ఉత్తరహరివంశము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఉత్తరహరివంశము

తృతీయాశ్వాసము

శ్రీదుర్గాకుచదుర్గ
స్వేదాంభోహారయష్టివిభ్రమశాలీ
శ్రీదత్తాభయమద నా
హ్లాదవ్రీడావినోద హరిహరనాథా!

1


వ.

దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.

2


గీ.

వాసుదేవుండు బదరికావనము సొచ్చి
ముందటితెఱంగునను తాను మునులుఁ గూడి
నవవినోదకథాగోష్ఠి నడపె నంత
నంతరంగంబు ముద మంద నంతలోన.

3


ఉ.

ఇక్కడఁ బౌండ్రభూపతి విహీనవివేకతఁ జేవ యెక్కఁగా
నెక్కడి వాసుదేవుఁ? డిల నే నొకరుండన వాసుదేవుఁడన్
దక్కినవాఁడు నందకసుదర్శనశార్ఙ్గగదాదిహేతులన్
[1]స్రుక్కక పట్టినన్ దెసలఁ జుట్టిన నిర్మలకీర్తి పట్టునే.

4


చ.

అని తన వంగడం బగు ధరాధిపమంత్రిపదాదివర్గముం
బనివడి కూడఁబెట్టి శతభారసువర్ణము దండ మెవ్వఁడై
నను ధర వాసుదేవుఁడను నామమున న్ననుఁ బిల్వకున్నఁ బా
యనిపగ వాసుదేవుఁ డని యాదవుఁ బిల్చినఁ జాటి చెప్పితిన్.

5


క.

నాచేతిచక్ర మిందఱుఁ
జూచితిరో చూడరో విశద్ధతరాయో

మేచకత సహస్రారం
బాచక్రము దోలఁ జాలు నతిభర మగుటన్.

6


తే.

నందకము గూర్చు యాదవునందకంబుఁ
బాంచజన్యంబుచేతఁ దత్పాంచజన్య
మడగు శార్ఙ్గంబుచేఁ జెడు నతని శార్ఙ్గ
మసము సేయదె గద గోపుఁ డెత్తు గదను.

7


ఉ.

నావుడు నేమియు బలుకక నాలుక యాడనిపాటియైన ధా
త్రీవరకోటి యుండ నొకదిక్కున మంత్రులు గూడి యిస్సిరో
యావసుదేవసూనుసరియా యితఁ డంచుఁ తొలంగి రెల్లచో
లావున నీతఁ డెక్కుడని లజ్జలు మానిరి ధూర్త సేవకుల్.

8


శా.

ప్రాలేయాంశుమరీచినిర్మలతనూభాగంబుఁ గృష్ణాజిన
వ్యాలోలామలయజ్ఞసూత్రములు నంసాసక్తవీణాలతా
లాలిత్యంబు లలాటికారుచులుఁ గ్రాల న్నారదుం డిచ్చలం
గైలాసంబున నుండి వచ్చెఁ గలహోత్కస్వాంతుఁ డచ్చోటికిన్.

9


క.

వచ్చిన మునిపతి [2]కర్హణ
మిచ్చిన పిదపన్ మహీశు లెల్లను వినఁగా
మచ్చరపువాసుదేవుఁడు
[3]పెచ్చారితనంబు మ్రానుపిల నిట్లనియెన్.

10

పౌండ్రక వాసుదేవుఁడు వాసుదేవుని నారదునిముందఱ నిందించుట

మ.

మునినాథా! నిఖిలంబు నీకు హృదయాంభోజాతగంధంబు దోఁ
పనియర్థంబులు లేవు నాకు సరి చూపం జాలుదే యాదవుం
డనుమానింపక వాసుదేవుఁ డని మిథ్యాగర్వరథ్యావిడం
బనుఁ డైనన్ [4]వినిపింతుఁగా కతని కీపంతంబుఁ జెల్లింతునే.

11


మ.

కలరే రాజులలో మదీయకరచక్రక్రీడ సైరింపఁ బె
ద్దల భీష్మాదుల ధిక్కరింపఁ దగ దెత్తం జాల రీకైదువో

రలు వో నాడకు గోపమీరు నొరుపేరం జీరు మీ విక్రమా
ఢ్యులలో నేనును వాసుదేవుఁడ నతండున్ వాసుదేవుండటే.

12


వ.

అనుటయు.

13


చ.

మనమున నోకిలించి మఱుమాటకుఁ గింకిరిపాటు తోడుగా
మునిపతి యల్ల నవ్వి విను మూర్ఖ మురాంతకుఁ బుండరీకలో
చనుఁ ద్రిజగన్నుతున్ సుగుణసాగరుఁ జేరవు గాక శార్ఙ్గితో
బెనఁగుట మంటలో మిడుత బీరము సూపుట గాదె దుర్మతీ!

14


క.

నీశంఖము నీచక్రము
నీశార్ఙ్గము నెఱుఁగమే యనిం గదిసినచోఁ
గేశవసాధనములు గళ
పాశంబులు నీకుఁ దొడరి బ్రతుకఁగ వశమే.

15


క.

ఏనుఁగులాగు పందికి
మానిసిచందంబు నీరుమానిసికి నగుం
గాని గుణంబులు గలుగవు
పూనకు చక్రంబు చక్రి పూనఁగ నెదురన్.

16


ఆ.

త్రుళ్లుఁ[5]బోత నీవు [6]తూలిపోఁ బలికిన
సార మేమి తఱుఁగుఁ జక్రమునకు
నినుము కూడఁ [7]బొరుగ నిది చక్రమా యెత్తు
వచ్చుఁగాన [8]నొరకు వచ్చు నెట్లు.

17


మ.

అనినం బౌండ్రుఁడు చిన్నవోయి హృదయం బల్లాడ నొం డేమి యు
న్మునుకం బాఱక నారదా కినుకకు న్మూలంబు నీ మాటలై
నను శాపాస్త్రుఁడ వైననీకు నవమానం బేను జేయంగ నొ
[9]ల్ల నిజేచ్ఛం జను మింక యాదవుల నెల్లం ద్రుంచి మెచ్చించెదన్.

18


వ.

అనుటయు నమ్మునీంద్రుండు నెమ్మనంబునం దనికిన
యేవంబును
భావంబునం బొడమిన రోషంబును మేలంబునం దెలుపుచు వెలుపలికి వెడలె

80

నిత్తెఱంగున నతఁ డుత్తలపడి బదరికాశ్రమంబునకు వచ్చి వాసుదేవుం గని
యతనితో నిట్లనియె.

19


శా.

దేవా! దేవరపేరు పెట్టుకొని ధాత్రిన్ వాసుదేవుం డనన్
లావుం జేవయు మీఱి పౌండ్రుఁడు దురాలాపంబులన్ గ్రొవ్వి సి
గ్గేవం బేమియు లేక నీసముఁడ నం చేమేని వాక్రువ్వ మ
ద్భావం బుద్గతరోషవహ్ని యగుడున్ ధట్టించితిం బల్కులన్.

20


తే.

ప్రల్లదంబున నందకపాంచజన్య
శార్ఙ్గకౌమోదకీసుదర్శనము లనఁగ
నలినలోచన నీసాధనముల సాటి
చేసె నతఁడు విశ్వామిత్రసృష్టి వోలె.

21


క.

అనుటయు నారాయణుఁ డను
మునినాయక! వేగపడకు మూఢునిఁ బౌండ్రా
వనివిభుని నీవు సూడఁగఁ
దునుముదు [10]నేఁ డెల్లిలోనఁ దుత్తునియలుగాన్.

22

పౌండ్రుఁడు రాత్రివేళ వచ్చి ద్వారకను ముట్టడించుట

మ.

అనిన న్నారదుఁ డుబ్బె నట్టియెడఁ బౌండ్రాధీశ్వరుం డేకల
వ్యనృపానేకసహస్రసంఖ్యరథకట్యాహాస్తికాశ్వీయసై
న్యనిరూఢిం జతురంగసైన్యమున సాహాయ్యంబుతో నాత్మవా
హిను లేతేర మురారిపట్టణముపై నేఁగె న్నిశీధంబునన్.

23


సీ.

గర్జితానేకపోత్కటదానధారలు
                 జలరాశిరాణివాసముల గెలువ
వల్గదాజానేయవదనఫేనము లంటి
                 నేల చుక్కలతోడినింగిఁ దెగడ
సన్నద్ధపాదాతశస్త్రప్రభాపంక్తి
                 కరదీపరాజిపైఁ గాలుద్రవ్వ
రథ్యా[11]ప్రతీకోత్థరవముచే గిరికోటి
                 పిడుగుల నెఱవిడిఁ బిఱుదుకొనఁగ

తే.

నంధతమసంబు శ్వేతపింఛాతపత్ర
దీధితులు మ్రింగ వైజయంతీవితాన
మెడములకు నెడమీక మీఁ దెడము కొనఁగఁ
బరఁగి నడతెంచెఁ బౌండ్రభూపాలుసేన.

24


చ.

పరిగొని వచ్చి యాదవులపట్టణ మొక్కటఁ జుట్టుముట్టి యా
హరి పొడ గానరాఁ డల హలాయుధుఁ డెక్కడ వోయె సాత్యకిం
బొరిగొనుఁ డంచు నార్పులును బొబ్బలు నింగిఁ జెలంగఁ బౌండ్రభూ
వరభటకోటి తూర్పుదెసవాకిట భేరులు మ్రోసి డాసినన్.

25


మ.

కరదీపంబులతోడ సామజతురంగస్యందనౌఘంబుతో
వరవీరావలితో బహుప్రహరణవ్యాపారసన్నాహసు
స్థిరతన్ సాత్యకియున్ హలాయుధుఁడు హార్దిక్యుండు లోనైన సం
గరరత్నాకరకర్ణధారులు గడంగ న్వచ్చి రచ్చోటికిన్.

26


వ.

ఇవ్విధంబున నుభయబలంబులుం గదిసిన సందడికయ్యం బయ్యె నయ్యెడ
కరులు గరులను దేరులు దేరులను దురంగంబులు తురంగంబులను బదాతులు
పదాతులనుం దలపడి కత్తివాతియమ్ములం గత్తరించినం దుత్తుమురులగు కత్తళంబు
లును, ఘనగదాఘాతంబులం జిద్రుపలైన సీసకంబులును, ముసలప్రహారంబులం
బఱియ లైన భటకర్పరంబులును, నిశితహేతివిదారణంబుల ఖండఖండంబు లైన
శుండాల శుండాదండంబులును, మొక్కలంబులం బరశుధారలం జెక్కిన నిక్క
డక్కడం బడిన పక్కెరలును, బ్రచండభిండివాలసంక్రీడనంబులం గలయం
గ్రుమ్ముడువడ్డ రథాంగంబులును, దుర్దాంతకుంతసంతాడనంబుల నింతింతలు తునియ
లైన కరిదంతంబులును, నరవాయి గొనక సురియలం జెరివినం దొరుగు రక్తంబులును
నెట్టుకొని సెలకట్టియలవైచిన నిట్టట్టు గదలక తెట్టెలు గొనం గూలిన కాలుబలంబు
లును గాలుబలంబులపైఁ బైకొనక యెక్కి పటవ[12]ణింపలేక తిరుగవచ్చినం జొచ్చి
చక్కడఁచుటయుఁ జాఁపకట్టువడి ఘోటకంబులకింద మిలమిల మెలంగెడు రావు
తులును రావుతుల మోహరంబునకు నోహటించిన బోనీక కరిఘటలం బురికొల్పిన
[13]రాగవాగల నైరావంబునం దురగధట్టంబు నిల్పి తెల్పికొని మగుడం బడి యడిదంబులు

డుస్సి వ్రేసినం బూసినచందంబున నేలంగూలిన యేనుంగుపీనుంగులును, నేనుంగుల
పీనుంగుల దిగ నుఱికి పాఱు మావంతులును. మావంతులవిన్నాణంబులం బొంగి
మ్రొగ్గుగజంబులగములపై యుగ్యంబులపగ్గంబుల వదలించి పోయినదియు వీథిగాఁ
దఱియ నుఱికిన యరదంబులకు ద్విరదంబు లెదురొగ్గించి కడనొగలు వట్టి
కరంబులం ద్రిప్పి వేయించిన సారథిసహితంబుగాఁ జదిసినరథికులును రథికులకర
లాఘవంబునఁ బఱపుశరపరంపరలచేతం దొరుగురుధిరంబులు కాలువలు గట్టం
గట్టలు గట్టి చూచుసైనికులును సైనికులం బేరుకొని వాసి కెక్కించి పురికొల్పు
కోలలవారి యెలుంగులును జెలంగులును జటుపటహభేరిభాంకారంబులును బుంఖాను
పుంఖనాదంబులును బిరుదకాహళకోలాహలంబులును బలంబులకుఁ జలంబులఁ బెనుప
నినుపపొడి రాల నొండొరుల యలుగు లలుగులఁ బడవ్రేసియు వీడం బోక
డాసియుఁ బోకు పోకని యదలించియుఁ బంతంబులు ముదలించియుఁ జిలుపచిలుప
నెత్తురుల బొత్తిల్లిన నేలం గాలూఁద నేరక జీరువాఱియు మూర్ఛల మునింగి
తేఱియుఁ గైదువుల ఘటించియు నెడగొని చొరవచ్చిన దట్టించియు నంగంబుల
హత్తియు నెమ్ముల సలియనొత్తియు సుభటసందోహంబులు గీలుబొమ్మలచందంబున
[14]మెలఁగాడు తెఱంగున [15]జొత్తుకడతలిలకైవడి సోమంబులపోలిక సంజీవనవిధిజ్ఞుల
విధంబున నసువులదెసకు శంకింపక పోరు నవసరంబున.

27

ఏకలవ్యుఁడు యాదవసైన్యంబు దైన్యంబు నొనరించుట

శా.

వీరాగ్రేసరుఁ డేకలవ్యుఁడు ధనుర్విద్యానవద్యుండు దో
స్సారఖ్యాతి నరాతిరాజుల రణోత్సాహంబు దూరంబుగాఁ
బారావారవిహారమందరగిరిప్రారంభ[16]శుంభద్గతిన్
దే రొప్పారఁగఁ బేరువాడి కలఁచెన్ ధీరోద్దతానీకమున్.

28


సీ.

అయిదుబాణంబులు హార్దిక్యు నొడల మా
                 ర్గణదశకంబు సారణుని మేన
సాయకపంచవిశంతి శుకప్రభు నిశి
                 తప్రదరంబుల దశక ముద్ద

వాచార్యు గాత్రంబునందు సప్తశరంబు
                 లానకదుందుభి యంగకమున
నాశుగపంచకం బక్రూరుకాయంబు
నం దెనుబదితొమ్మి దమ్ము లుగ్ర


తే.

సేను దేహంబునను గ్రుచ్చి చెలఁగి హస్త
లామవము వింతగా నేకలవ్యుఁ డెచట
నెచట నున్నాఁడు సాత్యకి యెందు వోయె
హలధరుం డని యదలించి యంతఁబోక.

29


మ.

సమదానేకపచక్రవర్తినవకాసారంబుతో నాడుచం
దము చూపం గరదీపికానికరముం దట్టించి రాజన్యసై
న్యము చెలాచెదర[17]య్యు గుంపు లగుచో నవ్వీరుఁ డస్త్రంబులం
జమరం జొచ్చిన నొచ్చి విచ్చి పఱచెన్ జట్రాతిపై పోఁకలై.

30


క.

నలిచప్పుడు లే కమ్మెయిఁ
దొలఁగినసైన్యంబు లెల్లఁ దొడిఁ దొడి నూరం
గలయఁబడి కోటదిక్కులఁ
బలుకక గుజగుజలు వోయెఁ బౌరులు బెగడన్.

31


శా.

ఈచందంబున నేకలవ్యువిజయం బింతంత గాకున్న వీ
రాచారంబు నుతించి పౌండ్రకవిభుం డాత్మీయులం జూచి చే
వీచెం [18]ద్రవ్వుఁడు కోటమేడలు పడన్వ్రేయుండు [19]డాయుండు లెం
డేచూ ఱెవ్వఁడు గొన్న నిత్తునని లావెక్కించె సంరంభియై.

32


వ.

అనుటయు నబ్బలంబునం గలవీరభటసంఘంబు లయ్యవసరంబున.

33


సీ.

వంకదారకుఁ జేరి వాకిటి [20]దద్దడం
                 బులు సేర్చి కొమ్మల మ్రోఁకు వైచి
ప్రాఁకి లోపలఁ జొచ్చి పలుగాఁడిఁ దెఱచిన
                 [21]పంతగార్లకు మున్న బ్రద్దపరుల

తోన నిచ్చెన లెక్కి [22]లోనికొత్తళములోఁ
                 బురణించి చొచ్చినపోటుమగల
వాఁడి మెచ్చక యాళువరిమీఁదఁ [23]బాళెల
                 వారిఁ దాఁకించిన వాసిబిరుదు


తే.

లచ్చరువు నొంద మేరలు సొచ్చి యార్చు
[24]దొద్దకార్లచేఁ బఱివోయెఁ దూర్పుదిక్కు
ఱాలవాటుల నటుల ఱంతు మిగిలి
తఱిమి రచ్చడి బలముఁ గొందఱు గడంగి.

34


ఉ.

సామజవాజిముఖ్యబలసంతతి వీఁగిన వృష్ణివీరు లే
మే మనఁ జేవ లేక దమయిండులలోనఁ జొరంగ మందిర
స్తోమము గోపురంబుఁ బడఁద్రోవఁగఁ జప్పుడు మిన్ను ముట్టినన్
దామరపాకునీరువలెఁ దల్లడమందిరి పౌరు లందఱున్.

35


వ.

ఇట్లు చటులతరపరాక్రమంబునం బ్రతిభటబలంబులు దలంకం
బౌండ్రభూపాలుడు యదువీరునగరంబు కలుకోట వికటంబుగా వలుదటంకంబుల
నఱికించియుఁ దంచనపుగుండం బడవైచియు [25]గొంకి క్రుమ్ముడు దగరు మొదలు
గాఁగల సాధనంబులచేఁ జీకాకు పఱిచియు స్వస్తికసర్వతోభద్రనంద్యావర్తపిచ్చంద
కాదిహర్మ్యప్రాసాదసౌధంబులు రూపుమాపించియు వెన్ను దన్ని చూచునవ
సరంబున.

36


మ.

హరివాక్యంబుఁ దలంచి సాత్యకి పురం బాత్మీయరక్షాస్థితిం
[26]జరపన్ వైరులు దొద్దగొన్న పిదపన్ జక్రాయుధుం డెన్నునే
వరవీరావలిలోనఁ దమ్ముఁ డనునే వాక్రుచ్చి నన్నంచు సం
గర సన్నాహము మీఱ నుధ్ధతశతాంగస్ఫారనానాస్త్రుఁడై.

37


క.

దారకునిసుతుఁడు దనకున్
సారథిగా నరద మెక్కి శైనేయుఁడు దు
ర్వారుఁడు దీపపరంపర
బోరనఁ జనుదేర యుద్ధమున కేతెంచెన్.

38

గీ.

రౌహిణియుఁడు భుజభబలోత్సాహ మెసఁగఁ
జటులరథమున శస్త్రాస్త్రసమితి నించి
మించి నడతెంచె నేనుగుమీఁద మెఱసి
యుద్దవుఁడు నచ్చె నీతికి నుచిత మెఱఁగి.

39


వ.

ఇవ్విధంబున నడచుదొరలం గని యదువృష్ణిభోజాంధకకుకురుసైన్యంబులు
గూడుకొని కృతవర్మప్రభృతిమహావీరులం దలకడచి నిజతూర్యంబులు సెలంగ
సింహనాదంబులు నింగిముట్ట నడిచి మునుముట్ట నప్పట్టణంబు చొచ్చి కడింగు రిపు
సేనలం దలపడియె నట్టియెడ.

40


శా.

మాయం బాయఁగఁ బెట్టు యోగిక్రియ సామలతావిజేయుండు శై
నేయుం డత్తరివైరివీరబలమున్ నిశ్శేషధూతంబుగా
వాయవ్యాస్త్రము నంబుదంబుగతిఁ బోవ న్వైచెఁ జొక్కాకుతో
రాయన్ రేణుకణంబుతోఁ జెనయఁ గార్పాసంబుతో సాటిగాన్.

41


క.

పరబలముఁ దోలి వెనుకొని
పురివెడలెను సకలసైన్యమును దనుఁ బొగడన్
శరము కరంబునఁ ద్రిప్పుచు
బిరుదుమగలు వినఁగఁ బలికెఁ బెద్దయెలుఁగునన్ .

42

పౌండ్రకసాత్యకు లొండొరుల నధిక్షేపించుచుఁ దాఁకుట

ఉ.

ఎవ్వఁడు రోరి తాను నొకయెక్కుడువీరుఁడపోలె రాత్రిమై
జివ్వకు వచ్చి మ్రుచ్చిమిగఁ జేరినవాఁడు దదీయమస్తముం
గ్రొవ్వినమచ్చరంబునన కూల్చెద వానిశరీరమాంసముం
గ్రవ్వికొనంగ గృధ్రములఁ గంకములఁ బరితృప్తి దేల్చెదన్.

43


ఉ.

నావుడుఁ గోపవేగముల నవ్వు మొగంబున నివ్వటిల్లఁ జెం
గావికనుంగవం బొడమఁగా వికటభ్రుకుటీకుటీలలా
టావిలఘర్మవారికణహారలలామనిలాసుఁడై గుణా
రావము చేసి నిష్ఠురశరం బరివోసి కడంగి డాసియన్.

44


వ.

ఏయ నొల్లక పౌండ్రుండు సాత్యకితో నిట్లనియె.

45

క.

[27]అయ్యాదవగోపాలుం
డెయ్యెడ నున్నాఁడొ పనుల నెం దడఁచెనొకో
యయ్యన్న తమ్ముఁడవు నీ
వియ్యాడెడుబిరుదుమాట లెచటఁ జదివితో.

46


చ.

మిడికెడు వాసుదేవుఁ డన మీఁదు దలంపక యాదవుం డొకం
[28]డుడుగఁడు వానిఁ ద్రుంతు సమరోర్వరలో నని వచ్చి పోరునే
పడుచులతోడఁ బౌండ్రుఁ డది పంతమె నావిశిఖంబు మ్రింగు నీ
తొడిగినబాణము న్వెనుక తూణమునందుననున్న ప్రాణమున్.

47


గీ.

చక్రి పొడమంగఁ బార్థివస్థాన మయ్యె
నోరి మీ వంశమందుఁ దాఁకోర్వఁ జాలు
వారిఁ జూపుము కుమ్మరావమున రాగి
ముంత లేఱుంగఁ గలవె నీ కింతయేల.

48


వ.

అనుటయు సాత్యకి కోపించి.

49


క.

ప్రేలకు జీలుగు వెరిఁగిన
మాలెకుఁ గంబంబు గాదు మాటలు మిగులన్
[29]నాలుక గఱచినయంతనే
దాలునొ మగతనము జూప సాత్యకి యెదురన్.

50


క.

గిరితోడ [30]నురభ్రకమును
హరితో [31]భషకంబుఁ జెనయునట్టిద కాదే
హరితోడ నీవు లావునఁ
బురణించుట పౌండ్ర! నీకు బోఁ టేమిటికిన్.

51


ఉ.

పన్నిదవాఁడ వింకఁ జెడి పాఱకుమీ యని మూదలించి చే
నున్న నిశాతబాణము మహోద్ధతిమై నరిబోసి యేసినన్
గన్నుల నోర నెత్తు రొలుకంగ శతాంగముమీఁద వ్రాలె నా
సన్నపరేతరాజ ఘనసౌధతలంబునఁ బవ్వళించె నాన్.

52

సీ.

అంతలోన తేఱి యాతండు బాణము
                 ల్తొమ్మిదిఁటఁ బదింటఁ దొలుత నేసి
సాత్యకినిటలంబు సాయకం బొకట భే
                 దించి నెత్తురు వెల్లిఁదేల్ప నతఁడుఁ
దేరిపైఁ జదికిలఁ దెళ్ళి నిశ్చైతన్య
                 గతి నున్న దశసాయకముల సూతు
నిరువదినమ్ములఁ దురగచతుష్కంబు
                 మిడుకు మాలఁగ సేసి మిన్ను ముట్ట


తే.

నార్చినఁ దదారవంబున నతఁడు మూర్చ
దెలిసి యొకకోలఁ దెగనిండఁ దిగిచి యేసె
వానివక్షంబు జీవంబు లేదు
కల దనఁగఁ దేరు పదిబాణముల నొగిల్చె.

53


క.

భల్లముల రెంటఁ డెక్కెము
ద్రెళ్ళను సూతుతల డొల్లఁ దెగఁ గొని శరముల్
పెల్లు గురిసి చక్రంబునఁ
బిల్లులుగా హరులు గూల బీరము నెఱపెన్.

54


వ.

వెండియు.

55


గీ.

సింహనాదంబు చేసిన సేద దేఱి
కనలి వరచాపములు గదాఖడ్గములును
గొన్ని సండిటఁ దనలావుకొలదిఁ బట్టి
నెగులు మోచినఁ బౌండ్రుండు నేల కుఱికి.

55


సీ.

కొలఁది మీటిన బాణకోటులు శైనేయు
                 పై నేసి పడవై చెఁ బడగ రథముఁ
బదిశరంబుల నేసి బాణచతుష్టయం
                 బున రథ్యములఁ గూల్చి భుజబలంబు
నెఱయఁ జాపముతోడ నేలకు దాఁటి సా
                 త్యకి వానిగుణము బాణాసనంబుఁ
దునిమె నంతట వాఁడు దొడ్డకోదండంబుఁ
                 గొని శరంబుల నొంచె శినిమనుమని

ఆ.

నతఁడు నైదు నైదు [32]నాఱు నెన్మిదియును
శరము లేసి యేసి కెరలి పదరి
పలుక నంతలోనఁ బౌండ్రుండు సాత్యకి
విల్లు ముష్టికౌలది విఱుగ నేసె.

57


ఉ.

వేఱొకచాప మెత్తి యదువీరుఁడు డెబ్బదిరెండుబాణముల్
మీఱిన పౌండ్రభూవిభుని మేను కలంతట నాఁటి నల్గడం
బాఱఁగ నేసి రేసి శలభప్రకరంబు మహీరుహంబుపైఁ
దాఱు తెఱంగుచేసి యతిధైర్యము సూపె నతండు సైరణన్.

58


గీ.

అర్ధచంద్రబాణంబున యాదవేంద్రు
నేసి తోడన బలదూపు లేడు వఱపి
యతనివేగంబు మాన్చెఁ బంచాశుగముల
వృష్ణివీరుండు పౌండ్రునివిల్లు దునిమె.

59


మ.

తనలా వంతయు నిండఁ బౌండ్రుఁడు గదాదండంబు సారించి వై
చిన శైనేయుఁడు నమ్మహాయుధము డాచేఁ పట్టి నారాచ మే
య నతం డంతన పట్టి శక్తిదశకం బవ్వీరుపై నాఁటినన్
ధను వల్లంతట వైచి సాత్యకి గదాదండంబుచే నొప్పగన్.

60


క.

డగ్గఱి యేసినఁ బౌండ్రుఁడు
స్రగ్గక గదఁ గొనుచు వ్రేటు సరగునఁ గొన్నన్
మొగ్గరములోన నిరువురు
యగ్గలికలు మెఱసె గదలు నాకస మంటన్.

61


క.

ఎత్తినగద లంకించియు
హత్తించియు బ్రమరి దిరిగి యడిచియుఁ జయిపై
నొత్తియుఁ దట్టియుఁ బట్టియు
మత్తగజద్వయముఁ బోలె మలసి రిరువురున్.

62

క.

ఈచందంబునఁ దెఱపులు
వేచి యుఁ బయిఁ బూఁచి లాఁచి వేసియుఁ బై పైఁ
ద్రోచురుధిరమునఁ దడిసిరి
పూచిన మోదువుల తోడఁబుట్టువు లనఁగన్.

63


వ.

ఇట్లు సరిసరిం బోరు నవరసంబున సాత్యకి సవ్యమండలప్రచారంబునఁ
బొలసిన వాసుదేవుఁడు వలవంక శంకింపక [33]పక్కళంబు గానీక యర్ధభ్రమణంబున
గదిసి [34]పరిచాళిక చేసిన శైనేయుం డత్తెఱపికి నాసచేయక ముఖచాళి చేసి [35]మురిసి
త్రుళ్ళగించిన నవ్వీరుండు దళపి (ద్రిప్పి) వేసి హాహా యనుటయుం గైటభారి
తమ్ముండు గనలి నిలునిలు మవి యదలించి కక్ష్యావర్తంబు వెనుక కొదిగించి
మెయిచూపిన నచ్చొరవరకు వాసుదేవుండు సీసకంబు [36]పూంచిన శైనేయుండు కుది
కిలి గదను డాకేలు దాపించినం బొంచి చొచ్చినసంతంబునకు మెచ్చి పౌండ్రుండు
కంఠాభరణంబు[37]చాళెంబున గద ద్రిప్పి భుజమధ్యంబు వ్రేసిన సాత్యకి స్వస్తి
కంబుగా నొడ్డి [38]బొంకు బొంకనుటయు నానృపాలుండు గదసుట్టి తివియ వచ్చిన
యదువీరుం డున్నతోడన యెత్తికొన్న నిరువురగదలును మసకంబునం బెనుంగు
పాములపగిదిం దాళించుపాసికలతోలికఁ [39]గ్రేతొటుకరళ్ళకైవడిఁ గలయ బెరయు నిరు
వురు మెయి మలంచి పాసియు డాసియుఁ దట్టియుఁ బట్టియు హత్తియు నొత్తియు
మలంగియుఁ దొలంగియు జడిసియు నొడిసియుం దాఁటియుం దూఁటియు [40]నరలించి
యు ము(వ)దలించియు లాసియు వేసియుఁ దఱిమియు మెఱిమియు నొండొరువుల
దేహంబులు రుధిరాసారంబునం దడిసి కుసుమితకింశుకంబులం బురుడింప లత్తుక
జొతిల్లిన పుత్తళ్ళ విడంబింప గైరికజలంబుల మునిగిన సింగంబులఁ దలఁపింప
నున్న సమయంబున.

64


గీ.

ఆర్చి యెడవంక సాత్యకి యడ్డగింప
వాసుదేవుండు వలవంక వచ్చి యురము
వేయ నవ్వీరుఁ డచ్చోట వ్రేసెఁ దత్త
ఱించి పౌండ్రుఁడు ధర మ్రోకఱిల్లఁ బడఁగ.

65

క.

ఆలోన నెగసి పౌండ్రనృ
పాలుఁడు శైనేయునిటలపట్టిక వ్రేయం
దూలి యతం డంత గదా
భీలాఘాతమున నతనిఁ బిలుకుర వ్రేనెన్.

66


సీ.

అటు వేటువడి పౌండ్రుఁ డంతకుండును బోలెఁ
                 బెడచాళి గద ద్రిప్పి విడిచిపాటు
వైచినఁ బడి యాదవశ్రేష్టుఁ డెన్నఁడేన్
                 చచ్చినయట్లు భూశయ్య నుండి
గ్రమ్మఱఁ దెలిసి యగ్గద రెండుదునుకలు
                 చేసి సముద్భటసింహనాద
వదనుఁ డై యున్న నవ్వాసుదేవుఁడు సొచ్చి
                 యెడమచే సాత్యకి నిఱియఁబట్టి


తే.

కుడికరంబునఁ బిడికిటఁ బొడిచె నురము
వృష్ణివీరుండు నేలతో వీఁవు మోవ
నతని వైచిన నవ్వీరుఁ గతనిఁ గ్రింద
వైచె రెండుసైన్యంబులుఁ జూచుచుండ.

67


వ.

ఇవ్విధంబున మల్లయుద్ధంబునకుఁ దొడంగి.

68


గీ.

కడవరానకు [41]జొచ్చి డొక్కకరము హత్తి
జడికిమై బిడ గొని పట్టెసమునఁ దొడరి
తోరహత్తంబునకుఁ బోఁతమారి బొబ్బ
ణంబునను రింజ వట్టి విన్నాణ మెసఁగ

69


చ.

మఱియు వివిధంబు లగువిన్నాణంబుల నొడిచియు నెమ్ములు నలియఁ బొడి
చియు మండి దాఁకించియుఁ గదయి సోకించియుఁ దల దల [42]నాగించియు భుజంబులు
భుజంబులతో స్రగ్గించియుఁ గక్షంబు కక్షంబులతో ఘట్టించియు వక్షంబు వక్షంబు తో దట్టిం
చియుఁ గరంబులు కరంబులతో నప్పళించియుఁ బిక్కలు పిక్కలతో నుప్పళిం
చియుఁ జరణంబులు చరణంబులతో

దాఁచియు నడుము లాగించి వైచియు లులాయంబులు మలయుమాడ్కి బులులుఁ దల
పడ్డపోలికఁ గరులు పోరాడుకయివడి సింగంబులు పెనంగుభంగి నుపతాయి[43]తో
నళువాయి నిరువురుం జదిసియుం గదిసియు నచ్చలంబునం జమురు చల్లినమంటల
కయివడిఁ బ్రత్తి తాల్చిన వడువున నిమ్మపండు నలంచిన పగిదిఁ బాదరసంబు
మర్దించు పంతంబునఁ [44]జోళంబు విఱుచు తెఱంగున మనసునం బలిమి లేక విసువక
పరస్పరజయకాంక్షలం బరాక్రమించు నవసరంబున.

70


ఉ.

 రెండు బలంబులందు నరరే యరరే యరరే యనంగ నొం
డొండఁ జెలంగు సన్నుతుల నుబ్బుదు రీయదువీరుఁ జంపుఁ బౌం
డ్రుం డనువారు సాత్యకి కఠోరభుజాపరిఘుండు పౌండ్రభూ
మండలనాథుఁ జంపు ననుమానము లేదనువారుఁ బోరిలోన్.

71


క.

అట్టియెడఁ బుండ్రనందను
దట్టించి యదూద్వహుండు దశముష్టిహతిన్
బిట్టడువ నయిదు ముష్టుల
నెట్టు వొడిచె నతఁడు నొడలు నెళినెళి యనఁగన్.

72

బలరాముఁ డేకలవ్యునితోఁ దలపడి పోరుట

గీ.

అంతలో నేకలవ్యుండు హలధరుండు
నాహవోత్సాహసన్నాహ మతిశయిల్లు
నెక్క టెక్కటిఁ దలపడ్డ నేకలవ్యుఁ
డేసె బలభద్రు నమ్ముల నిరువదింట.

73


క.

ప్రదరంబులు పదియింటం
బదియింటం బదిట రెంటఁ బరువడి నేసెన్
మొదల నరదంబు సూతుం
దుది నేసె న్నారి దునియఁ ద్రుళ్ళి చెలఁగుచున్.

74


ఉ.

అంతట రాముఁ డొండు గొనయం బమరన్ శరముల్ నిషాదసా
మంతునిమేనిలోఁ బది యమర్చి తదీయధనుఃప్రకాండ మిం

తింతలుగా దశాశుగము లేసి పదింటను ముప్పదింటఁ ద
ద్దంతిబలంబు నేయుచుఁ బితాక ధరం బడ భల్ల మేసినన్.

75


సీ.

ఆనిషాదేశ్వరుం డపరకోదండంబు
                 మధ్యమాంగుష్ఠప్రమాణదశక
ముగ మహామౌర్వీకముగ ధరించి నిశాత
                 ముఖసాయకమున రామునియురంబు
నెఱ నాట నేసిన నిట్టూర్పు నిగిడించి
                 యత డేకలవ్యుబాణాసనంబు
దశవిశిఖముల లస్తకము[45]చక్కటిఁ ద్రుంచె
                 నవ్వీరుఁ డొక నిశాతాసి వైవ


తే.

నడుమ నయిదుబాణంబుల నఱకె సీరి
వాఁడు సూతుపై నొకహేతి వైవ నదియు
బదిశరంబులఁ దునిమె నబ్బలుఁ డతండు
ఘంటలు చెలంగ నొకశక్తిఁ గనలి వైచె.

76


గీ.

ఒడలు నొలియించి యదువీరుఁ డొడిసిపట్టి
యమ్మహాశక్తిఁ గ్రమ్మఱ నతని వైచె
నురము గాడఁగ భూపతుల్ తిరిగి చూడ
వేగ నది చేసె నించుక వెలితిచావు.

77


వ.

అట్టియెడఁ దదీయనైన్యంబు గజిబిజించిన.

78


శా.

దృష్టారాతినృపప్రతాపకలుషోద్రేకోగ్రమై తాఁకె సం
దష్టాశీతిసహస్రనిష్ఠురనిషాదాధీశసైన్యంబు సం
ఘృష్ణాన్యోన్యభుజావిజృంథణరణత్కేయూరధారోన్నత
స్పష్టాసిక్షురికాకుఠారపరిఘప్రాసక్షురప్రోద్ధతిన్.

79


వ.

ఇట్టు దాఁకి బలభద్రుం బొదివి వివిధాయుధంబులం గనలించిన నవ్వీ
రుండు లయకాలశూలాయుధుండునుం బోలె హలవిహారం బమరసమరంబు
సలుప బలుపు మిగిలి మగతనంబునం దలపడి మడిసినముంగలివీరులం గను

గొనియునుం గడిపోవనికడిమి నిగుడం దెగి నడచి మగుడం దెరువు లేక నెగ డడి
చిన చందంబునం బొలియు బలుమూఁకలును నాఁకొనిన బెబ్బులికి నబ్బినగిబ్బల
విధింబున బహువిధవధంబులం బడిన బలుమానుసులును నుసులు లేక మానంబు
మనంబునకు ధనంబుగా వనంబునం గార్చిచ్చునం గమరినయట్లు రూపు సెడి
పీనుంగు పెంట లగుచోట్ల శరంబులు రాలినను శిరంబు వంపక కుంతంబులు వడి
నను బంతంబులు వదలక ప్రాసంబులు వెడలినను రోసంబులు సడలక గదలు దొలం
గినను నెదలు సలింపక శూలంబులు వోయినను నోలంబులు దలంపక చాపంబులు
విఱిగినను దాంపంబులం బొరలక లావున నిక్కియు బ్రేవులం జిక్కియు మెడలు
మిగ్గియుఁ బక్కలు నలిసియు డోక్కలు నులిసియు వీపులు నగిలియు
మూఁవులు నొలిగియు ముక్కులు చదిసియుఁ జెక్కులు చిదిసియు నెత్తురుల
జొత్తిల్లి లత్తుకపుత్తళులపొలికం బెనంగ నిడుపొడువునం గూలిన యట్లలతెట్టలు
గట్టలుకొన్న నెదురుదొట్టినరుధిరతరంగిణీతటాకంబుల నోలలాడు భూతభేతాళం
బుల వైతాళంబునకు నంతరంరంబు రంజిల్ల నయ్యాదవసింహంబు సింహనాదంబు
చేసిన.

80


మ.

హృదిజైతన్యమువోఁదఁ దెప్పిఱి నిషాదేశుండు సంరబ్ధతం
గదచేతం గొని కామపాలహలసంఘట్టక్షతాత్మీయసై
న్యదశారద్శనజాతరోషతఁ బ్రలంబారాతిపత్రుస్థలం
బదర న్వేయఁగ సీరియుం గదఁ దదీయాంగంబు నొప్పించినన్.

81


క.

అయ్యిరువురు గద లడరఁగ
వ్రయ్యం గ్రుయ్యంగ వ్రేయురవమున జలధుల్
వియ్యా లందఁగ మదమున
డయ్యక పోరిరి విశంకటబలోద్భటులై.

82


క.

ఆసమయంబునఁ బౌండ్రుఁడు
వ్రేసెన్ గద వేసినట్లు వృష్ణివిభుఁ దిరం
బై సాత్యకియును వానిం
జేసేతన వ్రేసెఁ బిడుగు చిట్లినభంగిన్.

83


క.

వేవినయంతకు నలువురఁ
జావంకంబులును పోలెనైన్యము హాహా

రావములతోడఁ జూడఁగ
దీవన వడయంగఁ దూర్పు తెలతెల[46]వాఱెన్.

84


వ.

తదనంతరంబ.

85


సీ.

కుంకు[47]ము హత్తించి కొనగోరఁ దీర్చిన
                 పురుహూతునిల్లాలిబొ ట్టనంగఁ
జక్రవాకములకుఁ బల్లఁగా మందు ద్రా
                 గించిన చెందపుగిన్నె యనఁగఁ
బార్వతీపతికిఁ బ్రభాతభూపతి గొన్న
                 యలరుగెందమ్మికోహళి యనంగఁ
తొలిదిక్కుతొయ్యలి చెలులపైఁ జల్లంగ
                 నిండ ముంచినపైడిఁకుండ యనఁగ


తే.

మేరుధరణిధరంబుతో మేలమాడ
నుదయగిరిరాజు దలయెత్తెనో యనంగఁ
గ్రమముతో నించుకించక గాన నగుచు
భానుబింబంబు గన్నులపండు వయ్యె.

86

శ్రీకృష్ణుఁడు ద్వారకానగరమున కేతెంచుట

ఉ.

అంత మురాంతకున్ బదరికాశ్రమవాసులు వీడుకొన్న ని
శ్చింతుఁ డతండు పత్త్రరథసింహము నెక్కి విమానపంక్తు లం
తంతఁ దొలంగ వచ్చి నగరాంతికసంగరసంభ్రమారవం
బెంతయు దవ్వులం జెవుల నించుక సోఁకిన సంశయించుచున్.

87


తే.

హలధరునియార్పు సాత్యకి యార్భటియును
బ్రతిభటనినాదముల దాఁటి పరఁగుటయును
దెలిసి కంసారి సంగరోద్రేకఘూర్ణ
మాననయనుఁడై యిట్లని మదిఁ దలంచు.

88


చ.

కటకట పుండ్రనందనుఁడు [48]కన్నులఁ గానక వచ్చి వీటిపై
నిటు విడియంగఁ జాలెనట యింకిట యాదవకోటి కేటికిం

జటులపరాక్రమం బనుచుఁ జయ్యన జేరి మురారి యొత్తెలె ను
ద్భటకుటిలారిహృత్పుటవిపాటనధన్యముఁ బాంచజన్యమున్.

89


క.

ఆ నినదము విని యాదవ
సేనలు పొంగారె నెదురు సేసలు సల్లెన్
మానవపతితతి వందిజ
వానూనస్తుతులు చెలఁగె నచ్యుతు మ్రోలన్.

90


చ.

గరుడుని డిగ్గి వీడ్కొలిపి కంసవిరోధి పురంబులోపలం
దిరపడి దారుకుల లనిచి తే రలవాటుగఁ దేర నెక్కి సం
గరకుతుకంబుతో వెడలి గర్వితులెల్లను దల్లడిల్ల ని
ష్ఠురరపాండజన్యుఁడగు[49]చున్ నిగుడన్ గని పౌండ్రుఁ డత్తఱిన్.

91


క.

శినిమనుమడు నిలు నిలు మని
వెనువెంటం దవిలి రాజవే నీవు ననుం
జెనకి యపకారితనమునఁ
జన వచ్చునె యనుడు శౌరి సాత్యకి కనియెన్.

92


మ.

రణసంరంభము మాన్ప నేమిటికనా రానిమ్ము రానిమ్ము నా
రణగర్వంబు మృగేంద్రసంచరణపర్యంతంబ నీగాలికిం
దృణ మీతం డనుచు న్నిజానుజునిఁ బ్రీతిం దేల్చినం బౌండ్రుఁ డు
ల్బణరోషంబున వాసుదేవునకు నుల్లాసంబుతో నిట్లనున్.

93


ఉ.

నీవును వాసుదేవుఁడవు నిక్కమ యేనును వాసుదేవుఁడం
బో వినువారి కైన నిది వోలునె యింతటనుండి ధాత్రిలో
గోవులఁ గాచి గాడిదల గొడ్డులఁ బోతులఁ జంపిరేని నే
జీవుల వాసు దేవుఁ డనఁ జెల్లునె లావునఁ బేరు సెల్లునే.

94


క.

నాకును గద నీకును గద
నాకును నందకము నీకు నందక మహహా
నాకును జక్రము చక్రము
నీకును విలు నాకు విల్లు నీకుం దగునే.

95

మ.

విను నీవారలఁ బోరిలో గెలిచెదన్ నేఁడెందు [50]వోవచ్చు నీ
కనుమానింపక వాసుదేవుఁ డన నొయ్యారంబునం జెల్ల దె
వ్వనిఁగా జూచితి నన్ను నొక్కగుహలో వర్తింప సింహద్వయం
బునకుం గూడునె యోడునే యొరునికిం బుండ్రక్షమాధీశుఁడున్.

96


ఉ.

నావుడు నవ్వు నెమ్మొగమున న్నెగయంగ జనార్దనుండు రా
రా వెడమాట లాడగ దురాగ్రహ చెల్లదు వాసుదేవసం
భావన నీకు నేఁ గలుగఁ బార్థివు లెన్నరు గాక [51]యెన్నడున్
లావు గొఱంత గాక నిఖిలక్రియచక్రము నీదుచక్రమున్.

97


గీ.

వెండియును గైదువులు నీకు వేఱ కలుగుఁ
బేర కలసొమ్ము దిగుఁ బోర బెండుకంటె
లావు గలవని వింటిమి లజ్జకండ
యొడలఁ గలదేని బలుమాట లుడిగి నడవు.

98


సీ.

అనుచు మురాంతకుం డాపౌండ్రు నొకనిశా
                 తాశుగంబున నేసె నతఁడు బాణ
దశకంబుఁ గంసారిఁ దాఁకించి దారకు
                 నిరువదనమ్ముల నేసి తురగ
ములమేనఁ బదిశరంబులు గ్రుచ్చి వెండియు
                 హరిమీఁద డెబ్బది యమ్ము లేయ
[52]మురవైరి మానసంబున నగి వానిద
                 ర్పము గంద దొడ్డనారసము దొడిగి


తే.

జలజనాభుండు కోదండచతురుఁ డగుచు
గుఱ్ఱములతోడ సారథిఁ గూలనేసి
వారెనయుఁ జక్రరక్షకద్వయముఁ ద్రుంచి
కల్లు బిల్లలు చేసి వెగ్గలము నవ్వె.

99

గీ.

తేరిపని మానిపిన వాసుదేవుఁ డిలకు
దాఁటి శాతాసి వైచె మాధవునిమీఁదఁ
బదిశరంబులఁ ద్రుంచి గోపాలవిభుఁడు
ముద్దుఁడునుబోలె కన్ను లు మూసికొనియె.

100


చ.

అతఁ డొకశక్తి వైచిన మురాంతకుఁ డంతన రెండు చేసె న
క్షతమదలీల వాఁడు పరిఘంబున వైచినఁ ద్రుంచె బౌండ్రభూ
పతి బహులోహభారదృఢభారదృఢారకఠోరచక్ర ము
ద్ధతిఁ గొని నీతలంబె యిది దాటనఁ నోర్వఁగ నంచు నేసినన్.

101


క.

గగనమున వచ్చుచక్రముఁ
జిగురాకుం బోలెఁ జక్రి చేఁబట్టి వడిన్
మగుడంగఁ ద్రిప్పి వైచిన
బెగడక మైముఱిసి వాఁడు పెల్లుగ నార్చెన్.

102


క.

కడు వెఱఁగంది మురాంతకు
డొడి దప్పినపామువోలె నుండఁగ మఱిఁ [53]దా
నొడిసెల జొన్నల కాచెడి
వడువునఁ బౌండ్రుండు ఱాల వైచెం బెలుచన్.

103

శ్రీకృష్ణుఁడు చక్రమున బౌండ్రునితలఁ దునుముట

మ.

అవి నారాయణుఁ డమ్ములం దునిమె నానాస్త్రంబులం గ్రమ్మఱం
గవియంజేసి యొకింత బీరము సెడం గారించి దైతేయచ
క్రవిదారక్రకచక్రమం బయిన చక్రం బెత్తి తద్దేహముం
బవుల న్వైచినఁ దుంగ వ్రచ్చినగతిం బాసెం బ్రకాశంబుగన్.

104


వ.

ఆ సమయంబున.

105


చ.

హలధరుఁ డేకలవ్యు హృదయంబు గొనన్ ఘనశక్తి వైచినన్
బలుగద వైచె వాఁడు బలభద్రునివక్ష మతండు రెండు సే
తుల గద పూన్చి వైచె నది తోరపుమంటలు మింటనంటఁ బైఁ
బొలసినఁ దేరు డిగ్గి చెడిపోయె నిషాదుఁడు గాందిశీకుఁడై.

106

గీ.

విఱిఁగి పాఱినఁ బోనీక వెన్నడించు
హలధరునిఁ జూచి వెగడొంది యబ్ధిలోన
నుఱికి దరి చేర రా కైదుయోజనములు
లావుతో నీఁది వాఁ డొకదీవి చేరె.

107


వ.

ఇట్లు నీలాంబరుం డేకలవ్యుపలాయనంబున పరిపూర్ణ మనోరథుండై
మరలి యంతకుమున్న సంతసంబున సామంతసహితుండై సభామండపంబునం
బేరోలగంబుననున్న నీలవర్ణుం గలసె. సాత్యకియును సకలయదువీరసమేతంబుగా
నయ్యెడకు వచ్చి నవ్విధంబున విజయవిభవభాసురుండై వాసుదేవుండు కైలాస
యాత్రాప్రసంగంబు చేసి ఘంటాకర్ణకాలాంతకుల వృత్తాంతంబును గొనియాడి
పార్వతీపతి ప్రసన్నుం డగుటయు వరలాభంబును సురలు సంయములు హరిహరా
భేదభావంబుఁ దెలియుటయు నెఱింగించి యెల్లవారల నిజనివాసంబులకు వీడుకొలిపి
యనంతరంబ యంతఃపురప్రవేశంబు చేసి సత్యభామారుక్మిణులసన్నిధిం దన
సకలవృత్తాంతంబును జెప్పె నని చెప్పి వైశంపాయనుండు జనమేజయునితో నట్టి
యెడ నొక్కవిస్మయంబు వినఁ గల దవధరింపుమని యిట్లనియె.

108

కృష్ణుఁడు రుక్మిణీసత్యభామలతో జూదమాడుట

గీ.

చక్రధరుఁ డట్లు రుక్మిణీసత్యభామ
లిరుగెలంకుల గొలువ ననేకగణిక
లంత నంత భజింప సత్యాముఖంబు
చూచి నెత్తమాడుద మనుచును గడంగి.

109


క.

ఓ తరుణి నేను నెత్తము
నీతో నాడునెడ రుక్మిణి గనుంగొను, ని
న్నాతి మఱి యాడ నీవుం
జూ తింతియ పంత మడుగుచోఁ దెల్పుటకున్.

110


వ.

అనుటయు నద్దేవి యిట్లనియె.

111


ఆ.

వాదులానితోడ వాట్లీనితోడను
బూతుతోడఁ దిండిపోతుతోడ

నటమటీనితోడ నడియరితోడను
వెలకు నెత్తమాడ వెరవు గాదు.

112


క.

జూదరివి సుమా[54]ళివి నెఱ
వాదివి [55]తసుకరివి గెలువ వచ్చునటే దా
మోదర నిను మా కనుటయు
నాదెసఁ గనుగొనక పిలువు మనె జాంబవతిన్.

113


వ.

అనుటయు సత్యభామ సాసూయంబుగా వాసుదేవున కిట్లనియె.

114


క.

కలిగె నొక జాంబవతి వె
న్నెలవడఁ [56]బడె దేల వలపు నీతల వేగెన్
బులియ[57]క వే సవతులు గల
పొలఁతుల కేపాటు వడక పోరా దనియెన్.

115


క.

చిత్తం బూరక కలఁచెదు
నెత్తము నాతోడ నాడ నేరుపు గలదే?
పొత్తు గలసి నీవును నీ
తత్తబళలు రండు గెలిచెదం బరువడితోన్.

116


ఉ.

ఇంతయు నేల మీద నెదు రెక్కటి[58]లో మునికిం బదారు సె
ల్లింతుఁ [59]గడళ్ళతాఁకున వెలిం బడ సారె గలప్పు డిత్తు గె
ల్పంతన సంగ్రహంబున సహారువు[60]తోఁ గను మాడిపోయినం
బంతముతో [61]దొహారమునఁ బెట్టుదుఁ బాసికబొమ్మ గట్టుదున్.

117


చ.

తొలితొలి రుక్మిణీరమణితో నెఱవాదిని నెత్తమాడుమా
గెలిచెదవేని మేలు సరికిం దగ నాడెద సూడు వట్టి నీ
కొలఁది యెఱుంగమే యనుడుఁ గోపము గన్నులఁ గ్రోలి నవ్వి య
చ్చెలువలతోడ శౌరి పొలిచెం జతురంతసమాసనంబునన్.

118


వ.

ఇట్లు చతురంతాసనంబున నుండి సకలలోకనాథుండు సత్యభామకు సాక్షి
పదం బొసంగి రుక్మిణీసమ్ముఖంబుగా సమాసీనుండయిన నద్దేవియు.

119

సీ.

[62]జోగిణి గొసరి [63]బైసుక వెట్టి పలకపై
                 సారెలు వోయించి సరము చూచి
తనకు లా గయిన నెత్తంబు గైకొని పన్ని
                 పాసికర్ దాళించి పా టెఱింగి
లోహటంటులు [64]మానిలులిఁ గన్నఁ బడకున్నఁ
                 బరదాళ మని పోవుఁ బలక లిచ్చి
తప్పారుఁ జూ రెండుదాయంబులును గని
                 వారింపకుము పోటువ్రాలు గలపు


తే.

పంత మడిగిన నీవలె భాగ మింతఁ
బోరఁ బెద్దదాయం బాడి పోరు పుచ్చి
వైచునది ధన మునికి పో వచ్చు ననుచుఁ
బేరుకొని పాటుతఱి సరి బేసి యడిగి.

120


క.

అత్తీవం [65]చిత్తిగ దుగ
సత్తా దచ్చౌక వంచి చౌవం చీరై
డిత్తిగ యిద్దుగ బద్రలు
చిత్తంబునఁ దలఁచినట్లు చేతికిఁ దెచ్చున్.

121


సీ.

దుగుణంబు సేసినతోడనే మూఁ డని
                 వారించి లేదని వలుము సేసి
యూర కెత్తకు దాయ ముగ్గడించినఁ గాని
                 పట్టి వేయకు మని పటితళించి
వెడలిన సారెలు వెనుకముందఱ చేసి
                 యెత్తిన సారె పో నీక యార్చి
సమ మాయె రమ్మని సరస [66]వారలఁ బిల్చి
                 గెలుపు సుమాళంబు గెరలఁ జేయ


తే.

బసిడి యీరైదు పూజించి పలకమీఁద
బలపమున వ్రాసి వెలివ్రాయిఁ దొలగివైచి
పన్ని పంచి యెక్కటి నాడఁ బంచి వ్రాలుఁ
దప్ప నో పత్రనయమునఁ దాన గెలిచె.

122

వ.

ఇత్తెఱంగున నత్తరుణి కరకౌశలంబును దట్టనయుం బుచ్చిపెట్టు వెర
వును గెలుపులెక్కయు లోపలఁ గలంగుటయు మోసపోక పంతం బడి
గిన నిమ్మపండు వైచి యుఱికితి నని సరి సరి యన్న జొన్నల కని తాఁకె
నన్నఁ గొన్న వారికి నని గెలిచితి నన్నమగనికి మున్నని పుడికిపుచ్చికొన్నట్లు
గత్తరించిన చందంబునఁ బందెంబు పఱచినవిధంబున మ్రొక్కిన దీవించిన
విధంబున వెరవున నాడుటయు నాకపటనాటకసూత్రధారుం [67]డంకించుకొని
యుల్లసంబున సారెయొడ్డి తొమ్మిది దాయంబుల కిచ్చిన నచ్చెలువ యెక్కి
పరిక తప్పుదాయంబునకు నొక వ్రాయి విడిచెద ననుటయు నద్దేవుండు
నాదాయ మీరైదు వెనుక యోటంబు విఱుగు ననుటయు నుదరిపడి యమ్ము
దిత సవిలాసంబుగా వైచిన నాశౌరి గోరినదాయంబ పడినం బొంగి వెనుక
సరి సరి యని యంతనుండి విన్ననై యాడి యన్నాతి మిగుల నోడియుం
దలంకక.

123


సీ.

చేయదు దుగుణంబు నెలవు లేకుండిన
                 నెక్కినపలకఁ బో నిచ్చుఁగాని
పలుకదు రోషించి పడనిపాసికలతో
                 నవదాయ మైనను నాడుఁ గాని
యొల్లదు గోపించి యొండునెత్తము పన్న
                 [68]నెచరంబు నేర్పని యెన్నుఁ గాని
నడుఁకదు వంచించి నయ మెక్కు డడిగిన
                 నిలుత మంతట నన్న నిలుచుఁ గాని


తే.

పలక దఱుమక [69]బయసుక పల్లటిలక
బోఁటి దూఱక యాతావు పుచ్చు మనక
[70]క్రింద గెలిచినవ్రాలు లెక్కింపు మనక
తప్ప నాడక తొల్లింటిదారి చెడక.

124


క.

ఇవ్విధమున రుక్మిణీమదిఁ
బువ్వుం బరిమళముబోలెఁ బొలుపుగ నెత్తం

బువ్వాయి గలిగె శౌరికి
మవ్వము దిగఁ దొడఁగె గెలుపు మట్టం బయ్యెన్.

125


గీ.

చాలు నని పాసె రుక్మిణి సత్యభామ
కరము గరమునఁ గీలించి కమలనాభుఁ
డిందు రమ్మనిపిలువ నయ్యింతి నగుచు
నభిముఖంబునఁ బాసిక లందుకొనియె.

126


వ.

పందెంబు చెప్ప రుక్మిణిం చాలించి.

127


సీ.

ఒకదాయ మాడిన నున్నదాయం బాడు
                 మనక వాటులు రెండు గొని చెలంగి
కానని మాటఁ దాఁ గడచి పోయినఁ జెప్పు
                 నెత్తంబు వడ దని నేర్పు దెగడి
యొకదాయమునకును నొంటి దాకినఁ బోయి
                 యింక వైచెద నని యినుమడించి
పోయెడి నని వ్రేయఁ బూచిన వారించి
                 చూచిపో [71]నిమ్మని సూటి చెఱిచి


తే.

సారె మోపును బొరలును సదర నిదర
మెఱిఁగి లాగైనఁగైకొని యించుకంత
పొసఁగకుండిన రుక్మిణి బొంకు బొంక
శౌరిఁ బలుమఱు గెలిచె నా సత్యభామ.

128


క.

నిష్కము మొద లెక్కెన్ ద్విచ
తుష్కాష్టకషోడశాదిదుర్వహశుల్కా
నిష్కములు వెరుగఁగా తో
చిష్కేశద్యోత మగు హృషీకేశుమదిన్.

129


వ.

ఇట్లు విశ్వలోకేశ్వరుండు వినోదించు నవసరంబున.

130

కాశీపతి ద్వారకపైఁ గృత్యను బనుచుట

ఉ.

తాపముఁ గోపముం [72]దలము దోఁకిన బౌండ్రసహాయుఁడైన కా
శ్రీపతి సైఁప లేక హరుచేఁ బడసెన్ పురిదేహదాహసం

దీపనిఁ గృత్య నాఁగ నొకదేవతఁ బావకకుండమధ్యకీ
లాపరిశోభితం గొలుపులావులు వేలుపులైన మెచ్చరే.

131


క.

మంటల మలఁచినరూ పై
మింట నడరి చూపు చూపు మ్రింగెదఁ గడు నాఁ
కొంటిం గలదే యాహుత
యంటయు వాఁ డంటఁ బనచె యాదవపురమున్.

132


గీ.

ఒడల నేదిక్కు సూచిన యోజనంబు
మండుచుండఁగఁ దానును మగువ వోలె
ద్వారవతి సేర నబ్బారిఁ దల్లడిల్లి
పట్టణం బెల్ల నిట్టట్టు పడఁ గలంగె.

133


గీ.

సాత్యకియు సీరపాణియు సంభ్రమించి
తమకుఁ జెప్పినవారును దారుఁగూడి
పెద్ద లైనసావాసులఁ బిలిచి పంచి
రంతిపురములో హరి నెత్త మాడునెడకు.

134


వ.

వారును దత్కృత్యాదర్శనంబు వెగడందినవారు గావున.

135


క.

పెదవులు దడుపుచుఁ బదములు
గుదిగొనఁ దత్తఱపుమాట గుత్తుక దగులన్
ముదుసలితనమున బెదరున
వదలినయంగములు మిగుల వడఁకఁ గడంకన్.

136


క.

సకలజగన్నాయక నేఁ
డొకలలన వపుఃకృపీటయోనిజ్వాలా
వికటచ్ఛటచ్ఛటారవ
వికారఘోరముగఁ జేరె నీపురమునకున్.

137


క.

ఆఁకొన్న మృత్యువో వెలిఁ
బ్రాఁకిన లయకాలరుద్రఫాలానలమో
యూఁకొనఁ దడ వయ్యెడు నది
సోఁకినచో టెల్లఁ గాలుఁ జొర నిచ్చెదవే.

138

క.

నావుడు దుగుణము సూ యిది
తీవంచన [73]యోడెఁ దప్పితే సరి యే యే
మీ వెఱవకు మన[74]రొ ప్రజం
బోవుఁ జుమీ పలకవ్రాయి పొదపొదఁ డనినన్.

139


వ.

వార లన్నారాయణదేవుండు నెత్తంబు తమకంబునం దత్తఱంపు
నొడువులఁ గలయం దమకు నుత్తరం బిచ్చిన పలుకులం బురుషోత్తముని చిత్తంబు
దమమీఁద లేదని విచారించి విన్నపం బవధారు దేవా యనుటయు నయ్యదు
కులాంబుధిసుధాకరుండు సకలకళాకుశలుండు గావున నత్తఱి సత్యభామ
పాసికలు దాలించి వైచిన.

140


గీ.

దాయ మెత్తనో యీసారే దాఁక నీక
కట్టి గెలిచెద నిదే పాసి కల[75]నిదయ్య
ముల బటాబూర మిందేమి ముట్టఁ గలదొ
పొంది వచ్చిన వ్రాలకుఁ బోవుఁ గాక.

141


క.

నావుడు సంతోషించిరి
సావాసులు వీరవచనచతురత సత్యా
దేవియు నెత్తవుమాటలు
గా విని తెలిసికొని మెచ్చెఁ గంసారాతిన్.

142

శ్రీకృష్ణుఁడు కృత్యపైఁ జక్రముఁ బంపుట

మ.

మతి నొక్కింతయు సంచలింపక నిలింపత్రాణపారీణుఁ డ
చ్యుతుఁ డాకృత్య కకృత్యకారిణికి ప్రాప్తిగాఁ బంచె ని
ర్గతబాష్పోదకదానధారరిపురాట్కాసార[76]విస్తారసం
తతపూరస్థిరమానమీనహరణాంతర్నక్రముం జక్రమున్.

143


వ.

అదియును శతకోటిశతకోటిసన్నిభంబై చిత్రభానుచిత్రభానుభావం
బై సహస్రకిరణసహస్రకిరణనిపుణం బై సహస్రారుణమండలమధ్యదేవతా
వివిధాయుధవిహరణవిద్యుల్లతికావిలాసం బై జపాక్షనిక్షప్తరక్షారక్షణం

బై మంటలు మింట నంట వెడలి కడలి వెడలిన బడబానలకీలాకలాపంబు
చందంబునం గాలకూటవిషవహ్నిజ్వాలామాలికాభీలం బై నీలకంఠనిటల
తటనయనశిఖశిఖాసహాయం బైన తెఱంగున మెఱచి చఱచినం బురంబు సొర
నేరక కృత్య కృత్యంబు లేక మరలి పఱవం జొచ్చిన విచ్చలవిడి దనమయం
బుగ గగనంబున నిగుడు నచ్చక్రంబుం గనుంగొని.

144


క.

సురగరుడయక్షవిద్యా
ధరకిన్నరదివ్యమునులు తద్దర్శనసం
స్మరణప్రణామపూజా
పరతంత్రతఁ దెరువు దొలఁగి బలసిరి చదలన్.

145


క.

పురుహూతముఖ్యదిక్పా
లురును సేవింపంగ సకలలోకేశ్వరుఁ డం
బురుహాసనుఁడు గని నమ
స్కరించి వినుతించె నిజముఁ గైవారముగాన్.

148


సీ.

రైతేయమదవతీధమ్మిల్లములతోడ
                 విరులనెత్తావికి వీడుకోలు
దనుజశుద్ధాంతకాంతాకటాక్షములతోఁ
                 గలికికాటుకలకుఁ గానివావి
దానవమానినీస్తనకుంభములతోడఁ
                 బసుపుఁబయ్యెదలకుఁ బాయు తెరువు
దైత్యావరోధనదయితాధరములతో
                 సొబగువీడెములకుఁ జుక్క యెదురు


తే.

చేసి సురసుందరీకరోశీరతాల
వృంతచలితాంతకుంతలవిలసదింద్ర
కులవధూటీలలాటికాకుంకుమంబుఁ
బదిలపఱుపఁ జక్రంబ నీభరమ కాదె.

147


వ.

అనుచుం జక్రంబు వీడుకొని కడచి పోవుటయు నాసుదర్శనంబు
నుద్దేశించి.

148

మ.

సతతంబు న్నుతియింతు జంతుమయసంసారక్రియారక్షణా
క్షతశౌర్యక్షపితారిపక్ష మగుటన్ సంగ్రామభీమభ్రమా
గతగేహాంతికదీర్ఘికాతటలుఠత్కంఠ[77]చ్ఛిదాచ్ఛాదన
క్షతజక్షాళితకేళితామరసరక్షశ్చక్రముం జక్రమున్.

149


క.

అనుచు గొనియాడి వనజా
సనుఁ డేగె సుదర్శనంబు సనుచో నెదురం
గని దనుజరాక్షనులు క్రో
ధను లై తన్నిశితధారఁ దగిలి తునియఁగన్.

150


ఉ.

ఆ పరమేశ్వరుండు జగదంబికతోఁ బ్రమథవ్రజంబుతో
గోపతితోడఁ జక్రమునకుం జవ మెక్కుడు పోదమంచుఁ గా
శీపురి నుండ నొల్ల కతిశీఘ్రగతిన్ శతయోజనంబులం
దాపసయోగ్యమై పరఁగుతాలవనంబున కేఁగె నెమ్మదిన్.

151


క.

కాశీపతినగరముపై
నాశాకాశావకాశహళహళితహఠా
క్రోశజ్జనజాలం బై
కేశవచక్రంబు కృత్యకృత్యం బయ్యెన్.

152


ఉ.

ఆపురుషోత్తమాయుధము నంతకము న్గనుఁగొన్న భీతిఁగా
శ్రీపతిఁ జేరి యుప్పతిలఁ జేసిన సిద్ధుఁడ వంచుఁ గౌఁగిటం
జేపడఁ బట్టి మందిరముఁ జేసె దిగంబరవేషఁ గృత్యఁ ద
త్పావపరాయణద్వయముఁ బావకచక్రము నీఱు చేసియున్.

153


చ.

తనియక కాల్చె వెండియును దంతితురంగశతాంగసైనికా
వనిసురమండలాధిపతివైశ్యజఘన్యజమండలానులే
పనకుసుమాంశుకస్తబకబంధవనాచలదుర్గరౌప్యకాం
చనతృణదారుగేహదృఢసంచయసూక్ష్మమహాపదార్థముల్.

154


గీ.

ఆరు యోజనములలోఁతు నందులో స
గంబు నలుసదరము గాలి కాశి గాసి

యయ్యె ముప్పదియేండ్లు సిచ్చాఱ దింద్రు
చేత నవిముక్త[78]మయి చెల్లెఁ జితి యనంగ.

155


వ.

ఇట్లు కాశీపురంబు దరికొలిపి కృత్యాసంహారణంబునం గృతకృత్యం
బై సుదర్శనంబు దామోదరదేవునకుం బొడసూపి సుఖం బుండె దురోదర
పరాయణుడైన యన్నారాయణుండు చెలుపు నోటంబును సరిగా
నద్దేవీ
ద్వయంబుతో వినోదించుచు మఱియు వివిధాంతఃపురవనితావిహారంబులం
బొద్దు పుచ్చుచు నుండె నచ్చక్రంబు వెండియు.

156


క.

దైతేయకామినీసం
ఘాతము మగ మొలక లైనకడుపులు డిగ సం
కేతించినట్లు చక్రము
పాతాళంబునకు నరుగుఁ బ్రతిషాణ్మాసిన్.

157


క.

నీయెడ నాయెడ నేయెడఁ
బాయఁడు గృష్ణుండు విష్ణుపరిచర్యాసం
ధాయకము చక మాత్మం
జేయుము సత్పూజ లిష్టసిద్ధికి ననఘా.

158


వ.

ఈ చక్రప్రభావంబు భావనంబునం దలంచిన యతనికిం గార్య
సిద్దియు శరీరరక్షయుం జేకుఱు నిది నీకుఁ జెప్పితి సావధానుండవై యెప్పు
డుం దలంచునది యనుచు నమ్మునీంద్రుండు.

159


ఉ.

భాననభానుమండలవిభాసివిభాకరదివ్యభవ్యసం
ధానవిధానదక్షిణసుధాకరుణారసపూరహారిచే
తోనయనాతపోనిధివిధూతతమస్ఫురణంతరంగని
ధ్యానపరాయణా పరమతత్త్వమయస్తవవైభవోన్నతా!

160


క.

కరణస్వైరవిహర
స్ఫురణావిర్భూతదోషపుంజతమఃప్రా
వరణవిలీనస్వజనో
ద్ధరణసహస్రాంశుతేజ దైవసమాజా!

161

మాలిని.

దురితజననహన్యా దూరసంచారమాన్యా
పరిమితగుణధన్యా భక్తిరేఖావదాన్యా
పరమపదగదివ్యా స్పందితస్వాంతభవ్యా
నిరుపమతనునవ్యా నిందితాక్రాంతభావ్యా!

162


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త బుధారాధనివిరాజి
తిక్కన సోమయాజి ప్రణీతం బైన శ్రీ మహాభారతకథానంతరంబున శ్రీమత్సకల
భాషాభూషణ సాహిత్యరసపోషణ సంవిధానచక్రవర్తి సంపూర్ణకీర్తి నవీనగుణసనాథ
నాచన సోమనాథ ప్రణితం బైన యుత్తరహరివంశంబునందు తృతీయాశ్వాసము.

  1. స్రుక్కక పట్టునే దెసలు చుట్టునె నిర్మలకీర్తిపట్టికల్.
  2. కర్ఘ్యంభి
  3. పిచ్చాలితనంబు మదిన బెనఁగొన ననియెన్; టెచ్చాలితనంబు మందటిల నిట్లనియెన్
  4. నడపిం
  5. గొంగ, గోఁక
  6. దూలపో
  7. బోసి రిది
  8. యొరకు
  9. సే
  10. నెల్లింటిలొనఁదు
  11. ప్రణీతో; ప్రణీపో.
  12. ణివిప్ప
  13. రాగెవాగె; రాగెవాగంబు నైరాగంబునం
  14. మెఱుఁగారు
  15. జొత్తుకడవలిలకైవడి వాహంబుల
  16. జృంభోద్ధతిన్
  17. యెం మూఁకలగు
  18. ద్రోవుఁడు
  19. పట్టుండు తెం
  20. బద్దకం
  21. పంతగారలుమున్ను
  22. దోని
  23. పల్లెల
  24. దొద్దకాఱుచేఁ బఱివోయె
  25. గొంకుఁగొమ్మతగరు
  26. జగరన్ – దొట్టకొన్న
  27. అయ.... డేయెడ...యీయిన్న....వీయడి బీరలపు
  28. దుడుగక వానిముంతు లవణోదములో నని
  29. నాలుగు
  30. న కరిపోదము
  31. ఋక్షంబు
  32. నాఱును నాఱును
    నెనిమిదియు శరంబు లేసి యేసి
    పదరి పలుకనంత బౌండ్రుండు సాత్యకి
  33. పగళంబు
  34. యుప్పళి
  35. ముఱుసి తూళగిం
  36. బొడిచిన
  37. వినుచాళింజన
  38. పోనుపోక
  39. గై
  40. నడల్చియు వదల్చియు
  41. జోడొక్కరముహత్తి, చడికి మైబిడ, [బెడగొని] ... బొత్తమూరిజృంభ....వింజపట్టి
  42. భంగిం
  43. లోనమవాయ
  44. బొళయంబుగా
  45. చక్కికిఁ
  46. నేగెన్
  47. కన్నులు
  48. డున్ నిగిడెన్
  49. బ్రొ
  50. యొక్కెడెన్
  51. నగవుతో శౌరి మానసమున వాని ద
    ర్పము మెచ్చి దొడ్డనారసము దొడిగి
    స్థిరము తోడన సారథి శిరము నఱికి
    గుఱ్ఱములు నాలుగమ్ములఁ గూలనేసి
  52. యున్, వడిసెడిత్రొక్కుల - (కపియుం, గుడిచెడికొన్నల)
  53. నిసి
  54. తనకలివి (తనుకరివి)
  55. బడనేల
  56. కు
  57. నొక్కటి
  58. దగ
  59. లోగమ
  60. డహారువున (నీ)
  61. జేగి
  62. వైసిక
  63. లులితంబువడ
  64. చవుక దుగ
  65. వారికి విచ్చి
  66. డెక్కించుకొని
  67. నచరంబు యురయు
  68. బైసిక
  69. యెంతలెక్కింపుమనక వ్రాయెక్కు డనక
  70. బొమ్మని వ్రేటుసూటి
  71. తలఁపు
  72. యొడ్డిత
  73. రోపో
  74. నువచ్చి పట్టెవో భూత మిందేమి పుట్టఁగలదొ
  75. ధీసార
  76. చ్ఛిదాచ్ఛేదన
  77. మహిసుతేజిత యనంగ