Jump to content

ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 27

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 27

రాంచీలో

యోగవిద్యాలయ స్థాపన

“సంస్థాపరమైన పని అంటే నీకు కిట్టదేం?”

గురుదేవుల ప్రశ్న నన్ను కొద్దిగా చకితుణ్ణి చేసింది. సంస్థలనేవి “కందిరీగల పుట్టలు” అని ఆ రోజుల్లో నాకు దృఢమైన విశ్వాసం ఉండేదన్న సంగతి నిజమే.

“అది కేవలం, మెప్పుకు నోచుకోని శ్రమండి!” అన్నాను, సమాధానంగా. “నాయకుడు ఏ పని చేసినా, చెయ్యకపోయినా కూడా విమర్శకు గురి అవుతూ ఉంటాడు.”

“దివ్యమైన ‘చన్నా’ (పెరుగు) అంతా నీ కొక్కడికే దక్కాలనుకుంటున్నావా?” మా గురుదేవుల ఎదురు సవాలుకు వాడిచూపు ఒకటి తోడయింది. “ఉదార హృదయులైన గురువుల పరంపర ఒకటి, తమ జ్ఞానాన్ని ఇతరులకు అందించాలని సంకల్పించి ఉండకపోతే, నువ్వుకాని మరొకరుకాని, యోగంద్వారా దైవానుసంధానం సాధించగలరా?” అంటూ ఇంకా ఇలా అన్నారు. “దేవుడు తేనె అయితే సంస్థలు తేనెపట్లు; రెండూ అవసరమే. ఆత్మ లేనిదే ఏ రూపమైనా వ్యర్థమే; అయినా నువ్వు, ఆధ్యాత్మికామృతంతో నిండి ఉండే చురుకయిన తేనెపట్లు ఎందుకు ఏర్పాటు చెయ్యగూడదు” ఆయన సలహా నన్ను గాఢంగా కదిలించింది. నేను పైకేమీ జవాబు చెప్పలేదు. కాని ఒక దృఢమైన నిశ్చయం నా మనస్సులో ఏర్పడింది; మా గురుదేవుల పాదసన్నిధిలో నేను తెలుసుకున్న ముక్తిప్రదమైన సత్యాల్ని నేను, నా శక్తిమేరకు, తోటివాళ్ళకు తెలియజెబుతాను. భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాను:

“ఈశ్వరా, నా భక్తి అనే గర్భగుడిలో నీ ప్రేమను ఎప్పటికీ ప్రకాశించనియ్యి. అన్ని హృదయాల్లోనూ నీ ప్రేమను నేను రగుల్కొలపగలిగేలా చెయ్యి”

ఇదివరలో ఒకసారి, నేను సన్యాసం తీసుకోకముందు, శ్రీయుక్తేశ్వర్‌గారు నే నెన్నడూ ఆశించని విధంగా వ్యాఖ్యానించారు.

“నీ ముసలితనంలో, భార్య సాంగత్యంలేని లోటు ఎంత ఉంటుందో నీకు!” అన్నా రాయన. “తన భార్యాబిడ్డల్ని పోషించడానికి, ఉపయోగపడే పనిలో ఉన్నవాడు దేవుడి దృష్టిలో, మెచ్చుకోదగ్గ పాత్ర నిర్వహిస్తున్నట్టేనని ఒప్పుకుంటావా?”

ఆ మాటలకు నేను భయకంపితుణ్ణి అయి, “గురుదేవా, ఈ జన్మలో నాకున్న కోరికల్లా ఆ విశ్వప్రియుడి కోసమేనని మీకు తెలుసు, అంటూ ఆక్షేపణ తెలిపాను.

గురుదేవులు వినోదంగా నవ్వారు; దాన్నిబట్టి ఆయన ఆ మాటలు కేవలం నన్ను పరీక్షించడానికే అన్నారని గ్రహించాను.

“ఇదుగో, మామూలు సంసార విధుల్ని విడిచిపెట్టేవాడు, అంత కన్న బాగా పెద్ద సంసారానికి సంబంధించిన ఏదో ఒక రకం బాధ్యత చేపడితేనే తప్ప, తను చేసింది న్యాయమని నిరూపించుకోలేడు. ఈ మాట గుర్తుంచుకో,” అని చెప్పారు మెల్లిగా. పిల్లలకు సరయిన విద్య నేర్పాలన్న ఆదర్శం నా కెప్పుడూ ప్రియమైన విషయమే. కేవలం శరీరాన్నీ బుద్ధినీ అభివృద్ధిచెయ్యడానికి ఉద్దేశించిన మామూలు విద్యాబోధనకు వస్తున్న శుష్కఫలితాల్ని నేను స్పష్టంగా చూస్తూనే వచ్చాను. నైతిక, ఆధ్యాత్మిక విలువల్ని గ్రహించక పోయినట్లయితే ఎవ్వరూ సంతోషాన్ని పొందలేరు; అయినప్పటికీ నియత విద్యాప్రణాళికల్లో అవి లేవు. కుర్రవాళ్ళ సంపూర్ణ మానవత్వ వికాసానికి తోడ్పడే విద్యాలయం ఒకటి స్థాపించాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ ఆశయ సాధనకు నేను చేసిన మొదటి పని, బెంగాలు గ్రామీణ ప్రాంతంలో దిహికా అనే చోట ఏడుగురు పిల్లలతో విద్యాలయం ప్రారంభించడం.

మరో ఏడాదికి, 1918 లో, కాసిం బజార్ మహారాజు సర్ మణీంద్రచంద్ర నందిగారి చలవవల్ల , శీఘ్రవృద్ధి చెందుతున్న మా విద్యార్థి బృందాన్ని రాంచీకి తరలించగలిగాను. కలకత్తాకు సుమారు రెండువందల మైళ్ళ దూరంలో, బీహారులో ఉన్న ఈ పట్నం, భారతదేశంలోని అత్యంత ఆరోగ్యప్రదమైన వాతావరణం గల ప్రదేశాల్లో ఒకటి. రాంచీలో ఉన్న కాసిం బజార్ రాజభవనం, కొత్త విద్యాలయానికి ప్రధాన భవనం అయింది; ఈ విద్యాలయానికి నేను ‘యోగదా సత్సంగ బ్రహ్మచర్యా విద్యాలయం’[1] అని పేరు పెట్టాను. ప్రాథమిక, ఉన్నత పాఠశాల తరగతులు రెంటికీ నే నొక కార్యక్రమం ఏర్పరిచాను. అందులో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య విషయాలూ ఇతర విద్యావిషయాలు కూడా చేర్చడం జరిగింది. ఋషుల విద్యాబోధనాశయాల్ని అనుసరించి, తరగతి బోధన చాలావరకు ఆరు బయటే జరిగే ఏర్పాటు చేశాను (ఋషుల వన్యాశ్రమాలు, భారతీయ బాలకులకు లౌకిక, ఆధ్యాత్మిక విద్యలు రెండూ బోధించే ప్రాచీన విద్యాపీఠాలు).

రాంచీ విద్యార్థులకు ధ్యానయోగ పద్ధతీ, ఆరోగ్యానికీ శారీరక వికాసానికి తోడ్పడే అద్వితీయ “యోగదా” విధానమూ నేర్పడం జరుగుతోంది; ఈ యోగదా అభ్యాసాల నియమాల్ని నేను 1916 లో కనిపెట్టాను.

మనిషి శరీరం విద్యుద్ఘటం (ఎలక్ట్రిక్ బ్యాటరీ) లాంటిదని గ్రహించి నేను, మానవ సంకల్పమనే ప్రత్యక్ష సాధనం ద్వారా దాన్ని మళ్ళీ శక్తితో నింపవచ్చునని తార్కికంగా వివేచించాను, సంకల్పించడమన్నది లేకుండా ఏ రకమైన చర్యా సాధ్యం కాదు కనక, మానవుడు, భారమైన ఉపకరణంతోకాని యాంత్రికమైన వ్యాయామాభ్యాసాలతోకాని కాకుండా తన బలాన్ని తిరిగి పెంపొందించుకోడానికి మూలచాలకమైన సంకల్ప శక్తిని వినియోగించుకోవచ్చు. తేలికయిన “యోగదా” పద్ధతుల ద్వారా అపరిమితంగా సరఫరా అయే విశ్వశక్తితో తమలో (మెడుల్లా అబ్లాంగేటాలో కేంద్రీకరించి) ఉన్న ప్రాణశక్తిని సంకల్పపూర్వకంగా, తక్షణమే నింపుకోవచ్చు.

రాంచీలో విద్యార్థులు “యోగదా" శిక్షణకు చక్కగా సుముఖత


రాంచీలో ఉన్న యోగదా సత్సంగ విద్యాలయాన్ని గురించి మరికొంత సమాచారం 40 అధ్యాయంలో ఇవ్వడం జరిగింది, చూపారు; ప్రాణశక్తిని శరీరంలో ఒక భాగం నుంచి మరో భాగానికి మార్చడానికి, కష్టసాధ్యమైన ఆసనాల్లో సుస్థిరంగా కూర్చోడానికి కావలసిన అసాధారణ సామర్థ్యం పెంపొందించుకున్నారు. శక్తిసంపన్నులైన అనేకమంది వయోజనులు కూడా తమకు సాటిరానంతగా, శారీరక బలానికి సహనశక్తికి సంబంధించిన అసాధారణ కృత్యాలు ప్రదర్శించారు.

మా చిన్నతమ్ముడు విష్ణుచరణ్ ఘోష్[2] రాంచీ విద్యాలయంలో చేరాడు. ఉత్తరోత్తరా అతను, ప్రసిద్ధ వ్యాయామశాస్త్రజ్ఞుడయాడు. అతనూ అతని శిష్యుల్లో ఒకడూ కలిసి 1938-39 లో, పాశ్చాత్య దేశాల్లో పర్యటిస్తూ బలాన్నీ కండరాల నియంత్రణనూ నిరూపించే ప్రదర్శనలు ఇచ్చారు. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయం, అమెరికా యూరప్‌లలోని ఇతర విశ్వవిద్యాలయాల ఆచార్యులు, శరీరంమీద మనస్సుకు గల ప్రాబల్యాన్ని నిరూపించే, వీరి ప్రదర్శనలు చూసి చకితులయారు.

రాంచీలో మొదటి సంవత్సరం ముగిసేనాటికి, విద్యాలయంలో చేరడానికి వచ్చినవాళ్ళ దరఖాస్తుల సంఖ్య రెండు వేలకు పెరిగింది. కాని అప్పటికి కేవలం ఆశ్రమ విద్యాలయంగా మాత్రమే ఉన్న ఆ పాఠశాల వందమందికే వసతి కల్పించగలిగింది, పగటిపూట వచ్చే విద్యార్థులకు కూడా త్వరలోనే బోధనకు ఏర్పాట్లుచేయడం జరిగింది.

విద్యాలయంలో నేను, చిన్నపిల్లలకు తల్లిగానూ తండ్రిగానూ కూడా వ్యవహరించవలసి వచ్చేది; దాంతో బాటు వ్యవస్థాపరమైన ఇబ్బందులకు కూడా చాలావాటికి తట్టుకోవలసి వచ్చేది. క్రీస్తు మాటలు నాకు తరచుగా గుర్తొస్తూ ఉండేవి: “నా కోసమూ సువార్త కోసమూ ఇంటిని కాని, అన్నదమ్ముల్నికాని, అక్కచెల్లెళ్ళనికాని, తండ్రినికాని, తల్లినికాని, భార్యనుకాని, పిల్లల్నికాని, భూముల్ని కాని విడిచిపెట్టినవాడూ ఈ లోకంలో హింసలకు గురికావడంతోబాటు, ఇప్పుడు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెళ్ళని, తల్లుల్ని, పిల్లల్ని, భూముల్ని, పరలోకంలో నిత్యజీవితాన్ని పొందనివాడూ లేడన్నది నిశ్చయం."[3]

ఈ మాటలకు శ్రీయుక్తేశ్వర్‌గారు ఇలా వ్యాఖ్యానం చెప్పారు: “సమష్టిగా సమాజం (“ఇప్పుడు నూరంతలుగా ఇండ్లను, అన్న దమ్ముల్ని”) పట్ల గురుతరమైన బాధ్యత వహించడంకోసం, పెళ్ళీ కుటుంబపోషణా వంటి మామూలు జీవితానుభవాల్ని వదులుకొనే భక్తుడు, అపార్థం చేసుకునే తత్త్వంగల ప్రపంచం పెట్టే హింసలకు తరచుగా గురి అయ్యే అవకాశం గల పని చేస్తుంటాడు. అటువంటి గురుతర బాధ్యతల స్వీకారం వల్ల భక్తుడు స్వార్థాన్ని జయించి దైవకృపకు పాత్రుడవుతాడు.”

ఒకనాడు మా నాన్నగారు, వాత్సల్యంతో ఆశీర్వదించి వెళ్ళడానికి రాంచీకి వచ్చారు; బెంగాల్ - నాగపూర్ రైల్వేలో ఆయన ఇప్పించదలచిన ఉద్యోగాన్ని నేను తిరస్కరించి ఆయన్ని నొప్పించినందువల్ల, చాలా కాలంగా ఆ ఆశీర్వాదం నాకు అందకుండా ఉంచారు.

“అబ్బాయి! నువ్వెంచుకున్న నీ జీవితమార్గానికి నే నిప్పుడు సమాధానపడ్డాను. హాయిగా, ఉత్సాహంగా ఉన్న కుర్రవాళ్ళ మధ్య నిన్ను చూస్తుంటే నాకు సంతోషం కలుగుతోంది. నిర్జీవమైన రైల్వే టైమ్ టేబుళ్ళ లెక్కల్లోకన్న ఇక్కడే ఉంది నీ అసలయిన స్థానం.” నా వెంట ఉన్న పన్నెండుమంది పిల్లలవేపు చెయ్యి ఊపారాయన. “నాకున్న వాళ్ళు ఎనమండుగురే పిల్లలు; అయినా పరిస్థితి నే నర్థం చేసుకో గలను!” – అన్నారాయన, మిలమిల మెరిసే కళ్ళతో.

మాకున్న డెబ్భై బిగాల మంచి సారవంతమైన భూమిలో విద్యార్థులూ ఉపాధ్యాయులూ నేనూ రోజూ కొంతసేపు చొప్పున తోటపని, ఆరుబయట ఇతర పనులు చేస్తూ ఆనందించేవాళ్ళం. మాకు పెంపుడు జంతువులు చాలా ఉండేవి; ఒక లేడి పిల్లతో సహా. మా పిల్లలు దాన్ని ముద్దుచేశారు. నేను కూడా అదంటే ఎంత మనసుపడేవాణ్ణంటే, అది నా గదిలోనే పడుక్కోడానికి అనుమతించాను. తూరుపురేక లారే వేళ ఆ చిట్టిపాప, పొద్దుటి లాలింపుకోసం నా పక్కదగ్గిరికి గునగునా నడుస్తూ వచ్చేది.

ఒకనాడు, ఏదో పనిమీద రాంచీ ఊళ్ళోకి వెళ్ళవలసి వచ్చి, మామూలు వేళకంటె ముందే లేడిపిల్లకి పాలు పట్టాను. నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా దానికి ఏమీ పట్టవద్దని కుర్రవాళ్ళకి చెప్పాను. కాని ఒక కుర్రవాడు, నా మాట పట్టించుకోకుండా, దానికి బోలెడు పాలు పట్టేశాడు. సాయంత్రం నేను తిరిగి వచ్చేసరికి దుర్వార్త వినవచ్చింది: “పాలు ఎక్కువ పట్టడంవల్ల లేడిపిల్ల ప్రాణం పోయే స్థితిలో ఉందని.”

కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉండగా, మృతప్రాయమై ఉన్న ఆ లేడిపిల్లని ఒళ్ళో పెట్టుకుని, దాని ప్రాణం కాపాడమని దీనంగా దేవుణ్ణి ప్రార్థించాను. కొన్ని గంటల తరవాత ఆ చిట్టిలేడి కళ్ళు విప్పింది; లేచి నించుని నీరసంగా అడుగులు వేసింది. విద్యాలయమంతా ఆనందంతో పరవళ్ళు తొక్కింది.

కాని ఆనాటి రాత్రి గంభీరమైన గుణపాఠం ఒకటి తెలియ వచ్చింది; నేనెన్నడూ మరిచిపోలేనిదది. రాత్రి రెండు గంటలవరకు, లేడిపిల్ల దగ్గరే మెలకువగా కూర్చున్నాను; ఆ తరవాత నిద్ర పట్టేసింది. లేడిపిల్ల కలలో కనిపించి నాతో మాట్లాడింది:

“నన్ను పట్టి ఉంచేస్తున్నారు, నన్ను పోనివ్వండి; నన్ను పోనివ్వండి!”

“సరే” అన్నాను కలలో.

వెంటనే మేలుకున్నాను; “ఏమర్రోయ్ పిల్లలూ! లేడి చచ్చి పోతోంది!” అని అరిచాను. పిల్లలు నా దగ్గరికి ఉరుక్కొచ్చారు.

గదిలో, నేను లేడిపిల్లను పడుకోబెట్టిన చోటికి పరిగెత్తాను. అది లేవడానికి చిట్టచివరి ప్రయత్నం ఒకటి చేసి, నా వేపు తూలి, ప్రాణం విడిచి నా కాళ్ళదగ్గర కూలింది.

జంతువుల భవితవ్యాల్ని నడిపించి క్రమబద్ధం చేసే ‘సమస్త కర్మ’ ప్రకారం, ఆ లేడి జీవితం అంతటితో ముగిసిపోయింది; ఉత్తమ జన్మకు పురోగమించడానికి అది సిద్ధంగా ఉంది. నా గాఢమైన అనుబంధంవల్లా అది స్వార్థంతో కూడిందని తరవాత గ్రహించాను – ఎంతో శ్రద్ధగా చేసిన ప్రార్థనలవల్లా దాన్ని జంతురూప పరిమితుల్లో ఆపి ఉంచగలిగాను; కాని దాని ఆత్మ, విడుదలకోసం పెనుగులాడుతోంది. ఆ లేడి ఆత్మ, ప్రేమతో కూడిన నా అనుమతి లేకుండా పోనూపోదు, పోనూలేదు కనక, కలలో నన్ను బతిమాలుకుంది. నేను ఒప్పుకోగానే వెళ్ళిపోయింది.

నాకు విచారమంతా తొలగిపోయింది. తన బిడ్డలు, సృష్టితో ప్రతిదాన్నీ తనలోని ఒక భాగంగానే ఎంచి ప్రేమించాలనీ, చావు అన్నిటినీ అంతంచేస్తుందనే మాయలో పడి బాధపడగూడదనీ భగవంతుడు కోరతాడని నేను కొత్తగా గ్రహించాను. అజ్ఞాని అయిన మనుష్యుడు, తన ప్రియమిత్రుల్ని శాశ్వతంగా మరుగుపరుస్తున్నట్టుగా బాహ్యదృష్టికి గోచరించే ఆలంఘ్యమయిన మరణకుడ్యాన్ని మాత్రమే దర్శిస్తాడు. కాని ఇతరుల్ని ఈశ్వరుడి అభివ్యక్తులుగా ప్రేమించే నిస్సంగుడు, తన ప్రేమ పాత్రులు మరణించినప్పుడు వాళ్ళు క్షణకాలం తెప్పరిల్లడానికి వీలుగా ఈశ్వరానందం పొందడానికి మాత్రమే తిరిగి వెళ్ళారని అర్థం చేసుకుంటాడు.

రాంచీ విద్యాలయం, చిన్నగా నిరాడంబరంగా మొదలయినదల్లా ఇప్పుడు బీహారులోనూ బెంగాలులోనూ సుప్రసిద్ధమైన సంస్థగా అభివృద్ధి చెందింది. విద్యాలయశాఖ లనేకం, ఋషుల విద్యాబోధనాదర్శాల్ని పరిరక్షించడంలో ఆనందం పొందేవాళ్ళు అందించిన స్వచ్ఛంద విరాళాలతో పనిచేస్తున్నాయి. మిడ్నపూర్ లోనూ లక్ష్మణపూర్ లోనూ శాఖావిద్యాలయాలు స్థాపించడం జరిగింది; అవి బాగా వర్ధిల్లుతున్నాయి.

రాంచీ కేంద్రకార్య స్థానం, రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ సహాయం కోసం వైద్యాలయం ఒకటి నిర్వహిస్తోంది. ఆటల పోటీల్లో కూడా విద్యాలయం పేరు తెచ్చుకుంది. ఇక విద్యారంగంలో, చాలామంది రాంచీ పట్టభద్రులు, ఆ తరవాతి విశ్వవిద్యాలయ జీవితంలో తమ ప్రతిభ నిరూపించుకున్నారు.

గత మూడు దశాబ్దుల్లోనూ తూర్పుదేశాల నుంచీ పడమటి దేశాల నుంచీ కూడా ప్రఖ్యాత స్త్రీపురుషులు అనేకమంది వచ్చి ఈ విద్యాలయాన్ని సందర్శించడం దీనికొక గౌరవం. కాశీలో ఉండే “రెండు శరీరాల సాధువు” స్వామి ప్రణవానందగారు 1918 లో రాంచీ వచ్చి కొన్ని రోజులు ఉన్నారు. చెట్లకింద నడిచే తరగతుల కమనీయ దృశ్యాన్ని తిలకిస్తున్నప్పుడూ, సంజెవేళ చిన్నచిన్న కుర్రవాళ్ళు యోగధ్యానంలో నిశ్చలంగా కూర్చుని ఉండడం గమనించినప్పుడూ ఆయన గాఢంగా చలించారు. “కుర్రవాళ్ళకు సరయిన శిక్షణ ఇవ్వడానికి లాహిరీ మహాశయులు ఉద్దేశించిన ఆదర్శాల్ని ఈ సంస్థలో అమలుజరపడం చూస్తుంటే, నా హృదయంలో ఆనందం కలుగుతోంది. దీనికి మా గురుదేవుల ఆశీస్సులు ఉండుగాక!” అన్నారాయన.

నా పక్కనే కూర్చున్న ఒక చిన్న కుర్రవాడు, ఆ మహాయోగిని ఒక ప్రశ్న అడగడానికి సాహసించాడు.

“అయ్యా, నేను సన్యాసి నవుతానా? నా జీవితం దేవుడికే అంకిత మవుతుందా?” అని అడిగాడు.

స్వామి ప్రణవానందగారు మృదువుగా చిరునవ్వు చిందించినా, ఆయన కళ్ళు భవిష్యత్తులోకి గుచ్చిగుచ్చి చూస్తున్నాయి.

“బాబూ, నువ్వు పెద్ద అయేసరికి, నీ కోసం ఒక చక్కని కన్నె పిల్ల ఎదురు చూస్తూ ఉంటుంది.” (ఆ అబ్బాయి సన్యాసం తీసుకోవాలని కొన్నేళ్ళపాటు పథకం వేసుకుని, చివరికి పెళ్ళి చేసేసుకున్నాడు).

స్వామి ప్రణవానందగారు రాంచీ సందర్శించిన కొంత కాలానికి కలకత్తాలో ఆయన తాత్కాలికంగా బసచేసిన ఇంటికి, మా నాన్నగారితో కలిసి నేను కూడా వెళ్ళాను. “తరవాత, మీ నాన్నగారితోబాటు చూస్తాను నిన్ను,” అంటూ ప్రణవానందగారు చాలా ఏళ్ళ కిందట చెప్పిన జోస్యం చటుక్కున నా మనస్సుకు స్ఫురించింది.

నాన్నగారు స్వాములవారి గదిలో అడుగుపెట్టగానే, ఆ మహాయోగి తమ ఆసనం మీంచి లేచి, ఆయన్ని ప్రేమపూర్వకమైన గౌరవంతో ఆలింగనం చేసుకున్నారు.

“భగవతిగారూ, మీ గురించి మీరు ఏం చేస్తున్నారు? మీ అబ్బాయి అనంతంలోకి వేగంగా దూసుకుపోతూండడం గమనించలేదా?” అంటూ ప్రణవానందగారు నన్ను మా నాన్నగారి ఎదుట మెచ్చుకుంటూ ఉంటే నాకు సిగ్గువేసింది. ఆయన ఇంకా ఇలా అన్నారు, “బనత్, బనత్, బన్‌జాయ్”[4] అంటూ మన గురుదేవులు ఎంత తరచుగా అంటూండేవారో గుర్తుచేసుకోండి. కనక, క్రియాయోగసాధన ఆపకుండా కొనసాగించి తొందరగా దివ్యసన్నిధికి చేరండి.”

నేను మొదటసారి కాశీ వెళ్ళి దర్శించినప్పుడు ఎంతో ఆరోగ్యంగా, బలంగా కనిపించిన ప్రణవానందగారి శరీరంలో ఇప్పుడు వృద్ధాప్యం స్పష్టంగా కనబడుతోంది. అయితే ఆయన, ఆసనం వేసుకొని కూర్చున్నప్పుడు మాత్రం వెనుబద్ద చక్కగా నిటారుగా నిలబడి ఉంటున్నది.

నేను సూటిగా ఆయన కళ్ళలోకి చూస్తూ ఇలా, అడిగాను; “స్వామీజీ, వయస్సు పైబడుతున్నట్టు మీకు అనిపిస్తోందో లేదో చెప్పండి? శరీరం నీరసపడుతూంటే మీ ఈశ్వరానుభూతుల్లో ఏమయినా తగ్గుదల కనిపిస్తోందా?”

ఆయన చిద్విలాసంగా చిరునవ్వు చిందించారు. “ఆ పరమ ప్రియతముడు, వెనకటికన్న ఇప్పుడే నాకు బాగా చేరువ అయాడు.” ఆయన పరిపూర్ణ విశ్వాసం నా మనస్సునూ ఆత్మనూ ముంచెత్తివేసింది. ఆయన ఇంకా ఇలా అన్నారు: “నే నిప్పటికీ రెండు పెన్షన్లు అనుభవిస్తున్నాను - ఒకటి, ఇక్కడున్న భగవతిగారి ద్వారా వచ్చింది; రెండోది పై నుంచి వచ్చింది.” ఆకాశంవేపు వేలు చూపిస్తూ ఆ సాధువు, కొద్దిసేపు ఆనంద సమాధిలో స్తంభీభూతులయారు; ఆయన ముఖం విద్యుతేజస్సుతో ప్రకాశించింది, నా ప్రశ్నకు సమృద్ధిగా లభించిన సమాధాన మది!

ప్రణవానందగారి గదిలో చాలా మొక్కలూ, విత్తనాల పొట్లాలూ ఉండడం చూసి, అవి ఎందుకోసమని అడిగాను.

“నేను కాశీనుంచి శాశ్వతంగా వచ్చేశాను,” అన్నారాయన. “ఇప్పుడు హిమాలయాలకి ప్రయాణంలో ఉన్నాను. నా శిష్యుల కోసం అక్కడొక ఆశ్రమం ఏర్పాటు చేస్తాను, ఈ విత్తనాలలో పాలకూరా మరికొన్ని కూరగాయలూ పండుతాయి. నా ప్రియశిష్యులు, ఆనందమయమైన దైవయోగంలో కాలం గడుపుతూ సాదాగా జీవిస్తారు. ఇంకేమీ అక్కర్లేదు.”

మా నాన్నగారు తమ సహాధ్యాయిని, మళ్ళీ కలకత్తా ఎప్పుడు వస్తారని అడిగారు.

“ఇక రాను,” అని జవాబిచ్చారు ఆ సాధువు. “నాకు ప్రియమైన కాశీని శాశ్వతంగా విడిచిపెట్టి నేను హిమాలయాలకు వెళ్ళే సంవత్సరం ఇదే ననీ, అక్కడే నేను దేహత్యాగం చేస్తాననీ లాహిరీ మహాశయులు చెప్పారు.”

ఆయన మాటలకు నా కళ్ళలో నీళ్ళు నిండాయి; కాని ఆ స్వాములవారు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వారు. జగన్మాత ఒడిలో సురక్షితంగా కూర్చున్న చిన్న దివ్యశిశువును తలపించారాయన. మహాయోగి సంపూర్ణ స్వాధీనంలో ఉన్న సర్వోత్తమ ఆధ్యాత్మిక శక్తుల మీద వయోభారం దుష్ప్రభావమేమీ ప్రసరించలేదు. సంకల్పానుసారంగా ఆయన కాయకల్పం చేసుకోగల స్థితిలో ఉన్నారు కాని ఒక్కొక్కప్పుడు ముసలితనం రాకుండా అరికట్టడానికి పూనుకోకపోవడం కద్దు. కర్మఫల భోగంలో మిగిలిపోయిన స్వల్పాంశాల్ని మరో కొత్త జన్మలో అనుభవించే అవసరం లేకుండా చేసుకోడానికి, కాలం కలిసివచ్చే సాధనంగా ఇప్పటి దేహాన్నే ఉపయోగించుకుని, భౌతిక స్థాయిలో కర్మను క్షయం కానిచ్చేవారు.

ఆ తరవాత కొన్ని నెలలకి, సనందుడనే మా పాత స్నేహితుణ్ణి కలుసుకున్నాను; ప్రణవానందగారి సన్నిహిత శిష్యుల్లో ఒక డతను.

“మా పూజ్య గురుదేవులు వెళ్ళిపోయారు,” అంటూ ఏడుస్తూ చెప్పాడు. “ఆయన ఋషీకేశం దగ్గర ఒక ఆశ్రమం స్థాపించి, మాకు ప్రీతిగా శిక్షణ ఇచ్చారు. మేము చక్కగా కుదుటబడి ఆయన సన్నిధిలో త్వరత్వరగా ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్న తరుణంలో ఒకనాడు ఋషీకేశం నుంచి పెద్ద జనసమూహాన్ని పిలిచి సంతర్పణ చెయ్యాలని తీర్మానించారు. అంత ఎక్కువమంది ఎందుకని నే నాయన్ని అడిగాను.

“ ‘ఇదే నా చివరి పండుగ వేడుక,’ అన్నారాయన. ఆయన మాటల్లో అంతరార్థాలు నేను పూర్తిగా అర్థం చేసుకోలేదు.”

భారీ ఎత్తున వంటలు చేయటానికి ప్రణవానందగారు సాయపడ్డారు. 2,000 మందికి సంతర్పణ చేశాం. సంతర్పణ ముగిసిన తరవాత ఆయన ఎత్తుగా ఉన్న ఒక వేదిక మీద కూర్చుని అనంత పరబ్రహ్మను గురించి ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చారు. అది ముగిసిన తరవాత, అన్ని వేలమంది సమక్షంలో, ఆయన నావేపు తిరిగారు; నేను వేదికమీద ఆయన పక్కనే కూర్చున్నాను. అసాధారణ పటిమతో నాతో ఇలా అన్నారు :

“ ‘సనందన్, సిద్ధంగా ఉండు ఈ చట్రాన్ని తన్నేస్తున్నాను,’ ”[5] “ఒక్క క్షణం స్తంభించిపోయి, ‘గురుదేవా, ఆ పని చెయ్యకండి! దయచేసి, ఆ పని చెయ్యకండి!’ అంటూ గట్టిగా అరిచాను. నా మాటలకి ఆశ్చర్యపోతూ, జనం నిశ్శబ్దంగా ఉండిపోయారు. ప్రణవానందగారు నా వేపు చిరునవ్వు నవ్వారు. కాని ఆయన కళ్ళు అప్పటికే శాశ్వత పరబ్రహ్మను అవలోకిస్తున్నాయి.

“ ‘స్వార్థపరుడివి కాకు; నా కోసం దుఃఖించకు.’ అన్నారాయన. ‘నేను చాలాకాలంగా, సంతోషంగా మీ కందరికీ సేవ చేస్తూ వచ్చాను; ఇప్పుడు దీనికి ఆనందించు; నాకు శుభం కలగాలని కోరుకో. నా విశ్వప్రేమమయుడి దగ్గరికి పోతున్నాను’ అన్నారాయన. అని, ఇంకా నా చెవిలో గుసగుసలాడారు, ‘త్వరలోనే’ మళ్ళీ పుడతాను. కొద్దికాలంపాటు అనంతానందాన్ని అనుభవించిన తరవాత భూమికి తిరిగివచ్చి బాబాజీని[6] చేరతాను. నా ఆత్మ ఎప్పుడు, ఎక్కడ కొత్త శరీరాన్ని ధరించిందో నీకు త్వరలోనే తెలుస్తుంది.”

“ఆయన మళ్ళీ అరిచారు, ‘సనందన్, ఇదుగో! రెండో క్రియాయోగం ద్వారా చట్రాన్ని తన్నేస్తున్నాను.”

“మా ముందు సముద్రంలా కనిపించే ముఖాలవైపు చూసి చిన్నగా ఆశీర్వదించారు. తరవాత, తమ దృష్టిని జ్ఞాననేత్రం వేపు లోపలికి సారించి నిశ్చలంగా అయారు. ఆయన తన్మయస్థితిలో ధ్యానంచేస్తున్నారని విస్మిత జనసమూహం అనుకుంటూ ఉండగా, అప్పటికే ఆయన, దేహపంజరాన్ని విడిచి పెట్టేశారు; తమ ఆత్మను విశాల విశ్వాంతరాళంలోకి దూకించేశారు. పద్మాసనంలో ఉన్న ఆయన శరీరాన్ని శిష్యులు తాకి చూశారు; కాని అప్పటికే ఒళ్ళు చల్ల బడింది. కొయ్యబారిన శరీరం మట్టుకే మిగిలింది; అద్దెకున్నవాడు అమరలోక తీరానికి పలాయనం చేశాడు.

సనందుడు చెప్పేది పూర్తి అవుతూంటే నేను అనుకున్నాను: “ఈ ‘రెండు శరీరాల సాధువు’గారు జీవితంలోనే కాక మరణంలో కూడా నాటకీయత ప్రదర్శించారు!”

ప్రణవానందగారు మళ్ళీ ఎక్కడ పుడతారని అడిగాను.

“ఆ సమాచారాన్ని పవిత్ర రహస్యంగా పరిగణిస్తున్నాను,” అని జవాబిచ్చాడు సనందుడు. “నే నది ఎవరికీ చెప్పగూడదు. బహుశా నువ్వుదాన్ని మరోరకంగా తెలుసుకోవచ్చు.”

చాలా ఏళ్ళ తరవాత స్వామి కేశవానంద[7]గారి దగ్గర ఆ విషయం తెలుసుకున్నాను. ప్రణవానందగారు, చనిపోయిన కొన్నేళ్ళకి కొత్త దేహంతో జన్మించి హిమాలయాల్లో బదరీనారాయణకు వెళ్ళారని, అక్కడ మహావతార బాబాజీ సన్నిధిలో ఉండే సాధుబృందంలో కలిశారని తెలిసింది.

  1. విద్యాలయం అంటే బడి. బ్రహ్మచర్యం అన్నదిక్కడ, వైదిక ప్రణాళికతో మానవ జీవితానికి నిర్ణయించిన నాలుగు దశల్లోనూ ఒకటి. ఆ నాలుగూ ఇవి: (1) బ్రహ్మచారిదశ; (2) లౌకిక బాధ్యతలు వహించే గృహస్థ దశ; (3) వానప్రస్థ దశ; (4) లౌకిక బంధాలు ఏమీ లేకుండా వనవాసం చేస్తూకాని, సంచారం చేస్తూకాని గడిపే సన్యాసి దశ. ఆదర్శవంతమైన ఈ జీవిత ప్రణాళికను ఆధునిక భారతదేశంలో విరివిగా పాటించనప్పటికీ, ఇప్పటికీ దీన్ని నిష్టగా పాటించేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ నాలుగు ఆశ్రమాల్నీ నిష్ఠగా, ఒక గురువు యావజ్జీవిత మార్గదర్శకత్వం కింద గడుపుతూ ఉంటారు.
  2. విష్ణుచరణ్ ఘోష్, 1970 జూలై 9 న కలకత్తాలో చనిపోయారు (ప్రచురణకర్త గమనిక).
  3. మార్కు 10 : 29-30 (బైబిలు).
  4. లాహిరీ మహాశయులకు ప్రియమైన వ్యాఖ్యల్లో ఇది ఒకటి; తమ శిష్యుల్ని, ధ్యానంలో పట్టుదలతో కృషిచెయ్యమని ప్రోత్సహించడానికి ఆయన ఇలా అంటూండేవారు. దీని అర్థం ఏమిటంటే: “చేస్తూ, చేస్తూ, పూర్తి చెయ్యాలి.” దీని భావం తీసుకొని ఇలా స్వేచ్ఛానువాదం చేసుకోవచ్చు; "శ్రమిస్తూ, శ్రమిస్తూ, ఒకనాటికి దివ్యలక్ష్యాన్ని దర్శించు!”
  5. అంటే, శరీరాన్ని విడిచిపెట్టడం.
  6. లాహిరీ మహాశయుల గురువులు; ఇప్పటికీ జీవించి ఉన్నారు. (33 అధ్యాయం చూడండి).
  7. నేను కేశవానందగారిని కలుసుకోడం గురించి. 42 అధ్యాయంలో వివరించడం జరిగింది.