కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/"పుణ్యైర్యశోలభ్యతే"

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search“పుణ్యైర్యశోలభ్యతే"

అంటూ తఱచుగా పెద్దలు వాడుతూవుంటారు. ఇది చాలా గమనించతగ్గది. యీ మాటే కాదు, తఱచుగా పెద్దలు వాడేవాట్లల్లో యేవిన్నీ అననుభూతమైన సంగతులు కనపడవు. ప్రస్తుతం యీ మాటనుగుఱించి నా అనుభవాన్ని కొంచెం వ్రాస్తాను. దీన్ని చూచి ప్రస్తుతం నాకు ప్రతి పక్షులుగా వుండేవారు గేలిచేయడం యేలాగా తప్పదనుకోండి. నాయందు ప్రేమాతిశయం కలవారిలో కూడా కొందఱు "యద్దేవ" చేస్తారని నాకు పూర్తిగ తెలుసును. తెలిసిన్నీ వ్రాయడమెందుకంటే దీనిలో కొంత "అహంకార నిరాసా"నికి పనికివచ్చే విషయాలుకూడా వుండడంవల్ల యెక్కువ పరిశీలకులైనవారు వాట్లను అభినందిస్తారనిన్నీ యింతేకాక యింత వయస్సు వచ్చీకూడా యీ అంశాన్ని వ్రాయకపోతే పలువిధాలుగా అనుమానించే లోకులకు యథార్థం యేలా బోధపడుతుందనిన్నీ సాహసించి వ్రాస్తూవున్నాను.

లోకంలో ఆచారం యేలావుందంటే, యెవరేనా తన్ను గూర్చి “మీరు అంతవారు యింతవా"రని అన్నప్పుడు "సరి, నేనెంతవాణ్ణి, మీ పాదధూళినికూడా పోల" ననడమున్నూ "నీవు శుద్ధ శుంఠ" వని కర్మంచాలక యెవరేనా అన్నట్టయితే "నీవు శుద్ధ శుంఠ"వని యెదురుకొని తిట్టడమున్నూ అనుభూతంగా తెలుస్తూవుంది. పయికి వినయమెంత నటిస్తూవున్నప్పటికీ ఏదో విద్యలో ప్రవేశముండి నలుగురులో అంతో యింతో పేరున్నవాఁడికి యేకొంచెమో అహంకారం వుండితీరుతుందిగాని "నాకేం వచ్చును. నేను శుంఠను" అనే భావం మాత్రం వుండదు. దీనికి యెన్నో వుదాహరణాలు చూపవచ్చును. యెక్కువ తెలివితేటలు కలవాఁడైతే గంభీరంగా ఆత్మశక్తిని ప్రకటించుకుంటాఁడు. అవి కొంచెం తక్కువ వున్నవాఁడైతే వున్న దున్నట్లుగా ప్రకటించుకొని "గర్విష్టి" అనిపించుకుంటాఁడు. మచ్చుకు ఒక్కటి చూడండి. కాళిదాసేమన్నాడు?

"అభిరూపభూయిష్ఠా పరిషదియం, తదత్ర కాళిదాస గ్రథితవస్తునానవేన నాటకే నోపస్థాతవ్య మస్మాభిః".

అని కాఁబోలును తన ప్రజ్ఞావిశేషాన్ని గూర్చి గంభీరంగా తెలుపుకున్నాఁడు. దీన్ని లోఁతుగా ఆలోచించకుండా “యేమీ వ్రాసుకోనేలేదు కాళిదాసు, నిగర్వచూడామణి"  అనేవారిమాటలు నేను బహుధా వినివున్నాను. విమర్శించిచూస్తే దీనిలో స్వోత్కర్ష బోలెఁడు ప్రకటిత మవుతూ వుందని తేలుతుంది. పండితరాయలు కాఁబోలును -

"ఆమూలాద్రత్నసానోః...కో౽స్తిధన్యోమదన్యః" అని పెళపెళమంటూ వక స్రగ్దరావృత్తంలో స్వాతిశయాన్ని ప్రకటించుకోవడంచేత ప్రతివారికిన్నీ గర్విష్ఠుఁడుగా కనపడతాఁడు. వాచ్యంగా దీనిలో యెంత స్వాతిశయం ప్రకటితమవుతూఉందో, వ్యంగ్యంగా దానిలోనున్నూ అంత స్వాతిశయమున్నూ ప్రకటితమవుతుంది. సందేహంలేదు. మహావేదాంత గ్రంథంగదా భగవద్గీత - దానిలోకూడ శ్రీకృష్ణభగవానుఁడు సహా స్వాతిశయప్రకటనము చేసికొన్నట్లు తీయవచ్చు. యెందుచేత? వొక్కొక్క సందర్భంలో ఆలాచెప్పక విధిలేదు. కాఁబట్టి ఆలా చెప్పడం తటస్థించింది.

యిక ప్రస్తుత మేమిటంటే లోకులందఱూ చదువుకున్నట్టే తి||వెం|| కవులున్నూ చదువుకున్నారనిగాని, అంతకన్న కొంచెం తక్కువ చదువుకున్నారనిగాని చెప్పవచ్చు. అట్టిస్థితిలో వీళ్లిరువురున్నూ "సమానానా ముత్తమశ్లోకోస్తు" అనే శ్రుతికి వుదాహరణంగా వుండడం తటస్థించింది. దీనికి సంతోషించేవారు చాలామంది వున్నా విచారించేవారు కూడా కొందఱు వుండడం తప్పదుగదా? అందుచేత వారిని విద్యార్థి దశనాఁటినుండిన్నీ పలువురు ద్వేషిస్తూవుండడం తటస్థించింది. కాని ఆ ద్వేషించేవారివల్లనే వీరి విద్యావృద్ధిన్నీ దానితో యశోవృద్ధిన్నీ దానితోపాటు ధనాభివృద్ధిన్నీ కలుగుతూవచ్చింది. దేశంలో మొట్టమొదట వీరికి విద్యావిషయమైన వాదోపవాదాలు అంతగా తటస్థించలేదుగాని నైజాంయిలాకా సంస్థానాలలో సుమారు 24-25 యేండ్ల వయస్సులో తటస్థిస్తూవచ్చాయి. ఈ దేశంలోనల్లా మొట్టమొదట ముమ్మిడివరంలో వకరితో వచ్చింది వాదం. ఆయనే కాకినాడలోకూడ అడ్డుతగిలి వోడిపోయారు. అదృష్టంవల్ల యశస్సు వస్తుందనడానికి యీ కాకినాడలో తటస్థించిందే ప్రథమోదాహరణము. యేమంటారా? మొదట వుపజాతి వృత్తాన్ని వుపజాతివృత్తంకాదనిన్నీ సీతావివాహాన్ని సీతావివాహం కాదనిన్నీ ఆక్షేపించిన పండితుఁడి కెంతతత్త్వం తెలుసునో ఆ విషయంలో వీరికిన్నీ అంతే తెలుసును. తీరా ఆయన ఆక్షేపించాక యిందులో చిన్నప్పుడు చదువుకొన్న రఘువంశద్వితీయసర్గ మొదటి శ్లోకంవల్ల వృత్తాన్ని గూర్చి ఆయన ఆక్షేపించడం ఖండించఁబడ్డది. అప్పటికప్పుడే వ్యాకరణంలో చాలావఱకు గ్రంథాలు అయివుండడంవల్ల “ఏనాం” అనేదానిలో "సీతాకళ్యాణాన్ని" కుయుక్తిచే సాధించేప్రజ్ఞ అలవడింది. యిందులో చాలామట్టుకు అదృష్టబలమే కనబడుతూవుందా?

తరువాత విజయనగరంలో కాఁబోలును, అవధానంలో వక మహాపండితుడు వసుచరిత్రలోవున్న వక కల్పన యిచ్చి పద్యం చెప్పమన్నాఁడు. దానిమీఁద ఆ కల్పన శుద్ధ తప్పుగా వుందికనక చెప్పకూడదన్నాం మేము. యిచ్చిందేదో చెప్పవలసిందేకాని మీరు దాన్ని ఖండించడానికి మీకు (అవధానులకు) అధికారం లేదన్నారాయన. అది సరికాదు, యిక్కడ వున్నవారికి యీ తప్పు తి|| వెం|| కవులదికాదు పృచ్ఛకులదే అని తెలుస్తుందికాని, యివి అచ్చై ప్రకటితమైన పిమ్మట యెవరిదీ కవిత్వ మంటే తి|| వెం|| కవులదంటారు, అప్పుడు దానివల్ల వచ్చే అగౌరవం మా నెత్తినే పడుతుంది. కాcబట్టి యీ కల్పన వదలుకొని మఱొకటి అడగమన్నాము. దానిమీఁద ఆయన అన్నారుగదా:- "యీకల్పన నాదికాదు వసుచరిత్రలోదండోయి" అన్నారు. “అయితే దాన్నే మేమున్నూ ఆక్షేపించిందిన్నీ మీరు సమర్ధిస్తే యీ కల్పన పుచ్చుకొని పద్యం చెపుతాము, లేదా? మఱొకటడగండి" అన్నాము. సమర్ధించలేక ఆయన ఆ కల్పన వదలుకున్నారు. దానితో మేమేమో ఆయన్ని జయించినట్లు పామరులకే కాక పండితులక్కూడా తోఁచింది.

యిఁక గద్వాలలో సంగతి. ఆ పండితులు ఋజుమార్గం విడిచి రాజుగారితో మా విద్వత్తునుగూర్చి అబద్ధాలు చెప్పడంవల్లనే తప్ప యేస్థలంలోగాని, అర్థంలో లేక శబ్దంలో విద్యాసంబంధమైన వాదోపవాదాలు లేశమూ జరిగినట్లు లేదు. ఆ కపటం యేలాగయితే నేమి రాజు గారికి కొంతకాలానికి బోధపడింది తుట్టతుదకు. పిమ్మట అవధానం చేయించి చూచారు, సంతోషించారు, సరిపోయింది. గద్వాలపండితులు సరియైన మార్గాన్ని అవలంబించేయెడల అందఱితోపాటేగాని, అక్కడ మాకు యొక్కువ సమ్మానం జరిగివుండదు.

యిఁక ఆత్మకూరువిషయం. గద్వాలకు ఆత్మకూరు మిక్కిలి సమీపం. మూఁడుకోసుల దూరంలో వుంది. మధ్య కృష్ణానది మాత్రమే అడ్డు. గద్వాలకు వచ్చినవాళ్లెవళ్లుగాని ఆత్మకూరుకి వెళ్లడం మానరు. అట్టిస్థితిలో మేము వరుసగా రెండేళ్లు గద్వాల వెళ్లికూడా ఆత్మకూరికి వెళ్లకుండానే దేశానికి వచ్చేశేవాళ్లం. దీనిక్కారణం, యీవూళ్లో సమ్మానింపఁ బడితేకదా యితరత్ర సమ్మానానికి యత్నించడం అనుకోవడమే. రెండోయేట గద్వాలలో సమ్మానం జరిగిందికాని అప్పటికప్పుడే ఆత్మకూరిలో వుత్సవం అయిపోయింది. అదిన్నీకాక యువరాజుగారి పట్టాభిషేకంవఱకున్నూ వుండవలసిందని గద్వాలరాజుగారు కొన్నాళ్లు ఆపుచేశారు. దానాదీనా "వేసవి దగ్గఱయ్యె" అనే పద్యంలో వుండే అర్థం స్ఫురణకువచ్చి రెండోయేడుకూడా ఆత్మకూరు వెళ్లనేలేదు. మూడోయేడు గద్వాలకు వెళ్లేము. తప్పక ఆత్మకూరు వెళ్లాలనిమాత్రం వుంది. ఆ సంస్థానంలో ఒక పండితుఁడున్నాఁడనిన్నీ ఆయన నాల్గు శాస్త్రాలువచ్చినవారనిన్నీ ఆశుకవిత్వం చెప్పేవారనిన్నీ చాలా సమర్థులనిన్నీ చెప్పడం మాత్రం వింటూవున్నాము. ఆయనకున్నంత పేరు ఆ ప్రాంతంలో యెవ్వరికిన్నీలేదు. కాని మమ్మల్నిచూచి కొందఱు వీరికి ఆయన లొక్కుతారని అనుకొనేవారు. మాకు మాత్రం “ఆయనకు వున్నన్ని ప్రజ్ఞలు మనకు లేవు కనక ఆయనకి మనమే లొక్కుతామేమో" అని మనస్సులో వుండేది. కాని యేమైనాసరే, వెళ్లడం మాత్రం తప్పదు. “యశోవా మృత్యుర్వా" అనుకుంటూ వుండేవాళ్లం. యితర విషయాలెట్లున్నా అవతలి పండితుcడితో నాలుగు మాటలు మాట్లాడడం తటస్థించేయెడల ఆయన్ని మనం జయించేదీ మనల్ని ఆయన జయించేదీ, తెలుసుకోగలనని నాకు ఆ రోజుల్లోనేకాదు యెప్పుడున్నూ ఒక ధిమాకు వుండేది. అయితే ఆయన గద్వాలసంస్థానానికి వచ్చేదేలాగ? వస్తేనేకదా మనకు కనపడేది. యీ సంస్థానం వారితో ఆయనకు సరిపడదు. యీలావుండఁగా ఒకరోజు తెల్లవారు జామున మేము బసచేసిన యింటి అరుగుమీఁద దేవీభాగవతప్రథమ స్కంధం తెలుఁగుచేస్తూ యిద్దఱమున్నూ కూర్చున్నాము. దైవవశాత్తుగా ఆ పండితుఁడు చుట్టాలింటికి వచ్చి కాఁబోలును తిరిగి స్వగ్రామానికి వెడుతూ అక్కడ కొంచెం నిల్చుండి "ఓహో! మీరే వో తిరుపతి వేంకటేశ్వరులు?” అని గంభీరంగా పృచ్చచేశారు. అంతకుమునుపు ఆయన్ని చూడకపోయినా మేముకూడా “ఓహో! తామేనా ఫలానా ఆచార్లవారు?” అని లేచి దయచేయండి అని పిలిచాము. వచ్చారు. కూర్చున్నారు. యేమిటి వ్రాస్తూ వున్నారన్నారు. దేవీభాగవతం తెలిఁగిస్తూ వున్నామన్నాము. యేదీ వక పద్యం చదవమన్నారు. చిత్తం అని-

“చ. చదివితి వెల్లవేదములు శాస్త్రములం బరికించినాఁడ వి
     య్యదను వివాహయోగమగునట్టిది గాన కళత్రమున్ వరిం
     పదగు మఖక్రియల్ పొనరుపందగుఁ బుత్రులఁ గాంచఁగాఁదగున్
     ముదమలరన్ మమున్ ఋణవిముక్తులఁ జేయఁదగుం గుమారకా!"

అన్న పద్యాన్ని అప్పుడే వ్రాసిన దానిని వినిపించాము. వినీ వినడంతోనే తుట్టతుదనున్న "కా" తీసివేస్తే బాగుంటుందన్నారు. చిత్తం, యిప్పడేకదా వ్రాశాము, సాపు వ్రాసేటప్పుడు మీ సెలవుప్రకారం సవరిస్తామన్నాము. తరువాత వారితోవను వారు దయచేశారు. మా వాడితో నే నన్నానుగదా, యీయన మనతో డీకొంటే తప్పక వోడిపోతాఁడురా అన్నాను. యేమన్నాఁడు, యేమో నా కల్లా తోఁచిందన్నాను. చెప్పాలన్నాఁడు. గంభీరుఁడుకాఁడు. తొందర మనిషి ఎప్పుడూ చూడక చూడక చూచినవాళ్లంగదా మనం? విన్నది వకపద్యం. దానిలోవున్న కుమారకా అనేపదం బాల, బాలక, పుత్ర, పుత్రక వంటిదిగాని దోషజుష్టం కాదాయె. యేదో కొంత పేరున్నవాళ్లని వింటూన్నట్టు ఆయన మాటలవల్లే తెలుస్తూ వుందాయె, నిజమైన తప్పన్నా అపరిచితుల విషయంలో ప్రథమసమాగమంలోనే సవరణను ప్రతిపాదించవలసివుండదు. అట్టి స్థితిలో యెట్టి సవరణతోగాని లేశమున్నూ అవసరంలేనిచోట సవరణ ప్రతిపాదించడంచేతనే నేనీ అంశాన్ని గ్రహింపఁగలిగానుగాని ఆయనకన్న మనం యెక్కువ చదివినవాళ్లమని కాదన్నాను. అయితే యిప్పుడే యెదురుకోలేదేమి, సవరిస్తానన్నావేమి? అన్నాఁడు. యిప్పుడే ఆయనతో కలహమెందుకు? ఆయనవున్న సంస్థానానికి మనం వెడుతూ యింకా వెళ్లడానికిముందే పోట్లాడడం ఆలోచనపని కాదు. వీలైనంత వఱకు తప్పుకోవడం మనపని. అంతకూ తప్పనివిధి అయితే - “త్వంశుంఠ, త్వంశుంఠ" యేలాగా తప్పదు, అన్నాను. తుదకు అక్కడికి వెళ్లడమూ, ఆయనతో వాదం రావడమూ, ఆయనకు వోడూ, మాకు జయమూ, గజారోహణోత్సవమూ, అందఱున్నూ యెఱిఁగినదే.

అక్కడేమీ పెద్ద శాస్త్రచర్చ జరుగలేదు. వ్యాకరణంలోతప్ప ఆయన మాకు లొంగరు. నాలుగు శాస్త్రాలువచ్చి సంస్కృతంలో బేబాగానున్నూ ఆంధ్రంలో కచ్చాపచ్చాగానున్నూ కవిత్వం ఛెప్పఁగల ప్రజ్ఞవుంది ఆయనకు. అయితే ఋజుమార్గవర్తి మాత్రం కాకపోవడం ఒకటి లోటు, యేలాగయితేనేమి, తొందరపడి,

“ఉ. నా పలు కాలకింపుమ యనంత! గుణాలయనైనయట్టి నా
     రూపముమాత్ర మొప్పుగ నిరూపణఁజేసి యెఱుంగుదీవు, దు
     ష్ప్రాపము నీకు నిర్గుణత భాసిలు నప్పరదేవతామహా
     రూపము, తెల్పె నాపె యిది రూఢిగ భాగవతాఖ్యమంత్రమౌ."

అన్న దేవీభాగవత ప్రథమస్కంధపద్యంలో "గుణాలయ" అనే చోట ఆక్షేపించి భారతోదాహరణమిస్తే దాన్ని దిద్దడానికి ప్రయత్నించి ఆయన వోడిపోయి మాకు గజారోహణోత్సవానికి కారణభూతులైనారుగాని మాప్రజ్ఞావిశేషం లేశమున్నూ లేదనుట నిశ్చయం.

యింతకు కొంచెం పూర్వం బులుసు పాపయ్యశాస్త్రులవారి మనుమరాలు, ప్రకాశశాస్త్రులవారి కొమార్త వివాహసందర్భంలో మనజిల్లాలోవున్న యావన్మంది పండితులున్నూ వచ్చివున్న సభలో ఒకగాయకుఁడు మంచి సంస్కృతసాహిత్యంకల దిట్ట, కవికూడాను, ఆయనతో కొంచెం మాకు వలచి' “పంకేరుహనేత్రి" అనే పదాలవిషయమై వాదం వచ్చింది. ఆయన తరఫున "అపరగౌతము" లనఁదగు ఒకానొక మహాతార్కికులు పూనుకున్నారు. వారితోపాటు కొందఱు వైయాకరణులు పూనుకున్నారు. యేంలాభం? వారు పట్టింది ములగకొమ్మ అవడంచేత, మమ్మల్ని వోడించడానికి అవకాశం లేకపోయింది. అంతేగాని ఆవిషయములోకూడా మాపాండిత్యం చేసిన పని లవమున్నూలేదు. యెవరికవిత్వాన్నిగాని మా అంతటమేమై విమర్శించి, నిజమైనవిగాని, అబద్ధమైనవిగాని దోషాలువున్నట్టు యింతవఱకు ప్రచురించినట్లు నాకు జ్ఞాపకంలేదు. నాకు రామశబ్దం దగ్గఱనుంచీ ప్రయోగించడానికి సంశయమే. యెందుచేత? అందులో తప్పేముందో అనే శంకచేతనే. రామశబ్దమంటే రామశబ్దం కాదనుకోండి; నాదంత అనుమానం మనస్సన్నమాట. యెవరి కవిత్వంలోనేనా యేదేనా తప్పుగా తోఁచినప్పటికీ యే మహాకవి యెక్కడ వాడింది చూచి ఆయన ప్రయోగించారో అని అనుకుంటానుగాని చట్టన తప్పనేదిలేదు. యెంతో ఆలోచిస్తాను. యెందఱినో అడిగిచూస్తాను. అప్పుడుగాని దాన్ని రంగంలో ప్రవేశపెట్టేది లేదు. అదేనా యే సందర్భంలోనంటారు? మా మీఁద కెవరేనా “గిల్లి కజ్ఞా"కు దిగితే వారి శిరోభారం తగ్గించడానికితప్ప పనిలేని పాటగా యెవరిమీఁదకీ వెళ్లేది లేదన్నది చదువరులు జ్ఞప్తిలో వుంచుకోవాలి. ఆ కారణంచేతనే యింతవఱకు మేము వెళ్లిన వాదాలేవిన్నీ వోడిపోలేదన్నది ముఖ్యాంశం. అది కొంత యశస్సుకు కారణం.

యింకొకటి యిక్కడ వ్రాయాలి. మొదటినుంచిన్నీ మాకు పలువురు శత్రువు లుంటూవున్నసంగతి లోకవిదితమే. ఆ శత్రువులు మా పుస్తకాలలో తప్పులుపట్టి మము అవమానించడానికి పూనుకొని వ్యర్టులవడం తటస్థించడంకూడా లోకు లెఱిఁగినదే. అందులో కొంత న్యాయమైన మా ప్రతిభ లేకపోలేదుగాని దైవసహాయం చాలావుంది. వుదాహరణకి ఒకటి మనవి చేసుకుంటాను. మా పాండవాశ్వమేధంలో ప్రతిపంక్తికిన్నీ గీటులుంచి తప్పులని యెవరైతేనేమి ప్రకటించారుగదా! అందులో అన్నీ సమాధానం చెప్పఁదగ్గవే కావడమేమి? యే ఒకటి రెండో నిజమైన ప్రమాదాలు వున్నప్పటికీ అవికూడా అన్యథా మార్గాంతరంచేత సమాధానం చెప్పఁదగ్గవి కావడమేమి? “మరుద్భూపాలుఁడు" అన్నదానికి చెప్పినసమాధానానిక్కాcబోలును, ఆకొండి వ్యాసమూర్తిశాస్త్రులుగారు నిర్ఘాంతపడ్డట్లు విన్నాను. యెంతసత్యమో? పూర్తిగా సమర్థించడానికే వీలులేని ప్రమాదాలు ఆ నాటకంలో మచ్చుకేనా లేకపోయాయా? వున్నాయి. యెన్నోలేవు. నాయెఱిఁగినంతలో ఒక్కటిమాత్రమే వుంది. అది మాప్రతిపక్షుల కెందుకు కనపడకపోవాలి? వారికేకాదు, వారి విమర్శనకున్నూ దానికిచ్చిన మాజవాబుకున్నూకూడ చాలా యిటీవల యెంతో కాలందాఁకా అది మాకున్నూ గోచరించనేలేదు. గోచరించినప్పుడేనా ఆ పుస్తకం చదివి పరిశీలించేటప్పుడు గోచరించలేదు. యేదో పనిమీఁద బజారుకువెళ్లి కృష్ణాప్రెస్సులో ఆలస్య మవడంచేతనూ, స్కూలుటైము అప్పటికే అతిక్రమించడంచేతనూ తొందరగా యింటికి వస్తూవుండంగా శ్రీకాశినాథుని బ్రహ్మయ్యలింగంగారి యింటిప్రక్క సందులో నడుస్తూ వుండఁగా ఆ తొందరలో హఠాత్తుగా పాండవాశ్వమేధంలోవున్న నిజమైన మా ప్రమాదం నాకు స్ఫురణకు వచ్చింది. యిది దైవసహాయంకాక యేమనుకోవాలి? ఆ తప్పుగల పద్యాన్ని వుదాహరిస్తాను.

తే. గీ. “వీర! చిత్రాంగదవిచిత్రవీర్యులకు వి
        వాహ మొనరించితివి కష్టపడి జయించి
        వారు నేఁటికిఁ బ్రత్యుపకార మిట్టు
        లాచరించిరి నావంటి యధముకతన.”

యిది భీష్మనిర్యాణఘట్టంలో ధృతరాష్ట్రుని వాక్యం. భీష్ముఁడు విచిత్రవీర్యునికే అంబికాంబాలికలను తెచ్చి వివాహం చేశాఁడుగాని చిత్రాంగదునికి చేయలేదు. ఆ వివాహకాలంనాఁటికే చిత్రాంగదుఁడు దివంగతుఁడైనాఁడు. యిది పెద్దతప్పు కాదనుకోండి. యేమైనా వైరు లాలా సరిపెట్టుకుంటారా? తి|| వెం|| కవులకు భారతం యేమీ తెలియదు, అని మొదలుపెడతారుగా? యీ మధ్య వక బుద్ధిశాలి, శుద్ధపత్రికలో సవరణ చూపినదాన్నే యెత్తుకొని, “చూపినా ప్రయోజనం లేదు. ఆ సవరణ వక కందపద్యంలో సవరించడానికి అవకాశం వుండ" దంటూ వ్రాశాఁడు. అప్పటికి ఆయన పునర్ముద్రణాన్ని చూడలేదుపాపం. నాయనా, ఆ కందపద్యంకూడా ఫలానాముద్రణంలో సవరింపcబడివుంది చూడుమని వ్రాశాను. చూచి మళ్లా వ్రాస్తాఁడుగదా “చూచానుగానీ, యింకొక పద్యంలో సవరించలేదు, దానికి యేముద్రణాన్ని చూడమంటా” రంటాడు. యీ మోస్తరుగా వుండే వుదారులు విమర్శకులైనప్పుడు ప్రస్తుత "చిత్రాంగద" విషయం వదలిపెడతారా? యెంతో రంజస్సు చేస్తారు. దారికెవరో సహృదయులు మందలిస్తా రనుకోండి, అంతదాఁకాకూడా రాకుండానే దైవం చేశాఁడుగా! వాళ్లకు ఆస్థలాన్ని కనపఱచనేలేదు. గ్రంథకర్తకే అప్రయత్నంగా ఆస్థలాన్ని కనపఱచాఁడు. దానితో గ్రంథకర్త యీ అంశాన్ని వుదాహరించి “నాయనలారా, మీరు దైవోపహతులు, కాఁబట్టి మీకు నిజమైన తప్పులు కనcబడవు" అని యీ మాటను సమర్ధించడానికి పైపద్యం వుదాహరించి మందలించడానికి అవకాశం కూడా కలిగింది. ఈ విషయం పాశుపతం చూస్తే తెలుస్తుంది. కాcబట్టి విస్తరించేదిలేదు.

యింతకూ వ్రాసే ముఖ్యసంగతి యేమిటంటే : తి|| వెం|| కవుల విజయాలల్లో నూటికి తొంబదులు దైవానుగ్రహ లబ్దాలనిన్నీ మిగతా పదిన్నీ స్వప్రయోజకత్వంవల్ల వచ్చినవనిన్నీ మనవిచేసుకోవడానికి ఆయీ విషయాలు వున్నవివున్నట్లు వ్రాయడం. అప్పటికింకా ప్రథమ ముద్రణంలో సరస్వతీపత్రికలో ప్రకటితమైన “పాండవ విజయం” ద్వితీయముద్రణం కానికారణంచేత దానినిండా యెన్నో వ్యత్యాసాలు వున్నాయి. అట్టిదాన్ని వదలి పాండవాశ్వమేధాన్ని ప్రతిపక్షులు విమర్శించడానికి పూనుకోవడంకూడా దైవహేతుకమే అని నా విశ్వాసం. పెద్ద పెద్ద పండితుల సాయంతో విమర్శిస్తూవున్న ఆ విమర్శనలో "క్షమాపణ" అనే పరిశుద్ధమైనశబ్దం "నింద్యగ్రామ్యం"గా లిఖింపఁబడడం కూడా దైవహేతుకమే అనుకుంటాను. ఆయీ సందర్భాలన్నీ దైవహేతుకాలేగాని, మా ప్రజ్ఞవల్లఁగాని, ఆవలివారి ప్రజ్ఞాలోపంవల్లఁగాని కలిగినవి కావని వ్రాయడంవల్ల కలిగే లాభమేమిటంటారా? లోకంతోపాటు అహంకారనిరాసను చూపడం వకటికదా? అబ్బో, యింతమాత్రం చేత తి|| వెం|| కవులు అహంకారపూరితులు కారనుకోదు లోకమంటే వినండి:- అదిన్నీ సత్యమే. యిపుడు నేను అనారోగ్యంగా వుండడం చేతనైతేనేమి, తి|| శాI| గారి సాహాయ్యం పోయి చాలాకాలం కావడం చేతనేమి, కొందఱు "గిల్లికజ్జాలకు" దిగుతూవున్నారు. వారికి యీలా మనవిచేసుకుంటే యేమేనా నచ్చుతుందేమో అని కూడా నా ఆశ. దైవోపహతులుతప్ప మామీఁదకు రారనిన్నీ మా విజయానికి కారణం దైవం గాని మా ప్రజ్ఞ లేశమున్నూ కాదనడానికే నేనీవ్యాసం వ్రాయడం. నీకు విజయమే లేదనిగాని, నీకు పేరుప్రతిష్ఠలే లేవని కాని యెవరేనా అనేయెడల వారు నాకు పరమోపకారులు. యెందుచేతనంటే అట్టిమాపుస్తకాలను వెక్కిరించడానికి యెవరున్నూ ప్రయత్నించరుకనుక ఆలాటి అభిప్రాయాన్ని వాళ్లకు కలిగించక మాపైకి 'గిల్లికజ్జా'కు పురికొల్పడమున్నూ దైవంపనే అని నా నమ్మకం. నా నమ్మకాన్ని సమర్ధించేవి కొన్ని వుదాహరణాలు యిదివఱకే చూపివున్నాను. మరికొన్ని కూడా చూపుతాను.

(1) "మన కవిచంద్రుఁడుగారు శ్రీరాగమెత్తుకొని సభలలో నానా రాజసందర్శనము లోని పద్యములు చదువుచు నుపన్యాసము చేయునప్పుడు సభయంతయు వింజమాకిడి నట్లుండును. ఇది వీరి పూర్వపుణ్య విశేషము”

(2) అమేధ్యపదార్ధములం దగుల్కొన్న యగ్నికి నశుచిత్వమంటనట్లును... తాను శుద్దుఁడైనచో నెట్టి దుష్టులతో సహవాసము చేసినను... ... "

యీ రెండు వాక్యాలున్నూ వేం|| శా|| మీఁద యెంతో ఆగ్రహంతో వ్రాసే మహనీయుల వాక్యాలలో నుండి తీసినవి. ఇవి వ్రాసినవారు మహాకవులు. ఇందు వేం|| శా|| పూర్వపుణ్య విశేషం కలవాఁడనే అంశమే కాక అగ్నివంటివాఁడనికూడా స్పష్టంగా తేలుతూవుందికదా? యీ వూహ శత్రువులకు కలిగిందని నేను వ్రాయడానికి చదువరులు సమ్మతించే యెడల, అగ్నిహోత్రంలో దుముకుట యెట్టిదో వేం|| శాII తో వివాదం పెట్టుకోవడం అట్టిదే అని శత్రువులుకూడా వొప్పకున్నట్లయిందికదా?

ఇట్టి పూర్వపుణ్య విశేషం కల తి|| వెం|| కవులతో “గిల్లికజ్జా"కు దిగేవారు దైవోపహతు లనడానికి వప్పనివా రుండరనుకుంటాను. అయితే లోకంలో “నీకు అవమానం రాను” అనడానికి బదులు “నీకు తి|| వెం|| కవులతో వాదంరాను" అంటే సరిపోతుందనుకుంటాను. వెనక యెవరో పాలెపు వెంకప్పగారని వక రుండేవారఁట. వారు సంతానం లేక పెంపకం చేసుకుంటే, యెన్నిసార్లు పెంచుకున్నప్పటికీ నిలిచింది కాదఁట! యీ కారణంచేత లోకంలో ఆ పెంపు వక తిట్టుగా పరిణమించిందఁట! అనఁగా “నీవు చచ్చిపోను” అనడానికి బదులు, “ఫలానావారు పెంచుకోను” అనడానికి మొదలెట్టారఁట! ఆలాగే ప్రస్తుత విషయమున్నూ

తేలినసారం; మాకేమేనా నామరూపాలు లోకంలో వుంటే దానికి పూర్వపుణ్యవిశేషం అప్రత్యక్షకారణమున్నూ ప్రత్యక్షకారణం మమ్మల్ని వృథాగా కదిపి "గిల్లి కజ్ఞా" పెట్టుకొనే శత్రువులనిన్నీ స్పష్టంగదా? యీ శత్రువులను మేము మిక్కిలిగా అభినందించడం తప్పదు. యితర విషయంలో పనిలేని పాటగా "స్త్రీలను" అనే ప్రయోగం తప్పంటూ వ్రాసి, అనంగా - మహత్యర్థకానికి, సప్తమ్యర్థకముగా ద్వితీయ నుపయోగించాఁడనీ, గోర్కెలు అని యెత్వఘటితంగా ప్రయోగించాఁడనీ, “చూపఱు” అనడానికి “చూపరులు" అన్నాఁడనీ, యింకా యేమో అన్నాఁడనీ ఆక్షేపించడానికి మొదలుపెట్టారు. యీ ఆక్షేపణాలన్నీ ఆక్షేపకులకు అపజయాన్ని కలిగించేవే అని అన్యత్ర దిఙ్మాత్రం వ్రాసి వున్నాను. యావజ్జీవమున్నూ తి|| వెం|| కవులు వారిమీఁదకు వచ్చిన వారిని వోడించడమే అన్యంలేదు అనే యశస్సు సంపాదించిపెట్టడానికేగాని యితరవిషయంలో యీ అంశం ఆవలి మహనీయులు యెందుకెత్తుకుంటారో విజ్ఞులు విచారించండి,

కొంతమంది మమ్మల్ని తిట్టాలని కోపంతో వ్రాఁతకి మొదలెడతారు, దానిలోకూడా మమ్మల్ని గొప్పఁజేసే మాటలే పడతాయి. "గంధర్వలోకం"లో నుంచి ఒకాయన యేలా వ్రాశారో చూడండి.

సత్కవీ! 'నీదు ఘన గౌరవము' 'కవీశ్వర!' 'నీబోటి శతావధానపరిపూర్జునకు’ ‘మహాత్ముఁడ!'

యిత్యాదులు ఆ గంధర్వలోకస్థుని దూషణవాక్యముల నుంచి జల్లిస్తే దొరికాయి. చూచారా, యిదేమనుకోవాలి? దైవ మాలా ఆయనచే అనిపించాcడనేనా? లేక ఆ గంధర్వలోకస్థునికి వెంll శాII మీఁద గౌరవముండే అట్లా వ్రాశారంటారా? యివన్నీ యీలా వుంచుదాం. గద్వాలలో యేమి, ఆత్మకూరిలో యేమి, యేవిధమైన వాదోపవాదాలూ లేని పద్ధతిని యే పండ్రెండు రూపాయిలో యిచ్చి పంపడంతప్ప యితర గౌరవాలకు అవకాశం లేశమున్నూ లేదుకదా? ఆ వాదోపవాదాలు యితరుల కేల లేకపోవాలి? తి|| వెం|| కవులకే యేలా కలగాలి? దైవమే కారణ మనుకోవాలికదా? నరసారావుపేటలో “పశ్యశబ్ద" ఘటితమైన సమస్య నెవరో యెవరినో అడిగి తెచ్చి సభలో అడగడమేమిటి? అడిగితే అడిగారుగాక, వెంll శా|| తప్పనడమేమిటి? దానిమీఁద విధిగా తి|| వెం|| కవులు దొరుకడ్డారనుకొని ప్రతిపక్షులు విజృంభించినకొద్దిన్నీ తి|| వెం|| కవులు చేతంగానివాళ్లవలె వెనక తగ్గినట్లు నటిస్తే ప్రతిపక్షులు మఱీ మఱీ తొక్కుకురావడమేమిటి? ఆవాదం అంతతో ఆఁగక ఆంధ్రదేశపు పండితులలో అనేకులను చుట్టుముట్టడమేమిటి? తుదకు దానిలో ఆవలివారికి మార్గాంతరం లేకపోవలసి రావడమేమిటి? కాశికామతాన్ని ఖండించడానికి తగ్గ లక్ష్యం ఛందోవ్యతిరిక్తమైనది అప్పటికే కాదు యిప్పటికిన్నీ ప్రతిపక్షులకు చిక్కక పోవడమేమిటి? యిదంతా దైవ విలాసం కాక మఱేమనుకోవాలి? అందుచే ప్రతిపక్షులు ఒకపని చేస్తే బాగుంటుందనుకుంటాను. తి|| వెం|| కవులు శుద్ధ శుంఠతావచ్ఛేదకకోటిలో వాళ్లు, వాళ్లకు దైవం సహాయం చేసి పేరు ప్రతిష్ఠలు తెప్పించింది. లేకపోతే మనముందు నిలుస్తారా? అనుకొని యెంతవఱకు సంతోషించాలో అంతవఱకు సంతోషించి తృప్తిపడడం యుక్తమనుకుంటాను. గుంటూరు వివాదాలలో ఒకాయన యేలా వ్రాశారో చూడండి-

సీ. ప్రబలగద్వాలభూపాలభర్మధరాధ
               రమ్మున భూరివ్రజమ్ము గొనుట
    ఆత్మకూర్ప్రాజ్యరాజ్యమదేభములనెక్కి
               వీధులలో విఱ్ఱవీఁగి చనుట
    గజపతిక్ష్మాపాలనిజకరార్పితకాంచ
               నాదులఁగొని చింతలేది చనుట
    పోలవరక్షమాలోలాభ్యుదయకీర్తి
               కాంతమన్ననలను గాంచి మనుట

తే.గీ. సరససుకవిత్వసంధానచాతురీణ
      ధీవిశేషపాణింధమశ్రీవిలాస
      గరిమనని యెంచుచుంటిమక్కట! పురాణ
      వాక్కలనఁ గాని యన్యమ్మువలనఁగాదు.

మమ్మల్ని చూడనప్పుడు పొరఁబాటుగా తి|| వెం|| కవులంటే యేమో మిణికారు కాcబోలునని అనుకొనేవారఁట ఆయన! తీరా చూచేటప్పటికి, పురాణం చెప్పి ఆయా సమ్మానాలు పొందినట్లు తెలిసికొన్నారఁట! యింతకూ ఆయనకు అప్పుడు కావలసిన ముఖ్యాంశమేమిటి? కవిత్వం తి|| వెం|| కవులకు బాగా తెలియదనేది. దాన్ని ఆ రీతిగా సమర్ధించి ఆయన సంతుష్టి పడ్డారు. దాన్ని గుంటూరుసీమలో ప్రకటించి వున్నాము. ఆలాగే యిప్పటి "గిల్లికజ్జా" సమాజంవారు కూడా యేదో విధంగా సమాధానపడవలసిందని మా ప్రార్థన. యీలాంటివారంటూ వుండఁబట్టే తి|| వెం|| కవులలో ఒకరేనా యింతకాలం జీవించివుండడం తటస్థించింది కాని లేకపోతే దిష్టికొట్టి యిద్దఱూకూడా యిదివరకే ఫయిసలయేవారేమో అన్నది సత్య దూరంకాదు. జరిగిన సంగతి ఒకటి జాతకచర్యలో గ్రంథవిస్తరభీతిచే బొత్తిగా యెత్తుకోనిది యిక్కడ వ్రాసి దీన్ని ముగిస్తాను.

మొట్టమొదట యేదో స్వల్పంగా వెం|| శాII కాశీనుంచి రావడానికి వెం|l శా|| తండ్రిగారు చేసిపంపిన ఋణాన్ని తీర్చుకొనేనిమిత్తం తి|| శాII సహితంగా నవరాత్రాల ఆరంభంలో కాకినాడకు వెళ్లడం తటస్థించింది. ముందు భిక్షవకటి కుదరాలి కనుక యెవరింటికి వెడదామని అనుకుంటూ శ్రీ బోడా రాజుగారి మేడప్రక్కనున్న ఉత్తరపు వీథినుంచి పడమటగా రైలుసంచీలు చేతcబట్టుకొని విద్యార్థులతో వెళ్లుచుండఁగా, శ్రీ వేమూరి సుబ్రహ్మణ్య సోమయాజులుగారి యింటివాఁకిటిలో తి|| శాI| గారి పినతండ్రిగారి అల్లుఁడు కనcబడి తి|| శాI| గారిని పలకరించాఁడు. అక్కడికి వెళ్లేటప్పటికి మిక్కిలి ముసాలివృద్దులు సుబ్రహ్మణ్యసోమయాజులు గారు మీ రెవరని అడిగి, ఫలానావారి శిష్యులమని చెప్పినపిమ్మట, నాయనా! మీ రీ నవరాత్రాలు వెళ్లేపర్యంతమూ మాయింటే వుండవలసిందని ప్రేమపూర్వకంగా ఆదేశించారు. వారి ఆజ్ఞప్రకారం అక్కడే వుండడం తటస్థించింది. వారింటికి సమీపంలోవున్న శ్రీదురిసేటి శేషగిరిరావుపంతులవారిని సందర్శించేటప్పటికి ఆయన స్వంతంగానే ఒక సభ వారి చావడిలోనే చేయించి, అష్టావధానం చూచి, వచ్చినపని అంతకుమున్నే మావల్ల వినివున్నారుకనుక ఆ ముప్పది రూపాయీల ఋణమున్నూ తీరేటట్టు సమ్మానించారు. వచ్చినపని అయిందికనుక మళ్లా చదువుకొనేచోటు ధవళేశ్వరానికి శ్రీ బ్రహ్మయ్య శాస్త్రులవారివద్దకు వెళ్లాలనుకుంటూ వుండఁగా యీ అవధానంసంగతి వారినోటా వారినోటా శ్రీబాదం వేంకటరత్నంగారి నోటీసులోకి వెళ్లింది. ఆయన కబురంపించి, అష్టావధానం చాలచోట్ల చూచాము. మీరు శతావధానంచేస్తే సభచేయిస్తానన్నారు. వెనకసంగతి లేదుగాని యిక్కడనుంచి టూకీగా జాతకచర్యలో వున్నది. ఆ సభ జరిగింది. చెప్పేమాటేమిటంటే, ఆ సభలో సమ్మానాన్ని పొందివచ్చినరోజున మమ్మల్ని మొట్టమొదట తమ యింటివద్ద నిలిపి ఆతిథ్యమిస్తూవున్న సోమయాజులుగారు గుమ్మందగ్గిఱకు మేము వెళ్లీవెళ్లడంతోనే అక్కడే నిల్వండి అని ఆఁపుచేయించి, దిష్టిపరిహారార్థమంటూ కొన్ని ప్రక్రియలు చేయించి కాని లోపల ప్రవేశించనిచ్చారుకారు. యీ కథ ప్రస్తుతాని కెంతవఱ కుపకరించినా ఆ మహాపురుషుని కృతజ్ఞతను వెల్లడించడానికేనా పనికివస్తుందని వుటంకించాను. ఆలాటివారు చేసిన దిష్టిపరిహారాలవల్లనేమి, కొందఱు ప్రతిపక్షులు చేసే ప్రయత్నాలవల్లనేమి, మాలో వకరేమేనా యింతకాలం వుండడానికి అవకాశం కలిగిందనుకుంటానునేను. దీన్ని లోకం యెంతవఱకు విశ్వసిస్తుందో?

పుట్టెఁడాముదం వ్రాసుకొని పొర్లినా యశస్సు పూర్వపుణ్యం వుంటేనేకాని రాదు. యీ మాట నే నిప్పుడే వ్రాయడంలేదు. యిదివఱలో ఆరోగ్యకామేశ్వరిలో కూడా వ్రాశాను. శా|| ఈజన్మమ్మునఁ గొంచెమేయనుము మున్నేజన్మమందైన నీపూజన్ బూర్తిగఁజేసె వీడదికతమ్ముంజేసియే లోకమున్ బూజించెన్... ... కామేశ్వరీ, తాదృశపుణ్య హేతుకమైన కీర్తిని పోఁగొట్టఁగలవారుంటే పోఁగొట్టుదురుగాక. వారికి కూడా పుణ్య పరిపాకం వుంటే కీర్తి కలుగుcగాక. “పుణ్యైర్యశో లభ్యతే, నాన్యథా, నాన్యథా, నాన్యథా."

పూర్వపుణ్యమనడానికే కొందఱు జాతకబలిమి అనడం కలదు. ఆమాటకూడా నేను వకచోట సభలోనే వాడివున్నాను. -

(వేమవరాగ్రహార శతావధానమునుండి)

చ. జననపులగ్నమం దలరు శక్రగురుండును శుక్రుఁడున్ గుజం
    డును నల రాహువు న్నను ఘనుంబొనరించెడి నంతెకాని యే
    నును నొక సత్కవీశ్వరుఁడనో! తిరపయ్యయు నొక్క మేటియో!
    యనఘ కవిగ్రహంబులు, గ్రహంబులు గవ్వనుజేయు వజ్రమున్.

యీ యంశాన్నే భంగ్యంతరంగా వకచోట కొలఁది కాలంనాఁడు వ్రాసివున్నాను. ఆ పద్యం "విక్రమ చెళ్లపిళ్ల" అనే వ్యావహారికభాషా పుస్తకంలో మీరు చదువుతారు. అయినా దాన్ని కూడా వుదాహరిస్తాను.

శా. నీ కారుణ్యమకాక యేనృపతిగానీ వీనిఁ బూజింపఁగా
    నీ కాలమ్మున నెంతపాటికవియో! యేమంతవిద్వాంసుఁడో!
    నీకే స్పష్టము, వీనిముం దొకరుఁడేని నిల్చి గట్టెక్కెనే?
    మోకాల్బంటియె నీ కటాక్షమున నబ్దుల్ నాకుc గామేశ్వరీ!

యెంత వినయం కోసం వ్రాసినా ఆయీ పద్యాలలో కొంత గర్వస్ఫూర్తి లేకపోలేదు. కొందఱు సకలశ్రమలూపడి యేవో గొప్పకు కావలసిన ప్రయత్నాలుచేసి వాట్లను అనుభవించే సభలో వినేవాళ్లు లోలోపల నవ్వుకుంటారనేనా ఆలోచించక, నేను వట్టిచవటను, అభాగ్యుఁడను యేమో? యేమో? యేమో" అంటూ వినయాన్ని ప్రకటించుకోవడానికి మొదలెడతారు. అట్టితోవ నాకు నచ్చదు. నేను ప్రకటించే వినయపుపద్ధతి చూపించనే చూపించాను. కాళిదాసాదులుకూడా ఆత్మనుగురించి అంత అవివేకంగా తిట్టుకొని వినయాన్ని ప్రకటించలేదు. “మందః కవియశఃప్రార్థీ" అన్న శ్లోక మెఱుఁగని అక్షరాస్యులెవరు? నిజంగా అంతచవటయు “అంత అభాగ్యుఁడు" న్నూ తానయివుంటే, అట్టివాఁడు యెంత ప్రయత్నించినా ఆ వ్యక్తిని సమ్మానించడమే తటస్థింపదుగదా? కాబట్టి స్వవచోవ్యాఘాతపు మాటలతో వినయాన్ని ప్రకటించుకోవడంలో విశేషించి కాని కొంచెంగాని ప్రయోజనం వున్నట్టు నాకు తోఁచదు. తాను వ్రాసే వ్రాఁతకున్నూ తన జీవితానికిన్నీ కొంత కాకపోతే కొంతేనా సంబంధం వుండడం అవసరమని నే ననుకుంటాను. అతివినయాన్ని మనపెద్దలు సుతరామున్నూ అంగీకరించలేదు. అంగీకరిస్తే - "అతివినయం ధూర్తలక్షణం" అని యెందుకు నిర్వచిస్తారు?


★ ★ ★