ఉపన్యాస పయోనిధి/అభేదానందస్వామి-వేదాంతము
అభేదానందస్వామి - వేదాంతము.
ఎన్నిక గన్న రామకృష్ణమతస్థులగు విశకానందస్వాములవారు అమెరికా దేశమునందుఁ గలజనముల హృదయ క్షేత్రముల యుక్తిహలచే బాగుగాదున్ని స్నేహరసములు వెల్లిగొలిపి వేదాంత రహస్యబీజముల బాగుగ నాటినసంగతి యందఱు నెఱింగియున్న విషయమేకదా. వారియనంతరమున తమకృషిని ఫలవంతము చేయుటకై ఏతన్నఠస్థులగు అభేదానందస్వాములవారు అమెరికాదేశమునకుం జని యచట బహుశ్లాఘనీయముగాఁ గృషిచేసి వివేకానందస్వాములవారి యుద్యమము ఫలవంతమగునట్లు చేసియున్నారు. ఈయభేదానందస్వాములవారు వేదాంత విద్యయందు స్తవనీయమైన పరిపూర్ణ ప్రవేశము కలవారు. మృదుమధుర వాగ్లహరిలో సభ్యుల నోలలాడింపఁ గల ఘనప్రజ్ఞకలవారు. వీరియముల్యోపన్యాసములను వినుటకాదేశస్థులు చాల అభిలషింతురు. వీరిమూలముగా వేదాంతశాస్త్రమున కృషిచేయుసభలు అమెరికాదేశములోఁ జాలస్థాపింపఁబడినవి. ఆదేశస్థులకు వేదాంతమునం దభిరుచి క్రమక్రమాభివృద్ధి నందుచున్నది. ఇట్లు పూజనీయముగా జీవయాత్రజరుపుచున్న యీస్వాములవారలిప్పుడు మరలమనదేశమునకు వచ్చియున్నారు. వీరిని మనవారును బహువిధముల గౌర వించి మార్గమధ్యమునం దచటనచట పెద్దసభలఁ గావించుచున్నారు. వీరిప్పుడు చెన్నపురికి వేంచేసియుండిరి. అచట గడచిన సోమవారమున (10 - 7 - 06) చెన్నపురిలో నొక్క గొప్పసభ కావింపఁబడినది. సభాభవనమును 3000 జనులలంకరించిరి. నాడు శ్రీస్వాములవారు —
వేదాంతముయొక్క సమస్త భువన సమాదరణీయతను గురించి బహుసరసముగా ముచ్చటించిరి. వారియుపన్యాససారము నీక్రిందనిచ్చుచున్నారము.
హిందువులు సమస్తముకంటెను, మతమును అధ్యాత్మ విద్యను నెక్కుడు ఘనముగా నాదరింతురనుట నాకత్యానందమును గూర్చుచున్నది హిందువులమైన మనకు రాజకార్యములును సంఘసంస్కార కార్యములును రెండవపక్షములోనివియై యున్నవికాని యధ్యాత్మ విద్యమనకు ప్రాణమై యున్నది. ఎప్పుడుమనమధ్యాత్మ విద్యను విడుతుమో యప్పుడమనము గతించిన వారమగుదుము. ఏమన, మనశక్తి యంతయును నాత్మతత్వమునంద యిమిడియున్నది. అనాది నుండి యిప్పటివఱకును మనధనము బ్రతుకు మనసర్వస్వము నధ్యాత్మ విద్యయందు నిలచియున్నవి. కానిరాజతార్యతంత్రములయందుగాని సంఘసంస్కార కార్యములందుఁగాని లేవు. సత్యఋషులైన మనపూర్వులనుండి మనముపొందిన చిత్తమగుమతమును నధ్యాత్మవిద్యయు విశ్వా దరణీయములై యున్నవి. ఇది ఎల్లప్పుడును నిత్యసత్య ములును నధ్యాత్మతత్వములు ననుదృఢదుర్గముల నాశ్రయముగాఁ గలదియై యున్నదిగాని దుర్బలమైన యిసుక నేలవంటి విధివిధానముల నాధారముచేసికొని యుండలేదు. ఈ విథముగా దృఢమయిన యాశ్రమమునందిన మనమతాధ్యాత్మవిద్యలు మొదటినుండియు నెన్నెన్ని యాతంకములు కలిగినను వానిని లక్ష్యపెట్టక జయించుకొని వచ్చుచున్నవి. మన పెద్దలవలన మనమార్జించు కొనినమతము శాస్త్రమును, ఆసియాఖండమునందును, యూరపుఖండము నందును, గల బహుజాతుల నెట్లయిన నేమి నాగరికస్థితిలోనికిఁ దెచ్చినవి. మొదట హిందూదేశమునందు ఘనమైన యధ్యాత్మతత్వములు పుట్టి తూర్పున చీనా దేశమువఱకును పశ్చిమమున నలగ్జాండ్రియా వఱకును వ్యాపించినవి. క్రీస్తుపుట్టుటకుఁ బూర్వము బహుశతాబ్దముల క్రిందనే మనవేదాంత మతబోథకులు సత్యధర్మముల బోధించుటకై బహుదూర దేశములకుఁ గూడఁ జనియించిరి. సత్యబోధకై వారెన్నఁడునునస్త్రశస్త్రములను మందుగుండు సామానులను దీసికొనిపోయియుండలేదు. వారెచటికేగినను దమక్షమాదులను ప్రేమాదులను గలిగించిరి. వారుసంపాదించినకీర్తి యట్టిది. మామతము తల్లినిబిడ్డను ఆలును మగనివిడఁదీయుటకును కలహములకును కొట్లాటకును మూలమైనదికాదనియు నెమ్మది సచ్చింత ప్రేమసౌహార్దత మొదలగు నుత్తమగుణములకు మూలమైనదని యిప్పుడుమనము బహిరంగముగానిలచి చాటవచ్చును. మన ము నిలచినందులకే ఈవర్తకపు దినములలోను ఈప్రకృతిప్రధానపు దినములలోను గూడ మనము లోకమునకుఁజూపునది యిదియే.
వేదము దేనిని బోధించునో తెలిసికొనుటకుఁ బూర్వము వేదశబ్దార్ధమును మనము తెలిసికొనవలెను. వేదశబ్దార్ధము జ్ఞానము. వేదశబ్దము "విద్” అను సంస్కృత ధాతువు నుండి పుట్టినది. దానికిఁ దెలిసికొనుట యని యర్ధము. వేదశబ్దము విద్‌జ్ఞానే యను ధాతువు నుండి పుట్టినదిగావున వేదాంతమనఁగా జ్ఞానావధియని యర్ధము. అజ్ఞానమెట్టిది దానినిఁ దెలిసికొనుట యెట్లు అనునవి వేదాంతముయొక్క ముఖ్యోద్దేశములు. జ్ఞానముయొక్క అంతమనఁగా ప్రకృతినిమన మింద్రియమూలముగాఁ దెలిసికొనవలసిన దానిపరమార్ధ మని యర్ధము. ఈబాహ్య ప్రపంచమంతయు దృశ్యాదృశ్యమైయున్న విశ్వములో సగపాలు. ఇఁకనొక సగపాలు కలదు. అదివిషయికాని విషయముకాదు. దానిమూలముగానే మనమీ బాహ్యప్రపంచమును జూచిగ్రహించు కొనుచున్నాము. బాహ్యప్రపంచము వట్టివిషయము మాత్రమేయైయున్నది. ఈబాహ్యాభ్యంతర ప్రపంచములను రెంటినినేకీభవింపఁ జేసినప్పుడ మనకు దివ్యజ్ఞానము కలుగును. అదియేనిత్య జ్ఞానము. ఆజ్ఞానమెచ్చట నున్నది ? ఈప్రపంచముకంటె భిన్నముగానున్నదా ? మనదేహములకంటె నతిరిక్తమైయున్నదా ? లేదు. ఆదివిశ్వమునం దంతటను నిండి యున్నది. దానికావలనుగలదు. అదిఅంతటనుగలదు. మనజీవులందుఁగలదు. ఆదివ్యజ్ఞాన జ్యోతియొక్క యాభాసములే మనజీవులు. ఈప్రపంచము యొక్క యాద్యంతములా దివ్యజ్ఞానమే. ఆదివ్యజ్ఞానమునే కొందఱు మూర్తిగా భావించియీశ్వరుఁడందురు. అప్పుడు ఈశ్వరుఁడు సర్వజ్ఞుడందురు కాని సర్వజ్ఞత్వ యీశ్వరత్వములు విడదీయుటకు వీలులేనివి. అతఁడు నిత్యత్వసర్వజ్ఞత్వములనుండి విడఁదీయ వీలులేనివాఁడు కావుననే వేదాంతమాతనిని "సత్యం జ్ఞానమనంతంబ్రహ్మ” అనిచెప్పుచున్నది. బ్రహ్మమునకు నామరూపములులేవు. వేదములీ ప్రపంచమునకు నాబ్రహ్మమే మూలమనిచెప్పుచున్నవి.