కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/“నా౽నృషిఃకురుతేకావ్యం"

వికీసోర్స్ నుండి



“నా౽నృషిఃకురుతేకావ్యం"

అంటూ వొక అభియుక్తోక్తి వుంది. యిది యే పుస్తకం లేదో తెలియదు.

శ్లో “నా౽నృషిః కురుతే కావ్యం I నా౽గంధర్వ స్పురూపధృత్
    నా౽దేవాంశో దదా త్యన్నం 1 నా౽విష్ణుః పృథివీపతిః"

అనే శ్లోకం నా చిన్నతనంలో మా ముత్తాతగారి ప్రాస్తావిక పద్య రత్నావళిలో చూచాను. యిటీవల చాలామంది పండితుల నోట విన్నానుకూడాను. ఋష్యంశసంభూతుఁడు కానివాఁడు కవి కానేరఁడనిన్నీ, గంధర్వాంశ సంభూతుఁడు కానివాఁడు అందగాcడు కానేరఁడనిన్నీ, దేవాంశ పెట్టి పుట్టనివాఁడు అన్నదాత కానేరండనిన్నీ, విష్ణ్వంశ పెట్టిపుట్టనివాఁడు రాజు (ప్రజాపాలకుడు) కానేరఁడనిన్నీ దాని తాత్పర్యం. (దీన్నిబట్టే మన భారతీయులు రాజును రెండో దేవుణ్ణిగా భావించేవారు.) ఆ యీ నాలిగింటిలో మొట్టమొదటిదాన్ని గూర్చి నాలుగుమాటలు వ్రాస్తాను. కవిగావడానికి ఋష్యంశ ఆవశ్యకమని చెప్పడంవల్ల మొదటి కవులు ఋషులే అని వేఱే చెప్పవలసివుండదు - వేదంలోకూడా కొంతభాగం ఋషిప్రోక్తం వున్నట్టు కనపడుతుందిగాని, ఆ పక్షంలో వేదాలు అనాది అనే వాదానికి భంగం వస్తుంది కనక, ఆయా భాగాలు ఆయా ఋషులు కనిపెట్టారుగాని రచించలేదని వ్యాఖ్యాతలు సమన్వయిస్తూ వచ్చారు. వేదాలు అనాదిగా వున్నాయని చెప్పేవారి వాదం స్థూలదృష్టులకు మూఢ నమ్మకంగా కనపడుతుందిగాని, తుట్టతుదకు నిల్చేది ఆ సిద్ధాంతమేకాని యితరంకాదు. వేదంలో వుండే విశేషాలు పుచ్చుకొని ఋషులు ధర్మశాస్త్రాలు, పురాణాలు రచించారు. పురాణగాథలన్నీ జరిగినవే అనుకోవడానికిన్నీ వీలు కనపడదు, జరగనివని అనుకోవడానికిన్నీవీలు కనపడదు. ఆంజనేయులు నూఱామడ సముద్రం వొక్క దాఁటుగా దూఁకాండా అంటే? (అయిదేళ్ల కృష్ణుడు గోవర్ధనం యెత్తడం వగయిరాలు చూ) మన మన శక్తులతో పోల్చి చూచుకుంటే విశ్వాస్యంగా కనపడదు. సంజీవి పర్వతం (అంతా కాదే అందాం) కొంతే అంటే? అవసరమైనంతేనా కొన్ని గంటల కాలంలో తేఁగలిగాఁడా? అంటే? యింకా యీ యిరవయ్యో శతాబ్దంలో యేదో జవాబు (రేడియోలు విమానాలు వున్నాయికదా) చెప్పడానికి పూనుకోనేనా వచ్చునుగాని, లోఁగడ వారికి ఆధారం లేదు కాని జనులయందు విశ్వాసరాహిత్య తీర్మానాలు లేకపోcబట్టి పెద్దలు చెప్పిన అంశాలను ప్రజలు- “విస్సన్న చెప్పినది వేద” మన్నట్టు విశ్వసించే తరగతిలో వుండేవారు. కనక, అప్పటి బోధకులకు ఆట్టే పరిశ్రమ కలిగేది కాదు. ఋషులుగాని, కవులుగాని ఆయా గ్రంథాలలో చెప్పిన భాగాలు చాలాభాగం (మ. ధరణీ మండలి దిర్దిరం దిరిగెఁబాతాళమ్ము ఘూర్ణిల్లెలోనైన వన్నమాట) అతిశయోక్తి కింద జమకట్టుకుంటే“నచ శంకా నచోత్తరం” గాని, ఆంజనేయులు సముద్రం దాఁటి లంకలోకి వెళ్లడమూ, లంకా పట్టణం తగులపెట్టడమూ యివన్నీ అతిశయోక్తులుగానే సమన్వయించుకుంటే

ఉ. సీతయు లేదు రావణుని చెల్లెలు లే, దలరాముఁ డబ్దిలో
    సేతువు గట్టలే, దతని చే దివిజారులు చావలేదు, సా
    కేతపురమ్ములే, దచటఁ గేకయపుత్రియు లేదు సర్వము
    న్నూ తనసృష్టియే యన జనుల్ విని నవ్వుదు రెమ్మొగమ్మునన్.
                                                               (ఇటీవలిచర్య)

కనుక, అన్నీ అతిశయోక్తులే అనుకోవడంకన్న అనాలోచితం వుండదు. కవులు యేపట్నాన్ని గుఱించి వర్ణిస్తారో ఆయా విశేషాలు అక్కడే వుంటాయని చెప్పలేంగాని, మఱోచోటేనా అంతా కాకపోయినా చాలా భాగం వుండి తీరతాయి. (టాజ్మహల్ వగైరా చూ) కాళిదాసాదులకు మార్గదర్శకులు ఋషులు, ఋషులకు మార్గదర్శకాలు వేదాలు. భోజరాజు “మధుమయఫణితీనాం మార్గదర్శీ మహర్షి” అని వాల్మీకిని గూర్చి తన రామాయణ చంపులో కృతజ్ఞత్వాన్ని ప్రకటించి వున్నాడు. సామాన్యదృష్టితో చదువుకునే విద్యార్థులకూ, తత్తుల్యులుగానే వుండే పండితులకూ, కవులకూ, భోజచంపు రుచించినంత సొగసుగా వాల్మీకి కవిత్వం రుచించనిమాట సత్యం. దానిక్కారణం చెప్పవలసివస్తే యింతలో తేలదు. ఋషులు చాలా తేలిక శైలిలో వ్రాస్తారు. తఱచు అనుష్టుపులే వుపయోగిస్తారు. యిటీవలి కవులో ఆలా కాదు. దానికి భిన్నంగా ప్రవర్తిస్తారు. పంపా తీరంలో రాముఁడు వున్నప్పటి రామాయణ కవిత్వం చాలా ప్రౌఢంగా అలంకారభూయిష్టంగా వుంటుంది. కొన్ని భాగాలు పేలపిండి మాదిరిగా వుండేవిన్నీ వుంటాయి. పునరుక్తి భూయిష్ఠంగావుండే భాగాలున్నూ వుంటాయి ఋషుల కవిత్వాలలో అంత మాత్రం చేత ఋషులకు యిమిడ్చి సంగ్రహంగా రచించే శక్తి లేదనుకోవడంకంటే స్థూలదృష్టిత్వం వుండదు. ఆ పద్ధతిని బ్రహ్మసూత్రాలూ, వ్యాకరణ సూత్రాలూ, రచించినవారు ఋషులు కారనుకోవలసి వస్తుంది. అందుచేత ఋషులు సర్వశక్తిసంపన్నులని వొప్పక తప్పదు. వారి రచనలో కవిత్వ విశేషాలన్నీ వుంటాయి. ... "

శ్లో "సర్పాధినా ధౌషధినాధయుద్ధ క్షుభ్యజ్ఞటా మండల గహ్వరాయ,
     తుభ్యంనమస్సుందరతాండవాయ యస్మి న్నిదం సంచవిచేతి సర్వమ్."

ఆయీ శ్లోకం వేదపాదస్తవంలోది, జైమినిమునికృతం. యిందులో మొట్టమొదటి విశేషణంలో యెంత అందంవుందో సహృదయులు పరిశీలించాలి. ఆ అందం సమాసంలో యిమిడిందంటే, మఱీశాఘ్యం. సాంబమూర్తి జడలో సర్పరాజున్నూ చంద్రుఁడున్నూ యుద్ధం చేస్తున్నారఁట! దానివల్ల బోలెడు గందరగోళం జరుగుతూ వుందఁట! చంద్రుడికీ సర్పానికీ పోట్లాట క్కారణం రాహువు సర్పరూఁపుడే కదా! యెక్కడో వొక్కటికాదు, యిలాటివి యెన్నోశ్లోకాలు ఋషుల కవిత్వాలలో వుంటాయి.

శ్లో. “మృతా మోహమయీ మాతా జాతో బోధమయ స్సుతః,
     సూతక ద్వయసంప్రాప్తౌ కథం సంధ్యా ముపాస్మహే?"

యిది మైత్రేయోపనిషత్తులో వున్న శ్లోకం. కవిత్వం యెంత రసవత్తరంగా వుందో, యెంత అలంకారమయంగా వుందో సహృదయులకి గోచరిస్తుంది. యిప్పటివారు వీట్లని (ఉపనిషత్తులు) నిన్న మొన్నటి వాట్లనుగా చెప్పటం వుంది. వేద ప్రామాణ్యవేత్తలు ఆలాటి కాలనిర్దేశాన్ని వినరు, వింటే చెవులు మూసుకుంటారు కూడాను. “యస్య నిశ్వసితం వేదాః’ అని మన ప్రాచీనులు విశ్వసిస్తారు. పరమాత్మకు ఆదిలేనట్టే, వేదాలక్కూడా ఆదిలేదనియ్యేవే వారి తాత్పర్యం. అట్టి అనాదిభూతమైన వేదంలో వుండే శ్లోకం యెంత మార్గప్రదర్శకంగా వుందో భావికవులకు పరిశీలిద్దాం. అజ్ఞానమయమైన తల్లి చనిపోయిందఁట! (పాపం) పైఁగా జ్ఞానమయమైన పుత్రుఁడుకూడా జన్మించాఁడఁట! ఆలా చూస్తే మృతాశౌచం (మైల) యిలాచూస్తే జాతా శౌచం (పురుడు) యిట్టి స్థితిలో సంధ్యా వందనం చేయడం యేలాగ? (జాతాశౌచ మృతా శౌచాలలో యేది తటస్థించినా, సంధ్యావందనం అసలే చేయకూడదని వొక మతం. అర్ఘ్యప్రదానం మట్టుకు చేసుకోవచ్చునని వొకమతం) సంధ్యావందనానికి నాయకమణి గాయత్రి. అపవిత్రస్థితిలో దాన్ని వుచ్చరించడం మహాదోషం. దాన్ని పురస్కరించుకొని పైశ్లోకార్థం ప్రవర్తించింది. యెంత అందంగా వుందో చూడండి. దీన్ని కవిత్వరీత్యా విచారిస్తే వ్యాసం చాలా పెరుగుతుంది. అజ్ఞానావస్థలోవున్న కర్మఠులకే కాని, జ్ఞానులకు సంధ్యావందనాదికంతో పనిలేదన్నది పిండితార్థం. యింకా బాగా వివరించవలసివస్తే సారాంశం ఈవిధంగా తేలుతుంది. సంధ్యావందనమనేది రోజులో యేవో కొన్ని గడియల కాలంలో మాత్రమే చేసుకొనేది. యితరకాలమంతా సాంసారికగోష్ఠిలో పడి విరామంలేక కొట్టుకొనే వాళ్లకి తరణోపాయంగా యేర్పడింది. జ్ఞానులంటే, సన్యాసులు సర్వదా ఓంకార (సర్వవేదసారభూత మన్నమాట) జపంతో కాలక్షేపం చేస్తారు. వారికి దీనితో పనేముంటుందని చెప్పడానికి? వేదపురుషుఁడు జాతాశౌచామృతాశౌచాలతో సంబంధం కల్పి, యెంత చక్కగా చమత్కరించాఁడో, యింతకంటే, రసవత్తరంగా కాళిదాసాదులు చెప్పఁగలరా? (బాణోచ్చిష్టమా, యీ జగత్తు వేదోచ్ఛిష్టమా?) దీన్ని బీజంగా వుంచుకునే అనుకుంటాను లీలాశుకుడు,

శ్లో. “సంధ్యావందన భద్ర మస్తుభవతే...
     స్మారంస్మార మఘం హరామి"

అన్నాఁడు. సర్వకాల సర్వావస్థల యందున్నూ, భగవన్నామాన్ని మనన చేసేవాళ్లకోసం సంధ్యావందనాదికం పుట్టలేదన్నది పరమార్థం. దాన్నే వేదపురుషుడు (ఆదిమకవి) పూర్వోక్తరీత్యా చమత్కరించాడు. సాహిత్య రత్నాకరకర్త అలంకారాలన్నిటికీ వేదంలోనే బీజాలు వున్నాయని వ్యాఖ్యానించాఁడు యీ ఘట్టంలోదే యిదిన్నీ

శ్లో. "హృదాకాశే చిదాదిత్య | స్పదా భాసతి భాసతే.
      నా౽స్తమేతి నచోదేతి | కథం సంధ్యా ముపాస్మహే?” -

సంధ్యావందనానికి యేర్పఱచిన కాలమేమోసూర్యోదయ సూర్యాస్తమయాలు. స్థూలదృష్ట్యా కనపడే సూర్యుఁడికి ఉదయాస్తమయాలువుంటే వున్నాయిగాని, జ్ఞానసూర్యుఁడు హృదయమనే ఆకాశమందు సర్వకాల సర్వావస్థలయందూ వొకటే విధంగా ప్రకాశిస్తూ వుంటే, సంధ్యావందనం చేయడం యేలాగ? అన్నాఁడు. వెనకటి శ్లోకానికీ దీనికీ రచనలో కొంచెం భేదం కనపడుతూ వున్నా తాత్పర్యంలో భేదంలేదు. అవ్వాగుఱ్ఱమూ వకటే. (ప్రమాణానా మనేకత్వే౽పి ప్రమేయస్యైకత్వాత్) కొన్ని శ్లోకాలు కొంత మార్పుతోనున్నూ కొన్ని యథామాతృకంగా నున్నూ ఋషులు (కాళిదాసాదులు కూడా) అనువదించుకున్నారు.

శ్లో, “మన ఏవ మనుష్యాణాం | కారణం బంధమోక్షయో"

యిది అమృతబిందూపనిషత్తులో యేలావుందో, భగవద్గీతలోనూ ఆలాగే వుంది.

శ్లో, "యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాః,
      తదా శివ మవిజ్ఞాయ | దుఃఖస్యా౽న్తో భవిష్యతి"

యిది శ్వేతాశ్వతరోపనిషత్తులో ఏలావుందో, దేవీభాగవత సప్తమ స్కంధంలోనూ, ఆలాగే వుంది. ధర్మాన్ని చుట్టచుట్టి (చంకని పెట్టుకొన్నట్టన్నమాట) నట్టు ఆకాశాన్ని చుట్టగా చుట్టగలిగినవాళ్లకు శివపరిజ్ఞానం లేకుండానే దుఃఖనివృత్తి కలుగుతుంది అని దీని అర్థం. తాత్పర్యమో, అది యేలా అసంభవమో; యిదిన్నీ ఆలాగే అసంభవం అని తేలుతుంది. “మరువ దుశీనరేషు జలం" అన్న మాదిరిని సమన్వయించుకోవాలి. ఉశీనరదేశాల్లో నీటి సదుపాయం యేలా వుంటుందని ప్రశ్నిస్తే - మరుప్రదేశంలో వున్నట్టే అని జవాబు. మరుప్రదేశం (అరేబియా యిసుకపఱ్ఱ)లో జలమేలా దుర్లభమో? ఆలాగే ఉశీనరదేశంలోనూ దుర్లభమని ఫలితార్థం. లేదని చెప్పడానికి వుందని జవాబు చెప్పినా ఫలితార్థం లేకపోవడమే పయిశ్లోకం. యథామాతృకంగానే వ్యాసులవా రనువదించి వున్నారని లోఁగడ వ్రాసే వున్నాను. యింతమాత్రంచేత గ్రంథ చోరత్వాన్ని ఆపాదించకూడదు. ఆ విషయం వేదంలో వున్నట్టుగానే వుటంకిస్తే, మఱీ ప్రమాణ ప్రమితంగా వుంటుందని ఆలా చేసి వుంటారు. కొన్ని యత్కించితు మార్పుతోటీ వుంటాయి - చూపుతాను.

శ్లో. “ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతేచ వసతి విజ్ఞానమ్."

యీ శ్లోకం యింతమట్టుకు యథామాతృకంగానూ ఉత్తరార్ధం పదాలు కొంచెం తాఱుమాఱుగా (అర్థం వొకటే) నున్నూ వుపనిషత్తు నుంచే దేవీభాగవతంలో అనువదింపఁబడివుంది. యింకా యిలాటివెన్నో కనపడతాయి. ఇది విషయాంతరం. ఋషుల కవిత్వాలలో కూడా ఎన్నో చమత్కారాలు కనపడతాయనేది వ్యక్తవ్యాంశం,

శ్లో. “మాతామహ మహాశైలం, మహాస్త దపితామహమ్
     కారణం జగతాం వందే కంఠా దుపరి వారణమ్."

ఇదిన్నీ జైమినీ విరచితమే. దీనిలో శబ్ద చమత్కారమే కాదు, అర్థచమత్కారమున్నూ వుంది. దీని పూర్వార్ధంలో మ-హ, అనే అక్షరద్వయం నాలుగుమాట్లు ఆవృత్తమయింది. ఉత్తరార్ధంలో - రణం - ద్విరావృత్త మయింది. అర్థంలోనో? మాతామహుఁడే వున్నాఁడుగాని, ఆ తేజస్సుకు పితామహుఁడు లేఁడఁట! యిదీ యిందులో చమత్కారం. పార్వతీ కల్పిత పుత్రుఁడైన గణపతికి తాత (మాతామహుఁడు) హిమవంతుడు గావచ్చును గాని పితామహుఁడెక్కడ దొరుకుతాడు? శివుడు కూడా యెవరికేనా కొడుకుగా వుండేపక్షంలో గణేశ్వరుఁడికి పితామహుఁడు వుండివుండేవాఁడు. ఈశ్లోకంలో చేస్తే కొన్ని శంకలు చేయవచ్చు. అవి వెఱ్ఱిగా వుంటాయి. ఆ వెఱ్ఱిశంకల స్వరూపం కొంచెం చూపుతాను. సర్వాదిగా వుండే పరశక్తికి హిమవంతుఁడు తండ్రిగా వున్నట్టే, యీశ్వరుడికి కూడా బ్రహ్మ తండ్రి కావచ్చునుగదా? దీనికి పురాణగాథ ఆధారం వుంది. ఆ పక్షంలో మాతామహుడిఁతోపాటు గణపతికి పితామహుడు కూడా వుండవచ్చునే అంటే వినండి. గ్రంథకర్త పరమశివుణ్ణి వుద్దేశించి ఆలా చమత్కరించాcడుగాని శివుని అంశంవల్ల అవతరించిన రుద్రులను కాదంటే సరిపోతుంది. కవి వుద్దేశాన్ని పట్టి వ్యాఖ్యాతలు ప్రవర్తించాలి. వక్తవ్యాంశం కాళిదాసాదుల కవిత్వాలలోనే కాక, చమత్కారాలు ఋషుల కవిత్వాలలో కూడా వుంటాయన్నదే. ఆ యీ శబ్దచిత్రాలుగాని, అర్థచిత్రాలుగాని ఋషులు అంతో యింతో సూచిస్తే యిటీవల వాట్లను తదితర కవులు విస్తరించారనేది పరమార్థం. వొక్క బంధకవిత్వం మాత్రం ఋషుల కవిత్వంలో ఎక్కడా వున్నట్టు తోఁచదు. అక్షరాలు విడcదీయడమూ వొక్కొక్క అక్షరానికి వొక్కొక్క అర్థం చెప్పడమూ వేదంలోనే కనబడుతుంది. అవధూతోపనిషత్తులో

శ్లో. అక్షరత్త్వాత్ (అ) వరేణ్యత్వాత్ (వ)
    ధూతసంసార బంధనాత్ (ధూ)
    తత్త్వమస్యాది లక్ష్యత్వాత్ (త)
    అవధూత ఇతీర్యతే."

అని వొక్కొక్క అక్షరమే విడఁదీసి, వ్యాఖ్యానించే మాదిరిని కూడా చెప్పడం సూచింపఁబడింది. సర్వవేదసార భూతంగా వుండే ఓంకారానికి వ్యాఖ్యానించడం యీ మార్గంలోనే ఋషులు చూపి వున్నారు. అయితే వొక్కొక్కరు వొక్కొక్క మార్గంతొక్కి వ్యాఖ్యానించారు. కాని అందఱూ అక్షరాలు విడదీయడంలో యేకీభవించే వున్నారు. కొందరు శివాధిక్యాన్ని కొందరు కేశవాధిక్యాన్ని - కొందరు శక్త్యాధిక్యాన్ని - యిలా వారి వారి మతాన్ని పోషించుకుంటూ వ్యాఖ్యానించి వున్నారు - దేవీ భాగవతం శక్తి ప్రాధాన్యాన్ని వివరించేదికనక, అందులో యీ విధంగా వుంది.

శా. ఓంకారమ్మున నాద్యకారమున వాచ్యం డయ్యజుం, డయ్యుకా,
     రాంకుం డాతని తండ్రి విష్ణువు, మకారాంకుండు శంభుండు త,
     త్సంకేతమ్మున నుత్తరోత్తరము ప్రాశస్త్యమ్ము వాటిల్లు ని
     శ్శంకన్ బైదగు నర్ధమాత్ర చెలఁగున్ శక్తిస్వరూపమ్ముగన్."

ఆయీ పద్యం సంస్కృతానికి మా (తి. వెం) అనువాదం. ఓంకారంలో (అ. ఉ. మ్) అకారోకారమకారాలు మాత్రమే స్థూలదృష్ట్యా శ్రుతమవుతూ వున్నాయి. మూఁడక్షరాలు ముగ్గురుమూర్తులకూ వాచకాలుగా వుపనిషత్తులు కొన్ని వ్యాఖ్యానించాయి, కొన్ని మాత్రం మూఁడక్షరాలూ కాక, పైని అర్ధమాత్రంకూడా శ్రుతమవుతూందనిన్నీ ఆ అర్ధమాత్రత్రిమూర్త్య తీతమైన శక్తికి వాచకమనిన్నీ వ్యాఖ్యానించాయి. దేవీ భాగవతం తుట్టతుది వ్యాఖ్యానాన్ని బట్టి ప్రవర్తించింది. లలితాదివ్య సహస్రనామాల్లో "అర్ధమాత్రార్థరూపిణీ" అని వుండడం దీన్నిబట్టే అనుకుంటాను. అర్ధమాత్రేమిటో, తత్స్వరూపమేమిటో ఆయి రహస్యం మహా యోగులకేగాని అనుభవంలేని పండితులకు గోచరించేటట్టు లేదు. నేను జగత్ర్పసిద్దులయిన పండితులను యీ విషయం ప్రశ్నిస్తే తేలింది కాదు. అప్పుడు యోగులకు గాని ఇది తెలియదనుకున్నాను. సరే! ఇది విషయాంతరం. అక్షరాక్షరానికీ విడcదీసి వ్యాఖ్యానించే మర్యాద వేదంనుంచి వచ్చిందేకాని, యిటీవలి కవులు కల్పించింది కాదని దీని వల్ల స్పష్టమయింది. (వొకటేమిటి? మన విజ్ఞానం సర్వమూ వేదమూలకమే) కాని, యీ మార్గం కావ్యకవిత్వంలో యెక్కడో తప్ప కవులు ఆమోదించలేదు. భారవి ప్రథమసర్గలో “తవాభిధానాత్” అన్నచోట “తశ్చ వశ్చ” అని తకారవకారాలకి ద్వంద్వ సమాసంచేసి, తార్క్ష్యవాసుకులని (నామైకదేశే నామగ్రహణం) వ్యాఖ్యానించడం అందరూ యెఱిఁగిందే. ఆ వ్యాఖ్యానం కేవలవ్యాఖ్యాత కల్పితమో, గ్రంథకర్త వుద్దేశమో? సహృదయులు గుఱితిస్తారు. కవితా సంప్రదాయంలో ఈలాటి పంథా కూడా వకటి వున్నప్పటికీ కవుల ప్రవర్తనంవల్ల దీనికి వైరళ్యం స్పష్టపడుతూ వుంది. కనక, ఇది ఋషులు సూచించినదే అయినా, కవులకు ఆదరణీయం కాకపోయిందని మనం తెలుసుకోవాలి. (వె = వెయ్యేళ్లు, ధ = ధనంతో, వ = వర్ధిల్లుము అనేది దీన్నిబట్టి పుట్టిందే) కొన్ని అక్షరాలు చేరి అయిన రామాదిశబ్దాలకే కాక, ప్రతి అక్షరానికీ కూడా అర్థం వుండడం మహాభాష్యకారులే అంగీకరించారు. (అర్థవంతో వర్ణాః యూపస్సూపః కూః) అయితే, ఆయీ భాష్యం ప్రకృతానికి అనుకూలించేదేనా? అంటారేమో, యే కొంచెమో సందర్భిస్తుందేమోగాని (ద్రావిడ ప్రాణాయామంగా అన్నమాట) నేరుగా సంబంధించదని యెఱుఁగుదును. వొక్క అక్షరాన్ని తీసి దాని స్థానంలో ఇంకో అక్షరాన్ని ఆదేశించినంతలో యెంతో మార్పు కలుగుతుందని తెల్పడానికే యీభాష్యం పుట్టింది. ఆ పక్షంలో అట్టి విలక్షణశక్తి యేకైకాక్షరమందు వుండితీరాలి కదా అని నేను ఆ భాష్యాన్ని వుదాహరించాను. భాష్యందాఁకా యెందుకు? ప్రస్తుతాంశానికి నానార్థ రత్నమాల చాలదా? ఆ నిఘంటువులో అకారాదులకు యెన్నెన్నో అర్థాలు వ్రాయడానికి ఆధారమేమి? ఋషుల పోకడలే. యెన్ని విధాలఁ జూచినా ఋషులకూ, కవులకూ పరస్పర బాంధవ్యం స్ఫురిస్తూనే వుంటుంది. భావనా శక్తి ఋషులయందు చాలాప్రబలంగా వుంటుంది. అంతో యింతో యీ శక్తి ప్రతీకవియందూ వుంటుంది. ఋషులకు వేదం ఆధారం, కవులకు ఋషులు ఆధారం, అస్మదాదులకు కాళిదాసాదులున్నూ, ఋషులూ కూడా ఆధారం. కొందఱు పద్యాలకి పద్యాలే, చరణాలకిచరణాలే పూర్వ కవులవి తమకవిత్వంలో పెట్టుకుంటారు. కొందఱు కొంచెం తలవిఱుపులతో పెట్టుకుంటారు. యివి రెండూకూడా ఆక్షేపణీయాలే. లోఁగడ అమృతబిందూపనిషత్తునుంచి "ఘృతమివపయసినిగూఢం" అనే శ్లోకంయొక్క పూర్వార్ధాన్ని మాత్రం వుదాహరించాను. వత్తరార్ధం వుదాహరిస్తాను. “సతతం మనసి మథయితవ్యం మనోమంథానభూతేన” ఇది వుపనిషత్పాఠం. దేవీభాగవతంలోనో? “సతతం మంథయితవ్యం మనసా మంథానభూతేన" అని వుంది. యింకా మఱికొన్ని యీలాటివి వున్నాయి. శ్రుతులను అనువదించే విషయంలో యత్కించిద్భేదంగానో, యథామాతృకం గానో అనువదించడం గత్యంతరాభావాత్ ఆక్షేపణీయంకాదు గాని కల్పనలు మాత్రం వొక కవిని మఱొకకవి అనువదిస్తే గ్రంథచోరుఁడు కాకపోఁడు. శ్రీనాథుని పద్యాలమాదిరిని పెద్దన్నగారి పద్యాలనడక వుండడంగాని, తిక్కన్నగారి పద్యాలమాదిరిని శ్రీనాథుని పద్యాలనడక వుండడంగాని ఆక్షేపణీయం కాదు. ఆలా అయ్యేపక్షంలో యెవఁడూ కవిత్వానికంటూ కలం చేతపట్టడానికే వీలు పడదు. ఆయినా తాత్పర్యం మనస్సులో పెట్టుకునియ్యేవే వొకమహాకవి - చ. "హృదయగతిన్ బురాతన కవీశ్వరు లేగని త్రోవ లేదు నే - తదనుగతిన్ రచించు కృతితాత్వికులన్ గరగింపకుండునే! మదగజరాజయాన మదమంథర బంధురయాన మానముల్" అని సమాధానం చెప్పాఁడు. కవిత్వం పుట్టింది మొదలు యిప్పటిదాఁకా ప్రస్తుతవిషయంలో యింత చక్కని సమాధానం యెవ్వరూ చెప్పలేదు. కేవలపట్టపగటి దొంగతనాలు కనcబడుతూనే వుంటాయి. అవే ఆక్షేపణీయాలు గాని, యేమాత్రమో పోలిక వన్నంత మాత్రంచేత ఆక్షేపణీయంకాదు. యేదేనా అలంకారం వచ్చేటట్టు యేకవేనా యేపద్యమోవ్రాస్తే, ఆ పోలిక యితర కవుల కవిత్వంలో అలా వుండఁగా అలంకార శాస్త్ర (ప్రతాపరుద్రీయాదులలో) గ్రంథాలలోనేనా వుండక తప్పదుగదా? ఆ పక్షంలో అదిమాత్రం గ్రంథచౌర్యంకిందకి రాదా! అందుచేత కవులమీఁద యీ దొంగతనాన్ని ఆపాదించేవారు చాలా పరిశీలించిగాని ఆపాదించకూడదు. నన్నయగారు "నిండుమనంబు" అనేమాట వాడివున్నారు. తిక్కన్నగారున్నూ వాడివున్నారు యీశబ్దాన్ని అంతలోనే గ్రంథచౌర్యాన్ని ఆపాదించడమా? యింతేకాదు యెఱ్ఱన్నగారు వొకచోట

'నీ యింద్రియజయము కీర్తనీయముతండ్రీ!'

అని కాఁబోలును వాడివున్నారు. యేకొంచెమో తేడాగా యీవాక్యం నన్నయ రచనలోనున్నూ చూచినట్టు జ్ఞాపకం. యిదికూడా గ్రంథ చౌర్యంగా భావించరాదు. యిదేమేనాకల్పనకి సంబంధించింది కాదుకదా! సామాన్యమైనమాట, ఆయన నోటమ్మటారావచ్చు యీయన నోటమ్మటా రావచ్చు. అంతమాత్రంచేత- "గ్రంథచోరులు గాని కవులు గారు” అని గ్రంథచౌర్యాన్ని ఆపాదించడం అవిచారమూలకంగా భావించాలి. బుద్ధి పూర్వకంగా కాకపోయినా, యెవరికి యెవరి కవిత్వమందు విశేషాదరం వుంటుందో వారికి వారికవిత్వప్పోలికలు కొంచెం కవిత్వంలో పడక మానవు. కాళిదాసంతవాఁడికే యీవిషయం అనుల్లంఘనీయంగా కనపడితే, యితరుల మాట చెప్పేదేమిటి? ప్రాచీనంగా వుండే కవుల కవిత్వాలను అనుకరించడం అనాదిగా వున్నట్టే కనపడుతుంది గాని, కొందఱు సమకాలీనుల కవిత్వాలను కూడా అనుకరించడం మాత్రమే కాదు, తలవిఱుపుళ్లు పెట్టి, ప్రచురించుకోవడం కూడా కనపడుతుంది. గ్రంథచౌర్యంకింద అలాంటి దాన్ని చేర్చవలసి వుంటుంది. ఋష్యంశ సంభూతులైన మహాకవులెవ్వరూ యీలాటి అనుచితప్పని చేయరు. నమః కవిభ్యః.


★ ★ ★