ఇంత మోహమా సామి

వికీసోర్స్ నుండి


పల్లవి:
ఇంత మోహమా సామి - ఇంత మోహమా
ఇపుడె రావలెన సామి ॥ఇంత మోహమా॥

చరణం1:
అక్కటక్కటా వేగు - చుక్క బొడిచెనో లేదో
కొక్కొరోకో యనుచు తొలి - కోడి గూసెరా
చిక్కియున్న కసర కసర - చీకటిలో నిదురలేక
ఇక్కడకు రానుపోను - యీ ప్రయాసమేల సామి ॥ఇంత మోహమా॥

చరణం2:
జుంటి తేనెలొలుకు దొండ - పంటి వంటి మోవి మీద
గంటు జూడగా యొడలు - మంట లెక్కెరా
ఒంటిగానె వచ్చితివో - వెంటనొకతె యున్నదో
జంట విడవు రేపు దాని - తంటాలేమి యున్నవో ॥ఇంత మోహమా॥

చరణం3:
వినుము తోట్ల వల్లూరి - వేణుగోపాల నీ
కనుల ఎరుపు చెక్కుల నలుపు - గనుగొంటినిరా
నిను నే నొకటన నేటికి - నిజమాడిన నిష్ఠురమే
ఘనుడ దాసు శ్రీరామ - కవి వందిత మునివందిత ॥ఇంత మోహమా॥