప్రకారం వర్తిద్దా మనుకుంటే పంచగురువులలో వొకరుగా లోఁగడ మనవి చేసుకున్న తమరు దానికి విఘ్నం కల్పించారు. గతానికి విచారించి ప్రయోజనంలేదు. "భాషామంజరీ సమాప్తా" పాండిత్యంతో యింకా పెనుగులాడక (యిది మీకోసమే చెప్పేమాట) త్వరలో నన్ను తమ గ్రామానికి వెంటఁబెట్టుకొని వెళ్లి మీరు వ్రాసిన వ్రాఁతలో (గోడమీద పిల్లివాటంగా వున్నదానిలో) యేసమ్మానం మీమనస్సా వివక్షితమో? దాన్నేచేయండి. పిమ్మట నేను నాతోకూడా నా స్వంత ఖర్చుల మీఁద మిమ్మల్ని తీసుకువచ్చి నాఆహ్వానంలో (యేవిధమైన యితరార్థములేదు. గనుక) వున్న నిష్కపటమైన సేల్జోడు బహుమానం చేసి తరిస్తాను. ఆమర్నాటినుంచి మళ్లా నా “శివాయనమ ఓం” లోకి దిగుతాను. "ఆలస్యాదమృతం విషమ్" కనుక జనవరినెల లేక ఫిబ్రవరి 15 తేదీకిలోఁగా యీ ప్రయత్నం చేయండి. యింతే పెద్దలగు మీకు నా నమస్కారాలు "శివాయనమ ఓం, శివాయనమ ఓం! శివాయనమ ఓం శివాయనమ ఓం" స్వస్తి.

అనుబంధము

నేను లోఁగడ సంవత్సరం నాఁడు వ్రాసిన “నన్నయ్యభట్టు" వ్యాసంలో ప్రసక్తాను ప్రసక్తంగా భారతం నన్నయ్యగారి చేతిమీదుగాఁ పూర్తికాకపోవడానికి సూచ్యార్థ సూచన నన్నయ్యగారి వాణి-

"చ. అమలిన తారకాసముదయంబుల నెన్నను సర్వవేదశా
     స్త్రముల యశేషపారము ముదంబునఁ బొందను బుద్ధి బాహువి
     క్రమమున దుర్గమార్థజల గౌరవభారత భారతీసము
     ద్రము దరియంగ నీఁదను విధాతృనకైనను నేరఁ బోలునే?"

అనే పద్యంలోనే సూచించిందని క్లుప్తంగా సూచించినాను. దాన్ని మావిమర్శకుఁడు గారు అపవదిస్తూ కొన్ని మాటలు వ్రాయుటయేకాక యెవరో చౌదరిగారివద్దనూ యింకా యెవరో బ్రాహ్మణపిల్లవానివద్దనూయేవో యుక్తులు చెప్పి ముఖపిధానం చేయడానికి ఆరంభిస్తే వారిద్దఱున్నూ నాపేర తఱుచుగా ఉత్తరాలు వ్రాస్తూన్నారు. వారి వ్రాఁత కొంత “శల్యసారథ్య" ప్రయుక్తంగానే కనపడుతుంది గాని అయినప్పటికీ ఆసంశయాన్ని మనస్సులో పెట్టుకోక నేను-

“అయ్యా! వ్రాస్తే చాలా వ్రాయాలి. కాఁబట్టి వొకసారి మా వూరు వస్తే నాకు తెలిసినంతలో మీ సంశయం తీరుస్తాను.”

అని వ్రాసి వున్నాను. కాని వారిలో వొకరు (చౌదరిగారు) నావలెనే వృద్దులఁట! అందుచేత రాలేక మళ్లా మళ్లా వుత్తరాలు వ్రాసి నాకు పనికలిగిస్తూన్నారు. అందుచేత యీ రెండు మాటలున్నూ వ్రాస్తే యిది వారికే కాక తద్ద్వారాగా "దేహళీదత్తదీపన్యాయం"గా యితర పాఠకలో కానిక్కూడా అందించినట్లగు నని పైని వుదాహరించిన పద్యంలో వున్న సూచ్యార్ధాన్ని వివరిస్తూన్నాను. ఆ పద్యంలో నాలుగోచరణంలో- “దరియంగ నీఁదను విధాతృనకైనను నేరఁబోలునే?” అనే వాక్యంలో పూర్తిగా యీఁదుట దుస్తరమనే అర్థం కలదా? లేదా దానివల్ల నన్నయ్యగారు సంశ యాత్ములైనారా? అంటే లేదని యెవరంటారు? "సంశయాత్మామ వినశ్యతి" అనే అభియుక్తోక్తినిబట్టి తుదకు సంశయం సంశయమే అయింది అనుకోవడానికి అవకాశం పూర్తిగా వుండఁగా యింకా వివాద మెందుకో? భవతు. యింకాఆపద్యంలో ఆయీ అర్ధాన్ని బలపఱిచే అక్షరాలు బోలెఁడు వున్నాయి చూడండి 1. ఎన్నను (ఎన్నఁగల వాణ్ణి కాను) 2. పొందను (పొందఁగలవాణ్ణికాను) 3. ఈcదను (ఈఁదఁ గలవాణ్ణికాను) అనే అర్థం రాకుండా చేయడానికి యెవరికేనా శక్యమవుతుందా? నన్నయ్యగారేమో? ఆయీ మూఁడు క్రియలున్నూ అసంపూర్ణ క్రియలుగా (ఎన్నుటకున్నూ, పొందుటకున్నూ, ఈఁదుటకున్నూ) ప్రయోగించినారు. రెండో అర్థంలో అనఁగా? గ్రంథసమాప్తికాదనే సూచ్యార్థ సూచనలో సంపూర్ణక్రియలు (వ్యతిరేకార్థకోత్తమ పురుషక్రియలు)గా పరిణమించాయి. ఆలా పరిణమించకుండా చేయడానికి “విధాతృనకైనను నేరఁబోలునే?” అంటాను నేను- కాఁబట్టి యిదివఱలో పరంపరగా కవులుచెప్పే - “పూరములంబర పూరితంబులై" అన్నదానికన్న యిది మిన్నగా వుందో లేదో? సహృదయులు పరిశీలించి పరిగ్రహించవలసి వుంటుందని నేననుకున్నాను. యేదోవిధంగా వాది ప్రతివాదిభావాన్ని కల్పించుకొని వివాదించేవారిని తృప్తిపఱచడం నాకే కాదు. యెవరికీ శక్యంకాదు. నాకు పూర్తిగా పైపద్యంలో ఆయీసూచ్యార్థం వుందనే నమ్మిక కల్గి వ్రాశానేకాని లోకాన్ని మోసగించే తాత్పర్యంలో వ్రాయలేదు. జీవిత చరిత్రలో దీన్నిగూర్చి వక పద్యం వ్రాశాను. దాన్ని వుదాహరిస్తాను.

ఉ. 'ఎన్నను, పొంద, నీఁద, ననునీత్రితయమ్మును బెద్దయెల్గుతో
    నన్నయ పూర్తి చేయునని నమ్మిక లేమివచించు నిట్లొగిం
    గన్నులఁ గట్టినట్టులుగఁ గన్పడు చున్నను నేఁటి క్రొత్తతి
    క్కన్న త్రిలింగ లోనటులు కాదని వ్రాయువృథావివాదియై.

చాలును. ఈయన తాను తిట్టినతిట్లు తనవి కావనిన్నీ యెవరో తిడితే ఆ తిట్లను అనుకరించాననిన్నీ తాను కృతియిచ్చినట్లుగా అభిప్రాయపడడం సరిగాదనిన్నీ ఆచౌదరిగారు వగయిరాలతో వివదించుచున్నట్లు తెలుస్తుంది. ఆమాటలను త్రిలింగ ఆమోదించి ప్రచురించే యెడల దాన్ని గూర్చి వ్రాస్తాను. ప్రచురించడంలో ఆమాటలు ససారాలోకావో అనేవిషయ విమర్శ ఆపత్రికదే అని మాత్రం వ్రాసి యిప్పటికి దీన్ని ఆపుతాను.

★ ★ ★