Jump to content

ఎందుండి వెడలితివో? ఏవూరో నే తెలియ ఇపుడైన దెలుపవయ్య

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః


ఎందుండి వెడలితివో? ఏవూరో నే తెలియ ఇపుడైన దెలుపవయ్య 
రాగం: దర్బారు
తాళం: త్రిపుట

పల్లవి:
ఎందుండి వెడలితివో? ఏవూరో నే తెలియ
ఇపుడైన దెలుపవయ్య ॥ఎందుండి॥

అను పల్లవి:
అంద చందము వేరై నడత లెల్ల త్రిగు
ణాతీతమై యున్నదుగాని శ్రీరామ ॥ఎందుండి॥

చరణము(లు)
చిటుకంటె నపరాధ చయములఁ దగిలించే శివలోకముగాదు
వటరూపుఁడై బలిని వంచించి మణచువాని వైకుంఠముగాదు
విట వచనము లాడి శిరము ద్రుంపబడ్డ విధిలోకముగాదు
ధిటవు ధర్మము సత్యము మృదు భాషలు గలుగు
దివ్యరూప త్యాగరాజ వినుత నీ ॥వెందుండి॥