ఉపన్యాస పయోనిధి/యజ్ఞోపవీత రహస్యము
యజ్ఞోపవీత రహస్యము.
ఈనడుమ కొందఱుబల్లిదులు యజ్ఞోపవీతమన నేమోతెలిసికొనకయే - విశేషించియయ్యది బ్రాహ్మణత్వమును బో ధించుసూత్రమను భ్రమనుబొంది - తీసివేసి మహావీరాగ్ర గణ్యులగుచున్నారని తెలియవచ్చుచున్నది. కాననీవిషయముం గూర్చి వ్రాయనిప్పు డవసరమైనది. ఈ నావ్రాసినదానిని బట్టియామహావీరులు మరలజన్నిదములచేఁ దమదేహముల నలంకరింతురను తలంపునాకులేదు. లేనిదానిని ధరించు నప్పుడయినను థరించుదానిని దీసివేయునప్పుడయినను ఆయావస్తువులంగూర్చి సత్యజ్ఞానమును సంపాదించుకొనుట వివేకి లక్షణముగాన నుపవీతములందీసి ప్రసిద్ధినందగోరువారుకూడ ముందుదానిరహస్య మేమో తెలిసికొని యాపయిత్రెంపి పారవేయుదురుగాక యనుతలంపుతో నీచిన్నివ్యాసమును వ్రాయుచున్నాఁడను. ఇందలిరహస్యము తెలిసినతరువాత మఱికొందఱు నవమేధావులు తక్షణముతమయజ్ఞ సూత్రములను లాగిపారవయిచినను బారవయితురుగాక. విషయమును మాత్రము బాగుగా గ్రహింపవలెనని నాప్రార్ధన.
ఉపవీతము బ్రాహ్మణత్వమును బోధించునదియా?
యజ్ఞోపవీతము బ్రాహ్మణత్వమును బోధించునది యని యెచటను తెలుపఁబడియుండలేదు, కానిబ్రాహ్మసూత్రమనుపేరుంగాంచి పాశ్చాత్యులు కొందఱుభ్రమసి దానిని బ్రాహ్మణులుధరించు సూత్రమని యర్ధముచేసికొని "Brahmanical thread" (బ్రాహ్మణసూత్రము) అని దీనినివాడఁజొచ్చిరి. మననవనాగరికాగ్రగణ్యులకే "మిషనరీ" యో వ్రాసినవ్రాఁతయే యాధారముగాని మనగ్రంధములఁ దిన్నఁ గఁజూచుకొనుట వారికెన్నండును నలవాటులేదుగావున నీ పాశ్చాత్యుల తప్పుడువ్రాఁతలను నాధారముచేసికొని దీనిని "Badge of brahmin hood" (బ్రాహ్మణత్వమును దెలుపుపట్టా) యనిపిలుచుచు నాకారణముచేదానిని ద్వేషింప మొదలుపెట్టిరి. కానియించుకబాగుగా విషయమునుదఱచి చూచినక్రైస్తవ బోధకుల వ్రాతలనయినఁ దిన్నగఁజూచుకొనరయిరి. కానపాశ్చాత్యుల యభిప్రాయములంగూడసాధ్యమగు నంతవఱకు ముందిచ్చుచు నీవిషయముంగూర్చి మనవారు వ్రాసియుంచిన యంశములనిందు వ్రాసెదను. దీనియందు రహస్యమ కలదా ?
దీనియందురహస్యము కలదా?
దీనిరహస్యముంగూర్చి "అబ్బేడూబోయి" యనుఫ్రెంచిమిషనరీ యిట్లువ్రాయుచున్నాఁడు. "It is composed of three strands of cotton, each strand formed by nine threads... The number three, adopted, and so to say consecrated, in this and in many other instances, is evidently used in an allegorical sense” (ఒక్కొక్కదానియందు తొమ్మిదేసిపోచలుగల మూడుకార్పాస సూత్రము లిందుఁగలవు. త్రిసంఖ్యందీసికొని యిందును నితర విషయమునిందువలెనే, పవిత్రీకరించి యుండుటచే నిందు రహస్యార్ధ ముండుటస్పష్టము) డూపోయి చెప్పినట్లుగా నిందువేదాంతాధర్మము కలదని జీర్ణయజ్ఞోపవీతమునుదీసి నూతనయజ్ఞోప వీతనమును ధరించనపుడు స్మరింపవలసిన మంత్రమువలనను దెలియవచ్చుచున్నది. అది యేది యన “పవిత్రవంతం యదిజీర్ణవంతం వేదాంతవేద్యం పరబ్రహ్మమూర్తిం ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచశుభ్రం జీర్ణోపవీతం విసృజామి తేజః" అనునదియైయున్నది. ఇందు జన్నిదము వేదాంతవేద్యమని విస్పష్టముగాఁ దెలుపంబడి యున్నది. మఱియుదీనిని బ్రహ్మసూత్రమనుట చేతనే యిందువేదాంత రహస్యముకలదని బాగుగాఁ దెలియవచ్చుచున్నది.
ఇందలి వేదాంతార్ధమేమి?
దీనింగూర్చి బహుప్రకారములఁ దెలుపఁబడి యున్నది. "డూబోయి” "I am rather inclined to believe that it refers to the three principal divinities of India. Brahma, Vistnu, and Siva." (ఇది హిందూదేశము నందలి త్రిమూర్తులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే బోధించు నని నేనుతలంచెదను) అని వ్రాసియున్నాఁడు. ఇదిసత్యము. ఈ మూఁడు సూత్రములనుగలపి ముడివేసి దానికి బ్రహ్మగ్రంధి యని పేరుంచుటచే నీమూవురునొక్కటియని తెలుపు చున్నది. సత్వరజస్తమో గుణప్రధానమయిన సృష్టి స్థిత్యంతములను గలిగించుబ్రహ్మమును త్రివిధముగా మనవారు గ్రహించియున్నారు. క్రైస్తవులును తండ్రి (విష్ణువు) కొడుకు (బ్రహ్మ) పరిశుద్ధాత్మ (శివుఁడు) అనిభగవంతుని త్రివిధముగా గ్రహించుచున్నారు.
ఇట్లునాగరికతగల మతములందన్నిటియందును త్రివిధముగాభగవంతుని గ్రంహించుటకలదు. బ్రహ్మ సామాజికులును బ్రహ్మవిష్ణు మహేశ్వర సంజ్ఞలచేఁ బిలువకున్ననుసృష్టికర్త (బ్రహ్మ) స్థితికర్త (విష్ణువు) లయకర్త (మహేశ్వరుఁడు) అని వేఱువేఱు వ్యాపారములతోఁగూడిన వేఱువేఱు పేరులతోఁ బిలుచుచునే యున్నారు. ఈమూఁడు వ్యాపారములొక్క బ్రహ్మమునుండియే వచ్చుచున్నవను రహస్యము తెలుపునది యజ్ఞోపవీతమయి యున్నది. కావుననేపరబ్రహోపనిషత్తున జన్నిదముంగూర్చి యిట్లు వ్రాయఁబడియున్నది. "ఆద్యస్తరైకత్వమన మధ్యేత్రిరావృత్య బ్రహ్మవిష్ణు మహేశ్వరత్వమను సన్ధాయాద్యంతమేకీ కృత్యచిద్గ్ర న్ధావద్వైత గ్రంథిం కృత్వానాఖ్యాది బ్రహ్మబిల ప్రమాణం పృధక్పృథక్సప్తవిగ్ శతి తత్వసంబంధం త్రిగుణోపేతం త్రిమూర్తిలక్షణలక్షితమప్యే కత్వమాపాద్యవామాగ్ సాదిదక్షిణ కట్యన్తంవిభావాద్యన్త గ్రహసమ్మేళ మేకం జ్ఞాత్వా” అనితెలుపఁబడియున్నది. అభ్యంతర సూత్రముయొక్కయు బహిస్సూత్రము యొక్కయును గూడ రహస్యమిది కావున సృష్టిస్థిత్యంతములను గలిగించుచున్న భగవంతుఁడొక్కఁడేయనియు నాతనినుండియే సర్వమును బయలువెడలుచున్న దనియుఁదెలుపుచున్నది జన్నిదమయియున్నది.
ఇంకనుబైబ్రహ్మోపనిషత్తులో 'పృధకృధక్సప్తవిగ్ శతితత్త్వసంబంధం త్రిగుణోపేతం' అని వ్రాయఁబడి యున్న దానినిబట్టి జన్నిదమునందుఁగల యిరువదియేడుపోచల రహస్యమును బాగుగా బోథలోనికి వచ్చుచున్నది. ఈవిషయముం గూర్చి సీతారామాంజనేయసంవాద టీకలోనిట్లువ్రాయఁబడియున్నది.
"మలినసత్వప్రథానయగు మూలప్రకృతి తనత్రిగుణములచేత తొలుత త్రిశక్తులుగ దోఁచినవెనుక ఆత్రిగుణపరస్పర సమ్మేళనమువలన నవవిధములయి పిదప ఆ నవవిధానోన్య సమ్మేళనముచేత సప్తవింశతివిధములై తెల్లనివస్త్రమునచిత్రములు కల్పితములయినట్లు శుద్ధపరబ్రహ్మమందు పైఁ జెప్పఁబడిన యిరువదియేడు భేదములుగల సృష్టి గలయట్లుగఁ గనపఱచెను. మఱిపెదపురుషుఁడు యీ యిరువదియేడు భేదములుగల సృష్టికి కారణమయిన ప్రకృతిమయమగు గాయత్రి మూఁడుపాదములును భూర్భువస్సువ యను వ్యాహృతి త్రయముతోడ ఇరువదియేడక్షరములును గలదనిచెప్పి దానిని ద్విజాతులైన బ్రహ్మక్షత్రియ వైశ్యులకు తారతమ్యత చేత నుపాస్యముగా నిర్ణయించెను. మఱిగాయత్రికి మారురూపమగు యజ్ఞోపవీతమును మూఁడు సూత్రములు గలది. అందొక్క సూత్రమునకు మూఁడేసిఅంతరసూత్రములు గలవు. ఆయాంతర సూత్రములయందొక్కటొక్కటికి మూఁడుమూఁడు పోగులుగలవు గానమూఁడు పెద్దపోగులు గల ఆయజ్ఞోపవీతము ఇరువది ఏడుగలదయ్యెను. ఆతంతువులే ఇరువది ఏడు భేదములుగలజగత్తు. ఆజగద్రూపమగు యజ్ఞోపవీతమునే గాయత్రియని ద్విజాతులు ధరించిపరబ్రహ్మమునుద్దేశించి సర్వ కర్మముల చేయవలయు." ఇది కైవల్యనవనీతమందును గాన్పించుచున్నది. సీతారామాంజనేయ సంవాదతాత్పర్య కారులును కైవల్యనవనీతకారులు గలసియే ఈ విషయమును వ్రాసిరని' తోఁచుచున్నది.
ఇంకను ఈజన్నిదముంగూర్చి అబ్బేడూబోయిపుస్తకమును బ్రచురించిన బౌచాంపుదొరవారిట్లు వ్రాసియున్నారు.
"The triple card is thus explained by one authority: It symbolizes the body, speech, and mined, It symbolizes the control of each; and therefore when the knots are tied in it, it means that the man who wear the thread has gained control over body, speech and mind" (ఒక ప్రమాణగ్రంధమున యజ్ఞోపవీతముంగూర్చి యిట్లు వ్రాయఁబడియున్నది. అయ్యది మనోవాక్కాయములప్రతిమయయి యున్నది. అయ్యది యామూటిని వశపరచుకొనుటకును బోథించును కాన ముళ్ళు వేయఁబడినప్పుడు దానినిథరించిన వాఁడామనోవాక్కాయముల మూటిని దనవశమున నుంచుకొనినాడని తెలుపును)
ఇంకను యజ్ఞోపవీతముంగూర్చి మోనియరు విలియమ్సు దొరవారు తమ "Religious thought & Life in India" అనుగ్రంథములో నిట్లువ్రాయించి యున్నారు.
"If we inquire a little closely into the nature of the sacred symbol supposed to be capable of effecting so vast a transformation in human beings' codnition, we find that now as formerly, it consists of three slender cotton threads -- white in colour to typifypurity, and tied together in one spot by a sacred knot of peculiar construction (called brahma-granthi) each of the three threds also consisting of three fixed threads tightly twisted into one"
అనువాక్యములలో జన్నిదము పవిత్రతనుదెలుపును అని వ్రాయంబడియున్నది. ఇదిసత్యము. జన్నిదముపవిత్రతను దెలుపును, గావుననే దీనికి "పవిత్రము” అను పేరేవచ్చినది యజ్ఞోపవీతమునకుఁ 'బవిత్ర' మను పేరుగలదనుటకు - పవిత్రం = An instrument for cleansing or purifying. Such as a sieve or strainer &c. 2. Two blades of kusa grass used at sacrifices in purifying & sprinkling ghee. 3. A ring of kusa grass worn on the fourth finger on certain religious occasions. 4. The sacred thread worn by members of the first three casts of the Hindus.”
అను నిఘంటు వాక్యములు సాక్ష్యమిచ్చుచున్నవి. "యజ్ఞోపవీతం పరమంపవిత్ర"మ్మనికూడఁ దెలుపఁబడియున్నది.
పై వానినన్నిటినిబట్టి చూడఁగా యజ్ఞోపవీతము పవిత్రతతో డను, మనోవాక్కాయముల నియమము అనఁగా త్రికరణ శుద్ధిగాను సంచరించుచు త్రిగుణాత్మకమైన ప్రపంచమున కీశ్వరుఁ డొక్కఁడేయను తలంపుగలిగియుండు ననుటను దెలుపు ప్రతిమ యజ్ఞోపవీతమై యున్నది. దీనిం దాల్చువారు పవిత్రులై త్రికరణశుద్ధిగలిగి "ఏకంసత్" అనినమ్మువారుగా నుండవలెను. దీనికిఘనత యీవిధముగా వచ్చినది. పవిత్రమనునామమును బట్టియే ఇంగ్లీషులో “Sacred thread” అనుపేరుకలిగినది.
యజ్ఞోపవీతకాలము.
ఈయజ్ఞోపవీత మనాదిగా మనపూర్వులచే ధరింపఁ బడుచున్నది. వేదములనాడును మనపెద్దలు దీనిని ధరించుట కలదు. మనుజుఁడాదిని (వేదములనాఁడు) వాయ్వాదిభూతములను గొలిచెడి వాఁడనియుఁ గ్రమక్రమముగా నుపనిషత్తుల నాటికి ఆవాయ్వాదిభూతము లీశ్వరుఁడు కాఁడనియు వీనికన్నిటికి నీశ్వరుఁ డొక్కఁడు కలఁడను తలంపును ఆతఁడొక్కరుఁడను తలంపునుగలిగినవనియుఁ గొందఱు చెప్పుచున్నారు. వాయ్వాదులనే దైవముగా వేదములు తెలుపుట లేదనియు వానియందధిష్టించి యున్నపరాత్పరునకా వాయ్వాదిసంజ్ఞలనే వేదఋషులు కలిగించిరనియు మఱికొందఱు చెప్పుచున్నారు. ఎట్లయిన యజ్ఞోపవీతమును ధరించునపుడు పఠింవఁ బడు మంత్రమునందు "ప్రజావతేర్యస్సహజ" మ్మని తెలుపఁబడి యున్నట్లుగా నియ్యది యనాదిదే యైన పక్షమున నుపనిషదాదుల మతమును మాత్రమేకలిగి యుండక వేదమతమును గూడఁ గలిగియున్న దాయందురేని నదియును గలదు.
నవతంతు రహస్యము
"ప్రధమస్తంతురోంకారో। ద్వితీయోగ్నిః। తృతీయేనాక దైవత్యః। చతుర్ధోవాయుదేవతాకః పంచమః పితృదేవత్యః షష్టః ప్రాజాపత్యః। సప్తమోవిష్ణుదైవత్యః। అష్టమస్సూర్యః। సర్వ దైవత్యో నవమః" అని సూత్రము లందు వ్రాయఁబడినది.
ఈవిధముగా జన్నిదమునందు వేదమతము, ఉపనిషన్మతము పురాణమతమునుగూడఁ గాన్పించుచుండుటచే నియ్యదిమిక్కిలి పురాతనమైనదనియు పవిత్రమైనదనియు వేదవేదాంతరహస్యోపేత మైనదనియు సన్నియమమునుదెలుపు యోగ్యమైన సూత్రమనియు బాగుగాఁ దెలియవచ్చుచున్నది.
కాఁబట్టియిట్టి పవిత్రమును ధరించుట నొక ఘనతగానెంచికొనుట యుచితముగానేయున్నది.
"Brahmins, and all the other castes which have the right to wear this cord, prize it more highly and are certainly more proud of it than are many Europeans who by noble birth or great deeds possess the right to wear the cordon of the knightly orders."
అని డూబోయి వ్రాసియున్నాఁడు. ఉత్తమవంశంబునఁ బుట్టినవారలు తమయుత్తమ వంశత్వమును దెలుపు సూత్రము దేహమునందుఁ దాల్చుట దానినిఘనతగా నెంచికొనుటయు పశ్చిమదేశములందును గలదని దీనివలనఁ దెలియవచ్చుచున్నది. పశ్చిమ దేశములందు నుత్తమవంశమునఁ బుట్టిన మాత్రముననే ఘనతను దెలుపుజన్నిదమును (Cordon) ధరించుట కధికారముండఁగా నదిఘనతకాఁగా నీదేశమునందు మాత్రమేలకాదు. పైదానినంతను బట్టి జాతిభేదమును బాటించుటకై యజ్ఞోపవీతము పుట్టియుండలేదనియు నయ్యది యోగ్యముగా దైవముఖమును జూచి ప్రవర్తింపవలెనను జ్ఞాపకముజేయుపవిత్ర సూత్రమనియు నిట్టి సూత్రముల ధరించు నాచారము నాగరికులందంతటను గలదనియుఁ దెలియ వచ్చినదిగదా. ఇఁకదీనిని జాతిభేదమును దెలుపు చిహ్నముగాఁ దలంచితీసిపారవేయుటయం దెంతవివేకముండఁగలదో బుద్ధిమంతు లూహింతురుగాక.
యజ్ఞోపవీతమును దీసివేసినంతన జాతి వైషమ్యముపోవునా? పైబంధమును దృటిలోతీసివేయవచ్చునుగాని యంతమాత్రమునమనస్సునందలి బంధముపోవునా? ఈబహిస్సూత్రమును దాల్చుట బాహ్యాడంబరమగుచో నంతస్సూత్రమునుదెంపకయే బహిస్సూత్రమును ద్రెంచుట మాత్రము వట్టి బాహ్యాడంబరము కాదా. మహషిన్‌యని పిలువంబడిన దేవేంద్రనాధ ఠాకురుగారినిగూర్చి 'మనోరమ' యందిట్లు వ్రాయఁబడి యున్నది. “దేవేంద్రనాథుఁడు యజ్ఞోపవీతము దీసి పారవైచి మతాంతురలతో భోజనాదికములు చేయుచుండెను కాని స్త్రీలను సభలకుఁ దోడ్కొనివచ్చుట యితరవర్ణములతో సంబంధబాంధవ్యములు జేసికొనుట మొదలగు కొన్ని కార్యముల కిష్టపడఁడయ్యె" ఈదేవేంద్రనాధుఁడు హిందూమతమును విడచి బ్రహ్మసమాజమతమునవలంబించెను. ఈయన యొక్క యోగ్యతనుబట్టి యీయన కు మహషిన్‌యని బిరుదమునిచ్చి బ్రాహ్మ సామాజికులు తమకధ్యక్షునిగాఁ జేసికొనిరి. విశేషమైన వివేకము విశేషమైనధర్మబుద్ధిగలిగి మహషిన్ యనిపించుకొనిన యీబ్రాహ్మసామాజికాధ్యక్షుఁడు కూడ యజ్ఞోపవీతరహస్యము తెలియక భ్రమపడి దానిని జాతిని దెలుపునదిగా గ్రహించి తీసివేయుటలో మాత్రము తనశూరత్వము చూపకలిగెనేకాని వర్ణాంతరులతో సంబంధ బాంధవ్యములు కలుపుకొనుట కిష్టపడలేకపోయెను. అనఁగా బహిస్సూత్రమును దీసిపారవైచెనేకాని యంతస్సూత్రమును దీసిపారవేయలేక పోయెను. ఇఁకక్రోధదేవతకు బలులై తాఁబట్టిన కుందేటికి మూఁడేకాళ్ళను మనుజులు పైనుండివచ్చిన ప్రోత్సాహమును బోరును బడలేక యతిబలవంతముమీఁద దేహముపైనొకమూలఁబడి చివుకుచున్న జన్నిదపుపోచల నూఁడదీసిపారవైచి నంతన లాభముండఁ గలదా? అస్మ ద్దేశీయు లారా, యివి వట్టి యాడంబరములుచుండి ?
మనస్సుపరివక్వమై సర్వభూతము నాత్మవత్తుగాగ్రహించునిక్క మగు నాత్మజ్ఞానికి జాతిభేద ముండదుగాని తక్కినవారి కెల్లరకుండితీరును. అట్టిసాధువు లీపైపైయాడంబరములను జేయరు. బ్రాహ్మణుఁడు, యజ్ఞోపవీతియు, హిందువునైన రామకృష్ణపరమహంస కడజాతి మాలవాని గుడిసెకడకుఁబోయి వానిముంగిలినూడ్చి వానికుపచారములఁజేసి వాని దాసత్వము నపేక్షించినాడు. ఈపని golden deed అనికా ని Heroic deed అనిగాని జను లనుకొనవలెనను తలంపాతనికి లేనేలేదు. ఈపనిచేసినంతన గర్వించి నాచేసినదిమార్గ దర్శకమగుగాక యనినుడువలేదు. జన్నిదమును దీసిపారవైచినను నుదరమునింపుకొను పనియందుమాత్రము తమతోడి మిత్రులయెడమాత్రము తమసర్వసమత్వమును దెలిపిన దేవేంద్రనాధాదులు చేసినపనియే యుత్తమమో జన్నిదమునుదీసివేయక కడజాతివానికి దాస్యముచేసిన రామకృష్ణపరమహంసదే యత్తమకార్యమో లోకము గ్రహించును గాక సోదరులారానిజముగా మీరులోకహితమునుకోరునెడల బాహ్యాడంబరములను మానుఁడు. సాధు హృదయులు కండు. మూఢలోకముయొక్క పొగడ్త నభిలషింపకుడు. సువిమర్శముల నాలింపుడు.