ఉత్తరహరివంశము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఉత్తరహరివంశము

చతుర్థాశ్వాసము

శ్రీహైమవతీకలహ
స్నేహవిరామ ప్రణామసీమంతపద
గ్రాహిసురసింధుకహ్లా
రాహితసింధూరలాక్ష హరిహరనాథా.

1


గీ.

హంసడిభకులు లోనుగా నఖిలధరణిఁ
బెరుఁగ కంటకకోటిచేఁ బేద లైన
నరపతులకీర్తిపటములు సిరుగకుండ
వెరవుతో నుద్ధరించిన వేల్పు శౌరి.

2


క.

నావుడు జనమేజయవిభుఁ
డావైశంపాయనుని మహాదేవు మదిన్
నీవు గొనియాడు పలుకుల
భావము దనివోదు చెవులపండువు లయ్యెన్.

3


క.

హంసడిభకు లెవ్వరొకో
కంసారికి వారిఁ జంపఁ గారణ మేమో
సంసారసారవచనరి
రంసామతిఁ దత్కథాంతరము వినవలతున్.

4


క.

అనుటయు వైశంపాయన
ముని జనమేజయ నృపాలముఖ్యునితో ని
ట్లనుఁ దత్కథాప్రపంచము
వినిపించెద మొదలుకొని వివేకనిధానా!

5

క.

ఎనుఁబది యెనిమిది వేవురు
దనుజుల కాఢ్యుండు వక్రదనుజుఁడు దోడై
చనుదేర హంసడిభకులు
[1]చెనకిన వెసఁ దునిమె శౌరి చెప్పెద నదియున్.

6


సీ.

సాల్వదేశంబున జనియించె బ్రహ్మద
                 త్తాభిరానుండు మూర్థాభిషిక్తుఁ
డఖిలధర్మవిధిజ్ఞుఁ డాత్మభార్యాద్వయం
                 బునకు బిడ్డలు లేమిఁ బొల్లవోయె
సంసార మనుచు నీశాను నారాధించెఁ
                 బదియేఁడు లొండు సంభ్రమము లేక
పరమేశుఁ డతని సద్భక్తికి మది మెచ్చి
                 కలలోన నొకనాఁడు గదిసి వరము


తే.

వేఁడికొను మన్న నిరువుర వేఁడె సుతుల
శివుఁడు నిచ్చితి ననుచు విచ్చేసె నంత
నతనిదేవు లిద్దరును గర్భాభిరామ
మూర్తులయి రన్నరేంద్రుండు ముద్దుసేయ.

7


ఉ.

ఆ సమయంబునందు మహితాత్ముఁడు మిత్రసహుండు నాఁగ ధా
త్రీసురుఁ డొక్కరుండు జగతీపతికిన్ సఖుఁడై సుతోదయో
ల్లాసము లేక శ్రీపతిఁ దలంచుచుఁ దప్పక పంచవర్షముల్
చేసిన పూజకుస్ హరియుఁ జిత్తములోఁ బొడసూపి విప్రుతోన్.

8


ఉ.

మెచ్చితి వేఁడికొ మ్మనుడు మిత్రసహుండు కుమారుఁ గోర నీ
కిచ్చితి నంచు నచ్యుతుఁడు నేఁగె ధరామరుఁ డాత్మకాంతకుం
జెచ్చెరఁ దోఁచు వేవిళులు చెప్పఁగఁ బల్మఱు వచ్చుబోఁటితో
ముచ్చటనూనె నల్ల చనుముక్కులు వెల్వెల బారు చెక్కులున్.

9


క.

ఈవిధమున గర్భిణు లగు
మూవురలో రాజసతులు మునుమును సుతులన్

శైవాత్ములఁ గని రిద్దఱు
నావిప్రవధూటి వైష్ణవాత్మునిఁ గనియెన్.

10


ఆ.

హంసడిభకు లనఁగ నన్నయుఁ దమ్ముండు
నధిపనందనులు జనార్దనుండు
విప్రతనయుఁ డిట్లు వీ రొక్కప్రాయంబు
వారు గూడి యాడ వచ్చువారు.

11


ఉ.

వేదపురాణశాస్త్రపదవిం దిరుగం బదిలంబు గల్గి ధ
న్వాదీసమస్తశస్త్రవివిధాభ్యసనంబున ధీరు లై సదా
సాదినిషాదిరథ్యుచితసత్కళలందు విదగ్ధు లై మనో
మోదము సేయువిద్యలకు మువ్వురుజాణ లనంగ నున్నచోన్.

12

హంసడిభకులు శివుఁగూర్చి తపస్సు చేసి వరములు వడయుట

గీ.

హంసడిభకులు హిమవన్నగాగ్రమునకు
బార్వతీపతిఁ గోరి తపంబు సేయ
నరిగిరి జనార్దనుండు విద్యావివేక
నిధి మురారి నారాధించె నిజగృహమున.

13


క.

వా రిరువురు నైదేఁడులు
నీరును గాలియును ద్రావి నిర్మలతరచే
తోరాజీవభ్రమరము
గౌరీపతిఁ దలఁచి నిష్ఠ గైగొని యుండన్.

14


క.

సన్నిధిఁ బన్నగహారుఁడు
పెన్నిధిఁ గని పొంగుచున్న పేదలక్రియ న
య్యన్నాదమ్ములఁ గని మీ
కెన్నఁగ నేవరము లిచ్చ యిచ్చద వానిన్.

15


సీ.

అనుడు వా రిరువురు నైకమత్యముతోడ
                 నమరాసురాది సైన్యాధిపతుల
కోడకుండంగ మా కొకవర మీశాన
                 రౌద్రమహేశ్వరబ్రహ్మశిరము

లనునస్త్రములు నభేద్యకవచములు దివ్య
                 చాపములును బరశ్వథవిశేష
ములుఁ గయ్యముల కేము పోవుచోఁ గావుగాఁ
                 బ్రమథద్వయంబు మత్పార్శ్వములను


తే.

వచ్చుటయు నీగి రెండవవరము నాఁగ
హరుఁడు వారికి నడిగినయట్ల యిచ్చి
భృంగిరిటిని గుండోదరుఁ బిలిచి వీరి
సమరములఁ గావుఁ డని పంచి చనియె నంత.

16


చ.

వరములు గన్న మోదమున వచ్చి కుమార యుగంబు మున్ను మా
తరపితృవందనంబును బదంపడి మిత్రసహాభివాదనా
దరము జనార్దనప్రణయతాపరిరంభము నాచరించి సం
గరమున తేరు హంసడిధక ప్రతివీరు లనంగఁ బొంగుచున్.

17


క.

కవచధనురస్త్రనికరము
నవిరళరుద్రాక్షమాలికాభరణములున్
ధవళవిభూతియు హరహర
శివశివ శబ్దములుఁ[2] గలిగి చెలువయి యున్నన్.

18


క.

పొలఁతుల రూపవతులఁ బెం
డిలి చేసిరి దొరలు హంసడిభకుల కమరం
గులపతి జనార్దనునకును
బలియించిరి ముగురు నేకపత్నీవ్రతముల్.

19


వ.

ఇట్లు వరప్రసాదసమ్మరదభరితహృదయు లై నిజజనకరాజ్యవిభవంబు
విలసిల్లం జేయుచు వీరాభిమానవిజృంభితు లై యొక్కనాఁడు వినోదార్థం
బయ్యరువురు కుమారులుం గూడుకొని.

20

హంసడిభకులు వేఁటకుఁ బోవుట

క.

కరితురగరథపదాతులు
పరివేష్టింపంగఁ గొలుచుప్రజ ముందఱ గా

సరస జనార్దనుఁడుం జన
నరిగిరి వేఁటాడ ధరణి యల్లల నాడన్.

21


క.

వెలివాఱును గాలరులును
వలలుఁ దెరలు దీమములును వడిఁ దీరిన కు
క్కలు నారెగోలలును మం
డలక్రోవులు వేఁట కారడంబుఁ బెనుపఁగన్.

22


వ.

ఇట్లు వచ్చునెడ ముందట.

23


సీ.

ప్రబలదంష్ట్రాగ్రపర్యస్తముస్తాస్తంబ
                 జంబాలశబలవేశంతపంక్తి
ఘనఘనాఘననీలఘనవనప్రతిఘాత
                 ఘనఘర్షణావభగ్నద్రుమంబు
ఘురఘురారవఘోరఘోణాప్రఘాణవి
                 ద్రాణచ్ఛదాచ్ఛన్నతాంతలతము
ఖవనఘళాత్కారి ఖరఖురోత్పాతత్రి
                 హల్యధాత్రీధ్వస్తయవసరాజి


తే.

ఖేటభాటభాషణోద్భటాఖేటచటుల
కుటిలకటుకటాక్షేక్షణక్షోభబధిర
మతిరథసభాసమానయానాభిమాన
రౌమవిక్రియాకులము వరాహకులము.

24


వ.

అప్పుడు పందికదుపుల వెనువెంటం దవిలి కొందలింపం జిందఱవందఱగాఁ
జేసి యేసి యట చనఁ జన.

25


గీ.

నల్ల[3]సేనపుగుండులు నడచినట్లు
[4]మంపు గొని మే యెఱుంగక మలసి మలసి
[5]నెనరువారికి నురుకంగ నెగసి మన్నుఁ
బోతు లెడ చొచ్చె దాఁటెడు పొదలువోలె.

26

వ.

ఇట్లన్నునం గన్ను గానక తిరుగు మన్నుఁబోతుల నున్న యునికిన
గన్నంతటం బడ నేసి పోవం బోవ.

27


గీ.

నీర ముంచిన సొరకాయ నెగసినట్లు
పేరుకొని వైచు[6]తెల్లంటుచీర వోలె
[7]నుంకుచెండువిధంబున నుత్తరించు
తములపాకు నిక్కెడుక్రియ దాఁటె నిఱ్ఱి.

28


వ.

ఇవ్విధంబున నెగసిన యిట్టి నాలుగుకాళ్లునుం ద్రెవ్వ నొక్కమ్మున
నేసి చనునెడ మఱియు నప్పటప్పటికిం జొప్పరులవలన నుప్పతిల్లిన చప్పు
ళ్ళకుఁ దెప్పరం బైన తుప్పల దూరు దుప్పులును (నిడువేఁటకార్లు)
(వేటఁకుం) గడంగిన నడికి నడికిడవారికి నెడగాక తొడిగిన యమ్ముననపడి
పొరలు పిడులు విడువక చిడిముడిపడు కడఁతులును నీఁటెలకుం బోటబ్బక
సూటిమెయి దాఁటియు వేఁటచే విటతాటంబైన లేటికదుపులును
బిఱుంద [8]రొప్పుచోఱిగాఱకుఁగాక వెఱచఱచి పఱచు నెడఁదెఱపి నుఱికిన
తొరు ద్రొక్కువం కుక్కలచేఁ బఱిపఱి యైన యఱుములును గొందఱు
గొందఱ ముందటం గొందలం బంది యందంద సందడిం గ్రిందు మీఁదుగా వైచినం
జిందఱవందఱలుగా మ్రందిన కుందేళ్ళును నేదెసఁ దొలంగినను నూదిపిఱింది
త్రాడై [9]యాదిగొని పాదులవారిచే [10]యాదుల కాదులచే మూదలించిన సీద
రంబులతోఁ బాదుకొనిన యేదులును నివ్వలవ్వలనుండి యెడత్రెవ్వకుండఁ
ద్రవ్విన యోదంబులంబడి క్రొవ్వఱక మవ్వంబు నివ్వటిల్లం బట్టుపడిన చివ్వం
గులునుం గలిగినం గనుంగొనుచు వెండియుఁ [11]గ్రీఁగాలి నోలిం జాలుకొలిపిన
కాలువలలకుం బాలువడి లోలోపలం గవళించియు దోడ్తోడ జోడెంపువల
లకు లేటివేడెంబు చేసినం గూడఁబడియును మున్ను పన్నినకన్నెవలల సన్న
సన్నం బోవక యన్నునం గన్ను దిరిగిపడి సన్న సున్నంబుగాఁ దన్నికొని
యును నడ్డగించి నించినయొడ్డువలలకు పట్టించి వెడ్డునం బడక గడ్డుఱికియు
మృగంబు లనేకంబులు వొలియుటయును వేఁట చాలించి హంసడిభకులు
నడపులం దిరిగి పరిశ్రాంతులై సేనాసమేతంబుగా మగుడం దలంచి
మధ్యాహ్నసమయంబున.

29

చ.

కనిరి కుమారు లంత శశికాంతశిలాతలశీతలస్థలీ
వనఘనపాదపాదపనివారితవారితరంగరంగన
ర్తనపరివర్తనద్విరదదానసమదాళిమాలికా
తనువనజాతనూతన[12]పతాకముఁ బుష్కర మన్ తటాకమున్.

30


క.

కని యాపద్మాకరమున
దను పారెడునీరు ద్రావి తమ సేనలుఁ దా
రును విశ్రమించి రాసే
చనకము లగుతరులనీడ సైకతములపై.

31


వ.

అట్లున్నయెడ.

32


క.

మాధ్యందినసవనధ్వని
విధ్యుక్తస్వరముతోడ విని వచ్చుటయున్
స్వాధ్యాయపరులు గావున
సధ్యాహారంబు పుట్టె నయ్యరువురకున్.

33


క.

ఊహించి యాశ్రమం బగు
నోహో యిం తొప్పునే సముచ్చారణ మం
చాహంసడిభకు లేసం
దేహము లే కందు సనుమతి సముత్థితులై.

34


ఉ.

అచ్చట సేనల న్నిలిపి యాశ్రమవాసులఁ జూచువేడుకన్
వచ్చిరి పాదచారు లయి వారు జనార్దనుఁ డేఁగుదేరఁగా
లచ్చి తనూవిలాసమున లావు ధనుశ్శరధారణంబుచే
నచ్చువడంగఁ గాశ్యపమహామునియజ్ఞసమీపభూమికిన్.

35


క.

ఆగి [13]సభాచార్యులకున్
బరిపాటి నమస్కరించి పదపడి వా రా
దరమునఁ జేయుసపర్యలఁ
బరితోషము నొంది కశ్యపప్రభృతులతోన్.

36

వ.

హంసుం డిట్లనియె.

37


క.

మాతండ్రి రాజసూయముఁ
బ్రీతిం జేయఁగఁ దలంచి పిలువం బనిచెన్
భూతలమునఁ గలనృపతి
వ్రాతంబుల మీరు నరుగవలయు నచటికిన్.

38


మ.

క్షితి నాతమ్ముఁడు నేను దిగ్విజయముం జేయంగ డాయం గడున్
బ్రతివీరప్రకరంబు డంబు మెయిఁ గప్పం బొప్పనం బీక యే
కత మాడం గలరే నరేశ్వరశిరోగర్వంబు సర్వంబుఁ బా
పితి మీశానవరప్రసాదమున మాపెం పెల్లెడం జెల్లఁగన్.

39


క.

అనుటయు వారందఱు హం
సునితో నిట్లనిరి రాజసూయమునకు మీ
జనకుఁడు దొడఁగిన జాలును
మునుముట్టన వత్తు మిందు మోసము గలదే.

40


మ.

అనినం దమ్మునితో జనార్దనునితో హంసుండు సంతోష మొం
ది నిజేచ్ఛం జనుచోటఁ బుష్కరసరసీరోత్తరారణ్యపా
వనభూమిం బరమోపదేశమున దుర్వాసోమునీంద్రుండు శి
ష్యనికాయంబుం బ్రబోధవీథిఁ జనఁ జేయన్ సాయమై తోఁచినన్.

41

హంసడిభకులు దుర్వాసుని నవమానించుట

ఆ.

కావిచీర ముసుగు కచ్చడంబును జూచి
బోడతలయు నిడుదబొట్టుఁ జూచి
గోఁచితోడి వెదురుఁగోలయుఁ జిక్కంబుఁ
గట్టియున్న బుర్ఱకాయఁ జూచి.

42


వ.

డాయం బోయి హంసడిభకు లతనితో నిట్లనిరి.

43


క.

మిడికెదు పెదవులు వ్రేళులు
మడిచేదు కనుదోయి మొగిడి మాయెదురఁ గడున్

వెడవీక యొడలు చేసెదు
కడపల జపమునకు నేఁడు గలదో లేదో.

44


వ.

అని పలికి యతఁడు పలుకకుండం దమలోన.

45


చ.

తిరిసినకూడు దెచ్చి నలుదిక్కుల బోడలు తిండిపెట్టగాఁ
బెరిగినపొట్టతోడ నొకపీఁటపయిం దొర వోలె నెవ్వరిన్
సరకు గొనండు పట్టుకొని చాఁగఱ గొన్న బలే యెఱుంగుఁ డ
క్కరి బలుమోపు మోచు నయగారితనం బిరువుట్టి గట్టినన్.

46


తే.

బాంధవులఁ బాసి తమయిల్లుపట్టు విడిచి
తల్లిదండ్రులు వగవఁ గైతవముతోడ
బోడతలలు గాఁ [14]బడసిరి పొడువలెల్ల
వీనిమాటలచేఁ గదా వెఱ్ఱులైరి.

47


చ.

ఎఱుఁగరు గాక లోకమున నెవ్వరికైనను మేలు సేయఁగా
నొఱపగునాశ్రమంబున సమున్నత మైన గృహస్థధర్మముం
[15]బఱగడ వైచి గోఁచిగొని పాఱెడుపొల్లకు ముక్తి గల్గునే
పఱిగల నేఱినం గొలుచుఁ [16]పాఁతటికిం గలదే తలంపగన్.

48


వ.

అని పలుకుచు నయ్యరువురు న మ్మహాముని కిట్లనిరి.

49


సీ.

[17]అఱుకువయెఱుకతో నాశ్రమం బిది మెచ్చి
                 [18]తిదిగాక గృహమేధ మేల యెల్ల
వేపదంబునఁ బొందె దిందు మూఢుండవ
                 కాక సంసారసౌఖ్యంబు మాని
కఱపె ది ట్లున్న కొందఱకు నారకపాత
                 శీలంబుఁ దగునె తాఁ జెడ్డవాఁడు
వెనకయ్యచేతికి వెస లిచ్చె ననుమాట
                 నిజముగా నిచ్చోట నిన్ను వంప


తే.

నొరులు లే రని తలఁతేని నున్నవార
మేము గృహిని గాఁ బంచయజ్ఞేచ్ఛఁ గలిగి

నాకసుఖ మొందు మిపుడు ప్రాణాన నుండఁ
దలఁచెదేని నావుడు జనార్దనుఁడు గలఁగి.

50


క.

భాస్కరనిభుఁ డగుమునికి న
మస్కారము చేసి నృపకుమారులతోఁ దే
జస్కరము లగునె మాన్యా
వస్కందశ్రుతికఠోరవచనము లనుచున్ :

51


క.

న్యాయము దప్పకుఁడీ పురు
షాయుషజీవికయు లౌకికాచారము ని
శ్శ్రేయససిద్ధియుఁ జెడు యతి
నాయకదూషణము చేసినన్ మనుజులకున్.

52


శా.

నాల్గుం జెల్లెడి బ్రహ్మచారిగృహవానప్రస్థయత్యాశ్రమం
బు ల్గైవల్యవివక్షు లంతిమపదంబుం జేరువా రిట్టి వీ
ర ల్గోపించిన నంతకుండుఁ జెడు మీరా యోర్చువా రిమ్మెయిన్
మేల్గీ డాడక వీరి జేరి మనుఁడీ మీమీ శుభప్రాప్తికిన్.

53


గీ.

చెలిమి మీతోడఁ జేయుట చెట్టతనము
దానఁ గీ డెంత పుట్టినఁ దగిలె నాకు
ననుభవింపక పోవునే యక్కటకట!
వరుగుతో దాఁగరయు నెండవలసినట్లు.

54


చ.

గురువులు సెప్పరే చదువుఁ గొంతవివేకము మిమ్ముఁ జేరదే
తెరువునఁ బోక నేఁ డిది మదీయమనోవ్యధఁ జేసె బిమ్మటన్
హరుఁ డుపదేశ మిచ్చినది యంతయుఁ గాల బలంబునన్ మహా
పురుషుం కెగ్గు సేయఁ దలపోయఁగ నాయమై పోయెఁ బాపమై.

55


గీ.

పాయఁ దగు మిమ్ముఁ గనుమారిఁ బడఁ బొసంగు
విషము ద్రావుట యోగ్యంబు వెల్లిలోన
మునుఁగు టుచితంబు మీరెల్లఁ గనుఁగొనంగ
నాత్మ విడుచుట చను నాకు ననుచు నడలి.

56

క.

అలవడునే రాజులకుం
దులువతనము వినుము యతులతో నతులమతుల్
గలుషించుట చిత్తము నోఁ
బలుకుట బాంధవులుఁ దారు బ్రదుకుతలంపే.

57


వ.

అనుచుండ నమ్మునీంద్రుండు.

58


క.

కరుణయుఁ గోపముఁ గనుఁగవ
[19]నొరయఁగ నొకచంటఁ బాలు నొకచంటను నె
త్తురుఁ గురియుగతి జనార్దను
ధరణీశసుతద్వయంబుఁ దప్పక చూచెన్.

59


గీ.

చూచి యిట్లను భూపాలసుతులతోడ
నన్నుఁ గనలించి బ్రదుకఁ గన్నారు లేరు
పొలిసితిరి పొలిసితిరి వే పొండు తొలగి
మిమ్ము దరికొనుకోపంబు మ్రింగికొంటి.

60


వ.

అది యె ట్లనిన.

61


ఆ.

చక్రధరుఁడు బారిసమర నున్నాఁడు మి
మ్మింక వేఱె కోప మేల నాకు
తెఱఁగుమాలి తవుడు దిని చచ్చువానికి
విషము వెట్టువాఁడు వెఱ్ఱివాఁడు.

62


క.

అనుచుఁ గదలి పో వచ్చిన
ననుమానము మాని హంసుఁ డమ్మునిఁ జేప
ట్టినచంద మేమి చెప్పుదుఁ
బనికిన కాలోరగంబుఁ బట్టుట దోఁచెన్.

63


వ.

ఇట్లు పట్టుకొని.

64


శా.

తాను న్నిక్కమ పెద్దవాఁడు బలె నీతం డిత్తఱి న్నక్కఁ బ
గ్గానం బట్టినయట్టు బిఱ్ఱబిగియంగా నెంతసే పైన ని

చ్చో నుండన్ సమకూడునే మనకు నంచుం జించె నమ్మౌని కౌ
పీనంబున్ నృపుఁ డాజనార్దనుఁడు దప్పింపంగఁ గ్రౌర్యంబునన్.

65


ఆ.

కలఁగి కన్నవారు కన్నదిక్కునఁ బాఱి
పోయి రెల్లయతులు బోగుమిగులఁ
గినుక యడర సన్నగిల్లినయెలుఁగుతో
నమ్మునీంద్రుఁ డిట్టు లనియె మఱియు.

66


గీ.

చేయఁదగని కీడెల్లఁ జేసితిరి మీరు
చెఱుపనోపుదు శాపంబుచేత మిమ్ము
నయిన యతి నైన నా కేల యాగ్రహంబు
దానవాంతకుఁ డిటమీఁదఁ దాన చెఱుచు.

67


మ.

సకలోద్యోగకృతానుబంధుఁడు జరాసంధుండు బంధుండు మీ
కకలంకుం డతఁ డాశ్రమస్థు[20] లను నౌదాసీన్యముం జేయఁ డూ
రకపాయంగలవాఁడు నేఁడు మిము దుర్వ్యాపారులం జూచి కొం
కక మీకింకిరికిం జెలంగినఁ దొలంగం బాఱుఁ దద్ధర్మముల్.

68


క.

పో పొమ్మని పలుమాఱుం
గోపమ్మున హంసుఁ బలికి కొనియాడుటయుం
జేపట్టుట మెఱయఁ గృపా
నూపాపాంగుఁడు జనార్దనుని దీవించెన్.

69


క.

శ్రీవల్లభుతో సంగతి
గావుత నేఁ డెల్లి నీకుఁ గలుగు సుజనసం
భవితలోకద్వయసుఖ
మీవృత్తాంతంబుఁ జెప్పు మీజనకునకున్.

70


చ.

అనునెడఁ గ్రమ్మఱం గినిసి హంసుఁడు నాడిభకుండుఁ దోడి దు
ర్మనుజులఁ గూడి దండముఁ గమండలముం బిదలంబుఁ జిక్కమున్
మునుకొని వెండియున్ యతులముం పగుసొమ్ములు [21]గాల్చి గాల్చి క్రొ
వ్వునఁ గఱకుట్టు లయ్యెడఁ జవు ల్గొనిపోయిరి వేడ్క నూరికిన్.

71

క.

వారివెనుక నంతంతం
జేరి జనార్ధనుఁడు వోయెఁ జెడి రకటకటా!
వీ రనుచు విధివినోదము
వారింపఁగ మనుజకోటి వశమే యనుచున్.

72


వ.

ఇట్లు పోయిన యనంతరంబ.

73


శా.

దుర్వారోద్గమరోషభాషణము లై ధూర్తప్రలాపంబు లం
తర్విద్యామహిమం గలంప యతు లంతం జేర నేతేర నీ
నిర్వేదం బుడిగింప నచ్యుతుఁడ పో నిర్వాహకుం డంచు నా
దుర్వాసోమునిపుంగవుండు గదలెన్ దుఃఖాకులస్వాంతుఁడై.

74


క.

మండఁగ మండగ నార్చిన
ఖండితబిదలములుఁ ద్రుటితకౌపీనములున్
దండముల తుండములును గ
మండలుశకలములుఁ జూచి మఱకువ దోఁపన్.

75


గీ.

మురవిరోధిముందట నిట్టమోపు గట్టి
తేరఁ బంచి సహస్రయతిప్రవరులు
తోడ రా [22]నెండ దాఁకిన నీడచోట
నిలిచి నిలిచి యహోరాత్రనిర్గమమున.

76


వ.

రేపకడ.

77


గీ.

ద్వారకోపశల్యం బటు చేరి యొక్క
కొలన వార్చి దుర్వాసుఁడు గూడ వచ్చు
యతుల ముందట నరుదెంచి యాదవేంద్రుఁ
డాడుచున్న సుధర్మాసభాంతికమున,

78


క.

అఱువుడు గావిముసుంగును
విఱిగినదండంబుఁ దునిసి వ్రేలెడు గోచిం
బఱి[23]య లయినకరకమునయి
చుఱచుఱ జూఁచెడితెఱగుచూపులతోడన్.

79

ఉ.

వాకిట నిల్చె లోన యదువల్లభుఁ డాడుచునుండె గోళముం
గైకొని సాత్యకిం గడవఁ గాలను గేల నమర్యి చిమ్ముచున్
లోకులునుం గుమారులును లోనుగ నుద్దుల కుద్దులై వినో
దైకపరాయణుండును ననేక విధంబులఁ జుట్టి యాడగన్.

80


చ.

అవసర మైన వచ్చి పణిహారులు దోడ్కొని పోవఁ జొచ్చి యా
దవకురిపారిజాతము నుదంచితగోళవినోదమోదితున్
నవవికచారవిందసయనద్యుతిశీతలుఁ గాంచి రాయతి
ప్రవరులు పూర్వజన్మకృతభాగ్యఫలంబునుఁ బోలె నుండగన్.

81


మ.

వసుదేవాత్మజుఁడుం గనుంగొనియె దుర్వాసఃపరివ్రాడ్విభున్
రససారూపకలాపశాపవచనప్రారంభసంభావితున్
వ్వసనవ్యాప్తరిరంసహంసడిభకవ్యాళవ్యధావ్యాకులో
ల్లసనున్ వేషవిశేషరోషనిషయోల్లాసాద్భుతభ్రూకుటిన్.

82


ఉ.

అంతకుమున్న యాదవు లపాయభయంబున నాసనాదిపూ
జాంతర మాచరింపు మని యంతట నంతట రా మురారి య
త్యంతవినీతుఁ డై యతికి నయ్యుపచారము లెల్లఁ జేసి వి
శ్రాంతి యొనర్చె నర్హపరిచర్యలఁ దక్కినభిక్షుకోటికిన్.

83


వ.

అట్లు సకలయతిప్రతతికిని యథోచితోపచారంబు లాచరించి వాసుదేవుండు
దుర్వాసునితో నిట్లనియె.

84


శా.

ఈరూపంబున సంసృతిం దొఱఁగి మీ రేచింతలం జెంతలం
జేరం గోరక యూరకున్న నిటు విచ్చేయంగఁ జేయం [24]గడుం
బారం బేదిన వంతయుం గలిగెనే బాలార్కబింబంబులో
నారం గూరినయంధకార మన నాహా సాహసం బెట్టిదో.

85


ఉ.

ఆసలఁ ద్రంపి వెట్టి హృదయం బనుకాఁగున యోగవాసనా
భ్యాసపునీరు గాఁచుటకు నాగమపావకముం దగిల్చి యా
యాసవిహారమత్కుణగణైహికశయ్యకుఁ దజ్జలంబు పైఁ
బోసిన నీశరీర మది పొందియుఁ బౌందనియట్ల యూఱడున్.

86

చ.

మఱకువఁ గత్తరించి మదమానములం [25]జుఱవుచ్చి మెచ్చుఁ జాఁ
గఱగొని క్రోధకామముల గండడగించి పరోపకారమున్
జఱఁ బడఁ ద్రోచి వాచవులచట్టలు వాపి తొలంగి చిత్తముం
జఱపడి యున్న నీకు నొక చక్కటి నెక్కటి వేడగల్గెనే.

87


గీ.

కలుగుటకు మీరు విచ్చేయు కారణమున
సందియము లేదు మీయట్టి సంయములకు
నేమి కార్యంబు గలిగెనో యెరుఁగ రాదు
తెలుపవే నాకు నిర్మలధీనిధాన.

88


క.

అనుటయు భగభగ మండెడు
కనుఁగవతో నొడల నడరుకంపముతో నె
ట్టిన నిట్టూర్పులతో మొగ
మునఁ దనికిన కెంపుతోడ మునిపతి యుండెన్.

89


వ.

తదనంతరంబ యంతరంగంబు కొంత సంతరించికొని యతండు నారాయణున
కిట్లనియె.

90

దుర్వాసుఁడు హంసడిభకుల దుర్నయంబు కృష్ణున కెఱిఁగించుట

మ.

తగునే యింత మురాంతకా తలఁపవే త్రైలోక్యముం గావ నీ
వు గదా దానవవైరివై పొడమి లావుం జేవయుం జూప రూ
పగుదైవంబు గదాధరుండ వఖిలవ్యాపారపారంగమా
ధ్వగ మావృత్త మెరుంగనేర వనఁ జిత్తం బుత్తలం బందదే.

91


శా.

ఏఁ గాదే నడ[26]తుం జతుర్ముఖునితో నింద్రాదిదిక్పాలకుల్
మూఁగంబాఱి భవత్పదాబ్జములకున్ మ్రొక్కంగ లేకున్నచో
నాఁగ న్వచ్చియు నాఁగఁ జాలని ప్రతీహారు న్విడంబించుచున్
దాఁగం బోయి తలారివానియెదురన్ దాఁగంగ నీ కేటికిన్.

92


ఉ.

ప్రాతల మేము నీకుఁ బలుబాములఁ బొందకి యున్ననాఁటి[27]నీ
చేతలు గంటి [28]మిందఱకుఁ జిత్తముల న్వెలిఁ దోఁచుసూఁత[29]లం

భూత[30]ల నీవయొండు దలపోఁతలు లేఁతలు మమ్ము నెమ్మెయిన్
లాఁతులఁగా దలంపకు నలంపకు చాల నలంగియుండగన్.

93


వ.

అని మఱియును.

94


సీ.

ఏ నెఱుంగుదు నిన్ను నేల నాతోడనే
                 వెడమాయములు బ్రహ్మవేత్త లెఱుఁగు
రూపు రూపులలోనిరూపుఁ దోరపురూపు
                 చూపనిరూపు నీరూపు సూపి
వేదాంతముల నైన వెదక నందనిరూపు
                 విజ్ఞానరూప మై వెలయురూపు
తేజ మైశ్వర్యంబుఁ దెలుపఁ జాలెడురూపు
                 ప్రణవరూపంబు గాఁ బరఁగురూపు


తే.

పంచభూతసుధాకరభాస్కరాత్మ
రూప మగురూపు నీరూపు రుచిరరూప
మొఱఁగుదవె మాకు వ్రేళ్ళతో మొదలు చూచి
చె ట్టెఱుఁగువారి కాకులు సిదుమ నేల.

95


క.

మాకుం బుణ్యము చాలమిఁ
గా కేమి జగత్రయంబు గావం బ్రోవం
గైకొన్న నీవు సకలవి
వేకివి మాదుఃఖ మెఱుఁగవే మధుమథనా.

96


క.

అంభోజనాథ! నరపతి
డింభులు భువనమున హంసడిభకు లనంగా
జృంభితు లయి యిరువు రుపా
లంభించిరి కానలోఁ జలంబున మమ్మున్.

97


ఆ.

హంసపరమహంసు లగునీయతీంద్రుల
పేరు సైఁప లేక పెచ్చు పెరిగి
హంసు డాత్మనామహర్షు లని కానోపుఁ
బట్టి మమ్ముఁ జాల భంగపఱచె.

98

క.

సరకుగొనరు సురవరులను
గురుశక్తిని భీష్మబాహ్లికులఁ గైకొన రు
ద్ధరత జరాసంధుని వెర
వరిగా మెచ్చరు మశవరగర్వమునన్.

99


తే.

హంసడిభకులనెత నీయతులు నేముఁ
బడినపాటులు వేఱ చెప్పంగ నేల
కమలలోచన! ముంజేతికంకణమున
కద్ద మేటికి నీసొమ్ము లరయరాదె.

100


వ.

అనుచుం బుండరీకాక్షుముందటం దమతెచ్చినభగ్నవస్తుసముదాయ
భారంబు విచ్చి చూపి యిట్లనిరి.

101


సీ.

ఈకమండలుపఱ్కి నెటు చూతు నిట్ల త
                 త్పాపమస్తంబులు వగుల కున్న
నీదండనివహంబు నెటు చూతు నిట్ల త
                 ద్ధూర్తహస్తంబులు దునియ కున్న
నీవల్కలవ్రాత మెటు చూతు నిట్ల త
                 త్కపటచర్మంబులు గాల కున్న
నీశిక్యసముదాయ మెటు చూతు నిట్ల త
                 ద్ద్వేషణాంత్రంబులు దైవ్వ కున్న


తే.

నకట మోమోట లేక తా రంత చేసి
బ్రదికిపోయిరె పులి పేదవడినఁ బసుల
[31]వాండ్రె యెక్కాడి రనుకత వచ్చె నాకు
మునులలోపల నాలుక ముల్లు విఱిగె.

102


తే.

వలదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర
జాతు లాత్మకులోచితాచారపథము
నడప నాహంసడిభకు లేనాఁట నేది
నడిపి రది చెల్లుఁ గాక వర్ణముల కెల్ల.

103

క.

మా కేది దిక్కుఁ దెరువో
లోకంబులు మూఁడు నింతలో నే మగునో
నీకడు పట సర్వంబును
జేకొనవే దుష్టశిక్ష చేసి మురారీ!

104


చ.

అనిన యతిం గనుగొని మురాంతకుఁ డిట్లనుఁ దప్పుచేసితిం
గినియకుమయ్య మి మ్మొకఁడు కీఁడునఁ బెట్టెడువాఁడు లేఁడ యెం
దని పరికింపనైతి విను మాధరణీశకుమారధూర్తులం
దునియెద నింతలో వగలఁ దూలకు సాత్యకితోడు సంయమీ.

105


క.

ఎఱిఁగి యెఱిఁగి నీముందు
నఱగొడ్డెము చేసి పోయి [32]రది గైకొన రీ
తెఱఁ గయినహంసడిభకులు
కొఱవిం దల [33]బరికికొన్న కొఱడులు గారే.

106


క.

హరుఁడు వర మిచ్చె వాణీ
వరవరుణకుబేరసురవివైవస్వతు లి
త్తురు గాక నీవు గినిసిన
వరముల గిరములను బ్రదుకువారే కుమతుల్.

107


క.

కలడు జరాసంధుఁడు వా
రలకుం జెలికాఁడు నిష్ఠురభుజాపరిఘుం
డలఘుబలుఁడు సేనలతో
గలయకమును వారిఁ జంపఁగలవాఁడఁ జుమీ.

108


చ.

ఎద్రిచిన కాలపాకముల నీగతి నీమదిఁ గ్రోధవల్లికం
బద్రిచినవారు మన్నిశితబాణపరంపర వైవ మిణ్గుఱుల్
విద్రుపగఁదత్ఫలంబులచవిం జరితార్థులుగా శరీరపుం
జిద్రుపలు చేరుఁ దత్సతులచేతులఁ గాకకులంబువాతులన్.

109


చ.

అనిన మునీంద్రుఁ డెంతయుఁ బ్రియంబున నచ్యుత పుండరీకలో
చన కమాలాసనాదిసురసంఘశరణ్యపదాంబుజా జనా

ర్దన దనుజాంతకా కొలిచెదం బ్రణమిల్లెద సంస్తుతించెదన్
నిను ననిశంబు నన్నుఁ గృప నెక్కొని కావుము దేవ నావుడున్.

110


వ.

అద్దేవదేవుం డిట్లనియె.

111


క.

 ఏమే నేమే నొడివిన
నామాటల కెగ్గుగా మనంబున యతిచూ
డామణివి నీవు దలఁపకు
స్వామీ మన్నింపవలయు సైరణతోడన్.

112


క.

దానము ధర్మముఁ దత్త్వ
జ్ఞానము సత్యంబు యశము శతమఖపురసో
పానము లయినవి పయిరణ
దానకదా యతుల కది ప్రధానము దలఁపన్.

113


క.

అని వేఁడికొని యతీంద్రుల
దనృహమున నారగింప దామోదరుఁ డిం
పునఁ బ్రార్థించిన నేమియు
ననుమానము లేక వారు నౌఁ గా కనినన్.

114


తే.

అలవరించి చతుర్విదాహారములను
దుష్టి చేసి దుకూలముల్ ద్రుంచి త్రుంచి
కట్టనిచ్చిన యతులును గమలనాభు
వీడుకొని మున్ను వచ్చినజాడఁ జనిరి.

115


క.

విచ్చలవిడి దుర్వాసుం
డచ్చోటన నిల్చె సంతతానందపదం
బిచ్చఁ దలంచుచు నారదు
డచ్చపుఁజెలికాఁడు గా మురాంతకుఁ డంకన్.

116


వ.

హంసడిభకుల వధింపం జింతించుచుండెఁ దదనంతరంబ.

117


ఉ.

క్రూరతఁ గ్రొవ్వి హంసడిభకుల్ సభకుం రాజ్యగౌరవో
దారుని బ్రహ్మదత్తుఁ దమతండ్రిఁ గనుంగొని రాజసూయమున్

ధీరతఁ జేయు మియ్యెడను దిగ్విజయం బొనరించి యజ్ఞసం
భారము లెల్లఁ దెత్తుమని బాహుబలంబుఁ జలంబుఁ జెప్పినన్.

118


క.

అతఁ డౌణ గా కనుటయు స
న్నుతమతి యగు నాజనార్దనుండు ధరిత్రీ
పతిసుతులకు నతిహితముగ
జతురతతోఁ బలికె సహజసౌజన్యమునన్.

119


గీ.

రాజసూయంబు చేయ నేరాజు దలంచు
నాతనికి రాజు లరిగాపు లయినఁ గాని
నిర్వహింపదు మన మెల్లి నేఁడు సేయు
లావు మెఱయునె ధర యింగలాలపుట్ట.

120


వ.

అది యెట్లనిన.

121


చ.

ఇరువదియొక్కమాఱు ధరణీశ్వరులం బరిమార్చి పేర్చి దు
ర్ధరతరసారుఁ డైనజమదగ్నితనూజుఁడు సంగరంబులో
సరిసరిఁ బోరియుం బిదపఁ జాలక యెవ్వని కోహటించె నా
పరబలభీష్ము భీష్ముఁ బెఱపార్థివు లేమనువారు పోరులన్.

122


మ.

కురువీరాగ్రణి బాహ్లికుం డలిగినం గోదండపాండిత్య మె
వ్వరుఁ జూపంగ వలంతు లే పవనజున్ వైరిక్షమాపాలభీ
కరు భీముం గదలించువారుఁ గలరే కంసారితోఁ బోరిలో
సరివాఁడై యని మీకుఁ బెట్టుట జరాసంధుండు సైరించునే.

123


సీ.

నరకాసురప్రాణనాళోత్తరణకేళి
                 [34]రణకేళి వలకేళి రమణఁ జూపెఁ
గంసదానవశిరఃకమల[35]కృత్తన మేలు
                 తనమేలు చేయి పుధ్దలకు నొసఁగెఁ
జాణూరముష్టికక్షతజకీలాలంబు
                 నాలంబులో నెల్ల నలవు వఱపె
మురహయగ్రీవాంత్రమూలఫేనావళి
                 నావ[36]లిదలఁగ జీకాకు పఱచె

తే.

వీరరససార[37]కాసారవిహరణంబు
విష్ణునకు నొప్పు నతనితో విగ్రహింప
దొరకొనిన వచ్చు మనకు మద్దులు మునింగి
పాఱ వెంపళ్లు కెంతబంటి యనుట.

124


మ.

నిలువం జాలుదురే రణాంగణములో నీలాంబరాడంబరో
జ్జ్వలవేషంబు హలాహలస్థలహలవ్యాపారదోస్సారముం
బ్రళయంబోధరసోదరారవము నొప్పన్ దర్ప మేర్పాటుగా
బలభ ద్రుం డతిరౌద్రుఁడై కదిసినం బ్రత్యర్థిభూపాలకుల్.

125


మ.

వికలవ్యూహవిధావిహస్తభట మై విధ్వస్తమాతంగ మై
శకలీభూతశతాంగ మై శరఘటాశల్యాయమానాశ్వ మై
సికతాసేతువు ని మ్నగారయముచేఁ జిందైనచందాన సా
త్యకిచేతం బడుశత్రుసంఘము దశాదైన్యంబు సైన్యంబునన్.

126


వ.

అదియునుం గాక.

127


ఉ.

చేసినవారు మీరు గడుఁ జెట్టతనం బది యోర్వలేక దు
ర్వాసుఁడు వాసుదేవుఁ గని వైరము తోరము చేసినాఁడు స
న్న్యాసులఁ గూడికొంచుఁ జని యంతకుము న్గడి ద్రెవ్వి మీయెడన్
గాసిలియుండు యాదవనికాయము సైఁపదు రాజసూయమున్.

128


క.

మును చేసిన వైరంబును
ముని చేసిన వైరమును మిముం దడవక పో
వునె వైదేశికుఁ డగు వి
ప్రునిచే నివ్వార్త వింటి భోజనవేళన్.

129


క.

ఒప్పగునో తప్పగునో
యిప్పటికిం దోఁచుకార్య మిది నృపతులకుం
జెప్పవలె నాప్తమంత్రులు
చొప్పగునే మనకు రాజసూయము చేయన్.

130

చ.

అనుటయు హంసుఁ డిట్లను జనార్దనుతో ముదిజోదు భీష్ము నొం
డనఁ బనిలేదు బాహ్లికుఁడు నాతనికంటెను బంకు వీరు మ
ద్ఘనభుజశక్తికిం దరము గారు దలంపక వచ్చి భీముఁడుం
గనుఁగొన లేఁడు మద్ధనురకాండరవిచ్ఛవిచండకాండముల్.

131


మ.

కలు ద్రావం బని పూని యాదవులు ఖడ్గాఖడ్గి [38]వాదింతురే
కలఁగం బాఱుట గాక పంతములకుం గంసారి సైరించినం
గలనం బ్రాణముతోన పట్టువడు నింకన్ సాత్యకిం గీత్యకిన్
బలభద్రున్ గిలభద్రు నాయెదురఁ జెప్పం జొప్పు దప్పుం జుమీ.

132


క.

మనకు జరాసంధునకును
మనసులు గలసినవి ధర్మమయుఁ డాతం డీ
పని గాదనఁ డింక జనా
ర్దన యాదవనగరమునకుఁ దడయక చనుమీ.

133

హంసడిభకులు జనార్దనుని యాదవనగరమునకుఁ బంచుట

క.

చని యా జనార్దనునిచే
ఘన మగులవణంబు మనకుఁ గప్ప మడుగు మే
ధనములును సరకు గా విటఁ
జనుదెమ్మను మతని యజ్ఞసమయంబునకున్.

134


క.

ఏయుత్తరంబు సెప్పిన
నీయానయ నీకుఁ జెలిమి నీతో మిగులం
జేయుట నొండన నేర న
సూయ తలంపునకు రాదు సూ నినుఁ గనినన్.

135


మ.

అనుడు న్వేడుకతోడ వీడుకొని యశ్వారూఢుఁడై యా జనా
ర్దనుఁ డేతేరఁ దదంతరంగము [39]మునీంద్రత్రాణు శ్రీవత్సలాం
ఛను నేఁడెల్లి కనుంగొనం గలిగినం జోలుం గృతార్థుండఁ బొ
మ్మని చింతింపఁగ నాకు నేఁడొదవె నాహా తీర్థమున్ స్వార్థమున్.

136

సీ.

యదుకులాంబుధిచంద్రు నానందమునఁ జూచు
                 రామాదిహితచకోరములలోన
దనుజారిపారిజాతముఁ జేరి పొదిగొన్న
                 రాజన్యరాజకీరములలోన
వసుదేవసుతసరోవరములో నోలాడు
                 సనకాదిదివ్యహంసములలోన
గోపాలనవపుష్పగుచ్ఛంబు మూఁగిన
                 పరిచారికాద్విరేఫములలోన


తే.

గలయఁ దొలుబామునోములు గలవుగాన
సెలవు లేక జన్మంబులు చెడియె నాకు
మీఁద జన్మంబు గలుగ నిర్మించె నేని
కమలజుని పేర దాపటికాలిబొమ్మ.

137


సీ.

వెలిదమ్ములో లేఁతవెన్నెలో యమృతమో
                 కన్నులో చిఱునవ్వొ కనికరంబొ
గగనమో చుక్కలో గ్రహరాజబింబమో
                 వక్షంబొ మౌక్తికావలియొ మణియొ
తరగలో ఫేనమో తరణిమండలమొ హ
                 స్తములో శంఖంబౌ సుదర్శనంబొ
తలిరులో కరికరంబులొ కుంకు[40]ముప్రభయొ
                 పదములొ యూరులో పచ్చఁబట్టొ


ఆ.

యనుచుఁ గన్నులార నాజగన్నాథునిఁ
గనుగొనంగ నేఁడు గలుగు గాన
తలఁపులోన మున్ను దలఁచినరూపంబు
పట్టువడుట జన్మఫలముగాదె.

138


వ.

అని వర్ణించుచుం జని ద్వారకానగరప్రవేశంబు చేసి యదువల్లభునగరివాకిట
హయావతరణంబు చేసి తనరాక యెఱింగించి పుచ్చి యద్దేవదేవునియనుమతంబున
సభామండపంబునకుం జని జనార్దనుండు.

139

మ.

కనియెం గౌస్తుభరత్నభూషణు వలత్కర్పూరహారావళీ
వనితాచాలితతాళవృంతపవనవ్యాధూతచేలాంచలున్
మనుజాధీశకిరీటకోటిపరిషన్మధ్యస్థసింహాసనాం
కునిఁ దేజఃప్రసరప్రభాతతరణిన్ గోపాలచూడామణిన్.

140


సీ.

బలభద్రుఁడును దాను భద్రపీఠంబునఁ
                 గదియ శైనేయుఁ డగ్రమున మెఱయ
దుర్వాసుఁడును నారదుండును రెండు ది
                 క్కులఁ దన కింపుగా గోష్ఠి సేయ
నుగ్రసేనుఁడు గౌరవోన్నతిఁ దనుఁ జేర
                 గంధర్వగానంబు గలసి పొలయ
నప్సరోగణనర్తనాడంబరముఁ జూచు
                 తనచేత నభి[41]నుతధనము లడరఁ


తే.

దనకునై వందిమాగధస్తవము నిగుడ
సామవేదులు దనయందు సార మెరుగఁ
దనవలన లోకు లానందధారఁ దేల
లీలఁ బేరోలగం బున్న నీలవర్ణు.

141


వ.

కని కదియం బోయి తనపేరు చెప్పి నమస్కారంబు చేసి బలదేవునకు
నట్ల ప్రణమిల్లి యథోచితస్థానంబునం గూర్చున్న యనంతరంబ మురాంతకుం
డతనితో నిట్లనియె.

142


గీ.

అనఘ! మీరాజు బ్రహ్మదత్తునకుఁ గుశల
మా నరేంద్రకుమారులు హంసడిభకు
లధికభవ్యులె వరములు హరునిచేతఁ
గొన్నవారట కుశలంబు గొఱఁత గలదె.

143


క.

మీజనకుఁడు శుభయుతుఁడే
రాజులు మిము గారవింతురా సుఖకరులే
భూజను లిపు డిబ్చోటఁ బ్ర
యోజనమా నీవు వచ్చునుద్యోగమునన్.

144

వ.

అనుటయు నా జనార్దనుం డిట్లనియె.

145


క.

అందఱకుం కుశలమ, మా
కుం దగుమన్ననల, ప్రజలకుం బరిణామం
బిం దే వచ్చినపవి గో
వింద యెఱింగింప కెఱుఁగవే విశ్వపతీ.

146


క.

లోపల వెలుపల వెలుపల
లోపలఁ గా నుండు నఖిలలోకంబులకున్
నీ పరతత్త్వము చిత్రము
రూపము నై నీవు లేనిరూపము గలదే.

147


ఉ.

ఉండుట తప్పు వారికడ నుండమి త ప్పిట రాక తప్పు, రా
కుండుట తప్పు, తప్పులకు నొప్పులకున్, గతి నీవ దేవ! యే
నొండొకరుండనే పలుక కూరక నేరక యుండఁ జేయు వీ
ఱిండితనంబుచేత నిసిఱింతలు వాఱెడిఁ జిత్త [42]మిప్పుడున్.

148


చ.

అనుడు జనార్దనుం డను జనార్దనుతో విను దూతకృత్యముం
బనివడి పూని యేలికల ప్రల్లద మైనను జెప్పఁ జెల్లుఁ ద
ప్పనిపలుకైనఁ బోలు వినఁ బంతము చల్లకు వచ్చి ముంత దాఁ
చినగతి నింత మాటువడఁ జేసినఁ గార్యము గానవచ్చునే.

149


క.

రావలదే పంచినపని
సేవకులకుఁ బాముకాటు సీరఁ దుడిచినం
బోవునె వారే మనిరో
నీ వేలా దాఁచె దేమి నేరమి నీకున్.

150


చ.

అనుడు నతండు హంసడిభకానుమతంబున రాజసూయమున్
జనపతి సేయఁ బూని భుజసారమునన్ సడిసన్న రాజులన్
ధనములు దాలఁ దెండని పదంపడి దేవర యున్నచోటికిన్
ననుఁ బని పంపె నిమ్న యజనంబున మున్నిడి చేయువాఁడుగాన్.

151

గీ.

అప్పు డాహంసడిభకు లిట్లనిరి మనకు
లవణ మెంతేని నడుగు యాదవులచేత
వేగ రమ్మను శౌరి నియ్యాగమునకు
నావుడుం బని పూనితి దేవదేవ!

152


వ.

అనుటయు వాసుదేవుండు రోసంబునకు మూలం బైన హాసంబు చేసి
యిట్లనియె.

153


ఆ.

రాజసూయకర్త బ్రహ్మదత్తుం డట్టె!
[43]రభస మెసఁగ హంసడిభకు లట్టె!
చేయఁ బంచువారు చెల్లఁబో లవణంబు
మోచువాఁడ కాక మురవిరోధి.

154


ఉ.

అప్పన మెంత గావలె నహంకరణంబు దొఱంగి యిచ్చినం
గప్పముపేర నేఁడు నొడికారితనంబున మోసపుచ్చఁగా
నుప్పులు దెత్తురే సమరయోగ్యతలంబున వైరికోటితో
నుప్పనఁబట్టె లాడునెడ నుప్పులు దెత్తురుగాక యాదవుల్.

155


వ.

అని పలికి యాదవలోకంబు నాలోకించి.

156


మ.

కలరా యింతకుమున్ను యాదవులచేఁ గప్పంబు దెప్పింపఁగాఁ
గలరా రాజులు గాజులుం దొడవుఁగా గల్పించిరా కాకులం
గలకంఠంబులఁ జేసెనా కటకటా! గౌరీశ్వరుం డేమిగాఁ
గలవారో యిటమీఁద హంసడిభకుల్ గర్వాంధకారంబునన్.

157


వ.

అనుటయు యాదవులు దమలోన.

158


గీ.

హంసడిభకులు రాజసూయంబు సేయ
మనము గప్పంబుఁ గొనిపోక మంచిమాట
నేఁడు [44]సారిసత్తెలమొనల్ వాఁడి చేసి
నోరి చొరవ భూతేశుండు వారిఁ జెఱిచె.

159


ఉ.

యాదవు లుప్పు మోవఁగ మురారికి సోలలు మోవ కింకఁ బో
రాదు హలాయుధుం గొలువ రమ్మను రై రటుగాని యాగముం

గాదట చేయ హంసడిభకక్షితిపాలకుమారు లంచు నా
బీదల కేల బోగుబడి పెద్దఱికంబునుఁ బెట్టబీరమున్.

160


తే.

అనుచు నొండొరుఁ జెయివ్రేసి యపహసింప
హరియుఁ గలకల నవ్వి జనార్దనుండు
వినఁగ నిట్లను నొం డేల వీరవరుల
నలుగుమొనఁగాక కప్పంబు లడుగ నగునె.

161


క.

అరిఁ గరమున నే దాల్చిన
నరిగరము నాగేంద్రధీరుఁ డయినం జెడఁడే
యరి దిరమై న న్నడుగుట
యరిది రమైకాభిలాషు లగునృపతులకున్.

162


మ.

వెదకం బోయినతీవ కాలఁ దవిలెన్ వేయేల దుర్వాసుచే
మొదటన్ సంచకరంబు హంసడిభకోన్మూలక్రియాకేళికిం
గుదురై యున్నది సాటిగాక యిట మత్కోదండకాండోదర
ప్రదరప్రావరణాంబుదప్రకటశంపాకంపశాత్కారముల్.

163


వ.

వారలతో నిట్లనుము.

164


ఆ.

ఈశువరముచేత నెవ్వఁడే నిప్పాట
శూరుఁ డైన దువ్వుఁ జూచి నక్క
యొడలు గాల్చికొన్న వడువున మీ రింత
లావుమాట లాడ లజ్జ గాదె.

165


ఆ.

హరిగదావిహార మల్లంతఁ దోఁచిన
వరము మిమ్ముఁ గావ వలఁతి యగునె?
వెఱ్ఱివార! పిడుగు వ్రేసినఁ దలటొప్పి
యాఁగునే వివేక మైన వలదె.

166


క.

అగునో కావో వరములు
డిగ విడువఁగ రాదు హంసడిభకులు నన్నున్
మొగరించిన హరునయినను
జగ మెరుఁగఁగ దోలి తమ్ముఁ జంపెద ననుమీ.

167

క.

పరపగు మోహర మేర్పను
నెరవగుచో నెల్లి నేఁడు విడెసెద మధురా
పురమునఁ బ్రయాగమునఁ బు
ష్కరమునఁ దా రేర్చికొన్న కల నగు మాకున్.

168


మ.

మొగమాటంబున నీవు వారి యెదుటన్ ముఖ్యంబు యుద్ధంబకా
దెగనాడన్ వెఱలేని సాత్యకి సమిద్ధీరుండు నీతోన యేఁ
గి గుణగ్రాహులు గాని తద్ధరణిభృత్కీటాంతరంగంబులం
బగుల న్వైచుఁ గఠోరవీరవచనప్రాసప్రసారోద్ధతిన్.

169


వ.

అని పలికి సాత్యకిం గనుంగొని నీ వితనితోడ సాల్వనగరంబునకు హయా
రోహణుండ వై సన్నాహంబు మెఱసి యొక్కరుండవ చని మదీయవచనంబు
లన్నియుఁ దద్రాజడింభకుల యెదురఁ బలికి కలను చెప్పి రమ్మని వీడుకొల్పిన.

170

సాత్యకి సాల్వనగరమునకుఁ బోవుట

ఉ.

వేడ్కఁ బ్రణామపూర్వముగ విశ్వజగజ్జనకున్ జనార్దనున్
వీడ్కొని యాజనార్దనుఁడు వేగమ కూడఁగ రా నరాతు లీ
మాడ్కి మహోద్ధతిం జెనయ మా వశమా యన జోడుఁగైదువుం
జూడ్కికిఁ దోఁప శౌరి యనుజుం డరిగెం దురగాధిరూఢుఁడై.

171


సీ.

చని సాళ్వపురము చొచ్చి నరేంద్రనందన
                 మందిరద్వారంబునందు హయము
నవతరించి జనార్దనాంతఃప్రవేశంబు
                 మున్నుగా వారికిఁ దన్ను శౌరి
పుత్తెంచుటయుఁ జెప్పి పుచ్చె నాతం డట్ల
                 చేసి యర్హాసనాసీనుఁ డైన
పిదప రప్పించినఁ బెంపుతో సాత్యకి
                 యాజనార్దనుఁ డన్నయాసనంబు


తే.

నందు గూర్చున్నఁ దప్పక హంసుఁ డతని
యాననంబు విలోకించి యామనోజ్ఞ

భీషణం బగువేషంబు బింబితావ
హిత్థరోషంబుఁ గనుఁగొని యిట్టులనియె.

172


మ.

ఇతఁడే సాత్యకి యిమ్మహాభుజుబలం బెల్లప్పుడుం జెప్పఁగా
శ్రుతిపర్వంబగు నేఁడు గంటిమిగదా శూరుండు ధీరుండు సు
వ్రతుఁ డౌదార్యసమన్వితుం డఖిలశాస్త్రజ్ఞుండు శస్త్రక్రమా
ర్జితసారుం డనుమాటలన్నియుఁ దగుం జిత్తం బుదాత్తంబుగన్.

173


వ.

అనుటయు జనార్దనుండు.

174


క.

హరిదక్షిణభుజము సమి
ద్దురంధరుఁడు నయవిహారదోహలి హలికిం
బరమాప్తుఁడు సకలకళా
పరిణతుఁ [45]డీతం డలంతిపని వచ్చునటే.

175


వ.

అనుటయు హంసుండు సాత్యకితో నిట్లనియె.

176

.

గీ.

కంసవైరికిఁ గుశలమే కామపాలు
నకుఁ బ్రమోదంబె యాదవులకు సుఖంబె
యుగ్రసేనుండు మొదలుగా నున్న సాత్వ
తులకు నెల్లను సేమమే దురితదూర.

177


క.

అనవుడు సాత్యకి మోమునఁ
గొనసాగనితెలివి దోపఁ గుశలమ నీచె
ప్పినవారి కెల్ల ననుటయు
ననియె జనార్దనునితోడ హంసుఁడు పిదపన్.

178


శా.

 కంటే శౌరి నతండు నీ పలుకు లాకర్ణించెనే క్రమ్మఱన్
వింటే తద్వచనంబు చెప్పు మనుడు న్విప్రోత్తముం డిట్లనున్
గంటిన్ గంటి దయానిధిన్ గుణనిధిన్ గారుణ్యపాథోనిధిం
గంటి న్నమ్మికఁ దమ్మికంటిఁ గొలువం గంటిం గృతార్థుండనై.

179

చ.

అవిరళరత్ననూత్నకనకాసనపూర్వమహీధరంబుపై
నవవికచారవిందరుచి నవ్వెడు కన్నులచాయ చుక్కలన్
దివియల మాయఁజేయ నలుదిక్కుల మ్రొక్కుల పేరమోడ్చు యా
దవకరకైరవంబుల కతంబునఁ గంటి మురారి భాస్కరున్.

180


సీ.

ఉరము కౌస్తుభరత్న ముదయాద్రితటమునఁ
                 బొడతెంచు కలువల[46]బోటుబోటు
శిరము కిరీటంబు సురగిరినెత్తాన
                 రాజిల్లు పగలింటిరాజురాజు
కటిపచ్చఁబట్టు దిగ్దంతి కుంభస్థలిఁ
                 జూపట్టు రేయెండజోడుజోడు
చేతిశంఖంబు గర్జితగజేంద్రము కేలఁ
                 బరఁగు వెన్నెలపూవుబంతిబంతి


తే.

యై కొలువులోనఁ దేజోమయంబు సేయ
మోక్తికవితానమయసభామండపమున
సత్యభామాసఖీకటాక్షముల గములు
చూఱగొనుచున్న దేవకీసుతునిఁ గంటి.

181


మ.

కని యద్దేవునితోడ వేడబమునం గప్పంబు గార్యంబుగా
ననుఁ బుత్తెంచుటఁ జెప్ప నోడితి జగన్నాథుండు నీ వందు వ
చ్చిన కార్యం బెఱిఁగింపు మన్న పిదపం జెప్పంగ నోరాడె న
వ్వనివా రెవ్వరు లేరు నా పలుకులన్ వాక్రువ్వ నిం కేటికిన్.

182


వ.

ఏ పురుషోత్తము నుప్పు గప్పం బడిగిన నప్పు డతం డెప్పుడెప్పు డప్పార్థివ
డింభద్వయంబుం జూతునో యెచటం దెగంజూతునో యనుచుండి వెండియుం
గొండుక నివ్వి యవ్విభుండు నారదుతోడ మాటలాడుచు నామాటలయెడ ననాద
రంబు చేసె నవ్వాసుదేవుండు దుర్వాసుతో వినోదంబుగాఁ గొందఱు యతీశ్వరులకు
వాదు చేయించి బ్రహ్మతత్త్వనిర్ణయంబునకు వెఱవక వారిచేత నుత్తరంబు లిప్పిం
చుచు నుండె నట్టియెడ నాతలంపున.

183

గీ.

అకట నేరనివా రైరి హంసడిభకు
లేమిగా నిందుఁ బుత్తెంచి రే నిదేల
వచ్చి వీఱిఁడి నైతి నివ్వాసుదేవుఁ
దేఱి చూడరాదని చాల దిగుల గుడిచి.

184


క.

మానితిఁ బని యామాటలు
మాని తిరుగుఁ డింక బోరు మనమాటలకుం
బూని మరుమాట లాడఁగ
శైనేయుఁడు వచ్చెఁ దాన చాలుం బనికిన్.

185


క.

అనుటయు హంసుఁడు గమగమ
గనలి మదిం జెరువు విడిచి కాలువఁ బొగడం
జనునే వీనికి నని యి
ట్లను ననుమానింప కాజనార్దనుతోడన్.

186


శా.

ఓరీ బ్రాహ్మణధూర్త! నా యెదుర నోహో! సాహసం బెట్టిదో
వైరిం గోరి నుతించుమాట లెటుగా వచ్చెం గృతఘ్నా! యిదిన్
నోరే యెవ్వరి కెవ్వ రయ్యెదరు నిన్నుం బెంచి మన్నించినన్
గారామై యిటు చేసితే తొలఁగు మింకం జాలు నీ కార్యముల్.

187


మ.

నిను రప్పింపక మున్న వేగపడి పూనెన్ శార్ఙ్గకౌమోదకీ
వనమాలాంబుజచక్రభూమికలు గైవారంబు చేయించె నే
లిననాగారులచేత యాదవుల నోలిం గొల్చి కూర్చుండఁగా
బనిచెం గేశవుఁ డైంద్రజాలికుగతిం భ్రాంతయ్యె నీ కంతటన్.

188


చ.

పిఱికివి గాక నీవు నొకప్రెగ్గడవే సభ లుండుభంగి ము
న్నెఱుఁగనివాఁడవై బ్రమసి యెవ్వరిముందర నేమి మాటలో
యఱచితి వారి జంకెనల కచ్చటఁ ద్రోపడి వచ్చి తిచ్చటం
[47]గఱవఁగ వచ్చునే బలిమి గాడిదకుం బులితోలు గప్పినన్.

189


శా.

నా కీతమ్ముఁడు ఖడ్గముం గలుగఁగా నాకేశుఁడున్ సాటియే
లోకంబు ల్పదునాలుగున్ గెలుతుఁ గల్లోలానిలాలోలవే

లాకూపారము పారముం గదియఁ జేయంజాలినన్ ద్వారకం
గైకొందున్ యదువృష్ణిభోజనృపసంఘధ్వంసనాపాది నై.

190


క.

మా పట్టణమున నుండక
పో పో నినుఁ జంపరాదు పొత్తునవాఁ డై
భూపాలకుసిరి మ్రింగితి
పాపాత్మా! చుట్టమైతి పగవారలకున్.

191


వ.

అని పలికి సాత్యకిం గనుంగొని.

192


గీ.

ఓరి యాదవ! కష్టాత్మ! యొక్కరుండ
విచ్చటికి నీవు వచ్చుట యేమి చంద
మే మనియె నందసుతుఁడు నన్నెఱిఁగి యెఱిఁగి
కప్ప మిప్పుడు నా కీనికారణంబు.

193


వ.

అనుటయు సాత్యకి యిట్లనియె.

194


శా.

ఆలోకించెదు శార్ఙ్గముక్తపటుబాణౌఘంబుచే నీ మొనల్
నేలం గూలఁ గపాలపాలికలలో నిండారురక్తంబులం
గ్రోలం గేలఁ బిశాచబాలికలు గైకొన్న న్మణిశ్రేణితోఁ
గ్రాలం బట్టిన వెండికోర గతిం గప్పంటు లొప్పంబుగాన్.

195


ఉ.

తెచ్చెద రెల్లి నేఁడు మముఁ దెండని పంచిన యుప్పు డాకినుల్
మచ్చఱికంబునం జవు లమర్చుటకై డిభకుండు నీవునుం
జొచ్చినచోటు సొచ్చి రణశూరుఁడు శౌరి కరాసిధారచేఁ
బచ్చడి చేయఁగా జమునిబానసముం బురుడించుచోటికిన్.

196


శా.

ఆకంసాసురభంజనుం గినియఁ జేయంజాలు నీజిహ్వ హం
సా! కోయంగలవాఁడ నిత్తు నది హస్తప్రాప్తిగా భూవరా
నీకంబెల్లఁ గనుంగొనంగ నిచటన్ నీసొమ్ము నీ కిచ్చెదం
గా కే నంతటివాఁడనే తలఁచినం గప్పంబుఁ దెప్పింపగాన్.

197


ఉ.

మేడ్పడి రాజ్యగర్వమున మీఁదు తలంపుగాక చిచ్చునుం
గాడ్పును గూడినట్టు మురఘస్మరుచేతుల శంఖశార్ఙ్గముల్

వీడ్పడి మ్రోయ డాయఁ బదివేవురుజోదులసింహనాదముల్
దోడ్పడ వే రసాతలము [48]దూఱిన మిన్నులమీఁదఁ బాఱినన్.

198


వ.

వా రెవ్వరంటేని వినుము.

199


సీ.

హలపాణి బ్రథముఁ డాహవశాలి సాత్యకి
                 నేను రెండవవాఁడ నిట్టివాఁడ
మొగజోదు కృతవర్మ మూఁడవవాఁడు నా
                 లవవాఁడు నిశరుఁ డుల్లఱపుబిరుదు
కంహు డేనవవాఁడు ఘనవిక్రమాఢ్యుండు
                 వివిధుఁ డాఱవవాఁడు విజయధనుఁడు
వివిధాస్త్రనిపుణుఁ డేడవవాఁడు ప్రఘనుఁ డ
                 ష్టముఁడు సారంగుఁ డుత్సాహశీలి


తే.

నవముఁడు విదూరదుండు సన్నాహమహితుఁ
డుద్దవుండు దళముఁ డింక నున్నవారి
నెన్నఁ గొలఁదిగా ది ట్లౌట యెఱిఁగి కృష్ణు
వెదకి తి[49]ప్పుడు పులిఁగోల వ్రేసినట్టు.

200


క.

హరి తనయు లిరువురును మీ
యిరువురకును ముందుకప్ప మెవ్వని కెవ్వం
డరువఁ గలవాఁడు వెఱ్ఱీ!
సురపతిగతిఁ బాసి రాజసూయము గలదే.

201


వ.

ఇంకం గార్యంబు పరువంబు దప్పె సంగరంబ పరిపక్వం బైనయది
వినుము.

202


క.

దురమునకు న్మధురయుఁ బు
ష్కరముఁ బ్రయాగంబుఁ దగిన కలఁకులు మీ కే
[50]దుర వగు నది గొను మనె హరి
యిర వగుగోవర్ధనంబు నేన యొసఁగితిన్.

203

వ.

అనుటయుం గనుంగవం గినుక నిక్క నక్కుమారయుగళంబు గిటగిటాయ
మానదంతంబును జటులభ్రుకుటివికటనిటలంబును నిబిడదీర్ఘతరనిశ్వాసంబును
నిష్పేషణభీషణకరతలంబును నిర్గళితఘర్మజలకణకలుషితకపోలంబును నగుచు
నవుడుగఱచి యిట్లున్నభంగిన పగఱం బరిమార్తు ననుచుండె నప్పుడు హంసుండు
సాత్యకితో నిట్లనియె.

204


ఉ.

ఓరి దురాత్మ! నీకుఁ దెగ నొల్లక యుండుట నీ పరాక్రమం
బారసి కాదురా వెఱవకాడుము దూతుఁ డవధ్యుఁ డెందు నీ
వీరుల నిన్నుఁ జమ్మెటనె వ్రేయుదు డాయుదుఁ బోర శౌరికిన్
సీరికి బాహుసార మెడసేయుదుఁ జేయుదు రాజసూయమున్.

205


మ.

వినురా సాత్యకి! మాట లేమిటికిరా వేదండకోదండకే
తనసంకేతనరేంద్రనూతనబలోదగ్రంబుగా మోహరిం
ప నవశ్యంబును వత్తుఁ బుష్కరసరఃపార్శ్వంబునం దెల్లి గొ
ల్లెన లెత్తింతు విరోధు లంబునిధివెల్లిం [51]డొల్లఁ జల్లింపఁగన్.

206


వ.

అనుటయు డిభకుండు.

207


చ.

విడు విడుమంచు నా మొనలవీరులు పోరులు గోరుచున్న వా
రెడపడకుండ మి మ్మిచట నెన్నితి [52]కొందఱ సిగ్గు గాదటే
గొరగులు దప్పఁ బట్టినను గోటగ నేనిక [53]తెట్టువెట్టినన్
బడుగులు మీరు చూడ హరిపాపటపై నడిదంబు వెట్టుదున్.

208


వ.

అనుటయు సాత్యకి కోపించి.

209


చ.

కడఁగితి [54]దౌత్యము న్నెఱపఁ గాన సహింపకపోదుఁగాక నా
కడిదము చేత నుండఁగ మురారి విరోధులఁ బట్టి పూవునుం
[55]దొడిమయుఁ జూపకున్న నది ద్రోహము పందెము వేసి తుండము
ల్దడఁబడకుండ మిమ్ముఁ బెడధారన వ్రేయుదు నేమి చేయుదున్.

210


వ.

అనుటయుఁ గోపంబులు రూపంబులు గైకొన్న తెఱంగున నాహంసడిభకులు
సాత్యకితో వీ వింక సంగరసన్నాహంబున సకలసైన్యంబుల సమకూర్చుకొని
పుష్కరసరోవరంబునకు రమ్ము చావునకుం దప్పితివి పొమ్మనుటయుం గనలి కల

కలనవ్వి కలనికి నడచికదా మాటలు సకలలోకైకనాథుండు సమయింపనున్న మిమ్ముం
జంపఁదగ దనుటయు వారు మీ యన్నం గయ్యంబునకు దోడ్కొని వచ్చిన
నీ పంతం బెఱుంగ వచ్చుం బొమ్మనుడు నాశైనేయుండు నడిదంబు జళిపించుచు
నీయకొని వెడలి హయారోహణంబు చేసి నిజపురంబునకు రయంబునం జనుదెంచి
జనార్దను దర్శించి తనపోయివచ్చినతెఱం గెఱింగించిన నారాయణుండు మరునాఁడు.

211


కృష్ణుఁడు దండయాత్ర వెడలి పుష్కరసరస్తీరమున విడియుట

మ.

కడఁకం బన్నఁగ నానతిచ్చెఁ జతురంగంబుల్ రణక్రీడకు
న్వెడలన్ డిండిమదుందుభు ల్గుభులనన్ వ్రేయించి సైన్యంబు సం
దడిఁ బై పై నడియాలపుంబడగ లెత్తం బంచె నొక్కుమ్మడిం
బడవాళ్ళం బిలిపించి చిత్తమున దర్పం బేర్పడం జేయుచున్.

212


వ.

తదనంతరసంరంభసంభావితసన్నాహులగు సారథులు సారథుల కుతూ
హలంబునకు యోగ్యంబులగు యుగ్యంబు లమర సమయంబున కమయందగుకణయ
గంపణముసలముద్గరపరిఘపరశ్వధకరవాలభిండివాలప్రముఖప్రహరణంబులు
నిండి నొండొండ నడుకొన నిడి సిడింబులు ముడివడ వెడలించి జడనిధిలో నడ
యాడుచుండిన యోడలతో వీడుజోడాడు రథంబులును [56]గుథంబులలోఁ బెఱికిన
మెఱుఁగుటమ్ముల నిమ్ముల నిడి తెరపుల నొరపుగా నున్న జోదులచేతి టంకారముఖ
రంబు లగు చాపంబుల రూపంబులం జూపట్టు పసిండకట్ల చుట్టంబులై భుజంబులం
బొలుచు కటకకేయూరంబులం గలసి కలసి బలసిన ప్రభలు ముంచికొని ఖచించిన
పలుదొడవులతోడఁ గూడం జూడ నలవడి వికచవివిధకర్ణికారపరికీర్ణంబు లగు
నంగంబులం దెగడు నాగంబులును బేరు వేర భైరవమతంబు భారంగి లంగిణి
కలీయ విలాలనంబు మొదలగు ఖలీనంబుల వినీలంబు లయిన ఫేనంబులు దొరుగ
నిరుగం గదలుకొనుకర్ణచామరంబు లినుమడింపఁ గరాళింపక లాఁత చేయక
పయివోవక కొక్కరింపక తొడుకక తొట్టింపక చెల్లక నడచి కింకిణిగణఝణ
ఝణఝంకారాలంకారహేషారవకోలాహలంబులు సెలంగ బంగరుపుపల్లనం
బులపైఁ బెల్లు ఖచించిన నానావిధనూత్నరత్నప్రభాపటలంబులతోడం జౌకళింపుచు

నింద్రాయుధంబులతోడం దోడు చూపుచు గంగాతరంగంబుల తెఱఁగు దాల్చు
వారువంబులును విశంకటకంకటవివిధవర్ణంబు లుదీర్ణంబులుగా వీరరససముచిత
సంభాషణంబులు చెలంగఁ గలంగక తొలంగక తెరలక మరలక నడుతు మను
పంతంబులు మున్నుగ సేసలుఁ గాసెలుం జిందెలు నందెలుఁ బూఁతలుఁ జేతలుం
జెలువుగ సురియ ముప్పడిపిడియమ్ము కఠారమ్ము దరువలి కొంగవా లడిదమ్ము
గండ్రగొడ్డలి కత్తి గొంతంబు సబళం బీటె యినుపకోల సెలకట్టె పట్టెంబుసిరా
ణంబు చక్రంబు మొదలగు కైదువులు మెఱుంగులు తుఱంగలించిన రవిమండలంబు
తెఱంగున వజ్రవైడూర్యమణిమరీచిమధ్యంబునం బొలుచు సింగంబులసంగడివా
లగు వీరభటులునుం గలిగి బహువిధచాతుర్యంబులు శౌర్యంబులకుఁ జేవ యొసంగ
బిరుదులతోడి యాతపత్రంబులు చిత్రపాత్రంబులుగా నడియాలపుంబడగలు మొగుళ్ళ
తోడం దడంబడ వెల్లివిరిసిన జలరాశిపొలుపునం దద్బలంబు నడిచె నప్పుడు.

213


సీ.

శార్ఙ్గనందకసుదర్శనపాంచజన్యకౌ
                 మోదకీకౌస్తుభములు వెలుంగఁ
బీతాంబరము గట్టి పెండెంబు డాకాల
                 బెట్టి సన్నద్ధుఁడై పేరురమునఁ
బద్మమాలిక గ్రాల బద్దగోధాంగుళీ
                 త్రాణుఁడై వందిబృందస్తవములు
భూసురాశీర్వాదములు మింట నంటంగ
                 బలభద్రసాత్యకిప్రభృతు లెల్లఁ


తే.

జేరి నడతేర నరదంబు దారకుండు
గడప యాదవసైన్యసాగరము వొంగఁ
[57]దొలుత నడతెంచు [58]నిండుచందురుఁడు వోలె
రుచిరమూర్తియై నీలవర్ణుండు వెడలె.

214


క.

ఈ విధమున సేనలతో
నా విశ్వంభరుఁడు వెడలునప్పుడు దృఢసం

రావంబుచేత సకల
స్థావరములుఁ గదలఁ బాంచజన్యం బొత్తెన్.

215


సీ.

వడఁకుపన్నగరాజుపడగలమీఁద స
                 ర్వంసహాకాంత పేరణము సూప
నుఱ్ఱూత లూఁగెడు నుదయాస్తగిరులతో
                 నాకాశలక్ష్మి కోలాట మాడఁ
దెర లెత్తి సప్తసాగరములుఁ బొరలంగ
                 వరుణుండు గొండిలి పరిఢవింప
మొకములచాయ వేఱొకచండముగ నిల్చి
                 కమలసంభవుఁడు [59]ప్రేంఖణ మొనర్చ


తే.

మంగళములోని ప్రేలాలమాడ్కిఁ జుక్క
లిక్కడక్కడ పడ దిక్కు లెనిమిదియును
బగులఁ బాతాళతలము [60]గుబ్బటిలఁ జెలఁగె
శౌరి పూరింప నప్పాంచజన్యరవము.

216


మ.

రథవేదండతురంగసైనికగణారావం బుదాత్తశ్రుతి
వ్యథనిస్సాణధణంధణంధణధణధ్వానంబుతో దిగ్వియ
త్పృథివీమండలమెల్ల నిండుటయుఁ దద్ధీరధ్వనిం బైకొనెం
బ్రథనారంభవిజృంభమాణహరిశార్ఙ్ఘక్వాణ[61]నిక్వాణముల్.

217


వ.

ఇట్లు చతురంగసైన్యసమేతంబుగా సవరణతో సన్నాహంబు మెఱసి హృషీ
కేశుండు పుష్కరసరస్తీరంబున విడిచి తదీయజలంబుల నుపస్పర్శంబు చేసి మొన
లేర్పఱిచి యున్న యవసరంబున.

218

హంసడిభకులు యుద్ధసన్నద్ధు లయి వచ్చుట

మ.

భసితాలిప్తవపుస్త్రిపుండ్రనిటలప్రత్యగ్రరుద్రాక్షదా
మసముజ్జృంభితవేషు లై వరధనుర్మాహేశ్వరాద్యస్త్రశ
స్రసమృద్ధిన్ రథముల్ వెలుంగ మును భూతద్వంద్వ మేతేర రా
జసహస్రంబులతోడ హంసడిభకుల్ సంగ్రామసన్నద్ధులై.

219

సీ.

[62]ఉద్ధతి నిజదశాక్షౌహిణీబలముతోఁ
                 బడగలు గ్రాలంగ వెడలునప్పు
డవసరం బెఱిఁగి దానవు లనేకసహస్ర
                 సంఖ్య లేతేర విచక్రుఁ డనఁగ
దైత్యేంద్రుఁ డటమున్న తత్కుమారద్వయ
                 సఖుఁ డైనవాఁడు వాసవునితోడఁ
గెలిపించెఁ బూర్వగీర్వాణుల
                 నారాయణునితోడి బోరిపోరి


తే.

ద్వారవతియందు నొంచె యాదవులనెల్ల
నట్టి వీరుండు దోడు రా యాతుధాన
ముఖ్యుఁ డగునాహిడింబుండు మొనకు నడిచె
దైత్యులెల్లను జెదర యాదవులు సెలఁగ.

220


వ.

ఇవ్విధంబున.

221


క.

ఎనుఁబది యెనిమిది [63]లక్షల
దనుజులు రాక్షసులు నడవఁ దమసైన్యంబుల్
మొన లై పదియక్షౌహిణు
లనూనగతి నడవ నడచి రానృపతనయుల్.

222


సీ.

కరటిఘటాకోటికటనిర్గళన్మదా
                 సారంబు దొలుకారుఁ జేరఁ బిలువ
రథనేమిర్భిన్నపృథివీపరాగంబు
                 నీహారసమయంబు నేర్పుఁ దెగడ
సుభటభుజోద్భటక్షురికాప్రభాభంగి
                 మండువేసవితోడ మాటలాడఁ
దురగధట్టఖలీనధుతఫేనతారకా
                 వళి శరత్కాలంబువరుసఁ జూపఁ


తే.

బవనచంచలధ్వజపటపల్లవములు
నవవసంతంబుఁ దెలుప సన్నాహతరళ

ఖడ్గలతికలు శిశిరంపుఁగడఁక నెఱప
హంసడిభకులసేన యేఁ డనఁగ నడిచె.

223


వ.

ఆ సమయంబున.

224


క.

బాంధవము చూడక జరా
సంధుఁడు దిగవిడిచె వారి సైరణ చెడి క్రో
ధాంధుఁడు దుర్వాసుం డను
సంధించుం దనకుఁ దగనిశాపం బనుచున్.

225


క.

ఇటు నడచి రెండుబలములు
బటుగతిఁ బుష్కరతటాకపార్శ్వంబునఁ జే
రుట పూర్వ[64]జన్మసుకృతము
ఘటియించుట గాక యిట్టికలనుం గలదే.

226


తే.

పొసఁగఁ బుండరీకాక్షునిఁ బుష్కరంబుఁ
దలఁచినంతన పాపంబు దొలఁగుఁ జెంత
నుభయమును గూడె నచ్చోట నున్నవారుఁ
జన్నవారును గైవల్యసారధనులు.

227


క.

ఆకలన నుభయబలములుఁ
గైకొన కొం డొంటిఁ దాఁకి ఘటితపటహభే
రీకాహళకోలాహల
సాకారస్వైరవిహరణాహంకృతు లై.

228


వ.

ఇట్లు తలపడి సాయకనికరంబులఁ గరంబుల మునికట్లపట్లకుఁ దునిమిన
మునుకొని కరవాలంబులు వదనంబులు గఱచికొని కదనంబునకుం బఱచు వార
లనుం గణఁగి గద వ్రేసినం గినిసినట్లు దునిసినచరణంబులతో మరగాళ్ళందిరుగు
వెరవరులకైవడిం దిరిగి యడిదంబులం బొడిపొడిగా నడుచు నడజోదుభటులును
దండతండంబు లగు వేదండంబులు దండెలం దగిలినం గదలనేరని తురంగంబులపై
మలంగి దంతంబులకొలందికిం దరుపలి కత్తులం దుత్తుమురుగా మెత్తి విడిపించు
రవుతుల దేరులగములనేరువల సారువలుగట్టు వారువంబులపక్కెరల పై నెక్కడఁ

జూచినం గ్రిక్కిఱియ నాటిననెఱనారసంబులు వెఱికి పిఱుందు ముందఱగా నేసిన
విలుకాఱచేతం జీకాకువడిన రథికులును గడుపులు గాఁడం బొడిచి యెత్తినగడల
కడలం బ్రేవులు చుట్టిపట్టి దిగం బడక వెఱబొమ్మలం గట్టినట్లు వ్రేలియును వ్రేల్మిడి
మొలలకఠారమ్ములు వెఱికి గడలు తెగ నఱికి దికనుఱికి పగఱం జిఱ్ఱుముఱ్ఱాడు
సహజసాహసులునుం డొంకెనలం బొడిచినఁ [65]గళ్యాలు గడచి తాళులు విఱిచి
సంధులు గాఁడి ప్రక్కలు వ్రక్కలు చేసినం జబలింపక జంకింపక జంకించి లవుడి
నడిచిన బుమిడికంబులతోడన యెమ్ములు నలిగులియైనఁ దలలును సిందెలం బొదివి
కట్టి మెట్టికొని నిల్చిన యసిధారులును గసిమసంగినమారి పిసికి పిండలివండు
చేసిన చందంబున గొండ లయినకండలలోఁ గలసి పేరినరుధిరంబునఁ దిరంబు
సవిమెట్టి యిట్టటు గదలనేరక యూరకయున్న గజంబులపై గజిబిజింపక భుజ
బలంబు సూపుజోదులును నురవడించిన యరదంబుల కడనొగలు దాఁకి తలలు
పగిలి హయంబులు గూలకమున్న లవణి గలిగి లంఘించి కరవాలంబులు విసరిన
మ్రొగ్గతిలిన యుగ్యంబులును దలలు దునిసిన సారథులునుం గడిఖండంబు లయిన
కోదండంబులునుం గలిగి రథులతోఁ బలుగాఁడిపై జిరాణంబుల బారి సమరి సరిం
బడిన యాశ్వికులును బలకలవారిపై బుయిలోడక పురికొల్పిన కరిఘటల కడ్డంబు
చొచ్చి మచ్చరికంబునం బచ్చడికి నఱికినట్లు కొమ్ములు విఱిచియు నెమ్ములు త్రుమ్ములు
చేసియు శుండాదండంబులు చిదిమియుం గుంభంబులు వగుల నేసియుం బ్రక్కలు
సెక్కలు వాపియుం బెక్కువిధంబులం జిక్కు వరచు పంతగారును మరియును గిరిగొన
రాలినమణిభూషణంబులుం జిద్రుపలైన మకుటంబులునుం జిందఱవందఱలైన జోళ్ళు
నుం జిక్కువడిన చామరంబులును నొరగిన పడగలును నొఱగినమస్తకంబులునుం బొర
లెడి యట్టలును దెరలెడి తిట్టలును గట్టలుకొన్న కైదువులును బొడి యైనరథాంగం
బులును తెలిసిన యంగంబులునుం దెలిసిన మొగంబులునుం గ్రాలం గీలాలజలప్రవా
హంబులం దేలియాడు వెలిగొడుగులును బుట్టులమీఁదం గాలూఁదియున్న బేతాళ
బాలికలు పుండరీకంబుల మూఁగిన యళికులంబు విడంబింప నిశితభల్లంబులం బెల్లగిల్లి
డొల్లిన సమౌక్తికగజకుంభపాలికలు గరంబులం బూనిన డాకినులు సురనారీవీర

స్వయంవరసమయంబున సకుంకుమాక్షతవ్రాతపాత్రహస్తలై [66]సువ్రతంబు చెప్ప
వచ్చిన సతులం దలఁపింపఁ బ్రహారమూర్ఛాపరశులగు వీరుల బొండుగలు వ్రచ్చి
పెఱికి తిగిచినం బ్రేగులు రాకున్న ముక్కుల నూఁదిపట్టి వెనుకకు నిక్కి ఱెక్కలు
విద్రుచు కంకగృధ్రంబులచేతం జలిగాలి వొడమినం దెలిసి సచేతనంబు లగుకళే
బరంబులునుం గలిగి మఱియు నొండొరుల మెచ్చక నీసున వ్రేసిన యసిధారలు
మండ గండు మిగిలి మెదడును బ్రుంగి మజ్జంబులు దలమునుకలుగ సందడిం
దడఁబడ కుండ ముందల పట్లు పట్టికొని పోట్లాడువారును మొనకయిదుపుల పయిఁ
రఱియ నుఱికి సరకు సేయక వీపునం జెంగలువరేకులు వెడలినట్లు వెడలఁ
గెడయువారును వీరు వారనక వీరావేశంబునం చేతుల కసివోవం జెలరేఁగి సింహ
నాదంబులు సేయుచు మోదువారునుం దిరుగుడు వడక తివియక బీరంబు సెడక
బీఱువోక యొడ్డగిల్ల యొదుఁగక వేసఱక విఱుగక విబుధలోకంబునకు వెక్క
సంబును వేడుకయునుం గదుర నసమసమరంబు సేయ మధ్యాహ్నసమయం బయ్యె
నయ్యవసరంబున.

229


తే.

దనుజవైరి విచక్రుతోఁ దలపడుటయు
హలధరుఁడు హంసుఁ దాఁకె సాత్యకి యెదిర్చి
డిభకు మార్కొని రల్ల హిడింబు నుగ్ర
సేన వసుదేవ నృపతు లుత్సేక మెసఁగ.

230


మ.

మఱియుం దక్కినవారుఁ దక్కినరిపుల్ మార్కొన్నచో శౌరి డ
గ్గఱి బాణంబులు మూఁడు డెబ్బదులు పై గప్ప న్విచక్రుండు న
త్తఱి నేసెం దెగ నిండ నారసమునన్ దైత్యారి వక్షంబునం
గఱి దోఁపన్ హరియున్ భుగు ల్భుగులుగాఁ గ్రక్కె న్వెసన్ నెత్తురుల్.

231


క.

పదునాలుగుజగములుఁ దన
యుదరంబునఁ దాల్మి విష్ణుఁ [67]డుత్పాదకుఁడై
తుది నుమియునాఁటిచందము
మదిఁ దలఁచె మహేంద్రుఁ డపుడు మాధవుని దెసన్.

232

చ.

హరి నిశితక్షురప్రమున నాతని టెక్కము గూల్చి సారథిం
బొరిగొని మూఁడుతూపుల నపూర్వగతిన్ హరుల న్వధించి భీ
కరతరపాంచజన్యరవగర్వము చూపినఁ దేరు డిగ్గ వాఁ
దరిది గదం గదల్చి దనుజారి కిరీటముఁ దల్లలాటమున్.

233


తే.

చేరి యటు వ్రేసి దనుజుండు సింహనాద
చటులవదనుఁడై దొడ్డపాషాణ మొకటి
శతగుణము ద్రిప్పి శౌరివక్షంబు చూచి
వైచె నది పట్టుకొని వాని వైచె విధుఁడు.

234


క.

వాటునన మూర్ఛ వోయెం
బోటరి దైత్యుండు దెలిసి బొమముడి గినుకం
జాటఁ గరఘటితపటుపరి
ఘాటోపము చూపి శౌరి కతఁ డిట్లనియెన్.

235


ఉ.

ఈ పరిఘంబు తాఁకునకు నెంతటివాఁడవు నీవు పోరిలోఁ
బ్రాపయి వచ్చి దేవతలపాల మదీయభుజాబలంబు నే
మీ పొడగానవే కొఱుక మెత్తనొకో చెడిపోయె దేల నీ
పాపము నాఁటి నీటికద బాహులచేవయు నాఁడిదేకదా.

236


క.

అనుచుం బరిఘము వై చిన
దనుజాంతకుఁ డొడిసి పట్టి తన ఘనహేతిం
దునుకలుగ నఱికి నీపొం
గినపుడిసెఁడుఁ బోయె ననుచు గేలి యొనర్చెన్.

237


వ.

ఆ దనుజుండు వెండియు.

238

శ్రీకృష్ణుఁ డాగ్నేయాస్త్రమున విచక్రుని సంహరించుట

మ.

ఘనశాఖం బగువృక్షముం బెఱికి యా కంసారిపై వైచినన్
వనజాక్షుండు గరాసిధార నది ద్రెవ్వన్ వైచి చేపట్టి త
క్కినశస్త్రంబుల నొంచి కొంతపడి నాగ్నేయాస్త్రముం బూన్చి త
ద్దనుజుం గాల్చి మరల్చె నంతఁ గదిసెం దద్బాణముం దూణమున్.

239

తే.

ఉన్నదైతేయు లందఱుఁ గన్నవారు
గన్నదిక్కులఁ బోయి సాగరములోన
నడగి కటు నీళ్ళెలోని ముళ్ళైరిగాని
నేఁడు దుదిగా ధరిత్రికి నెగయ లేరు.

240


వ.

అంత నిక్కడ.

241


చ.

హలధరుఁ డేసె హంసుఁ బదియమ్ముల నైదిట నేసె హంసుఁ డా
హలధరు నాతఁ డాశరము లైదిట నైదిట నాఁగి రేఁగి మొ
క్కలమున నారసం బొకటి గాఁడఁగ వానిలలాట మేయుడున్
సొలసి యతండు తేరిపయిఁ బొమ్మలు వోయె నచేతనస్థితిన్.

242


చ.

తడవుగ నుండి తేఱి బలితంపుశరం బరిఁబోసి యేసి బె
ట్టడరెడు సింహనాదమున హంసుఁడు గ్రాలఁగ నేఁటుగంటి [68]ను
గ్గడు వగునెత్తుటన్ సుడిసి క్రక్కెడు నెత్తుటఁ గుంకుమచ్ఛవిం
బడిని హలాయుధుండు కనుపట్టెడు కింక నహంకరించుచున్.

243


ఉ.

పూచినకింశుకం బనఁగ బుత్తడిలత్తుకబొమ్మవోలె నా
రాచము లేడువే లొకపరంపరఁగా బరఁగించి పై పయిం
ద్రోచినఁ దేరుఁ గార్ముకముఁ దూణముఁ గేతనమున్ మునింగి దుః
ఖాచితదేహుఁ డై కరఁగి హంసుఁడు గన్నుల నిప్పు లొల్కఁగన్.

244


తే.

ఒక శరంబున బలభద్రు నుచ్చి పోవ
నొకటఁ బడగ ద్రెళ్ళంగ వే ఱొకట సూతు
నాస దిగఁగా రయంబున నేసి యేసె
నోలి నాలుగు గుఱ్ఱాలు నేలఁ గూల.

245


క.

ఒదవిన కినుకం గొదగొని
గద గొని హలధరుఁడు రథము కండ్లును నొగలు
జదిపి పతాకయు సారథి
విదారణము చేసి మిన్ను వ్రీలఁగ నార్చెన్.

246

ఉ.

అంతటఁ బోక సూతు నద రంటఁగ వ్రేయ రథంబు డిగ్గి వాఁ
డంతకదండసన్నిభగదాతిభయంకరబాహుఁ డై పరి
భ్రాంతి యొనర్చె నిద్దఱు నపారపరాక్రమకేళిఁ దేలి రం
తంతకు నంతరంగము లహంకరణంబునఁ గొంత వింతగన్.

247


వ.

ఇట్లు గదావిహారంబున హంసహలధరులు రుధిరధారాసారంబునం
దడిసి వడిసెడక వారింపక యోసరిలక యోలంబు గొనక పాటింపక పాడు
కొనక సడలక శంకింపక సందీక సరకుగొనక వెనుక మెట్టక వేగిరపడక
చఱచిపోక చాలిపవక చలింపక చాయ దఱుగక గదలు సారించియు సైరిం
చియుం జుట్టియుం దట్టియుఁ గదల్చియు నదల్చియుఁ దాఁకించియు జోఁకిం
చియుం బూఁచియుం జూఁచియు మోపియుం బాపియు జడిసియు నొడి
సియు నెత్తియు నొత్తియుఁ దాచియుం ద్రోచియు వివిధవిచిత్రవిహారం
బులం దిరుగ హలాయుధుండు డక్షిణమండలప్రచారంబునం బరఁగిన
హంసుండు సవ్యభ్రమణంబునం గదిసె నప్పు డయ్యిరువురదట్టనయు ఢాకయు
లవణియు లావునుం దెగువయుఁ దెలివియు మత్సరంబును మదంబును వెర
వును వేగంబును సైరణయు సాహసంబునుం గనుంగొని సురమునిగణంబులు
వెక్కసంబున నిత్తెఱంగు సమరం బింతకు మున్నెన్నండునుం గాన మనిరి.
తద్గదాధరయుగంబు వృత్రవాసవుల విడఁబించె నట్టియెడ హంసుండు వల
పలిదెసఁ జుట్టుకొని వచ్చుటయు నాబలభద్రుండు డాపలివంకం దిరిగి కదియు
టయుం బిడుగుం బిడు గడిచినచందం బయ్యె నయ్యవసరంబున.

248


క.

డిభకుఁడు సాత్యకియుఁ బర
ప్రభావపరిధవవిహారపారీణులు సా
రభుజాలలవిభవులు లో
కభయంకరమూర్తు లగుచుఁ గలనఁ గదిసినన్.

249


సీ.

సాత్యకి డిభకుపై సాయకదశకంబు
                 నిగిడింప నవి మొగమునందుఁ
[69]జనుమొనమీఁద వక్షంబుపై నాఁటిన
                 నతఁడు సాత్యకి నేసె నయిదువేలు

నారసంబుల వాని నడుమన తునుమాడి
                 శైనేయుఁ డార్చినఁ జాల నలిగి
విశిఖసప్తక మేసి వెండియు లక్ష బా
                 ణంబులు వఱపిన నఱకి వైచె


తే.

వృష్ణివీరుఁడు డిభకునివిల్లు దునిమె
నర్ధచంద్రబాణంబున నతఁడు వేఱ
వింట నిశితక్షురప్రంబు వెలయఁ దొడిగి
శినివరునినోర నెత్తురు చింద నేసె.

250


క.

ఆమని ములు[70]మోదుగుతో
సోమించి మురాంతకానుజుఁడు నెత్తురువ
ఱ్ఱై మరియు నఱకె డిభకుని
చేముందఱ మెఱయువిల్లు శితభల్లమునన్.

251


చ.

డిభకుఁడు వేఱ వింటఁ బ్రకటించిన బాణపరంపరన్ ధరా
విభులు గనుంగొనంగ యదువీరుఁడు గాసిలి వాని చాపమున్
రభస మలర్పఁగాఁ బటుతరంబున ద్రుంచి క్రమంబుతోడఁ ద
త్ప్రభ చెడఁ ద్రుంచెఁ జాపములు పంచశతంబు శతంబు నేకమున్.

252


క.

ఎత్తెడు వేగము విండులు
దత్తఱమున విఱుగ నేయుతమకము నైనన్
జిత్తములు గృపాణరణా
యత్తములుగ నిలకు నుఱికి రావీరవరుల్.

253


వ.

అట్లు ఖడ్గహస్తులై కదిసినప్పుడు.

254


ఆ.

సౌమదత్తి నకుల సౌభద్ర దౌశ్శాస
ని ప్రసిద్ధఖడ్గనిపుణవిద్య
డిభక సాత్యకుల కడిందిశౌర్యము నందుఁ
గానవచ్చె నట్లు గదిసి వారు.

256


వ.

భ్రాంతంబు [71]విభ్రాంతంబు విద్ధం బావిద్ధంబు విప్లుతంబు విసృతం
బాకరంబు వికరంబు భిన్నంబు నిర్మర్యాదం బమానుషంబు సంకుచితంబు

వికుచితంబు సవ్యజానువు వామజానువు చిత్రకం బాహితకంబు క్షిప్తంబు
గుడుంబంబు లంబనంబు దృతంబు సవ్యబాహువు వినిర్భాహువు సవ్యేతరంబు
వృత్తంబు త్రిబాహువు తుంగబాహువు నవ్యోన్నతంబు దాసి పృష్ఠతః
ప్రసారణంబు యోధికంబు పృఢితంబు నన ముప్పదిరెండు ప్రచారంబులం
బరిభ్రమించి నవసేవకులునుం బోలెఁ జౌరువ వేచికొని ప్రతిగ్రహీతలుం
బోలె ధార యేమఱక జూదరులునుంబోలె నండ మఱవక జౌతిషికులుం
బోలె ముష్టి వదలక గొండ్లి వరిఢవించు నటువులునుం బోలెఁ [72]జాళెలు
చూపి [73]యెగ్గు లాడెడువారునుంబోలె నాసపా[74]టున నిక్కి తూర్పెత్తువారునుం
బోలె విసరి త్రాసునం దూఁచువారునుం బోలెఁ దట్టి దారకులునుంబోలె
నట్టించి పనిఁ దిరుగు వెరవరులునుంబోలె మసలక వడి వసంతమాడెడివారునుం
బోలె జిమ్మి శకటవ్యవహారులుంబోలె మెట్టుకొని విరక్తవిటులునుం
బోలెఁ జేయీక తనిసిన [75]గవరలునుంబోలె సరకు గొనక నటమటపుఁ గోమ
టులునుంబోలె లెక్క సేయక పాదరసమర్దకులునుంబోలెఁ జంపం దలంప
యడిదంబులు జళిపించిన ఝణఝణఝంకారంబులుం దదీయపరస్పరఘర్షణ
కేంకారంబులుం దమహంకారంబులును ముప్పిరిగొనం గొప్పరించియుం
గొసరియు విచ్చియుం జొచ్చియు నదలించియుం గదలించియుం బోరు నవ
సరంబున సురవిద్యాధరగంధర్వదివ్యమునులు దివమ్మున నిలిచి యవ్వీరద్వ
యంబుం గనుంగొని వెక్కసంబున.

256


చ.

ఇతని కితండె సాటి యగు నీతని కితఁడే సాటి వచ్చు ను
ద్ధతిఁ జను వెంట వింట నడిదంబున నింతటివారు లే రుమా
పతికొకరుండు శిష్యుఁ డురుబాహుఁడు ద్రోణున కొక్కరుండు ధీ
రతముఁడు శిష్యుఁ డిట్లిరువురన్ రణధీరతఁ జెప్ప నేఁటికిన్.

257


గీ.

అర్జునుండు మురారి సాత్యకియు వీరు
ముగురు జయకాంక్షు లనిమొన మోసపోరు
శక్తిధర చైద్య డిభకులు సములు వీరు
ముగ్గురు మహారథులు శౌర్యమూలధనులు.

258


వ.

అనుచుం గొనియాడుచుండి రాసమయంబున.

259

మ.

వసుదేవుం డటె యుగ్రసేనుఁ డటె నన్వారించు వారంచుఁ గ్రో
ధసముల్లాసముతో హిడింబుఁడు మహాదంష్ట్రాగ్రసంఛన్నసై
న్యసమూహుం డయి తాఁకె నానృపులు బాహాసారముం జూపినన్
వెస మ్రింగెం గడుపార వీరవరులన్ విస్ఫారజిహ్వాగ్రుఁడై.

260


వ.

ఇట్లు ముందటం దలపడిన యదువృష్ణిబలంబులకు భయంకరుఁడై దౌడలు
గొఱుకుచుఁ దల విదుర్చుచు మిడిగుడ్లు ద్రిప్పుచు మీఁదులు చూచుచు బారలు
సాఁచుచు బారి సమరుచుం గడు ప్రక్కళించుచుఁ గాలం జరుముచు మేను వెంచుచు
మెడ నిక్కించుచు నరదంబుల నరదంబులతో నంటసిల నడుచుచుఁ దురగంబుల
దురగంబులతోఁ దుత్తుమురుగా దూటుచు దంతావళంబులతోఁ దలలు వగులం
దాఁటించుచు వీరుల వీరులతో విటతాటంబుగా విఱుగ వ్రేయుచుం బ్రళయకాల
రుద్రుండు ప్రజలపైఁ బరఁగు చందంబునఁ జటులగతిం జాలు మగలఁ జట్టలు వాపి
చవిగొను రుధిరపయఃపానంబునను మేదఃఖాదనంబునను మజ్జిమజ్జనంబుననుం జేవ
మిగిలి చేరినవీరు లాహారంబుగాఁ గుంభకర్ణుండు వానరబలంబుల మ్రింగు భంగి
దోఁప యదువృష్ణిసైన్యంబు నిరవశేషంబు చేయుచుం గదిసిన నా వృద్ధనృపతు
లిద్దఱు సాహసంబున గంఠీరవంబు తోడం దలపడిన తగళ్లకైవడి నారాక్షసు
తోడం దలపడి.

261


మ.

ఖరనారాచపరంపరం బఱపి వీకం దాకి పాతాళగ
హ్వరముం బోని నిజాస్యముం దెఱచి రక్షోధీశుఁ డన్నింటి ని
ష్ఠురుఁడై మ్రింగి తదీయ చాపములు రెండుం బట్టి ఖండించినం
దెరలం బాఱక యున్నవారిఁ గని యాదేవద్విషం డిట్లనున్.

262

ఉగ్రసేన వసుదేవులు హిడింబున కోడి పాఱుట

చ.

ముదుకల మాంసము న్మెదడు మోదముతోఁ గడుపార మ్రింగ నే
డొదవె మదీయభాగ్యమున నూరక నోరు సొరుండు రండు మీ
రదవదగాక నావుడుఁ దదాననదర్శనముక్తశస్త్రులై
మదమఱి పాఱి రానృపులు మానిసిదిండికిఁగాక భీతితోన్.

263


వ.

అట్టియెడ హలధరుండు.

264

మ.

కని కంసాంతకుతోడ హంసునికి సంగ్రామంబు హత్తించి త
ద్దనుజుం బేర్కొని యిక్క డిక్కడ భవద్దర్పంబు గ్రక్కింతు న
మ్మనుజాధీశులఁ దోల నే లనుచుఁ బల్మాఱున్ భుజస్ఫాలనం
బనిరుధ్ధక్రియఁ దెల్పి వీతశతచాపాక్షేపుఁ డై తాఁకినన్.

265


చ.

కనుఁగొని వీనిమేను బలుగండల నాఁకలి పుత్తుఁ గాక నే
డని దనుజాధముండు వికృతాననుఁ డై బలభద్రుఁ దాఁకి నె
ట్టన నెఱలావునం బిడికిటం బొడిచెన్ హలపాణి యొక్కము
ష్టిన తనముష్టిఘాతము హిడింబునకుం జవి చూపి వెండియున్.

266


క.

వారింప రానిముదమున
వారిరువురుఁ జటచ్ఛటారవంబులు నెగయం
బోరాడిరి వీరులు చే
యారఁగ బిడిగ్రుద్దులాట నా సమయమునన్.

267


క.

పిడికిటఁ బొడిచె హిడింబుఁడు
వడితో హలధరునియురము వానియురంబుం
బిడికిటఁ బొడిచెను రాముఁడు
విడువక యఱచేత నోరు వ్రేసెం బెలుచన్.

268


ఉ.

పోటున వ్రేటునం దిరిగి బోరగిలం బడియున్న దానవుం
గాటుకకొండ నెత్తువెలిగౌరు తెఱంగున నెత్తి త్రిప్పి చె
ర్లాటము చూపి వీఁడు [76]మొదలా మనకంచు బలుండు సంగరా
ఘాటము దాఁట వై చిన డిగంబడెఁ గ్రోశయుగంబు చక్కటిన్.

269


క.

వికలగతి నున్న రాక్షసు
లౌకనొకని మొగంబు గాన కూరక చని రం
తకు నరుణకిరణుకిరణము
లకుఁ బడుమటికొండపంచలం బడ వలసెన్.

270


సీ.

కడపంగ రాకున్న కాలఖడ్గముచేతఁ
                 బగలింటితల నేలఁ బడినయట్లు

సాయంతనం బనుజాలరి జలధిలోఁ
                 బచరింప వల డిగ్గఁ బాఱినట్లు
పొడ వైనయాకాశభూరుహంబున సంధ్య
                 గోయంగ గొల [77]ద్రెవ్వి కూలినట్లు
చరమదిగ్భేతాళకరమున వరుణుండు
                 గడిపెట్టఁ బొల పొట్ట నడఁగినట్లు


తే.

క్రుంకుగుబ్బలిపారకి కొప్పరించి
పట్టజాలక వైచిన బ్రద్దపరికిఁ
బాటియగుచు ముగురపొత్తు పళ్ళెరంబు
భానుమండల మంతఁ జూపట్ట దయ్యె.

271


క.

ముఱుముఱుచీకటితో నం
దఱురాజులు సమర ముడిగి తగ నెల్లిటికిం
గొఱ గలకలనగు నడవుఁడు
నెఱవగు గోవర్ధనాద్రి నేలకు ననుచున్.

272


క.

రెండుబలంబులవారలు
నొండొరులకుఁ జెప్పు నప్పు డుద్ధతమతు లై
రండనఁగ్ర హంసడిభకుల
దం డాగోవర్ధనాద్రితటమున విడిసెన్.

273


మ.

హరి యారాత్రి బలంబుఁ బుష్కరతటాకారణ్యమధ్యంబునన్
వెరవారన్ విడియించి ఱేపకడఁ బృథ్వీనాథు లెల్లం దనున్
గురుసన్నాహబలంబుతోఁ గొలువఁ దద్గోవర్ధనోద్యన్నగాం
తరభూమిన్ యమునాతటంబున సమాధానంబుగాఁ బన్నినన్.

274


గీ.

హంసడిభకుల బల మెల్ల నాయితముగ
మోహరము చేసి నడచిన మొనలు రెండు
దలపడి భయంకరంబుగ దారుణాస్త్ర
శస్త్రపాతంబుచేత నుత్సాహ మెసఁగ.

275

గీ.

చెలఁగుబలములతో నుగ్రసేనుఁ దాఁకి
బాణముల హంసుఁ డిన్నూటపదిట నేసె
డిభకుఁడును వసుదేవు నేడింట నేసె
నిరువురఁ బొదివి యాదవు లేసి రంత.

276


క.

అప్పుడు పదిపదియమ్ములఁ
దప్పక యాదవుల బ్రహ్మదత్తకుమారుల్
నొప్పింప రుధిరధారలు
చిప్పిల్లనివారు లేరు సేనలలోనన్.

277


చ.

తమబల మింక వీఁగు నని తత్సమయంబునఁ గృష్ణరేవతీ
రమణులు దాఁకి రయ్యిరువురన్ సురసిద్ధమునీంద్రబృందముల్
సమరము జూచి మెచ్చ హరశాసనతత్పరభూతయుగ్మముం
గ్రమమునఁ దోఁచెఁ దోడుపడ రాజకుమారుల రెండుదిక్కులన్.

278


మ.

హరితో హంసుఁడు సీరితో డిభకుఁడున్ హంకారహుంకారభీ
కరశంఖధ్వని విక్రమం బమర వీఁకం దాఁకినం బాంచజ
న్యరవాడంబరమున్ సహింప కడరెన్ మాహేశుభూతద్వయం
బరవా యించుక లేక హస్తధృతశూలాకారఘోరంబుగన్.

279


గీ.

అడరి హరిమేను శూలంబు నదుముటయును
జిఱునగవుతోడ దివిజు లచ్చెరువు నొంద
వారితేరిపై కుఱికి చేయారఁ బట్టి
విసరి యుత్తర[78]దిక్కున వీచివైచె.

280

కృష్ణుఁడు భూతద్వయమును గైలాసాద్రిపై బడవై చుట

క.

వైచిన నిరువురుఁ గైలా
సాచలశిఖరమునఁ బడి మహాద్భుతమతులై
రాచంద మెల్ల హంసుఁడు
చూచి హరిం గ్రోధపరవశుం డై పలికెన్.

281

ఉ.

విఘ్నము చేసె దేల పృథివీపతిలోకము గప్ప మిచ్చె శ
త్రుఘ్నత రాజసూయమఖదోహలి మాజనకుండు సత్కృపా
నిఘ్నుఁ డొకింత దోడ్పడిన నిన్ను ముదంబునఁ జూచు నీశిరో
దఘ్నము లింకఁ దెమ్ము కరదానముగాఁ గనకంపుఁగాలువల్.

282


ఉ.

రాజుల కేను రాజ మఱి రాజశిరోమణి రాజు దేవతా
రాజికి నెల్ల నీవసమె రాసెదు నాసరివాఁడుగా విసీ
తేజము మాలి తంచు నతితీక్ష్ణశరం బరిఁబోసి యేసినన్
భ్రాజిత మయ్యె నప్డు హరిఫాలమునం దిలకంబు పోలికన్.

283


వ.

ఇ ట్లేటు వడి విచారించి.

284


మ.

ప్రకటస్యందనకేళికిం దగినసారథ్యంబు చేయంగ సా
త్యకిఁ జాలించి తదాత్తచిత్రగతి రథ్యాడంబరం బొప్ప దా
రుకుఁ డేఁగం గడికాఁడిపై హుతవహక్రూరాస్త్రసంధానకా
ర్ముకహస్తుండు మురాంతకుండు పలుకుం గ్రోధాంధుఁడై హంసుతోన్.

285


ఉ.

ఏమిర హంస! కంసనరకేంధనబంధురమఛ్ఛరానలం
బామిషముం గొనం గలదురా విడిపింపఁగ నిన్ను నేఁడు సం
గ్రామము చేసి నన్నడుగు కప్పము దర్పము నీకు నేల సా
నామునిబాధలం గమరినాఁడవు కాలినత్రాటిచందమై.

286


క.

నినుఁ బొరిగొనియెద నిదెపో
జనులు మునులు విని ప్రమోదసంపదఁ దేలన్
మనుజాధమ! యని తొడిగిన
యనలాస్త్రం బేసె నదరు లంటఁగ వాఁడున్.

287


క.

వారుణబాణంబున నది
హరించె మురారి యేసె వాయవ్యాస్త్రం
బారాజకుమారుం డది
బోరన మాహేంద్రబాణమున నడఁగించెన్.

288

తే.

హరి ప్రయోగించె మాహేశ్వరాస్త్ర మప్పు
డతఁడు రౌద్రాస్త్రమునఁ దోన యడ్డకట్టె
నిట్లు ప్రతిబాణముల హంసుఁ డెచ్చుఁ గుందు
లేక పోరాడె శారి కుద్రేక మెసఁగ.

289


మ.

సరి గాంధర్వము రాక్షసంబు మఱి పైశాచంబు బ్రాహ్మంబనన్
హరి యేసెన్ వరుస న్మహాస్త్రముల నాహంసుండుఁ గౌబేరమా
సురమున్ యామ్యము వారుణంబు ననఁ దేజోరూపశస్త్రంబుల
న్మరలించె న్మొదలింటి నాల్గిటి రణోన్మాదోద్భటాకారుఁడై.

290


గీ.

అచ్యుతుఁడు బ్రహ్మశిర మనునస్త్ర మేయ
హంసుఁ డాయస్త్రమున నది యడఁగఁ జేసె
నచ్చెరువు నొంది మురవైరి యమునలోన
వార్చి వచ్చి మహోగ్రభావంబు దాల్చి.

291


చ.

తొడిగిన వైష్ణవాస్త్రమునఁ ద్రుంగితి పొమ్మని హంసు నేసినం
బిడుగులపిండువోలె నతిభీకరతం జనుదేర మాఱుగా
దొడుగుశరంబు లే కతఁడుఁ దోరపుబెగ్గల మెత్తి వేయఁగా
గడువడిఁ దేరు డిగ్గి పడెఁ గాళియనాగమహాహ్రదంబునన్.

292

కృష్ణుఁడు హంసుని యమునలో నడగంటఁ ద్రొక్కుట

మ.

కడువేగంబున హంసుపై నురికి యాకంసారి కాళిందిలో
వడిఁ గాలం దన్నె లోకు లెఱుఁగ న్వాఁడంత లో జచ్చెనో
చెడెనో యెక్కడ వోయెనో యొకఁడునుం జెప్పంగ లేఁ డప్పుడే
పడెఁ బాతాళభుజంగవక్త్రముల నప్పాపాత్ముఁ డం డ్రెప్పుడున్.

293


ఉ.

ఈ తెఱఁ గాచరించి రథ మెక్కె మురారి ధరాధినాథ! నీ
తాత పితాహమహుం డయినధర్మతనూజుఁడు రాజసూయవి
ఖ్యాతి వహించు నయ్యెడల హంసుఁడు ప్రాణముతోడనున్న నే
లా తుద చేరు నధ్వరము లావున వాఁ డొరు నేల కైకొనన్.

294


క.

వరములు శరములు హరుచేఁ
దిరముగ హంసుండు వడయుదినమునఁ గాదే

ధర నవతరించె లక్ష్మీ
శ్వరుఁడు జగన్నాథుఁ డపుడు వార్ష్ణేయుండై.

295


వ.

ఆదేవుఁడు గలుగుటంజేసి కౌంతేయురాజసూయంబు నిర్వహించే నట్లు యమున
మడువునం బడినహంసుఁడు పొడవడంగుట సకలగంధర్వులు హరినామసంకీర్తనంబున
గీతంబు లొనర్చిరి తత్సమయంబున.

296


క.

హలధరునితోడ డిభకుఁడు
దలపడి పెనఁగునెడ సూర్యతనయాసలిలం
బుల మునిగి హంసు డిలిగెం
దలఁకున నని పలుకు వినియెఁ దత్రత్యులచేన్.

297


మ.

 విని వేగంబునం బాఱుతెంచి యమునావేగంబునం బాకశా
సనశస్త్రప్రహతిం బయోధిఁ బడు నా శైలంబుచందంబునన్
మునిఁగెన్ వెంట హలాయుధుండు దఱమన్ మోహాంధకారంబులో
మునిఁగెం దజ్జల మెల్లఁ దల్లడపడ న్ముప్పెట్టు వెట్టెన్ వడిన్.

298


వ.

ఇట్లు డిభకుఁడు యమునాజలంబుల మునింగిన హంసుం గానక యిట్లని
విలాపించు.

299


సీ.

నాయెల్లినీడన నరలోక మేలుదు
                 ననులావు వఱితిపా లయ్యె నన్న!
దేవేంద్రునకు నైనఁ దేఱిచూడఁగరాని
                 గౌరవోన్నతి నీటఁ గలసె నన్న!
పార్వతీపతిచేతఁ బడిసినదివ్యాస్త్ర
                 భూరిసంపద వెల్లిఁ బోయె నన్న!
వలరాజునకు నైన వర్ణింపఁ గాఁ దగు
                 తనువిలాసం బేఱు గొనియె నన్న!


తే.

యన్న! నీయట్టియన్న న న్ననుదినంబు
గారవింపఁగ నుండ నే కరుదుఁ నన్న
నింకఁ జాల నెవ్వగలచే నిచట నిలువ
నాకు నేల నీ[79]తోడిదే లోక మన్న!

300

చ.

అనుచు విలాపనాలసత నాయమునానదీతీరభూమికిం
జని హరిఁ గాంచి యోరి పురశాసనశిష్యుని హంసుఁ గానవే
యనుటయు వాఁడె పో యమునయందు మునింగె ననంగ వెండియున్
మునుఁగుచుఁ దేలుచున్ డిభకమూఢుఁడు హంసునిఁ గానఁ డయ్యెడన్.

301


క.

వ్రేలెడు వెండ్రుక లిరుగడఁ
దూలఁగఁ దలయూఁచుఁ దొప్పుదొప్పున నోరుం
గేల నడిచికొను సెలవుల
లాలలు దొరుఁగంగ నన్నలా! యని యొఱలున్.

302


క.

ఱాలం దల యడిచికొనున్
నేలం బడి పొరలు లేచు నెత్తురు లుమియుం
గేలిఁ బడి రిపులు చూడఁగ
నాలుక వెఱికికొనుఁ జావునకుఁ దన్నికొనున్.

303


వ.

ఇట్లు దుర్మరణంబున హంసడిభకులు వెలిసిరి తదనంతరంబ గోవిందుండు
గోవర్ధనాచలంబున బలభద్రసాత్యకిప్రభృతియాదవలోకంబుతోఁ గొంతవడి వినో
దించు నవసరంబున.

304

యశోదయు నందుఁడును గృష్ణునిఁ జూడవచ్చుట

శా.

గోపాలాగ్రణి రేవతీరమణుతో గోవర్ధనాధిత్యకా
వ్యాపారుం డయినాఁ డనంగ విని భావంబేతదాలోకచిం
తాపూర్ణంబుగ నందగోపుఁడు యశోదాదేవియు న్వచ్చి భృ
త్యోపానీతము లైనకానుకలు దా రొప్పించి రేర్పాటుతోన్.

305


క.

ఇతరేతరసందర్శన
కృతాభివాదనుల రామకృష్ణులఁ బ్రీతిన్
సతియును బతియుం జూచిరి
సుతులుం బితృభక్తి నెఱయఁ జూచిరి వారిన్.

306


వ.

అప్పు డామురాంతకుండు నందగోపునితో నిట్లనియె.

307

సీ.

పసిగ్రేపుఁ బెనుచునే? పాఁడి మొల్లం బెట్లు
                 మెకము దాఁటదు గదా? మేపు గలదె?
తొడకాలితఱుపుల విడుతురా తొడితొడి?
                 జన్నెలఁ దరిపట్టు జూడ గలదె?
వెలికల్ల వైతురా వేల్పుల కుడుపుచోఁ
                 గదుపులో నే[80]పోతు గడవఁ బాఱు?
[81]సలగ[82]పన్నులు గొన్ని జట్టిచూపరు గదా?
                 బెదరిన నిలుగూఁతఁ బెట్టఁ గలదె?


తే.

వల్లె వై చువా రెవ్వరు మల్లరాల
లంపు గలతొఱ్ఱులను గూయ లావు గలదె?
యేర్పుదాఁటులలో దొఱఁ గెఱుఁగ బడునె
[83]పరికరము కోడె లమ్మెడుపాటి గలదె?

308


వ.

అనుటయు నతండు.

309


క.

నినుఁ గన్నులార నెప్పుడుఁ
గనుగొనఁగా లేనివగపు గల దొక్కటియున్
వనజోదర! నీయాదర
మునఁ దక్కినపనుల మాకు మోదము గొఱుఁతే.

310


వ.

అనుటయు నచ్యుతుండు యశోదం జూచి యిట్లనియె.

311


శా.

తల్లీ నిన్నుఁ గనుంగొనం బడయుటన్ ధన్యుండనైతిన్ జగం
బెల్ల న్నిన్ను నుతించి మ్రొక్కిన ధనాధీశోన్నతిన్ నిత్యమై
చెల్లు న్నాకుం బ్రియంబు చేయునదియై చెన్నొందు నావారు ని
న్నుల్లంబారఁ దలంచువారు పరమాయుఃప్రాప్తారోగ్యులున్.

312


వ.

అనుచు నయ్యరువురకు యథోచితోపచారంబు లాచరించి నిజనివాసంబులకు
వీడ్కొల్పి యనంతరంబ మురాంతకుండు పుష్కరసరోవరంబునకు వచ్చి యందలి
మునీంద్రులం గాంచి వారిచేత నర్ఘ్యపాద్యంబులు మొదలగు నుపచారంబులం బరితో
షంబు నొందినపిదప వా రిట్లనిరి.

313

క.

ఓహో! విచక్రుఁ జంపుట
సాహస మొరు లైన వానిఁ జంపం గలరే?
యాహంసడిభకు లెవ్వరి
చే హతు లయ్యెదరు నీవు చెఱుపకయున్నన్.

314


వ.

అని కొనియాడి నద్దేవునితో వెండియు.

315


సీ.

చక్రంబు మేదినీచక్రంబు నేదేవు
                 దక్షిణబాహుసౌందర్య మొసఁగు
జలజంబు నొకపాణిజలజంబు నేదేవు
                 సవ్యభుజంబుతో సరస మాడు
రత్నంబుఁ గామినీరత్నంబు నేదేవు
                 వక్షస్స్థలంబున వన్నెమిగులు
నోఘంబు దానవార్యోఘంబు నేదేవు
                 చరణపల్లవసమాశ్రయము నొందు


తే.

భానుమండలమును సుధాభానుమండ
లంబు నేదేవుకనుల లావు వడయు
దేవదేవ నద్దేవునిఁ దెలియువారు
దేవదేవునిరూపంబుఁ దెలియువారు.

316


మ.

అని తన్నుం గొనియాడు సంయముల నత్యానందదృష్టిం గనుం
గొని తీపారెడుమాటలం జవులు పెక్కుల్ చూపి వారాదరం
బున వీడ్కొన్న యనంతరంబ మిగులం బొంగారు సైన్యంబుతో
జనియెన్ ద్వారవతీపురంబునకుఁ గంసధ్వంసి నిశ్చింతుఁడై.

317


వ.

ఇట్లు విచక్రవిదారణంబు చేసి హంసడిభకవధం బాపాదించి మునియతీంద్ర
నివహంబునకు మోదం బొనరించి నిజనగరంబున నీలవర్ణుండు నిత్యోత్సవపరి
పూర్ణుండై యుండె నద్దేవునిగుణంబులు గొనియాడుటకు సహస్రచతురాననులకుం
గొలది గాదని వైశంపాయనుండు జనమేజయునితో నింక నేమి వినవలతు
వనుటయు.

318


ఉ.

సారసనీలతామరస సమ్మదకారణనేత్ర నిర్మలో
ధారవిహారమానసవిధాయితతాపసముఖ్య సంతత

స్ఫారతరార్చనాకరణపాత్ర రమాగిరిజానితంబినీ
చారుమనస్సరోజచరషట్పద రాజమరాళనాయకా.

319


క.

చక్రపరశ్వథయుతదో
విక్రమజితదానవేంద్ర వివిధవినోదా
పక్రాంతహృదయభవ్యా!
శక్రప్రముఖామరౌఘా సతతనిషేవ్యా!

320


మాలిని.

జలధిగిరినివాసా! చంచదుద్యద్వికాసా!
విలసితదరహాసా! వృత్తసచ్చిద్విలాసా!
ప్రళయబహుళరూపా! పండితాంతః ప్రదీపా!
దళితవిబుధతాపా! దైత్యసంహారికోపా!

321


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కౌమ్మనామాత్యపుత్త్ర బుధారాధనివిరాజి
తిక్కన సోమయాజి ప్రజీతం బైన శ్రీ మహాభారతకథానంతరంబున శ్రీమత్సకల
భాషాభూషణ సాహిత్యరసపోషణ సంవిధానచక్రవర్తి సంపూర్ణకీర్తి నవీనగుణసనాథ
నాచన సోమనాథ ప్రణీతం బైన యుత్తరహరివంశంబునందుఁ జతుర్థాశ్వాసము.

  1. తను జెనకినఁ దునిమె శౌరి తగనది వినుమా.
  2. ల తోడఁజె
  3. సీసపు
  4. మ్రంపుకొని మెయ్యె
  5. నెనడువాతికి
  6. తెల్లంటి
  7. నుక్కు చెడక వేగంబున నుత్తరించు
  8. చొఱకారకుంగాక
  9. యెయిదికొను
  10. యాదలకాదలచే
  11. క్రిగ్గా
  12. బలాకము (వావిళ్ళ); పతాకము (వీ)
  13. యచటిమునివరులకు
  14. బది
  15. పఱకటవైది
  16. పాఁతఱకుం (వీ)
  17. అలకువ
  18. తేదిగా
  19. నొరిచంటం బాలు గురియ నొరిచంటకునె
  20. లకు నీర్ష్యఁన్ దైన్యముం
  21. గాల్చి క్రొవ్వునన్, గనుకుటు లయ్యెడం జవులుగాఁ గొని
  22. నేరకంతంత
  23. యలునకమండలమును
  24. గడున్భారంబే నిను నంతయుం గలిగెనే
  25. జుఱువుచ్చి
  26. నం
  27. విచ్చేఁతలు
  28. మింతటికి
  29. లు
  30. లు
  31. వాండ్రె వెక్కాడి రను
  32. రదె కొసరై యీ
  33. కఱటికొనినకోర్కులు కావే.
  34. వల కేలివనమున కలవు సూపెఁ
  35. కృకతనమగు
  36. లీవలఁగఁ
  37. సాకార
  38. ఁబాటింతురే
  39. విచారంబార
  40. మ ప్రభో
  41. నవ
  42. మె
  43. రచన౼డిచకులట్టి (వీ)
  44. సారెసత్తుల
  45. డతలంకి రాచపని నచ్చునటే
  46. బోఁటిబోఁటి
  47. గరిమము
  48. దూఱియు... బాఱియున్
  49. పరున్నపులిఁ
  50. దొర పగు
  51. పుల్లఁ
  52. రున్నఁగ; నీకును
  53. తట్ట
  54. ధౌర్త్య
  55. దొడమయుఁ
  56. నగంబుతోఁ జేరిన
  57. గరిమ
  58. నల్లఁజకదుడు; సల్లఁజందురుఁడు.
  59. పెక్కణ
  60. గుబ్బతులు వోవ
  61. నిర్మాణముల్
  62. సన్నద్ధ
  63. వేవురు
  64. జన్మకృతసం, ఘటనమహిమ గాక యిట్టి,
  65. గేశాలు గఱచి తాళాలు విఱిచి
  66. చపుతంబు
  67. డుత్పాతకుఁడై
  68. యుం గడువఁగ
  69. జనుమఱ
  70. మోఁదుగుతో
  71. బుధ్భ్రాంతంబు
  72. జూళ్యాలు
  73. సోగు
  74. టుం దక్కి
  75. తఱువరులునుం
  76. ముదలా
  77. నేలగూఁలి
  78. రుక్కుకై
  79. లోక మగుదు నన్న
  80. తొఱ్ఱు
  81. సలిగ, సలిగె.
  82. పన్నులఁ
  83. పదుదరము