ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అధ్యాయం : 36

పాశ్చాత్య ప్రపంచం గురించి

బాబాజీ ఆసక్తి

“గురుదేవా, మీ రెప్పుడయినా బాబాజీని కలుసుకున్నారా?”

శ్రీరాంపూర్‌లో ప్రశాంతమైన ఒక వేసవిరాత్రి అది; ఆశ్రమం రెండో అంతస్తు బాల్కనీలో నేను శ్రీయుక్తేశ్వర్ గారి పక్కన కూర్చుని ఉన్నప్పుడు, మా తలలకు పైన పెద్ద పెద్ద నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి.

“ఆ” నా సూటిప్రశ్నకు గురుదేవులు చిరునవ్వు నవ్వారు; ఆయన కళ్ళు భక్తి ప్రపత్తులతో ప్రకాశించాయి. “మూడుసార్లు ఆ అమర గురువుల దర్శనభాగ్యం కలిగింది. మేము మొదటిసారి కలుసుకోడం, అలహాబాదులో, కుంభమేళా సందర్భంలో.”

చిరకాలంగా భారతదేశంలో జరిపే మతధార్మిక ఉత్సవాల్ని కుంభమేళా లంటారు. ఆధ్యాత్మిక లక్ష్యాల్ని అవి జనబాహుళ్యం దృష్టిలో ఎప్పుడూ నిలుపుతూ ఉంటాయి. శ్రద్ధాళువులైన హిందువులు, వేలాదిమంది సాధువుల్నీ, యోగుల్నీ, స్వాముల్నీ, తపస్వుల్నీ- అన్ని రకాల వాళ్ళనీ దర్శించుకోడానికి, ప్రతి ఆరేసేళ్ళకి కాని పన్నెండేసేళ్ళకి కాని ఒకసారి చొప్పున లక్షలకి లక్షలు వచ్చి చేరతారు. మామూలుగా ఎన్నడూ ఏకాంత స్థానాల్ని విడిచిరాని సాధువులు చాలామంది ఈ మేళాలకు హాజరయి ప్రాపంచిక స్త్రీపురుషులకు తమ ఆశీస్సులు అందిస్తారు. “నేను బాబాజీని కలుసుకున్న నాటికింకా నేను స్వామిని కాలేదు.” అంటూ చెబుతూ వచ్చారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “కాని అప్పటికి, లాహిరీ మహాశయుల దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నాను. 1894 జనవరిలో అలహాబాదులో జరిగే మేళాకు వెళ్ళమని నన్నాయన ప్రోత్సహించారు. నాకది మొట్టమొదటి కుంభమేళా అనుభవం. ఆ కోలాహలమూ ఆ జన ప్రవాహమూ చూసి నేను కొద్దిగా దిగ్భ్రమ చెందాను. చుట్టూ గుచ్చిగుచ్చి చూశాను; తేజస్సుగల ఒక్క సద్గురువు ముఖమూ నాకు కనిపించలేదు. గంగానది ఒడ్డున ఒక వంతెన దాటుతూ ఉండగా, దగ్గరలోనే నిలబడి ఉన్న ఒక పరిచయస్థుణ్ణి చూశాను; అతని భిక్షాపాత్ర ముందుకు చాపి ఉంది.

“ ‘ఈ మేళా అంతా గోలా గందరగోళమూ బిచ్చగాళ్ళూ తప్ప మరేం లేదు,’ అనుకున్నాను నిరాశపడి. మనస్సును భిక్షాల మీదే నిలిపి పైకి ధర్మోపదేశాలు చేసే ఈ సోమరులకన్న మానవ కళ్యాణంకోసం విజ్ఞాన రంగాల్ని ఓర్పుతో విస్తరింపజేస్తున్న పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తలు, దేవుడికి ఎక్కువ సంతోషం కలిగించడం లేదా?’ అనిపించింది.

“నా ఎదురుగా వచ్చి ఆగిన పొడుగాటి ఒక సన్యాసి కంఠస్వరం, సమాజ సంస్కరణ గురించి నాలో రగులుతున్న ఆలోచనలకు అంతరాయం కలిగించింది.”

“ ‘మహాశయా, మిమ్మల్ని ఒక సాధువు పిలుస్తున్నారండి.’ అన్నాడతను.”

“ ‘ఎవరాయన?’ ”

“ ‘వచ్చి మీరే చూడండి.’ ”

“కొంచెం వెనకాడుతూనే, ఆయన టూకీగా ఇచ్చిన ఈ సలహాని పాటించి ఒక చెట్టు దగ్గరికి వచ్చాను. ఆ చెట్టు కొమ్మల నీడన, ఆకర్షకమైన శిష్యబృందంతో ఉన్న ఒక గురువుగారిని చూశాను. మిలమిల మెరిసే నల్ల కళ్ళతో, తేజస్వంతమైన అసాధారణ విగ్రహం గల ఆ గురువుగారు, నేను వస్తూండగా లేచి నించుని నన్ను కావలించుకున్నారు.”

“ ‘స్వాగతం, స్వామీజీ,’ అన్నారాయన ఆప్యాయంగా.”

“ ‘అయ్యా, నేను స్వామిని కానండి,’ అని ఒత్తి పలికాను.”

“ ‘స్వామి అన్న బిరుదు ఎవరికి ఇమ్మని దైవపరంగా నాకు ఆదేశం వచ్చిందో వాళ్ళు దాన్ని పరిత్యజించరు.’ ఆయన నాతో సౌమ్యంగానే మాట్లాడారు కాని, ఆయన మాటల్లో గాఢమైన సత్యనిష్ఠ ధ్వనించింది. తక్షణమే ఒకానొక ఆధ్యాత్మిక ఆశీర్వాద తరంగం నన్ను ముంచెత్తేసింది. సనాతన సన్యాసాశ్రమ స్థాయికి[1] హఠాత్తుగా నన్ను పెంచినందుకు చిరునవ్వు నవ్వుతూ, ఆ విధంగా నన్ను గౌరవించి, మానవరూపంలో ఉన్న మహామహులుగా, దేవదూతసదృశులుగా స్పష్టమవుతున్న ఆయన పాదాలకు ప్రణామం చేశాను.”

“ ‘బాబాజీ- నిజంగా బాబాజీయే- చెట్టుకింద తమకు దగ్గరగా ఉన్న ఒక ఆసనం నాకు చూపించారు. ఆయన బలిష్ఠంగా, పడుచు వయస్సులో ఉన్నవారు; లాహిరీ మహాశయుల్ని పోలి ఉన్నారు. ఈ మహానుభావులిద్దరి రూపురేఖల్లోనూ ఉండే అసాధారణమైన పోలికల్ని గురించి అంతకుముందు నేను తరచుగా వినే ఉన్నప్పటికీ అప్పుడా పోలిక నాకు తట్టలేదు. ఒక వ్యక్తి మనస్సులో ఏ నిర్దిష్ట భావమైనా తల ఎత్తకుండా నిరోధించే శక్తి బాబాజీకి ఉంది. ఆయన్ని నేను గుర్తు పట్టి భయ భక్తుల్లో మునిగిపోకుండా, తమ సమక్షంలో పూర్తిగా సహజంగా ఉండాలని మహాగురువులు ఆశించారని స్పష్టమవుతోంది.”

“ ‘కుంభమేళా గురించి ఏ మనుకుంటున్నావు?’ ”

“ ‘స్వామీ, నాకు చాలా నిరాశ కలిగిందండి,’ అని చెప్పి, చటుక్కున ఇంకా ఇలా అన్నాను, ‘మిమ్మల్ని కలుసుకునేటంత వరకు, ఏమిటో కాని, సాధువులకీ ఈ సంక్షోభానికి పొత్తు కుదిరినట్టు కనిపించడం లేదండి.’ ”

“ ‘బాబూ,’ అంటూ ప్రారంభించారు ఆ మహాగురువులు - ఆయన వయస్సుకు నేను దాదాపు రెట్టింపు వయస్సులో ఉన్నట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ. చాలామందిలో ఉండే తప్పులవల్ల, మొత్తం అందరినీ గురించి మంచిచెడ్డలు నిర్ణయించకు. భూమి మీద ప్రతిదీ, ఇసకా పంచదారా కలిసిపోయినట్టుగా, మిశ్రమై ఉన్నదే. పంచదార మాత్రమే తీసుకుని ఇసకను ముట్టకుండా వదిలేసే తెలివైన చీమ మాదిరిగా ఉండు. చాలామంది సాధువులు ఇక్కడ మాయలో సంచరిస్తున్నప్పటికీ, దైవ సాక్షాత్కారానుభూతి గల కొద్దిమందివల్ల ఈ మేళా పునీతమయింది.’ ”

“ఈ మహాగురువులతో నాకు సమాగమం జరిగినందువల్ల నేను త్వరగానే ఆయన అభిప్రాయంతో ఏకీభవించాను.”

“ ‘అయ్యా, దూరాన ఉన్న యూరప్‌లోనూ అమెరికాలోనూ నివసిస్తూ, వివిధ మతధర్మాల్ని బోధిస్తూ, ఇప్పటి మేళా లాంటివాటి నిజమైన విలువలు ఎరక్క, ఇక్కడ కూడిన చాలామంది కంటె తెలివిలో చాలా గొప్పవాళ్ళయిన ప్రముఖ పాశ్చాత్య విజ్ఞానశాస్త్రవేత్తల్ని గురించి నేను ఇంతవరకు ఆలోచిస్తూ ఉన్నానండి. భారతదేశపు సద్గురువులతో సమావేశాలవల్ల ఎక్కువగా లాభం పొందగలవాళ్ళు వీళ్ళు. కాని భౌతిక విజయాల్లో ఉన్నతులే అయినప్పటికీ, చాలామంది పాశ్చాత్యులు, కఠోరమైన భౌతికవాదానికి కట్టుబడిపోయినవాళ్ళు. విజ్ఞానశాస్త్రంలోనూ తత్త్వశాస్త్రంలోనూ ప్రసిద్ధులైన ఇతరులు, మతంలో ఉన్న సారభూతమైన ఏకత్వాన్ని గుర్తించరు. వాళ్ళ ధర్మాలు, దాటశక్యంకాని అవరోధాలై, వాళ్ళని శాశ్వతంగా మననుంచి వేరు చేస్తున్నాయి.’ ”

“ ‘పాశ్చాత్య ప్రపంచంగురించి, ప్రాచ్య ప్రపంచంగురించి కూడా నీకు ఆసక్తి ఉండడం చూస్తున్నాను.’ బాబాజీ ముఖం, ఆమోదంతో వెలుగొందింది. ‘నీ హృదయవేదన నాకు తెలుసు; విశాలమైన నీ గుండెలో మానవులందరికీ చోటు ఉంది. అందుకే నిన్నిక్కడికి పిలిపించాను.’ ”

“ ‘తూర్పు పడమర దేశాలు, కార్యకలాపాల్నీ ఆధ్యాత్మికతనూ మేళవించిన చక్కని మధ్యేమార్గాన్ని ఏర్పరచుకోవాలి,’ అంటూ ఇంకా చెప్పారు బాబాజీ. ‘భౌతిక అభివృద్ధి విషయంలో పడమటి దేశాలనుంచి భారతదేశం నేర్చుకోవలసింది చాలా ఉంది, దానికి బదులుగా, పడమటి దేశాలు తమ మతవిశ్వాసాలకు యోగశాస్త్రీయమైన గట్టి పునాదులు ఏర్పరచుకోడానికి తోడ్పడే విశ్వజనీన పద్ధతుల్ని భారతదేశం నేర్పగలదు.’ ”

“ ‘స్వామీజీ, ప్రాచ్య పాశ్చాత్య ప్రపంచాల మధ్య ముందుముందు జరగబోయే, సామరస్య పూర్వకమైన వినిమయంలో మీరు నిర్వహించ వలసిన పాత్ర ఒకటి ఉంది. మరి కొన్నేళ్ళకి, నేను మీ దగ్గరికి ఒక శిష్యుణ్ణి పంపుతాను; పాశ్చాత్య ప్రపంచంలో యోగవిద్యా వ్యాపనానికి మీరతన్ని తర్ఫీదు చెయ్యగలరు. ఆధ్యాత్మికంగా అన్వేషణ సాగిస్తున్న, అక్కడి అనేక ఆత్మల స్పందనలు వరదలా నా దగ్గరికి వస్తూంటాయి. అమెరికాలోనూ యూరప్‌లోనూ, జాగృతి పొందడానికి ఎదురుచూస్తున్న భవిష్యత్ సాధువుల్ని నేను చూస్తూ ఉన్నాను.’ ” తమ కథనంలో ఈ అంశందగ్గిర, శ్రీయుక్తేశ్వర్‌గారు, తమ దృష్టి పూర్తిగా నా మీద కేంద్రీకరించారు.

“ ‘నాయనా, అనేక సంవత్సరాలకు పూర్వమే, నా దగ్గరికి పంపుతానని బాబాజీ మాట ఇచ్చిన శిష్యుడివి నువ్వే,’ అన్నారు. గురుదేవులు, పండు వెన్నెట్లో చిరునవ్వు చిందిస్తూ.”

బాబాజీయే నాకు, శ్రీయుక్తేశ్వర్‌గారి సన్నిధికి దారి చూపించి నడిపించారని తెలిసి సంతోషించాను; అయినా నా గురువర్యులకూ నిరాడంబర ఆశ్రమ ప్రశాంతికి దూరంగా, ఎక్కడో దూరాన ఉన్న పాశ్చాత్య ప్రపంచంలో నా ఉనికిని ఊహించుకోడం నాకు కష్టమయింది.

“తరవాత బాబాజీ, భగవద్గీత గురించి మాట్లాడారు,” అంటూ చెప్పసాగారు, శ్రీయుక్తేశ్వర్‌గారు. “గీతలో చాలా అధ్యాయాలకి నేను వ్యాఖ్యలు రాశానన్న సంగతి తమకి తెలుసునన్నట్టుగా, మెచ్చుకుంటూ కొన్ని మాటల్లో ఆయన సూచించడంతో ఆశ్చర్యచకితుణ్ణి అయాను.

“నా కోరిక మన్నించి, స్వామీజీ, మీకు మరో పని చేపట్టండి.” అన్నారు మహాగురువులు. ‘క్రైస్తవ, హిందూ పవిత్ర గ్రంథాలకి మూలభూతంగా ఉన్న ఏకత్వాన్ని గురించి మీరో చిన్న పుస్తకం రాయరూ? ఉత్ప్రేరితులైన దైవపుత్రులు అవే సత్యాల్ని ప్రవచించారనీ, మానవుల పాక్షిక భేదాలవల్ల వాటి ఏకత్వం ఇప్పుడు మరుగుపడిపోయిందనీ, సమానార్థక గ్రంథభాగాలు ఉదాహరిస్తూ నిరూపించండి.’ ”

“ ‘మహారాజ్, ఎటువంటి ఆజ్ఞ! దాన్ని నెరవేర్చగలనా నేను?” అంటూ సంకోచపడుతూ సమాధాన మిచ్చాను.

“బాబాజీ మృదువుగా నవ్వారు. ‘నాయనా, నువ్వెందుకు సందేహిస్తావు?’ అంటూ నాకు నమ్మకం కలిగించేలా అన్నారు. ‘నిజానికి, ఇదంతా ఎవరి పని? ఈ పనులన్నీ చేసేవాడు ఎవరు? ఈశ్వరుడు నా చేత ఏది చెప్పిస్తే అది సత్యమై తీరక తప్పదు.’ ”

“ఆ సాధువు ఆశీస్సులవల్ల నేను ఆ శక్తి పొందినట్లు భావించి, ఆ పుస్తకం రాయడానికి ఒప్పుకున్నాను. నేను సెలవు తీసుకోవలసిన సమయం వచ్చిందని అనిపించి, మనస్సు ఒప్పకపోయినా, నా పత్రాసనం మీంచి లేచాను.”

“ ‘నీకు లాహిరీ తెలుసా?’ అని అడిగారు, మహాగురువులు. ‘అతను మహాత్ముడు కదూ? మనం కలుసుకున్న సంగతి అతనికి చెప్పు.’ ఆ తరవాత లాహిరీ మహాశయులకు అందించవలసిన వర్తమానం నాకు చెప్పారు.

“వీడుకోలుగా, నేను సవినయంగా వంగి నమస్కారం చేసిన తరవాత ఆ సాధువు, ప్రసన్నంగా చిరునవ్వు నవ్వారు. ‘ నీ పుస్తకం పూర్తి అయిన తరవాత నిన్నోసారి చూడ్డానికి వస్తాను,’ అని మాట ఇచ్చారు. ప్రస్తుతానికి సెలవు.”

“ఆ మర్నాడు నేను కాశీ వెళ్ళడానికి రైలు ఎక్కాను. మా గురుదేవుల నివాసానికి చేరి, కుంభమేళాలో కనిపించిన అద్భుతయోగి కథ అంతా ఏకరువు పెట్టాను.”

“ ‘అయ్యో, ఆయన్ని గుర్తు పట్టలేదా నువ్వు?’ లాహిరీ మహాశయుల కళ్ళు నవ్వుతో నాట్యమాడుతున్నాయి. ‘నువ్వు గుర్తుపట్టలేక పోయావని తెలుస్తోంది; అందుకాయన అడ్డుపెట్టారు నిన్ను. ఆయన అసదృశులయిన నా గురుదేవులు; దైవస్వరూపులైన బాబాజీ!’

“ ‘బాబాజీ!’ అంటూ మారుపలికాను, ఆశ్చర్యచకితుణ్ణి అయి, ‘యోగీశ్వరులు బాబాజీ!, దృశ్యాదృశ్య రక్షకులు బాబాజీ! అయ్యో గతాన్ని మళ్ళీ వెనక్కి రప్పించి ఆయన పాదపద్మాలకు భక్తితో మొక్కడానికి మళ్ళీ మరోసారి ఆయన సన్నిధిలో ఉండగలిగితే ఎంత బాగుండును!’

“ ‘పరవాలేదు,’ అంటూ ఊరడింపుగా అన్నారు లాహిరీ మహాశయులు. ‘నిన్ను మళ్ళీ చూస్తానని ఆయన మాట ఇచ్చారు.’

“ ‘గురుదేవా, దైవతుల్యులైన ఆ గురువులు మీకో వర్తమానం అందించమని చెప్పారు నాకు, “లాహిరీకి చెప్పు: ఈ జన్మకోసం నిలవచేసి ఉంచిన శక్తి ఇప్పుడు చాలా తక్కువ స్థాయిలో ప్రవహిస్తూ ఉంది; అది దాదాపు అయిపోయినట్టే.’ ”

“గూఢార్థం గల ఈ మాటలు నేను అనీ అనడంతోటే లాహిరీ మహాశయుల విగ్రహం, పిడుగువచ్చి మీద పడ్డట్టుగా కంపించిపోయింది. ఒక్క లిప్తలో అంతా నిశ్శబ్దమైపోయింది; చిరునవ్వు చిందే ఆయన ముఖకవళిక ఊహించరానంత కఠినమై పోయింది. గంభీరంగా, నిశ్చలంగా కూర్చుని ఉన్న కొయ్యబొమ్మ మాదిరిగా, ఆయన దేహం వివర్ణమయింది. నేను భయభ్రాంతుణ్ణి అయాను. ఈ ఆనందమూర్తి అంత ఆశ్చర్యకరమైన గాంభీర్యం ప్రదర్శించడం నా జీవితంలో అంతకు ముందెన్నడూ చూడలేదు. అక్కడున్న తక్కిన శిష్యులు నావేపు భయం భయంగా చూశారు.”

“మూడు గంటలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. అప్పుడు లాహిరీ మహాశయులు, తమకు సహజమైన ప్రసన్నతను తిరిగి పొంది, ప్రతి శిష్యుడితోటీ ఆప్యాయంగా మాట్లాడారు. ప్రతివారికీ మనస్సు తేలికపడింది.”

“మా గురుదేవుల్లో వచ్చిన ఈ మార్పునుబట్టి, బాబాజీ సందేశం స్పష్టమైన ఒక సంకేతమనీ దాన్ని బట్టి లాహిరీ మహాశయులు తమ శరీరాన్ని త్వరలో విడిచి వెళ్ళిపోవలసి వస్తుందని తెలుసుకున్నారనీ నేను గ్రహించాను. గురుదేవులు తక్షణమే తమను తాము అదుపులో పెట్టుకుని, భౌతిక ప్రపంచంతో తమకు ముడిపడి ఉన్న చిట్టచివరి దారాన్ని తెంపుకొని చిరంతన పరమాత్మ తత్త్వంలోకి పలాయనం చేశారని ఆయన భీకర మౌనం నిరూపించింది. బాబాజీ సందేశం, ‘నేను నీతో ఎప్పుడూ ఉంటాను’ అని చెప్పడానికి ఆయన అనుసరించిన పద్ధతి.

“బాబాజీ, లాహిరీ మహాశయులూ సర్వజ్ఞులయినప్పటికీ నా ద్వారాకాని మరో మధ్యవర్తి ద్వారాకాని ఒకరికొకరు వర్తమానాలు పంపుకోవలసిన అవసరం లేనప్పటికీ ఆ మహానుభావులు, మానవ నాటకంలో ఒక పాత్ర నిర్వహించడానికి తరచుగా ఇతరులను అనుగ్రహిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తమ భావిదర్శనాల్ని మామూలు పద్ధతిలో వార్తావహుల ద్వారా తెలియజేస్తూ ఉంటారు; ఎందుకంటే, తమ మాటలు చివరికి నెరవేరిన తరవాత, ఉత్తరోత్తరా ఈ కథ వినే జనబాహుళ్యంలో ఇతోధిక మైన దైవభక్తి కలిగించడానికి.”

“త్వరలోనే నేను కాశీ నుంచి వచ్చేసి శ్రీరాంపూర్‌లో, బాబాజీ కోరిన పవిత్ర గ్రంథ రచనాకార్యక్రమానికి పూనుకొన్నాను,” అంటూ ఇంకా చెప్పారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “నేను ఇలా పనికి పూనుకొన్నానో లేదో, ఆ అమర గురుదేవులకు అంకితంగా ఒక శ్లోకం రాయాలన్న ఉత్ప్రేరణ నాలో కలిగింది. అంతకు ముందెన్నడూ నేను సంస్కృత కవిత్వ రచనకు పూనుకోకపోయినప్పటికీ, మధురమైన పద్యపాదాలు అనాయాసంగా నా కలంలోంచి ప్రవహించసాగాయి.”

“ప్రశాంత నిశీధ సమయంలో నేను, బైబిలునూ సనాతనధర్మ[2] శాస్త్ర గ్రంథాల్నీ సరిపోల్చి చూడడంలో నిమగ్నుణ్ణి అయాను. పావనమూర్తి ఏసు ప్రభువు వాక్కుల్ని ఉదాహరిస్తూ, ఆయన ఉపదేశాలు వస్తుతః, వేదదర్శనాలతో ఏకీభవిస్తాయని నిరూపించాను. పరమగురువు[3]ల కృపవల్ల, ది హోలీ సైన్స్ (కైవల్య దర్శనం)[4] అన్న నా పుస్తకం చాలా కొద్దికాలంలోనే పూర్తి అయింది.

“నా రచనా కార్యక్రమం ముగిసిన మర్నాడు పొద్దున, గంగలో స్నానం చెయ్యడానికి ఇక్కడ రాయ్‌ఘాట్ రేవుకు వెళ్ళాను,” అంటూ చెప్పారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “రేవు నిర్మానుష్యంగా ఉంది; వెచ్చ వెచ్చని ఎండలో ప్రశాంతిని అనుభవిస్తూ కొద్దిసేపు నిలకడగా ఉండిపోయాను. తళతళ లాడే నీళ్ళలో ఒక్క మునుగు మునిగి ఇంటికి బయలుదేరాను. ఆ నిశ్శబ్దంలో వినవస్తున్న శబ్దమల్లా, నేను అడుగుతీసి అడుగు వేస్తున్నప్పుడు, గంగలో తడిసిన బట్ట రెపరెపలాడుతూ చేస్తున్న చప్పుడే. ఏటి ఒడ్డున విశాలమైన పెద్ద మర్రిచెట్టున్న తావు దాటి కొంచెం వెళ్ళేసరికి, ఎందుకో వెనక్కి తిరిగి చూడాలన్న గట్టి ఊపు ఒకటి వచ్చింది. అక్కడ, మర్రిచెట్టు నీడన, కొద్దిమంది శిష్యుల నడుమ కూర్చుని ఉన్నారు మహామహులు బాబాజీ!, “ ‘అభినందనలు, స్వామీజీ!’ నేను కలగనడం లేదని నమ్మకం కలిగించడానికి, మహాగురువుల కంఠస్వరం మధురంగా ధ్వనించింది. ‘మీ పుస్తక రచన విజయవంతంగా ముగించడం గమనించాను. మీకు మాట ఇచ్చిన ప్రకారం, మీకు ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడున్నాను.’ ”

“దడదడలాడుతున్న గుండెతో, ఆయన పాదాలముందు సాగిలపడ్డాను. పరమగురూజీ, ‘మీరూ మీ శిష్యులూ, దగ్గరిలో ఉన్న మా ఇంటిని పావనం చెయ్యరూ?’ అంటూ ప్రాధేయపూర్వకంగా విన్న వించుకున్నాను.”

“పరమ గురువులు చిరునవ్వుతో నిరాకరించారు. ‘వద్దు, నాయనా, చెట్లనీడంటే ఇష్టపడే మనుషులం మేము; ఈ చోటు చక్కగా సుఖంగా ఉంది.’ ”

“ ‘కాస్సేపు ఉండండి,’ అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన వేపు చూశాను. ‘కొన్ని ప్రత్యేకమైన మిఠాయిలు తీసుకుని చటుక్కున చక్కా వస్తాను.’[5]

“కొద్ది నిమిషాల్లో నేను ఫలహారాల పళ్ళెంతో తిరిగి వచ్చేసరికి, విశాల వటవృక్షం నీడన ఆ దివ్యస్వరూపుల బృందం లేదు. రేవు చుట్టు పక్కలంతా గాలించాను; ఆ సాధుబృందం గాలిరెక్కల మీద అదివరకే ఎగిరిపోయిందని నా హృదయానికి తెలుసు.

“నా మనసు తీవ్రంగా గాయపడింది. ‘మళ్ళీ మేం కలుసుకున్నాకూడా, నేను బాబాజీతో మాటే ఆడను’ అనుకున్నాను మనసులో. ‘అంత హఠాత్తుగా ఆయన వెళ్ళిపోయి, నా మీద నిర్దయ చూపించారు.’ నిజంగా ఇది ప్రణయ కోపం; అంతకిమించి మరేమీ లేదు. “మరి కొన్ని నెల్లకి నేను కాశీలో లాహిరీ మహాశయుల్ని దర్శించాను. నేను గదిలోకి ప్రవేశించగానే, మా గురువులు, పలకరింపుగా చిరునవ్వు నవ్వారు.”

“ ‘రావయ్యా, యుక్తేశ్వర్’ అన్నారాయన. ‘నా గది గుమ్మంలో నువ్వు బాబాజీని చూశావా?’ ”

“ ‘లేదండి’ అని జవాబిచ్చాను, ఆశ్చర్యంగా.”

“ ‘ఇలా రా.’ లాహిరీ మహాశయులు, నా నుదుటిని మెల్లగా స్పృశించారు; వెంటనే చూశాను, తలుపు దగ్గర, ప్రపుల్ల పద్మ సదృశులైన బాబాజీ సుందరరూపాన్ని.

“నా మనస్సుకు తగిలిన వెనకటి గాయం గుర్తుకు వచ్చింది; నేను ప్రణామం చెయ్యలేదు. లాహిరీ మహాశయులు ఆశ్చర్యచకితులై చూశారు నావేపు.”

“అగాధమైన కళ్ళతో నా వేపే చూస్తున్నారు దివ్యగురువులు, ‘నా మీద కోపంగా ఉంది నీకు.’ ”

“ ‘ఔనండి, ఎందుకుండగూడదు?’ అని జవాబిచ్చాను. ‘గాలిలోంచి వచ్చారు. మీ గారడివాళ్ళ జట్టుతో; ఆ పల్చటి గాలిలోకే మళ్ళీ మాయమయారు.’ ”

“ ‘నేను నిన్ను చూస్తాననే చెప్పాను కాని, ఎంతసేపుంటానో చెప్పలేదు.’ బాబాజీ మృదువుగా నవ్వారు. ‘నువ్వు ఉత్సాహాతిరేకంలో ఉన్నావు. నీ అశాంతి గాలిదుమారంలోనే నేను ఎగిరిపోయానని నీకు నమ్మకంగా చెప్పదలుచుకున్నాను.’ ”

“పొగడ్త లేని ఈ సంజాయిషీతో తక్షణమే తృప్తిపడ్డాను నేను.” ఆయన పాదాలకు ప్రణామం చేశాను; ఆ పరమగురువులు దయతో నా భుజం తట్టారు.

“ ‘అబ్బాయి, నువ్వింకా ఎక్కువగా ధ్యానం చెయ్యాలి,” అన్నారాయన. ‘నీ చూపు ఇంకా లోపరహితం కాలేదు. సూర్యకాంతికి మరుగున ఉన్న నన్ను చూడలేక పోయావు నువ్వు. దివ్య వేణునాదం వంటి స్వరంతో ఈ మాటలు పలికి మరుగయి ఉన్న వెలుతురులోకి మాయమయ్యారు బాబాజీ.

“నా కడపటి కాశీ సందర్శనల్లో ఇది ఒకటి,” అని ముగించారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “కుంభమేళాలో బాబాజీ జోస్యం చెప్పినట్టుగానే, లాహిరీ మహాశయుల గృహస్థ అవతారం ముగింపుకి దగ్గర పడింది. 1895 వేసవిలో ఆయన దృఢకాయానికి, వీపుమీద ఒక చిన్న కురుపు వేసింది. కురుపు కొయ్యడానికి ఆయన అడ్డుపెట్టారు; తమ శిష్యుల్లో కొందరి దుష్కర్మను తమ శరీరంలో అనుభవించి దాన్ని నశింపు చేస్తున్నారు. చివరికి కొందరు శిష్యులు పట్టుపట్టారు; దానికి ఆయన గూఢంగా జవాబు ఇచ్చారు:

“ ‘ఈ దేహం తాను పోవడానికి ఒక కారణం చూసుకోవాలి; మీరు ఏం చెయ్యదలుచుకున్నా నేను ఒప్పుకుంటాను.’ ”

“కొద్ది కాలంలో, ఆ అసదృశ గురుదేవులు, కాశీలో తనువు చాలించారు. ఆయనకోసం నేనిక ఆయన చిన్న గదికి వెళ్ళక్కరలేదు. నా జీవితంలో ప్రతిరోజూ ఆయన సర్వోపగత మార్గదర్శిత్వంతో ధన్యమవుతోంది.”

చాలా ఏళ్ళ తరవాత, లాహిరీ మహాశయుల నిర్యాణాన్ని గురించి అద్భుతమైన వివరాలు అనేకం, ఉన్నత స్థితి నందుకొన్న, స్వామి కేశవానంద[6] అనే శిష్యుల నోటి మీదగా విన్నాను.

“మా గురుదేవులు శరీరాన్ని విడిచి పెట్టడానికి కొన్నాళ్ళముందు, నేను హరిద్వారంలో నా ఆశ్రమంలో కూర్చుని ఉండగా, నా ఎదుట ఆయన సాక్షాత్కరించారు.”

“ ‘వెంటనే కాశీకి రా.’ ఈ మాటలతో లాహిరీ మహాశయులు అదృశ్యమయారు.”

“వెంటనే నేను రైలెక్కి కాశీకి బయలుదేరాను. మా గురుదేవుల ఇంట్లో చాలామంది శిష్యులు చేరి ఉన్నారు. ఆ రోజున[7] గురుదేవులు కొన్ని గంటలపాటు గీతను వ్యాఖ్యానిస్తూ ఉపన్యసించారు; ఆ తరవాత మాతో టూకీగా ఇలా అన్నారు:

“ ‘నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను.’ ”

“మాలో దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది; వెక్కి వెక్కి ఏడిచాం.”

“ ‘కుదుటపడండి. నేను మళ్ళీ లేచి వస్తాను. ఈ ముక్క అన్న తరవాత లాహిరీ మహాశయులు తమ ఆసనంమీంచి లేచారు; తమ శరీరాన్ని గుండ్రంగా మూడుసార్లు తిప్పారు; ఉత్తరంవేపు తిరిగి పద్మాసనం వేసుకున్నారు; అద్భుతంగా, అంతిమమయిన మహాసమాధి[8]లోకి వెళ్ళిపోయారు.

“భక్తుల కెంతో ప్రియమైన, లాహిరీ మహాశయుల సుందరదేహాన్ని గృహస్థోచితమైన కర్మకాండతో, పావన గంగాతీరాన మణికర్ణికా ఘట్టంలో దహనం చేశారు,” అంటూ చెప్పారు కేశవానందగారు. “ఆ మర్నాడు పొద్దున పది గంటలకు, నే నింకా కాశీలోనే ఉండగా, నా గది ఒక మహత్తరమైన కాంతితో కమ్ముకుపోయింది. ఆహా! లాహిరీ మహాశయుల రూపం, రక్తమాంసాలు నిండిన శరీరంలో నా ఎదురుగా నిలబడి ఉంది. అది అచ్చం, ఆయన వెనకటి శరీరంలాగే ఉంది కాని, దానికన్న ఇది తక్కువ వయస్సులో ఉన్నట్టూ దానికన్న తేజోవంతంగానూ ఉంది. గురుదేవులు నాతో మాట్లాడారు.”

“ ‘కేశవానందా, నేనే, దహనమయిన నా శరీరం తాలూకు విఘటిత పరమాణువుల నుంచి నా రూపాన్ని కొత్త నమునాగా సృష్టించి పునరుత్థానం కావించాను. గృహస్థుగా ఈ ప్రపంచంలో నా పని పూర్తిఅయింది. కాని నే నీ భూమిని పూర్తిగా విడిచి పోను. ఇకనుంచి, బాబాజీతో హిమాలయాల్లో కొంతకాలం గడుపుతాను; ఆ తరవాత బాబాజీతో బ్రహ్మాండంలో.’ ”

“ఆశీః పురస్సరంగా నాతో కొన్ని మాటలు పలికి అంతర్ధానమయారు, లోకాతీత గురుదేవులు. అద్భుతమైన ఉత్తేజంతో నిండిపోయింది నా గుండె. క్రీస్తు, కబీర్[9]ల శిష్యులు, తమ గురుదేవుల్ని, వారి భౌతిక మరణానంతరం సజీవరూపంలో దర్శించినప్పుడు ఎటువంటి ఆత్మోన్నతి అనుభూతమయిందో నాకూ అటువంటిదే అనుభూతమయింది.

“హరిద్వారంలో ఉన్న నా ఏకాంత ఆశ్రమానికి నేను తిరిగి వెళ్ళి నప్పుడు, గురుదేవుల చితాభస్మంలో కొంతభాగం కూడా తీసుకునివెళ్ళాను. నాకు తెలుసు, దేశకాలావధులు గల పంజరంలోంచి ఆయన తప్పించుకు పోయారని, సర్వవ్యాపకతా విహంగం విముక్తమయిందని. అయినా, ఆయన చితాభస్మానికి సమాధి కట్టించడం నా మనసుకు ఊరట కలిగించింది.”

పునరుత్థానం చెందిన గురుదేవుల్ని దర్శించే భాగ్యం పొందిన మరో శిష్యులు, సాధుప్రవృత్తిగల పంచానన్ భట్టాచార్య[10] గారు. నేను కలకత్తాలో ఆయన ఇంటికి వెళ్ళి, గురుదేవులతో ఆయన గడిపిన అనేక సంవత్సరాల వృత్తాంతాన్ని ఆనందంగా విన్నాను. చివర, తమ జీవితంలోకల్లా అత్యద్భుతమైన ఘట్టం ఒకటి చెప్పారాయన.

“లాహిరీ మహాశయుల దహనం జరిగిన మర్నాడు పొద్దున పది గంటలకి, ఇక్కడ కలకత్తాలో, జీవద్విభవంతో నా ముందు ప్రత్యక్షమయారాయన.”

రెండు శరీరాల సాధువు - స్వామి ప్రణవానందగారు కూడా తమ అతీంద్రియానుభూతిని నాకు వివరించారు. మా రాంచీ విద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో, ప్రణవానందగారు నా కిలా చెప్పారు.

“లాహిరీ మహాశయులు శరీరాన్ని విడిచి పెట్టడానికి కొన్నాళ్ళ ముందు, ఆయన దగ్గర్నించి నాకో ఉత్తరం వచ్చింది; నన్ను వెంటనే కాశీకి రమ్మని రాశారాయన, అందులో. అయితే, తప్పనిసరి ఆటంకంవల్ల నా ప్రయాణం ఆలస్యమయింది; వెంటనే బయలుదేరలేకపోయాను. నేను కాశీ ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండగా, పొద్దున పదిగంటల వేళ , మా గురుదేవుల ఉజ్జ్వలరూపాన్ని నా గదిలోనే చూసి ఆనందం పట్టలేక పోయాను.

“ ‘కాశీకి రావాలని తొందరెందుకు?’ అన్నాడు, చిరునవ్వు చిందిస్తూ. ‘నన్నింక అక్కడ చూడవు.’ ”

“ఆయన మాటల్లో అర్థం నాకు స్ఫురించేసరికి, గుండె పగిలి వలవలా ఏడ్చేశాను; ఆయన్ని కేవలం అంతర్దర్శనంలోనే చూస్తున్నానని నమ్మి.”

“గురుదేవులు. ఓదార్పుగా నా దగ్గరికి వచ్చారు. ‘ఇక్కడ, నా కండ పట్టి చూడు,’ అన్నారు. ‘ఎప్పటిలాగే నేను జీవించి ఉన్నాను. దుఃఖపడకు; ఎప్పటికీ నీతోనే ఉండడం లేదూ?’ ”

ఈ ముగ్గురు మహాశిష్యుల నోళ్ళనుంచీ అద్భుత సత్యాన్ని తెలిపే కథ బయల్పడింది: లాహిరీ మహాశయుల దేహం మంటలకు ఆహుతి అయిన మర్నాడు, పొద్దున పది గంటలవేళ - రూపాంతరం చెందినప్పటికీ - వాస్తవమైన దేహంతో మూడు వేరువేరు నగరాల్లో, ముగ్గురు శిష్యుల ముందు ఆయన సాక్షాత్కరించారు.

“నశ్వరమైన దీనికి అనశ్వరత సిద్ధిస్తే, మర్త్యుడు అమరత్వం సాధిస్తే అప్పుడు, మృత్యువును విజయం కబళించేసిందన్న లిఖిత సూక్తి రుజువవుతుంది. మరణమా, ఎక్కడ నీ కాటు? శ్మశానమా, ఎక్కడ నీ విజయం?[11]

 1. ఉత్తరోత్తరా శ్రీయుక్తేశ్వర్‌గారికి, బుద్ధగయలోని మహంతుగారు, అనుష్టానికంగా సన్యాస దీక్ష ఇచ్చారు.
 2. అంటే, “శాశ్వతమైన మతం” అని అర్థం; వేదబోధల సమస్తానికి పెట్టిన పేరు ఇది. ఈ ‘సనాతన ధర్మం’. గ్రీకుల కాలంనుంచి ‘హిందూమతం’గా పేరు పొందింది. సింధునదీ తీరాల్లో నివసించే ప్రజలకు గ్రీకులు, హిందువులు (Indoos, or Hindus) అని పేరు పెట్టారు.
 3. పరమగురువు అంటే “అతీత గురువు” అని వాచ్యార్థం; ఇది గురు పరంపరను సూచిస్తుంది. లాహిరీ మహాశయుల గురువులైన బాబాజీ, శ్రీయుక్తేశ్వర్ గారికి పరమగురువులు. క్రియాయోగ సాధనచేసే ఎస్. ఆర్. ఎఫ్. వై. ఎస్. ఎస్. సభ్యులందరికీ బాబాజీ పరుగురువులు.
 4. ఇప్పుడు భారతదేశంలో బీహారులో, రాంచీలో ఉన్న యోగదా సత్సంగ సొసైటీ వారు దీన్ని ప్రచురించారు.
 5. గురువుల దర్శనం చేసుకున్నప్పుడు ఫలహారాలు సమర్పించకపోవడం, భారతదేశంలో ఆయన్ని అగౌరవపరచడం కింద లెక్కకు వస్తుంది.
 6. నేను కేశవానందగారి ఆశ్రమాన్ని సందర్శించిన సందర్భం 42 అధ్యాయంలో వివరించడం జరిగింది.
 7. లాహిరీ మహాశయులు దేహత్యాగం చేసిన రోజు 26 సెప్టెంబరు 1895. మరి కొన్నాళ్ళలో ఆయనకి అరవైఏడో ఏడు వచ్చేది.
 8. శరీరాన్ని మూడుసార్లు గుండ్రంగా తిప్పడం, ఉత్తరాభిముఖం కావడం వైదిక కర్మకాండలో భాగాలు, తమ భౌతిక కాయానికి అంతిమ ఘడియ ఎప్పుడువస్తుందో ముందుగా తెలిపిన మహాగురువులు ఇలా చేస్తారు. చివరి ధ్యానంలో మహాగురువులు, ఓంకార విశ్వనాదంలో లయమవుతారు; ఈ చివరి ధ్యానాన్నే ‘మహాసమాధి’ అంటారు.
 9. కబీరు, పదహారో శతాబ్దినాటి గొప్ప సాధువు. ఆయన శిష్యుల్లో హిందువులూ ముస్లిములూ కూడా ఉండేవారు. కబీరు నిర్యాణానంతరం ఆయన శిష్యులు, ఆయనకు అంత్యక్రియలు జరపవలసిన విధానం గురించి తగువులాడుకున్నారు. దానికి ఆగ్రహం కలిగిన ఆ గురువు, దీర్ఘ నిద్రనుంచి లేచి, వాళ్ళకి ఆదేశాలిచ్చాడు. “నా అవశేషాల్లో సగం, ముస్లిం విధి ప్రకారం పాతిపెట్టండి,” అన్నాడాయన. “మిగిలిన సగం హిందూ సంస్కారాన్నిబట్టి దహనం చెయ్యండి.” తరవాత అదృశ్యమయాడు. అప్పుడు శిష్యులు, ఆయన శవంమీద కప్పిన గుడ్డ తీసేసరికి అక్కడ, అందమైన పూల బారు ఒకటి తప్ప ఇంకేమీ కనిపించలేదు. వాటిలో సగం తీసుకుని ముస్లిములు, మగ్హర్‌లో భక్తి శ్రద్ధలతో సమాధిచేశారు; వాళ్ళు ఇప్పటికీ ఆ సమాధికి మొక్కుతూ ఉంటారు. తక్కిన సగం, హిందూ సంస్కారానుసారంగా కాశీలో దహనం చేశారు. కబీరు పడుచు వయస్సులో ఉండగా, మార్మిక మార్గంలో సూక్ష్మమైన జ్ఞానోపదేశం కావాలని కోరుతూ ఇద్దరు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళకి, ఆ గురువు టూకీగా ఇలా జవాబిచ్చాడు:

  “కో ఈ కహత్ దూరీ హై యహ్ కీ దూరక్ బాత్ నిరాసీ,
    సో తేరో మన్ మోహి విరాజే అమర్ పురుష్ అవినాసీ,
    మోహిం సుని-సుని ఆవే హాఁసీ,
    పానీ మే మీస్ పియాసీ.”

    (దారి అంటూ చెప్పినప్పుడు దూరమనేది ఉంటుంది దానికి;
    ఆయన దరిదాపులోనే ఉంటే, నీకో దారి అన్నదే అవసరం లేదు.
    నాకు నవ్వొస్తూ ఉంటుంది,
    నీళ్ళలో చేపకు దాహంగా ఉందని ఎవరైనా చెప్పగా విన్నప్పుడు!)

 10. పంచానన్ భట్టాచార్యగారు, బీహారులో ఉన్న దేవగఢ్‌లో, పదిహేడెకరాల తోటలో శివాలయం ఒకటి నిర్మించారు; అందులో లాహిరీ మహాశయుల తైలవర్ణ చిత్రం ఒకటి ప్రతిష్టించారు.
 11. కోరింథీయులకు 15 : 54-55 (బైబిలు). “చనిపోయిన వాళ్ళని దేవుడు లేపుతాడన్న సంగతి నమ్మలేని మాటగా ఎందుకసుకోవాలి మీరు?" అపొస్తలుల కార్యాలు 26 : 8 (బైబిలు).