కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/సోమరిసత్రాలు

వికీసోర్స్ నుండి

సోమరిసత్రాలు

సోమరిసత్రాలు పూర్వం తంజావూరు రాజ్యంలో ఆ కాలపు రాజులు వేసినట్టు వినడం. ఆలా వేయడానిక్కారణం ఆ కాలపు రాజుగారికి యెప్పడో వకనాcడు సోమరితనం కలిగినట్టున్నూ దానివల్ల యెన్నో రాచకార్యాలు చెడిపోయినట్టున్నూ చెప్పకుంటారు.

దానితో రాజుగారికి యేం తోచిందంటే? “సరే! మనబోట్లకు సోమరితనం కలిగితే యెన్నో పనులుచెడ్డాయి. చెడ్డప్పటికీ యీ నష్టాన్ని భరించతగ్గ సామర్ధ్యంకూడా వుందికనక అంత చిక్కులేదనుకుందాం. లోకంలో యెందటో నిఱుపేద లుంటారుగదా! వాళ్లలో యెందటో సోమరులున్నూ వుంటారు. వాళ్లగతి యేమి?"టని ఆదయాళువైన ప్రభువు ఆలోచించి “అట్టివాళ్లను పోషించడం మనకు సుకృతం" అనుకొని మంత్రులతో - "సోమరిపోతులనిమిత్తం కొన్ని సత్రాలు యేర్పాటు చేయవలసిందని ఆజ్ఞాపించి నట్టున్నూ మంత్రులు రాజాజ్ఞచొప్పున అట్టి సత్రాలు యేర్పఱచి నట్టున్నూ, స్విష్టకృతుగా ఆ సత్రాల్లో భోజన సదుపాయం జరుగుతూ వుండడంవల్ల యెందటో ఆ సత్రాల్లోచేరి సుఖిస్తూ కాలక్షేపంచేస్తూ వున్నట్టున్నూ అంతట్టో కొన్నాళ్లకు ఆ రాజుగారికి తాము యేర్పాటు చేసిన సత్రాలు యేలా వున్నాయో చూడాలని బుద్ధి పుట్టినట్లున్నూ ఆలా బుద్ధిపుట్టి మంత్రులతోసహా ఆ సత్రాలను చూడడానికి వెళ్లేటప్పటికి యీ కింది విధంగా కనపడ్డట్టున్నూ చెప్పకుంటారు - యేం జరిగిందంటే? ఆ చుట్టుపట్లనే కాదు; రాజధానికి కొంతదూరంలో వున్న జనం కూడా పిల్లలతో పాపలతో ఆసత్రాల్లోచేరి తింటూవున్నారట! ఆ జనాన్ని చూచేటప్పటికి రాజుగారు పరమాశ్చర్యం కలిగి మంత్రులతో - "యేమీ? మనరాజ్యంలో యింతమంది సోమరిపోతులున్నారా?” అని మంత్రులను అడిగేటప్పటికి ఆ మంత్రులలో వక బుద్ధిశాలి – “అయ్యా! వీళ్లందఱున్నూ నిజమైన సోమరిపోతులుగారు. యిందులో పరీక్షకి నిల్చేవాళ్లు ಏಟ್ಟು మంటే నూటికి వకరో యిద్దతో వుంటారేమో?" అని జవాబు చెప్పాండంట! రాజుగారు ఆ మాట విని “వీళ్లని పరీక్షించటం యేలాగ?” అని ప్రశ్నించారట. సెలవైతే క్షణంలో నేను పరీక్షించి నిజమైన సోమరిపోతులెవరో తేలుస్తానన్నాట్ట! రాజుగారు కానిమ్మన్నారంట! అప్పడు మంత్రి - యీ రీతిగా దండోరా వేయించాట్ట, యేమనంటే? “యింక వొక్క గంటలో యీ సత్రాలన్నీ తగలఁబెట్టం బడతాయి కనక మీరంతా వెంటనే వెళ్లిపోవలసిందోహో" అని ముమ్మాటికీ చాటింపు చేయించేటప్పటికి అది వినీవినడంతోటట్టుగానే డబ్బాడవాలీ, చెంబూ చేంతాడు చేతcబుచ్చుకొని పిల్లా జెల్లాతో నూటికి తొంభైతొమ్మండుగురు ఆ పాకలు వదలిపెట్టి వెళ్లారఁట! కాని తక్కినవాళ్లు కొందఱు ఆలాగే వుండిపోయారఁట! యేర్పఱిచిన కాలానికి సరీగా ఆ పాకలు అంటించారఁట! అంటించాక మంట కనపడ్డాక కొందఱు లేచి వెళ్లారఁట! మఱికొందఱు యింకా మనమున్న చోటికి మంటరాలేదంటూ కదలకుండా పేకో, చదరంగమో, పులిజూదమో ఆడుకుంటూ అలాగే నిలిచిపోయారఁట! కొందరు సోమరిపోతులు నిద్రపోతూ లేవనేలేదఁట! అప్పడు మంత్రి నిష్కారణంగా చచ్చిపోతారని భయపడి వాళ్లను బలవంతంగా రాజుగారి నౌకర్లచేత యీవలికి లాగించి – “అయ్యా! నిజమైన సోమరిపోతులంటే వీళ్లుమాత్రమే" అని చెప్పేటప్పటికి రాజుగారు వీళ్లకు యావజ్జీవమున్నూ అన్నవస్త్రాలు జరిగేటట్టు సత్రాలు వేయించడం మనకు విధి అని అలా వేయించారంటూ యెవరో చెప్పఁగా యెప్పడో విన్నాను. బహుశః ఆసత్రాలే కొంతమార్పుతో యిప్పటికిన్నీ జరుగుతూ వున్నాయనుకుంటాను. కాని ప్రస్తుతం జరిగే సత్రాలు తిరువాన్‌కూరు రాజ్యంలోవి. ఆ సత్రాలకు పేరు తంజావూరు సత్రాలు అని వినఁబడుతుంది. ఆకాలంనాటికి తంజావూరున్నూ తిరువాన్కూరున్నూ వకటే రాజ్యంగా వుండేవోయేమో? చరిత్రజ్ఞులకుఁగాని బాగా తెలియదు. యిప్పుడుకూడా ఆ సత్రాల్లో సామాన్య కుటుంబాలవారి మాటలావుండఁగా 60 రూపాయలకు లోపు జీతంగల. వుద్యోగులు కూడా వచ్చి సకుటుంబంగా భోంచేసి వెళ్లడమే ఆచారమని చెప్పుకోఁగా విన్నాను. అంతో యింతో దక్షిణాది వాసనవున్న వేంకటగిరిలో వున్న సత్రంలో ఆవీథివాళ్లొకనాఁడూ యీ వీథి వాళ్లొకనాఁడూగా గ్రామస్థులే తినడం నేను చూచి వున్నాను. కాశీలో యిప్పడెలావుందో చెప్పలేనుగాని ఆ యీ మహారాజులున్నూ మటికొందఱు సంపన్న గృహస్థులు కోటీశ్వరులున్నూ వేయించిన సత్రాల్లో వకపూఁట నిరాఘాటంగా భోజనం దొరకడం నేను స్వయంగానే యెఱుఁగుదును. కొన్ని సత్రాలల్లో “యింతమందికి మాత్రమే" అనే నియమం వుంది గాని కొన్నిటిలో ఆనియమంలేనేలేదు. ఆలాటి నియమంలేని సత్రాలల్లో వకటి అన్నపూర్ణసత్రం. దీన్ని మహారాష్ట్ర ప్రభువు శ్రీమంతుడు వేయించినట్టు చెపుతారు, యిది పన్నెండు గంటలవేళ అన్నం పెట్టే సత్రం. రెండు గంటలప్రాంతంలో యిదేమాదిరిగా “సర్వమోకళా"గా పెట్టే సత్రం సింధ్యా సత్రం. రామనాథపురం మహారాజా సత్రం ఉదయం యెనిమిదీ తొమ్మిదీ మధ్యనే పెట్టేది. రాత్రిమాత్రం యేసత్రంలోనూ అన్నంపెట్టరు. ఆయీ సత్రాలుండఁబట్టే కాశీలో యితరదేశపు విద్యార్థులకు వకపూఁటేనా అన్నం దొరకడం వుంది కనక విద్యాభ్యాసం అనాదిగా జరుగుతూ వచ్చింది. ఆంధ్ర ద్రవిడ కర్ణాట విద్యార్థులకు రాత్రికూడా మారోజుల్లో అన్నసదుపాయం వుండేది. యిప్పుడు ఆలాటి సదుపాయాలన్నీ క్రమంగా అంతరించినట్టు చెప్పకుంటారు. సోమరిపోతు సత్రాలను గుఱించిన యితిహాసం నిజంగా జరిగేవుందో! లేక పుక్కిటి పురాణాల్లోనే చేరుతుందో నిశ్చయించడానికైతే అంతగా ఆధారంలేదుగాని లోకంలో నిరతాన్నదానం చేసేవారి యిళ్లను "తంజావూరి సత్రం" అంటూ చెప్పడం యిప్పటికిన్నీ వినబడడంచేత యిందులో కొంత కల్పనవున్నప్పటికీ కొంతేనా యథార్థం వుండకపోదని నానమ్మకం. నిజమైన సోమరులెవరో తేల్చడాన్ని గూర్చిన యితిహాసంవంటిదే నిజంగా సంగీతం విని ఆనందించడం యెట్టిదో, వూరికే తల తిప్పడం యేలాటిదో, తేల్చడానికిక్కూడా వకకథ చెప్పుకుంటారు. పనిలో పనిదాన్ని కూడా వుదహరిస్తాను. యెవరేనాసంగీతం పాడేమగవాళ్లుగాని, ఆఁడవాళ్లుగాని సభలో పాడుతూవుంటే చాలామంది ఆ పాటలోవున్న సారం బాగా తమకు తెలిసినట్టు తల వూఁపుతూ ఆ సమీపంలో కూర్చోవడంకలదు. సోమరుల విషయంలో తంజావూరు మహారాజుక్కలిగినట్టే యీ తలత్రిప్పేవారిని గూర్చి యే మహారాజుకో సంశయము కలిగి మంత్రిని ప్రశ్నించేటప్పటికి మంత్రి వకవుపాయం చేసినట్టు చెప్పుకోవడం. ఆవుపాయం యేలాటిదంటే?...

“అయ్యా! యీవేళ సంగీతసభలో యెవరున్నూతలతిప్పఁగూడదు. నిశ్చలంగా వింటే అభ్యంతరంలేదు. తలతిప్పేయెడల వారిపేళ్లు నోటుచేసుకొని తరువాత వారిని టుపాకితో కాల్చివేయడం జరుగుతుంది. కాఁబట్టి జాగర్తా!” అని ముందు చెప్పి సంగీతకచేరీ జరిగించారఁట! యిదివఱలో తలతిప్పేవారిలో నూటికి తొంభైతొమ్మండుగురు అసలు ఆ సభకు రానేలేదఁట! వచ్చిన వాళ్లల్లోకూడా అందఱూనిర్జీవ ప్రతిమలలాగే కూర్చున్నారఁట! కాని యేకొందఱో అప్పుడుకూడా తలతిప్పడంమానలేదఁట! ప్రాణం పోతుందనే భయాన్నికూడా మఱచిపోయి సహజంగా కలిగే ఆనందాన్ని వెలిపుచ్చడంవల్ల నిజంగా సంగీతరసం తెలిసినవాళ్లు వీళ్లే అనిన్నీ తక్కినవాళ్లు- “గతానుగతికో లోకోనలోకః పారమార్థికః" అనే తెగలో వాళ్లే కాని నిజంగా గానం తెలిసినవాళ్లు కారనిన్నీ నిశ్చయించుకొన్నారఁట! ప్రతివిద్యలోనూకూడా అనుకరించేజనం చాలా వుంటుంది. తత్త్వం తెలిసినవాళ్లు మిక్కిలీ తక్కువగానే వుంటారు. యీ అనుకరణాన్ని గూర్చికూడా వక యితిహాసం మఱోవిషయంలో పెద్దలవల్ల విన్నాను. దాన్నికూడా సంగ్రహంగా వ్రాస్తాను. వక బ్రాహ్మఁడు యేదో పుణ్యకాలంలో యేనదికో స్నానానికి వెళ్లాఁడఁట! స్నానం చేయడానికి నదిలోకిదిగి వచ్చేలోపున తనజారీచెంబు యొవళ్లేనా తస్కరిస్తారేమో? అనే అనుమానంచేత ఆ వొడ్డుమీఁద వుండే యిసుక పోగుచేసి వకలింగాకారంగా తనజారీ లోపలభద్రపఱిచి యేర్పఱచి స్నానానికి నదిలోకిదిగి యథాశాస్త్రంగా యావత్తున్ను నెరవేర్చుకొని వొడ్డుమీఁదకువచ్చి చూచేటప్పటికి యెక్కడ చూచినా లింగాలే కనబడ్డాయఁట! కారణమేమిటంటే? యీయన విద్వాంసుఁడయి వుండడంచేత లింగంచేసి స్నానానికి దిగడాన్ని బట్టి యీ పుణ్యకాలంలో యీలాచేయడం విధికాcబోలు ననుకొని మఱికొందఱుకూడా లింగాకారాలు నిర్మించడానికి ఆరంభించేటప్పటికి, వారిని చూచివారూ, వారినిచూచి మఱికొందఱూ లింగాలు నిర్మించేటప్పటికి మొట్టమొదట ఆయన చేసిన లింగమేదో తెలియకపోవడంచేత ఆబ్రాహ్మఁడు యీ కింది శ్లోకం చెప్పినట్టు వినడం...

శ్లో. గతానుగతికో లోకో నలోకః పారమార్థికః
    గోదామహానదీతీరే నష్టం మే తామ్రభాజనమ్. ”*[1]

దీని తాత్పర్యం, “యెవఁడేనా యేపనేనాచేస్తే వాఁడు ఆపని యెందుకు చేశాఁడో ఆలోచించకుండా తానుకూడా ఆపనిని చేయడమేకాని యథార్థవిచారణ చేయడం లోకంలో కనపడదు. అందుచేత నిక్షేపంవంటి నారాగిచెంబు లేక జారీ వృథాగా పోయింది" అనిదీనికి సంబంధించిందే యింకో యితిహాసం వుంది. వక బ్రాహ్మఁడు యింటివద్ద భార్య ప్రతీరోజున్నూ పెసరపప్పే వండి తిండి పెడుతూవుంటే విసుగుపుట్టి పొరుగూరికి వెడితే ఆవూళ్లోకూడా ‘దై వాద్వా" ఆ రోజున పెసరపప్పే వండటం తటస్థించింది దేవతార్చన చేసుకొని సంచిలోకట్టి ఆపట్లాన్ని ఆ బ్రాహ్మణుఁడు వడ్డించిన ఆ విస్తరంటకు మూడు ప్రదక్షిణాలుచేసి భోజనానికి కూర్చునేటప్పటికి ఆయన పంక్తినివున్న మఱికొందఱు బ్రాహ్మలుకూడా అదేరీతిని ప్రదక్షిణాలకు ఆరంభించారఁట! అదిచూచి ఆబ్రాహ్మడు యేమండీ? మీయిళ్లల్లోకూడా ప్రతిరోజున్నూ పెసరపప్పేనా? యేమిటి? అని ప్రశ్నించేటప్పటికి ఆబ్రాహ్మలందఱూ వెలవెల పోయారఁట! ఇంకా యీవిషయమై యీలాటి కథలు మఱికొన్ని వున్నాయి. యింకోటిమాత్రం వుదహరించి యీవ్యాసాన్ని ముగిస్తాను. అప్పయ్య దీక్షితులవారు వకరోజున నదీతీరంలో సంధ్యావందనం చేసుకుంటూ వుండఁగా దైవవశాత్తూ కచ్చ జాఱిపోయిందఁట! గతా౽నుగతికులుగా వుండే మఱికొంతమంది బ్రాహ్మణులుకూడా కచ్చవూడcదీసికొని సంధ్యావందనానికి ఆరంభించారఁట! అన్నీ నిజమైనవిగా వుండవుగాని యీలాటి కథలలో యేకొన్నో నిజమైనవికూడా వుంటాయి. “మహాజనో యేన గతస్స పంథాః" అనడంచేత సామాన్యులు గొప్పవారి ఆచారాన్ని చట్టన అనుకరించడంతఱుచు అనుభూతం. అందుచేతే ఆచార్యపురుషులుగా వుండేవారు తమ వర్తనాన్ని చాలాభద్రంగా కాపాడుకుంటూ వుండాలని పెద్దలు చెపుతారు. యీవిషయము శ్రీకృష్ణభగవానులు గీతలలో వ్యాఖ్యానించే వున్నారు. మనం, ప్రస్తుతం ఆరంభించింది సోమరిసత్రాలను గుఱించి. వకదానిలోనుంచి యింకోదానిలోకిన్నీ యింకోదానిలోనుంచి మఱోదానిలోకిన్నీ ప్రసక్తిసంక్రమించింది. పూర్వకాలంలో సోమరిపోతులనుకూడా పోషించేరాజులుండేవారన్నమాట. యిప్పడు మాత్రం అన్ని రాజ్యాల్లోనూ ఈ సోమరిపోతుతనాన్ని పూర్తిగా నశింపచేయడానికి యత్నం జరుగుతూవుంది. బీదలలో యెవళ్లో కాని సోమరులుగా వుండనే వుండరు. యిప్పుడు చేసేయత్నం ధనికులు కూడా సోమరులుగా వుండకుండావుండడానికే. రష్యాలో యీ ప్రయత్నం నెగ్గినట్టుచెప్పుకుంటారు. కొందఱేమో ఆదేశంలో అవలంబించిన సామ్యవాదంలోకూడా కొన్ని అతివ్యాప్త్యవ్యాప్తులు వచ్చి మళ్లా మఱోమాదిరిగామార్చాలనే అభిప్రాయంకలుగుతూ వున్నట్టు చెప్పుకుంటారు. అందఱినీ సమానంగా వుంచడం భగవంతుని వుద్దేశమే అయితే కొందఱి నాలాగా కొందఱినీలాగా సృష్టిచేయడమే తటస్థింపదేమో? దీన్నిబట్టి భగవదుద్దేశం యిందుకు అన్యథా వుందనుకోవాలి- "నానాగతి విధికృత సృష్టియందకనపడునుగదా!" మన పండితులందఱూ యీసిద్ధాంతానికి కట్టుపడేవారే. పాశ్చాత్యులో- “యత్నే కృతే యది న సిద్ధ్యతి కోஉ త్రదోషః" అనే పంథలో వారు-భగవంతుఁడున్నాఁడని వప్పుకుంటారుగాని వారివుద్దేశ్యాని క్కూడా భిన్నంగా పనిచేసి నెగ్గఁగల మనో ధైర్యం కలిగివుంటారు. మనవారో? యీ విషయంలో యేకారణంచేతైతేయేమి పూర్తిగా సోమరితనాన్నే కనపఱుస్తారు

శ్లో. "కనకశిబికారూఢాః ప్రౌఢాధిరాజ్యపదేస్థితాః
      కతిచిదతులంమన్యా ధన్యాశ్చరంతి య దిందిరే!
      యదపిచవహం త్యేతాన్ దీనాన్పరే ఫల మంబ! త
      ద్ద్వయమపి తన స్తోకా లోకాన్వయవ్యతిరేకయో"

యీశ్లోకముఖ్యతాత్పర్యం లోకంలో కొందఱు పల్లకీ యెక్కడానికిగాని మఱికొందఱు ఆ పల్లకీ మోయడానికిఁగాని భగవత్కటాక్షం వుండడమున్నూ లేకపోవడమున్నూ కారణం గాని స్వప్రయోజకత్వాప్రయోజకత్వాలు లేశమున్నూ కారణంగావు అని ప్రాజ్ఞులో? అప్రాజ్ఞులో? మన పూర్వులు అందఱూ యేకవాక్యతగా పై సిద్ధాంతాన్ని ఆమోదిస్తారు. కొందఱికి భగవత్కటాక్షం వుండి కొందఱికి వుండకపోయే పద్ధతిని దయామయుఁడైన భగవంతుఁడికి వృథాగా పక్షపాతదోషం తగులుతూవుందనీ ఆదోషనివారణకోసం వాళ్లువాళ్లు చేసుకున్న పుణ్యపాపకర్మలనుబట్టి భగవదనుగ్రహం వుండడమూ, వుండక పోవడమూ కలుగుతుందన్నారు. దీనిమీcదకూడా శంకలయితే లేకపోలేదుగాని వున్నా యింకోమార్గం కంటె యీమార్గం కొంత కట్టుదిట్టంగా కనబడుతుంది. ధనధాన్యాల విషయంలో సామ్యవాదపరులు అందఱినిన్నీ యేకరీతికి తేఁగలుగుతారేమో కాని తెల్వితేటలలో, అందచందాలలో, బలాబలాలలో యింకా యెన్నిటిలోనో తేలేరని వ్రాయనక్కఱలేదు. యిది విషయాంతరం. సోమరిపోతులకు సత్రాలుపెట్టి సోమరితనాన్ని వృద్ధిపఱచిన నిర్వ్యాజ కరుణాశాలులకన్నదాన్ని నశింపఁజేయడానికి ప్రయత్నించేవారిని సర్వథా అభినందించడం యుక్తమే అని చెపుతూ దీన్ని ముగిస్తాను.


★ ★ ★

  1. *యీ శ్లోకంలో "ఏలామహానదీ" అనేపాఠం నేను విన్నాను. ఏలానది మహానదికాదని “గోదా" అని దిద్దినట్లు చదువరులు గమనించాలి.