ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 35

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 35

లాహిరీ మహాశయుల

పావన జీవనం

“ఈ ప్రకారం సర్వధర్మాన్ని పాటించడం మనకు ఉచితం.”[1] బాప్టిస్ట్ యోహాను (జాన్) తో అన్న ఈ మాటల్లోనూ, తనకు బాప్టిజం ఇమ్మని యోహాన్ను కోరడంలోనూ ఏసు, తన గురువుకు గల దివ్యాధికారాల్ని అంగీకరిస్తున్నాడు.

ప్రాచ్యదేశీయుడి దృక్పథం[2]తో పూజ్యభావంతో బైబిలు అధ్యయనం చేసిన మీదటా సహజావబోధంతో గ్రహించిన మీదటా, బాప్టిస్ట్ యోహాను పూర్వజన్మల్లో క్రీస్తుకు గురువని నాకు నమ్మకం కుదిరింది. పూర్వజన్మల్లో యోహాను ఎలిజా (Elijah) గానూ అతని శిష్యుడయిన ఏసును ఎలిషా (Elisha) గానూ బైబిలులో అనేక భాగాలు సూచిస్తాయి. (బైబిలు పాత నింబధన గ్రంథంలో ఉన్న వర్ణక్రమ మిది. గ్రీకు అనువాదకులు ఈ పేర్లలో ఎలిజాను Elia3 అని, ఎలిషాను Eliseus అని రాశారు. ఇలా మార్చిన రూపాలే కొత్త నిబంధన గ్రంథంలో మళ్ళీ కనిపిస్తాయి). పాత నిబంధన గ్రంథంలోని చివరి ఆంశం, ఎలిజా ఎలిషాల పునర్జన్మ గురించి ముందుగా భవిష్యత్ సూచన చెయ్యడం: “చూడండి. ప్రభువు తాలూకు మహత్తర, భయంకర దినం రావడానికి ముందు, ఎలిజా ప్రవక్తను మీ కోసం పంపిస్తాను.”[3]

ఈ ప్రకారంగా “ప్రభువు......రావడానికి ముందు” పంపగా వచ్చిన యోహాను (ఎలిజా), క్రీస్తు రాకను చాటడానికి ఉపకరించే విధంగా, ఆయనకన్న కొద్దిగా ముందుగా పుట్టాడు. యోహాను తండ్రి అయిన జకర్యాకు ఒక దేవదూత ప్రత్యక్షమైనది. అతనికి పుట్టబోయే కొడుకు యోహాను ఎలిజా (ఏలీయా) తప్ప మరొకరు కారని ధ్రువపరచడానికి.

“కాని దేవదూత అతనికి ఇలా చెప్పాడు, భయపడకు, జకర్యా. ఏమంటే, నీ ప్రార్థన వినబడింది; నీ భార్య ఎలీసబెత్తు నీ కో కొడుకును కంటుంది; అతనికి నువ్వు యోహాను అని పేరు పెడతావు. ఇశ్రాయేలీయులు సంతానంలో అనేక మందిని అతను, వాళ్ళ దేవుడివేపు తిప్పుతాడు. తండ్రుల హృదయాన్ని పిల్లలవేపు, అవిధేయుల్ని న్యాయపరుల జ్ఞానమార్గంవేపు తిప్పడానికి ప్రభువు[4] ఆగమనంకోసం ఆయత్తమై ఉన్న ప్రజల్ని సిద్ధం చెయ్యడానికీ, ‘ఏలీయా ఆత్మతోనూ శక్తితోనూ, ఆయన రాకకు ముందే వస్తాడు.[5]

యోహానును ఏసు, ఎలిజా (ఏలీయా) గా రెండుసార్లు నిర్ద్వంద్వంగా గుర్తుపట్టాడు. “ఏలీయా ఇదివరకే వచ్చాడు; వాళ్ళది ఎరగరు... ఆయన బాప్తిస్మ మిచ్చే యోహానును గురించి తమకు చెప్పాడని అప్పుడు శిష్యులు గ్రహించారు.”[6] మళ్ళీ అంటాడు క్రీస్తు: “యోహాను కాలం వరకు ప్రవక్తలు ప్రవచించారు; ధర్మశాస్త్రం కూడా ప్రవచించింది. మీరు గ్రహించేటట్లయితే, రావలసి ఉన్న ఏలీయా ఇతడే.”[7]

తాను ఏలీయా (ఎలిజా)[8] నన్న విషయం యోహాను ఒప్పుకోక పోవడంలో యోహాననే వినయ వేషంలో ఉన్న తాను, మహాగురువైన ఎలిజా బాహ్యోత్కర్షతో వచ్చినవాణ్ణి కానని చెప్పడం అతని ఉద్దేశం. పూర్వజన్మలో తాను, తన మహిమ అనే “ఉత్తరీయాన్నీ” ఆధ్యాత్మిక సంపత్తినీ శిష్యుడైన ఎలిషాకు ఇచ్చేశాడు. “ఎలిషా అన్నాడు, - మిమ్మల్ని వేడుకుంటాను, మీ ఆత్మశక్తికి రెట్టింపు భాగం నాకు ప్రాప్తించేలా అనుగ్రహించండి అన్నాడు. దానికి అతను చెప్పాడు, నువ్వు కష్టమయింది అడుగుతున్నావు; అయినా, నీ నుంచి నన్ను తీసుకుపోతూండగా నువ్వు నన్ను చూసేటట్లయితే నీ కోరిక నెరవేరుతుంది... ఎలిజా మీది నుంచి పడ్డ ఉత్తరీయాన్ని, అతను తీసుకున్నాడు.”[9]

ఆయన నిర్వహించే పాత్ర ఇప్పుడు తారుమారయింది; కారణ మేమిటంటే, దైవపరంగా పరిపూర్ణత సిద్ధించిన ఎలిషా- ఏసుకు, ఎలిజా- యోహాను ప్రత్యక్ష గురువుగా ఉండవలసిన అవసరం ఇక మీదట లేదు. కొండమీద క్రీస్తు రూపాంతరం చెందినప్పుడు,[10] మోషే (మోసెస్) లో ఆయన చూసినది, తన గురువు ఏలీయాను. శిలువ మీద తన అంత్య సమయంలో ఏసు ఇలా ఆరిచాడు: ‘ఏలీ, ఏలీ లామా సబక్తానీ?’ “అంటే, నా దేవా, నా దేవా, నన్నెందుకు వదిలేశావు?” అని అర్థం. అక్కడ నిలబడి ఉన్నవాళ్ళలో కొందరు, అది విన్నప్పుడు, ఈయన ఏలీయాను పిలుస్తున్నాడు... ఈయన్ని కాపాడ్డానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం అన్నారు.”[11]

కాలావధిలేని గురుశిష్య సంబంధం, యోహానుకూ ఏసుకూ ఉన్నట్టుగానే బాబాజీకి లాహిరీ మహాశయులకూ కూడా ఉంది. మృత్యుంజయులైన ఆ పరమ గురుదేవులు, తమ శిష్యుడి జన్మలు రెంటికీ మధ్య వడివడిగా సుళ్ళు తిరిగిన లోతయిన అఖాత జలాల్ని ఈదుకుంటూ దాటి, పిల్లవాడిగానూ పెద్దవాడిగానూ లాహిరీ మహాశయులు గడిపే జీవిత క్రమానికి దారి చూపించారు. ఎన్నడూ విడిపోని బంధాన్ని బహిరంగంగా మళ్ళీ కూర్చడానికి, తమ శిష్యుడికి ముప్ఫైమూడో ఏడు వస్తేనేకాని సరైన కాలం రాలేదని బాబాజీ భావించారు.

రాణీఖేత్ సమీపంలో కొన్నాళ్ళు కలిసి ఉన్న తరవాత, స్వార్థరహితులైన గురుదేవులు, తమ ప్రియశిష్యుణ్ణి తమ దగ్గరే ఉంచేసుకోకుండా, బాహ్యమైన లోకకళ్యాణ సాధనకోసం లాహిరీ మహాశయుల్ని విడుదల చేశారు. “నాయనా, నేను నీకు అవసరమయినప్పుడల్లా వస్తాను.” అటువంటి వాగ్దానంలోని అనంతమైన నిబంధనల్ని మర్త్యుడైన ఏ ప్రేమికుడు పాటించగలడు?

సమాజ సామాన్యానికి తెలియకుండానే, కాశీలో ఒక మారుమూల, 1861 లో, మహత్తరమైన ఒకానొక ఆధ్యాత్మిక పునరుజ్జీవనం ఆరంభ మయింది. పూలవాసనని ఎవ్వరూ అణిచిపెట్టలేరు; అలాగే, ఆదర్శ గృహస్థుగా ప్రశాంతంగా జీవిస్తున్న లాహిరీ మహాశయులు, సహజ సిద్ధమైన తమ మహిమను దాచి ఉంచలేకపోయారు. భక్త భ్రమరాలు, ఈ విముక్త సిద్ధపురుషుల దివ్యామృతాన్ని వెతుక్కుంటూ, భారతదేశంలో ప్రతిభాగం నుంచి రావడం మొదలు పెట్టాయి.

లాహిరీ మహాశయుల్ని “ఎక్‌స్టాటిక్ బాబూ” (ఆనందమగ్నుడు) అని ఆప్యాయంగా పిలుస్తూ ఉండే ఇంగ్లీషు ఆఫీసు సూపరింటెండెంటు, ఈ ఉద్యోగిలో చిత్రమైన ఒక ఉత్కృష్ట పరివర్తనను తొందరగా గమనించాడు.

“అయ్యా, మీరు దిగులుగా కనిపిస్తున్నారు. ఏమిటి ఇబ్బంది?” లాహిరీ మహాశయులు ఒకనాడు పొద్దున తమ యజమానిని సానుభూతిగా పలకరిస్తూ అడిగిన ప్రశ్న ఇది.

“ఇంగ్లండులో మా ఆవిడ ప్రమాదకరమైన జబ్బులో ఉంది. నేను ఆందోళనతో కుమిలిపోతున్నాను.”

“ఆవిడ గురించి నేను మీకు కొంత సమాచారం తెస్తాను,” అని లాహిరీ మహాశయులు, ఆయన గదిలోంచి వచ్చేశారు; ఒక ఏకాంత ప్రదేశంలో కొంత సేపు కూర్చున్నారు. తిరిగి వస్తూ, ఊరడింపుగా చిరునవ్వు నవ్వారు.

“మీ ఆవిడ మెరుగవుతున్నారు, ఇప్పుడు మీ కో ఉత్తరం రాస్తున్నారు.” సర్వజ్ఞులైన ఆ యోగిపుంగవులు, ఉత్తరంలో కొన్ని భాగాలు ఉదాహరించారు.

‘ఎక్‌స్టాటిక్ బాబూ, మీరు సామాన్య వ్యక్తి కారని నాకు ముందే తెలుసు. అయినా మీరు, సంకల్పమాత్రంచేత దేశకాలాల్ని బహిష్కరించగల రన్నదే నమ్మలేకుండా ఉన్నాను.”

చివరికి, అనుకున్న ఉత్తరం వచ్చింది. అందులో, తమ భార్య కోలుకోడాన్ని గురించిన శుభవార్త ఉండడమే కాదు, కొన్ని వారాల ముందు ఆ మహాయోగి పలికిన మాటలు కూడా అందులో అచ్చూమచ్చూ ఆలాగే ఉన్నాయి.

కొన్ని నెలల తరవాత, ఆయన భార్య భారతదేశానికి వచ్చింది. లాహిరీ మహాశయుల్ని కలుసుకుని పూజ్య భావంతో ఆయన్ని తదేకంగా చూసింది.

“కొన్ని నెల్లకిందట నేను, లండన్‌లో నా రోగశయ్య పక్కన చూసింది, దివ్యకాంతితో పరివేష్టితమైన ఉన్న మీ రూపాన్నే. తక్షణమే నాకు జబ్బు పూర్తిగా నయమయింది! తరవాత కొద్ది కాలానికే, ఇండియాకు దీర్ఘమైన సముద్ర ప్రయాణం చెయ్యగలిగాను,” అంది ఆమె.

ఆ మహాగురువులు, రోజు రోజుకూ ఒకరిద్దరికి క్రియాయోగ దీక్ష ఇస్తూ వచ్చారు. ఈ ఆధ్యాత్మిక విధులకూ ఉద్యోగ, కుటుంబ సంబంధమైన బాధ్యతలకూ తోడుగా ఈ మహాగురువులు, విద్యావిషయంలో ఉత్సాహభరితమైన ఆసక్తి కనబరిచారు. అనేక అధ్యయన బృందాలు ఏర్పరిచారు; కాశీలో బెంగాలీ టోలా బస్తీలో ఉన్న పెద్ద ఉన్నత పాఠశాలను అభివృద్ధిచెయ్యడానికి క్రియాశీలకమైన కృషి చేశారు. వారం వారం జరిగే సమావేశాల్లో ఈ గురుదేవులు, అనేకమంది జిజ్ఞాసువులైన సత్యాన్వేషకుల కోసం, పవిత్ర గ్రంథాల్ని వ్యాఖ్యానిస్తూ ఉండేవారు; ఈ సమావేశాలకు “గీతా అసెంబ్లీ” అని పేరు వచ్చింది.

బహుముఖమైన ఈ కార్యకలాపాల ద్వారా, లాహిరీ మహాశయులు “వృత్తి - ఉద్యోగ, సామాజిక విధులు నిర్వర్తించిన తరవాత, భక్తియుక్తమైన ధ్యానానికి టై మెక్కడ ఉంటుంది?” అన్న సామాన్యమైన సవాలుకు సమాధానమివ్వడానికి ప్రయత్నించారు. మహనీయులైన ఈ గృహస్థ గురువుల సామరస్య సంతులిత జీవనం, వేలకొద్దీ స్త్రీపురుషులకు ఉత్ప్రేరణ అయింది. స్వల్పమైన జీతం ఆర్జిస్తూ, మితవ్యయం చేస్తూ, నిరాడంబరంగా, సర్వజనసులభులైన ఈ గురువులు, క్రమశిక్షణ గల ప్రాపంచిక జీవన మార్గంలో సహజంగా, సుఖంగా సాగారు.

పరమాత్ముడి స్థానంలో పదిలంగా కుదురుకొని ఉన్నప్పటికీ, లాహిరీ మహాశయులు, మనుషుల యోగ్యతల్లో తరతమాలతో నిమిత్తం లేకుండా, అందరిపట్లా పూజ్యభావం ప్రదర్శించేవారు. తమ భక్తులు ఎప్పుడు ప్రణామం చేసినా, ఆయన వాళ్ళకు ప్రతినమస్కారం చేస్తూ వంగేవారు. పిల్లవాడి కుండేటంత వినయంతో ఆయన, తరచుగా ఇతరుల పాదాలు తాకుతూ ఉండేవారు. అయితే, గురువుపట్ల అటువంటి విధేయత చూపించడం సనాతనమైన ప్రాచ్యదేశ ఆచారమే అయినప్పటికీ, తమకు మాత్రం అటువంటి గౌరవం ఇవ్వడానికి ఆయన ఇతరులను అనుమతించడం అరుదు.

లాహిరీ మహాశయుల జీవితంలో విలక్షణంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ప్రతి మతంవాళ్ళకీ క్రియాయోగ దీక్ష ఇవ్వడం. హిందువులొక్కరే కాదు; ముస్లిములూ క్రైస్తవులూ కూడా ఆయన ప్రముఖ శిష్యుల్లో ఉన్నారు. అద్వైతులూ ఇతర మతాలవాళ్ళు లేదా వ్యవస్థితమైన ఏ మతానికి చెందినవాళ్ళూ కూడా ఈ జగద్గురువుల ఆదరం నిష్పక్షపాతంగా పొంది, ఉపదేశం అందుకునేవారు. ఆయన శిష్యుల్లో ఉన్నతస్థాయి నందుకున్నవాళ్ళలో ఒకడు అబ్దుల్ గఫూర్ ఖాన్; ఈయన ముస్లిం. తాము సర్వోన్నతమైన, బ్రాహ్మణ కులానికి చెందిన వారయి లాహిరీ మహాశయులు, తమ కాలంలో ఉన్న కఠినమైన కుల దురభిమానాన్ని అంతమొందించడానికి సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారు. అన్ని జీవిత మార్గాలవాళ్ళు, సర్వవ్యాపకమైన గురుదేవుల రెక్కల నీడన ఆశ్రయం పొందేవారు. దైవప్రేరితులైన ప్రవక్తలందరి మాదిరిగానే లాహిరీ మహాశయులు, సమాజం నుంచి వెలిఅయినవాళ్ళకి దళితజాతుల వాళ్ళకి ఒక కొత్త ఆశ కలిగించారు.

“నువ్వెవ్వరివాడివీ కావనీ, ఎవ్వరూ నీవారు కారనీ గుర్తుంచుకో. ఎప్పుడో ఒకనాడు నువ్వు హఠాత్తుగా ఈ ప్రపంచంలో ప్రతిదీ వదిలేసి పోవలసి ఉంటుందని తలుచుకో – కాబట్టి దేవుడితో ఇప్పుడే పరిచయం చేసుకో,” అని చెబుతూండేవారు మహాగురువులు, తమ శిష్యులకు. “ప్రతిరోజూ, దైవానుభూతి అనే గాలిగుమ్మటంలో ఎగురుతూ, రాబోయే మృత్యువనే సూక్ష్మయాత్రకు తయారవు. మాయవల్ల నిన్ను నువ్వు, మాంసాస్థుల కట్టగా చూసుకుంటున్నావు; నిజానికది కష్టాలు కాపురం చేసే గూడు మాత్రమే.[12] ఎడతెరిపిలేకుండా ధ్యానం చెయ్యి; ఏ విధమైన క్లేశమూ లేని అనంతతత్త్వంగా, నిన్ను నువ్వు తొందరగానే చూసుకుంటావు. శరీరానికి బందీవై ఉండడం మానెయ్యి; క్రియాయోగమనే రహస్య కీలకాన్ని ఉపయోగించి, శరీరంనుంచి తప్పించుకొని పరమాత్మ సన్నిధిలోకి పారిపోవడం నేర్చుకో.”

వివిధ శిష్యుల్ని, తమతమ మత విశ్వాసాలకు సంబంధించిన సత్సంప్రదాయ నిష్ఠకు కట్టుబడి ఉండమని గురుదేవులు ప్రోత్సహించేవారు. విముక్తికి సాధనానుకూలమైన ప్రక్రియగా క్రియాయోగానికున్న సర్వార్థసాధక స్వభావాన్ని నొక్కిచెబుతూ లాహిరీ మహాశయులు, ఆ తరవాత తమతమ పరిసరాలకూ పెంపకానికీ తగినట్టుగా తమ జీవితాల్ని అభివ్యక్తం చేసుకొనే స్వేచ్ఛ తమ శిష్యులకు ఇస్తూండేవారు.

“ముస్లిం, రోజుకు ఐదుసార్లు నమాజ్[13] చెయ్యాలి,” అని చెప్పేవారు గురుదేవులు. “హిందువు, రోజుకు అనేకమాట్లు ధ్యానంలో కూర్చోవాలి. క్రైస్తవుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ బైబిలు చదువుతూ రోజూ అనేక మాట్లు మోకాళ్ళ మీద వంగాలి.”

ఈ గురువర్యులు సునిశితమైన వివేచనతో, తమ శిష్యుల్ని, వారి వారి సహజ ప్రవృత్తుల్ని బట్టి, భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగ మార్గాల్లో నడిపించేవారు. సాంప్రదాయికమైన సన్యాసమార్గంలో ప్రవేశించదలిచిన భక్తులకు అనుమతి ఇవ్వడంలో ఈ గురువర్యులు చాలా నిదానం చూపేవారు. సన్యాసాశ్రమ విధుల్నిగురించి మొదటే బాగా ఆలోచించుకోమని ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవారు.

పవిత్ర గ్రంథాలగురించి సిద్ధాంత చర్చ మానమని ఆ మహాగురువులు శిష్యులకు చెబుతూండేవారు. “సనాతన దివ్యదర్శనాల్ని గురించి కేవలం చదవడంతోనే సరిపెట్టుకోకుండా, వాటిని సిద్ధింపజేసుకోడంలో నిమగ్నుడయేవాడే జ్ఞాని,” అన్నారాయన. “ధ్యానం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోండి.[14] లాభంలేని, మతసంబంధమైన ఊహలకు బదులు, వాస్తవమైన దైవసంస్పర్శ మీద శ్రద్ధ నిలపండి. మీ మనస్సుల్లోంచి, దైవశాస్త్ర సంబంధమైన పిడివాదపు చెత్తకుప్ప తొలగించెయ్యండి; అపరోక్ష జ్ఞానమనే స్వచ్ఛమైన, ఉపశమనకారకమయిన జలాల్ని లోపలికి పారనివ్వండి. చురుకైన ఆంతరిక, మార్గదర్శిత్వంతో మిమ్మల్ని అనుసంధానం చేసుకోండి; జీవితంలో ప్రతి సందిగ్ధస్థితికి దివ్యవాణి దగ్గర సమాధానం ఉంది. తనకి తాను చిక్కులు తెచ్చి పెట్టుకోడంలో మనిషి కున్న చాతుర్యానికి అంతులేనట్టు కనిపిస్తున్నప్పటికీ, అనంత సహాయ రూపుడైన భగవంతుడు, చాతుర్యంలో మనిషికన్న తక్కువవాడేమీ కాడు.”

గురుదేవుల సర్వవ్యాపకత్వం శిష్యబృందానికి ఒక నాడు ప్రదర్శిత మయింది; ఆయన భగవద్గీతను వివరిస్తూ ఉండగా శిష్యులు వింటున్నారు. స్పందనశీలమైన సృష్టి అంతటిలోనూ ఉన్న కూటస్థ చైతన్యానికి అర్థం వివరిస్తూ ఉండగా లాహిరీ మహాశయులు, హఠాత్తుగా ఎగుశ్వాసతో అరిచారు;

“జపాను తీరసముద్రంలో, అనేక ఆత్మల శరీరాల్లో నేను మునిగి పోతున్నాను!”

మర్నాడు పొద్దున, టెలిగ్రాం ద్వారా వచ్చిన పత్రికా సమాచారం చదివారు శిష్యులు; అందులో, ముందు రోజున, జపాను సమీపంలో ఓడ మునిగి కొందరు చనిపోయారన్న వార్త ఉంది.

లాహిరీ మహాశయుల శిష్యుల్లో దూరాన ఉన్నవాళ్ళు చాలామంది ఆయన తమకు సమీపంలోనే ఉన్న సంగతి ఎరుగుదురు, “క్రియాయోగ సాధన చేసేవాళ్ళ దగ్గర నేను ఎప్పుడూ ఉంటాను,” అని చెప్పేవారాయన, తమకు దగ్గరలో ఉండలేకపోతున్న శిష్యులకు ఊరటగా. “నిరంతరం విస్తరించే మీ ఆధ్యాత్మిక అనుభూతుల ద్వారా బ్రహ్మాండ నిలయానికి మీకు దారి చూపిస్తుంటాను.”

ఆ మహాగురువుల ప్రఖ్యాత శిష్యులైన శ్రీ భూపేంద్రనాథ్ సన్యాల్,[15] పడుచు వయస్సులో ఉండగా 1892 లో, కాశీకి వెళ్ళలేక, ఆధ్యాత్మిక ఉపదేశం కోసం గురువుగారిని ప్రార్థించారు. లాహిరీ మహాశయులు, భూపేంద్రునికి కలలో కనిపించి, దీక్ష ఇచ్చారు. తరవాత ఆయన కాశీ వెళ్ళి గురువుగారిని దీక్ష ఇమ్మన్నారు. “నీ కిదివరకే దీక్ష ఇచ్చాను, కలలో,” అని జవాబిచ్చారు లాహిరీ మహాశయులు.

శిష్యు డెవరయినా తన లౌకిక బాధ్యతల్లో ఏది ఉపేక్షించినా, గురుదేవులు మెల్లగా అతన్ని చక్కదిద్దేవారు.

“శిష్యుడి లోపాలగురించి పదిమందిలో చెప్పక తప్పనప్పుడు కూడా, లాహిరీ మహాశయుల మాటలు సౌమ్యంగా, నయంచేసేలా ఉంటాయి,” అని ఒకసారి చెప్పారు నాకు, శ్రీయుక్తేశ్వర్‌గారు. తరవాత విచారంగా ఇంకా ఇలా అన్నారు. “మా గురువుగారి బాణం మొనల్ని తప్పించుకోడానికి ఎన్నడూ ఏ శిష్యుడూ పారిపోలేదు.” నేను నవ్వు ఆపుకోలేకపోయాను; వాడిగా ఉన్నా ఉండకపోయినా, నా గురుదేవుల ప్రతి మాటా నా చెవులకు సంగీతం లాంటిదని సత్యప్రమాణంగా వారికి నచ్చజెప్పాను.

లాహిరీ మహాశయులు క్రియాయోగాన్ని జాగ్రత్తగా నాలుగు క్రమోన్నత దీక్షలుగా విభజించారు.[16] సాధకుడు నిశ్చితమైన ఆధ్యాత్మిక ప్రగతి కనబరిచిన తరవాతే పై మూడు ప్రక్రియలూ ఉపదేశించేవారు: ఒకనాడొక శిష్యుడు, గురువుగారు తన విలువను సరిగా అంచనా వెయ్యడం లేదని గట్టి నమ్మకం ఏర్పరచుకొని, తన అసంతృప్తి వెల్లడించాడు.


“గురుదేవా, నేను రెండో దీక్షకు నిశ్చయంగా సిద్ధంగా ఉన్నాను.”

సరిగా ఇదే సమయంలో తలుపు తెరుచుకుంది; వినయ సంపన్నుడైన బృందా భగత్ అనే శిష్యుడు లోపల అడుగుపెట్టాడు. అతను కాశీలో ఒక పోస్ట్‌మాన్.

“బృందా, ఇలా నా పక్కన కూర్చో.” మహాగురువులు అతనికేసి ఆప్యాయంగా చిరునవ్వు చిందిస్తూ చూశారు. “ఒక్కమాట చెప్పు; క్రియాయోగంలో రెండో ప్రక్రియకు సిద్ధంగా ఉన్నావా?”

ఆ పోస్ట్‌మాన్, గురుదేవులను వేడుకుంటున్నట్టుగా చేతులు జోడించాడు. “గురుదేవా, ఇంకే ఉపదేశాలూ నాకు వద్దండి! ఇంతకన్న పై ఉపదేశాల్ని ఎలా ఒంటబట్టించుకోగలను? ఈ రోజు, మీ దీవెనలు కోరడం కోసం వచ్చాను; ఏమంటే, మొదటి క్రియే నన్ను దైవపర మయిన మత్తుతో నింపేసి నేను ఉత్తరాలు బట్వాడా చెయ్యలేకుండా చేసిందండి!” అన్నాడు భయంగా.

“అప్పుడే బృంద, ఆత్మసాగరంలో ఈతలాడుతున్నాడు.” లాహిరీ మహాశయులన్న ఈ మాటలకు, ఆ రెండో శిష్యుడు తల వంచుకున్నాడు.

“గురుదేవా, పనిచెయ్యడం చేతకాక పనిముట్లకు వంకలుపెట్టే నాసిరకం పనివాణ్ణి నేను.” అన్నాడతను.

వినయశీలుడైన ఆ పోస్ట్‌మాన్, చదువుకున్నవాడు కాడు; కాని తరవాత అతను క్రియాయోగం ద్వారా తన అంతర్దృష్టిని ఎంతవరకు అభివృద్ధిచేసుకున్నాడంటే ధర్మశాస్త్ర విషయాలకు సంబంధించిన సమస్యలకు అతను చేసే వ్యాఖ్యానం కోసం అప్పుడప్పుడు పండితులు కూడా వస్తూ ఉండేవారు. పాపమూ పాండిత్యమూ రెండూ ఎరగని బృందాభగత్, పండిత లోకంలో ప్రసిద్ధి పొందాడు. లాహిరీ మహాశయులకు కాశీలో ఉన్న శిష్యులే కాకుండా, భారతదేశంలో దూరప్రాంతాల నుంచి కూడా వందలకొద్దీ శిష్యులు ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారు. తమ కుమారు లిద్దరి అత్తవారిళ్ళకు వచ్చిన సందర్భాల్లో ఆయన, చాలామాట్లు బెంగాలు వచ్చారు. ఆ విధంగా, ఆయన ఉనికివల్ల బెంగాలు, చిన్నచిన్న క్రియాయోగి బృందాల తేనెపట్టు అయింది. ముఖ్యంగా, కృష్ణనగర్, విష్ణుపూర్ జిల్లాల్లో అనేకమంది నిరాడంబర శిష్యులు ఈ నాటికీ, ఆత్మధ్యానపరమయిన అదృశ్యవాహిని ప్రవహిస్తూ ఉండేటట్టు చేస్తున్నారు.

లాహిరీ మహాశయుల దగ్గర క్రియాయోగ దీక్ష పొందిన అనేకమంది మహాపురుషుల్లో చెప్పుకోదగ్గవారు - కాశీలో ఉండే, ప్రఖ్యాతులు స్వామి భాస్కరానంద సరస్వతి, ఉన్నత మూర్తిమత్వం గల దేవఘర్ తపస్వి బాలానంద బ్రహ్మచారి, లాహిరీ మహాశయులు కొంతకాలంపాటు, కాశీలోని మహారాజ ఈశ్వరీ నారాయణ్ సింహ బహాదూర్ వారి కుమారుడికి ప్రయివేట్ ట్యూటరుగా పనిచేశారు. గురువుగారి ఆధ్యాత్మిక సిద్ధిని గుర్తించి, ఆ మహారాజూ ఆయన కుమారుడూ కూడా వారి దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నారు; అలాగే మహారాజ యతీంద్రమోహన్ ఠాకుర్‌గారు కూడా దీక్ష తీసుకున్నారు.

లాహిరీ మహాశయుల శిష్యుల్లో పలుకుబడి గల లౌకిక పదవుల్లో ఉన్న కొందరికి, ప్రచారం ద్వారా క్రియాయోగి మండలిని విస్తృతం చెయ్యాలన్న కోరిక ఉంటుండేది. గురువుగారు దానికి అనుమతి ఇవ్వలేదు. కాశీరాజుకు వైద్యుడుగా ఉన్న ఒక శిష్యుడు - గురువుగారి పేరును “కాశీ బాబా” (కాశీలో ఉండే మహామహులు)[17]గా వ్యాప్తి చెయ్యడానికి వ్యవస్థాపరమైన కృషి ఒకటి ప్రారంభించాడు. గురువుగారు దాన్ని కూడా నిషేధించారు.

“క్రియాకుసుమ గంధాన్ని సహజరీతిలోనే వ్యాపించనివ్వండి,” అన్నారాయన. “క్రియాబీజాలు, ఆధ్యాత్మికంగా సారవంతమైన హృదయ క్షేత్రాల్లో తప్పకుండా మొలకెత్తుతాయి.”

వ్యవస్థాపకమైన ఆధునిక మార్గం ద్వారా కాని, అచ్చుయంత్రం ద్వారా కాని ప్రచారంచేసే పద్ధతిని మహాగురువులు అవలంబించనప్పటికీ తమ సందేశశక్తి, అడ్డూ ఆపూ లేని వరదవెల్లువలా పెల్లుబికి, తన ధాటితో మానవ మనస్సుల తీరాలను ముంచేస్తుందని ఆయనకు తెలుసు. పరివర్తనచెంది, పరిశుద్ధినందిన భక్తుల జీవితాలే, క్రియాయోగం అమర జీవశక్తికి ప్రత్యక్ష నిదర్శనాలు.

1886 లో, అంటే రాణీఖేత్‌లో దీక్ష తీసుకొన్న ఇరవై ఐదేళ్ళ తరవాత, లాహిరీ మహాశయులు పెన్షను మీద పదవీవిరమణ చేశారు.[18] పగటిపూట కూడా ఆయన దొరకడంతో, శిష్యులు ఇతోధిక సంఖ్యలో రావడం ప్రారంభమయింది. మహాగురువు లిప్పుడు రోజు మొత్తంలో చాలాసేపు, ప్రశాంతంగా పద్మాసనబద్ధులై మౌనంగానే కూర్చుంటూ వచ్చారు. కొద్దిసేపు షికారుకు వెళ్ళడానికి కాని, ఇంట్లోనే ఇతర చోట్లకు వెళ్ళడానికి కాని ఆయన తమ గది విడిచి వెళ్ళింది చాలా అరుదు. గురుదేవుల దర్శనం కోసం, దాదాపు ఎడ తెరిపిలేకుండా, శిష్యులు ప్రశాంత ప్రవాహంలా వచ్చేవారు. చూసేవాళ్ళకి సంభ్రమాశ్చర్యాలు కలిగేటట్టుగా, లాహిరీ మహాశయులకు అలవాటయిన శారీరక స్థితి- ఊపిరి లేకపోవడం, నిద్రలేక పోవడం, నాడీ గుండె కొట్టుకోడం మానెయ్యడం, గంటల తరబడి రెప్పపాటులేకుండా ఉండే ప్రశాంతమైన నేత్రాలు, ప్రగాఢమైన ప్రశాంతి పరివేషం వంటి మానవాతీత లక్షణాల్ని ప్రదర్శించేది. ఆత్మోద్ధరణానుభూతి పొందకుండా అక్కణ్ణించి వెళ్ళినవాళ్ళు ఎవ్వరూ లేరు; దైవసాక్షాత్కారం పొందిన ఒక సత్పురుషుని మౌన ఆశీర్వాదం పొందామని వాళ్ళందరికీ తెలుసు.

పంచానన్ భట్టాచార్య అనే శిష్యుడు కలకత్తాలో, “ఆర్య మిషన్ ఇన్‌స్టిట్యూషన్” అనే పేరుతో ఒక యోగకేంద్రం స్థాపించడానికి గురువుగారు ఇప్పుడు అనుమతించారు. ఈ కేంద్రం, యోగసంబంధమైన ఓషధులు పంచిపెడుతూ ఉండేది; భగవద్గీత చౌకధరకు అమ్మడానికి అనువుగా బెంగాలులో మొట్టమొదట ప్రచురణచేసింది ఈ కేంద్రమే. హిందీలోనూ బెంగాలీలోనూ ప్రచురించిన ఆర్యమిషన్ గీత ప్రతులు వేలాది ఇళ్ళలోకి ప్రవేశం పొందాయి.

సనాతనాచారం ప్రకారం గురుదేవులు, వివిధ రోగాల నివారణకోసం ప్రజలకు సాధారణంగా వేప[19]నూనె ఇస్తూండేవారు. ఈ నూనె బట్టీ పట్టి ఇమ్మని, గురుదేవులు ఏ శిష్యుణ్ణయినా కోరినట్లయితే, ఆ పని అతను సులువుగా నెరవేర్చగలిగేవాడు. అదే మరొకరెవరయినా ప్రయత్నిస్తే, చిత్రమైన ఇబ్బందులు ఎదురయేవి; అవసరమైన ప్రక్రియల్లో నూనె బట్టీపట్టడం అయిన తరవాత చూస్తే, ఆ ద్రవం దాదాపు అంతా ఆవిరయిపోయి ఉండేది. గురుదేవుల ఆశీస్సు కూడా దీనికి ఆవశ్యకమైన ఒక దినుసని దీనివల్ల స్పష్టమవుతోంది.

లాహిరీ మహాశయుల చేతిరాత, ఆయన సంతకం, బెంగాలీ లిపిలో, పైన చూడవచ్చు. పై పంక్తులు, ఒక శిష్యుడికి రాసిన ఉత్తరంలోవి; మహాగురువులు ఒక సంస్కృత శ్లోకాన్ని ఇలా అన్వయించారు: “కనురెప్పలు అల్లాడనంతటి ప్రశాంతస్థితి నందుకున్న వాడు ‘శాంభవీ ముద్ర’ సిద్ధింపజేసుకున్నవాడు.”[20]

(సంతకం) "శ్రీ శ్యామాచరణ్ దేవ శర్మన్"

చాలామంది మహా ప్రవక్తలలాగే లాహిరీ మహాశయులు కూడా తమకు తాముగా పుస్తకాలేమీ రాయలేదు కానీ, పవిత్ర గ్రంథాలను తమ వ్యాఖ్యానాలతో వివిధ శిష్యులకు బోధించారు. మహాగురువుల మనుమలైన కీ. శే. ఆనందమోహన్ లాహిరీ ఇలా రాశారు:

“భగవద్గీతలోనూ మహాభారత ఇతిహాసంలో ఇతర భాగాల్లోనూ వ్యాసఘట్టాలు (వ్యాసకూటాలు; చిక్కుముడులు) ఉంటుంటాయి. ఈ వ్యాసఘట్టాల్ని ప్రశ్నించకుండా వదిలేస్తే, ఇట్టే అపార్థం చేసుకోడానికి వీలైన చిత్రమైన పురాణ కథలు తప్ప మరేమీ కనిపించవు. ఈ వ్యాస ఘట్టాల్ని వివరించకుండా వదిలేస్తే వేలకొద్దీ సంవత్సరాల ప్రయోగ అన్వేషణ అనంతరం మానవాతీతమైన ఓర్పుతో ప్రాచ్యఖండం పరిరక్షిస్తూ వచ్చిన ఒకానొక శాస్త్రం మనకు దక్కకుండా నశించినట్టే లెక్క![21] పవిత్ర గ్రంథాల్లో శబ్దచిత్ర కల్పనాత్మకమైన చిక్కుల్లో తెలివిగా కనుమరుగుచేసి ఉంచిన మతశాస్త్రాన్ని, రూపకాది అలంకారాల ఆవరణ నుంచి తప్పించి, లాహిరీ మహాశయులు వెలుగులోకి తెచ్చారు. వేదమంత్రాలు పూర్తిగా వైజ్ఞానిక ప్రాముఖ్యమున్నవన్న సంగతి ఈ మహాగురువులు నిరూపించిన మీదట, ఇప్పుడవి, అర్థంకాని మాటల గారడీ అనిపించడం మానేశాయి...”

“విషయవాంఛల ఉద్ధత ప్రాబల్యం ముందు, మనిషి మామూలుగా నిస్సహాయుడై ఉంటాడని మనకి తెలుసు. కాని మనిషిలో క్రియాయోగం ద్వారా అధికతర శాశ్వతానంద చైతన్యం ఉదయించినప్పుడు ఈ విషయ వాంఛల్ని అది శక్తిహీనం చేస్తుంది; వాటికి తాను లోలుడయే ఉద్దేశం మనిషిలో కనిపించదు. ఇక్కడ ఈ నివృత్తి- అంటే, అధమ విషయ వాంఛల తృణీకారం, మరో ప్రవృత్తికి, అంటే, పరమానందానుభూతి ప్రాప్తికి - సమకాలంలో జరుగుతుంది. అటువంటి మార్గం ఒకటి లేనట్లయితే, కేవల నివృత్తిబోధకమైన నీతిసూత్రాలు మనకు నిరుపయోగ మవుతాయి.

“దృశ్యమాన విషయాలన్నిటి వెనకా ఉండేది అనంతం; అది మహాశక్తి సాగరం. ప్రపంచ కార్యకలాపాలమీద ఉన్న ఆసక్తి మనలో ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరమైన జ్ఞానాన్ని చంపేస్తుంది. ప్రకృతి శక్తుల్ని ఉపయోగించుకోడం ఎలాగో ఆధునిక విజ్ఞానశాస్త్రం మనకి చెబుతుంది కనక, నామరూపాలన్నిటి వెనకా ఉన్న మహతీ ప్రాణశక్తిని అవగాహన చేసుకోడంలో విఫలమవుతాం. ప్రకృతితో మనకున్న అతిపరిచయంవల్ల దాని పరమరహస్యాలగురించి అవజ్ఞ ఏర్పడుతోంది; దాంతో మనకున్న సంబంధం, ప్రయోజనాపేక్షక వ్యవహారపరమైనది. ఒక రకంగా చెప్పాలంటే, అది మన ప్రయోజనాలకు ఉపకరించేటట్టుగా దానిచేత నిర్భంధంగా పనిచేయించుకోడానికి మార్గాలు కనిపెట్టడానికి మనం దాన్ని వేధిస్తూంటాం; మనం దాన్ని సొంతానికి వాడుకుంటాం; అయినా దాని మూలం మనకి తెలియకుండానే ఉండిపోతోంది. విజ్ఞానశాస్త్రంలో, ప్రకృతితో మనకున్న సంబంధం, పొగరుబోతు యజమానికి అతని నౌకరుకూ ఉండే సంబంధం లాంటిది; లేదా, తాత్త్విక దృష్టితో చెప్పేటట్లయితే ప్రకృతి, [న్యాయస్థానంలో] సాక్షి బోనులో ఉన్న బందీ లాంటిది. దాన్ని మనం అడ్డుపరీక్ష చేస్తాం, సవాలు చేస్తాం; మరుగుపడి ఉన్న దాని విలువల్ని తూచలేని, మానవుల తక్కెళ్ళలో దాని సాక్ష్యాన్ని సూక్ష్మాంశాలతో సహా తూస్తాం. అలా కాకుండా ఆత్మకు, అంతకన్న పై శక్తితో సంపర్కం ఏర్పడి ఉంటే ప్రకృతి, ఎటువంటి బాధకాని మానవ సంకల్పం కాని లేకుండా, దానంతట అది తల వంచుతుంది. ప్రకృతి మీద అప్రయత్నకమైన ఈ అధికారాన్ని, అవగాహన చేసుకోని భౌతికవాది, ‘అలౌకిక ఘటనాత్మకం’ (మిరాక్యులస్) అని అంటాడు.

“లాహిరీ మహాశయుల జీవితం నెలకొల్పిన ఆదర్శం, యోగం ఒకానొక మర్మవిద్య అన్న తప్పుడు అభిప్రాయాన్ని మార్చేసింది. భౌతికశాస్త్రం యథార్థతాలక్షణం ఉన్నదే అయినా, ప్రతి మనిషి, ప్రకృతితో తనకున్న సరయిన సంబంధాన్ని అర్థంచేసుకోడానికి ప్రకృతి శక్తులన్నిటి పట్లా ఆధ్యాత్మిక పూజ్యతాభావానుభూతి పొందడానికి ఒక దారి కనుక్కుంటాడు; ఆ ప్రకృతి శక్తులు (దృగ్విషయాలు] మార్మికమైన వయినా, దైనందిన సంఘటనలయినా సరే.[22] ఒక వెయ్యేళ్ళ కిందట మార్మిక విషయాలుగా అనిపించినవి ఈనాడు అలా అనిపించడం లేదనీ, ఈనాడు మార్మిక విషయాలనిపిస్తున్నవి మరో వందేళ్ళకు శాస్త్ర నియమబద్ధాలుగా మనకు అవగాహన కావచ్చుననీ మనం గుర్తుంచుకోవాలి.

“క్రియాయోగ శాస్త్రనియమం శాశ్వతమైనది. ఆది గణితశాస్త్రంలా సత్యమైనది; కూడికలూ తీసివేతలూ వంటి సరళ సూత్రాల మాదిరిగా, క్రియాయోగ నియమం కూడా ఎన్నటికీ నశింపు కానిది. గణితశాస్త్రం మీద రాసిన గ్రంథాలన్నింటినీ తగలబెట్టెయ్యండి; తర్కబుద్ధిగలవాళ్ళు అటువంటి సత్యాల్ని ఎప్పుడూ తిరిగి కనుక్కుంటూనే ఉంటారు. యోగం మీదున్న పుస్తకాలన్నింటినీ నాశనం చెయ్యండి; దాని మూల సూత్రాలన్నీ, నిర్మల భక్తీ తదనుసారంగా నిర్మల జ్ఞానమూ గల యోగి అవతరించినప్పుడల్లా మళ్ళీ వెల్లడి అవుతూనే ఉంటాయి.”

అవతారపురుషు లందరిలోకీ బాజాజీ మహావతార స్వరూపులయినట్టు, శ్రీయుక్తేశ్వర్‌గారిని న్యాయతః జ్ఞానావతార స్వరూపులుగా పేర్కొన దగినట్టుగానే, లాహిరీ మహాశయులు యోగావతార స్వరూపులు.[23] గుణాత్మక, పరిమాణాత్మక ప్రమాణాలు రెండిటి దృష్ట్యా, లాహిరీ మహాశయులు, సమాజం ఆధ్యాత్మిక స్థాయిని సమున్నతం చేశారు. తమ సన్నిహిత శిష్యుల్ని క్రీస్తు మాదిరి ఉన్నత మూర్తి మత్వానికి పెంచడానికి వారికున్న శక్తినిబట్టి, జనబాహుళ్యంలో సత్యాన్ని విస్తృతంగా వ్యాప్తిచేయడాన్ని బట్టి లాహిరీ మహాశయులు, మానవజాతి రక్షకుల కోవలోకి వస్తారు.

ప్రవక్తగా ఆయన అద్వితీయత, యోగవిముక్తి ద్వారాల్ని మొట్ట మొదటిసారిగా మానవులందరికోసం తెరుస్తూ, క్రియాయోగమనే ఒక నిర్దిష్ట పద్ధతిని ఆచరణాత్మకంగా నొక్కిచెప్పడంలో ఉంది. ఆయన జీవితంలో గోచరించిన అలౌకిక ఘటనల సంగతి అలా ఉంచి, నిజంగా ఆ యోగావతారులు, యోగవిద్యలోని పూర్వపు జటిలతల్ని తగ్గించి సాధారణ బుద్ధికి ఆవహన అయేటట్టుగా ఫలవంతమైన సరళత్వాన్ని సాధించడం అద్భుతాలన్నిటికీ పరాకాష్ఠ.

అలౌకిక ఘటనల్ని గురించి ప్రస్తావిస్తూ లాహిరీ మహాశయులు తరచు ఇలా అనేవారు: “జనబాహుళ్యానికి తెలియని సూక్ష్మనియమాలు పనిచేసే తీరును తగినంత విచక్షణలేకుండా బహిరంగంగా చర్చించనూ గూడదు, ప్రచురించనూ గూడదు.” ఈ పుస్తకంలో నే నెక్కడయినా, ఆయన హెచ్చరికగా చెప్పిన మాటల్ని ఉల్లంఘించినట్టు కనిపించినట్టయితే, ఆయన నాకు ఆంతరికమైన హామీ ఇవ్వడమే కారణమని గ్రహించాలి. అయినప్పటికీ బాబాజీ, లాహిరీ మహాశయ, శ్రీయుక్తేశ్వర్ గార్ల జీవితాల్ని గ్రంథస్థం చేసేటప్పుడు నేను, కొన్ని కొన్ని అలౌకిక ఘటనలు మినహాయించడం మంచిదని అనుకున్నాను. ఈ గుహ్య దర్శన శాస్త్రానికి వివరణాత్మక గ్రంథం కూడా ఒకటి రాయకుండా వాటిని చేర్చలేకపోయేవాణ్ణి. గృహస్థ యోగిగా లాహిరీ మహాశయులు, ఈనాటి ప్రపంచం అవసరాలకు అనువయిన, ఆచరణానుకూల సందేశం ఒకటి అందించారు. ప్రాచీన భారతదేశంలో ఉన్న అద్భుతమైన ఆర్థిక, మతధార్మిక స్థితులు ఈనాడు లేవు. అందువల్ల యోగి భిక్షాపాత్ర చేత బుచ్చుకొని సంచారం చేసే తపస్విగా జీవించాలన్న పాతకాలపు ఆదర్శాన్ని ఆ మహాయోగి ప్రోత్సహించలేదు. దాని బదులు, ఇప్పటికే ఎంతో ఒత్తిడికి గురిఅయి ఉన్న సమాజం మీద ఆధారపడి ఉండకుండా యోగి, తన బతుకు తాను బతకడానికి కావలసినది సంపాదించుకోడంలోనూ, తన ఇంట్లోనే ఏకాంతంగా ఒకచోట యోగసాధన చెయ్యడంలోనూ గల లాభాలు నొక్కి చెప్పారు. ఈ సలహాకు తోడుగా, హర్షదాయకమైన తమ ఆదర్శబలాన్ని ఆయన జోడించారు. ఆయన ఆధునికులయిన, సర్వశ్రేష్ఠ ఆదర్శరూపులయిన యోగి. ఆయన జీవన మార్గం, ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉండే యోగసాధకులకు మార్గదర్శకంగా ఉండాలని బాబాజీ ప్రణాళికలో నిర్ణయమయింది.

కొత్తవాళ్ళ కొక కొత్త ఆశా రేఖ! “దైవసాయుజ్యం స్వయంకృషి ద్వారా సాధ్యం” అనీ, “అది దైవశాస్త్ర సంబంధమైన విశ్వాసాలమీద కాని విశ్వనియంత నిరంకుశ సంకల్పంమీద కాని ఆధారపడి ఉన్నది కాదు” అనీ యోగావతారులు ఉద్ఘాటించారు.

మానవుడి దివ్యత్వంమీద విశ్వాసమేర్పరచుకోలేని వ్యక్తులు, క్రియాయోగ కీలకాన్ని ఉపయోగించి చివరికి, తమ సంపూర్ణ దివ్యత్వాన్ని దర్శిస్తారు.

  1. మత్తయి 3 : 15.
  2. పునర్జన్మ సిద్ధాంతాన్ని, బైబిలు - పాత నిబంధన గ్రంథమూ కొత్త నిబంధన గ్రంథమూ రాసినవాళ్ళు అర్థంచేసుకున్నట్టూ దాన్ని అంగీకరించినట్టూ బైబిలు భాగాలు అనేకం వెల్లడిస్తాయి.
  3. మలాకి 4: 5.
  4. లూకా 1: 13-17.
  5. “ఆయన రాకకు ముందే,” అంటే, “ప్రభువు రాకకు ముందే.”
  6. మత్తయి 17 : 12-13.
  7. మత్తయి 11 : 13.14.
  8. యోహాను 1 : 21.
  9. II రాజులు 2 : 9-14.
  10. మత్తయి 17 : 3.
  11. మత్తయి 27 : 46–49.
  12. ఎన్ని రకాల చావులున్నాయి మన శరీరాల్లో! చావుతప్ప మరొకటి అందులో లేనే లేదు.” – మార్టిన్ లూథర్.
  13. ముస్లిముల ముఖ్య సాధన
  14. “సత్యాన్ని ధ్యానంలో అన్వేషించు; బూజుపట్టిన పుస్తకాల్లో కాదు, చంద్రుణ్ణి చూడాలంటే ఆకాశంలోకి చూడు, నీటి మడుగులో కాదు.” – పారశీక సామెత.
  15. శ్రీ సన్యాల్ 1962 లో మరణించారు (ప్రచురణకర్త గమనిక).
  16. క్రియాయోగంలో శాఖోపశాఖలు చాలా ఉన్నాయి. లాహిరీ మహశయులు వాటిని పరిశీలించి నాలుగు ప్రక్రియల్ని- సాధనపరమైన అత్యధిక విలువ కలవాటిని ఎంపిక చేశారు.
  17. లాహిరీ మహాశయులకు శిష్యు లిచ్చిన ఇతర బిరుదులు: ‘యోగివర్’ (యోగుల్లో శ్రేష్ఠులు), ‘యోగిరాజ్’ (యోగుల్లో రాజువంటివారు), ‘మునివర్‌’ (మునుల్లో శ్రేష్ఠులు); ఇవికాక నేను చేర్చింది మరొకటి. ‘యోగావతార్’ (మానవ రూపంలో జన్మించిన యోగవిద్య),
  18. మొత్తం మీద ఆయన, ఒకే ప్రభుత్వశాఖలో ముప్ఫైఐదేళ్ళ పాటు ఉద్యోగం చేశారు.
  19. మార్గోసా చెట్టు. దాని ఔషధ విలువలు ఇప్పుడు పాశ్చాత్యదేశాల్లో కూడా గుర్తింపు పొందాయి. చేదుగా ఉండే వేపబెరడు ఒక టానిక్కుగా ఉపయోగిస్తారు; గింజలనుంచీ పళ్ళనుంచీ తీసిన నూనె, కుష్టూ మరికొన్ని ఇతర వ్యాధులూ నయం చెయ్యడానికి వాడతారు.

హిందూ వైద్యశాస్త్రాల్ని ఆయుర్వేదం అంటారు. వైదిక వైద్యులు సున్నితమైన శస్త్రచికిత్సా పరికరాలు ఉపయోగించారు, ప్లాస్టిక్ సర్జరీ చేశారు, విషవాయువు ప్రభావాలకు విరుగుడు ఎలా వెయ్యాలో తెలుసుకున్నారు. సిజేరియన్ ఆపరేషన్లూ మెదడు ఆపరేషన్లూ చేశారు. మందుల అంతశ్శక్తిని పెంపుచేయడంలో ఆరితేరారు. క్రీ. పూ. 4 శతాబ్దినాటి హిపోక్రేట్స్ అనే ప్రసిద్ధ గ్రీకు వైద్యుడు, తన మెటీరియా మెడికా (ఔషధ పదార్థ తత్త్వశాస్త్రం) లో చాలామట్టుకు హిందూ ఆధారగ్రంథాల్లోంచి ఎరువు తెచ్చుకున్నాడు.

  • శాంభవీముద్ర అంటే, భ్రూమధ్యంలో చూపు నిలిపి ఉంచడం. యోగి, ఒకానొక ప్రశాంత మానసిక స్థితికి చేరుకున్నప్పుడు, అతని కనురెప్పలు కదలవు; అంతర్లోకంలో లీనుడై ఉంటాడు.

    ముద్ర (“చిహ్నం”) అనేది మామూలుగా, వేళ్ళతోనూ చేతులతోనూ చేసే, ధార్మికాచారపరమైన ఒక చేష్టను సూచిస్తుంది. చాలా ముద్రలు నిశ్చితమైన నరాలమీద పనిచేసి ప్రశాంతత అలవరుస్తాయి. సనాతన హిందూ శాస్త్రగ్రంథాలు నాడుల్నీ (శరీరంలో 71,000 నాడీమార్గాలు), మనస్సుతో వాటికిగల సంబంధాల్నీ సునిశితంగా వర్గీకరించాయి. అర్చనలోనూ యోగసాధనలోనూ ఉపయుక్తమయిన నరాలకు, ఈ విధంగా శాస్త్రీయమైన ప్రాతిపదిక ఉంది. విగ్రహ శిల్ప శాస్త్రంలోనూ ధార్మికాచారపరమైన భారతీయ నాట్యాల్లోనూ ఈ ముద్రలకు విస్తృతమైన భాష ఒకటి కనిపిస్తుంది.

  • “క్రీ. పూ. మూడువేల ఏళ్ళనాటివని నిర్ణయించదగిన, సింధునదీ లోయలో పురాతత్త్వ పరిశోధన క్షేత్రాల్లో తవ్వి తీసిన, కొన్ని ముద్రికల మీద ధ్యానముద్రలో కూర్చుని ఉన్న ఆకృతులు కనిపిస్తున్నాయి. ఈనాటికి యోగసాధన విధానంలో వాడుకలో ఉన్న ఈ ముద్రల్నిబట్టి, యోగశాస్త్ర మౌలికాంశాలు కొన్ని ఆనాటికే తెలిసి ఉన్నవని నిష్కర్ష చెయ్యడానికి వీలు కలుగుతోంది. భారత దేశంలో ఐదువేల ఏళ్ళకు పూర్వమే, అధ్యయనానుశీలన పద్ధతుల సహాయంతో సక్రమమైన ఆత్మపరిశీలన సాధనచేసేవారన్న నిర్ణయానికి రావడం హేతురహితం కాకపోవచ్చు.”- ప్రొఫెసర్ డబ్ల్యు. నార్మన్ బ్రౌన్, అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ లెర్నెడ్ సొసైటీస్, వాషింగ్టన్, డి. సి., వారి బులెటిన్‌లో,

    అయితే, హిందూ పవిత్ర గ్రంథాలు చూపించే ప్రమాణం, యోగశాస్త్రం, భారతదేశంలో చెప్పనలవి కానన్ని వేల సంవత్సరాల నుంచి వర్ధిల్లుతూ ఉందని.

  • “ఆశ్చర్యపోజాలని వాడూ, అలవాటుగా ఆశ్చర్యపోని (ఆశ్చర్యపోయి పూజించని) వాడూ - అతను అనేక రాయల్ సొసైటీలకు అధ్యక్షుడైనా, అన్ని ప్రయోగశాలల, వేధశాలల ప్రతీకల్నీ వాటి ఫలితాలన్నీ ఒక్క తన బుర్రలోనే ఇముడ్చుకుని ఉన్నవాడైనా– వెనకాల కన్నులేని కళ్ళజోడు లాంటివాడు.”

    - కార్లైల్, ‘సార్టర్ రిసార్టన్’లో.

  • శ్రీయుక్తేశ్వర్‌గారు తమ శిష్యులైన పరమహంస యోగానందగారిని దివ్య ప్రేమావతారులుగా పేర్కొన్నారు. పరమహంసగారి నిర్యాణానంతరం, ఆయన ప్రధాన శిష్యులు రాజర్షి జనకానంద (శ్రీ జేమ్స్ జె. లిన్); ‘ప్రేమావతార’ స్వరూపులనే అత్యంత సముచితమైన బిరుదు ఆయనకు అర్పించారు.