ఆ భా 7 4 1 to 7 4 30

వికీసోర్స్ నుండి

-ప్రకాశ్ స్వామినాథన్

7_4_1

క. శ్రీమత్త్వాయుష్మత్త్వసు

ధీమత్త్వప్రదకటాక్ష దీపితభక్తి

స్తోమారామవసంతా

వ్యామోహప్రశమకరణ హరిహరనాథా.


-: సాత్యకి మొగ్గరంబు సొరందొడంగుట :-


7_4_2

వ. దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.


7_4_3 తే. ధర్మపుత్రుండు వనుప సాత్యకి గడంగి

తనబలము దెస నడచుట వినినయాంబి

కేయుఁ డర్జునుఁ గలయ శైనేయుఁబోవ

విడిచిరే మనవా రని యడుగుటయును.


7_4_4

వ. సంజయుం డతని కిట్లను నట్లు మఱందిం బనిచి యుధిష్ఠిరుం డాచార్యు

వల నవలోకించి యాశినివరుపిఱుందన తఱిమె నప్పుడు ధృష్టద్యుమ్నుం

డవష్టంభంబున నెలుం గెత్తి పురికొల్పఁ బాండవసైనికులు గవిసిన మనవా

రును మార్కొనిరి తదనంతరంబ.


7_4_5

క. తలలను గరముల వక్ష

స్థ్సలముల జఘనములఁ దొడలఁ జరణంబుల న

య్యిలఁ గప్పెడు సాత్యకికో

ల్తల కోర్వక నీబలము గలంగం బడియెన్.


7_4_6

క. విచ్చినమూఁకల కడ్డము

సొచ్చిన నేడ్వురునృపాలశూరోత్తములం

బుచ్చె జముం గొలువఁగ వి

వ్వచ్చుమఱఁది పెఱనృపాలవరము దెరలన్.


7_4_7

సీ. ఆసమయంబున నతని మార్కొని కుంభభవుఁ డేడుతూపులు వఱపె మేన

నతఁ డస్త్రసప్తకహతుఁ జేసె నాతని నగ్గురుఁ డాఱింట నశ్వములను

సూతు నాతని నొంచె నాతఁ డయ్యాచార్యు నేపుమైఁ బదియును నేడునాఱు

నెనిమిదియును బదునెనిమిదియును శాతశరముల నొప్పించి తురగచయము


అ. నాల్గుసాయకముల నడికించి సారథి

నొక్కమార్గణమున ను బ్బడంచి

యార్చుటయును ద్రోణుఁ డలిగి

వాలమ్ములఁ బొదివెఁ దద్రథంబు మద మెలర్ప.


7_4_8

వ. ఇట్లు బాణజాలంబులం గప్పి గురుండు సాత్యకి నుపలక్షించి.


7_4_9

క. నాచేతిబలుపు గని నీ

యాచార్యుం డోడి తొలఁగి యరిగెను నీవే

త్రోచి యట వోవువాఁడవు

సూచెదు గా కెట్లు నిన్న స్రుక్కించెదనో.


7_4_10

క. అనవుడు ధర్మాత్మజుపను

పున నే గాండీవికడకుఁ బోయెద నన్నిం

తన నేటికిఁ దడ వయ్యెడు

ననుగ్రహము సేయు మర్హ మది పెద్దలకున్.


7_4_11

క. అని పలికి తొలఁగిపోవుట

మనమున నూహించి దైత్యమర్దనుతమ్ముం

డను సూతుతోడ ద్రోణుఁడు

మనలం బోనీక పెనఁగు మాత్సర్యమునన్.


7_4_12

వ. తడసినఁ గర్జంబు దప్పు నితనికి నోసరించి పోవవలయు విను మిదియె

బాహ్లికబలం బదె యంగసైన్యం బల్లదె దాక్షిణాత్యసేన వీనియం దొక్క

సందున వెడలుద మివి గడంగి యడ్డపడిన నొప్పించి చిక్కువఱచి పోద

మనిన నట్ల కాక యని యద్దారుకానుజుండు ద్రోణునకుందొలంగించి తేరు

దోలం దీవ్రబాణంబులు గురియుచు నగ్గురుండు వెనుతవుల నయ్యాదవసిం

హుండు సింహవిక్రమంబున నంగచమూచ్ఛేదనంబు నేసి చనునెడఁ గృత

వర్మ యాతనిఁ దాఁకి.


7_4_13

క. ఆఱమ్ము లతనిమేనం

దూఱంగా నేసి నాల్గుతురగాంగములన్

గీఱించినఁ గని ద్రోణుం

డూఱడి ధర్మజునిదెసకు నున్ముఖుఁ డయ్యెన్.


7_4_14

వ. అక్కడ మొగ మయ్యు నిక్కడ నేమఱక యుండె నప్పుడు.


7_4_15

క. కృతవర్మయొడల సాత్యకి

శితసాయకములు పదాఱు సెరివినఁ గోపో

ద్ధతి మెఱయఁగ బలుదూపుల

నతఁ డాతని నుచ్చి పోవునట్లుగ నేసెన్.


7_4_16

వ. వెండియు.


7_4_17

చ. విలు దునుమాడి పక్షమున వే పదియమ్ములు నాఁట నాతఁడు

జ్జ్వలఘనశక్తి వైచి కృతవర్మునిబాహువు నొంచిధైర్యని

శ్చలమతి నొండువిల్లు గొని సారథిఁ జంపిన సూతకృత్యమున్

వలనుగఁ బూని యారథికవర్యుఁడు నిల్చె నితాంతధీరతన్.


7_4_18

వ. నిలిచియు సాత్యకిదెసుం దఱుమక భీమసేనపురస్సరం బైనబలంబున కడ్డపడ

నరిగె నవ్విధంబున నతని బెట్టు వఱచి యాశైనేయుం డచటుగడచి చనియె

ననిన విని ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె.


7_4_19

చ. గురుకృతవర్మముఖ్యు లతిఘోరపరాక్రమశీలు రట్టినా

దొరలను సైన్యసాగరము దోర్బలసంపద గాసి సేసె న

న్నరుఁ డది గాక క్రమ్మఱ వినం గడు విస్మయ మి ట్లజయ్యుఁడై

వెరవున లావునం బరిభవించుచు సాత్యకి యేపు సూపెనే.


7_4_20

మ. హరియుం బార్థుఁడు నట్లు నేర్పు గలబాహాశక్తిమైఁ జొచ్చుచో

దొరలున్ సేనలుఁ బెల్లు గూలుటకు నాదుర్యోధనుం డెంతయా

తురతం బొందెనొ దంతిఘోటకపదాతుల్ సాత్యకిస్ఫారదో

స్స్ఫురణన్ మ్రగ్గుట కెట్లు దాను ననుజుల్ శోకించెనో యక్కటా.

7_4_21

వ. అనవుడు సూతసూనుం డమ్మానవపతి కిట్లనియె.


7_4_22

క. నీయవినయంబు పెంపున

నీయాపద సంభవించెనింక వగచినం

బాయునె యితరులక్రియ శో

కాయత్తుఁడ వగుట నీకు నర్హమె యధిపా.


7_4_23

వ. సుస్థిరుండవై సమరప్రకారంబు వినుము సాత్యకి యత్తెఱంగునం జని

కాంభోజసేనఁ జొచ్చిన నందలి మేటమగులు దలపడి రట్టియెడం గుంభసం

భవుండు.


7_4_24

క. కని కృతవర్మకు సారథి

నొనర్చి తనకృత్యమునకు నునిచి కడఁగి యా

శినివరు వెనుకొన ధర్మసు

తునిదొర లయ్యస్త్రగురునిఁ దొడర నడరినన్.


7_4_25

క. వారిఁ గృతవర్మ మార్కొని

దారుణశరశిఖల నేర్చి తల్లడపఱుపం

గా రయము గుంది నిలిచిరి

వా రొండొరుఁ జూచుచును వివర్ణాకృతులై.


7_4_26

వ. ఇట్లు హార్థిక్యుబలువిడి కోహటించినరథికులం బురికొలిపికొని వృకోదరుండు

సోదరపుత్త్రమిత్త్రసహితంబుగా నతనిపైఁ గవిసె నట్టిసమయంబున నయ్య

నిలజుండును ధృష్టద్యుమ్నుండును శరత్రయంబులను ధర్మనందనద్రుపదులు

బాణపంచకంబులను హైడింబుం డేడమ్ములను మత్స్యపతి పదియేనింటను

సహదేవుం డిరువదేనింటను శిఖండి యిరువదింటను ద్రౌపదేయులు డెబ్బది

తూపులను నకులుండు సాయకశతంబునను నొక్కుమ్మడి నమ్మేటివిలుకానిం

బొదివిన నతండు.


7_4_27

సీ. ఐదైదుశరముల నందఱ స్రుక్కించి భీముని నేడింట బెట్టు వఱచి

ధనువుఁ గేతనమును దునిమి డెబ్బదితూపు లతిరయంబున నురమాడ నేయ

సోలిన యమ్మరుత్సుతుఁ జూచి యందఱు నాకృతవర్మపై నడరి రంతఁ

దెలిసి వృకోదరుం డలఘుదారుణసముజ్జ్వలశక్తి నాతని వై నతఁడు


తే. ముత్తునియఁ జేయ దొడ్డవి ల్లెత్తి యతని

యొడలు నెత్తురు వఱ్ఱు సేయుడయు నాస

మీరనందనుఁ దక్కటివారి నొంచె

మూఁడుమూఁడమ్ము లేసి యవ్వాఁడిమగఁడు.


7_4_28

తే. అందఱును జుట్టిముట్టి తీవ్రాస్త్రజాల

కములఁ గృతవర్మ నొంప శిఖండి గదిసి

యాక్రమించిన విలు ద్రుంచె నాతఁ డప్పు

డతనిచాపంబు దునిమె నుగ్రాసి వైచి.


7_4_29 క. ఆలోనన భోజపతిన్

వాలమ్ములఁ బొదివి రెల్లవారలు దానం

దూల కతఁడు బలువిలు గొని

క్రాలుచు నాభీమముఖ్యరథికుల నొంచెన్.


7_4_30

వ. అప్పుడు.

"https://te.wikisource.org/w/index.php?title=ఆ_భా_7_4_1_to_7_4_30&oldid=3340" నుండి వెలికితీశారు