ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 1

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 1

మా తల్లిదండ్రులు,

నా బాల్యజీవితం

పరమసత్యాల అన్వేషణ, దానికి తోడుగా ఉండే గురుశిష్య సంబంధం భారతీయ సంస్కృతికి స్వాభావికమైన లక్షణాలుగా చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాయి.

నే ననుసరించిన మార్గం నన్ను దైవస్వరూపులైన ఒక ఋషి దగ్గరికి నడిపించింది. మహిమాన్వితమైన ఆయన జీవితం అనేక యుగాలకు ఆదర్శంగా నిలిచేటట్టు రూపొందినది. భారతదేశానికి నిజమైన సంపద అయిన మహానుభావుల్లో ఆయన ఒకరు. అటువంటి మహాపురుషులు ప్రతి తరంలోనూ ఆవిర్భవిస్తూ, ప్రాచీనకాలంలో ఈజిప్టుకూ బాబిలోనియాకూ పట్టిన గతి భారతదేశానికి పట్టకుండా కాపాడుతూ వచ్చారు.

నా స్మృతిపథంలోని మొట్టమొదటి జ్ఞాపకాలన్నీ ఒకానొక పూర్వ జన్మకు సంబంధించిన అస్తవ్యస్త విషయాలతో నిండి ఉన్నవి. చాలా వెనకటి జన్మలో ఎప్పుడో నేను, హిమాలయాల మంచు ప్రదేశాల మధ్య ఒక యోగి[1]గా జీవించినట్లు సుస్పష్టమైన జ్ఞాపకాలు నా మనస్సులో మెదిలాయి. ఈ గతకాలపు జ్ఞాపకాల మెరుపులే, పరిమితిలేని ఏదో ఒక సంబంధం ద్వారా, భవిష్యత్తును కూడా లీలామాత్రంగా నాకు గోచరింప జేశాయి.

పసితనంలో నిస్సహాయస్థితిలో నేను పొందిన అవమానాలు ఇప్పటికీ నాకు గుర్తే. అప్పట్లో నాకు నడక రాకపోవడంవల్లా మనస్సులో ఉన్న భావాల్ని స్పష్టంగా చెప్పలేకపోవడంవల్లా ఉక్రోషంగా ఉంటూండేది. శారీరకమైన నా అశక్తతను గ్రహించినప్పుడు, నా హృదయంలో ప్రార్థనాభరితమైన తరంగాలు లేస్తూండేవి. ఎంతో భావోద్రేకంతో నిండిన నా జీవితానుభవాలు నా మనస్సులో అనేక భాషల్లో వెల్లడవుతూ ఉండేవి. ఇలా నాలో వివిధ భాషల గందరగోళం ఉంటూ ఉండగా, క్రమక్రమంగా మావాళ్ళ బెంగాలీ మాటలు వినడానికి అలవాటుపడ్డాను. పసిపిల్లల మనస్సు, ఆటబొమ్మలతోనూ కాలివేళ్ళతోనూ ఆడుకుంటూండడానికే పరిమితమైందని అనుకుంటూ పెద్దవాళ్ళు ఎంత మోసపోతూ ఉంటారో!

నేను ఎన్నోసార్లు మంకుపట్టు పట్టి ఏడుస్తూ ఉండేవాణ్ణి; మనస్సులో అలజడీ, దాన్ని వెళ్ళబెట్టుకోడానికి అలవికాని శరీరం- ఈ రెండూ దానికి కారణాలు. సాధారణంగా నా బాధ చూసి ఇంట్లోవాళ్ళు గాభరాపడుతూండడం నాకు గుర్తే. అయితే మా అమ్మ లాలింపులూ, ఏదో పలకాలనీ తప్పటడుగులు వేయ్యాలనీ నేను చేసే తొలి ప్రయత్నాలూ ఇలాంటి సంతోషకరమైన జ్ఞాపకాలు కూడా నాలో ముసురుకొంటూ ఉంటాయి. మామూలుగా ఇట్టే మరుపుకు వచ్చే ఈ తొలి విజయాలే ఆత్మ విశ్వాసానికి సహజమైన ప్రాతిపదిక అవుతాయి.

ఈ మాదిరిగా సుదీర్ఘ కాలాల జ్ఞాపకాలు రావడం నా కొక్కడికే జరిగింది కాదు. నాటకంలో దృశ్యాల్లాగ ఒకదాని తరవాత ఒకటిగా మారుతూ వచ్చే “చావుపుట్టుకల" పరంపరకు లోనుకాకుండా ఎందరో యోగులు ఆత్మస్మృతి అవిచ్ఛిన్నంగా నిలుపుకున్నారని వింటాం. మనిషి అంటే కేవలం శరీరమే అయి ఉన్నట్లయితే, ఆ శరీరం నశించిపోతే అతని వ్యక్తిత్వం కూడా నశించిపోతుంది. కాని వేలకొద్ది సంవత్సరాలుగా ప్రవక్తలు చెబుతున్నది కనక నిజమే అయితే, మానవుడంటే ప్రధానంగా ఆత్మ అని చెప్పాలి; అది ఒక రూపమంటూ లేనిదీ అంతటా వ్యాపించి ఉన్నదీను.

చిన్నప్పటి జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తుండడం విడ్డూరమయితే కావచ్చు కాని, మరీ అరుదు మాత్రం కావు. అనేక దేశాల్లో నేను పర్యటన చేస్తూండేటప్పుడు, సత్యసంధులైన స్త్రీపురుషులు తమ బాల్య స్మృతులను ఏకరువు పెట్టగా విన్నాను.

నేను జనవరి 5, 1893 తేదీన, హిమాలయపర్వతాలకు సమీపంలో ఈశాన్య భారతంలో ఉన్న గోరఖ్‌పూర్ లో పుట్టాను. నా జీవితంలో మొదటి ఎనిమిదేళ్ళూ అక్కడ గడిచాయి. మేము ఎనిమిదిమంది తోబుట్టువులం. నలుగురు మొగపిల్లలం, నలుగురు ఆడపిల్లలు. అప్పట్లో నా పేరు ముకుందలాల్ ఘోష్[2]; మొగపిల్లల్లో రెండోవాణ్ణి; అందరిలో నాలుగోవాణ్ణి.

మా అమ్మా నాన్నా బెంగాలీలు; క్షత్రియకులంవారు. ఇద్దరూ సాధుస్వభావులు. వాళ్ళలో ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమ ప్రశాంతమైనదీ గంభీరమైనది; హుందాతనమున్న ఆ ప్రేమలో అల్పత్వానికి తావు లేదు. ఈ ఎనమండుగురు పిల్లలూ చేసే కోలాహలానికి ప్రశాంతమైన కేంద్రం మా తల్లిదండ్రుల సామరస్యమే. నాన్నగారు భగవతీచరణ ఘోష్‌గారు దయాశీలురూ, గంభీరులు, అప్పుడప్పుడు కఠినులూనూ. పిల్లలం మేము ఆయన్ని అమితంగా ప్రేమిస్తూనే గౌరవభావంతో కాస్త ఎడంగా ఉంటుండేవాళ్ళం. ఆయన ప్రతిభావంతులైన గణిత శాస్త్రజ్ఞులు, తార్కికులు; ప్రధానంగా బుద్ధిబలాన్ని అనుసరించి సాగేవారు. కాని మా అమ్మ సంగతి వేరు; ఆవిడకు హృదయమే ప్రధానం. ఆవిడ మా కన్నీ ప్రేమతోనే నేర్పింది. ఆవిడ పోయిన తరవాత నాన్నగారు, తమలో ఉన్న మార్దవాన్ని మరింతగా పైకి చూపేవారు. అప్పుడు ఆయన చూసే చూపు తరచుగా మా అమ్మచూపే అనిపించేది.

తొలి దశలో పవిత్రగ్రంథాలతో కలిగే పరిచయం, తీపి చేదూ కలిసిన రుచిలా ఉంటుంది. ఈ రకమైన అనుభవం మేము మా అమ్మ దగ్గరే పొందాం. క్రమశిక్షణ అలవరచడంకోసం అమ్మ, సందర్భానికి అనువైన కథలను మహాభారతంలోంచి, రామాయణం లోంచి తీసుకుని చెబుతూ ఉండేది. ఇల్లాటి సందర్భాల్లో శిక్షవెయ్యడం, శిక్షణ ఇవ్వడం- రెండూ కలిసే ఉండేవి.

నాన్నగారు ఆఫీసునుంచి వచ్చే సమయానికి ఆయనకి గౌరవంగా స్వాగతం చెప్పడంకోసమని మా అమ్మ సాయంత్రం వేళల్లో పిల్లలందరికీ జాగ్రత్తగా బట్టలు వేసేది. భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీల్లో ఒకటిగా పేరుగన్న బెంగాల్ - నాగఫూర్ రైల్వేలో, ఉపాధ్యక్ష పదవిలాంటి ఉద్యోగంలో ఉండేవారాయన. దాని రీత్యా ఆయనకు ప్రయాణాలు పడుతుండేవి; నా చిన్నతనంలో మా కుటుంబానికి అనేక నగరాలు నివాసాలయ్యాయి.

అవసరాల్లో ఉన్నవాళ్ళని ఆదుకోడం విషయంలో అమ్మ ఎప్పుడూ ఉదారంగా ఉండేది. నాన్నగారు కూడా దయ చూపించేవారు; కాని ఆ రకంగా చేసే ఖర్చులు ఆదాయవ్యయాల అంచనాకి లోబడే ఉండాలని ఆయన అభిప్రాయం. ఒకసారి, బీదవాళ్ళకి అన్నదానం చెయ్యడానికి అమ్మ చేసిన ఖర్చు, నాన్నగారి నెలసరి రాబడిని మించిపోయింది.

అప్పుడు నాన్నగారు అమ్మతో ఇలా అన్నారు: “నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే. దానాల నిమిత్తం నువ్వు చేసే ఖర్చు ఉచితమైన పరిమితిని మించకుండా చూడు!″ నాన్నగారు సౌమ్యంగా మందలించడం కూడా అమ్మ మనస్సును బాధించేది. తమ కిద్దరికీ కలిగిన ఈ అభిప్రాయ భేదాన్ని గురించి పిల్లలకి చూచాయగా కూడా చెప్పకుండా ఆవిడ, ఒక జట్కా బండిని పిలిపించింది.

‘‘సెలవు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా." బహు ప్రాచీనకాలం నుంచి వినిపించే తుది హెచ్చరికే ఇది!

ఆ మాటకి మేము తెల్లబోయి ఏడుపులు మొదలుపెట్టాం. సరిగ్గా ఆ సమయానికి, ఎక్కణ్ణించో పిలిచినట్టు వచ్చాడు మా మామయ్య; వచ్చి నాన్నగారి చెవిలో ఏదో గుసగుసలాడాడు. సందేహం లేదు; యుగ యుగాలుగా ఎందరో చేస్తూ వస్తున్న హితోపదేశమే ఇది. దాని మీదట నాన్నగారు, రాజీధోరణిలో నాలుగు మాటలు చెప్పిన తరవాత, బండిని సంతోషంగా తిప్పి పంపించేసింది అమ్మ. నేను గమనించినంత వరకు, అమ్మకి నాన్నగారికీ ఏర్పడిన ఒకేఒక వివాదం అంతటితో ముగిసింది. అయితే వాళ్ళిద్దరికీ స్వభావసహజంగా సాగిన చర్చమాత్రం ఒకటి గుర్తుకు వస్తుంది.

“ఒక్క పదిరూపాయ లివ్వండి, పాపం ఓ బీదావిడ వచ్చి అడుగుతోంది," అంది. ఎదటివాళ్ళని ఒప్పించే గుణం అమ్మ చిరునవ్వులో ఉండేది. “పది రూపాయలెందుకు? ఒక్కటి చాలు.” నాన్నగారు తమ అభిప్రాయాన్ని సమర్థించుకోడానికి ఇంకా ఇలా అన్నారు: “మా నాన్న గారూ, తాతయ్యా, నాయనమ్మా హఠాత్తుగా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా పేదరికం అంటే ఏమిటో నాకు అప్పుడు అనుభవంలోకి వచ్చింది. బడికి వెళ్ళడానికి కొన్ని మైళ్ళు నడిచిపోవాలంటే పొద్దుటిపూట నా భోజనం ఏమిటో తెలుసా?- ఒక చిన్న అరటిపండు మాత్రమే. తరవాత యూనివర్సిటీలో చదివే రోజుల్లో డబ్బుకోసం ఎంత కటకట అయ్యేదో తెలుసా! డబ్బున్న ఓ జడ్జిగారిని ఆశ్రయించి నెల కొక్క రూపాయి ఇప్పించమని కోరాను. ఇయ్యనన్నా డాయన; ఒక్క రూపా యయినా తనకి ముఖ్యమైందే నన్నాడు.”

“ఆయన ఆ రూపాయి ఇయ్యనన్నాడని ఎంత బాధగా తలుచు కుంటున్నారు!” అమ్మకున్న దయకు, చటుక్కున సమర్థించుకోగల కారణం ఉంటుండేది. “తొందరపని పడ్డప్పుడు పదిరూపాయి లివ్వనన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ, అలాగే బాధగా తలుచుకోవాలని ఉందా?”

“నువ్వే గెలిచావులే!” ఓడిపోయిన భర్తలందరూ అనాదిగా చేస్తున్న భంగిమే ఒకటి చూపించి, డబ్బుల సంచీ తెరిచారాయన. “ఇదుగో పది రూపాయల నోటు. నా శుభాకాంక్షలతో ఆవిడ కియ్యి.”

ఏ కొత్త ప్రతిపాదన వచ్చినా మొట్టమొదట, ‘వద్దు’ అనడం నాన్నగారికి అలవాటు. అంత తొందరగా అమ్మదగ్గర సానుభూతి పొందిన ఆ అపరిచితురాలి విషయంలో ఆయన చూపించిన ధోరణి, మామూలుగా ఆయన కనబరిచే జాగ్రత్తకు ఉదాహరణ. అడిగిన వెంటనే ఒప్పుకోక పోవడమన్నది నిజంగా, “ఆలోచించి నిర్ణయించాలి” సూత్రాన్ని పాటించడమే. తీసుకొనే నిర్ణయాల విషయంలో ఆయనెప్పుడూ సమంజసంగానూ సమతూకంగానూ ఉండడమే గమనించాను. అసంఖ్యాకమైన నా కోరికలకు కారణాలు చూపిస్తూ ఒకటిరెండు చక్కటి వాదాలతో కనక నేను సమర్థించుకోగలిగినట్లయితే, నేను కోరిందల్లా నెరవేర్చేవారు- సెలవుల్లో ప్రయాణాలకయినా సరే, కొత్త మోటారు సైకిలు కావాలన్నా సరే.

ఆయన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు చాలా గట్టి కట్టుబాట్లలో ఉంచేవారు. తమ విషయంలో అయితే ఆయనది కఠోర వ్రతమే. మాట వరసకు చెప్పాలంటే, ఆయనెన్నడూ నాటకాలకు కూడా వెళ్ళలేదు. వివిధ ఆధ్యాత్మిక సాధనల్లోనూ, గీతాపారాయణంలోనూ ఆనందం పొందేవారు. విలాసాలనన్నిటినీ విడిచిపెట్టేసి, ఒక్క జత పాత బూట్లతోనే గడుపుకొంటూ, ఇంక పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటినే వాడుతుండేవారు. మోటారు కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తరవాత ఆయన కొడుకులు కొనుక్కున్నారు కాని, ఆయన మాత్రం రోజు ఆఫీసుకు ట్రామ్ బండిలోనే వెళ్తూండేవారు.

అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి నాన్న గారికి లేదు. ఒకసారి ఆయన, కలకత్తా అర్బన్ బ్యాంకును తానే స్థాపించినప్పటికీ, దాంట్లో వాటాలు తీసుకోడానికి నిరాకరించారు. వాటితో లాభం పొందడం ఆయనకి ఇష్టం లేదు. తీరిక వేళల్లో, ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలనే ఆయన అనుకునేవారు.

నాన్నగారు ఉద్యోగం విరమించుకున్న తరవాత చాలా ఏళ్ళకి, బెంగాల్ - నాగపూర్ రైల్వేవాళ్ళ పుస్తకాల్ని తణిఖీ చెయ్యడానికి ఇంగ్లండు నుంచి ఒక ఎకౌంటెంటు వచ్చాడు. అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయాడు. జరిగింది ఏమిటంటే, రైల్వేవారి దగ్గర్నించి నాన్నగారికి బోనస్సు రావలసి ఉంది. బకాయిపడ్డ బోనస్సుకోసం ఆయ నెన్నడూ దరఖాస్తు చెయ్యనేలేదట!

“ముగ్గురి పని ఆయనొక్కడు చేశాడు!” అని కంపెనీకి చెప్పాడు ఎకౌంటెంటు. “వెనకటినించి పరిహారంగా ఆయనకి చెల్లించవలసినవి 1,25,000 రూపాయలు.” ఆ మొత్తానికి, కంపెనీ కోశాధికారి నాన్నగారికో చెక్కు పంపాడు. ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయమంటే, ఇంట్లో వాళ్ళకి చెప్పడం కూడా మరిచిపోయారు. తరవాత చాలా కాలానికి మా ఆఖరి తమ్ముడు విష్ణు, నాన్న గారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమ అయిన సంగతి, బ్యాంకువాళ్ళు పంపిన స్టేట్‌మెంటులో చూసి, దాన్నిగురించి నాన్నగారి నడిగాడు.

“భౌతికమైన లాభాల్ని చూసి పొంగిపోవడం ఎందుకు?” అని జవాబిచ్చారాయన. “అన్నిటి విషయంలోనూ సమదృష్టితో ఉంటూండే వాడు లాభం వచ్చినప్పుడు పొంగిపోడు; నష్టం వచ్చినప్పుడు కుంగి పోడు. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండానే వస్తాడనీ, పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా పట్టుకుపోడనీ అతనికి తెలిసి ఉంటుంది.”

దాంపత్య జీవితంలోని తొలినాళ్ళలో మా అమ్మా నాన్నగారూ కాశీలో ఉండే లాహిరీ మహాశయులనే మహాగురువులకు శిష్యులయారు. సహజంగా నాన్నగారికుండే తాపస ప్రవృత్తి ఈ సాంగత్యంవల్ల మరింత బలపడింది. అమ్మ ఒకసారి, పెద్దక్క - రమకి ఒక గొప్ప విషయం చెప్పింది: “మీ నాన్నగారూ నేనూ భార్యాభర్తలుగా కలిసేది ఏడాది కొక్కసారి మాత్రమే; పిల్లలకోసమని!”

నాన్నగారు లాహిరీ మహాశయుల్ని మొట్టమొదట కలుసుకున్నది, అవినాశబాబు అనే రైల్వే ఉద్యోగిద్వారా. గోరఖ్‌పూర్‌లో ఉండే రోజుల్లో ఈ అవినాశబాబు అనేకమంది భారతీయ మునుల కథల్ని మనస్సుకు హత్తుకొనేటట్టుగా నా చిట్టి చెవుల్లో నూరిపోస్తూండేవారు. కథ చెబుతూ చిట్టచివరికి తమ గురువుగారి మహత్తుకు తప్పకుండా జోహార్లు అర్పిస్తూండేవారు. “మీ నాన్నగారు ఎటువంటి విచిత్ర పరిస్థితిలో లాహిరీ మహాశయులకు శిష్యులయారో ఎప్పుడైనా విన్నావా?”

అది వేసవి కాలం; మందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాశ బాబూ నేనూ మా ఇంటి ఆవరణలో కూర్చుని ఉన్నాం. అప్పుడీ చిక్కు ప్రశ్న వేశారాయన. ఏం చెబుతారో వినాలన్న ఆశతో, చిరునవ్వు నవ్వుతూ - తెలియదన్నట్టుగా తల తిప్పాను.

నువ్వింకా కొన్నేళ్ళకి పుడతావనగా, నేను కాశీ వెళ్ళి మా గురువుగారి దర్శనం చేసుకురావడానికి ఓ వారం రోజులు సెలవిమ్మని, నా పై ఆఫీసరుగార్ని- అంటే మీ నాన్నగారిని అడిగాను. దానికి నన్ను వేళాకోళం చేశారాయన.

“మతంలో పడి పిచ్చివాడివవుతున్నావా ఏమిటి?” అని అడిగారు. ‘నువ్వు కనక పైకి రాదలుచుకుంటే, ఆఫీసు పనిమీదే దృష్టి పెట్టుకో,’ అంటూ హితవు చెప్పారు.

“ఆ రోజు నేను విచారంగా ఇంటిమొహం పట్టి చెట్ల గుబుర్లున్న దారిలో నడిచిపోతూంటే, పల్లకీలో వస్తూ మీ నాన్న గారు కనిపించారు. బంట్రోతుల్నీ పల్లకీనీ వెనక్కి పంపించేసి ఆయన నాతో నడక సాగించారు. నన్ను ఓదార్చే ఉద్దేశంతో, లౌకికంగా విజయం సాధించడానికి కృషి చేస్తే కలిగే లాభాలేమిటో చెప్పుకొచ్చారు. కానీ నేను దిగులుపడుతూనే ఉన్నాను. ‘లాహిరీ మహాశయా! మిమ్మల్ని చూడందే నేను బతకలేను,’ అంటూ మొరపెడుతూనే ఉంది నా గుండె, అదే పనిగా.

“ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది మా దారి. అక్కడ ఉవ్వెత్తుగా లేచిన కెరటంలా పెరిగిన అడివిగడ్డికి కిరీటం పెట్టి నట్టుగా మెరుస్తున్నాయి సాయంకాలం సూర్యకిరణాలు. అద్భుతమైన ఆ దృశ్య సౌందర్యానికి మేము ముగ్ధులమై నిలబడిపోయాం. ఇంతట్లో, ఆ పొలంలో మాకు కొద్దిగజాల దూరంలోనే మా గురుదేవులు ప్రత్యక్షమయారు.”[3]

“భగవతిబాబూ, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు!” అన్నారాయన. ఆశ్చర్యచకితులమై ఉన్న మా చెవుల్లో ఆయన కంఠస్వరమే మారుమోగింది. ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయారో అంత విచిత్రంగానూ అదృశ్యమయ్యారు. నేను మోకరిల్లి, ‘లాహిరీ మహాశయా! లాహిరీ మహాశయా!’ అంటూ ఆశ్చర్యంలో ఆయన్ని స్మరించాను. మీ నాన్నగారు కొన్ని నిమిషాల సేపటివరకు అక్కడే స్తంభించుకుపోయారు.

“అవినాశ్ బాబూ! సెలవు నీ కివ్వడమే కాదు – నాక్కూడా నేను ఇచ్చుకుంటాను. రేపే బయల్దేరి కాశీ వెళ్దాం. నీ తరఫున చెప్పడంకోసం తమ సంకల్ప శక్తివల్ల ఇక్కడ ప్రత్యక్షం కాగలిగిన మహాగురువులు--లాహిరీ మహాశయుల్ని గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి! మా ఆవిణ్ణి కూడా తీసుకువెళ్ళి, తమ ఆధ్యాత్మిక పంథాను అనుసరించడానికి మాకు దీక్ష ఇమ్మని ఆయన్ని అడుగుతాను. ఆయన దగ్గరికి తీసుకు వెళ్తావా?”

“తప్పకుండా.” నా ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకూ, పరిస్థితులు తొందరగా నా కనుకూలంగా మారినందుకూ ఆనందంలో మునిగి పోయాను.

“మర్నాడు సాయంకాలం మీ అమ్మగారూ, నాన్నగారూ, నేనూ కాశీ వెళ్ళడానికి బండి ఎక్కాం. ఆ మర్నాడు అక్కడికి చేరగానే కొంత దూరం గుర్రబ్బండి మీద వెళ్ళి, తరవాత సన్నసన్నటి సందులగుండా నడిచి, ఏకాంతంగా ఉన్న ఇంటికి చేరుకున్నాం. గురువుగారు కూర్చునే చిన్న గదిలోకి ప్రవేశించి, వారికి ఎదురుగా ప్రణామం చేశాం. ఆయన పద్మాసనం వేసుకొని కూర్చుని ఉన్నారు. గుచ్చిగుచ్చి చూస్తూ, కళ్ళు మిలమిల్లాడించి మీ నాన్నగారిమీద చూపు నిలిపారు. ‘భగవతిబాబూ, మీ కింద పనిచేసే ఉద్యోగివిషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు!’ రెండు రోజుల కిందట గడ్డిబీడులో ప్రత్యక్ష మైనప్పుడు అన్న మాటలే ఇప్పుడు కూడా ఆయన అన్నారు. ఆ తరవాత, ‘అవినాశ్ బాబు నా దగ్గరికి రావడానికి మీరు అనుమతించినందుకూ అతనితోబాటు మీరు, మీ భార్యా కూడా వచ్చినందుకు చాలా సంతోషం,’ అని కూడా అన్నాడు.

“మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం[4] అనే ఆధ్యాత్మిక సాధనను ఉపదేశించి ఆనందపరిచారు. ఆ దర్శనం లభించిన రోజు చిరస్మరణీయమైన రోజు. ఆనాడు మొదలుకొని మీ నాన్నగారూ, నేనూ సహాధ్యాయుల్లా, సన్నిహిత మిత్రుల్లా ఉంటున్నాం. నీ పుట్టుక విషయంలో లాహిరీ మహాశయులు గాఢమైన ఆసక్తి చూపించారు. నీ జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉండాలి; మహాగురువుల ఆశీస్సు ఎప్పటికీ వృథా కాదు.”

నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్ది కాలానికే లాహిరీ మహాశయులు తనువు చాలించారు. ఆయన ఫొటో ఒకటి అందంగా అలంకరించిన చట్రంలో మా ఇంట్లో ఉండేది. ఆఫీసువాళ్ళు చేసే బదిలీల వల్ల మా నాన్నగారు తిరిగిన ఊళ్ళల్లో అల్లా ఆయన ఫొటో మా పూజా మందిరానికి వన్నె తెస్తూండేది. అమ్మా నేను అనేక రోజులు, పొద్దుటా సాయంత్రమూ, తాత్కాలికంగా ఏర్పాటుచేసుకున్న మందిరం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చునేవాళ్ళం; సుగంధం గల చందనంలో ముంచిన పూలతో పూజ చేస్తుండే వాళ్ళం. సాంబ్రాణి, గోపరసం ధూపాలు వేసే వాళ్ళం; లాహిరీ మహాశయుల్లో సంపూర్ణంగా వ్యక్తమయిన దైవత్వాన్ని సమైక్య భక్తి ప్రపత్తులతో మేము ఆరాధించేవాళ్ళం.

ఆయన ఫొటో, నా జీవితం మీద చూపిన ప్రభావం మహత్తరమైనది. నేను పెరుగుతున్న కొద్దీ, ఆ మహాశయుల గూర్చిన భావనకూడా నాతోబాటు పెరుగుతూ వచ్చింది. ధ్యానంలో కూర్చుని ఉండగా, ఆ ఫొటోగ్రాఫులో ఉన్న ఆయన ఆకారం, ఆ చిన్న చట్రంలోంచి బయటికి వచ్చి సజీవ రూపం దాల్చి, నా ఎదట కూర్చున్నట్టుగా కనిపించేది తరచు. తేజోమయమైన దేహంతో ప్రకాశిస్తున్న ఆయన పాదాల్ని తాకడానికి నేను ప్రయత్నించినప్పుడు మళ్ళీ అది బొమ్మలా మారిపోయేది. శైశవం గడిచి బాల్యంలోకి ప్రవేశించేటప్పటికి, లాహిరీ మహాశయుల రూపం నా మనస్సులో, చట్రంలో బిగించిన చిన్న బొమ్మ రూపంలోంచి స్ఫూర్తి మంతమైన సజీవ రూపంలోకి మారిపోయింది. ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడుకాని, సంక్షోభమేర్పడినప్పుడుకాని తరచుగా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి; నాలో ఉపశమనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనించేవాణ్ణి.

ఆయన భౌతికరూపంలో జీవించడం లేదే అని, మొదట్లో బాధపడుతూ ఉండేవాణ్ణి. కాని గోప్యమైన ఆయన సర్వవ్యాపకత్వాన్ని గ్రహించడం మొదలు పెట్టిన తరవాత ఇక బాధపడ్డం మానేశాను. తమను చూడాలని అతిగా ఆదుర్దాపడే శిష్యులకు ఆయన, “రక్తమాంసాలతో నిండిన దేహాన్ని చూడ్డానికి ఎందుకూ రావడం- నేను మీ కూటస్థ (ఆధ్యాత్మిక దృష్టి) శ్రేణిలోనే ఎప్పుడూ ఉండగా ?” అని రాస్తూండే వారట.

నాకు ఎనిమిదేళ్ళ వయస్సప్పుడు, లాహిరీ మహాశయుల ఫొటోగ్రాఫు మూలంగా అద్భుతంగా స్వస్థత చేకూరే భాగ్యం కలిగింది. ఈ అనుభవం నా ప్రేమను మరీ గాఢం చేసింది. బెంగాలులో మా వంశం వారికున్న ఇచ్చాపూర్ ఎస్టేటులో ఉండగా నాకు ఏషియాటిక్ కలరా అనే వ్యాధి వచ్చింది. నా మీద ఆశ వదులుకున్నారు; డాక్టర్లు ఏమీ చెయ్యలేకపోయారు. నా మంచం దగ్గర కూర్చున్న అమ్మ, నాకు తలాపి దిక్కున గోడమీద, పైన ఉన్న లాహిరీ మహాశయుల ఫొటో వేపు చూడమని బెంబేలుపడుతూ సైగ చేసింది.

“మనస్సులో ఆయనకి దండం పెట్టు.” ఆవిడకి తెలుసు, దండం పెట్టాలంటే చేతులు ఎత్తడానికి కూడా నేను ఓపిక లేనివాణ్ణని. “నువ్వు కనక నిజంగా నీ భక్తిని చూపించినట్లయితే, మనస్సులోనే ఆయనకు మొక్కినట్లయితే, నిన్నాయన చల్లగా చూస్తారు” అంది.

ఆయన ఫొటోవేపు తదేకంగా చూశాను. అక్కడ మిరుమిట్లు గొలిపే వెలుగు ఒకటి కనిపించింది. అది నా శరీరాన్నీ గదినీ చుట్టేసింది. వాంతి అయేటట్లనిపించే లక్షణంతో సహా, లొంగుబాటులోకి రాని ఇతర రోగ లక్షణాలన్నీ మటుమాయమయిపోయాయి; నాకు స్వస్థత చేకూరింది. అమ్మకి గురువుగారిపట్ల ఉన్న అపరిమితమైన విశ్వాసానికి నాలో సంతోషం ఉప్పొంగింది; వెంటనే ఆవిడ పాదాలమీదికి వాలి స్పృశించడానికి కావలసినంత బలం వచ్చేసింది. అమ్మ తన తలను ఆ చిన్న పటానికి పదేపదే ఒత్తుకుంది. “సర్వవ్యాపకులైన గురుదేవా, మీ తేజస్సు నా బిడ్డను నయంచేసి నందుకు మీకు నా ధన్యవాదాలు!”

మామూలుగా ప్రాణాంతకం కావలసిన ఆ జబ్బు చటుక్కున నయమై నేను కోలుకోడానికి కారణమైన తేజఃప్రభను ఆవిడ కూడా చూసినట్టు గ్రహించాను.

నాకున్న అమూల్య వస్తుసామగ్రిలో అన్నిటికంటె విలువైనది ఆ పటమే. లాహిరీ మహాశయులు స్వయంగా ఇచ్చిన ఈ ఫొటో, పవిత్రమైన స్పందనల్ని ప్రసరిస్తుంది.

ఈ ఫొటో పుట్టుకకు వెనక అద్భుతమైన కథ ఒకటి ఉంది. దీన్ని మా నాన్నగారి సహశిష్యులైన కాశీకుమార్ రాయ్‌గారు చెప్పగా విన్నాను.

ఫొటోలో పడ్డమంటే మహాశయులకు కిట్టేది కాదు. ఒకసారి, ఆయన వద్దంటున్నా వినకుండా, ఆయన్నీ కాళికుమార్ రాయ్‌గారితోబాటు శిష్యబృందాన్ని కలిపి ఫొటో తియ్యడం జరిగింది. అయితే ఆ ఫొటో తాలూకు ప్లేటు చూసిన - తరవాత, ఫొటోగ్రాఫరు ఆశ్చర్యపోయాడు. శిష్యులందరి బొమ్మలు స్పష్టంగా వచ్చాయికాని, లాహిరీ మహాశయుల రూపురేకలు ఉండవలసిన స్థానంలో ఖాళీ తప్ప మరేమీ కనిపించలేదు. ఈ అద్భుతవిషయాన్ని గురించి విరివిగా చెప్పుకొన్నారు.

గంగాధర బాబనే విద్యార్థి ఒకడు మంచి నైపుణ్యంగల ఫొటోగ్రాఫరు. ఫోటో తియ్యబోతే మాయమైపోయే మహాశయుల రూపం తన కెమేరాను తప్పించుకుపోజాలదని దంభాలు పలికాడు. మర్నాడు పొద్దున అతను తన కెమెరా తీసుకువచ్చాడు. గురుదేవులు పద్మాసనం వేసుకొని ఒక కొయ్యబల్ల మీద కూర్చుని ఉన్నారు. ఆయన వెనకాల ఒక తెర వేలాడుతోంది. అప్పుడా అబ్బాయి, తను తలపెట్టిన పని నెరవేరడానికి అన్ని జాగ్రత్తలూ తీసుకుని, ఆబగా పన్నెండు ఫొటోలు తీశాడు. అయినా తరవాత చూస్తే ప్రతి ప్లేటు మీదా కనిపించిందేమిటి? కొయ్యబల్లా, వెనకాల తెరానూ. అంటే మహాశయుల ఆకారం మాత్రం అయిపు లేదు.

ఆ అబ్బాయికి కళ్ళవెంట నీళ్ళు వచ్చేశాయి; గర్వం పటాపంచలైంది. గంగాధరబాబు మళ్ళీ గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. ఎన్నో గంటలు గడిస్తేనే కాని మహాశయులు మౌనం విడవలేదు. తరవాత భావగర్భితంగా వ్యాఖ్య చేశారు:

“నేను ఆత్మస్వరూపుణ్ణి. సర్వవ్యాప్తమైన అగోచరశక్తిని నీ కెమేరా ఫొటో తియ్యగలదా?”

“తియ్యలేదని తెలుసుకున్నానండి. కాని స్వామీ, మీ శరీరాలయం ఫొటో ఒకటి కావాలని భక్తితో కోరుతున్నాను. ఇంతవరకు నా దృష్టి సంకుచితంగా ఉంటూ వచ్చింది. ఆత్మశక్తి మీలో సంపూర్ణంగా ఉంటుందన్న సంగతి ఈ నాటివరకు గ్రహించలేకపోయాను.

“అయితే రేప్పొద్దున్నే రా; ఫొటో తీసుకుందువుగాని,” అన్నారు మహాశయులు.

ఫొటోగ్రాఫరు మళ్ళీ ఫోకస్ చేశాడు. కంటికి కనిపించకపోవడం మనే చిత్రమైన ముసుగులో మరుగుపడకుండానే ఈసారి ఆయన పవిత్ర రూపం స్పష్టంగా ఫొటోలో పడింది.

ఆ ఫొటోగ్రాఫే ఈ పుస్తకంలో అచ్చువెయ్యడం జరిగింది. విశ్వజనీనమైన రూపంలో ఉండే లాహిరీ మహాశయుల సుందరమైన ఆకృతి చూస్తే ఆయన ఏ జాతివారో వెంటనే తెలియదు. దైవసంసర్గంవల్ల కలిగిన ఆనందం నిగూఢమైన ఆయన చిరునవ్వులో కొద్దిగా వ్యక్తమవుతోంది. అరవిచ్చిన ఆయన కన్నులు, బయటి ప్రపంచంపట్ల ఆయనకు నామ మాత్రమైన ఆసక్తి మాత్రమే ఉన్నట్టుగా తెలుపుతున్నాయి. అవి సగం మూసుకొని ఉడడంలో, ఆంతరికమైన ఆనందంలో మునిగి ఉండటాన్ని సూచిస్తాయి. జిజ్ఞాసువులు చాలామంది ఆయన ఔదార్యాన్ని ఆశించి వచ్చే వారు; లౌకికమైన క్షుద్ర ప్రలోభాలకు లొంగని ఆయనకు, వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు సంపూర్తిగా అన్ని సమయాల్లోనూ తెలిసే ఉండేవి.

గురుదేవుల పటానికున్న మహిమద్వారా స్వస్థత చేకూరిన కొన్నాళ్ళకు నాకు స్ఫూర్తిమంతమైన ఆధ్యాత్మిక దర్శనం ఒకటి కలిగింది. ఒకనాడు ఉదయం నేను పక్కమీద కూర్చుని స్వాప్నిక చింతనలో మునిగిపోయాను.

“కళ్ళు మూసుకొని ఉన్నప్పుడుండే చీకటికి వెనకాల ఉన్నది ఏమిటి?” అంటూ లోతులు తరిచే ఈ ఆలోచన నా మనస్సులో చొరబడింది. తక్షణమే నా అంతర్దృష్టిలో బ్రహ్మాండమైన మెరుపులాంటి వెలుగు ఒకటి కనిపించింది. కొండ గుహల్లో ధ్యానముద్రలో కూర్చుని ఉన్న మునుల దివ్యదేహాలు, నా నుదుటికి లోతట్టునున్న పెద్ద వెలుతురు తెరమీద చిన్న సైజు సినిమా బొమ్మల్లా రూపుగట్టాయి.

“ఎవరు మీరు?” అంటూ బిగ్గరగా అడిగాను.

“హిమాలయ యోగులం,” అన్నారు ఆ దివ్యపురుషులు. వారి సమాధాన్ని వర్ణించడం కష్టం. నా గుండె ఝల్లుమన్నది.

“హిమాలయాలకి వెళ్ళాలనీ, నేను మీ లాగే కావాలని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను!” ఆ దృశ్యం అదృశ్యమైంది. కాని తళతళలాడే ఆ కిరణాలు వలయాలు వలయాలుగా అనంతంగా పెరిగిపోతున్నాయి.

“అద్భుతమైన ఈ వెలుతురు ఏమిటి?” “నేను ఈశ్వరుణ్ణి.[5] నేను వెలుతురును.” మేఘాల ఉరుముల్లా వినిపించింది స్వరం.

“నీలో కలిసిపోవాలనుంది నాకు!”

మెల్లగా కరిగిపోతున్న పరమానంద పారవశ్యంలో, భగవంతుణ్ణి అన్వేషించాలనే ప్రేరణ శాశ్వత వారసత్వంగా లభించింది నాకు. “ఆయన శాశ్వతుడు; నిత్యనూతన ఆనందరూపుడు!” ఈ పారవశ్యం కలిగిననాటి తరవాత కూడా చాలా కాలంవరకు, దీని తాలూకు స్మృతి నాలో నిలిచి పోయింది.

చిన్నప్పటి జ్ఞాపకం మరొకటి కూడా చెప్పవలసి ఉంది; అక్షరాలా అది చెప్పుకోవలసిందే. ఎందుచేతనంటే, దాని తాలూకు మచ్చ ఈ నాటికీ నా ఒంటిమీద ఉంది. ఒకరోజు పొద్దున, నేనూ మా అక్క ఉమా, మా గోరఖ్‌పూర్ కాంపౌండ్‌లో ఒక వేపచెట్టుకింద కూర్చుని ఉన్నాం. మాకు దగ్గరలో కొన్ని చిలకలు వేపపళ్ళు తింటున్నాయి. నేను వాటినే తేరిపారి చూస్తున్నాను. మధ్యమధ్య వాటి మీదినుంచి చూపు మళ్ళించగలిగినప్పుడల్లా నేను బెంగాలీ వాచక పుస్తకం చదవడానికి అక్క నాకు సాయం చేస్తోంది,

కాలిమీద కురుపువేసిందని చెప్పి ఉమ, ఆయింట్‌మెంటు సీసా ఒకటి తెచ్చింది. అందులో మందు కొంచెం తీసి నా చేతిమీద పూసుకున్నాను.

“బాగున్న చేతికి మందు పుయ్యడమెందుకు?”

“రేపు నాకో కురుపు వేస్తుందని అనిపిస్తోందక్కా! కురుపు వెయ్యబోయే చోట నీ మందు పూసి చూస్తున్నాను.”

“ఓరి అబద్ధాలకోరూ!”

“అక్కా, నన్ను అబద్ధాలకోరనకు; రేప్పొద్దున ఏం జరుగుతుందో చూసి అను.” నాకు ఉడుకుబోత్తనం వచ్చింది.

ఉమకి నా మాటమీద నమ్మకం కలగలేదు; అదే మాట మూడుమాట్లు ఎత్తి పొడిచింది, నేను మెల్లిగా జవాబు చెబుతూంటే నా గొంతులో దృఢమైన ప్రతిజ్ఞ ఒకటి ధ్వనించింది.

“నాకున్న సంకల్ప శక్తివల్ల, రేప్పొద్దున్నకి నా చేతిమీద సరిగ్గా ఇదుగో, ఇక్కడ, బాగా పెద్దకురుపు ఒకటి వెయ్యాలి; నీ కురుపు ఇప్పుడున్న దానికి రెట్టింపు అవాలిగాక!”

తెల్లవారేసరికి, నేను చెప్పినచోట నా చేతిమీద పెద్ద కురుపు ఒకటి కనిపించింది; ఉమ కురుపు రెట్టింపయింది. దాంతో అక్క కెవ్వున అరిచి అమ్మదగ్గరికి పరుగెత్తింది. - “ముకుందుడు మంత్రగాడయ్యాడమ్మా!” మాటలకున్న శక్తిని, అపకారం చెయ్యడానికి ఎన్నడూ ఉపయోగించ వద్దని అమ్మ నన్ను గంభీరంగా హెచ్చరించింది. ఆవిడ సలహాని ఎప్పటికీ గుర్తు పెట్టుకొని అనుసరించాను.

ఆపరేషన్‌చేసి నా కురుపు నయంచేశారు. డాక్టరు, కోతపెట్టినచోట అయిన మచ్చ ఈ నాటికీ ఉంది. మనిషి పలికే ఒట్టిమాటకు కూడా ఎంత శక్తి ఉంటుందో అనుక్షణం గుర్తుచేసే మచ్చ నా కుడిచేతిమీద ఉంది. ఉమతో నేన్నవి మామూలు మాటలే; నిరపాయమైనవేనని తెలుస్తూనే ఉంది. కాని గాఢమైన ఏకాగ్రతతో అన్న ఆ మాటలకు, బాంబుల్లా పేలడానికి, అవి ఎంత హానికరమయినప్పటికీ, కచ్చితమైన ఫలితాలు కలిగించడానికి చాలినంత నిగూఢమైన శక్తి ఉంది. ఒకరి జీవితంలో కష్టాలు తొలగించడానికి, తద్ద్వారా మచ్చపడకుండానూ తిట్లు రాకుండానూ శస్త్రచికిత్స చేయడానికి వాక్కులో ఉన్న విస్పోటక స్పందన శక్తిని తెలివిగా ఉపయోగించవచ్చునని తరవాత నాకు అర్థమయింది.[6]

మా కుటుంబం పంజాబులో ఉన్న లాహోరుకు మారింది. అక్కడ కాళికాదేవి[7] రూపంలో ఉన్న అమ్మవారి బొమ్మ ఒకటి సంపాదించాను. ఆ బొమ్మ, మా ఇంట్లో బాల్కనీలో నిరాడంబరంగా ఉన్న చిన్న మందిరాన్ని పావనం చేసింది. ఆ పవిత్ర స్థలంలో నేను చేసే ప్రార్థనల్లో ఏదైనా సరే ఫలిస్తుందన్న దృఢమైన విశ్వాసం ఒకటి నాలో కలిగింది. ఒకరోజున నేను, ఉమతోబాటు అక్కడ నించుని, ఇద్దరబ్బాయిలు ఎగరేస్తున్న గాలిపడగల్ని గనునిస్తూ ఉన్నాను. వాళ్ళిద్దరూ చెరొక ఇంటి కప్పుమీదా ఉన్నారు. ఆ ఇద్దరి ఇళ్ళకీ మధ్యలో చాలా చిన్న సందులో ఉంది మా ఇల్లు.

“అంత నిశ్శబ్దంగా ఉన్నావేం?” అంటూ ఉమ, సరదాగా నన్ను తోసింది.

“ఏం లేదు− నేను ఏం కోరితే అది అమ్మవారు ఇవ్వడం ఎంత అద్భుతంగా ఉందో అని ఆలోచిస్తున్నాను.”

“అమ్మవారు నీ కీ రెండు గాలిపడగలూ ఇస్తుందనుకుంటాను!” అంటూ వేళాకోళంగా నవ్వింది అక్క.

“ఎందుకివ్వదు?” వాటిని సంపాదించడానికి మౌన ప్రార్థనలు ప్రారంభించాను.

భారతదేశంలో గాలిపడగలు ఎగరేయడంలో పోటీలు జరుగుతుంటాయి. వాటి దారాలకి బంక, గాజుపొడి పూసి ఉంటాయి. ప్రతి ఆటగాడూ, తన పోటీదారు పట్టుకున్న దారాన్ని కోసెయ్యడానికి ప్రయత్నిస్తాడు. తెగిన గాలిపడగ ఇళ్ళ, కప్పులమీద తేలిపోతూ ఉంటుంది; దాన్ని పట్టుకోవడంలో బలే సరదా ఉంది. నేనూ ఉమా ఉన్నది. పై కప్పున్న గూడుమాదిరి బాల్కనీ కావడంవల్ల , తెగిన గాలిపడగ మా చేతుల్లోకి రావడం అసంభవంగానే కనిపించింది; దాని దారం ఇంటికప్పు మీద వేలాడుతూ ఉంటుంది.

మా సందుకు ఈ వైపూ ఆ వైపూ ఉన్న ఆటగాళ్ళు పోటీ మొదలు పెట్టారు. ఒక దారం తెగింది; దానికున్న గాలిపడగ, తేలుతూ నా వేపు వచ్చింది. ఇంతలో హఠాత్తుగా గాలి తగ్గిపోవడంవల్ల, ఆ గాలిపడగ ఒక్క క్షణం అలా నిలిచిపోయింది. ఆ సమయంలో దాని దారం, ఎదురింటి కప్పుమీద ఉన్న నాగజెముడు మొక్కకు తగులుకుంది. దాంతో, నేను పట్టుకోడానికి వీలుగా, పొడుగ్గా చక్కటి వంపు తిరిగింది. నాకు చేజిక్కిన బహుమతిని ఉమకి ఇచ్చేశాను.

“ఇదేదో అదృష్టవశాత్తు అసాధారణంగా జరిగిందేకాని నీ ప్రార్థనకు ఫలితం మాత్రం కాదు. ఆ రెండో గాలిపడగ కూడా నీ దగ్గిరికివస్తే, అప్పుడు నమ్ముతాను; నీ మాట!” అంటూంటే, అక్క మాటల్లో కంటె ఆమె నల్లటి కళ్ళలోనే ఎక్కువ ఆశ్చర్యం కనబడింది. నా ప్రార్థన గాఢంగా కొనసాగించాను. బలవంతంగా గుంజులాడుకోడంలో రెండో ఆటగాడి గాలిపడగ కూడా చటుక్కున తెగిపోయింది. గాలిలో నాట్యం చేస్తూ నా వేపు రావడం ప్రారంభించింది. మొదట నాకు సాయంచేసిన నాగజెముడు మొక్కే, ఈ గాలిపడగ దారాన్ని కూడా నేను పట్టుకోడానికి వీలుగా వంపు తిరిగేటట్టు చేసింది. నా రెండో బహుమతిని కూడా ఉమకి ఇచ్చేశాను.

"నిజమేరోయ్! అమ్మవారు నీ మాట వింటుంది! ఇదంతా నాకు మాయలా కనిపిస్తోంది!” అంటూ బెదిరిపోయిన లేడిలా రయ్యిన పరిగెత్తేసింది అక్క.

  1. భగవద్‌ధ్యానానికి సంబంధించిన యోగం- అంటే "కలయిక" - అనే ప్రాచీన భారతీయశాస్త్రాన్ని సాధనచేసేవాడు (చూడండి అధ్యాయం 26 : 'క్రియా యోగశాస్త్రం'.
  2. 1915లో నేను సనాతమైన ఆశ్రమ వ్యవస్థానుసారంగా సన్యాసం తీసుకున్నప్పుడు నా పేరు యోగానందగా మారింది. 1935 లో మా గురుదేవులు పరమహంస అన్న సాంప్రదాయిక బిరుదు ప్రసాదించారు (చూడండి అధ్యాయాలు 24, 42).
  3. మహామహులకుండే అద్భుత శక్తుల్ని గురించి అధ్యాయం 30 ‘అలౌకిక ఘటనల నియమం’ అన్నదాంట్లో వివరించడం జరిగింది.
  4. లాహిరీ మహాశయులు బోధించిన యోగ విధానం. దీంతో, ఇంద్రియాలు రేపే కల్లోలం శాంతించి; ఈ విశ్వచైతన్యమే తాను అన్న గుర్తింపు ఎప్పటికీ పెరుగుతూ ఉండే విధంగా మానవుడు సాధన చెయ్యడానికి అవకాశ మేర్పడుతుంది. (చూడండి అధ్యాయం 26).
  5. విశ్వపాలకరూపంలో భగవంతుడికి ఉన్న సంస్కృత నామం; ఇది ఈశ్ అన్న ధాతువునుంచి వచ్చింది - పాలించడం అని దీనికి అర్థం. హిందువుల పవిత్ర గ్రంథాల్లో భగవంతుడికి వెయ్యి పేర్లుంటాయి. వాటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క దార్శనిక అర్ధచ్ఛాయసు సూచిస్తుంది. ఎవరి సంకల్పంవల్ల లోకాలన్నీ వ్యవస్థిత చక్రక్రమాల్లో సృష్టి అవుతూ వినాశం చెందుతూ ఉంటాయో అతడే ఈశ్వరనాముడైన భగవంతుడు.
  6. ధ్వనికున్న అనంతమైన శక్తులు ఓం అనే సృజనాత్మక శబ్దంలోంచే ఉద్భవిస్తాయి. అణుశక్తులకన్నిటికీ వెనక ఉన్న విశ్వస్పందన శక్తి ఈ ఓంకారమే. స్పష్టమైన అవగాహనతోనూ గాఢమైన ఏకాగ్రతలోనూ పలికే ఏ మాటకైనా ఫలించే శక్తి ఉంటుంది. ఉత్తేజకరమైన మాటల్ని గట్టిగాగాని మౌనంగాగాని పునశ్చరణ చేసినట్లయితే అవి ఫలిస్తాయని మనోవైజ్ఞానిక చికిత్సకు సంబంధించిన అనేక వైద్య విధానాల్లో గమనించారు; దీని రహస్యం, మనస్సుకున్న స్పందనాల రేటును పెంచడంలో ఉంది.
  7. శాశ్వతురాలైన ప్రకృతిమాత రూపంలో ఉండే భగవంతుడి సంకేతమే కాళి.