ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు - దంపూరు నరసయ్య/దినచర్య : కొన్ని జీవిత విశేషాలు

వికీసోర్స్ నుండి

8

దినచర్య

కొన్ని జీవితవిశేషాలు

దినచర్య రాయడం నరసయ్య నిత్యకృత్యంలో భాగం. ఆనాటి విద్యావంతులు - వీరేశలింగం, గురజాడ మొదలైనవారు దినచర్య రాశారు. నరసయ్య గంటగంటకు తాను చేసిన పనులన్నీ దినచర్యలో పేర్కొనేవాడు. చదివిన పుస్తకాలు, పత్రికలు గుర్తుగా రాసిపెట్టేవాడు. తనకు తారసపడిన ప్రతివ్యక్తి వివరాలు గుర్తుంచుకొని దినచర్యలోకి ఎక్కించేవాడు. విలేజి పోస్టుమాన్, బండివాడు, కూలీలు, అందరి వివరాలు దినచర్యలో రాసేవాడు. ప్రకృతిలో వచ్చే మార్పులు, రాత్రివర్షం కురిసిన సంగతి, అనారోగ్యంవల్ల నిద్రపట్టకపోవడం, భార్య 'పవిత్రస్నానం' అన్నీ ఆయన దినచర్యలో చోటు చేసుకొన్నాయి.

1896, 1901 నరసయ్య దినచర్యలను పెన్నేపల్లి గోపాలకృష్ణ తన వ్యాసాలలో ప్రస్తావించాడు. 1896లో పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక కొనసాగుతూనే ఉంది. 1901 దినచర్యలో ఆంధ్రభాషా గ్రామవర్తమానికి సంబంధించిన ప్రస్తావన ఉన్న కొన్నివాక్యాలను ఆయన ఉదాహరించాడు. ఈ రెండు దినచర్యలు ఇప్పుడు లభించడంలేదు. ఆ విధంగా ఎంతో విలువైన సమాచారం కనుమరుగైంది. 1898 దినచర్యలో కొన్నిపుటలు మాత్రమే ఇప్పుడు లభిస్తున్నాయి. నెల్లూరు నవాబుపేటలో బడి నడుపుతున్న రామయ్య “మంచి తెలివితేటలున్న వ్యక్తి” అని ప్రశంసిస్తూ, ఎనిమిదిమంది విద్యార్థులకు చదువు చెప్పినందుకు అతనికి గోశాల్ రామానుజులునాయుడు నిధినుంచి ఆర్థికసహాయం ఇప్పించడానికి నిశ్చయించుకొన్నట్లు ఈ దినచర్యలో పేర్కొన్నాడు.1

1900 ఆరంభం అయ్యేసరికి, నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ అచ్చాఫీసు నెల్లూరు నవాబు పేటలో ఏర్పాటుచేశాడు. ప్రెస్సు ఉన్న ఇంట్లోనే కాపురం ఉంటూ పత్రిక నడిపాడు. నరసయ్య 1901 అక్టోబరులో నెల్లూరు కోర్టులో ఇచ్చిన వాజ్మూలంలో "My profession - press office and cultivation" అని, "My residence - Nellore village" అని చెప్పాడు. పత్రికవల్ల కర్చుతప్ప, రాబడిలేని పరిస్థితిలో పత్రికా నిర్వహణ తనవృత్తి అని చెప్పుకోడంవల్ల ఆ వృత్తిమీద ఆయనకున్న గౌరవభావం, అభిమానం వ్యక్తమవుతున్నాయి.

1905, 1906 దినచర్యలు

ఈ దినచర్యలు 12cm x 8cm సైజు చిన్న పుస్తకాలు. వారం మొదలైన వివరాలుదిద్ది, నరసయ్య 1904 డైరీలో 1905 దినచర్య, 1905 డైరీలో 1906 దినచర్య రాశాడు. గత సంవత్సరం డైరీలో కొత్త సంవత్సరం దినచర్య రాయడమే ఆయన దయనీయస్థితిని సూచిస్తుంది. ఇంత చిన్న సైజు పుస్తకాల్లో గంట గంటకు జరిగిన విషయాలు పేర్కొంటూ, కొన్ని పుటలు పెన్సిల్ తో, కొన్ని పుటలు ఇంక్ పెన్‌తో, కరక్కాయసిరా కలంతో రాశాడు. పేజీకి ఒకవైపు రాసిన సిరా ఊరి అవతలివైపు పుటలోని రాతతో కలగలసి పోయింది. ఇరికించి సన్న అక్షరాలు రాయడంవల్ల ఆయన దస్తూరి పోల్చుకోడం పూర్తిగా సాధ్యపడలేదు. ఈ దినచర్యల వల్ల ఆయన చదివిన పుస్తకాల పేర్లు, పత్రికల పేర్లు కొన్నైనా తెలుసుకోడానికి వీలుపడింది. ఆయన విశ్వాసాలు, ఆచరణ, ఇతర వివరాలు గ్రహించడానికి అవకాశం కలిగింది.

పందొమ్మిది వందలా ఐదుకల్లా నరసయ్య తన నివాసం నెల్లూరు నుంచి భట్టారంవారికండ్రిగకు మార్చి, అక్కడ తన అక్క మీనాక్షమ్మతో ఉంటూ వ్యవసాయం సాగించినట్లుంది. 1905 దినచర్య ఈ విధంగా ఆరంభమవుతుంది. “శ్రీరామ

"శ్రీరామ - శుభమస్తు”

Sunday 1st January 1905

Bhattaramvari Khandriga,

Codoor V., N.T., N. Dt.

Morning : Begin another year, with many fears, misgivings and prayers to my Almighty heavenly Father, may the Lord give us our daily bread and shield us from all evil throughout the year..." నరసయ్య తన కుమారుడి ఆస్తి వ్యవహారంలో మద్రాసు హైకోర్టులో చేసుకొన్న అపీలు వీగిపోయింది. డిక్రీ బాకీ తీర్చడానికి ఆయన పడ్డ కష్టాలు, ఇబ్బందులు, వ్యవసాయంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఈ దినచర్యల్లో వివరంగా ఉన్నాయి. ఆయన మద్రాసు వెళ్ళినపుడు, వీలుచేసుకొని హిందూ ఆఫీసుకు వెళ్తాడు. ఈ సంగతి 1905 జనవరి 20 దినచర్యలో ఉంది.

"Went to the Hindu Office to see Mr. M. Veeraraghavachariar, but sorry to say he was not present at the office and I was told he had not been to the office for some days. I then went over to ఆంధ్ర - office where also A.C.P. too was not to be seen. Left a chit for the latter. Then went over to Higginbothams - purchased "Uncle John". Then walked over to Moore Market, seeing Sir T. Munro's statue, Rajah Ramaswami Chetty and H. Rest nut, etc., on the way."2

నరసయ్య మిత్రులు, పరిచయస్థులు

నరసయ్య నెల్లూరు వచ్చిన తర్వాత కూడా ఎం. వీరరాఘవాచారితో, సి.కరుణాకర మీనన్‌తో, తరచుగా ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ వచ్చాడు.3 హిందూ వ్యవస్థాపకుడు వీరరాఘవాచారితో ఇంత గాఢమైన స్నేహం ఉన్నా, దినచర్యలో హిందూ చదివినట్లు ఎన్నడూ రాయలేదు. ఆంధ్రప్రకాశిక అధిపతి ఏ.సి. పార్థసారథినాయుడితో నరసయ్య నెల్లూరు నుంచి ఉత్తరాల ద్వారా స్నేహం సాగించాడు.4 క్రమం తప్పకుండా పోస్టులో నరసయ్యకు ఆంధ్రప్రకాశిక అందేది. దాదాపు రెండు దశాబ్దాలపాటు పత్రికలు నిర్వహిస్తూ, మద్రాసులో ఉండడంవల్ల నరసయ్యకు దేశంలోని వివిధ నగరాల్లో అభిమానులు, స్నేహితులు ఏర్పడి ఉంటారు. 1876 నాటికే పూనాలో పట్వర్టన్ స్నేహితుడైనట్లు ఒక ఉత్తరంవల్ల తెలుస్తుంది. కలకత్తాలోని ఒక సంపన్న కాంగ్రెసువాది నరసయ్య కృషిని అభినందిస్తూ రాసిన ఉత్తరం లభించింది.5 దినచర్యలో నరసయ్య మిత్రుల పేర్లు, పరిచయస్థులపేర్లు వస్తాయి. మద్రాసు క్రిస్టియన్ కళాశాల ప్రధానాచార్యుడు డాక్టర్ విలియం రెవరెండ్ మిల్లర్ (Dr. Reverend Miller William) ను "My friend" అని పలుమార్లు పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య జాబులు, జవాబులు తరచుగా కొనసాగాయి. ఇంగ్లీషు, తెలుగు నిఘంటు కర్త. పి. శంకరనారాయణ "పీపుల్స్ ఫ్రెండ్స్ సంపాదకులు శ్రీ దంపూరు నరసయ్యపంతులుగారికి గౌరవ పురస్సరంగా” అని రాసి బహూకరించిన నిఘంటువు ఇప్పుడు కూడా ఆయన వారసుల వద్ద ఉంది. నరసయ్య మద్రాసు మిత్రులు పి.కృష్ణస్వామి బి.ఏ. బి.ఎల్., క్రైస్తవ మిషనరీ రెవరెండ్ ఏ. మోఫెట్ (?), గోపతి నారాయణచెట్టి, గోపతి వరదరాజులుచెట్టి. చివరి ఇద్దరు మద్రాసులో సంపన్నులైన వడ్డీ వ్యాపారులు. వీరు రుణదాతలు మాత్రమేకాక, నరసయ్యకు ఆత్మీయులు. మద్రాసు వెళ్ళినపుడల్లా వీరిని చూచి వచ్చేవాడు. నరసయ్య మరొక మద్రాసు పరిచయస్థుడు సి.వి.చారి. ఈయనకు ఉత్తరాలు రాశాడు. నరసయ్య పెద్దన్న 'పార్థసారథయ్య' కుమారుడు ఆదెన్న, చిన్నన్న కృష్ణయ్య మద్రాసులో స్థిరపడ్డారు. వీరితో నరసయ్యకు సత్సంబంధాలున్నాయి.6

వెంకటగిరి జమీందారు రాజగోపాలకృష్ణ యాచేంద్రకు నరసయ్య ఇంగ్లీషు ట్యూటరుగా వ్యవహరించినా, ఆయనతో సంబంధాలు కొనసాగించలేదు. ఆయన తమ్ముళ్ళు ముద్దుకృష్ణయ్య, వెంకటకృష్ణయ్య, వేణుగోపాలయ్యలను కలుసుకొన్నట్లు, వారికి ఉత్తరాలు రాసినట్లు దినచర్యలలో పేర్కొన్నాడు. వెంకటగిరిలో ముద్దుకృష్ణయ్య నిర్వహిస్తున్న హైస్కూల్లో ఉపన్యసించిన వైనం దినచర్యలో ఉంది.7

కొందరు నెల్లూరు రంగనాయకుల పేట వైష్ణవ యువకులు నరసయ్య అభిమానులు, మిత్రులు అయ్యారు. ఈ యువకులు మద్రాసు చదువులకు వెళ్ళినపుడు ఆయనకు పరిచయం అయి ఉండాలి. నెల్లూరులోని వెంకటగిరిరాజా హైస్కూలు ఉపాధ్యాయుడు ఆసూరి సరస్వతీ నరసింహాచార్యులు నరసయ్య సన్నిహిత మిత్రుడు. ఈయన నెల్లూరు పురప్రముఖుడు, అమెట్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్ (Amateur dramatic association) సభ్యుడు, నెల్లూరు ప్రోగ్రెసివ్ యూనియన్ (Progressive Union, Nellore) వ్యవస్థాపక సభ్యుడు. ఈయనను "My old friend" అని దినచర్యలో వర్ణించాడు. “My friend కొమాండూరు నరసింహాచార్లు” అని దినచర్యలో మరొక నరసింహాచార్యులను ప్రస్తావించాడు. ఈయన జిల్లా బోర్డు హైస్కూలు ప్రధాన అధ్యాపకుడుగా పనిచేశాడు. చక్కిరాల వెంకటసుబ్బయ్యతో కలిసి నెల్లూరు ఉత్తరభాగంలో ఒక పాఠశాల నెలకొల్పడానికి కృషిచేసినట్లు కూడా దినచర్యలో ఉంది.8

నరసయ్య నెల్లూరు స్నేహితులలో రంగమన్నారు అయ్యంగారు, చిలకపాటి రామానుజాచార్యులు, వెంకటేశయ్యరు, ఒంగోలు వెంకటరంగయ్య మొదలైన వారున్నారు. నరసయ్య కోడూరు నుంచి నవాబుపేట ఇంటికి వచ్చినపుడల్లా మిత్రులు వచ్చి కలిసేవారు. నెల్లూరులోని వేదం వేంకటరాయశాస్త్రి శిష్యవర్గంతో నరసయ్యకు పరిచయాలున్నాయి. నెల్లూరు పర్మనెంట్ ఫండ్ ఆఫీసు స్థాపకులలో ఒకరైన టి. సుబ్బులాలా నరసయ్య చిరకాల మిత్రుడు.9

నరసయ్యను "పుస్తకాల పురుగు” అని వర్ణించవచ్చు. పుస్తకపఠనం ఆయన వ్యసనం, ఆయన ప్రవృత్తి. పుస్తకంచేత పట్టుకొని, సాయంత్రం దీపాలు పెట్టినా ఏకాగ్రంగా పఠనం సాగించినట్లు దినచర్యలో పేర్కొన్నాడు. తనతో పాటు కుమారుడు రామకృష్ణయ్య కూడా గంటల తరబడి కదలకుండా చదువుతూ కూర్చొన్నట్లు దినచర్యలో రాశాడు.10 ఆర్థికంగా చితికిపోయి, జీవితం సంక్షోభంలో ఊగిసలాడుతున్న పరిస్థితులలో కూడా ఆయన పుస్తకపఠనం నిరంతరాయంగా సాగించాడు. ఒకవైపు రుణదాతలను శాంతపరచడానికి టి.ఎం.ఓలు పంపుతూ, అదే చేత్తో పుస్తక ప్రచురణ సంస్థలకు టి.ఎం.ఓలు పంపి పుస్తకాలు తెప్పించుకొన్నాడు. మదరాసు వెళ్ళినపుడల్లా పుస్తకాలు కొనడం అలవాటు. కొత్తగా వచ్చిన పుస్తకాలకు కేటలాగు తయారుచేస్తున్నట్లు దినచర్యలో పేర్కొన్నాడు. ప్రతిరోజు పోస్టులో ఉత్తరాలు, పత్రికలు వి.పి.పార్సెళ్ళు వచ్చేవి. పోస్టుమాన్ రానిరోజు అసహనంతో “తపాలాశాఖ ఉండి ఏమి ప్రయోజనం” అని చిరాకు వ్యక్తంచేస్తూ పలుమార్లు దినచర్యలో రాశాడు. మద్రాస్ మెయిల్, ఆంధ్రప్రకాశిక, రీస్ అండ్ రయ్యత్ (Reis and Ryyet), ఇలస్ట్రేటెడ్ వీక్లీ (Illustrated Weekly) మొదలైన పత్రికలు క్రమం తప్పకుండా చదువుతున్నట్లు దినచర్యలవల్ల తెలుస్తుంది. "VPM చలమయ్య called and brought 1 paper, 1 magazine and 1 book-post from America" అని దినచర్యలో రాశాడు.11 వారం రోజుల తర్వాత "The History of Slavery and Success Movement in US of America" గ్రంథం చదువుతున్నట్లు దినచర్యలో ఉంది. లండన్ నుంచి పుస్తకాలబంగీ అందుకొన్నట్లు 1905 అక్టోబరు 25 దినచర్యలో ఉంది. వీరేశలింగం రచనలు, అనిబిసెంటు రచనలు, జేమ్స్‌మిల్ రచనలు, స్కూల్ కమిషన్ రిపోర్ట్ ఆన్ మద్రాస్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, జేనెట్ రిపోర్టులు, స్టరన్స్ రిపోర్టులు మొదలైన పరిపాలనా సంబంధమైన ప్రచురణలు చదువుతున్నట్లు దినచర్యలో పేర్కొన్నాడు. మూడు పైసల కరపత్రాలు - ఫెటర్స్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ట్రేడింగ్ (The fetters of Christianity in Trading) హిస్టరీ ఆఫ్ క్రైస్ట్ (History of Christ), ది ఏజ్ అండ్ ఆరిజిన్ ఆఫ్ గీతా (The age and Origin of Geeta) చదివినట్లు దినచర్యలో రాశాడు.12 ఇవి వందేమాతరం ఉద్యమనేపథ్యంలో వెలువడిన కరపత్రాలని అనిపిస్తుంది. ఈ కరపత్రాలు చదివినట్లు రాసుకొన్న కొన్ని గంటల తర్వాత “ది క్రిస్టియన్ ఇయర్” (The Christian Year) పుస్తకం చీకట్లు ముసురుకొనే వేళదాకా చదువుతూ కూర్చున్నాడు.14 ఏ.ఎస్. రే ఇంగ్లాండ్ అండ్ ఇండియా, (A.S. Ray's England and India) అమృత్ లాల్ రచన రెమినిసెన్స్‌స్, (Reminiscences) ఆర్.సి.దత్ హిస్టరీ ఆఫ్ బెంగాల్ అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ (History of Bengal and Madras Presidency), ఇండస్ట్రియల్ లైఫ్ (..............) అండ్ కండిషనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ సక్సెస్ (Industrial Life (................) and Conditioning of Industrial Success) మొదలైన చరిత్ర, రాజకీయ, ఆర్థికశాస్త్ర గ్రంథాలు చదువుతున్నట్లు దినచర్యలో ఉంది.14 'వాల్తెర్' (Voltair), క్రామ్‌వెల్ (Cromwell) అబ్రహాం లింకన్ (Abraham Lincoln) మొదలైన వారి రచనలు చదివినట్లు దినచర్యలవల్ల తెలుస్తూంది. డికెన్సు అమెరికన్ నోట్సు (American Notes) తో సహా డికెన్సు సాహిత్యం సమగ్రంగా అధ్యయనం చేసినట్టు దినచర్యలవల్ల బోధపడుతుంది. "Reading London (.............) magazine" అనే వాక్యం దినచర్య పుటల్లో తరచుగా కనపడుతుంది. సీరియస్ రచనలేకాక, కాలక్షేపంకోసం 'సిక్స్ పెన్నీ' (Six penney) నవలలు, కథలు చదివినట్లు దినచర్యల్లో రాసుకొన్నాడు. భర్తృహరి, భగవద్గీత ఇతర సంస్కృత గ్రంథాలు చదివినవైనం దినచర్యల్లో ఉంది. రచయిత పేరు, పుస్తకం పేరు ఒకటి రెండు సన్న అక్షరాలలో పేర్కొన్నందువల్ల నరసయ్య చదివిన పుస్తకాల పేర్లు, పత్రికల పేర్లు వివరంగా తెలుసుకోడానికి సాధ్యపడలేదు. ఏ పుస్తకం చదివినా, దానిమీద ఒక వాక్యంలో తన అభిప్రాయం రాసుకోడం ఆయన అలవాటు. "Reading Uncle (John) and finished it by 6 p.m. The book is a beautiful story written in a very ( ) Not a dull line from beginning to end" "Reading Mrs. Besant's Lectures (8) 5th 1891. How clear and eloquent !" "Reading 'Gone' - A story of some years of memory through!" "Reading again "Tenant of Wild Fell Hall-" how clever the author Ani Bronti is!" ఇటువంటి వాక్యాలు దినచర్యలో తరచుగా కన్పిస్తాయి.15 నరసయ్య చరమ సంధ్యలో కూడా సమకాలిక జాతీయ, అంతర్జాతీయ విషయాలను గమనిస్తూనే ఉన్నాడని, సాహిత్య గ్రంథాలను, ఉబుసుపోక పుస్తకాలను చదువుతున్నాడని చెప్పడానికి దినచర్య నుంచి వివరంగా ఉదాహరించవలసి వచ్చింది.

మతవిశ్వాసాలు

1901 కోర్టు వాఙ్మూలంలో తాను స్మార్త బ్రాహ్మణుణ్ణని నరసయ్య చెప్పుకొన్నాడు. ఆచరణలో ఆయన బ్రహ్మసమాజ భావాలకు దగ్గరగా జరిగినట్లు తోస్తూంది. తల్లితండ్రుల తిథులు జరపడం, శ్రావణ పౌర్ణిమనాడు నూతన యజ్ఞోపవీతాలు ధరించడం - ఈ రెండు మతకర్మలను మాత్రమే ఆయన పాటించాడు. నరసయ్యకు శిఖ ఉండేదని ఆయన వంశీయులు తెలిపారు. క్షురకర్మ, స్నానపానాలు, భోజన భాజనాలు, వాహ్యాళి వంటి ప్రతి నిత్యకృత్యాన్ని దినచర్యలో ఆయన రాశాడు. మద్రాసు, నెల్లూరు, వెంకటగిరి ప్రయాణాలలో ఒక పర్యాయం కూడా గుడికి వెళ్ళినట్లు పేర్కొనలేదు. అనుష్ఠానపరులైన బ్రాహ్మణుల వలె సంధ్యావందనం, దేవతార్చన చేసినట్లు ఏ ఒక్కరోజూ ప్రస్తావించలేదు. దినచర్య మామూలుగా "Prayed and laid down" అనే వాక్యంతో ముగుస్తుంది. "Reading and meditating" వంటివాక్యా లు, "Remembering myself and family to the kind keeping and care and mercy of our Father at Heaven" వంటివాక్యాలు అప్పుడప్పుడూ కనిపిస్తాయిగాని, సగుణబ్రహ్మ ప్రస్తావన కనిపించదు. నూతన సంవత్సరం ఉదయం ప్రార్ధనచేసినట్లు, కొన్ని సంస్కృత శ్లోకాలు పఠించినట్లు పేర్కొన్నాడు. 1905 దినచర్య తొలిపుటమీద 'శ్రీరామ' అని రాయడం తప్ప, మూడు సంవత్సరాల దినచర్యలో ఏ దేవత ప్రస్తావన రాదు. “ఉపవాసం ఉంటే ఊరపందై పుడతార” ని పరిహాసంగా అనేవాడని ఆయన వంశీయుల వల్ల తెలిసింది. నరసయ్య మాదిరే ఆయన అన్న కృష్ణయ్య కూడా బ్రహ్మసమాజ ప్రభావంలో జీవించినట్లు అనిపిస్తుంది.

నరసయ్య మీద క్రైస్తవ ప్రభావం ఉంది. క్రిస్మసు సందర్భంగా దినచర్యలో రాసిన ప్రార్ధనలు ఈ విషయాన్ని సూచిస్తాయి.

"Sunday 24th December 1905 భ||వారి ఖండ్రిగ

May Xmas bring peace and rest for me and (.......) all."

"Monday 25th December 1905 భ||వారి ఖండ్రిగ

Xmas Day. May the (.........) and blessing of Christ rest upon this land, this village and all of us now in such a trouble! Rose at 6 A.M. and engaged in reading certain books of prayers in Sanskrit."

నరసయ్య 1906 ఏప్రిల్ 15 దినచర్య ముగిస్తూ, "Prayed to my Father in Heaven for his endeavour and protection" అని రాశాడు.

1884 సంవత్సరంలో మద్రాసు బ్రాహ్మణ సంఘం ప్రోత్సాహంతో పీఠాధిపతి వీరేశలింగాన్ని, నరసయ్యను మరికొంతమందిని (ఆరుగురు సంస్కర్తలు) సంఘ బహిష్కారం చేశాడు. 1905 నాటికి ఈ సంగతి పాతపడి పోయింది. మద్రాసు, నెల్లూరు, కోడూరు చుట్టుపట్ల గ్రామాల్లో బంధువుల ఇళ్ళలో శుభాశుభాలకు నరసయ్యను పిలుస్తూ వచ్చారు. నరసయ్య మిత్రుడు గండవరపు సుబ్బరామిరెడ్డి తమ కుటుంబసభ్యులు జరుపుకొంటున్న సమారాధనలో భోజనం చెయ్యమని కోరినట్లు, ఆ ఆహ్వానాన్ని మర్యాదాపూర్వకంగా తిరస్కరించి, 'మోయన' తీసుకోడానికి మాత్రం అంగీకరించినట్లు దినచర్యలో పేర్కొన్నాడు. వీరేశలింగంవంటి సంస్కర్త అనుష్ఠానిక బ్రాహ్మోగా మారింది 1906 తర్వాతనే అని గుర్తు చేసుకొంటే, నరసయ్య ఆచరణ ఆనాటి సంస్కర్తల ఆచరణకు దగ్గరగానే ఉన్నట్లు తెలుస్తూంది.

జీవకారుణ్యం

నరసయ్యకు పెద్ద వ్యవసాయం, పశుసంపద, భట్టారంవారి కండ్రిగ ఇంటి పెరడులో పశువులదొడ్డి, పొలాల్లో పశువుల కొట్టాలు, పశువులు తిరిగి రావడానికి అనువైన బీడుపొలాలు ఉండేవి. కోడూరు, కండ్రిగలో దగ్గర ఉండి టెంకాయ మొక్కలు నాటిస్తాడు. అరటితోట వేయిస్తాడు. పెరడులో మామిడి, కిచిలి మొలకలు నాటి పెంచుతాడు. పాలేర్లు, కూలీలు భోజనాలు చేసిన సంగతి కూడా దినచర్యలో రాయడం ఆయన విస్మరించడు. స్వయంగా తాను కాయకష్టం చేస్తాడు. 1905 జనవరి 7వ తారీకు దినచర్య ఇట్లా ఆరంభం అవుతుంది.

"I rose as usual and walked through our pasture lands and had there cattle droppings collected carefully till 10 a.m."

రాత్రి, పగలు, వర్షాగమనం, శీతాకాలం, వేసవి ప్రకృతిలో వచ్చే మార్పులు అన్నీ దినచర్యలో రాశాడు. పైరుపంటలన్నా, పశువులన్నా ఆయనకు ప్రాణం. పశువులకు పేర్లు పెట్టుకొని పిలిచేవాడు. "Calf born to our cow (పుల్లావు or పుల్లి) which we named “సూర్యనారాయణ” అని ఒక పుటలో రాశాడు. పిచ్చిరామయ్య, మంగ, రామస్వామి ఎద్దులపేర్లు. “పుల్లావు కూతురు గయ్యాళి గౌరి”. రత్నమ్మ, అమ్మాయమ్మ పెయ్య దూడల పేర్లు, ఒక కోడె పేరు వెంకటేశ్వరులు. ఇంకో కోడెదూడ పేరు “లక్ష్మీనారాయణుడు”. ఒక ఆవు ఈనితే ఆ దూడకు సీత అని నామకరణం చేశాడు.16 తల్లిలేని దూడకు 'శంకరయ్య' అని పేరు పెట్టి సాకాడు. కుటుంబ సభ్యులు వెంట ఉండి రైల్లో శంకరయ్యను వెంకటగిరి తీసుకొని పోతారు. శంకరయ్యకు జబ్బు చేస్తుంది. ఈ వార్త తెలిసి నరసయ్య ఎంతగానో దుఃఖిస్తాడు. వెంకటగిరి వెళ్ళి శంకరయ్యను చూచి వస్తాడు. "Saw శంకరయ్య How miserable is the poor creature's present condition" అని దినచర్యలో రాసుకొన్నాడు. శంకరయ్య మరణ వార్త తెలుస్తుంది. “శంకరయ్య the orphan calf brought up by us ...............) died. God ! have mercy upon him (this) poor soul !" అని శోకిస్తూ రాశాడు.17 'లక్ష్మయ్య' అని పిలుచుకొనే ఎద్దుకు 'ముసర' వ్యాధి సోకుతుంది. అన్ని కష్టాల మధ్య నలిగిపోతున్న నరసయ్య ఈ విషయాన్ని దినచర్యలో రాయడం మరచిపోలేదు. "God is great and his decisions are mysterious and inscrutable, My bullock named లక్ష్మయ్య seems to have been suddenly taken ill last night. Only God (.....................) may take care of this poor beast" అని రాశాడు.18

కోర్టు వ్యవహారాలు

గురజాడ విలువైన కాలం జమీందారీ వారసత్వ దావాలతో వృథా అయినట్లు, నరసయ్య చివరి పదేళ్ళ జీవితం కోర్టు వ్యాజ్యాలతో సరిపోయింది. ఆంధ్రభాషా గ్రామవర్తమాని నడుపుతున్న రోజుల్లో ఆయన పేదలపక్షాన నిలబడి, భూస్వాములకు, గ్రామాధికారులకు వ్యతిరేకంగా ధ్వజమెత్తాడు. విద్యాధికుడు, పేరున్నవాడు కావడంవల్ల ప్రభుత్వ అధికారులు ఆయనను గౌరవంగా చూచినా, స్థానిక భూస్వాములు ఆయన మీద కసిపెంచుకొని అనేక ఇబ్బందులు పెట్టారు. వీటన్నిటికి తోడుగా గృహచ్ఛిద్రాలు ఆయనను కలవరపెట్టాయి. ఇన్ని వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నా, గ్రామీణుల సమస్యల పరిష్కారానికి కృషిచేశాడు. గ్రామీణులను వెంటపెట్టుకొని పై అధికారులను కలిసి మహజరులు ఇచ్చాడు. వారి సమస్యలమీద పత్రికలకు రాశాడు.19 తాసిల్దారు కోరిక ప్రకారం 1906 జనవరి నుంచి నాలుగైదు నెలలు నరసయ్య కోడూరు గ్రామాధికారిగా (Village Munsif) పనిచేశాడు. నరసయ్య కుమారుడికి మైనరు తీరగానే అతణ్ణి గ్రామాధికారిగా ప్రభుత్వం నియమించింది.20 నరసయ్య వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యడానికి దినచర్యలో పేర్కొనబడిన ఈ సంఘటన ఉపకరిస్తుంది. ఎవరో ఒక దిక్కులేని ఆదివాసి స్త్రీని కొట్టారు. ఆయన కుమారుడు ఆరేడు మైళ్ళు నడిచి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. ఈ విషయం దినచర్యలో రాశాడు.

"6 a.m. got up at 6 awakened by the noise created by a row between జంగం వెంకటసుబ్బడు and యేనాది అంకి on account of some money due by latter to former. I advised former to collect the money in a legal and amicable manner. He, advised by his brother పిచ్చివాడు dragged the woman away forcefully. We (I and BRK) complained to S.H.O Indukurpet who advised the fellows not to do such things any further."21

నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ ప్రెస్సు చాలా పెద్దది. దాన్ని అమ్మి ఉంటే ఆయన బాకీలన్నీ క్షణంలో తీరిపోయేవి. ప్రెస్సు ఆయన బహిః ప్రాణం. "when will my Heavenly Father enable me to pay off commitment and pay the creditors and resume my printing work" అని భగవంతుణ్ణి వేడుకుంటాడు. "Mercy Heaven wish me to pay off my creditors and work my press, etc.," అని ప్రెస్సు పునరుద్ధరించే రోజు గురించి ఆశగా ఎదురు చూస్తాడు.22

ఈ దినచర్యలో నరసయ్య నిస్సహాయమైన పరిస్థితులు వెల్లడి అయ్యాయి. 1906 అక్టోబరు 23 దినచర్య పుటలో ఆయన రాసిన ఈ వాక్యాలతో విషయాన్ని ముగిస్తాను.

"In my wife's illness, sister's helplessness, debts, difficulties of cultivation, etc., I require God's help."

చివరి రోజులు

1907లో తోడల్లుడు రాపూరు ఆదినారాయణయ్య అండదండలతో నరసయ్య వెంకటగిరిలో స్థిరపడ్డాడు.23 అక్కడ ఆయన అచ్చాఫీసు వ్యాపారం ఏ పాటిగా జరిగిందో తెలియదు. అప్పటికి ఆర్ధిక ఇబ్బందులన్నీ తొలగి పోయినట్లుంది. పది సంవత్సరాలు రుణబాధతో, కుటుంబ చిక్కులతో సతమతమయి పోయినందువల్ల అరవైఏళ్ళకే వృద్దాప్యం ఆయనను లోగొంది. తనకు "మధుమేహవ్యాధి లేదని” ఒక మిత్రునికి రాసిన లేఖలో పేర్కొన్నా, రెండు మూడుసార్లు అస్వస్థతకు గురిఅయిన విషయం దినచర్యలో ఉంది. 1908లో నెల్లూరులో జరిగిన తొలి జిల్లా రాజకీయ సభలకు కూడా ఆయన హాజరు కాలేదు. 1907-1909 మధ్య ఆయనకు సంబంధించిన సమాచారం ఏదీ లభించలేదు.

గురజాడ 1909 జూలై 7వ తేదీ ఒంగోలు మునిసుబ్రహ్మణ్యానికి రాసిన లేఖలో నరసయ్యను గురించి వాకబు చేస్తూ “ఆయన జీవించి ఉన్నారా?" అని విచారించాడు. నరసయ్య చివరిరోజులు ఎంత అజ్ఞాతంగా గడిచిపోయాయో దీనివల్ల అర్థమవుతుంది. గురజాడ ఉత్తరం రాసే సమయానికి నరసయ్య చనిపోయి తొమ్మిది దినాలు. నరసయ్య కుమారుడు రామకృష్ణయ్య తండ్రి మరణాన్ని “28-6-1909 (ఆషాఢ శు11-)” అని “ఫేమిలీ రిజిస్టరు” లో రాసిపెట్టాడు. వెంకటగిరి పంచాయితీ ఆఫీసు జనన మరణ రిజిస్టరులో ఇదే తారీకు నమోదయింది. “ఆకస్మిక మరణం” అని మరణ కారణాన్ని రికార్డు చేశారు.

నరసయ్యకు ఉదయం పదిగంటలకే భోజనంచేసే మద్రాసు అలవాటట. పొద్దున భోజనం ముగించి, వాలుకుర్చీలో పడుకొని, విశ్రాంతిగా పత్రిక చదువుతూ, అనాయాసంగా ప్రాణాలు విడిచినట్లు తెలుస్తూంది.

నరసయ్య జీవితం అంతా పోరాటమే. ఉద్యోగాలకోసం ప్రయత్నాలు, ఆస్తిపాస్తుల తగాదాలు, బంధువులతో సంబంధాలు - ఇవన్నీ ఆయన కాలాన్ని కొంతవరకు హరించి, సాంఘిక కార్యకలాపాలకు అవరోధాలయ్యాయి. ఇన్ని ప్రతికూల శక్తులమధ్య నూతన భారత నిర్మాణానికి కృషిచేశాడు. ఆయన లక్ష్యం - అజ్ఞానం, అవిద్య తొలగిపోయి కొత్త ప్రపంచం ఏర్పడడం. ఉన్నతమైన, న్యాయమైన సమాజంకోసం తన కాలాన్ని, శక్తిని వినియోగించాడు. ఆయనను ఒక సంఘసంస్కర్తగా గుర్తించవచ్చా? రాజకీయ ఉద్యమాలకు దన్నుగా పత్రికలు నిర్వహించాడా? పొట్టకూటికి పత్రికలు నడిపాడా? దేశభక్తుడా? ఆయనను ఏమని పిలవాలి? సంస్కరణ ఉద్యమంలో వీరేశలింగం, వెంకటరత్నం వంటి నాయకుల పేర్లు లోకానికి తెలుసు. లోకం దృష్టికి రాని "Unsung Heros" ఎందరో? శ్రీధరనాయుడు, సి. సుబ్బరాయలు పెట్టి, మన్నవ బుచ్చయ్య, నరసయ్య, దేశిరాజు బాపయ్య, బసవరాజు, గవర్రాజు ఇట్లా ఎంతెంతమంది అజ్ఞాత వీరులకృషి ఈ మహోద్యమాల వెనక దాగుంది!

శేష ప్రశ్నలు

నా కృషి చాలా అసమగ్రమైనదని తెలుసు. నాకున్న పరిమితులు తెలిసే ఈ పుస్తక రచనకు పూనుకొన్నాను. పీపుల్స్ ఫ్రెండ్ రెండు సంచికలు తప్ప నరసయ్య పత్రిక లేవీ ఇప్పుడు లభించడం లేదు. ఆనాటి పత్రికల పేర్లు వినడమేకాని ఒకటి కనిపించదు. సజీవపత్రిక హిందూ మొదటి మూడేళ్ళ సంపుటాలే ఇప్పుడు లభించడం లేదు. నరసయ్య పత్రికలు ఒకటి రెండు సంచికలైనా, ఏ విదేశీ గ్రంథాలయంలోనో, ఆర్కైవ్స్‌లోనో కనిపించినా ఆశ్చర్యపడ నక్కర లేదు. 19వ శతాబ్దిలో ఒక పత్రిక ప్రచురించిన వ్యాసాన్ని, వార్తను, మరొక పత్రిక పునర్ముద్రణ చేసుకొనే సంప్రదాయం ఉంది. ఇంగ్లీషు పత్రికలలో వెలువడిన వార్తలను, రచనలను దేశభాషా పత్రికల్లో అనువదించి ప్రచురించుకొనే సంప్రదాయమూ ఉంది. పీపుల్స్ ఫ్రెండ్ ప్రచురించిన రెండువార్తా ఖండికలు ఆ విధంగా లభించాయి. ఓపికగా అన్వేషిస్తే పీపుల్స్ ఫ్రెండ్లో అచ్చయిన విషయాలు ఇతర సమకాలిక పత్రికల్లో కనిపించే అవకాశం ఉంది.

హిందూకు సమాంతరంగా పీపుల్స్ ఫ్రెండ్ నడిచింది. 1909 వరకు హిందూ సంపుటాలు పరిశీలిస్తే, పీపుల్స్ ఫ్రెండ్ ప్రస్తావనలు కనుదగిలే అవకాశం ఉంది. హిందూ రజతోత్సవ, స్వర్ణోత్సవ, వజ్రోత్సవ సంచికలు సంప్రదించడానికి ఈ రచయితకు అవకాశం లభించలేదు. వీటిలోనూ పీపుల్స్ ఫ్రెండ్ రెఫరెన్సులు ఉండవచ్చని అనిపిస్తుంది. ఆంధ్రప్రకాశిక, “ఇండియన్ సోషల్ రిఫార్మర్” మొదలైన పత్రికల్లో నరసయ్య పత్రికల ప్రస్తావనలు ఉండే అవకాశం ఉంది.

మద్రాసు మహాజనసభ కార్యక్రమాల్లో నరసయ్య క్రియాశీలంగా పాల్గొని ఉంటాడని అనిపిస్తుంది. ఆ రికార్డులు పరిశీలిస్తే నరసయ్య పాత్ర ఏమైనా ఉందా అనే సంగతి తెలుస్తుంది.

“లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్” తప్ప, నరసయ్య రాసిన పుస్తకాలేవీ లభించలేదు. తమిళనాడు ఆర్కైవ్స్‌లో ఓపికగా అన్వేషిస్తే, నరసయ్యకు, ప్రభుత్వానికి మధ్య నడిచిన 'కరస్పాండెన్సు' మరికొంత బయటపడే అవకాశం ఉంది. నెల్లూరు కలెక్టరాఫీసు రీటైన్డ్ డిస్పోజల్సు (Retained disposals) పరిశీలిస్తే, నరసయ్య పంపిన మహజర్లు, అర్జీలు లభ్యం కావచ్చు.

నరసయ్య ఫోటో కూడా ఆయన వారసులవద్ద లేదు.24 “ఆచార్య రంగాగారన్నట్లు దంపూరు నరసయ్యగారు ఎంతటి అద్భుతమైన వ్యక్తి” అనే వాక్యంతో బంగోరె “నూరేళ్ళనాటి జర్నలిస్టు" వ్యాసం ప్రారంభించాడు.25 ఆచార్య రంగా ఏ సందర్భంలో ఈ మాటలు రాశాడో, అన్నాడో బంగోరె ఆ వ్యాసంలో స్పష్టం చెయ్యలేదు. ఆచార్య రంగా నరసయ్య మీద రాశాడా అని శోధించవలసి ఉంది. నా కృషి సమగ్రంగా లేదనే అసంతృప్తితో ఈ రచన ముగిస్తున్నాను.