ఉత్తరహరివంశము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఉత్తరహరివంశము

ద్వితీయాశ్వాసము

శ్రీపార్వతీకుచాగ్రా
రోపితముక్తేందుకాంతరోచిర్ని చితా
కూపారశైలహరణ
[1]ప్రాపితమణిరుచిసనాథ హరిహరనాథా.

1


వ.

దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.

2


మ.

శరతల్పంబున నున్న శాంతనవునా[2]జ్ఞం దత్పరుండై యుధి
స్ఠిరుతో నర్జునుఁ డిట్లనున్ హరిఁ బ్రశంసింపంగ [3]రారే మునీ
శ్వరులు ద్వారక కేను బోయితిఁ గదా సంబంధులం జూడనాఁ
డరు దాదేవునియందుఁ గంటి నొకకృత్యం బెవ్వరుం జేయరున్.

3


క.

ఆపట్టణమున నుచిత
వ్యాపారతఁ గుకుర వృష్ణి యదు భోజ సమా
జాసాదితపూజుఁడ నై
యీపురుషోత్తమునిఁ గొలిచి యే నున్నయెడన్.

4

శ్రీకృష్ణునియొద్ద కొకబ్రాహ్మణుఁడు వచ్చి తన కుమారుల రక్షింప వేడుట

క.

ఒకనాఁ డొకశాస్త్రములో
నొకక్రతు వొకనాఁటిదీక్ష కొనరినఁగని ధా
ర్మికుఁ డాహరి యది గైకొని
యొకచో నుండంగ విప్రుఁ డొకఁ డేతెంచెన్.

5

చ.

అకట కుమారులార కడుపార మిముం గని పాఱవైచు త
ల్లికి నటు సూనుతండ్రికి బలే తొలుబామున లేవు నోము లూ
రక ననుఁ గన్నుఁబ్రామి విధిరత్నపుబొమ్మల నాఁచికొన్ననా
మొకమున వ్రేలుచున్నయవి మువ్వురమూర్తులు నంచు నార్తుఁడై.

6


క.

వెడ వీడెడుదోవతియును
బెడతలచేతులు వడంకుపెదవులు తూఁగా
డెడువెండ్రుకలును బైపై
వెడలెడు కన్నీరుఁ గలుగు వేషముతోడన్.

7


క.

ముందట నిలిచి, మురాంతక,
మందరధర, భక్తలోకమందార, దయా
కంధళితహృదయ, సురముని
వందితపాదారవింద, వసుదేవసుతా!

8


గీ.

దేవ దేవ, రక్షింపవె దివ్యమూర్తి!
యనుచుఁ బలుకు నవ్విప్రుని యార్తభంగి
చూచు[4]మురవైరి శోకంబుఁ జూడలేక
వెడలె నాకును గన్నీరు వేయు నేల.


వ.

అట్టియెడ దేవదేవుం డమ్మహీదేవున కిట్లనియె.

10


క.

ఏలయ్య భూసురోత్తమ
దూలెదు? నీయట్టివారు దుఃఖాంబుధిలోఁ
దేలుదురే మముబోంట్లకుఁ
దాలిమి లేకున్నఁ దెలుపఁ దగువారయ్యున్.

11


క.

మేలుం గీడును వచ్చుం
గాలముతో రెంటిచేతఁ గలఁగరు ధీరుల్
తేలుచు మునుఁగుచు నితరులు
జాలిం బడుదురు వివేకసంగతి లేమిన్.

12


వ.

అనుటయు నవ్వాసుదేవునకు భూసురోత్తముం డిట్లనియె.

13

క.

ఓ పురుషోత్తమ! యెట్లు ప్ర
లాపింపిక యుండుదుం జలంబున వీధి నా
పాపల మువ్వురఁ దోడ్తోఁ
జూపోపక చంపెఁ దత్ప్రసూతిదినములన్.

14


మ.

అవి యెల్లం గడచన్న నేఁడు దుదగా నస్మత్కళత్రంబు గౌ
రవమున్ మోదము ఖేదమున్ బెరయ గర్భం బిమ్ములం దాల్చినన్
నవమాసంబులు నిండె గుండె పగిలెన్ నాకంతలోఁ గొంత లో
కవినోదంబుల కీఫలంబు చవి [5]దక్కం జేసి రక్షింపవే.

15


సిీ.

తడి యొత్తు చీరతో దాది కౌఁగిటఁ జేర్చి
                 చూపంగఁ గన్నారఁ జూడ నైతిఁ
దడవి యారకమున్న తట్టాడు మని పట్టి
                 వడకంగ సెజ్జపై వ్రాల్ప నైతి
నల్లంతదవ్వుల నప్పలప్ప లనంగ
                 నెదురుగాఁ బఱతేర నేత్త నైతి
వియ్యాలచే నిచ్చి వేడుక నను వారు
                 తిట్టింప విని దప్పి దేర నైతి


తే.

నకట మిథ్యామనోరథుం డైతిఁ గాని
కొడుకులం గని దమవారు గొండసేయ
నుండ లేదయ్యె సంపద లుబ్బె నేని
లేబరమ కాదె బిడ్డలు లేని బ్రతుకు.

16


క.

ఈగర్భము రక్షించిన
నాగౌరవ మేమిఁ జెడక నారాయణ! నా
నాగుణసంపన్నులలో
సాఁగుదు నటు గాక యున్న సమయుదు వగలన్.

17


చ.

అనుడు నొకింత లేఁతనగ వాననపద్మము గారవింప మ
న్ననఁ గృప సేయు నేఁడొకదినంబును దీక్షితుఁడైన నాకు; రా

ననువగు నెల్లి భూసురకులాగ్రణి! యిన్ని విధంబులందు నీ
తనయునిఁ గాతు, నన్న హరి దప్పక చూచి యతండు దీనుఁడై.

18


ఉ.

నేఁడు ప్రసూతికాలమున నీవు గదాధర! మద్గృహంబునన్
వాఁడిమితోడ నుండి జము వాకిలి గట్టి మదీయసంతతిం
బోఁడిమితోడఁ గాచి ననుఁ బుణ్యునిఁ జేసినఁగాక యింతలో
మాడిన నేమి చేసెదపు మంత్రపునీళులు సల్లవచ్చునే.

19

అర్జునుఁడు విప్రార్భకరక్షణార్థము తా నరుగఁ గోరుట

క.

అనవుడు నెద జింతిల్లిన
వనజాక్షునితెఱఁ గెఱింగి వసుధామరుప్రా
ర్థన దీర్ప నన్నుఁ బనుపుము
పనివినియెద నంది లావుఁ బంతము మెఱయన్.

20


మ.

విని విశ్వంభరుఁ డల్ల నవ్వి కరుణావిర్భూతచేతస్కుఁడై
ననుఁ బ్రీతిం గడగంటఁ జూచి విజయా! నాచేత [6]నెబ్భంగి నే
పని యైనం గడతేఱుఁగాని యిది నీ పంతంబులం దీఱునే
యనిన్న్ మో మరవాంచితిన్ వినయలజ్జాయత్తచిత్తుండనై.

21


మ.

ధరణిదేవుని దైన్యమున్ నిజమనోధర్మక్రియానిష్ఠయున్ ,
విర[7]సోల్లాసమదాననావనతియున్ వీక్షించి పద్మాక్షుఁడు
ద్ధురతం దోడ్కొనిపొమ్ము రాముఁడునుఁ బ్రద్యుమ్నుండుఁ దక్కం బురం
దరపుత్త్రా! మన వీటిలోనఁ గలయోధవ్రాతమున్ నావుడున్.

22


మ.

యదువృష్ణ్యంధకభోజసైన్యములతో నభ్రంకషారావభి
న్నదిగంతద్వీపమండలుండ నయి కృష్ణశ్రీపందాభోజముల్
మదిలో నిల్పి మహీసురావసధరమ్య గ్రామమధ్యంబునం
బదిలుండైతిఁ బ్రసూతివేళ యమునిం బ్రత్యర్థి రాఁ జూచుచున్.

23


క.

ఎఱసంజ దాసనంబుల
తెఱఁగయ్యెను, గూబ లెల్ల దెసలఁ జెలంగెన్.

వఱడు లఱచె, నుల్కలు వడె,
నెఱి చెడి సురగాలి విసరె నిలువక పెలుచన్.

24


గీ.

అట్టియెడ సైన్య మెల్లఁ గట్టాయితంబు
చేసి [8]యేనును గాండీవశింజినీని
నాదమేదురభూనభోంతరుఁడ నగుచు
[9]నమ్మహీదేవుని గృహాంగణమ్మునందు.

25


ఉ.

ఉండునెడన్ భయంబున మహోద్దతిఁ గొందఱు వచ్చిపట్టుప
ట్టుం డిట తెండు పొండని కడున్ రభసంబున నాడుమాటలుం
బండియుఁ బొల్లవోయెనని బ్రాహ్మణి లోపల నేడ్పు నేడ్చు నొం
డొండ కడంగి తచ్ఛిశువు నుద్భవమున్ మరణంబు దెల్పినన్.

26


స్రగ్ధర.

గాండీవారావఝంపాఘటితభయదివౌకఃపురాంతఃపురంధ్రీ
గండాభోగశ్రమాంభఃకణకలుషితగంగాతరంగాభిషంగా
ఖండాస్మత్కాండపాళీకబళితసకలాకాశసీమానిశాంతో
ద్దండాతిక్రాంతగర్భాంతకయమభటసంతానముం గాననైతిన్.

27


గీ.

పోయె బాలుండు యదువృష్ణిభోజబలముఁ
జిన్నవోయెను జూడ వచ్చినజనంబు
డించి పోయె మదీయగాండివము లజ్జ
వోయెఁ గొనిపోయె [10]భూసురపుత్రు జముఁడు.

28


వ.

ఇవ్విధంబున గాండివమ్ములావు వమ్మయినం గ్రమ్మునుమ్మలికంబున విన్న
నైన నన్నుం జూచి యవ్విప్రుండు.

29

నిజకుమారుని యముఁ డపహరింపఁగా బ్రాహ్మణుఁ డర్జునుని దూఱుట

క.

ఓపార్థ! నిను నమ్మితి
బాపని రక్షింప కిట్ల పార్థుఁడ వైతే
నాపాలిపారిజాతము
గోపాలకచక్రవర్తిఁ గొని రానైతిన్.

30

చ.

పిలిచితి నన్న నిన్ను నతిభీతుఁడ విప్రుఁడ నమ్మినాఁడ నీ
పలు కనృతంబు గాఁదగునె పాఱెడుబండ్లకుఁ గాళ్లుసాఁపఁగా
నలవడు నన్న పోటుమగఁడై యిటు చేసితిగాక యాసతో
నిలుతు మురారి నన్నచట నీళుల ముంచినఁ బాల ముంచినన్.

31


క.

మే లైననుఁ గీ డైనను
నాలవపా [11]లాఫలము ధనంజయ రక్షా
శీలునకుఁ జేరు నీ వీ
బాలుని రక్షింప [12]వట్టిఫల మందఁదగున్.

32


క.

నీవేమి సేయు దీగాం
డీవము నీ కిచ్చి [13]యమ్ము డెప్పర మైనన్
లావుగల దంచుఁ బలికిన
[14]పావకు చేఁగాదె కోలుపడితిఁ గుమారున్.

33


గీ.

అనుచు ననుచారియై విప్రుఁ డరుగుదేరఁ
దేర గాండివ మిడి యస్మదీయమహిమ
మహి మడుంగ మడుంగగుమనసు మాయ
మాయ గన్నులఁ గ్రమ్మఁ గ్రమ్మఱితి నేను.

34


క.

ఈరూపున బొలివోయిన
బీరముతో వృష్ణిభోజవిభు లేతేరన్
ద్వారవతి కరిగి నిలిచితి
నారాయణు నెదుర ఖేదనమ్రముఖుఁడ నై.

35

విప్రకుమారుల నుజ్జీవింపఁజేయుటకై కృష్ణుఁడు పార్థసహితముగాఁ బోవుట

సీ.

అట్లున్న నన్ను నొయ్యన గారవించి యా
                 భూసురోత్తముఁ జాల బుజ్జగించి
నీకుమారకుల నేలోకంబునం దున్న
                 దెత్తు; నీ కిం తేల ధృతి గలంగ?

ననుచుఁ బీతాంబరుం డనుపమాభరణుఁ డై
                 శార్ఙ్గకౌమోదకీచక్రనంద
కాదిప్రహరణంబు లరదంబుపై బెట్టి
                 దర్వీకరాహితధ్వజము మెఱయ


తే.

దారకుని డించి సారథిత్వంబు నాకు
నొసఁగి భూసురసహితుఁ డై యొప్పుమెఱసె
గృతవలాహకసైన్యసుగ్రీవమేఘ
పుష్పసన్నాహ మగురథంబున మురారి.

36


వ.

ఇవ్విధంబున వసుదేవనందనుండును నేమును రథగమనోచితం బగు
పథంబున వితతమనోరథులమై వెడలి మదముదితమాధవమహిళామంజుశింజాన
మంజరీకోలాహలహళహళితహంససందోహసందీహ్యమానకుముదదళాళింద
కళింగనందనీసందర్శనంబువలనను లాటివధూటీకటకనికటవిషంకటతటనట
త్సారససంచయచంచుపుటవిపాటితకమలముకుళపుటకుటీరపటీయఃకేసర
కడంగరీయభ్రమరవిభ్రమభ్రమణభాసురభాగీరథీవిలోకనంబువలనను మనంబు
రంజిల్ల మచల్లకంబు మట్టి మ్లేచ్ఛంబు మెట్టి దరదంబు దాఁటి కాశ్మీరంబు గడచి సైం
ధవం బనుసంధించి నారదంబు పరిభ్రమించి హిమాచలం బెక్కి హేమకూటంబు
ద్రొక్కి నిషధం బతిక్రమించి నిమిషంబున.

37


చ.

కదిసితి మంత దంతపరిఘద్విపఖండితదేవదారువున్
మదనవినోదకందళితమానసమానసవాసభీరువుం
బ్రదరపదాచ్యుతక్రకసాటితలస్తకదేశచారువున్
ముదితచమూరువున్ ఫలితమూలనమేరువు నాసుమేరువున్.

38


గీ.

కడచి వర్షాచలంబునుం గడచి మఱియు
నెడ నెడం గలవిపినంబు లేఱు లద్రు
లన్నియును దాఁటి కంటి ముద్యత్తరంగ
నాకడోలాకరంబు రత్నాకరంబు.

39


గీ.

అతఁడు నెదురుగ వచ్చి మురాంతకునకు
నర్ఘ్య మిచ్చి లోకేశ నా కానతిమ్ము

చేయఁ గల కార్య మనుటయు సింధురాజ
తెరువు [15]విడు నాకు నుత్తరదిశకు ననిన.

40


ఉ.

నావుడుఁ గంసవైరికిఁ బ్రణామము చేసి పయోధి యిట్లనున్
దేవ భవన్నియోగమునఁ దేఁకువదప్ప దొకండు నాపయిం
బోవఁగ లేఁడు కాల్నడ విభుండవు నీవు చనంగ నంతయుం
ద్రోవ యగున్ సమాశ్రితుఁడు దూలిన నెవ్వగ నీకుఁ బుట్టదే.

41


గీ.

అనుడు విప్రార్థమై నాకు నరుగవలసి
త్రోవ వేఁడితి మఱి నిన్ను దేవతలకు
దేఱి చూడంగ రా దన్నఁ దెలిసి జలధి
రథము చనునంత శోషింతు బథము గొనుము.

42


చ.

అనుడు మురారి యిట్లను మహాంబునిధీ! తగ దింక నింక నీ
కనితరగమ్యధైర్యము ననర్హమణిప్రకరంబు నెవ్వరుం
గనుఁగొన నేల నేల నొడికంబుగ నేఁగినమాడ్కి నాహరుల్
చనియెడు నంబువూరము శిలాసదృశంబుగఁ జేయు నావుడున్.

43


క.

ఆపారావారము ఱా
రూ పై రథ మరుగునంత త్రోవ విడిచినన్
వే పఱపితిఁ దురగములఁ గ
ళాపాండిత్యంబు హరితలంపున కెక్కన్.

44


వ.

ఇత్తెఱంగున నుత్తరసాగరం బుత్తరించి చిత్తం బలర గంధమాదనంబు
సేరి.

45


గీ.

వచ్చు నెడ జయంతం బన వైజయంత
మనఁగ నీలంబు నారజతాచలం బ
నఁగ మహామేరుకైలాసనగము లనఁగ
నింద్రకూటంబు నా వచ్చె నేరుగిరులు.

46


గీ.

వివిధవర్ణరత్నప్రభావితతి మెఱయఁ
దమ్ము బనిపంచు మనిన మాధవుఁడు భూధ

రములఁ గృపఁ జూచి మీయందు రథము నడవం
దెఱపి యిం డన్న ననియు నత్తెరఁగు చేసె.

47


క.

అంతట నేడునగంబులు
నంతర్ధానంబు [16]చేసి యట చనఁగా న
త్యంతభయంకరకర్దమ
సంతమసంబున రథంబు సాగక నిలిచెన్.

48


మ.

మఱియుం జీఁకటికొండ చందమయినన్ మాకెల్లఁ బాతాళము
న్దఱియం జొచ్చు తెఱంగు దోఁచె నచటనే దైత్యాంతకుం డుద్ధతి
న్నఱకెం దత్తిమిరంబు నంబుధములోనం దోఁచుదంభోళిద
[17]గ్గఱుచుట్టం బన విక్రమక్రమణచక్రక్రీడ శోభిల్లఁగన్.

49


శా.

ఆకాశంబు వెలుంగఁ దోఁచె నడ పో నత్యద్భుతాకారుఁడై
రాకాచంద్రదివాకరానలశిఖారత్నప్రభాజాలరే
ఖాకాంతింబురుషుం డొకం డచట లోకం బెల్ల నిండించినన్
మాకన్నుఁగవ లిట్టిరూప మని నమ్మజాలవయ్యె న్నృపా.

50


క.

నను నవ్విప్రుని నచ్చో
నునిచి జగన్నాథుఁ డఖిలయోగనిధి జనా
ర్దనుఁ డాతేజములో[18]నం
జనఁ జొచ్చె న్మగుడఁ దెచ్చెఁ జచ్చినసుతులన్.

51

కృష్ణుఁడు విప్రకుమారులఁ దెచ్చి యిచ్చి ద్వారకకు వచ్చుట

తే.

ఎవ్వఁ డెయేఁట బుట్టె నయ్యేటి[19]వయసు
సుతుల మువ్వుర నాఁడు గన్నతనిఁ గూర్చి
యిచ్చె నలువుర సుతుల మహీసురునకు
వచ్చితిమి క్షణంబున ద్వారవతికి నేము.

52


మ.

దివసార్ధంబునఁ జోయి వచ్చుట ధరిత్రీనాథ చిత్రంబు భ
క్తవిధేయుం డగు దేవదేవుని ప్రసాదం బెట్టిదో యేము బాం

ధవులం గ్రమ్మఁ జూడఁగంటిమి ప్రమోదంబార నద్దేవుఁడున్
వివిధార్థంబులతోడ వీడుకొలిపె న్విప్రుం గృతాహరునిన్.

53


ఆ.

బంధుభోజనంబు భాస్కరపూజయుఁ
బొందుపడఁగ నేనుఁ బొత్తుగలియఁ
గేలన వృష్ణిసాత్యకులుఁ బంతి గుడువంగ
యదుకులాభిచంద్రుఁ డారంగించె.

54


వ.

తదనంతరంబ సభామండపంబున నుచితకథావినోదంబులు సలుపుచున్న
యన్నారాయణునకుం ప్రణమిల్లి మెల్లన యిట్లంటి.

55


తే.

సాగరము నీరు పేరుట శైలకులము
తెరువు లిచ్చుట చీఁకటి నరకువడుట
దివ్యతేజంబు దోఁచు టద్దీప్తి నీవు
సొచ్చుట కుమారులం గొని వచ్చు టేమి ?

56


క.

అతిదూరమైనమార్గము
కతిపయపదగమ్య మైనకతముఁ దెలియ నా
నతి యీవే యనుడును స
న్మతిఁ గైకొని దానవారి నా కిట్లనియన్.

57


సీ.

అపుడు తేజోమయం బైనరూపంబు మ
                 త్ప్రకృతి యందుఁ జరాచరంబు దోఁచు
మడుఁగు నప్పురుషుండు మద్దర్శనకుతూహ
                 లముగ నవ్విప్రబాలకుల మ్రింగె
వారు కారణముగా వత్తు నే నని యంధ
                 తమసంబు నేన భేదకుఁడ నేన
యచలంబు లేన రంధ్రాపాది నేన సా
                 గర మేన సంస్తంభకారి నేన


తే.

పంచభూతాత్మకంబు ప్రపంచ మిందుఁ
గలిగినది లేనియది లేదు కల దనంగ
నున్నయదియె సర్వంబును నుచితగమ్య
మిది రహస్యంబు దెలిపితి నెరఁగు పార్థ!

58

తే.

అక్షరత్రయరూపమై యఖిలయోగ
మూల మగుప్రణవంబు నా మూర్తి సుమ్ము
నీకుఁ జెప్పితి, నత్యంతనియతమతికిఁ
దప్ప నీ మంత్ర మొరులకుఁ దగదు తెలుప.

59


చ.

అని పరమోపదేశముగ నానతి యిచ్చిన యంతనుండియు
న్వనజదళాక్షు భక్తజనవత్సలు [20]వేదశిఖావతంసపా
వనపదపల్లవుం ద్రిదశవల్లభసేవితు నాశ్రయింతు నా
మనమున ఘోరదుర్దశలు మట్టిన సంపద మిన్ను ముట్టినన్.

60


క.

అన విని ధర్మతనూజుఁడు
జనపతులును గృష్ణుఁ జిత్తసరసిరుహములం
దునిచి పులకాంకురమ్ములు
మొనయఁగ నానందబాష్పములు వెడలంగన్.

61


క.

అని చెప్పిన వైశంపా
యనునకు జనమేజయుఁడు ప్రియం బారఁగ ని
ట్లను మురవైరి పరాక్రమ
మనఘా వినవలతుఁ జెప్పుమా పరిపాటిన్.

62


వ.

అనుటయు వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.

63


సీ.

మడియించె వక్రాఖ్యు మాహిష్మతీనాథు
                 నరకాసురునిఁ జంపె నాకవిభుని
దట్టించి పారిజాతము దెచ్చె లోహిత
                 హ్రదమున వరుణు [21]నూటార్చె నూఱు
చెట్టలు సైరించి శిశుపాలు నరకె శో
                 ణితపురంబున నగ్ని నీలలోహి
తుని గెల్చె బాణునిఁ దోలె వార్ధిఁ గలంచి
                 పాంచజన్యంబు చేపట్టి రూప

తే.

[22]డంచె నా జరాసంధుఁ బాండవుల మనిచె
గాండివం బిచ్చె నరునకు ఖాండవమునఁ
దల విఱిచెఁ గలయవను మైందద్వివిదుల
ను బ్బడఁచె జాంబవంతునియుక్కు మడఁచె.

64


శా.

చేసెన్ దౌత్యము యాదవాన్వయము రక్షించెం గురుక్షోణి నా
థా! సాందీపుని పుత్తునిన్ జనకుఁ జైతన్యంబు బొందించెఁగా
దే సాల్వుం బడవైచె సౌంభకముతో దేశాధిపోదగ్రులన్
గాసిం బెట్టె విశాపుఁ జేసె నృగునిం గంసారి సామాన్యుఁడే.

65


వ.

అనుటయు జనమేజయుండు.

66


క.

ఎన్ని తెఱంగుల ముందఱ
విన్నను మురవైరి మహిమ విన నింపగు నా
వెన్నుఁడు గైలాసమునకుఁ
జన్న తెఱఁగు శివునిఁ గన్న చందముఁ జెపుమా.

67


మ.

 పరివాదాస్పదవాదమోదమదిరాపానంబుచే మత్తులై
హరి మేలంచు హరుండు మే లనుచు నాహా కొంద ఱీపొం దెఱుం
గరు కైలాసనగంబునందు మును లేకత్వంబు భావించి రా
మురవైరిం బురవైరిఁ బాపుట మహామోహంబు ద్రోహంబగున్.

68


క.

పదునాలుగులోకంబులుఁ
బొదలింపం ద్రుంపవలసి పొడవులు రెండై
తుదిఁ దా రొక్కటి యగుదురు
వదరలఁ జేయుదురు భేదవాదులనెల్లన్.

69


తే.

పుండరీకాక్షునకు శూలి పూజలిచ్చె
సంయములు చూడ బదరికాశ్రమమునందు
వాఁగ విందు మయ్యిరువురనాటకంబుఁ
జెప్పి చెవులకుఁ బండువు సేయు మనఘ!

70

వ.

అనుటయు వైశంపాయనుం డాజనమేజయున కిట్లను జనార్దనుండు
రజతాచలంబునకు నరుగుటయు నద్దేవుండు నిశ్చలతపశ్చరణంబుల నుండు
టయు నవ్విభుని దివ్యమునిగంధర్వదేవతానివహంబు చూడవచ్చుటయు నచ్చట
హరుం డానారాయణునకు వరం బిచ్చుటయు నయ్యిరువురయేకత్వంబు సకల
లోకంబులుఁ దెలియుటయుం దెలియం జెప్పెద నాకర్ణింపుము.

71


శా.

కంసారాతి మురామురారినరకక్రవ్యాదముఖ్యాసుర
ధ్వంసాపాదనవీతకంటకవతిన్ ద్వారావతిన్ రుక్మిణీ
హంసీహారమృణాలహారిభుజమద్యస్భారకాసారుఁడై
సంసారార్ణవసారమన్మథసుధాసారంబునం దేలఁగన్.

72


సీ.

యమునాతరంగడోలాధిరోహణమున
                 [23]డంబుమీఱెడుమరాళంబువోలె
హరినీలమణిమనోహరమందిరస్తంభ
                 ముల వినోదించు కీల్బొమ్మవోలె
దళితనీలోత్పలదళదామసంగతిఁ
                 గొమరారుసంపంగిగుత్తివోలె
దరుణతమాలపాదపశిఖాశాఖలఁ
                 జెలువారువలరాచచిలుకవోలె


తే.

బారిజాతగోవర్ధనోత్పాటనమున
బలిమి తొడవైన మురవైరిబాహుయుగము
తెప్పగా మన్మథాంబుధిఁ దేలుచుండె
రమ్యగుణమణి రుక్మిణిరమణి ప్రీతి.

73

రుక్మిణీదేవి తనకు సుపుత్త్రు ననుగ్రహింపుమని శ్రీకృష్ణుని వేఁడుట

శా.

ఆరామాతిలకంబు మన్మథవినోదైకాంతగేహంబులో
గారామై యొకనాఁడు లేనగవు శృంగారంబుగాఁ గన్నులం
బారం బేదనిలజ్జఁ దోఁప హరికిం బాదప్రణామక్రియా
ప్రారంభం బగుభ క్తిఁ గుట్మలితహస్తాంభోజయై యిట్లనున్.

74

గీ.

అఖిలలోకైకనాథ! నీయట్టిరూప
విక్రమౌదార్యశౌర్యవివేకనిలయు
నొకకుమారుని దయచేసి యుర్విలోనఁ
గడుపు చల్లనికాంతలఁ గలుపు నన్ను

75


వ.

ఈవరంబు నా కీవై తేని.

76


క.

మును రుక్మిణి తన్నడిగిన
దనుజాంతకుఁ డేవరంబుఁ దప్పక యిచ్చుం
దనయుని నడిగిన నీఁడని
జను లాడఁగఁ జెవులు నేఁడు సంకటపడవే.

77


క.

కాచికొని కొడుకు నడిగెనఁ
[24]టేచనవున నాలు మగఁడ[25]ఁ టేవర మిచ్చెం
జూచెద మను సవతులచే
నీచులకఁదనంబు చేరనీకుము కృష్ణా!

78


చ.

అనిన మురాంతకుండు దరహాసము మోమునఁ దొంగలింప నో
వనజదలాక్షి! నీకుఁ దగవా? యిటు లాడుట నన్ను నీవె వేఁ
డిన నటు చేయకుండుట ఘటిల్లునె చేసిన నెవ్వరైన మె
చ్చనిపని యేను జేయుదును సంతసమందుము కోర్కి దీర్చెదన్.

79


క.

తన వలచు కాంత యేపని
మనమునఁ దలఁచినన జేయుమగవానికి న
వ్వనిత బిగియారుకౌఁగిలి
దినదినమును మదనకామధేనువు గాదే.

80


క.

పుత్త్రులకలిమియె శుద్ధక
ళత్రమునకు లక్షణంబు లక్షణవతు లై
పుత్త్రవిహీసతఁ బొరసినఁ
బాత్రములే సతులు పతులు పాటించుటకున్.

81

మానిని వినవే 'పున్నా
మ్నో నరకా త్త్రాయతే' యనుట పుత్త్రార్థం
బైనది నీ కోరిక నా
మానస మలరించె వేదమార్గోచితమై.

82


వ.

అని పలుకుచు నాలీలావతివిలోచనంబులం బొరయు లజ్జావినయదర
హాసంబులకుం దనమేలంబునుం గరుణయు సమేళంబున నెదుర్కొన నారాత్రి వర
లాభంబున బ్రభావిభాసిత యగునద్దేవితో వినోదించి.

83


మ.

మఱునాఁ డంధకభోజవృష్ణియదుసామంతాగ్రణీసేన గం
దెఱగా సాత్యకి రాముఁ డుద్ధవుఁడు హార్దిక్యుండు లోనైన కొం
ద ఱమాత్యుల్ దనుజుట్టిరా నమరె నాస్థానంబునం గృష్ణుఁడా
కఱకంఠుండు పరీతపారిషదరేఖం [26]జూచుచందంబునన్.

84


క.

అప్పరమపురుషుఁ డందఱ
దప్పక కనుఁగొని ప్రసాదదరహాసములన్
ముప్పిరిగొను భాషణముల
నప్పటి కప్పటికి వేడ్క లలర నిటు లనున్.

85


మ.

శిశుతాకేళిఁ దొడంగి గర్వితులఁ గేశిం గంసు జాణూరునిన్
శిశుపాలున్ నరకాదులం బరువడిం జెండాడి సప్తార్ణవీ
రశనారాజవిరాజితక్షితిసతీరత్నప్రభామాలికా
విశదాల్మీయగుోల్లసన్నృపయశోవిక్రాంతిఁ జెల్లించితిన్.

86


చ.

పరఁగినవాఁడు నేఁడు ధరఁ బౌండ్రుఁడు రాజులయం దభంగుఁడై
నరకుఁడుఁ దాను మిత్రములు నాకును వానికి సాటిగాని యె
వ్వరికిఁ దరంబు గాదు యదువంశము మ్రింగుదు నంచు నుండు నీ
శ్వరుఁడు గణంబులం గలసివచ్చిన నంబుధి[27]లోనఁ జొచ్చినన్.

87


వ.

ఇంత సెప్పుటకుఁ గతం బేమియనుతలంపు గలదేని (ంజె ప్పెద)
వినుండు

88

శా.

చూడం బోదు గజాపనీతకటఖర్జూభూర్జఖర్జూరలీ
లాడోలాసుఖలేఖలోకమహిళాలంకారహారక్షణ
క్రీడాతారకితాంతరాళతరళశ్రీకంఠకంఠప్రభా
చూడాచంద్రకళాకిలాసము సతీశుద్దాంతకైలాసమున్.

89


ఆ.

బదరికాశ్రమంబుఁ బావనమునిలబ్ధ
విశ్రమంబు నచట విమలయోగ
దీపికాప్రకాశతేజోమయాకారు
భుజగహారు హరుని భువనగురుని.

90


క.

కనుఁగొని నాతలఁచినపని
యనువుపఱిచి మఱిచి యైన నలయక వేగం
బున వత్తు వచ్చునంతకు
మనవీ డేమఱక కాచు మత ముచిత మగున్.

91


సీ.

కోట [28]సింగారించి కొత్తళంబుల నెల్ల
                 నట్టళ్ళు వన్నించి యాళువరికిఁ
బందిళ్ళు పెట్టించి [29]పైకొమ్మ లెగయించి
                 గుండుదూలము వసికొయ్యఁ గూర్చి
యగడిత లీఁతనీ రలవడఁ ద్రవ్వించి
                 వెలిచుట్టిరా [30]ములు వెలుగు వెట్టి
డంచనంబులు దద్దడంబులు నెత్తించి
                 పలుగాఁడితలుపులు బలుపుచేసి


తే.

బాళెము ల్వెట్టి క్రొంకులు బ్రద్దపరులుఁ
గత్తి గొంతంబు లొడిసెళ్ళుఁ గత్తళములు
నారసములును విండులు నగరిలోనఁ
బెట్టి పెట్టుఁడు నడు[31]హట్టి[32]మట్టిలావు

92


క.

ఈకోటకు నొకదిక్కున
వాకిలి సారించి యానవాలుగఁ జారుల్

రాకలఁ బోకలఁ జక్రముఁ
జేకొని రక్షకులతోడఁ జెప్పి చనఁ దగున్.

93


మ.

పురిచుట్టు న్నిచరుండు సారణుఁడు నీభోజాంధకు ల్గూడి క
త్తెరగాయంబుల గండముం[33]గిళుల సందిం గొమ్మకొమ్మ న్నిరం
తరమున్ [34]సోదనదీవె లెత్తి చనుఁ డుత్తాలధ్వజాభీలగో
పుర భేరీరవభిన్నవైరి హృదయాపూర్ణంబుగా రాత్రులన్.

94


వ.

అని పలికి సాత్యకిం గనుంగొని.

95


మ.

శరకోదండకృపాణకంకటశిరస్త్రాణంబులం బూని సం
గరసన్నాహవిహారి వై నగరరక్షాదక్షతం జూపు శా
ర్వరి నిద్రం బెడిఁబాసి వాదనిగమవ్యాఖ్యానము ల్మాని యె
వ్వరిచేత న్నగుఁబాటు దేక పరభావజ్ఞుండవై తమ్ముఁడా!

96


వ.

అనుటయు సాత్యకి యిట్లనియె.

97
ఉ.

దేవర యానతిచ్చినగతిం గృతకృత్యుఁడ నైతి వీటికిం
గావలి పెట్టి పౌండ్రవిభుకన్నులు గట్టి ప్రలంబవైరికిన్
సేవ [35]యొనర్చి నీ కిచట సిద్ధఫలంబులు గోరి యుండెదన్
దేవత లైన నా కెదిరి ధీరత మైమయిఁ బోవ నేర్తురే.

98


వ.

అనియె నట్టియెడ నమ్మహీధరధరుం డుద్ధవాచార్యున కిట్లనియె:

99


ఉ.

తండ్రులు మీరు మీకు నయతత్తముఁ జెప్పెదమన్న మమ్ము నే
మండ్రు జనంబు, లూఱడు బృహస్పతి మీయెడ, నేను లేనిచో
వెండ్రుకయంతమోసమును వేచి దురంబున కెత్తి వచ్చు నా
పౌండ్రుఁడు వానిచేత మనబంధులు చిక్కకయుండఁ గావుఁడీ.

100


వ.

అని పలికి హలాయుధుం గనుంగొని.

101


మ.

గద చేతం గొని యున్న [36]ని న్నమరదిగ్దంతావళశ్రేణియుం
[37]గదియం జాలదు చాలదుస్తరము మత్కైలాసయాత్రాంతరో
న్మదపౌండ్రక్షితిపాలసంగరము ధీమన్మంత్రిసామంతస
మ్మదశక్తి న్విముఖప్రమాదమతివై మర్దింపు మీ శత్రులన్.

102

గీ.

అనుటయు హలాయుధుం డియ్యకొని నృపాల
సంఘమును దాను వీడ్కొని చనియె నపుడు
హరియుఁ గైలాసయాత్రకు ననువు చేసి
తలఁచె సౌపర్ణు శతకోటితరణివర్ణు.

103


వ.

అంత.

104

శ్రీకృష్ణుఁడు గరుత్మంతుని నెక్కి కైలాసంబునకుఁ బోవుట

మ.

హరిదంతద్విపదంతకుంతశిఖరాహంకారనిశ్చింతని
ర్జరరాజార్జితవజ్రజర్జరితవిద్ఛాయైకరోమచ్ఛని
స్థిరవిద్యుత్ప్రతిపక్షవక్షుఁడయి వచ్చెన్ వైనతేయుండు భా
స్కరబింబప్రతిబింబ మంబరము మ్రింగం బారు చందంబునన్.

105


గీ.

వచ్చి నిజపాదపంకజావనతుఁడైన
వైనతేయుఁ గనుంగొని వాసుదేవుఁ
డల్లఁ గరపల్లవంబున నాదరించి
పయన మెఱిఁగించి యెక్కె నప్పక్షివిభుని.

106


వ.

ఇవ్విధంబు వివిధగతిసంచరణచాతురీధురీణ గరుడాధిరోహణంబున
నతిత్వరితంబుగా సములాసంబునం గైలాసంబుఁ జేర వచ్చునప్పుడు.

107


సీ.

వాచంయమోత్సంగ[38]వత్సలసారంగ
                 మురుచషాలస్థూలయూపశతము
ప్రాగ్వంశబంధురబహుగంధసాన్నాయ్య
                 మాగ్నీధ్రముఖ్యర్త్విగాశ్రయంబు
సుత్రామసఖయాయజూకసామాజికం
                 బాతిథేయమయోటజాజిరంబు
పటుధవిత్రపవిత్రపవనోజ్జ్వలత్రేత
                 మఘమర్షణజ్ఞశౌకాంచితంబు


తే.

సంతతబ్రహ్మచర్యసుస్నాతకంబు
పరమయోగినిరాకృతపాతకంబు

హస్తికైతిహ్యసహ్యపంచాననంబు
బదరికాకాననంబు చూపెట్టె నెదుర.

108


సీ.

పవనవేగవికీర్ణపాదపాగ్రంబుల
                 జడియకుండఁగఁ బట్టుసామజములు
పూజార్థనియమితపుష్పవాటికలపై
                 మధుకరంబులఁ జోఁపుమర్కటములు
నవభృథస్నానపర్యంతనిర్మలతకై
                 కాసారములఁ గాచుకాసరములు
నిజనిజోటజభాగనీవారసీమలు
                 సొరక కావలి యుండు సూకరములు


ఆ.

గలిగి కంసవైరి కన్నులపండువై
చెలువు మిగిలెఁ బూర్ణకలశవిగళ
దాలవాలవారిహరి[39]తమువిదారి
కాశ్రమంబు బదరికాశ్రమంబు.

109


వ.

మఱియుం దదాశ్రమంబు వలాహకంబునుంబోలెఁ గరకాస్పదంబై కుంజ
రంబునుం బోలెఁ గుంభాభిరామంబై రంగస్థలంబునుం బోలె శైలూషశతరమ్యంబై
యింద్రపదంబునుం బోలె నైరావతరుచిరంబై తరుణీముఖంబునుం బోలెఁ దిలక
విరాజితంబై పరమయోగిహృదయంబునుం బోలె మోక్షనిలయంబై పారావారాంబునుం
బోలె నమృతోత్పాదనస్థానంబై మహాభారతంబునుంబోలె శతపర్వసనాథంబై
గగనంబునుంబోలె ఋక్షగణసంకీర్ణంబై కర్ణరథంబునుంబోలె శల్యాధిష్ఠితంబై వేఱొక్క
తెఱుంగున రతిరమణరణవిరహితం బనుటకుం దగి శంబరసత్త్వవర్ధనస్థానం బై
యదృష్టపుండరీకం బనుటకుం దగి రాజోదయనిధానంబై రామమనోహరం
బనుటకుం దగి వైదేహికృతపరివేష్టనంబై పరిపుష్టవాజినికరం బనుటకుం దగి సంత
తాహవనీయమానమహిమంబై గంధర్వనివాసం బనుటకుం దగి విష్ణుపదావలంబన
మూలంబై వెండియు నొక్కచందంబున బుద్ధసిద్ధాంతసంశ్రమం బయ్యును నజినవా
సస్థితిశోభితంబై పుణ్యజనేశ్వరనివాసం బయ్యును యమనియమవశంవదశాంతలో

కంబై సమద్భారధురీణసంకులంబయ్యును నక్షమాలాభాతిశయంబై యొప్పునప్పుండరీ
కాక్షుండు దద్దర్శనంబున హృదయంబు ప్రియంబునం బెనంగొన సాయంతన
సమయంబున.

110


సీ.

సంయమీశ్వరదత్తసంధ్యార్ఘ్యజలబిందు
                 జాలంబు నక్షత్రసమితి గెలువ
దాపసకృతదేవతానమస్కృతిహస్త
                 [40]ములు ముకుళితపద్మముల జయింపఁ
బారికాంక్షిహుతాగ్ని బహుధూమపటలంబు
                 దిక్కీర్ణదతిమిరంబు ధిక్కరింప
స్నాతకవల్కలక్షాళనోద్ధతకాంతి
                 సాంధ్యరాగద్యుతి సంహరింప


గీ.
ధైనుకాగమనోన్ముఖతరళవాత్స

కారవంబును సామగానారవంబు నంతకంతకుఁ జెలఁగంగ హర్షలీల

నంబుజాక్షుండు సొచ్చె నయ్యాశ్రమంబు.
111


తే.

గౌత మాత్రి విశ్వామిత్ర కణ్వ యాజ్ఞ
వల్క్య జాబాలి కాశ్యప వామదేవ
రైభ్య ధూమ్ర వాల్మీకి పరాశ రాంగి
రఃపవిత్రాక్ష శంకకర్ణ ప్రభృతులు.

112


క.

మునివరు లెదురుగ జని పా
వనలోచను లైరి గోపవల్లభసంద
ర్శనమునఁ గృష్ణుఁడు వారలఁ
గనుఁగొని సంభ్రమముతోడ గరుడని డిగ్గెన్.

113


వ.

ఇవ్విధంబున నితరేతరసందర్శనసమయ ముచితకృత్యంబు లాచరించి తత్తా
పసోత్తములు పురుషోత్తముం దపోవనమధ్యపర్ణశాలాంగణంబున నున్నతబ్రుసీ

సమాసీనుంజేసి యాతిథేయపరిగ్రహణానంతరంబున నతనితో
నిట్లని విన్నవించిరి.

114


సీ.

ఆకాశగంగ నీయడుగునఁ బొడమె నీ
                 కి ట్లర్ఘ్యపాద్యంబు లిచ్చు టెంత?
నిఖిలంబు రక్షింప నీరజోగుణమూర్తి
                 పని నీకుఁ గుశలసంప్రశ్న మెంత?
కమలంబు నీనాభి గన్నది నీ కిట్లు
                 పుష్పాంతరంబులపూజ యెంత?
యమృతంబు నీచేత నమరులు గుడిచిరి
                 నీకు వన్యాహారనియతి యెంత?


తే.

యెంచ మాభక్తి యెంత! మాయెఱుక యెంత!
మాతపోబల మెంత! మామనికి యెంత!
యింతసంతోష మెసఁగ నీ విచట నునికిఁ
గంటి, మిది మాకు భాగ్యంబు కలిమి గాదె.

115


క.

నీవారము నీ విచ్చితి
నీవారము మాకు భోగనియతసుఖంబుల్
గావింపుము మాప్రియములు
గావింపుము నీవు భక్తిగమ్య మురారీ.

116


వ.

అని పలుకుచు నద్దేవుని ననేకవిధంబులం గొనియాడి యాదేవునిం గొలిచి
వచ్చిన దివ్యమునిదేవతాసిద్ధవిద్యాధరగణంబులకు నాతిథ్యంబిచ్చి యామంత్రణంబు
చేసి యమ్మురాంతకు వీడుకొని నిజనివాసంబులకుం బోయిరి. తదనంతరంబ.

117


శా.

గంగానిమ్నగ దాఁటి యుత్తరతటీకాంతారపర్యంతభూ
మిం గంసారి పురారిఁ గోరి నియమోన్మీలన్మనఃపద్ముఁడై
భంగాపేతపయోధివోలె ననిలాపాయప్రదీపంబునా
నంగం బొప్పఁగ నుండెఁ దొల్లియుఁ దపోవ్యాస క్తిఁ దానున్నచోన్.

118


వ.

అట్టియెడ.

119

బదరికావనంబునఁ బిశాచద్వయంబు శ్రీకృష్ణునకు దృగ్గోచరమగుట

ఉ.

కుక్కలు వెంటఁబడ్డ నొక కొన్నిమృగంబులు వాఱె నెత్తురు
ల్గ్రక్కుచు నేలఁగూలె విశిఖంబులు నాఁటిన గొన్ని యున్నవే
దిక్కు నెఱుంగవయ్యెఁ గరదీపనికాయము చాయఁ బర్వఁగా
గ్రక్కున వచ్చి రంతట వికారశరీరపిశాచసైనికుల్.

120


వ.

అందులోన.

121


సీ.

వికృతాననంబులు విరళదంతంబులు
                 నిడుపైన దౌడలు నిక్కుమెడలుఁ
ముడివడబొమలును ముమ్మూలముక్కులుఁ
                 బల్లవెండ్రుకలును బడికితలలు
బొక్కిఱొమ్ములు లోఁతుఁబొట్టలు మిడిగ్రుడ్లు
                 గూనివీఁపులు నిడుఁగ్రొంకివ్రేళ్ళు
బూరకాళులు నీచఁబోయినచేతులుఁ
                 గోలమూఁపులు గుదిగొన్నతొడలు


తే.

నతిభయంకరగతి సూప నట్టహాస
కహకహారావములతోడఁ గాననయ్యె
దావపావకఘనశిఖాదగ్ధతాల
సాలసంకాశ మగు పిశాచద్వయంబు.

122


వ.

అందు నొక్కరుండు.

123


చ.

పిరిగొనఁ దాల్చు పెట్టముగఁ బ్రేవులు చుట్టి కపాలపాత్రలో
విరియఁ గలంచుఁ గ్రొమ్మెదడు, వెండ్రుక లేఱి తొలంగవైచు నె
త్తురు చవిచూచుఁ గండలు తుథూ యని క్రాయుఁ ద్రిశూలధారలం
జెరివిన ప్రేతమాలికలఁ జిమ్ముఁ బిశాచవిభుండు వేడుకన్.

124


వ.

మఱియొక్కరుండు.

125

(అచ్చ తెనుఁగు)

చ.

కఱచినపీనుఁగు న్వెడఁదకప్పెరయు న్మొలఁ బచ్చితోళులున్
బుఱియల పేరులు న్మెదడుపూఁతకు జుమ్మనిమూఁగునీఁగలుం

బెఱికినవాలు ఱొమ్ముపయిఁ బేరిన నెత్తురుత్రేపుడున్ గడున్
బిఱులుములచూపులుం దఱచు బీఱనరంబులుఁ గల్గురూపునై.

126


క.

చనుదేరఁగ నయ్యరువురఁ
కనుఁగొని మురవైరి వారి కలకలమున నె
మ్మనముం బదిలముచేయక
ఘనతరవిస్మయవికారకలితముఁ జేసెన్.

127


వ.

తదనంతరంబ దద్వికృతవేషవేతాళయుగళంబు నరులగళంబులు దెగనడిచినఁ
దొరుఁగు రుధిరంబు చవిగొని రుచియగుటయు హరికి సమర్పితం బయ్యె ననుచు
నద్దేవుని సహస్రనామంబులు పేరుకొని.

128


శా.

ఓ నారాయణ యో మురాసురహరా యో భక్తచింతామణీ!
యో నీలాంబుదవర్ణ! యో గుణనిధీ యో లోకరక్షామణీ!
యో నీరేరూహపత్త్రనేత్ర కృప నాయుల్లంబులో నుండవే
యో నా వే భవబంధముల్ చెఱుపవే యో దేవకీనందనా!

129


శా.

గోవిందాయ నమో నమో భగవతే గోపాలభర్త్రే నమో
దేవేశాయ నమో నమో మురభిదే దిక్పాలకర్త్రే నమో
భావజ్ఞాయ నమో నమో ముదహృతే పావప్రహర్త్రే నమో
జీవస్థాయ నమో యనంగ శుభముల్ చేకూరు మా కెప్పుడున్.

130


గీ.

అనుచు నిరువురుఁ దను జేర నరుగుదేర
గారవంబున వారి నాకంసవైరి
చూచుచుండంగ నం దగ్రజుండు గాంచి
పలికె నల్లన గంభీరభాషణముల.

131


ఉ.

ఎక్కడివాఁడ వన్న కడు నీరపుఁగాఱడవిం జరించె దీ
చక్కనిమేను నీ గరువచందము నెందును గాన మక్కటా
నిక్కము మాకుఁ జిత్తములు నీరగుచున్నవి క్రూరసత్తము
ల్ధెక్కలి గొన్నఁ జొక్కపడదే మదిలో నినుఁ గన్న తల్లియున్.

132


శా.

చేతోజాతుఁడు నీవు నే మవుదురో శీతాంశుచూడామణిం
బ్రీతుం జేయఁ దపంబు సేసెదొ విచారింపంగ నట్లే లగున్

బాతాళంబును నేలయుం దైవముం బాలించు సిద్ధుండవో
నా తండ్రీ నను నేలవచ్చిన జగన్నాథుండవో చెప్పవే.

133


క.

అనుటయుఁ బిశాచవల్లభు
దనభక్తునిఁగా నెఱింగి దామోదరుఁ డ
ల్లనఁ గరుణ వొడముకన్నులఁ
కనుఁగొని యిట్లనియెఁ బలుకుగారవ మొసఁగన్.

134


క.

భూజనములు యదువంశము
రా జనఁగాఁ బరఁగుదు న్నిరంతరమును స
త్పూజయును దుష్టశిక్షయు
నాజన్మవ్రతము లఖిలనాథుఁడ నగుటన్.

135


గీ.

నాకు నొకకోర్కి కైలాసనాథుచేతఁ
బార్వతీవల్లభునిచేతఁ బడయుతలఁపు
గలదు గావున బదిరికాకాననంబుఁ
జూడ వచ్చితి మీ రిందు సొచ్చు టేల?

136


చ.

వలదు మహామునీశ్వరులు వారి సదాశివచింతచేత ని
శ్చలగతి నున్నవా రిది పిశాచనివాసము గాదు మీరుఁ గు
క్కలుఁ గవియంగఁ బాఱెడి మృగంబులఁ జూచి సహింపరాదహోఁ
నిలువుఁడు వేయునేల తగునే కఱకుట్లునుఁ జంకఁ బొత్తముల్.

137


క.

వెలి నుండుఁ డిచ్చటికిఁ గా
వలి నే నుండంగఁ జొచ్చువారుం గలరే
బలిమిఁ బిశాచంబులు మీ
రలిగిన నలిగితిరి చూడనగునే మిమ్మున్.

138


వ.

అనుటయు నం దగ్రజుం డిట్లనియె.

139


శా.

ఘంటాకర్ణుఁడ నేను నాయనుజుఁ డీకాలాంతకుం డేము ము
క్కంటిం గొల్తుము కిన్నరేశుపనికిన్ కైలాసశైలంబునన్
జంట న్వచ్చినసారమేయములు నీసైన్యంబులున్ మావె యే
వెంటం బోయితి మేమి? కాఱడవిలో వేఁటాడరే యెవ్వరున్?

140

గీ.

నీపు నీపోవుదెసఁ బొమ్ము నీకు మాకు
మాట లేటికి ననుచు నమ్మరులుఱేడు
నచటఁ బ్రేవులు దర్భలు నాసనంబు
చేసి తనమానసంబునఁ జేర్చెఁ గృష్ణు.

141


క.

తలఁపునఁ జూచినరూపును
వెలిఁజూచినరూపు నొక్కవిధ మయి యున్నన్
నెలకొని ఘంటాకర్ణుఁడు
నలినాక్షుని నామకీర్తనం బొనరించెన్.

142


వ.

 అద్దేవుని నుతియించు నప్పుడు.

143


సీ.

తొమ్మండ్రుగొడుకులఁ దొలివేలుపులఁ జేయుఁ
                 బొడమించు నేదేవు బొడ్డుఁదమ్మి
మూఁడుత్రోవలఁ బాటి మున్నీటిగరిత గాఁ
                 బరఁగు నేదేవునిపాదతటిని
పండ్రెండురూపులై పగలింటి రాజు గా
                 వలఁతి యేదేవుని [41]వలనుఁగన్ను
వేయిమానికపుదివ్వెలతోడఁ బడగలు
                 మ్రాల్చు నేదేవునిమలకపాన్పు


గీ.

మునులకెల్ల నేదేవునిమూర్తి వెలుఁగు
హృదయగేహంబులో దీప మెత్తి నట్లు
హరి మురారి నద్దేవు మహానుభావు
మనసులోఁ గంటి భవములు మాను నంటి.

144


వ.

అనుచు విలోచనంబులు దెఱచి చూచి.

145


సీ.

పుండరీక[42]ములతోఁ బురణించుకన్నులఁ
                 గారుణ్య మనుతేనె గడలుకొనఁగఁ
మందారశాఖతో మలయఁ జాలెడు కేల
                 బాంచజన్యం బనుపండు మెఱయ

నుదయాద్రితటము[43]తో నుద్దించునురమునఁ
                 గౌస్తుభం బనుదివాకరుఁడు దోఁప
నాకలోకంబు[44]తో నవ్వుపాదంబున
                 నాకాశనది యనునమృత మొప్ప


తే.

నమృతధారాధరము మాటలాడినట్లు
భాగ్యదేవత రూపు చేపట్టినట్లు
లలితగతి నున్న సద్గుణాలంకరిష్టు
విష్ణుఁ బొడగంటి భవముల వీడుకొంటి.

146


వ.

అనుచుం ప్రణామంబు చేసి.

147


క.

పకపక నవ్వుచు నొకవి
ప్రుకళేబరమాంస మెల్లఁ బుచ్చి పునుకపా
త్రిక లోనఁ గడిగి పెట్టుచు
నకుటిలమతిఁ గృష్ణ! 'నీకు నర్పిత' మనుచున్.

148


గీ.

ఆరగింపవె దేవ! మాయందు విందు
వేలు పన్నఁ బాటింతురు విప్రమాంస
మిచట మత్ప్రీతిసేసి న న్నేలికొనుము
భక్తి గాని నీ కేమియు బ్రాఁతి గాదు.

149


క.

నావుడు మురారి నవ్వుచు
నావేఁదుఱు నూఱడించి యనుచితము మహీ
దేవునిఁ జంపుట యనుచుం
గైవెక్కినవానిమేను కరమున నిమిరెన్.

150


వ.

నిమురుటయును.

151


క.

తామరరేకులఁగన్నులు
సామజహస్తములు దొడలు శశిమండలమున్
మోమును మెఱుపును నొడలును
సోమింపఁగ దివ్వరూపసుందరుఁ డయ్యెన్.

152

క.

అంటినమాత్రన హరిచే
ఘంటాకర్ణుండు మెఱసె గంధర్వపదం
బంటినగతి సిద్ధపదం
బంటినగతి దివ్యతేజ మంటిన కతనన్.

153

శ్రీకృష్ణుఁడు ఘంటాకర్ణున కింద్రపద మిచ్చుట

చ.

అతనికిఁ బ్రీతి నిట్లను మురారి బలారిపదంబు నీకు ని
చ్చితి నతనిం దొలంగ విధి చేసిన వాఁ డమరావతీపురీ
పతి వని నేఁడ నీ నుదుటఁ బట్టము గట్టితిఁ గొంతగాల మి
ట్లతిశయభోగ మొంది పరమాత్మునిఁ గూడఁగ రమ్ము పిమ్మటన్.

154


క.

నీతమ్ముఁడు నీరూపున
నీతోడన కూడ వచ్చి నిర్జరరాజ్య
స్వాతంత్ర్యముఁ గని పిమ్మట
నాతత్త్వముఁ గూడ వచ్చు నాకాధిపతీ!

155


చ.

అని వర మిచ్చి వానివినయంబునకు న్మదిమెచ్చి వెండియుం
గొనుము వరంబు నీ వనినఁ గోరె భవచ్చరణారవిందభా
వనకు మదాత్మ యింత గడవ న్మురభంజన వేయు నేల యే
జననమునందు నిట్ల నిను సంస్తుతి సేయఁగ నిమ్ము నావుడున్.

156


శా.

సంతోషించె మురారి యంతట భవిష్యన్నాకలోకాధిరా
ట్కాంతున్ శక్రుఁడు దోడికొంచుఁ జన ఘంటాకర్ణుఁ డట్లేగు వృ
త్తాంతం బంతయుఁ గృష్ణుచేత విని సాంద్రానందపూరావృత
స్వాంతం బయ్యె మునీంద్రలోకము పునస్సందర్శనాహ్లాదియై.

157


వ.

ఇవ్విధంబున నారాత్రి సంయమీశ్వరులకుం గన్నులపండువునకుం
దోడు సెవులపండువును జేసి మధుసూదనుండు మరునాడు మహా
మునుల వీడ్కొని వచ్చి వచ్చి.

158


ఉ.

వాసుకిహారసంతతనివాసము వాసరవల్లభప్రభా
న్యాసము నాసముద్రరశనక్షితిహాసము నాత్మకీర్త్యను

ప్రాసము దత్తదిక్తటనిరాసముఁ గంసవిరోధి గాంచెఁ గై
లాసము నభ్రవిభ్రమకిలాసము మేరుతటీవిలాసమున్.

159


వ.

కనుఁగొన్న నన్నగంబు కన్నులకు నందక మిన్నంది నందికృత నాందీ
సందానితవందనమాలాసందోహావిహరదృృందారకసుందరీహారఘటితనటనారంభ
విజృంభితరంభాకుచకుంభసందర్శనసంభావనాసుభగంభావుకకుబేరకుమార
సంభ్రమావతకరణరాణచరణఝణాయమానమణిమంజీరజ్ఞాపితసోపానపథోపగ
మ్యంబై , రమ్యంబై వెండియు వెండియుం బసిండియుం దడంబడు ననుటకుం దగి
కుందగిరిమల్లికాకుముదసముదయదాయాదసదాదితేయనీదీసుమేరుశిఖరవిసర
విసరదుదీచీముఖప్రవాహవిహరమాణవిరించిపురమహిళాపయోధరకుంకుమపరాగ
రాగచ్ఛవిచ్చురితతరంగపరంపరాపరార్థ్యఫేనపటపల్లవితవిగతరజతరుచిరుచిరత
రాధీత్యకాదిత్యకాత్యాయనీరమణశిరోభూషణశశాంకశకలవిలాసనిస్తంద్రచంద్రి
కావిళరదవాచీముఖరోచిర్ఘరీపరీతపరిసరపరిహృతతపనీయతటద్యుతినిపతదితరేతర
కాంతివినిమయంబై మునిమయంబై పాతాళంబును మూలంబును మేలంబు లాడునని
యాడుట కొనియాడుటగాదని తెలుపం దెలుపగు సహజప్రకాశంబునకు నవకాశం బొసం
గక భవానిసేవానిపుణపుణ్యజనేశ్వరపురపురంద్రీపునఃపునరాగనునరాగమనఃప్రియ
వదపల్లవపరిచయపరితఃప్రకటితప్రవాళప్రభావిభావ్యమానదశాననభుజాపరిఘ
సంఘాతవిఘాతవిఘట్టితవసుధాసనిబధ్ధవివరవినిర్యద్దర్వీకరసార్వభౌమఫణామణికిర
ణచ్ఛురణప్రావరణంబై వరణంబై దురితంబులం జొరనీక ఛందంబు గాకుండియు జగతీ
ధృతిప్రకృతిప్రతిష్ఠాంచితంబై దంతావళంబు గాకుండియుఁ గటకరవిగ్రహవిహారదా
నోన్నతంబై కాంతారూపంబు గాకుండియుం నలకాహితపుష్పకచారూఢముక్తాభిరామంబై
యట్లునుంగాక సంసారియుం బోలెఁ బ్రసౌషధిపూర్ణోదరం బయ్యును సకలాభరి
తంబై యనాత్మజ్ఞుండునుం బోలెఁ దుర్వర్ణసానుభవం బయ్యును నున్నతవంశధ్వని
ముఖరంబై యట్లుంగాక జామదగ్న్యుండునుఁ బోలె భృగుసంతతివర్ణనీయం బయ్యును
భూభృద్విగ్రహనిరూఢంబై నిఖిలనిర్జరలోకమకుటరత్నరాజినీరాజిపాదంబై రాజ
కళాధరు విడంబించియున్న నప్పు డప్పురుషోత్తముఁ డిట్లని విచారించు.

160

సీ.

ఇం దుండుహరుమౌళి నిందుండు పెద్ద యై
                 నెత్తంబు నిండువెన్నెలలు గాయ
నీగిరిరాజుపై నీఁగిరి గాఁబోలు
                 నఖిలదేవతలు నేకార్ణవమున
నిచ్చట విహరింప నిచ్చఁట సంయమీ
                 శ్వరులకు మోక్షంబు సందియంబె
యీనగాగ్రంబున నీన గాఁడినయంత
                 శిల నైన మున్నేఱు నెలవ కున్నె


తే.

యీవనము లీకెలంకులు నీనగంబు
లీకొలంకులుఁ గలుగ సింహేభశరభ
హరిణశార్దూలగంధర్వయక్షసిద్ధ
గణగణాంగనాగణనలు గానఁబడునె.

161

శ్రీకృష్ణుఁడు ద్వాదశవర్షంబులు తపస్సు చేయుట

మ.

అనుచున్ దద్ధరణీధరాధివరకూటారూఢుఁ డై మానసం
బనుకాసారము నుత్తరంబున విహంగాధీశ్వరున్ డిగ్గి గ్ర
క్కున వల్కంబు జటాభరంబు నమరం గూర్చుండి చర్చించెఁ బా
వనదేశంబు శౌరి ద్వాదశసమావ్యాప్తిం దపప్రాప్తిగాన్.

162


వ.

అట్లు విచారించి.

163


క.

ఫాల్గునమాసము మొదలుగ
ఫల్గునసఖుఁ డతులతరతపశ్చరణమునన్
వల్గదరివర్గహయఖుర
ఫల్గువు గానీక మనసు పదిలము చేసెన్.

164


గీ.

పుష్పములు గోయుఁ జక్రంబు భుజగవైరి
నఱకు నిధ్మము ల్గుశములు నందకంబు
తెచ్చుఁ బాంచజన్యము గాచు దెసలు శార్ఙ్గ
మెదుర నిలుచుండు గద సేయు నెల్లపనులు.

165

క.

దిన మొక్కొక్కటి యెక్కఁగ
వనజాక్షుం డుపవసించి వత్సర మెల్లం
జనఁగా నొక్కొకయేఁడె
క్క నుపాసం బుడిగి యశనకర్మము నడపున్.

166


శా.

పండ్రెండేఁడులు నీగతిం జనఁగ జంభద్వేషిముఖ్యామరుల్
మండ్రాటం బిది యేల చెప్పుడము కామధ్వంసికి న్నేమముల్
గుండ్రా యైనఁ జెమర్చు నింత కకటా గోపాలచూడామణిన్
గండ్రో కానరొ వారు చెప్పఁ దగదా కైలాసవాచంయముల్.

167


గీ.

అనుచు గంధర్వసిద్ధవిద్యాధరాను
గమ్యమాను లై బదరికాకాననంబు
వలనిమునులుఁ దోఁ జనుదేర వచ్చి కనిరి
నిశ్చలధ్యానపరిపూర్ణు నీలవర్ణు.

168


క.

కని యాకైలాసతటం
బున నమరులు తమవీవిమానములు డిగ్గి జనా
ర్దనుఁ దిరిగి వచ్చి కొలువఁగఁ
గనువిచ్చె నతండు నియమగతి చెల్లుటయున్.

169


వ.

అట్టియెడ.

170

(అచ్చతెలుఁగు)

సీ.

తొలుకారుమెఱుఁగులతోఁటలో నాడెడు
                 రాయంచకొదమతో రాయఁ జాలి
యిరులబండారంపుటింటికిఁ బెట్టిన
                 బొండుమల్లెలకోటఁ బోర గెలిచి
బలుమంచుఁగంబాల బలసి రాఁ జుట్టిన
                 క్రొత్తమంజిడిబాగుఁ గొఱఁత చేసి
పాలపెన్నురువుగుబ్బలిమీద నెలకొన్న
                 నిండువెన్నెలముగ్గు నిగ్గు చెఱిచి


తే.

జడలఁ గ్రొన్నెల మెడఁ బాఁపసరిగఁ దొడలఁ
బొడలతో ల్మేన వెలిమిడిపూఁత మించఁ

బొడమి వ్రేఱేనిముందటఁ బొడవు సూపెఁ
[45]బొడువులం దెల్లఁ బొడువైనబోటువేల్పు.

171

(అచ్చతెలుఁగు)

ఉ.

ఏనికతోలుపచ్చడము, నెమ్ములగుబ్బసరంబు, సంపపూఁ
దేనియతియ్యవిల్లుఁ గొని త్రెంచినబొట్టు పలుంగునెట్టము
న్వీనుల[46]చూపుపెండెముఁ, దవిల్చిన మంచముకోటికైదువుం
బూనిన ప్రాఁతవేల్పుఁ గని, పోకులఁబోయిన వెన్నుఁ డిట్లనున్.

172


సీ.

కల్హారమకరందకలితమందాకినీ
                 లహరీపరీతకోలాహలంబు
బాలేందుచంద్రికాపరభాగశోభాప
                 రాగసంభావితారగ్వధంబు
సేవాసమాసన్నసిద్ధసీమంతినీ
                 తాలవృంతోత్తాలతాండవంబు
కాత్యాయనీదత్తకర్ణావతంసక
                 ర్పూరఖండామోదపూరితంబు


తే.

మారుతంబు నామీఁదట మలసియాడ
గలుగునొకొ నాకు నొకనాఁడు కన్నులార
శివునిఁ జూచుపుణ్యం బనుచింత నెఱయ
మొదలివేలుపుఁ బొడగంటి మ్రొక్కఁ గంటి.

173


సీ.

తరుణపల్లవరాగతామ్రవిద్యుల్లతా
                 భాసురం బగుజటాభార మెఱిఁగి
నిబిడసంతమసాతినీలబాలతమాల
                 పరిపంథి యగుకంఠభాగ మెఱిఁగి
తారముక్తాహారధవళశారదనీర
                 దాకార మగునిర్మలాంగ మెఱిఁగి
ద్రవశాతకుంభగౌరకుసుంభకుసుమఖం
                 డనశీల మగుఫాలనయన మెఱిఁగి

తే.

యెఱిఁగికొనవచ్చు నటమీఁద హృదయకమల
కర్ణికాభద్రపీఠంబుఁ గదియఁ జేర్చి
వరసుధాభిషేకంబునఁ బరమయోగి
సార్వభౌముఁడ వగునిన్నుఁ జంద్రమౌళి.

174


సీ.

లలితవిద్రుమలతాలావణ్య మగు జటా
                 జూటంబుఁ జిగురాకుజొంపమైన
సాంద్రతారకవిలాసం బగుపురుహూత
                 పురపురంధ్రులసేస పూవు లైన
విశదకాదంబినీవిభ్రమం బగు వియ
                 త్సింధుతోయము పూవుఁదేనె యైనఁ
దరుణభానుసమంచితం బగునుష్ణీష
                 ఫణిఫణామణికోటి ఫలము లైన


తే.

నైనపారిజాతంబు మూలాలవాల
జాత మగు నైన నభిలాషజాత మెల్లఁ
జేతిలోనికి వచ్చు నిచ్చిత్ర మిచట
నాత్మలోఁ గంటిఁ గన్నార [47]నంటికొంటి.

175


సీ.

కుజము కుంజరముచేఁ గూలునో కూలదో
                 కూలుకుంజరము నీకుజము గూల్చె
మ్రాను పేరేటిచే మడుఁగునో మడుఁగదో
                 మడుఁగు పేరేటి నీమ్రాను మడఁచెఁ
గాలునో యొకనిచేఁ గాలదో సాలంబు
                 గాలునీసాలంబు గాల్చె నొకని
దునియునో పరశుచేఁ దునియదో వృక్షంబు
                 తునియు నీవృక్షంబు తునిమెఁ బరశు


తే.

వనుచుఁ దమలోనఁ జర్చించు నమరవరుల
కభిమతార్థఫలార్థ మై యంద వచ్చు
పారిజాతంబు నామ్రోలఁ బండియుండ
నందఁ గంటి నాకోర్కుల నందఁ గంటి.

176

మ.

అనుచున్ లోచనపుండరీకములలో నానందబాష్పాంబువుల్
తనుసీమం బులకాంకురంబులుఁ బ్రమోదంబుం బ్రకాశింప న
వ్వనజాక్షుండు చెలంగుచుండఁ గని సర్వజ్ఞుండు యోగీంద్రవా
ఙ్మనసాగమ్యుఁడు కేలుఁ గేలఁ గదియ న్మన్నించెఁ గృష్ణుం గృపన్.

177


క.

ఇత్తెఱఁగున నయ్యరువుర
చిత్తముగతి నొడలు గలసి సిద్ధాంతపరా
యత్తు లగు మునుల యెఱుకకు
విత్తై చెలువారె జమిలివేల్పని తెలుపన్.

178


వ.

అట్టియెడ.

179


సీ.

అభ్రంకషం బైనయాలపోతు నితండు
                 తుంచినాఁ డీతండు పెంచినాఁడు
సాధుసమ్మతముగా సామజంబు నితండు
                 గాచినాఁ డీతండు ద్రోచినాఁడు
బర్హిర్ముఖార్థమై పర్వతేశు నితండు
                 దాల్చినాఁ డితండు వ్రాల్చినాఁడు
ఫణపరంపరతోడి పన్నగేంద్రు నితండు
                 మెట్టినాఁ డితండు సుట్టినాఁడు


తే.

నేఁడు నాఁడును నాఁడును నేఁడు మనకుఁ
జూపఁ జెప్పంగఁ జెప్పంగఁ జూపఁ గలిగె
ననుచుఁ గొనియాడు సంయమిజనుల కొదవె
రజతగిరిమీఁద హరిహరారాధనంబు.

180


సీ.

సారసంబున లేవ నారసంబునఁ జావఁ
                 బద్మాసనుఁడు వీరిపాలఁ గనియె
రూపు గంటఁ జెలంగఁ జూపు మంట లడంగఁ
                 బంచబాణుఁడు వీరిపాలఁ గనియె
వరములు వడయంగ శరములు గెడయంగఁ
                 బంక్తికంఠుఁడు వీరిపాలఁ గనియె
గేహరక్ష నటింప దేహశిక్ష ఘటింప
                 బాణాసురుఁడు వీరిపాలఁ గనియెఁ

తే.

గనియెఁ జిత్రంబులకు వీరు గలసియుండి
మనుపఁ జెఱుపంగఁ జెఱుపంగ మనుప నేర్తు
రెల్లలోకంబులకు దైవ మేక మగుట
హరిహరాత్మక మెఱిఁగితి మనిరి సురలు.

181

శివుఁడు సాక్షాత్కరించి కృష్ణునకుఁ బుత్త్రు నొసంగుట

చ.

ప్రమథులు సప్తమాతృకలుఁ బార్వతియు న్మురవైరి తాపసో
త్తములు నుతింప నయ్యెడ సుధాకరఖండవతంసుఁ డిట్లనున్
దమతమలోనిచూడ్కిఁ దముఁ దార కనుంగొనుమాడ్కి నింతగా
లము నినునీవ చూచి[48]తి తలంపున నీవును నేన కావునన్.

182


మ.

యదువంశాంబుధిచంద్ర! నీమదిఁ గుమారాపేక్ష నాలో నెఱుం
గుదు నాకీ చన వీఁ దలంచియ తపోఘోరక్రియ న్మెచ్చఁగాఁ
బిదపం జెప్పెడివాఁడవై తగుఁ దగున్ బృందారకశ్రేణికిన్
హృదయాహ్లాదముగా మదీయమకుటం బెక్కెన్ భవత్పాదముల్.

183


క.

నీ కొడుకు నీకు నిచ్చితిఁ
గైకొనుము విరించిచిట్టకాలకు లోనై
నాకుఁ బగ యగుట నంగము
లేకున్నాఁ డతఁడు కొఱత లే దతనిపయిన్.

184


వ.

అది యె ట్లనిన వినుము.

185


మ.

హిమవత్కూటమునన్ దపోమహిమతో నే నున్ననాఁ డమ్మహీ
ధ్రము నాకుం దనకన్యం జూపి పరిచర్యాకారిణిం జేసినన్
రమణీరత్నము నన్ను సంతతము నారాధించె సద్భక్తిసం
భ్రమభావంబులు విభ్రమభ్రమణవిభ్రాంతిం దొలంగింపఁగన్.

186


ఉ.

అత్తఱిఁ దారకుం డనుమహాసురుఁ డీసురసంఘము న్మదో
న్మత్తవిహారుఁ డై గెలిచి నాకము చూఱగొనంగ వాసవుం
డెత్తినభీతి బ్రహ్మకడ కేఁగి ప్రణామము చేసి ఖేదముం
దత్తఱపాటుఁ జెప్పిన విధాతృఁడు నాతనితోడ నిట్లనున్.

187

మ.

దనుజేంద్రుండు తపఃప్రభావమున నత్యంతస్థిరస్వాంతుఁ డై
నను మెప్పించి వరంబు వేఁడెఁ దన కెన్నండున్ వినాశంబు లే
క నికామవ్యవహారుఁ డై తిరుగ నౌఁగా కంటి నేనుం ద్రిలో
చనసూనుం డొకరుండుదప్పఁ జెఱుపన్ శక్తుండు గాఁ డెవ్వఁడున్.

188


క.

అని వానివరములోనన
మునుముట్టఁగఁ గొంత నెగులు మోవఁ బలికినన్
విని దనుజుఁడు మీ దెఱుఁగక
చనియె జితేంద్రియుల కేటిసంతతి యనుచున్.

189


చ.

అమరపతీపతివ్రతల కాదిమదైవతమైన పార్వతిం
బ్రమథవిభుండు గైకొనెఁ గృపాపరతన్ బరీచర్య సేయ నీ
సమయమునందు మన్మథుఁడు సాగి శరాసనకౌశలంబునన్
హిమగిరిరాజకన్యపయి నీశునిచిత్తముఁ జేర్ప నోపినన్.

190


క.

ఆరమణికి నుదయించుకు
మారుఁడు సేనాని యగు నమర్త్యులు వొగడన్
దారకుని నెల్చి తిరముగ
నీరాజ్యము నిలుప నోపు నిక్కం బనుడున్.

191


శా.

జంభారాతి విజృంభమాణహృదయోత్సాహైకసాహాయ్యుఁడై
యంభోజాసనుపంపునన్ జని ప్రసూనాస్త్రున్ దలంచె న్నటా
[49]రంభస్తంభనదంభఖేదవిహరద్రంభాపరీరంభణ
స్తంభాసంభవగుంభరత్నరచనాస్థాన[50]స్థలస్థేముఁడై.

192


వ.

ఆలోన.

193


సీ.

మకరంద మాని మైమఱచిన గొనయంబు
                 వెడమ్రోయఁ గడివోనివింటితోడ
జలజకేసరరాజి జల్లెడమూఁకగా
                 దాఁటుపఠారిరథ్యములతోడఁ
గర్ణికారపుమొగ్గ కనకంబుగుబ్బగాఁ
                 గోయిల నోరూరుగొడుగుతోడ

రతికన్నుఁగవ మచ్చరము సేయుటెక్కెంబు
                 వడఁక వీతెంచు సేవకులతోడ


తే.

వలపుఁదూపులు కరసాన వాఁడి చేసి
మండునెలతోడఁ దన మేనమామమైన
నిండునెలతోడ వలరాజు నిర్జరేంద్రు
సభకు నేతెంచె భుజబలోత్సాహ మెసఁగ.

194


క.

ఇవ్విధమున బొడసూపిన
పువ్వులవిలుకానిఁ జూచి పురుహూతుఁడు లే
న వ్వడర వేయుఁగన్నులు
నువ్విళు లూరంగ నున్న యుత్పలవన మై.

195


గీ.

సముచితోపచారములతో సంతసంబు
మనమునకుఁ జేయ నచ్చట మన్మథుండు
[51]నిర్జరాధీశ ననుఁ బంపు నీకుఁ జేయ
వలయుపని యేది కడతేర్చి వత్తు ననుఁడు.

196


చ.

త్రిపురహరు న్వరింపఁ దగుదేవి ధరాధరకన్య డగ్గఱన్
దపముఁ గలంప నం దొకఁడు తారకుఁ జంప నిలింపలోకమున్
గృపఁ దిలకింపఁ బెంపఁ బరికింపఁగలాఁ డుదయించు నంచు వే
దపుగనివేల్పు సెప్పినఁ బదంపడి నిన్నుఁ దలంపఁ జొప్పడెన్.

197


క.

అత్తాపసోత్తముని మదిఁ
దత్తఱపా టొదవఁజేయఁ దక్కొరులకుఁ గా
దిత్తెఱఁగు నీక చెల్లు ను
దాత్తగుణా యనుడు నతఁ డుదగ్రమదమునన్.

198


వ.

తదనంతరంబ రంభాదిరంభోరుకరకిసలయవికీర్ణకల్పతరుకుసుమకేసర
విసరద్ద్విరేఫదంభధూమధూసరశిరోరుహంబువలనను జంభాసురవిసృంభనపరి
రంభరాగనిర్భరనయనసహస్రప్రభాపటలకపటకిలాకలాపపరీతదేహప్రభా
విహారంబులవలనను రతివిరచితమంగళాచరణగోరోచనారుచిరదక్షిణభుజా

నిక్షేపణలక్షణలక్షితమౌక్తికాక్షతకైతవస్ఫులింగసంగరసమయోచితవైక
క్ష్యంబు వలనను వాతాయనవివరవితీర్ణదితిసుతారాతినగరచతురయువతిముకుళిత
కరకర్పూరపూరవ్యాజనిచితభసితవితానవిస్తారితపతాకాపటపల్లవంబుల వలనను
పరితఃప్రతిపదముఖరబృందారకబృందజయజయారావపరిపూరితవీరరసావేశ
వేల్లితభుజాస్ఫాలనకోలాహలచ్ఛద్మగద్గదశబ్దప్రతిరవవిభావితగోపురప్రదేశంబుల
వలనను మొదలన మదీయలోచనానలంబునకు నాహుతి యగుటఁ దెలుపుచు నమ
రావతీపురంబు వెడలె నచ్చందంబునం బచ్చవిల్తుండు నన్నుం గలంచుటకు సమకట్టి
తానును సమయుట వీరిందఱు నెఱుంగుదు రిది పిదప నేఁ దెలిసి యపరాధంబు
గాకుండుటకు నా మనంబున ననుతాపంబు వొడమిన.

199


మ.

వగఁ బొందంగ విరించి దేర్చినఁ గృపావంతుండవై మన్మథు
న్మగుడ న్జేసితి నీకుఁ బెద్దకొడుకై మద్భక్తుఁడై చెప్ప నొ
ప్పగుఁ బ్రద్యుమ్నుఁ డనంగ నీధర సరోజాక్షాతపస్సిద్ధికిం
దగు మేలిచ్చుట గాదు పూర్ణవిహితార్థం బింత కింతేటికిన్.

200

శ్రీకృష్ణుని శివుండు కొనియాడుట

క.

అనుచుం గరములు మొగుపఁగ
మునుముట్టఁగ మొగిడె నమరమునిపారిషదా
వనిధరతనయాకరములు
పినాకి గొనియాడఁ దొడఁగెఁ బీతాంబరునిన్.

201


సీ.

ప్రకృతిసంజ్ఞికము గారణము ద్రిధాభూత
                 మది ప్రధానమునకు నాత్మ యయ్యె
సత్త్వరజస్తమోజాతమై జగదండ
                 మంతకుఁ గారణం బనఘ నీవ
ప్రకృతియందు మహత్తు ప్రభవించె నం దహం
                 కారంబు వొడమెఁ దత్కల్పితములు
పంచభూతములు శబ్దస్పర్శగంధరూ
                 పరసంబులును బాదపాణిపాయు

తే.

వాగుపస్థములుఁ దదీయవర్తనములు
మనసు గలయఁగ నివి సాంఖ్యమతమునందుఁ
దత్త్వములు వీని కంత[52]కుఁ దాఁప వీవు
పనులు వీనికిఁ దగుభంగిఁ బనుపనేర్తు.

202


గీ.

బ్రహ్మయై రాజసమున నుత్పత్తిఁ గూర్చి
విష్ణుఁడై సాత్వికమ్మున వృద్ధిఁ గూర్చి
రుద్రుఁడై తామసంబున రూపు మాపి
చూపుచు చరాచరంబుఁ గౌస్తుభవిభూష.

203


క.

ఇంద్రియముల గోచరముల
కుం ద్రోవలు చేసి భక్తకోటులలో నె
ల్లం ద్రిమ్మరు నాత్మవు రవి
చంద్రవిలోచన వివేకచైతన్యనిధీ!

204


గీ.

బ్రాహ్మణులు మోము రాజులు బాహుయుగము
వైశ్యు లూరులు తక్కినవారు పదము
లుదయపథములు సేయ నీయొడలు మెఱయు
నీవు విశ్వేశ్వరుండవు నీలవర్ణ.

205


క.

రవిచంద్రశిఖమరుద్వా
సవదిగ్వియదంతరిక్షసర్వంసహలున్
భవదక్షిహృదోజోఘ్రా
ణవదనకర్ణోత్తమాంగనాభిపదోత్థల్.

206


సీ.

విశ్వలోకవ్యాప్తి విష్ణునామముఁ దాల్తు
                 మధు వింద్రియములు దన్మర్దనమున
మధుసూదనుండవు మా యన విద్య ద
                 త్పతివి మాధవుఁడవు దపముచేత
నగుదు తపస్విని హరణ మింతకుఁ జేసి
                 హరి వైతి నారంబు లన జలంబు

లం దయనంబు నీ కగుట నారాయణ
                 త్వము వహించితి బృహత్త్వంబు బృంహ


తే.

ణమును జూపుట బ్రహ్మ వై నాడఁ వింద్రి
యము లగు హృషీకములు దదీశాఖ్యఁ గలిగి
నది హృషీకేశసదము శమ్మది సుఖం బ
ఖిలమునకుఁ జేసి శంకరాకృతి భజింతు.

207

శ్

గీ.

వసనము దివంబునన కాన వాసుదేవుఁ
[53]డన మనమున ముని యని యన యతనమునను
యతి యనఁగ భూతవితతి నీయందు నెప్డు
నునికిఁ గనితి విశ్వంబరాఖ్యను మురారి.

208


క.

కపదంబున బ్రహ్మయు నీ
శపదంబున నేనుఁ బరఁగి జన్మింపఁగ నీ
కుపగతము కేశవత్వము
ప్రసన్న మఖిలజగదీశ్వరత నీశతయున్.

209


గీ.

వామనం బణువు తదాఖ్య వామనుఁడవు
వేదముల త్రినామములు దద్వి క్రమమున
నీ త్రివిక్రనామంబు నెగడె వాణి
వెలయు గోసంజ్ఞ నెఱిఁగి గోవిందుఁ డయితి.

210


సీ.

అగుదు ఛందముల గాయత్త్రి వర్ణంబుల
                 యం దకారము రుద్రులందు నేను
ననలుండు వసువులం నాదిత్యులందు వి
                 ష్ణుండు వాస్తోష్పతి సురలయందు
గజములలో నింద్రగజము పక్షులలోన
                 గరుడుఁడు నరులలో నరవరుండు
నిర్ణరవరులలో నీరజాసనుఁడు వృ
                 క్షముల నశ్వత్థంబు శైలములను

తే.

మేరుగిరి దేవమునులలో నారదుండు
దైత్యులందు బ్రహ్లాదుండు ధనదవిభుఁడు
కిన్నరులయందు వాసుకి పన్నగముల
లోన మృగములలోనఁ బంచాననంబు.

211


సీ.

నీయంద జనియించె నీయంద నిఖిలంబు
                 నడఁగె నీ వాదిమధ్యాంత మగుట
నేన నీ వన నీవ నే నన వర్తింతు
                 మిరువుర శబ్దార్థ మేకరీతి
నీనామములు నాకు నానామములు నీకుఁ
                 జేసినపూజ నాకుఁ బూజ
నిన్ను నొల్లనివార నన్ను నొల్లనివార
                 లెచట నీయునికి నా కచట నునికి


తే.

చెల్లునది చెల్లుచున్నది చెల్ల నున్న
యది సమస్తంబు నీవ నీ కనభిగమ్య
మేదియును లేదు వేదంబు లెఱుఁగు నవియు
నీవ నా నమస్కారంబు నిన్నుఁ జేరు.

212


వ.

అని పలికి సకలదేవతామునిసంఘంబులం గనుంగొని వారితో నిట్లనియె.

213


క.

ఏ మిరువురు నేకం బిది
సామర్గ్యజురాదితత్త్వసారము హరిచేఁ
గామార్థధర్మమోక్ష
శ్రీమహిమలు మీతపంబు సేర్చు ఫలంబుల్.

214


క.

ప్రణవాత్మకు నవ్యయు హరి
నణిమాదివిభూతికారణాంతఃకరణుం
బ్రణుతించువారు చేసిన
ప్రణామములు నన్నుఁ జేరుఁ బరమార్థముగాన్.

215


గీ.

ఇదియ పరమోపదేశంబు హితము సకల
మంగళము నిత్య మోంకారమంత్రమయము

శ్రీకరంబు నిశ్శ్రేయససిద్ధి నిగమ
సారము తపఃఫలంబు నిశ్చలపదంబు.

216


వ.

అని యద్దేవుని నుద్దేశించి.

217


సీ.

ప్రణుతింతు నో న్నమో భగవతే వాసుదే
                 వాయ నమో భక్తవత్సలాయ
సూర్యాత్మనే నమ స్సోమాత్మనే నమః
                 ప్రణవాత్మనే నమో బ్రహ్మణే న
మో రుద్రనామ్నే విమోనష్ణవే నమో
                 మూలప్రకృతయే నమో వసుంధ
రాదిభూతగణానుహారిభాసే నమో
                 మాయామయాయ నమ స్సహస్ర


తే.

బాహునేత్రశిరఃపాదవస్తయే న
మో వషట్స్వధాస్వాహాత్మమూర్తయే న
మః స్వభావశుద్ధాయ నమః ప్రహరణ
ధారిణే నమో యనుచు నుదాహరింతు.

218


గీ.

అద్యబీజాయ విశ్వకర్త్రే౽క్షరాయ
నిర్గుణాయ గుణాత్మనే నిర్మలాయ
హరిహరాత్మనే ప్రవరదివ్యాయ యజ్ఞ
సూకరాయ నమో యనుచు న్నుతింతు.

219


క.

అని వినుతించి మహేశుఁడు
మునులు వినఁగ నిది పురాణముఖ్యస్తోత్రం
బనవరతముఁ జదివిన వ్రా
సిన విన్నను సకలకార్యసిద్ధి ఘటించున్.

220


మ.

అనుచుఁ బారిషదాంబికాసహితుఁడై యంతర్హితుండై త్రిలో
చనుఁ డేఁగెం దదనంతరఁబ సుమనస్సంఘంబు గోవిందు వం
దనవూర్వంబుగ వీడుకొన్న మును లత్యానందులై యిచ్చలున్
జనిరా కృష్ణుఁడుఁ దార్క్ష్యు నెక్కి మగిడెం జక్రాదిసన్నదుఁడై.

221

ఉ.

చక్రపినాకమండన భుజాకృతభండన దైత్యఖండనా
విక్రమనర్తన ద్యుపదవీపరివర్తన మూర్తికీర్తనా
శక్రమణిప్రభాసిత నిశాకరభాసిత వర్ణభాసితా
నక్రపమత్తవారణ ఘృణారసకరణ కృత్తిధారణా.

222


క.

చికురాభరణకిరీట
ప్రకటజటాజూటఘటితబర్హఫణీంద్రా
మకరాకరగిరితనయా
ముకురీభవదేక పంచముఖషట్చంద్రా.

223


మాలిని.

నిగమశిఖరవేద్యా నిర్యదానందవిద్యా
విగతశుగనవద్యావిర్భవద్ధ్యానవేద్యా
జగదధికరృతరక్షా సారసంసారశిక్షా
ద్యగణితకృతసాక్షా దద్భుతాకారదీక్షా!

224


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధాన
విరాజితిక్కనసోమయాజి ప్రణీతం బైన శ్రీమహాభారతకథానంతరంబున శ్రీమత్సకల
భాషాభూషణసాహిత్య రసపోషణసంవిధానచక్రవర్తి సంపూర్ణకీర్తి నవీనగుణసనాథ
నాచనసోమనాథ ప్రణీతం బైన యుత్తరహరివంశంబునందుఁ ద్వితీయాశ్వాసము.

  1. వ్యాపారణరుచి
  2. జ్ఞాత
  3. లే
  4. నప్పుడు మురవైరి చూడ్కి కేల
  5. దాఁకం
  6. నీచేత నే
  7. శో
  8. యేను గాండివము శింజినినినాద, భరితబధరితభూ
  9. కణఁగి ధరణిసురునిగృహాంగణమునందు
  10. ఁగడసారెలోయె, శవము
  11. లరయఁగా
  12. నట్టిపల మందఁదగున్
  13. యితఁడు....గలడంచు; యిమ్ము
  14. భావము
  15. విడుము నా కుత్తరదిక్కు కనియె.
  16. చేసె నట (ఉ-హరి-4)
  17. గ్గఱుచందంబున
  18. ఁజొచ్చెన్ దెచ్చెన్ జచ్చినట్టి శిశువుల
  19. ప్రాయమైన
  20. దేవ
  21. నో
  22. డఁచె జరాసంధు మనిచెఁ బాండవల నేర్చె
    ఖాండవం బిచ్చె నరునకు గాండివంబు
  23. దళుకొత్తు పసిఁడినెత్తమ్మివోలె
  24. టో
  25. పో
  26. బూఁచు
  27. లోను సొ
  28. నిగ్గ
  29. పైకొమ్మ పెట్టించి
  30. వెదుర్వెలుగు
  31. నెట్టి
  32. గట్టి
  33. గడల
  34. సాదన
  35. నవార్చి
  36. నీయెదుర
  37. గదలం
  38. వర్చస
  39. తన్ము
  40. పుటములు పంకజంబుల జయింప
  41. వలనికన్ను(లీ)
  42. మ్ములం
  43. న నుద్దించు
  44. ను నవ్వు
  45. బొడవు (బొడువ) లందెల్లఁ బొడవైన బోఁటు
  46. చూపుఁబెం
  47. నందు
  48. తె తలంచిన
  49. రంభస్తంభనిశుంభఖేదవిచరద్రం. (వి)
  50. స్థితి
  51. కణగి నిర్జరాధీశ నాకతనఁజేయ
  52. కు దాప
  53. డనఁగ మౌనంబునను ముని యనఁగ యతన
    మున యతి యనంగ నీయందు భూతనివహ
    మునికి గలుగ భూతావాసుఁ డన మురారి.