Jump to content

ఉపన్యాస పయోనిధి/హిందూమతము ఒంటెద్దుతనమును గలిగించునదియా

వికీసోర్స్ నుండి

"కువాద" మనియు "వృధావాగ్వాదమ"నియు నేమేమో పంతులవారు తిట్టిపోయుదురుకాని యిప్పుడా మార్గమును దామేయవలంబించిరి. శ్రీ న్యాపతి సుబ్బారావుపంతుల వారు మనమతమునకు "హిందూ" సంజ్ఞయే యుత్తమమైన సంజ్ఞయని చెప్పియుండలేదు. దేనినిప్పుడందఱును హిందూమతమనుచున్నారో దానింగూర్చి ముచ్చటించిరి. కాన నిట "హిందూ" సంజ్ఞంగూర్చి చర్చతోనేమిప్రయోజనమున్నది.

హిందూమతము ఒంటెత్తుతనమును గలిగించునదియా?

శ్రీపండితశివనాధశాస్త్రిగారు మొన్న నీనడుమచెప్పినరీతిగా మనబ్రాహ్మసామాజిక సోదరులు మనహిందూమతధర్మములు మున్నగువానిని బాగుగా దెలిసికొనక పశ్చిమదేశమతాదులధర్మములను బాగుగా నేర్చుకొనుట వాడుకయైయున్నది. ఈరీతిగాహిందూమతమన నెట్టిదో యెఱుంగని బ్రాహ్మసామాజికభ్రాతలు దానినిగూర్చి విపరీతభాషణములు చేయుచుండుటకలదుకాని యదియొక వింతకాదు. విజ్ఞులైనపండిత శివ నాధశాస్త్రిగారు కూడ తమమాతృమతమైన హిందూమతమును గూర్చి వింతమాటలాడుటఁ గనఁజాలవింతయేపుట్టుచున్నది. మాకాకినాడపురమున నీనడుమజరిగిన యాంధ్రదేశీయాస్తికసభలో ముచ్చటించుచు శ్రీశాస్త్రిగారు తమముఖోపన్యాసములో హిందూమతముంగూర్చి యిట్లు సెలవిచ్చిరి; —

"It has made the higher religion of India essentially anti-social."

(అది (వైరాగ్యము) యున్నత హిందూమతమును సాంఘికధర్మవిరుద్ధము చేసినది.) అని.

ఇది అసత్యము నసంగతమునునై యున్నది. హిందూమత ధర్మములనుగాని హిందువుల పూర్వచారిత్రములనుగానిబాగుగా నెఱింగిన వారెవ్వరును నిట్లునుడువసాహసింపరు. తెలిసియుఁదెలియని ప్రతిభగలబ్రాహ్మ సామాజికులుమాత్ర మిట్లు చెప్పుచుండుట వాడుకయై యున్నది. ఈయాక్షేపమునకు సమాధానమును విద్వద్వరులగు లాలాలజపతిరాయిగారు ఇదివఱకే యిచ్చియున్నారు. ఈసూరిపుంగవుల వ్యాసముహిందూమతసామాజిక లక్షణము (The social genius of Hinduism) అను శీర్షికక్రింద కాయస్త సమాచారనామక పత్త్రికారాజములో (సంపుటము 10 సంచిక 4) విరాజుల్లుచున్నది. అందుహిందువుల సాంఘికధర్మములను గూర్పిలెస్సగా ముచ్చటింపఁబడియున్నది. అయ్యది 24పుటల పెద్దగ్రం థమై యున్నది. దానినుండి గ్రంథవిస్తరభీతిచే కొన్ని వాక్యములను మాత్ర మిచటనిచ్చుచున్నాను.

శ్రీలాలాగారు తమవ్యాసమును నీక్రిందిరీతిని ప్రారంభించిరి; -

"An idea seems to be gaining ground amongst Hindus educated on Western lines that the genius of Hinduism essentially individualistic and anti-social & that therefore no substantial reform in social life can come out of a revival of the past, and that we can only draw on the west and take light therfrom. They do not place much faith in reform on national lines and would rather go in for wholesale or bodily adoption of most at least, if not all of the social institutions of the West."

(పశ్చిమమార్గాను సారముగా విద్యాభ్యాసము గావించుకొనిన హిందువులలో హిందూమతము ఒంటెత్తుతనమును సాంఘికధర్మవిరోధమును గలిగించు శీలముకలదై యున్నదనియు నందుమూలముచేఁ దన్మతోద్థరణమువలన నేఘనసంస్కారమును సాగ నేరధనియుఁ గాఁబట్టి మనము పశ్చిమము ననుకరించి దానినుండి జ్ఞానజ్యోతిని బడయవలయుననియుఁ దలంపులు కలుగుచున్నట్లు కాన్పించుచున్నది. ఇట్టివారికి జాతిధర్మానుసారమైన సంస్కారమునందు నమ్మకములేదు. కాన పూర్తిగాఁ బాశ్చాత్యుల సాంఘికధర్మముల నవలంబింప వీరు ప్రయత్నము చేయుచున్నారు.) "They would rather build a new social edifice on nationality as distinguished from nationality."

(వీరు జాతిధర్మవిలక్షణమగు యుక్తిధర్మముపై నొకనూత్న సాంఘిక భవనమును గట్టప్రయత్నమును చేయుచున్నారు)

సాంఘికధర్మమూలముంగూర్చి రెండు భిన్నాభిప్రాయములు పాశ్చాత్యులలోఁగలవు (1) స్పెన్సరు మున్నగు పశ్చిమదేశజ్ఞానులు బోధించిన సాంఘికధర్మ మొకటి. ఇది ప్రస్తుతమున్న సంఘముయొక్క యుపయోగమును గూర్చియే ముచ్చటించును. డార్వినుబోధించినపరిణామమతము వేఱొకటి దీనినిబట్టి యిప్పుడున్న సంఘమేకాక యిఁక రాఁబోవువారియొక్క యుపయోగమును గూర్చి యాలోచింప వలసి యుండును. ఈమతమును బొగడుచు మిస్టరు బెంజమెను కిడ్డుదొరవారు (Mr. Banjamin Kind) స్పెన్సరు మతమును నిరసించియున్నారు. దీనినిబట్టి యిప్పుడున్న ప్రజలసంఖ్యనే లెక్కలోనికిఁ దీసికొనక రాఁబోవు ప్రజలసంఖ్యను గూడ లెక్కలోనికిఁ దీసికొని విధులు నేర్పాటు చేసికొనవలెను. అనఁగా మానవజాతినంతను లెక్కలోనికిఁ దీసికొనవలెనను మాట దీనిని మూలముగాఁ బెట్టుకొని లాలాగారు తమవ్యాసమును వ్రాసిరి. ఇంతియేగాక వీరు పశ్చిమదేశసంఘములను గూర్చి యిట్లు వ్రాయించిరి:— "The first is that there must surely be something wrong in a social system from which has developed the modern civilization of Europe, which has evoked strong and sweeping condemnation from so eminent a scholar and Scientist as Professor Huxlay."

(ప్రస్తుతము పాశ్చాత్యుల నాగరికతకు మూలమైన పాశ్చాత్యుల సాంఘికధర్మములోఁ దప్పక లోప మొకటుండి తీరవవలెను. కావుననే విద్యాన్‌హాక్సులే యంతటివాఁడు కూడ నీ నాగరికతను నిందించి యున్నాఁడు. పండితుఁడగు 'హక్సులె' చెప్పినవాక్యములివి: —)

"Even the best of modern civilizations appears to me exhibit a condition of mankind which neither embodies any further ideal nor even possesses the merit of stability. I do not hesitate to express the opinion that, if there is no hope of a large improvement of the condition of the greater part of the human family † † †, I should hail the advent of some kindly comet which would sweep the whole affair away as a desirable consummation."

(ఇప్పటినాగరికతలలో మిక్కిలి ప్రసిద్ధినందినదికూడ సుస్థిరత లేనిదియును నున్నతమైన పరమావధిలేనిదియునై యున్నది. మానవకుటుంబములోఁ జాలభాగ మభివృద్ధి కానియెడల ఓకతోఁకచుక్క వచ్చిదీనినంతను సిద్ధిపొందింపఁ గోరెదను.) దీనినిబట్టి పాశ్చాత్యుల ఘనధర్మములు నింధ్యములై జాత్యభిమానపురస్కృతములై యున్నవని స్పష్టపడుచున్నదని లాలాగారు తెల్పిరి. పశ్చిమదేశసంఘములు తమలాభమును గోరియే యితరుల కెవ్వరికైన నుపకారము చేయుదురుగాని కేవల పరార్థ పరత్వముతో నెన్నఁడును జేయరు. తమసంఘము బాగుపడుటయే వీరిముఖ్యోద్దేశము. మానవుకుటుంబమునకు (human family) లాభకరము గాక యొక తెగవారికి మాత్రమే లాభకర మగు నుద్యమము చచ్చుటయే మంచిదని హక్సెలెదొరవారు వ్రాయుటకుఁ గారణము పాశ్చాత్యుల కుమార్గములేయనవచ్చు. ఇట్టితంత్రములను ఇట్టిసాంఘికధర్మములను బాశ్చాత్యులనుండి గ్రహించుటకే మన సంఘ సంస్కార ప్రియులు ప్రయత్నము చేయుచున్నారు.

హిందువుల సాంఘికధర్మమిట్టిదికాదు. ప్రస్తుత కాలమున వీరు పాలితజాతి (subject race) గానుండి యుండుటచే సామాన్యబుద్ధులకు వీరిధర్మములు విశాలములుగాఁగాన్సింపక పోయినను బాగుగా విమర్శించి చూచుకొనువారికి హిందూధర్మములందలి ఘనత బోధవడక పోదు. హిందువుల సాంఘిక ధర్మములకు మూలమొకదేశమును నొక జాతియునుగాదు. ఒకసంఘముయొక్క యభివృద్ధియు నొక దేశముయొక్క లాభమును వీరుకోరియుండలేదు. వీరుకోరినది ఆత్మయొక్క యభివృద్ధి. వీరభిలషించినది ఆత్మయొక్కలాభ ము నాత్మయొక్క ఘనతయునై యున్నవి. లోకములో నాత్మయంతటను వ్యాపించియున్నది. హిందువులందున్న యాత్మయును, మహమ్మదీయు లందున్న, యాత్మయుఁ గ్రైస్తవులందున్న యాత్మయునొక్కటియే. జీవకోటియొక్క యనుబంధమునకుఁ గారణ మాత్మయే. కావుననే హిందువుల ధర్మమిట్లుచెప్పుచున్నది.


"శ్లో॥ త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్ధేకులంత్యజేత్ ।
     గ్రామంజనపదస్యార్ధే ఆత్మార్థేవృథివీంత్యజేత్ ॥"


"Sacrifice a member for the sake of the family, a family for the sake of a village, a village for the sake of a district, and even the earth for the welfare of the soul."


(కులముయొక్క బాగునకడ్డువచ్చువాఁడొకఁడుండునెడలవానిని కులార్ధమై విడువవలసినది. అట్లేగ్రామమునకొక కులమడ్డువచ్చునెడల దానినిగామార్ధమై త్యజింపవలసినది ఆరీతినేయొకమండలమునకు నొకగ్రామము భంగకరమైనచో నాగ్రామమును ద్రోసివేయవలసినది. ఆతీరుననే యాత్మాభివృద్ధికి భంగమువచ్చునెడల భూమినంతనైనను విడచివేయ వలసినది.) అనియు దీనితాత్పర్యము. ఆత్మ జ్ఞానమును బ్రధానముగాఁ జేసికొని తమధర్మముల నిర్మించుకొనిరి. కావుననే హిందువులు తొల్లితాముమిక్కిలి యున్నత స్థితియందున్న కాలములోఁ గూడ లోకమంతటను వ్యాపించి తాము వ్యాపించిన తావులనెల్ల పీల్చి పిప్పిచేయలేదు. మఱియును మనుజుఁడు ఋణములతోఁ బుట్టుననియు వాఁడువానిని దీర్చికొనవలసినదనియు శతపథబ్రాహ్మణము తెలుపుచున్నది. అదియేదియన -

“I. Verily, whoever exists he in being born is born as (owing) a debt to the gods to the Rishis to the fathers, and to men."

(మనుజుఁడు నాలుగు ఋణములతోఁ బుట్టుచున్నాఁడు. (1) దేవఋణము (2) ఋషిఋణము (3) పితృఋణము (4) మనుష్యఋణము.)

మఱియును యజ్ఞయాగాదులవలన (దేవపూజ) దేవఋణమును ఆధ్యాత్మ విద్యాస్వీకారము వలన ఋషిఋణమును సంతానమువలన పితృఋణమును దానథర్మముల వలన మనుజఋణమును ప్రతినరుఁడు తీర్చికొనుచున్నాఁడు. అనిశతపథబ్రాహ్మణము నొక్కి చెప్పుచున్నది.

సంఘాభివృద్ధి కింతకంటె నెక్కుడు ధర్మమేదికావలెనో తెలియవచ్చుటలేదు. ఈవేదమంత్రము ప్రతినరుని సంసారము స్వీకరించి సంతానమును బడయవలసినదని నొక్కి చెప్పుచున్నది. దీనిననుసరించియే యొకఁడు వివాహము చేసి కొకన తిరుగుచుండఁగా వానిపితరులు ఆధోగతి పాలగుచున్నట్లు కాన్పించినదనియు దాన నాతఁడు వివాహముచేసికొనె ననియు భారతము చెప్పుచున్నది. ఇఁక హిందూ ధర్మములనసాంసాంరికము (anti-social) లనుట తప్పుకాదా? ఈ బ్రాహ్మణమువలన ప్రతిమానవుఁడును దానధర్మములను జేసితీరవలెనని తేలుచున్నది. ఇట్టిధర్మములను బోధించు మతము నసాంఘికమనుట మహాసాహసముకాదా ? ఈ బ్రాహ్మణమువలన ప్రతినరుఁడును విద్యాబుద్ధులు సంపాదింపక తప్పదని తెలియవచ్చుచున్నది. ఇట్టిబోధగలమతము నన్యధాభావించుట వింతకాదా.

స్మృతులు పంచఋణములను దెలుపుచున్నవి. అయిదవఋణము జంతువులు వృక్షములు మొదలగు వానిని గూర్చినదై యున్నది. ఇట్టి హిందూమతమును మనశివనాథశాస్త్రిగా రసాంఘిక మన సాహసించిరి.

ఇంకను ప్రతిమానవునకును బంచఋణములేగాక పంచ సూనములుకూడఁ గలవని మనుస్మృతి తెలుపుచున్నది.


"శ్లో॥ పంచసూనాగృహస్థస్యఛుల్లీ పేషణ్యువస్కరః ।
    కండనీచోదకుంభశ్చ బధ్యతేయాస్తువాహయన్.


సూనము లనఁగా పధస్థానములు. ఇవి ప్రొయి రోలు చీపురు ఉదకుంభము సన్ని కల్లుననునవియైయున్నవి. వీనిమూలముగా జీవహింస జరుగుచున్నది. కాన పంచ యజ్ఞములు మనుజుఁడు చేయవలెనని మనుస్మృతి విధించుచున్నది.


శ్లో॥ తాసాంక్రమేణ సర్వాసాం నిష్కృత్యర్థం మహషిన్‌భిః।
   పంచక్ల్‌ప్తామహాయజ్ఞాః ప్రత్యహం గృహమేధినామ్॥

"శ్లో॥ అధ్యాపనం బ్రహ్మయజ్ఞః పితృయజ్ఞస్తు తర్పణం।
    హోమోదైవోబలిర్భౌతో నృయజ్ఞోతిథిపూజనమ్॥"

దీనినిబట్టికూడ నృయజ్ఞాదులు గృహస్థులకెల్ల తప్పని విథులని తెలియవచ్చుచున్నది. ఇట్టి మతము సాంఘికమతము కాదా ?

సంసారము చేయుట ప్రతిమనుజునికిని విధి. ప్రతిసంసారికిని సంఘముయొక్క స్థిరతకై సంతానముకనుటవిధి. ప్రతిసంసారికిని నృయజ్ఞమన మానవతృప్తి చేయుటవిథి. ఇది హిందువుల మతధర్మము. ఇంతకంటె సాంఘికమతము వేఱొండు కలదా ?


"శ్లో॥ దేవతాతిధి భృత్యానాం పితృణామాత్మనిశ్చయః।
    ననిర్వవతిపంచానా ముచ్ఛ్వసన్న సజీవతి॥"


అను శ్లోకమువలన నీపంచయజ్ఞములు చేయనివాఁడు బ్రతికియున్నను జచ్చినవాఁడేయని తెలియవచ్చుచున్నది.


ఇది యిటుండఁ దమది సాంఘిక మతమైనందులకు మనబ్రాహ్మసామాజికసోదరులెక్కుడు సౌహార్ద్రము గలిగియున్నారా? లేదు. 12 తెగలుగా విడిపోయి కొట్లాడుచున్నారు. ఎక్కుడు దానధర్మములు కలిగియున్నారా? లేదు. ఇప్పు డిప్పుడు హిందువులను జూచి నేర్చికొందుమని చెప్పుచున్నారు. ఈవిషయమై శ్రీశివనాథశాస్త్రిగారే తమ యీ ముఖోపన్యాసమునందె యిట్లు చెప్పియున్నారు:—


"The Theistic Church too has not as yet fully developed its capacities in that line. All honor to other sister associations like the Arya Samaj, and the Vivekananda Mission, which are already besterring themselves for active philanthropic work. Their orphanages, their asylums for the sick and poor, are standing monuments of the noble impulses that rule them. We theists should not be behind hand in these respects. (The italics are ours)

మన బ్రాహ్మసామాజిక సోదరులు సోదరమత సహనముకలిగియున్నారా? లేదు. సోదరమతములపై వీరికిఁగల యసూయకు మితిలేదు. హిందువగు వివేకానందస్వామి విశ్వప్రఖ్యాతినందుటకై యీతెగవారలందుచున్న దుఃఖమునకు పరిమితిలేదు ఈతెగవారాయన కపఖ్యాతి కలిగింపవలెనని ప్రయత్నముచేసిరి. ఇప్పటికిని చేయుచున్నారు. బ్రాహ్మసామాజికులచేఁ బ్రకటింపఁబడు “న్యూఇండియా” యనుపత్రికయందే ఈదేశస్థులగు దేశాభిమానులు తలపెట్టు దేశోపకార కార్యములయెడ బ్రాహ్మసామాజికులు విముఖులై యున్నారని వాయఁబడియున్నది. ఈతెగయందునుఘనులుకలరనుటకు సందియములేదు. అందఱును నొక్కరీతినే యున్నారని చెప్పసాహసించువారుండఁబోరు. దానికేమి;

హిందువుల సంఘీభావమునుగూర్చి ప్రమాణములనులాలాగారు చాల కనపఱచియున్నారు. వానిలోనుండి మరలగొన్ని యెత్తిచూపుచున్నాను.

-ఋగ్వేదములో-

"2. Assemble, speak together; let your minds be all of one accord. As ancient Gods unanimous sit down to the appointed share. 3. The place is common, common the assembly common the mind; be so their thoughts united. A common purpose do I lay before you and worship with your general oblation.

4. One of the same resolve, and be your minds of one accord.

United be the thoughts of all that all may happily agree." - (10th Mandala-Hymn)

2 (ఏకీభవింపుడు. కలసి సంభాషింపుడు. మనస్సు నేకీభవించునట్లు చేసికొనుడు. ఏకోద్దేశము కలవారై యుండుఁడు దేవతలు తమభాగములనిమితమై ఏకీభవించి యుండెడు నట్లే (3) ఒకటేప్రదేశము (భాష) ఒకటేసంఘము ఒకటేమనస్సు కలిగియుండునట్లు వారియూహలు వెలసియుండెను. మీకందఱకు సమానప్రయోజనము కలిగించియున్నాను. సాధారణోపాయనముతోఁబూజింపుఁడు. (4) ఒకటిగానేకీభవింప నిశ్చయించుకొనుఁడు. మనస్సులో నొకటే ప్రయోజనముకలిగియుండనిండు. ఆనుకూల్యము కలవారందఱు నొకటేతలంపుకలిగియుండుఁడు.)

దీనినిబట్టి సంఘీభావమున కుండవలసిన లక్షణములనన్నిటిని హిందూమతమును బాగుగా బోధించినదని తెలియవచ్చుచున్నదిగదా:

-అధర్వణ వేదములో—

I. "Agree and be united; let your minds be all of one accord. Even as the Gods of ancient days, unanimous, await their share.

2. The rede is common, common the assembly common the law, so be their thoughts united.

I offer up your general oblation; together entertain one common purpose.

3. One and the same be your resolve, be all your hearts in harmony; one and the same be your minds that all may happily consent."- Book VI. 64.

పైదానియర్ధమును దీనియర్ధము నొక్కటియే.

ఇట్టివాక్యముల ననేకములను శ్రీలాలాగారుదాహరించి యుండిరి. గ్రంథవిస్తరభీతిచే వానినన్నిటినిచ్చుటలేదు. తుదిని శ్రీలాలాగారిట్లు వ్రాసిరి:-

“For the actual working of this spirit of unity you may study the Ramayana and the Mahabharata”

(ఈధర్మములన్నియు నాచరణములోఁ బెట్టఁబడిన వనితెలిసికొనుటకై భారతరామాయణములను జదువుకొనుఁడు) ఇవిఅన్నియు జదివినయెడల హిందువు లెంతచక్కని సంఘముగా నుండెడివారో బోధలోనికిరాఁగలదు.

శ్రీశివనాధ శాస్త్రిగారొక గొప్పయుక్తిచేసిరి. అదియేది యన హిందూమతమంతయుఁ సాంఘికధర్మవిరుద్ధముగా నున్నదనకయున్నత హిందూమత మసాంఘికముగా నున్నదని వీరు సెలవిచ్చిరి. "it has made the higher religion of India essentially anti-social” అని శాస్త్రిగారు సెలవిచ్చిరి. ఇది పెద్దకల్ల. వేదాంతము వైరాగ్యమును బోధించుచున్న దన సంఘమునుండి విడిపోవుటను బోధించుచున్న దనిభ్రమ పడిరి. ఉన్నత హిందూమతమిట్టిదని తెలువుటకు కారణము వీరిట్లిచ్చి యున్నారు:-

"To be truly religious we must turn away from society. Who is thy wife, who thy son' cries the Hindu sage and teaches the aspirant for religious life to seek his salvation in asceticism and renunciation of the world."

(నిక్కముగా మతస్థుఁడై యుండుటకు సంఘము నుండి విడిపోవలెను. 'కాతేకాంతా కస్తెపుత్త్రః, అనిహిందూజ్ఞానిఘోషించును. మతరతిగలిగి జీవింపగోరువారిని ప్రపంచమునువిడిచి వైరాగ్యముకలిగి వ్రతించినంగాని మోక్షములేదని చెప్పును.) అనిశివనాధ శాస్త్రిగారు సాహసించి పలికిరి. వీరియందు మనకెంతగౌరవముండినను హిందూమతముంగూర్చి వీరికేమియు తెలియదని యీవాక్యములు బోధించుచున్నవని చెప్పితీరవలసిన వారమగుచున్నాము.

వేదాంతము ప్రపంచమును విడువఁగోరునా?.

ఉన్నత హిందూమతము సాంఘిక ధర్మవిరుద్ధమగు వైరాగ్యమును బోధించుచున్నదనుటగొప్పతప్పు. జ్ఞానులలోఁ బ్రధమగణ్యులైన జనకాదులు సంసారులు కారా ? జ్ఞానవాసిష్ఠాది మహా వేందాంతగ్రంధములు విరచించిన వసిష్ఠాదులు సంసారులు కారా? లోకమునకున్నతవేదాంతమును బోధించిన యవతారమూర్తులగు రామకృష్ఠాదులు సంసారులుకారా? ఉన్నత హిందూమతమును బోధించు భగవద్గీత యెవనిధర్మమును వాఁడుచేయవలయునని చెప్పుటలేదా? శత్రుసంహారము కావించి జగము నేలవలసినదని బోధించుచున్నది. కాని దిగంబరులై యడవులపాలై పోవలసిందని బోధించుటలేదుకద మఱియును బ్రతిమనుజునికిని హిందూమతము నాలుగు ఆశ్రమముల విధించుచున్నది. అందు గృహస్థాశ్రమ మొక్కటియైయున్నది కదా శ్లో॥ శైశవేభ్యస్తవిద్యానాం ! యౌవనేవిషయైషిణాం । వార్ధకేమునివృత్తీ నాం యోగేనాం తేతనుత్యజామ్॥ అనికవికులసార్వభౌముఁడగు కాళిదాసు వర్ణించినట్లుగా ప్రతి హిందువును బాల్యమున విద్యార్ధియు యౌవనమున గృహస్థును వార్థకమున మునియునై యుండవలసియున్నది. "కామిగాకమోక్షకామిగాడు” అని హిందూమతము నొక్కి చెప్పుచున్నది. కామియన యధా న్యాయముగా విషయసుఖముల ననుభవించువాడు. శ్రీమచ్ఛంకర భగవత్పాదులవారు మారుదేహమునుదాల్చి సంసార సుఖమునుగూడ ననుభవించి తీరిరను కథయన్ని ధర్మములయందును, మనుజుఁడు పూర్ణుఁడు గావలెనని హిందూమతము బోధించుచున్నదను నంశమును ఋజువు చేయుచున్నది. ధృవాది దైవసాక్షాత్కారులుకూడ సంసారముచేసియే పరమపదమునందినట్లు శాస్త్రములు మొఱలిడుచున్నవి. హిందూమతము గృహస్థాశ్రమమును నాశ్రమములలో నెల్ల ఘనమయినదిగా వర్ణించుచున్నది అంధ్రకవితాపితామహుని పద్యమునిట నిచ్చుచున్నాను:-


సీ. కెలకులనున్న తంగెటిజున్ను గృహమేధి
          యజమానుడంకస్థితార్ధ పేటి
   పండిన పెరటికల్పకమువాస్తవ్యుండు
          దొడ్డిఁ బెట్టిన వేల్పు గిడ్డికాపు
   కడలేనియమృతంపు నడబావి సంసారి
          సవిధమేరునగంబు భవనభర్త
   మరుదేశపదమధ్యమప్రపకులపతి
          యాఁకటి కొదవు సస్యముకుటుంబి

గీ. బధిరపంగ్వంభిక్షుక బ్రహ్మచారి
   జటిపరివ్రాజకాతిధిక్షపణకావ
   ధూతకాపాలికాద్యనాధులకుఁ గాన
   భూసురోత్తమ గాహన్‌స్థ్యమునకు సరియె"


ఈరీతిగాపురాణములేగాక స్మృత్యాదులు గృహస్థాశ్రమమునే ఘనుమయినదిగా వర్ణించుచున్నవి.

ఇఁక “కాతేకాంతా కస్తేపుత్రః" (నీకుభార్యయెవరు పుత్రులెవరు) అనిబోధించుటకుఁ గారణమేమందురేని అది యాత్మనుగూర్చిన విషయము. ఆత్మకు భార్యాపుత్రాదులు లేరుగదా? ముక్తినందియాత్మలు విరాజిల్లుచుండుననికదా బ్రాహ్మసామాజికులు తలంచుచున్నారు. అట్లుముక్తులైన యాత్మలు పరలోకములో భార్యాపుత్రాది బాంధవ్యము కలిగియుండునా? అట్లుండవనియేకదా వారిసిద్ధాంతము. ఇఁక యాత్మలకు భార్యయెక్కడిది? పుత్రులెక్కడివారు? ఇదినడుమవచ్చిన యుస్థిరసంబంధము. నడుమనేపోవుచున్నది. భార్యాభర్తలకనురాగ మేలయుండవలెను? ఇంద్రియసుఖార్ధమని పామరులతలంపు. ఆత్మార్థమనిజ్ఞానుల తలంపు భార్య భర్తనువలచును. ఎందుచేత ఆత్మసంబంధ మునుబట్టి భర్త భార్యనువలచును. ఎందుచేత? ఆత్మసంబంధ మునుబట్టియని యుపనిషత్తులు మొఱలిడుచున్నవి. కావున నిక్కమైన యాత్మజ్ఞానము కలవారికి వీరునావారు వీరుపరులు ననునల్పబుద్ధి యుండదు. లోకమేవారి కుటుంబముగాన శంకరుఁడు "కాతేకాంతా కస్తేపుత్రః అనిచెప్పినాఁడు. ఇట్లుపలికినశంకరుఁడు జన సంఘమునువిడచి అడవికిఁబోయి ముక్కు మూసికొని కూర్చుండి నాడా? జన సంఘముల బాగును గోరి యాసేతుహిమాచలమును దిరిగి మతబోధకావించినాఁడా ? సమస్తదేశములును దిరిగి జనసంఘములకు మతబోధకావించి లోకమునకు మహోపకారము చేసినాఁడు. ఇట్లె రామానుజుఁడు మధ్వుఁడు చైతన్యుఁడు రామకృష్ణపరమహంస, వివేకానందుఁడు క్రీస్తు మున్నగువారు లోకములో నాయాలుబిడ్డలను సంబంధలేశమును గలిగించుకొనక లోకమునంతను దమకుటుంబముగా నెంచుకొని యెట్టియిక్కట్టులకును జంకక ధర్మబోధకై తమజీవనముల థారపోసినారు. ఇట్టివారు సాంఘిక ప్రజలా ? తాము కట్టు కొనిన యొకరిద్దఱు భార్యల సుఖదుఃఖముల నారయుటలో బద్ధులై లోకమున స్వేచ్ఛగా మతబోధచేయుటలో సదాతమకాలమును గడువఁజాలకుండిన శ్రీశివనాధశాస్త్రి గారివంటి వారు సాంఘిక ప్రజలా ? ఆత్మబోధచేయువారు పితాపుత్రాదినీరససంబంధమును నిరసించుట యుచితమేయైయున్నది. ఇందునుగూర్చి శ్రీలాలాలజపతిరాయి గారిట్లు వాయించినారు.

"No religion can be worth its name which does not take sufficient care of the individual. The development of the individual soul and its attainment of spiritual beatitude must be the goal of all religion. There can be no religion without this object. A religion without the teaching of spirituality is a misnomer and a lever without fulcrum. All purely Spiritual development, must from the very nature of things be individualistic, and it should be the ambition of every human being to strive after the elevation and refinement of the spirit in him and thereby secure spiritual perfection resulting in perfect bliss or (as some religions style it) salvation. No religion can, therefore, be condemned as individualistic, because it attaches great importance to the unfolding and developing of the spiritual side of men, nor can any religion be extolled as socialistic which either ignores the spirit altogether or gives it only a subordinate or secondary position." (మతమునకు ఆత్మజ్ఞానము ముఖ్యము. అదిలేనిది మతముకాదు. ఆత్మాభివృద్ధి పూర్తిగాఁగోరునది సంసారబంధమును స్వభావసిద్ధముగా నిరసించితీరును. మోక్షముకావలసిన వారెల్లరు నాత్మజ్ఞానమును వృద్థి జేసికొనవలెను గాన ఆత్మాభివృద్ధిని గూర్చి ముచ్చటించు దానిని అసంసారికమని నిందింపను రాదు. ఆత్మజ్ఞానమును ధిఃకరించుదానిని సాంసారికముఅని పిలువనురాదు. అనిదీని తాత్పర్యము.)

కావున మా చదువరు లెల్లరును హిందూమతము సాంఘికధర్మ విరుద్ధము (anti-social) గాఁదలంచుట గొప్ప తప్పని గ్రహింపవలెను. శ్రీపండితశివనాథశాస్త్రిగారు క్రీస్తుమతము మున్నగు వానిని దెలిసికొనుటలో నొసంగిన శ్రద్థలో నొకకొంత హిందూమతమును దెలిసికొనుటలో వినియోగించిన యీతప్పుటూహలు కలిగియుండకుందురు.

[ఇందీఁబడిన శ్రుతివాక్యాదుల మూలములీబడక ఇంగ్లీషు భాషాంతరీకరణలీఁబడియున్నవి. అందులకుఁ గారణమును శ్త్రీ లాలాగారే యిట్లు చెప్పియున్నారు. 'In the above article I have relied upon the English translation of Sanscrit Texts by European scholars so that there may be no occasion for a charge of straining the words or of extorting meanings or of inventing theories of my own." ఈయూహతోడనే నేనును ఈపత్రికలో హూణాదులు వ్రాసిన వ్రాతలనే తీసికొంటిని.]