కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/కళలను ప్రదర్శించే స్రీలు స్వతంత్రలుగా ఉండాలి

వికీసోర్స్ నుండి



కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రలుగా వుండాలి

“వేలంవెఱ్ఱిగా" యీ యిరవయ్యోశతాబ్దంలో ఆయా జాతులు తమతమ జాత్యౌన్నత్యాన్ని గూర్చి మిక్కిలిగా కృషి చేస్తూవున్నాయి. ఆ కృషికి కొందఱికి యే అభ్యంతరాలున్నూ లేవుగాని కొందఱికి కులవృత్తులకు సంబంధించిన స్థిరరూపకమైన ఆస్తులు అడ్డుతగలడమంటూ వకచిక్కు యేర్పడింది.

దాన్ని యేదో విధంగా తొలగించడానికి కొంత ప్రయత్నించడం జరిగింది. అలా జరగడానిక్కారణం అది నోరులేని దేవుఁడికి సంబంధించిన దగుటచేతనున్నూ ఆ దేవుణ్ణి నమ్మివుండే ప్రాచీనాచారపరాయణులు నోరున్న వాళ్లైనా వాళ్లకు సంఘబలం లేకపోవుటచేతనున్నూ ప్రస్తుత స్థితిగతులనుబట్టే కాక యీ యుగమందు “సంఘీశక్తిఃకలౌ యుగే" అను అభియుక్తోక్తి ప్రకారము నడుస్తూవుండడం చేతనున్నూ ప్రతీ వ్యక్తికీ పూర్వులన్నా వారికట్టుఁబాట్లన్నా బొత్తిగా నిస్సాకారంగా చూడడం సామాన్యమై పోయింది. పూర్వం వర్ణాశ్రమాచారాలకూ, ప్రభుత్వానికీ సంబంధంవున్నట్టు యిప్పడు లేదుకదా! దానికితోడు పత్రికలన్నీ వారి అభిప్రాయాన్నే పురస్కరించి యేవ్యక్తి యేవ్యక్తిని యెంత తూలనాడినా అది పూర్వులకు సంబంధించిందైతే సమ్మతించి ప్రచురించడమున్నూ, నవీనులకు సంబంధించిందైతే దాన్ని “బుట్టదాఖలు” చేయడమున్నూ తటస్థించింది. పూర్వుల అభిప్రాయాలను ఆమోదించే పత్రికలంటూ లేనేలేవు. వుంటే అవి తగ్గంత ప్రచారం కలవిగాలేవు. అదిన్నీకాక పూర్వాచారపరాయణు లందఱూ వారి కర్మాన్ననుసరించి వారు వర్తిద్దామనే వారే కాని యితరుల వాదాలతో ప్రసక్తి పెట్టుకోవడానికి అంగీకరించే వారుగా లేరు. యెవరో యేవో కొంచెంగా వ్రాస్తూ వుంటారే అని కొందఱనవచ్చును. ఆ వ్రాసేవారు.సామాన్యులుకాని పెద్ద పెద్దలు కారు. వారు అదృష్టవశంచేత రంగస్థలంలోకి అవతరించడం లేదు గాని అవతరించడమంటూ వస్తే వారి మాటలు యెవరిదాcకానో యెందుకు? వారి వారి సంతానంకూడా యీ రోజుల్లో ఆదరించే స్థితిలోలేదు. అందుకే వారు వూరుకున్నారుగాని చేతకాక కాదు. శ్రీ కాశీ కృష్ణాచార్యులుగారు మొదలైనవారు కొంతవఱకు యేదో విషయంలో కలిగించుకున్నవారున్నారు. వారి ధర్మోపదేశానికి తగినంత సహాయం కలిగినట్లు కనిపించదు. యిప్పుడల్లా “పూర్వాచారాలు దుష్టాలు. ఆకట్టుఁబాట్లను యేర్పఱచిన ఋషులు మూర్ఖులు" అనేతోవలో వాక్కునుగాని, లేఖినినిగాని నడిపిస్తే దానికి యెంతవిలువవుండాలో అంతవిలువా వుంటుంది. నవీనమార్గాలనుగూర్చి యేమాత్రం కాదన్నా వాఁడిమీదికి లేచి యేంచేసినా ప్రపంచకం చేసిందన్న మాటే! యీ స్థితంతా తెలిసివుండీ కూడా దేవతోద్దేశకంగా సేవ నిమిత్తం పూర్వపు మహారాజులు వగైరా పరలోకంలో వుత్తమ గతి సంపాదించుకొనే వుద్దేశంతో యిచ్చిన మాన్యాలు వృథాగా పోవడాన్ని గురించి పూర్వ గ్రంథానుసారంగా యేవో కొన్ని మాటలు నేను వ్రాసివున్నాను. అవేనా నాఅంతట నేను వ్రాయలేదు; కొందఱు యోగ్యులు వ్రాయవలసిందిగా కోరితే నే వ్రాశాను. ఆ వ్రాయమన్న వారిపేళ్లు యిందుదాహరిస్తే యిప్పుడు నన్ను దూషించిన మహావ్యక్తి వారిని కూడా దూషించడానికి వెనుతీయడు కనక వుదాహరించలేదు. యిప్పుడు వారువారు తొక్కేమార్గాలు యెంత వఱకు నెగ్గుతాయోకాని, ప్రస్తుతం యెందఱికో యెన్నో విధాల నష్టాన్ని కలిగిస్తూవున్నాయి. వకటి వుటంకిస్తాను.

సుమారు యిరవైయైదేళ్లనాఁడు శృంగారగ్రంథాలు బహిష్కరించవలసిందని వొకరు కొందఱి సహాయంతో గవర్నమెంటులో రూలొకటి పుట్టించారు. అది యెందఱికో యెన్నో విధాల బాధించింది. తుదకవి నిషేధించబడ్డాయేమో అంటే అన్నీ అమ్ముతూనేవున్నారు. యెవళ్లోభయస్టులు మాత్రం ఆ నష్టిని అనుభవిస్తూ వున్నారు. యిప్పుడు మళ్లా ఆ నిషేధం తొలంగించడానికి పెద్దపెద్దలు ప్రయత్నిస్తూ వున్నారు. ఫలితం యేమవుతుందో? తెలియదు. మొదట ఆ ప్రయత్నం యెందుకు? ఇప్పుడు యీ ప్రయత్నం యెందుకు? శారదాబిల్లంటూ వకటి పుట్టించారు. అది పట్టినపిమ్మట బాల్యవివాహాలు మఱీ చెలరేగుతూ వున్నాయి. ఆలాగని యే పిచ్చి బ్రాహ్మఁడేనా తప్పులేదు కాఁబోలు నని బాల్యవివాహం చేశాఁడా యే సంఘసంస్కర్తలో కాస్త కలిగించుకుంటారు. వాఁడి హవిష్యమూ, భవిష్యమూ తీసిపాఱవేస్తారు. దేవదాస్యానికి ఏర్పడ్డ మాన్యాలేమో బిల్లు ద్వారా క్షణంలో అంతరించాయి. యెందుకోసం యీఅంతరించడం కావలసివచ్చిందో ఆకార్యం ఏమాత్రమూ కొనసాఁగినట్టు లేదు! పోయినట్టు లేదంటావు గదా! ఋజువుచేస్తావా? అని ప్రశ్నవస్తుంది. అది యెవడి శక్యం? ప్రభుత్వంవారికి జాతిమత భేదంతో అవసరం లేదనే రహస్యం యెప్పుడైతే ప్రపంచానికి సర్వేసర్వత్ర గోచరించిందో అప్పుడు యేదో సంఘ మంటూ పేరుతో బయలుదేఱి వారివారికోరికలను తీర్చుకోవడానికి ప్రపంచం ప్రయత్నిస్తూ వున్నట్టు తోస్తుంది. నాట్యకళకోసం దేవదాసీ లనిమాత్రమే అక్కఱలేదు. మరివకళ్లయినాసరే స్వతంత్రం కలవాళ్లుండాలని నేను వ్రాస్తే వొకావిడ నన్ను ఎన్నో ఆడిపోసింది. దానిలో బోలెఁడు శ్లేషలు! స్వాతంత్ర్యం స్త్రీలకి సర్వేసర్వత్ర వుండాలని మళ్లా యెందఱో యెన్నో వ్యాసాలు వ్రాస్తూవున్నారు. నేను నాట్యాభినయాలు వినియోగించేవాళ్లకి మాత్రమే కదా! స్వాతంత్ర్యం వుండాలన్నది. అట్టి స్వాతంత్ర్యం యిష్టం లేనివాళ్లు ఆ కళలు వదలుకోరాదా? వదలుకోవడమంటే పూర్తిగా కాదు: మహాసభలలో వినియోగించడం మట్టుకే. యింతకూ ఈ విద్య స్త్రీలమీఁద ఆధారపడి వుండఁదగ్గది కానేకాదనికూడా ఆవిడ అభిప్రాయమేమో? పోనీ తోఁచినమాటలు వ్రాసి వూరుకుంటే బాగుండును; వుల్లికుట్టు మాటలతో దూషించింది. వ్యక్తిగతంగా చేసిన దూషణవల్ల ప్రధాన విషయం గట్టెక్కుతుందా? గాంధీమహాత్ముని మాటకన్నా పాటించతగ్గ మాటంటూ వుంటుందా? ఆయన దేవాలయంలో హరిజనులను ప్రవేశపెట్టాలన్నారు. అందఱూ అంటే పూర్వాచార పరాయణులే అందాం అంగీకరించారా? యిఁక ముందేనా అంగీకరిస్తారా? పైఁగా వ్యభిచారాన్ని రూపుమాపడానికి మేం ప్రయత్నం చేస్తూ ఉంటే యీ శాస్త్రుల్లు దాన్ని వృద్ధిపొందించడానికి దోహదం చేస్తున్నాఁడనిన్నీ వక అపాండవం వేయడానికి ప్రతీవాఁడున్నూ భయపడి తీరవలసిందేకదా? ప్రస్తుత విషయంలో, అందుచేత నోరుమూసుకు వూరుకోవడంకన్నకర్తవ్యం కనపడదు. ఆ వ్యభిచారాన్ని దోహదం చేయడానికి యీయనకేదో స్వార్థం అందులో వుందంటూ వక అపాండవమా? భవతు, దానికిన్నీ వప్పకుందాం, "జగమెఱిఁగిన బ్రాహ్మఁడికి" వచ్చే చిక్కేమిటి? కాటికి కాళ్లుచాచుకొన్న రోజుల్లో ఆ స్వార్థాన్ని పురస్కరించుకొని వ్రాయవలసిన అగత్య మేముంటుందో విచారించవలసిందని బుద్ధిమంతుల నడుగుతాను. "వయసి గతే కః కామవికారః" యీలాటి అపాండవం ఆరోపించినంతమాత్రంలో పూర్వుల అభిప్రాయాల యందు నాకు వున్న నమ్మకాన్ని వదలుకొని నేను నవీనాచారాలకు దాసోహమంటానా? సర్వే సర్వత్ర సద్వృత్తిలో లేక దుర్వృత్తిలోనే వుంచుదామని, లేక యేదేనా వక శాస్త్రీయమైన మతమందు వుంచుదామని యెవరేనా ప్రయత్నించి కృతకృత్యులైనారా? అయితే యిన్ని మతా లెందుకుండవలసి వచ్చింది? బుద్ధుఁడు ప్రాణిహింసను మాన్పవలెనని చేసిన ప్రయత్నంకంటే యెవరే ఘనకార్యాన్ని నిర్వహించడానికి పాటుపడ్డారు? దాని ఫలితం రవ్వంతేనా కనపడుతూ వుందా? చైనా జపాను వగయిరాలన్నీ బుద్ధమతంలో చేరినవే కదా! అతఁడు దేవుఁడులేఁడని చెప్పింది మాత్రం వారందఱూ అమల్లోవుంచి ఆదరిస్తూ వున్నారు. హింస చేయకూడదన్నది అప్పుడే దులిపేసి “సెనగలు తిని చేతులు కడుక్కున్నారు" ప్రస్తుత విషయంకూడా అంతే. అయ్యో ఆజాతివారు నేఁటికి కన్నుతెఱిచి దుర్వృత్తిని వదులుకోవాలనుకుంటూ వుంటే దిక్కుమాలిన దేవస్థానం నౌకరీ మాన్యాలు వచ్చి అడ్డుతగులుతూ వున్నాయని దయతలఁచి ఆ పీడకాస్తా తొలగించారు సమర్డులు, దానితో పూర్వదాతల నెత్తి కొట్టినట్టయింది. తక్కిన విషయాన్ని అడిగేదిక్కేదీ? అడిగితేమాత్రం "యిందులో నీకేదో స్వార్ధంవుం” దంటూ వ్రాయడానికి చేతకాదా? భవతు. యేదేనా ఘనకార్యం చేయవలసివస్తే కొంత స్వార్ధత్యాగం అవసరం కదా! అట్టి సందర్భంలో యీ దేవదాసీలు ఆమాన్యాలను కూడా వదలుకొని వుత్తమశీలాన్ని అలవఱచుకోవడానికి యేల ప్రయత్నించరాదు? ఆ మాన్యాలేమో అనుభవించాలీ? ఆ దేవతా సాన్నిధ్య నవుకరీమాత్రం వదులుకోవాలీ? యిది మాత్రం యుక్తిసహంగావుందా? పోనీయండి యీ నాట్యకళ సంసారి స్త్రీలకుకూడా వుపాదేయమే అయినట్టు యిప్పటి సంస్కర్తలు కొందఱు అభిప్రాయపడుతూవున్నారు. అలాటి వ్యాసంకూడా నిన్న మొన్న వకటి చూచాను. ఆ పద్ధతిని సంసారిణులుగా మాఱి కూడా దేవదాసీలు దేవ ద్రోహం లేకుండా ఆ దాస్యాన్ని నిర్వర్తించుకోవచ్చునే! దేవతాదాస్యం పాపకృత్య మనే తాత్పర్యంతో కాదు గదా యీ “మూమెంటు" ప్రారంభించింది? యెన్నో సందర్భాలు నావ్యాసంలో చర్చించే వున్నాను. మళ్లా యిక్కడ చర్వితచర్వణం చేయనక్కఱలేదు. నాట్యకళ పురుషులు కూడా నేర్చినా స్త్రీవేషం ధరించినప్పుడు తప్ప పురుష స్వరూపంతో దానికంతగా శోభరాదు. పురుషుఁడుగానే వుండిచేసే అభినయ విషయం చాల తక్కువ. సాంబమూర్తి యేస్వరూపంతో నటించినా అది వకరిని సంతోష పెట్టడానికి కాదు. దాన్ని చూచినదల్లావక్క పరశక్తి మాత్రమే. నాట్యకళ వినయ విధేయతలతో సిగ్గు బిడియములతో భయభక్తులతో కొన్ని కట్టుఁబాట్లతో వున్న స్త్రీలవల్ల ప్రదర్శింపఁ దగ్గదని యెవ్వరున్నూ చెప్పరు. యిప్పుడు మాత్రం చెప్పేవారు లేకపోలేదు. వారికి పదివేల నమస్కారాలు. అట్టి స్త్రీలు యేజాతిలోనుండి బయలుదేఱినాసరే, స్వతంత్రంగా వుండcదగ్గవారే కాని అన్యథాగా వుండఁదగ్గవా రెన్నఁటికీకారు. “నస్త్రీస్వాతంత్ర్యమర్హతి" అని వ్రాసిన మనువు మూర్ఖఁడని అనేవారు యిప్పటిసాహసులలో కొందఱున్నా అస్మదాదుదలకు అంతటి సాహసంలేదు. స్త్రీ స్వాతంత్ర్యం గృహమందే తప్ప సభల కెక్కడానికి యేమనిషిన్నీ తుదకు యుక్తాయుక్త పరిశీలనగల యే ప్రాచీనాచార పరాయణుఁడైన మనిషిన్నీ అంగీకరించఁడు. గృహమందుకూడా స్త్రీ స్వాతంత్ర్యం యేవో కొన్ని సందర్భాలయందు మాత్రమే - “స్త్రీపుంవచ్చ ప్రచలతి గృహేతస్య గేహం వినష్టమ్" అన్న కాళిదాసు అప్రాజ్ఞుఁడని పూర్వ సాంప్రదాయవేత్తలు చెప్పలేరు. యిప్పటి సంస్కర్తలు తొక్కేతోవలు దేవుఁడంటూ వకఁడున్నాఁడనే నమ్మికతో తొక్కేవికావు. పాశ్చాత్య బుద్ధిమంతులు ప్రకృతిశాస్త్రం యెంత చదివి వశం చేసుకొని దానివల్ల యెన్ని అద్భుతకార్యాలు లోకానికి కనపఱచి, లోకాన్ని భ్రమింపఁజేసినా అవి అన్నీ క్షణికంగా వుండే యీజీవితకాలానికి సంబంధించినవేకాని కళ్లుమూసుకున్న పిమ్మట పనికి వచ్చేవికావు. స్త్రీకిఁగాని, పురుషునకుఁగాని పరమంటూ వకటివుందనే నమ్మికలేనప్పుడే యథేష్ట సంచారం అర్హమవుతుందిగాని అది వుంటే అర్హం కాదని చెప్పనక్కఱలేదు. విషయం విషయాంతరంలోకి దూఁకుతూ వుంది. చెప్పొచ్చేదేమిటంటే? నాట్యాభినయాలు కుల స్త్రీల కర్ణంగావు. యెందుచేత? సలజ్జాగణికా నష్టా నిర్లజ్జేవ కులాంగనా' అని కట్టుఁబాటులో వుండే వాళ్లవల్ల ప్రదర్శింపవలసిన వెన్నఁటికీ కాకపోవడంచేతనే అందుకోసం స్వేచ్ఛా ప్రచారంగల స్త్రీకోసం అవి పుట్టినట్టయింది - లేదా వాట్లకోసం అట్టి స్త్రీలేనా పుట్టినట్టనుకోవాలి. అట్టి జాతి యిదివరలో అనాదిగా అంటే పురాణాలెప్పుడు పుట్టాయో అప్పటికింకా పూర్వాన్నుంచే వకటి యేర్పాటయింది. ఆ జాతికి యిప్పుడు యితర కారణాలవల్ల ఆ విద్య వదులుకోవాలని అభిప్రాయం ప్రాయికంగా కలిగింది. వదులుకోవడానికి పూర్వకాలంలో అయితే రాజకీయ ప్రతిబంధం వుండవలసివచ్చేదేమో కాని యిప్పుడట్టి ప్రతిబంధం లేశమున్నూలేదు. ఆ వదులుకొనే వారిని సంస్కర్తలతోపాటు నేనుకూడా అభినందించేవాణ్ణే. కాని దేవతోద్దేశకంగా మహా పుణ్యాత్ములైన దాతలు పూర్వం తమకు ప్రసాదించిన మాన్యాలతోకూడా వదులుకోవలసిందంటాను. ఆ మాన్యాలు గత కళంకాన్ని జ్ఞప్తికి తెస్తాయనేనా భయపడడం యుక్తం. మాన్యాలేమో అనుభవించడమా? నౌకరీ వదులుకోవడమా? శాంతం పాపం! యీరీతికి అర్చకులుకూడా వస్తేగతేమిటి? దేవుఁడు రాయేకదా! దేవుఁడికి గతెవ్వరు? పండితులేగదా!

శ్లో, "ఐశ్వర్యమదమత్తో౽సి మాం న జానాసి దుర్మతే!
      పరైః పరిభవే ప్రాప్తే మదధీనా తవ స్థితిః."

అని వేదాంతాచార్యులవారు చెప్పిన శ్లోకార్ధంవల్ల పండితులకున్నూ గుళ్లో వుండే దేవుఁడికిన్నీ వుండే సంబంధం యేలాటిదో తెలుస్తుంది. అయితే యిప్పుడు పండితులకు ధర్మనిర్ణయంలో స్థానంలేదు. యేలాటి పండితులకు? వెనకటి భారతీయశాస్త్ర వాసనతో వున్నవారికి. పాశ్చాత్య విజ్ఞానం కలవారే సర్వధర్మ నిర్ణయానికి నియంతలుగా వుంటూ వున్నారు. వారి వుద్దేశాలకిన్నీ వీరివుద్దేశాలకిన్నీ వుత్తరధ్రువ, దక్షిణధ్రువాల కున్నంతే సంబంధం. మళ్లా విషయం విషయాంతరంలోకి దూఁకుతూ వుంది. దేవతా ద్రోహం తప్పు. అది లేని పద్ధతిని దేవదాసీలు తమ సంస్కారాన్ని నిర్వర్తించుకోవడం యుక్తం. ఒక్కళ్లుకూడా పూర్వవృత్తిలో వుండనక్కఱలేదు. ఆ వృత్తిలో హేయత్వం వున్నమాట సత్యమే! ఆ వృత్తిలోనే కాదు; జీవనార్థంగా లోకులు ఆచరించే అన్నివృత్తులలోనున్నూ అంతో యింతో హేయత్వం వుండే తీరింది. అయినా వారువారు యెందు కాయా వృత్తులు అవలంబిస్తూ వున్నారంటే?- "పొట్టకు పట్టెఁడు కూటికే సుమా!' పూర్వవృత్తులలో కంటేకూడా యిప్పుడు మహాగౌరవమైన వనుకొనే వృత్తులలోనున్నూ దోషాలుమితిమీఱి వున్నాయి. ప్రస్తుతం దేవదాసీలు యేవగించుకుంటూ వున్న వృత్తిలోవున్నంత యేవం కాకపోవచ్చును గాని కొంత యేవమున్నూ యెంతో ఘోరమున్నూ వున్న వృత్తులు మఱికొన్ని  వున్నాయి. కాని యింకా వారువారు ఆ వృత్తులను యేవగించుకొన్నట్టు లేదు. లేక వారిలోఁగూడ కొందఱు యేవగించుకొని మానుకొన్న వృత్తులు కొన్ని వుంటే వున్నాయేమోగాని అవచ్ఛేదకావచ్చేదేనా ఆయావృత్తులు చేసేవారిలో యీలాటి చలనం కలిగినట్టులేదు. దేవదాసీలలోనే యీలాటి సంచలనం కలిగింది. యిందుకు యెవరుగాని అడ్డంకి చెప్పకూడదు. వారు యెంత తొందరగా నేనా ఆయావృత్తులు సర్వమూ వాట్లకు సంబంధించిన ఫలితాలతోకూడా వదులుకుంటే బాగా వుంటుంది. వీట్ల కన్నింటికీ అంగీకారం యేజాతివారికేనా అయితే ఆ జాతిలోన్నుంచి కొందఱు గాని, లేకపోతే అందఱూకాని యీ ఖాళీఅయిన చోటును ఆక్రమిస్తే ఆక్రమించవచ్చును. లేదా ఆ పోస్టు ఖాళీగానే వుంటుంది. మునిఁగిపోయిందేమిటి? ఆ విచారంతో పనిలేదుకాని ప్రపంచ చరిత్రలో యేవృత్తికాని ఖాళీపడి యెవరికోసమున్నూ నిరీక్షించిందని చెప్పుకోవడం నాకు తెలియదు. "ధాతా యథాపూర్వ మకల్పయత్" యింకా వ్రాస్తే చాలావ్రాయాలి. యింతదాఁకా వ్రాయుటకు వక తపస్విని తొదరపాటు కారణం. ఆపెకోసమైతే యింత దాఁకా వ్రాయనక్కరలేదు. ఆపె తొందరపాటు నిమిత్తమాత్రంకాని ఆయా విషయాలు యితర సోదరులకొఱకేనా యెవరో వ్రాయవలసినవే కాని, వ్రాసి సంపాదించే ప్రయోజనం మాత్రం లేదు. యెందుచేత? యిప్పుడు యిట్టి మాటలయందు యెవరికోతప్ప విలువలేదు. కొందఱు యెవరీ వ్రాసిందంటూ విచారిస్తారు. “వ్రాసినవ్యక్తి లాటీచార్టీ రుచిచూచిన వాఁడేనా? శ్రీకృష్ణ జన్మస్థానానికి యెన్నిమాట్లు వెళ్లి వున్నాఁడు?” అంటూ విమర్శిస్తారు. ఆ విమర్శనకు యేమాత్రమేనా ఆఁగితే తప్ప వాడిమాటకు “వాల్యూ” వుండదు. యిప్పుడు ముఖ్యంగా కావలసిన "క్వాలిఫికేషన్సు" అవిమాత్రమే యింతవఱకు నాకుదెలుసును. తెలిసిన్నీ నాకు తోcచినమాటలు వ్రాస్తూ వుంటాను. అవి యెవరినిగాని బాధించే తాత్పర్యంతో వ్రాసేవికావు. కాకపోయినా ప్రస్తుతం వొకతపస్వినికి బాధకంగా కనపడ్డాయి. ఆపె వేశ్యావృత్తియందు వుండేయే వాన్ని బాగా తెలుసుకొని ఆ సంఘాన్ని అభివృద్ధికిఁ దెచ్చే తలంపుతో శాయశక్తులా పాటుపడుతూ వున్నవారిలో వొకవ్యక్తి; ఆపెవుద్యమాన్ని ఆమోదించేవాళ్లలో నేను మొదటివాణ్ణి. అందులో వుండే యేవం ఆమెకు యెంత తెలుసునో అంతకన్న నాకు పదిరెట్లు యెక్కువ తెలుసును. నేను ఎందఱికో ఆవృత్తిని వదులుకోవలసిందని సలహాలుయిచ్చి వున్నాను. ఆసందర్భం గ్రంథాల్లో కొంత కనపఱచికూడా వున్నాను. అంతవఱకు ఆవిడకూడా వప్పుకుంటూనేవుంది. యిఁక మా యిద్దఱికీ అభిప్రాయభేదం యెక్కడంటే? దేవతానౌకరీభూములు తేరగా అనుభవించడం దగ్గిఱ. ఆపెకువేశ్యలలో యిప్పటికప్పుడే పూర్తిగాకాకపోయినా నూటికి తొంభై వంతులు దుర్నీతివదలుకొని సంసారిస్త్రీమార్గం అవలంబించడం జరిగిందనే నమ్మకం పూర్తిగావుంది, అలావుండడం తప్పున్నూకాదు. యెవరేనా వకకార్యాన్ని పూనుకొని నిర్వహించేటప్పుడు ఆ నిర్వహణంలో “ఆవగింజలో అఱపాలు” గూడా కాకుండావున్నా చాలావఱకు జరిగిందనే నమ్మికవుంటేనే కాని దానిలోవారు పనిచేయడానికి సాహసోత్సాహాలుకలగవు. వెనకయెవరో బ్రాహ్మఁడు పరమామాయికుఁడు సముద్రం దోసిళ్లతో తోడుతూవుండడమూ, ఆలా పది పదిహేను రోజులు జరిగాక "యేమాత్రం సముద్రం తరిగిందని ప్రశ్నరావడమూ, ఆ ప్రశ్నకు జవాబుగా ఆ పిచ్చిబ్రాహ్మఁడు "నూటికి తొంభైతొమ్మిదివంతులు తరిగింది. రేపోనేఁడో పూర్తిగా సముద్రంవట్టిపోతుం"దని సంతోషపూర్వకంగా చెప్పడమూ అన్యత్రా వ్రాసే వున్నాను. ఆమె యొక్క విశ్వాసానికిన్నీ ఉద్యమానికిన్నీ నా వ్యాసంలో భంగించేమాట వక్కటికూడా లేదు. కళలకోసం యిప్పుడున్న వేశ్యలే వుండి తీరాలనే అభిప్రాయాన్ని నేను నా వ్యాసంలో యెక్కడా వెల్లడించలేదు. యేజాతిలోన్నుంచేనాసరే కొందఱు వుండవలసి వస్తుందని మాత్రం అభిప్రాయం సూచించాను. కాని, "కళలు అంతరిస్తాయి కనక వారుగాని మరొక జాతివారుగాని వాట్లను సంరక్షించడానికి కొంత దుర్నీతితో సంబంధించిన దేవదాసీత్వాన్ని లేక వేశ్యాత్వాన్ని స్వీకరిస్తే గాని వల్లకాదని గవర్నమెంటు ద్వారాగా బిల్లు చేయించవలసి వుంటుంది గనక అందుకోసమై గవర్నమెంటులో పలుకుబడి కలవారికి విన్నపమంపుకోవలసిం"దనియే సంఘాన్నీ నేను పురికొల్పలేదు. యిట్టిస్థితిలో ఆమెకు నామీఁద ఆగ్రహమెందుకో? నా వ్యాసం “వుపసంహరించుకోవలసిం"దని శాసించడం ఎందుకో? అగమ్య గోచరంగా వుంది. ప్రతివృత్తిలోనూ మంచిచెడ్డలు రెండూ మిళితమై వుంటాయి. విధిలేక - పాలకోసం రాయిమోసినట్టు ఆమంచికోసం చెడ్డనుకూడా ఆమోదించవలసి వస్తుంది. దీన్నే "ధాన్యపలాల న్యాయం" అంటారు. ప్రపంచకంలో వేయింటికి యేవొక్క వ్యక్తికో తప్ప మాంసభక్షణతో అవసరం సర్వత్రా కలిగేవుంది“మ్రానను రాతనుం గలదె? మాంసము ప్రాణులమేనఁగాక” అందుచేత గోవు మొదలుకొని అన్ని జంతువులనూ అందులో ముఖ్యంగా అందఱికీ పనికివచ్చే మేఁకలనూ, ఆ గొఱ్ఱెలనూ వధించవలసివుంది. ఆయీ జంతువులకు (సోల్) ఆత్మ లేదని చెప్పే పాశ్చాత్యులకెంత కరుణ వుందో? వాట్ల యందు మనలో లాగే ఆత్మ వుందని అంగీకరించక తప్పదు. యిట్టి నిష్కరుణత్వం సహింపలేకో మాంసభక్షణం రుచింపకో యెందఱో ఆ వంశాలకు సంబంధించినవారు పూర్తిగా శాకాహారులుగా మారివున్నారు. వారిని – “మీరు మాంసభక్షణం చేస్తేనే కాని వల్లకా"దని యెవరూ నిర్బంధించినట్టులేదు. ఆలాగే వేశ్యాత్వాన్ని గూర్చిన్నీ నిర్బంధించేవాళ్లంటూ వుండరు; ప్రోత్సహించేవాళ్లున్నూ వుండరు. యిక్కడ వ్రాయవలసిన ప్రధానంమాట వ్రాయనేలేదు. ఆ జంతువధ వక్కరోజున ఆవ్యాపారస్థులు సమ్మెకట్టి చేయకపోతే యెందఱో వుపవాసము చేయవలసివస్తుంది. కాని ఆవధకు కులక్రమాగతంగా అలవాటుపడ్డవారే తప్ప యితరులు మాంసభక్షకులే అయినా అవలంబించలేరు. అంతటి ఘోరకృత్యానికి వారుగాని, వేరొకరుగాని సిద్ధపడడం యెందుకు? లాభాపేక్షచేతే కదా? ఆ లాభాపేక్ష మాత్రం అందఱినీ ఆ పనిలోకి" దిగనిస్తుందా? ఆలాగే ప్రస్తుత విషయమున్నూ - యిందాఁకా యెందుకు? పరమపవిత్రమైన యజ్ఞంలో పశుహననం చేయడంలో ఆరితేరిన శ్రౌతిపేరు శమిత. ఆశమిత వక నరమేధంలో పశువుగా యేర్పడ్డ మనిషితండ్రే కావలసివచ్చింది. యెందుచేత? యజ్ఞానికి సమ్మతించికూడా ఆపనికి యితర శ్రౌతులు సమ్మతించారు కారు. అప్పుడు ఆ నరుణ్ణి కన్నతండ్రి – “మరికొంత ధనాన్ని యిస్తే నేనే ఆశమితృవ్యాపారాన్ని నిర్వర్తిస్తా" నన్నాడు. యింతకన్న ప్రకృతవిషయంలో యెక్కువ వ్రాయనక్కఱలేదు. అన్ని దుష్కృత్యాలూ ధనంచేయిస్తుంది.

ఉ. “దేవతలన్ యజింత్రు పర దేశములన్ జరియింత్రు దాతలై
     కోవిదకోటికిన్ ముదము గొల్పుదు రుత్తము, లల్పలోభులో?
     జీవుల హింస సేయుదురు చేయుదురెంతయుc జౌర్యమున్ దగన్
     భావనసేయఁగాఁ బరధనమ్ము హరించెడి త్రోవ లిన్నియున్."

దానికోసం పలువురు పలువృత్తులను అవలంబించారు. అందులో కొన్ని వృత్తులలో మంచికన్నా చెడ్డ తక్కువ వుంటుంది. కొన్ని వృత్తులలో చెడ్డకన్నా మంచే యెక్కువగా వుంటుంది. కొన్నిట్లో రెండూ సమంగా వుంటాయి. యావత్తుగాని, కొంతేగాని మంచితో చేరడమున్నూ చెడ్డే చేరడమున్నూ ఏ వృత్తిలోనో కాని సంఘటించదు. అట్టిస్థితిలో ఆయా వృత్తులు వారి వారి యోగ్యతానుసారం అనాదిగా అవలంబించి – “కులవృత్తికి సాటిలేదు గువ్వల చెన్నా!" అన్న గుడ్డి విశ్వాసానికి దాసులై కొందఱు అలాగే పడివున్నారు. వారివారికి భారతంలో వున్న ధర్మవ్యాధుఁడు వగయిరాల ధర్మవాక్యాలున్నూ, భగవద్గీతలోవుండే - స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః’ అనే శ్రీకృష్ణ పరమాత్మయొక్క అభిప్రాయమున్నూ ఆధారంగా కనబడుతుంది. కొత్తతోవ తొక్కేవారికో? "తాతస్యకూపో౽యమితి బ్రువాణాఃక్షారం జలం కాపురుషాః పిబంతి” అనే వాక్యం తోడ్పడుతుంది. ఆయావ్యక్తులు తమ తమ వృత్తియందుండే నైచ్యాన్ని యేవగించుకొని క్వాచిత్కంగానే అనుకుందాం, ఆవృత్తిని వదులుకోవడానికి ముఖ్యకారణంగా నాబుద్ధికి యిలా తోస్తుంది. యేవో రెండు పరీక్షలు ఆయా నీచవృత్తులలోనే వుండి సంపాదించిన ధనంతోనే తమ తమ సంతానానికి తల్లిదండ్రులు అంటేటట్టు చేస్తే తద్ద్వారాగా గౌరవ జీవనం యే కొందఱికో కలగడం చూచి యితరులు కూడా స్వవృత్తిత్యాగానికి ప్రయత్నిస్తూవున్నారు. కాని ఆలాటి పుణ్యకాలం గతించి చాలాకాలం అయింది. దానికి అపేక్షించి కులక్రమాగతమైన వృత్తిని వదులుకుంటే విచారించవలసిన రోజులు ఆసన్న మయినాయి.

నావద్ద చదువుకోవడానికి వచ్చిన బ్రాహ్మణ విద్యార్థులలో అనాదిగా పౌరోహిత్యాలు వున్నవాళ్లు కొందఱు ఆపౌరోహిత్యమందు వుండే నైచ్యాన్ని బట్టి దాన్ని యిఁకముందు వదులుకునే లేఁత ఆలోచన చేస్తూ వుండేవారు.

శ్లో “పురీషస్యచ రోషస్య హింసాయా స్తస్కరస్యచ
    ఆద్యక్ష రాణి సంగృహ్య చక్రేధాతా పురోహితమ్."

అంటూ వకశ్లోకం యెవరోమహాకవి చెప్పింది లోకంలో శిష్టపరంపర చదవడం కలదు – ఈశ్లోకార్థం వివరించడంకంటె వివరించకపోవడమే కొంత గంభీరంగా వుంటుందని వదిలేశాను - యింతేకాకుండా -

"పౌరోహిత్యం రజనిచరితం గ్రామణిత్వం నియోగమ్" అంటూ వక శ్లోకంలో యెన్నో వృత్తులను అవలంబిస్తే అంతగా ఆక్షేపణ లేని వాట్లను యెత్తుకొని – “మాభూ దేవం మమ పశుపతే! జన్మజన్మాంతరే౽పి"

అంటూ వకకవి దూషించివున్నాఁడు. కవులకేంపని వుంది? ప్రతీదాన్నిన్నీ అగ్రస్థానానికి యెక్కించాలంటే యెక్కించాగలరు! అధఃపాతాళాని కంటించాలంటే అంటించాగలరు. బిల్హణుఁడు కవులశక్తినిగూర్చి విక్రమాంకదేవచరిత్ర 18వ సర్గలో కాఁబోలును యెత్తుకొని రావణాసురుఁడు దుర్మార్గుఁడనుకోవడానిక్కాని, రాముఁడు సన్మార్గుఁడనుకోవడానిక్కాని కవులయొక్క ఆగ్రహానుగ్రహాలే కారణంగా సమర్ధించి వున్నాఁడు - స్తనశల్యపరీక్ష చేయడానికి వుపక్రమిస్తే జీవనార్థం యేవృత్తినీ అవలంబించడానికి అవకాశం లేకపోవలసి వస్తుంది. తుట్టతుదకు శిలోంఛాది వృత్తులుకూడా విమర్శిస్తే ఆఁగనే ఆఁగవు. యీసందర్భం నేను "మల్లేశ్వర షట్చతి" అనేదానిలో విస్తారంగా విమర్శించి అనేకులు నింద్యవృత్తిగా అభిప్రాయపడ్డ అర్చకత్వాన్ని యితర వృత్తులకన్న యిహపర సాధకమైన వృత్తిగా సమర్ధించివున్నాను. విస్తరభీతిచేత ఆయాపద్యాలు వుదాహరించలేదు. ప్రస్తుత మేమిటంటే? పౌరోహిత్యం వదులు కోవాలనుకున్న ఆయా విద్యార్థులకు నేను వదులుకోవద్దని హితబోధ చేసివున్నాను. ఆయా విద్యార్థులు ఆ పౌరోహిత్యంమీఁదనే యిప్పుడు సుఖ జీవనం చేస్తూ నన్ను తల్చుకుంటూ వున్నారు. యీ రోజుల్లో వేదశాస్త్రాలకు ఆమాత్రం మంచివృత్తి మఱోటి వున్నట్టు నాకు తోఁచదు. యేవ్యామోహంవల్ల బ్రాహ్మణాది వర్గాలవా రందఱూ స్వకులోచితవృత్తులు వదులుకొని వున్నారో ఆ వర్ణాలవారందఱూ ఆయా వృత్తులకోసం మళ్లా పాఁకులాడవలసిన కాలం తారస మవుతూవుందనే అంశం ఆ వ్యామోహం శూన్యం కావడంవల్ల అందఱికీ అనుభవంలోనే వుంది కనక విస్తరించను. నిన్న రాత్రి నేను పిఠాపురంలో వక సంపన్న గృహస్థులయింట విందుకు వెళ్లాను. అక్కడవున్న వంట బ్రాహ్మఁడు మెట్రుక్యులేషను చక్కఁగా అన్ని సబ్జట్లూ ప్యాసుచేసినవాఁడు. పూర్వకాలంలో వంటబ్రాహ్మలు యిట్టివారున్నారా? యీకాస్త ప్యాసుకూ వున్న నాలుగెకరాల భూమీ చెట్టెక్కింది. పనిపాటలు యమ్ యేలకే లేనప్పుడు మెట్రుక్యులేషనుకు దొరకడం యెక్కడ? అందుచేత పాపం! యీవృత్తి చేసుకుంటూ వున్నాఁడు. బ్రాహ్మఁడు కనక పనిపాటులు దొరకలేదనుకుందామా? అక్కఱలేదు. నాన్ బ్రామిన్సు కూడా ఇదే అవస్థ. కాస్త ఆలస్యంగా రాఁదలచి వున్నట్టు సూచనలు కనపడుతూవున్నాయి. "బబ్భావళ్యా మంతక స్సన్నివిష్టః" బ్రాహ్మణులను బ్రాహ్మణేతరులు అణఁగఁదొక్కితే వారిని హరిజనులు అణఁగఁదొక్కుతారని సూచనలు కనపడుతూ వున్నాయి- వక సంపన్న గృహస్టు మా బంధువులలోనే వుండేవాcడు. ఆయన కావడానికి పురోహితుఁడేకాని యెందఱినో పోషించాఁడు. కొడుకు లందఱికీ యింగ్లీషు చెప్పించాఁడు. వాళ్లు పౌరోహిత్యం చేయరుకదా! పనిపాటులో యెక్కడనుంచి వస్తాయి?- “యితో భ్రష్టస్తతో భ్రష్టః" అయింది. తుదకి పౌరోహిత్యం యితరు లాక్రమించుకున్నారు - అయితే వేశ్యాత్వం వకరు ఆక్రమించు కుంటారేమో? అని భయపడి స్వీకరించడంలోదికాదు. వేశ్యలందఱూ సంసారిణులుగా మాఱినా లోకానికి వచ్చేచిక్కున్నూ స్థూలదృష్టిని లేదనుకుందాం. ఆవృత్తిలో వున్న ప్రధానదోషం అందఱూ యేవగించుకోతగ్గది బహుపురుష సాంగత్యం. యే అదృష్టవంతురాలికోతప్ప వక్కడితో జీవితం తెల్లవారనిమాట సత్యం. యిదిపాశ్చాత్యకవులు రసాభాసంగా పరిగణించారో లేదో కాని మన కవులందఱూ రసాభాసమే అన్నారు - యీ దోషం యిప్పటిస్తీలందఱికీ సంక్రమింపచేయడానికి తగ్గబిల్లు విడాకులచట్టం వకటి రాఁబోతూవున్నట్టు అందఱూ యెఱిఁగినదే. అట్టిస్థితిలో ఆదోషాన్ని యేవగించుకోవడం యేమంత ప్రయోజనకారిగా వుంటుంది; కొద్దిభేదంవుంటే వుండనివ్వండి గాని ఆచట్టంవచ్చాక పాతివ్రత్యమనే మహాపదవి వేశ్యలతోపాటు యితరస్త్రీలల్లో కూడా నూటికి తొంభైపాళ్లు పోవలసిందే. యేపురుషుణ్ణి కట్టుకుంటే ఆ పురుషుఁడితోటే వుండడం పాతివ్రత్య మనిపించుకుంటుంది. ఆ పురుషుఁడి జీవిత కాలంలోఁగానీ, అనంతరమందు గానీ దానికి అన్యథాత్వం కలిగితే ఆ వ్రతానికి భంగం కలగక తప్పదు. భారతీయుల శాస్త్రాలన్నీ ఆసూత్రానికి కట్టుపడేవున్నాయి. అయితే యింత అసిధారావ్రతంగా బ్రతకడం దుర్ఘటంకాదా? అంటారేమో? అందుచేతే ఆ బిరుదును యేకొలఁదిమందో తప్ప, అందఱూ పొందలేక పోవడం. పొందలేకపోతే “పొందలేక పోయాంగదా” అని విచారించేవారు పూర్వం వాళ్లు. యిప్పుడో యితరులక్కూడా లేకుండా చేయడానికో అన్నట్టు కొన్ని ప్రయత్నాలు చేస్తూవున్నారు. విడాకులచట్టమంటూ వచ్చినా ఆలాంటి పతివ్రతలు చలించరుగాని, ఆచట్టాన్ని కంఠంముడి పట్టుకొనేలాగ సవరించి- "యేస్త్రీగాని బ్రహ్మచారిణిగా వుండకూడదు. వుంటే శిక్షకు పాత్రురాలవుతుంది." అని శాసించడంకూడా తటస్థిస్తే చేసేదేమిటి ఆలాటి దురన్యాయం వుంటుందా? అనడానికి వీలులేదనుకుందామా ఫ్రెంచిదేశంలో ఆమధ్య అనాదిగా నివసిస్తూవున్న "కన్యస్త్రీలు" ఆ దేశంలో వుండడానికి వల్లకాదన్నారంటూ పత్రికల్లో చదివినట్టు జ్ఞాపకం. యిదంతా విషయాంతరం. ప్రస్తుతం పూర్వాచారపరాయణులకు నిలవనీడ లేకుండా పోయేశాసనాలను భారతీయులే ప్రభుత్వం వారినికోరి చేయిస్తూ వున్నారని తెల్సుకోవడమే ఆయీ సోదెకంతకూ ఫలితం. ఆ శాసనాలు కొన్ని కొందఱిని బాధించినా, కొందఱికి వుపకారాలుగా వున్నాయి. అందులో దేవాలయపు మాన్యాలు అంతరించడానికి పుట్టించిన శాసనం యొవళ్లకీ బాధించినట్టు బాహ్యదృష్టికి కనపడకపోయినా, అంతర్దృష్టిని విచారిస్తే క్రమేణా అది పూర్తిగా దేవాలయాలనే అంతరింపచేస్తుందేమో? అని గోచరింపకపోదు. పంచములను దేవాలయాలలో ప్రవేశపెట్టడం జరిగాక, యింకా వాట్ల సత్తకోసం విచారింపవలసివుండదు. “యిప్పటి సంస్కారంవల్ల వేశ్యలు కులస్త్రీలుగా మాఱడమేకదా! జరిగింది. దానివల్ల కొంత సునీతికే అవకాశం యేర్పడిందిగాని దుర్నీతికి అవకాశం లేశమూ లేదే" అనేవారికి జవాబు చెప్పడంకష్టం. అందుచేతే దేవాలయంమాన్యాలు అంతరించవలసి వచ్చింది. “పాపం! యీ మాన్యాల మూలాన్ని యీ జాతికి యీ దురవస్థ తొలఁగడానికి అవకాశం లేకపోతూవుంది” అని శాసనసభ్యులు కరుణించారు. దేవుఁడు రాయేకనక యెవరికీ వానిబాధ లేకపోయింది. జరగవలసినదేమో జరిగింది. యీ బిల్లు ప్యాసుకాలేదే అనుకుందాం; యిదివఱలోవున్న ప్రకారమే ఆయీ కట్టుఁబాట్లు వున్నాయే అనుకుందాం. అప్పడు మాత్రం వేశ్యావృత్తియందు యిష్టంలేని వనితామణులు తమతమ సంతానానికి వివాహాలుచేసి కులస్త్రీమర్యాదలను సంపాదించడానికి అభ్యంతర మేమేనావుందా? అలా వివాహాలు అనాదిగా జరుగుతూనే వున్నాయి కదా! కులస్త్రీలకన్నా యెంతో మిన్నగా సదాచార సంపత్తితో వారు వర్తిస్తూనే వున్నారుకదా! యిప్పుడు దేవ ద్రోహంతప్ప వచ్చిన విశేష మేమిటని నాప్రశ్న జాతియావత్తున్నూ నిష్కళంక జీవనానికి రావడమే విశేషమని ఆవలివారి ప్రత్యుత్తరం. సర్వేసర్వత్ర వకటేనీతికి కట్టుపడడం అసంభవమని చెప్పవలసివున్నా చెప్పక అందుకుకూడా వప్పుకుంటాను. యే యితర సంఘాన్నుంచో కొందఱు దీనికి ఆలాయపడి తీరుతారనిన్నీ మూలోచ్ఛేదం యెన్నటికీ సంభవించదనిన్నీ నా తలంపు - యెన్నెన్ని గాలివానలు. యెన్నెన్ని కలరాలు, యెన్నెన్ని ప్లేగులు, యెన్నెన్ని యుద్ధాలు వచ్చి యెంతెంత జనాన్ని నాశనంచేసినా జనాభివృద్ధి నామమాత్రావశిష్ట మయిందా? ఆలాగే ఆయాదుర్వృత్తులున్నూ, అని దేశచరిత్రవేత్తలకు తెలియనివిషయం కాదు. అందులోనూ ప్రస్తుతవిషయం మరీ దుర్ఘటం. యిది వొకరి తోడ్పాటక్కఱలేకుండానే వారివారి ఆత్మబలం వల్లనే నెగ్గఁదగ్గది. ఆ వృత్తి యందుండే దుర్నీతిని యెఱిఁగే కొందఱు దానివల్ల వుండే లాభాపేక్షచేత వదలలేకుండా వున్నారుగాని మఱో కారణం చేతకాదు. అందఱికీ దేవాలయనవుకరీలు లేవుకూడాను - లేనివారందఱూ ముందుగా దుర్నీతిని వదిలి సునీతిలోకి వస్తే వున్నవారు ఆఫలాపేక్షను వదులుకొని వెంటనే - “నలుగురితో నారాయణా, కులంతో గోవిందా" గా మాఱడం తటస్థించేది. యిప్పుడు ఆలా జరగలేదు. “ముక్కు కోసుకుంటే దేవుఁడు కనపడతాఁ"డన్నట్టు దేవతామాన్యాల చిక్కుతీర్చడంజరిగింది. యితరం యెంతవరకు కొనసాగిందో మాన్యాలు పోఁగొట్టుకున్న ఆ భగవంతుఁడికే తెలియాలి. యే సంఘమేనా నీతిమీఁద ఆధారపడి సునీతికి రావాలి. ఆలాటినీతిని పాటించేవారు యే సంఘంలోనేనా, యే కాలంలోనేనా కొలఁది మందిమాత్రమే వుంటారు. వారు తమతోపాటుగా మఱికొందఱిని తమ మార్గంలోకి రప్పించుకుందామని యత్నించడం యుక్తమే. దాన్ని నిషేధించడంతప్పు. ముమ్మాటికిన్నీ తప్పు. అట్టితోవ నా వ్యాసంలో లేశమున్నూ లేదు. కొన్ని విద్యలకు యే దుష్కార్యంతోటిన్నీ అవసరంలేదు. గాని కొన్ని విద్యలకు అట్టి చిక్కువున్నది. మృదంగం వగయిరా చర్మకట్టు వాద్యాలకు చర్మాలతో అవసరం. అది స్వయంగా చచ్చిన జంతువుల చర్మంతోకూడా సాధించవచ్చునేమో కాని జపతపాలు చేసుకొనేవారికి కృష్ణాజినం కావలసివస్తే అట్టిది పనికిరాదు. అట్లని యే వేఁటకాఁడితోటి గాని నాకొక చర్మం బలవంతంగా చంపిన జంతువు తాలూకు కావాలని చెప్పనూకూడ దన్నారు. అది యెట్లో వీరి ప్రేరేపణ లేకుండా చంపినది దొరికితే స్వీకరించవలసిం దన్నారు. యిది విషయాంతరం. కొందఱు ఋషులైతే సంగీతాన్నిన్నీ దాన్ని పాడేవారినిన్నీ కూడా పూర్తిగా నిషేధించి వున్నారుగాని నారదాదులు గానాన్ని పూర్తిగా ఆమోదించి వున్నారు. పైఁగా దానివ్యుత్పత్తి సామవేదాన్నుంచి పుట్టినట్టుకూడా ప్రమాణాలు కనపడుతూవున్నాయి. అట్టి సంగీతం పురుషులనోటితో వినడంకన్న స్త్రీల నోటితో వినడమే ఎక్కువ రసవత్తరంగా వుంటుందని కాఁబోలును ఆ నారదాదులు అప్సరసలకు దాన్ని వుపదేశించినట్టు తోస్తుంది. గానంతో పాటు అభినయం. అది నాట్యంతో చేరిందే. యివన్నీ స్త్రీలవల్ల కళగట్టి నట్టు పురుషులవల్ల కళగట్టేవి కాకపోయినాయి. రాజాధిరాజులు ఆయీ విద్యలను మిక్కిలిగా ఆదరించేరోజుల్లో యేదో సంఘాన్నుంచి వారివారి తలిదండ్రుల సమ్మతినిబట్టి కొంత ఫలాపేక్షతో దీనికిఁగా తమతమ కొమార్తలను కొందఱిని వదిలిపెట్టడం తటస్థించింది. వాళ్లకు స్వతంత్రత్వం లేకపోతే ఆయీ విద్యాభ్యాసాదులు కొనసాగవు కనక వివాహం లేకపోవడం తటస్థించింది. కాని రాజసభలలో విద్వాంసులు వగయిరాలతోపాటు వకస్థానం గౌరవాపాదకంగానేవుంది. పైఁగా దేవాలయాలల్లోను స్థానం వుంది. చాతుర్వర్ణ్యం తరవాత దేవాలయాలల్లో తీర్థప్రసాదా లివ్వడం వుంది. వ్యభిచార దోషం వకటి వుందిగాని అది యితర స్త్రీలకు పరలోకంలో బాధించినట్టు బాధించదని చెప్పవచ్చు. యెందుచేత? అగ్నిసాక్షికంగా వకభర్తకి వివాహితురాలై ఆపె అందుకు తప్పి సంచరించింది కనక దండింపతగ్గ దోషం చేసినట్టయింది- యిక్కడ అట్టిదోషంలేదు. కాని తనకుయేర్పడ్డ ప్రవర్తనలో అన్యథాగా సంచరిస్తే ఈవిడకూడా దండ్యురాలే. వక వేశ్య మూఁడురోజులు వకరితో వుండుట కేర్పరచుకొని ఆ మూఁడురోజులలో ఆయన స్వర్గతుఁడు కాఁగా సహగమనం చేయబోవడం వగయిరా పురాణగాథలవల్ల బహు భర్తృకత్వాన్ని అంగీకరిస్తూ దానిలోకూడా నియతవర్తనంవుంటే పరలోకహానిలేనట్టు తేలుతూవుంది. యిహలోకంలో దేహారోగ్యం చెడగొట్టుకోవడం, యితరులది చెడగొట్టడం అనేది యీలాటిజాతి యేర్పాటుగా లేని డచ్చి దేశాన్నుంచి దేశానికి దిగుమతి అయిన వ్యాధుల పేరులవల్ల తెలుస్తుంది. అసత్యం లేకుండా జరగనివృత్తులు కొన్ని వున్నాయి. అందులో యిది వకటి. యిట్టిదాన్ని అవలంబించికూడా సత్యతత్పరత్వంవుంటే ఆపె కులస్త్రీ, అందులో పరమోత్తమురాండ్రు పొందే సద్గతినే పొందుతుందని పూర్వ గ్రంథాలవల్ల తేలుతుంది. యిప్పుడు ఆ గ్రంథాలయందుఁగాని వాటిని చదువుకొన్నవారియందుఁగాని గౌరవంలేదు. వారు యే మెంబరు పదవికిన్నీ యెన్నడూ ప్రయత్నించే స్వభావం కలవారుగానూ వుండరు; వకరెవరేనా ప్రయత్నించినా వారికి వోట్లూరావు. కాఁబట్టి వారికి సభ్యత్వం లేదు. సభ్యత్వం వున్నవారున్నూ ప్రాజ్ఞులే కాని వారు భారతీయమైన శాస్తాలయందు కృషి చేసినవారుకారు. మాటవరసకి వక సంగతి వ్రాస్తాను. కుక్కలున్నాయనుకోండి. వాట్లని చంపవలసిందని యేభారతీయ విద్యా నిష్ణాతుఁడున్నూ కొంత ఫండు ధర్మబుద్ధితో యేర్పాటుచేయఁడు. యెవరో వకయూరోపియన్ అట్టిధర్మకార్యానికి కొంతఫండు నిలవచేసినట్టువింటాను. మునిసిపాలిటీలలో కుక్కలని చంపించడం అంతా యెఱిఁగిందే. యివన్నీ ధర్మాలుగా వప్పుకొనే సంస్కారులు గానాభినయాలు ప్రధాన జీవనోపాధులుగాఁ బెట్టుకొని ఆ విద్యలు స్వాతంత్ర్యంతో సంబంధించినవవడంచేత అవివాహితలుగా వుండి ఆకారణంచేత వ్యభిచారదోషానికి గుఱికావలసివచ్చిందని వారిని యేవగించుకొంటూ వున్నారు. కొందఱు నవనాగరికులనే కారణంచేత ఆ విద్యలతోపాటు సమస్తమూ వదులుకొనదలఁచుకొని పాటుపడుతూ వున్నారు. సంతోషమే! అట్టిస్థితిలో నౌకరీ చేస్తే అనుభవించతగ్గవిన్నీ పద్ధతిని వదులుకోతగ్గవిన్నీగా వున్న మాన్యాలు వదులుకోకపోవడమే యుక్తంగా వుందా? మాతంగ స్త్రీలంటూ గాన విద్యాపరిశ్రమ కలవారు వున్నట్టు హరిశ్చంద్రోపాఖ్యానంలో కనపడుతుంది. ఆలాటివాళ్లేవరు ఆ మాన్యాలు పుచ్చుకొని ఆ దేవుఁడి నౌకరీకి సిద్ధపడుదురేమో? యిప్పుడు గాంధీగారి యేర్పాటుప్రకారం వాళ్లకు దేవాలయప్రవేశానికి ప్రవేశమున్నట్టుకూడా కనపడదుగదా! లేదా ఆభూములు మఱివకసత్కార్యానికి దేవాలయ ధర్మకర్తలు వినియోగించుకుంటారు. వీరికెందుకు? యిప్పుడు వితంతువివాహం చేసుకొనే కన్యకకు పూర్వ భర్త తాలూకు ఆస్తియందు వుండే హక్కు పోcగూడదనే శాసనానికి కొందఱు దయాళువులు ప్రయత్నిస్తూ వున్నట్టు వినడం. ప్రస్తుత విషయంకూడా అట్టిదే. దీన్ని గురించి యెవరుగాని, యేదిగాని వ్రాయకూడదు. వ్రాస్తే మాటదక్కదు– “బుధ జన ఇవ గ్రామ్యసదసి." ప్రధానవిషయాన్ని వదలిపెట్టి యేవో తోఁచిన మాటలతో దూషించి వ్రాయడానికి యేతపస్వినేనా మొదలుపెడుతుంది. ఆవిడకు జవాబు వ్రాయక వూరుకుంటే వకచిక్కువ్రాస్తే వక చిక్కు అందుచేత ఆవిణ్ణి యిలా ప్రార్ధిస్తే బాగుంటుందను కుంటాను- “అమ్మా! నేను జనరల్‌గా కళలనుగూర్చి యెవరికి అధికారంవుందో వారిని గూర్చిన్నీ దేవాలయ మాన్యాలు వృథాగా అయిపోవడాన్ని గుఱించిన్నీ వ్రాశానుగాని ఆయా విద్యలు వేశ్యలు వదులుకోవద్దనిగాని. వదులుకోవద్దని యెవరేనా బోధించవలసిందనిగాని వ్రాయలేదు. యెన్నో సంగతులు పూర్వకాలంలో వుండేవి వ్రాసి నా వ్యాసంలో చర్చించి వున్నాను. నీవు వాట్లను స్పృశించనేలేదు. వక్క మాన్యాలను గూర్చిన్నీ, కళలను గూర్చిన్నీ మాత్రమే యెత్తుకున్నావు. వాట్లను గూర్చి నేను నాస్వీయాభిప్రాయాన్ని లేశమున్నూ వ్రాయలేదు. పూర్వుల అభిప్రాయాన్ని నేను అనువదించానుగాని అందులో నా అభిప్రాయము లేశమున్నూలేదు. నన్ను వుపసంహరించుకొమ్మన్నావు నీవు నన్ను దూషిస్తావనే భయంచేత వుపసంహరించుకున్నానే అనుకో? ప్రాచీన గ్రంథాలని యేంచేస్తావు?పంచాంగాలు చింపేస్తే నక్షత్రాలు పోతాయా? అందుచేత వొకవుపాయం చేస్తే బాగుంటుంది. లీగల్‌గా వొక నోటీసు యిప్పిస్తివా, వెంటనే దానిమీఁద వ్యాసం వుపసంహరించుకోవడమేకాదు, క్షమాపణే ప్రచురిస్తాను. కొందఱు యీమధ్య యిలాటి విషయాలకు వుపవాస దీక్షలు ప్రారంభిస్తూవున్నారు. అవికూడా పనిచేస్తూనే వున్నాయి. యీ మధ్య వక స్వాములవారు యేదో ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాన్ని పురస్కరించుకొని యేదో పుస్తకం వ్రాస్తే అది యే సంఘంవారికో బాధకంగా కనపడిందనిన్నీ ఆ గ్రంథాన్ని రద్దుపరచవలసిందని గవర్నమెంటు వారికి విన్నపాలంపుకుంటూ వున్నారనిన్నీ పత్రికలలో కనపడుతుంది. ఆయన జగదేకగురువు ఆయన రచనయందు అంతటి గౌరవం వున్నా వుండవచ్చు. కాఁబట్టి ఆసంఘంవారు యత్నించారన్నా బాగుంది. నేను సామాన్యుఁడను, నేను వ్రాసినదానికి నీవంత భయపడనక్కఱలేదు. యెన్నఁడుగాని వేశ్యాజాతికి వివాహాలు పనికిరావనే కట్టుఁబాటున్నట్టు లేదు. నా వ్రాఁతవల్లకూడా పూర్వంవున్న అధికారం పోవడంలేదు. యిప్పుడు సంస్కర్తలు వేశ్యాజాతికి కలిగించిన కొత్త లాభమల్లా దేవునిసొత్తు అపహరించడానికి అర్హత తప్ప, తక్కిన స్వాతంత్ర్యమంతా పూర్వపు విజ్ఞులున్నూ యిచ్చే వున్నారని పలుచోట్ల వ్రాసేవున్నాను- వకాయన దేవుఁడికి ధర్మకర్తగావుండి తద్ద్వారాగా మహదైశ్వర్య సంపన్నుఁ డైనాఁడనిన్నీ యెవరేనా దేవస్వాపహారం తప్పిదంకాదా? అని తెగించి మాట్లాడితే యెవఁడికేనా దేవుఁడివ్వవలసిందే, నాకున్నూ దేవుఁడేయిచ్చాఁడు మీకు కడుపుబ్బు యెందుకంటూ జవాబు చెప్పేవాఁడనిన్నీ బందరులో వున్నప్పుడు విన్నట్టు జ్ఞాపకం. ఆ పద్ధతిని దేవస్వాపహారదోషం ప్రతీవ్యక్తికీ తటస్థిస్తుంది. దీన్ని యిలాక్కాకపోయినా యింకోవిధంగా భారతీయవిజ్ఞానులు అంగీకరించే వున్నారు– ఆ కారణం చేతనే శిష్టులందఱూ దేవుఁడికి నివేదించి కానీ భుజించరు. ఆయీపదార్థ మంతా తమకు దేవుఁడిచ్చిందే కనక ఆయనకు సమర్పించకుండా భుజిస్తే స్తేనత్వం అనఁగా చోరత్వం తమకు సంఘటిస్తుందనే తాత్పర్యమే. అలా నివేదించడాని క్కారణం. దేవతా మాన్యాలను హరించడానికి దేవదాసీ సంఘానికి తోడుపడ్డవారెవరూ అలా నివేదించేవారుకారు సరిగదా! అలా నివేదించి భుజించేవారి జ్ఞానాన్ని అభినందించే వారుకూడా కారు. కాఁబట్టి ఆ ద్రవ్యం అనుభవించేటప్పడు ఆ పనికూడా ఆ దేవదాసీ జాతివారు చేయనక్కఱలేదనుకుంటాను. తీగఁదీస్తే డొంక కదులుతుంది. పూర్వాచారాలలోఁ గానీ, నవీనాచారాలలోఁగానీ, యేకట్టుఁబాటులోఁగాని యేలేశానికి అంగీకరించకపోయినా అంతకీ ముప్పు సంభవిస్తుంది. అట్లని ఆకట్టుఁబాట్లన్నీ ఆచరణలో పెట్టడం మాత్రం సంభవిస్తుందా? అదిన్నీ సంభవించదుగాని శక్యమైనంతవఱకు ఆచరణలో పెడుతూ శక్యంకాక చేయలేకపోయిన దాని విషయంలో పశ్చాత్తాపాన్ని పొంది తన్నివృత్తికై భగవన్నామస్మరణ చేయవలసివుంటుందని పూర్వుల ప్రవృత్తి తెలుపుతుంది. "క్షంతవ్యో, మేஉ పరాధశివశివశివభో! భోమహాదేవశంభో?” యిత్యాదులవల్ల పైసందర్భము తేలుతుంది. యివన్నీ ఆనకట్టకు పూర్వం మాటలు. యిప్పుడు యీ మాట్లయందు గౌరవంలేదు. లేకపోయినా వ్రాయడం వ్యర్థం. యిప్పుడల్లా యేదో పత్రిక నిండటానికి మేటరు వ్రాయడమే కావలసింది. తారతమ్య జ్ఞానంతో అవసరంలేదు. యెవరినేమాటేనా సరే వ్రాసి పత్రికకు పంపితే “వారూవారూ చూచుకుంటారు మనకేమి?” అని పత్రికవారు ప్రకటిస్తారు. అందుచేత జంకి పెద్ద పెద్దలు "వయం మౌనవ్రతాలంబినః." అని వూరుకున్నారు. నాకు ఆపెద్దలంతటి పాండిత్యంగానీ, యోగ్యతగానీ లేకున్నప్పటికీ ఆయీ ఆచారవ్యవహారాల విషయంలో వారితోపాటు నేనున్నూ వూరుకొనేవున్నాను. యేదో వ్రాస్తూవుంటే దేవుఁడిమాన్యాలు వృధాకావడం మనస్సుకి తగిలింది. దాన్ని పురస్కరించుకొని

వ్రాసిన మాటలకు మళ్లా యింత వ్రాయవలసివచ్చింది. ఆ మాటలవల్ల వారిసంఘం ముందుకురాక వెనక్కి మళ్లా మళ్లుతుందేమో అని వక సంఘసంస్కర్తిృకి అనుమానం కలిగింది. కాని ఆ అనుమానం సరి అయిందికాదు. యింతమాత్రం చేత అది వెనకడుగు వేయదు. కాని భగవంతునికికూడా శక్యంకాని సంస్కారాలు కొందఱు యిప్పుడు ఆరంభిస్తూ వున్నారు. అవి శక్యమైనవే అయితే భగవంతుడిదివఱకే చేసివుండేవాఁడేమో? యిన్ని విధాలుగా సృష్టివుండేదే కాదేమో? కొందఱు బలవంతులు, కొందఱు బలహీనులు, ధనవంతులు, ధనహీనులు, సౌందర్యవంతులు, సౌందర్యహీనులు, నీతిమంతులు, నీతిశూన్యలు యీలాటి భేదం లేకపోయేదేమో? అని బుద్ధిమంతులు చర్చించి, చర్చించి తేలక తుట్టతుదకు విసిగి ఆలోపం భగవంతుండిమీఁద పెడితే మఱీ చిక్కు వస్తుందని భయపడి వాఁడివాఁడికర్మాను సారంగా ఆయీ భేదాలు కలిగినట్టు స్థిరపఱచుకున్నారు. ఆ కర్మలు వొక మోస్తరుగా వుండవు. కనక చాలాభాగం వారికి సంతుష్టి కలిగింది. అట్టిస్థితిలో అందఱినీ వక్క తాటిమీఁదకు తేవడము యేలాగ? యెక్కడో సామ్యవాదం బయలుదేఱిందంటారు. అక్కడ కూడా కొన్ని విషయాలలోనే కాని అన్నివిషయాలలోనూ ఆ సిద్ధాంతం అమల్లోకి వచ్చినట్టుగాని, రావడానికి వీలున్నట్టుగాని, కనపడదు. యేమేనా ఇప్పటివారి సిద్ధాంతాలు యేటికెదురీఁదే తోవలో వుంటాయి. నామట్టుకు దేవదాసీల సంస్కరణం కూడా అలాటిదే. వ్యక్తిగతంగా మంచికి రావడానికి యిదివరకే ఆధారం వుందని పలుచోట్ల వ్రాసే వున్నాను. సర్వే సర్వత్ర వక తాటిమీఁదికి రావడం శక్యం యెన్నటికీ కాదు- కాకపోయినా యత్నించేవారు యత్నించడం మానకూడదు. యత్నించవలసిందే. విద్యలు పోతాయని భయం వారికి అవసరంలేదు. వాట్లవల్ల లాభం వుంటే, ఆ లాభం అవసరమే అయితే అందులోకి యెవరో మరివకరు ప్రవేశించి తీరుతారు. దొడ్డి వూడ్చడం దగ్గరనుంచి ఖాళీలేకుండా నడిపిస్తూవున్న భగవంతుఁడు యీకళల నిమిత్తం యేదోవక జాతిని యేర్పరచలేకపోతాఁడా? యేదేనా వృత్తి వకటి ఖాళీ కావడమే తడవుగాని అయేట్టటయితే అందులో వుండే దోషాన్ని గణించకుండా ప్రవేశించేవాళ్లు యీ కాలంలో లేకపోతారనుకో నక్కఱలేదు అధవా! లేకపోతారే అనుకోండి. "అత్తా! అత్తా! నీకొడుకు ఆఁకలికి ఆఁగలేఁడుసుమా!” అన్న సామెతగా అందుకోసమని ఆవృత్తిని వదిలిపెట్టి వెళ్లే వారు ఆఁగుతారా? అందుచేత వారివారికి తోఁచినట్లు హేయమనితోఁచిన వారివారి వృత్తులను వదులుకోవలసిందే. పరమోత్తమస్థానాన్ని అలంకరించవలసిందే. అట్టి స్వాతంత్ర్యాన్ని అరికట్టడానికి వుంటే గవర్నమెంటుచట్టాలకు వుండాలి కాని యే యితరపండితుల వ్యాసాలకూ వుండదు - యెవరికి తోఁచింది వారు వ్రాస్తూవుంటారు – “ఉపసంహరించుకో వలసింది” అని వ్రాయడం పొరపాటు. వితంతూద్వాహాన్ని మనదేశంలో శ్రీ వీరేశలింగం పంతులుగారు ప్రారంభించినప్పుడు యెందఱో పండితులు అది శాస్త్రవిరుద్ధమని వ్రాసివున్నారు. వారివారిని "మీమీ వాదాలు వుపసంహరించు కోవలసిం"దని ఆ పంతులవారు శాసించినట్టుమాత్రం లేదు. ఆయనకు తోఁచిన వుపపత్తులను ఆయన చూపుతూ వచ్చారు. పండితులకు తోఁచిన అనుపపత్తులను పండితులు వ్రాస్తూ వచ్చారు. పూర్తిగా పంతులవారి వుద్యమం నెగ్గినట్టూ లేదు? పండితులదీ నెగ్గినట్టూలేదు; శాస్త్రమేమో పండితుల కనుకూలంగా వుంది - "మును చచ్చినట్టి మగని తద్దినం బెట్టులు?” అనే మీమాంస తేలక కర్మసిద్ధాంత బద్దులగు పండితులు వూరుకున్నారు గాని దయలేకకాదు - జడ్జీ యెంత దయాశీలుఁడైనా లాప్రకారం వురిశిక్షవేస్తూవున్నాఁడు. మేజస్ట్రేటు యెంత దయాశీలుఁడైనా దగ్గిఱవుండి వురితీయిస్తూ వున్నాఁడు. ఆవురిలో ఆ వ్యక్తిని దగిలించేవాళ్లు యెంత దయావంతులైనా ఆ వృత్తిని అవలంబించి వున్నవాళ్లవడంచేత ఆపనిచేస్తూ వున్నారు. ఆతగిలించేవాళ్ల వంశస్థులు ఆవృత్తియందు వాళ్లకు దోషం వుందని మానుకుంటే యెవరు వద్దనఁగలరు? మానుకున్న తత్క్షణం ఆవుద్యోగానికి యెన్నో దరఖాస్తులు వచ్చి పడతాయి. కనక వేశ్యలందఱూ యితరవృత్తితోపాటు కళలుకూడా వదులుకోవచ్చును. అందుకు నావ్యాసం భంగిస్తుందనుకో నక్కఱలేదు. యిదివఱలో యింత విస్పష్టంగా తెలుసుకోకపోయినా యిప్పుడేనా తెలుసుకోవచ్చు ననుకుంటాను- దేవుఁడు మాత్రం దిక్కు లేనివాఁడై, నోరులేనివాఁడై తన మాన్యాలనుగూర్చి అడగలేకపోయాఁడు. దానితో వట్టిరాయే అని స్పష్టమయింది. ఆ పట్లాన్ని హరిజనులకు లోఁకువ చిక్కింది. నేఁడో రేపో అర్చకులు వుడాయిస్తారు. యిఁక నైవేద్యంకూడా వుండదు. ఆపైని కట్టడాలు కొన్నాళ్లవఱకూ మిగిలితే మిగులుతాయి. లేదా యీలోఁగా అవి యేసంస్థకేనా వుపయోగపఱిచేయెడల వారి వారి ద్రవ్యంతోటి మరమ్మత్తు జరుగుతుంది కనక మఱికొంతకాలంకూడా వుండవచ్చు. దేవతానౌకరీకి యేర్పడ్డ మాన్యాలుపోతే వుపేక్షించడంలో సూత్రప్రాయంగా యింత అర్థం యిమిడివుంది. యిదే యే మహమ్మదీయుల మసీదుకు, సంబంధించిందేనా అయితే వారూరుకోరు. యెంత ఆందోళన చేయాలో అంతా చేస్తారు. సాధించితీరుతారు. లోఁకువసంఘానికి సంబంధించిందవడంచేత దీనిగతి యీలాపట్టింది. సాధించేదీలేదు, అఘోరించేదీ లేదు గాని అయ్యో! యీలాజరిగిందే అని యెవఁడేనా అనుకుంటే అనుకోవడానిక్కూడా వీలులేకుండా ఆమాన్యాలవల్ల లాభంపొందిన సంఘాన్నుంచి యెవరో వక మహావ్యక్తి తారతమ్య జ్ఞానంతో పనిలేకుండా సాహసోక్తులతో శాసించడం వకటి తటస్థిస్తూవుంది. అందుచేత భర్తృహరి చెప్పినట్టు"జీర్ణ మంగే సుభాషితమ్” అని చెప్పి వూరుకోవలసిందే! యింతే యెంత వ్రాసినాయింతే, నావ్యాసంమీఁద ఆకొండివారొకరు వారికి తోఁచినమాటలు వ్రాసివున్నారు. ఆయన మతాన్ని ఆయన తెలిపినారే కాని లేశమున్నూ అనుచిత ప్రసంగానికి ఆయన చోటివ్వలేదు. ఆయన యిప్పటి ఆచారాలకు ప్రాధాన్యం యిచ్చేవారు. నేనో? పూర్వుల ఆచారాలు ఆచరించినా ఆచరించకపోయినా వాట్లయందే ఆదరం కలవాణ్ణి. అందుచేత ఆయనకూ నాకూ మతభేదం వుండవలసి వచ్చింది. యీవిడ నన్ను స్వార్థపరుఁడని సూచించింది. బాగా ఆలోచిస్తే దేవస్వాపహారానికి సమ్మతించని నన్ను దూషించడంవల్ల ఆదోషం ఆవ్యక్తియందే వుందేమో? ప్రాజ్ఞులు విచారించకపోరు.

★ ★ ★