ఆ భా 7 3 061 to 7 3 090

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


7_3_061 వ. ఇవ్విధంబునం గుంభ సంభవుండు విజృంభించిన వివ్వచ్చుం డలిగి సజ్యశరాసనుండై యా ధనురాచార్యుం బటు బాణ విసర వేగంబున నతిక్రమించి కెలంకుల బలంబుల నాక్రమించిన.

7_3_062 సీ. కులిశంబు తాఁకునఁ గూలిన కుల పర్వతంబుల కరణి మత్తద్విపదములు బలుగాలిఁ దూలిన జలధర పంక్తుల చాడ్పున నుద్భట స్యందనములుఁ గీలుకాఁ డెడలింపఁ గెడసిన బొమ్మలకై వడిఁ బటు తురంగ వ్రజంబు బెడితంపు వఱ్ఱోడిఁ బడిన పేరడవి చందంబున బహుల పదాతి చయము

తే. వికటముకఁ ద్రెళ్లె నలుగడ విచ్చె నొక్క పెట్ట వెస డొల్లె నిలఁ జాఁపకట్టు పడియెఁ జండగాండీవ నిర్ముక్త శాత వివిధ కాండ దారుణ ప్రహతులఁ గౌరవేంద్ర.

7_3_063 ఆ. అడ్డపడి గురుండు దొడ్డనారసము వ క్షంబు దూఱ నేయ సవ్యసాచి యొల్లఁ బోయి తెలిసి పెల్లేసె నక్కుంభ జన్ముమీఁద నిశిత సాయకములు.

7_3_064 వ. అతండును.

7_3_065 క. హరి నైదు విశిఖముల న న్నరు డెబ్బదిమూఁట గేతనము మూఁటను స త్వరుఁ డై యేయుచు శితశర పరంపరలు తద్రథంబు పైఁ బరగించెన్.

7_3_066 క. కరములు నిగుడఁగ నొప్పెడు తరణిఁ బొదువు వర్షదంబుదము క్రియ నట్లా స్ఫురితాస్త్రుఁ బార్థు నత్యు ద్ధుర బాణ సమగ్రుఁ డైన ద్రోణుఁడు వొదివెన్.

7_3_067 వ. పొదివిన యగ్గురు ప్రాపున భవదీయ సైనికులు గొంద ఱా కృష్ణులం జేరి పరాక్రమించుట గుండ్లు దేలి బెండ్లు మునింగినట్లయ్యె నిబ్భంగి నక్కిరీటి కుమారుం డయ్యును వృద్ధుం డగు కలశ భవునిం గడవం జాలక చిక్కువడి యున్నం జూచి విచారించి యచ్యుతుం డతని కిట్లనియె.

7_3_068 క. రిత్త దడవు గా కుండఁగ నిత్తఱి నాచార్యుతోడి యీ సుడిగి వెసం జొత్తము శకట వ్యూహము చిత్తంబున నొండుదలఁపు సేర్పకు మింకన్.

- అర్జునుఁడు ద్రోణాచార్యుల నతిక్రమించి కురు సైన్యంబు సొచ్చుట – సం. 7-66-30

7_3_069 చ. అనవుడు గ్రీడి నీదు హృదయంబున నెయ్యది దోఁచెఁ గృష్ణ దా నిన తగఁ జేయువాఁడ నని నెమ్మిగఁ బల్కిన బ్రీతి గుంభజ న్మునకుఁ బ్రదక్షిణంబుగ సముద్ధతి నాతఁడు దేరు వోవని చ్చిన శరజాలముల్ వరగఁ జేయుచుఁ బార్థుఁజు వోవుచుండఁగన్.

7_3_070 వ. కనుంగొని నవ్వుచు భరద్వాజుండు.

7_3_071 క. కలవే యెందును నిట్టివి బలసూదన తనయ పగఱఁ బరిమార్పక వి చ్చలవిడిఁ బ్రతిష్ఠితుఁ డవుగఁ దలఁచెదు పోలునొకొ యనుచుఁ దగిలెఁ బిఱుందన్.

7_3_072 వ. ధనంజయుండును.

7_3_073 క. గురుఁడవు గాక పగతుఁడవె దురమునఁ గుపితుఁడగు నిన్నెదుర్కొన నా కొ క్కరునకు శక్యమె యా పుర హరున కగుం గాక యనుచు నరుగుచు నుండెన్.

7_3_074 వ. ఇవ్విధంబున సైన్యంబు సొచ్చు నా సవ్యసాచి చక్ర రక్షకు లగు పాంచాల కుమారులు యుధామన్యుండును నుత్తమౌజుండును దోడన వచ్చి చొచ్చిరప్పుడు కృతవర్మయుం గాంభోజుండును శ్రుతాయువుఁ దమతమ యున్న చోట్లన యుండి తల లెత్తి జుచి కపిధ్వజ వేదికా కేతనంబుల కతంబునఁ గవ్వడి వెనుకం గలశ భవు రాకయుం గని యుత్సాహంబు మిగిలి తగులు వడ నడ్డపడుటకు నప్పళించుచుండ నప్పు డప్పాండవ వీరునిం గేకయ ప్రభద్రక నారాయణ గోపాల ప్రభృతులు వొదివి రెవ్వ రెట్లు వొదివినం బ్రదిజ్ఞా తత్పరుండగు నన్నరుండు సామజంబు సరోవరంబు దఱియం జొచ్చు తెఱంగున నబ్బల ప్రకరంబు బడలువడం జేయుచుం బోవం బోవ.

7_3_075 క. కదిసి శరాసన గురుఁ డిరు వది యేను శరంబు లేయఁ బార్థుఁడు వానిం గుదియించి విశాలాస్య ప్రదరము లడరింపఁ గుంభ భవుఁ డెడఁ ద్రుంచెన్.

7_3_076 క. విజయుం డను శైలము గల శజధారాధరము గప్పె శరవృష్టి మహా ద్విజు నతఁ డేయక కడు న క్కజముగ నయ్యంపసోన గ్రక్కున మాన్చెన్.

7_3_077 ఆ. మఱియు నిరువదేను మార్గణంబుల నరు డెబ్బదింటఁ గృష్ణు నుబ్బి యేసి గురుండు నారసములఁ గురియంగ నవి యాఁగ నలవా గామి నతఁడు నతఁడు నొచ్చి.

7_3_078 వ. అమ్మేటి విలుకాని వంచించి కృతవర్ముని సైన్యంబు సొచ్చుటయు నగ్గురుండు సేయునది లేక సేనా ముఖ రక్షణంబునకుం జనియె నప్పార్థు మార్కొని కృతవర్మ పదియమ్ము లేసిన నక్కిరీటి యొక్కవాలమ్మురమ్మున నాటించి మఱియును నారాచత్రయంబున నొప్పించె నా భోజపతి యన్నరనారాయణులం గనుంగొని నవ్వుచు నిరువదేనేసి తూపు లేపునం బరగించిన ధనంజయుం డతని ధనువు దునిమి యేక వింశతి విశిఖంబుల నొప్పించిన నొండ కోదండంబు గొని హార్దిక్యుండు బాణ పంచక యుగంబు వివ్వచ్చు పక్షంబునఁ గ్రుచ్చె నవ్వీరుండును దదీయ స్తనాంతరంబునఁ దొమ్మిది యంబకంబులు దూర్చె నప్పు డా సవ్యసాచిం జూచి యితండు దవులు వడియె నిది గా దని తలంచి దామోదరుండు.

7_3_079 క. తడవయ్యె నితఁడు మన కె క్కడి బంధుం డేల కృప దెగం బాఱుము నా వుడుఁ గీ లెడపిన జంత్రము వడువునఁ బడ నేసె నతని వాసవి యధిపా.

7_3_080 వ. ఇట్లు భజపతిం గ్రూరనారాచంబుల మూర్ఛితుం జేసి.

7_3_081 తే. కడచి కాంభోజ సైన్యంబు గలఁగఁ బెలుచఁ జొచ్చు వివ్వచ్చు వెనుకన చొరక యుండ ముట్టి యాఁగె నా కృతవర్మ మూర్ఛ దేఱి వచ్చి రథ చక్ర రక్షక ద్వయముఁ గడిమి.

7_3_082 వ. ఇవ్విధంబున నుత్తమౌజుని యుధామన్యుం బోనీక భోజపతి శర చతుష్టయంబును సాయక త్రయంబును దనువులం గీలించిన నయ్యిరువురుం బదేసి బాణంబుల నతని నేసి తత్కోదండంబు దుండంబులు సేసిన నతండు.

7_3_083 ఉ. వేఱొక విల్లు పుచ్చుకొని విండులు రెండును ద్రుంచి మేనులం దూఱంగ నేసె బెట్టిదపుఁ దూపుల వారును వాని యమ్ములన్ గీఱఁగ నొండువిండ్లు గొని కిన్క యెలర్పఁగ నేసి రెమ్మెయిం దీఱద గండి గాంచి నరు తేరి పథంబునఁ బోవ వారికిన్.

- అర్జునుఁడు శ్రుతాయుధ ప్రముఖ మహారథికులం జంపుట – సం. 7-67-36

7_3_084 వ. అట్లు చొచ్చు వివ్వచ్చుం జూచి శ్రుతాయుధుం డను రాజు రభసంబున నెదిర్చి మార్గణ త్రయంబున నేసి వాసుదేవుని పై సప్తతి ప్రదరంబులు నిగిడించి.

7_3_085 తే. వెడఁద తూపునఁ గేతువు వ్రేయఁ గ్రీడి నవతి విశిఖంబు లేయ నన్నరవరుండు డెబ్బదేనమ్ము లడరింప నుబ్బి విల్లు ద్రుంచి యుర మేడు శరముల నొంచె నరుఁడు.

7_3_086 క. కోపించి యాతఁ డొండొక చాపము గొని నవ నిశాత సాయకములు బా హోపరితలముల నురమున నేపున నాఁటుటయుఁ బార్థుఁ డెలన వ్వొలయన్.

7_3_087 ఉ. సారథిఁ గూల్చి యశ్వములఁ జంపి తదంగములందు సప్తతి క్రూర శిలీ ముఖంబు లతి ఘోరముగాఁ దొరఁగింపఁ బ్రస్ఫుర ద్భూరి గదాభి రాముఁ డయి దుర్దమలీల రథంబు డిగ్గి యా ధీర గుణోత్తరుం డతని తేరి దెసం గవిసెన్ రయంబునన్.

7_3_088 వ. ఆ రాజు వరుణ తనయుం డనియు నగ్గద వరుణు వరంబున వచ్చిన దనియును వరుణుం డతనికి దాని నిచ్చునప్పుడు దీని ధరించిన వాఁడు రిపుల కజయ్యుండగుఁ బోటెక్కించు కొనని వాని మీదం బ్రయోగించిన వానిన మరలి వధియించు నని చెప్పె ననియును బెద్దల వలన విందుము.

7_3_089 ఉ. కాలము ప్రాప్తమైన మదిఁ గానఁడ యన్నియమంబు మేదినీ పాలకుఁ డప్పు డట్లగుటఁ బంకజనాభుని వైచె నాతఁ డా భీల గదం ద దంసమునఁ బెట్టిన నూతన పుష్ప మాలయుం బోలి వెలింగెఁ గాని యది భూవర నొంపద యించు కేనియున్.

7_3_090 వ. ఇట్లు గోవిందునకుఁ గుసుమాభరణం బై పొలిచి యా క్షణంబ.