కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/శుద్ధాంధ్ర భారతసంగ్రహము-పీఠిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీపరబ్రహ్మణేనమః

పీఠిక.

చ. సిరియొక యింత చేకుఱుటచేతనె మత్తిలి ముందు కీడుమే
ళ్ళరసెడివాఁ డొకండు గలఁడంచుఁ దలంపక పెక్కుదోసముల్
జరపెడి వారినేన్ దగుదొసంగిడి పిమ్మటఁ బ్రోచువేల్పు దా
సరగున నేలుఁ గాత గురుసామిని వెంకట సుబ్బరాయనిన్.

సీ. ఏవాఁడు జగముల నెల్లను నొక్కటఁ దలఁపులోననే తాను గలుగఁ జేయు
నెవ్వాఁడుకనఁబడ కల్లచోటులనుండి యన్నింటిననయంబు నరసిప్రోచు
నెవ్వాని యిచ్చమై నెల్లమైతాల్పులు దివికినేగుదురు బొందిగమిఁ బాసి
యెవ్వఁడు నెఱిఁదప్ప కెపుడునుండెడి వారికెన్నఁడుఁదఱుఁగనియెలమిఁ గూర్చు
నట్టివేలుపువాకొన నలవిగాని కనికరంబున నెనలేని కలిమి యొసఁగి
రమణఁ గొల్ల వేంకట సుబ్బరాయ సెట్టి నతనితమ్మునిగురుసామినరయు గాతే.

క. బటువు జగమ్ములఁ గలయ, న్నిటికిని దొరయైన యట్టి నెఱవేలుపు వేం కటసుబ్బ రాయసెట్టిని, దిటవుగ గురుసామిసెట్టిఁ దిరముగమనుచున్.

సీ. ఏ వారియింటి పేరిజ్జగంబునఁదొల్లి గుఱ్ఱము వారిని కుదిరియుండి
కొల్లగా రోయీవిఁగోరు వారలఁదన్ప గడను గొల్లావారుగాఁగ మాఱె
నెవ్వారి తాత పేరెన్నికకును నెక్కి సుబ్బరాయలు సెట్టి సొబగుమీఱె
మివుల సరివారిలోనగారవఁగాంచి. యెసఁగినట్టి వేంకయ సెట్టి యెవరి తండ్రి యట్టివేంకట సుబ్బరాయలునుదమ్ముఁ, డై నగురుసామిసెట్టి యునలరుచుండ్రు.

చ. అడవిమెగంబు లందమగునట్టి పులుంగులు నున్నతోఁటయె
క్కడ ఁ గనువారివేడ్కకయి కన్నుల పండువు గాఁగఁ గనుండునే
కడఁ బలువింతలెల్లఁ జనికాంచెడి వారికిఁ గాఁగఁ గూరుసం
బడిన వెడందసాల చెలువంబగుఁ జూపఱకున్న విందుగాన్.
 
ఉ. ఎక్కడఁ గూడి నాయములనేవురు తీర్చెడు గొప్పకొల్వు వే
ఱెక్కడనీడులేక తగు నెక్కడఁ బిల్లలకన్ని విద్దెలుం
జక్కఁగ నేర్పి తేఱుసఁగఁ జాలిన విద్దెల సాలయొప్పుఁదా
నెక్కడ గొప్పకోట యొకఁడింపగు దండులు నిండియుండఁగన్.

సీ. ఏవీటి తూర్పున నెసఁగును సంద్రంబు డాయరాని యగడ్తయో యనంగ
నేప్రోలినుండి తామింలోఁ బొగబండు లెల్లెడలకు విచ్చ లేగివచ్చు
నేనేలఁ బొగయోడ లించుకలో దీవి వారినైనను గొవివచ్చివిలుచు
నెచ్చోట నాణెము లచ్చొత్తుచుండెడు జానుమీఱెడు టంకసాలయుండె
రాణిగారికి మాఱుగా రాచఱికము, వెలయఁ జెల్లించు దొర తనకొలువువారి
తోడనెచ్చట నెప్పుడుఁ గూడియుండు, నట్టి చెన్నపట్టణమున కలరువేడ్క.

సీ. ఏనొకపనిమీఁద నేగియున్నప్పుడు నాకూరిమి నెయ్యడౌ కారుమంచి
సుబ్బరాయలు నాయఁ డబ్బురమగు వాని నెల్లనాకావీట నెలమిమీఱఁ
జూపుచు నొకనాఁడు సుబ్బరాయలుసెట్టి గారి యింటికి నున్న గారవమును
గొని పోవదవ్వుగ గురుసామి పెట్టియు నన్నయు నెదురుగా నరుగుదెంచి
మేడమీఁదికిఁ గూరిమి మీఱనన్నుఁ వెలమిఁ గొనిపోతమ్మలమ్ములనొసంగి
కరము మరియాదయొనరించిసరసనొక్క, కుర్చిమీఁదఁ గూర్చుండనొనర్చియనల

తే. సేమమారసి మఱికొంతసేపు వేడ్క
ముచ్చటలతోడ నచ్చటఁ బ్రొద్దుపుచ్చి
మాటవెంబడిపాండు కొమాళ్ళకతను
గొలఁదిగాఁ దెనుఁగునఁ జేయఁ గోరుటయు.

క. కొల్లావారలు పెల్లుగ, నెల్లెడలను బేరునడుట నెన్నెన్నియొ చా
వళ్ళును బలువత్తరువులుఁ, గొల్లగ విలుపుటయు నెంచి కొంకవి మదితోన్.

తే. నేను నీకొని యిమ్మాడ్కి దీని వ్రాయుఁ
బూనివాఁడను దెలుఁగునఁ బొలుపుమీఱ
వారికెప్పుడు మేలును గోరునట్టి
కందుకూరి వీరేశిలింగమనువాఁడ.